Home వ్యాసాలు ఆధునిక తెలుగు కవిత్వంలో లఘు కవితా రూపాలు

ఆధునిక తెలుగు కవిత్వంలో లఘు కవితా రూపాలు

by Sabbani Laxminarayana
(హైకూలు, నానీలు, నానోలు,రెక్కలు, ఏకవాక్య కవితలు)
ఆధునిక తెలుగు కవిత్వంలో వచన కవితది అగ్రస్థానం. అది గురజాడ నుండి, శ్రీ శ్రీ నుండి, శేషేంద్ర నుండి, తిలక్ నుండి, సినారె నుండి, ఆరుద్ర నుండి, కుందూర్తి నుండి నేటి ఆధునిక కవి వరకు కాలముతో పాటు ముందుకు సాగుతూ సుసంపంనమవుతూ వచ్చింది. కాల క్రమములో నవ్యతను, నాణ్యతను, గాడతను, క్లుప్తతను సంతరించుకొని కూడా ముందుకు నడిచింది. తన రూప నిర్మాణాన్ని కూడా మార్పుచేసుకుంటూ వచ్చ్చింది. నాటి మహాభారతం పద్యంలో 18 పర్వాలైతే , నేటి ఆధునిక వచన కవిత 18 లైన్లే అన్నారు పెద్దలు. అలాంటి వచన కవిత కాల క్రమములో మినీ కవిత్వమై కూడా వర్దిల్లింది
 తెలుగు కవిత్వ సీమలో మినీకవిత్వం 1980 లలో విశిష్ట స్థానం పొంది వర్ధిల్లింది, ప్రచారం పొందుతూ ముందుకు సాగింది. 1980 లలో విజయవాడ నుండి “ యువ స్వరాలు “ అనే ఒక సంకలనం వస్తుండేది నెల నెల యువ కవుల మినీ కవితలతో. అద్దేపల్లి రామ మోహన రావు , శీరిష్ కుమార్ లాంటి పెద్దల ఆధ్వర్యములో సాంస్కృతి సమాఖ్య ద్వారా . ఆంధ్ర జ్యోతి లాంటి వార పత్రికలో ఏమ్విఎల్ ఆది గా గల కవుల మినీ కవితలు వస్తుండేవి. యువ కవి అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవి చిత్రకారుడు, చైతన్య వంతమైన మినీ కవితలు రాసి వాటికి బొమ్మలు కూడా వేసి మినీ కవితల చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలిశెట్టి ప్రభాకర్ మినీ కవితలు ‘సిటీ లైఫ్ ‘ పేరున రోజుకొక్కటి ఆంద్ర జ్యోతి దిన పత్రికలో వచ్చి విశేషంగా ప్రజాదరణ పొందినాయి. మచిలీ పట్నం నుండి డా. రావి రంగారావు గారు విశేషముగా కృషి చేసినారు మీనీ కవిత వ్యాప్తి కోసం, వారు స్వయంగా మినీ కవితపై పరిశోధన చేసి “మినీ కవిత శిల్ప సమీక్ష “ అనే పుస్తకం కూడా రాసినారు. మచిలీపట్టణం, విజయ వాడ పట్టణాలలో మినీకవితపై పలుమార్లు వర్క్ షాప్ లను ఏర్పాటు చేసి కళాశాల విద్యార్థులు ఎందరూ మినీ కవితలు రాయడానికి దోహద కారిగా నిలిచి నారు. వారు స్వయంగా ఎన్నో మినీ కవితలు రాసి సంకలనాలు వేసినారు. ఎందరో సంకలనాలు వేయడానికి తోడ్పడినారు. వారు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో తన మినీ కవితల సంకలనం పుస్తకం కూడా తెచ్చినారు. ఇక మినీ కవిత అంటే స్పష్టత, సూటిదనం,సంక్షిప్తత, సరళత, వ్యంగ్యం మినీకవితలలో కనిపించే విశిష్ట లక్షణాలు అన్నారు పెద్దలు. కవితకు శీర్షిక తప్పకుండా ఉంటున్నట్లు మినీ కవితకి కూడా ఒక శీర్షిక తప్పకుండా ఉంటుంది. మినీ కవిత ఎన్ని లైన్లలో ఉండచ్చు అంటే ఓ అయిదారు లైన్లు లేదా పది లైన్ల లోపు ఉంటె అది మినీ కవిత. శ్రీశ్రీ నుండి, కాళోజి నుంచి ఆదునిక కవుల వరకు అప్పుడప్పుడు అందరు మినీ కవితలు రాసినవారే. మచ్చుకు కొన్ని ఉదాహరణలు
 మినీ కవితల్లోంచి వివిధ కవులవి. ఆః!
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
        నిర్దాక్షిణ్యంగా వీరే… -శ్రీ శ్రీ
                             జెపి
                                   పుటుక నీది
                                    చావు నీది
                                    బతుకంతా దేశానిది .- కాళోజి
                    కరెన్సీ నోటు
                    ‘గుండెల్లో
                    కొత్తగా దిగబడే
                     కాగితపు కత్తి
                     కరెన్సీ నోటు’ -అలిశెట్టి వేట లేళ్ళను, కుందేళ్ళను పులులు వేటాడేవి
లేళ్ళను, కుందేళ్ళను,పులులను మనిషి వేటాడేవాడు నేడు లేళ్ళు లేవు, పులులు లేవు బతుకే అడవైపోయి
మనిషిని మనిషే వేటాడుతున్నాడు -సబ్బని
అమెరికా పిల్లలు
ఒక లక్ష్యంతో
వదిలిన బాణాలు
మన పిల్లలు…
అంతే…
అవి తిరిగి రావు. – డా. రావి రంగారావు పాదాల
ఇలా మినీ కవితలను చూసాక, మూడు పాదాల కవితలు , నాలుగుపాదాల కవితలు, అయిదు పాదాల కవితలు, ఆరు పాదాల కవితలు మినీ కవితల్లో కనిపిస్తాయి. ఇలా మినీ కవితల మార్గములో వాటి లక్షణాలను పుణికి పుచ్చుకొని వచ్చినవే ఈ మూడు లైన్లలో ఉన్న హైకూ, నాలుగు లైన్లలో ఉన్న నానీ, నానో, ఆరు లైన్లో ఉన్నా రెక్క మరియు ఒకే వాక్యములో ఉన్న ఏక వాక్య కవిత .
వాటి గురించి విపులంగా చూస్తే ముందుగా హైకూల గురించి
హైకులు :
హైకూ జపనీస్ కవిత ప్రక్రియ, 17 వ శతాబ్ధం నుండి జపనీస్ సాహిత్యంలో విశేష ఆదరణ పొందిన ఈ ప్రక్రియ తెలుగు కవిత్వం లోకి దిగుమతి అయింది. ఈ సాహితీ ప్రక్రియకు జపానులో ఆద్యులు- బాషో (1644-1694), యోసాబుసాన్ (1716-1784), ఇస్సా (1763-1825)- అన్న ముగ్గురు కవులు హైకూకు అపారమైన కీర్తిప్రతిష్ఠలను తీసుకువచ్చారు. హైకూలో మూడు పాదాలలో పదిహేడు ‘మాత్రలు ‘ ( సిలబుల్స్) ఉంటాయి. మొదటి పాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడో పాదంలో ఐదు చొప్పున మాత్రలు ఉంటాయి, 5-7-5 మాత్రల చొప్పున . ప్రకృతి పరిశీలనతో , జీవితానుభవాన్ని జోడిస్తూ రసానుభూతిని కలిగిస్తూ, గుణాత్మకంగా ఉంటూ ముచ్చటగా మూడు చిన్న పంక్తుల్లో వెలువడే ప్రక్రియ హైకూ.
ఇస్మాయిల్‌, గాలి నాసరరెడ్డి, పెన్నా శివరామకృష్ణ లాంటి వారు జపాన్‌ భాషలోని ఛందస్సును పాటిస్తూనే హైకులను రచించారు. గాలి నాసర రెడ్డి తొలిసారిగా హైకులను 1990లో ప్రచురించాడు. 1991లో ఇస్మాయిల్‌ ‘వానాకాలం హైకులు’ వెలువరించాడు. అనుభూతి ప్రధానంగా సాగే హైకు రచనను తరువాతి కవులు ఆకలింప చేసుకున్నారు . పెన్నా శివరామకృష్ణ గారు హైకు సంప్రదాయాన్ని పాటిస్తూ హైకులు రచించారు. ఆత్మానుభూతిని, సౌందర్యానుభూతిని కలిగించే హైకులను పెన్నా రచించి, వాటినన్నింటిని ‘రహస్య ద్వారం’ పేరిట వెలువరించాడు. తర్వాతా ‘ “చినుకుల చిత్రాలు” (2000), “సులోచనాలు” (2006) పేర్లతో మరో రెండు హైకూ సంకలనాలను కూడా పెన్నా శివరామకృష్ణ గారు వెలువరించారు. ప్రపంచ దేశాల హైకూలను తెలుగులోనికి అనువదించి “దేశదేశాల హైకూ” అనే మరో అనువాద రచనను కూడా పెన్నా శివరామకృష్ణ గారు ప్రచురించారు.. 1994లో గాలి నాసరరెడ్డి జపాన్ హైకూలను తెలుగులోకి అనువదించారు. అనకాపల్లికి చెందినా తలతోటి పృథ్వీరాజ్ ‘ ఇండియన్ హైకూ క్లబ్ ‘ ని స్థాపించి ఈ ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించి హైకూ సంకలనాలు వేస్తూ , హైకూ సంకలనాలు వేసిన వారికి అవార్డులు కూడా ప్రదానం చేశారు. .ఇంకా రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ రచించిన ‘హైకూ సారస్వతం’ పుస్తకం, .డా||అద్దేపల్లి రామమోహన్‌రావు, బి.వి.వి. ప్రసాద్, లలితానంద ప్రసాద్, వెంకటరావు, వరలక్ష్మి, సబ్బని లక్ష్మీనారాయణ, మాకినీడి సూర్యభాస్కర్‌, రామచంద్రారెడ్డి, పి.శ్రీనివాస్‌గౌడ్‌, డా||పత్తిపాక మోహన్‌,, శిఖా ఆకాష్‌, బొల్లముంత వెంకటరమణారావు, చిమ్మపూడి శ్రీరామమూర్తి, డా||భీంపల్లి శ్రీకాంత్‌,డా||శోభారాణి, దాట్ల దేవదానం రాజు, జిసనారా, పెరుగు రామకృష్ణ, డా||కె.జి.వేణు, పి.అమరజ్యోతి, పులిపాటి పరమేశ్వరి తదితరులు హైకులు రాశారు. కొందరు హైకూ సంపుటాలను uవెలువరించారు. కొన్ని హైకూలు పరిశీలిస్తే :
సమీక్షకుడు
పచ్చిపాల మీగడ
వెతికే అత్త – పెన్నా శివరామకృష్ణ.
మంచి పోలికతో, ప్రకృతి పరిసరాల పరిశీలనతో చెప్పేది హైకూ. ఇక్కడ విమర్శకుడు అనేవాడు పాల లోంచి మీగడ తీసే వాడు, ఇంకా తప్పులు వెతికే అత్త లాంటి వాడు అని అర్థం. “మూసిన కన్ను
 నాలోని లోకానికి
 రహస్యద్వారం” — పెన్నా శివరామకృష్ణ .
గొప్ప అంతర్ దృష్తి ఉంది ఈ హైకులో ఆత్మ పరిశీలన చేసుకుంటే .” వాగు ప్రవాహానికి
అన్నీ కొట్టుకపోతున్నాయి
చంద్రుడు తప్పించి “- తలతోటి పృథ్విరాజ్.
 ప్రకృతి పరిశీలన, సౌందర్యాత్మకత ఇమిడి ఉంది ఈ హైకూలో . “కాలం సిగలో
కొత్తగ పువ్వు
తెలంగానము “. – సబ్బని . ఇందులో సౌందర్య భావన ఉంది, సామాజిక అంశం కూడా ఇమిడి ఉంది. 2. నానీలు :
నాలుగు పాదాలలో ఉన్న లఘు కవితారూపం ‘నానీ. నానీల సృష్టి కర్త .డా.ఎన్.గోపి.
1997 సంవత్సరంలో ‘వార్త’పత్రికలో ఎబికే ప్రసాద్ ఎడిటర్ గా ఉన్నపుడు, గోపిగారి నానీలు సీరియల్ గా వచ్చినాయి. అవన్నీ తరువాత ‘నానీలు’ పేరిట పుస్తకరూపంలో వచ్చినాయి.
నానీలను గురించి గోపిగారి మాటలలోనే :
1.ఒకానొక మానసికస్థితిలో అలవోకగ మొదలైన నానీలు అలా ఏడాదిపాటు అలుపులేకుండా వెలువడ్డాయి
2.నానీలు చిన్నపద్యాలు,మరీచిన్నవిగాదు
3.నానీలు అతిబిగింపు,అనవసరమైన సడలింపూ లేకుండా రూపొందిన 20—25అక్షరాల విస్తీర్ణం గల చట్రం.
20అక్షరాలకి తగ్గవు,25అక్షరాలకి మించవు.
4.నానీలు అంటే నావీ నీవి వెరసి మనవి అనర్థం.
అదేవిధంగ నానీలు శతకపద్యాల్లా ముక్తకాలు. నానీలకు మినీకవితలో లా శీర్షికవుండదు. దీంతోపాటు నానీల నిర్మాణవైవిధ్యం గురించి వారే ఇలా అన్నారు
1.మొత్తం నానీ పద్యానికి నాలుగుపాదాలుంటాయి
2.రెండుపాదాలు కలసి ఒక భావాంశంగా, నాల్గుపాదాలు కలసి రెండు భావాంశాలుగ వింగడించుకోవాలి.
3.ఈ రెండు భావాంశాలు ఒకదానితో ఒకటి వైరుధ్యంగాను
సాదృశ్యంతోనూ అల్లుకోవచ్చు.రెండుభావాంశాలు సమన్వయం సాధించాలి
4.నానీలు లఘురూపమైనా కవితాప్రక్రియన్నమాట మరువరాదు.
ఈ నియమాలతో,గోపిగారు నానీలు తొలిసంపుటంలో 365 అందించారు.. నానీలకు విశేషంగా పాఠకులేర్పడ్డారు.పెద్దకవులనుంచి నవయువ కవులదాక నానీలకు ఆకర్షితులయ్యారు. నానీల గాలి తెలుగునేల అన్నిదిక్కులా విస్తరించింది. తెలంగాణ నుంచి అత్యధిక నానీలసంపుటాలు వచ్చాయి. ఒక్క కరీంనగర్ జిల్లాలోంచే 60 నుండి 70 వరకు నానీల సంపుటాలు వచ్చినాయి. బొంబాయి నుంచి అంబల్లజనార్థన్ ,సంగెవేనీ వంటివారు బొంబాయి నానీలు , వలస నానీలు అని పుస్తకాలు వేశారు.
గోపిగారు మళ్లీ మరో 365 నానీలతో రెండవసంపుటి తీసుకొచ్చినారు. ఇందులోని నానీలన్నీ ‘సుప్రభాతం’ పత్రికలో ధారావాహికంగ వచ్చాయి. అలా వారు, ‘నానీలనాన్న’గ పేరు గడించి నానీ కవులకు పీఠికల ద్వారా నిర్మాణ మర్మాలను అందిస్తూ,ముందుకు నడుస్తున్నారు.
1997 లో మొదలైన నానీల యాత్ర 2017 నాటికి రెండు దశాబ్దాల మార్గములో పయనించింది . .ఈ రెండు దశాల్దాల్లో ౩౦౦ లకు పైగా నానీల సంకలనాలు వచ్చినాయి. .మానవసంబంధాలు,ప్రకృతిచిత్రణలు, సామాజికాంశాలు, ప్రాంతీయ చైతన్యం, ప్రపంచీకరణ, జీవిత తాత్వికాంశాలు ఇలా అనేక అంశాలు నానీలలో కవిత్వీకరించబడ్డాయి. .
వేలకొలదినానీలు అన్నిపత్రికలలో వచ్చినాయి. నానీలపై విశ్లేషణాత్మక వ్యాసాలు, వ్యాస సంకలనాలు వచ్చాయి.’నానీకవులడైరక్టరీ’ వచ్చింది. ‘నానీలపై ఎంఫిల్ , పిహెచ్ డిలు జరిగాయి,జరుగుతున్నాయి. ‘నవ్యకవితారూపం నానీ వివేచన’ అనేది చింతకింది శ్రీనివాసరావు గారి ముద్రితమైన సిద్ధాంతగ్రంథం. కేంద్రప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ వారిచే 2008 జూనియర్ ఫెలోషిప్ పొందిన పరిశోధనవ్యాసం చలపాకప్రకాష్ రాసారు. అది ‘అత్యాధునిక కవితారూపప్రక్రియ నానీ’, .ఇలా నానీలు పాఠకుల,పరిశోధకుల, విమర్శకుల మన్ననల్ని అందుకున్నవి.
ఈ రెండు దశాబ్దాలకాలంలో నానీలు విస్తృతమైన సమాజచిత్రణ చేస్తూ, సమకాలీన ఉద్యమాలకి కూడా తమవంతు ఉడతా భక్తిగా సాయాన్ని అందించాయి.
“బొంబాయి నానీలు,తెలంగాణ నానీలు,మానేరు నానీలు, వలస నానీలు,, చార్మినారు
నానీలు,నల్గొండనానీలు,విశాఖనానీలు, గుంటూరు నానీలు , డిల్లీ నానీలు,హైదరాబాదు నానీలు,కడపనానీలు, కళింగ నానీలు,అమెరికా నానీలు, , న్యూజిలాండ్ నానీలు, సీమ నానీలు,నెల్లూరు నానీలు మొదలైనవన్నీ ప్రాంతీయ స్పృహతోనూ, విశేషాలతోనూ వెలువడ్డాయి. .
అదే విధంగా నానీలు ముక్తకాలు అయినప్పటికీ కొందరు కవులు , ఏక వస్తువుతో నానీలు రాసినారు, “సాహిత్య నానీలు, నానీల్లో సినారె, సునామీ నానీలు, దళిత నానీలు,నీటి నానీలు,నేతన్న నానీలు,నానీల నాన్నపై నానీలు, అనాథ నానీలు, కవిత్వ నానీలు, తెలంగాణ నానీలు
రైతు నానీలు,బడి నానీలు,బంజారా నానీలు మొదలగునవి .ఇవేగాకుండ, సబ్బని శారద – లక్ష్మీనారాయణ దంపతులు కలిసి పుస్తకం వేసిన. ” దంపతి నానీలు” ప్రత్యేకమైనవి .
ఇంకా, “,అడవి కూనలు,వెలుగు పూలు,చిటికెలు,బుడ్డ పర్కలు,నెమలీకలు, మట్టి ముత్యాలు, గులకరాళ్లు,బత్తీసలు,చిగిరింతలు, ముంజలు,పల్లెపుంతలు,చెమట చుక్కలు, పిచ్చుక గూళ్ళు, మెరికెలు,నడిచే నక్షత్రాలు,బుర్క పిట్టలు,గోరు కొయ్యలు, రైలు కిటికీలు….ఇట్లాంటి నానీల సంకలనాలు ఎన్నో వెలువడ్డాయి.
కాల క్రమములో గోపి గారి నానీలు 12 భారతీయ భాషల్లోకి అనువాదం కూడా అయ్యాయి.
ఉదాహరణకు కొన్ని నానీలు ::
నాగిశెట్టి తాతయ్యనాయుడు నానీ
“పెదవులకు
రంగుతో పనేముంది?
చిరునవ్వును
పులుముకున్నాక ! “
సబ్బనినాని “హృదయం
మేఘావృతం అయ్యింది
ఇక కవితల జల్లులు
కురుస్తయేమో “
౩. నానోలు :
‘నానోలు’ తెలుగు లఘు కవిత్వంలో ఉన్న రూపాల్లోకి సూక్ష్మమైన కవిత్వం.. నాలుగు పాదాలు, పాదానికి ఒకే ఒక్క పదం, ఆ పదం సరళమైన సమాసం లేదా సంధి అయినా సరే, ఇది ఈ ప్రక్రియ వ్యాకరణం అన్నారు నానోల రూప శిల్పి ఈగ హనుమాన్ గారు.
అనగా నాలుగు స్వతంత్రమైన పదాలతో, పాదానికొక్క పదముతో నాలుగు పాదాలలో ఇమిడి ఉండి ఒక అద్భుతమైన భావాన్ని చెప్పే సూక్ష్మాతి సూక్ష్మ కవిత నానో.
నానో అంటే భౌతిక శాస్త్ర పరిభాషలో అతి చిన్న శూక్ష్మాతి సూక్ష్మమైన కవిత. పొడవును కొలువడానికి ప్రమాణం మీటర్ గా తీసుకుంటారు, దాని తరువాత చిన్న కొలత , సె.మీ., మి.మీ., తర్వత మైక్రో మీటర్ , ఇంకా అతి చిన్న కొలతప్రమాణం నానో మీటర్ అంటే 10 (-9 ), 10 to the power of minus 9 . ఇది పొడవును కొలవడములో అతి సూక్ష్మమైన కొలత. ఈగ హన్మాన్ గారు యువ ఇంజనియర్, సైన్స్ విద్యార్ధి పైగా కవి, అతడు అలోచించి కవిత్వం ఉంది, మినీ కవిత్వం ఉంది ఇంకా సూక్క్ష్మాతి సూక్ష్మంగా అతి తక్కువ పదాలతో కవిత్వం రాయవచ్చు కదా అనే ఆలోచనతో నానో కవిత్వాన్ని సృష్టించారు. ఇది వారి మెదడుకు పుట్టిన బిడ్డ. ఎవరినో కావాలని అనుకరించి రాసింది, సృష్టించింది కాదు. నాలుగు పదాలతో నాలుగు పాదాలలో ఒక కవితకు రూపం ఇవ్వాలనే తపన లోంచి ఈ నానోలు పుట్టినాయి. నానోలు రాయడానికి అక్షర నియమాలు అని ఏమీ లేవు, శీర్షిక కూడా ఉండదు అన్నీ నానోల పేరు కిందే వస్తాయి. పదాలు విడివిడిగా ఉన్నా అంతర్లీనంగా ఒక భావ సమైక్యతను కలిగి ఉండడం అనేది నానోల లక్షణము. నానో కవిత్వానికి కూడా వస్తువు విశ్వ వ్యాప్తం కాదేది కవిత కనర్హం అన్నట్లుగా. ఇంకా ఏక వస్తువు అంశాముతో కూడా నానో సంకలనాలు వచ్చినాయి. అందుకు సబ్బని లక్ష్మీ నారాయణ “తెలంగాణ నానోలు”, “సాహిత్య నానోలు” ఉదాహరణలు.
 ఈగ హనుమాన్ గారు మొదటగా వేసిన నానోల పుస్తకం: నానోలు కవిత్వం X 10 (-9) ( Naanolu Kavithvam X 10(-9) 10 to the power of minus nine ) అనే పేరుతో 2005 వ సంవత్సరం లో వచ్చింది.
ఈగ హనుమాన్ గారు మార్గములో విశేషంగా నానోలు రాసిన వారు ఉన్నారు. ఇంటర్నెట్లో నానోల బ్లాగులు కూడా ఉన్నాయి. ఫేస్బుక్ లో నానోల గ్రూప్లు కూడా ఉన్నాయి. అత్యధికంగా న్నానోలు రాసిన కవిగా శ్రీ నూతక్కి రాఘవేందర్ రావు గారి గురించి చెప్పాలి,వారు 10,౦౦౦ వరకు నానోలు రాసినారు. బొమ్మరాతి ఎల్లయ్య గారు మంచి నానోలు రాసి పుస్తకం కూడా వేసినారు. సబ్బని లక్ష్మీనారాయణ గారు తెలంగాణ అంశముతో ‘తెలంగాణ నానోలు’( 2009), సాహిత్యకారులపై “ సాహిత్య నానోలు”( 2016), మరియు “అక్షరాణువులు” ( 2017)అనే నానోల సంకలనాలు వెలువరించారు. నానోల పై వారి కృషికి గుర్తింపుగా, 2016 వ సంవత్సరములో వారికి, “ఆంధ్ర సారస్వత సమితి” మచిలీపట్నం వారు నానోల పురస్కారం అందించినారు. గతములో బొమ్మరాతి ఎల్లయ్య గారు, నూతక్కి రాఘవేందర్ రావు గారు నానోల పురస్కారం పొంది ఉన్నారు.
ఇంకా పోతగాని సత్యనారాయణ, గరికపాటి మణిందర్, కాకరపర్తి పద్మజ, ఎస్. ఆర్. పృథ్వీ ,కొట్టి రామారావు, ఆర్.వి.ఎస్..ఎస్. శ్రీనివాస్, బొబ్బిలి జోసెఫ్, భీంపల్లి శ్రీకాంత్, వల్లభాపురం జనార్ధన, బిట్రా నాగ మల్లేశ్వర రావు, మాధవరావు కురుప్రోలు, రాజ శేకర్, వాల్మికి వడ్దేమాని, రాధికా కేశవ దాస్, తొడుపునూరి లక్ష్మీ నారాయణ, ఆదిగా గల వందమంది కవులకు పైగా నానోలు రాసున్నారు విశేషంగా పత్రికల్లోను, అంతర్జాలం లోను.
నానోలు అని రాసే వాళ్ళు ఒక్క విషయాన్ని గమనించాలి, ఒక వాక్యాన్ని నాలుగు పదాలుగా విడగొట్టి చెపితే అది నానో కాదు. నానో చదివినపుడు అది వాక్యములా స్పురించకూడదు. అది నానో అవునో కాదో గుర్తించడానికి ఇది మంచి లక్షణం.
ఉదా:’ చదువు/ అందరిది /ఉద్యోగం /కొందరిది ‘ అన్నాడు ఓ కవి కాని నాలుగు స్వతంత్ర అర్ధవంతమైన పదాలతో లోతైన భావముతో నానో రాయాలి అని కవికి తెలిసి ఉండాలి. కాని ఇందులో పెద్ద జీవిత సత్యమో, తాత్త్విక బావననో, కవిత్వ సౌందర్యమో, ధ్వనో కనబడే విశేషం ఏమీ లేదు కవిత్వం అని చెప్పడానికి. కవిత్వం అని చెప్పినపుడు కొంత పోలికతో చెప్పాలి, అర్ధవంతమైన భావనతో,సౌందర్యాత్మకంగా మంచి శిల్పంతో చెప్పాలి . అలా చెప్పినపుడే మంచి నానోలు పండుతాయి.
నానోను నానో పరిభాషలో, నా భాషలో చెప్పాలంటే
“నవ్యత / నాణ్యత/ గాఢత / నానో “ అనవచ్చు.
“అక్షరం
తపస్సు
కవిత్వం
అమృతం”- సబ్బని
      …
“మనిషి
మనసు
నిర్మలం
ఆరోగ్యం”
పై నానోలను గమనిస్తే పదాలు మద్య ఒక అంతర్లీనత, ఒక సంబంధం , ఒక భావన, ఒక పరిశీలన కనిపిస్తుంది.
కాకరపర్తి పద్మజ గారు
“జీవితం
పలక
కాలం
బలపం “
వాల్మీకి వడ్డెమాని :
“పక్షి
శోకం
వాల్మికి
శ్లోకం “
“కవిత / సూక్ష్మం / భావం / అనంతం”- సబ్బని
నానో స్వరూపాన్ని చూపే నానో ఇది.
వస్తువు ఏదైనా, తీసుకున్న అంశం ఏదైనా దానిని ప్రతిభావంతమైన నానోగా మలిచే సామర్థ్యం ఉండాలి కవికి
నానోలు పుట్టి ఒక పుష్కర కాలం దాటింది. అది చాలా మంది యువ కవులను విశేషంగా ఆకర్షించి నానో కవిత్వం రాయిస్తుంది.
4. రెక్కలు :
రెక్కల గురించి చెపుతే అది అంతా ఆశామాషిగా రాసే కవిత్వం కాదు. కవితలకి రెక్కలస్తే అవి విహంగాల్లా ఎగురుతాయి సాహితీ లోకములో. భావస్పోరకంగా, చిక్కగా, తాత్వికంగా, బతుకు లోతుల్లోంచి అనుభవ సత్యాలను వెలువరించే కవితా ప్రక్రియ రెక్కలు. వాల్మీకి రాసినా, బర్త్రుహరి రాసినా, వేమన రాసినా ఊర్కే రాయలేదు. బతుకు మూలాల్లోంచి జీవన సారాన్నిమధించి రాసారు. అలా రెక్కలను సృష్టించాలనుకొంటే అంత జీవితావగాహన, బతుకు మర్మము ఎరిగి ఉండాలి. అలా రెక్కలను అధ్బుతంగా సృష్టించిన వారు సుగమ్ బాబు గారు. 2౦౦౩ సంవత్సములో” రెక్కలు – వచనాలు “ వారు తొలుత ప్రచురించారు. సుగం బాబు గారు వచనాలు అని రాసి వాటిని పక్షుల్లా ఎగిరే చిన్న కవితలని, వాటిని రెక్కలు అని పేర్కొంటూ పుస్తకం ప్రచురించారు. రెక్కలు ఆరు పాదాలలో ఉండే చిన్న కవితలు. మొదటి నాలుగు పాదాలలో విషయాన్ని చెప్పి, ఆ నాలుగు పాదాల సారాన్నంత చివరి రెండుపాదాలలో ఇమిడ్చి చాలా లోతుగా కవితను పూర్తిచేయడం. వారు వందల సంఖ్యలో అద్భుతమైన రెక్కలు రాసినారు. సుగమ్‌ బాబు రాసిన రెక్కలు కవితల్ని డేవిడ్‌ షూల్‌ మ్యాన్‌, ఆవులమంద మోహన్‌గారు ఆంగ్లంలోకి అనువదించారు “వింగ్స్ “అనే పేర. తర్వాత కాలంలో మోపిదేవి రాధ కృష్ణ గారి ‘కాంతి కెరటాలు’ రెక్కల పుస్తకం వచ్చింది. సుగం బాబు గారు, మోపిదేవి గారు రాసిన రెక్కల స్పూర్తితో సబ్బని లక్ష్మీనారాయణ తెలంగాణ కావ్య వస్తువుతో “ తెలంగాణ రెక్కలు” అనే పుస్తకాన్ని రాసి, సినారె, సుగంబాబు గార్ల ముందుమాటతో 2010 సంవత్సరములో ప్రచురించారు. చీరాలకు చెందిన శ్రీనివాస గౌడ్‌ ‘వెలుతురు వెలయాలు’ రెక్కలు పుస్తకం వెలువరించారు. పెద్దూరి వెంకటదాసు, ధూర్జటి, షరీష్‌ ముగ్గురూ కలిపి ‘త్రివేణి రెక్కల శతకం’ (2011) లో ప్రచురించారు. , మల్లవరపు చిన్నయ్య ‘ఆమని’- సంపుటం ప్రచురించారు. సుగంబాబు గారి స్పూర్తితో కాలక్రమములో కైలాసపతిరావు, పద్మకళ,మల్లవరపు చిన్నయ, ద్యావర నరేందర్ రెడ్డి, రుద్రారం శ్రీనివాస రెడ్డి, నందవరం కేశవ రెడ్డి, వంగర పరమేశ్వేర్ రావు , దుగ్గిరాల సోమేశ్వెర్ రావు ఆది గాగల 150 మంది కవులు రెక్కల కవిత్వం రాస్తున్నారు.
ఏక వస్తువు ప్రదానంగా కొద్ది కాలములో రెక్కల పుస్తకాలు రానున్నాయి. అవి: చాణక్య నీతి – పి. వీరా రెడ్డి, రెక్కల్లో గీతాంజలి – డి. హనుమంతరావు, రెక్కల్లో గీతామృతం – డా. కేతవరపు రాజేశ్వరి. రెక్కల పందిరిలో భజగోవిందం – మోపిదేవి రాధా కృష్ణ. ఇవన్నీరెక్కల్లో ప్రయోగాత్మకంగా రాయబడే మంచి పుస్తకాలు.
జీవితాన్ని తపస్సులా భావించిన వారు మాత్రమే అద్భుతమైన రెక్కలు రాయగలరేమో. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం బుద్ధుడి జీవనసారం “ ధమ్మపదం”. లోని విషయాలను రెక్కల్లో సులభంగా , హృద్యంగా మన కందించారు సుగమ్ బాబు గారు, రెక్కల రూప శిల్పి . అలానే వివేకనందుని జీవితం పై కూడా రెక్కలను రాసి పుస్తకం వేశారు వారే.
సుగంబాబు గారి ‘దమ్మ పథం ‘‘ లోని కొన్ని రెక్కలను పరిశీలిస్తే చాలా లోతైన తార్కిక భావనలు అవి. బుద్ధుడి జ్ఞ్యానబోధనలను సులభంగా అర్ధవంతంగా మనకు రెక్కల్లో అందించారు సుగమ్ బాబు గారు.
 ‘ పగతో శత్రువు
 చేసే పని కన్నా
 దారితప్పిన మనసు
 చేసే కీడు అధికం –
అయినవారి కన్నా
మంచిబుద్ధి మిన్న’ అంటారు.
ఇంకా కొన్ని రెక్కల్లో :
‘సువాసన పంచె ‘
అందమైన పూలపై
 వాలి తుమ్మెద
 మకరందం గ్రోలినట్లు –
 గ్రామాల్లో బతకాలి
 భిక్షువు ‘ అంటారు
 ‘ గాలికి
 కదలదు కొండ
 నిందాస్తులకు
 జంకడు జ్ఞ్యాని-
నిర్మల కాసారం
మేధావి చిత్తం ! ‘అంటారు
.ఆ రెక్కల కవిత మార్గములో ఇటీవలి కాలములో వెలువడిన మంచి రెక్కల పుస్తకం మోపిదేవి రాధ కృష్ణ గారి ‘కాంతి కెరటాలు’ ఒకటి.
ఏదయినా అనుభవించి పలువరించమన్నాడు మహాకవి శ్రీ శ్రీ. అలా అనుభవించి పలువరించినవే మోపిదేవి రాధ కృష్ణ గారి రెక్కలు.
ఆ రెక్కల్లో కొన్ని:
‘ వ్యసనాలు
మనిషిని
పీక్కు
తింటాయి
జీవితం
బలి పశువు.’ అంటారు.
బతుకును తిర్చిదిద్ధుకొనే, లేదా ధ్వంసం చేసుకొనే వీలు ఎవరికి వారి చేతుల్లోనే ఉంది అనే సత్యం ఉంది పై రెక్కలో .
ఇంకో రెక్కలో,
‘ గొప్పగా ఎదిగానని
ఇగోను
పెంచుకుంటే
మూర్ఖత్వమే—
వ్యక్తిత్వమే
రత్న కిరీటం’ ఇది అక్షరాలా సత్యం మేము గొప్పవాళ్ళమని విర్రవీగే మనుషులకు, వర్తిస్తుంది వ్యక్తిత్వం ఉండాలని చెపుతూ ఈ రెక్క .
ఇంకో రెక్కలో,
‘ స్వయంకృషితో
పొందిన
ఆనందం
వర్ణనాతీతం
తేనెటీగల శ్రమే
తేనే’ ఎంత గొప్ప మాట ఇది. బతుకు ఎవరికి వారు తిర్చిదిద్దుకోనేది, స్వయంకృషితో అందుకొనేది.
బతుకు ఒక మధువనం, మంచివాళ్ళ సృష్టి లోకహితానికి.. రామాయణమైనా, మహాభారతమైనా, ఖలీల్ జిబ్రాన్ కవితలైనా, వేమన పద్యాలైనా, బర్త్రుహరి సుభాషితాలైనా గొప్ప సందేశాలు కదా! ఇలా చెప్పుకుంటూపోతే రెక్కల్లో జీవిత సత్యాలను ఆవిష్కరించారు వారు.
‘ ఈ
మట్టిపై
మమకారం ఉన్న
ప్రతి ఒక్కరిని
ఆదరించే అమ్మ
తెలంగాణ !’ – అంటాడు సబ్బని
ఇలా రెక్కలు సుసంపన్నమైన చిరు లఘు కవితలు ఆధునిక తెలుగు కవిత్వములో, తిరుగు లేని సత్యం . రెక్కలు రాసి పండించిన వారు ధన్యులు నిజంగా. తెలుగులోకి రెక్కల ప్రక్రియను ప్రవేశపెట్టిన సుగంబాబు గారు ఆదరణీ యుడు సర్వదా.
5. ఏకవాక్య కవితలు
  క్లుప్తత, గాఢత కవిత్వానికి కావలసిన ప్రధాన లక్షణాలు. గాఢత అధికమవుతూ, క్లుప్తత ఎంత పెరిగితే – అంత కవిత్వం స్థాయి ప్రతిఫలిస్తుంది. అలా “మినీ కవిత్వం” సాహిత్య ప్రక్రియలలో తన ప్రత్యేకతను చాటుకొంటూ వచ్చింది . ఆ క్రమం లోనే “హైకూలు”, ” నానీలు”, “రెక్కలు”, ” ఏక వాక్య కవితలు” వంటి మినీ కవితా ప్రక్రియలు అశేష ప్రజాదరణకు నోచుకున్నాయి .
ఈ సందర్భంగా మహాకవి కీ. శే. గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఒక మాట చెప్పుకుందాం. ” విశిష్టమైన భావం,విశిష్టమైన భాష తన రక్తములో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదు”- శేషేంద్ర ఇక 14 వ శతాబ్దపు ప్రాచీన ఆలంకారికుడు విశ్వనాథుని – “వాక్యం రసాత్మకం కావ్యం” అన్న నిర్వచనం స్ఫూర్తితో 1998 – 2000 సంవత్సరాల ప్రాంతంలో, తెలుగు సాహిత్యంలో తొలిసారిగా డా. ఆచార్య ఫణీంద్ర గారు, “ఏక వాక్య కవితల” ను రచించి ప్రవేశ పెట్టడం జరిగింది. 2002 సంవత్సరంలో వారి “ఏక వాక్య కవితలు” విజయవాడలోని “ఎక్స్ రే” సంస్థ పురస్కారం పొంది, తొలి గుర్తింపును పొందాయి. 2004 లో అవి “వాక్యం రసాత్మకం” పేరిట గ్రంథ రూపం దాల్చాయి. పండిత పామరులను విశేషంగా ఆకర్షించిన ఆ “ఏక వాక్య కవితలు” 2009 లో ఆంగ్లంలోకి “Single Sentence Delights” అన్న గ్రంథ రూపంలో అనువదింపబడి, ప్రముఖుల ప్రశంసల నందుకొన్నాయి. ఈ ఏక వాక్య కవితలు వెలువడడానికి. కొన్ని దశాబ్దాల క్రితమే (సుమారుగా 90 ఏళ్ల క్రితం ) విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ ఈ ఏకవాక్యకవితలకు అంకురార్పణ చేసారు, “Stray Birds” అనే ఆంగ్ల సంకలనం ద్వారా. ఇటీవలి కాలములో కేతవరపు రాజ్య శ్రీ గారు ఆ పుస్తకాన్ని ” వెన్నెల పక్షులు ” పేర తెలుగు లోకి అనువదించి పుస్తకం వెలువరించారు.
ఆ తర్వాతి కాలంలో ఎందరో యువ కవులు, కవయిత్రులు “ఏక వాక్య కవితల” ను రచించడం ప్రారంభించారు. అంతర్జాలంలో “ఏక వాక్యం”, ” ఏక్ తార” వంటి “ఫేస్ బుక్” గ్రూపుల ద్వారా వందల్లాది మంది వేలాది “ఏక వాక్య కవితల” ను సృజించారు. సృజిస్తున్నారు. ముఖ్యంగా యువకవి R.V.V.S. శ్రీనివాస్ గారు మూడు వేలకు పైగా “ఏక వాక్య కవితల” ను రచించి, “శ్రీవాక్యం”, “శ్రీవాక్యం – 2” పేరిట రెండు గ్రంథాలను వెలువరించారు. “సిరిమల్లెలు” పేరిట రచయిత్రి “సిరి వడ్డే” గారు, “పూల పిట్ట” పేరిట శ్రీమతి “స్వర్ణలతా నాయుడు” గారు తమ “ఏక వాక్య కవితల” గ్రంథాలను పాఠక లోకానికి అందించారు. వివిధ కవులు, కవయిత్రుల “ఏక వాక్య కవితల” ను సంకలన పరచిన గ్రంథాలు కూడ ఒకటి, రెండు వెలువడ్డాయి.
అదే వరుసలో 2017 సంవత్సరము ఎప్రిల్ మాసం లో – శ్రీ “సబ్బని లక్ష్మీనారాయణ” గారు “ప్రేమ స్వరాలు” పేరిట తమ “ఏక వాక్య కవితల” పుస్తకాన్ని మరియు మే మాసములో “ అక్షర సౌరభాలు “ అనే మరో “ఏక వాక్య కవితల” పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. .
“నీ ఒక్క చూపులో వెయ్యి కృతజ్ఞతలు, వెయ్యి స్వాగతాలు” “బతుకు పుస్తకంలో అపురూపంగా నువ్వొక నెమలీకలా!”
“నీ కళ్ళలోకి సూటిగా చూశాను – రెండు భూప్రపంచాలు!”
“నువ్వు ప్రవహిస్తున్న నదివి – నది అంచులను ముద్దాడుతున్న తీరాన్ని నేను!” మొదలైన “ఏక వాక్య కవితలు” సబ్బని ప్రేమ స్వరాలు ” లోనివి
చివరగా : కవిత్వం ఎప్పటికి కాలక్షేపానికి రాయబడకూడదు. కవిత్వానికి కొంత ప్రయోజనం ఉంటుంది. కవిత్వానికి నిర్మాణ శిల్పం ఉంటుంది. ఆ విషయాలు తెలిసి ఉండాలి కవులకు.
లేకుంటే కవిత్వం రాయడం ఈజీ అని బ్రమసి పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాలుగు లైన్లలో రాస్తే నానీ, మూడు లైన్లలో రాస్తే హైకూ , నాలుగు పదాలతో రాస్తే నానో, ఆరు లైన్లలో రాస్తే రెక్కలు, ఒక్క వాక్యంలో
రాస్తే అది ఏకవాక్య కవిత అని అనుకోని రాసే క్రమములో కవులు ఉంటే వాళ్ళు మంచి కవిత్వాన్ని రాయలేరు, తెలుగు కవిత్వ సీమను సుసంపన్నం చేయలేరు. కవిత్వం అర్ధవంతమైన ,ఒక స్వతసిద్ధమైన ధార.
సుప్రసిద్ధ తెలుగు కవి దేవరకొండ బాల గంగాధర తిలక్ చెప్పినట్లు, కవిత్వం ఒక ఆల్కెమి దాని రహస్యం కవికే తెలుసు ,” పెద్దనకు తెలుసు, శ్రీశ్రీ కి తెలుసు శ్రీనాథుడికి తెలుసు అన్నట్లు”,. కవులు ఈ రహస్యాన్ని గుర్తెరిగి కవిత్వ రచన చెయ్యాలి , అవి హైకూలైనా, నానీలైన, నానోలైనా, రెక్కలైనా, ఏకవాక్య కవితలైన, వచనకవితలైనా, దీర్ఘకవితలైనా అప్పుడే అవి కవిత్వమై వ్సర్ధిల్లుతాయి జనులను అలరిస్తాయి, ఆనంద పరుస్తాయి, జనులచే కొనియాడబడుతాయి.

You may also like

Leave a Comment