మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
అనువాద సాహిత్యం

అనువాద కుసుమాలు – 1

by Jwalitha June 23, 2021
written by Jwalitha

జీవిత సాహసయాత్రకు సాహిత్యాన్ని చుక్కానిగా ఎంచుకున్న కవయిత్రి, ప్రాణభయాన్ని దేశబహిష్కరణను కవిత్వీకరించిన యోధురాలి పరిచయం….

1966లో నోబుల్ బహుమతి గ్రహీత జర్మన్- స్వీడిష్ కవయిత్రి, నాటకరచయిత, అనువాదకురాలు “నెల్లీసాచ్స్” కవిత్వ పరిచయం

(తెలుగు సేత – జ్వలిత)

” ప్రేమికులు రక్షించబడతారు”

ఎత్తైన గోడల ఆకాశం కింద
ప్రేమికులు రక్షించబడతారు

వారికి
ఒక మర్మపదార్థం ఊపిరినందిస్తుంది
రాళ్ళు ఆశీర్వాదాలుగా దక్కుతాయి

అవన్నీ కాలచక్రంలో
వారితో పాటు మాత్రమే
జన్మభూమిగా అవతరిస్తాయి.

**

ప్రేమికులు రక్షించబడతారు
కేవలం వారికోసమే కోకిలలు రాగాలాపన చేస్తాయి
బధిరత మరణించకుండా
జింకలు, అడవుల్లోని మృదు ఇతిహాసాలు
వారికోసం సౌమ్యంగా దుఃఖిస్తాయి

**

ప్రేమికులు రక్షించబడతారు
అస్తమిస్తున్న సూర్యునిలోని బాధను
నెత్తురోడుతున్న విల్లా చెట్టుకొమ్మలను
వారు కనుగొంటారు

నిశీధిలో, నిశ్శబ్దంగా చిరునవ్వులతో మరణించడం వారు అభ్యాసం చేస్తారు.

వారి కోరికల ఊరేగింపులు అన్నివసంతాల్లో కొనసాగుతూనే ఉంటాయి

**

మూలం – నెల్లీ సాచ్స్
ఆంగ్లానువాదం- రూతండ్ మాథ్యూ మెడ్

“The lovers are protected”

The lovers are protected beneath the walled-up sky.
A secret element gives them breath and they bear the stones into the blessing and all that grows has a homeland only with them.
The lovers are protected and only for them the nightingales sing and have not died out in deafness and the deer, soft legends of the forest, suffer in meekness for them.
The lovers are protected they find the hidden pain in the evening sun bleeding on a willow branch and smilingly in the nights they practice dyin the quiet death with all springs which run in longing.
*(((()))))**

“అప్పుడు వేసవి ప్రారంభంలో”

అప్పుడు వేసవి ప్రారంభంలో వెన్నెల రహస్య సందేశాలను పంపింది, స్వర్గం నుండి లిల్లీపూల అత్తరు పాత్రలతో…

కొన్ని చెవులు వినేందుకు విప్పారాయి
కీచురాళ్ళ కింద భూమి కదలికలతో
తన భాషను మార్చుకుంటుంది ఆత్మల స్వేచ్ఛకోసం

కానీ స్వప్నసీమలో చేపలు గాలిలోఎగురుతున్నాయి
అడవులు హృదిగదిలో తమ వేళ్ళను పాదుకుంటున్నాయి

అయినా మధ్యలో వ్యామోహపు మాటల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది విస్మయంగా

ప్రపంచమా… వంచన చేసే సమయంలో
నీ ఆటలు ఎలా సాగిస్తావు

ప్రపంచమా… మంటల్లో రెక్కలు కొట్టుకుంటున్న సీతాకోకచిలుకల వలె చిన్న పిల్లలు విసరివేయ బడుతున్నారు

మరి, నీ భూమి కనీసం మురిగిన యాపిల్ పండు వలె భయంగొలిపే నరకంలోకి విసరబడ లేదు

ఎప్పటి వలెనే సూర్య చంద్రులు వాహ్యాళికి వెళ్లారు ఏమీచూడని మెల్ల-కన్నుల జంట సాక్ష్యమిస్తున్నది
**

మూలం – నెల్లీ సాచ్స్
ఆంగ్లానువాదం: రూతండ్ మాథ్యూ మెడ్

“When in early summer”
When in early summer the moon sends out secret signs, the chalices of lilies scent of heaven,
some ear opens to listen beneath the chirp of the cricket to earth turning and the language of spirits set free.
But in dreams fish fiy in the air and a forest takes ficm root in the floor of the room.
But in the midst of enchantment a voice speaks clear
amazed:
World, how can you go on playing your games and cheating time-
World, the little children were thrown like butterflies,
wings beating into the flames
and your earth has not been thrown like a rotten apple into the terror-roused abyss-
And sun and moon have gone on walking- two cross-eyed witnesses who have seen nothing.
*(((())))**

కవయిత్రి గురించి:—–

నెల్లీ సాచ్స్ డిసెంబర్ 10, 1891 న బెర్లిన్‌లో జన్మించింది. ఆమె సంపన్నమైన టైర్‌గార్టెన్ విభాగంలో పెరిగింది.
1970 లో 78 సంవత్సరాల వయసులో పెద్దప్రేగు క్యాన్సర్‌తో మరణించింది. నెల్లీ సాచ్స్ చిన్నతనంలో నృత్యం మరియు సాహిత్యాన్ని అభ్యసించింది. ఆమె తన 17 సంవత్సరాల వయస్సులోనే శృంగార కవితలు రాయడం ప్రారంభించింది.
ఆమె జీవితం దాదాపు కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ముగిసింది. సాచ్స్ తండ్రి 1930 లో మరణించారు, కానీ ఆమె మరియు ఆమె తల్లి మార్గరెట్ బెర్లిన్‌లో ఉన్నారు. 1940 లో నిర్బంధ శిబిరానికి నివేదించడానికి వారానికి సమయం ఉందని వారికి తెలిసింది, దానితో వారు దేశం నుండి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. స్వీడన్ నవలా రచయిత సెల్మా లాగెర్లాఫ్ తో నెల్లీకి ఉన్న పరిచయం కారణంగా, సెల్మా స్వీడన్ రాజకుటుంబాన్ని ఒప్పించి  స్వీడన్ నుండి తప్పించుకోవడానికి సహాయం చేశాడు.
నెల్లీ మరియు ఆమె తల్లి స్టాక్‌హోమ్‌కు చేరుకున్న తర్వాత, సాచ్స్ స్వీడిష్ నేర్చుకున్నది. చివరికి అనువాదకురాలిగా పనిని చేసింది.. ఆమె కవిత్వాన్ని స్వీడిష్ నుండి జర్మన్ చట్టానికి విరుద్ధంగా అనువదించింది.

నెల్లీ సాచ్స్ స్వీడిష్, జర్మన్ కవయిత్రి, నాటక రచయిత, అనువాదకురాలు. సాహిత్యంలో ’66 నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆమె కవితలలో “ఇన్ ది హౌస్ ఆఫ్ డెత్”, “ఎలి” ముఖ్యమైనవి.

నెల్లీ జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క శాంతి బహుమతిని అందుకుంది , ఆమె 75 వ పుట్టినరోజు సందర్భంగా ఆమె సాహిత్యానికి నోబెల్ బహుమతి లభించింది.
జర్మన్-స్వీడిష్ కవి, నాటక రచయిత అయిన నెల్లీ భయానక కాన్సంట్రేషన్ క్యాంపు గురించి హృదయం కదిలించేట్టు హోలోకాస్ట్ రాశారు. ఆమె తన ఇంటి నుండి పారిపోయి విదేశంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడం ద్వారా మరణాన్ని తృటిలో తప్పించుకుంది.

1947లో ఆమె తనకు 60 సంవత్సరాల  వయసులో మొదటి కవితా పుస్తకాన్ని ప్రచురించింది.
నెల్లీసాచ్స్  మొదటి కవితా సంపుటి పేరు ‘డెన్ వోహ్నున్గెన్ డెస్ టోడ్స్ లో’ (మరణం యొక్క నివాసాలలో),  ఈ సంకలనంలో మరియు తరువాతి కవితలలో యూదు ప్రజల బాధలను వివరించింది.

1965లో ఆమె జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క శాంతి బహుమతిని గెలుచుకుంది..
ఆమె 75 వ పుట్టినరోజు సందర్భంగా సాహిత్యానికి నోబెల్ బహుమతి గెలుచుకుంది.
సాచ్స్ మరియు ఇజ్రాయెల్ రచయిత ష్ముయెల్ యోసేఫ్ ఆగ్నాన్ సంయుక్తంగా సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందారు. నోబెల్ బహుమతి వెబ్‌సైట్ ప్రకారం, సాచ్స్ కు “ఆమె అద్భుతమైన సాహిత్య మరియు నాటక రచనకు లభించింది”
**

June 23, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

డా . అమృతలత గారితో ముఖాముఖి 

by Rama Devi Nellutla June 23, 2021
written by Rama Devi Nellutla

డాక్టర్ అమృతలత ఒక మంచి రచయిత్రిగా తెలుగు పాఠకులకి తెలుసు . నాణ్యమైన విద్య నందించేపాఠశాలల , కళాశాలల స్థాపకురాలిగా నిజామాబాద్ జిల్లావాసులకు తెలుసు . ఒక మంచి సంపాదకురాలిగా, ప్రచురణకర్తగా ‘ అమృత కిరణ్ ‘ పక్ష పత్రిక పాఠకులకూ , తెలంగాణా ఉద్యమ సమయంలో అక్షర సేనానిగా ‘ గాయాలే గేయాలై ‘ , ‘ వెతలే కథలై ‘ కవితా , కథా సంకలనాల సంపాదకురాలిగా తెలంగాణా అభిమానులకుతెలుసు . వివిధ రంగాలలో విశిష్ట మహిళలకు ఇచ్చే ‘ అపురూప అవార్డుల వ్యవస్థాపకురాలిగా , నిజామాబాద్ సాహిత్య కళా రంగ ప్రసిద్ధులకు బహూకరించే ‘ ఇందూరు అపురూప అవార్డుల ‘ ద్వారాసాహిత్య కళాభిమానులకు తెలుసు . ప్రశాంతమైన పరిసరాల్లో ఒక అందమైన ఆలయాన్ని నిర్మించి ఇచ్చిననిరాడంబర వ్యక్తిగా సామాన్య భక్తులకు తెలుసు .  వీటన్నిటికీ మించి స్నేహశీలి , నిగర్వి , మృదుభాషి , దానశీలి , కర్తవ్య నిర్వహణ లో , క్రమ శిక్షణ లో రాజీ పడని వ్యక్తిగా ఎందరికో తెలిసిన డా . అమృతలత గారి తోముఖాముఖి మయూఖ కోసం :

1 .ప్రశ్న : మీకు సాహిత్యం పట్ల ఇష్టం ఎలా మొదలయింది ? మీ బాల్యం లో సాహిత్యానికి దోహదపడినఅంశాలేవైనా ఉన్నాయా?

జ : చిన్న తనంలో మా పెద్దన్నయ్య దగ్గర ఉండి చదువుకుంటున్నప్పుడు అన్నయ్య ఇంటికి చందమామ , బాలమిత్ర , ప్రజామత , కృష్ణా పత్రిక ,జాగృతి , ఆంధ్ర పత్రిక , ఆంధ్ర ప్రభ ..ఇలా బోలెడు పుస్తకాలుతెచ్చేవాడు . అవన్నీ చదివే దాన్ని . అన్నయ్య ఇచ్చే పాకెట్ మనీ తో నిజామాబాద్ లోని ‘అరుణా బుక్ హౌస్ ‘ లో బాలల బొమ్మల రామాయణం , భట్టి విక్రమార్క కథలు , వేయి శిరస్సులు ఖండించిన అపూర్వచింతామణి పుస్తకాలు కొనుక్కొని చదివేదాన్ని . సెలవుల్లో జక్రాన్ పల్లికి వెళ్ళినప్పుడు మా క్లాస్ మేట్స్ కొందరుడిటెక్టీవ్ నవలల్ని అద్దెకు తెచ్చి ఇచ్చేవారు . మేముండే గడీ ఎదురుగా ఉన్న గ్రామ పంచాయతీకి ‘ ఆంధ్రభూమి ‘ దినపత్రిక వచ్చేది . సభ్యులందరూ చదివాక నేను తెచ్చుకుని చదివి మళ్ళీ జాగ్రత్తగా ఇచ్చేసేదాన్ని . తరువాతి రోజుల్లో వార పత్రికలూ , పక్ష , మాస పత్రికలూ చదివితే  కుటుంబ సమస్యలూ , సామాజికజీవితమూ , మనుష్యుల మనస్తత్వాలూ తెలుస్తాయని తెలియజెప్పింది మా మేన వదిన కూతురు సరోజక్క . ఇవన్నీ కలిసి నాకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగేలా చేశాయి .

2 .ప్రశ్న : మీ పాఠశాల విద్యాభ్యాసం గురించి చెప్పండి . అప్పటికీ ఇప్పటికీ విద్యా వ్యవస్థలో మీరు గమనించినమార్పులు ఏమైనా ఉన్నాయా ? ముఖ్యంగా విద్యార్థులకూ , సాహిత్యానికీ ఉండే సంబంధం ఎలా ఉంది ?

జ : అరవై ఏళ్ల క్రితం తెలంగాణాలో ఆడపిల్లలు చదువుకోవడానికి ఎన్ని కష్టాలు పడాలో అవన్నీ నేనూపడ్డాను . అయితే నా చదువుకు మా ఇంటి వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది . ఊరు దాటాక , నేను మాపెద్దన్నయ్య ఇంట్లోనూ , చిన్నక్క ఇంట్లోనూ ఉండి చదువుకున్నాను .అప్పట్లో ప్రతి క్లాస్ లోనూ నలుగురో , అయిదుగురో ఎగువ మధ్య తరగతి కి చెందిన ఆడ పిల్లలుండేవారు . మిగతా అమ్మాయిలకు చదువుఅందని పండే !  పడకల్ , జక్రాన్ పల్లి , అర్గుల్  గ్రామాల్లోనూ , జిల్లా కేంద్రమైన నిజామాబాద్ లోనూ , కరీంనగర్ జిల్లా లోని హుజురాబాద్ లోనూ నా స్కూల్ విద్య కొనసాగింది . నా మూడో తరగతి లోనే నేను రోజామూడు కిలోమీటర్లు , ఎనిమిదో తరగతిలో అయిదు కిలోమీటర్లు నడిచి స్కూల్ కి  వెళ్లాల్సి వచ్చేది .

అప్పట్లో గురువులు విద్యార్థుల పట్ల తల్లిదండ్రులుగా , బాధ్యతగా ఉంటే , విద్యార్థులు గురువుల పట్ల భయభక్తులతో , గౌరవంతో ఉండేవారు . ఆనాటి పాఠశాల విద్య బలమైన సంస్కారపు పునాది ఏర్పరచేది . ఇప్పుడు ఎవరైనా విద్యార్థిని మందలిస్తే పేరెంట్స్ ఆ టీచర్ పైకి యుద్ధానికి వస్తారు .అప్పట్లో మా పిల్లలనుకొట్టినా సరే , మంచి చదువు చెప్పమని కోరేవారు .

ఇక సాహిత్యం అంటారా … అప్పటి పిల్లలు ఇంత ఒత్తిడిలో చదువుకోలేదు .చదువుతో బాటు ఆటపాటలకీసమయముండేది .తెలుగు , హిందీ , ఇంగ్లీష్ భాషా ఉపాధ్యాయులు ఆయా పాఠాలు చెప్పేటప్పుడుఅనుబంధ పుస్తకాలను సూచించి చదవమనే వారు . కొనుక్కునే వాళ్ళు కొనుక్కోగా లేని వాళ్ళు లైబ్రరీ కి వెళ్లిచదువుకునే వారు . వాళ్ళల్లో ఎందరో సాహిత్యకారులుగా రూపుదిద్దుకునేవారు . ప్రముఖ రచయితలూ , కవులూ అప్పట్లో పాఠశాల రోజుల్లో రచనలు చేసిన వారే . పైగా మాతృభాషలో రచన చేయడం సులువు . ఇప్పటి విద్యార్థులు సాహిత్యమే కాదు  , కనీసం దిన పత్రికలని కూడా చదవడం లేదు . తడబడకుండాతెలుగు చదివే వాళ్ళే తగ్గిపోతున్నారు .

3 .ప్రశ్న :సమాజాన్ని బాగా చదివినవారే సాహిత్య సృజన చేయగలుగుతారని అంటారు కదా ? మీరుసమాజాన్ని అధ్యయనం చేయడం ఏ వయసులో మొదలయింది ? మీకు స్ఫూర్తి నిచ్చిన గురువులు ఎవరు ?

జ : ఊహ తెలిసిన నాటి నుండీ ఎవరైనా సమాజాన్ని చూస్తూ , చుట్టూ ఉన్న వ్యక్తుల్ని గమనిస్తూనేపెరుగుతారు . అయితే , కొందరికి తల్లిదండ్రుల గైడెన్స్ , గురువుల మార్గదర్శకత్వం విపరీతంగాదొరుకుతుంది . అది సంఘటనల్నీ , సందర్భాల్నీ , మనుషుల మనస్తత్వాల్నీ సరిగా అంచనా వేసి అవగాహనచేసుకోవడానికి ఉపయోగపడుతుంది . దానికి మంచి సాహిత్య పఠన తోడయితే , అలాంటి వారే రచనలుచేయగలుగుతారు . నా మట్టుకు నాకు చిన్నప్పుడు బాగా చదివిన పుస్తకాలే సాహిత్య సృజనకు తోడ్పడ్డాయి .

4 .ప్రశ్న : మీరు చిన్నప్పుడు పుస్తకాలు బాగా చదివేవారన్నారు . మీకు నచ్చిన రచయితలెవరు ? వారిలో  ఎవరిప్రభావం మీపై ఎక్కువగా ఉంది ?

జ : నచ్చిన రచయితలు ఒకరిద్దరని చెప్పలేను . రంగనాయకమ్మ గారి రచనలు బాగా నచ్చేవి . చందమామకథల్లోని సరళత , అంతర్లీనంగా ఒక నీతినీ , సంస్కారాన్నీ బోధించే విధానమూ , డిటెక్టీవ్ కథల్లోని సస్పెన్స్ , చివరికి దుర్మార్గులని పట్టుకోవడం బాగా నచ్చేవి . సున్నిత హాస్యం , కొసమెరుపూ ఉన్న కథలని ఎక్కువగాఇష్టపడతాను .

5 .ప్రశ్న : తెలంగాణాలో యాభై ఏళ్ల క్రితం స్త్రీ విద్య అంతగా కొనసాగే వాతావరణం లేదు . మరి మీరు ఇంతఉన్నత విద్య ఎలా అభ్యసించగలిగారు ?

జ : నన్ను డాక్టర్ గా చూడాలని మా బాపు ఎంతో ఆశించారు . కానీ , నా చిన్నతనంలో ఆక్సిడెంట్ లో చేతివేళ్ళు పోగొట్టుకున్నాను గనుక తరువాతి రోజుల్లో వైద్య విద్య  చదవలేకపోయానే బాధ ఉండేది . చదువు పట్లవిపరీతమైన ఇష్టం చిన్నప్పటి నుండీ ఉండేది . నా నాలుగేళ్ల వయస్సులో అమ్మా , నేను తొమ్మిదో తరగతిలోఉన్నప్పుడు మా బాపు చనిపోయారు . హై స్కూల్ విద్య వరకూ ఫరవా లేదు గానీ ఉన్నత విద్యకు ఆటంకంఏర్పడుతుందేమో అని చాలా భయపడ్డాను .ఆ సమయంలో మా బాపు నా కోసం ఒక ఎకరం పొలం తీసిపెట్టారని తెలిసి ఎంతో పొంగి పోయి అది అమ్ముకుని బి ఏ ,బి ఎడ్ చేసాను . ఆ తరువాత ఉద్యోగం చేస్తూఎమ్మే , ఎమ్మెడ్ చేసాను . మెడికల్ డాక్టర్ ని  కాలేక పోయినా పీ హెచ్డీ చేసి డాక్టరేట్ తీసుకోవాలని నా అరవైఅయిదవ ఏట శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నుండి పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నాను .

6 ప్రశ్న : చిన్నప్పటినుండీ మీరు పెరిగిన కుటుంబ వాతావరణం గానీ , మీ చుట్టూ ఉన్న సామాజికవాతావరణం గానీ మీ రచనకు తోడ్పడిందా ? మీ పూర్వీకులలో రచనలు చేసిన వారున్నారా ?

జ : మా పూర్వీకుల్లో కవులూ , రచయితలూ లేరు .మా కుటుంబంలో గానీ , నా చుట్టూ ఉన్న బంధువులు , స్నేహితుల్లో గానీ చాలా మంది దిగువ మధ్య తరగతికి చెందిన వారే . కడుపు నిండా భోజనం , ఏడాదికి ఒకసారి కొత్త బట్టలూ , అప్పుడప్పుడూ పట్నం వెళ్లడమే గొప్ప జీవితం మాకు ! నాలాంటి కొద్ది మందికి  తప్పమిగతా అమ్మాయిలకు పై చదువులు చదివే అవకాశమే లేదు . పదో తరగతిలోనో  అంతకు ముందో పెళ్లి , ఆతరువాత సంసారం , పిల్లలూ , బాధ్యతలు … వీటిల్లో పడి వచ్చిన చదువు మర్చిపోయిన వారే ! ఆ నేపధ్యంతప్పకుండా మనసులో ఉంటుంది , దాని గురించి రాయాలనీ ఉండేది . అయితే .. అప్పుడు దాదాపు అన్నిపత్రికలూ తెలంగాణా కంటే చదువు లోనూ , అభివృద్ధి లోనూ ముందున్న ఆంధ్రా ప్రాంతపు ప్రచురణకర్తలచేతుల్లో ఉండేవి . వాళ్ళు తెలంగాణా రచయితలను గానీ , ఇక్కడి వాతావరణం ప్రతిబింబించే రచనలనుగానీ పెద్దగా ప్రోత్సహించలేదు .మన రచన ప్రచురింపబడాలంటే మనది

7 ప్రశ్న :తెలంగాణలో కవిత్వం రాసేవాళ్ళు ఎక్కువ. మీరు స్కూల్ రోజుల్లోనే కవిత్వం రాశారు . మరి తరువాతిరోజుల్లో దాన్ని కొనసాగించకుండా , ఇతర సాహిత్య ప్రక్రియల వైపు వెళ్ళడానికి కారణం ఏమిటి ?

జ : నేను మొదట రాసింది కవితనే అయినా .. మొత్తంగా నాలుగయిదు కవితలకు మించి రాయలేదు . కవిత్వం రాయడానికి కావలసిన భాష , సాంద్రత ,అభివ్యక్తి  నాకు లేవు గనుకనే కవిత్వం జోలికి వెళ్ళలేదు . అయితే ..మంచి కవిత్వం ఎవరు రాసినా చదివి ఆనందిస్తాను . ఇక పోతే .. తరువాతి రోజుల్లో ఏది రాసినామా పాఠశాలల విద్యార్థులు వేదికపై పాల్గొనేందుకు వీలుగా చిన్న నాటికలు , గేయాలూ రాసాను . ఒక రకంగాగేయ రచన కూడా లయకు ఒదిగే కవిత్వమే కదా !

8 ప్రశ్న : కాలేజీ జీవితపు మాధుర్యం తో ‘ సృష్టిలో తీయనిది ‘ నవల రాశారు కదా ! ఆ తరువాత నవలలురాయక పోవడానికి ఏదైనా కారణం ఉందా ?

జ : చదువులో వెనుకబడిన మా నిజామాబాదు జిల్లాలో ..విద్యార్థుల ముంగిట్లోకి నాణ్యమైన విద్యను తీసుకురావాలన్న తపనతో ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి , వాటి నిర్మాణ ,నిర్వహణ , అభివృద్ధి పనులలోరేయింబవళ్లు తలమునకలయ్యే స్థితిలో మరే రచనలూ చేయలేకపోయాను .

9 ప్రశ్న : మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారన్నారు కదా ! వ్యవసాయమంటేనే కష్టాలు .. అందునాతెలంగాణా లో ! ఆ కష్టాలు మిమ్మల్ని తీర్చిదిద్దాయా ?

జ : కష్టాల్ని కొందరు సవాలుగా తీసుకుని ఆ అనుభవాలతో జీవితాన్ని తీర్చి దిద్దుకుంటే ఇంకొందరునిరాశావాదులై జీవితం పై విరక్తి పెంచుకుంటే , మరి కొందరు ఏ మార్గం లోనైనా డబ్బు సంపాదించేమోసగాళ్ళుగానో , లేక సమాజం పై కసితో తీవ్ర వాదులుగానో  మారుతారు . కష్టాలను నిందిస్తూ కూర్చునేబదులు ఆత్మ విశ్వాసం తో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తామనేది నా భావన , అనుభవం కూడా ! మనంఏదో కొంత సాధించగానే కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించకుండా తోచినంత సాటి వారికి సాయపడడం , వారు పైకిరావడానికి కావాల్సిన మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం కనీస బాధ్యత అని భావిస్తాను . పోతే .. వ్యవసాయదారులకష్టాలు మటుకు ఇప్పటికీ అలాగే ఉండడం శోచనీయం

10 ప్రశ్న : మిగతా ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే మీ పాఠశాలల ప్రత్యేకత ఏమిటి ? మీ విద్యార్థులు కథలూ , కవిత్వం రాస్తారు , ఆటలూ , పాటలూ నేర్చుకుంటారు .. చదువు వెనక బడుతుందని తల్లిదండ్రులు ఏమీఅనరా ?

జవాబు : నిజమే , ఒక సాహిత్యమనే కాదు , మా విద్యార్థులు యోగా , సంప్రదాయ నృత్యాలూ , సంగీతం , మార్షల్ ఆర్ట్స్ , క్రీడలూ … ఇలా అన్నింటిలోనూ రాష్ట్ర ,జాతీయ , అంతర్జాతీయ స్థాయిల్లో బహుమతులుగెల్చుకుంటూనే చదువులో అత్యున్నతంగా రాణిస్తారు . వారిలో దేశ విదేశాల్లో అద్భుతంగా రాణిస్తున్నకలెక్టర్లూ , డాక్టర్లూ , ఇంజినీర్లూ , అడ్వొకేట్లూ , ఇతర ఉద్యోగులూ ఎందరో ఉన్నారు .ఇక తల్లిదండ్రులకుఅభ్యంతరమేముంటుంది ? నిజానికి లలిత కళలు మనో వికాసానికీ , చదువుపై శ్రద్ధ పెరగడానికీ దోహదంచేస్తాయి కూడా . మా విద్యార్థుల్లో పాతిక మందికి పైగా పీజీ డాక్టర్లు ఇక్కడే .. మా నిజామాబాద్ జిల్లా లోనేవైద్య సేవలు అందిస్తున్నారు అంటే ఆనందమే కదా ! ఇటీవల విక్టోరియా మహారాణి చేతుల మీదుగాలండన్ లో తన వైద్య సేవలకు గాను అవార్డు తీసుకున్న డా . శ్రీధర్ మా విద్యార్ధి అవడం మాకు గర్వకారణం . మా దగ్గర చదువుకున్న ముప్పై అయిదు వేల మంది విద్యార్థుల్లో అలాంటి వాళ్ళు ఎందరో !

11 ప్రశ్న :‘ అమృతలత -అపురూప అవార్డ్స్ ప్రారంభించడానికి ఆలోచన ఎలా వచ్చింది ? పదేళ్లలోమరపురాని సంఘటనలు ఉన్నాయా ? ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా నిర్వహించగల్గుతున్నారు ?

జవాబు : చాలా ఏళ్లుగా  నా పరిశీలనలో ఉన్న విషయం ఏమిటంటే లలిత కళల్లో చాలా వాటికి మూలంసాహిత్యమే .రామాయణ , మహాభారత కథల నుంచీ … చరిత్రలో అనేక సంఘటనలూ , యుద్ధాలూ , సామాజిక పరిణామాలనూ అక్షరబద్దం చేసేదీ , యుగాల తరబడి నిలిపేదీ సాహిత్యమే ! ఆటల్లో క్రికెట్ కితప్ప మిగతా వాటికి గుర్తింపు లేనట్టుగా సినిమాలు , టీవీలకున్న ప్రాధాన్యత సాహిత్యానికివాళ లేదు . నిజానికి వాటికి కావాల్సిన కథలూ , మాటలూ , పాటలూ వంటి ముడి సరుకునందించేది సాహిత్యమే . అందులోనూ స్త్రీలు ఏ కళలోనైనా ప్రావీణ్యత సంపాదించాలంటే వారి వ్యక్తిగత జీవితాన్నీ , సమయాన్నీ చాలాఅడ్జస్ట్ చేసుకోవాల్సి , త్యాగం చేయాల్సి ఉంటుంది . అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ కళల్నినిలుపుకుని సమాజానికి అందిస్తున్న మహిళల్ని గుర్తించి , గౌరవించాలని ఒక ఆలోచనకు రూపమేఅపురూప అవార్డులు . ఇక తెలంగాణా కథయిత్రుల ‘ వెతలే కథలై ‘ ఆవిష్కరణ సభలో డా . ముదిగంటిసుజాతా రెడ్డి గారికి అమృతలత జీవన సాఫల్య పురస్కార ప్రదానం తో మొదలైన అవార్డులు గత పదేళ్లుగాకొనసాగుతూ ఉండడం మీకు తెలిసిందే ! అన్ని కళా విభాగాల్లోనూ ఇచ్చే అవార్డుల్లో సింహ భాగంసాహిత్యానికీ .. అందునా సగానికి పైగా తెలంగాణా మహిళలకు చెందాలనేది మా అభిలాష . అవార్డుగ్రహీతలు దీన్ని అపురూపంగా , గౌరవంగా భావించడం …, రెండు వందలకు పైగా సాహితీ వేత్తలు పాల్గొనితమ ఇంటి పండుగలాగా ఈ పురస్కార సభను విజయవంతం చేయడం చూసి మా లక్ష్యం నెరవేరిందనిభావించాం . ఈ సందర్భంగా అవార్డు గ్రహీతల , అతిథుల జీవిత విశేషాలతో కూడిన ‘అభినందన ‘ ప్రత్యేకసంచిక ‘ కు కూడా మంచి పేరు వచ్చింది . విశిష్ట మహిళలకు అవార్డులివ్వాలనుకునే వారికి , పరిశోధకవిద్యార్థులకూ ఈ సావనీర్స్ ఉపయోగపడుతున్నాయి . పోతే ..బంధు మిత్రుల సహకారంతోనే ఈ కార్యక్రమందిగ్విజయంగా జరుగుతోంది . అందులోనూ సింహ భాగం నెల్లుట్ల రమాదేవి , కిరణ్ బాల గార్ల పాత్ర ఉంది .

12 .ప్రశ్న :మీరు ముందు రచయిత్రి , తరువాత టీచర్ .. ఆ తరువాత విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు . వీటిల్లో మీకు ఏ పాత్ర ఇష్టం ? ఎందుకని ?

జ : నాకు అన్నిటి కన్నా టీచర్ పాత్రే చాలా ఇష్టం . విద్యార్థికీ , టీచర్ కీ ప్రత్యక్ష సంబంధం , అపురూపఅనుబంధం ఉంటుంది . టీచర్ తన విద్యార్థిని ప్రభావితం చేసి , ఉత్తమ పౌరుడిగా తీర్చి దిద్దగలడు .  రచయిత రచనల ద్వారా కొద్ది మంది ప్రభావితులయ్యే అవకాశం ఉందేమో గానీ , అది పాఠకుల మేధోస్థాయిని బట్టీ , వాళ్ళు ఆ రచనను చూసే కోణాన్ని బట్టీ ఉంటుంది . ఇక విద్యాసంస్థల నిర్వాహకులకైతేపాలసీ డెసిషన్స్ , టీచర్ల పని తీరు, అడ్మినిస్ట్రేషన్ వంటివి తప్పితే పిల్లలతో ప్రత్యక్ష సంబంధమే ఉండదు . నేను స్కూల్ పెట్టి టీచింగ్ కి దూరమయ్యాననే బాధ నన్ను అప్పుడప్పుడూ వేధిస్తూ ఉండడంతో కొన్ని సార్లుక్లాసులు తీసుకుంటుంటాను .

13 .ప్రశ్న :మీరు ‘ అమృత కిరణ్ ‘ అనే పక్ష పత్రిక పెట్టి రెండేళ్ల పాటు నడిపారు . పత్రిక పెట్టాలని ఎందుకుఅన్పించింది ? ఎందుకు ఆపేశారు ?

జ : నాకు ఇవాళ కొద్దో గొప్పో సాహిత్యంతో పరిచయం , అందులో ప్రవేశం ఉందంటే నేను చిన్నతనంలోచదివిన పత్రికలూ , పుస్తకాల వల్లే . అయితే చాలా పత్రికలు ఓ మాదిరి పేరున్న వాళ్ళ రచనలే వేసేవారు . దానితో ఒక పక్ష పత్రిక ప్రారంభించి ఎందరో వర్ధమాన రచయితలకు , కవులకు అవకాశం ఇవ్వాలని ‘ అమృతకిరణ్ ‘ స్థాపించి అనుకున్నట్లుగానే చాలా మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చాం . లబ్ద ప్రతిష్టులూ రాశారు. జిల్లా లోనే మొట్టమొదటి ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రారంభించింది మేమే ! అయితే … మార్కెటింగ్ లో మెళకువలుతెలియక , సరిగా మార్కెటింగ్ , అడ్వర్టైజింగ్ చూసే వాళ్లు లేక దాన్ని మూసేయాల్సి వచ్చింది .

14 ప్రశ్న :‘ అమృతలత -అపురూప అవార్డ్స్ ప్రారంభించడానికి ఆలోచన ఎలా వచ్చింది ? పదేళ్లలోమరపురాని సంఘటనలు ఉన్నాయా ? ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా నిర్వహించగల్గుతున్నారు ?

జవాబు : చాలా ఏళ్లుగా  నా పరిశీలనలో ఉన్న విషయం ఏమిటంటే లలిత కళల్లో చాలా వాటికి మూలంసాహిత్యమే .రామాయణ , మహాభారత కథల నుంచీ … చరిత్రలో అనేక సంఘటనలూ , యుద్ధాలూ , సామాజిక పరిణామాలనూ అక్షరబద్దం చేసేదీ , యుగాల తరబడి నిలిపేదీ సాహిత్యమే ! ఆటల్లో క్రికెట్ కితప్ప మిగతా వాటికి గుర్తింపు లేనట్టుగా సినిమాలు , టీవీలకున్న ప్రాధాన్యత సాహిత్యానికివాళ లేదు . నిజానికి వాటికి కావాల్సిన కథలూ , మాటలూ , పాటలూ వంటి ముడి సరుకునందించేది సాహిత్యమే . అందులోనూ స్త్రీలు ఏ కళలోనైనా ప్రావీణ్యత సంపాదించాలంటే వారి వ్యక్తిగత జీవితాన్నీ , సమయాన్నీ చాలాఅడ్జస్ట్ చేసుకోవాల్సి , త్యాగం చేయాల్సి ఉంటుంది . అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ కళల్నినిలుపుకుని సమాజానికి అందిస్తున్న మహిళల్ని గుర్తించి , గౌరవించాలని ఒక ఆలోచనకు రూపమేఅపురూప అవార్డులు . ఇక తెలంగాణా కథయిత్రుల ‘ వెతలే కథలై ‘ ఆవిష్కరణ సభలో డా . ముదిగంటిసుజాతా రెడ్డి గారికి అమృతలత జీవన సాఫల్య పురస్కార ప్రదానం తో మొదలైన అవార్డులు గత పదేళ్లుగాకొనసాగుతూ ఉండడం మీకు తెలిసిందే ! అన్ని కళా విభాగాల్లోనూ ఇచ్చే అవార్డుల్లో సింహ భాగంసాహిత్యానికీ .. అందునా సగానికి పైగా తెలంగాణా మహిళలకు చెందాలనేది మా అభిలాష . అవార్డుగ్రహీతలు దీన్ని అపురూపంగా , గౌరవంగా భావించడం …, రెండు వందలకు పైగా సాహితీ వేత్తలు పాల్గొనితమ ఇంటి పండుగలాగా ఈ పురస్కార సభను విజయవంతం చేయడం చూసి మా లక్ష్యం నెరవేరిందనిభావించాం . ఈ సందర్భంగా అవార్డు గ్రహీతల , అతిథుల జీవిత విశేషాలతో కూడిన ‘అభినందన ‘ ప్రత్యేకసంచిక ‘ కు కూడా మంచి పేరు వచ్చింది . విశిష్ట మహిళలకు అవార్డులివ్వాలనుకునే వారికి , పరిశోధకవిద్యార్థులకూ ఈ సావనీర్స్ ఉపయోగపడుతున్నాయి . పోతే ..బంధు మిత్రుల సహకారంతోనే ఈ కార్యక్రమందిగ్విజయంగా జరుగుతోంది . అందులోనూ సింహ భాగం నెల్లుట్ల రమాదేవి , కిరణ్ బాల గార్ల పాత్ర ఉంది .

15 ప్రశ్న :మిగతా ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే మీ పాఠశాలల ప్రత్యేకత ఏమిటి ? మీ విద్యార్థులు కథలూ , కవిత్వం రాస్తారు , ఆటలూ , పాటలూ నేర్చుకుంటారు .. చదువు వెనక బడుతుందని తల్లిదండ్రులు ఏమీఅనరా ?

 జవాబు : నిజమే , ఒక సాహిత్యమనే కాదు , మా విద్యార్థులు యోగా , సంప్రదాయ నృత్యాలూ , సంగీతం , మార్షల్ ఆర్ట్స్ , క్రీడలూ … ఇలా అన్నింటిలోనూ రాష్ట్ర ,జాతీయ , అంతర్జాతీయ స్థాయిల్లో బహుమతులుగెల్చుకుంటూనే చదువులో అత్యున్నతంగా రాణిస్తారు . ఇక తల్లిదండ్రులకు అభ్యంతరమేముంటుంది ? నిజానికి లలిత కళలు మనో వికాసానికీ , చదువుపై శ్రద్ధ పెరగడానికీ దోహదం చేస్తాయి కూడా . మావిద్యార్థుల్లో పాతిక మందికి పైగా పీజీ డాక్టర్లు ఇక్కడే .. మా నిజామాబాద్ జిల్లా లోనే వైద్య సేవలుఅందిస్తున్నారు అంటే ఆనందమే కదా ! ఇటీవల విక్టోరియా మహారాణి చేతుల మీదుగా లండన్ లో తనవైద్య సేవలకు గాను అవార్డు తీసుకున్న డా . శ్రీధర్ మా విద్యార్ధి అవడం మాకు గర్వకారణం . మా దగ్గరచదువుకున్న ముప్పై అయిదు వేల మంది విద్యార్థుల్లో అలాంటి వాళ్ళు ఎందరో !

16 ప్రశ్న :‘ ఇచ్చుటలో ఉన్న హాయి ‘ మీకు బాగా తెలుసు .బాధల్లో ఉన్నవారికి సహాయం చేయడం , కొన్ని సార్లుఆశ్రయం, ఉపాధి కల్పించడం , విద్యార్థులకు , అనాథ స్త్రీలకు తోడ్పడడం , పుస్తకాలు వేసుకోలేనిరచయితలకు చేయూతనివ్వడం …. ఇలా చాలా గుప్త దానాలు చేస్తూంటారు . కానీ ఎక్కడా చెప్పుకోరు . ఎందుకని ? జనం క్యూ కడతారనా ?

జవాబు : మన జీవితం చాలా చిన్నది , విలువైంది కూడా ! ఇందులో మనం ఏ కాస్తయినా ఇతరులకుసహాయపడడం మనుషులుగా మన బాధ్యత , అంతే ! దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం ఎందుకు ? అదిసహాయం పొందిన వాళ్ళను న్యూనతకు గురి చేయడం , అవమానించడం కూడా ! ఇకపోతే తరతరాలకుసరిపోయేంత కూడబెట్టాలని నాకు కోరిక లేదు . నేను ఇతరులపై ఆధార పడకుండా జీవితం గడిచిపోతేచాలు . బద్దకస్తులకూ , నిజాయితీ లేని వారికీ నా దగ్గర చోటుండదు . అలాంటి వారికి నేనేమీ సహాయంచేయలేను .

17 ప్రశ్న . తెలంగాణా తొలి ఉద్యమం లో విద్యార్థిగా , మలి ఉద్యమంలో విద్యా సంస్థల ముందు టెంట్ వేసివిద్యార్థులను నడిపించిన వారుగా మీరు పాల్గొన్నారు . పోరాట సమయం లో అందరూ మహిళలే రచించిన’గాయాలే గేయాలై ‘ కవిత్వాన్నీ , ‘ వెతలే కథలై ‘ కథలనూ పుస్తక రూపంలో వెలువరించారు . ఒక తెలంగాణాప్రేమికురాలిగా ఇప్పుడేమంటారు ?

జ : మనం ఆశించిన తెలంగాణా వచ్చింది . మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్న ఈ రోజుల్లో నేటితరం యువతులు రాజకీయాల్లోకి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వచ్ఛమైన సుపరిపాలన అందించాలి . ఆ రోజుతొందర్లో రావాలని ఎదురు చూద్దాం .

June 23, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శతజయంతుల పి.వీ. నరసింహారావుగారికి అక్షర నివాళి

by mayuukha June 23, 2021
written by mayuukha

అష్టభాషా ప్రావీణ్యులు కవి – రచయిత మన దేశ పూర్వ ప్రధాని పి.వి.నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారిని తలచుకుందాం.

మాతృభాష తెలుగు, రాష్ట్ర భాష హిందీ ప్రపంచ భాష ఇంగ్లీష్ లతోబాటు కన్నడం, మరాఠీ, ఉర్దూ, అరబ్బీ, పార్సీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం సాధించారు. ఫ్రెంచ్, స్పానిష్ భాషలూ నేర్చారు.

గొప్ప వక్త. 14 భాషల్లో మాట్లడగలరు. మితభాషి అని పేరు వచ్చినా సభను రంజింప చేసేటప్పుడు తమ సహజగుణాన్ని అధిగమిస్తారు. ఇది ఒక కళ! కళాత్మక హృదయులకే సాధ్యమయ్యే అద్భతకళ పి.వి.గారి సొంతం!

1921 జూన్ నెలలో జన్మించారు. జూన్ 28న ఇప్పటికి సరిగ్గా వందేళ్ళు! మనం శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం.  2004 డిసెంబర్ 9న పరమపదించారు. మనకు ఎన్నో ఆదర్శాలను నేర్పి వెళ్ళారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ గణనీయమైన మార్పులను తీసుకువచ్చిన మేధావి! అపర చాణుక్యుడని పేరుగాంచిన రాజకీయ దురంధరుడు. బుద్ధికి బృహస్పతి! కులబలం, ధనబలం లేకున్నా పల్లె నుండి ఢిల్లీవరకు ప్రతిభావంతమైన వ్యక్తిగా కీర్తి సంపాదించారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ వారి తొలి, తుది పార్టీ! భారతదేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో మంచి మార్పులను తీసుకువచ్చి, ఒకానొక సందర్భంలో దేశం ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే స్థాయికి చేరుకున్నప్పుడు గొప్ప సంస్కరణలకు బీజం వేసి పునరుజ్జీవం కల్పించారు.

సహస్రఫణ్ అనే పేరుతో విశ్వనాథసత్యనారాయణగారి వేయి పడగలను హిందీలోకి అనువదించారు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమి బహుమతి వచ్చింది. అబలా జీవితం – అనే పేరుతో పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని హరినారాయణ్ ఆప్టే రచనను అనువదించారు. ఇన్ సైడర్ – రచించారు. వీరి ఆత్మకథా రచన . ఇది ‘లోపలి మనిషి’ పెరుతో తెలుగులోకి అనువదించారు. మాగ్నమ్ ఓపస్ Magnam Opus అనదగిన autobiographical novel స్వీయ చరిత్రాత్మక కాల్పనిక కథన పద్ధతిలో ఉన్నట్లు అర్థం అవుతుంది. Strait Forword narrative తో మొదలైన అద్భుత నవల. పీ.వీ.గారు రాజకీయాల్లో రాకుంటే గొప్ప కవి, రచయిత  అయ్యేవారు.  జ్ఞానపీఠమూ, ఓ నోబుల్ బహుమతి వచ్చి ఉండేవి.

పి.వీ.గారు ప్రఖ్యాత రచయిత్రి జయప్రభగారి కవిత్వాన్ని తెలుగులోంచి ఇంగ్లీషులోకి అనువదించారు.

ఆనాడు పాములపర్తి సదాశివరావుగారితో కలిసి ‘కాకతీయ’ ప్రతికకు సంపాదకత్వం వహించినా వృద్ధాప్యంలో కంప్యూటర్ నేర్చుకుని ఉపయోగించినా పి.వీ.గారి పట్టుదలకు, నిబద్ధతకు నిదర్శనం.

కాళోజీగారు దగ్గరి మిత్రులు. ఈ మిత్రుల ఆత్మీయత సాహితీలోకానికెరుక.

కవివరేణ్యులు వానమామలై వరదాచార్యులకు గండపిండేరం తొడిగిన పీవీ స్వయంగా కవి పండితుడు.

1940 పి.వి.రచించిన గొల్ల రామవ్వ కథ తెలంగాణ జీవన చిత్రాన్ని చిత్రికపట్టి ఆనాటి స్వాతంత్ర్య పోరాటాలకు వెలుగుదివ్వె అయ్యింది.

నీలిరంగు పట్టుచీర, మానావమానాలు వంటి కథలు పి.వీ.గారి ఆదర్శ భావజాలాన్ని పట్టిస్తాయి.

మంగయ్య అదృష్టం, నవలిక వంటిది ద మినిస్టర్ Secret of the ballot, forgotten suitcase the guest, The reshuffle వంటి కథానికలు రచించారు.

దేశభక్తి పివిగారి ఒడనెల్లా ప్రవహించేది కాబట్టే ఓ గొల్లరామప్పలో దేశమాతను దర్శించుకున్నారు. “అవ్వా నీవు సామాన్యురాలవు కావు సాక్షాత్ భారతమాతవే” అనగలిగారు.  స్త్రీ పురుషులెవరికైనా శీలం గొప్ప సంపద అని చెప్పిన ‘నీలిరంగు పట్టుచీర’ కథనూ వ్రాయగలిగారు. ఇది మన దేశ సంస్కృతి! ఒక సందర్భం పి.వి.వంటి కవిని రాజకీయవేత్తను చేసుకుని రాజ్యానికి ఇటువంటి వ్యక్తి కావాలి అనుకున్నది. కాలం ఇందుకు తన శక్తిని ధారబోసింది. ఎట్లయితే పి.వి.గారు తమ శక్తి దేశం కోసం ధారబోసారో అట్లే! అవును. మనసుపెట్టి, మంచి మనసుపెట్టి దీక్షగా పి.వి.గారిని పరిశీలిస్తే ఇవన్నీ బోధపడ్తాయి. ఆయన ప్రత్యక్ష ప్రయత్నాలు లేకున్నా కొన్ని విషయాలలో అవినీతి ఆరోపణలు అంటగట్టి, ఎక్కడ మహాశక్తిగా ఇంకా ఎత్తుకెదుగుతాడోనని కుట్రలు పన్ని అంతటి గొప్ప వ్యక్తి నిస్వార్థ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడానికి కారణం ఎవరు అని నిజాయితీగా చర్చించుకోవాలి ఈ సభ్య సమాజం.

భారతీయ ఫిలాసఫీ అంటే, భారతీయ ఫిలాసఫర్స్ అంటే పీవీగారికి ఇష్టం. ప్రపంచంలోనే ఇంత గొప్ప తత్త్వవేత్తలు లేరు. ప్రపంచంలోనే ఇంత గొప్పసంస్కృతి లేదు.

అది 1972 ఆగష్టు 15. స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భం. అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాసనసభ భవనంలో కవితాత్మక సందేశాన్ని అందించారు పి.వీ.

“నవరసా ర్థ జీవితాల, నవోన్మేష మానసాల

నవ పల్లవ తరుశాఖల రవళించెడు జనాల

నవవిధ భక్తుల, రక్తుల, నవశక్తుల మేళవించి,

నవ నిర్మిత జాతి సంతరించినాడ విప్లవ తపస్వి’ అంటారు.

విప్లవమంటే ఏమిటి? విప్లవమంటే మార్పు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అధినేతగా తాముచేయదలుచుకున్న సంస్కరణలకు రూపశిల్పి తానే అయిన వారు కవిరాజు పి.వి. కాని కొందరు కుటిలులు ఉంటారు గదా!

“భువి దానవగ్రహమై పోవ రోదసిని మధించి

మానవతా వాహనకై పూనుకున్న రాజ్యేందిర

జయదుందుభి విని ఉత్తేజనము పొందునా పౌరుడు!

మోదమలరని చెర అరలో మూల్గిన భావకిశోరికి

విహారయ స్వేచ్ఛాంతరిక్ష వీధిని లభ్యమవునా?’’ ఎంతటి నిశ్చలత?

ఎంతటి నిర్భీతత్వం. తమ ఆలోచనలకు రూపమిస్తే ఎందరు వ్యతిరేకిస్తారో తెలుసు పి.విగారికి. అయినా ఎంతటి ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలు. అందుకే అంటారు –

“విహంగమున లాకసంపు కొలతలేల?

చిన్న అలకు ఒడ్డు దూరమున్నదన్న చింత ఏల?

దీపము పెనుగాలికి బీతిల్లనేల?

జీవితాత్మకు ఎన్నడు బ్రహ్మము చేరుదునన్న సందియ మ్మదేల?”

అంటారు. ఎంత గొప్ప పోలికలు? తమ నిర్ణయాలకు ఎందరి వ్యతిరేకత ఉన్నా ప్రజాశ్రేయస్సు దృష్ట్యా దేనికీ భయపడవద్దనుకున్నారు.

నేనొక చైతన్మోర్మిని

నిస్తుల ప్రగతి శకలమును

ఇది నా సంతత కర్మ

మరే హక్కులు లేవు నాకు

ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ

వెలుగుటయే నా తపస్సు.

వెలిగించుట నా ప్రతిజ్ఞ”.

ఇంతటి ప్రసంగం గతంలో ఎవరూ చేయలేదు! Creating is the act of turning new and imaginative idias into reality. ప్రపంచమే ఒక సృజన. పి.వి.గారి సృజన ఇది!

కొత్త ఆలోచనలను, ఊహలను ఆచరణలోకి అమలు చేయడం. ప్రధానంగా చెప్పాల్సిందేంటంటే ఒక రాజకీయ వేత్తగా ఇంత గొప్ప కవితను రాసారు పి.వి.గారు. అందుకే అంత గొప్ప ప్రతిజ్ఞను చేసినందుకే, ఆచరించినందుకే ముఖ్యమంత్రి పదవికి ఎంతటి నష్టం వాటిల్లిందో ప్రపంచానికి తెలుసు! అయినా చెదరలేదు, బెదరలేదు. దేశమే పి.వీగారిని ప్రధానిగా ఎంచుకున్నది. సాహిత్యకాశానికి ధృవతార! రాజకీయ జ్ఞానాకాశానికీ ధృవతార!

మా నాన్నగారు పెండ్యాల రాఘవరావు గారు ఆనాటి సాయుధ పోరాట వీరుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రథమ సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్ట్ నాయకునిగ రెండు MLA , ఒక MP మొత్తం మూడు స్థానాలలో అత్యధిక మెజారిటీ తో గెలిచిన వారు . MP గా ఢిల్లీ లో వరంగల్ ప్రాంతానికి చెందిన తెలంగాణ కేతనాన్ని ఎగురవేసి,ప్రజాసేవ చేసినవారు . పి వీ గారికి గురుతుల్యులు . ఇక మా మామగారు తెలంగాణ కు చెందిన సుప్రసిద్ధ చిత్రకారులు డా౹౹ కొండపల్లి శేషగిరి రావుగారికి కూడా పివి గారు అత్యంత సన్నిహితులు. పివి గారు ప్రత్యేక శ్రద్ధతో పాల్గొన్న పోతన పంచశతి ఉత్సవాలలో పోతన చిత్రాన్ని చిత్రించినందుకు గాను మరియు తెలంగాణ సారస్వత పరిషత్ స్వర్ణోత్సవాలో దేవులపల్లి రామానుజారారావు గారి పోట్రయిట్ చిత్రించినందుకు గానూ పివిగారు శేషగిరిరావు గారిని ఘనంగా సన్మానించారు. ఇవి మహనీయులు పివి గారికి సంబంధించిన మా జ్ఞాపకాల పూబుట్ట లోని కొన్ని పరిమళాలు .

సముద్రమంత గొప్ప వ్యక్తి పి.వి.గారు. అందులో నుండి దోసెడు నీళ్లను హత్తకున్నట్టు ఈ నాలుగు మాటలు. భావితరాలకు స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడించిన స్వచ్ఛమైన భారతీయుడైన పి.విగారు ప్రపంచానికే మార్గదర్శులు. మయూఖ పత్రిక వినమ్రంగా అక్షర నివాళులు అర్పిస్తున్నది.

— మయూఖ సంపాదకురాలు

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సినీ గేయాల సాహిత్య పరామర్శ — పాట విశ్లేషణ

by ఏలూరు అశోక్ కుమార్ రావు June 23, 2021
written by ఏలూరు అశోక్ కుమార్ రావు

‘వాగ్ధానం’ సినిమాలోని పాట

1961 సం||లో విడుదలైన వాగ్ధానం చిత్రాన్ని నిర్మించిన ఆచార్య ఆత్రేయ దర్శకత్వం కూడా వహించారు. దాశరథి కృష్ణమాచార్య గారు వ్రాసిన తొలి సినీ గీతం “నా కంటి పాపలో నిలిచిపోరా”. ఇందులోనిదే. ఈ పాట కొరకు ఆత్రేయగారు, దాశరథిని ప్రత్యేకంగా పిలిపించుకొని వ్రాయించుకున్నారు.

నా కంటి పాపలో నిలిచిపోరా

నీ వెంట లోకాల గెలువ నీరా

తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమికుడు ఎక్కడో దూరంగా వుండకుండా తన కంటి పాపలోని ఉంటేనే తనకు సంపూర్ణ రక్షణ. ఆత్మబంధాన్ని హృదయం కళ్ళలోకి తీసికుంటుంది. కనుపాపలలో పొదుగుకుంటుంది. కాని కంటి పాపలో ప్రేమికుడు ఉండడమేమిటని మనకు అనిపించవచ్చు. మనిషి (మనో లోకం) ఏమోమో కావాలనుకుంటుంది. దానికి హద్దులు అంటు ఏవీ వుండవు, ప్రేయసి తన కళ్ళలోని పాపలో తన రక్షణ కొరకు తన ఇష్టసఖుడిని నిలుపుకొని 14 లోకాలను గెలుచుకొని రావచ్చును. అందుకే తన ప్రియుడు ఎటూ పోకుండ తన కంటి పాపలోనే వుండి పొమ్మని ఇక్కడి  కథా నాయిక ఆకాంక్షిస్తున్నది.

ఈనాటి పున్నమి ఏ నాటి పున్నెమో

జాబిలి వెలిగేను మన కోసమే

నెయ్యాలలో తలుపుటుయ్యాలలో

అందుకుందాము అందని ఆకాశమే  || నా కంటి ||

ప్రేయసీ ప్రియులు భావోద్వేగానికి లోనై తమ భావనా లోకంలో సృష్టిలో వున్న, ప్రతి వస్తువు తమకు స్వంతం కావాలనుకుంటే, సమస్త మానవాళి కొరకు సృష్టించబడిన అపురూపమైన వస్తువులన్నీ తమ కొరకే వున్నాయని భావించుకుంటే, ఇతర మానవులకు కాని, ప్రాణికోటికి కాని నష్టం ఏమీ లేదు. అందుకే ఆకాశాన్ని తాము తమ చేతిలోనికి తీసుకొని, చందమామ కేవలం తమ ఇద్దరి కొరకే వెలిసింది అనుకుంటున్నారు. ఆ సమయంలో వారిద్దరి హృదయాలు పారవశ్యంలో తేలిపోతుంది.

ఆ చందమామతో ఆనందసీమలో

వెన్నెల స్నానాలు చేయుదమా

మేఘాలలో వలపు రాగాలలో

దూర దూరాల స్వర్గాలు చేరుదమా  || నా కంటి ||

ప్రేమికులు తమ ఆనంద సీమను చేరుకోవాలనుకుంటే

పున్నమి నాటి చందమామ వెలుగులో వెన్నెల స్నానాలు

చేయడానికి సిద్ధపడ్డారు. ఎవరైనా పన్నీటి స్నానాలు చేస్తారు.

కాని వీరి పరిస్థితి భిన్నం. ఆ భావనా లోకంలో వారిద్దరు

ఆకాశంలో విహరిస్తూ, తమ చుట్టూరా ఆవరించి వున్న

మేఘాలపైన నడుస్తూ, తాము బ్రతికి వుండగనే, ఎవరు కూడా చూడలేనటువంటి స్వర్గాన్ని చేరుకోవాలని కలలు కంటున్నారు.

ఈ పూలదారులూ, ఈ నీలి తారలూ

తీయని స్వప్నాల తేలించగా

అందాలను, తీపి బంధాలను

అల్లుకుందాము డెందాలు పాలించగా   || నా కంటి ||

తాము భావనా లోకంలో ఆకాశంలో పూలదారులను ఏర్పరచుకొని, ఇద్దరూ నక్షత్రాలలో చేరి తమ బంధాలను దృఢంగా చేసికొని, తమ హృదయాలు తమ భావనాలోకాలలో ఎవరి అధికారం లేకుండా పరిపాలించుకొనవచ్చని ప్రేమికులు కలలలో తేలియాడుతున్నారు.

తన తొలి పాటతో తెలుగు సినీ సాహిత్యంలో ప్రేక్షకులను, శ్రోతలను సుకురమైన మనఃప్రసన్నకరమైన రసోద్వేగానికి గురిచేసిన దాశరథిగారు చిరస్మరణీయులు. సాహిత్యం – సంగీతం పోటీపడి, ఘంటసాల, సుశీలగారల గాత్రాలు సంగీత ప్రియులతో రసఝరులు నింపిన ఈ గీతం 60 సంవత్సరాలైనప్పటికి, ఇప్పటికే కాదు, చిరస్థాయిగా అందరి హరృదయాలలో నిలిచిపోతుంది.

దాశరథిగారు వ్రాసిన ఈ గీతం గల చిత్రం ‘వాగ్ధానం’ తేది 05.10.1961న విడుదలైంది. అంటే ఇప్పుడీ పాటకు షష్టిపూర్తి సంవత్సరమన్న మాట


అమరశిల్పి జక్కన్న (1964) సినిమాలోని

 ఈ నల్లని రాళ్ళలో……… పాట గురించి

ఈ పాటను డా|| సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు తాను రచించిన “రామప్ప” సంగీత రూపకం కొరకు వ్రాసినారు. వారి అనుమతితో అమరశిల్పి జక్కన సినిమా కొరకు నిర్మాత, దర్శకులు బి.ఎసం.రంగా ఈ పాటను వాడుకున్నారు.

సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాలగారు ఈ పాటను అద్భుతంగా గానం చేశారు.

ఒక శిల్పి ఉలిని చేత పట్టుకొని, శిలవద్దకు చేరగనే, ఆ శిలల మాటున దాగిన శిల్పాలన్నీ మన కళ్ళకు గోచరమవుతాయి.

ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నుల దాగెనో

ఈ బఁడల మాటున ఏ గుండెలు మోగెనో

అంతకుముందు రాయి లాగ పడి వున్న వస్తువులో దాగిన కళ్ళ కాంతి పుంజాలు మనకు గోచరిస్తాయి. ఆ రాయి చాటున దాగిన గుండె చప్పుళ్ళు మన మనస్సును తాకి మనం పరవశమగునట్లు వినిపిస్తాయి.

పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి

మునులవోలె కారడవుల మూలలందు పడి ఉన్నవి ||ఈ నల్లని||

అడవులల్లో తపస్సు చేసికొనే ఋషులవలె పర్వతాలు కూడ (పర్వతాలలో వుండే శిలలు) మానవ జాతికి దూరంగా పాపాలకు, తాపాలకు దూరంగా కారడవులలో ఎక్కడో ఎవరికీ కనపడకుండ వుంటాయి.

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు

ఉలియలికిడి విన్ననంతనే జల జలమని పొంగి పొరలు   ||ఈ నల్లని||

శిలలు ప్రకృతి సహజంగా ఎక్కడ వున్నవి అక్కడే కదలకుండా వుంటాయి. కాని శిల్పి ఉలిని ఆడించగనే ఆ శబ్ధం వినబడగానే సెలయేర్లు ఉప్పొంగినట్లు సజీవ శిల్పాలు ఏర్పడతాయి.

పైన కటిన మనిపించును, లోన వెన్న కనిపించును

జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును ||ఈ నల్లని||

మనుషులుపైకి మంచివాళ్ళలాగా కనపడతారు. కాని లోపల క్రూరమైన తలంపులుంటాయి. శిలలు పైకి కఠినంగా కనపడతాయి. కాని శిల్పి ఉలితో వాటిని తాకితే ఒక ఆకారం వచ్చి, వాటిలో వెన్నలాగా మృదుత్వం మనకు సాక్షాత్కారమవుతుంది. అయినప్పటికీ అవి ప్రపంచంలోని ఏ వస్తువుకు కూడా హాని చేయవు. ప్రాణమున్న మనిషికంటే శిల్పాలైన శిలలే ఎన్నోరెట్లు బాగనిపిస్తాయి.

శిల్పకళ ప్రవీణుడు జక్కన పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు జీవించారు. ముఖ్యంగా “ఈ నల్లని రాళ్ళలో” గీతం సన్ని వేశంలో ANR నటన అద్భుతం.

ఇక సాహిత్యానికి వస్తే అలతి పొలతి పదాలలో, మనం మాట్లాడే భాషా పదాలను ఉపయోగించి, సినారెగారు సినిమాకు కాకుండ, తాను రచించిన “రామప్ప” రూపకానికి లిఖిస్తే, రాజేశ్వరరావుగారి మధుర బాణికి ఘంటసాలవారు తన గాన మాధుర్యంతో శ్లోతలను తన్మయంలో ముంచారు.

-ఏలూరు అశోక్ కుమార్ రావు

June 23, 2021 0 comment
3 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

‘ధన్య’కవీంద్రుడు దాశరథి—-‘మాన్య’ కవీంద్రుడు ‘సినారె’

by గురిజాల రామశేషయ్య June 23, 2021
written by గురిజాల రామశేషయ్య

‘ధన్య’కవీంద్రుడు దాశరథి

తెలంగాణ ప్రజావళికి ప్రాతఃస్మరణీయుడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య. తక్కువ శీర్షికలతో తన కవిత్వంలో ఎంతటి కవిత్వ సాంద్రతను దట్టించినాడో కవితావిశారదులంతా గమనించినవారే ! “జయపత్రముల”వంటి ప్రశంసావాక్యములందించినవారే!!
సార్థకమైన బిరుదులను ప్రదానం చేసినవారే !!!


మహాకావ్య స్థాయి అభివ్యక్తీకరణ శిల్పరచనను ప్రకటించే కవులు ప్రపంచంలో అరుదుగా జన్మిస్తారు.ఎదుగుతారు.జాతికీర్తిని నిలబెడతారు.సమకాలీన దుష్టతనూ ౼ దౌర్జన్యాన్నీ చీల్చిచెండాడుతారు. తమ కనుల ముందే తమ ప్రధాన శుభసంకల్పం ఫలిస్తే ఆకాశమెత్తు తన జాతి ప్రగతి ఎదగాలని పొంగిపోతారు. *_మహాకవి దాశరథి ప్రధాన శుభసంకల్పం : నిజాం నిరంకుశపాలన నుండి తెలంగాణ విముక్తం కావటమే_* అన్న సత్యశివసుందర’సూక్తిని ఎవరూ ఏవిధంగానూ ఆక్షేపించలేరు. తదనంతర పరిణామాలు తనదృష్టి కోణంలోనికి అందనంత ప్రతారణనూ అప్పటి పరిస్థితుల దృష్ట్యా అందరిలాగే గమనించలేని సజ్జనకవి దాశరథి. *కాలం తనకు కావలసినంత’కాలం తన మనుషులను తానే ఎన్నుకుంటుంది( _రాశే_ )* అనే వాక్యం సమర్థనీయం అనుకుంటే కాలం తెలంగాణ విముక్తి కోసం కవి’దాశరథిని కూడా తానే ఎన్నుకుంది అంటాను నేను. సమకాలీన ప్రముఖులు దాశరథిని _యుగకవి_ అని కీర్తించటం ఇందువల్లనే ! ఆత్మవిశ్వాసం ఆత్మబలం లేకుండా ఆత్మగౌరవం అనే మాట వ్యర్థం. దాశరథి తెలంగాణ జాతి ఆత్మగౌరవ ప్రజారథి.సారథి.ప్రతినిధి. కవితావాక్య”శర”ధి.తన కనులముందే తన మనోరథం ఈడేరి ఆనందించిన కవిని తదనంతర కాలంలో పట్టించుకోవలసినంతగా పట్టించుకోకున్నా ఆత్మగౌరవంతో
*అరుగుచున్నాడు. దాశరథి అమరపురికి* … అన్నట్లు జీవితాన్ని తృప్తిగా _బాగానే బతికాను_ అన్నట్లుగా నిష్క్రమించిన *మహాపురుషుడు దాశరథి* . నిలువెల్లా స్పందించి
*నా తెలంగాణ కోటిరత్నాల వీణ* అనే నినాద’నిక్వాణస్వరాన్ని నిరంతర ప్రేరక విజయశంఖం గా విడిచి వెళ్లిన మహాదార్శనికుడు.
ఇటీవలి కాలఃలో సొంత’ఊపిరిని గెలుచుకొని మరింతగా పెంచుకుని సువర్ణప్రగతి(బంగారు తెలంగాణ) పథంలో పురోగమిస్తూన్న
ఆధునిక తెలంగాణకు *నా తెలంగాణ కోటి రత్నాలవీణ* నిజమైన జీవనోజ్జీవన శంఖధ్వానం.
మహాకవి దాశరథి జయంతి 22,జులై సందర్భంగా ఆ మహాకవికి ఇది నా అక్షరనీరాజనం.
Poets are the unacknowledged legislators of the world ౼ P.B.Shelly

౼ గురిజాల రామశేషయ్య


‘మాన్య’ కవీంద్రుడు ‘సినారె’

ఆధునిక తెలంగాణ సుస్పష్టమైన హద్దులతో ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటి. తెలుగు భాష ప్రాచీన హోదాను పొందిన భారతీయ భాషలలో ఒకటి. మాధుర్యమునకు పేరు పొందిన భాషలలో తెలుగు మొదటిది. సాహిత్యపరంగా తెలుగు పద్యం విశిష్టమైన భావ వాహిక. మందార మకరంద మాధుర్యమునకు పోతన భాగవత తెలుగు పద్యం దృష్టాంత సాక్ష్యం. అటువంటి పోతనను ఉద్దేశించి “ఎందుకాతడుగ పుట్టకైతిని హరీ!” అని తన “భూమిక’’ కావ్యంలో పలువరించి ‘కల’వరించి ఆ కల ‘వరించి’ తన కవన గళ సహపది కాగా మాన్యుడైన మహాకవి సింగిరెడ్డి నారాయణరెడ్డి. ‘సినారె’ సంక్షిప్త నామంతో సుప్రసిద్ధుడైనాడు.
‘సినారె’ అగణ్యమాన్యతామకుటాలు రెండు. ఒకటి, భారతీయ జ్ఞానపీఠ పురస్కార స్వీకృతి, రెండు, ‘రాజ్యసభ’ సభ్యత్వం.
పల్లె నుండి ఢిల్లీవరకు ఎదిగిన తెలంగాణ కవులలో ఒకరు ‘సినారె’. మూడుతరాల యువకవులను ప్రభావితం చేసిన మహాకవి తాతయ్య ‘సినారె’. ఎందరికో శబ్దభిక్ష పెట్టిన ధన్యుడు. ఎందరికో ‘లయ’ను పరిచయం చేసిన సం‘గీత’జ్ఞుడు. ఖండాంతరాలలోని తెలుగు డెందాలను తన పలుకుబడితో పులకరింపజేసిన సుమధుర కవి ‘సినారె’.
విశ్వవిద్యాలయ ఆచార్యునిగా, ఉపకులపతిగా రాణించిన ‘సినారె’ నిజంగా కవి కులపతి. కవి కవిత్వం వరకే పరిమితుడుకాడని నిరూపించిన అధికార భాషా సంఘాధ్యక్షుడు. నిత్య శోభిత సాహిత్య సభాధ్యక్షుడు, ముఖ్యాతిథి. తిథిరీత్యా నిత్యకవన రచనా పిపాసి. కవితాభ్యాసి. కవితా ‘కళాప్రపూర్ణుడు’. కవి పద్మ భూషణుడ. రణం మరణంపైనే అని సగర్వంగా ప్రకటన చేసిన కవి యశస్వి ‘సినారె’.
తన పేర తెలంగాణ రాజధానిలో సారస్వత నిలయం ఏర్పడే అంతగా ఘనత పొందిన మాన్య కవీంద్రుడు ‘సినారె’.
మధ్య తరగతి మందహాసాన్ని తన పరిధిలో వివేచించి ఉన్నతి గతి మీది చిరకాంక్షతో ‘విశ్వంభర’ మానవుని వరకు తరగెత్తిన కావ్య సమీక్షణం ‘సినారె’ స్వీయ నిర్ణయ కావ్యకళా పథం కావ్యకళా.
అందుకే ఒక సందర్భంలో : గర్జించే గళం నాది! నిర్జించే కలం నాది! స్వీయానుభవగర్వ దీప్తిని అక్షరీకరించినాడు.
ప్రతిష్ఠాత్మక కవితా పీఠాధిష్ఠుడైన తాను ‘పీఠిక’ రచనలతో యువ కవుల నుండి మహాకవుల వరకు అందరిలోని ప్రతిభా వ్యుత్పన్నతలను కల కలిచే తన పద సంపుటితో సప్రమానంగా అభినందించినాడు.
తెలుగు సాహిత్యంలో పద్యం గద్యం ద్విపద కీర్తన వచనం గేయం వచన కవిత మినీ కవిత ఇలా ఇలా అలల్లాంటి ఎన్నెన్నో ప్ర్రకియలు తలలెత్తి కవుల తలపైన కీర్తికిరీటాలను సుస్థిరం చేసినాయి. ఈ క్రమంలో 20వ శతాబ్ధం 30వ దశకంలో 29 జులై 1931 రోజున ఆషాఢ పూర్ణిమ (గురుపూర్ణిమ)నాడు జన్మించిన ‘సినారె’ మాత్రాచ్ఛందస్సుల్లో గేయ కావ్యాలను రచించి ఒడుపుగా పద్య గంధిలతను – సమాసకల్పనల పొందికతో అక్షర రమ్యంగా సముచిత రీతిలో ఔచిత్య భాసురంగా గంగాతరంగచారిమతో భారత స్వాతంత్ర్యానంతర కవిస్వాతంత్ర్యానుకూల గేయం దేశచ్ఛందస్సులలోనికి తెలుగు పలుకు ఒరవడికి మడులు తీర్చి కవిత్వపు పంటను పండించే చొరవను పాదు కొల్పినారు. ఇది ‘సినారె’ పైకి చెప్పకుండా అఖిలాంధ్ర సాహిత్య చరిత్రకు చేసిన మేలు. దీనివల్ల అంటే మాత్రాచ్ఛందో కావ్యాలవల్ల పద్య పఠన శక్తి ఒనగూడి ప్రాచీన కావ్యధోరణుల సమవగాహన శక్తిని పొందటానికి అప్పటి యువతరానికి సాధ్యమైంది. అంతేకాక గహనమైన కావ్యశిల్ప సంప్రదాయములను యథాశక్తి గ్రహించి తమ రచనలలో పాటించగలిగే నేర్పు ఇంతో అంతో ఒనగూడింది. ముఖ్యంగా భాషా పరంగా నిర్దుష్ట భాష పట్ల ఆసక్తి పెరిగింది. అంతేనా! ‘సినారె’ రుచి చూపించిన అంత్యప్రాస, అంతఃప్రాస (సినారె మాటే ఇది), అనుప్రాస, యమకాది అలంకారాలను గమనించి ఆనందించటంలోనూ; తమ రచనలలో ప్రయోగించి మెప్పుపొందటంలోనూ కవులను మార్గదర్శనం చేసినట్లయింది. జనరంజకమైన సినీ గీతాలలోనూ ఈ సాంప్రదాయిక సాహిత్యరీతి విధానాలను చవి చూపించినాడు. కలవరించి – కల- వరించి సభంగ శ్లేషాత్మక యమకం. “శివరంజని” సినిమాలోని పాటలో “నా దానివి – నా –దానివి” ఇలాంటిదే! పాలవెలుగై –మణదీ “పాల” వెలుగై ఇలాంటివెన్నెన్నో! తనకంటె ముందు తరంలోని పెద్దల సరసన ఇటు శిష్ట సాహిత్యంలోనూ అటు సినీ సాహిత్యంలోనూ నెగిలిన ప్రతిభాశాలి ‘సినారె’. ఇక తన తర్వాతి తరం చేత అభిమానింపబడిన, సన్మానింపబడిన పెద్ద “సినారె”. తరం మారుతున్నది….. స్వరం మారుతున్నదని గమనించిన దార్శనికుడు. “సరిలేరు. నీకెవ్వరు” అని జేజేలు పొందిన అదృష్టవంతుడు. ఇంతగా సినీ సాహిత్యపరంగా చెప్పటమెందుకంటే “సినారె” కీర్తి కిరీటంలో ఒకటి ఆచార్య పదవి – దాని ఉన్నత ఉప కులపతి పదవి ఒక తురాయి. శిష్ట సాహిత్యంలో భారతీయ జ్ఞానపీఠ పురస్కృతి మరో కలికితురాయి. సినీగీతావళి కీర్తి కలిమితురాయి. శ్రోతలకేమో సరళీ స్వరాల పంట. ఒక వ్యక్తి కవిగా ఇంత ఉన్నత స్థాయి కీర్తి స్థితులను అందుకోవటం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంతటి సంయమన శీలంతో – మరెంతటి కళాసేవా “శ్రమ” కర్తృత్వంతో ఇంకెంతటి ఉల్లాస భరిత స్వరచాలన హృదయంతో ఉజ్జీవిస్తూ రోజు రోజూ కాలాన్ని కర్పూరంగా మండించుకోవాలో కదా! అప్పుడే కదా ఇంతటి మాన్యచరితకు దీప్తి!
ప్రభుత్వ కళాసాహిత్య సేవా సలహాదారుగా పనిచేసిన “సినారె” ఎన్నో ప్రసిద్ధ కళాసాహిత్య సేవా సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచినాడు. తెలంగాణ సారస్వత పరిషత్తును చెదరకుండా నిలిపిన వ్యవహారజ్ఞుడు.
సమష్టిపై ‘సినారె’ ఆధునికతలో అడుగులు వేసిన ధీశాలి. ప్రాచీన వైభవ సంస్కృతిని (Heritage) ఆధునిక స్పృహతో సమీక్షించిన సామాజిక కళామేధావి.
“సురభిళ శబ్దమ్మొక్కటి
తరగెత్తిన చాలు – నా
గుండె సందులందు కోట్లి
నందనాలు గుబాళించు”
అని తన శబ్ద ప్రీతిని అభివ్యక్తీకరించుకున్న ‘సినారె’ అస్మదాదులకు “శబ్ద గురువు”.
“అంత కడివెడు పాలపై – ఒ
క్కింత మీగడ పేరినట్లుగ మనకు
మిగులును గతము లోపలి మంచి
అదిమె సంప్రదాయము”
అని సంప్రదాయములోని మంచిని ఆధునికతలోని ప్రయోగ ప్రయోజన శీలతను మేళవించుకని ‘ఒళ్ళంతా లయ’గా అడుగులు వేసి – “చూపంతా ప్రగతిశీలత” నుడుగులు పలికి తెలుగుజాతికి మాన్యకవీంద్రునిగా ఆదర్శనీయుడై తరించిన స్వరధుని “సినారె”! మానవీయ విశ్వంభరుడు “సినారె”.
శ్రీ గురుభ్యోనమః

– గురజాల రామశేషయ్య

 

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పద్య సుగంధం

by డా|| మృదుల నందవరం June 23, 2021
written by డా|| మృదుల నందవరం

విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం,
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః,
విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం
విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీనః పశుః.

మానవులకు విద్యయే సౌందర్యము; అదియే గుప్తధనము; చదువే కీర్తిని,
సుఖమును,భోగమును కలిగించును; విద్యయే గురువులకు గురువైనది;విదేశములకు పోయినపుడు విద్యయే బంధువు; అదియే మరొక కన్నువంటిది; రాజ్యసభలలో పూజార్హత విద్యకే గాని ధనమునకు గాదు.ఇంతటి శ్రేష్ఠమైన విద్య లేని నరుడు వింతపశువు మాత్రమే.

సూక్తి ముక్తావళి – సంకలన కర్త మహీధర జగన్మోహన రావు -ప్రాచీ పబ్లికేషన్స్-మొదటి ముద్రణ1963,ఏడవ ముద్రణ 2015 నవోదయ బుక్ హౌస్-హైదరాబాద్.

 

విద్య మాత్రమే మానవులకు అందాన్నిస్తుంది.అంతేకాదు గుప్తధనం వంటిది.ఈ విద్యే మానవులకుకీర్తిని,సుఖాన్ని, సౌఖ్యాలను అందిస్తుంది.విద్య-గురువులకు గురువు వంటిది;విదేశాలలో బంధువులా సహాయం చేస్తుంది;మరో నేత్రం వలె ప్రపంచపు లోగుట్టును తెలియ జేస్తుంది.అంతమాత్రమే కాదు,రాజ సభలలో విద్యావంతుడు మాత్రమే గౌరవాన్ని పొందుతాడు.విద్యా విహీనుడు చులకనగా చూడబడతాడు.అని భర్తృహరి నీతి శతకం లో చెబుతాడు.

విద్య ఒక్కటే, మానవునికి విలువను పెంచుతుంది,అన్న విషయాన్ని ఆధునిక కాలంలో నిరూపించిన వారిలో ప్రథమంగా చెప్పుకోదగిన వ్యక్తి-ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.కాస్మాలజి,జనరల్ రిలెటివిటి పై అతడు చేసిన పరిశోధనలు ప్రపంచానికి కొత్త చూపును ఇచ్చాయి.మోటార్ న్యూరాన్ వ్యాధి తో బాధపడుతూ, ప్రత్యేక మైన వీల్ చైర్ కి పరిమితమై ఆయన చేసిన కృషి సమస్త మానవాళికి స్ఫూర్తి దాయకం.జ్ఞానానికి దక్కిన గౌరవం అది.

విద్యను గూర్చి విశిష్టంగా తెలిపిన స్వామి వివేకానంద గారి బోధలను మనం పరిశీలిస్తే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది.’విద్య’ ప్రతి మానవుని యందు ఉంటుందని,పాత్రకు మకిలి పట్టినట్లుగా,ఆ విద్య చుట్టూ అజ్ఞానం అలుముకొని ఉంటుందని,గురువు ఆ అజ్ఞానాన్ని తొలగించినపుడు అతడు విద్యావంతుడు కాగలడని అంటారు.మఱ్ఱి విత్తనంలో చెట్టుకు ఉండవలసిన సమస్త భాగాల కణాలు ఉంటాయి. భౌతిక పరిస్థితులు అనుకూలించి నప్పుడు ఆ విత్తనం చెట్టుగా ఎదిగినట్లే, వ్యక్తి కి సరైన సుఖం హితగురువు లభించినప్పుడే అతడు విద్యావంతుడు గా పరిఢవిల్లుతాడు అని వివేకానందుల వారు చెప్పిన వాక్యాలు సమస్త మానవాళికి హితవాక్యాలు.ఆ పాత్ర వంటకు యోగ్యమైనట్లుగా ,ఆ మఱ్ఱి చెట్టు పక్షులకు ఆశ్రయమిచ్చి నట్లుగా,బాటసారులకు నీడనిచ్చినట్లుగా విద్యావంతుడు సమాజాన్ని తన అక్కున చేర్చుకుని కావలసిన రక్షణనిస్తాడు.అతడు ఆ సమాజం చేత ప్రేమించబడతాడు-అని మనం గుర్తించాలి.

విద్య ఒక్కటే, మానవునికి విలువను పెంచుతుంది,అన్న విషయాన్ని ఆధునిక కాలంలో నిరూపించిన వారిలో ప్రథమంగా చెప్పుకోదగిన వ్యక్తి-ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.కాస్మాలజి,జనరల్ రిలెటివిటి పై అతడు చేసిన పరిశోధనలు ప్రపంచానికి కొత్త చూపును ఇచ్చాయి.మోటార్ న్యూరాన్ వ్యాధి తో బాధపడుతూ, ప్రత్యేక మైన వీల్ చైర్ కి పరిమితమై ఆయన చేసిన కృషి సమస్త మానవాళికి స్ఫూర్తి దాయకం.జ్ఞానానికి దక్కిన గౌరవం అది.

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

Cartoon

by Rama Devi Nellutla June 23, 2021
written by Rama Devi Nellutla

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

జీవ వైవిధ్యానికి స్వర్ణధామం….. (కెన్యా)- Travelogue

by Narmada Nomula June 23, 2021
written by Narmada Nomula

ఆధునికత అంటే అన్నీ ఉండటం, సకల సౌకర్యాలు అనుభవించడం, యాస భాషల్లో హుందాగా ఉండటం, ఖరీదైన బట్టలు కట్టుకోవడం అనుకుంటాం. కానీ ఆధుకత అంటే ఇవేవీ కావు అనేది ప్రకృతిని దగ్గరి నుంచి గమనిస్తూ, వాటిని అనుభూతి చెందితే తప్ప అర్థమే కాదు. వాస్తవానికి ఇప్పటికీ ఆ్రఫికా ఖండంలోని నల్లవాళ్ళను చూస్తే వాళ్ళు ఇంక ఆధునికతకు అందిపుచ్చుకోలేదు. చాలా వెనుకబడి ఉన్నారు అనుకుంటాం. కానీ అదేమీ నిజం కాదు. నిజానికి ప్రకృతిలోని సకల జీవరాశుల్లో మనిషి మాత్రమే అన్నింటికి దూరంగా నివసిస్తూ ఆధునికత పేరుతో గదుల్లో బంధించుకొని కూర్చున్నాడు. మిగతా ఏ జీవరాశి ప్రకృతికి దూరంగా బంధించుకొని కూర్చొలేదు. పశుపక్షాదులు అన్ని కలిసిపోయి, ఆనందిస్తూ, ప్రకృతిని అనుభూతి చెందుతూ స్వేచ్ఛగా విహరిస్తున్నాయి ఒక్క మనం తప్ప. ఇది ప్రకృతికి ఎంత విరుద్ధం కదా…?

నిజానికి నాగరికతలు అన్నీ నదుల వెంట విలసిల్లాయి అని చరిత్ర చెబుతుంది కానీ ఇవాళ ఆ నదుల వెంట మనం ఎక్కడున్నాం…. మనం లేము కానీ మిగతా జీవకోటి అంతటా అక్కడ కొలువు తీరింది. మనం గమనిస్తున్నామో లేదో కానీ మనిషి పుట్టుక నదుల దగ్గరే మొదలై చివరకు నదుల దగ్గరే ముగుస్తుంది, ఒక్క మధ్య జీవితం తప్ప. అందుకే ప్రకృతికి దూరంగా బతుకుతున్న మనం కనీసం అప్పుడప్పుడైనా ఆ నదుల దగ్గరకు వెళ్ళి ఆ జీవితాన్ని అనుభూతి చెందాలి. అందుకే ప్రపంచంలోని వివిధ దేశాలలోని నదీ తీరాలలో పర్యటించాలనే మా కోరికను ఈసారి కెన్యావైపు మళ్ళించాం.  నైల్ నది ప్రవహించే దేశాలలో కెన్యా కూడా ఒకటి. నైల్ నదీ తీరంలో నడవాలనే కోరికతో హైదరాబాద్ నుండి కెన్యాకు బయలుదేరాం.

మేం ముంబాయి నుండి కెన్యా రాజధాని నైరోబీకి తక్కువ రేట్లలో టికెట్లు బుక్ చేసుకున్నాం. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూతురు నైరోబీలో నివసిస్తుంది. ఆమె మాకు చాలా తక్కువ ఖర్చులో కెన్యా అందాలన్నీంటిని చూసేలా ఒక ఓపెనం టాపం జీపం మాట్లాడి మమ్మల్ని కెన్యాకు ఆహ్వానించారు. మాతోపాటు ఇంకే జంట, ఒక లేడీ డాక్టరు, మరో మహిళా వ్యాపారవేత్త మొత్తం ఆరుగురం కలిసి ఓపెన్ టాప్ జీప్లో మా ప్రయాణం మొదలెట్టాం.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను కెన్యా పర్యటనకంటే ముందు వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్ కు వెళ్ళి వచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే స్లిప్ అయి కిందపడ్డాను. అప్పటి నుండి కొద్దిగా నడుం నొప్పి స్టార్ట్ అయింది. అందువల్ల కెన్యా పర్యటనలో జీపులో ముందు సీట్లో కూర్చున్నాను.

మొదట మేము నకూర్ సరస్సుకు వెళ్ళాం. ఇది భూమధ్య రేఖకి దగ్గరగా ఉంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలను చూడాలంటే రెండు కండ్లు చాలవు. వర్ణిస్తే ఒక దృశ్యకావ్యంగా అవుతుంది. ఈ సరస్సు చుట్టూ యోఫోర్బియా చెట్లు ఉన్నాయి. ఇదొక ఔషధ మొక్క. ఈ పేరు బొంతజెముడు. దాని శాస్త్రీయ నామం యుఫోర్బియా. సహజంగా చెట్లనగానే ఒకలాంటి భావన కలుగుతుంది. దాని తెలుసుకోవాలనే తపన నాలో పెరిగి. ఈ మొక్కలు ఎక్కువగా కొండ దిగువ ప్రాంతాలైన గలస మట్టి నేలల్లో ఎక్కువగా పెరుగుతాయి.  ఈ చెట్టును గీరినప్పుడు, లేదా గిల్లినప్పుడు తెల్లని పాల లాంటి ద్రావం కారుతుంది. ఈ చెట్లు కొమ్మలు… కొమ్మలుగా పైకి ఎగబాకుతాయి. చెట్లు పైకి ఎదిగే కొద్ది కింది కొమ్మలు రాలిపోతాయి. ఇంకా యుఫోర్బియా చెట్లతోపాటు ఎల్లో ఫీవరం చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి.

అత్యంత అందమైన నకురు సరస్సు….

దూరంగా కొండలు… పక్కనే ఉన్న ‘నకురు సరస్సు’ అందాల్ని చూడాలని వెళ్ళాం. కెన్యాలో నకూరు నేషనల్ పార్క్ కు దగ్గరలో ఉండటంవల్ల దీనికి నకూరు సరస్సు అని పిలుస్తారు. ఇది తూర్పు ఆఫ్రికన్ ఫాల్ట్ జోన్ వెంట ఉన్న సహజ జలాశయాలలో ఇదొకటి. ఈ సరస్సు సముద్రమట్టానికి  1759 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఎత్తయిన పర్వత జలాశయాలలో ఒకటి. నకూరు సరస్సులో ఫ్లెమంగోలు గూడు కట్టుకోవడంవల్ల ఈ సరస్సు అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ పక్ష్లు సంఖ్య చాలా తక్కువ. ఫ్లెమింగోలతోపాటు పెలికాన్లు ఇక్కడ ఎక్కువగా నివసిస్తాయి. ఇంకా వీటితోపాటు లేకం నకూరులో పెద్ద  సంఖ్యలో జంతు జాతులు నివశిస్తున్నాయి. ఖడ్గమృగాలు, ఇంపాలా జింక, ఉగాండా జిరాఫీ, నీటిమేక, ఆఫ్రికన్ గేదె, క్షీరదాలు, వివిధ రకాల సరీసృపాలు ఉన్నాయి. వీటిని చూడటానికి ఎక్కడెక్కడి నుండో పర్యాటకుల వేలసంఖ్యలో అక్కడికి వస్తారు.

ఫెలికాన్ పక్షుల సందడి….

సరస్సు నిండా ఫెలికాన్ పక్షులు వేలసంఖ్యలో విహారిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఫెలికాన్ పక్షుల గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా… ఈ పక్షులకు పొడవాటి ముక్కు, పొట్టితోక, చిన్నకాళ్ళు, పెద్ద రెక్కలు, గోధుమ లేదా తెలుపు రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా భారతదేశం, ఆఫ్రికా, ఇరాక్ దేశాలకు వలస వెళ్తుంటాయి. మన దేశంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని కొల్లేరు సరస్సుకు ఇతర దేశాల నుండి ఫెలికాన్లు వస్తాయి. ఫెలికాన్ రంగునుబట్టి అవి ఏ దేశానికి చెందినవో గుర్తించవచ్చు. స్పాట్ బిల్ట్, డాల్మెషియ్, పింక్ బ్యాక్డ్, ఆస్ట్రేలియాన్, పెరువియన్ ఇలా బోలెడు ఉన్నాయి. సైబీరియా, ఆస్ట్రేలియా, అమెరికన్ వైట్ ఫెలికాన్లు అక్కడ వేసవిని భరించలేక వేల కిలోమీటర్లు దాటి వచ్చి…. ఇక్కడ శీతాకాలాన్ని ఆస్వాధిస్తాయి. అయితే మేం చూసిన నకూర్ సరస్సులో మాత్రం గోధుమ రంగు ఫెలికాన్లు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవి బాగా ఎత్తు నుండి నీటిలోకి మునిగి లోతుగా డైవ్ చేసి చేపల్ని పడతాయి. ఫెలికాన్ల గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నంటే ఇవి మన దేశంలోని కోల్లెరు సరస్సుకు ప్రతి ఏటా డిసెంబర్ లేదా నవంబర్ మాసంలో మన దేశానికి వలస వచ్చి సందడి చేసి వెళ్తాయి కాబట్టి.

ఇలే మేం రెండు గంటలపాటు సరస్సు వెంట అటూ… ఇటూ తిరుగుతూ…. పక్షులతో ఫోటోలు దిగాం. ఒక విధంగా మేం నకూరు సరస్సును వదిలి వెళ్ళలేకపోయాం.  ‘ఇంకొంచెం టైం ఇక్కడే స్పెడ్ చేస్తే బాగండు కదా’ అనిపించింది. ‘ఇక చాలు, ఇక్కడి నుండి బయలుదేరండి’ అన్నట్టుగా అప్పుడే వర్షం మొదలైంది. దాంతో మేం పరుగో పరుగో అనుకుంటూ జీప్ లోకి వెళ్ళి కూర్చోన్నాం.

నైవాషా సరస్సు….

నకూరు సరస్సు నుండి నేరుగా నైవాషా సరస్సుకు వెళ్ళాం.  ఇదొక స్వర్గధామమనే చెప్పవచ్చు. ఇక్కడ నైవాషా సరస్సు సముద్రమట్టానికి 1886 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది రాజధాని నైరోబికి వ్యాయవ్యంగా ఉన్నటువంటి మంచి నీటి సరస్సు. ఈ సరస్సులో దాదాపుగా 400 పైగా పక్షులు ఉన్నాయి. ఈ సరస్సులో మరొక అద్భుతం తెల్లటి కొంగల సందడి. ఇవి ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సరస్సులోని తెల్లటి కొంగలు మరో రకమైన అందంగా చెప్పొచ్చు. వాటిని చూసి చాలాసేపు ఎంజాయ్ చేశాం.

మాసాయి మారా నేషనల్ పార్క్….

ఇది కెన్యాలో ప్రధాన వన్యప్రాణుల పార్క్ల్లో ఒకటి. ఇది టాంజానియా సరిహద్దుల్లో నైరుతి కెన్యాలో ఉంది. ఇక్కడంతా నేల గడ్డిభూములతో నిండుకొని ఉంటుంది. ఇదొక అద్భుతమైన దృశ్యం. రంగురంగుల సంస్కృతి, వన్యప్రాణుల విన్యాసాలు పర్యాటకులను ఆనందింపజేస్తాయి. దీనిలోకి ప్రవేశించాలంటే ఇతర దేశీయులకు 80 డాలర్ల వరకూ చార్జ్ చేస్తారు. మేము టికెట్ ఒక సఫారిలో లోపలికి వెళ్ళాము. అక్కడికి వెళ్లగానే మాకు మసాయి మారా గిరిజనులు స్వాగతం పలికారు. అక్కడే మాకు వారు భోజనం ఏర్పాటు చేశారు. భోజనానికి మాకు లావు బియ్యంతో అన్నం, మటన్ క్రరీ వండారు. దాంతోపాటు బ్రెడ్, వెన్న, జామ్ పెట్టారు. భోజనం చేసిన వెంటనే అందరం కలిసి మాసాయి మారా నేషనల్ పార్క్ చూడటానికి వెళ్ళాం. మారాయి మారా నేషనల్ పార్క్ చూడటానికి వెళ్ళాం. మాసాయి మారా నేషనల్ పార్క్లో చాలా రకాల పక్షులు నిరంతరం గాల్లో విహరిస్తుంటాయి. రాబందులు, క్రెస్టెడ్ ఈగల్స్, మరబౌ కొంగలు, గినియా కోళ్ళు, సోమాలి ఉష్ణపక్షి, కిరీటం కలిగిన క్రేన్లు, పిగ్మీ ఫాల్కన్లు ఇంకా చాలా ఉన్నాయి. మావో ప్రజల (మాసాయి) భాషలో ‘మారా’ అనే పదానికి అర్థం ‘మచ్చలు’ అని. నిజానికి దూరం నుండి చూస్తే ఈ ప్రాంతంలోని మైదానం మొత్తం చిన్న చిన్న చెట్లతో మచ్చలుగా కనిపిస్తుంది.  మారా మైదానాలు నల్లటి చారలతో పెయింట్ వేసినట్లు కనిపిస్తాయి. నిజంగా ఇదొక అరుదైన దృశ్యం. కెన్యా అంతటా సుమారు రెండు మిలియన్ల అడవి దున్నలు, సుమారు రెండు లక్షల జీబ్రాలు, అర మిలియన్ గజెల్లు ఇంకా ఇతర శాఖాహార జంతువులున్నాయి. చిరుతపులి, సింహాలు, హైనాయిడ్ కుక్కలు, అలాగే నక్కలు, రాబందులు, మరబౌ వంటి మాంసాహారులు కూడా ఉన్నారు.

ఇక మేం వెళ్ళిన రోజు జరిగిన సంఘటన గురించి ఈ సందర్భంగా చెప్పాలి. మేం చేరుకునేసరికి అక్కడ మైగ్రేషన్ మొదలైంది. మైగ్రేషన్ అంటే ఏమిటి అనే సందేహం రావొచ్చు. మైగ్రేన్ అంటే ఏం లేదు జంతువులు గుంపులుగా ఒక ప్రాంతం నండి మరొక ప్రాంతానికి వలస వెళ్లడం. తరచూ మన దగ్గర కూడా చూస్తుంటాం. ఆఫ్రికా, దక్షిణ అమెరికా నుండి కొన్ని కొంగలు, పక్షులు వలస వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మేం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇదే సంఘటన జరుగుతుంది. కొన్ని లక్షల సంఖ్యలో అక్కడ అడవి దున్నలు కనిపించాయి. అవి చూడటానికి పెద్ద పెద్ద బ్రరెల్లా ఉండి జుట్టు కూడా ఉంటుంది.  అన్నీ కలిసి లక్షల సంఖ్యలో ఒక దగ్గర గుమ్మి గూడతాయి. అవి నడిచే దార్లు చూస్తే ఎక్కడో పేరంటానికి పిలిచినట్టుగా వెళ్తుంటాయి. ఒకదాన్ని మరొకటి పిలిచినట్లుగా ఒకదాని మరొకటి పరిగెత్తుకుంటూ వెళ్తాయి.

ఇవన్నీ ఒకే వరుస క్రమంలో ఎక్కడెక్కడి నుండో వందల కిలోమీటర్లు నడిచి అన్ని ఒకచోటకి చేరతాయి. ఈ అడవి దున్నలు (వైల్ బిట్స్) అన్నీ ఒక చోటకి చేరాక…. మాసాయి కాలువ అవతలివైపు ఉండే గట్టులోకి చేరతాయి. అవతలివైపు మొత్తం పచ్చగడ్డితో నిండి ఉంటుంది. ‘మనం అక్కడికి వెళ్తాం’ అని ఆ జంతువులు మాట్లాడుకుంటాయట అని స్థానికులు చెబితే ఆశ్చర్యపోయాను. నిజంగా అలాగే అనిపించింది ఆ అడవి దున్నలు పరుగులు చూస్తే…

అవి ఎప్పుడైతే ఈ మాసాయి నది దగ్గరీ వస్తాయో…. వాటిల్లోంచి ఐదు లేదా ఆరు అడవి దున్నలు నీటిలోకి తొంగి చూస్తాయి. అలా రోజంతా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటలవరకు నీటిలోకి తొంగి చూస్తూ, వాటిల్లో అవి మాట్లాడుకున్నట్లు అన్నీ ఒకే చోటకు చేరుతాయి. ఎప్పుడైతే మొసళ్ళు తక్కువగా ఉన్నాయో, అవి కనిపించడం లేదా అని వాటికి అనిపిస్తుందో అప్పుడు అన్నీ కలిసి ఒక దాని వెనుక ఒకటిగా నదిలోకి దూకుతాయి. అవతలివైపు ఒడ్డు చేరడానికి ఇదొక మార్గం. దీనినే మైగ్రేషన్ అంటారు. మేం మధ్యాహ్నం ఒంటి గంటకి వెళ్ళి నాలుగు గంటలవరకు ఈ మైగ్రేషన్ దగ్గర ఉన్నాం. ఆ క్షణం ఎంత ఉద్విగ్నంగా ఉందో చెప్పలేను. ఈ మైగ్రేషన్ దృశ్యాన్ని చూడటానికి చాలామంది కొన్ని నెలల తరబడి ఎదురుచూస్తారు. మేం వెళ్ళిన గంటలో ఇది చూడటం మా అదృష్టం అనీ, చాలా సంతోషంగా అనిపించింది.

అక్కడి నుండి వెళ్తూ ఉంటే వందల ఏనుగులు, జీ్బ్రాలు, సింహాలు, పులులు, అడవి దున్నులు అన్నీ కలిసి ఒకేచోట ఆహారం తినడం చూశాం. మాకు ఒక అడుగు దూరంలో ఒక పెద్ద సింహం తిరుగుతూ ఉంటే దానినే చూస్తూ ఒక గంట సమయం గడిపాం. ఆ రోజు ఒక 60 సింహాలవరకూ చూశాం. అవి కూడా 4 నుండి 5 సింహాలు గుంపులు… గుంపులుగా కలిసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాం.

ఈ మైగ్రేషన్ అప్పుడు మొసళ్ళు కూడా ఎక్కడో దాక్కుని, అవి నది దాటుతున్నప్పుడు వాటిని చంపి తింటాయని చెప్పారు అక్కడి స్థానికులు. అవి తినడం మొదలవగానే మిగతా జంతువులు ఆగిపోతాయని చెప్పారు మాతో వచ్చిన గైడ్. ఇలా జంతువ అంత గ్రహింపును కలిగి ఉండటం చాలా ఆనందంగా అనిపించింది. ప్రాణరక్షణ గురించి ఆలోచించడం ఎంత విడ్డూరం. లక్ష జంతువులు గుమిగూడటమేమిటి? అవి అన్నీ ఎవరో చెప్పినట్లుగా బార్డర్ దాటడమేంటి? అని చాలాసేపు ఆలోచించాను. జంతువులకు కూడా అద్బుతమైన తెలివితేటలు ఉంటాయి. కాకపోతే మనలా మాటలు రావు అంతే తేడా. అన్ని సింహాలు ఉన్నా, వందలమంది యాత్రికులు చూడటానికి వచ్చినా, సింహాలు ఏమీ అనడం లేదు. స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అవి అన్నీ చూసి మేం రాత్రి కావడంతో భోజనం కానిచ్చేశాం.  మసాయి మారా గిరిజనులు మా గుడారాలకు వచ్చారు. ఆ రాత్రి వారి డ్యాన్స్ చూశాం. వారు స్వయంగా వండిన అన్నం, కూరలు తిని అక్కడే ఉన్న మా గుడారంలో పడుకున్నాం.

కిలి మాంజారో….

ఈ మధ్యకాలంలో తరచూ మనం వింటున్న పేరు. ఒకటి శంకర్ దర్శకత్వం వహించిన రోబో సినిమాలో ‘కిలో మంజారో భలా భల్లి మంజారో యారో యారో’….. అంటూ ప్రస్థావన వస్తే, రెండోది ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రల్లోని సోషల్ వెల్ఫేర్ హోటల్లో చదువుతున్న పిల్లలు ఆ్రఫికాలో అతి ఎత్తయిన ఈ పర్వతాన్ని అధిరోహించినట్టు మనం వార్తల్లో చూస్తున్నాం. కేవలం 13 ఏండ్ల చిన్న వయసులోనే పూర్ణ మాలవత్ కిలి మంజారోని  కూడా ఎక్కి రికార్డు సృష్టిఁచడం ఒకటైతే అనంతపురం జిల్లా అగ్రహారానికి చెందిన తొమ్మిదేండ్ల అమ్మాయి కిలి మంజారోని అధిరోహించిన వార్తను కూడా మనం చూశాం. అంటే ఇంత చిన్న పిల్లలు కూడా వెళ్ళిన వార్తలు మనం చూశాం. చిన్న పిల్లలు కూడా ఈ కిలిమంజారో పర్వతాన్ని చాలా సునాయాసంగా ఎక్కడం అధిరోహించడం చూసిన నేను. కెన్యా వెళ్ళినప్పుడు నేనెందుకు చూడలేను అని అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది.

మర్నాడు మేం మసాయి మారా నేషనల్ పార్క్ నుండి ఉదయం కిలి మంజారో చూడటానికి బయలుదేరాం. కిలిమంజారో పర్వతం టాంజానియా రాష్ట్రంలో ఉంది. కానీ కెన్యా సరిహద్దుకు దగ్గరలో ఉందని తెలిసి చూడటానికి వెళ్ళాం. పర్యాటకుల సందడితో కిలిమంజారో నిండిపోయి ఉంది మేం వెళ్ళేసరికీ. ప్రముఖ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే కిలిమంజారో పర్వతం గురించి ఒక కథ కూడా రాశారు. అది ‘కిలి మంజారో స్నో’ ఇది మొదటిసారి ఎస్కైర్ పత్రికలో 1936లో ప్రచురించబడింది. ఈ కథ ఆధారంగా సినిమాలు కూడా తీశారు. దీన్నిబట్ఠి అర్థం చేసుకోవచ్చు ఈ పర్వతం ప్రాముఖ్యతను.

ఇది రెండు మిలియన్ సంవత్సరాల పురాతనమైన అగ్నిపర్వతం. ఆ్రఫికాలోనే ఎత్తయిన అగ్నిపర్వతం. ఇక్కడ సినిమా షూటింగంలు నిరంతరం జరుగుతునే ఉంటాయి.

కిలిమంజారో అంటే అర్థం ‘ప్రకాశించే పర్వతం’ అని. ఈ పర్వతం పై భాగం మొత్తం తెలుగురంగులో ఉండటంవల్ల ఈ పేరు పెట్టారు. కిలిమంజారో చుట్టూ, పరిసరా ప్రాంతాల్లో ఎలాంటి పర్వతాలు లేవు. మొత్తం చదునుగా ఉండే మైదాన ప్రాంతం. ఇది ఉష్ణమండల మైదాన ప్రదేశం. ప్రముఖంగా కెన్యాలో మొక్కలు, జంతువులు, ఎత్తయిన పర్వతాలు పర్యాటకులను ముగ్ధమనోహరులను చేస్తుంది. ఈ పర్వతం కింది భాగంలో పంట పొలాలు, గడి్డతో నిండి పచ్చని తివాచీల కనిపిస్తుంది. ప్రపంచ నలుమూలల నుండి కిలిమంజారోని చూడటానికి వస్తుంటారు. ఇది టాంజానియా దేశానికి ప్రధాన పర్యాటక ఆధాయ వనరుగా చెప్తుంటారు.

కిలిమంజారో నుండి నేరుగా ‘హెల్స్ గేట్ నేషనల్ పార్క్’కు వెళ్ళాం. అక్కడి నుండి ఒక గుట్టపైకి ఎక్కి దిగాం. తర్వాత ఒక జలపాతం దగ్గరకు వెళ్లడానికి బయలుదేరాం. ఎన్నో కొండల మధ్య ఒక్కొక్కరం దాటాలంటే, అంతా పాచిగా ఉంది. జాగ్రత్తగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ కొండకి ఆనుకొని ఒక్కొక్క అడుగూ జరుగుతూ ఎంతో కష్టంగా ఆ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళి, మరలా తిరిగి వచ్చాం. దీనికి హెల్స్ గేట్ అనే పేరు నిజంగా సార్థకమే.

అక్కడి నుండి ఎలిఫెంట్స్ ఆర్ఫనేజ్ కి వెళ్ళాం. అక్కడ చాలా పిల్ల ఏనుగులు ఉన్నాయి. వాటికి స్నానం చేయించడం, వాటితో చిన్న చిన్న ఫీట్స్ చేయించడం అన్నీ చూసి మేం తిరిగి వచ్చేశాం. కెన్యాలో నైలునదీ ప్రవాహం చూశాం. పరీవాహాక ప్రాంతంలో నడక సాగించాం. కెన్యా లేకం నుండి తెల్లటి మంచులా నీరు ప్రవహిస్తుంది.

లేక్ విక్టోరియా…

దీనిని ‘సోర్చ్ ఆఫ్ నైలు’ అంటారు. విక్టోరియా లేకంలో పుట్టి బురుండి, రువాండా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, కెన్యా, ఉగాండా, ఇథియోపియా, సూడాన్, సౌత్ సుడాన్, ఇంకా ఈజిప్టులలో ప్రవహిస్తుంది.

ముచేబిసన్ జలపాతం…

దీన్ని కబలేగా జలపాతం అని కూడా అంటారు. ఉగాండాలో ఉన్న ఈ జలపాతం నైలునదీ ప్రవాహంతో ఏర్పడింది. నైలునది ప్రవహిస్తున్న అన్ని ప్రాంతాలలోనూ జంతువులు, నీటి జంతువులు, చింపాంజీలు, బర్రెలు, ఏనుగులు ఉంటాయి. వీటిని మూర్ఛపోన్ ఫాల్స్ వద్ద కూడా చూడొచ్చు. ఈ ప్రాంతమంతా ఒక నేషనల్ పార్క్. నైలు నదిలో ప్రయాణించడానికి క్రూజెసం, వైట్ వాటర్ రాఫ్టింగ్ వంటివి  ఈ ప్రాంతాలలో ఉన్నాయి. ఈ నైలునది వెంట ఆఫ్రికా క్రూజర్ పార్క్, కెన్యా సఫారీ ఉన్నాయి. ఈ నైలు నది ‘ఫాదర్ ఆఫ్ ఆఫ్రికన్ రివర్స్’ అనే పేరుతో ప్రసిద్ధి అంటారు.

ఈక్వేటర్ ప్రాంతమైన ఉగాండాలో మొదలుపెడితే, వైట్ నైల్, బ్లాక్ నైల్ గా మారుతుంది. ఈజిప్టులో నైలునది మట్టి నల్లగా ఉండి, ‘కెమ్ ఆర్ కెమి’ అనే పేరుతో ప్రసిద్ధి నొందింది. కెమ్ ఆర్ కెమి అంటే బ్లాక్ అని అర్థం. అంటే ఎప్పుడైతే వరదలు వస్తాయో ఈ ప్రాంతమంతా నల్లటి మట్టితో నిండిపోతుంది, అందుకే బ్లాక్ అంటారు.

7వ శతాబ్దికి చెందిన ప్రఖ్యాత గ్రీసు రచయిత హోమర్ రచన ‘ఒడిస్సీ’లో నైలునదిని నల్లటి దృఢమైన పురుషునిగాను, ఈజిప్టును స్త్రీ గాను తను అభివర్ణించాడు. ఇది అద్భుతమైన కల్పన.

నాకు ఈ నైలునది గురించి కొత్తగా వర్ణించాలని అనిపించింది. బ్లూ నైల్, వైట్ నైల్ ని చూసినప్పుడు ఈ బ్లాక్ నైల్ని చూసినప్పుడు ఇంద్రధనస్సులోని ఏడు రంగులతో ప్రతిబింబిస్తాయి. ఎలాగంటే అది అథియోపియాలో బ్లూ నైల్, కెన్యాలో వైట్ నైల్, ఈజిప్టులో బ్లాక్ నైల్. ఈ జలపాతం గుండా ఈ నది పారి ఇంద్రధనుస్సులు ఏర్పడి ఏడురంగులతో అందరినీ మురిపిస్తుంది. ఇన్ని రంగులమయంతో అలరారే నది ప్రపంచంలో ఇది ఒక్కటేనేమో… నైలు నది హంగులు, పొంగులు అందాలు, నేషనల్ పార్కులు అన్నీ చూసి సంతోషంగా తిరిగి వచ్చాం.

భూ మధ్య రేఖ (ఈక్వేటర్)

మేము కెన్యా పర్యటనల్లో చూసిన వాటిల్లో తప్పక చెప్పుకోవాలసింది భూ మధ్య రేఖ ప్రాంతం. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు భూ మధ్య రేఖ గురించి చదవడం తప్ప అక్కడ ఎలా ఉంటుందో అనేది అనుభవంలోకి రాలేదు. మేుము ఉన్న కెన్యాలో భూ మధ్య రేఖ ప్రాంతం ఉందని తెలియగానే దాన్ని ఎటైనా చూద్దామని బయలుదేరాం. ఈ భూమధ్య రేఖ అనేది 11 దేశాల గుండా పోతుంది. అందులో ఒకటి కెన్యా. ఈ భూమధ్య రేఖ ఉన్న ప్రాంతంలో మార్చ్ 20 నుండి సెప్టెంబర్ 20 మధ్య కాలంలో పగలు, రాత్రి సమానంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో సంవత్సరం పొడగున వాతావరణం ఒకటే ఉంటుంది. భూ మధ్య రేఖలు దూరం పోయిన కొలది వాతావరణంలో హెచ్చుతగ్గులు వస్తాయి.

మేము ఉన్న ప్రాంతం నుండి ఒక మూడు గంటల ప్రయాణంలో భూ మధ్య రేఖ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ విలేజ్ లాంటివి, ఇల్లు లాంటివి లేవు కానీ రోడ్డుమీద ఒక దగ్గర ఇది భూమధ్య రేఖ ప్రాంతం అని సూచించేలా ఒక బోర్డు పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యాత్రికులు అక్కడి ఫోటోలు దిగుతూ ఆనందిస్తున్నారు. మేము ఆ ప్రాంతంలో దిగి కాసేపు చుట్టు పక్కల గమనించి వెనక్కి వచ్చాము.

 

 

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

కలం కనే కలలు

by mayuukha June 23, 2021
written by mayuukha

తెలుగు భాషపైన మక్కువ ఈ యువతరాన్ని ఏకం చేసింది . తెలుగు రాష్ట్రాల వెలుగులు వీళ్ళు . అన్ని ఊళ్ళ నుండి , హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ ఇలా ప్రాంతాలు వేరైనా నవతరం ప్రాబ్లమ్ ఒక్కటే తమవైన ఆలోచనలను పంచుకునే తెలుగుభాష స్నేహ బృందం కావాలి . కవిత్వ సొగసులద్దడానికి ఒక వేదిక కావాలి -ఇది వారి తొలి అడుగు గా Wattsap సంఘాన్ని ఏర్పరుచుకున్నారు . కథలు , కవితలు , గల్పకలు , గేయాలు ఇలా అన్ని ప్రక్రియలలో వారికి తోచినరీతిలో చక్కని తెలుగులో కవితాత్మకంగా రాస్తున్నారు . సమాజంలో కనిపించే వింతతత్వాలకు సెటైర్స్ లాగా రాయడమైనా , నిత్య జీవన విధానంలో గమనించే అంశాలను సున్నితంగా స్పృశించడమైనా ఇలాంటివి రచిస్తూ యవతరానికేకాదు మనతరానికీ స్ఫూర్తిదాయకంగా అడుగులేస్తున్నఈ”కలం కనే కలలు” కు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది ‘ మయూఖ’

ఇలా వాళ్ళను మయూఖ లో పరిచయం చేస్తున్నాను ‘ నవతరం ‘ గా

*********************************************************

పలకడానికి మనిషి లేనప్పుడు, బ్రతకడానికి తోడు లేనప్పుడు పదం పదం పేర్చి మనసు కట్టుకున్న బొమ్మరిల్లు కదా కవిత్వం. మా కలలను కలాలతో పంచుకుంటూ కవిత్వం అనే సముద్రంలో ఈదుతున్న కాలం అది.
రేపటి పరీక్షకు సిద్ధం అవుతున్న విద్యార్థి ఒకడు, రాత్రి కంప్యూటర్ తో కుస్తీ పడుతున్న ఒక యువతి, తీవ్రమైన గాయాలకు చికిత్స చేస్తున్న వైద్యుడు, ఉద్యోగ అవకాశాల వేటలో నిద్ర రాక మరో నిరుద్యోగి, వెన్నెల వైపు చూస్తూ గతంలోకి పయనిస్తున్న ఓ అందమైన యువతి, పొద్దంతా తీరిక లేకుండా పని చేసి వచ్చి అలసిపోయిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, ఇలా ఇంకా కొందరు.. ఎక్కడెక్కడో ఎవరికీ ఎవరితో సంబంధం లేని కొందరు యువతీ యువకులు.. అనగనగా ఒక రోజు, అనుకోకుండా ఒక చోట కలిశారు ఒక వాట్సప్ గ్రూప్ లో.

కలం కాగితంతో కలిసే వరకు ఎన్నో కలలు కంటుంది. ఒక అందమైన కవి ఆలోచనలు ఆ కలానికి తోడైతే, అద్భుతమైన కవితలను సృష్టిస్తుంది. అందుకేనేమో మా వాట్సప్ గ్రూప్ కి “కలం కనే కలలు” అని పేరు పెట్టుకున్నాము. మా వాట్సప్ గ్రూప్ నింపిన స్ఫూర్తి తో, తెలుగు భాష పట్ల అభిమానంతో మాలో ఒకరికి అనుకోకుండా వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టి, ఎన్నో ఆటుపోట్లని ఓర్చుకుని, 44 మంది యువతీయువకులు కలిసి రాసిన పుస్తక సంకలనమే మా ‘కలం కనే కలలు’.
28 మే 2020 లో “శ్రీ నందమూరి తారక రామారావు” గారి జయంతి సందర్భంగా ప్రచురించడం జరిగింది.
అక్షరానికి అక్షరం కూర్చి
పదానికి పదం జోడించి
ఎద మోయలేని భావాలను సిరా లో నింపి కలం అంచునుంచి జాలువారిన
పదకుసుమాలను ఈ పుస్తకం లో పొందుపరిచాము.

అనుకోని ప్రమాదం లో మాకు దూరమైన మా సన్నిహితుడు హేమంత్ కు ఈ పుస్తకాన్ని అంకితం చేశాము. పది పదకొండు మందితో మొదలైన సమూహం ఇప్పుడు ఎనభై మంది యువ రచయితలకు స్థానం చేకూర్చింది. అన్న – తమ్ముళ్ళుగా, అక్కా – చెల్లెళ్ళుగా, మంచి స్నేహితులుగా మా ఈ పయనాన్ని కొనసాగిస్తున్నాము. చిన్నగా ఒక్క అడుగుతో మొదలైన మా ప్రయాణం ఇప్పటికి రెండు వార్షికోత్సవాలు జరుపుకుని, తన మూడవ వసంతం లోకి అడుగు పెట్టింది. ఒకరికి ఒకరం తెలియకుండానే పరిచయం అయ్యాము, అనుకోకుండానే ఆప్తులమయ్యాము.

“కలం కనే కలలు”
– మా కళలతో నిండిన కలలు

 

June 23, 2021 1 comment
5 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

మన యాదాద్రి- 2 & 3

by బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం June 23, 2021
written by బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం

శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు గారు సుప్రసిద్ధ సాహిత్యవేత్తలయిన డా|| ఎస్. లక్ష్మణ మూర్తి

డా|| శ్రీ రంగాచార్య సోదరులయొక్క తండ్రిగారు.

 

అభ్రాజ భ్రాజ దవ్యాజ నిరుపమ దయాసార ధారానుసారం

కోపాటోప ప్రదీప్త ప్రకటతర గరుద్వంద్వ భూమ ప్రతాపం

వ్యాక్షిప్త స్వర్గగంత ప్రథిత గుణగణారంభ వీటీమ్యవాహం

వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహం (2వ శ్లోకం)

తాత్పర్యం: ప్రకాశములేని వాటిని కూడ ప్రకాశింపజేసే, కపటములేని – కారణము నెంచని, దేనితోను ఉపమింపబడని – నిరుపమానమైన తన దయాసారము యొక్క అనుసరణమైనవాడు; కోపం వల్ల కలిగిన ప్రజ్వరిల్లుతున్న – అందరికీ తేటతెల్లనైన, గరుత్మంతునిపై వెలుగొందుతున్న గొప్ప ప్రతాపం కలిగినవాడు; స్వర్గము, దిగంతాలలో విస్తరించబడిన శ్రేష్ఠమైన గుణసమూహములచేత ఉత్తమము, రమ్యము అయినవాడు, గరుత్మంతుని వాహనముగా కలిగిన యాదాద్రిపైన తన పటుతరమైన భుజబలాన్నీ, వేగాన్ని చూపుతున్న శ్రీలక్ష్మీనృసింహస్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: లోకంలో ఒక ఆర్యోక్తి ఉంది. “వస్తేణ వపుషా వాచా, విద్యయా వినయేన చ, వకారైః పంచభిరీనః, వాసవో పి న పూజ్యతే”. లోకంలో ఐదు వకారాలకు (వకారంతో మొదలయ్యే పదాలకు) అత్యంత గౌరవ స్థానం ఉంది. అవి – వస్త్రం, అందమైన చక్కని శరీరం, వాక్కు చదువు, వినయము – ఈ వకారంతో మొదలయ్యే వాటికే జనాలు విలువనిస్తారు, గౌరవిస్తారు. అంటే వస్త్రము మొదలైన ఈ ఐదు ఆడంబరాలు ఎవరికైతే ఉంటాయో వారికే లోకంలో గౌరవం! పూజింపబడతారు లేకపోతే ఇంద్రుడంతవాడికి కూడ గౌరవం లభించదు. కంలో ధర్మపరులు, నీతి-నిజాయితీ కలిగిన వాళ్ళు. న్యాయవర్తన కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళను ఆడంబరాలకు గౌరవాన్నిచ్చే ఈ లోకం గౌరవించదు. వాళ్ళు లోకం దృష్టిలో ప్రకాశహీనులే! ఆ విధంగా లోకంలో ప్రకాశించలేని తన భక్తుల్ని ప్రకాశించేవాడు (అబ్రాజభ్రాజత్) పరమాత్మ! ఏ విధంగా అంటే – తన స్వభావసిద్ధమైన, ఎటువంటి కారణములను అడగని తన యథార్థమైన కపటములేని దయాసారంతో! ఆ దయ కూడ ఎటువంటిది? నిరుపమానమైనది. ఆ దయకు ఉపమానంగా చెప్పగలిగినది ఈ సృష్టిలోనే లేదు! అటువంటి శ్రేష్ఠమైన (సార) దయను అఖండమైన, ఎడతెగని ధారగా కురిపించే పరమాత్మ (దయాసార ధారానుసారం) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఇక్కడ ‘అనుసారం’ స్వారస్యాన్ని కొంచెం చెప్పుకోవాలి. అనుసారం అంటే అనుసరించేవాడని అర్థం. దేవుడు ఎవరిని అనుసరిస్తాడు? తన ‘దయాసారాన్ని కురిపిస్తూ! అంటే పరమాత్మ భక్తుల్ని ముందు తన దయాసారంతో అనుగ్రహిస్తాడు. భక్తుల పై తన దయను పంపిస్తాడు. దాని వెంట తాను అనుసరించి భక్తులకు దర్శనమిస్తాడు! అందుకే కవి లక్ష్మీనరసింహస్వామి వారిని “అవ్యాజ నిరుపమ దయాసారానుసారం” అంటూ అభివర్ణించారు.

నరసింహస్వామి దుష్ట సంహారం కోసం అవతరించినవాడు. భక్త పరిపాలన ఆయన నిత్యకృత్యం! రాక్షసుల్ని సంహరించే సందర్భంలో నరసింహుడు తన కోపాన్నీ, వేగిరపాటును (ఆటోపాన్నీ) ప్రదర్శిస్తాడు. అప్పుడు ఆయన కోపం ప్రజ్వరిల్లిపోతూ ప్రకటితమవుతుంది. అతి భయంకరమైన వేగమూ, పరాక్రమమూ కలిగిన గరుత్మంతునిపై వెలుగొందుతూ తన గొర్పు ప్రతాపాన్ని ప్రదర్శించి రాక్షస సంహారం చేస్తాడు. స్వర్గాది దివ్యలోకాలలోను, దిగంతాలలోను ఆయన శ్రేష్ఠమైన గుణగణాలు వ్యాపించాయి. అటువంటి గుణగణారంభము చేత శ్రేష్ఠుడైనవాడు! ఇంకా రమ్యమైన ఆకారం కలవాడు!! అటువంటి లక్ష్మీనరసింహస్వామి వేగ పరాక్రమాలు కల గరుత్మంతుని తన వాహనంగా చేసుకున్నాడు. యాదగిరిపై తన పటుతర భుజబలంతో ప్రకాశించే శ్రీలక్ష్మీనరసింహస్వామినీ నమస్కరిస్తున్నాను అంటాడు కవిశేఖరుడు!

: స్వస్తి :

కౌటల్యాట వ్యట త్కాంచన తను నయనభ్రాంతికృచ్ఛంబరఘ్నం

లాంగల్యబ్లాంకుశేంద్రాయుధ ఝష శుభరేఖోజ్జ్వలత్పన్నవాబ్దం

ఆపన్నా పన్నగేంద్రం శుచి నియమ గుణార్యాభివంద్యాభిధేయం

వందే యాదక్షమాభృత్కటక పటు భుజారంహ లక్ష్మీనృసింహమ్

తాత్పర్యం: కుటిలత్వము, వంచన అనే అడవిలో తిరిగే, మనోహరమైన ఆకారాలతో చూచేవారి కళ్ళకు భ్రమను కలిగించే మాయను నశింపజేసేవాడు; నాగలి, పద్మము, అంకుశము, వజ్రము అనే ఇంద్రుని ఆయుధం, చేప (మత్స్యం) అనే శుభప్రదమైన రేఖలు కలిగి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న తామరతో పోల్చదగిన పాదము కలవాడు; తనను భక్తితో ఆశ్రయించిన వారి ఆపదలనే పర్వతాలకు ఇంద్రుని వంటివాడు; పరిశుద్ధమూ-పవిత్రమూ అయిన నియమము మొదలైన సద్గుణములచే ఉత్తములచే అభివందనములందుకునే చెప్పుకోదగిన రూపము కలవాడు అయిన – యాదగిరిపై నెలకొన్న – తన దృఢతరమైన భుజబలాన్నీ, వేగాన్ని చూపుతున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: కౌటిల్యము అనేది ఒక దట్టమైన అడవి. ఈ సంసారం కూడా దాటలేని ఒక మహారణ్యమే! సంసార మహారణ్యంలో మనిషిని ఎన్నో వ్యామోహాలు వెంటాడుతూ ఉంటాయి. వాటికి లొంగి మనిషి కష్టాల పాలౌతూ ఉన్నాడు. దీన్నే కౌటిల్యము (కుటిలత్వము, కపటము మొదలైన దుర్గుణములు) కల మహారణ్యమని, అందులో (అటత్) తిరుగుతూన్న (కాంచనతను) వ్యామోహాన్ని కలిగించే రకరకాల విశేషాలు మానవుని కళ్ళకు ఆకర్షణీయాలుగా కనిపించి భ్రమను (నయన భ్రాంతి కృత్) కలుగజేస్తూ ఉంటాయి – రామాయణంలో కాంచన మృగ రూపంలో మారీచుడు సీత కళ్ళకు భ్రమను కలుగజేసినట్లు! శంబరము అంటే ఒకజాతి లేడి అన్న అర్థమూ ఉంది, మాయ అన్న అర్థంతోపాటు. ‘శాంబరీవిద్య’, ‘శాంబరీ ‘మాయ’ అన్న వ్యవహారాలు ప్రసిద్ధాలే కదా! శంబరుడు అటువంటి మాయను ప్రయోగించడంలో నిపుణుడు. అటువంటి శంబరుణ్ణి (శంబరాసురుణ్ణి) మన్మథుడు సంహరించాడు. మరి ఈ సంసారమనే అరణ్యంలో వ్యామోహమనే లేడి శాంబరీ మాయవలె మానవుల్ని వ్యామోహంలో ముంచి వేస్తూ కష్టాల పాలు చేస్తున్నది. అటువంటి శాంబరీ మాయను నశింపజేసి (శంబరఘ్నం) తన భక్తులకు కలిగిన నయన భ్రాంతిని పోగొట్టి ముక్తిని ప్రసాదించేవాడు నరసింహస్వామి!

హస్తరేఖాశాస్త్రం ప్రత్యేక బహుళ ప్రచారం పొందింది. చేతిలో ఉన్న రేఖలను ఆ శాస్త్రాధారంగా గుర్తించి వ్యక్తి భవిష్యత్తును చెప్తుంటారు. చేతిలో ఉన్నట్లుగానే పాదాలలో కూడా రేఖల ద్వారా కొన్ని గుర్తులు (రూపాలు) ఏర్పడుతూ ఉంటాయి. వాటిని బట్టి వారి ఉజ్జ్వలమైన జీవితం ముందుగానే తెలుస్తుందంటారు విజ్ఞులు! శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పాదాలలో లాంగల రేఖ దీన్నే హల రేఖ అంటారు. నాగలి ఆకారంలో ఉంటుంది. పద్మరేఖ, అంకుశరేఖ, వజ్రరేఖ, ఝష (మత్స్య) రేఖలు ఉన్నాయి. స్వామివారి పాదాలు, శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు, ఎక్కడ నెలకొని ఉంటే అక్కడ హలరేఖ చేత అన్న సమృద్ధి ఉంటుంది. పద్మరేఖ సంపదభివృద్ధిని ఇస్తుంది. అంకుశ రేఖ దుష్టుల్ని, దుర్గుణాల్ని అదుపు జేస్తుంది. వజ్రరేఖ శత్రు సంహార కారకం! మత్స్య రేఖ సర్వసమృద్ధిని చేకూరుస్తుంది. స్వామివారు స్థితి కారకులు! లోక రక్షణ దీక్షగా కలిగినవారు! అటువంటి శుభరేఖల చేత ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న నూతనాబ్దములవంటి పాదాలు కలవారు స్వామివారు! (శుభలేఖోజ్జ్వలత్ +పత్+నవాబ్దం). స్వామివారు తమ భక్తులకు సర్వసమర్ధినీ కలిగిస్తారని భావం! ఆపదలు కలిగినవాళ్ళు ఆపన్నులు. స్వామివారు తమ భక్తుల మానసిక సైర్యాన్ని పరీక్షించడం కోసం వారికి తరచూ ఆపదలను కలిగిస్తూ ఉంటారు. ఎన్ని ఆపదలు ఎదురైనా భక్తులు స్వామి వారిని విడువకుండా సేవిస్తూ ఉంటారు. అటువంటి భక్తులకు కలిగిన ఆపదలనే పర్వతాల్ని ఖండించే ఇంద్రుడే శ్రీలక్ష్మీ నరసింహస్వామి! (ఆపన్న+ఆపద్(త్)+నగ+ఇంద్రం). పరిశుద్ధతను, పవిత్రతను కలిగించే నియమాది సద్గుణాల చేత ఉత్తములైన వారిచేత నమస్కరింపబడే నామధేయం కలిగినటువంటివారు (శుచి+నియమ+గుణ + ఆర్యా +అభివంద్య + అభిధేయం) శ్రీస్వామివారు! యాదాద్రి పై నెలకొని (వెలసి) తన పటుతరమైన భుజ బల విక్రమం చేత ప్రకాశించే శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని నమస్కరిస్తున్నాను.

 

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us