మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం.. ఒకప్పటి తెలుగింటి ఇల్లాలి మనస్తత్వానికి మునిమాణిక్యం గారు ఇచ్చిన అక్షరరూపం ఈ పాత్ర. కాంతం కథలు సంపుటిలో కథలన్నీ చాలా చమత్కారంతో కూడుకొని ఉంటాయి. హాస్య కథలు రాయడానికి చాలా వివేకం కావాలి. హాస్యం పండాలంటే, రచయితలోనూ చాతుర్యం ఉండాలి. అందుకే ఇదే సంపుటిలో మునిమాణిక్యం గారు ఇలా సెలవిస్తారు. మూడు ముక్కల్లో కట్టి, కొట్టి, తెచ్చి అన్నట్లు కథ రాస్తే అందులో కథకుడి చమత్కారమేముంది? అంటారు. కథను ఒక Work of Art గా పరిగణించాలట.
కథను మొదలు పెట్టడంలో చమత్కారం, అదే కథను నడపడంలో నేర్పు, ముగించడంలో ముచ్చట, కథకుడికి ఉండాలన్నది మునిమాణిక్యం గారి మాట. ఈ పుస్తకంలో ఓ పాత్ర చేత మునిమాణిక్యం గారే ఈ మాటలను చెప్పిస్తారు. కొన్ని సందర్భాల్లో కథ ఎలా తేలుతుందా ..? అనే ఆదుర్దా పాఠకుడికి కలగాలట. విసుగు రాకూడదట. కథ కుదురుగా ఉండాలట. ఇవన్నీ లేకపోతే ముక్తాయింపు మాటలతో ముగిసే కథ ముక్కలు చెక్కలుగానే ఉంటుందట. చూశారా.. ఎంత చక్కగా చెప్పారో!
కాంతం కథల్లో కూడా ఇదే ఫార్ములాని వాడారు రచయిత. కాంతం తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె ఎత్తులకు పై ఎత్తులు వేసే తెలివి కాంతం మొగుడికి లేవు గానీ.. అప్పుడప్పుడు అవే ఎత్తులు చిత్తు అయినప్పుడు.. భర్త దగ్గర తన పరువు కచ్చితంగా నిలబడాలని అనుకుంటుంది ఆమె. ఏ ఇల్లాలైనా అంతే కదా. అలాగని తనకు భర్తంటే ప్రేమ లేదని కాదు.
సాహిత్యంలో కొన్ని పాత్రలను కొందరే సృష్టించగలరు. నండూరి వారికి ఎంకిలా, గురజాడ వారికి మధురవాణిలా, ముళ్లపూడి వారికి బుడుగులా .. మునిమాణిక్యం గారికి కాంతం అలా అన్నమాట. మునిమాణిక్యం గారు తన ఇల్లాలిని చూసే ఈ పాత్రను కనిపెట్టారేమో అని అనిపించకమానదు. వివాహం చేసుకున్న రోజే.. గంధం పూసే పేరుతో మొగుడు తాకబోతే లెంపకాయ కొట్టిన ఘనత కాంతమ్మది.
“తేనీరు” కథలో కాంతం తన భర్తతో టీ మానిపించాలని వేసే ఎత్తులు అన్నీ,యిన్నీ కావు.తేనీరు మానేయడం వలన ఎన్ని డబ్బులు పొదుపు చేయవచ్చో భర్తకు సుద్దులు చెబుతుంది.టీ మానిపిస్తానని పందెం కాస్తుంది. కానీ,కాంతంతో పందెం అంటే ఆయనకు భయమే.ఎందుకంటే,కొన్నిసార్లు పందెం కాసి చెంపదెబ్బలు,మొట్టికాయలు తినడంతో పాటు గుంజీలు కూడా తీసిన అనుభవం తనకుంది.అంత మోటు సరసమా..?! అని కూడా పాఠకులు అనుకోవడానికి వీలు లేదు.ఎందుకంటే, ఎన్ని చేసినా-ఆమె ప్రేమకు భర్త లొంగిపోతాడు.ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేడు.”అమ్మో!ఆమె అశ్రుధారాస్త్రాలను చూడలేను” అంటాడు.”ఆమె శిరీష కోమల హస్తం అందించే తాంబూలానికే పరవశించిపోతా” నంటాడు. కానీ,తబుకులో పెట్టుకుని వచ్చిన తమలపాకులను భర్తకు అందిస్తున్నప్పుడల్లా-కాంతం తన భర్తను తిడుతూనే వుంటుంది.కానీ,ఆ తిట్లలోనూ “శ్రవణ సౌఖ్యాన్ని” పొందడం కాంతం మొగుడికే చెల్లింది.తాను స్కూలు మాస్టారు అవ్వడం వల్ల,పాఠశాలలో చిన్నపిల్లలను చూసినట్లే,భార్యను చూస్తాడు.ఆమెను కూడా “చిన్నపిల్లలా” భావించి,సర్దిచెప్పుకుంటాడు.అందుకే, ఏ కథలో చూసినా,కాంతం తన పంతం గెలిపించుకుంటుంది.
తన చెల్లెలు సుబ్బమ్మతో కలిసి,తన భర్తను అల్లరి పట్టించడానికి వేసే ఎత్తులు అన్నీ,యిన్ని కావు.వీరిద్దరి “మిళిత భావప్రకటనా కుట్ర” అంటాడు.సుబ్బమ్మపై అతను మనసు పడ్డప్పుడు,భార్యకు తెలీకూడదనుకుంటాడు.కానీ,ఆమె అంత అమాయకురాలు కాదు కనుక,పసిగడుతుంది.తాను “అందంగా లేనా–అసలేం బాలేనా?!” అని బాధపడి,సోదరిపై అసూయపడుతుంది.కృష్ణుడిని సత్యభామ తన్నినట్టు ఎడమకాలితో తన్నాలనుకుంటుంది.కానీ,అలా చేయదు.చాల కొంటెగా,ప్రేమగా బుద్ధి చెపుతుంది. అదెలాగన్నది “ఊదారంగు చీర” కథలో చదవాల్సిందే!
ఆలుమగల మధ్య జరిగే చిలిపి తగాదాల దగ్గరనుండి-వారు వాటిని పరిష్కరించుకునే దిశగా చేసే ప్రయత్నాలు ఎంత మురిపెంగా వుంటాయో తెలుసుకోవాలంటే–కాంతం కథలు చదవాల్సిందే.
ఇలాంటి కథలు కోకొల్లలు.భర్త కూరగాయల మార్కెట్టుకి వెళ్లి,ఎక్కువ ధరలకు వాటిని కొంటున్నాడని కాంతం వాదన.కానీ,ఆయన సరుకుల్లో నాణ్యతని చూసే రకం.ఆమె నమ్మదు. తానే ఓ రోజు మార్కెట్టుకు వెళ్లి,ధరలు మండిపోవడం చూసి,అవాక్కవుతుంది.కానీ–భర్త దగ్గర తన డాంబికం తగ్గకూడదు కదా!అందుకే,తక్కువ ధరకు సరుకులు కొనాలనుకుంటుంది కానీ,అరవ కొట్టువాడు చమురులో బూడిద నీళ్లు కలిపి అమ్మేసి,అదే కిరసనాయిలు అంటే,ఆతృతపడి కొనేస్తుంది.తీరా ఇంటికొచ్చాక,వత్తులు వెలగవు. తన తెలివితక్కువతనానికి బాధపడుతుంది.కానీ,భర్త దగ్గర పరువు పోకూడదు కదా!తనకు రోజూ ఎదురొచ్చే సుబ్బమ్మని పచ్చిబూతులు తిడుతుంది. తన రోజు బాగుండక పోవడానికి కారణం శుభశకునం రాకపోవడమే అని వాదిస్తుంది. కానీ,తన తెలివితక్కువతనాన్ని మాత్రం ససేమిరా ఒప్పుకోదు.కాంతం గురించి చెప్పుకోవాలంటే ఇలాంటి ఉదాహరణలెన్నో!
“కాంతం కైఫీయత్తు” కథలో తాను భర్త జేబులోనుంచి డబ్బులు తీసి తనకు చీర,పిల్లలకు కోతి బొమ్మలు కొన్నందుకు భర్త “నేనిక ఈ సంసారం చేయలేను.”బుద్ధం శరణం గచ్ఛామి” అంటూ సన్యాసం తీసుకుంటాను అంటాడు.”ఈ చీర కట్టుకుంది మీ ఆనందం కోసమే,నా తప్పేమీ లేదంటుంది” కాంతం.తీరా వెళ్లబోతుంటే చంటిదాన్ని చేతికిచ్చి,”ఒక్కసారి తీసుకోండి.కనీసం అరసారి” అని నవ్విస్తుంది.ఆ పిల్ల అతని చేతుల్లోంచి రానంటుంది.ఇక పెద్దపిల్లవాడు బూటులు వేసుకుని,”నాన్నా ,నేనూ వస్తాను” అని వెంటపడతాడు.అమ్మాయి సుశీ కూడా కొత్త పరికిణీ, నగలు వేసుకుని నాన్న వెంట తయారవుతుంది వెళ్ళడానికి.”ఆ బుద్ధుడు రాత్రిపూట పిల్లాడు నిద్రపోతున్నప్పుడు బయటపడ్డాడు.ఈ అసురసంధ్య వేళ పిల్లలు వెంటపడితే తెలిసేది తనకి” అని మనసులో అనుకుంటాడు.”నాన్నా!సినిమాకేగా-మేమూ వస్తాం” అనగానే,ఇదంతా కాంతం వేసిన ఎత్తు అని తెలిసిపోయి,తిరిగి ఇంటికి చేరుకుని “తలుపు” అంటాడు కొడుతూ.”ఎవరా తలుపూ?సన్యాసం తీసుకుంటానని వెళ్లారుగా”అంటుంది.”తీయవే తలుపు” అని బ్రతిమిలాడించుకుని తీసి,పిల్లలు,భర్త లోపలికి రాగానే,ధడాలున తలుపు మూయటంతో కథ ముగుస్తుంది.అంటే అతని సన్యాస దీక్ష ముగిసిందని సింబాలిక్ గా చెప్పారన్నమాట రచయిత.అసలు అతనికి కూడా వెళ్ళటం ఇష్టం లేక “ఇదే ఆఖరు.ఇక వెళ్లిపోతున్నాను.తిరిగి రాను” అంటూ గొంతులో సన్నని వణుకుతో అన్నప్పుడే అతని మనస్తత్వం మనకు తెలిసిపోతుంది.చంటిదాన్ని చేతికిచ్చి,పిల్లలను పంపి,సన్యసించడానికి వెళతానన్న భర్తను వెనక్కి తీసుకురావడంలో కాంతం గడుసుదనం,చాకచక్యం మనకు తెలుస్తాయి.
కాంతానికి గ్రాంథికం రాదు.వ్యవహారికంలో శుభ్రంగా మాట్లాడుతుంది.భర్త ఆమెకోసం మాసపత్రికలు తెప్పిస్తే,అందులో గ్రాంథికం అర్థం కాక,”చారు కాచే పాత్రపై మూత” లా వాడుతుంది.మొగుడికి ఒళ్ళు మండిపోదూ?!పద్యాలన్నీ అరవ పాటల్లా అనిపిస్తాయామెకి.తన “మంగళహారతులే” వీటికంటే గొప్పవని వాదిస్తుంది. మునిమాణిక్యం గారికి వ్యవహారికంపై ప్రీతి కనిపిస్తుంది ఈ సంఘటన ద్వారా.అలాగే “గిడుగు” వారి ఉద్యమ ప్రభావ స్థాయి కూడా కళ్ళకు కడుతుంది.
