Home కవితలు గాజు బొమ్మ

గాజు బొమ్మ

by Seshabhattar Raghu

గెలుపు గుర్రాలెన్నో సొంతం చేసుకొని ఒకడు
రత్న సింహాసనం ఎక్కి కూర్చున్నప్పుడు
రాబోయే పందాలెన్నో లోలోపల గీరినప్పుడు
తెలియని సలపరమేదో
ఒళ్లంతా కమ్ముతుంది
నిన్నటి గెలుపు జీర్ణమైన అన్నమని
ఉరకలేసే ప్రాణాలు దాని లవణాలని చెప్పుకుంటాడు

గెలిచిన ప్రతిసారి అనుకుంటాడు-
ఈ ఎడతెగని బరువులొద్దని
వ్యసనం వంటి వ్యూహాలొద్దని
కిక్కిరిసిన బుర్ర నుండి జారుకొని
నిద్ర లేచిన పిచుకలా ఉండాలని

కొన్నాళ్ళకు
ఊగిసలాటలేని క్షణికాల మధ్య
పందాలొద్దని స్థిరపడి
ప్రశాంత తారకలు తారాడే రాత్రి కాంతిలో
తడిసినప్పుడు
బడలిక
మర్చిపోయిన విద్యలా కమ్ముకుంది

ఆ రాత్రి తనకు గెలిచే మనిషిననే స్పృహ లేదు
రేపటి జయాల కోసం వ్యూహాలు లేవు
ఊహల్లో భుజకీర్తుల మోహాలు లేవు
నిద్రలో పీడ కలల జాడలు లేవు

చిన్నప్పుడు రాసుకున్న స్వప్నాలేవో గుర్తుకొచ్చి
ఒకసారి దులిపినప్పుడు
వాటిని దాచుకున్న తల గాజు బొమ్మలా తోచింది

          

You may also like

Leave a Comment