మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

తెలంగాణ తేజోరూపం

by vanaparti padma October 24, 2021
written by vanaparti padma

నిర్థిష్ఠ లక్ష్యంగా సాహిత్యపు విలువలతో నిరంతర కవిగా మృత్యుపర్యంతం తెలుగు కవితా ప్రపంచంలో వెలుగొందిన అగ్రగణ్యులు సి.నా.రె గారు.  గేయం పద్యం, సంగీత రూపకం, కథాకావ్యం, కావ్యేతీహాసం, వచనకవిత్వం, గజల్‌, పాట నాటిక, వ్యాసం, పరిశోధన, సంభాషణా రచన, విద్యబోధన, వ్యాఖ్యానం, ఉపన్యాసం వంటి అనేక ప్రక్రియలలో ఆరితేరిన సాహిత్య ధీరుడు. తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రను మిగిల్చి వెళ్లిన మానవీయకవి సి.నారాయణ రెడ్డి గారు.  మేరు శిఖరం లాంటి సినారె జన్మదినం సందర్భంగా తిరునగరి శ్రీనివాస్‌ గారి సంపాదకత్వంలో ‘‘కవితా విశ్వంభరుడు’’ అనే కవితా సంకలనం వెలువడించారు.  ఇందులో 71 మంది కవుల కవితా నీరాజనాల సమహారంగా తరతరాలకు ఆదర్శంగా అక్షర పుష్పాల పరిమళంగా నిలుస్తుంది. తిరునగరి శ్రీనివాస్‌ గారు కవి, రచయిత, మరియు జర్నలిస్టు కావడంతో పాటు నారాయణ రెడ్డి గారికి ఆప్తుడు కూడా అతి సమీపంగా ఉండి వారి రచనశైలిని కొంత ఆకళింపు చేసుకున్నారు.  కాబట్టి సి.నా.రె. కవిత్వం, గజళ్ళు, పాటలపై వచ్చిన రచన పై కూడ తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ‘‘జ్ఞానవీచికలు’’ సాహిత్య విమర్శా వ్యాసాలు అనే పుస్తకం కూడా సి.నా.రె జన్మదినం సందర్భంగా ఆవిష్కరించి, గురుభక్తిని చాటుకున్నారు.  ‘‘కవితా విశ్వంభరుడు’’ కవితా సంకలనం, మరియు ‘‘జ్ఞానవిచీకలు’’ వ్యాససంపుటి రెండు పుస్తకములు కూడా నేటి తరానికి, మరో తరానికి అధ్యయనం, పరిశోధనకు ఉపయుక్తంగా వుంటాయనేది అక్షర సత్యం.  ‘‘విశ్వంభరుడు’’ అక్షరాలతో నిరాజనం పట్టిన కవుల అక్షర లక్షల అణిముత్యాల వంటి కవితలను విశ్లేషించుకుందాం…

అక్షరనాదాల్ని పలికించిన విజ్ఞాని / గుండెనిండా విశ్వంభరా తత్వంతో / ఎన్నో అనుభూతుల క్షేత్ర బంధం / అలలెత్తిన మానవత్వం / ‘యశస్వి’ సి.నా.రె. అంటూ వారి జీవితపు సాహితి ప్రస్తావాన్ని వివరించారు.  ‘‘చిత్రం… హాయి భళారే విచిత్రం’’గా మదిలో మీ జ్ఞాపకాలు నింపి / కానరాని లోకానికి ఎలా వెళ్లారు / ‘‘విశ్వంభర’’ తో జ్ఞానపీఠాన్ని అదిరోహించి మీరు ఇంద్రుడి పీఠాన్ని అధిరోహించటానికి వెళ్లారా / అంటు మదినిండ అక్షరాలు నింపిన జ్ఞాపకాలతో జీవిస్తాము అంటూ మనోవేధనను వ్యక్తం చేశారు.

శబ్దసౌందర్యాలు సైనిక కవాతులై సాగేవి / పొద్దును పాట చేసి / భూగోళమంతా భూపాలరాగమైన వెన్నెలపాట / సర్వసామాన్యుడు / బహుముఖీన ప్రతిభా ప్రభాతుడు అంటు ‘‘వనపట్ల సుబ్బయ్య’’ వెన్నెల పాటగా కవిత్వీకరించారు.  ‘‘ఆయన ఈ అనంతమైన / సాహిత్య వెలిగే జ్యోతి / ఆసాంఘిక శక్తులపై ఉరిమిన ‘‘మహద్యుతి’’ అంటారు మౌనశ్రీ మల్లిక్‌.  మలి జ్ఞానపీఠ విశ్వంభరుడా ‘‘మాకు దూరమై మీ… పెన్నుమూ ‘‘సి.నా.రె’’! అంటూ తను లేడనే నిజాన్ని జీర్ణించుకోలేని డా॥ అమ్మిన శ్రీనివాసరాజు గారి వ్యధ నే మూడక్షరాలు.  ‘‘పద్మభూషణంతో, జ్ఞానపీఠంలో నింగికెగసినారె నిత్యమయినారె / ధృవతారగా నిలిచిపోయినారె అంటు డా॥ రామకృష్ణమూర్తి గారు సి.నా.రె. ను చిరంజీవిగా చేశారు.  ‘వగలరాణివినీవే’ నంటూ అక్షరాన్ని వంపులు త్రిప్పిన సముద్రుడు / ‘మబ్బులో ఏముందని’ అంటునే ఆ చోటికే తరలిపోయిన తపస్వి / ‘‘అభినందన మందరామాలలు’’ ఎన్ని వేసిన సరిపోవు అంటు ‘‘పాటల రారాజు’’గా మల్చినారు.  యలమర్తి అనూరాధ ‘‘కృష్ణవేణి నడకలా… సాగించిన సృజనకారుడు!’’ / తెలుగు పదాలను కర్పూరం / వసంత రాయలకు కావ్యమల్లిన / కవి శిఖమణి సి.నా.రె. అంటారు.  ‘‘కిలపర్తి దాలినాయుడు’’

‘‘గలగలపారే జలపాతమై / ధీర, గంభీర వీరతలతో / సాహితీ సీమను అలరింప చేసిన మహకవి, మహోన్నత కవికి వందనం చేశారు.  ‘‘కవిసార్వబౌముడు’’ అనే శీర్షిక ద్వారా శనిగరపు రాజమోహన్‌ ‘‘పేదలకన్నీటిలో తడిసిన కష్టం / పెద్దల పెదాలతో పలికిన జీవిత సత్యం ఆయన కవిత్వం’’ అంటూ సి.నా.రె. పదాల అల్లికను చెప్పారు.  డా. గంజి భాగ్యలక్ష్మి, ‘‘అతడొక సాహితి యుద్దనౌక / ఎడారిలో సైతం పయనించే శక్తి / సాహితి లోకానికే ఆయనొక స్ఫూర్తి’’ అంటారు టి.వి. అశోక్‌ కుమార్‌.  ‘‘తెలంగాణ అక్షరకీర్తి, కిరీటం, కవితా తపస్వినిత్య ప్రగతిశీలి, అభ్యుదయవాది, మానవతామూర్తి, కవితా జాతిరత్నం’’ అంటూ సి.నా.రె. గారి కీర్తిని అక్షర శిఖరాల్లో నిల్పినారు ఎల్గటి తిరుపతిరెడ్డి. ‘‘అభినందన మందార విశ్వంభర సాహితి సారంగధర సినారె… దివికేగిన గేయతార తెలుగు కావ్యధార అజరామర సినారె… అంటూ కవి ఎపుడు అమరుడె అన్నట్లు గుమ్మడి రామలక్ష్మి తన కలం ద్వారా వెల్లడిరచారు.  ‘‘సాహిత్య సమరంలో గెలిచి నిలిచిన అక్షర తపస్వి / విశ్వజనీనతకు నిదర్శనం / మన తెలుగు వెలుగుల తేజం సి.నా.రె అంటూ సాహిత్య జగత్తులో అక్షరాలను నక్షత్రాలుగా మల్చిన తేజో రూపం సి.నా.రె వారు ప్రతిభకు పట్టంకట్టారు వనపర్తి పద్మావతి.  మాతృభాష సినారె / మధుర కవిత సినారె / మహిలోపల వెలిసినట్టి / మహాకవి సినారె అని ‘‘మణిపూసలు’’ గా మల్చారు వడిచర్ల సత్యం.  సినీ జగత్తు నీ పాటకు దాసోహం అంది, కర్పూర వసంత రాయల్ని పలకరించినా, నాగార్జున సాగరాన్ని తాకిని నీ మాటల ప్రతిధ్వని మనసును తాకుతుంది.  మహాకవి ప్రణామం అంటాడు కందుల శివకృష్ణ సాహిత్యపు బాటసారి… శీర్షికతో.

‘‘తెలుగు భాషా దురంధురుడు / సాహితి విశ్వంభరుడు / మీగజల్స్‌ అద్భుతాలు భళారే / మిమ్మల్ని ఎప్పటికి మరువలేరే సినారె అందుకోండి మా జోహారే అని అద్దేపల్లి జ్యోతి సినారె గారికి ‘పరిపూర్ణుడు’ అంటు జోహార్లు అర్పించారు.  ‘‘సినిరంగాన్ని ఉర్రూతలూగించి మెరిసిన వెండి తెరధృవతార / వివిధ రంగాల్లో ప్రతిభను చూపి చెరగని ముద్ర వేసిన గురువుకు నా కవితా సుమాంజలి అని డా. చీదెళ్ల సీతాలక్ష్మి అక్షరసుమాలు అర్పించారు.  ‘‘ఓ పద్మశ్రీ… నీకలం పగలే వెన్నెలను, వెన్నెలలోని చల్లదనాన్నే కాక సాగర ఘషను వినిపించింది’’ అని విశ్వకవికి వందనం… అంటారు లింగాల రజని. ‘‘ఆ కలం నడక అమృత వర్షం / ఆ గళం సాహితీ పరవశం / ఆ  స్నేహం పుస్తకాల పరిమళం’’ ‘‘మీ బాటలోనే’’ మేము అంటారు ఉండ్రాళ్ళ రాజేశం. ‘‘చిరంజీవిగా చరితార్థులు సినారె / తెలుగు సాహిత్యాంబరంలో / శోభాయ మానంగా వెలిగె స్మరణీయ నారాయణ ధృవతారమీరె’’ ధృవతారగా వెలుగొంది సాహితి లోకానికి వెలుగులు పంచాలనే ఆశ మనోహర్‌ రెడ్డి గంటా.  మరెందరో కవులు, కవయిత్రులు, వ్యధతోను, గౌరవంతోను, ఆవేధనతోను ఓ మహామేరు పర్వతమే సాహితిలోకాన్ని విడిచింది అని తెల్సినప్పటికి కవుల కలంగళం ఎప్పటికి సినారెగార్ని తమవెంట ఉన్నట్లుగానే భావిస్తున్నారు.  సినారె గారు మన మధ్య లేకపోవచ్చు కాని వారు రాసిన కవిత్వం సిని గేయాలు, గజళ్ళు, అన్ని కూడా సాహితి వినిలాకాశంలో ఉన్నంత వరకు సినారె అజరామరుడు.  చిరంజీవి అంటు నీరాజానాలు అర్పిస్తు విశ్వంభరుడుని విశ్వవ్యాప్తం చేశారు.

తిరునగరి శ్రీనివాస్‌ కలం నుండి జాలువారిన మరో పుస్తకము ‘‘జ్ఞాన వీచిక’’ సాహిత్య విమర్శా వ్యాసాలు ఇందులో 25 వ్యాసాలు ఉన్నాయి.  సాహిత్యాన్ని మలుపులు తిప్పిన ప్రయెగశీలి సినారె గారు.  ‘‘వాక్కుకు వయస్సు లేదని’’ ప్రవచించిన సాహిత్యాన్వేషి, ‘నవ్వనిపువ్వు’ మొదలుకొని, ‘‘నా రణం మరణంపైనే’’ వరకు 86 గ్రంథాలను రాసిన నిలువెత్తు తెలుగు సాహిత్య సాక్ష్యం.  అనుభూతి కేంద్రం ఆయన కవిత్వం.  విభిన్నసాహిత్య తాత్విక కోణాలను శోధించిన సమగ్ర పరిశోధన సినారె రచనలు అలాంటి రచనల పై సాహిత్య విమర్శా వ్యాసాలను అక్షరాలక్షలను ప్రోది చేసి భావితరాలు సులభ శైలిలో తన కలం ద్వారా ‘జ్ఞానవీచిక’ అందించారు రచయిత శ్రీనివాస్‌.

1931 జులై 29 నుండి 12 జూన్‌ 2017 వరకు నిర్ఠిష్ట లక్ష్యంతో సాహిత్యపున విలువలతో ‘‘నిరంతరకవి’’గా తెలుగు కవితా ప్రపంచంలో వెలుగొందిన అగ్రగణ్యులు కవిత్వమే చిరునామా, శ్వాసగా మార్చుకున్న నిరంతర బాటసారి సాహితీ ఉన్నత శిఖరం సినారె.  ‘వాక్కుకు వయస్సు’ లేదన్న సాహిత్యాన్వేషి, ‘నవ్వని పువ్వు’ మొదలుకొని ‘‘నా రణం మరణం పైనే’’ అంటూ 86 గ్రంథాలను రచన చేసి మధుర కవితాక్షర జలపాతాలను పొంగించారు.  ‘‘నడక నా తల్లి పరుగు నా తండ్రి సమత నా భాష’’ అన్న కవితా వారి ప్రతిభా సమ్మేళనానికి నిదర్శనం.  ‘‘చిన్న నాటి మురిపెం ఇప్పటికి నా గుండె గూటిలో పదిలంగా ఉంది’’ అంటూ హృదయ నేత్రాలలో దివ్యత్వంగా బాల్యాన్ని దాచుకున్నారు.  చైతన్యం రంగరించుకున్న రవి లాంటి కవి సినారె తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన సాహితీ చైతన్య దీపం.

సాహిత్య ప్రపంచంలో ఓ అపూర్వ ప్రయోగంగా నిలిచింది.  ‘ప్ర’ పంచపదులు, భావపరిణతికి, చందోవైవిద్యానికి పరాకాష్టగా నిలిచి వెలిగింది ఈ కావ్యం.  ‘ప్ర’పంచపదులు అన్న కూర్పులో అనేక అర్థాలున్నాయి.  ‘ప్రపంచించి’ చెప్పడం అంటే ‘విస్తరించి చెప్పడం’ అని అర్థం.  ‘ప్రపంచ’ అని కలుపుకుంటే లోకతత్వాన్ని బట్టి చెప్పిన పదాలని తెలుస్తుంది.  మానవ సమాజ పరిణామతత్వానికి సినారె అందించిన నిరంతర మూల్యాంకన ఫలితమే ‘‘ప్ర’’పంచపదులన్నది అక్షరాక్షర సత్యం, మానవ సమాజాన్ని విశ్లేషించిన సినారె మహత్తర హృదయావిష్కరణే ‘ప్ర’పంచ పదులు అంటూ విశ్లేషించారు  రచయిత.

‘‘ఒళ్ళంతా కన్నీళ్ళయిన జీవితం’’ పట్ల కనబరిచిన ఆర్తినారాయణ రెడ్డి కవితా వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు.  40సం॥ సినారె కవితా కృషికి సంకేతంగా ‘ది బెస్ట్‌’ అనే ఉద్దేశ్యంతో కాకుండ ‘ఆల్‌ ఆర్‌ ది బెస్ట్‌’ అనుకున్న కవితలను ఎంపిక చేసి ‘నిరంతరం’ను ప్రచురించారు.  ‘‘తరం మారుతుంది ` ఆ స్వరం మారుతున్నది / వందేమాతరం గీతం వరుస మారుతున్నది’’ అనే కవితలో అభివృద్ధి వైపుగా కనబరుస్తున్న నిర్లిప్తత, నిర్లాక్ష్యాన్ని ఎండగడుతూ చిదిమి వేసినా వదలని చీడ అంటుకుని ముసి, ముసినవ్వుల మాటున విషం మరుగుతున్నదని వేదన చెందారు.  ‘‘కాలం ఇసుకలో దిగబడ్డ కాళ్ళను పెరుక్కుంటూ వేళ్ళమీద నడుస్తున్న మాతృభారతిని ‘జాగ్రత్త  సుమా అంటూ ముందు జాగ్రత్త చెప్పారు.  ‘‘ఆకలేస్తే వీధి దోసిలి / ఆగ్రహిసై వీధి పిడికిలి’ అంటూ నిన్ను నిన్నుగా నిలిపి భుజం తట్టే మహాభోధి వీధి’ అంటారు.  శబ్దశక్తితో కూడిన హృదయ స్పందనలకు చైతన్యాన్ని రంగరించి నిరంతరం కవిత్వాన్ని అజేయంగా, ఆప్రతిహతంగా సినారె గారు ఆవిష్కరించారు.

ప్రౌడ నిర్భరవయః పరిపాకంలో ప్రచురించిన కవితాసంపుటి ‘వ్యక్తిత్వం’ 69వ జన్మదినంన వెలుబడిన ఈకృతిలోని కవితల్లో సినారె క్రాంత దర్శిత్వం ప్రస్ఫుటించడం ప్రత్యేక విశేషం, అత్యాధునికుడుగా సృజన చేసిన ప్రతిభాశాలి ‘వ్యక్తిత్వం’ సంపుటిలోని ప్రతికవితా నవనవో న్మేషమైందె అనడంలో సందేహం లేదు.  ‘‘గుండెకు నిప్పంటుకుంది అర్పడానికి నా దగ్గం కన్నీళ్ళు లేవు’’ అనే పంక్తుల్లో సమాజంలో ఒక గుండె బాధతో రగులుతున్నపుడు సానుభూతీదయాచూపలేని కఠినాత్ములను మెత్తగా మందలించిన తీరు బాగుంది అంటారు వ్యాసకర్త శ్రీనివాస్‌.

సినారె వెలువరించిన అత్యాధునిక, ఆలోచనాత్మక కవితా సంపుటి ‘‘కవితావ్యక్తిత్వం’’ వర్తమాన పరిస్థితుల మధ్య సినారె ఎగురవేసిన మానవీయపతాకం ‘వ్యక్తిత్వం’

‘‘ప్రకృతిలోని చలనశీలానికి పరిణామం మనిషి / జగతిలోని భ్రమణ గుణానికి ప్రతిరూపం మనిషి అనే మానవతా వాదాన్ని మకుటాయమానం చేసుకున్నారు.  ఐదు ప్రకరణాల సమగ్రకావ్యం 1980లో ‘‘విశ్వంభర’’గా మానవ  పురోగమనశీలితకు నడకలు నేర్పిన కావ్యంగా ప్రచురితమై జ్ఞానపీఠపై నిలిచింది సినారె గారి రచనాశిల్పం.  మానవత్తత్వం, అలంకార ఔచిత్యం కల్పనం, శబ్ధ, ఉదాత్తభావమై సమనిష్పత్తిలో కలిసి హృదjైుక, వేద్యమైన ప్రతికాత్మక కావ్యం ‘విశ్వంభర’ జ్ఞాన బీజమే విశ్వంభరాభ్రమణానికి శాశ్వతచైతన్య తేజమై నిలిచింది.  నాయకుడైన మానవునికి విశాల విశ్వంభరనే జీవన రంగస్థలంగా మలిచి చూపిన మహాకావ్యమైంది ‘‘విశ్వంభర’’

చిరకాలం స్మృతిపదంలో నిలిచే  మనోజ్ఞ కళాఖండాలుగా కథాకావ్యాలను మలిచాడు.  సి.నా.రె.  ‘‘జాతిరత్నం’’ ‘‘విశ్వనాథనాయుడు’’ కర్పూర వసంత రాయలు, ‘‘సప్నభంగం’’ ‘‘నాగార్జున సాగరం’’ లాంటి రచనా వైచిత్రిని అనుభూతుల దృశ్య పరంపరలను కళ్ళముందు నిలుపుతాయి.  ఉదయం నా హృదయం మధునం, విశ్వగీతి, భూమిక, సమదర్శనం, మావూరు మాట్లాడిరది, ముఖాముఖి సమీక్షణం, రామప్ప, గాంధీయం, మీరాబాయి, శిఖరాలు, లోయలు, ముత్యాలకోకిల, మందార మకరందాలు, మట్టిమనిషి, ఆకాశం, నిరంతరం, విశ్వంభర వంటి కావ్యాలలో అనవరతంగా పరిజ్ఞాణంతో సాగిన సినారె రచనా ప్రయాణపు మలుపులు, మార్పులు, వారు ఇచ్చిన తీర్పులు పరిశోధనాత్మక విమర్శకు, విశ్లేషణలకు ద్వారాలు తెరిచాయి.  కవిత్వాన్ని గుబాళింపచేసే లక్షణాన్ని పుష్కలంగా కలిగిన కవి కావున కవిత్వమే సినారెకు శ్వాసగా మాతృభాషగా మారింది.

అంత్యప్రాస, పూర్వాంత్యప్రాస నియతితో ఫారసీ, ఊర్ధూకవితలోని రదీప్‌, ఖాసియా చందస్సులో ‘తెలుగు గజళ్లను’ సృజించి విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకవచ్చారు సినారె గజల్‌పల్లవి ‘మత్లా’చరణం ‘ముక్తా’ కవినామముద్ర ‘తఖల్లుస్‌’, నారాయణరెడ్డి గజళ్లలో తఖల్లుస్‌ ‘సినారె’’ తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి స్మృతిలో ప్రఖ్యాతమై విఖ్యాతిపొందిన తెలుగు గజళ్లనెన్నింటినో రచించి స్వరకల్పన చేసి స్వయంగా గానం చేశారు. ‘అమ్మ’ లాంటి వాళ్లమ్మాయి ‘గంగ’కు తన గజళ్లను అంకితమిచ్చారు.  35 గజల్‌ను ‘‘సినారె గజల్స్‌’’ పేరిట పుస్తకంగా వెలువరించారు.  అంతకు ముందే ‘తెలుగు గజల్‌లు’ కూడా ఆయన లేఖిని నుండి వచ్చాయి.  ‘మత్లా’ మొదులుకొని ‘మక్తా’ వరకు అన్ని పాదాల్లో మాత్రా సంఖ్యాసమత్వాన్ని పాటిస్తూ ‘కాఫియా’ స్వరూపంలో స్వేచ్ఛ తీసుకుంటు గజళ్లలో కూడా యతి నియతిని పాటిస్తూ సినారె గజల్స్‌కి పరిపూర్ణత తీసుకవచ్చారు.

ఆచార్య సినారె ప్రతినిత్యం నడకలో సహచరుల పలకరింతలకు బదులు పలుకుతూనే మనసులో పంక్తుల అట్లుకుంటూ చెప్పగా వెలుబడిన ‘ద్విపదులు’ ‘కలం సాక్షిగా’ పేరుతో 1995 సం॥లో ప్రచురించబడ్డాయి.  చతురస్ర, మిశ్రతిస్ర గతులలో సాగిన ఈ ద్విపదులు నడకలో జనించిన ముత్యాలుగా, మనసుకు అద్దం పట్టిన మౌలిక సత్యాలుగా అభివర్ణించారు. కత్తిరిస్తేనే మొక్కలు కొత్తగా చిగురు పెడతాయని చెప్పిన సినారె బీజం చిన్నదైనా దిక్కులను కాపాడె దిక్కయ్యే పచ్చని చెట్టుని ప్రసవిస్తుందని సూచించారు.  ‘కరగని జీవన నిధులు’’గా నారాయణ రెడ్డి ద్విపదులుగా భాసించాయి.  ‘‘ఊపిరిగాడ్పులు చెలరేగుతున్నాయి / ఉరికే రోజులతో చేయి కలిపి నా మనసు పరుగులు తీస్తున్నది / పరిసరాల ప్రశంసలతో… ముంచేస్తున్నవి.  అనే ఉరికే రోజులు ` సినారె చివరి ప్రచురిత కవిత ‘‘మన తెలంగాణ’’ దిన పత్రిక ` కలం పేజీలు 12/6/2017 లో అచ్చు రూపంలో ఉంది.  ‘‘చెక్కనిదేశిల కడుపున శిల్పమెలా పుడుతుంది / మరగనిదే నీరు ఎలామబ్బు రూపుకడుతుంది / నలగనిదే అడుగు ఎలానటన రక్తి కడుతుంది’’ అన్న సినారె మరణం సాహిత్య ప్రపంచానికి, సాంస్కృతిక వైభవానికి ఎంతో లోటును మిగిల్చింది.

‘‘సంకల్పం అచంచలంగా వుంటే / ఈదగలిగే చేతులకు సముద్రాలు లొంగిపోతాయి’’ అనే ధీమాను వ్యక్త పరుస్తూ 116 కవితలతో తన 86వ జన్మదినోత్సవ సందర్భాంగా సినారె గారు ‘‘నా రణం మరణం పైనే’’ అన్న కవితల సంపుటిని వినూత్న వస్తు వైవిద్యం, భావవైశిష్ట్యం, శిఖరస్థాయిలో అభివ్యక్తిని సంతరించుకున్న కవితలను ఈ సంపుటిలో చేర్చారు.  ‘‘తొలి ఊపిరి జననం, తుది ఊపిరి మరణం’’ అని తెలిసిన ప్రాణికి కరిగిపోయిన జీవనకాలంలో తాను మిగిల్చిన పునాదులే మరణానంతర సజీవత్వాన్ని ఆపాదిస్తాయని అ ంటారు.  మరణాన్ని జయించే దైర్యపు ధీరతనే జీవిత వృక్షాన్ని అక్షయంగా నిలుపుతుందన్న ఆశావాహ దృక్పథాన్ని నారాయణ రెడ్డి గారు వ్యక్తం చేశారు.  పరిపక్వఫలభరితమై తరుదశకు చేరుకుని అన్నీ తట్టుకుని నిలబడే మనుగడల జీవిత వృక్షాన్ని కాంక్షించారు.  వారి వారసులుగా మనం సాగుదాము అంటూ తిరునగరి శ్రీనివాస్‌ వారి వ్యాసాల ద్వారా తెలిపారు.  ఈ సాహిత్య విమర్శా వ్యాసాలు భావితరాలకు పరిశోధనకు నాందిపలుకుతాయని భావిస్తున్నాము.

‘‘చినుకును రమ్మని చిటికేశాను అది జల్లై వచ్చి కురిసిపోయింది చిగురును చేత్తో నిమిరి చూశాను అది నూరు రేకుల పువ్వై విచ్చుకుంది.  తారను ధగధగ వెలిగిపో అన్నాను, అది మధ్యాహ్న సూర్యబింబంలా ఉజ్వలించింది’’ అనే పంక్తుల్లో ప్రకృతిలో మనిషి మమెకమైతే సంపదలను ఇస్తుంది.  ఆదే ప్రకృతిని విధ్వంసం చేస్తే కల్లోలం సృష్టింస్తుంది.  వ్యక్తి నీతిగా, న్యాయంగా, నిస్వార్థంగా మానవతా దృష్టిలో తోటి వారిని ఆదుకోవాలనే సమన్యాయం వీరి రచనల్లో ఉన్నాయి.  ఓ మేరుపర్వతం లాంటి భావకుడు స్పర్శించిన అక్షర జ్ఞానం మనకిచ్చిన అక్షర వరాలుగా భావిస్తూ ఆదర్శవంతమైన, సాహితి విలువలతో కూడిన రచనలు చేయటానికి ఆదర్శనీయులు మన ఆచార్య సి.నారాయణ రెడ్డి అంటారు శ్రీనివాస్‌ తిరునగరి.

 

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

*సామాజిక స్పృహతో చేసిన రచన–చైతన్య జ్యోతి*

by vedartham Madhusudana sharma October 24, 2021
written by vedartham Madhusudana sharma
      నేటి సమాజములో మానవతా విలువలను పెంపొందించుటకు,సామాజిక ప్రగతి సాధించుటకు,సమాజము లోని లోటుపాట్లను ఎత్తి చూపి,వాటికి పరిష్కార మార్గాలను సూచించుటకు,గొప్పనైన సంస్కృతి,సంప్రదాయాలను గురించి తెలియజేయుటకు,సన్మార్గానికి దారిదీపాలైన మహనీయుల చరిత్రను భవిష్యత్తు తరాల వారికి అందించుటకు సాహిత్యము ఏకైక మార్గమని తన కవిత్వము ద్వారా పాఠకులకు తెలియజేసేందుకు మన ముందుకు వచ్చారు డా.పోలా సాయి జ్యోతి గారు.
      వీరు తెలుగు భాషా అధ్యాపకురాలిగా విద్యార్థులకు తెలుగు భాషా,సంస్కృతులను గురించి తెలియజేస్తూనే,సమాజము లోని ప్రతి ఒక్కరికీ తన కవిత్వం ద్వారా హితబోధ చేస్తున్నారు.”హితేన సహితం సాహిత్యం ” అన్నారు కదా పెద్దలు.
       ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాహిత్యములో రాణిస్తున్న అతి కొద్దిమంది మహిళల్లో శ్రీమతి సాయి జ్యోతి ఒకరు.వీరి ప్రస్తుత రచన “చైతన్య జ్యోతి”.ఇందులో ఉన్న కవితలన్నీ వివిధ సందర్భాలలో రాసినవి.అనేక కవితా సంకలనాలలో ప్రచురించబడినవి,వివిధ కవి సమ్మేళనాలలో చదివినవి.ఆయా కార్యక్రమాల నిర్వాహకులు విధించిన నిబంధనల మేరకు ఇవి రాయబడినవి కాబట్టి రాసిలో చిన్నవైన వాసిలో గొప్పవి.కవితలను చదువుతూ వెళ్తుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది.వారు చెప్పిన విధముగా కొన్ని వాక్యాలలోనే విషయాన్ని చెప్పడం కత్తి మీద సాము వంటిది.పాఠకులను ఆకట్టుకునేలా,పరిధి లోపల రాయడం అనేది ఎంతో చాకచక్యంతో కూడిన పని.అయితే ఆ పరిధిని దాటకుండా ఆయా అంశాల గురించి తనదైన శైలిలో అద్భుతమైన కవిత్వాన్ని రాసి సాహిత్యజ్యోతిగా పలువురి చేత ప్రసంశలు అందుకున్నారు ఈ కవయిత్రి.
      ఈ పుస్తకములో శ్రీమతి సాయి జ్యోతి మొదటగా తన ఇష్ట దేవతలైన శ్రీ గణేశుడు,శ్రీ వేంకటేశ్వరుడు మొదలైన వారికి ప్రాణామములు అర్పించి,పూర్వకవులైన పోతన,సురవరం,యశోదా రెడ్డి,పి. వి,సినారె,కపిలవాయి తదితర సాహితీ మూర్తుల భాషా సేవలను స్మరించుకోవడం అనేది మంచి సంప్రదాయం.
         తర్వాత వీరు అనేక సామాజికాంశాలు అయిన తెలంగాణ,శిల్పి,ఓటువిలువ, జలం,శ్రమైక జీవనం,వృద్ధాప్యం,వరకట్నం,కాలుష్యం,పాలమూరు,కందనూలు ఘనత మొదలైన వాటిని స్పృశించారు.

           వీరు ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే  పండగ లైన ఉగాది,బతుకమ్మ,బోనాలు,రాఖీ ల గురించి తన కవిత్వములో చక్కగా తెలియజేసారు.
          మాతృభాషా గొప్పతనాన్ని వీరు సాహిత్యం,అక్షరామాలిక,జ్ఞానదీపం,తెలుగు భాష,జ్ఞానకోవెల,మాతృ భాషా వంటి కవితల్లో తనదైన శైలిలో చిత్రించారు.
           అంతేకాకుండా భారతదేశ రక్షణ కొరకు తమ కుటుంబం,భార్యా పిల్లలను వదలి,ప్రాణాలను సైతం లెక్క చేయక,విపత్కర పరిస్థితులలో సరిహద్దుల్లో పహారా కాస్తున్న వీర సైనికుల ప్రాణ త్యాగాలను స్మరించుకుని తన కవిత్వము ద్వారా శ్రద్ధాంజలి ఘటించారు.
        నేడు ప్రపంచం మొత్తాన్ని కంటిమీద కు నుకు లేకుండా చేసి,తన ప్రతాపంతో ఎన్నో లక్షల మంది ప్రాణాలను బలి గొంటున్న కరోనా మహమ్మారి గురించి,దాని ప్రతాపం గురించి దాదాపు 10 కవితల్లో తెలియజేసింది.దీన్ని నిలువరించుటకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్బంగా చేయడానికి పనిలేక,తినడానికి తిండిలేక సొంత వూరికి వెళ్లి, కలో గంజో తాగుదమని బయలుదేరిన వలస కార్మికుల కు సరైన రవాణా సౌకర్యాలు లేక కాలినడకన మైళ్ళ కొద్దీ ప్రయాణిస్తున్న వారి కష్టాలను గురించి చక్కగా వివరించింది సాయి జ్యోతి.
          అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ బంగారు తెలంగాణ,మిషన్ భగీరథ,కెసియార్ వంటి కవితల ద్వారా తన కృతజ్ఞతను చాటుకున్నారు.
        ఇంకా తనకు జన్మ నిచ్చిన అమ్మ నాన్నల గురించి,భార్య గొప్పతనం గురించి,మానవీయ విలువల గురించి,మాన సంవేదనలు అయిన సంతోషము,ఆనందం, మొదలైన వాటి గురించి గొప్పగా తన కవితల్లో చిత్రించారు.
         ఈ విధంగా వైవిధ్యభరితమైన అంశాలను కవిత్వీకరించి ఒక్క చోట రాసిపోసినట్లుగా ఉన్న డా.పోలా సాయి జ్యోతి గారి ఈ పుస్తకం ఒక పూల సింగిడిగా పేర్కొనవచ్చు.వీరు భవిష్యత్తులో మరిన్ని రచనలు చేసి గొప్ప సాహితీ వేత్తగా ఎదగాలని కోరుకుందాం.
October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

సంభవామి యుగేయుగే …

by Jayanti Vasara Chetlu October 24, 2021
written by Jayanti Vasara Chetlu

ఊరి వెలుపల విసిరేసినట్టుగా కనిపిస్తున్న ఒక పది గుడిసెలు

ఎవరూ లేని నిర్జన ప్రదేశం.

మురికి తుమ్మ చెట్లు పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఆ ప్రదేశమంతా ఇలా కనిపిస్తుంది.

దగ్గరికి వెళ్లి చూస్తే గానీ తెలియదు అక్కడ మనుషులు నివాసం ఉంటున్నారని …..సువర్ణ టీచర్ ఆవాడంతా తిరిగి అక్కడి పిల్లల గురించి ఆరా తీస్తుంది.

 

స్కూల్స్ తిరిగి మళ్ళీ ప్రారంభం కావడంతో ఊర్లో ఉపాధ్యాయులందరూ

క్యాంపేయిన్  చేస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్న దాదాపుగా అందరి ఇళ్ళలో కి వెళ్లి పరామర్శించి వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి కోవిడ్  నిబంధనలు ఏమిటో తెలియజెప్పి అవగాహన కల్పిస్తున్నారు.

2 సంవత్సరాల క్రితం ఉన్న ఆ ఊరికి ఇప్పుడు చూస్తున్న సమయానికి ఊళ్లో చాలా మార్పులు కలిగాయి.

గ్రామమంతా చిందరవందరగా ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయింది.

పాఠశాల ఆవరణమంతా దుమ్ము కోట్టుకుపోయింది ఇంతకుముందు స్కూల్ ను కోవిడ్ పేషెంట్స్ కోసం ఐసోలేషన్ వార్డుగా  ఉపయోగించారేమో  శుభ్రం చేయకుండా ఎక్కడికక్కడే మురికి గా ఉంది పాఠశాల మొత్తం .

***********

“ఊరంతా చాలా పాడైపోయింది ఏం చేద్దాం సార్ ….? అన్నాడు హరీష్ అనే ఒక ఉపాధ్యాయుడు.”

“గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ అతనితో చెప్దాం అని మరో ఉపాధ్యాయుడు రఘునాథం అన్నాడు.”

” ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది

మళ్ళీ మనం తిరిగి మన ఊరికి వెళ్లి పోవాలి కదా సర్ …!!

భోజనాలు చేయడానికి కూడా సౌకర్యంగా లేదు ఏం చేద్దాం అన్నది సువర్ణ టీచర్.”

“మనం నడుస్తూ మాట్లాడుకుందాం పదండి టీచర్ అంటూ బ్యాగులు తీసుకుని సర్పంచ్ ఇంటికి బయలు దేరారు.”

*************

 

“నమస్కారం సర్పంచ్ గారు అన్నారందరూ ఎదురుగా కనిపిస్తున్న సర్పంచ్ ను చూస్తూ…..!!”

నమస్కారం సర్, మేడం బాగున్నారా అన్నాడు అతను.

భోజనాలు అయ్యాయా పరామర్శించాడు.

విషయం చెప్పారు వాళ్ళు.

“ఇప్పటికైతే మన ఇంట్లోనే భోజనాలు చేయండి రేపు మీరు వచ్చేసరికల్లా క్లీన్ చేయిస్తాను అన్నాడు సర్పంచ్.”

అందరూ భోజనాలు ముగించుకుని పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అని ఆరాతీసారు టీచర్లు.

కొందరు తల్లిదండ్రులు కోవిడ్ బారినపడి మరణించారు.

“కొందరు పిల్లలను కోల్పోయారు. అంటూ ఊరిగురించిన సమాచారం అందించాడు సర్పంచ్.”

” సర్ ఫోటోకు దండవేసారు…అంటూ సాగదీస్తూ ఎదురుగా ఉన్న ఫోటో చూసి అన్నాడు రఘునాథం .”

“మా అమ్మాయి సార్ కోవిడ్ నా బిడ్డ ను మాకు దూరం చేసింది . సంవత్సరం కావొస్తుంది ఉన్న ఒక్కగానొక్క కూతురు మమ్మల్ని అనాథలను చేసి వెళ్ళిపోయింది.అన్నాడు కన్నీళ్ళపర్యంతమై.”

“మన్నించండి సర్ ప్రపంచమంతా అనుభవిస్తున్న బాధ ఇది ఓదార్చలేని బాధ అన్నారు టీచర్లు.”

“మీరు రేపు వచ్చేసరికి స్కూల్ దగ్గర పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టిస్తాను నేనూ వస్తాను అక్కడే తల్లిదండ్రులతో మాట్లాడండి అన్నీ తెలుసుకుని తరువాత ఏంచేయాలో నిర్ణయం తీసుకోవచ్చు అన్నాడు సర్పంచ్.”

అవును సర్ అలాగే అంటూ అందరూ సెలవు తీసుకుని బయలుదేరారు.

*********************

సర్పంచ్ పైన ఉన్న గౌరవం ఏమో తల్లిదండ్రులు అందరూ వచ్చారు.

అందులో పిల్లలను కోల్పోయిన  వాళ్ళుకూడా ఉన్నారు.

దీనంగా చూస్తున్న వాళ్ళ ముఖాలు చూస్తే టీచర్ల గుండె తరుక్కుపోయింది.

తీర్చలేని దుఃఖం వాళ్ళది ఎలా ఓదార్చగలం అనుకున్నారు.

ఊరిపైన ఎంత ప్రేమ వాళ్ళకు రామాపురం 700 ఇళ్ళు గల ఒక పల్లెటూరు.

ఆ ఊళ్ళో అప్పర్ ప్రైమరీ స్కూల్ లో విద్యార్థులు 400 వరకూ ఉంటారు.

కోవిడ్ రాకముందు వరకూ చక్కని ప్రవర్థన తో పిల్లలు శ్రద్ధగా చదివేవారు.

ఈ రెండు సంవత్సరాల లాక్ డౌన్ కాలంలో కొంత కాలం స్కూల్ నడవనేలేదు ఓ నెలరోజులుగా నడుస్తున్నా పిల్లలు ఎవరు రావడం లేదు.

ప్రభుత్వం నుండి స్కూల్ లు రెగ్యులర్ గా నడపాలనే ఉత్తర్వులు రావడం తో ఇలా మళ్ళీ అందరూ కనిపిస్తున్నారు.

అందరితో మాట్లాడి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు నిర్వహణ వ్యవహారాలకోసం ఒక మనిషిని చూసుకుని సర్దుకునే సరికి వారంరోజులు గడిచిపోయాయి.

అప్పుడు గుర్తొచ్చారు రేవంత్ ,లక్ష్మీ , సంధ్య బాగా చదివే పిల్లలు వాళ్ళు ఎందుకు రావడం లేదో నని ఆరాతీసారు టీచర్లు.

రేవంత్ , లక్ష్మీ అన్నా చెల్లెళ్ళు తల్లిదండ్రులను కోల్పోయారు. చూసుకోవడానికి ఎవరూలేరు. వాళ్ళ చిన్నాన్న వాళ్ళు తీసుకుని వెళ్ళి ఎక్కడో పనిలో పెట్టారంట. తెలుసుకుని చెప్పారు. సంధ్య నాన్న చనిపోయాడు తల్లి ఆరోగ్యం అంతంత మాత్రమే అందుకే ఆ అమ్మాయి రావడం లేదు అన్నారు.

ఎలా చేద్దాం సర్ ?అంది సువర్ణ టీచర్ .

మనమేం చేయగలం టీచర్…?

అందరిదీ అదే పరిస్థితి కదా …? అన్నారు.

ఏమో సార్ మనకు చేతనైనంత ఏమైనా చేయగలమేమో అంది.

మళ్ళీ తనే ఆపిల్లలు చాలా బ్రిలియంట్స్ కదా ఈ సంవత్సరం “మనస్కూల్లోనే 10వ తరగతి వరకు అవుతుంది.అప్పుడు టీచర్లు కూడా పెరుగుతారు. కాస్తా శ్రద్ద తీసుకుంటే ట్రిపుల్ ఐటీ లో సీటు వస్తుంది .

వాళ్ళ వల్ల మన స్కూల్ కు మంచిపేరు వస్తుంది ఆలోచించండి అన్నది.”

ఆలోచిద్దాం టీచర్ కానీ మన పరిస్థితే అంతంతమాత్రంగానే ఉంది. చదువు చెప్పగలం కానీ అకామిడేషన్ ఎలా..?

మన ఇళ్ళల్లోకి తీసుకుని వెళ్ళలేము కదా…? అన్నారు వాళ్ళు.

సువర్ణ టీచర్ తల్లి మనసు ఊరుకోలేదు. ఏదో చేయాలనే తపన మొదలైంది ఆమెలో…!

ఆలోచించింది.ఏదో మనసులోనే నిర్ణయం తీసుకుంది.

టీచర్లిద్దరినీ తనకు తోడుగా రమ్మంది. సర్పంచ్ ఇంటికి వెళ్ళారు వాళ్ళు.

వాళ్ళ మనసులోని మాటలకు కన్విన్స్ అయ్యాడు సర్పంచ్.

ఆ ముగ్గురు విద్యార్థులకూ అకామిడేషన్ ఆయన ఏర్పాటు చేసాడు.

పిల్లలను తీసుకుని వచ్చాడు.

రెండు సంవత్సరాల పాటు భోజనం ఏర్పాట్లు కూడా అతనే చేసాడు.

తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అనుభవించేవారు కాదేమో….!!

పదవ తరగతి పరీక్షలు అయిపోయాయి. వాళ్ళూహించినట్లే ముగ్గురు విద్యార్థులకూ మంచి జిపీఏ వచ్చింది.

బాసర ట్రిపుల్ ఐటీ లో సీటు వచ్చింది.  సర్పంచ్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసాడు.

” అందరూ కలిసి వాళ్ళను కాలేజీ లో జాయిన్ చేసారు.”

సెలవులకు ఆయన దగ్గరికే రమ్మని చెప్పాడు.

అలా కొన్నేళ్ళు గడిచిపోయాయి.

*****************

 

సువర్ణ టీచర్ రాజేశం,రఘునాథం ముగ్గురు ట్రాన్స్ ఫర్ లో హైదరాబాద్ కు వెళ్ళారు.ముగ్గురూ ఒకే స్కూల్ లో పనిచేస్తున్నారు.

 

మేడం మీకోసం ఎవరో వచ్చారండీ…!!

ప్యూన్ పిలుపుతో క్లాస్ లో వర్క్ ఇచ్చి ఆఫీసు రూపంలో కి వచ్చింది సువర్ణ.

ఎస్ చెప్పండి అంటూ…!

అక్కడే మిగతా ఇద్దరు సార్లు ఉన్నారు.

ఒక పెద్దాయన తో పాటు ముగ్గురు యువతీ యువకులు ఉన్నారు.

“మీరు వీరాస్వామి గారు కాదండీ రామాపురం సర్పంచ్ అంది ఆశ్చర్యానందాలతో ”

“అవునమ్మా అన్నాడు అతను.”

ఆ ముగ్గురు వచ్చి సువర్ణ కాళ్ళు గట్టిగా పట్టుకుని మొక్కారు.

ఏంటిది బాబూ ఎవరు మీరు..?

అమ్మాయిలు ..! అంది.

టీచర్ మమ్మల్ని గుర్తు పట్టలేదా మేము టీచర్… రేవంత్ లక్ష్మీ సంధ్య అన్నారు‌.

సువర్ణ కు మాతృత్వం పెల్లుబికింది.

ఎలా ఉన్నారు

ఏం చేస్తున్నారు…??

ఒకటే ప్రశ్నల వర్షం.

మేమందరం ఐఐటీ మద్రాస్ లో ఫినిష్ చేసాము టీచర్.

రేవంత్ అక్కడే ప్రొఫెసర్ గా చేస్తున్నాడు.

అదే కాలేజీలో చదివే మాక్లాస్ మేట్స్ తో పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యాయి.

ఈరోజు వరకూ వీరాస్వామి అయ్యగారే మా బాగోగులు చూసుకున్నారు.

ఇంకా ముందుకూడా ఆయనే మాకు పెద్దదిక్కు అంటూ పెళ్ళి కార్డు లు చేతిలో పెట్టారు.

పెళ్ళి పెద్దలు అని ఉన్న దగ్గర రాజేశం,రఘునాథం,సువర్ణ గార్ల ఆశీస్సులతో అని ఉంది.

తల్లిదండ్రులు వీరాస్వామి, కామేశ్వరి గార్ల దత్త పుత్రికలు అని ఉంది.

ఎంత పెద్దమనసు సర్పంచ్ గారు మీలాంటి వాళ్ళు గ్రామానికి ఒకరుంటే చాలు దేశం భవిష్యత్తు బంగారు బాటలో నడుస్తుంది.అన్నారు చేతులెత్తి మొక్కుతూ…!!

సర్పంచ్ చిరునవ్వు తో నాకు ఉన్న ఒక్క కూతురు కరోనా మహమ్మారి మింగింది. ఆశలన్నీ చచ్చిపోయిన సందర్భం లో మీరు నాకు ఒకదారి చూపారు. పిల్లలు అనాథలు కాకుండా తల్లిదండ్రులను సమకూర్చారు. మేం నిరాశతో జీవించకుండా అంత్యకాలంలో మాకు తోడుడడానికి పిల్లలను ఇచ్చారు. మీరు ఉపాధ్యాయులే కాదు జీవన గమ్యాన్ని చూపిన భగవత్సమానులు  అన్నాడు రెండు చేతులు జోడించి.

మీరు అంతమాట అనకండి వీరాస్వామి గారు మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం.

మనమంతా చేయిచేయి కలిపితేనే దేశాన్ని ప్రగతిపథంలో నడుపగలం అన్నారు టీచర్లు.

శ్రీ గురుభ్యోనమః విద్యనే కాదు జీవితాన్నిచ్చిన మీకు శథదా వందనం అన్నారు.

 

********

తేది:22-09-2021

జయంతి వాసరచెట్ల

9985525355

 

 

 

October 24, 2021 3 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

 పశ్చాత్తాపం

by తడక మళ్ళ మురళీధర్ October 24, 2021
written by తడక మళ్ళ మురళీధర్

“ఏందే మంగీ ఉరికొత్తాన్నవు, ఏమైంది” అడిగింది  పక్కింటి రాజవ్వత్త.

మంగ రాజవ్వ మాటలు  వినిపించుకోకుండా ఇంట్లోకి పరుగెత్తింది.   రాజవ్వ మంగ వెనుకే వెళ్లింది.  మంగ నేల మీద  కూర్చొని ముఖాన్ని రెండు మోకాళ్ల సందులో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడవ సాగింది.

       “ఏమైందే మంగీ ఎందు కేడుత్తాండవు” అంటూ రాజవ్వ మంగ తల నిమురుతూ ప్రక్కనే కూర్చుంది. మంగ అమాంతం రాజవ్వను కౌగిలించుకొని ఏడుపు ఉధృతం చేసింది.

      “ఏమైందో చెప్పకుంట ఏడిత్తేం లాభం, పొలం కాడ మీ నాయిన గాని నిన్నేమైన అన్నడా?” అడిగింది రాజవ్వ.

         “లేదత్తా మా నాయిన ఏమన్లేదు, పొద్దు మూకుతుందని నన్ను జల్ది ఇంటికి పొమ్మన్నడు, పన్లు చూస్కొని ఎనకెంబడి వస్తనని శెప్పిండు. నేను ఇంటి కాడికి ఒక్క దాన్నే వస్తాంటే నారాయణ మామ చల్క కాడికి రాంగనే మన ఉప సర్పంచు శంకరి గాడు నాకు అడ్డం తిరిగిండు.  ‘నాతో పండుకో నిన్ను లగ్గం చేసుకుంట’ అని నా చెయ్యి పట్టుకొని గుంజిండు.  నేను ఆన్ని బాగ తిట్టిన.  నన్ను తోస్తే నేను కింద పడ్డ. నా మీద పండుకోనికి ప్రయత్నం చేసిండు, నేను ఆన్ని తోసేసి పోలీసులకు చెప్త అని  ఉరికొస్తాంటే,   ‘ఈ ముచ్చట ఎవల్లకైన  చెప్పితే సంపుత’ అని బెదిరించిండు” ఏడుస్తూ చెప్పింది మంగ.

      “పోనీలే బిడ్డా ధైర్నం చేసి తప్పించుకొని ఉరికొచ్చినవు. ఆడు ఆని పెండ్లాన్నే తిట్టి కొట్టి ఎల్ల గొట్టిండు, రెండేండ్ల సంది కాపురం శెయ్యట్లేదు.  ఆడు మంచోడు కాడని తెలిసీ  మనూరూల్లేమో ఓట్లేసి ఆన్ని ఉప సర్పంచ్ జేసిండ్రు. ఆని పాపాన ఆడే పోతడు లే బిడ్డా, అంతా మరిశిపో. మీ నాయినకు గీ ముచ్చట జెప్తే శంకరి గాని తోటి పంచాతీ పెట్టుకుంటడు , రచ్చ రచ్చ అయితది ఊళ్లె, అసలే పెండ్లి కావలసిన పిల్లవి నువ్వు” అంటూ మంగని ఓదార్చి వెళ్లింది రాజవ్వ.

                  *****

        మంగ ఎనిమిదో ఏట తల్లి దీర్ఘ రోగంతో చనిపోయింది. చనిపోయి  ఎనిమిది సంవత్సరాలైంది.  ఈ ఎనిమిది సంవత్సరాలు తండ్రి నర్సింలు అన్నీ తానై మంగను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పక్కింటి రాజవ్వత్త అప్పుడప్పుడు చిన్నా చితకా సహాయం  చేస్తుంది. మంగ ఐదవ తరగతితో చదువు ఆపేసింది. ఉన్న ఎకరం పొలం పనులు తండ్రి చూసుకుంటుంటే తను వంట పనులు బాగానే నేర్చుకుంది. పొలం పనుల్లో తండ్రికి సాయం కూడా చేస్తుంది.   రైతుబంధు సాయం, వ్యవసాయం మీద వచ్చే కొద్ది పాటు ఆదాయం తోటి రెండు గదుల ఇంట్లో తండ్రీ కూతురు గుట్టుగా జీవనం సాగిస్తున్నారు.  మంగను తన చెల్లెలి కొడుకు రవికి ఇచ్చి పెళ్లి చేయాలని నర్సింలు ఎప్పుడో నిర్ణయించుకోవటం,  చెల్లె, బావ కూడా అందుకు సుముఖత వ్యక్త పరచటం  జరిగింది.  మంగ చామన ఛాయతో  పొందికగా ఉంటుంది.   మేనత్త కొడుకు రవి ఒడ్డు పొడుగు ఉండి తన ఊర్లోనే గ్రామ పంచాయితీ ఆఫీసులో చిన్న పాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు.  ఇద్దరి ఊర్లకు ఇరవై కిలో మీటర్ల దూరమే.

                 *****

       “అమ్మా మంగా అన్నం వండినవా బిడ్డా” చీకటి పడ్డాక పొలం నుండి తిరిగి వచ్చిన నర్సింలు అడిగాడు.

     “లేదు నాయినా, పొయ్యి మీన  అచ్చరు పెట్టిన, నువ్వు కాళ్లు  మొఖం కడుక్కో, అప్పటికి అయిపోద్ది” భరోసా ఇచ్చినట్టుగా చెప్పింది మంగ.

     “పొద్దటి కూర ఉందా బిడ్డా”

       “లేదు నాయిన, చింతపండు పచ్చడి ఉంది” అంటుండగానే రాజవ్వ స్టీలు గిన్నెతో వచ్చింది.

       “అన్నా, టమాటా ఆలుగడ్డ కలిపి కూర చేసి తెచ్చిన, ఇద్దరు తినుండ్రి” అంటూ గిన్నె కింద పెట్టింది.

      రాజవ్వ మంగ దగ్గరికి పోయి  “మంగీ మీ నాయినకు గాని శెప్పినవా ఏంది ముచ్చట” అని నెమ్మదిగా అడిగింది.

       “లేదత్తా నాయిన ఇప్పుడే అచ్చిండు” అని అంటుండగానే అక్కడికి వచ్చిన నర్సింలు “ఏం ముచ్చట బిడ్డా” అన్నాడు.

       “ఏం లేదులే అన్నా, నేను పోతున్న, నిమ్మళంగ తినురి” అంటూ వెళ్లి పోయింది రాజవ్వ.

      “ఏంది బిడ్డా రాజవ్వత్త ఏందో ముచ్చట అంటాంది”

       “ముందగాల నువ్వైతే అన్నం తిను” అన్నది మంగ.

        మంగ వడ్డించిన అన్నం రాజవ్వ తెచ్చిన కూరతో తిని నర్సింలు చెయ్యి కడుక్కున్నాడు.  మంగ కూడా ప్లేట్లో అన్నం వడ్డించుకొని తినటం ముగించింది.

       “మంగీ నువ్వు, రాజవ్వత్త ఏదో ముచ్చట అనుకోబడ్తిరి, ఏంది బిడ్డా గది” అడిగాడు నర్సింలు.

        “పొలం కాడి నుండి వస్తాంటే ఉప సర్పంచ్ శంకరి గాడు అడ్డం తిరిగిండు నాయినా , నా చెయ్యి పట్టుకొని గుంజితే నేను కింద పడ్డ, ఆడ్ని వదిలించుకొని వస్తాంటే ఎవళ్లకైన చెప్తే సంపేస్తనని బెదిరించిండు.  నాకు మస్తు భయమైంది.” చెప్పింది మంగ.

      “ఆనికి పోయే కాలం వచ్చింది, తిరుపతయ్య బిడ్డ రాణిని కూడ గిట్లనే  చేసిండంట నెల రోజుల కింద.  రేపు సర్పంచి శోభ కాడికి ఆన్ని పిలిపిత్త.  పెద్ద మనుషులల్ల పంచాతి పెట్టిత్త” అంటూ నులక మంచం మీద నడుం వాల్చాడు నర్సింలు.

                   *****

       మరుసటి రోజు పదకొండు గంటలకు సర్పంచ్ శోభ ఉప సర్పంచ్ శంకర్ ను పంచాయితీకి పిలిపించింది.  వార్డ్ మెంబర్ కనకా చారి, మండల ప్రాదేశిక సభ్యుడు రాములు, నర్సింలు, మంగ, ఇంకా కొంత మంది ఊరి జనం హాజరయ్యారు.  మంగ తనపై  శంకర్ చేసిన  అత్యాచార యత్నం గురించి అందరి సమక్షంలో చెప్పింది.  శోభ, కనకాచారి, రాములు తనపై మంగ చేసిన ఆరోపణకు సమాధానం చెప్పాల్సిందిగా శంకర్ ను ప్రశ్నించారు.

       ఆవేశంతో రెచ్చిపోయిన శంకర్ కూర్చున్న వాడల్లా అమాంతం లేచి “నేను  తప్పు చేయలేదు, నన్ను  పంచాతీకి పిలిచి నా మీద జూటా ఆరోపణ చేసినందుకు ఉల్టా నాకే  పది లక్షల రూపాయలు నష్ట పరిహారం కింద ఇయ్యాలని  కోర్టులో కేసు ఏస్తా” అంటూ  విసరుగా బయటకు వెళ్ళిపోయాడు.  అతన్ని ఆపడానికి  కనకాచారి, రాములు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

    “తప్పు చేసినోడు ఒప్పుకోకుంట ఎల్లిపోయిండు. పెద్ద  మనుషులు మీరేం తీర్మానం శేస్తరో శెప్పండి” అంటూ నర్సింలు సర్పంచ్ శోభ వైపు చూస్తూ అడిగాడు.

      “నర్సిములన్నా, అసలు మనిషి లేకుండ ఏమి తీర్మానం అయితది నువ్వే చెప్పు.  మేమేదన్న చెప్పాలన్న శంకర్ ఉండాలే కదా.”అన్నాడు రాములు.

       “నువ్వన్నది నిజమే రాములు, మంచో చెడో చెప్పాలి మనం.  సర్పంచమ్మా  నువ్వే ఆలోచన చెయ్యి” పంచాయితీ అయిపోయిందన్నట్టు లేచి నిల బడి అన్నాడు కనకాచారి.

         “ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఊరుకుంటే మళ్లీ మళ్లీ జరగదని నమ్మకమేంది.  నర్సింలూ, నువ్వు, నీ బిడ్డ  పోలీసు స్టేషనుకు పొయ్యి దరఖాస్తు ఇయ్యుండ్రి, వాండ్లే తేలుస్తరు” అంటూ శోభ కూడా లేచి నిలబడింది.

          “దరఖాస్తు ఇస్తం, కానీ శంకరి సంపుత అని బెదిరించిండు. మా పాణానికి ఆని దిక్కెల్లి ఆపతి ఉంది”  నర్సింలు సందేహం వెలిబుచ్చాడు.

      “మన జిల్లా కలెక్టరుకు, ఎస్పీకి కూడా ఒక దరఖాస్తు ఇయ్యి”    సలహా ఇచ్చింది శోభ.

అదే రోజు నర్సింలు, మంగ పోలీసు స్టేషన్లో రాత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. అదే విధంగా కలెక్టరుకు, ఎస్పీకి సంఘటన వివరాలు తెలియజేస్తూ శంకర్ నుండి ప్రాణభయం ఉందంటూ  దరఖాస్తు కూడా ఇచ్చారు.  పోలీసు వారు వెంటనే ప్రతి స్పందించి శంకర్ పై అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు.

              *******
మరుసటి రోజు పొద్దున్నే విషయం తెలిసిన నర్సింలు చెల్లెలు మణి, బావ వెంకటి మోటార్ సైకిల్ మీద నర్సింలు ఇంటికి వచ్చారు.  “అన్నా, మేము ఇన్న ముచ్చట నిజమేనా?” అడిగింది మణి.

      “అవును, నిన్న పొలం కాడి నుండి మంగ ఒక్కతి వత్తాంటే శంకరిగాడు అడ్డం తిరిగి  శెయ్యి పట్టుకొని గుంజి మనువాడత నన్నడంట.  ఆన్ని తోసేసి ఏడ్సుకుంట ఇంటికి వచ్చింది” జవాబిచ్చాడు నర్సింలు.

       “నా కొడుకు రవి తోటి దాని లగ్గమని మనం దాని శిన్నప్పుడే అనుకుంటిమి. నాలుగొద్దులు ఉండే పదవిని  సూస్కొని శంకరి  గానికి మాయరోగం పుట్టింది.” రెండు చేతులను నొక్కుకుంటూ అన్నది మణి.

      అంతలోనే శంకర్ నర్సింలు ఇంటికి వచ్చి “ఒసేయ్ మంగా, పోలీసోళ్లకు ఫిర్యాదు చేసినవని తెల్సింది. నేను భయపడేటోన్ని కాను. నిన్ను, మీ నాయన్ను లేపేస్త” అంటూ  పెద్దగా అరుస్తూ బెదిరించాడు.

“శంకర్, ఇది మంచి పద్దతి కాదు. తప్పు చేస్తవు ఉల్టా మమ్మల్నే బెదిరిస్తవా.” జోక్యం చేసుకున్నాడు నర్సింలు.

     “నిన్ను మామ అని పిలుస్త కదా మరి నీ బిడ్డ నాకు వరుస అయితది. నా మీద దరఖాస్తు ఇయ్యనీకి నేను చేసిన దాంట్లో తప్పేముంది” ప్రశ్నించాడు శంకర్.

     “శంకర్, నీకు పెండ్లి అయింది. బిడ్డ ఉంది. ఇప్పుడు ఇట్ల మాట్లాడటం నీకు మంచిగుండది,  ఎల్లిపో” జవాబిచ్చాడు నర్సింలు.

      “పోలీసోళ్లు గాని నా కాడికి రావాలి అప్పుడు మిమ్మల్ని ఎవరినీ వదిలి పెట్టేది లేదు. అయినా  ఉపసర్పంచ్ ను నేను, నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం వాండ్లకు లేదు, అదంతా పోనీ,  కేసు వాపసు తీసుకుంటరా లేదా, ఆ ముచ్చట చెప్పు” అన్నాడు శంకర్.

      “కేసు వాపసు తీసుకోనీకి నేను గాజులేసుకొని లేను, ఎట్ల అయ్యేదుంటే గట్ల అయితది” అని నర్సింలు అనటంతో  “నువ్వన్న మాటకే కట్టుబడి ఉన్నవన్న మాట.  నేను చూస్త ఏమైద్దో” అంటూ విసురుగా వెళ్లి పోయాడు శంకర్.

                 ****

      నర్సింలు, మంగ ఇచ్చిన దరఖాస్తు నమోదు చేసిన  సబ్ ఇన్ స్పెక్టర్ తన సిబ్బందితో గ్రామానికి వచ్చి సాక్షులను విచారించి, నేరస్థల నమూనా గుర్తింపు తీసుకొని, శంకర్ ఇంటికి వెళ్ళాడు.   కేసు నమోదు చేసిన విషయం చెప్పి తనను అరెస్ట్ చేయటానికి వచ్చినట్టుగా చెప్పాడు.

      “సబ్ ఇన్ స్పెక్టర్ గారూ, జూటా కేసు పెడితే అరెస్ట్ చేస్తర, నేను ఉప సర్పంచ్ ను, నేను లేకుంటే  గ్రామంలో పనులు ఆగి పోతయి.  నన్ను అరెస్ట్ చెయ్యనీకి కలెక్టరు కాడ మీరు అనుమతి తీసుకున్నరా” మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ    ప్రశ్నించాడు శంకర్. అతని మనసులో మాత్రం ఓ పక్క భయం, ఆందోళన కలుగుతుంది.

        “సాక్షులను విచారించి నిర్దారణకు వచ్చాను. ఈ కేసులో నిన్ను అరెస్ట్ చేయటానికి నాకు ఎవరి పర్మిషన్ అక్కర లేదు.  అరెస్ట్ చేశాక ఏమైతదో నువ్వే చూద్దుగాని.”  సమాధానం చెప్తూనే శంకర్ ను  కస్టడీలోకి తీసుకున్నాడు సబ్ ఇన్ స్పెక్టర్.   మరుసటి రోజు అతడ్ని కోర్టు ముందు ప్రవేశ పెట్టడంతో పద్నాలుగు రోజుల కస్టడీ విధించింది కోర్టు.

సబ్ ఇన్ స్పెక్టర్ అదే రోజు శంకర్ అరెస్టు, తదుపరి కోర్టు విధించిన కస్టడీ విషయం తెలియపరుస్తూ జిల్లా  కలెక్టరుకు, ఎస్పీకి నివేదిక పంపటం జరిగింది.  ఆ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టరు సర్పంచ్ శోభ నుండి కేసుకు సంబంధించిన పూర్వా పరాలపై వేరొక నివేదిక తెప్పించుకొని శంకర్ ను ఉప సర్పంచ్  పదవి నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  ఆ ఉత్తర్వులను జైలు అధికారుల ద్వారా శంకర్ కు అందచేయటం కూడా జరిగింది.
******

నెల రోజుల  జైలు జీవితం పిదప శంకర్ బెయిలుపై విడుదలయ్యాడు.  భార్య లతను పుట్టింటి నుండి తెచ్చుకోవాలన్న అతని ప్రయత్నం ఫలించలేదు. అత్త, మామలు తమ ఇంటి  గడప తొక్కనీయలేదు. బయటి నుండే వెళ్ల గొట్టారు. ఎంత బ్రతిమిలాడినా తన మూడు సంవత్సరాల కూతురును  చూడటానికి  కూడా ఒప్పుకోలేదు. తనను గృహ హింస, శారీరక, మానసిక వేధింపులకు గురి చేయటమే కాకుండా మంగ కూడా అత్యాచార ఆరోపణ చేస్తూ కేసు వేసింది కాబట్టి  కాపురానికి రానని భార్య నిక్కచ్చిగా చెప్పింది.  ఊర్లో ఈ విషయం అందరికీ తెలిసింది. నెలలు గడుస్తున్నాయి.  ఉప సర్పంచ్ గా ఒక వెలుగు వెలిగి భవిష్యత్తులో సర్పంచ్,  వీలైతే ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలనే ఆశతో ఉన్న తనను ఇప్పుడు గ్రామస్తులు ఎవరూ లెక్క చేయట్లేదు.  ఎవరినైనా పలకరిస్తే  మౌనంగా తప్పుకుంటున్నారు. తన పొలం పనులకు కూడా వెళ్లొద్దని కూలి వాండ్లు తీర్మానించు కున్నారు.  ఒక విధంగా చెప్పాలంటే తాను  సామాజిక బహిష్కరణ చేయబడ్డాడు.  పొలంలో పండిన పంట చేతికి అందలేదు.  వేరే ఆదాయం లేదు. పైరవీల కొరకు జనం దగ్గర   తీసుకున్న డబ్బులు పనులు కాక పోవటంతో ఒత్తిడి పెరిగింది.  బాగా బతికిన  రోజుల్లో మందు మత్తులో తేలిన తను ఇప్పుడు మందుకు డబ్బులు లేక, అప్పిచ్చే నాథుడు లేక సతమతమై పోతున్నాడు.  జీవితం రెంటికీ చెడ్డ రేవడి అయింది.  ఒంటరి జీవితం దుర్భర మనిపిస్తుంది. అచ్చోసిన ఆంబోతు లాగా తిరిగిన ఊర్లో ప్రస్తుతం  ఎవరినీ ఎదిరించ లేని పరిస్థితి.  నర్సింలు, మంగ పెట్టిన కేసులో నెల రోజుల విచారణ ఖైదీగా అనుభవించిన  జైలు జీవితం పదే పదే  గుర్తొస్తుంది.  ఇక శిక్ష పడితే  జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడటమే కాకుండా ఇతర ఖైదీల మనో వేదన ద్వారా విన్నాడు.

                   ****

        కాలాన్ని ఎవరూ ఆపలేరు. పగలూ రాత్రి గడచి పోతున్నాయి. శంకర్ బాగా బక్క చిక్కి పోయాడు.  కోర్టులో కేసు తుది అంకానికి చేరుకుంది.  మంగ, నర్సింలు, రాజవ్వ, శోభ, కనకా చారి, రాములు, మణి, వెంకటి ఇంకా కొంత మంది సాక్షులను విచారించారు.   ప్రతి ఒక్కరూ శంకర్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు.  పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుందర్ కనీసం ఐదేళ్లకు తగ్గకుండా శిక్ష విధించాలన్న వాదన ముందు  శంకర్ నియమించుకున్న న్యాయవాది వెల వెల పోయాడు.  తీర్పు వెలువరించే తేదీ ప్రకటించింది కోర్టు.  తీర్పు తెలుసుకోవాలనే ఆసక్తితో కోర్టుకు నర్సింలు, మంగ మాత్రమే కాకుండా శంకర్ భార్య లత కూడా వచ్చింది.  పలకరిస్తే బాగానే మాట్లాడింది.  శంకర్ మనసంతా ఉద్విగ్నంగా, ఆందోళనతో ఉంది. కొన్నాళ్లుగా అతని హృదయం  పశ్చాత్తాప పడుతుంది. అదే విషయం భార్యకు చెప్పాడు. కూతుర్ని  ఎత్తుకున్నాడు. అతడు వేసుకున్న మాసిన  దుస్తుల తీరు, మాటల్లోని  ఆవేదనకు లత హృదయం ద్రవించింది.  కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. ఎంతైనా హిందూ ధర్మ పత్ని కదా.  ఇన్నాళ్ల విడతీత ఆమెను కూడా కుంగ దీసింది.

“లతా నాకు శిక్ష పడి జైలుకు పోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకో” అనునయంగా చెప్పాడు భార్యతో.  లత ఏమి సమాధానం చెప్పకుండా కళ్ళు తుడుచుకుంటూ తల అడ్డంగా తిప్పింది. కేసు పిలుస్తున్న  కోర్టు అటెండర్ కూత  వినిపించింది. శంకర్, అతని న్యాయవాది కోర్టు హాలులోకి వెళ్లారు. వెనుకే లత  తన కూతురుతో లోనకు వెళ్లింది. ఆ వెనుకే మంగ, నర్సింలు కూడా వెళ్లారు.  న్యాయమూర్తి  కేసు రుజువైనట్లు తీర్పు సారాంశం చెప్పి, విధించబోయే శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా అని ప్రశ్నించాడు.  బోరుమని ఏడ్చాడు శంకర్. నోటి నుండి మాట పెగల్లేదు.  అవకాశం తీసుకున్న అతని భార్య మాత్రం శంకర్ లో పశ్చాత్తాపం ఉందని, క్షమించమని వణకుతున్న గొంతుతో న్యాయమూర్తికి చెప్పింది. లతను చూసిన మంగ ధైర్యం తెచ్చుకొని శంకర్ లో బాగా మార్పు వచ్చిందని, గత కొంత కాలంగా భార్యాబిడ్డలు ఎడ బాటుగా ఉంటున్నారని, మారిన మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకొమ్మని ప్రాధేయ పడుతూ భయం భయంగా   తనదైన ధోరణిలో చెప్పింది. మంగ ఉదారతను న్యాయమూర్తి ప్రశంసించారు. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదని, లత, మంగల విజ్ఞాపనలు,  శంకర్ కూతురు భవిష్యత్తు దృష్ట్యా  ఐదు సంవత్సరాలు వేయాల్సిన శిక్షకు బదులుగా  ఆరు నెలల సాధారణ శిక్ష మాత్రమే విధిస్తున్నట్లు న్యాయమూర్తి  తీర్పు చెప్పారు. అడుగకున్నా కల్పించుకొని  మంగ కోర్టుకు చేసిన విన్నపం శంకర్ గుండెల్లో బాగా నాటుకుంది.  కోర్టు హాలు నుండి బయటకు వచ్చిన శంకర్   అమాంతం మంగ కాళ్ల మీద పడ బోయాడు.  “వద్దన్నా, నువు పెద్దోనివి, నా కాళ్ల మీద పడితే నాకు ఆయుస్సు తగ్గుద్ది” అంటూ పక్కకు జరిగింది. పోలీసు అధికారులు కళ్ల నీళ్ల పర్యంతమైన  శంకర్ ను జీపు ఎక్కించుకొని ఆరు నెలల శిక్ష అమలుకు తీసుక పోయారు.

October 24, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

“జీవన మాధుర్యాలు”  

by గొర్రెపాటి శ్రీను October 24, 2021
written by గొర్రెపాటి శ్రీను

మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ గణేష్ అయ్యర్ గారి క్యాబిన్ లోకి అడుగు పెట్టాడు సురేంద్ర.
ఇరవై ఏడు సంవత్సరాలకే పి.హెచ్ డి పూర్తి చేసి జి.ఎం గా కొత్తగా జాయిన్ అయిన గణేష్ అయ్యర్ కూల్ గా సీట్లో కూర్చుని ఫైల్ ఏదో పరిశీలించే పనిలో ఉండగా..

“May I come in sir..” అంటూ తలుపు తీసుకుని బాస్ ఎదురుగా నిలబడ్డాడు సురేంద్ర.

“Come in ..Surendra..” అంటూ కూర్చోమన్నట్లుగా చేయి చూపాడు.

బాస్ ఎదురుగా బిడియంగా కూర్చుని వున్నాడు సురేంద్ర.
అతడు ఆ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా జాయిన్ అయ్యాడు.
చేరిన నాటి నుండి గణేష్ అయ్యర్ గారి దగ్గరే వర్క్ చేస్తున్నాడు.

తన మనస్సులోని మాట అడగాలంటే అతడికి ధైర్యం సరిపోలేదు.
ఎదురుగా బాస్ గంభీరంగా వున్నాడు.
ఇద్దరి మధ్య కొద్ది సమయం నిశ్శబ్దం.

మనస్సులో తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ కూర్చున్నాడు సురేంద్ర.

“ఏంటి!?” అన్నట్లుగా చూసాడు గణేష్ అయ్యర్.

సి.ఎన్.సి మిషనింగ్ (Computer numerical control machining )  డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న సురేంద్ర అంటే గణేష్ అయ్యర్ కి ఎంతో ఇష్టం.

పని ఎంతో నిబద్ధతగా ,దీక్షగా చేసే సురేంద్ర ని అందరూ అభిమానిస్తారు.

జీవితం లో కొన్ని సందర్భాల్లో ఎవరమైనా అంతే !

పెద్దవాళ్ల ముందు వినయంగా వుంటాం.
వాళ్లు మాట్లాడే వరకు మనమేమీ మాట్లాడకుండా వారి స్పందన కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాం.

మనకంటే వయసులో పెద్దవారు..పదవిలో ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడు
వారు మన పట్ల చూపే ఆప్యాయత అణువంతైనా అదే కొండంత గా భావిస్తూ ..
వారు మన కి అండగా వున్నారన్న ధైర్యంతో జీవితంలో సంబరంగా సాగిపోతుంటాము.

అలాంటి స్థితి నే ఎదుర్కొంటున్న సురేంద్ర అతిపిన్న వయస్సులో జి.ఎం గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా సాగుతున్న అయ్యర్ గారి ముందు వినయంగా కూర్చుని వున్నాడు.
“ఏంటి సురేంద్ర ఇలా వచ్చావు?” ఆప్యాయంగా అడిగాడు గణేష్ అయ్యర్.

తడబడుతూనే అడిగాడు సురేంద్ర..

“సార్! ఓ పాతిక వేలు వుంటే సర్థగలరా !? మీకు రెండు నెలల్లో ఇస్తాను.”

కొద్ది సమయం నిశ్శబ్దంగా వున్న అయ్యర్..
“”అరే ! రెండు నెలల వరకు అయితే నా దగ్గర ఉన్నాయి!

కానీ ఇటీవలే నగర శివారులో రెండు వందల గజాల జాగా కొన్నాను కదా!
నా దగ్గర వున్న డబ్బులన్నీ పెట్టి ఆ స్థలం కొన్నాను.
సారీ సురేంద్ర !
ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు నేను సహాయం చేయలేను.”
నిర్మొహమాటంగా నవ్వుతూ చాకచక్యంగా చెప్పాడు.

మారు మాట్లాడకుండా మౌనంగా వచ్చి తన సీట్లో కూర్చున్నాడు సురేంద్ర .

అతను అలా సీట్లో కూచున్నాడో లేదో..
అతడి రాక కోసం నిరీక్షిస్తున్న శ్రవణ్ వచ్చి ..

“సార్! మిషన్ టూల్ బ్రేక్ అయ్యింది. మీరు వస్తే ఇద్దరం కలిసి టూల్ మారుద్దాం!” అన్నాడు.

టూల్ విరిగింది అన్న మాట వినడంతోనే కోపం వచ్చింది సురేంద్రకి .

రెండు రోజులుగా శ్రమిస్తూ అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా సెట్టింగ్ చేసి అప్పగిస్తే ..
మిషన్ టూల్ విరిగింది అంటూ ఆపరేటర్ శ్రవణ్ రావడం అతడికి విపరీతమైన కోపం రావడానికి కారణం అయ్యింది.

ఎందుకో తమాయించుకున్నాడు.

“సర్లే! వస్తానులే ” నిర్లిప్తంగా సమాధానం చెప్పాడు.
ఏమనుకున్నాడో శ్రవణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అతడికి రెండు రోజుల క్రితం తండ్రి చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి.

సురేంద్ర మనసంతా ఆందోళనగా ఉంది.

“సురేంద్ర సార్! మిమ్మల్నోసారి గణేష్ అయ్యర్ సార్ రమ్మంటున్నారు..” అన్నాడు అటెండర్ మస్తానయ్య.

‘డబ్బులు అడిగితే సాయం చేయలేదు కానీ ..పని చెప్పడానికి మాత్రం నేనే కావాలి ‘ మనస్సులో అనుకున్నాడు సురేంద్ర.
“లంచ్ చేశాక సార్ ని కలుస్తాను లే !” అన్నాడు.
“అదే మాట చెప్పమంటారా ?” సందేహంగా అడిగాడు మస్తానయ్య.
“ఆ..” అన్నాడు నిర్లిప్తంగా..

ఇరవై రెండేళ్ల సురేంద్ర డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు కున్నాడు.

ఇంటర్మీడియట్ చేశాక..

డిగ్రీ చదివే అవకాశం ఉన్నా వెంటనే ఉపాధి మార్గాలు లభిస్తాయని ఆశతో పాలిటెక్నిక్ లో చేరాడు.
అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు మార్కెట్లోకి విరివిగా రాలేదు.
తండ్రి వెంటనే బయలుదేరి రమ్మంటూ ఫ్యాక్టరీ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి చెప్పడంతో రెండు రోజుల క్రితం ఇంటికి హుటాహుటిన బయలుదేరి వెళ్ళాడు.
లంచ్ రూమ్ లో ఒంటరిగా కూర్చున్న అతడి కళ్ళ ముందు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనలు ఒక్కోటిగా గుర్తుకు రాసాగాయి .
*                                            *                                          *
తండ్రి సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఫోన్ చేయగానే అంతా విని
“సరే నాన్న ఇప్పుడే బయలుదేరుతున్నాను.” అంటూ వెంటనే పర్మిషన్ తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకుని సాయంత్రం ఆరు గంటలకు నారాయణాద్రి ట్రైన్ అందుకుని ఎనిమిదిన్నర కల్లా నల్గొండ లో దిగాడు సురేంద్ర .

తండ్రి చెప్పిన అడ్రస్ కనుక్కోవడం అతడికి పెద్ద గా కష్టం అనిపించలేదు.
నటరాజ్ థియేటర్ కి దగ్గరలో వున్న “ఆదిత్య హాస్పిటల్” కి చేరుకున్నాడు.
నల్గొండ లో పాలిటెక్నిక్ చదువుకున్న అతడికి ఆ ఊరిలోని ప్రతి గల్లీ సుపరిచితమే.
సురేంద్ర వాళ్ళ నాన్న రాఘవరావు నల్గొండ కి దగ్గరలో వున్న ధర్వేశిపురం లో ఆటో మెకానిక్ గా పని చేస్తూ ముగ్గురు పిల్లల్ని పోషిస్తున్నాడు.
సురేంద్ర కి ఒక తమ్ముడు,చెల్లి ఉన్నారు.
తమ్ముడు ఇంటర్మీడియట్ పూర్తిచేసి డిగ్రీ లో ఇటీవలే చేరాడు.
చెల్లి ఇప్పుడు పదో తరగతి.
విచార వదనంతో వున్న తండ్రి చెప్పిన మాట వినగానే సురేంద్ర కి తన కాలి కింద భూమి కదిలినట్లుగా అనిపించింది.
తల్లి పడుతున్న కష్టం విని కళ్ళనిండా నీళ్ళు నిలిచాయి.
“వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్స్ అందుకు యాభై వేలు కావాలన్నారు.
నా వద్ద పది వేలుంటే కట్టేశాను.మిగతా డబ్బులు సర్దుబాటు కావడం కష్టంగా వుంది.
మీ మామయ్య ఓ పది వేలిస్తానన్నాడు.ఇంకా కనీసం ముప్పై వేలు కావాలి” అన్నాడు రాఘవరావు .
“నాన్న! నా దగ్గర ఐదు వేలు వున్నాయి.ఇవిగో ” అంటూ ఇచ్చాడు సురేంద్ర.
“ఇంకో పాతిక వేలు కావాలి ! హాస్పిటల్ లో ఖర్చులు కూడా ఉంటాయి కదా !
 చార్జీల కి పై ఖర్చులకి ఎలారా !?”

నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా.. ఇంత కాలం నువ్వు దాచింది ఇదేనా..
ఆయన ఫేస్ ఫీలింగ్ అది అన్నట్టుగా అర్థం అయ్యింది అతడికి .

తను నెల నెలా నల్గొండ రావడం ..ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా గడపడం గుర్తొస్తుంది అతడికి.
ఫలితం తన వద్ద వున్న బ్యాంక్ బ్యాలెన్స్ అది.
వస్తున్న డబ్బులు దాచుకుంటే రేపటి అవసరాలకి అక్కరకొస్తాయని తెలియని వయస్సు తనది అనుకున్నాడు.
ఇంతకాలం ఆర్థిక ఇబ్బందులు పడుతూ గడుస్తున్న రోజులు.
ఉద్యోగంలో చేరాక వస్తున్న జీతం..అతడి జల్సాలకు ,సినిమాలు ,షికార్ల కి ఖర్చవసాగాయి.
నెలాఖరులో తనే డబ్బుల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి !
 ఇలాంటప్పుడే తల్లి అనారోగ్యంతో బాధ కి గురవడం అతడికి తీవ్ర నిరాశ ని కలగజేసింది.

తన ఫ్రెండ్స్ ని సాయం చేయమని అడిగాడు.
వాళ్ళు తమ వద్ద అంత డబ్బులు లేవని చేతులు ఎత్తేశారు.

ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ స్థితి అతడిది.
“నువ్వే ఎలాగైనా డబ్బులు సర్దాలి  ! ఈ మధ్య నాకు ఊళ్ళో పనులు తగ్గాయి రా !
ఆదాయం నామమాత్రంగానే వుంది.” అన్నాడు రాఘవరావు కొడుకు ని ఉద్దేశించి.
“సరే నాన్న!” అన్నాడు సురేంద్ర.
ఆ మాట అయితే అన్నాడే కానీ డబ్బులు తేవాలో అర్థం కావడం లేదు.
కొడుకు అన్న మాట విని సంబర పడ్డాడు రాఘవరావు.

మరుసటి రోజు ఉదయం నల్గొండ బస్ స్టాప్ కి తెల్లవారుజామున నాలుగున్నరకు చేరుకున్నారు తండ్రి కొడుకులు.

ఫస్ట్ బస్ ఎక్కి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఫ్యాక్టరీ కి చేరుకోవాలన్న తొందర లో వున్న సురేంద్ర కి తండ్రి మరొక్కసారి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
” అమ్మకు వెంటనే ఆపరేషన్ (హిస్టరెక్టమీ) చేయాలంట.
ఆలస్యం అయితే ప్రమాదమని డాక్టర్స్ హెచ్చరించారు.
వెళ్ళగానే డబ్బుల ఏర్పాటు చూడు ,డబ్బులు అందగానే నా అకౌంట్ లో వెయ్యి.
నేను ఇక్కడ తీసుకుంటాను ,సరేనా ! మర్చిపోవద్దు.. ”

తన నిస్సహాయ స్థితి ని తలచుకుని తనలో తనే బాధ పడ్డాడు.

*                                     *                                  *
“చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది.
కానీ జీవితం పరీక్ష లు పెట్టి పాఠాలు నేర్పుతుంది.”
పెద్దలు చెప్పిన మాటలు అక్షర సత్యాలు .
చదువుల్లో సందేహాలు వస్తే తీర్చేందుకు గురువులు ఉంటారు.
తగిన సూచనలు,సలహాలు ఇచ్చి సందేహ నివృత్తి చేస్తారు.
కానీ జీవితం లో అలా కాదు.
మనకు ఎదురైన ఓటమి..
మనం ఎదుర్కున్న కష్టం..
మనం అనుభవించే బాధ ..
మనని వెంటాడుతున్న అవమానం
 ..ఇవన్నీ గురువులై మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి !
ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి !
కొన్నిసార్లు మనపై మనకే జాలి కలిగినా..
మన స్థితి మన కే ఇబ్బందికరంగా అనిపించినా ..
వెనకడుగు వేయొద్దు ..సవాళ్లను ఎదుర్కోవడమే జీవితం అనిపించేలా చేస్తాయి !

లంచ్ రూం దగ్గర వున్న అద్దం ముందు నిలబడ్డాడు.
కళ్ళని కమ్మేసిన సన్నని కన్నీటి పొర ని కర్చీఫ్ పెట్టి తుడిచాడు.
చల్లని నీరు మొహాన్ని తాకగానే హాయిగా అనిపించింది.
భోజనం చేయాలని అనిపించకపోయినా ..ఏదో కాస్త తిన్నాడు.
దూరంగా ఉన్న ఆంజనేయ స్వామి పటం ఏదో సందేశాన్ని అందిస్తున్నట్లు గా అనిపించడంతో పెదవులపై చిరునవ్వు కదిలింది.

ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాడు కష్టాన్ని తీర్చమని కాదు ..
ఆ కష్టాన్ని చేదించి గెలిచే మార్గాన్ని సూచించమని !
పట్టుదల,ఆత్మవిశ్వాసాన్ని కూడబెట్టుకుని పనిలోకి బయలుదేరాడు.
వెంటనే టూల్ మార్చి ఆపరేటర్ ని పని ప్రారంభించమని చెప్పాడు.
గణేష్ అయ్యర్ ..సురేంద్ర ని అడిగాడు.
” అసలేంటి ప్రాబ్లం !? “
జరిగిందంతా చెప్పాడు సురేంద్ర గణేష్ అయ్యర్ కి.
“సరే! నీ సమస్య అర్థం అయ్యింది.నేను నీకు పర్సనల్ గా సాయం చేయలేకపోవచ్చు.
కానీ నీకో హెల్ప్ మాత్రం తప్పకుండా చేయగలను.కానీ ఓ చిన్న రిస్ట్రిక్షన్ వుంది.”

“చెప్పండి సార్”

“నువ్వు మన ఆఫీస్ లో చేరి సంవత్సరం పూర్తయింది.

నువ్వు అడ్వాన్స్ గా రెండు నెలల జీతం తీసుకోవచ్చు.
నేను ఎం.డి గారితో ఇందాకే మాట్లాడాను.
అంటే నీకు ముప్పై వేల వరకు లోన్ వస్తుంది.వెంటనే  అప్లై చేయి రేపే మనీ ఇస్తారు.
రిస్ట్రిక్షన్ ఏంటంటే నీకు ష్యూరిటీ గా ఎవరైనా సంతకం చేయాలి!” అన్నాడు గణేష్ అయ్యర్ .
ఓ పక్క “లోన్.. ఓ.కే  “అవుతుందన్న ఆనందం ..మరో పక్క ష్యూరిటీ ప్రాబ్లం !
గణేష్ అయ్యర్ ..యంగ్ డైనమిక్ జి.ఎం. సురేంద్ర వైపు చూస్తూ ..
“ష్యూరిటీ నేను పెడతానులే .
 వెంటనే కాగితాలు తీసుకుని అప్లికేషన్ ఫిల్ చేయి..”అంటూ పేపర్స్ అందించారు.
గణేష్ అయ్యర్ గారి పక్కనే వున్న ..శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వేంకటేశ్వరుడు చిరునవ్వులు చిందిస్తున్న ట్లుగా సమ్మోహనం గా చూస్తున్నాడు….
రెండు చేతులెత్తి తననే మొక్కుతున్న భక్తుడు సురేంద్ర వైపు !

రచన : గొర్రెపాటి శ్రీను ( హైదరాబాద్)  9652832290

October 24, 2021 1 comment
8 FacebookTwitterPinterestEmail
కథలు

అనసూయ

by Mandava Subbarao October 24, 2021
written by Mandava Subbarao

“ ఏంటి అను ? ఎంత చెప్పినా వినవు. నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నావు. “  ఎంతో అనునయంగా చెప్పాడు ఛార్లెస్.

“ ఏంటి భవిష్యత్తు, భవిష్యత్తు అంటున్నావు? నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ఒక్కటే. పదేపదే ఎందుకు అలా మాట్లాడుతున్నావు చారు ? “ అంది అనసూయ ఛార్లెస్ నోటిలో నుంచి కారుతున్న సొంగను

గుడ్డతో తుడుస్తూ.

“ లేదు అను. నా మాట విను. నీ వయస్సు నిండా పాతిక కూడా లేదు. మనం కలిసివుంది కేవలం మూడు సంవత్సరాలు. మన అదృష్టం కొద్ది పిల్లలు కూడా లేరు. ఇక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నేను బ్రతకనని , బ్రతికినా పసి పిల్లాడిలా బ్రతకాలని  డాక్టర్లందరూ కరాఖండిగా చెప్పేశారు కదా. ఇంకా నాకు ఊడిగం చేస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకోమాకు. నేను చెప్పేది విను. “ ఆయాసంగా ముద్దముద్దగా మాట్లాడు తున్నాడు ఛార్లెస్.

“ చాల్లే చారు. ఇంకా మాట్లాడాకు. నీకు ఏమీ కాదు. నా ప్రేమతో నిన్ను బ్రతికించుకుంటాను. వైద్యం చేయలేని పనులెన్నో ప్రేమ చేస్తుంది. నువ్వు నాకు ఈ మూడు సంవత్సరాలలో ఇచ్చిన ప్రేమ నాకీ జన్మకు చాలు. నిన్ను నా బిడ్డలా జీవితాంతం సాకుతాను. నా గత జీవితం గురించి నీకు తెలుసు కదా!  అనవసరంగా మనస్సు పాడు చేసుకోమాకు. ఏమీ కాదు. నీకు నేనున్నాను. నాకు నువ్వు తోడుంటావు. కాసేపు నిద్రపో !“

ఛార్లెసి అయిష్టంగానే కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో నర్స్ వచ్చి  డాక్టర్ గారు రమ్మంటున్నారని చెప్పింది. అనసూయ  ఛార్లెస్ కు దుప్పటి కప్పి, డాక్టరును కలవటానికి వెళ్ళింది.

“ సర్ ! మే ఐ కమిన్? “  డాక్టర్ ఛాంబర్ డోర్ తట్టి అడిగింది.

“ ఎస్ . ప్లీజ్ కమిన్. కూర్చోండి. చూడండి అనసూయగారు ! మీరు ఇక్కడకొచ్చి రెండు నెలలై పోయింది. మీ కంపెనీ వారు ఇక ఇన్స్యూరెన్స్ ఇవ్వురట. అంతే కాదు. ఇంకా కొత్తగా ఛార్లెస్ కు చేయవలసిన ట్రీట్ మెంట్ కూడా ఏమీ లేదు. ప్రముఖ న్యూరాజిస్ట్ డాక్టర్ పరమేశ్వరన్ గారి అభిప్రాయం కూడా తీసు కున్నాము. వారు చెప్పిందేమంటే, ఛార్లెస్ వెన్నెముకలో లింక్ పోయింది. ఆపరేషన్ ద్వారా సరిచేసే ప్రయత్నం చేస్తే, అసలు ప్రాణానికే ముప్పు. ప్రపంచంలో ఎక్కడా ఇప్పుడు దీనికి చికిత్స లేదు. అందుకని మీరు ఇంటికి తీసుకు వెళ్ళండి. మేము రాసిచ్చే మందులు జీవితాంతం వాడాలి. ఒక మనిషి నిరంతర కనిపెట్టుకొని వుండాలి. ఏదైనా అత్యసరం అనిపిస్తే ఇదిగో ఈ నెంబరుకు ఫోన్ చేయండి. ఓ.కే.  ఈ రోజు డిచార్జ్ చేస్తారు.” అని ఆ కేసుకు సంబంధించిన ఫైల్ ఆమె చేతికి ఇచ్చి,  “ ఓకే. ఇక మీరు వెళ్ళ వచ్చు “ అని కాలింగ్ బెల్ కొట్టాడు. వచ్చిన సిస్టరుకు వివరాలు చెప్పి పంపించాడు డాక్టర్.

అనసూయ తల్లిదండ్రిలిద్దరూ సివిల్ సర్వెంట్స్. అమ్మ ఐపిఎస్., నాన్న ఐఏఎస్. ఒకరు ఆంధ్రాలో మరొకరు ఝార్ఖండులో. నెలకు ఒకటి రెండు సార్లు కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు కూడా మనస్సు విప్పి మాట్లాడుకోరు. ఎవరు ఎంత సంపాదించారో ఎలా పొదుపు చేసుకుంటున్నారో, ఏమేమి కొంటున్నారో ఇంకా ఎలా సంపాదించ వచ్చో , ఎలా దాచుకోవచ్చో మాట్లాడుకుంటారు నిసిగ్గుగా, నిర్భయంగా. ఆలు మగలు కాబట్టి శారీరకంగా శరీర వాంఛలు తీర్చుకోటానికి కలుసుకుంటారు. తత్ఫలితంగా అనసూయ పుట్టింది. పాలిచ్చి పెంచింది ఆయ. అమ్మ నాన్నల ప్రేమ అంటే ఏమిటో తెలియదు పాపం. స్కూల్ కు వెళ్ళే వయస్సు రాగానే ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించారు. పొద్దున్నే జిమ్ము, సాయత్రం స్కూల్ అయుపోయాక స్విమ్మింగ్. రోజంతా బిజీబిజి. అమ్మ దగ్గర స్కూల్ రోజుల్లో. స్కూల్ సెలవుల్లో నాన్న దగ్గరకు. ఎక్కడవున్నా ఒక్కటే. ఊరకే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ లు చెప్పటానికే అమ్మ నాన్నలు. అన్ని పనులు ఆయానే చేసి పెడుతుంది. తనకు ఏది కావాలన్నా ఆయాతో వెళ్ళి కొనుక్కో వచ్చు. ‘ఎందుకు ? ఏమిటి?’ అని అడిగే వాళ్ళు లేరు. గౌహతి ఐఐటీలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఛార్లెస్ పరిచయమయ్యాడు. క్లాసులో ఇద్దరూ మొదటి రెండు ర్యాంకుల్లో ఉండేవారు. పోటీబడి ఒకరిని మించి ఒకరు మార్కులు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఒకరికొకరు దగ్గరయ్యారు. మానవ సంబంధాలకు మొఖం వాసిపోయివున్న అనసూయ ఛార్లెస్ కుటుంబాన్ని చూసి మరీ దగ్గరయ్యింది. ఆ కుటుంబంలో డబ్బుకోసం కాక ఒకరి బాగోగులు కోసం మరొకరు చేసే త్యాగాలు అనసూయకు బాగా నచ్చాయి. ఛార్లెస్ స్నేహం అనసూయకు మరో నూతన ప్రపంచాన్ని చూపించింది. జీవితాంతం ఛార్లెస్ తో కలసి బ్రతకాలని నిర్ణయించుకుంది.

అమ్మ నాన్నలకు తన ప్రేమ విషయం చెప్పింది. అందరి తల్లిదండ్రుల్లాగానే కాదుకూడదు అన్నారు. డిగ్రీ పూర్తికాగానే యుఎస్ వెళ్ళి ఎమ్మెస్  చేయాలన్నారు.

“ లేదు. నాకు మైక్రోసాప్ట్ లో మంచి ఆఫర్ వచ్చింది.  సెప్టెంబర్ లో నేను జాయినవుతాను. ఛార్లెస్ కూడా జాయినవుతాడు. నెక్స్ట్ మార్చ్ లో పెళ్ళి చేసుకుంటాము. “  తన అభిప్రాయాన్ని చెప్పేసింది.  కలెక్టర్ ఎస్పీలిద్దరు ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు.

“నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాము?”

“నేను కూడా మీ మీద ఎన్నో ప్రేమలు పెట్టుకున్నాను. మీరెప్పుడైనా నా గురించి ఒక్కటంటే ఒక్క గంట మీ సమయాన్ని ఉపయోగించారా? “

“ అనూ ! ఏమిటా మాటలు? నువ్వింకా చిన్న పిల్లవు కాదు కదా ? నీకు మా ఉద్యోగాలు ఎలాంటివో తెలీదా ? “

“ అవును ఈ దేశంలో మీరిద్దరే గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కూతురు ఏం చేస్తుంది? ఏం చదువుతుంది?  తనకు అసలేం కావాలి? అని ఎప్పుడైనా తెలుసుకున్నారా?” అనేక సంవత్సరాలుగా తన మనస్సులో రగిలిపోతున్న ప్రశ్నలను సంధించింది.

“ అవన్ని తెలుసుకున్నాం కాబట్టే, మంచి స్కూల్లో, మంచి కాలేజీల్లో చేర్పించాము. “

“ ఔనౌను. మంచి స్కూళ్ళు, మంచి కాలేజీలు. అంతే గానీ, అసలు నా మనస్సులో ఏముందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? “ కోపంతో రగిలిపోతూ అడిగింది.

“ నువ్వెప్పుడైనా నా కిది వద్దు, ఇది కావాలి. అని అడిగావా?  నువ్వు అడిగింది మేమెప్పుడైనా కాదన్నామా? “ అంతే కోపంగా ప్రశ్నించింది.

“అసలు నేను చెప్పుకోటానికీ, మీరు వినటానికి నాకెప్పుడైనా టైమిచ్చారా? మీరు ఆయాకు చెప్పటం. ఆయ నాకు చెప్పటం. నేను ఆయకు చెప్పిన మాటలు మీదాకా రావు. వచ్చినా పట్టించుకోరు. ఇంట్లో వాళ్ళు ప్రేమించక పోతే, ఆ ప్రేమ బయట దొరికితే, చిన్న పిల్లలైనా, నా లాంటి పెద్ద పిల్లైనా అల్లుకు పోరా ! అతుక్కు పోరా? “

“    ఏంటీ, కవిత్వం చెపుతున్నావా? “

“ నాకు అనిపించింది చెపుతున్నా. ఇది మీకు కవిత్వంలా అనిపించిందా? “

“  ఏ సినిమాలోది ?”

“ నేను సినిమాలు కూడా చూస్తానా ? ఇదేగా నేను అంటున్నది. అసలు నాకేది ఇష్టమో, నేనేమి చేస్తున్నానో మీకు పడితే కదా ?”

ఇంతలో అమ్మ ఫోను మోగింది. అమ్మ తన గదిలోకి వెళ్ళి పోయింది. ఈ సంభాషణంతా విన్నాడో లేదో నాన్న. మౌనంగా ఏదో ఆలోచిస్తూవుండి పోయాడే గానీ, ఒక్క మాటా మాట్లాడ లేదు.

“ అనూ ! “ అంటూ దగ్గరకొచ్చి అను భుజంమీద చెయ్యి వేశాడు. ఇంతలో.. ఈయన గారి ఫోను రింగైంది. తను మరో రూంలో దూరాడు. ఇదే అనుకు ఊహ వచ్చిన దగ్గరనుంచి జరుగుతున్నది, చూస్తున్నది. మరో పది నిమిషల్లో ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళి పోయారు.  అనసూయ ఏమాత్రం ఆశ్చర్య పోలేదు. తనకిది అలవాటేగా.

డాక్టర్ చెప్పినట్టుగానే ఛార్లెస్ ను డిచార్జ్ చేశారు. ఇంటికి వచ్చారు. అనసూయ మరో మూడు నెలలు తల సెలవు పొడిగించింది. అత్తగారు కోడలికి ఒక కన్న తల్లిలా చెప్పింది.

“ చూడమ్మా ! మా ఛార్లెస్ సంగతి మాకందరికీ బాగా అర్థమైంది. ప్రభువు వాడియందు లేడు. మేమందరం రక్త సంబంధికులము. ఎవరిమో ఒకరము నిరంతరం వాడి బాగోగులు చూచుకుంటాము. నువ్వు చిన్న పిల్లవు. ఛార్లెస్ చెప్పినట్టు చెయ్. ఆ ప్రభువు నిన్ను చల్లగా చూడాలి “, అంటూ అనునయించే ప్రయత్నం చేసింది.

“ అదేంటత్తయ్య మీరు కూడా అలా అంటారు?  నా జీవితమంతా ఛార్లెస్సే. మీ కుటుంబంలో నా కెంతో ప్రేమ దొరికింది. ఈ మూడు సంవత్సరాలలో నాకేమైనా పని చెప్పారా మీరు ?  ఏదో ఉద్యోగం చేస్తున్నా నని, నా పనులూ మీరే చేసి పెట్టారు. ఇకనైనా నా పనులు ఛార్లెస్ పనులు నన్ను చేసుకోనివ్వండి” ,  తన నిశ్చితాభిప్రాయం చెప్పింది అనసూయ.

“  చూడు అను. ఛార్లెస్ గానీ, నేను గాని ఎందుకు చెపుతున్నామో అర్థం చేసుకో. నీ మంచి….”

ఇంకా ఏదో చెప్పబోతుండగ,

“ చూడండి అత్తయ్య . ఇక మీరు ఏమీ చెప్పవద్దు. ఛార్లెస్ మీకెంతో నాకూ అంతే. నా కన్న బిడ్డా సాకుకుంటా. ఈ జన్మకిది చాలు. దయచేసి ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడకండి. “

ఈ సంభాషణ తరువాత ఆ కుటుంబంలో ఎవరూ అనుసూయను అనునయించే ప్రయత్నం చేయలేదు. ఛార్లెస్ ఒకటి రెండు సార్లు చెప్పబోయే ప్రయత్నం చేసినా,  కాస్తా కటువుగానే తిరస్కరించి హెచ్చరించింది. అంతటితో ఆ కథ ముగిసింది.

మూడు నెలల్లో ఛార్లెస్ కొంత కోలుకున్నాడు. అంటే భార్యా సహాయంతో బాత్ రూంకు వెళ్ళడం, మొఖం కడుక్కోవటం, వాలు కుర్చీలో కూర్చోని తినటం, టీవీ చూడటం.

సెలవులు అయిపోగానే ఉద్యోగంలో చేరింది. అది కూడా ఛార్లెస్ బలవంతం చేస్తే. కుటుంబంలో అందరూ ఉద్యోగస్తులే. ఆర్థిక సమస్యలేమీ లేవు. కానీ తామిద్దరూ కూర్చుని తినటం బాగుండదని, అన్నదమ్ములు, వదిన మరదళ్ళు ఎంత చెప్పినా వినకుండా అనుసూయను ఉద్యోగానికి పంపించాడు. ఇక పగలంతా బోరు కొట్టకుండావుండటానికి తనెప్పుడో వదిలేసిన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాడు. తానా వారికి ఒక కథానికను పోటికి పంపించాడు ‘అనుశ్రీ’  అనే కలం పేరుతో. ఆ కథకు ప్రథమ బహుమతి వచ్చింది, పాతిక వేలు డబ్బూ వచ్చింది. ఆ ఉత్సాహంతో అనేక పత్రికలకు కథలు పంపించాడు. ఆరు నెలల్లో ఇరవై కథలు రాశాడు. ఐదింటికి ప్రథమ బహుమతులు, మరో నాలుగు కథలకు ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, అమెరికా వరకు అనుశ్రీ పేరు మారుమ్రోగింది. వర్థమాన కథా రచయితగా విమర్శకులు ఆయన శైలిని , కథాకథనాన్ని మెచ్చుకుంటూ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు.

బహుమతులు అందుకోటానికి ప్రత్యక్షంగా తను వెళ్ళక పోవటం కూడా  అతనికి మంచిదే అయింది. అనేక మంది విమర్శకులు ‘ అనుశ్రీ బహుమతులకోసం, పేరు కోసం తన కలాన్ని తాకట్టు పెట్టడ’ని పొగిడారు.

కరోనా మహమ్మారి ఫలితంగా ఛిద్రమైన వలస బ్రతుకుల మీద రాసిన మొదటి నవల ‘చతుర ‘  మాస పత్రికలో ప్రచురించబడింది. అదో సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రలలోని అనేక సాహితీ సంస్థలు ఆ నవలకు బహుమతులు ప్రకటించాయి. తెలుగు విశ్వవిద్యాలయం వారు  నవలా విభాగంలో ఉత్తమ రచనగా గుర్తించి, అవార్డు ప్రకటించారు. ఆ అవార్డు తీసుకోటానికి హైదరాబాద్ రావలసిందిగా ఆహ్వానం అందింది. ఛార్లెస్ ఆరోగ్య పరిస్థితి గురించి యూనిర్సీటీ వారికి అనసూయ వివరించింది. ఇది మరో సంచలనమైంది. ‘మడత కుర్చీకే పరిమితమైన మహా రచయిత అనుశ్రీ స్టీఫెన్ విలియం హాకింగ్’  అంటూ పత్రికలు, టీవీలు కథనాల్ని ప్రచురించాయి, ప్రసారం చేశాయి. కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలు చేశాయి.

సమకాలీన సామాజిక సమస్యలపై తన పరిశీలన, పరిష్కారాలు సూచిస్తూ చేసిన రచనలు  పాఠకుల్ని చైతన్య పరిచాయి.  కథైనా, నవలైనా, వ్యాసమైనా , కవితైనా, పాటైనా అనుశ్రీ కలం నుండి అక్షరాలు  చైతన్యమై ఆబాలగోపాలాన్ని మేల్కొలుపుతాయి. రెండు నవలల సినిమాలుగా వచ్చాయి. అందులో ఒక సినిమా కథకు ఉత్తమ సినీరచనా పురస్కారం లభించింది.

అనుశ్రీ రచయిత ప్రతి విజయం వెనక అనసూయ పాత్రవుందని తెలుగు సమాజం మొత్తానికి తెలిసిపోయింది. అనసూయ , ఛార్లెస్ జీవితమే ఒక కథగా సినిమా తీయటానికి ఎంతో మంది నిర్మాతలు ముందుకు వచ్చారు. అనసూయ ఆత్మ కథ ఆధునిక సమాజానికి ఒక దిక్సూచి అయింది.

October 24, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

బడి-గుడి

by Padma Tripurari October 24, 2021
written by Padma Tripurari

పచ్చని ప్రకృతి పులకించి నాట్యమాడినట్టుగా కనిపిస్తున్న పాఠశాల ఆవరణంతా శోభాయమానంగా కనపడుతుంది. ఆరేళ్ళుగా శ్రమించి పెంచిన పూలవనంపై రంగు రంగుల సీతాకోకచిలుకలు సయ్యాటలాడుతున్నాయి.,తాను వచ్చేనాటికి పదుల సంఖ్యలో ఉన్న మొక్కలు నాలుగు వందలకు చేరి చిట్టడవిని తలపిస్తుంటే,ఆ చెట్టుకొమ్మలపై వాలి కిలకిల రావాలను వినిపిస్తున్న రకరకాల పక్షులను చూస్తుంటే, ప్రధానోపాధ్యాయులు భరత్ మనసు పరవశించి పోతున్నది.పర్యవేక్షణలో భాగంగా ప్రతి గదిని పరికిస్తూ,విద్యార్థుల అభ్యున్నతిని పరిశీలిస్తూ,ఉపాధ్యాయులకు తగిన సూచనలిస్తూ ముందుకు కదులుతున్న భరత్ దృష్టి ఒకచోట ఆగిపోయింది.
డిజిటల్ తరగతిగదిలో అందరూ శ్రద్ధగా పాఠం వింటుండగా ,రమ్య అనే అమ్మాయి కళ్ళు మాత్రం ఆపకుండా కన్నీరు కారుస్తున్నాయి.ఆ అమ్మాయిని హృదయానికి హత్తుకొని ఓదారుస్తున్న ఉపాధ్యాయిని కనపడింది. వెంటనే హెచ్.ఎమ్.భరత్ మిగతా పిల్లల దృష్టి మళ్ళకుండా ఉండడానికి నెమ్మదిగా వెనుకనుండి వెళ్ళి,రమ్యను ఉపాధ్యాయుల గదికి తీసుకురమ్మని మల్లిక టీచర్ కి చెప్పారు.అలాగే నంటూ మల్లిక రమ్యను తీసుకుని వెళ్ళింది.

మల్లికగారూ,ఏమైందండి?.రమ్య ఎందుకు ఏడుస్తున్నది అని అడిగారు.వెంటనే మల్లిక టీచర్ ,సార్,ఈ అమ్మాయి వాళ్ళింట్లో చాలా కష్టాలున్నాయి సర్.తండ్రి చనిపోయాడు.తల్లి మగ్గం నేస్తూ,వచ్చిన నాలుగు రాళ్ళతో ఈ అమ్మాయిని,వాళ్ళ అన్నయ్యని చదివిస్తున్నది .ఇవాళ ఇంట్లో సరుకులు నిండుకోవడం వల్ల, ఉదయం ఏమీ తినలేదట.వాళ్ళ అమ్మ ఖాళీ కడుపుతో తన బిడ్డను బడికి పంపిస్తున్నానని చాలా ఏడ్చిందట.ఏడుస్తున్న వాళ్ళ అమ్మ మొఖం మదిలో మెదిలి మన రమ్య తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నానని చెబుతోంది సర్.

ఓ.అలాగా.మల్లిక టీచర్ ,రమ్య ఎలా చదువుతుంది?అని అడుగుతూనే హెచ్.ఎమ్.భరత్ రమ్యని ఊరడిస్తున్నారు.హెచ్.ఎమ్.అడిగిన ప్రశ్నకి సమాధానంగా మల్లిక టీచర్ తన ప్రియతమ శిష్యురాలు రమ్య గురించి చెబుతున్నది.సర్, రమ్య చాలా మంచి అమ్మాయి. మన బడి మొత్తంలో ఎక్కువ మార్కులు వచ్చేది ఈ అమ్మాయికే .చదువొక్కటే కాదు.ఎంతో సంస్కారవంతురాలు కూడా. మొన్నామధ్యన మనం పిల్లలందరినీ అనాధాశ్రమానికి,వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళాం కదా!అప్పుడు రమ్యయితే సెలవు రోజు కూలికి వెళ్ళి మరీ డబ్బులు సంపాదించి వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ పండ్లు,అనాధాశ్రమంలో పిల్లలకి గాజులు కొనిచ్చింది సర్.వద్దమ్మా.నువ్వే ఇబ్బంది పడుతున్నావు.నీవు మళ్లీ డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకన్నా వినలేదు.లేదు టీచర్.మనం ఒక పూట తినకపోయినా ఫరవాలేదు. మరొకరికి సాయం చేయమని చెప్పారు కదా.ఆ మాటలే నా మనసులో మెదలుతున్నాయి అంటూ మరీ వృద్ధులకు,అనాధలకు సాయం అందించింది సర్.అంతేనా మన బడికి ఎంతో మంది ప్రముఖులను మీరు ఆహ్వానిస్తుంటారు కదా.వాళ్ళ సందేశాలన్ని ఒక పుస్తకంలో రాసుకొని,జీవితంలో గొప్పగా ఎదగుతానని సంతోషంగా చెబుతుంది.మీకు తెలుసు కదా.మన రమ్య చదువులోనే కాదు.ఆటపాటల్లోను ప్రథమ స్థానంలోనే నిలుస్తుంది.మొన్నీ మధ్యన లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారంతో మీరు నియమించిన శిక్షకుడి సాయంతో నేర్చుకున్న కరాటే పోటీలోనూ,రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీల్లోను మన రమ్య విజేతగా నిలిచింది. ఆ బహుమతులు మొన్న మీరు ప్రార్థనలో అందించి,అభినందించారు కదా.

మల్లిక టీచర్ రమ్య గురించి ఆపకుండా తనలోని మంచిని చెబుతున్న తీరును చూసి హెచ్.ఎమ్.భరత్ మనసు ఉప్పొంగిపోయింది.చదువొక్కటే కాకుండా, విద్యార్థుల కుటుంబ పరిస్థితులను తెలుసుకొని వారికి అండగా నిలిచే ఉపాధ్యాయ వర్గము తన పాఠశాలలో ఉన్నందుకు ఎంతో సంతోషం కలిగింది.అటువైపు తిరిగి ఉబికి వస్తున్న కన్నీటిని అదిమిపడుతున్న రమ్యను ఓదారుస్తున్నారు హెచ్.ఎమ్.భరత్.ఈలోగా అటుపక్కనే ఉన్న మురళి సార్ వచ్చి,సార్ రమ్య ఉదయాన్నే ప్రార్థనలో రోజొక చక్కటి నీతి పద్యం,సూక్తి వినిపిస్తుంది.ఏకపాత్రాభినయమయితే బ్రహ్మాండంగా చేస్తుంది.అని చెబుతుండగానే తరగతిగదిలోనుండి వచ్చిన మరొక ఉపాధ్యాయుడు అయ్యో రమ్యా?ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు?నువు చాలా క్రమశిక్షణ కలిగిన విద్యార్థివని అందరికీ చెబుతుంటాను.ధైర్యవంతురాలివని చెబుతుంటాను.అలాంటిది నువ్వు ఏడవడమేమిటి?అని అంటుండగానే మల్లిక తన బ్యాగ్ లో నుండి బిస్కెట్లు తీసుకువచ్చి, రమ్యకి అందించింది.రమ్యా!వద్దురా.ఏడవద్దు.మేమందరం నీవెంటే ఉన్నాము కదా.మేమంతా నీ భవిష్యత్తు కోసం ఒక ఆలోచన చేస్తాము.అని అంటుండగానే హెచ్.ఎమ్.భరత్,మల్లికతో ,టీచర్,రమ్యని తన గదిలోకి పంపించి మిగతా విద్యార్థులకు బాగా చూసుకోమని చెప్పిరండి.మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొందాం అని చెప్పగానే,మల్లిక రమ్యను తీసుకొని వెళ్ళింది.
తరువాత కొద్ది సేపటికే హెచ్.ఎమ్.భరత్ ఉపాధ్యాయులందరితో సమావేశం ఏర్పాటు చేసి,ఏం చేద్దాం అని అడిగారు.ఉపాధ్యాయులందరూ సర్.రమ్యలాంటి ఉత్తమ విద్యార్థి చదువుకు ఎలాంటి ఆటంకము కలుగకుండా ఉండాలంటే మనమంతా కలిసి, కొంత డబ్బు వేసుకుందాము.ఒక్క రమ్యనే కాదు.రమ్యలాగా వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులందరికీ మన పాఠశాల ఒక భరోసా కావాలి.చదువే కాదు బంగారు భవితకు బడి గుడిలాగ నిలుస్తుందన్న నమ్మకాన్ని కల్పించాలి.అందుకోసం మన గ్రామంలో ఉన్న కొందరు పెద్దల సహకారంతో కొంత నిధిని ఏర్పాటు చేసి,ఆ నిధినుండి ఇలాంటి పిల్లలకు సహకారమందిద్దాం అని ముక్తకంఠంతో చెప్పారు.మల్లిక టీచరయితే సార్,మాకు తెలిసిన బంధువునడుగుతాను.తను ఇలాంటి ఉత్తమ విద్యార్థులకు తప్పకుండా పెద్ద మొత్తంలో సహకారమందిస్తారు అని చెబుతుండగానే,హెచ్.ఎమ్.భరత్ మాట్లాడుతూ చాలా మంచి ఆలోచన.మన బడి గుడికన్నా పవిత్రమయినదని నిరూపిద్దాం.పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం మన శక్తినంతా కూడదీసుకొని ఉత్తమ బోధనతో పాటు,ఉన్నత భవిష్యత్ ను అందిద్దాం అని చెబుతూనే కార్యాచరణకు పూనుకొన్నారు.

పద్మ త్రిపురారి(ఆర్)
తెలుగు ఉపాధ్యాయిని.
జి.ప.ఉ.పాఠశాల. నీర్మాల.
మం::దేవరుప్పుల.
జిల్లా::జనగామ.

October 24, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

బాధ్యత

by Venkata Ramana October 24, 2021
written by Venkata Ramana

పక్కింటిఅంకుల్కిజ్వరంగాఉందిటమందులుకావాలి ,ఒకసారిమెడికల్షాప్కివెళ్లిరాఅంటూకొడుకుసూర్యనినిద్రలేపిందివాళ్ళఅమ్మ  . అంకుల్కిబాగాలేకపోతేనన్నెదుకులేపుతావుఒక్కనిముషముకూడానన్నునిద్రపోనివ్వవుకదాఅంటూమళ్ళీనిద్రలోజారుకున్నాడుసూర్య. అర్జెంటురాఅందుకేచెప్పాను , అయినాటైంచూడుఎనిమిదిదాటిందిఇంకానిద్రఏంటిరామంచందిగుఅంటూమళ్ళీకుదిపింది.

ఏమండీసూర్యవెళ్లాడా , డాక్టర్అరగంటలోమందువెయ్యాలిఅనిచెప్పాడుఅనిలోపలికివచ్చిందిపక్కింటిఆంటీ . సూర్యవెళ్తాడుమీరుకంగారుపడకండిఅంటూసర్దిచెప్పింది.

సూర్యమళ్ళీనిద్రలోజారుకున్నాడు. కొన్నినెలలక్రితంసూర్యకివిపరీతమయినజ్వరంవచ్చినపుడు , రాత్రిమందులులేవు ,పక్కింటిఆంటీసూర్యదగ్గరేకూర్చుంది .ఐస్వాటర్తోవొళ్ళుతుడుస్తూఅంకుల్నిమందులుతీసుకురమ్మంది. ఆటోలోవెళ్లిరాత్రిఅంకుల్మందులుతీసుకువచ్చిసూర్యకితానేదగ్గరఉందిటెంపరేచర్చూస్తూఆరాత్రిఎంతోధైర్యాన్నిఇచ్చారు.

ఇవాళఆఅంకుల్జ్వరంతోఉంటెనేనుఎంచెయ్యలేకపోతున్నాఅన్నభావననాలోకలిగింది. సిటీలోఉన్నఅన్నయ్యకిఫోన్చేసిందిఅర్జెంటుగామందులుకావాలిఅని. సూర్యఇంకానిద్రలోనేఉన్నాడు. ఆంటీమళ్ళీవచ్చింది. మాఅన్నయ్యతీసుకువస్తున్నాడుమీరుకంగారుపడకండిఅనిచెప్పిఅంకుల్వాళ్ళఇంట్లోకివెళ్ళాను. అంకుల్చాలధైర్యంగాఉన్నారు , ఏమీలేదమ్మామందుపడితేరెండురోజుల్లోతగ్గుతుంది, మీఆంటీఅనవసరంగాకంగారుపడుతోందిఅన్నారు. సూర్యరాత్రిచాలాలేట్గాపడుకున్నాడు , లేవలేదు , మాఅన్నయ్యకిచెప్పాను , మందులువస్తాయిఅంకుల్కొంచంవెయిట్చేయండిఅన్నాను. ఒకఅరగంటలోఅన్నయ్యమందులుతెచ్చిఇచ్చాడు. అంకుల్దగ్గరకూర్చునితానేమందులువేసాడు. నీకుశ్రమఇచ్ఛానయ్యానేనుఅన్నారు , అదేంటిఅంకుల్నేనువూరులోలేనప్పుడుమాచెల్లెలిని , సూర్యనిమీరుతల్లితండ్రుల్లాగాచూసుకుంటున్నారు . ఇందులోశ్రమఏంటి. మీరుకొంచంసేపునిద్రపోండిఅంటూఅన్నయ్యమాఇంట్లోకిదారితీసాడు. సూర్యఅప్పుడేలేచాడు, హాయ్మామయ్యాఏంటిఇంటపొద్దున్నేవచ్చావుఅంటూఅన్నయ్యపక్కనకూర్చున్నాడు.

సూర్యా, ఇదేమీబాగాలేదు ,పక్కనఇంటిఅంకుల్కిఅంతఫీవర్గాఉంటె , నువ్వువెళ్లిసహాయంచెయ్యాలికదా. మీకుఎప్పుడుఏఅవసరంవచ్చినావాళ్ళేకదాచూస్తున్నారు. బాధ్యతనేర్చుకోవాలి. చిన్నపిల్లాడివికావునువ్వు. మీనాన్నకూడాలేడు, అమ్మనిఎంతోబాధ్యతగాచూసుకోవాలి. ఎప్పుడుఎవరికీఏఅవసరంవచ్చినవెంటనేసహాయంచెయ్యాలి. ఒకసారిగుర్తుచేసుకో, హాల్టికెట్మరిచిపోయిఎక్సమ్కివెళ్ళావు. అంకుల్నీవెనకాలఆటోలోవచ్చినీకుస్కూల్లోహాల్టికెట్ఇచ్చారు. లేకపోతేపరీక్షతప్పేవాడివి. అలాగేఒకసారినీకుజ్వరంవచ్చినప్పుడునేనుఊరులోలేను , రాత్రిపరిగెత్తుకునివెళ్లినీకుమందులుతెచ్చిరాత్రిఅంతానీపక్కనేకూర్చునిఅమ్మకిధైర్యంచెప్పారుఅంకుల్వాళ్ళు .

నువ్వుఇలాప్రవర్తిస్తావనినేనుఅనుకోలేదు. సాటిమనిషికిమనంచెయ్యగలిగినసహాయంఎప్పుడూచెయ్యాలిఎందుకంటేఎప్పుడుమనకిఏఅవసరంవస్తుందోతెలీదు . ఒకబాధ్యతఉన్నమనిషిగాఎదగాలినువ్వు. కొంచంసేపయ్యాకవెళ్లిఅంకుల్నిచూడు. అక్కడకూర్చునిమందులుఇవ్వు. ఆంటీకిధైర్యంచెప్పు . తెలిసిందాఅనిమందలించాడుఅన్నయ్య.

సిగ్గుతోతలాదించుకున్నసూర్య , నువ్వుచెప్పిందినిజంమామయ్యా , పక్కింటివాళ్ళుఎంతోమంచివారు. నేనునువ్వుచెప్పినట్టేచేస్తాఅంటూఅంకుల్వాళ్ళఇంట్లోకిదారితీసాడు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

October 24, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

రుద్రమదేవి 6 & 7 & 8 ప్రకరణములు

by రంగరాజు పద్మజ October 24, 2021
written by రంగరాజు పద్మజ

ఆరవ ప్రకరణం
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయశర్మసరళీకృతం:- రంగరాజు పద్మజ
( సిగము )
(దేవతావేశం)

పరమభక్తినుపాసించు భక్తవరుల
కొక్క చోటుగాకున్న నింకొక్కచోట
ఫలము బ్రాపింపగోఱి చెప్పంగలేడే?

తద్విధివిధానముల దేవతా ప్రభుండు.

— గ్రంథకర్త.

భావం:- భక్తుడైనవాడు తాను నమ్మిన దైవాన్ని పరమభక్తితో విధివిధానంగా పూజిస్తే ఒకచోట కాకున్నా మరొక చోటైనా ఫలితం పొందగలడు.

వ్యాఖ్య:-గ్రంథకర్త ఈ పద్యాన్ని రుద్రమదేవి తన కూతుర్లకు సంతానం కలగక పోవడంతో బుద్ధ గణపతిని పూజించమని మదనమంజరి చెప్పినప్పుడు “ఎంత పూజించినా లాభమేముంది ?”అని నిరుత్సాహ పడిన సందర్భంలో పూజలు చేయగానే వెంటనే ఫలితం కలగక పోయినా పూజల ఫలితం తప్పక ఉంటుందని భావి కథాభాగాన్ని సూచిస్తూ సాగిన ప్రకరణ ఔచిత్య పద్యమిది–

సాయంకాలం తర్వాత రుద్రమదేవి బుద్ధగణపతి దేవాలయంలో కూర్చుని ఉన్నది. ముమ్మడమ్మ, రుయమ్మలు ఆమె పక్కనే కూర్చున్నారు. మరికొందరు సేవికులు కొంచెం దూరంలో కూర్చున్నారు. మదనమంజరి రుద్రమదేవి దగ్గరకు వెళ్లి ఇలా అన్నది.

తల్లీ !  ఈ బుద్ధగణపతి ఆలయంలో ఇంతకు ముందు ఎవ్వరూ ఇంతగా దానం చేసిన వారులేరని అనుకుంటున్నారు. బ్రాహ్మణులు మీరు చేసిన దానాలతో చాలా సంతృప్తి పొందారు. మీరు ఇచ్చిన ధనం మోసుకొని పోలేక దారిలో ఎదురైన వారికల్లా పంచిపెడుతూ పోతున్నారు.

నిజమేనా? అయినా ఫలితం ఏమున్నది? అన్నది రుద్రమదేవి. ఫలితానికి భక్తి కారణమైనా, భక్తి కలిగినప్పుడే ఫలితం కలుగదు !  కొన్ని రోజు

లు కొలిస్తే ఫలితం కనపడుతుంది. అయినా ఇవన్నీ మీకు తెలియవా? నేను మీకు తెలియదని చెప్పడం లేదు. ఫలితం  కోరే వాళ్ళు శ్రద్ధతో మనస్సును లగ్నం చేసి అనుకున్న పని నెరవేరే దాకా దేవుడిని పూజించడం వదలకూడదని దాసి అన్నది.

మరిచిపోయాను

నువ్వు చెబితే జ్ఞాపకం వచ్చింది. సాయంత్రం ఎక్కడికైనా వెళ్లావా? కనిపించలేదు? అని రుద్రమదేవి అడిగింది.
అమ్మా! మీరు తప్ప నాకు ఇక్కడ పరిచయస్తులు ఎవరున్నారు? కనుక ఎక్కడికి వెళ్ళలేదు. రుయ్యమ్మ దొరసాని ,నేను తోటలో తిరుగుతూ ఏవో పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశామన్నది మదనమంజరి.
ఆ సంగతి నాకు తెలుసు. అప్పుడు కాదు… మీరు వచ్చేసరికి కొంచెం పొద్దున్నది. ఆ తర్వాత సాయంత్రం నువ్వు కనిపించలేదు. అక్కడా ఇక్కడ చూశానని అన్నది రుద్రమదేవి.

అయ్యోయ్యో!  మీరు బిగ్గరగా పిలిచి ఉండరు. అయినా ఎక్కడికైనా వెళ్లే పని నాకు ఏముంది? చిన్న దొరసాని, నేను తోటలో తిరుగుతున్నప్పుడు కొన్ని అందమైన పూలు కనిపించాయి. వాటిని తెంపీ తెచ్చి చిన్న దొరసానులకు ఈరోజు దండలను గుచ్చాలను కున్నాను. అప్పుడు నేను రుయ్యమ్మ గారితో మాట్లాడుతున్నాను. కానీ పూలు ఏరడం కోసం కాదు. దొరసానిని ఇక్క

డికి తీసుకొని వచ్చి, మళ్లీ నేనొక్కదాన్నే వెళ్లి తోటలో ముందు చూసిన పూలను తెంపుకుని వచ్చి, మళ్లీ ఇక్కడ కూర్చుండి పోతే దండలను గుచ్చడానికి అవకాశం దొరకదని అనుకొని, దేవుని గుడి వెనుక కూర్చొని దండలను గుచ్చుకొని వచ్చాను. ఇది సరే!  మన మొగిలిచర్ల ప్రయాణం ఎప్పుడు? రేపు తెల్లవారుజామున పోవాలి కావచ్చని అన్నది మదనమంజరి.
ఇక్కడి నుండి ఇంటికే వెళ్ళేది. మళ్లీ ఒకసారి మొగిలిచర్ల ప్రయాణం గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదని రుద్రమదేవి అన్నది.
అప్పటికి రాత్రి రెండు మూడు గడియలు అయింది. ముమ్మడమ్మ, రుయ్యమ్మ బుద్ధ గణపతిని పూజించడానికి వెళ్ళిపోయారు.
రుద్రమదేవి అక్కడే కూర్చుని ఉన్నది. మదనమంజరి ఆమె దగ్గర కూర్చొని, ఒకసారి వెనకవైపు చక్కగా చూసి తర్వాత ఏమేమో విచిత్రంగా మాట్లాడుతూ కాలం గడుపుతున్న ది.
ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి రుద్రమదేవి దగ్గర నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుడు దాదాపు యాబై సంవత్సరాల వయస్సున్న వాడు. వెంట్రుకలు తెల్లబడ్డాయి. ఎర్రని శరీరం మీద  తెల్లని విభూతి రేఖలు స్పష్టంగా కనబడుతున్నాయి. నుదుటిమీద విభూతి రేఖలమధ్య గంధంతో తడిపిన అక్షింతలు అందంగా కనబడుతున్నాయి. మెడలో రుద్రాక్షమాల వేలాడుతున్నది. ఏడువరుసలు కుచ్చిళ్ళు పోసి తెల్లని ధోవతి కట్టుకున్నాడు. పెట్టిన శాలువా భుజంపై రెపరెపలాడుతున్నది.చేతిలో చిన్న పంచ ఉన్నది.
నడుముకు( రొంటిలో)  చెక్కిన నశ్యపు కాయ  అతడు అచ్చమైన బ్రాహ్మణుడని తెలుపుతున్నది.
ఇలాంటి వేషంతో వచ్చిన బ్రాహ్మణుని చూడగానే రుద్రమదేవి లేచి భయంతోనూ, వినయంతోనూ నమస్కరించింది.
బ్రాహ్మణుడు రుద్రమదేవిని శాస్త్ర ప్రకారంగా ఆశీర్వదించాడు. బ్రాహ్మణుడు, రుద్రమదేవి వారివారి ఆసనాలపై వారు కూర్చుని ఇలా మాట్లాడుతున్నారు.
బ్రాహ్మణోత్తమా! మీరు ఈ ప్రాంతం వారేనా?
అమ్మా నాది; ఈదేశం కాదు.
ఏ దేశం?
పనికిరాని దేశంలో బతికాను. అయినా వెనుకటి మాటలు ఎందుకు?
ముందు మీరు ఏ దేశంలో ఉండేవారో చెప్పండి? మన చరిత్ర మనకే వద్దంటే మరెవరికి అవసరమవుతుంది?
ధర్మానికి మారురూపంగా ఉన్న అమ్మా!  నా వెనుకటి విషయాలు చెప్తే నా శత్రువులు నన్ను ఏమైనా హింసిస్తారేమో అని భయం.
నేను ఉన్నంతదాకా  మీకేమీ భయంలేదు చెప్పండి!
నేను దేవగిరిలో నివసించే వాడిని.
దేవగిరిని ఎందుకు వదిలారు?
రాజు అవమానించటం వల్ల.
యాదవ రాజులు బ్రాహ్మణులపై కోపగించుకున్నరా?
రాజుల కోపం బ్రాహ్మణులా? భట్టులా? అని చూడనీయదు.
అక్కడ మీరు ఏం పని చేసేవారు?
వారికి నేను పురోహితుడిని. ఒకనాడు కృష్ణ భూపతి ఇంట్లో వ్రతం జరిగింది. ఆ రోజు నాకు ఆరోగ్యం బాగా లేక, లేవలేక పోయాను. వ్రతం చేయించి రమ్మని నా మేనల్లుడిని పంపాను. అలా అతన్ని పంపినందుకు నా మీద చాలా కోపంతో నన్ను మోసం చేయాలని ప్రయత్నించాడు.నాకు ఈ సంగతి తెలిసి వచ్చాను. కృష్ణ భూపుడు మరణించినా… అతని తమ్ముడు మహాదేవరాజు మాపై ఉన్న కోపం వదలలేదు.
ఏవండీ ! మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కృష్ణభూపాలుడు సామాన్యుడు కాడు. తెలివి లేని వాడు అంతకన్నా కాడు. కారణం లేకుండా ఇంత చిన్న విషయానికి మిమ్ములను ఇంత స్థితికి రానివ్వడని  నాకు బాగా తెలుసు. మీరు బ్రాహ్మణులు.అబద్ధం ఆడరని నాకుతెలిసినా ఇప్పుడు మీ మాటలు నేను నమ్మలేను.  బ్రాహ్మణుని మొహం విచారంగా  మారింది.
ఏమండీ!  అలా ఎందుకు బాధ పడుతున్నారు? మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే కృష్ణభూపుడు గానీ, మహాదేవరాజు గాని ఈ చిన్న కారణం చేత అలా చేయరు.
నా మాట మీరు నమ్మకపోతే మొన్న నాకు నా స్నేహితుడు రామభట్టు రాసిన ఉత్తరం చూడండి!  అది చదివితే మీకే తెలుస్తుంది.
బ్రాహ్మణుడు రుద్రమదేవి చేతికి ఒక ఉత్తరాన్ని  ఇచ్చాడు.
రుద్రమదేవి ఆ ఉత్తరం విప్పి చదివింది. దానిలో ఉన్న సమాచారం ఇలా ఉంది.
యజ్ఞయాగాలు చేయించడంలో, పరమ నిష్ణాతులైన షడ్వింశ బ్రాహ్మణులైన శాస్త్రి గారికి…
రాంభట్టు ఈరోజుపదివేల నమస్కారాలు చేస్తూ,
ఇక్కడ మేమంతా క్షేమం!  మీ క్షేమసమాచారాలు రాయించగలరు.
తర్వాత చాలా రోజుల నుండి మీ క్షేమ సమాచారాలేమీ తెలియడం లేదు. మీ మీద మహాదేవరాజుగారికి చాలా కోపంగా ఉన్నది ఇప్పట్లో మీరు ఈ దేశానికి రావడం మంచిది కాదు అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీకా మారువేషం బాగానే ఉన్నది. మీ వారు అందరూ క్షేమంగా ఉన్నారు.
కావున దయ ఉంచండి….
ఉత్తరం నిపుణుడైన వాడు రాయలేదని రుద్రమ తెలుసుకుంది. ఆ ఉత్తరం వంకరటింకర అక్షరాలతో రాసి ఉన్నది మళ్లీ రుద్రమదేవి బ్రాహ్మణునితో ఇలా అన్నది .
కావచ్చును కానీ  ఈ ఉత్తరం వల్ల మీకున్న శత్రుత్వానికి సరైన కారణం తెలియడంలేదు. మీరు చెప్పిన కారణం మాత్రం సరిగ్గా లేదు
నీ సన్నిధికి వచ్చి రాయబారం అనే మాట ఇంతదాకా వచ్చినప్పుడు అసలు విషయం చెప్పకుండా ఉండడం మంచిది కాదు. నేను ఒక తప్పు చేశాను. దాన్ని వివరించి చెప్తే మీకు తప్పక కోపం వస్తుంది. అయినా చెప్పక తప్పదు. దేవగిరి రాజులు మేము శ్రీకృష్ణుని సంతతి వారమని, యాదవులమనీ, యాదవ శబ్దం మా ఇంటి పేరు గాని, మేము గొల్లవాళ్ళ తెగకు చెందమనీ చంద్ర వంశాన పుట్టిన క్షత్రియులమనీ, మాకు వేదోక్త కర్మలు కావాలని వారంటారు. నేనందుకు ఒప్పుకోక పురాణం చెప్పిన ప్రకారం కర్మలు చేయించేవాడిని. వారికి నామీద అనుమానం ఎక్కువై,ఆ వ్రతం రోజున నేను వెళ్ళక,  నా మేనల్లుడైన చిన్నవాడిని పంపాను. రాజు వల్ల అవమానమైనా,సన్మానమైనా చిన్నవాడు అతను భరిస్తాడనీ  పంపాను. రాజు ఈ విషయం తెలుసుకున్నాడో? ఏమో? నా అల్లుడిని తిప్పి పంపేసి, నన్ను రమ్మని కబురు చేశాడు, నేను ఒప్పుకోలేదు. ఆ కోపం ఇంతకాలమైనా విడిచిపెట్టలేదు. అందుకే దేశం వదిలి వచ్చాను. కుటుంబాన్ని వదిలి పెట్టాను. ఒంటరి వాడిని పారాయణం ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నాను. ఏం చెప్పను? తల్లీ!? మాటలలో పడి నాసంగతి మీకు చెప్పాను.  ఎన్నడూ, ఎక్కడా, ఎప్పుడూ, ఎవరితోనూ చెప్పినా నాకు ముప్పు తప్పదని నాకు పూర్తిగా తెలుసు. తల్లీ!  మీరు వారికి తెలిపితే నా కొంప మునుగుతుంది. నా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. ముంచినా తేల్చినా మీదే భారం!
భక్తులందరు బుద్ధ గణపతి ఆలయం లోపలికి వెళ్లి స్తోత్రపాఠాలు చేస్తున్నారు. కీర్తనలు పాడుతున్నారు. ఆ శబ్దాలన్నీ భక్తిభావంతో కూడి ఉన్నాయి. గుడి బయట చాలా దూరం వరకు వినవస్తున్నాయి.
”  కుమార శాస్త్రి గారూ! మీరు భయ పడకండి! మీ మాటలను నేను రెండో వాడి చెవిలో పడనివ్వను లెండి! అని అన్నది రుద్రమదేవి.
బ్రాహ్మణుడు తల పంకించాడు. తన మాటలకు సమాధానం చెప్పేందుకు తల ఊపాడు అనుకున్నది రుద్రమదేవి. కానీ ఆ బ్రాహ్మణుని తల అలా ఊగుతూనే ఉన్నది… ఆగడం లేదు. తలతోపాటు కాళ్లు చేతులు కూడా ఊగుతున్నాయి.  రుద్రమదేవికి ఏమీ తోచటం లేదు. అయ్యా! అయ్యా !!అని పిలిచింది. అతను సమాధానం ఇవ్వలేదు.
ఆయన స్వభావం తెలియని రుద్రమదేవి” రక్షించండి! రక్షించండి!  అని పెద్దగా కేక వేసింది. ఆ గుడిలో ఉన్న వారికి వినబడనందున ఎవరు రాలేదు. ఇంతలో దాసి బ్రాహ్మణుని తేరిపార చూసి, అమ్మా! మీరు భయపడవలసిన పనిలేదు ఈ బ్రాహ్మణునికి ఏం భయం లేదు. ఇతనికి దేవత ఆవేశం అయినట్టు అనిపిస్తుంది. ఇతని వల్ల మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే రాశిఫలాలు అడిగి తెలుసుకోవచ్చని అన్నది.
ఆ బ్రాహ్మణుడు అలా వణికి -వణికి కెవ్వుమని కేక వేసి లేచి, బుద్ధ గణపతి కోవెలలోనికి పరిగెత్తి వెళ్ళాడు. రుద్రమదేవి, దాసి ఇద్దరు అతని వెనుకనే నడిచారు.
కుమార భట్టు పెద్దగా అరుస్తూ… ఒక చోట నిలబడకుండా అటూ- ఇటు తిరుగుతూ, ఊగి పోతూ, వణుకుతూ, పండ్లు పటపటా కొరుకుతూ, కౄరంగా దేవతా విగ్రహాన్ని చూస్తున్నాడు.
అతని పరిస్థితి తెలుసుకొని కొందరు కొంత సామ్రాణి, నిప్పును తెచ్చి ధూపంవేసి,” స్వామీ!  ఏం సమాచారం? ఇంతగా ఎందుకు ఊగిపోతున్నారు? ఎందుకు వచ్చారు? ఎందుకు ఆయాస పడుతున్నారని అడిగారు.
రుద్రమదేవి ఇటువంటి వినోదం ఎప్పుడూ చూడలేదు కాబట్టి ముందుకు వచ్చి నిలబడింది. రాణి గారి కొరకు ప్రజలు కాస్త వెనుకకు వెళ్లి చోటుకల్పించారు. దాసిని దగ్గర నిలబెట్టుకొని ఆ వింత చూస్తున్నది రుద్రమ దేవి.
ఒక మనిషి ఆ గుంపు నుండి ముందుకు వచ్చి నమస్కారం చేసి ,చేతులు జోడించి, నిలబడి”  స్వామి నా సంగతి ఏమిటి? అని అడిగాడు.
“హూ!  ఏమిరా? భక్తుడా?  నువ్వు నన్ను పూజిస్తూ ఉండి రెండు మూడు మండలాలైనా ( మండలం అనగా నలబై రోజులు.) కాలేదు, అప్పుడే నీకు ఫలితం కావాలిరా? ఇంకొక మండలం నన్ను పూజించు! నీ కోరిక నెరవేరుతుంది.
హూ!  అని గంభీరంగా అన్నాడు.
ఇలా ఒకరి తర్వాత  మరొకరు వచ్చి దేవుని వల్ల తమకు ఎటువంటి ఫలాలున్నాయో అని అడిగి తెలుసుకుంటున్నారు. దేవుడు పూనిన  బ్రాహ్మణుడు కొందరికి మంచి జరుగుతుందనీ, కొందరికీ చెడు ఫలితాలు ఉన్నాయని చెబుతున్నాడు కొందరికి విభూతి, ఖర్జూర ఫలాలు, సామ్రాణి ఇస్తున్నాడు.
అమ్మా!  మనం వచ్చిన పని గురించి అడుగుదామా? అని  రుద్రమదేవిని అడిగింది మదనమంజరి. రుద్రమదేవి అవునని కానీ, కాదని కానీ ఏమీ అనలేదు. ఆమెకు ఇది అంతా విచిత్రంగా అనిపిస్తుంది.
మదనమంజరి దేవతావశమైన బ్రాహ్మణుని దగ్గరకు వచ్చి భయభక్తులతో నమస్కరించి, దేవుడా!మేమొక పని మీద వచ్చాం. మా మనసులోని  అనుమానం తొలిగేటట్టు మంచి వరమివ్వమని అడిగి మళ్లీ నమస్కరించింది.
రుద్రమదేవి మనసులో కొంచెం ధైర్యం తెచ్చుకున్నది.ముమ్మడమ్మ, రుయ్యమ్మ కూడా ధైర్యం చెప్పారు  దాసి మాత్రం ధైర్యం వదలకుండా… స్వామీ! ఎల్లకాలం మిమ్మల్నేనమ్మి ఉన్న మా కోరికలను తప్పక తీర్చాలి! మీరు తప్ప మాకు వేరే గతిలేదు. మమ్ములను ఆదరించండి !అని వేడుకున్నది.
హా!  భక్తురాలా!  హూ!  మీకు… మంచి ఫలితం లేదని నేను చెప్పలేదు కానీ, మీరు రేపు పొద్దున్నే…హా… లేచి.. మొగిలిచర్లకు పోయి… ఏకవీరా… మహాదేవిని.. హా .. మొక్కండి! ఫలము….హూ! … తెండి… శీతలం
( బెల్లంపానకం)  ఏదిరా? అని అరవడం మొదలు పెట్టాడు వెంటనే అక్కడే ఉన్న బ్రాహ్మణుడొకడు” స్వామీ!  మీరు అడిగిన శీతలం చేస్తాము! శాంతి పొందండి! అని రెండు బిందెల నీళ్ళలో బెల్లం కలిపి తెచ్చాడు దేవుడు ఆవేశించినవాడు ఆ శీతలం తాగకముందే ” ధభేలుమని”  నేల మీద పడ్డాడు. అతనికి స్మృతి లేనట్టున్నది. గుడి అంతా సంక్షోభం తీరిన సముద్రం వలె  నిశబ్దంగా మారింది.

ఏడవ ప్రకరణ
గ్రంథకర్త:- ఒద్దిరాజు సీతారామ చంద్రరాయ శర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[  ముఖ్యరాలు రుద్రమ చిక్కినది]
అల్పోపాయాన్మహాసిద్ధి
రేతన్మసన్త్ర ఫలంమహత్ ॥
—హితోపదేశము.
భావం:-కొంచెమైన సాధన వల్ల గొప్ప లాభం పొందవచ్చు.విస్తారమైన ఆలోచన వల్ల మరెంతో లాభం పొందువచ్చు
కథాభాగం:- రుద్రమదేవి వడ్డేపల్లి విడిదికి వచ్చి ఐదు రోజులు అయింది. ఇప్పుడు రుద్రమదేవి కూతుళ్లతో, దాసితో మొగిలిచర్లలో ఉన్నది. మొగిలిచర్ల ఓరుగల్లుకు ఈశాన్యదిశలో నాలుగైదు కోసుల దూరంలో ఉంటుంది.
మొగిలిచర్ల పెద్ద ఊరు కాకున్నా ఆ ఊరిలో”  ఏకవీర మహాదేవి”  చాలా ప్రభావవంతమైన దేవత.ఆ కోవెలతో ఆ ఊరు ప్రశస్తి గాంచినది. ఆ కోవెలలో రుయ్యమ్మ ,ముమ్మడమ్మ ఇద్దరూ ఏకవీరాదేవిని భక్తితో పూజిస్తున్నారు.
మనకథా కాలంలో ఈ ప్రదేశమంతా అడవి ఉండేది. అడవి పగటిపూటనే చీకటి అయిందా ! అని భ్రమ కలిగించేలా చిక్కగా ఉండేది. అడవి నుండి మనుషులు ,బండ్లు నడవడానికి ఒక బాట ఏర్పడింది. ఆ బాటకు ఉత్తరానికి కొంత సాగి తిరిగి తూర్పుదిక్కుకు మళ్ళింది. ధర్మాత్ములు కొందరు ఆ దారి వెంట అక్కడక్కడా మూడు నాలుగు ఆమడలకొక ధర్మసత్రాలు కట్టించారు. అందులో ఎవరూ నివసించరు. కానీ, ప్రయాణపు అలసట తీర్చుకుని తమ వెంట తెచ్చుకున్న భోజన పదార్థాలను తినేందుకు ఉపయోగకరంగా ఆ ధర్మసత్రాలలో యోగులు, బైరాగులు , అడవి జంతువులకు భయపడని వారు ఒక పగలో, ఒక రోజో ఉంటారు.
ఇప్పుడు మన ఈ ప్రయాణానికి సంబంధించిన అటువంటిదే ఒక సత్రం. ఆ సత్రం మొగిలిచెర్లకు దాదాపు ఒక కోసు దూరంలో ఉన్నది. మొగిలిచర్ల నుండి ఉత్తరానికి పోయే బాట తూర్పు దిక్కునకు మరిలే బాట దగ్గర ఆ సత్రం ఉన్నది. అక్కడ ఒక బావి ఉన్నది. అందులో నీరు ఏమంత పరిశుభ్రంగా ఉండదు. అయినా బావి నిండా నీరున్నా వాడక పోవటం చేత నాచు పట్టి ఉన్నది.
ముగ్గురు మగవారు, ఒక స్త్రీ ఆ సత్రం ముందటి వైపు కూర్చున్నారు. ఏమంత పొద్దు పోలేదు. సాయంకాలం అయింది. వాళ్ళందరూ ఏం మాట్లాడు కుంటున్నారు? వారి చూపులు అడవి జంతువులను కనిపెట్టేందుకో ఏమో! నాలుగువైపులా చూస్తున్నారు. అందులో ఇద్దరు మగవారు మాత్రం దాదాపు ఒకే వయసు ఉన్నవారు. ఒకడికి మాత్రం యాబై సంవత్సరాల వయసు ఉన్నది.ఆ స్త్రీ దాదాపు నలబై సంవత్సరాలు వయస్సున్నది. మగవారి చేతులలో నిలువెత్తు ఖడ్గాలు ఉన్నాయి.
ఆ బాట వెంట జనాలు ఎక్కువగా తిరగరు. అందున సాయంకాలమైంది కాబట్టి ఎవరో వస్తారని అనుకోలేము. వారిలో ఒకరి పేరు హరిహర దేవుడు, మరొకరి పేరు మురారి దేవుడు, ముసలి వాడి పేరు ధర్మవర్తనుడు. ఆమె పేరు కమల. వాళ్ళు  ఇలా మాట్లాడు కుంటున్నారు.
మురారి:– కమల చాలా నేర్పు ఉన్న స్త్రీ. చక్కని చమత్కారంతో మాట్లాడుతూ పనిని చక్కగా తోవకు తెచ్చింది.అందుకే అంటారు”బుద్ధిష్చాపి చతుర్గుణమ్”
( అంటే ఆడవాళ్లకు మగవారికన్నా బుద్ధి నాలుగు రెట్లు ఎక్కువ పని చేస్తుందని)
ధర్మ:–  నిజమే మనం తలపెట్టిన పనికి మూడు వంతుల సహాయం కమలదే! అనుమానమే లేదు.
మురారి:–  మీరు మాత్రం సామాన్యమైన వారా? పనిని ఆచరణలో పెట్టే దక్షులు.
హరి:– అవును అలా కాకపోతే వెతికి వెతికి మహాదేవరాజు వీరిని ఎందుకు పంపుతాడు? మన పనికి సగం సహాయం కమల, సగం సహాయం ధర్మవర్తనుడు గారు తల పెట్టిన పనని పూర్తి చేసి వచ్చారు.
ధర్మ:–  నా సహాయం ఏం సహాయం? కమలను మెచ్చుకోవాలి. మహాదేవరాజు గారి దగ్గర తాంబూలం పుచ్చుకొని, వచ్చి రుద్రమదేవి దగ్గర చేరి, పన్నిన మాయలను, ఆడిన అబద్దాలను పొల్లు పోకుండా ఎలా సమర్థించుకుంటూ వచ్చిందో చూడండి! పనిలో నైపుణ్యం అంటే ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది? రుద్రమదేవిని ఓరుగల్లు నుండి లేవదీసి వడ్డేపల్లికి తీసుకొని వచ్చింది ఎవరు? మన కమలనే కదా! కమల సాయం మనం మెచ్చుకోవాలి. అవును మరిచిపోయాను కమల నీ పేరేమిటి? కమల కాదు కదా!  మదనమంజరీ! మీ అమ్మని ఎత్తుకొని పోయిన వాడెవడు?
కమల సిగ్గుపడింది.
ధర్మ:– చెప్పు చెప్పు! నిన్ను పెళ్లి చేసుకున్న భర్త ఏ రోగంతో ప్రాణాలు కోల్పోయాడు? మీ రుద్రమదేవితో చెప్పిన మాటలే మాతో చెప్పు, కానీ ఏడవ వద్దు!
హరి:–  కమలకు ఇప్పుడు ఏడుపు ఎందుకు వస్తుంది? అప్పుడంటే రాచకార్యం ఎలా చక్కబెట్టాలని ఒకవైపు, రుద్రమదేవి తనను ఎలా నమ్ముతుందా? అని మరోవైపు, తనను అనుమానించకుండా పని ఎలా చక్కబడుతుందా! అని ఇలా మూడు రకాల విచారంతో అప్పుడు అలా నటించవలసిన వచ్చింది కానీ ఇప్పుడు విచారం ఎందుకు? ఇద్దరు బిడ్డలతో రుద్రమదేవి మన చేత చిక్కింది. ఇంకో జాముకో అర జాముకోపూర్తిగా మన వశం అవుతారు. సంతోషించే వేళ ఏడ్చేందుకు కమలకేమి గ్రహచారం? రుద్రమదేవికి చెప్పిన విషయం ఎన్నిసార్లు పాఠం అభ్యాసం వలె చేసిందో కానీ అలా చెప్పకుంటే రుద్రమదేవి కమలను నమ్మక పోయేది.
మురారి:–  నిజమే! కమల బుద్ధి మెచ్చుకో తగిందే!ఏం మంజరి ఏమంటావు?
కమల:-  వడ్డేపల్లికి రుద్రమదేవిని తీసుకొని రావడానికి నాకు అంత కష్టం అనిపించలేదు. కానీ మొగిలిచర్లకు రానని అన్నారు. నా ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఆమె అనగానే నాకు నిరాశ కలిగింది. మన ధర్మవర్తనుడు గారు దేవుడు, ఆ విషయమైయినట్లు నటించి, వారి బుద్ధిని మరలించక ఉంటే వారు రాకపోయే వారు. వారు అలా బ్రాహ్మణ వేషం వేయకపోతే నేను అన్నమాటలు కానీ, నేను పన్నిన పన్నాగం కానీ ప్రయోజనం లేకపోయేది.మీతో నేను వారిని మొగిలిచర్లకు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళాను. అప్పటికి నాకు వారి సంగతి పూర్తిగా తెలియదు.” మేము మొగిలిచర్లకు రాము” అని అన్నారని మీకు తెలియజేసి, మన పనిని అక్కడనే చేయాలని ప్రయత్నం చేశాను కానీ వడ్డేపల్లిలో ఈ పని జరుగుతుందా? అని అనుమానంగానే ఉండేది. ఉన్న రెడ్డి వారు రుద్రమదేవిని కనిపెట్టుకొని కాపు వేసినట్లు నాకనిపించింది. ఇంతలో ధర్మవర్తనుడు గారు రావడంతో ఇలా చేస్తే బాగుండు అనిపించింది. అలా ఆలోచన చేశాను. వారు అవునని ఆ వేషం వేశారు .లేకపోతే ఈ పన్నాగం అంతా పాడై పోయేది.
మురారి:-   నువ్వూ, మేము చెరువు కట్ట కింద మర్రిచెట్టు నీడలో కూర్చుని మాట్లాడి, నువ్వు పెళ్లిపోయిన మరు నిమిషంలో ధర్మవర్తనుడు గారు మా దగ్గరికి వచ్చారు. పని ఎలా అవుతుందో! అని చూసి రమ్మని వారిని నీ దగ్గరికి పంపాను. వారు నీకు ఎక్కడ కనబడ్డారు?
కమల:–  ముందే నాకు వారు కనిపించి తనను పరిచయం చేసుకున్నారు. జరగబోయే సంగతి తెలుసుకొని, వినవచ్చని వారికి చెప్పి తీసుకొని వచ్చాను. రుద్రమదేవితో ప్రయాణం విషయం మాట్లాడుతూ ఉంటే ధర్మవర్ధనుడు గారు మా వెనుక కొంచెం దూరంలో నుండి వింటున్నారు. ముమ్మడమ్మ, రుయ్యమ్మలు దేవుని గుడి లోనికి పోగానే వీరు వచ్చి వింతగా మాట్లాడి చివరకు ఆ వేషం వేశారు. మీరు ఎప్పుడు వచ్చారు? పానకం ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు తడి పడిపోయారు? దేవత నివేదన చేయకుండానే అతని ముందర ఎందుకు పెట్టారు పానకాన్ని?
హరి:– ఏదో జరిగింది జరిగిన దానికేం గాని?
కమల:-  ఏం గుర్రపు బండ్లు ,మనుషులు తయారుగా లేరా? ఇంకా మనం విచారించడానికి ఏముంది?
హరి:– అందరూ సిద్ధంగా ఉన్నారు లేకేం? మరి మన ప్రయాణం ఎప్పుడు ?
మురారి :-ఎప్పుడు అనడానికి ఏముంది? మనం ఎప్పడనుకుంటే అప్పుడే! మనలను అడ్డుకొనేవారెవరున్నారు?
మనం ఎంత చేతులు చాపితే బాఱ అంత పొడుగు అవుతుంది.
ధర్మ:–  అలా అనుకోవద్దు రుద్రమదేవి సామాన్యురాలు కాదు ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. మహా మేధావతి. కనుమరుగైన అంతవరకూ పనిచేశాం. ఇప్పుడు తప్పించ వలసిన పని జాగ్రత్తగా చేయాలి.
మురారి:–  ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారు కదా!
కమల:-  మన ఇల్లు అంటే? మీరున్న ఇంట్లోనా?
మురారి:-  కాదు వారి కోసం కట్టించిన ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఎక్కడికి పోగలుగుతారు? వంటిల్లు చొచ్చిన కుందేలు తప్పి పోగలదా?
ధర్మ:-  అలా అనలేము! ప్రాప్తం లేకుంటే చేతిలో ఉన్న పండు బావిలో పడి పోతుంది. మన ఇంట్లో ఉన్న వారు మన చేతికి చిక్కినారని అశ్రద్ధగా ఉండకూడదు. వడ్డేపల్లిలో మనం మర్రిచెట్టు కింద కూర్చుని మాట్లాడుతున్న తర్వాత నేను కమలను చూసేందుకు చెరువు కట్ట ఎక్కినాను. అప్పుడు అక్కడ ఒక అతను ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు కూర్చుని ఉన్నాడు. అతను మన మాటలు విన్నాడో? లేదో ?నేను ఖచ్చితంగా చెప్పలేను. నేను వచ్చింది అతనికి తెలియదు. నువ్వు ఎవరు ? అని నేను అతనిని అడిగాను. ఆ మాటకు అతను ఉలిక్కిపడి లేచి ఏమి మాట్లాడకుండా వెర్రి చూపులు చూస్తూ వెళ్లిపోయాడు. అతను నిజంగా పిచ్చివాడో? లేదా మన మాటలు విన్నాడో? నాకు అర్థం కాలేదు.
మురారి:–  అతనెవరో? ఏదైనా గూఢచారిగా పని చేసేవాడేమో? తన నీడ కనపడినా ఉలిక్కిపడ్తాడు. మన మాటలు వింటే రుద్రమదేవికి తెలియకుండా ఉండదు. ఆమె మన మాటలు అతనికి చెప్పితే వడ్డేపల్లి నుండి ఓరుగల్లుకే పోయేది. మొగిలిచర్లకు ఎందుకు వస్తుంది?
ధర్మ:-  ఎందుకు రాదు? మన మోసం తెలిసీ, తెలియనట్లు నటించి మనలను పట్టుకునేందుకు తగిన సైనికులను పిలిపించవచ్చు కదా! వచ్చిన సైన్యాన్ని మనం పట్టుకో కూడదా? ఎలా అయినా మన ప్రయత్నం నెరవేరే దాకా ముందూవెనుకా  చేయకూడదు. పట్టు విడిచి పెట్టవద్దు!
హరి:-  నిజమే! అయినా కూడా దానికి తగిన పని చేశాం. వారు నివసించి ఉన్న ఇంటి చుట్టూ కత్తులు చేతబూని భటులు అప్రమత్తంగా ఉన్నారు. మన సంగతి తెలిసి బయటపడడానికి ప్రయత్నిస్తే వరుసబెట్టి నరికి వేస్తారు. బయటి సైన్యం రాకుండా ఆపేందుకు ఈ ఊరిలో నాలుగువైపులా అడవిలో చాలినంత మంది జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నారు. కాబట్టి వచ్చే సైన్యం కూడా రాలేదు.
ధర్మ:-  ఇది మంచి ఏర్పాటు. ఇంకా మనకు ఆలస్యం ఎందుకు? అర్ధరాత్రి దాటిన తర్వాత మన పని మనం చేసుకుందాం! ఊరికి పోదామా!
మురారి:–  మంచిది కమలా!  నువ్వు వెళ్లి ఎప్పటివలె రుద్రమదేవి దగ్గర ఉండు !
అందరూ తమతమ స్థానాల నుండి లేచి నిలబడ్డారు .ఊరు చేరే దాకా అందరూ కలిసి వచ్చి తర్వాత తలోదారిన వెళ్లారు.
దాదాపు సాయంత్రమైంది. మెల్లగా రాత్రి అవుతున్నది అమావాస్య ముందు దశమి కాబట్టి వెన్నెల జాడలేదు మూడు జాముల రాత్రి అయితే తప్ప సూర్యోదయం కాదని ప్రజలకు తెలియనందున జనలెవరూ వెన్నెల కోసం కానీ ,చంద్రుడి కోసం ఎదురు చూడడం లేదు.
రుద్రమదేవి విడిదిగా చేసుకొన్న భవనం సత్రమని చెప్పటానికి సందేహం లేకున్నా, కేవలం సత్రం వల్లే బట్టబయలుగాలేదు. విశాలంగా లేదు. రెండు మూడు గదులు రెండు మూడు  మనసాలలున్న మూసినట్లు ఉన్న ఇల్లు, ఇంటినిండా దీపాలు వెలుగుతున్నాయి. రుద్రమదేవి ఆమె కూతురు ఇద్దరూ ఒక మనసాలలో కూర్చున్నారు.
ఇంతలో మదనమంజరి అక్కడికి వచ్చింది. మదనమంజరి రుద్రమదేవిని వదలిపెట్టి చాలాసేపు అయింది. మదనమంజరి వచ్చేదాకా వాళ్లు ముగ్గురే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు చాలా నెమ్మదిగా అంటే కనీసం వారికి కూడా వినపడడం లేదేమో అన్నంత మెల్లగా మాట్లాడు కుంటున్నారు. మదనమంజరి రాగానే వారు సంభాషణ ఆపినట్టుగా ఆమె గుర్తించలేదు. మదనమంజరిని చూడగానే అయ్యో! మదన మంజరీ! మమ్మల్ని విడిచి పెట్టి నువ్వు వెళ్లి చాలాసేపు అయింది. కొత్త ఊర్లో  తెలిసిన దానివి నువ్వు లేకుండా మాకు పొద్దు ఎలా గడుస్తుంది? దా! కూర్చో! అని అన్నది రుద్రమదేవి.
మదనమంజరి వచ్చి రుద్రమదేవి దగ్గర కూర్చొని ఏదో చెప్పబోయింది ఆమెను మాట్లాడ నివ్వకుండా ఇలా అన్నది.
మదనమంజరీ! నీకు ఒక విషయం చెప్పాలి అనుకుని మరిచిపోయాను. ఈ రోజు ఏకవీరాదేవి దేవాలయం చూశాం. కానీ మదనమంజరి ఏం చెప్పను? దేవికి మా మీద దయలేదు. రుయ్యమ్మకు సంతానం ఇవ్వలేదు. ముమ్మడమ్మకు మాత్రమే సంతానమున్నదని దేవి ఆజ్ఞ!
రేపు ఓరుగళ్ళకు వెళ్లి బ్రాహ్మణ సమారాధన చేయాలి. ప్రయాణానికి తగినట్లు మూటాముళ్ళు కట్టాలి. బండి వాళ్లను, పల్లకీల వాళ్లను ఎక్కడ ఉన్నారో వారికి తగిన జాగ్రత్తలు చెప్పి రావాలేమో? అయినా వారందరూ అంత జాగ్రత్తగా ఉండరేమో? కాచుకొని ఉంటారేమో!
ఇంతలో వంట తయారయిందని లోపల నుండి వంట చేసే సేవకురాలు వచ్చి చెప్పింది. రుద్రమదేవి ఆమె ఇద్దరు కూతుళ్లు లేచి భోజనం చేశారు. మదనమంజరి కూడా తిని లేచింది. పనిచేసే సేవకురాలు ఎప్పటివలె పడుకోవడానికి వెళ్ళింది. మదనమంజరి మూడు పడకలను సిద్ధం చేసింది.దాని మీద ముగ్గురు విశ్రమించారు. మదనమంజరి వారి దగ్గరే  తనపడక వేసుకొని పడుకున్నది. అందరూ క్రమంగా నిద్రపోయారు.
దాదాపు జామురాత్రి దాటింది. ఊరి ప్రజలు అందరూ నిద్ర పోయారు. చిన్నపల్లెటూరు కాబట్టి ఊరి వారంతా తలుపులు బిగించుకొని అడవి మృగాల భయం లేదని  నిశ్చింతగా  నిద్ర పోయారు. రుద్రమదేవి నివసిస్తున్న ఇంటి తలుపులు అన్నీ బిగించబడ్డాయి.
అనుకోకుండా రుద్రమదేవి ఉన్న ఇంటి చుట్టూ ఏదో కలకలం పుట్టింది. ఆ ఇంటి చుట్టూ జనాలు మూగి ఉన్నారు. వారంతా ఊరి వారు కాదు. వాళ్ల చేతులలో కత్తులు మొదలైన సాము చేసే దుడ్డుకర్ర వంటివి చాలా ఉన్నాయి. వారందరూ కలిసి ఇంటి దర్వాజా తడుతున్నారు. కానీ తలుపులు తీయలేదు. తలుపులు రాకపోవడంతో అందులో కొందరు గడ్డపారతో పెళ్లగించి, తలుపులు ఊడదీసి లోపలికి ప్రవేశించారు. మొదట గదిగదికి పది మంది  మనుషులు లోపల అంత శ్రద్ధగా  వెతుకుతున్నారు. ఒక మనసాలలో మూడు మంచాలపై ఉన్న వారిని కొందరుచూశారు.రుద్రమదేవి ఆమె కూతుర్లు ఆ మంచాలపై నిద్రిస్తున్నారని వారు అనుకున్నారు. మూడు మంచాల మీద ముగ్గురు దుమికారు. ఆ ముగ్గురిలో ఒకడు హరిహర దేవుడు. మరొకడు మురారి దేవుడు. మూడోవాడు ధర్మవర్ధనుడు.
[వీళ్ల ముగ్గురిని మన పాఠకుల్లో నిర్మలాపురం నుండి దేవగిరి కి వెళ్ళే తోవలో ఉన్న చెరువు కట్టమీద మాట్లాడుకున్న అప్పటి నుండి చూస్తూనే ఉన్నారు]
వాళ్లు ముగ్గురూ మూడు మంచాలపై పడి చూశారు. ఆ మంచాలపై ఎవరూ లేరు. వారికి చాలా ఆశ్చర్యం వేసింది. చుట్టుపక్కల చూశారు .ఎవరూ పట్టుబడ్డ లేదు. నాయకులు ముగ్గురూ నిశ్చేష్టులయ్యారు .
ఇంతలో ఒకడు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి హరిహర దేవుడికి అప్పగించాడు.
అతడి కాళ్లు చేతులు బట్టలతో కట్టేసి ఉన్నాయి. మోహం కనపడకుండా బట్టతో మూతి కట్టేశారు. కట్టుకున్న బట్టలను బట్టి ఆమె ఒక మహిళ అని తెలుస్తున్నది. దాన్ని చూసి హరహర దేవుడు  సేవకులకు ఇలా చెప్పాడు.
మిగిలినవారు చిక్కపోయినా సరే ముఖ్యులైన రుద్రమ్మ  మన చేతికి చిక్కింది. దీనిని కట్లు విప్పకుండానే గుర్రం బండిలో వేసి తలుపులు మూసి చాలా త్వరగా నడిపించండి!  ఊరూరికి మన బండ్లు ఉన్నాయి. నదుల దగ్గర మన పడవలు ఉన్నాయి.
సేవకులు ప్రభువు ఆజ్ఞ పాటించారు.

ఎనిమిదవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయశర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[ అనభిజ్ఞాన సహాయ్యము]
(తెలియనివారి సహాయం)
మ. సమదాటోపత వాయునందనుడు ధృష్టద్యుమ్ను శైనేయు లే
కమనోవృత్తి గడంగితో నడర దోర్వర్గంబు శోభిల్ల శౌ
ర్యము సొంపార నిలింపకోటి వొగడన్ రారాజు సైన్యంబు లొ
క్క మొగిం బెల్లగిలంగ బెట్టడరె సక్రోధాంతరంగంబుతోన్ .
—      మహాభారతము
భావం:-  క్రోధాంతరంగంతో, పరాక్రమాతిశయంతో భీముడు దృష్టద్యుమ్న , సాత్యకులు తనకు తోడురాగా, దుర్యోధనుడి సేనలు పారి పోయేటట్లుగా విజృంభించాడు. అది చూసి దేవతలు  ప్రశంసించారు.
వ్యాఖ్య  :—కర్ణపర్వం ద్వితీయాశ్వాసం లోని యుద్ధవర్ణనను… గ్రంథకర్త రుద్రమదేవి నవల కథాసూచిగా తీసుకున్నారు. కథార్ధభాగం అచ్చంగా భారత యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించడం పోలికలో గొప్ప విశేషం.
కథాభాగం:-
రెండు జాముల రాత్రి. ఇంకా చంద్రోదయం కాలేదు. లోకమంతా చీకట్లు కమ్ముకుని ఉంది. వేలవేల నక్షత్రాలు ఆకాశంలో వజ్రాల ముక్కల వలె మెరుస్తున్నాయి. మబ్బులు లేకుండా ఆకాశం నిర్మలంగా ఉంది. చూడడానికి ఎంతో అందంగా కనపడుతున్నప్పటికీ… ఆకాశంలో చంద్రుడు లేని వెలితి స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
మొగిలిచర్ల నైరుతి దిక్కున పెద్ద  అడవి ఉంది. సహజంగా లోకమంతా పరుచుకున్న చీకటి ఆ అడవిలో ఇంకా చిక్కగా పరుచుకొని ఉన్నది. ఆ అడవిలోని ప్రాణులకు కళ్లు మూసినా తెరచినా ఒకే తీరుగా ఉంది. కళ్ళు ఆ చోట్ల ఏమాత్రం పనిచేయవు.
ఏదైనా శరీరానికి తాకితే తెలుసుకోవాల్సిందే తప్ప అలా కాకపోతే తెలుసుకోలేరు. ఆ తాకిన వస్తువును కూడా గుర్తించడం కష్టంగా ఉంది ఆ చీకట్లో…
అంత చిమ్మచీకటిలో ఆనాటి అడవిలో కొందరు ద్వంద యుద్ధం చేస్తున్నారు. ఎవరిని ఎవరు కొడుతున్నారో? తాను ఎవరినీ కొడుతున్నాడో? తనను ఎవరు కొడుతున్నారో కూడా తెలియడం లేదు.
కత్తీ కత్తీ తాకినపుడు వచ్చే నిప్పు కణాల వెలుగు అప్పుడప్పుడు కాస్త కనబడుతున్నది. ఆ నిప్పురవ్వలు ఎంతసేపు ఉంటాయి కనుక? దరిద్రుడి మనసులోని కోరికలు పుట్టడం అవి ఎలా తీరుతాయిలే అనే నిరాశలో మాయమై పోయినట్టు మాయమైపోతూన్నాయి.
అలా చీకటిగా ఉన్నా కూడా వారు యుద్ధం చేయడం ఆపలేదు. అసలు తమ వారెందరు జీవించివున్నారో, ఎదుటి వారి వైపు ఎందరు మరణించారో! అని తమ బలంగానీ, ఎదుటి వారి బలంగానీ వారికి తెలియదు. అలా అని కత్తి వేటు ఏ మనిషిపై వేస్తే అది తప్పకుండా ఆ వ్యక్తిని తాకడం లేదు. అలా అని గాయపడని వారు కానీ, చావని వారు కానీ లేరని చెప్పలేం. ఆ దొమ్మి యుద్ధపు కలకలం చాలా ఎక్కువగా ఉన్నది.
ఇంతలో ఒకప్పుడు ఉన్న చీకటి మెల్లగా తొలగిపోయి, నక్షత్రాలు తన సహజమైన వెలుగునిస్తున్నాయి. ఉదయ పర్వత శిఖరం మీద తెల్లని కాంతులు వెదజల్లుతూ చల్లని సూర్యుడు ఉదయించాడు. ప్రపంచమంతా నిర్మలమైన సూర్యకిరణాలతో చక్కగా కనపడుతున్నది.
సైనికులకు అందాకా చీకటితో మూతపడుతున్న కళ్ళు చీకటి తొలగిపోవడంతో చాలా సంతోషపడ్డారు. కొత్త ఉత్సాహంతో రెండువైపులా సైనికులు ఎదురుపడి యుద్ధం చేస్తున్నారు . ఇప్పుడు వారి యుద్ధ నైపుణ్యం చక్కగా కనపడుతున్నది. అంతకుముందు గాయాలపాలైన వారు, చనిపోయిన వారు అందరూ కనపడి ఎవరెవరో తెలుసుకున్నారు. తమ వారు చచ్చిపడి ఉండటం చూసిన వారి కోపానికి అంతేలేదు.
” హుమ్మని” ఒక్కసారిగా ఎదుటివారిపై దూకి  యుద్ధం చేస్తున్నారు.కత్తివేట్లను తప్పించుకుంటున్నారు. కొందరు గాయపడుతున్నారు. కొందరు చస్తున్నారు.  యుద్ధతీవ్రత ఎక్కువైపోయింది.
ఒకవైపు సైన్యం తక్కువ సంఖ్యలోనూ, రెండో వైపు సైన్యం కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎక్కువ సైన్యం ఉన్నవారు వారికున్న దళ బలంతో చెలరేగి శత్రు వీరులను చంపుతున్నారు. రెండు వైపులా సైన్యంలో సైనికాధికారులున్నట్టు కనిపించడం లేదు.రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులు రెండు వైపులాసైన్యంలోను లేవు. సామాన్య పదాతి దళాలు అయినా బింకంగా, పరాక్రమంతో, పంతంతో బలం గల సేనానాయకులు ఉన్న సైన్యం వలె కనపడుతున్నది.
చంద్రోదయం తరువాత దాదాపు నాలుగు గడియలు యుద్ధం అయ్యే సరికి రెండు వైపులా సైన్యంలో చాలామంది చనిపోయారు. అందులో ఒక వైపు మరీ తక్కువ సైన్యంతో ఉన్నది. అందులో కొందరు శత్రువులచే చంపబడ్డారు. ఇక వారి గెలిచే అవకాశం లేదని అనుకున్నారు. తమను ప్రోత్సహించే వారు లేరు. అయినా ప్రాణాలు ఉన్నంత దాకా పోరాడడమే వారి నిర్ణయం. ఏం చేయగలరు? బలం నశించింది కాబట్టీ శత్రువులను చంపక పోయినా, మనుషులు తమపైన పడకుండా కష్టంగా తప్పించుకుంటున్నారు. శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. తక్కువ సైన్యం ఉన్నవారు వెనుకకు మళ్ళీ పోతున్నారు.ఇంతలో వారికి అడవిలోపల ఫెళఫళమని చప్పుడు వినబడింది. అది జంతువులు పరిగెత్తడం వలన కలిగిన చప్పుడు వలె ఉన్నది. డెక్కలు ఉన్న పెద్ద జాతి జంతువుల పరుగు శబ్దం అది. రెండు వైపులా సైన్యాలు ఆ చప్పుడు విన్నారు. కానీ యుద్ధం ఆపలేదు. యుద్ధం అంత పెద్దగా లేకున్నా… వీరాలాపములు ఎక్కువగా ఉన్నాయి.
ఇంతలో నలుగురు గుర్రపు స్వారీ చేస్తూ వచ్చిన యోధులు త్వరగా త్వరగా వచ్చి రెండు వైపులా ఉన్న సైన్యం మధ్య నిలబడి ఒక సారి అటు ఇటు చూసి, ఎక్కువ సైనికులున్న దళాన్ని నరకడం మొదలు పెట్టారు. ఆ నలుగురూ ఇరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు వయసు ఉన్నవారు.వారు ఎక్కిన గుర్రాలు చాలా ఎత్తుగా, బలంగా ఉన్నాయి. వారు మామూలు మగవారు కట్టుకొనే టటువంటి దుస్తులనే కట్టుకున్నారు. వారి చేతులలో అర్ధచంద్రాకారంలో ఉన్న పదునైన కత్తులు ఉన్నాయి. ఆ వెన్నెల వెలుగులో వారి గుర్రపు జీనులు మిలమిలా మెరుస్తున్నాయి. ఖడ్గాలను పెట్టే ఒరలు ఆ గుర్రపు జీనులకు వేలాడుతున్నాయి. ఆ నలుగురు యోధుల శరీరాలపై, వారు కట్టుకున్న దుస్తులపై నెత్తురు మరకలు ఉన్నాయి. వారెవరు? ఎక్కడనుండి వస్తున్నారు? వారి శరీరాలపై బట్టలపై రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు. అలాగే ఆ యుద్ధం చేస్తున్న రెండు సైనిక దళాలు ఎవరివైనవని మనకు తెలియకపోయినా… తక్కువ సైనికులున్న సేన ఈ గుర్రపుస్వారీ చేస్తూ వచ్చిన యోధుల స్వంత సేననో లేక, వారి బంధువుల సేనయో కావచ్చునని మనం ఊహించగలం.
ఆ వీరులు నలుగురు తమకు అండగా రావడం, తనకు బదులుగా శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధం చేయడం చూసి, ఎక్కువ సేన ఉన్న మిగిలిన సేన యుద్ధానికి సిద్ధపడింది. ఎదుటి పక్షం వారు కొంచెం సేపు యుద్ధం చేశారు కానీ కొత్త వీరుల కోపపు వేడికి నిలువలేక ఎక్కడివారక్కడ పారిపోయారు. యుద్ధభూమిలో శత్రువులు ఎవరూ లేరని గ్రహించారు.
తమను ఆపదనుండి రక్షించిన నలుగురు వీరులు ఎవరైనదీ, సైనికులకు తెలియకపోయినా తమ కృతజ్ఞతా వందనాలు తెలిపి ఇలా చెప్పడం మొదలు పెట్టారు.
అయ్యా!  మీరెవరో మాకు తెలియకున్నా మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవతా స్వరూపులని అనుకుంటున్నాం. మృత్యువు  ఒడిలోకి చేరే సమయంలో ఏ కారణం లేకుండా మాపై దయ చూపారు? ఎందుకు మమ్మల్ని రక్షించారు?
అయ్యా!  మేము ఓరుగల్లు సైనికులం. మా రాణి గారు తమ కూతుళ్లతో కలిసి వడ్డేపల్లికి పోయి, అక్కడినుండి మొగిలిచర్ల పోయారట. వారి వద్ద మాయలు చేసే ఒక దాసి దాపురించి, మేము ఎవరమూ వెంట రానీయకుండా చేసి, మా రాణి ఒక్క దాన్ని తీసుకొని వచ్చిందట. మా రాజా దేవేరి మోసగించిన బడిందని ఎలా తెలుసుకున్నారో కానీ, శివదేవ మంత్రీశ్వరులు గారు మమ్మల్ని త్వరగా వెళ్లి మొగిలిచర్లకు పోయే మన ప్రభువు ఉన్న విడిదికి వెళ్లి వారికి రాబోయే ఆపదలను తొలగించి, సుఖంగా ప్రయాణం చేయించుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చి పంపారు. మేము దాదాపు నూటా ఇరవై మందిమి బయల్దేరి వస్తున్నాం. మంత్రి మహారాజు గారికి ఈ వార్త సాయంకాలం తెలిసింది కావచ్చు. మాకు వెంటనే తెలిపారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మేము ప్రయాణమై వస్తున్నాం మమ్మల్ని ఈ సేన రక్షించింది కావచ్చు. రహస్యంగా అల్లరి చేయకుండా తోవను విడిచి, అడవిలో పడి వస్తున్నా కూడా కనిపెట్టి ఎదుర్కొన్నారు. మమ్మల్ని ఎదిరించిన వారు దాదాపు రెండు వందలమంది. సాధ్యమైనంత వరకు యుద్ధం చేసాం. ఎదుటి వారి బలం ఎక్కువగా ఉండడంతో నాలుగువైపులా వాళ్లే నిలిచి, మమ్మల్ని హింసిస్తున్నారు. చివరకు ఈ గుంపుకు చిక్కినాం. ఇరవై మంది ఉన్నామనుకుంటాను. మీరు రాకపోతే మేము మా రాణి గారిని కష్టపడకుండా రక్షించుకోలేక పోయే వాళ్ళం.
అయ్యా!  మా నమస్కారాలను అందుకొని మాకు సెలవు ఇప్పించండి. మేము త్వరగా వెళ్లాలి. అక్కడ ఏం జరుగుతుందో ఏమో?
ఎప్పటి వరకు మీరు మొగిలిచెర్లకు పొమ్మని మీ మంత్రి గారు ఆదేశించారు? అని ఒక యోధుడు అడిగాడు.
అయ్యా!  మమ్మల్ని మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి సమయం వృధాగా గడిచేలా చేయకండి. ఇప్పటికే ఆలస్యం అయిందని బాధపడుతున్నాం. ఇంకా ఆలస్యం చేస్తే మేము అనుకున్న పని చేయగలమా? అని ఒకడు అన్నాడు.
ఒక విషయం చెప్పండి!
జామురాత్రి కాకముందే పొమ్మని మంత్రి గారి ఆజ్ఞ! మాకు ఇబ్బంది లేకుంటే ఇదివరకే పోయే వాళ్ళం
శత్రువుల వల్ల మీ దొరసానికి ఆపద కలుగుతుందని తెలుసుకొని దానిని ఆపేందుకేనా? మీరు వెళ్ళేది.
ఔను !
మీరు ఇరవై మంది కన్నా ఎక్కువ లేరు. ఇంత తక్కువ మందితో వెళ్లి ఏం చేయగలరు? శత్రువులు మీకన్నా ఎక్కువ మంది ఉన్నారనడంలో సందేహం లేదు.అందున దారిలో మిమ్మల్ని ఎదుర్కొనే వారు ఎక్కువగా ఉన్నప్పుడు… ఇంక ఊరి లో ఎంత మంది ఉన్నారో? ఆలోచించారా? లేకపోతే ఇప్పుడైనా ఆలోచించుకోండి!
ఏది ఏమైనా మాకు విచారం లేదు. మా ప్రాణాలు మా దొరసాని పని కోసం కానీ, వారి కనుల ముందు మా ప్రాణాలు విడువడానికైనా మాకు సంతోషమే! మేము వారి సేవకులుగా ఉన్నందుకు, వారి ఉప్పు పులుసు తింటున్నందుకు  మా జన్మలు అప్పుడే సార్థకం అవుతాయి. మమ్మల్ని తొందరగా పంపితే మీకు దండం పెడతాం!
ఎందుకలా తొందర పడుతున్నారు? మీ ప్రాణాలు రక్షించడానికి పైన రెండు మాటలు వినరా?
అయ్యా!  మీరంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. అయినా మా రాణీగారి పని కన్నా మీతో మాట్లాడటం మాకు ఎక్కువ కాదు. మీరు మా ప్రాణాలు రక్షించినందుకు మేము మరణించేటప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటూ మరణిస్తాం. దయతలచి మీరెవరో మాకు చెప్పండి! బతికి ఉంటే మళ్లీ ఎప్పుడైనా మీ సేవ చేసుకుంటాం! మేము స్వతంత్రులం కాము. నాకు అప్పజెప్పిన పని చేసేదాకా మేము ఆలస్యం చేయకూడదు.అయినా మీకు తెలియనిది ఏమున్నది?
మేము రాకుంటే యుద్ధంలో మరణించేవారు కదా! అలా అయితే మీరు ఏం చేసేవారు?
అది మాకు మంచే జరిగింది. మా తోటి వారంతా తమ ప్రభువు కోసం ప్రాణాలను సంతోషంగా విడిచారు. మేము కూడా అలాగే విడిచిపెట్టే వాళ్ళం.
అలా అయితే మీ దొరసాని పని ఏమయ్యేది? ఇలా ఆలోచించే వారు ఎవరు?
మీరు అలా అంటారా? మాలాంటి వాళ్లు వేల మంది ఉన్నారు.
ఇప్పుడు కూడా అలానే అనుకోండి!
అయ్యా!  మీరెవరో రాజద్రోహుల వలే కనపడుతున్నారు. మమ్మల్ని ప్రభుత్వం పోషిస్తున్నప్పుడు మా రాణిగారి కోసం నీతి లేని మాటలు విన్నప్పుడు మా చేతులలోని కత్తులు ఊరుకోవు! మీరు మా ప్రాణాలు రక్షించుకునేందుకు యుద్ధంలో మా ప్రాణాలు మీకు అర్పిస్తాం! ఇక ముందు ఎటువంటి మాటలని, మమ్మల్ని కృతఘ్నులుగా  చేయకండి! మాకాజ్ఞ ఇవ్వండి !
ఓ సైనికులారా!  పిచ్చివాళ్ళయి పోయారు! అలా కాదు! మీ మంత్రి ముందే అక్కడికి చేరుకోమని చెప్పాడు. ఆ సమయం దాటింది. మీరు ఇప్పుడు వెళ్తే ఉపయోగం లేదు. అయ్యే పని ఏదో ఇంతకు ముందే జరిగిపోయి ఉంటుంది. మీరు ఇప్పుడు పోయి ఏం చేస్తారు? అని అన్నాను, కానీ మీ రాజు పైన ఉన్న భక్తిని విడిచి పెట్టమని చెప్పలేదు.
ఒకవేళ జరిగితే వారి జాడ తెలుసుకుంటాం. ఇంకేదైనా జరగకుండా తగిన జాగ్రత్త తీసుకుంటాను. మమ్మల్ని విడిచి పెట్టండి!
సరే !వెళ్ళి రండి!  మాకేమీ అభ్యంతరం లేదు! అటు బాట వైపు వెళ్లి, మీరు మీ పని మీద, మేము మా పని మీద వెళ్దాం! అడవిలో నుండి ఎందుకు వెళ్లడం?
బాట ఇక నుండి ఎంత దూరం ఉందో?
అదిగో ! దగ్గరలోనే కనపడుతున్నది. మీ మాటలు మాకు బాట వెంట పోయే వారికి సులువుగా వినపడటం చేతనే ఇక్కడికి వచ్చాం. రండి! బాట దగ్గరికి వెళ్దాం!
సైనికులు ఆ మాటలకు ఒప్పుకున్నారు. గుర్రపు రౌతులు ముందు దారిన వెడుతుంటే… సైనికులు వెనుక నడుస్తున్నారు. వారంతా బాట వెంట నడిచారు.

(సశేషం)

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తవ్వకం

by హిమజ October 24, 2021
written by హిమజ

ఇప్పుడంతా తవ్వకాలు
జరుగుతున్నాయి
లోలోకి-లోలోతుల్లోకి

యోగం క్షేమం
కనుక్కుంటున్నారు
జ్ఞాపకాల చిత్తర్వులని
మనసు తెరపై వెతికి వెతికి
అతికించుకుంటున్నారు

మారుతున్న ప్రాధాన్యాలు
అవసరార్థ మిత్రుత్వాలు
వెలిసిపోతున్న ప్రేమలు
మనసు నింపని స్నేహాలతో
ఎవరి వలయాల్లో వారు
నిమిషాల ముళ్ళపై పరిగెడుతూ….

ఉప్పెనలై విరుచుకుపడుతున్న విద్వేషాలు
పొగలు గక్కుతున్న ప్రపంచం
మనిషి చుట్టూ హింస
మరెంత రక్తపాతం
ఇంకెంతో నిర్దయ
ఈ భూమి పైని
ఏ పుణ్యజలాలతో శుభ్రపడతాయో
తెలియని ….
ఎడతెగని యుద్ధాలు

కరాళకాలపు కుదుపుకు
ప్రాణాలు క్షణాల్లో వాయులీనమై
బంధాలు అకస్మాత్ నిష్క్రమణలై
సప్తవర్ణాల జీవితం
ఒకే దు:ఖవర్ణంగా మారిపోయి
నిర్వేదపు పెను నిశ్శబ్దం
ఫెటిల్మని పేలిన
ఈ కాలాన….

మరపు మడతల్లో మడిచి
ఉపేక్షించిన అపేక్షలను
ఆర్తిగా తిరగదోడుకుంటున్నారు
మరణం పిదప మనతో
వచ్చేదేమిటన్న ఎరుకతో

దయగా మన్నించి
దరి చేర్చుకోవడంతో
మానవజీవితాల్లో కొంతైనా
కొత్తదారులు వెలుగుతున్నాయి
మనిషి మనిషికి మధ్య

October 24, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us