మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

వాట్-ఏ-పిటీ!

by కుడికాల వంశీధర్ February 28, 2022
written by కుడికాల వంశీధర్

ఆర్టిపీషియల్ గాలికి అలవాటుపడ్డ దేహాలు
గ్లోబల్ వార్మింగ్ వేడికి
కలుగులోని ఎలుకల్లా
బయటపడతాయి.
‘గో గ్రీన్’  అని
బోదురు కప్పలా అరిచి
సొల్యూషన్ ఏదో దొరికిందనిపించి
పొల్యూషన్ లెవెల్స్ పెంచుకుంటూ
వచ్చిన కార్లలో
తిరిగి బతుకు బావిలోకి వెళ్లిపోయాయి.
*
వైఫైతో వల్లెవాటు వేసుకున్న విశ్వైక జీవాలు
తలుపులు లేని గదికి
తాళం వేసి
ఒంటరిగా గడుపుతాయి.
ఇంటర్‌నెట్ ఇంటరప్షన్‌తో
మరో ప్రపంచం ఉన్నదని తెలుసుకొని
భయకంపితులౌతాయి.
తెలియని ఏకాకితనపు కరతాళ ధ్వనులకు
తాళలేక
ఫ్రీక్అవుట్ అవుతాయి.
*

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పూల దోసిళ్ళు

by Rama Devi Nellutla February 28, 2022
written by Rama Devi Nellutla

నిలబడ్డ నేలా తల మీది ఆకాశం నీది కానప్పుడే
స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుస్తుంది
పీలుస్తున్న గాలీ పలుకుతున్న పదమూ
నీ స్వంతం కానప్పుడే స్వతంత్ర్యం విలువ తెలుస్తుంది
ఏడు దశాబ్దాల క్రితం ఎర్ర కోట మీదే కాదు
ఎన్నో కోట్ల హృదయ మైదానాల్లో ఈ జెండా ఎగిరినపుడు
ఎన్ని దేహాలు రోమాంచితమైనాయో …ఎన్ని రక్త నాళాలు ఉప్పొంగినాయో ….
ఎన్ని యుద్ధాలు ఎన్ని త్యాగాలు ఎన్ని సమర్పణలు ఎన్ని బలిదానాలు ఈ దేశం చూసిందో –
చిన్న మూటల్తో వర్తకానికి వచ్చి మూటలకు మూటలు రత్న రాసులు దోపిడి చేసినవారు
గొంతులు నొక్కి శ్రమను దోచి రాజ్యాలు గెలిచి హక్కులు కబళించి ఆధిపత్యం చెలాయించిన వారు
మూటా ముల్లె సర్దుకుని పోవడానికి ఎన్ని ప్రాణ త్యాగాలు జరిగాయో …ఎలా మరుస్తాం ?
రాజ్య వారసుడు పోయినా ప్రజా స్వేచ్ఛ కోసం ‘ ప్రాణమిస్తా , ఝాన్సీ నివ్వను ‘ అన్న ప్రధమ స్వాతంత్ర్య పోరాట జ్వాలనీ ,
గుండె అక్కడ కాదురా ఇక్కడ కాల్చమంటూ శత్రువు కెదురు నిల్చిన మన్నెం వీరుడినీ ,
‘ఇంక్విలాబ్ జిందాబాద్ ‘ అన్న భగత్ సింహాన్నీ , ‘ స్వాతంత్ర్యం జన్మహక్కు ‘అన్న బాల గంగాధరుణ్ణీ
‘వందే మాతరం ‘ అంటూ నినదించిన వంగ భూమి పుత్రుడు బంకిం చంద్రుడినీ ..
‘రుధిరమివ్వండి. స్వరాజ్యమిస్తా ‘ నన్న ఆజాద్ ఫవుజ్ సుభాష్ బోస్ నీ ఎలా మర్చిపోతాం ?
‘నా దేశ ప్రజలు నిండా బట్టలు కట్టేదాకా నేనూ చొక్కా తొడగనన్న’ ఒక బక్క పలుచని దేహం
ఆచ్ఛాదన లేని ఛాతీ విరుచుకుని ఎముకలు కొరికే చలిలో రౌండ్ టేబుల్ సమావేశానికి
సత్యాహింసలను ఊతకర్రలుగా మార్చి ‘డూ ఆర్ డై ‘ అంటూ నడిచి వెళ్లడం ఎలా మరుస్తాం ?
ఉప్పు పిడికిలిని ఉక్కు పిడికిలిగా మార్చిన శాంతి మాంత్రికుడు
భరత భూమికి స్వేచ్చనూ ప్రపంచానికి అహింసనూ బహుమతిగా ఇచ్చిన బోసి నవ్వుల తాతనూ
‘ఆరాం హరామ్ హై ‘ అంటూ జాతి నిర్మాణానికి నడుం కట్టిన చాచానూ గుర్తు పెట్టుకోకుంటామా ?
ఎందరు త్యాగ ధనులు , చరిత్ర కెక్కని ఘనులు
కారుణ్యం లేని శత్రువుకు చిక్కి కాలాపానీ కారాగారాల్లో మగ్గారు
తమ రక్తంతో జాతి చరిత్రకు ప్రాణం పోశారు
దేశం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చటం కోసం
దేహం నుంచి చెమట చుక్కల్ని రాల్చినంత సునాయాసంగా ప్రాణాల్ని వదిలారు
సమర యోధులారా అమర వీరులారా
మీ సమాధులపై వెలుగుతున్నది ఆ కొవ్వొత్తులే కాదు మా హృదయ దీపాలు కూడా
మీ కోసం రాలుతున్నవి ఆ చెట్ల పూలగుత్తులే కాదు మా కన్నీటి చుక్కలు కూడా
మీ కోసం మా శాల్యూట్ లూ జోహార్లూ , వీరగంధాలూ పూల దోసిళ్ళు కూడా
ఏడు దశాబ్దాల క్రిందటే కాదు , జై జవాన్ జై కిసాన్ ఇప్పుడు కూడా !!

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బొజ్జ గణపయ్య

by రంగరాజు పద్మజ February 28, 2022
written by రంగరాజు పద్మజ

పార్వతి:–
పద పదరా! ఏకదంతా! మనపొదరింటికి!
మంగళంపాడిరి నీకు – మనుషులందరు
మరు సంవత్సరమునకు- మళ్ళి రమ్మని!

విఘ్నేశ్వరుడు:-
ఇంటికి పోనమ్మా! నేనిక్కడే ఉంటానమ్మా!
ఇంటింటికి కుడుములు తింటానమ్మా !!

పార్వతి:-
కుడుములు లేవుర! కుమారా! ఇడుములుపాపుటేరా!
నడు నడు కైలాసానికి! పద పద రా ఏకదంతా!

విఘ్నేశ్వరుడు:–
నన్ను మంచిరి కోనేరులలో…
కోశము తడిసేను- కోరుదు సెలవులు!!
విరిగెను నా దంతము- చదువుట వ్రాయుట ఏలా?

పార్వతి:-
చరవాణి లోనే చక చక చదువుము చంటీ!
చదువులకే వేలుపను పదవి ఊడును తండ్రీ !
ఇల్లిల్లూ తిరుగు-తినుట మానుము నాన్నా !
అద్దంలో నీ ముద్దు మోము చూడరా కన్నా!
నడక అసలే లేక పెరగెను !నీ బొజ్జ!
బడికి పోయి చదవరా తండ్రి!
చదువురాకున్నా!గానీ సన్నగా అయ్యేవు !

విఘ్నేశ్వరుడు:–

నేను సన్నంగా అయితే! కవులకు కష్టం!
వికటకవులు హాస్యం లేక కటకట బడేరు !

ఓ బొజ్జ వెంకయ్య! నీ బంటు నేనయ్య అను
నా స్తుతులు స్తోత్రాలు మార్చి రాయాలమ్మ !!

పలుచబొజ్జ గణపయ్య- పాదాలు పట్టే మని;

నేనూ లేఖకుడినే- లేఖకులంటే నాకు ఇష్టమే అమ్మా!
కష్ట పెట్టను కవులను కనికరముతో…
నన్ను నా రీతి గుండగా నిమ్మమ్మా!
కాలు పెట్టను నేను కైలాస మందు !
కుడుములు తింటూ ఉంటానుఇక్కడే!
కర్మ భూమిన నుందు – కరమొప్పగాను !

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అనర్ఘ రత్నాలు

by డా॥ సంగనభట్ల నరసయ్య January 16, 2022
written by డా॥ సంగనభట్ల నరసయ్య

 శ్రీమతికి శ్రీనాథుని ప్రే(క్షేమ) లేఖ

ఉ. శ్రీమదసత్యమధ్యకును, చిన్ని వయారికి, ముద్దులాడికిన్

సామజయానకున్, మిగుల చక్కని ఇంతికి, మేలు కావలెన్

మేమిట క్షేమమీవరకు, మీ శుభవార్తలు వ్రాసి పంపుమా,

నామది నీదు మోహము క్షణంబును దీరదు, స్నేహబాంధవీ !

శ్రీనాథుని పద్యాలనేకం స్త్రీ అంగాంగ వర్ణనలతో కావ్యాల్లోనూ, చాటువుల్లోనూ ఉన్నాయి. చాటు పద్యాల్లో అధికంగా ఆయన శృంగారాసక్తిని, భోగ లాలసను సూచిస్తాయి. అందుకే ఆయనకు శృంగార శ్రీనాథుడని పేరు. ఆహార, ఆహార్య, విహారాల్లో ఆయన భోగజీవితేచ్ఛ అడుగడుగునా కనిపిస్తుంది. ఆయన సంచార జీవనం, నానారాజ సందర్శనం, అంకితోత్సవాలు, వాగ్విజయ సభలు, రాజ సన్మానాలు, శృంగార జీవనం చాటువుల నిండా పరచుకొన్నాయి. స్త్రీ శృంగారాన్ని వర్ణించే ఇతర కవులవి కూడా శ్రీనాథునికి అంటగట్టినవి ఉన్నాయి. కాని శ్రీనాథుని రచనలు అతని ఒడుపు, ఎత్తుగడ, పదబంధాలు, సంస్కృత సమాసాలు ఆయన శైలితో మెరుస్తూ అతనివిగానే ఋజువు చేస్తాయి.

పై పద్యం శ్రీనాథుని ఇతర పద్యాలవలె అన్యకాంతా మోహం, పర స్త్రీ సౌందర్య వర్ణనతో గాక, సభ్యవర్ణనతో భార్యను ఉద్దేశించి రాసిన వర్ణన లేదా లేఖగా కనబడుతుంది. చూద్దాం.

శ్రీమత్ = సంపదలతో లేదా సౌభాగ్యముతో కూడినది. ఈ సంబోధన పుణ్య / గౌరవ స్త్రీలకు వేసే విశేషణం. పైగా లేఖా సంప్రదాయంలో తొలిపదం. ఈ ప్రారంభపదమే ‘లేక’ అనడానికి గుర్తు.

అసత్య మధ్యకు సన్నని నడుము కలదని, చిన్ని వయారికి = చిన్న వయసులోనిదని, ముద్దులాడికిన్ = ముద్దుమురిపాలిస్తున్న నూత్న వధువు అని ఇది పెళ్లి అయిన కొత్తలోనే రాసిన పద్యంలా ఉంది. అసత్యమధ్య అంటేనే నడుం పెరగలేదని మధ్యవయస్కు ప్రౌఢ కాదని తెలుస్తోంది. దీంట్లో (ఈ విశేషణాల్లో) సభ్యత వల్ల భార్యకు వేసిన విశేషణాలుగా భావించవచ్చు. మేలు కావలెన్ = ఆశీస్సులందిస్తున్నాడు. తొలిపదం లేఖ ప్రారంభంగా, తొలి వాక్యాంత క్రియ ఆశీస్సుగా లేఖగా ధృవీకరిస్తు లేదూ? ఇది లేఖే అనడానికి ఇంకా కింద చూడండి.

మేమిట క్షేమము = తన క్షేమం తెలుపుతున్నాడు. ‘ఇట’ అంటే తన ఊరి నుండి భార్యను వదిలి బయల్దేరి, చాలా దూరం వచ్చిన ఈ పద్యం రాసిన ఊరికి (ప్రస్తుతం ఉన్నది) వచ్చేవరకు క్షేమంగా ఉన్నానంటున్నాడు. ఇది లేఖ అనడానికి మరీ కింద చూడండి.

మీ శుభవార్తలు = మీరంటే తన భార్య ఒక్కతే ఐతే ఏకవచనం ఉండేది. భార్యతో బాటు శిశువైన తన సంతానమో లేక తన ‘మదేకపుత్ర’ తల్లి లేదా తండ్రి (జీవితులుగా ఉంటే), అంటే కుటుంబం అంతా అని బహువచనం వాడినాడు. వ్రాసి పంపుమీ = ఈ లేఖ తెస్తున్న శిష్యుడు తన వద్దకు తిరిగి వచ్చేటపుడు తిరుగులేఖ ద్వారా రాసి పంపమంటున్నాడు. అయ్యా! ఇప్పటికైనా ఈ పద్యం ఉత్తరం అని ఒప్పుకుంటారుగా!

నీదు మోహము = నీపై అనురాగం, నా మది క్షణంబును దీరదు = ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా నువ్వే గుర్తు వస్తున్నావని, స్నేహ బాంధవీ! = స్నేహం (అనురాగం)తో బాంధవ్యం (తాళి గట్టిన బంధుత్వం)తో (తాకి కట్టడం బంధనం, బంధనంతో బంధుత్వం కదా లోకంలో) – పై రెంటిలో స్నేహ బాంధవ్యాలు (అనురాగం, భార్యాత్వం) కల్గిన దానా?

ఇది శ్రీనాథుని రచనే అని చెప్పడానికి పై విశేషణాలే సాక్ష్యమిస్తున్నాయి. అసత్యమధ్య, వయారి, ముద్దులాడ, సామజయాన వంటివి ఆయన తరచూ వాడే పదాలే. ప్రతి కవికీ కొన్ని పద బంధాలు పడికట్టుగా ఉంటాయి. శ్రీనాథుడు “దూరటంకాల…” పద్యంలో రావు సింగమహీ పాటని రాచకొండ రాజ్యసభలో ఎటుల మెప్పించెదో అంటూ “సరససద్గుణ నికురుంబ శారదాంబ” అని సంబోధించినాడు. తానే తిరిగి ఫిరంగిపుర శాసనాన్ని రాస్తూ “సరస సద్గుణ నికురంబ సూరమాంబ” అని శాసనకర్తిని (దాత) పేరును అదే పదబంధాలతో సూచించినాడు. “శ్రీనాథో విద్యాధికారీ శ్రీ వీరవేమభూపతేః” అని శాసనాంతంలో తన పేరును తన ‘విద్యాధికారి’ హోదాను సూచించినాడు.

శ్రీనాథుడు భార్యకు లేఖ రాయడానికి వచనం వాడాలి, కాని పద్యం (ఛందస్సు)లో రాస్తాడా? అని మెడ మీద తలకాయ ఉన్నవాడెవడూ అడుగడు. ఆయన జీవితంలో ప్రతి సంఘటనను ఛందోబద్ధం చేసినాడు. ఆఖరుకు తన ఆత్మహత్యను కూడా “అరగుచున్నాడు శ్రీనాథుడమర పురికి”అని పద్యంలో రాసుకున్న జీవకవి. ఆయనవి దొరికినన్ని చాటువులు మరే కవివి దొరకలేదు.

భార్యకు పద్య లేఖ రాయడంలో తప్పేం లేదు. ఆవిడా కవయిత్రి కావచ్చు. లేదా పద్య సౌగంధ్యానికి పరవశించే పడతి కావచ్చు. శ్రీనాథుని శ్రీమతా? మజాకా? తెలుగు కవులు తమ భార్యల గూర్చి వారి వైదుష్యం సంగతి (వారిజ భవుడెరుగు) పేరైనా చెప్పరైరి (ఒక్క కృష్ణరాయని కావ్యాల్లో తప్ప)

-డా. సంగనభట్ల నరసయ్య

9440073124

విశ్రాంత ప్రాంశుపాలుడు, ప్రాచ్య కళాశాల, ధర్మపురి

(ఈ పద్యం డా. కోడూరి ప్రభాకరరెడ్డి సంకలనం “శ్రీనాథుని చాటువులు” నుండి స్వీకరించాను.)

January 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

తలుపు చప్పుడు

by Sudharshan Chintapatla January 6, 2022
written by Sudharshan Chintapatla

ఆంగ్లం : కె.సచ్చిదానందన్, తెలుగు : చింతపట్ల సుదర్శన్
మొట్టమొదటి తలుపు చప్పుడు
విని అడిగాను
ఎవరది
నేను మీ నాన్నను
తలుపు తెరిచాను
సూర్యుడు లోపలికి వచ్చాడు
ఉదయపు లేత సూర్యకిరణం
రెండవసారి తలుపుచప్పుడు
విని అడిగాను
ఎవరది?
నేను నీ ప్రేయసిని
తలుపు తెరిచాను
మల్లెల పరిమళం వెదజల్లుతూ
చల్లని గాలి లోపలికి వచ్చి
నన్ను కౌగలించుకుంది
మూడవసారి తలుపుచప్పుడు
విని అడిగాను
ఎవరది?
నేను నీ స్నేహితుడ్ని
తలుపు తెరిచాను
వర్షం లోపలికి వచ్చి
నన్ను పూర్తిగా తడిపేసింది
మళ్ళీ తలుపు చప్పుడు
విని అడిగాను
ఎవరది?
నీ స్నేహితుడ్ని
తలుపు తెరిచాను
బురద పూసుకున్న మేఘపు ముక్క
లోపలికి వచ్చి కూర్చోమనకుండానే
కుర్చీలో కూర్చుని
పొగలూగుతూ
ఇంద్రధనస్సును సృష్టించింది
అప్పుడొచ్చింది
అయిదవ తలుపు చప్పుడు
ఎవరది విని అడిగాను
నీ మృత్యువును
తలుపు తెరవలేదు
అడిగాను
సుదీర్ఘకాలంగా
ఒంటరిదైన ఈ భూమ్మీద ఉన్నాను
నాకేం బహుమతి ఇస్తావు
నీకు స్వేచ్ఛనిస్తాను
సారవంతమైన మట్టిగా మారుస్తాను
తమలపాకు మొక్కలన్నీ
లిల్లీ పువ్వుల్నీ నీలో పెరగనిస్తావు
నువ్వొక బిందువువై
సముద్రంలో కలుస్తావు
ముత్యానివీ, ఉప్పువీ అవుతావు
నువు మళ్ళీ మళ్ళీ
భూమి ఉన్నంత కాలమూ
మొలకెత్తుతావు
సముద్రం ఉన్నంతవరకూ
అలవై ధ్యానిస్తావు
ఈ మాటలు చివరగా
నన్ను ప్రలోభ పెట్టాయి
తలుపు తెరిచాను
ఇప్పుడు –
మీరు చూస్తున్నది
నా నీడను మాత్రమే

కె.సచ్చిదానందన్ అంతర్జాతీయ కవి. ఆంగ్లంలోనూ మళయాళంలోనూ అద్భుతమైన కవిత్వాన్ని సృజించారు. ఆయన 20 సంపుటాల కవిత్వం 119 ప్రపంచ భాషల్లోకి అనువదింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. కేరళ సాహిత్య అకాడమీ అవార్డును 5 సార్లు అందుకున్న కవి. తులనాత్మక సాహిత్యంలో కె.కె.బిర్లా ఫౌండేషన్ ఫెలోషిప్ పొందిన సచ్చిదానందన్ కు N.T.R జాతీయ అవార్డు కూడా లభించింది.

January 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఇవీ మన భారతీయ భావం

by మోతుకూరి నరహరి January 5, 2022
written by మోతుకూరి నరహరి

1.”వాన కురిస్తే,మెరుపు మెరిస్తే,/ ఆకసమున హరివిల్లు విరిస్తే,/

అవి మాకే-అని ఆనందించే/ పిల్లల్లారా!” అంటాడు మహాకవి

శ్రీశ్రీ తన ‘మహాప్రస్థానం’ సంపుటిలోని ‘శైశవగీతి’ కవితలో.

2.అట్లాగే అమాయకులు, ప్రకృతి ప్రేమికులు అయిన మన ప్రాచీనులు ప్రకృతిలోని

వివిధ ఘటనలను,వింతలను చూసి ఆనందాశ్చర్యాలకు లోనై ప్రకృతిశక్తులకు దైవత్వాన్ని,తనకు లేని,తాను కోరుకొనే అనేక శక్తులను వారికి ఆపాదించి,స్తోత్రాలు,సూక్తాలు, పురాణాలు రచించారు.  ఈ క్రమంలోనే సంపదకు అధిదేవతగా లక్ష్మిని,విద్యా విజ్ఞానాలకు అధిదేవతగా సరస్వతిని,దుర్మార్గాలను నిర్మూలించే ‘శక్తి’గా కాళికను (పార్వతిని)తన ఆకారంతోనే రూపొందించుకున్నాడు.  వారికి తాను కల్పించిన, ఊహించిన శక్తులకు అవసరమైనట్టుగా ఎక్కువ తలలను,చేతులను,వివిధ ఆయుధాలనుకూడా వారికి కల్పించాడు.  మన నిష్క్రియా పరత్వానికి విదేశీయుల దండయాత్రలో, పరాయిపాలనో కారణమని సర్దిచెప్పుకోవడం సరికాదు.

2.మన దేశంలో ప్రాచీనకాలంలోనే గార్గి, మైత్రేయి వంటి బ్రహ్మవాదినులు ఉండేవారు-

అని గర్వించడం సరే. కాని అంతటితోనే సరిపెట్టుకోకూడదు కదా! ఆధునికకాలంలో సావిత్రీబాయి

ఫూలేగారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు (ఉపాధ్యాయిని)అయ్యేదాకా

మన సరస్వతీ దేవికి వారసులు లేకపోవడం బాధాకరమేకదా!

3.మనకు వైద్యాధిదేవుడుగా ధన్వంతరి,ప్రాచీనకాలంలోనే గొప్ప వైద్య శాస్త్ర వేత్తలైన చరకుడు,సుశ్రుతుడు ఉన్నా గత శతాబ్దంలో విదేశాలలో ఆధునిక వైద్యవిద్యను అభ్యసించి వచ్చిన డాక్టర్ ఆనందీబాయి జోషి గారి వరకు మనకు ఆధునిక మహిళావైద్యులు లేరు-అంటే ఆ మధ్యకాలంలో మన సమాజం ఎంత నిద్రావస్థలో, అచేతనంగా ఉందో అర్థం చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి,ఆ లోపాలు పునరావృత్తి కాకుండా చూసుకోవాలి. వీరు ఇద్దరు కూడా ఆంగ్లేయుల పాలనాకాలం లోనే తమను తాము నిరూపించుకొన్న వారు కావడం గమనార్హం, ప్రశంసార్హం.

4.మరో ప్రధానమైన అంశం- నిత్యం లక్ష్మిని, సరస్వతిని, పార్వతిని-వారి అనుగ్రహాన్ని

కోరుతూ -పూజించే మనం మనను కనిపెంచిన తల్లి, జీవితాన్ని పంచుకున్న భార్య,అక్క చెల్లెళ్ళు,కూతుళ్ళ, కోడళ్ళగురించి ఎట్లా ఆలోచిస్తున్నామో,వారిపట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నామోకూడా ఆత్మావలోకనం చేసుకొని,

వాళ్ళను గౌరవించడం,ప్రేమను పంచడం నేర్చుకోవాలి. మన కుటుంబ సభ్యులలోనే, మన చుట్టూ ఉన్న సమాజంలోనే ఆ ‘ముగ్గురు అమ్మలను” చూసుకోగలగాలి.

5.మహాకవి గురజాడ అప్పారావుగారు చెప్పిన- “మగడు వేల్పన పాతమాటది,

ప్రాణమిత్రుడ నీకు…” అనే పంక్తుల సారాంశాన్ని ఒంటబట్టించుకొని మనం కొత్తమనుషులముగా

రూపాంతరం(మెటా మార్ఫోసిస్/Metamorphosis)చెందాలి. ప్రయత్నపూర్వకంగా భూస్వామ్య,పితృస్వామ్య

భావజాలాన్ని,పురుషాహంకారాన్ని పాము కుబుసంలాగా వదులుకోవాలి.అప్పుడే మన జీవితాలకు సార్థకత.

మన స్తోత్రాలు అర్థవంతం అవుతాయి.

सरास्वती प्राथना

जय जय हे भगवति सुरभारति !

तव चरणौ प्रणमाम: ।।

नादतत्‍वमयि जय वागीश्‍वरि !

शरणं ते गच्‍छाम: ।।1।।

त्‍वमसि शरण्‍या त्रिभुवनधन्‍या

सुरमुनिवन्दितचरणा ।

नवरसमधुरा कवितामुखरा

स्मितरूचिरूचिराभरणा ।।2।।

आसीना भव मानसहंसे

कुन्‍दतुहिनशशिधवले !

हर जडतां कुरू बुद्धिविकासं

सितपंकजरूचिविमले ! ।।3।।

ललितकलामयि ज्ञानविभामयि

वीणापुस्‍तकधारिणि ! ।।

मतिरास्‍तां नो तव पदकमले

अयि कुण्‍ठाविषहारिणि ! ।।4।।

जय जय हे भगवति सुरभा‍रति !

तव चरणौ प्रणमाम: ।।

 

భారతీ వందన గీతం

జయ జయహే భగవతి సురభారతి,

తవ చరణం ప్రణమామహః|

నాద బ్రహ్మమై జయ వాగేశ్వరి,

శరణం తే గచ్చామః|

త్వమసి శరణ్య త్రిభువన ధన్య,

సురముని వందిత చరణా|

నవ రస మధురా కవితా ముఖరా,

స్మిత రుచి రుచి భరణా|                      ||జయ జయ జయహే||

ఆసినా భవ మానస హంసే,

కుంద తుహిన శశి ధవలే|

హర జడతాం కురు బోధి వికాస్|

సిత పంకజ తను విమలే|                    ||జయ జయ జయహే||

లలిత కళామయి జ్ఞానవిభామయి,

వీణాపుస్తక ధారిణీ|

మతి రాస్తామ్ నౌ తవ పద్ కమలే,

అయికుంఠా విషహరిణీ||                     ||జయ జయ జయహే||

 

పంక్తులవారీగా శ్లోక భావము

1.(భగవతి=పార్వతి,లక్ష్మి, సరస్వతి,పూజ్యురాలైన స్త్రీ).

పూజ్యురాలవైన ఓ సంస్కృత

(సుర/దేవ)భారతీ!

నీకు జయము జయము (కలుగుగాక)!

నీ చరణాలకు ప్రణామం!

2.నాదబ్రహ్మమయివి,భాగేశ్వరివి(ఒక రాగం)(వాక్కులకు

అధిదేవతవు-వాక్ ఈశ్వరివి

=వాగీశ్వరివి) అయిన నీ

పాదాలను నేను శరణు వేడుతున్నాను/చేరుకుంటున్నాను.

3.మూడు లోకాలను ధన్యము

చేయగల,మునులచే,దేవతలచే నమస్కరింపబడే పాదాలు

గల నువ్వే నాకు శరణం/దిక్కు.

4.నవ రసములతో కూడిన,

మధురమైన కవితలను ధ్వనింపజేసే,అందమైన చిరునవ్వును,కాంతిమంతమైన

ఆభరణాలను ధరించిన అమ్మా!నీకు జయము జయము (కలుగుగాక).

5.(నా)మానస హంసపై ఆసీనురాలవైన,మొల్లలు,

మంౘు,చంద్రునివంటి ధావళ్యము గల తల్లీ!

6.శ్వేతకమలం వంటి స్వచ్ఛమైన శరీరం వర్ణంగల

అమ్మా!నా జాడ్యాన్ని (జడతను,మాంద్యాన్ని,మంద

బుద్ధిని)తొలగించి,బుద్ధి

వికాసాన్ని కలిగింౘు.

నీకు జయము జయము (కలుగుగాక).

7.అమ్మా!నీవు లలితకళామయివి(లలిత కళా

స్వరూపిణివి),జ్ఞానకాంతితో

ప్రకాశిస్తున్నదానివి,వీణను,

పుస్తకాన్ని ధరించినదానివి.

8.నీ పాద పద్మాల దగ్గర నా మతిని (బుద్ధిని) సమర్పిస్తున్నాను.నా సోమరి

తనం అనే విషాన్ని తొలగించే

(హరించే)అమ్మా!నీకు జయము, జయము (కలుగుగాక).

 

నాగరలిపిని తెలుగు అక్షరాలలో రాయడంలో అక్షర దోషాలు దొర్లుతాయి.  నాగరలిపి ఆధారంగానే ఈ కింది అర్థ,తాత్పర్యాలు రాశాను. మూల కవితలోని అంత్యప్రాసలను తాత్పర్యంలోనికి తీసుకురాలేము. అవి రావాలంటే మళ్ళీ మనం దానికి కవితారూపాన్ని ఇవ్వవలసిందే.అందుకు చాలా చాలా శ్రమించాలి.

 

January 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అమ్మతనమంటే…..

by కె. వీణారెడ్డి, January 5, 2022
written by కె. వీణారెడ్డి,

కాలింగ్ బెల్ మోతతో తలుపు తీశాడు కార్తీక్. ఎదురుగా మూతికి మాస్క్తో, శానిటైజింగ్ చేతులతో, పక్కనే వుంచిన ఓ రెండు బ్యాగులతో కనిపించాడు కార్తీక్ మిత్రుడు రాఘవ.

“రారా రాఘవా చాన్నాళ్లకు బుద్ధి పుట్టింది నీకు!”

మిత్రుణ్ని ఆహ్వానించాడు.

రాఘవ పళ్ళు తీసుకొచ్చే సమయానికి కార్తిక్ భార్య , వాళ్ళ ఎనిమిదేళ్ళ కొడుకుకు తల పై తడిబట్ట వేస్తూ వాడిని బుజ్జగిస్తున్నది .

ఏమైందిరా ? అని రాఘవ అడుగుతుంటే , ఉదయం నుండి బాగా జ్వరంగా ఉన్నదిరా అన్నాడు బాధగా కార్తిక్.

“మొన్న ఊరెళ్లాను కార్తీ…. తోటలో బత్తాయిలు, సంత్రాలు తెంపించాడన్నయ్య. నీకు కొన్ని తెచ్చాను.”

“ఈ కరోనా టైమ్ లో ఇమ్యునిటీ ఫ్రూట్స్…. చాలా థ్యాంక్స్ రా!” అంటూ ఆ పళ్ళ బ్యాగులందుకున్నాడు కార్తీక్.

“అమ్మ కనిపించటం లేదురా కార్తీ?” అటూ ఇటూ కలయ చూస్తూ అడిగాడు రాఘవ.

టి.వి.లో కరోనా న్యూస్ వింటూ “ఈ సెకండ్ వేవ్ ముసలోళ్ళ కన్నా వయసు వాళ్లపైనే దాడి చేయడం బాధాకరం రా!” అన్నాడు కార్తీక్.

“అంటే కార్తీక్… ముసలివాళ్ల ప్రాణాలు విలువైనవి కావంటావా?”

“ఎంతైనా కాటికి కాళ్లు చాచుకున్న ముసలోళ్లకన్నా, బాధ్యత, భవిష్యత్తూ వున్న యువత ప్రాణాలు విలువైనవి కద రాఘవా?”

“కాదనటం లేదు…. కానీ పిల్లలను కనిపెంచి పెద్దచేసి, యువతకు దిశా నిర్దేశం చేయగల జ్ఞానసిద్ధులు వృద్ధులు! వారు మమతల కోవెలలు…. గత వైభవాల జ్ఞాపకాలు కదరా పెద్దలంటే!” అన్నాడు స్పందనా స్వరంతో రాఘవ.

“సర్లేరా…. పద భోం చేద్దాం” అంటూ మిత్రుడి చేయందుకున్నాడు కార్తీక్.

“అమ్మ అగుపించడం లేదురా… నేనొస్తే తను బయటికి రాకుండా వుంటుందా? ఒంట్లోగాని బాగా లేదా?”

అంటూ హాల్ కెదురుగానున్న గదిలోకి వెళ్ళి చూశావా రాఘవ.

“కార్తీ…. అమ్మేదిరా ఏమైందిరా?” ఆదుర్దాగా అడిగాడు మళ్లీ.

“ఏం కాలేదుగానీ…. పద భోం చేద్దాం. వడ్డించు పద్మా!” అంటూ భార్యకు చెబుతూ, మిత్రుడి భుజం తట్టాడు కార్తీక్.

“నో… అమ్మను చూడందే… అమ్మను పలకరించందే అన్నం తినను!” సోఫాలో కూర్చుంటూ పట్టుదలగా అన్నాడు రాఘవ.

ఏం మాట్లాడలదు కార్తీక్.

“చెప్పరా అమ్మెక్కడ?” రెట్టించాడు రాఘవ.

“నాన్నమ్మను నాన్న ఓల్టేజ్ హోమ్ కి పంపించాడు!”

కార్తీక్ కూతురు నాలుగేళ్ళ పాప చెప్పింది. ఉలికిపాటుగా చూశాడు రాఘవ.

“కారణం?” కలవరపాటుగా అడిగాడు కార్తీకు నుద్దేశించి.

“అమ్మ తల తిరుగుడే కారణం!”

“అదేంట్రా? ఎంత మంచిది అమ్మ! అంత తల తిరుగుడు పనులేం చేసిందని?”

“పనులు కావురా… రోగం… తల అటూ ఇటూ ఊగుతూ…. అలా…. ఆర్నెల్లయింది!” అదోలా అన్నాడు కార్తీక్.

“అయితే… అంత మాత్రాన…” బాధ రాఘవ గొంతులో.

“ఒరే రాఘవా… అలా ఎప్పుడూ ఆమె తల అడ్డంగా అటూ ఇటూ ఊగుతూ వుంటే, కాదు… కాదు… అంటున్నట్టుగా నాకు నెగెటివ్ ఫీలింగ్స్ కలుగుతుంటే…. భరించలేకపోయేవాడిని!” అసహనంగా అన్నాడు కార్తీక్.

“ఒరే కార్తీక్…. అమ్మ శారీరక వ్యాధి కూడా నీకు…. భరించలేని మానసిక బాధేనా? ఆమె అనారోగ్యాన్ని, బాధనూ కూడా అర్థం చేసుకోలేక వృద్ధాశ్రమం బాట పట్టించిన ఘనుడవు కదరా…..” బాధగా మిత్రుడివైపు చూశాడు.

“ఒరే కార్తీక్…. నీకో సంగతి చెప్పనా?”

“చెప్పరా!” చిన్నగా అన్నాడు కార్తీక్.

“లేక లేక పుట్టిన నిన్ను, మీ నాన్న చేసిన అతిగారాబం నిన్ను మొండివాడిగా మార్చింది! ఏది చెప్పినా ఔనంటే కాదు… కాదంటే ఔనంటూ ప్రతిదానికి తల అడ్డంగా ఆడించేవాడిని గుర్తుందా? నీ చిన్ననాడే మీ నాన్న పోయాక, నీ నెగెటివ్ సమాధానాల భారమంతా అమ్మపైనే పడిందిరా! అమ్మ ఏం చెప్పినా మొండిగా తలటూ ఇటూ ఆడించి సతాయించే నీతో వేగలేకపోయేది. అయినా అన్నీ భరించింది. అప్పట్లో ఒకే ఊళ్ళో, ఒకే స్కూళ్ళో నీతోపాటు చదువుచున్న, అమ్మలేని నన్నెంతో ఆదరించిన ఈ అమ్మ ఎన్నోసార్లు నాతో చెప్పి బాధపడేది. నీ స్నేహాన్ని వీడవద్దని వేడుకునేది!”

“రాఘవా!” చిత్రంగా చూశాడు కార్తీక్.

“ఔనా…. అన్నింటికి అడ్డంగా తలాడించే నీ నెగెటివ్ తత్త్వాన్ని ఒంటరిదైన అమ్మెలా సహించిందో…. నిన్ను చదివించి ఇంతవాణ్నెలా చేసిందో…. అమ్మ మాటకు అడుగడుగునా తల అడ్డంగా ఆడించే నీ నెగెటివ్ థాట్స్ ను తన తల్లి తనపు పాజిటివ్ రెక్కలతో నిన్నెలా కాపాడుకున్నదో….. తన ప్రేమతో నిన్నెలా ఓ మనిషిని చేసిందో…. ఆ మాతృమమతనెలా మరచిపోయావురా?”

“ నీ కొడుకు కు జ్వరం వచ్చినట్లే నీకెన్నిసార్లు వచ్చుంటుందో జ్వరం నీ చిన్నప్పుడు “

కంటి చెమరింతతో రాఘవ కంఠం వణికింది.

“రాఘవా!” కార్తీక్ కళ్ళలో పశ్చత్తాపంతో కూడిన తడి కదలాడింది.

“చెప్పరా కార్తీ…. చిన్న నాటి నుండి నీ మనసుకున్న ఇగోతో, నీ నెగెటివ్ తత్త్వంతో…. ఎన్ని వేలసార్లు తల అడ్డంగా ఆడించేవాడివో…. అయినా ఆ తల్లి ఒడి నీకు ఓ బడిగా, గుడిగా ఎలా మారిందో…. ఎన్నడైనా ఆలోచించావా? అదే…. అదేరా అమ్మతనమంటే!” రుద్ధ కంఠంతో అన్నాడు రాఘవ.

ఆలోచనతో కూడిన ఆవేదనతో తలొంచుకున్నాడు కార్తీక్.

“కార్తీ…. ఆఖరుగా ఒక్క మాటరా…. రోగ్రగస్థురాలైన అమ్మ తల ప్రకంపనలనే భరించలేనివాడివి…. నీకు జన్మనిచ్చిన్నాడు అమ్మ ప్రసవ వేదనలో ఎన్ని వందల కాదు కాదు వేనవేల బాధా ప్రకంపనల బరువును ఆ తల్లి ఎలా భరించి వుంటుందో ఒక్కసారైనా ఊహించలేవా?”

“అమ్మా!” అంటూ అప్రయత్నంగా ఒక ఆర్థ్రతా పూరితమైన బాధా ప్రకంపనలతో కూడిన ఓ పిలుపు వెలువడింది కార్తీక్ నోటి వెంట.

“అమ్మతనమంటే ఏంటో అర్థమైందిరా! ధన్యవాదాలు రాఘవా…. పద… అమ్మను ఆశ్రమం నుండి తీసుకొద్దాం!” ఆగని కన్నీళ్ళతో అన్నాడు కార్తీక్.

  • కె.వీణారెడ్డి
January 5, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

తెలివైన రామచిలుక

by ఒద్దిరాజు మురళీధరంరావు January 3, 2022
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అనగాఅనగా చాలా కాలం క్రితం ఒక రాజు వద్ద ఒక అందమైన రామచిలుక ఉండెను. ఆ రామచిలుక తెలివైనది మరియు రాజుతో మాటా్లడుతుఁడేది. రాజుకు ఏదైన తోచనపుడు రామచిలుకను అడిగేవాడు. రామచిలుక తోలూ అని పిలువబడేది. రాజు దరా్బరుకు పోయే ముఁదు ఆ రోజు ఏ విషయం ఎట్లు చేయాలో అడిగేవాడు.

ఒకరోజు తోలూ దర్బారులో కూర్చుంటుండెను. రాజభవన తోటలో ఒకచెటు్టపై రామచిలుకల మంద కనబడెను. తోలూ రాజువైపు లుంగి అనెను. మహారాజా అవి మా జాతివి. నేను పుట్టి పెరిగిన చోటుకు నన్ను ఆహ్వానించేందుకు వచ్చాయి. దయతో నాకు ఒకరోజు శెలవు ఇవ్వండి. నేను నా జన్మభూమికి వెళ్ళి మా తల్లిదండ్రులను మరియు బంధువులను చూచి రాగలను.

“రాజుకు ఆశ్చర్యం అయింది మరియు అతను విచారంలో పడినాడు” తోలూ, నీవు ఒకవేళ అక్కడికి పోతె కొన్ని రోజులు నాకు దినదినం ఎవరు సలహాలు ఇస్తారు, మరియు సహాయపడుతుంటారు. నీవు దూరాన వున్న నీ పుట్టిన స్థలం నుండి త్వరగా రాగలవని ఎట్లు నమ్మగలను అని వాదించాడు.

“రాజా! నేను నమ్మదగిన దానినని నీకు తెలుసు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. నేను త్వరగా రాగలనని వాగ్దానం చేయగలను. నేను ఆలస్యం చేయను. నేను తిరిగి వచ్చేపుడు ఒక విచిత్రమైన పండు తేగలను. ఆ పండు సామాన్యమైన పండు కాదు. ఎవరు దాన్ని తిన్నా వారికి మరణం ఉండదు. వారు సజీవుగా ఉంటారు” తోత అన్నది.

రాజు ఆ పండు తిని చిరంజీవిగా ఉండగలనని తోతా వెళ్ళుటకు అంగీకరించాడు.

తోతా తన స్నేహితులతో ఎగిరిపోయింది. తోతా తండ్రి అక్కడి పక్షులన్నిటికి రాజు. అతను మరియు అతని భార్య కొడుకును చూచి చాలా సంతోషించారు.

అతను గొప్ప విందు ఏర్పాటు చేశాడు. తోతాకు మంచి డిన్నరు దొరికింది. తోతా తన జన్మభూమిలో వారం రోజులు ఉన్నాడు. అప్పుడు అతను తన రాజును జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు అతను తన తండ్రితో తను తిరిగి రాజు వద్దకు పోవాలని, రాజు తను వస్తాడని ఎదురు చూస్తుంటాడు.  “నా ప్రియమైన కొడుకా,  నీవు నీ ఆఫీసుకు నమ్మినవాడివని తెలుసు. దయతో వెళ్ళు. మీ రాజును మరి కొన్ని రోజులు సెలవు అడుగు మరియు మరొకసారి మా వద్దకు రా.

“సరె నాన్నా, నేను అట్లే చేస్తా. ఇప్పుడు నీవు నాకు ఒక సహాయం చేయాలి. నేను రాజుకు సజీవంగా ఉండేందుకు ఒక ఫలము తెస్తావన్నాను, మన దేశంలో పండేది.

ఆ పక్షుల రాజు అట్టి విచిత్రమైన ఫలము తోటాకు ఇచ్చినాడు.

ఆ రామచిలుక తను పనిచేసే స్థలానికి తిరిగి వెళ్ళింది మరియు తన యజమానిని కలిసింది.

“ఓహ్! తప్పక! దాన్ని తిన్నవారికి మరణం రాదు, ఎన్నటికి. నా రాజా! మీరు దయతో దీన్ని గ్రహించండి” ఆ రామచిలుక అంది.

అక్కడి మంత్రులు మరియు కౌన్సిలర్లు పండును చూసి ఎల్లపుడు జీవించి ఉండేందుకు దాన్ని తినాలనుకున్నారు.

ఈ మధ్యలో రాజు స్వయంగా అన్నాడు, తోతా ఈ విలువైన పండును వృధా చేయవద్దు. మనం దీన్ని వాడుదాము. దాని నుండి వచ్చే చెట్టుకు ఎక్కువ ఫలాలు వస్తాయి. దానివలన ఎక్కువ ప్రజలకు లాభం కలుగుతుంది”.

రాజు తోట మాలిని పిలిచి ఆ ఫలాని్న నాటి వచ్చే మొక్కను జాగ్రతగా చూడు.

ఆ తోటమాలి ఆ ఫలాన్ని నాటాడు, దాని నుండి మొలకపెరగటం మొదలయింది. కొంతకాలం తరువాత ఆ చెట్టుకు ఫలాలు రావడం మొదలయింది. ఏ ఫలాన్ని తెంపలేదు. ఒకరోజు ఓ ఫలం కింద పడింది. దానిపై నుండి పాము పోయింది. దాన్ని ఆ పాము నాకింది కాబట్టి అది విషతుల్యమైంది. తోటమాలికి ఏమి జరిగింది తెలియదు. దాన్ని మామూలుగా తీసి బుట్టలో పెట్టాడు. తరువాత దాన్ని రాజుగారికి ఇచ్చాడు.

మొదటి ఫలాన్ని చూసి రాజు సంతోషించాడు. అతను తోతాను మరియు ప్రధానమంత్రిని పిలిచాడు. వారు వచ్చారు.

“ఇది మొదటి ఫలము. నన్ను తిననీయండి” రాజు అన్నాడు.

ప్రధానమంత్రి మధ్యలో మాట్లాడాడు. “మహారాజా! దాన్ని తినకండి. సామాన్యంగా మొదటి ఫలాన్ని దేవునికి అర్పిస్తారు”. రాజు అంగీకరించి దాన్ని గుడికి పంపించాడు. పూజార్లు దాన్ని మధ్యకు కోసి రెండు ముక్కలు చేశారు. ఒక ముక్కను దేవునికి అర్పించారు. మిగతా భాగాన్ని వారు తిన్నారు. వారు గాఢ నిద్రలోకి జారుకున్నారు. వాస్తవముగా వారు ఎప్పుడు తెలివిలోకి రాలేదు.

రాజుగారికి సమాచారము అందించారు. రాజు చాలా విచారపడి తన మంత్రంతో విచారించారు. ఆ శాశ్వత జీవాన్నిచ్చే పండు తిని వారు మరణించవచ్చు అన్నాడు మంత్రి. వెంటనే రాజు తోతాని పిలిపించాడు. మరియు అడిగాడు. “తోతా, ఇదా నేను నీతో ఆశించినది? నీవు ఎవరి కోసం ఆ పండును తెచ్చావు?”

తోతా అన్నాడు, “ఎందుకు సార్? మీ కోసమే దాన్ని తెచ్చాను”.

“నన్ను చంపుటకు గదా? మిమ్ములందరిని ఇన్నాళ్ళు రక్షించాను. నిన్ను ఉచ్చ స్థితిలో ఉంచాను. దాని కోసం బదులు నాకు మరణ నోటీసు తెచ్చావు”.

అట్లు అని కత్తితో చిలుకను నరికేసాడు.

ఆ చెట్టు చుట్టు కంప పాతియ్యమని ఆజ్ఞ ఇచ్చాడు, మరియు పట్నవాసులను అటువైపు వెళ్ళవద్దని ప్రకటించాడు.

ఒకరోజు ఒక చాకలతను జీవితంతో విసిగి ఆ పండు తిన మరణించాలని నిశ్చయించారు. అతని భార్య కొడుకు అతనితో కొట్లాడుతుండేది. ఓ రాత్రి ఆ  పండును దొంగిలించి తినేశాడు. తన భార్య, కొడుకుకు గూడా ఇచ్చాడు, వారు కూడా మరణించాలని.

కానీ వారి ఆశ్చర్యానికి వారందరు యువకులైనారు. ఆ ముసలి చాకలి తను చాలావరకు వయసులో ఉన్నట్లు గ్రహించారు. ఆ వార్త అగ్నిలాగా నీటిలో వ్యాపించింది. రాజుకు కూడా వార్త అందింది. అతను తోటమాలిని పిలిపించి మొదటి పండు ఎక్కడి నుండి తెచ్చావని అడిగాడు. తోటమాలి ఆ పండును చెట్టుపై నుండి తెంపలేదు. భూమి మీద పడియున్న పండును తెచ్చాను.

అప్పుడు రాజు ఆ పండు పాము వలన విషతుల్యమైనదని గ్రహించాడు.

రాజు రంథి పడినాడు. అతను తన ప్రియమైన తోతా మరణం గురించి జాలిపడినాడు.

“నా తోతా, ఎంత బుద్ధిహీన పనిచేశాను? నీవు నాకు చాలా మంచి మిత్రుడివి. నేను నిన్ను నమ్మలేదు. నీవు నన్ను క్లిష్ట పరిస్థితులలో రక్షించావు. కాని నేను సరీగ విచారించకుండా నిన్ను చంపేశాను. నేను నిన్ను మరల ఎక్కడ చూడగలుగుతా?” ఆ రాజు చాలా దుఃఖించాడు. అతను గుండె బలిగినాడు.

అప్పటి నుండి అతను ఒక శాసనం తీశాడు. ఆ శాసనం “పాలకులు ఎవరిని కూడా బాగా విచారించకుండా శిక్షించవద్దు. దూషుడు అని నిర్ణయమైన తరువాతే శిక్షించాలి”.

మూలం :  Bed time stories the wise Parrot

January 3, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ముకుంద విలాసము – ప్రబంధము కాణాదం పెద్దన సోమయాజి పరిచయం

by డా॥ గండ్ర లక్ష్మణరావు January 3, 2022
written by డా॥ గండ్ర లక్ష్మణరావు

నిర్వహణ:

– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి

ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు

పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.

ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి


ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.

ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.

మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .

వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్ధమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.

పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.

కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.

ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .

కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .

తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471

 

 

 

 

 

డా॥గండ్ర లక్ష్మణరావు గారి పరిచయం:
__________

ఆధునిక తెలుగు సాహిత్య ప్రపంచంలో లబ్ధప్రతిష్ఠులైన తెలంగాణ సాహిత్యవేత్తలలో డా॥ గండ్ర లక్ష్మణరావుగారు ఒకరు . “సాహితీరత్న” బిరుదాంచితుడు. చేపట్టిన ప్రతి సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన స్థానం నిలుపుకున్న అక్షర తపస్వి. సుమనస్వి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహింపబడిన ప్రపంచ తెలుగు మహాసభలలో నిర్వాహక మండలి సభ్యునిగా పనిచేసి ప్రశంసలందుకున్న నిర్విరామ కృషిశీలి. నాకు ఈ మహౕసభలలో నా కోరిక మేరకు “తెలంగాణ ప్రబంధాలు“ అనే అంశంపై డా. నందిని సిధారెడ్డి గారి అంగీకారంతో ప్రసంగించే అవకాశం లభించింది. తదనంతరం నా నిర్వహణ లో ఈ ‘మయూఖ’ పత్రికలో తెలంగాణ ప్రబంధాలకు చెందిన వ్యాసాలు ధారావాహికంగా వెలువడుతున్న విషయం పాఠకులు గుర్తించవచ్చు.
డా. లక్ష్మణరావు విశిష్ట బోధకునిగా పేరు పొందిన ఆచార్యుడు.
ఆదిపాద మకుట “నీవు” పదంతో ప్రయోగశీలమైన పద్యరచనలో వాసిగాంచిన శతక కర్త. వచన కవితా ప్రక్రియలో “వర్తమాన సంధ్య” కవితా సంపుటి ప్రచురించారు. “సాహితీ వనమాలి” పేరిట వివిధ విషయాలను గురించి సాహిత్యవ్యాస సంపుటి సమర్పించిన సాహిత్య విశ్లేషకుడు .
జూమ్ మీటింగ్ లలో ఆచార్య సుప్రసన్న వంటి ప్రసిద్ధ విమర్శకులను గురించి సాధికారిక ప్రసంగాలు చేసిన; తదితరులను గురించీ చేస్తున్న మంచి వక్త. పద్యపఠన – ధారణలలో రాణించే డా॥ లక్ష్మణరావు తెలంగాణ లోని నేటి అష్టావధానులలో ఒక అవధాని. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రారంభించిన ‘జయంతి’ పత్రిక
డా. వెల్చాల కొండలరావుగారి సంపాదకత్వంలో పునః ప్రారంభింపబడిన నాటినుండి సంపాదక మండలి సభ్యుడు.
పద్మశ్రీ శ్రీభాష్యం పార్థసారథి గారు స్థాపించిన కరీంనగర్ “ఆది వరాహక్షేత్ర” సంబంధమైన సాహిత్య సేవలో పాలు పంచుకుంటున్నారు. కరీంనగర్ “ సాహితీ గౌతమి” వ్యవస్థాపక బాధ్యులలో వీరొకరు. ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ సినారె అవార్డుల కమిటీ ముఖ్య సభ్యుడు. అనేకానేక గ్రంథాలకు పీఠికాకర్త . “వేయిపడగలు” పై పిహెచ్ . డి . పట్టా పొందినవారు. ఇటీవలి కాలంలో”రామాయణ కల్పవృక్షం” పై ప్రతిపద్య వాఖ్యానం ప్రారంభించిన వక్త. తెలుగు అకాడమీ వారి కోరికపై 30 రామాయణాలను గురించి పుస్తకం వ్రాసియిచ్చిన మంచి వచన రచయిత . “ ఒక పద్యం నేర్చుకుందాం” పేరుతో 100 తెలుగు పద్యాలకు సామాజిక వ్యాఖ్యానం రచించినారు.వివిధ విశ్వవిద్యాలయ సెమినార్లలో, అకాడమీ , పరిషత్తు వంటి విశిష్ట సంస్థలలో విశేష ప్రసంగాలు చేసిన వక్త. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార మండలి జిల్లా సభ్యుడు. వైష్ణవ దీక్షాస్వీకర్తయైననూ నా కోరికను మన్నించి నేెనెన్నుకున్న ముగ్గురు పద్య కవులలో ఒకడుగా చిన్న చిన్న మాటలతో శివచరిత్రను –తత్త్వమును జోడించి “శివా!” శతకమును రచించి యిచ్చిన హరిహరాద్వైత భావం నిలుపుకున్నవాడు.
“దేశ భాషలందు తెలుగు లెస్స” యన్న శ్రీకృష్ణదేవరాయల “భువన విజయము” రూపకమును రచించి ప్రదర్శనలిచ్చిన – యిప్పించిన తెలుగు పద్యాభిమాని.
విశ్వవిఖ్యాత ఆంగ్లకవి ఖలీల్ జిబ్రాన్ కవితను “వెఱ్ఱిమానవుడు” పేరుతో తెలుగులో పరిచయం చేసిన అనువాదకుడు. ఇది ఇంగ్లీషుకు చెందిన అంశం అయితే త్వరలో వీరి సంపాదకత్వం లో వెలువడనున్న సతాత్పర్య సంస్కృత “చమత్కార చంద్రిక” అనే అలంకార శాస్త్రగ్రంథం సంస్కృత పండితుల శ్లోక తాత్పర్య రచనతో వెలువడనుంది.
నేనూ లక్ష్మణరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ లో ఎం .ఏ., లో సహాధ్యాయులం . అద్దె గదిలో స్వంతవంటతో సాహిత్యపు వేపుడులు కూడా వడ్డించుకొని తిన్నవాళ్లం . అడిక్ మెట్ రైల్వే అడ్డదారిలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ రోడ్డుపై నడుస్తూ చెరిరెండు పాదాలుగా పద్యాలూ-శ్లోకాలూ వల్లించుకుంటూ-సాహిత్యాంశాలు వర్ణించుకుంటూ నడుస్తుంటే సినారె సర్ మా ప్రక్కగా కారు ఆపించి ఎక్కించుకొని ఆర్ట్స్ కాలేజ్ ముందు దిగిన తర్వాత నమస్కారం స్వీకరించి తలపంకించి ఆశీర్వదించిన సందర్భాలు మాకిద్దరికీ మనోజ్ఞ గురువాత్సల్య ప్రకటన జ్ఞప్తి మాధుర్య దృశ్యాలు.
కాణాదం పెద్దన సోమయాజి రచించిన “ముకుంద విలాసం” అద్భుతమైన శబ్దశిల్పరేఖలతో అలరారే తెలంగాణ ప్రబంధం. కోరిన వెంటనే అంగీకరించి వ్యాసం వ్రాసి యిచ్చిన మిత్రుడు లక్ష్మణ రావుకు అభివందనములు తెలియజేసుకుంటున్నాను.
– గురిజాల రామశేషయ్య

 

ముకుంద విలాసము – ప్రబంధము కాణాదం పెద్దన సోమయాజి పరిచయం – డా. గండ్ర లక్ష్మణరావు

తెలంగాణ సాహిత్యం అనేక రూప ప్రక్రియల ప్రయోగాలకు నెలవు. ప్రబంధాలు కూడా పదహారవ శతాబ్దం కన్నా ముందు నుండి వెలుగులోకి వచ్చాయి. అయితే ఆధునిక యుగం దాకా తెలంగాణలో సంస్థానాల ఆశ్రయంలో అనేక కావ్యాలు అత్యంత ప్రతిభావంతంగా ప్రయోగాత్మకంగా వైవిధ్యభరితంగా వెలువడ్డాయి. అటువంటివాటిలో కాణాదం పెద్దన సోమయాజి రచించిన ముకుంద విలాసం విశిష్టంగా పేర్కొనదగింది.

తెలంగాణలోని గద్వాల సంస్థానానికి విద్వద్గద్వాలగా ప్రసిద్ధి వచ్చింది. గద్వాల సంస్థానాధీశులు స్వయంగా సాహితీవేత్తలు, కవులు, ఎందరో కవిపండితులను ఆదరించి సత్కరించినవారు. అన్ని ప్రాంతాల పండితులను ఆహ్వానించి విద్వద్గోష్టులు నిర్వహింపజేసినవారు. ఈ సంస్థానం ముష్టిపల్లి రెడ్డి వంశీయులు పాకనాటి రెడ్లు 1695-1705 ప్రాంతంలో స్థాపించి పాలించారు. వీరి వంశంలో చినసోమ భూపాలుడు క్రీ.శ. 1761లో అధికారానికి వచ్చాడు. ఇతని కాలం సాహిత్యానికి స్వర్ణయుగంగా భాసిల్లింది. ఆయన స్వయంగా కవి. హరిభట్టు సంస్కృతంలో రచించిన రతి రహస్యాన్ని తెలుగు చేశాడు. అప్పటి పండితులచే ఆంధ్రభోజుడనిపించుకున్నాడు. ఆయన ఆ స్థానంలో కాణాదం పెద్దన సోమయాజి, కిరీటి వేంకటాచార్యులు, కొత్తపల్లి రామాచార్యులు, గార్గ్యపురం సుబ్బశాస్త్రి, కామసముద్రం అప్పలాచార్యులు, తిరుమల కృష్ణమాచార్యులు, బోరవెల్లి శేషాచార్యులు, సోమనాథ శాస్త్రి అనే ఎనమండుగురు కవులు ఎంతో ప్రఖ్యాతి వహించినవారు. ఈతని ఆస్థానానికి వన్నె తెచ్చిన విద్వత్కవులు.

వీరందరూ వివిధ కావ్యాలు తెలుగులోను, సంస్కృతంలోనూ రచించినవారు. ముఖ్యంగా యథాశ్లోక తాత్పర్య రామాయణాన్ని ఆయా కాండలను రచించి పూరించడం ఒక విశేషం. తెలుగు సంస్కృతాలు మాత్రమే కాక బహుభాషావేత్తలు వీరిలో ఉన్నారు.

కాణాదం పెద్దన సోమయాజి – కవి పరిచయం

గద్వాల సంస్థానాన్ని చినసోమభూపాలుడు క్రీ.శ.1764-1793 వరకు పాలించారు. ఈయన ఆస్థానంలో పెద్దన సోమయాజి ఉన్నాడు. అంతకుముందు సురపురం సంస్థానలో రామన్నపాలుని సంస్థానంలో కూడా కొంతకాలం ఉన్నాడని అతని రచనల వలన తెలుస్తున్నది. దీన్నిబట్టి పెద్దన 18వ శతాబ్దంకవి అని స్పష్టం.

చినసోమభూపాలుడు తనను సభకు ఆహ్వానించిన సందర్భంలో పెద్దన చెప్పిన పద్యం,

నను నందవరపురాన్వయ పయోనిధి చంద్రు

కాణాద వంశ విఖ్యాతి సాంద్రు

అశ్వలాయన సూత్రం నాత్రేయ ముని గోత్రు

సకల విద్వత్కవి ప్రకరమ మిత్రు

ప్రౌఢలక్ష్మీపతి పండిత సోదర్యు

బాహట గ్రంథానుభావ ధుర్యు

వేదశాస్త్ర పురాణ వివిధ మర్మధురీణు

వరచతుర్విధ కవిత్వ ప్రవీణు

భోజచంపూ ప్రబంధార్థ బోధనాను

బంధ గీర్వాణ టీకా నిబంధనాది

పేశల వచో రచన ధుర్యు పెద్దనార్యు

గాంచి దయమించి పలెకె సగౌరవముగ (ముకుంద, వి.ప్ర.ఆ.23)

ఈ పద్యాన్నిబట్టి నందవర పురాన్వయానికి చెందినవాడు, కాణాద వంశం, ఆశ్వలాయన సూత్రం, ఆత్రేయ మునిగోత్రం అని తెలుస్తున్నది. సోదరుడు ప్రౌఢలక్ష్మీపతి అని అతడు పండితుడు. వేదశాస్ర్త పురాణగీర్వాణ పండితుడు. చతుర్విధ కవితా ధురీణుడు. భోజచంపూ మొదలైన కృతులు రచించినవాడు అని విదితమవుతున్నది. సోమభూపాలుని ఆస్థానంలోకి రాకముందే ఈ రచనలు చేసి ఉంటాడు.

భోజవ్యాఖ్య, శేషశైలేష లీల, మత్స్యపురాణం, ముకుంద విలాసము, ఆధ్యాత్మ రామాయణము పెద్దన రచనలు. వీటిలో శేషశైలేష లీల అనేది అపూర్వ ప్రయోగము. క,చ,ట,త,ప అనే వర్గాక్షరాలకు చెందిన 25 అక్షరాలు వాడకుండా కేవలం య,ర,ల,వ,శ,ష,స,హ లతో మాత్రమే పద్య రచన చేసి కావ్యాన్ని పూర్తి చేశాడు. తెలుగు సాహిత్యంలో నిరోష్ఠ్య, నిర్వచనాదికాలు వచ్చినవి కాని ఇన్ని అక్షరాలు వదిలేసిన కావ్య రచన ఈ పెద్దన నాటికి రాలేదు. దీనినిబట్టి ఆయన పాండిత్యము, కవితా ప్రతిభ తెలియవస్తుంది.

మత్స్యపురాణం మాత్రం సురపురం సంస్థానంలో ఉండగా వ్రాసినట్లు ముకుంద విలాసములోని అవతారిక వలన తెలియవస్తుంది.

“మీ తాతయు మీ తండ్రియు మీ తమ్ముడు మీరు మరియు మీ కులజులు విఖ్యాత ప్రబంధ రచనా ప్రీత చరిత్రులు” (ము.వి.ప్ర.ఆ.26) అని సోమభూపాలుడు ప్రశంసించడాన్నిబట్టి వారిది కవి పండిత వంశమని స్పష్టం. కాగా ఆశ్వాసాంత గద్యనుబట్టి “ఇది శ్రీమదుభయ కవితా నిస్సహాయది సాహితీ విహార కాణాదాన్వయ తిమ్మనార్యుడు. పైగా పెద్దన ఈ ప్రబంధం రాసే నాటికి సోమయాజి అని పేరొ్కనలేదు. తరువాతి కాలంలో సోమయాగం చేసి సోమయాజి అయి వుంటాడు.

ఈయన కూడా తిక్కనవలె ఉభయ కవితా నిస్సహాయ అని ఉభయ కవిత్వ విషయాన్ని పేర్కొనడం గమనార్హం.

ముకుంద విలాసము ప్రబంధము :

సోమభూపాలుని కోరిక మేరకే పెద్దన ముకుంద విలాసం కావ్యం రాశాడు.

పురుషోత్తమాష్టమహిషీ

పరిణయములలోన మున్ను భద్రాదేవీ

పరిణయ మెవ్వరు తెనుగున

విరచించుట వినము పూర్వ విబుధుల లోనన్ (ము.వి.ప్ర.ఆ.28)

అనడాన్నిబట్టి శ్రీ కృష్ణుని అష్టమహిషులలో భద్ర వివాహ కథను ప్రబంధంగా రచింపుమని కోరాడు. ఏ కవి కూడా ఇంతకు మునుపు ఇది కావ్యంగా రాసినట్టు లేదు అని సోమభూపాలుని మాటల వలన తెలుగు సాహిత్యంలో ఈ కథా ప్రబంధం రాలేదని రూఢి.

ఈ ప్రబంధానికి పెద్దన భద్రాపరిణయమని, ముకుంద విలాసమని రెండు పేర్లు ప్రయోగించాడు.

శ్రీనాథుని హరవిలాసము, చేమకూర విజయవిలాసము మొదలైన పేర్లు ప్రబంధాలకున్నాయి. ఆ వరుసలో ముకుంద విలాసము అని పేరు పెట్టి ఉంటాడు. అయితే రుక్మిణీ కల్యాణము అని నాయికా ప్రధానంగా భద్రాపరిణయము అని పేరును కూడా ఆశ్వాసాంతంలో పేర్కొన్నాడు. సోమభూపాలుడు కూడా ‘శ్రీముకుంద విలాసాఖ్యావిధి జేయుడు’ అని ముకుంద విలాసంగా సూచించాడు.

అంకింతం: సోమభూపాలుని ఆదేశాన్ననుసరించి ఈ ప్రబంధాన్ని రచించినాడు కాని ఆ సోమభూపాలుని ఇష్టదైవమైన కేశవస్వామికే దీన్ని అంకితం చేశాడు. “కేశవ దేవున కంకితముగాగ ధీరవతంసా” అని సోమభూపాలుడు ఆశించినట్లుగానే కేశవస్వామికంకితం చేశాడు. గద్వాలా సంస్థానాన్ని నెలకొల్పిన వారి పూర్వీకులే కేశవస్వామి ఆలయాన్ని నిర్మించి ఇష్టదైవంగా కులదైవంగా సేవించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ అవతారికలో పెద్దన స్పష్టం చేశాడు.

ప్రబంధము : తెలుగు ప్రబంధాలు ప్రధానంగా వర్ణనా ప్రధానాలు అనే అంశాన్ని చర్వణం చేయవలసిన అవసరం లేదు. పెద్దన చతుర్విధ కవితా ధురీణుడు అని చెప్పుకున్నాడు. చిత్రబంధ కవిత్వాలలో కూడా అపారమైన ప్రతిభ కలవాడు అని శేషశైలేష లీల వంటి కావ్యాల వల్ల తెలుస్తున్నది. అట్లాంటి ప్రయోగాలు ఈ ప్రబంధంలో కొల్లలుగా చేశారు. చాలా చిన్న కథను సుమారు 911 గద్య పద్యాలలో మూడాశ్వాసాల ప్రబంధంగా విస్తరించారు. శబ్ధార్థాలంకారాలు, పాత్రోచితమైన వర్ణనలు, ప్రకృతి వర్ణనలు విశేష రీతిలో వర్ణించినవి ముందు దాహరించడం జరుగుతుంది.

అవతారిక : గద్వాల సంస్థాన ఇలవేలుపు కేశవస్వామి స్తుతితో ప్రారంభమైన అవతారికలో వేంకటేశ్వర, అలివేలుమంగ, పరమశివుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి, గణపతి, గరుడ విష్వక్సేనులు హనుమంతుడు హరి పంచాయుధములు క్రమంగా స్తుతించబడినారు. వాల్మీకి, వ్యాస, భవభూతి, కాళిదాసు సంస్కృత కవులను నన్నయ, భీమన, తిక్కన, ఎఱ్రన, సోముడు, భాస్కరుడు, శ్రీనాథుడు, పోతన్న, పినవీరన, చిన్నన్న, సూరపరాజును, రామభద్రుని, పెద్దనను, తిమ్మనను తెలుగు కవులను స్మరించాడు. తన గురువైన మల్లేశ్వర దీక్షితులను సేవించాడు. తన భగినీధవుడు అంటే బావ ఊర్వసి నాగార్యుడనీ అతడు గొప్ప కవియని అతని తలచాడు. కుకని నిందలో కాకవులు, నా కవులు అని మంచి కవులుండగా పనికిరాని కవులను స్తుతించడమెందుకు అన్నాడు.

కృతిరచింపుమని కోరిన సోమభూపాలుని వంశవర్ణనము అతని గుణగములను సుమారు 75 గద్య పద్యాలలో వర్ణించారు. గద్వాల సంస్థానం నెలకొల్పిన ముష్టిపల్లి వంశీయుల తొలినాటి నుండి సోమభూపాలుని వరకు గల వంశపరంపర వర్ణించి సోమభూపాలుని ప్రత్యేకంగా పంచరత్నాలలో ప్రశంసించాడు. ఈ అవతారిక పద్యాలలో కూడా ముక్తపదగ్రస్తాలు, శ్లేషలు, అర్థాంతరన్యాసాలు, ఉత్ర్పేక్షలు వంటి ఎన్నో అలంకారాలు ప్రయోగించాడు. అవతారికలోని పద్యాలు కూడా పద్యరచనా పాటవానికి నిదర్శనాలుగా కనిపిస్తాయి. ఇందులో సోమభూపాలుడని ఔదార్యమునిట్లా ప్రశంసించాడు.

సుకవుల కొకరొక్కరికొసంగె నే ఘను/డలరి వేనూట పదార్లు గాగ

బహుభక్ష్య సత్రముల్ పరగించె నే దాత / ద్విజుల కర్ణము పదివేలుగాగ

మాఘ కార్తిక పూర్ణిమల నిచ్చె నే రాఉ / విప్రకోటికి పదివేలగాగ

నొగి కేశవస్వామి కొనరించె నే మేటి / లలిత భూషాదులు లక్షగాగ… దాన ధర్మములే కాక మాఘ కార్తిక పౌర్ణిమల సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహింపజేసేవారు. కేశవస్వామిని సోమభూపాలుని వివిధ విధాలుగా స్తుతించారు.

భద్రాపరిణయము మూలం :

సంస్కృత భాగవతంలో భద్రాపరిణయం కేవలం ఒక్క శ్లోకంలోనే వర్ణింపబడింది.

“శృతకీర్తేః సుతాం భద్రాముపయేమ పితృష్యసుః

కైకయీం భ్రాతృభిర్దత్తాం కృష్ణం సంతర్దనాదిభిః”

(శ్రీ కృష్ణుడు తన మేనత్త శ్రుతకీర్తి కూతురు, కేకరు రాజకుమార్తె అయిన భద్రాదేవిని ఆమె సోదరుడైన సంతర్దనాదులు సమర్పించగా వివాహమాడినాడు)

తెలుగులో పోతన భాగవతంలో కూడా ఒక పద్యంలోనే భద్రావివాహం తెలిపాడు.

“జనవంద్యన్ శ్రుతకీర్తి నంద్యతరుణిన్ సందర్శన క్షోణి పా

ద్యనుజునం మేనమఱందలినం విమల లోలాపాంగకైకేయ ని

ద్దన యో నిద్ర ప్రపూర్ణ సద్గుణ సముద్రన్ భద్ర నక్షుద్ర నా

వనజాతాక్షుడు పెండ్లియాడె నహిత వ్రాతంబు భీతిల్లగన్”….

ఇంత చిన్న కథనయినా పెద్దన తన కవితా ప్రతిభచే మూడాశ్వాసాల రమణీయ ప్రబంధంగా తీర్చిదిద్దాడు.

ఇదికాక కాళ్ళకూరి గౌరీనాథ కవి పూర్వీకులెవరో భద్రాపరిణయం రాసినట్లు తెలుస్తున్నదికాని వారి పేరుగాని ఆ కావ్యంగాని ఇప్పడ లభ్యములు. ఆధునికులలో ఒకరు అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి రచించిన భద్రాపరిణయం ఒకటి ఈతని తరువాతికాలానిది. కాగా భద్రాపరిణయ ఇతివృత్తంతో రాసిన మొదటి కావ్యం ముకుంద విలాసము.

ఇతని కవిత విష్ణుచిత్తీయ తుల్యమౌనని చెప్పుకున్నాడు. రాయలవారి ఆముక్త మాల్యదను పోలి ఉంటుందని, కాని పెద్దన కవిత్వంలో మృదుత్వం ఎక్కువగా ఉంటుంది. కల్పనలతో, వర్ణనలతో, శబ్దార్థాలంకారాలతో ఈ కావ్యాన్ని కథను ఎంతో అందంగా మలిచినాడు. రసజ్ఞులు, పండితులైన పాఠకుల మనోరంజకంగా రచించాడు.

కథాసంగ్రహం : ప్రథమాశ్వాసం:

శ్రీ కృష్ణుడు ద్వారకలో ఉంటూ ఒకనాడు పాండవులను చూడాలని ఇంద్రప్రస్థపురానికి వెళ్లాడు. అక్కడ అర్జునునితో ఉండగా అగ్నిదేవుడు వచ్చి ఖాండవవనం దహనం చేయాలని ఉందని అడిగాడు. కృష్ణార్జునులంగీకరించారు. అగ్నిదేవుడు ఖాండవవనం దహనం చేస్తుండగా అందులో ఉన్న మయుడు తనను రక్ష్మింపుమని కోరాడు. అతడిని రక్షించారు. మయుడు కృతజ్ఞతగా అర్జునునికి మయసభ నిర్మించి ఇచ్చాడు. కృష్ణునికి ఏదయినా నిర్మించి ఇవ్వాలని ద్వారకకు వెళ్ళాడు. అయితే అక్కడ తాననుకున్న దానికన్నా ఆశ్చర్యకరమైన భవనాలను చూసి కృష్ణునితో ఏది ఇవ్వాలన్నా అన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పి దగ్గరలోని రైపతకపర్వతంపై ఒక అందమైన ఉద్యానవనాన్ని నిర్మించి ఇచ్చాడు. దేవేంద్రుడు కూడా ఖాండవవన దహనం వేళ చేసిన తప్పిదానికి కృష్ణునికి ఏదయినా ఇవ్వాలని ఆ ఉద్యానవనంలో అందమైన లతాగుల్మాదులను, హరిచందనాది వృక్షాలను ఏర్పాటు చేశాడు. కృష్ణుడు అప్పుడప్పుడు ఆ రైవతకాద్రిపై గల ఉద్యానవనంలో విహరిస్తూ ఆనందిస్తూండేవాడు.

వసుదేవుడు తన చెల్లెలైన శ్రుతకీర్తి యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని గదుని పంపించాడు. గదుడు వెళ్ళి వచ్చి ఆమె యోగక్షేమాలు తెలియజేశాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణునితో ఆ శ్రుతకీర్తి కూతురు భద్ర గురించి ఆమె అందచందాల గురించి తెలియజేశాడు. ఆమె సౌందర్యాతిశయం విన్న కృష్ణునికి భద్రపై మనసు కలుగుతుంది.

ద్వితీయాశ్వాసం : శ్రీ కృష్ణుడు రైవతకాద్రిపై ఉద్యానవనంలో విహరిస్తుండగా మామిడి చెట్టుపై ఒక అందమైన రామచిలుక కనిపించింది. ఆ రామచిలుకను ముచ్చటపడి పట్టుకున్నాడు. ఆ రామచిలుక కృష్ణునితో మనుష్య భాషలో మాట్లాడింది. “ఓ కృష్ణా! నేను సరస్వతీ దేవి దగ్గర ఉండేదానను. ఒకసారి లక్ష్మీదేవికడకు వెళ్ళాను. అప్పుడు తన అంశతో జన్మించిన భద్రను అన్ని విద్యలలో నేర్పరి యగునట్టు చేయుమని నన్నాదేశించింది.

నేను కేకయ నగరానికి వెళ్ళ భ్రదాదేవితో పరిచయం చేసుకొని ఆమెకు సంగీతం, నాట్యం, కావ్యనాటకాదులు, అలంకారశాస్త్రం, తర్కవ్యాకరణాదులు, కవితా రచన వంటి అనేక విద్యలు నేర్పించాను. ఆమె ఇప్పుడు సకల విద్యా ప్రవీణ. అంతేకాదు గొప్ప సౌందర్యవతి. ఆమెకు తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడో నని అనేక దేశాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. మిమ్ములను చూసిన తరువాత మీరే తగిన వరుడని అనిపించింది.

ఆమె తండ్రి ధృష్టకేతువు ఎందరో రాజకుమారుల చిత్రపటాలను తెప్పించి చూపించాడు. ఆమె ఎవరినీ మెచ్చలేదు. ఒక్క మీ చిత్రపటాన్ని మాత్రమే చూస్తూ ఉంటుంది. మీ గురించి ఏమయినా పాడుమని నన్ను అడుగుతూ ఉంటుంది. మీ గురించి చిన్నప్పటి నుంచే విన్నదట. అప్పటి నుంచే మీరు తప్ప మరొకరు భర్త కారని భావించిందట. ఎల్లవేళలా మీ గురిఁచి కలువరిస్తూనే ఉంటున్నది. ఆమెను మీరు కరుణించి పరిగ్రహించాలి” అని రామచిలుక అనేక విధాలుగా ఆమె గుణగణాలను, రూపురేఖలను వర్ణించడంతోపాటు ఆమెకు కృష్ణునిపై గల ప్రేమను కూడా తెలిపింది.

శ్రీ కృష్ణుడు కూడా ఆమె మాటలకు భద్రపై మరింత ప్రేమను పెంచుకుంటాడు. ఆమెను ఎట్లయినా తనతో కూర్చుమని చిలుకతో వేడుకుంటాడు. చిలుక తన రెక్కలలో దాచిన భద్ర చిత్రపటాన్ని శ్రీ కృష్ణుని కందజేసింది. తరువాత కేకయ నగరానికి వెళ్ళిపోతుంది. కృష్ణుడు భద్రను స్మరిస్తూ కలవరిస్తూ ఉంటాడు.

తృతీయాశ్వాసం :

రామచిలుక కేకయ నగరానికి వచ్చి శ్రీ కృష్ణుడిచ్చిన పారిజాత సుమాలను భద్రకిచ్చి ఆయన గురించి మోహనాకారాన్ని గురించి వివిధ రకాలుగా వర్ణిస్తుంది. కృష్ణునికి తనపై ఇష్టమున్న విషయాన్ని కూడా తెలుపుతుంది. భద్ర ఎప్పుడు కృష్ణుడు వచ్చన తనను స్వీకరిస్తాడా అని ఎదురుచూస్తుంటుంది.

విరహ వేదననుభవిస్తుంది. ఇక్కడ చంద్రోపాలంభన, మదనోపాలంభన మొదలైన వర్ణనలున్నాయి.

ధృష్టకేతువు తన కూతురు భద్రకు స్వయంవరం ఏర్పాటుచేశాడు. స్వయంవరానికి ఎందరో రాకుమారులు వచ్చారు. రామచిలుకను తీసుకొని రథంపై భద్ర ఆయా రాజకుమారుల ముందుకు వెళుతుంది. రామచిలుక ఆయా రాజకుమారులను గురించి వివరాలు తెలుపుతుంది. శ్రీకృష్ణుని వద్దకు రాగానే అతని గుణగణాలను వర్ణించింది. భద్ర చూడగానే కృష్ణుని గుర్తించి అతని మెడలో హారం వేసి వరించింది. మిగతా రాకుమారులందరూ కృష్ణుడేదో మాయచేసి ఉంటాడని తిరుగుాటు చేశారు. కృష్ణుడు వారినోడించాడు.

కేకయ రాజు ధృష్టకేతువు తన కూతురు భద్రను శ్రీ కృష్ణునకిచ్చి వైభవంగా వివహం జరిపించాడు. వారిద్దరూ ద్వారకకు వచ్చి సుఖభోగాలననుభవించారు. వారికి కొంతకాలానికి భద్రజయుడను కుమారుడు జన్మించాడు.

విష్ణమూర్తి వివాహ కథలను జనకమహారాజు వినగోరినపుడు శుకమహర్షి పై కథను చెప్పినట్లు ముగించారు. మూలంలో ఎంతో సంక్షిప్తంగా ఒక శ్లోక పరిమితమైన కథను కాణాదం పెద్దన తన కవితా ప్రతిభచే, కల్పనలచే ఒక మహాప్రబంధంగా మలచినాడు. రైవతకాద్రి ఉద్యానవనం, రామచిలుక, కృష్ణభద్రల ప్రేమలు నాయికా నాయకుల విరహాలు స్వయంవరాలు మొదలైనవన్నీ పెద్దన చేసిన కల్పనలు మాత్రమే.

ప్రబంధోచితంగా పురవర్ణన, రైవతకాద్రి పర్వత వర్ణన, ఉద్యానవర్ణన, రామచిలుక వర్ణన, రామచిలుక దౌత్యము, సూర్యాస్తమయము, రాత్రి, చుక్కలు, చంద్రోదయము, నాయిక సౌందర్య వర్ణనము, నాయకుని వర్ణన, దశావతార కందములు, చంద్రోపాలంభన, మదనోపాలంభన, భద్రజననము, బాల్యయౌవనములు, స్వయంవరము, నానారాజుల వర్ణన, భద్రాకృష్ణుల కళ్యాణము, భద్రకు పుత్రోదయము… మొదలైన అనేక వర్ణనలు చేయబడినాయి. పరిపూర్ణ ప్రబంధంగా రూపొందించాడు కవి.

వర్ణనలు, శబ్దార్థాలంకారాల ప్రయోగాలు, పద్య రచనా ప్రాభవం పూర్వ ప్రబంధ కవులకేమాత్రం తీసిపోనివి. కాగా ఆశు, మధుర, చిత్ర, బంధ అనే చతుర్విధ కవిత్వంలో అత్యంత ప్రతిభావంతుడైన కవి ప్రబంధంలో ఆయా ప్రయోగాలు చేశాడు.

కొన్ని వర్ణనలు ఉదాహరణకు…. భద్రాదేవి మోమును వర్ణిస్తూ

అనువై నెన్నొదురొంటుగా పదునొకండై కన్బొమలం జంటగా

ఘనతం బోల్పగ రెండు తొమ్మిదులునై కర్ణద్వయం బొష్పగా

గన పూర్ణస్థితి బర్వలీల నెసగంగా నింతయుంగూడ దా

దిన సంఖ్యం దిలకింప నిండు నెలగా దీపించు మోమింతికిన్ (ది.ఆ.98)…

ఆమె ముఖం నిండు చందురునితో సమానమైనదని కవి భావము. నిండు నెల అనే ఉత్పేక్షగా చెపుతున్నాడు. అందుకు హేతువులు చూపుతున్నాడు. ఆమె నుదురు ఒంటు (౧) కనుబొమలు రెండు ౧ ౧ పదకొండు, రెండు చెవులు తొమ్మిది ౯ ఆకారంలో ఉన్నాయి, రెండు తొమ్మిదులు, అంట 1+11+18=30 సరిగా ముప్పది రోజులు నెల అంటే నెలచంద్రుని వలె అని సమర్థించినాడు. ఇట్లా నుదురు, కన్బొమలు, చెవులు కూడా లెక్క సరిపోయేట్లుగా చెప్పి ఆమె మోము చంద్రబింబమువలె ఉందనటం చమత్కార కల్పన.

ఆమె కనులను గురించి వర్ణిస్తూ….

ఒక యేట చిక్కెమీనము

ఒక నెలకే చిక్కె పద్మమొక పగటింటన్

వికలత చిక్కెం గుముదము

సకినయనంబులగునె జడగతులెపుడున్ (1-129)

ఆమె కనులను మీనములతోను, పద్మములతోను, కలువలతోను, పోల్చడం కవి భావం. కాని అవన్నీ కూడా ఆమె కనులతో పోటీ పడి ఓడిపోయినాయట. చేప ఒక సంవత్సరకాలంలో చిక్కిపోయింది, పద్మము ఒక నెలలో చిక్కిపోయింది, కలువ ఒక పగటిపూటకే చిక్కిపోయింది. అవన్నీ ఆమె కన్నుల అందం కన్నా తక్కువయి చిన్నపోయినాయి అని. సహజంగానే చేపను ఒక ఏడుగా, పద్మము ఒక నెలగా, కలువ ఒక పగటిగా మాత్రమే వికసించి ఉంటాయనే సహజ గుణాన్ని ఆమె కన్నులతో పోటీపడి ఓడినట్టుగా చమత్కరించాడు. జడగతులు ఆమె కన్నులతో పోటీపడతాయా? అంటే అవి జలగతులు నీటి పాలయినవి కదా! అని మరో చమత్కారము.

ఒకే పదాన్ని ప్రయోగించి ఆ పదానికున్న నానార్థాలతో ఆమె కురులు, కన్నులు, కంఠస్వరము, నడక వర్ణించారు.

సారంగంబు హసించు మేచక కచాంచచ్చాక చక్యంబులన్

సారంగంబు హసించు నీక్షణ రుచా సౌభాగ్య భాగ్యంబులన్

సారంగంబు హసించు కంఠ నినద స్వారస్య విస్ఫూర్తులన్

సారంగంబు హసించు యాన గరిమం చంద్రాస్య సాంద్రస్థితిన్…. (1-224)

సారంగము = తుమ్మెద, లేడి, వానకోకిల, ఏనుగు…. ఈ అర్థాలతో ఆమె కురులు తుమ్మెదలను పరిహసిస్తున్నాయని, కనులు లేళ్ళను పరిహసిస్తున్నాయని, స్వరం కోకిలను పరిహసిస్తున్నదని, ఆమె నడక ఏనుగులను పరిహసిస్తున్నాయని కల్పన చేశాడు.

పెద్దన కవికి సాహిత్యాలంకారాల పాండిత్యము, వైద్య, జ్యోతిష, తాత్త్వికాది శాస్త్రాల వైదుష్యం కూడా అపారమైనది. ఆయా శాస్త్ర్త విషయాలను సంవదింపజేస్తూ నాయిక వర్ణన చేసిన విధం కూడా అద్భుతమైనవి.

“గతి మత్తేభము నాస చంపకమొగిం కైశ్యంబు కందంబు సం

గత వాక్యంబులు మత్తకోకిలలు దృక్పాండిత్యమయ్యుత్పల

ద్యుతి మోమంబురుహంబు దేహరుచి విద్యున్మాలిగా మానినీ

తత వృత్త స్థితులెన్నగా తరమె తద్వాగ్జాని కైనం దగున్ (1-225)

ఈ పద్యంలో ఛందో విశేషాలున్న వృత్తాలను పేర్కొన్నాడు. మత్తేభము, చంపకము, కందము, మత్తకోకిల, ఉత్పల, విద్యున్మాలి, మానిని మొదలైన వన్నీ వృత్తాలు. కాని ఎన్ని వృత్తాలలోనైనా ఆమె నెన్నెగా తరమె అని ఒక ఆశ్చర్యం ప్రకటిస్తూ ఆయా వృత్తాల వైశిష్ట్యాన్ని ఆ పదాల అర్థాలలోని పోలికలతో ఆమె అవయవ సౌందర్యాన్ని వర్ణించాడు.

గతి మత్తేభము, అంటే నడక ఏనుగు, నాస చంపకము, ముక్కు సంపంగి, కొప్పు కందము, వాక్యాలు మత్తకోకిలలు, చూపులు ఉత్పలాలు, మోము అంబురుహము, శరీరకాంతి విద్యున్మాలి, మెరుపుతీగ, మానినీ ఆ మానిని యొక్క మానిని అనేది కూడా ఒక వృత్తం. ఇట్లా ఛందో వృత్తాలతో వర్ణించం విశేషం వసుచరిత్రకారుడు కన్నె నెన్న తరమే గేయ వాక్ర్పౌఢిమన్ అనగానే ఓహా అనిపించింది. ఆమె గేయాన్ని, వాక్కును ఎన్న తరమా? అని, ఏ గేయంలోను, ఏ వాక్కులోను ఆమెను పొగడలేము అని, కాని పై వర్ణన వసుచరిత్రకారుని వర్ణనను మించిదనుటలో సందేహం ేదు.

ఒకచోట కవికులశేఖరులు హరిన్ కొనియాడి… అంటారు ఇందులో కులశేఖరాళ్వార్ల ప్రస్తావన అర్ధాంతరం.

అట్లే ఆదిశంకర, మధ్వాచార్య, రామానుజాచార్యుల పేర్లను తీసుకొని నాయికను వర్ణించారు. ఇక్కడ ఆచార్య త్రయం అర్థాంతరంగా ప్రస్తావించడం ఇట్లాంటివెన్నో తన తాత్త్విక పరిజ్ఞానాన్ని పట్టి యిస్తాయి. సంధ్యారాగాన్ని వర్ణిస్తూ ఒక వైద్యుడు చేసే క్రియను చూపిస్తాడు.

సమయభిషగ్వరుండపర శైలపు కుప్పె దినేంద్రుడనం రసేం

ద్రమునిడి పై తదూర్థ్వ కరతాశ్రమశలాకఘటించి వహ్నియో

గము నొనరింప సింధురముగా పయికిం ప్రసరించె నా కరం

బమరెను సాంధ్యరాగము నభోంతర దంతురితాంశుభాగమై

కాలమనే వైద్యుడు పడమటి దిక్కు అనే కుప్పెలో సూర్యుడనే రసముపెట్టి పైన రాగిశలాకతో కదిలిస్తూ వేడిచేయగా పైకి వచ్చిన సింధురమా అన్నట్లుగా సంధ్య కనపడుతున్నదట. ఇది వైద్యప్రక్రియ.

వ్యాకరణజ్ఞుడు తండ్రి అని తర్కవేత్త భ్రాతయని, మీమాంసకుడు, నపుంసకుడని, ఛాందసుని అస్పృశ్యుడని అందరినీ దూరముంచి కావ్యరసమర్మజ్ఞుడైన కవిని కవితావధూమణి వరిస్తుంది ఒక పద్యంలో చెప్పారు. ఇక్కడ ఆయా శాస్త్రవేత్తలను శాస్త్రాలను ఉటంకించడం విశేషం. దీనికి సంస్కృత మూలశ్లోకం ఉంది, అది తెలుగులో ఇంత అందంగా అనువదించాడు. ఇట్లా అనేక శాస్త్రాల ప్రస్తావనలు చోటుచేసుకున్నాయి. వసుచరిత్రకారుని సీస పద్యాల వంటి సంగీత బద్ధమైన పద్యాలు, చేమకూర వంటి పదవిరుపుల చమత్కారాలు అనేకం అడుగడుగునా కనిపిస్తాయి. అక్షర శబ్ద క్రీడలు అపారంగా ఉన్నాయి.

భంబుగదే నఖవ్రజ మిభంబుగదే….., అనే పద్యంలో బిందుపూర్వక బకారాలనేకం ప్రయోగించాడు.

ఆసవఫలభోక్త విభుండాసవ ఫభోక్తయయ్యె…. ఇట్లాంటి యమకాలకు కొదువలేదు

మరియ గోరుచుండు మనభద్ర మదిగదా

మాధువులకెనైన మంచి మంచి మగని

మరియు గోరుచుండు మనభద్రమదిగదా

మాధవుండ కలుగ మంచి మగడు….. వంటి పద్యాలు చేమకూర మనసు భద్ర మహిమయే మనవచ్చు. మనసుభద్రమయ్యె మనకు నెల్ల వంటి పద్యాలు స్ఫురిస్తాయి. పెద్దన, రాయలు, రామరాజభూషణుడు, చేమకూర వీరందరి కవితా చమత్కారాల గడుసుదనాలనన్నిటినీ కొల్లగొట్టి వాటికి మెరుగులు దిద్దిన పద్యాలు రాశాడు పెద్దన.

అనుప్రాసలు, యమకాలు, శ్లేషలు అనేక పద్యాలలో దొంతరలు దొంతరలుగా దర్శనమిస్తాయి.

హరియీ గిరులం దరులం విరులం…. ఇట్లా అనుప్రాసలు, ఆహారమమేశుడిచ్చె నాహారమె కదా…. వంటి యమకాలు అనేకం ఉదాహరించవచ్చు. ప్రబంధ ప్రియులు ఈ ప్రబంధాన్ని చదివితే ఆ పద్య రచనకు ముగ్ధులవుతారు.

రెండక్షరాల కందం…. “మిమ్మే మమారేమా/ మమ్మోము మరేమి మర్మమా మమ్మారా / ముమ్మారు రమా రామా/ రమ్మరమర మేర మరి రామ రామ మురారీ!” కేవల సోష్ఠ్య కందాలు, నిరోష్ట్య ద్వివిధ కందం అంటే ఒకే కందంలో రెండు కందాలు నిరోష్ట్యంగా, అపంచవర్గీయ ముక్తపద గ్రస్తం, అంటే కచటతప వర్గాక్షరాలు వాడకుండా వాడిన మిగతా అక్షరాలతోనే ముక్తపదగ్రస్తంగా చెప్పటం, విశేషమైన విలక్షణమైన ప్రయోగాలున్నాయి.

ప్రసిద్ధ వృత్తాలే కాక పంచరామరము, తోటకము, మొదలైన విశేష వృత్తాలున్నాయి.

అచల జిహ్విక పద్యం, పద్యమంతా చదివితే నాలుక కదలదు.

పాదభ్రమిక కందం, ప్రతిపాదం తిరగేసినా ఒకే తీరుగా ఉండటం.

ద్విప్రాస, త్రిప్రాస, చతుష్, పంచ ప్రాసలతో పద్యాల ఆనందాన్ని కలిగిస్తాయి.

గర్భమత్తేభకందగీతాలు, ఛత్ర, చక్ర, పుష్పగుచ్ఛ, సర్వతో భద్రాది బంధాలు గల పద్యాలు అద్భుతమైన అతని రచనాపాటవాన్ని పట్టిస్తాయి.

తాడి తన్నెడి వాడుంటే తలదన్నేవాడుంటాడు వంటి సామెతలు ప్రయోగాలున్నాయి.

కాణాదం పెద్దన చతుర్విధ కవిత్వానికి కాణాచి.

పందొమ్మిదో శతాబ్దం ఉత్తరార్థం వాడయిన అల్లమరాజు సుబ్రహ్మణ్యం అనే కవి భద్రాపరిణయ కావ్యాన్ని రాశాడు. ఇతని కావ్యంలో అనేక పద్యాలు పెద్దననుకరించినవి ఉన్నాయి. కొన్ని పద్యాలు కించిద్భేదంతో యథాతథంగా రాశాడు. ఈ కవి ప్రభావాన్ని తప్పించుకోలేకపోయాడు.

తెలంగాణ నుండి వెలువడిన అరుదైన అద్భుతమైన ప్రబంధాలలో ముకుంద విలాసం ప్రత్యేకంగా పేర్కొనదగినది. ఇంత గొప్ప ప్రబంధమైనా అంతగా ప్రచారానికి నోచుకోని ఈ ప్రబంధాన్ని పరిచయం చేయుమని సూచించిన కవి, పండితుడు మిత్రుడు రామశేషయ్యకు, మయూఖలో ప్రచురణకు స్వీకరించిన సంపాదకురాలు, కవయిత్రి డా|| కొండపల్లి నీహారిణిగార్లకు ధన్యవాదాలు.

1985లో తెలుగు విజ్ఞానపీఠం వారు ఆచార్య రవ్వాశ్రీహరిగారి సంపాదకత్వంలో మొదటిసారి ప్రచురించారు. తెలంగాణ సాహిత్య అకాడమి కాని తెలుగు విశ్వవిద్యాలయం కాని మరల ముద్రించినట్లయితే ఈ ప్రబంధం వెలుగులోకి వస్తుంది.

January 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వ నైపుణ్యాలు-5 కవిత్వము – భావనాశక్తి – భావుకత

by నందిని సిధారెడ్డి January 3, 2022
written by నందిని సిధారెడ్డి

కవిత్వం వస్తువు గురించి తెలిసిన తర్వాత, వస్తువు పట్ల ఎంత సరళమైనటువంటి, ఎంత స్పష్టమైనవటువంటి అవగాహన కలుగుతుందో శిల్పం దగ్గరికి వచ్చేసరికి తదనంతర భావుకత మొదలైనటువంటి విషయాల్లో నిర్ణీపమైన పద్ధతి అంటే ఇదీ అని చెప్పడానికి వీలు కలిగించే అంశం ఒకటి సాహిత్యంలో కొనసాగుతుంది. అట్లాగే శిల్పం తయారుకావడానికి ఒక రూపం ఒక శిల్పం కావడానికి – శిల్పం కళ కావడానికి మూలభూతమైనటువంటిది మొదటిది భావుకత. ఒకే వస్తువు మీద అందరం రాస్తాం. కాని కొన్ని మాత్రమే ఆకట్టుకుంటాయి. కారణం మొదటి మాట శిల్పం వలన అంటాం. ఎందుకు అంటే ఇక్కడ శిల్పం లేదు – అక్కడ శిల్పం బావుంది అనే చర్చ వింగడింపు జరిగినప్పుడు కవికి భావనాశక్తి ఉన్నప్పుడు ఆ శిల్పంలో పరిణతిగా భావించడానికి, ఆ పరిణతి కనిపించడానికి అవకాశం ఉంటుంది. కవికి ప్రధానమైనది భావనాశక్తి. కవికి గనక భావనాశక్తి లేకపోతే ఆ కవిత్వం కవిత్వం కాదు. కాబట్టి కవికి భావుకత ఉండాలన్నారు. భావుకతను ఇంగ్లీష్ లో ‘ఇమాజినేషన్’ (Imagination) అన్నారు. మీరు కథ రాయండి, కవిత్వం రాయండి కవిత్వంలో మళ్ళీ పాట రాయండి, వచన కవిత రాయండి   ; ఏది రాసినప్పుడైనా కూడా, ఒక వస్తువును వర్ణించేటప్పుడు, శిల్పం రూపం తీసుకునేటప్పుడు అత్యంత క్రియాశీలమైంది, ఆధార భూతమైంది, మూలమైంది ఏదీ అంటే భావనాశక్తి.

అంటే కవిత్వ శక్తి కాబట్టి పాశ్చాత్య విమర్శకులు కూడా భావనాశక్తిని, ఆధునిక కాలంలో వచ్చినటువంటి విమర్శకులు కూడా భావనాశక్తిని కీలకమైందిగా భావించారు. ముఖ్యంగా ప్రాచీన ఆలంకారికులు భావనాశక్తి పై ఎక్కువగా మాట్లాడలేదు గాని వాళ్ళు వేరువేరుగా చెప్పారు.

కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆధునిక కవిత్వ వస్తువును గురించి ‘కవిత్వ తత్త్వ విచారము’ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో ప్రాచీన కవిత్వ విధానాన్ని కూడా సునాయాసంగా విమర్శలోకి తీసుకొచ్చాడు. ఎట్లాంటి విమర్శ తీసుకొచ్చాడంటే భావనాశక్తి లేని కవిత్వం తేలిపోతుంది అని వారు ప్రతిపాదికగా ప్రధానంగా తేల్చి చెప్పిన అంశం. ఇమాజినేషన్, భావనా శక్తి లేదా కల్పనాశక్తి అనేటు వంటిది చాలా కీలకమైనది.

అయితే ఇమాజినేషన్, భావనాశక్తి, ఊహాశక్తి, కల్పనాశక్తి అనే మాటల కన్నా కూడా ఊహాశాలిత్వం తరుచుగా వాడుతుంటారు అందరు. మీరెప్పుడైనా వ్యాసం చదువుతున్నపుడు ఊహాశక్తి ఎక్కువుంది, కల్పనాశక్తి ఎక్కువుంది అనేవి చూస్తుంటారు. ఇవన్నీ ఈ ఇమాజినేషన్ చుట్టూ తిరుగుతుంటాయి. కాబట్టి ఇమాజినేషన్కు భావనాశక్తి మాట పర్యాయపదంగా వాడుతుంటారు. దానికి తోడుగా ఊహాశక్తి, భావనాశక్తి అనేవి వాడడం జరుగుతుంది. ఇట్లా చూసినప్పుడు మనం కవిత్వాన్ని బాగా రాణింపజేయాలని, బాగా పండించాలి, తీసుకురావాలి అనుకున్నప్పుడు ఈ భావనాశక్తిని తీసుకురావలసిన అవసరం ఉన్నది. ఇది పెంచుకునేదా, స్వతహాగా వచ్చేదా? పెంచుకునేదా అంటే ఖచ్చితంగా చెప్పలేం. స్వతహాగానే వస్తుందని చెప్పడానికి లేదు. అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. భావన అనేది ఇక్కడ కవి యొక్క హృదయానికి సంబంధించింది. భావన అనేది ఎక్కడ ఉంటుంది అంటే, హృదయంలో ఉంటుంది. తెలుగులో ఒకమాట ఉన్నది. లేదా సంస్కృతంలో ఒక మాట ఉన్నది అది భావము అని. భావము, భావాల యొక్క పొందికనే కవిత్వము అని అనుకుంటుంటాము.

కవులు సాధారణంగా పండితులను ఒప్పుకోరు. పండితులు కవులను ఒప్పుకోరు. కట్టమంచి రామలింగారెడ్డి ఏమన్నాడంటే పండితులంటే ఎవరంటే, ఇంట్లో కూర్చొని నిఘంటువులు, శాస్త్రాలు కంఠతాబట్టి పండితులవుతారు అన్నాడు.

కాని కవి అట్లా గాదు కవికి కవిత్వం కంఠతా పడితే వచ్చేది కాదు. కవి ప్రకృతితో మమేకం కావాలి. రూపంతో మమేకం చెందాలి. మనుషులతో, జీవితంతో మమేకం కావాలి. కాబట్టి జీవితంతో, మనుషులతో మమేకం కావాలంటే, మనకు ప్రధానంగా భావనాశక్తి కావాలి. భావనాశక్తే కీలకం. ఒకమాట ఆయనే ఏమని చెప్పాడంటే “భావనా శక్తియనగా విషయములను మనసులో ప్రతిబింబింప చేయు సామర్థ్యము” అని అన్నాడు. అంటే ఒక వస్తువును చూస్తే, ఒక వస్తువును కవిత్వంలో ఆవిష్కరించాలి అనుకున్నప్పుడు, ఒక సంఘటనను ఆవిష్కరించాలి అన్నప్పుడు మనకు కావాల్సింది భావనాశక్తి అని అంటున్నాం. ఈ భావనాశక్తిని ఆయన ఏమని నిర్వచిస్తున్నాడూ అంటే, “ఆ విషయాన్ని మనసులో ప్రతిబింబింప చేయు ఒక సామర్థ్యము” అని అన్నాడు. అందరం ప్రతిబింబించడానికి ప్రయత్నం చేస్తాం గాని, కొందరికి మాత్రమే ప్రతిబింబించే సామర్థ్యం ఉంటుంది. కొందరికి మాత్రమే దాన్ని చిత్రిక పట్టడానికి సాధ్యం అవుతుంది. కొందరికి మాత్రమే ఆ రూపాన్ని సరిగా ఆవిష్కరింప చేయడానికి సాధ్యమవుతుంది. దీన్ని ప్రాచీన కవులయితే ఎక్కువ వరకు ‘ప్రతిభ’ అని చెప్తూ వచ్చారు. ప్రతిభ అనేది టాలెంట్ అనేదని చెప్పారు. కాని ఆధునిక కాలంలో అయితే దీన్ని ఇమాజినేషన్, భావనాశక్తి పైనే చెప్పారు. కాబట్టి భావనాశక్తి కీలకం. విషయాన్ని మన మనసుకు గోచరించేటట్లు చెప్పేటటువంటి ఒక సామర్థ్యమే భావనాశక్తి. అందుకని ఈ భావనాశక్తి, ఈ భావుకత కవిత్వంలో చాలా కీలకమైంది. ఆంగ్ల సాహిత్యంలో కూడా భావనాశక్తికి సంబంధించి చాలా సుదీర్ఘకాలం చర్చించడం జరిగింది. ఇమాజినేషన్ అనే పదం కంటే ముందు మనకు ‘ఇమేజ్’ అనే పదం ఉన్నది. ఇమేజ్ చేయడం ఇమాజినేషన్. ఇమేజ్ చేయడానికి శక్తి కలిగి ఉండటమే ఇమాజినేషన్. ఇమేజ్ అంటే ఏంటి? ఇమేజ్ అంటే బొమ్మ, ఒక రూపం. ఆంగ్లంలో జరిగినటువంటి చర్చలో ఇంగ్లీష్ లో జరిగిన చర్చలో చాలామంది కవులు, లేదా విమర్శకులు చేసిన ప్రతిపాదనలేంటీ అంటే ఒక వస్తువు ఉదాహరణకి మనం రాసేటప్పుడు కాగితం, కలం పట్టుకొని రాస్తాం. ఇప్పుడు సరిగ్గా మన ఎదురుగా పువ్వు ఉండక పోవచ్చు. పువ్వును గురించి మనం రాస్తూ ఉంటాము. వర్షం గురించి రాస్తాం అనుకోండి. కానీ ఆ రోజు వర్షం పడకపోవచ్చు. కానీ కవి రాస్తాడు. వాన పడకపోయినా వానను గురించి రాస్తాడు, పువ్వు లేకపోయినా, ఎదురుగా లేకపోయినా పుష్పాన్ని గురించి రాస్తాడు. చీకటి పూట అర్ధరాత్రి వేళ సూర్యుని గురించి రాస్తాడు. ఎట్లా రాస్తాడు?? అంటే సూర్యుడు ఎదురుగా ఉంటే కదా సూర్యుని గురించి రాయాలి? అని అంటే ఇంగ్లీష్ లో చాలా చర్చ జరిగింది. ఏంటంటే మనము ఒక వస్తువును చూసినప్పుడు, ఒక దృశ్యాన్ని చూసినప్పుడు, వస్తువు, దృశ్యము చూడగానే ఒక స్పందన ఏర్పడుతుంది. రూపం మనసులో ముద్రింప బడుతుంది. ఇంక ప్రతిసారి చూడనక్కర లేదు. మన మనసులో ముద్రించబడిన ఒక రూపం ఉంది. కనుక, మనం రాయదలుచుకున్నప్పుడు దాన్ని ఆవాహన చేసుకుంటాం. అంటే భావనాశక్తికి రెండు దశలు. ఒకటి ప్రైమరీ ఇమాజినేషన్, మరొకటి సెకండరీ ఇమాజినేషన్ అనేవి ఉన్నాయి.

ప్రైమరీ ఇమాజినేషన్ అంటే మనం చూడగానే మన మనసులో పడిన రూపు వస్తువుకు సంబంధించిన ఒక ముక్క అని ముందే అనుకుని ఉంటాం. అంటే ఇమేజ్ అంటే ఒక రూపం, ఒక ప్రతీక ఉంటుంది. అది తొలి దశ. ఉదాహరణకు ఒక గులాబి పువ్వున్నది. గులాబి పువ్వు అనగానే అది ఎరుపు రంగులో ఉంటుందని, దాని రిక్కల అందం హృదయంలో నాటుకొని ఉన్నది. కాబట్టి ఇమాజినేషన్ చేయగలం. కానీ ఎక్కడ ఉన్నాయి అంటే దానియొక్క రూపుగాని, దాని అందంగాని దాని సొగసులు మన మనసులో ఆ వస్తువు యొక్క స్వరూపం ముద్రబడి ఉన్నది, గులాబి ఎట్లా ఉంటుందో స్థిరపడింది. కాబట్టి దాని గురించి చెప్పగలం, రాయగలం. ఇది మొదటి దశ. ఇక రెండవది సెకండరీ ఇమాజినేషన్ ఏంటంటే. తన మనసులో ముద్రించబడిన విషయం. చాలా రోజుల క్రిందటి జలపాతాన్ని ఇప్పుడు చూడకపోవచ్చు. కాని ఆ జలపాతాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చూపుతాం. ఒక నది ఉన్నది. ఆ నదిని ఎప్పుడో చూసి ఉండడం వల్ల, మనస్సులో నాటుకొని ఉండడం వల్ల దాన్ని మనం వర్ణించడానికి వీలుగా మన హృదయాల్లో భద్రపరచుకోవడం వల్ల కవిత్వం భావాలను రాయగలగాలి. ఆ ఆవిష్కరించేటు వంటి శక్తి కవి మనసులో ఎంత బలంగా ముద్ర వేసుకుంటే కవిత్వంగా అంత బలంగా  ఉంటుంది. కనుక కవిత్వంగా వస్తుంది. ఆ చిత్రాన్ని ఊహించుకొని ఆవిష్కరించే వీలవుతుంది. కాబట్టి కవి యొక్క మనసులో ఉంటుంది గనుక, ఏదో ఉంది గదా అని అందిన దాన్ని మనసులోకి జ్ఞాపకం తెచ్చుకొని రాస్తావు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది కూడా జీవం రావడానికి కుదరదు. అందుకని నీ మనసులో కూడా, కవి యొక్క మనసు ఎట్లా ఉంటుంది అనంటే, ఇప్పుడే పూసిన గులాబీ పువ్వు ఏవిధంగా ఉంటుందో ఆ విధంగా తాజాగా ఉండేటువంటిదే భావనాశక్తి. అటువంటి భావనాశక్తి నీ హృదయంలో ఉంటుంది. పండితునికి, కవికి తేడా ఉంది. పండితునికి మొత్తం కావ్యాలు, మొత్తం పద్యాలు ఏవి ఎక్కడ ఉన్నాయో ఏకరువు పెట్టేటువంటి శక్తి పండితులకు ఉంటుంది. కాని కవికి ఆ పద్యాలకంటే ఆ పద్యాలలో ఉండే భావము, ప్రకృతిలో ఉండే దృశ్యం, ఇంకెక్కడో చాలా చిన్నప్పుడు చూసిన దృశ్యం కవికి మనసులో ఉంటుంది. నాస్టాల్జియా గురించి రాస్తున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు రాయడం అన్నమాట. కవిత్వం జల్లుతున్నారు ఈ మధ్య బంగారు ఈ పురుగుకు దారం కట్టుకొని ఆడిన మన జ్ఞాపకాలు ఉంటాయి.

చిన్ననాడు బంగారుపురుగును పట్టుకోవటం, దానికి దారం కట్టడం, అగ్గిపెట్టెలో పెట్టడం దానికి బంతాకులు ఆహారంగా పెట్టడం, అది బంతి ఆకులు మాత్రమే తింటుంది. అది ఒక నమ్మకం. గిరగిర తిప్పితే అది రెక్కలారిస్తే మనకు పరమానందం, బ్రహ్మానందం. అట్లా ఉండేటప్పుడు ఎప్పుడో యాభై ఏళ్ళ క్రింద ఆడిన ఆటలు అంతా కూడ ప్రతిరూపం. అంతా కూడా ముద్ర అంతా కూడా ఇవ్వాళటికీ కళ్ళక్కట్టుకోవడం ఈ విధంగా మనకు గుర్తుంటుంది. మనం రాయదలుచు కున్నప్పుడు మన భాషలో ఇది మొత్తం ఆవిష్కరిస్తాం. దీనికి కీలకమైనది ఆ భాష. ఆ భావన. అందుకనే భావనాశక్తి చాలా కీలకం. ఎప్పుడో మీ మనసుల్లో నాటుకొని, ముద్రపడిన భావాలు కవిత్వంగా రాస్తారు.

భావాలు కావచ్చు, అనుభవాలు కావచ్చు ఇవన్నీ కూడా హృదయంలో, మనసులో భద్రపడి ఉంటాయి, ముద్రపడి ఉంటాయి. వాటినే కవిత్వంలో రాస్తాము. ఇవి కావాలనుకున్నప్పుడు నేనేనును అనుకుంటూ ఆ భావాలన్నీ మీ ముందుకు వచ్చి వాలుతాయి. అవి తీసుకుని మనం కాగితంపై అలంకరిస్తాం. అవి అలంకరించాలంటే సౌందర్యారాధన శక్తి ఉండాలి. ఇష్టపడే అది కవిత్వీకరిస్తాం. కేవలం భాష రాగానే సరిపోదు. కవులగుట అసంభవము. కట్టమంచి రామలింగారెడ్డి స్పష్టంగా “కొయ్యల రీతినో, మహర్షుల రీతినో నిర్వికారస్థితినుండువారు పద్యములు రాయనేర్తురు గాని కవులగుట అసంభవము” అని అన్నాడు. జాగ్రత్తగా వినండి.

కట్టిగా ఉంటేనో, మహర్షులుగా ఉంటేనో, నిర్వికారంగా ఉంటేనో కవిత్వాన్ని వ్రాయలేరు. తమకున్న ప్రతిభతో పద్యాలల్లుతారు కొందరు. కాని, పద్యాలు రాయగలిగిన వారంతా కవులుగా లేరు అని అంటాడు. ఎందుకంటే పద్యం ఛందస్సు అవన్నీ వ్యాకరణంగాని పద్యాన్ని గాని రాయగలుగుతాయి. తీర్చిదిద్దుతాయి గాని, ఈ కవిత్వాన్ని హృదయానికి చేరవేసే శక్తి పద్యానికిగాని, ఛందస్సుకు గాని ఉండవు అని ఆయన అభిప్రాయం. అందుకని ఆయన ప్రబంధ కవులను చాలా తీవ్రంగా విమర్శిస్తాడు. తిక్కన బాగా హృదయానికి హత్తుకునేలా రాస్తారు. తిక్కనంత గొప్ప కవి లేడు అని భారతం రాయడం గురించి చెప్తాడు కట్టమంచి రామలింగారెడ్డి. ప్రబంధ కవులలో ఒకే ఒక్క కవి పింగళసూరన ఒక్కడే గొప్ప కవి అంటాడు. కారణం ఏమిటో అంటే తిక్కన జీవితానికి ఇచ్చినంత విలువ, భావనా శక్తికి ఇచ్చినంత విలువ అలంకారాలకు ఇవ్వలేదు. అలంకారాలు కూర్చినటువంటివారే ప్రబంధ కవులన్నారు.

అష్టాదశ వర్ణనలలో వర్ణిస్తారు. అంటే పద్దెనిమిది వర్ణనలలో రాస్తారు. నీకు ఇష్టమున్నా లేకున్నా అష్టాదశ వర్ణనలు చేయాలి. వీటిలో పడి, ఈ జీవితం, జీవితం యొక్క అనుభవం మరుగునపడి పోతుంది అనేది ఆయన భావన. నీ హృదయంలో పుట్టినటువంటి భావం సహజంగా సజీవంగా ఆవిష్కరించాలంటే నీకు ఉండాల్సింది భావనాశక్తిగాని, అలంకార శక్తి కాదు అనేటువంటిది ఆయన ప్రతిపాదించిన విషయం. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ని రాసాడు. గీతాంజలిలో నన్ను బాగా ఆకట్టుకున్న ఒక పోలిక ఉన్నది. అది మనకు ఇప్పుడు సరిగ్గా సరిపోయేటువంటిది. అందుకే ఆ ప్రస్తావన తీసుకువస్తున్న.

పిల్లలందరూ ఆడుకుంటూన్నారు. అందరితో ఆడుకోవడానికి రాజుగారి కొడుకు కూడా, అంటే బాలరాజు, చిన్నపిల్లవాడైనటువంటి ఆ రాజు కూడా ఆడుకోవడానికి వెళ్ళాలనుకున్నాడు. ఆయన రాజకుమారుడు కదా అందరిలాగా వెళ్తే ఆయనకు విలువ ఉండదు గదా. అందుకని ఆయన ఏం జేసాడు ఇంట్లో ఆడుకోవడానికెళ్ళేటప్పుడు కూడా అతనిని అలంకరించి, మంచిగా ఆభరణాలు పెట్టి, నగలు వేసి మంచి బట్టలు వేసి ఆడుకోవడానికి పంపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు. ఆయనెట్లా ఆడుకోగలడు. ఆడుకోబోతే ఈ మట్టిలో ఆడితే దుస్తులు మాసిపోతాయని భయం. ఆడుకోవాలంటే, పిల్లలతో ఆడుకోవాలని కోరికగా ఉన్నదిగా, వాళ్ళతో ఆడుకుంటుంటే బట్టలు మాసిపోతాయేమోనని భయం. ఆడుకుంటే ఈ ఆభరణాలెక్కడ జారిపోతాయేమోనని భయం. ఆడుకుంటే తన ఒళ్లు ఎక్కడ కందిపోతుందేమోనని భయం. ఆయన పిల్లలతో ఎట్లా ఆడుకుంటాడు. ఎట్లా మమేక మవుతాడు? ఆ పిల్లలు ఆటల ద్వారా పొందుతున్న ఆనందం ఇతను ఎట్లా పొందుతాడు? అని రాసాడు. ఆ పిల్లవాడి దృష్టి అంతా ఎక్కడ ఉన్నది? దుస్తుల మీద ఉంది, నగల మీద ఉంది, శరీరం మీద ఉంది, అలంకరణ మీద ఉంది. ఈ అలంకరణ మీద ఆయన ధ్యాస ఉన్నప్పుడు ఆటలను ఆనందించ గలుగుతాడా? పిల్లలతో కలిసిపోగలుగుతాడా? ఎందుకంటే అతనిని ముట్టుకోవాలంటే చెయ్యికి మట్టంటుతుంది. అతనిని ముట్టుకోగలరా? అతనితో ఆడగలరా? ఈ ఆటలే మట్టిలో ఉంటాయి. చిన్నప్పుడు ఆడే ఆటలన్ని గూడా మట్టితో సంబంధం లేకుండా ఉండవు. కాబట్టి ఎక్కడున్నది ఆనందం? ఎక్కడున్నది భావోద్వేగం? ఎక్కడున్నది హృదయానికి ఒక శక్తి, ఒక అనుభవం? అంటే హృదయానికి అనుభవం నిన్ను నువ్వు మరిచిపోవడంతోనే ఉంది. నిన్ను నీవు మరిచిపోయే టట్లు ఉండడంలోనే ఆనందం ఉంది. ఆ ఆటలో కావచ్చు, ఆ వస్తువులో కావచ్చు, ఆ సంఘటనలో కావచ్చు నిన్ను నీవు మరిచిపోయే దాంట్లోనే ఉన్నది. నిన్ను నీవు మరచిపోయి లీనంగా వాలి అనేది ఈ భావనాశక్తి యొక్క మూలం. కాబట్టి నీలో భావుకత ఉంటే, ఇవన్నీ మరచిపోయి పిల్లలతో ఆలింగనం చేసుకుంటావు. నీకప్పుడు దుస్తుల మీద దృష్టి ఉండదు, చేతులకు మట్టి అంటుతుందనే ఆలోచనే రాదు. పిల్లలతో ఆడడం ఒక్కటే నీ లక్ష్యమై ఉంటుంది. ఆడడం కోసమే నీ మనసు నిన్ను ఒత్తిడి చేస్తుంది. కాబట్టి నీ నగల మీద దృష్టి ఉండదు, నీ దుస్తుల మీద దృష్టి ఉండదు, చేతుల మీద దృష్టి ఉండదు, మొహం  మీద దృష్టి ఉండదు. అట్లాంటి దృష్టి ఉండనటువంటి ఒకానొక తన్మయ స్థితికి భావనాశక్తి అని పేరు. కాబట్టి ఈ భావనాశక్తి కీలకం. అందుకే కట్టమంచి రామలింగారెడ్డి గారు ఇంకోమాట కూడా అన్నారు. “వృతాంతమును, స్థితిగతులను అందలి పాత్రల సుఖదుఃఖములను రోమరోమ మునకు తానే అనుభవించినప్పుడే పాత్రలకు ఆపాదించి అభివర్ణించడానికి సాధ్యమవుతుంది” అన్నారు.

ఒక కవిత రాసినా, ఒక కథ రాసినా అందులోని భావాలను మనస్పూర్తిగా రోమరోమమున అనుభవించడం. మనం ఒక కవిత చదువుతూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకున్నవి అంటాం. మీలో చాలామందికి కవిత్వం రాసే అలవాటు ఉన్నవారందరికి ఒక అనుభవం తప్పక ఉంటుంది. ఈ మాట కూడా నా అనుభవంలోనూ ఉన్నది, మీ అనుభవంలోనూ ఉన్నది. ఏంటిదయ్యా అంటే మీరు రాస్తున్నప్పుడు మీ రోమాలే నిక్కబొడుచుకుంటాయి. మీరు రాస్తున్నప్పుడు కళ్లవెంట తడితడిగా చుక్కలు రాలుతుండే అవకాశముంటుంది. మీరు రాస్తున్నప్పుడు ఏ అనుభవంతో రాస్తున్నారో ఆ అనుభవం వల్ల మీ హృదయం ఉప్పొంగుతుంది. అట్లా ఉప్పొంగగలగాలి. కాబట్టి రోమరోమమూ తానే అనుభవించగలగడం తానే ఎట్లా అనుభవిస్తాడని ఒక దుర్యోధనుని గురించి రాస్తాడు. ఒక కర్ణుని గురించి రాస్తాడు. ఒక అర్జునుని గురించి రాస్తాడు. ఒక రాముని గురించి రాస్తాడు. ఒక సీత గురించి రాస్తాడు. కవి ఎన్ని పాత్రలను పరకాయ ప్రవేశం చేయాలి? స్త్రీల గురించి తెలుసా? వాల్మీకికి సీత గురించి తెలుసా? తెలియకపోతే సీతను ఆవిష్కరించలేడు. తెలియాల్సిందే. తెలియకపోతే సీత దుఃఖాన్ని ఆవిష్కరించలేడు. తెలియకపోతే సీత ప్రక్కన త్రిజటను ఆవిష్కరించలేడు. సీత , ఆమె చెప్పుకోవడానికి ఎవరూ లేనప్పుడు, రాక్షస స్త్రీ అయిన సీత ప్రక్కన ఉండి ఓదారు స్తుంది. సీతకు నమ్మినటువంటి ఒకే ఒక్క రాక్షస పాత్ర త్రిజట. అందుకని తెలిసినటు వంటి ఒక్క పాత్ర ఉన్నప్పుడే వాల్మీకి రాయగలడు. రాయడానికి సీత పాత్ర తెలియాలి. అంటే భావనాశక్తి ఉన్నప్పుడే ఆ పాత్రలోకి ప్రవేశించి రాయగలడు. నువ్వు చూస్తున్నప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు, అనుభవిస్తూ ఉన్నప్పుడు స్త్రీల యొక్క మాటలెట్లా ఉంటాయి, స్త్రీ యొక్క దుఃఖమెట్లా ఉంటుందో, స్త్రీల వేదనెట్లా ఉంటుందో తెలియాలి.

నువ్వు ఎవరినైనా విన్నప్పుడు, కన్నప్పుడు కలిగిన భావాలు, నీ మనసులో బలంగా నాటుకొని ఉన్నప్పుడు మాత్రమే రాయగలుగుతావు. దీనికి కావలసింది ఏమిటీ అనంటే, రోమరోమాన తానే అనుభవించడం, అనుభవించగలిగినవారే రాయగలుగుతారు అంటాడు. అందుకని సీత యొక్క దుఃఖాన్ని మనము రోమ రోమాన అనుభవించగలిగేలా ఉండడమే భావనాశక్తి అంటాడు. అందుకని ఈ భావనా శక్తి ఇట్లానే ఉంటుందని చెప్పడానికి ఉండదు.

అద్భుతమైన ఘట్టాలన్నీ మనను కదిలించిన ఘట్టాలు, మనను ఒప్పించిన ఘట్టాలన్నీ ఎట్లా వచ్చినవి అంటే, ఎక్కడి నుండి వచ్చినవి అంటే ఈ భావనాశక్తి గనక సరిగ్గా లేకపోతే అది ఆ కవిత్వము రాణించడానికి అవకాశం లేదు. అందుకని ఈ ఇమాజినేషన్ అనేది చాలా కీలకం. నాట్ ఇంటలెక్చువల్ ఇమాజినేషన్ అనేటువంటిది హార్ట్ ఫుల్ నెస్, హృదయంగమమైంది, హృదయగతమైంది. హృదయంలో మనం మన హృదయం యొక్క సామర్థ్యాన్ని పెంచుకో వలసినవి. అందుకే పి.బి.షెల్లీగారు కవిత్వం గురించి నిర్వచించేప్పుడు ఏమన్నారంటే “పొయెట్రీ ఈజ్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇమాజినేషన్’ అని అన్నాడు. వస్తువును చెప్పడం కాదు. వస్తువును అందరు కవులు చెప్తారు. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ది కంటెంట్, ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ది ఫీలింగ్. ఈ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ది కంటెంట్ అందరు చెప్తారు. ఈయనేమన్నాడు అనంటే ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ది ఇమాజినేషన్ అని అన్నాడు. నీ భావనాశక్తిని వ్యక్తీకరించటమే కవిత్వం. కాబట్టి నీ భావనాశక్తి ఎంత వుంది అనేది కవిత్వానికి కావాల్సింది. ఇదంతా కూడా నువ్వు వ్యక్తీకరించే దాన్ని బట్టి ఉంటుంది. హృదయం నిండా నిండాలి. రోమ రోమాంచితమైంది కావాలి అని చెప్తున్నాడు. అందుకని ఒక నటుడు కావాలన్నా, ఒక చిత్రకారుడు కావాలన్నా, ఒక కవి గావాలన్నా ఇవన్నీ అతనికి తెలుసుండాలి. నువ్వు విషాదాన్ని నటించు అని డైరెక్టర్ చెప్తాడు. నువ్వు ఇపుడు చాలా ఇబ్బందుల్లోఉన్నావు. నీ ప్రేమ విఫలమైపోయింది. నువ్వు విరహరంలో ఉన్నావు, వియోగంలో ఉన్నావు కాబట్టి ఈ దశలో నువ్వు ఉద్వేగభరితంగా అభినయించు, ఆక్ట్ చెయ్యి అన్నాడు. అంటే ఎట్లా ఆక్ట్ చేస్తాడీయన? ఆయన చెప్పిందంత ఆక్ట్ చేయడానికి కుదరదు. డైరెక్టర్ అంతా ఆక్ట్ చేసి చెప్పడు. కొందరు డైరెక్టర్లు చెప్పవచ్చు. ఆ డైరెక్టర్ కూడా ఇమాజినేషన్ పవర్ ఉన్న డైరెక్టర్ అయితే చెప్పగలడు. కాని ఇక్కడ నటుడికి కూడా ఇమాజినేషన్ ఉండాలి. ఎవరైనా నటుడైనా ఆ పాత్రలోకి ప్రవేశించి ఏడిస్తే ఎట్లా ఏడుస్తారు? నవ్వుతే ఎట్లా నవ్వుతారు హాయిగా ఉంటే ఎట్లా తాదాత్మ్యం చెందుతారు అనేదంతా కూడా ఇతను తన హృదయానికి అవగతమై ఉండాలి. మన హృదయాలకు అందించాలంటే ఇంతకు ముందే ముద్రింపబడి ఉండాలి. ఆ ముద్రింపబడి ఉండేటువంటి శక్తి ఏది అంటే భావనా శక్తి ఉండాలి. అందుకే కొందరు ఉత్తమ నటులు కాగలుగుతారు. కొందరు మామూలు నటులుగా ఉంటారు. ఉత్తమ నటులందరికి కూడా ఈ భావనాశక్తి ఉంటుంది. కోపాన్ని ప్రదర్శించాలి అన్నప్పుడు నీ కళ్ళతోనా? నీ ముక్కుతో? నీ మాటతోనా? ఎక్కడ ఎట్లా ప్రదర్శిస్తావు? నీ యిష్టం. ఇవన్నిట్లల్లోనా ఎట్లా ప్రదర్శిస్తావు? కోపం అంటే కండ్లు మిడిగుడ్లు తెరువగానే కోపం గాదది. కోపం అనేది నీ చూపులో ఉండాలి. నీ కళ్ళలో ఉండాలి. నీ కదలికలో ఉండాలి. అట్లాగూడా నీవెప్పుడూ ప్రతిభావంతంగా ప్రదర్శించగలుగుతావూ అనంటే భావనాశక్తి ఉన్నప్పుడే నీవు ప్రదర్శించగలుగుతావు. నీవు కోపానికి వచ్చినప్పుడు నీవు ముద్రించుకొని ఉంటే కోపమంటే ఇట్లా ఉంటుంది కదా అని తెలుసుకున్నప్పుడు నువ్వు బాగా ప్రదర్శించ గలుగుతావు. కవి అనేవాడు ఆ కోపాన్ని రాస్తాడు గనక ఆ కోపాన్ని రాసేటప్పుడు ఎట్లా రాయాలి? తిక్కన భీమునికి వచ్చినటువంటి కోపాన్ని ఒక పద్యంలో వర్ణిస్తాడు. పండ్లు కొరుకుతాడు. కండ్లు కొరికినప్పుడు కండ్లు ఎర్రబడతాయి, ఆ ముఖం కంది పోయి ఉండడం అనేవి తిక్కన భీముని కోపాన్ని అద్భుతంగా వర్ణించాడు. అట్లా వర్ణించగలిగి నటువంటి ఒక నేర్పు ఉండడమనేది భావనాశక్తి వల్లనే సాధ్యమవుతుంది.

యుద్ధానికి వెళ్లే ఒక సైనికుడు ఎట్లా ఉంటాడు? ఈ మధ్య సైనికుని గురించి చాలా కవిత్వం రాస్తున్నారు. ఆ సైనికుడు యుద్ధానికెట్లా వెళ్తున్నాడు. చనిపోతే ఎట్లా ఉంటుంది అని రాస్తున్నారు.

ఈ అన్ని అంశాలని తమ భావనాశక్తితో మాత్రమే రాయగలరు. ఎక్కడో దూరంగా ఉండే ఒక సైనికుని యొక్క స్థితిని రాయదలుచుకున్నప్పుడు అందులో ఒక దుఃఖం ఉంటుంది. తన కుటుంబానికి దూరమైపోయినాడనేది ఒక దిగులు ఉంటుంది. ఒక దిగులు ఉంటుంది. నేనిక్కడే చనిపోతే నా కుటుంబాన్ని నేను ఇక చూడలేను అనే దిగులూ ఉంటుంది. అట్లనే ఒక రోషం ఉంటుంది. నా దేశానికి సంబంధించిన ఈ సరిహద్దు భాగాలను వాళ్లు ఆక్రమిస్తే నేనెందుకు ఊరుకుంటాను? ఒక సైనికునిగా నా శక్తినంతా ధారబోసి నిలుపుతాను, వాడెంతటి వాడైనా అవతలివాళ్ళను నేను తరిమి కొడ్తాను అనే రోషముంటుంది. తన శక్తిమీద తనకు, తన ఆత్మవిశ్వాసం మీద తనకు ధైర్యం ఉంటుంది. ఒక్కడే అయినా కూడా ముందుకు వెళ్ళేప్పుడు పదిమంది తన వెనుక ఉన్నారా లేదా అని కూడా చూసుకోకుండా తన దేశం కోసం ప్రాణాలను లెక్కచేయక ముందుకు సాగిపోతాడు. ఆ సాహసం ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు మాత్రమే అతని యొక్క ఆ సైనికుని యొక్క చిత్రాన్ని మనం ఆవిష్కరించుతాం. ఇవన్నీ కలిగి ఉండే శక్తి ఎక్కడ ఉంటుంది అంటే నీ హృదయంలో ఉండేటువంటి భావనాశక్తిలో ఉంటుంది.

ఆ భావనాశక్తి మేళవించినప్పుడే ఈ ఆత్మవిశ్వాసంతో ఇవన్నీ ఒక దిగులు, ఒక దుఃఖం, ఒక ధైర్యం, ఒక సాహసం, ఒక రోషం, ఒక కోపం ఇవన్నీ కూడా మేళవించే శక్తి, హృదయ పూర్వకంగా చెప్పగలిగే శక్తి ఎక్కడిదంటే కేవలం భావనాశక్తిదే. ఈ భావనాశక్తి అనేది ప్రతిసారి రెండు రకాలుగా – ఏకకాలంలో అది వ్యక్తిగతమైనది, అట్లాగే అది బహుముఖమైనదిగా ఉంటుంది. అంటే ఒక ప్రక్కనించి భావనాశక్తితో ఏదైనా రాస్తావు. వేదనను రాసేటప్పుడు, నీ స్వీయవేదనను రాస్తావు, ఈ స్వీయవేదనను రాసేటప్పుడు ఆ విషయానికి ఆధారమైనది లోకంలోని భావమే. ఈ భావనాశక్తితో ఏం రాస్తావు? అది లౌకికమయ్యేదే రాస్తావు. కృష్ణశాస్త్రి చెప్పినటువంటిది అందరికి తెలిసిన పద్యమే – ఏమయ్యా ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగితే, నీ హృదయం ఏమిటి? ప్రేమ ప్రేమ అంటావు ఎందుకు? అంటే

సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజంబు

చంద్రికల నేల వెన్నెల కురియు చందమామ

ఏల సలిలంబు పారు, గాడ్పేల వీచు

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

ప్రియురాలు ప్రియుణ్ణి పట్టుకొని అడిగింది. ఏల ప్రేమించగలవు అని. అడిగితే, ఆ విధంగా ప్రియుడు అన్నట్టు కృష్ణశాస్త్రిలోని భావుకుడు ఇట్లా చెప్పాడు. ఎందుకు కలుగుతుందో తెలియదు. లోకాన్ని ఆధారం చేసుకొనే కవి చెప్తాడు. వ్యక్తిగతంగా తన స్వీయ మేధనుండి చెప్పినా లోకాన్ని ఆధారం చేసుకొని, పూలు సౌరభాలను ఎందుకు విరజిమ్ముతాయి అంటే ఏం చెప్పాలి నేను? చంద్రుడు వెన్నెలను కాయడానికి ఏం కారణం అంటే ఏం చెప్పగలం? ఏల సలిలంబు పారు అంటే నేను ఏం చెప్పాలి? నీళ్ళు ఎందుకు ప్రవహిస్తాయి? గాడ్పు ఎందుకు విసురుతుందో? ఎందుకు వీస్తుందో? నేను అందుకు నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఇది కృష్ణశాస్త్రి కవిత్వం. భావనా శక్తికి గాలి, నీరు, పూలు, వెన్నెల ఇన్ని కారణమయినాయి. ఇన్ని కారణమైతే తప్ప తన ప్రేమను సమర్థించు కోలేడు ఒక భావుకుడు. కవి భావనాశక్తిని బట్టి కవి సామర్థ్యాన్ని బట్టి కవిత్వంలో తన అనుభవాన్ని బట్టి చెప్పగలుగుతాడు. ఈ వామనునికి నువ్వు ఇస్తే అడిగింది మూడడుగులే అయినా కాని నువ్వు నష్టపోతావు వద్దు అని  శుక్రాచార్యుడు చెప్పినా కూడా బలిచక్రవర్తి దానమియ్యడానికి ఒప్పుకుంటాడు. సిద్ధపడ్డాడు. శుక్రాచార్యుడు అంతే అంటే బలిచక్రవర్తి ద్వారా పోతన అడిగిస్తాడు. ఏమనంటే అయితే అయ్యింది, నేను మోసపోతే పోతాను అని అనుకొని ఏమన్నాడు అంటే…

“ఆదిన్ శ్రీసతి కొప్పుపై… అంసోత్తరీయంబుపై…

ఏదో పై… ఇట్లా మహావిష్ణువు యొక్క చెయ్యిని వర్ణించాలి. ఆ చెయ్యిని వర్ణించిందెట్లా అంటే “ఆదిన్ శ్రీసతి కొప్పుపై” మొదట శ్రీలక్ష్మి యొక్క కొప్పును ముట్టుకున్న తనువును ముట్టుకున్న చెయ్యి, ఆమె కొప్పును సవరించివచ్చు ఆ తర్వాత ఆమె అంసోత్త రీయం భుజాలుపై నుండే ఆమె కొంగును సవరించివచ్చినటువంటిది, ఆట్లా సవరించి సవరించి పాలిండ్లపై నడయాడినటువంటి చెయ్యి లక్ష్మీదేవి యొక్క అవయవాలపై నూతన మర్యాదలు తెలిసిన చెయ్యి అయిన విష్ణువు చెయ్యి కిందికి ఉంటుంది. నా చేయి మీద ఉంటుంది అంటాడు. ఇది భావనాశక్తికి చెందినటువంటి విషయం ఊరికే ఆ చెయ్యి కిందా, నా చేయి మీద అంటే కాదు, ఎట్లా వర్ణించాడు అంటే మహావిష్ణువు చెయ్యి, మహాలక్ష్మి యొక్క శరీరాన్ని తడమగలిగినటువంటి చెయ్యి క్రింద ఉన్నది, నా చెయ్యి మీదై ఉంది.. పోతే పోనీ అంటాడు. “కారే రాజులు…’ రాజులు ఎంతోమంది అవుతారు. నా పేరు ఇట్లా ఉండిపోతుంది ఉండనీ అని అంటాడు. అందుకని ఈ భావన అంతాకూడా పోతనకు హృదయంలో ఉన్నటువంటి భావనా శక్తి్. హృదయంలో ఉన్న సామర్థ్యం అంతా ఈ రూపములో తీసుకురావడంవల్ల వ్యక్తీకరించడం వల్ల ఆ పద్యాలు, బలిపాత్ర అద్భుతమైనటువంటి ఆ వర్ణన అలా వచ్చింది, మిగిలి ఉంది. కాబట్టి భావనాత్మకమైన విషయాన్ని కీలకం మనం గుర్తుకు తెచ్చుకుంటూ మనకు శాస్త్రము సత్యాన్ని చెప్పవచ్చు గాని, సత్యము ఒకటే ఉంటుంది. శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి సూత్రము ఒకటే ఉంటుంది. (A+B)­2=A2+B2+2AB అని ఉంటుంది. ఇంతే ఉంటుంది. 2X2=4, నాలుగే అవుతుంది. ఇది సత్యానికి సంబంధించినటువంటిది. అది సైన్స్, అది అట్లాగే ఉంటుంది. కాని కవిత్వం అట్లా కాదు. 1+1=1 వన్ ప్లస్ వన్ ఇజ్ క్వల్ట్ వన్ అని రాసాడు శ్రీశ్రీ. 1+1=1 ఎట్లా అవుతుంది? కానీ అవుతుంది అదే కవిత్వం. అదే సాహిత్యము. ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు కలిసి ఒకటవడం. ఒక స్త్రీ + ఒక పురుషుడు ఇద్దరు కలిసి ఒకటవడం. 1+1=2 అనేది శాస్త్రంలోనిది. కాని సాహిత్యంలో అట్లా కాలేదు. మనుషులకు చెప్పాడు. రెండు మనసులు ఒకటై ఉంటాడు. రెండు మనసులు ఎప్పుడు కాని నిజ జీవితంలో ఒకటి కావు. కాని కవిత్వంలో ఒకటవుతాయి. హృదయంలో ఒకటవుతాయి. భావనలో ఒకటవుతాయి. ఉన్నాగూడా ఒక్కటిగా మారిపోతాయి. అది కవిత్వానికి సంబంధించిన అంశం. అందుకని కవిత్వము వైవిధ్యపూరితమైంది. శాస్త్రం కేవలం సత్యానికి నిబద్ధమై ఉంటుంది. సత్యం ఒక్క రకంగానే ఉంటుంది. కాని కవిత్వము వివిధ రూపాలను పొందినటువంటిది. చాలామంది అనుకుంటూ ఉంటారు. రెండు లైన్లు రాస్తారో లేదో పొంగిపోతారు అని అంటుంటారు. ఆయన పాట రాస్తాడు ఎన్నో హృదయాలను, ఎంతోమందిని ఆకర్షిస్తుంది. ఎట్లా ఆకర్షిస్తుంది? రవీంద్రుడు గీతాంజలి రాశాడు కొన్ని కోట్లమందిని ఆకర్షించాడు. ఎట్లా ఆకర్షించాడు? అంటే కవిత్వానికి వివిధ హృదయాల్ని అలరింపజేసేటువంటి శక్తి ఉంటుంది. ఈ శక్తి దేనివల్ల వచ్చింది? ఈ శక్తి భావనాశక్తి వల్ల వచ్చింది. భావనాశక్తి గనక కవికి లేకపోతే లేదా పాఠకునికి లేకపోతే, లేదా సహృదయులకు లేకపోతే ఈ కవిత్వము ఇంతమందిని ఆకర్షించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ భావనాశక్తి కీలకం. ఈ భావనాశక్తి హృదయంలో ఒకటే విధంగా ఉండకపోవచ్చు. రెండు విధాలుగా మూడు విధాలుగా ఎనిమిది విధాలుగా ఉండవచ్చు. అట్లా లెక్కబెట్టాల్సిన పని లేదు. అవసరమైనప్పుడు మీరేదైతే రాయదలుచుకుంటారో ఎప్పుడో మీ చిన్నప్పుడు చూసిన విషయాన్ని ఇప్పుడూ రాయాలి. ఎప్పుడూ చూసింది మీకు జ్ఞాపకం ఉంటుంది. మీరు ఇప్పుడు రాసేప్పుడు అది నేనున్నాను అని పరిగెత్తుకుంటూ వస్తుంది. దానికి కావలసింది భావనాశక్తి. ఆ భావనాశక్తికి కావలసిందల్లా నీ హృదయానికి ఉద్వేగం కలిగించేదయ్యి ఉండాలి. కాబట్టి ఈ ఆవిష్కరించే భావనాశక్తి కీలకమైందని చెప్తూ, తేనెటీగ అనేది అన్ని పువ్వులమీద వాలుతుంది. అన్ని పువ్వుల యొక్క మకరందాన్ని అది ఆస్వాదిస్తుంది. ఆస్వాదించి అదంతా తన దగ్గర భద్రపరుచుకుంటుంది. భద్రపరుచుకొని అది తేనె తెట్టెను తయారుచేస్తుంది. అది అనేక పువ్వుల మీద వాలకపోతే, అది మకరందాన్ని ఆస్వాదించకపోతే తనదైన తేనెను తయారుచేసే అవకాశం ఉండదు. అనేక పువ్వుల మీద వాలగలిగేటువంటి శక్తే అనేక మకరందాలను గ్రోలగలిగే శక్తే భావనాశక్తి. అది భద్రపరుచుకోవడం అనేది కొత్త తేనెను తయారు చేయగలిగేటువంటి శక్తిని ఇస్తుంది. అందుకని భావనాశక్తి ఎటువంటిది అంటే ఎక్కడెక్కడి రసాలను, ఎక్కడెక్కడి అనుభవాల రసాలను ఒక్కదగ్గర భద్రపరుచుకొని, అది నీకు అవసరమైనపుడు నీకు ఇవ్వగలిగేటవంటి శక్తి ఈ భావనాశక్తికి ఉంటుంది. అందుకని చాలా చిత్రమైనటువంటిదీ ఈ భావనాశక్తి. వ్యక్తిగతమైనటువంటి దానిని సార్వజనీనం చేస్తుంది. ఇందాక కృష్ణశాస్త్రి వర్ణనలోని బాధ, చలం మాటల్లోనే కృష్ణశాస్త్రి బాధ లోకానికి బాధ, లోకం బాధ శ్రీశ్రీ, లోకం బాధ కవి బాధ అవుతుంది. కృష్ణశాస్త్రి బాధ లోకం బాధ చేసాడు. అదే భావనాశక్తి వల్ల లోకం బాధ శ్రీ శ్రీ బాధ అయింది. కవి యొక్క బాధ లోకం బాధ అయ్యే భావన చేశాడు. శ్రీశ్రీ ఏమన్నాడు “పతితులార భ్రష్టులార బాధాతప్త ప్రజలారా, ఏడవకండేడవకండి వస్తున్నాయ్ వస్తున్నాయ్ మీకోసం వస్తున్నాయ్, వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్ వస్తున్నాయ్” అన్నాడు. ఎక్కడి రథచక్రాలు? ఎక్కడో పూరీలో ఉన్నాయి జగన్నాథ రథచక్రాలు అవి పూరీలో ఉంటే అవి పూరీలో తిరుగుతాయి. యాడాదికొక్కసారి ఊరేగిస్తారు. కాని శ్రీశ్రీ ఏం చేస్తాడు. పూరీలో ఊరేగే జగన్నాథ రథచక్రాలను తీసుకొచ్చి సమసమాజానికి ప్రతీకగా మార్చి, అనేకమంది యొక్క దుఃఖాన్ని తుడిచి వేయడానికి శ్రీశ్రీ చేసిన భావనాశక్తి అది. ఒక దేవుడిని ఊరేగించాల్సి వచ్చినప్పుడు ఉత్సవ విగ్రహాల్ని ఊరేగించే రథమది.

ఊరేగింపులో ఉపయోగించే రథాన్ని తీసుకొచ్చి, దాన్ని సమాజం కోసం వస్తున్నట్టు భావించి సమసమాజాన్ని భావించి “పతితులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార, ఏడవకండేడవకండి వస్తున్నాయి వస్తున్నాయ్ – మీ కోసం వస్తున్నాయ్ అని సమసమాజ స్థాపనకు ఆపాదించి రాసాడు, శ్రీశ్రీ అక్కడికి వెళ్ళాడు గనక చూసాడు గనక తన హృదయంలో భద్రపరుచు కున్నాడు. ఆయన రష్యాలో చైనాలో తిరిగాడు గనక అక్కడ చూసిన సామాజిక చైతన్యం ఇక్కడ కూడా రావాలని సమసమాజం యొక్క చైతన్యాన్ని ఆవాహన చేసుకున్నాడు. దీన్ని అర్ధవంతంగా భావించి రథచక్రాన్ని భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అని అన్నాడు. ఇక్కడ కవిత్వాన్ని సృష్టించాడు. ఆకాశపు దారులలోనుంచి రథాన్ని తీసుకొస్తాడు. ఇక్క సంబంధం లేని పద్ధతుల్లో వెళ్తున్నాయి. కవులు ఆకాశంలోనుంచి రథాన్ని తీసుకొచ్చి మళ్ళీ కోట్లాది హృదయాలకు అందేలా తీసుకువచ్చాడు. అట్లాంటి భావనాశక్తే పెద్దనకు, మనుచరిత్రలో ప్రవరోపాఖ్యానంలో ప్రవరుడనే పాత్రను హిమాలయాలకు తీసుకువెళ్తాడు. ఆయన నడుచుకుంటూ పోవాలంటే పదుల సంవత్సరాలు పడుతుంది. అందుకోసం అతని కాళ్ళకు పసరును పూసిన వర్ణన చేస్తాడు. ఈ పసరుతో శక్తి పోతుంది. ఆయన అక్కడి హిమాలయాలకు పోయినట్లు రాయడం అది ఆయన ఇమాజినేషన్ కు సంబంధించింది. కాళ్ళకు పూసిన పసరు శక్తి ఎప్పుడైతే భూమి మీద దిగిన తర్వాత కరిగి శక్తి పోతుంది. దిగిన దగ్గర వరూధిని ఉంటుంది. అక్కడ మాయా ప్రవరుడు ఉంటారు. అక్కడ వర్ణన ఇద్దరు మధ్య ఒక నరుడు, ఒక గంధర్వుడు నడుస్తుంది. అక్కడంతా కవి మళ్ళీ తన అనుభవమే ఉంటుంది. అతడు బాట చెప్పమంటే వరూధిని అంటుంది. “ఇంతలు కన్నులుండ భూసురోత్తమ” అని “ఓ బ్రాహ్మణుడా నీకు ఇచ్చిన పెద్ద కళ్ళు ఉన్నాయి, నీకు ఈ బాట వెలువదా?” అంటుంది. ఇది ఇక్కడి లౌకిక జీవనంలోని విషయాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రవరునికి ఆపాదిస్తాడు. ప్రవరుడు తొవ్వ దొరకడం లేదని అంటాడు. గంధర్వ కన్యతో మాట్లాడేప్పుడు ఒకమాటను పెట్టి “ఇంతలు కన్నులుండ” అనే మాటను వరూధినితో అనిపించడం అనేది హృదయాంతరాళలతో ఉన్న భావనాశక్తి లౌకిక విషయంగా, తెలిసిన మాటను అక్కడ పెడతాడు. ప్రవరుని మాటలో పెడ్తాడు. గంధర్వ కన్యను తీసుకొచ్చి, ఒక లౌకి జీవనంలో ఉండేటువంటి మాటను ఆమెతో అనిపిస్తాడు కవి. ఇలా పెట్టడం అనేది ఇది భావనాశక్తికి సంబంధించినటు వంటిది. కవి హృదయాంతరాళాల్లో ఉన్నది కవిత్వమవుతుంది. వర్ణన అవుతుంది.

కవిత్వానికి కళ వస్తుంది. ఈ కవిత్వానికి ఒక ప్రాణకళ రావాలన్నా ఈ భావనాశక్తి వల్లనే. దీనివల్లనే ఈ కవిత్వానికి ఒక ప్రాణమొస్తుంది. కవిత్వానికి ఒక తేజమొస్తది అని కట్టమంచి రామలింగారెడ్డి అన్నాడు. ఈ కవిత్వానికి ఒక కళ రావాలంటే, దేనివల్ల వస్తుందంటే మనోగాంభీర్యం వల్ల వస్తుంది. ఈ మనశ్శక్తి వల్ల వస్తుంది. ఈ భావనాశక్తి వల్ల వస్తుంది అన్నాడు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరికొన్ని ఉదాహరణలు తెలుసుకోవాలి. హిందీలో కల్పన, చతురత, భావన అనేవే ఉన్నాయి. హిందీలో కూడా చాలా చర్చ జరిగింది. ఈ భావనాశక్తి ప్రయోజనాలను నెరవేరుస్తుంది. ఈ భావనాశక్తి కొన్నిచోట్ల వాస్తవమైందేమో కృతకమైన దానిలా కనిపిస్తుంది. కృతకమైందేమో వాస్తవంగా కనిపించవచ్చు. ఈ కృతకమైంది ఈ వాస్తవమైంది రెండింటినీ మేళవించి వర్ణించేదే భావనాశక్తి. నీవు అద్భుతమైన కల్పన చెయ్యాలంటే ఎక్కడినుంచి చేస్తావు? వాస్తవమైన ప్రపంచం నుంచే చెయ్యాలి. స్వర్గం ఉన్నదని అన్నారు. భూలోకాన్ని చూడలేకపోతే స్వర్గాన్ని సృష్టించలేరు. రంభను చిత్రించాలన్నా ఊర్వశిని చిత్రించాలన్నా భూలోకంలో ఉన్న అందగత్తెలను చూస్తేనే అట్లా చిత్రించడం సాధ్యం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చూడకుండా, లౌకికమైన విషయాలు చూడకుండా పారలౌకికమైన విషయాలు వర్ణించడం సాధ్యం కాదు. కృతకమైన వాటిని వాస్తవికతతో, వాస్తవమైనవి కృతకమైనవిగా మేళవించి చెప్పగలిగే శక్తి ఈయనకుంటుంది. అట్లా “లౌకికమైన విషయాలను మాత్రమే మేళవించి కొత్త అర్థాలను, కొత్త అందాలను, కొత్త ఆలోచనలను, సొగసులను సృష్టిస్తుంది ఈ భావనాశక్తి” అంటాడు. అంతా మనకు తెలిసినదే, అంతా మనం అనుభవాలే, అంతా మనం చూసిన జీవితమే. కాని నీ భావనాశక్తి వల్ల, వాటి మేళవించడం వల్ల, రంగరించడం వల్ల దానికి ఒక కొత్తదనం రావడానికి కొత్త సొగసు, కొత్త బలం వచ్చే అవకాశమున్నది. అట్లా ఇవ్వి చాలా కీలకమైనవి కాబట్టి భావనాశక్తి మనకు కవులు వర్డ్స్ వర్త్ అంటాడు. సాయం సమయాన మంచు బిందువులు సూర్యుడు రాలేనందువల్ల రాల్చే కన్నీటి బిందువులల్లే ఉన్నాయి. సూర్యుడు రాలేనందువల్ల కమలాలు రాల్చే కన్నీరువలె ఉన్నది అని అన్నాడు. సూర్యునికి, కమలానికి ఉన్న ప్రణయబంధం ఉన్నట్లుగా మనకు చాలామంది కవులు వర్ణించారు. కాని కురిసిన మంచు కన్నీటి సూర్యుడు రానందున కమలాలు కన్నీరు రాల్చాయి. ఈ మంచు బిందువులు అవి రాల్చిన కన్నీటి బిందువులు అని కల్పన చేశాడు వర్డ్స్ వర్త్.

అట్లానే జాషువా కవిత్వం చదువుతూ వుంటే ఆకర్షించినటువంటి మాట ఏమంటే “దినదినము క్రుంకు జీవనము కట్టెడి బ్రహ్మ – ఆ పాపము ఏల లిఖించెనో నాథా….” వనకన్యలు జాలిపడుతున్నా రన్నాడు. ఇది వనకన్యని చూసి ఎందుకు జాలి కలిగింది జాషువాకు అంటే, “దినదినము గ్రుంకు జీవనమును చూసి జాలిపడ్డాడు. రోజూ అస్తమించేది రాయడం. రోజూ అట్లానే ప్రకాశమానంగా ఉంటున్నట్టు రాయకుండా, ఆ బ్రహ్మ సూర్యుణ్ణి సృష్టించేటప్పుడు రోజూ అస్తమించాలి మళ్లీ ఉదయించాలి అని అనేటువంటిది చూసి రాశాడు. ఆ వనమనే దానిని కన్యగా భావించి, ఆ వనకన్యలంతా సూర్యునికి ఇట్లా రోజూ అస్తమించేటువంటి రాత రాసిన బ్రహ్మదేవుణ్ణి కొంచెం కోపిస్తూ దుఃఖిస్తున్నటువంటి స్థితిని ఆయన రాశాడు. అట్లా మనం చూసినప్పుడు చంద్రసేన్ అనేటువంటి కవి చిన్న చిన్న పదాలతో జీవితాన్ని చెప్పాడు. ఈ కవివి మీకందరికీ తెలిసిన మాటలే. “కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ప్రయాణం” అని రాశాడు. మనం చూస్తన్నదే మనం కన్ను మూస్తాం, తెరుస్తాం. కాని అందరికీ ఆ ఊహాశక్తి రాలేదు. ఈ భావనాశక్తి చంద్రసేన కు మాత్రమే వచ్చింది. ఒక పుట్టుక కన్ను తెరవడం, ఒక చావు కన్ను మూయడం. ఇంతేకదా అంటాడు.

అట్లా పాపినేని శివశంకర్ కవిత్వంలోనూ ఇట్లాంటి మంచి మాటలు ఉన్నాయి. “రెండు కళ్ళు, రెండు అపురూప కార్యాల కోసం వేచి వున్నాయి” అని రాస్తాడు. “ఒకటి నీ దుఃఖం కోసం, రెండవది పరాయి దుఃఖం కోసం”. రెండు కళ్లెందుకున్నాయనంటే ఒకటి మనకోసం ఏడవాలి. ఒకటి పరాయి దుఃఖం కోసం అంటాడు.

అందుకని ఈ రెండు కళ్ళను అట్లా ఊహించడం అనేది సార్వజనీనదృష్టికి ప్రతీకగా చేసి రాసాడు పాపినేని శివశంకర్. కొపర్తి “నా కవిత్వం నన్ను పలకరించి ఎన్నాళ్ళయ్యిందో, నాకు నేను కాకుండాపోయి అన్నాళ్ళయ్యింది. కవిత్వం వెళ్ళిపోయి నన్ను నాలో నేను మిగలకుండా చేసింది” అంటాడు. కవిత్వం వెళ్ళిపోయి నన్ను మిగులకుండా చేసింది అని గొప్పగా అన్నాడు. “పశువుల కాపరి ఒకడైనా రెండు చేతులను ఇలా నోటి చుట్టు పెట్టి ఒక పొలికేక వేసినా సరిపోయేది. నా కవిత్వం మైదానాల్లో, లోయల్లో ప్రతిధ్వనించి ఉండేది” అన్నాడు. ఎక్కడి పశువుల కాపరి? కవి ఇక్కడ కూర్చుని కవిత్వం రాస్తున్నాడు. కవి ఎక్కడినుంచి కవిత్వం తీసుకుంటాడు అంటే కవి అనుభవించిన విషయాల్లోంచి, ఆయన చూసిన ప్రకృతి నుంచి సేకరించుకుంటాడు. ఆయన చూసిన మనుషుల నుండి తీసుకుంటాడు. ఆయన, దుఃఖించినటువంటి అనేక వ్యక్తుల యొక్క కథ చెప్పవలసి వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది.

ఆ ఉడుత ప్రయాణం చేస్తూ వచ్చి ఇసుకలో దొర్చి దులుపుకుంటున్నటువంటి దృశ్యాన్ని చూసిన వాల్మీకి, ఏం రాస్తాడు? మీకందరికీ తెలిసిందే. వారధి కడూ ఉన్నప్పుడు ఒక ఉడుత వస్తుంది రాముని దగ్గరికి. ఎందుకా ఉడుత? ఎందుకా ఉడుత వచ్చింది అనేది వాల్మీకికి తెలియాలి? నిజమైన కవికి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే, ఆ ఉడుత అక్కడికి రావడం, ఇసుక రేణువుల్ని తీసుకొచ్చి పోస్తూ ఉంటే రాముడు వచ్చి దగ్గరికి తీసుకొని నవ్వుతూ, వీపు మీద నిమురుతూ ఉంటాడు. అవే, ఆ ఉడుత మీద మూడు చారలుగా పడి నిల్చి ఉంటాయి అని. అంటే భావనాశక్తి అనేది కవికి అట్లా ఉంటుంది. అంత సూక్ష్మంగా కవి హృదయంలో ముద్రపడిపోయి భద్రపరుచుకుంటాడు. ఈ రాముడు ఉడుత వీపు మీద దువ్వడం వల్లనే ఈ మూడు గీతలు వచ్చినవి అని ఊహిస్తారు. ఉడుత లేకపోయినా కథకు ఏమీ నష్టం లేదు. శబరి పాత్ర లేకపోయినా కథకు ఏం కాదు. అయినా ఇటువంటివన్నీ జీవితంలో కనిపించడం, జీవితానికి దగ్గరగా రావడం జరుగుతుంది. శబరి రామునికి ఎంగిలిపండ్లు ఇస్తుంది. ఇదంతా మనకందరికీ తెలిసిన కథే. ఈ ఎంగిలి పండ్లు ఇవ్వడమెందుకు? కవి యొక్క భావనాశక్తి అట్లా రాముడు లాంటి ఒక గొప్ప వ్యక్తి వస్తే అతనికి ఎంగిలి పండ్లు ఇవ్వడమేమిటి? తను సగం తిని, అవి రుచికరంగా ఉన్నాయా లేదా అని చూసి, నీకు ఇస్తున్నాను అని అంటుంది. భక్తి పారవశ్యానికి అంతేలేదు అనేలా. సరిగ్గా శబరికుండేటువంటి భావనాశక్తి లేదా శబరిలో ఉన్న భావనాశక్తి, వీటిని ప్రవేశింపజేసిన వాల్మీకి భావనాశక్తి గొప్పది. శబరి పాత్ర ద్వారా ప్రవేవించి పలికించినటువంటి భక్తి భావన ఇవన్నీ వాల్మీకి భావనాశక్తి వల్లనే ఈ పాత్రలన్నీ సజీవ పాత్రలయినవి.

అలాంటిదే “నాకోసం ఒక కన్ను దుఃఖిస్తుంది, ఇంకొక కన్ను పరుల కొరకు దుఃఖిస్తుంది” అని శివశంకర్ అంటాడు. “ఒక పశువుల కాపరి పిలిచినప్పుడు ఒక కేక వింటే నాలోని కవి బతుకుతాడు” అని పరిగనేరుకునేటువంటి వేళ నా కోసం ఎదిరి చూడు. పత్తికాయ పగిలినప్పుడు ఎట్ల అయితే శబ్దం వినిపిస్తుందో ఆ వేళ నాకోసం విని చూడు అట్లా నా హృదయంలో భావన వినిపించాలి అని అనడం. ఇట్లా శివసాగర్ ఒక కవిత రాసాడు. అట్లా కవి ఎప్పుడో చూసిన విషయాలను తన కవితలో ప్రతిబింబింపజేయడం, తన భావన ఆవిష్కరింపచేయడం. భావనను మనసులో ముద్రింప చేసుకోవడం, మనసులో భద్రపరుచుకోవడం వల్లనే ఆవిష్కరింపచేయడం జరుగుతుంది. నీ భావనాశక్తితో సంఘటనలు, దృశ్యాలు పరిపూర్ణమయ్యేలా పెంచుకోవడం. ఇది పెంచుకుంటే వస్తుందా అంటే, ఇది నీ హృదయంలో నీవు గుర్తు పెట్టుకోవాలని అనుకొని గుర్తుపెట్టుకోవు. నీవు ఏడవాలనుకొని ఏడవవు. అనుకోవు. ఇందాక కృష్ణశాస్త్రి చెప్పినట్లుగా పూలెందుకు సువాసనలు విరజిమ్ముతాయో, నీళ్ళెందుకు పారుతాయో కవి హృదయం కూడా అందుకే తాపత్రయపడుతుంది. ఇది భావనాశక్తి వల్లనే జరుగుతుంది అని చెప్తూ, ఆ భావనాశక్తిని మన లోకజ్ఞానం ద్వారా అనేక సంఘటనల ద్వారా మన హృదయం యొక్క సంస్కారం వల్ల వస్తుంది.

అందరికి కూడా సాధన వల్లనే సాధ్యమవుతుందని అనలేనుగాని, ప్రతీదీ సిద్ధమై ఉండదు. భావనాశక్తి సాధించడం వల్ల వస్తుందని అనలేము. గాని మనం గడించిన అనుభవాలని నీవిగా

చేసుకొని, ఆ ఉద్వేగాలను ఆస్వాదించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం గడిచి వచ్చిన, మనం నడిచి వచ్చిన జీవితమంతా కూడా నీ భావనాశక్తికి రంగస్థలంలాగా, వేదికలాగా ఉంటుంది. నీ ఊహలను ప్రతిబింబిపచేయడం, రోమరోమాన నువ్వు అనుకొని ఆస్వాదించి రాయాలి.

ఇందాకే, రామలింగారెడ్డి చెప్పినట్టు అనుభవాలని నీవిగా చేసుకొని రాస్తే, ఉద్వేగంతో పాత్రల యొక్క భావుకత వ్యక్తమవుతుంది. భావనాశక్తి అందుతుంది. దాన్ని అందుకోవాలని కోరుకుంటూ కవిత్వం భావనాశక్తి అనేది సాధించాలి. భావుకత మీలో ఉంటే తప్ప ఇంతసేపు వినలేరు! (చదవలేరు!)

 

January 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us