Home కథలు నిష్కామ కర్మ

నిష్కామ కర్మ

by Maji Bharathi

మా మేనత్త చావుని దగ్గరనుండి చూశాను. మంచం మీద తీసుకొని, తీసుకొని ఈ మధ్యనే చనిపోయింది. చనిపోయేముందు చాలా బాధపడింది. ఒక రకంగా చెప్పాలంటే, చుట్టూ ఉన్నవాళ్లు, ఆమె ఎప్పుడు చనిపోతుందోనని ఎదురు చూశారు. భగవంతుడా! అలాంటి మరణం మా అమ్మకు రాకుండా చూడు దేవుడా! అని నేనెప్పుడూ మనసులో కోరుకునే వాడిని.
అమ్మ చాలా తేలిగ్గా “యిన్నాళ్లూ అత్త వాళ్లకు చేసింది కదా! మరి వాళ్ళు ఆ రుణం తీర్చుకోవాలి కదా! అందుకే మీ అత్త మంచాన పడితే వాళ్ళందరూ మీ అత్త కింద చేశారు.” అని అంది. కానీ నాకు అర్థం కాని ప్రశ్న… “మనం వాళ్ళందరికీ సాయం చేస్తే, మరలా వాళ్లు మన రుణం తీర్చుకునే లాగ… మనకి చేసేలాగా…. మనం మంచానపడి చనిపోతామా అనేది?” నాకు పెద్ద ప్రశ్న.
“అలాంటి చావు ఎవరికీ రాకూడదు” అనే వాడిని అమ్మతో. దానికి బదులుగా “మరి వాళ్ళు మీ అత్త రుణం తీర్చుకోవాలి కదా నాయనా! లేకపోతే ఆ రుణం కోసం మరో జన్మ ఎత్తవలసి ఉంటుంది. ఈ జన్మలో ఆ భవబంధాలన్నీ తీర్చుకుని వెళ్లి పోయింది మీ అత్త. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, తెలిసో, తెలియకో మనం చేసిన తప్పులు కొన్ని ఉంటాయి. వాటి కర్మను ఈ జన్మలోనే అనుభవించేస్తే, అంత్య సమయంలో నిష్పూచీగా ఈ కట్టెను వదిలేయవచ్చు. లేకపోతే ఈ పాప కర్మను వచ్చే జన్మలో కూడా మోయాల్సి వస్తుంది.” అనేది అమ్మ చాలా ప్రశాంతంగా.
మా అమ్మ కూడా అందరి క్రింద చేసింది కదా! వాళ్ళు అమ్మ రుణం తీర్చుకోవాలంటే, అమ్మ కూడా అత్తలాగే మంచాన పడి, అందరి చేత సేవలు చేయించుకుంటూ, మరణం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తూ…. ఇంకా ఎక్కువ కాలం మంచం మీద ఉంటే ఈవిడ ఎప్పుడు పైకి వెళ్లిపోతుందా అని అందరి చేత అనిపించుకుంటూ…. అమ్మ కూడా అత్తలాగే బాధపడి, బాధపడి ప్రాణం ఒదులుతుందా అనేది నాకెప్పుడూ విపరీతమైన భయాన్ని కలిగించేది. అందుకే అమ్మ ఆఖరి ఘడియలు ఎలా ఉంటాయోనని నాకెప్పుడూ బెంగగా ఉండేది.
ఎందుకంటే అమ్మ అందరి కిందా చేసింది. మరుదులు, ఆడపడుచులు, అత్తమామలు…. అందరినీ, తను పెద్దకోడలుగా బాధ్యతలు నెత్తిన వేసుకొని వాళ్ళందరి పెళ్లిళ్లు, పురుళ్లు అన్నీ అమ్మే చూసింది. ముందు, అంటే మా చిన్నప్పుడు అమ్మను వాళ్ళందరూ ఎలా చూసేవారో తెలియదుగానీ, ఇప్పుడు మాత్రం అందరు కూడా “వదిన లేకపోతే మేమిప్పుడు యిలా ఉండేవాళ్ళం కాదు. మా అమ్మకన్నా మా వదినే మాకు ఎక్కువ చేసింది” అని నా మేనత్తలందరూ అనేవారు. నా వదినల విషయానికొస్తే నేనే దగ్గరుండి చూసేవాడిని అమ్మ వాళ్లకు ఎంత బాగా అన్నీ చేసిపెట్టేదో! ఏ రోజు కూడా వాళ్ళనొక్క మాట కూడా అనకుండా అమ్మలాగే లాలించేది. వాళ్ళు మా అమ్మని వాళ్ళ అమ్మలాగ చూసుకున్నారా అంటే లేదనే చెప్పొచ్చు. అమ్మకా విషయం మీద ఏ రోజూ కంప్లైంట్ అనేదే లేదు. వాళ్లు మా అమ్మని ఎలా చూస్తున్నారనే విషయం, అమ్మ ఎప్పుడూ పట్టించుకునేది కాదు.
ఇంటికి నేను చిన్న కొడుకునవడం చేత అమ్మ దగ్గర చనువెక్కువ. నా పెళ్లి అయ్యేటప్పటికి అన్నీ తానే దగ్గరుండి అందరికీ చేసి పెట్టేది. కానీ నా పెళ్లి అవ్వగానే వదినలందరూ, ఇంతవరకు మేమే చూసాము కదా! ఇంకా ఎన్నాళ్ళు మేము చూస్తాము అని అమ్మ బాధ్యత నాకు అప్పచెప్పారు. నా భార్య ప్రేమగా కాకపోయినా బాధ్యతగా చూస్తుంది. కానీ నా భయాలను అబద్ధాలు చేస్తూ, అమ్మ తులసి మొక్కకు పూజ చేస్తూ, అలా కూర్చొని ప్రాణాలు వదిలేసింది.
“ఎవరి రుణమూ ఉంచుకోకూడదు నాయనా! ఉంచుకుంటే అది తీరేవరకూ మనం ఈ లోకంలోనే ఉండాల్సి వస్తుంది.” అనేది అమ్మ. అమ్మ ఎవరి రుణమూ ఉంచుకోలేదు. కానీ అమ్మకు చాలామంది రుణపడి ఉన్నారు. మరి వాళ్ళందరూ అమ్మ రుణం తీర్చుకోకుండా అమ్మ ఈ లోకం నుండి ఎలా వెళ్ళిపోయింది? తన మరణం తాను కోరుకున్నట్లు ఎలా జరిగిందనేది, నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న? ఈ పన్నెండు రోజుల కార్యక్రమాలు అన్నీ అయిపోయాక, అమ్మ ఎంతో గౌరవించే రామాలయం పూజారిగారి ముందు నా ప్రశ్నను ఉంచాను.
“ఏమీ లేదు నాయనా! మీ అమ్మ నిష్కామకర్మురాలు. ఏ రోజూ ఎవరికీ సహాయం చేశానని అనుకోలేదు. అది తన బాధ్యత కాబట్టే, ఇతరులకు సాయం చేయడానికి భగవంతుడు తనకా అవకాశం ఇచ్చాడు అనుకునేది. ఇంకా కాకపోతే ఏ జన్మలో వారికి రుణపడి ఉన్నానో? ఈ రకంగా వాళ్లకి సాయం చేసి ఆ రుణం యిప్పుడు తీర్చుకుంటున్నాను, అనుకునేదే తప్ప, తనేదో వాళ్లకు ఉపకారం చేశానని ఏ రోజూ అనుకోలేదు. ఎవరికి ఏ పనిచేసినా, అది భగవంతునికి చేశాను అనుకునే చేసేది. దేవుడు తనకా శక్తి ఇచ్చాడు, కాబట్టి చేయగలిగానని భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకునేది మీ అమ్మ. అందుకని ఆమెకు ఎవరూ రుణపడి లేరు. అందుకే మీ అమ్మ చాలా సులువుగా ఈ భవబంధాలను తెంచుకుని వెళ్ళిపోగలిగింది.”
“ఇంకొకరికి చేసాము, చేసాము అనుకుంటే, వాళ్లు మన రుణం తీర్చుకునే దాకా మనమిక్కడ బాధలు పడాలి. ఎవరికీ మనమేమీ చెయ్యలేదనుకుంటే, మనకు ఎవరి రుణమూ ఉండదు. నాటకంలో తమ పాత్ర అయిపోగానే నిష్క్రమించిన పాత్రధారిలా, ఆమెకు ఈ లోకంలో భగవంతుడు చెప్పిన పని చేసి, ఈ లోకం నుండి నిష్క్రమించింది. ఆమె నిష్కామకర్మురాలు. ఇలాంటి మరణం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని రాదు. మీ అమ్మ అదృష్టవంతురాలు నాయనా! అదీ విషయం” అని చాలా తేలిగ్గా తేల్చి చెప్పేశారు పూజారిగారు.
ఆయన చెప్పిన మాటలు విన్నాక నా అనుమానం తీరిపోయింది. అమ్మ ఎప్పుడూ చెప్పే నిష్కామకర్మ అంటే ఏమిటో యిప్పుడు నాకు అర్థమైంది. “మనం ఎవరి రుణమూ ఉంచుకోకూడదు నాయనా! అనేది అమ్మ. మనకు సాయం చేసిన వాళ్ళను మర్చిపోకుండా, వాళ్లు మనకు చేసిన సహాయం మనమెప్పుడూ మర్చిపోకుండా కృతజ్ఞులమై ఉండాలి. మనం ఎవరికైనా చేసిన సాయం, చేసిన వెంటనే మర్చిపోవాలి. వాళ్లకు సాయం చేసాం అనే భావం మనసులో ఎప్పుడూ ఉండకూడదు. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి చేయగలిగాం అనే భావం ఉండాలి. ఇది అమ్మ చెప్పిన నిష్కామ కర్మ అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అమ్మలా ఆలోచించే శక్తిని నాకు ప్రసాదించు భగవంతుడా! అనుకుంటూ, నా భయాలేవీ నిజాలు కానందుకు మనసులోనే అమ్మకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.

You may also like

3 comments

Ramani TV June 10, 2026 - 4:36 pm

నిజమైన వివరణ👌👌

Reply
vn68win1com August 29, 2026 - 4:17 pm

Fast deposits and even faster withdrawals. This is exactly what I was looking for. Big thanks to vn68win1com for the great service.

Reply
cl44app September 26, 2026 - 8:44 am

Super impressed with the graphics and the overall feel of the app. It makes the whole experience so much more immersive. I’m sticking with cl44app.

Reply

Leave a Comment