మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

వ్యంగ్య చిత్రాలు (కార్టూన్స్)

by మూటుపూరు విఠల్ చందర్ రావు October 25, 2021
written by మూటుపూరు విఠల్ చందర్ రావు

-మూటుపూరు విఠల్ చందర్ రావు
Tech Arch Delivery Manager, Accenture
+91-9908817120

October 25, 2021 0 comment
3 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సినీ గేయాల పరామర్శ

by ఏలూరు అశోక్ కుమార్ రావు October 25, 2021
written by ఏలూరు అశోక్ కుమార్ రావు

1960లో వచ్చిన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’లో ఆత్రేయ వ్రాసిన ‘ఎవరో అతడెవరో’ పాట ఒక రసాత్మక గీతం. బృందావన సారంగ రాగంలో పెండ్యాల నాగేశ్వరరావు దీనిని స్వరపరచారు. ఘంటసాల, సుశీల పాడిన యీ పాటను ఎన్టీఆర్, సావిత్రి లపై చిత్రీకరించారు దర్శకులు పి.పుల్లయ్య.
పల్లవి : ఎవరో అతడెవరో, ఆ నవ మోహను డెవరో, నా మానస చోరుడెవరో, ||ఎవరో||
తొలి చూపులలో వలపులు చిలికి దోచిన మగసిరి దొర ఎవరో ||తొలి||
అరయక హృదయమునర్పించితినని, ఆదరించునో ఆదమరచునో ||ఎవరో||
వల రాజా? కలువల రాజా? కాడే కన్నుల కగుపడినాడే!
అకలంకుడే…. హరిణాంకుడు కాడే ||అక||
మరి ఎవరో ఏమరినానో ||ఎవరో||

శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా లక్ష్మిదేవి పద్మావతిగా అవతరించారు. పద్మావతి శ్రీనివాసుని చూచినప్పటి నుండి తన హృదయాన్ని అర్పించింది. శ్రీనివాసుడే శ్రీ మహావిష్ణువని తెలియక ‘ఎవరో అతడెవరో’ అని పాడుకున్నదని ఆత్రేయగారి వాదన. అంటే మానవ రూపంలో అవతరించిన లక్ష్మీదేవికి శ్రీనివాసుడు నవమోహనుడిగా, తన మానస చోరుడిగా అగుపించాడు. తన హృదయాన్ని అర్పించినది. అతడు కూడా తన కోరికను మన్నిస్తాడో లేదో అని బాధపడుతుంది. పైగా తాను ఇష్టపడిన శ్రీనివాసుడు మన్మథుడా (వలరాజా) దేహం లేని మన్మథుడైతే మరి తన కళ్ళకు కనపడుతున్నాడే! చంద్రుడా (కలువల రాజా), జింక చిహ్నం మచ్చగా గల చంద్రుని (హరిణాంకుడు) లాంటివాడు కాదే, మచ్చలేనివాడు (అకలంకుడు) (హరిణాంకుడు) లాంటి వాడు కాదే, మచ్చలేనివాడు (అకలంకుడు) కదా తాను ఇష్టపడినవాడని పద్మావతి ఊహించుకొన్నదని భావుకుడైన ఆ్రతేయగారి ఆలోచన. కాని ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుని ఆత్రేయగారు అతని కంటె స్థాయిలో చిన్నవారైన మన్మథునితోను, చంద్రునితోను పోల్చడం, విష్ణువు గుండెలపై ఉన్న శ్రీవత్స చిహ్నం(మచ్చ) గురించి ఆమె మరచిపోయి అకలంకుడు అని భావించడం, ఇతరులు విమర్శించడానికి అవకాశం ఇస్తుంది.

‘చలువలు కురిసే జాబిలి !
చెలి కలతను తెలిసీ కలుగద జాలి
కరుణ చూపి కబురు తెలిపి రమ్మనవా నను చే కొమ్మనవా’

తన మనోగతాన్ని చందమామకు తెలిపి, నీవు చల్లని వెన్నెల కురిపించే వాడివి– “ఆతడు నా బావని నీకు తెలిసినప్పటికి నా మీద జాలి కలగడం లేదా ? నాపై దయ చూపి, శ్రీనివాసుని నేను ప్రేమిస్తున్నాననే కబురు ఆయనకు చెప్పి ” తనను పెళ్ళి చేసుకొమ్మని చెప్పమని రాయబారిగా వెళ్ళమని చంద్రుణ్ణి, పద్మావతి బ్రతిమాలుతుంది.

‘కరుణ చూపి కబురు తెలిపి’

చరణంలో ఉర్దూ పరమైన
‘ కబురు ’ _ తాను ఉపయోగించినందుకు ఈ పాట రికార్డింగు పూర్తయ్యాక, ఆత్రేయగారికి గుర్తొచ్చి, బాగా బాధపడ్డారట. వెంటనే తనకు గురు సమానుడైన రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి వద్దకు వెళ్ళి, తన మనసులోని బాధను చెప్పారట ఆత్రేయ. అందుకు మల్లాదివారు ‘ఏం ఫర్వాలేదు. ఆ కాలంలో బీబీ నాంచారి కూడా ఉన్నది. ఆమె ముస్లిం కదా, బాధపడవద్దని ఆత్రేయగారిని ఊరడించారట. అంటే ఎవరూ కూడ పసిగట్టలేనటువంటి ప్రయోగాన్ని ఉపయోగించినందుకు ఆత్రేయగారు బాధపడిన తీరు చూస్తుంటే ఆయన నిజాయితీ తెలుస్తుంది. ఇక్కడ ఊరడించిన మల్లాది వారి ప్రతిభ , సాహిత్య విశ్లేషణ శక్తి , ఆ రోజుల్లో ఎందరికో ఆయన పెద్ద దిక్కైన గొప్పతనమూ గమనించవచ్చు.

పద్మావతి తన బాధను చందమామతో వెల్లడించిన సమయంలోనే శ్రీనివాసుడు కూడ
‘ఎవరో తానెవరో ఆ నవమోహిని ఎవరో నా మానస హారిణి ఎవరో ||ఎవరో||
నందన వనమున నానందములో తొలిసారిగ పూచిన పూవో
||నందన||
తొలకరి యవ్వన మొలికిన నవ్వో మనసిచ్చినదో నను మెచ్చినదో
ఆ జవ్వని ఎవరో తానెవరో ఆ నవ మోహిని ఎవరో నా మానస హారిణి
ఎవరో ఎవరో తానెవరో ’ అని తన మనో గతాన్ని వ్యక్తపరచాడు. ఆత్రేయగారి భావనలో పద్మావతి, శ్రీనివాసుడు ఇద్దరు కూడా ‘Both are Sailing in the same boat’ ఒకే విధమైన అనుమానంతో ఆందోళన తో ఉన్నారు.

పద్మావతి : నవ మోహనుడు అంటే శ్రీనివాసుడు : నవమోహిని అంటున్నాడు. ఇంకా ఇంకా
మానస చోరుడు : మానస హారిణి
తొలి చూపులలో : నందన వనముననానందములో తొలి పూవో …
వలపులు చిలికి దోచిన తొలిసారిగ పూచిన పూవు
మగసిరి దొర : మనసిచ్చినదో,
నను నర్పించితినె : ఆదరించునో
మెచ్చినదో : ఆదమరచునో

ఆత్రేయగారి ఆలోచన, అంతర్మథనం, అంతర్ముఖత్వం మనకు ఈ పాటలో స్ఫురిస్తున్నాయి. కనుకనే 60 స.లు గడిచిపోయినప్పటికి ఈ పాట సాహితీ మర్యాదను అందుకుంటున్నది.
– ఏలూరు అశోక్ కుమార్ రావు, హైదరాబాద్

ఆచార్య ఆత్రేయ (కిళాంబి వేంకట నరసింహాచార్యులు)
తన గోత్రాన్ని కలం పేరుగా పెట్టుకొని సినీరంగ ప్రవేశం చేశాడు ఆత్రేయ . నాటక రచయిత, సినిమా మాటల, పాటల రచయిత, దర్శకుడు 1961 సంవత్సరంలో వాగ్దానం సినిమాను నిర్మించారు. తెలంగాణ మహాకవి దాశరథి ని మద్రాసు పిలిపించుకొని
“నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా “పాటను వ్రాయించుకున్న కవిప…

October 25, 2021 4 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శ్రీ యాదాద్రీశా వైభవమ్-10

by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు October 25, 2021
written by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు

చంచ న్మాయాప్రపంచ స్థితి లయకరణాద్యంత తంత్రస్వతంత్రం
కంబాలాభప్రతాపం కపటపటు పటాలంబిత ప్రాఙ్నితంబం
రంగజ్జంఘాల జంఘాయుగ మపరిమితానందనందాభివంద్యం
వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !
తాత్పర్యం: అస్థిరమైన ఈ మాయా ప్రపంచం యొక్క ఉనికికీ, మహా ప్రళయంలో లయమై పోవటానికీ, సమస్త సృష్టి పరిరక్షణకూ, పోషణకూ, ఆదినుండీ అంతమువరకూ అన్నింటికీ కారణభూతమైన స్వతంత్ర చిద్రూపుడూÑ అపార పరాక్రమశాలిjైున ఆంజనేయునితో సముడగు ప్రతాపశాలీÑ తన మాయాబలంతో వస్త్రంవలె తూర్పుపర్వతాన్నంతా కప్పివేసినవాడూÑ ప్రకాశిస్తూ శీఘంగా కదలగల బలిష్ఠములైన రెండు పిక్కలు కలవాడు, తనయుని బాల్య చేష్టావిశేషాల చేత అంతులేని ఆనందాన్ని పొందిన నందునిచేత నమస్కరింపబడినవాడూ అయిన ` యాదగిరిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలపరాక్రమాలను ప్రదర్శిస్తున్న ` శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని నమస్కరిస్తున్నాను.
విశేషాలు: ‘‘య ద్దృశ్యం త న్నశ్యం’’ అని వేదాంతులు నొక్కి వక్కాణించారు. ఇంద్రియ గోచరమయ్యే ప్రతిదీ నశించిపోయేదే అని దీని భావం! సమస్త చరాచర సృష్టినీ తనలోని అంతర్భాగంగా చేసుకుని అంతా తానుగా కనిపించే ఈ ప్రపంచం (చంచత్‌GమాయాGప్రపంచంR) కదులుతూ ఉన్నట్లుగా కనిపించే మాయాప్రపంచమే! ఈ ప్రపంచం యొక్క ఉనికి (స్థితిR) అంటే జన్మించినట్లుగా కనిపించి, ఇదంతా నిజమేనని భ్రమింపజేసి, (లయR) కొంతకాలం అందరినీ మాయలో ముంచి, శోక`మోహాదులకు గురిచేసి, నశించిపోతున్నట్లుగా అనిపించి, చివరికి మహాప్రళయ సమయంలో సమస్తాన్నీ తనలో కలుపుకునే మహాసముద్రంగా కనిపించి, ఈ (జన్మలయల) మధ్య కాలంలో (కరణR) రక్షింపబడుతూ, వృద్ధి చెందుతూ ఉన్నట్లుగా అందరినీ భ్రమింపజేసే ఈ మాయా ప్రపంచం (స్థితిGలయGకరణGఆద్యంతGతంత్రGస్వతంత్రంR) పుట్టుకకూ, వృద్ధికీ, నాశానికీ తానే మూలకారణమైన సర్వతంత్ర స్వతంత్రుడు ఆ లక్ష్మీనరసింహస్వామి!
బమ్మెర పోతన మహాకవి కూడ భాగవతంలో ఈ విషయాన్ని ఈ విధంగా పేర్కొన్నాడు ` ‘‘ఎవ్వనిచే జనించు జగ, మెవ్వని లోపల నుండు, లీనమై యెవ్వని యందు డిరదు, పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం బెవ్వ, డనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానjైునవాడెవ్వడు, వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌’’ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు.
(కంGబాలGఆభGప్రతాపంR) ‘క’ అనే ఏ కాక్షరానికి ఉన్న నానార్థాలలో వాయుదేవుడు అన్న అర్థం కూడ ఒక్కటి. వాయుదేవుని బాలుడు (కుమారుడు) ఆంజనేయస్వామి. బాలశబ్దానికి చిన్న శిశువు అన్న అర్థం కూడ ఉంది. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఆంజనేయుడు ఉదయిస్తున్న సూర్యుణ్ణి పండుగా భావించి, మింగటానికి పైకెగిరిన విషయం తెలిసిందే కదా! అంతటి పరాక్రమశాలి ఆంజనేయుడు. సీతజాడ తెలిసికొని వచ్చిన ఆంజనేయుణ్ణి, అతని పరాక్రమాన్ని మెచ్చుకున్న సుగ్రీవుడు లక్ష్మణునితో ఇలా అంటాడు ` ‘‘కార్యసిద్ధి ర్మతి శ్చైవ తస్మి న్వానరపుంగవే, వ్యవసాయ శ్చ వీర్యం చ శ్రుతం చాపి ప్రతిష్ఠితమ్‌, జాంబవా న్యత్ర నేతా స్యా దంగద శ్చ మహాబలః హనూమాం శ్చా ప్యధిష్ఠాతా న తస్య గతి రన్యథా’’ ‘‘వానశ్రేష్ఠుడైన ఆ హనుమంతునిలో కార్యసిద్ధి, తెలివితేటలు, పట్టుదల, పరాక్రమము, విద్య అన్నీ నెలకొన్నాయి. ఏ పనిలో జాంబవంతుడు, మహాబలుడగు అంగదుడు నాయకులుగా ఉంటారో, హనుమంతుడు తోడుగా ఉంటాడో ఆ పని వేరు విధంగా కాదు. అంటే తప్పకుండా జయప్రదం అవుతుంది’’ అని అంటాడు.
తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు సమస్త దేవతాగణానికీ, దేవలోకానికీ అధిపతి కూడా! దైత్యదానవుల తాకిడి నుండి ఇంద్రుణ్ణీ, దేవలోకాలను రక్షించేవాడు శ్రీహరి! వాళ్ళు పన్నే చిత్ర విచిత్రములైన మాయోపాయాలన్నిటినీ ఛేదిస్తూ ` అనంతమైన, అభేద్యమైన కవచంగా నిలిచేవాడు విష్ణుమూర్తి! (కపటGపటుGపటGఆలంబితGప్రాక్‌GనితంబంR) రాక్షసుల దాడి నుండి సురలోకాన్ని కాపాడటం కోసం (కపటR) తన విష్ణుమాయ అనే (పటుGపటR) దృఢమైన వస్త్రంతో (ఆలంబితGప్రాక్‌GనితంబంR) కొండ మధ్య భాగం వలె స్థిరమైన సురలోకాన్ని కప్పి, రక్షిస్తున్నాడు. నితంబం అంటే కొండ (పర్వతం) యొక్క నడిమి భాగం అని అర్థం. విష్ణుమాయ నిరంతరం దుర్మార్గుల బారి నుండి (ప్రాక్‌GనితంబంR) దేవ లోకాలను కాపాడుతూ ఉంటుందని భావం!
పిక్కల్లో బలం ఉంటే కాని శత్రువులను ఎదిరించి పోరాడి విజయం సాధించలేము. యుద్ధంలో (రంగత్‌GజంఘాలG జంఘాయుగంGఅపరిమితGఆనందGనందGఅభివంద్యంR) తన బలపరాక్రమాలను ప్రదర్శించాడు శ్రీకృష్ణావతారంలో శ్రీహరి. దానిని చూడటం వలన అపరిమితమైన ఆనందం కలిగింది నందగోపుడికి. భక్తితో శ్రీకృష్ణపరమాత్మను (శ్రీహరిని) స్తుతించి నమస్కరించాడు నందుడు.
అనంత మహిమాన్వితుడై, యాదాద్రిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలమును ప్రదర్శించుచున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని కవి భక్తి ప్రపత్తులతో స్తుతించి నమస్కరిస్తున్నాడు.

October 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ October 25, 2021
written by కొరుప్రోలు హరనాథ్

తేడా
——-

ఆకాశంలో
మిణుకు మిణుకుమంటూ
మెరిసే కోటానుకోట్ల
నక్షత్రాల కన్నా…..
జిగేల్ న మెరిసే
ఒక జాబిల్లి మిన్న
పదవి పట్టాన్ని వరించి
వాగ్దానాల నూకల్ని విసిరే
నాయకుల కన్నా
జాతిని ఒక త్రాటిపై నడిపే
ఉద్యమకారుడు మిన్న

—-**——

రాజకీయం
—————

రాజకీయ ప్రయాణంలో
పదవుల పట్టాలు తప్పి
ప్రతిపక్ష పార్టీల
యాక్సిడెంట్లు సహజం –
వాటిని తట్టుకుని
ముందుకు సాగినవాడే
రాజకీయ నాయకుడు
అదే అసలైన
రాజకీయం

కె.హరనాథ్, 9703542598

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఐదు స్పూన్ల ఉప్పు

by ఒద్దిరాజు మురళీధరంరావు October 25, 2021
written by ఒద్దిరాజు మురళీధరంరావు

గీతా, ఎక్కడున్నవు? నా మెడిసిన్ కొరకు నువ్వు మెడికలం షాపుకు త్వరగా వెళ్ళి రావాలి, రా, నా దగ్గరికి, అని గీత తాతగారు గీతను పిలిచాడు. గీత ఎక్కడ ఉండింది? ఆమె ఓ పుస్తకం చదువుతూ బెడ్లో ఉండెను. చాలాసేపు వరకు ఆమె ఏమి విననట్టు నటించింది. ఆ పుస్తకం చాలా ఉద్రేకపరిచేట్టు ఉండెను. దీనికి తోడు బయట చాలా వేడిగా నుండెను, అందుకు ఆమె బెడ్ నుండి కదలదలచుకోలేదు.

గీతా! ఈసారి తన తల్లి మాట కూడా వినవచ్చింది రమ్మన్నట్లు. అమ్మాయి ఒక నిట్టూర్పు తీసి బెడ్ నుండి బయటికి వచ్చి ఏం కావలెనో తెలుసుకోదలచింది. ఆమె తాతగారు కొంత డబ్బు చేతిలో పెట్టి, తనకు చాలా తలనొప్పి బాధ ఉదయం నుండి ఉందని చెప్పాడు. నాకు ఈ మందులు తేగలవా? అన్నాడు.

గీత డబ్బులు తీసుకొని మెడికల్ స్టోర్ వైపు వెళ్లింది. దారిలో ఒక స్పీట్ షాపు పక్క నుండి వెళ్ళుతుండెను. ఓహ్, ఏం చెప్పాలి, ఎంతమంచి గులాబ్ జామున్, లడ్డూలు, జిలేబిలు ఘుమ ఘుమ వాసనలు. ఆమె కొన్ని తీసుకోదలచింది. ఆమెకు చెప్పిన పని మరిచిపోయి షాపులోకి వెళ్ళి స్వీట్లను తీసుకొని తన ఒడిలో పెట్టుకోసాగింది. అప్పుడే ఓ ఫ్రెండు అటు వచ్చి ఈమెతో కలిసింది. ఆ ఇద్దరు అమ్మాయిలు స్వీట్లు తిని చాలాసేపువరకు మాట్లాడుకున్నారు. గీత తన దీన తాతగారి తలనొప్పి గురించి పూర్తిగా మరిచిపోయింది. ఆమె ఇంటి నుండి బయటికి వచ్చిన పని జ్ఞాపకం వచ్చేవరకు మధ్యాన్న నుండి సాయంత్రం అయి మెడికల్ షాపు ఆ రోజుకు మానేశారు. ఆమె ఇంటికి త్వరపడిపోయిందో, తన తాతగారు ఎంతో బాధపడినాడు. ఎప్పుడు పెద్దదానివి మరియు బాధ్యత రాలువు అవుతావు గీతా అని అతను నిట్టూర్చి అడిగాడు.

గీతా వాస్తవంగా చాలా బాధపడింది, కాని తన పద్ధతులు మార్చుకుందా? లేదు. ఆమె ఎప్పటిలాగే మతిమరుపు మనిషి. ఎప్పుడైతే ఆమె తల్లి బయట ఆరేసిన బట్టలు తెమ్మందో, ఆమెకు మరుసటి రోజు ఉదయాన జ్ఞాపకం వచ్చింది. అప్పటివరకు రాత్రంతా కురిసిన వానకు బట్టలు తడిసి ముద్దయినాయి. మరొక రోజు తన చెల్లెలుకు లంచ్ బాక్సు స్కూలుకు తీసుకపోవలసియుండె.  దారిలో సర్కస్ డేరాలను చూసింది. ఉదయమంతా సర్కస్ టెంటు చుట్టు తిరుగుతూ జంతువులు తినగా మరియు అవి చేయవలసిన పాత్రలకు జరిగే ట్రేనింగ్ కుతూహలంగా చూస్తూ గడిపింది.

కేవలం తనకు ఆకలి అయినపుడే తన చేతిలోని బాక్సు చూసి తన చెల్లెలు స్కూలులో దినమంతా ఏమీ తినకుండా ఇల్లు చేరి ఉంటుందని అనుకుంది.

ఇంకకసారి తన తండ్రి పనికి పోయే తొందరలో షర్టు ఇస్తే చేయమని గీతకు చెప్పిండు. గీత షర్టు తీసుకని వేడి ఇస్తీపెట్టె దగ్గర పెట్టింది. ఇంతలో బజారులో పెద్దవి రుచికరమైన మామిడి పండ్లు బుట్టలో పెట్టుకుని అమ్మేవాడి కూత వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి పండ్లు ఏరడం మదలు పెట్టింది. ఇంతలో షర్టు కాలుతున్న వాసన వచ్చింది. ఆ రోజు తండ్రి చాలా విచారపడినాడు.

ఈ సంఘటన తరువాత కొన్ని రోజులకు స్కూలు నుండి వచ్చి మరుసటి రోజు స్కూలు నుండి పిక్ నిక్ వెళ్ళగలమని చెప్పింది గీత. పిక్ నిక్ కు వెళ్ళేటప్పుడు తలా ఒక అయిటమ్ తీసుకెళ్ళాలని, తను సాంబారు తేగలనని నిర్ణయించింది. తన తల్లి మంచి రుచికరమైన సాంబరు చేస్తుందని తన ఫ్రెండ్సు బాగా సంతోషిస్తారని అనుకుంది. తల్లి పెద్ద కుండలో సాంబరు చేస్తానని ఒప్పుకుంది. గీత రాత్రి సంతోషంగా పడుకుంది, మరునాటి మంచి పిక్ నిక్ రోజు బాగుంటుందని ఊహిస్తూ.

మరుసటి రోజు ఉదయం తల్లి త్వరగా లేచి సాంబారు చేయడం మొదలు పెట్టింది. ఆమె పప్పు ఉడకపెట్టింది. కూరగాయలు, కొబ్బరి మరియు అన్ని మసాలాలు వేసి కుండను మండే స్టౌపై పెట్టింది. గీత బెడ్ లో ఉన్నపుడే మంచి ఘుమ ఘుమ వాసన రాబట్టింది. గీత కదలికలను చూసి, నా ప్రియమైన గీతా లేవమ్మా ఇప్పుడు. చూడు, సాంబారు దాదాపు కావచ్చింది. నేను గుడికి పోతున్నాను, కాబట్టి కొద్దిసేపు అయ్యాక ఐదూ స్పూన్ల ఉప్పు దాంట్లో వెయ్యి. మరిచిపోకు ఇప్పుడు. లేచి త్వరగా తయారుగా అంది.

తిట్లు అనుకుంటూ హడావిడిగా ఆమె వెళ్లిపోయింది. గీత నాయనమ్మ ఎవరైతే వంట గదిలో వుండెనో. అదంతా విన్నది మరియు తనలోనే తానే అనుకుంది, తన కోడలు ఎప్పుడు గీత మతి మరుపు పిల్ల అని తెలుసుకుంటుందో యని. నాకు గట్టి నమ్మకం ఉంది, ఆ అమ్మాయి ఉప్పు వేయడం మరిచిపోతుందని. అప్పుడు అమ్మాయిని ఆమె ఫ్రెండ్సు ఆట పట్టిస్తారు. జాగ్రతగా ఉండటమే మేలు అనుకుంటూ వెళ్ళి కుండలో ఉప్పు కలిపింది.

గీత తాతగారు వరండాలో కూర్చొని వార్తా పత్రిక చదువుతుండేది. అతనికి గీత తన తల నొప్పికి మెడిసిన్ తెమ్మని పంపుతె ఆమె మరిచి పోవడం తను బాగా తలనొప్పితో బాధపడటం జ్ఞాపకం ఉంది. గీత ఏదైన జ్ఞాపకం ఉంచుకోవడమే? అది కాని పని, అని తనలో తానే ్నుకుంటు వంట గదిలోకి వెళ్ళి సాంబరులో ఉప్పు వేశాడు.

గీత చెల్లెలు తల దువ్వుకుంటుండెను. స్కూలుకు పోయేందుకు తయారు అవుతూ ఆమెకు గుతా గీత లంచ్ బాక్సు తేవడం దారిలో సర్కస్ డేరాలు చూస్తూ మరిచిపోయి తను ఆ రోజు ఆకలితో ఇల్లు చేరడం బాగా జ్ఞాపకం ఉండింది. గీత ఉప్పువేయడం తప్పక మరిచిపోయే ఉంటుంది, దానితో తన స్నేహితురాళ్ళు నవ్వుతారు. అనుకుంటూ తను త్వరగా వంటగదిలకి వెళ్ళి ఐదు స్పూన్ల ఉప్పు సాంబరులో కలిపింది.

గీత తమ్ముడు పండ్లు తోముకుంటూ తల్లి తన అక్కకు చెప్పిన మాటలు ఉప్పు గురించి తప్పక మరిచే ఉంటుంది. అతను కిచెన్ లోకి వెళ్ళి కొన్ని స్పూన్ల ఉప్పు కుండలో వేసి వెళ్ళిపోయాడు.

గీత తండ్రి బహు జాగ్రత్తగా తన షర్టును ఇస్త్రీ చేసుకుంటుండెను. అందరి వలె అతను కూడా కిచెన్ లోకి వెళ్ళి సాంబారు కుండలో ఉప్పు వేశాడు.

ఇప్పటికి గీత లేచింది, ఆశ్చర్యంలో ఆశ్చర్యం ఉప్పు వేయడం ఆమెకు జ్ఞాపకం ఉండింది. అందుకు ఆమె కూడా వెళ్ళి ఐదు స్పూన్ల ఉప్పు తల్లి చెప్పినట్లు కలిపింది.

ఇప్పటివరకు తల్లి వచ్చి సాంబారు ఒక కంటే నీరులో పోసింది. దాన్ని తన కూతురుతో పిక్ నిక్కు పంపించింది.

పిక్ నిక్ ప్రాంతంలో పిల్లలు బాగా సంతోషంగా ఆడుకున్నారు కొంతసేపు. కాబట్టి ఇక ఏమి చేయలేక ఆకలితో ఉండిరి. ప్లేట్లు, స్పూన్లు బయటికి తీశారు. కంటెనర్సు పదార్థాలతో నిండి వుండెను. ప్లేట్లలో రైసు, చట్నీలు, కూరలు, పూరీలు, మరియు తీరు తీర్ల మిఠాయిలతో నిండిపోయినవి. అందరు ఎక్కువ ఎక్కువ గీత చేతితో సాంబారు పోయించుకున్నారు. కాని ఒక స్పూను నోట్లో పెట్టుకున్నారో లేదు, హా, హా, నీళ్లు, నీళ్లు అని మొత్తుకోవడం మొదలయింది. ఆశ్చర్యపడింది. గీతకు ఏమైందో తెలుస్తలేదు. అల్లం వాసన రైసం మరియు సాంబరు తన ప్లేటుతో వచ్చిన కూలి. అది చాలా అయిష్టంగా ఉండెను. అది తన తల్లి సముద్రంలోని ఉప్పంతా సాంబరులో వేసినట్లు తోచింది. అప్పుడు గీతకు జ్ఞాపకం వచ్చింది.  తన తల్లి ఉప్పు కలుపలేదు, తనే కల్పింది. అయితే ఎక్కడ తప్పు జరిగింది?

ఆ రోజు గీత ఇంట్లో అందరు ఆతురతతో గీత స్కూలు నుండి వచ్చి సంతోషానికి బయటికి వెళ్ళిన సమాచారం కొరకు ఎదిరి చూస్తుండేది. కాని ఇదేమిటి? ఆమె చాలా అలసిపోయినట్లు, ఆమె ముఖం రంధితో మరియు కన్నీరు పెట్టుకున్నట్లు కనిపించింది. ఏం జరిగింది? గీత వారిమీద అరిచింది, ఇంకెవరయిన సాంబరులో ఉప్పు వేశారా?

నేను వేసిన, నాయనమ్మ అంది

నేను వేసిన, తాతగారు అన్నారు

నేను వేసిన తండ్రిగారు అన్నారు

నేను కూడా అన్నాడు తమ్ముడు

మరియు నేను అంది చెల్లెలు.

భయంతో అందరూ ఒకరి ముఖం చూసుకుంటూ కూర్చున్నారు. గీత రంధితో ఉండటం ఆశ్చర్యం కాదు. ఆమె ఫ్రెండ్సు ఆమెను సాంబరులోని ఉప్పు గురించి హేళణ చేసి యుండవచ్చు!

‘’మీరంతా అలా ఎందుకు చేశారు? అమ్మనా ఒక్కతికే గదా చెప్పంది’’ అని ఏడ్చింది గీత.

ఓహో ప్రియమైన గీత, నీకు ఏది చేయమని చెప్పినా మరిచిపోతవు గదా అని, ఈసారి కూడా మరిచిపోతావని, అనుకొని… అందరు విచారం వ్యక్తపరిచారు.

ఇప్పుడు తల్లి గీతను దగ్గరకు తీసుకని కన్నీరు తుడిచి నీవు ఏదైనా నాల్గు సార్లు జ్ఞాపకం చేయండి మరిచిపోగలవని ఇట్లు జరిగింది. ఇక ముందు జాగ్రతగా వుంటానని వాగ్ధానం చెయ్యి. మేమంతా నీవు నీ పనులు సక్రమంగా చేయగలవని నమ్ముతాము.

గీత ముక్కు చీదుకని, సరేనని తల ఊపింది. అటు తరువాత తమ తమ పనులు చాలా జాగ్రతగా చేసుకుంటుండేది. ఎంతో సదిరి చెప్పాక తన ఫ్రెండ్సు తన ఇంటికి ఒక నాడు లంచ్ కు వచ్చారు. తల్లి చేసిన రుచికరమైన సాంబరుతో లంచ్ బాగా ఆరగించి, ఇంత రుచికరమైన సాంబరు అన్నం ఎన్నడు తినలేదని ఒప్పుకున్నారు. అందరూ బాగా ఆనందించారు.

 

రచయిత రెండు మాటలు

మా నాయనమ్మ క్రిష్ణ, అందరు కిష్టక్క అని పిలిచేవారు. ఆమె చాలా తెలివయినది మరియు చాలా దయగలది. ఆమె కథలు గొప్పగా చెప్పేది కూడా ఆమె మాకు ఎప్పుడూ నీతులు చెప్పేది కాదు. కాని జీవిత విలువలను కథల రూపంలో చెప్పేది. మేము చిన్నపుడు చాలా ఫ్రీగ కుటుంబంలోని తోటి అమ్మాయిలతో మరియు తాతయ్య, నాయనమ్మలతో ఉత్తర కర్నాటకలోని హడావిడి లేని నగరం షిగాన్ (Shiggaon), లో ఉంటిమి. ఏదైన మేమందరం సంతోషంగా పంచుకునేవారము.  మా అందరి కలయికకు మా నాయనమ్మే మూలం (Binding force). నాయనమ్మ చెప్పిన కథల ప్రభావం నా మీద ఇప్పటికి ఉంది. ఏవో చిన్న చిన్న మార్పులతో ఈ కథల పుస్తకం వ్రాశాను. కానీ చాలావరకు వాటి ప్రభావమే.

ఎప్పుడైతే నా మనుమరాలు క్రిష్న పుట్టిందో ఆమె నన్ను అమ్మమ్మ స్థాయికి లేపింది. నేను అన్నీటికన్న కథల విలువ ఎక్కువని గ్రహించాను. అవి పిల్లల విజ్ఞానం పెంపుదలలో ఎంతో సహాయపడుతాయి. అందుకే ఈ పుస్తకం.

ఈ కథలు పిల్లలు, తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మలు మూడుతరాలవారు ఒకరితో ఒకరు ప్రేమతో కలిసి ఉండేందుకు దోహదపడుతాయి.

పెంగ్విన్ బుక్స్ ఇండియా నా పుస్తకాల ప్రచురణకు ఉత్సాహం చూపుతున్నందుకు ధన్యవాదాలు. నేను సుదేశ్నా షోం ఘోష్ కు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆయన నాకు గత పదేండ్లలో కథలు రాయడంలో ఎడిటర్ గాక మంచి మిత్రుడయినాడు.

 

సుధామూర్తి

బెంగళూరు

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

మారుతున్న కాలం తో పాటు బాల సాహిత్యం లో మార్పు రావాలి

by vedantasuri October 25, 2021
written by vedantasuri

మనిషికి బాల్యం పునాది వంటిది. పిల్లలు కదా వారికి ఏమి తెలుసు అని అనుకోవడం పొరపాటు. వారి పరిశీలన , అవగాహన లోతుగా ఉంటుంది. బాల్యం లో ఏర్పడిన అభిప్రాయాలు, అభిరుచులు, మనిషి వయసుతో పాటు పరిణతి చెందుతుంటాయి. అందుకే వారికి చిన్న వయసులోనే అంటే మూడేళ్ళ వయసు లోపే ఏది , మంచి , ఏది చెడు అనేది చెబుతుండాలి. ఆ వయసులోనే వారి అభిరుచులు ఏమిటో తెలుసుకోవచ్చు . ఈ దిశగా పెద్దలు పిల్లలను అవగాహన చేసుకుని వారి అభిరుచులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలి. అంతే కాకుండా. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమం లో పిల్లల మానసిక ఎదుగుదల కూడా పెరిగింది. వారు ఎంత వేగంగా ఆలోచిస్తున్నారు గమనించి వారికి అన్ని ఏర్పాట్లు చేయాలి.
అదే విధముగా రచయితలూ కూడా తమ రచనల్లో మార్పులు తీసుకు రావాలి. బాల్యం లోనే సృజన అమోఘంగా ఉంటుంది. దాన్ని పదును పెట్టడానికి పెద్ద్లు కృషి చేయాలి . కానీ మీరు అనుకున్నది వారు చేయాలి. మీరు చెప్పింది వారు వినాలి అనే ధోరణి ఉంటే వారు రెంటికి చెడ్డ రేవడిగా మారి పోతారు. వారి ఆలోచనలు మారుతున్న కాల పరిస్థితులను అవగాహన చేసుకుని పెద్దలు కూడా తమ రచనల్లో మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు చందమామ , బాల మిత్ర కథలు కాదు ఈ తరానికి తగిన రచనలు చేయాలి. ప్రపంచ బాలలతో పోటీ పడి ఎదగాలంటే బాల సాహితీ వేత్తలతో పాటు ప్రభుత్వాలు, సమాజ ఆలోచనల్లో తగిన మార్పు రావలసి వుంది.
ఇలా పెద్దల్లో మార్పు వస్తే భావితరానికి బంగారు బాట వేసిన వారమవుతాము.
ప్రతి ఏటా ఉపాధ్యాయులకు , రచయితలకు కార్యశాలలు ఏర్పాటు చేయాలి. సమాజ ఆలోచనా విధానాలు కూడా మారాలి. మారుతున్న కాలం తో  పాటు మనుషులు కూడా మారాలి. ఆ మేరకు పిల్లల ఆలోచనలకు అనుగుణంగా అవగాహన పెంపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించాలి ,  మొక్కు బడి ఆలోచనల నుంచి బయట పడాలి. రచనలు చేయడం ఒక్కటే సరిపోదు , మీరు రాసేది ఎందరు చదువుతున్నారు , ఎంతమందికి ఉపయోగ పడుతుంది ఆలోచించాలి. లేకుంటే మీ లక్ష్యం నెరవేరనట్టే .

 
 
October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

” పసి పిల్లలు ” (బాలగేయం)

by Gadwal Somanna October 25, 2021
written by Gadwal Somanna
పసి పిల్లలు వేల్పులు
జగతి ప్రగతి బాటలు
వెలుగునిచ్చు భానులు
నింగిలోని  తారలు
       ముద్దులొలుకు పిల్లలు
       ముద్దబంతి పువ్వులు
       మురిపించే మువ్వలు
       విహరించే గువ్వలు
ఇంటిలోన దివ్వెలు
కంటిలోని పాపలు
ప్రాణమున్న బొమ్మలు
ఫలములిచ్చు తరువులు
         వెన్నెలమ్మ జల్లులు
         వెన్న వంటి మనసులు
         సొగసుల హరివిల్లులు
         తెల్లని సిరిమల్లెలు
కన్నవారి ఆశలు
వారి గుండె శ్వాసలు
బాధ్యతగల పౌరులు
భారతమ్మ వీరులు
-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు, సెల్:9966414580
—–హామీ పత్రం——
మయూఖ పత్రిక సంపాదకులకు నమస్కారం. ఈ గేయం నా సొంత రచన.అనువాదం, కాపీ కాదని హామీ-గద్వాల సోమన్న
October 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

సైరంధ్రి

by Bhavani October 25, 2021
written by Bhavani

సర్గ : 2

అక్కడే మేలుకొన్నది ఆలోచనాలోకం ,

ఎక్కడికో పరిగెడుతున్నది మానసం ;

భిన్నభ్రమలను కూడదీసుకుని ,

తనకుతానే నిలిచెను ఒంటరిగా  !

 నిత్య వికసిత యవ్వనదీప్తి ,

ముగ్ధవసంత బాల్యవిముక్త ;

అరుణచాప అపురూప విలసిత,

ఎగిసిపడినది యజ్ఞజ్వాలలా!

 కలత చెందిన కోరికలు ,

క్రూర వాస్తవ విలోకనలు;

సర్వం కరిగిన కాలంతెరలు,

                                       -2-

స్వరబద్ధాలంకృత శిధిల వాద్యాలు!

 లోపలి సూర్యుని నిద్రలేపెను,

వడిగా చీకటి పారిపోయెను ;

ఎప్పటినుంచో హత్తిన నీడ ;

అన్నిటినుండీ లిప్తను వీడెను!

 సకల అస్మితలు ఓడిపోయినవి,

మాన్యతాయుత  ముకుటము తొలగె ;

యాచన  కోరిన శరణాగతిగా,

వికృతరూపము దీక్షగబూనె!

 అటు ఇటు ఏవో ఆలోచనలు,

అతులిత సమయస్మృతి కదలె;

స్వయంవరం అది ఎవరి కోసమో ,

ఆమెయే నేడు అభిశప్త భాగ్య!

                                     -3-

జనకుడు వరుని వెదకిన వేళ ,

ఆహ్వానించెను రాజవీరులను;

చివరకు పడినది దావానలమున,

నూతనరూప శపిత మోసమున!

 పరమ ప్రియతముని వరించవలయు,

అయినను కానదు మనోహరుని;

పాండుపుత్రుని ప్రతిష్ట వెలిగె,

సూతపుత్రుడు కళంకమొందె!

 అచ్చట నిలిచిరి ఇద్దరు వీరులు, అద్వితీయ దీప్తిమంతులు,

విజయునే  వరింపవలసె , రాధేయుని  వెడలగద్రోసె;

క్షాత్రతేజమున విరాజిల్లినా, నాధుడుమాత్రం కాలేడు,

కిరీటికి  సరిసమానుడు , వివశవదనుడై వెనుదిరిగె!

                         ******

గుజరాతీ మూలం , హిందీ అనువాదం : డా. వినోద్ కుమార్ జోషి  

 

 

 

 

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు October 25, 2021
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

నీ భుజంమీద నువ్వు పెట్టుకున్న తుపాకీకి

కళ్లు లేవు, కాళ్లూ లేవు

నా అడుగుల్ని గమనించేందుకు

అది నీ కళ్లను దొంగిలిస్తుంది

నా అడుగుల జాడల కోసం,

నా ఛాతీని ఛిద్రం చేయడం కోసం

నా చావుకేకను నీ వీనులతో వినడం కోసం

అది నీ పాదాలను తస్కరిస్తుంది

 

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

నీ భుజం మీద నువ్వు మోసే ఆ తుపాకీ

అవిటిదా చెవిటిదా గుడ్డిదా?

నీ కళ్లను చెవులను పాదాలను తగిలించుకునేందుకు

అది తన కళ్లను చెవులను పాదాలను రాల్చుకుందా?

 

నీకేమీ తెలియకపోవచ్చు ఆ తుపాకీ గురించి

కానీ మనం మన అన్నదమ్ములను అంతమొందించేలా

మన దవడలను ఒకరినొకరం దారుణంగా విరగ్గొట్టేలా

తను మాత్రం దొరకకుండా క్షేమంగా ఉండేలా

మనిద్దరి శత్రువు ఒక దూరప్రాంతంలో

పథకాన్ని రచిస్తున్నాడు

తన రక్తం చిందకుండా

మన రక్తం మాత్రం మట్టిలో కలవాలని అతని కోరిక

తన శరీరాన్ని షర్టులాగా ఇంటిదగ్గర వదిలి

తుపాకీ రూపంలో రావాలన్నది అతని పన్నాగం

 

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

కాళ్లుచేతులు లేని మన దుష్టశత్రువు

ఒంటరిగా రాడు, మనకన్న పెద్దసంఖ్యలో

గుంపులుగుంపులుగా వస్తాడు

ప్రతి తుపాకి విచ్చలవిడిగా తిరుగుతూ

ఎడతెగకుండా పేలుతుంటుంది

తన ఎముకలు విరగకుండా, తన చర్మం కాలకుండా

తన రక్తనాళాలు నెత్తురోడకుండా

తుపాకీ అంగాలన్నీ ఇంటిదగ్గర క్షేమంగా ఉంటై

అది మన అవయవాల్ని ఉపయోగిస్తుందిక్కడ

ఒక తుపాకీ నీ పాదాలతో నన్ను వెంటాడుతుంటే

మరొకటి నా కన్నుతో నిన్ను గురి చూస్తుంది

మూడోది నీ భుజం మీద ఉన్నట్టుగానే

ఇంకొకరి భుజం మీద ఉంటుంది

దాని అంగాలన్నిటినీ ఇంటిదగ్గర వదిలేసి

అది కేవలం నోరుతోనే వచ్చిందిక్కడికి

భుజం నీది కానీ నోరు మాత్రం దానిదే

దంతాలు లేని ఆ నోరు తూటాలను

పదాలుగా మార్చి మాట్లాడుతుంది

కానీ ఒక తూటా మనవాడిని చీల్చినప్పుడు

అతడు దంతాలు లేని తుపాకీ నోరును చూడడు,

నీ భుజాన్ని, నీ చేయిని చూస్తాడు

నిన్ను శత్రువుగా భావిస్తాడు, గన్నును కాదు!

నీ నుండి ప్రతీకారాన్ని కోరుతాడు

 

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

నీ భుజం మీది తుపాకీ మన నేలమీద

ఎంత రక్తాన్ని చిందించింది?

అయినా సంజాయిషీ ఇవ్వలేదెందుకు?

ఈ రక్తపాతానికి నువ్వే నిందింపబడుతావు

నీనుండే ప్రతీకారం ఆశింపబడుతుంది

వాళ్లేమో మరో తుపాకీని భుజం మీద పెట్టి

దాని నోట్లోంచి వచ్చే తూటాను నీ గుండెకు గురి చూస్తారు

 

రాజ్యాధికారం కోసం అర్రులు చాస్తున్నవాడా!

ఏదో ఒకరోజు తూటా నీ గుండెను చీలుస్తుంది

నువ్వు సింహాసనం కంటె శవపేటికకు

ఎక్కువగా దగ్గరవుతున్నావు జాగ్రత్త

నీ శత్రువు నిన్ను సమాధిలోకి విసరకముందే

నువ్వు యోచించి జాగ్రత్త పడు

ఈ విషాదకర విధిరాత నుండి రక్షించుకునేందుకు

నీ చావుకోసం పథకం వేసేవాణ్ని గుర్తించాలి నువ్వు

నేను నీ సోదరుణ్ని. మనిద్దరి శత్రువైన తుపాకి

అవిటిదానిగా, చెవిటిదానిగా,

గుడ్డిదానిగా ఉంది నీ భుజం మీద

అది నా అడుగులను నీ కళ్లతో గమనిస్తోంది

నా గుండెలోంచి దూసుకుపోయేందుకు,

నా చావుకేకల్ని నీ చెవుల్తో వినేందుకు

నన్ను వెంటాడుతోంది నీ పాదాలతో

పష్తో మూలం: దర్వేష్ దురాని

                                                  ఆంగ్లం: దావూద్ ఆజమి

                                                  తెలుగు సేత: ఎలనాగ

***

       

October 25, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

నిశీధి

by Sudharshan Chintapatla October 25, 2021
written by Sudharshan Chintapatla

అర్ధరాత్రి.
డాక్టర్.. డాక్టర్..
ఎవరో పిలుస్తున్నారు కాదు అరుస్తున్నారు.
నేను కళ్ళు తెరిచి స్థానిక జమీందారు దక్షిణాచారణ్ బాబును చూశాను. లేచి నిలబడి చేతులు విరిగిన కుర్చీలో ఆయనను కూర్చోబెట్టి గాభరాగా ఆయన ముఖం లోకి చూశాను. గడియారం రెండున్నర గంటల సమయం చూపింది. ఆయన ముఖం పాలి పోయి ఉంది. సూటిగా నన్ను చూస్తూ” మళ్లీ అదే సమస్య మీ మందు పనిచేయలేదు” అన్నాడు.” బహుశా మీరు మద్యం సేవించి ఉంటారు అందువల్లనేమో”
అన్నాను జంకుతూ. ఆయన ముఖం ఎర్రబడింది
” కాదు కాదు తాగడం వల్ల కాదు కథ మొత్తం మొదటి నుంచి చివరి దాకా  చెప్తే కానీ కారణం ఏమిటో నీకు అర్థం కాదు” అన్నాడు. గూట్లో ఉన్న గుడ్డి దీపం వత్తిని ఇంకొంచెం పైకి జరిపాను. అది వెలుతురుని కొంచెం పెంచింది.  ధోవతి బిగించి దినపత్రికల కట్ట ఉన్న అట్ట పెట్టె మీద కూర్చున్నాను.
దక్షిణాచారణ్ బాబు మొదలుపెట్టాడు. నా మొదటి భార్య లాంటి ఉత్తమ ఇల్లాలు చాలా అరుదుగా కనిపిస్తుంది. నేను మంచి వయసులో ఉన్నాను  కవిత్వం మోజులో ఉండటంవల్ల కల్తీ లేని స్వచ్ఛమైన ఇల్లాలు నాకు పెద్దగా నచ్చేది కాదు. ఆమె ముందు నేను ఒక ప్రేమికుడులా ప్రవర్తిస్తే పగలబడి  నవ్వేది. గంగానది బురదలో చిక్కుకున్న ఇంద్రుడి ఐరావతం లా గిజగిజలాడేవాణ్ణి . ముత్యాల్లాంటి పదాలను కూర్చి ఎంత ప్రియమైన మాటలు చెప్పినా ఆమె ఒకే ఒక్క నవ్వుతో ఊడ్చి పారేసేది.
నాలుగు సంవత్సరాల జీవితం గడిచింది. నేను జబ్బు పడ్డాను. జ్వరం తీవ్రమై సంధి ప్రేలాపనదాకా వచ్చింది. నేను బతుకుతానని ఎవరూ అనుకోలేదు. డాక్టర్ కూడా లాభం లేదన్నాడు. ఆ సమయాన మా బంధువు ఒకడు ఎక్కడి నుంచో ఒక సన్యాసిని మా ఇంటికి తీసుకు వచ్చాడు. ఆయన ఒక మూలికను నేతిలో ముంచి నా చేత తినిపించాడు. మందు ప్రభావం వల్లో ఆయుష్షు తీరకపోవడం వల్లో బ్రతికి బయట పడ్డాను.
నేను జబ్బుతో ఉన్నప్పుడు  నా భార్య తీరిక లేకుండా గడిపింది. ఆరోజుల్లో యమదూతలు మా ఇంటి ముందు గుంపు గా ఉండేవారు. ఒక అబల అయి ఉండి ఆమె కేవలం మానవ శక్తితో నా మీద ప్రేమతో నా పనికి మాలిన ప్రాణాలు నిలబెట్టటానికి వారు లోపలికి రాకుండా నిరంతరం పోరాడింది.   ఒక చిన్న పిల్లాడిని సంరక్షించినట్టు నన్ను రక్షించింది.  తిండి తినలేదు నిద్ర పోలేదు. ప్రపంచంలో నన్ను కాపాడుకోవడంతప్ప మరో ధ్యాస లేదు.
విజయం సాధించి తృప్తిచెందిన పులిలా మ్రృత్యువు
నోటకరిచిన నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ పోతూ పోతూ అది నా భార్యని పంజాతో బలంగా కొట్టి పోయింది. అప్పుడు ఆమె గర్భవతి. ప్రసవ సమయంలో ఒక మృత శిశువును కన్నది. ఆ తర్వాత రకరకాల జబ్బులు ఆమెను పీడించడం మొదలుపెట్టాయి. నేను ఆమె బాగోగులు చూసుకోవలసి రావడం ఆమెకు ఇబ్బంది కలిగించింది ‘ఏం చేస్తున్నారు అందరూ ఏమనుకుంటారు’ అనేది ‘మగవారు మీరు నాకు సేవలు చేయడం తప్పు’ అనేది. బారానగర్ లో మా ఇంటి ముంగిట ఇంటికి గంగానదికి మధ్య ఒక తోట ఉండేది. ఇంటికి దక్షిణం వైపు ఉన్న పడక గది పక్కన చిన్న స్థలంలో ఆమె గోరింట పొదలు పెంచింది. తోట లో  గులాబీ, మల్లె, రజనీగంధ మొక్కలు ఉండేవి. ఒక పెద్ద పొగడ వృక్షం ఉండేది. దాని చుట్టూ పాల రాతి అరుగు ఉండేది. నా భార్య రోజుకు రెండు సార్లు ఆ చెట్టు కింద  శుభ్రం చేసేది .తన పనులన్నీ పూర్తయ్యాక అక్కడ కూర్చుని గంగా నదిలో కదిలే కంపెనీ పడవలను చూస్తుండేది.
మంచానికే పరిమితం అయిపోయిన చాలా రోజుల తర్వాత  చైత్రమాసంలో వెన్నెల కురుస్తున్న ఒక సాయం సమయంలో హఠాత్తుగా ఆమె నాతో ‘ఇలా లోపలే ఉండి ఉండి విసుగొస్తుంది ఇవాళ తోటలో కాసేపు కూర్చో వాలనిపిస్తున్నది’ అంది. నేను నెమ్మదిగా జాగ్రత్తగా ఆమెను తీసుకు వెళ్లి పొగడ వృక్షం కింది అరుగుమీద పడుకోబెట్టాను. నా తొడ మీద ఆమె తల పెట్టుకుంటే సంతోష పడేవాడిని. కానీ ఆమెకు  వింత గా అనిపిస్తుందని లోపలనుంచి  ఒక దిండు తెచ్చాను. వీచే గాలికి ఉండి ఉండి ఒకటీ రెండు  పొగడ పుష్పాలు పైనుంచి కిందికి రాలుతున్నాయి. కొమ్మల మధ్య నుంచి వెన్నెల నీడలు ఆమె ముఖం మీద పడుతున్నవి.చుట్టూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. సువాసన నిండిన నీడ లో ఆమె పక్కన కూర్చుని నేను ఆమె ముఖంలోకి చూశాను. నా కళ్ళ నుంచి కన్నీళ్లు రాలాయి. ఆమెకు దగ్గరగా జరిగి సన్నబడిన ఆమె వేడి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. అభ్యంతరం చెప్పలేదు. కాసేపు నిశ్శబ్దంగా గడిచాక అన్నాను’ నీ ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని. వెంటనే ఆ మాట అని ఉండాల్సింది కాదని నాకు అర్థమైంది. నా భార్య నవ్వింది. ఆ నవ్వులో ఆనందం ఉంది. ఆ నవ్వులో నమ్రత ఉంది. ఆ నవ్వులో కొంత ఆసక్తి కొంత ఎగతాళి కూడా ఉన్నాయి. ఒక్క మాట మాట్లాడలేదు. నవ్వింది .నన్ను ఎప్పటికీ మర్చిపోవా  అది అసాధ్యం అలా అని నేను అడగను’ అనే అర్థం  ఉంది ఆ నవ్వులో. తీయగా గుచ్చుకునే ఈ నవ్వుకు భయపడే నేను నా భార్యతో ప్రేమకు సంబంధించిన మధురమైన మాటలు మాట్లాడే వాడిని కాదు. అచ్చులో ఎంతో అందంగా కనిపించే మాటలు కన్నీరు కార్పించే మాటలు ఆమెకు ఎందుకు హాస్యాస్పదంగా కనిపించేవో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాదించడానికి మాటలు అవసరం కానీ నవ్వును ఏ వాదనతో ఎదుర్కొంటాం మౌనంగా ఉండటం తప్ప ఏమీ చేయలేం.వెన్నెలకాంతి పెరిగింది.  ఎక్కడి నుంచో కోయిల అసహనంగా మళ్లీ మళ్లీ కూస్తున్నది. ఇలాంటి వెన్నెల రాత్రి కూడా ఆడ కోయిల చెవులు వినిపించడం లేదా  అని నాకు ఆశ్చర్యం కలిగింది.
ఎన్ని రకాల మందులు వాడినా నా నా భార్య ఆరోగ్యం కుదుట పడలేదు. డాక్టర్ సలహా తో గాలి మార్పు కోసం ఆమెను అలహాబాద్ తీసుకు వెళ్ళాను. దక్షిణాచారణ్ హఠాత్తుగా చెప్పటం ఆపి రెండు చేతుల మధ్య తల పెట్టుకుని ఏదో ఆలోచనలో పడ్డాడు. గూట్లో ఉన్న గుడ్డి దీపం మసకబారింది. నిశ్శబ్దంగా ఉన్న గదిలో దోమల రొద స్పష్టంగా వినిపించింది. నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఆయన మళ్లీ చెప్పసాగాడు. అలహాబాదులో డాక్టర్ హరన్ గారు  నా భార్యకు చికిత్స చేసేవారు. ఆయన అన్ని విధాల ప్రయత్నించి ఆమె ఆరోగ్యం బాగుపడదని మిగిలిన జీవితమంతా ఇలాగే ఉండిపోతుందని చెప్పాడు. ఒక రోజు ఆమె నాతో  ‘ఇక నేను కోలుకునేది లేదు నేను  అలాగని తొందరగా నాకు చావూ వచ్చేట్టు లేదు. మీరు ఎందుకు ఒక జీవచ్ఛవం తో బ్రతుకు గడపాలి మళ్లీ పెళ్లి చేసుకోండి’ అంది. మా సమస్యకు ఇదే పరిష్కారమని ఆమె భావించింది. నవ్వడం లో ఆమెకు ఉన్న ప్రతిభ నాకు లేకపోయినా ఇప్పుడు నాకూ నవ్వే అవకాశం వచ్చింది. ఒక నవలలోని కథానాయకుడిలా గంభీరంగా రాజసంగా అన్నాను.’ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు…’ ‘చెప్పండి చెప్పండి నన్ను మధ్యలోనే ఆపి’ ఆపకండి మీరు ఇలా మాట్లాడటం చాలు నన్ను చంపేయడానికి’ అంది. నేను కొనసాగించాను.’ నిన్ను తప్ప ఇంకెవరినీ ప్రేమించలేను’ ఆమె బిగ్గరగా నవ్వడం తో ఆపక తప్పలేదు. బాగుపడుతుందని నమ్మకం లేని దానికి సేవలు చేసి  అలసిపోయాను అని జీవితమంతా ఇలాగే నిస్పౄహలోనే గడపాలాఅని, వయసులో ఉన్న వాడికి అవసరమైన అందం ఆనందం ఆకర్షణ ప్రేమ అనేవి ఇప్పుడు కనబడటం లేదని, నా ముందు  ఒక  ఎండమావి ఒక బీడు భూమి ఒక ఎడారి కనిపిస్తున్నదని నేను అనుకుంటున్నానని పసిగట్టిందేమో  నా భార్య.ఒక చిన్న పిల్లవాడు మొదటి వాచకంలో విడి విడి అక్షరాలను చదివినట్టుగా నన్ను చదివేయ గలదు. అందువల్ల నేను శృంగార నాయకుడిలా కవితా వాక్యాలు చెప్పినప్పుడు ఆమె నిస్సహాయంగా నవ్వేసేది. ఆమె నా అంతరంగంలోని ఆలోచనలను పసిగట్టడం తలుచుకుంటే ఇప్పటికీ నాకు అవమానంతో చచ్చిపోవాలని  అనిపిస్తుంది.
డాక్టర్ హరన్  మాకులస్థుడే. అప్పుడప్పుడు నన్ను తన ఇంటికి రమ్మని పిలిచే వాడు. ఒకనాడు తన కూతురును పరిచయం చేశాడు. పదిహేనేళ్ల వయసులో ఉన్న యువతి ఆమె. డాక్టర్ తనకు నచ్చిన వరుడు దొరకలేదని ఆమెకు ఇంకా పెళ్లి చేయలేదు. ఆమె అందంగా ఉండడమే కాక చాలా ప్రతిభావంతంగా మాట్లాడేది. ఇద్దరం అనేక విషయాలు చర్చించుకునే వాళ్ళం. మాటల్లో పడి నేను భార్యకు సేవ చేయాల్సిన సమయం దాటిపోయాక ఇంటికి వచ్చేవాణ్ణి. నేను డాక్టర్ ఇంటికి వెళ్లి వస్తున్న సంగతి ఆమెకు తెలుసు. కానీ ఎన్నడూ ఆలస్యానికి కారణం అడగలేదు. ఎడారిలో ఒక కొత్త ఎండమావిని చూడటం మొదలు పెట్టాను. దాహంతో తపించి పోతున్న నాకు ఇసుక లో గల గల పారే నీరు కనిపించింది. దాని నుంచి మనసు మరలించలేక పోయాను.  నా భార్య గదికి వెళ్లాలని నాకు అనిపించకపోవడంతో ఆమెకు సేవ చేయడం మందులు అందించడం క్రమం తప్పాయి
. డాక్టర్ హరన్ నయంకాని జబ్బు ఉన్నవారు మరణించడమే మంచిది. వారికీ సుఖము ఉండదు ఇతరులకూ ఉండదు అంటూ ఉండేవాడు .ఆయన నా భార్య గురించి ఇలాంటి మాటలు అంటున్నాడని నేను అనుకోలేదు. ఇది లోకంలో సర్వసాధారణమైన విషయమే కదా అనుకునేవాణ్ణి .మానవుల మరణం డాక్టర్లకు పెద్దగా విచారాన్ని కలిగించదు అనుకుంటా వారికి మానవుల అనుభూతులు అర్థం కావు. ఒకనాడు పక్కగదిలో ఉన్న నా భార్య డాక్టర్ తో అన్న మాటలు వినబడ్డాయి ‘ఎందుకు డాక్టర్ నా చేత ఇలా మందులు తినిపించి మీ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు జీవితం దుర్భరం అయిపోయింది ఏదైనా ఇచ్చి నాకు విముక్తి కలిగించండి’ ఆమె మాటలకు డాక్టర్ ‘వద్దు వద్దు ఇలాంటి మాటలు మాట్లాడవద్దు’ అని సమాధానం చెప్పి వెళ్లిపోయాడు. నా మనసు  బాధతో విల విల లాడి ఆమె గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుని ఆమె నుదుటి మీద చేత్తో రాస్తూ ‘ ఈ గదిలో చాలా వేడిగా ఉంది కదా!’ అన్నాను ‘మీకు వాకింగ్ టైం అయింది వెళ్ళండి వెళ్లకపోతే సాయంత్రం మీకు ఆకలి వేయదు’ అంది. వాకింగ్ కు వెళ్ళడం అంటే డాక్టర్ ఇంటికి వెళ్లడమే. నాకు ఆకలి వేయడానికి ఇలా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆమెకు నేనే చెప్పాను. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆమె నా మోసాన్ని కనిపెట్టి ఉండాలి. నేనొక తెలివి తక్కువ వాణ్ణి కనుక ఆమెను కూడా తెలివి తక్కువదనే  అనుకున్నాను. దక్షిణాచరణ్ మళ్ళీ చేతుల మధ్య తల పెట్టుకుని గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి  అని తాగి  కొనసాగించాడు. ఒకసారి డాక్టర్ కూతురు  మనోరమ నా భార్య ని చూడాలని ఉంది అని అడిగింది నేను అందుకు ఏమాత్రం సిద్ధంగా లేను కానీ వద్దు అనడానికి కారణం ఏమీ లేదు కదా! ఆ సాయంత్రం నాతో పాటు మనోరమ మా ఇంటికి వచ్చింది నా భార్య ఎప్పటికంటే ఎక్కువగా నొప్పితో బాధపడుతున్నది. నొప్పి బాగా ఎక్కువ అయినప్పుడు ఆమె పిడికిళ్ళు బిగించేది. ముఖం నీలి రంగులోకి మారేది. ఆమె కళ్ళకి వెలుతురు గుచ్చుకుంటుందని  దీపం ఎప్పుడూ గది తలుపు దగ్గరే ఉంచేది. చీకట్లో ఆమె బాధతో మూలుగుతూ ఉన్నది.  భారమైన మూలుగు బయటకి వినిపిస్తున్నది. నేను  గదిలోకి వెళ్ళాను. గది ముందు నిలబడింది మనోరమ.దీపపు వెలుతురు ఆమె ముఖం మీద పడింది. ఆమె చీకటీ వెలుతుర్ల మధ్య తటపటాయిస్తూ నిలబడింది. ఎవరో కొత్తమనిషి కనపడటంతో నా భార్య కదిలి నా చెయ్యి గట్టిగా పట్టుకుని బలహీనమైన స్వరంతో ‘ ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు?’ అని అడిగింది మూర్ఖుడిలా నేను మొదట నాకు తెలియదు అనాలి అనుకున్నా కానీ ఎవరో కొరడాతో వీపు మీద కొట్టినట్లు అనిపించింది.’ ఆమె .. ఆమె డాక్టర్ గారి కూతురు’ అన్నాను. నా భార్య నా వైపు సూటిగా చూసింది నేను ఆమె వైపు చూడలేకపోయాను ఆమె మనోరమను లోపలికి రా అంది. నన్ను దీపం పైకెత్తి పట్టుకో  అంది. మనోరమ లోపలికి వచ్చి కింద కూర్చుని నా భార్యతో కాసేపు మాట్లాడింది. అప్పుడు వచ్చాడు డాక్టర్ రెండు రకాల సీసాలతో. ‘ఈ నీలం రంగు సీసాలోని లోషన్ ను వంటికి రాసుకోవాలి మరో సీసాలోని మందు తాగాలి జాగ్రత్త ఒంటికి రాసుకునే మందు విషపూరితమైనది ఒక దాని బదులు మరొకటి వాడకూడదు.’ అన్నాడు. నన్ను  కూడా ఈ విషయం గురించి హెచ్చరించి సీసాలు మంచం పక్కనే ఉన్న బల్ల మీద పెట్టాడు. తర్వాత సెలవు తీసుకుంటూ కూతుర్ని కూడా రమ్మన్నాడు. ఆమె ‘నాన్నగారూ!  ఈమెకు సేవ చేయడానికి మరో ఆడమనిషి లేదు కదా’ అంది. ‘వద్దు వద్దు నువ్వేమి ఇబ్బంది పడవద్దు మాకు ఒక వృద్ధురాలైన సేవకురాలు ఉంది ఆమె నన్ను తల్లిలా చూసుకుంటుంది’ అన్నది నా భార్య. ‘నీ భార్య ఎంత మంచిది ఇతరులకు సేవ చేయాలని అనుకుంటుంది కానీ తనకు ఎవరూ సేవచేయడానికి ఒప్పుకోదు.’ అన్నాడు డాక్టర్ నవ్వుతూ. డాక్టర్ కూతురుతో వెళ్ళిపోతుంటే ‘మా ఆయన ఈ గదిలో చాలా సేపటినుంచి ఉన్నారు ఆయనను మీతో పాటు తీసుకు వెళ్ళండి’ అని అంది. ‘ రండి
మాతోపాటు  అలా నది ఒడ్డుకు వెళ్లి వద్దాం’ అన్నాడు డాక్టర్. నేను ఏ మాత్రం ఆలస్యం చేయలేదు.    మేము వెళ్తుంటే డాక్టర్ ఆ రెండు మందుసీసాల విషయం మళ్లీ హెచ్చరించాడు. డాక్టర్ ఇంట్లో భోజనం చేసి ఇంటికి వచ్చేటప్పటికి చాలా రాత్రయింది నేను వచ్చేటప్పటికి నా భార్య మంచం మీద బాధతో మెలికలు తిరుగుతున్నది. తప్పు చేశాననే భావన నన్ను కత్తిలా గుచ్చుకుంది. మంచం పక్కనే నిలబడి’ నొప్పి చాలా ఎక్కువగా ఉందా?’ అని అడిగాను. ఆమె ఉలుకూ పలుకూ లేకుండా నా వైపు సూటిగా చూసింది. జవాబు చెప్పడానికి ఊపిరి ఆడలేదు. నేను వెళ్లి డాక్టర్ను తీసుకు వచ్చాను ఏం జరిగిందో డాక్టర్ కు అర్థం కాలేదు. తర్వాత ఏదో స్ఫురించి ఒక సీసాను చూపిస్తూ
‘ పొరపాటున ఈ సీసాలోని మందు తాగావా?’ అని అడిగాడు. ఆమె మాట్లాడకుండా అవును అన్నట్టు తల ఊపింది. కడుపులో వేసే  పైపు తీసుకురావడానికి డాక్టర్ ఇంటికి పరుగెత్తాడు. నేను స్ఫృహలో ఉన్నానో లేదో తెలియకుండా మంచం మీద పడిపోయాను. ఒక చిన్న పిల్లవాడి తలలా నా తలను తన పక్షం మీదకు తీసుకుని ఏదో చెప్పాలనుకుంది కానీ నోరు పెగల్లేదు. బాధపడకండి ఇది మన మంచికే! మీరు సంతోషంగా ఉంటారు నేనూ సంతోషంగా వెళ్లి పోతాను అని ఆమె చేతి స్పర్శ నాకు చెప్పింది.
డాక్టర్ తిరిగి వచ్చేటప్పటికి నా భార్యకు ఎన్నాళ్ల నుంచో అనుభవించిన హింస నుంచి విముక్తి లభించింది.
గదిలో ఉక్కపోతగా ఉందని  దక్షిణాచరణ్ వరండా లోకి వెళ్లి నాలుగైదు సార్లు అటూ ఇటూ పచార్లు చేసి వచ్చి మరో గ్లాసు నీళ్లు తాగి మళ్లీ చెప్పసాగాడు. నేను మనోరమను పెళ్లి చేసుకుని బెంగాల్ కు తిరిగి వచ్చాను. తండ్రి అనుమతితో పెళ్లి చేసుకుంది కానీ నేను ఆమె తో ప్రేమగా మాట్లాడినప్పుడల్లా చిరు నవ్వు కూడా నవ్వకుండా గంభీరంగా ఉండేది. బహుశా ఆమె నన్ను అపార్థం చేసుకుందేమో అనుకున్నా. నేను ఆశించినట్టుగా ఆమె ప్రవర్తన లేకపోవడంతో నా తాగుడు హద్దులు దాటిపోయింది.
అది శరదృతువు. సాయంత్రం వేళ బారానగర్ లోని మా తోటలో మనోరమ తో కలిసి నడుస్తున్నాను. చీకటి ఎందుకో భయం కలిగించేదిగా ఉంది. దారికి రెండు పక్కలా ఉన్న పొదలు  ఒకదానికొకటి తాకుతున్న శబ్దం తప్ప గూళ్ళల్లో పక్షుల రెక్కల చప్పుడు కూడా వినిపించనంత నిశ్శబ్దంగా ఉంది.   అలసిపోయిన మనోరమ పొగడ వృక్షం కింద పాలరాతి అరుగుమీద మోచేతిపై తలపెట్టి పడుకుంది. నేను ఆమె పక్కనే కూర్చున్నా. అక్కడ చీకటి ఇంకా చిక్కగా ఉంది. చెట్టు కొమ్మల మధ్య నుంచి అక్కడక్కడ ముక్కలుగా కనిపిస్తున్న ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకు మంటున్నవి. కీచురాళ్ళు ఆకాశం నుంచి కిందకు జారిన నిశ్శబ్దమనే చీరకు శబ్దం అనే సన్నటి  అంచును కుడుతున్నవి. నేను ఆ మధ్యాహ్నం అంతా తాగుతూనే ఉండడంవల్ల నా మెదడు మొద్దుబారి పోయింది. నామీద నాకే జాలి కలుగుతున్న మానసిక స్థితి లో ఉన్నాను. నా కళ్ళను ఒత్తిపట్టి ఉంచుతున్న చీకటిని  పక్కకునెట్టి చూస్తే నీడలా కనిపిస్తున్న నా భార్య దేహం నాలో బలమైన కోరికను కలిగించింది. కానీ నీడలా కనిపిస్తున్న్త ఆమెను  నా చేతులతో చుట్టేయడం సాధ్యం కాలేదు. హఠాత్తుగా దగ్గరలో ఉన్న పొదలో మంటలు అంటుకున్నట్టు అనిపించింది. పసుపు చంద్రవంక ఆకాశంలోకి మెల్ల మెల్లగా వచ్చి   తెల్లటి అరుగు మీద తెల్లటి చీరలో ఉన్న స్త్రీ ముఖాన్ని వెలిగించింది. ఆ ముఖం నీరసంగా తెల్లగా పాలి పోయి ఉంది. నేను ఆగలేక ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ‘మనోరమా చెప్తే నమ్మవు కానీ నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను .నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాను. నా మాటలు నాకే భయం కలిగించాయి ఇవే మాటలు ఒకప్పుడు నేను మరొకరితో అన్నాను ఆ క్షణంలో పొగడ వృక్షం పైనుంచి  ఆ పక్కన ఉన్న పొదల మీదినుంచి  కోసిన పండు ముక్క లాంటి పసుపురంగు చంద్రుడి నుంచి,  గంగానది తూర్పు వైపు నుంచి పడమర వరకు ఒక నవ్వు అతి వేగంగా దొర్లుతూ వెళ్ళింది. ఆ నవ్వును నేను వర్ణించలేను.  అది హృదయవిదారకంగా ఉంది. అది ఆకాశాన్ని రెండుగా చీలుస్తున్నట్టనిపించింది. నేను అరుగు మీద నుంచి కింద పడి  స్పృహ తప్పాను.
మెలకువ వచ్చాక చూస్తే ఇంట్లో నా మంచం మీద పడి ఉన్నాను. మనోరమ ‘ఏమైంది ఎందుకలా పడిపోయారు’ అంది. ‘నీకు వినబడలేదా ఆ నవ్వు ఆకాశమంతా వ్యాపించిన ఆ నవ్వు’ అన్నా.  ‘నవ్వా? దాన్ని  నవ్వు అంటారా? ఒక పెద్ద పక్షుల గుంపు మనపై నుంచి వేగంగా ఎగిరిపోయింది నేను వాటి రెక్కల చప్పుడు విన్నాను అంతమాత్రానికే మీరు భయపడ్డారా?’ అంది నవ్వుతూ. ఉదయం   నది ఒడ్డుకు ఉత్తరం వైపునుంచి ఆహారం కోసం ఒక పక్షుల గుంపు వచ్చిందని నాకు అర్థమైంది. కానీ సాయంత్రం అవుతుంటే నేను చూసింది ఎగిరే పక్షుల గుంపు కాదని అనిపించసాగింది. గుండె కోసే ఆ నవ్వు చీకటి పడటం కోసం వేచి ఉన్నట్టు అనిపించేది. అవకాశం దొరికీ దొరకడంతో అది విరుచుకుపడుతుంది అనిపించేది. సాయంత్రం అవుతుంది అనగానే భయం శరీరాన్ని వణికించేది. ఆ సమయంలో మనోరమ తో మాట్లాడటానికి కూడా భయం వేసేది.ఇక అక్కడ ఉండాలనిపించలేదు.  మనోరమను బారానగర్ నుంచి దూరంగా పడవలో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాను. నది నుంచి వీచే చల్లని గాలుల్లో  పడవ సాగుతుంటే నా భయం క్రమంగా తగ్గి పోసాగింది.
కొన్ని రోజుల వరకు మేము సంతోషంగానే ఉన్నాం మేము గంగను ఖారిని దాటి పద్మా నది కి చేరాం. అద్భుతమైన ఆ నది ఉత్తరాన కుబుసం కప్పుకొన్న నాగులా తన శీతాకాలపు నిద్రను ఆరంభించి  ఇసుక తిన్నెల నుంచి  క్షితిజరేఖ వైపు విస్తరించి నిశ్చలనంగా మసకమసకగా  ఉన్నది. అలాగే నిటారుగా ఉన్న దక్షిణపు ఒడ్డునుంచి గ్రామాలలోకి ఉగ్రరూపంతో విరుచుకు పడుతున్నది. మామిడి తోటలు కంపిస్తున్నవి. వరదలు గ్రామాలను ముంచెత్తున్నవి.ఒకవైపు నిద్రమత్తులో ఉన్నట్టున్న పద్మ మరొకవైపు ఒడ్డును విసిరి కొడుతూ కోస్తూ విరిగిపోతున్నది.
మేం పడవను ఒకచోట కట్టేశాం. తర్వాత పడవ నుంచి చాలా దూరం  నడిచి వెళ్ళాం.  సూర్యాస్తమయపు బంగారు నీడలు కనిపించకుండా పోయాక మా కళ్ళ ఎదుట ఒక స్పష్టమైన పూర్ణ చంద్రబింబం ఉదయించింది. కట్టలు తెంచుకున్న  వెన్నెల వరద ఆకాశం భూమి కలిసే చోటు వరకు వ్యాపించింది. విశాలమైన తెల్లటి ఇసుక లో నాకు మేమిద్దరమే ఒక స్వప్న లోకంలో విహరిస్తున్నా మనిపించింది.  మనోరమ ముఖానికి చుట్టు కున్న ఎర్రని శాలువా ఆమె తల మీద నుంచి కిందకు జారి ఆమె శరీరం మొత్తాన్ని  కప్పేసింది. చిక్కని నిశ్శబ్దం లో దారి ఎటు నుంచో ఎటో తెలియని తెల్లదనంలో  కనుచూపుమేరా వ్యాపించిన శూన్య ప్రదేశంలో మనోరమ తన చేతిని బయటకు తీసి నా చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె నాకు బాగా దగ్గరగా జరిగి తన మనస్సు మొత్తం శరీరం యవ్వనము అన్ని నావే నంది. నా హృదయపు వేగం పెరిగింది. ప్రేమ అనేది ఇంటి నాలుగు గోడల మధ్య పరిపూర్ణం కాదు అనిపించింది. ఇలాంటి విశాలమైన చోట అనంతంగా దిగంబరంగా ఉన్న వినీలాకాశం తప్ప ప్రేమకు అనువైన చోటు లేదు అనుకున్నాను. ఇల్లు లేదు తలుపులు లేవు తిరిగి వెళ్లాలనే తొందర లేదు ఈ వెన్నెల వెలిగించిన విశాలమైన ప్రదేశంలో చేతిలో చేయి వేసుకుని ఎక్కడికి పోతున్నామో తెలియకుండా విహరించడమే ప్రేమ అనిపించింది.
ఇద్దరం  నడుస్తూ ఇసుక మధ్యలో ఉన్న నీటి కొలను వద్దకు వెళ్లాం.పద్మ తన దారి మార్చుకుంది అందువల్ల ఇలా వచ్చి ఇక్కడ ఇసుక లో చిక్కుకుంది. నిద్రపోతున్న ఎడారిలో అలలు లేని ఈ కొలనులో ఒక పొడవైన చంద్రరేఖ మూర్ఛపోయినట్టు పడుకుంది. మనోరమ నా వైపు చూసింది. ఆమె శాలువా జారిపోయింది. ప్రకాశిస్తున్న వెన్నెల వెలుతురు లో ఆమె తన ముఖం పైకెత్తింది. ఆ శూన్య ప్రదేశంలో ఒక్కసారిగా ఒక శబ్దం ప్రతిధ్వనించింది.  ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు? అన్న మాటలు మూడుసార్లు గాలిలో ప్రకంపనలు రేపాయి. నేను భయంతో అడుగుల వేగం పెంచాను.  మనోరమ కూడా భయపడ్డది.తర్వాత మాకు అర్థమైంది అది మానవ స్వరం కాదని అతీంద్రియ ధ్వనికూడా కాదని అది   మా అలికిడికి నీటి ఒడ్డున ఇసకలో పక్షుల రెక్కల చప్పుడని.  భయంతో వణుకుతూ మేం మా పడవ  వైపు పరిగెత్తి వెళ్లి మా పడకల మీదికి చేరుకున్నాం. బాగా అలసిపోయి ఉన్న మనోరమ వెంటనే నిద్ర లోకి జారుకుంది. కానీ ఆ చీకట్లో ఎవరో వచ్చి నా పక్కనే నిలబడ్డారు. ఆ ఆకారం పొడవైన సన్నని ఎముక వేలుతో మనోరమను చూపుతూ నా చెవిలో స్పష్టంగా  ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు?  అన్నది. నేను లేచి  దీపం వెలిగిద్దామని  అగ్గిపుల్ల గీశాను.ఒక భయంకరమైన తుఫాను  శబ్దం లాంటి నవ్వు వినిపించింది. ఆ నీడ లాంటి ఆకారం మాయమైంది. ఆ నవ్వు నా దోమతెరను మొత్తం పడవను సుడిగాలితో ఊపేసింది. చెమటతో తడిసిన నా శరీరంలోని రక్తాన్ని మంచుగడ్డ గా మార్చి ఆ చీకటి రాత్రి లో కలిసి పోయింది. అది పద్మను దాటి ఇసుక తిన్నెలను దాటి నిద్రిస్తున్న పొలాలను గ్రామాలను పట్టణాలను దేశాలను ప్రజలను దాటి క్రమక్రమంగా అస్పష్టమై పోయింది. ఆ నవ్వు ఊహకు అందనంత దూరానికి చేరి చివరికి జననమరణాల పొలిమేరను కూడా దాటి పోయింది.

నేను  దీపం ఆర్పేస్తే తప్ప నిద్రపోలేనని అనుకున్నాను. దీపం ఆర్పేసి పడుకున్నాను. చీకట్లో ఆ ధ్వని మళ్ళీ నా పక్కకు వచ్చి నా చెవి దగ్గర నా గుండెలోని రక్తపు లయను అనుసరిస్తూ  ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు? అంది. ఆ చీకటి రాత్రి నిశ్శబ్దంగా ఉన్న పడవలో  నా ఎదురుగా ఉన్న గుండ్రటి గడియారానికి  కూడా ప్రాణం వచ్చి దాని చేతులను మనోరమ వైపు చాచ సాగింది. గడియారపు టిక్కు టిక్కుమనే ధ్వని ఆమె ఎవరు ఆమె ఎవరు ఆమె ఎవరులా వినిపించింది.
మాట్లాడుతున్న దక్షిణాచరణ్ బాబు పసుపురంగులోకి మారాడు. నేను అతనిని కొంచెం నీళ్లు తాగండి అన్నాను కుదుపుతూ. గుడ్డి దీపం ఆరిపోయింది. బయట సన్నటి వెలుతురు జాడ కనిపించింది.  కాకులు కావు కావు మంటున్నయి.  పక్షులు ఈలలు వేస్తున్నాయి.   మా ఇంటి ఎదురుగా ఉన్న బాటమీద  ఓ ఎద్దు బండి నేలను రాసుకుంటూ పోతున్న శబ్దం వినిపిస్తున్నది. దక్షిణాచరణ్ ముఖంలో భావాలు మారాయి రాత్రి చేసిన చేతబడి కారణంగానూ తెలిసీ తెలియని స్థితిలోనూ ఇదంతా నాకు చెప్పడం అవమానంగా భావించినట్టున్నాడు. మరొక మాట లేకుండా అంశంగా లేచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు  మరునాటి రాత్రి …
అర్గ్థరాత్రి
ఎవరో పిలుస్తున్నారు కాదు అరుస్తున్నారు.
డాక్టర్ !డాక్టర్  !

మూలం: రవీంద్రనాథ్ టాగూర్

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us