నాడు మా అమ్మ అవని నుండి నీవు విడిపోయి గగనతలంలో విహరిస్తున్నావని మా అమ్మ
” చందమామ రావే జాబిల్లి రావే” అని నిన్ను పిలుస్తూ బుజ్జగిస్తూ పాటలు పాడుతూ ఆడిస్తున్నది…
నీ వెన్నెల చల్లదనంలో రాత్రి వేళ , హాయిగా తీయగా పాడుతూ ఆడుకుంటున్నాము…
నీవు మా చెంతకి తిరిగి రాలేకపోయినా
మేమే మేనమామ ఇంటికి , ఆశించి ప్రయత్నించి వచ్చాము మామయ్య…
ఎలాగైతేనేం నీ నివాసం చూడగలిగాం నేడు.
నీ ముందు భాగం పండు వెన్నెల ప్రసరిస్తే ,
నీ వెనుక భాగం చిమ్ము చేకటెందుకు?
నీ తిమిర భాగంలో నిక్షిప్తంగావున్న సంపదను చూడాలని ఉంది మామ !
ఈ ఖనిజ, మూలకౌల సంపదంతా ఇక్కడ నిరుపయోగంగా పడివున్నాయి….
ఒంటరివాడివి ఎందుకు నీకివన్నీ !
ఎవరైనా ఆస్తులు సమకూర్చి కూడబెట్టినా రాబోవు తరానికి అందిస్తారు…
నీవు వదలివచ్చిన నీ సోదరి , మా భూమాత సంతతే కదా మేమంతా!
అమ్మ తరువాత ఆమె తోబుట్టువు నీవు , మాకు మా మేనమామవే కదా….
ఎన్నో శ్రమలకోర్చి నీ ఇంటికి వచ్చాము.
మా జగతి జనం పురోగతికి తోడ్పడి ,
నీ నిక్షిప్త నిధులను భువికి తరలించి , ఆదుకోవాలని ఆశించివచ్చాం !
ఈ రాఖీ పండుగ సందర్భంగా , మాకు రాఖీకట్టి
” అంతా శుభమే జరుగుతుందని, క్షేమంగా వెళ్లి లాభంగా రండని ” మా అమ్మ అవని పంపించింది.
మీకు ఈ సందర్భంగా భువిపై జనావళి అందరి శుభాకాంక్షలు అందిస్తున్నాం.
ఇక నుండి మేమిలానే వస్తూ పోతుంటాం .
ఇక సెలవు
కవితలు
వర్షాన్ని,భూతల్లిని నమ్ముకుంటాడు రైతు
సాలుసాలంతా స్వేదం చిందించి కష్టించి
పంటను గిట్టుబాటుధరకుఅమ్ముకున్నప్పుడు
కళ్లల్లో ఆనందాల అరోరాకాంతులు
భూమంతా సంతోషం గుండెల్నిండా
మనసు దూదిపింజంలా తేలిపోతుంది ఆ క్షణం
అక్కడ ప్రాజెక్టు మంజూరు కాకముందు
ఏలోటులేని మహారాజు అతడు
మాలకు దారం
మమతలకు మనిషే ఆధారం
ఆరుగాలం దుక్కిదున్నే హాలికుడికి
మరిభూమేకదా బంగారం
ప్రాజెక్ట్ పనుల ప్రకటన
సర్వేలు,నిర్థారణలు
నష్టపరిహారాల వెల్లువ
ఏండ్లకేండ్లు వ్యవసాయం చేస్తున్నా
పట్టాపాసుబుక్కుల్లేని రైతే
ఏ హక్కుల్లేని నేరస్తుడు ఇప్పుడు?
జవాబులు లేని ప్రశ్న అతడు?
కుటుంబానికి ఏమని చేస్తాడతడు వాగ్దానం ?
పట్టాకాగీతాలులేని రైతులంటే శీతకన్నే
వాస్తవాలకు దూరమైన జి.వోలు
దయలేని అధికారులు
కంటితుడుపుగా కొంతమొత్తం విదిలిస్తే ఏంలాభం?
అతడు కన్నకలలన్నీ
తటాకంలో గాలిగీసేఅలలై తీరంలోకనుమరగయ్యాయి
పట్టాభూమిగల రైతు నగదుకునగదు,భూమికిభూమి పొంది
నాగలిపట్టి దర్జగా దున్ని ఏటికేడుప్రగతిపల్లవందుకోవడమే
ఆవశ్యమైన దేశాభివృద్ధి దేశప్రజలందరికీ శుభసూకమే
పట్టాదస్తావేజులులేని నిర్వాసితుడు మాత్రం
భూమితోబాటుప్రాజెక్టు నీళ్లల్ల నిండామునిగి
ఏకాకి బాధాజీవి కావడమే విషాదగీతం
ఉన్నట్టు ఉండి అతను దున్నే భూమి ఎలా అదృశ్యం అవుతుందో?
ఎందుకు అంతర్థానం అవుతుందో?
అర్థంకాదు…ఎటూ పాలుపోదు… అతనికి
భూమిలేనితనం
కర్షకుడికి భరించరాని విలువల్లేని ఒంటరితనపు బతుకువేదనే ఈ లోకంలో
ఆశలన్నీ పక్షులై తిరిగిరాని దూరాలకుఎగిసిపోయిన ఆకాశం అతడు
ఎంతగా ఎదురుచూసినా ఏమి ప్రయోజనం?అంతా శూన్యం?
చివరికి అప్పులు అతని ఆస్తులు
బతుకు తిప్పలైన జీవితం అతడు
ఒక్కోసారి ప్రాజెక్ట్ అంటే
లోతట్టుభూముల్ని
పట్టాలేని భూరైతుల్ని
గల్లంతుచేస్తున్న సముద్రజలం
జీవితాలు జీవితాలే తలక్రిందులు చేస్తున్నభూస్థలం బహుశా
వంశపారంపర్యమైన భూమికి
పట్టాచేసుకోకపోవడం అజ్ఞానమో,పేదరికమో, నిర్లక్ష్యమో,జడత్వధర్మమో
దేశంలోవెసులుబాటు చట్టాలు ఇంకనూ లేకపోవడం తలపోసే అంశం
అదిగో నైరుతిఋతుపవనాల ఆగమనం
ఆగని కుండపోతవానల ఏకశృతి గానం
జలాశయాలు అన్నీ నిండుకుండలే!.
భూమిని,భుక్తిని కోల్పోయిన రైతులకేది న్యాయం?.
నేలను కరుచుకుని అర అంగుళం దేహం
తలకు రెండు యాంటినా కళ్ళు
ఆరుకాళ్ళతో చలాకీగా కదులుతూ
కత్తిరించిన ఎర్రటి మక్మల్ బట్ట ముక్కలు
చల్లినట్లు నేలపై ఆరుద్రలు!

ఆరుద్ర కార్తె ఆరంభం తో
చినుకులతో పాటే
ఎర్రటి మొగ్గలు పూసినట్లు
పచ్చటి గడ్డిపై అవి…
బీడు వారిన భూమిపై
తొలకరి జల్లు చేరంగానే…
బడిగంట శబ్దానికి
పిల్లలు బిలబిలా పరుగుతీసినట్లు
కుప్పలుతెప్పలుగా చందమామ పురుగులు!
కొంత ఇసుక నేల
మరికొంత పచ్చ గడ్డి నేల ఉంటే చాలు
పట్టుకుచ్చుపూలలా అలరిస్తాయి!
పిల్లలను పెద్దలను ఆకర్షిస్తూ
ముట్టుకుంటే ముడుచుకు పోయే
అత్తిపత్తి మొక్క లా మక్మల్ పురుగులు!
ఇసుకనేల బొరియల్లో జీవనం సాగిస్తూ ….
నేలను గుల్ల బార్చి పంటకుపోషకాలు
అందించడంలో సహాయకారులు!
ఆ రుద్రుడికి ప్రీతికరమైన నామాలతో
మన మధ్యే మనకోసం బ్రతికే జీవులు !
వరుణదేవుడి కి ప్రతిరూపాలు
రైతన్నలకు నేస్తాలు ఆరుద్ర పురుగులు!
పక్షవాతం మరెన్నో రుగ్మతలకు
తమ ప్రాణాలను అర్పించి
సాంప్రదాయ ఔషధ ప్రధాతలు రెడ్ వెల్వెట్ మైట్స్!
ఇప్పుడు
దళారుల చేతుల్లో కాసులు కురిపించేందుకు
వాటి దేహాలను చాలించి
రేపటి తరానికి ఆన్లైన్ లో
బొమ్మలుగా కనిపించబోతున్నాయి!
విరామమెరుగక వీస్తున్నది
విద్యుత్ వీవన
ఊష్మకంలో వెట్టిచాకిరిచేస్తూ
వీవనలెన్ని వీచినా
తరగని వేసవితాపం
తనువంతా స్వేదం
నిదాఘమ నిద్ర కోసం
కృత్రిమకృత్యాలెన్నయినా
ఆ సూరీడి ఎదుట
వెలవెలబోయే దివిటేలేగా
మదిలోన ఎదలోన
భానుడి భగభగల ఊష్ణసంవహనం
రహదారులన్నీ
నిర్మానుష్య నిస్సవ్వడి క్షేత్రాలు
సవ్వడి పెరిగి
శీతలత్వాన్ని స్పృశిస్తూ ప్రశ్నిస్తూ
చినబోయిన శీతల యంత్రాలు
పర్యావరణ మిత్రకు
పరిపరి ప్రశ్నలు
పెను సవాళ్లు
పెచ్చుమీరుతున్న
సంబంధ బాంధవ్యాల నిష్పత్తుల క్షీణత
జలచక్రంలో
తరిగిన తరువులు
కొండలు గుట్టలు చెరువుల
అదృశ్యదృశ్యం
నీరింకని సిమెంటు రోడ్లు
అడుగడుగున
వర్షాగమనంలో
మట్టి వాసనలకు దూరమైన బతుకులు
నీరింకని చెమ్మలేని చేతల చైతన్యం
నవనాగరికత పేరున
పన్నీరు తన్నీరు
కాలుష్యపు కాసారంలో
కన్నీరై కడగండ్లు
వాతావరణంలో నీటితేమ లేని
పొడిబారిన తడిలేని వడగాడ్పులు
ఉష్ణోగ్రతల ఉక్కిరి బిక్కిరిలో
జీవజాలం
శీతల పవనపుంజాల వేటలో
అతలాకుతలం!
బొగ్గుబావుల్లో
వేసవి నిప్పుల కొలిమికి
స్నేహం స్వేదంతో
మలయసమీరాల వీవనలు
కర్బన ఉద్గారాలతో
కర్పరాలను దాటేస్తూ
వేడి చెలిమెల గ్రీష్మతాపం
బాష్పోత్సేకానికి
బహుదూరపు బాటసారిలా
విశృంఖలంగా వృక్ష హననం
ఎడారుల్లా మారుతున్న
కారడవులు కార్చిచ్చు
కదనోత్సాహాంతో!
శిక్షణలు క్రమశిక్షణలు
మరచిన మనిషి అవసరానికి
ప్రకృతి బలిపశువు
ప్రకృతి విశృంఖల విధ్వంసం
లయకారకం వినాశకరం
విరించి విరచితం
వాతావరణ సమతుల్యత
అసమగ్రం అసమంజసం
డబ్బుమైకంలో మద్యం మత్తులో
ఆడంబరాల ఆలంబనలో గ్రీష్మం
వీవనలెన్ని విరామమెరుగక ఊగినా
తగ్గని శరీర తాపం
మనిషి మనసు మారితేనే
ఆదర్శ వాతావరణం
ఆదర్శ సమాజం
లేదంటే నరక కూపంగా
నవసమాజం ప్రగతిని ప్రశ్నిస్తూ!

వెంకటేశ్వర స్వామిని జోలపాడి నిదుర బుచ్చుతున్న అన్నమయ్య.
సీసమాలిక :-
భక్తుల తరియింప భగవంతుడేతాను
బాలుడై దిగివచ్చె బంటు జేర
కోనేటి రాయునిగోముగా ముద్దాడి
ఆర్తిగా లాలించె అన్నమయ్య
యేడుకొండలవాని యెత్తుకొనిమురియ
తన్మయత్వముపొందె తనివి తీర
బాలాజి రూపాన భక్తుడే కీర్తించ
ఆనందభరితుడై అవతరించె
శంకుచక్రములెల్ల శరములోలెనుగాక
ఆటబొమ్మగమారె అయ్యచేత
జోఅచ్యుతానంద జోతలే పాడగా
అలసటనుమరిచి ఆద మరిచె…
ఆటవెలది :-
ఆపదలనుబాపుఅలమేలు పతియేను
ఆడుకొనగవచ్చె నవనియందు
భాగవతములోని బాలకృష్ణునిరూపు
కన్నులారగాంచకనులునిండె
అడిగి అడిగి అలసిపోయాను
కాశీపుర వీధుల్లో తిరిగినట్లు
కాగితపు భిక్షా పాత్రతో
గడప గడపను గంగలా తాకి తీర్థమయ్యాను
ఐనా –
నా గొంతు తడారే వుంది
గుండె ఎడారై ఇసుక నదుల్ని
సాగనంపడానికి సిద్ధంగా ఉంది
భుజాన వేళ్లాడుతున్న ఖాళీ జోలె
బరువు విలువ ఏమిటో బోధిస్తోంది
కొన్ని యోజనాల పొడవు నా గమ్యం
తెలియని దారుల్లో అడుక్కుంటూ, వెతుక్కుంటూ-
ప్రతి సింహద్వారం ఎదురగా నిలుచొని
గడప మీద విసుగ్గా విసిరేసిన అనుభవాలను ఏరుకుంటూ –
దారి మధ్యలో –
గడ్డకట్టిన మాటల చిత్తు కాగితాలను పోగేసుకుంటూ
ఛీత్కారాల గ్రీష్మంలో కాలిపోతున్న
మంచులో తడిసి ముద్దయిన ‘గొబ్బెమ్మ’ పొడపైన
విరిసే వసంతాలను ఎదపైకి ఎత్తుకుంటూ
నడచి నడచి అలసిపోయాను
ఫడేల్ మని మూసుకుంటున్న ద్వారాల వెనుక
కనబడిన ఖండిత దృశ్యాలను
మూగబోయిన ముఖ ద్వారాల గొంతుల్లోంచి
జారిపడుతున్న కొన్ని మాటల రేణువులను
రిక్తమైన హృదయ కళశంలోకి వొంపుకున్నాను
బరువెక్కిన జోలెతో వెనక్కి తిరిగితె
ఈ ప్రపంచం వదిలి వెళ్లిన చోటే
నేనొక
విలువల మూటనయ్యాను.
పచ్చని నేలపై పశుత్వం
పెల్లుబికిన వేళ
భూగర్భ ఖనిజాలపై
దృష్టి పడిన వేళ
కన్నూ మిన్నూ కానకుండా,
స్త్రీలు పిల్లలు అని చూడకుండా,
దాడులు అత్యాచారాలు
జరిపిన వేళ
దుకాణాలు,
వాహనాలు,
ఇళ్ళు,కాల్చివేసి,
బూడిద చేసిన వేళ
దిగంబర స్త్రీపై
దాష్టీకం చేస్తున్నాడు క్రూరుడొకడు
బెల్టుతో బాదుతున్నాడు
నిర్దయతో వాడొకడు
నవ్విపోదురుగాక నాకేంటన్నట్టు
నడిబజార్ లో సిగ్గు లేని జనాలు
చోద్యం చూస్తున్నవేళ
కాళ్లొకచోట
చేతులొకచోట
తలొకచోట
మొండెమెుక చోట
తెగిపడిన వేళ
మణిపూర్ మాయలో పడిన వేళ
ప్రపంచంలో జరుగనటువంటి
హింస జరిగిన వేళ
ఈ కిరాతకానికి
హిట్లర్ సైతం సిగ్గుపడేవేళ
రెండు నెలలుగా
సోషల్ మీడియాను
చీకట్లో ఉంచిన వేళ
ఎంతోమంది తల్లుల
అక్కల చెల్లెళ్ళ
కూతుళ్ళ హాహాకారాలకు
ఆకాశం దద్దరిల్లిందేమో
దేవుని వద్ద దేర్ ఉంది
ఆయన వద్ద
అధేంర్ లేదు
దేవుడికి భయపడాలి మరి
అది మణిపూర్ కానీ
మరోటి కానీ
తప్పు చేసారంటే తలవంచాల్సిందే!
పిల్లి కళ్ళు మూసుకొని
పాలు తాగినంత మాత్రాన
ప్రపంచం చూడకుండా ఉంటుందా?
ఓ ప్రపంచమా మేలుకో
ఓభారతీయుడా మేలుకో
శాంతిని
సోదర భావాన్ని
ప్రేమాభిమానాలు
గల వాతావరణాన్ని
ఈ నేల కోరుతున్నది
కంకణం కట్టుకో
కంకణం కట్టుకో
కంకణం కట్టుకో
అలా…..అలా..
అలరించే అలలతో
పాడుతూ సాగిపోతావు
చల్లని నీమనసు
సుతిమెత్తని నీ హృదయం
నీ ఒడి చేరినపుడే నాకర్థమైంది౹
గర్భంలో ఎన్ని విపత్తులు దాచుకుంటావు౹
బాహ్యంలో ఎందరి రసపిపాసకుల హృదయం దోచుకుంటావు౹
కవి కలంలోని సిరలో రసమైంది నీవే కదా౹
నీ రసమైన మాహృదయంలో ఉత్సాహం నింపింది నీ పరుగే కదా౹
నీకు ఒరిగేదేముంది అనుకోవు౹
అడుగడుగునా
పుడమికి పచ్ఛదనాన్నద్దుతావు౹
ఆర్తుల ఆకలి తీర్చడంకోసం
వారి నోటిలో అన్నపు ముద్దౌతావు౹
నీలో అడుగిడగానే
నాకు నేనే పొంగి పోయేటట్లు
నాగరికతను బోధిస్తావు౹
సంస్కృతీ సంప్రదాయాలను కథలు కథలుగా చెప్తావు౹
ఓ తరంగిణి
గమ్యాన్ని మరువని గమనం నీది౹
నన్ను మరువకు
నీతో కలసిన పలుగు రాళ్ళకు మృదుత్వాన్ని అలదినావు
నేనూ రాయినే
రాస్తూనే ఉంటాను
నిను చూస్తూనే ఉంటాను..
నీవు పాడుతూనే ఉండాలి
పుడమిని కాపాడుతూనే ఉండాలి౹
★★★★★★★★★★★
ఈ రోజంతా మనమందరం
కొత్తదనంతో-నవతనువుతో
హృదయమంతా ఉదయించిన
ఉత్తేజ ఉద్వేగభరిత
హుషారుగా ఉషానిషా కిరణాలవుతున్నాం..!
మనమంతా
ఉల్లాసంగా ఉత్సాహంగా
తొలి యవ్వన కాంతులమై
అన్ని పండుగలన్నీ ఒకేసారి
కాళ్ల ముందుకు వచ్చినట్లుగా…
విందుల వినోదాలు
సరదాలసరాగాలన్నింటిలో
సత్వర ద్వార సందర్శనమై
సంలీన విలీనమై
సౌకర్యాల సౌరభాల మధ్యఓ విజయంగా విజృంభిస్తున్నాం…!
కలకలం – కలతలు లేకుండా
కలకాలం కలిసి ఉండాలనీ
కలలన్నీ నిజం కావాలనీ
సంకల్ప సంక్రాంతికి
నిర్ణయాలు నిర్భయంగా
తోడూ నీడైన నిమిషాన
ప్రతీ వాగ్దానంతో
ఒళ్లు విరుచుకుంటున్నాం..!!
ఇక…. ఇప్పటి నుండి
రేపటి – భావి జీవితం కోసం
క్రమం తప్పని..కసరత్తుని
కంకణంగా కట్టుకుని…………….
కలం కదిలించి- కదం కదిపి
గళం విప్పి- గతం మరిపించి
సవరించుకుని సరిదిద్దుకుని
సర్దుబాటు చేసుకుని
అప్పటి వరకు
ముడుచుకున్న ముఖాలు
వికసితమైన వీక్షణంతో
వైరాగ్యంలో మహాభాగ్యాన్ని
వేకువ మెళకువల్లో మెలికలు తిరిగి
మేలిమిని వెతుక్కుంటున్నాయి..!!
అనుదినమూ ఆనందంగా
శ్వాసించిన..ఆశించిన..ఆచరించిన
తరుణం తర్వాత…
నిన్నటి కన్నా మిన్నగా
ఏ తీరమైనా- ఏ తరమైనా
మహాత్తరమవుతుందనీ…..
అటు ఆరంభశూరత్వ లేమిని
ఇటు నూతనతన్మయత్వ కలిమిని
నిత్యం నిఖిలం
చలించని చెలిమిని
అభిలషిస్తూనే
ఇపుడు ఇక………
గమనం-గమ్యం పురోగమించేలా
అందరం…..ఒక్కటవుదాం…..!!!
చెమటను చిందించిన చేతులు
భవనాన్ని నిర్మిస్తే బతుకుపోరంటావు
నువు మాత్రం అవుటర్ రింగ్ రోడ్డో
అందమైన గెస్ట్ హౌసో రూపకల్పన చేసి
ఇది మేధోమధనమంటావు
అనాదిగా కష్టించే కార్మికులు
ఈ దేశంలో రెండవ తరగతి పౌరులే
ఆశ్చర్యం పడాల్సిందేమీలేదు
సామూహికంగా అలవాటుచేసుకున్న
సానుభూతి చాటున
నీ విసుగు వినయాన్ని ప్రదర్శిస్తోంది
వారిని తలుచుకో ఒక్కసారి…
పునాదులు తీస్తారు
ఇటుకపై ఇటుక పేరుస్తారు
అంతస్తుపై అంతస్తుకట్టి
తథాస్తు దేవతల్లా దీవిస్తారు
ఓటుబ్యాంకు కాదుకాబట్టి
మరోమజిలీకి మారిపోతుంటారు
అద్దె గర్భాన్ని మోసిన తల్లుల్లా
కన్నీటితో వీడ్కోలు పలుకుతారా
పోనీ జ్ఞాపకాలను కన్నీటిని చేస్తారా అనుకుంటే
వారి గాంభీర్యం అన్నింటిని కప్పేస్తుంది ఆకలితోసహా…!
కట్టినవాడు హక్కుదారుడు కాదు
హుష్ కాకి అంటే ఎగిరిపోయినట్టు
మరో చోటును
వెతుక్కుంటూ అలుపెరగని బాటసారుల్లా సాగిపోతారు అన్న నిజం తెలిసిన ధనికస్వామ్యవర్గం
విలాసంగా నవ్వుకుంటుంటుంది !
భారంమోసే భూమిలా బలహీనులెప్పుడూ
బాధ్యతతో సాగే నిశ్శబ్ద యాత్రికులే
వారు పరాయికరణ చెందలేదు
శతాబ్దాలుగా వారు పరాయివారిగానే
మిగిలిపోయారు.. కాదు కాదు
పరాయివాళ్ళని చేసేశాం
మనమే పరాయికరణ చెందాం
(ఏహక్కూలేని కొంతమంది వలస కార్మికులను చూసినప్పుడు)