Home కవితలు గుండె నిండిన స్వప్నాలు

గుండె నిండిన స్వప్నాలు


తొంగి చూస్తున్న జాబిల్లి ఇంట్లోకే,
వాయుదేవుని ప్రతిభాపాటవాలతో
వెలుగు లీనుతున్న
ఇంటి పైకప్పు చిల్లులగుండా…!

మెరుపుల తీగలు ఇంటి చుట్టూతా
సిరీస్ బల్బుల్లా ధగధగలాడుతూ
మల్లెపూల దండలా వేలాడుతు
చినుకు చినుకు అతుక్కుని
వసుధను వలపుల మంజరితో అలంకరిస్తుంటే…!!

కుక్కి మంచంలో విరిగిపోతున్న నడుము
అమ్మా అయ్యా అంటుంటే,
పొట్టనే అతుక్కుపోతున్న వెన్నుపూస
గజం లోతుకి వెళ్లిన కళ్ళు
ఏమి చేయలేక!!

తడిసిన చితుకులు
నానిన మెతుకులు
తడిసిన దుస్తులు
ఈ అలమటలతో తలపడి
ఆర్ద్రతలో బతుకుని
అధిగమించి ఆనందంగా గడపాలని !!

జలఖడ్గం విసిరినవల
తెంచాలని తుంచాలని
భారంగా మూసిన మనసు . ‌.‌‌..
బ్రతకాలనే కాంక్ష
బ్రతికించాలనే తపనతో
గుండె నిండా స్వప్నాలే
కంటోంది….!!

ఇంతలో దానికదే
హోరు సర్దుకుంది
జడివాన వెలిసింది
పొంగిన వాగులు
ఎగిసిన కెరటాలు
చేరాయి తమ తమ తావులు!!

పచ్చని చేలు
విరబూసిన పూల సువాసన
నాసికను హత్తుకుంటే
మత్తుతో మతిని చిత్తు చేస్తూ…
చల్లని పిల్ల గాలులు మేనిని తాకుతూ
ఎగిరే పక్షుల రావాలు
తిరిగే పశువుల గిట్టెల చప్పుళ్ళు
వీనుల విందు చేస్తుంటే!!

తుడిచిన అద్దంలా
నిర్మలమైన ఆకాశం
మిల మిల మెరిసే తారలతో
వసంతం పూయిస్తుంటే!!

లేవాలనే కోరిక బలీయంగా
అయినా లేవలేక
పై కప్పు పొక్కలోంచి
తదేకంగా చూస్తుంటే !!

బాధంతా బలమై మొలిచింది
వేదన మోదమై
చిలిపిగా చూస్తుంటే
దుఃఖం
సాంఖ్య యోగము వినిపిస్తుంటే
స్వర్గంలో నడయాడుతున్న ట్టు
అనుభూతి!!
ఆహా ఏమి చిత్రం !?
ఈ విచిత్రం ప్రకృతి వైచిత్రి కదా!!

ఇది నా స్వీయ రచన

You may also like

Leave a Comment