తొలుస్తున్న మెదడులోంచి పుట్టిన బాణం ప్రశ్న గిరగిరా తిప్పి విసిరే ఒడిసెలరాయే ప్రశ్న సమాధానానిదేముంది, కుక్కపిల్లలా తోకూపుకుంటూ వచ్చి వాలుతుంది..!
ప్రశ్నే.. మనిషికి తొలి చలనం ఎందుకు? అనే జిజ్ఞాస లోంచే విజ్ఞాన చంద్రికలు ఉదయించినయ్ ఆపిల్ కిందే ఎందుకు పడిందని న్యూటన్ ప్రశ్నించకపోతే.. గురుత్వాకర్షణ ఇంకెన్ని రోజులు చెట్టుకిందే పడి ఉండేదో!? దుఃఖానికి కారణమేమిటి.!? అని సిద్ధార్థుడు ప్రశ్నించకపోతే బుద్ధుడు ప్రపంచానికి దొరికేవాడా? ఎందుకు మనిషికి మనిషి అంటరాని వాడు..!? అని అంబేద్కర్ ప్రశ్నించకపోతే సమానత్వం రాజ్యాంగ పుటల్లో మొలకెత్తేదా!? ఎందుకు స్త్రీ బానిస? అని సావిత్రీ బాయి ఫూలే ప్రశ్నించకపోతే ఈ రోజు నా కలలకు అక్షరాల వెలుగు చేరేదా?
ప్రశ్న అంటే ఎదుటివాడిని ఓడించడం కాదు.. నిజాన్ని గెలిపించడం. ప్రశ్న అంటే మూఢనమ్మకానికి నీళ్ళొదిలి హేతుబద్ధంగా ఆలోచించడం ప్రశ్న అంటే చీకటి గదిలో కిటికీ తెరవడం.. ప్రశ్నించని మనిషి నడిచే రాతిబొమ్మ శ్వాసించే బానిస..! ప్రశ్నించని సమాజం నిశ్శబ్ద సమాధి అది ఎప్పటికీ స్థబ్దంగా ఉండిపోతుంది..!
అందుకే.. నేను పిల్లలకు పాఠంతో పాటూ.. ఎందుకు, ఏమిటి, ఎప్పుడూ, ఎట్లా అని అడగడం నేర్పించాను రేపటి సమాజం చైతన్యంగా ఉండాలని చిరు ఆశ. పౌరులు..”ఎందుకు, ఎట్లా..”? అని అడగడం మానేసిన రోజు ప్రజాస్వామ్యం శవపేటిక ఎక్కుతుంది..! పాలనలోనూ ప్రశ్న ఉండాలి.! ప్రతి ఓటులోనూ ప్రశ్న ఉండాలి.
అయితే ఒక్క మాట..! ప్రశ్న కత్తిలా కోయకూడదు..దీపంలా వెలిగించాలి. ప్రశ్న అవమానించడానికి కాదు, అవగాహన పెంచడానికి. ప్రశ్న గాయపరచడానికి కాదు, గమ్యం చూపించడానికి. ఎందుకంటే.. ప్రశ్నే పురోగతికి మొదటి అడుగు ప్రశ్నే విప్లవానికి ఉనికి ప్రశ్నే స్వేచ్ఛకు తొలి ఊపిరి..!
సమాధానాలతో చరిత్ర ముగుస్తుంది.. ప్రశ్నలతోనే కొత్త చరిత్ర మొదలవుతుంది..! ప్రశ్నలు పుట్టిన చోటే జ్ఞానం మొలుస్తుంది, జ్ఞానం మొలిచిన చోటే స్వేచ్ఛ పుష్పిస్తుంది. ప్రశ్నించే పెదవుల్ని మూయించవచ్చు.. ప్రశ్నించే ఆలోచనను మాత్రం ఎవరూ బంధించలేరు.