మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంట‌ర్వ్యూలు

అణచివేతల నుంచి ఎదిగిన అగ్నిజ్వాల

by Vanga yashoda May 30, 2023
written by Vanga yashoda

మట్టి విలువ తెలిసిన మనుషుల మధ్య ఆమె జీవితం ఊపిరి పోసుకుంది. పట్టణంలోని పల్లె వాతావరణంలో పెరిగి  ప్రకృతి పరిమళాలకు చిన్నతనాన్నే పరవశించించారు. దేశభక్తి కి  ప్రతీకగా నిలిచే సైనికుల కుటుంబాల జీవితాలను చాలా దగ్గరగా చూశారు.  భర్త చేయి పట్టుకుని పారిశ్రామిక వాడలో అడుగుపెట్టి అక్షరం తో దోస్తి కట్టారు. జీతం పెరుగుతుందన్న ఆశతో చదివిన డిగ్రీలు ఆమె జీవనగమనాన్ని మార్చాయి. కూలీగా, కార్మికురాలిగా, రచయితగా, జర్నలిస్ట్ గా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమకారిణి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన ఆమెకు రాజకీయ రంగం ఆహ్వానం పలికింది. ఏ రంగంలో ఉన్నా ప్రజల మధ్య ప్రజల మనిషిగా ఉంటే అవకాశాలు అవంతట అవే వస్తాయి అని ప్రగాఢంగా నమ్మే వ్యక్తి ఆమె.. అందుకే దినసరి కూలీగా జీవితం ప్రారంభించినా జాతీయ స్థాయి నాయకురాలిగా  ఎదిగారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉంటే కాలం తప్పక అవకాశం ఇస్తుందన్న తన నమ్మకం నిజమైంది అంటారు ఆమె. అంచెలంచెలుగా తనను తాను మలచుకుంటూ ప్రస్తుతం రాజకీయరంగంలో జాతీయస్థాయి లీడర్ గా కొనసాగుతున్నారు. ఆమే ప్రముఖ రచయిత, భారత బొగ్గు గనుల శాఖ నుంచి  సెంట్రల్ కోల్ ఫీల్డ్ ,  జార్ఖండ్ రాష్ట్రానికి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జాతీయ నేత జాజుల గౌరీ గారితో ముఖాముఖి….. (తరుణివారపత్రిక సౌజన్యంతో)

తరుణి : రైతు బిడ్డగా, కార్మికురాలిగా పనిచేస్తూనే సామాజిక కోణం నుంచి ఆలోచిస్తూ అనేక రచనలు చేశారు. ఇది ఎలా సాధ్యమైంది.

జాజుల గౌరీ : కంటి ముందు కనిపించే అనేక అంశాలు నా కథల్లో పాత్రలుగా మారాయి. అందుకే నేను రాసిన కథలు సామాజిక అంశాల చుట్టూ అల్లుకున్నవి. చిన్నతనం నుంచి నేను పెరిగిన వాతావరణం, అణచివేత అనేక కొత్త విషయాలు నాకు నేర్పింది. నా చుట్టూ ఉన్న సంఘటనలు, వ్యక్తులు నా కథల్లోని ఇతివృత్తాలుగా , పాత్రలుగా మారారు. వాస్తవికతకు అద్దంగా పట్టేలా నా సాహిత్యం ఉంటుంది. 

జాజుల గౌరీ

తరుణి :   మీరు పెరిగిన వాతావరణం గురించి చెప్పండి. 

జాజుల గౌరీ :   సికింద్రబాద్ లోని  బొల్లారం దవఖానాలో పుట్టాను.  లోతుకుంటలో  జాజుల బాయి లో పెరిగాను. మాది దళిత వ్యవసాయ కుటుంబం. మా నాయిన  జాజుల మల్లయ్య, అమ్మ జాజుల లక్ష్మమ్మ. నాయిన వాళ్లు 1930 ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలోని  కీసర నుంచి వచ్చి  అల్వాల్ లోని వ్యవసాయ భూముల్లో మాదిగతనం చేస్తూ స్థిరపడ్డారు. ఆ తర్వాత ఎనిమిది ఎకరాల బీడు భూమిని లోతు కుంటలో సాగు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అమ్మమ్మ వాళ్లది అంబర్ పేట. ఇప్పుడు ఈ ప్రాంతమంతా పట్టణంగా మారింది. కానీ మా చిన్నతనంలో చుట్టూ పచ్చని పొలాలు ఉండేవి. ఒకవైపు కిసాన్.. మరోవైపు జవాన్. మా ఇల్లు, పక్కనే పొలాలు. మరోవైపు చూస్తే మిలట్రీ ఏరియా. పొద్దుగాల పొద్దుగాల సైనికుల కవాతులు , వారి క్రమశిక్షణతో కూడ జీవితం కనిపించేది. ఊహ తెలిసే నాటికే  నిస్వార్థమెరుగుని రైతు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికుల కుటుంబాల మధ్య పెరిగాను.  నాయిన వ్యవసాయ పనులతో పాటు మేస్త్రిగా పనిచేసేవాడు. మా ఇల్లు మేమే కట్టుకున్నాం. అంతేకాదు వాయుపురి, మల్కాజ్ గిరి, సఫిల్ గూడ, సికింద్రబాద్ కాలనీలో చాలా ఇండ్లు మా వాళ్లు కట్టినవే. మేం ఏడుగురు పిల్లలం. అక్క, ముగ్గురు అన్నల తర్వాత నేను, గంగ  కవలలుగా పుట్టాం. ఆ తర్వాత ఒక చెల్లెలు. అమ్మ పొలం పనులు చేస్తూనే జానపాదాలను ఎంతో బాగా పాటలు పాడేది. అలవోకగా వందకు పైగా జానపదాలు ఆమె నోట నానేవి. అక్షర ముక్కరాని జీవితంలోని సందర్భాలకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆమె పదాలను అల్లుతూ పాటలు పాడేది.  ఇంట్లో రేడియో మాత్రం ఎప్పుడు మోగుతూనే ఉండేది.     చదువు జీవితాన్ని మార్చుతుందని నాన్న చెప్పేవారు. మా వంశంలో బడికి పోయినా మొదటి ఆడపిల్లను నేనే.  లోతుకుంట ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. అక్కడ జరిగిన సంఘటనలు నా జీవితంపై చాలా ప్రభావం చూపించాయి. నా మొట్టమొదటి టీచర్ అన్నమ్మ చూపించిన ప్రేమ నా జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.   జీవితాలను ఆవరించి కులం ఒకటి ఉంటుందని స్కూలు స్థాయిలోనే గ్రహించాను. జీవితంలో ఉన్నత దశకు చేరుకోవాలంటే చదువు ముఖ్య సాధనమని అర్థమైంది. ఒకవైపు పచ్చని ప్రకృతి,  మిలట్రీ ప్రాంతపు  క్రమశిక్షణతో కూడిన కవాతులు, మరోవైపు అమ్మ పాటలు..రేడియోలో వచ్చే బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు నాలో సాహిత్య అభిలాషను కలిగించాయి. పాటల్లోని పదాల్లో అంత్యప్రాసలను గమనించేదాన్ని. చిన్న కాగితం దొరికినా చదవుతూ.. నా మనసుకు తట్టిన భావాలను రాసుకునేదాన్ని. అలా అలా రాయడం మాత్రం స్కూలు స్థాయిలోనే అలవాటు అయ్యింది. పట్టణీకరణలో  ముందుగా మాయం అయ్యేవి దళితుల వ్యవసాయ భూములే. అలా మాకు ఉన్న పొలం కాస్త కాలనీలుగా రూపాంతరం చెందాయి. వైవిధ్యభరితమైన వాతావరణంలో పెరిగాను. 

తరుణి :  చదువు జీవితాన్ని మార్చుతుందని నమ్మారు కదా మరి చదువు మీ జీవితంలో తీసుకువచ్చిన మార్పు గురించి చెప్పండి.

జాజుల గౌరీ : పెద్దపెద్ద చదువులు చదవాలని ఎంతగా ఉన్నా కుటుంబ పరిస్థితులు అనుకూలించాలి కదా.  పెండ్లీ కారణంగా  చదువు ఎనిమిది లోనే  ఆగిపోయింది. మా ఆయన మునింగం నాగరాజు. ఆల్వీన్ కంపెనీలో పనేచేసేవాడు. దాంతో పొలాల మధ్య నుంచి పరిశ్రమల మధ్యకు శాస్త్రీ నగర్, ఎర్రగడ్డకు మకాం మారింది. మాకు ఇద్దరు పిల్లలు,  చాలీ చాలనీ జీతం. చదువు మీద నాకు ఎప్పుడూ ఆసక్తి ఉండేది అది గ్రహించి మా వారు నాకు పుస్తకాలను కొని ఇచ్చారు. కానీ సరైన గైడెన్స్ లేక నేను డైరెక్ట్ గా టెన్త్ రాయలేకపోయాను. అయితే నాకు అలవాటు ఉండేది అదేమిటంటే కనిపించిన ప్రతి చిత్తు పేపర్ ని తీసుకుని చదవడం నాకు సాహిత్యం పై ఆసక్తిని పెంచింది. సనత్ నగర్ , బాలానగర్ పారిశ్రామిక వాడలకు అతి దగ్గరగా మా ఇల్లు ఉండటంతో ఇల్లు గడవడం కోసం, పిల్లల చదువుల కోసం ఫ్యాక్టరీలకు పనికి వెళ్లక తప్పలేదు.  కరెంటు మీటర్లు తయారు చేసే కంపెనీలో ఐదురూపాయల వేతనానికి పనిచేశాను. అక్కడ నాతో పాటు పనిచేసే శారద చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పింది. అక్కడే ఉన్న హస్పిటల్ లో ఆయాగా పనిచేస్తే రెండు వందల రూపాయలు ఎక్కువ ఇస్తారని తెలిసి అక్కడ చేరాను. అయితే రక్తం చూస్తే కళ్లు తిరిగేవి.. దాంతో ఆ ఉద్యోగం కొద్దిరోజులే.  1989 నుంచి నా జీవితంలో దుర్భరమైన పరిస్థితులు. అల్విన్ లో మా వారి కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం రేపు మాకు అన్నట్లుగా ఉండి మొత్తానికి 1990 ప్రాంతంలో ఆల్వీన్ మూతపడింది. దాంతో మా ఆయన ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖలో డైలీ లేబర్ గా చేరారు. 9 వందల రూపాయల జీతం. ఎటు సరిపోని సంపాదన.  బతుకు ఉద్యమం మొదలైంది.  పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించడం కోసం మంచి ఉద్యోగం రావాలంటే ముందుగా పై చదువులు చదవాలని నిర్ణయించుకున్నాను.  రిసెప్షనిస్ట్ గా పనిచేస్తే ఎక్కువ జీతం వస్తుందని ఎవ్వరో చెప్పగా తెలిసింది. మా చుట్టూ ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే చదువు ఒక్కటే మార్గంగా కనిపించింది. నా తపన గమనించి ఫ్యాక్టరీలో పనిచేసే  గోపాల్ అనే ఒకతను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష అప్లికేషన్ తీసుకువచ్చి ఇచ్చాడు. పరీక్ష రాసి.. 1993లో డిగ్రీలో జాయిన్ అయ్యాను.  అదే సమయంలో శ్రీలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్రిక్స్ కంపెనీలో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. కొండల్ రావు గారు ఆ సంస్థ యజమాని.  పిల్లలను తీసుకుని వెళ్లి ఆఫీస్ లో కూర్చునేదాన్ని. మొదటిసారి ఫోన్ చూసింది మాట్లాడింది అక్కడే. దాదాపు ఐదేండ్లు అక్కడే పనిచేశాను. ఆ తర్వాత 2008 వరకు చదువు కొనసాగింది. డిగ్రీ, ఎంసిజె, ఎంఎ, ఎల్ఎల్ ఎం పూర్తి చేశాను.  పిహెచ్ డిలోనూ సీటు వచ్చింది.                                                                      

తరుణి :   మీ తొలి రచన ఎప్పుడు ప్రచురించబడింది.                                                                                                                  

జాజుల గౌరీ :  చిన్నతనం నుంచి అమ్మ పాడే జానపద గేయాలు. రేడియోలో నిరంతరంగా వచ్చే పాటలు, నాటికలు ఎంతగానో ఆకట్టుకునేవి. రేడియోలో పాట వస్తుంటే  ఆ పాటలోని పదాలను గుర్తు పెట్టుకుని రోజంతా  అవే  పాడేసరికి  పదాల మధ్య ఉన్న ప్రాసలు తెలిసి కవిత్వం రహస్యం ఏమిటో అర్థం అయ్యేది. 1980లో నాలోని స్పందనలు రాయడం మొదలుపెట్టాను. అయితే డిగ్రీలో తెలుగు సాహిత్యం చదువుతున్నప్పుడు అమ్మ పాడిన పాటే మౌఖిక సాహిత్యం అని,  గ్రంథస్తం అయితేనే అది సాహిత్యంగా పదికాలాలు నిలుస్తుందని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. 

తెలిసి తెలియని వయసులో రాసిన కవిత్వం గుర్తుకువచ్చింది. సాహిత్యంపై అవగాహనతో  రచన ప్రక్రియ మొదలైంది.  పత్రికలకు పంపించాను. కానీ ఏ పత్రికలు కూడా నా రచనలను ప్రచురించలేదు. అదే సమయంలో ఒక సభలో పరిచయం అయిన గెస్ట్ లెక్చరర్ డాక్టర్  ప్రభంజన్ కుమార్ యాదవ్ రాంనగర్ లోని ఏకలవ్య పత్రిక సంపదకులైన కె. జి. సత్యమూర్తి గారికి నన్ను పరిచయం చేశారు.  1997లో దసరా దీపావళి సంచికలో ఉతికి ఆరేస్తా అన్న కవిత మొదటిసారి అచ్చు అయ్యింది. అలా పత్రికలో నా సాహితీ ప్రస్థానం మొదలైంది. డా. ననుమాస స్వామి, ప్రొ. సత్యనారాయణ తదితరులు నా కవిత్వాన్ని మెచ్చుకున్నారు.  ఆ తరువాత  మాదిగ సాహిత్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ నాగప్ప గారి సుందర్ రాజుగారు ఈనాడులో మాదిగ రచయితల నుండి కవితలు కావాలంటూ పత్రిక ప్రకటన ఇచ్చారు. అది చదివి నేను అందులో జాయిన్ కావడం జరిగింది. నాగప్ప గారి సుందర్ రాజుగారు  సాహిత్య రచన మేలుకువలు నన్ను సాహిత్య పీఠంపై నిలిపాయి.  వెనిక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. మాదిగ సాహిత్య వేదిక ద్వారా నా సాహిత్య ప్రస్థానం వ్యాసం, కవిత, కథ, నవల ప్రక్రియలకు దారితీసింది. నేను రాసిన మొదటి కథ మన్ను బువ్వ, దస్తకత్ కథలు ఎదురుచూపులు కథాసంకలనంలో వచ్చాయి. మాదిగ సాహిత్య వేదిక ఉపాధ్యక్షురాలిగా కొనసాగాను. ఆ సమయంలో , దార్ల వెంకటేశ్వరరావు, కొల్లూరి చిరంజీవి తదితరులతో సాహిత్యచర్చలు జరిగేవి.  అదే సమయంలో నాగప్ప గారి సుందర రాజు గారి మరణంతో మాదిగ సాహిత్య వేదిక ద్వారా రచనలు రావడం ఆగిపోయింది.  నా రచన వ్యాసాంగం కొనసాగుతున్నా పత్రికలకు పంపే సాహసం చేయలేదు.  ఎందుకంటే ఎంతో శ్రమపడి రాసిన నా కథలు చెత్తబుట్టలో పడటం నాకు ఇష్టం లేకపోయింది. 

తరుణి :  ఉద్యమంలోకి ఎలా వచ్చారు. సత్యమూర్తి లాంటి ప్రముఖులతో మీ పరిచయం ఎలా జరిగింది.

జాజుల గౌరీ :    కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో తెలియదు. కానీ, కాలం మనల్ని కొన్నింటికి ఎంపిక చేసుకుంటుంది అని మాత్రం నేను నమ్ముతాను. సోషల్ వెల్పేర్ ఆఫీస్ లో పనిచేసే క్రమంలో మా ఆయన సభలకు, సమావేశాలకు వెళ్లేవారు. అలా ఒకసారి జె.బి రాజు గారి సభకు మా ఆయన వెళ్లడం.. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ పుస్తకం ఆయన చేతికి వస్తే పుస్తకాలపై నాకున్న ఆసక్తి తెలిసి ఆ పుస్తకం తీసుకువచ్చి నాకు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారి గురించి తెలుసుకునే అవకాశం ఆ పుస్తకం ద్వారా కలిగింది.  14 ఏప్రిల్, 1996 ఆ రోజు ఆదివారం. బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజ్ కి క్లాస్ కు వెళ్లాను. లంచ్ తర్వాత సెమినార్ హాల్ లో ఉపన్యాస పోటీ ఉంది అంటే అందరం వెళ్లాం. అంబేద్కర్ గురించి అందరూ మాట్లాడారు. ఇంకా  ఎవ్వరైనా   మాట్లాడండి అంటూ ఐదు నిమిషాలు టైం ఇచ్చారు. అందరి మాటలు విన్న నేను  బి. ఆర్. అంబేద్కర్  గురించి అంతకు ముందే చదివిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాను. మాట్లాడేందుకు సిద్ధమై వేదికపైకి వెళ్ళాను.  జీవితానికి, కులానికి ఉన్న సంబంధం అర్థం చేసుకుంటూ  రాజ్యాంగ రచనకు ప్రేరణ ఇచ్చిన ఆయన జీవితం నుంచి చదువే జీవితాన్ని మార్చుతుందన్న నా జీవితం వరకు నేను గమనించిన కొన్ని అంశాలను చెప్పాను. ఐదు నిమిషాలు కాస్త 25 నిమిషాలు అయ్యింది. అందరూ చప్పట్లతో నా ఉపన్యాసాన్ని మెచ్చుకున్నారు

. ఆ పోటీల్లో నాకే ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది. ఆ తర్వాత  మా గెస్ట్ లెక్చరర్ డాక్టర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ గారు నాతో మాట్లాడారు. ఆయన అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారు. ఉద్యోగం కోసం డిగ్రీలో చేరాను అని తెలిసి జర్నలిజం చదువు పిఆర్ ఓ ఉద్యోగం వస్తుందని చెప్పారు. ఒక రోజు ఓయూ అంతా తిప్పి చూపించారు. ఉస్మానియా యూనివర్సిటీలోఆర్ట్స్ కాలేజీ డోం ముందు నిలబడి జీవితంలో ఎత్తైన స్థాయికి చేరుకోవాలని కలలు కంటూ వాటిని పట్టుదలతో సాకారం చేసుకోవాలి అంటూ చెప్పారు. ఆ క్షణం ఆ మాటలు నాతో పట్టుదలను మరింత పెంచాయి. ఓయూలో బిసిజె, ఎంసిజె చేశాను. కేసరి పత్రికలో కొన్నిరోజులు జర్నిలిస్ట్ గా పనిచేశాను. అయితే జీతం ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అక్కడ మానేశాను. ప్రభంజన్ సార్ ద్వారానే ప్రముఖ విప్లవ రచయిత కె.జి. సత్యమూర్తిగారు పరిచయం. రాంనగర్ లోని ఆయన ఇంటికి మొదటిసారి వెళ్లినప్పుడు ఆయన అడిగిన మొదటి ప్రశ్న బిడ్డ అన్నం తిన్నావా అని.. బిడ్డా అంటూ పిలిచిన ఆయనను నేను నాయిన అంటూ పిలిచేదాన్ని. ఎంతో మంది ప్రముఖులు, సాహిత్యకారులు అక్కడకు వచ్చేవారు. 

తరుణి :  మీరు రాసిన కవిత్వంలో ఆవేశం, కథలో ఒక ఆలోచన ఉంటాయి. మీ సాహిత్యానికి ప్రేరణ.                            

జాజుల గౌరీ :  చిన్నతనం నుంచి నేను చూసిన జీవితాలే నాకు ప్రేరణ. నిరంతర శ్రమ జీవి మా నాయిన, తర్కంతో కూడిన ప్రేమ మూర్తి మా అమ్మ, మన జీవితాలను మనమే నిర్మించుకోవాలని నేర్పించారు. సైన్యంలోకి వెళ్లిన కొడుకు కోసం ఏండ్ల తరబడి కండ్లు కాయలు కాచేలా ఎదురుచూసే తల్లు లు, సాటి మనిషిని కులం కోణంలో చూసే సమాజంలో దళితుల జీవన విధానం, సమస్యలు ఎలా ఎన్నో ప్రేరణ ఇచ్చే అంశాలున్నాయి.

May 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

వ్యంగ్య భావన ఉండడం కవిత్వం యొక్క ముఖ్య లక్షణం

by Aruna Dhulipala May 27, 2023
written by Aruna Dhulipala

– కోవెల సుప్రసన్నాచార్యులు

తెలుగు సాహితీ జగత్తుకు తలమానికమైన సుప్రసిద్ధ కవులు, విమర్శకులు, ఆధ్యాత్మిక, తాత్వికవేత్త, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కార గ్రహీత కోవెల సుప్రసన్నాచార్యులు గారితో ముఖాముఖి. -అరుణ ధూళిపాళ

సుప్రసన్నాచార్యులుగారితో అరుణధూళిపాళ

గురువుగారు నమస్కారాలు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మహద్భాగ్యం. మీలాంటి మహనీయుని గురించి మా పాఠకులకు పరిచయం చేయడం నా జీవితానికి ఒక గొప్ప అనుభూతి.

1) మీ బాల్యం, విద్యాభ్యాసాల గురించి మాకు వివరంగా తెలపండి.

జ. మార్చి 17, 1936న వరంగల్లులోజన్మించాను నేను. మా తండ్రి వెంకట నరసింహాచార్యులు గారు, తల్లి లక్ష్మీనరసమ్మ గారు. మా పితామహుడు అయిన కోయిల్ కందాడై రంగాచార్యులు గారు, మాతామహులైన ఠయ్యాల లక్ష్మీనరసింహాచార్యులు గారు నాకు సాహిత్యంలో గురువులు. వరంగల్లు లోనిని ఏవీవీ హైస్కూల్లో ఉన్నత విద్య వరకు చదివి, హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎమ్.ఏ చేసి రామరాజ భూషణుని కృతులు అనే అంశంపై పరిశోధన చేసి పీ హెచ్ డీ పట్టా పొందాను.

2) కేవలం 9వ ఏట కంద పద్యాలు రాసిన సామర్థ్యం ఎలా పట్టువడింది?

జ. ఛందస్సు తెలియదు నాకు. నేర్చుకోలేదు ఇవ్వాల్టి వరకు కూడా. అప్పుడు వీధి బళ్ళలో భాగవత పద్యాలు, భాగవత ఘట్టాలు చెప్పేవారు.అది చదవడం, వినడం వల్ల వాటి నడక మాకు అర్థం అయ్యేది. ఆ కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడంటే “”హయరింకా ముఖ ధూళి ధూసర పరిన్యస్త అలకోపేతుడై” గుర్రపు డెక్కల యొక్క ధూళి ఎగిసి ముఖం మీద పడింది. ముంగురులలో చెమట వచ్చింది. ఆ దుమ్ములో పడి అట్టకట్టుకుని పోయిన రూపాన్ని ఎంతో అందంగా వర్ణించాడు. ఇలా కాకుండా రారా పరిగెత్తుకు పోదాం క్రికెట్ ఆడదామంటే ఏముంటుంది దాంట్లో? పోతనది ఎంత గొప్ప కవిత్వం అంటే విజువలైజేషన్లో ఆయనను మించిన వారు లేరు. “నల్లని వాడు పద్మ నయనంబులవాడు కృపారసంబు పై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు”ఈ పద్యాలు చదువుతున్నప్పుడు పద్యం యొక్క రూపం, నడక, గురులఘువులు ఎక్కడ ఉంటాయో తెలియకపోయినా ‘ధాటి’ అంటారే ఆ ధాటి నాకు తెలిసేది. ‘శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకలజనులు’..’తన కోపమె తన శత్రువు’..ఇలా  భాగవతం, సుమతీ శతకం, పద్యాన్ని నేర్పాయి. ఒక ఇమేజ్ మనసులో ఏర్పడితే దానికి ఒక ధాటి వస్తుంది. చెక్కుతూ పోవాలి దాన్ని. అది అందరికీ సాధ్యం కాదు. అలా చెక్కుతూ పోయినవాడు కృష్ణశాస్త్రి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇలా గొప్పగా వ్యక్తీకరించడమనేది పోతన వల్ల నాకు కలిగింది. సుమతీ శతకంలో కంద పద్యం ఒరవడి తెలుస్తుంది కదా! అది 6,7 ఏళ్ళ వయస్సులోనే పిల్లలకు చెప్తారు కదా! అదే నాకు అలవడింది. It happend, it continued till day. అందువల్ల దానికోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరం రాలేదు. అంతే కాక మా తాతగారు ఉభయ వేదాంత విద్వాంసులు. ఆ రోజుల్లో కాంచీపురం నుండి బరంపురం వరకు ఆయన ఉపన్యాసం లేని ఊరు లేదు. దాదాపు 3 గంటలు. మైకు లేకుండా చెప్పేవారు. కంఠం చాలా గొప్పగా ఉండేది. నా మొదటి విద్యా ప్రదానం ఆయన దగ్గరే జరిగింది. రజాకార్ల గొడవలు జరుగుతున్న సందర్భంలో మేము తల దాచుకోవడానికి కల్లెడ గ్రామంలో ఉండేవాళ్ళం. మధ్యాహ్నం గుడిలో భక్తి ప్రబోధ విషయాలు, సాయంకాలం శ్రీమద్రామాయణం చెప్పేవారు తాతగారు. మాకు అప్పుడు పని ఏమీ లేదు. కాబట్టి అన్నీ వింటూ ఉండేవాళ్ళం. పులిహోర ప్రసాదం కోసం వెళ్ళేవాళ్ళం (నవ్వుతూ). కేవలం కాలక్షేపానికి మాత్రమే కాక, వేదాంత, పురాణ, ఇతిహాస, ఉపనిషత్తుల విషయాలు కూడా చెవిలో వినబడుతుండేవి. ఆ తర్వాత జాతీయోద్యమ స్ఫూర్తితో ఏర్పడ్డ చందా కాంతయ్య గారి ‘ఆంధ్ర విద్యాభివర్ధిని’ స్కూల్లో చదువుకున్నా.. చందా గారు గొప్ప వదాన్యుడు. ఉర్దూ మీడియం స్కూళ్లకు వ్యతిరేక ఉద్యమంలో భాగంగా లక్షరూపాయలు దానంగా ఇచ్చి తెలుగు మీడియం స్కూల్ పెట్టాడు. దాంట్లో చదువుకున్నా. అందులో గొప్ప టీచర్లు వుండేవారు. అక్కడ ఒక సాంస్కృతిక వాతావరణాన్ని ఏర్పాటు చేశారు వారు. ప్రతీ ఏటా పోతన జయంతి చేసేవారు. రెండు మూడు రోజులు ఉత్సవాలు చేసేవారు. విశ్వనాథ వెంకటేశ్వర్లు గారని విశ్వనాథ సత్యనారాయణ గారి తమ్ముడు గొప్ప విద్వాంసుడు. ఆయన పాఠం చెప్పేవాడు మాకు. పద్యం, కవిత్వం ఎలా ఉండాలో, ఎలా రాయాలో చెప్పేవారు. ఆయన చెప్పే పద్ధతి నాకు ఆదర్శం. ఆయన నత్కీరుని కథ ఉదాహరణగా చెప్పి, ఎవరినీ స్తోత్రం చేయవద్దని, ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని ఈ రెండు విషయాలను చెప్పారు నాకు. అవి నేను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాను. అలాగే రాస్తూ వచ్చా. ఎవరికీ ఎప్పుడూ తలొగ్గలేదు. ఆ స్కూల్లో సోమేశ్వర రావు గారని ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు. పేరుకు ఇంగ్లీష్ టీచరే గాని ఆయన చిత్రకారుడు. సంస్కృతి గురించి చెప్పేవారు. పాఠశాలలో రామప్పకు ఎక్స్ కర్షన్ తీసుకెళ్లినప్పుడు అక్కడి శిల్పకళలో హోయసాల, కాకతీయ, చోళుల భేదాలను కూడా చెప్పేవారు. ఈ విధంగా రచనా పద్ధతి నాకు అలవడింది. అలా రాస్తూనే వున్నా.

సుప్రసన్నాచార్యులు గారి మాటలు వినండి

3. అసలు కవిత్వం యొక్క లక్షణం ఏమిటి? ఇప్పటి కవిత్వం ఎలా వుంది? కవిత్వంలో రసజ్ఞత ఎలా ఉండాలి?

జ. వ్యంగ్య భావన ఉండడం కవిత్వం యొక్క ముఖ్య లక్షణం. వాక్యంగా చెబితే కవిత్వం కాదు. ఇప్పుడేమయ్యిందంటే ఏదో పాద విభజన చేస్తున్నారు. అదే కవిత్వం అంటున్నారు. ఎక్కువమంది కవిత్వానికి దూరంగా ఉంటున్నారు అనుకుంటున్నాను. నేను చాదస్తుడిని అనుకోవచ్చు, మరేమైనా అనుకోవచ్చు. అప్పట్లో ఎన్నో అవకాశాలు ఉండేవి. ఇప్పుడు క్రమంగా తగ్గిందని అనుకుంటున్నా. పద్యం ఎప్పుడైనా సరే ఆనాటి చైతన్యాన్ని లబ్దీకరించుకునే శక్తి దానికున్నది. దాశరథి పద్యం మామూలుదా? పింగళి కాటూరి వారి సౌందర నందనంలోని పద్యాల కాఠిన్యం…? అసలు కాఠిన్యం అంటే..? భావ క్లేశం ఉండొచ్చు. మోహన్ ప్రసాద్ కవిత ఎంతమందికి అర్థం అవుతుంది? ఆయనను పొగిడిన వాళ్ళు కొన్ని కవితల్ని కాదంటే..? వాళ్ళ దృష్టి వేరు కదా! కవిత్వంలో ఒక ఆత్మీయ లక్షణం ఉండాలి. శ్రీశ్రీ “కవితా! ఓ కవితా” లో కవిత అనేది ఏకాంతమైనది. భావ గర్భితమైనది అనే మాట అంటాడు. ఏకాంతంలో వుండే ఒక స్థితి అనుభవంలోకి రావాలి. దానికోసం ఎన్నో చోట్లు చూస్తూ వచ్చాడు. నిఘంటువు, వ్యాకరణాలను, ఛందస్సులను వదిలేయమంటాడు. ఎందుకు వదలాలి? అవి ప్రధానం కావు కాబట్టి. కానీ అవి ఉంటాయి. విశ్వనాథ కూడా ఒకచోట ” నా కవితకు ఔచితి లేదు, భాషలేదు, ఆకృతి లేదు. ఊరక రసాత్మకనే ప్రవహించి పోదు” అంటాడు. అంటే వ్యాకరణం, శబ్దం లేదని కాదు కదా! కేవలం నిఘంటువుల్ని మాత్రమే పట్టుకోవద్దనేది వారి భావన..ఇద్దరూ వారివారి మాటల్లో ఒకే విషయం చెప్పారు. దాశరథి ఒకచోట అంటాడు. వైద్యశాస్త్రం శ్లోకాల్లో ఉంటుంది. మరి అది కవిత్వం అవుతుందా? అని. కవిత్వానికి ఆత్మస్పర్శ ఉండాలి. అది ఉండాలంటే అంతస్సులోకి వెళ్లిపోవాలి. వ్యష్టి చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో అనుసంధానించుకోవాలి. రస సిద్ధాంతంలో   సాధారణీకరణం అనే మాట వాడారు. అంటే ఏమిటి? కవి తన దేశాన్ని, కాలాన్ని మరచిపోవాలి. అన్నింటినీ దాటుకొని విశ్వయాత్ర చేయాలి. ఎవరి జీవితంలోనైనా ఏవో అనుకోని విషయాలు వస్తూనే ఉంటాయి. వాటిని కవిత్వీకరించాలి. ఇదే ‘విశ్వజనీనం’ అనే మాట అవుతుంది. కావ్యాల్లో చెట్లు, పుట్టలు, పక్షులు, చంద్రుడు, మేఘం ఇలా ప్రకృతి ఉంటుంది. ఇవి ఏమీ చెప్పవు. తన భావాలన్నింటికీ ఏదో ఒకదాని మీద ఆధారపడి మనుష్యత్వాన్ని కల్పించి, దాంతో ఏదో ఒక సందర్భాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తాడు కవి. ఆ సమయంలో అన్నింటినీ మరచిపోయి రెక్కలు కట్టుకుని మరీ ఎగరాలి. నేల బారుగా పడిపోతే లాభం ఏముంది? 80, 90 ఏళ్ళల్లో జరిగింది ఏమిటంటే భావనల కంటే  ఉపన్యాసాలకు, సిద్ధాంతాలకు, ఇతర విషయాలకు ప్రాధాన్యత పెరిగింది. మనుచరిత్రలో ప్రవరుడు దారి తప్పాడు. ఇలాంటి ఇష్టంలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం అందరికీ సహజమే. దాని నుండి బయటపడడానికి ప్రయత్నమూ సహజమే..దాన్ని అర్థం చేయించడమే కవికి ముఖ్యమైనది. అందువల్ల కవిత్వం ఎప్పుడూ అపరిమితమైన స్థితిలో ఉండాలి కానీ పరిమితులకు లోబడి ఉండకూడదు.  శబ్దానికి ఒక శిల్పం ఉండాలి. శాస్త్రాలు వేరు, కావ్యాలు వేరు.శాస్త్రాలకు, కావ్యాలకు వుండే భేదం తాదాత్మ్యత. తన్ను తాను మరిచిపోయినప్పుడు సమస్త విశ్వంలో ఉండే భావన తనలో లీనమయ్యే పరిస్థితి వస్తుంది. అలౌకికమైన ఆనందపు స్థితిని పొందడం కవిత్వం చేసే పని. పద్యం అంటే ఏవో గణాలు కుదుర్చుకొని ఛందస్సు సరిచూసుకొని రాసేది కాదు. మనసులో ఛందస్సు కుదురుకున్నాకే పద్యం బయటకు వస్తుంది. ఇది విశిష్టమైన ప్రక్రియ. ఉపమానాలు వుండొద్దు, ఉపమేయాలు వుండొద్దు, శబ్దం వుండొద్దు. మనకు ఉన్న కొన్ని శబ్దాలతోనే కవిత్వం ఉండాలంటే ఆ పటుత్వం ఎలా ఉంటుంది? ఇప్పటికే ఎంతో శబ్ద సంపదను కోల్పోయినాము. ఈనాటి ఆధునిక కవులలో శబ్దజ్ఞానం కొరవడింది. తిలక్ కవిత్వంలో ‘రొమాంటిక్ ఎలిమెంట్’ ఉండడం చేత అంత గొప్ప కవి అయ్యాడు. ‘రొమాంటిక్ ఎలిమెంట్ ‘అంటే ఏమిటి? ప్రతీదాన్ని ప్రేమించడం. ప్రేమ అనేది స్త్రీ పురుష సంబంధం కాదు. బాహ్య, అంతర్లీనమైన ప్రతీ అంశాన్ని ప్రేమించ గలగాలి. ఏ వస్తువునైనా కవిత్వంగా మార్చగలిగే శక్తి ఉండాలి. దీనికి ప్రాచీన, ఆధునిక కవిత్వాలనే భేదం అవసరం లేదనుకుంటా. కవిత్వంలో గాఢత వద్దంటే ఎలా? నాకనిపించేది ఏంటంటే We are loosing almost all the essences of the literature. వివాదాల్లో పడి వీటిని పోగొట్టుకుంటున్నామేమో…

4) హైదరాబాద్ లో మీరు ప్రారంభించిన ‘రసధుని’ సంస్థ గురించిన వివరాలు చెప్పండి. ఇంకా అలాంటివి ఏవైనా మీరు స్థాపించారా?

జ. మేము చదువురీత్యా హాస్టల్లో ఉండేవాళ్ళం. సాయంకాలం కాగానే సుల్తాన్ బజార్ కి వచ్చి ఎక్కడో ఒకచోట భాషా మీటింగులు అటెండ్ చేసేవాళ్ళం. పల్లా దుర్గయ్య, నారాయణరెడ్డి, దాశరథి, రామరాజు గారు ఆళ్వార్ స్వామి, వరదాచార్యులు గారు వీళ్లంతా పల్లా దుర్గయ్య గారి ఇంట్లో సమావేశం అయ్యేవారు. ఆ సమయంలో వరదరాజేశ్వరరావు గారు కవిత అనే రెండు వచన సంపుటాలు వేశారు. అబ్బూరి ఛాయాదేవి సంపాదకత్వంలో కూడా ఆయన రచనలు వెలువడ్డాయి. ఆళ్వార్  స్వామి దేశోద్ధారక గ్రంథమాలకు పుస్తకాలు వేస్తున్నారు. రాఘవాచారి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు అప్పుడు. ఆయన ఆదర్శ సాహిత్య అనే ఏదో పేరుతో పుస్తకాలు వేస్తుండేవారు. సాహిత్యం మీద ఆక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది.  అప్పటికే తెలంగాణ రచయితల సంఘం ఏర్పడింది. మొదటి మహాసభలు జరిగినాయి. దానికి దాశరథిగారు అధ్యక్షులు. ఆ సమావేశానికి శ్రీశ్రీ మొదలైన వారు ఎంతోమంది వచ్చారు. తర్వాత సంఘాలలో చాలా మార్పులు వచ్చాయి. సారస్వత పరిషత్తుకు అప్పటికే స్థలం ఉండేది. దానిని ఆక్రమించాలనే ప్రయత్నాలూ  జరిగాయి. ఆ సమయంలో నేను నా మిత్రుడు మాదిరాజు రంగారావు గారు హాస్టల్లో ఉండే వాళ్ళం. పద్యం అంటే చాలా ఇష్టమైన తనకి. రాత్రి 8,9 గంటల సమయంలో గంట గంటన్నర సేపు రామాయణ కల్ప వృక్షం చదివి వినిపించేవాడు. పద్యాలు బాగా చదువుతాడు ఆయన. అప్పుడు హైదరాబాద్లో ఆక్టివిటీ కోసం ‘రసధుని’ పేరుతో సంస్థ ప్రారంభించాలని అనుకున్నాము. అదే సమయంలో రామకోటి శాస్త్రి గారు గుడివాడ నుండి వచ్చి రిసెర్చ్ చేస్తున్నారు ఇక్కడ. మొదలి నాగభూషణ శర్మ ఎమ్.ఏ చదువుతున్నారు. రమాపతిరావు గారు, అక్కిరాజు గారు మేమంతా కలిసి తాజ్ మహల్ లో ఏదో ఓ మూల కూర్చొని టీ తాగుతూ చాలా సమయం గడిపే వాళ్ళం. అప్పుడు ఈ ‘రసధుని’ అనే కాన్సెప్ట్ వచ్చింది.  ఒక కవి మీద స్టడీ చేసిన ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగింది. మొదటిది విశ్వనాథ మీద చేశాం. గౌతమ రావు గారు ,సంపత్ కుమార్ ఆచార్య గారు, ఆనందమూర్తి గారు మొదలైనటువంటి వారు ముందు వ్యాసాలు రాసారు. ఆ వ్యాసాలనే ఉపన్యాసాలుగా తయారు చేశాం. ఆ వ్యాసాలన్నీ తర్వాత స్రవంతి పత్రికలో వచ్చాయి. తర్వాత శ్రీశ్రీ పేరు మీద కూడా సెమినార్ ఏర్పాటు చేశాము. సంపత్ రాఘవాచారి అనే ఆయన ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా ఉండేవాడు. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరుగా పనిచేసే ఒక ఆయన ఇంకో ఇద్దరు,ముగ్గురు శ్రీశ్రీ గురించి మాట్లాడారు. చలం మీద అనుకున్నాం కానీ కుదరలేదు. విశ్వనాథ గారి మీద వ్యాసాలు అన్నీ స్రవంతిలో వచ్చాయి. తెలంగాణ సంఘంలోని కవులు విస్తృతంగా కృషి చేశారు. ప్రాచీన కావ్యాలలోని ఒక్కొక్క ఆశ్వాసాన్ని ఒక్కొక్కరు గానం చేసేవారు. కొత్త కవులు అందరికీ మంచి ప్రోత్సాహం ఇచ్చేవారు. దాశరథి,ఆనందమూర్తి, నారాయణ రెడ్డి ఏదో ఒక కావ్యాన్ని గానం చేసేవారు. పైకి చదవడం వల్ల మనసులోకి పోతుందది. శబ్దం కాదు భావం ముఖ్యం. గౌతమ రావు గారు కల్పవృక్షం చదివితే అక్కడ చేకూరి రామారావు లాంటి ఎలాంటి పెద్ద వాళ్ళు ఉన్నా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కరీంనగర్ లో  రెండు మూడు రోజులు సెషన్స్ పెట్టుకునేవాళ్ళం. ఐదు, ఆరు సంవత్సరాలు నడిచింది అట్లా. పద్యం అంటే  చైతన్యం. చచ్చుగా చదవడం కాదు. ఏదైనా కవిత్వమయంగా చెప్పినప్పుడు అనుభూతి కలుగుతుంది. 1954 లో సాహితీ బంధు అని వరంగల్ లో ప్రారంభించాము. 1957లో మిత్రమండలి, 1960లో కులపతి సమితి స్థాపించాము. ‘చేతనావర్త కవులు’ అనే పేరిట నేను, సంపత్కుమారాచార్య, పేర్వారం జగన్నాథం, నరసింహారెడ్డి కలిసి అనేక వ్యాసాలు ప్రచురించాము. ఇది ఒక కవిత్వ తీర్థయాత్ర. పోతూ ఉండడమే.. కనిపించిందల్లా జేబులో వేసుకోవడమే. ఆ విధంగా కవిత్వ యాత్రలో మమేకమై పోయేవాళ్ళం.

సుప్రసన్నాచార్యులు గారి మాటలు వినండి

5) అవధానాల మీదకు మీ దృష్టి ప్రసరించడానికి కారణాలు ఏవి?

జ. 1970 ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఈ లెఫ్టిస్ట్ కోర్సులు పద్యాలను తిరస్కరించడం మొదలు పెట్టాయి. పద్యం పనికిరాదు. పద్యాలు రాయకూడదు. ఛందోబద్ధ గణాలన్నీ వ్యర్థములని సిద్ధాంతాలు చేయడం మొదలు పెట్టాయి. దాన్ని తట్టుకోవడానికి ఏదో ఒక మార్గం అవసరం. పద్యం చెప్పడం ఎంత సులభమైంది? ఎంత హాయిగా చదువుకోవచ్చు? ఎంత హృద్యంగా ఉంటుంది? ఇవన్నీ తెలియాలి కదా! కొప్పరపు కవులు గంటకు 500 పద్యాలు ఆశువుగా చెప్పేవారు. విశేషమేమిటంటే, ఉదాహరణకు…జటాయువు కథ చెప్పాలంటే, మొత్తం ఆ కథకు సంబంధించిన పద్యాలే అన్ని చెప్పేవారు. అది అద్భుతమైన శక్తి. అదే కావ్య నిర్మాణమంటే. తిరుపతి వేంకట కవుల సమకాలికులు. వారు. ఆ కాలంలో వందలకొద్దీ శతావధానులు వచ్చారు. గుంటూరు సీమ వాళ్ళను చూస్తుంటే ఎంత గొప్ప పరిశ్రమ జరిగిందో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ సందర్భంలో మా వూళ్ళో ఎవరో ఒకాయన వచ్చి అష్టావధానం చేశారు. అది మాకు అంతగా నచ్చలేదు. నేను, శ్రీభాష్యం విజయసారథి గారు,ఇంకో ఇద్దరం మిత్రులం రోజూకలుసుకునేవాళ్ళం. విజయ సారథి గారు అపుడు నన్ను ప్రారంభం చేయమన్నారు. “నేనెక్కడ చేయగలను ఈ ఆశువుగా” అంటే “ఎందుకు కుదరదు..చేయి” అన్నారు. వాళ్ళింట్లోనే ప్రారంభం చేశాను. ఒక కవి మిత్రుని ఇంట్లో సాయంకాలాలు కలుసుకొని రెండు, మూడు రోజులకొకసారి నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది ఈ మూడు, నాల్గు అంశాలపై అభ్యాసం చేసేవాడిని. అష్టావధానంలో మిగతావి ఈజీనే కదా! ఆ క్రమంలో ఉగాది వచ్చింది. ఆరోజు మొదటిసారి ( 1973 ) అవధానం చేశాను. అట్లా తీవ్రంగా మూడేళ్లు చేశాను. ఆ తర్వాత ఇక చాలనిపించింది. ఎందుకంటే పృచ్ఛకులు దొరకరు. ఉన్నవాళ్ళు సందర్భానికి తగని అంశాలేవో ఇవ్వడం.. మనం వాళ్ళని ఏమీ అనలేక పోవడం.. అందుకే విరమించుకున్నా. 1975లో తెలుగు మహాసభలు జరిగాయి. దానికి ముందు వరంగల్ లో ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఒక మధ్యాహ్నం పూట నా అష్టావధానం పెట్టారు. మా ఇంగ్లీష్ ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి గారు గొప్ప సంస్కృత విద్వాంసులు. ఆయన సమస్య ఇచ్చారు.  అనుకోకుండా అక్కడికి పీవీ నర్సింహారావు గారు వచ్చారు. చిన్నప్పటినుండీ తెలిసినవాడిని అవడం వల్లో, చిన్న పిల్లవాడు వీడేం చేస్తాడని చూడడానికో మొత్తానికి వచ్చారు. ఎప్పటి నుండి చేస్తున్నావని అడిగారు. ఇటీవలే పద్యం మొదలు పెట్టానని చెప్పాను. అలా ఆయన రావడం నాకు జీవితంలో మరపురాని అనుభూతిని మిగిల్చింది. ఎందుకంటే కవిత్వ స్థాయి తెలిసిన వాడు కాబట్టి, ఆ స్థాయిలో ఆస్వాదించ గలుగుతాడు కాబట్టి. మరోసారి భారతీ తీర్థ స్వామివారు వరంగల్ లో శంకర మఠానికి వచ్చినప్పుడు వారి ఆశీస్సులు లభించాయి. తర్వాత 20 ఏళ్లకు అక్కడే కవితా ప్రసాద్ అవధానం స్వామివారి సమక్షంలో జరిగింది. పృచ్ఛకునిగా వున్నాను నేను. నన్ను చూసి వారు 20 ఏళ్ళ క్రితం మీరు అవధానం చేశారు కదా! అని అన్నారు. వారి ధారణా శక్తికి ఆశ్చర్యపోయాను. వారు శాస్త్రాలలో సమృద్ధులు. తపస్వి. ఇలాంటి అదృష్టాలు కొన్ని నాకు కలిగాయి.

6) అవధాన ప్రక్రియలో విజయం సాధించాలంటే ఏ విధమైన పట్టు సాధించాలి?

జ. పట్టు ఏముందమ్మా ! ముందు పద్యం తెలియాలి. ఆశువుగా పద్యం చెప్పగలగాలి. భాష మీద అధికారం ఉండాలి. వెతుక్కుంటూ, వెతుక్కుంటూ పోవడం కాదు. ధారగా రావాలి. రెండవది ధారణ ఉండాలి. మనం ముందు ఒక పాదం చెబుతాం. ఓ సమస్య, ఓ దత్తపది, ఓ నిషిద్ధాక్షరి ఇవన్నీ ఒక ఆవర్తనం పూర్తయ్యేటప్పటికి ముందువన్నీ జ్ఞాపకంలో ఉండాలి. అవి ఒక క్రమంలో చెప్పగలగాలి. ఉదా: నిషిద్ధాక్షరి చూస్తే, ఒక అక్షరం దగ్గర నిషేధం అయ్యేటప్పుడు దానికి ప్రత్యామ్నాయ పదం మన దగ్గర ఉండాలి. అలాగే ఆ అక్షరం తర్వాత నిషేధించబడే అక్షరాన్ని ఊహించి దానికి తగిన మరో పదాన్ని మన ఆలోచనల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. లోకజ్ఞత కూడా అవసరం. ఎందుకంటే ఇపుడు అప్రస్తుత ప్రశంస ఉంటుంది. ఆ సమయంలో కోపం తెచ్చుకోకూడదు. సరదాగా ఉండాలి. ఇలా వుండగలిగితే సాధ్యం అవుతుంది.

7) దాదాపు మీకు సమవయస్కులు, చిన్నాన్న గారైన సంపత్కుమారాచార్యులు గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది?

జ. మా పినతండ్రి ఆయన. మా నాన్నగారికి కనిష్ఠ సోదరుడు. ఆయనకు నాకు కేవలం మూడేళ్ళ వయసు తేడా మాత్రమే ఉంది. అందువల్ల స్నేహితుల్లాగా మెలిగేవాళ్ళం. చాలామంది మేమిరువురం సహోదరులమని పొరపాటు పడేవాళ్ళు ( నవ్వుతూ ). ఇద్దరమూ కలిసి జంటగా కవిత్వం చెప్పేవాళ్ళం.  హృద్గీత, ఆనందలహరి, అపర్ణ అనే రచనలను చేసాం. చేతనావర్త కవులుగా పేరు తెచ్చుకున్నాం. ఎన్నో సాహిత్య అనుభవాలున్నాయి ఇద్దరివీ కలిపి.

సుప్రసన్నాచార్యులు గారి మాటలు వినండి

8) భారతీయ గొప్ప తత్వవేత్త, మహాయోగి శ్రీ అరవిందులవారి తత్వం మీకెలా అలవడింది?

జ. మా టీచరు సోమేశ్వరరావు గారని చెప్పాను కదా!ఆయన ద్వారానే అరవిందుల వారి గురించి తెలిసింది. అదేకాక శతావధాని వేలూరి శివరామ శాస్త్రిగారు ‘భారతి’లో అరవిందుల వారి తత్త్వం గురించి వ్యాసాలు రాసారు. అవి చదివాను. నాకది నచ్చింది. ఆయన జగత్తు మిథ్య అనలేదు. శంకరులు కూడా మిథ్య అంటే పారమార్థిక మిథ్య అన్నారు కానీ వ్యావహారికంలో కాదు. అరవిందుల వారు ఏం చెప్పారంటే “జగత్తు పరిణామంతో కూడుకున్నది.. ఈ జడమైన పదార్థం ప్రాణంగా, ప్రాణమైన పదార్థం మనసుగా, మనసైన పదార్థం విజ్ఞానంగా, విజ్ఞానమైన పదార్థం ఆనందంగా పరిణమిస్తుంది. అట్లాగే ఆనందం నుండి విజ్ఞానానికి, విజ్ఞానం నుండి మనస్సుకు, మనస్సు నుండి ప్రాణానికి, ప్రాణం నుండి జడత్వానికి దిగివస్తుంది” అని. దీనిలో  transformation  ఉంటుంది. ఇది ascent, descant గా నడుస్తుంటుంది. మానవుడు ఎప్పుడూ ascent కోసం ప్రయత్నించాలి. పైకి ఎక్కాలి. తన చైతన్యాన్ని దివ్య తరంగా మార్చుకోవాలి. అని చెప్పారు. ఈ విషయాలన్నీ నేను శివరామశాస్త్రి గారి నుంచి కొంచెం, మా టీచరు చెప్పడం ద్వారా కొంత నేర్చుకున్నా. విశిష్టాద్వైతంలో గాని, ద్వైతంలో గాని జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడూ నిత్యమే. ఇక్కడ జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి కూడా ఒకటే అంశం కానీ అవస్థా భేదం చేత ఒకటి ఒకటిగా, ఒకటి ఒకటిగా మారిపోతూ ఉంటుంది. పరిణమిస్తూ ఉంటుంది. ఆ పరిణామంలో  మనం భాగమయ్యి ఎంత aspiration జరిగితే అంత  పరిణామం సిద్ధిస్తుంది. అప్పుడు ఈ జగత్తులో దుఃఖం పోతుంది. మృత్యువు పోతుంది. మృత్యువు ఉందనుకుంటాం మనం. భగవద్గీతలో చెప్పినట్టు ఈ శరీరం పోతుంది. మరో శరీరం వస్తుంది. పరిణమిస్తుంది తప్ప మృత్యువనేది భయంకర పదార్థం కాదు. మనం ఎంత కష్ట పడితే అంత పైకి పోతాం. Rituals ని పట్టించుకోను నేను. Traditions లో ఉండే rituals తో నాకు సంబంధం లేదు. దాంట్లో ఉండే సత్యంతో సంబంధం. ఆ సత్యం ఏమిటంటే నాకు నా దేశం, జాతి, సంస్కృతులు ముఖ్యం. ఇవి భద్రంగా ఉంటే జగత్తుకు భద్రం కలుగుతుంది. ఇందులో వుండే సకల ప్రాణులు భద్రంగా ఉంటాయి. మానవుడే మహనీయుడు అంటూ చెట్లు, పుట్టలు అన్నింటినీ ధ్వంసం చేసి ప్రకృతిని సర్వ నాశనం చేస్తుంటే ఏం జరుగుతుంది? Industrial Revolution రాకముందు ఎలా ఉండేది? ఇంత అకాలం ఉందా? ఇసుకను తీయడం వల్ల నీరూ పాయె, కొండలు, బండలు పోయేటప్పటికి వర్షాలూ పాయె.  ఋషులను సృష్టి తెలిసిన క్రాంత దర్శులు అన్నారు ఎందుకు? Universal truth తెలిసిన వాళ్ళు వారు. మరి మనం..? పరుగెడుతున్నాం. “రాజా కాలస్య కారణం” అని సామెత ఉంది. పరిపాలనా దోషాలు కాలాన్ని అకాలంగా మారుస్తాయి. మంచి వైపు వెళ్తున్నామా, చెడు వైపు వెళ్తున్నామా తెలియడం లేదు. మంచి జరుగుతుందనే ఆశించాలి.

సుప్రసన్నాచార్యులు గారి మాటలు వినండి

9) భగవాన్ రమణమహర్షి గారు మీ ఆలోచనలను ఎలా ప్రభావితం చేయగలిగారు?

జ. వారి మార్గం అందరికీ ఆదర్శం ఆచరణీయం. అందుకే నచ్చింది నాకు. అరవిందో, రమణమహర్షి సమకాలికులు. చలం అంతగా మారడానికి కారణం చింతా దీక్షితులు. రమణ మహర్షి భక్తులు. అలా మారిన చలం తిరువణ్ణామలైలో స్థిరపడిపోయారు. నేను ఆయన్ను అక్కడే చూసాను. సౌరీస్ మొదలగు వారు అక్కడ ఒకే ఇంట్లో ఉండేవారు. చలం, నేను చాలాకాలం ఉత్తరాలు రాసుకున్నాం. మంచి కవిత్వం ప్రస్తావన వచ్చినప్పుడు సౌందర్యలహరి, శివానంద లహరి పుస్తకాలు పంపించాను ఆయనకి. ఆ సమయంలో ఆయన మారడం వల్ల లాభం ఏమిటి?  భగవద్గీతను అనువాదం చేశాడు. రమణ మహర్షిపై వచన గేయాలు రాశాడు.  గీతాంజలి అనువాదం చేశాడు. ఇన్ని చేసినా అంతకుముందు జీవితం పరిస్థితి ఏమిటి? అంతే.. మనిషికి కర్మఫలం తప్పదు.

10) ‘విశ్వలయ’ ప్రతిపాదన అంతరార్థాన్ని వివరించండి.

జ. సాహిత్యంలో ‘విశ్వలయ’ ఉండాలనే ప్రతిపాదన అది. సూర్యుడు ఉదయించడం, వాయువు వీయడం లాంటివన్నీ నియమాలకు లోబడి జరుగుతున్నాయి. ఇదే విశ్వంలో వుండే క్రమమైన వ్యవహారం. అంటే సృష్టి అంతా ఒక లయలో నడుస్తున్నది. భాషలో ఒక లయ ఉన్నది. మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇలా ఒక లయ ఉన్నది. ఒక క్రమము, క్రమ వికాసము వున్నది. ఒక పువ్వు పుట్టడం, పరిమళించడం, రాలిపోవడం ఇవన్నీ కూడా సృష్టిలో ప్రతీ వస్తువుకు, ప్రతీ అంశానికీ ఉంటుంది. ఈ విశ్వంలో ఉండే లయను అనుసరించిపోతే మనకు అనుకూలంగా నడుస్తుంది. దీనికి భిన్నంగా పోతే ప్రవాహానికి ఎదురీది నట్లు అవుతుంది. అట్లాగే కవిత్వంలో కూడా భాషలో లయ ఉండాలి. ఛందస్సులో లయ ఉండాలి. శబ్దంలో లయ ఉండాలి. అపశబ్దం ఉండకూడదు. సంగీతం పాడే వాళ్ళకు లయ ఉంటుంది. అలాగే భాషలో ఉండే లయ మనలో reflect కావాలి. ఋతువులన్నీ క్రమబద్ధంగా సాగుతాయి. శిశిరంలో గ్రీష్మం, గ్రీష్మంలో వర్షం రాదు. ఇప్పుడెందుకు వస్తుందంటే భూతాపం పెరిగింది కాబట్టి.

సుప్రసన్నాచార్యులు గారి మాటలు వినండి

అంటే ఇక్కడ విశ్వలయ తప్పింది. మనుషులే కారణం దీనికి. సృష్టి యొక్క లయ ఏంటంటే పుట్టడం, పెరగడం, చివరకు నశించడం ఇది పద్ధతి. మనిషి యొక్క చైతన్యం దాన్ని అనుసరించి ఉండాలి. స్త్రీలను హింసిస్తున్నారు ఇప్పుడు. ఢిల్లీలో, హైదరాబాద్ లో ఎక్కడైనా ఇదే నడుస్తున్నది. ఒక 50 ఏళ్ల నాటి క్రితం ఒక బంధుత్వం, ఒక ప్రేమ అన్నీ సహజంగా ఉండేవి. తర్వాత అవన్నీ పోవడం లేదా? ఇవాళ మానవ సంబంధాలు బలహీన పడలేదా? ఇవన్నీ మన జీవితంలోని లయను తొలగిస్తున్నవి. ‘విశ్వలయ’ అనేది ఏదో అద్భుతమైన విషయం అని కాదు. The system in the Universe un disturbed and help to growth towards universal consciousness. అదే విశ్వలయ అంటే.

11) తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో మీరు రాసిన పలు గ్రంథాల్లో మీకు అత్యంత సంతృప్తిని ఇచ్చినది ఏది?

జ. అన్నీ సంతృప్తిని ఇచ్చినవే.. ప్రతీదీ సంతృప్తి ఇస్తేనే రాశాను. నేను వ్యాపారం కోసం రాయలేదు. డబ్బు కోసం రాయలేదు. నేను నా మనసులోంచి తన్నుకు వచ్చిన భావాలనే రాశాను. “కన్నుల ఓకిరింతలుగ రాల్చెడి భాష్పజలము గొంతులో సన్నవడి.. పుట్టువుల చాళ్ళు దాటుతు వచ్చి నీ సన్నిధి చేరితి..మిగులు సంగతి నీదయా!” ఎంత వేదన ఉంటే ఇలా వస్తుంది? కన్నులకు కూడా ఓకిరింత ఉంటుందా? ఎన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చామో..మనకు మంచి గురువు లభించడమంటే అది అదృష్ట విశేషమే.. ఎన్ని జన్మలు వెతుక్కుంటూ వస్తే ఆ గురువు లభిస్తాడు? అదొక అద్భుత సన్నివేశం. ఏదో అదృష్టవశాత్తూ ఈ దేశంలో ఉండే మట్టివాసన లభించింది.

12) విభిన్నమైన పద్య, వచన కవిత్వాన్ని ఎలా సంబాళించుకున్నారు?

జ. ఎందుకు భిన్నమైనవి? ప్రాచీన కావ్యాల్లో వచనం లేకుండా ఏ ఒక్కటైనా ఉందా? నిర్వచనమని రాసుకోవాల్సి వచ్చింది (నిర్వచనోత్తర రామాయణం).
పాత, కొత్త ఏమిటి? వేంకటేశ్వర గీతాలేమిటి? సింహగిరి వచనాలేమిటి? వేంకట పార్వతీశ కవులు భావ సంకీర్తనమనే కావ్యం రాశారు. దానిలో రెండవ భాగం అనుకుంటా…పూర్తి వచనంలాగా ఉంటుంది. పద్యమే అది ( గట్టిగా నవ్వుతూనే ). మీరు ఎంత తన్నుకున్నా పద్యం దొరకదు. చలం గారి వచనాలు? ప్రాచీనం ఏంటి నాకర్థం కాదు. భాష ప్రాచీనమవుతుందా? దాహం వేసినప్పుడు మంచినీళ్లు తాగడం సహజం అది ఏ భాషలో చెప్పినా.. అంతే కదా! చిలుక, కోకిల, మర్రిచెట్టు ఇవన్నీ ప్రాచీనమా? అప్పుడున్నది ఇవాళ లేనిదేమిటి? ఇవాళ లేదు అంటే మనం నాశనం చేసుకున్నదే. ప్రకృతికి మానవుడు చేసిన దుర్మార్గం తప్ప మరోటి కాదు. స్పందనలు అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. మృత్యుభయం అందరికీ సమానమే ఎప్పుడైనా.. “ఆహార నిద్రా భయ మైథునంచ సామాన్య మేతత్ పశుభిర్నరాణామ్” ఆహారం, నిద్ర, భయం, స్త్రీ పురుష సంగమం ఇవన్నీ మానవునికి పశువులకు సమానమే. అరిషడ్వర్గాలు ఇవాల్టివా, ముందు లేవా? “ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే” దీంట్లో ప్రాచీనత, నవీనతలు ఏమున్నాయి? నేను వ్యతిరేకిస్తున్నానని అనుకోవద్దు. ఎక్కడ Universal అయితే అక్కడ కవి ఉంటాడు. Universal కాని చోట కవి ఉండడు. ఇదే సిద్ధాంతం.

13) అపారమైన మీ సాహితీ జగన్నిర్మాణంలో మూలాధారంగా నిలిచిన అంశం ఏది?

జ. సృష్టి రహస్యం తెలుసుకోవడం. మనిషి రహస్యం తెలుసుకోవడం. ఈ జీవితం continue కావాలి. Consiousness continue కావాలి. అది ఒక పరిమితిలో ఉంటుంది. దాన్ని దాటి రావాలి. కుండలో ఉన్న ఆకాశం వేరు. బయట ఉన్న ఆకాశం వేరు. కానీ కుండ అనేది దానికి పరిమితి విధించింది. కుండ పగిలిపోతే ఆకాశం లేకుండా పోతుందా? అలాగే “యూనివర్సల్ కాన్షియస్ నెస్” కూడా మన లోపలే ఉంది. అది బయట ఎక్కడో లేదు. అది అల్టిమేట్ గా మనకు కావాలి. అదే ముక్తి. అంటే ఘటాకాశ స్థితి నుండి మహాకాశ స్థితికి చేరుకోవడమే ఒకరకంగా మోక్షం.

14) అనేక ఉద్యమాలు, త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం లభించడం ఎలా అనిపించింది?

జ. తెలంగాణ ఉద్యమం రాజకీయ ఉద్యమం. ఈ ప్రాంతానికి న్యాయం జరగడం లేదన్న భావనతో ఉద్యమం ఊపిరి పోసుకొంది. దానికి ముందే సాంస్కృతికోద్యమం జరిగిందని ముందే మీకు చెప్పాను. ఆ ఉద్యమంలో పదవులు, ఆకాంక్షలు, స్వార్థాలు లేవు. ఒక ఇంట్లో బలవంతుడు ఉంటే బలహీనుని ఇబ్బంది పెడతాడు. అన్యాయం జరగ లేదని నేననను. కానీ సాంస్కృతికోద్యమం బలహీన పడడం సరియైనది కాదు. అది ఎప్పుడూ బలంగా ఉండాలి. నిజాం కాలంలో అణచివేతకు గురయ్యాము. మన కర్మ..తప్పలేదు. మా మేనమామ ఆ రోజుల్లో హైదరాబాద్ లో చదువుతున్నాడు. ఒకసారి ఇంటికి వచ్చేటప్పుడు షేర్వాణి, కుచ్చు టోపీ ధరించి వచ్చాడు. ఆ వేషం చూసి ఆశ్చర్య పోయాను. కానీ తప్పదు. అణచివేత ఉన్నప్పుడు బాధ తప్పదు. అవి రాజకీయ పరమైనవి. రాజకీయానికి, సంస్కృతికి తేడా చూడాలి. ఒక సందర్భంలో ఒక మంత్రి గారిని కలవాల్సి వచ్చింది నేను. అందులో మాన్య మహాశయులు మంత్రి గారికి అని, కింద ఇతరులకు ఆచార్య, డాక్టర్ అని గౌరవ వాచకలున్నాయి. నా పేరు దగ్గర ఏమీ లేవు. అయితే మీరంతా డాక్టర్లు, ఆచార్యులు కానీ నేను కానా! అని ఆహ్వాన పత్రిక కింద పడేశాను. మనసు గాయపడింది. రాజకీయ బలం ఏంటంటే మనిషిని విచిత్ర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ఇవన్నీ తలచుకుంటే కష్టాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా మాట్లాడుతున్నప్పుడే శరీరం పక్కకు వాలిపోతే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అవార్డులు వద్దు, రివార్డులు వద్దు. ఇస్తే వద్దని అనను. ఇవ్వమని అడగను. అంతే…

15) చివరగా రాబోయే తరాలవారికి మీ ఆశీర్వాద బలంగా ఏదైనా సందేశం ఇవ్వండి.

జ. (నవ్వుతూ) నా పుస్తకాలన్నీ సందేశాలే. నేను రాసిన కారణం “A search for Universal Truth” కోసమే. వెతుకులాట కోసమే. లయలో లీనమైపోవాలి. మొత్తానికి మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆనందాన్ని పొందాలి. చుట్టూ మంచి వాతావరణాన్ని ఏర్పరుచుకోవాలి. మంచి వాయువు పీల్చాలి. అట్లా ఉంటే చాలు జీవితం ధన్యమైనట్లు…

………ఇంతటి వయస్సులో కూడా అడిగిన వెంటనే కాదనకుండా మాకోసం సమయాన్ని వెచ్చించినందుకు వేనవేల నమస్కారాలు. ఎన్నెన్నో విషయాలను తెలుసుకున్నాం. ఈరోజు మా జన్మలు ధన్యత పొందాయి..మా తరఫున, మా పాఠకుల తరఫున మీకు కృతజ్ఞతాభివందనాలు.

May 27, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

పులికాపు

by Laxmi Madan May 15, 2023
written by Laxmi Madan

ఏం చేస్తున్నావే! ఒకసారి ఇటురా అన్నాడు బాపు…

“అత్తకు పూజ కోసం నీళ్లు పెడుతున్న ఏం కావాలో చెప్పండి” అన్నది అమ్మ…

“రేపు పెద్ద ఏకాదశి కదా ఉపవాసంతో అలసటగా ఉంటది అందుకని ఈ రోజే పులికాపు చెయ్” అన్నాడు బాపు.

“సరే ఇవాళనే చేస్తా పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మొదలు పెడతా” అన్నది అమ్మ,…

“మడివంట అమ్మ చేస్తుంది ఈరోజు నువ్వు పులికాపు చెయ్” అన్నాడు బాపు…

“పాపం !అత్తను ఎందుకు శ్రమ పెట్టడం రెండు పనులు నేనే చేస్తా మెల్లగా” అన్నది అమ్మ…

అక్కడే ఉన్నా నాయనమ్మ “కూర్చున్న చోట పులికాపు నేను చేస్తాలే నువ్వు వంట పనులు చూసుకో “అన్నది మెల్లగా…

“ఏదో ఒకటి ఇద్దరు చేసుకోండి” అని చెప్పి బాపు దేవుడి పూజ చేయడంలో నిమగ్నమయ్యారు.

అంతా వింటున్న నాకు “వావ్! పులికాపు చేస్తారట ఎలా ఉంటుందో కొత్తరకం వంటకమేమో! అమ్మను అడుగుదామంటే నాకు స్కూలు టైం అయింది సరేలే వచ్చిన తర్వాత తింటా ఎలా ఉంటుందో? ఏమో మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పాలి బాగుంటే మళ్ళీ ఒకసారి అమ్మతో చేయించుకుని వాళ్లను కూడా పిలిచి పెట్టాలి”. ఇలా ఆలోచించుకుంటూ స్కూలుకు చేరుకున్నాను.. క్లాస్ లో కూడా అప్పుడప్పుడు పులికాపు గుర్తొస్తూనే ఉంది ఫ్రెండ్స్ తో చెప్పాను కూడా మా అమ్మ పులికాపు చేస్తానంది అని..

“అవునా! ఎలా ఉంటుంది అది మాకు రుచి చూపిస్తావా “అన్నారు ఫ్రెండ్స్…

“ఏమోనే నేను ఇప్పటివరకు తినలేదు తిన్న తర్వాత బాగుంటే మీ అందరిని కూడా పిలుస్తాను “అని చెప్పాను..

ఒంటిగంట అయింది మధ్యాహ్నం బెల్ కొట్టారు అందరము భోజనాలకు ఇంట్లోకి పరుగు తీసాము…

ఇంటికెళ్లి పుస్తకాల సంచి టేబుల్ మీద పడేసి వంటింట్లోకి వెళ్లి అమ్మా! నాయనమ్మా! ఏది పులికాపు చేశారా” అని అడిగాను..

“ఆ చేసాము అనగానే ఉవ్వెత్తున సంతోషంతో పొంగి పోయాను

“అన్నం తినడానికి వచ్చేయండి కాళ్లు కడుక్కొని రండి” అని చెప్పింది అమ్మ..

కాళ్లు చేతులు కడుక్కొని వంటింట్లోకి వచ్చి పీట మీద కూర్చొని
” ముందు పులికాపు పెట్టు ఆ తర్వాత అన్నం తింటా. పొద్దుటి నుండి ఎదురుచూస్తున్న దానికోసం” అని అన్నాను…

అమ్మా నాయనమ్మ విస్తు పోయారు..

“ఏంటి పులి కాపు పెడితే తింటావా తినడానికి అదేమైనా వస్తువా తిండి పదార్థమా ?”అని ఇద్దరూ ముక్తకంఠంతో అన్నారు..

“మరి ఏంటిది పులికాపు అంటే తినేది కాదా మరి ఏంటిది “అన్నాను బిక్క మొహం వేసుకొని…

అమ్మ నాయనమ్మ నవ్వుతూనే ఉన్నారు…

“ముందా నవ్వు ఆపండి ఎందుకు నవ్వుతున్నారు అసలు పులికాపు పెట్టమంటే పెట్టకుండా” అన్నాను..

వెంటనే అమ్మ “అయ్యో పిచ్చి పిల్ల పులికాపు అంటే దేవుళ్ళని శుభ్రపరచడం చింతపండుతో కడిగి చక్కగా అలంకరించి పూజ చేసి నైవేద్యం పెట్టాలన్నమాట రేపు ఏకాదశి కదా అందుకనే ఈరోజే పులికాపు చేసాము “అని చెప్పింది..

ఎంతో ఆశగా ఎదురుచూసిన నాకు నిరాశ కలిగింది ఏడుపు మొహంతో కొంచెం కోపంతో గబగబా నాలుగు మెతుకులు తిని స్కూలుకు పరిగెత్తాను..

క్లాసులోకి వెళ్లిన వెంటనే ఫ్రెండ్స్ అడిగిన మొదటి మాట
“పులికాపు ఎలా ఉందే తీయగా ఉందా కారంగా ఉందా అసలు ఎలా ఉంటుంది “అని ప్రశ్నల వర్షం కురిపించారు….

కక్క లేక మింగలేక అసలు విషయం వివరించాను వాళ్ళకి ..వాళ్లు నన్ను చూసి నవ్వుతూనే ఉన్నారు ..అసలే కోపంగా ఉన్న నాకు ఇంకా కోపం ఎక్కువైంది…

సాయంత్రం ఇంటికి వచ్చిన నాకు బాపు ఇంట్లో ఎదురయ్యాడు నన్ను చూసి

“ఏంది బిడ్డ పులికాపు అంటే తినేది అనుకున్నవా అయ్యో నీకు ఇష్టం ఉన్నది చేసుకుందాం లే “అని దగ్గరికి తీసుకున్నాడు అమ్మ మధ్యాహ్నం వచ్చినప్పుడు చెప్పిందట ఇలా జరిగిందని..

పులికాపు కథ అలా జరిగింది
_***

May 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ధార్మిక జీవనులు శ్రీమాన్ పాములపర్తి వేంకట మనోహరరావుగారి రచనల సమాహారం ” సాహితీ మనోహరం” పై ఒక సమీక్ష.

by Aruna Dhulipala May 15, 2023
written by Aruna Dhulipala

పీ.వీ. మనోహర రావు గారు…సాహితీ గగనతలంలో
ఏమాత్రం పరిచయం అక్కరలేని పేరు. తళుకులీనే తార. నిరాడంబరుడు, నిగర్వి, నిష్కామకర్ముడు, నిష్పక్షపాతి, నిష్కపటి, నిరంతర ఆధ్యాత్మికతా లోలుడు అనే ఆభరణాలతో స్వయం ప్రకాశకులు.
స్వాతంత్ర్య సమరంలో, హైదరాబాద్ విమోచనోద్యమంలో పాల్గొన్న అపర దేశభక్తులు.అపర చాణుక్యునిగా భారతదేశానికి విశిష్ట సేవలందించి, వినమ్రుడిగా ఎదిగిన ప్రధాని పీవీ నరసింహారావు గారికి స్వయంగా సోదరులైనా తనకంటూ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న మహనీయులు పాములపర్తి వేంకటమనోహర రావు గారు.
‘సాహితీ మనోహరం’ మరుమాముల దత్తాత్రేయ గారి ప్రధాన సంపాదకత్వంలో ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా, అద్భుతమైన భావజలధిలో పురుడు పోసుకున్న తరగ. ఆయనకు మనోహర రావు గారి మీద ఉన్న అవ్యాజమైన అనురాగంతో వారి రచనల గురించి ఏదైనా చేయాలనే సత్సంకల్పం, ఆశయాలతో
ముందుకు నడిచి, మహామహుల విశ్లేషణలను క్రోడీకరించి ఒక సమగ్ర కూర్పుతో వ్యాస సంకలనంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్ది తన విధేయతను ప్రకటించుకున్నారు దత్తాత్రేయ గారు. పెద్ద కొండను చిన్ని అద్దంలో చూపినట్లు మనోహరరావు గారి అద్భుతమైన పాండిత్యాన్ని సుమనోహరంగా,
సులభ గ్రాహ్యంగా మనకు అందించడంలో కృతకృత్యులయ్యారు.
దీంట్లో మనోహరరావు గారు రచించిన కైలాస దర్శనం, రుద్రాభిషేకం, సర్వార్థ సంక్షేమ సమితి, సమర్పణం, సద్విద్య – సత్పథం అనే ఐదు పుస్తకాలకు రాయబడిన సమగ్ర వ్యాఖ్యానం పొందుపరచబడింది.

కైలాస దర్శనం – అన్వీక్షణం

పద్యకోకిల, అష్టావధాని -డా.బోచ్కర్ ఓంప్రకాశ్ గారు మనోహరరావు గారి యాత్రాగ్రంథమైన కైలాసదర్శనం గురించి, దాంట్లో వారు రాసుకున్న యాత్రా విశేషాలను ఆద్యంతం ఆసక్తికరంగా విపులీకరించారు. సుపథ గామిగా ఆయనను అభివర్ణించారు. పురాణ కాలంనుండీ మన భారతీయ సంస్కృతిలో యాత్రలు చేయడం ఒక గొప్ప లక్షణంగా చెప్పబడింది. అందువల్ల మనదేశంలో ప్రతి వ్యక్తికి ఆసేతు హిమాచలం వరకు పర్యటించే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ లోని విదేశాంగ శాఖ కార్యాలయం నుండి కైలాస, మానస సరోవర యాత్రకు నాల్గవబృందంలో ఎంపికైన పీ. వీ. మనోహరరావు గారు 19-7-1983 న తమ బ్రహ్మ మానస సరోవర యాత్ర ప్రారంభించారు. ఆ విశేషాలను మొత్తంగా ‘కైలాసదర్శనం’ అనే పేరుతో పుస్తకంగా రాసుకున్నారు. 45అధ్యాయాలలో తమ అనుభవాలు, అనుభూతులు చేర్చి తెలుగు యాత్రా చరిత్రలలోనే దీనికి ఒక విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. దాదాపు మండల కాలంలో ఈ యాత్రను పూర్తి చేసారు. ఎన్నెన్నో పుణ్య క్షేత్రాలు, ఆశ్రమాలు, తీర్థాలు, జలపాతాలు, నదులు, సంగమస్థలాలు, పర్వతాలు, మంచుశిఖరాలను దర్శించి తాదాత్మ్యం చెందారు. ఆ అనుభూతులతో మనకు ప్రత్యక్ష దర్శనం చేయించారు. ప్రతీ అధ్యాయానికి ఒక రమణీయమైన పేరు పెట్టడం, ప్రతి అధ్యాయం కూడా ఏదో ఒక దైవ శ్లోకంతోనో, పద్యం తోనో ప్రారంభించడం ఆయన దైవభక్తికి తార్కాణం.

” యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః “అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఉత్తముల కర్మలు

సదాచారాలుగా ఆదర్శప్రాయమవుతాయి. భారతీయ సంస్కృతిలో పురాణాలు, ఇతిహాసాలు సదాచారాలకు నిధులు. మనోహరరావు గారు అలాంటి ఎన్నో సదాచారాలను అయా అధ్యాయాల్లో పేర్కొన్నారు. ఉ:- సాలగ్రామ విశిష్టత, వాటిలోని వివిధ రకాలు, సాలగ్రామ అర్చనలో తులసీదళంతో పూజించడం గురించి చెబుతూ శంఖోదకాన్ని తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. భస్మ, రుద్రాక్ష ధారణల గురించి వివరించారు. వాచిక, మానసిక, కాయిక, తపస్సులను గురించి తెలిపారు. సత్యము యొక్క విశిష్టత, స్వార్థ, అసత్య, మాయ, మోహ, మోస, దుష్టచింతనల వల్ల సమాజానికి జరిగే అనర్థాలను హెచ్చరించారు.
ఇంతే కాక కైలాస, మానససరోవర ప్రాంతాలకు చెందిన ఆయా సాంఘిక ఆచారాలను కూడా దీంట్లో పొందుపరచడం విశేషం. టిబెట్ లోని బౌద్ధమత సంస్కృతిని, భారతీయ సంస్కృతికి గల సాన్నిహిత్యాన్ని ప్రస్తావించడం వారి జ్ఞాన విస్తృతిని తెలియజేస్తుంది. టిబెట్ లోని ప్రజల వాయిద్యాలు, దైవ నివేదనకు ఉపయోగించే ఆహారాలు.. ఇలా ఎన్నో విశేషాలను విడమరిచారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే మరో వైపు సందర్భానుసారంగా వేద, పురాణ, కావ్య, శాస్త్రముల నుండి పద్య, శ్లోకాలను ఉదాహరించి, అందరికీ అర్ధమయ్యే రీతిలో రాయడం ఈ యాత్రకు శోభను సంతరించుకుంది. కాళీమాతను దర్శించుకున్న సందర్భంలో,
“అంబ నవాంబుజోజ్జ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా”
“అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ” అంటూ దేవీ భాగవతంలోని స్తుతులతో అమ్మవారిని దర్శించి పునీతులయ్యారు.
“పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం” అని మంచిని బోధించారు.
సత్యం నిష్ఠ, సదాచారాల గురించి తెలుపుతూ భారతంలోని ” భూత హితంబుగా బలుకు బొంకును సత్య ఫలంబు నిచ్చు” నని వాటిపట్ల తన శ్రద్ధను వ్యక్తం చేసారు. ఒక సందర్భంలో తన వెన్ను నొప్పి కారణంగా ఇక యాత్ర చేయలేనేమో అనుకున్నప్పుడు,
“క్లైబ్యం మా స్మగ మః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే” ఒక కార్యాన్ని చేపట్టినప్పుడు పతనానికి కారణమయ్యే నపుంసకత్వాన్ని,హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టాలని అర్జునునికి కృష్ణుడు బోధించిన భగవద్గీత శ్లోకాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని కార్యోన్ముఖులైనారు.
హిమాలయాల ఎత్తును చూసి కాళిదాస విరచిత కుమారసంభవ కావ్యంలోని “అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా, హిమాలయో నామ నగాధిరాజః” అనే శ్లోకాన్ని అలాగే అల్లసాని వారి మనుచరిత్ర లోని ప్రవరుని హిమాలయ యాత్రకు సంబంధించిన “అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర
ఝరీ పటల ” అనే పద్యాన్ని ఉదాహరించడం ఆయన జ్ఞాన సంపదను తెలుపుతుంది. పీవీ నరసింహారావు గారికి మానస సరోవర ఉదకమును తీర్థంగా ఇచ్చిన సమయంలో వారి మాతృమూర్తిని స్మరిస్తూ చాందోగ్యోపనిషత్తును అనుసరించి భావానుసరణ చేసిన పద్యం…

” తల్లి అధికురాలయ్యె ధరణికంటె
తండ్రి యధికుండు విష్ణు పదంబుకంటె” అని తెలపడం
తల్లిదండ్రుల విశిష్టతను తెలియచేస్తుంది. ఇక్కడ ఆయన ఒలికించిన కరుణ రసం అద్భుతం.
జరిగిన కొన్ని చేదు అనుభవాల దృష్ట్యా ” యద్ధాత్రా నిజ ఫాలపట్ట లిఖితం ” అనే శ్లోకం ద్వారా ధనధాన్య సంపదలు, సుఖ దుఃఖాలు మనుషులు ఎక్కడికి వెళ్లినా వెంటే వస్తాయని తెలిపారు. వీటన్నింటిని బట్టి అనేకానేక అంశాలలో వారికున్న విజ్ఞానము, వివేకము మనకు ద్యోతకమవుతాయి.
ఈ పుస్తకాన్ని మండల కాలంలో పూర్తి చేసి, తమ మాతృమూర్తి రుక్మిణీదేవిగారికి అంకితం ఇవ్వడం పుణ్యకార్యంగా చెప్పవచ్చు. ఆమె పదాలకు సభక్తికంగా
ఎన్ని జన్మల పున్నెమో ఈ తనువున
తల్లి ! నీ యనురాగ సంతర్పితుడగు
చిన్ని కొడుకీయనున్న ఈ చిన్ని యుపద
నీ పదాబ్జములందున నిలుచుగాక !
అంటూ శిరసు వంచి ఆమెకు సమర్పించుకున్నారు.
45 అధ్యాయాలుగా విభజించబడిన ఈ గ్రంథంలో 58 పద్యాలు, 304 శ్లోకాలు విశేషంగా ఒక దండకం ఉదాహరించబడ్డాయి. ఈ యాత్రా విశేషాలను ఒక మణిహారంగా మనకు అందించారు ఓం ప్రకాశ్ గారు.

షోడశోపచార పూజ – రుద్రాభిషేకము

అవధాని -అప్పాల శ్యాంప్రణీత్ శర్మ గారు

పీవీ. మనోహరరావు గారు రచించిన ‘రుద్రాభిషేకము’ గ్రంథం గురించి అత్యంత సులభంగా చదువరులకు అర్థం అగు రీతిలో ఈశ్వరార్చన చేయు విధానాన్ని
విశ్లేషించారు. “అభిషేక ప్రియశ్శివః ” అన్న ఆర్యోక్తిని అనుసరించి అభిషేకప్రియుడు, సులభవశుడు ఆయిన శివుని అనుగ్రహాన్ని పొందడానికి రుద్రాభిషేకాలు చేసే పూజా క్రమణికను రూపొందించారు.
‘రుద్రాభిషేకము’ పుస్తకము 478 పేజీలు ఉన్నప్పటికీ చేతిలో ఇమిడిపోయేంత ఆకారంలో తయారుచేయబడింది. పుస్తకంపై ఆధారపడి అభిషేకాదులు చేసుకునే వారు ప్రయాణాల్లో సైతం వెంట తీసుకొని వెళ్లేందుకు వీలుగా అనువైన కాగితంతో రూపొందించడం దీని ప్రత్యేకత. ఈ పుస్తకం ముఖ చిత్రంపై పైన సగభాగం కైలాసశిఖరం కాగా క్రింది సగ భాగం మనోహరరావు వారి స్వస్థలం వంగర గ్రామం ఉండడం విలక్షణంగా ఉంటుంది. కైలాసానికి వేసిన నిచ్చెన కైలాస శిఖరం అయితే ఆ పరమశివుని పాదారవిందాలకు త్రోవ చూపే గ్రంథంగా దీనిని భావించవచ్చు. తమ గ్రామంలో స్వయంగా నిర్మించి, కైలాస కల్యాణి క్షేత్రంగా నామకరణం జరిపి ప్రతిష్టించిన ఆ వూరి దైవంపట్ల ఆయనకున్న భక్తి ప్రపత్తులను ఈ ముఖచిత్రం చాటుతోంది.
ఉత్సాహవంతులైన పాఠకుల అవగాహన కోసం మనోహరరావు గారు ఇందులో మంత్రాలకు, శ్లోకాలకు భావతాత్పర్యాన్ని రాశారు. దీనికొరకు
సాంప్రదాయ భాష్యాలను ఆధారం చేసుకున్నారు.
” జ్ఞాత్వా కర్మాణి కుర్వీత ” అని గీతలో చెప్పబడింది.
శివుని అభిషేక సమయంలో చేయవలసిన, చేయకూడని విషయాల కనీస జ్ఞానం అవసరం. దానికి ఈ గ్రంథం కల్పవృక్షం వంటిది.
యజ్ఞోపవీత ధారణ ఎంత పవిత్రమో ఇందులో చెప్పబడింది. తొమ్మిది తంతువులతో అనగా దారపు పోగులతో తయారుచేసే దీనిలో ఒక్కో తంతువుకు ఒక్కో దేవత అధిష్ఠాతగా వుంటారు. ఇది కేవలం తంతువుల సముదాయం మాత్రమే కాదని, తొంభై ఆరు విషయాలకు ప్రతీకయని విడమరిచారు.
” సమ్యక్కల్పతే అనేనేతి సంకల్పః ” అని అమరకోశ వ్యాఖ్య. ఏ పని గురించి అయినా మనసులో చక్కగా కల్పించబడేది సంకల్పం. దానికి దైవం తోడయితే అది సఫలీకృతం అవుతుంది. అదే సంకల్పం యొక్క విశిష్టత. ఇంట్లో చేసుకునే పూజ మొదలుకొని యజ్ఞయాగాదుల వరకు ఆరంభంలో చేసే
క్రియ ఇది. తిథి, వార, నక్షత్రాదులు, మనం ఉన్న ప్రదేశం , ఏ రెండు నదుల మధ్య ఆప్రాంతం ఉందో వాటిపేర్లు, కాల వివరణ ఆ తర్వాత చేయబోయే పని ఇవన్నీ సంకల్పంలో చెప్పబడతాయి.
“ఆదౌ పూజ్యో గణాధిపః” ఏ పూజ చేసినా ప్రథమంగా గణపతిని పూజించడం మనకు ఆనవాయితీ. గణపతికి షోడశోపచారాలతో పూజించే విధానాన్ని ఇందులో నిక్షిప్తం చేశారు. గణనాథుని అభిషేకానికి వీలుగా గణపత్యుపనిషత్తును కూడా దీంట్లో జతచేశారు. ఈ పారాయణ చేసే విధానాలను, వాటి ఫలశ్రుతులను కూడా చక్కగా వివరించారు.
ఇక రుద్రాభిషేకంలో, రుద్రుడు సర్వ మంగళ స్వరూపుడు. అభిషేక ప్రియుడు. ఆ అభిషేకానికి ఉపయోగపడే మంత్రాలే నమక చమకాలు.ఇవి కృష్ణ యజుర్వేదంలో చెప్పబడ్డాయి. దీనికే శతరుద్రమని వ్యవహారం. ‘నమశ్శివాయ’ అన్న శివపంచాక్షరీ మంత్రం దీనినుండి గ్రహించినదే. ఇలా ఏ సేవల ద్వారా స్వామి అనుగ్రహం పొందుతామో విపులంగా తెలుపబడింది.
ప్రకృతిని, జీవరాశులను గౌరవించాలి, ప్రేమించాలి. ఇదే రుద్రాధ్యాయంలోని అర్థం. పరమశివుని అభిషేకం తర్వాత పురుషసూక్త, శ్రీసూక్తాలతో అభిషేకాన్ని ముగించడం అనాదిగా ఆచరణ యోగ్యమైన పద్ధతి. అందుకే ఇవి కూడా ఇందులో చేర్చబడ్డాయి.
వీటన్నింటినీ విశదపరచి చివరగా నామార్చనలు తప్పక చేయాలని మనోహరరావుగారు సూచించారు. ఇంతటి సులువైన మార్గాన్ని మనకు అందించిన వారికి శతధా వందనాలు.శ్యాంప్రణీత్ శర్మగారు ఈరుద్రపూజా క్రమణికను సవిస్తరంగా తెలియచేశారు. ప్రతీ ఇంట్లో ఉండవలసిన పుస్తకమిది. దేవాలయ అర్చకులకు కూడా ఇది మార్గదర్శనం చేస్తుంది.

సర్వ జనోపయోగి ‘సద్విద్య – సత్పథం’

డా. బ్రాహ్మణపల్లి జయరాములు గారు మనోహరరావు గారి రచన ‘సద్విద్య – సత్పథం’ అనే దానిని విస్తారంగా విశ్లేషించారు. ఇది కేవలం విద్యార్థులే కాక అందరూ చదవదగిన పుస్తకం. ప్రస్తుత విద్య,దాని విధానం గురించి మనోహరరావు గారికి పూర్తి అవగాహన ఉందని ఈ పుస్తకం మనకు తెలుపుతుంది. నైతిక, సాంస్కృతిక , ఆధ్యాత్మిక విలువలకు, మానవ సంబంధాలకు ఇది ఉపయోగపడడం లేదని ఆయన ఆవేదన. కేవలం స్వార్థమయమై, ఆర్థిక ఒప్పందాల బంధాలతో, సుఖ భోగాల లాలసతో బానిసగా జీవించడానికే ఇది పనికివస్తుందని వారి భావన. అందుకే ‘సత్ ‘ అంటే శాశ్వతము, సత్యము అయిన జ్ఞానాన్ని సంపాదించాలని, దీని ద్వారా మనిషి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతాడని ఇందులో చెప్పబడింది.
సత్పథం అంటే మంచి మార్గం. లోకంలో మంచి, చెడూ ఉంటాయి. చెడుని విడిచి ధర్మమార్గంలో నడిచినప్పుడే మానవుడు ఉత్తముడవుతాడు. అలా చేయలేనప్పుడు మనిషికి, జంతువుకు తేడా ఉండదు. జాతి గౌరవం దేశ ప్రజల నైతిక ప్రవర్తనపై, పాలకుల నీతి నిజాయితీపై ఆధారపడి ఉంటుందని రావుగారి
నిశ్చితమైన అభిప్రాయం. విద్య వల్ల వినయం, సంస్కారం, క్రమశిక్షణ, తల్లిదండ్రుల, గురువుల పట్ల గౌరవం కలుగుతుందనే భావన లేకపోవడం వల్ల నైతిక విలువలు పతనమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. శీలం విలువను వివరిస్తూ ఈ గ్రంథంలో ప్రహ్లాదుడు శీలం దానం చేసిన కథను వివరించారు.
గురువుల గొప్పతనాన్ని గుర్తుచేశారు. ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ మతాలు పుట్టాయో వాటిని గూర్చి తెలిపారు. మనకు సహజంగా కలిగే ఎన్నో ప్రశ్నలకు ఇందులో సమాధానాలు దొరుకుతాయి. మాటల కాఠిన్యాన్ని మానుకోవాలని హితబోధ చేశారు. దీనికి భారతంలోని ” తనువున విరిగిన యలుగుల”-మనసులో విరిగే మాటల ముల్లులను తీయడం కష్టం. అనేఅర్థాన్నిచ్చే పద్యాన్ని ఉదాహరించారు. మన సంస్కృతి యొక్క విస్తృతిని అయిదు అంశాలుగా విభజించి, ఎన్నో విషయాల్లో అవగాహన కల్పించారు. “ధర్మ మూలం ఇదం జగత్” అని నొక్కి వక్కాణించారు. లోకంలో చాలామంది అష్టకష్టాలు పడుతున్నామంటుంటారు. కానీ అవేవో తెలియవు. పరదేశయాత్ర, సొంతంగా వండుకోవడం, భార్యలేకుండా ఉండడం,యాచక వృత్తి, సరివారి పంచన ఉండడం,తెలియని ప్రభుసేవ, చదువులేక పెద్దలనెదిరించడం, దారిద్ర్యం….ఇవి అష్టకష్టాలని తెల్పారు.ఇవేకాక ఎన్నో శ్లోకాలు, తాత్పర్యాలతో పొందుపరిచారు.
కేవలం రాయడమే కాక 70 పేజీల ఈ పుస్తకాన్ని కొన్ని పాఠశాలలకు స్వయంగా వెళ్లి, పుస్తకాలని పంచి, దానిపై పరీక్షల నిర్వహణ, నగదు బహుమతులు ఇచ్చే దిశగా ప్రోత్సహించారు. ఫోను ద్వారా నిర్వహించిన పరీక్షల్లో జయరాములు గారిని కూడా భాగస్వాములను చేశారు. ఈ పుస్తకాన్ని చదివిన విద్యార్థుల్లో ఒక్కరైనా ఆచరిస్తే చాలని ఆయన ఆశ. దీనిని చదివిన వారికి మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా జీవించాలో తెలుస్తుంది. భావితరాలవారికి హైందవ సంస్కృతిని అందించాలన్న రావుగారి ఆశను, ఆశయాన్ని మనలను ఆలోచింప జేసే దిశగా, సమగ్రంగా అందించారు జయరాములు గారు.

సర్వార్థ సంక్షేమ సమితి – అనుశీలన

విదుషీమణి శ్రీమతి మంచినీళ్ళ సరస్వతీ రామశర్మ గారు మనోహర రావు గారి ‘సర్వార్థ సంక్షేమ సమితి’ సంస్థ, దానికి సంబంధించిన వివరాలతో ఆయన రాసిన గ్రంథం గురించి అద్భుతమైన విశ్లేషణను అందించారు.”సర్వేజనా సుఖినోభవంతు – సత్కార్యాలకు సహృదయుల సహకారం సదా సంభవం” అనే నినాదంతో పురుషార్థాల సమభావానికి, సనాతన ధర్మ రక్షణ, సర్వజనుల శాంతం, సమైక్యత అనే ఆశయాలతో ఆధ్యాత్మిక ప్రచారం కోసమే మనోహరరావు గారు ‘సర్వార్థ సంక్షేమ సమితి’ సంస్థను 3-6-1992లో స్థాపించారు.
ఒక సంస్థను స్థాపించడం చెప్పుకున్నంత సులభమైన అంశం కాదు. ఆశయం, దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, శాంతం, నిస్వార్ధం, నిరంతర కృషి ఇలాంటి ఎన్నో లక్షణాలు ఉండాలి. ఇవన్నీ తనలోన నిలుపు కున్నటువంటి మనోహరరావు గారు అనేకమైన ఆధ్యాత్మిక, సాహితీ కార్యక్రమాలకు మార్గదర్శకుడై ఈ సంస్థను ముందుకు నడిపించారు. ఎన్నో లక్ష్యాల ఆచరణగా విశ్వకిరణం, విశ్వప్రకాశం అనే మాసపత్రికల ద్వారా 5 సంవత్సరాలు విశేషపురస్కారాలతో సాగింది.
మనోహర రావు గారు ఈ సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు అన్నీఇన్నీకావు. లోకకల్యాణం కోసం వివిధ ప్రాంతాల్లో ఎన్నో యజ్ఞయాగాదులు దాదాపు 100కు పైగా నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆధ్యాత్మిక వేత్తలకు బిరుదులు,స్వర్ణ పతకాలు, సన్మాన పత్రాలు, శాలువలతో గౌరవ సత్కారాలు చేశారు. ఇవి సుమారు 1000 కి పైబడి చేయగలిగారంటే ఇది ఆయనలోని నిస్వార్థత, ధర్మ పరిరక్షణ జిజ్ఞాస అనడం అతిశయోక్తి కాదు. ఇవి కాక
అనేక సాహిత్య, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహించింది. ఉచిత హోమియో, ఉచిత మందులతో దవాఖాన నడపడం, తుఫాను, భూకంప
బాధితులకు సహాయం చేయడం, అన్నదానాలకు, వృద్ధాశ్రమాలకు, వికలాంగులకు, కరోనా బాధితులకు, గోశాలలకు సహాయం చేస్తున్నది.
30 సంవత్సరాలకు పైబడి ఎన్నో ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇప్పటికీ కొనసాగుతున్న “సర్వార్థ సంక్షేమ సమితి” మనోహర రావుగారి ఆకాంక్షలకు దర్పణం. ఆశయాలకు నిలువెత్తు రూపం.
దానిపై వారు రాసిన ఈ గ్రంథంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమాన్ని తేదీలు, సంవత్సరాల వారీగా రికార్డ్ చేసి పెట్టడం వారి దూరదృష్టికి నిదర్శనం. చేసే పనులన్నింటిలో చిత్తశుద్ధి, శ్రధ్ధ, పట్టుదల, దేనినీ ఆపేక్షించకుండా నిర్వహించడం ఇవన్నీ వారి విశిష్ట లక్షణాలు. ధర్మం కోసం చేసే పని కాబట్టి యథాశక్తి ఈ
సమీక్షను సమర్పిస్తున్నానని వినయంగా చెప్పుకుంటూ ఈ గ్రంథాన్ని విపులీకరించారు శ్రీమతి సరస్వతీ రామకృష్ణ గారు.
‘సమర్పణం’ శ్రీ పి. వి. మనోహరరావుగారి జీవనయానం.

సాహితీ చక్రవర్తి, పద్య శిరోమణి తూపురాణి వేంకట కృష్ణమాచార్యులు గారు, మనోహర రావు గారు తమ జీవిత విశేషాలతో రాసుకున్న ‘సమర్పణం’ అనే గ్రంథాన్ని’సాహితీ మనోహరం’ పుస్తకంలో అసామాన్యంగా విపులీకరించారు. శ్రీమాన్ పాములపర్తి వేంకట మనోహర రావు గారు మన భారత ప్రధానులలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న బహుభాషా పండితులు, గొప్ప రాజనీతిజ్ఞులు అయిన పీవీ నర్సింహారావు గారి సోదరులు. రుక్మాబాయమ్మ, సీతారామరావు పుణ్య దంపతుల ప్రియపుత్రులు. వీరి సతీమణి శ్రీమతి సరస్వతి గారు వీరికి అత్యంత అనుకూలంగా మసలుకునే గుణవతి.
రావు గారు సర్పంచ్ గా తమ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరచారు. ఆదర్శ వ్యవసాయదారుడే కాక వివిధ పదవులను అలంకరించి నిబద్ధతతో వాటిని నిర్వహించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆధ్యాత్మిక చింతనులై ఎన్నెన్నో యాత్రలు చేసి, పుష్కర నదీస్నానాలు, దానధర్మాలు చేసి, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించి, తమ స్వగ్రామమైన వంగర గ్రామంలో ఉన్న శిథిలావస్థలో నున్న ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి, కైలాస వాసునిపై భక్తితో శ్రీ కైలాస కల్యాణీ క్షేత్రంగా నామకరణం చేసి ధన్యులైనారు. విదేశీ యానాలు చేసి ఎంతో జ్ఞానాన్ని, అనేక విషయాల పట్ల అవగాహన, మరెన్నో అనుభవాలను ప్రోది చేసుకున్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఇప్పటివరకు కూడా అప్రతిహతంగా విజయాలు సాధిస్తూ, అహర్నిశలు తమ జీవితాన్ని పరోపకారానికై వినియోగిస్తూ, సంపదను, సంపాదనను మొత్తం సత్కార్యాలకు వెచ్చిస్తున్నారు.
ఒక వ్యక్తిగా ఏదేని ఒక రంగంలో కృషి,సేవ చేయడం గొప్ప విషయం కాదు. కానీ ఎన్నోరంగాలు, పదవులు, సంఘసేవ, ధార్మిక సేవ చేయడం అత్యంత కఠినమైనది. “లెక్కకు రానీయడు కార్య సాధకుడు దుఃఖంబున్, సుఖంబున్ మదిన్” అన్నట్లు దేనిని సంకల్పించినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తలవంచకుండా, వెనుకంజ వేయకుండా, సమర్థవంతంగా సాధించిన ధీశాలి, మనందరికీ ఆదర్శప్రాయుడు, మార్గదర్శి మనోహర రావుగారు. వారి జీవిత విశేషాలను తెలుసుకోవడం మన అదృష్టం.
ఈ ‘సాహితీ మనోహరం’ పుస్తకంలో పై విశ్లేషణలతో పాటు ప్రముఖుల ఆత్మీయ స్పందనలు, మనోహరరావు గారి ‘నా అభిమతం’ వ్యాసాలు చేర్చబడ్డాయి. ఇన్ని చేసి చివరగా ” శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కాబట్టి ఈ కార్యాలన్నీ ప్రతీచోట ఆ పరమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలతో చేస్తున్నానని”
వినయంగా చెప్పుకోవడం ఆయన ఉత్తమవ్యక్తిత్వానికి, సహృదయతకు నిదర్శనం. వారి రచనలు చదివి, వాటిని ఆచరించిన ప్రతీ వ్యక్తి ఉత్తమ జీవితాన్ని పొందుతాడు అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

May 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

ఎర్రరంగు బురద

by Jwalitha Denchanala May 15, 2023
written by Jwalitha Denchanala

ప్రముఖ కవయిత్రి, రచయిత్రి జ్వలిత రచించిన ‘ ఎర్రరంగు బురద‘ నవల ధారావాహికంగా వస్తుంది. చదువు లేకపోవడం వలన వెనుకబడి పోయిన మనుషులకు ఈ సమాజం లో ఎన్నెన్ని ఈతిబాధలు ఉన్నాయో అక్షరాక్షరాన చూపించారు జ్వలిత. ముందుకెళ్ళాలంటే చదువుల బాటలే పడాలి, పడ్తాయికూడా అనే ఆశావహ దృక్పథం కూడా వ్యక్తీకరించారు. ఆడవాళ్ళ కు ఆపదలు వస్తే ఎలా ఉపాయం గా ఎదుర్కోవాలో చెప్తుంది ఈ నవల . వారం వారం మిమ్మల్ని పల్లీయుల సంభాషణ లతో ఉత్కంఠ మైన కథతో అలరించడానికి వస్తున్నది సీరియల్ గా ఈ నవల ….. చదవండి .. – సంపాదకులు

మొదటిభాగం

“ఓ టీచరమ్మా.. మీ తరగతిల పద్మను పిలసక రమ్మన్నది మా పెద్ద మేడం” అన్నది ఆయమ్మ రొప్పుకుంట.
“లెక్కల క్లాసు నడుస్తున్నది.. తర్వాత పంపుత పో..” ఆయమ్మ రొప్పుడు పట్టిచ్చుకోకుండా అన్నది పదో తరగతి లెక్కల టీచర్ ప్రగతి.
“కాదమ్మా.. వాల్ల అక్క బిడ్డకు ఫిట్స్ వచ్చినయి డాక్టరు తొందరగ పిలిపిచ్చమన్నడు… ” అన్నది ఆయా భయపడుకుంటనే.
“సరే.. వెళ్ళు పద్మా..” కసిరి పంపింది టీచర్.

“ఏమయింది ఆయమ్మా.. మా పుష్పకు ?” అన్నది పద్మ ఆత్రంగ బయటికొచ్చి .
“ఏమో అమ్మ నాకు తెలవదు, పెద్ద మేడం పిలసకరమ్మన్నది” అన్నది ఆయా.
హైస్కూల్ పక్కన ప్రైమరీ స్కూలుంటది, హాస్టల్ పిల్లలే ఎక్కువుంటరు అందుల.
పద్మకూడా ఆస్కూల్ల సదువుకొనే హైస్కూలుకు పోయింది.

ప్రైమరీ స్కూలు హెచ్చెమ్, పక్కనే ఉన్న హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న పద్మను పిలుచుక రమ్మని ఆయాను పంపి, బయట వరండాల నిలబడి ఉన్నది, పద్మను సూసి ” రా.. రా.. తొందరగా.. డాక్టర్ ఎదురు చూస్తున్నరు.. పుష్ప వాళ్ళ అమ్మా నాన్నలను పిలిపించమంటున్నరు..” అన్నది.
“అసలేమయింది మేడం..?” అడిగింది పద్మ.
“రేపు హోలీ పండగ కదా వాళ్ళ క్లాస్ పిల్లలు సీసాలల్ల రంగు నీళ్ళు కలుపుకొని తెచ్చుకున్నట్టున్నరు, బ్యాగుల్ల ఉన్నయట టీచర్లు సూడలే, ఇంటర్వెల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ రంగు నీళ్ళు సల్లుకుంటుంటే పక్కనే ఉన్న పుష్ప, అది సూసి గట్టిగ అరుసుకుంట పడిపోయింది. డాక్టరు దగ్గరికి తీసుక పోయినం..” అన్నది హెచ్చెమ్.
“మనం పొయ్యి సూద్దాం మేడం ఇప్పుడెట్లున్నదో…” అన్నది పద్మ.
“డాక్టర్ వాళ్ళ అమ్మా నాన్నను పిలిపిచ్చమన్నడు కదా..”
“వాళ్ళ నాన్న లేడు, అమ్మ ఉన్నది,  పిలిపిద్దాం ముందు మనం సూద్దాం రండి మేడం” అన్నది పద్మ.
“ఔనమ్మా.. పుష్ప ఇప్పుడెట్లున్నదో సూసొద్దామమ్మా..” అన్నది ఆయమ్మ.
“సరే సూద్దాం పదండి..” అంటూ…
డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అందరూ కలిసి.

*
పక్క బజార్ల ఉన్నది ప్రైవేట్ క్లినిక్, అందులనే మందుల షాపు కూడ ఉంటది. చిన్నపాటి నర్సింగ్ హోమ్, డాక్టర్ సుధాకర్ నడుపుతున్నాడు దాన్ని. ఆయన లయిన్స్ క్లబ్ మెంబర్ కావడం వల్ల, హాస్టల్ పిల్లలకు ఉచితంగా వైద్యం చేస్తాడు. పది అంగల్ల ఆగమాగంగ అక్కడికి పోయిన్రు వాళ్ళు ముగ్గురు.
పుష్ప దగ్గర వాళ్ళ క్లాసుటీచర్ కూర్చుని ఉన్నది.
పుష్ప కళ్ళుమూసుకుని పండుకొని ఉన్నది. పుష్ప ఎనిమిదేళ్ల పిల్ల. ఇంతకు ముందెపుడూ స్కూల్లో ఎవరికీ అట్లా జరగ లేదు. టీచర్లు గాబర గాబర పడ్తాన్రు భయంతో..
“పుష్పా..” అని పిలిసింది, చెయ్యి పట్టుకొని పద్మ.
కళ్ళు తెరిచి చూసి పద్మను పట్టుకొని ‘పద్మక్కా..’ అని ఏడవడం మొదలు పెట్టింది.
వేరే పేషుంటును చూస్తున్న డాక్టరు, పుష్ప ఏడుపు విని అక్కడి కొచ్చి “మళ్ళీ ఏమయింది ?” అన్నాడు.
“ఏం కాలేదు డాక్టర్… వాళ్ళ అక్కను చూసి ఏడుస్తున్నది” అని చెప్పింది టీచర్.
“తల్లి దండ్రిని పిలిపించమన్నా కదండీ..” అన్నాడాయన. “హాస్టలు పిల్లలు కదా డాక్టర్, తల్లిదండ్రులు ఊర్ల ఉంటరు.. రేపు పిలిపిద్దామండీ.. ఆ అమ్మాయి  అక్క వచ్చింది. పద్మ అనీ.. హైస్కూల్లో చదువుతుంది” వివరించింది హెచ్చెమ్.

“ఓ.. పద్మా.. నాకెందుకు తెలవదు వాళ్ళ హాస్టల్ లీడర్ కదా..
సరే ఇంకా ఇద్దరు పేషెంట్లున్నారు, వాళ్ళయి పోయినంక నేను మట్లాడుతా.. భయమేమి లేదు” అంటూ వెళ్ళాడు డాక్టర్.
“నేనుంట మీరెళ్ళండి టీచర్” అని హెచ్చెమ్ పుష్ప వాళ్ళ టీచర్ను పంపించి అక్కడే కుర్చీలో కూర్చుంది.

అర్థగంట తరువాత డాక్టరు వచ్చాడు.
“ఆం.. పద్మా… చెప్పు.. ఈ అమ్మాయి మీ చెల్లెలా…” అన్నాడు.
“కాదు డాక్టర్.. మా అక్క బిడ్డ”
“వాళ్ళ నాన్న ఏమి పని చేస్తాడు ?”
“మా బావ లేడు, చచ్చిపోయిండు” అన్నది పద్మ.
“అయ్యో ఎట్ల చచ్చిపోయాడు..?
ఇంతకుముందు ఇట్ల ఎప్పుడైన ఫిట్సు వచ్చాయా?” సానుభూతిగా అన్నాడు డాక్టర్.
“నాకు తెలవదు డాక్టర్… ప్లీస్ బెటర్ టు అవాయిడ్ ద టాపిక్, బిఫోర్ ద కిడ్ డాక్టర్…” అన్నది చేతులు జోడించి..
“ఓకే.. ఐ అగ్రీ. రేపు సెలవే కదా.. రేపు మాట్లాడుదాము. పుష్ప కూడా ఇప్పుడు ఓకే. ఓకే కదా.. పుష్పా.. ఇంటికి పోతావా హాస్టల్ కు పోతావా..” అన్నాడు.
“ఇంటికే పోతా.. మా తాతొస్తడు సాయంత్రం. రేపు హోలి పండగ కదా..” అన్నది హుషారుగా.
“వెరీ గుడ్.. అయితే మీ తాతను నా దగ్గరకు తీసుకొస్తవా..”
“సరే డాక్టర్ ఇప్పుడు నేను స్కూల్ కు పోనా మరి… రా పద్దక్కా..” పద్మ చెయ్యి పట్టుకొని లాగింది.
“సరే డాక్టర్.. వెళ్ళొస్తాం..” అని చేతులు జోడించింది హెచ్చెమ్.
పద్మ కూడా “రేపు కలుస్తాను డాక్టర్..” అని నమస్కారం పెట్టింది..
ముగ్గురూ బయటకొచ్చారు..

దారిలో “డాక్టర్ తో భలేగా ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడావు పద్మా.. భయం లేకుండా..” అన్నది..
“భయమెందుకు మేడం.. డాక్టర్ గారే మాకు మోటివేషనల్ క్లాసులు చెప్తారు..
స్పోకెన్ ఇంగ్లీషు కోసం ట్యూటర్ ని పెట్టారు… మమ్మల్ని చాలా ప్రోత్సాహిస్తారు కూడా..”  చెప్తుండగా స్కూలొచ్చింది.
“వస్తా మేడం..” అంటూ తన స్కూల్ కు వెళ్ళింది పద్మ.
డాక్టర్ తో తనెందుకు మాట్లాడాలిసి వచ్చిందో గతం గుర్తు చేసుకుంది పద్మ..
*

తెలుగు రాష్ట్రాల్లో అతిసామాన్య మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఊరది. నాగరికతకు లోటు లేకున్నా మూఢనమ్మకాలకు దురలవాట్లకు అలవాటైన జనవాసం. రాజ్యాంగ సౌలభ్యాలు, రాజకీయ హామీలు నోచుకోని జాతిలో మనుషులు కొందరు.. శ్లేష్మంలో వాలిన ఈగల్లా.. కుడితిలో పడ్డ ఎలకల్లా.. జీవనారాట పోరులో కొనసాగుతున్నారు ఆ ఊర్లో. అందులో ఒక ఈగ వంటి, ఒక ఎలుక వంటి ఎరికలి నాంచారి అనే అర్భకురాలు. ఎరికల ఈరన్న, తిరుపతమ్మలకు పెద్ద బిడ్డ నాంచారి, చిన్నది పద్మ. నాంచారి పెనిమిటి ఏదులు. కాలం నాంచారి మొగణ్ణి దారుణంగా మింగింది. భర్త  పోయినంక తన చిన్నబిడ్డ పుష్పని తన తల్లిదండ్రుల దగ్గర వదిలి పెట్టి కొడుకులను తీసుకొని ‘నసూర్లపాడు’, తన అత్తగారి ఊరికి పోయింది నాంచారి, నిజామాబాద్ జిల్లాలో ఒక పల్లెటూరది. మొదట్ల పుష్ప ఉషారుగనే ఉండేది. కానీ అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేది. మూర్ఛలు అనుకున్నరు. కానీ డాక్టర్లు మూర్చ కాదు అన్నారు.

ఒక శుక్రారం నాడు తిరపతమ్మ స్నానం చేసి అంతకు ముందు వారం ‘బాలగామ’కు పెట్టిన ఎర్రచీరకట్టుకుంది. బయట ఆడుకొని ఇంట్లకు అప్పుడే వచ్చిన పుష్ప, తన అమ్మమ్మను సూసి కెవ్వున అరిసి పడిపోయింది. మొకాన నీళ్ళు చల్లంగనే  కండ్లు తెరిచి చూసి అరిసి మళ్ళీ పడిపోయింది. ఇట్ల ఒక్క రోజులనే ఆరుసార్లు అయింది. పిల్లకేదో గాలి తగిలిందని అనుకున్నది తిరపతమ్మ. ఒక సారి అరిసినప్పుడు వాంతి కూడా అయింది. చీరంత పాడయిందని, పిల్ల మూతి తుడిచి పండ పెట్టి, చీర ఇప్పి మరొక చీరకట్టుకొని వచ్చిందామె.

ఈసారి కళ్ళు తెరిసి సూసింది పుష్ప. మల్లీ ఫిట్స్ వస్తయేమో అని భయపడ్డది తిరుపతమ్మ. కానీ మల్ల రాలేదు. ప్రశాంతంగా నవ్వుకుంట కూసున్నది.

ఆరోజు ఈరన్న ఊళ్ళె లేడు. పిల్లలను హాస్టల్ కు పంపడానికి పట్నం పోయిండు.
సాయింత్రం ఈరన్న వచ్చినంక డాక్టర్ దగ్గరికి తీసకపోయి అంతా చెప్పిన్రు.
“అన్నిసార్లు ఎందుకు వచ్చాయి. ఏమన్న భయపడ్డదా.. తిండి తేడా వచ్చిందా..” అని అడిగిండు డాక్టర్ రమేష్.
“ఏంలేదు పప్పన్నం తనకిష్టం అదే తిన్నది. సంతోషంగా పలక మీద రాసుకునేది ఉన్నట్టుండి అట్లయింది” అన్నది తిరపతమ్మ.
వాల్ల పక్కింటామెకు జరమొచ్చిందని వచ్చింది అక్కడికి.. డాక్టర్ మాటలిని.. “బాలగావకు పెట్టిన చీర కట్టినవు ఒదినే పొద్దుగాల.. దేవత మాయనే అది.. మొక్కుకో ఒదినె, పిల్ల బాగయితది” అన్నది.

డాక్టర్ కసిరిండు “మీ మూఢ నమ్మకాలు అయ్యన్ని.. అదికాదు గని, అన్ని సార్లు ఫిట్స్ రాకూడదు. పరీక్షలు చేయించాలె.. పరీక్షలు రాస్తూన్న” అన్నడు.

సరే అని ఈరన్న అన్ని పరీక్షలు చేయించిండు. తెల్లారి రిపోర్టులు తీసుకొని మళ్ళా డాక్టర్ దగ్గరికి పోయిండు.
ఈరన్న తెచ్చిన రిపోర్ట్ లు డాక్టర్ చూసాడు.
“అన్నీ బాగున్నాయి. మరి అట్ల ఎందుకు జరిగిందో” అనుకుంటూ.. తన ఎదురుగా ఉన్న తన స్నేహితుడు డాక్టర్ ప్రసాద్ కు రిపోర్టులందించాడు. ఆయన హేతువాద నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త. అన్నీ చూసి “రిపోర్టులన్నీ బాగున్నాయే…” అన్నాడు.

అక్కడే ఉన్న కంపౌండర్  “సార్ వాళ్ళ నాయినే పట్టుంటడు.. అర్థాంతరంగ సంపింన్రు కదా..” అన్నాడు.

అక్కడే ఉన్న కంపౌండర్  “సార్ వాళ్ళ నాయినే పట్టుంటడు.. అర్థాంతరంగ సంపింన్రు కదా..” అన్నాడు.

“నీ మొకం నోరు మూసుకో. నిన్నొకామె దేవతన్నది.. నువ్వేమో దయ్యమంటున్నావ్.. అసలు కారణం అంతుపట్టట్లేదు..” అన్నాడు డాక్టర్ రమేష్.
ఆయన స్నేహితుడు కలగజేసుకొని “మనం ఒక సారి వాళ్ళింటికి పోదాము.  సైకలాజికల్ గా ఆ అమ్మాయిని ఏమి డిస్ట్రబ్ చేస్తున్నాయో చూద్దాము” అన్నాడు.

“సరే రేపు ఉదయం క్లినిక్కు వచ్చేటప్పుడు పోదాము,
ఉదయం తొమ్మిదిన్నరకు నీ దగ్గరకు వస్తాము మీ ఇల్లెక్కడ” అని అడిగాడు ఈరన్నను.
“ముత్త్యాలమ్మ గుడి దాటిన తర్వాత కుడిపక్క మొదటిల్లు డాక్టర్. పెద్ద ఏపచెట్టుంటది మా ఇంటి ముందల..”  ఈరన్న చెప్పిండు.

*
అన్నట్టుగానే తెల్లవారి పొద్దునే ఇద్దరు డాక్టర్లు ఈరన్న ఇంటికి వెళ్ళారు.
అంతా ప్రశాంతంగా ఉంది. శుభ్రంగా కూడా ఉన్నది. పందుల పెంపకం పై ఆధారపడే ఎరుకల కులం అయినా శుభ్రంగానే ఉన్నది.
గుడిసె లోపల బయిట కూడా.. అమ్మాయి అనారోగ్యానికి
కారణాలేవీ కనపడలేదు.
పుష్ప వాకిట్ల ఆగిన కారును చూసి కేకేసి పడిపోయింది.
“అగో మళ్ళీ ఫిట్స్ వచ్చినయి..” అని ఈరన్న పిల్లను ఎత్తుకొచ్చి మంచంల పండేసి నీళ్లు చల్లిండు. కొద్ది సేపటికి కళ్ళు తెరిచి చూసి నవ్వింది. “ఇపుడెట్లున్నదమ్మా..” అన్న డాక్టర్లతో..
‘బాగానే ఉన్న..’ అన్నట్టు తలూపింది… నెమ్మదిగి లేచి కూర్చున్నది.

ఇదేం వింతో అంతు పట్టట్లేదు.
“సరే మేము బయిల్దేరతము..” అని డాక్టర్లిద్దరూ బయిటికి వచ్చారు. వాళ్ళతో పాటు ఈరన్న కూడా వచ్చాడు.
తాతెనక బయటకు వచ్చిన పుష్ప మళ్ళీ ఫిట్సు వచ్చి పడి పోయింది. అందరు వెనక్కి వచ్చారు… డాక్టర్ ప్రసాద్ గమనించాడు.
కారును చూసి పుష్ప కేకేసి పడి పోయింది. నీళ్ళు చల్లి లేపారు ఆమెను.
‘తాతను పిల్లనెత్తుకొని బయటకు పొమ్మన్నారు’.

పుష్పనెత్తుకొని నడుస్తున్న తాతను గట్టిగ పట్టుకొని వాకిట్లకు సూసి గట్టిగ అరిసి స్పృహ తప్పింది.
డాక్టర్ ప్రసాద్ కు ఈ సారి విషయం అర్థమయింది..
“సరే మేము వెళ్ళిన తర్వాత నీళ్ళు చల్లి లేపవయ్యా… సాయంత్రం దావఖానాకు తీసుకురా మందులిస్తాడు డాక్టర్..” అన్నాడు ప్రసాద్.
డాక్టర్ రమేషుకిదంతా గందరగోళం అనిపించినా, ఈరన్న ముందు ఏమీ మాట్లడకుండా బయటకు నడిచాడు..
ఇద్దరూ కారులో కూర్చున్న తరువాత ప్రసాద్ వివరించాడు.   “మన కారు రంగును చూసి భయపడింది.. ఆ అమ్మాయికి ‘ఎరిథ్రో ఫోబియా’..  ” అన్నాడు..
“ఎరిథ్రో ఫోబియా.. అంటే..? ఎక్కడో చదివినట్టు గుర్తు.. వివరంగా చెప్పు” రమేష్ ఆలోచిస్తూ అన్నాడు.
“కొందరికి కొన్ని రంగులంటే భయం వుంటుంది. కారణాలు అనేకం… ‘ఎరిథ్రో ఫోబియా’ ఉన్న వాళ్ళు ఎరుపురంగంటే భయపడతారు…” కారణం చెప్పాడు ప్రసాద్.
“నిజమే ఆమె తండ్రి హత్య జరిగిందని, చనిపోయి రక్తంలో పడున్న తండ్రిని చూసినప్పుడు మొదటి సారి ఫిట్స్ వచ్చినాయని, వాళ్ళ తాత ఈరన్న చెప్పాడు..” గుర్తు చేసుకున్నాడు డాక్టర్ రమేష్. మళ్ళీ తనే “మరిప్పుడు ఏమి చెయ్యాలి, పట్నం తీసుక పొమ్మని చెప్పనా..” అనడిగాడు స్నేహితుణ్ణి.
“అవసరంలేదు.. ప్రమాదం ఏమీ లేదు. కొంచం వయసు పెరిగిన తర్వాత సరైన కౌన్సిలింగ్ తోపాటు.. మెడికేషన్ తో తగ్గించవచ్చు.  అంత వరకు ఆ రంగు చూడకుండా ఉండేటట్టు జాగ్రత్త పడితే సరిపోతుంది.. అరెరె.. కారాపు నేను దిగాలిక్కడ..” అన్నాడు ప్రసాద్.
డాక్టర్ రమేష్ మిత్రుణ్ణి దింపి ముందుకు సాగాడు.
ఆరోజు సాయంత్రం ఈరన్నకు విషయాలన్నీ వివరించాడు డాక్టర్ రమేష్. అప్పట్నించి మళ్ళీ పుష్పకు ఫిట్స్ రాలేదు..
ఈరోజు స్కూల్లో. ఆ ఎర్ర రంగు నీళ్ళు చూసి మళ్ళా ఫిట్స్ వచ్చినయి.

ఈ సంగతులన్నీ పద్మకు కూడా తెలుసు. అందుకే డాక్టరుతో అట్లా మాట్లాడింది..

తెల్లారి డాక్టర్ సుధాకర్ హాస్టల్ కు వచ్చినప్పుడు పద్మను అడిగాడు..  “పుష్ప సంగతి ఏమిటమ్మా పద్మా..” అంటూ..

పద్మ కొంత టూకీగా చెప్పి.. “మీకొక విచిత్రం చూపిస్తాను డాక్టర్. ఎల్లుండి మా నాన్న వస్తాడు. ఇద్దరం. కలిసి మీ దగ్గరికి వస్తాము” అన్నది.
మిగిలిన పిల్లల ముందు ఆ విషయం మాట్లాడటం ఇష్టంలేక. అది గమనించిన డాక్టర్ సుధాకర్ ఇంకేమీ అడగలేదు.

*
అన్నట్టుగానే మూడురోజుల తర్వాత తండ్రితో కలిసి డాక్టర్ సుధాకర్ దగ్గరికి వెళ్ళింది పద్మ. చేతిలో ఒక లావుపాటి నోట్ బుక్ తీసుకొని.
గ్లాస్ చాంబర్ నుండి వాళ్ళను చూసి… పేషంట్లను ఒక్క నిమిషం ఆగమని, వాళ్ళను లోపలికి పిలిచాడు డాక్టర్ సుధాకర్..
ఇద్దరూ డాక్టర్ కి నమస్కరించారు.
“మీ పద్మ చాలా తెలివైనదయ్యా బాగా చదివించాలి…” అన్నాడు.

“మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండ చదివిస్తా డాక్టర్..” అన్నడు ఈరన్న.
“ఆం.. పద్మా మీ పుష్ప ఎట్లున్నది..”
“బాగుంది.. బడిల తోలొచ్చిన డాక్టర్” అన్నడు తండ్రి.
“చెప్పు పద్మా.. ఏదో విచిత్రం అన్నావు.. పుష్ప సంగతేమిటి..” డాక్టర్ కుతూహలంగా అన్నాడు.
“మీ అన్ని ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానాలున్నాయి సార్.. మా నాన్న చెప్తుంటే నేను రాశాను. మీరు చదవండి… ఇదొక జాతి జీవిత చరిత్ర..” అన్నది ఉద్వేగంగా..

ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని పేరు చూశాడు… ‘ఎర్రరంగు బురద’ గుండ్రటి అక్షరాలు ముత్యాలు పేర్చినట్టున్నాయి.
“నీ హాండ్ రైటింగ్ చాలా బాగుంది పద్మా.. తప్పకుండా సాయంత్రమే చదవడం మొదలు పెడతా.. చదివిన తరువాతే మాట్లాడుతాను” అన్నాడు డాక్టర్..
తండ్రీ బిడ్డలు ఆయనకు నమస్కారం పెట్టి బయటకొచ్చారు.

క్లినిక్ నుండి వచ్చిన డాక్టర్ ఆ రోజు క్లబ్బుకు వెళ్ళలేదు..

త్వరగా భోజనం ముగించి పద్మ ఇచ్చిన పుస్తకం చదవడం మొదలు పెట్టాడు.

**

అదొక పూరిగుడిసె వంటి, ఒంటి నిట్టాడు ఇల్లం. ఇంటి చుట్టూ చెట్ల మీద పచ్చులన్నీ రకరకాలుగా అరుస్తున్నయి.. పక్కనే పందుల గుడెసెల గున్నలు గుర్ గుర్ అంట అడ్డం పెట్టిన రాయిని ముట్టెలతో నెడ్తన్నయి. రాయిని నెట్టడానికి వాటిబలం సరిపోట్లేదు.. కోళ్ళ గూళ్ళ నుంచి గోలగోలగా అలుపులు మొదలైనయి.. మబ్బుల్ని తోసుకుంట సూర్యుడు తొంగిచూస్తున్నడు..

అప్పుడే లేసిన తండ్రీ కొడుకులు పందుం పుల్లేసుకొని, గుడిసె సూరు కింద అరుగు మీద కాళ్ళమీద కూసొని ఉన్నరు. తండ్రి సంగడు, వాని కొడుకు ఎంకడు.

“అయ్యా వాడు నిన్ను తిడతాండే ..” కొడుకు.

“కొత్తేంది కొడకా..” తండ్రి.

“కానీ.. నాకు అవమానమయితాందే.. దోస్తుల ముందల తల కొట్టేసినట్టయితాంది..” కొడుకు.

“నాకు సుత గట్లనే ఉన్నది. వాడి కూతలు తిట్లు నాకేమన్న సంబరం ఐయితందనుకున్నవా..” తండ్రి.

“తెర్లి తెర్లి గుచ్చుకుంటున్నయి.. కంటి మీద నిద్ర లేకుండయ్యింది” కొడుకు.

“వానికి అన్నాయమయింది.. మనవల్ల వాని తల్లి సచ్చిందని కోపం.. కడుపు మంటకు అనే మాటలు పట్టిచ్చుకోకు కొడకా..” అనుకుంట గుడిసెల నుంచి జాలారికెల్లి పోయింది ఆడమనిసి..

“గుడెసెకు అడ్డమున్న చెట్టును కొట్టేద్దామయ్యా..” అన్నడు కొడుకు.

మడతేసి కూసున్న తండ్రి కాలు ఒక్క సారి సాగింది. 

బిత్తర చూపులు చూసిండు, ఎవరన్న ఇన్నరా అని.. కొడుకు మొగంకేసీ ఓపాలి సూసి.. లేసి పార పోయిండు తండ్రి. 

కొడుకు కాసేపు ఆడ్నే కూసోని నెత్తిగోక్కుంట లేసి గోలెం కాడికి పోయిండు. జాలాట్లున్న తల్లి తన మాటిన్నదేమోనని.. తల్లిని పరికించిండు. తలొంచుకొని తల్లెలు తోముతాందంటే, ఇనలేదన్న ధైర్యంతో బైటకు నడిచిండు కొడుకు. 

*

ఊరంత ఎవలి పనిల వాల్లున్నరు… అంబటాలయింది. 

“మా అమ్మను సంప్పిండు, మరోదాన్ని మరిగి మాకు తల్లి లేకుంట సేసిండు…. మా అక్కను బొంబయికి తోలిండు.. నేనేకాకినయిన.. నాకు దిక్కూ లేకుంటయింది” సగం మత్తుల గునుక్కుంటాడు ఏదులు. 

గుడిసె నిట్టాడికి ఆనుకుని కూసున్నా, పక్కకు ఒరుగుతాండు..

“ఎన్ని పొద్దులు దుఃఖ పడతవు ఊకో యయ్యి.. నీకు ముగ్గురు పిల్లలయిన్రు కదా! నువ్వొంటరోనివెట్లయితవు.. ఊకో యయ్యి” అనుకుంట.. పొయ్యి కాడ కూసున్న ఏదులు భార్య మొగని కోసం తల్లెల ఉడుకుడుకు అన్నం ఏసుకొచ్చి ముందల పెట్టింది. రాతెండి సెంబుల నీళ్ళు తెచ్చి తల్లె దగ్గర పెట్టింది. పాలు తాగే పిల్లను వల్లేసుకుని ఏదులు పక్కనే కూసున్నది. ‘తల్లి తర్వాత తల్లోలె ఆకలి దూప అరుసుకొనేదే ఆలి’ అనే మాటను నమ్మింది నాంచారి.

“మనకొక కుటుంబమున్నది నీసుట్టు నీ బలగమున్నది. నువ్విట్ట దుఃఖపడితే పిల్లలు బెంగటిల్తన్రు. నాకు బుగులయితంది” అన్నది.

“నా దుఃఖం మరవలేనిది.. మా అవ్వ అన్నాయంగ సచ్చిపోయింది. మా అయ్య ఆ మచ్చల పొట్టిదానితోనే ఉండేటోడు. మా అవ్వ ఆ మనాదిల… మొగని అన్నాయం ఎవరికి సెప్పలేక కుమిలి కుమిలి పోయేటిది. ‘మనోవ్యాధిని మించి మరణం లేదన్నట్టు’ ఆ మనాదితోటే చేదగ్గు రోగమొచ్చింది.. మంచినాడే మంచి చెడ్డ అరుసుకోని మా అయ్య రోగ మొచ్చినంక ఆయింత ఇంటికొచ్చుడే మరిసి పోయిండు, మా పెద్దక్క బువ్వండి పెడుతుండె… ఈతాకు సమురుకొస్తుండె. మా అమ్మ మంచంల కెల్లి లేవకుంటయినంక. మీ నాయిన, అమ్మమ్మ వచ్చి దావఖాన్ల సెరీకు చేసిన్రు.. అప్పటికే రోగం ముదిరింది లాభం లేదన్నరు డాక్టర్లు, ఇంటికి గొంచబొమ్మన్నరు. ఇంటికి తెచ్చినంక నెలరోజులు నవిసి నవిసి పేగులు బయటికొచ్చేట్టు దగ్గి దగ్గి ఊపిరొదిలింది. మా అవ్వ… మామే దానం చేసిండు. అవ్వ సచ్చిన మూడోనాడొచ్చిండు కఠినాత్ముడు మాయయ్య. పాపిష్టోడు.. నల్ల బండరాయి గుండె వానిది. మా అవ్వను పొట్టన పెట్టుకున్నడు.. కాదు కాదు వాని సుఖానికి మా అవ్వను బలిచ్చిండు. మమ్ముల దిక్కులేని పచ్చుల చేసిండు. వాన్ని సంపుత ఎప్పటికైనా.. నా సేతులనే వాని సావు..” తనల తను మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నడు ఏదులు. 

పక్కనే కూసున్న పెళ్ళాం ఒల్లె  ఉన్న పిల్లను పక్కకు జరిపి, మొగని కండ్ల నీళ్ళు తుడిసింది… 

“అత్తకు జరిగింది అన్నాలమే గని, నా బిడ్డలకు, నాకు అన్నాయం సేస్తవా… మీ అయ్యను సంపి నువు జైలుకు పోతే.. మాగతేంది ? నేను, నా పిల్లలు దిక్కు లేనోల్లం అయితం. జర సోంచాయించు.. నీ కొడుకు సుత నీ ఓతిగ మనాది పడడా…. మనసు శాంతం జేసుకో ఆడదాని మాటేంది ఇనేది అనుకోకు.. జర చిత్తంబెట్టి ఇచారించు.. ఊరటిల్లు.. గుండె ధైర్యం తెచ్చుకో…  మా మొగం చూడు.. నీకేమన్నయితే నేను పిల్లలు ఏం కావాలే.. మనాది ఒదిలి ఓ ముద్ద సోరు కుడువయ్యా..” అని అన్నం తల్లె చేతులకు తీసుకుని అన్నం కలిపి ముద్ద జేసి మొగని నోటికందించింది.

 తలకాయ పక్కకు తిప్పుకున్నడు ఏదులు దుఃఖంతో..

“నీ బాంచెనయిత జరంత సోరుకుడు..” అంట బలవంతంగా రెండుముద్దలు తినిపిచ్చింది. మంచి నీల్లు తాగిచ్చి, “జర చల్లబడు… శాంతంగుండు.. కాసేపు అట్ట పండు..” అన్నది.

ఏదులు లేసి గుడిసె బయిటికెల్ల బారిండు. సంగడి మొదటి పెళ్ళాం కొడుకు ఏదులు.

            *  * *

ఎండ మటమట లాడుతాంది. పొద్దు నెత్తి మీదికెక్కింది. ఏదులు ఆలోచిస్త అడుగులేస్తున్నడు. నిజమే తన పెండ్లం చెప్పినట్టు… తనకు తండ్రికి తేడా ఏమున్నది. ఏదో అఘాయిత్యం చేసి తను జైలుకు పోతే పిల్లల గతేంది.. తనకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. వాళ్ల మంచి చెడు ఎవరు సూత్తరు. తన కొడుకులు సుత తనోతిగనే దుఃఖ పడతరు కదా.. అనుకున్నడు. ఆలోచిస్తూ నడుస్తున్న ఏదులు చెరువు గట్టుకు చేరిండు. చెరువుకు దిగువన, చెరువు కట్టెమ్మటి, జెండా పండగకు సోల్పుగ బడిపిల్లలు నించున్నట్టు వరసగ ఈత చెట్లున్నయి. రొంటిల దోపిన వంక కత్తితీసి ఈతమట్టలు చెలిగి మోపు కోసం కుప్పేసిండు. పక్కనే వరిపొలం గట్ల మీదన్న దుస్సేరు తీగలు మరిన్ని చెలిగి ఈత మోపు మీదేసిండు. రెండు తీగలు తీసి మోపు గట్టిండు. ఇంక జరంత ముందుకు నడిచి ముదిరిన సర్కారు తుమ్మలల్ల రాగోల తీరున్నదాన్ని ఎంచుకొని నరికిండు.. ఆ కొమ్మకున్న ముళ్ళను ఆకులను చెలిగి నున్నగా రాగోల తయారు చేసి ఈతమట్టల మోపుకు గుచ్చిండు, అమాంతం లేపి భుజానేసుకుని ఇంటి దారి పట్టిండు. ఎంత మోర్దోపుగ ఆలోసించిన ఇన్ని దినాలు. అయ్య మీది కోపంతోని, నా బిడ్డల అనాధల సేసుకుందును వుత్తపున్నానికి…. అనుకుంట ఇంటి దారిపట్టిండు.

మాట్లాడకుండా ఇంట్ల నుంచి బయటకు పోయిన ఏదులు యాడ తాగొచ్చి ఎంత లొల్లిసేస్తడోనని బిక్కు బిక్కు మనుకుంట కూసున్నది ఏదులు పెండ్లాము నాంచారి. అల్లంత దూరాన ఏదుల్ని సూసి దమ్ము తీసి వదిలింది గుండెలనిండా.. ఉప్పుస తీరిందామెకు. “దేవుడా.. ఎంకన్నసామీ..” అంట రెండు చేతులెత్తి మొక్కింది.

నెత్తి పట్టుకొని కూసున్నదల్లా ఏదులొచ్చేది చూసి దిగ్గున లేసి గుడిసెలకు పోయి రాతెండి లోటతో కుండల నీళ్లు ముంచుకొచ్చి మొగనికి అందిచ్చింది “ఎంటోసునవే.. జర తెన్నికుడు” అంట. (ఎక్కడికి పొయినవే.. గిన్ని నీల్లు తాగు)

ఎండకు అలిసి పోయిండో.. ఆలోచనలకు గొంతు తడారిపోయిందో.. ఎత్తిన లోట దించకుండా నీళ్లన్నీ తాగి ఖాళీ లోటా అరుగు మీద పెట్టి, అక్కడే కూలబడ్డడు ఏదులు. 

నాంచారి గుడిసెలకు దూరి పొయిల కట్టెలు ఎగేస్తంది.. బయటి నుంచి పెద్ద పెద్ద అరుపులు వినపడ్డయి..

——–సశేషం——

May 15, 2023 1 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

“బామ్మ ఆశయం”

by Madduri Bindu Madhavi May 15, 2023
written by Madduri Bindu Madhavi

సుజిత్, వంశీ స్కూల్ బస్ దిగి కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు. సుజిత్ బెల్ కొట్టబోతూఉండగా వంశీ తల్లి కృష్ణవేణి వచ్చి “సుజిత్…ఇదిగో మీ బామ్మ గారు నీకు తాళం చెవి ఇమ్మన్నారు. ఆవిడ బయటికెళ్ళారు. డైనింగ్ టేబుల్ మీద పాలు, తినటానికి స్నాక్స్ పెట్టారుట. నువ్వు అవి పూర్తి చేసే లోపే వచ్చేస్తానన్నారు” అని చెప్పారు.

“ఈ టైం లో ఎక్కడికెళ్ళిందబ్బా బామ్మ?” అనుకుంటూ కాళ్ళూ చేతులు కడుక్కుని స్కూల్ బట్టలు మార్చి పాలు తాగేసి షటిల్ ఆడుకోవటానికి బయలుదేరుతుండగా, బామ్మ హడావుడిగా వచ్చింది.

“బామ్మా..నేను పాలు తాగేశాను. షటిల్ ఆడుకోవటానికెళుతున్నా” అని చెప్పి వెళ్ళిపోయాడు సుజిత్.

మరునాడు సుజిత్, బామ్మ ఇంచుమించు ఒకేసారి వచ్చారు.

అలా వారం గడిచాక, ఒక రోజు సుజిత్ కంటే ముందు వచ్చిన బామ్మ అతను స్కూల్ నించి వచ్చేసరికి తలుపు తీసి బయటే నిల్చుంది.

“ఓహ్ బామ్మా నువ్వింట్లోనే ఉన్నవా? రోజూ ఎక్కడికెళుతున్నావ్” అనడిగాడు.

కళ్ళు పెద్దవి చేసి, మొహం వెలిగిపోతూ ఎవరైనా వింటారేమో అని బామ్మ చుట్టూ చూస్తూ రోజూ తనెక్కడికి వెళుతున్నదో సుజిత్ చెవిలో రహస్యంగా చెప్పింది. “ఎవరికీ చెప్పకు. అందరినీ ఆశ్చర్య పరుద్దాం! సరేనా?” అన్నది.

సుజిత్ తలూపి బామ్మని అభినందన పూర్వకంగా హత్తుకుని, వదిలేసి ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు.

* * * *

బాగా తలనొప్పిగా ఉండి, మధ్యాహ్నం త్వరగా వచ్చేసింది సుజన. తన దగ్గర ఉన్న కీ తో తలుపు తీసుకుని లోపలికొచ్చి, ఇల్లు నిశ్శబ్దంగా ఉండే సరికి “అత్తయ్య ఎక్కడికెళ్ళారబ్బా! మధ్యాహ్నం బయటికెళుతున్నట్టు పొద్దునేమీ చెప్పలేదే! ఒంట్లో బాగాలేదా? హాస్పిటల్ కి ఏమయినా వెళ్ళారా?” అని ఆదుర్దాగా కృష్ణవేణి వాళ్ళ బెల్ కొట్టి అడిగింది.

“తెలియదు సుజనా! మూడు గం. లప్పుడు, నెల రోజుల నించి కీ మా ఇంట్లో ఇచ్చి వెళుతున్నారు. సుజిత్ వచ్చి తనే తలుపు తీసుకుని పాలు తాగి ఆడుకోవటానికి వెళుతున్నాడు” అని చెప్పింది.

వీళ్ళ మాటలు విని లోపల నించి కృష్ణవేణి కూతురు మల్లిక వచ్చి “బామ్మ గారు మొన్నొక రోజు మన ఎదురు ఫ్లాట్స్ లో ఉండే బంటి వాళ్ళ తాతగారితో కలిసి వస్తూ కనిపించారు. సరుకులకో, కూరలకో వెళ్ళుంటారనుకున్నాను. నేను ఇంటికొచ్చేసరికే బామ్మ గారు మీ ఇంట్లోకెళ్ళిపోయారు” అన్నది.

“కూరలకి, సరుకులకి ఆవిడ వెళ్ళటమెందుకు? ఆదివారం నాడు నేను, అంకుల్ వెళ్ళి తెస్తున్నాం కదా! అయినా ప్రతి రోజూ బయటికెళ్ళి తెచ్చేవేం ఉంటాయి” అని ఆశ్చర్యంగా, అనుమానంగా అనుకుంటూ లోపలికొచ్చింది.

సుజన లోపలికొచ్చాక, బామ్మ ఇంటికొచ్చింది. తలుపు ఓరగా తెరిచి ఉండటం చూసి..మనవడు వచ్చేసుంటాడు అనుకుంటూ లోపలికొచ్చేసరికి కోడలు సుజన కనిపించింది. “అప్పుడే వచ్చేశావేం? ఒంట్లో బానే ఉందా” అనడిగారు. “ఆ మాట నేనడగాలి. చెప్ప చెయ్యకుండా నెల రోజుల నించి మధ్యాహ్నం మూడింటికి ఎక్కడికెళుతున్నారు? బయట పనులు పెద్దావిడ చేత చేయిస్తున్నామని అందరూ మా గురించి ఏమనుకుంటారు? బంటి వాళ్ళ తాతగారు కూడా మీతో వస్తున్నారుట..ఎదురింటి మల్లిక చెప్పింది” అన్నది.

సుజన తన పాటికి తను మాట్లాడుతుంటే, తనకేం సంబంధం లేనట్లు లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కుని వచ్చి “టీ కలపనా” అనడిగారు. “అడిగిన దానికి జవాబు చెప్పరా? వస్తూ రోడ్డు దాటేటప్పుడు ఏ యాక్సిడెంటో జరిగితే మీ అబ్బాయి నన్ను కేకలేస్తారు” అన్నది.

అలా గద్దించినట్టు అడిగేసరికి బామ్మ గారు మనసు కష్టపెట్టుకుని బాధగా బయట మెట్ల మీద కూర్చున్నారు. స్కూల్ నించి వచ్చిన సుజిత్ బామ్మ అక్కడ కూర్చోవటం కనిపించి, ఏం జరిగిందని అడిగి తను కూడా బ్యాగ్ అక్కడే పడేసి బామ్మ పక్కనే కూర్చున్నాడు.

పిల్లవాడు ఇంకా రాలేదేంటని చూడటానికి బయటికొచ్చిన సుజనకి ఇద్దరూ మూతులు ముడుచుకుని అక్కడ కూర్చుని కనిపించారు. “బాగుంది సంబరం! అంటే తప్పు. ఏం చేస్తున్నారో చెప్పరు! వాడిది బాల్యం, మీది రెండో బాల్యం! ఉక్రోషాలకేం తక్కువ లేదు” అన్నది.

“నువ్వు బామ్మనేమన్నావ్? బామ్మ నా ఫ్రెండ్! ఆవిడని ఏమన్నా అంటే నీతో మాట్లాడను. చూడు పాపం ఎలా చిన్నబుచ్చుకుందో” అన్నాడు సుజిత్.

* * * *

టెంత్ క్లాసులో స్కూల్ ఫస్ట్ వచ్చిన శకుంతల ఇంటర్మీడియెట్ చదువుతూ ఉండగా, ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేశారు. నలుగురి పిల్లల మధ్యలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన శకుంతలకి, కుటుంబ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం లేదు మరి!

స్వతహాగా ఉన్న తెలివితేటలు చురుకుదనంతో ఉమ్మడి కుటుంబాన్ని సమర్ధంగా నడిపి ఇద్దరు ఆడపడుచుల పెళ్ళిళ్ళు చేసి, ఇద్దరు మరుదులని చదివించి ప్రయోజకులని చేసింది.

తన పిల్లలు జీవితంలో స్థిరపడి, బాధ్యతలన్నీ తీరాక..చిన్నప్పుడు చదువుకోలేక పోయాననే అసంతృప్తిని నెరవేర్చుకోవటానికి ఇంటికి దగ్గరలో ఉన్న కంప్యూటర్ సెంటర్ లో చేరి ఎమ్మెస్ ఆఫీస్, ఎక్సెల్ నేర్చుకుంటూ …తనకంటూ ఒక ఐడి క్రియేట్ చేసుకుని కూతురుకి మెయిల్స్ ఇవ్వటం, యూ ట్యూబ్ లో తను చేసే వంటలు లోడ్ చెయ్యటం నేర్చుకున్నది.

మనవడికి అవసరమైన స్టడీ మెటీరియల్ నెట్ లో వెదికి డెస్క్ టాప్ మీద పెట్టి వాడి ప్రాజెక్ట్ వర్క్ కి సహాయం చెయ్యాలనే తాపత్రయం లో ఉన్న శకుంతలని కోడలు నిగ్గదీసి అడిగేసరికి ఉక్రోషం వచ్చింది.

ఆఫీస్ నించి ఇంటికొచ్చిన కొడుకు రఘు, అమ్మ చిన్నబుచ్చుకున్న మొహం చూసి సుజనని అడిగాడు.

మధ్యాహ్నం నించి జరుగుతున్న ప్రహసనం అంతా చెప్పింది.

“దానికంత రాద్ధాంతం ఎందుకు” అని “అమ్మా నువ్వొక్క దానివే బయటికెళితే ఏ యాక్సిడెంట్ అయినా జరుగుతుందని భయపడుతోంది. ఇంతకీ ఎక్కడికెళుతున్నావ్” అని లాలనగా అడిగాడు.

శకుంతల కొడుకు లాప్ టాప్ తీసుకుని తన ఐడి ద్వారా కూతురుకి ఇచ్చిన మెయిల్స్, తన ఫైల్ లో ఆవిడ కుటుంబ నెలవారీ ఖర్చులు తయారు చేసిన ఎక్సెల్ షీట్…కొడుకు కొత్తగా కొనాలనుకుంటున్న “విల్లా” కి తను తయారు చేసిన బడ్జెట్ చూపించేసరికి, రఘుకి నోట మాట రాలేదు.

“ఎప్పుడు నేర్చుకున్నవమ్మా ఇవన్నీ? ఈ వయసులో మేమే తడబడుతున్నాం! అద్భుతం.. నీ దగ్గర మేం చాలా నేర్చుకోవాలి” అని ఇప్పుడర్ధమయిందా అమ్మ మధ్యాహ్నాలు ఎక్కడికెళుతున్నదో, ఏం చేస్తున్నదో అన్నట్టు భార్య వైపు చూశాడు రఘు.

May 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

ప్రథమ గురువు

by Acharya Phanindra May 15, 2023
written by Acharya Phanindra

ఆత్మకు రూపాన్ని అందించి
అనంత లోకాల నుండి అవని పైకి
దిగుమతి చేసే దేవత – అమ్మ!

నెల తప్పిన నాటి నుండి
నిలువెల్లా మురిసిపోతూ –
కడుపులో కదలికలు మెదలుతుంటే
కలలలో తేలిపోతూ –
కూర్చున్నా, లేస్తున్నా, నడుస్తున్నా,
ఆపసోపాలు పడుతూనే
ఆనందంలో మునుగాడుతూ –
జవ సత్త్వాలు ఉడుగుతున్నా
నవ మాసాలు మోసి,
నిండు గర్భిణిగా నొప్పులన్నీ భరించి,
ప్రసవించి, ప్రభవింపజేస్తుంది
సృష్టిలో ఒక సరిక్రొత్త జీవిని!
పడతి నుండి పరిణామం చెంది
ప్రపంచంలో నిలుస్తుంది
ఒక మాతృమూర్తిగా!
నిస్వార్థమైన ప్రేమకు
ఒక నిలువెత్తు ప్రతీకగా!!
కనుల ముందు నిజమైన
తన కలను చూచి
కష్టాన్నంత క్షణంలో మరిచిపోయే
కమనీయ హృదయ – అమ్మ!
చనుబాలే అమృతంగా పంచి,
తన ఒడినే ఊయలగా మలచి,
జోలపాటతో యోగ నిద్రలోకి
ప్రయాణింపజేసే ప్రథమ గురువు – అమ్మ!
అమ్మ అడుగులు వేయిస్తుంది
అమ్మ నుడుగులు నేర్పిస్తుంది
అమ్మ ఆకలి తీరుస్తుంది
అమ్మ లోకం చూపిస్తుంది
అమలినమైన అనురాగానికి
ఆకృతి దిద్దితే – అది అమ్మ!
ఆమెకు సరితూగడు తానైనా
ఆ సృష్టికర్త బ్రహ్మ!!#

(మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో …)

May 15, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

సుప్రసిద్ధ సాహితీ ద్రష్ట, సాహితీ స్రష్ట ఆచార్య ఎస్వీ రామారావు గారితో ముఖాముఖి

by Aruna Dhulipala May 15, 2023
written by Aruna Dhulipala

మాస్టారూ నమస్కారం…ఈరోజు మిమ్మల్ని కలుసుకొని
మీతో మాట్లాడడం ఎంతో అదృష్టం. ఉత్తమ సాహిత్య దార్శనికులుగా తెలుగు సాహిత్యాన్ని తరతరాలకు పంచి
ఇచ్చిన మీ జీవిత విశేషాలను, మీ రచనా వైభవాన్ని మా పాఠకులకు తెలియ చేయాలనుకుంటున్నాము.
ముందుగా…

1.  మీరు పుట్టి పెరిగిన ఊరు, విద్యాభ్యాసాల గురించి తెలపండి.

జ. మా ఊరు ప్రస్తుత వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం గ్రామం. నేను జూన్ 5వ తేదీ 1941లో జన్మించాను. మా తండ్రి సూగూరు వాసుదేవరావు గారు, తల్లి రామచూడమ్మ గారు. హెచ్ ఎస్ సి వరకు నా విద్యాభ్యాసం వనపర్తి లోనే  జరిగింది. నిజాం కళాశాలలో బీఏ పూర్తి చేశాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్ ఏ, పి హెచ్ డి చేసి డాక్టరేట్ పొందాను. హైదరాబాద్ హిందీ ప్రచారసభ నుండి హిందీ భూషణ్, భారతీయ విద్యా భవన్ నుండి జర్నలిజంలో డిప్లొమా చేసాను. ఇక  మాగ్రామం శ్రీరంగాపురం రంగనాయకస్వామి పుణ్యక్షేత్రానికి నెలవు. దీనిని 300 సంవత్సరాల కిందట వనపర్తి సంస్థాన రాజులు నిర్మించారు. అష్టభాషా కోవిదుడైన బహిరి గోపాలరావు గారు దీన్ని నిర్మించడం జరిగింది. ఆయన సంస్కృతంలో రంగనాయక స్వామి వారి గురించి నాటకాలు రాశారు.

ఎస్వీరామారావుగారితో అరుణధూళిపాళ

2. మీ సాహిత్యాభిలాషకు పూర్వరంగం ఏమిటో వివరిస్తారా? మీ పూర్వీకుల్లో అలాంటి పాండిత్యం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా?

జ. మా ఇంట్లో ఎవరికీ సాహిత్య వాసన లేదు. హఠాత్తుగా అది నాలో ప్రవేశించింది.  ఆనాడు ఉమ్మడి పాలమూరు జిల్లాల సంస్థానాల్లో వనపర్తి, జటప్రోలు, ఆత్మకూరు, గద్వాల ఇవి సాహిత్య పోషణకు నెలవులుగా, కేంద్రాలుగా ఉండేవి. అట్లాంటి వాతావరణంలో జన్మించి ఉండడం చేత బహుశా నాలో కూడా సాహిత్యాభిలాష ఏర్పడి ఉండవచ్చునని భావిస్తున్నాను. నేను పుట్టిన కాల నేపథ్యం కూడా చూసుకుంటే రెండవ ప్రపంచ యుద్ధకాలంలో. మనకు స్వాతంత్య్రం రావడానికి ముందు పుట్టాను. ప్రైమరీ విద్యార్థిగా వున్నప్పుడు 6 ఏళ్ల వయస్సులో స్వతంత్రం వచ్చిన సందర్భంగా మేమంతా త్రివర్ణ పతాకం బ్యాడ్జీలు పెట్టుకొని ర్యాలీలో పాల్గొన్నాము. అట్లా జాతీయోద్యమ ప్రభావం, ప్రపంచ వాతావరణ ప్రభావం, మా వనపర్తి సాహిత్య ప్రభావం ఇవన్నీ ఒక రచయితగా ఎదగడానికి దోహదం చేశాయని నా అభిప్రాయం.

              మరొకటి నా గ్రంథ పఠనం. చిన్నప్పడు స్కూల్లో ఉన్నప్పుడే చందమామ, బాల పత్రికలు చదివేవాడిని. ఆ తర్వాత ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన ఆనాటి పత్రికలన్నీ చదివేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే పత్రికలు, సినిమాలు, పుస్తకాలు ఇవే నన్ను నడిపించాయి. వాటివల్ల ప్రభావితుడినై సాహిత్య రంగంలోకి దిగాను. సినిమాలు చూసే అలవాటు బాగా ఉండేది. గుణసుందరికథ, సంసారం, షావుకారు మొదలైన సినిమాలు చూడడమే కాక వాటి గురించి  ఆంధ్రపత్రిక ,ఆంధ్రప్రభ లో వచ్చినటువంటి సమీక్షలు చదువుతున్నప్పుడు నాకు కూడా సమీక్షలు రాయాలని కుతూహలం  కలిగింది.  నా 14, 15 సంవత్సరాల వయసులో అప్పటి సినిమాలకు  సమీక్షలు రాసి మద్రాసు పత్రికలకు పంపిస్తే అవన్నీ అచ్చు వేశాయి. అది నాకు ఎంతో గర్వకారణం అయిన విషయం. ఒక మారుమూల గ్రామం నుండి ఒక విద్యార్థి పంపించిన వ్యాసాలు మద్రాస్ లో ధనికొండ హనుమంతరావు, గొప్పవాళ్ళ పత్రికలు అయిన చిత్రసీమ, సినిమా రంగం  నా సమీక్షలు అచ్చు వేశాయి. అట్లా నా సమీక్షలతో నా సాహిత్య రచన ప్రారంభమైందని చెప్పవచ్చు సినిమాను విమర్శనా దృష్టితో చూడడం మొదలుపెట్టి తర్వాత సాహిత్య రంగంలో కూడా ప్రవేశించాను.

3. విద్యార్థిగా దశలో మీకు ఆదర్శగురువులు ఎవరైనా ఉన్నారా? పుస్తకాలు ఏమైనా చదివారా?

జ. విద్యార్థి దశలో గురువులకంటే ముందు నేను చదివిన పుస్తకాల గురించి చెప్పాలి. వనపర్తి హైస్కూలు లో గొప్ప లైబ్రరీ ఉండేది. అక్కడ చదువుతున్నప్పుడే 15 ఏళ్ళ వయస్సులోనే విశ్వనాథ గారి ఏకవీర,బుచ్చిబాబు చివరకు మిగిలేది, గోపిచంద్ అసమర్థుని జీవయాత్ర మొదలగు ఎన్నో నవలలు, సాహిత్యమంతా చదివాను. చివరకు మిగిలేది, ఏకవీర నన్ను బాగా ప్రభావితం చేసాయి. వారే నా సాహిత్య గురువులు.  ఆ తర్వాత నాకు పాఠశాలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బోధించిన గురువులు. వాటివల్లే నేను పాస్ కాగలిగాను. మిగతా సైన్స్, జాగ్రఫీ సబ్జెక్టులలో నేను వీక్. వాటిల్లో అత్తెసరు మార్కులు వచ్చేవి (నవ్వుతూ). తెలుగు మీడియం విద్యార్థిని అయినా నిజాం కాలేజీలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థిగా ఇంగ్లీష్ లో కూడా పియుసి లో అత్యధిక  మార్కులు తెచ్చుకున్నాను. నిజాం కాలేజీ లో గొప్ప పండితులు, ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి గారు నాకు పియూసీ నుంచీ గురువు. నారాయణరెడ్డి గారు ” రామారావు నాకంటే పదేళ్ళు చిన్నవాడు. నా దగ్గరే చదువుకున్నాడు. నా వద్దనే పి హెచ్ డి  చేసాడు. నావెంటే వస్తున్నాడు” అని చెబుతుండేవారు. అట్లాగే పల్లా దుర్గయ్య గారు. ఆయన రచించిన గంగిరెద్దు కావ్యం చదివాను. మంచికవి ఆయన. నారాయణరెడ్డి గారి నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు మొదలగు కావ్యాలు చిన్నప్పుడే చదివా. ఆయన కవిత్వం కంఠోపాఠం నాకు. మొదటగా ఆయన పియుసి  క్లాసులో మా గురువుగా పరిచయమైనప్పుడు ఆయన కావ్యం వినిపించడం మరపురాని సంఘటన.  అప్పుడు చదివిన కావ్యం మళ్లీ ఎప్పుడూ ముట్టుకోలేదు అయినా ఇప్పటికీ మర్చిపోలేదు. “ఇక్ష్వాకు వంశ క్షితీంద్ర చంద్రుల కీర్తి కౌముదులు నల్గడల కలయ విరిసిన నాడు…..నేను జీవించి యున్నానంచు భావించి పలికింతు గేయ కావ్యమును హృదయము పెంచి” ( గేయ వాక్యాలను తలచుకుంటూ ) అట్లా వాళ్ళతో పరిచయం కలగడం  నా అదృష్టం. నాల్గు సంవత్సరాలు వారి శిష్యుడిగా  వర్ధిల్లాను. వారి ప్రోత్సాహంతో వ్యాసనరచన పోటీల్లో పాల్గొనేవాడిని. నిజాం కళాశాల పత్రికకు సంపాదకుడుగా వున్నాను. కాలేజీ దాటి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అదృష్టం కొద్దీ నారాయణరెడ్డి గారు బదిలీ అయి అక్కడికి వచ్చారు. అక్కడ కూడా ఆయనే నా గురువులు. పిహెచ్ డి అక్కడే పూర్తి చేశాను. యూనివర్సిటీలో చెప్పుకోవలసిన గురువులు ఖండవల్లి లక్ష్మీ రంజనం గారు, బి. రామరాజు గారు, చలమచర్ల రంగాచార్యులు గారు ( సంసృతం చెప్పేవారు ), పల్లా దుర్గయ్య గారు, నారాయణరెడ్డి గారు. అట్లా విశ్వవిద్యాలయంలో వీరందరి శిష్యరికంలో సాహిత్యాభిలాష పెంపొందించుకున్నాను. ఇట్లా సినిమా సమీక్షల నుండి సాహిత్యం మీదకు నా దృష్టి మళ్ళింది.

4. సాహిత్య విమర్శపై పి హెచ్ డి చేయాలనే సంకల్పానికి కారణం ఏమిటి? ఆ సిద్ధాంత గ్రంథం గురించి చెప్పండి.

జ. నిజాం కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, విశ్వనాథ సత్యనారాయణ గార్ల విమర్శనావ్యాసాలు  చదవడం వల్ల పియుసి లోనే సాహిత్య విమర్శ మీద పి హెచ్ డి చేయాలనే కోరిక కలిగింది. ఎమ్ ఏ పూర్తి కాగానే నా గురువులు లక్ష్మీ రంజనం గారు, దివాకర్ల వేంకటావధాని గారు, నారాయణ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించారు. నారాయణరెడ్డి గారికి మొట్టమొదటి పి హెచ్ డి విద్యార్థిని నేనే. తెలుగులో సాహిత్య విమర్శ అనే అంశాన్ని పరిశోధనాంశంగా తీసుకొని పట్టా పొందాను. అది నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఈ అంశంపై అంతకుముందు ఎవ్వరూ పరిశోధన చేయలేదు. అది చాలా కఠినమైన అంశం. మొత్తం సాహిత్యం తెలిసి ఉండాలి. అప్పుడే సాహిత్య విమర్శ చేయగలం. అందువల్ల ఏది మంచి, ఏది చెడు తెలుసుకోవడానికి తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసాను. విమర్శ గ్రంథాలను చదివాను. దాదాపు. అందరూ 4,5 సంవత్సరాల్లో పి హెచ్ డి. పూర్తి చేస్తారు. కానీ నేను ఎక్కువ సమయం తీసుకొని 7 ఏళ్ళు కష్టపడ్డాను. అన్ని లైబ్రరీలు తిరిగాను. వేటపాలెంలో మంచి లైబ్రరీ ఉంది. తర్వాత రాజమండ్రిలోని గౌతమి గ్రంధాలయం, మద్రాసు యూనివర్సిటీ లైబ్రరీ, తంజావూరు లైబ్రరీలకు వెళ్లి అన్ని పత్రికలు, విమర్శ గ్రంథాలు పరిశోధించి, ఒక ఉత్తమమైన సిద్ధాంత గ్రంథం తయారు చేసాను. దీని గురించి చెప్పుకోవాలి. ‘సాహిత్య విమర్శ గ్రంథం’ అచ్చయిన నా తొలి గ్రంథం. అటు తర్వాత 40 గ్రంథాలు రాశాను. నారాయణ రెడ్డి గారు 80 సంవత్సరాల జీవితంలో 80 గ్రంథాలు రాస్తే, ఆయన శిష్యునిగా కనీసం 40 గ్రంథాలైనా రాయాలనుకున్నా. నా సాహిత్య విమర్శ గ్రంథం అత్యంత జనాదరణ పొందింది. విశ్వవిద్యాలయాల్లో టెక్స్ట్ బుక్ గా,రెఫరెన్స్ బుక్ గా, పరిశోధకులకు మార్గదర్శకంగా ఇప్పటికి కూడా సాహిత్య విమర్శ అంటే గుర్తుకు వచ్చేది నా పుస్తకమే. అదే మొట్టమొదటి ఏకైక గ్రంథం. ఆతర్వాత ఎవరూ రాయలేదు. అసలు సాహిత్యం ఎట్లా ప్రారంభమైందో మొదలుకొని ఎవ్వరికీ తెలియని విమర్శకులను అందులో పరిచయం చేశాను. 19 వ శతాబ్దంలో తొలి విమర్శ గ్రంథం, తొలి నాటకం, తొలి నవలా విమర్శ ఇవి ఎవరికీ తెలియవు. వీటిని గురించి తెలిపి ఆధునిక విమర్శకులైన విశ్వనాథ, రాళ్లపల్లి వారి గురించి తెలిపాను. ఒక పి హెచ్ డి థీసిస్ అచ్చవడమే విశేషం. అటువంటిది ఆరు ముద్రణలు పొంది, ఏడవ ముద్రణకు సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తున్నాను. నా జీవిత సాఫల్య గ్రంథం ఏదైనా ఉందంటే “తెలుగులో సాహిత్య విమర్శ” అని చెప్పొచ్చు.

ఎస్వీరామారావు దంపతులతో అరుణధూళిపాళ

5. ప్రత్యేకంగా తెలంగాణ సాహితీ వైశిష్ట్యం, సాంస్కృతిక వైభవం గురించి రాయాలని ఎందుకు అనుకున్నారు?

జ. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, అంతకు ముందు కోస్తాంధ్ర రచయితలు తెలుగు పట్ల నిరాదరణ భావంతో ఉన్నారు. తెలంగాణ వారికి తెలుగు రాదని ఇక్కడ తెలుగు సాహిత్యం లేదని వారి అభిప్రాయం. తెలంగాణాలో కవులు పూజ్యమన్న అపప్రథను తొలగించడానికి మా పాలమూరు జిల్లాకే చెందిన సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ కవుల సంచిక వెలువరించారు. తెలంగాణలో సంస్కృత కవులు, తెలుగు కవులు వందలాది మంది ఉన్నారు. వారి కవితలు సేకరించి మొట్టమొదటగా గోలకొండ కవుల సంచిక వేశారు. అందుచేత తెలంగాణ సాహిత్యాన్ని మొదటగా వెలుగులోకి తీసుకువచ్చింది ఆయనే. వారి ప్రభావం నామీద ఉంది. నేను వనపర్తి హైస్కూలులో  విద్యార్థిగా వున్నప్పుడు వారు వనపర్తి నుండి ఎమ్ ఎల్ ఏ గా కాంటెస్ట్ చేశారు. అప్పుడే ఆయన పుస్తకాలు చదివాను. వారు తెలంగాణ సాహిత్యం మీద గొప్ప పరిశోధన చేశారు.11వ శతాబ్దికి చెందిన నన్నయ్యభట్టును ఆదికవిగా చెప్తున్నారు. కానీ ఆయనకు ముందు నూరు సంవత్సరాల క్రితమే ఇక్కడ కరీంనగర్ బొమ్మలగుట్ట శాసనంలో మల్లియరేచన అనే కవి తన ‘కవిజనాశ్రయం’ అనే తొలి తెలుగు గ్రంథం రాసారని ఉంది. నేను ఆ గ్రంథాన్ని పరిష్కరింపజేసి, దాని వ్యాఖ్యానం రాయించి, తొలి తెలుగు కావ్యం ఇదేనని నిరూపిస్తూ మొట్టమొదటి సారి అచ్చు వేయడం జరిగింది. అందువల్ల తెలంగాణా తొలి తెలుగు కావ్యాన్ని వెలుగులోకి తెచ్చిన అదృష్టం నాకు లభించింది. తెలంగాణలో గొప్ప పండితులు వున్నారు. వనపర్తి, గద్వాల మొదలగునవి సాహితీ కేంద్రాలని చెప్పాను కదా! వనపర్తి సంస్థానంలోనే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి, కేశవపంతుల నరసింహ శాస్త్రి గారు (ఆల్ ఇండియా రేడియోలో  సంస్కృతం అమరవాణి వినిపించేవారు) వంటి వారు సాహితీ సేవ చేశారు. అందుకే ఈ సాహిత్యాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో పాలమూరు జిల్లా సాహిత్య చరిత్ర, పూర్వకవుల చరిత్రను రాశాను. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు పాలమూరు ఎంపీగా ఉన్నారు. 2010 లో ఆయనకు పాలమూరు జిల్లా సాహిత్య చరిత్రను అంకితం చేసాను. ఆ తర్వాత పాలమూరు ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, గడియారం రామకృష్ణ శర్మ  ఇట్లా ఒక వందమంది కవులను పరిచయం చేస్తూ ఆధునిక కవుల చరిత్ర రాశాను.  ఇంతటితో ఆగిపోలేదు నేను. తెలుగు సాహిత్య విమర్శ ఎంత అభిమానమో, తెలుగు సాహిత్య చరిత్ర కూడా నాకు అంతే అభిమానం.అవి రెండూ రెండు కళ్ళు.

సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్యాన్ని వెలికి తీసుకు రావాలని మొత్తం తెలంగాణ సాహిత్య చరిత్రను సేకరించి తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, తెలంగాణ సాహిత్య చరిత్ర అనే రెండు గ్రంథాలను రాయడం జరిగింది. తెలంగాణా సంస్కృతి కూడా చాలా గొప్పది. ఇక్కడి శిల్పాలు, కట్టడాలు, ఆలయాలు, సాంస్కృతిక వైభవం గురించి కూడా ఒక పుస్తకాన్ని రాశాను. అది’నవచేతన’ వాళ్ళు అచ్చువేశారు. అట్లా పాలమూరు జిల్లాతో మొదలుపెట్టి మొత్తం తెలంగాణా సాహిత్య, సంస్కృతుల గురించి విలువైన పుస్తకాలు రాశాను. ఇవాళ అందరూ తెలంగాణ చరిత్ర అన్నా, తెలుగు సాహిత్య చరిత్ర అన్నానా పుస్తకాలు చదవాలి. కష్టపడి చరిత్రను సేకరించి వాస్తవ దృష్టితో రాశాను. ప్రత్యేకంగా నేను ఏ వర్గ దృష్టితోనో, ఏ ప్రాంత దృష్టితోనో రాయలేదు. తెలంగాణా, ఆంధ్ర భేదాలు నాకు లేవు. నిజం చెప్పాలంటే నా అభిమాన కవి నన్నయ్య, అభిమాన రచయిత విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ వారే నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నా లోపల ఆయనే ఉన్నారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్ లాంటి ఎన్నో భాషల గొప్ప గొప్ప నవలలను చదివాను. ప్రపంచంలో అందరికన్నా గొప్ప రచయిత అని చెప్పుకోవాలంటే అది విశ్వనాథ గారేనని నా ఏకైక అభిప్రాయం. దానికి తిరుగు లేదు. విశ్వనాథ గారి అభిమాని అంటే నన్ను సాంప్రదాయ వాదిగా, ఛాందసుడుగా అనుకుంటారు. ఆయన సంప్రదాయవాదీ కాదు, ఛాందసుడు కాదు. స్త్రీలకు ఎంతో ప్రాధాన్యమిచ్చాడు. ఆయన చేపట్టని ప్రక్రియ లేదు. చరిత్రను రేడియో రూపకాలుగా రాశాడు.

            అందుచేత తెలంగాణ సాహిత్యంతో పాటు తెలుగు సాహిత్య చరిత్ర కూడా రాయాలని నన్నయ్య దగ్గరనుండి ఈనాటి వరకు ఉన్న చరిత్రను ‘సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర’ 19 వ శతాబ్దం వరకు అని రాశాను. నా కృషి చెప్పాలంటే అటు సాహిత్య విమర్ధ చరిత్ర, ఇటు పాలమూరు జిల్లా సాహిత్య చరిత్ర, తెలంగాణా  సాహిత్య చరిత్ర ఇవన్నీ నా చేతిమీదుగా వచ్చాయి. ఇప్పటికీ రాస్తునే ఉన్నా..

6. తెలుగు సాహిత్యంలో అప్పటికీ ఇప్పటికీ చోటు చేసుకున్న పరిణామాలు ఎటువంటివి?

జ. సాహిత్యం ప్రగతిశీలం. సమాజానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. ప్రాచీన కవులు గొప్పవాళ్ళు, వాళ్లకున్న పాండిత్యం ఆధునిక కవులకు లేదు అన్న దురభిప్రాయం చాలామందిలో ఉంది. కాలానుగుణంగా సాహిత్యం మారుతూ ఉంటుంది. మహాకవి శ్రీశ్రీ యే  “నిన్నటి మహాకావ్యం 18 పర్వాలుంటే, ఈనాటి మహాకావ్యం 18పంక్తులే ఉండవచ్చు” అన్నారు. ప్రాచీన సాహిత్యంలో మహాభారతం ఎంత గొప్పదో ఆధునిక యుగంలో శ్రీశ్రీ మహాప్రస్థానం అంత గొప్పది. విశ్వనాథ గారి కిన్నెరసాని పాటలు, ఆంధ్రప్రశస్తి, ఆంధ్ర పౌరుషం మొదలగు కావ్యాలు గొప్ప కావ్యాలు. అయితే ఆధునిక యుగంలో  కూడా పాండితీ ప్రభావంతో కూడుకున్న కవులు ఉన్నారని చెప్పడానికి విశ్వనాథ గారి రామాయణ కల్పవృక్షమే అని నా అభిప్రాయం. అందుచేత సాహిత్య కృషి ఆధునిక కాలంలో తక్కువ స్థాయిలో ఉందని వీలు లేదు కాలనుగుణంగా ప్రక్రియలు పెరుగుతున్నాయి ముఖ్యంగా ఒకనాడు నిశితమైన గ్రంథపఠనం అధికంగా ఉండేది. ఇవాళ సాంకేతికంగా పెరిగిన అభివృద్ధి వలన పుస్తక పఠనం తగ్గింది. అయినప్పటికీ మినీ కవితల రూపంలో నానీల రూపంలో సంక్షిప్త కథలు, కథానికలు, ఆధునిక ప్రక్రియలు విశిష్టమైన రీతిలో ఈనాడు సమాజానికి సందేశాత్మకంగా, ప్రబోధాత్మకంగా వస్తున్నాయి. ప్రాచీన సాహిత్యం గొప్పదని ఆధునిక సాహిత్యాన్ని నిరాదరణ చేయకూడదు. మొదటి నుండి నాది సమదృష్టి గురువు గారే చెప్పారు రామారావుది సమదర్శనమని. సమవీక్షణం, అన్వీక్షణం అని నా పుస్తకాల పేర్లే ఉంటాయి. సమదృష్టితో సాహిత్యాన్ని చూడవలసిన అవసరం ఉంది. ఈనాడు కొత్త కొత్త ప్రయోగాలు వస్తున్నాయి కొత్త కొత్త రచయిత్రులు అనేకమంది వస్తున్నారు. ప్రాచీన సాహిత్యంలో రచయిత్రులు తక్కువ. ఆధునిక కాలంలో నవలా రచయిత్రులు వచ్చారు. మాలతీ చందూర్, యద్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, పాకాల యశోదా రెడ్డి మొదలగువారు సాహిత్యాభివృద్ధికి దోహదం చేశారు. ఇంకా అనిశెట్టి రజిత, కొండపల్లి నీహారిణి ఇట్లా ఎంతోమంది రచయిత్రులు, కవయిత్రులు సాహిత్యం పై తమ వంతు కృషి చేస్తున్నారు అందువల్ల ఆధునిక సాహిత్యాన్ని కూడా చదివి అందులో ఉన్నటువంటి సామాజిక దృక్పథాన్ని, సామాజిక సందేశాన్ని అలవర్చుకోవడం ఎంతైనా అవసరం అని నేను భావిస్తున్నాను.

7. సాహిత్య విమర్శ సిద్ధాంతం గురించి నిర్వచనం చెప్పండి.

జ. విమర్శ అంటే కావ్య ప్రకాశానికి దోహదం చేసేది. విమర్శకుడు లేకపోతే కావ్య ప్రకాశం లేదు. కాళిదాసు రాసిన కావ్యాలు మల్లినాథ సూరి వ్యాఖ్యానాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. భాసుడు సంస్కృతంలో గొప్ప నాటక కర్త. కాళిదాసు, భాసుడు, భవభూతి ప్రపంచ నాటక చరిత్రలో మహా రచయితలు. ఆధునిక కాలంలో కన్యాశుల్కం ఎంత గొప్ప నాటకమో, క్రీస్తుశకం ఒకటో శతాబ్దంలో శూద్రకుని మృచ్ఛకటికం  గొప్ప సాంఘిక నాటకంగా పేరొందింది. వాటిని వెలుగులోకి తేవడానికి విమర్శకులే కారణం. కేరళలో గణపతి శాస్త్రి అనే పండితుడు శిథిలావస్థలో  ఉన్న దాదాపు 30 భాస నాటకాలను సేకరించి ‘భాసనాటక చక్రం’ అనే పేరుతో 1915లో భాసుని మనకు పరిచయం చేశాడు. విమర్శ అనేది సాహిత్య ప్రకాశానికి, కావ్య ప్రకాశానికి దోహదం చేసేది. సూక్ష్మంగా చెప్పాలంటే “కప్పి చెప్పేది కవిత్వం విప్పి చెప్పేది విమర్శ”  కావ్యం లోకాన్ని ప్రతిబింబిస్తుంది లోక జీవితాన్ని చిత్రిస్తుంది. లోక జీవితాన్ని కావ్యం ఎట్లా చిత్రించింది? దానిలోని బాగోగులు మంచి చెడులు ఏమిటి? అనేది  విమర్శ చెబుతుంది. అంటే ఒక విధంగా కవి కన్నా ఒక అధిష్ఠానం సంపాదించి, ఆయన ఒక వ్యాసుని లాగా సమవీక్షణంతో చూడాలి. ఏ సాహిత్యం గొప్పది? ఎందులో మంచి లక్షణాలు ఉన్నాయి? కేవలం రంధ్రాన్వేషణ చేస్తూ తప్పులు వెతకడం కాకుండా సమదృష్టితో చేయడం సాహిత్య విమర్శ యొక్క అసలైన తత్వం. అందుచేత నేను ఆ దృష్టితోనే కొనసాగిస్తూ ఉన్నాను.

SV రామారావు గారి గళంలోమాటలు వినండి ..

8. సంపాదకులుగా మీ తొలి పత్రిక లేదా పుస్తకం ఏది?

జ.చాలా మంచి ప్రశ్న, మంచి విషయం అడిగారు. నా సంపాదకత్వంలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి. మొట్ట మొదటిసారిగా ఎం.ఏ పాస్ కాగానే ‘జ్యోతిర్మయి’ అనే సంస్థను స్థాపించి పాలమూరు జిల్లా కవుల కవితలు సేకరించి ‘జ్యోతిర్మయి’ అనే పేరుతో 1966లోనే (57 సం.కిందటే బహుశా మొట్టమొదటి జిల్లా కవుల సంకలనం అదే అని చెప్పవచ్చు ) నా సంపాదకత్వంలో వెలువడిన మొట్టమొదటి పుస్తకం. దానికి మా గురువుగారైన డా. శ్రీ నారాయణ రెడ్డి గారు పీఠిక రాశారు. “భారతికి పసిడి కింకిణులు కట్టిన 33 కవుల లలిత భావాంశ సంపుటి ఇది”అని ఆయన ప్రశంసించారు. ఇందులో పాలమూరు జిల్లాలోని దిగ్గజాలు సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, కేశవపంతుల నరసింహ శాస్త్రి,  కప్పగంతుల లక్ష్మణ శాస్త్రితో పాటు ఆధునికులైన ముకురాల రామారెడ్డి మొదలగు 33 కవుల గురించి ఈ పుస్తకంలో వివరించాను. కవితా సంకలనం తర్వాత కథా సంకలనం కూడా నా సంపాదకత్వంలో వెలుడింది. జ్యోతిర్మయిలో పాలమూరు రచయితలు ఇందులో ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి కథ మరికొన్ని ఇతర కథలు చేర్చి సమర్పణ అనే పేరుతో కథా సంకలనం కూడా చేశాను ఆ తర్వాత ఎంతోమంది మహానుభావులు, రచయితల గురించి గడియారం రామకృష్ణ శర్మ గారి షష్ఠిపూర్తి సంచిక,బూర్గుల రామకృష్ణారావు గారి సంచిక, సురవరం ప్రతాపరెడ్డి గారి వ్యాసాలు వీటన్నింటికి నేను సంపాదకత్వం వహించాను సంపాదకత్వ లక్షణం నాలో మొదటి నుండి ఉన్నది. నిజాం కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీ మ్యాగజైన్ కి ఎడిటర్ గా ఉన్నాను కాబట్టి ఒక పత్రిక ఎట్లా నడపాలి, ఎట్లా అచ్చువేయాలనేవి పూర్తిగా అవగతమైనవి. రచనలు సేకరించడం, వాటిని ఎడిట్ చేయడం, అచ్చు వేయడం, కవర్ పేజీని అందంగా తీర్చిదిద్దడం.. ఇట్లా మూడు సంవత్సరాలు నిజాం కళాశాల విద్యార్థి పేరుతో మంచి సంచికలు తీసుకువచ్చాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధిపతిగా ఉన్నప్పుడు’ వివేచన ‘ అనే తెలుగు శాఖ పత్రిక వచ్చేది. దానికి కూడా సంపాదకత్వం వహించాను.  తర్వాత ఈనాటి ఆధునిక కవులు రావుకంటి వసునందన్ వంటి వారి గ్రంథాలకు కూడా సంపాదకత్వం వహించాను. ముఖ్యంగా ఇంతకుముందే చెప్పినట్టు మొట్టమొదటి తెలంగాణ కవి అయిన మల్లియరేచన ‘కవిజనాశ్రయా’నికి సంపాదకుడిని. కొంతమంది కవులు, రచయితలు అపరిచితులుగా అజ్ఞాతంగా ఉన్నారు. బూర్గుల రామకృష్ణారావు ఎంత గొప్ప కవి, రచయితో ఆయన కుమారుడైన రంగనాథరావు కూడా గొప్ప కవి, రచయిత. ఆయనను గురించి ఎవరికీ తెలియదు. ఆయన కథలు, కవితలు, రేడియో ప్రసంగాలు, ఆనాటి వ్యాసాలు అన్నీ సేకరించి రంగనాథరావు సాహిత్యం మూడు సంపుటాలుగా వేశాను. సంపాదకుడిగా నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాను. నా సంపాదకత్వంలో దాదాపు పాతిక గ్రంథాలైనా వెలువడి ఉంటాయి మొదటి నుండీ సాహిత్యమే నా జీవితం. పుస్తకమే నన్ను నడిపించింది.

9.సంపాదకులుగా పొందిన మీ అనుభవాలతో అప్పటికి ఇప్పటికీ సంపాదకత్వంలో వచ్చిన మార్పులను గురించి చెప్పండి.

జ. పూర్వ పరిశోధనలు చేశారు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, మానవల్లి రామకృష్ణ కవి గారు. రామకృష్ణ కవిగారు మా వనపర్తి సంస్థానంలోనే రాజావారికి కార్యదర్శిగా ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడే నన్నె చోడుని కుమార సంభవాన్ని మొట్టమొదటిసారి ముద్రించి వెలుగులోకి తెచ్చాడు. నన్నయ ఆదికవి కాదని అంతకుముందే నన్నె చోడుడు ఉన్నాడని వాదించాడు. కానీ దానిని ఎవరూ ఒప్పుకోలేదు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, మానవల్లి రామకృష్ణ గారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు వీళ్లు సంపాదకత్వంలో చాలా కృషి చేసి, పరిష్కరణలు చేసి,పాండిత్యంలో కృషి చేసే గ్రంథాలు తీసుకువచ్చారు. ఈనాటి సంపాదకుల్లో పరిశోధనా కృషి కొరవడిందని చెప్పొచ్చు. ఈనాటి సంపాదకత్వంలో వస్తున్న గ్రంథాల్లో ఏదో కొరత కనిపిస్తోంది. వారు సమగ్రంగా పరిశీలించి పరిష్కరించడం లేదు. అందుకే కొంత జాగ్రత్త వహించడం అవసరం. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ సాహిత్యం గురించి అనేక పుస్తకాల ప్రచురించారు. కానీ వాటిల్లో అనేక లోపాలు, దోషాలు ఉన్నాయి. వాటిని పరిహరించుకోవలసిన అవసరం ఉంది. మనం మన చరిత్రను చెప్తున్నప్పుడు తప్పుదోవ పట్టించకుండా వాస్తవ చరిత్రను తెలిపాలి. కవిజనాశ్రయం వచ్చిన తర్వాత కూడా వేములవాడ భీమకవి తొలి తెలుగుకవి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవి సరైనవి కావు. అందుకే సంపాదకత్వంలో మంచి చెడులను చూడవలసిన ఆవశ్యకత ఉంది ఇది ప్రస్తుతం కొరతగానే ఉంది.

10. రచయితగా, విమర్శకులుగా, ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. ఇంకా ఏదైనా రాయాల్సింది మిగిలిపోయిందని మీరు భావిస్తున్నారా?

ఎస్వీరామారావుగారు రచించిన పుస్తకములు

జ. ఇప్పటికీ నా సాహితీ రచన ఆగిపోలేదు. 80కి   పై బడిన వయస్సులో ఇంకా చేయవలసిన కృషి చాలా ఉంది అని అనుకుంటున్నాను. ఇంకా ఎంతో చరిత్రను వెలికి తీసుకొని రావాలని నా కోరిక. ప్రస్తుతం తెలుగు సమగ్ర సాహిత్య నిర్మాణంలో మునిగి ఉన్నాను. ఇంతకు ముందు తెలుగు సాహిత్య చరిత్రను 19వ శతాబ్దం వరకు ఉన్న కవుల సాహిత్యాన్ని  తీసుకొని రావడం జరిగింది. 19వ శతాబ్దంలో జన్మించి 20వ శతాబ్దంలో సాహిత్య కృషి చేసిన కవులున్నారు. విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, నాయని సుబ్బారావు వంటి భావ కవులందరూ 19వ శతాబ్ది చివరి పుట్టారు. జాషువా, విశ్వనాథ మొదలైన వారు సాహిత్య సేవ చేశారు. వీరందరి కృషిని వెలుగులోకి తీసుకురావాలి. శ్రీశ్రీ, ఆరుద్ర తర్వాతి తరం వారు. వీళ్ళ సాహిత్యమంతా వెలికి తీయాలి. పిలకా గణపతి శాస్త్రి, రావిశాస్త్రి, ఆత్రేయ లాంటి వారి కవిత్వమంతా రికార్డు చేయాలి.

అందరి జీవిత విశేషాలను సమగ్రంగా “శతజయంతి సాహితీమూర్తులు” అని రెండు సంపుటాలు రాశాను. 19, 20శతాబ్దాలలో ఉన్న ఉత్తరాంధ్ర, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ఇలా అన్ని ప్రాంతాల వారిని ఇందులో చేర్చాను. ఇక్కడ ప్రాంతీయ దృష్టి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో సాహిత్యం, పరిస్థితులు వేరు. ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలుపుకోవాలి. తెలంగాణాకు ఎంత అస్థిత్వముందో మిగిలిన ప్రాంతాలకు అంతే ఉంటుంది కదా…ఉత్తరాంధ్ర తెర మరుగున పడింది. ఆంధ్ర సాహిత్య చరిత్ర అంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర రచయితలను కలిపి రాశారు. ఉత్తరాంధ్ర రచయితలు తాపీ ధర్మారావు, గిడుగు రామమూర్తి, గిడుగు సీతాపతి, గురజాడ అప్పారావు..కందుకూరి, విశ్వనాథ, జాషువా కోస్తాంధ్ర రచయితలు. వీటిపైన కూడా ప్రత్యేకమైన అధ్యయనం చేయవలసి ఉంటుంది. పక్షపాతం లేకుండా 19, 20 శతాబ్దాలలో జన్మించిన అన్ని ప్రాంతాల వారిని పరిగణనలోకి తీసుకున్నా. అంతటితో ఆగకుండా దక్షిణదేశం కూడా..ఎందుకంటే తంజావూరు, మైసూరులలో తెలుగు కవులు ఉన్నారు. తెలుగు సాహిత్యమంతా మద్రాసులోనే పుట్టింది. కాశీనాథుని నాగేశ్వరరావు అక్కడి వారే. శ్రీశ్రీ, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర సినిమా పాటలన్నీ అక్కడ వుండే రాశారు. అందువల్ల దక్షిణ దేశ చరిత్రపై కూడా దృష్టి పెట్టాను. ఈ దృష్టిలో ఎవ్వరూ సాహిత్య చరిత్ర రాయలేదు. ప్రాంతాల వారీగా, కాలక్రమాన్ని పాటిస్తూ ఉ:-నన్నయ్య 11 వ శతాబ్ది అయితే 16వ శతాబ్దం కృష్ణదేవరాయలు, తర్వాత రఘునాథరాయలు ఇలా శతాబ్దాల వారీగా తీసుకున్నా. కాలక్రమమనేది సాహిత్య పరిణామాన్ని చెబుతుంది. ఈ రకంగా సాహిత్యచరిత్ర నిర్మాణం జరగాలన్న ఉద్దేశ్యంతో ఒక ఉద్యమంగా ఈనాటికీ నేను రచన కొనసాగిస్తూ ఉన్నాను. ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. సాహిత్యానికీ, రచనకు విశ్రాంతి లేదన్న ఉద్దేశ్యంతో (నవ్వుతూ) ఈ విశ్రాంత జీవితాన్ని యథాశక్తి సాహితీ సేవకు వినియోగిస్తున్నాను.

11. ప్రస్తుతం ఎంతోమంది రచనలు చేయడంలో ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారు మంచి రచయితలుగా ఎదగడానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు?

జ. ఇప్పుడిప్పుడు నానీలు, మొగ్గలు అని కొత్త కొత్త ప్రయోగాలు వస్తున్నాయి కవితలు కథలు కూడా మైనారిటీ దృక్పథంతో వస్తున్నాయి. స్త్రీవాద కథలు దళితవాద కథలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈనాటి సమాజాన్ని చిత్రించడానికి, సందేశాన్ని  అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.  ఈ చిత్రణలో ఒక సమగ్రమైన అవగాహన ఉండాలి. ప్రాచీన సాహిత్యాన్ని మనం చదివినప్పుడు మనకు భాష మీద పట్టు ఏర్పడుతుంది. సాహిత్య రచన మీద ఒక అవినివేశం కలుగుతుంది. ఒక దృష్టి ఏర్పడుతుంది. ప్రాచీన సాహిత్యాన్ని చదవకుండా ఆధునిక సాహిత్యంలోకి వెళితే అది పరిపూర్ణమైన సాహిత్యం కాదని నా అభిప్రాయం. అందుచేత ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను బాగా అధ్యయనం చేయాలి. అలా చేస్తేనే ఈనాటి ఆధునిక సమకాలీన రచయితలు మంచి రచనలు చేయగలుగుతారు. వారి స్థాయిని అందుకోగలుగుతారు.ఆ దృష్టితో రచనలు చేయాలని నా అభిప్రాయం.

12. మీ సతీమణి స్వయంప్రభ గారు కూడా మంచి రచయిత్రి, కవయిత్రి…ఆమెకు అది ఎలా పట్టువడింది?

జ. నిజమే. ఆమెలో కూడా సాహిత్య వాసన కొంత ఉంది. ఆమె రెడ్డి మహిళా కళాశాలలో చదువుకుంది. పాఠశాల స్థాయిలో మంచి రచయితలు ఆమె గురువులు. సి. ఆనందారామం గారు ఆమెకు హైస్కూలులో టీచరు. ఆ పాఠాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. నాలాగే ఆమె సినారె గారి విద్యార్థి.  ఆ ప్రభావం వలన, వివాహం తర్వాత నా ప్రభావం వలన తెలుగు ఎమ్ ఏ కూడా చేయడం జరిగింది. నేను ఏవిధంగా సాహిత్య సంస్థల పట్ల అభిరుచి ఏర్పరచుకున్నానో ఆమె కూడా నాలాగే ఆ అభినివేశాన్ని కలిగివుండేది. ‘తరంగిణి’ అనే ఒక సాహిత్య సంస్థను ఆరంభించి నేను ఏవిధంగా పాలమూరు జిల్లా కవుల సంకలనం వేశానో అలాగే కవయిత్రుల కవితలను ఆమె సేకరించి ‘తరుణి’ పేరుతో వెలువరించింది. స్వయంగా ఆమె రాసిన కవితలు ‘తరంగిణి’ అనే కవితా సంకలనంగా వచ్చింది. ముఖ్యంగా ఆమెకు ఆధ్యాత్మిక దృష్టి ఎక్కువ. మా కుటుంబమంతా పుట్టపర్తి సాయిబాబా భక్తులం. ఆమె సత్యసాయి బాల వికాస్ విద్యార్థులకు నీతి పాఠాలు చెప్పేది. స్వామివారి ఆధ్యాత్మిక రచనల ప్రభావంతో మంచి సాహితీ వ్యాసాలు రాసింది. అవి వ్యాస ప్రసూనాలు  పేరుతో అచ్చు అయినాయి. ఇప్పటికీ నాతో పాటు ఆమె కూడా ఉడుతా భక్తిగా సాహిత్య కృషి చేస్తున్నది.

ఎస్వీరామారావు దంపతులు

అడిగిన వెంటనే కాదనకుండా మీ ఇంతటి సమయాన్ని మాకోసం సద్వినియోగపరిచినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున మరీ మరీ హృదయ పూర్వక  ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీరు కొనసాగిస్తున్న సాహిత్య కృషికి ఆ భగవంతుడు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలను అనుగ్రహించాలనిప్రార్థిస్తున్నాము.

ఎస్వీ రామారావు గారి రచనలు సాహిత్య విమర్శలు: 1. తెలుగులో సాహిత్య విమర్శ (సిద్ధాంత గ్రంథం).  2. శతాబ్ది కవిత,  3. విశ్వనాథ దర్శనం,  4. విమర్శక వతంసులు 5. The Evolution of Telugu Literary Criticism సాహిత్య చరిత్రలు: 1. పాలమూరు సాహితీ వైభవం,  2. పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర,  3. తెలుగు సాహిత్య చరిత్ర,  4. తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, 5. తెలంగాణ ప్రాచీన సాహిత్య కరదీపిక, 6. మా ఊరి కవులు 7. తెలంగాణ సాహిత్యచరిత్ర, 8. వనపర్తి జిల్లా సాహిత్యచరిత్ర, 9. సమగ్ర తెలుగు సాహిత్యచరిత్ర, 10. 20వ శతాబ్ది సాహిత్య చరిత్ర,  11. స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు రచయితలు, , 12. శతజయంతి సాహితీమూర్తులు 1,2,  13. సాహితీ కదంబం, సాంస్కృతిక చరిత్రలు:  1. శ్రీ సత్యసాయి అవతారం – దశావతార గాథలు,  2. పరిశోధనోత్సవం, 3. నూటపది వసంతాల శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం,  4. తెలుగు భాష ప్రాచీనత-విశిష్టత, 5. తెలంగాణ సాంస్కృతిక వైభవం,  6. తెలంగాణ సినిమా బంగారు కాంతులు ఇవేకాక.. వ్యాస సంపుటాలు 4, పీఠికలు 2,  వ్యాఖ్యానాలు 3,  మోనోగ్రాఫులు 4, అనువాదాలు 3, పురస్కృతులు 4

May 15, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi May 14, 2023
written by Chillara Bhavanidevi

7
నవరాత్రి పండగ వేడుకలతో హంపీ పట్టణమంతా కోలాహలంగా
ఉంది. రాయలవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పండుగనాడు హంపీ విజయనగరం ఇంద్రలోకాన్ని తలపిస్తోంది. నగరాన్ని రంగురంగుల రంగవల్లికలతో ఫలపుష్ప సమూహాలతో అలంకరించారు. స్త్రీ పురుషులంతా ఆకర్షణీయమైన వస్త్రాభరణాలతో పూలమాలలు, గంధం, కస్తూరి అగరులతో శోభిల్లుతున్నారు. వీరవరుల పౌరుష విన్యాసాలైన ఖడ్గం, బల్లెం, అశ్వారోహణం, గజారోహణం మొదలైన విద్యలన్నీ రాజ సముఖంలో ప్రదర్శనకు సిద్ధమైనాయి. విజయనగరంలో రత్నాల వర్తకులంతా మరిన్ని మేలిమి రత్నాలను రాసులుగాపోసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. వివిధ రత్నాభరణాల భూషణాలు ధరించిన స్త్రీ పురుషులు ఆనందాతిరేకంతో నృత్యాలు చేస్తున్నారు.
క్రీడామైదానంలో వివిధ క్రీడాకారుల పాటవ ప్రదర్శనలు జరుగుతున్నాయి. కూచిపూడి మొదలైన నృత్య సమారాధనలతో రాజ్య జనాభా అంతా విజయనగరం చేరిందా అన్నట్లున్నది. పదిలక్షల సైన్యం కవాతు చేస్తూ విజయనగర కీర్తితోరణాన్ని వెలిగిస్తున్నది.
తోలుబొమ్మల కళాప్రదర్శనలు, యక్షగానాలు, కోలాటాలు ఒకటేమిటి, విజయనగరమే ఒక సుందర కళావేదికగా మారిపోయింది.
‘విజయమందిరం’ సర్వాంగ సుందరంగా అలంకరించబడిరది. ఈ వేదికను ‘సింహాసనవేదిక’ అని కూడా పిలుస్తారు. ఇది ప్రాచీన విజయనగర రాజుల వైభవాన్ని చాటటానికి ఆదర్శప్రాయమైన వేదిక. మూడునాలుగు నెలల ప్రయాణం చేయవలసినంత దూరప్రాంతాల నుండి, రాజ్యాలనుండి సామంతరాజ ప్రభువులు అక్కడ సమావేశం కావాలని విజయనగరాధీశుని ఆజ్ఞ. విజయనగరానికి వచ్చే దారులన్నీ సముద్రాన్ని చేరే నదీప్రవాహాల్లా ఉన్నాయి. మేఘాల్లా గర్జిస్తూ అంబారీలతో అలంకరించబడి ఏనుగులమీద గారడీ విద్యలవాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు పైనుండి సుగంధ పరిమళాల జల్లుల్ని కురిపిస్తూ తమవెంట వేల ఏనుగుల్ని తీసుకొస్తున్నారు. ఆ ఏనుగులన్నింటికి చెవులు, నొసట, తొండంమీద వివిధరంగులతో అతి విచిత్ర సుందరమైన చిత్రాలను చిత్రించారు. అవి చూసేవారికి ఆసక్తికరంగా ముగ్ధుల్ని చేస్తున్నాయి.
‘విజయమందిరం’ అని పిలిచే దసరాదిబ్బ మందిరం ముందు తొమ్మిది అంతస్తుల శిలాస్తంభాలతో కూడిన భవనాలున్నాయి. మహారాజు సింహాసనం తొమ్మిదవ అంతస్తుల్లో విరాజిల్లుతున్నది. విదేశీ రాయబారులు, యాత్రికులకు ఏడవ అంతస్తు కేటాయించబడిరది.
ఈ భవనానికి విజయభవనానికి మధ్యలో ఉన్న విశాల మైదానంలో కథకులు, గాయకులు తగినంత అభ్యాసం చేసుకోవటానికి వీలుంది. గాయకులలో చాలామంది యువతులే ఉన్నారు. ఆ రోజు చంద్రప్ప గానం ప్రత్యేక ఆకర్షణ అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. గాయకులంతా మహారాజు ఎదురుగా ఒక జలతారు తెర వెనుక ఆసీనులై ఉన్నారు. రెండువైపులా ఉన్న తెర తొలగించినప్పుడు బంగారంతో తాపడం చేసిన అమూల్య రత్నఖచిత సింహాసనంపైన కూర్చుని
ఉన్న ప్రభువు వీరిని చూడటం జరుగుతుంది.
వైభవోపేత విజయభవనం ముందుభాగంలో గోపురంతో ఉన్న ప్రవేశ ధ్వారముంది. దీని బయట రాజమందిరం చుట్టూ చాలా ఎత్తయిన ప్రహరీగోడ ఉంది. సింహద్వారంలో సాయుధులైన భటులు కాపలా కాస్తున్నారు.
దీని తర్వాత కొంతదూరంలో మరోద్వారముంది. ఆ దారిలో ప్రవేశిస్తే విశాలమైన ఆరుబయలు ప్రాంతం. దాని పక్కన ఒక పెద్దమండపముంది. అక్కడ ముఖ్యమైన అధికారులు, నగర ప్రముఖులు కూర్చుని వినోదాలు చూస్తున్నారు. ఈ ఆరుబయలు ప్రాంతానికి ఉత్తరంగా మరో పెద్ద పలు అంతస్తుల భవనం కన్పిస్తోంది.
ఏనుగు, గుర్రం వంటి ఆకారాలతో ఎత్తైన స్తంభాల మీద ఈ కట్టడాలు కట్టారు కాబట్టి విశాలంగా ఉండి పైకి ఎక్కటానికి రాతిమెట్లు కన్పిస్తున్నాయి.
ద్వారానికెదురుగా రెండు వృత్తాకార రంగస్థలాలున్నాయి. వాటిలో నాట్యగత్తెలు రత్నఖచిత సువర్ణాభరణ భూషితలై నృత్యాలు చేస్తున్నారు.
ఈ రంగస్థలాలకెదురుగా సింహద్వారానికి తూర్పున విజయ భవనం లాంటి మరో రెండు మందిరాలున్నాయి. వాటిలో ఒకటి మధ్యలో, ఇంకొకటి చివరిలో ఉన్నాయి. ఇవి అమూల్యవస్త్రాలచే అలంకరింపబడి ఉన్నాయి. ఆ వస్త్రాలమీద ఆసక్తికరంగా వివిధ చిత్రాలు కన్పిస్తున్నాయి. ఈ భవనాలలో రాజకుమారులు తమ అభిరుచుల కనుగుణమైన విందులు ఆరగిస్తూ మిత్రులతో కలసి ప్రదర్శనలు చూస్తున్నారు.
నవరాత్రి విజయోత్సవ ప్రారంభసూచికగా ధర్మఘంటారావం విన్పించింది. అది నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు. శ్రీకృష్ణదేవరాయలు విజయమందిరానికి విచ్చేశారు. అక్కడే నిర్మితమై ఉన్న దేవమందిరంలోకి ప్రవేశించారు.
బలమైన అవయవ సౌష్టవంతో మంచి ముఖవర్చస్సు గల్గిన శ్రీకృష్ణదేవరాయల వదనంలో ప్రత్యేకత అందరినీ ఆకర్షిస్తోంది. పట్టుపంచ, అంగరఖా, ఉత్తరీయం ధరించి తులలేని నవరత్నఖచిత ఆభరణాలతో, కిరీట భుజకీర్తులతో రాచకరవాలంతో నిలువెత్తు వీరత్వానికి ప్రతీకగా భాసిల్లుతున్న రాయలు దేవమందిరంలోని విగ్రహాన్ని పూజించారు. బయట ఉత్సవం కోలాహలంగా జరుగుతున్నది. ప్రభువు బంధువులు, ఆప్తులు, కళాకారులు అంతా నృత్యగాన విశేషాదుల్ని ఆనందిస్తున్నారు. బయట మండపాల్లో దండనాథులు,
ఉన్నతాధికారులు, పౌర ప్రముఖులు ఉత్సవాన్ని దర్శించాలని వచ్చి వేచిచూస్తున్నారు.
కింద ఆరుబయలు ప్రాంగణంలో నానావిధాలుగా పుష్పాది సుగంధ ద్రవ్యాలతో అలంకరింపబడిన పదకొండు అశ్వాలు, నాలుగు పట్టపుటేనుగులు వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయ ప్రభువు లోపలినుండి సద్బ్రాహ్మణసమేతుడై అక్కడికి వచ్చారు. బ్రాహ్మణులు గజాశ్వాలను వైదిక సంస్కార ప్రకారం మంత్రజలంతో ప్రోక్షణ చేసి పూలమాలలతో వాటిని అలంకరించారు. ఆ తర్వాత జాజ్వల్యమాన వజ్ర ఖచిత కనక సింహాసనం మీద విజయనగర సామ్రాజ్యధీశుడైన శ్రీశ్రీశ్రీ కృష్ణదేవరాయల ప్రభువు ఆసీనుడయ్యారు.
ఆనవాయితీ ప్రకారం కొన్ని పొట్టేళ్ళు, దున్నపోతుల్ని బలి ఇవ్వటం పూర్తయింది. మహారాజు బ్రాహ్మణుల వేదమంత్రయుక్త ఆశీర్వాదం అందుకుని మరలా తొమ్మిదవ అంతస్తుకు వెళ్ళి కిరీటం తీసి దేవుని ఎదుట ఉంచి దేవునికి సాష్టాంగ ప్రణామం చేసి లోనికి వెళ్ళిపోయాడు.
ఇక్కడ రంగస్థలాలపై చాలాసేపు నృత్యప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. నవరాత్రుల తొమ్మిదిరోజులు ఇదేవిధమైన కార్యక్రమం ఏర్పాటు చేయబడిరది.
సాయంత్రంవేళ అవుతున్నది. మర్తాండుడు ప్రతాపం చాలించి లోకం మీద తన వేడికిరణాలను ఉపసంహరించుకొని పశ్చిమాద్రికి ప్రయాణమవుతున్నాడు.
ప్రజలు, ఉద్యోగులు, అతిథులు అంతా విజయభవన ప్రాంగణానికి విచ్చేశారు. మల్లురు, జెట్టీలు, నృత్యగాన కళాకారులు అలంకృత అశ్వాలతో ఊరేగింపుగా బయలుదేరారు. బ్రాహ్మణులు, రాకుమారులు, రాజబంధువులు, వారి వారి మిత్రులు, పరవారం మహారాజుని అనుసరించారు.
ఈ ఉత్సవాల విషయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అడుగడుగునా శక్తివంతమైన గూఢచారి వ్యవస్థతో మహామంత్రి తిమ్మరుసే స్వయంగా పర్యవేక్షిస్తూ తగు సూచనలు, ఆజ్ఞలు ఇస్తున్నారు.
మహారాజు విజయభవన వేదికపై సింహాసనాన్ని అధిరోహించారు. ప్రజలు అధికారగణం లేచి నిలుచుండి విజయాభివందనం చేశారు. కొందరు ఆప్తులు మహారాజు దగ్గరగా కూర్చున్నారు. దేవేరులు మహారాజు సమీపంలో తెరల మాటున వీక్షిస్తున్నారు. తాంబూల సేవనం మహారాజు సమక్షంలో నిషిద్ధమని అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ ఆ పని చేయటం లేదు.
అప్పటిదాకా బయట నిరీక్షిస్తున్న సేనాధికారులు ఒక్కొక్కరు వరుసలో వచ్చి రాజుకు జోహారులు సమర్పించి మండపంలో తమతమ స్థానాలలో కూర్చున్నారు. అనంతరం నత్య ప్రదర్శన జరిగింది.
నాడు మంజరి చేసిన ‘నవమోహిని’ నృత్యం సరికొత్త భావానుభూతిని మిగిల్చింది. క్షీరసాగరమధనంలో హాలాహలాన్ని పరమశివుడు భరించాడు. తర్వాత పుట్టిన అమృతాన్ని దేవదానవులకు పంచే విధానంలో శ్రీ మహావిష్ణువు మోహినీరూపంలో అవతరించి దానవులను సమ్మోహనపరచిన విధానాన్ని మంజరి అభినయ నర్తనంగా అందించిన ప్రావీణ్యతకు కళాహృదయాలన్నీ పులకించాయి.
మంజరి నవమోహినీ రూపం చంద్రప్ప మనసులో గిలిగింతలు పెట్టింది. ఈ దసరా నవరాత్రులలోనే విజయదశమినాడు ఆ ఇద్దరికీ పరిణయం జరుగనుంది. ఆ తలపే చంద్రప్పను వివశుడ్ని చేస్తున్నది.
‘‘బాగు బాగు’’ ఆ కర్కోటక స్వరం వీరేంద్రునిదే.
చంద్రప్ప తీక్షణంగా వీరేంద్రుని చూశాడు. వీరేంద్రుని వాక్కులో ప్రశంసకన్నా కుటిలత్వమే విన్పిస్తున్నది.
‘‘నర్తకీమణీ! మీ నృత్యాభినయంతో మేము ముగ్ధులమయ్యాం!’’ అంటూ ప్రభువు తన మెడలోని ముత్యాలహారాన్ని ఆమెకు బహుకరించారు. కృతజ్ఞతతో మంజరి కళ్ళు చెమర్చాయి.
‘‘మంజరీ! నేటినుండి నిన్ను మా ఆస్థాన నర్తకిగా గౌరవిస్తున్నాం.’’ ప్రభువిచ్చిన వెలలేని కానుకలతో ఇల్లుచేరిన మంజరికి తల్లి గుర్తొచ్చింది. కృష్ణసాని ఉంటే ఎంత సంతోషించేదో! ఆమె కళ్ళు తల్లి జ్ఞాపకాలతో చెమర్చాయి.
మర్నాటి కార్యక్రమం మొదలయింది.
రంగస్థలంలో వెయ్యిమంది మల్లయోధులు ఆయుధాలు లేకుండా పోరాడి వివిధరకాల మల్లవిద్యలు ప్రదర్శించారు. వారికందరికీ బహుమతులు అందాయి. కొందరు వలలు విసురుతూ రంగస్థలంలోనివారిని చేపల్లా పట్టే వినోదాన్ని ప్రదర్శించారు.
ఈవిధంగా అనేక ప్రదర్శనల తర్వాత పలువర్ణాల జ్యోతులు వెలిగించారు. బాణాసంచా పేల్చారు.
అనంతరం బారులుతీరిన అలంకృత ఏనుగులు, అశ్వాలు, వృషభాలు రాజు ఎదుట వచ్చి నిలబడ్డాయి. బ్రాహ్మణుడు మంత్ర పుష్పాక్షతలతో వీటిని అర్చించాక మహారాజు పక్కనే ఉన్న చిన్నద్వారం గుండా నిష్క్రమించాయి.
బ్రాహ్మణులు విజయమందిర దేవాలయ విగ్రహాన్ని యథాశక్తి పూజించారు. మహారాజు ఉత్సవాలు జరిగే తొమ్మిదిరోజులు ఉపవాసమున్నారు. ఆయన ముఖకళ రోజురోజుకూ ఇనుమడిస్తూనే ఉండటం విశేషం.
ఈ ఉత్సవాల కాలంలో సామంత నాయకులు రాజమందిరం దగ్గర నవదుర్గాల్లో అమూల్య వస్త్రాభరణాలు, వస్తువులు ఉంచి విజయదశమి మహోత్సవవేళ చక్రవర్తికి రాజచిహ్నాలను అలంకరించి కానుకలు చెల్లించారు. ప్రభువు దేవేరులంతా స్వర్ణాభరణ భూషితులై బంగారుకలశాలతో రాజచంద్రునికి నీరాజనాలు సమర్పించారు. నవరాత్రి దసరాఉత్సవం తొమ్మిదిరోజులు రాజభవనం ఆనందపారవశ్యంలో మునిగితేలుతున్నది.
కురిసిన దెచట వాక్కుల జృంభణములోన
కవిరాజుపైన బంగారువాన
సలిపిన దెచట ధూర్జటి దివ్యలేఖిని
నవ్యవారాంగనా నర్తనంబు
తొడిగిన దెచట నిస్తుల రాజహస్తము
కవిపితామహు కాలి కంకణంబు
విసిరిన దెచట ప్రవీణవాచస్పతి
రామలింగని హాస్య రససమృద్ధి
అది శిలలదిబ్బ దసరాలకైన దిబ్బ
తెలుగు లలితకళాదేవి తీర్చినట్టి
కొలువుకూటపు దిబ్బ వన్నెలకు దిబ్బ
మా మహర్నవవిూశాల మంటపంబు
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
తిమ్మరుసు భవనంలో కుమారుడు గోవిందరాయలతో గంభీరంగా సమావేశమైనాడు.
‘‘మీరేమైనా చెప్పండి నాన్నగారూ… వీరేంద్రుడిరక విజయనగరంలో
ఉండటానికి వీలులేదు’’ గోవిందరాయలు ఆవేశంగా అన్నాడు.
‘‘త్వరపడితే ఎలా గోవిందా! అతను రాజబంధువు. ముల్లును ముల్లుతోనే తీసివేయాలి. అతని కపటబుద్ధి నాకూ తెలుసు. గజపతుల కూతురితో వచ్చి విజయనగరంలో పాగా వేసినప్పటినుంచి అతన్ని కనిపెడుతూనే ఉన్నాను’’ తిమ్మరుసు సాలోచనగా అన్నాడు.
‘‘ఇంక జాప్యం చేయరాదు నాన్నగారూ. కంటకుడు రాజద్రోహులతో మంతనాలు చేస్తున్నాడు. సైన్యాధికారులు, రాజోద్యోగుల మీద పెత్తనం చేయాలని చూస్తున్నాడు’’ గోవిందరాయలి కోపం తారాస్థాయిలో ఉంది.
తిమ్మరుసు మౌనంగా తల పంకించాడు.
‘‘విజయనగరంలో స్త్రీలను ఎంత గౌరవిస్తామో మీకు తెల్సు. అలాంటిది ఎందరో స్త్రీలు అతనివల్ల బాధపడ్తున్నారు. అధికారులకు లంచాలు నేర్పిస్తున్నాడు’’ ఆవేశంగా మళ్ళీ చెప్పాడు గోవిందరాయలు.
‘‘నిజమే గోవిందా! అన్నపూర్ణాదేవి బంధువు అనే చిన్న కారణమే అతన్ని రక్షిస్తుంది. మన వేగులవల్ల చాలా కొత్త సంగతులు తెలుస్తున్నాయి. నేనున్నాను నీవు కలవరపడకు’’ కుమారుని శాంతపరిచే ప్రయత్నం చేశారు తిమ్మరుసు.
ఇంతలో చంద్రప్ప వచ్చినట్లు వర్తమానం అందింది. చంద్రప్ప వచ్చేలోపు గోవిందరాయలు లోనికి నిష్క్రమించాడు.
‘‘అభివాదం మంత్రివర్యా’’
‘‘చంద్రప్పా! ఏమి వార్త’’
‘‘మంత్రివర్యా! నవరాత్రి ఉత్సవాల్లో ఒక ప్రమాదం తప్పింది.’’
‘‘ఏమిటది చంద్రప్పా?’’
‘‘ఓఢ్రం నుంచి వచ్చిన నృత్యాంగనల్లో ఒక స్త్రీ దుస్తులమాటున ఛురిక దాచింది. ఆమె రాయలవారికి చాలా చేరువగా వచ్చింది గాని ప్రయత్నించేలోపు మంజరి ఆ రహస్యాన్ని ఛేదించడంతో ఆ నర్తకిని దండనాథులు బందీని చేశారు.’’
‘‘ఆమెను ఓఢ్రం నుంచి పిలువనంపింది మనమేనా?’’ అనుమానంగా అడిగారు తిమ్మరుసు.
‘‘కాదు. వీరేంద్రులవారి వ్యక్తిగత ఆహ్వానం మేరకు వచ్చిందట’’ తటపటాయిస్తూ చెప్పాడు చంద్రప్ప.
‘‘ఊ’’ తిమ్మరుసు గంభీరముద్ర వహించారు.
‘‘అంతేకాదు అమాత్యవర్యా! కవాతు చేసిన మన సైన్యంలో లెక్కకు మించి ఇతర సైన్యం గుర్తించలేనివిధంగా కలిసి ఉందట.’’
‘‘ఇక నీవు వెళ్ళవచ్చు’’ చంద్రప్ప నమస్కరించి వెళ్ళిపోయాడు. మంత్రి తిమ్మరుసు చురుకుగా సేనా నాయకుడికి కబురుపెట్టారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
మంజరి పున్నమి వెలుగులో వసంతవాటికలో వేచివుంది. కొలనులోని చందమామ చంద్రప్పలా ఉన్నాడు. తమ వివాహానికి ఇంకా మూడు
నాళ్ళున్నది.
ఆ తర్వాత చంద్రప్పతో తమ విహారం శిల్పారామంలోనే! పరవశిస్తూ సంచరిస్తున్నది మంజరి.
విజయనగరమంతా ఎక్కడ చూసినా అద్భుత శిల్పప్రపంచమే కదా! శ్రీరామచంద్రునికి సహాయపడిన వానరోత్తముల రాజ్యం ఇది. ఇపుడు మరో రామరాజ్యమయింది. వరాహస్వామి పతాకచిహ్నంగా ఉన్న ఈ విజయనగరంలో రఘునాథ దేవాలయం బయటి గోడమీద శిల్పకళాకృతులంటే మంజరికి ఎప్పుడూ ఇష్టమే. ఇక్కడే రామచంద్రుడు తమ తండ్రికి పిండప్రధానం చేశాడంటారు. నిజమేనా! ఎప్పటి రాముడు! త్రేతాయుగం నాటి మాట. నమ్మినా నమ్మకపోయినా ఆ పుణ్యస్థలం నేటికీ పవిత్రమైనదే! మంజరి నర్తనశాలలో ప్రవేశించింది. రాత్రివేళ కదా! నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆమె మనోవీధిలో అక్కడ నృత్యకేళి పరమ మనోహరంగా జరుగుతున్నది. ఇది ఎంతటి ముగ్ధమనోహర ప్రదేశం!
‘‘కాళ్ళ పారాణిచిక్కన నృత్యవేళల
చెమటలో కరిగిపోసినది ‘చార’
చక్రభ్రమణ వేళ జలతారు తలకట్టు
తెగిన ముత్యాలు దిద్దినవి ‘ముగ్గు’
శ్రామకేళికావేళ వాదించి ప
చ్చీసులో నెంచి కచ్చినది ‘పావు’
నృత్యగానపరీక్ష నెరిగి దినాభ్యాస
మునకు ధరించి విప్పినది ‘గజ్జె’
రేగిపోలేదు, చెరగను లేదు, కదలి
పంటగడి తప్పలేదు, సప్తస్వరాల
కనుగుణంబుగ మ్రోయ మానినది లేదు
నేటినికి కిన్నరాంగనా నిచయ మాంధ్ర
రాజకన్యానుసరణ పర్వతమందు
తెలుగు నర్తనశాలలో తిరుగుకతన’’
ఆమె వివశంగా సన్నని గొంతుతో పాడుకుంటున్నది. అకస్మాత్తుగా గోవిందరాయడి రాక ఒకింత విస్మయం కలిగించింది.
‘‘మంజరీ! ఇక్కడ్నించి త్వరగా వెళ్ళిపో! అపాయం’’ హెచ్చరించిన అతను మరుక్షణంలో మాయమయ్యాడు.
ఆమె తేరుకుని వెంటనే పరుగులాంటి నడకతో ఇల్లు చేరుకుంది. వెనుక కత్తుల శబ్దాలు విన్పిస్తున్నాయి. ఏం జరుగుతుందిక్కడ? విజయనగరం నివురుకప్పిన నిప్పులా ఉంది.
‘‘ఈ నిప్పు జ్వాలగా ఎగయకముందే చల్లార్చు స్వామి!’’ విరూపాక్షుని
ఉద్వేగంగా ప్రార్ధించింది మంజరి.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయల మందిరంలో సేనానాయకుడు రామలింగనాయకునితో సమావేశమయ్యారు ప్రభువు.
‘‘ప్రభూ! చిన్న పామునైనా పెద్ద కర్రతోనే…’’ రామలింగనాయకుని ఆత్రుత అది.
‘‘మాకు తెలుసు రామలింగనాయకా! ఇస్మాయిల్‌ ఆదిల్‌ఖాన్‌పై దాడి జరిపి రాయచూర్‌ను మన స్వంతం చేసుకున్నది సముచితమే! అయినా స్వమత కారణంగా గోల్కొండ, అహ్మద్‌నగర్‌, బీదర్‌, బీరార్‌ పాలకులు మనపై కత్తిగట్టారు. ఆదిల్‌ఖాన్‌కు రాయచూర్‌ తిరిగి ఇవ్వాలట. హు!’’ రాయలు సింహంలా జూలు విదిల్చి మళ్ళీ అన్నాడు కోపంగా`
‘‘అదెన్నటికీ జరుగదు. ఆదిల్‌ఖాన్‌ని వచ్చి నా పాదాలను ముద్దుపెట్టుకో మనండి. అలాచేస్తే అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చేస్తామని కబురు పంపండి.’’
‘‘కానీ ప్రభూ!’’
‘‘మా ఆజ్ఞ’’ ప్రభువు మందిర అంతర్భాగంలోకి విసవిసా వెళ్ళిపోవటంతో రామలింగనాయకుడు నిస్సహాయంగా చూశాడు.
ప్రాణాలొడ్డి సాధించిన రాయచూర్‌ను తిరిగి ఆదిల్‌ఖాన్‌కు అప్పగించటమా! ఇది విజయనగర ప్రతిష్టకే మాయని మచ్చ. తిమ్మరుసుల వారేమని యోచించారో! ఆదిల్‌ఖాన్‌ రాయల్ని కలవటానికి సిద్ధంగానే ఉన్నాడు. సరిహద్దులోకి రమ్మని కబురంపాలని ప్రభువు ఆజ్ఞ. కానీ అతను వస్తాడా? బెల్గామ్‌ సుల్తాన్‌ లారీ కూడా జిత్తులమారి. నమ్మటానికి లేదు. ఆలోచిస్తూ రామలింగనాయకుడు మందిరం బయటికి వస్తుండగా వీరేంద్రుడు ఎదుటపడ్డాడు.
‘‘రామలింగ నాయకులేదో రాచకార్యం నిర్వర్తించడానికి వచ్చినట్లున్నారే’’ వెటకారంగా ప్రశ్నించాడు.
రామలింగనాయకుడు అతనికేసి తీక్షణంగా చూశాడు.
‘‘మా సైన్యంలోకి దూరిన నక్కల్ని ఏరిపారేయటానికి’’ విసురుగా జవాబిచ్చాడు.
‘‘నక్కలకీ తెలివి ఉంటుంది మిత్రమా!’’ వీరేంద్రుడు వ్యంగ్యంగా అన్నాడు.
‘‘సింహాలముందు ఆ తెలివి పనిచేయదులెండి’’ అంటూ రామలింగ నాయకుడు బయలుదేరాడు.
వీరేంద్రుడు పళ్ళు పటపట కొరికాడు.
‘‘సింహమా! ఎవరో అదీ తేలుస్తానురా! నేనిక్కడ అడుగుపెట్టిందే ఈ విజయనగరాన్ని మట్టి చేయటానికి. మీరెంత సైన్యపాలన చేసినా ఈ వీరేంద్రుని తెలివితేటల ముందు చిల్లపెంకులే. మా అమ్మాయినిచ్చి పెళ్ళిచేశామని లోకువయ్యామేమో! అది పెళ్ళా? శ్మశానానికి దారి. అన్నపూర్ణ వట్టి పిచ్చి పతివ్రత. భర్తే దైవం, జగన్నాథం అనుకుంటున్నది. ఆమెకెంత చెప్పినా తిమ్మరుసుని తండ్రిలా భావిస్తున్నది. తిమ్మరుసుకు రాజుకు మధ్య దూరం పెంచనిదే, స్పర్థ రేకెత్తించనిదే నా పని సులభం కాదు. మహాభారతంలో శకునే నాకు ఆదర్శం’’ అనుకుంటూ కళ్ళెగరేశాడు క్రూరంగా.
స్వపక్షంలోనే ఉంటూ స్వపక్ష వినాశనం ఎలా చేయాలో నేర్పిన గురువు శకునే కదా!
‘‘రాయలు పోర్చుగీసువారితో స్నేహంచేసి పరాయిపాలనకు బీజం వేస్తున్నాడు. ముస్లిం రాజుల ఐక్యతకు దోహదపడ్తున్నాడు. ఇవన్నీ నాకే లాభిస్తాయి. నా లక్ష్యం ఒకటే! విజయనగర పతనం. అంతే! దీనికోసం అన్నపూర్ణ ప్రాణం తీయాల్సివచ్చినా వెనుకాడే ప్రసక్తి లేదు. జగన్నాథ’’
లోపలికి వెళ్తున్న వీరేంద్రుని రహస్యంగా అనుసరిస్తూ పొంచి ఉండి అంతా విన్న చంద్రప్ప కర్తవ్య స్ఫురణతో మెరుపులా తిమ్మరుసు మందిరం వైపు కదిలాడు.

May 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

స్త్రీ సంతకం

by Ramesh May 14, 2023
written by Ramesh

క్షీరసాగర మధనంలో
అందం తాలూకు అమృతబిందువుల్ని
మహిళాలోకం ఒడిసిపట్టుకున్నారా బహుశా
అందం కురిసిన అసలు ఆ రాత్రిఆడవాళ్లు మాత్రమే మేల్కొని
ఉన్నారేమో తెలివిగా,
పారిజాతంలా ,పున్నాగంలా
నా వాక్యాలకు అందని ఇంకాఏదో అవ్యక్త సౌందర్య వారాశి లా
‘అందం’ వాళ్ల వశమై పరవశమయ్యింది

మగమానవుడు వాళ్ల జీవిత ఖైదే ఈనాటికికూడా
సహనం,త్యాగం,సాహసం వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు
ఆనందం, సహన సున్నితత్వాలు వాళ్లతో ముడిపడ్డాయి

అనాదిగా
అతివలదే ఘనత అంతా
వనితలదే చరిత అంతా

బ్రహ్మచారికి మోక్షం గృహస్థాశ్రమంలోఉందంటారు పండితులు

మగువతోడు లేని మగరాయుడి జీవితమంతా సన్యాసం
కాదంటే శూన్య విన్యాసమే అంటారు బాధితులు

శిశిర మోడుల మౌన ఆకాశం లో
శిలల శిలల పరమ నిశ్శబ్దంలోంచి
ఒక వసంతగాన పులకిత పుడమిలా
మగాడు గాయపడ్డప్పుడు
ఈ బాధామయ,కన్నీటి కథలు నుంచి
గుండె పగిలే క్షణాల్నుంచి
ఆమె అమలినప్రేమవర్షంతో తడుస్తూ
అనంత ఓదార్పు నదిఒడిలో స్నానిస్తూ
ఆమె అనంత దయాపారావారం తీరం చేరి
ఉపశమనిస్తున్నాడు,తిరిగి మానవత్వమున్న మనిషౌతున్నాడు పురుషపుంగవుడు

రేయి పగలు యుగయుగాలుగా….
శక్తి,చేతనత్వాలకు పర్యాయపదం కదా మానవి

స్థావర జంగమాత్మక ఈ జగత్తుసమస్తం
సమ్మోహన పరాశక్తి స్త్రీ కాబోలు

ఏమని చెప్పను
ఇంకా ఎంతని చెప్పగలను

నాతో నడుస్తున్న నా అర్థాంగికి
నన్ను నడిపిస్తున్న మా అమ్మకు
సుకుమారమైన మనసుగల ఈ ఆడాళ్లకు
ఈ జన్మకు కృతజ్ఞతలు తప్ప!

రమేశ్ నల్లగొండ
8309452179

May 14, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us