మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

ఆనందంగా బ్రతుకుదాం!

by Ramesh January 1, 2022
written by Ramesh

స్వప్నాలన్ని సత్యాలే
సత్యాలన్ని స్వప్నాలని
నీ చేతలే నిర్ధారిస్తాయి
జీవించడమంటే ఒకరకంగా స్వప్నించడమే.

గొప్పవిషయాలన్నీ సాధారణమైనవే
సాధారణ విషయాలన్నీ గొప్పవని
నీ కళ్ళే చెబుతాయి
సృష్టిలో ప్రధానమైనది దృష్టే.

ముఖ్య వ్యక్తులందరూ మామూలు వ్యక్తులే
మామూలు వ్యక్తులందరూ ముఖ్యులని నీ మనసే చెబుతుంది
కర్మలన్నీ నిర్మలమైనవే.

కాయమంటే గాయాలే
గాయలుంటేనే కాయమని
అణువణువు బోధిస్తుంది
గాయాల కాయంకదా అనుభవమంటే.

బాధపడే క్షణాలన్ని మరచిపోయేవే
మరచిపోయే క్షణాలన్ని బాధలమయమని
నీ బ్రతుకు నేర్పిస్తుంది
ఈ భూమి పై ఇంద్రజాలం చేసేది కాలం ఒక్కటే.

“ఆనందంగా జీవించాలి” అనే వాక్యం
ఎన్ని గ్రంథాల సారమో
ఈ బ్రతుకు ఎన్ని మిలియన్ల పుటల సమూహమో
అంతిమ జీవనపరిణతి వెల్లడయ్యేది ఆఖరు స్మృతినుండే.

రమేశ్ నల్లగొండ
8309452179

January 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

2022 – నూతన స్వాగతం

by dr. Lakkraju Nirmala January 1, 2022
written by dr. Lakkraju Nirmala

అంకెలు మారుతున్నాయి
ఆర్భాటాలు పెరుగుతున్నాయి
అక్షరం విలువ తరిగిపోతున్నది
అమ్మ విలువ కరిగిపోతున్నది
విలువల అంకెలు మారిపోతున్నాయి
అంకెల విలువలు వీగిపోతున్నాయి
మారిన అంకెలు తిరిగి రావని తెలిసిన నా మనసు మలుచుకొమ్మంటున్నది ఆనందమయ
భవిష్యత్తుగా –

అందరికీ ఓ విజ్ఞప్తి !!

ఆశల కిరణాల నిరంతర నిర్విరామ ప్రవహాలనే నువు చూసేది
ఆకాశానికి హద్దులు లేవు
మనసుకి హద్దులు లేవు
కావాలి అనుకునే అన్నీ
సాధించుకునే శక్తి మానవునిది భగవంతుడు ఇచ్చాడనో
నువ్వే తెచ్చుకున్నావనో
సందిగ్ధతల సంగతి అటుంచి
నా మాటలు తూటాలనుకోక వినండి –
కానీ కాలమే దేవుడుఅంటాను నేను
నేనే శక్తిని అంటావు నీవు
కరిగిపోయే కాలం శక్తి
కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే యోగ్యత
సకాల నిర్ణయం
యోగ్యత లక్షణం
కాలం సమస్యా పరిష్కర కర్త
ఇది పెద్దలమాట
ఇదే పెద్ద మూట
కాలమే మనిషిని
నియంత్రించే ఓ శక్తి!
అదే ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఓ అద్భుత శక్తి!
దానిని తెలుసుకున్నావో
ఇక అద్భుతాలు నీవే
అద్భుతానివీ నీవే

శోధించు
సాధించగలవు
సాధించు జీవించగలవు
కాలాన్ని సద్వినియోగం చేసుకో అన్నిట్లో విజయం నీదే
స్వీయ నియంత్రణ నీదైతే
ఓ మనిషీ నీకే సొంతం విజయం
నూతన సంవత్సరాన్ని
నూతనంగా ఆహ్వానిద్దామా !!

— డాక్టర్ లక్కరాజు నిర్మల

January 1, 2022 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

అసలు కావ్యం

by Tummuri Rammohana Rao December 31, 2021
written by Tummuri Rammohana Rao

‘ఉదయనగరమందు ఉన్నట్టి నా మీద

అంతులేని ప్రేమ ఆవహింప

ప్రక్కనుండి లేవ బ్రాహ్మీముహూర్తాన

పాటపాడు పికమ వందనమ్ము’- 1

బ్రాహ్మీముహూర్తపు అవసరం ఎవరికి ఉంటుంది? నిత్య కర్మానుష్ఠాన నియతి గలిగినవారికే. చెన్నప్పగారు ఆ వేళకు తనను లేపడానికి పాటపాడే పక్షికి వందనం చెబుతున్నారు. ఉండేది ఉదయనగరం. ఉషఃకాలమే లేచే ఆధునిక ఋషిసత్తముడైన ఆచార్య మసన చెన్నప్పగారిని మేల్కొల్పడానికో లేక తనను బోలిన వారితో ముచ్చట్లు పెట్టాలనిపించో కోకిల రూపంలో ఆదికవి అవతరించాడనిపిస్తుంది. పద్యప్రవాహంలో మునకలేస్తుంటే.

ఎక్కడా ధార ఆగని పద్యపరంపర.

‘జీవితమును తెలిసి కన్నంత విన్నంత తెలియవచ్చినంత’ అన్నట్లు కోకిలతో ముచ్చట్లు బహురమ్యం. తనను మురిపించడానికి, వెతలు మరిపించడానికి, దారిచూపించడానికి వచ్చిన కోకిలతో ఆత్మానాత్మ విచికిత్స అద్భుతమైన సరళ సుందరమైన ఆటవెలదుల రూపంలో సాక్షాత్కరిస్తుంది.

ఎంతో సహృదయులైన వారే ఎదుటివారి లోపాలను కాకుండా వారి ప్రతిభాపాటవాలను ప్రస్తుతిస్తారు.

కోకిలమ్మ తాను నల్లనిదనే న్యూనతాభావం కలిగి ఉందేమోనని,

“నల్లనైన రూపు నాకిచ్చెనని నీవు

బాధపడకు తల్లి భావమందు

దేవుడిచ్చె నీకు దివ్యమౌ గానమ్ము- అంటారు చెన్నప్పగారు.

అంతేగాక ఏకంగా ఆ నల్లనయ్యనే తెచ్చి ఇలా ఓదారుస్తారు.

“నల్లనయ్యననుచు నంద కిశోరుడు

బాధపడగలేదు భావమందు

గానవిద్యలోన గంధర్వుడాతడు”- అని.

అంతేనా, కోకిల గొప్పతనాన్ని చాటి చెప్పే అనేక సాహిత్య విషయాలను వివరిస్తారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘కోకిలమ్మ పెళ్లి’ని ప్రస్తావిస్తారు. జాషువా వంటి కవి కోకిలలను స్మరిస్తారు.

బాల రసాలకిసలయాలు మెసవుతూ కంటికి కనిపించకుండానే కమనీయగాన సుధారసాన్ని ఆస్వాదింపజేసే నల్లపిట్టను మనసారా ఆహ్వానిస్తూ కమ్మని కబురుల విందులు చేస్తారు కవి. ఆటవెలదులతో ఆటలాడుకున్నట్టుగా ఒక్కో పద్యం హృద్యం, అనవద్యం.

పురుడు పోసుకున్నదాదిగా పురుషోత్తమ స్థాయిదాకా తన దైనందిన జీవన విశిష్ట చర్యల విశేషాలను ఆది కవి రూపంలో అరుదెంచిన అతిథి కోయిలకు వినమ్రంగా విన్నవించుకుంటారు. ఆశ్రమ ధర్మాలలోని బ్రహ్మచర్య, గార్హహత్య సాఫల్యాలను వివరిస్తూ వానప్రస్థాశ్రమానురక్తిని చెప్పడంతో కోకిల కావ్యం సుసంపన్నమయింది. చెప్పేవన్నీ లౌకికమైన విషయాలే అయినా అలౌకికానందంవైపు దృష్టిని సారింపజేయడం ఈయన కవితా మర్మం. నేలవిడచిన సాము ఉండదు ఎక్కడా. తన బ్రహ్మచర్యాశ్రమం విశిష్టమైంది. గార్హపత్యం విలక్షణమైంది. కర్కశ హృదయుడైన నిషాదుడికి కర్మఫలవిశేషం వల్ల సప్తర్షులు ఎదురై జీవిత గమనాన్నే మార్చివేసినట్టుగా, మామూలు మగ్గం నేసే కుటుంబంలో జన్మంచిన మసన చెన్నప్పగారి పూర్వజన్మ పుణ్యవిశేషం చేత గురువులే శిష్యుణ్ణి వెదికి పట్టుకుని ఒకరు సంస్కృతం నేర్పిస్తే, మరొకరు షడ్దర్షనాలను బోధించారు. పలువురు గురువుల నుండి పలు విషయాలను గ్రహించి తనను తాను దిద్ది తీర్చుకున్న అధునాతన ఋషి చెన్నప్ప.  అందుకే వాల్మీకి కోకిల రూపంలో ఆయన గుమ్మం ముందు గుబుర్లలో దాగి కబుర్లకై చేరాడు.

ఇందులోని ప్రతిపద్యమూ సరళమైన భాషలో సహజసుందరంగా ఉండి ఆ పాత మధురానుభూతినందిస్తుంది. పుస్తకమంతా చదివిన తరువాత ఆలోచనామృతం ప్రసాదిస్తుంది. ఇది కావ్య విశేషం. ఈ కోకిల కావ్యం మసన చెన్నప్పగారి సకలోహసనాథమని కూడా అనవచ్చు. పద్యం అత్యంతాధునిక శైలిలో ఉండి చదువరులకు ఆనందానుభూతుల్ని కలుగజేస్తుంది.

స్ఠాలీపులాక న్యాయంగా కొన్ని పద్యాలను ఉట్టంకించడం ధర్మం. అలాగని ఆ పద్యాలు మాత్రమే విశిష్టమని చెప్ప వీలు లేదు. మూడు వందల పద్యాలూ ముచ్చటైన రత్న సమాలు.

“రామకథను రాసి రంజిల్ల జేసిన

ఆదికవిని గూర్చి అవనిలోన

పోల్చుచుందురమ్మ పొందుగ నీ తోడ

పణ్య మేమి చేసి పుట్టినావొ” – 25

“నీవు శాస్త్ర విద్య నేర్చిన యట్టుల

కానబడదు బ్రహ్మ కరుణదప్ప” – 32

“కెంపుగంటి నిన్ను గెలువంగలేవమ్మ

పక్షులేవి ఈ ప్రపంచమందు” – 73

“కంటి రెప్పలందు కన్నీరు దాగుండు

తరణి మబ్బులందు దాగుకొనును

చెలమ ఇసుకలందు తలదాచుకొని యుండు

నీవు కొమ్మలందు నిలుతువమ్మ” – 79

అంటూ కోకిలను ప్రస్తుతిస్తూనే,

“నీకు తెలియదేమో నేనార్షకవినమ్మ

ఉపనిషత్తులన్న ఉత్సహింతు” – 132

“అమ్మ నీదు రాక ఔచితీవంతము

కూజితమ్ము వట్టి కూతగాదు

ఆశ్రమమ్ము జేరి ఆత్మలో పరమాత్మ

బడయుమనెడి ‘దివ్యవాణి’ తల్లి!”   – 158

అనటం భగవంతుని సందేశాలను అందుకునే నేర్పును సూచిస్తుంది.

“నీదు కూజితమ్ము నిజముగా నాకింత

సుఖము గూర్చునంచు చూడలేదు

ఏది యెపుడు సంభవించిన నయ్యది

అచ్యుతుని అనుగ్రహంబె తల్లి! – 177

అన్న పద్యంపై దానికి పూరకం.

“గుండెరావు నాకు గురువయ్యె తొలినాళ్ల

గోపదేవుడయ్యె గురువు పిదప” -62

అని సప్తర్షులు, సనకసనందనాదులవలె హర్కారే గోపదేవాదులను స్మరిస్తారు. గురువుల కృపవల్ల బ్రహ్మచర్యం సంపన్నమైతే మనసెరిగిన సతి ప్రమీల తన జీవిత భాగస్వామిగా గార్హపత్య జీవితాన్ని పుత్రపౌత్రాభివృద్ధి గావించి పునిస్త్రీగా వెళ్ళిపోయారు. వారికి స్మృతి చిహ్నంగా కృతి నొసంగి ధన్యులైనారు. ఈ విషయాలన్నిటినీ ఆత్మాశ్రయరీతిలో కోకిలకు చెప్పుకుంటారు కవి.

వ్యాసవిస్తర భీతివల్ల ఉదాహరించలేకపోయినా చదువరులు ఆ చవులన్నీ గ్రోలవచ్చు. దాదాపు రెండు వందల పద్యాల దాకా తమ జీవితంలో తారసపడ్డవారిని, గానకళా శ్రేష్ఠులను సాహితీ స్రష్టలను, కారుణ్యమూర్తులను తలచుకొంటూ నిత్య నివేదనలు సమర్పిస్తారు కెంపుగంటికి, తలిరుదిండికి తమ తదుపరి గమ్యమైన వానప్రస్థ విశేషాలను తెలుపుతూ, వానప్రస్థాశ్రమ దిశానిర్దేశనానికి ‘దివ్యవాణి’ రూపంగా పికరాణి వచ్చిందని భావించడంతో కవి కావ్యరచనా సంభావ్యత పరిపుష్టమవుతుంది.

కావ్యారంభం లౌకికంతో మొదలుపెట్టి చివరికి చేరేసరికి తాను దర్శించిన అనేక పార లౌకిక విషయాలను అక్షరీకరించి ఆలోచనామృతంగా అందిస్తారు పాఠకులకు ఆధ్యాత్మికవేత్త, ఆర్షకవి మసన చెన్నప్పగారు.

చివరి పద్యంలో ఇలా అంటారు :

“అశ్వమై వెలుంగు విశ్వమ్ము చూడంగ

ఎక్కి తిరుగువారమెంతో సేపు

నిజము దెలియ బ్రహ్మ నిష్ఠులకదియెప్డు

‘హయము’ విడువదగినదమ్మ పికమ!” – 306

ఆచార్య మసన చెన్నప్పగారితో నాకు ఇటీవలనే పరిచయమేర్పడినా అది జన్మజన్మాల బంధమనిపించింది. వారి సౌమనస్యం అనుభవైక వేద్యం. ఈ కావ్యానికి ముందుమాట రాయమని వారాదేశించటం నా అదృష్టం తప్ప అర్హతవల్ల కాదని నాకు తెలుసు. నన్ను ఈ కావ్యానికి ముందుమాట రాయమని చెన్నప్పగారడిగినప్పుడు విస్మయుణ్ణయ్యాను. ఎందుకంటే వారి వేదోపనిషత్తులను మథించిన పాండిత్యం ముందు నా శ్రుత పాండిత్యం గరికపోచకు సరిగాదు. కానీ వారికి నాపై ఇంతటి అవ్యాజమైన అభిమానం ఏర్పడటం దైవ సంకల్పం. బహుశః వారిని నా పుస్తకాల శీర్షికలు గొంత్తెత్తిన కోయిల, మహెఫిల్లో కోయిల, శార్వరిలో కోయిల, ఎలకోయిల పాట ఆకర్షించి ఉంటాయనుకంటాను.

ఏది ఏమైనా ‘కోకిల’ పేరుతో ఆచార్య మసన చెన్నప్పగారు వెలువరిస్తున్న ఈ పద్యకావ్యం ఒక కొత్త లోకానికి నాంది అనిపిస్తుంది. వారి జీవితానుభవాలు, చేరుకున్న గమ్యాలు, చేర్చిన మహానుభావులు ఇలా ఆచార్య మసన చెన్నప్పగారి సాకల్య సాఫల్య జీవన చిత్రణ ఈ పద్యకృతి ‘కోకిల’ అనడంలో సందేహం లేదు. వారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు.

 

December 31, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

కళ్ళ జోడు

by Y. Ramakrishna Rao December 31, 2021
written by Y. Ramakrishna Rao

రెండు చెవులపై బారజాపుకుని

ముక్కుమీద దర్జాగా కూర్చునే కళ్ళజోడు

నా దృష్టికి ప్రతి సృష్టి.

అలుక్కుపోయిన అక్షరాలను

ఆణిముత్యాల్లా మెరిపిస్తుంది

వాన తెరపిచ్చిన నీలాకాశమంత స్పష్టంగా

ప్రపంచాన్ని చూపిస్తుంది.

ఆలోచిస్తే ఇదొక అద్భుత ఆవిష్కరణే!

నాలుగు దశాబ్దాల ప్రాయంలో

నయనాలకు అనివార్యమైన నెచ్చెలిగా వచ్చి చేరింది

పదాలు, వ్యుత్పత్తుల సంగతేమో గానీ

నాలుగు పదుల వయసులో

మంచు తెరలాంటి మసకచపును ‘చత్వారం’ అంటారు కదా!

పారదర్శకమైన తన గుండెల్లో నుండీ

ఎన్ని క్రోధారుణ దృక్కులు దూసుకెళ్లినా,

తాను గాయపడలేదు.

ఎన్ని ప్రేమామృత శీకరాలు తరలివెళ్ళినా

తాను పులకించలేదు

ఎన్ని ఆవేదనల అశ్రుకిరణాలు ప్రతిఫలించినా

తాను ద్రవించలేదు

ప్రశాంత ఆహ్లాద వీక్షణాలు స్పృశించినా

తాను దరహసించలేదు.

ఈ కళ్ళజోడు

ప్రతి జీవితానుభూతికీ సాక్షిగా ఉన్నా

దేనికీ స్పందించని ‘ఉదాశీన’

ఏ వీక్షణ నేపథ్యాన్నీ నిక్షిప్తం చేసి ఉంచని

నిశ్చల నిర్లిప్త సహచరియైన సులోచన

కానీ, మా నాన్న వదలివెళ్ళిన కళ్ళజోడు

ఆ చల్లని చూపుల్ని

ఇంకా నాపై ప్రసరిస్తూనే ఉంటుంది.

 

 

December 31, 2021 3 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

చెవిలో గులిమి తీస్తే

by డా.కందేపి రాణీప్రసాద్ December 31, 2021
written by డా.కందేపి రాణీప్రసాద్

నారాయణ, పద్మ ఇద్దరి పిల్లల తల్లితండ్రులు. రష్మికి ఏడేళ్ళు, రాకేష్ కు ఐదేళ్ళు. నారాయణ మెకానిక్ గా పని చేస్తాడు. పద్మ ఇంట్లోనే ఉంది పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది. ఇంటి పనంతా చక్కగా చేసుకుంటుంది పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. నారాయణ తల్లిదండ్రులు వారి సొంత ఊరిలో ఉంటుంటారు. ఎప్పుడైనా వచ్చి పోతుంటారు.
రాత్రి పిల్లల్ని పడుకోబెట్టేటపుడు రాకేష్ చెవి నొప్పిగా ఉందన్నాడు. “ఎం లేదులే స్కూలు ఎగ్గొట్టటానికి ఎదో ఒకటి చెప్తావ్” అని పద్మ పడుకోబెట్టింది. కాని లోపల ఆలోచిస్తోంది. మూడు, నాలుగు రోజుల్నుంచి ఇలాగె చెపుతున్నాడు. రేపు చెవిలో టార్చి లైటు వేసి చూడాలి అనుకున్నది.
పొదున్న రాకేష్ లేస్తూనే “అమ్మా! నా చెవిలో నుంచీ ఏదో కారుతోంది” అన్నాడు. పద్మ దగ్గరకొచ్చి చూసింది. చెవిలో నుంచీ చీము కారుతున్నది. వెంటనే భర్తకు చెప్పింది. నారాయణ ఆసుపత్రికి వెళదమన్నాడు.
రాకేష్ ను తీసుకొని భార్యాభర్త లిరువురు సృజన్ పిల్లల ఆసుపత్రికి వెళ్లారు. చెవిలో నుంచీ చీము కారుతున్నదని మందులు ఇవ్వమని అడిగారు పద్మ, నారాయణలు.
డాక్టరు టార్చి లైటు చెవిలో వేసి పరీక్షించాడు చీము పట్టిపోయి ఉన్నది. మందు వేసి మొత్తం చెవిని శుభ్రం చేసి మరల పరీక్షించాడు. లోపల అగ్గిపుల్ల ముక్క కనిపించింది కానీ తియ్యటానికి రావటం లేదు. మత్తిచ్చి చిన్న ఆపరేషన్ చేసి తియ్యాలి అసలు చెవి లోపలికి ఆగ్గిపుల్ల ఎన్నిరోజుల క్రితం పెట్టుకున్నాడో అనుకుంటూ డాక్టరు వివరాలడిగాడు.
ఏమో డాక్టరు! నాకేమి తెలియదు మూడునాలుగు రోజుల్నుంచి చెవి నొప్పిగా ఉందని చెపుతున్నాడు కానీ నేనే వినలేదు చూడలేదు అంటూ పద్మ చెప్పింది డాక్టర్ తో.
మీరు ఇంట్లో అగ్గిపుల్లలు చెవిలో పెట్టుకొని గులిమిని తీసుకుంటుటారా? అది చూసి పిల్లవాడు కూడా చేసుంటాడు. అగ్గిపుల్ల తల విరిగిపోయి చెవిలోనే ఇరుక్కు పోయింది. పెద్దవాళ్ళు ఏ పని చేస్తే పిల్లలు చూసి అదే చేస్తుంటారు అన్నాడు డాక్టర్.
అంతలో పద్మ “ఇదిగో ఈయన అగ్గిపుల్లలతోనే గులిమి తిసుంటాడు సార్. నేనేన్నో సార్లు చెప్పాను పిన్నిసులతో తీసుకోవాలని వినలేదు” అంటూ భర్త మీద చెప్పింది.
“ ఏయ్ ఊరుకో మీ ఆడోళ్ళ దగ్గరంటే పిన్నిసులుంటాయి మా మగాళ్ళ దగ్గర ఎందుకుంటాయి. అగ్గిపెట్టెలో పుల్లలే ఉంటాయి” అంటూ నారయణ భార్యను గద్దించాడు.
“ సరే లేమ్మా ఇప్పుడు పిల్లవాడికి కొద్దిగా మత్తిచ్చి చిన్న ఆపరేషన్ చెయ్యాలి భయపడవద్దు. లోపల ఉన్న పుల్లను తిసేస్తా” అంటూ డాక్టరు ఆపరేషన్ థియేటర్ కు వెళ్ళాడు.
కాసేపటి తర్వాత డాక్టరు బయటకు వచ్చి “ పిల్లవాడి చెవిలో నుంచీ పుల్లను తిసేశాం. ఒక వారం రోజులు చెవిలో చుక్కల మందు వేసుకోవాలి చెవిలోకి నీళ్ళు పోకుండా చూసుకోవాలి జాగ్రత్త” అని నారయణ కు చెప్పాడు.
తర్వాత పద్మ వైపు తిరిగి “ చూడమ్మా, చిన్నపిల్లలు వేరుశనగ గింజలు, శనగపప్పు విత్తులు వంటికి కూడా చెవిలో పెట్టుకుంటుటారు. పిల్లల దగ్గర ఏ వస్తువు కనపడకపోయినా అనుమానించాలి. నోట్లో, ముక్కులో, చెవిలో పెట్టుకొని దాదాపు వారం రోజులు దాటి ఉండవద్దు. అది చెవిలో ఉండి, ఉండి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇంకా ఎక్కువైతే లోపల కర్ణభేరి పాడాయి పోయి చెవుడు వచ్చే అవకాశముంటుంది. అందువలననే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నీకు ఇద్దరు పిల్లల్ని చూసుకోవటం కష్టమైతే మీ అత్తా మామల్ని తెచ్చి ఇంట్లో ఉంచుకోండి. పసి పిల్లల్ని పెంచేతపుడు పెద్దవాళ్ళ సలహాలు, అనుభవాలు చాల అవసరం. ప్రతి చిన్న సమస్యకు డాక్టరు దగ్గరకు పరుగెత్తలేరు కదా! పిల్లలు ఇలా ఎవరి చెవుల్లో వాళ్ళు పెట్టుకోవటమే కాదు వేరే పిల్లల చెవుల్లోనే, ముక్కుల్లోనే కూడా పెడుతుంటారు. ఇంట్లో ఉన్నా సోదరుల, సోదరికో ప్రమాదాలు తెచ్చిపెడుతూ ఉంటారు. జాగ్రత్తగా చూసుకోండి” అని వివరంగా చెప్పి పంపించాడు డాక్టరు.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

హేమంత ఋతువు – మయూఖ సంపాదకీయం, డిసెంబర్ – 2021

by mayuukha December 31, 2021
written by mayuukha

సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. దైనందిన జీవితంలో రోజులు దొర్లిపోతుంటాయి . భూమండలం తన కక్ష్యలో యధావిధిగా తన ధర్మం నిర్వర్తిస్తున్నది. ఇదంతా సహజ సిద్ధంగా జరిగిపోతుంటుంది. మనకేం పేచీ లేదు. ఉన్నదంతా ‘మన’తోనే! తింటున్నాం, పంటున్నాం, రోజులు దొర్లిపోతుంటాయి . బ్రతుకు గడిచిపోతుంటే చూస్తుంటాం. ఏ జంజాటం లేకుండా ఉన్నామా? ఇదేంటీ అని అనిపిస్తుంది! ఎందుకనిపించదు? తనదైన కష్టం లేనిదే మనుషులు జీవిస్తున్నారా ? లేదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అందరినీ ఒక్క గాటన కట్టలేం కాని, ఈ ‘రైతు’ ఉన్నాడే? అతని శ్రమ ముందు అంతా, అందరూ దిగదుడుపే అనిపిస్తుంది. చాలావరకు ఒక మాట అంటుంటాం. “కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా?” అని. చూడండి, ఇందులో ఎంతటి అర్థం దాగి ఉన్నదో! అన్నంతో మొదలవుతుంది బ్రతుకు. అన్నమంటే వరి బియ్యంతో వండే అన్నమనే గాదిక్కడ, తినే పదార్థాలు అని. మనుషులకు, జంతువులకూ తేడా ఏమిటో తెలుసుకోవాల్సిన, తెలుపుకోవాల్సిన అగత్యం ఉండదనుకోవాలి. రైతు లేనిదే మన బ్రతుకు లేదు, రైతు కర్మజీవి. మట్టిని నమ్ముకున్న చైతన్యుడు.
పంచేంద్రియాలున్న మనిషి ప్రకృతిని తనలోకి ఆవాహన చేసుకోవడానికి మనసును కేంద్రీకరిస్తాడు. పంచభూతాల ప్రకృతి రమణీయత ఎన్నటికీ తగ్గదు.
కొండకోనల, వాగువంకలు, చిగురులెత్తే పచ్చికల భూమి ఒకవైపున్నది. సన్నగా వీచే గాలి వీవెనల ఆహ్లాదమంతా ప్రాణవాయువుగ బ్రతికిస్తున్నది. ఎక్కడి నుంచో తెలియని ప్రయాణం సాగిస్తూ నీటి జలాలన్నీ పాయలై, నదులై నీరుగా మన నోటికందిస్తున్నవి . రుచి అరుచులన్నీ, నేర్పిన నిప్పు జాడ తెలిసిన తెలివైంది. ఈ అన్నింటికీ సాక్షిభూతంగా నిలిచింది ఆకాశం. రస, రూప, స్పర్షలతో మనిషి జీవిస్తున్నాడంటే ఈ పంచభూతాల సహాయంతోనే. అటువంటి మనిషి ఎంత బాగా తన బ్రతుకును ఈ కర్మజీవి సాయం తో నే కదా అనుభవిస్తున్నది . ఈ కృషీవలుని శ్రమ దృష్ట్యా పరిశీలించాలి కదా! అది కూడా భారతీయ భావన తగ్గకుండా పరిశీలించాలి. అంతేకాకుండా ప్రపంచ జ్ఞానాన్ని పనితనమున్న మన రైతు కష్టానికి అన్వయించుకోవాలి. ఇదే దర్శనం. దీన్నే సత్యం దర్శనం అంటాం. రాళ్ళను కదిలించి నీళ్ళను తెచ్చుకోవడం అనే శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే కష్టానికి తగిన ఫలితం అందాలి. రైతే రాజు అన్నారు. కిరీటం పెట్టకుండా టోపీ పెడుతున్నాం. జీవకారుణ్య భావన ఉండాలి. రైతు పంటసిరికి మంట పెట్టకుండా ఉంటే పదికాలాలు చల్లగా ఉంటాడు , చల్లగా ఉంచుతాడు . “మన్ను బంగారౌ మాన్యాలున్నా సాలెల్లపారే సెలయేరులున్నా మడిలో మొక్కకు తడిలేదన్నా” అని ఏనాడో ఒక కవిత లో అన్నారు పెండ్యాల రాఘవరావుగారు .ఇవ్వాళ గుండెతడి కరువై పోతున్నది. వ్యాపార ధోరణితో చూస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయిగాని ఆరుగాలం కష్టపడి మట్టిని పిండి బువ్వను పండిస్తున్న ఆ రెక్కల కష్టానికి విలువ ఎవరిస్తున్నారు. విత్తనాల నుండి ధర నిర్ణయాలవరకు ఎన్నెన్ని ముళ్ల కంచెల్ని దాటాలి ఏంటి? . “దున్నిన దుక్కీ దక్కదురన్నా, చేసిన కష్టం చెందదురన్నా, రాచనాలా పట రాజోరి కంటా, దొడ్డు మొద్దూ పంట బీదోనికంట” అని రాఘవరావుగారు కరుణ రసాన్ని గూడు కట్టించారు. దోపిడి వర్గాలనూ అక్షరాలతో పట్టించారు. ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లోని ఈ కవిత ఇప్పటికీ తాజా తనాన్ని కోల్పోకుండా ఉన్నదంటే వర్తమాన పరిస్థితులెంత దారుణంగా ఉన్నాయో కదా అనిపించక మానదు.
మనిషి తనాన్ని మింగేస్తున్న గ్లోబలైజషన్ ప్రభావం నుండి బయటపడలేక సగటు జీవి అతలాకుతలం అయిపోతున్నాడు. ఆధునిక విజ్ఞానశాస్త్రం ఎంత అభివృద్ధి చెందుతుంటే మానవ విలువల పతనం అంత ఎక్కువైపోతున్నది. ఇటువంటి సమయంలో మట్టిని నమ్ముకుని, ప్రకృతిని నమ్ముకుని పనిచేస్తున్న రైతు ఎంత ఉన్నతుడో కదా అనే విచక్షణ మనలోంచి పోతే ఎట్లా? క్షుద్భాధను తీర్చుకోవడానికన్నా సంబంధం లేని ఎన్నో విషయాల కోసం వెనుక ముందు చూడకుండా ఖర్చులు పెడుతుందీ లోకం. వీటన్నింటిపై నుండి ఆహారపదార్థాలను వృధా చేసే వైనం మరోవైపు. ఇవన్నీ కించిత్ ఆందోళనన్నీ కలిగించడం లేదా?
లోకాసమస్తా సుఖినోభవంతు అని సూక్తిని చెప్పిన మనం రైతులు గురించి పట్టించుకోవడం అవసరం . రైతును హాలికుడు అంటారు. రైతు భార్య ను లేదా మహిళా రైతును ‘హాలిని‘ అంటున్నాను. ఈ హాలిని హాలికుడు చల్లగా ఉంటేనే మనమూ చల్లగా ఉంటాం మరి మీరేమంటారు!!

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలంగాణ నవలా వికాసం

by Butam Mutyalu December 31, 2021
written by Butam Mutyalu
తెలుగు సాహితీ చరిత్రలో తెలంగాణ కవులు, రచయితలు రాసిన సాహిత్యం వలసాంద్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా విస్మరణకు, వివక్షకు గురికావడం జరిగింది. పాల్కూరికి సోమనాథుని మొదలు శ్రీనివాసాచార్య వరకు దాదాపు వెయ్యేండ్ల చరిత్రను పునర్జికించుకోవడం జరిగింది. తదనంతర కాలంలో పాశ్చాత్య ప్రభావంతో ఆధునిక సాహిత్యం ప్రవేశించింది. ఈ సాహిత్యం 19వ, శ॥ లో మొదట బెంగాల్, వారి ప్రభావంతో అనువాద నవలలుగా తెలుగునేలపై కాలూనింది నవల. వారిని అనుసరిస్తూ చిలకమర్తి, కందుకూరి, జి.కృష్ణ, ఉన్నవ త్రిపురనేని గోపిచంద్, రావిశాస్త్రి మొదలైన ఉద్దండులు అనువాద రచనలతో పేరు ప్రఖాతులు గడించారు, (పుట.15,తె.న చ. సంగిశెట్టి) అటునుండి తెలుగు నేలపై తన ప్రభావాన్ని చూపుతూ ఆదునిక సాహిత్యం: పోకడలు నవల, కథ, కవిత్వం, నాటకం, వ్యాసం, జీవిత చరిత్రలు, వంటి వివిధ రూపాలలో నేటికీ
తెలంగాణ తెలుగు సాహిత్యంలో “నవల”ప్రక్రియను నిశితంగా పరిశీలించినచో తెలుగులో తెలంగాణేతరులు రాసినదే సాహిత్యంగా చలామని అయ్యింది. నిజానికి తెలంగాణ ప్రాంతపు కవులు, రచయితలు స్వాతంత్య్రానికి పూర్వమే కవిత్వం, కథలు, నవలలు రాసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఒక దశలో (1944-56) కాలం తెలంగాణ నవలలకు స్వర్ణయుగంగా బాసిల్లింది. తెలంగాణేతర కవుల అబద్దపు సోదికి అడ్డుకట్టవేస్తూ ఈ ప్రాంత కవులు: తెలంగాణ సోయి తెచ్చుకొని తమ మూలాలను తవ్వితీస్తున్నరు. దేశ సాహిత్యం పురుడు పోసుకున్న నాటినుంచి పాశ్చాత్యల నుంచి అచ్చతెనుగు దిగుమతి అయిన ఆధునిక రూపాలైన నవల, కథ, కవిత్వం నూతనత్వంతో పురుడు పోసుకుని సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించిండ్రు ఇక్కడి కవులు, వారి కృషిని సాహితీలోకానికి ఎరుక చేస్తున్న తెలంగాణ ప్రచురణ కర్తలు అందుకు పూనుకోవడం సాహసోపేతం.
తొలి తెలంగాణ నవల రికార్డు చేసే క్రమంలో భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. తెలంగాణ వారికి తెలుగేరాదని వారిది యాసభాషని ఎచ్చిడి చేసిన సందర్భాలు కోకొల్లలు. వారి మాటల్లోనే తెలంగాణ మొదటినవల పట్టికోట అల్వారు”ప్రజల మనిషి” నవల అని ప్రచారం చేశారు. మరి కొందరు ‘నరహరిగోపాల కృష్ణమశెట్టి రాసిన రంగరాజచరిత్ర(1872) అన్నరు. ఇంకొందరు కొక్కొండ వెంకటరత్నం రాసిన’మహస్వేత’ను వాడుకలోకి తెచ్చారు. వీటన్నీటిని తోసిరాజని ‘కందుకూరి వీరేశలింగం “రాజశేకరచరిత్ర” (1878)ని తొలినవలగా ప్రచారంచేసి సాహితీచరిత్రపై నిలిపారు. కాని అసలు నిజమేమంటే 1866లో తడకమళ్ళ వెంకట కృష్ణారావు రాసిన “కంబుకంధరచరిత్ర”మెదటి నవల. (పుట.12, నిలకడగా తెలుగు నవలాచరిత్ర, సంగిశెట్టి శ్రీనివాస్) అని, మరుగున పడిన నిజం తేలినచందంగా, తెలంగాణ రచయితల కృషిఫలితంగా తెలంగాణ నవల ఉనికి తెరపైకి వచ్చింది. ఇందుకు తెలంగాణ ప్రచురణ కర్తల కృషి ఎంతోవుంది.
తెలంగాణ సాహితీపరిశోధకులు తెలంగాణ నవలలను నాలుగు దశలుగా వర్గీకరించారు. అవి 1. 19106 ముందుదశ,2)1911-1929 వరకు, 3)1930-1944 వరకు, 4)1945 1956 వరకు. ఈ నాల్గుదశలలోని నవలల గూర్చి లోతుగా విశ్లేషించి వివరించి మనముందుంచారు. మన నవలలపై ఇంగ్లీషు, ఉర్దు ప్రభావము ఉంది. అందుకు…ఒద్దిరాజు సోదరులు, సురవరం, బాస్కరబట్ల కృష్ణారావు, నెల్లూరు కేశవస్వామి, నవలలు చదివితే ఈవిషయం తేటతెల్లమవుతుంది.
తెలంగాణ తొలినవలయే గాక తెలుగు సాహిత్యంలో తొలితెలుగు నవల తడకమళ్ళ(1825-1890) వారు ” కంబుకంధర చరిత్ర’ (1866). దీనిని మొదట వచనప్రబందంగా పేర్కొన్నారు. ఈ నవలలో అక్కడక్కడా పద్యాలున్నాయి. ఈనవల గూర్చి మద్రాసు గ్రంథాలయంవారు తమ కెటలాగ్ పేర్కొన్నారు. ఇందు 8అద్యాయాలు ఉన్నాయి. నవలలో “సీ. కంబుకంధరుడు….. మత్రిత్వమును గల్గి భూతి మెరయు…”(పద్యం, పుట19, తె.న. చ) అలాగే కామరూపకథ” గూర్చి నిడదవోలు వెంకటరావు (ప్రఖాత పరిశోధకులు) పేర్కొంటూ ఇది కంబుకంధర చరిత్రనుబోలిన రచన’ అనగా స్వతంత్ర రచన, నవలమాదిరి వున్నదని1937లో పేర్కొన్నారు. ఈ కామరూపకథ 1868 జులైలో మొదలెట్టినట్టు తెలిపారు.మరో నవల “తెలుగు వెలుగు ముగుదకథ 1879లో ముద్రితమైంది. దీనికే “శ్రీమదాంధ్రకవితావేదిని విలాసము” అని పేరు ఉందని ముంగిలిలో సుంకిరెడ్డిగారు పేర్కొన్నారు. తడకమళ్ళవారు కామందకము, లీలావతి గణితము, రామావతారం కాలనిర్ణయము,చిత్రకథావివరణము”మొ||లగు ఇతర రచనలు చేశారు. అలాగే బడారు శ్రీనివాసరావు 1910లో ఆశాదోషమునవల (1512సం॥ చెందిన చారిత్రక గాధఆధారం.) ఈనవలలో కోయిల్ కొండ దుర్గం, ముస్లిం రాజులు, నవాబుల జీవితాలు,వలీ,సూఫీలవివరణ, వారి ఆచారాలు, యుద్ధనీతికుట్రలు, గూఢచర్యం, అంతపురకాంతలు, మొ|లగు మన నవల. పాలమూరు మూలాలు పట్టుకుంటున్న బీంపల్లి శ్రీకాంత్ నవల సేకరించిండు. ఒద్దిరాజుసోదరులు(1887-1956) రుద్రమదేవి(1918) నవల చారిత్రక ప్రసిద్దనవల,ఇది. కాకతీయుల పాలన, రుద్రమదేవి పరాక్రమము, గోనగన్నారెడ్డి వీరత్వము తెలుపుతుంది. ఇది 1922లో పునర్ముద్రన పొందింది.ఇంకా వీరు శౌరశక్తి, బ్రమర, బ్రాహ్మణ సాహసము, వరశముద్ర అనే చారిత్రక నవలలతో పాటు స్త్రీ సాహసము, ముక్తవలస అనే సాంఘిక నవలలు రాశారు. వీరి రుద్రమదేవి నవల విజ్ఞాన చంద్రిక మండలి వారి బంగారు బహుమతి పొందింది(పుట. 50 తె.న.చ. సంగిశెట్టి), టేకుమళ్ళనరసింహం”రాధమ్మ”నవల ఒకవేశ్యావ్యధాభరిత జీవితాన్ని హృద్యంగా చిత్రించిండు.
భహుముఖ ప్రజ్ఞాశాలి నవలా సాహిత్యంలో సంచలనాల రచయిత సోమరాజు రామానుజరావు (1896-1934). ఖమ్మం జిల్లా భద్రాచలం, దుమ్ముగూడానికి చెందిన ఇతను గ్రంధాలయోర్యమునికి కృషి చేస్తూనే గాంధీ ప్రభావంతో జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నారు. ఇతను ‘మంజుమతి'(1914లో),’జగన్మోహిని’ అనే చారిత్రక నవలు రాశారు. 1916లో హైమవతి నవల రాశారు. వీరి నవలలు బాష సరళంగా ఉండటం చేత బహుళ ప్రజాదరణ పొందాయి. 1916లోనే విషమోహిని నవల రాశారు. 1921లో దొమ్మాడ యుద్ధం’నవల రాశారు(క్రీ.శ. 1763లో జరిగిన యదార్ధ ఘటన) ఇంకా వీరు ‘శిశుహత్య, వనదుర్గం, తపోవనం, జపమాలిక, రక్తజ్వాల, కరుణ, నవలలు రాశారు. వీరు నాటకాలు, పాటలు కూడా రాశారు. వీరు 38 సంవత్సరాలు జీవించారు. ఇతను తన 18వ ఏట నుంచే రచనలు చేసిన ప్రజ్ఞాశాలి. సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) వీరు చారిత్రక నవల కొనసాగింపుగా 1917లో శుద్ధాంతకాంత అనే నవల రాశారు. హైదరాబాద్ జీవితంలో భాగమైన రోమాని ని ఇతి వృత్తంగా తీసుకొని రాశారు. ఇది సురవరం 20వ ఏట రాయడం విశేషం వీరు అరెవీరులు (1932) అనే మరో నవల రాశారు,ప్రకృతిని కథాంశంగా తీసుకొని శేషబట్టరు, వేంకటరామానుజాచార్య (1900-1944) ప్రాకృత…దాంపత్యం పేర 1922లో నవల రాశారు. ఇంక 1922లో ‘వసుంధర కొండపల్లి ముట్టడి 1929 దేవులపల్లి మొదట చలపతిరావు రాశారు. వరంగల్లు నుంచి కోకల సీతారామశర్మ ఆంద్రయ్యదయిం పేర పత్రిక నడిపి పావని అనే నవల రాశారు. చట్రాతి లక్ష్మీనరసమాంబ అనురాగ విపాకము నవల రాశారు. మాడపాటి హనుమంతరావు ఆనందమఠము(అనురాదము)గ్యారిబాల్డి జీవితం నవలలు రాశారు. సికింద్రాబాదులో పేరొందిన సంఘసంస్కర్త టేకుమళ్ల నరసింహం రాధమ్మ అనే నవల రాశారు.
కరీం నగర్కు చెందిన ముడుంటా చర్యలు కాదాంబిని ప్రేమచాంచల్యం నవలలు రాశారు. సిరిసిల్లా అవునూరుకు నేనుగోపాలరావు జోహరాబాయి నవల రాశారు. 1930 నాటికి నవలలు రాసినవారు రాశిలో తక్కువైన అచ్చుకు నోచుకోవడం గగనమైన రోజులు అవి మెదకు నుంచి భాగవతము సీతారామశర్మ(1902 1942) పశ్చాతపము, పుష్పావతి, ఈశ్వర సంకల్పము నవలలు రాశారు. నల్లగొండకు చెందిన పైడమర్రి వెంకటసుబ్బారావు కాలభైరవుడు అనే నవల రాశారు. వరంగలకు చెందిన లక్ష్మీనరసింహరాజు (1891-?) శాంత బాయి. వరంగల్కే చెందిన నలం తింఘల్ చక్రవర్తుల కంయిల వెంకటన్నసింహ చర్యలు (1884-1959) భయంకర పిశాచము నవల రాసిండు ఖమ్మం జిల్లా పెదమడుగుకు చెందిన వనం వెంకట నరసింహరావు పద్మనీబాయి అనే నవల రాసిండు. ఈ దశకంలో ఎక్కువగా చరిత్రక నవలలు ప్రచురించబడ్డాయి. సోమరాజు రామానుజరావు ముందువరుసలో ఉండగా ఒద్దిరాజు సోదరులు, సురవరం, కేశాద్రి రమణ కవులు, వనం వెంకట నరసింహరావులు ఉన్నారు. అభ్యుదయానికి బాటలు వేసిన నవలలు ఉన్నాయి. 1930 నుండి 1944వరకు ఈదను పేర్కొనవచ్చు. దేవరకొండ(నల్లగొండ జిల్లా)కు చెందిన సయ్యద్ అజ్మతుల్లా(1902-1930) జాహ్నవి, సుశీల, అంపరాకాసి,మణి పేరున నవలలు వచ్చాయి. మెదక్ జిల్లా అందోలకు చెందిన మఠం సిద్ధివీరయ్య(1902-?) నిరపరధి,పుష్ప సేనవిజయం రాశారు. మంథనికి చెందిన వెంకట రాజన్న(1909-1995) పతిపత్ని పేర నవల రాశాడు. తాతాచార్య ఆకలి నవల బాస్కరబట్ల కృష్ణారావు పట్టికోట అల్వారు కాళోజి, లోకమాలహరి, కవిరాజమూర్తి , నెల్లూరి కేశవస్వామి రచనలతో 1944-56 నవలలకు స్వర్ణయుగంగా తెలంగాణ బాసిల్లింది. ఈ కాలపు రచయితలు తెలంగాణను విభిన్న పార్శ్వాలతో సామాజిక, రాజకీయ జీవితాలను ఆవిష్కరించారు.
ఇదే సమయంలో ఆంధ్రమహాసభ ఆవిర్భావం, కమ్యునిస్టులు రావినారాయణరెడ్డి నేతృత్వంలో చీలిపోవడం దేశముఖ్ లు, భూస్వాములు నిజాంకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేయడం, భూమికోసం, భుక్తికోసం, వెట్టి విముక్తికోసం పట్టికోట, దాశరధి నవలలు రాశారు. తెలంగాణ ఉద్యమాలతో సంబందమున్న, లేకున్నా బొల్లిముంత శివరామకృష్ణ మృత్యంజయులు నవల రాశారు (1947). లక్ష్మీకాంతమోహన్(1951) సింహగర్జన నవల, లోకమల (1910-2010) గద్దె, సంఘం నవలలు (1947-55) మధ్య గాంధీజీ బావజాలంతో అంబేద్కర్ ఆలోచనా విదానంతో రచనలు సాగాయి బెగ్గనియిద్దె’ నవలలతో నిఘంటుకెక్కని పదాలు నాడి తెలంగాణ భాష ఉ నికిని చాటిరు.ఈ నవలలోని చాలా పదాలు నిఘంటువులోకి ఎక్కలేదని రచయిత తన తొలిపలుకు’లో ‘ చెప్పుకున్నాడు. ‘అంబటాల్ల,గోజలు, బట్టబాతా, పిస్స, కాల్మొక్త్ర, నాల్గొద్దులు, పంది కొక్కు తన కిందికే తోడుకున్నట్లు సంతానానికి మొదటి గురువే స్త్రీ న్యాల్క బుగోరుతుంది. చేసిన రెక్కలు శాగబత్తాయి, చెయ్యిని బూజుపడ్తాయి. బక్కల్ను కడుపు నిండా మేపుకరా, ఒగ్గన్ని జంపితెగాని ఐద్యుడు గాడు, తగువు జెప్పు మారాజంటే తల్లీ పిల్లా…నాదేనన్నడట,మేమంత?తొడిగితే కాలుకు, ఇడిస్తే పంచకు ఇట్లా అనేక పదాలు, సామెతలను ఈ నవల నిండా జోడించి దానికి నిండుతనాన్ని తీసుకొచ్చిండు.(పు,ట.69,తె.న.చ.సంగిశెట్టి శ్రీనివాస్) 1955లో ఈ నవల దేవిదాసు రెడ్డి అనే లోకమహరి మిత్రుల పూనికతో అచ్చయ్యింది. అప్పుడు మాడపాటి హనుమంతరావు, గడియారం రామకృష్ణశర్మలు తమ అభినందనలు తెలిపారు. 2012లో ఆచార్య జయదీర్ తిరుమలరావు వ్యాసం రాశారు. కతిరాజమూర్తి(1926-7) తెలంగాణ నవల సాహిత్యంలో దృవతారగా నిలవాల్సిన వ్యక్తి ‘మైగరీబాహు’నవల పకడ్బందీగా రాశారు. 1954లో వీరి మరో నవల ‘చివరిరాత్రి వెలువడింది. ఈ నవలలో లోతైన బావ సంఘర్షణను రికార్డు చేశారు. ఇంకా అంగారే, లాహుకీ లకీర్(పొలిమేరలు) ప్రజాదరన నవలలు ఖమ్మంకు చెందిన హీరలాల్ మోరియా(1922-2006 1948లో గుడిమెట్లు, 1958లో తెగని గొలుసులు, ఆగిన తుఫాను’ నవలలు విరిగిన విగ్రహాలు, జీవనది, ఎవరికోసం నవలలు కూడా, నల్లగొండ జిల్లా వాడయిన పుల్లా బొట్ల వెంకటేశ్వర్లు(1924)ఇప్పుడు ఖమ్మంలో ఉంటుండ్రు. 1945-50లో ‘సముద్రఘోషలు,రాధ అనే నవలలు రాశారు. ‘మా ఘంటం’నవల ఆలిండియా రేడియోలో ధారవాహికగా ప్రసారమైంది. పెండెం వాసుదేవరావు (1920 ?)గుసగుసలు నవల.ఉమెత్తల యజ్ఞరామయ (1922-1995)ఆశాలత(1949) నవల.అస్థిత్వవాదాన్ని అందాల మెక్కించిన బాస్కరబట్ల కృష్ణారావు(1918-1966) నవలలు, అధివాస్తవిక దోరణిలో ‘యుగసంధి’నవల ప్రసిద్ది ‘వెలువలో పూచికపుల్లలు’ (1960) ప్రజల మనిషి నవల భయంతో రాసిండు. జనభాషలో రాశాను అని స్వయంగా చెప్పుకుండు. ఈ నవలలోని కథ గురించి ప్రజల మనిషి’ నవల నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి దగ్గర దిమ్మగూడెం ఊరు భూమిక అని అన్నారు వరవరరావు. ‘గంగు’నవల ‘ప్రజల మనిషి’కి కొనసాగింపు, జి. రాములు పిచ్చిశాయన్న నవల రాసిండు. గూడూరి సీతారాం (1936-2011) కొత్తపాతలు నవల 1960లో వెలువడి ఉంటుంది. సింగరాజు లింగమూర్తి ‘ఆదర్శాలు అంతర్యాలు, రంగులమేడ, చిగురించిన విలువ, ఆకర్షరణలో అవస్వరాలు’: పోతుకూచి సాంబశివరావు ‘ఏడు రోజుల మజిలీ, అన్వేషణ’లాంటి నవలలు రాశారు. శొంతి కృష్ణమూర్తి(1925) మూగభార్య (1958), ఇవ్వాళ తనలోకి తాను తొంగి చూసుకుంటున్న తెలంగాణ నెర్రెలు పారిన నేలమీద పాదా లు వూదించి గతాన్ని తవ్విపోస్తుంది. సాహిత్యములో దొరికిన మనులు మాణిక్యాలు సానబెడుతూ అన్యాయాన్ని లెక్కగడుతుంది. 1956 తర్వాత తెలంగాణలో వందలకొద్ది నవలలు, పురుడు పోసుకున్నాయి ఇందులో అభ్యుదయ నవలలు,ప్రగతి శీల నవలలు, ఉద్యమ నవలలు, వలస బతుకుల నవలలు, గ్లోబలైజేషన్ నవలలు, మురికివాడ బతుకు నవలలు, నగరజీవన నవలలు, కుల వృత్తి నవలలు, పల్లె జీవనానికి చిత్రిక పట్టిన నవలలు, అస్థిత్వవాద నవలలు, స్త్రీ వాద నవలలు,బి.సి., మైనారిటీ వారి నవలలు ఉన్నాయి. అయితే ఇక్కడి సాహిత్యం పై పక్షపాతంతో అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో కూడా పెద్దగా పరిశోధనలకు నోచుకోలేదు. అయితే తెలంగాణ సాహిత్యవేత్తలు మరుగున పడిన నవలా సాహిత్యాన్ని ఎరుకజేస్తూ తెలంగాణ నవలా చరిత్రను మనముందుంచారు. ఇందుకు తెలంగాణ ప్రచురణకర్తలు మరియు సంపాదకులు కృషి ఎనలేనిది.
..భూతం ముత్యాలు
December 31, 2021 0 comment
4 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

 చరిత్రకెక్కని చరితార్థులు తెలంగాణ సాహిత్యకారులు”

by Butam Mutyalu December 31, 2021
written by Butam Mutyalu
ఒక దేశం, ప్రాంతం ప్రజల యొక్క జీవన విధానము, వారి యొక్క సంస్కృతి సాహిత్యం ప్రభావితం చేస్తాయి. ఆయా కాలాలలోని ప్రజల ఆచారాలు, వ్యవహారాలు, రాజుల పాలన తెలియాలంటే అప్పటి మౌఖిక, లిఖిత సాహిత్యం ఆధారం, ఒక వెయ్యి సంవత్సరాల సాహిత్యం ప్రజల భాషకు పట్టం గట్టి రాజు ఆస్థానంలోనేగాక ప్రజల నాలుకలపై నడయాడింది. నాటి నుండి నేటికి సాహిత్యంలో విస్మరణకు, వివక్షతకు గురియైన తెలంగాణ: సాహితీ తేజోమూర్తులను వారి సాహిత్యాన్ని, వెలుగులోకి తీసుకవచ్చి వారిని సాహితీ యవనికపై పునర్జికించి. సాహిత్యంలో తెలంగాణ ఉనికిని దశదిశల చాటాలని తెలంగాణ ప్రచురణలు సంస్థ నిర్ణయించడం శుభపరినామం. “చరిత్రకెక్కని చరితార్థులు తెలంగాణ కవులు, రచయితలు”, ఇది అనాదిగా సాగుతూ వస్తున్న తంతు, వలసాంద్ర పాలకులు ఇక్కడి కవులను విస్మరించి, వివక్షతకు గురిచేశారు. ఇది శతాబ్దాలుగా సాగింది. ఈ నేలపై పుట్టిన ఆమహానీయులను గుర్తించి తనకున్న సమాచారం ప్రకారము ముప్పది రెండు మంది కవులను వెలుగులోకి తీసుక వచ్చిన ఘనత ఆచార్య “బిరుదురాజు రామరాజు” గారిది. వారు 1985లోనే కిరార్డు చేయనికె పూనుకున్నరు.
పరిశోధనే ప్రాణంగా జీవించిన రామరాజు గారు తెలుగు సాహిత్యంలో గుర్తింపుకు నోచుకొని, మేటి ఉద్దండులైన సాహితీ తేజోమూర్తులు, వారి కృతులు వివిధ ప్రాంతాలు పర్యటించి సేకరించి భావితరాలకు అందించాలనే తపనతో చరిత్రకెక్కని చరితార్థులుగా వారి
…వారి ప్రశస్తిని తీసుకు రావడం ముదావాహం. అలాగే ఎవరు అనగా ఏ పరిశోదకుడు పట్టించుకోని జానపద సాహిత్యాన్ని మనకందించారు. ఆరకంగా వారు దన్యులైనారు. ఈ పరిశోదకవ్యాసం లోని కవి పండితులు మరుగున పడి కాలగర్భంలో కలిసిపోకుండా నిబద్దతతో కంకణబద్దులై మనముందుంచారు తెలంగాణ ప్రచురణ కర్తలు. బి. నర్సింగ్ రావు, సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి గారలు.
ఆనాడు రామరాజుకు గురువు అయిన ఖండవల్లి లక్ష్మీరంజనం, డా॥ మాదవరావు పేర్వారం జగన్నాదం.. డా|| వల్లపు బుచ్చిరెడ్డి, ఆర్, శ్రీహరి మొదలగువారు రామరాజుకు సహకరించారు. రామరాజు సేకరించిన కవిపండితులు పాల్కూరికి సోమనాథుడు మొదలు బాల సరస్వతి శ్రీనివాసాచార్యుల వరకు క్రీ.శ. 11వ శతాబ్దినుండి, 20వ శతాబ్ది వరకు జీవించిన వారిని అంటే వెయ్యేండ్ల సాహిత్య చరిత్ర మనకందించిన పుణ్యపేటి రామారాజు గారు. తెలంగాణలో కవులు లేరు, సాహిత్యం లేదను వలసపాలకులకు చెంపపెట్టు రామరాజు కృషి ఫలిత పరిశోదక వ్యాసం. ఈ వ్యాసంలో చరిత్ర కెక్కిన లిఖిత కవులు గాకుండా కేవలం తాళపత్ర గ్రంథలకే పరిమితమై కాలగర్భంలో కలువనికె సిద్దంగున్నవారు. అలాంటి వారి సాహిత్య సంపదను మనకందించారు రామరాజు గారు వీరు “మహ యోగులు” “మరుగున పడిన మాణిక్యాలు” అనే సంపుటాలు తీసుక వచ్చారు. రామరాజుగారు సేకరించిన తాళపత్ర కమ్మలు మిక్కిలి జీర్ణావస్థలో ఉన్నవి. ఆయా కమ్మలలోని కొన్ని పంక్తులు అసలు చదువ వీలు లేకుండ ఉన్నవి. ఆ కమ్మలలో
…కమ్మలలో వ్రాత తప్పుకూడ కుప్పులు, తెప్పలుగా ఉండగా వాటిని ఎలాగైన పరిష్కరణ చేయాలన్న తపనతో వీరు ఒకటికి పదిమార్లు ఆయా గ్రంథముల కమ్మలు పరిశీలించి, జాగ్రత్తగా చదివి వాటి ప్రాచీనతను, అవి ఏ కాలం నాటివో అని తేల్చుకొని ఒక నిర్ధారణకు రాగలిగారు. అది రామరాజు గారి తాళపత్రగ్రంథములపై ఉన్నమక్కువే మరో విషయమేమంటే ఒక కావ్యం ఎలా ప్రారంభమైనది. అది ఎలా? ముగించబడినది. దాని కాలపరిధులు, వాటిలోని కల్పనలు పరిష్కరిస్తూ తన అనుమానాలను నివృతి చేసుకొన్న పిమ్మట దానిపై ఒక అభిప్రాయానికి రాగలిగారు….ఇందులో
రాజాబహర్ పామనాయక భూపాలుడు సురపుర సంస్థానాదీశులు ఇతను 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నాడు. ఇతను “భార్గవపురాణం”. ద్రౌపదీ కళ్యాణకర్త బోయినపల్లి కుమార వెంకటరాయులు 17వ శతాబ్దికుడు, పద్మనాయకులు – రెడ్లు వంశం. హరివంశంలోని “ఆశ్చర్యపర్వం” లో ధర్మకథలు, తెలుగులో తురిమిళ్ళ రామన్న “శేషధర్మం”. నవీన ద్రోణపర్వం కమ్మపై కారణం రామయ్య తాత పేరు. గద్వాల పెదసోమభూపాల వినతి కి కోటికెలపూడి వీరరాగవ కవి. “యాదశ్యుక తాత్పర్య బారతోద్యోగపర్వం” లయాగ్రహికవి “కౌసలేంద్ర చరిత్ర”. అద్దంకి గంగాధర కవి “తపతీ సంవరణోపాక్యనం” నాడగౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు. “దివ్యదేశమహత్మ దీపిక” 108 దివ్యస్తలాలు ద్విపద గ్రంథం “వెంకటాచలరమణ” శతకం మూడువేల కీర్తనలు.. “శ్రీ రుక్మిణీ కురవంజి” అత్తను రామనుజాచార్యుని రచన, జంపె, సువర్ణలులు, మంగళహారతులు, ద్విపదులు, దవళలు, ఆనాటి సామాజిక స్థితులు మొత్తనముగ – మట్టుసముగ మహబూబ్ నగర్ జిల్లా వాడుక పదం గద్వాల, సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు “సారంగధర చరిత” 14వ శకము యక్షగాణం (1376), 16వ శ॥ కందుకూరి రుద్రకవి “సుగ్రీవవిజయం” తొలి యక్ష గానం నాలుగు వందల ఎండ్ల కింద పుట్టిన
కుతుబ్షాహి వంశంలో సుల్తాన్ స్థాన మంత్రి నేబతి కృష్ణయామాత్యుడు “పంచతంత్రం” ఆధారంగా “రాజనీతి రత్నకర” ఆరు అశ్వాసాల కావ్యం వ్రాసిండు. ఇతని పూర్వికులు నేబతివృత్తిలో ఉన్నరట (నియంత్ పతి (1580) 1960 నాటి మాట, వరంగల్కు చెందిన పరశురామ పంతులు..లింగమూర్తి రాసిన “ఆత్మరామ గోవింద” శతకాలు సుప్రసిద్ధం. ఆదికవి పాల్కురి సోమన లఘుకృతి పండితారాద్యోహరణం” సారంగ తమ్మయకవి “వైజయంతి విలాసం” ఇందులో “బాగిరదీపట్టనే” అన్నమాట బాగమతి మల్కిబరాం అయ్యి ఉంటుంది. ఓరుగంటి లక్ష్మణ యజ్వరాసిన “సీతరామవిహరకావ్యం” పరశురామ పంతులు అనంతరామ పండితుడు రాసిన ‘సీతావిజయం చంపు” – దిట్టకవి లక్ష్మణ ఏకసర్గకావ్యాలు “హనుమద్రామాయణం” దేవులపల్లి. అన్నపూర్నేశ్వరశర్మ రాసిన “నరసింహవిజయం వ్యాయోగం” – అయ్యవారు శాస్త్రి గారి “సాంభోదయం” చంపు ప్రబందం. చంద్రబట్టు ఈశ్వరప్ప “పార్వతీపరిణయం” చంపుకావ్యం బరద్వాజ రామచార్యులు రాసిన “బద్రగిరి చంపుకావ్యం” “బాలసరస్వతి శ్రీనివాసచార్య” ఏకదిన ప్రబంధం” పిల్లల మర్రి వెంకట పతి సూరి “రాజేశ్వర విలాస మాహకావ్యం 16వ శతాబ్దం.
రామరాజు మాదిరే తాళపత్ర గ్రంథాలపై కృషి చేసిన వేటూరి ప్రభాకరశాస్త్రి, మానవల్లి రామకృష్ణ గారలు రామరాజుకి ఆదర్శం, శేషాద్రి రమణకవులు కూడ ఈ కోవకి చెందినవారే. రామరాజుగారి కృషితో అనేక కొత్త గ్రంథాలు, కవులు, కావ్యకర్తలు, నూతన గ్రంథాల అంశాలు వెలుగులోకి వచ్చాయి. రామరాజు కృషిఫలితంగా కనుమరుగైయ్యే స్థితిలో ఉన్నవారు, చరిత్రకెక్కి చరితార్థులైనారు.
కొన్ని తాళపత్రగ్రంథాలు మూలం నుండి కొన్ని శతాబ్దాల అనంతరం దాని రూపు మార్చుకొన్నవి. కొందరు వ్రాయసకార్లు ఎత్తిరాయడం కూడా జరిగింది. ఒకానొక కాలంలో జీవించిన రాజు లేదా కవి యొక్క కాలం తాళ పత్రాలలో పేర్కొనబడినప్పటికి చివరకు వాటిని బద్రపరచిన వారి మనవలు, మునిమనవలు, (ముందు తరాల వారు) నేడు వారి వలననే రామరాజు గారికి ఇట్టి పత్రాలు లభించడం జరిగింది. ఏది ఏమైననూ తెలుగు సాహిత్యాన్ని మరుగున పడిపోయే కవులను రామరాజు గారు తెలంగాణ సాహిత్యాన్ని చరిత్రపై పునరుజ్జీవింపజేయడం ముదావాహం వారి కృషిని బావితరాలకు అందించాలనే వారి తపనతో ఈ గ్రంథాన్ని తీసుకు వచ్చినందుకు తెలంగాణ సంపాదక, ప్రచురణ కర్తలకు అభినందనలు.
December 31, 2021 0 comment
3 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

బహుముఖ విద్వన్మణి వేదం

by Cheedella Seetha Lakshmi December 31, 2021
written by Cheedella Seetha Lakshmi

ప్రముఖులు రాసిన లేఖల్లోని విశేషాలను తెలుసుకునే ధారావాహికలో భాగంగా మనమిప్పుడు ప్రముఖ
సాహితీవేత్త వేదం వేంకటరాయ శాస్త్రి గారి లేఖల ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం.
సాహితీవేత్త,బహుగ్రంథకర్త ,ఆంధ్ర విశ్వకళాపరిషత్ ప్రప్రథమ ఉప కులపతి కట్టమంచి రామలింగారెడ్డి గారు(సి.ఆర్.రెడ్డి)
శాస్త్రిగారి గురించి ప్రశంశిస్తూ ఆయన మాటల్లో ఇలా వివరించారు. “వేదం వేంకటరాయ శాస్త్రి గారు గొప్ప సాహితీవేత్త మరియు బహుగ్రంథ కర్త
‘కళాప్రపూర్ణ’ బిరుదానికి అర్హులని చెబుతూ

“ప్రతాపరుద్రీయాది స్వతంత్ర గ్రంథములు వీరి కవితాపరిపాటికిని,
విమర్శన వీరి సునిశితమగు విశేషమునకును,శృంగార నైషధాది వ్యాఖ్యానములును,కథా సరిత్సాగరాది భాషాఅంతరీకరణములను వీరి రసజ్ఞతకును
తార్కాణములు వారు వార్ధక్య దశలో మనః క్లేశము,దేహక్లేశములకు వెనుదీయక ఆముక్తమాల్యదకు సమగ్రమగు మహా వ్యాఖ్యానమును వీరు
ఇటీవలే రచించి ప్రచురించుట చూడగా
భాషా కృషి వీరికి కర్తవ్యముగానే గాక స్వభావము కూడా అని స్పష్టమగుచున్నది” అని రాశారు.

ఈ మాటల బట్టి చూడగా శాస్త్రి గారి రచనాసక్తి,సాహిత్య
తృష్ణ,వయసు సైతం లెక్కచేయని ఆయాన తెలుగు భాషా సేవ బహుధా ప్రశంసనీయం,చిరస్మరణీయం.

తెలుగు సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞను చూపి నాటక రచనలో పాత్రోచిత భాషను ప్రయోగించి తనదైన ప్రత్యేక ముద్రను వేసి కీర్తి గడించిన విద్వన్మణి వేదం వెంకటరాయ శాస్త్రి.

విమర్శకుడు,నాటకకర్త,,వ్యాఖ్యారచయిత,పరిశోధకుడు,పరిష్కర్త,అనువాదకుడు ,ముద్రాపకుడైన వేదం వారి ప్రతిభకు తార్కాణంగా అనేక బిరుదులు,సత్కారాలు ఆయన ఖాతాలో వచ్చి చేరాయి.

మహామహోపాధ్యాయ,కళాప్రపూర్ణ వేదం వేంకటరాయ శాస్త్రి గారు వేంకట లక్ష్మణ శాస్త్రి,లక్ష్మమ్మ దంపతులకు 1853 డిసెంబర్ 21 వ తేదీన మద్రాసులో జన్మించారు.సంస్కృతం,ఆంగ్ల భాషల్లో పట్టభద్రుడు వివిధ ప్రక్రియల్లో తనవంతు కృషి చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహనీయుడు వేదం.
వేదం వారు ఆర్ధిక దురవస్థకు గురైన సమయంలో ఔదార్యవంతుడు, తనంటే అభిమానురాగాలు చూపే వెంకటగిరి మహారాజాగారికి తన మనోరథాన్ని తెలుపుతూ ఒక సుదీర్ఘ లేఖ రాశారు.

కుటుంబభారం కోసం ధనం సరిపోక సంపాదనార్ధం ధనాపేక్ష కలిగి ” విక్రమార్కాది పురాతన రాజర్షి చరిత్రాభిమానిత చేతను తచ్చరిత్ర పుస్తకములను
సంస్కరించి సటిప్పణ ములనుగా ముద్రించితిని. ఇట్టి ఉద్యమము వలన ముందున్న లేనికి తోడు ఋణములు సైతము
సంభవించినవి….
కొంత అపు తీర్చుటకై
జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల లోని సామగ్రి విక్రయం చేత తీర్చి,శిష్టఋణమును నా జీవితము వలననే. తీర్చుచుంటిని”.
అని బాధను వెల్లడించారు. ఆర్ధిక సమస్యలు,అప్పులో ఉన్నా అప్పు తీర్చడం కోసం ఆయన పడే పాట్లు పురాతన రాజర్షి
చరిత్రపై వేదం వారికి ఉన్న అభిమానం కొద్దీ
టిప్పణాలు రాసి ముద్రించడం. శాస్త్రిగారి మనోభావాలు లేఖలో తొంగి చూస్తున్నాయి.

ఎన్ని సమస్యలున్నా కూడా,ఎన్ని ఆర్థిక బాధలనుభవిస్తున్నప్పటికీ సాహిత్యకృషిలో
మాత్రం శ్రద్ధ తగ్గలేదు.
ఆయన మాటల్లోనే,” సంస్కృత నాటకములను
పెక్కింటిని శాకుంతల,మాలతీమాధవ,

మహావీరచరిత్రోత్తర రామచరిత్రాదులను మూల విరుద్దార్థముగా నాంధ్రీ కృతములైనట్టి వానిని–వాస్తవార్థబోధకముగా వ్యాఖ్యాసమేతముగా –ప్రకటింపవలసియున్నది—వ్యుత్పత్తులనొసంగునట్టి నిఘంటువొకటి నిర్మించవలసియున్నది.శ్రీమదాంధ్ర మహాభాగవతమును సాధుపాఠ నిర్ణయ పూర్వకముగాను గూఢార్థ బోధన పూర్వకంగాను ప్రకటింపవల్సియున్నది.శిశుపాలవధాది కావ్యములను సంస్కృతాంధ్ర వ్యాఖ్యానాంధ్ర టీకా సమేతముగా ముద్రింపవలయును.

మహావీరచరిత్రోత్తర రామచరిత్రాదులను మూల విరుద్దార్థముగా నాంధ్రీ కృతములైనట్టి వానిని–వాస్తవార్థబోధకముగా వ్యాఖ్యాసమేతముగా –ప్రకటింపవలసియున్నది—వ్యుత్పత్తులనొసంగునట్టి నిఘంటువొకటి నిర్మించవలసియున్నది.శ్రీమదాంధ్ర మహాభాగవతమును సాధుపాఠ నిర్ణయ పూర్వకముగాను గూఢార్థ బోధన పూర్వకంగాను ప్రకటింపవల్సియున్నది– ఎల్లవారికిం బఠనీయముగా సకల నాటక కథావళి రచింపవలసియున్నది.శిశుపాలవధాది కావ్యములను సంస్కృతాంధ్ర టీకా సమేతముగా ముద్రింపవలయును. అమరకోశమునకు ఆంధ్రగీర్వాణ మయమైన సుబోధవ్యాఖ్య రచింపవలయును.కాశీఖండ సోమ హరివంశ పాండురంగ మహాత్మ్యాది దివ్యప్రబంధములను విషయ పద టీకలతో ముద్రితములంజేయవలయును.” అని చెప్పుకోవడంలో సాహిత్య సేవకై ఆయన తపన,ఆరాటం తెలుస్తుంది.నిరంతర శ్రమ చేసి ఏదో రాయాలని,ముద్రించాలని తహతహలాడేవారు.వేదం వారి వ్యక్తిత్వం,తెలుగు భాషా సాహిత్యం కోసం ఆయన పడ్డ శ్రమ,ఆందోళనను మహారాజుకు తన మనసు విప్పి చెప్పుకునే తీరు,మహారాజుతో ఈయనకు గల సాన్నిహిత్యాన్ని ఋజువు చేస్తుందీ లేఖ.” నా వ్యాపారము ప్రకృతమున నదీ మాతృకమయిన సుకృషి సుక్షేత్రము విత్తనము లేక చల్లకము మానినందున కంపతంపర మయిన రీతింబొందియున్నది.” నీటి వసతి ఉన్న నల్లనిమట్టి కలిగి చక్కని పండే భూమి వున్నప్పటికీ విత్తనాలు చల్లకపోతే కంపపెరిగి బీడు భూమిగా ఎట్లా అవుతుందో తన వ్యాపారం కూడా క్షీణించిందని తెలుపుతూ నాకు నిరంతరము ఏకాశ్రయులు,రాజవారేనని తన మనసులో ఉన్న విషయాన్ని బాధను వ్యక్తం చేసి రాజా వారి సహాయాన్ని అర్థించిన సాహిత్య పిపాసి.అరమరికలు లేకుండా తన మనోవ్యధను రాజవారికి తేటతెల్లం చేశారీలేఖలో.
ఈ లేఖ ద్వారా మనకు కూడా ఏదైనా పనిని చేయాలన్న తపన,దానికి తగ్గ శ్రమ ఎట్లా ఉండాలో సూచించినట్టుంది.

వేంకటరాయశాస్త్రి గారు నాగానందం నాటకాన్ని ఒక కొత్త మార్గంలో రచించారు.సంస్కృత నాటక మర్యాదలననుసరించి సంస్కృత భాష వుండేచోట సలక్షణ భాషను,ప్రాకృతాది భాషా భేదం వుండేచోట తెలుగు గ్రామ్య భేదాన్ని అంటే పాత్రోచితభాషను ప్రయోగించి అనువాదం చేశారు.” ఆంధ్ర భాషలో పాత్రోచిత భాషలో రచింపబడిన మొట్టమొదటి నాటకము నాగనందమే” కొత్తమార్గాన్ని కొందరు సహృదయులు ఆమోదించారు.వడ్డాది సుబ్బరాయ కవి శాస్త్రుల వారికి వ్రాసిన లేఖలో ” నీచ పాత్రములకు తెలుగు నాటకముల యందు దమరు చూపిన దారి నామట్టు కాదరణీయముగానే తోచుచున్నది.మఱియు దాని వలన ననేక లాభములున్నట్లు నేను దలంచుచున్నాడను.గ్రామ్యములేవో యగ్రామ్యములేవో యెఱుంగని వారలనేకులుందురు గాన వారిని గ్రామ్యములివి యాగ్రామ్యములివని తెలిసికొనుటకు వీలు కలుగుచున్నది.మఱియు వాడుక ప్రకారము అట్టి గ్రామ్యరూపములు వ్రాయుట కష్టమే.నాకు జూడ దన్నాటకము బహు రసవంతముగా నున్నది.” అని తన అభిప్రాయాన్ని లేఖాముఖంగా వెల్లడించారు.

ప్రతాపరుద్రీయము నాటకాన్ని రచించారు.పూండ్ల రామకృష్ణయ్య గారు లేఖ వ్రాస్తూ వెలగల యశస్సును తెచ్చి పెడుతుందని అచ్చునకివ్వమని ప్రోత్సహిస్తూ
“తాటాకు చప్పుళ్లను మీరు లక్ష్యము చేయకుడు” ఎవరెన్ని పోకడలు పోయినా లక్ష్యపెట్టవద్దని,విమర్శనలనెదుర్కోవాలని హితవు చెప్పి వెన్నుతట్టారు.

‘జక్కన విక్రమార్కచరిత్ర’ ముద్రణానంతరము అనేక ఆక్షేపణల నెదుర్కొన్నారు.” అన్ని పద్యములును అన్యాపదేశముగా వ్రాసి నిందించినారు.వానిలో తెలుగు భాషలో బాండిత్యము లేదని సూచింపబడియున్నది.మీరు సంస్కృత పండితులే గాని యాంధ్ర పండితులు గారట” అని రామకృష్ణయ్య గారి లేఖలో తెలిపారు.ఆనాడు కూడా ఓర్వలేనివారు ఏదో పేరు పెట్టి విమర్శించే వారని తెలుస్తుంది.అట్లాంటి వాటిని లెక్క చేయక దైర్యంగా ముందుకు పోతేనే అభ్యుదయం.జంకకుడు,వెనుకంజ వేయకుడు ” అంటూ సవ్యసాచిగా ఇప్పుడుండవలెనని ప్రోత్సహించారు రామకృష్ణయ్య గారు.నాడైనా,నేడైనా మంచి పని చేస్తున్నప్పుడు యేడ్చెవాళ్లు,వెనక్కి కాలు గుంజే వాళ్ళుంటారని తెలుస్తుంది.

ఆనాడు పూండ్ల రామకృష్ణయ్య గారికి వేదం వారికి గల మైత్రీబంధం,వెన్నుతట్టి వేదం వారిని ప్రోత్సహించే పధ్ధతి లేఖల ద్వారా స్పష్టమౌతుంది.

వేదం వారిపై గురజాడ అప్పారావు గారి అభిప్రాయం లేఖల ద్వారా తెలుస్తుంది.

ఏదైనా విషయాన్ని తీసుకుని చర్చ మొదలెడితే దాన్ని ఆమూలాగ్రం చర్చించే స్వభావం వేదం వారిదని ప్రస్తుతించారు అప్పారావుగారు.అదే ఆనాటి పండితులలో కన్పించదంటారు. జీవితంలో కల్సిపోయిన మన సంప్రదాయాలను,అలవాట్లను,ఒక్కసారిగా మార్చుకోవడం సులభం కాకపోయినప్పటికీ
” మీలాంటి నిజమైన తాత్వికవేత్తలు మీకున్న అనుభవసారం,సాహిత్య శక్తితో ఒక కొత్త సాహిత్య ప్రక్రియకు నూతన మార్గాలు కనిపెట్టి, నూతన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి స్తంభించిపోయిన సాహిత్యాన్ని రక్షించగలరు” అని పెద్ద భారాన్ని గురజాడ వేదం వారిపై మోపారు.
వేదం వారి శైలిని గురించి విమర్శిస్తూ వ్యాకరణము,శైలి అంతా పూర్వకవుల పంథా లోనే సాగుతుంది మీ పద్యరచన అని అంటారు.

వీరేశలింగం పంతులు, వారి అనుచరులు. సాహిత్యపరంగా గ్రాంధికభాషకు అలవాటు పడిపోయి
మాట్లాడే మాండలిక పదాలను కూడా సీరియస్ గా సాహిత్యధోరణిలో రాస్తేనే అది అగౌరవంగానూ హాస్యాస్పదంగానూ ఉండదా!! వీరేశలింగం ఆధ్వర్యంలో ఉన్న ఈ పద్ధతి పట్ల (గద్యరచన) వేదం వారి అభిప్రాయాన్ని కోరుతూ లేఖలో పేర్కొన్నారు.

‘శృంగార నైషధ వ్యాఖ్య’ పై కూడా అభిప్రాయాన్ని తెలుపుతూ అప్పారావు గారు లేఖలో తెలుగు సాహిత్య విద్యార్థులకు
అమూల్యమైనదని,
తెలుగులో సగటు విద్యావేత్తలు ఎవరూ దానిని అర్థం చేసుకోలేరని,ఇప్పుడు మీరు చేయని చేయలేని గొప్ప కార్యాన్ని చేశారని ప్రస్తుతించారు. వేదం వారు యూనివర్సిటీ లో పరీక్షాధికారిగా ‘తెలుగు విభాగానికి’ నియుక్తులయ్యారు. పూండ్ల రామకృష్ణయ్య గారు ఈ విషయమై
లేఖ రాస్తూ “యీ మహాయుద్ధములో మిమ్మునాంధ్రముకే ఏర్పాటు చేయుట కొంత సుగుణమనియు విమతులకు శృంగభంగమనియు తలచెద.ఇక మాకందరికీ తమరు ‘ఎగ్జామినరగుట’ బ్రహ్మానందముగా నున్నది” అనడం వలన
ఆ కాలం నాటి సమాజపరిస్థితి కొంత అర్థం చేసుకోవచ్చు. ఒకరిపై ఒకరికి పడరానివారున్నారనీ,అడ్డుపుల్లలు వేసేవారని,కుయుక్తులు చేసేవారికి శాస్త్రి గారి పరీక్షాధికారి నియామకం వలన శృంగభంగమైందని తెలుస్తోంది.ఈ కాలంలో వలెనే ఆకాలంలో కూడా కుట్రదారులు,
కుళ్ళుపోతులు ఉండేవారని స్పష్టం.

‘ఆంధ్రభాషాభిమాని సమాజానికి’ అధ్యక్షునిగా ఉండి నీతిమంతంగా ప్రవర్తించి డబ్బు విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండేవారని శాస్త్రి గారి ప్రవర్తన,గుణశీలాదులు
లేఖల ద్వారా తెలుస్తాయి.

ఈ విధంగా ప్రముఖుల చేత కూడా మన్నలను పొందిన ఉన్నత కవి వతంసులు,
బహుముఖ ప్రజ్ఞాశాలి,’పాత్రోచిత భాష’కు ఒక కొత్త ఒరవడి చేకూర్చి తెలుగు సాహిత్యవనంలో గుబాళించిన పుష్పం శ్రీ
వేదం వెంకటరాయ శాస్త్రి గారు అని ఆయన లేఖల ద్వారా విశదమౌతుంది.

బహుముఖ విద్వన్మణి వేదం వేంకటరాయ శాస్త్రి గారు తెలుగు సాహిత్య సేవలో తరించి తన 76 వ ఏట1929వ సంవత్సరం జూన్ 18 వ తేదీన మద్రాసులోనే తుది శ్వాస విడిచారు.

మహా మహోపాధ్యాయుని జయంతి సందర్బంగా దివ్యస్మృతికి నివాళులర్పిస్తూ…

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి.

December 31, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

KALPA’ VRIKSHA

by గురిజాల రామశేషయ్య December 31, 2021
written by గురిజాల రామశేషయ్య

__________

Good Wishes for a Happy New Year 2022

rendering into English :
late_ Prof. M.Siva Ramakrishna
Head, Dept. of English O.U. Hyd.

The wish fulfilling Tree
yields a fresh, new bud
flowering into a fountain
that the timeless womb delivers

Bud expands to a flower
a fruit even as
the fountain transforms
into a stream, a river
And enriches , I wish,
Your life with the
nectar of
limitless, eternal JOY.

(Telugu original : Gurijala RamaSeshaiah)

1–1–2022

కల్పవృక్షం

కొత్త సంవత్సరం —

కాలవృక్షం తొడిగిన కొత్త మొగ్గ
కాలగర్భం నుండి చిమ్ముకొచ్చిన కొత్త నీటి బుగ్గ

మొగ్గ వికసించి పుష్పమై ఫలమై
బుగ్గ కదలి కదలి పాయయై నదియై

మీ జీవితాన్ని రసవంతం చేయాలి
మీ జీవనాన్ని ప్రాణవంతం చేయాలి

అవధులు లేని ఆనందం మీ సొంతమై
మీ జీవితం శాశ్వతోజ్జీవనసుధాసమృద్ధితరంగమై ప్రగమించాలని

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

— గురిజాల రామశేషయ్య
1–1–2022

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us