Home ఇంట‌ర్వ్యూలు మనుషులు ధర్మనిష్ఠతో ఉన్నప్పుడు సమాజంలో చెడు ఉండదు

మనుషులు ధర్మనిష్ఠతో ఉన్నప్పుడు సమాజంలో చెడు ఉండదు

by Aruna Dhulipala

– డా. దహగాం సాంబమూర్తి

తెలుగు బోధనా పద్ధతుల శిల్పి, పాఠ్య ప్రణాళికా నిర్ణేత, ప్రసిద్ధ రచయిత డా. దహగాం సాంబమూర్తి గారితో మయూఖ ముఖాముఖి….. ధూళిపాళ అరుణ

******************************************

జ:   నేను కరీంనగర్ జిల్లాలోని మహాదేవపురం గ్రామంలో జూలై 30, 1943లో జన్మించాను. ప్రభుత్వ రికార్డులలో 1942, అక్టోబర్ 12 గా నమోదు అయింది. మా నాన్న దహగాం వీరయ్యగారు, అమ్మ వేంకట నరసమ్మ గారు. నేను ఒక్కణ్ణే సంతానం. వైదిక కుటుంబం కావడం వల్ల మా నాన్నగారు పురోహితులు. మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆయన నడిచి కానీ, బండి కట్టుకొని కానీ వెళ్లి పౌరోహిత్యం చేసేవారు. 1956 వరకు ప్రాథమిక తరగతులన్నీ అంటే ఏడవతరగతి వరకు మహాదేవపురంలోనే చదువుకున్నాను. అంతకుమించి చదువుకు ఊళ్ళో అవకాశాలు లేవు. మా అమ్మగారికి నేను కూడా పౌరోహిత్యం చేయాల్సి వస్తుందేమోనన్న భయం ఉండింది. మా నానమ్మ ఇక చదువు ఆపి వేయించమని చెప్పినా అమ్మ వినకుండా నాన్నకు నచ్చచెప్పి మా ఊరికి దగ్గరలో ఉన్న చెన్నూరులో ఎనిమిదవ తరగతిలో చేర్పించింది. అప్పటికే నాకు ఉపనయనం అయింది. మంథని ఊరు కూడా మాకు దగ్గరే అయినప్పటికీ చెన్నూరులో తెలిసినవాళ్ళు కూడా ఉండడం వల్ల అక్కడ చేర్పించారు. పదవతరగతి వరకు అక్కడే చదివాను. ఆ కాలంలో అది 11వ తరగతి. దహగాం లక్ష్మీపతి, దేవరాజు సాంబమూర్తి, మహంకాళి దత్తాత్రేయ రావు, మురళీధరరావు గారలు మాకు ఉపాధ్యాయులు. ఎన్. అప్పారావు గారు మాకు ప్రధానోపాధ్యాయులు. లండన్ నుండి చదువుకొని వచ్చిన విద్యాధికుడు. ఆయన భార్య కూడా టీచరే. వాళ్లు వానమామలై వరదాచార్యులు గారింట్లో కిరాయికి ఉండేవారు. ఇతర గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులను దత్తత తీసుకొని వారికి ఇబ్బందిగా ఉండే సబ్జెక్టులలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. సాయంత్రం వాళ్ళింట్లో మాథ్స్ ఇంగ్లీష్ చెప్పేవారు. మేము వెళ్లి చదువుకునేవాళ్ళం. అట్లా రెండేళ్లు వరదాచార్యుల గారింట్లో తిరిగే అవకాశం కలిగింది.

        రతన్ బుక్ స్టోర్స్ అని పుస్తకాల షాప్ ఉండేది. విరామ సమయమంతా అక్కడే గడిపేవాడిని. 1956 లోనే అక్కడ ఎన్నో పుస్తకాలు చదివాను. భారతి, స్వతంత్ర, బ్లిట్స్ ఇతర దిన, వారపత్రికలు చదివేవాడిని.

పదవతరగతి పరీక్షలకు మాకు సెంటర్ వరంగల్. వెళ్తున్న సమయంలో రైల్వే స్టేషన్లో నేను కుక్క కాటుకు గురయ్యాను. ఇంజక్షన్లు తీసుకుంటూనే పరీక్షలు రాశాను. సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణుడినయ్యాను. తరువాత చదువు ఎక్కడ? అన్నది ప్రశ్న. మా నాన్నగారికి నేను ఇంకా చదువుకోవడం ఇష్టం లేదు. తిరిగి మా అమ్మ బలవంతంపై నాన్నగారు ఒప్పుకోవడంతో వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో పి.యు.సి లో చేరాను.

జ:      పి.యు.సి. లో నాది సైన్స్ సబ్జెక్ట్. వాసుదేవ్ గారు సైన్స్ చెప్పేవారు. ఇరివెంటి కృష్ణమూర్తి, వేటూరి ఆనందమూర్తి, జి.వి సుబ్రహ్మణ్యం మూర్తి గారలు తెలుగు బోధించేవారు. దాంతో తెలుగు సాహిత్యంపై ఆసక్తి పెరిగింది. మొత్తం విద్యార్థుల్లో 13 మందిమి మాత్రమే పాసయ్యాం. మా నాన్న పౌరోహిత్యం చేయడానికి ఊరికి తిరిగి వచ్చేయమన్నారు. నాకు ఎమ్.బి.బి.ఎస్ చేయాలని ఉండేది. ఆ కాలంలో 5, 6 వేల రూపాయలు పెడితే సరిపోయేది. కానీ అది కూడా పెట్టలేనంత పేద కుటుంబం. అందువల్ల డిగ్రీ చేయాలనుకున్నాను. పౌరోహిత్యం ఇష్టం లేక ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో పేరు నమోదు చేసుకున్నాను. 1960లో “నేషనల్ సాంపిల్ సర్వే” హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. నేను వెళ్లలేదు. సెప్టెంబర్ 9, 1960 న మా ఊరి దగ్గరి పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరిపోయాను. సిద్దిపేటలో పనిచేస్తున్న మా చినమామ ఎస్. విశ్వనాథం గారి ప్రోత్సాహంతో అప్లై చేశాను. రెండు సంవత్సరాలు బి.ఎ పరీక్షలు సిద్దిపేటలో రాశాను. ఫైనల్ ఇయర్ లో సెంటర్  వరంగల్లులో వచ్చింది. పరీక్షలు సరిగా రాయలేదు.  1964లో బొటాబొటి మార్కులతో పాసయ్యాను. ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే వివాహం అయింది.

       బి ఎడ్ చేయడానికి నా సర్వీసు, బి.ఎ లో వచ్చిన మార్కులు కలిపి సీటు ఇచ్చారు. 1967లో బి ఎడ్ పూర్తి చేశాను. డిస్టన్స్ లో తెలుగులో పిజి చేయాలని నిర్ణయించుకున్నాను. మొదటి సంవత్సరం 1968లో 68 శాతం మార్కులతో పాసయ్యాను. రెండవ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ సమయంలో నేను దామరకుంటలో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాను. నెలరోజులు సెలవు పెట్టి పరీక్షలు రాయడానికి వచ్చాను. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం వల్ల ఎమ్.ఏ. పరీక్షలు వాయిదా పడుతూ వెళ్లాయి. ఆ సమయంలో బిరుదురాజు రామరాజు గారి అనుమతితో హన్మకొండలో పిజి తరగతులకు హాజరయ్యాను. కోవెల సుప్రసన్నగారు వసుచరిత్ర కావ్యం చెప్పారు. మాదిరాజు రంగారావు గారు ఆధునిక సాహిత్యం, కేతవరపు రామకోటిశాస్త్రి గారు వ్యాకరణం,రామరాజు చరిత్ర, సంస్కృతి చెప్పారు. వీరి బోధన నన్ను ప్రభావితం చేసింది. 74 శాతం మార్కులతో యూనివర్సిటీలో 3వ ర్యాంక్ వచ్చింది.

         మా మామయ్య విశ్వనాథం గారు అప్పటికే పూణే విశ్వవిద్యాలయంలో ఎమ్.ఇడి చేశారు. మిత్రుల ప్రోత్సాహంతో నా మరో మిత్రుడు చందుపట్ల జనార్దన్ రెడ్డితో కలిసి ఎమ్ ఇడి లో చేరాను. రెండేళ్లు కష్టపడి యూనివర్సిటీ 1st వచ్చాను. ఇప్పటికీ నేను చదివిన పూణే కాలేజీ “ఆదర్శకాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్” ప్రకటన బల్లలో ఎమ్.ఎడ్ విభాగంలో నా పేరు ముందు First Class అని రాసి ఉంటుంది. ఆ కళాశాలలో M.Ed లో మొదటి ఫస్ట్ క్లాస్ నాదే.

జ:    అది ఏదో పెద్ద కారణమని కాదు. ఆసక్తి అంతే! ఉద్యోగ ప్రస్థానంలో అనేక చోట్లకు వెళుతూ వివిధ పదవులు నిర్వర్తిస్తున్న సమయంలో 1988లో నా సహచరులైన అధ్యాపకుల ప్రోత్సాహంతో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో వయోజన విద్యా క్షేత్రంలో విద్యా విభాగాధ్యక్షులు ఆచార్య మల్లారెడ్డి అనుమతితో  పి.హెచ్.డి చేశాను. నాకు పరిశోధనకు పర్యవేక్షకులుగా ఆచార్య మల్లాది శ్రీరామమూర్తి గారు వ్యవహరించారు. నేను అంతకుముందు అడల్ట్ ఎడ్యుకేషన్ క్లాసెస్ చెప్పాను. ఒకరోజు “వయోజన విద్య సమాజాభివృద్ధి” అనే అంశం గురించి క్లాసులో పాఠం చెబుతున్నప్పుడు ఒక విద్యార్థి డా. ఎమ్. ఎన్ శ్రీనివాస్ గారి పుస్తకంలో ఎన్నో వివరాలున్నాయని చెప్పడంతో ఆ పుస్తకం తెప్పించుకొని చదివి, విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందించాను. వయోజన విద్య పట్ల ఆసక్తితోనే వయోజన విద్యపై పి హెచ్ డి చేశాను. “అనుస్యుత విద్య” అనే పుస్తకం కూడా రాశాను. మెడిసిన్ చదివి డాక్టర్ కావాలనుకున్న కోరిక నెరవేరకపోయినా ఈ విధంగా డాక్టరేట్ పొందాను  (నవ్వుతూ).

జ:    నేను అనేక చోట్ల ఉద్యోగం చేయాల్సి రావడం వల్ల ఎన్నో అనుభవాలు ప్రోది చేసుకున్నాను. మొదటగా “నేషనల్ సాంపిల్ సర్వే”లో జాబ్ వచ్చాక హైదరాబాద్ కు వెళ్లలేను కాబట్టి టీచరు ఉద్యోగం చేయాలనుకున్నాను. దానికోసం ట్రైనింగ్ చేయాలి. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చిత్రంగా మాకు హైస్కూల్లో హెడ్ మాస్టర్ గా ఉన్న అప్పారావు గారే కరీంనగర్ జిల్లా విద్యాధికారి. ఆయన నన్ను చూసి పి.యు.సి చేసిన నీకు ఈ ట్రైనింగ్  అవసరం లేదు. నువ్వు వస్తే కరీంనగర్ లో నీకు ఉద్యోగం ఇస్తానన్నారు. ఆయన అట్లా అనడానికి కారణం ఉంది. టీచర్ ట్రైనింగ్ పదవతరగతి వారికే ఇస్తారు. నేను పి.యు.సి చదివాను కదా! ఆయన దగ్గరికి వెళితే పోస్టింగు ఇచ్చారు. మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామంలో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలో చేరాను. మూడు నెలలు అయినా జీతం ఇవ్వలేదు. ఆరోజుల్లో టైం చూడడానికి గడియారాలు లేవు. ఇంటి పైకప్పు నీడలను చూసి స్కూల్ ప్రారంభించడం, వదిలేయడం జరిగేది. ఒకరోజు మబ్బులు కమ్ముకొని ఉండడం వల్ల టైం తెలియక మూడున్నరకే పిల్లలను పంపించి స్కూల్ మూసేసి, వెళ్తుంటే దారిలో డిప్యూటీ ఐ.ఓ.ఎస్ నారాయణ రావుగారు పాఠశాల పర్యవేక్షణకు వస్తూ కనిపించారు. నిజాయితీగా విషయం చెప్పాను. సెంట్రల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులను నా పని గురించి తెలుసుకొని నాలుగు నెలల తర్వాత జీతభత్యాలు ఇచ్చారు.

      మా ఊరి హైస్కూల్లో గ్రాడ్యుయేట్ టీచర్లు లేకపోవడం వల్ల నేను బి.ఏ చేసిన తరువాత ప్రమోషన్ తో అక్కడ చేరాను. టీచర్లకు లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు స్టాఫ్ రూమ్ లో అనవసర విషయాలు చర్చించకూడదని, ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలనే నిబంధన ఉండేది. హెడ్ మాస్టర్ కూడా ఖాళీ సమయంలో స్టాఫ్ రూమ్ కి వచ్చి కూర్చునేవారు. తరువాత దామరకుంట హైస్కూల్లో హెడ్ మాస్టర్ గా నియమించబడ్డాను. తరువాత ప్రభుత్వం నన్ను డిప్యుటేషన్ మీద కన్నడ భాష డిప్లొమా కోర్సు కొరకు మైసూరుకు పంపింది.

      ఎమ్. ఏ, ఎమ్.ఇడి లు  ప్రథమ శ్రేణిలో పాసయ్యాక మా స్నేహితుడు వేంకటరాములు గారితో కలిసి హైదరాబాద్ కు వెళ్లి పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయంలో పదోన్నతి కొరకు వినతి పత్రం ఇచ్చాను. నాకున్న అర్హతల కారణంగా వరంగల్ బిఎడ్ కాలేజీలో లెక్చరర్ గా నియమించారు. ఆ తరువాత కాకతీయ విశ్వవిద్యాలయంలో గెస్ట్ లెక్చరర్ గా కొంతకాలం చేశాను. “ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు” కొరకు నన్ను ఇంగ్లండ్ కు పంపారు. మూడు నెలలు అక్కడ పని చేశాను. వచ్చిన తరువాత 1995లో డిప్యూటీ డి.ఇ.ఓ గా హుజురాబాద్ కు వెళ్ళాను. అదృష్టవశాత్తూ డి.ఇ.ఓ నా ఫ్రెండ్. ఒక సవాలుగా తీసుకొని హుస్నాబాద్ నుండి ఒక విద్యార్థికి పదవతరగతిలో మూడో ర్యాంకు తెప్పించాను.

సాంబమూర్తిగారితో అరుణ ధూళిపాళ

     ప్రభుత్వం తిరిగి వరంగల్ బి ఇ డి కాలేజీలో లెక్చరర్ గా నియమించింది. పాఠ్యపుస్తకాల వాచకాల నిర్మాణంలో రచయితగా, సంపాదకునిగా చేసే అవకాశం కూడా లభించింది. తరువాత పదోన్నతి కల్పించి జిల్లా విద్యా శాఖాధికారిగా భద్రాచలానికి పంపింది. కొంతకాలం తర్వాత నాకు ఆ పదవి వద్దని, డి.ఇ. ఓ గా రిటైర్ అవడం నాకిష్టం లేదని, నన్ను బోధన విధుల్లోకి పంపుమని విద్యాశాఖను అభ్యర్థించగా మళ్లీ వరంగల్ బిఎడ్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పంపారు. పదవీ విరమణ అనంతరం కూడా కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో ఆచార్యునిగా, బ్రౌన్స్ విద్యా కళాశాల ఖమ్మంలో ప్రిన్సిపాల్ గా, గుంటూరు జిల్లాలోని కనగాలలో HKMS విద్యా కళాశాల ప్రిన్సిపాల్ గా చేశాను. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే చదువుకోవడం ఉన్నత విద్యార్హతలు సాధించడం, అదే సమయంలో రకరకాల పదోన్నతులు పొండడం, మరో వైపు కుటుంబ బాధ్యతలు. ఈ విషయంలో నా శ్రీమతి పూర్తి సహకారాన్ని అందించింది. మా నలుగురు పిల్లలు ఇప్పుడు ఉన్నతస్థానాలలో ఉన్నారు.

జ:   1998 అక్టోబర్ లో ప్రభుత్వం నాకు ప్రమోషన్ ఇచ్చింది. గిరిజన ప్రాంతాలలో జిల్లా విద్యాశాఖాధికారిగా ఉంటే అక్కడ ప్రభుత్వపరంగా మార్పులు చేయడానికి, విద్యాపరంగా వాళ్ళల్లో అభివృద్ధి తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో భద్రాచలం  వెళ్ళాను. ITDA (Integrated  Tribal Development Agency) లో నియమించారు. ఆ సమయంలో అక్కడ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ఐఏఎస్, ఖమ్మం జిల్లా కలెక్టర్ గిరిధర్ గారలున్నారు. వారి సహకారంతో భద్రాచలంలో పట్టభద్రులైన గిరిజన విద్యార్థుల కొరకు సి ఎం దాకా వెళ్లి మొత్తానికి NCTE (National  Council for Teachers Education) వారి అనుమతితో దేశంలోనే మొట్టమొదట బి ఐ డి కాలేజీ ఏర్పాటుచేశాం. కాకతీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఘంటా రమేష్ గారు కూడా సహకరించారు. తర్వాత కొన్నాళ్ళకు నాకు ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారిగా స్థానచలనం కలిగింది. అప్పుడు భద్రాచలం బి ఐ డి కాలేజీకి ప్రిన్సిపాల్ గా అదనపు బాధ్యతలు నిర్వహించాను. ఆ తరువాత హన్మకొండ కాలేజీలో ప్రిన్సిపాల్ గా చేరినా మరో సంవత్సరం కూడా గిరిజన బిఎడ్ కాలేజీలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాను. కొండరెడ్లు అని గుట్టల మీద పిల్లలు ఉండేవారు. వాళ్లు అసలు కిందికి దిగరు. కేవలం సంత ఉన్నప్పుడు మాత్రమే వచ్చి వాళ్లకు కావల్సిన సరుకులు తీసుకొని పైకి వెళ్లి పోయేవారు. అక్కడ పిల్లలకు చదువు నేర్పించడం కోసం పాఠశాలలు పెట్టాలనుకున్నాం. ముందుగా ఇద్దరు టీచర్లను నియమించాం. నెలలో చెరి పదిహేనురోజులు వాళ్లు గుట్టమీదే ఉండాలి. అక్కడే ఉంటూ వాళ్లకు పాఠాలు చెప్పాలి. ఇప్పటికీ ఆ స్కూళ్లల్లో ఒకటి రెండు నడుస్తున్నాయి. అలా చదువును కొనసాగించి, డిగ్రీలు చేసి ఉద్యోగాలు చేస్తున్నవారూ ఉన్నారు. అట్లా నేను కొంత వాళ్లకు ఉపయోగపడ్డానన్న సంతృప్తి ఉంది. ఇక మీరడిగినట్లు నేను ఉద్యోగ విరమణ సమయంలో డి.ఇ.ఓ గా ఉండొద్దనుకోవడానికి కారణం ఏమిటంటే ఆ రోజుల్లో డి.ఇ.ఓ లు డబ్బుకోసం పనిచేస్తారన్న భావం ఉండేది. అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నవారూ ఉన్నారు. అందువల్ల నాకు అట్లా కాకుండా బోధన విధుల్లో ఉంటూ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొని విద్యాశాఖ డైరెక్టర్ ని కోరడం వాళ్లు దాన్ని మన్నించి హన్మకొండకు ప్రిన్సిపాల్ గా పంపడం జరిగాయి.

జ:   నేను స్కూల్లో చదువుతున్నప్పుడు 6వ తరగతిలో తెలుగు చెప్పే మాష్టారు రాఘవరాజు గారు. అప్పుడు మాకు కరుణశ్రీ పద్యాలు ఉండేవి. ఆయన బోధనలో అప్పుడే తెలుగు సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడింది. చెన్నూరులో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఐచ్ఛికంగా సంస్కృతం తీసుకోవడం వల్ల  భాష పట్ల అభిరుచి ఏర్పడి, పుస్తకాల అధ్యయనాసక్తి కలిగింది. నిత్య జీవితంలో ఒక భాగంగా పుస్తకాలు కొనడం అలవాటయింది. పి.యు.సి లో ఇరివెంటి కృష్ణమూర్తి గారు, జి.వి సుబ్రహ్మణ్యం గారు, వేటూరి ఆనందమూర్తి గారల ప్రభావం నా మీద ఎంతైనా ఉంది. బి.ఏ లో తెలుగు ఐచ్ఛికం కావడం వల్ల క్రమంగా సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. ఎమ్.ఏ చేస్తున్నప్పుడు సుప్రసన్నగారి వంటి సాహితీ మూర్తుల వల్ల ఎంతో నేర్చుకున్నాను. మహాభారత, భాగవత, రామాయణాది ఇతిహాసాల నుండి మొదలుకొని ఆధునిక కవిత్వం వరకు అనేక పుస్తకాలు చదివాను. బి ఎడ్ కాలేజీలో చేరిన తర్వాత ఎప్పటికప్పుడు టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం, పాఠ్య ప్రణాళికలు రూపొందించడం వీటితో సాహిత్యాన్ని కొంతవరకు మర్చిపోయాననే చెప్పాలి. కానీ రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా నా దృష్టిని సాహిత్యం వైపు మళ్లించాను. ఈ విషయంలో ఎంతోమంది మిత్రులు నాకు సహకరిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు.

జ:    1995లో రాష్ట్ర ప్రభుత్వం వారు నన్ను విద్యా ప్రణాళికా నిర్మాణ సంఘంలో సభ్యత్వం – వాచకాల నిర్మాణంలో ఒక సభ్యునిగా నియమించారు. ఆనాడు పాఠ్య పుస్తకాల అధికారిగా ఉన్న డా. ఐ. వి రాధా కృష్ణమూర్తి గారి ప్రోత్సాహం ఎంతో ఉంది. పాఠ్య రచయితగాను, పాఠ్య పుస్తకాల సంపాదకవర్గంలోను పనిచేశాను. కె. విశ్వనాథరెడ్డి గారు, రంగనాథాచార్యులు గారు, అంతటి నరసింహం గారు, గంగప్ప గారు, కోడూరు శ్రీరామమూర్తి గారు వంటి వారు బోర్డులో సభ్యులుగా ఉన్నారు. బి ఇడి కాలేజీ నుండి నేను నియమించబడ్డాను. ఎన్నో సమావేశాలు జరిగేవి. సమావేశంలో చర్చించిన అంశాలను నేను నోట్స్ రాసి ఫైల్ ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. డి. చంద్రశేఖర రెడ్డి గారు, నేను ఎడిటింగ్ వర్క్ చూసేవాళ్లం. అప్పుడు నాల్గవ తరగతి పుస్తకం మొత్తాన్ని తయారుచేసే బాధ్యతను నాకప్పగించారు. 10వ తరగతి పాఠ్యాంశాల తయారీలోనూ నేను పాలు పంచుకున్నాను. ఆ సమయంలో 10వ తరగతి ఉపవాచకంగా బారిస్టర్ పార్వతీశాన్ని ఎంపిక చేశాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సార్వత్రిక విద్య, ఇంటర్మీడియట్ వాచకాల సంపాదకత్వం కూడా చేశాను.

జ:   ఉపాధ్యాయ విద్యా క్షేత్రంలో తెలియాల్సిన విషయాలను గురించి తెలపడానికి నేను చదివిన అనేక గ్రంథాల పరిజ్ఞానంతో వయోజన విద్య నిరంతర విద్య, బి ఎడ్, డి ఎడ్ వాళ్లకు తెలుగు బోధన పద్ధతులు తయారుచేశాను. ఉన్నత తరగతి స్థాయి విద్యార్థుల కోసం నేను రాసిన ‘వ్యాస మంజూష’ సినారె గారి ముందుమాటతోనూ ‘వ్యాకరణ మంజూష’ రవ్వా శ్రీహరి గారి ముందుమాటతో వెలువడ్డాయి. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ కింద సెమినార్లు పెట్టడం, నిర్వహించడం, మాట్లాడడం చేసేవాడిని. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ వరంగల్ ఈ ఐదు జిల్లాల్లో ప్రతీ సంవత్సరం ఒకటి రెండు ప్రోగ్రామ్స్ అయినా నిర్వహించాల్సి ఉంటుంది. వాళ్లు రావడం కానీ మేము వెళ్లడం కానీ జరిగేది. ఒకసారి అయిదు రోజుల కార్యక్రమం జరిగింది. నేను తెలుగు బోధన మీద మాట్లాడుతున్నప్పుడు విని, అంతకుముందు నేను పాఠశాలను ముందుగా వదిలినప్పుడు ప్రశ్నించిన నారాయణ రావు గారు “బాగా ఎదిగావు” అన్నారు. నేను మాట్లాడిన దానికి స్పందిస్తూ ఆనంద కిశోర్ గారు నన్ను ప్రశంసించడమే కాక, లక్సెట్టి పేటలో మూడు రోజులు టీచర్స్ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ పెట్టించి, నా ఉపన్యాసాలు ఏర్పాటుచేశారు.

జ:   1974లో నేను దామరకుంట పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్న సమయంలో ప్రభుత్వం నన్ను కనడ భాష నేర్చుకోవడానికి డిప్లొమా కోర్స్ కొరకు డిప్యుటేషన్ మీద మైసూరుకు పంపింది. అప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్ క్రింద ఒక భాష వచ్చిన వాళ్లకు మరో భాష నేర్చుకోవాలనే నియమం ఉండేది. “సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్” (కేంద్రీయ భాషల సంస్థానం) వారు పంజాబ్, పూణే, భువనేశ్వర్, మైసూర్ ఈ నాలుగు ప్రాంతాల్లో నాలుగు బ్రాంచిల చొప్పున మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఆఫీస్ మైసూరులో ఉండేది. పట్నాయక్ గారు దానికి హెడ్. తెలుగు దగ్గరగా ఉంటుందని నేను కనడాను ఎంపిక చేసుకున్నాను. అందులో డిష్టింక్షన్ వచ్చింది. అదే సమయంలో నేను సినారె, కుందుర్తి గారి వంటి వారి రచనలను చదివాను. కొన్నిటిని తెలుగులోకి అనువాదం చేశాను. కన్నడంలోని కొన్ని రచనలను తెలుగులోకి అనువాదం చేశాను. అక్కడ పత్రికల్లో కొన్ని అనువాదాలు వచ్చాయి. కాకపోతే దురదృష్టవశాత్తు ఇప్పుడవేవీ నావద్ద లేవు. ఇప్పుడు చేసే ఓపిక కూడా లేదు. కన్నడంలో ఉన్న గొప్ప కవుల రచనలు కూడా అధ్యయనం చేశాను. ఉపాధ్యాయ క్షేత్రంలో నాకు తెలిసిన, అధ్యయనం చేసిన అంశాలు, విషయాలను పదిమందితో పంచుకోవడానికి రచనలు చేశాను.

జ:  మా మిత్రుడు డి. చంద్రశేఖర రెడ్డి కర్ణాటక పుస్తకాలకు ఎడిటర్ గా వెళ్లాడు. బోధనా శాస్త్రంలో ఆయనకు పరిపూర్ణ అవగాహన లేదు. నేను అంతకుముందే మీకు చెప్పినట్లు కనడా భాషలో డిప్లమా చేయడం, అనువాదాలు చేస్తుండడం వీటివల్ల ఆ రాష్ట్రంలో డి ఎడ్ వాళ్లకు కనడ బోధన పద్ధతులు రాసేందుకు నా పేరు సిఫారసు చేశాడు. అందువల్ల అటువంటి అవకాశం నాకు కల్గింది. నేను విద్యార్థులకు కనడ భాష బోధించాను కూడా.

జ:   సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు రాసి పత్రికలకు పంపే అలవాటు ఉండేది. అట్లా రాసిన వ్యాసాలను పుస్తకంగా వేద్దామనే ఆలోచనతో వాటిని భాషాశాస్త్రం, సాహిత్యం, విద్య అనే మూడు భాగాలుగా విభజించాను. దీనికి గిరిజా మనోహరబాబు గారి ప్రోత్సాహం ఎంతైనా ఉంది. ఆయన సూచన మేరకే ‘అక్షరత్రివేణి’ అని పేరు పెట్టాను. దాదాపు 600 పేజీల పుస్తకమది.

జ:   1965లో నా రచనా ప్రస్థానం ప్రారంభం అయినప్పటి నుండీ ఇప్పటికి సుమారు 25 పుస్తకాలు వెలువడ్డాయి. ఎడ్యుకేషన్ కు సంబంధించిన విషయంలో మహనీయుల చెప్పిన సూక్తులను తెలుగువే కాకుండా సంస్కృతం నుండి తీసుకున్నవి, ఇంగ్లీష్ నుండి తీసుకొని తెలుగులోకి అనువాదం చేసినవి కొన్ని ఇట్లా అన్నీ కలిపి 5వేల సూక్తులను “మహనీయుల మహితోక్తులు” అనే పేరుతో వేశాను. ‘మూర్తి మాట’ అనే మకుటంతో చిన్న పద్యాలతో ‘మూర్తిమాట శతకం’,విద్యార్థుల కోసం వ్యాకరణ, వ్యాస మంజూషలే కాక విద్యా సాంకేతిక పరిజ్ఞానం, తెలుగు భాషా సాహిత్య దర్పణం మొదలగునవి వెలువడ్డాయి. నేను రాసిన “తెలుగు బోధన పద్ధతులు” దాదాపు 18 సార్లు ప్రచురితమైంది. తెలుగు అకాడమీకి వానమామలై వరదాచార్యులు, తెలుగునాట విద్యా వ్యవస్థ, భాషావిద్య వంటి మోనోగ్రాఫులు రాశాను. తెలుగు అకాడమీ డైరెక్టర్ గా యాదగిరి గారు ఉన్నప్పుడు నా చేత చట్టాలను తెలుగులోకి చేయించారు. మా మిత్రుడు దేవరాజు రాంభావు గారు. ఆయన వరదాచార్యుల వారికి ప్రత్యక్ష శిష్యుడు. చిన్నప్పటి నుండే పద్యాలు రాసి “బాలకవి’ అనిపించుకున్నాడు. ఆయన పద్యాలుచాలా ప్రౌఢంగా ఉండేవి. వరదాచార్యుల వారే మళ్లీ పద్యం రాస్తున్నాడా అనిపించేది. ఆయన కూడా నన్ను ప్రోత్సహించేవాడు. ఆయన రాసిన ‘భరతోదయం’ పద్య కావ్యానికి 42 పేజీల సమీక్ష రాశాను. పద్మాకర్ అని మరో శిష్యుడు సౌందర్యలహరి, శివానంద లహరులను పద్యరూపంలో రాశాడు. ఇప్పుడు శివమహిమ్నా స్తోత్రానికి చేస్తున్నాడు. శివానందలహరికి ముందుమాట రాశాను. ప్రముఖ కథారచయిత్రి, నవలా రచయిత్రి తెన్నేటి హేమలత గారి భర్త తెన్నేటి వేంకట సుబ్బారావు గారు. నేను తరచుగా ఆయనను కలుసుకునే వాడిని. ఏవైనా పనులతో వెళ్లలేకపోతే కబురు పంపేవారు. హిందీ టీచరు అయినా ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులలో దిట్ట. గణితంలో ఒక Theorem ని కనుక్కున్నారు.

ప్రైమరీ హైస్కూల్ విద్యార్థుల కోసం బాలగేయాలు రాశారు. ఆ పుస్తకాలకు నాతో ముందుమాట రాయించారు. “బతికున్నాం కదా రాయాలి” అనేవారు.


సాంబమూర్తి దంపతులతో అరుణ ధూళిపాళ

వినికిడి సమస్య ఉన్నా రాస్తూనే ఉండేవారు. అది నాకు ఎంతో స్ఫూర్తి దాయకం. పుస్తకాలతో పాటు ఎన్నో సమీక్షా వ్యాసాలు కూడా రాశాను. వచనకవిత్వం పట్ల ఆసక్తి కొంత తక్కువే అయినప్పటికీ వి.ఆర్. విద్యార్థి గారి కోరిక మేరకు ఆయన అశీతి అభినందన సంచిక కోసం ఆయన కవిత్వమంతా చదివి సుదీర్ఘ వ్యాసం రాస్తే బాగున్నదని సంచికలో దాన్నే మొదటగా వేశారు (నవ్వుతూ). డా. గుంజి వెంకటరత్నం గారి విజ్ఞాన సర్వస్వాలు చదివి అభిప్రాయం రాశాను. వరుసగా ఇట్లా పుస్తకాలు రాస్తున్న సమయంలోనే సతీ సమేతంగా దేశమంతటా పర్యటించి అనేక యాత్రలు చేశాను.

జ:   మీరన్నమాట వాస్తవమే. సహజంగా అభినందన సంచిక ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ రాసే వ్యాసాల సంపుటి. నాకెందుకో నా గురించిన విషయాలు కాకుండా భారతీయ తత్త్వాన్ని గురించిన వ్యాసాలు వేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ ఆధ్యాత్మిక వ్యాస సంకలన ఆలోచనకు మిత్రులు గిరిజామనోహర్ గారు, పాలకుర్తి రామమూర్తి గారు,  కుందావజ్ఝల కృష్ణమూర్తి గారు, డా. యన్.వి.యన్. చారి గారు ఎంతో ప్రోత్సహించారు. సాహితీమూర్తులు, ఆధ్యాత్మిక వేత్తలు

సహృదయంగా తమ అమూల్యమైన వ్యాసావళులు అందించారు. ముందు 60 వ్యాసాలు వేద్దామనుకుంటే 90 వ్యాసాలు అయ్యాయి. వ్యాసాల చివర నా జీవన ప్రస్థానాన్ని సంగ్రహంగా తెలిపాను. ఆ విధంగా ‘భారతీయ చింతన’ రూపుదిద్దుకుంది. సహృదయ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ” ఆధ్వర్యంలో ఈ సంచిక ఆవిష్కృతమైంది. నాలో ఉన్న ఆధ్యాత్మిక భావనా పరంపరలకు ఒక రూపాన్ని కల్పించడం కోసం కూడా చేసిన ప్రయత్నమే ఈ అభినందన సంచిక.

జ:    అవునమ్మా! నాకు చిన్ననాటినుండే ఆధ్యాత్మిక చింతన ఉంది. మా అమ్మ ప్రతినిత్యం ఇంట్లో భాగవత పారాయణం చేసేది. అంతేకాదు. రాక్షసుల వధ జరిగినప్పుడు ఇంట్లో కొబ్బరికాయలు కొట్టేది. మా ఇంట్లో భాగవత సప్తాహలు జరిగేవి. ఇప్పటికీ వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, భాగవతాలను పారాయణం చేస్తుంటాను. వరంగల్ లో పనిచేస్తున్నప్పుడు ముకుందం గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ఒకసారి కావ్యకంఠ గణపతిముని జీవిత చరిత్ర చదవమని ఇచ్చారు. వారి ఆధ్యాత్మిక సాధన ఆయా విషయాల అధ్యయనం మీద ఆసక్తిని కలుగజేసింది. అనేకుల పరిచయాలు, అనేక పుస్తకాల అధ్యయనం నాలో ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని మరింత పటిష్టం చేశాయి.

జ:     ఇంగ్లీషు నుండి కొన్ని అనువాదాలు చేస్తున్నాను. ‘తెలుగు బోధనా సర్వస్వం’ చేయాలని 2017లోనే నిర్ణయించుకున్నాను. నాకు సాంకేతిక విజ్ఞానం పట్ల ఎక్కువ అవగాహన లేదు. సాంకేతికానుగుణంగా బోధన చేసే విధానం గురించి ఇద్దరు ముగ్గురు మిత్రులను అడిగాను. నేను రాసిన వ్యాసాలన్నీ సుమారు 600 పేజీల వరకు టైపింగుతో సహా సిద్ధంగా ఉంది. రాసి ఇవ్వాల్సిన వాళ్లు ఆలస్యం చేయడం, ఈలోపు సాంకేతిక విజ్ఞానం అప్ డేట్ అవుతూ ఉండడం వల్ల ఆలస్యమవుతోంది. ఇదొక్కటి చేస్తే చాలు నేననుకున్నది నెరవేరుతుంది. కుందావజ్ఝల కృష్ణమూర్తి గారి ఆరవతరం తాతగారు గోపాల సూరి గారు రచించిన “శ్రీకృష్ణ జన్మఖండం” సుమారు ఏడు వేల పద్యాలతో, 16 ఆశ్వాసాల గ్రంథం. దాన్ని పుస్తకంగా తేవాలన్న ఆలోచన కలిగింది. కొన్ని పరిష్కారాలు అవసరమయ్యాయి. కంది శంకరయ్య గారు ఛందస్సు వాటికి సంబంధించిన సవరణలు చూశారు. నేను, గిరిజా మనోహర్ గారు, భాషాచారి గారు ముగ్గురం కూడా కొన్ని సవరణలు చేశాం. త్వరలో దాన్ని పుస్తకంగా తీసుకురావాలి.

జ:   ప్రస్తుతం వస్తున్న పుస్తకాలలో వాక్యరచనల్లో పట్టు లేదు. ముఖ్యంగా పుస్తకానికి రీడబిలిటీ చాలా అవసరం. పుస్తకం చదవడం మొదలుపెట్టినప్పటినుండీ ఏకబిగిన చదివించగలగాలి. అటువంటి పుస్తకాలు ఈ రోజుల్లో చాలా తక్కువగా వస్తున్నాయి. కారణం అధ్యయనలోపమే. తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో రాయడానికి పూనుకుంటున్నారు. మంచి పుస్తకాలను చదవడం వల్ల భాషాజ్ఞానం విషయజ్ఞానం పెంపొందుతాయి. అలాగని మొత్తం అటువంటివే అని  చెప్పడానికి లేదు. మంచి పుస్తకాలు రాస్తున్నవారూ ఉన్నారు.

జ:    మానవజీవితం అనుకోకుండా లభించిన అదృష్టం. మనకు ఎన్ని పరిమితులు ఉన్నా, అవి ఆర్థికమైనా, సామాజికమైనా ఇతరులకు సంతృప్తిని, సంతోషాన్ని కలిగించినట్లయితే, సమాజ అభివృద్ధికి ఏమైనా చేయగలిగితే, మంచికి దోహదం చేసినట్లయితే మనిషి జీవితం ధన్యమవుతుంది. కానీ ఈ రోజుల్లో స్వార్థం, నాకెందుకన్న ఉదాసీనత ఎక్కువయ్యాయి. భారతంలో “సారపు ధర్మమున్ … అనే పద్యంలో దక్షులెవ్వారలుపేక్ష సేసిరది వారికి చేటగున్…” అని చెప్పబడింది. లోకంలో ఎప్పుడైనా చేయదగినవారు, చేవ ఉన్నవారు నిర్లక్ష్యం చేస్తే ఆ ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మనుషులు నిజాయితీగా, ధర్మ నిష్ఠతో ఉన్నప్పుడు సమాజంలో ఎటువంటి చెడు జరగదు. ఉన్నంతలో తోచిన సహాయం చేయడం, ఉన్నదానికి సంతృప్తి చెందడం, సమస్యలను దృఢంగా ఎదుర్కోవడం వల్ల దేన్నయినా సాధించవచ్చు.

చాలా సంతోషం సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ జీవన, సాహిత్య ప్రస్థానాలను గురించి సమగ్రంగా తెలియజేసినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున అనేక ధన్యవాదాలు, నమస్సులు. సెలవు.

You may also like

Leave a Comment