మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
బాల‌సాహిత్యం

పొట్ల కాయ పొగరు

by డా.కందేపి రాణీప్రసాద్ August 20, 2021
written by డా.కందేపి రాణీప్రసాద్

ఓ ఇంటి పెరట్లో పొట్లకాయ పాదు, దొండకాయ పాదు ఇంకా రకరకాల కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఆ ఇంటి యజమాని చక్కగా అన్నిరకాల కూరగాయల మొక్కల్ని ప్రేమగా పెంచుకుంటున్నాడు. పక్కపక్కనున్న పందిళ్లపై పాకి ఉన్న పొట్లకాయ, దొండకాయ తీగలు రోజు మాట్లాడుకుంటూ ఉంటాయి. పైకి మామూలుగా మాట్లాడుతున్నప్పటికి పొట్లకాయకు తాను బాగా పొడుగ్గా ఉంటానని అహంకారం ఉంది. పొడుగ్గా ఉంటే అందంగా ఉంటారని అనుకుంటుంది ఇలా మొదలైన దాని అహంకారం పెరిగి పెరిగి పొగరుగా రూపుదిద్దుకున్నది.

పొట్లకాయకు తాను పొడుగ్గా అందంగా ఉంటాననే కాకుండా, దొండకాయ పొట్టిగా, అందవికారంగా ఉంటుందని అనిపించసాగింది.  అలా ఆలోచన వచ్చిందే తడవుగా తాను దొండకాయకన్నా గొప్పదాన్నిని అనుకోవడంతో పాటు దొండకాయను అవహేళన చేయడం మొదలు పెట్టింది. ఈ మాత్రం సమయం దొరికినా, ఏ చిన్నపాటి అవకాశం లభించిన దొండకాయను వదలడం లేదు. పొట్లకాయ మాటలకు దొండకాయ చాలా బాధపడుతోంది. కానీ ఏం చేయలేకపోతున్నది. దూరంగా పారిపోదామా అంటే జంతువులకు ఉన్నట్లు తమకు కాళ్ళు చేతులు లేవాయే. ఎక్కడ ఉన్నవాళ్లం అక్కడే ఉండాలి. తమ తల్లిదండ్రులు ‘ఇరుగుపొరుగుతో మంచితనంగా ప్రేమగా ఉండాలి’ అని చెప్పారు. అందుకే పొట్లకాయతో ఎంత ప్రేమగా ఉన్న అది ఊరుకోవడం లేదు. దాని పొడుగును చూసుకొని విర్రవీగుతోంది. దొండకాయ తననింతపొట్టిగా పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకొంది. ‘నేనెందుకింత అందవిహీనంగా ఉన్నాను’ నేను చేసిన పాపమేమిటి? అనుకుంటూ రోజు తనలో తాను కుమిలిపోసాగింది.

ఈ వ్యవహారన్నంతా ఆ పక్కనే ఉన్న కాకరపాదు గమనించింది. విషయం కొద్దిగా అర్థమైన పూర్తిగా తెలుసుకుందామని దొండకాయను పలకరించింది. అడిగిందే తడవుగా తన మనసులోని బాధనంతా చెప్పేసుకుంది దొండకాయ. ‘నేను పొట్టిగా ఉండటం నా తప్పా? పొట్లకాయ ఎలా కూరగాయగా మానవులకు పనిచేస్తుందో నేను కూడా అలాగే కూరగాయగా పనికొస్తున్నాను కదా!’ అంటూ బోరుబోరున ఎడ్చింది. కాకరకాయ దొండకాయను ఊరడిస్తూ ఇలా చెప్పింది. ‘దేవుని దృష్టిలో గొప్ప, తక్కువ తేడా లేదు. అందరూ సమానమే. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది! కాబట్టి మొదట నువ్వు ఏడవడం మానేసి ప్రశాంతంగా ఆలోచించు! అన్నీ నీకే అర్థమవుతాయి!’ అన్నది.

దొండకాయ కొద్దిగా ఏడుపు ఆపి కళ్ళ నీళ్ళు తుడుచుకొని సరిగా కూర్చుంది.అప్పుడు కాకరకాయ మరలా ఇలా చెప్పింది. “చూడు! నన్ను కూడా అందరూ చేదు చేదని అసహ్యించుకుంటారు. పిల్లలైతే నన్నసలు ముట్టుకొనే ముట్టుకోరు. ఇంకా నా చర్మం మూడుతలు పది ఉంటుందని ముసలమ్మని అంటూ ఎగతాళి చేస్తారు. అయినా నేను ఇవేవి పట్టించుకొను. నన్ను ఇంతగా అసహ్యించుకున్నా షుగర్ వ్యాది ఉన్నోళ్ళు నన్ను ఎంతో ప్రేమగా తింటారు. నాలో షుగరు వ్యాధిని తగ్గించే గుణాలు ఉన్నాయట. మానవులు తినటానికి కూరగాయగా పనికిరావడమే కాకుండా వారి వ్యాధుల్ని కూడా తగ్గించగలుగుతున్నానన్నసంతోషం ముందు ఈ ఎగతాళులు ఎంత మాత్రం నన్ను బాధించవు! అలాగే నువ్వు కూడా ముందు బాధపడటం మానెయ్యి. చక్కగా తిని ఆరోగ్యంగా ఉండు. చూడు నీరసంతో ఎలా చిక్కి శల్యమయ్యావో!”. దాంతో దొండకాయ కొంత ఊరట చెందింది. ‘అంతేనంటావా! నాకు ఈ లోకంలో గుర్తింపు ఉందంటావా?’ ఇంకా పూర్తిగా అనుమానం పోక అడిగింది.

చూడు దొండకాయ మిత్రమా! అసలు నీ గొప్పదనం నీకు తెలియడం లేదు. మానవుల్లోని మహా మహాకవులు అందగత్తెలైన స్త్రీల పెదవుల్ని ‘దొండకాయ వంటి పెదవులు’ అని నీతో పోలుస్తారు తెలుసా! నేవ్వెమో కధలు చదవవు. నీకేమో పుస్తకాలు చదివే అలవాటే లేదాయే! అతిలోక సుందరులైన రంభ, ఊర్వశి, మేనకల్నైనా ఎర్రగా పండిన దొండపండు వంటి పెదవులు’ అంటూ పొగడాల్సిందే. నీ ప్రత్యేకత ఎవరికీ లేదు! అంటూ వివరిచింది.

ఇప్పుడు దొండకాయకు ఇంకాస్త ధైర్యం వచ్చింది. ‘ నేనీ అందమైన ఆడవాళ్ళ పెదవుల్లా ఉంటానా’ అనుకుంది. ‘నేను ప్రత్యేకమైనదాన్నని నాకు తెలిసొచ్చింది. నాకు పిరికితనం పోయి ఆత్మవిశ్వాసం వచ్చింది. మరి ఈ పొట్లకాయ ఆగడాలు ఇలా భరించాల్సిందేనా! దీనికేం దారిలేదా!’ మళ్ళీ బేలగా అడిగింది. దానికి కాకరకాయ సమాధానంగా దొండకాయ తల నిమురుతూ ఇలా చెప్పింది. ‘చూడు మిత్రమా! ప్రతిదానికీ ఒక సమయమంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చినపుడు ఏది ఎలా జరగాలో అలా అరుగుతుంది. దాని మాటలు పట్టించుకోవద్దు. సృష్టిలో ఎన్నో మొక్కలు ఉన్నాయి. ఏడిపించేవారిని వదిలేసి నీతో మంచిగా ఉండేవారితో స్నేహం చెయ్యి. ఏమి బాధపడకు. ధైర్యంగా ఉండు’ అంటూ ఉపదేశించింది. దాంతో దొండకాయ పూర్తిగా శాంతించింది. పొట్లకాయను మరిచి మిగతా స్నేహితులతో సంతోషంగా ఉండసాగింది.

ఇలా ఉండగా ఒకరోజు ఉదయం నిద్రలేచేసరికి ఇంటి యజమాని పొట్లపాదును తీసేస్తున్నాడు. తీగలన్నీ పీకెసి చెట్టు మొదలును తవ్వేస్తున్నాడు. పొట్లకాయ విపరీతమైన బాధతో ఏడుస్తున్నది. తనను చంపొద్దని యజమానిని ప్రాధేయపడుతుంది మౌనంగా. యజమాని అలా దొండకాయకు అర్థం కాలేదు. ఎంటా అని పక్కనే ఉన్న కాకరచెట్టు వంక చూసింది.

అప్పుడు కాకరచెట్టు ఇలా చెప్పింది. రాత్రి యజమాని వాళ్ళ చిన్న కొడుకు చీకట్లో పొడుగ్గా పెరిగిన పొట్లకాయను చూసి పాము అని జడుసుకున్నాడట. రాత్రి నుంచి జ్వరం తగ్గలేదు. పిల్లాడు బాగా భయపడ్డాడు అందుకే యజమాని పొద్దున్నే ఈ చెట్టును పీకెస్తున్నాడు. చూశావా ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నువ్వు దాని పొగరు చూసి భయపడ్డావు. దాని ఆకారాన్ని చూసి పొట్లకాయ గర్వించింది కానీ పిల్లాడు పామని ఎలా భయపడ్డాడో చూడు. మన గొప్పదనాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకోవాలి కానీ మనకు మనమే గొప్పనుకోకూడదు. నువ్వు ఇకనుంచైనా ఆత్మవిశ్వాసంతో మెలుగు. ఎవరేం చెప్పినా, ఎవరేం అన్నా పట్టించుకోవద్దు. నీ సంతోషమే నీకు ముఖ్యం.

అప్పటి నుంచీ దొండకాయ సంతోషంగా ఉండసాగింది. ఏడిపించే వాళ్ళను వదిలేసి స్నేహితంగా ఉండేవాళ్ళతో కలిసి ఉండసాగింది.

 

August 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పాయిరంగల్ల యిల్లు

by కూకట్ల తిరుపతి August 20, 2021
written by కూకట్ల తిరుపతి

పురుళ్లు వోసుకున్న జాగ
పుట్టుకూసాలు తొడుక్కున్న తలం
బొడ్డుపేగులు తెగిపడ్డ పురిటిగడ్డ
మాయి ముంతలు పాతిపెట్టిన పొలిగుంటలు
కూరాడు నీరాడులను నిలుపుకొన్న నిట్టాడు
బువ్వ కుండలను పొందిచ్చుకున్న సుట్టకుదుర్ల తోడు
సరప్పట్టెలకు ఉయ్యాలలోలే యాళ్లాడే ఉట్లు
ఉగ్గాలు ఊగులాడవడ్డ పాలు పెరుగు బుడ్లు
ఒత్తుకుండ పొయ్యి వొంపిన ఉడుకు నీళ్లు
పాలగోకును పంచిన దాలిల కాగిన పాలు
గడుకతిని గంజినీళ్ళు తాగిన తావు
నిండు జీవునాలను నిలిపిన రేవు

తలపెయ్యికి వొయ్యందే అడుగు తర్రవెట్టని దేవునర్ర
సామాన్లను వొచ్చోరకు వెట్టిన సాయమానర్ర
ఇసిరెలు పసిరెలను యిగురంగ మోసిన చిటుకు
కాయితపు కత్పలను కడుపుల దాచుకున్న తనాబ్బీ
ఇల్లు పొడుగూత ముగ్గులు మొల్సిన అరుగు
కుదురుగ కుదిరిచ్చిన కుమ్మరిగూన కప్పుటిల్లు
ముంగట నీడకు నిలవడ్డ గడ్డి గుడిసె
జమిలి సూరు దారలను మోసే రేకుల దోని
పదిమంది పండిబొర్రేంత ఎల్లుడంగ పెద్దర్వాజ
ఇరుగుపొరుగును మందలిచ్చు యింటెనుక పనుగడ
ఎర్రలుకు పూసి లప్పతొక్కిన మట్టి గోడల పడారి
జాజు పూతల్ల సున్నపు తీనెల వన్నెసిన్నెలు
చీమలకు శెక్కర వోసిన పున్నెవంతుడు
మా తాత చెట్మడిపి నిలవెట్టిన పాయిరంగల్ల యిల్లు
పాములకు సుతా పాలువోసిన బోళ్లకోరిది
మా అవ్వవ్వ బోనం కుండోలే పుదిచ్చిన గూనపెంకిల్లు

ఆయిటి పూనిన వాసనకు
ఓటికోటీ పోటీవడ్డట్టూ యిగిలిచ్చిన
సూరు కింద సోల్పుగ యేనుకొని యెదిగిన
ఉద్దరాసి గోరంట చాబంతి మొల్కల సాళ్ల సొగసు
కసువూడ్చి కల్లాపిసల్ల యాస్టకుదెచ్చే వాకిలి
నవ్వులపువ్వులతో ముర్సిన ఆటల లోగిలి
వాయిలి పొర్క తడ్కలను తొడుక్కున్న జీవాలదొడ్డి
కంకబద్దల ద్యాగర కమ్ముకున్న గొర్రెబొక్కులు
కొట్టంల కొలువైన యెడ్లూబర్ల అరుపులు
గంపలు బోర్లేసిన పిల్లల కోళ్ల పిలుపులు
ఇంటెనుక పబ్బులకు అల్లుక పారిన పచ్చదనం
బీర కాకర చిక్కుడు తీగెల ల్యాతాకుల పరువం

శాదబాయిల యెగిరే పిట్టల ఒయ్యారం
సితపతాల్లంకెళ్లే శాతాడు బొక్కెనల సోయగం
పెయ్యిల మైలలూడదీసే గదిల తానాలు
నిండు శూలాలోలే నిగనిగలాడే నీళ్లకుండలు
పాకురునుగీకి పడుకున్నట్టు గోలెంల కశికలు
కడుపుల తలవెట్టి కాళ్లకు నీళ్లిచ్చే అంపులు
కడుగులంట్లతో నిండిన కుడిది గోలెపుకడుపు

సట్టంబెట్టి మెత్తేసిన వడ్లు దినుసుల గుమ్ములు
పటువ బొత్తల బూడిదతో ఇత్తునంగట్టిన ఇగురం
అటుకు నిండార్గ మెలిగిన పొయ్యిలకట్టెల మండెలు
కుండ మీద కుండలు కూసున్న దొంతుల వర్సలు
సిక్కుడుకు చెక్కిన సువరాకలూ జాబులు

గొంగళ్లను పర్సుకొన్న నులుక మంచాలు
సుక్కలతో ముచ్చట వెట్టించిన గడెంచలు
శాత్రాలూ సంబురాలు కతలూ యెతలు
సుట్టాలూ పక్కాల కట్టనిట్టూరాల కలబోతలు
అచ్చేగాళ్లు బిచ్చగాళ్ల దీవెనార్తులు

ఏగిలేత్తే సేనుశెల్కల్ల మెదిలిన పనిమంతులు
మన్ను బుక్కి మన్ను కక్కిన మట్టిమనుషులు
తాతమ్మల బొక్కలు బొత్తిగ తెల్లవడంగ
మట్టి బొమ్మల మీద మన్సువడంగ
కట్టిన యిల్లూ పెట్టిన పొయ్యీ
ఇయ్యాల వచ్చెలువచ్చెలుగ యిచ్చకపోవచ్చు!
ఆ ఆత్మగల్ల దంట పేరైతే మాసిపోలేదు
గాల్ల సత్తువగల్ల యిత్తునం
కొడుకులూ కొమ్మలూ బిడ్డలూ బాందవులు
చెట్టంత నిండు బలగమయ్యింది
శెల్కంత పసిరిక సేనయ్యింది
గా పాయిరంగల్ల గూనపెంకల యిల్లు
కన్ను మలుగంగనే కలల కనవడుతంది
క్యాలికి రాంగనే కండ్లల్ల మెరుస్తంది.

August 20, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

లలిత సంగీతం – ఆకాశవాణి

by chimmapudi Sriramamurti August 20, 2021
written by chimmapudi Sriramamurti

శ్రుతి, లయ, రాగ, భావయుక్తంగా సామాన్య శ్రోతలకు సైతం అర్థమయ్యే విధంగా వినిపించే మధుర మనోజ్ఞ గీతమే లలిత సంగీతం. లలిత సంగీతం శాస్త్రీయ – జానపద సంగీత స్రవంతికి వారధి వంటిది.

లలిత గీతం మాత్రా ఛందస్సులో ఉంటుంది. సరళమైన అలతి అలతి తెలుగు నుడులకు గుడి వంటిది. పల్లవి రెండు లేక నాలుగు పంక్తులతో మొదలై 3,4 చరణాలతో సమాప్తమవుతుంది. పంక్తుల మాత్రలన్నీ సమసంఖ్యలో ఉంటాయి.  4,6,8,10,12,16 ఇలా మాత్రల సంఖ్య ఉంటుంది. లలిత గీతం గాన యోగ్యత గలిగి ఉండటం ప్రధాన లక్షణం. గాన యోగ్యమైతేనే గేయం.

లలిత గీతానికి యతి నియమం, అంత్యప్రాస నియమం కూడా ఉంటుంది. కొందరు యతినే పాటిస్తారు. కొందరు కవులు అంత్యప్రాసను పాటిస్తారు. రెండూ పాటిస్తే గీతం చాలా అందంగా ఉంటుంది. వినసొంపుగా ఉంటుంది.

హ్రస్వాలన్నీ ఏకమాత్రికలు. దీర్ఘాక్షరాలన్నీ ద్విమాత్రికలు. ఒక మాత్రను లఘువు అనీ, రెండు మాత్రలను గురువు అని  కూడా అంటారు. లఘువు గుర్తు =I గురువు గుర్తు U. లయను సామాన్యార్థంతో వాడతారు. లయ విభిన్నగతులలో కనపడినప్పుడు తాళం అంటారు. ఉదా|| చతురస్రగతి, మిశ్రగతి, త్రిశ్రగతి. ఇవన్నీ తాళాల పేర్లు.

తాళం లేకుండా గేయమే ఉండదు. లలిత గీతానికి 5 ప్రధాన లక్షణాలు. 1. పల్లవి, 2. గతి లాలిత్యం, 3. ఏకకర్మత్వం, 4. తాళం, 5. పరమార్థ లక్ష్యం: భావోన్మీలత.

జానపద గీతాలు ఆశువుగా వచ్చేవి. పల్లెవాసులు వాళ్ళకొచ్చిన భాషలో యాసలో పాడుకున్నవి. వాటిలో ప్రామాణిక భాష దృష్ట్యా ఎన్నో భాషాదోషాలు, వ్యాకరణ దోషాలు ఉండవచ్చు.  జానపద గీతానికి పరిణామదశ లలిత గీతం అనవచ్చును. ఇందులో పరిశుద్ధమైన భాషతో, వ్యాకరణయుక్త పదబంధాలు ఉంటాయి. శిష్ట వ్యావహారిక భాష, సరళశైలిలో కనిపిస్తాయి.

లలితగీతాలు మొదట ప్రేమ, విరహం, ప్రకృతి, మానవత్వం భావుకతతోనే వెలువడ్తాయి. తరువాత దేశభక్తి, దైవభక్తి, సామాజిక చైతన్యం, సామయిక సమస్యలు – ఇలా ఎన్నో అంశాలు లలిత సంగీతంలో ఆవిష్కృతమవుతాయి.

ఎందరో కవులు, పండితులు, వర్ధమాన, వర్తమాన రచయితలు లలిత గీత రచన పట్ల ఆకర్షితులవుతున్నారు. దేశ స్వాతంత్ర్య సమర సందర్భాలలోనే లలిత గీతాల  రచన ఆరంభమైంది. సుప్రసిద్ధ తెలుగు లలిత గీత గాయకులు చిత్తరంజనంగారు లలిత సంగీతంపైన పాఠ్యప్రణాళికా రచన చేశారు.

గురజాడ, చిలకమర్తి, రాయప్రోలు, అబ్బూరి, విశ్వనాథ, నండూరి, బాపిరాజు, బసవరాజు, దేవులపల్లి, దువ్వూరి, కవికొండల, తల్లావజ్ఝల, బసవరాజు, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, చావలి బంగారమ్మ బసవరాజు రాజ్యలక్ష్మమ్మ, మల్లవరపు విశ్వేశ్వరరావు, బాలాంత్రపు రజనీకాంతరావు, శ్రీశ్రీ, కొనకళ్ళ వెంకటరత్నం, వింజమూరి శివరామారావు, ఇంద్రగంటి, పైడిపాల, బోయిభీమన్న, పుట్టపర్తి, దాశరథి, సి.నారాయణరెడ్డి, కందుకూరి రామభ్రదరావు, శశాంక, బాపురెడ్డి, సుశీలాదేవి, ఆచార్య తిరుమల, ఆరుద్ర, తిరుమల శ్రీనివాసాచార్య, గిడుగు రాజేశ్వరరావు ఊటుకూరి సత్యనారాయణ, పిలకాగణపతి శాస్త్రి మొదలైన కవిశేఖరులెందరో గత శతాబ్దంలో లలితగీతాలు రాసి ప్రసిద్ధులైనారు. డా||వడ్డేపల్లి కృష్ణ లలిత గీతాలపైన సిద్ధాంత గ్రంథం రాసి ph.d తీసుకున్నారు.

ఆకాశవాణి కేంద్రంవారు ఈ లలిత గీతాలకు స్వయంగా బాణీలు కట్టి, తాము పాడి, ఎందరో గాయనీ గాయకుల చేత పాడించి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.  వారిలో వింజమూరి అనసూయాదేవి, సీత, రజని, బి.వి.నరసింహారావు సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల, బాలమురళీకృష్ణ, పాలగుమ్మి విశ్వనాథం, బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి, భానుమతి, యస్. వరలక్ష్మి, రాజరత్నం, సుందరమ్మ, మల్లిక్, జగన్నాథరావు, చిత్తరంజన్, లబ్ధప్రతిష్ఠులు.

తరువాతి తరం గేయ కవులలో వడ్డేపల్లి కృష్ణ, బలభద్ర పాత్రుని రమి మధు, కోపల్లె శివరాం, తిరునగరి, ఎం.కె.రాము, జైహింద్ రెడ్డి, మృణాళిని, చిల్లర భవానీదేవి, సుధామ, కృష్ణమోహన్, శర్మ, సుద్దాల అశోక్ తేజ నాగపద్మినీదేవి, ఓలేటి పార్వతీశం, వి.ఎస్.నారాయణమూర్తి, చిమ్మపూడి శ్రీరామమూర్తి, వై.రామకృష్ణారావు, మొదలైనవారు పేర్కొనదగినవారు.

లలిత సంగీత గాయనీ గాయకులలో శశి కళాస్వామి, స్నేహలత, సురేఖామూర్తి, మితిల, చంద్రతేజ, మూర్తి విశ్వనాథ్, రామాచారి, ప్రభాకర్, చంద్రకాంత, కన్నరావు, సాయిబాబా, విన్నకోట మురళీకృష్ణ, ఎమ్.ఆర్.కె.ప్రభాకర్, వేదవతి, ఛాయాదేవి, రమణ, సురేశ్, శారదారెడ్డి, నిత్యసంతోషిణి, పద్మావతి, గోపికాపూర్ణిమ, సునీత, విజయలక్ష్మి, గాయత్రి, గీతామాధురి, మాళవిక, కౌశిక్, కల్యాణ్, హేమచంద్ర, చిమ్మపూడి, బాంధవి, రమణకుమారి, జ్యోత్స్న, వెంకట్రావు, మొదలైనవారు పేరు గడించారు.

లలిత సంగీత దర్శకులలో బొబ్బిలి భాస్కర్ రెడ్డి, వల్లూరి సుధీర్ కుమార్, గోపాలకృష్ణ, విన్నకోట, బంటి, స్నేహలతా మురళి, విశ్వనాథ్, ప్రభాకర్, సాయిబాబా, కలగా కృష్ణమోహన్ మొదలైనవారు ప్రముఖులు.

ఆధునిక కాలంలో గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులు ఇంకా ఎంతోమంది తమ ప్రతిభాపాటవాలు చూపుతున్నారు.

ఇవాళ పాట అనగానే చాలామంది సినిమాపాట అనే అనుకుంటారు. సినీ గీతానికి లలిత గీతమే బీజం. లలిత సంగీతానికి సంబంధించిన సేవ ఆకాశవాణి, దూరదర్శన్లు మాత్రమే చేస్తున్నాయి. ఈ దిశగా ఇంకా ముందుకు పోవాల్సి వుంది. ప్రసిద్ధ గీత రచయితలు, సంగీత దర్శకులు గాయనీ గాయకుల్ని ఇతోధికంగా ప్రోత్సహించి, వారి ప్రతిభకు పట్టం కట్టవలసి ఉంది. లలిత గీతం నవ సుప్రభాతాన్ని మళ్ళీ చూడగలదని ఆశిద్దాం! లలిత గీతం ఇటు శ్రవణపేమతను; అటు భావగమ్యతను సంపుటీకరించే మధుర సంగీత స్రవంతి.

ఆకాశవాణి – లలిత సంగీతం

లలితగీతాలు మొదట పత్రికాముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. ప్రప్రథమంగా 16.6.1938లో మద్రాసులో ఆకాశవాణి ప్రారంభమైంది. అప్పటి బ్రిటిష్ గవర్నర్ ‘లార్డ్ ఎర్స్ కిన్’ ప్రారంభోత్సవ సందేశాన్ని ప్రసారం చేశారు. ఓ వారం తర్వాత అనార్కలి నాటకం తెలుగులో ప్రసారమైంది. అందులో ఆచంట జానకిరాం, దేవులపల్లి, విశ్వనాథ, ఊటుకూరి సత్యనారాయణ, వింజమూరి లక్ష్మీనరసింహారావు, పిలకాగణపతిశాస్త్రి ముద్దుకృష్ణ లలిత గీతాలు ఆ నాటకంలో వచ్చాయి. వీటినప్పుడు నాటక గీతాలన్నారు. 1939లో మల్లవరపు విశ్వేశ్వరరావుగారి బిల్హణీయం నాటకం ప్రసారమైంది. తర్వాత మోహినీ రుక్మాంగద, చండీదాసు, అతిథి శాల నాటకాలలో కూడా లలిత గీతాలు వచ్చాయి. 1941-42 నుంచి ‘గీతావళి’ కార్యక్రమాల ద్వారా లలిత గీతాలు ప్రసారమయ్యాయి. 1954 నుంచి లలిత సంగీతం పేరుతో గీతాలు ప్రసారమై క్రమంగా విశేషంగా ప్రాచుర్యం పొందాయి.

మద్రాసుతోపాటు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో రజని, బాలమురళీకృష్ణ, పాలగుమ్మి విశ్వనాథం లలిత సంగీత ప్రయోక్తలుగా వ్యవహరించారు.

లలిత సంగీతం కర్ణాటక సంగీత చ్ఛాయలతోను, అన్యప్రాంతీయ సంగీతపు చాయలతోను ప్రసారం కాసాగాయి. సాహిత్య ప్రధానంగా సరళంగా తేలికైన గమకాలతో పాడేది లలిత సంగీతం – అన్నారు సుప్రసిద్ధ సంగీత శాస్త్రవేత్త రజని. 1940లోనే బసవరాజు అప్పారావుగారి రచన బాలసరస్వతిగారు మద్రాసులోనే గానం చేశారు.

1, దినదినమూ పాపణ్ని దీవించి పొండి

  1. కావ్యపానము చేసి కైపెక్కినానే

మొదలైన పాటలకు సాలూరి రాజేశ్వరరావు బాణీలు కూర్చారు.

  1. తలుపు తీయునంతలోనె తత్తరమది ఏలనోయి (బసవరాజు)
  2. కోయంచుకూయకే – కూయకే కోయిలా
  3. రెల్లు పూల పానుపుపైన – దేవులపల్లి
  4. కన్నారనిన్ను చూడనా
  5. వినవే చెలీ పిలుపు అల్లదిగో
  6. నల్లనివాడా నే గొల్ల కన్నెనోయి – వింజమూరి
  7. పాడకోమామా! నా గుండె కుదిపే పాడకు పాడకు – శ్రీ శ్రీ
  8. సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ (ఇంద్రగంటి)
  9. ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు (ఆరుద్ర)
  10. నిండు పున్నమి పండు వెన్నెలలో (దాశరథి)
  11. ముసురేసిందటే (కొనకళ్ళ)
  12. మ్రోయింపుము జయభేరి (రజని)
  13. ప్రాభాత ప్రాంగణమున (దేవులపల్లి)
  14. మాదీ స్వతంత్ర దేశం (రజని రచన – గానం టంగుటూరి సూర్యకుమారి)
  15. యాత్రికుడా? గానం సాలూరి, రచన – మల్లవరపు
  16. పసిడి మెరుంగుల తళతళలు రజని రచన – గానం భానుమతి (1.10.53)
  17. అన్నాడే వస్తానన్నాడే (రచన, గానం వల్లూరి జగన్నాథరావు)
  18. పూలదోసిళ్ళెత్తరా (ఇంద్రగంటి)
  19. పూలదీపమెత్తరావే (గానం చిత్తరంజన్) దాశరథి రచన.
  20. . ఏలా ఈ మధుమాసము? సినారె రచన.

తొలి నాళ్ళలో దేవులపల్లి గేయాలే అధికంగా ప్రసారమైనవి.

  1. జయజయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి….
  2. రామచరణం రామచరణం
  3. నారాయణ అల్లా అల్లా!
  4. ఉప్పొంగి పోయింది గోదావరి (అడివిబాపిరాజు)
  5. తెప్పవోలిక చంద్రబింబం (మల్లవరపు)
  6. దేశమును ప్రేమించుమన్నా (గురజాడ)
  7. ఏ దేశమేగినా (రాయప్రోలు)
  8. త్రిలింగ దేశం మనదేనోయం (పైడిపాటి)
  9. తలనిండ పూదండ దాల్చిన దానా…. (దాశరథి)
  10. ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట (కందుకూరి రామభద్రరావు)
  11. చెయ్యెత్తి జైకొట్టు (వేముల పల్లి శ్రీకృష్ణ)

ఇంకా వక్కలంకల లక్ష్మీపతిరావు, నెల్లుట్ల వెంకటేశ్వరరావు, మధురాంతకం రాజారాం, జైహింద్ రెడ్డి, విద్యాసాగర్, పులికంటి, ఆనందమూర్తి, జొన్నవాడ రాఘవమ్మ, గంగరాజు సుశీలాదేవి, దుర్గానాగరాజు, శారదా అశోకవర్ధన్, యం.పద్మినీదేవి, పాపారావు, రాఘవరావు, అర్జునగౌడ్, శంకరకవి, శ్రీనివాసబాబు, అందెశ్రీ, నండూరి విఠల్, చైతన్య ప్రసాద్ మొదలైన వారెందరో గీత రచయితలుగా ప్రసిద్ధులు.

ఆధునిక గీత రచయితలు ఇప్పటికీ లలిత గీతాలు రాస్తున్నవారు – కలగా కృష్ణమోహన్, వడ్డేపల్లి కృష్ణ బలభద్ర పాత్రుని రమణి, రాము, ఓలేటి చిమ్మపూడి, మధు, నాగలక్ష్మి, ఎస్.వి.ఎల్.ఎన్ శర్మ, మిక్కిలినేని భగవంతరావు తదితరులు.

ఆధునిక గాయనీ గాయకులలో శశికళాస్వామి, సురేఖామూర్తి, ప్రసన్న లక్ష్మి, అవంతి, ఆమని, రమణమూర్తి జయలక్ష్మి, చంద్రతేజ, బాంధవి, కనకదుర్గ, అరుణసుబ్బారావు, నిత్య సంతోషిణి, హిమబిందు, రమణ, సురేష్, మూర్తి, రుక్మిణి, శైలజ, జ్యోత్స్న, పద్మశ్రీ నరసింహా, శంకర్రావు ఇలియాస్, శిరీష, నిష్మా మొదలైనవారు ఎందరో గాయనీ గాయకులు లలిత సంగీతం మెట్టు ఎక్కి చిత్రసీమలో స్థానం సాధించుకుంటున్నారు.

 

 

August 20, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
కవితలు

కంటిదీపాలు*

by Nv Raghveerpratap August 20, 2021
written by Nv Raghveerpratap

అభివృద్దికి నోచని అడవుల్లో

ఆనవాళ్ళు కరువైన వన్యప్రాణులు

ఆకాశం నిండా

ఆనందంతో స్వేచ్ఛగా

రెక్కలల్లార్చి ఎగరాల్సిన పిల్లపక్షులు

కాలుష్య కాసారాలలో

చిక్కుకు పోతున్న వైనాలు

హాస్టల్ ఇరుకుల గదుల్లో

కోల్పోతున్న చురుకుదనాలు

మార్కుల మహాపందేరంలో

మసకబారుతున్న మస్తిష్కాలు

ర్యాంకుల సాధనే ధ్యేయంగా

శరవేగ మవుతున్న పరుగులు

ధన సంపాదనే లక్ష్యంగా

విలువలకు తిలోదకాలు..

బాల చంద్రుల భవితవ్యంలో

కల్హారాలు మొలిపిస్తున్న

కార్పోరేట్ విద్యా సంస్థలు

ప్రపంచానికి వెల్గులు పంచినోళ్ళం

కంటి దీపాల్ని కొడగట్టించడమేంటి?

చీకటి ఛాయలేవి

అలముకోనీకుండా

రేపటి పౌరుల మేధస్సులో

విలువల జ్యోతుల్ని వెలిగింపజేయాలి

చదువును వ్యాపారం చేస్తున్న

వ్యవస్థలకిక పిండ ప్రధానం చెయ్యాలి.

 

August 20, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

కళతప్పిన వేడుక

by సంధ్య సుత్రావె, August 20, 2021
written by సంధ్య సుత్రావె,

ఈ వేకువ చిన్నబోయి

పంద్రాగస్టు వేడుకకు రాని

బడిపిల్లల  పాదముద్రలకోసం ఎదురు చూస్తున్నది

నిద్రలేచి అందంగా

ముస్తాబై  ముందస్తు ప్రణాళికతో

అందరికన్నా ముందుగా

బడిలో ఉండాలనే

ఉత్సాహంతో

ఆనందంతో

ఒకరితో ఒకరు పోటీపడిన పచ్చని జ్ఞాపకాలు మదిలో తారాడుతున్నవి

సాంస్కృతిక కార్యక్రమాల సందడిలో తానొక తేజం కావాలని

పాటలో పాటగా పాల్గొనాలని,బడి అంతా

తమని మెచ్చుకోవాలనే ఉబలాటం మూడు రంగుల తోరణం లా తొందరిస్తుండేది

టీచర్ల సూచనలు , దోస్తుల ప్రోత్సాహం

స్పీచ్ లు  రాసుకొని

స్టేజి పై చెప్పాలన్న కోరిక తెల్లని ఇస్త్రీ దుస్తుల్లా మెరుస్తుండేది

కాలం చేసే వింతలలో కననివెన్నో

విననివెన్నో నిత్యం తారసపడుతున్న ఈ వేళ

పాఠశాల ప్రాంగణాన్ని

తరగతి గదులను,

అందంగా అలంకరించుకొని

వేడుకను నిర్వహించాలనుకొనే

విద్యార్థుల  సంతోషాల  జాడనెత్తుకెళ్ళిన విపరీతమిది

కోవిడ్ మహమ్మారి కనుసైగ

కారణంగా టీచర్లు మౌన ఋషులయ్యారు

మూతికి మాస్కులతో

పాటించే భౌతికదూరం  తో

కొత్త గీతాలేవో ఆలపిస్తున్నారు.

విద్యార్థులులేక

బోసిపోయిన బడి నిశ్శబ్దాన్ని మోస్తున్న తల్లిలా ఉన్నది

బాధగా,

భారంగా

తప్పనిసరిగా జెండాను

ఎగురవేసి జనగణమణ

గీతాలాపన వేళలో

స్వాతంత్య్ర పోరాటాలను కాదు విద్యార్థులను

గుర్తుతెచ్చుకొంటు కోరేదొక్కటే

త్వరగా

వరంగా

ఈస్థితి  మారగా

మునుపటిలా

మల్లెలు నవ్వినట్టు

పక్షులు ఎగిరినట్టు

విద్యార్థుల గలగలలతో

కిలకిలలతో

ఆనందంగా

ఈ స్వాతంత్ర్యదిన వేడుకను

ఎప్పటిలా

కళ తప్పని కళగా

విద్యార్థుల సందళ్ల  సజీవత్వం ఉట్టిపడేట్టు

ఉల్లాసపరిచేట్టు

ఉర్వి మురిసేట్టు

జెండావందనం కళ తప్పిన వేడుక  కావద్దనే అందరి కాంక్ష

____________

August 20, 2021 0 comment
8 FacebookTwitterPinterestEmail
కవితలు

‘తెలుగు-వెలుగు!

by cvl sujatha August 20, 2021
written by cvl sujatha

పోతన కలం నుండి

సుమ సౌరభ పరిళాలు

వెదజల్లిన భాష..

సిరులు పొంగు భరతభూమి

పసిడి కాంతులు విరజిమ్ముతూ

దశదిశలా కీర్తి గాంచిన అమృతభాష..

గిడుగు వారి వ్యవహారిక రీతిలో వ్యాప్తి చెంది..

తెలుగుదనం విలువ పంచిన అమ్మభాష..

ఆదికవి నన్నయ్యకు ఖ్యాతి నొసగిన

మధుర భాష..

అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య పదకృతులై

అమృతాన్ని కురిపించే

తేనెలూరు తియ్యని భాష..

పద్య,గద్య, గేయ రూపాల్లో అలరారుతూ..

ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ గా

ప్రణతులందుకున్న కమ్మనైన గుమ్మపాల భాష..

అజరామరమై బ్రౌను సేవనలరారిస్తున్న అజంత భాష..

విశ్వనాథ వారి వినసొంపు రచనలు

కృష్ణశాస్త్రి గారి కవితాకుసుమాలు

నండూరి వారి ఎంకి సొంపు సొబగులను పొదువుకున్నది నా మాతృభాష..

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ తెలుగు..

ఘంటసాల, బాలమురళీ కృష్ణ, బాలు గారి కంఠస్వర మాధుర్యం తెలుగు..

విశ్వవిఖ్యాతి తెలుగు..

సంస్కృతి సంప్రదాయాల నెలవు..

హృదయాంతరాల కొలువు..

తెలుగు మన వెలుగు.!

August 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అంతరాలు

by Dr. Kasarla Rangarao August 20, 2021
written by Dr. Kasarla Rangarao

జ్యోతికి పన్నెండు, పదమూడు సంవత్సరాలు. చాలా చలాకీ పిల్ల. అమెరికా నుండి తల్లిదండ్రులతో సహా ఒక నెలరోజులు గడపటానికి హన్మకొండ వచ్చింది. వాళ్ళ బామ్మ, అమ్మమ్మ, తాతమ్మలతో వారి అనుభవాలను తెలుసుకొని ఒక వ్యాసమో, కథో వ్రాయాలని ఒకటే ఉబలాటం. తాతమ్మ శాంతాదేవి దగ్గర చనువెక్కువ. మీ తరానికి యిప్పటికి పోలికలు, తేడాలు తెలుపమని ఒకటే గొడవ. ముని మనవరాలు పోరు పడలేక శాంతాదేవి ఇలా చెప్పసాగింది. మా అప్పుడు తొమ్మది, పది సంవత్సరాల వయసుకే పెళ్ళిళ్ళు చేసేవారు. నాకు మా అత్తలు ముగ్గురు అక్కచెళ్ళెలు.

ఒకామె ఇగో హన్మకొండ, మీ ముత్తాత గారి తల్లి, ఇంకొకామె దేశముఖుగారి భార్య. మూడవ ఆమె బాలవితంతువు.

జ్యోతి వెంటనే అడిగేసింది :  అయ్యో తాతమ్మా! మరి ఆ తాతమ్మకు మళ్లీ పెళ్ళి చేయలేదా?

శాంతాదేవి : ఆ కాలంలో చెయ్యలేదే. మాటికి అడ్డం రాకు. చెప్పేది విను. మా మావగారు కరణం. చాలా నిక్కచ్చి మనిషి. చాలామందికి సహాయం చేసేవారు. ఎంతోమంది ఈ యింట్లో తిని వెళ్ళినవారే.  తమ పనులన్నియు చక్క దిద్దుకున్నవారే. మాకు ఐదుగురు ఆడబిడ్డలు. నాకు యిద్దరు యారాండ్లు. భూములు వ్యవహారాల్లో మామగారికి వారి ముగ్గురి కొడుకులకి పొరపొచ్చాలు, గొడవలు, పంచాయతీలు వచ్చినా, మేం ముగ్గురం ఎప్పుడూ గొడవలు పడలేదు.

జ్యోతి : ఓహో! సరే తాతమ్మా, మీరెంతమంది అక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నదమ్ములు,

శాంతాదేవి : మా అమ్మకు ఆరుగురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు. అందులో ఒక పిల్లాడేమో పుట్టగానే చనిపోయాడు. ఆ విధంగా నాకు ఐదుగురు అన్నయ్యలు. ముగ్గురక్కలు.

జ్యోతి : ఐతే తాతమ్మా, మీతరం చదువుకోలేదు. అయితే అమ్మమ్మ లందరూ చదువుకున్నారు కదా! అందులో ముగ్గురు కూడా టీచరుద్యోగాలే చేశారు.

శాంతాదేవి: ఔనే. మా తరానికి యీ యింటికి ఏడుగురు కొడుకులు. అందులో నలుగురు ఇక్కడ వున్నారు. ముగ్గురు అమెరికాలో స్థిరపడ్డారు.

జ్యోతి : ఓ తాతమ్మా, అమ్మ, బామ్మ వాళ్ళు, వేయి స్థంభాలగుడికి, భద్రకాళి గుడికి వెళ్ధామంటున్నారు.

శాంతాదేవి : సరే వెళ్ళిరావే. అక్కడి వివరాలు, విశేషాలు వాళ్ళనే అడుగు. ఒక్క నా ఒక్కదాని బుర్రతింటే ఎలా! వాళ్ళను కూడా ప్రయత్నించు.

జ్యోతి : సరే తాతమ్మా! బై.

*    *  *

ఆ రోజంతా వేయి స్థంభాల గుడి, భద్రకాళి గుడి సందర్శనలతోనే గడిచింది. జ్యోతివాళ్ళ బామ్మ, అమ్మమ్మలకు ఎక్కువ విషయాలు తెలియవు కాబట్టి ఆయా గుళ్ళ శంకుస్థాపన వివరాలు, పురాతత్వ బోర్డులు చూపించి తప్పుకున్నారు. సాయంత్రం ఈ సీమటపాకాయ పేపరు, పెన్నుతో సిద్ధం.

జ్యోతి : తాతమ్మా! ఈ నీరెడి కొమురయ్య వాళ్ళట ఎవరు, వారికి ముత్తాత గారికి చాలా దగ్గరట ఎందుకు?

శాంతాదేవి : నీకీ విషయం ఎవరు చెప్పారే?

జ్యోతి : అదే గుడిలో నీరెడి కొమురయ్య వాళ్ళ వాళ్ళు పెద్దమ్మమ్మను గుర్తుపట్టి మాట్లాడారు.

వాళ్ళ మాటల్లో గ్రహించాను.

శాంతాదేవి : మరి పెద్ద అమ్మ్మనే అక్కడే అడగక పొయ్యావా, తీరిగ్గా గుర్తుపెట్టుకొని అడుగుతున్నావ్.

జ్యోతి : ఆఁవాళ్ళనడిగితే నీకెందుకే ఇవన్నీ పొట్టిబుడంకాయం అన్నారు, తాతమ్మా.

శాంతాదేవి : ఆహాఁ, అలాగా, ప్రతి గ్రామంలో చెరువు నీరు పారకం, బాగోగులు చూడటానికి వుండేవారినే నీరెడివారు అంటారు. నీరు + ఇడి నీరు యిచ్చేవారే నీరెడివారు. కరణం ఆధ్వర్యంలో గ్రామపరిపాలనంతా సాగేది. యెలవాళ్ళు, షేకం సింధీలు కరణం చేతి క్రింది వుండి తోడ్పడేవారు. శిస్తు వసూళ్ళు పై అధికారులు వచ్చినపుడు ఏర్పాట్లు చూసేవారు. మా మామగారు రైతు అనుకూలురుగా మంచి పేరు నిలుపుకున్నారు. అప్పటి నీరెడివారి వయసు, మీ ముత్తాత వయసు ఒకటే సమ వయస్కులవటం వల్ల వారి మధ్య చనువెక్కువ. మీ ముత్తాత గారు పదవతరగతి కాగానే ఉద్యోగంలో చేరిపోయారు. ఆ తర్వాత క్రమక్రమంగా పరీక్షలు ప్యాసై యం.ఎ.బి.ఇడి అయ్యారు. గెజిటెడ్ హెడ్మాస్టర్గా పదవీ విరమణ చేశారు.

జ్యోతి : భద్రకాళి గుడిలో మన ఊరి వారట తాతయ్యతో కలిసి చాలాసేపు, చాలా ఆత్మీయంగా మాట్లాడారు. మీరు పదిహేను సంవత్సరాలు ఆ ఊరిలో ఉన్నారట కదా! ఎందుకు, చాలామంది ఊళ్ళళ్ళ నుంచి హన్మకొండకొస్తే మీరెందుకు ఊరికి వెళ్ళారు తాతమ్మా!

శాంతాదేవి : మీ తాతయ్యనే అడుగక పోయావానే సీమ టపాకాయ్.

జ్యోతి : అది కాదు తాతమ్మా! నీ కొడుకు కొంత చెప్పేసి నీ కెందుకే వివరాలు అని అధరగొడతాడు. నీ దగ్గరున్నంత మాలిమి, చనువు నాకెవ్వరి దగ్గరా లేవు. అందుకే నిన్ను అడుగుతున్నాను.

శాంతాదేవి : సరేనే నా తల్లి. ఆ రోజుల్లో మా మావగారికి మీ ముత్తాతగారికి ఏవో పొరపొచ్చాలు, పట్టింపులు వచ్చి మా మామగారు, మీ ముత్తాతగారిని ఊరి భూముల సేద్యానికి పంపించారు. అక్కడ మీ ముత్తాతగారు అందరితో మంచిగా వుండి మంచి పేరు తెచ్చుకున్నారు. మేము ఊరికి వెళ్లిన తర్వాతే అక్కడ విద్యుత్ సౌకర్యం, తారు రోడ్లు వచ్చాయి.

జ్య్తోతి :  మరప్పుడు నీవు గోల చేయలేదా, తాతమ్మా.

శాంతాదేవి : ఆఁ ఆ రోజుల్లో అత్తమామలకీ, భర్త, ఆడబిడ్డలకీ ఎదురు చెప్పలేదు. మా రోజుల్లో పద్ధతులావిధంగా ఉండేవి. మెల్లమెల్లగా మన ఊరు కూడా పట్టణంలో కలిసిపోయింది. అక్కడ కళాశాల, ఇంగ్లీషు మీడియం హైస్కూల్స్ వచ్చాయి. అంతకుముందే ఉన్న ప్రభుత్వ పాఠశాల క్రమక్రమంగా ఉన్నత పాఠశాలయింది.

జ్యోతి : ఓహో, అందుకేనా తాతయ్య, అమ్మమ్మ వాళ్ళకు ఆ ఊరిలో స్నేహితులున్నారు. ఆ ఊరితో చనువెక్కువన్న మాట.

శాంతాదేవి : ఔనే, క్రమక్రమంగా ఊళ్ళో పిల్లలందరూ చదువుకొని ఉద్యోగరీత్యా అంతటా వ్యాపించారు. మీ ముత్తాత దగ్గర చదువుకున్నవారు చాలామంది ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆ రోజుల్లో పండుగలంటే ఊరంతా కలిసిమెలిసి కలిమిడిగా బాగా జరుపుకునేవాళ్లం.

జ్యోతి : ఐతే తాతమ్మా! అక్కడ అమెరికాలో అంటే మా దగ్గర కొంతమంది పిల్లలకు, తల్లో, తండ్రో ఒకరే ఉంటారు. ఇక్కడ ఆ పద్ధతులింకా రాలేదా!

శాంతాదేవి : ఏమోనే, బొంబాయి, హైదరాబాదుల్లో వచ్చినట్లుంది. ఇక్కడ కూడా అక్కడక్కడ ఉందేమో నాకు తెలియదు. ఐనా అటువంటి పద్ధతులు మంచివి కావు. పిల్లలకి తల్లిదండ్రులిద్దరి అవసరం, ఆజమాయిషీ కావాలి.

జ్యోతి : తాతమ్మా! మీ మామగారి నుంచి నీ మనవడి వరకు పరిస్థితులు ఎలా మారాయో, మీ పరిశీలనలేంటో తెల్పండి.

శాంతాదేవి: ఏముందే ఆస్థులు తరిగాయి. అంతస్థులు పెరిగాయి. మా మామగారు ఫ్యూడల్ ప్రజాస్వామ్యవాది. మూడు ఊళ్ళలో ఆస్థులుండేవి. ఎక్కువగా కాలినడకన, ఎప్పుడో కాని రిక్షాలో వెళ్ళేవారు. రెవిన్యూ విషయాలు, కరణీకం, కోర్టు వ్యవహారాలు ఎప్పుడూ వారికి చేతినిడా పని. ఆయన సైకిల్ కూడా వాడలేదు. కానీ పెద్దొర, పెద్దొర అని చాలా పేరు ప్రతిష్టలు ఉండేవి. ఇంక ఆయన కొడుకులు ముగ్గురూ బడిపంతుళ్ళే. ఫ్యూడల్ వాసనలు పోని ప్రజాస్వామ్యవాదులు. ఇంక మీ తాతయ్యలు, అమ్మమ్మలందరూ సోషలిస్టు ప్రభావజాలంతో స్నేహితులతో మెదిలి పెద్ద చదువులు చదివి ఉద్యోగస్థులయ్యారు, ఇంక మీ నాన్నలు విదేశాల్లో స్థిరపడి, మీరు అక్కడే పుట్టారు. మా మావగారి హయాంలో ఎందరో రాజకీయ నాయకులు, కవులు మన ఇంటి దగ్గరికి వస్తుండేవారు. బంధువులు కూడా బాగా వచ్చేవారు. ఐతే ఆ చుట్టరికాలు, కలిమిడులూ, కలుపుగోలు తనాలూ, ఆస్థులూ అన్నీ తగ్గిపోయి, కార్లూ, ఫ్లాట్లూ, ఉద్యోగాలూ, విదేశాలకు వలస వెళ్లటాలూ పెరిగాయి. మీ ముత్తాతలు సైకిలు పైబడులకెళ్లేవారు. మీ తాతల హయాంవరకు బండ్లు వచ్చాయి. మీ నాన్నల కాలానికి కార్లు వచ్చాయి. నీ తరానికి విమానాలూ, హెలికాఫ్టర్లు వచ్చాయే సీమటపాకాయా!

జ్యోతి : హమ్మ! ఎంత మార్పు చెప్పావు తాతమ్మా, మరి మీ కాలంలో మీరు ఎలా వెళ్లగలిగారు?

శాంతాదేవి : మాకు మొద్దుబండ్లు, సవారి కచ్చరాలుండేవి. ఆ తర్వాత టాంగాలు, రిక్షాలుండేవి. బస్సులు, ఆటోలు ఆ తర్వాత వచ్చాయి.

జ్యోతి : మరిప్పుడు తాతమ్మా! మీ మావగారి తరం నుంచి నా వరకు ఎన్ని తరాలయ్యాయి. ఊ…..1,2,3,4,5 తరాలయ్యాయి. ఇంక రెండు తరాలయితే ఏడుతరాలౌతుంది కదా.

శాంతాదేవి : ఆఁ అటు ఏముందీ మా మావగారి తండ్రిగారు గ్రామ కరణం. మా మావగారు పట్నం ఇల్లరికపు టల్లుడు. దాంతో పట్నం కర్ణీకం కూడా మా మావగారికే వచ్చి చేరింది. మా మావగారి తల్లికి అన్నదమ్ములు లేరు. వాళ్లిద్దరూ అక్క చెల్లెలు. అందువల్ల మా మామగారి తల్లి ద్వారా కూడా ఆస్థి సంక్రమించింది.

జ్యోతి : భలే, భలే, తాతమ్మా, మీరూ తాతయ్యలూ మాత్ర సంబంధ ఆస్తి అనుభవించారు. మరి మీ తరానికీ యిప్పటి తరానికీ ఆడవారి విషయాల్లో తేడాలేమిటి?

శాంతాదేవి : ఎందుకు లేవే, హస్తిమశకాంతరం ఉంది. మా అప్పుడు చదువులే లేవు. మీ బామ్మలు, అమ్మమ్మలు మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేశారు. మీ అమ్మలు, అత్తయ్యలు సరేసరి. ముందంజలో ఉన్నారు. మీరు ఇంకా మంచి పరిస్థితుల్లో ఉన్నారు.

జ్యోతి : తాతమ్మా! చాలా మంచి విషయాలు చెప్పావు. ఇది కథో, వ్యాసమో వ్రాసిం తర్వాత నీకు పంపిస్తా!!!

శాంతాదేవి : సరేనే తల్లీ, జాగ్రత్తగా విశ్లేషిస్తే, ఇది ఏడు తరాల భోగట్టా ఔతుంది. సరే, సరే!! ఇంక అన్నం తిని విశ్రాంతి తీసుకో. మీకు అన్నీ ప్రయాణాలే కదా!!!!

 

జ్యోతి: పరవాలేదులే, ఇంకా చెప్పవా, మరి తాతమ్మా !! ఇలా మూడు ఊళ్ళ ఆస్థి చేరితే మీ కుటుంబంలో డాక్టర్ , ఇంజనీర్లు , లాయర్లు తయారు కాలేదా

శాంతాదేవి: అప్పట్లో స్వాతంత్ర్యం వచ్చి దేశం అప్పుడప్పుడే కుదుటపడుతోంది. ఆకాలంలో మీ ముత్తాతలు ఆ మాత్రం చదువుకొని ఉద్యోగాలు చేయడమే ఎక్కువ. నేనింతకుముందు చెప్పినట్లు ఆ ప్రజాస్వామ్య భావాలు దేశపరిస్థితుల గురించి ఇంట్లో చిన్నగా చర్చలు జరిగేవి. కమ్యునిస్టు నాయకులు మనింటికి వచ్చేవారు. ఎక్కువగా ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు.మన బంధువులందిరివిషయాలు ఇక్కడే అందరికీ తెలిసేవి. అందుకే అప్పట్లో ఈ ఇంటిని ఆలిండియా రేడియో అనేవారు.ఇల్లు

జల్ జలాటంగా సాగింది. వాళ్ళ నెల వారీ ఖర్చు ఈ ఇంటి చాయనీళ్ళ ఖర్చంత కాదని పేరు పోయింది.

ఇప్పుడేముందే ఉద్యోగాలున్నాయి. ఉద్వేగాలు పెరిగాయి.

రాను రాను సమాజంలో హింస , దౌర్జన్యం పెరిగిపోయాయి. మూర్ఖత్వం , భీభత్సం మూర్తీభవిస్తే ఏ ఉద్యమమైనా ఈ ప్రజాస్వామ్య యుగంలో అణిచి వేయబడుతుందే తల్లీ. ఏదైనా విచక్షణ తో అందర్నీ కలుపుకుపోయేదిగా ఉండాలి.

జ్యోతి : ఆ రోజుల్లో చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టు ల్లో చాలా యేళ్ళు పట్టేదట కదా

శాంతాదేవి: ఔనే తల్లీ ! ఇదేమిటే నీ పొట్టనిండా ప్రశ్నలే ఉన్నాయేమే ,నీ పొట్ట ఓ ప్రశ్నల పుట్టయిందే తల్లీ.

జ్యోతి: తాతమ్మా మా స్కూల్లో నేను NTRగారి డైలాగులతో సుయోధన ఏకపాత్రాభినయం చేశాను . తెలుగు రాకున్నా మా బడి పిల్లలంతా నా హావభావాలు ఉచ్ఛారణ , అభినయం బాగున్నాయని మెచ్చుకున్నారు తాతమ్మా.

శాంతాదేవి:  ఆహా ‌! అట్లానా ,నీకు భారత రామాయణాలు ఏం తెలుసే బుడంకాయా ?

జ్యోతి: ఆ(  అందులో ఏముంది తాతమ్మా కుటుంబంలో ఐకమత్యత లోపిస్తే అష్టకష్టాలపాలవుతారనీ పాపం వ్యాసవాల్మీకులు  ఎంతో ఓపికగా  పురాణేతిహాసాలుగా మలచి మనకందించారు. మన దేశంలో కుటుంబ విలువలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తామని అమెరికా వంటి దేశాలకు చాలా ఆశ్చర్యం తెలుసా.

శాంతాదేవి:ఏమే బుడంకాయ , నువ్వెంత ,నీ వయసెంత అన్నీ పెద్ధ పెద్ద మాటలు మాట్లాడుతున్నావేమే.

జ్యోతి:  నీ మనవడు అదే మా నాన్నే  విడువకుండా , వదలకుండా రోజూ అరగంటపాటు మన విషయాలన్నీ ఇండియా గురించి చెప్పి నేర్పిస్తున్నాడు తాతమ్మా.

శాంతాదేవి:  అసలివన్నీ ఎందుకు చెప్పాడట నీకూ!!!?

జ్యోతి:  అదే తాతమ్మా కౌరవ పాండవులు కలిసి మెలిసి ఐకమత్యం గా ఉంటే కర్ణ,శకునిలు , కృష్ణుడు లాంటి వారికి జోక్యం చేసుకునే అవకాశమే రాదనే వారు.

శాంతాదేవి:  సరే ఇగ అది అలా జరిగితే భారతమే ఉండేదికాదు. భగవద్గీత, విష్ణుసహస్రనామాలు వచ్ఛేవే కావు ,కానీ సరే జరిగిన దాని గురించి గుణపాఠాలు తెలుసుకుని ప్రతి కుటుంబం ఐకమత్యం తో అభివృద్ధి సాధించాలి.

జ్యోతి : థ్యాంకూ తాతమ్మా, చాలా విషయాలు చెప్పావు. ఆ కాలపు విషయాలను ఈ కాలంలో  ముడిపెట్టక తేడాలన్నీ పోయేటట్లు చెయ్యాలని నా ఆలోచన తాతమ్మా! భారతదేశమే ఒక  పెద్ద కుటుంబం లాంటిది కదా తాతమ్మా!

తాతమ్మా : ఔనే! మారుతున్న కాలం విలువను ఇద్దరూ మనస్సులో తర్కించుకుంటూ బాగా చెప్పావు.

ఇక పడుకో తల్లీ!!

నిద్రలోకి జారుకున్నారు. రేపటి వెలుగులు స్వాగతిస్తుంటాయని వాళ్లకు తెలుసు!

August 20, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

మూడు చీమలు

by chittiprolu Subbarao August 20, 2021
written by chittiprolu Subbarao

మూడు చీమలు

భద్రాచలం క్షేత్రంలో మంచిమిత్రులైన మూడు చీమలుండేవి.  అవన్నీ ఒకసారి పాపికొండలు చూడాలనుకున్నాయి.  ఒక్కొక్కటి ఎవరి దారిలో వారు వెళ్ళి పాపికొండల్లో కలుసుకోవాలనే షరతు విధించుకున్నాయి.

గోదావరి ఒడ్డుకు చేరిన మొదటి చీమకు అక్కడ ఒక పడవ కనిపించింది.  మనుషుల మాటలు విని ఆ పడవ పాపికొండలకు వెళ్తుందని అర్థం చేసుకుని పడవ మీద అపాయం లేని ఒక మూలన కూర్చుని ప్రయాణమైంది.

రెండవ చీమ గోదావరి ఒడ్డునే నడచుకుంటూ పాపికొండల వైపు సాగిపోయింది.

మూడవ చీమ కళ్ళుమూసుకుని దేవుడికి ప్రార్థించి గోదావరి నదిలోకి దూకేసింది.

ముందుగా మొదటి చీమ పాపికొండలు చేరింది.  ఇద్దరు మిత్రుల కోసం ఎదురుచూసింది.  ఎట్టకేలకు రెండవ చీమ చాలా ఆలస్యంగా వచ్చి మొదటి చీమను కలిసింది.  ఇక ఆ రెండు చీమలూ మూడవ చీమ కోసం నిరీక్షించాయి.  రోజులు గడిచాయి.  వారాలు గడిచాయి.  కానీ మూడవ చీమ జాడే లేదు.  చేసేది లేక రెండు చీమలూ కలిసి తిరుగుప్రయాణానికి భద్రాచలం వెళ్ళే పడవెక్కాయి.

భద్రాచలం చేరగానే రెండు చీమలూ సరాసరి మూడవ చీమ ఇంటికి వెళ్ళి తలుపుకొట్టాయి.  బయటకు వచ్చిన చీమ దిగులుగా జరిగిన విషయం చెప్పింది.

భద్రాచలం వద్ద గోదావరిలో దూకిన మూడవ చీమ నీటిలో మునిగిపోతూ ప్రాణభయంతో ఈదటం మొదలుపెట్టిందట.  కొంతసేపటికి అలసిపోయిందట.  కళ్ళు తేలేసి నదిలో కొట్టుకుపోతున్న ఆ చీమను ఎదురుగా వస్తున్న ఒక తాబేలు చూసి తన వీపు మీదకు ఎక్కించుకుందట.

చీమ పాపికొండలు పోవాలని తాబేలుకీ, తాబేలు భద్రాచలం పోవాలని చీమకూ అర్థమైంది.  తాబేలు వెనక్కు వెళ్ళదు .  చీమ తనంతట తాను ఈదుకుంటూ పాపికొండలు వెళ్ళలేదు. బతికుంటే పాపికొండలు మళ్ళీ ఎప్పుడైనా చూడొచ్చని తాబేలుతోపాటు భద్రాచలానికే తిరిగివచ్చింది మూడవ చీమ.

విషయం మళ్ళీమళ్ళీ చెప్పీ చెప్పించుకునీ మూడు చీమలూ పెద్దగా నవ్వుకున్నాయి.  కానీ మూడవ చీమకు లోలోపల ఎక్కడో తీరని దుఃఖం మిగిలిపోయింది. ఆ రాత్రంతా నిద్రపట్టక అల్లాడిపోయింది.

మరుసటి రోజు తాను చేసిన పనికీ ఇద్దరు మిత్రుల పనులకూ గల తేడా ఏమిటోనని ఆలోచించుకుంటే విషయం అర్థమై మనసు కుదుటపడి హాయిగా నిద్రపోయింది.

“ఏదైనా గమ్యం చేరాలంటే దేవుడిచ్చిన తెలివితేటల్ని వాడుకోవాలి. దేవుడిచ్చిన దేహంతో కష్టపడాలి. అంతేగానీ దేవుడి మీద భారం వేశామనుకుని గుడ్డిగా ప్రవర్తించకూడదు, తన ప్రయత్నం మానకూడదు.”

 

August 20, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
కవితలు

రెక్కలు

by Peddurti Venkatadasu August 20, 2021
written by Peddurti Venkatadasu
రాసే వాళ్లంతా
గొప్ప
పండితులే
కావచ్చు —
చూసేవాడు
జ్ఞాని!

కాలు
కదపనోడికి
కాలువైనా
కడలే—
సొమరికన్నీ
అమావాస్యలే!

సుడిగుండాలుసునామీలు
కడలికే కాదు
కార్యోన్ముఖులకూ..
చలించనిదే
ధీరత్వం!

ప్రేమను ఆశించడం
అందరి కల
ప్రేమను పంచడం
కొందరి కళ–
కాగితంపువ్వు
పరిమళం పంచదు!

చీకటిని
గెలవడానికి
రవి కూడా
రాత్రంతా ఆగాల్సిందే —
సహనంతోనే
వెలుగు సాధ్యం!

ఏ ఒక్కర్నో కాదు
అందర్నీ
పలకరించేవే
వైఫల్యాలు–
పడిలేచినోడే
ప్రాజ్ఞుడు!
August 20, 2021 2 comments
2 FacebookTwitterPinterestEmail
కవితలు

75 వసంతాల ‘‘మయూఖ’’ భారత ‘‘అమృతోత్సవ’’ పతాక

by Krishna Vaddepalli June 23, 2021
written by Krishna Vaddepalli

నా దేశం వేద పునీత ` భగవద్గీత

నా జెండా శాంతి, అహింసల ‘ఎజెండా’ !

భరతుడు, రాముడు, కృష్ణుడు పరిపాలించిన

గౌతమ, ఆది శంకరాదులు ప్రవచించిన

గంగా, గోదావరి, కావేరి ప్రవహించిన

పావన జీవనక్షేత్రం ` నా దేశం,

విశ్వశాంతి సందేశం ` నా దేశం!

పురుషోత్తమ, చంద్రగుప్తుల ప్రతిఘటనల మార్గం

శివాజీ, ఝాన్సీల స్వాతంత్య్ర ఖడ్గం

సిపాయీల తిరుగుబాటుతత్వం

గాంధీజీ, నేతాజీ నేతల స్వాతంత్య్ర మనస్తత్వం

నా జెండా జవసత్వం !

హిమవన్నగం తలమానికంగా

వింధ్య గిరీంద్రం ఒడ్డాణంగా

కన్యాకుమారి పాదపీఠంగా

అలరారే భారతావని నా దేశం,

పాడిపంటల తులతూగే శ్రీకోశం ` నా దేశం!

హరిత భరిత సస్యశ్యామలం ఆకుపచ్చగా

త్యాగచరిత అరుణవర్ణం లేత ఎరుపుగా

శాంతి ` అహింసల సంకేతం స్వచ్ఛమైన తెలుపుగా

కలగలిసి ఎగిరే మువ్వన్నెల నా జెండా,

పులకిత భారతి మెడలో విరిసే పూదండా !

సాధించుకున్న స్వాతంత్య్ర విజ్ఞానంతో

నా దేశం నాకంలా వర్ధిల్లాలి,

నా జెండా ధర్మచక్రంగా విలసిల్లాలి.

June 23, 2021 1 comment
2 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us