మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

అవసరం

by Rama Devi Nellutla December 31, 2021
written by Rama Devi Nellutla

ఆమె మళ్ళీ రావడం కనిపించింది .
ఎప్పట్లాగే భుజానికో బ్యాగు తగిలించుకుని , కుడి చేత్తో ఆ పెద్దావిడ చేయి పట్టుకుని నడిపిస్తూ నెమ్మదిగా లోపలికి వచ్చింది .చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఆ ముసలామెను కస్టమర్స్ లాంజ్ లోని కుర్చీలో కూర్చోబెట్టింది .
ఆవిడ కూర్చున్నాక తన భుజానికున్న బాగ్ లోనించి నీళ్ల సీసా బయటికి తీసి మూత తీసి పదిలంగా ఆమె నోటికి అందించింది . పెద్దావిడ వద్దన్నట్టుగా తల తిప్పింది . అయినా వదలకుండా బుజ్జగిస్తున్నట్టుగా ముసలామెతో కొన్ని మంచినీళ్లు తాగించింది .
ఆ తరువాత స్టాండ్ దగ్గరికి వెళ్లి ఒక విత్ డ్రా ఫామ్ తీసుకుని ఏదో రాసింది . పెద్దావిడ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పి ఆవిడతో పెన్ను పట్టించి చిన్న పిల్లలతో అక్షరాలు దిద్దించినట్టుగా జాగ్రత్తగా సంతకం చేయించింది . మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్లి పాస్ బుక్ తో బాటు వోచర్ ఇచ్చి పెద్దావిడను చూపిస్తూ ఏదో చెప్పింది .
వాళ్ళూ నవ్వుతూ పలకరించి ఏదో అంటున్నారు . టోకెన్ తీసుకుని కాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది . క్యాషియర్ నవ్వుతూ డబ్బులు లెక్కబెట్టి ఇచ్చాడు . ఆమె కూడా చిరునవ్వుతో మాట్లాడుతోంది .
నేను ఈ బ్రాంచ్ కి మేనేజర్ గా వచ్చిన గత అయిదు నెలలుగా చూస్తున్నాను , ప్రతీ నెలా ఆఖరి వారం లోనే ఆమె బ్యాంక్ కి వస్తుంది . అది కూడా ఉదయం బ్యాంకు తెరచిన అయిదు నిముషాల్లోపే వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్తుంది . ఆ రోజుల్లో .. అందునా ఆ టైం లో అయితే రష్ ఉండదని కాబోలు !
ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది . ఎందుకో తెలీదు గానీ ఆమెను చూస్తూంటే ఎంతో ఆత్మీయురాలనిపిస్తుంది . సౌమ్యంగా , నెమ్మదిగా తన పని చేసుకువెళ్తుంది . ఆమె రాగానే మా స్టాఫ్ కూడా ఎంతో బాగా పలకరించడం , గబగబా ఆమెకు పనులు చేసి పెట్టడం నేను గమనించాను .’ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు ‘ , ఇదే కాబోలు !
ఇవాళ రిలీజ్ చేయాల్సిన ఒక లోన్ గురించి ఫీల్డ్ ఆఫీసర్ తో చెబుదామని నా కేబిన్ లోంచి బయటికి వస్తూంటే ఆమె తన చేత్తో ఆ ముసలావిడను పట్టుకుని నడిపించుకుని వెళ్తూ కనపడింది .
” నమస్తే మేడమ్ !” చక్కటి చిరునవ్వుతో కుడి అరచేయి ఛాతీకి ఆనించి తల కొద్దిగా వంచి విష్ చేసింది .
” నమస్తే ! మీ అమ్మగారా ?” పెద్దావిడ వైపు చూస్తూ అడిగాను . చిన్న పిల్లను పట్టుకుని నడిపించినట్టు ఆమె ఎంతో అపురూపంగా ఎడమ చేత్తో ఆమెను పొదివి పట్టుకుని తీసుకువెళ్తూంది .
” లేదండీ , మా అత్తగారు !” అంది ఆమె అదే వినయంతో .
ఆశ్చర్యపోవడం నా వంతయింది .
వాళ్ళు నెమ్మదిగా బయటికి వెళ్ళగానే , ఓ ఆటో వచ్చి ఆగింది . ముందే ఆటో అతన్ని పోనూ రానూ మాట్లాడుకున్నట్టున్నారు . ముందు జాగ్రత్తగా అత్తగారిని ఎక్కించి ఆ తరువాత తాను వెనకాల నుండి తిరిగి వచ్చి అటుపక్కనుండి ఎక్కిందామె . ఆటో కదిలింది . ‘ ఎంత జాగ్రత్త !’ అనుకుంటూ అటే చూస్తూ ఉండిపోయాను .
********
ఎట్టకేలకు ఆ ఇల్లు దొరకపట్టగలిగాను . అతని కోసం దాదాపు నెల రోజుల్నించి తిరుగుతున్నాను. కుమార్ అనే అతను వీడియో కెమెరాకు లోన్ తీసుకున్నాడు బ్యాంక్ నుండి . పెళ్లిళ్లకు, పుట్టిన్రోజులకు , ఇతర ఫంక్షన్లకు వెళ్తూ సంపాదించుకుని తక్కువ మొత్తంతో ఎక్కువ ఇన్ స్టాల్ మెంట్స్ లో మూడేళ్ళలో కట్టుకునేలాగా ఏర్పాటు చేశారు మా బ్యాంకు వాళ్ళు .
మొదట్లో ఒకట్రెండు నెలలు సరిగానే కట్టినట్టున్నాడు . ఆ తరువాత నుండీ ఏమీ చెల్లింపులు లేవు . నేను ఈ బ్రాంచ్ లో మేనేజర్ గా చేరిన కొద్ది రోజులకే అతని లోన్ ఖాతా మొండి బకాయిగా సిస్టమ్ లో కనపడుతోంది .
సహజంగా నేను చిన్నదైనా , పెద్దదైనా లోన్ రికవరీ కోసం ఒకట్రెండు సార్లు ఫోన్ చేసినా ఫలితం ఉండకపోతేనే ఇంటికో , పని చేసే చోటికో , షాపుకో వెళ్తాను . పైగా లోన్ ఇచ్చినప్పుడు మధ్య మధ్య యూనిట్ చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది .
ఈ కుమార్ అనే అతను అస్సలు దొరకలేదు . ఇప్పటికి మూడిళ్లు మార్చాడు . ఎలాగో ఆచూకీ తీసి దొరకపట్టాను . తీరా చూస్తే ఇంట్లో ఘోరమైన పరిస్థితి ! అతడు ఇంట్లో లేడు , ఏ రాత్రికో బాగా తాగి వస్తాడట . మొదట్లో ఎవరో వీడియో గ్రాఫర్స్ దగ్గర పనిచేసినప్పుడు బాగానే డబ్బులు వచ్చేవట . అయితే తాగుడు ఎక్కువై ఇంట్లోకి డబ్బులేమీ ఇవ్వకపోగా రెండు లక్షల విలువైన ఆ వీడియో కెమెరా కూడా కుదువబెట్టి మరీ తాగేవాడట .
ఇప్పుడు ఆ కెమెరా కూడా ఉందో అమ్మేశాడో తెలీదు , ఎక్కడా పెద్దగా షూటింగ్స్ కూడా ఉన్నట్టు లేదని అతని భార్య ఏడుస్తూ చెప్పింది . ఆమె షిఫ్ట్ పద్ధతిలో ఏదో మాల్ లో పని చేసి తెచ్చే డబ్బులే ఇంటికి ఆధారమట . తల్లికి వచ్చే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా బెదిరించి తీసుకుంటాడట . లోన్ కట్టమని అతని భార్యని అడగలేక పోయినా , అతను ఇంట్లో ఉండే టైంకు వస్తానని ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని బయటికి వచ్చాను .
” నమస్తే మేడమ్ ! ఏంటి ఇలా వచ్చారు ?” పలుకరింపుతో స్కూటీ స్టార్ట్ చేస్తున్న నేను అటు చూసాను . రెగ్యులర్ గా వాళ్ళ అత్తగారిని తీసుకుని బ్యాంక్ కి వచ్చే ఆమె నవ్వుతూ పలుకరిస్తోంది .
” ఓ ! మీ ఇల్లు ఇక్కడేనా ?” అడిగాను . కూరగాయల బండి దగ్గర కూరలు కొన్నట్టుంది , చేతిలోని బుట్టలో కూరగాయలున్నాయి .
” ఆ రెండో ఇల్లే , మీకు ..ఇక్కడ తెలిసినవాళ్లున్నారా ?”
” కస్టమర్లందరూ మా చుట్టాలూ , ఫ్రెండ్సే కదా ! ఒక లోన్ రికవరీ కోసం వచ్చా !” చెప్పాను .
” మీరు కూడా తిరగాల్సిందేనా మేడమ్ ! మీ ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళరా ?” అడిగిందామె .
” వెళ్తారు , నేను కూడా రావాల్సి ఉంటుంది ”
” ఇంత దూరం వచ్చారు కదా , మా ఇంటికి రండి మేడమ్ , ఆ కన్పించేదే ”
” అయ్యయ్యో , వద్దు లెండి ” అన్నానే కానీ .. ఆమె ద్వారా ఈ కుమార్ ఉన్నప్పుడు తెల్సుకుని రావచ్చనీ , ఈమెతో టచ్ లో ఉంటే మంచిదనీ వెళ్లాను .
చిన్న ఇల్లే కానీ శుభ్రంగా బావుంది . ” అత్తయ్యా ‘ ఇదిగో , మనింటికి బాంక్ మేనేజర్ గారొచ్చారు ” అంటూనే ముందు రూమ్ లో ఆగిపోయిన నన్ను చూసి ” లోపలికి రండి !” అంటూ తీసుకెళ్లింది . పెద్దావిడ అప్పటి దాకా టీవీ చూస్తున్నట్టుంది , నన్ను చూడగానే ఆఫ్ చేసింది .
“ మీ కోసం రెండు రకాల ఆకు కూరలు తీసుకున్నాను . మీకిష్టమని మునక్కాయలు కొన్నాను . ” అంటూనే ” అయ్యో , ఇదేంటీ , ఈ పళ్ళ ముక్కల్ని ఇలా వదిలేశారు ?” అంటూ అత్తగారిని అడిగిందామె .
” చాలా ఇచ్చావు , కొన్ని తిన్నానులే .. అవన్నీ నేను తినలేను ” అంది పెద్దావిడ .
” ఈ మాత్రం తినకపోతే ఎలా ? పళ్ళు బాగా తినాలని డాక్టర్ చెప్పలేదూ ! ” అంటూ ప్రేమగా మందలిస్తూనే కాస్త పైకి పోయిన పెద్దామె చీరను కిందికి జరిపి కాళ్ళు కన్పించకుండా సవరించడం నా దృష్టిని దాటి పోలేదు .
” నీ ఆరాటం గానీ , పోయిన వయసూ , ఆరోగ్యం మళ్ళీ వస్తాయా ? సరే గానీ వారికి కాఫీ ఇవ్వు !” అంది అత్తగారు .
” అయ్యయ్యో ! ఇప్పుడేమీ వద్దండీ ! నేను మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళాలి ” అన్నాను .
ఆమె అప్పటికే కిచెన్ లోకి వెళ్లనే వెళ్ళింది .
” మీ ఆరోగ్యం బాగుందా ?” అన్నాను నేను ఏం మాట్లాడాలో తెలీక .
” నా కోడలుండగా నాకేం లోటమ్మా ! నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది . నా కన్న తల్లి కన్నా ఎక్కువ . నా కూతురు కూడా ఇంత బాగా చూసుకునేదో లేదో ! అయినా వయసై పోయాక ఏముందమ్మా , ఆ పై వాడి పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్లిపోవడమే !” అంది .
” అదిగో ! హాస్యానికైనా ఆ మాట అనొద్దన్నానా !” ఎప్పుడు వచ్చిందో కోడలు .. కాఫీ తీసుకొచ్చింది .
” మీకు కాఫీ ఇవ్వనా ?” అత్తగారిని అడిగింది .
” ఇప్పుడొద్దు లేమ్మా , ఇందాకేగా తాగాను ” అంది పెద్దావిడ .
కాఫీ బాగుంది , మంచి రిలీఫ్ ఇచ్చింది . దానికన్నా ముందు ఆ అత్తా కోడళ్ల అనుబంధం నచ్చింది .
ఏ మాత్రం తెచ్చిపెట్టుకున్నట్టుగా లేకుండా , చాలా సహజంగా .. నటనేమీ లేకుండా , ప్రేమగా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడ ముచ్చటగా ఉంది .
నేను బయల్దేరి వస్తుంటే ఆమె మర్యాద కోసం బయటి దాకా వచ్చింది .
” నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తూంటే ! నిజంగా ఈ రోజుల్లో ఇంత అన్యోన్యంగా ఉండే అత్తా కోడళ్ళు అరుదు . ముఖ్యంగా ఆవిడ్ని కన్న తల్లిలా చూసుకుంటున్నందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి ” అన్నాను మనస్ఫూర్తిగా .
” చూసుకోవాలి , తప్పదు .. అవసరం !” అందామె అదో రకంగా .
” అదేంటీ ?” అన్నాను నేను ఆశ్చర్యపోతూ .
” అదంతే ! మా మామగారు స్వాతంత్ర్య సమర యోధులు , ఆయన పెన్షన్ ముప్పై వేలు మా అత్తయ్యకు వస్తుంది .”
” అది సహజమే కదా !” అన్నాను అయోమయంగా .
” అదే మాకు ఇల్లు గడవడానికి ఆధారం . ఆ పెన్షన్ ఆవిడ ఉన్నన్నాళ్ళేగా వచ్చేది . అందుకని ఆమె ఆరోగ్యంగా , ఆనందంగా చాలా ఏళ్ల పాటు ఉండడం మాకు తప్పనిసరి .”
” అది సరే ! బెదిరించో , బ్లాక్ మెయిల్ చేసో పెద్దవాళ్ళ పెన్షన్ లాక్కునే వాళ్ళున్న రోజుల్లో మీరు చాలా ప్రేమగా చూసుకోవడం గొప్ప విషయమే కదా !”
” నాకు మొదట్నుంచీ ఆవిడంటే గౌరవమే , ఇష్టమే ! అత్తయ్య కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు . రానురానూ నాక్కూడా ఆమెను వదిలి ఎటూ వెళ్లాలనిపించదు . నా అమ్మ కన్నా ఆమెనే ఎక్కువ ఇష్టపడ్తాను . కాకపోతే హైదరాబాద్ లో ఉన్న మా ఆడపడుచు అడపా దడపా తీసుకెళ్లి రెండు మూడు నెలలు ఉంచుకుని పంపిస్తూండేది . తను కూడా మా అత్తయ్యను బాగా చూసుకుంటుంది ”
” మరి .. సమస్యేమిటి ?” నాకు అవసరమా కాదా అని ఆలోచించకుండా కుతూహలంతో అడిగాను , మనుషులు ఇంత ప్రేమల్తో ఉన్నా ఇబ్బందేమిటో అనుకుంటూ .
” మధ్య తరగతి మనుషుల సంగతి మీకు తెలియనిదేముంది ? మా అత్తయ్య అక్కడున్నన్నాళ్ళూ పెన్షన్ డ్రా చేయడానికి కుదరదు . మేము వెళ్లి అడగలేము .ఆ డబ్బు లేకపోతే ఇల్లు గడవదు . అందుకే తాను అక్కడికి వెళ్లకుండా ..ఎప్పుడైనా కూతురే వచ్చి నాల్రోజులు ఉండి వెళ్తే సరి .. అని మా అత్తయ్యకే అనిపించేలా చూసుకుంటాను ” శుష్క హాసం ఆమె పెదవులపై !
” మరి మీ వారు ?” ఏం చేస్తారు అని అడగలేక సగం లో వదిలేసాను .
” డిగ్రీ దాకా చదివారు . ఏ పనీ స్థిరంగా చేయరు . కుదురు ఉండదు , బద్ధకం ఎక్కువ . గొప్పలకు పోయి అప్పులు చేస్తారు . ప్రైవేట్ జాబ్స్ ఎన్నో చేసి మానేశారు . దేంట్లోనూ మూడ్నెల్లకు మించి పని చేయరు . అసలు ఎప్పుడు మానేసింది కూడా ఇంట్లో చెప్పరు . పూర్తిగా చెడ్డవాడని కాదు కానీ .. ఆ మనిషి మీద ఆధారపడి బతకలేం ”
“మా మామగారికి ఫ్రీడమ్ ఫైటర్ కోటా లో ఐదెకరాల భూమి ఇచ్చారు . సిటీ శివార్లలో ఉన్న ఆ భూమికి ఇప్పుడైతే మంచి రేటు వచ్చేది . కానీ ఎనిమిదేళ్ల క్రితమే ఆ భూమిని అమ్మి అడ్వాన్స్ తీసుకున్నారు మా ఆయన . ఇక కొడుక్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ దగ్గర పరువు పోతుందని మా అత్తయ్య సంతకం పెట్టారు . నేనూ ఆవిడా కల్సి మిగతా డబ్బులు మేమే తీసుకుని ఆవిడ పేరుతో ఈ ఇల్లు కొన్నాం . మాకు ఒక్కర్తే అమ్మాయి. మిగిలిన డబ్బుల్తో మా అమ్మాయి పెళ్లి చేసాం . ”
” మరి ..మీరు …ఏదైనా చేయొచ్చు కదా !”
ఆమె ఓ క్షణం ఆగింది . ” నేను ఎమ్మే బీ ఎడ్ చేసి జాబ్ వెతుక్కుంటుండగా పెళ్లి అయి ఇక్కడికి వచ్చాను . చాలా ఏళ్ళు ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేసాను . మా అమ్మాయి పెళ్లి ముందు నాకు కాన్సర్ వచ్చింది .మాస్ట్రక్టమీ చేశారు . ఆ తరువాత మా అత్తయ్య , మా ఆయనా ..నన్ను జాబ్ చేయనివ్వట్లేదు .”
” మీరు ప్రతి సారీ బ్యాంక్ కి వచ్చే బదులు ఏటీఎం కార్డు తీసుకోవచ్చుగా !”
” అదీ అయింది . మా అత్తయ్య కొచ్చే ముప్పై వేల పెన్షన్ లో పదిహేను వేలతో ఇల్లు గడుపుతాను . ఏవన్నా పండుగలూ , పబ్బాలో , చుట్టాలు రావడమో జరిగితే మరో అయిదు వేలు .అంతే ! మిగతా డబ్బులు అలా ఖాతాలోనే ఉన్నాయనుకునే వాళ్ళం . ఈయన ఏటీఎం కార్డు తో ఎప్పటికప్పుడు మొత్తం డ్రా చేసాడని ఓ సారి లైఫ్ సర్టిఫికెట్ కోసం బ్యాంకు కు వెళితే తెలిసింది .ఇక కార్డ్ సరండర్ చేసి మేమే వెళ్లి తెచ్చుకుంటున్నాం . మిగతా డబ్బులు మూడు , నాలుగు నెలలు కాగానే మా అత్తయ్య పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ చేస్తాం . నామినేషన్ నా పేరిటే ఉంటుంది . ఆవిడ తదనంతరం మాకు కావాలిగా !” గొంతు వణికినట్లనిపించింది .
లోపలికి చూసాను , పెద్దావిడ ఏదో చదువుకుంటోంది . ఆమె ముఖంలో నిశ్చిoత , సంతృప్తి !
” ఏదేమైనా … మీరు ఆవిడ్ని ఇంత అపురూపంగా చూసుకోవడం చాలా సంతోషం ! మిమ్మల్ని మెచ్చుకోవాలి ” మనస్ఫూర్తిగా అన్నాను .
” మీరలా అనకండి . నాకు చాలా గిల్టీగా ఉంటుంది . నేను చేసేది త్యాగమూ కాదు , చూపేది అనురాగమూ కాదు . కేవలం స్వార్థం , అవసరం అనాలి ! ఆవిడ లేని రోజున మేము వీధిలో పడతాం . నా మందులకు కూడా డబ్బులుండవు . ఆవిడ జీవితం చాలా ఏళ్ళు పొడిగించాలి , అందుకోసం ఆవిడ ఆరోగ్యంగా , ఆనందంగా ఉండాలి . మా అత్తయ్యని కాపాడుకోవడమే నా ఉద్యోగం అని అర్థం చేసుకున్నాను గనకే ఆవిడని బాగా చూసుకుంటున్నాను . ప్రేమ , గౌరవం లేవని కాదు . ఈ డబ్బులే లేకపోతే మాకు ఎంత ప్రేముంటే ఏముంది చెప్పండి ?” నీటితో నిండిన ఆమె కళ్ళు మరెన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాయి .
“మీ ఆరోగ్యం జాగ్రత్త ! మీ అవసరం ఆవిడకు చాలా ఉంది .” అని వచ్చేసాను .

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పద్యమాయె నీకు పసిడి అందె . .

by రాఘవాచార్య‌ December 31, 2021
written by రాఘవాచార్య‌

ఆ.వె : శ్రీ సరస్వతి ఇల సింగార రూపమ్ము
వాసర స్థలి నది వాసమాయె
వ్యాస మునులు నిలుప వాసికెక్కెనుగా
పద్యమాయె నీకు పసిడి అందె         1

పశువు వెంట వెళ్లు పసివాడి చూసిన
పలక లేదు బతుకు పలక పలిగె
బాలలకు చదువు బహు బంగారమాయెనా
పద్యమాయె నీకు పసిడి అందె          2

నన్నయ మరి  తిక్కన ఎర్రన పోతన
కవుల కలము వెలసి కరుణ గాంచి
నట్లు నను కరుణించు నవ్య రీతిగ కళలు పొంగ
పద్యమాయె నీకు పసిడి అందె            3

వేదవాణి వినగ వెలసె రాయి ఒకటి
వాసరందు చిత్ర వాద్యముగను
రాయి కూడ గట్టి రాగ విధము నేర్వ
పద్యమాయె నీకు పసిడి అందె                4

గంగ అన్ననేమి గోదావరి అన్న
నేమి విద్యరూప నదియె చూడ
ఊరు ఊరు చదువు ఊరునట్లు పద్యమాయె నీకు పసిడి అందె                5

— కందాళై రాఘవాచార్య
8790593638

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

స్నేహం

by డా|| మృదుల నందవరం December 31, 2021
written by డా|| మృదుల నందవరం

ఈ సంచికలో మంచివాళ్ళ మధ్య స్నేహం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అసలు ‘స్నేహం’ ఎలా ఉండాలో భర్తృహరి చెబుతారు.

శ్లో||     క్షీరేణాత్మగతోదకాయ హి గుణాదత్తాః పురాతే౭ఖిలాః

క్షీరోత్తాపమేక్ష్య తేన పయసాస్వాత్మా కృశానౌ హుతః

గన్తుం పావక మున్మన స్తదభవద్దృష్ట్వాతు మిత్రాపదం

యుక్తం తేన జలేన శామ్యతి, సతాం మైత్త్రీ పునస్వ్తీదృశా

సజ్జన పద్ధతిలోని ఈ శ్లోకానికి ఏనుగు లక్ష్మణకవిగారి అనువాదం పరిశీలిద్దాం.

చ.       క్షీరము మున్ను నీటికొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్

క్షీరము దప్తమౌటగని చిచ్చుఱికిన్ వెతచే జలంబు దు

ర్వారసుహృద్విపత్తిగని వహ్న జారంజనె దుగ్ధ, మంతలో

నీరము గూడి శాంతమగు, నిల్చు మహాత్ముల మైత్రి యీ గతిన్

పాలు తనలో కలిసిన నీటికి తన గుణాలను ఇస్తుంది. తనకు సహాయం చేసిన పాలు కాగిపోతూ అగ్నిలో పడబోతుండగా దానికి నీరు చేరువ కాగా అది శాంతిస్తుంది. సజ్జనుల మధ్య మైత్రీ భావం ఇలానే ఉంటుంది.

మిత్రులైన సజ్జనులు వారిలో ఎవరికి ఆపద వచ్చినా పరస్పరం సహాయం చేసుకొని ఆ ఆపద నుండి బయటపడతారని కవి చెబుతూ పాలు – నీరు దృష్టాంతంతో వివరిస్తున్నారు.

మొదట మనం పాలలో నీటిని కలుపుతాం. అప్పుడు పాలకు నీటితో స్నేహం ఏర్పడుతుంది. అందువల్ల పాలు, స్నేహ ధర్మంతో నీటికి తన మాధుర్యాది గుణాలనన్నింటినీ ఇస్తుంది. ఆ తరువాత వాటిని అగ్నితో వేడి చేసినప్పుడు ఆ వేడికి పాలు బాగా కాగిపోతుంటాయి. తమకు ఆశ్రయమివ్వడమేగాక మాధుర్యాదిగుణాలను కూడా ఇచ్చిన పాలు కాగిపోవడం చూచి, నీరు మైత్రీభావంతో, పాలు ఇంకిపోకుండా తాము ఇగిరిపోతుంటాయి. నీరంతా ఇగిరిపోగానే, ఇఁతసేపు తమతో కలిసి ఉన్న నీరు లేదనే భావనతో పాలు పొంగి నిప్పులో పడబోతూ ఉంటే మళ్ళీ చేరిన నీరు ఆ పాలను పొంగకుండా చేస్తుంది. ఈ నీరక్షీర విధానం మనం రోజూ వంటింట్లో చూచేదే. ఈ రెండింటి స్వాభావికమైన తీరును కవి, మంచివారి స్నేహానికి ఆపాదించి చెబుతున్నారు. పాలు తమ మాధుర్యాది గుణాలను నీటికిచ్చినట్లుగా సంపద ఉన్న మిత్రుడు తన మిత్రునికి సంపదనిస్తాడు. సంపద ఇచ్చిన మిత్రుడు ఆపదలో ఉన్నప్పుడు, పూర్వం సంశయం పొందిన మిత్రుడు ఆ మిత్రునికి సహాయం అందిస్తాడు. మంచి మిత్రులు ఎప్పుడూ ఇలాగే పరస్పరం చేసుకుంటారు.

ఈ విషయాన్నే అబ్దుల్ కలామ్ గారు – ఒక మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానమంటారు. ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానమని చెబుతారు. అంటే స్నేహితుడు జీవిత మార్గదర్శిగా నిలుస్తాడని, నిలవాలని వారి అభిప్రాయం. వీరే మరొక సందర్భంలో మంచి స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని, ఆత్మీయ స్నేహితులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారని, నిజమైన స్నేహితులు ఎల్లవేళలా , ఎల్లలు దాటినా, ఎల్లప్పుడూ ఉంటారని చెబుతూ స్నేహధర్మాన్నీ, స్నేహ మాధుర్యాన్ని తెలియజేశారు.

మనిషి సంఘజీవి. ఒకరి సహాయం లేనిదే అతని జీవితం, జీవిక సాగదు. అది స్నేహస్పదమైతే మరింత మధురంగా ఉంటుంది. దానికై మనం మనుగడ సాగించాలి. దానితో జీవనం కొనసాగించాలి.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సంక్రాంతి ముగ్గులు పడుచుల ఓపికకు ప్రతీకలు ,సంస్కృతి

by రసస్రవంతి& కావ్యసుధ December 31, 2021
written by రసస్రవంతి& కావ్యసుధ

భారతీయ మహిళలు కళాపిపాసకులు ఏ పనినైనా అందంగా తీర్చిదిద్దడం వారికి అలవాటు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రకరకాల ముగ్గులు వాకిట్లో వేయడం తెలుగు ఆచారం. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వాకిలిని ఆవుపేడతో అలికి లేదా కళ్ళాపి చల్లి ముగ్గులు వేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ ముగ్గులు ఇంటికి అందం కంటికి అందం.
సంక్రాంతి పర్వదినాల్లో ఆవుపేడతో చల్లినా – లేదా అలికిన ఇంట్లోకి క్రిములు కీటకాలు, సూక్ష్మక్రిములు చేరవని పల్లెవాసుల ఒక విశ్వాసం,ఇది సహజం పూర్వ కాలంలో ఉండేది, అక్షరాల సత్యం. ఈ ఆధునిక కాలంలో కృత్రిమమైన ముగ్గులకు అలవాటు పడిపోతున్నారు మహిళా మణులు. ఆనాటి ఆహ్లాదకరమైన వాతావరణం నేడు కనిపించడం లేదు. సహజత్వానికి దూరంగా మసలుతూ ఉన్నారు.

ముగ్గులను రంగవల్లులు, రంగవల్లికలు అని అంటారు. రంగం… వేదిక. ప్రపంచం. ‘ వల్లిక ‘ అంటే అందమైన అల్లిక. ప్రపంచానికి సంబంధించినవే జ్ఞానాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది. కనుక దీన్ని రంగవల్లిక అన్నారు.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగకి ఇతర పండుగలకు లేని
విశిష్టత వుంది . హిందువుల పండుగలలో కేవలం సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి వస్తుంది. మిగతా పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి.

పండుగలు వ్యక్తిని లౌకిక జీవితాన్నుంచి , ఆధ్యాత్మిక చింతనకు మార్గనిర్దేశికతను సూచిస్తాయి. భగవధ్యానానికి దోహదపడతాయి.

సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి సంక్రమణం చెందే పవిత్రమైన రోజున “మకర సంక్రాంతి” గా ఆనందోత్సవాలతో జరుపుకోవటం అనాదిగా వస్తున్నది. భోగి, మకర సంక్రాంతి,కనుమ, ముక్కనుమ కూడా, ఇది పాడి పంటల పెద్ద పండుగగా కూడా పెద్దలు చెబుతారు. ఈ మూడు, నాల్గు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. పట్టణాలలో కంటే, పల్లెల్లో సంక్రాంతి హడావుడి హరిదాసుల సందడి, కోడిపందాలు, గాలిపటాలు పండుగ సంబరాన్ని ప్రతి ముంగిటి లోనూ కనిపించే గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు సంక్రాంతి ప్రత్యేకత ను మరింత ఆనందంగా ప్రదర్శిస్తాయి.

ఈ సంక్రాంతి సూర్యుని సంక్రమణానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశములో జరిగే, గ్రహగతులను నేల మీద ముగ్గుల రూపంలో గమనించే ఏర్పాటు చేశారు మన ప్రాచీనులు. తొమ్మిది చుక్కల ముగ్గు ఇది నవగ్రహాలకు సంకేతం. ఆవుపేడతో అలికిన నేల, ఆ పైన కనిపించే ఆకాశానికి సంకేతం. నేల మీద పెట్టబడిన చుక్కలు నక్షత్రానికి సంకేతం .ఆ చుక్కలను ఏ తీరుగా కలుపుతూ ప్రతి చుక్క కూడా ఓ గడిలో పదిలంగా కూర్చునేలా చేసి , దాన్ని “ముగ్గు” అనే పేరిట పలికేలా చేసిన ఈ విధానమంతా ఏ గ్రహం ఎలా ప్రయాణిస్తుందో, ఖగోళంలోని ఏ గ్రహగతి నక్షత్ర స్థితి ఎలా ఉందో తెలియజేసే సంకేతం.

గ్రహగతి రంగవల్లిక ద్వారా ఏ గ్రహం దేనితో మైత్రి ఉంటుందో, ఏ గ్రహం దేనికి శత్రువువో,ఏ గడి దేనికి అనుకూలమో అనే జ్యోతిష్య పరిజ్ఞానంతో ముగ్గులను తీర్చి దిద్దేవారు. ముగ్గులలో మధ్య గడిలో ఉండే సూర్య గ్రహానికి ఎరుపు రంగు కుంకుమతో, సూర్యునికి ముందుగా ఉండేది శనిగ్రహం ఆ గడికి నల్లని రంగుతో లేదా నీలి రంగుతో నింపేవారు. ఏ గడిలో ఏ రంగు నింపాలో అదేవిధంగా ప్రతి ముగ్గు లోనూ అలంకరిస్తూ ఉండేవారు ప్రాచీనులు.

“దేవుడి ముగ్గు” ఇది కుండలినీ శక్తికి సంకేతం. రెండు త్రికోణాలు ఇందులో ఉంటాయి. మధ్యలో ఒక చుక్క ఉంటుంది దేవుడి గది ముందు వేస్తారు. మరోరకం ఆరు చుక్కల ముగ్గు.త్రికోణాలు ఇందులో ముగ్గు అని కూడా అంటారు.వేడుకగా దేవుని ముందు వేసేది అష్ట ఇందులో కోణాలని మలుపుల తీరుగా ఉంటాయి. దైవ మందిరం ముందు వేసే మరో ముగ్గు పద్మపు ముగ్గు. ఇది ఎనిమిది కోణాల ముగ్గు తూర్పు వైపున ఇంద్రుడు, తూర్పు దక్షిణానికి మధ్యన అగ్ని, దక్షిణ వైపు యముడు, దక్షిణ పశ్చిమానికి నడుమ నైరుతి, పశ్చిమానికి వరుణుడు పశ్చిమోత్తర వాయువు, ఉత్తరము కుబేరుడు, ఉత్తరానికి తూర్పు కు నడుమ ఈశానుడు ఉంటారు. ఇవన్నీ గ్రహ ఉపగ్రహ విధానానికి ప్రతీకలు.

సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా వేసేది స్వర్గద్వారం ముగ్గు. వైకుంఠ ఏకాదశి ముందు రోజు స్వర్గ ద్వారాలు మూసి ఉన్నట్టుగానే ముక్కోటినాడు తలుపులు తెరిచి ఉన్నట్టుగా ఈ ముగ్గులు వేస్తారు. అట్లాగే భోగినాడు స్వర్గ ద్వారాలు మూసి ఉన్నట్టుగా సంక్రాంతినాడు వైకుంఠ వాకిలి తెరిచి ఉన్నట్టుగా ముగ్గులు వేస్తారు. భోగినాడు వాకిలి బయట రథం ముగ్గు వేస్తారు.u సంక్రాంతి రోజు ఇంటి ముందుకు రథం వచ్చినట్లుగా వేసి రథాన్ని లాగే తాడు ఇంట్లోకి వచ్చే ఎలా వేస్తారు. కనుమనాడు ప్రధాని బయటికి వేస్తారు. ముక్కనుమ నాడు మన రథాన్ని పక్కింటి రథానికి తగిలేట్టుగా వేస్తారు. ఇలా ప్రతి ఇంటి ముందు నుంచి కదిలే రథం ఊరి చివరి దాకా సాగుతుంది. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు మా ఇంటికి వచ్చాడు ఆయనకు పూజ చేసి పరమాన్నం పెట్టి పంపించండి అన్నా మార్మిక సందేశాన్ని ముగ్గులు సంకేతంగా చెబుతాయి.
ఆనాటి సాంప్రదాయాన్ని అనుసరించి సంక్రాంతి పండుగ ముంగిట్లో ముగ్గులు ఇంటికి శోభని వ్వడమే కాదు లక్ష్మీప్రదం కూడా. ఎవరి ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు అలంకరించబడి ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుందనే విశ్వాసం . మనం రోజు తినే ఆహారం భూదేవి మనకు ఇచ్చిన వరం, అటువంటి భూమాతను అలంకరించడంమే ముగ్గులు వేయడంలోని ఆంతర్యం. మారేడు దళం ముగ్గు, తులసి కోట ముగ్గు. పద్మ బంధం నాగబంధం, గుమ్మడి పండు ముగ్గు ఇలా రకరకాల ముగ్గులు ఇంటి ముందు తీర్చిదిద్దడం ముగ్గు వ్యక్తి మనస్తత్వం చెబుతుంది. ముగ్గులు వేయడానికి ఓపిక కావాలి అభిరుచి ఏకాగ్రత ఎంతో అవసరం. తెల్లవారుజామున ముగ్గులు వేయడం స్త్రీ మూర్తుల శరీరాలకు వ్యాయామం లాంటిది. ముగ్గులు పెట్టడం మన భారతీయ సంప్రదాయం.

⚜️ ⚜️ ⚜️ ⚜️
⚜️⚜️
⚜️

* వరి పిండితో వేసిన ముగ్గులు చిన్న చిన్న కీటకాలకూ, పక్షులకూ ఆహారం అవుతాయి.
* భూత దయకు ఆలవాలంగా నిలుస్తాయి .
* ముగ్గులోని కాల్షియం క్రిమి కీటక సంహారానికి తోడ్పడుతుంది.
* వనితలు నడుము వంచి ముగ్గులు వేయడం మూలంగా కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు రాకుండా నిరోధిస్తాయి.
* ముగ్గులు వేసేటప్పుడు నడుము వంచి వేయటం వల్ల ఉదర కండరాలకి కలిగే ఒత్తిడి మసాజ్ లా పనిచేస్తుంది.
* నేటి ఆధునిక యుగంలో మహిళా మణులు రకరకాల రంగులతో వేయడం, స్త్రీలలోని సృజనాత్మకతకు అద్దం పడతాయి.
* ముగ్గులు దేవత ఆరాధనగా చెప్పవచ్చు.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

జొన్న చేను ముందు నిలబడి

by Dharba Shyayanam Srinivasacharyulu December 31, 2021
written by Dharba Shyayanam Srinivasacharyulu

మరీ దూరం కాని దగ్గరలో పరుచుకున్న

ఆకుపచ్చ పుప్పొడి దాకా వెళ్ళాను
తీరా చూస్తే అది జొన్న చేను, మొన్న మొన్న మొలకెత్తింది

పసిపిల్లల్లాంటి మొక్కలు, ఒంటి నిండా మెత్తని చూపులు
చిట్టి ఆకులు నాజూకైన చేతులు, ఉత్సాహపు వుయ్యాలలు

ఆ పక్క నిల్చున్న పెద్ద చెట్టూ, ఇటు నేనూ
చేనునే చూస్తున్నాం  కానీ
నా కన్న చెట్టే చేనుకు చేరువ అనుకుంటా-

చేనునానుకున్న రహదారిమీద
వడివడిగా వాహనాల్లో  వెళ్తున్న కళ్ళలోకి
ఈ చేను మొత్తంగా ఎట్లా చేరుతుంది
కనుక వాళ్ళ ఇళ్లకు దీని సోయగం చేరదు

తానే  ఈ చేనుకు చోటిచ్చానని
నేల ఇక్కడ  ఏ హోర్డింగూ పెట్టుకోలేదు
తానే దున్ని విత్తానని చెప్పడానికి
రైతు ఇక్కడ ఏ ఫలకాన్నీ పెట్టి పోలేదు

తొలిసారి కాదేమో నేను ఈ చేనును దర్శించడం!
ఏ పూర్వ జన్మలోనో  నేనేమో చేను, ఇది మనిషి కాబోలు
మా ఇరువురి సంభాషణ అప్పుడు మొదలై
ఇప్పటికీ  కొనసాగుతున్నట్లున్నది

రైతు పాదముద్రలతో చేను పావనమైంది
అతని రోజూ తన నీడను ఇక్కడ వదిలి వెళ్తాడనుకుంటాను
దానితో మిళితమై ఈ మొక్కల నీడలు చిక్కబడ్డాయి

ఆ  సంగమ ఛాయల్తో  నా నీడ కలిసిపోయిన ఈ క్షణాలు
నా దేహమ్మీద కురుస్తున్న దయాపూరిత దీవెనలు!

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

యోగ ప్ర్రకియలు

by Bandi Usha December 31, 2021
written by Bandi Usha

అలసిన మనసుకు, బద్ధకించిన శరీరానికి ఔషథం యోగా. ఇది అందరూ అభ్యసించవలసిన ప్ర్రకియ.

శరరాన్ని, మనసును ఏకంచేసి అనేక రకాల శారీరక, మానసిక సమస్యలకు పరిష్కారం చూపే యోగా “ఇహం నుండి పరం”కు తీసుకెళ్తుంది.

యోగా అంటే జ్ఞానం, మార్గం, చైతన్యం, గమ్యం. శాస్త్రబద్ధమైన జీవన విధానం. స్వీయ జ్ఞాన సాధన. సృష్టి రహస్యాలను ఛేదించే పరిణామంలో పొందిన ఆత్మజ్ఞానమే యోగా.

దుఃఖాన్ని అధిగమించి సత్యమైన జ్ఞానంతో పరమానందం పొందటమే మానవ జీవిత లక్ష్యం. వత్తిడి నుండి విముక్తి, శారీరక దృఢత్వమే కాకుండా “ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి”కి తీసుకెళ్ళే బంగారు బాట యోగా.

ఆలోచనలను, జీవనశైలిని ప్రభావితం చేయటానికి యోగాలో అనేక రకాల ప్ర్రకియలు కలవు. అందులో కొన్ని

  1. రాజయోగము, 2. హఠయోగము, 3. జ్ఞానయోగము, 4. కర్మయోగము, 5. భక్తియోగము, 6. మంత్రయోగము, 7. కుండలినీ యోగము, 8. లయయోగము.
  2. రాజయోగము : యోగములన్నిటిలో ఉత్తమమైనది ఏదంటే ఖచ్చితంగా రాజయోగమనే చెప్పవచ్చు. బుద్ధిని సంస్కరించుట, మానసిక సంస్కరణ, ఉన్నత జ్ఞానం అనుభవపూర్వంకంగా తెలియచేసేది రాజయోగము. ఇది పతంజలి యోగ సూత్రములపై ఆధారపడి ఉన్నది.
  3. హఠయోగము : ప్రస్థుత యోగా ప్ర్రకియలకు ఆధారము హఠయోగము. ఇందులో ఆసనాలు, ప్రాణాయామాలు ఉంటాయి. ఇది శ్రమతో కూడుకున్నది. దీని ద్వారా బుద్ధిని బాహ్య విషయాల నుంచి దూరంగా ఉంచవచ్చు. ‘హ’ సూర్యుడు, ‘ఠ’ అంటే చంద్రుడు. అనగా సూర్యచంద్రుల సాంగత్యాన్ని తెలుపుతుంది. హఠయోగంలో అష్టాంగ యోగం మరియు యోగ ముద్రలు అనుసరిస్తారు. దీనినే ప్రస్థుతం విస్తృతమైన అర్థంతో యోగా అని పిలువబడుతుంది. ఆలోచనలలో స్పష్టత, చక్కటి శరీర ఆకృతి. దీని ద్వారా సాధించవచ్చు.
  4. జ్ఞానయోగము: మనిషి వివేకవంతుడు కావాలంటే తత్వము తెలుసుకోవాలి. అప్పుడే ఏది సత్యము, ఏది అసత్యము సూక్ష్మబుద్ధితో తెలుసుకోగలుగుతారు. గత జన్మల ద్వారా, శ్రవణం, పఠనం మరియు సద్గురువుల ద్వారానే కాకుండా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఉత్తమ జ్ఞాని మాత్రమే ఆనందాన్ని పొందగలుగుతాడు.
  5. కర్మయోగము : కర్మ అనగా పని. కర్మ చేయకుండా ఏ జీవికి మనుగడలేదు. ఎవరి ధర్మము ననుసరించి వారు కర్మలనాచరించాలి. కర్మ చేయటమే మన కర్తవ్యము. కర్మ ఫలాన్ని ఆశించే అధికారం ఎవరికీ లేదు. ఇంద్రియ నిగ్రహంతో ప్రతిఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాలను నిర్వర్తించేవారే యోగి. జ్ఞానులు లోకకల్యాణం కోసం నిష్కామ కర్మలు ఆచరిస్తారు.

ఇంద్రియాల కన్నా మనసు, మనసుకన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ ఉన్నత స్థితిలో ఉంటుంది. కర్మలు చేయకుండా ఏ వ్యక్తి ముక్తి పొందలేడు. చర్యకు ప్రతి చర్యా ఉన్నట్టే కర్మలనుబట్టి ప్రతిఫలం ఉంది. జన్మరాహిత్యము కొరకు కర్మను నేర్పుతో చేస్తూ ముక్తి పొందటమే జీవన పరమార్థం.

  1. భక్తియోగము : ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానించుచూ ఉద్వేగాలను నియంత్రించుకోగలగటమే భక్తి యోగము. ఉద్వేగాల వలన కలిగే రుగ్మత తొలగించుకోవటానికి భక్తి యోగము ఒక వరము.
  2. మంత్రయోగము: మానవుడిని రక్షించేది మంత్రమని ఉపనిషత్తులు తెలియచేయుచున్నవి.

అష్టాక్షణ మంత్రము : “ఓం నమో నారాయణాయ”

పంచాక్షరీ మంత్రము : “ఓం నమశ్శివాయ”

గాయత్రీ మంత్రము – ఓఁ భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోయదయాత్

మృత్యుంజయ మంత్రము :         ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

మంత్రాలను జపించటం ద్వారా శరీర శుద్ధి అనగా నాడీ వ్యవస్థ పని తీరు సక్రమంగా పనిచేస్తుంది. ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి.

  1. కుండలినీ యోగము : మన వెన్నెముకలో అనిర్వచనీయమైన శక్తి ఉంటుంది. సుషుమ్మ నాడి నుండి సహస్రారం వరకు తీసుకెళ్ళే పద్ధతిని వివరించేది కుండలినీ యోగం. మనలో కుండలినిని జాగృతం చేయటానికి ముఖ్య మార్గము ప్రాణాయామ అపారమైన శక్తిని జాగృతం చేయటమే కుండలినీ యోగము. ముఖ్యంగా షట్చక్రాలలోని ఒక్కో చక్రాన్ని యోగక్రియల ద్వారా ఊర్థ్వముఖంగా దాటుతూ తలపై భాగంలో ఉన్న సహస్రార చక్రాన్ని చేరుతుంది. దీనినే సమాధి స్థితి అంటారు.
  2. లయ యోగము: లయము అంటే కలయిక. అందుకు నాదానుసంధానము జరగాలి. నాడీ శుద్ధి జరిగినప్పుడు ఇది సాధ్యం. ఇందుకు నిరంతరం ప్రాణాయామం చేయాలి. ఓంకారాన్ని శ్రద్ధతో జపించాలి. ఇలా నాదముపై మనసును లయం చేయటాన్ని నాదానుసంధానము అంటారు. అప్పుడే సమాధి స్థితిని పొందగలుగుతారు. అనిర్వచనీయమైన, అలౌకికమైన అనుభూతిని పొందటమే సమాధి స్థితి.

జీవన విధానంలో గొప్ప మార్పులు తెచ్చే యోగ ప్ర్రకియలు ఎన్ని రకాలయినా అవి అన్నీ పతంజలి క్రమపద్ధతిలో సూత్రబద్ధం చేసినే. తను రచించిన యోగదర్శనము నాలుగు పాదాలుగా విభజించి అన్ని సూత్రాలను వివరించం జరిగింది.

మానవుడిని అజ్ఞానం నుండి అనంతమైన జ్ఞానమార్గంకు నడిపించే పతంజలి అష్టాంగ యోగం గురించి మనమందరమూ తెలుసుకొని ఆచరిస్తేనే కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుంది.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

రుద్రమదేవి 9 &10 ప్రకరణములు

by రంగరాజు పద్మజ December 31, 2021
written by రంగరాజు పద్మజ

[ విఫలత ]

( నిరుపయోగం )

అపరాధః సదైవస్య
నపునర్మన్తిణా మయమ్ ;
కార్యం సఘటితం యత్నాత్, దైవయోగాద్వినశ్యతి ”
— హితోపదేశం.
భావం:-అనగా  నాకు కలిగిన వంచన మంత్రి యొక్క లోపం వల్ల కాదు. అది దైవకృతాపరాధం. ఏ హేతువు చేతనో బాగా ప్రయత్నం చేసిన పని దైవాధీనం వల్ల నశించింది. కాబట్టి మంత్రి యొక్క దోషం కాదు.
కథాభాగం:–  తెల్లవారుజాము చాలా అందంగా ఉంది.తూర్పుదిక్కున ఎరుపు రంగు కనపడుతోంది.కాకులు తమ గూళ్ళను వదిలి అరుస్తూ వెళుతున్నాయి. పశువుల కాపరులు కట్టి వేసిన ఆవుల దగ్గరకు దూడలను వదిలి, కొంచెం పాలు తాగనిచ్చి, తరువాత దూడలకు పాలు అందకుండా దూరంగా కట్టివేసి, పాలు పితికి, కుండలను నింపుతున్నారు. గృహిణిలు నిద్ర లేచి రోజువారీ పనులు చేయడానికి పూనుకున్నారు.కొందరు పశువులను తోలుకొని ఊరి బయలు ప్రదేశానికి మేపడానికి వెళుతున్నారు. తెల్లవారితే ఏవైనా చెడు శకునాలు ఎదురవుతాయని, వాటివల్ల పనులకు అడ్డంకులు కలుగుతాయని, ప్రయాణాలు చేసేవారు ఇండ్ల నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నారు.
ఊరివారు కొందరు రుద్రమదేవి నివసిస్తున్న ఇంటి దగ్గరకు వచ్చి, ఆ రాత్రి జరిగిన ఆ పనికి అందరూ బాధపడుతున్నారు. “ఇంత పని చేయడానికి ఎవరు సాహసించారు?” అని కొందరంటూంటే…ఇంకా కొంత మంది ” ఆ పని చేసేవాడికెంత గుండె ధైర్యం?” అని, ధర్మాత్మురాలైన రుద్రమదేవిని జైల్లో పెట్టారో? చంపేసారో? అయ్యో! అయ్యో!! అని కొందరు బాధపడుతున్నారు. కొందరు ఇంటి లోపలికి వెళ్లి చూసి వస్తున్నారు. కొందరు చుట్టుపక్కల చూస్తున్నారు. ఇలా ఇంటి చుట్టు వాతావరణం దీనంగా తయారయింది.
అక్కడ నుండి ముగ్గురు మగవారు ఒక మహిళ బయలుదేరి ఒకే తోవలో ఒకరి వెంట మరొకరు నడుస్తున్నారు. కొద్ది దూరం నడిచి వారు ఆ ఊరు దాటి చిక్కటి అడవిలోనికి వెళ్లారు. అలాగే కొంత దూరం నడిచి ఒక చోట కూర్చున్నారు.
ఆ ప్రదేశం ఎత్తుగా ఉన్న చెట్లు ఉండటం వల్ల, చిక్కటి పొదలు అల్లుకొని ఉండడం వల్ల రహస్య విషయాలు ఆలోచించు కోవడానికి తగినట్లుగా ఉన్నది. కాబట్టే ఆ నలుగురు ఆ స్థలానికి వచ్చారు. నేలంతా మొనతేలిన కంకర రాళ్ళు ఉండడం వల్ల గడ్డి ఏమంత ఎక్కువగా మొలువలేదు. అలా ఉండడం వాళ్ళకి ఆ స్థలం కూర్చోవడానికి వీలుగా ఉంది.
వారెవరో పాఠకులు ఆలోచించ అక్కరలేదు. ఒక్కడు మురారి దేవుడు, రెండవవాడు హరిహర దేవుడు, మూడవ వాడు ధర్మవర్తనుడు, ఆ మహిళ కమల. అక్కడ కూర్చొని ఇలా మాట్లాడు కుంటున్నారు.
ధర్మ:–  చూశారా? పని అంతా ఎలా అయిందో? రుద్రమదేవి మగవాళ్ళను చంపి పుట్టిన ఆడమనిషి. ఆమెకు తెలిసిన అన్ని మాయలు మంత్రాలు మగవాళ్ళకి కూడా తెలియవు. ఏమీ తెలియనట్లుండే రుద్రమదేవి మన ప్రయత్నాన్ని మంట కలిపింది. నాకెందుకో మొదటినుండి అనుమానం గానే ఉన్నది.
మురారి:–  నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఇంట్లో కట్టు వేసిన వారు ఎలా తప్పించుకున్నారు? చుట్టూ కాపలా ఉన్న వారు కంటిమీద రెప్పవేయకుండా కాపలా కాస్తున్నారు. అదే కాకుండా ఆ ఊరు చుట్టూ ఉన్న మన సైనికుల కనుగప్పి ఎలా తప్పించుకొని పోనిచ్చారు? ఇదంతా గారడి విద్యవలె ఉన్నది.కమలా!  నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నావు కదా!  వారు ఎక్కడికి వెళ్లారు నువ్వు చూడలేదా?
కమల:–  నాతో వారెప్పుడూ భయపడుతున్నట్లుగా మాట్లాడనేలేదు. రోజు ఎలా ఉన్నారో రాత్రి కూడా అలానే ఉన్నారు. మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లావని కూడా నన్ను అడగలేదు ప్రయాణం ఉందని మాత్రం చెప్పింది. తర్వాత రోజుటివలనే నిద్రపోయాం.
ఇంకా నాకు ఆశ్చర్యం కలిగింది.  నేను చూస్తూనే ఉన్నాను. వెనుకనుంచి ఎవరో వచ్చే నా కళ్లను మూసి, నా నోట్లో గుడ్డలు కుక్కి నన్ను తాళ్ళతో కట్టి వేశారు. తర్వాత ఏమైందో నాకు తెలియదు.
హరిహర దేవుడు:–  వాళ్ళు తగిన జాగ్రత్తలు ఉండి భయపడకుండా ఉన్నారు. కావలివాళ్లకు ధనమిచ్చి  కట్లు  విడిపించుకున్నారు కావచ్చును. లేకపోతే వీళ్లు కాకుండా లోపలికి వేరెవ్వరు రావడానికి కానీ పోవడానికి కానీ ఎలా వీలు చిక్కింది? మనం కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నాం కదా!
కమల:–   మొదట వాళ్ళకు ఈ సంగతి ఎలా తెలిసింది?
ఆనాడు ధర్మవర్తనుడు గారు చెరువుకట్టపై కూర్చుని ఉన్నప్పుడు చూసింది గూఢచారై ఉంటాడు.అతను మన గుట్టు బయట పెట్టాడా?
అయ్యో!  అయ్యో!  మన పని అంతా వెల్లిపాయలో కలిపిన చింతపండు లాగా అయింది  కదా!
ధర్మ:–  మన ఆశలన్నీ వ్యర్థమైనవి. మహాదేవరాజువద్ద మనం చెప్పినవన్నీ అబద్ధాలు అయినవి కదా! అయ్యో! ఎలా కావలసిన పని ఎలా అయ్యింది?  ఆ నలుగురు మాట్లాడుకుంటు ఉండగా ఇద్దరు మగవారు వచ్చి నిలబడ్డారు. వారిని చూడగానే మురారి దేవుడు”  మీరేం వార్తలు తెచ్చారు? శుభమా? అశుభమా? శుభమని అనుకోవడానికి వీలు లేకపోతే అది ఎలా కలుగుతుంది? మీరంతా మీ మీ పనుల మీద శ్రద్ధతో ఉన్నా కూడా రుద్రమదేవి ఎలా తప్పించుకొని పోయింది? ఇలా తప్పించుకున్నారని   ఆలోచించడానికి అవకాశమే లేదని అన్నాడు.
అయ్యా!  మీ ఆజ్ఞ ప్రకారం మేమంతా జాగ్రత్తగా ఇంటి చుట్టూ ఉన్నాం. ఇంటి నుండి పిల్లి కూడా బయటకు పోలేదని మేము ఖచ్చితంగా చెప్పగలం. మాలో తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా “రుద్రమదేవి తప్పించుక పోయిందని మీరు చెప్పే దాకా మాకు తెలియదు. ఏమి చేయాలి? మాకు మాట దక్కని రోజు వచ్చిందని వచ్చిన ఇద్దరిలో ఒకడు అన్నాడు.
మరొక చిత్రమైన సంగతి జరిగింది. మీరు అడవిలో  కావలి ఉంచిన సైన్యమంతా చనిపోయారని రెండవవాడు చెప్పాడు.
ఆ మాటలకు వారంతా అవాక్కయ్యారు.
ఎలా? ఎలా?  సైన్యమంతా చనిపోయిందా? కటకటా!  ఆ సైన్యాన్ని చంపిందెవరు? అని హరిహర దేవుడు అన్నాడు.
అయ్యా!  ఏమని చెప్పేది? ఊరికే నాలుగువైపులా కావలి ఉన్న సైనికులను రెండు భాగాలుగా మారి ఓరుగల్లు తోవను కాపలా కాస్తూ ఒక సైనిక దళమూ, ఊరిని చుట్టుముట్టి మరొక దళమూ ఉన్నాం. అక్కడక్కడ ఇద్దరిద్దరినీ ఉంచాం. ఎప్పుడు కావాల్సి వస్తే సైగ చేయగానే తోడుగా రావాలని సైగలు ఏర్పాటు చేసుకుని ఎవరి పనుల మీద వారు ఉన్నాం. ఇంతలో గుర్రపు స్వారీ చేస్తూ ఎక్కడినుండో  వచ్చారు. మేము ఊరి దగ్గరగా ఉన్నాం కాబట్టి వారు తప్పించుకొని పోతున్న వారనుకొని, వారి మీద దాడి చేశాం , కానీ  వాళ్లు నలుగురు మగవారే! కటిక చీకటిలో వాళ్ళను మగవారిగా పోల్చుకోలేదు. పోల్చుకుంటే వారిని ఎదుర్కొనే వాళ్ళం కాదు. ఆ వీరుల శౌర్యం చెప్పనలవికాలేదు. నలుగురు నాలుగు వైపులా మమ్మలను అవతలికి పోనీయకుండా నరికి వేయడం మొదలుపెట్టారు. కొన్ని ఘడియలలో మా సైన్యం పావువంతు మాత్రమే మిగిలింది. చీకటిగా ఉన్నా  ఎలానో ఒకలాగ వారి నుండి తప్పించుకొని ఓరుగల్లు తోవను కాపలా కాస్తున్నవాళ్ళను పిలుచుకొని వచ్చేందుకు పోదామనుకునేసరికి  శస్త్రాల చప్పుడేదో వినపించింది. పరిగెత్తుకొని అటు వెళ్ళాం. అప్పుడు ఓరుగల్లు సైన్యంతో మనవాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఓరుగల్లు సేన తక్కువగా ఉండి, మన సేన ఎక్కువ మంది ఉండటం వల్ల శత్రువులను ముందుకు రానీయకుండా అరికట్టి నిలిపాం. దాదాపు విజయం మాసొంతమైందని చెప్పవచ్చు. దాదాపు ఇరవై మంది దాకా చంపాం. ఏమనాలి? ముందు మాతో యుద్ధం చేసి,  మమ్మల్ని తరిమిన ఆ నలుగురు వీరులు ప్రత్యక్షమై బాధించటం మొదలుపెట్టారు. వారు వచ్చి చాలా మందిని చంపారు. పది పదిహేను మందిమి మాత్రం మిగిలి, అటూ  ఇటూ చెల్లాచెదురు అయిపోయాం. మేము కూడా ఊరిలో ఆ ఇంటి చుట్టూ ఉన్న వారితో కలిసి ఏ ఊరుకైనా పోదాం అనుకుని వస్తున్నాం. ఇంతలో ఇతడు కలిసి మీ జాడ మాకు చెప్పాడు.  మేమిద్దరం ముందు నడిచి ఇలా వచ్చాం. వారు ఇప్పుడో, ఇంకాసేపటికో ఇక్కడికి వస్తారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తానని అందరూ వినేటట్లు గా బొంగురు గొంతుతో అన్నాడు.
పనంతా తలకిందులైంది. మనలను వారు గుర్తుపట్టారా ఏమో? అని కొంచెం అనుమానం వస్తున్నది. ఒక్క పని చెడిపోయి, ఎంత మందికి బాధ కలిగించిందో కదా! మహాదేవరాజుకు, మాకు, కొందరు మాండలికాలకు చెప్తే  కూడా తీరనంత ఆశాభంగం కలిగిందని  మురారి దేవుడన్నాడు.
వాళ్లు మనను ఎప్పటినుండో కనిపెట్టి తిరుగుతున్నట్టున్నారు లేకపోతే అవలీలగా తప్పించుకోవడం సాధ్యమా? మన కాపలా వారికి లంచం ఇచ్చి ఉంటారు. రెండో దారి లేదు అని కమల అన్నది.
ఇంతలో మరి కొంత మంది మనుషులు వచ్చి నమస్కరించి నిలబడ్డారు. వారు రాగానే మురారి దేవుడు వారిని చూసి, మీరు ఇంత మంది మాత్రమే బతుక గలిగారా? ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు.
సరిగ్గా చెప్పలేం పది పదిహేను మంది చెల్లాచెదరై పోయి ఉంటారు. వాళ్ళందరిని వెతికి రమ్మని మన వాళ్ళను ఇద్దరు ముగ్గురిని పంపాను. వెతికి మనలను కలుస్తారని వచ్చిన వారిలో ముఖ్యుడన్నాడు.
ఇంకా మనం ఆలస్యం చేయవద్దు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. మన రహస్యం తెలుసుకుంటున్నవారు మనం ఉన్న చోటు తెలుసుకుంటారనడం నిజం! వాళ్లకు దొరికిపోయి, ఇగిలిగించడం కన్నా పరిగెత్తి వెక్కిరించడం మంచిది. లేవండి! వెడదామని ధర్మవర్ధనుడు అన్నాడు.
వారంతా ప్రయాణమైనారు. కమల కూడా వారి వెంటే ఉన్నది. వారంతా అడవిలో పడి ఒక పక్కగా నడుస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు.నాలుగు వైపులా జాగ్రత్తగా చూస్తూ నడుస్తున్నారు.అర కోసు దూరం నడిచే టప్పటికీ వాళ్లకు ఆడవిలో జనాలు నడుస్తున్నట్టు చప్పుళ్ళు వినబడ్డాయి.ముందుకు నడవకుండా  వాళ్ళు నిలిచి తమ చుట్టుపక్కల చూశారు. కొంతమంది బలిష్టులయిన వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తుండటం చూశారు.వచ్చినవాళ్లు క్షణంలో  చుట్టుముట్టారు. తప్పించుకుని పారిపోవడానికి అవకాశం చిక్కలేదు. అప్పటికి తగిన పని యుద్ధమే అనుకొని, ఒరల నుండి కత్తులను దూశారు. రెండు వైపుల వారికి పోరాటం జరిగింది. మురారి దేవుడు మొదలైనవారు కూడా మామూలు వ్యక్తులు కారు.యుక్తిగా యుద్ధం చేస్తున్నారు.  వారి అనుచరులు కూడా యుద్ధం చేస్తున్నారు. వచ్చి చుట్టూ మూగిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మురారి దేవుడు మొదలైన వారి శౌర్యంతో నిలువలేక గడ్డిపోచ మంటకు మాడిపోయినట్టు క్షణంలో నశించిపోయింది.
క్రమంగా మురారి దేవుడు, హరిహర దేవుడు, ధర్మవరధనుడు  నేల మీద కూలిపోయారు.కొందరు సైనికులు చచ్చారు. మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. కమల ఒక్కతే వారికి చిక్కింది. ఆ స్త్రీ ఎంత మాయామర్మాలు నేర్చుకున్నా పౌరుషానికి చిక్కితే ఏం చేయగలదు? ఆమెను వారు బంధించారు
కమల ఏడుస్తూ ఏమేమో మొర పెట్టుకుంటున్నది. వీరులు ఆమె మాటలను పట్టించుకోకుండా, జాలి పడక, కట్టిన కట్లు విప్పకుండా ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు.

పదవ ప్రకరణ
[  వార్త నిర్దేశనం]
ఏతదాఖ్యాంతితే సర్వే
హరయోరయోరామ సన్నిధౌ
వైదేహీ మర్షతాం శ్రుత్వా
రామ స్తూత్తరమబ్రవీత్
సుందరకాండ..65 సర్గ 3వ శ్లోకం
ఉవాచ వాక్యం వాక్యఙ్ఞ
సీతాయాదర్శనం యథా
సముద్రం లంఘమిత్వాఽహం
శతయోజనమాయతమ్
సుందరకాండ..65 సర్గ 5వ శ్లోకం
భావం:– వానరులు శ్రీ రాముని దగ్గరకు వెళ్లి సీతమ్మ రావణుడి అంతఃపురంలో బంధింప బడి ఉండడం, రాక్షస స్త్రీలు ఆమెను బెదిరించడం మొదలైన సమాచారమంతా రామునికి చెప్పి మౌనంగా ఉన్నారు.
రాముడు సీతాదేవి నాశనం చెందక క్షేమంగా ఉన్నదని విని వానరులను చూచి ఇలా అన్నాడు. హనుమ సీత ఇచ్చిన మణిని రామునకు సమర్పించి, తాను సీతాదేవిని చూసిన విధం చెప్పెను.నేను నూరు యోజనముల విస్తీర్ణం కలిగిన సముద్రం దాటి సీతాదేవిని చూడడానికి వెతుకుతూ పోయాను.
వ్యాఖ్య:–రామాయణం లోని సుందరకాండలోని సీతాన్వేషణ ఘట్టంలోని హనుమ సీతను చూసినట్లు రామునికి చెప్పినట్టు…
రుద్రమదేవి నవలలో ప్రకరణౌచిత్య శ్లోకం…రుద్రమదేవిని గోనగన్నారెడ్డి చూసినట్లు చెప్తూ…రాబోవు కథాసూచిగా చెప్తూ… మంగళాంతంగా ముగియనున్నట్లు  గ్రంథకర్త ఇలా ఇతిహాసోపమానం ఇవ్వడం అనేక పురాణ, ఇతిహాసాల పఠనాసక్తి, పరిచయం ఉన్నట్లు తెలుస్తున్నది…
ఇది ఒక అపూర్వ ప్రక్రియ…ప్రకరణాలకు నామకరణం చేయడం పాఠ్యాంశంగా అభ్యాసానికి సులువైన పద్ధతి…
(రంగరాజు పద్మజ)
కథాభాగం:- ఓరుగల్లులో రుద్రమదేవి రాజదర్బార్ లో కూర్చుని ఉంది. ఆమెకు కుడివైపున ముఖ్యమంత్రి అయిన శివదేవయ్య, అతని తర్వాత కాయస్థ కులంలో పుట్టిన వాడు” బ్రహ్మరాక్షసుడు” మొదలైన బిరుదులున్న వాడైన మంత్రి, సేనాపతి రెండు  పదవులను నిర్వహిస్తున్న జన్నిగదేవ సాహిణి, అతనికవతల కాయస్త వంశీకుడైన” ఏకంగా వీర, వీరావాతార” మొదలైన ఎన్నో బిరుదులున్న మంత్రి, సేనాధిపతి అయిన త్రిపురాంతక మహాదేవ రాజు, అతనికవితల వైపు ఇతని చిన్న తమ్ముడు “రాయ సహస్ర మల్ల”  బిరుదు పొందిన గండికోట, ములికి, నాడు, రేనాడు,పెందాడి , పెడకట్ల, సకిలియెరువ, పొత్తపినాడు మొదలైన ప్రాంతాలను రుద్రమదేవికి ప్రతినిధిగా పాలిస్తున్న అంబ దేవమహారాజు, కూర్చుని ఉన్నారు.ఎడమ వైపున నాగదేవరాజు, ఇతని పక్కన రుద్రమదేవి అల్లుండ్లు విక్రమాఢ్యులైన అన్నమ దేవరాజు, చాళుక్య వీరభధ్రరాజు కూర్చుని ఉన్నారు.  ఒకవైపు మిగిలిన సైన్యాధ్యక్షులు,  మరొకపక్కన ఆస్థాన పండితులు, ఇంకో వరుసలో విదేశీయులు, ఇంకొక చోట ఉన్నతోద్యోగులు, మరోచోట రాయబారులు కూర్చున్నారు.
రుద్రమదేవి పొగలేని నిప్పు వలె భగభగమండి పడుతున్నది. ఆ సభలో ఉన్న వారికి ఆమె మనసులో ఏమి ఆలోచిస్తున్నదో తెలియడం లేదు. ఆమెను అటువంటి వేషంలో ఎవరూ.. ఎప్పుడూ.. చూడలేదు.సభలోనే కొందరు ముఖ్యులకు అసలు ఏం జరిగిందనే కారణం తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నారు. అయినా కానీ ప్రశ్నించడానికి ధైర్యం చేయలేదు.
శివదేవయ్య సభ్యుల మనసు తెలుసుకొని, తన ఆసనం నుండి లేచి, అందరూ వినేటట్లు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
” ఓ సభ్యులారా!  భారతీయులకు సత్యం వంటి ఆభరణం ఇంకొకటి లేదు… బాహాటంగా యుద్ధంలో ఖడ్గంతో ఖడ్గం పోరాడి శత్రువును గెలవడమో? లేక శత్రువుతో ఓడిపోవడమో  మాత్రమే ప్రజలు మెచ్చుకుంటారు.శాస్త్రం కూడా అదే ఒప్పుకుంటుంది  దుర్మార్గులు ఈ పద్ధతిని విమర్శిస్తారు. అంతేకాదు మరింత చెడుతోవ తొక్కుతారు. మనకు తల్లితో సమానమైనది, ధర్మానికి మారూపైన మన రాణి గారి యొక్క ఉత్తమమైన ఉదార గుణాలతో, సేవకుల మీది వాత్సల్యంతో ఉండడం మన అందరికీ తెలిసిందే.
” శరణని వచ్చిన వారికి తల్లివలె కాపాడే శ్రీమతి రుద్రమదేవికి  దేశంలో కొందరు దేశద్రోహులు కారణం లేకుండా పగబూని, ఈ కుట్ర పన్నారు. మనం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల మన రాణి చిక్కులలో పడిన కూడా శ్రమ పడకుండా బయటపడ్డారని చెప్పడానికి నాకూ, వినడానికి మీకు చాలా ఆనందంగా ఉన్నది. అయినా శ్రద్ధతో పనిచేస్తున్న శత్రువులకు పూర్తిగా దొరికిపోయి, ఎక్కువ శ్రమ లేకుండా తిరిగి రావడం అసంభవమని ఆ ద్రోహులను చూసి మీరు అనుకున్నారు కావచ్చు…..
ఇంతలో ఒకతను సభలోనికి త్వర త్వరగా వచ్చి, రుద్రమదేవికి నమస్కరించాడు. అతని వెంట ఒక మహిళ ఉన్నది. ఆమె తాళ్లతో కట్టి వేయబడి ఉన్నది. రాజభటులు ఆమెను కాపలా కాస్తూ వెంట నడుస్తూ వస్తున్నారు. మరి కొంతమంది కొన్ని పెట్టెలను తలపై పెట్టుకొని వచ్చి, రుద్రమదేవి ముందు దింపి,  నమస్కారం చేసి పక్కకు పక్కకు ఒదిగి నిలబడ్డారు.
వచ్చినతను గోనగన్నారెడ్డి. ఇతడు రుద్రమదేవికి నమ్మకమైన బంటు.తనకు అప్పచెప్పిన పనికి వెనకడుగు వేయడు. పేరున్న గొప్ప వీరుడు. గోనగన్నారెడ్డి తన వెంట తీసుకొని వచ్చిన స్త్రీని, ధనమున్న పెట్టెలను రుద్రమదేవికి, సభలోని వారికి చూపించి ఇలా అన్నాడు.
ఈమె శత్రువుతో కుట్ర చేయమని పంపినదే అయినా, కాకతీయ రాణివాసం కొలుస్తూ జీవిస్తున్న దాసి కులంలో పుట్టిందనీ,శ్రీ గణపతి రాజరాజ రాజేంద్రుని దేవికి సేవలు చేసిన లలిత కూతురు అని,  క్రీ.శ.1228 లో  శ్రీ చక్రవర్తి గారు అద్దంకి సేనపై దాడి చేసినప్పుడు తన తల్లి, తాను శ్రీవారి వెంట ఉన్నామని, ఆ కల్లోలంలో తన తల్లి ఎక్కడో తప్పిపోయిందని, మొదలైన ఏవేవో కట్టుకథలు చెప్పి, తన పేరు మదనమంజరి అని చెప్పింది. దీని పేరు కమల. కానీ మదనమంజరి కాదు. మాయలు పన్నే ఈమె చెప్పిన చరిత్ర తన తల్లి  గురించి కాకపోయినా, నిజమైన చరిత్ర కాబట్టి మన రాణిగారు నమ్మవలసి వచ్చింది. మన రాణి చాలా ఉపాయంగా ప్రశ్నలు వేసినా, మాయామర్మాలను బాగా వంట పట్టించుకున్న ఈవంచకురాలు  ఆ ప్రశ్నలకు చిక్కక సరైన సమాధానాలిచ్చి, రాణి గారు అనుమాన పడకుండా చేసింది. నాకు మాత్రం మొదటి నుండి దీని విషయం కొంచెం అనుమానంగానే ఉంది. అందుకే నేను ఈమె విషయంలో శ్రద్ధతో గమనిస్తున్నాను. కొన్ని రోజులకు రాణిగారు తమ కూతుళ్లతో బుద్ధగణపతిని పూజించాలని వడ్డేపల్లికి వస్తున్నారు. అప్పుడు ఈ దొంగ దాసీ మంతనాలతో మన రాణిగారి వెంట వీరులను లేకుండా చేసింది. మొదటి నుండి అనుమానం ఉన్న నేను మారువేషంలో రాణిగారి వెంట మొగిలిచర్లకు వెళ్లాను. నేనెప్పుడూ దాసిని కనిపెట్టుకొని ఉన్నా కూడా ఒకనాటి సాయంకాలం ఈ దాసి కనిపించకుండా ఉండటంతో భయం వేసి, అటు ఇటు కొంతసేపు వెతికి, ఈ దాసి దొరకక నిరాశతో ఎక్కడ పోయిందో చూద్దామని చెరువు కట్ట ఎక్కి నడుస్తూ పోతున్నాను. నేను కొంత దూరం నడిచేటప్పటికీ ఈ దాసి కట్టకింద ఉన్న మర్రిచెట్టు దగ్గర నుండి వస్తున్నది. అప్పుడు నా అనుమానం సరైనది అనుకొని, దానికి కనిపించకుండా దాక్కొని, అది వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఏమీ తెలియనట్లు కూర్చొని, నా ద్యాసంతా మర్రిచెట్టు మీదే నిలిపాను. ఎవరో ఆ చెట్టుకింద ఉన్నట్టు, గుసగుసలు పెట్టుకుంటున్నట్టనిపించింది. వాళ్ళ మాటలు స్పష్టంగా వినబడటం లేదు. ఇంతలో ఒకడు వాళ్ళ దగ్గర నుండి నా వైపు వస్తున్నాడు. అతను పైకి వస్తున్నప్పుడు”  ఇప్పుడే వెళ్లి త్వరత్వరగా కమలను కలుసుకోవాలి”  అనే మాటలు వినబడ్డాయి. చూసి చూడనట్టు వాళ్ళ వైపు చూసి వారి రూపాలను నా హృదయంలో ముద్ర వేసుకున్నాను. వాళ్ళు ముగ్గురు మగవారు, అందులో ఇద్దరు అక్కడ ఉన్నారు. ఒకతను గబగబా నడుస్తూ వచ్చి నన్ను చూసి” ఎవరు నువ్వు?”  అని అడిగాడు. నేను వినిపించుకోలేదు. వచ్చిన అతను అచ్చంగా బ్రాహ్మణుడు వలె ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు అడిగాడు. చెవిటి వాడి వలె నటించాను. అతను నన్ను ఏమీ అడగకుండా వెళ్ళిపోయాడు. మర్రిచెట్టు కింద ఉన్న ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారు.నేను లేచి ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి నన్ను మాట్లాడించిన బ్రాహ్మణుని వెంట నడిచాను. అతడు అంతకుముందే చాలా దూరం వెళ్ళాడు.అయినా నాకు అతడు కనిపిస్తున్నాడు.అతన్ని చూస్తూ  పోతున్నాను. కాబట్టి అతడు తోవలో ఈ దుర్మార్గురాలుని పనికి పురమాయించడం చూశాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ, ఏదో మోసం ఉన్నది అని అనుకొని, బుద్ధగణపతి ఆలయానికి వెళ్లి, నా వేశం మార్చుకుని, పరమభక్తుని వేషం వేసుకున్నాను. ఇంతలో ఆ బ్రాహ్మణుడు దేవుడు ఆవేశం అయినట్టు నటించి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. మర్రిచెట్టు కింద నేను చూసిన మరో ఇద్దరు కూడా వచ్చి అతనికి సేవలు చేశారు. ఇదంతా నా అనుమానాన్ని మరింత బలపరిచింది.నా అనుమానం సరైనదే అని తేలేదాక ఆ విషయం రాణిగారికి చెప్పడం సమంజసం కాదని, అప్పటికి చెప్పడం మానివేసి ఆ ముగ్గురి వెంటనే ఉన్నాను.
తెల్లవారకముందే రాణిగారు ఇద్దరు కూతుళ్లతో మాయ బ్రాహ్మణునికి దేవత ఆదేశించినప్పుడు అన్న మాటల ప్రకారం మొగిలిచర్లకు ప్రయాణం అయిపోయారు. నేనా ముగ్గురుతో పాటు వారికి తెలియకుండా మొగిలిచర్లకు వెళ్లాను. వాళ్లు నేరుగా ఆ ఊరికి రాకుండా అడవి నుండి రావడానికి నిశ్చయించుకున్నారు. ఆ ఆలోచన మోసానికి సంబంధించిందని నేను అనుకొని, రుద్రమదేవి తెలుపాలని అనుకొని, రుద్రమదేవిగారున్న విడిది గృహానికి వెళ్లాను  కానీ, ఆ ఇంటి చుట్టూ కాపలా ఉన్న భటలు నన్ను లోపలికి  వెళ్లనియ్యలేదు. ఎన్ని విధాల చెప్పినా లోపలికి వెళ్లి వచ్చి,” ఇది సమయం కాదని రాణిగారు అన్నారు అని”   నాకు వచ్చి చెప్తున్నారు .
”  నా దగ్గరకు ఎవరూ రాలేదని”  రుద్రమదేవి అన్నది.
నాకు తెలుసు  వాళ్లు శత్రుపక్షం వారు.  కాబట్టి లోపలికి వచ్చి మీకు చెప్పలేదని తెలుసు. వాళ్ళని ఎదుర్కొందామంటే నేను ఒక్కడినే ఉన్నాను. అంతే కాదు నా దగ్గర నన్ను నేను రక్షించుకునేంత మాత్రమే ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి సాహసించే వీలు లేకపోయింది.
ఓరుగల్లుకు పోయి సైన్యంతో వద్దామంటే ఆ లోపలే ఇక్కడ ఏం జరుగుతుందో అని మనసొప్పలేదు. అప్పుడు ఆ ఊరికి పోయి దేనికైనా పనికి వస్తుందని నా వెంట తెచ్చిన ధనంతో  కొంతమంది మట్టి పని చేసే వారిని నా వెంట తీసుకొని, ఊరి బయట నుండి  చిన్న ఎడ కత్తులతో సొరంగం చేసి, దేవిగారు ఉన్న ఇంటి గదిలోనికి  సొరంగం తవ్వమని చెప్పి, నేను ఆ ఇంటిని కాపలా కాస్తున్నాను. మళ్లీ ఒకసారి అడవి మధ్యకు వచ్చాను.అప్పటికి ఈ దాసి, ఆ ముగ్గురు అడవిలో కూర్చొని ఏదో రహస్య ఆలోచన చేస్తున్నారు. నేను వచ్చిన సంగతి వాళ్లకు తెలియక, ఆనాటి రాత్రి రుద్రమదేవిని పట్టి బంధించాలనుకుంటున్నారని, పట్టణం చుట్టూ దారుల వెంట జనాలు కాపలా ఉండాలని అనుకుంటున్నారు. నేను అక్కడ నిలబడడం అంత మంచిది కాదనుకుని, ఊరికి వచ్చాను. కానీ ఇంతలోనే మరొక ఆపద ఎదురైంది. ఊరి బయట సొరంగం ఊరికి ఏమంత దూరంలో లేదు.ఆ సొరంగం నుండి  రుద్రమదేవి వస్తే,ఇవతల కాచుకొని ఉన్న వారిని  ఎదుర్కో లేము. అయినా పనికి విచారించక, గబగబా ఊరికి వెళ్లి, ఒక ఊరు అతని దగ్గరకు పోయి, రహస్యంగా  అతనికి కొంత ధనమిచ్చి, శ్రీ శివదేవయ్య మంత్రి పేరు మీద”  మోసం జరిగింది. జాము రాత్రి లోపల సైన్యం మొగిలిచర్లకు రావాలని”  ఒక ఉత్తరం రాసి పంపాను.
ఇంతలో సొరంగం తవ్వడం అయిందని  తెలిసింది. సాయంత్రం అయింది. నాలుగు ఘడియల రాత్రి దాటిన తర్వాత ఆ సొరంగం బయట చాటుగా నాలుగు గుర్రాలను, నాలుగు నిలువు కత్తులను సిద్ధంగా ఉంచి,  ఆ సొరంగం ద్వారా నడచి, శ్రీ రుద్రమదేవి దగ్గరకు చేరాను. నేను రావడం దేవికి ఆశ్చర్యం వేసింది. జరిగిన సంగతంతా సంక్షిప్తంగా చెప్పి, దాసిని కట్టేసి, కళ్ళకు గంతలు కట్టి, ఆ వచ్చిన తోవనే బయట పడ్డాము.
సొరంగం తవ్విన వారే వెంటనే దానిని సాధ్యమైనంత వరకు పూడ్చి వేశారు. దాసిని వెంట పెట్టుకొని వెడితే తోవలో రహస్యం దాచడం కష్టమని అక్కడనే కట్టి వేసాం. బయట పడి కొన్ని రాళ్ళు రప్పలు, సొరంగంలో వేసి నలుగురం గుర్రాలనెక్కాము. ఇద్దరు కూతుళ్లతో రాణిగారు కట్టుకున్న బట్టలనే మగవారు కట్టుకున్నట్టుగా సవరించుకున్నారు.  మేము నలుగురం నడుస్తూ వస్తుండగా ఊరు చుట్టూ కాపలా ఉన్న వారు మాపై దాడి చేశారు. వాళ్లని అవలీలగా చంపేసి,  ఓరుగల్లు తోవ వెంట వస్తుండగా బాటకు కొంచెం దూరంలో రెండు సైన్యాలు యుద్ధం చేస్తున్నట్టు తెలిసి అక్కడికి వెళ్ళాం. అందులో ఒక సైన్యం ఓరుగల్లు సైన్యమని, మేము అంచనాగా తెలుసుకొని, శత్రువులను వెళ్ళగొట్టాం. మేం ఎవరిమో? ఆ సైనికులకు తెలియదు. వాళ్లను వెంట తీసుకొని వచ్చి, కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇంకొంత ఓరుగల్లు సైన్యం మాకు కలిసింది. కొత్త సైన్యాన్ని వెంటబెట్టుకుని నేను మళ్ళీ మొగిలిచర్లకు వెళ్లాను. కూతుళ్లు ఇద్దరు నీ వెంట తీసుకొని రాణిగారు జాగ్రత్తగా ఓరుగల్లు చేరారు. నేను మొగిలిచర్లకు వెళ్లి; నేరస్తుల కోసం వెతికాను కానీ వారు ఎక్కడా కనపడలేదు. ఆ రాత్రి అక్కడే గడిపి, తెల్లవారక ముందే చెట్లపై దాక్కొని, వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో వాళ్ళు మా దగ్గరికి వచ్చి, మేమున్నది తెలియక నడుస్తున్నారు. మేము వాళ్లను చుట్టుముట్టి సైనికులను, ఈ పనికి ముఖ్య కారకులైన మురారి, హరిహర దేవులను,  ధర్మవర్ధనుడుని చంపేసి, ఈ దుర్మార్గురాలిని కట్టేసాం. దీనిని అడిగి మురారి దేవుడికి ,హరిహర దేవుడికి సంబంధించిన ధనాన్ని కొల్లగొట్టు కొని తెచ్చాను.ఇక ముందు మీ ఇష్టప్రకారం ఈ ధనాన్ని, ఈ దాసీని ఏమి చేస్తారో చేయవచ్చు. అని చెప్పి గోనబుద్ధారెడ్డి తన ఆసనం మీద కూర్చొన్నాడు.
ఈ విషయం విన్న సభలోని సభ్యులందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. కమల వంచిన తల ఎత్తలేదు. అందరూ గన్నారెడ్డి చేసిన సాహస కృత్యానికి , అతని రాజభక్తికి మెచ్చుకున్నారు.
రుద్రమదేవి తన సింహాసనం నుండి లేచి, ” నా ప్రాణాలను ,నా కూతుళ్ళ మాన, ప్రాణాలను ” రక్షించిన గోనగన్నారెడ్డికి నా మనస్ఫూర్తిగా నా చేతిలో ఎప్పుడూ ఉండే ముత్యాల బాకును బహుకరిస్తున్నానని అంటూ తన చేతిలో ఉన్న బాకు గన్నారెడ్డి కిచ్చారు.
రాణీగారు అన్నమాటలతో  సభ్యులందరికీ సంతోషంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
గోనగన్నారెడ్డి దిగ్గున లేచి రెండు చేతులతో ఆ కత్తిని తీసుకుని, కృతజ్ఞతగా నమస్కారం చేసాడు.
రుద్రమదేవి కమలను చూస్తూ ” నువ్వేమైనా చెప్పదలచుకున్నావా?” అని అన్నది.కమల ఏమీ సమాధాన మీయకుండా తలవాల్చుకుని నిలబడింది.
మారుమాట్లాడకున్నంత మాత్రాన నువ్వు నిర్దోషివి కాదు ! నీ ప్రాణాలు మా చేతిలో ఉన్నాయి.నిజం చెప్పి,నీకొచ్చే ముప్పు తప్పించుకో ! నిన్నెవరు పంపారో? చెప్పు! అని రుద్రమదేవి అడిగింది.
” నన్నేమి చేసినా సరే! నేను మీకేమీ చెప్పలేను.” అని కమల అన్నది.
ఎవరు పంపారన్న అనుమానం మీకక్కరలేదు. వీళ్ళ నందరినీ పంపింది మహాదేవరాజు. ఈ నలుగురు దుర్మార్గులు. మొగిలిచర్లకు చెందిన అడవిలో కూర్చుని మాట్లాడుకుంటుండగా నాకు తెలిసిందని అన్నాడు గోనగన్నారెడ్డి.
నువ్వు చెప్పకున్నా నిన్ను పంపింది మహాదేవరాజని తెలిసింది. నీ నోటితో చెప్పి ఇక్కడ నుండి వెళ్లి పో! అని అన్నది రుద్రమదేవి.
దాసి కొంచెం సేపు ఆలోచించి ” నేనిక్కడ నుండి పోకున్నా, నన్ను మీరు కఠినంగా శిక్షించినా నన్నెవరు పంపారో వారి పేరు చెప్పను. ” అని మొండికేసి నిలబడింది.
దాసి మొండితనానికి రుద్రమదేవికి చాలా కోపం వచ్చింది. ఆడది కావడం వల్ల చంపక వదిలాను.” నువ్వు ఈరోజే మా దేశాన్ని వదిలి వెళ్లిపో! మా ఎల్లలు విడిచే దాకా మా భటులు నిన్ను వెంటాడుతూ ఉంటారు.మళ్లీ మా రాజ్యంలో  నీ మొహం కనపడితే నీ ప్రాణాలు నీకు దక్కవు.ఆడుదానివైనందుకు బతికిపోయావు! నీ మహాదేవరాజు కూడా ఆడదాని వలె గాజులు తొడుక్కోవడం వల్లనే కదా! బహిరంగంగా యుద్ధంలో ఆడదానినైన నాతో ఎదుర్కోలేక కుట్ర చేసాడు.
సిగ్గు, బుద్ధి తెచ్చుకుని మళ్లీ ఇటువంటి పనులు చేయవద్దని చెప్పు. రాజ్యం దక్కించుకోవాలంటే మాతో స్నేహంగా ఉండమనీ గర్వం, అహంకారం వదిలి పెట్టమని చెప్పు! మేము మంచిగా చెప్పిన మాటలు మరచిపోతే మా పదునైన బాణాల గుట్టలై చురచుర మని వచ్చి తగిలి , బుద్ధి చెబుతాయని చెప్పు! అని దాసికి చెప్పి, ” త్రిపురాంతక దేవా! దీన్ని ఈ రోజు మన రాజ్యం దాటించేందుకు నలుగురు భటులకు చెప్పి పంపుమని అన్నది.
త్రిపురాంతక దేవుడు వెంటనే లేచి నమస్కరించి, కమలను వెంటబెట్టుకొని అక్కడ నుండి వెళ్లి పోయాడు.
అంతలో సభలో నుండి ఒకతను లేచి, నిలబడి  “నేను వెనీసు వర్తకుడిని , నా పేరు మార్కోపోలో” అని అంటారు. నేను చాలా దేశాలు వ్యాపారంకోసం తిరుగుతుంటాను. పురుష పరిపాలన అజమాయిషీలో ఉన్న దేశాలు , స్త్రీ స్వభావమున్న పరిపాలనలో ఉన్న దేశాలను చూసాను. రాజులకుండాల్సిన ధర్మాలోచన, నీతి సమృద్ధిగా ఉండడం, సేవకుల పట్ల అభిమానం ఆదరణ , రాచకార్యాలు చేసేటప్పుడు చూపించే చతురత కలిగి ఉండడం మొదలైనవి ఈ రాణి దగ్గర చూసినట్లు ఎక్కడా చూడలేదు. రాజు పట్ల ఎంత భక్తి శ్రద్ధలుండాలో అవన్నీ ఈ రాణి సేవకుల దగ్గర మాత్రమే చూడగలిగాను. మిగిలిన దేశాలలో సేవకులకు ఇటువంటి వినయం లేదు.ఈ రాజ్యం కేవలం పురుష రాజశ్రేష్ఠులు పాలిస్తున్నట్టున్నది కానీ మహిళ చేత పరిపాలింప బడుతున్నట్టు లేదు. ఈమెను రాజు అనక తప్పదు.నాకు చాలా సంతోషంగాఉంది. మిగతా దేశాధినేతలు ,ఆ దేశాలలోని  సేవకులు ఇక్కడకు వచ్చి ఈ నీతిని  నేర్చుకోవాలని బిగ్గరగా అంటూ తన దగ్గర ఉన్న విలువైన విదేశీ వస్తువులను రుద్రమదేవి కి బహుమతిగా ఇచ్చాడు.
సభ్యులందరూ రుద్రమదేవి యొక్క చాకచక్యమైన పనులను పొగుడుతూ అవన్నీ మార్కోపోలోకు తెలిపారు.
సభ్యులారా! ఈనాటి ఈ అపూర్వమైన కార్యక్రమం వల్ల సభయొక్క ఉద్దేశ్యం మీరు ఇంకో తీరుగా అనుకున్నారు. కానీ ముఖ్యమైన అభిప్రాయం తెలుసుకునే అవకాశం చిక్కలేదు. రాయబారులెందరో వచ్చినట్టు తెలిసింది.వారి రాయబారాలను తెలుసుకునేందుకు సమయం చిక్కలేదు. దాడిలో పాల్గొని గెలిచిన వీరులైన సైనికులకు పారితోషికం ఇవ్వలేదు. కుట్రలో బలైనవారెందరో ? ఎంతమంది ఉన్నారో? తెలుసుకొని, వాళ్ల కుటుంబాలకు భరణం ఏర్పాటు చేయలేదు.
ఇప్పుడు సమయం చాలా గడిచి పోవడంవల్ల సభ ఇంతటితో చాలిస్తున్నాం. రేపటి కొలువులో అన్నీ జరుగుతాయని మంత్రి శివదేవయ్య తన ఆసనం నుండి లేచి చెప్పి మరలా కూర్చున్నాడు.
సభలోనివారందరూ  ఒప్పుకున్నారు
(కొలువుకూటమి ముగిసింది.)
(సశేషం)

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శ్రీ యాదాద్రీశ వైభవమ్‌ – 11

by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు December 31, 2021
written by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు

లోకానీకావనౌకం సకల భువనభు క్సత్ర సంత్రాణ తంత్రం

కారుణ్యార్ణోధినాధం ఘనరవవిలస న్నూపురాసాదపాదం

తాటంకద్యోత కర్ణం విషగళసుషమా తాండవానంద కందం

వందే యాదక్షమాభృత్‌ కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: సమ్తలోకాలను సంరక్షించే ఆశ్రయముÑ సకల భువనా(లోకా)లను లయమొందించేవాడు, నిరంతరము పోషించి రక్షించేవాడుÑ కరుణ అనే సముద్రానికి ప్రభువైన (అధిపతిjైున) వాడుÑ విశేషమైన శబ్దాలను వెలువరించే ప్రకాశిస్తూన్న అందెలను అలంకరించుకున్న పాదము(లు) కలవాడుÑ తాటంకముల (చెవికమ్మల) చేత అందమును సంతరించుకుని ప్రకాశిస్తున్న చెవులు కలవాడుÑ శ్రీకంఠుని పరమశోభాకరమైన తాండవనాట్య సమయంలో కలిగే ఆనందానికి మూల(కారణ)మైనవాడు అయిన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: లోకం అంటే ఇంద్రియగోచరమైన ఈ సమస్త చరాచర స్థావర జంగ మాత్మకమైన, ఎనభై నాలుగు లక్షల జీవరాశికి నిలయమైన, సంపూర్ణ సృష్టి అని చెప్పవచ్చు. సాధారణ మానవుడికి ఇంద్రియ గోచరమైన ఈ లోకం అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా పిలవబడుతున్నది. ఋషివరేణ్యుల జ్ఞానచక్షువులకు ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు కనిపిస్తుంటాయి.  వాటినే అనేక కోటి బ్రహ్మాండాలని జ్ఞానులు చెప్తుంటారు. (లోకGఅనీకGఅవనGఓకంR) అటువంటి లోకానీకములను, అనేక కోటి బ్రహ్మాండాలను (అవనR) రక్షించటానికి (ఓకంR) చక్కని, ఏకైక ఆశ్రమైనవాడుÑ (సకలGభువనR) సమస్త లోకాలను (భుక్‌R) భుజించటం అంటే మహాప్రళయకాలంలో తనలో లీనం చేసుకునేవాడు విష్ణుమూర్తి! అంతేనా? (సత్రR) ఆ లోకాలన్నిటినీ పోషించి, శరణమిచ్చి, రక్షణ కల్పించి, వాటికి తానే ఆశ్రయంగా నిలిచినవాడు. సత్రం అంటే  తగిన దక్షిణ లిచ్చి సతతము అన్నదానం చేయటం అని కూడ అర్థం! పూర్వం ఋషులు సత్రయాగం చేశారని పురాణాల్లో పేర్కొన్న దీ యాగాన్నే!, ఇంకా (సంత్రాణR) చక్కగా రక్షించటం అనే (తంత్రంR) కుటుంబ భరణ వ్యాపారాన్ని, పనిని, చేసేవాడు శ్రీలక్ష్మీనరసింహస్వామివారు.

సృష్టి, స్థితి, లయ కార్యాలకు మూలమైనవాడు విష్ణుమూర్తియే కదా!Ñ తనను ఆశ్రయించిన, ఆపన్నులైన భక్తజనులను, విపత్తుల నుండి కాపాడి (కారుణ్యGఅర్ణోధినాధంR) దయతో బ్రోచే కరుణాసముద్రానికి అధినాథుడుÑ (ఘనGరవGవిలసత్‌G నూపురGఆసాదGపాదంR) విశేషంగా మంజులనాదాన్ని వెలువరిస్తూ, మిక్కిలి సౌందర్యవంతములైన అందెలచేత (మంజీరాలచేత) అలంకరింపబడిన పాదాలు కలిగినవాడుÑ (తాటంకGద్యోతGకర్ణంR) శోభాయమానములైన చెవికమ్మలచేత ప్రకాశిస్తూన్న చెవులు కలిగినవాడుÑ (విషగళGసుషమాGతాండవGఆనందGకందంR) విషగళుడు శంకరుడు. సకలలోక శుభంకరుడైన శంకరుడు దివసావనాన సమయంలో అంటే సాయంసంధ్యా సమయంలో తాండవ నృత్యం చేస్తూ

ఉంటాడంటారు. (విషగళR) హాలాహల విషాన్ని తన కంఠసీమలో నిలుపుకుని శ్రీకంఠుడనే నామధేయాన్ని సార్థక పరచుకున్నవాడు శివుడు! అందుకే ఆయన శివుడు R మంగళకరుడైనాడు. శివుడు మనోజ్ఞమైన తాండవ నృత్యాన్ని చేస్తూంటే కలిగే ఆనందం ఇంతటిదని చెప్పడానికి వీలు కాదు! దాన్ని ఆనంద తాండవమంటారు. అదే బ్రహ్మానందం కంటే అతీతమైనది. అటువంటి ఆనందం కలగటానికీ, కలిగించటానికీ మూలమైనవాడు శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు. శ్రీ యాదగిరిపై నెలకొని తన పటుభుజబలంతో విక్రమిస్తున్న శ్రీలక్ష్మీనరసింహస్వామిని కవి తన సుధామధుర కవితారస ధారాపూరంతో నమస్కరిస్తున్నాడు.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

బోయి భీమన్న

by Dr. Kasarla Rangarao December 31, 2021
written by Dr. Kasarla Rangarao

బోయి భీమన్న (19 సెప్టెంబరు 1911-16 డిసెంబర్ 2005) మధ్య జీవించారు. సామాజిక మార్పు కు సామాజిక చైతన్యాన్నాశించి రచనలు చేశారు.అతిపేద దళిత కుటుంబంలో పుట్టి స్వయంకృషితో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆశావహ దృక్పథంతో జీవించారు. వీరి “గుడిసెలు కాలిపోతున్నై” అనే రచన ఒక బలమైన సామాజిక సమస్యను చర్చకు పెట్టింది. వీరి సాహిత్యకృషికి ( “గుడిసెలు కాలిపోతున్నై” కి) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సామాజిక కృషికి ” పద్మభూషణ్” , రాజా లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు ,కాశీ విద్యాపీఠం గౌరవ డాక్టరేట్ లు లభించాయి. “పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమన్న” గ్రంథం హైమవతి గారు రచించారు. బోయి భీమన్న గారి బహుముఖీన సాహిత్య , సామాజిక దృక్పథానికి ఈ గ్రంథం చుక్కాని వంటిది. జాతీయతతో తాను పుట్టిపెరిగిన దేశీయ వాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే ఆత్మగౌరవం తో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది. ఈ అనుగుణంగా ఉండటమంటే అస్పృశ్యతకు వ్యతిరేకంగా ,కులాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడటమే. ఈ వాస్తవికాల ద్వారానే ఎదిగి కులనిర్మూలన పంథా రావాలని ,వేయేళ్ళ బానిసత్వానికి కారణమైన మన యీ అనైక్యత పోవాలని బోయి భీమన్న , అంబేద్కర్ ల ఆశయం, ఆకాంక్ష. సామాజిక న్యాయం లభించిన తర్వాత ప్రతిభ ,ప్రజ్ఞ , జిజ్ఞాస కలవారిని మాత్రమే ఎన్నిక చేయాలని కులప్రాతిపదికగా చేయరాదని వారి పోరాటం. ఇదే వారి కులనిర్మూలనోద్యమానికి ప్రాతిపదిక. దాదాపు 15 వరకు కవిత్వ సంపుటులు, 13 నాటకాలు , 8 వచన రచనా సంపుటుల ద్వారా తన అభ్యుదయ , ప్రగతిశీల భావాల్ను బోయి భీమన్న గారు ప్రకటించారు. బోయి భీమన్న సాహిత్య పీఠం ద్వారా ప్రముఖులకు అవార్డు ప్రధానం జరుగుతుంది. ఇది శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వారి ద్వారానే నిర్వహించబడుతుంది. మన బోయి భీమన్న వర్థంతి 16 డిసెంబర్ సందర్భంగా అన్ని రకాల హింసను వ్యతిరేకించి ,సమన్వయ దృక్పథాన్ని ఆచరించిన ఆయన పరిణితిని , పోరాట శీలాన్ని స్మరించుకుంటూ ఆచరిద్దాం.

December 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అతడే ఒక ఎదురుదెబ్బ

by Agumamidi Ayodhya reddy December 31, 2021
written by Agumamidi Ayodhya reddy

కుర్చీలోంచి విసురుగా లేచాడు రమణ.

“గాయత్రీ..! ఫర్ గాడ్స్ సేక్.. మళ్లీ  నీ ఎపిసోడ్ మొదలెట్టకు. వినీవినీ విసుగొచ్చింది. నువు ముందా ఏడుపు మానెయ్యి. ఐ కాంట్ టేక్ ఎనీమోర్ ఆఫ్ దిస్” చిరాకునంతా ముఖంలో ప్రదర్శిస్తూ అన్నాడు.

అతని అనవసర ఇరిటేషన్ నాకూ కోపం తెప్పించింది. కానీ సర్దుకున్నాను.

“నేను చెప్పేది ఎపిసోడ్ లా అనిపిస్తుందా నీకు?”

“కాదామరి,  మాట్లాడితే మన పెళ్లి ఎప్పుడంటావు. అసలా బాండింగ్ కోసం ఎందుకంత తొందర?”

“ తొందర కాదు, అవసరం. మనం కలిసుందామని డిసైడైనప్పుడు అది కొద్దిరోజులు మాత్రమే అనుకున్నాం. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఇప్పటికి  ఏడాదిన్నర దాటింది. నువ్వుగా ప్రస్తావన తేవు. నేను పెళ్లి మాటెత్తితే దాటేస్తావు. దీనివల్ల  మనమధ్య మనస్పర్థలు, దూరం పెరుగుతున్నయి. మన ప్రేమ మీద ఇష్టంతో, భవిష్యత్తు మీద నమ్మకంతో సహజీవనానికి ఒప్పుకున్నా. ఇప్పుడేమో నువు పెళ్ళిని తేలిగ్గా తీసుకుంటున్నావు. అసలు నీ మనసులో ఉన్నదేమిటో  స్పష్టం చెయ్యి. ఒక క్లారిటీ వస్తే మంచిది”

“జస్ట్ షటప్ ఐసే.. నీ సోది మళ్ళీమళ్ళీ వినే ఓపిక నాకు లేదని ముందే చెప్పాను. ఇంట్లో ఉంటే ఒక్కక్షణం మనశ్శాంతిగా ఉండనీవు. అందుకే వెళ్లిపోతున్నా” మాట పూర్తిచేస్తూనే విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. అతని వెనుకే పెద్దచప్పుడుతో తలుపు మూసుకుంది.

గత కొన్నిరోజులుగా జరుగుతున్నదే మళ్లా ఈరోజూ జరిగింది.

ఒక సందర్భానికి తనకు అనుకూలమైన విధంగా ముగింపు పలికి అతడు తప్పుకున్నాడు. చిక్కని నీడలాంటి మరో సాయంత్రం నాముందు పరుచుకుంది. ఇల్లంతా నిండిన నిశ్శబ్దం… నన్ను కావలించుకునే ఒంటరితనం. నిస్సహాయతతో ఏడుపొస్తుంది. కానీ ఇప్పడేడ్చి లాభమేమిటి?

అనుకోకుండా మొదలైన మా సహజీవనం మరొకలా రూపం మార్చుకుంది. అప్పటికి ఇద్దర ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. అంతకుమించి మంచి స్నేహితులం. మామీద ఆఫీసులో, బయటా ఏవేవో రూమర్స్ పుట్టేంత సన్నిహితులం.

ఒకరోజు లంచ్ టైములో కేంటీన్లో చెప్పాడు రమణ.

“ఇంకో వారంలో నేనుండే ఇల్లు వెకేట్ చేయాలి గాయత్రీ ..! ఎంత ప్రయత్నించినా నాకు సూటయ్యే మరో కొంప దొరకడం లేదు. ఈ నగరంలో సరైన ఇల్లు, అందులోనూ మన స్తోమతకు తగింది దొరకడం కష్టమని తేలిపోయింది”

“ఇల్లు కోసం వెతుకుతున్నావా ఏమిటి..?”

“అవును. ఇల్లు సౌకర్యంగా ఉందనిపిస్తే అద్దెలు ఎక్కువున్నయి. తక్కువలో కావాలనుకుంటే అసౌకర్యంగా, మన ఆఫీసుకు చాలా దూరంగా ట్రాన్స్ పోర్టుకు ఇబ్బంది అయ్యేలా ఉన్నాయి”

“ఇది అందరికీ ఎదురయ్యే సమస్యనే. ప్రత్యేకించి నీకొక్కడికే కాదు” నవ్వాను.

“అందుకే మరెవరినైనా కలుపుకొని షేరింగులో మంచి ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందనే యోచనలో ఉన్నా”

“నాదగ్గరో మంచి ఐడియా వుంది..చెప్పనా?”

“చెప్పు.. సందేహం ఎందుకు?”

“మరి నువు షేర్ చేసుకునే హౌస్ మేట్ నేనే అయితే ఎలా ఉంటుంది..?”

రమణ ఒక్కక్షణం అయోమయంగా నాముఖంలోకి చూసి ఆశ్చర్యపోయాడు. ఇబ్బంది పడినట్టు కనిపించాడు.

“ ఇది మంచి ఐడియా యెలా అవుతుంది? అందరూ ఏమనుకుంటారు? ముఖ్యంగా మీ తల్లితండ్రులకు తెలిస్తే…”

“ఏమీ కాదు. నేనేం చేసినా అది నాయిష్టం. నాకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉంది. పైగా మనం ఒకర్నొకరు

బాగా సన్నిహితులం. మన భవిష్యత్తుకూ, పరస్పరం  సంపూర్ణంగా అర్థం చేసుకునేందుకూ ఇదో అవకాశంగా భావించు.”

“నీతో కలిసివుండటం ఒక అద్భుతం, కానీ…”

“ఇంకేం ఆలోచించకు. నేను కూడా పీజీ నుంచి ఖాళీ చేయాల్సివుంది. ఇద్దరం కలిసి మంచి ఇల్లు వెతికి ఈ వీకెండుకే చేరిపోదాం”

“నువు నిజంగానే నాతో కలిసుండాలనుకుంటున్నావా?” అతనిలో ఏదో సంశయం.

రమణకు వివరంగా సర్దిచెప్పాను. అట్లా ఎక్కువకాలం ఉండాల్సిన అవసరం లేదన్నాను. త్వరలోనే మనకూ ఒక కుటుంబం ఏర్పడి అంతా సెటిలైపోతుందని చెప్పాను. ఆవిధంగా ఇద్దరం ఒకచోట వుండాలనుకున్నాం. నేనప్పటికే అతన్ని ఇష్టపడి ఉన్నాను. పైకి అనకపోయినా రమణ కూడా అంతేనని నాకు తెలుసు. అయితే ‘మనం వెంటనే పెళ్లి చేసుకుందామని’ మాత్రం చెప్పలేకపోయాను.

మేము కలిసివుండటం మా అమ్మా నాన్నలకు ఇష్టంలేకపోయింది.

“కలిసివుండటం ఎందుకు? ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లిచేసుకోవచ్చుగద. మిమ్మల్నెవరు కాదన్నారు?” అమ్మ అన్నది.

“ కొద్దిరోజులే మమ్మీ..! తొందర్లోనే మ్యారేజీ చేసుకుంటాం. రమణ చాలా మంచివాడు”

“ ఏ మాత్రం బెడిసికొట్టినా నష్టపోయేది స్త్రీ మాత్రమే. ఆ సంగతి గుర్తుంచుకో బేబీ”

నాన్న ఎందులోనూ లోతుగా జోక్యం చేసుకోడు. ఈ విషయంలో నన్ను సున్నితంగా హెచ్చరించాడు.

“అతను మంచివాడే కావొచ్చు బేబీ..! కానీ సహజీవనమంటే కాలక్రమంలో అతనికి నీమీద గౌరవం పోవొచ్చు. ఇప్పుడున్న ఆపేక్షలు ముందు ముందు ఉండకపోవచ్చు. నా సలహా ఏమంటే మీరు పెళ్లి చేసుకుంటేనే మంచిది.”

“ అదేం కాదులే నాన్నా. నేను అన్నీ ఆలోచించాను. నా నిర్ణయంలో మార్చులేదు”

“తప్పు చేస్తున్నావు బేబీ..! ఏదోరోజు బాధపడే స్థితి తెచ్చుకోకు. ఎదురుదెబ్బలు తినకుండా చూసుకో” అమ్మ చివరి హెచ్చరికగా అన్నది.

నేను వాళ్ళ జాగ్రత్తలు, హితవచనాలను పట్టించుకోలేదు. అమ్మానాన్న నన్ను సరిగా అర్థం చేసుకోలేదనిపించింది. నాజీవితాన్ని నేనే మలుచుకోవాలని భావించుకున్నాను. నేను రమణని ప్రేమించాను. అతనితో కలిసి నాకిష్టమైనట్టుగా బతకాలనుకున్నా. జీవితం రొటీన్ కావడం నాకు నచ్చదు. రమణతో సహజీవనంలో ఒకరినొకరు అర్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లిచేసుకోవడం, నా సంసారం.. పిల్లలు.. ఇదే నాక్కావలిసింది.

గడియారం వంక చూశాను. పది గంటలు దాటింది. రమణ ఇంటికి రాలేదు. మరునాడు కూడా రాలేదు. ఆవేశమూ ఆవెనుకే నిస్సహాయతా నన్ను కుదిపివేశాయి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అతనిప్పుడు పనిచేసే కంపెనీకి కాల్ చేస్తే సరైన రెస్పాన్స్ లేదు. పెళ్లి విషయంలో అతన్నుంచి పదేపదే తిరస్కార స్థితిని ఎదుర్కోవడం ఓటమిగా అనిపించి ఆవేదన పెరిగింది. మనసులో అలుముకున్న నా గోడు వెళ్లబోసుకుంటే తప్ప బరువు దిగదనిపించింది. నాన్నతో మాట్లాడే ధైర్యంలేక అమ్మకు కాల్ చేశాను. వెంటనే ఫోనెత్తింది.

“హలో మమ్మీ..!”

“హలో బేబీ..! ఎలా ఉన్నావు. బిజీ అనుకుంటా.. మొన్న ఫోన్ చేస్తే లిఫ్టు చేయలేదు”

“నేను బాగానే ఉన్నాను మమ్మీ”

“మరి నీ గొంతు అట్లా ధ్వనించడం లేదే”

అమ్మ మాటకు తెలియకుండానే ఏడుపొచ్చింది. దుఃఖం గొంతులోంచి జారకుండా సర్దుకున్నాను.

“అవును మమ్మీ..! మేము మళ్ళీ గొడవపడ్డాం. మొన్న ఇంట్లోంచి వెళ్ళిన రమణ ఇంకా రాలేదు”

తల్లికి ఏం అర్థమైందో, ఎలా ఫీలయిందో తెలియదు, కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది.

“చాలారోజులుగా నీకు అబద్ధం చెపుతూ వొచ్చాను. నిజానికి రమణ పెళ్ళికి సిద్ధంగా లేడు మమ్మీ. అడిగితే దాటేస్తున్నాడు.

లేదా ఘర్షణపడి బయటికి పోతాడు. అతనితో సహజీవనం విషయంలో మీరొద్దన్నా వినకుండా తొందరపాటు నిర్ణయం

తీసుకున్నాననిపిస్తుంది”

“పెళ్లి గురించి నువు ఖచ్చితంగా అడిగావా?”

“చాలాసార్లు అడిగాను. అతనిలో ఆ ధ్యాసే లేదు. పెళ్లి, పిల్లలు, ఒక కుటుంబం కోసం నేనెంత ఇష్టంగా ఆరాటంగా ఉన్నదీ చెప్పినా అతడు వినిపించుకోవడం లేదు. రమణ నేను ఊహించుకున్న వ్యక్తి కాదు. నన్నతడు వాడుకుంటున్నాడని అనిపిస్తుంది”

“మీరిలా గొడవలకుపోతే సమస్య తీవ్రమవుతుంది. ఇద్దరూ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోండి. అతని ఉద్దేశ్యమేమిటో తెలుస్తుంది. అంతేకాదు, నీ పరిస్థితేమిటో.. నువ్వెక్కడున్నావో కూడా నీకు అర్థమవుతుంది” అమ్మ చెప్పింది.

సహజీవనం తొలుత స్వర్గతుల్యం అనిపించింది. ఎంతో అన్యోన్యంగా గడిపాం. ఒకరిమీద ఒకరు ఎంతో ఆపేక్ష కనబరిచాం. రోజులెట్లా గడిచాయో తెలియలేదు. గంటలకొద్ది కబుర్లు, సినిమాలు, షికార్లు, వీకెండ్ విహారాలు, మోహాలు, తాపాలు, సుఖాలు. కానీ కాలక్రమంలో సహజీవన చిత్రం రంగు మారసాగింది. నెలలు గడిచినా రమణ ఏనాడూ పెళ్లి మాటెత్తలేదు.  భవిష్యత్ జీవితం, పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అతడు విషయం దాటేస్తూ వొచ్చాడు. పెళ్లి.. సంసారం.. పిల్లలు అంటే అనాసక్తిగా ఉండేవాడు. నాకు అసహనం పెరగసాగింది. అసలు రమణ నన్ను ఇష్టపడ్డాడా అనే సందేహం చాలా  రోజులకుగానీ నాకు కలుగలేదు. అతన్ని గట్టిగా నిలదీసి అడుగలేకపోయాను.

అందుకు అతడు నాకు ద్రోహం చేస్తాడన్న ఊహ నాలో లేకపోవడమే. ఎంత వొత్తిడి చేస్తున్నా అతడు తేలిగ్గా తీసుకున్నాడు.

“పాతకాలపు ఆడపిల్లలా ఏమిటి నీ చాదస్తం..! మనకు పెళ్లి అవసరమేముంది.. ఇప్పుడు బాగానే ఉన్నాముగా”

అతని ధోరణిలో నాకు నిర్లక్ష్యం కనిపించి హృదయం విలవిలాడుతుంది. ఒక అభద్రతా భావన మొలకెత్తి బలపడసాగింది.

అతడు మరో అమ్మాయివేపు మొగ్గుతున్నాడా? వేరే పెళ్లిచేసుకోవాలని చూస్తున్నాడా అనే అనుమానం. ఆ ప్రభావం క్రమేపీ మా సహజీవనం మీద చూపుతున్నది. అతడు అనవసరంగా చిరాకుపడటం, కోపగించుకోవడం సాగించాడు. ఇంట్లో ఉండటం తగ్గించి ఎక్కువగా బయటకు వెళ్లి  వొస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదనిపించింది. అమ్మ చెప్పిన సలహా ప్రకారం అతన్ని నిలదీసి మనోగతం తెలుసుకోవాలి.

***

నాలో ఒక అభద్రతా భావం పెరుగుతున్నది. దానికితోడు నేనిప్పుడు గర్భవతిని.

“రమణా.. అట్లా కూర్చో. మనం సీరియస్ గా ఒక విషయం మాట్లాడుకోవాలి” అతన్ని నిలదీశాను.

కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి రెండ్రోజుల తర్వాత తిరిగొచ్చిన గిల్టీ గానీ, ఇబ్బంది పడుతున్న స్థితిగానీ అతనిలో  కనిపించలేదు. రమణ  అసహనంగా చూస్తూ “ఏంమాట్లాడాలి? పాత పాటేనా? నువు పెళ్లి.. పిల్లలు.. సంసారం అన్నావంటే సారీ..! నాకు వినే ఓపిక లేదు”

“నేను మళ్ళీమళ్ళీ అనేందుకు ఏముంది?  ఈ సమస్య కొత్తది కాదు. ఎన్నోరోజుల ముందే మొదలైంది.”

“ఇందులో సమస్య ఏముంది? మనకేం గొడవలు లేవు. హాయిగా ఉంటున్నాం. సగటు ఆడపిల్లలా ఆలోచించి సమస్యను నువ్వే సృష్టించుకుంటున్నావు”

“అయితే పెళ్లి వద్దంటావు. కలిసి కాపురం చేయగాలేంది పెళ్ళంటే అభ్యంతర మేమిటి? అసలు నీ మనసులో ఎమున్నదీ చెప్పు”

“నాకు ఎలాంటి బాదరబందీలు ఇష్టం లేదు గాయత్రీ ..! జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న మనస్తత్వం నాది. నేను ఇంటరు చదువుతున్నప్పుడే మానాన్న పోయాడు. మా అమ్మే కష్టపడి నన్ను చదివించింది. ఉద్యోగంలో చేరిన తర్వాత కుటుంబం బరువులన్నీ నామీద వేసుకున్నాను. ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిచేశాను. ఇందుకోసం చాలా సర్దుబాటుతో బతికాను. ఇప్పుడు అమ్మ కూడా పోయింది. ఒంటరిని. నాకే బంధనాలు లేకుండా హాయిగా గడపాలని అనుకున్నాను. అందులో భాగంగానే నీతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నా. మనం పరస్పర ఇష్టంతోనే సహజీవనానికి సిద్ధపడ్డాం. ప్రేమ, పెళ్లి, సంసారం, బంధాలు ఇవన్నీ నాకు నచ్చనివి. నువు ఏవేవో ఊహించుకొనివుంటే అందుకు నేను బాధ్యున్ని కాదు. ఇక పిల్లలంటావా.. దానికి ఏనాడూ అంగీకరించను. నాకే జంజాటాలు వొద్దు. జీవితంలో మొదటిసారి స్వేచ్ఛను అనుభవిస్తున్నా. నాకు దీన్ని కోల్పోవడం ఇష్టం లేదు. మళ్లా బరువులెత్తుకోవడం నావల్ల కాదు.”

“ఈ ఆలోచన ఉన్నవాడివి నాతో సహజీవం ఎందుకు? ఎంజాయ్మెంటులో ఇదీ భాగమేనా? పెళ్లి విషయంలో నీకిప్పుడే జ్ఞానోదయమైందా? అంటే… ఇంతకాలం నన్ను ఉద్దేశపూర్వకంగానే వాడుకొని..” మాట్లాడుతుంటే దుఃఖంతో నాకంఠం వొణికింది.

“ నన్ను మాత్రమే దోషిని చెయ్యాలని చూడకు. నీకిష్టం లేకనే నాతో సహజీవనం చేశావా? నాతోపాటు నువ్వూ ఎంజాయ్ చేశావు కదా. కొత్తగా ఈ పెళ్లి.. పిల్లలు అంటూ ఏళ్లతరబడి బాధ్యతలు మోయలేను..సారీ”

“నీ సంసారం, నీకుపుట్టే  పిల్లలు భారం ఎట్లా అవుతుంది? నిన్ను ప్రేమించినట్టే ఇల్లు, సంసారం, పిల్లలంటే నాకు ప్రేమ. రమణా.. అర్థం చేసుకో”

“అయాం సారీ..! ఈ విషయంలో నువు ఎప్పటికీ నిరాశచెందక తప్పదు”

ఒకరోజు అతనికి అసలు విషయం వెల్లడించాను.

“అయామ్ ప్రెగ్నెంట్ రమణా..” చిన్నగా చెప్పినా నాగొంతు స్పష్టంగా ఉంది.

విషయం తెలిసి సంతోషిస్తాడనుకున్నా. కానీ ఏదో వినకూడనిది విన్నట్టు నావైపు తీక్షణంగా చూశాడు. సోఫాలో కూర్చొని ఫోనులోకి చూస్తున్నవాడల్లా ఆపేసి పూర్తిగా నావైపు తిరిగాడు. కోపంగా తల విదిలించి “నో..! అలా జరగడానికి వీల్లేదు. ఈ విషయం ఇన్నిరోజులు ఎందుకు దాచావు? నాకెందుకు చెప్పలేదు?”

“ఇందులో రహస్యం ఏముంది.. సంతోషపడే సంగతే కద. నాకిప్పుడు మూడోనెల”

“కాదు, నువు కావాలనే దాచావు. దీన్నడ్డం పెట్టుకొని నువు అనుకున్నది సాధించాలనుకున్నావు. కానీ పెళ్ళీ, పిల్లలూ నాకెంతమాత్రం ఇష్టంలేదు. నేను టాలరేట్ చేయను అంతే..”

“రమణా.. ఏమిటి నీ ధోరణి? వాట్స్ రాంగ్ విత్ యూ?”

“నో.. ఐ కాంట్ డు దిస్. నువ్వెంత చెప్పినా అస్సలు ఒప్పుకోను. నేను ఒక భర్తగా, తండ్రిగా సెటిలయ్యే మనిషిని కాదు. నా కోరికలు వేరు, జీవితం వేరు. ఐనా ఇప్పుడేమైంది? ముందు కడుపు తీయించుకో. వెంటనే ఆస్పత్రికి పోతే అబార్షన్ చేస్తారు”

“ఇడియట్..!” గట్టిగా అరిచాను. “నీకు బుద్ధుందా? అసలు మనిషివేనా? గర్భం తొలగించుకోమంటావా? బిడ్డకు తండ్రిగా ఇదా నీ మాట? కనీస మానవత్వం కూడా లేదా? పుట్టబోయే బిడ్డలను చంపేస్తూ మనం మాత్రం హాయిగా ఎంజాయ్ చేద్దామంటావా? పశువులా బిహేవ్ చేయకు..” మాటలంటుంటే నన్ను నేను కంట్రోలు చేసుకోలేక ఏడిచాను.

“నువ్వెంత సెంటిమెంటలైనా, నీ ఫీలింగ్స్ ఏవైనా నాకు సంబంధం లేదు. ఏడ్చి గగ్గోలు పెట్టినా లాభంలేదు. నా మనసు మారదు. గుర్తుంచుకో”

దుఃఖం ఆపుకొని నార్మల్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ అన్నాను: “ నిజమే.. నువు మారవు. ఇదంతా నీ తప్పుకాదు, నాది. మొదటినుంచీ నీ మనసులో నిర్ణయాలు ఉన్నాయి. నన్ను నువు ప్రేమిస్తున్నావని నేనే తెలివితక్కువగా నమ్మి మోసపోయాను. జీవితంలో మనిద్దరం రెండు వేర్వేరు ఇష్టాలతో భిన్నమైన అంశాలను కోరుకున్నాం. నిజానికి నీకు నేనంటే ఏనాడూ ప్రేమ అనేదే లేదని నాకనిపిస్తుంది”

“అయితే ఏమిటిప్పుడు..? నన్ను వెళ్లిపొమ్మంటావా?”

“ నువ్వెందుకు.. నేనే వెళ్లిపోతాను. మనమిప్పుడు చేయగలిగేది అదొక్కటే. ఇంతజరిగి.. అసలు వాస్తవం తెలిశాక ఇక మనం ఒకే గూట్లో వుండటం అసందర్భం.. అసాధ్యం” కళ్లవెంట నీరు కారుతున్నా నాస్వరం కటువుగా పలికింది.

మరోమాట లేకుండా అతడు బయటికి వెళ్ళిపోయాడు. రెండ్రోజుల తర్వాత ఫోన్ చేసి తనకు బెంగళూరు బదిలీ అయిందని, వెళ్లిపోతున్నానని తెలిపాడు. శాశ్వతంగా గుడ్ బై అనికూడా చెప్పాడు.

నాకర్థమైపోయింది ఇక అతడు తిరిగిరాడని. ఏమీచేయలేని నిస్సహాయురాలిగా దుఃఖమొచ్చింది. కొంతసేపటికి తేరుకొని మామూలయ్యాను. చేయవలసిన దానిగురించి ఆలోచించాను. జీవితాంతం కలిసి బతకాలనుకున్న మనిషి అసలు రూపం బయటికొచ్చింది. ఒక సంకుచిత నిర్ణయాన్ని అతడు తీసుకున్నాడు. నాకు తోడు కాలేకపోయాడు. అతనికోసం దేబిరిస్తూ.. ఎదురుచూస్తూ ఎందుకుండాలి? బంధాలు వద్దనుకున్నవాడు పెళ్ళికి ఒప్పుకుంటాడా? అతన్ని ప్రేమించడం, నమ్ముకోవడం నాదే తప్పిదం. జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటూ నేనుగా ముందుకు సాగాలనుకున్నా. ప్రెగ్నెన్సీ నిలుపుకోవాలని, బిడ్డను కనాలనే నిర్ణయించుకున్నా. ఆఫీసుకి సెలవుపెట్టి పుట్టింటికి వెళ్లిపోయాను.

***

కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. నాకిప్పుడు ముద్దులు మూటగట్టే పాప ఉన్నది. రమణ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అతని గురించి గుర్తుచేసుకునే తీరికా.. ఇష్టమూ ఇప్పుడు నాలో లేవు. అతడు వెళ్ళిపోయాడు ఇంట్లోంచి, నా బతుకులోంచి. కొత్తదారిలో చాలాదూరం వొచ్చేశాను. ఆశలు వెతుక్కుంటూ బతుకుబాటలో నాదైన రీతిలో సాగిపోతున్నాను.

కాలింగ్ బెల్ చప్పుడువిని వెళ్లి తలుపు తీశాను. అతడు నన్ను దాటుకొని లోపలికొచ్చాడు.

“బాగున్నావా గాయత్రీ..” అంటూ నా జవాబు కోసం చూడకుండా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.

గుర్తుపట్టాను.. రమణ. బాగా మారిపోయాడు. “ఇక్కడికెందుకొచ్చావు? ఎవరు చెప్పారు నేనిక్కడున్నట్టు” చిరాకుపడుతూ అన్నాను.

“మనసుంటే మార్గాలకేం? తెలుసుకోలేననుకున్నావా?”

“మళ్లీ ఎందుకొచ్చావు? ఇంకా ఏంచేద్దామని? నా బతుకేదో బతకనివ్వవా?”

“నీకు కీడు చేద్దామని రాలేదు డియర్. నేనిప్పుడు మారిపోయాను. నీకు మేలుచేద్దామనే వొచ్చాను”

“ఇప్పటివరకు నువు చేసిన మేలు చాలు. నన్నిట్లా వొదిలెయ్యి. బెంగళూరు నుంచి స్టేట్స్ వెళ్ళినట్టు నీ పాత కొలీగ్ అప్పుడెపుడో చెప్పాడు. మళ్లా ఎందుకొచ్చావు?”

“ అవును,  నెలరోజుల క్రితమే ఇండియా వొచ్చాను. ఇప్పుడేమో నీకోసం వొచ్చాను”

“ఏం.. ఇంకెవరూ ఆడవాళ్ళు దొరుకలేదా? నేను నీకోసం తయారుగా ఉంటాననుకున్నావా?”

“అంత కటువుగా మాట్లాడకు డియర్ ..! మీ ఊరువెళ్ళి మీ అమ్మ నాన్నను కలిసి నేను చేసిన తప్పు గురించి చెప్పాను. తప్పును

తెలుసుకున్నట్టు కూడా తెలిపాను. సరిదిద్దుకుంటానన్నాను. వాళ్లు నన్ను క్షమించారు. నువు కంపెనీ మారినట్టూ.. ఒంటరిగానే

ఉంటున్నట్టూ చెప్పారు. నీ అడ్రసు తెలుసుకొని నేరుగా వొచ్చాను”

నేను మాట్లాడకుండా అతనివైపు  చూశాను. రంగుతేలి బాగా లావయ్యాడు. డాలర్లు వొంటికి పట్టి దర్జా అలవడినట్టుంది. నన్ను వెతుక్కుంటూ వొచ్చిన అతనిపట్ల నాలో ఏమాత్రం స్పందన లేదు.

“ఎట్లా ఉండింది అమెరికా జీవితం..? ముఖ్యంగా నీ స్వేచ్ఛా జీవితం”

నామాటల్లోని వ్యంగ్యానికి అతడేమీ నొచ్చుకున్నట్టు కనిపించలేదు.

“మా పెద్ద చెల్లెలు న్యూజెర్సీలో వుంది. ఆమె దగ్గర కొన్నిరోజులు వున్నాను. తర్వాత మరో ఇద్దరితో కలిసి షేరింగ్ ఫ్లాట్ తీసుకొని వున్నాను. ఎక్కువ సంపాదన, కొత్త స్నేహాలు, అమ్మాయిలు.. బాగానే ఎంజాయ్ చేశాను”

“మరింకేం, అక్కడే హాయిగా ఉండకుండా ఇండియాకు ఎందుకొచ్చావు?”

“డబ్బు, స్వేచ్ఛ, ఇవేవీ జీవితంలో అసలైన ఆనందాలు కావని గ్రహించాను. చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా వాళ్ళెవరూ నావాళ్ళనిపించలేదు. వారిలో ప్రేమానురాగాలు, కన్సెర్న్ లేవు. పరిచయాలైనా, స్నేహాలైనా అన్నీ అవసరపూర్తివే. కొందరు నావెనుకున్న డబ్బునుచూసి కమిట్ అయ్యేందుకు సిద్ధపడితే, ఇంకొందరు నాకంటే మెరుగైనవాడి కోసం వెతుక్కున్నారు. ఎవరి స్నేహమైనా కొద్దిరోజులకన్నా మిగల్లేదు. ఒక బంధంలో ఇరుక్కోవడం ఎవరికీ ఇష్టంలేక పోయింది. నాకనిపించింది.. అంతపెద్ద దేశంలో మాచెల్లెలు ఒక్కరు తప్ప నాకోసం నిజాయితీగా  తలచేవారెవరూ కనిపించలేదు”

“ దాదాపు రెండేళ్లు అమెరికాలో వుండి వొచ్చావు. ఎవరినీ తోడు తెచ్చుకోలేదేం..? బాదరబందీ ఎందుకనుకున్నావా? బంధాలు, బాధ్యతలు నీకు సరిపడవు కదా”

నా ఎగతాళి, ఎత్తిపొడుపు రమణ గ్రహించినా పట్టించుకోనట్టు కనిపించాడు.

“ఈపాటికి నువు పెళ్లిచేసుకొని ఉంటావనుకున్నా. కానీ ఒక్కదానివే ఇలా. నీ తెగువను మెచ్చుకుంటున్నా. అన్నట్టు పాప పుట్టిందటగదా. ఏదీ మన పాప..? నాకు చూపించవా?”

“మన పాప కాదు.. నాపాప” నా మాటల్లో కఠినత్వం.

“అయాం సారీ గాయత్రీ ..! నీపట్ల నేను చేసిన ద్రోహానికి ఎంత చింతించానో నీకు తెలియదు. ఏ అమ్మాయితో వున్నా నువ్వే గుర్తొచ్చేదానివి. నేన్నీకు చేసిన అన్యాయం గుర్తొచ్చేది. నిన్ను తలుచుకోకుండా, నీ ఫోటో చూస్తూ నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా లేను. అప్పుడు అర్థమైంది నీ ఉనికి.. నీ విలువ. అంతేకాదు, నిన్ను ఎంత ప్రేమించానో కూడా నాకు తెలిసింది. మనం సంతోషంగా వున్నప్పటి రోజులు పదేపదే జ్ఞాపకమొచ్చి బాధపడ్డాను. దయచేసి నన్ను క్షమించగలవా?”

“క్షమించడానికి నేనేవరు..?  నిన్ను ప్రేమించడం, అట్లాగే నీ మనోగతం తెలుసుకోకుండా, నువ్వూ నన్ను ఇష్టపడ్డావని నమ్మడం నాదే తప్పు. మనిద్దరం జీవితంలో వేర్వేరు అంశాలను కోరుకున్నాం. అది తెలుసుకోలేక చాలారోజులు భ్రమలో నీతో కలిసి బతికాను. అసలు వాస్తవం ఆలస్యంగా గ్రహించినందుకు సిగ్గనిపించింది. నువు కొట్టిన ఎదురుదెబ్బ పాఠం నేర్పింది. నీమీద నాకేం కోపం లేదు. నిన్ను మర్చిపోయాను కూడా. ఇక క్షమించడాలెందుకు? ఎవరి దారులు వారివి. ఎవరి జీవితాలు వాళ్లవి.”

“అట్లాఅనకు..! ప్లీజ్.. ఫర్ గివ్ మీ. నేను చేసిన తప్పును ఇప్పటికైనా  దిద్దుకోనీ. మనం మళ్లా కలిసివుందాం. కాదు, పెళ్లిచేసుకొని మనకంటూ ఒక ఇల్లు, పిల్లలు, కుటుంబంతో ఆనందంగా ఉందాం”

“ఇందులో తప్పు నీ ఒక్కడిదే కాదు. నేను కోరుకున్నదే నువ్వూ కోరుకుంటావని భావించి దెబ్బతిన్నాను. ఇది తెలుసుకునేసరికే నష్టం జరిగిపోయింది”

“నేను మారిపోయాను గాయత్రీ ..! మనం మళ్ళీ అన్యోన్యంగా ఉండగలం. నాకిప్పుడు భార్యా.. పిల్లలూ.. ఇల్లు అన్ని బంధాలు, బాధ్యతలు కావాలి. అన్నిటికంటే ముఖ్యం.. నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ సోమచ్. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే వుంటా. నన్ను ప్రేమించగలవా?” అంటూ అతడు నాచేరువగా వొచ్చి రెండు భుజాలపైన చేతులు వేశాడు.

“నువు స్వీకరిస్తావనే నమ్మకం వందశాతం వుంది. అందుకే మళ్లా వొచ్చాను” అన్నాడు.

అతని ధోరణికి దిగ్భ్రాంతి చెందాను. కొద్దిక్షణాలు బొమ్మలా వుండిపోయాను. అది తనకు సానుకూలంగా భావించినట్టున్నాడు రమణ. నా ముఖం మీదుగా వొంగి పెదాలను నోటితో అందుకున్నాడు. నాకు కడుపులో తిప్పినట్టయింది. అతనిమీద ఎంత విముఖత ఉందో నా శరీర ప్రతిస్పందన చెప్పింది. అతన్ని ఉన్నపాటున వెనక్కి తోసేశాను.

“బయటికి వెళ్లిపో రమణా..! ఇంకెప్పుడూ నాకు ముఖం చూపించకు” గట్టిగా అరిచాను.

బాధపడుతూ చూశాడు రమణ. అతని ముఖంలో  పశ్చాత్తాపం లాంటిది చూశాను. కానీ ఇప్పుడు నా బతుకును తప్ప దేన్నీ నమ్మలేని స్థితి. నాదారిలో నేను చాలాదూరం వచ్చేశాను.

***

గతమూ, వర్తమానమూ అలలుగా కదిలిపోతూ కళ్లు చెమ్మగిల్లాయి.

చేతుల్లో ముఖం కప్పుకున్నాను. నాకు తెలుసు భవిష్యతు పూలపాన్పు కాదని. దారిలో ఎన్నో ముల్లు.. చిక్కుముడులు. కానీ ఎవరి ఆసరా లేకుండా బతకడం నేర్చుకుంటున్నా. ఇప్పుడు నాకు తోడుగా నా ఏడేళ్ళ పాప. నాబిడ్డ నాకో వరంలా వొచ్చింది. నాకున్న ధైర్యంతో, నా చిన్నారి ప్రేమతో ముందుకు సాగుతాను. కష్టం కావొచ్చు. కానీ సాధిస్తాను.

———————–

 

December 31, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us