మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

   స్వరాంజలి -4

by Krishna Kumari Yagnambhatt December 31, 2021
written by Krishna Kumari Yagnambhatt

క్షేత్రయ్య పదాలన్నీ చక్కని జాను తెలుగులో రచింపడ్డాయి. ఆ నాటి  తెలుగు భాషా స్వరూపం ఈ పదాల ద్వారా తెలుసుకోవచ్చును. అయినా ఇతను సంస్కృతాంధ్ర భాషలు రెండింటిలో సమాన మైన పాండిత్యం కలవాడు.అన్నమాచార్యుల వారు చెప్పిన సంకీర్తన లక్షణం ఈతని పదాలలో స్పష్టంగా కన్పిస్తుంది.దేశీయ కవిత లో అందె వేసిన చేయి గల ఈతని రచనలో ఎన్నో పలుకుబళ్ళు, సామెతలు అలవొకగా ఇమిడిపోయాయి.పదాలలోని సన్నివేశ చిత్రీకరణ గాని, వర్ణన గాని అత్యంత మనోహరం. జయదేవుని అష్టపదులు కూడా రాధాకృష్ణుల రాసక్రీడల వర్ణనలే కానీ అవి సంస్కృతంలో ఉండడం వలన  భాషా పటిమ గల పండితులకే పరిమితమైనవి. కానీ క్షేత్రయ్య పదాలు జాను తెలుగులో ఉండడం వలన పండిత పామర జన రంజకమయ్యాయి.తేట తెలుగు పదాలతో భావ గాంభీర్యాన్నివ్యక్తం చేయగల రచనా చాతుర్యం ఈతని ప్రత్యేకత. పదాల భావ పరిణామమంతా అలంకారిక మయమే. ప్రాచీన మహాకవుల ప్రయోగాలతో సమానమైన అలంకార ప్రయోగం చేయడం ఒక విశేషం. మల్లెలు గుభాళించి నట్లు,వేసవి కాలపు సాయంకాలం చల్లని గాలి వీచినట్లు, గున్న మామిడి తోపుల నుంచి కోయిల కూసినట్లు, నల్లని మబ్బుల నేపథ్యంలో తెల్లటి కొంగలు ఎగురుతున్నట్లు ఉంటుంది క్షేత్రయ్య కవిత. గతంలో సాహిత్యానికి పరమావధి నాటకమని అనేవారు. కానీ అన్నమయ్య క్షేత్రయ్యల  తర్వాత సాహిత్య పరమావధి పదం అనవచ్చును. ఎందుకంటే పదంలో ఇమడని భావం లేదు. అణువులో అణువు వంటిది,బ్రహ్మండం లో బ్రహ్మాం డం వంటిది ఈ పదం. క్షేత్రయ్య పద స్వరూపం ఇటువంటిది కాబట్టే దానిని మనసులో ఆస్వాదించడానికి గాని, అనుభవించడానికి గాని మామూలు చదువుతో పాటు ప్రత్యేక మైన సంస్కారం ఉండాలి; లలిత కళలలో ప్రవేశం ఉండామే గాకుండా వ్యుత్పత్తి అభ్యాసం వల్ల , అనుభవం వలన మనసు పరిపక్వత చెంది ఉండాలి. అందుకే క్షేత్రయ్య అక్షరాక్షరం పరమ ప్రమాణ మణి అన్న ముందు తరాల విద్వాంసుల మాటను శిరసా వహించాలే  తప్ప నిరసించకూడదు. క్షేత్రయ్య పదాలలో విషయాలు అనేకంగా ఉంటాయి. ఒక్కొక్క పదం చదివినా, పాడినా, అభినయించినా ఆ నాయిక మనోభావాలు, మనో వ్యధలు , బయటకు చెప్పుకోలేని ఎన్నెన్నో భావాలు మనకు స్పష్ట మవుతాయి. ఒక ఉదాహరణ చూడండి.

‘ఉసురని తల యూచునే శయ్యపై నుండి యులికి దిగ్గున లేచునే

కసరి దిక్కులు చూచునే కన్నీరు నించి

కనులెర్రగా చేసునే ఓ లలనరో ‘

ఆన్ ఈ గేయం విరహి నాయిక మనస్థితికి ప్రతిబింబం.

అట్లాగే క్షేత్రయ్య పద చిత్రణ అత్యంత సుందరం.

 

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నేటి స్థితి

by సుదర్శనం వేణుశ్రీ. December 31, 2021
written by సుదర్శనం వేణుశ్రీ.

సీ.       రైతులే మనకు పోరాట పటిమ చూపి

విజయమ్ము సాధించి వీరులైరి

ఎందరో ప్రాణాల నిట్టెనొదిలినను

స్ఫూర్తిని వీడక సోయి తోడ

రాజ్యహింసలనన్ని రైతులు భరియించి

పడరాని కష్టాల పడతులు పడి

పట్టు సడలకుండి ఫలితము సాధించ

ప్రాణాలనిచ్చిన భరతరైతు

తే.       జలము విద్యుత్తు లేకున్న జంకులేక

భాష్పవాయుతొ ప్రభుతయు బాధలేట్టె

కార్ల నెక్కించి చంపిన కదలకుండ

వెన్ను చూపులే రైతులు విజయులైరి

 

సి.       అంగట్లో వడ్లన్ని ఆగమై పోవట్టె

వానకు తడిసియు వరదమునిగె

వడ్లు తడువకుండా పాలకవర్గము

శాశ్వత షెడ్లను సత్వరమ్మె

నిర్మించ చేపట్ట నిధులనీయవలెను

వడ్లన్ని కొనలె వడివడిగను

రైతు జాగరణలు రాత్రి పగలు లేక

అమ్ముకొనవలెను అలుపులేక

తే.                రైతు బాగున్న దేశమ్మె రంగులీను

వానకాలము వడ్లపై వాదనేల

ఎండకాలమువడ్లకు నిప్పుడేల

ఉన్న దాన్యాన్ని కొనకుండ ఉచితమేన

 

సీ.       రాష్ట్రములోనున్న రైతులందరు నింక

వరిని సాగును చేయబందుపెట్టు

పత్తిమిరప పంట పండించవలె నింక

వ్యాపార పంటలే పాడియౌను

రైతుల స్థితియేమొ రంగుల బతుకులౌ

రాను రానేమౌనొ రాష్ట్ర జనము

రాష్ట్రము వరికొన రంగుల రాట్నాల

పైనె రైతును తిప్పి పంపుతుండు

తే.       కాలిమీద కాలెస్కుంటె కఱువు తీరు

చిన్న ధాన్యాలెయిక నుండి చిఱుతిండ్లె

అన్నమనుమాని రొట్టెలె యందరు తిన

జనులు ఆరోగ్యవంతులై చనుదురింక

 

సీ        కవులేమొ కొందరు కౌలుదార్లుగ పార్టి

వారలకు కవితలు వ్రాయుచుండి

పథకాలనన్నియు ప్రభుత పెట్టిరటంచు

అతిశయోక్తులతోడ నల్లుకొనుచు

కవితల పద్యాల కాగితాల నింపగ

గాయకుల గళాలో గానమొప్ప

ఆిపాడెదరుగ అన్ని సభలయందు

పదవులు ప్రజాకవులను బందిజేసె

తే.       పాలనల్జేయ పాలకవర్గముండె

పాతకొత్త పార్టీలన్ని బదురుకొనియు

వివిధ రాష్ట్రల నేలుచు పేద జనుల

బాధలను తీర్చగనెవరు వత్తురయ్య

 

 

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

బిడ్డా.. నువ్వు గెలవాలి!

by వేణు నక్షత్రం December 31, 2021
written by వేణు నక్షత్రం

“నాన్నా  రేపటి నుండి లాక్ డౌన్ ఎత్తేస్తున్నారట,చెల్లి కూడా ఇప్పుడే ఫోన్ చేసింది.  అందరమూ కలిసి రేపొస్తం” అంది కవిత చాలా రోజుల తర్వాత తల్లితండ్రుల్ని చూస్తున్నాననే సంతోషంతో.   “రండ్రి బిడ్డా రండ్రి! ఒక్కూర్లే ఉన్నట్టే కానీ,ఎన్ని రోజులాయె మిమ్మల్ని సూడక! ఈ మాయదారి  కరోనా వచ్చి అందరినీ ఆగమాగం చెయ్యవట్టె”  విచారంగా కొంత వేదాంత ధోరణిలో  అన్నాడు నారాయణ.

కరోనా మహమ్మారి తన ప్రతాపంతో  ప్రపంచాన్ని వణికిస్తుంది.  పిట్టల్లా జనాలు నేల కొరుగుతున్నారు. ప్రపంచం అంతా లాక్-డౌన్ లో ఉంది.  ఒక సేల్స్ ఆఫీసులో అకౌంటెంట్ గా పని చేస్తున్న కవిత కూడా ఇంటికే పరిమితం అయ్యింది. కవిత చెల్లి సవిత,  ఒక ఎం.ఎన్ .సి లో వైట్ కాలర్ ఉద్యోగం. అందరూ హైదరాబాద్ లోనే ఉన్నా కేవలం  స్కైప్, జూమ్, వాట్సాప్ లలో చూసుకోవడమే తప్ప ప్రత్యక్షంగా కలుసుకోక చాలా రోజులు అయ్యింది.

ఇంటికొచ్చిన  బిడ్డలిద్దరినీ చూడగానే, యుద్ధానికి వెళ్లి విజయంతో తిరిగి వచ్చిన సైనికుల్ని చూసినట్లు సంతోషంతో ముఖం వెలిగిపోయింది తల్లితండ్రులిద్దరికీ.  అందరూ ఒకరికొకరు కౌగలించుకుని కళ్ళు  చెమర్చారు కొద్దిసేపు.  తెలిసిన వాళ్ళు కరోనా భూతానికి బలైపోయిన విషయాలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

నారాయణకు ఐదేండ్ల క్రితం గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది.  అప్పటి నుండీ  ఆరోగ్యం రోజు రోజుకీ కొంత దెబ్బతింటుంది., మీడియా అత్యుత్సాహంతో  భయపెట్టే  కరోనా వార్తలు, చూసీ చూసీ నారాయణ మానసికంగా, శారీరకంగా ఇంకా  క్రుంగి పోయాడు!  బక్క చిక్కి పోయిన తండ్రిని చూడగానే బాగా జాలేసింది బిడ్డలిద్దరికీ.   వెళ్తూ వెళ్తూ తండ్రికి ఇష్టమయిన మద్యం ఒక చిన్న బాటిల్ తీసుకుపోయింది కవిత. బాగా బతికిన రోజుల్లో, వారంలో ఒకటి రెండు సార్లు మద్యం తీసుకునే వాడు. ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల కూడా బాగా తగ్గించేసాడు.  “ఎందుకు బిడ్డా గివన్నీ! వద్దని చెప్పినాను కదా!!”  అన్నాడు  కొంచెం నిష్టూరం కలిసిన ప్రేమతో తీసుకుంటూ!  తల్లి కూడా వారించింది బిడ్డని ఎందుకివన్నీ అని.

వెంటనే వెళ్లి ఒక గ్లాసు తెచ్చుకొని కొద్దిగా మందు ఒంపుకుని బిడ్డలను పక్కన కూర్చుండ బెట్టుకొని ఒక సిప్పు తీసుకున్నాడు నారాయణ. తల్లి చేసిన పకోడీలతో  తండ్రికి కంపెనీ ఇస్తూ కూర్చుని మాట్లాడుతున్నారు అందరూ.

“బిడ్డా.. నీకు చాలా రాజుల రోజుల నుండి ఒక ముచ్చట చెపుదాము అనుకుంటున్నాను!  ఇగో అందరున్నారు కదా  ఇనుండ్రి”  అని ఒక  సుక్క మందు నోటితో జుర్రుకొని మొదలు పెట్టాడు.  కవితకి అర్థం అయ్యింది ఏదో అతి ముఖ్యమైన విషయంచెప్పబోతున్నాడని.  ‘మందు పడ్డప్పుడే ఏవేవో మాట్లాడతాడు’  అని  అనుకోవాలని తండ్రి ప్రయంత్నం, కానీ  కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికే  మందు తాగుతాడు అని, మందు లేకపోతె మాట్లాడలేడు అనే విషయం ఎప్పుడో  అర్థమయ్యింది ఇంట్లో అందరికీ.

“బిడ్డా,  ఇగ నేనా ఇంకెక్కువ రోజులు బతకను.  నీకు తెల్వంది కాదు, వయసు డెబ్బయి దాటిపోయి మూడేండ్లయిపాయె. రోజు రోజుకూ ఏవో కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. మూణ్ణెల్ల కింద దమ్ము తీసుకోవడంలో ఇబ్బంది అయితే మీరు దవాఖానకు తీసుకుపోయి ఆక్సిజన్ పెట్టిచ్చుట్ల మళ్ళా  మంచిగయితిని.  దమ్మొచ్చిన్నప్పుడన్న మీరు దగ్గరుండి దవాఖానలకు తింపుతుండ్రు  కాబట్టి సరిపోయింది.  ఇప్పుడు కాకపొతే  రేపో, ఎల్లుండో, ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే!  ఇంక నేనా సాధించేది ఏదీ లేదు,  కానీ ఒక్క మాట!” అని మరొక్క సిప్పు జుర్రుకుని మళ్ళీ మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వింటున్నారు తల్లీ కూతుళ్లు.

“నాకా కొడుకులు లేరు,  ఉన్నది  మీరిద్దరే!  మిమ్మల్ని కూడా కొడుకుల్లేక్కనే పెంచిన, సదివిపిచ్చిన కద!  రేపు నేను పొతే మాత్రం,నాకు తలకొరివి నువ్వే పెట్టాలె!” అని ఒక పకోడీ ముక్క తీసుకున్నాడు.

“ఎక్కడయినా పెద్ద కొడుకు తండ్రికి, చిన్న కొడుకు తల్లికి  అంతిమ సంస్కారాలు  చేస్తారు. మీరు అదే పాటించుండ్రి.    ఇదొక్కటి చేస్తానని మాటివ్వు!” అని కవిత చేయి తీసుకుని చేయి చాపాడు నారాయణ.  తండ్రికి పెద్ద  కూతురు అంటే తాను,  తల్లికి తన చెల్లి సవిత  అంతిమ సంస్కారాలు చేయాలని, తల్లి నొచ్చుకోకుండా  చెప్పడం గ్రహించింది కవిత.

అనుకోకుండా ఇలాంటి కోరిక కోరడంతో కొంత ఉద్వేగానికి గురయ్యారు తల్లి కూతుళ్ళు.  “నాన్నా.. ఇప్పుడవన్నీ ఎందుకు? నీకేమి కాదు.  నేను చూసుకుంటాలే, నేనున్నాను కదా!”  వేడెక్కిన వాతావరణాన్ని కొంత తేలిక చేయాలని ప్రయత్నించింది కవిత.  సవిత కూడా జత కలిపింది అక్కతో.  తల్లి కొంత బాధగా లేచి అక్కడి నుండి వంటింట్లోకి వెళ్ళింది.

“అవునమ్మా, నేను అదే చెపుతున్నాము, నువ్వున్నావనే నా ధైర్యం.  నాకు తెలుసు, ఈ సుట్టాలు ఒక పట్టాన నెగలనియ్యరు.  మిమ్మల్ని సదివించాలంటేనే, నేను ఎందరికో సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది.  ‘ఆడోల్లకు సదువెందుకు, సక్కగ  పెద్ద మనిషి కాగానే పెళ్లి చేస్తే సరిపాయె’ అని అందరూ అనేటోళ్లే.  వాళ్ళు అట్ల అన్నందుకన్నా, జిద్దు తోటి మీ ఇద్దరినీ చదివించిన బిడ్డా.  నేనా సదువుకోక పోతి, ఏదో కంపెనీల రోజుకూలి కింద పని జేస్తి.  మీకు నా అసుంటి కష్టం రావద్దని చదివిస్తి. నాకు మాత్రం  కొడుకులయినా  బిడ్డలయినా మీరే కద!” కొంత ఉద్వేగానికి గురయ్యాడు నారాయణ.

మాట్లాడడానికి, వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ, నాన్న కోరుతున్నది చాలా న్యాయమైన కోరికే అని అర్థం అయ్యింది కవితకి.  ఆడపిల్లల్ని చదివించడం కూడా ఒక విప్లవాత్మక మార్పు నారాయణ కుంటుంబంలో.  ఆడపిల్లై ఉండి మొట్టమొదట స్కూల్ కి వెళ్ళింది కవితనే వాళ్ళ కుటుంబంలో.  కవితకి ఈ విషయం తండ్రి చెప్పినప్పుడు చాలా గర్వంగా అనిపించేది. తండ్రి అడిగిన కోరికకి కవిత సమాధానం చెప్పే వరకు ఊరుకోలేదు నారాయణ.  సరే అని చేతిలో చెయ్యి వేసింది కవిత, అప్పటికి గానీ శాంతించలేదు నారాయణ.

ఆ  తర్వాత కొద్దిసేపు  అవీ ఇవీ  మాట్లాడి  భోంచేసి బయలు దేరారు కవిత,సవిత.  తండ్రి గురించి ఆలోచిస్తుంటే చాలా  బాధేసింది కవితకి.  తన స్కూటీ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్లుతుంటే జ్ఞాపకాలు తన చిన్నప్పటి రోజుల్లోకి వెళ్లాయి.

*** *** ***

“ఇద్దరూ అమ్మాయిలే, ఒక బాబు ఉంటే  బాగుండు” అని చిన్నప్పుడు తల్లి సరోజ చాలా సార్లు అనేది తండ్రి తో.

“కొడుకైతేనేమీ, కూతరయితే నేమి,మళ్ళీ పిల్లగాడే పుడతాడని గ్యారంటీ ఏమిటి?”  అని గట్టిగా  వాదించేవాడు తండ్రి తల్లితో.

మరోసారి అడగడానికి అవకాశం లేకుండా  తానే వెళ్లి, పిల్లలు పుట్టకుండా వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. మళ్ళీ అమ్మాయే పుట్టిందని ఎందరో తండ్రులు, పురిట్లోనే పసిపిల్లల్ని అంత మొందించండం లాంటి ఎన్నో  వార్తలని చూసింది కవిత.  కానీ తన తండ్రి  ఇద్దర్నీ ప్రేమగా పెంచడం, తండ్రి పట్ల చాలా గౌరవం పెరిగింది. ఇద్దరూ అమ్మాయిలే  అని, ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు. సరిపోయీ, సరిపోనీ జీతంతో తాను, తిన్నా తినకున్నా కూడా ఇద్దరినీ గ్రాడ్యుయేషన్ వరకూ చదివించాడు.

నారాయణకు ఒక అన్న ఉండేవాడు, కొన్ని సంవత్సరాల క్రితం  చనిపోయాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు.  ఒకరోజు ఇంటికి వచ్చిన ఆయన   “అరేయ్  నారాయణా, నీకు ఎట్లాగూ మగపిల్లలు లేరు కదా! నా ఇద్దరి పిల్లల్లో ఎవర్నో ఒకర్ని దత్తత తీసుకుంటే వాడు మీ ఆలుమగలిద్దరినీ  ‘పున్నామ నరకం’ నుండి రక్షిస్తాడు”  అన్నాడు.  అప్పుడు నారాయణ వినీ విననట్టే ఆవిషయాన్ని దాటేసాడు. ఆయన వెళ్లిన తర్వాత  “ఆ కనపడని పున్నామనరకం ఉందో లేదో కానీ, వాళ్ళు మన ఇంటికి వస్తే మాత్రం ప్రత్యక్ష నరకమే!  నా పిల్లలు నాకు చాలు, వాళ్ళని ప్రయోజకులుగా చేస్తే అంతకంటే  స్వర్గం ఏముంటుంది?“ అని ఆరోజు  నారాయణ  తన ఇద్దరు బిడ్డల్నీ పొగడుతూ  కొంత వేదాంత ధోరణిలో భార్యతో చెప్పడం ఇప్పటికీ మరచిపోలేదు కవిత.

ఇద్దరు  కూతుళ్ళని కొడుకుల్లాగే పెంచాడు, కానీ కొడుకు అవసరం ఏంటో ఆ రోజుల్లో అమ్మ అంతగా ఎందుకు కోరిందో  ఇప్పుడర్థమయ్యింది కవితకి. కొడుకు మాత్రమే నిర్వహించే ఒక బాధ్యత  మిగిలి ఉంది అని ఈరోజే తెలిసింది కవితకి.  కానీ తండ్రి మాత్రం, ఆ భాధ్యతను కూడా కూతుళ్లే నిర్వహించాలని ఈ రోజు మాట వేయించుకోవడం చూస్తే, ఆడ పిల్లల్ని ఇంతగా ప్రేమించే తండ్రి  అంటే మరో మారు గౌరవం పెరిగింది కవితకి.

ఈ మధ్య లాక్ డౌన్ సమయంలో తండ్రికి  శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది అయితే ఎవరికీ ఫోన్ చెయ్యొద్దు అని తల్లితో ఒట్టు వేయించుకుని బాధనంతా తండ్రి కడుపులోనే తెగ మింగుకున్నట్టు అమ్మ చెప్పింది ఏడుస్తూ. కరోనా  మొదలవ్వని రోజుల్లో,  ఇంటికి దగ్గరి లోని నర్సింగ్ హోమ్ కి తీసుకు వెళ్తే  కొన్ని గంటలు ఆక్సిజన్ పెట్టితే, మళ్లీ  మామూలు స్థాయికి వచ్చే వాడు. ఇప్పుడు ఆ నర్సింగ్ హోమ్ లో ఎవరికో  కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల మూసివేశారట.  బయటకి పోయే పరిస్థితి లేనందువల్ల  ఎవ్వరికీ ఇబ్బంది కలిగించొద్దు అన్నాడట.   ఆ విషయం విన్నప్పటి నుండీ మనసు మనసులో లేదు కవితకి, తండ్రి పరిస్థితి గుర్తొచ్చి రెండు కళ్లూ నీటితో నిండిపోయాయి. తండ్రి ఆలోచనలు వెంటాడుతుండగా ఇంటికి చేరుకుంది కవిత.

*** *** ***

ఎప్పటి నుండో బిడ్డలతో చెప్పాలనుకున్న మాటలు చెప్పేయడంతో మనసు చాలా తెలీకయ్యింది నారాయణకి. చాలా సంతోషంగా కూడా ఉంది. నారాయణకి  కవిత అంటే చాలా ప్రేమ, నమ్మకం.  ఆలోచనలు కవిత చుట్టూ తిరుగుతున్నాయి.

కొడుకులా పెంచినందుకు తన కుంటుంబాన్ని  కూడా మగవాడి లాగే దగ్గరుండి నడిపిస్తుంది, చాలా ధైర్యవంతురాలు.   క్వారీలో పనిచేస్తున్న భర్తకు  దుమ్ము, ధూళితో ఆస్తమా వచ్చి, జీతం కన్నా హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతుంటే, ఉద్యోగం మానేపించి ఏదైనా వ్యాపారం చెయ్యమని చెప్పింది.  భర్త రియల్ ఎస్టేట్ అని ఎచ్చులకు పోయి అప్పుల్లో కూరుకు పోతే, కవిత ఉద్యోగం చేస్తూ తనే కుటుంబాన్ని పోషిస్తుంది ఇప్పుడు. అంతే కాకుండా ఈ మధ్యనే బ్యాంకు నుండి లోను తీసుకుని, తన వంటిమీద  ఉన్న బంగారం కూడా అమ్మేసి, ఒక ఇంటికి  యజమాని కూడా అయ్యింది. ఆడవాళ్లు తమ కిష్టమయిన బంగారాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడరు, కానీ  కుటుంబం కోసం సంతోషంగా బంగారాన్ని అమ్మేసింది కవిత.  ఈరోజుల్లో భార్య మెడలో ఉన్న బంగారం కోసం హింసించి తీసుకెళ్లే భర్తలున్నారు. ఇప్పుడు భర్త కూడా బంగారం అమ్మొద్దని చెప్పినా  రేపటి రోజుల గురించి ఆలోచించడం కవిత  దూర దృష్టికి, కుటుంబం పట్ల వహిస్తున్న  బాధ్యతలని చూస్తే చాలా గర్వంగా ఉంది తండ్రికి.  కానీ ‘లోను’ తీర్చడానికి, సంసారాన్ని నడిపించడానికి కవిత  పడుతున్న కష్టాన్ని, ఆమె బోసి పోయిన మెడను చూస్తూ తట్టుకోలేక పోయేవాడు నారాయణ.   ఆలోచనలు కవిత చుట్టూ తిరుగుతుంటే, ఒక భారం దిగిపోయిన తృప్తితో హాయిగా నిదురపోయాడు నారాయణ.

*** *** ***

కరోనా ఇప్పట్లో తగ్గేలా లేదు, కరోనాతో  కలసి ప్రయాణించాల్సిన అవసరం ఉంది అని,  ప్రభుత్వం అన్ని  వ్యాపారాలు, ఆఫీసులు ప్రారంభించుకోవచ్చు అని ప్రకటన చేయడంతో మెల్లమెల్లగా వ్యాపారాలు తెరచుకుంటున్నాయి.

ఆఫీసుకుకి రమ్మని, మేనేజరు నుండి ఫోన్  రావడంతో మాస్క్ ధరించి, భయం భయంగా ఆఫీసుకి  వెళ్ళింది కవిత.  లాక్-డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు విపరీతంగా బయట పడుతున్నాయి.  కనిపించని శత్రువుతో అందరిలో గుబులు మొదలయ్యింది .  కవిత గత అయిదు సంవత్సరాలుగా వెళ్తున్నది అదే ఆఫీసు, అదే వీధి, అదే మనుషులు –  కానీ ఇప్పుడు అంతా  కొత్తగా,  శత్రువులు లేని యుద్ధభూమిని తలపిస్తుంది. కనిపించిన  ప్రతి ఒక్కరూ, ఒకరికి-ఒకరు శత్రువులాగే కనిపిస్తున్నారు.  రోజూ పక్క పక్కనే కూర్చుని గంటలకొద్దీ  మాట్లాడుతూ పనిచేసిన కొల్లీగ్స్ తో కూడా ఇప్పుడు పక్కన కూర్చోవాలి అన్నా, మాట్లాడాలన్నా  భయం.  మాస్కులు ధరించడం వల్ల  తెలిసిన వాళ్ళని కూడా కొన్ని సార్లు  కొత్త గా పరిచయం చేసుకోవాల్సిరావడం వింతగా ఉంది. పక్క ఆఫీసుల్లో పని చేసే ఇద్దరు వ్యక్తులు కరోనాతో చనిపోయారు అని తెలిసి ఆఫీసు బయటకి వెళ్ళడానికి చాలా భయపడింది కవిత.

అప్పటికి ఒక వారం గడిచింది. మెల్లి మెల్లిగా పరిస్థితులకు అలవాటు పడుతున్నారు  ప్రజలందరూ.   రోజులాగే ఆరోజు కూడా ఆఫీసుకి వెళ్ళింది.  వీలయినప్పుడన్నా తల్లి తండ్రులతో మాట్లాడుతుంది. తండ్రికి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు అన్న  విషయం తెలిసినప్పటి నుండి  రోజూ రెండు మూడు సార్లు ఫోన్ చేసి పరిస్థితి కనుక్కుంటుంది కవిత.  ఆఫీసుకి వెళ్లే ముందు ఫోన్ చేసి మాట్లాడింది తండ్రితో.

“నాకేమయింది బిడ్డ , నేను మంచిగున్న. ఏం ఫికర్ చేయకు” అన్నాడు నారాయణ.  ఆ తర్వాత ఆఫీసుకి వెళ్లిన కవిత పనిలో బిజీ అయిపొయింది,  అంతలో అనుకోకుండా అమ్మ నుండి ఫోన్ వచ్చింది  “నాన్నకి శ్వాస తీసుకోవడం లో చాలా ఇబ్బంది అవుతుంది” అని.

ఇంకేమాత్రం ఆలస్యం చేయక వెంటనే ఇంట్లో ఉన్న భర్తకి  ఫోన్ చేసి, తండ్రిని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని చెప్పింది కవిత.  ముందు ఫోన్ చెయ్యమంది హాస్పిటల్ కి. కరోనా మహమ్మారి  వల్ల చాలా వరకు హాస్పిటల్స్ మూసివేయ బడ్డాయి, కొన్ని హాస్పిటల్స్ కేవలం కోవిడ్ కేసుల కోసమే తెరిచారు.  కోవిడ్  భయంతో  చాలా వరకు  హాస్పిటల్స్ సాధారణ  పేషంట్స్ ని  చూడడం లేదు.  కవిత భర్త  దగ్గరలోని రెండు హాస్పిటల్స్ కి ఫోన్ చేస్తే నిరాశే ఎదురయ్యింది.

సమయం చూస్తే మధ్యాహ్నం మూడు గంటలు.  విషయం తెలిసిన కవిత, సహాయం చేస్తారనుకున్న  మిత్రులు కొందరికి  ఫోన్ చేసింది.  కావాల్సింది తాత్కాలిక ఆక్షిజన్ ఏర్పాటు, కానీ ఏ  హాస్పిటల్ వాళ్ళు సిద్ధంగా లేరు ఆక్షిజన్ మాస్క్ అమర్చడానికి.  కోవిడ్  కేసు కాదు అని చెప్పినా వినే  పరిస్థితిలో ఎవరూ లేరు.

ఆక్సిజన్ పెట్టడం ఎలా అని ఆలోచించింది.  విషయం కనుక్కున్న  కొల్లీగ్,  తనకు తెలిసిన ఒక  వ్యక్తి ఫోన్ నంబర్,ఇంటి అడ్రస్ ఇచ్చాడు.  అతడు ఆక్షిజన్ సిలండర్ తో  పేషంట్ ఇంటికే వచ్చి అమర్చుతాడు అన్నాడు. ఇదేదో మంచి సదుపాయం అని వెంటనే ఫోన్ చేసింది ఆనంబర్ కి.  ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవ్వరూ లేపడం లేదు.  భర్తకు కూడా ఆ వివరాలు ఇచ్చి, ఫోన్ లేపక పొతే ఒకసారి వెళ్లి చూసిరమ్మంది.  కవిత భర్త వెళ్లి చూస్తే అది ఒక మెడికల్ షాప్, బందు చేసి ఉంది.  లోపల ఎవరూ లేరు.

నారాయణ కి ఆయాసం ఎక్కువ అవుతుంది, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది, పరిస్థితి విషమిస్తుంది .   చెల్లికి కూడా ఫోన్ చేసింది కవిత.  వెంటనే సవిత తన భర్తకు ఫోన్ చేసి రమ్మంది. వాళ్లకు స్వంత కారు ఉంది, వచ్చే వరకు ఉండమని తల్లికి చెప్పింది.  కొద్దీ సేపు ఎదురు చూసారు,  కానీ  నారాయణకి  ఇబ్బంది కావడంతో ఆటో  మాట్లాడుకొని దగ్గరలోని హాస్పిటల్ కి వెళ్లారు అత్త, అల్లుడు .  ఆ హాస్పిటల్ వాళ్ళు పేషంట్స్ ని తీసుకోవడం లేదు అని తెలిసినా, బ్రతిమిలాడితే పని అవుతుందేమో అన్న ఆశతో అక్కడి వరకూ వెళ్లారు.  ప్రభుత్వాసుపత్రికి  తీసుకు వెళ్లామన్నారు గేటు బయటే. కానీ ప్రభుత్వాసుపత్రిలో ఖాళీ బెడ్స్ లేవు అని ప్రచారం జరుగుతుంది.  చేసేదేమీ లేక ఇంకొంత దూరంలో ఉన్న మరొక హాస్పిటల్ కి వెళ్లారు, అక్కడా అదే పరిస్థితి.  ఈ లోపుల కవిత కొన్ని హాస్పిటల్స్ కి ఫోన్ చేస్తూనే ఉంది.

ఆటోలో అచేతనంగా భార్య భుజాలపై ఒరిగిన నారాయణకు ప్రాణాలు అవిసిపోతున్నాయి శ్వాస ఆడక.  ఊపిరి బిగపట్టుకుంటున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు.

ఎక్కడన్నా, ఏ హాస్పిటల్ వాళ్ళు అయినా కరుణించి  వైద్యం చేస్తారేమో అని ఆశతో  గత మూడు గంటల నుండీ     దవాఖానా  కోసం ఆటోలో తిరుగుతూనే ఉన్నారు.  చివరకు సికిందరాబాద్ లో ఒక నర్సింగ్ హోమ్ వాళ్ళు తీసుకు రమ్మన్నారు.  వెంటనే అడ్రస్ వాట్సప్ లో పంపింది భర్తకి కవిత.  తండ్రిని తీసుకు రమ్మని చెప్పి తానూ బయలు దేరింది హాస్పిటల్ కి. చెల్లి కూడా ఎక్కడికి రావాలో తెలియక కంగారుపడుతుంటే హాస్పిటల్ అడ్రస్ చెప్పింది.

కవిత హాస్పిటల్ కి చేరుకొని, తండ్రి కోసం ఎదురు చూస్తుంది.  భరించరాని నొప్పి, చిన్న పిల్లాడిలా  విల విల లాడుతున్నాడు. మధ్య మధ్యలో పెద్దగా ఒక  శ్వాస తీసుకుంటున్నాడు.  దాదాపు ముప్పై నిమిషాల పైనే పడుతుంది హాస్పిటల్  చేరుకోవడానికి నారాయణ దంపతులకి. చుట్టూ హాస్పిటల్సే, కానీ ఏమీ చేయలేక, తన అస్సహాయతకు బాధపడుతూ  ఓదార్చుతుంది భర్తని  సరోజ.  కవిత  ఫోన్ చేస్తూనే ఉంది, కానీ తండ్రి  మాట్లాడే పరిస్థితిలో లేడు, తల్లితో మాట్లాడుతుంది.  హాస్పిటాల్  చేరుకోవడానికి  ఇంకో  పది నిమిషాలు ఉంది అనగా, ఒక దీర్ఘ శ్వాస తీసాడు నారాయణ. అదే చివరి శ్వాస అని ఊహించలేదు ఎవ్వరూ!

కవిత తల్లి తో మాట్లాడుతూ, హాస్పిటల్ సిబ్బందిని సిద్ధం చేసింది.  ఈ లోపుల హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆటో రాగానే కంగారు పడుతూ పరుగెత్తింది కవిత.  తండ్రి ఉలుకూ పలుకూ లేక ఉండటం మనసు కీడుని శంకించింది. ఆ భయాన్ని తనలోనే దాచుకుంది.  అంతలోనే  ముందు కరోనా కోసం టెంపరేచర్ చెక్ చేయడానికి నర్సు వచ్చింది,  కానీ శరీరంలో ఎలాంటి స్పందన లేక పోవడం వల్ల వెళ్లి డాక్టర్ కి చెప్పింది.  డాక్టర్ వచ్చి పల్స్ చూసి,  చాలాసేపటి క్రితమే శ్వాస ఆగిపోయింది, ఇంకేం లాభం లేదు, ఇంటికి తీసుకెళ్లమని  చెప్పాడు.

విషయం తెలిసి ఘొల్లుమని ఏడ్చారు తల్లీ బిడ్డలు.  అంత కష్ట పడి అన్ని హాస్పిటల్స్ తిరిగి వస్తే తండ్రితో చివరి మాటలకి కూడా నోచుకోలేదు అని కవిత కన్నీరు మున్నీరు అయ్యింది.  ప్రతి పేషంట్ ని కరోనా రోగి లానే అనుమానించడం చాలా బాధేసింది కవితకి.  ఏదో  ఒక హాస్పిటల్ లో కొంత సేపు ఆక్సిజన్ పెట్టితే  బ్రతికేవాడు.  చుట్టూ హాస్పిటల్లే అయినా ఒక్క హాస్పిటల్ కూడా వైద్యం అందిచండానికి ముందుకు రాలేదు.  “ఇది ముమ్మాటికీ  హాస్పిటల్  యజమాన్యం చేసిన  హత్యనే “ గట్టిగా  అరవాలనిపించింది, కానీ మాటలు గొంతు పెగల్లేదు.

చాలా కోపం, దుఃఖం వస్తుంది, కానీ తాను కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటే జరగాల్సిన పనులు ఎవరూ చేయరు అని దుఃఖాన్ని కడుపులోనే మింగుకుంది.  తల్లిని ఓదార్చడం తమ వల్ల  కాలేదు కవితకి.  అంతవరకూ  స్వంతంగా నడుచుకుంటూ వచ్చి  ఆటోలో కూర్చున్న వ్యక్తి కొన్ని నిమిషాల్లో నిర్జీవం అయిపోవడం నమ్మలేకుండా ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోక ముందే  సెక్యూరిటీ గార్డ్ వచ్చి, అక్కడినుండి  వెళ్లిపోవాలని పురమాయిస్తున్నాడు.  ఆటోవాడు నారాయణ పార్థివ శరీరాన్ని అక్కడే దించేస్తాను, తీసుకుపోను అంటాడు.  ఒక మనిషి కష్టాల్లో ఉంటే  ఏ మాత్రం పట్టించుకోకుండా, సహాయం చేసేది బదులు ఇలా ఇబ్బందులకి  గురిచేయడం చూస్తుంటే చాలా కోపం, అసహ్యం కలిగింది కవితకి.

ఒకపక్క చెల్లి కొద్ది సేపట్లో వస్తుంది అని చెప్పింది. ఇక్కడ వెయిట్ చేయడానికి కూడా అనుమతించడం  లేదు.  అంతవరకూ మనిషిగానే  ప్రవర్తించిన ఆటోవాలా సాటి మనిషి మరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం, గత మూడు గంటల నుండీ తన ఆటోలో ఎక్కించుకొని తిరిగిన వారి మనోభావాలను కనీసం పట్టించుకోకుండా,  ఆపదలో ఉన్న వారి నుండి  ఆర్థిక ప్రయోజనాలకోసం వెంపర్లాడటం చూస్తే ఏమనాలో తెలియలేదు కవితకి. మొత్తానికి కవిత భర్త  ఏదో బేరం కుదుర్చుకుంటే సరే అని ఇంటికి తీసుకెళ్లాడు ఆటోవాలా.

తండ్రిని బ్రతికించుకోవాలని ఎంతో  ఆరాటంతో  కనపడ్డ ప్రతి హాస్పిటల్ తలుపు తడుతూ , చివరికి ఇక్కడికి  చేరుకుంటే హాస్పిటల్ సిబ్బంది తమ పరిస్థిని అర్థం చేసుకోకుండా అక్కడి నుండి వెళ్లిపొమ్మని తరిమి వేయడం చూస్తుంటే  మానవత్వం అనేది డబ్బు పొరలతో కప్పివేయబడిందా  అనిపించింది కవితకి. ఎవ్వరికీ ఇతరుల కష్టాలతో కానీ, వారున్న పరిస్థితిని  అర్థం చేసుకోకుండా, కేవలం తమ అవసరాన్ని  ఆర్ధిక ప్రయోజనంలా మార్చుకోవడము చూస్తుంటే ఏమనాలో తెలియలేదు  కవితకి.

ఆటోలో వెళ్తూ చెల్లికి ఫోన్ చేసింది, ఇద్దరూ ఫోన్లో నే ఏడుస్తూ,  దగ్గరి చుట్టాలందరికీ కవిత  ఫోన్ చేసి చెప్పింది.  తల్లి తండ్రుల రక్త సంబంధీకులు అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి తెలిసిన కొన్ని గంటల్లోనే వచ్చారు. కరోనా  కట్టడి సమయం కాబట్టి కొద్ది మంది పెద్దవాళ్ళు రాలేము అన్నారు. జరగాల్సిన పనులు ఇద్దరు అల్లుళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

సరోజ చెల్లెలికి ఇద్దరు కొడుకులు భాస్కర్, రమేష్.  కవిత – సవిత లతో  బాగా కలసి ఉంటారు,  నెలకొక సారి అయినా   రెండు ఫ్యామిలీలు  కలుస్తుంటారు.  విషయం తెలియగానే అందరూ వచ్చారు.  ఇద్దరు బావలతో  కల్సి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు  కవిత   కజిన్స్  భాస్కర్, రమేష్.  వారు రాగానే చాలా  ధైర్యం వచ్చింది కవితకి, పట్టుకుని ఏడ్చింది చాలా సేపు. అందరూ కవితకి, వాళ్ళ నాన్నకి ఉన్న అనుబంధాన్ని పొగుడుతూ చెపుతుంటే దుఃఖం రెట్టింపు అయ్యింది కవితకి.

పెదనాన్న కొడుకులు, పెద్దమ్మ, కవిత – అత్తా,మామ,మరుదులు అంటే తన భర్త తమ్ముళ్లు, సవిత – అత్తా మామలు,ఆడబిడ్డ అందరూ వచ్చారు.  కొత్తవాళ్లు వచ్చినప్పుడల్లా ఏడ్పులు మిన్నంటుతున్నాయి.    అప్పటికే దగ్గరి బంధువులందరూ వచ్చారు, చీకటి కాబోతుంది.

“అందరొచ్చినట్టే కదా, ఇంకా ఎవరి కోసం ఎదురు చూసేది లేదు తంతు మొదలు పెట్టండి, అంతిమ సంస్కారాలు ఎవరు చేస్తున్నారు ” అన్నాడు కార్యక్రమాలు నిర్వహించే కులపెద్ద.

తండ్రి కోరిక ప్రకారం, పెద్ద కూతురు కవిత తలకొరివి పెడుతుంది అని తల్లి చెప్పింది అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కులం పెద్ద మనిషికి.   అసలే  తండ్రి పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న కవితకి   ఆ విషయం అప్పటిదాకా గుర్తుకు రాలేదు.   నాన్నకి ప్రామిస్ చేసిన విషయం ఎప్పుడో మర్చిపోయింది ఈ హడావిడిలో.  తల్లి చెప్పగానే కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధురాలు అయ్యింది కవిత.

‘పెద్ద బిడ్డ తలకొరివి పెడతదట’  అన్న  మాట విన్న కులపెద్ద, వెంటనే అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు కోపంతో.  “నా జిందగీల చూడలేదు ఆడోల్లు తలకొరివి పెట్టంగ.  చిన్నాయిన, పెద్దనాయిన కొడుకులు ఎవ్వరూ లేరా? అసలు మొగోల్లే లేరా  వంశంల అగ్గి పెట్టడానికి?  గీ ఆడోల్లు చేసుడేంది?”  రెచ్చి పోతున్నాడు మద్యం మత్తులో ఉన్న ఆ పెద్ద మనిషి.  భాదిత కుటుంబాల దుఃఖంతో  అసలే పనిలేదు, కానీ వారికి మాత్రం మద్యం అందించాల్సిందే అడిగినప్పుడన్నా.  ఆయన తృప్తిగా ఉంటే  చనిపోయిన వారికి ఆత్మ శాంతిస్తుందని చెప్పుకుంటారు.  అందుకే ఆయనకు కోపం  రాకుండా చూసుకుంటారు ఇలాంటి సందర్భాలలో.

ఈ వార్త  కొన్ని సెకండ్లలో అక్కడ ఉన్న  అందరికీ చేరి పోయింది.  కొద్దిమంది  గుసగుసగా చెవులు కొరుక్కుంటున్నారు  ‘ఆడపిల్ల తలకొరివి పెడుతుందట అని.

“అమ్మాయి, మన వంశం వాళ్ళు ఇంకో వంశం వారికి తలకొరివి పెట్టకూడదు. అందులో ఆడ పిల్లలు అసలే పెట్టకూడదు” అన్నాడు కవిత మామ అంటే తన భర్త తండ్రి.  సాధారణంగా ఆయన చాలా సౌమ్యుడు,కోడలన్నా మంచి గౌరవం. ఎప్పుడూ తను చేసే అన్ని పనులనూ  సమర్థించే మామయ్య కూడా ఈ రోజు ఏదో తప్పు చేసినట్టు వద్దని వారించడం, విషయం అంత సీరియస్ గా ఉంటుందని అనుకోలేదు కవిత.

“మన వంశంలో ఇద్దరు కొడుకులు ఉండగా, వేరే ఇంటికి ఇచ్చిన  పిల్లతోటి ఎట్ల తలకొరివి పెట్టిస్తరు? మేమేమన్నా ఆస్తులు , పాస్తులు  పంచివ్వమన్నామా తలకొరివి పెట్టినందుకు?“  కొడుకులను చూపిస్తూ అంది పెద్దమ్మ అంటే తన తండ్రి అన్న భార్య.

“పెద్ద బిడ్డ తలకొరివి పెడుతుందట, విడ్డూరం కాకపొతే ఎక్కడన్నా విన్నారా? ఇంకో ఇంటికిచ్చిన ఆడిపిల్లలు  తలకొరివి పెడతారా? అల్లుళ్ళ కు తెలివి లేదా? ఎట్లా ఒప్పుకుంటారు పెళ్ళాం తలకొరివి పెడుతుంటే? ”  పెదనాన్న వాళ్లకు సంబంధించిన ఎవరో దూరపు బంధువు అంది అందరికీ వినబడేట్టు, అగ్నికి ఆజ్యం పోసినట్టు.

పనిలో పనిగా అప్పటికే బయటకి వెళ్లిన ఇద్దరు అల్లుళ్ళు కొంత మద్యం సేవించి వచ్చారు. రెచ్చగొట్టే విధంగా ఉన్న  ఆ ముసలమ్మ మాటలు ఇద్దరు అల్లుళ్ళూ విన్నారు.  పెద్ద అల్లుడు అంటే కవిత భర్త  ఇలాంటి విషయాలు పెద్దగా  పట్టించుకోడు, భార్య ని సమర్థిస్తాడు ప్రతీ విషయంలో.   అసలే మందు మీదున్న చిన్న అల్లుడు రాజు కి రోషం పొంగుకు వచ్చింది ముసలమ్మ అన్న మాటలు విన్నాక.

“మేము ఇంటి అల్లుళ్ళము,  మాకు అన్ని  హక్కులు ఉంటాయి.  కొడుకుల తర్వాత  మేమే కొడుకుల్లాంటి వాళ్ళం.  తలకొరివి పెట్టేది మగవాళ్ళు మాత్రమే!  మేము, ఆడవాళ్లు పెడితే  ఒప్పుకోము. వదినా.. నువ్వే  తలకొరివి  పెట్టాలనుకుంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం, ఆ తర్వాత  నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో! “   కవిత భర్త తరుపున కూడా వకాల్తా పుచ్చుకున్నట్టు, అరిచాడు రాజు. సవిత వారిస్తున్నా వినడంలేదు రాజు,  ఇంత వ్యతిరేకత తమ ఇంటి నుండే మొదలు అవుతుందని ఊహించలేదు కవిత.

అంత వరకూ తనూ ఇంటి వాడే అన్నట్టు అని పనులు పురమాయిస్తున్న తన చెల్లెలు భర్త  ఆవేశాన్ని ఆపుకోలేక అలా అరవడం, ఊహించక  తట్టుకోలేక పోయింది కవిత.  ఆపత్కాలంలో అందరూ ఆదుకుంటారని అనుకున్న కవితకి, సమస్య ఇంత జటిలంగా ఉంటుందని ఊహించలేక పోయింది. ఆ రోజు తండ్రి చేతిలో చేయి వేసి మాట ఖచ్చితంగా ఎందుకు వేయించుకున్నాడో, ఆ విషయం  తీవ్రత ఎంత ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా  అర్థమయింది  కవితకి.

అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న కవితని ఓదార్చడం అటుంచి,  తాగి వచ్చి ఈ రోజు తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా తిరగబడడం తట్టుకోలేక పోయింది. ఎవరో బయటి వారు అంటే తిరిగి జవాబు ఇవ్వాలని అనుకుంది, కానీ తన స్వంత మరిది, పెద్దమ్మ, మామగారు ఇలా అందరూ తన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళే ఈ రోజు ఎదురు తిరగడం తట్టుకోలేక పోయింది కవిత.  సవితకి భర్తని అనేంత  స్వతంత్రం లేదు,  కనీసం ఆపడానికి కూడా ధైర్యం లేక పోయింది  అలా మాట్లాడుతుంటే.  తండ్రికిచ్చిన మాట కోసం ఎట్టి పరిస్థితిలో వెనుకడుకు వేసేది లేదని నిర్ణయించుకుంది కవిత.

“నేను చేస్తున్న పని నా కోసం చెయ్యట్లేదు, నా తండ్రి చివరి కోరిక!  నేను తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను”  అని  గట్టిగా అరిచింది, కానీ ఏడ్చి ఏడ్చి నోరు ఎండి పోయింది, గొంతు కూర్చిండి పోయింది.  మాటలు  నోరు దాటి రాలేకపోయాయి.

“ఈ సుట్టాలు ఒక పట్టాన నెగలనియ్యరు” ఆ రోజు తండ్రి అన్న మాటలు గురుకు వచ్చాయి.  తన ముందు ఏ మార్గం కనపడటం లేదు, కార్యక్రమం నిర్వహించాల్సిన కులపెద్ద చాలా కోపంగా ఉన్నాడు.  బాగా ఆలోచిస్తుంది ఎలా మొదలు పెట్టాలా అని. ఎవరో మంచి నీళ్లు తెస్తే తాగి గొంతు తడుపుకుంది.    కులపెద్దని ఏమన్నా అంటే పరిస్థితి ఎక్కడికో పోతుంది, ఆయన ఈగో హార్ట్ కాకుండా  పరిస్థితి అర్థం చేయాలి అనుకుంది  కవిత.  ఆయన కనుక అలిగి పొతే అరిష్టం అంటారు,  ఇక అందరితో మాటలు పడాలి.  బాగా ఆలోచించింది, పుట్టెడు దుఃఖంలో కూడా తన బాధ్యతని మరచి పోలేదు.

కవిత ఏమీ మాట్లాడక పోవడం చూస్తుంటే భాస్కర్ కి చాలా కోపం వచ్చింది.  భాస్కర్ తమ్ముడు రమేష్ కూడా పరిస్థితి గమనిస్తున్నాడు.  కానీ కవిత అంత తొందరగా దేన్నీ వదులుకోదు అని తెలుసు వాళ్ళిద్దరికీ.  కవిత భర్త కూడా చూస్తూ ఉన్నాడు కానీ ఎవరినీ ఏమంటే పరిస్థితి ఎలా మారుతుందో అర్థం కాక మౌనంగా చూస్తున్నాడు.  తన భార్య అంతిమ సంస్కారాలు చేయడం అతనికేమీ అభ్యంతరం లేదు, తనకు తండ్రి అంటే ఎంత ప్రేమనో  తెలుసు.  కవిత తల్లి  కూడా పుట్టెడు దుఃఖంలో ఉంది, కూతురు పరిస్థితికి లోపల చాలా చింతిస్తుంది. తన భర్త చివరికోరిక దక్కక్కుండా పోతుందేమో అని అంత దుఖంలోనూ భయపడుతుంది.

కవిత తన మౌనాన్ని అంగీకారం అనుకున్నాడు మరిది.   తన ఆలోచనలని తీవ్రం చేసింది.  ఈ రెండు మూడు నిమిషాల్లో తాను మాట్లాడక పొతే,  మరెప్పటికీ సరిదిద్దు కోలేని ఒక పెద్ద తప్పు, తన తండ్రి చివరికోరిక ను తీర్చలేని అసమర్ధురాలి గానే  జీవితమంతా మిగిలి పోవాలి” అనుకుంది.

“తండ్రి తమ కోసం ఎంతో  చేసాడు, కష్టపడి  చదివిస్తే ఆయనకు చివరి రోజుల్లో ఒక మంచి జీవితం అందించలేక పోయాను, చివరికి ఒక కృత్రిమ ఆక్సిజన్ పెట్టించలేక  పోయాను” అని  కరోనా భూతాన్ని తిట్టు కుంటూ,   కుమిలి పోయింది  మనసులో.  తండ్రి శవం పై పడి బోరున విలపిస్తుంటే అక్కడ ఉన్న వారి అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.  కొద్దిసేపు తల్లిని పట్టుకుని కడుపులో గూడుకట్టుకున్న  దుఃఖమంతా పోయేవరకు ఏడ్చింది.  “నాకేమి కాదమ్మా ఫికర్ చేయకు” అని అన్న తండ్రి కొన్ని గంటల్లో  తమకు దక్కకుండా పోవడం, హాస్పిటల్ వాళ్లు ఎవరన్నా సమయానికి ఆక్సిజన్ పెడితే  ఈ రోజు తమ తండ్రి తమతో ఉండేవారు అని అక్కాచెల్లెళ్ళిద్దరూ  విలపిస్తుంటే ఆ దృశ్యం అక్కడున్న వారి గుండెలను పిండేసింది.   ఆ బాధ లోంచి, తండ్రి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ, బలాన్ని ధైర్యాన్ని చేకూర్చుకొని, తన తండ్రి అంతిమ సంస్కారానికి మానసికంగా సిద్ధం అయ్యింది కవిత.

“తన తండ్రి అంతిమ సంస్కారం కోసం ఇంకొకరిని అడిగేదేముంది?  ఒక్కసారి కూడా తన తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించని వారి కోసం తన నిర్ణయాన్ని మార్చుకోవాలా?”   ఆలోచనలు పదునెక్కుతున్నాయి కవితకి.

పెద్దమ్మ  వాళ్ళను, ఇంకో పెద్దమనిషిని పెద్దగా పట్టించుకోదలచుకోలేదు, వారికి జవాబు ఇవ్వడం కూడా వ్యర్థం అనుకుంది, కానీ సమస్య అంతా  కార్యక్రమం నిర్వహించాల్సిన కులపెద్దని  ఒప్పించడం పెద్ద సవాల్ గా మారింది.  రాజు తండ్రి అంటే తన చెల్లి మామయ్య, ఒక రిటైర్డ్  గవర్నమెంట్ అధికారి. ఎక్కడ అయినా చాలా హుందాగా ప్రవర్తిస్తాడు, మొత్తం ఫ్యామిలీ లో బాగా చదువుకున్న వాడు అని పేరు. ఇంతకు ముందే వచ్చి కూర్చున్నాడు, కవితని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు.  రాజు తన తండ్రి పక్కనే కూర్చున్నాడు, ఆయన పక్కనే కులపెద్ద కార్యక్రమ నిర్వాహకుడు  కూర్చొని  గుర్రుగా చూస్తున్నాడు కవితని.

మరిది దగ్గరకి వెళ్లి  “రాజూ .. నీవు చెప్పింది అంతా  విన్నాను. ఇప్పుడు నాకు, నా తండ్రి చివరి కోరికను తీర్చడం కన్నా వేరే  మార్గం లేదు.  కొడుకు తర్వాత  కొడుకులం  అన్నావ్, నిజంగా ఆ మాటకు కట్టుబడి ఉంటే నా తండ్రి చివరి కోరిక ఏదో, దాని విలువెంతో తెలుసుకో!  కాదు కూడదూ అంటే  నీ ఇష్టం.  ఇది నా తండ్రి చివరి కోరిక, ఖచ్చితంగా ఆయన అంతిమ సంస్కారం  నేనే చేసి తీరుతాను . అయినా, ప్రపంచమంతా  స్త్రీలకు,  పురుషలకు ఒకటే రూలు అని, చివరకి సుప్రీం కోర్టు కూడా తరతరాలుగా  ప్రవేశం లేని గుళ్ళకి స్త్రీలను అనుమతిస్తుంటే, కన్న తండ్రి  చివరి కోరిక ప్రకారం, స్వంత బిడ్డ  తండ్రి అంతిమ సంస్కారాలకు పనికి రాదా?  ఎవరన్నా అడ్డొస్తే కోర్టుకు పోయయినా అనుమతి తీసుకొస్తా!  ఎవరన్నా ఇష్టం ఉంటె ఉండొచ్చు, నేను తలకొరివి పెట్టడం చూడటం ఇష్టలేక పొతే వెళ్లిపోవచ్చు”  చివరి రెండు మాటలు కులం పెద్దవైపు చూస్తూ గట్టిగా వార్నింగ్ లా  అంది.

అంతకు ముందు ఏం జరిగిందో తెలియదు కాబట్టి  అప్పుడే వచ్చిన సవిత మామయ్య భాస్కర్ ని విషయం అడిగి  తెలుసుకున్నాడు. కవిత అంటే చాలా గౌరవం ఆయనకి, నారాయణ చాలా విషయాలు చెప్పేవాడు కవిత గురించి.  వాళ్ళ కొడుకు  ప్రతీ దగ్గర ఏదో  ఒక  సమస్య సృష్టిస్తాడని బాగా తెలుసు.  అసలే తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న వాళ్ళకు  తన కొడుకు ద్వారా, అక్కడ  జరుగుతున్న పనులకు అడ్డంకులు జరగడం  చూసి సహించలేక పోయాడు, కొంత ఇబ్బందికి గురయ్యాడు.

“అమ్మాయి కవితా,  మీ తండ్రి  మిమ్మల్ని ఎలా పెంచాడో,  చాలీ చాలని జీతంతో  మిమ్మల్ని ఎలా చదివించాడో   అన్నీ తెలుసు.   స్త్రీ, పురుష బేధం లేకుండా మనిషి చంద్ర మండలానికి  వెళ్తుంటే, ఈ పనులు  స్త్రీలే చేయాలి, పురుషులే చేయాలి అని నిబంధనలు  పెట్టుకోవడం  తప్పు.  ఇంకా ఈ కాలంలో కూడా అంతిమ సంస్కారాలు  ఎవరు  చేయాలి  అని వాదించుకోవడం అనవసరం.  తండ్రికి, కొడుకు అయినా, బిడ్డ అయినా ఒక్కటే.   మీ తండ్రి కోరిక ఎలా ఉందో  అలాగే కానివ్వు”  అందరూ వినేట్టు గట్టిగానే అన్నాడు మామయ్య.

అంత  వరకూ నిశ్శబ్దంగా చూస్తున్న భాస్కర్ కి  కూడా అవకాశం దొరికినట్లయింది.    “హంతకులను  ఉరితీసేప్పుడు కూడా వారి  చివర కోరిక అడిగి నెరవేర్చంగా లేంది, తండ్రి  చివరికోరికను స్వంత కూతురు తీర్చడం ఎలా తప్పు అవుతుంది అంకుల్ ?  ఇప్పుడు చేసే పనికి, లింగ భేదాన్ని అన్వయిస్తే అది చట్ట రీత్యా నేరం,  ఏ పని అయినా ఎవ్వరయినా  చెయ్యొచ్చు అనేది ప్రభుత్వం నిర్ణయం”    ఆవేశంగా అన్నాడు భాస్కర్.

ఇప్పుడు కవిత కి  మామయ్య, అన్నయ్య  సప్పోర్ట్ తో  ఇంకా ధైర్యం తెచ్చుకుంది. “కొడుకులు లేకుంటే ‘పున్నామ నరకానికి’  పోతారు అని  భయపెట్టించినా, ఆయన ఎప్పుడూ  ఎవరికీ భయపడలేదు. ఆడ పిల్లలకి చదువెందుకని మొత్తుకున్నా ఆయన మమ్మల్ని చదివించకుండా ఉండలేదు.    చివరికి తలకొరివి నన్నే పెట్టమని చేతిలో చెయ్యి వేయించుకున్నాడు.  మా నాన్న కోరిక  నేను తీర్చడంలో  మిగతా వాళ్ళకి ఏం  ఇబ్బందో తెలియదు.  ఆడ వాళ్ళు ఉద్యోగం చేయవచ్చు,  ఆడవాళ్లు సంపాయించ వచ్చు, మగవాళ్ళు ఆడ వాళ్ళ సంపాదన మీద పడి తిని బ్రతకొచ్చు,  కానీ ఆడవాళ్లు మాత్రం  తండ్రి అంతిమ సంస్కారాలు చేయడానికి పనికిరారు! ఇది  ఎక్కడ రాసి ఉంది?” ఆవేశంగా అంది కవిత పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ.

ప్రేమగా పెంచిన తండ్రి  చివరికోరిక తీర్చడంలో తప్పేంటి అని అందరూ కవితకు మద్దతుగా నిలిచారు. కవితకు  మద్దతుగా  మాట్లాడిన మాటలు అందరినీ తీవ్రంగా ఆలోచింపచేశాయి.    ప్రభుత్వం, చట్టాలు, కోర్టులు అన్న మాటలు బాగా వినిపించాయి ఆ కులపెద్దకి.   దానికి తోడు, కవిత మామయ్య, బాగా  చదువుకున్న వాడు, సంఘంలో మంచి పేరున్న  ఆయన కూడా   మద్దతు ఇవ్వడంతో  కొంత భయపడి, పెద్దరికాన్ని కాపాడుకోవాలంటే నలుగురితో నారాయణ అనడమే మంచిదని  “మీరందరూ సరే అంటే నాకేమి ఇబ్బంది?  మీరన్నట్టే కానీ,  చలో నడువమ్మా , ఇప్పటికే పొద్దుపోయింది బాగా” అని లేచాడు  కులపెద్ద.  కులపెద్ద ఏమాత్రం ఎదురు చెప్పక, ఒప్పుకోవడంతో కవిత  మనసులో  తండ్రికి కృతజ్ఞతలు  చెప్పుకుంది.

“బాగా చెప్పినవమ్మా , ఇప్పటికయినా కొద్ది  మందికి  బుద్ది  వస్తే అదే మంచిది.  నీవు వెళ్లి పని చూసుకో, మిగతాది నేను చూసుకుంటా” అని  భార్య సంపాదన మీద పడి బతుకుతున్న తన కొడుకుకు ఇప్పటికన్నా బుద్ది  రావాలని   గట్టిగానే అన్నాడు సవిత మామయ్య.  అంత వరకూ ఎగిరెగిరి దూకిన  కవిత మరిది, సిగ్గుతో  తలదించుకున్నాడు, తాగిన మత్తు కూడా పూర్తిగా దిగింది.

“బాగా ఆలోచిస్తే,  కన్న తండ్రి చివరి కోరిక తీర్చడం కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అనిపిస్తుంది.   ఈ వంశాలు, గోత్రాలు అన్ని మనకి మనం సృష్టించుకున్నాయి. మనిషి పుట్టాకే ఈ పద్ధతులు పుట్టాయి,  ఒక పని చేయడానికి  మంచి మనసు ఉండాలి.  నీవే కరెక్టు, అలాగే కానియ్” అన్నాడు కవిత మామయ్య అంటే తన భర్త తండ్రి.  అంత వరకూ వద్దూ అన్న తన స్వంత  మామయ్య కూడా సమర్దించడం వల్ల కవితకి ఇప్పుడు వెయ్యి ఏనుగుల  బలం వచ్చింది.  ఏలోకంలో ఉన్నాడో తెలియని తన తండ్రి,  తప్పక ఈ మాటలు వినిసంతోషిస్తాడని అనుకుంది.   అంతవరకూ అటు భర్త పోయిన దుఃఖంతో, ఇటు భర్త చివరి కోరిక తీర్చలేమేమో అని బాధపడుతున్న సరోజ మనసు కొంచెం కుదుట పడింది.

స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగిన  నారాయణ పార్థివ శరీరాన్ని అలంకరించి పాడె పై పడుకోబెట్టారు.  పాడె పై ఉన్న తండ్రిని చూసి, తల్లీ కూతుళ్లు ఒకరినొకరు పట్టుకుని బోరుమని విలపించారు. తిరిగిరాని  లోకాలని శాశ్వతంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న తండ్రిని చూస్తే,  ఫ్యాన్టు- షర్టు వేసుకొని ‘ఫ్యాక్టరీ కి పోయొస్తా బిడ్డా’  అని చెప్పుతున్నట్టు అనిపించింది  కవితకి.

“నాన్న  వెళుతున్నాడు, మరెన్నడూ రాడూ”   అంటూ తల్లినీ, చెల్లినీ పట్టుకుని బోరుమని కవిత ఏడుస్తుంటే, అందరి హృదయాలు బరువెక్కాయి. ఆ దృశ్యం చూసి, ఒక్కసారి ఘొల్లుమని ఏడుపు అందుకున్నారు అక్కడున్న అందరు చుట్టాలు.  అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.  తల్లీకూతుళ్లు విలపిస్తున్న తీరు చూసిన వారి కళ్ళు చెమ్మగిల్లాయి.   “బిడ్డా, నువ్వు గెలిచావ్!“ అని తండ్రి దీవించినట్టు అనిపించింది కవితకి తండ్రిని చూస్తుంటే.  తృప్తిగా కళ్ళు  మూసుకుంది కొన్ని  క్షణాలు.

“నాన్నా , నువ్వే గెలిచావ్! నీవు మాపై పెట్టుకున్న నమ్మకానికి ,ఇప్పుడు నీ నమ్మకమే గెలిచింది, అని లోపలి నుంచి దుఃఖంతోపాటు  తన్నుకొచ్చిన   కన్నీళ్లను  తుడుచుకుంటూ తండ్రి కి మొక్కింది కవిత.  తన కర్తవ్యం  గుర్తుకు వచ్చి మిగిలిన కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నద్ధం అయ్యింది.

కుండలో మండుతున్న బొగ్గులని వేసి,  దాన్ని  చేతితో పట్టుకోవడానికి వీలుగా తాడుతో కట్టి  సిద్ధంగా ఉంచాడు భాస్కర్. తన భర్త తోడు రాగా, అంతిమ సంస్కారాల్లో అతి ముఖ్యమైన ఆ పొగలు కక్కుతున్న కుండని,  కండలు తిరిగిన మహారాజులకే సాధ్యం కాని శివధనుస్సు ను సీతమ్మ తల్లి   సునాయాసంగా లేపినట్టు, గుండెనిండా ఆత్మవిశ్వాసంతో వంగి,  తన చేతులోకి తీసుకుంది  కవిత.  గోవిందా, గోవిందా అని నిదానాలు చేస్తూ,  నారాయణ పార్థివ శరీరానికి  తన ఇంటి నుండి అంతిమ వీడ్కోలు పలుకుతూ బయలు దేరారు బంధుజనమంతా.  గుండెనిండా పుట్టెడు దుఃఖంతో,  చేతిలో పొగలుకక్కుతున్న కుండతో పాడె ముందు గంభీరంగా నడుస్తున్న కవితని చూస్తుంటే, అత్యంత శక్తివంతమైన  పాశుపతాస్త్రాన్ని పట్టుకుని, అనాదిగా మగవాడి చేతిలో అణచబడుతున్న  స్త్రీలలో  ఆత్మవిశ్వాసం నింపుతూ నడుస్తున్న ఆదిశక్తిలా కనిపించింది అందరి కళ్ళకి కవిత.

 

ఈ కథ మీద సమీక్షవ్యాసాలలో చూడగలరు.

 

 

 

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్

by కుడికాల వంశీధర్ December 31, 2021
written by కుడికాల వంశీధర్

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్
సముద్రం పైన ఉంది కదా
దాని ఠీవి దానిది.

మొదటిసారి
ఆ వంతెన మీదుగా వెళ్తున్నప్పుడు
చప్పట్లు కొడుతున్నట్టుగా
అలల చప్పుడు.

మూడు కిలోమీటర్లు మించని వెడల్పు
పావు కిలోమీటరు మించని పొడుగు
అయినా
అది పసిఫిక్ పడతి మెడలో
నిగ నిగల నారింజ తొడుగు.

తూర్పు నుండి పడమరకి
పరుగెత్తే సూర్యునికి
ఇదే ఫినిష్ లైన్‌గా కనిపిస్తుంది.

అక్కడి విస్టా వ్యూ పాయింట్ నుండి చూస్తే
విస్తారమైన సముద్రం
సహస్ర కోటి బాహువులను
సారించి పిలుస్తుంది.

అది కేవలం
ఇనుప కడ్డీల సేతువు కాదు
సాయం చేసే నేస్తమంత మృదువు.

ఎన్ని సంవత్సరాల చరిత్ర దానిది!
శాన్ ఫ్రాన్సిస్కో, మెరైన్ కౌంటీల మధ్య వారధి
సిలికాన్ వ్యాలీ గుర్రాలను నడిపే సారథి.

ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా
క్లైమాక్స్‌లో రణక్షేత్రంగా
మీరూ దీనిని చూసే ఉంటారు
అదంతా ఓ ఫాంటసీ!
నిజానికి అక్కడికి వెళ్లి
ముట్టుకుంటేనే అసలు ఇంటిమసీ.

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అందమైన దృశ్యాలు
శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞాపకాలు
దాని ఇనుప దేహం మీద
నేనొక కవిత రాసి పెట్టాను
మీకు కనిపిస్తే
చదువుకోండి.

[ఉద్యోగరీత్యా 2014-2016 మధ్య కాలంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నొవాటో నగరంలో ఉన్నప్పడు పలుమార్లు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వెళ్ళే అవకాశం కలిగింది. ఆ అనుభూతికి అక్షరరూపం ఈ కవిత.]
December 31, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

*దాక్కో దాక్కో మేక..( Lyrical Review*)

by Ramakrishna Manimadde December 31, 2021
written by Ramakrishna Manimadde

సాహిత్యం ఎన్నో రూపాలలో మనకు తెలివిని , ప్రతిభనూ ఇస్తుంది. అందులో పాట అనేది హృదయాలను తొందరగా ఆకట్టుకుంటుంది . ఈ “ దాక్కో దాక్కో… “ పాట లో దాగి ఉన్న భావాన్ని వెతికి పట్టుకోవాలంటే ఇట్లా విమర్శ చేసుకుందాం.

చిత్రం : పుష్ప ( The Rise)
రచన : చంద్రబోస్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
దర్శకత్వం : సుకుమార్

నటీనటులు: అల్లు అర్జున్ – రష్మీక మందన్న

జీవితం అదొక వేట..
మనుగడకోసం పోరాటమే
సృష్టి జీవిత రహస్యం..!

ఆహారపు గొలుసు..
అది జీవశాస్త్ర రూపు..!!
ఆ రూపానికి సాహిత్యం సమకూర్చితే..
“పుష్ప” సినిమాలో
“దాక్కో దాక్కో మేక..” పాటగా
సంచలనం సృష్టిస్తుంది.

*వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక..*
*మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి..*
*అ.. అ.. అ.. అఅఅ..*
*పులినే తింటది చావు.. చావును తింటది కాలం..*
*కాలాన్ని తింటది కాళీ.. ఇది మహా ఆకలి..*
*అ.. అ.. అ.. అఅఅ..*

వెలుతురును సంగ్రహించుకుని
కిరణ జన్య సంయోగక్రియ ద్వారా
ఆహారం తయారు చేసుకుంటుంది ఆకు..
అంటే…
ఆకు వెలుతురును తింటది..
ఆకును మేక తింటది..
మేకను పులి తింటది.. ఇది కదా ఆకలి..
ఈ ఆకలికి అంతం ఉందా..?
లేదు..!
అంతటి పులినే చంపుకు తింటది చావు..
చావును కూడా తింటది కాలం..
ఎంతటి చావు ఐనా కాల ప్రవాహంలో
కనుమరుగు అవ్వాల్సిందే..
కానీ..
ఆ కాలాన్ని కూడా తింటది కాళీ
ఇది అసలు ఆకలి.. మహా ఆకలి.

ఆకు.. మేక.. పులి.. ఆహారపు గొలుసులో
ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి.
ఒక దగ్గర వినియోగదారుడుగా ఉన్న ప్రాణి..
స్థానం మారగానే ఆహారంగా మారుతుంది.
భక్షకాలు.. భక్షితంగా మారుతున్నాయి.

“ఆకలి – చావు – కాలం ” ఇవి మూడు బలమైనవి.. బలీయమైనవి. ఇవి బ్రతకడం నేర్పిస్తాయి. బలిఅవకుండా ఉండటం నేర్పిస్తాయి.

*వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి..*
*దొరికిందా ఇది సస్తాది..* *దొరక్కపోతే అది సస్తాది..*
*ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే..*
*హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..*

ఈ సృష్టిలో వేటాడేది ఒకటి..
పరిగెత్తేది ఇంకొకటి..

వేటాడేది తినడానికి..
పరిగిత్తేది ప్రాణ రక్షణకి..
రెండిటికీ ప్రాణమే ప్రథమ ప్రాధాన్యత.

వేటను మానేస్తే ఆకలితో అలమటించి కనుమూస్తది ఒక జీవి..
పరిగెత్తడం మానేస్తే ఆకలిగా ఉన్న జీవికి ఆహారంగా మారి మరణిస్తది మరో ప్రాణి..
అంటే..
ఒక ప్రాణికి ఆకలేస్తే ఇంకో ప్రాణి అంతమవ్వాల్సిందే..
అందుకే..
మరణం రణం.. ప్రాణం ఉండాలా..?
దాక్కో దాక్కో మేకలాగా..
లేదంటే పులొచ్చి కొరుకుద్ది పీక..!!

*చాపకు పురుగు ఎరా.. పిట్టకు నూకలు ఎరా..*
*కుక్కకు మాంసం ముక్క ఎరా.. మనుషులందరికీ బతుకే ఎరా..*

ప్రతిదీ ఎర నే…
చేపను చంపాలంటే పురుగును ఎర వేయాలి.
పిట్టను పట్టాలంటే నూకలు ఎర వేయాలి.
కుక్కకి మాసం ముక్క ఎరా..
మనుషులందరికీ బతుకే ఎరా.

బతకాలి అనే ఆశే లేకుంటే.. మనిషే ఉండడు.
ఆ మనిషి ఉండాలి అంటే బతకాలి అనేది ఎరా..!

*గంగమ్మ తల్లి జాతర.. కోళ్లు పొట్టేల్ల కోతరా..*
*కత్తికి నెత్తుటి పూతర.. దేవతకైనా తప్పదు ఎరా..*
*ఇది లోకం తలరాతరా..*
*అ.. అ.. అ.. అఅఅ..*

గంగమ్మ తల్లి జాతర చేస్తే.. కోళ్లు పొట్టేలు బలి ఇస్తారు. ఆ తల్లికి అవి ఎర..
అంటే.. దేవతకైనా ఎర వేయాల్సిందే..
ఈ చరాచర జగత్తులో ప్రతిప్రాణి ఒక ఎర..
ఇది లోకం తల రాత.

*ఏమరపాటుగా ఉన్నావా ఎరకే చిక్కేస్తావు..*
*ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు..*
*కాలే కడుపు సూడదురో నీతి న్యాయం..*
*బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం..*
*హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..*

ఏమౌతుంది అని ఏమరపాటుగా ఉన్నావా..?
ఎరకే చిక్కేస్తావు.. చిక్కకుండా ఉండాలి అంటే
ఆ ఎరనే మింగే ఆకలి ఉండాలి.
అలా ఉంటేనే ఈ భూమిపై బతికేస్తావు.
ఆకలితో ఉన్న వాడికి నీతి, న్యాయం అవసరం లేదు.
బలం ఉన్నోడిదే రాజ్యం.. అది అంతే.

*అడిగితే పుట్టదు అరువు..* *బతిమాలితే బతుకే బరువు..*
*కొట్టర ఉండదు కరువు..* *దేవుడికైనా దెబ్బే గురువు..*
*తన్నుడు సేసే మేలు.. తమ్ముడు కూడా సెయ్యడు..*
*గుద్దుడు సేప్పే పాఠం.. బుద్దుడు కూడా సెప్పడహే..*
*హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..*

అడిగితే పెట్టేవాడు ఎవరూ ఉండరు.
బతిమాలితే చిన్నచూపు చూస్తారు..
ఛీదరించుకుంటారు.

నిలబడు.. కలబడు.. అన్నీ నీ దాసోహం అవుతాయి. అపుడు దేనికి కొదవలేదు.. దేబిరించాల్సిన అవసరం అసలే లేదు. దేవుడికి ఎందుకు భయపడుతున్నారు. దండిస్తాడని. అంటే దేవుడికి కూడా దెబ్బే గురువు.!

నాలుగు తన్నిచూడు సక్కరకొస్తాడు ఎవడైనా..
అందుకే తన్నులు చేసే మేలు తమ్ముడు కూడా చేయడు.

రెండు గుద్దులు పడితే.. మళ్ళీ నీ జోలికి రాడు ఎవడూ.. ఇవి జీవిత పాఠాలు..
ఏ బుద్దుడు కూడా చెప్పడు..
అంటూ..
బలవంతుడి ముందు బతకాలి అంటే
అంతకన్నా బలవంతుడిగా నువ్వు ఉండాలి.
నిన్ను నువ్వు రక్షించుకోవాలి.. అంటూ జీవశాస్త్ర సూత్రాలను జీవత సత్యాలుగా మలిచి సాహిత్యం అందించారు గీత రచయిత చంద్రబోస్.

పాటలో ఒక చురుకు ఉంది..
ఒక ఉద్భోద ఉంది..
న్యాయం కానీ న్యాయం ఉంది.
అంతర్గత సందేశం ఉంది..

December 31, 2021 0 comment
4 FacebookTwitterPinterestEmail
కవితలు

నువ్వెక్కడ…?

by Sirajudding Mohmmad December 31, 2021
written by Sirajudding Mohmmad

ఒక నిన్న మన మధ్య గడిచిపోయింది/
అక్కడ నువ్వుంటివి/
నేనూ ఉంటిని/
ఆ నిన్న నేడూ వచ్చింది/
నువూ ఉన్నావు/
నీతో నేనూ, మనతో మన వారూనూ…/
ఈ నేడు రేపూ వస్తుంది/
బహుశా నేనుండక పోవచ్చు/
నువున్నా…
మన వాళ్ళల్లో ఎందరుంటారో…?ఎందరెల్లి పోతారో…?/
ఇక ఎల్లుండికి/ ఎవరి స్థితులు, గతులు, పరిస్థితులూ
ఏమో…? ఏమిటో…?/
శతాబ్దం బ్రతికి
ఎవరికీ ఏమీ కాకుండా పోయేవారు…/
దశాబ్దాలు బ్రతికీ
ఎందరెందరికో ఏమేమో అయ్యేవారు/
ఎందరో కదరా…?/
నిన్నడుగుతున్నా /
సిరాజ్ నీ లెక్కేమిటీ…???.
*****

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ December 31, 2021
written by కొరుప్రోలు హరనాథ్

అసూయ

——-

నిన్ను చూసి

ఎదుటివాడు

అసూయపడేలా

జీవించు

కాని

ఎదుటివాడిని చూసి

నువ్వు మాత్రం

అసూయపడకు

—-**——

రాజకీయం

—————

రాజకీయ ప్రయాణంలో

పదవుల పట్టాలు తప్పి

ప్రతిపక్ష పార్టీల

యాక్సిడెంట్లు సహజం –

వాటిని తట్టుకుని

ముందుకు సాగినవాడే

రాజకీయ నాయకుడు

అదే అసలైన

రాజకీయం

 

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

బిడ్డా.. నువ్వు గెలవాలి! – సమీక్ష

by mudigonda Santhosh December 31, 2021
written by mudigonda Santhosh

కొలిమి సాహిత్య సాంస్కృతిక వేదిక లో ఫిభ్రవరి 2021 సంచికలో అచ్చు అయిన వేణు నక్షత్రం రచన  “బిడ్డా నువ్వు గెలవాలి! “ కథ పై సంతోష్ ముదికొండ  సమీక్ష

కరోనా సమయంలో మధ్య తరగతి జీవితాలు, కొడుకులు లేని తండ్రి చనిపోతే , ఆ తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆ కూతురు పడ్డ వేదన, చేసిన పోరాటం, ఈ  రెండు సందర్భాలను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ, తన ప్రతి కథలో  ఒక సామాజిక అంశాన్ని సృజించే వేణు నక్షత్రం  ఈ కథలో స్త్రీలు సాంప్రాదాయం ముసుగులో  అనాదిగా  కోల్పోతున్న ఇంకొక హక్కుని గుర్తు చేస్తూ, స్త్రీలలో పోరాట పటిమని తట్టి లేపిన కథాంశమే  “వేణు నక్షత్రం” కలం నుండి వెలువడ్డ “బిడ్డా నువ్వు గెలవాలి”.

నారాయణ ఒక మధ్యతరగతి గృహస్తుడు. అందరిలాగే తాను పిల్లలను పెంచి పోషించాడు. కాకపొతే ఆయనకు ఉన్నది ఇద్దరూ ఆడపిల్లలే కవిత,సవిత.  అయినా ఆయన ఏలోటు లేకుండా మగ పిల్లలలాగే వాళ్ళను పెంచాడు. పెద్దగా చదువుకున్న వాడు కాకపోయినా, అధర్షభావాలు ఉన్నవాడు కాబట్టి మంచి చదువులు చదివించి ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా వారిని తీర్చిదిద్దారు. అంత బాగానే ఉంది కాని నారాయణకు ఒక దిగులు ఉంది. నిజానికి నారాయణ దిగులు కోట్ల ప్రజానీకానికి ఉంది. నారాయణ లాంటి వారు సమాజం లో అడుగడుక్కు తారసపడతారు. ఉన్నంతలో బాగానే బతుకుతున్నాడు.   కాస్త ఆర్థిక పరిస్థితి చతికిల బడ్డా ఆడంబరాలు లేకపోయినా అన్నానికి కొదవలేదు.

మరి ఈ దిగులు దేనికి?  ఆయన దిగులు బతుకు గురించి కాదు ఆ మాటకొస్తే అసలు బతికున్న రోజుల గురించి కాదు మరణించాక జరిగే తంతు కోసం దిగులు. ఎందుకు అది అంటే ఉన్నది ఇద్దరు ఆడ పిల్లలు. అనాదిగా సమాజం కొడుక్కు తలకొరివి పెట్టె హక్కు ఇచ్చింది కానీ ఆడపిల్లకు కాదు. . ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా వ్యథను అనుభవిస్తారు. మానసికంగా ఎంతగానో కృంగిపోతారు ఈ విషయంలో.  కొడుకు ఎంత దుర్మార్గుడు అయినా  తల కొరివి పెట్టాలి అనే ఒకే ఒక నియమం కోసం వాళ్ళు పెట్టె కష్టాలు అనుభవిస్తూ చావుకోసం ఎదురుచూస్తుంటారు. కానీ ఎదిరించి మాట్లాడలేని దయనియమైన స్థితి వారిది.  ఇంకా చెప్పాలంటే, ఎప్పుడు ఎలాంటి సహాయం చేయని,  ఎవరో దూరపు బందువుల మగ  పిల్లలలకు తలకొరివి పట్టే  అవకాశం ఉంటుంది కానీ ఏందో ప్రేమగా చూసుకున్న స్వంత కూతుర్లకి ఆ అవకాశం లేదు మన సంప్రాదాయంలో.    చచ్చాక తప్పించే పున్నామ నరకం కోసం బతికుండగా నరకాన్ని అనుభిస్తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. చనిపోయిన తండ్రి కి తలకొరివి ఎవరు పెట్టాలి అని చర్చ జరగడం, కవితకి తాను తండ్రికి ఇచ్చిన మాట గుర్తురావడం. ఆ విషయం తెలిసిన కులపెద్దతో సహా అక్కడి పెద్దవాళ్ళు అదేదో పెద్ద అపరాధం అన్నట్టు గోల చేయడం. వాళ్లంతా  సంప్రదాయాలకు బానిసలు అయిన వాళ్ళు. కానీ చదువుకున్న తన మరిది వదినకు ఎంతో గౌరవం ఇచ్చే వాడు కూడా దాన్ని వ్యతిరేకించి మాట్లాడడం, అరవడం కవిత జీర్ణించుకోలేకపోయింది.  తన తండ్రి చివరి కోరిక తీర్చాలి అనే పట్టుదల ఆమెలో బలంగా ఉంది. ఆనాడు తండ్రి మాట తీసుకున్ననాడు తనకు తెలియదు ఈ విషయం లో ఇంత గొడవ జరుగుతుంది అని,  అయినా  తాను గెలవాలి.  ఓడిపోయి ఎలాంటి ఒత్తిడులకు లొంగిపోవద్దు అని గట్టిగా నిర్ణయించుకుంది.   ఆడది మగాడికి సంసారం మోసి పిల్లలను కని వంశాన్ని వృద్ధి చేయడానికి అందరికి అన్ని సేవలు చేయడానికి  పనికొస్తుంది. ఆడదాని సంపాదన మీద కూడా మగాళ్లు బతకవచ్చు కానీ ఆడది అంతిమ సంస్కరం చేయడానికి పనికి రాదా అని సూటిగా సమాజాన్ని కడిగేస్తుంది.  ఈ విషయం లో అవసరమైతే కోర్టుకి కూడా వెళ్తా అనే తెగువ చూపించడం అభినందించాలి.  కవితలో వచ్చిన చైతన్యం సమాజం లో రావాలి. ఆడది తనను తాను నిలబెట్టుకోడానికి తానే పోరాడాలి.  కవిత భర్తకి ఆమెను సమర్ధించాలని ఉన్నా పెద్దల మాట కుల ఆచారాలు అతన్ని మాట్లాడనివ్వవు.

తాగడం అనేది సంస్కృతిలోభాగంగా అయింది అనాలా మనం అలా భాగం చేసామా  అనాలా ఏదైనా మనం చేసుకున్నది ఎక్కువ.  కథలో ఈ మద్యం ప్రస్తావన లేకపోయినా, దాన్ని తప్పించి రాసినా కథ కి లోటు ఉండేది కాదు. అది రాయడం వల్ల దాన్ని జీవితంలో భాగంగా మనంఒప్పుకుంటున్నట్టు అవుతుందేమో ఆలోచించాలి.  సాహిత్యం జీవితాల్ని ప్రభావితం చేస్తుంది.  ఇలాంటి నెగెటివ్ కోణాలు కథకులు కథల్లో చొప్పించ కుండా ఉంటే బాగుంటుంది.

కూతుళ్ళను కర్మ చేయమని అడగడం మార్పు, అది రావాలి లోకంలో కొడుకైన కూతురైన ఒకటే అనేది. వేసెక్టామి కూడా నారాయణ  చేయించు కోవడం కూడా కొత్త కోణం.  నిజానికి మగవాల్లే చేయించుకోవాలి కానీ సాధారణంగా ఆడవాళ్లకు  చేయిస్తారు. వారి ఆరోగ్యం రీత్యా అదికరెక్టు కాదు.

కరోన పరిస్థితుల్లో నిజానికి చాలా మంది ఎన్నో సమస్యలు  ఎదురుకున్నారు.  హాస్పిటల్ మూత పడడం, ఎలాంటి ఇతర జబ్బులున్న వ్యక్తులను కూడా కరోనా పేషంట్ లాగానే ట్రీట్ చెయ్యడం,  ఎక్కువ డబ్బులు లాగడం, లాంటి ఎన్నో  ఇబ్బందులు పడ్డారు అందరూ కథలో నారాయణ కుటుంబం లాగా.  కరోన వచ్చిన వాళ్ళది ఒక రకం బాధ అయితే రాని వాళ్ళది మరో రకం బాధ.  హాస్పిటల్ వాడు, ఆటో వాడు ప్రవర్తించిన తీరు మనకు నిర్దయగా  ఆటోవాళ్ళ డబ్బు గుంజే వ్యవహారం,  అంత ఆపద వచ్చిన కుటుంబానికి సాటి మనిషిగా సహాయం చేయాల్సింది పోయి ఇంకా ఎక్కువ డబ్బులకోసం పీక్కు తినడం చాలా బాధాకరం.

అమ్మాయి ఇంటి పేరు మారడం ఒక సమస్య, ఒక వంశం వాళ్ళు ఇంకో వశం వారికి కర్మ కాండలు  చేయరాదు అనడం ఇవన్నీ అడ్డంకులు.   కవిత తీసుకున్న నిర్ణయం హర్షించదగింది.  ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  అంతిమ సంస్కారం బిడ్డలెవరయినా చేయొచ్చు అనే సంప్రదాయం  మారాలి.  ఎప్పుడు అండగా ఉండని వారు ఆంక్షలు విధించడానికి తయారూ అవుతారు.

స్త్రీ సాధికారత, సమానత్వం పరంగా రావలసిన కథల్లో ఒక మంచి కథ ఇది.   ఆత్మ విశ్వాసం నింపే కథలు అవసరం అబలగా కాకుండా ఆదిశక్తి గా స్త్రీ లను చూపించి సమాజం లోని స్త్రీ లకు మార్గదర్శకత్వం అందించాలి ఇలాంటి కథలు . చక్కని కథ.

నక్షత్రం వేణు గారు మంచి కథకుడు. ‘మౌనసాక్షి’ వీరి మొదటి కథా  సంపుటి, ఇప్పుడు “అరుగు” పేరుతొ రెండవ కథా  సంపుటి  సిద్ధం చేస్తున్నాడు.  తన పుట్టిన గడ్డకు దూరంగా ఉంటున్నా,  తన మాతృభాషను మరిచిపోలేదు.   తన మూలాలను   వదులుకోలేదు.  తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ  ఆ మమకారాన్ని పెనవేసుకునే ఉన్నారు. ఒక రచయితగా ఎదిగి, చుట్టూ ఉన్న సమాజం లో తారసపడే సంఘటనలు విషయాలు అక్షరికరిస్తూ  ఒక చైతన్యానికి దోహదం చేస్తున్నారు.  ఆధునిక భావజాలం,  ఆధునిక అంశాలతో మంచి శైలి తో వీరి కథలు ఆకట్టుకుంటున్నాయి,  ఆలోచింపజేస్తున్నాయి. ఒక మంచి కథను అందించిన వీరికి ధన్యవాదాలు.

వేణు నక్షత్రం అమెరికాలోని  వాషింగ్టన్ డి.సి లో గత రెండు దశాబ్దాలకు పైగా స్థిరపడిన రచయిత, దర్శకుడు మరియు నిర్మాత.  కథ తో పాటు పాట, మాట, చిన్నసినిమా ఇలా వివిధ అంశాల్లో వీరికి ప్రావీణ్యం ఉంది.   సాఫ్ట్ వేర్ రంగంలో  ప్రధాన వృత్తిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రవృత్తి గా కథా రచన, సినిమా, టీవీ రంగాన్ని ఎంచుకొని  పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గని పూర్తి హంగులతో మనసుకు హత్తుకునేట్టుగా నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమాలు  ఎంతెంతదూరం, అవతలివైపు, పిలుపు, మై డాడ్. తనతో పనిచేసిన వారి టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ప్రొడ్యూసర్ గా నిర్మించిన లఘు చిత్రం ఎక్స్చేంజ్,  కాక్టైల్ డైరీస్ అనే ఎనిమిది ఎపిసోడ్ ల వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో పలువురు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. లఘు చిత్రాలు ఈ యూట్యూబ్ లింక్ లో చూడొచ్చు. https://youtu.be/S717rCUReoc

సిద్దిపేటలో 90వ దశకంలో మంజీరా రచయితల సంఘం స్పూర్తితో, కాలేజీ రోజుల నుండే రాయడం అలవాటు చేసుకున్నవేణు నక్షత్రం తొలి కథా సంపుటి ‘మౌనసాక్షి’. వేణు రెండవ కథా సంపుటి “అరుగు” అతి త్వరలో మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేణు నక్షత్రం రాసిన మొట్ట మొదటి నవల “శ్రీగీతం-Faction, Love, Romance – Ceded to Nizam” అనే  ట్యాగ్  లైన్ తో  అతి త్వరలో వెలువడనుంది.  వేణు నక్షత్రం కొన్ని పాటలను కూడా రాసాడు, కానీ కథకుడుగానే కొనసాగుతున్నాడు. వేణు నక్షత్రం రాసిన చందమామ పాట ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేసిన సందర్బంగా చాలా మంది ప్రశంసించారు. ఈ పాటను యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. https://youtu.be/TbRD8RLDC0U

 

పూర్తి కథను  కథలలో చూడగలరు.

 

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కపిలవాయి లింగమూర్తి (కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు.)

by Sridevi Reddy Tangella December 31, 2021
written by Sridevi Reddy Tangella

కలం అతడిదే…. కాలం అతడిదే….
అక్షరం అతడిదే… అర్థం అతడిదే…
అనంతానంత విశ్వంలో రెపరెపలాడుతున్న
సాహితీ కేతన వర్ణమతడిదే
అతడు…..
పాలమూరు సాహితీ దిగ్గజం కపిలవాయి లింగమూర్తి !

▪️పరిచయం :
1928 మార్చి 31
ఉమ్మడి పాలమూరు జిల్లా, అచ్చంపేట తాలూకా, బల్మూర్ మండలం జినుకుంట గ్రామంలో జన్మించారు.
మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులు వీరి తల్లిదండ్రులు. 1930- 31 ప్రాంతంలో వెంకటాచలం గారు మరణించారు. ఈ పరిస్థితిలో మేనమామ పెద లక్ష్మయ్యగారు కపిలవాయిని చేరదీసాడు.
ఆనాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కపిలవాయి పాఠశాల విద్య ఉర్దూ మాధ్యమంలో కొనసాగింది. కానీ ఒక వయసు, ఒక ఆలోచన, వచ్చాక గుండె నిండా తెలుగు భాషమీద అభిమానం అనివార్యంగా ఏర్పడింది. ఈ క్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి తెలుగు విశారద ప్రమాణ పత్రాన్ని పొందాడు.
తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ. పట్టా పొందాడు.
సంస్కృతాంధ్ర నిఘంటువులు, పురాణేతిహాసాలు, కావ్యనాటకాలు, జ్యోతిషశ్రౌతాదిభాగాల్లో కపిలవాయి ఆరితేరారు.
▪️విధి నిర్వహణ :
వీరి ఉద్యోగ జీవితం 26 ఏండ్ల వయసు నుండి కొనసాగింది. 11.7.1954 న జాతీయోన్నత పాఠశాల, నాగర్‌కర్నూల్‌ లో తెలుగు పండితునిగా చేరి సేవలు అందించాడు.
19.8.1972 న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, పాలెంలో ఉపన్యాసకులుగా చేరి చరిత్రోపన్యాసకులుగా సేవలు కొనసాగించారు.
28.2.1983 న ఉద్యోగ విరమణ పొందారు.
వృత్తిలో కొనసాగుతూనే ప్రవృత్తిని కొనసాగిస్తూ శతాధిక రచనలు చేశాడు.
▪️సాహితీ ప్రస్థానంలో
కపిలవాయి పద్య రచనతో తన ప్రస్థానం ప్రారంభించాడు. తర్వాత వచన సాహిత్యం,
కావ్యాలు, గీతాలు, శతకాలు, బాల సాహిత్యం,
స్థల చరిత్రలు,దేవాలయ చరిత్రలు, విమర్శ, జనపదం, తదితర సాహిత్య ప్రక్రియలను స్పృశించారు.
జిల్లా వ్యాప్తంగా శ్రమకోర్చి పర్యటించి మరుగున పడిన శాసనాలను పరిశీలించాడు. . చరిత్రను గ్రంధస్థం చేసాడు. జానపదుల నోళ్ళలో కదలాడే మౌఖిక సాహిత్యాన్ని సేకరించి రికార్డు చేసాడు. ఇవి వీరి జీవితంలో “వేయిపున్నమల వెలుగు “.
వీరి రచనలపై విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి రచనలు – జీవితం ఆధారంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం , తెలుగు విశ్వవిద్యాలయం , మధురై యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో ఆరు సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి.
1. డా. అనంత రాములు (ఉస్మానియా యూనివర్సిటీ) కపిలవాయి శతకాలు – పరిశీలన
2. డా. అనంత రాములు (ఉస్మానియా యూనివర్సిటీ) కపిలవాయి జీవితం – సాహిత్యం
3. యాదగిరిచారి (మధురై యూనివర్సిటీ) శ్రీమత్ప్రతాపగిరి ఖండం – పరిశీలన
4. రామాచారి (యస్‌.వి. యూనివర్సిటీ) చక్రతీర్థ మహాత్మ్యం – పరిశీలన
5. రామాచారి (తెలుగు యూనివర్సిటీ) కపిలవాయి జీవితం – సాహిత్యం
6. జి. వెంకటరాజం (ఉస్మానియా విశ్వవిద్యాలయం) కపిలవాయి లింగమూర్తి సాహిత్యంలో చరిత్ర – సంస్కృతి
వీరు మొత్తం 100కు పైగా రచనలు చేసారు. వాటిలో శతకాలు, ద్విపద కావ్యాలు, సంకీర్తనలు, చరిత్రలు, ఉదాహరణలు, ఆధ్యాత్మిక గ్రంధాలు, కథలు, సంకలనాలు – వ్యాఖ్యనాలు, సంపాదకాలు – పరిష్కృతాలు, అనువాదాలు మొదలగునవి ఉన్నాయి. కొన్ని అముద్రితాలు. వీరి కొన్ని ముఖ్యరచనలు, వాటి వివరాలు గమనిస్తే…
1)భాగవత కథాతత్వం
(భాగవతంలో 10 కథలకు వ్యాఖ్యానం )
2)సాలగ్రామ శాస్త్రం
(సాలగ్రామం దానిపుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర),
3) శ్రీ మత్ప్రతాపగిరి ఖండం
(అమరాబాదు స్థల చరిత్ర)
4)కుటుంబగీత (కుటుంబ నియంత్రణను చాటి చెప్పే ఏకైక కావ్యం)
5)మాంగళ్య శాస్త్రం
(మాంగళ్యం ధరించడంలోని గూడార్థాలు, విశేషాలు), 6)దుర్గా భర్గా శతకాలు
(అలంకార యతి లక్షణాలు)
7) ఆర్యా శతకం
(చిత్ర పద్యాల గారడి)
8) స్వర్ణశకలాలు
(90 కావ్యాలలోని స్వర్ణశిల్పి ప్రశస్తి)
9)గీతాచతుష్పథం
(భ్రమరగీత, భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవగీతల సారాంశము)
10)రుద్రాధ్యాయం
(సామాజిక చారిత్రక వ్యాఖ్యానం)
11)పాలమూరు జిల్లా మాండలికాలు (పామర సంస్కృతం)
వీరి ఆత్మకథ ” సాలగ్రామం ”
▪️భాగవతకథాతత్త్వం :
కపిలవాయి వారికి అభిమానమైన గ్రంధాలలో ఇది ఒకటి. కానీ వారి మరణం తర్వాత ఈ గ్రంధం ప్రథమ ముద్రణ వచ్చింది.. ఇందులో మొత్తం 10అధ్యాయాలు ఉన్నాయి.
01 ) కపిల దేవహూతి సంవాదం
ఈ కథ ఆంధ్ర భాగవతంలోని తృతీయ స్కంధంలో ఉంది . మూలంలో ఇది 21 నుండి 33 అధ్యాయాల వరకు గల సమగ్ర గ్రంథం . ఈ కథను పవిత్ర గంగాతీరంలో మైత్రేయుడు ‘ విదురునికి చెప్పాడు.. దీనిలో 310 గద్య పద్యాలున్నవి . ఈ కథలో వేదాంత విషయం ఎక్కువ కాబట్టి ఇది సంసారికేతి వృత్తం వలె సరసంగా ఉండదు .
02.) పురంజనోపాఖ్యానం
కళాపూర్ణోదయంలోని సరస్వతీ చతుర్ముఖుల శృంగారం వలె భాగవతంలో పురంజనోపాఖ్యానం
ఒక మార్మిక ప్రబంధం . ఇది అద్వైత ప్రతిపాదకమైన వృత్తాంతం . దీన్ని నారదుడు ప్రాచీన బర్షికి చెప్పినాడు . పూర్వం పురంజనుడనేరాజు ఉండేవాడు. అవిజ్ఞాతుడు అతడి మిత్రుడు.పురంజనుడు తనకు తగిన పట్టణాన్ని వెదకటానికి మిత్రునితో బయలుదేరి దేశదేశాలు తిరుగుతాడు. అనేక పట్టణాలు చూస్తాడు.కాని ఏదీ తనకు నచ్చలేదు . చివరకు హిమాలయ దక్షిణ సానువుల్లో నవద్వారపురం అనే పేరుగల
ఒక పట్టణం రాజవారిని ఆకర్షిస్తుంది . అదే క్రమంలో ఆ పట్టణం ముందున్న ఉద్యానంలో ఒక యువతి కనిపిస్తుంది. ఆమె ఆ పట్టణం రాకుమారి. పేరు ప్రమదోత్తమ.ఆమె వెంట పదిమంది అనుచరులు ఉంటారు. రాజుకు ఆమె పరిచయం అవుతుంది. “నేను తగిన వరునికై చూస్తున్నా -నాభాగ్య వశంగా నీవిక్కడికి వచ్చినావు ” అని వివరిస్తుంది. ఈ విధంగా కథ సాగుతుంది.
03) భరతోపాఖ్యానం
ఈ కథ భాగవతంలోని పంచమ స్కంధంలోగల ప్రథమాశ్వాసంలో ఉన్నది.మూలంలో 7 నుండి 14 అధ్యాయాలు గల గ్రంథం . ఇది ఏ భరతుడి కథ అని చెప్పడానికి వివరణ అవసరం. ఎందుకంటే పురాణాలలో భరతులు చాలానుంది ఉన్నారు.
మొదటివాడు నాట్యశాస్త్రకర్త.
రెండవవాడు కైకేయీ దశరథుల పుత్రుడు . మూడవవాడు శకుంతలా పుత్రుడు .ఈ మూడవ భరతుడి కారణంగా మనదేశానికి భారతదేశమనే పేరేర్పడిందని నమ్ముతారు. కాని ఇది నిజం కాదు . మనదేశానికా పేరు రావటానికి ఋషభ దేవుడి కుమారుడైన భరతుడు కారణం . అతడు కపిల మహర్షి సమకాలికుడు. ఈ భరతుడికి పూర్వం మన దేశానికి ” అజనాభం ‘ అని పేరు ఉండేది. మేరుదేవి , నాభి ప్రభువుల కుమారుడు ఋషభదేవుడు. ఇతడు
శ్రీమహావిష్ణువు అవతారం . జైనులు వీరిని తమ ప్రథమ తీర్థంకరుడుగా అంగీకరించినారు . ఋషభుని జీవితం నుండి గూడ నేర్చుకోవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవ్వన్ని కథాను సారంగా పొందుపరచబడ్డాయి.
04 ) అజామీళోపాఖ్యానం
ఇది భాగవతంలోని షష్ఠ స్కంధంలో ఉంది . తెలుగు భాగవతంలో వంద గద్యపద్యాలలో ఈ కథ చెప్పబడింది . తరువాత మరో 32 పద్యాల్లో విష్ణు సంకీర్తన ప్రభావం వివరించబడింది . తెలుగు భాగవతంలో షష్ఠస్కంధం మహాభారతంలోని విరాటపర్వం వంటిది. ఈ భాగంలో గుణనిధి,నిగమశర్మ, సుకుమారుడు, మదాలుసుడు, నిరంకుశుడు కథలను కపిలవాయి వార0పొందుపర్చారు.
05) నారాయణ కవచం
ఆంధ్ర భాగవతంలో పోతనగారు 19 గద్యపద్యాలతో ఈ భాగాన్ని వివరించారు.ఇది భాగవతంలోని షష్టస్కందంలో గల ఇతివృత్తం. దీనిలో మొత్తం మూడు భాగాలు ఉన్నాయి. అవి – కవచానుష్టానా విధానం , కవచం , కవచఫలం. విశ్వరూపాచార్యుడు ఇంద్రునికి ఉపదేశించిన మంత్రరాజం నారాయణ కవచం.. ఇంద్రత్వం ఒక పదవి , దానిపై ప్రతి మన్వంతరానికి ఒకరు మారుతూ ఉంటారు . అందుచేత ఇంద్రులు చాలామంది గడిచినారు . ఈ పదవిని సృజించి మొదటిసారిగా అధిష్టించినవాడు సుయజ్ఞ అనే పేరుతో కాలం గడిపిన విష్ణువు. సుయజ్ఞ తర్వాత ఎందరో ఈ పదవిపైకి వచ్చినారు కాబట్టి వారిలో వారెవరో , అహల్యా జారుదేవరో నిర్ణయించి చెప్పటం కష్టం. ప్రస్తుతం ఉన్న ఇంద్రుని పేరు పురందరుడు . బ్రహ్మ పేరు ఆదిజుడు. ప్రస్తుతం ఈ కథ ఒకనాటి ఇంద్రుని విషయాన్ని తెలుపుతుంది .
06) ప్రహ్లాద చరిత్ర
ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు .
ఇది పద్యమయ నాటకం.ఈ నాటకం తృతీయ స్కంధం హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననంతో ప్రారంభమైతుంది. విష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుని వధించటం , అతనిపై హిరణ్యకశిపుడు పగ పెంచుకుని ప్రతీకారంతో రగిలిపోయే కథ ఉంటుంది. ఈ భాగంలోని చివరి వంద పద్యాలలో హిరణ్యాక్షుని వృత్తాంతం చెప్ప బడింది.
07) గజేంద్ర మోక్షం
ఈ కథ భాగవతంలోని అష్టమ స్కంధంలో ఉన్నది . మూలంలో ఈ కథ నాలుగాధ్యాయాల పరిమితమై ఉన్నది. కాని పోతనగారు తనదైన ప్రతిభతో నాలుగంతలు పెంచినాడని శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మగారు చెప్పినట్టుగా కపిలవాయి వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కథ నాలుగు మన్వంతరాల క్రింద క్షీరసాగరంలోని శ్వేతద్వీపంలో జరిగినట్టుగా కపిలవాయి తెలిపారు.
08)వామన చరిత్ర
ఈ కథ భాగవతంలోని అష్టమ స్కంధంలో 15 నుండి 23 అధ్యాయాలువరకు ఉంది . దీన్ని పోతనగారు 125 గద్య పద్యాల వరకు పెంచడం జరిగింది . ఋగ్వేద కాలం నాటికి ఇంద్ర త్రివిక్రములే ముఖ్య దేవతలు . అప్పటికి నేటిరాముడు కృష్ణుడు లేరు . పూర్వం వ్యవహార జయం కోరేవారు ప్రాతః కాలంలో వామన స్తుతి చేసేవారు . ఆదర్శ గృహస్థుడైన ప్రవరుడు ప్రతిదినం శ్రీ వామన స్తుతితో మేలుకొనేవాడు . బలి చక్రవర్తి అస్సలు పేరు ఇంద్రసేనుడు . ఇతడు ప్రహ్లాదుని మనుమడు . విరోచనుని కుమారుడు . రాక్షస లోకానికి రాజు . రాక్షసులకు దేవతలతో ఎపుడూ ఆటంకాలు కలుగుతూ ఉండేవి . అందుచేత వారు బలిని చేరి ఇంద్రుని జయించటానికి ప్రోత్సహించినారు . వంటి వివరాలు ఈ అధ్యయంలో కపిలవాయి పొందుపర్చారు.
09 )గోపికా గీతలు – భ్రమర గీతాలు
భాగవతం దశమ స్కంధంలో 31-32 అధ్యాయాలలోనూ, 47 వ అధ్యాయంలోనూ భ్రమర గీతాలు ఉన్నాయి. 36 పద్యాలలో పొందుపర్చడం జరిగింది.. భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాల సంపుటి . వాటికి ఆలంబనం శ్రీకృష్ణుడు . శ్రీకృష్ణుడు లీలా మానుష విగ్రహుడు కాబట్టి అతని జీవితానికి రెండు విధాల సమన్వయం ఉంది . అతనిని కన్నవారు దేవకీ వసుదేవులు . పెంచినవారు యశోదా నందులు . రెండు కుటుంబాలు పరస్పరం మిత్రులు . నందుడు ఆవుల మందలకు యజమాని.కాబట్టి శ్రీకృష్ణుడు బాల్యంలో కొంత కాలం గోవులను మేపాడు.గోవులను అనేకమైన ఆపదల నుండి కాపాడినాడు తరువాత సాందీపుని దగ్గర విద్యలు నేర్చుకున్నాడు . . కృష్ణుడు జంతు పోరాటంలో మంచి నేర్పరిగా కన్పిస్తాడు .ఈ వివరాలు మొత్తం ఈ అధ్యాయంలో పొందుపర్చబడ్డాయి.
కృష్ణుడు మంచివాడనుచు సంప్రీతిన్ ప్రశంసించెంది సంగీతంబున నేము సొక్కుదుమె తచ్చారిత్రముల్ వింతలే
అంగీకారముగావు మాకు పురకాంతాగ్ర ప్రదేశంబులన్ సంగీతం బొనరింపు వారిడుదు రోజన్నీకు నిష్టార్థముల్ .
సమదాళీశ్వర ! చూడుముజ్జ్వలిత హాసభ్రూ విజృంభంబులన్….
రమణీయుండగు శౌరిచే గరగరే రామల్ త్రిలోకంబులన్…
ప్రమదా రత్నము లక్ష్మియాతని పదాబ్జాతంబు సేవింప ని
క్కము మేమెవ్వరమా కృపా జలధికిన్ కారుణ్యముల్ జేయగన్….
వంటి పద్యాల విందు రమనీయముగా ఉన్నది.
10 ) రుక్మిణీ కల్యాణము
తే :
రూఢి నామాయ కామినీ రూపమునను
పురుషులకు నెల్ల మోహంబు బొందజేయు
గాన పురుషులు సతుల సంగంబు
మాని యోగవృత్తి చరించుచు నుండవలయు .
కం :
యోషిద్రూపంబున నను
నీషణముఖ గహ్వరమున నెగమ్రింగి కడున్ ద్వేషమున కోతి జేసిన
దోషదయగు నాత్మమాయ దొలగగ గంటిన్ .
వంటి పద్యాలతో కపిలవాయి గారు రుక్మిణి కళ్యాణం అధ్యయనాన్ని ప్రారంభించాడు.
▪️పాలమూరు జిల్లా దేవాలయాలు
“పాలమూరు జిల్లా దేవాలయాలు” పరిశోధనాత్మక రచన కపిలవాయి జీవన సాఫల్య గ్రంధం. జిల్లావాసులకు ఉపయుక్త గ్రంధం. తిరుమల తిరుపతి దేవస్థానములు – తిరుపతి వారు 2010 లో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకంలో మొత్తం 30 శీర్షికలతో జిల్లా దేవాలయాల సమాచారాన్ని పొందుపర్చారు.
1.పాలమూరు జిల్లా పుట్టుక
2.అచ్చంపేట తాలూకా ఆలయాలు
3.అచ్చంపేట మండలంలోని అరణ్యకాలు
4.అమరాబాదు పట్టీలోని ఆలయాలు
5.అమరాబాదు సీమలోని అరణ్యకాలు
6.ఆలంపురం సీమలోని ఆలయాలు
7.కలువకుర్తి తాలూకాలోని గుడులు
8.వెలిదండలో వెలసిన ఆలయాలు
9.కొల్లాపురం తాలూకా కోవెలలు
10.కోడంగల్ తాలూకాలోని గుడులు
11.నాగర్ కర్నూలు తాలూకాలోని గుడులు
12.వడ్డవాని సీమలో వర్ధిల్లిన ఆలయాలు
13.పాలమూరు తాలూకాలోని ఆలయాలు
14.మక్తల్ తాలూకాలోని మందిరాలు
15.లోకయ్యపల్లె దొరలు కట్టించిన గుడులు
16.వనపర్తి యిలాకా ఆలయాలు
17.నాయక్ వంశీయులు కట్టించిన గుడులు
18.గోపాలపేట యిలాకా కోవెలలు
19.ఈ జిల్లాలోని కొన్ని వెంకటేశ్వరాలయాలు
20.వాసవీ కన్యకాంబ ఆలయాలు
21.వీరబ్రహ్మేంద్రుని ఆలయాలు
22.మన గ్రామదేవతలు
23.ఇదమ్మ జాతరలు
24.ఎల్లమ్మ జాతరలు
25.మైసమ్మ జాతరలు
26.ఇతర దేవతలు జాతరలు
27.ఆశ్రమాలు – మఠాలు – సమాధులు
28.మఠాలు
29.సమాధులు
30.మా జిల్లాలో కొన్ని దర్శనీయ స్థలాలు
▪️నలుగురు ముఖ్యమంత్రులతో సన్మానం
సాహిత్యరంగంలో వీరి కృషి, సంకల్పం, వెలకట్టలేనిది.
వీరి విశిష్ట రచనలు వీరికి పురస్కారాలతో విశిష్ట స్థానాన్ని ఆపాదించి పెట్టాయి. వాటిలో విశేషమైన వాటి వివరాలు చెప్పుకుంటే…….
1983లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు కపిలవాయి వారిని సన్మానించి గౌరవించారు.
నారాచంద్రబాబు నాయుడు, వై.యస్. రాజశేఖరరెడ్డిలు కూడా తమ పాలనాకాలంలో కపిలవాయిని సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సైతం వీరిని సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక సాహిత్యకారుడుగా కపిలవాయి చరిత్ర విశిష్టమైనది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన మొదటి వ్యక్తిగా కపిలవాయి ఘనత దక్కించుకోవడం
విశేషం.
తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభాపురస్కారం –
బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం-
బ్రౌన్ సాహిత్య పురస్కారం –
నోరి నరసింహశాస్త్రి పురస్కారం –
కందుకూరి రుద్రకవి పురస్కారం –
పులికంటి సాహితీ పురస్కారం –
బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం –
1992లో కవితా కళానిధి, పరిశోధనా పంచానన
1996లో కవికేసరి
2005లో వేదాంత విశారద
2010లో గురు శిరోమణి
2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి, సాహితీ విరాణ్మూర్తి
2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్
▪️సంచికలు సంపాదకులు :
1. విశ్వజ్ఞ రామాచార్యులుగారి అభినందన సంచిక ( షాద్ నగర్ ) – 1990
2. ఎమ్ . నారాయణ గారి షష్టిపూర్తి సంచిక 1992 3.స్మృతివాణి ( కాకమాను లక్ష్మీశ్వరమ్మ స్మృతి ) 2001
4. కళా నీరాజనం – భైరోజు దామోదరాచారి షష్టిపూర్తి సంచిక –
వ్యక్తిత్వం :
కపిలవాయి !
మూర్తీభవించిన మహాతత్త్వం …
తెలుగు భాషను, తెలుగు ప్రజలను మనసారా ప్రేమించిన భాషా యోగి…….
తెలంగాణ ప్రాంతం తన గుండెకాయగా జీవించిన అభిమాన ధనుడు….
తాను నడిచే గ్రంధాలయం అయినప్పటికీ, వహించిన విజ్ఞానం అయినప్పటికీ అందరినీ కలుపుకు పోయిన నిగర్వి…..
కుటుంబం
వీరి జీవిత భాగస్వామిమీనాక్షమ్మ. ఈ పుణ్య దంపతులకు కిశోర్ బాబు, అశోక్ బాబు ఇద్దరు సంతానం.
శివైక్యం
కపిలవాయి నవంబర్ 6, 2018 న తన 90 ఏండ్ల వయసులో దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రి హైదరాబాదులో కాలధర్మం చెందారు.
ఎందరో మహానుభావులు
అందరికీ వందనాలు

December 31, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

సావిత్రి — యమ ధర్మరాజు ( హాస్య కథ)

by రంగరాజు పద్మజ December 31, 2021
written by రంగరాజు పద్మజ

సావిత్రికి చిన్నప్పటి నుండి ఒక అలవాటున్నది. తల్లి ఏదైనా వంటకము చేసి పెట్టి రుచి ఎలా వున్నది ? అని అడిగితే “ యమహా “ గా వున్నది … అనేది- తండ్రి కొత్త బట్టలు తెచ్చి అమ్మడూ!బాగున్నాయా? అనడిగితే నాన్న గారూ! “ యమహా “గా వున్నాయనేది. స్నేహితులు ఫలానా సినిమా చూసావా ? ఎలా వుంది ? అని అంటే “ యమహా “ గా ఉన్నదంటుంది.
సావిత్రి రేడియో జాకీగా పనిచేస్తుంది. మైకు పట్టుకుని … హలో !!! హైదరాబాద్ !!!గుడ్ మార్నింగ్ !! ఎలా వున్నారు? నేనైతే యమాహా గా వున్నాను.మీశ్రోతలందరికీ యమా యమాగా మీరు కోరుకున్న పాటలు విని పిస్తాను.ట్రింగ్ …ట్రింగ్ …హలో !! ముందుగా కాల్ చేస్తున్నారు యమాహాగా! M.ధర్మరాజు గారూ ! ఈ రోజు మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు.
హలో ! హలో ! సావిత్రి గారూ ! మీ వాయిస్ బాగుంటుంది .. అది వినాలనే చాలా సార్లు కాల్ చేసాను అదృష్ట వశాత్తూ ఈ రోజు కలిసింది. థాంక్సండీ మీకు ఏ పాట కావాలి ? అవతలి వైపునుండి .. ”యమహో ..యమా యమా అందం “ అనే పాట కావాలి.శ్రీదేవి గారు లేరు కదా ! మరొక్క సారి గుర్తు చేసుకుందామని …
ఓ ! సరే సరే యమ్ ధర్మరాజు గారూ వినిపిస్తాను …వినండి వినండి ఉల్లాసంగా ..ఉత్సాహంగా !!అలా తన డ్యూటీ ముగించుకుని సావిత్రి తన “యమహా “మోటారు సైకిల్ మీద యమా స్పీడుగ భర్త ఆఫీస్ కు వెళ్ళి, ఆయనను పికప్ చేసుకుని , వస్తుంటే… తోవలో ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ యమ ధర్మ రాజులా కనపడి( ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు యమధర్మరాజు వేషము వేసుకుని … హెల్మెట్ పెట్టుకోకుంటే మీ ఇంటికి వస్తామని నటిస్తున్నారు జనాలు రూల్స్ పాటించడానికి కొత్త పద్ధతి) హెల్మెట్ లేదనిసఅడ్డగిస్తే …సర్ది చెప్పి బయట పడేసరికి ఆలస్యమయింది. తోవలో ఏదైనా తిని పిల్లలకు తీసుకుని పోదామని అటు చూసేసరికి…స్వర్గలోక్ రెస్టారెంటు కనపడింది. హోటల్ ముందు బోర్డ్ మీద రుచి గా చేసేందుకు ఐదు నక్షత్రాలహోటల్ చెఫ్ యమ్ ( అతని పూర్తి పేరు యామినేని మార్కండేయులు .పేరు పెద్దగా వున్నదని అలా యమ్ అని రాసుకుంటాడు.) చాలా రుచిగా శుచిగ చేస్తాడని, అతనికి సహాయకులుగా నల్,భీమ్ లున్నారని రాసి వున్నది. ఇద్దరూ నవ్వుకున్నారు. కొంప దీసివీడి హోటల్ లో పుఱ్ఱెలలో వడ్డిస్తారేమో అపిటైజర్ కు బదులు ఏ రక్తమో ఇవ్వరు కదా! అని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.
భోజనమైన తరువాత వాళ్ళకు ఒక అలవాటు ఎప్పుడైన సరే లోపల కిచెన్ లోపలికి వెళ్ళి ఫలాన నంబరు గల టేబిల్ పై సర్వ్ చేసిన ,భోజనము తయారు చేసిన చెఫ్ ఎవరో తెలుసుకోవచ్చా? అని అడిగితే మాస్టర్ యమ్ (యామినేని మార్కండేయులు) వచ్చి నేనే చేసాను . మీకు నచ్చలేదా ? అనగానే , కాదు కాదు యమహా గా వున్నదని అభినందించి, అక్కడి విజిటర్స్ బుక్ లో రాసి వచ్చినారు.
ఇద్దరూ కూర్చుని మాట్లాడు కుంటూ ఒక మంచి యమహా ఇల్లు కట్టుకోవాలి… ఎన్ని రోజులు ఈ నరకంలో వుంటాము అనుకుంటూ టీవీ ఆన్ చేసినారు. కామెడీ సీన్స్ వస్తున్నాయి. ఇద్దరికీ కామెడీ ప్రోగ్రామ్ లు చాలా నచ్చుతాయి.ఇంతలో స్క్రీన్ మీద “ యమధర్మ రాజు” మీద తీసిన
సినిమా క్లిప్పింగ్ లు వస్తున్నాయి. చూస్తూ నాకు యమదొంగ అంటే ఇష్టం అన్నాడు భర్త, నాకు యమగోల అంటే ఇష్టము …ఏ సినిమా లో నైనా యమధర్మరాజు పాత్ర చాలా నచ్చుతుంది. పాత సినిమాలలోని. సత్యనారాయణ అయినా , ఈ మథ్య నటించిన మోహన్ బాబు యమహా గా అదరగొట్టే డైలాగులని అవే చెప్పుకుంటూ నిద్రలోకి ఒరిగినారు.
తెల్లవారు ఝామున సావిత్రికి మెలుకువ వచ్చింది.ఎదురుగా యమపాశం పట్టుకుని యమధర్మరాజు నిలబడి సావిత్రీ !!! నీకు భూలోకంలో నివసించే సమయము అయిపోయింది రా!! యమలోకం వెళ్ళాలి… అని పిలుస్తున్నాడు. సావిత్రి అనుకుంటున్నది కదా! … కల వచ్చిందని… పడుకునేముందు యమధర్మరాజు సినిమాల గురించి మాట్లాడుకున్నాము ..తను నేను.
ఓహ్! కలనా అని పైకే అన్నది సావిత్రి.కాదు కాదు నువ్వు కల కన లేదు… నిజంగానే నీకుమరణించే రోజు వచ్చింది అన్నాడు యముడు.
“అయ్యో ! అలానా ? అయినా నువ్వు చాలా స్ట్రిక్ట్ కదా ! సరే వస్తాను !! కాని నేను నాభర్తను పిల్లలను చాలా ప్రేమిస్తాను. గమ్మత్తుగా అనుకోకుండా … వాళ్ళిద్దరి పుట్టిన రోజు ఒకేరోజ వస్తాయి.
నాకు కొంచెము సేపు టైమ్ ఇవ్వు… ఈ ఒక్కరోజు నేను వాళ్ళకిష్టమైనవి చేసి సంతోష పెట్టి వస్తాను “అని బతిమిలాడింది. అంటే సరే నేను ఇలా ఎవరికీû టైమ్ ఇవ్వను.వారి మరణమా
సన్నమవగానే …పాశం వేసి , ప్రాణాలు తీస్తాను…ఇలా మాట్లాడుతూ సమయము గడపను. కానీ నీకు చిన్నప్పటి నుండి నన్ను ప్రతి నిమిషము”యమహా! యమహా “  అని తలుచు కుంటావు కాబట్టి… అందునా మానవ లోకంలో నన్ను స్తోత్రము చేసే వాళ్ళే లేరు. అందరూభయపడి మనసు లో కూడా యమ అనరు అటువంటిది అలా ప్రతి పని లో నన్ను మనస్పూర్తిగా తలుచుకుంటూంటావు …. కాబట్టి నేను ముందున్న డ్రాయింగ్ రూంలో కూర్చుంటాను త్వరగా పని ముగించుకొని రా…అన్నాడు యముడు.
ఇక నడుము కు కొంగు చెక్కుకుంది… ఏ పని తో మొదలు పెట్టాలా అను కుంటూ.. గబగబబాయిలర్ లో నీళ్ళు పోసి, చెక్క పేళ్ళతో అంటించి, నీళ్ళు వెచ్చ పడగానే… భర్తకు, కొడుకుకు తలంటుపోయాలి అనుకుంటూ .. వంటింట్లోకి వెళ్ళి చిక్కటి కాఫీ చేసి ఒక కొత్త గ్లాసు లో పోసి ముందు రూంలో వున్న యముడికిచ్చింది అహా ! సావిత్రీ నాకు ఇలా ద్రవ పదార్ధాలు తాగే అలవాటు లేదంటే …కాదు ఒక్క గుక్క తాగండి” యమహా “ గా ఉంటుందని చప్పున నాలుక కరుచుకుంది.
యముధర్మరాజు ఒక్క గుక్క వేసి నువ్వన్నట్టు యమహా గా వున్నదన్నాడు. మీరే కాదు స్వామీ! “నా భర్త స్నేహితులు, చుట్టాలు అందరూ అదే మాటంటారు.
సరే సరే వెళుదాం పద ! నాకు ఇవ్వాళ “ టర్కీ “ దేశంలో వరదలు రావాలని వరుణుడిని పంపాను. అక్కడ చాలా మంది ప్రాణాలు తీయాల్సివుంది” అన్నాడు.
సావిత్రి పనిలో పడింది. బ్రేక్ ఫాస్ట్ మంచిగా చేయాలి. రేపటి నుండి నేనుండను కదా!అని వడ అందరికీ ఇష్టమని వడా , చట్నీ, సాంబార్ చేస్తూ ..మధ్య మధ్య భర్తను , పిల్లలను నిద్ర లేపుతున్నది.అటునుండి , ఇటుతిరిగి పండుకుంటున్నారు.సావిత్రి అటు టిఫిన్లు చేస్తూనే కుక్కర్ లో పప్పు , అన్నం పెట్టి , కూరలు కట్ చేసి మరొక్కసారి అందరిని నిద్ర లేపి , ఇంతలో మునిసిపాలిటీ పంపు రావడంతో …బిందెల తో నీళ్ళు పట్టి , ఫిల్టర్ నింపింది.లంచ్ బాక్స్ లు సిధ్ధం చేసి, భర్త షర్ట్ ఇస్త్రీ చేసి , పిల్లల స్కూల్ బ్యాగ్ లు సర్ది, వాటర్ బాటిల్స్ నింపి , బూట్లు పాలిష్ చేసి , సాక్స్ , యూనిఫాం రెడీగా పెట్టి , దువ్వెన రిబ్బన లు పట్టుకొని మళ్ళీ పిల్లల రూం లోకి వచ్చి వాళ్ళను బలవంతంగా బాత్ రూంలోకి ఈడుస్తూ, బ్రష్ మీద పేస్ట్
పెట్టు తుండగానే యముడి పిలుపు “సావిత్రీ ! త్వరగా రా !” అని గంభీరంగా పలికాడు.
“స్వామీ ! మధ్య తరగతి మహిళలకు పొద్దున్నే యమ పని వుంటుంది. పనిలో పక్కనున్న వారితో అంటారు కూడా … చావ తీరుతులేదు … ఈ పని తో అని మీరే చూస్తున్నారు కదా ! అసలే ఈ రోజు కూరగాయల సంత – అక్కడ యమ రష్ గా వుంటుంది.నాకు కూరగాయలు కొని ఆ యమ రష్ నుండి పడేసరికి యమలోక దర్శనమే. అసలే కూరగాయలు యమ గిరాకీ … అంతేనా? కరెంట్ బిల్లు , వాటర్ బిల్లు చెల్లించడానికి ఈ సేవా సెంటర్ కు వెళితే అక్కడా యమ రష్. అక్కడి నుండి స్కూల్ లో పిల్లల ఫీజు పే చేసి పేరంట్స్ మీటింగు లో వాళ్ళడిగే యమ గందరగోళ ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆ స్కూల్ కుయమక్రేజీ..వాళ్ళడిగే ప్రశ్నలు యమ ఈజీ అంటారు కొందరు.
సరే కుటుంబం బాగుండాలని ప్రార్ధిద్దామని కోవెలకు వెళ్ళి …రాముడిని దర్శనము చేసుకోవాలంటే ఆ క్యూలో జనాలు కాళ్ళు తొక్కి , నెట్టేస్తుంటే యమా ! నీవే గుర్తుకు వస్తావు. అంతేనా రేషన్ షాప్ కు వెళితే అదొక యమలోకం.అక్కడ సరుకులిచ్చే వాడు అచ్చంగా నీ వలె  (యముడు) కూర్చొని , తూకంలో మాత్రం నీ ధర్మం , నీ న్యాయం పాటించడు సుమా
అన్నీ తప్పుడు కొలతలే …చెడ్డ కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఎంత విసిగి పోతామంటే రేషన్ డీలర్ ఇచ్చిన కిరోసిన్ వాడి మీద పోసి, అంటించి నీ( యమ ) లోకం పంపాలనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సరదాగా వెళ్ళే సినిమా హాలులో క్యూ కొట్లాటలు, బజారులో డేరాలు వేసి మహిళా సంఘాల న్యాయపోరాటాల మోతలతో యమ లోకం కనపడుతుంది….”అంటూండగానే…
ఈ రోజు మొత్తము నీ ఇంటిముందు పడిగాపులు పడ్డా …నీవు నా వెంట వచ్చేటట్ట లేవు , అంటే …అయ్యో! యమా ! ఇంకెక్కడ పని తీరింది…ఈ వంట పాత్రలు శుభ్రం చేసి, ఇల్లంత సర్ది , బట్టలుతికి , నేను ఆఫీసుకు పోయే సరికి , లేటయితే అక్కడ మరొక యముడుంటాడు. అదే మా బాస్ !ఇక ఆయన తిట్ల దండకము అందుకుంటే ఇంతకన్నా తానే నయమని… యమధర్మరాజా! నన్ను నీ లోకం తీసుకెళ్ల వయ్యా! అని అనుకుంటాము మా మధ్య తరగతి మహిళలము అని చెప్తూ అటు తిరిగి చూసేసరికి … యముడు స్పృహ తప్పి పడి, పక్కకు ఒరిగి పోయి వున్నాడు. ఎలా యముడిని లేపడం ? అనుకుంటూ – నాకు నా భర్తా , పిల్లలను లేపడమే యమ కష్ఠం … ఇవాళ యమహా గా యముడిని లేపడం… ఒక సమస్య తరువాత ఒకటి
నేను భరించ లేనయ్యా ! యముడా ! నన్ను తీసుకొన పోవయ్యా ! అని నాలుక కరుచుకొని , చూస్తుండగానే కళ్ళు తెరచి, సావిత్రీ ! వస్తావా లేదా ? ఈ మాయదారి దోమలు కుట్టి కుట్టి నేను వెళ్ళే ప్రయత్నము చేయకుండానే… యమ లోకం పంపేటట్టున్నాయి. అనగానే…
“అయ్యో ! యమా ! నిన్ను హాలులో కూర్చుండ బెడిత బాగుండును…ఈ డ్రాయింగ రూంలో యమ దోమలు అవి కుట్టాయంటే …యమ మంట పుడుతుంది”
అనగానే ఆ ఒక్క పని తక్క మరొకటి చేయ వీలులేదు పోదాం పద !అని గట్టిగా అన్నాడు యముడు. సరే స్వామీ మిగిలిన పని చేసి వస్తానని …ఒక్క గెంతు గెంతింది పెరట్లోకి అపర సావిత్రి యముడు తన చేతిలో పాశం చూస్తూ… భూలోకంలో సగటు మధ్య తరగతి మహిళలకు యమ పాశం అక్కరే లేదు …వాళ్ళ బంధనాలే పాశం , ఇలా పొద్దటి నుండి …సాయంత్రం దాకా పని చేసి చేసి …యమ నీరస పడి పోతారు. ఇక పూర్వ జన్మ పాపాలు పరిహారము చేయడానికే నేను యమలోకం తీసుకొని వెళ్ళేది. వాళ్ళు ఆ శిక్ష లేవో ఇక్కడే అనుభవిస్తున్నారు. ఇంకా నేను తీసుకొని పోయేసరికి … వాళ్ళ చిట్టాలు జమా- ఖర్చు సమానమవుతాయి ఎందుకులే ఈ అబల సావిత్రిని కీసుకొని వెళ్లడము అనుకొని …చెప్పా పెట్ట కుండా వెళ్ళిపోయాడు యమాగా “ సమవర్తి “.
*******************

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us