‘అక్కా! నీ రూప లావ
గరిమకు
నీలాకాశాన వెలిగే నిండు చంద్రుని
అందచందాలు సరిరావేమాత్రం!’
అక్క ఉదయాన్నే స్నానసంధ్యలు ముగించుకుని వరండాలో కూర్చుని ఏదో విషయమై దీర్ఘాలోచనలో మునిగి ఉన్నది. తన దినచర్య అక్కడ నుంచే ఆరంభమవుతుందని తెలిసివచ్చింది నాకు.
‘అక్కా! నీ ప్రశాంత గంభీర వదనం మాటున
అంతరంగ గర్భగృహంబున అణగారిన ఆవేదనలెన్నో!
తెలియరాని నా చిరుహృదయానికి
అర్థంకాని ఆందోళనఏలో!’
“అక్కా!” నా పిలుపుకు తేరుకుని నన్ను దగ్గరకు తీసుకున్నదామె. ఆప్యాయంగా నా తల నిమిరి “ఏమిటి చంద్రా!” అని నా కళ్లలోకి చూసింది. “ఏమిటి తమ్ముడూ!” అని మరోసారి అడిగింది. నా ముఖం, చూపు కిందకే దించి ఉన్నవి. చిన్నగా నవ్వి నన్ను తన సన్నిధి నుండి విడుదల చేసింది.
అక్క ఇంట్లో నా మొదటి ఉదయం అనుభవమది.
నాకప్పుడు ఎనిమిదేళ్ల ప్రాయం. నన్ను తీసుకుని మా అమ్మ వాళ్ల అక్క (తోబుట్టువు కాదు) ఊరికి వెళ్లింది. వాళ్లది చాలా పెద్ద ఇల్లు. రెండస్తుల మేడ. సున్నం, ఇటుకలు కలపతో నిర్మాణమైనది. మా చిన్న ఇంటితో పోల్చుకుంటే చాలా అద్భుతంగా తోచిందది. ఆ ఇంట్లో వారందరూ, అన్నలూ, వదినలూ చాలా పెద్దవారు. మొదట్లో కొంచెం బెరుకుగా ఉన్నా వారం రోజుల్లో నేనా ఇంట్లో ఒక భాగమయిపోయిన. చిన్నగా, నాజూకుగా, ముద్దుగా ఉండేవాణ్ణి. వారంతా నన్ను అపురూపంగా చూసుకునే వారు. వారి ప్రేమకు ముగ్ధుడనయ్యేవాణ్ణి. ఆ ఇంటి పరిసరాలు ఆనందదాయకంగా ఉండేవి. అటవీ ప్రాంతం, పెద్దపెద్ద వృక్షాలు, పొదలు, లతలు, వాటిమధ్య పొలాలు, చేలు ఎక్కడ ఉండేవో కనపడేవే కావు.
నా ఆనందానికి అవధులులేవు. అట్లా ఉండగా ఒకరోజు ఉదయం పదకొండు గంటలు. పెద్దమ్మ వాకిట్లో ఆగిన ఓ కచ్చడంలోంచి ఒక స్త్రీమూర్తి దిగి వచ్చి వరండా మెట్లెక్కింది. ఆశ్చర్యం! ఆమె ఒక మనిషిలా లేదు. దేవతా స్త్రీలాగా ఉన్నది. తెల్లని వస్త్రాలు. దేహమూ అదేరంగు, మెరుపులాంటి ముఖవర్చస్సు. పెద్దమ్మ ఎదురు పడగానే చిరునగవుతో నమస్కరించింది. అక్కడే నిల్చున్న నేను తదేకంగా తననే చూస్తున్నాను. నా వంక ప్రశ్నార్థకంగా చూసిందామె. ‘లక్ష్మి చిన్నాయి (చిన్నమ్మ) కొడుకు చంద్రసేన్’, ‘అక్క’ అంటూ తిరిగి నావంక చూసింది పెద్దమ్మ. నేను వంగి అక్కపాదాలు స్పృశించి నమస్కరించిన. ఎవరి పాదాలకైనా ప్రణమిల్లటం నా బాల్యంలో అదే ప్రథమం.
రెండు రోజుల తర్వాత అక్క తిరుగుప్రయాణం. వెళ్తూవెళ్తూ పెద్దమ్మకు చెప్పి వారంరోజులకోసం నన్ను తమ ఊరికి తీసుకెళ్లింది. అక్క ఇల్లు పెద్ద అందమైన భవంతి. భవంతినానుకొని పొడుగూతా ఉన్న అరుగు. ఆ అరుగుమీద కూర్చొని ఎదురుగా ఫర్లాంగు దూరాన గలాగలా పారుతున్న జలాలు, ఆ పరిసరాలను చూస్తుంటే ఆహ్లాదకరంగా సమయం గడిచిపోతుంది. అక్క ఊరు గోదావరికి దక్షిణాన, తీరానికి సమీపంలోనే ఉన్నది. ఇక్కడా కొంత దూరం వరకు అటవీక్షేత్రం వ్యాపించి ఉన్నది. పెద్దమ్మ ఊరు గోదావరి ఉత్తర తీరాన ఉండి, అక్కడి నుంచి విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం దండకారణ్యంలో సంలీనమవుతున్నది. ఈ రెండు ఊళ్లమధ్య ఉన్న దూరం నాలుగు క్రోసులు (8మైళ్లు). మా ఊరు గోదావరి నదీ దక్షిణ తీరానికి 20 క్రోసుల దూరంలో ఉన్నది. నదీ జలాలు, అటవీ ప్రాంతాల పట్ల నాకున్న మక్కువవలన పెద్దమ్మ ఊరు, అక్క ఊరు రెండూ నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. వారంరోజులు అక్క దగ్గర ఎట్లా గడిచిపోయినయో తెలియలేదు. ఒకరోజు తనతోపాటు నదీతీరాన ఉన్న మామిడితోటకు వెళ్లినం. అక్క పాలేర్లు, పనివాళ్లతో మాట్లాడుతూ పనులు పురమాయిస్తుంటే నేను తోటంతా కలియతిరిగిన. ఒకనాడు వరి పొలాల వద్దకు, మరోనాడు ఇంకో చోటికి అక్కతోపాటు నేనూ వెళ్ళేవాణ్ణి. ఆ చిన్న కచ్చడంలో ప్రయాణం భలేసరదాగా ఉండేది. ఆ బండికి కట్టే ఎద్దులు వేరు. వాటిని ఇతర పనులకు వాడరు.
అక్క ఇంట్లో ఒక పెద్ద వయసు స్త్రీ ఉండేది. ఆమె గొల్లనో, గోండు స్త్రీయో! అందరూ ఆమెను ‘గొండమ్మా’ అని పిలిచే వారు. నేనూ అలాగే పిలిచేవాణ్ణి. రుచికరమైన వంటలు వండి పెట్టడంలో ఆమె దిట్ట. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఆమె సృష్టించిన షడ్రుచులను ఆవారం- పదిరోజుల్లో ఎంతగా ఆస్వాదించానో! ప్రతిరోజూ మధ్యాహ్నం తాగడానికి తాజా మామిడికాయలతో షర్బత్ తయారు చేసి ఇచ్చేది. అప్పుడప్పుడు పాయసం వండి పెట్టేది. పెద్దమ్మ ఇంటికి పంపిస్తూ అక్క నన్ను దగ్గరకు తీసుకుని వీడ్కోలు చెప్పేటప్పుడు ఆమె కళ్లు సజలమవటం గమనించిన. గొండమ్మ ముఖంలోనూ అదే ఆర్ద్రహృదయం ప్రతిఫలించింది. “కవిత్వం రాస్తూ చదువును అశ్రద్ధ చేయకు చంద్రా!” హితవు పలికి అక్క నన్ను సాదరంగా పంపింది.
అక్కపట్ల నా మనస్సులో స్థిరపడ్డ ప్రేమాభిమానాల ప్రభావం వల్లనేమో ఆ తర్వాత వరుసగా నాలుగేండ్లు సెలవులు రాగానే అక్క ఊరిలో వాలిపోయేవాణ్ణి. నన్ను చూడగానే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయేది. తప్పనిసరిగా రెండు రోజులు పెద్దమ్మ దగ్గరకూడా ఆగేవాణ్ణి. ఎప్పటివలెనే ఆ ఇంట్లో వారందరూ నన్ను ప్రేమతో ఆదరించేవారు. అక్కతో చనువు దినదిన ప్రవర్ధమానమవుతున్నది. అక్క ఉదయం ఎప్పుడులేస్తుంది, తెల్లవారక ముందే జరిగే ఆమె దినచర్య ఏమిటో గమనించాలని నాలో కుతూహలం చెలరేగింది. ఒకరోజు రాత్రంతా నిదురపోలేదు. స్నానం ముగించుకుని నాలుగున్నర గంటల సమయంలో అక్క ఒక గదిలోకి ప్రవేశించింది. ముందు రెండు దీపాలు వెలిగించింది. ప్రమిదల్లో కొంచెం నూనె వేసి వత్తులను ఎగదోసింది. కొన్ని పూలు ఎదురుగా ఉన్న విగ్రహాల ముందుంచి దండం పెట్టింది. ఒక చిన్న కర్రపీట మీద కూర్చుని ఒక పుస్తకం నుండి మనస్సులోనే ఏదో పఠిస్తూన్నది. అంతా నిశ్శబ్దంగా ఉన్నది. తలుపుచాటున నిలబడి నేనిదంతా గమనిస్తున్నాను. సుమారు అరగంట తర్వాత పుస్తకం మూసి పక్కనపెట్టి “లోపలికి రా చంద్రా!” అన్నదామె. నాకు చాలా భయమేసింది. లోపలికి వెళ్ళగానే ఒక పీట చూపించి కూర్చోమన్నది అక్క. ఆ తర్వాత ఇంకేమీ మాట్లాడకుండా కళ్లు మూసుకున్నది. దాదాపుగా గంట సమయం నిశ్చలంగా ఉండిపోయింది. ఆ దృశ్యం పుస్తకాల్లో నేను చదివిన ధ్యానముద్రలో ఉన్న ఋషులు, మునులు, తపస్వినులను తలపింపజేసింది. అప్పుడు ఆమె లేచి “వెళ్తాం పద చంద్రా!” అన్నది. నేను లేచి ఆమె పాదాలను స్పృశించి సాష్టాంగ నమస్కారం చేసి ఆమెను అనుసరించిన. అప్పటి నుండి నా మనస్సులో అక్కపట్ల ప్రేమాభిమానాలేగాక, ప్రగాఢమైన భక్తి భావమేర్పడింది.
ఎనిమిదవ క్లాసు నుండి పియుసి పరీక్షలయ్యేదాకా నేను అక్క ఊరికి వెళ్లలేకపోయిన కారణాలనేకం. సెలవుల్లో కూడా బిజీగా ఉండేవాణ్ణి. నాలుగేళ్లు తనను చూడకుండా గడిచిపోయినయా! అనే భావన స్ఫురించగానే మనస్సు చివుక్కుమన్నది. వెంటనే బయలుదేరి సరాసరి వాళ్ల ఊరికే చేరుకున్నా! కాని ఆమె అక్కడలేదు. నాలుగు క్రోసులు నడిచి పెద్దమ్మ ఊరికి వెళ్లిన. అక్క పాదాలకు ప్రణమిల్లి ఒక నిముషం అట్లాగే ఉండిపోయిన. “చంద్రా!” అంటూ నన్ను లేపి కళ్లు తుడిచి నా నుదుటిమీద ముద్దుపెట్టింది. ఆమె నయనాలూ సజలమయినవి. పెద్దమ్మ విస్తుపోయి చూస్తున్నది. ఆమె పాదాలకూ నమస్కరించి నిలబడ్డ. “కూర్చో చంద్రా!” అని ఓ కుర్చీమీద నన్ను కూర్చుండబెట్టి తానూ కూర్చున్నది. లాలనగా నా చేతిని నిమురుతూ చాలా సేపు పరధ్యానంగా ఉండిపోయింది. పెద్దమ్మ అప్పటికే లోపలికెళ్ళిపోయింది. అక్క పెట్టిన ఆ ముద్దు నా జీవితంలో ఓ మధురానుభూతి అయి, చిరస్థాయిగా నిలిచిపోయింది. పరిపూర్ణ ఆప్యాయతానురాగాలతో ఎవరైనా నాకు పెట్టిన మొదటి ముద్దు అదే. రెండు రోజుల తర్వాత అక్కా, నేనూ వాళ్ల ఊరికి వెళ్లినం. వారంరోజులు హాయిగా గడిచిపోయినవి.
ఒకసాయంకాలం. అక్క బాగా అలసిపోయి ఉన్నది. తొందరగా భోజనాలు ముగించుకున్నాం. అక్క విశ్రాంతి తీసుకుంటున్నది. గొండమ్మ ఆమె కాళ్లు ఒత్తుతున్నది. సంకోచిస్తూనే అక్క గది ఎదుట నిలబడి “అక్కా!” అని పిలిచిన. “రా చంద్రా!” అని తలగడ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమన్నది. నా నిశ్శబ్దం గమనించి, “చంద్రా! ఏదో చెప్పాలనుకుంటున్నవు. ఫరవాలేదు చెప్పు” అన్నది. అప్పటికీ నేను నోరువిప్పలేదు. “గొండమ్మ ఉంటే ఫర్వాలేదు. నాకు ఆమె పరాయిది కాదు. నిస్సంకోచంగా చెప్పు” అని భరోసా ఇచ్చింది అక్క.
“అక్కా! నీకో కథ చెప్తా, వింటావా?” “కథనా?” “ఔను.”
“చదువుతున్నవా, కథలే రాస్తున్నవా?” “లేదక్కా! ఇది నిజమైన కథే!” “ఔనా? అయితే చెప్పు”.
“మా పొరుగూర్లో ఒక పెద్దమ్మ (అమ్మకు స్వంతక్క) ఉంటుంది. నాకు ఊహతెలిసినప్పటి నుండి ఆ ఊరికి తరచుగా వెళ్తున్న శీతాకాలపు సెలవుల్లో అయితే తప్పనిసరిగా పెద్దమ్మ ఇంటితో పాటు అక్కడ ఇంకో మూడు నాలుగిండ్లు ఉంటవి. ఊరికి కొంచెం దూరంగా. చుట్టూ పొలాలు, మొక్కజొన్న చేండ్లు, మిరపతోటలూ, వాటికి నీళ్లు పారించడానికి మోటలు కొడ్తూ రైతులు. ఆ పరిసరాలంటే నాకు బాగా ఇష్టం. అక్కడ నన్ను నేను మరచిపోతా!” అక్కడ ఇంకో విశేషమున్నది. అందుకే నేనెప్పుడూ అక్కడికి పోవడానికి ఇష్టపడేవాణ్ణి.”
అక్క ధ్యాసను పరిశీలించడానికి కొద్దిసేపు చెప్పటమాపిన.
“ఏమిటి చంద్రా అది?”
“అక్కడ ఉన్న ఒక అక్క వరుసకు అక్కే, వాళ్ళు పెద్దమ్మకు పాలివాళ్లే. నాకు తెలిసినప్పటి నుంచీ తను అక్కడే ఉన్నది. అక్కచాలా అందగత్తె. రూపురేఖలు, రంగు అన్నీ అచ్చంగా నువ్వే! ఎప్పుడూ తెల్లని మెరిసిపోయే దుస్తుల్లోనే ఉండేది. ఎందుకట్లా ఉండేదో తర్వాత తెలిసివచ్చింది నాకు. చిన్నతనంలో పెళ్లయింది. కొద్దికాలంలోనే భర్త చనిపోయినడు. అప్పటి నుండి అక్క తల్లిగారింటనే ఉంటూన్నది. పెద్దమ్మా, పెద్దనాన్న అన్నలు, వదినలూ అందరికీ ఆమె పట్ల గారాబమే. వాళ్లందరూ మంచివారు. మర్యాదస్తులు. వాళ్ల వ్యవసాయము కూడా పెద్దదే. పెద్ద ఇల్లు. దానికి చాలా పెద్దవాకిలి. మా పెద్దమ్మ ఇల్లు వాళ్లకు మరీ దగ్గరగా ఉంటుంది. నా మాట వినపడితే చాలు, అక్క పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను వాళ్లింటికి తీసుకెళ్లి కూర్చోబెట్టేది. వెంటనే ఏదో ఒకటి తినడానికి తెచ్చేది. కాదు అనేటందుకు లేదు. తినవలసినదే. నేనంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇల్లంతా కలియతిరిగేవాణ్ణి.
“నేను నాలుగేండ్లు ఇక్కడికి రాలేదు కదా! కాని అక్కడికి ఆ ఊరికి మాత్రం వెళ్ళేవాణ్ణి. దగ్గరేకదా! చలికాలపు సెలవుల్లో సంక్రాంతి సందర్భంలో వెళ్ళేవాణ్ణి. ఈ సంవత్సరం ఎప్పటివలెనే జనవరి నెలలో వెళ్ళిన. అంతకుముందుటిసారి అక్కను చూసి ఒక సంవత్సరం గడిచిపోయింది. అందుకే వెంటనే ఆమెను చూద్దామని వాళ్ళింటికి పరుగెత్తిన. ఎక్కడా అక్కజాడ లేదు. ఎవరూ నాతో మాట్లాడలేదు. అక్క అల్లరితో ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇల్లు మూగబోయింది. చిన్నబుచ్చుకుని పెద్దమ్మ ఇంటికి తిరిగివచ్చిన. తనూ ఏమీ చెప్పలేదు. నాలో బాధా, భయమూ, దుఃఖమూ భరించలేకుండా పోయినవి. అక్కడికి కొంచెం దూరంలో ఉండే ఒక అత్త ఇంటికి వెళ్లిన.
‘అది ఎక్కడికిపోయిందో ఎవరికీ సరిగా తెలువదు. కానీ, ఓ పుకారుపుట్టింది. కత్తులూ, చాకులూ, వంటింటి సామాన్లు ఊరూర తిరిగి అమ్ముకునే ఒక అబ్బాయితో వెళ్లిపోయిందని. ఆ తర్వాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. ఊళ్లో అందరూ మీ పెద్దమ్మ కుటుంబాన్ని మాత్రం వెలివేసిండ్రు. ఒకప్పుడు మంచి పేరు, మర్యాదలు గల కుటుంబం’ అని ఆ అత్తనిట్టూర్చింది. నాకు ఏడ్చినంత పనయింది. కాని అత్తముందర కష్టంమీద నిభాయించుకున్న. అత్త చెప్పిందాన్ని బట్టి అక్క బాల వితంతువు, ఆమెకు సంసార సుఖమేమిటో తెలియదు. అత్త దగ్గర సెలవు తీసుకుని బరువెక్కిన హృదయంతో పెద్దమ్మ ఇంటికి తిరిగి వచ్చిన. ఇక అక్కడ ఉండాలనిపించలేదు. ఆ సాయంత్రమే మా వూరికి వెళ్ళిపోయిన. క్రమంగా దుఃఖం, బాధా తగ్గి నా హృదయంలో అక్కపట్ల గాఢమైన సానుభూతి చోటుచేసుకొన్నది. ఆమెపట్ల ఆదరభావం ఇంకా ఎక్కువయింది, క్లుప్తంగా ఇది ఆ కథ అక్కా!” అని కళ్లు మూసుకొన్న. నా హృదయం ఆవేదనతో నిండిపోయింది.
అక్క మృదువుగా నాకుడిచేతిని నిమురుతున్నది. “బాధపడకు చంద్రా!” “అక్కా! చిన్నక్క చేసినపని తప్పా?” అక్క సమాధానం చెప్పలేదు. “అక్కా! నువ్వు ఏదో ఒకటి చెప్పేదాకా నా మనస్సు కుదుటపడదు”. ఆమె దీర్ఘాలోచనలో పడిపోయింది. తర్వాత “ఒకరి జీవితానుభవాలు, వాళ్ల నిర్ణయాలు, వాళ్ళబతుకులమీద తీర్పులు చెప్పటానికి మనమెవరం?” అన్నది. ఆ సమాధానంతో నేను తృప్తిపడలేదు. అప్పుడు నేనన్నాను, “చిన్నక్క మీద నాకు ఏ ఆక్షేపణా లేదు, కాని ఈ లోకులు ఆమె కుటుంబం పట్ల ప్రవర్తించే తీరు సహింపరానిది. వారి పరిస్థితిని తలచుకుంటే బాధగా ఉంటుంది.”
“తమ్ముడూ! నువ్వు సున్నిత మనస్కుడవు. కానీ ఇలాంటి లోకంలోనే నువు జీవిస్తున్నానని గ్రహించు!” అక్క నుండి వచ్చిన ఈ సమాధానమూ, లేదా సందేశము నన్ను సంతృప్తిపరచలేదు.
ఆ రాత్రి చాలాసేపు నాకు నిద్రపట్టలేదు. చివరకు ‘చిన్నక్క నా ఆదర్శం. ఆమె ఈ యుగ స్త్రీ. జీవితాన్ని ప్రేమిస్తుంది. సాహసి, యథాలాపంగా ఓటమిని అంగీకరించదు. ఈ పెద్దక్క నా ఆరాధ్యదైవం. ఆమె జీవితాన్ని ఒక ద్రష్టగానే దర్శిస్తుంది. ఆమె పూర్వయుగాల స్త్రీ. ఉన్నదున్నట్లుగా జీవితాన్ని అంగీకరించడమే ఆమె నైజం. ఇద్దరూ ప్రేమైక జీవులే! ఇద్దరినీ నేను సమంగా ప్రేమిస్తాను’ అని నా మనస్సు తీర్మానించింది.
కాలగమనంలో 30 ఏళ్లు గతించిపోయినవి. ఒకరోజు ఇంట్లో ఫోన్ మోగింది. ఎవరిదో అపరిచిత గొంతు. ‘అక్క ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమె నన్ను చూడాలని కోరుకుంటూన్నది. నా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది’ అని అతడు చేరవేసిన సమాచారం. ఇంత సుదీర్ఘకాలం అక్కను దర్శించుకోనందుకు మనస్సు అనంతమైన దుఃఖంలో మునిగిపోయింది. కారణాలేమైనా కావచ్చు. అవాంతరాలెన్నైనా ఎదురయి ఉండవచ్చు. ఇన్నేళ్లు అక్కను చూడకపోవటం క్షంతవ్యం కాదు అని నన్ను నేను నిందించుకున్నాను. ఏవో కొన్ని సెలవులు కలుపుకుని వారంరోజులకోసం బయలుదేరినం. నేనెంతగానో ప్రేమించిన అక్క అని విని ఉన్నారు కాబట్టి నా శ్రీమతి, ఇద్దరు పిల్లలు కూడా ఆమెను చూడాలనే కుతూహలంతో ఉన్నారు. ఆ ఏడే కొత్తగా కారు కొన్నాం. అందరమూ కలిసి ఒక ఉదయం బయల్దేరి సాయంకాలానికల్లా అక్క ఊరు చేరుకున్నాం. ఆమె ఇల్లు సమీపించేకొద్ది నాలో ఆందోళన అధికం కాసాగింది. వాకిట్లో ప్రవేశించి ఓ పక్కనున్న పెద్ద చేదబావి గచ్చుపళ్లెంలో ఉంచిన గంగాళంలోని నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కుని లోపలికి ప్రవేశించినం
అక్క తన గదిలో పడుకునే ఉన్నది. పడకచెంతనే ఉన్న కుర్చీలో కూర్చుని ఆమె కుడిచేతిని నా రెండు చేతుల్లో తీసుకుని ‘అక్కా!’ అని పిలిచిన. కళ్లుతెరిచి నన్ను చూడగానే, “వచ్చినవా చంద్రా! ఈ అక్కను చూడకుండా ముప్పయ్యేండ్లు ఎట్లా ఉండగలిగినవు? నన్ను పూర్తిగా మరచిపోయినవు!” అని వెంటనే తనకు ఎదురుగా కూర్చుని ఉన్న నా శ్రీమతి నుద్దేశించి, “అక్కా! అక్కా! అని నన్ను నోటినిండా పిలిచే నా తమ్ముని పిలుపు ముప్పయ్యేండ్లు మూగబోయింది. ఊహించగలవమ్మా!” అని ఆమె వంకచూసింది. ఆమె తనను సమీపించి, ‘వదినా!’ అని ఇంకా ముందుకు మాట్లాడలేకపోయింది. “నన్ను క్షమించక్కా!” నా కళ్లు వర్షించసాగినవి. “గడచిన దానికి బాధపడకు. ఇప్పుడొచ్చినవుగదా! అది చాలు”. ఆమె కళ్లు సజలమయినవి. ఇద్దరు పిల్లలను పిలిచి ముద్దుపెట్టుకొన్నది. అక్క శరీరం బాగా శుష్కించి చాలా నీరసంగా ఉన్నది. ముఖం క్షీణచంద్రుని తలపిస్తున్నది. గాంభీర్యం స్థానే ముఖంలో కరుణ, ప్రేమ స్పష్టంగా ప్రస్ఫుటమవుతున్నవి. అక్క ఇంట అయిదు రోజులున్నం. పెద్దమ్మ అప్పటికే కాలం చేసిందని తెలిసింది. ఆ ఊరికి వెళ్లటం విరమించుకున్నం. మా నలుగురి రాకతో అక్క ఇంట్లో సందడిగా ఉన్నది. మా రాకవల్ల కలిగిన ఆనందమో, ఇంట్లో నెలకొన్న కొత్తవాతావరణం వల్లనో అక్క ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్నది.
నాల్గవరోజు నుండి మంచంలో నుండి లేచి ఇంట్లో తిరుగాడుతున్నది. చిన్న కచ్చడంలో పిల్లలను తీసుకుని పొలాలు చూపించుమని ఒక పాలేరును ఆదేశించింది. దగ్గరలోనే ఉన్న గోదావరి నదీజలాలతో సయ్యాటలు, పొలాలు, తోటలు చూడటంతో వాళ్లు తమ సమయాన్ని చాలా ఉల్లాసంగా గడిపినరు.
రేపు ఉదయం మేము మా వూరికి బయలుదేరుతామనగా ఆ ముందురాత్రి భోజనాల తర్వాత అక్క తన గదిలో నన్నొక్కణ్ణి కూర్చోబెట్టుకొని చాలా సేపు మాట్లాడింది. చివరగా తను పడుకున్న మంచానికి మరీదగ్గరగా నన్ను కూర్చోబెట్టుకున్నది.
“తమ్ముడూ! చంద్రా! నీతో చెప్పాలనుకొంటున్న నా ఆంతరంగిక జీవితానికి సంబంధించిన అత్యంత గోప్యమైన విషయం ఒకటున్నది. అది ఇప్పటిదాకా నా మదిలోనే దాచిపెట్టుకున్న ఒక రహస్యం. ఎవరికీ తెలియని రహస్యం. ఎవరితోనూ పంచుకోవడానికి భయపడిన రహస్యం. సానుభూతితో దాన్ని జీర్ణించుకుని సాంత్వన చేకూర్చే ఆర్ద్రహృదయంగల వ్యక్తి నాకింతదాకా తటస్థపడలేదు. కాని ఆ రహస్యం, దాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకుని నా మనస్సును నిరంతరం కలవరపరిచే ఓ భావన నా హృదయంమీద పెద్ద గుదిబండలాగా మారినవి. జీవితాంతం నేనా భారాన్ని మోయలేను. ఇప్పటికి దానికి పరిష్కారం దొరికిందని అనిపిస్తున్నది.
“నువ్వు నాకు అత్యంత విశ్వసనీయుడవు. నా మీద ఉన్న నీ ప్రేమాభిమానాలు నిర్మలమైనవి. స్వార్థరహితాలు. ఇంకో విషయం కూడా విను! స్త్రీల జీవితాలు, వారి ఆవేదనలు, ఆకాంక్షలను వారి హృదయాలలోనికి చొచ్చుకునిపోయి వాటిని ఆకళింపు చేసుకుని స్పందించే అర్ద్ర హృదయం నీది. అందుకే ఈ అక్క తన అంతరంగాన్ని ఇన్నాళ్ళూ క్షోభపెడుతున్న ఆ జీవిత రహస్యాన్ని నీ ముందర విప్పి తన హృదయాన్ని తేలికపరుచుకోవాలని నిశ్చయించుకున్నది. అందువల్లనే, ఇన్నేళ్లయినా నీమీద ఉన్న సడలని నా విశ్వాసంతోనే నిన్ను నా దగ్గరకు రప్పించిన!” అక్క కొంచెం సేపు మౌనంగా ఉండిపోయింది.
“ఏమిటక్కా అది? నిరంతరంగా నీ మనశ్శాంతిని భగ్నంచేసి నిన్ను వేధిస్తున్న సంఘటన ఏమిటక్కా! ఈ తమ్ముడు నీ విశ్వాసాన్ని ఎప్పటికీ వమ్ముచేయడు. నీ గుండెమీది భారం దిగిపోతుందనుకుంటే ఆ రహస్యమేమిటో చెప్పక్కా!” అన్నాను.
“ఆ గుప్త విషయం తెలిసి అక్క పట్ల ఇంతవరకున్న నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావో, నీ భక్తి ప్రపత్తులు చెదిరిపోతాయో నాకు తెలియదు. కాని ఒక్కటిమాత్రం గట్టిగా నమ్ముతా! తమ్ముడు నాకెప్పుడూ దూరంకాడు. నా పట్ల తనకున్న ప్రేమ ఏమాత్రమూ అస్థిరమవదు.”
“అక్కా! నీ ఈ తమ్ముడు ఎప్పటికీ నువ్వు మొదటిసారిగా చూసిన ఆ ఎనిమిదేండ్ల ముద్దుల కుర్రవాడే. నా అక్కపట్ల హృదయంలో ఆనాడు ఏ భక్తి, ఆరాధనా భావాలు చోటుచేసుకున్నవో అవి చిరస్థాయిగా నిలిచి ఉంటవి. చెరగని నా అక్క మమతానురాగాలను నేనెప్పటికీ వదులుకోను.”
“ఇక అసలు విషయం విను చంద్రా! తన జీవితంలో ఏ పరిస్థితిని నీ చిన్నక్క ఎదుర్కొన్నదో, అచ్చంగా అదే పరిస్థితి నా జీవితంలోనూ తటస్థపడింది. దాని మూలంగా నా మనస్సులో కొంతకాలం పెద్ద సంఘర్షణే జరిగింది. నీ చిన్నక్క సంఘాన్ని ధిక్కరించింది. స్వతంత్రించి తన జీవిత గమ్యాన్ని తానే ఎన్నుకొన్నది. విజేతగా నిలిచింది. నువ్వు చెప్పినట్లుగా ఆమె గొప్ప సాహసి!
“ఇక ఈ అక్క! సమాజానికి తలవంచింది. దాని క్రూర దుర్నీతిని ఎదుర్కొనే సాహసం లోపించి ఓడిపోయింది. రాజీపడి జీవిస్తున్నది. ఇదీ నీ ఆరాధ్యదైవం నీ అక్క నిజమైన అస్తిత్వం!” అని ఆగిపోయింది. అక్క నయనాల నుండి ఉబికిన అశ్రువులు ఆమె చెక్కిళ్ల మీదుగా జారిపడుతున్నవి. నేను వెంటనే లేచి కన్నీళ్లు తుడిచి అక్క రెండు చేతులను నాచేతుల్లోకి తీసుకుని సున్నితంగా నిమురుతున్నా. అక్క నా నుదుటిని చుంబించి, “సదా సుఖసంతోషాలతో వర్ధిల్లు! తమ్ముడూ” అని ఆశీర్వదించింది.
తిరుగు ప్రయాణమంతా ఒకే ఒక భావన ఎడతెరిపి లేకుండా నా మనస్సును కలవరపరచసాగింది: ‘సభ్యసమాజం’- దాని దుష్టనీతి, పక్షపాతబుద్ధి! ఎందరక్కల జీవధారలను శోషించి అర్ధంతరంగానే శుష్కకుహరాలుగా మార్చి వేస్తున్నవో కదా!’