జడలు విప్పెనుకదా జగతిపై విషక్రిమి
విస్ఫులింగం విసరి యూపిరి తీయ
శ్వాసకోశములపై పాశసర్పము చుట్టి
మహిషవాహనుడల్లె మహిని విజృంభించె
ముళ్ళ నాలిక జాపి మెల్లగా మనుజులను
కాలగర్భములోకి కలుపుతూపోతోంది
ప్రాణవాయువు నాపి ప్రాణముల హరియిస్తు
పసిడి తరువులలోటు పరిహసించుతు చెప్పె
ముక్కు మూతుల రెండు మూసి మాస్కుల తొడుగు
కరములను గడిగడికి కడిగి లేపనమద్దు
కళ్ళనూ, ముక్కునూ కలియతిప్పకు నెపుడు
కాచుకొని కూచుండె కరోనా వాటిలో
ఆరునడుగుల దూరమవలంబనము చేసి
విషవాయు వలయమును విరిగేట్లుజేయాలి
భద్రతలు పాటించ పారిపోవును క్రిమి
మన బతుకు కలదిపుడు మన చేతనే సుమి
సద్గురువే దైవసమానం
ఓంకారనాద బీజాక్షర రూపం
అతని వాక్కే
కాలగమన ప్రబోధం
చీకటిని చీల్చేటి జ్ఞానదీపం
బ్రతుకుబాటకు గీతోపదేశం
కలల సాకారపు కర్తవ్యగీతం.
//సద్గురువే//
వ్యాస సాందీప సప్తఋషి మునిజనులు
బుద్ధ రాఘవేంద్ర సాయిబాబాలు
నిదురించే పెదవులకు కీర్తనలయ్యారు
శంకరాచార్య వివేకానంద రవీంద్రనాథాదులు
సత్యశోధక భక్తియోగ ప్రాణమయ్యారు
సద్గురువులే
నవజీవన రాగపు ఆరాధనా గీతికలయ్యారు
కర్మఫలాన్ని ప్రక్షాళనచేయు సహజదేవుళ్లయినారు.
//సద్గురువే//
అక్షరాల నీడలలో కనిపించేదే గురు మంగళరూపం
కంటిపాప తానై చేర్చుకునే సహజ లక్ష్యం
అమావాస్య నిశిలోనూ
గురువే పౌర్ణమి తేజం
నడతలలోనూ నడకలలోనూ
సద్గురువే మనకు ఆదర్శం
తస్మై శ్రీ గురవే నమః
కం!
వేదండ తొండ మండిత
కైదండగమారి మమ్ము కాపాడు మయా
వేదాంత భూషణోజ్వల
మా దండి మహాత్మ శరణమయ్య గణేశా!
కం!
శ్రీ బుద్ధి సిద్ధి సేవిత
మా బుద్ధి వృద్ధి చేయ మా గృహమునకున్
రా బుద్ధి గలిగి రావయ
పో బుద్ధిని మాని తిరిగి పోకు గణేశా!
కం.
నీ కన్న తల్లిదండ్రులె
లోకులకును తల్లిదండ్రులో గణనాథా
మా కుల పెద్దవు నీవై
సాకుము మమ్మెల్లవేళ సంతస మిడుతున్!
అప్పుడప్పుడు నాతో
రాత్రి వేళాకోలమాడాలనుకుంటుంది –
ఎంతకీ నిద్రపట్టనీయకుండా
నన్ను ఆటపట్టించాలనుకుంటుంది –
రెప్పలు మూయనీయకుండా
ఎన్నో తిప్పలు పెట్టాలనుకుంటుంది –
పట్టుబట్టి నన్ను ఓడించాలని
కుట్రలు పన్నుతూనే ఉంటుంది –
పిచ్చిపిచ్చి ఆలోచనలతో నన్ను
ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటుంది –
కునుకు పట్టకపోతే
అటూఇటూ పక్కదొర్లుతూ
ఆకాశంలోని చుక్కలను
లెక్కిస్తూ ఉంటాననుకుందేమో ?
కాలాన్ని సైతం మరిపించే
కమ్మని కవిత్వంతో కరచాలనం
చేస్తానని దానికి తెలీదు కాబోలు –
పరాజయం పొందినవాడిలా
నిశీధిముందు చేతులు కట్టుకొని
నిర్దయగా లొంగిపోతాననుకుందేమో ?
ఆయుధాన్ని ఎక్కుపెట్టిన సైనికుడిలా
పుస్తకాన్ని చేత పట్టుకొని
కవిత్వపు తీరంవెంట పహారా కాస్తా –
కంటిమీద కునుకు పట్టనీయకుండా
నిశి నాతో తమాషాలాడుతున్నపుడు
అంధకారాన్ని ఉరితీసే వాక్యాల్ని ఆరగిస్తూ
తిమిరాన్ని తరిమేసే కవిత్వాన్ని
తిరగేస్తూ
రేయి చెంప ఛెళ్లుమనిపిస్తా –
సీసాలో దెయ్యాన్ని బంధించినట్టు
విర్రవీగుతున్న నడిరేయి భూతాన్ని
చెలరేగుతున్న కవితా పాదాల నడుమ
ఊపిరాడనివ్వకుండా చేస్తా –
ఆయువు తీరినవాడిని
అట్టడుగు మట్టిపొరల్లో పాతిపెట్టినట్టు
నాతో నాటకాలాడే నిశీధిని
కవన సౌధంక్రింద సమాధి చేసి
నడిరాతిరి నడిబొడ్డున నిలబడి
కవిత్వపు జెండాను ఎగరేస్తా
రేపటి ఉషోదయానికి
సరికొత్త పద్యాన్ని కానుకగా ఇస్తా ..!
పె (ప)ంట కుప్ప
కొందరికి
అది చీదరించుకునే
పెంటకుప్ప
కాని –
అందరికీ
అది ఆకలిదప్పులు తీర్చే
ప్రాణప్రదమైన
పంట కుప్ప!
ఒకటే…
శ్మశానంలో
కాకుల అరుపులు….
వేదికలపై
నాయకుల వాగ్ధానాలు…
కాకపోతే
అవి ఎంగిలి మెతుకుల కోసం
ఇవి తిన్నది
అరగటం కోసం!
స్వాతంత్య్రం
అర్థరాత్రి
స్వాతంత్య్రం
వచ్చిందన్నమాట నిజం!
నా దేశానిక్కాదు
ఈ దేశాన్ని
దిగమింగే
దేశ దిమ్మరులకు!
వ్యత్యాసం
ఒక్క
(రా) బంధువుకన్న
వందమంది
శ్రతువులు మిన్న!
వందమంది
(రా) బంధువులకన్న
ఒక్క
స్నేహితుడు మిన్న!
– కొరుప్రోలు హరనాథ్
ఫ్రీలాన్సర్ పోయెట్ కాలమిస్ట్
+91-9703542598
ఒకానొక సందర్భంలో కవి యాత్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన తట్టింది ఆలోచనకి అప్పుడే బలమైన బీజాలు పడ్డాయి అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి అనుకునే హైదరాబాద్లోని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలోకి వెళ్లానుఅప్పటికే ఎంతో బిజీగా ఉన్న అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారు ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించి కవితకు ఇస్తానని హామీ ఇచ్చారు తేదీ ఖరారు చేయనున్నారు చివరికి వారు ఇచ్చిన తేదీనే మార్చి 24 2019 ఖరారైంది డాక్టర్ నరసింహ రెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి తమ సమ్మతిని తెలిపినప్పటికీ ఎలక్షన్ డ్యూటీ ఉన్నందున రాలేకపోయారు నేటి నిజం సంపాదకులు యాత్ర ప్రారంభ సభకు విశిష్ట అతిథిగా హాజరు కావాల్సి ఉండగా వారి స్వల్ప అనారోగ్య కారణంగా రాలేకపోయారు అయితే కవి యాత్రకు ముందు ఒక వాట్సప్ సమూహం ఏర్పాటు చేశాను కవి యాత్ర అనే శీర్షిక పై ఈ వాట్సప్ సమూహంలో చాలా చర్చ జరిగింది కవి యాత్ర అనడంకంటే కవుల యాత్ర అ అంటేనే సరైనదని కవిమిత్రుడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు ఎంతో చర్చ మొదలైంది. కవి యాత్ర అంటే కవి చేసే యాత్ర ఇది ఏక వచనం కవుల యాత్ర అంటే కవులు చేసే యాత్ర ఇది బహు వచనం కవి యాత్ర షష్టి తత్పురుష సమాసము. కవుల యాత్ర ఇది కూడా షష్టి తత్పురుష సమాసము అవుతుంది ఇక్కడ సమాసము మారలేదు . అయితే కవి యాత్రలో ధ్వనించిన శబ్ద సౌందర్యం దానిలో ఉన్న శక్తివంతమైన ప్రకంప
నలు కవుల యాత్రలో ధ్వనించదు అందుకే కవి యాత్ర అనడమే సరైనది కొన్ని పదాల్లో ఏకవచనం బహువచనం నిక్షిప్తమై ఉంటుంది బహువచనం లేక ఏక వచనం ఉంటుంది. అందుకే కవి యాత్ర ఆనడమే మంచిదని అంతిమంగా నిర్ణయించడమైనది. అప్పుడే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి యాత్రకి కొంత ఇబ్బందిగా మారింది పోలీస్ పర్మిషన్ కావాల్సి వచ్చింది అందుకు డాక్టర్ కృష్ణంరాజు కవి నేత్ర వైద్య నిపుణులు ముందుకొచ్చి కవి యాత్రకు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. కవి యాత్రకు ముందు కూడా ప్రతులు కరపత్రాలు ఆవిష్కరించడం, ప్రెస్ మీట్ పెట్టడం వల్ల కవి యాత్ర గురించి ప్రజల్లో బాగా ప్రచారం జరిగింది. ఈ కవి యాత్రలో కవి బి. వెంకట్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించి ముందు నడిచారు యువకవి ,శిల్పి పోలీస్ భీమేష్ తనవంతుగా శ్రమించాడు ఏళ్ల తరబడి నా ఆలోచనలు రగిలి రగిలి కవిత్వమై అక్షరాలు అక్షరాలుగా ప్రవహించి నప్పటికీ కవిత్వమొక తీరని దాహం ఒక దశాబ్ద కాలంగా నిశ్శబ్దంగా రగులుకున్న కొలిమి నిత్య చైతన్యమై ప్రభవించాలను కొన్నది అదే సంకల్పం కవియత్రగా ఈ తెలంగాణా మట్టిపై అంకురించింది. ఎంతకాలమని ఈ నాలుగు గోడల మధ్య కవిత్వం వినిపిస్తాం ప్రజల వద్దకే వెళ్ళాలనిపించింది అందుకే బస్సు కే స్పీకర్లు కట్టాం దాదాపు 50 మంది కవులం నిర్మల్ నుండి బాసరకు బయలుదేరాంతెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి గారిని కలిసి ఆహ్వానించగా అనే వారు ఎంతో ప్రేమపూర్వకంగా స్పందించడం వల్ల మా మొట్టమొదటి విజయం ప్రారంభమైంది. నా ఆలోచనల్ని కందుకూరి శ్రీరాములు గారితో పంచుకోగా అనే కవి యాత్రను జై కొట్టి నన్ను ఎంతో ప్రోత్సహించడంతో నా రెండో విజయాన్ని సాధించాను నేను తీసుకున్న నిర్ణయం ఎంతో విశిష్టమైనదని విలక్షణమైనది అని సుప్రసిద్ధ కథా రచయిత కాలువ మల్లయ్య చింతపట్ల సుదర్శన్ లాంటి ఎంతోమందిసాహితీవేత్తలు నేను చేపట్టిన కవియాత్ర ప్రక్రియకు ప్రోత్సహించడం నాలో నూతన ఉత్తేజాన్ని నింపింది, తేదీ 24 .03 .2019 న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు ఆకుపచ్చ జెండా ఊపి ప్రారంభించారు కళలకు పుట్టినిల్లు నిర్మల్ నుండి మొట్టమొదటి యాత్రకు శ్రీకారం చుట్టడంతో శ్లాఘనీయం నిర్మల్ మినీ ట్యాంక్ బండ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నారాయణ ధర్మసాగర్ చెరువు అక్కడే టెంట్ వేసి ప్రారంభ సభను ఏర్పాటు చేశాను నందిని సిద్ధారెడ్డిగారితో పాటుగా కందుకూరి శ్రీరాములు , శ్రీమతి చీదెళ్ళ లక్ష్మి అతిథిగా విచ్చేసి సభను విజయవంతం చేశారుసమాజాన్ని చైతన్య పరిచే అనేక యాత్ర అంటూ కవి యాత్ర లక్ష్యాన్ని ప్రాముఖ్యతను గురించి ఎంతో స్పూర్తివంతమైన ఉపన్యాసం సభికుల్లో ఉత్సాహాన్ని నింపింది రెండు బస్సులకు ముందు భాగంలో పచ్చని అరటి కొమ్మలు కవి యాత్ర బ్యానర్ కట్టుకొని ఆ బస్సులకు స్పీకర్లు కట్టాం ఆ ప్రాంగణమంతా ఆహ్లాదకరంగా మారింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు నందిని సిద్ధారెడ్డి గారు పూలమాలవేసిన అనంతరం కవుల సమక్షంలో లో కవి అతను నందిని సిద్ధారెడ్డి గారు ప్రారంభించారు కవి యాత్ర వర్ధిల్లాలి ఇలాంటి స్లొగన్స్ తో కవులు గొంతు చించుకొని నినదించారు మొట్టమొదట నిర్మల్ ప్రధాన కూడళ్ళలో బస్సును ఆపి రోడ్లపైనే కవులు కవిత్వం చదివారు దిలావర్ పూర్ లో కొంత సేపు రోడ్డుపై ఆగి కవులు కవిత్వం చదివారు అదో వినూత్నమైన ప్రక్రియ బస్సు చైతన్యరథమే బాసర వైపు కదిలింది మాతో పాటుగా బస్సులో బాసరకు నందిని సిద్ధారెడ్డి గారు రావడం కవులలో ఎంతో ఉత్తేజాన్ని నింపింది మార్గ మధ్యలో నర్సాపూర్ జి లో ఊరవతల రామాలయం ఆవరణలో అప్పటికే తెచ్చుకున్న వంటకాలతో చెట్లకింద భోజనం చేసాము అనంతరం డీలర్ పూర్ లో కొంత సేపు రోడ్డుపైన ఆగి కవులు కవిత్వం చదివారు పాటలు పాడారు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాల ప్రాంతాల నుంచి వచ్చిన కవులతో ఈ కవి ఎంతో చైతన్య రగిలించింది తద్వారా సాహితీ చరిత్రలోనే ఓనూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని ఈ కవి యాత్ర ఎంతో విలక్షణమైనది అని విశిష్టమైనదని నవ్య పదంలో నడుస్తూ ఆలోచనా బీజాలు నాటుతున్నదని ప్రజలు కొనియాడారు నాలుగు గోడల మధ్యకవిసమ్మేళనాలు నిర్వహించే సంప్రదాయం నుంచి నాలుగు రోడ్ల కూడళ్ళలో సామాన్య ప్రజల వద్దకు వెళ్లి కవిత్వం వినిపించే సరికొత్తత ఆలోచనలతో కవి యాత్ర ముందుకు సాగింది. భైంసా కు చేరుకోగానే గానే అక్కడి సాహితీమిత్రులు కవి యాత్రకు స్వాగతం వంటి బ్యానర్లు కట్టి స్వాగతం తెలిపారు, ముధోల్ లో ఊహించ కుండానే కవి యాత్రకు ఘనమైన స్వాగతం లభించింది రవీంద్ర భారతి హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ఘనంగా స్వాగతం పలికి అనంతరం కవులను శాలువాలతో సన్మానించారు అనంతరం బాసర అమ్మవారి ముఖద్వారం ఎదుట జనం మధ్యలో కవులు కవితా గానం చేసారు తిరుగు ప్రయాణంలో బైంసా కు చేరుకునేప్పటికి సమయం తొమ్మిది దాటింది బస్టాండ్ ఎదుట కవులు కవితా గానం చేశారు ప్రఖ్యాత హిందీ కవి మధు భావల్కర్ తన కవిత పఠనంతో ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించారు, అనంతరం ప్రజలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము ఇందులో నా శ్రీమతి కె నివేదిత, మరియు చెల్లెలు కమల తమ వంతు కృషి చేశారు.
నాలుగవ విడత కవియాత్రలో ప్రముఖులు
నాలుగవ విడత కవియాత్రలో ముఖ్య అతిథిగా ప్రసిద్ధ కవివర్యులు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి గారు, సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత సాధనాల వెంకట స్వామి నాయుడు గారు, నల్గొండ సిలివేరు సాహితీ కళాపీఠం అధ్యక్షులు సిలివేరు లింగమూర్తి గారు, ఆసిఫాబాదు కవుల సంఘం అధ్యక్షులు గుర్రాల వేంకటేశ్వర్లు గారు ,కార్యదర్శి డా తిరుపతి గారు ,మంచిర్యాల రచయితల సంఘం అధ్యక్షులు బొడ్డు మహేందర్ గారు, ముధోల్ లోని రబీంద్ర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్ గారు ,తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి యం సి లింగన్న గారు ,కవులు -కవియాత్ర ఉపాధ్యక్షులు డా. కృష్ణం రాజు గారు, డా. వేణుగోపాల కృష్ణ గారు, జీ ఆర్ కుర్మే గారు, జాదవ్ పుండలీక్ రావు పాటిల్ గారు ,కవియాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ గారు ,చైర్మన్ కారం నివేదితగారు , ప్రధాన కార్యదర్శి మరియు వ్యాఖ్యాత బి వెంకట్ గారు ,కుర్మేహరికృష్ణగారు, పాటే మా ప్రాణం సంగీత అకాడమీ డైరెక్టర్ చెనిగారపు నాగరాజు గారు లు నిర్మల్ నుండి నిజామాబాదు వరకు జరిగిన కవియాత్రలో పూర్తిగా పాల్గొని విజయవంతం జేశారు .
కారం ప్రణయ,కారం ప్రణతి,కారం రాజ్ ప్రసేన్ జిత్ లు పాల్గొనడమేగాక కవియాత్రకు చేదోడువాదోడుగా నిలబడి ,పూర్తిగా అంకితమైనారు చిన్నారులకు అభినందనలు.
నాలుగవ విడత కవియాత్ర
( నిర్మల్ నుండి నిజామాబాదు వరకు)
కవియాత్ర 3 వ వార్షికోత్సవము
అంతర్జాతీయ కవితా దినోత్సవము
- 03.2021, ఆదివారము
నాలుగవ విడత కవియాత్ర నాలుగు కూడళ్లకే పరిమితం కాలేదు. ఈ యాత్ర క్రొత్త సమాజం వైపు దూసుకెళ్లింది. ప్రేమను పంచింది .శాంతిని విస్తరించింది .జ్ఞానాన్ని వెదజల్లింది .కారణం ప్రముఖ కవి సద్విమర్శకులు కవియాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ గారు తలపెట్టడమే .ప్రముఖ లాయర్ ,కవియాత్ర చైర్మన్ కారం నివేదిత సహృదయం సమాజం పట్ల, కవులపట్ల ,ప్రేమను కురిపించడం ఒక ఉదాహరణం .కవియాత్ర ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యాత బి వెంకట్ సదుక్తుల వ్యాఖ్యానంతో కవియాత్ర బస్సు కదలడమే .నాలుగవ విడత కవియాత్ర ప్రారంభసభ కు ముఖ్య అతిథి మాన్యులు తెలంగాణ రాష్ట్ర దేవదాయ, అటవీ ,న్యాయ శాఖా మంత్రివర్యులు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డిగారు ఆకుపచ్చ జెండా ఊపి, కవియాత్ర బస్సును ప్రారంభించడము అదొక మధుర జ్ఞాపకము .ప్రజల్లో నవ చైతన్యము కలగడము అనేది కవియాత్రకు బలము చేకూర్చిందని చెప్పవచ్చును. మంత్రిగారి మాటల్లోనే చూద్దాం– – ప్రముఖ కవి కారం శంకర్ గారు తలపెట్టిన కవియాత్ర ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుంది .ప్రజలు చైతన్యమవుతారు. కవియాత్ర ద్వారా సమాజానికి ఉపయోగపడే మంచి కవిత్వం వస్తుంది .కవులు, కవయిత్రులు క్రొత్త చైతన్యమును వారి వారి కవిత్వం ద్వారా నింపుతారు. ప్రజల గుండెల్లో కవియాత్ర కవిత్వం చిరస్థాయిగా నిలుస్తుంది .అని నాలుగవ కవియాత్ర ప్రారంభ సభలో రాష్ట్ర మంత్రివర్యులు అలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడంలో అతిశయోక్తి లేదు.
నాలుగవ విడత కవియాత్రకు ముఖ్య అతిథి
ఏనుగు నరసింహా రెడ్డి గారు,
ప్రసిద్ధకవి ,సాహితీవేత్త, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్.
అంతర్జాతీయ స్థాయి లో ప్రసిద్ధి పొందిన ,నిర్మల్ కొయ్యబొమ్మల నెలవైన, నిమ్మనాయుడేలిన, చారిత్రకపరమైన నిర్మల్ ప్రధాన పట్టణం నడిబొడ్డులోగల తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం సమావేశ హాల్లో కవియాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన నాలుగవ విడత కవియాత్ర ప్రారంభసభకు ప్రముఖ సాహితీవేత్త ,కవి, రచయిత, కరీంనగర్ అదనపు పాలనాధికారి ఏనుగు నరసింహా రెడ్డి గారు మరో ముఖ్య అతిథిగా హాజరై. అమూల్యమైన సందేశమును ఇచ్చారు. కవియాత్ర వల్ల లాభమున్నదా? అనే ప్రశ్నను ఉత్పన్నం జేసి .చక్కని సమాధానాలను ఇచ్చారు. కవియాత్ర తప్పక చేయాలనీ అన్నారు . కారం శంకర్ గారు తలపెట్టిన ఈ యాత్ర ఉపయోగకరమైనది అన్నారు. ఈ కవియాత్రలో కవులు కవిత్వమును క్రొత్తగా ఆవిష్కరించి ,ఆ కవితలను ప్రజలమధ్యలో ఆలపించడం వల్ల ప్రజల్లో నూతన ఉత్సాహం, కవిత్వం వ్రాసే శక్తి, భాషాపరమైన నూతన నానుడులు పుడుతాయని అన్నారు .కవియాత్ర ప్రత్యేకముగా ప్రజలు తిరుగాడే కూడళ్లలో కొనసాగుతూ ప్రజలకు మైకు ద్వారా ప్రేమ శాంతి జ్ఞానం వినిపించడం ద్వారా ,కవిత్వరూపంలో ,పాట రూపంలో వినిపంచడం ద్వారా ప్రజల్లో నవ చైతన్యం కలుగుతుందని అన్నారు. ప్రజలందరికి స్ఫూర్తిగా నిలుస్తూ క్రొత్త కవులు తయారవుతారని అన్నారు. నవ్యకవిత్వం తో కవులు పుట్టుకొస్తారని అన్నారు .ప్రేమ శాంతి జ్ఞానం అను సమాజమును ప్రతిబింబించే పదాలను తీసుకొని కవియాత్ర అనే పేరుతో యాత్రను చేయడం కారం శంకర్ గారు, వారి సతీమణి కారం నివేదిత ధన్యులని అన్నారు. ఈ దంపతులు చేపట్టిన ఈ కవియాత్ర చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందని అన్నారు. కవియాత్రను చేపట్టిన కారం శంకర్ గారు చైర్మన్ నివేదితగారు , వ్యాఖ్యాత, ప్రముఖ కవి బి. వెంకట్ లు అభినందనీయులని అన్నారు.
తదనంతరము కదిలిన కవియాత్ర బస్సులో సామాన్య జనునివలె కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డిగారు ప్రయాణం చేశారు .మధ్యలో కవియాత్ర ఆగినచోట ఉత్సాహాన్ని నింపే ప్రసంగాలను చేశారు .బాల్కొండ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.మాట్లాడారు. అక్కడినుండి ఆర్మూర్, నిజామాబాదు సభల్లో సందేశమిచ్చారు .నిజామాబాద్లో కంఠేశ్వర్ లోని ప్రాచీన శివాలయం ప్రాంగణంలో నిజామాబాదు కవులు స్వాగతం పలికారు .తర్వాత మహా శివున్ని అర్చించారు. తర్వాత గీతాభవన్లో జరిగిన కవియాత్ర జ్ఞానజ్యోతి సభలో సందేశమిచ్చి, కవియాత్రలో పాల్గొనిన ప్రతి కవిని సన్మానించారు .కవియాత్రకు ఒక రోజంతా పూర్తి సమయాన్ని ఇచ్చి ,కవియాత్ర సాహిత్యలోకానికి స్ఫూర్తిని నింపారు.
నిర్మల్ నుండి నిజామాబాదు వరకు కవియాత్ర లో కవితాగానం
కవియాత్రకు విశిష్ఠ అతిథిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రముఖ కవి డా ఉప్పు కృష్ణం రాజు గారు చక్కని సందేశాన్ని అందించారు తనదైన శైలితో కవిత్వమును రచించి కవితను గానం చేశారు కవియాత్రకు వెన్నుదన్నుగా నిలిచి పోలీసుల అనుమతిని తీసుకున్నారు అంతేగాక కవియాత్రకు సహకారాలను అందించారు ఆయా తెలుగు రాష్ట్రాల నుండి 60 మంది దాక కవయిత్రులు కవులు పాల్గొన్నారు ఆయా కూడళ్లలో కవిత్వమును వినిపించారు. పాటే మా ప్రాణం సంగీత అకాడమీ చెనిగారపు నాగరాజు గారు వారి కళాకారుల బృందంతో పాటలను పాడించారు ప్రముఖ జానపద కళాకారిణి కళ్యాణి రాగయుక్తంగా పాడిన పాటలు అలరించాయి .నాగరాజు పాడిన అమ్మానాన్నల పాట హృదయాలను రంజింపజేసింది .నిర్మల్లోని ప్రారంభమైన కవియాత్ర అమరవీరుల స్తూపం, కలెక్టర్ చౌరస్తా. శివాజీ చౌక్ .చైన్ గేట్, కంచెరోని చెరువు సమీపంలోని ప్రాచీన కట్టడం కోట శ్యాం ఘడ్ లలో కవులు కవితాగానం చేశారు .తర్వాత సోఫీనగర్, కడ్తాల్ ,గంజాల్ ,సొన్, పోచంపాడ్ ,ముప్కాల్ మీదుగా బాల్కొండ చేరింది. కవియాత్ర ఆయా కూడళ్లలో అక్కడి కవులు కవియాత్రకు స్వాగతం చెప్పారు .ఇలా నిజామాబాదువరకు కవియాత్ర వెళ్ళింది.
బాల్కొండలో కవియాత్రకు బ్యాండు మేళాలతో ఘనస్వాగతం
మండలోజు నరసింహ స్వామి , నాగుల రాజేందర్ అను కవులు బ్యాండు మేళాలతో ,పాఠశాల విద్యార్థులతో ఘనస్వాగతమును పలికారు. బాల్కొండ ప్రవేశ ద్వారము నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు సద్భావన యాత్రగా తీసుకెళ్లారు .తెలంగాణ తల్లికి పూలమాలలను సాహిత్య ముఖ్య అతిథి ఏనుగు నరసింహ రెడ్డి చేతులమీదుగా వేయించారు. కవియాత్ర అధ్యక్షులు కారం శంకర్, చైర్మన్ నివేదిత, వ్యాఖ్యాత బి. వెంకట్, డా యు. కృష్ణంరాజు కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. తర్వాత అక్కడి చిన్న దుకాణ కూడలిలో చెట్ల నీడన ప్రముఖ కవులను సన్మానం చేశారు. పాటలు పాడిన కళ్యాణి బృందానికి కవితాగానం చేసిన కవులకు తాను స్వతంత్రంగా రచించిన రుబాయిలు పుస్తక సంకలనాలను బహుమతిగా అందించారు. బాల్కొండ కవితాగానంలో ప్రజలు ఆసక్తిగా కవితలను విన్నారు.
కవియాత్రకు ప్లెక్సీలతో స్వాగతం చెప్పిన ఆర్మూర్ కవులు
బాల్కొండ నుండి బయలు దేరిన కవియాత్రకు అక్కడి కవులు ప్లెక్సీలతో స్వాగతం చెప్పారు .అష్టావధాని డా బోచ్కర్ ఓంప్రకాష్ రామకృష్ణ ,సాయినాథ్, గణపురం రాజేందర్ ,పీరి గంగాధర్ లు స్వాగతం చెప్పారు .శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి గుడిలో కవియాత్ర కవులకు లిల్లీపుట్ స్కూల్ కరస్పాండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో భోజనాలను ఏర్పాటు చేశారు .తర్వాత జరిగిన సాహిత్య సభలో కవులకు సన్మానం చేశారు. చిన్నారి అభిజ్ఞ చేసిన శాస్త్రీయ నృత్యం సభను అలరించింది .అక్కడి నుండి ఆర్మూర్ కూడళ్లలో కవితాగానమును కవులు చేస్తూనే కవియాత్ర నిజామాబాదు వైపు సాగింది.
నిజామాబాదు కంఠేశ్వర్ లో కవియాత్రకు వేదమంత్రాలతో స్వాగతం
నిజామాబాదులోని భావన సాహితి సంస్థ అధ్యక్షులు పడాల రామారావు గారు సభ్యులు సురేశ్ వివిధ ఇందూరు సాహితిసంస్థలు కలిసి కవియాత్రకు స్వాగతం పలికినవి .అచటి ప్రాచీన శివాలయం లోనికి పూజారుల వేదమంత్రాలతో స్వాగతం పలికారు .శివునికి అర్చనలు చేయించారు .తర్వాత ప్రముఖ కవులకు సాహిత్య ముఖ్య అతిథి ఏనుగు నరసింహారెడ్డి గారికి పరమేశ్వరుని వస్త్రాలను అందించి, తీర్థప్రసాదాలను అందించారు .అచటి ప్రాంగణంలో వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కవులు కవితాగానం చేశారు .వేసవి తాపమును నివారించే చల్లని మజ్జిగను కవియాత్ర దంపతులు కారం శంకర్, కారం నివేదితలు అందించారు తర్వాత నిజామాబాదు లోని ప్రధాన కూడళ్లలో కవియాత్ర సాగింది గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి కవియాత్ర చైర్మన్ కారం నివేదిత, ప్రధాన కార్యదర్శి బి వెంకట్ లు పూలమాలలను వేశారు అక్కడినుండి కవితాగానం చేస్తూ ,కవియాత్ర గీతా భవన్ కు చేరుకుంది .అచటి సాహిత్య సభలో ముఖ్య అతిథులుగా ఏనుగు నరసింహారెడ్డి గారు డా కావేరి ఫౌండేషన్ చైర్మన్ డా అప్పాల చక్రధారి పాల్గొని ,కవియాత్రను కొనియాడారు .కవియాత్ర కొనసాగడం చాలా విభిన్నమైనదని అన్నారు. కవియాత్ర సామాన్యప్రజలను చైతన్యం చేస్తుందని అన్నారు. తర్వాత నిజామాబాదు కవులు కవితాగానం చేశారు .యూత్ అసోషియేషన్ అధ్యక్షులు సాయిబాబా మాట్లాడారు నిర్మల్ నుండి నిజామాబాద్ వరకు బస్సులో ప్రయాణం చేసిన కవితాగానం చేసిన కవయిత్రులకు .కవులకు,నిజామాబాదుకవులకు ముఖ్య అతిథుల చేతులమీదుగా సన్మానం చేశారు . వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ చైర్మన్ కారం నివేదిత లు ఈ కార్యక్రమాన్ని పరిశీలించగా వ్యాఖ్యాత బి వెంకట్ వ్యాఖ్యానం చేశారు. చెన్నూర్ నుండి తీసుకొచ్చిన కవియాత్ర జ్ఞాన జ్యోతిని నిజామాబాదు కవులు పడాల రామారావు సురేశ్ తదితర కవులకు బొడ్డు మహేందర్ .గుర్రం వెంకటేశ్వర్లు,డా తిరుపతి లు అందజేశారు.తర్వాత ధన్యవాద సమర్పణతో, చివరగా కవియాత్ర దంపతులు కారం శంకర్, కారం నివేదిత లు కవులెల్లరకు భోజనాలను పెట్టించారు. త్వరలో హైదరాబాదుకు కవియాత్ర వెళ్ళనుంది. కవియాత్రకు ముగింపులేదు.
గీతాభవన్ లో
పుస్తకాల ప్రదర్శన కవియాత్ర సన్మానం ప్రాంగణంలో నవతెలంగాణ వారు పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. నిర్మల్ నుండి నిజామాబాదు వారికీ సాగిన కవియాత్రను లైవ్ చూపించడం కోసం వివిధ చానళ్ళు ప్రోత్సాహమును ఇచ్చాయి. ప్రింట్ మీడియావాళ్లు చక్కని కథనాలను అందించారు. అందరికి కవియాత్ర పక్షాన ధన్యవాదాలు.
కవియాత్రలో కవితాగానం చేసిన కవులు
ప్రముఖ కవి ఏనుగు నరసింహ్మా రెడ్డి ,కారం శంకర్ ,బి వెంకట్,డా. అప్పాల చక్రధారి, కారం ప్రణతి ,డా కృష్ణంరాజు,డా వేణుగోపాలకృష్ణ, పత్తి శివప్రసాదు, నేరెళ్ళ హన్మంతు, పొలీస్ భీమేశ్, అంబటి నారాయణ ,జి ఆర్ కుర్మే ,సాధనాల వెంకట స్వామి నాయుడు ,జాదవ్ పుండలీక్ రావు పాటిల్, సిలివేరు లింగమూర్తి ,కుర్మే హరికృష్ణ, అసంవర్ సాయినాథ్ ,గుర్రాల వెంకటేశ్వర్లు ,డా తిరుపతి, సిలివేరు లింగమూర్తి ,డా కోవెల శ్రీనివాసా చార్య ,అరుణ బట్టువార్ ,చంద్రకళ ,చెనిగారపు నాగరాజు ,ధర్మపురి, రాఘవులు, శేషుకుమార్ ,బి విజయలక్ష్మి ,సుమతి, మామిడాల దశరథ్ ,రాజేశ్వర్, పీరి గంగాధర్ ,కిరణ్మయి ,కారం ప్రణయ, ఓంప్రకాశ్ ,పడాల రామారావు,సురేశ్ ,సాయిబాబా, నిజామాబాదు కవులు,తదితరులు .పాల్గొని కవితాగానం చేశారు.
కళాకారులు -కళ్యాణి, సాయికృప ,దీపిక ,కావ్య, సుప్రియలు పాల్గొని అందమైన పాటలను పాడారు.
రాత్రి భోజనం చేశాక కాసేపు నడవడం అలవాటు నాకు. ఈ మధ్య రాధ కూడా వస్తోంది నడకకి నాతో. ఆరోగ్యం కోసమనే కాదు, పగటి విషయాలు పంచుకునే మంచి సమయం అది.
“ ఈ రోజు ఎనిమిది సంబంధాలొచ్చాయి నా వాట్సాప్ లో. ఇదేంటో?స్రవంతి వివరాలు మన చుట్టాలకి తప్ప ఎవరికీ చెప్పకపోయినా, ఏ పెళ్ళిళ్ళ బ్యూరో కి ఇవ్వకపోయినా వస్తూనే ఉన్నాయి.” ట్రింగుమంటూ వాట్సాప్ నోటిఫికేషన్ రావడంతో, ఫోను చూసుకుంటూ అంది రాధ.
ఈ మధ్యే మా పెద్దమ్మాయి స్రవంతికి సంబంధాలు చూస్తున్నాం. ఇంజనీరింగ్ అయిన ఈ ఏడాది నుంచీ ఉద్యోగం చేస్తోంది. తాను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కనుక, కాబోయే భర్త సైతం తన రంగం వాడే అయితే మంచిదని భావిస్తోంది. ఆ క్రమం లో మంచి సంబంధం ఉంటే చెప్పమని దగ్గరి వాళ్లకి చెప్పి పెట్టాను, నాకు జాతకాల మీద నమ్మకం, కొద్ది ప్రవేశం కూడా ఉన్నాయి. నా ఫోనుకీ, రాధ ఫోనుకీ చాలా సంబందాలొస్తున్నాయి. చిత్రం. వడపోతల తర్వాత, ఒక్కటీ మిగలట్లేదు. అలా అని మేమేం పెద్దగా షరతులు, పరిమితులు నిర్ణయించలేదు. మంచి కుటుంబం, కుదురైన ఉద్యోగం ఉండి, దురలవాట్లు లేకుండా ఉంటే చాలు అనుకుంటున్నాం.
“ఇదుగో! ఈ అబ్బాయి ఫోటో చూడండి. బావున్నాడు కదూ!” చూపించింది రాధ.
చాలా బావున్నాడు కుర్రవాడు. స్రవంతికి ఈడు జోడు. నడక అయ్యాక ఇంటికి వెళ్లి, ప్రొఫైల్ ని తీరిగ్గా చూశాం. అతనికి మాస్టర్స్ డిగ్రీ ఉంది. ఉద్యోగమూ బాగానే ఉంది. అది కూడా హైదరాబాద్ లోనే! మిగిలిన వివరాల్లోకి వెళ్లాను. మా గోత్రం కాదు. నక్షత్రాలు కలుస్తున్నాయి. మొత్తం మీద ముప్పయ్యారుకు గానూ, ముప్పయ్యయిదు గుణాలొచ్చాయి.
స్రవంతిని పిలిచి చూపించింది రాధ.
“సారంగపాణి. పేరు కూడా బావుంది నాన్నా!” తనకి అంగీకారమే అన్న సూచన ఉంది అందులో.
వివరాలలో తండ్రి పేరు రమా మనోహర్ అని ఉంది. ఇది నాకు బాగా పరిచయం ఉన్న పేరు. కానీ ఒకే పేరు చాలా మందికి ఉండొచ్చు కదా. తెల్లవారాక ఆ సంబంధం వాళ్లకి ఫోన్ చేశాను. పిల్లవాడి తండ్రి మాట్లాడాడు.
నేననుకున్నట్లే అయింది, ప్రపంచం బొత్తిగా చిన్నది. ఆ కుర్రవాడు నా మిత్రుడు రమామనోహర్ కొడుకే! మనోహర్ బీయస్సీ లో నా సహాధ్యాయి. నన్ను గుర్తించిన తర్వాత వాడి ఆనందానికి హద్దుల్లేవు. కాసేపవీ ఇవీ మాట్లాడుకున్నాక ఫోను పెట్టేసేసరికి, ప్రక్కనే క్వశ్చన్ మార్కు ముఖాలతో రాధ, స్రవంతి, స్పూర్తి.
“ఈ సంబంధం వద్దులే రాధా….”
“అదేమిటి? ఇంతసేపు నవ్వుతూ మాట్లాడారు, ఇప్పుడీ మాటేంటీ?” నివ్వెరపోయింది రాధ.
“వద్దన్నానుగా…వదిలెయ్యి. ఇంకోటి చూద్దాంలే!” అన్నాను.
“ అన్నీ బావున్నాయి. జాతకాలు కుదిరాయి. మేం విన్నదాన్ని బట్టి, ఆయన మీ మిత్రుడే అని కూడా అర్థమయింది. అన్నింటికన్నా ముఖ్యంగా స్రవంతికి నచ్చాడు.” రాధ నిష్టూరంగా అంటూంటే, స్రవంతి నిరాశగా చూసి లోపలికెళ్ళిపోయింది.
ఇంక వాళ్లకి సూటిగా, స్పష్టంగా చెప్పేయాలనుకున్నాను.
“రాధా! మనోహరూ, నేనూ డిగ్రీలో కలిసి చదూకున్నాం. మా నాన్న, వాళ్ళ నాన్న ఒకటే డిపార్టుమెంటు. అంటే వాళ్ళ నాన్నగారికి, మా నాన్న ఆఫీసర్. ఆ భేదమేమీ మా మధ్య లేదనుకో! అయితే, చాలా విషయాల్లో మనోహర్ తీరు నాకు నచ్చేది కాదు. వాడుట్టి డబ్బు మనిషి. డబ్బే ప్రాణం. డబ్బే జీవితం. ఓ సరదా, షికారూ, షాపింగ్ ఏదీ లేదు వాడికి. పైసా, పైసా దాచుకునేవాడు. మేం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూంటే, ఒక్కసారి కూడా మాతో కలిసేవాడు కాదు. ఉదయం రెండు, సాయంత్రం రెండు హోం ట్యూషన్స్ చెప్పుకుని సంపాదించుకునేవాడు. దీపావళి పండగొస్తే టపాకాయలమ్మకం, సంక్రాంతికి గాలిపటాలు ఇలా సీజన్ చూసుకోవడం, డబ్బు చేసుకోవడమూ తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు వాడికి. ఎప్పుడు చదువుకునే వాడో ఏమో గానీ, మంచి మార్కులే వచ్చేవి. నాకస్సలు నచ్చేది కాదు వాడి వ్యవహారం.”
“అయితే…దానికీ దీనికేం సంబంధం? అప్పట్లో పాపం పేదరికమో, పెద్దకుటుంబమో అయి ఉంటుంది.” రాధ అంది.
“ అయితే గియితే ఏమిటి నీ మొహం? పెద్ద కుటుంబమే కానీ, గతి లేని వాళ్ళేం కాదు వాళ్ళు. మేం అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం, వాళ్ళది సొంత ఇల్లు. ఆ డబ్బు మనుషుల ఇంట్లో పడితే, మన పిల్ల ఎంత కష్ట పడవలసి వస్తుందో ఒక్క సారి ఆలోచించు. అల్లారు ముద్దుగా పెంచాం మనం వీళ్ళని. కంటికి నచ్చింది కొనుక్కోవడం, నోటికి నచ్చింది తినడం అలవాటు మనకి. రేపటి నుంచీ మెతుకులు లెక్కపెట్ట్టుకుని తినాల్సొస్తే? చాలా కష్టంలే….వద్దు.” కాస్త ఖచ్చితంగానే చెప్పి లేచాను.
“ పాపం…అక్క ఆ అబ్బాయి వివరాలు మొత్తం ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో వెతికేసింది నాన్నా! దానికి చాలా నచ్చాడు.” స్ఫూర్తి మాటలు విననట్లే ఊరుకున్నాను.
****
ఆదివారం. బద్ధకంగా కాఫీ త్రాగుతూ వార్తలు చూస్తుంటే, కాలింగ్ బెల్ మ్రోగింది. స్రవంతి తలుపులు తీసి ఎవరో అడుగుతూండగానే, నేను లేచి చూసాను.
ఆశ్చర్యం. రమా మనోహర్.
రాత్రేగా వాడితో మాట్లాడాను. ప్రొద్దున్నే ప్రత్యక్షమయ్యాడేమిటా అనుకుంటూ ఉన్నానో లేదో, వాడి వెనుక వాడి భార్య. మరింత ఆశ్చర్యం. వాడి కొడుకు… అదే పెళ్లి కొడుకు సారంగపాణి.
‘ఇదేమిటి, ఉరుముల్లేని వానల్లే నేరుగా పటాలంతో ఇంటికొచ్చేశాడు.. వీడికి నా అసమ్మతి ఇంకా చెప్పలేదు. ఇప్పుడెలా? కాదని ఎలా చెప్పాలి?’ మధన పడుతూనే, ఇంట్లోకి ఆహ్వానించాను. నేను ఆహ్వానించడమేమిటి? మొహమాట పడుతున్న భార్యతో, ‘వీడు నా జిగిరీ దోస్తు. రా… రా… పాణీ! మీ తాతయ్య, ఈ అంకుల్ వాళ్ళ నాన్నగారి క్రిందే చేశారుద్యోగం’ అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు.
“రండి. కూర్చోండి” ఆహ్వానించింది రాధ.
“వార్నీ…ఎన్ని సార్లు ఈ వైపు నుంచీ తిరిగానో! నువ్విక్కడే ఉన్నావని తెలీనే లేదురా ప్రసాదూ! పాతికేళ్ళయింది కలిసి. ఉండబట్టలేక ఫ్యామిలీతో దిగి పోయా! ఏమ్మా..రాధమ్మా? . నీ పేరు బయట నేమ్ బోర్డు మీద చూశాలేమ్మా! తను… దమయంతి. నా భార్య. పెద్దబ్బాయి సారంగపాణి. వీడి తర్వాత ఒక కొడుకు, కూతురు కవలలు.” మంచి మాటకారి మనోహర్. తనే పరిచయం చేసేసుకున్నాడు మా వాళ్లకి.
స్రవంతిని, స్పూర్తిని పరిచయం చేసింది రాధ. స్రవంతి, సారంగపాణి ఒకర్నొకరు చూసుకోవడం నేను గమనించక పోలేదు. మనోహర్ భార్యకి మొహమాటం ఎక్కువనుకుంటా! తక్కువ మాట్లాడుతోంది. అంతేలే….దంపతులలో ఒకరిలా, మరొకరలా ఉంటేనే మంచిది.
“అంకుల్! కాఫీలో చక్కర వెయ్యచ్చా?”
“నేనింకా చక్కెర ఫ్యాక్టరీ కొనలేదమ్మా! నిరభ్యంతరంగా వెయ్యొచ్చు. దమయంతీ…నువ్వు తెచ్చినవి ఇవ్వూ!” స్పూర్తికి చెప్పి, భార్యతో అన్నాడు మనోహర్.
వాళ్ళు తెచ్చిన బుట్ట తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది అతని భార్య దమయంతి.
చాలా కబుర్లు చెప్పుకున్నాం.
“అయితే, అత్తయ్య, మావయ్యగార్లు నీ దగ్గరే ఉన్నారన్నమాట.” వాడితో అన్నాను.
గలగలా నవ్వాడు మనోహర్.
“మేమే వాళ్ళ దగ్గరున్నాం. అదే ఇల్లు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. నిన్ను కలవడానికి వెళ్తున్నామని చెప్తే ఎంత సంతోషించారో! మీ నాన్నగారు పోయారని తెలిసింది. అమ్మ ఎక్కడున్నారు?” అడిగాడు.
మా ఈ అపార్ట్ మెంట్ లో ఉండడం నచ్చలేదు అమ్మకి. తమ్ముడి దగ్గర కాకినాడలో ఉంటోంది. వాడిది ఇండిపెండెంట్ ఇల్లు. అదే చెప్పాను. పాత విషయాలు చాలా మాట్లాడుకున్నాం. ఇద్దరం యాభైలు దాటాం కాబట్టి, అప్పటి విషయాలు ఇపుడు చాలా సిల్లీగా అనిపించాయి. మనోహర్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడుట. ట్రాన్స్ఫర్ ఇష్టం లేక, పరీక్షలు రాయలేదట. అందుకే ప్రమోషన్ కూడా రాలేదుట. పిల్లలు ముగ్గురివీ మంచి చదువులేనట. సారంగపాణి ఖరగ్ పూర్ ఐ.ఐ.టీ లో చదివాడట. అదృష్టవశాత్తూ, అంతసేపట్లోనూ మా మధ్య పెళ్లి విషయాలేవీ రాలేదు.
“ మిస్సెస్ మనోహర్ మంచి కలుపుగోలు మనిషండీ! మాట తక్కువ కానీ చేత ఎక్కువ. ఆ కాసేపట్లో, మాట్లాడుతూనే, నేను వంట కోసం పెట్టుకున్న చిక్కుడుకాయలు వలిచేసింది. కొబ్బరి తురిమేసింది. వారించినా వినలేదు. ‘చేతులు ఖాళీగానే ఉన్నాయి కదండీ’ అంది. వాళ్ళ ఇంటి పంటట. బోలెడు కూరగాయలు, ఆకు కూరలు తెచ్చారు.” చెప్పింది రాధ, వాళ్ళు వెళ్ళిపోయాక.
“చెప్పానా…ఉట్టి డబ్బుమనిషి అని. ఎవరయినా పళ్ళు తెస్తారు. స్వీట్స్ తెస్తారు. వీళ్ళ లాగా ఇంట్లోవి తెస్తారా?” మనసులో ఉన్న మాట అనేశాను.
“తప్పేముంది నాన్నా? పళ్ళు, స్వీట్స్ దొరుకుతాయి కానీ, ఇంత తాజా వెజిటబుల్స్ మార్కెట్ లో దొరుకుతాయా?” ఎర్రటి క్యారెట్ ని నములుతూ తన గదిలోకెళ్ళిపోయింది స్రవంతి.
“స్వీట్లు కూడా తెచ్చారండీ వాళ్ళు. ఆవిడ రెండు చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతారట. ఒకటి స్వగృహ ఫుడ్స్, మరోటేమో మగ్గం వర్క్స్ చేయించి, డిజైనర్ దుస్తులు కుట్టించి అమ్మే బొతీక్. పాతిక మంది పనివాళ్ళు ఉన్నారట.” కమ్మని నెయ్యి వాసన వస్తున్న బొబ్బట్టును పళ్ళెంలో పెట్టిచ్చింది నాకు రాధ. నేను తీసుకోలేదు.
“హు…తెలిసిందా….వాడొక్కడే కాదు, వెధవ డబ్బు కోసం భార్యని కూడా కష్టపెడుతున్నాడన్నమాట! ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలూ ఉంటే…పగలూ, రాత్రీ లేకుండా మొగుడూ పెళ్ళాలు సంపాదనలో పడితే, అమ్మో…మనమ్మాయిని ఇచ్చామంటే ఎంత కష్టం?” అనేసి వెళ్ళిపోయాను.
డబ్బే జీవితం అనుకునే వాళ్ళు నాకసలు నచ్చరు. మనం సృష్టించుకున్న డబ్బు, మనని శాసించడం కరెక్ట్ కాదు. డబ్బు వల్ల వచ్చే పరువు, ప్రతిష్ట కృత్రిమం. శాశ్వతమయినవి మనవాళ్ళతో మనం గడిపే క్షణాలే! నేనెరిగిన మనోహర్ డబ్బునే శ్వాసిస్తాడు. వాడి ఆస్తిపాస్తుల గురించి నేనడగలేదు. వాడే మాటల మీద చెప్పాడు. ఒకప్రక్క బ్యాంకు ఉద్యోగం చేస్తూనే, పార్ట్ టైం జాబ్ లాగా కన్స్ట్రక్షన్ అడ్వైజర్ గా ఉండి ఇళ్ళూ, అపార్ట్మెంట్స్ కట్టిస్తాడట. ఈ మధ్య కాలంలో పారితోషికానికి బదులుగా ఓ ఫ్లాట్ ని ఇమ్మని అడుగుతున్నానని చెప్పాడు. .
ఏతా,వాతా అస్సలు మార్పులేని వాడి వైఖరి నాకు నచ్చలేదు. రాధకి దమయంతి నచ్చింది. స్పూర్తికి మనోహర్ కలివిడితనం నచ్చింది. స్రవంతికి ఎవరు నచ్చారో నేనడగలేదు. అది నాకు చెప్పనూ లేదు.
***
“సరేరా..ప్రసాద్! బై! వెళ్ళొస్తా! అయితే…ఒకటి… నేను డబ్బే సర్వస్వంగా బ్రతికే స్వార్ధపరుడిని అన్నావు చూడు. ఈ నీ అభిప్రాయం తప్పు. మనలో ఉన్న శక్తెంతో , అర్హత ఏమిటో తెలుసుకొని అది పెంచుకుని ఎదుగుతే తప్పెలా అవుతుంది?చూడూ…సంపాదించడం తప్పు కాదు. అక్రమ సంపాదన తప్పు. వ్యాపారం తప్పు కాదు. ఆ పేరుతో మోసం చేసి దోచుకోవడం తప్పు. నేను డబ్బును ఆర్జించడమే కాదు, ఖర్చు కూడా సక్రమంగా పెడతాను. సంపాదించడంలో నాకు ఆనందం లభిస్తుంది. భవన నిర్మాణం లో అనవసర ఖర్చులు తగ్గించి, మరింత నైపుణ్యత తో కట్టించి ఇచ్చి యజమానికి లక్షల ఖర్చుని మిగిల్చి, నేను వేలల్లో ఫీజు తీసుకోవడం తప్పెలా అవుతుందిరా?” చాలా నొచ్చుకున్నాడు మనోహర్.
గత ఆదివారం మా ఇంటికి వచ్చి వెళ్ళాక, నాలుగు రోజులాగి నాకు ఫోన్ చేశాడు మనోహర్. మాకు ఇష్టమైతే, మాతో సంబంధం కలుపుకోవాలని ఉందని, స్రవంతి వాళ్ళ అబ్బాయికి నచ్చిందనీ చెప్పాడు. ఇంట్లో వాళ్ళ ముందు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అందుకని వాడిని మెయిన్ రోడ్ లో ఉన్న హోటల్ కి రమ్మన్నాను. మేము కలిశాక, నిర్మొహమాటంగా చెప్పేశాను.
“ డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మీయులతో గడిపే సమయాన్ని. డబ్బు వైద్యాన్ని అందించగలదేమో ఆరోగ్యాన్నివ్వలేదు. పరిచయస్తులనివ్వగలదు, స్నేహితుల్నివ్వదు. ఈ సంపాదన మోజులో పడి ఎన్ని కోల్పోతామో! నిన్నే చూడు. ఇంట్లో పెద్దవాళ్ళని వదిలి, నువ్వూ మీ ఆవిడా డబ్బు వెంట పడుతున్నారా లేదా? ఏం చేసుకుంటావురా మనోహర్ అంత డబ్బుని? ఒకటికి ఏడు ఫ్లాట్లున్నాయన్నావు. స్థలాలు కొన్నావు. అరే! నువ్వు బ్రతకడానికి కావాల్సింది ఎంత? ఒక్క ఇల్లు. అంతేనా? చిన్నప్పటి నుంచీ డబ్బు వెనకాలే పడుతున్నావు. నీకంటూ తీరికగా ఓ పుస్తకం చదవడమో, సినిమా చూడడమో ఉందా అసలు? పెళ్ళాన్నీ తిప్పలు పెడుతున్నావు. రేపు నా పిల్లనీ మనీ మిషన్ గా మార్చేస్తావేమో! వద్దురా….ఏమీ అనుకోకిలా అన్నానని.” ఈ నా మాటలకే వాడలా అన్నాడు. లేచి నిల్చున్నాడు.
“ఓకే రా…పర్లేదు. కలుద్దాం. చెప్పడం మర్చిపోయాను. అమ్మ నిన్ను అడిగినట్లు చెప్పమంది. స్వగృహ ఫుడ్స్ నడిపేది అమ్మే! నాన్న దగ్గరుండి ఎకరాన్నర భూమిలో ఆర్గానిక్ కూరల సేద్యం చేయిస్తారు. అయితే, ప్రసాదూ అది నా ప్రోద్బలం వల్ల మాత్రం కాదు సుమా! అక్కడే పది ఆవులతో గోశాల కూడా ఉంది. పాలిచ్చే ఆవులు కావవి. వట్టిపోయి, కబేళాకి తీసుకు పోతూంటే డబ్బిచ్చి కొన్నాను. ‘ఇంట్లో ఊరికే ఉండి ఏం చేయను? నేనూ ఏదో ఒకటి చేస్తాన’న్నది దమయంతి. తనకిష్టమైన పని చేస్తూ, చేయిస్తూంది.
డబ్బు కేవలం దాచుకోవడానికీ, ఖర్చు పెట్టడానికే కాదురా! సమాజసేవ చేయాలంటే కూడా డబ్బే అవసరం. పదిమంది పేదలకి చదువు చెప్పించాలన్నా, నలుగురికి ఉపాధి కల్పించాలన్నా డబ్బున్నవాడేగా చేయగలడు? డబ్బున్న వాళ్ళని ద్వేషించడం అనేది తరతరాలుగా చాలా మందిలో ఉన్న జాడ్యం. వాళ్లకి డబ్బు చేదు కాదు. డబ్బున్నవాళ్ళు చేదు. చెడిపోతేనే ధనవంతులవుతారని వాళ్ళ నమ్మకం. ఏం చేస్తాం? అందర్నీ మార్చే అవసరం నాకేం లేదు. సోమరిపోతులా బ్రతకవద్దనేవాడు మా నాన్న. సమయాన్ని డబ్బుగా మార్చుకోవడం నేర్పాడు. పరుల మీద ఆధారపడకుండా నిజాయితీ తో బ్రతకాలన్నాడు. నాకది నచ్చింది. నా వాళ్ళకీ నచ్చింది. అయినా నాకెంత కావాల్రా? ఇంకేం కావాలసలు? అమ్మా నాన్నల అండ దండలున్నాయి. అందమైన కుటుంబం ఉంది. ఆరోగ్యం ఉంది. నలుగురికీ మంచి చేయాలనే తపనుంది. నా దారి నాకు బాగుంది. …ఓకే రా…! నెవర్ మైండ్. విష్ యువర్ డాటర్ అల్ ది బెస్ట్. వీలున్నప్పుడు అందర్నీ తీసుకురా…అమ్మానాన్నా సంతోషిస్తారు.” చేయి కలిపి లేచాడు మనోహర్. రెండు కప్పుల కాఫీకి నలభై రూపాయలకి బదులు, వంద నోటు వెయిటర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. మరో కప్పు కాఫీ త్రాగి నేనూ బయల్దేరాను.
*****
రాత్రంతా ఆలోచించాను. మనోహర్ మాటలే మననం చేసుకుంటూ ఉన్నాను. నిర్ణయం తీసుకున్నాకగానీ నిద్ర పట్టలేదు.
తెల్లవారింది.
“ఏం తల్లీ…నీకు సారంగపాణి నచ్చాడా? ముందుకు వెళ్దామా?” నా నుంచీ ఈ ప్రశ్న ఊహించలేదేమో, స్రవంతి బుగ్గలు ఎరుపెక్కాయి. కళ్ళు మెరిశాయి.
“మీ ఇష్టం నాన్నా!” రాధ వెనక్కి చేరి నెమ్మదిగా అంది.
“అక్కా…నేను చెప్పలేదూ…’నాన్న ఒప్పుకుంటారే! డోంట్ వర్రీ అని.’ మా నాన్న బంగారు.” నా భుజాల్ని చుట్టి అంది స్ఫూర్తి.
నా వాళ్ళ ముఖాల్లో సంతోషం కాక, నేను కోరుకునేది ఇంకేముంటుంది?
వేములవాడ=కొన్ని వెంటాడే దృశ్యాలు
——————
నా అరవై రెండేళ్ల జీవనయానంలో వేములవాడది ఒక ప్రధాన భూమిక. అనేక అనుభవాలకు,ఆనందాలకు,కొన్ని అవమానాలకు వేదికయిన ఆ వూరు మా అమ్మను కన్న వూరు,అమ్మమ్మ వూరు,తాతయ్య జోరు, గొప్ప జాతర హోరు.
వేములవాడ లో నేను అమ్మ గారింటి తోనే ఐడెంటి ఫై అయినప్పటికీ మా వారాల వంశం మూలాలు వేములవాడలోనే వున్నాయి.తరతరాలుగా మిఠాయిలోల్లం. అది తర్వాత ఎప్పుడయినా రాస్తాను.
నేను పుట్టింది వేములవాడలోనే అయినా పెరిగింది చదివింది కరీంనగర్. సెలవులకు,పండగలకు,పబ్బాలకు,అమ్మ గారింటికి వచ్చేవాడిని. అమ్మమ్మ సత్తమ్మ, తాతయ్య డాక్టర్ సుబ్రహ్మణ్యం,మామయ్యలూ, అత్తమ్మలూ, అందరిలో ఒక్కడినై కలగలిసి పోయి వేములవాడ వాడినే అయిపోయాను.
నా సుజనాత్మక జీవితంలో నటరాజ కళానికేతన్ ఒక ప్రధాన మూల మలుపు. ఆ మలుపు వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపించి జాతీయ అంతర్జాతీయ స్థాయి సినిమాల్ని ప్రదర్శించడం దాకా సాగింది.1983 దాకా నా ప్రధాన వేదిక భూమిక ఆ వూరే.
ఆ వేదిక గురించి విస్తృతంగా రాయాల్సివుంది. రాస్తాను ఎప్పటికయినా.
ఇప్పటికి గత అయిదు దశాబ్దాలుగా నన్ను వెంటాడుతున్న కొన్ని images గురించి రాస్తాను.
SOME Haunting images :
1 ) తిప్పాపురం బస్ స్టాండ్ :
చిన్నప్పటి నుండి దశాబ్ద కాలం వీక్షించిన దృశ్య మిది. జనంతో క్రిక్కిరిసి పోయి నిండు గర్భిణీ లా మెల్లిగా స్టాన్డ్ కు చేరుకున్న బస్సు చుట్టూ పొలోమంటూ పూజార్లూ వేద పండితులూ చేరి దేవుని దర్శనానికా అని పలకరిస్తూ పోటీలు పడి తలా ఒకటో రెండో కుటుంబాల్ని వెంట తీసుకెళ్లి. వారికి వసతి దర్శన తదితర బాధ్యతలు చూసే వారు. వేదపండితులు,విజ్ఞులు అయినా వారిని అలాంటి స్థితిలో చూడ్డం తీవ్రంగా కలత పెట్టేది.ఆ ఇమేజ్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది.
2 ) ధర్మ గుండం
అప్పట్లో దేవాలయ ధర్మ గుండానికి చెరువుకి నడుమ కేవలం చిన్న రాతి కట్టడం ఉండేది, ఇంకా కట్టడాలేవీ లేవు. యాత్రికులు దేవునిమీది విశ్వాసం తో గుండం లోకి పైసలు వేసేవాళ్ళు. అప్పుడేన్నని ఒకటో,రెండో, ఐదో పైసల బిళ్ళలు వేసేవాళ్ళు వాటికోసం కొంతమంది నీళ్ళల్లోకి దూకి మునిగి వెతికి కరుచుకుని
మరీ తెచ్చు కునే వాళ్ళు. ఎన్ని సంపాదించే వాళ్ళో కానీ ఆ ఇమేజ్ ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే వుంది.
3 ) మిఠాయి దుకాణాలు
గుడి ముందు కాలువ పక్కన కేశన్నగారి ఇంటి వరుసలో పొందికగా వున్న మిఠాయి,గాజుల దుకాణాలు నాకిప్పటికీ గొప్పగా అనిపిస్తాయి. రంగు రంగుల చిలుకలు బత్తీసలు బెండ్లు శక్కరి పుట్నాలు, అందంగా పేర్చిన పేడాలు ఎంత కళాత్మకంగా ఉండేవో. గొప్ప దృశ్యాలవి పిల్లలు మేడలో చిలుకల పేర్లు వేసుకోవడం ఎంత అందంగా ఉండేదో.
4 ) బిచ్చ గాళ్ళు
జాతరలు ఆలయాల ముందు వీళ్ళు సాధారణం. కానీ వేములవాడ వీధుల్లో ముళ్ల కంపల పై పడుకుని కొందరు, ఇంకొందరయితే భూమిలో గోతి తవ్వి అందులో తల పెట్టి మట్టి తో కప్పుకుని పక్కనే ఒక ప్లేటు పెట్టుకుని గంటల తరబడి అట్లా వుండే వాళ్ళు. వాళ్లకు శ్వాస ఎట్లా ఆడేదో ఇప్పటికీ అర్టంకానీ విషయమే.ఆ దృశ్యాలు నన్ను వెంటాడు తూనే వున్నాయి. అప్పుడు కెమెరాల్లేవు ఇమేజెస్ మనసులోనే ఉండి పోయాయి
5 ) తూము
చెరువు కింది తూములోంచి నీళ్లు వదిలి నప్పుడు ఉప్పొంగి కాలువలోకి వచ్చే నీటి దృశ్యం పట్నం లో పెరిగే నాకు అబ్బురంగా కనిపించిన ఇమేజ్ .
6 ) పోచమ్మ
పోచమ్మ బోనాలు వాటికి ముందు మోగే దప్పుల చప్పుడు శివాలూగే భక్తులు ఓహ్ చూడాల్సిందే.మరీ చిన్నప్పుడు భయమేది కానీ ఆ ఇమేజ్ మామూలుది కాదు
7 ) జైన శిల్పాలు
ప్రధాన దేవాలయం నుండి తరలించిన వందలాది శిల్పాల్ని అనాధలుగా భీమన్న గుడి పక్క తోటలో పడేసిన దృశ్యం వెరీ మచ్ హాంటింగ్. కొంచెమయినా చారిత్రిక దృష్టి లేని తనం దుఃఖం కలిగిస్తుంది.వేదనగా ఉంటుంది.
8 ) తాతయ్య దవాఖానా
సుబ్రహ్మణ్యం తాత దవాఖానా రోజంతా పేషంట్ల తో క్రిక్కిరిసి ఉండేది. కషాయం దగ్గు పొట్లాలతో బిజీగా ఉండి సేవ చేసేది. సాయంత్రమయితే చాలు దవాఖానా ముందు ఊడ్చి శుభ్రం చేసి చాపలు వేసేవాళ్ళు. ఆప్పుడు తాతయ్య, ఠాకూర్ సాబ్, సాంబయ్య సారూ ఇంకా అనేక మంది పెద్దలు ఒక్కోసారి ఎం.ఎల్లే రాజేశ్వర్ రావూ కూర్చుని దేశం గురించి రాజకీయాల గురించీ చర్చించే వాళ్ళు. ఆ దృశ్యం ఎంత గొప్పగా ఉండేదో
9 ) దవాఖాన్ల అమ్మమ్మ రాజేశ్వరి అమ్మమ్మ
నా చిన్నప్పటి నుండి మనసులో అట్లా నిలిచి పోయిన స్త్రీ రూపం దావాఖాన్ల అమ్మమ్మ. ఒకింత నిండుగా ముక్కు పుడక, చెవులకు గంఠీలు సహా ఒంటినిండా ఆభరణాలతో కళకళ లాడేది.నోట్లో పాన్ ఎంత అందంగా ఉండేదో. దసరాకు జాతరాకో మా పిల్లలందరికీ ఒక్కో రూపాయి ఇచ్చేది. తను నాకయితే గొప్ప గ్రామ దేవతలా అనిపించేది. చాలా గొప్ప స్త్రీ మాత్రమే కాదు గొప్ప మనిషి కూడా.
ఇట్లా నన్ను హాంట్ చేసిన ఇమేజెస్ ని కొన్నింటిని నా ‘శివ పార్వతులు’ డాక్యుమెంటరీ లో పొందు పరిచాను.
ఆ ఫిలిం Slovenia ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు గెలుచుకుంది.ఇంకా భూటాన్, మెక్సికో లాంటి చోట డాక్యుమెంటరీ ఫెస్టివల్స్ లో పాల్గొంది. ఆ వివరాలు మరో సారి.
ఇవన్నీ నన్ను వెంటాడిన ఇమేజెస్ మాత్రమే. నా ఫిలిం చూడాలనిపిస్తే చెప్పండి లింక్ ఇస్తాను.
వేములవాడ=కొన్ని వెంటాడే దృశ్యాలు= 2
ఆయిదారు దశాబ్దాల క్రితం సామాజికంగా ఇంత చలనం, సాంకేతిక అభివృద్ధి లేని కాలం లో పిల్లలకు బడులకు ఇచ్చే సెలవులు గొప్ప ఆట విడుపు. ఆ ఆటవిడుపులో అమ్మగారింటికి వెళ్ళడంలో వున్న మజాయే వేరు. అదీ ఆత్మీయంగా చూసే తాతయ్య అమ్మమ్మలు వున్నప్పుడు ఆనందం ఎన్నో రెట్లు పెరిగేది. ఇంతకు మందే చెప్పినట్టు మా అమ్మగారిల్లు వేములవాడ. మావూరు కరీంనగర్. తాతయ్య డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం, అమ్మమ్మ సత్యమ్మ. ఎక్కడో మహాబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి వేములవాడ వచ్చి అక్కడి దేవస్థానంలో మొట్టమొదటి వైద్యాదికారిగా సేవలందించిన తాతయ్య కొల్లాపూర్ లో రాచరిక భూస్వామ్య వ్యవస్థ ముందు తల ఒగ్గ లేక వేములవాడ వచ్చినట్టు విన్నాను
ఆ విషయాలు తాతయ్యను ఎప్పుడు అడిగినా చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవాడు. నేను కరీంనగర్లో కార్ఖానాగడ్డ, గంజ్ స్కూళ్ళల్లో చదువుతున్నప్పుడు పరీక్షలవుతున్నప్పుడు తాతయ్యకు ఉత్తరం రాసేవాడిని ఫలానా రోజుతో పరీక్షలయిపొతున్నాయని. సరిగ్గా ఆరోజు పగటీలికల్లా తాతయ్య కరీంనగర్లో మా మిఠాయి దుకాణం ఇంట్లో దిగేవాడు. అనేక మంది పిల్లలతో మున్సిపల్ స్కూలులా వుండే మా ఇంట్లో అందరికీ ఐస్ ఫ్రూట్లు ఇప్పించి నన్ను తీసుకుని వేములవాడ బయలు దేరేవాడు. అట్లా దాదాపు స్కూలు సెలవులన్నీ వేములవాదలోనే గడిచేవి. అక్కడి మిత్రులు దేవాలయ వాతావరణం నా బాల్యం లో భాగం అయిపోయారు.
అమ్మమ్మ తతయ్యలకు తమ కూతుళ్ళ పిల్లలంటే ఎంత అభిమానమంటే వాళ్ళని ఏమయ్యా అనేవాల్లె గాని అరేయ్ ఒరేయ్ అని పిలిచే వాళ్ళు గాదు. అమ్మమ్మయితే ఆడబిడ్డల కొడుకులను అరేయ్ అంటామా అని అందరిముందూ అనేది. అదే మా ప్రసాద్ బావని మాత్రం అరేయి ప్రసాదూ అని పిలిచేది. అదీ అప్పటి పెద్దల అభిమానాలూ ఆదరణలూ.
తాతయ్య వేములవాడ దేవస్థాన మొట్టమొదటి వైద్యాధికారి. దేవాలయ వెనకాల కట్టమీద ఆసుపత్రి నివాసమూ వుండేదని చెప్పేవారు. అక్కడే అనేక ఏళ్ళు గొప్ప సేవా తత్వంతో సేవలందించిన ఆయన ఆజానుబాహువు. ముఖంలో గంభీర్యంతో కూడిన చిరునవ్వుతో అందరి ఆదరణకూ పాత్రుడయ్యేవారు. కరేమ్నగర్ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ లో 1960 ప్రాంతంలో లైబ్రేరియన్ గా పనిచేసిన శ్రీ శ్రీరంగా రావు గారు ఇటీవల నాతో మాట్లాడుతూ మీ తాతయ్య ఎంత అందగాడనుకున్నావు కట్టమీద నడుస్తుంటే ఎవరికయినా గౌరవంగా పలకరించాలని పంచేది. నేనూ తన దగ్గర నా చిన్నప్పుడు వైద్యం చేయించుకున్నాను అన్నాడు. అంతేకాదు ప్రైవేట్ గా ఆసుపత్రి తెరిచి ఆయన చేసిన సేవ గురించి దావఖాన్ల అమ్మమ్మ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. (అవన్నీ మరెప్పుడయినా పంచుకుంటాను)
నాకయితే ఆర్ద్ర రాత్రి ఆపరాత్రి అనకుండా మందుల పెట్టె పట్టుకుని కాన్పులు చేయడానికి ఆపదలో వున్న వాళ్లకు వైద్యం చేయడానికి వెళ్ళిన ఆయనే గుర్తొస్తాడు. అట్లా వేముల వాడలోనే కాదు చుట్టూ పక్కల అనేక గ్రామాల్లోని ఆపన్నులకు ఆయన అందించిన సేవల్ని ఆయా గ్రామాల ప్రజలు దశాబ్దాలపాటు స్మరించుకున్నారు. చిన్నపిల్లలు మొదలు వృద్ధుల దాకా ఆకాలంలో ఆయన చేతి కషాయం, దగ్గు మందు, దగ్గు పొట్లాలు వాడని వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి.
ఆ మహానుభావుడి యాదిలో ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు అనుభూతులు.
వ్యక్తిగతమయినవి కాకుండా వూరి పరంగా సామాజిక పరంగా నన్ను వెంటాడుతున్న మూడు దృశ్యాల్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.
1) తాతయ్య ఉదయాన్నే లేచి బావి వెనకాల చెట్లకు నీళ్ళు పారించి పిల్లల స్నాన పానాదు లతో గడిపి గ్లాసెడు చాయ్, నోట్లో పాన్ బిగించి తన స్టాండర్డ్ డ్రెస్ లాల్చీ పైజామాలు ధరించి ఆసుపత్రికి బయలు దేరేవాడు. అప్పుడప్పుడు నేనూ వెంట వుండే వాడిని. తాను ఇంటి గడప దాటింది మొదలు ఆయనకు కుడిచేయి దించే అవకాశం వుండేది కాదు. తాతయ్యా నమస్తే, తాతా నమస్తే అంటూ బడి పిల్లలూ ఆడుకునే పిల్లలూ ఆయన్ని పలకరిస్తే అందరికీ ప్రతిగా నవ్వుతూ చేయి ఊపుతూ దగ్గరికి వచ్చిన వాళ్లతో చేతులుకలపదం చేసేవాడు. ఇక పెద్ద వాళ్ళయితే ‘దండాలయ్యా’, నమస్తే డాక్టర్ సాబ్, అయ్యా దండం పెడ్తున్నా అనేవాళ్ళు ఇంకొందరు, అందరికీ బదులిస్తూ అందరినీ పలకరిస్తూ తాతయ్య ఆసుపతికి చేరే సరికి ఎంతో సమయం పట్టేది. నిజంగా ఒక మనిషి అంతమంది ఆదరణను ప్రేమని పొందడం అపురూపమం. ఆ దృశ్యం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది. మనిషి కనిపిస్తే ముఖం చాటేసి వెళ్ళే ఈ కాలం లో అది అపురూప దృశ్యమే.
2) ఇక రెండవది రాజ రాజేశ్వరుని ‘సేవ’. ప్రతి దసరాపండుగ రోజు సాయంత్రం వేములవాడ దేవస్థానం ఆధ్వర్యంలో రెండు సేవలు (దేవుని పల్లకీలు) బయలుదేరేవి. శివకేశవుల సేవలు అవి. ఆలయంలో బయలుదేరి జమ్మి చెట్టు నిలబెట్టే స్థలానికి చేరి ఇక అక్కడినుంచి వూరు ఊరంతా అన్ని వీధులూ తిరిగి ఆలయానికి వచ్చేవి. ఆ రెండు సేవలూ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటి ముందుకు వచ్చి అక్కడ గౌరవంగా నిలబడేవి. అప్పటికే అమ్మమ్మ తో సహా అనేక మంది మహిళలు హారతులు పట్టుకుని నిలబెడేవారు. మేము పిల్లలమంతా సేవల కిందినుంచి అటూ ఇటూ దూరి పరుగులు తీసే వాళ్ళం. అదొక అద్భ్తమయిన దృశ్యం. దేవుని సేవలు ఒక వ్యక్తి ఇంటి మందు నిలబడడం ఒక అపురూపమయిన విషయం. ఆ ఆనవాయితీ తాతయ్య ఉన్నంత కాలం కొనసాగింది.
౩) ఇక మూడవది తాతయ్య అంతిమ యాత్ర. బహుశా నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని వెంటాడే దృశ్యం అది. అనారోగ్యం తో హైదరాబాద్ ఆసుపత్రిలో తన అంతిమ శ్వాస విడిచిన ఆయన అంతిమ యాత్ర వేములవాడలో మొదలయినప్పుడు వేములవాడ వూరు ఊరంతా దుఖమే. రోదించని వాళ్ళు లేరు. అంతిమ యాత్ర ముగిసే వరకు దేవాలయ ప్రధాన ద్వారం మోసేసారు. ఊరంతా బందు. అంతిమ యాత్ర సాగినంత మేరా ఇళ్ళముందు పిల్లా పెద్దా అంతా తమ ఇంట్లో మనిషి పోయినట్టు రోదిస్తున్న దృశ్యం నా కళ్ళల్లో ఇప్పటికీ మెదుల్తూనే వుంది. ఇదికదా ఒక మనిషికి మహానుభావుడికి ప్రజలు ఇచ్చే నివాళి. గౌరవం.
జయహో తాతయ్యా జయహో డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం జయహో.
కన్నీళ్ళతో ఇక ఏమీ రాయలేను’
