వసంత విభావరిలో విరిసిన వెలుగుల వేళ,
పచ్చని ప్రకృతి పులకించి నవ్విన వేళ,
గడపల గర్భగృహమున మంగళ స్వరమై
తెలుగు తల్లి పండుగగా ఉగాది అవతరించె.
మామిడి తొరణాల పచ్చని తంతువులలో
ఆశల అలలు అలరిస్తూ ఊగుచుండగా,
వేప పుష్పాల చేదు గర్భిత గంధములో
జీవన సత్యాల గూఢార్థం మౌనమై నిలిచె.
కోకిల కూయు కంఠమున కలకల రాగములు
ప్రకృతి మంగళ ధ్వనులై పరిమళించగా,
వసంత సమీర మృదుస్పర్శ సన్నిధిలో
నూతన సంవత్సర స్వప్నాలు సుస్వాగతించె.
మామిడి–వేపల మేళన రసమూర్తిగా
ఉగాది పచ్చడి రూపమై వెలిసిన వేళ,
చేడు–తీపి–పులుపు–కారం–ఉప్పుల రుచులలో
జీవిత చక్రం సత్యమై ప్రతిధ్వనించె.
సంస్కృతి సుమములు వికసించు వేళ,
సంప్రదాయ దీపములు ప్రకాశించు వేళ,
ప్రకృతి–మనుజ బంధమది పావనమై
భూమి ఒడిలో నిత్యమై నిలిచియుండె.
అందుకే ప్రతి ఉగాది ప్రబోధమై,
పచ్చని మామిడి పుటల పలుకులలో,
వేప పుష్ప సుగంధ విరిసిన వేళ,
కోకిల గానామృత తరంగములలో,
ప్రకృతి సాక్షిగా మన జీవన గాథకు
కొత్త ఆది – కొత్త ఆశ – కొత్త మార్గమై నిలిచె.
“రవి గాంచని చోటు కవి గాంచున్”
“కత్తి కంటే కలం గొప్పది”
సాహితీ రంగానికి సంబంధించి తరుచుగా వినిపించే రెండు సూక్తులు.
వస్తువు ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయగలిగే శక్తి కవులకు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ (రవి……. గాంచన్)నానుడి పుట్టి ఉండవచ్చు.
“కత్తి కంటే కలం గొప్పది”
కత్తి శరీరాన్ని గాయపరిస్తే, కలం ఆలోచనను రేకెత్తిస్తుందన్న భావన ఈ సూక్తిలో మనకు కనిపిస్తుంది. [గాయపరచడం మాత్రమే కాదు, శస్త్రచికిత్సలోనూ తనదైన పాత్ర పోషించి, వ్యాధి పీడితులకు స్వస్థత చేకూర్చడంలో బలమైన పనిముట్టుగా ఉపయోగపడుతుందనేది (ప్రస్తుతానికి అనవసరమైనా) అందరూ ఆమోదించాల్సిన మరో కోణం].
కలం అజ్ఞానాన్ని పారద్రోలి, జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది. ఆలోచనను రేకెత్తించి, మార్పు వైపు నడిపిస్తుంది. ఆ మార్పు మనిషిలోని మాలిన్యాన్ని కడిగేసేదైనా కావచ్చు, అభివృద్ధి బాట పట్టించేదైనా అయి ఉండవచ్చు.
మేము సైతం అంటూ కలాన్ని చేతబట్టి, తమకంటూ ఒక గుర్తింపును సంతరించుకున్న 19వ శతాబ్దపు ఈ సరస్వతీ పుత్రికలను కెమెరాలో బంధించిన ఆనాటి అపూర్వ ఘట్టం, తీయని జ్ఞాపకమై నేడు నెట్టింట వైరల్ గా మారుతోంది. వారు వెదజల్లిన పరిమళాలను ఆఘ్రాణిస్తూ, ఈ చిరు అక్షర నీరాజనం.
రంగనాయకమ్మగారు
సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రిగా, విమర్శకురాలిగా, మార్క్సిస్ట్(శ్రామిక వర్గ ప్రయోజనాలను సమర్ధించే వ్యక్తి) గా సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజాస్వామిక విలువలు, కుల వ్యతిరేకత, సమానత్వం, భారతీయ పురాణాలు వంటి అంశాలపై రచనలు చేశారు. 1955లో రచనా వ్యాసంగం ప్రారంభించిన వీరు 15 నవలలు, 70 కథలు,వ్యాసాలు మాత్రమే కాకుండా భారత కమ్యూనిస్టు ఉద్యమం, మావోయిజంపై కలాన్ని సంధించారు.
కలం పట్టిన తొలినాళ్లలో దద్దనాల (తండ్రి ఇంటి పేరు) రంగనాయకమ్మగా, వివాహానంతరం ముప్పాళ్ళ రంగనాయకమ్మగా పాఠకులకు చిరపరిచితులు.
1965 లో ‘ బలిపీఠం’ నవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. మార్క్సిస్ట్ దృక్పథంతో రాసిన ‘రామాయణ విషవృక్షం’ బ్రాహ్మణ వ్యతిరేకిగా, స్త్రీవాద రచనలు చేయడం వల్ల పురుష వ్యతిరేకంగా ముద్ర పడింది.
జానకి విముక్తి, కళ్ళు తెరిచిన సీత, కృష్ణవేణి, బలిపీఠం, రచయిత్రి, కళ ఎందుకు, ప్రేమకి ముగింపు ఎప్పుడు?, వాళ్ళిద్దరూ అంతేనా?, రామాయణ విషవృక్షం,ఇదండీ మహాభారతం వంటి రచనలు చేసి, సాహిత్య రంగంలో పలు సంచలనాలు సృష్టించారు.
పాకాల యశోదా రెడ్డి
తెలంగాణ భాష,యాసలతో కూడిన రచనలు చేసిన వీరు తమలోని ప్రతిభకుగాను ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో ఆచార్య పీఠాన్ని అలంకరించారు. ప్రాచీన తెలుగు సాహిత్యంపై వీరు చేసిన ప్రసంగాలు పలువురి మన్నన లందుకున్నాయి. ఆకాశవాణిలో తెలంగాణ మండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయిత్రిగా వినుతి కె క్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, లలితకళా అకాడమీ,సంగీత అకాడమీ సభ్యురాలిగా కొనసాగారు. ఆంధ్ర సారస్వత పరిషత్, జానపద కళా సాహిత్య సంస్థలతో వీరికి విడదీయరాని అనుబంధం ఉంది. ధర్మశాల, ఎచ్చమ్మ కథలు, మా ఊరి ముచ్చట్లు, భారతీయ చిత్రకళ, ద్విపద వాంగ్మయం, ప్రబంధ వాంగ్మయం, భావిక వంటి రచనలు, పలు విమర్శనాత్మక గ్రంథాలు రచించారు.
కాసు రాఘవమ్మ గారు
గాంధీజీ సిద్ధాంతాలకు ప్రభావితురాలై, జాతీయ ఖాదీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేటలో కాసు రాఘవమ్మ – బ్రహ్మానందరెడ్డి పేరుమీద 1972 లో జూనియర్ కళాశాల,1974 లో డిగ్రీ కళాశాలలు(25 ఎకరాల విస్తీర్ణంలో) స్థాపించబడినవి.

ఈ రెండు కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో వెలువడే ‘ప్రతిభ’
అనే వార్షిక పత్రిక విద్యార్థుల్లో దాగిన సాహితీ విలువలకు అద్దం పడుతూ ఉండేది.
భానుమతీ రామకృష్ణ
అటు చలనచిత్ర రంగం, ఇటు సాహితీ రంగం. రెండింటిని సమన్వయ పరచుకున్న తీరు అద్భుతం. నటిగా, గాయనిగా, స్టూడియో అధినేత్రిగా, నిర్మాతగా, దర్శకురాలిగా అన్ని పాత్రల్లో ఒ దిగిపోయి మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. శ్రోతలను మురిపించి, మరిపించిన కంఠస్వరం ఆమె వరం. హాస్యంతో కూడిన రచనలు, చక్కని వాగ్దాటితో కట్టిపడేసే ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణలు. ఆత్మవిశ్వాసం పాలు ఒకింత ఎక్కువై గర్విష్టి(కొంతమంది దృష్టిలో)గా ముద్రపడినా, వారిలోని భక్తి తత్పరత, స్నేహశీలతల కారణంగా అందరి మనసుల్ని చూరగొనేవారు.
తమిళనాడులోని సంగీత కళాశాలకు ప్రధాన ఆచార్యులుగా సేవలందించారు. వీణ వా ద్యంలోనూ ప్రావీణ్యం గడించారు. వస్త్రాలపై ఎంబ్రాయిడరీ చేయడాన్ని బాగా ఇష్టపడేవారు. తమిళం పై పట్టు సాధించినప్పటికీ,తెలుగు భాషపై ఉన్న అభిమానంతో అచ్చమైన తెలుగులో మాట్లాడేవారు. తప్పనిసరైతే తప్ప సంభాషణల్లో ఆంగ్ల పదాలను వాడేవారు కాదు.
ప్రతీ వాక్యంలో హాస్యాన్ని గుప్పిస్తూ, సులభ శైలిలో రచించిన ‘అత్తగారి కథలు’ అనే రచన పేరు ప్రఖ్యాతల్ని మాత్రమే కాకుండా, సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించింది. వ్యక్తిగత జీవితంలోని పార్శ్వాలను, చలనచిత్ర ప్రస్థానాన్ని ఉటంకిస్తూ వ్రాసిన ‘నాలో నేను ‘ అనే స్వీయ రచన 1994లో జాతీయ బహుమతిని అందించింది.
చలనచిత్రాలకు దర్శకత్వం వహించడం వారిలోని ఆత్మవిశ్వాసానికి, సాహసానికి ప్రతీకగా పరిగణించవచ్చు. ప్రతీ చిత్రంలోను ఒక త్యాగరాయ కీర్తన, ఒక జావళి ఉండటాన్ని ఇష్టపడేవారు. చలన చిత్రాల్లో స్త్రీకి సముచిత స్థానం కల్పించేవారు.
1953లో నిర్మించిన ‘చండీరాణి ‘తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన తొలి తెలుగు మహిళా దర్శకురాలి చలనచిత్రంగా రికార్డుల కెక్కింది.
తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలి మహిళా సూపర్ స్టార్ ఐన వీరిని1996లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్ వరించింది.
ఇల్లిందుల సరస్వతి
ప్రముఖ తెలుగు కథా రచయిత్రిగా వాసికెక్కిన వీరు స్వయంకృషితో హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు సాధించి, జర్నలిజంలో డిప్లమా పొందారు. 250 కథలు, 5 నవలలు,5 వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, రేడియో నాటకాలు రచించారు. వివిధ భాషల్లోంచి అనువాదాలు చేసి, కథాసంకలనాలు వెలువరించారు. బాల సాహిత్యంలో రచనలు చేసి, చక్కటి గుర్తింపును పొందారు.
ముత్యాల మనసు, కల్యాణ కల్పవల్లి, మనం – మన ఆహారం (అనువాదం), రాజహంసలు స్వర్ణకమలాలు, భారతనారి – నాడూ నేడూ వంటి విశిష్ట రచనలు చేశారు.
1934లో హైదరాబాద్ మహానగరంలో ఎల్లాప్రగడ సీతాకుమారి గారితో కలిసి ‘ఆంధ్ర యువతి మండలి’ని స్థాపించి, దానికి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకు వచ్చేందుకుగాను మూడు సంవత్సరాల పాటు జైలు విజిటర్ గా సేవలందించారు. కేంద్ర రాష్ట్ర సినిమా అవార్డు కమిటీలో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రిగా రికార్డుల కెక్కారు. ‘స్వర్ణకమలాలు’ కథా సంకలనానికిగాను 1982లో ఈ అవార్డు వీరిని వరించింది.
1958లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి నలంకరించారు.
తురగా జానకీరాణి
ప్రముఖ తెలుగు రచయిత్రి, సంఘ సేవకురాలైన వీరు 1975 లో ఆకాశవాణిలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినది మొదలు పలు సవాళ్లు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో అలుపెరుగని పోరు సలిపారు. వీరు ఉద్యోగంలో చేరే నాటికి దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్నది. ఆ గడ్డుకాలంలో ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలను ప్రజలకు చేరవేయడాన్ని, వారిని చైతన్య పరచడాన్ని సవాలుగా స్వీకరించారు. వారిలోని అంకితభావం, నిబద్దతలపై స్పష్టమైన అవగాహన ఉన్న పై అధికారులు, వారి నిర్ణయాలను ఆమోదించి, వాటిని అమలు పరిచే విధానంలో పూర్తి స్వేచ్చ నిచ్చేవారు. ప్రణాళిక, నిర్వహణ, ప్రదర్శన అనే ఈ మూడు అంశాలు దృఢంగా ఉంటే ఏ కార్యక్రమంలోనైనా చక్కగా రాణించవచ్చని చెబుతారు.
100 పైగా కథలు (3 సంపుటాలు),3 నవలలు, 5 బాల సాహిత్య గ్రంథాలు, 3 అనువాద రచనలు చేశారు. రేడియో పాటలు, నాటికలు, రూపకాలు రచించి, వాటిని పిల్లలతో ప్రదర్శింపజేసి, రేడియో అక్కయ్యగా అందరి ప్రేమను చూరగొన్నారు. సభా ప్రసంగాలు, సాధారణంగా మైక్ పట్ల ఉండే జంకును పోగొట్టి, చక్కని వక్తలుగా మలచడానికి ‘బాలానందం’కార్యక్రమాన్ని బలమైన వేదికగా ఎంచుకున్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే క్రమంలోనే వీరిలోని సంఘసంస్కర్త మేల్కొన్నారు. బాలల హక్కులు, బాలల సమస్యలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. UNICEF, NCRT, బాల జాగృతి (బాజా), ప్రభుత్వ శాఖల సమన్వయంతో 670 వీథి ప్రదర్శనలు నిర్వహించారు. ‘ఇది నా సమస్య’ అనే స్త్రీల కార్యక్రమాన్ని, వృద్ధులకు సంబంధించి ‘స్రవంతి’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వాటి ద్వారా వారి సాదకబాధకాలను తెలుసుకుని, పరిష్కరించేవారు. పంచాయితీలలోని మహిళలను సంఘటిత పరిచి, ‘అందరికీ చదువు’ అనే కార్యక్రమం ద్వారా వారికి విద్యనందించడమే గా కుండా, వారిలోనే రచనా శక్తిని జాగృత పరిచేవారు.’మా చేతి పంపు – మా బిందె నింపు’ అనే సామాజిక అవగాహనా కార్యక్రమానికి చక్కని స్పందన లభించింది.
వీరి వెలలేని సేవలకు గాను గృహలక్ష్మి స్వర్ణ కంకణం, బాల సాహిత్య రత్న, బాలబంధు, ఈనాడు, ఆంధ్ర సారస్వత పరిషత్ లో పరిణిత వాణి, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (2 సార్లు), రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, పింగళి వెంకయ్య స్మారక సత్కారం, అరవిందమ్మ మాతృమూర్తి పురస్కారం, సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వరించాయి. 1994లో IBPS సహాయ దర్శకురాలి (అసిస్టెంట్ డైరెక్టర్) గా పదవీ విరమణ చేశారు.
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు
రచయిత్రిగా, పండితురాలిగా, పరిశోధకురాలిగా, ఉపన్యాసకురాలిగా ప్రఖ్యాతి గాంచిన వీరు, కృష్ణకుమారి అనే పేరుతో ‘భారతి ‘ మాస పత్రికలో రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. వ్యాసం, గేయం, వచన కవిత, ఖండకావ్యం, చారిత్రక పరిశోధన వంటి పలు ప్రక్రియల్లో పాండిత్యం గడించారు. 10 సంవత్సరాల వయసులోనే వేదికలెక్కి ఉపన్యసిస్తూ, ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను ప్రేరేపించేవారు. 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి కవిత్వం, నృత్యం, కుట్టుపని, ఎంబ్రాయిడరీ వంటి కళల్లో నైపుణ్యం సంపాదించారు. విజయవాడ, మద్రాసు రేడియో కేంద్రాలలో వీరి రచనలు, ప్రసంగాలు తరచుగా ప్రసారమవుతూ ఉండేది. 18 వ. ఏట ‘ఉభయ భాషా ప్రవీణ ‘పట్టా పొందారు.
కోరల మధ్యన కోటి స్వర్గాలు, లజ్జ కిరీట ధారిణి, చీకటిరాజ్యం, దేవి స్తవతారావళి, మన సాహితి – మధుర భారతి, కనకమ్మ నివాళి, మహిళా విక్రమ సూక్తము, ఆంధ్ర కవయిత్రులు వంటి రచనలు అఖిల భారత కవయిత్రిగా గుర్తింపు నిచ్చాయి. చంద్రమతి కథ, యుగళ సిరి అనేవి వీరి అముద్రిత రచనలు. వాగ్గేయకారులు, పదాలు, జావళీలు,తత్వాలు, సంకీర్తనలపై సునిశిత పరిశీలనాశక్తితో ‘ఆంధ్ర కీర్తన వాంగ్మయ సేవ ‘ అనే గ్రంథాన్ని రచించారు. ఆకాశవాణిలో లలిత, భక్తి గీతాల ప్రసారంలో గణనీయమైన పాత్ర పోషించారు. 1968లో ‘కథామందారం ‘ అనే సంకలనాన్ని ప్రచురించారు. తెలుగు మొలక, విద్వత్కవయిత్రి, ఆంధ్ర విదుషీ కుమారి, ఆంధ్రసరస్వతి, కవయిత్రీతిలక, సాహితీరుద్రమ, కళాప్రపూర్ణ వంటి పలు బిరుదులను పొందారు. గృహలక్ష్మి స్వర్ణ కంకణం అవార్డు పొందారు. కనకాభిషేకం, పౌర సన్మానం, గజారోహణం వంటి ఘన సన్మానాలు పొందిన ఆధునిక తెలుగు కవయిత్రిగా వాసికెక్కారు.
తెన్నేటి హేమలతగారు
రెండు పదులు కూడా నిండని వయసులోనే రచనకు శ్రీకారం చుట్టిన జానకి రమాకృష్ణవేణి వివాహానంతరం తెన్నేటి హేమలతగా పేరు మార్చుకుని పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించారు.5 వ. తరగతి వరకు మాత్రమే పాఠశాలలో చదివినప్పటికీ, జిజ్ఞాస కారణంగా తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషలపై పట్టు సాధించారు.70,80 దశకాల్లో వీరి రచనలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
1955లో విజయవాడ ఆకాశవాణి కేంద్ర అనౌన్సర్ గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వీరు, పలు రేడియో నాటకాలు, సినిమాల్లో నటించి, మాటలు వ్రాయడం మొదలుపెట్టారు. ‘శిలా హృదయం’పేరుతో వీరు రచించిన మొదటి రేడియో నాటకం 1952లో డక్కన్ రేడియోలో ప్రసారమైంది. సంగీతాన్ని అమితంగా ఆరాధించే వీరు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిపై ఉన్న అభిమానంతో వారు స్వరపరచిన కొన్ని రాగాలకు చక్కని సాహిత్యాన్ని అందించారు.
100 కథలు,105 నవలలు, 700 రేడియో నాటకాలు, 10 రంగస్థల నాటకాలు,5 సాహిత్య వ్యాసంపుటాలు, 2 సాహిత్య విమర్శనా సంపుటాలు, ‘లత వ్యాసాలు’ పేరుతో సంపుటి, ‘చరిత్ర కందని ప్రేమ కథలు’ అనే కవితా సంపుటుల వెలువరించారు.
ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన ‘రామాయణ విషవృక్షం’ నవలను విమర్శిస్తూ ‘రామాయణ విషవృక్ష ఖండన’ రచించారు. హైదరాబాద్ 6 వ. నిజాం నవాబైన మీర్మఖ్బూల్ అలీఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ ప్రియతముడు ‘ అనే నవలను రచించారు. పాంచాలి,ఎడారి పువ్వులు, మహానగరంలో స్త్రీ, రక్తపంకం, మోహనవంశీ, గాలి పడగలు – నీటి బుడగలు, అంతరంగ చిత్రం వంటి రచనలు చేశారు. ‘గాలి పడగలు – నీటి బుడగలు’ నవలలో వేశ్యల దుర్భర జీవితాలను చిత్రీకరించడంతో పలు విమర్శలు ఎదురైనప్పటికీ, ఏమాత్రం జడవకుండా ‘రక్తపంకం’ లో వారి దైన్యాన్ని మరింత లోతుగా అక్షరబద్ధం చేశారు.ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించాననీ, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సందర్భాలు లేకపోలేదని చెబుతారు. మోహనవంశీ, అంతరంగ చిత్రం నవలల్లో వీరికి జీవితానికి సంబంధించిన పలు విషయాలను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఘట్టి ఆంజనేయ శర్మగారు ‘సాహితీలత’ అనే పేరుతో వీరి జీవిత చరిత్రను వ్రాశారు.
1963 లో గృహలక్ష్మి స్వర్ణకంకణం, 1981లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలక్షణ మహిళా పురస్కారం వీరిని వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 20 సంవత్సరాల పాటు వీరు తమ విశిష్ట సేవలను అందించారు.
సామాజిక చైతన్యానికి ఆయువుపట్టైన రచనా వ్యాసంగాన్ని కొనసాగించే కవులు, రచయితలు అప్పుడూ,ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటారు. వారు తమ రచనల ద్వారా గొప్ప కార్యక్రమాలకు పునాదులు వేయకపోయినా, దృఢమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టక పోయినా పరవాలేదు. ఎక్కడో, ఏ మారుమూలో ఒక నిస్సహాయుడి కంటి వెలుగై, ఒక నిరుపేద ఇంట చిరుదీపం వెలిగించ గలిగితే చాలు. ఆ రచన సార్థకం. ఆ రచయిత జన్మ ధన్యం.
ఉదయం లేవగానే మంచి మాట వింటే ఎలా ఉంటుంది? నచ్చిన వాళ్ళ పిలుపు , హృదయానికి హత్తుకునే సంగీతం లా ఉంటుంది కదా! అందుకే మనకిష్టమైన పండుగ శుభాకాంక్షలు అందరికీ చెబుతామూ, కోరుకుంటాము. పండుగల రోజు దేవుడిని , ప్రకృతి మాత నూ పలకరించి, పులకరిస్తాం!! ధన్యవాదాలు కూడా తెలుపుతాం . మరి ఇప్పుడు ఆ పండుగ ఏంటి దాని పరమార్థం ఏమిటో పునశ్చరణ చేసుకుందాం . అంటే రివైజ్ చేసుకుందాం.. రివ్యూ చేసుకుందాం….
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. యుగాది అని కూడా అంటారు యుగ అనగా కాలమని ఆది అంటే ఆరంభం అని, ఉ -అంటే నక్షత్రం, గ- అంటే గమనం, నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాము అని కూడా చెబుతారు. ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలించాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యవతార రూపంలో వెళ్లి సోమకారుణ్ణి వధించి వేదాలను బ్రహ్మకు అప్పచెప్పాడట. బ్రహ్మదేవుడు ఈ రోజే సృష్టికార్యం ప్రారంభించినాడని పురాణ వాక్యం. తెలుగు వారు ఎక్కువగా చంద్రమానం అనుసరించి మొదటి నెల చైత్రమాసం కనుక ఈ మాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది జరుపుకుంటారు. ఇంగ్లీష్ నెలలు ప్రకారం మార్చి నెల అవుతుంది .
కొత్త సంవత్సరం అనేది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మారుతుంది. అమెరికా న్యూ ఇయర్ జనవరి 1, అలాగే చైనా ఫిబ్రవరి న్యూ ఇయర్. నోవరేజ్ మార్చ్ లో, ఇథోపియా సెప్టెంబర్ లో న్యూ ఇయర్ జరుపుకుంటుంది ( వీరి క్యాలెండర్లో 13 నెలలు ఉండడం విశేషం ).
మనదేశంలో గుజరాత్ అక్టోబర్, నవంబర్లో, బెంగాలీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ ఇంచుమించు మార్చి ఏప్రిల్ నెలల్లోనే వివిధ రకాల పేర్లతో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు.
మన కొత్త సంవత్సరాదిలో మన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో భాగంగా అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు సారే పెట్టి పంపుతారు మళ్ళీ అలాగే ఇంచుమించు అంతే ఘనంగా ఉగాది సారే పెట్టి అత్తవారింటి నుండి అమ్మాయిని అల్లుడిని సంవత్సరాది పండుగకు తీసుకువస్తారు.
సూర్యోదయానికి ముందే లేచి వాకిళ్లలో ముగ్గులు వేసి, గడపలకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెడతారు. మామిడి తోరణాలతో అలంకరిస్తారుఏ పండుగకైనా ఇది ఆరంభం, ఆనవాయితీ. పండుగ అంటేనే మలినాన్ని తొలగించే పవిత్రత,శుభ్రత. మన ఇల్లు వాకిళ్లలోకి భగవంతుని ఆహ్వానించడమే గాక మనందరి గుండె గుడిలో కొలువై ఉన్న దైవాన్ని మనం పలకరించుకోవడమే పండుగల పరమార్థమని మన పెద్దలు నేర్పుతూ వచ్చిన మన సంస్కృతి. పదిమందితో కలిసి పండుగ సంబరాన్ని పంచుకోవడమే పండుగల ఉద్దేశ్యం కూడా.
వసంత ఋతువు రాకతో ప్రకృతి అంతా పచ్చదనాన్ని నింపుకుంటుంది. మావిచిగుళ్ళు తింటూ మత్తెక్కిన కోయిల రాగాలు మనసును ఉల్లాస పరిస్తే, రుచులు కోరుకునే నాలుక షడ్రుచుల,నా స్వాదిస్తూ, శరీరానికి కావలసిన నూతన శక్తి నిస్తుంది.
వసంత ఋతువు వెంట రాబోయే కాలం గ్రీష్మ ఋతువు కాబట్టి, ఉష్ణం ఎక్కువయ్యి శరీర వ్యాధులు పెరుగుతాయి. వందలఏళ్ళ క్రితం మనుషులు తయారు చేసే కృత్రిమ మందులు లేవు. ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపదపైనే మనుషులు ఆధారపడ్డారు. అందుకే వృక్షాలను ఓషధులు అని కూడా అంటారు. వేపకు శరీరానికి వేడి తగ్గించే రోగ నిరోధక శక్తి ఉన్నట్లే, బెల్లo నుండి రక్తపుష్టి, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. పెద్దమ్మ, ఆటలమ్మలకు వేపతోనే వైద్యం చేసే వాళ్ళు. ఏ సమయంలో ఏ ఉపద్రవం వస్తుందోనని మన అవసరాలకు ప్రకృతి ముందే అన్నీ ఏర్పాట్లు చేసి మనల్ని కాపాడుతుంది. అందుకే ప్రకృతిని మనం నిర్వీర్యం చేస్తే మన అమ్మను మనం చంపుకున్నట్టే, అంతకంటే నీచం లేదు.
లోకంలో ఉన్నవి ఆరు రుచులే, వేప -చేదు గుణాన్ని కలిగి శరీరానికి చలువనిస్తుంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుండి మంచిని గ్రహించమంటుంది. అలాగే ఉప్పు- రుచిని ఉత్సాహాన్నిస్తుంది., చింతపండు -నేర్పరి తనాన్ని, మామిడి- సవాళ్లను ఎదుర్కొనే శక్తిని, కారం -సహనాన్ని నేర్పుతాయి.
ఉగాది మనకు ప్రకృతి జ్ఞానం ఇస్తుంది,శారీరక జ్ఞానం, ఒక ప్రతీకాత్మక జ్ఞానం ఇస్తుంది, భావోద్వేగ జ్ఞానాన్ని ఇస్తుంది, ఇన్ని మర్మాలు ఒక్క ఉగాది పచ్చడి ద్వారా మనకు తెలుస్తున్నాయి. అందుకే ముఖ్యంగా పిల్లలు భవిష్యత్తులో మెచ్చుకోలుకు పొంగిపోక, విమర్శలకు కృంగిపోక, అయోమయ స్థితిలో పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని, షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి సందేశాన్ని, సాధనంగా పెద్దలు పిల్లలకు అందించాలి. నిజమైన విద్య స్కూలు, కాలేజీల్లో కాదు మన ఇంటి సంప్రదాయంలో ఉన్నది, ఈ తత్వం తెలుసుకోవడంలో ఉన్నది.
కొత్త బెల్లం,కొత్త చింతపండు, వేప పువ్వు, మామిడికాయలు ఉప్పు, కారం ( మిరియాలు). ఇవన్నీ కొత్త పంటలుగా ఉగాది నాటికి వస్తాయి. షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులకు, చిడిముడులకు ప్రతీ కగా సమభావంతో స్వీకరించాలన్న భావంతో ఉగాది పచ్చడి భగవంతునికి నివేదించి అందరూ తప్పక తింటారు. భగవంతునికి పూజ నైవేద్యాలు అనంతరం దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని పంచాంగ శ్రవణం చేస్తారు. వారి వారి జన్మ నక్షత్రాలను బట్టి రాసులు ఉంటాయి. ఏ ఏ రాశి వారికి ఆ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎంత ఉంటాయి, గ్రహదోషాలు, దేశ పరిస్థితులు ఇవన్నీ పంచాంగ శ్రవణంలో వివరిస్తారు. ఇంగ్లీష్ నెలలు అందరికీ అనుకూలంగా, ప్రభుత్వ కార్యాలయాలు, మిగిలిన వ్యవహారాలలో మన నిత్య విధులలో కూడా అలవాటైనప్పటికీ, మన పండుగలు, వివాహాది శుభకార్యాలు, ప్రయాణాలు, అవి ఇవి అని ఏమిటి ? సకల శుభకార్యాల ముహూర్తాలు తిధి వార నక్షత్రాలను అనుసరించే మనం జరుపుకుంటాము. ఆ సంవత్సరం ఏ పంటలకు అనుకూలము అనేది కూడా పల్లెల్లో చూస్తారు. ఆ పంటలే ప్రముఖంగా వేస్తారు కూడా, కొత్త పనులకు ఈరోజు శుభారంభంగా తలుస్తారు. ఊర్లలో సాయంత్రాలు తప్పనిసరిగా దేవుడి ఊరేగింపు ఉంటుంది. ఆరోజు స్వామి దేవాలయం నుండి బయటకు వచ్చి రాని వారిని,రాలేని వారిని కూడా అనుగ్రహించి దీవిస్తాడు. చల్లని చూపుల స్వామి పాడిపంటలతో పల్లె సుఖశాంతులతో ఉండాలని, పర్యవేక్షణకు వస్తాడని అందరి నమ్మకం.
తాటి కొండాల నరసింహారావు గారితో మయూఖ ప్రతినిధి రంగరాజు జరిపిన ముఖాముఖి
సమాజాన్ని రంగస్థలం మీద మలచిన వ్యక్తి…వ్యక్తి కాదు ప్రవాహం…. రంగస్థలం; పుస్తకాల రచన… పత్రికా సంపాదకత్వం… అన్నీ కలిసిన విశిష్ఠమైన బహుముఖీన ప్రజ్ఞాశాలులు…వారెవరో కాదు! గౌరవనీయ శ్రీ తాటికొండాల నరసింహారావు గారు… వారితో ముచ్చటించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకుందాం! ఇంకా ఆలస్యం ఎందుకు? సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
నాపేరు రంగరాజు పద్మజ. నాకు కూడా నాటక రంగమంటే అంతులేని మక్కువ… బాల్యంలో పాఠశాల వార్షికోత్సవ సందర్భంగానూ, సెల్ఫ్ గవర్నమెంట్ డే సందర్భంగాను నాటకం వేసి, ఆనందించిన నేను ఈరోజు గొప్ప రంగస్థల కళాకారులతో సంభాషించడం ఎంతో సంతోషంగా ఉంది…. పరిచయమే అక్కరలేని బహుముఖ ప్రజ్ఞాశాలులైన తాటికొండాల నర్సింహారావుగారిని మన మయూఖ పత్రిక పక్షాన వారిని పరిచయం చేసుకుందాము….
రంగరాజు పద్మజ:– నమస్కారమండీ !
తాటికొండాల నర్సింహారావుగారు:– నమస్కారమమ్మా!

పద్మజ : వ్యక్తిత్వం… ప్రస్థానంగా మీ జీవిత ప్రయాణం నిర్వచిస్తారా?
నర్సింహారావు:– నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణాజిల్లాలో 1943లో జన్మించాను. కొద్ది కాలం అక్కడ ఉన్న తర్వాత, నా చదువు సజావుగా సాగలేదు! ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రం మా ఊర్లో నాలుగవ తరగతి వరకు చదివాను. తర్వాత మా మేనత్త గారి ఊరు నెమలి అనే గ్రామంలో తిరువూరు తాలూకాలో ఉంది, అక్కడకు వెళ్లి పంచ కావ్యాలు, అమర కోశం మా మేనత్త మరిదిగారు నాకు నేర్పించారు. సంస్కృతం చదువుకొని ఎంట్రన్స్ పాస్ అయ్యాను. వాళ్లే ఒక ఉత్తరం రాసిచ్చారు హైదరాబాదులోని ఆల్వాల్ లో వేదాంతవర్ధిని కళాశాల సంస్కృత కాలేజీ ఉన్నది. అక్కడికి వెళితే నన్ను కాలేజీలో చేర్చుకున్నారు. అప్పుడు నాకు శ్రీ రవ్వ శ్రీహరి గారు మొదలైన వారు నా సహాధ్యాయులు…
BOL చదివాను. తరువాత మా నాన్న గారు ఏం చేసారంటే సంస్కృతం వద్దురా ! అంటే మళ్ళీ సంస్కృతంలోనే చదువుతున్నావని… కేకలేసి తీసుకొని వెళ్లి SGBT (ఎస్జీబీటీ) లో చేర్పించారు. అక్కడ పరీక్షలు ఏమీ లేవు. విద్యార్థులకు స్టైఫండ్ ఇచ్చేవారు. నెలకు 35 రూపాయలు వాటితోనే నా ఖర్చులు చేసుకునే వాడిని. యాజమాన్యం నా చేత ఒక బాండ్ రాయించుకున్నారు. నేను నాలుగు సంవత్సరాలు ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేస్తాను అని, మధ్యలో ఎక్కడికి వెళ్ళను… అని అలా బాండ్ రాసిస్తేనే నాకు ట్రైనింగ్ ఇచ్చారు. దాని ప్రకారం హై స్కూల్ ప్రైమరీ టీచర్ గా ఉద్యోగంలో చేరాను. జగ్గయ్యపేట ముక్త్యాలరాజా గారి ఆస్థానం లో చేరాను. ఆయన కృష్ణాజిల్లా బోర్డు సెలక్షన్ కమిటీ మెంబర్… తన దగ్గర నన్ను వేయించుకున్నారు. రెండు సంవత్సరాల అక్కడ పని చేశాను.
ఆయనకు నాకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ముక్కు సూటిగా వెళ్లే వ్యక్తిత్వం నాది! ఆయనతో తేడా వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చాను. మా నాన్నగారు అదేమిటి అంత పెద్ద రాజా గారి దగ్గర ఉద్యోగం వదిలి రావడం ఏమిటని? కేకలేశారు. ఇప్పుడు నీకు ఉద్యోగం ఎవరిస్తాడని మందలించారు. బాధపడ్డారు.
“నాకు భయపడాల్సిన అవసరం లేదు! నాన్నా! అన్నాను. అప్పుడు మా స్నేహితుడు ఖమ్మంలో జిల్లా పరిషత్తులో పనిచేసేవాడు. ఆయన ఇప్పిస్తానన్నాడు. ఖమ్మం వెళ్ళాను. అక్కడ జలగం కొండలరావు జిల్లా పరిషత్తు చైర్మన్ ఆయన దగ్గరకు పోయాను. నా స్నేహితుడు పరిచయం చేసి ఉద్యోగం కావాలి అన్నాడు… అంటే ఆయన ఏమన్నాడంటే సంస్కృతం చదివావు- ఎస్జి బి టి చదివావు… ఎస్జీబీటీ ఉద్యోగాలు ఇక్కడ లేవు! సంస్కృతం పాఠశాలలు లేవు… నీకు ఉద్యోగం ఎలా ఇవ్వాలి? అని అన్నాడు. మా స్నేహితుడు ఎలాగైనా ఇవ్వండి సార్! అని బతిమిలాడాడు. అక్కడ సూర్యనారాయణ గారని సెక్షన్ హెడ్ ఉండేవారు. ఆయన కాస్త చొరవ చేసుకొని” ఏదో ఒకటి ఇవ్వండి! తాత్కాలికంగా ఆ పని చేస్తాడు. ఎక్వైర్ చేసుకోమని చెప్పండి!” అని అన్నాడు. అప్పుడు ఏం చేశారంటే సబ్జెక్టు కండిషన్ తెలుగు విశారద- తెలుగు డివోఎల్- ఏదేని చదవాలని కండిషన్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. నేను జాయిన్ కావడానికి వెళ్ళి రాజేశ్వరపురంలో జాయిన్ అయ్యాను. నాకు తెలియని విషయం ఏమిటంటే ఇక్కడ నైజాం రాష్ట్రంలో ఉద్యోగం చేయాలంటే ముల్కీ సర్టిఫికెట్ కావాలి! ముల్కీ అంటే ఈ ప్రాంతంలో పుట్టినట్టు సర్టిఫికెట్ ఉండాలి. మరి నా దగ్గర లేదు! నెలకాగానే అందరికీ జీతాలు ఇచ్చారు. నాకు ఇవ్వలేదు!
హెడ్మాస్టర్ గారితో అదేమిటి సార్ నేను పని చేశాను కదా? అన్నాను.
నీకు తెలిసే మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు తెలియదు. నువ్వు ముల్కీ సర్టిఫికెట్ దాఖలు చేస్తేనే నీకు జీతం వస్తుంది అన్నాడు లేకపోతే రాదు! అన్నాడు. ఎవరు ఇస్తారని అడిగాను.
“సర్పంచ్ ఇప్పిస్తాడు” అన్నాడు. ఇంతలో పరీక్షలు జరిగే సమయం వచ్చింది, తరువాత సెలవులు వచ్చాయి. నన్ను ఉద్యోగం నుండి తొలగించారు. ఇంటికి వెళ్ళిపోయాను. సెలవులు అయిపోయి పాఠశాల తెరవగానే మళ్ళీ వచ్చాను. అప్పుడు ఆయనొక ఉద్యోగం ఇప్పించాడు. ఈ మధ్యన ఏమైందంటే సెలవుల్లో ఊరికే కూర్చోకుండా ఒక ఫిలిం రిప్రెసెంటేటివ్ గా పని చేశాను. అప్పుడు ఫిలిం రీల్స్ తీసుకొని సెంటర్ కి వెళ్ళాలి, ఎక్కడ రిలీజ్ అయితే అక్కడకి… అక్కడ కలెక్షన్ చూసుకొని తీసుకుని ఉదయమే వెళ్లి డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుకు పంపించాలి. అలా కొన్ని రోజులు పని చేశాను. కేవీ రెడ్డి గారితో పరిచయమైంది. కేవీ రెడ్డి గారు సినిమా కథా చర్చలు చేసేవారు. నా చేతిరాత బాగుంటుందని నువ్వు ఇక్కడే ఉండవయ్యా! అని నీకు రెప్రెజెంట్ వద్దు! ఏమీ వద్దు! మేము చెబుతున్నట్టు నువ్వు రాసేయమని ఆయన తన దగ్గర పెట్టుకున్నారు. అప్పుడు జగదేక వీరుడు కథ చర్చ జరుగుతున్నది. కొన్ని రోజులు స్టోరీ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. అప్పటికే నాకు పెళ్లయింది, ఒక అబ్బాయి పుట్టాడు. నేను అక్కడ- నా భార్య ఇక్కడ! కుదరడం లేదు! ఈ డబ్బులు ఉంటాయో? ఉండవో? సంసారం గడవాలి కదా! ఇది స్థిరమైన ఉద్యోగం కాదని, మానేసి మళ్ళీ ఖమ్మం వచ్చాను.
ఇక వచ్చావు కదా రెగ్యులర్ జాబు నీకు ఇప్పిస్తా అన్నారు సత్యనారాయణ గారు. 1968 లో అంటే నాకు 25వ ఏట ఉద్యోగంలో గ్రేడ్ సెకండ్ తెలుగు పండిట్ గా చేరాను. జీతం 70-100 స్కేలు. తర్వాత దూరవిద్యలో తెలుగు ఎమ్ ఏ (Telugu MA) చేశాను. సంస్కృతంలో MA చేశాను. DOL ఉన్నా కూడా బీఈడీ ( Bed)చేశాను. Med చేయలేదు. అప్పుడు జీవితం అనేది ఒక గాడిన పడింది.
పద్మజ :- రంగస్థలం- సాహిత్యం -క్రీడలు- సంపాదకత్వం… ఈ విభిన్న రంగాలలోకి మిమ్మల్ని నడిపించిన మూల ప్రేరణ ఏమిటి?
నరసింహారావు:– నాటక రంగంలో నా అడుగు హై స్కూల్ లోనే పడింది. అది ఎలా అంటే మా పాఠశాల వార్షికోత్సవం రోజున అప్పటికి నాకు ఇంకా 12 సంవత్సరాలే… మా సోషల్ మాస్టర్ గారు కన్నయ్యశాస్త్రి గారని ఉండేవారు. వారేమన్నారంటే “మన పాఠశాలకు DEO గారు వస్తున్నారు. మనం వార్షికోత్సవానికి ఏదైనా ఒక నాటకం వేయాలి! అని ఒక నాటకం ఎంపిక చేసుకున్నారు. అప్పుడు నాకు జులపాల జుట్టు ఉండేది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కథ కాబూలీవాల కథను నాటకీకరణ చేశారు. ఆ కాబూలి వాలాలో చిన్నవాడిని కనుక (మినీ యాక్సెంచర్) ఆడపిల్ల వేషం వేయించారు. ఆ నాటకానికి చాలా ప్రశంసలు వచ్చాయి. సార్ నాతో “అరేయ్ నువ్వు వృద్ధిలోకి వస్తావురా! నువ్వు నటన నేర్చుకో” అని అన్నారు మాస్టారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాను.
మా పెద్దన్నయ్య గారు రచయిత అప్పారావు గారు ఆయన కూడా ఉపాధ్యాయులే! ఆయన తాను స్వంతంగా ఒక నాటకం రాసి, అందులో సర్పంచ్ పాత్రను నన్ను వేయమని నాకు ఇచ్చారు. ఆ నాటక ఇతివృత్తం ఒక పాఠశాలను ఎలా నడిపించాలని…
ఆ రకంగా నాటక రంగంలో ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ సంస్కృత కళాశాలలో చేరిన తర్వాత అంతర్ కళాశాల పోటీలు జరిగాయి. ఆ రోజుల్లో ఆంధ్రాభ్యుదయ ఉత్తరాలు జరిగేవి. వేరే వేరే పాఠశాలల నుండి నాటకాలను ఆహ్వానించేవారు. ఉభయ రాష్ట్రాలలో ఉన్న కాలేజీలలోని విద్యార్థులు అందరికీ కూడా ఆయా నాటకాలకు ప్రథమ,ద్వితీయ, తృతీయ, బహుమతులు ఇచ్చేవారు. ఆ విధంగా నేను సంస్కృత కళాశాలలో చదువుతున్నాను కాబట్టి, ఆ కాలేజీ తరపున వచ్చాము. అయితే తెలుగు నాటకం వేయాలని స్వప్న సీమ అనే నాటకం తీసుకుని వేయాలనుకున్నాము. దాంట్లో ప్రత్యేకత ఏమిటంటే మైమ్ (myme ) యాక్షన్ చేయాలి! ఆ పాత్ర పాప్ సింగర్! ఒక హార్మోనియం పట్టుకొని పాట పాడుతుంటాడు కదా? ఆ నాటకం వేసే సమయానికి మాకు ఎక్కడా హార్మోనియం దొరకలేదు! స్టేజి మీదకి వచ్చాను ఏం చేయాలో ?అర్థం కాలేదు! బాగా ఆలోచించాను. ఎలాగో డైలాగులు చెబుతున్నట్టు…
మైమ్ యాక్షన్ చేశాను. అప్పుడు న్యాయనిర్ణేతలుగా వచ్చిన వారు ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్; అలాగే మల్లీశ్వరి చిత్రదర్శకులు బి.యన్ రెడ్డి గారు. 1957 లో వారిద్దరి చేతుల మీదుగా ఒక అవార్డు తీసుకున్నాను. దాంతో నాలో ఉత్సాహం పెరిగింది. తర్వాత మా కాలేజీలోనే సంస్కృత మాధ్యమంలో ( డైలాగ్లన్నీ సంస్కృతంలోనే ఉంటాయి.) అలా మృచ్ఛకటికము, ముద్రారాక్షసము,అనే వాటిల్లో మంచి పాత్రలు వేసాను.
మా గురువుగారు వేదాల తిరువేంగళాచార్యులు గారు. మాకు అలంకార శాస్త్రం బోధించేవారు. ఆయన నన్ను చాలా ప్రోత్సహించారు. రేడియోలో ప్రోగ్రాం ఇచ్చాను. అప్పుడు కథలు చదవాను. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారంచేసారు.
BOL అయిపోయాక మధుర దగ్గర మహాదేవపురం అక్కడ ఉద్యోగంలో గ్రేడ్ 2 తెలుగు పండిట్ గా ఉద్యోగంలో చేరాను. పాఠశాలలో ఏ కార్యక్రమాలైనా తెలుగు టీచరే ఆ పని చేయాలి! అంటే సాంస్కృతిక ఉత్సవాలైనా సరే లైబ్రరీ ఇన్చార్జి గాని వాటికి సంబంధించిన పనులన్నీ తెలుగు టీచర్ గా నేనే చేసే వాడిని .సోషల్ మాస్టర్ నాకే అప్ప చెప్పేవారు. అలా పిల్లలతో నాటకాలు వేయించడం, నేను వేయడం, అలా కొడాలి గోపాల్ రావు గారి నాటకాలను, గొల్లపూడి మారుతీ రావు గారి నాటకాలను, ఇలా అన్నిటిని వేసేవాడిని. ఏ పాఠశాలకు వెళ్లిన నేనే పిల్లల చేత నాటకాలు వేయించడం జరిగింది.
ఒక విషయం ఏమిటంటే పందిళ్ళపల్లిలో 1974 నుండి 84 వరకు అక్కడ పనిచేసాను. అక్కడ కూడా నాటకాలు వేయిస్తూ ఉండేవాడిని. ఆ స్కూల్ కు సరైన వస్తు సామాగ్రి లేదు! వాటిని సమకూర్చుకొనేందుకు నేనే ఒక నాటకం రాసి, భారతంలో సీత అని పేరు పెట్టి రాసుకొని, బాగా ప్రాక్టీస్ చేయించి, చుట్టుపక్కల ఊళ్ళల్లో ప్రదర్శింపజేసి, ఆ రోజుల్లోనే 15000/రూ.లు నాటకాల ద్వారా వసూలు చేసే స్కూల్ డొనేట్ చేశాను. అంటే బెనిఫిట్ షో అన్న మాట!
అలా ఊరికి నాకు విడదీయలేని సంబంధం ఏర్పడింది. నాకు వేరే ఊరికి బదిలీ అయినా కూడా ఆ ఊరి వాళ్ళు నన్ను వెళ్ళనీయకుండా ఆ గ్రామంలోనే ఉండమన్నారు. ఆ తర్వాతేమైందంటే? అక్కడి నుండి వెళ్ళక తప్పలేదు!
ఒకాయన నన్ను వాళ్ళ ఊరికి రమ్మన్నారు. ఆయనకు మా ఊళ్ళో బంధువులున్నారు. నాకోసం ఇల్లు వసతులు ఏర్పాటు చేసారు. మా శ్రీమతిని తీసుకొని వెళదామనుకున్నాను కానీ ఇంకొక ఆయన పెద్ద పైరవీ చేసి నన్ను రాఘవపురం అనే ఊరికి రమ్మని పిలిపించుకున్నారు. పాత ఆర్డర్ క్యాన్సిల్ చేసి రాఘవపురానికి ఆర్డర్ ఇచ్చారు. నేను సర్దుకుని పోదాం అనుకున్నంతలో ఇలా జరిగింది. ఇలా ఎందుకు చేసారు? అని అడిగితే నీవు వెళ్లి ఓ ఐదు నెలలు అక్కడ ఉండి చూడు! నువ్వు అక్కడ ఉండలేక పోతే నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయిస్తానన్నాడు. ఎందుకంటే? ఆరోజుల్లో సర్పంచ్ లకు బదిలీ చేయించే ఇన్ ఫ్లుయన్స్ ఉండేది. సర్పంచ్ అడిగితే తబాద్ లా చేసేవారు. అలా బురద రాఘవాపురం వెళ్లాను.
నేను ఎక్కడికిపోయినా ప్రయాణ సౌకర్యాలు ఉండకపోయేవి. ఎక్కడికి వెళితే ఆ ఊర్లోనే కాపురం పెట్టాల్సిందే. అలా ఆ ఊరి ప్రజలతో మమేకమైపోయేవాడిని. అక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాడిని. అక్కడ ఒక సత్యేంద్ర కుమార్ అనే సినిమా నటుడుండేవాడు. ఆయన తెలంగాణ నుండి మొట్టమొదటి రాష్ట్రపతి అవార్డు అందుకున్న నటుడు. ఊరుమ్మడి బ్రతుకులు అనే సినిమాలో ఆయన నటించారు. ఆయనతో కలిసి నాటకాలు వేసే వాడిని. ఆయన మాతో పాటు ఉండేవారు. నాకు ప్రమోషన్ రాలేదు. అదే గ్రేడ్ 2 తెలుగు పండిట్ గానే చేసాను. నేను మొదలు చేరినప్పుడు నా జీతం- 50 జీతం వచ్చినప్పుడు ఎలా ఉన్నానో? పదివేల జీతం తీసుకున్నప్పుడు కూడా అలానే ఉన్నాను నేను పదవి విరమణ పొందినప్పుడు నా జీతం పదివేల, ఐదువందల రూపాయలు. నేను 26 సంవత్సరాలయింది పదవి విరమణ పొంది… తర్వాత పిల్లలందరూ చదువుతూ ఉంటే వారితో పాటు కలిసి నేను డిగ్రీ చేసాను.
మా అమ్మాయితో పాటు సంస్కృత పరీక్ష రాసాను. మా అబ్బాయితో మరో పరీక్ష రాసాను. నిరంతరం చదవడం పరీక్షలు రాయడమో, నాటకాలు రాయడమో? చేస్తుంటాను. రిటైర్ అయిన తర్వాత బి.ఎడ్ కాలేజీ వారు నన్ను పిలిపించుకున్నారు. తర్వాత డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసాను. అలా జీవితం ఒక గాడిలో పడిపోయింది.
2001లో పదవి విరమణ పొందాను. అప్పటినుండి రచన వ్యాసంగంలోకి వచ్చాను. ఈ మధ్య ఖమ్మంలో నాటక సమాజం ఏర్పాటు చేసి ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ 20 సంవత్సరాలుగా సంస్థ నడుపుతున్నాను. దానికి డైరెక్టర్,ఫౌండర్, నిర్మాతను అన్నీ నేనే. జిల్లాలోని నటీనటులంతా నా అసోసియేషన్లో ఉన్నారు. అలా నాటకాలు రాస్తూ…. వేస్తూ…. ఉన్నాను.
నా సహ ఉపాధ్యాయుడు ప్రసాద్ బాబు అని అతను కూడా ఉపాధ్యాయుడు. మేమిద్దరం కలిసి, నాటకాలు రాయడం మొదలుపెట్టాము. మేము ఇద్దరం కలిసి రాసిన నాటకం ఏదైనా సరే నంది బహుమతి పొందాల్సిందే! దానికి ప్రత్యామ్నాయము అన్నది లేదు. ఆ రకంగా నాలుగైదు నాటకాలు రాసాను. వాటికి నంది బహుమతులు వచ్చాయి. రచయితగా, దర్శకుడిగా, నటుడుగా బహుమతులు అందుకున్నాను. ఒక్క నంది బహుమతే కాకుండా… పెద్దపెద్ద సంస్థలు సన్మానాలు, అవార్డులు, గరుడ అవార్డు, ఆలా లెక్కకు మించి అవార్డులు వచ్చాయి. అలా ఈ రచన వ్యాసంగంలో కౌసల్య సుప్రజా రామా అనే నవల మామూలుగా రామాయణం అందరూ రాముడు పుట్టిన దగ్గర నుండి చదువుతారు. బాలకాండలో దశరధుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తే రాముడు పుడతాడు. అక్కడినుండి బాలకాండ ప్రారంభమవుతుంది.. కానీ రాముడు పుట్టకముందు నుండే నేను రాసాను. దశరధుడికి కౌసల్యతో వివాహం ఎలా అయింది ?అసలు కౌసల్య ఎవరు? కైకమ్మ ఎవరు ? సుమిత్ర ఎవరు? ఎలా పెళ్లి చేసుకున్నాడు ఈ ముగ్గురిని? అనే విషయాన్ని తీసుకొని రాసాను. దాన్ని నాటకంగా ప్రదర్శించాము. తిరుపతిలో బుర్రా సుబ్రహ్మణ్యం గారి కుమారులు తెనాలి వీణ అవార్డ్స్ నెలకొల్పి, మా చేత నాటకం వేయించారు.
ఆ తర్వాత మా అబ్బాయి చక్కని కవితలు వంశీకృష్ణ అనే పేరుతో రాస్తాడు. మంచి రచయిత! తెలంగాణ నాటక రంగ చరిత్ర రాసినప్పుడు దీన్ని నేను Mphill కోసం రాద్దామనుకున్నాను. రాయడం కష్టమని అందరూ అన్నారు. అయినా కూడా రాసినాను! తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ఇచ్చారు.
నేను రాసిన పుస్తకాలకు అవార్డులు వచ్చాయి. ఖమ్మం కథా సుధ రాసినప్పుడు కూడా తెలంగాణ ఆవిర్భవించిన తరువాత మొదటి పుస్తకం ఇది. తెలంగాణ గొప్పతనం నిండి ఉంది కాబట్టి, ఖమ్మం జిల్లా గురించి రాద్దామనుకున్నవాడిని ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ వచ్చిందో తెలంగాణ నాటక రంగ చరిత్ర రాసాను. ఖమ్మం జిల్లాలో ఉన్న కథా రచయితలందరి సమగ్ర జీవితం రాశాను. అలాగే ఖమ్మం కవులు ఎందరున్నారో దాశరధి గారు, హరి భట్టు గారి- దగ్గర నుండి (13వ శతాబ్దం నుండి ) ఖమ్మం లో ఉన్న కవులందరి చరిత్ర రాసాను. ఈ రకమైన రచనలు చేయడం, మిగతా జిల్లాల వారికి మార్గదర్శకుడిగా నన్ను తీసుకొని, తెలంగాణ ఫోరం నెలకొల్పారు. దాంతో నాకు సంబంధం లేదు. వాళ్లు జిల్లాల ప్రకారం రాయలేదు! తెలంగాణ మొత్తం తీసుకున్నారు. నేను జిల్లాను యూనిట్ గా తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చిన వారందరూ జిల్లాను యూనిట్ గా తీసుకొని, వాళ్ల జిల్లాలో కవులు, వారి రచనల గురించి కథలు, నాటకాలు, కవితలు, వారు రాయడం జరిగింది. అదే ఒరవడిలో అన్ని జిల్లాల చరిత్రను రాయించారు. అందులో ఖమ్మం జిల్లా చరిత్రను, భద్రాద్రి జిల్లా చరిత్రను కూడా నేనే రాశాను. కావూరి పాపయ్య శాస్త్రి గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన తాను రాస్తానని పేరు ఇచ్చారు. ఆయన కొంత కాలం రాసి చనిపోయారు. తరువాత నేనే దాన్ని పూర్తి చేశాను. ఇలా ఖమ్మం జిల్లా సంబంధించిన సాహిత్య సర్వస్వం నా దగ్గర ఉంది. ఏదైనా సరే నా దగ్గర అనధికారికంగా 20 మంది విద్యార్థులు ఎంపీహెచ్డీలు చేశారు.

పద్మజ: మీరు పత్ర సమర్పణలు చేసే అవకాశం ఎలా వచ్చింది? ఏ అంశాలతో సమర్పించారు?
నరసింహారావు గారు:– యూనివర్సిటీ వారు సెమినార్ జరిపినప్పుడు నాటక రంగం మీద పత్ర సమర్పణ చేయమని అన్నారు. దాని మీదనే పత్ర సమర్పణ చేసాను. తెలుగు యూనివర్సిటీలోనూ నాటక రంగ అనే అంశం మీద సమర్పించాను.
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఖమ్మం జిల్లా నాటకరంగం అనే అంశంతో పత్ర సమర్పణ చేసాను.
నాగార్జున యూనివర్సిటీ నల్లగొండలోనూ పత్ర సమర్పణ చేసాను. ఇలా అన్ని యూనివర్సిటీలలో చేసాను.
ఉమ్మడి జిల్లా పద సాహిత్యం మీద ఒక పత్ర సమర్పణ చేసాను. ఇలా వైవిధ్యమైన అంశాలతో పత్ర సమర్పణలు చేసాను.
పద్మజ:— ధార్మిక ఉపన్యాసాలు చేసారని విన్నాను. అది ఎలా జరిగింది?
నరసింహారావు:— మా దగ్గర రామకృష్ణ మిషన్, గాయత్రి సేవా సమితి ఉంది. వీటిల్లో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలోను, పండగలప్పుడు, వసంత నవరాత్రులలో, దుర్గా నవరాత్రులలో, సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు ప్రసంగించే అవకాశం వచ్చింది. రామాయణ, భారత, భాగవతాల, మీద బ్రహ్మాండ పురాణాల మీద ఉపన్యాసాలు చేసాను. పరిషత్తుల ద్వారా కూడా ప్రసంగించాను.
పద్మజ:– ఒకేసారి మీరు… మీ అబ్బాయి నంది అవార్డులు తీసుకున్నారు కదా! ఆ సందర్భం ఎలా వచ్చింది?
నరసింహారావు:– 2017 సంవత్సరంలో నేను చాణుక్య-చంద్రగుప్త అనే నాటకం ప్రదర్శించాము. నాకు తృతీయ బహుమతి వచ్చింది. అదే సమయంలో సినిమా గురించి రాసిన పుస్తకానికి ప్రభుత్వం బహుమతి ప్రకటించింది. మా అబ్బాయి మంచి రచయిత అని చెప్పాను కదా! ఆ సంవత్సరమే 25 th ఫ్రేమ్ అని ఒక పుస్తకం రాశాడు. సినిమాకు సంబంధించిన ఆ పుస్తకానికి అబ్బాయికి అవార్డు వచ్చింది. నాటకం ప్రదర్శించినందుకు నాకు నంది అవార్డు వచ్చింది. అలా ఇద్దరం ఒకేసారి అవార్డులు అందుకున్నాము. అది ఒక రికార్డు అని అందరూ ప్రశంసించారు. ఈ రకంగా కల్చరల్ అంటే నాటకాలు మొదట స్పురిస్తాయి. అందుకే నాటక రంగ చరిత్ర రాసిన… అందులోను నాకు దర్శకత్వ శాఖలోనూ నాదైన నైపుణ్యం సంపాదించుకున్నాను. దానికి రుజువే నూరు- నూటా యాభై మంది నటీనటులతో దర్శకత్వం నిర్వహించాను. వాళ్ళందరూ స్వంతంగా నాటక ప్రదర్శనలిస్తున్నారు.
పద్మజ:– బాల్యం-లేదా- యవ్వనంలో అత్యంత ప్రభావం చూపెట్టిన సంఘటన ఏదైనా ఉందా?
నరసింహారావు:— అత్యంత ప్రభావం చూపెట్టిన సంఘటన అయితే మటుకు కచ్చితంగా సంస్కృత కాలేజీలో చదివిన కాలమే! అదొక స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. కారణమేమిటంటే సంస్కృతం అందరూ మృత భాష అని చెప్పుకున్నప్పటికీ, నాకు అన్నం పెట్టింది సంస్కృత భాషనే! నేను ఉద్యోగంలో చేరినప్పుడు కూడా నాకు నా సంస్కృతాన్ని చూసిన తర్వాతనే తెలుగు బోధన చేయగలరు అని ఉద్యోగం ఇచ్చారు. కాబట్టి నా ఉద్యోగానికి మూలం అదే కదా! అంతేకాకుండా లోకజ్ఞానం నేర్పేటటువంటిది సంస్కృత భాష అని నా ఉద్దేశ్యం. మామూలు లౌకిక సంబంధమైన పాఠశాలల్లో సిలబస్ కు సంబంధించినవే చెప్తారు. కానీ సంస్కృత గ్రంథాలలో సమాజాన్ని మార్చే శక్తి ఉంది. వాటిల్లో ఇప్పుడున్న రచయితల వలె వర్ణ,వర్గ విచక్షణలు ఉండవు. అప్పుడు భాష అంటే ఎవరికైనా భాషే! అంటే భాషా పరమైన జాతి తప్ప ఇతర భేదభావాలుండకపోయేవి. క్రమశిక్షణ నేర్పడానికి మూలభాష సంస్కృతమే! కుటుంబ సంబంధాలను అంటే కుమారుడిని ఎలా చూడాలి? కూతురును ఎలా చూడాలి? ఇవన్నీ ప్రాచీన గ్రంథాలలో రాసిపెట్టారు. అవార్డుల కోసం మనం రాయకూడదు! నేను జ్ఞాన సముపార్జనకోసమే చదువుకున్నాను. దానితో పాటు కుటుంబాన్ని పోషించుకునే శక్తి కూడా సరస్వతి దేవి నాకు కల్పించింది. ఇది అత్యంత ప్రభావం చూపే సంఘటన. నాటకానికి సంబంధించినదైతే అదే సమయంలోనే బి.ఎన్.రెడ్డి గారి ప్రోత్సాహం అందడంలో నా నాటక జీవితానికి మలుపు తిరిగింది. అది మరో మరచిపోని సంఘటన.
తర్వాత ఇంకొకటి ఏమిటంటే మా శ్రీమతి భ్రమరాంబ! ఆమె నా జీవితంలో ప్రవేశించిన తరువాతనే నాకు ఒక స్థిరత్వం ఏర్పడింది. అంతకు ముందు అటు మద్రాసు ఇటు హైదరాబాదు తిరిగేవాడిని. పొద్దున ఒక ఊరు సాయంత్రానికి మరో ఊరు వెళ్లడం జరిగేది! అలా కాకుండా పిల్లలను ఎలా పెంచాలని ఆమె సలహా సంప్రదింపులతోనే పెంచగలిగాను. ఐదుగురు పిల్లలకు పెళ్లిళ్లు చేసి, వారికి పురుళ్ళు, పుణ్యాలు చేసి, చదువులు ఇవన్నీ ఆమె సహకారంతోనే అని నేను చేయగలిగానని అనుకుంటాను. ఆమెకు అనుకోకుండా క్యాన్సర్ వచ్చి మరణించింది. ఆమె స్మారకంగా ఒక అవార్డు ఇస్తున్నాము. మూడు సంవత్సరాల నుండి మొదటగా ఆచార్య ఎన్ గోపి గారికి, ప్రసేన్ అనే రచయితకు, పోయిన సంవత్సరం శ్రీ ఏనుగు నర్సింహా రెడ్డిగారికి అందజేశాము.
ఇప్పుడు నా సర్కిల్ లో ఎందరో ఉన్నారు కాబట్టి ఆమె పేరు మీద అవార్డు ఇస్తున్నాము.
పద్మజ:– ఈ అవార్డు ఇస్తూ మహిళగా మీ శ్రీమతి గారికి ఒక ఉన్నత స్థానం కల్పించడం మీ హృదయ ఔన్నత్యాన్ని తెలుపుతున్నది. మీకు మరో మారు అబినందనలు. మరి బాలసాహిత్యంలో మీ కృషి ఎలా సాగింది?
నరసింహారావు:— బాలసాహిత్యంలో నేను కొంత వెనుక పడ్డాను అనే చెప్పాలి! ప్రత్యేకంగా రాయకపోయినా కొంత కృషి చేశాను. బాలసాహిత్యం ప్రచురణలు చేయలేదుకానీ, పిల్లలచేత కథలు, కవితలు రాయించాను, నాటకాలు వేయించాను ఇలా రాయాలని…రాసే పద్ధతి వారికి నేర్పించాను. పిల్లలు నాటకాలు రాసినప్పుడు బోధకుడిగా వెళ్లాను.
పద్మజ:– ప్రపంచ మహాసభల్లో మీ కృషి గురించి వివరించండి?
నరసింహారావు:– మహాసభలలో కవి సమ్మేళనానికి ఆహ్వానించారు… అంతేకానీ, నాకు పెద్దగా ప్రత్యేకతలు ఏమి ఇవ్వలేదు. తిరుపతిలో ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు నాకు ఒక సెక్షన్ అప్పచెప్పారు. దాన్ని చక్కగా నిర్వహించాను. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అకాడమీ వారు నన్ను అందులో చేర్చుకున్నారు. నేను ఖమ్మంలో ఉండేవాడిని కాబట్టి నాకు అంతగా ప్రాధాన్యత లేదు. ఖమ్మం నుండి ఇక్కడికి వచ్చి చేయలేం కదా?
పద్మజ:– మాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే? నాటకారంగం- అటు సాహిత్యం… జోడు గుర్రాల వలె నడుపుతున్నారు. మరి క్రీడారంగంలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది? దాని వెనుక ప్రేరణ ఏమిటి?
నరసింహారావు:–క్రీడారంగం నాకు చాలా ఇష్టమైనదే! హై స్కూల్లో చదివేటప్పుడు నాకు అంతగా క్రీడల్లో ప్రవేశం లేదు కానీ, నేను ఉద్యోగంలో చేరిన తర్వాత పందిళ్ళ పల్లెలో స్థిరపడినప్పుడు ఒక చదరంగా అసోసియేషన్ ఉంది. మా మిత్రుడు చదరంగం ఆడే వాడు. చదరంగం బోర్డు ముందర పెట్టుకొని చూస్తూ ఉండేవాడు. దీన్ని ఎలా ఆడతారు? అని అడిగాను. “మీరు ఆడతారా సార్” అనడిగాడు. ఆడతానని అన్నాను. ప్రాథమిక సూత్రాల చెప్పాడు. పావుల గురించి తెలిపాడు. వాటి నడకలు వాటిని ఎలా అరికట్టవచ్చు అని, అది విన్నాక నాకు ఈ ఆట నేర్చుకుంటే బాగుంటుంది కదా? అనే ఆలోచన వచ్చింది. అలా నేర్చుకున్నాను.
ఖమ్మం జిల్లా చదరంగ సంఘానికి మార్కండేయుడు అనే అతను అధ్యక్షుడుగా ఉన్నాడు.
కొంతకాలం తర్వాత నేను పోటీలో పాల్గొనే వాడిని. చిన్నచిన్న బహుమతులు వచ్చేవి. అలా ఒక సంవత్సరం జరిగిన తర్వాత ఆ సంఘంలో చీలిక ఏర్పడింది. చీలిక వచ్చినప్పుడు “నరసింహ రావు గారూ! మీరు అధ్యక్షులుగా ఉండండి” అని అన్నారు. నేనేదో చిన్నగా నాటకాలు రాసుకుంటాను. అలాంటిది ఒక సంస్థను నడపడం అంటే కష్టం అన్నాను. వారంతా పట్టు పట్టి అధ్యక్షుడిగా ఉండాల్సిందేనని బలవంత పెట్టారు.
చదరంగంలో ఉన్న ఆసక్తితో బాగానే కృషి చేశాను. అది నాకు రెండు విధాల ఉపయోగపడుతుందని పించింది. ఒకటి మేథస్సు అభివృద్ధి చెందుతుంది, మానసిక ఉల్లాసం ఇవ్వడమైతే మరొకటి జీవితాలకు చదరంగాన్ని అన్వయించుకోవచ్చు అని అర్థమైంది. ఎందుకంటే? ఆటగాడు ఎదుటివాడు ఎలాంటి వేస్తాడో తెలుసుకోవాలి! నేను ఊహించినట్టు ఎదుటివాడు ఎత్తు వేస్తాడా? లేక ఊహించనిది వేస్తాడా? నేను వేసిన ఎత్తు ఒకవేళ విఫలమవుతుందనుకున్న పక్షంలో ఏమైనా విరుగుడు ఉన్నాయా? ఏ రకంగా ఎదుటి వాడికి చెక్ పెట్టగలుగుతాను?
పద్యం:-
చదరంగంబున నేనతి చతురుండబంటు చేత కట్టించెద… అనే పద్యం ఉంది.
చతురంగంలో నేను అతి చతురడను… బంటు చేత రాజును కట్టించేద!
అంటే ఒక బంటుకు రాజును కదలకుండా చేసాడంటే ఇంత సైన్యమున్న రాజు బంటు చేత చిక్కడమంటే ఎలా బంధించగలుగుతాడు? ఈ పద్యం
నాకు నచ్చింది. ఒక బంటు చేత రాజును చెక్ పెట్టించే బంటున్నాడంటే మన జీవితంలో మనకు చెక్ పెట్టగలిగే వాడిని మనం చెక్ పెట్టగలగాలి! చదరంగం ఆటలో ఉన్న విశేషం ఏమిటంటే? ఈ ఆటను బాగా ఆడగలిగినవాడు జీవితంలో జయిస్తాడు. ఎందుకంటే నేను ఈ పని చేస్తే అవతలివాడు ఏమనుకుంటాడు? నేను అనుకుంటున్నాట్టు వాడు అనుకుంటున్నాడా? లేదా ఇంకో రకంగా అనుకుంటే నేనేం చేయాలి? నేను చేసే పని అందరికీ నచ్చాలని లేదుగా! కాబట్టి నేను చేసిన పని అవతల వాడికి నచ్చాలంటే నేనేం చేయాలి? లేదా వాడిని అధిగమించాలంటే.. వాడు వేసే ఎత్తలను నాలుగు రకాలుగా ఊహించాలి! అందుకు ఆసక్తితో నేర్చుకొని జిల్లా మొత్తం మీద 30 అసోసియేషన్ సంఘాలను ఏర్పాటు చేశాను. అలా చదరంగ క్రీడను ఎందరితో పరిచయం చేసి, అందులో నిష్ణాతులను చేసాను. కొంత కాలానికి ఇతర పనులు ఎక్కువై దానికి సమయం కేటాయించలేకపోయాను వదిలేసాను.

పద్మజ:— యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సమాజం కానీ ప్రభుత్వం కానీ ఏం చేయాలంటారు?
నరసింహారావుగారు :— యువతకు ఏ క్రీడల పట్ల ఆసక్తి ఉందో గమనించి, దాన్ని అటు తల్లి తండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు టోర్నమెంట్స్ మొదలైన ఖర్చుకు సంబంధించి, ప్రభుత్వం ముఖ్యంగా లోకల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే యువతనే ఏదైనా సాధించాలి! యువత ముందుకు రానిది ఎవరు ఏమి చేయలేరు. ఉద్యోగం అవకాశం కల్పించాలి అలాగే వాళ్ళకి చదరంగం పట్ల అవగాహన కల్పించాలి! అందుకు చదరంగం ఆటలాగానే కాదు జీవితంలో ఎలా నడుచుకోవాలో ఆటను అలా మలుచుకోవాలని చెప్పాలి! జీవితమే ఒక చదరంగం అందులో మనం పావులమని ఒక కవి చెప్పారు కదా! అందుకని నాయకులు, తల్లిదండ్రులు అందరూ కలిసి చేయాల్సిందేమిటంటే ప్రోత్సహించాలి! ఏ ఆటలో నైనా ఆటగాడు ఎదుటి జట్టును ఓడించి, తాను గెలవాలి అనుకుంటాడు కదా! అలా వారి వారి అనుభవాన్ని బట్టి తమ పరిధిలో ఉన్న యువకులను జీవితాలు ఎలా తీర్చిదిద్దుతారో అలా క్రీడలలో అలా తీర్చిదిద్దాలి! అలా తోడ్పడుతుంది క్రీడారంగం విజయ పరంపరలో కొనసాగుతున్న క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో ఆటలలో ఎదిగారు! ఎదుగుతున్నారు.. ప్రతి ఆటలోను గెలిచి రికార్డు సృష్టించిన వారందరూ యువ క్రీడాకారులకు స్ఫూర్తి దాయకులే కాబట్టి, సమాజం యువకులను పరిశీలిస్తున్నది. యువత జాగ్రత్తగా ఉంటూ తనకిష్టమైన రంగంలో అది కవిగా కానీ, రాజకీయనాయకుడు కానీ, క్రీడాకారులు కానీ ఏదైనా సరే ఎదగడానికి ప్రయత్నించాలి !ఎందరో తనను పరిశీలిస్తున్నారు నేనెన్నుకున్న రంగంలో మాత్రం కృషి చేయడంలో అలసత్వం ఉండకూడదు! అని యువత అనుకోవాలి. అప్పుడే విజయం సాధించవచ్చు లేకపోతే రాదు! అందుకని నేను అనేది ఏమిటంటే అవగాహన కలిగి ఉండాలి.
పద్మజ:– కళాకారుడు సమాజానికి అద్దమా? లేక దారి దీపమా?
నరసింహారావు:–కళాకరుడు సమాజానికి దారి దీపం. అద్దమైతే కాదు! ఎందుకంటే అద్దం అంటే ఎవరో చేసినదే తాను చేసినట్టు, అద్దం చూస్తే ఎవరి ముఖం వారికే కనపడుతుంది. అలా కాదు! దారి చూపెట్టాలి! దారి దీపంగా ఉన్నప్పుడే కళాకారుడు తను ముందుకు నడుస్తూ తెలియని వారికి దారి చూపిస్తూ వారందరినీ గమ్యం చేర్చాలి.
పద్మజ:- మీరు సాధించాలనుకున్నవి ఇంకా కలలేమైనా ఉన్నాయా?
నరసింహారావు:– మనిషనే వాడికి ఆశ ఎప్పుడూ ఉంటుంది. ఆశా జీవులం కదా! ఉన్నాయి. ఆశాయా బద్దతే లోకః కుసుమ సదృశః అన్నాడు కాళిదాసు. ఒక పువ్వుకు తొడిమ ఎలా ఉంటుందో? మనిషికి ఆశ అలాంటిది. తొడిమె లేని పువ్వు ఉండదు కదా! మనిషి జీవితం కూడా అంతే! ఆశాబద్ధయే లోకా ఈ లోకమంతా కూడా ఆశాదీపాలతో నిండి ఉంది. ఆశతోనే మనుషులు జీవిస్తున్నారు. ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కావాలనుకుంటాడు…. వంద రూపాయలు ఉన్నవాడు వెయ్యి రూపాయలు కావాలనుకుంటాడు… అందుకే నీతి శాస్త్ర కారుడిలా అన్నాడు కోరికలకు అంతులేదు పువ్వును నిలిపి ఉంచడానికి తొలిమె ఎలా ఉంటుందో అలా ఆశ మనిషిని నిలబెడుతుంది. ఆశ అనేది లేకపోతే జీవితం ఉండదు ఎలా అయితే తొడిమ లేకపోతే పువ్వు రాలిపోయినట్టుగా….
పద్మజ:— భవిష్యత్తులో మీ లక్ష్యాలు ఏమిటి?
నరసింహారావు:– నాకు సంబంధచినంత వరకు నా లక్ష్యం ఒకటే!నా పరిధిలో ఉన్నంతవరకు యువతను జాగృతి చేయడం, సమాజానికి ఒక మార్గదర్శకం నిలబెట్టడం అనేది నా లక్ష్యం….
పద్మజ :— మీ జీవితాన్ని వెనుకకు తిరిగి చూసుకుంటే సంతృప్తిగా ఉందా? లేక ఇంకా ఏదో చేయలేదని వెలితి ఏమైనా మిగిలి ఉందా?
నరసింహారావు:– నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఎందుకంటే? ఇప్పటి వరకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు లభించాయి. అనుకూలవతి ఐన భార్య, అనుకూలంగా ఉండే బుద్ధిమంతులైన పిల్లలు ఉన్నారు. ప్రేమించే మనుమలు- మనుమరాండ్లు ఉన్నారు. ఇంత మంది సమాజంలోని స్నేహితులు నన్ను గౌరవంగా చూస్తారు. పరిచయస్తులేకాదు.. అపరిచితులు కూడా అపారమైన ప్రేమను పంచుతారు కాబట్టి నాకు ఆశించేది ఏదీ లేదు.
పద్మజ:— మయూఖ పత్రికకు ఈ ముఖాముఖి ద్వారా పాఠకులకు మీ అమూల్యమైన సందేశం ఇవ్వండి.
నరసింహారావు:– ఏ పత్రికైనా సమాజానికి ఉపయోగపడాలి! పడడమే! కావాలి!
పద్మజ:– అంటే ఏ కోణంలో అంటారు?
నరసింహారావు:– పత్రికలోని అంశాలతో మంచి పౌరులుగా తయారు చేయాలి. ప్రలోభాలకు లోను కాకూడద నే హెచ్చరికలుండాలి. సాహితీవేత్తలను పరిచయం చేస్తున్నది చాలా సంతోషం! సాహితీ సేకరణ పత్రిక చేస్తున్నది… అంతటితో సరిపోదు! స్వార్థం లేకుండా ఎవరు ఉండరు గానీ, అతిగా ఉండకూడదు ఒకరు మన దగ్గరకు వచ్చారంటే మనతోని వాడికి అవసరం ఉన్నట్టే… నేను మీతో మాట్లాడుతున్నానంటే అందుకు తగిన మేలు ఏదో నేను కోరుకుంటున్నట్టుగా అనిపిస్తుంది కదా? అలా కాకుండా ఏమి ఆశించకుండా సాగాలి.
సంతోషమండీ నమస్కారం మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇంతవరకు ఎన్నో విషయాలు సమగ్రంగా చెప్పారు అందుకు అనేక ధన్యవాదములు.
“తాటికొండాల నర్సింహా రావుగారూ… మీ మాటల్లో మేము కేవలం జ్ఞాపకాలను మాత్రమే వినలేదు; ఒక యుగపు స్పందనను అనుభవించాము. రంగస్థల వెలుగుల్లో మెరిసిన కళాకారుడిని, సాహిత్య పుటల్లో నిలిచిన రచయితను, క్రీడాస్ఫూర్తిని నాటిన మార్గదర్శిని, సంపాదకత్వంతో విలువలను కాపాడిన సంస్కృతి సేవకుడిని—ఈరోజు ఒకే వేదికపై దర్శించుకున్నాం. మీ ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు; అది కృషి, కట్టుబాటు, కళాప్రేమలకు ప్రతీక. మీరు నడిచిన దారిలో వెలిగిన దీపాలు ఇంకా ఎన్నో మనసులను వెలిగించాలి.
‘మయూఖ ముఖాముఖి’కి మీరు అందించిన ఈ ఆలోచనల కాంతి మా హృదయాల్లో నిలిచిపోతుంది. మీ సృజనయాత్ర నిరంతరం కొనసాగాలని, మీ ప్రేరణ తరతరాలకు ప్రసరించాలని మనసారా ఆకాంక్షిస్తూ… మీతో ముఖాముఖి చేయాలనుకుంటున్నామని అడిగితే సహృదయతతో మీ ఇంటికి ఆహ్వానించి,చక్కని సంభాషణలతో సమగ్రంగా మీరిచ్చిన సమాచారం మా మయూఖ పాఠకులకెంతో ఉపయోగమండీ! అందుకు గాను గాఢమైన కృతజ్ఞతలతో నమస్కరిస్తున్నాం.”
( ఆయనను గూర్చిన సమాచారం అందించిన వారు కుమార్తె వేదవతి గారికి కృతజ్ఞతలతో)
సినిమాలు టి.వి.ఛానల్స్ లేని కాలంలో ప్రజలహృదయాల్ని దోచుకున్న ఏకైక సాధనం రేడియో అదే ఆకాశవాణి.ఆరోజుల్లో అందులో పనిచేసిన హేమాహేమీలు కాలగర్భంలో కల్సిపోయినా వారి వాక్చాతుర్యం గళమాధుర్యం కొందరికి మాత్రమే గుర్తు.నేటి యువత కి అస్సలు తెలీదు.ఆనాటివారికి జీతభత్యాలు అంతగాలేవు. పని ఎక్కువ. కానీ ఆనాటి కళాకారులవల్లనే ఆకాశవాణి బ్రతికి బట్టకట్టింది. అలాంటి ఆల్ రౌండర్ సంగీత సాహిత్య వేత్త,నవరసాలు గళంలో పలికించిన అమరగాయకుడు, నటుడు,హాస్యంతో ఆకట్టుకున్న ప్రయాగవారిని గూర్చి విధంగా విహంగావలోకనం చేస్తాను.కొండను అద్దంలో చూపే ప్రయత్నం నాది.


20నవంబర్ 1909లో విశాఖపట్నం సమీపంలోని పెదగాడిలో పుట్టారు.6_7ఏళ్ల పిల్లాడిగా గొంతెత్తి పాడి అందర్నీ ముగ్ధుల్ని చేసిన ప్రయాగవారు 11సెప్టెంబర్ 1983లో హృద్రోగంతో పరమపదించారు.ఐదో ఏటనుంచి ఆటపాటలతో మొదలైన ఆయన జీవితం74 వ ఏటకూడా కష్టాల్ని పక్కకు నెట్టి స్వాతంత్య్రోద్యమం పాటలతో పెరిగి ఆంధ్ర బాలానందసంఘంలో మొద్దబ్బాయి గా ఎదిగారు.తన కంచుకంఠంతో బుర్రకథ హరికథ పిట్టకథ బావగారి కబుర్లతో ఆకాశవాణిలో వెలిగారు.మైకులేకున్నా సంగీతం నేర్వకున్నా ధన్యాసి, తోడి వంటి రాగాల్లో తనదైన ముద్ర వేశారు.పల్లెపదాలు జానపదాలు ఆయన గొంతులో ఊపిరిపోసుకున్నాయి.1969లో ఆకాశవాణిలో రిటైరైనాక పెన్షన్ లేని కాలం కాబట్టి సంపాదన కోసం మద్రాసు వెళ్లారు.సినీరంగంలో రాణించారు.1971_76దాకా ఫీల్డ్ పబ్లిసిటీ ప్రోగ్రాంలలో హరికథ బుర్రకథలద్వారా జనాల్లో చైతన్యం కల్గించారు.తిరుమల తిరుపతి కళాపీఠం నెలకొల్పినపుడు జానపదకళారూపాల ప్రయోక్త గా చెక్క భజనలు, సంప్రదాయ భక్తిగీతాలు నేర్పారు.1977లో మద్రాస్ ఆకాశవాణి ఈయనని సన్మానించింది పుంభావసరస్వతి అని కొనియాడింది.1975లో ప్రపంచ తెలుగుమహాసభ గౌరవించింది.చింతా దీక్షితులు గారు ప్రశంసిస్తూ లేఖరాశారు”నాయనా! నీనయగరాజలపాతం వాగ్ధాటికి జోహార్లు”.
విజయవాడలో ఇళ్లు కాలిబూడిదైతే ప్రభుత్వం డబ్బుసాయం చేసింది.కానీపంపిణీచేసేవారు అక్రమంగా డబ్బునొక్కేస్తుంటే వినోదాలవీరయ్యగా ఆగుట్టంతా బైట పెట్టారు ప్రయాగవారు.కలెక్టర్ ఎంక్వయిరీ చేసి యాక్షన్ తీసుకోవటం జరిగింది.
శ్రీప్రయాగవారు1939_56వరకు మద్రాస్ ఆకాశవాణిలో పనిచేశారు.1956లో విజయవాడ గ్రామస్థుల కార్యక్రమ ప్రయోక్త గా ఆయన చేసిన ప్రోగ్రాంలు జనాల గుండెల్ని తట్టిలేపాయి.
ఆయన సినిమారంగంలో కూడా రాణించారు.చిత్తూరు నాగయ్య సినిమా త్యాగయ్య లో ప్రథమశిష్యుడు గణపతివేషం వేశారు.1970_74మధ్య అందాల రాముడు,చీకటి చీకటివెలుగులు, డబ్బుకులోకం దాసోహం ,ఒకే కుటుంబం,కొత్త కాపురం,కొత్త దేవదాసు చిత్రాల్లో నటించారు.మద్రాస్ ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లో ఆనాటి సినిమాలకు అనుగుణమైన జానపదగేయాలు ,సినిమా బ్యాక్ గ్రౌండ్ గా బుర్ర కథలు రాసి పాడారు.ముగ్గురు మరాఠీలు బాలరాజు,బాలనాగమ్మ, శ్రీలక్ష్మమ్మ, మనోహర మొదలైన సినిమాలకు పాటలు రాసి పాడి నటించిన ఆల్ రౌండర్ ప్రయాగవారు.70_80బుర్రకథలు రాశారు.హెచ్.ఎం.వి.గ్రాంఫోన్ కంపెనీవారు 36డిస్కులు రిలీజ్ చేశారు.శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రిగారి స్ఫూర్తి ప్రోత్సాహంతో ఆయన సంగీత సాహిత్యాలలోకి అడుగుపెట్టారు. యక్షగానాల్లో సూత్ర ధారిగా ఆయన వాచికం నభూతో నభవిష్యతి. ఆయన పాడిన పాటలు” మేలుకొనుడీ భరతపుత్రుడా,మాకొద్దీ తెల్లదొర తనం,కల్లు మానండోయ్” మొదలైన పాటలు ఇంటింట పాడుకునేలాచేశారు.అంధభిక్షువుగా తెల్లగుడ్డు మాత్రమే కనిపించేలా ఆయన చేసిన నటన నభూతో నభవిష్యతి. 1939లో రేడియోలో ఆయన కి లభించింది కేవలం 5రూపాయలు మాత్రమే!బావగారి కబుర్లు రేడియోలో వస్తుంటే ఆనాడు ప్రతిపార్కులో వినపడి జనం చెవియొగ్గి వినేవారు. ఎస్.వరలక్ష్మి టంగుటూరి సూర్య కుమారి మొదలైన వారికి పాటలు నేర్పిన ఘనాపాటి!
1977లోమద్రాస్ ఆకాశవాణి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారిని,ప్రయాగ నరసింహశాస్త్రి గారిని,ఆనాటి స్టేషన్ డైరెక్టర్ని సన్మానించటం ఓవిశేషం ప్రత్యేకత గూడా!
శ్రీప్రయాగ నర్సింహ్మ శాస్త్రిగారి తల్లి దండ్రులు శ్రీమతి సత్యనారాయణమ్మ శ్రీ వెంకట రమణయ్య గార్లు .కలెక్టర్ ఆఫీసులో తండ్రి పనిచేశారు.దురదృష్టవశాత్తు 35వ ఏటనే రమణయ్య గారు చనిపోయేటప్పటికి ప్రయాగ వారికి 14 ఏళ్లు.ఏకైక కుమారునిగా ఆయన తల్లిశిక్షణలో పెరిగి బి.ఎ.పాసైనారు.రేడియో కళాకారునిగా ఆయన జీవితం ధన్యం !!
ఒక చెరువు దగ్గరలో ఒక కొంగ మరియు దానికి దగ్గరలోని అడవిలో ఒక నక్క ఉండేవి. అవి మనమిద్దరం దగ్గర దగ్గర ఉండేవాళ్ళం కదా, కాబట్టి మనం ఒకరికొకరం పిలిచి విందు చేసుకుందాం అని అనుకున్నాయి. మొదటగా నక్క విందుకు పిలిచింది. ఎంతో మర్యాదగా నక్క కొంగను తన ఇంటికి పిలిచి ఒక ప్లేటులో రుచిగల పదార్థాలు పెట్టి ఇక తినుమని ప్రేమతో కోరింది. కొంగ తన పొడుగు మూతితో ఎక్కువగా తినలేకపోయింది. కానీ నక్క మాత్రం గబగబా తినేసింది.
తర్వాత రోజు కొంగ తగిన విధంగా మర్యాద చేయాలనుకుంది. ఎంతో మర్యాదగా నక్కను కొంగ తనింటికి విందుకు పిలిచింది. ఒక టేబుల్ మీద ఒక సన్నమూతి కూజాలో పాయసం పోసి నక్కను తినమని కోరింది. కొంగ తన సన్నని పొడవైన మెడతో కూజాలో మూతిపెట్టి పాయసం మొత్తం తినేసింది. కానీ నక్క ఆ కూజాలో మూతి పెట్టలేక టేబుల్ చుట్టూ తిరిగి తిరిగి కొంచెం కూడా పాయసం తినలేకపోయింది. ఈ విధంగా కొంగ, నక్కకు సరైన గుణపాఠం నేర్పింది.
ఇదే అవి ఒకరికొకరు విందుకు ఆహ్వానించడం చివరిసారి అయ్యింది.
నీవు ఇతరులకు ఎలా మర్యాద చేస్తావో, అదే తీరు మర్యాదను నీవు పొందుతావు.
(ఈ కథ 365 గుడ్ నైట్ స్టోరీస్ లోని 23 జనవరి ది)
ఏడాదికో కొత్త పేరు
సౌందర్యమంతా పచ్చదనంగా పరుచుకొని
మనకోసం ఎన్నెన్నో ఒడిలో నింపుకొని తెచ్చే
చైత్ర వరలక్ష్మికి స్వాగతం
కాలపరిణామాల్లో
క్రమానుగత రుతువుల మార్పులో
శిశిరానిది పెద్దబాధ్యత
కష్టకాలంలో కలత విలాపాలను రాలుస్తూ
ఉజ్వల భవితను కాంక్షిస్తూ
వసంతానికై సర్వం సిద్ధం చేసి
చిగురు నవ్వులు వినపడగానే
సెలవు తీసుకుంటుంది.
అనుభూతులేవైనా ఎప్పుడూ మారని జీవికలు
జీవితపు కుండలో షడ్రుచుల అనుభవాలు
మనసు కొమ్మల్లో రాగాలు
వసంత సంతస వేదికలపై
కవితాగానం చేసే కవికోకిలలు
అందం ఐక్యత స్వచ్ఛత సౌభాగ్యం
ఓ ఉగాది పర్వమా నీదే!
నీవు ఎప్పుడూ మారలేదు
ప్రకృతి జీవులేవి మారనేలేదు
ప్రకృతి జీవితత్వాన్ని అలవర్చుకోలేక
మనిషి మాత్రం అహంకారిగా మారిపోయాడు
నాలుగు తరాల ముచ్చట్లను
కలబోసుకుని ఆరబోసుకున్న వాకిళ్లు
నిశ్శబ్దపు నీడల్లోకి జారిపోయాయి
ఆధునికత పెరిగిన నాగరికతలో
వాడి పడేసే సంస్కృతిలో
ఆత్మీయ బంధాలు కూడా చేరిపోయాయి
పిల్లల లేత చేతుల్లో
చరవాణి ప్రపంచం
ఆన్లైన్ వేగంలో అన్ని పారేసుకుంటున్నాం
సాంస్కృతిక వైభవాలను వదిలేసుకుంటున్నాం
పంచుకుంటే అనుభూతులు
తుంచుకొనిపోతే జ్ఞాపకాలు
వాటికి కూడా కరువుతనం
అంతాఏకాకితనం పరాయితనం
విద్యుద్దీపాల కాంతులున్న
దారి కనిపిస్తలేదు గుండె గూళ్లను చేర
మనిషి పరిమళిస్తేనే లేడు
యుద్ధభయాలు దగ్ధ జీవితాలు
ఓ పరాభవ వత్సరమా!
ఎన్నని చెప్పను?
పెత్తనాల పరాభవాలు
పాపాలతో ధరాభారాలు
ధర్మం తప్పుతున్నదీ మేమే!
ఏది ఏమైనా, తెలుగుతనానికి నిండు వెలుగువై వచ్చిన
నీవే మాకు స్ఫూర్తివి
నీశుభ ఆగమనానికి స్వాగతం
పరాభవమా! నీకు మా స్వాగతాంజలి
పరస్పర హృదయ వైషమ్యాల నడుమ
విస్త్రతమైన భావజాల దురాగతం
‘నేను’ ను కాంక్షిస్తూ కాగుతూనో
అధికారదర్పాన్ని వేలాడదీసుకునో
పర్యవసాన ఫలితాలను
శూన్యంలోకి ఎగదోస్తూ
ప్రకటితమయ్యే యుద్ధోన్మాదం
అదేమిటన్న ప్రశ్న అంకురించకుండానే
గాలిని చేరే నిస్సహాయ ఊపిరులు,
దిక్కుదిక్కునా విసిరివేయబడిన
ఖండిత భాగాల కల్లోలాలు,
బతుకు అర్థం మారి ముక్కలవుతూ
బతికడమెందుకన్న ఆక్రోశం
కన్నుల్లో శరాఘాతమై తగిలి
కన్నీటి కొండ పగిలి ప్రవహిస్తోంది
ఇది గత చరిత్ర పుటలపై
మరోమారు ముద్రించిన మరక అంటూ
పేజీ తిప్పి సర్దుకొని పోవడమేనా?
దుర్నీతి దారుల గమనంలో
కాలాన్ని కర్కశంగా మారుస్తూ
చిరునవ్వుల పసితనాన్ని సైతం
కొల్లగొడుతున్న ఆగడాలకు
కరగని శిలా హృదయ ప్రభుత్వాలు
నియంత్రించలేని శాంతి కాముక సంస్థలు
అమానవీయ నైజంతో
ప్రపంచాన్ని విషంగా మార్చే ఓ మనిషీ!
కోర్కెల మాయోపాయాలెన్నైనా
ఈ జీవనాటకంలో నీ పాత్ర
నూరేళ్లకు మించదన్న సత్యాన్ని మరిచావా??
అంగూరుతోటలో
అంగూరు నేలమీద అంగూరు తీగలు తీగలు
అందాల అంగూరుగుత్తుల ఆకాశం
ఆ ఆకాశం కింద అంతా అంగూరు తియ్యని గాలే
అన్నీ పండ్లు కండ్లైచూచే అద్భుతఅంగూరులోకం
అది అంగూరురైతు కలలుగన్న స్వప్నదేశం
పండ్లవ్యాపారం బండీలు ఎక్కి
అంగూరు గుత్తులు ఆసిఫాబాద్ అంగట్లోకి చేరాక
అగ్గువగా, అంగూరంగూరని తియతియ్యగా పిలుస్తాయ్
తోపుడు బండ్ల పై లేతఆకుపచ్చగా,పసిడిపచ్చగా అమాయక పసిపాపల కండ్ల అంగూరుగుత్తులు
మార్కెట్టులో ఆపిల్ల ధర ఆకాశనంటినా
అరకిలో యాభైయే అని అంగూర్లంటవి
గిరిజన గ్రామాలకు,లంబాడి తండాలకు,గుట్ట మీది పల్లెలకు, గ్రామగ్రామానికి, ఆసిఫాబాద్ పట్టణం ప్రతీవాడకు
యాబై కరెన్సీ నోటుకు ముస్తాబై ఉషారుగా బయలుదేరుతవి
ఆస్తులున్నవారని,పస్తులున్నవారని భేదంలేకుండా
కడుపులోకింత అంగూరు మధుర రసం భేషరతుగా దుంకుతది
అంగూరపండ్లవానికి
ఉసురు మన్న రోజులు కొన్ని అతనిగుండెలను గాయంచేస్తాయ్
ఊహకందని రోజులు కొన్ని ఆ గుండెలకే మాలాం రాస్తాయ్
కలవారి కలల ముందు
శపించిన జీవితం వేస్తున్న ప్రశ్నలముందు
నీరసించి నీల్గుతూతోపుడు బండిని ఈడ్చుకెళ్లిన రోజులుకొన్ని
అతని జీవితానికి పాఠమవుతాయి
ద్రాక్షా గుత్తుల్లో కొన్నిపండ్లు కుళ్లి పోయి పండ్లమ్మేవాడిగుండెను బరువెక్కించినా
ఆధునిక సంఘం ముందు అవంతగా కుళ్ళినవేం కావు బహుశా
ఊసురమన్న చీకట్లు తొలగి గిరాకీ సూర్యుడుదయించినపుడు అతడు ఆనందుడవుతాడు
మమకారంగామాట్లాడి అరకిలోపండ్లకి ముత్యమంత ప్రేమను,చిరునవ్వునూ మొగ్గుగా ఇస్తాడు పండ్లవాడు
మరలా రావాలంటది అతడికండ్లనిండా తొంగిచూసే గిరాకీఆశ
గంపెడు బరువు గల నాలుగుటైర్లతోపుడు బండి
పండ్లవానికి ఎంతఅమ్ముడు పోతే అతనిగుండె అంత అల్కగవుతది కదా
పండ్లను బాగమ్మినరోజు అతడి కండ్లల్లో నియాను వెలుగులు నిండుతాయ్
పండ్లఅమ్మకాలరాబడి ఆగిఆగి పడే వానలు
ఐనా గానీ,రాతిరివేళ ఇల్లు మురుస్తుంది ఒక కుటుంబం పచ్చవడ్తది
తాజాదనం,సరసమైనధరలనీ ధనవంతులసూపర్ మార్కెట్లు కాకుండా
తోపుడు బండ్ల పై అంగూరుగుత్తుల
బేల చూపుల్ని చూడండి
బాల చూపుల్ని చూడండి
ఆ చూపుల్లో దాగున్న రోజువారి జీవితాల పిలుపులు వినబడతాయ్
అంగూర్ అంగూర్
అరకిలో యాభై అరకిలో యాభై….
మనం బజారుకెల్దాం పదండి, అరకిలోఅంగూర్లకోసం.
పి.శ్రీనివాస గౌడ్ నాలో నిద్రపోతున్న నగరం కవిత.
ప్రముఖ కవి,పి.శ్రీనివాస గౌడ్ కలం నుండి జాలువారిన నాలో నిద్రపోతున్న నగరం కవిత పై విశ్లేషణా వ్యాసం.నాలో నిద్రపోతున్న నగరం అనే కవిత ఆధునిక నగర జీవనంలోని సంక్లిష్టతను,మనిషి – నగరం మధ్య ఉన్న ఆత్మీయ మానసిక బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.నగరం కేవలం బయట కనిపించే ప్రపంచం మాత్రమే కాదు ; అది కవి అంతరంగ అనుభూతుల ప్రతిబింబం కూడా. ’నాలో’అనే పద ప్రయోగం ద్వారా నగరం కవి మనసులోనే నివసిస్తున్నదనే భావం స్పష్టమవుతుంది.’నిద్ర పోతున్న నగరం’ అన్న రూపకం అలసిపోయిన ఆలోచనలు,అణగారిన అనుభూతులు, తాత్కాలికంగా నిశ్శబ్దంలో మునిగిపోయిన జీవన చలనాలను సూచిస్తుంది.ఇప్పుడు కవి శ్రీనివాస గౌడ్ కవితా చరణాల లోకంలోకి ప్రవేశించి,ఆ భావ సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం ; కవిత్వానుభూతుల విస్తార లోకంలో విహరిద్దాం.
“నిద్ర రానప్పుడు/నగరాన్ని ఎదురుగా/ కూర్చొనపెట్టుకుంటాను/ఇక్కడ కవి ఒక అందమైన కల్పనను చేశాడు.నగరం అనేది కేవలం భవనాల సముదాయం మాత్రమే కాదు ; అది ఒక సజీవ చిత్రంలా కనిపిస్తుంది.నిద్ర దూరమైన రాత్రుల్లో నగరం కవికి స్నేహితుడుగా మారి,ఆగని సంభాషణలా అతని ముందుకు వస్తుంది.బాహ్య ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ,కవి మనసులో మాత్రం నగరం మేల్కొనే ఉంటుంది. ఇది అత్యంత లోతైన కవితా పంక్తిగా భావించవచ్చు.నిద్ర రాకపోవడం కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు ; అది మానసిక చలనం కూడా.ఆ సమయంలో కవి తనకు ఎదురుగా నగరాన్ని కూర్చోబెట్టినట్లు ఊహిస్తాడు.అంటే, నగరాన్ని కేవలం పరిశీలించడం కాదు – నగరంతో సంభాషణకు సిద్ధమవుతాడు.ఇక్కడ నగరం ఒక వ్యక్తిగా రూపాంతరం చెందుతుంది.ఇది కవి యొక్క ఒంటరితనాన్ని, ఆలోచనల్లో మునిగిపోయిన మనస్తత్వాన్ని సూచిస్తుంది. నగరం జీవన సంక్లిష్టతను,ఆధునిక ఒత్తిడిని,మనిషిలోని అంతర్గత మనో గందరగోళాన్ని ప్రతిబింబిస్తే,ఆకాశం విస్తృతిని,భావోద్వేగాల మార్పును, స్థిరత్వం లేని మనస్సు స్థితిని, ప్రతీకాత్మకంగా వ్యక్తపరుస్తుంది.
“ఎప్పుడు చూసినా రంగులు మారే ఆకాశంలా/ఇది నగర యొక్క వైవిధ్యాన్ని, మార్పును,అందాన్ని చూపిస్తుంది.ఇది చాలా సున్నితమైన ఉపమానం.ఆకాశం మారడం సహజం. నగరం కూడా అలాగే మారుతుంది.కానీ,ఆ మార్పు కేవలం దృశ్య రూపానికే పరిమితం కాదు – అది మనసును తాకే భావాత్మక పరివర్తన కూడా.
“ఎప్పుడు చూసినా రంగులు మార్చే/ వుంటుంది నగరం/ నగరం తన స్వరూపాన్ని చూసే వారి మనసు యొక్క స్థితిని బట్టి వ్యక్తం చేస్తుంది.ఆనందంలో ఉన్న వాడికి నగరం వెలుగుగా కనిపిస్తుంది.అలసటలో ఉన్న వాడికి నగరం భారంగా మారుతుంది.ఇక్కడ నగరం పోలిక రంగులు మారే ఆకాశం.ఆకాశం క్షణక్షణానికి రంగులు మారుస్తుంది.అలాగే నగరం కూడా తన రూపాన్ని,స్వభావాన్ని మారుస్తుంది. ఉదయం ఉండే కోలాహలం,రాత్రి ఉండే కాంతిపుంజాలు, మనుషుల అవసరాలకు తగ్గట్టుగా నగరం ధరించే ముసుగులు.వీటన్నింటిని రంగులు మార్చడం అనే ప్రతీకతో కవి వర్ణించారు.సరళమైన భాష – కానీ,భావం లోతుగా మరియు కవిత్వంలో అనుభూతి బలంగా ఉంది.
ఈ కవితలో ఒక వ్యక్తి తనలోనే ఉన్న నగరాన్ని చూసుకుంటూ,ఆత్మ పరిశీలనలో మునిగిపోతున్నాడు.నిద్ర రాని రాత్రుల్లో మనిషి బయట ప్రపంచాన్ని కాదు – తనలోని ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.నగరం అక్కడే ఉంది, నిద్రపోతూ కూడా మారుతూ ఉంటుంది.నగరం యొక్క చిత్రణ – కవి నగరాన్ని సజీవ వస్తువుగా చిత్రీకరించడం ద్వారా నగరం యొక్క జీవన శైలిని,అందాన్ని,మార్పును, చలనశీలతను చూపిస్తున్నాడు.ఈ కవితలోని భావాలు, వర్ణనలు,పాఠకులను నగరం యొక్క అందాన్ని అనుభవించేలా చేస్తాయి.ఇక్కడ కవిత శీర్షిక నాలో నిద్రపోతున్న నగరం.నగరం అనేది బయట ఎక్కడో లేదు.అది కవి వ్యక్తిత్వంలో,ఆలోచనల్లో భాగమై పోయింది.మనం నగరంలో నివసించడమే కాదు,నగరమే మనలో నివసిస్తుంది అనే తాత్విక చింతన ఇందులో కనిపిస్తుంది.ఈ కవితలోని ప్రత్యేకత చాలా సరళమైన పదాలతో లోతైన భావాన్ని పండించడం.నగరాన్ని ఎదురుగా కూర్చొనపెట్టుకోవడం అనే ప్రయోగం కవి యొక్క ఊహాశక్తికి,నగరం పట్ల ఆయనకున్న అనుబంధానికి నిదర్శనం.ఈ కవితా పంక్తులు ఆధునిక మానవుడి ఒంటరితనాన్ని,ఆ ఒంటరితనంలో నగరం ఇచ్చే తోడును,దాని అస్థిర స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఈ కవితలో నగరం ఒక ప్రదేశం కాదు – మనస్సు యొక్క స్థితి.నిద్ర లేని రాత్రి,మారుతున్న నగరం,రంగులు మార్చే ఆకాశం – ఇవన్నీ కలిసి మనిషి అంతరంగాన్ని మృదువుగా ఆవిష్కరిస్తాయి.
“నగరం కడుపులో ఏముంటుందో గాని/ఇక్కడ నగరం కడుపు అనే రూపకం ఎంతో ప్రభావవంతంగా ఉంది.కడుపు అంటే అంతర్గతం,దాచిన భావాలు,తెలియని నిజాలు.నగరం బయటకి ప్రకాశవంతంగా కనిపించినా,దాని అంతరాళంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు.ఇది ఆధునిక నగర జీవనంలోని రహస్యత్వం,ఆజ్ఞాతత్వం,అనిశ్చితిని సూచిస్తుంది.నగరం కడుపులో ఏముంటుందో తెలియకపోయినా నగరాన్ని చూస్తే కవి యొక్క మనసులో ఒక రకమైన అసౌకర్యం,దిగులు కలుగుతుంది.ఇది నగరం యొక్క సంక్లిష్టతను,దాని ప్రభావాన్ని కవి మనస్సుపై చూపిస్తుంది.నగరం – మనిషి సంబంధం బాహ్య పరిశీలన నుంచి అంతర్గత అనుభూతిగా పరిణమిస్తుంది.ఈ కవితా పంక్తి ప్రశ్నార్థకంగా మొదలవుతుంది.నగరానికి కడుపు అనే మానవీయ లక్షణం ఇవ్వడం ద్వారా కవి నగరాన్ని ఒక జీవిగా రూపాంతరం చేస్తాడు.నగరం లోపల దాచుకున్నది ఏమిటో తెలియదు – అది రహస్యంగా,భయంకరంగా కూడా ఉండ వచ్చు.ఇది నగరం యొక్క రహస్యాలను,దాని లోపలి సంక్లిష్టతను సూచిస్తుంది.
“నగరాన్ని చూస్తే నా కడుపులో దిగులుగా/వుంటుంది/ఇక్కడ నగరం మనసుకు భారంగా మారింది.కడుపులో దిగులు అనేది ఆందోళన,భయం,ఒత్తిడిని సూచిస్తుంది.
నగరం అంటే అవకాశాల ప్రదేశం,అదే సమయంలో ఒంటరితనం,పోటీతత్వం,ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని చూస్తాం.ఇది కవి యొక్క మనసులో ఒక మానసిక ఒత్తిడిని,నగరం వల్ల కలిగే అసౌకర్యాన్ని, దిగులును వ్యక్తం చేస్తుంది.ఇక్కడ నగరం – కవి మధ్య ప్రత్యక్ష భావోద్వేగ అనుసంధానం ఏర్పడుతుంది.నగరం కేవలం కంటికి కనిపించే దృశ్యం కాదు.అది శరీరంలో దాగి కడుపులో దిగులును కలిగిస్తుంది.ఆధునిక జీవన ఒత్తిడిని,శారీరక అనుభూతిగా మార్చిన కవితా పంక్తి.ఇక్కడ నగరం ఒక అంతు చిక్కని రహస్యం.నగరం బయటికి జిగేల్మనే రంగులతో,భావనలతో కనిపిస్తుంది.కానీ,అంతరంగంలో ఏముందో?ఎవరికి తెలియదు.ఈ అనిశ్చితి కవిలో ఒక తెలియని భయాన్ని, దిగులును కలిగిస్తుంది.ఇక్కడ ప్రధానంగా నగరం ఇచ్చే సౌకర్యాల కంటే అది కలిగించే మానసిక అశాంతి కనిపిస్తుంది.ఇక్కడ కడుపు మౌలిక భావాల నిలయం – ఆందోళన,అసహనం వంటి భావాలు అక్కడే కేంద్రీకృతమై ఉంటాయి.
“స్థలం లేకపోయినా ఇద్దరి మధ్య ఇరుక్కొని కూర్చున్నట్టు/ఇది కవి యొక్క ఒంటరితనాన్ని నగరం మధ్యలో తన స్థానాన్ని గుర్తించలేకపోవడాన్ని సూచిస్తుంది.ఇది నగర జీవనంలోని ఇరుకుదనాన్ని,గందరగోళాన్ని బలంగా వ్యక్తపరుస్తుంది.ఇద్దరి మధ్య ఇరుక్కోవడం అనేది శారీరకంగా మాత్రమే కాక, భావోద్వేగపరంగా ఒత్తిడిని సూచిస్తుంది.మనిషి తన వ్యక్తిత్వానికి స్థలం లేకుండా,జన సందోహంలో ఉన్నా,తన్ను తాను కోల్పోతున్నట్టు అనిపిస్తుంది.తనకంటూ ఒక వ్యక్తిగత స్థలం లేకపోవడం వల్ల కలిగిన సామాజిక ఒత్తిడి,ఆధునిక నగర జీవనంలోని ఇరుకును సూచిస్తుంది.
“నగరం మధ్యలో నేను ఇరుక్కున్నాను/ఇది కేవలం శారీరక స్థితి మాత్రమే కాదు,మానసిక స్థితిని సూచిస్తుంది.ఇది వ్యక్తి తన స్వంత స్థలాన్ని కోల్పోయిన స్థితి.ఇది ప్రత్యక్షంగా ఒంటరితనాన్ని,అసహయతను వ్యక్తపరుస్తుంది.నగరం మధ్యలో ఉన్నప్పటికీ కవి తాను పరాయివాడిలా భావిస్తున్నాడు.ఇక్కడ జన సమూహంలో ఉన్నా ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నాడు అనే భావం ప్రతిఫలిస్తోంది.నగరంలో వేల మంది మనుషులు నివసిస్తూ ఉన్నా,ఎవరికీ,ఎవరితో సంబంధం ఉండదు.జన సందోహం మధ్య కూడా మనిషి ఏకాకి. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికుడిలా,విశాలమైన నగరంలో కవి ఊపిరి సలపని స్థితికి చేరి తన ఉనికిని కోల్పోయినట్టు భావిస్తున్నాడు.ఇది నగరాల్లో పెరిగిపోతున్న జనాభా సాంద్రతను మాత్రమే కాదు. మనుషుల మధ్య పెరిగిన మానసిక దూరాన్ని కూడా సూచిస్తుంది.ఈ కవితలో కవి నగరాన్ని ఒక సంక్లిష్టమైన, రహస్యమైన వస్తువుగా చిత్రీకరిస్తున్నాడు.నగరం యొక్క ప్రభావం కవి మనసుపై ఎలా ఉంటుందో,అతని అస్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ కవితలో వ్యక్తం చేయబడింది.
“కానీ నగరం చేతులు చాచిన ఆకాశం/కవి నగరాన్ని తనతో పోల్చుకుంటూ అద్భుతమైన ప్రతీకలను వాడారు.నగరం ఎప్పుడు తనను తాను విస్తరించుకోవాలని చూస్తుంది.నగరం ఆకాశమంత ఎత్తుకు ఎదగాలి,అందరిని తనలో విలీనం చేసుకోవాలి అని చూసే ఒక భారీ శక్తి.ఇక్కడ ఒక మలుపు కనిపిస్తుంది.నగరం ఇరుకుదనానికి ప్రతీకగా ఉన్నప్పటికీ,అదే నగరం ఆకాశానికి చేతులు చాచినట్టు చూపిస్తుంది.ఇది ఆశ,స్వేచ్ఛ,విస్తరణకు సంకేతం.నగరం కేవలం బంధనమే కాదు – అది అవకాశాల విస్తృతి.కవి నగరం యొక్క విస్తరణ,దాని పరిధి,ఆకాశాన్ని తాకేంత విశాలంగా ఉందని భావిస్తున్నాడు.ఇది నగరం యొక్క వైభవాన్ని,విస్తృతిని చూపిస్తుంది.
“నేను బావి నీళ్లలో తేలుతున్న ఆకాశం/ఇది అత్యంత లోతైన భావం.బావి నీళ్లలో ఆకాశం కనిపిస్తుంది.కానీ అది కేవలం ప్రతిబింబం మాత్రమే.బావి అనేది పరిమితులకు,బంధాలకు సంకేతం.కవి తనను తాను ఆకాశమంత విశాలమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిగా భావించినా,తాను నగరం అనే బావిలో పడిపోయి,అందులోనే బందీగా ఉన్నానని ఆవేదన చెందుతున్నాడు.ఆకాశమంత స్వేచ్ఛ ఉన్నా అది కేవలం ఒక చిన్న నీటి చట్రంలోనే కనిపిస్తుంది.ఈ కవితా పంక్తులు నగరంలోని యాంత్రికతను,మనిషి తన సొంత మూలాలను కోల్పోయి అనుభవిస్తున్న అభద్రతా భావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.నగర విస్తృతికి,వ్యక్తిగత స్వేచ్ఛారాహిత్యానికి మధ్య ఉన్న సంఘర్షణే ఈ కవితా సారం.ఇది కవి తనను బావి నీళ్లలో తేలుతున్న ఆకాశంగా భావించడం ద్వారా,తన అస్తిత్వాన్ని,తన భావాలను ఆకాశంతో పోల్చి,ఒక లోతైన, అందమైన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.ఇది కవి యొక్క ఆత్మ పరిశీలనను,తన అస్తిత్వాన్ని గుర్తించడాన్ని సూచిస్తుంది.ఈ కవితా పంక్తి అత్యంత సారవంతమైన రూపకం.బావి నీళ్లలో కనిపించే ఆకాశం పరిమితంగా ఉంటుంది – కానీ అదే నిజమైన ఆకాశానికి ప్రతిబింబం.కవి తనను అలాంటి ప్రతిబింబంగా చూస్తున్నాడు.తనలో కూడా ఒక విస్తృతి ఉంది.కానీ ఒక పరిమిత పరిధిలోనే కనిపిస్తుంది.ఇది స్వీయ అవగాహన,అంతర్గత స్వేచ్ఛ,ఆత్మాన్వేషణకు సంకేతం.ఈ కవితా పంక్తులు నగర జీవనంలోని రెండు విభిన్న దృశ్యాలను చూపిస్తుంది.ఒక వైపు ఇరుకుదనం,ఒత్తిడి,ఒంటరితనం.మరో వైపు విస్తృతి,ఆశ.ఆత్మలోని ఆకాశం.నగరం బయటి ప్రపంచం అయితే కవి మనసు అంతర్గత ప్రపంచం.నగరం కడుపు ఏమిటో తెలియకపోయినా తన కడుపులోని దిగులు అతనికి తెలుసు.చివరికి తనలోని ఆకాశాన్ని గుర్తించడమే విముక్తి. ఇది ఒక అంతర్ముఖ కవిత.చదివిన తర్వాత మనలో కూడా ఒక ప్రశ్న మిగులుతుంది.మనం నగరంలో చిక్కుకున్నామా? లేక మనలోని ఆకాశాన్ని మర్చిపోయామా?ఈ కవితా పంక్తుల్లో నగరం ఒక భౌతిక స్థలం మాత్రమే కాదు – అది మనసు స్థితి.అంతర్మథనం మరియు వ్యక్తిత్వ సంక్లిష్టతకు ప్రతీకగా నిలుస్తుంది.
“ఆకాశాన్నంటే భవనాలను చూసి/అసింట పోతుంటాను గానీ/ఇది భవనాల వైభవాన్ని,వాటి ఎత్తును,ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్నా,వాటిని చూసి కవి అనుభవించే భావాన్ని సూచిస్తుంది.కవి భవనాల వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతున్నప్పటికీ, వాటి వెనుక ఉన్న కలలను,కష్టాన్ని గుర్తించలేకపోవడాన్ని వ్యక్తం చేస్తుంది.ఇక్కడ ‘ఆకాశాన్నంటే భవనాలు’అనే రూపకం అత్యున్నత ఆశయాలను, అభివృద్ధిని,విజయాన్ని సూచిస్తుంది.కానీ,కవి హృదయంలో ఉల్లాసం కంటే ఒక విచిత్రమైన కలవరపు భావం కలుగుతుంది.ఈ భావం ఆశ్చర్యం కాదు,అసమానతలపై ఒక అంతర్మథనం.నగరం అనగానే ముందుగా గుర్తొచ్చేవి ఆకాశహార్మ్యాలు.వాటిని చూసి సాధారణంగా ఎవరైనా ఆశ్చర్యపోతారు.కానీ కవి చూపు ఆ భవనాల మెరుపుల కంటే లోతుగా వెళ్తోంది.ఆ భవనాలు కేవలం కొందరి కలల సౌధాలు మాత్రమే అని,కవి అంగీకరించ లేకపోతున్నాడు. అంటే ఆ అందమైన కట్టడాల వెనుక ఎందరో సామాన్యుల కష్టం,కన్నీళ్లు దాగి ఉన్నాయి అనే స్పృహ ఇక్కడ కనిపిస్తుంది.
“ఖరీదైన విలాస విరామ జీవితం చూసి/ కలవరపడతా గానీ/ నగరంలోని విలాసవంతమైన జీవనశైలి కవిని ఆశ్చర్యపరచదు ; అది అతనిని కలవరపెడుతుంది.ఆ విలాసం వెనుక దాగి ఉన్న శ్రమ,కష్టాల గాఢతను పూర్తిగా గ్రహించలేకపోవడం,అతన్ని గాఢమైన ఆలోచనలోకి తీసుకెళ్తుంది.విలాసవంతమైన జీవితం ఒక ఆకర్షణ.కానీ.కవి దానిని చూసి అసూయ పడటం లేదు,కలవరపడటం లేదు. ఎందుకంటే ఆ విలాసం వెనుక ఉన్న శ్రమ,అసమాన అవకాశాలు,అదృష్టం – దురదృష్టం మధ్య ఉన్న వ్యత్యాసాలు కవిని ఆలోచనలో ముంచేస్తాయి.
“చెమట చుక్కల శ్రమనో,మేధో కష్టమో/ఎవరిదైనా ఎవరైనా/ నగరంలోని విలాసవంతమైన జీవనశైలి,ఆ విలాసం వెనుక ఉన్న చెమట చుక్కల శ్రమనో,మేధో కష్టమా అని కవి ఆలోచిస్తున్నారు.అది ఎవరిదైనా సరే,ఆ సంపద సముపార్జనలో ఉండే నైతికతను లేదా అసమానతను ఆయన ప్రశ్నిస్తున్నారు.ఇక్కడ శ్రమకు రెండు పార్శ్వాలు చూపించారు.శారీరక శ్రమ,మేధో శ్రమ,విజయానికి కారణం ఏదైనా కావచ్చు.కానీ,అందరికీ సమానంగా దక్కదని కవి గ్రహిస్తున్నారు.ఇది కవి శ్రమను,కష్టాన్ని గుర్తించలేకపోవడాన్ని అందరి కష్టాన్ని ఒక విధంగా చూడలేకపోవడాన్ని వ్యక్తం చేస్తుంది.ఈ కవితలో కవి భవనాల వైభవాన్ని, విలాసవంతమైన జీవితాన్ని చూసి ఆశ్చర్యపోతున్నప్పటికీ, వాటి వెనుక ఉన్న శ్రమను,కష్టాన్ని గుర్తించలేకపోవడాన్ని వ్యక్తం చేస్తున్నాడు.ఇది కవి యొక్క సామాజిక చైతన్యాన్ని, శ్రమను గుర్తించడంలోని లోపాన్ని సూచిస్తుంది.
“అందరి గమ్యం అదే కదాని అనుకోలేను/ఇది అత్యంత కీలకమైన కవితా పంక్తి.సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ ఖరీదైన విలాసాల కోసమే పరిగెడుతున్నారు.అందరి జీవిత పరమార్ధం ఆ సౌధాలను చేరుకోవడమేనని కవి నమ్మడం లేదు.భౌతిక సుఖాలే జీవితానికి అంతిమ లక్ష్యమని భావించే భౌతికవాద ధోరణిని కవి ఇక్కడ సున్నితంగా నిరసిస్తున్నారు.ఈ కవితలో అనుకోలేను అనే పదం పదేపదే రావడం గమనార్హం.ఇది కవి యొక్క వ్యక్తిత్వానికి, ఆయన తాత్విక నిలకడకు నిదర్శనం.లోకం దేనినైతే గొప్పగా చూపిస్తుందో,అదే కోణంలో చూడకుండా,దాని వెనుక ఉన్న సామాజిక మూల్యం గురించి కవి ఆలోచిస్తున్నారు. సమాజంలో అందరికీ ఒకే గమ్యం ఉండ రాదు.పరిస్థితులు, అవకాశాలు – ఇవన్నీ గమ్యాలను వేరు చేస్తాయి.కవి సమానత్వాన్ని ఆశిస్తున్నప్పటికీ వాస్తవం వేరు అని అంగీకరిస్తున్నారు.ఆకాశాన్నంటే భవనాలు అనే ప్రతీక ద్వారా అభివృద్ధి – అసమానతల ద్వంద్వాన్ని చూపారు.కవిత అంతా ఒక ఆత్మ పరిశీలనగా సాగుతుంది.వ్యక్తిగత భావం ద్వారా సామాజిక నిర్మాణాన్ని ప్రశ్నించడం ప్రధాన లక్షణం. ఆశ్చర్యం,కలవరం,శ్రమ,విలాసం వంటి విరుద్ధ భావాలను సమతుల్యం చేశారు.
ఈ కవిత ఆధునిక నగర సంస్కృతిపై ఒక మానవీయ ప్రశ్న.ఎత్తైన భవనాలు ఉన్నా – అందరి కలలు అక్కడికి చేరవు.విలాస జీవితం కనిపించినా – అందరి ప్రయాణం అక్కడితో ముగియదు.ఈ కవితలో ఉన్న భావ గాఢత, సామాజిక అవగాహనతో ముడిపడి ఉంది.అది ఒక సాధారణ పరిశీలన కాదు – ఒక సున్నిత మనసు ప్రపంచాన్ని చూసే విధానం.
ఈ కవితా పంక్తుల్లో ఆధునిక నగర జీవన విరుద్ధాలపై తలెత్తిన ఆత్మ పరిశీలన కనిపిస్తుంది.ఇది కేవలం భావనలను గూర్చిన వర్ణన కాదు – సమాజంలో ఉన్న అసమానతలపై,కలల విలువలపై,శ్రమ – విలాసాల మధ్య దూరంపై ఒక భావోద్వేగ స్పందన.ఈ కవితలో కవి ఆకాశాన్ని తాకే భవనాలను చూసి,వాటి వైభవాన్ని అనుభవిస్తూ,వాటి వెనుక ఉన్న కథను,శ్రమను గుర్తించలేకపోవడాన్ని వ్యక్తం చేస్తున్నాడు.భవనాలు కొందరి కలల సౌధాలు అని,వాటి వెనుక ఉన్న కష్టాన్ని,శ్రమను అర్థం చేసుకోలేకపోవడాన్ని చెబుతున్నాడు.ఈ కవితా పంక్తులు నగరంలోని సామాజిక అసమానతలను మరియు భౌతిక సంపద వెనుక ఉన్న వాస్తవాలను తాత్విక కోణంలో ప్రశ్నిస్తున్నాయి.
“బోనులో వున్న పులిని భీతిల్లి చూస్తున్నట్టు/ నగరాన్ని భీతిల్లి చూస్తున్నా/ఇక్కడ నగరం ఒక బంధించబడిన పులిలా కనిపిస్తుంది.పైకి అదుపులో ఉన్నట్టే అనిపించినా లోపల అణిచివేయబడిన క్రూరత్వం,అశాంతి దాగి ఉంది.కవి ఆ పులిని చూసి భీతిల్లినట్లే, నగరాన్ని కూడా భయంతో చూస్తున్నాడు.ఇది నగరంలో దాగి వున్న హింస,ఒత్తిడి, అస్థిరతకు సంకేతం.ఇక్కడ నగరాన్ని బోనులో వున్న పులితో పోల్చడం,అత్యంత బలమైన రూపకం.పులి అంటే శక్తి, హింసకు,దాడికి సంకేతం.బోను అంటే కనిపించే ప్రమాదం నియంత్రణలో ఉన్నట్టుగా భావించడం.నగరం కూడా అలాగే – అది నియంత్రణలో ఉన్నట్టుగా కనిపించినా,ఎప్పుడైనా మనపై దాడి చేయ గల శక్తిగా అనిపిస్తుంది.అందుకే కవి నగరాన్ని ఒక భయానక జీవిగా చూపించాడు.ఇది నగర జీవనంలోని అస్థిరతను,పోటీని మరియు నిరంతర ఒత్తిడిని సూచిస్తుంది.ఇది నగరాన్ని ఒక ప్రమాదకరమైన,భయపెట్టే వస్తువుగా చిత్రీకరిస్తుంది.కవి నగరాన్ని చూసి భయపడుతున్నాడు.దాని ప్రభావాన్ని తప్పించుకోలేకపోతున్నాడు. “నగరాన్ని భీతిల్లి చూస్తున్నా – ఇది కవి యొక్క నగరం పట్ల భయాన్ని,ఆందోళనను వ్యక్తం చేస్తుంది.ఇక్కడ నగరాన్ని కవి ఒక పులితో పోల్చాడు.పులి బోనులో ఉన్నప్పటికీ దాని క్రూర స్వభావం మారదు.అది ఎప్పుడైనా దాడి చేయవచ్చు అనే భయం మనలో ఉంటుంది.నగరం కూడా చూడడానికి కట్టుదిట్టంగా,నాగరికంగా కనిపించినా,దాని లోపల ఒక హింసాత్మకమైన,క్రూరమైన స్వభావం దాగి ఉంది అని కవి భయపడుతున్నాడు.
“నిద్రలో దాని గాండ్రింపులు/వినపడుతున్నాయి/ఇక్కడ భయం బాహ్య ప్రపంచానికి మాత్రమే పరిమితం కాలేదు ; అది అంతర్మనస్సులోకి చొచ్చుకుపోయింది.నిద్రలో కూడా నగరపు గాండ్రింపు వినిపించడం అనేది మనస్సులోని కలవరం,మానసిక వేదన ఏర్పడింది అనే సూచన.నగరం ఒక స్థలం కాదు – అది మనసులోకి ప్రవేశించిన శబ్దం.ఇది ఆధునిక జీవనంలో మానసిక ప్రశాంతత కోల్పోవడాన్ని ప్రతిబింబిస్తుంది.నగరం యొక్క ధ్వని,కవి చెవులకే కాదు, ఆయన మనస్సులోకి కూడా చొచ్చుకుపోయింది.నగరం పగలు చేసే రణగొణ ధ్వనులు,శబ్దాలు నిద్రలో కూడా గాండ్రింపులా వెంటాడుతుంది.అంటే నగరపు యాంత్రికత, మనిషి అంతరంగ శాంతిని ఎలా హరించి వేస్తుందో ఇక్కడ స్పష్టం అవుతుంది.
“సముద్రాన్ని ఎదురుగా పెట్టుకుని/చెవులు మూసుకున్నా/ అలల ఘోషలు వెంటాడుతున్నాయి/ఇక్కడ సముద్రం ఒక విశాలతకు,ప్రకృతి శక్తికి ప్రతీక.చెవులు మూసుకోవడం, సమస్యను దాటవేయాలనే ప్రయత్నం.ఎంత దూరం పెట్టినా,ఎంత మర్చి పోవాలనుకున్నా,నగర జీవన శబ్దాలు మనసులోంచి పోదు.అలలు నిరంతరం తీరాన్ని తాకినట్టే,ఆ ఒత్తిడి మనసును తాకుతూనే ఉంటుంది.ఇక్కడ సముద్రం నగరం యొక్క అనంతమైన కోలాహలానికి ప్రతీక.మనం ప్రయత్నించి బాహ్య ప్రపంచానికి తలుపులు వేసుకున్నా, చెవులు మూసుకున్నా,నగరపు ఒత్తిడి,వేగం,ఆందోళనలు మనిషిని వదలవు.అవి సముద్రపు అలల ఘోషలుగా నిరంతరం మనసును తాకుతూనే ఉంటాయి.ఈ కవితా పంక్తుల్లో కవి నగరాన్ని ఒక నియంత్రించ లేని శక్తిగా చిత్రించారు.మనిషి నగరం నుండి భౌతికంగా దూరంగా ఉన్నా,మానసిక గాయంలా అది అతడిని వెంటాడుతూనే ఉంటుంది.నగరపు నాగరికత మనిషికి అసౌకర్యాన్ని ఇచ్చి ఉండవచ్చు.కానీ, ప్రశాంతతను మాత్రం దూరం చేసింది అని కవి ఆవేదన చెందుతున్నాడు.ఈ కవితలో నగరాన్ని ‘పులి’ మరియు ‘సముద్రం’ వంటి ప్రకృతి శక్తులతో పోల్చడం ద్వారా దాని తీవ్రతను కవి అద్భుతంగా పండించారు.
ఈ కవితలో మూడు ప్రధాన ప్రతీకలు ఉన్నాయి.పులి – భయం,హింస,దాడికి సంకేతం.గాండ్రింపు – మానసిక కలవరానికి ప్రతీక.సముద్రపు అలలు – నిరంతర ఒత్తిడి, తప్పించుకోలేని వాస్తవానికి ప్రతీక.ఈ ప్రతీకల ద్వారా కవి నగరాన్ని ఒక భయానకమైన,శబ్దభరితమైన శక్తిగా మలిచాడు.
ఈ కవితా పంక్తుల్లో కవి బాహ్య నగరాన్ని కాదు.తనలోని అంతర్గత భయాన్ని మాత్రమే చిత్రిస్తున్నాడు.నగరం ఒక ప్రతీక మాత్రమే ; అసలు యుద్ధం మనసులోనే జరుగుతుంది. నగరాన్ని చూడటానికి భయపడటం,నిద్రలో కూడా వెంటాడడం,దూరం పెట్టినా శబ్దం ఆగకపోవడం,ఇవి అన్ని ఒక మానసిక అసౌకర్యానికి సంకేతాలు.ఈ కవితా పంక్తులు నగర జీవనంలోని శబ్దాన్ని,భయాన్ని,ఒత్తిడిని,ఒక ఆత్మీయ అనుభూతిగా మలిచింది.ఇది కేవలం నగరం పై విమర్శ కాదు – ఆధునిక మనిషి మనసులోని కలవరానికి ప్రతిబింబం. చివరిగా ఒక ప్రశ్న మిగులుతుంది.నగరం నిజంగా పులినా? లేక మన భయాలే ఆ గాండ్రింపులా?ఈ కవితా పంక్తుల్లో భయం,అనిశ్చితి,అంతర్మథనం మరియు రూపకాల ద్వారా భయాన్ని కూర్చిన తీరు విశేషంగా ఉంది. కవి నగరం ఒక వైభవ చిహ్నంగా కాకుండా ఒక బంధనంగా,ఒక భయంకర జీవిగా అనుభూతి చెందుతున్నాడు.కానీ,కవి దృష్టిలో ఆశ్చర్యాన్ని కలిగించినా,కొందరి కలల సౌధాలుగా మారలేకపోతున్నాయి.ఇక్కడ కవిత యొక్క ప్రధాన వ్యతిరేక భావన ప్రారంభం అవుతుంది.సముద్రం ఎదురుగా ఉన్నా, చెవులు మూసుకున్నా అలల ఘోషలు వినిపించడం.అంటే ఎంత దూరంగా ఉండాలనుకున్నా,ఎంత తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నా – నగరపు శబ్దం వెంటాడుతూనే ఉంటుంది.
ఇది నగరం నుండి విముక్తి సాధ్యం కాదన్న అంతర్లీన వేదనను సూచిస్తుంది.
ఈ కవితా పంక్తులు నగరాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా కాదు, ఒక భయానక జీవిగా,ఒక మనసును వెంటాడే శబ్దంగా,ఒక అసమాన కలల గూడుగా చిత్రిస్తుంది.ఇది కేవలం నగర విమర్శ కాదు – ఆధునిక జీవన విధానంపై ఒక అంతర్ముఖ ప్రశ్న.నగరం పట్ల కవికి ఉన్న అభద్రతాభావాన్ని,నగర జీవనంలోని బీభత్సాన్ని,అత్యంత శక్తివంతమైన ప్రతీకలతో ఆవిష్కరించాయి.
“నగరంలో కొచ్చి నగరాన్ని/తప్పించుకు తిరగడం/ఇది నగరంలో జీవించడం,నగరాన్ని తప్పించుకుని తిరగడం,ఎంత కష్టమో సూచిస్తుంది.ఇది ఆధునిక మనిషి మనోవైఖరి. నగరంలో నివసిస్తూ కూడా దాని సంస్కృతి,దాని వేగం,దాని ప్రభావం నుండి తప్పించుకోవాలని ప్రయత్నించడం ఒక అంతర్గత సంఘర్షణ.నగరం మన జీవనానికి అవసరం అయిపోయిన తర్వాత,దాని నుంచి విడిపోవాలన్న కోరిక ఒక అసాధ్యమైన ప్రయత్నంగా మారుతుంది.నగరాన్ని తప్పించుకు తిరగడం ఎంత కని సాధ్యం?అన్న ప్రశ్నలో ఒక నిస్సహాయత కనిపిస్తుంది.నగరం అనేది కేవలం భౌగోళిక ప్రాంతం కాదు – అది ఒక జీవనశైలి.దానికి కవి అద్భుతమైన ఉపమాతో మరింత లోతుగా చెబుతాడు. “సముద్రంలో మునిగిపోతూ/ఈత కొట్టకుండా వుండడం/ సముద్రం అంటే అపారత్వం,ఆవరించే శక్తి.అందులో పడిపోయి ఈత కొట్టకపోతే మునిగిపోవడమే.అదే విధంగా నగర జీవనంలో ఉండి దానితో మమేకం కాకపోతే జీవన యాత్ర సాఫీగా సాగదు.ఇక్కడ నగరం సముద్రంలా – మనల్ని చుట్టుముట్టి మనల్ని ఆవరించే వాస్తవం.సముద్రంలో ఉన్న వాడు ఈత కొట్టకపోతే మునిగి పోవాల్సిందే.అలాగే నగరంలో ఉన్న మనిషి నగర నియమాలకు లోబడకపోతే,ఆ వ్యవస్థలో తుడిచిపెట్టుకుపోతాడు.ఇక్కడ నగరం ఒక నిర్దాక్షిణ్యమైన సహజ శక్తిలా మారుతుంది.నగరం అనే మహాసముద్రంలో ఉంటూ దాని ప్రభావానికి లోను కాకుండా ఉండటం అంత కంటే అసాధ్యం అని కవి భావం.ఇది ఆధునిక మానవుడు నగర గమనంలో చిక్కుకుపోయిన తీరును తెలుపుతుంది.
“వేప చెట్టుని రావి చెట్టు పెనవేసుకున్నట్టు/ పెనవేసుకుంటుంది నగరం/ఇది నగరం – మనిషి సంబంధాన్ని పరాన్న జీవి సంబంధంలా చూపిస్తుంది.మొదట అది సహజంగా,అవసరంగా అనిపించినా,కాలక్రమేణా మన అస్తిత్వాన్ని,స్వతంత్రతను మెల్లగా కమ్మేస్తుంది.వేపచెట్టు తన ఔషధ గుణాలతో ప్రత్యేక గుర్తింపు ఉన్నది ; కానీ రావి చెట్టు దాన్ని పెనవేసుకుంటే వేపచెట్టు స్వరూపమే మాయం అవుతుంది.అలాగే మన వ్యక్తిత్వాన్ని మూలాన్ని మసక బార్చుతుంది.చెట్లు సహజంగా పెనవేసుకోవడం రూపకం.ఇది చాలా సున్నితమైనది.వేపచెట్టు,రావి చెట్టు వేరు వేరు స్వభావాలు కలవి.కానీ,ఒక దానితో ఒకటి పెనవేసుకుంటే విడదీయలేని సంబంధంగా మారతాయి.అలాగే నగరం కూడా మనిషిని నెమ్మదిగా,గమనించకుండా,తనలో చుట్టేసుకుంటుంది. ఇది బలవంతపు బంధం కాదు ; ఇది సహజమైన,కానీ తప్పించుకోలేని అనుబంధం.నగరంలో ఉంటూ నగరాన్ని దూరం పెట్టాలనుకున్నా,నగరం అతన్ని తన సంస్కృతితో,తన అవసరాలతో,తన కలలతో కట్టిపడేస్తుంది.
ఈ కవితా పంక్తుల్లో ఒక ప్రశ్నార్థకం ఉంది – ‘ఎంతకని సాధ్యం?ఈ ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది.నగరాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు.నగరం అంటే కేవలం భావనలు కాదు ; అది జీవనశైలి,ఆలోచన,పోరాటం,ఆశ, ఆవేదనల సమాహారం.మనిషి నగరంలో జీవిస్తూ దాని ప్రభావం నుండి పూర్తిగా బయట ఉండ లేడు.అది సముద్రం లాంటి అపారత్వం,చెట్లు పెనవేసుకోవడం లాంటి సహజ అనుబంధం.ఈ కవిత నగర జీవనంలోని వైరుధ్య భావనను సున్నితంగా ఆవిష్కరిస్తుంది.నగరంలో ఉంటూ నగరాన్ని దూరం పెట్టాలనుకోవడం అసాధ్యం.నగరం ఒక సముద్రంలా మనల్ని ముంచుతుంది.అది ఒక వేప చెట్టు వేరులా మన జీవితంలో పెనవేసుకుంటుంది.కవి చెబుతున్నది ఏమిటంటే – నగరాన్ని తప్పించుకోవడం కాదు.దానితో ఈత కొట్టడం నేర్చుకోవడమే జీవన జ్ఞానం.నగరం ఒక ప్రదేశం కాదు ; అది ఒక పట్టుదల గల వ్యవస్థ.దానిలోకి వచ్చిన మనిషి దాని ప్రభావం నుంచి పూర్తిగా తప్పించుకోవడం అసాధ్యం.ఇది నగర జీవితం మీద మాత్రమే కాదు – మన స్వేచ్ఛ ఎంతవరకు నిజమో అన్న ప్రశ్న. వేపచెట్టుని రావి చెట్టు పెనవేసుకున్నట్టు అనే ఉపమానం ఇక్కడ అత్యంత శక్తివంతమైనది. సాధారణంగా గ్రామాల్లో వేప,రావి చెట్లు పెనవేతను పవిత్రంగా భావిస్తారు.కానీ,ఇక్కడ నగరం మనల్ని ఆ విధంగా పెనవేసుకుంటోందని చెప్పడంలో ఒక విధమైన ఊపిరాడని బంధం కనిపిస్తుంది.నగరం మరియు మనిషి విడదీయలేనంతగా కలిసిపోయారు.కానీ,ఆ కలయికలో మనిషి తన ఉనికిని లేదా స్వేచ్ఛను కోల్పోతున్నాడనే హెచ్చరిక ఇందులో ఉంది.సముద్రం,ఈత, మునిగిపోవడం వంటి పదాలు అస్తిత్వ వేదనను సూచిస్తాయి.నగరం అనే సముద్రంలో మనిషి నిరంతరం ప్రవాహాన్ని ఎదురీతున్నాడు. ఒకవేళ ఈత కొట్టడం ఆపేస్తే,నగర వేగంతో పోటీ పడకపోతే మునిగిపోవడం ఖాయం.ఇది పరుగుల జీవనంలోని ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది.
ఈ కవితా పంక్తుల్లో నగరం ఒక ఆత్మీయ నేస్తంలా కాకుండా, మనిషిని తన కౌగిలిలో బంధించి తనలో లీనం చేసుకునే ఒక మాయావిలా కనిపిస్తుంది.ప్రకృతికి దూరమై కాంక్రీట్ వనాల్లో చిక్కుకున్న మానవుని స్థితిని ఈ కవితా రూపం అద్దం పడుతోంది.
ఈ కవితా పంక్తుల్లో కవి నగరాన్ని ఒక అజ్ఞాత శక్తిగా,ఒక తప్పించుకోలేని వాస్తవంగా చిత్రిస్తాడు.నగరంలో జీవిస్తూ నగరాన్ని దూరం పెట్టాలనుకోవడం,అసాధ్యమని,కవిత స్పష్టంగా తెలియజేస్తుంది.
ఈ కవితా పంక్తుల్లో నగరీకరణ మరియు ప్రకృతి మధ్య జరిగే సంఘర్షణను ఒక ఉక్కరిబిక్కిరి చేసే ఆలింగనాన్ని ఎంతో గాఢంగా వర్ణిస్తున్నాయి.నగరాన్ని ఉదాహరణగా తీసుకుని ఆధునిక నగర తీరుతెన్నులను కవి వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“ఊరే కాదు నగరం కూడా/మనిషిలో తల్లి వేర్లు దించుతుంది/ ఇది నగరాన్ని పూర్తిగా తిరస్కరించకుండా,అది కూడా మనిషికి ఒక రకమైన మాతృభూమి అవుతుందన్న భావన. ఊరు మాత్రమే కాదు,నగరం కూడా మనిషిని పోషిస్తుంది, రూపుదిద్దుతుంది.నగరం – తల్లి ప్రతి రూపం.ఇందులో కవి ఒక గాఢమైన భావ సత్యాన్ని వ్యక్తం చేస్తాడు.ఊరు అంటే సహజత్వం,మూలాలు,అనుబంధం.కానీ,నగరం మనిషి అంతరంగంలో వేర్లు పెడుతుందని చెప్పడం ద్వారా కవి నగరాన్ని పరాయిగా కాక,తన అంతరంగంలో భాగంగా చూపిస్తాడు.ఇక్కడ తల్లి వేర్లు అనే రూపకం నగరాన్ని పోషికశక్తిగా,ఆప్యాయతగా చిత్రిస్తుంది.సాధారణంగా తల్లి వేర్లు లేదా మూలాలు అంటే మనకు పల్లెటూరు గుర్తొస్తుంది. కానీ,కవి ఇక్కడ ఊరే కాదు,నగరం కూడా మనిషిలో తల్లి వేర్లు దించుతుంది అంటూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.
“అడవులు,నదులు మాయమయి/నగరాలు వెలిశాయి కదా../అనే కవితా పంక్తిలో ఆధునిక నాగరికత,ప్రకృతిని ఎలా మింగేసిందో సూచన.ఇక్కడ మాయమయి అన్న పదం అభివృద్ధి వెనుక జరిగిన నష్టాన్ని,నిశ్శబ్దంగా గుర్తు చేస్తుంది. ఇది ఆరోపణ కాదు ; ఒక వాస్తవ స్వీకారం.
“మరి నగరం మొలిచిన నేలలో/తడి హృదయాలు మొలవవా?/ఇది అత్యంత మానవీయమైన ప్రశ్న.రాతి, సిమెంట్ మధ్య కూడా సున్నితమైన మనసులు,కారుణ్య హృదయాలు పుట్టలేవా?అన్న ఆశ ఇక్కడ వ్యక్తమవుతుంది. తడి హృదయాలు అన్న ప్రతీక.ప్రేమ,కరుణ,స్పందనకు సంకేతం.ఇది నగరంపై విమర్శ కాదు ; ఇది నగరాన్ని సమర్థించే అంతర్మథనం.రాతి కట్టడాల మధ్య కూడా సున్నితమైన హృదయాలు వికసిస్తాయని కవి విశ్వసిస్తున్నాడు. అడవులు,నదులు మాయమై నగరాలు వెలిసినా,ఆ నేల తన గుణాన్ని,తడిని కోల్పోదని కవి నమ్ముతున్నాడు.
“నగరానిది రాతి ముఖమే గానీ/హృదయం కూడా రాయేనా?/నగరానికి బయట కనిపించే కఠినత్వం,వేగం, నిర్దాక్షిణ్యం – ఇవి దాని ముఖం మాత్రమే కావచ్చు.కానీ,ఆ లోపల దాగి ఉన్న హృదయం కూడా అంతే కఠినమా?ఇది తీర్పు కాదు – ఒక ప్రశ్న.ఆ ప్రశ్ననే కవితా పంక్తులుగా మలచడం ఈ రచనలోని గొప్పతనం.నగరాన్ని శత్రువుగా కాదు,ఒక పెరిగిపోయిన పిల్లలాగే చూస్తుంది – దాని ముఖం కఠినమైనా, హృదయం ఇంకా మారే అవకాశం ఉందన్న విశ్వాసంతో నగరాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని కూల్చడమే,పొగడడమో కాదు – అది కూడా మనలాగే మారుతున్న ఒక జీవి అనే భావన ఈ కవితలో నిగూఢంగా వ్యక్తం అవుతుంది.ఇక్కడ కవి నగర బాహ్య కఠినత్వాన్ని, అంతర్గత మృదుత్వంతో పోలుస్తాడు.నగరం నిశ్శబ్దంగా కనిపించినా,అది అనుభూతులను దాచుకుంటుందనే భావం వ్యక్తమవుతోంది.రాతి కట్టడాల వెనుక రక్తం పంచుకున్న మనుషుల భావోద్వేగాలు ఉంటాయని,అందుకే నగరానిది రాతి ముఖమే కానీ రాతి హృదయం కాదని కవి వాదిస్తున్నాడు.
“నిద్ర రానప్పుడు/నగరాన్ని ఎదురుగా కూర్చోబెట్టుకుంటాను/ ఇది ఒక అద్భుతమైన చిత్రణ.నగరాన్ని ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడటం అంటే తనను తాను ఎదుర్కోవడం.నిద్రలేమి ఇక్కడ కేవలం శారీరక స్థితి కాదు ; అది ఆత్మ అప్రమత్తంగా ఉండే క్షణం.ఆ క్షణంలో కవి నగరాన్ని ఎదురుగా కూర్చోబెట్టడం అంటే తన అంతరంగంలోని నగరాన్ని ఎదుర్కోవడమే.నగరం ఇక బయట స్థలం కాకుండా – చర్చకు సిద్ధమైన ఒక శక్తివంతమైన స్థితిగా మారిపోయింది.
“నోరు విప్పదు గానీ/గుండెలు విప్పుతుంది/ఇక్కడ నగరం మాటలతో కాదు,అనుభూతులతో స్పందిస్తుంది.నగరం మాట్లాడదు.కానీ,దాని అనుభవాలు,గాయాలు,జ్ఞాపకాలు మన హృదయాన్ని తెరుస్తాయి.ఇది నగరపు మౌనభాష. శబ్దాల నగరం ఇక్కడ నిశ్శబ్దంగా మారడం ఒక విశేషం.ఈ కవితా పంక్తుల్లో నగరానికి,మనిషికి మధ్య ఉన్న ఏకాంత అనుబంధం కనిపిస్తుంది.పగటి వేళ ఉరుకులు పరుగులతో రొద చేసే నగరం,రాత్రివేళ మౌనంగా తన గుండెను విప్పుతుంది.అంటే నగరంలోని ప్రతి గల్లీ,ప్రతి ఇల్లు ఒక కథను, ఒక గాథను దాచుకుని ఉంటుందని అర్థం
అవుతుంది.నగరం నోరు విప్పి మాట్లాడక పోయినా,తనలోని మనుషుల కన్నీళ్లను,కష్టాలను కళ్ళకు కడుతుంది.
“కళ్ళలో నీళ్లతో/ఊరిని చూసిన కళ్ళతో నన్ను చూడమంటుంది/నగరం కవికి తన మూలాలను గుర్తు చేస్తుంది.ఊరు అనుభూతి,నగరం అనుభవం – ఈ రెండు ఒకే దృష్టిలో కలిసిపోతాయి.ఇక్కడ నగరానికి కన్నీళ్లు ఉన్నాయి ; అవి మనిషివి కావు – నగరపు కన్నీళ్లు. “ఊరిని చూసిన కళ్ళు అంటే మూలాలను,సహజత్వాన్ని, కోల్పోయిన అమాయకత్వాన్ని తడిమిన చూపు.నగరం కవిని తన కళ్ళతో – అంటే మనిషి మూలాల దృష్టితో – చూడమంటోంది.ఇదే నగరం తన కఠినత్వాన్ని వదిలి ; మానవత్వాన్ని ఆలింగనం చేసుకునే క్షణం.
“క్షణం కళ్ళు మూసుకొని నాలో/చూసుకుంటే/నేను నగరంలో వున్నాను/ఇది కవిత యొక్క తాత్విక శిఖరం.బయట నగరాన్ని చూడడం ఆపి,లోపలికి చూసినప్పుడు నగరం తనలోనే ఉన్నదని కవి గ్రహిస్తాడు.నగరం ఒక భౌగోళిక స్థలం మాత్రమే కాదు – అది మన మనస్సులో ఏర్పడిన జీవన విధానం,అలవాటు,భయం,ఆశ.ఈ కవితలో కవి చెప్పదలుచుకున్నది ఇదే – నగరాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు,ఎందుకంటే మనలోనే వేర్లు వేసుకుంది.అయితే అదే నగరం మనలో దాగి ఉన్న ఊరి జ్ఞాపకాలను,తడి హృదయాలను మళ్ళీ గుర్తు చేసి,మనల్ని మనమే చూసుకోమని ఆహ్వానిస్తుంది.ఇది నగరంపై తీర్పు కాదు – మనిషి ముందు పెట్టిన అద్దం.చాలా లోతుగా,మౌనంగా తాకే కవితా పంక్తులు.వ్యక్తికి నగరం బాహ్య ప్రపంచం మాత్రమే కాదు ; అది ఒక అంతర్గత అనుభూతి కూడా.నగరం మనిషిలో భాగమైపోయిందని,మనిషి నగరంలో ఒక అణువైపోయాడని ఈ కవితా పంక్తులు ప్రతిబింబిస్తున్నాయి. ఊరిని చూసిన అదే ఆలోచనతో నగరాన్ని కూడా చూడమని చెప్పడమే ఇందులోని మర్మం.ఈ కవిత నగరాన్ని ఒక యంత్రంగా చూడకుండా,ఒక జీవనదిగా,గాయపడిన హృదయంగా చిత్రించింది.అభివృద్ధి పేరిట ప్రకృతిని కోల్పోయినా,మానవత్వం అనే తడి నగరంలో ఇంకా సజీవంగానే ఉందని,ఈ కవితా పంక్తులు తెలుపుతున్నాయి.
నగరం బయట కాదు ; అది మనిషి అంతరంగంలోనే ఉంది. మనిషి – నగరం అనుబంధం విడదీయలేనిది.ఈ కవితలో నగరం రాతి ముఖం ఎవరైనా,తడి హృదయం కలిగి ఉంటుంది.ప్రకృతి వినాశం ఉన్నప్పటికి అంతర్ముఖ సంభాషణ
కొనసాగుతుంది.కవి నగరాన్ని విమర్శించడం లేదు ; అతను దానిలోని మానవత్వాన్ని వెతుకుతున్నాడు.చివరికి ఈ కవిత మనకు చెబుతుంది – నగరం మన బయట కట్టడాల్లో కాదు,మన లోపలే నిర్మితమవుతుంది.
ఈ కవితలో నగరం ఒక భౌతిక స్థలం కాదు ; అది ఒక జీవి,ఒక తల్లి,ఒక అంతర్ముఖ ప్రతిబింబం.కవి నగరాన్ని రాతి గోడల సముదాయం నుంచి తీసుకువచ్చి మనసు కలిగిన సజీవసత్త్వంగా నిలబెడతాడు.
ఈ కవితా పంక్తులు నగరం పట్ల ఉన్న సాధారణ దృక్పథాన్ని – అది కేవలం కాంక్రీట్ జంగిల్ అనే భావనను – పటాపంచలు చేస్తూ దానికి ఆర్ద్రతను మరియు ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని ఆపాదిస్తున్నాయి.
“నగర కీకారణ్యంలో/గిరికీలు కొట్టే పక్షిలా వున్నాను/ఇక్కడ నగరం అడవిగా మారింది.అది సహజ అడవి కాదు ; ఇది కీకారణ్యం శబ్దం,వేగం,అయోమయం,గందరగోళం నిండిన మానవ నిర్మిత అడవి.ఆ అడవిలో కవి ఒక పక్షి – పక్షి స్వేచ్ఛకు ప్రతీక అయినా,ఇక్కడ అది దిశలేని గిరికీలు కొడుతోంది.ఎగరడం ఉంది,కానీ దిశ లేదు.ఇది నగర జీవితం ఇచ్చే తప్పుడు స్వేచ్ఛను సూచిస్తుంది.కవి తన స్థితిని తెలియజేస్తాడు.కీకారణ్యం అంటే దట్టమైన అరణ్యం.కానీ, ఇక్కడ అది భవనాల అరణ్యం.ఆ అరణ్యంలో తల తిరిగే పక్షిలా తన అస్థిరత,అయోమయం,దిశా హీనత వ్యక్తమవుతుంది.నగరం అతనికి ఆశ్రయం కాదు ; గిరికిలు కొట్టే స్థితి మాత్రమే.ఈ కవితా పంక్తులలో నగరంలోని గందరగోళం,దారి తెలియనితనం స్పష్టంగా కనిపిస్తాయి. నగరం ఒక అడవిలా మారినప్పుడు,మనిషి తన ఉనికి కోసం కొట్టుమిట్టాడే పక్షిలా మిగిలిపోతున్నాడు.
“నగరం నాలో ఉరవళ్ళు పెట్టే/నదిలా ఇంకిపోయి వుంది/ఈ కవితా పంక్తుల్లో నగరం బాహ్య వాస్తవం నుంచి అంతరంగ ప్రవాహంగా మారుతుంది.అది బయట ఉన్న నిర్మాణం కాదు – అతని రక్తనాళాల్లో పరుగులు తీసే ప్రవాహం.నగరం అతనిలో కలిసిపోయింది.అతను నగరంలో లేడు ; నగరం అతనిలో ఉంది.ఇది కవిత యొక్క భావాత్మక మలుపు.నగరం ఇక బయట లేదు ; అది కవిలోకి నదిలా ఇంకిపోయింది.నది ప్రవాహానికి,జీవానికి సంకేతం.కానీ ఇక్కడ అది ఉరవళ్ళు పెట్టుతూ ప్రవహిస్తుంది – అంటే నగరం కేవలం భారమే కాదు,శక్తి కూడా.ఆ శక్తి కవిలో కలిసి పోయింది ; విడదీయలేనంతగా.ఈ రెండు కవితా పంక్తుల మధ్య ఒక సూక్ష్మ విరోధం కనిపిస్తుంది – ఒకవైపు దిశలేని పక్షి,మరో వైపు ఉగ్ర ప్రవాహంతో పారే నది.అంటే బయట జీవితం అయోమయంగా ఉన్నా, లోపల నగరం ఒక బలమైన ప్రవాహంలా స్థిరపడింది.
ఈ కవితా పంక్తులు నగరాన్ని శత్రువుగానో, ఆశగానో చూపులు.అది మన జీవితంలో అనివార్యమైన భాగమని అంగీకరిస్తాయి.నగరం మనల్ని గిరికీలు కొట్టే పక్షుల్లా మార్చుతుంది.అదే సమయంలో మనలో ప్రవహించే నదిలా కూడా మారుతుంది.ఇది నగరంలో జరిగే పోరాటం కాదు ; నగరంతో కలిసిపోయిన అస్తిత్వం.నగరం కేవలం బయట కనిపించే భౌతిక రూపం మాత్రమే కాదు.అది మనిషి ఆలోచనల్లో,రక్తంలో భాగమై పోయిందని కవి భావం.
“నగరం నా ఎదురుగా కూర్చొని/తన మరో చెంప చూయించింది/ఇది అద్భుతమైన రూపకం.సాధారణంగా మరో చెంప చూపించడం క్షమ,సహనం,అహింసకు సంకేతంగా భావిస్తారు.ఇక్కడ నగరం తనపై వచ్చిన నిందల్ని,దెబ్బల్ని అంగీకరిస్తూనే – తన ముఖానికి ఇంకొక చెంప కూడా ఉందని చూపిస్తోంది.కవి – నగరం మధ్య ఉన్న విరోధ సంబంధం ఇక్కడ సంభాషణగా మారింది.ఇక్కడ నగరం ఒక మనిషిగా రూపాంతరం చెందుతుంది.తన మరో చెంపను చూపించడం అంటే తన రెండో వైపు – కనిపించని అంతరంగం,మృదుత్వం – బయటపడటం.నగరం కేవలం కాంక్రీట్ జంగిల్ మాత్రమే కాదు ; ఇది అనుభవాల గాయాలు, స్మృతి గీతాలు మోసుకెళ్ళే జీవి.నగరం తన మరో చెంపను చూపించడం అంటే మనం చూసే పైపై మెరుపులు మాత్రమే కాదు,దాని వెనుక ఉన్న ఆవేదనను,వాస్తవాలను చూడమని చెప్పడమే.
“తన మీద పారిన కొన్ని తీగలకి/బతికిన కలలు కొన్ని బహుకరించింది/నగరంపై పారిన తీగలు అంటే విద్యుత్ తీగలు,ఇంటర్నెట్ కేబుల్స్ వంటి ఆధునిక సౌకర్యాలు.వాటి నీడన ఎన్ని వేల మంది కలలు సాకారమయ్యాయో,ఎన్ని జీవితాలు నిలబడ్డాయో నగరం గుర్తు చేస్తోంది.అనేక మందికి ఆశ్రయమిచ్చిన ఒడిగా అది తన విశాల హృదయాన్ని చూపిస్తుంది.నగరంలో పేదరికం,వలసలు,శ్రమ, అణిచివేతలు,కలల భారాలు – ఇవన్నీ ఉన్నాయి.అవి నగరాన్ని నలిపినా,అదే నగరం బతికిన కలల్ని తిరిగి మనుషులకు బహుకరిస్తోంది.ఇది నగరం ఇచ్చే అవకాశాలపై ఒక మృదువైన అంగీకారం.అందరికీ అవకాశాలు సమానంగా లభించకపోయినా,అవి పూర్తిగా లేనివి కావు అన్న భావన ఇందులో దాగి ఉంది.ఈ తీగలు వలస వచ్చిన ప్రజల ఆశలకు ప్రతీకలుగా భావించవచ్చు.వాటికి బతికిన కలలు ఇవ్వడం ద్వారా నగరం ఒక అవకాశాల వేదికగా కనిపిస్తుంది.ఇక్కడ ఆశలు చనిపోవు ; పోరాడి నిలబడతాయి.
“కలలు కనే అనేక కళ్ళకి చోటిచ్చిన/తన ఒడి చూయించింది/ ఇక్కడ నగరం ఒక తల్లిలా మారుతుంది.’ఒడి’ అంటే ఆశ్రయం.భద్రత,సహనాన్ని సూచిస్తుంది.వేలాది ఆశావహ కళ్ళకు ఆశ్రయం ఇచ్చే ఒడిగా నగరం కనిపిస్తుంది.ఇది దయగల రూపం మాత్రమే కాదు.అనేక కళ్ళు,అనేక కథలు, అనేక ఆశలు,అనేక విఫలాలు వాటన్నింటికీ చోటిచ్చే విస్తీర్ణమే నగరం అని కవి ఇక్కడ అంగీకరిస్తున్నాడు.ఇక నగరం కఠినమైన ముఖం మాత్రమే కాదు ; తన గాయాలను,తన ఉదారతను చూపించే పరిపక్వ సత్తాగా కనిపిస్తుంది.ఇంతకు ముందు కవితా పంక్తుల్లో నగరం భయంగా కనిపించింది. తర్వాత అది ఒక ప్రశ్నగా మారింది.కానీ ఇక్కడ మాత్రం నగరం సహజీవనానికి సిద్ధమై మాతృ రూపంగా నిలిచింది. నగరాన్ని పూర్తిగా చూడాలనే భావనతో కవిత చాలా నిశ్శబ్దంగా,హృదయాన్ని తాకేలా ముగుస్తుంది.
“అభివృద్ధి అనకొండ/తన పిల్లను నోట కరుచుకుని/ చుట్టుకుంటుంటే/అరుస్తున్న ఆవులా అనిపించింది/ అభివృద్ధిని అనకొండగా పోల్చడం అత్యంత శక్తివంతమైన, కలవరపెట్టే రూపకం.సాధారణంగా అభివృద్ధిని పిల్లలను పోషించే తల్లిగా చెబుతారు.కానీ ఇక్కడ అది తన పిల్లలను నోట కరుచుకుని చుట్టుకునే అనకొండగా మారింది.అభివృద్ధి పేరిట మనుషులే – శ్రామికులు,పేదలు,వలసవాదులు, బాధితులు – బలై పోతున్నారు అనే తీవ్ర విమర్శ ఇందులో ఉంది.ఇది కేవలం పెరుగుదల మాత్రమే కాదు ; మింగే శక్తిని సూచిస్తుంది.తన పిల్లలను నోట కరుచుకుని చుట్టుకునే దృశ్యం అభివృద్ధి పేరిట జరిగే దమనాన్ని సూచిస్తుంది. పురోగతి అనిపించేది కొన్ని సార్లు వినాశమే కావచ్చు. ‘అరుస్తున్న ఆవులా అనిపించింది’ అన్న ఉపమానం అద్భుతంగా పని చేస్తుంది.ఇక్కడ అనకొండ బలవంతం, క్రూరత్వానికి సంకేతం.ఆవు నిస్సహాయతకు,మూగ వేదనకు ప్రతీక.అభివృద్ధి ప్రక్రియలో బాధపడుతున్న వారి అరుపులు బయటకు వినిపించవు.ఆ మూగ అరుపును కవి తనలోకి తీసుకుంటాడు.అభివృద్ధి అనకొండలా విస్తరిస్తూ చుట్టుపక్కల ఉన్న ప్రతి దాన్ని మింగేస్తోంది.తన పిల్లను,ప్రకృతిని కాపాడుకోలేక అనకొండ నోటికి చిక్కి విలవిలలాడుతున్న ఆవులా నగరం కనిపిస్తోంది.ఇది అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని,మనుషుల నిస్సహాయతను స్పష్టంగా చూపిస్తోంది.ఈ ఉపమానం నగరంలోని బాధను స్పష్టంగా వినిపిస్తుంది.అది మూగ అరుపు కాదు ; వినిపించని అరుపు కాదు ; శబ్దాల మధ్య నలిగే కేక అని భావాలు తెలుపుతున్నాయి.
“మిరుమిట్లు గొలిపే తన కళ్ళ వెనుక/జాలి గొలిపే మూగ కథలెన్నో మూట/విప్పింది/ ఇక్కడ అభివృద్ధి కళ్ళలో మెరుపు ఉంది – ఆకర్షణ,ప్రగతికి సంబంధించిన గణాంకాలు,భావనలు ఉన్నాయి.అవి చూసి మనం మోహించి పోతాం.కానీ,ఆ మెరుపు వెనుక నిజం దాగి ఉంది.అభివృద్ధి వెనుక మాటలేని బాధల మూటలు విప్పబడుతున్నాయి – నిరుద్యోగం,శ్రమ దోపిడీ,గుర్తింపు లేకపోవడం ఈ కథలో మూగగా ఉంటాయి. ఎందుకంటే వాటికి వేదిక లేదు.ఈ కవిత అభివృద్ధిని తిరస్కరించదు ; కానీ దాని క్రూర రూపాన్ని బట్టబయలు చేస్తుంది.ఇది ఒక ప్రశ్న వేస్తుంది – అభివృద్ధి ఎవరికోసం?దాని ధర ఎవరు చెల్లిస్తున్నారు?ఇక్కడ మానవత్వం ఒక స్పష్టమైన నైతిక స్థానంగా మారింది. మెరుపు వెనుక చీకట్లు,ప్రకాశం వెనుక కష్టాలు ఉన్నాయి.నగరం వెలుగులో మెరిసినా,దాని వెనుక పేదరికం,వలస బాట,శ్రమ,నిరాశ వంటి మూగ కథలు దాగి ఉంటాయి.కవి వాటిని విప్పి చూపించాడు.
ఈ కవితా పంక్తులు నగరాన్ని ఒక ద్వంద్వ స్వరూపంగా చిత్రిస్తాయి.నగరం కవికి శత్రువు కాదు,స్నేహితుడు కూడా కాదు ; అది అతనిలో సంభాషించేది,అతన్ని మలిచేది, అతనిలోనే ఇంకిపోయిన జీవి.కవి చూపులో నగరం ఒక అద్దంలా ఉంటుంది – అందులో మన సమాజం,మన కలలు,మన విరుద్ధతలు స్పష్టంగా ప్రతిబింబిస్తాయి.
ఈ కవితా పంక్తుల్లో ప్రధాన శక్తి ప్రతీకల ఘనత్వం.అవి నగర అనుభవాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తాయి.అందు వల్ల ఈ కవిత ఒక వ్యక్తిగత అనుభూతి మాత్రమే కాక, ఆధునిక జీవనంపై ఒక సాక్ష్యంగా నిలుస్తుంది.నగరం రాత్రివేళ విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలుపుతుంది.కానీ,ఆ కాంతి వెనుక జాలి గొలిపే మూగ కథలు ఎన్నో ఉన్నాయి.ఫుట్ పాత్ ల పై బతుకులు,మురికివాడల కష్టాలు, ఒంటరితనం – ఇలాంటి ఎన్నో గాధలను నగరం తనలో మూటగట్టుకుని ఉంది.
కవి నగరాన్ని ఒక రాతి కట్టడంలా కాకుండా, ఒక జీవచ్చవంలా లేదా ఒక మూగజీవిలా చూస్తున్నారు.అది తన పిల్లలను,ప్రజలను సాకుతోంది.అదే సమయంలో ‘అభివృద్ధి’ అనే రక్కసి చేతిలో చిక్కి శల్యమవుతోంది.నగరంలోని వైభవాన్ని చూసి మురిసిపోయే కళ్ళకు,దాని వెనుక ఉన్న కన్నీటి కథలను కూడా చూడమని ఈ కవిత హెచ్చరిస్తోంది. నగర జీవనంలోని అభివృద్ధి – విధ్వంసం అనే ద్వంద్వ వైఖరిని ఈ కవితా పంక్తులు అద్భుతంగా వ్యక్తం చేస్తున్నాయి.
ఈ కవితా పంక్తుల్లో నగరం ఒక స్థలం మాత్రమే కాదు – ఒక జీవి,విరుద్దాల సమాహారం.కవి తన అనుభవాన్ని ప్రతీకల రూపంలో చిత్రిస్తూ,నగరాన్ని అంతరంగ – బాహ్య ప్రపంచాల సంగమంగా చూపించాడు.ఈ కవితా పంక్తులు నగరాన్ని ఒక సంక్లిష్టమైన దృశ్య కావ్యంగా,వైరుధ్యాల సమాహారంగా ఆవిష్కరించాయి.అభివృద్ధి వెనుక దాగి ఉన్న మూగ వేదనను కవి అత్యంత ప్రతిభావంతంగా వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
“శతాబ్దాలు ఒలకని/కన్నీటి చుక్క నగరం/నగరానికి ఉన్న సుదీర్ఘ చరిత్రలో అణిచివేతలు,మూగవేదనలు దాగి ఉన్నాయి.శతాబ్దాలుగా పోగైన బాధ, వలసలు, యుద్ధాలు,ఆకలి,శ్రమ – ఇవన్నీ ఒక కన్నీటి చుక్కగా సంక్షిప్తమవుతాయి.ఆ చుక్కలో చీలికలు ఉన్నాయి ; అంటే అది పూర్తిగా వెలిబుచ్చబడదు.నగర చరిత్ర నిశ్శబ్దంగా గుండెల్లోనే మిగులుతుంది.ఇక్కడ నగరం కాలాన్ని మోసుకుంటూ వచ్చిన వేదనగా రూపుదిద్దుకుంటుంది. ఒలకని కన్నీటి చుక్క అంటే – ఎప్పుడు బయటికి కారని, లోపలే నిలిచిపోయిన బాధ.ఇది నగర చరిత్రలోని నిరంతర శ్రమ,అణిచివేత,అసమానతలకు సంకేతంగా నిలుస్తుంది.
“జీవితం వెనుక పరిగెత్త లేక/కూలిన ఆశల గూడు నగరం/ ఇక్కడ నగరం ఒక విఫలమైన కలల సమాహారం.జీవితం వేగంగా పరిగెత్తుతుంటే దాన్ని అందుకోలేకపోవడం,ఆశల గూడు కూలిపోవడం – ఇది ఆధునిక మనిషి అసమర్థతను సూచిస్తాయి.’గూడు’ అనేది భద్రతకు,ఆశ్రయానికి ప్రతీక.అది కూలిపోవడం అంటే భవిష్యత్తు చీలి పోవడమే.నగరాన్ని సాధారణంగా ఆశల గూడు అంటారు.కానీ,ఇక్కడ అది కూలి పోయిన ఆశల గూడు.జీవితం ముందుకు పరిగెత్తుతుంటే దాన్ని అందుకోలేక వెనుకబడిపోయిన వారి కథలు ఈ కవితా పంక్తుల్లో దాగి ఉన్నాయి.నగరం అంటే కేవలం భవంతులు మాత్రమే కావు ; అవి ఎందరో మనుషుల కూలిపోయిన ఆశల గూడు.నిరంతరం పరుగులు తీసే నగర జీవితంలో ఆ పరుగును అందుకోలేక వెనుకబడిపోయిన సామాన్యుల నిస్సహాయతను కవి ఎంతో ఆర్ద్రంగా చిత్రించారు.
“ రేయింబవళ్ళు పరిగెత్తి పరిగెత్తి/ అహోరాత్రులు మేలుకొని మేలుకొని/అలసి పోయిన నగరం/ఈ పునరుక్తులు నగర జీవితం యొక్క యాంత్రికతను,నిరంతర శ్రమను స్పష్టంగా అనుభూతి పరుస్తాయి.నగరం నిద్రపోదు’ అనే భావనను ఇక్కడ తలకిందులు చేస్తూ,అది కూడా అలసిపోతుందనే మానవీకరణ ఈ కవితలో అద్భుతంగా ప్రతిఫలిస్తుంది.నగరం నిరంతర కదలికలో ఉంటుంది.అది ఎప్పుడూ నిద్రపోదని మనం అనుకుంటాం.కానీ,ఈ కవితలో మాత్రం నగరం అలసి పోయినట్టుగా చూపబడింది.ఇది ఒక అరుదైన దృశ్యం. సాధారణంగా మనిషి అలసిపోతాడు ; అయితే ఇక్కడ నగరమే అలసిపోవడం ద్వారా కవి నగరాన్ని మానవీకరించాడు.పగలు,రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం శ్రమించే నగరానికి కూడా అలసట ఉంటుందని కవి సూచిస్తున్నాడు..
“అహో రాత్రులు మేలుకొని మేలుకొని అలసి పోయిన నగరం” – ఇది కేవలం భౌతికమైన అలసట మాత్రమే కాదు. యాంత్రికమైన జీవనంలో కలిగే అంతర్గత విసుగును కూడా సూచిస్తుంది.నగరం తన అనేక కథలను వినిపించి,చివరకు కవి అంతరంగంలో నిద్రకు ఉపక్రమించడం,నగరం మరియు మనిషి మధ్య ఉన్న విడదీయలేని ఆత్మీయ బంధానికి సంకేతంగా నిలుస్తుంది.
“తన కతలు చెపుతూ చెపుతూ/అలాగే నాలో నిద్రకు ఒరిగింది/నగరం తన కథల్ని చెప్పుకుంటూ నిద్రపోవడం అంటే – కవి ఆ కథలకు ఆశ్రయంగా,సాక్షిగా మారాడని సూచిస్తుంది. ఇది కవి – నగరం మధ్య ఏర్పడిన అత్యంత సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తుంది.నగరం కవి అంతరంగంలో ఒదిగిపోతుంది.అది బయట వినిపించే శబ్దం కాదు ; లోపల చెప్పుకునే కథ.ఆ కథల్లో వేదన ఉంది,అనుభవం ఉంది,మౌనం ఉంది.చివరకు నగరం కవి గుండెల్లో నిద్రపోతుంది.కానీ ఈ నిద్ర ద్వంద్వార్థకమైనది.
“ఏ పాపమెరుగని పసిపాప లాగో.. అనే ఉపమానం అమాయకత్వాన్ని,నిర్దోషిత్వాన్ని వ్యక్తం చేస్తుంది.నగరం తన క్రూరత్వాన్ని విడిచి ఒక చిన్నారి రూపంలో కనిపిస్తున్నట్లుగా కవి భావాన్ని వ్యక్తపరుస్తాడు.ఇదే కవితలోని కరుణ.
కవి ఉపయోగించిన ఉపమానాలు అత్యంత శక్తివంతమైనవి. నిద్రపోతున్నప్పుడు నగరం ఏ పాపమెరుగని పసిపాపలా నిశ్శబ్దంగా కనిపిస్తుంది.పగటి పూట కనిపించే రొద, కపటం ఏవీ లేని స్థితి అది.
“కడుపు నిండిన క్రూర మృగంలాగో../
కడుపు నిండిన క్రూర మృగంలాగానే నగరం కూడా ఒక ప్రమాదకరమైన శక్తి.కడుపు నిండినా దాని క్రూరత్వం మాయమవదు ; అది దాగి ఉన్న హింసగా ఉంటుంది.అదే సమయంలో నగరం ఒక క్రూర మృగంలా అనిపిస్తుంది.ఎందరో మనుషుల శ్రమను,కలలను,జీవితాలను మింగేసి కడుపు నింపుకొని విశ్రాంతి తీసుకుంటున్న రాక్షసిలా నగరాన్ని చిత్రించడం ఒక విశేషం.ఈ కవిత నగరాన్ని ఒక జీవమున్న ప్రాణిగా దర్శిస్తుంది.అది ఒక వైపు బాధితురాలైన పసిపాపలా కనిపిస్తే.మరో వైపు బాధించే క్రూర మృగంలా కూడా కనిపిస్తుంది.మనిషి తన ఉనికి కోసం నగరాన్ని ఆశ్రయిస్తాడు ; కానీ నగరం మాత్రం మనిషి అంతరాత్మను ఆశ్రయిస్తుందని కవి చెప్పిన తీరు అత్యున్నత సాహిత్య విలువలతో కూడి ఉంది.నగరానికి ఉన్న ఈ రెండు చిత్రాలు – పసిపాప మరియు క్రూర మృగం – కలిపి నగరపు అసలు స్వరూపాన్ని చూపిస్తాయి. నగరం పూర్తిగా అమాయకం కాదు,పూర్తిగా క్రూరం కాదు ; ఈ రెండూ కలిసిన ఒక సంక్లిష్ట జీవి.
“నగరం నాలో నిద్రపోతోంది/అనే కవితా పంక్తి లోతైన భావాన్ని మోసుకెళ్తుంది.నగరం బయట ఎక్కడో ఉన్న స్థలం కాదు ; కవిలోనే జీవిస్తోంది.ఈ భావన ద్వారా సమాజం మన వెలుపల మాత్రమే కాకుండా మన అంతరంగంలోనూ నివసిస్తుందని కవి సూచిస్తున్నాడు.మన కలలు,మన దౌర్పాల్యాలు,మన అమాయకత్వం,మన క్రూరత్వం – ఇవన్నీ కలిసే నగరంగా రూపుదిద్దుకుంటాయి.ఈ కవితలో నగరం చరిత్రలో పేరుకున్న కన్నీటి చరిత్ర,విఫలమైన ఆశల నిశ్శబ్దం, అమాయకత్వం మరియు క్రూరత్వం కలిసి ఏర్పడిన ఒక సంక్లిష్ట అనుభూతిగా దర్శనమిస్తుంది.కవి నగరాన్ని కేవలం విమర్శించే స్థాయిలో ఆగిపోకుండా,దానిని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.చివరికి నగరం ఒక బాహ్య వాస్తవం మాత్రమే కాదు ; అది మన అంతరంగంలో ప్రతిబింబించే ఒక గొప్ప అనుభూతిగా నిలుస్తుంది.అందువల్ల ఈ కవిత ఆధునిక జీవనంలోని విరుద్ధతలను,మృదువైన భావుకతతో కానీ, గాఢమైన అంతర్దృష్టితో ఆవిష్కరించిన సాహిత్య ప్రకటనగా నిలుస్తుంది.
ఈ కవితా పంక్తుల్లో నగరం ఒక విరుద్ధ స్వభావాల ప్రతిరూపంగా ప్రత్యక్షమవుతుంది – ఒక క్షణంలో కన్నీటి చుక్కగా,మరొక క్షణంలో క్రూర మృగంగా. కవి దృష్టిలో నగరం ఒక స్థిర వస్తువు కాదు కాలం,కష్టం,కలలు,పోరాటాలు, క్రూరత్వం – ఇవన్నీ కలిసి రూపుదిద్దుకున్న ఒక సజీవసత్వం.అలా బయట ఉన్న నగరం క్రమంగా అంతరంగంలోకి చేరి,అలసటతో,గాయాలతో చివరికి కవిలోనే నిద్రపోయే జీవిగా మారుతుంది.ఈ కవితా పంక్తులు నగర జీవితంలోని అలసటను,వైరుధ్యాన్ని, చివరికి దానికి దొరికే ప్రశాంతతను అత్యంత సున్నితమైన భావుకతతో ఆవిష్కరిస్తాయి. “నాలో నిద్రపోతున్న నగరం” అనే అందమైన కవితను అందించిన కవి పి.శ్రీనివాస గౌడ్ ను అభినందిస్తున్నాను.వారి కలం నుండి ఇలాగే మరిన్నో సుగంధభరితమైన కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
