మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

ఉమ్మడి కుటుంబం బరువు కాదు

by Dr. Vasundhara September 15, 2025
written by Dr. Vasundhara

డాక్టర్. చిటికెన కిరణ్ కుమార్ గారి “ఎర్ర సూరీడు” కథకు సమీక్ష.

మనిషికి శిరస్సు ఎంత అవసరమో కథకు, శీర్షిక అంత విలువనిస్తుంది.
“ఎర్ర సూరీడు” అన్న పేరు కథకు తగినట్లు ఉంది. వేడి కిరణాలతో ఎర్రబారిన సూర్యునితో పోల్చి సుహాన్ అనే పిల్లవాని పాత్ర ఇందులో ముఖ్య పాత్ర కావడం గమనించాల్సిన విషయం!

ఈ కాలం కుటుంబాలలో జరిగే ఒక విషాదకరమైన విషయానికి ఈ కథ ప్రతిబింబం అని చెప్పవచ్చు.
తన చదువులు వివాహాలు అయ్యేంతవరకు పెద్దరికాన్ని పెద్దలకిచ్చి ఒక్కసారిగా ఆ పెద్దలను వారి వృద్ధాప్యంలో అందరూ ఉన్నా, ఎవరూ లేని పేదవారిగా మార్చడం నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దీనిని కథా వస్తువుగా తీసుకొని తనదైన శైలి లో ఒక పరిష్కార మార్గం దిశగా కథను నడిపించిన కిరణ్ కుమార్ గారు చక్కటి విషయానికి విత్తు నాటారు!!!
నేడు అపార్ట్మెంట్లలోని పరిస్థితిని చక్కగా చూపించి పరిష్కార మార్గం చెప్పారు. పక్కఅపార్ట్మెంట్లో ఏం జరిగినా మనకు తెలియదు, మనం పట్టించుకోము – ఇది నేటి పరిస్థితి. దీనికి చరమగీతం పాడమని చెప్తూ కథకు చక్కటి ముగింపు ఇచ్చారు.
వీటన్నిటికన్నా ముఖ్యమైనది:
“పిల్లల మనస్తత్వం పెద్దలు గ్రహించాలి” అన్న అతి ముఖ్యమైన మానవత్వానికి సంబంధించిన గొప్ప విషయం ఈ కథలో మనం గమనించాల్సిన మొదటి విషయం.
కిరణ్ కుమార్ గారు ఈ కథలో నిజంగా చెప్పాలంటే ఒక 10 ఏళ్లకుర్రాడుగా మారిపోయారు. ఈ కథలో హీరో ఓ 10 ఏళ్ల కుర్రాడు – అతడి పేరు సుహాన్.
సుహాన్ తండ్రి అరవింద్, తల్లి సంధ్య. కథ నడవడానికి కారకుడు సీతారత్నం.
సీతారత్నం అరవింద్ తండ్రి, సుహాన్ కు తాత, సంధ్యకు మామగారు.
వృద్ధులు పిల్లలు ఒకే రకం మనస్తత్వం కలిగి ఉంటారు అన్నది పెద్దల మాట. అందుకే సుహాన్ కు తాతయ్యంటే ఎంతో ఇష్టం. కానీ పెద్దల వాసన దగ్గర కూడా ఉండకూడదన్న ఈ నాగరికత ప్రపంచంలో సీతారత్నం గారి కోడలు సంధ్య, మామగారిని ఇంటికి దూరం చేసి వృద్ధాశ్రమానికి దగ్గర చేసింది. కానీ సుహాన్ మనసుకు మాత్రం వాడి తాతయ్యను దూరం చేయలేక పోయింది. ఇక ఇక్కడినుంచి కథ మొదలు!!!

ఈ కథ పేరు “ఎర్ర సూరీడు”. ఇది “నేటి నిజం” దినపత్రికలో ప్రచురింపబడింది.
“డాడీ, తాతయ్య ఎప్పుడు వస్తాడు?” అంటూ సుహాన్ ప్రశ్నించడంతో కథ ప్రారంభం.
దానికి ఆ పిల్లాడి తల్లి జవాబు –
“నీవైతే ఆయనను మళ్లీ తీసుకొచ్చావనుకో నా యొక్క అసలు రూపం చూపిస్తా…” అని భర్తను బెదిరించి, పిల్లాడిని చెవులు పెట్టి లాగుతూ –
“మరోసారి తాతయ్య తొండం అంటూ వెధవ వేషాలు వేసావ్ అనుకో, తోలు తీస్తా రా!” అంటూ సంధ్య పిల్లవాడిని తీసుకెళ్తుంది.
ఆ తల్లికి కొడుకు మీద కోపమో, మామగారి మీద అసహ్యమో ద్వేషమో – రెండూ ఈ సంభాషణలో తారాస్థాయికి చేరుకున్నాయి. ఇది కొన్ని ఇళ్లలో జరిగే సర్వసామాన్యమైన సంఘటన.
దీనికి కారణం కొంతవరకు బయట నుంచి వచ్చిన కోడలు స్థానంలో ఉన్న స్త్రీలే! వారికి వంత పలుకుతున్న వారి భర్తలు. కానీ అటు భార్యలను కాదనలేక ఇటు తల్లిదండ్రులను వదులుకోలేక మగవాళ్ళు నలిగిపోతున్నారన్న సత్యాన్ని కిరణ్ కుమార్ గారు కథాంతంలో సూచించారు.
సీతారత్నంలాంటి వారెందరో ఈనాడు తాము కట్టుకున్న సొంత ఇంట్లోనే స్థానం లేక వృద్ధాశ్రమాల పాలవుతున్నారు. అందుకే తల్లిదండ్రులు కూడా కొంత మెలకువగా తెలివితేటలతో తమ వృద్ధాప్యం గురించి జాగ్రత్త పడాలి. పిల్లల మీద ఆధారపడడం గాలిలో పెట్టిన దీపం లాంటిది. లేదా వారి దగ్గర ఉండాలి అనుకుంటే తమ ఆలోచనను, అధికారాలను, ఆశయాలను అన్నిటిని మూటగట్టి పక్కన పెట్టి పిల్లలను నూటికి నూరుపాళ్ళు అనుసరిస్తూ ఉండాలి!
ఈ కథలోని సుహాన్ లాంటి పిల్లలు కూడా ఇప్పుడు అరుదుగా ఉన్నారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు వీటి ప్రభావం వల్ల పిల్లలు వృద్ధుల పట్ల శ్రద్ధ చూపించడం లేదు. అలాగే పక్కింటి గొడవ పట్టించుకునే నాధుడే లేరు.
ఇలాంటి పరిస్థితులను బాగా గమనించిన కిరణ్ గారు కథకు తగ్గట్టుగా సంభాషణలను, సంఘటనలను రూపొందించి రక్తికట్టించారు. “ఎర్ర సూరీడు” అన్న పేరు పిల్లవాడికి, తాతగారికి తగినట్టుగానే ఉంది.
ఎర్ర సూర్యుడు అనేదానికి సంకేతంగా ప్రత్యేకంగా ఎర్ర వస్త్రాన్ని చూపించారు కిరణ్ కుమార్ గారు.
ఒక కథకు ఆయువు పట్లు వర్ణనలు, మచ్చుకు కొన్ని చూద్దాం:
“తండ్రి సీతారత్నమును తీసుకుని కారులో ఎక్కించుకొని తిరుగు ప్రయాణానికి బయలుదేరాడు అరవింద్. తిరుగు ప్రయాణంలో సూర్యుడు వెనక వైపు ఉండగా పక్కన తన తండ్రి సీతారత్నం వెలిగిపోతున్నాడు. పండు వారిన ఆ మడతల చర్మంతో ముఖంలో ఏదో ఆనందం…”
“పంజరం నుండి పక్షి బయటకు ఎగిరిపోయినట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోర్ తీసి తాతయ్య బుజాలను ఎక్కాడు సుహాన్!”
సంతోషంతో ఆనందంతో ఉన్నప్పుడు మనిషి ముఖం కొంత లేత ఎరుపులోకి రావడం సహజం.
సీతారత్నం గారికి మనవడిని చూడగానే ముఖంలో కొద్దిగా తేలిపోతూ ఎర్రని… ఎంతో ఆనందంతో తేలిపోయాడు… ఎర్ర సూరీడులా వెలుగుతున్న ముఖంతో!!!
సుహాన్ కు కోపం వచ్చినప్పుడు వాడు చేసిన పనులు – టీవీని, ఫ్రిడ్జ్ ని పగలగొట్టడం, పెద్దగా అరుస్తూ “నాకు తాతయ్య కావాలి, ఇప్పుడే కావాలి!” అంటూ కోపంతో చేసిన పనుల వర్ణనలు కథా వస్తువుకు బలాన్ని ఇచ్చాయి.
కొడుకు కోపం వాడి బాధ మొదట్లో తల్లిదండ్రులకు చికాకు కలిగించి, చుట్టుపక్కల వారిని “మీకేం పనులు లేవా? మీ ఇంట్లో మీరు తగలడండి…” అంటూ సంధ్య ఆవేశంగా మాట్లాడినప్పటికీ, సుహాన్ తండ్రి అరవింద్ లో మార్పు వచ్చి, కొన్ని నిష్టుర వాక్యాలు సంధ్యతో పలకడంతో –
మనుషుల్లో మానవత్వం కొన్ని సంఘటనల వల్ల మేల్కొంటుంది అన్న సత్యాన్ని నిరూపించారు.
పదిమంది రావడం, ఆ దంపతులను చివాట్లు పెట్టడం – ఇవన్నీ ఏ ఇంట్లో అయినా పెద్దలను నిరాదరణ చేసినప్పుడు నిజంగా జరిగితే, ఆ పెద్దలు ఎంతో గొప్ప సంతోషాన్ని, మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది.
ఈ కథ ఈనాటి సంఘంలో జరిగే సంఘటనకు దర్పణం లాంటిది. పిల్లలలో సూర్యుని వలె చురుకుదనం, స్వచ్ఛమైన మనసు ఉంటే ఆ సంసారంలో పెద్దవారికి పెద్దపీట వేయొచ్చని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సరిదిద్దడానికి పిల్లలే పూనుకోవాలని చెప్పే మంచి కథ.
ఇరుగుపొరుగు వారు కూడా అనాలోచితంగా ఆవేశంలో ఉన్న వ్యక్తులను లాలించి, దండించి మంచి మార్గంలో పెట్టాలని… ఈనాడు తాము ఆచరిస్తున్నదే రేపు తమ పిల్లలు ఆచరిస్తారని భార్యాభర్తలు తెలుసుకోవాలని…
ఈ కథలో రచయిత కిరణ్ కుమార్ గారు గట్టిగా స్పష్టంగా చెప్పడం వల్ల పాఠకులకు మంచి సందేశం అందించారు.
ఉమ్మడి కుటుంబం బరువు కాదని, కలిసి ఉంటే సంతోషాలను కోల్పోవడం జరగదని సత్యం చాటి చెప్పే కథ “ఎర్ర సూరీడు”.
రచయిత డా. చిటికెన కిరణ్ కుమార్ గారికి అభినందనలు!!!

September 15, 2025 5 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన — ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni September 14, 2025
written by Narendra Sandineni

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) అరణ్య రోదన కవితపై విశ్లేషణా వ్యాసం

ప్రముఖ కవి,ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల సేకరణ కర్త,రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన అరణ్య రోదన కవితపై విశ్లేషణా వ్యాసం.అరణ్య రోదన అంటే అరణ్యం యొక్క ఏడుపు లేదా ప్రకృతి విలాపం. అరణ్య రోదన అంటే – అడవిలో నిర్మానుష్యమైన చోట ఏడిస్తే ఆ ఏడుపును ఎవరు వినలేరు. ఇతరులెవరూ కూడా సహాయం చేయలేరు.ఈ నికృష్టమైన స్థితి వల్లే అరణ్యాల ఏడుపులు,వాటి బాధలు తీర్చే వారు లేక అరణ్య రోదనగా ఉన్నదని కవి భావించడం జరిగింది.ప్రకృతిలోని ఆర్తనాదం. పచ్చని చెట్లను నరికి వేయడం, జంతువుల ఆవాసాలను ధ్వంసం చేయడం వంటివి అరణ్యానికి నొప్పిని కలిగించి అది విలపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.అరణ్య రోదన అనేది మనుషుల నిర్లక్ష్యం,దోపిడీకి ప్రకృతి వ్యక్తం చేసే మౌన విలాపం. చెట్లను నరికి వేయడం వల్ల పక్షులు గూళ్లు కోల్పోతాయి.అడవులు నాశనం కావడం వల్ల జంతువులు ఆవాసం లేక వలస వెళ్లాలి.నదులు ఎండిపోవడం,వర్షపాతం తగ్గిపోవడం,భూక్షీణత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.ఈ కవితలో ప్రకృతి నాశనం పట్ల ఒక హెచ్చరికను అందించారు. అరణ్యంలో ఏడిస్తే వినే వారు ఎవ్వరూ లేని పరిస్థితి.కవి సామాజిక సమస్యలపై తన వేదనను వ్యక్తం చేసినా సమాజం వినకపోతే అది అరణ్య రోదనగా మిగిలిపోతుంది.అరణ్య రోదన ప్రకృతి రోదన కూడా.ప్రకృతి పట్ల మనిషి నిర్లక్ష్యం,సమాజం యొక్క నిర్లిప్తత,మనిషిలోని మౌనవేదన అన్నీ అరణ్య రోదన అనే పదబంధం చేత వ్యక్తం అవుతున్నాయి.అడవులు దయనీయమైన స్థితికి చేరినాయి.అటవీ శాఖ వారు చేష్టలుడిగిపోయి చూస్తున్నారు.అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.మానవుల మనుగడకు చెట్లు ప్రధానం.ప్రతి ఒక్కరు విరివిగా చెట్లను నాటాలి.అట్టి నాటిన చెట్లను పరిరక్షించాలి అని పర్యావరణవేత్తలు గొంతు చించుకొని చెప్పుచున్నారు.మరో ప్రక్క అక్రమార్కుల ఇష్టా రాజ్యం కొనసాగుతోంది. అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లుగా చెట్లను నరుకుతూనే ఉన్నారు.అటవీ శాఖ వారు సరైన చర్యలు తీసుకోవడం లేదు.అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు.అందు వల్ల అడవుల దుస్థితి చక్కబడడం లేదు.ఈ దారుణమైన స్థితి వల్లే అరణ్యాల ఏడుపులు,బాధలు తీర్చే వారు లేక అరణ్య రోదనగా ఉన్నది అని కవి భావించడం జరిగింది.అరణ్యాలు నశించడం,అడవి జంతువులు జనుల నివాసాలలోకి రావడం,నీళ్ళ ట్యాంకులో పడి కోతులు దుర్మరణం పాలైన వార్తల చేత అశేష ప్రజానీకం తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనైంది.ఇట్లాంటి దారుణ సంఘటనలను లోకంలో ఎవ్వరు ఇష్టపడరు.అందరి మనస్సులలో తీవ్రమైన ఆవేదన నెలకొన్నది.కొందరి దుర్మార్గపు చేష్టల వల్ల అడవులు తగ్గిపోయి కోతులు జనుల ఇండ్లలోకి వచ్చి నీళ్ల ట్యాంకులో పడి చనిపోవడం కవి నారాయణ రెడ్డి (మానారె)హృదయాన్ని ద్రవింపజేసింది. వేదనలో నుండి కవిత్వం పుడుతుంది అంటారు.ఆ వేదనలో నుండి కవిత పురుడు పోసుకుంది.ఈ కవితలో ప్రకృతి సంపద, అటవీ జీవ వైవిధ్యం,మనిషి లోభం,వాని ఫలితంగా పర్యావరణానికి కలిగే హాని హృదయానికి హత్తుకునేలా చెప్పబడింది.
“చీమలు దూరని చిట్టడవులూ/కాకులు దూరని కారడవులూ/కథల పుస్తకాలలోనే కాదు/ పృథులమైన పృథ్వి అంతటా ఉండేవి/ అంటున్నారు.చీమలు కూడా ప్రవేశించ లేని చిట్టడవులు పూర్వం ఉండేవి.కాకులు కూడా చేర లేని మిక్కిలి దట్టమైన అడవులు ఉండేవి.ఇవి కేవలం కథల్లో ఉండే కల్పితాలు కాదు.నిజంగా అలాంటి అడవులు భూమి మీద ఉండేవి అని మనకు గుర్తు చేస్తున్నారు.విస్తృతమైన ఈ భూమి విస్తారమైన అడవులకు నెలవు. ఈ కవి ప్రకృతి యొక్క స్వర్ణ యుగం నాటి అడవుల పూర్వ రూపాన్ని ఈ కవితా పంక్తులలో అద్భుతంగా చిత్రించారు. పుస్తకాల్లో రాయబడిన కల్పన కంటే ప్రకృతి సహజ సౌందర్యం మిన్న అని కవిత ద్వారా తెలుపుతున్నారు.

“సింహాల రాచరికపు కొలువులూ/జంతు సమూహాల నెలవులూ/అడవుల నిండా ఉండేవి/అంటున్నారు. ఆనాటి అడవులు అనేక రకాల జంతు సమూహలతో కళకళలాడుతూ ఉండేవి.వన్య జీవులు ఒకప్పుడు తమ సహజ పరిసరాల్లో అధికంగా ఉండేవి.సింహాలు,పులులు,కోతులు, పక్షులు,అడవులలో స్వేచ్ఛగా తిరుగాడుతూ కనిపించేవి.కవి ఆ కాలపు జీవులు కలిసి జీవించే తీరును కవితలో చూపించారు.ఆనాడు జీవజాల సమృద్ధితో సింహాలు,పులులు,ఎలుగుబంట్లు, కోతులు,పక్షులు స్వేచ్ఛగా కలిసి జీవించే వాతావరణం నెలకొని ఉండేది.
“పక్షుల కిలకిలా రావాలు/చెవులకు విందు చేసేవి/ సెలయేరుల సరిగమలు/సరసంగా వినిపించేవి/ అంటున్నారు.పక్షుల కిలకిలమనే ధ్వనులు,పరుగెత్తే వాగుల నీటి శబ్దం,ప్రకృతిలోని సంగీతం మనస్సును పులకింపజేస్తుంది.ప్రకృతి కేవలం ఆహ్లాదాన్ని ఇచ్చేది మాత్రమే కాదు.ప్రకృతి మనస్సును రంజింప చేస్తుంది.పక్షుల స్వరాలు – చెవులకు విందుగాను, వాగుల శబ్దం – సంగీతంగాను చూపించారు.
“మిసిమి చివురుల కొమ్మలతో/గుసగుస లాడే గాలి తెమ్మెరలు/పచ్చదనపు పసిమి సొబగులతో/ అడవులు నందనవనంలా మురిపించేవి/ అంటున్నారు.అడవుల్లో ఎటు చూసినా పచ్చదనంతో కూడిన చెట్లు చేమలతో ప్రకృతి కాంత పరవశిస్తున్నది. అడవిలో గుబురుగా పెరిగిన చెట్లు గాలికి అటు ఇటు ఊగే కొమ్మల సయ్యాటల సౌందర్యంతో అలరారేవి.ప్రకృతి చూడ చక్కగా నందనవనంలా దర్శనమిస్తుంది. మనసును కట్టి పడేసే అందాలు,అడవులలో చిందులు వేస్తున్నాయి.ఇందులో కవి చిత్రణ అద్భుతంగా ఉంది.గుసగుసలాడే గాలిని సజీవంగా చూపించిన తీరు బాగుంది.
“పరికి పండ్లు,పాల పండ్లు,తునికి పండ్లు/వెలగ పండ్లు,మొర్రి పండ్లు,మారేడు పండ్లు/రేగుపండ్లు,గొట్టి పండ్లు,ఊడుగ పండ్లు/పరెం పండ్లు,రాగి పండ్లు, బలుసు పండ్లు/సీతాఫలం,కొండ మామిడి,కొండ నేరేడు/మొదలైన పండ్లకు కొదువే లేదు/ అంటున్నారు.అడవులలో అనేకమైన పండ్లు మెండుగా లభించేవి.పూర్వం అడవులు ఆహారానికి నిల్వ గదుల్లా ఉండేవి.కవి సమృద్ధితో కూడిన ప్రకృతిని,వివిధ రకాల పండ్లతో నిండిన అటవీ సంపదను అద్భుతంగా చిత్రించారు.అడవిలో లభించే పండ్ల జాబితాను చక్కగా వివరించారు
“అడవులలో దుంపలు ఎన్నో దొరికేవి/నార దుంపలు,అడవి ఏలేరి దుంపలు/నాగేల్ మాటి దుంపలు/నోస్కో మాటి దుంపలు/తీగ దుంపలు, నెమలి గడ్డలు/ఇలాంటివి ఇంకా ఎన్నో దొరికేవి/ అంటున్నారు.పండ్లతో పాటు పిండి పదార్థాలు గల అనేక విధములైన దుంపలు సమృద్ధిగా లభించేవి. ఆ కాలంలో జంతువులకు,ఆదివాసులకు ఆకలి సమస్య దాదాపుగా ఉండేది కాదు. అక్కడ నివసించే ఆదివాసుల జీవితం ఏ లోటు లేకుండా గడిచి పోయేది.ప్రకృతి తల్లి అన్ని విధాల తన బిడ్డలకు ఆహారాన్ని అందించి పోషించేది.
“ఇప్పపువ్వుకు కొరతే లేదు/తెల్లారేసరికి పచ్చని పసిమిలా/చెట్ల కింద పరుచుకొని రాలిపడేవి/ అంటున్నారు.ఇప్పపూలను, పాల పండ్లను,తునికి పండ్లను బాగా ఎండబెట్టి గుమ్ములలో భద్రపరుచుకునే వారు.ఇప్ప పువ్వులతో కుడుములు చేసుకుని తినేవారు.ఇప్ప పూలతో సారాను తయారు చేసుకొని ఇష్టంగా త్రాగే వారు.
ప్రకృతి మాత పలు రకాల విరిసిన పుష్పాల సుగంధాలను వెదజల్లుతూ కనువిందు చేసేది.అడవుల్లో సమృద్ధిగా లభించే ఇప్ప పువ్వులను పచ్చని పసిమితో పోల్చడం మనోహరంగా ఉంది.
“కల్తీ లేని జుంటి తేనెకు/అడవులే పుట్టినిండ్లు/ అంటున్నారు.అడవుల్లో సహజమైన తేనె లభించేది.ఇది ప్రకృతి మాత ఆటవికులకు ప్రసాదించిన అమృతం.ఆనాడు ప్రకృతిలో లభించే పండ్లు,తేనె,అటవీ ఉత్పత్తులు కల్తీ రహితంగా ఉండేవి.ఆ అడవి ప్రదేశం పచ్చని చెట్లతో,పారే వాగులతో కూడిన మనోహర దృశ్యాలతో కళకళలాడుతూ ఉండేది.వివిధ రకాలైన పండ్లు, దుంపలు,పూలు,తేనె మొదలైనవి సమృద్ధిగా లభించేవి.
“అడవులు క్షుధార్థుల ఆకలి తీర్చేవి/ సెలయేరులు దాహార్తుల దాహం తీర్చేవి/అంటున్నారు.అక్కడ అడవుల్లో నివసించే జంతువులతో పాటు మనుషులు ఆహారం,నీటి కోసం ప్రకృతి పైనే ఆధార పడి ఉండే వారు.అడవిలో లభించే పండ్లు,దుంపలు ఆకలిని తీర్చేవి.సెలయేరులలోని నీరు దప్పికను తీర్చేది.ప్రకృతి సౌభాగ్యం సమస్త ప్రాణికోటి జీవనానికి సహకరించేది.
“పులులు,సింహాలు,ఎలుగుబంట్లను/ కోతులు, కొండముచ్చులు,కుందేళ్ళను/దుప్పులు,మెకాలు, మహిష జాతులను/ నెమళ్ళు,చిలుకలు, పావురాలను/గువ్వలు,గోరువంకలు,గ్రద్దలను/ మృగజాతులను పక్షుల సంతతిని/అన్నింటిని అడవులు ఆదరించి/ఆహారాన్నిచ్చి దప్పిక తీర్చేవి/ అంటున్నారు.కవి ఇక్కడ వన్య జీవులు ప్రకృతిలో సమూహాలుగా జీవితాన్ని గడపడాన్ని చక్కగా చూపించారు.అడవి కేవలం మనుషులకే కాదు. అడవి తల్లి అన్ని జీవజాతులను తన ఒడిలో పెట్టుకుని పోషించడంతో పాటు రక్షణ కల్పించేది అని గుర్తు చేస్తున్నారు.
“అడవి బిడ్డలకు ఆ వనమాత/అవని తల్లి అన్నింటిని ఇచ్చేది/అంటున్నారు.కవి అడవిని తల్లిలాగా వర్ణిస్తున్నారు.అది తన బిడ్డలైన జంతువులు,పక్షులు,మనుషుల అవసరాలన్నిటిని తీర్చేది అని చెబుతున్నారు.ప్రకృతి పోషించే తల్లి. ఇందులో సందేహానికి తావు లేదు.అది అన్ని జీవజాతులను పోషిస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు.
“అడవి తల్లికి పులులు,సింహాలు/చెంచులు, గోండులు రక్షణ కవచాలు/ అంటున్నారు.అడవి తల్లిని పులులు,సింహాలు,చెంచులు, గోండులు, ఆదివాసులు రక్షణ కవచంగా ఉండి చక్కగా కాపాడుకునే వారు‌.ప్రకృతిని రక్షించేది కేవలం ప్రభుత్వాలు తయారు చేసిన చట్టాలు మాత్రమే కాదు.ప్రకృతి ఒడిలో మమేకమైన పులులు,సింహాలు మరియు ఆటవికులు అడవులను రక్షిస్తున్నారు అని కవి ఘంటాపథంగా తెలియ జేస్తున్నారు.
“ఆటవికులు అడవులను కన్నతల్లిలా/కళ్ళలో పెట్టుకుని కాపాడుకునే వారు/గుడిసెలు కట్టు కోవడానికో/గొడ్డలి కామకో నాగటి దుంపకో/వంట చెరుకుకో నెగళ్ళ కొరకో/ఎండి మోడు వారిన చెట్లను తప్ప/ఏ పచ్చని చెట్టునూ నరకని/ప్రకృతి ప్రియులు ఆటవికులు/అంటున్నారు.ఆదివాసులు వీలైనంత వరకు తమ అవసరం కొరకు ఎండి మోడు వారిన చెట్లను మాత్రమే ఉపయోగించే వారు.తమ అవసరాలైన గుడిసెలు కట్టుకోవడానికి,నాగటి దుంపలకు, గొడ్డలి కామలకు,వంట కట్టెలకు,ఇంటి ముందు చలి మంటలకు,ఎండి మోడు వారిన చెట్లను మాత్రమే వాడుకునే వారు. అంతే గాని ఏ ఒక్క పచ్చని చెట్టును నరికే వారు కాదు.పచ్చని అడవులను ఆటవికులు కంటికి రెప్పలా కాపాడుకునే వారు.ఆదివాసులు పచ్చని చెట్లను నరక వద్దు అనే నియమాన్ని ఆచరించిన వారు. ఆదివాసుల సుస్థిరమైన జీవన విధానం అందరికీ ఆదర్శంగా నిలవాలనే సందేశం ఈ కవితలో స్పష్టం చేయబడింది.
“స్వార్ధపరులైన నాగరికుల ప్రవేశంతో/అటవీ సంపదకు ఆపద వాటిల్లింది/అంటున్నారు. ఆటవికులు ప్రకృతిని అమితంగా ప్రేమించే వారు. మధ్యలో లోభులైన నాగరికులు అడుగు పెట్టడం వల్ల అడవుల వినాశనం మొదలైంది.నాగరికులైన స్వార్థపరులు ప్రకృతిని నాశనం చేస్తున్నారు అనే వాస్తవాన్ని కవి భావాలలో వ్యక్తం అవుతున్నది.
“అమాయకులైన గోండు గూడాలల్లో/కోయ గూడాలల్లో,చెంచు గూడాలల్లో/అమ్మకాలు కొనుగోళ్ళు మొదలైనాయి/అంటున్నారు.ఏ పటాటోపం హంగులు ఆటవికులకు తెలియదు. సాదా సీదాగా జీవించే ఆదివాసుల గ్రామాల్లోకి వాణిజ్యం ప్రవేశించడంతో వారి జీవితాల్లో పెను మార్పు వచ్చింది.వాణిజ్యం ప్రవేశించడం చేత, వర్తకుల దోపిడీ విధానం వల్ల ఆదివాసులు బానిసత్వం చెరలోకి నెట్టబడ్డారు.దానితో ప్రకృతి సంరక్షణకు ముప్పు ఏర్పడింది.
“అటవీ సంపద కొల్లగొట్టడానికి ప్రణాళికలు సిద్ధమైనాయి/అడవి జంతువులను వేటాడడం/ మాంసాన్ని అమ్ముకోవడం మొదలైంది/పులి చర్మం, జింక,దుప్పి చర్మాలకు/చీకటి అంగళ్ళలో గిరాకీ పెరిగింది/అంటున్నారు.అడవిలోని జీవ రాశిని, విలువైన కలపను కొల్లగొట్టడానికి ప్రణాళికలు సిద్ధం అయినాయి. విశృంఖలంగా వన్య జీవుల వేట కొనసాగింది.జంతువులను చంపి మాంసాన్ని అమ్ముకోవడం,జంతువుల చర్మాలను అమ్మడం మొదలైంది. విపరీతమైన స్వార్థం మనుషులలో పెరిగింది.స్వార్థపరుల దుందుడుకు చేష్టలతో మూగ జీవులైన జీవజాతులు నాశనం చేయబడ్డాయి.ఇది అత్యంత క్రూరత్వం అని కవి తెలియజేస్తున్నారు.
“కలప రవాణా నగరాలకు మొదలైంది/ కర్కశ మనస్కులైన మనుషులు/క్రూర మృగాల అవతారమెత్తారు/అంటున్నారు.పెరుగుతున్న జనాభా కారణంగా అతి వేగంగా నగరాలు విస్తరించాయి.అట్టి నగరాల నిర్మాణం కోసం కలప దోపిడీ విచ్చలవిడిగా పెరిగింది.మనుషుల హృదయాల్లో క్రూరత్వం చోటు చేసుకున్నది అని తెలియజేస్తున్నారు.ఇందులో మనిషి లోభత్వం – క్రూర మృగాల కంటే ప్రమాదకరమైనది అని చూపించబడినది.
“దిన దినం అడవి మాయమై పోయింది/మృగ పక్షుల సంతతి సన్నగిల్లింది/అంటున్నారు.అడవిలో చెట్లను నరకడం,జంతువులను వేటాడి చంపడం నేరం.చట్టాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళ అలసత్వం, నిర్లిప్తత వల్ల అటవీ వినాశనం పెరిగింది.వాస్తవంగా వన్య జీవుల సంఖ్య తగ్గిపోవడం జరిగింది. జంతువుల సహజ జీవనానికి ముప్పు ఏర్పడడం, పర్యావరణం దెబ్బ తినడం సరియైనది కాదు అని కవి తెలియ జేస్తున్నారు.ఆటవికులైన గోండు,చెంచు, కోయ గూడాలలోని ప్రజలు ప్రకృతిని తల్లిలాగా భావించి అవసరానికి మించి ఏ వనరును వినియోగించని తత్వం కల వారు.ఇది సహజ వనరుల సమతుల్యతకు చక్కటి తార్కాణం.మనిషి లోభం,నాగరికత అడవుల నాశనానికి దారి తీసింది. కవి మానవులలో స్వార్థం పెరిగి అడవులపై ఎలా విరుచుకు పడ్డారో చక్కగా వివరించారు. జంతువులను వేటాడి మాంసం,చర్మాలను అమ్మడం,చెట్లను నరకడంతో కూడిన కలప వ్యాపారం,అటవీ ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలకు మూలమైంది.కవి ఇక్కడ మనిషి నాగరికత అనే ముసుగులో ప్రకటితమైన క్రూరత్వాన్ని వ్యక్తం చేశారు.కర్కశ మనస్కులు క్రూర మృగాల కంటే ప్రమాదకరం అని సూచించారు.
“తరగని ఆహార భాండాగారం/ఆదివాసుల పెరటి కల్పకము/వట్టి పోయి ఉసూరుమంటున్నది/ అంటున్నారు. ఒకప్పుడు అడవి ఆహార సంపదలతో కళకళలాడుతూ ఉండేది.అట్లాంటి అడవి రూపురేఖలు మారిపోయాయి.అడవిని పెరటి కల్పకము అని అన్నీ ఇచ్చే కల్పవృక్షంగా పోల్చి చెప్పినారు.
“తన నాశ్రయించిన జనాన్ని మృగాదులను/ పోషించలేని అడవి తల్లి/తన చేతకానితనానికి/ విలవిలలాడిపోతున్నది/ఏక ధాటిగా ఏడుస్తున్నది/ అంటున్నారు.అడవి తల్లి తనపై ఆధారపడి జీవించే జంతువులకు,మానవులకు, ఆహారం,నీరు,ఆశ్రయం కల్పిస్తుంది.మనుషుల అహంకారం,అతి దోపిడి,వన నాశనం వల్ల అడవి తల్లి తన బిడ్డలకు కనీస అవసరాలైన ఆహారాన్ని అందించ లేని స్థితికి చేరింది.తల్లి తన బలహీనత,అసమర్థత వల్ల తన పిల్లలకు అన్నం పెట్టలేక విలవిలలాడుతుంది. అలాగే అడవి తల్లి కూడా తన వనరులు నాశనం అయిన తర్వాత ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. అడవి తల్లి ఏకధాటిగా ఏడుస్తున్నది.ఇది కేవలం భావోద్వేగంతో వచ్చిన కన్నీళ్లు కాదు.ఒక హెచ్చరికను తెలుపుతున్నది.వర్షాలు,తుఫానులు, వరదలు,కరువులు వివిధ రూపాలలో అడవి తల్లి తన వేదనను మనకు అందిస్తోంది. ప్రకృతి యొక్క నిరంతర రోదన మనిషి వినిపించుకోకపోతే భవిష్యత్తు మరింత భయంకరంగా మారుతుంది. కన్నతల్లి తన పిల్లలను కాపాడలేని ఘోరమైన స్థితి‌ కొనసాగుతున్నది.నిజానికి పిల్లలే తల్లిని హింసకు గురి చేయుచున్నారు.తల్లి దుస్థితికి తన పిల్లల పెంపకంలో లోపం,పిల్లలలో నెలకొన్న కాఠిన్యం కారణం అని తెలియ చేయడం జరిగింది.అడవి నాశనం అయిన తర్వాత మానవుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న తల ఎత్తుతుంది.వరదలు,కరువులు, వాతావరణ మార్పులు అన్ని ఒక నిరంతర రోదన రూపాలు.ప్రకృతిని రక్షించకపోతే మన జీవనం కూడా రోదనలతో నిండిపోతుంది. పాలకులు, సమాజం తల్లి వలె తమను ఆశ్రయించిన ప్రజలను రక్షించలేని స్థితికి వస్తే ఆ సమాజం శిథిలం అవుతుంది‌.వరదల రూపంలో ప్రకృతి విలవిల లాడుతుంది.కరువుల రూపంలో ఏడుస్తుంది. తుఫానుల రూపంలో తన వేదనను వ్యక్తం చేస్తుంది. అడవితల్లి జంతువులను,మనుషులను పోషించలేని స్థితికి చేరింది,ప్రకృతి రోదన వినకపోతే మనిషి ఉనికి ప్రమాదంలో పడుతుంది. సమాజ రోదన పట్టించుకోకపోతే దేశం శిథిలావస్థకు చేరుతుంది. నేడు తనని ఆశ్రయించిన జనాన్ని పోషించ లేని అడవి తల్లి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు ఈ కవితలో ప్రతిబింబిస్తున్నది.ఒక వైపు ప్రకృతి పరిరక్షణ విఫలం.మరో వైపు సామాజిక న్యాయం లోపం కనిపిస్తున్నాయి.అడవి తల్లి బాధతో విలవిలలాడుతున్నది,ఎంతగానో ఏడుస్తున్నది అని కవి భావోద్వేగంతో ప్రకృతి యొక్క నిస్సహాయ స్థితిని తెలియ జేస్తున్నారు.
“అడవి తల్లి కడుపు రగిలిపోతున్నది/దావానల జ్వాలల చేత/ఆత్మాహుతి చేసుకుంటున్నది/ అంటున్నారు.స్వార్థపరుల దుందుడుకు చేష్టల వల్ల జ్వాలలు ఎగసిపడి అడవి తల్లి తగలబడింది.కవి అడవిని దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్న తల్లిలా చిత్రించడం అద్భుతమైన పోలికగా భావించవచ్చు.
“ఆహారం దొరకని పులులు/జనావాసాల పైన పడుతున్నవి/కోతులు పల్లెలకు,పట్టణాలకు,బ్రతుకు కోసం వలస పోతున్నాయి/తిండి వెదుక్కుంటూ తిరుగుతున్నాయి/ అంటున్నారు.అడవిలో ఆహారం లేక పోవడం వలన వన్య జీవులు మనుషుల నివాసాలకు వస్తున్నాయి.వాటి రాక వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.ఇందులో ప్రకృతి వినాశనం నేరుగా మనుషులకే ముప్పు తెచ్చి పెట్టింది అనే సందేశం ఉంది.
“ఇండ్లలో దూరి రచ్చ రచ్చ చేస్తున్నాయి/వాటిపై కోపమెందుకు,ద్వేషమెందుకు/ఇందులో వానరాల తప్పేముంది/వాటి ఆవాసాలను మనం ఆక్రమిస్తే/ మన నివాసాలకు అవి చేరాయి/అంటున్నారు. అడవులు క్షీణించడం వల్ల జంతువుల ఆహార వనరులు తగ్గిపోయాయి.పులులు గ్రామాలపై దాడి చేయడం మొదలు పెట్టాయి.కోతులు పల్లెలకు, పట్టణాలకు వలస వచ్చినాయి,ఆహారం కోసం రచ్చ రచ్చ చేయడం మొదలుపెట్టాయి.కోతుల విపరీత ప్రవర్తనపై కోపం వద్దు.ద్వేషం వద్దు. అన్యాయంగా అడవులను నాశనం చేసినాం,కోతుల నివాసాలను మనం ఆక్రమించుకున్నాం.కాబట్టి అవి పల్లెలకు, పట్టణాలకు వలస వచ్చినాయి.అట్టి ఘోరమైన కార్యానికి మనమే బాధ్యులుగా భావించాలి అని కవి సున్నితంగా తెలియజేస్తున్నారు.
“కోతులను ఆంజనేయులనుగా/పూజించే గొప్ప సంస్కృతి మనది/చచ్చిన కోతికి గుడిని కట్టి పూజిస్తున్న పుణ్యభూమి మనది/అంటున్నారు. కోతులను దేవుని రూపంలో పూజించే గొప్ప సంప్రదాయం మనది.చనిపోయిన కోతికి గుడిని కట్టి పూజించే పుణ్యభూమి మనది.ఇందులో మనం మానవత్వం మరియు దయను కలిగి ఉన్నాం అని గర్వంగా చెప్పుకుంటున్నాం అనే సందేశం ఉంది.
“అట్టి సంస్కృతి కేమైందిప్పుడు/మానవత్వాన్ని గట్టున బెట్టి దయా దాక్షిణ్యాలకు తిలోదకాలిచ్చి/ వందల కొద్ది వానరాలకి/విషం పెట్టి చంపిన పాపం/ అంటున్నారు.మనలోని మానవత్వాన్ని దయా గుణాన్ని మరిచిపోయినాం.కోతుల వల్ల విసుగు చెందినాం.కోతులకు విషం పెట్టి వాటిని చంపడం హేయమైన చర్య.ఇప్పుడు కోతులకి విషం పెట్టి చంపే ఘోరమైన స్థితి దాపరించింది.ఇది దిగజారిన మానవతకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది. మానవులు తరతరాల విశిష్టమైన సంస్కృతిని మరిచిపోయినారు,తమలోని మానవత్వాన్ని కోల్పోయినారు అని ఈ కవిత తెలియజేస్తున్నది.
“నీళ్ల ట్యాంకులో పడి మరణించిన/కోతుల ఉసురు ఊరికే పోదు/వాటిని ఆకలితో నకనకలాడించిన/మానవజాతికి నిష్కృతి లేదు/ అంటున్నారు.నీళ్లు దొరకని స్థితిలో నీళ్ల ట్యాంకులోని నీటిని త్రాగబోయి అందులో కోతులు పడి మరణించినాయి.ఇటు వంటి ఘోరమైన క్రూర ఘటనలకు మూలమైన మానవ జాతికి ఎన్నటికిని నిష్కృతి లేదు.ప్రకృతి వినాశనాన్ని ఘోరమైన పాపంగా భావించాలి.ఈ కవితలో ప్రకృతికి చేసిన ద్రోహం నుండి మానవులు తప్పించుకోలేరు అనే గొప్ప సందేశం ఉంది.
“ప్రకృతిని పోషించి కాపాడుకుంటేనే/ మానవుల మనుగడకు రక్షణ/ప్రకృతి ప్రేమికులారా/ కారుణ్యమూర్తులారా/మానవులారా తస్మాత్ జాగ్రత్త/అంటున్నారు.ఇందులోని సందేశం ప్రకృతిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.అప్పుడు మాత్రమే మానవులు,జంతుజాలం మనుగడకు ఆధారం దొరుకుతుంది. ప్రకృతిని కాపాడకపోతే మనమే నశిస్తాం.ప్రకృతి ప్రేమికులారా, కారుణ్యమూర్తులారా,మానవులారా,ప్రకృతిని దీక్ష,పట్టుదలతో రక్షించుకోవాలి అని కవి హెచ్చరిస్తున్నాడు.ఈ కవితలో ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్వ కాలపు అడవుల సౌందర్యం,నాగరికత ప్రవేశంతో కలిగిన నష్టం,మన సంస్కృతి క్షీణత,పర్యావరణ హెచ్చరికలను గమనించవచ్చు.ఇందులో ప్రకృతిని తల్లిగా తలంచిన భావం ఉంది.ఈ కవితలో అడవి – తల్లి అనే ప్రతీక ప్రధానంగా కనిపిస్తుంది.తల్లి తన పిల్లలకు ఆహారం,నీరు,ఆశ్రయం,భద్రత ఇస్తుంది. ప్రకృతితల్లి పండ్లు,దుంపలు,నీటి వనరులు, జీవనానికి అవసరమైన అన్నింటిని ఇచ్చింది.కానీ, మనిషి తాను లోభం వల్ల కన్నతల్లి వంటి అడవులనే నాశనం చేసినాడు.మనిషి ప్రకృతి నుండి వేరుపడిన ప్రాణి కాదు.మనిషి ప్రకృతిలో ఒక భాగం.మనిషి ప్రకృతి తల్లిని హింసకు గురి చేయడం తప్పు.మనిషి ఇట్టి ఘోరమైన చర్యలకు పాల్పడడం తనను తాను శిక్షించుకోవడంగా భావించవచ్చు.ప్రకృతి సహజ సమతుల్యతకు దర్పణం లాంటిది.పూర్వం వన్య జీవులు, మనుషులు,చెట్లు,నీరు అన్ని పరస్పర ఆధారంగా జీవించేవి.సింహాలు,పులులు అడవులను నరికే వారిని నియంత్రించేవి. పక్షులు విత్తనాలు వ్యాప్తి చేసేవి.చెట్లు వర్షాలను ఆకర్షించేవి.ప్రకృతిలోని సహజ సమతుల్యతను కోల్పోయినప్పుడు పులులు గ్రామాలపై దాడి చేస్తున్నాయి. కోతులు పట్టణాలకు వలస వస్తున్నాయి. కరువు కాటకాలు పెరిగాయి. మున్నెన్నడు లేనంతగా వరదలు ముంచెత్తుతున్నాయి.అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. కవి నవీన నాగరికత – వరమా? శాపమా?అనే దానిని కవితలో స్పష్టంగా వివరించారు.ప్రకృతిని సంరక్షించుకోవడంలో నిజమైన నాగరికత ఉంది.కానీ,మనం వాణిజ్యం పేరిట వ్యాపారం చేస్తూ కలప రవాణా,జంతువుల వేట వంటి క్రియలతో ప్రకృతిని దోచుకున్నాం. కాగితాల మీద అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు పెరిగినాయి.భూమి మీద ప్రకృతి సంపద తగ్గి పోయింది.ఈ కవితలో కోతులను ఆంజనేయులనుగా పూజించే గొప్ప సంస్కృతిని ప్రస్తావించారు.పూర్వం జీవులపై అపారమైన కరుణ తొణికిసలాడేది. మనుషుల హృదయాలలో పేరుకుపోయిన కాఠిన్యం వల్ల ఇప్పుడు జీవులకు విషం పెట్టి చంపే ఘోరమైన స్థితి వచ్చింది.మనలో దయాభావం లేకపోతే తరతరాల విశిష్టమైన సంస్కృతికి అర్థం లేదు.అట్టి సంస్కృతి కేవలం ఒక ముసుగుగా నిలుస్తుంది.మానవులారా తస్మాత్ జాగ్రత్త అనే కవితా పంక్తిలో అద్భుతమైన లోతైన అర్థం దాగి ఉంది.ప్రకృతిని మనం సంరక్షించక పోతే మనమే నశిస్తాం.ఇది కేవలం భావోద్వేగపు మాట కాదు.శాస్త్రీయ సత్యం.ఈ కవిత మనకు మూడు స్థాయిల్లో హెచ్చరిక చేస్తున్నది.దయ,కరుణ కోల్పోతే మానవత్వం కొనసాగదు,ఇది నైతిక స్థితి.ప్రకృతి సమతుల్యత లేకపోతే జీవనం దుర్లభం అవుతుంది, ఇది పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలుపుతుంది.మనం మారక పోతే,భూమిపై మన బ్రతుకు దుర్భరం అవుతుంది,ఇది భవిష్యత్తుకు చెందిన హెచ్చరిక.అరణ్య రోదన అనే చక్కటి కవితను రాసిన కవి మాదాడి నారాయణ రెడ్డి (మానారె) పాఠకులకు గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు.వారిని అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

September 14, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

” కౌమార అమృత శతకం”

by Rathod Sravan September 14, 2025
written by Rathod Sravan

తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. అందులో వచన కవిత్వం  ఒకటి.
తెలుగు భాషా సాహిత్య జ్ఞాన ప్రపంచంలో వచన కవిత్వాన్ని, పద్యాన్ని ఎంతో ప్రాముఖ్యత ఉంది.   పద్యాలు  విద్యార్థుల్లో కంఠస్థ, ఉచ్చారణ పటిమను,ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని,ఆలోచనను,వివేచనను,విచక్షణను,పెంపొందిస్తుంది.కనుక భాషాభోధనలో వచన  పద్యాలకు విశిష్టమైన స్థానం ఉంది.

తెలుగు భాషా మాధుర్యం లోని  నవరసాలను ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందే శతక   రచయిత  గజ్జారాం చట్ల ఆదిలాబాదు జిల్లా ,బజర్హత్నూర్ 
మారుముల ఏజెన్సీ మండల కేంద్రంలోని  శ్రీమతి/శ్రీ, చట్ల అమృతమ్మ,   బక్కయ్య  దంపతులకు 01 జూన్ 1961లోజన్మించారు.ప్రాథమిక విద్య స్వంత గ్రామంలో చదివి, ప్రాథమికోన్నత  విద్య  యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేలు గురుకులంలో  అభ్యాసించి ఉన్నత విద్యను హైదరాబాదులో పూర్తి చేశారు.డిగ్రీ  పట్టభద్రులై పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం జీవితం ప్రారంభించారు. తెలుగు భాష పై ఉన్న మమకారంతో  బాల్యం నుండే నాటికలు, కథలు, కవితలు  రాయడం  అలవాటు కావడంతో 
సాహిత్యంలో  బీజాలు పడ్డాయి.

వృత్తి రీత్యా ‌పంచాయితి రాజ్ శాఖలో  మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా  పనిచేస్తూ పదవీ విరమణ పొంది ప్రవృత్తి రీత్యా సాహితీ రంగంలో రాణిస్తూ  ”కౌమారామృత శతకం” ను రచించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితం చేశారు. దేశానికి రోల్ మోడల్ నిలిచిన సర్వేలు గురుకుల పాఠశాలలో  చదివే రోజుల్లో నాటికలు రాసి  ప్రదర్శించి గురువుల మన్ననలు పొంది,  ప్రధాన చార్యులు చేతుల మీదుగా చిట్టి పురస్కారం సైతం అందుకున్నారు.  

తాను మాట్లాడే తెలుగు భాషకు ఒక గౌరవ జ్ఞాపకాన్నివ్వాలని గట్టి సంకల్పంతో సమాజ హితాన్ని కోరుకుంటూ  శతక పద్యంలో 
మానవుని జీవితంలో వికాస దశలు  అందులో బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధాప్యం మొదలు దశలు ఉన్నాయి.  కౌమార దశ అన్ని దశలలో కెల్లా అతి ముఖ్యమైన దశ.  ఈ దశలో సంభవించే శారీరక  పరిపక్వత తో పాటు మానసిక వికాసంలో మార్పులు మరియు ఆరోగ్యం అభివృద్ధికి పునాదులు వేయబడతాయి. ఈ దశలో హార్మోన్లు ఉత్పత్తి కావడం, అతి ఒత్తిడితో  ద్వంద్వార్థాల పదాలు అతిగా వాడటం, మిత్రులతో  చిలిపి చేష్టలు చేయడం, చేడు స్నేహితుల వల్ల భవిష్యత్తును నాశనం చేసుకోవడం, చివరికి  జైలు పాలు కావడం  జరుగుతుంది. కౌమార దశ ముగిసే సమయానికి చదువు సంస్కారంతో మెదడుకు పదును పెడుతూ ఉపాధి పొందాలన్న గొప్ప ఆలోచనలతో ముందుకు సాగితే ఆనందదాయకమైన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ధైర్యంగా కొత్త అనుభవాలను స్వీకరించి,  వాటాని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం వల్ల భవిష్యత్తులో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కౌమార దశలో సంభవించే కౌమార విజయం, కౌమార రుగ్మతలు వాటి పరిష్కారాల మార్గాలు మొదలగు  అన్ని అంశాల పైన ఛందో బద్ధమైన” కౌమారామృత శతకం” ను ఎంతో ఉత్సాహంతో  రచించారు.ఇది గజ్జారాం చట్ల గారి తొలి రచన కావడం విశేషం.

శతక కర్త పద్యం పట్ల మక్కువను పెంచుకొని, విద్యార్థులకు, పాఠకులకు, తెలుగు భాషాభిమానులకు, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో వచన  పద్యాలను తీసుకుని నేటి తరానికి  ఈ శతకము ద్వారా సమాజంలో కౌమార దశలో పతన మౌతున్న భక్తి,నీతి, ప్రేమ, జీవిత విలువలను తీసుకురావడానికి, బాలబాలికలు, విద్యార్థులు, సమాజ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మొదలగు వారు   చైతన్యవంతులు కావాలనే తపనతో, తన యొక్క రచన నైపుణ్యం వలన  ప్రయత్నాలు చేస్తూ, నిర్మల్ జిల్లా పద్యకవులలో ఒకరుగా స్థానం సంపాదించుకున్నారు.

ఈ  పద్య ఛందస్సు ప్రమేయం లేకుండా 108 పద్యాలు రచించన  గజ్జారాం చట్ల గారు. 2023లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్ లో అప్పటి తెలంగాణ తొలి  దేవాలయ గృహ, నిర్మాణ న్యాయ అటవీ శాఖ మంత్రి వర్యులు శ్రీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి శ్రీ , వరుణ్ రెడ్డి ఐఏఎస్,గార్ల చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం. తొలి గురువు ఆయన తన తండ్రి  కీ,శే, బక్కయ్య చట్ల గారితో ఏర్పడిన తండ్రి కొడుకుల బంధం కాస్తా గురుశిష్య  బంధంగా మారడంతో పాఠశాల స్థాయి నుంచే తెలుగులో కవితలు , కథలు, నాటకం, పద్యాల పట్ల ఆకర్షితులై  నాన్న గారి పద్యాలు విని స్ఫూర్తి పొందారు.తదనంతరం స్వయానా భగవద్గీత అర్థ తాత్పర్యాల పుస్తకాలు చదువుతూంటే వాటి అర్థాలను  నాన్న వివరించే వారు. ఇంతటి గొప్ప పాండిత్యాన్ని  తండ్రి వలన సంపాదించారు.

మాతృ మూర్తి, మాతృ  భాష అంటే ప్రాణమని  చేప్పే గజ్జారాం చట్ల తెలుగు భాష పై ఉన్న అభిరుచి తో  తనకు చిన్నప్పుడు   తల్లిదండ్రుల నేర్పిన సాహితీ విద్యతో శతకం పూర్తి చేసారు.తన తొలి శతకాన్ని బాల్యాన్ని నడిపేది – శివ కేశవులే అను దైవస్తుతి తో ఆరంభించడం గొప్ప విషయం.

కొన్ని శతక పద్యాలు పరిశీలిద్ధాం; –

1).
శైశవంలో సంరక్షణ – సరస్వతీపతి
బాల్యాన్ని నడిపేది – శివ కేశవులే 
యవ్వనం వార్దక్యం – పరిపక్వమే
చిక్కుల్లో చిక్కుకుంది కౌమారమే అమృత పుత్రా!!

భావము :- పిల్లలు దైవ సమానులు
అని అంటారు.రచయిత మనవ జీవితంలోని వికాస దశలను వివరిస్తూ   శైశవ దశలో బ్రహ్మ దేవుడు బాల్యంలో విష్ణువు సంరక్షిస్తూ నడిపిస్తారు.మరి యవ్వనం, ముసలితనంలో ఆదర్శంగా నిలిచిన మనిషి ,కౌమార దశలో పలు సమస్యలను ఎదుర్కొనక తప్పదు  అని  
చక్కగా వర్ణించారు.  
 
2).

స్నేహితుల సాంగత్యం – అధికమగుటచే
తల్లిదండ్రుల సాన్నిధ్యం – అధమమగునులే
సాంప్రదాయ సంస్కారం – గగనమగుటచే
ఆత్మస్థైర్య తగ్గుదల ఆత్మ న్యూనతే – అమృత పుత్రా !!

భావము:- ఓ అమృత పుత్రా! నీవు స్నేహితులతో కలిసి చేసే సరదా, చిలిపి చేష్టలు ఒత్తిడిని  తగ్గించి,స్నేహాన్ని బలోపేతం చేస్తాయి. కనుక తల్లిదండ్రుల చేప్పిన మాటలు పిల్లలు పట్టించుకొక దూరంగా ఉండటం ప్రారంభిస్తారు. తన సంస్కృతి సంప్రదాయాల పట్ల కూడా చిన్నచూపు కలిగి ఆత్మ విశ్వాసం తగ్గిపోవడంతో ఆత్మ న్యూనత పై ప్రభావం చూపుతుందని కవి స్పష్టం చేశారు 

3)
ఇట్టి ఘర్షణ తో గడిపేటి – కౌమారంలో 
ప్రేమ తగ్గి,పగనెగ్గి – బుగ్గిపాలె భవిష్యత్తు
హార్మోన్లు,మేధవృద్ధి కారణమని ఎరిగి – తల్లిదండ్రులె
మార్చాలి తనయుల బుద్ది – అమృత పుత్రా!

భావము:- కౌమార దశలో హార్మోన్ల మార్పు వల్ల మానసిక ఆందోళన, చిరాకుతో రక్తసంబంధికుల మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగాలు తగ్గి పోతుంది. అలాంటప్పుడు  తల్లిదండ్రులు కారణాన్ని గుర్తించి తనయులను అనుకూలంగా మార్చుకోవాలని కవి భావోద్వేగంతో
తెలియజేశారు.

4).
తనుపడ్డ తిప్పల్ని – తనయులు పడకూడదంటు
గాడిద చాకిరి చేసి – డబ్బు గడించి పెడితే 
గార్థభ పుత్రులు మొత్తం – బూడిద పాల్చేసి
అడుక్కు తింటుంటారు – అమృత పుత్రా !

భావము:- తాను పడ్డ కష్టాలు భవిష్యత్తులో పిల్లలు పడకుడదు అనే ఉద్దేశంతో  తల్లిదండ్రులు పిల్లల్ని గారాబంగా పెంచడమే అస్సలు పిల్లలు చెడిపోవడానికి కారణం. దీని వల్ల పిల్లల పట్ల  మనం చూపిస్తూన్న ప్రేమ వారిని బద్దకస్తుల్ని చేస్తుందని దానితో  పిల్లలు దద్దమ్మలుగా తయారవుతున్నరని  రచయిత శత  శాతం వాస్తవాలను  కళ్ళకు కట్టినట్లు చూపించారు.

రచయిత గజ్జారాం చట్ల గారు సంఖ్యాపరమైన 
శతక లక్షణం పాటించి 108 పద్యాలు లిఖిస్తు “అమృతపుత్రా” అనే  తన అమ్మ పేరుతో మకుటంగా శతకం రాయడం అభినందనీయం.

వారి పదపొందిక, రచనా నైపుణ్యం, కవితా శైలి 
ఎంతో బాగుంది.ఎన్నో విషయాలను సృజించిన కౌమార రచయిత గజ్జారాముని కలము నుంచి మరింత కావ్యాలు జాలువారాలని వారి కీర్తి దశదిశలా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాను.

వెల : ₹=150/-
ప్రతులకు,
ఇ.నెం1- 4–130/3 
ఆదర్శనగర్ ,
నిర్మల్ జిల్లా,-504106
చరవాణి : 9959299039

September 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఏకత్వంలో భిన్నత్వం 

by Agora September 14, 2025
written by Agora

ఒక్క నిప్పు రవ్వ 
అరణ్య దహనం చేయగలదు!
ఆహార పచనం చేయగలదు!

ఒక్క తప్పు తొవ్వ 
పతనానికి చేర్చే ముప్పు కాగలదు
గుణపాఠం నేర్పే కనువిప్పు కాగలదు! 

ఒక చీత్కారం
మదిని చీల్చే అవమాన శరం కాగలదు!
మనిషిని సరిదిద్దే అసమాన స్వరం కాగలదు!

ఒక్క శ్రీకారం
విధి ప్రారంభానికి దీవన కాగలదు!
కార్యపూరణకు రక్షణ కాగలదు!

ఒక్క బీజం
సఘనారణ్యానికి ఆది జీవ ధనం కావచ్చు!
గొప్ప వంశవృక్షానికి తొలి 
జన్యు కణం కావచ్చు!

ఒక మహా విస్పోటనం
విశ్వ వికాసానికి కారణం కావచ్చును!
ప్రపంచ వినాశనానికి ప్రేరణం
 కావచ్చును!

. ఒక మహా సాగరం
మనో నిగ్రహానికి నిదర్శనం కావచ్చును!
భీకర ఆగ్రహానికి నిరూపణం కావచ్చును!

ఒక చినుకు
ఎడారిలో నిరర్థకం కావచ్చును!
ఆల్చిప్పలో మౌక్తికం కావచ్చును!

ఒక దిటవైన దీక్ష
ఆత్మ శోధనకు నడవ కావచ్చు!
జన్మార్థ సాధనకు సడవ కావచ్చు!
.
ఒక్క ఆలోచన
ఆత్మ త్యాగానికి నిర్ధారణ కాగలదు!
కళ్యాణ యాగానికి అంకురార్పణ కాగలదు!
        ——*——

.

September 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహిత్యస్ఫూర్తి రజితగారికి అక్షరనీరాజనం

by అనూశ్రీ. September 14, 2025
written by అనూశ్రీ.

“ఈ దుఃఖం.. ఏనాటి శాపమో ఈ శోకం.. ఎందరెందరి శాపమో..”

అంటూ ఉద్వేగభరిత పదాలను లిఖించిన ఆ స్వరం ఇప్పుడు మన మధ్య లేదు.. ఆమె కేవలం కవయిత్రి కాదు, పోరాట స్ఫూర్తి, సమానత్వం కోసం స్త్రీ హక్కుల కోసం రగిలిన “అగ్నిశిఖ”

“చైతన్యం పడగెత్తింది” అంటూ తొలి రచనతోనే ఒక నినాదమై కదిలిన “నిర్భయాకాశం”

“గులాబీలు జ్వలిస్తున్నాయి” అంటూ మహిళలపై అన్యాయాలను ఎత్తి చూపి శ్రమజీవుల పక్షాన నిలిచిన “చెమట చెట్టు”

కాకతీయ విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా, ప్రజా గాయనిగా, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యక్షురాలిగా వెలిగిన తెలంగాణ ఉద్యమకారిణి.

1958లో వరంగల్ జిల్లాలో జన్మించిన రజిత గారు, చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని, తెలంగాణ తొలి ఉద్యమదశలోనే చురుకుగా పాల్గొన్నారు.

దస్తఖత్, అనగనగా కాలం, మట్టిబంధం, మార్కెట్‌,స్మార్ట్‌ శ్రీమతి “వెతలే కథలై”, “ఉద్విగ్న” (2013, అత్యాచార విరోధ సంకలనం), “అగ్నిశిఖ” (2014), “జీగర్”, “ముజఫర్‌నగర్ మారణకాండ”, “పోలవరం-ప్రాణాంతక ప్రమాదం” వంటి సమాజానుసారమైన సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. సామాజిక ఉద్యమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ, ఆదివాసీలు,దళితులు అట్టడుగు వర్గాల గొంతును తనదిగా చేసుకుని కవితలు, వ్యాసాలు,పాటలు వ్రాసిన అసాధారణ సాహిత్య యోధురాలు.

ఉపన్యాసాలలో ఆమె కవిత్వం ఉత్సాహం నింపేది, సాహిత్య వేదికలపై ఆమె మాటలు ఆలోచనల జ్యోతిని వెలిగించేవి. 2017లో తెలంగాణ ప్రభుత్వం ఆమెను “రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం”తో సత్కరించడం, ఆమె కృషికి లభించిన గౌరవం.

తన ఆలోచనలకు ఏ ముసుగులు లేకుండా స్పష్టంగా మాట్లాడడం ఆమెకే సాధ్యం. హృదయంలో మృదుత్వం. ఆలోచనల్లో స్పష్టత..ఆచరణలో
దృఢత్వం.. ఆమె నైజం. జీవితంలో సాదాసీదాగా కనిపించినా,ఆచరణలో, ఆలోచనల్లో ముక్కుసూటి తత్వం.

వారి వ్యక్తిత్వంలో నాకు బాగా నచ్చింది నిరాడంబరమైన వ్యవహారశైలి. రాతల్లో రాస్తున్నది ఆచరణల్లో ఉండాలని, హంగు ఆర్భాటాలను పొగడ్తలను తిరస్కరించేవారు. వ్యక్తిగత ప్రయోజనం కాదు, సమాజ హితంకోసమే రచనలు సాగాలని ముఖ్యంగా మహిళలు మహిళల గురించి ఆలోచించాలని అనేవారు.

ప్రోత్సహించడం ధైర్యం చెప్పడం ఆమె సహజ స్వభావం కష్ట సమయాల్లోనూ తడబడకుండా ముందుకు నడిచే నాయకత్వం వారిది. రజిత గారి వ్యక్తిత్వం మనందరికి స్ఫూర్తిదాయకం ఆమె జీవితం మంచి విలువలను నేర్పుతుంది అలాంటి వ్యక్తి సాహిత్యంలో ఉండడం మన అదృష్టం. నా మొదటి నవల “వేద” ఆవిష్కరణకు ఎంతో సంతోషంగా వచ్చారు. రెండవ నవల జగతికి ముందుమాటలు రాశారు. నవల అందుకున్న క్షణం నుండి ఆవిడకు నాకు ఒక మంచి బంధం ఏర్పడింది. నన్నెందుకు అంతగా ఇష్టపడ్డారో నాకు తెలియదు గానీ “కవిత్వం కన్నా నవలా రచన నీనుండి కోరుకుంటున్నా” అని ఎప్పుడూ గుర్తుచేసేవారు. ఏ సాహిత్య సమావేశానికి వెళ్లినా అక్కడి విశేషాలను నాతో పంచుకునేవారు.

అనిశెట్టి రజిత గారు లేరన్న విషయం తెలియగానే, ఆమెను సన్నిహితంగా చూసినవారు మాత్రమే కాదు, ఆమెను రచనల ద్వారా తెలుసుకున్న పాఠక హృదయాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఎన్నో కలాలు వారిని స్మరిస్తూ కన్నీటి అక్షరాలను లిఖించాయి.

రజిత గారు లేకపోవడం లోటు మాత్రమే కాదు నా వరకు ఒక వెలితి కొన్ని ఖాళీలు మరొకరితో భర్తీ చేయలేము. నిజంగా
“ఈ దుఃఖం ఏనాటి శాపమో.. “

ఆమె ఆశయం ఒక వెలుగుతున్న దీపం..
ఆ దీపకాంతులు అంతటా ప్రసారించాలని ఎంతోమందిని ప్రభావితం చేయాలని కోరుకుంటూ

మనసు నిండా తొణుకుతున్న కన్నీటితో నివాళి.

September 14, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

చుట్టపు దయ్యం

by Laxmi Madan September 14, 2025
written by Laxmi Madan

అమ్మగారు ఓ అమ్మగారు! అంటూ పిలుస్తూ లోపలికి వచ్చింది కుమారి.

లోపలికి వచ్చిన కుమారికి హాల్లో ఎవరు కనిపించలేదు.

“అదేంటి ఈపాటికి పెద్దమ్మ గారు వంట చేస్తూ, వంటింట్లో కనిపిస్తారు. ఈరోజు చడీ, చప్పుడు లేదు. ఆరోగ్యం బాగాలేదా ఏంటి?”అని అనుకొని పెద్దమ్మ అనబడే దమయంతి గదిలోకి వెళ్ళింది.

అప్పటికే దమయంతి స్నానం చేసి, పూజ చేసుకున్నట్లు కనిపించింది. కానీ రోజు వంటింట్లో ఉండే బదులు ఈరోజు గదిలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చునిఉంది.

“ఇక్కడ ఉన్నారామ్మా! వంట అయిపోయిందా? లోపల లేకుంటే ఒంట్లో బాగా లేదేమో అనుకొని వచ్చానమ్మా”అన్నది కుమారి.

“ఒంట్లో బాగానే ఉంది. రోజు వంటింట్లో పని చేసి, చేసి చిరాకు వచ్చేసింది. ఎవరికి బాధ్యత లేదు
నేను చేసి పెట్టడం అందరూ కూర్చొని తినడం”అనీ దమయంతి కొంచెం కోపంగా అన్నది.

“అదేంటమ్మా? ఎప్పుడు సంతోషంగా పనిచేస్తూనే ఉంటారు. ఈరోజు అంత మాట అనేసారు”అన్నది కుమారి.

“నువ్వు వెళ్లి పని చేసుకో కుమారి”అంటూ పుస్తకం చదవటంలో నిమగ్నం అయ్యింది దమయంతి.

“కోడలమ్మ ఏం చేస్తుందో చూస్తాను. అయినా ఆ అమ్మాయి ఆలస్యంగానే లేస్తుంది కదా”అనుకుంటూ కోడలు వినీల గదిలోకి వెళ్ళింది.

అప్పటికే లేచి కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది వినీల.

“వినీలమ్మ కూడా పని చేసుకుంటూ ఉంది. ఆలస్యంగా లేచినా, వినీలమ్మ తాను మొదటిసారి టీ తాగుతూ, అత్తగారికి ఓ కప్పులో ఇస్తుంది. ఇద్దరు కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటూ తాగుతారు. ఈరోజు ఏంటి! చెరొక గదిలో కూర్చున్నారు”అనుకుంటూ..

“వినీలమ్మ! ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటే ఏం చేస్తున్నారో అని ఇక్కడికి వచ్చాను. చాయ్ తాగారామ్మ! మీఅత్తమ్మ నువ్వు ఇద్దరు కూర్చుని తాగుతారు కదా”అన్నది కుమారి.

“నాకు చాయ్ పెట్టుకునే ఓపిక లేదు. అవసరమనుకుంటే ఆమె పెట్టుకొని తాగుతుంది”అన్నది వినీల.

ఇదేంటబ్బా? ఎప్పుడూ లేనట్లుగా వీళ్ళిద్దరూ ఎడ ముఖం పెడ ముఖం గా ఉన్నారు” అనుకున్నది.

తన పని తాను చేసుకోవడం మొదలు పెట్టింది కుమారి.

కుమారి ఇలా ఎందుకు ఆలోచించిందో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే మనకి అర్థం అవుతుంది.

పొద్దున్నే కాలింగ్ బెల్ మోగ గానే దమయంతి తలుపు తీస్తుంది.

” కప్పులో టీ పోసి పెట్టాను. తాగి పని చేసుకో కుమారి”అని నవ్వుతూ చెప్పింది దమయంతి.

“నాకు చాయ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవు నువ్వు ఎన్ని పనులున్నా, రోజు ఇక్కడే టీ తాగి వెళ్తానమ్మ”అన్నది కుమారి టీతో పాటు దమయంతి ఇచ్చిన బిస్కెట్ టీలో ముంచుకుని తింటూ.

“ఒక్కదానివే పని అంతా చేస్తావు. నీకు కష్టం అనిపించదా అమ్మా” అన్నది కుమారి.

“మన ఇంట్లో పనులు మనం చేసుకోవడానికి కష్టమంటే ఎలా? అయినా ఎవరికి చేస్తున్నాను? నా కొడుకు ,కోడలు మనవళ్ళుకే కదా”అన్నది దమయంతి సాంబార్లో పోపు వేస్తూ..

“మా అత్తయ్య అయితే ఒక్క నాడు ఇంత పని చేయదమ్మ. నేను ఇళ్లలో పనిచేసే ఇంటికి పోయి, నేనే చేసుకోవాలి. తిని బిడ్డ ఇంట్లో పోయి కూర్చుంటది. నా పిల్లలు మాత్రం తన మనవళ్లు కాదా? అన్నం అయినా తినిపించవచ్చు కదమ్మ! మీరు చేసేది మంచి పని. కోడలును ఇలా చూసుకోవాలి”అన్నది బాధగా.

“అయ్యో! చేస్తే ఏమైంది ?రెక్కలు ఏం కట్టుకుపోతామా? నలుగురికి చెయ్యని చేతులు ఏం చేతులు?”అన్నది దమయంతి.

ఎనిమిది గంటల వరకు రోజు స్నానం పూజ వంట ముగించేది.

నెమ్మదిగా లేచిన కోడలు, తాను చాయ్ పెట్టుకుని, అత్తగారికి ఒక కప్పు ఇచ్చి, తాను కూడా పక్కనే కూర్చుంటుంది.పిల్లలకు బాక్సు లు కూడా దమయంతి పెడుతుంది.

ఇద్దరు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. ఇంట్లోకి కావలసిన సరుకులు, పిల్లల బట్టలు, చదువులు ఇలా ఎన్నో.

ఆ తర్వాత వినీల కంప్యూటర్ ముందు కూర్చుంటుంది. పనిమనిషి పని అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత తోచిన పారాయణం చదువుకొని, పిల్లలకి వచ్చే వరకు ఏదైనా చేద్దామని ఆరాటంలో ఉంటుంది దమయంతి. ఊరికే ఉండడం అంటే అసలే నచ్చదు. భర్త పోయి దాదాపు నాలుగేళ్లు అయింది. అప్పటినుండి ఊరు విడిచి ఉన్న ఒక్క కొడుకు దగ్గరే ఉంటుంది వీలైనప్పుడు ఊరికి వెళ్లి వస్తూ ఉంది.

కొడుకు, కోడలు కూడా దమయంతికి బాగా గౌరవం ఇస్తారు. గౌరవంతో పాటు ప్రేమను కూడా పంచుతున్నారు.

అన్ని విధాల అమర్చిపెట్టే అత్తగారంటే దమయంతికి ఎనలేని అభిమానం. తాను వర్క్ చేసుకుంటుంటే టీ తెచ్చి పెట్టడం, స్నాక్స్ ఇవ్వడం చేస్తుంది దమయంతి.

“నేను వచ్చి చేస్తాను కదా అత్తయ్య! ఎందుకు మీరు కష్టపడతారు”అని అన్నది వినీల.

“ఈ పనులు నేను చేయగలనమ్మ! నీ ఉద్యోగం నేను చేయగలనా? అందుకే నాకు వచ్చిన పనులు నన్ను చేయని, ఊరికే కూర్చొని మాత్రం ఏం చేస్తాను? మీకు ఏదైనా చేసి పెడితే నాకు సంతోషంగా ఉంటుంది. మీ మామయ్యకి కూడా అంతే, ఎప్పుడూ మీ గురించే ఆలోచించేవాడు”అన్నది కొంచెం బాధగా దమయంతి.

నవ్వుతూ టీ కప్పు అందుకున్నది వినీల.

సెలవులు ఉన్నప్పుడు మాత్రం దమయంతిని ఒక్క పని చేయ నీయకుండా అంతా తానే చేసుకునేది వినీల. బయటకు వెళ్తే తప్పకుండా దమయంతి రావాల్సిందే.

“వాళ్లకి ప్రైవసీ లేకుండా తాను వెళ్లడం ఎందుకు” అని ఎన్నోసార్లు వద్దని చెప్పినా, వినకుండా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతారు.

అత్తగారికి కావలసిన వస్తువులు ఏవైనా ఉంటే అప్పటికప్పుడు కొనుక్కొని వస్తుంది వినీల.

దమయంతి ఎప్పుడైనా బయటకు వెళ్తే, కోడలు కోసం ఎన్నో వస్తువులను తెస్తుంది.

అప్పుడప్పుడు వీళ్ళతో కొడుకు రాకున్నా,వీళ్ళిద్దరూ మాత్రం వెళ్లడం పక్కగా ఉండేది.

ఇలా ప్రశాంతంగా సాగుతున్న కుటుంబంలోకి ఒక చిన్న రాయి అడ్డంగా వచ్చింది. అంతే పరిస్థితి అంతా తారుమారు అయ్యింది.

ఒక రోజు ఇంటికి ఒక దూరం బంధువు వచ్చింది. ఇక్కడ నగరంలో ఏదో పని ఉందని, వారం రోజులు ఉండిపోయింది. ఉన్న మనిషి తిని ఊరికే ఉండక, ఇటు దమయంతి మనసు, అటు వినీల మనసును పాడు చేసింది.

పొద్దున్నే వంటింట్లో హడావుడిగా ఉన్న దమయంతి దగ్గరికి వచ్చింది. చుట్టం చూపుగా వచ్చిన దయ్యపు మనిషి.

“దమయంతి వదినా! ఇంత వయసు వచ్చినా, నీకు వంటింటి పని తప్ప లేదన్నమాట. హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కాలం గడిపే వయసులో, ఈ పనులన్నీ చేసుకోవలసి వచ్చింది”అన్నది సన్నాయి నొక్కులు నొక్కుతూ.

“నా చేతుల్లో శక్తి ఉంది చేస్తున్నాను. అయినా ఎవరికి చేస్తున్నాను? నా పిల్లలకే కదా”అన్నది దమయంతి.

“నీ పిల్లలు నీ పిల్లలు అని నువ్వు అనుకుంటావు. కానీ ఆ వచ్చిన కోడలు అనుకోవద్దు ఇంత సేపైనా లేవలేదు. అత్తగారి వయసు అయిపోయింది .కాస్త యినా సహాయం చేద్దాం అనేది ఉందా? అదే నీకు కూతురు ఉంటే ఇలా చేసేదా వదిన! నువ్వే ఆలోచించుకో”అన్నది చుట్టపు దయ్యం.

ఇలా మూడు రోజులుగా ప్రతి దాంట్లో తాను వేలు పెట్టి, తాను ఎంత కష్ట పడుతుందో అనేది దమయంతి మనసులోకి బాగా ఎక్కించేసేది.

ఇక దమయంతి మధ్యాహ్నం పడుకున్న సమయంలో వినీల దగ్గరకు వెళ్లి..

“ఎంత కష్టపడి పోతున్నావు తల్లి! ఇటు ఆఫీసు పని, మళ్ళీ ఇంటి పని. అందులో మీ అత్తగారు ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుందాయే! మరో కొడుకు ఉంటే అక్కడికి నాలుగు రోజులు వెళ్లి వచ్చేది. మీకు ఇబ్బంది కదా! మీ భార్యాభర్తలిద్దరూ ఎక్కడికి వెళ్లాలన్నా ఆమెను తీసుకొని వెళ్లాల్సిందే, పాపం ఈరోజుల్లో నీలాంటి వాళ్ళు ఎవరున్నారే పిచ్చి తల్లి”అని వినీల దగ్గర మరో రాగం అందుకుంది.

“అదేంటి మా అత్తయ్య గురించి అట్లా అంటారు. పొద్దున వంటంతా తానే చేస్తుంది. బయటకు వెళ్తే మాతో వస్తుంది తప్పేంటి? బయట మేమిద్దరమే ఉంటామా ఏంటి? వేరే జనం ఉండరా”అన్నది వినీల చిరాగ్గా.

“మీ అత్తయ్య అంటే నీకు ఎంత ప్రేమనే తల్లి! కానీ ఆమె అలా అనుకుంటుందా? కష్టపడి నేనే పని చేస్తున్నాను అని పొద్దున్న అంటూనే ఉంది. పనిమనిషి తో కూడా నీ మీద ఏదేదో చెప్పడం నేను విన్నానమ్మ”అన్నది చుట్టపు దయ్యం.

“అదేంటి నేను అత్తయ్యను సొంత తల్లి లాగా చూసుకుంటే, ఇలా నామీద చెప్తోందా? వంట తానిష్టంతోనే చేస్తాను అన్నది కదా? లేకుంటే నేను చేసుకో లేనా?”అనీ బాధపడ సాగింది.

ఇటు దమయంతికి కూడా బాధ పెరిగింది. “ఇంటెడు పని నేనే చేస్తున్నాను. పోనీ చేస్తున్నాను అనే సానుభూతి కూడా ఎవరికీ లేదు. ఈ వయసులో నేను ఎందుకు చేయాలి? మా అత్తయ్య నాకు చేసి పెట్టిందా “?అంటూ ఆలోచించసాగింది.

చుట్టపు దయ్యం నాటిన విషపు బీజాలు ఇద్దరిలో మొలకలై, వృక్షాలై పెరిగిపోయాయి. అంతే ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి.

దమయంతి పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుంది.

వినీల కూడా లేచిన తర్వాత తన టీ కప్పు తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతుంది.

ఎప్పుడో మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చి అన్నం ఒక కూర చేసి తాను ప్లేట్లో పెట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది.

వినీల చేసిన కూర సహించని దమయంతి తాను ఏదో పచ్చడి ఒకటి చేసుకుని తినేస్తుంది. కొడుకు ఎక్కువగా ఆఫీస్ లో తింటాడు కాబట్టి ఈ కోల్డ్ వార్ అతనికి అర్థం కాలేదు. ఒకసారి వరుసగా మూడు రోజులు సెలవు వచ్చాయి. కొడుకుకి విషయం అంత అర్థమయింది. “ఇద్దరు మాట్లాడుకోవటం లేదు కానీ కారణం తెలియదు.ఎలా ఈ సమస్యకు పరిష్కారం?” అనుకున్నాడు.

అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇల్లంతా అశాంతిగా ఉంది. మునుపటి సంతోషం లేకుండా పోయింది.

ఒకరోజు వినీల ఆఫీసుకు వెళ్లింది. అప్పుడు కుమారి వచ్చి దమయంతి దగ్గర కూర్చుంది.

“అమ్మగారు ఒక మాట చెప్తా. మీ అత్త కో డళ్ళిద్దరూ, తల్లి కూతుర్ల లాగా ఉండేవాళ్లు. ఎందుకు అమ్మ ఈమధ్య ఇలా అయిపోయారు?”అని అడిగింది.

“మీఅమ్మని అడగాల్సింది నన్ను ఎందుకు అడుగుతున్నావ్?”అన్నది దమయంతి.

“నాకు అర్థమైంది ఒకటి ఉందమ్మా! ఈ ఇంటికి ఒక చుట్ట పామే వచ్చింది. దయ్యం లాగా మీ మధ్య ఏదో పెట్టింది. అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వంటింట్లో ఉన్నంతసేపు మీతో ఏదో మాట్లాడేది. తర్వాత మీరు పడుకున్నప్పుడు వినీలమ్మ గదిలోకి వెళ్లి గుసగుసగా చెప్పేది. నాకు ఎలా తెలుసు అంటే, ఒకరోజు మధ్యాహ్నం పనికి వచ్చాను నేను. మీరు పడుకొని ఉన్నారు. ఆ గది ఊడుస్తుంటే ఆమె ఏదేదో చెప్తుంది. అప్పుడే అనుకున్నాను ఈవిడ ఏదో చిచ్చు పెడుతుంది అని ,అదే నిజమైందమ్మ. అలాంటి వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి మీపచ్చని కుటుంబాన్ని అశాంతిపాలు చేసుకోవద్దమ్మ! నేను చదువుకోని దాన్ని. కానీ ఎన్నో ఇళ్లల్లో చూస్తున్నాను మీ ఇంట్లో ఉన్నంత మంచిగా ఎక్కడ ఉండరు .కలిసి ఉండండి అమ్మ”అని చెప్పింది.

దమయంతికి ఒక్కసారిగా విషయం అర్థమైంది.” అవును, ఆ చుట్టం వచ్చినప్పటి నుండి మనశ్శాంతి కరువైంది. ఆమె ఇవన్నీ చెప్పడం వల్లనే కదా నేను ఇలా చేస్తున్నాను” అనుకుంది.

దమయంతి మధ్యాహ్నం పడుకున్నప్పుడు, ప్రత్యేకంగా కుమారి ఇంటికి వచ్చి వినీల గదిలోకి వెళ్ళింది..

“చిన్నమ్మ నేనొక మాట చెప్తాను విను. మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది ఆ చుట్టపామేనమ్మ. పొద్దున పెద్దమ్మకి మీ గురించి ఏదేదో చెప్పేది. మధ్యాహ్నము ఆమె గురించి మీకేదో చెప్పింది. అప్పటినుండి మీ కుటుంబం లో కలతలు మొదలయ్యాయి. మీ ఇద్దరు మీదికి గొడవ పడకున్నా,మనసులో ఏదో దిగులు ఉన్నారు. వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, ఎప్పటిలాగా ఉండండమ్మ,! నా మాట వినండి”అని చెప్పి వెళ్ళిపోయింది.

వినీల కూడా ఆలోచించసాగింది. ఇంత చదువుకొని ఎవరో చెప్పిన మాటలు విని, నేను ఇలా అవడం ఏంటి? వెళ్లి అత్తయ్యను క్షమించమని అడుగుతాను” అని గదిలో నుండి బయటకు వచ్చింది.

అప్పుడే దమయంతి కూడా “నా వయస్సు, నా జ్ఞానం ఏమైపోయింది? ఎవరి మాటనో పట్టుకొని ఇలా అయ్యాను. చిన్నదైనా కోడలికి నేను క్షమాపణ చెప్తాను” అంటూ బయటకు వచ్చింది ఇద్దరూ ఒక్కసారిగా ఎదురుపడ్డారు.

ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. ఇద్దరు ముఖాలలో బాధ కనిపిస్తుంది. మాటల్లో ఏమి చెప్పకుండా ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ఒకరి మనసు ఒకరికి అర్థమయిపోయింది ఇద్దరి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. .తేరుకున్న దమయంతి,

“వినీల! మంచి టీ తయారుచేసి తీసుకొస్తాను. నువ్వు లోపలికి వెళ్లే పని చేసుకో”అన్నది దమయంతి.

“మీరెళ్ళి హాల్లో కూర్చోండి. నేనే టీ పెట్టుకుని అలాగే ఏదైనా స్నాక్స్ చేసుకొని వస్తాను”అన్నది వినీల.

సరే ఇద్దరం వంటింట్లోకెళ్లి చేసుకుందాం పద” అంటూ నవ్వుకుంటూ ఇద్దరు వంటింట్లోకి వెళ్లిపోయారు. మాటల్లో చెప్పలేని భావం వాళ్ళ మనసుల్లో కలిగింది. ఇకముందు ఏ చుట్టపు దయ్యాలకి వాళ్లు అవకాశం ఇవ్వలేదు. అప్పుడే ఇంటికి వచ్చిన కొడుకు ఇద్దరిని చూసి సంతోష పడ్డాడు.

September 14, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శ్రీమతి నందగిరి ఇందిరాదేవి జీవితం – సాహిత్యం..

by Cheedella Seetha Lakshmi September 14, 2025
written by Cheedella Seetha Lakshmi

14వ అంతర్జాతీయ తెలుగు సాహితీ సదస్సు ,అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన సభలో సమర్పించిన ప్రసంగపాఠం

జీవనరేఖ

తెలంగాణ తొలి తరం రచయిత్రి నందగిరి ఇందిరాదేవి 22.09.1919 సంవత్సరంలో శ్రీ వడ్లకొండ నరసింహారావు శ్రీమతి వెంకటమ్మ దంపతులకు హనుమకొండలో జన్మించారు..అదేసంవత్సరం నవంబర్ మాసంలో ఏకైక మహిళా భారత ప్రధాని ఇందిర కూడా జన్మిచడం విశేషం వీరి పేరు కూడా ఇందిరఅని పెట్టడం కాకతాళీయం. వీరి స్వగ్రామం హనుమకొండ దగ్గర వంగపహాడ్ గ్రామం. వీరి తండ్రి శ్రీ వడ్లకొండ నరసింహారావు గారు వరంగల్ లోని రంగశాయి పేటలో ఒక హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయుడుగాగా పనిచేస్తూ ఉండగా వారిక ఆంగ్ల భాషలో ఉన్న పట్టు కారణంగా నిజాం ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఉద్యోగం దొరకడం వలన వారు హనుమకొండ నుండి హైదరాబాద్ సుల్తాన్ బజార్ కు మకాం మార్చారు. దాదాపుగా ఇందిరా దేవి బాల్యం అంతా ఇక్కడే గడిచింది.
శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయం గ్రంథాలయానికి కార్యదర్శిగా వుండి తన విధినిర్వహణలో భాగంగా రజతోత్సవాలు,స్వర్ణోత్సవాలు ఘనంగా జరిపించారు. గ్రంథాలయానికి తండ్రితో కలిసి తరుచుగా వెళ్లేవారు చిన్నారి ఇందిర. తండ్రి ప్రభావమే ఇందిరపై గాఢంగా పడిందని చెప్పొచ్చు.

శ్రీమతి నందగిరి ఇందిరాదేవి తన 15 ఏటనే హైదరాబాద్ నారాయణగూడ లోని రెడ్డి హాస్టల్ వార్షికోత్సవంలో అష్టావధానం చేసి అందరిని అబ్బురపరిచారు.
ఆనాటి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సాహితీ ప్రియురాలు గద్వాల మహారాణి శ్రీ ఆదిలక్ష్మి దేవమ్మ గారు 15 సంవత్సరాల చిన్నారి ఇందిరాదేవిని ఘనంగా సత్కరించారు.

నైజాం కాలంలో ఉర్దూ మాధ్యమికంగా కొనసాగుతున్న రోజులు.ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుకొనే స్థితి లేదు.ఆసమయంలో తెలుగు మాధ్యమికంగా ఆడపిల్లలకు చదువు ఆవశ్యకతను,అవసరాన్ని గుర్తించిన వడ్లకొండ నరసింహారావు గారు ఆంధ్ర బాలికల పాఠశాలను నెలకొల్పడం పెద్ద సాహసకార్యమే. నందగిరి ఇందిరా దేవి నారాయణగూడ ఆంధ్రా బాలికల పాఠశాలలో (అంటే ఇప్పటి మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.

నైజాం రాజ్యం పోయి భారత దేశంలో కలిసాక బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వలన మాడపాటి హనుమంతరావు గారితో కలిసి నెలకొల్పిన పాఠశాలకు మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలగా నామకరణం చేయబడింది.
వ్యవస్థాపకులలో వీరి తండ్రి వడ్లకొండ నరసింహారావు గారు ఒకరు. వీరు తాను అద్దెకుండే ఇంట్లోనే రెండుగదులను పాఠశాలకుపయోగించడం ,అమ్మాయిలను స్వంత డబ్బు ఖర్చుపెట్టి రిక్షాలో బడికి తీసుకొని రావడం ఆయనకు విద్యపట్ల ఆసక్తి వ్యక్తమౌతుంది. ప్రజాసేవ చేయడం,సంఘసంస్కరణ అనే లక్షణాలు తండ్రి గారినుండే వారసత్వంగా కూతురైన ఇందిరాదేవి పుణికి పుచ్చుకున్నారు.

ఇందిరాదేవి ఎస్.ఎం.డి.టి. మహిళా విశ్వవిద్యాలయం పూణే నుంచి 1937 వ సంవత్సరంలో జి.ఏ., లో పట్టభద్రురాలయ్యారు. G.A. అంటే (గృహ ఆగమ.)
ఈమె ఆ రోజులలో అంటే 1940 ప్రాంతంలో తొలి తెలంగాణ మహిళా పట్టభద్రురాలు.

శ్రీమతి నందగిరి ఇందిరాదేవి తన 14వ ఏట నుండే అనేక సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలలో పాలుపంచుకున్నారు. ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపక సభ్యులలో ఆమె ఒకరు. సంఘ సంస్కరణోద్యమ సారథిగా ఎన్నో పోరాటాలు చేశారు. వాటిలో ఒకటి బాల్యవివాహాల పట్ల నిరసన.
తాను స్వయంగా యుక్త వయస్కురాలు అయ్యాకనే వివాహం చేసుకుని నలుగురికి మార్గదర్శకురాలు అయ్యారు. ఆ రోజులలో తండ్రి నరసింహారావు కూతురు ఇందిరకు పెళ్లి చేయట్లేదని బంధువులు ఎన్నో సూటిపోటి మాటలు అంటున్నా బంధుత్వాలు సడలిపోయే స్థితి ఎన్నో అవాంతరాలు వచ్చినా తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి తన కూతురిని బాల్య వివాహం నుండి తప్పించారు. ఆమె పట్టభద్రురాలు అయిన తర్వాతనే వివాహం జరిపించారు.

ఆ తర్వాతి కాలంలో ఇందిరాదేవి బాల్య వివాహాలను తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా తీవ్రంగా ఖండించారు. 1937 సంవత్సరంలో నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర మహాసభ అనుబంధంగా జరిగిన ఆంధ్ర మహిళా సభకు ఇందిరాదేవి అధ్యక్షత వహించారు.

ఆ నిజాం కాలంలో “నషర్” గా పిలువబడే కార్యక్రమం ద్వారా దక్కన్ రేడియోలో ప్రసంగించిన మొట్టమొదటి తెలంగాణ మహిళ ఇందిరాదేవి.1937 సంవత్సరంలో తన 18 ఏటనే నిజాం ప్రభుత్వం వారు ప్రసారం చేయదలచుకున్న సందేశం తెలుగులో ఇందిరాదేవి తమ వాణిగా మొట్టమొదటిసారిగా వినిపించారు. కథారచయుతలకు కథలు ఎట్లా రాయాలో సూచనలు చేసేవారు.

కుటుంబ వ్యవస్థలోని వైరుధ్యాలను, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలను,సామాజిక సమస్యలు, సంసారంలో వయసు మళ్ళిన వారి సమస్యలు,
సాంఘిక దురాచారాలు మొదలగు విషయాలను ఏడు దశాబ్దాల కిందటే చిత్రించిన కథా రచయిత్రి శ్రీమతి నందగిరి ఇందిరాదేవి. తెలంగాణ
సాహిత్యంలో ఆమెది చెరగని ముద్ర. ఒక ప్రత్యేక స్థానం.

కథలు, నాటకాలు, వ్యాసాలు,ఎన్నో వ్రాశారు. రేడియో కోసం కూడా ఎన్నో కథలు రాశారు.
ఆకాశవాణి బాలనందం కార్యక్రమాల ద్వారా మంచి స్నేహం విలువ, కష్టాలలో ఉన్న వారికి సాయపడాలని, సోమరిపోతుగా ఉండకూడదని, అనేక నీతి కథలు “అమ్మమ్మ కథలుగా” ఆమె విభజించారు.
ఈ అమ్మమ్మ కథలు అనే బాలల కథల పుస్తకం కూడా తెలంగాణ సాహిత్య అకాడమీ వారు 2019 సంవత్సరంలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి సంపాదకత్వంలో ప్రచురించారు.

ఇందిరా దేవి గారికి శ్రీ నందగిరి వెంకట్రావు గారితో వివాహం జరిగింది. ఆమెకు శౌరి,అరుణ్,వీర అనే ముగ్గురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు.ఆ తర్వాత కూడా ఆవిడ రచనా వ్యాసంగాలు మానుకోలేదు.
నిజాం కాలంలో,
ఆ తర్వాత కూడా ఆమె రేడియో ప్రసంగాలు చాలా చేశారు. దాదాపు 50 ఏళ్ల పాటు రచించిన రేడియో ప్రసంగాలను ఆమె “మసకమాటున మంచు ముత్యాలు” అను పేరుతో 1995 సంవత్సరంలో వెలువరించారు..జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సి.నారాయణరెడ్డి,మా గురువు గారు ఆవిష్కరించారు ఈ గ్రంథాన్ని.

ఆవిడ రాసిన కథలు,వ్యాసాలు,నాటకాలు ఆ కాలం లోని పత్రికలు భారతి,యువ,
వినోదిని, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి ,మాతృభూమి,చిత్రగుప్త,ఆంధ్రకేసరి, శోభ,ప్రజాహిత,వనితా జ్యోతి వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

ఈమె భర్త శ్రీ నందగిరి వెంకట్రావు గారు,సమాజ సేవకుడు ప్రముఖ న్యాయవాది,న్యాయమూర్తి ఉద్యమకారుడే కాక ఆంగ్ల, తెలుగు,ఉర్దూ భాషలలో ప్రసిద్ధ కథా రచయిత 1926 – 1935 మధ్యకాలంలో 50 కి పైగా కథలు రాశారు. గిరి అనే కలం పేరుతో వారు రాసిన కథలు భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సమదర్శిని, సుజాత, గోలకొండ పత్రికలలో
అచ్చు అయ్యాయి.

ఇందిరా దేవి రచనలలో హాస్య రసం పాలు ఎక్కువ. సాహిత్యంలో వారికి హాస్యం అంటే చాలా ఇష్టం.
“నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్న జంధ్యాల వారి
హాస్యోక్తికి నిలువెత్తు నిదర్శనం ఇందిరాదేవి.
అందుకేనేమో
2006లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారు వీరి హాస్య రచనలకు “ధర్మనిధి” పురస్కారాన్ని అందజేశారు.

వడ్లకొండ కుటుంబంతో మా అనుబంధం

శ్రీమతి నందగిరి ఇందిరా దేవి 1940 దశకం నుండి తెలంగాణా సాహితీ చరిత్ర లో తొలితరం తెలంగాణ రచయిత్రిగా,సమాజోద్ధరణ కర్తగా తన భుజాన వేసుకుని ఉన్నతమైన పాత్రను పోషించినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆమెకు పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు.

ఆమె ఎన్నో కథలు, వ్యాసాలు, వార, పక్ష మాసపత్రికలలో వచ్చినప్పటికీ
ముద్రణ రూపంలో ఒక సంకలనంగా చేసే ప్రయత్నం నేను అంటే డా.చీదెళ్ళ సీతాలక్ష్మి మా వారు పరిమి వెంకట సత్యమూర్తి తోనే మొదలైంది.

నందగిరి ఇందిరా దేవి గారి తమ్ముడు, వడ్లకొండ నరసింహారావు గారి కుమారుడు డాక్టర్ వడ్లకొండ రవీంద్ర గారు
కాలక్రమంలో మాకు మంచి ఆప్త మిత్రులయ్యారు.
వారు రాష్ట్ర
భూగర్భ జలశాఖలో డైరెక్టర్ గా పని చేసి పదవీ విరమణ చేశారు. వారి ధర్మపత్ని ఆచార్య
వడ్లకొండ స్వరాజ్యలక్ష్మి గారు ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. నారాయణ గూడా చౌరస్తా లోని వారి ఇంటికి మేము తరచుగా వెళ్తుండేవాళ్ళం.

డాక్టర్ వడ్లకొండ రవీంద్ర గారు మేము ఎప్పుడు వారి ఇంటికి వెళ్లినా
ఒక ఆడబిడ్డ ఇంటికి వచ్చిందని చాలా సంతోషపడి ఎంతో సేపు వదలకుండా కూర్చుని సంతోషంగా మాట్లాడుతూ గత విషయాలు ఎన్నెన్నో చెబుతూ వాళ్ళ నాన్న గురించి అక్కయ్య ఇందిరాదేవి గురించి వివరించేవారు.
ఈ సందర్భంలోనే
అక్కయ్య నందగిరి ఇందిరాదేవి రాసిన రచనలను ముద్రించాలనే తాపత్రయంతో మీరే చేయాలమ్మా ఆ పని అని వారు మేము చేస్తామన్న ధృడ విశ్వాసంతో మాకు ఇందిరాదేవి గారు రాసిన శుద్ధ
వ్రాత ప్రతులను మాకు
చూపించారు.అలా
నందగిరి ఇందిరాదేవి గారి రచనలను వింగడించి, ముద్రించి
ప్రజలకు చేరువ చేసే బాధ్యతను మాకు అప్పగించారు.

ఈలోపే రవీంద్రగారి అకాల మరణం చెందటం మమ్మల్ని చాలా వ్యధకు గురిచేసింది. తర్వాత కొంతకాలానికి ఆయన భార్య ఆచార్య స్వరాజ్య లక్ష్మి గారు ఇందిరాదేవి గారు స్వయంగా రాసిన వ్రాతప్రతితో పాటు మొత్తం మెటీరియల్ మా చేతిలో పెట్టారు.

2018 సంవత్సరంలో అప్పటి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ మెటీరియల్ అంతా చూపించాము. వారు చాలా సహృదయతతో నందగిరి ఇందిరాదేవి తెలంగాణ తొలి తరం గొప్ప రచయిత్రి అని మన అకాడమీ తరఫున తప్పక ముద్రిస్తామని చెప్పగా చాలా సంతోషించాము .

వారి ఆనతి మేరకు మెటీరియల్ ను మొత్తం విడదీసి మొదటి దశలో ఇందిరాదేవి రాసిన 13 కథలను “నందగిరి ఇందిరాదేవి కథలు” గా నామకరణం చేసి అకాడమీ ద్వారా నేను అంటే డా.చీదెళ్ళ సీతాలక్ష్మి మరియు మా శ్రీవారు పరిమి వెంకట సత్యమూర్తి సంపాదకులు గా వెలువరించడం జరిగింది. ఈ పుస్తకం
నందగిరి ఇందిరాదేవి శత జయంతి సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ సిద్ధారెడ్డి గారిచే 8 అక్టోబర్ 2018 సంవత్సరంలో రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో పెద్ద సభ నిర్వహించి ఆవిష్కరించడం జరిగింది.

తరువాత రెండవ దశలో ఆమె రాసిన 13 కథలను సేకరించి “నందగిరి ఇందిరాదేవి అమ్మమ్మ కథలు”అని
పేరు పెట్టి తెలంగాణ సాహిత్య అకాడమీ 2019 సంవత్సరంలో శతాబ్ది వేడుకల సందర్భంగా మా సంపాదకత్వంలో ముద్రించడం జరిగింది.
అలా మా ఇద్దరి సంపాదకత్వంలో నందగిరి ఇందిరాదేవి రెండు గ్రంథాలు వెలువడడం మాకెంతో గర్వకారణం.
ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రథమ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి గారికి తొలి కార్యదర్శి డా.ఏనుగు నరసింహారెడ్డి గారికి,వడ్లకొండ వారి కుటుంబానికి ఇక్కడే ఉన్న నందగిరి పుత్రుడు శౌరి గారికి ధన్యవాదములు.ఇంత చక్కని అవకాశం కల్పించిన అమెరికా వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు చిట్టెంరాజు గారికి నమస్కారం ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను.
శ్రీమతి నందగిరి ఇందిరాదేవి గారు ఇలా తన జీవితాంతం వరకు సాహిత్య సేవ చేస్తూ తన అవసాన దశలో 1998 సంవత్సరం నుండి అమెరికాలోని హ్యూస్టన్ షుగర్ ల్యాండ్ లో తన కుమారుని వద్ద ఉంటూ22 జనవరి 2007 సంవత్సరంలో తుది శ్వాస విడిచారు.

తొలి తెలుగు కథా రచయిత్రి బండారు అచ్చమాంబ అయితే, ఆ తరం లోనే వచ్చిన తెలంగాణ తొలి కథా రచయిత్రి నందగిరి ఇందిరాదేవి గారని చెప్పవచ్చు.

డాక్టర్ నందిని సిధారెడ్డి గారు అన్నట్టు తన సోదరి ఇందిరాదేవి కథలు గ్రంధరూపంలో చూడాలని కలలుగని తీరా కోరిక నెరవేరే సమయానికి అందరి నుంచి దూరమైన కీర్తిశేషులు డాక్టర్ రవీంద్రకు ఈ రెండు గ్రంథాలు నివాళిగా భావించవచ్చును.

September 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కవితలు

by Kayita Anusha September 14, 2025
written by Kayita Anusha

అనుభూతులు…


ఎందుకొ మాట మూగబోయింది.
తెలియడం లేదు అస్సలు ఏమయింది.
ఆలోచిస్తే ఎదో కొత్తగా ఉంది.
అనుభవిస్తే అర్థం అవుతుంది.
కొన్ని అనుభూతులు జీవితాన్ని
మార్చివేస్తాయని…
కొన్ని అనుభూతులు జీవితాన్ని
కలచివేస్తాయని…
కొన్ని అనుభూతులు జీవితాన్ని
అలరిస్తాయని…
జీవితం అంతా అనుభూతులు అనేవి,
సముద్రంలో అలల వలే జీవితంలో
ప్రతి క్షణం ఉంటాయి…

మెుక్క

చిన్న విత్తనం నుండి వెలువరిస్తూ…
మట్టి అనే గర్భం నుండి ప్రతిబింబిస్తూ…
రవిజలవాయువులతో అనుబంధాన్ని పెంపోదిస్తూ…
మనిషి జీవితాన్ని ఆయుష్షుతో మూడివేస్తూ…
సుమధురమైన సుహసన్ని వెదజల్లె పుష్పములను అందిస్తూ…
మనిషి జీవితాన్ని నీతో జతచేస్తూ…
ఈ భూమండలంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ…
చెడువాయువులను ఇష్టంగా స్వీకరిస్తూ…
ప్రతి జీవి యెుక్క జీవితాన్ని నడిపిస్తూంది…

September 14, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

“నాగరికత ఆవిష్కృత కళ – కుమ్మరి”

by Kancharla Mahesh September 14, 2025
written by Kancharla Mahesh

చెరువు గర్భం నుండి
మట్టిని తెచ్చి
అలంకరణ సృష్టిలో జీవం నింపి
బంగారు బింబాలకు శిల్పం చెక్కే
అద్బుత సృష్టి కర్త కుమ్మరి

సూర్యుని కిరణాలతో
మొదలయ్యే ఈ చక్రం,
నాగరికతకు ఊపిరి పోసి
మృత్తికా మంత్రమై చల్లని నీరందించి
గుండె తడిని తాకే సుజలం..

చక్రం చుట్టూ తిప్పుతూనే
కాలాన్ని కరిగించే
గరగ బుడ్డి కి
అద్భుతమైన రూపాన్ని ఆవిష్కరిస్తాడు…

పెళ్లికి పెద్దవై
ఇంటికి దీపానివై
కొత్తింటి వంటగదికి మట్టి సుగంధమై
దీపావళి రాత్రి వెలిగే దీపాల కాంతివై,
కుమ్మరి చెయ్యితో తయారైన సౌందర్య రేఖవి.

మట్టిలో మమకారం
కళలో కౌశలం
తరతరాలుగా వారసత్వం
చక్రం ఆగినా వారి కలలు ఆగవు..
మట్టిలో నుంచి మనిషి ఎదలను తాకుతారు.

పల్లెల గుమ్మంలో పొలిమేర ముంతలు..
వంటింటి పొగలో మట్టి వాసనలు,
బజారులో కుండల రాకపోకలు –
ఇవన్నీ కుమ్మరుల జీవన గీతాలు.

కష్టాల కడగడ్లు నిల్చిన
కళను విడవని మనసు,
ప్రపంచీకరణ వినాశనం..
కులవృత్తికి ఉరితాడు.
ఐనా
పల్లెకు బంధంగా
సమాజానికి సేవకుడిగా
లక్ష్య సాధన కృషివలుడిగా
వృత్తే జీవన సరళీగా
నడిపించే శాస్త్రవేత్త…

ఇలాంటి
మట్టి పరిమళాల చిట్టి కవిత
చక్రం తిరిగే శబ్దం వారి గీతం
వారి శ్రమ
మన సంస్కృతికి శిరోమణి.

September 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన — ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni July 31, 2025
written by Narendra Sandineni

అమ్మ కవిత
కవిత్వం ఓ విశ్లేషణ
ప్రముఖ కవి,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన నా లక్ష్యం – నా గమ్యం కవితా సంపుటిలోని అమ్మ కవిత పై విశ్లేషణా వ్యాసం.కవి క్రాంత దర్శి.రవి గాంచని చోటు కవి గాంచును అన్నది అక్షరాలా నిజం అనిపిస్తుంది. మల్లారెడ్డి పోరాటాల పురిటి గడ్డ అయిన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని పోతారం (జె) తుర్కవానికుంట గ్రామం రైతు కుటుంబంలో జన్మించాడు.మల్లారెడ్డి విద్యాభ్యాసం పోతారం (జె) గ్రామం,హుస్నాబాద్, సిద్దిపేట,హైదరాబాదులో కొనసాగించారు.మల్లారెడ్డి సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడే గులాబీ అనే పత్రిక నడిపాడు. మల్లారెడ్డికి చదువుకునే రోజుల్లోనే సాహిత్య సృజన పట్ల అనురక్తి పెరిగింది.మల్లారెడ్డి విద్యార్థిగా రాయడం ప్రారంభించి సాహిత్యాన్ని నిత్య కృషీవలుడుగా కొనసాగిస్తున్నాడు.నిరంతర అధ్యయనం,సునిశిత పరిశీలనా శక్తి ఉన్న వారే చక్కటి కవితలను రాయగలరు అని కవి మల్లారెడ్డి నిరూపించాడు.వ్యక్తి ఎదుగుదలకు కుటుంబం మరియు సమాజం ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పవచ్చును.తెలంగాణలో తొలి పోరాట యోధుడు మల్ దాదా యొక్క మనవడు మల్లారెడ్డి.మల్ దాదా కుమారుడు లింగా రెడ్డి కూడా పోరాట యోధుడు.మల్లారెడ్డి తాత,తండ్రి నుండి పుణికిపుచ్చుకొన్న సంస్కారంతో పీడితుల పక్షాన నిలిచాడు.మల్లారెడ్డి 1978 నుండి కరీంనగర్ లో వకీలు వృత్తిని కొనసాగిస్తున్నాడు.మల్లారెడ్డి అణగారిన వర్గాలకు అండగా ఉన్నాడు.మల్లారెడ్డి స్వగ్రామమైన పోతారం (జె) తుర్కవానికుంట గ్రామానికి సర్పంచిగా ఎన్నికైనాడు.గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు.మల్లారెడ్డి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘానికి కార్యదర్శిగా పనిచేసి సేవలందించాడు.రచయిత నరేంద్ర సందినేని,కవి మల్లారెడ్డిని వారి స్వగృహం వావిలాలపల్లిలో కలవడం జరిగింది.మల్లారెడ్డి కరీంనగర్ జిల్లాలో సీనియర్ న్యాయవాదిగా పని చేస్తున్నాడు.మల్లారెడ్డి రచించిన “నా లక్ష్యం– నా గమ్యం” కవితా సంపుటి చదవమని ఇచ్చాడు. మల్లారెడ్డి ఆఫీసులో కేసులకు సంబంధించిన ఫైళ్లు మరియు న్యాయవాద వృత్తికి సంబంధించిన జర్నల్స్ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు వారి లైబ్రరీలో నిండి ఉన్నాయి.రచయిత నరేంద్ర సందినేని మల్లారెడ్డితో సాహిత్య విషయాలతో పాటు న్యాయవాద వృత్తికి సంబంధించిన విషయాలను గురించి కూడా చర్చించడం జరిగింది.రచయిత నరేంద్ర నాన్నగారు ఎస్. కె. పిళ్ళే ప్రముఖ కవిగా ప్రసిద్ది పొందారు.ఎస్ కె పిళ్ళే సమాజ అభ్యున్నతి కాంక్షించి చక్కటి రచనలు అందించాడు.ఎస్.కె.పిళ్ళే తెలంగాణ సాయుధ పోరాటంలో అమృత లాల్ శుక్ల గారలతో కలిసి పని చేశారు.మల్లారెడ్డి ఎస్.కె పిళ్ళేను జ్ఞాపకం చేశాడు. కవి,మల్లారెడ్డి నా లక్ష్యం– నాగమ్యం కవితా సంపుటిలోని అమ్మ కవితలోని చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి.చక్కటి అనుభూతులను సొంతం చేసుకోండి.

“అమ్మ ఎన్ని కొమ్మల చెట్టు/అంటున్నారు.ప్రకృతి అంటే అమ్మ.ప్రకృతి అంటే చెట్లు చేమలు.ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనలను తల్లిలా కాపాడుతుంది.వృక్షో రక్షతి రక్షితః అని శాస్త్రాలు చెబుతున్నాయి.మనం చరిత్ర పుస్తకాలు చదివితే కళింగరాజు అశోకుడు చెట్లు నాటించాడు అని చదివాం.ఆనాటి రాజులు మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు.ప్రజల అభ్యుదయానికి తోడ్పాటు అందించారు.ఆనాటి రాజులు మానవ నాగరికత వికాసానికి తమ వంతు సాయం అందించారు.ఏపుగా పెరిగిన చెట్టు నీడన ఎండన వెళ్ళే బాటసారి సేద తీరతాడు.వర్షం కురుస్తున్నప్పుడు కూడా తడవకుండా ఉండటానికి చెట్టును ఆశ్రయిస్తారు.చెట్ల కట్టెలతో వంట చేసుకుంటారు.చెట్ల కలపతో దర్వాజాలు, తలుపులు,కిటికీలు,దూలాలు,కుర్చీలు,బల్లలు మరియు పారిశ్రామిక కార్యకలాపాలకి కూడా ఉపయోగిస్తారు.పేదవాడి ఏసీ.రూం చెట్టు.ఎందరో పేదవాళ్లు చెట్ల కిందనే ఆవాసాలు ఏర్పరచుకుంటూ జీవనం సాగిస్తున్నారు.స్వచ్ఛమైన గాలి చెట్లనుండి లభిస్తుంది.చెట్టు కార్బన్ డయాక్సైడ్ ను పీల్చి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది.చెట్లు కాలుష్యం దరిచేరకుండా నివారిస్తుంది.చెట్లు వాతావరణాన్ని పరిరక్షిస్తుంది.ఆకాశంలో కనిపించే నక్షత్రాల్లాగే అమ్మను ఎన్ని కొమ్ముల చెట్టు అనే మల్లారెడ్డి కవి భావన కల్పన కాదు,వాస్తవం అని మనం అర్థం చేసుకోవాలి.
“అమ్మలో ఎన్ని పూల మెట్లు/అంటున్నారు. పూల చెట్లను చూడండి.రకరకాల పూలు. రంగురంగుల పూలు.కనులవిందు చేసే పూలు.అవి మల్లెలు,బొండు మల్లెలు,బంతులు,చామంతులు, విరజాజులు,గోరింటలు,నంది వర్ధనాలు, కనకాంబరాలు,జాజి పువ్వులు,కట్ల పూలు,తంగేడు పూలు,గుమ్మడి పూలు,తెలుపు,ఎరుపు,పసుపు,నీలి పువ్వులు.పూలతో దేవుని పూజిస్తారు.శుభకార్యాల్లో గృహంలో దర్వాజాలకి పూలదండలు కడతారు. స్త్రీలు తమ సిగలను పూలతో అలంకరించుకుంటారు.అశుభకార్యాల్లో కూడా వ్యక్తి చనిపోతే అతన్ని పూలతో అలంకరిస్తారు. చనిపోయిన వ్యక్తిని పూలతో సాగనంపుతారు. సన్మాన సభల్లో సన్మానిస్తూ పూలదండలు వేస్తారు. పూలు శాంతికి ప్రతిరూపాలు.పూలు లోక కళ్యాణానికి తోడ్పాటు అందిస్తాయి.పూలు సకల జనసౌఖ్యానికి మరియు శాంతికి ప్రతీకలు అని తెలుస్తుంది.అమ్మలో ఎన్నో పూల మెట్లు దాగి ఉన్నాయి అని కవి మల్లారెడ్డి తెలియజేస్తున్నాడు.

“నిజానికి అమ్మనే ఒక సతత హరితారణ్యమ్ ‘ఒట్టు/ అంటున్నారు.అమ్మను సతత హరితారణ్యముతో పోల్చాడు.కవి మల్లారెడ్డి ఒట్టు పెట్టి ప్రమాణం చేస్తున్నాడు.పచ్చని చెట్లతో పక్షుల కిలకిలా రావాలతో జంతువుల అరుపులతో ఆహ్లాదంగా అరణ్యం కళకళలాడుతుంటుంది.మనం ఇంటి వద్ద కానీ,మరెక్కడైనా కానీ,పంచాయతీలో కానీ,ఒట్టు పెట్టుకుంటే అమ్మతోడు అని అంటాం.దేవుని తోడు అని కూడా అంటారు.ఒట్టు అంటే ప్రమాణం చేయడం.అమ్మ పట్ల చెప్పలేనంత భక్తి,అనురక్తి, నమ్మకం మరియు అంత ప్రాధాన్యత ఉంది.
“ఒక పరిపూవులా నవ్వుతుంది అమ్మ/అంటున్నారు.
నవ్వు టానిక్ లాంటిది.నవ్వు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.నవ్వితే శారీరక మానసిక రోగాలు నయమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు.లాఫింగ్ థెరపీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.లాఫింగ్ థెరపీని ఆచరించి ఎందరో తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకుంటున్నారు.అమ్మ నవ్వులో అనురాగపు జల్లులు కురుస్తాయని కవి మల్లారెడ్డి తెలియజేశాడు.
“ఎంత పరిమళమో అమ్మ నవ్వు/ అంటున్నారు. అమ్మ నవ్వులో గులాబీలు,మల్లెలు,బంతులు, చామంతుల పరిమళాల సుగంధాలు వ్యాపిస్తాయి. పూల పరిమళాలను గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.
“మరుక్షణమె తేనెలా కురుస్తుంది అమ్మ/ అంటున్నారు.ఆయుర్వేదం,ఆల్లోపతి, హోమియోపతి,యునాని వైద్యంలో మరియు పతంజలి మహర్షి మరియు చరకుడు,హోమియో వైద్య పితామహుడైన హనిమన్ మహాశయుడు మొదలుకొని అలనాటి ఋషుల పరంపర మరియు ఈనాటి ఆధునిక వైద్యంలో తేనె ప్రాముఖ్యత గురించి చెప్పబడింది.తేనె త్రాగడం వల్ల ఎన్నో జబ్బులు నయమౌతాయి,శారీరక మానసిక శక్తులు వికాసం పొందుతాయి.అమ్మ ఎప్పుడు అలసట ఎరుగక ఉల్లాసంగా ఉంటుంది.అమ్మ కుటుంబాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది.అమ్మ కుటుంబ సంక్షేమం కొరకు తన తనువును మనసును ఏకాగ్రం చేసి పనిచేస్తుంది.కవి మల్లారెడ్డి తేనెలా కురుస్తుంది అమ్మా అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఎన్ని తీయదనాలో అమ్మలో/అంటున్నారు.చంటి పిల్లవాడికి అమ్మ పాల తీయదనం గురించి తెలుసు. చెరుకుతో తయారైన పంచదార,బెల్లం ఎంతో తీపిగా ఉంటుంది.అమ్మ ఏది చేసినా అమృతంలా ఉంటుంది.అమ్మ మనసు తీపి అని కవి మల్లా రెడ్డి తెలియజేయడం చక్కగా ఉంది.
“ అమ్మ ఒళ్ళు నిమిరితె ఎంత పారవశ్యం/ అంటున్నారు.అమ్మ ఒళ్ళు నిమిరితే ఆ పాప ఎంతో పారవశ్యంతో పొంగిపోతుంది.అమ్మ చేయి తాకగానే పాప ఆనందంతో ఓలలాడుతుంది.అమ్మను చూడగానే పాప కేరింతలు కొడుతుంది.అమ్మ లాలనలో పాప ఆనంద తాండవం చేస్తుంది అని కవి మల్ల రెడ్డి తెలియజేస్తున్నాడు.
“అమ్మ మాటలే మమతల మూటలు/అంటున్నారు.
పసిపాపకు అమ్మ మాటలే మమతానురాగాల మూటలు.తల్లి భాషను పసిపాప అర్థం చేసుకుంటుంది.అమ్మ స్పర్శ కోసం పసిపాప తపించిపోతుంది.పసి పాపకు అమ్మే కద ప్రాణం మరియు వెలుగు అని చెబుతున్నాడు.
“అమ్మ కళ్ళు నిజాయితీకి ఆనవాళ్లు/అంటున్నారు.
ఇప్పుడున్న వ్యవస్థలో నిజాయితీని వెదకడం చాలా కష్టంగా అనిపిస్తుంది.ఎటు చూసినా అవినీతి,ఆశ్రిత పక్షపాతం,బంధుప్రీతి ఆవరించి ఉంది.కానీ ఈ వ్యవస్థలో అమ్మ కళ్ళు నిజాయితీతో నిండి ఉంటాయి.అప్పటికి,ఇప్పటికీ,ఎప్పటికీ పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే అనే సినీ గీతం మన విని ఉన్నాం. అలాగే అమ్మ కళ్ళు కూడా నిజాయితీకి ఆనవాళ్లు అనేది సత్యం అని కవి మల్లారెడ్డి తెలియజేస్తున్నాడు.
“ఎన్నో ధీర గుణాలకి నకళ్ళు ఆ కళ్ళు/అంటున్నారు.
ఛత్రపతి శివాజీని తీర్చిదిద్దింది తల్లి జిజియాబాయి. మనం అతన్ని వీర శివాజీ అని పిలుస్తాం. “అమ్మ ఒక్క చూపు చాలు సుదూర గమ్యం చేరడానికి/అంటున్నారు.అమ్మ యొక్క చల్లని చూపు ఆశీర్వాదాల వల్లనే ఎందరో పిల్లలు ఉన్నత విద్య కొరకు ఉద్యోగాల కొరకు అమెరికా,ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్,న్యూజిలాండ్,జర్మనీ,కెనడా మరెన్నో విదేశాలకు వెళ్లి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు.విదేశాల్లో స్థిరపడుతున్నారు.తమ దేశం యొక్క ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారు.
“ఎన్ని గండాలను గట్టెక్కించింది అమ్మ/ అంటున్నారు.అమ్మ నవ మాసాలు మోసి పసిపాపను కంటుంది.ఆ పసిపాపను పెంచి విద్యాబుద్ధులు నేర్పించి పెద్దవాన్ని చేస్తుంది.ఎన్ని గండాలు ఎదురైనా గట్టెక్కిస్తుంది అమ్మ.కవి మల్లారెడ్డికి అమ్మ పట్ల ఆనిర్వచనీయమైన ప్రేమ,నమ్మకం,విశ్వాసం ఉన్నట్లు తెలుస్తుంది.
“చిన్ని బ్రతుక్కి అమృత బాండమైంది అమ్మ/అంటున్నారు.మనం పురాణాలు చదివితే అమృతం దేవతలకి మాత్రమే లభించింది.కానీ రాక్షసులకు అమృతం దొరకలేదు.అమృతాన్ని గ్రోలిన వారు అమరులై ఉంటారంటారు.చిన్నారులు అమ్మ ప్రేమతో అమృత భాండాన్ని అందుకుంటున్నారు.
“నిజానికి అమ్మ సమస్త సమాజానికి అధి దేవత/ కొలిస్తేనే కాదు పిలిస్తేనే కాదు – /తనంత తానే ఒక శక్తిపీఠవుతుంది అమ్మ/ అంటున్నారు.అమ్మను దుర్గామాతగా కొలుస్తారు.సకల దేవతల స్వరూపం అమ్మ.రామకృష్ణ పరమహంస కాళీమాత ఉపాసకుడు.రామకృష్ణ పరమహంస శిష్యుడే స్వామి వివేకానంద.అమ్మ సకల మానవాళి సంక్షేమాన్ని కోరుతుంది.అమ్మకు సంబంధించిన ఆలయాలన్నీ శక్తి పీఠాలే.అమ్మను ఆరాధించడం వల్ల సకల భయాల నుండి సంకటాల నుండి అరి‌‌ష్ఠాల నుండి ఆమె నివారిస్తుంది.
“సంకల్పబలమనే స్తన్యమిచ్చి పెంచింది అమ్మ/ అంటున్నారు.అమ్మ పాలు తాగి సంకల్ప బలంతో వీర శివాజీ,నేతాజీ సుభాష్ చంద్రబోస్,భగత్ సింగ్,చంద్రశేఖర్ ఆజాద్ మరెందరో వీరులు మన భారతదేశం స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారితో పోరాడి వీరులుగా పేరు తెచ్చుకున్నారు.
“అమ్మనే జీవితానికి భూమిక దిగంతాలకి వేడుక/అంటున్నారు.అమ్మలేని జీవితం లేదు.అమ్మే కద అన్నిటికీ మూలం మరియు అమ్మ ఆకాశానికి వేడుక అని కవి మల్లారెడ్డి చెప్పాడు.
“మాతృదేవోభవ నమో నమామి/అంటున్నారు. అమ్మని దేవతగా ఆరాధించమని మన పురాణాలు చెపుతున్నాయి.అమ్మని పూజిస్తే దైవాన్ని పూజించినట్లే.కనిపించే దైవం అమ్మ.కానీ ఈనాడు ఎందరు తమ ప్రత్యక్ష దైవమైన తమ తల్లులను పూజిస్తున్నారు?.అహంకారం తలకెక్కి తల్లులను క్షోభకు గురి చేస్తున్నారు.వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలివేస్తున్నారు.తల్లుల పట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదు.బంధాలు బాంధవ్యాలను మరిచి పోతున్నారు.మమతానురాగాలకకు మసి పూస్తున్నారు.మన ప్రభుత్వాలు తల్లుల సంక్షేమం కోసం ఎన్ని చట్టాలు చేసినప్పటికీ అవి చట్టు బండలుగా మారుతున్నాయి.అమ్మను ఆప్యాయంగా పలకరించుకొనే సంప్రదాయం పల్లెలోనే ఉండేది.ఇప్పుడు ఆ పల్లెలు అన్ని ఖాళీ అయిపోతున్నాయి.వర్షాలు ఉండవు.కరువులు కాటకాలు.ఉన్న ఊరిలో ఉపాధి కరువై పల్లె జనాలు పట్టణాలకి విదేశాలకి వలస వెళుతున్నారు.పాడి పంటలతో తులతూగే పల్లెలు ఈనాడు వల్లకాడుగా మారుతున్నాయి.మరుభూమిని తలపింపజేస్తున్నాయి.పాత ఇండ్లు అన్నీ కూలిపోతున్నాయి.రోజులన్నీ మారిపోతున్నాయి. ఒక తల్లి పిల్లలే పాలి పగలు పెంచుకొని చంపుకుంటున్నారు.కన్నతల్లులను నిరాదరణకి గురి చేస్తున్నారు.తల్లులను ప్రేమించడం లేదు.తల్లులను ప్రేమించలేని వారు తమ వ్యక్తిత్వం,సంపద మరియు ఉన్నతమైన విలువలను కోల్పోతున్నారు.తల్లుల్ని ప్రేమించిన వారికి కామధేనువులా,కల్ప వృక్షంలా కోరినవన్నీ లభిస్తాయి అనే విషయాన్ని మర్చిపోతున్నారు.అమ్మను జగదాంబ,ఆదిశక్తి, పరాశక్తి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.అమ్మ గురించి చక్కటి కవిత రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి గులాబీల మల్లారెడ్డి మరిన్ని మంచి కవిత సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

July 31, 2025 137 comments
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us