మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

బహుముఖ విద్వన్మణి వేదం

by Cheedella Seetha Lakshmi December 31, 2021
written by Cheedella Seetha Lakshmi

ప్రముఖులు రాసిన లేఖల్లోని విశేషాలను తెలుసుకునే ధారావాహికలో భాగంగా మనమిప్పుడు ప్రముఖ
సాహితీవేత్త వేదం వేంకటరాయ శాస్త్రి గారి లేఖల ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం.
సాహితీవేత్త,బహుగ్రంథకర్త ,ఆంధ్ర విశ్వకళాపరిషత్ ప్రప్రథమ ఉప కులపతి కట్టమంచి రామలింగారెడ్డి గారు(సి.ఆర్.రెడ్డి)
శాస్త్రిగారి గురించి ప్రశంశిస్తూ ఆయన మాటల్లో ఇలా వివరించారు. “వేదం వేంకటరాయ శాస్త్రి గారు గొప్ప సాహితీవేత్త మరియు బహుగ్రంథ కర్త
‘కళాప్రపూర్ణ’ బిరుదానికి అర్హులని చెబుతూ

“ప్రతాపరుద్రీయాది స్వతంత్ర గ్రంథములు వీరి కవితాపరిపాటికిని,
విమర్శన వీరి సునిశితమగు విశేషమునకును,శృంగార నైషధాది వ్యాఖ్యానములును,కథా సరిత్సాగరాది భాషాఅంతరీకరణములను వీరి రసజ్ఞతకును
తార్కాణములు వారు వార్ధక్య దశలో మనః క్లేశము,దేహక్లేశములకు వెనుదీయక ఆముక్తమాల్యదకు సమగ్రమగు మహా వ్యాఖ్యానమును వీరు
ఇటీవలే రచించి ప్రచురించుట చూడగా
భాషా కృషి వీరికి కర్తవ్యముగానే గాక స్వభావము కూడా అని స్పష్టమగుచున్నది” అని రాశారు.

ఈ మాటల బట్టి చూడగా శాస్త్రి గారి రచనాసక్తి,సాహిత్య
తృష్ణ,వయసు సైతం లెక్కచేయని ఆయాన తెలుగు భాషా సేవ బహుధా ప్రశంసనీయం,చిరస్మరణీయం.

తెలుగు సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞను చూపి నాటక రచనలో పాత్రోచిత భాషను ప్రయోగించి తనదైన ప్రత్యేక ముద్రను వేసి కీర్తి గడించిన విద్వన్మణి వేదం వెంకటరాయ శాస్త్రి.

విమర్శకుడు,నాటకకర్త,,వ్యాఖ్యారచయిత,పరిశోధకుడు,పరిష్కర్త,అనువాదకుడు ,ముద్రాపకుడైన వేదం వారి ప్రతిభకు తార్కాణంగా అనేక బిరుదులు,సత్కారాలు ఆయన ఖాతాలో వచ్చి చేరాయి.

మహామహోపాధ్యాయ,కళాప్రపూర్ణ వేదం వేంకటరాయ శాస్త్రి గారు వేంకట లక్ష్మణ శాస్త్రి,లక్ష్మమ్మ దంపతులకు 1853 డిసెంబర్ 21 వ తేదీన మద్రాసులో జన్మించారు.సంస్కృతం,ఆంగ్ల భాషల్లో పట్టభద్రుడు వివిధ ప్రక్రియల్లో తనవంతు కృషి చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహనీయుడు వేదం.
వేదం వారు ఆర్ధిక దురవస్థకు గురైన సమయంలో ఔదార్యవంతుడు, తనంటే అభిమానురాగాలు చూపే వెంకటగిరి మహారాజాగారికి తన మనోరథాన్ని తెలుపుతూ ఒక సుదీర్ఘ లేఖ రాశారు.

కుటుంబభారం కోసం ధనం సరిపోక సంపాదనార్ధం ధనాపేక్ష కలిగి ” విక్రమార్కాది పురాతన రాజర్షి చరిత్రాభిమానిత చేతను తచ్చరిత్ర పుస్తకములను
సంస్కరించి సటిప్పణ ములనుగా ముద్రించితిని. ఇట్టి ఉద్యమము వలన ముందున్న లేనికి తోడు ఋణములు సైతము
సంభవించినవి….
కొంత అపు తీర్చుటకై
జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల లోని సామగ్రి విక్రయం చేత తీర్చి,శిష్టఋణమును నా జీవితము వలననే. తీర్చుచుంటిని”.
అని బాధను వెల్లడించారు. ఆర్ధిక సమస్యలు,అప్పులో ఉన్నా అప్పు తీర్చడం కోసం ఆయన పడే పాట్లు పురాతన రాజర్షి
చరిత్రపై వేదం వారికి ఉన్న అభిమానం కొద్దీ
టిప్పణాలు రాసి ముద్రించడం. శాస్త్రిగారి మనోభావాలు లేఖలో తొంగి చూస్తున్నాయి.

ఎన్ని సమస్యలున్నా కూడా,ఎన్ని ఆర్థిక బాధలనుభవిస్తున్నప్పటికీ సాహిత్యకృషిలో
మాత్రం శ్రద్ధ తగ్గలేదు.
ఆయన మాటల్లోనే,” సంస్కృత నాటకములను
పెక్కింటిని శాకుంతల,మాలతీమాధవ,

మహావీరచరిత్రోత్తర రామచరిత్రాదులను మూల విరుద్దార్థముగా నాంధ్రీ కృతములైనట్టి వానిని–వాస్తవార్థబోధకముగా వ్యాఖ్యాసమేతముగా –ప్రకటింపవలసియున్నది—వ్యుత్పత్తులనొసంగునట్టి నిఘంటువొకటి నిర్మించవలసియున్నది.శ్రీమదాంధ్ర మహాభాగవతమును సాధుపాఠ నిర్ణయ పూర్వకముగాను గూఢార్థ బోధన పూర్వకంగాను ప్రకటింపవల్సియున్నది.శిశుపాలవధాది కావ్యములను సంస్కృతాంధ్ర వ్యాఖ్యానాంధ్ర టీకా సమేతముగా ముద్రింపవలయును.

మహావీరచరిత్రోత్తర రామచరిత్రాదులను మూల విరుద్దార్థముగా నాంధ్రీ కృతములైనట్టి వానిని–వాస్తవార్థబోధకముగా వ్యాఖ్యాసమేతముగా –ప్రకటింపవలసియున్నది—వ్యుత్పత్తులనొసంగునట్టి నిఘంటువొకటి నిర్మించవలసియున్నది.శ్రీమదాంధ్ర మహాభాగవతమును సాధుపాఠ నిర్ణయ పూర్వకముగాను గూఢార్థ బోధన పూర్వకంగాను ప్రకటింపవల్సియున్నది– ఎల్లవారికిం బఠనీయముగా సకల నాటక కథావళి రచింపవలసియున్నది.శిశుపాలవధాది కావ్యములను సంస్కృతాంధ్ర టీకా సమేతముగా ముద్రింపవలయును. అమరకోశమునకు ఆంధ్రగీర్వాణ మయమైన సుబోధవ్యాఖ్య రచింపవలయును.కాశీఖండ సోమ హరివంశ పాండురంగ మహాత్మ్యాది దివ్యప్రబంధములను విషయ పద టీకలతో ముద్రితములంజేయవలయును.” అని చెప్పుకోవడంలో సాహిత్య సేవకై ఆయన తపన,ఆరాటం తెలుస్తుంది.నిరంతర శ్రమ చేసి ఏదో రాయాలని,ముద్రించాలని తహతహలాడేవారు.వేదం వారి వ్యక్తిత్వం,తెలుగు భాషా సాహిత్యం కోసం ఆయన పడ్డ శ్రమ,ఆందోళనను మహారాజుకు తన మనసు విప్పి చెప్పుకునే తీరు,మహారాజుతో ఈయనకు గల సాన్నిహిత్యాన్ని ఋజువు చేస్తుందీ లేఖ.” నా వ్యాపారము ప్రకృతమున నదీ మాతృకమయిన సుకృషి సుక్షేత్రము విత్తనము లేక చల్లకము మానినందున కంపతంపర మయిన రీతింబొందియున్నది.” నీటి వసతి ఉన్న నల్లనిమట్టి కలిగి చక్కని పండే భూమి వున్నప్పటికీ విత్తనాలు చల్లకపోతే కంపపెరిగి బీడు భూమిగా ఎట్లా అవుతుందో తన వ్యాపారం కూడా క్షీణించిందని తెలుపుతూ నాకు నిరంతరము ఏకాశ్రయులు,రాజవారేనని తన మనసులో ఉన్న విషయాన్ని బాధను వ్యక్తం చేసి రాజా వారి సహాయాన్ని అర్థించిన సాహిత్య పిపాసి.అరమరికలు లేకుండా తన మనోవ్యధను రాజవారికి తేటతెల్లం చేశారీలేఖలో.
ఈ లేఖ ద్వారా మనకు కూడా ఏదైనా పనిని చేయాలన్న తపన,దానికి తగ్గ శ్రమ ఎట్లా ఉండాలో సూచించినట్టుంది.

వేంకటరాయశాస్త్రి గారు నాగానందం నాటకాన్ని ఒక కొత్త మార్గంలో రచించారు.సంస్కృత నాటక మర్యాదలననుసరించి సంస్కృత భాష వుండేచోట సలక్షణ భాషను,ప్రాకృతాది భాషా భేదం వుండేచోట తెలుగు గ్రామ్య భేదాన్ని అంటే పాత్రోచితభాషను ప్రయోగించి అనువాదం చేశారు.” ఆంధ్ర భాషలో పాత్రోచిత భాషలో రచింపబడిన మొట్టమొదటి నాటకము నాగనందమే” కొత్తమార్గాన్ని కొందరు సహృదయులు ఆమోదించారు.వడ్డాది సుబ్బరాయ కవి శాస్త్రుల వారికి వ్రాసిన లేఖలో ” నీచ పాత్రములకు తెలుగు నాటకముల యందు దమరు చూపిన దారి నామట్టు కాదరణీయముగానే తోచుచున్నది.మఱియు దాని వలన ననేక లాభములున్నట్లు నేను దలంచుచున్నాడను.గ్రామ్యములేవో యగ్రామ్యములేవో యెఱుంగని వారలనేకులుందురు గాన వారిని గ్రామ్యములివి యాగ్రామ్యములివని తెలిసికొనుటకు వీలు కలుగుచున్నది.మఱియు వాడుక ప్రకారము అట్టి గ్రామ్యరూపములు వ్రాయుట కష్టమే.నాకు జూడ దన్నాటకము బహు రసవంతముగా నున్నది.” అని తన అభిప్రాయాన్ని లేఖాముఖంగా వెల్లడించారు.

ప్రతాపరుద్రీయము నాటకాన్ని రచించారు.పూండ్ల రామకృష్ణయ్య గారు లేఖ వ్రాస్తూ వెలగల యశస్సును తెచ్చి పెడుతుందని అచ్చునకివ్వమని ప్రోత్సహిస్తూ
“తాటాకు చప్పుళ్లను మీరు లక్ష్యము చేయకుడు” ఎవరెన్ని పోకడలు పోయినా లక్ష్యపెట్టవద్దని,విమర్శనలనెదుర్కోవాలని హితవు చెప్పి వెన్నుతట్టారు.

‘జక్కన విక్రమార్కచరిత్ర’ ముద్రణానంతరము అనేక ఆక్షేపణల నెదుర్కొన్నారు.” అన్ని పద్యములును అన్యాపదేశముగా వ్రాసి నిందించినారు.వానిలో తెలుగు భాషలో బాండిత్యము లేదని సూచింపబడియున్నది.మీరు సంస్కృత పండితులే గాని యాంధ్ర పండితులు గారట” అని రామకృష్ణయ్య గారి లేఖలో తెలిపారు.ఆనాడు కూడా ఓర్వలేనివారు ఏదో పేరు పెట్టి విమర్శించే వారని తెలుస్తుంది.అట్లాంటి వాటిని లెక్క చేయక దైర్యంగా ముందుకు పోతేనే అభ్యుదయం.జంకకుడు,వెనుకంజ వేయకుడు ” అంటూ సవ్యసాచిగా ఇప్పుడుండవలెనని ప్రోత్సహించారు రామకృష్ణయ్య గారు.నాడైనా,నేడైనా మంచి పని చేస్తున్నప్పుడు యేడ్చెవాళ్లు,వెనక్కి కాలు గుంజే వాళ్ళుంటారని తెలుస్తుంది.

ఆనాడు పూండ్ల రామకృష్ణయ్య గారికి వేదం వారికి గల మైత్రీబంధం,వెన్నుతట్టి వేదం వారిని ప్రోత్సహించే పధ్ధతి లేఖల ద్వారా స్పష్టమౌతుంది.

వేదం వారిపై గురజాడ అప్పారావు గారి అభిప్రాయం లేఖల ద్వారా తెలుస్తుంది.

ఏదైనా విషయాన్ని తీసుకుని చర్చ మొదలెడితే దాన్ని ఆమూలాగ్రం చర్చించే స్వభావం వేదం వారిదని ప్రస్తుతించారు అప్పారావుగారు.అదే ఆనాటి పండితులలో కన్పించదంటారు. జీవితంలో కల్సిపోయిన మన సంప్రదాయాలను,అలవాట్లను,ఒక్కసారిగా మార్చుకోవడం సులభం కాకపోయినప్పటికీ
” మీలాంటి నిజమైన తాత్వికవేత్తలు మీకున్న అనుభవసారం,సాహిత్య శక్తితో ఒక కొత్త సాహిత్య ప్రక్రియకు నూతన మార్గాలు కనిపెట్టి, నూతన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి స్తంభించిపోయిన సాహిత్యాన్ని రక్షించగలరు” అని పెద్ద భారాన్ని గురజాడ వేదం వారిపై మోపారు.
వేదం వారి శైలిని గురించి విమర్శిస్తూ వ్యాకరణము,శైలి అంతా పూర్వకవుల పంథా లోనే సాగుతుంది మీ పద్యరచన అని అంటారు.

వీరేశలింగం పంతులు, వారి అనుచరులు. సాహిత్యపరంగా గ్రాంధికభాషకు అలవాటు పడిపోయి
మాట్లాడే మాండలిక పదాలను కూడా సీరియస్ గా సాహిత్యధోరణిలో రాస్తేనే అది అగౌరవంగానూ హాస్యాస్పదంగానూ ఉండదా!! వీరేశలింగం ఆధ్వర్యంలో ఉన్న ఈ పద్ధతి పట్ల (గద్యరచన) వేదం వారి అభిప్రాయాన్ని కోరుతూ లేఖలో పేర్కొన్నారు.

‘శృంగార నైషధ వ్యాఖ్య’ పై కూడా అభిప్రాయాన్ని తెలుపుతూ అప్పారావు గారు లేఖలో తెలుగు సాహిత్య విద్యార్థులకు
అమూల్యమైనదని,
తెలుగులో సగటు విద్యావేత్తలు ఎవరూ దానిని అర్థం చేసుకోలేరని,ఇప్పుడు మీరు చేయని చేయలేని గొప్ప కార్యాన్ని చేశారని ప్రస్తుతించారు. వేదం వారు యూనివర్సిటీ లో పరీక్షాధికారిగా ‘తెలుగు విభాగానికి’ నియుక్తులయ్యారు. పూండ్ల రామకృష్ణయ్య గారు ఈ విషయమై
లేఖ రాస్తూ “యీ మహాయుద్ధములో మిమ్మునాంధ్రముకే ఏర్పాటు చేయుట కొంత సుగుణమనియు విమతులకు శృంగభంగమనియు తలచెద.ఇక మాకందరికీ తమరు ‘ఎగ్జామినరగుట’ బ్రహ్మానందముగా నున్నది” అనడం వలన
ఆ కాలం నాటి సమాజపరిస్థితి కొంత అర్థం చేసుకోవచ్చు. ఒకరిపై ఒకరికి పడరానివారున్నారనీ,అడ్డుపుల్లలు వేసేవారని,కుయుక్తులు చేసేవారికి శాస్త్రి గారి పరీక్షాధికారి నియామకం వలన శృంగభంగమైందని తెలుస్తోంది.ఈ కాలంలో వలెనే ఆకాలంలో కూడా కుట్రదారులు,
కుళ్ళుపోతులు ఉండేవారని స్పష్టం.

‘ఆంధ్రభాషాభిమాని సమాజానికి’ అధ్యక్షునిగా ఉండి నీతిమంతంగా ప్రవర్తించి డబ్బు విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండేవారని శాస్త్రి గారి ప్రవర్తన,గుణశీలాదులు
లేఖల ద్వారా తెలుస్తాయి.

ఈ విధంగా ప్రముఖుల చేత కూడా మన్నలను పొందిన ఉన్నత కవి వతంసులు,
బహుముఖ ప్రజ్ఞాశాలి,’పాత్రోచిత భాష’కు ఒక కొత్త ఒరవడి చేకూర్చి తెలుగు సాహిత్యవనంలో గుబాళించిన పుష్పం శ్రీ
వేదం వెంకటరాయ శాస్త్రి గారు అని ఆయన లేఖల ద్వారా విశదమౌతుంది.

బహుముఖ విద్వన్మణి వేదం వేంకటరాయ శాస్త్రి గారు తెలుగు సాహిత్య సేవలో తరించి తన 76 వ ఏట1929వ సంవత్సరం జూన్ 18 వ తేదీన మద్రాసులోనే తుది శ్వాస విడిచారు.

మహా మహోపాధ్యాయుని జయంతి సందర్బంగా దివ్యస్మృతికి నివాళులర్పిస్తూ…

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి.

December 31, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

KALPA’ VRIKSHA

by గురిజాల రామశేషయ్య December 31, 2021
written by గురిజాల రామశేషయ్య

__________

Good Wishes for a Happy New Year 2022

rendering into English :
late_ Prof. M.Siva Ramakrishna
Head, Dept. of English O.U. Hyd.

The wish fulfilling Tree
yields a fresh, new bud
flowering into a fountain
that the timeless womb delivers

Bud expands to a flower
a fruit even as
the fountain transforms
into a stream, a river
And enriches , I wish,
Your life with the
nectar of
limitless, eternal JOY.

(Telugu original : Gurijala RamaSeshaiah)

1–1–2022

కల్పవృక్షం

కొత్త సంవత్సరం —

కాలవృక్షం తొడిగిన కొత్త మొగ్గ
కాలగర్భం నుండి చిమ్ముకొచ్చిన కొత్త నీటి బుగ్గ

మొగ్గ వికసించి పుష్పమై ఫలమై
బుగ్గ కదలి కదలి పాయయై నదియై

మీ జీవితాన్ని రసవంతం చేయాలి
మీ జీవనాన్ని ప్రాణవంతం చేయాలి

అవధులు లేని ఆనందం మీ సొంతమై
మీ జీవితం శాశ్వతోజ్జీవనసుధాసమృద్ధితరంగమై ప్రగమించాలని

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

— గురిజాల రామశేషయ్య
1–1–2022

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వ్యంగ్య చిత్రాలు (కార్టూన్లు)

by మూటుపూరు విఠల్ చందర్ రావు December 31, 2021
written by మూటుపూరు విఠల్ చందర్ రావు

December 31, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పద్యకిరణకలనం – 5

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి December 31, 2021
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

ఆధారములు
*****
ఏకాక్షరులు :-
03. నోరు (1)
25. చంద్రుడు (1)

అడ్డం
***
01. చెఱకు మున్నీరు (3)
04. పెరుగు కడలి (3)
06. క తో మొదలైన మరో కవ్వడి (2)
07. టెక్కెము గుర్తు (2)
08. శమంతకమణిలో శాంతి (2)
09. పొగడ్త కోరిక (2)
11. ఈ హరి ముందున్న కోరిక (2)
12. పాలెం కట్ట కూడలిలో బంటు, శిష్యుడు (2)
14. ముద్ద (2)
15. తీగ నరం (2)
17.” ……… – గోదావరి యీత” ఒక సామెత(4)
21. ఆశ్చర్యం (2)
22. చేమకూర వారి దీర్ఘాంత ద్విరేఫం (2)
23. గడ్డం (3)
26. రగులు ఱేడు (2)
27. వీణ (3)
29. ఎడారి ఓడ (2)
32. బాధ (2)
33. చిత్రపటంలో దాగిన సిగ్గు (2)
35. ప్రత్తి పింజ, .. మేకు ఐనట్లు (2)
36. చొల్లు కబురు (2)
38. బొబ్బిలి లో తిరుగుబాట పట్టిన ధనం (2)
39. ధనంతో అశాశ్వతం (3)
41. ఇంద్రాయుధం (2)
43. విచారం (2)
44. అంతంతో చీకటి (2)
45. పెసరట్టు లో నింద (2)
46. దొంగతనం (2)

నిలువు
**
01. ఓనమాలలో మూడవదానితో మొదలైన జింక (2)
02. కవ్వంతో కొట్టబడిన మజ్జిగ (4)
04. దండోపాయం (2)
05. కాటు (2)
06. దయచూపు (5)
08. పొలుసు ముక్క (3)
10. బండి పోలుగర్ర తొడ (2) 13. నేను నేనే ! మేము …… ! (2)
16. మూడుతో స్వర్గం (4)
18. పాలకడలిలో మందరగిరి పాత్ర (2)
19. భూపతి తో తూచేది (3)
20. 22/7 తో ధనము (2)
24. పామరులు పెట్టే భోగం (2)
26. దేశం, మండలాలతో ఏర్పడే ప్రాంతం (2)
27. బ్రహ్మరాత (5)
28. చిత్రసీమలో మాయ గాయని (2)
30. మదంతో జవ్వాజి (4)
31. రసాలరాయి ముత్యం (4)
34. పాట మాట (2)
37. ఆద్యంతాలు లేని ఆదివిష్ణు 16 నిలువు (2)
40. ఆనందాది యోగములలో ఉసిరిక పాలిచ్చి పెంచు తల్లి (2)
42. కత్తి తొడుగు (2)
43. కందకం అగడ్త (2)

 

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నాకొక మనిషి కావాలి

by Dr. T Rangaswami December 31, 2021
written by Dr. T Rangaswami

నిత్యజీవన సుగంధ పరిమళాల
నిరంతరాన్వేషకుడను
నిర్దిష్ట జీవన గమనానువర్తుడను
సరళానుదాత్త కాముకుడను
జీవనగమనంలో…
నిత్యసాహితీ చర్చాంకితడనవుతూ
సమాజశ్రేయస్సుకై ఉద్దీప్తతతో
సమకాలీనతలో …
సమ్యక్ చింతనానుశీలనతో
ప్రవహించే జీవనశైలుడను
నేనొక సామాన్యుడను
మధ్యతరగతి మందహాసాన్ని
నలుగురి మధ్యలో
బతుకునీడుస్తున్న వాడిని
అయినా …
ఆధునిక రుగ్మతలకు ఎవరూ
అతీతులు కాదనిపిస్తుంది
దానికి… వయోభేదాలు
ఆర్ధిక మూలాలను పట్టించుకొనకుండా –
నా గమనంలో … అందరూ సమమే
నాకు జాతి, మతాలు లేవు
ఆలింగనము చేసుకోవడమే
ప్రపంచమును అతులాకుతలం చేస్తూ
వణికించడమే నా ధ్యేయం.
కరోనా … కరోనా … ప్రాణాలపై
ఆశలు వదిలేలా చేయడమే…
నా…కరో.. అన్నా! ఏమీ చేయలేని స్థితి
మూతికి, ముక్కుకు మాస్కే గతి
నాజీవన సౌగంధికత ఆవిరవుతున్నది
X. X X
తుమ్ము, దగ్గు, ఆయాసం
క్షణ క్షణం కుంచించుక పోతున్నాను
జీవనపోరాటంలో సతమతం
ఒకపక్క నిర్మానుష్యం
ఎవరూలేని ఏకాకితనం
ఆత్మీయులంటూ మసలిన
నా సమాజం, బంధువులెక్కడ
ఇన్నాళ్ళ నా పారదర్శకమైన గమనం
ఏమైంది? ఎవరికెవరు?
కనీసం పలకరింపుకు
నోచుకోని బతుకైనది.
ఉభయ సాహిత్యాలకోసం
గుమిగూడే వారెక్కడ!
ఆత్మీయతలను ప్రదర్శించే వారేరి…
ఈ నిండు ఏకాకితనములో
నాకొక మనిషి కావాలి
ఏ అరణ్యములోనో…నిర్జీవనప్రాంతంలోనో
వనచరాల మధ్య బతకడమే మేలేమో!
సమాజానికి ఉపయోగపడే అవసరాలు
అన్నీ బంద్ అయినట్టు
నా బంధాలు కూడా రద్దయినవి
వాత్సల్యాలూ, ప్రేమలూ లేవు
పలకరించే గళమేది?
అందుకే నాకిపుడు
స్మశానవైరాగ్యం ఆవహించింది
నన్ను నన్నుగా మన్నించే
నాకొక మనిషి కావాలి.
==##==
డా. టి.శ్రీరంగస్వామి

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఓ….మాయా జాలమా

by -మారంరాజు శ్రీనివారావు December 31, 2021
written by -మారంరాజు శ్రీనివారావు

ఎవరు నీవు ఎవరు
నీ ఊపిరి మేమేనా
ఎవరు నీవు ఎవరు నేను
నువ్వంటే ఈ జనం పడి చస్తారెందుకు,
నువు కనబడితే కళ్లకద్దుకుంటారు,
నువు లేక బతుక లేరు ఈ జనం,
నిను అచ్చోత్తిన వారిదే కులము ?
ఇచ్చి పుచ్చు కునే వారిదే కులము,
ఎవరి నెవరు కులము మతము అడుగబోరు,
కులము మతము పట్టింపు లేదు నీకు,
అమీరు గరీబు అనే భేదమే లేదు నీకు,
ఆకలి అయిన వారి ని
ఆపద లో ఆదుకుంటూ ఉంటావు,
నీ కు నచ్చ కుంటే
ఎందరితోనో ఆడుకుంటూ ఉంటావు,
నీ కోసం ఒకరి నొకరు
పొడుచు కొని చస్తుంటే చూస్తూ ఊరుకుంటావు,
నిజాన్ని అబద్ధముగా
అబద్దాన్ని నిజముగా మారుస్తూ ఉంటావు,
బతుకు తెరువు సాగుటకు
నీ కోసం వాళ్ళు కొందరు ఒళ్ళమ్ముకుంటారు
మగాళ్లు కొందరు మనసు అమ్ముకుంటారు
నీ కోసం దేశాలు రాజ్యాలు
తల కిందులుగ మారిపోతూ ఉంటాయి
చివరకు దేవుడు కూడా నీ కోసం
ఓ..వ్యాపారిగా మారి పోతు ఉంటాడు,
నీవు లేని దెక్కడ
ఈ భువి పైన సర్వాంతరి వై పోయావు,
ప్రతి మనిషికి నీవే ఓ తోడు నీడ వయ్యావు,
మరువ జాల నిన్ను ఓ..భారతీయ
“రూపి” మాయా జాలమా,
ఓ..మాయా జాలమా.
********

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణకలనం

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి December 31, 2021
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

పదకిరణకలనం సరియైన జవాబులు పంపినవారు  ఉమారాణి నెల్లుట్ల గారు .

మేధస్సును పదును పెడుతూ, మనసును ఉత్సాహపరిచే ఒకానొక సాహిత్య చిక్కుప్రశ్నల సరదా ! మీదే విజయం కావచ్చు !ఇదిగో-మయూఖ పదకిరణకలనం (puzzle) పరిష్కర్త నెల్లుట్ల ఉమానరసింహారావు కు అభినందనలు .

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

చదువులమ్మ శతకం

by kandukuri Bhasker December 31, 2021
written by kandukuri Bhasker
తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు వచ్చినప్పటికీ పద్య ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యతనే వేరు. వేమన, సుమతి, కుమారా, కుమారీ, నరసింహ, దాశరథి మొదలైన శతక పద్యాలు నేటికి ప్రజల నాలుకలపై నాట్యమాడుతున్నాయంటే కారణం, ఆ పద్యాలకున్న ధారాశుద్ధి ధారణా శక్తి, ఆ శతక కర్తల రచనా పఠిమ, శైలి గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆధునిక కాలంలో కూడా శతకాలు రాసే కవుల సంఖ్య మరీ తక్కువనేం చెప్పలేము. ఎక్కువ మంది రచయితలు మాత్రం వచన కవిత్వం వైపు  మొగ్గుచూపుతున్న మాట నిజం. తెలుగు భాషోపాధ్యాయులు కూకట్ల తిరుపతికి కూడా 2005లో  వెలువడిన “మేలుకొలుపు” వచన కవిత్వ గ్రంథమే, మొదటగా కవిగా, రచయితగా మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత 2006లో పద్య ప్రక్రియలో  “శ్రీ చదువులమ్మ శతకము” ను తీసుకొచ్చి, పద్యకవిగా సాహితీ లోకాన్ని మెప్పించారు.
కూకట్ల తిరుపతి వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనప్పటికీ సాహిత్యాన్ని తన ప్రవృత్తిగా మలుచుకొని అనేక రచనలు చేస్తున్నారు. సామాజిక ఉద్యమాలలో పాల్గొంటున్నారు. సాహిత్య సంస్థలకు బాధ్యులుగా పలు సాహిత్య కార్యక్రమాలను జరుపుతున్నారు. తెలుగు భాష ఉపాధ్యాయునిగా పిల్లలకు తరగతి గదిలో పాఠాలు బోధిస్తూనే, వారి కొరకు ఒక యూట్యూబ్ చానల్ ను తన పేరుతోనే ఏర్పాటు చేశారు. అందులో తెలుగు భాషా మూలాల్లోకి వెళదాం అనే పేరుతో భాషా వివరణలు, అన్ని తరగతుల తెలుగు వాచకాలలోని పద్యం, పాట, గేయం, వచన పాఠాల పఠనాలు, వ్యాకరణాంశాల విశ్లేషణలతో పాటు సాహిత్య అంశాలను సైతం సమాహారంగా అందిస్తున్నారు. ఈ సమాజాన్ని చక్కజేయమంటూ, జ్ఞాన ప్రదాయిని చదువులమ్మను వేడుకుంటూ కూకట్ల తిరుపతి “శ్రీ చదువులమ్మ శతకము” రాయడమనేది గొప్ప విశేషంగా చెప్పవచ్చు. భారత దేశానికి, ప్రపంచానికి శుభం చేకూరాలని రాసిన తీరు ఆకర్షణీయంగా ఉంది. పిల్లలకు స్ఫూర్తిదాయకంగా, నైతికతను బోధించేలా ఉన్నది. సమాజంలో నానాటికీ మారుతున్న విలువలు, చెదిరిపోతున్న బాంధవ్యాలు, మసకబారిపోతున్న మానవత్వం, అంతరించి పోతున్న సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఈ శతకంలో తిరుపతికవి  ఆందోళన కనపడుతుంది.
“చక్కజేయు మమ్ము! చదువులమ్మ!” అనే మకుటంతో  కూర్చిన ఈ శతకంలోని పద్యాలన్ని అన్ని వర్గాల పాఠకులకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా, ఆలోచింప చేసేలా ఉన్నాయి. ఇందులో వర్తమాన సామాజిక స్థితిగతులను చక్కగా వివరించారు. వస్తుగతమైన నూట పద్దెనిమిది  ఆటవెలది పద్యాలతో అందమైన హారాన్ని చదువులమ్మ మెడలో అలంకరించారు. శతక రచనా సంప్రదాయ పద్ధతిని పాటిస్తూ, “శ్రీ సరస్వతమ్మ శీఘ్రము రావమ్మ” అంటూ తొలి పద్య పాదాద్యక్షరాన్ని శ్రీకారంతోనే మొదలుపెట్టారు కవి. అలాగే విఘ్నేశ్వర, సరస్వతి, ఇష్ట దేవత, గురు, తల్లిదండ్రుల స్తుతి పద్యాలను సంప్రదాయ శతక లక్షణాలలో భాగంగా శతక కర్త పొందు పరిచినట్లు భావించవచ్చు. కవి వంశావళి, ఫలశ్రుతిని సీస పద్యాలలో అందించడం ప్రాచీన శతక రచనా పద్ధతి అయినప్పటికీ, శతక పద్యాల ఇతి వృత్తాలన్ని అత్యాధునిక కాలానికి చెందినవి కావడం గమనార్హం. విద్యకు సంబంధించిన అనేక అంశాలతో పాటు తల్లి పట్ల, తల్లి భాష పట్ల, నేలతల్లి పట్ల తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
ఈ పద్యంలో…
“మాతృమూర్తి కంటె మమకారమేదయ్య/
మాతృభాష కన్న మధురమేది/
మాతృభూమి యెన్న మకుటాయమానంబు/
చక్కజేయు మమ్ము! చదువులమ్మ!”
అంటూ తల్లిప్రేమను మించిన ప్రేమ లేదనీ, తల్లిభాషను మించిన తియ్యదనం లేదనీ, జన్మభూమికన్న గొప్పది ఏదీ లేదని చెప్పారు. ఈ పద్యం ద్వారా పిల్లలలో మాతృభక్తి, మాతృభాషా ప్రేమను, మాతృదేశ భక్తిని పెంపొందింపచేయవచ్చు. ఏ వ్యక్తికైనా ఇవి అవసరం మాత్రమే కాదు, అనుసరణీయం, ఆచరణీయం కూడా.
“కులమతమ్ములనుచు కుత్సితంబేటికీ?/ మానవతను మించు మార్గమేది” అని నేడు కులమతాల కుమ్ములాటలలో కూరుకుపోతున్న ప్రజలకు మానవతను మించిన మార్గం లేదని హితవు పలికారు.  “పరువు తీయుచుండె అరువు సంస్కృతి నేడు/ సంప్రదాయ పథము సన్నగిల్లె…” నని విదేశీ విష సంస్కృతి మోజులో పాల మీగడ లాంటి మన దేశపు సంస్కృతి సంప్రదాయాలు నశిస్తున్నాయని ఆవేదన చెందుతారు. “మైత్రి బంధమెన్న మకుటాయ మానంబు/ ఇచ్చి పుచ్చుకొనుడు యింపుగాను/చెలిమి కంటె మించి కలిమియు సరికాదు” అంటూ స్నేహ బంధాన్ని మించిన బంధం మరేదీ లోకంలో లేదని తన స్నేహ హస్తాన్ని అందించారు.
ఇలా ఈ శతకంలోని ఏ పద్యం తీసుకున్న ఏదో ఒక హితబోధను, అద్భుత ఆచరణను, మానవీయ భావనను కలిగించేదే. ప్రకృతి రమణీయతను, పల్లె పరువాలను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ, ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదనే మాటను నిజం చేస్తూ, వాటి పట్ల కవికున్న అచంచలమైన ప్రేమను చాటుకున్నారు. అవినీతిపరులైన వారి అంతులేని సంపదను, దోపిడీని వేలెత్తిచూపుతూ, వాటిని అరికట్టాల్సిన అవసరాన్ని వక్కానించారు. దేశభక్తి గొప్పదనాన్ని, జాతీయత వాద అవసరాన్ని, బలంగా వినిపించారు. శాంతి, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటివి ప్రతి ఒక్కరికి దక్కాలని కోరుకున్నారు. అన్నదాతలకు అండగా నిలిచారు. పేద ప్రజలకు సంకటంగా మారిన పెరుగుతున్న నిత్యావసర ధరలను నిరసించారు. వాటిని ప్రభుత్వాలు నిలువరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ధనిక, పేద భేదాలు తొలిగిపోయి, కులమతాల కుత్సితాలు కూలిపోయి, వర్గ వైషమ్యాలు వదిలిపోయి, ఎలాంటి అంతర దొంతరలకు తావు లేకుండా, సమసమాజ నిర్మాణానికి సహకరించవలసిందిగా చదువులమ్మను వేడుకుంటూ, కూకట్ల రాసిన ఈ శతకం కొత్త లోకపు ఆవిష్కరణకు ఒక మేలుకొలుపు పిలుపు కావాలని కోరుకుంటున్నాను.  కూకట్ల తిరుపతి కలం నుండి భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో సామాజిక పరమైన మంచి రచనలు వస్తాయని ఆశిద్దాం.
చదువులమ్మ శతకం
వెల: రూ. 20/
పుటలు: 45
ప్రతులకు:
కూకట్ల లక్ష్మి, ఇం. నెం. 1-29/1,
గ్రా: మద్దికుంట, మం: మానుకొండూర్,
జిల్లా: కరీంనగర్. 505505.
చరవాణి: 9949247591.
December 31, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

రమణీయ మొల్ల రామాయణం

by చంద్రకళ దీకొండ December 31, 2021
written by చంద్రకళ దీకొండ
సరళ,రమణీయ శైలిలో
ఆనాటి పద్ధతికి విరుద్ధంగా
వాడుక భాషలో
ఐదు రోజుల్లో రచించిన
ఆరు కాండాల
నూట ముప్ఫయి ఎనిమిది పద్యాల
మొల్ల రామాయణం…!
రామాయణ కావ్య రసధునిని
తిక్కన వలె పాత్రలను
కళ్ళకు కట్టి
గోపురపు శ్రీకంఠ మల్లేశుని కృపచే రచియించినానని
వినయంగా పలికిన ఆజన్మ బ్రహ్మచారిణి…!
పోతన వలె పదబంధముల నేర్పుతో
అలతి అలతి పదములతో
కూర్చిన
*నవ్యత కలిగి వీనులవిందయి*
*యమృతపు సోనల పొందయి*
*యలరారిన రామచరిత* కు
కందువ మాటల నందముగా కూర్చి
పఠితలకు,శ్రోతలకు
విందును గూర్చిన మొల్ల రామాయణం…!
*కోయిలలు కిరములు క్రూయగ నళివ్రజము లేయెడల*
*కూరగాయలు కూడుగా కుడుత్సున్నట్టి రాముడేరీతి*
*లంకకు రాగలడు*
అంటూ పామరులకు సైతం అర్ధమయ్యే భాషలో రచించిన మొల్ల రామాయణం…!
*మొగము బిగించి పాదముల మొత్తముగానట*
*సూదిత్రొక్కి,నీటుగ మొగమెత్తి భీకర కఠోర రవంబున వార్చి*
*బాహులత్యగణితలీల చాచి,*
*వలయంబుగ వాలము ద్రిప్పి వ్రేగునన్*
*నగము సగంబు క్రుంగ( గపినాథుడు నింగి దాటే రివ్వునన్*
అని హనుమంతుని సమద్రోల్లంఘన ఘట్టమును సత్యసముపేతంగా తేటతెలుగులో
దృశ్యమానం చేసిన
తెలుగు కవయిత్రి మొల్ల…!
*కట్టిన వస్త్రంబు కట్టుకొంగే తప్ప*
*జీర్ణించిపోయిన చీర తోడ*
*నుడుగని నగలచే నోరంత ప్రొద్దును*
*జెక్కింట జేర్చిన చేయి తోడ*
*బుడమిపై బొరలాడు నొడలు బూడిద బృంగి*
*నిరతంబు ధారగు కన్నీటి తోడ*
*నిడుద వెన్నెటి వేణి సడలించి జడలతో*
*నిరత నిరాహార నియతి తోడ*
*తే//గీ//*
*గినుక జంకించు దైత్య కామినుల నడుమ*
*దపము జేయుచు దనుజ బాధలకోర్చి*
*వనిత ప్రాణంబు దక్క సర్వము ద్యజించి*
*నిత్యమును మిమ్ము మదిలోన నిల్పియుండు*
అంటూ సీతాదేవి దైన్యస్థితిని
వర్ణించిన మొల్ల రామాయణం
కడు రమణీయం…!!!
*************************************
December 31, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

 కవితా జలపాతం

by Dr. Kanchanapally Gora December 31, 2021
written by Dr. Kanchanapally Gora

జీవితం ఒక పరిమళ

భరిత పుష్పమని

జీవితం ఒక హరిత హరిత గానమని

నిరూపించిన మహామనిషి

నడకలో లయ ,

మాటలో లయ,

నడతలో లయ

వెరసి సకలమూ కవిత్వలయగా

మలచిన మహా స్రష్టా,

హనుమాజీపేట

శుక్తి ముక్తి ముక్తాఫలం

కరీంనగర్ శిరసున

ఙ్ఞాన పీఠ కిరీటం ,

కవితా కస్తూరి వనంలో

ఎన్ని పదసుందరులు

నీ గంటంలో నూతన నాట్యం

చేయడానికి వేచి చూసేవో

ఎన్ని నదీమాతృకలు

నీలో ఆవాహన చెంది

అక్షర గవాక్షాలు

చీల్చుకొని ప్రవహించేవో

సి.నా.రే….

తెలంగాణ పల్లెతల్లి చీకటికంటిలో

వెలుగుపుంతా

తెలుగు జీవన సంగీతానికి

వైదుష్యపు హస్తన్యాసమా,

ఎలా నిన్ను మాతరం

మాగాణం విస్మరించగలదు?

కవితా జలఫాతానివైన

నీ అస్తిత్వం స్మరించకుండా

ఎట్లా కొనసాగగలదు ?

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us