మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

చిత్రమైన చైత్రమాసం..

by Damaraju Vishalakshi March 19, 2026
written by Damaraju Vishalakshi

చైత్రమాసంలో వసంత ఋతువు వస్తుంది. మోడులను చిగురింప చేసి మనోహరంగా ప్రకృతిని మార్చి వేస్తుంది.
ఈ చిత్రాలు చేసే చైత్రమాసం 60 సంవత్సరాల మన కాలచక్రంలో మొదటిది. అందుకే పెద్దలు 60 సంవత్సరాల కాలాన్ని ఒక మహా విపంచిగా భావన చేశారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తంత్రి పలుకుతుందట.

మన సంప్రదాయంలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంది.. సంవత్సరాన్ని ఆరుఋతువులుగాను
12 మాసాలుగాను ,రెండు అయినాలుగాను ,విభజించారు మన పూర్వులు.రెండేసి మాసాలకు ఒక ఋతువు చొప్పున ఆరు ఋతువుల్లో 12 మాసాలు అమరిపోతాయి.. చెట్లన్నీ పూలతో, సరస్సులన్నీ పద్మాలతో , స్త్రీ పురుషులు కాముక భావంతో అలరారుతున్నారని వర్ణిస్తాడు కాళిదాసు…
చైత్ర శుద్ధ పాడ్యమని ఉగాదిగా యుగాది నుండి ఆరాధిస్తూ వస్తున్నాం.. పూర్వం మన పెద్దలు చెప్పిన మాట ప్రకారం పుష్యమాసం మంచు కురిసే సమయంలో హేమంత ఋతువులో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండేటప్పుడు పోషణ శక్తి కలిగి ఉంటాడు కాబట్టి పుష్య పున్నమినాటి రాత్రి సిద్ధాంతులు తెల్లని నూతన వస్త్రాన్ని గాని దూదిని గాని మంచులో ఉంచి ఆ మరునాడు దానిని పిండి ఆ ప్రక్రియలో వచ్చే నీటి చుక్కల్ని బట్టి పంచాంగ రచన చేసే వారినీ, ఎన్ని చుక్కలు నీరు పడితే అన్ని కుంచాల వర్షం కురుస్తుందని అంచనా వేసే వారనీ,
తిథి వార నక్షత్ర కరణ యోగాలను గణించి, చైత్ర శుద్ధ పాడ్యమినాడు పంచాంగాన్ని చెప్పే వారని ప్రతీతి. ఇదే ఆచారంగా ఇప్పటికీ తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజైన ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేస్తారు..
తీపి, కారం , పులుపు , ఉప్పు , చేదు , వగరు కలిపిన ఆరు రుచుల పచ్చడిని తిని పగలు, రాత్రి , చీకటి , వెలుతురు , సుఖం , దుఃఖం అనే మానసిక వికారాలను అధిగమించడానికి నాందిగా ఉగాదిని జరుపుకుంటారు.
తిథి, వార , కరణ , నక్షత్ర , యోగ కారణాలు రోగాలను తొలగించి సమస్త శుభాలను కలుగచేయడం ఉగాది నుండే ప్రారంభం అవుతుందని గొప్ప విశ్వాసం. ఈ ఉగాది వసంత ఋతువులో చైత్రమాసంలో మొదటి రోజున వచ్చి భవిష్యత్తు ఆశలను చిగురింప చేస్తుంది….
కొన్ని ప్రాంతాలలో ఉగాదినాడు ఏరువాక ముహూర్తం కూడా పెట్టుకుని ఆరోజే నూతనమైన కార్యక్రమాలు అన్నిటికీ శ్రీకారం చుడతారు.
వసంతం ప్రకృతికాంతకు సీమంతం.. వసంతాన్ని మధుమాసం అని , మాధవ మాసమని కూడా అంటూ ఉంటారు. మాధవుడంటే విష్ణువు మాధవునికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి దీన్ని మధుమాసం అంటారంటారు.
మనసును చలింప చేసే మాసం వసంత ఋతువుగల చైత్రమాసం కాబట్టి దీన్ని మన్మధ మాసం అని కూడా అంటారు. వసంతంలో చెట్లన్నీ చిగుర్లు వేస్తాయి. ఎర్రగా పూచే మోదుగు పూలు , మల్లెలు , మొల్లలు , జాజులు, విరజాజులు , నందివర్ధనాలు , గరుడ వర్ధనాలు కనులవిందు చేస్తాయి. ముఖ్యంగా పూలు పరిమళించి, మహిళల
మనసులను రంజింపజేస్తాయి.. రాజుల కాలంలో ఈ వసంత రుతువులో అద్భుతమైన కార్యక్రమాలు , సాంస్కృతిక కార్యక్రమాలు , వేడుకలు నిర్వహించేవారు.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తీర్థాలు, పరసలు, అమ్మవారి పండగలు ఉగాది నుండే ప్రారంభమవుతాయి.. తెలుగు ప్రాంతంలో కూడా వసంత ఉత్సవాలు జరుపుకొనే సంప్రదాయమున్నది. “ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకుని వచ్చింది” అంటారు మన శ్రీశ్రీ గారు.
ఈ ఋతువులో ప్రకృతి సోయగాలు చూడడానికి రెండు కళ్ళుచాలవు… భగవంతుని మాయాజాలమే..
ప్రతి ఋతువు అందాలు చిందించినా, వసంత సోయగాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఈ ఋతువును ఋతువుల రాణి అన్నారు. ఈ నక్షత్రం సమయం లో అత్యంత ఆహ్లాదకరమైన వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజు,
దైవం మానస రూపేణా అన్న విధంగా,,మానవ ధర్మాలను విడమర్చి చెప్పడానికి ఆచరించి చూపిన శ్రీరామచంద్రుడు ఇనవంశంలో జన్మించాడు..తల్లిదండ్రులను దైవాలుగా భావించడానికి అన్నదమ్ములను ఆదరించడానికి, సేవకులను సంతోష పరచడానికి, ప్రజలను కన్న బిడ్డల వలె పాలించడానికి,, ముఖ్యంగా ఆలుమగల అనురాగానికి నిలువెత్తు నిదర్శనమైన సీతారాముల కళ్యాణం రామచంద్రుడు జన్మించిన నక్షత్రం నాడే .. అంటే, శ్రీరామనవమినాడే ఉత్సవంగా జరుగు తుంది ..రామ కళ్యాణం లోక కళ్యాణం అని భారతదేశం అంతటా బ్రహ్మాండంగా జరుపుకుంటారు.. ముఖ్యంగా మనతెలుగువారు సంప్రదాయబద్ధంగా తాటాకు పందిళ్లు వేసి, సీతారాములచే తలంబ్రాలు పోయించి, అయోధ్య రామయ్య అన్నయ్య మాకు … వాలు కనుల సీత వదినమ్మ మాకు … అంటూ మురిసిపోతూ ఆ కళ్యాణ ఘట్టాన్ని వీక్షిస్తారు.. రామ కళ్యాణపు అక్షితలను శిరస్సున ధరించి తమ జీవన మార్గానికి సోపానాలు వేసుకుంటారు……
ఉత్తరాది వారికి అత్యంత ప్రియమైన హోలీ పండుగ ఈ మాసంలోనే వస్తుంది . ఆటలతో పాటలతో సందడిగా, ఐకమత్యంగా రంగులు జల్లుకుంటూ ఆనందంగా ఉత్సవాలు చేసుకుంటారు..

చిత్రాల చైత్రం శోభిల్లుతూ మదమాసం కావున మన్మధ భావాలు రేకెత్తిస్తూ మనోహరంగా సాగిపోతుంది.
సంవత్సరాది తో పాటుకళ్యాణాలతో కమనీయంగాసాగిపోయే మాసమిది.
నాటి రాజులలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు వసంతోత్సవాలు నిర్వహించి కవి పండితులను సత్కరించే వారని ప్రసిద్ధి . అదేవిధంగా కొండవీటి రాజులు కూడా వసంతోత్సవాలను కడువైభవంగా జరిపే వారట కర్పూర వసంతరాయులని అందుకే అతనికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు వచ్చింది .
రామాయణంలో, మహాభారతంలో, ఈ ఋతువర్ణనలు అద్భుతంగా జరిగాయి.. చైత్రమాసంలో జైత్రయాత్రలు చేసినట్లు ప్రబంధాల్లో వర్ణింపబడి ఉంది… వన విహారములు, ,జలవిహారాలు ఈ మాసంలో జోరుగా సాగుతాయి..
ఋతుసంహారమే ప్రధాన కావ్యం గా రచించిన, కవి కుల గురువు కాళిదాసు,వసంత ఋతువు గురించి అద్భుతంగా వర్ణించారు..కవిత్రయంలో ఎర్రన, భాగవతం లో పోతన, మనోహరంగా ఋతువులను వర్ణిస్తే …. ప్రబంధ కవులలో
అల్లసాని పెద్దన, చక్కగా వర్ణించారు.. వసంత ఋతువు రాగానే దేవకాంతలు హిందోళ రాగం లో గానం చేశారట . ఉగాది ని చైత్ర శుద్ధ పాడ్యమినాడుజరుపుకొని, గున్న మామిడి గుబురులలోంచి కూస్తూ హుకు హు రాగాల కోయిలమ్మను పిలుస్తూ, పంచాంగ శ్రవణంలో పరవశించిపోతూ,,
ఆరు రుచుల పచ్చడిని ఆస్వాదిస్తూ వసంత ఋతువు కు స్వాగతం పలుకుతాం..

భారతీయ సంస్కృతిలో కాలాన్ని అత్యంత పవిత్రమైన తత్వంగా భావించారు . కాలమే సృష్టికి ఆధారం . కాలమే జీవన చక్రాన్ని నడిపించేది . అందుకే కాలాన్ని మన పూర్వీకులు పండగగా జరుపుకునే సంప్రదాయాన్ని అర్పరిచారు . తెలుగు ప్రజలు ఆ సంవత్సర ఆరంభ దినాన్ని ఉగాది అనే పేరుతో మహోత్సవంగా జరుపుకుంటారు ఉగాది అనే శబ్దం సంస్కృత పదం యుగాది నుండి వచ్చింది. ఉగాది అనే పదం యుగానికి .. అంటే, సంవత్సరానికి మొదటి రోజు అనంటారు. ఉగాది అంటే యుగానికి ఆది అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం అని అర్థం . భారతీయ కాల గణన ప్రకారం సంవత్సరాన్ని 12 మాసాలుగా విభజించారు . అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, , శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణ మాసం అనే పేర్లతో పిలుస్తాం. ఈ 12 మాసాలను వాటికి గల ప్రకృతి లక్షణాల ప్రకారం మారుతున్న విధానానికి సరిపడా విభజించారు . వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలు , గ్రీష్మఋతువు జ్యేష్ట ఆషాడ మాసాలు , వర్షఋతువు శ్రావణ భాద్ర పదమాసాలు, శరదృతువు ఆస్వాయుజ కార్తీక మాసాలు , హేమంత ఋతువు మార్గశిర పుష్య మాసాలు , శిశిర ఋతువు మాఘ ఫాల్గుణ మాసాలు. ఈ ఆరు ఋతువుల్లో వసంత ఋతువు ను అత్యంత సౌందర్యమయమైన ఋతువు గా వర్ణించారు . ప్రకృతి మళ్లీ పునర్జన్మ పొందినట్లుగా కనిపించే సమయంలో ముఖ్యమైన సమయం ఇదే . చెట్లన్నీ కొత్త చిగురులను అలంకరించుకొని, పూలు వికసించి, పక్షుల కిలకిల రావాలతో భూమి ఎంత అందంగా నిండిపోతుంది . అందుకే వసంతాన్ని ఋతురాజు అని కూడా పిలుస్తారు . ఈ వసంత ఋతువు ప్రారంభమయ్యే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు ప్రజలు ఉగాది పండుగ జరుపుకుంటారు . ఈరోజు ప్రకృతి నవచైతన్యంతో నవ నవీనంగా ప్రకాశిస్తూ మన జీవితాలలో కూడా కొత్త ఆశలను చిగురించేలా కనిపించి పరవశింప చేస్తుంది . అందుకే కొత్త ఆశలు ప్రారంభం కావాలని సంకల్పిస్తారు మనవాళ్ళు.

ఉగాది పండుగ రోజు ఉదయాన్నే లేచి , స్నానం చేసి, ఇల్లంతా శుభ్రం చేసి , మామిడాకుల తోరణాలతో అలంకరించి , ముంగిళ్ళలో రత్నాల ముగ్గులు తీర్చిదిద్ది, నూతన వస్త్రాలు ధరించి , ఉగాది పచ్చడిని తయారు చేసి , అందరూ సేవిస్తా రు. అందులోని ఆరు రుచులు తీపి పులుపు చేదు కారం ఉప్పు వగరు మన జీవితాలలో కలిగే ఆనందం కోపం ఆశ్చర్యం భయం అంటే అనుభవాలను సూచిస్తాయని భావిస్తారు . చాలావరకు చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో కూడా అమ్మవార్లకు ఉత్సవాలు తీర్థాలు పండగలు పరసలు జరుగుతూనే ఉంటాయి.ఉగాదికి ముందు రోజు అమావాస్య కొత్తమవాస్య అని పిలుస్తారు అమావాస్యనాడు అమ్మవారిని ఆరాధిస్తూ ఉత్సవాలు చేస్తారు.
ఈ రోజున మరొక ముఖ్యమైన పండగ అంటే ఈ పండగలో ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం.
ఈ పంచాంగం తయారు చేయడంలో కూడా ఆ కాల గణనను చేయడంలో ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తారని పెద్దల ఉవాచ . పుష్య మాసంలో సంక్రాంతికి పూజలు చేసి కాలపురుషునికి నమస్కరించి నిష్టాగరిష్ఠులైన పండితులు ఇంటిపై ఒక తెల్లని వస్త్రాన్ని సాయం సంధ్యా సమయంలో ఆరవేసి, ప్రాతఃకాలంలో అనుష్టానం అయిన తర్వాత ఆ వస్త్రాన్ని ఒక పాత్రలో పిండుతారని అలాగా ఆ నెల రోజులు పిండిన మంచు నుండి వచ్చిన బిందువులను లెక్కిస్తూ కాలగణన చేస్తారని చిన్నప్పుడు పెద్దలు చెప్పేవారు. ఆ విధంగా పంచాంగం లెక్కలు కడతారని నమ్మేవారు.
పంచాంగంలో ఆ సంవత్సరానికి సంబంధించిన గ్రహగతులు రుతువులు మార్పులు పండుగలు శుభకాలాలు మొదలైన విషయాలు వివరింప బడతాయి .
పంచాంగంలోని ఐదు ప్రధాన అంగాలు 1. తిథి 2. వారం 3. నక్షత్రం 4. యోగం 5 కరణం.ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఒకటి తిథి
చంద్రుడు సూర్యునితో సంబంధించి పొంది కోణాంతరాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడే కాలాన్ని తిథి అంటారు
ఒక నెలలో 30 తిథులు ఉంటాయి
15 రోజులు ఒక పక్షం. మాసంలో రెండు పక్షాలు ఉంటాయి. 15 తిథులు ఒక పక్షంలో వస్తాయి.
అవి వరుసగా పాడ్యమి ,విదియ, తృతీయ ( తదియ) , చతుర్థి( చవితి) , పంచమి , షష్టి, సప్తమి , అష్టమి , నవమి , దశమి , ఏకాదశి, ద్వాదశి , త్రయోదశి, చతుర్దశి , పౌర్ణమి ఇవి శుక్లపక్ష తిథులు.
కృష్ణపక్షంలో పాడ్యమి నుండి చతుర్దశి వరకు తిథులు యధాతథంగా వచ్చి 15వ రోజు అమావాస్య వస్తుంది.
వారం వారం అంటే వారంలోని రోజుల వ్యవస్థ. భారతీయ సంప్రదాయం ప్రకారం ఏడు వారాలు ఉంటాయి. అవి వరుసగా ఆది , సోమ , మంగళ , బుధ , గురు , శుక్ర , శనివారాలు. ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు.
నక్షత్రం విషయాలు చెప్పుకుంటే, చంద్రుడు తన ప్రయాణంలోని 27 నక్షత్రాలను దాటి సాగుతాడు . చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడో ఆ రోజు నక్షత్రంగా చెప్పబడుతుంది . ఉదాహరణకు అశ్వనీ , భరణి , కృతిక , రోహిణి , మృగశిర , ఆరుద్ర, పునర్వసు , పుష్యమి , ఆశ్లేష , మఖ, పుబ్బ , ఉత్తర , హస్త , చిత్త, స్వాతి , విశాఖ , అనురాధ, జ్యేష్ట, మూల , పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం , ధనిష్ట, శతభిషం , పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర , రేవతి. చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కూడియున్నది ఆశ్వీజ మాసం అని భరణితో కూడియున్నది బాధపడమాసం అనీ, కృత్తికతో కూడియున్నది కార్తీక మాసం ఇలా చెప్పబడతాయి..

ఇక యోగము …. సూర్యుడు, చంద్రుడు కలిసి ఏర్పడే గణిత సంబంధం ఆధారంగా యోగాలు నిర్ణయింపబడతాయి . మొత్తం 27 యోగాలు ఉంటాయి .
ఉదాహరణకు నిష్టం బయోగం ప్రీతియోగం ఆయుష్మాన్యోగం సౌభాగ్య యోగం మొదలైనవి.
ఐదు కరణం- తిథి యొక్క అర్థ భాగాన్ని కరణం అంటారు . మొత్తం 11 కరణాలు ఉంటాయి . ఉదాహరణకు
బావ కరణం బాలవకరణం, కొలవకరణం, తైతిల కరణం, గరజ కరణం వణిజ కరణం మొదలైనవి..
పంచాంగంలో ఉండే ఇతర విషయాలు…
పంచాంగంలో ఈ ఐదు అందాలతో పాటు మరికొన్ని విషయాలు కూడా ఉంటాయి.
ఒకటి సంవత్సర నామం మాసాలు పండగల తేదీలు , గ్రహణాలు , శుభముహూర్తాలు , రాహుకాలం , యమగండం పాటించ వలసిన పద్ధతులు , ఉపాసనలు దీక్షలకు సంబంధించిన ముహూర్తాలు, వ్రతాలు ఉపవాసాలు మున్నగున వన్నీ ఉంటాయి .

ఉగాది రోజున పంచాంగ శ్రవణం ప్రాశస్త్యం.
ఉగాది రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపిస్తారు . దీనిని పంచాంగ శ్రవణం అంటారు.
పంచాంగం వినడం వలన, ఆ సంవత్సరంలో వర్షపాతం ఎలా ఉంటుంది, సహజ ఉత్పాతాలు, దొంగ భయాలు,
ఆర్థిక పరిస్థితులు, పశువులు పక్షులు, పశుపక్షాదులు, వారి పాలకులు . పాలితులు, యుద్ధాలు, యోచనలు
దేశ ప్రజల స్థితిగతులు గ్రహగతులు వంటి విషయాలను సాంప్రదాయం ప్రకారం సవివరంగా తెలియజేస్తారు . అందుకే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం శుభప్రదం . ఇది మన సంప్రదాయం.
పేరుపేరునా వారు పుట్టిన జన్మ నక్షత్రం నామ నక్షత్రం బట్టి ఆ సంవత్సర ఫలితాలు వారికి ఎలా ఉంటాయో పంచాంగ శ్రవణంలో తెలియచేస్తారు.
పంచాంగ శ్రవణ ఫల శృతి శ్లోకం..
“తిథేశ్చ శ్రీమాప్నోతి వారాదాయుష్య వర్ధనం ,
నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం
కరణాత్ కార్యసిద్ధిస్తు పంచాంగ శ్రవణం శుభం”
భావం – పంచాంగంలోని 5 అందాలను వినుటం వలన …. తిథి వలన ఐశ్వర్యం లభిస్తుంది . వారం వలన ఆయుర్దాయం పెరుగుతుంది . నక్షత్రం వలన పాపాలు తొలగిపోతాయి . యోగం వలన రోగాలు తగ్గుతాయి . కరణం వలన కార్యసిద్ధి కలుగుతుంది . అందువలన పంచాంగ శ్రవణం శుభప్రదమని ఈ శ్లోకం తెలియజేస్తోంది.

నూతన సంవత్సర మంగళ శ్లోకం….

సర్వే జనాః సుఖినోభవంతు సర్వే సంతు నిరామయా:
సర్వేభద్రాణి పశ్యంతు మా కశ్చిత్ ద్దు:ఖ భాగ్భవేత్ “
ఈ సంవత్సరం “పరాభవ” నామ సంవత్సరమని పరితపించే వారికి ఒక మాట . పరా అంటే పరాశక్తి త్రిపుర సుందరీ దేవి, భవ అంటే భవుడు శివుడు, “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరః” అని ప్రార్థించే ఆ పరమేశ్వరీ పరమేశ్వరులపేర్లను తనలో దాచుకున్న ఈ “పరాభవ నామ ” సంవత్సరం,మనలను పరాభవించాలనుకున్న శత్రువులను పరాభవానికి గురిచేసి ఆ పరాశక్తి పరమేశ్వరుల కృపతో జగత్ కళ్యాణ కారణమై అలరిస్తుందని ఆశిద్దాం .
మానవ జీవితమే ఆరు ఋతువుల సమ్మేళన అయినప్పుడు మధురమైన వసంత ఋతువు మానసికోలాసాన్ని కలిగిస్తుంది… సృష్టికి ఆరంభమైన ఈ ఈరోజు ఉగాది అంటూ ఉత్సాహంగా 60 వసంతాల కాలగమనంలో
అందంగా వచ్చే సుందర సంవత్సరంలో ఆదిమాసమైన చైత్రం అందాల మాసం.సుందర దరహాసం…
ఈ పరాభవ సంవత్సరం సమస్త సుఖాలను శుభాలను కలుగజేసి మానవతా భావంతో మనుషులందరూ వికసించేటట్లు చేయాలని ఆశిద్దాం..మన ఆశయం సిద్ధించాలని ఆశలు నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం..

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శత్రువుతో ప్రయాణం ` జండర్ స్పహ

by Devendra March 19, 2026
written by Devendra

ఈ ఉగాది
నాకు విరోధి
షడ్రుచులు వడ్డించిన
భూమి తల్లిపై
అత్యాచారం
అంటూ స్తీల పక్షాన నిలబడి అక్షరగొంతుకను వినిపించిన కవి, విమర్శకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ గారు. శ్రీశ్రీ కోరినట్లుగా పీడితుల పక్షాన నిలబడి అభ్యుదయ దక్పథంతో పయనిస్తున్నారు. ‘శత్రువుతో ప్రయాణం’ కవితా సంపుటిలో ఉన్న 36 కవితలు సమాజాన్ని అనేక కోణాల్లో ప్రశ్నిస్తాయి. మార్పుతో కూడిన మానవత్వాన్ని కోరుకుంటాయి. రాజకీయ రంగులను ఎండగడుతాయి. స్తీవాద ఉద్యమాన్ని సమర్థిస్తాయి.
అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా వచ్చిందే స్తీవాదం. స్తీల ఉనికిని, స్తీల హక్కులను, స్తీల సమస్యలను స్తీలే వ్యక్తపరిచే సాహిత్యాన్ని స్తీవాద సాహిత్యం అంటున్నాం. తరతరాల వ్యవస్థ నిర్మాణంలో మాతస్వామ్యం రూపాంతరం చెంది పితస్వామ్యంగా స్థిరపడిపోయింది. ఆనాటి నాగరిక సమాజం నుండి నేటికి ఆ మూలాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించి, ఎదిరించే క్రమంలో వచ్చిందే స్తీవాదం. జెండర్ స్పహ, గహహింస, మాతత్వం, ఇంటి చాకిరి మొదలైన అంశాలెన్నో స్తీవాద ఉద్యమంలో వెలుగులోకి వచ్చిన అంశాలు. జండర్ సహజంగా ఏర్పడింది కాదు. కుటుంబం, సమాజం, మతం ‘స్తీలు’ అంటే ఇలా ఉండాలి, ‘పురుషులు’ అంటే ఇలా ఉండాలి అని జీవనవిధానంలో అలవాటు చేసే క్రమపద్ధతిని జండర్‌స్పహ అంటున్నాం. ఎంగెల్స్ ప్రకారం “పురుషత్వం, స్తీత్వం అనేవి శరీర ధర్మాల ప్రకారం ఏర్పడినవి కావు. ఒక సుదీర్ఘ చారిత్రక యుగంలోను పురుషత్వం, స్తీత్వం అనేవి వేరువేరుగా నిర్వచించబడ్డాయి. ఈ నిర్వచనం ఆయా యుగాలలోని ప్రధానఉత్పత్తి విధానమీద ఆధారపడి ఉంటుంది” అన్నారు. అంటే స్తీత్వ, పురుషత్వాల గురించి భావజాలాన్ని సమాజం తయారుచేసి అందిస్తోంది. ఆ భావజాలం తిరిగి సమాజక్రమాన్ని స్థిరపరచడంలో సహాయపడుతుంది. ఈ క్రమానంతటిని స్తీవాదం పరిశీలించింది. స్తీవాదం అంటే పురుషులను ద్వేషించడం కాదు. స్తీల సమస్యలను గుర్తించి స్తీలందరు ఏకమై పురుషులకు అర్థమయ్యేలా చెయ్యడం. ఈ భావజాలాన్ని అర్థంచేసుకున్న సహదయ కవి ఆచార్య మాడభూషి కుమార్‌గారు. ‘ఆమె’ కవితలో స్తీల సమస్యలను కళ్ళకు కట్టినట్లు లోతైన భావుకతతో అక్షరీకరించారు.
“చిన్నప్పటినుండి అంతే
చిన్నచూపుతోనే పెరిగింది” అంటారు
……….
ఇంకా
ఆమె నిఘంటువు నుంచి ఏ నిషేదం
అందుకే
ఎందుకు, ఏమిటి
లాంటి ప్రశ్నలు ఆమెనోట్లో రాకూడదని శాసనం”
బాల్యంనుండే ఆడపిల్ల జండర్‌వివక్షను ఎదుర్కొంటుంది. కన్నతల్లే కొడుకును ఒకరకంగా కూతురును మరొరకంగా పెంచుతుంది. లేకపోతే తల్లిపెంపకం బాగాలేదంటారు. దుస్తులు, ఆటలు, ఆహారం, ఇలా అన్నిట్లోను ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కుటుంబంలో ఆడపిల్ల ఇట్లా ఉండాలి అని తర్ఫీదునివ్వబడుతుంది. తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో పెరిగిన ఆడపిల్లకు పెళ్ళి అనే బంధం మరిన్ని బాధ్యతలను, పరిమితులను విధిస్తుంది. అందుకే కవి ఇలా అంటారు.
“అతగాడికి కావలసింది ఒక మరమనిషి
సంపాదించడానికి
వండిపెట్టడానికి
కోరికలు తీర్చడానికి
పెళ్ళిరోజున ఎ.టి.ఎం లాంటి
పెళ్ళాం దొరికిందని మరిసిపోతాడు”
స్తీకి పెళ్ళిజీవితం అనేది రూపాయి బిల్లకు ఉండే బొమ్మ, బొరుసు లాగా మారిపోయింది. మంచి భర్త దొరికితే పరవాలేదు కాని, ఆమెను అర్థంచేసుకోలేని కుటుంబంలోకి అడుగుపెట్టినప్ప్పుడు జీవితఖైదీగా మారిపోతుంది. అసలు కుటుంబమే స్తీని కంట్రోల్ చేసే బంధిఖానా అవుతుంది. ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం అన్ని స్తీల బాధ్యతలే. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా వీటన్నింటిని బాలెన్స్ చేసుకోవాలి. తద్వార స్తీల శారీరక, మానసిక ఆరోగ్యాలమీద ఒత్తిడి పెరుగుతుంది. ఎదిగే క్రమంలో అనేక సవాళ్ళను స్తీ ఎదుర్కోవలసి వస్తుంది. ‘ఆమె’ కవితలోనే ఈ పంక్తులు చూడండి.
“ఆకాశమంత వ్యాపించి
అందీ అందని ఆ తేజోమూర్తిని చూసి
నిందలు వేసే వాళ్ళెందరో!
మబ్బుల నడుమనుంచి
అప్ప్పుడప్ప్పుడు మెరుస్తూ ఉంటేనే
ఇంత అసూయగా ఉంటే
పున్నమి వెన్నెల విరిస్తే
రెక్కలు ముక్కలు చేసుకొని
ఆకాశానికి ఎగురుతున్న ఆమె రెక్కల్ని
ముక్కలు చేయడానికి ఎందరో”
అన్న పంక్తులు బాధ్యతల దొందరలో, ఉరుకుల పరుగుల ‘ఆమె’ జీవితంలో పడగనీడలా నిందలు, ఆధిపత్యాలు, అకత్యాలు, వివక్షలు, చిన్నచూపులు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘర్షణల మధ్య స్తీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటు ముందుకు వెళ్ళే సాహసం చేస్తుంది. అయినప్పటికి స్తీలు తమను తాము నిరూపించుకుంటూ అన్నిరంగాలలో ముందుకు వెళ్ళే ప్రయత్నంచేస్తున్నారు. అయినప్పటికి అడగడుగున పరీక్షలపర్వాలను దాటక తప్పడంలేదు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లి కలలుకంటుంది. అన్నీ తానై భరిస్తుంది. అయినప్పటికి తండ్రి అంటే పిల్లలకు గౌరవం. తల్లి అంటే చిన్నచూపు. ‘ఆమె’ గురించి కవి మాటల్లో …
ఇంట్లో సెలవులేదు
పనిలో సెలవులేదు
జీవితమంతా పిల్లలకోసం పరుగెత్తి పరుగెత్తి
అలిసిపోయిన ఆమెకు
ఆసరా లేదు
………
ఆమె లేకుండా
మానవ చక్రం పరిభ్రమించదు
అందుకే ఆమెను
పరిమళించనివ్వండి
కవితా ముగింపులో స్తీ ఉన్నతిని ఆకాంక్షిస్తున్నారు కవి. ఈ విశ్వమానవ కాలభ్రమణంలో స్తీ, పురుషులిద్దరు అవసరమే. ఎవరికివారుగా బాధ్యత నిర్వహణలో పోటీపడాలి గాని ఆధిపత్యాలు, అహంకార పెత్తనాలు స్తీల అశాంతికి కారణమౌతున్నాయి. హింసకు దారితీస్తున్నాయి. స్తీల చుట్టు భయాన్ని గుర్తుచేస్తూ ‘భయం’ కవిత లో ఇలా అంటారు.
భయం
కట్నంలా రావచ్చు
పట్నంలో రావచ్చు
అత్యాచారంలా రావచ్చు
నిత్యాచారంలా ఉండవచ్చు
……………..
భయం
మగాడిలా ఉండవచ్చు
మగడి రూపంలో ఉండవచ్చు
మైరావుణుడి రూపంలో ఉండవచ్చు
రూపం ఏదైనా
భయం మాత్రం ఒక్కటే
అది భయమే
స్తీలకు ఉన్న భయాలు అన్ని ఇన్ని కావు. పురుషస్వామ్య ప్రపంచంలో ఎక్కడ పొంచి ఉంటుందో ఆ భయం. కవి పై కవితలో కట్నం వలన భయం అనడంలో మనం ఇప్పటికి వరకట్న వేదింపులకు బలైన స్తీలను మీడియా ముఖంగా చూస్తునే ఉన్నాం. స్తీలపై అత్యాచారం అన్నది ఈనాటికి రూపుమాపలేకపోయాం. ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు చేసిన దిశ లాంటి అమ్మాయిలు ఇంకా బలవుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తవుతే కన్న తండ్రి కళ్ళు కామంతో కప్పబడినపుడు కూతురు పరిస్థితి అగమ్యగోచరం. ‘తండ్రి’ అన్న కవితలో
“కన్న బిడ్డనే కామించే తండ్రులు
తండోపతండాలుగా పత్రికల్లో మొలుస్తూనే
టీవీలో మెరుస్తునే ఉన్నారు
వాటిని చూసిన మొహంతో
కన్నబిడ్డను చూసే శక్తిలేక
ఆత్మహత్య చేసుకుంటున్న”
అంటారు. ఇక్కడ కవి ఈ సంఘటనకు కరుణరసభరిత కవితాక్షరాలను మనముందుంచారు. ఎవరో చేసిన పనికి తండ్రిగా కూతురు ముందు నిలబడలేని స్థితిని తండ్రులందరి పక్షాన నిలబడి బలమైన సందేశాన్ని ఇచ్చారు. ‘మగాడు’ కవిత జండర్ వివక్షను మరింత స్పష్టంగా చెప్తుంది.
“వాడు కావాలనుకొన్నప్ప్పుడు
నేను రావాలి
వాడు తేవాలన్నప్ప్పుడు
నేను తేవాలి
వాడు తిరగమన్నట్టు
నేను తిరగలిగా తిరగాలి”
స్తీ, పురుషులిద్దరు మనుషులే. ఇద్దరిలో ప్రవహించే రక్తం ఎర్రగానే ఉంటుంది. కాని, స్వేచ్ఛా పరిధిలోకి వచ్చేసరికి జండర్ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. పితస్వామ్య వ్యవస్థ పురుషుడిని ‘మగాడు’ గా చూడాలనుకుంటుంది. మగాడు అంటే ఎలా ఉండాలని సమాజం, కుటుంబం చెప్పిందో కవి ప్రతిసందర్భంలో మగాడి రంగును తేటతెల్లం చేస్తాడు. స్తీ ఎల్లప్పుడు పిల్లలకోసమో, పుట్టింటి వారి కోసమనో, పరువు మర్యాదల కోసమనో తను ఉండాలనుకున్నట్టుగా ఉండలేకపోతుంది. తన అస్తిత్వాన్ని ఉనికిని పరిస్థితులకు ఫణంగాపెట్టి అన్నిటికి సర్ధుబాటుతనపు సంకెళ్ళు వేసుకుంటుంది. అందుకే ‘కవి’ స్తీ, పురుషుల సహవాసాన్ని శత్రువుతో పోల్చడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.
“నేను సహవాసం చేస్తున్నది
శత్రువుతో
నేను సహజీవనం చేస్తున్నది
శత్రువుతో
నేను పంచుకొంటున్నది
శత్రువుతో
పనిచేస్తున్నది
శత్రువుతో”
ఈ శత్రువులు మిత్రులు అయ్యేదెప్పుడు! జండర్‌వివక్ష తగ్గినప్పుడు ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకెళ్ళినప్పుడు అంటే స్తీవాదాన్ని పురుషుడు అర్థంచేసుకున్నప్ప్పుడే సమస్య పరిష్కారం దిశగా ముందుకు కదులుతుంది. ఆచార్యస్థానంలో ఉన్న మాడభూషి సంపత్‌గారు మహిళల ఆర్తిని, ఆవేదనను, వివక్షను అర్థంచేసుకున్న వ్యక్తిగా, కవిగా, ప్రగతిశీల మార్గదర్శకుడిగా స్తీల గొంతుకను ‘శత్రువుతో ప్రయాణం’ పేరుతో తన కవితాధారతో బలం చేకూర్చిన మానవతామూర్తి ఆచార్య సంపత్‌కుమార్‌గారు.

ªªª

March 19, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సంఘర్షణ

by Bhargavi Lahari March 18, 2026
written by Bhargavi Lahari

సిద్ధి ప్రాప్తికై
సిద్ధార్థుని
వన ప్రవేశం
గాఢాంధకారంలో మునిగిన
యశోధర వైవాహిక జీవనం

త్యాగ ఫలితం
బుద్ధుని జ్ఞానోదయం
యశోధర మనోఘాతం
సౌభాగ్యురాలి విరహం
రాజ మందిర వనవాసం

ఆతని వైరాగ్యం
ఆవిడ పాలిట శాపం
కాని ప్రపంచానికి
అదో ఆదర్శం

ఆ మహారాణి మనోవేదన
ఒకటే ఒక ప్రశ్న
పరిత్యజించినది పతి అయితే
తనకు ఎందుకీ సంఘర్షణ?

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఓడి గెలిచే కలల స్నేహం

by Mrudula March 18, 2026
written by Mrudula

చేదు జ్ఞాపకమైతే
మరచిపోయినట్టు
నిర్లక్ష్యం చేయగలను
నువ్వొక
మరుగున దాచలేని
పచ్చి నిజానివి
నా జీవిత లక్ష్యానివి

కల తీరని బాధ చూశాకే
నీ వెంట పరిగెత్తాను
నా అంతర్మధనం తెలుసుకున్నాను
నువ్వు గుర్తుపెట్టుకునేంత
గెలవాలనుకున్నాను !!

మరచిపోవద్దని అనుకున్నాను కనుకే……..
కలలను ప్రోది చేసుకున్నాను
కన్నీళ్లను పొదువు చేసుకున్నాను
నవ్వులను ఆవిరి చేసుకున్నాను
మనసు పొరలను గోడగ చేసుకున్నాను

నన్ను నీ గమనంలోకి
నువ్వే ఆహ్వానించావన్న నిజాన్ని
నీకు గుర్తు చేసేంత సాధించాలనుకున్నాను
నువ్వు మార్చే ప్రకృతి రంగులు లెక్క చేయక మరీ ప్రయత్నించాను

కానీ నువ్వు కాలమనే మాయాజాలానివి
పండు వెన్నెల్లో వేణు గానం వినిపించగలవు
నిశీధి రాత్రిలో జాలిరాగం పాడగలవు

అయినా………
ప్రయత్నమే
అసలు విజయమైతే
గెలుపు నాదిగా
తియ్యని రాగాన్నై
వేణు గానంలో ఓలలాడగలను
ప్రతి రాత్రినీ వసంతరాత్రిగా
మార్చుకోగలను
నీ ఒడిని సైతం ఊయలగా అనుభవించగలను !!

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

శాలువా విలువెంత ?

by Divakarla Rajeshwari March 18, 2026
written by Divakarla Rajeshwari

రఘుపతి లోపలికి రాగానే ఆయన చేతిలో ఉన్న వస్తువులను అంది పుచ్చుకుంది రాగిణి. మెత్తని సిల్కు శాలువా! అందమైన కుచ్చులతో జరీ దారాల మెరుపులతో ఖరీదును చాటుతోంది. శ్రీ కృష్ణ దేవరాయల వెండి అచ్చు బొమ్మతో సభను ఏర్పాటు చేసిన వారి నామ ఫలకం తో జ్ఞాపిక స్వర్ణోత్సవం జరుపుకుంటోన్న సంస్థ వైభవాన్ని తెలుపుతోంది.
రఘు పతికి రోజూ సభలలో పాల్గొనడం తప్పని సరి అయిపోయింది. సభ లో అధ్యక్షుని గానో పుస్తక ఆవిష్కర గానో, లేదా సాహిత్య ప్రసంగ కర్త గానో ఆహ్వానాన్ని అందుకోడం పరి పాటిగా మారింది. రఘుపతి ప్రసంగం ఉన్న సభ ఒక వేడుకగా మారుతుంది. ఏ విషయాన్నైనా సమగ్రంగా అధ్యయనం చేసి ఆద్యంతం ఆసక్తి కరం గా ఉపన్యసించి రఘుపతి సాహిత్య సభలకు జన ప్రియతను కలిగించాడు.
రఘుపతి సభా పరిశ్రమను చేసి సంపాదించిన శాలువలను రాగిణి జాగ్రత్తగా భద్ర పరుస్తుంది. జ్ఞాపికలను ప్రత్యేకమైన గాజు బీరువాలో అలంకరణగా ఉంచుతుంది
రఘుపతి ఆ రోజు పొందిన సత్కార శాలువాను మడత పెడుతూ, “నారాయణకు రమ్మని చెప్పండి, మంచి నమూనాలను సిద్ధం చేసాను. ఈ సారి నారాయణ జాతీయ స్థాయిలో ప్రశంసను పొందవలసినదే “అంది
నారాయణ ఇప్పుడు దర్జీ గా పేరు సంపాదించాడు. నారాయణ జీవితం బాగు పడింది. కష్ట పడి పని చేస్తాడు. సమయానికి బట్టలు కుట్టి అందజేస్తాడు….
మీరు చెప్పినదంతా నిజమే .. కాని నారాయణ బాగుపడినదంతా మన చలవే ! మన సహాయం వల్లనే తాను పేరు తెచ్చుకోవడం జరిగిందని వచ్చి నప్పుడల్లా కృతజ్ఞతలతో ముంచి వేస్తాడు.
సరేలే !అది వాడి అభిమానం –
మొత్తానికి మీకు మంచి మిత్రుడు దొరికాడు.
నారాయణ వచ్చినప్పుడు ఇవ్వవలసిన, సూచనలు, డిజైన్లు ప్రింట్ అవుట్ తీసి పెట్టాలి అనుకుంటూ కంప్యూటర్ తెరిచింది రాగిణి.
—
రఘుపతి ఉద్యోగం లో చేరడానికి వచ్చినప్పుడు కళాశాలకు దగ్గరలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ గది గాలి వెలుతురు తో మనసుకు హాయినిచ్చేటట్లుగా ఉంది. ఊళ్ళో అతి కష్టం తో జీవన భత్యం గడుపుకుంటున్న టైలర్ నారాయణకు గదికి ఆనుకుని ఉన్న వసారాలో కుట్టు పనికి చోటును కల్పించాడు. తాము ఉండే గది కొంచం ఎత్తుగా రోడ్డు మీద తిరిగే వాళ్ళ దృష్టికి ఆనుతూ ఉండడం వల్ల దర్జీ నారాయణను వినియోగ దారులు గుర్తించడం జరిగింది. నారాయణకు మంచి దర్జీ అని చుట్టు పక్కలవాళ్ళ మౌఖిక ప్రచారం ద్వారా చేతి నిండా పని దొరికింది.
నారాయణ తోడుగా ఉండడం రఘుపతికి సహాయకారి లభించినట్లయింది. నారాయణ కుట్టి ఇచ్చిన లాల్చీని వేసుకుని కళాశాలకు వెళ్ళిన రఘుపతి హుందాతనం పెరిగింది. తెలుగు ఉపన్యాసకునికి అభిమానులు అధికం అయ్యారు.
తరగతి గదిలో గంభీరంగా స్పష్టమైన ఉచ్ఛారణతో వివరంగా బోధించే పాఠ్యాంశాలు విద్యార్థులతో గురు శిష్య అనుబంధానికి గల ప్రమాణాన్ని పెంచింది.
అంత చిన్న వయసులోఅతడుసంపాదించినపాండిత్యానికి,విషయపరిజ్ఞానానికి,వాక్చాతుర్యానికి . రఘుపతి కి వక్తగా పరంపరల ఆహ్వానాలు మొదలయ్యాయి.
సభ వాళ్ళు ఇచ్చిన శాలువాలకు సత్కార సామాగ్రికి, గదిలో ఉన్న చిన్న చెక్క బీరువా సరిపోలేదు.
రఘుపతికి వివాహం అయింది. భార్య రాగిణి దుస్తుల నమూనా లలో డిప్లొమా కోర్స్ చేసింది. చాలా చురుకుగా ఉంటుంది. ఆమెకు గృహ అలంకరణ నిర్వహణలలో ప్రత్యేకమైన అభిరుచి ఉంది.
పెళ్ళి కాగానే రఘుపతి పెద్ద ఇంట్లోకి మారాడు. అతని కి ఆచార్య పదవి వచ్చింది. నగరం లో ప్రముఖ సాహితీ విమర్శకునిగా ప్రసిద్ధి పొందాడు. స్వంత ఇల్లు కట్టుకున్నాడు. నారాయణ పని కూడా . సంతృప్తికరంగా సాగుతోంది. .
కాల గడచిన కొద్దీ రఘుపతి నారాయణల స్నేహం మరింత దృఢమవుతూ వచ్చింది. నారాయణ కుట్టిన లాల్చీ ధరిస్తే రఘుపతికి మిత్రుడు భుజం మీద చేయి వేసి నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరి కుటుంబం పెరిగింది. పిల్లలు కాలేజీ చదువులకు వచ్చారు. కుటుంబ వ్యయం పెరిగింది.
నారాయణ కూతురు డాక్టర్ కోర్సు చదవాలని. గట్టి పట్టుదలతో ఉంది. తన సంపాదనతో కొడుకు ఇంజనీరింగ్,కూతురు మెడిసిన్ లను చదివించ గలనా? అని సందేహించాడు నారాయణ. కష్ట సుఖాలను ముచ్చటించుకుంటున్న సమయం లో పిల్లల చదువులను గురించి ప్రస్తావించాడు నారాయణ
నారాయణ సమస్యను విని పూర్తిగా అర్థం చేసుకుంది రాగిణి. బాగా ఆలోచించింది.
—
మర్నాడు తను పిలిచిన వెంటనే వచ్చిన నారాయణ ను కూచోమని కాఫీ ఇచ్చింది.
ఇప్పుడే వస్తాను ఉండు అంటూ బీరువాలలో ఉన్న శాలువలను. కొన్నింటిని తెచ్చింది
నారాయణా ఇవన్నీ రఘుపతికి సభా కార్య క్రమాలలో సత్కారానికి వచ్చినవి, ఇంకా చాలా ఉన్నాయి
ఇందులో కాశ్మీరు నుండి ఖద్దరు వరకూ, అనేక రకాలున్నాయి. వాటిని బట్టి నేను నమూనాలను గీసి ఇస్తున్నాను. వాటిని నువ్వు చూసి నేనిచ్చిన డిజైన్ లకు అనుగుణం గా కత్తిరించి దుస్తులను తయారు చేయి.. బ్లౌజులు, కుర్తీలు, బ్రైడల్ దుస్తులను తయారు చేయి.అందమైన దుపట్టాలు, స్కార్ఫ్ ల నమూనాలను కూడా ఇచ్చాను.
అవన్నీ ఆధునిక యువతీ యువకులకు నచ్చే టట్లుం డాలి. ఇక వయసు పై బడిన వారికి భుజాల మీదనుండి జారిపోకుండా చేతులకు పట్టి వుండేటట్లు, ధారణకు అనుకూలంగా కుట్టాలి. అందమైన రంగుల దారాలను ఉపయోగించి ధరించే వారి విలువను పెంచాలి ..
ఇలా ఆమె రూపొందించిన నమూనాలకు నారాయణ నైపుణ్యం జోడించి తయారు చేసిన దుస్తులు అందరినీ ఆకర్షించాయి.
ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లుగా నారాయణ, అతని భార్య అహర్నిశలు కావించిన శ్రమ కు ఫలితం లభించింది.
కుట్టిన వెంటనే దుస్తుల కొనుగోళ్ళు జరిగాయి. నారాయణ ఎప్పటికప్పుడు రాగిణికి సమాచారం అందించడం తో ఆమె పేర్చి ఉంచిన శాలువాలు అన్నింటినీ విడతల వారీగా నారాయణకు అందించడం , అతడు తయారు చేసిన వస్త్రాలు స్థానికం గానే కాక ,వివిధ దేశాలకు ఎగుమతి కావడం తటస్థించింది.
నారాయణ తాను రూపొందించిన దుస్తులు ఎప్పటికప్పుడు కొనుగోళ్ళు కావడానికి కారణం రాగిణి గారు అని, ఆ శాలువాలను తమ బుద్ధి పరిశ్రమ తో సంపాదించిన వారు ఆచార్య రఘుపతి గారని, తాను సంపాదించిన డబ్బును వారికి చెల్లించ బోతాడు.
రాగిణి, రఘుపతి ఆ మాటను నవ్వుతూ తిరస్కరిస్తారు.
మాది ఆలోచన మాత్రమే! నీది ఆచరణ. మాది కొంత ఔదార్యం ,నీది ఔపచారికం ,జీవితావసరం, నీ సంతాన భవిష్యానికి సోపానం. నీ కూతురు డాక్టరయితే అనేక మందికి ఆమె సేవా భాగ్యం కలుగుతుంది. కొడుకు దేశ ప్రగతికి దోహదం చేస్తాడు. మా ఔదార్యం వల్ల ఇంతగా మేలు జరుగుతే అంతకంటె మాకు ఇతర కానుకలు ఎందుకు? అంటారు.—
ఆ రోజు రాగిణి డిజైనర్ షాపు ఆరంభ దినోత్సవం . అధునాతనమైన దుస్తుల తయారీలో సాటి లేని ప్రతిభను చూపిన రాగిణీ డిజైనర్ షాపు యజమాని రాగిణి ని చూడాలని వచ్చిన అతిథులు ఎదురు చూసారు.
ఆవిష్కరణ రఘుపతి చేతుల మీదుగా జరిగింది.
రాగిణి ఎవరు అన్న ప్రశ్న మిగిలింది.
విలువ ఇంత అని చెప్పలేని గౌరవం, ఆప్యాయత, మరియు సత్కారానికి ప్రతిబింబమే రాగిణి అని, ఈ దుస్తులను ధరించిన వారు సంప్రదాయానికి, ప్రత్యక్ష సాక్షులు గా ఉండాలన్నదే రాగిణి డిజైనర్స్ ధ్యేయం “అత్యుత్తమ మైన భారతీయ సంస్కృతి కి ఆధిపత్యం వహించిన శాలువా సభా గౌరవాలకు పరిమితం కాకుండా బీరువాలలో నలిగి ఉక్కిరి బిక్కిరి కాకుండా, సర్వ జన గణ వినుత మాధ్యమం లో విస్తృత విలువలను అందుకోవాలన్నదే రాగిణి ఆశయం” అంది సభలో అప్పటి వరకూ మౌనంగా రాగిణి గారిని ఆరాధిస్తున్న డా చంద్రిక , నారాయణ గారి కూతురు……రాజేశ్వరి దివాకర్ల

March 18, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

జాగ్రత్త మహిళా..!

by Manjula Pathipati March 18, 2026
written by Manjula Pathipati

గుంట నక్కలు ముసుగేసుకుని మన
చుట్టు తిరుగుతు మాయ మాటలు
చెప్పి నిన్ను  మాయం చేస్తారు జాగ్రత్త
మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!

బడికి వెళ్లే ఆడ పిల్లపై నీ వెయ్యి
కన్నులు వేసి ఉంచు మహిళా..!
రెప్పపాటు ఆదమరచినావో
డేగ లాగా తన్నుకొని పోతారు జాగ్రత్త
మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!

పొలం పనుల కోసం పొయ్యేటప్పుడు
బుడ్డదాన్ని వెంట తీసుకునిపో…
మరచి పోయినావో కామాంధుల
కాటుకు బలై పోతుంది జాగ్రత్త
మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు…!

కూలి నాలికి పొయ్యేటప్పుడు చీడ
పురుగుల బారిన పడకుండా
నిండు వస్త్రధారణతో వెళ్లు…
మరచి పోయినావో  చుట్టు ముట్టి
చిత్రవధ  చేస్తారు జాగ్రత్త మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు…!

అంతా నావాళ్ళే అని గుడ్డిగా నమ్మకు
మహిళా..!
నీ వెనక గోతులు తీసేది నీ వాళ్ళే అని
తెలుసుకో మహిళా..!
మహిళ  చిరునవ్వుల చాటున
కన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు…!

సమాజంలో ఉన్న కొంత మంది
గురించి మాత్రమే వారు మంచిగా
మారుతారు  అని  ఆశిస్తు…
తరలిపో తరలిపో.. చీకటి నుంచి
వెలుగుకు తరలిపో.. కుందేలువి కావు..
పులిలా మారిపో.. వెంటాడే ఒడిదుడుకుల
మృగాలతో యుద్ధానికి తరలిపో…’’
ఓ మహిళా మీకివే మా వందనాలు.
కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’కి వందనాలు

March 18, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వైజ్ఞానికం వందే జగద్గురుం

by Y. Sujatha March 18, 2026
written by Y. Sujatha

అగ్గిపుల్లా,
సబ్బు బిళ్ళా
తలుపు గొళ్ళెం,
గుఱ్ఱపు కళ్ళెం
సర్వం వైజ్ఞానికమే !

దేవుని హుండీ
పూల కుండీ
చొక్కా గుండీ
చక్రం బండీ
సర్వం వైజ్ఞానికమే !

లోహ విహంగం
విద్యుత్ తరంగం
నదీ సంగమం
డ్రోన్లు వీరంగం
సర్వం వైజ్ఞానికమే !

చేతిలో సెల్లు
కరెంటు బిల్లు
రాముని విల్లు
మేఘం జల్లు
సర్వం వైజ్ఞానికమే!

గ్రహాల భ్రమణం
జీవుల చలనం
ప్రకృతి గమనం
శరీర మరణం
సర్వం వైజ్ఞానికమే !

చంద్రయానం
సముద్ర శోధనం
అణు విస్ఫోటనం
కణ విచ్ఛిన్నం
సర్వం వైజ్ఞానికమే !

దృశ్య మాధ్యమం
ప్రింట్ చోద్యం
శ్రవణ పరికరం
రవాణా పరిశ్రమం
సర్వం వైజ్ఞానికమే !

విద్యా బోధన
వైద్య శోధన
ఆహార పోషణ
అంతరిక్ష వీక్షణ
సర్వం వైజ్ఞానికమే!

ఆనకట్ట
ఆయుధ గుట్ట
లెక్కల చిట్టా
టెక్నాలజీ పట్టా
సర్వం వైజ్ఞానికమే !

సర్వం
వైజ్ఞానికం
వందే జగద్గురుం

March 18, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సామాన్య వర్ణ విన్యాసంతో గంభీర భావాల ప్రదర్శించగల ప్రతిభాశాలి – కొండపల్లి

by mayuukha March 18, 2026
written by mayuukha

       – డాక్టర్  దాశరథి ,(1976 అక్టోబర్ 9-‘ఆంధ్రప్రభ’ దినపత్రిక,’రాగవల్లరి’)

పరుగెత్తే నది నైనా
బంధించును చిత్రం
అంతటి ఆకాశమైనా
ఇంతవును విచిత్రం

గదిలో నది:-
     చిత్రకారుని కుంచే గంగానది నైనా కాన్వాస్ మీద బంధించగలదు. శేషగిరిరావు గారి ‘గంగ’ను చూసినవారికి ఆశ్చర్యం ఆనందం కలుగుతాయి.  అన్నీ పోతాయి, కళ ఒక్కటే మనతో ఉంటుంది అన్నారు అంటీన్ డాల్ఫిన్ .
రాజ్యాలు, సింహాసనాలు పోయాయి. అజంతా ఎల్లోరాలు మనకు మిగిలాయి. కాలం పరిగెత్తుతుంది. కళ నిలిచి ఉంటుంది.కదలాడే ప్రకృతి కళలో  ఘనీభవిస్తుంది.  అర్థం కానిదేదైనా గొప్పది అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. అయితే కడ కూడా వెర్రి తలలు వేస్తుంది ఒక చిత్రపడా ప్రదర్శనలో ఒక కంచు బొమ్మను ప్రదర్శించారట ఆ బొమ్మని పత్రికలో పొగిడాయట విమర్శకులు మెచ్చుకున్నారట ఆ కాన్స్టయ శిల్పం కింద ఇటాలియన్ భాషలో ఏదో పేరు ఉంది ఇటాలియన్ భాష తెలిసిన వారిని అడిగితే ‘ఏనుగులద్ది’అని అర్థం చెప్పారట!
అర్థం కానిదేదైనా గొప్పది-  అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. క్యూబిస్ట్, సర్రియలిస్ట్, డాడాయిస్ట్, నైరూప్య, అధునాతన చిత్రకళారూపాలను తెగ పొగిడే వారు ఉన్నారు. మనకు అర్థం కాని దల్లా గొప్పది అనుకోవడం ఎంత పొరపాటు అందులో ఏమీ లేదనుకోవడం అంత పొరపాటే .పాశ్చాత్య సంగీతం వినీ వినడంతోనే అందులో శ్రావ్యత లేని లేదు అనేస్తారు కొందరు మరి మన సంగీతం వారికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి కొంత సంస్కారం కావాలి మరి.
‘ఉత్తమ కళ ఏ కాలంలోనైనా తన కాలాని కంటే ముందు పరుగెత్తుతుంది తన కాలపు సమాజాన్ని ప్రతిబింబిస్తుంది కళ పయనించే వేగాన్ని సమాజం
అందుకోలేదు. కళ నేడు అందుకున్న దాన్ని సమాజం రేపు గాని అందుకొనదు. ఇక్కడే సమాజానికి కళాపధ ప్రదర్శకురాలు అవుతుంది”. అన్నారు ప్రసిద్ధ చిత్రకారులు, విమర్శకులు సంజీవ్ దేవ్ గారు.

      ” సమాజం కళ ను సజీవ పరుస్తుంది. కళ సమాజాన్ని ఆనందపరుస్తుంది.సమాజం గుప్తపరిచే దానిని కళ వ్యక్తపరుస్తుంది. గుప్తత  వ్యక్తత రెండు కూడా జీవన సాఫల్యానికి సమానావసరాలే” అన్నారు ఆయనే! కళను గురించి ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం అసాధ్యమేమో! అయితే గుప్తత, వ్యక్తత ఏ పాళ్ళలో ఉండాలన్నదే ప్రశ్న. గుప్తత ఎక్కువైపోయి,వ్యక్తత తగ్గిపోతే సుబోధకత తగ్గుతుంది. కనుక ఆయన చిత్రాలు చాలా వరకు సుబోధకం గా ఉంటాయి.వీరు స్పష్టతను కోరే కళాకారులు. అందులో అయోమయత్వం లేదు. పెన్సిల్ తో గీసినా కలంతో వ్రాసినా, కుంచెలో వాడినా,తైలవర్ణాలు ఉపయోగించినా, లలితములైన జలవర్ణాలు ప్రయోగించినా, ప్రాచీన చిత్రాలు రచించినా, పాశ్చాత్య రీతులను అనుసరించినా శేషగిరిరావు తన చిత్రంలోనే కనబడేలా చేయగల ప్రతిభాశాలి. చిత్రకళానిపుణులు, విమర్శకులు ఇది శేషగిరిరావు గారి బొమ్మ అని ఇట్టే చెప్పగలరు.

   శేషగిరిరావు శిల్పులకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి. ప్రపంచంలోని సుప్రసిద్ధ కళాకారులు శిల్పులు ఆయన మిత్రులు. ఆయనది సుకుమార హృదయం. ఉదారమైన మనస్తత్వం. నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ కేంద్ర లలిత కళా అకాడమీకి తొలి అధ్యక్షులు.ఊ అలాంటి వ్యక్తి అనురాగం ఆశ్రయాలు, ఉచిత విద్య శేషగిరిరావుకు లభించాయి.శాంతినికేతన్ లోని విశ్వభారతిలో చేరినప్పుడు ఆచార్య నందాలాల్ శిష్యులుగా ఎంతో అనుభవాన్ని పొందారు. ప్రముఖ చిత్రకారులు కుమారిల్ స్వామి వీరికి అక్కడ సహధ్యాయి.

     చిత్రకళా నిపుణులు విమర్శకులు అయినా వేలూరి రాధాకృష్ణ గారు, శేషగిరిరావు నందాలాల్ బోస్ గురించి చెప్పిన మాటలు ఈ సందర్భంలో గమనించవలసి ఉంది. నందాల్ లాల్ బోస్ వద్ద నేర్చుకోవడం మూలంగా నాలోని చాలా లోపాలు దిద్దుబాటు చేసుకోగలిగాను.ఆయన వద్ద నేర్చుకోవడం గురుకులంలో మునివర్యుని వద్ద నేర్చుకోవడం వంటిది.”     తమకు అదే అనుభవం కలిగినట్లు వేలూరి రాధాకృష్ణ గారు అభిప్రాయపడ్డారు. ఆయన తను చేయు ‘కర్మకు బద్ధుడైన యోగి పుంగవుడు’ అన్నారు నందా బాబును గూర్చి.

   పందొమ్మిది వందల యాభైలో హైదరాబాద్ చిత్ర కళాశాలలో శేషగిరిరావు అధ్యాపకులైనారు. బనస్థలి విద్యాపీఠంలో కుడ్య చిత్ర రచనలో తర్ఫీదు పొందిన శేషగిరిరావు ఎన్నో కుడ్య చిత్రాలు రచించారు.భారతీయ పౌరాణిక చిత్రాలు,ప్రకృతి చిత్రాలు రచించడంలో శేషగిరిరావుది అందవేసిన చెయ్యి. పల్లె ప్రజల జీవితాలను వివిధ కోణాల నుండి సున్నిక్షితంగా పరిశీలించి చిత్రాలు రచించడం శేషగిరిరావు లోని మరో విశిష్టత. రోజూ మనం వీధిలో వెళుతూ రకరకాలైన వృక్షాలను చూస్తాం. దాటిపోతాం .తన కుంచెలోని నైపుణ్యంతో శేషగిరిరావు వేసిన వృక్ష చిత్రాలు చూసి ఆగిపోతాం. దాటిపోలేం. ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుని ఆగిపోయేలా చేసి, ఆశ్చర్యచకుతునిగా చేసే శక్తి శేషగిరిరావు చిత్రాలలో ఉంది. అతడు వేసిన గుల్మోహర్ చూచి తీరవలసిందే.

   ఈయన చిత్రాలల్లో మరో విశేషం ఏమిటంటే రంగులు సామాన్యమైనవిగా ఉంటూ ఎంతో కండ్ల పండువగా  గంభీర భావాలను వ్యక్తపరుస్తాయి ఈయన న్యూరల్ పెయింటింగ్స్ లో కంపోజిషన్ అద్భుతంగా ఉంటాయి ఈయన బ్రష్ వర్క్ లో వేగం శక్తి జవం స్పేసింగ్ ఉట్టిపడుతుంటాయి సంతాల్ నృత్యం, వసంతం, కాకులు అనే చిత్రాలకు 1949లో, గేదెలు ,నెమళ్లు ఈ చిత్రాలకు 1953 లోను, సంతాపం, క్షమ అనే చిత్రాలకు బంగారు పతకం, బహుమతి, స్టేట్ హుడ్ అనే చిత్రాలకు కలకత్తా అకాడమీ అవార్డు లభించాయి.

     1963 ఏప్రిల్ లో హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో ఈయన పెయింటింగ్స్ ప్రదర్శన చూశాను సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ వివాస్కర్ ప్రదర్శనను ప్రారంభించారు ఈ ప్రదర్శనలో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించినవి నన్ను బుధ్ధిని చేసినవి కొన్ని చిత్రాలు ఇక్కడ ఉదాహరించడం యుక్తమని భావిస్తున్నాను.చేదిత దృమం, గుల్మోహార్, గంగ ,నూతన ప్రభాతం, అడవి కోన, విషాద ప్రకృతి  ఒక తరహాకు చెందిన ఉత్తమ చిత్రాలు అయితే, పద్మం, గర్భిణి ,చిత్రాంగద, శకుంతల, అరుంధతి బతుకమ్మ, అహల్య, గాయత్రి, రామానుజ, పార్వతి, దమయంతి మరొక రకమైన ఉత్తమ చిత్రాలు.

    శేషగిరిరావు చిత్రాలను స్వదేశంలోనూ, విదేశాలలోనూ ఎందరో కళాభిమానులు కొన్నారు. హైదరాబాదు మ్యూజియంలో, సాలార్జంగ్ మ్యూజియంలోనూ, హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లోనూ, ఢిల్లీలోని వెస్టర్న్ కోర్టులోను, కాబూల్, కైరో , మాస్కో మ్యూజియం లండన్ ఇటలీలలోను శేషగిరిరావు చిత్రాలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ భవనంలోనూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోను ఈయన చిత్రాలు ఉన్నాయి.

  అలంకరణ కళ పై శేషగిరిరావు ఒక గ్రంథం వ్రాశారు. ఇది ఇంకా ప్రచురణ కావలసి ఉంది.లేపాక్షి,తాడిపత్రి, హంపి దేవాలయాలలోని శిల్పాల రేఖాచిత్రాలు శేషగిరిరావు రచించారు.వాటి సంపుటమే ‘ సురేఖ’ .ఇది ప్రచురించబడింది .శేషగిరిరావు రచించిన పోతన, తిమ్మరుసు, అల్లసాని పెద్దన,ఉభయపార్వ్శాలలో గల అశ్వారూఢుడైన  శ్రీకృష్ణదేవరాయలు, కొంగలు మరపురాని చిత్రాలు.

   ప్రముఖ విమర్శకులు వేలూరి రాధాకృష్ణ గారు అభిప్రాయ పడినట్లు అతని రేఖలలో నుంచి జీవం ఉట్టిపడుతూ ఉంటుంది అతని రంగులలో నుంచి తేజస్సు తాండవం మాడుతూ ఆయన చిత్రాలు చూపురులను ముగ్ధులను లను చేస్తవి.పట్టు వస్త్రం పై శేషగిరిరావు గారు చక్కని భారతీయ శైలిలో చిత్రించిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నవి. అన్నింటికన్నా మించినవి అతని నలుపు తెలుపు చిత్రాలు చైనా సిరాలో ‘వాష్’ శైలిలో రచించిన చిత్రాలూను, వాటిలోని వేగం గమనింపదగింది. శేషగిరి రావు గారు తైల వర్ణాలతో కూడా మిగతారీతులలో వలె సులభంగాను చిత్రించగలడు. మన దేశంలోని అనేక ముఖ్య నగరాలలో శేషగిరిరావు తన సొంత చిత్రాల ప్రదర్శనలను ఏర్పాటు చేసి పండిత పామరుల  మన్ననలను పొందారు.

   సాంఘిక ప్రయోజనం లేని కళను ఆధునికులు హర్శించరు. ఇటీవల హైదరాబాదు నగరంలో జరిగిన బ్రహ్మాండమైన హరిజన మహాసభలలో శేషగిరిరావు గారు చిత్రించి, ప్రదర్శించిన “హరిజనోద్యమం”అని ప్యానెల్ లో సాంఘిక ప్రయోజనం తో పాటు ఆయన చిత్ర విద్యాలయపుణ్యం పరాకాష్ట నందుకు ఉన్నది. అందుకే అశేష ప్రజ్ఞాధురీణుడు శేషగిరిరావు అంటాను.

March 18, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సహన భారతం

by Thokala Rajesham March 18, 2026
written by Thokala Rajesham

సీ:కులము కులమటంచు కులుకుచుందురు గాని
                            కోరికవడి తెచ్చుకొనిరె కులము
   మతము మతమటంచు కతలుజెప్పుదురెల్ల
                           వారి మతములొక్క తీరు గాదె?
    ధనము నాకేయున్నదని గర్వ మేలకో?
                           పైసలనేదిని బతుకగలమె?
    అధికార బలమున్నదని తుల్లెదరు నాయ
                           కుల జేసినది ప్రజాబలము గాదె?

తే:  ప్రజల కన్నీటిలోని ఆపదలనెల్ల
   తీర్పజాలిన నాడు-విద్వేష బుద్ధు
   లింకిపోవవే? కాని నెడెందు జూడ
    నాయకులె రెచ్చగొట్టుట నడుచు చుండె

చ:మతముల పేరుజెప్పుకొని మారణహోమము రేపి చీకటుల్
    బతుకులలోన నింపుట-శవమ్ములపై పడు చిల్లరేరు దు
    ష్కృతములు సాగవెల్లపుడు-కిందిది పైనది కాకపోదు-స
    మ్మతములు తారుమారుగను మారక పోవునె?భారతావనిన్

ఆ:మతములోన గలుగు మానవత్వమ్మును
    గొంతుబిసికి చంపి గోతి లోన
    పూడ్చిపెట్టి సుద్ద పూసమాటలు నేడు
    చెప్పు చుండ్రి లేని గొప్ప కొరకు

క: పరమతములపై పడి యె
    వ్వరు’దూషింపండి’యనుచు ప్రవచించిరి నె
    త్తురులను పారింపుమనుచు
    విరచించిరె గ్రంథముల పవిత్రత నెరుపన్

ఆ:మధ్యలోన పుట్టి మధ్యలోనే పోయె
    గతమునందు కొన్ని మతములవని
    మానవత్వమనెడు మతమొక్కటే మాన
    వాళితోడ చివరి వరకు నిలుచు

తే:చెట్టుపై కిచకిచలాడు పిట్టలందు
    కులము మతములు గలిగెనే? కుట్రలేవి
    యేని పొడసూపెనే?లేని పోని లొల్లు
    లొక్క మనుషులందే కల్గియుండుటేమి?

తే:మనది ఉపఖండమని చెప్పుకొనుచు
    పక్క వారి సంస్కృతి కించపరుచ నేల?
    మాలలో తీరుతీరైన పూలు గలుగ
    చూడ ముచ్చట గొల్పదే శోభ హెచ్చి                   –

March 18, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సుయజ్ఞోపాఖ్యానము

by Devaraju Revathi March 18, 2026
written by Devaraju Revathi

ఎన్నో జన్మల పుణ్యఫలంతో అదృష్టవశాత్తు లభించిన మానవ జన్మ నిరంతరం భగవన్నామ స్మరణతో సఫంలం చేసుకోవాలే తప్ప భౌతిక మోహాలకు లొంగి వ్యర్థం చేసుకోకూడదనే వేదాంత పరమార్థం తెలియ జెప్పేదే సుయజ్ఞోపాఖ్యానం.ఇహము పరము మధ్యలో కొట్టు మిట్టాడే మనిషి ఆత్మకు పరమాత్మకు అనుసంధానం పొందే విధమైన ఆత్మజ్ఞానం పొందటానికి వేదవ్యాసుడు సమవర్తి అయిన యమధర్మరాజు నోటి వెంట చెప్పించిన తత్వ విచార సారాంశంగా అర్థం చేసుకోవచ్చు.

వేదాలను విభాగం చేసి పంచమ వేదంగా మహాభారతం వ్రాసినప్పటికీ అసంతృప్తి తో వేదన చెందుతాడు బాదరాయణుడు. కారణమేమిటో విచారించిన నారద మహర్షి భగవన్నామ సంకీర్తన లేని కావ్యం అంతగా సంతృప్తి కలిగించిందని చెప్పి పురాణ రచనకు ప్రోత్సహిస్తాడు. అందులో తొలి పురాణంగా వ్యాసుడు వ్రాసింది భాగవత పురాణమే.దానిలో భక్తి,గమ్యం,వైరాగ్యం,తత్త్వం,ముక్తి ఐదు అంశాలను సమపాళ్ళలో నింపి ఇతిహాసాల స్థాయితో తీర్చిదిద్దాడు.విష్ణుమూర్తి తో మూడుజన్మల వైరం కోరుకున్న హిరణ్యాక్షుడిని యజ్ఞావరాహస్వామి అవతారంలో కేశవుడు
సంహరిస్తాడు అసందర్భంగా అంత్యక్రియలు చేయటానికి పూనుకున్న హిరణ్యాక్షుని సోదరుడు హిరణ్యకశిపుడు తన తల్లి దితికి జీవితము కర్మఫలాల గురించి వివరించిన అంశాలలో సప్తమ స్కంధములో సుయజ్ఞోపాఖ్యానం చేర్చాడు.

సుయజ్ఞుడు ఉశీ నగరానికి రాజు.తెలివిగలవాడు,యుద్ధ విద్యలలో నైపుణ్యం గలవాడు.కీర్తి ప్రతిష్టలు కలవాడు.రాజులకు యుద్ధాలు,గెలుపు ఓటములు సహజములు.ఎన్నో సంగ్రామాలలో విజయం సాధించినప్పటికీ ఒక బలహీన క్షణాన యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు.దేహము తునాతునకలై పోతుంది.రత్నకిరీటం ముక్కలౌతుంది.ఆభరణాలు అక్కడక్కడా పడిపోతాయి.కనుగడ్లు పైకి వస్తాయి.చెవులు తెగిపోతాయి.పెదవులు రక్తసిక్తమైపోతాయి.అందమైన ముఖం అనామకమై చిన్నాభిన్నమై వికారమై భయంకరమై చూడలేకుండా పోతుంది.ఈవిషయం తెలిసి భార్యలు చెప్పలేనంతగా ఏడుస్తుంటారు.వాళ్ళ విలాపానికి బండలు కూడా కరుగుతాయా అనిపిస్తుంది.అతడు బ్రతికిన కాలంలో చేసిన మంచి పనులను వేనోళ్ళ పొగుడుతుంటారు.రాజ్యంలోని ప్రజలు దురదృష్టవంతులని మంచి మహారాజును కోల్పోయారని సానుభూతి వచనాలు వినపడుతాయి.
ఇదంతా గమనించి
యమధర్మరాజు చిన్నపిల్లవాని రూపంలో వచ్చి ఆత్మజ్ఞానం బోధించి
వైరాగ్యం వల్ల కలిగే ఆత్మ శాంతిని వివరించటమే ఈ కథలో ముఖ్యవిషయం.

కథగురించి విచారిస్తే హిరణ్యకశిపుడి ద్వార తల్లి దితికి పదహారు శ్లోకాలలో
ఆత్మజ్ఞానం బోధిస్తూ యమధర్మరాజు నోట
ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథక్భౌతిక మీయతే గృహమ్ యథౌదకైఃపార్థివ తైజసైర్జనః కాలేనజాతో వికృతో వినశ్యతి
అంటూ ఇరవై మూడు శ్లోకాలో శరీరానికి ఆత్మకు మధ్య ఉండే సంబంధాన్ని వేదవ్యాసమహర్షి సంస్కృత మహాభాగవతం లో వివరిస్తారు.ఇదే అంశాన్ని తెలుగులో బమ్మెర పోతనామాత్యుడు

నీరాగారనివిష్టపాంథులక్రియన్ అంటూ నలభై పద్యాల్లో సుయజ్ఞోపాఖ్యానంలో ఆత్మజ్ఞానం వివరించారు.దీనిలో తొలుత హిరణ్యకశిపుడు తల్లి దితికి , తర్వాత బాలుని రూపంలో యమధర్మరాజు సుయజ్ఞుని భార్యలకు చెప్పిన పరోక్ష కథనాలద్వారా ఆత్మజ్ఞానం వివరణ కన్పిస్తుంది.

హిరణ్యకశిపుడు తల్లి దితితో
అమ్మా!బాటసారులు దారిలో స్నేహం చేసి గమ్యం చేరగానే విడిపోతారు.జీవిత గమనమంతే.కర్మానుసారంగా పుట్టుక,మరణంతో కాయం మాయమవుతుంది.కాని ఆత్మ
వాసాంసిజీర్ణాని యథావిహాయ అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు తనువు వీడి మరో ఉపాధి లో ప్రవేశిస్తుంది.ఆత్మకు మరణంలేదు.శరీరములో ఉన్నంత వరకే సుఖదుఃఖాలు పొందుతుంది.నీరు కదలికలో మన ప్రతిబింబం తిరిగినట్లనిపిస్తుంది.కాని తిరుగదు.అట్లే విషయ వాసనల వలన తిరిగినదని భ్రమిస్తాము అదే ఆత్మ జ్ఞానం అంటు సుయజ్ఞునికథ చెబుతాడు.
సుయజ్ఞుని భార్యలు పరివారం ఏడుస్తున్న వేళ
దండధరుడు బాలుని రూపములో వస్తాడు.
చచ్చిన వాని కేడ్చెదరు చావున కొల్లక డాగ వచ్చునే యెచ్చట బుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్ అంటూ జననము,మరణము రాగ బంధాల నుండి విముక్తుడై మోక్షమార్గం మునకు తరలిపోయే ఆత్మ గురించి ఓపికతో వివరిస్తాడు.
సీసము పాంచ భౌతికమైన భవనంబు దేహంబు పురుషుడు దీనిలో బూర్వ కర్మ వశమున నొక వేళ వర్తించు దీపించు దఱియైన నొకవేళ దలగి పోవు జెడెనేని దేహంబు సెడుగాని పురుషుండు సెడ డాతనికినిం సేటు లేదు పురుషునికిని దేహ పుంజమునకు వేఱుగాని యేకత్వంబు గానరాదు ఆటవెలది దారువుల వెలుంగు దహనుని కైవడి గాయముల చరించు గాలి భంగి నాళలీనమైన నభము చాడ్పున వేఱు తెలియ వలయు దేహి దేహములకు ( పోతన భాగవతం సప్తమ స్కంధం 51 వ పద్యం)
అంటూ శరీరానికి ఆత్మకు దోస పండుకు తీగకు ఉన్నటువంటి బంధంగా విశ్లేషిస్తారు.తల్లిగర్భములోనున్నపుడు కాపాడింది భగవంతుడే.వాడేజీవులన్నింటినీ కాపాడుతాడు.తనలీల కొరకే సృష్టి,స్థితి,లయము చేస్తాడు‌.ఇది అతని బొమ్మలాట.కర్మ వలన జనన మరణములు కలుగును.ఆత్మకు అంటవు.దేహము,మట్టి,నీరు,తేజస్సు అనేవి పరిణామక్రమము.ఆత్మకు ఆకార వికారములు లేవు.ఆత్మ శరీరము వేరు.సుయజ్ఞుని కళేబరము మీ ముందరే ఉన్నది.అందులో ఉండాల్సిన వాడు లేడు.ఇంకా ఏడ్చు టేల?దేహము లోని ఇంద్రియా లన్నిటికి ప్రాణమే హేతువు.అది ఉంటేనే మాట్లాడుట,వినుట,కనుట.ప్రాణమే లేనిది ఇవేవీ సాధ్యము కాదు.ఆత్మ సర్వవ్యాపకము.ఆత్మశరీరమును త్యజించి పోతుంది.మాయా మోహములకు కష్ట నష్టములకు కర్మ బంధములే కారణము.అందుకే అశాశ్వతమైన శరీరము కొరకు ఏడ్చుట అజ్ఞానము. అంటూ యమ ధర్మరాజొక కథ చెబుతాడు.
ఒక అడవిలో బోయ వాడొకడు పక్షులకు యముని లాంటి వాడు.పిట్టల జంటకు ఎరపెట్టి వల పన్నుతాడు.ఆడపిట్ట వలలో చిక్కుకుంటుంది. దాన్ని విడిపించే శక్తి లేక మగపక్షి విలవిలలాడుతుంది.
పసి కూనలైన పిల్లల రక్షణ బాధ్యత తనకు గుర్తు వస్తుంది. ఈ విచారంలో జాగరుకత కోల్పోయిన మగపిట్టను బోయవాడు బాణంతో చంపుతాడు.భార్య గురించి విచారిస్తూ తన ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు.అందువల్ల సుయజ్ఞుని గురించి మీరెన్నేళ్ళు ఏడ్చినా తిరిగిరాడని బాలుడైన యముడు సముదాయించటంతో భార్యలు,పిల్లలు జ్ఞానులై సుయజ్ఞునికి కర్మకాండలు జరిపిస్తారు.గతంలో జరిగిన ఈ కథ తన కొడుకు హిరణ్యకశిపుని ద్వారా విన్న దితి,హిరణ్యాక్షుని భార్యలకు ఆత్మజ్ఞానం కలుగుతుంది.దుఃఖము నియంత్రించి అంత్యక్రియలు నిర్వహిస్తారు.అందుకోసమే జ్ఞానంతో ఉన్నప్పుడే మానవత్వంతో జీవరాశికి సేవ,హరినామ స్మరణతో మోక్ష మార్గములో పయనించాలని మహా భాగవతములోని సుయజ్ఞోపాఖ్యానం లోకానికి మార్గదర్శనం చేస్తున్నది.

ఉపయుక్తగ్రంథసూచి:
1.వేదవ్యాసమహర్షి రచించిన శ్రీ మహాభాగవతం( సంస్కృతం-తెలుగులిపీ)గీతం ప్రెస్ గోరఖ్ పూర్ వారి ప్రచురణ
2.శ్రీమదాంధ్రమహాభాగవతము( బమ్మెరపోతనామాత్యప్రణీతము)
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ
3.డాక్టర్ దాశరథి రంగాచార్య రచన
భాగవతవ్యాఖ్యానం
1977ముద్రణ

March 18, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us