చాణక్యుడు అర్థశాస్త్ర రచయిత . అర్థశాస్త్ర విషయములే కాకుండా పాలనా రీతి ,నీతి పాలనా విషయముల కూలం కుష పరిశీలన చేశాడు .అప్పుడు పరిపాలనలో ఉన్న నందవంశ పాలన (బౌద్ధమత అనియాయి )నిర్మూలింప జేసి గాంధారదేశంలో తిష్టవేసిన విదేశీ దురాక్రమదారుల పీచ మడచడానికై చంద్రగుప్త మౌర్యునితో కలిసి బలమైన పునాది నిర్మించాడు .అది దాదాపు ఒక ఎనిమిది లేదా తొమ్మిది వందల సంవత్సరాల వరకు ప్రత్యేకంగా ఒక దురాక్రమణదారు అనేది లేకుండా చేయగలిగింది .శకులు ,యవనులు ,కుషానులు మున్నగు వారు వచ్చి చిన్నచిన్న రాజ్యాలు ఏర్పరచినా వారు స్థానిక ప్రజలతో మమేకమై దాదాపు స్థానికులుగానే మిగిలిపోయారు .వివిధ కారణాల వల్ల వివిధ పేర్లతో వచ్చిన ఇస్లాం దండ యాత్రలు మొదటి రెండు మూడు వందల సంవత్సరాలు దోచుకుని పోవడానికే వినియోగించుకున్నారు . గుప్త సామ్రాజ్యం శాతవాహన రాజుల కాలాలు హిందూ బౌద్ధ మతావలంబనలకు అనుకూలంగా రాజ్యపాలన కావించి గుంపులు గుంపులుగా వస్తున్న వారిని అటకాయించి ఆపి వారిని స్థానికీకరించారు .ఈ మధ్యలో చిట్టచివరి ఉత్తర భారత సామ్రాజ్యం హర్ష చక్రవర్తిదే . దక్షిణ భారతంలో కాకతీయ మరియు విజయనగర సామ్రాజ్యాలు కొంతకాలం తురుష్క దండయాత్రలకు తట్టుకున్న కాలక్రమంగా ఈ రెండు సామ్రాజ్యాలు తురక దండయాత్రలకు గాని పరస్పర యుద్ధాలకు గాని తట్టుకోలేక మొత్తం భారతదేశమంతా ఔరంగాజేబు పరిపాలనలో మొఘల్ సామ్రాజ్యముగా మారిపోయింది .ఈ క్రమంలో ఈశాన్య భారతదేశంలో పాల సామ్రాజ్యం కొంతవరకు బౌద్ధాన్ని నిలబెట్టగలిగింది .ఇది క్రీస్తుశకం 800 నుండి క్రీస్తుశకము 1200 వరకు మాత్రమే .
క్రీస్తు శకం 8 00 నుండి క్రీ.శ. 1200 వరకు దక్షిణ భారతదేశము నుండి ఒడియనులు తెలుగువారు మరియు తమిళులు నౌక మార్గము ద్వారా ఇండోనేషియా ,జావా సుమత్రాలలో హిందూ బౌద్ధ రాజ్యాన్ని ఏర్పరిచినారు .
తక్షశిల, నలంద ,విక్రమశిల , నాగార్జున మున్నగు విశ్వవిద్యాలయముల నేర్పరచి ఆ కాలంలోనే భారతదేశం ప్రపంచ దేశాలకు విజ్ఞాన భిక్ష పెట్టింది . ప్రపంచంలో అన్ని మూలలనుండి విద్యార్థులు భూ,జల మార్గాల ద్వారా వచ్చి చదువుకున్నారని తెలుస్తుంది. ఈ విషయం ఆ కాలంలోనే భారతదేశ వైభవం తెలుపుతుంది. ఈ విధంగా భూ జల మార్గాల ద్వారా వర్తక మరియు రవాణా జరిగాయని ఇవి వేలయేళ్ళ కొనసాగింపని తెలుస్తుంది. కాలక్రమంలో భారత దేశంలో బౌద్ధం మరియు మిగతా మతాలలో అనేక శాఖలు ఏర్పడి మతపరమైన ఘర్షణలు గందరగోళాలు ఏర్పడసాగాయి .పటిష్టమైన తర్కంతో హేతువాద భూమికతో యున్న బౌద్ధ మతము ఆరామాలు మఠములు ఆర్థిక తోడ్పాటుతో నైతికపతనం ప్రారంభమైంది . బౌద్ధంలో వజ్రయానం అనే శాఖ ద్వారా తాంత్రికం బయలుదేరి బుద్ధుడు ఏ విషయాలయితే చెడుగా చెప్పి జీవితంలో నుంచి బహిష్కరించాడో వాటికే పెద్ద పీట వేసి పతనం వైపుకు చేరుకుంది . ఈ మధ్యకాలంలో వైదిక మతము పంచ మకారాలను నిష్కర్షగా నిషేధించి సనాతన మతరూపంలో బౌద్ధ జైన శాఖలలోని అహింస హేతుబద్ధతల్ని కొంతవరకు జీవితానికి అనువయింపజేసే వీలు వసతి కల్పిస్తూ అద్వైత తత్వానికి దారులు వేసింది సరిగ్గా ఈ సమయంలోనే ఆదిశంకరుడు కాలడిలో జన్మించి చిన్నతనంలోనే ఏకసంథాగ్రహణంతో విద్యలన్నీ నేర్చుకొని నర్మదా తీరంలోని గోవిందాచార్యుల శిష్యరికంతో బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి అద్వైత మత ప్రస్థానం మొదలు పెట్టాడు .బౌద్ధ తత్వంలోని శూన్యవాదాన్ని తన మాయావాదంతో ఎదుర్కొని అద్వైత సిద్ధాంతాన్ని భారతదేశ మంతట వేళ్ళూనుకునేటట్లు బలపడి పై చేయి సాధించేటట్లు చేయగలిగాడు .అయితే ఈ క్రమంలో బుద్ధుని భగవంతుని అవతారంలో ఒకరిగా చేర్చి బౌద్ధ సూక్తులు అన్నిటిని తీసుకున్నా డు . ఆ విధంగా అప్పటి బౌద్ధంలో వైదికల్లో ఉన్న చెడుపోకడలని నాశనం చేసి నిజమైన బౌద్ధ సనాతన ధర్మాన్ని ప్రతిష్టించాల్సిన అది శంకరుడు ఆ ప్రయత్నం చేశాడు. ఒకరకంగా హేతువాద దృష్టి తగ్గడం వల్ల భారతదేశ ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకుంది . బలమైన వైదిక మతస్తులు మత సంస్కరణ ఇష్టం లేనివారు అంతా కలిసి ఆదిశంకరుని ప్రచ్ఛన్న బౌద్ధునిగా నిరసించి నిందించారు .ఈ విధంగా ఒక సంధి కాలంలో విదేశీ దురాక్రమణం ఎదుర్కొన్న చాణక్యుడు ,మత సంస్కరణతో అన్ని శాఖలను పరస్పరం సమన్వయం చేసి గానపత్యులు ఇంకా నరబలులు జంతుబలులు చేసే వారిని మార్చి ఎదుర్కొని ఓడించి అద్వైత మత స్థాపన చేసిన ఆదిశంకరాచార్యుడు , ఇరువురు ప్రఖ్యాత పురుషులు మరియు ప్రత్యేక స్థలంలో ఉన్నవారైనప్పటికీ లక్ష్యసాధనలో చాణిక్యుడు సఫలం అయ్యాడని చరిత్ర నిరూపించింది . చాణక్యుడు విదేశీ దాడుల్ని దండయాత్రనని అణివేసే పరిస్థితి ఏర్పరిస్తే ఆ కోణంలో ఆదిశంకరుడు విఫలమయ్యాడు .
విగ్రహారాధన లేని ఒకే నిరాకార భగవంతుని విధేయతతో ఇస్లాం మతప్రభావం భారతదేశం పై బలంగా పడింది .దాదాపు ఒక వేయి సంవత్సరాలు ఇస్లాం మతస్తుల మతపరమైన పరిపాలనలో భారతదేశం ఉండిపోయింది .వర్తక వాణిజ్యాలకై వచ్చిన బ్రిటిష్ వారు (తెల్లవారు )1857 నుంచి 1947 వరకు నిరంకుశ పాలన గావించినా ఆధునిక ఇంగ్లీష్ విద్య పరిపాలన సంస్కరణల ద్వారా చదువుకున్న యువత ప్రజాస్వామ్య స్వయంపాలనకై అనేక రకములైన పోరాటాలు చేసింది .1920 నుంచి జాతీయ పోరాట రూపంలో గాంధీ నాయకత్వంలో క్రమక్రమంగా ప్రజా ఉద్యమాలు వెల్లవలా వచ్చాయి .శాంతి , అహింస,నిరాడంబరత మొదలైన మౌలిక విషయాల ద్వారా సత్యాగ్రహ ఉద్యమ రూపంలో ప్రజలు తండోపతండాలుగా ఉద్యమించారు .
ప్రభుత్వ హింసను హింస ద్వారానే ఎదుర్కోవాలనే వాదంతో బయలుదేరిన ఉద్యమాలన్నీ కొంతవరకు సాగి చివరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా జపాను తోడ్పడుతో బ్రిటిష్ ఇండియా విముక్తికై పోరాడింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి అమెరికా రష్యా బ్రిటన్ కూటమి విజయం సాధించడం ద్వారా ఒక కొత్త పరిస్థితి ఏర్పడింది .రష్యా మూడవ ప్రపంచ దేశాల స్వాతంత్రానికి బలంగా నైతిక మద్దతు తెలపడం , అమెరికా కూడా ప్రపంచంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మద్దతు ప్రకటించడం వల్ల బ్రిటన్ కు మింగుడు పడని పరిస్థితి వచ్చింది. భారతదేశంలోని అన్ని కులాలను వర్గాలను మతాలను ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటంలో మమేకం గావించిన కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్ పక్కలో బల్లెంలా తయారయింది. విభజించి పాలించు అనే కూటనీతితో బ్రిటిష్ వారు చివరకు భారత ఉపఖండమును పాకిస్తాన్ మరియు భారతదేశం ,రెండు దేశాలుగా విభజించి వెళ్లారు .విభజన సమయంలో కనీ వినీ ఎరుగని హింస విధ్వంసం చెలరేగాయి .ఎట్టకేలకు ఆగస్టు 14 , 1947నాడు పాకిస్తాన్ ,1947 ఆగస్టు 15 నాడు భారతదేశం (హిందుస్థాన్ ) స్వతంత్ర దేశాలుగా బ్రిటిష్ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడినాయి.
వ్యాసాలు
ఒక వ్యక్తి తాను అనుకున్న రీతిగా లక్ష్యాలను చేరుకుంటూ తన ఏడు పదుల జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం సామాన్య విషయం కాదు. కానీ అందులో కృతకృత్యులై జీవన సాఫల్యాన్ని చవి చూసినవారు దాస్యం సేనాధిపతి గారు. అందరిలాగే జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కున్నా కవిగా, రచయితగా, సమీక్షకులుగా, ఉత్తమ సభా నిర్వాహకులుగా పలువురి మన్ననలను అందుకున్నారు. ఇటీవలే సప్తతి మహోత్సవాన్ని జరుపుకొని ఆత్మీయులనేకులు అక్షరరూపంలో వ్యక్తీకరించిన ఆప్యాయతానురాగాలను ‘అక్షరగీతం’ పేరుతో అభినందన సంచికగా వెలువరించారు. ఇది కేవలం అభినందనలకు పరిమితమైన పొత్తంగా కాక అభినందన పురస్సర జీవితచరిత్రగా చెప్పవచ్చు. అక్షరదాసులైన సేనాధిపతి గారు వారి సతీమణి గీతారాణి పేరును కూడా ఈ అభినందన సంచిక పేరులో పొదువుకొని ‘అర్ధాంగి’ అనే మాటను సార్థకం చేశారు.
ఇందులోని అంశాలను బట్టి దీనిని ఆరు భాగాలుగా విభజించుకోవచ్చు.
* మొదటి మరియు మూడవ భాగంలో వివిధరంగాల ప్రముఖులు, సాహితీవేత్తలు, బంధుమిత్రుల సందేశాలు, వ్యాసాలు, కవితలు ఉంటాయి.
* రెండవ భాగమంతా సేనాధిపతిగారి సాహిత్య సమాలోచన చేస్తూ ప్రసిద్ధ సాహితీవేత్తల విశ్లేషణలు, ప్రత్యేక వ్యాసాలున్నాయి.
* నాల్గవ భాగంలో ఆయనవి రెండు ఇంటర్వ్యూలు… పూర్తి సాహిత్య వివరాలతో ఆయన మాటల్లోనే చెప్పిన విశేషాలతో ఒకటి, వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆయన వివరించిన అంశాలతో ఒకటి ఉంటాయి.

* అయిదవ విభాగమంతా వివిధ వర్ణ చిత్రాలు, ఆయా సందర్భాలలో ఆయనకు సంబంధించి వివిధ పత్రికల్లో వెలువడిన విశేషాలుంటాయి.
* ఆరవది పూర్తిగా ఆయన జీవిత పరిచయం ఉంటుంది.
పుస్తకం ఆసాంతం ఆయనతో ఆత్మీయత గలవారి ఛాయా చిత్రాలు సందర్భానుసారంగా క్రమపద్ధతిలో కూర్చడం ఈ పుస్తకానికి ఎంతో వన్నె తెచ్చింది.
మాన్యులు సి.హెచ్. విద్యాసాగర్ రావు గారు దీనిని ఒక కర్తవ్య గాథగా పేర్కొంటూ “వాక్చాతుర్యంతో మంత్రించగలగడం మాత్రమే కాదు. మౌనంగా నిర్దేశం చేయగల శక్తి ఆయనది” అన్న మాటలు దాస్యం వారి జీవితస్వరూప స్వభావాన్ని మొత్తంగా ప్రత్యక్షం చేయిస్తాయి.
మనం ఎన్నో అభినందన సంచికలను చూసి ఉంటాం. వాటిల్లో ఇది విభిన్నమైనది. సందేశాలు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆయనకు కుటుంబంతో ఉన్న అనుబంధం, బంధుమిత్రులతో ఉన్న వాత్సల్యం, ఉద్యోగ ప్రస్థానంలో వారు తమ సహోద్యోగుల పట్ల చూపిన ఆదరాభిమానాలు, వారితో ఉన్న స్నేహశీలత వల్ల ప్రతీఒక్కరూ వారిని గురించి తమ ఆత్మీయతను ఇందులో వెల్లడించడం దీనికొక ప్రత్యేకతను ఆపాదించింది. ఒకవైపు కౌటుంబిక జీవితానికి ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు సాహిత్యంతో మమేకమై సభలు, సమావేశాలు , సాహితీ సంస్థలతో అనుబంధాన్ని పెనవేసుకొని ముందుకు సాగుతున్నారాయన.
“మా కురు ధన జన యవ్వన గర్వం, హరతి నిమేషాత్కాలః సర్వమ్” అన్న శంకరాచార్యుల మాటలను ఆయన తమ జీవితంలో ఆచరణాత్మకంగా నిరూపించారు. క్షణభంగురమైన జీవితంలో ప్రతీ క్షణాన్ని వినియోగించుకున్నారు. ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకొని ప్రయోజనకరంగా మలచుకున్నారు.
ఒక వృత్తిలో ఉన్నవారికి క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం ప్రధానలక్షణాలు. అందులో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. దీనికి ఉదాహరణగా వారి సతీమణి గీతారాణి గారు ఈ పుస్తకంలో తమ దాంపత్య జీవితాన్ని వివరిస్తూ చెప్పుకున్న అనుభవాల్లో ఒకదానిని చూద్దాం. ఆయన శిశుమందిర్ జిల్లాల పర్యవేక్షణాధికారిగా ఉన్నప్పుడు సూర్యోదయానికి ముందే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ రాత్రికో తిరిగి వచ్చేవారు. ఒకనాడు మూడేళ్ళ కుమారుడు సేనాధిపతిగారిని చూసి ‘ఈయనెవరు?’ అని అడిగిన మాట ఆ తల్లిదండ్రుల మనస్సులను ఎంతగా కలచివేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతటి కార్యదీక్షాపరులు సేనాధిపతిగారు.
“Duty is more important than beauty and personal happiness” అని అంటారు. అయితే కావచ్చు. కానీ వృత్తిలో నిబద్ధత కలిగిన వ్యక్తులు కొన్ని అపురూపమైన ఆనందాలను కూడా త్యాగం చేయడం తప్పనిసరి అవుతుంది.

“ప్రతిభా నవనవోన్మేష శాలినీ” అన్నట్లు ఆయన ఎప్పటికప్పుడు తమ ఆలోచనాసరళిని కొత్తగా రూపు దిద్దుకుంటూ వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. ఇప్పటివరకూ 16 పుస్తకాలను వెలువరించి తమ సమర్థతను చాటుకున్నారు. సామాజిక అంశాలపై వెయ్యికి పైగా సంపాదక లేఖలు రాయడం వారి సాహిత్యాభిరుచితో పాటు వైశిష్ట్యాన్ని, వైయక్తిక అభీష్టాన్ని వ్యక్తపరుస్తుందని శ్రీ కె. వి. రమణాచార్యులు గారు దాస్యం వారిని ప్రశంసించారు.
“ఇప్పుడు వస్తున్న కవిత్వంలోనూ, ఇతర రచనల్లోనూ పైపైన అక్షరాలు వెల్లువెత్తినంతగా హృదయం వెల్లువెత్తడం లేదు. హృదయస్పందన లేని కవిత్వం వ్యర్థమ”ని దాస్యం సేనాధిపతిగారు చెప్పిన మాటలు రచనల పట్ల కవులు, రచయితలకు ఉండాల్సిన బాధ్యతను స్పష్టం చేస్తాయి. ఆయన సునిశిత పరిశీలనా దృక్పథాన్ని తేటతెల్లం చేస్తాయి. కాలక్షేపానికో, మేమూ రాయగలమని పదిమందికి చెప్పుకోవడానికో రాస్తున్న వారందరూ ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
ఒక పుస్తకం ఆయన చేతిలో పడడమే ఆలస్యం. వెంటనే స్పందించడం ఆయన నిరంతర అధ్యయన శీలత్వానికి నిదర్శనం. చదివిన వెంటనే స్పందించి దానికి సమీక్ష రాయడం మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వర్ధమాన కవులను కూడా ప్రోత్సహించడం ఆయన ఉదాత్త వ్యక్తిత్వ లక్షణం. ఆయన సమీక్ష మూల గ్రంథాన్ని మించిన సౌందర్యాన్ని సంతరించుకోవడం పరిపాటి. ఇప్పటివరకు 1500 కు పైగా సమీక్షలు రాసారంటే ఆయన అక్షరాన్ని ఎంత ప్రేమిస్తారో, ఎంత బాధ్యతగా భావిస్తారో అర్థం చేసుకోవచ్చు.
“ఈనాడు సాహిత్యం వికాసదశలో కాకుండా ప్రతికూల దశలో పయనిస్తున్న సందర్భంలో సహృదయ సార్వభౌముల కొరత మీవంటి వారి వల్ల తీరుతున్నది” అని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు దాస్యం వారిని అభినందించడం సేనాధిపతి గారి సాహితీ ప్రకాశనానికి నిదర్శనం. వాణిజ్యశాస్త్ర పయోనిధి అయినప్పటికీ నిరంతర అధ్యయనం, సహృదయత, మానవీయత మొదలగు సల్లక్షణాలు కలిగిన సేనాధిపతిగారు సారస్వతార్చనలో మేటిగా, ఆధ్యాత్మ చింతనా వాహినులుగా తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు.
ఈ అభినందన సంచిక దాస్యం సేనాధిపతి గారి జీవితాన్ని వడ్డించిన విస్తరిలా మన ముందుంచుతున్నది. కంటికింపైనది మనసుకింపైనట్లు అందమైన పుస్తకంతో పాటు ఆయన వ్యక్తిత్వ, సాహిత్య జీవితాలు హృదయంగమంగా పాఠకులను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. ఇంతటి పుస్తకాన్ని వెలువరించడానికి ‘ఉదయసాహితి’ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాస్యం లక్ష్మయ్యగారితో పాటు అంకితభావం కలిగిన ఆ సంస్థ నిర్వాహక సభ్యులు చేసిన కృషి ప్రశంసించదగినది. దాస్యం సేనాధిపతి గారు పరిపూర్ణ ఆరోగ్యవంతులై శతాధిక ఆయుష్మంతులై మరింత సాహితీ కృషి చేయగలగాలని కోరుకుంటూ సప్తతి మహోత్సవ సందర్భాన వారికి అభినందనలు.
జ్ఞాన సముపార్జనకు పూర్వ కాలం నుండి ఎంతో మంది తపస్సులు చేసారు, ఎన్నో వేదవేదాంగాలు, గ్రంథాలు చదివారు. అలా ఎంతో మంది తత్వవేత్తలను మనం పురాణేతిహాసాలలోను, చరిత్రలోనూ చూస్తాము. పురుషాధిక్యత ఉన్న వేదకాలంలో పతుల నీడలోనే, గృహాల్లోనే కాలం వెళ్ళబుచ్చే మహిళలు జీవించే వ్యవస్థనుండి ప్రపంచానికి తమ ఉనికిని చూపిన మహోన్నతస్త్రీలు కూడా ఉన్నారనటానికి ఉదాహరణ లోపాముద్ర, గార్గి, అపాలా, మైత్రేయి వంటివారు.
మైత్రేయి వేదకాలంలోనే మహిళలు చదువుకుని, తత్వవిచారం చేసినారని చెప్పడానికి మంచి ఉదాహరణ. భారతీయ మహిళల విజ్ఞానానికి, ఆధ్యాత్మిక ఆలోచనలకు ఆమె ఒక ప్రతీక. మైత్రేయి ప్రాచీన భారతదేశ వేదకాలానికి చెందిన ప్రముఖ మహిళా తత్వవేత్త. బృహదారణ్యక ఉపనిషత్తులో ఆమెను యాజ్ఞవల్క్య మహర్షి యొక్క ఇద్దరు భార్యలలో ఒకరిగా పేర్కొన్నారు. రెండవ భార్య కాత్యాయనీ. యాజ్ఞవల్క్యుడు క్రీ.పూ. సుమారు 8వ శతాబ్దానికి చెందినవాడిగా పండితులు అంచనా వేస్తున్నారు.
మైత్రేయి ఆస్తి, సంపదలకంటే బ్రహ్మజ్ఞానమే శాశ్వతమని విశ్వసించిన బ్రహ్మవాదిని. యాజ్ఞవల్క్యునితో ఆమె చేసిన తత్త్వచర్చలు ఉపనిషత్తులలో ముఖ్యమైన స్థానం పొందాయి. ఈ సంభాషణలలో ప్రతిఫలించే ఆత్మ బ్రహ్మ ఏకత్వ భావన తరువాత కాలంలో రూపుదిద్దుకున్న అద్వైత వేదాంతానికి మౌలిక ఆధారంగా పరిగణించబడుతుంది. మహాభారతం, మరి కొన్ని స్మృతి వ్యాఖ్యాన సంప్రదాయాలలో మైత్రేయిని బ్రహ్మజ్ఞాన సాధనకు అంకితమైన మహిళగా వర్ణించారు. ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఆమెను బ్రహ్మవాదినిగా అంటే వేదతత్త్వాలపై లోతైన అవగాహన కలిగిన తత్వవేత్తగా గౌరవించారు. మైత్రేయి భారతీయ తత్త్వచింతనలో మహిళల మేధస్సు, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఋగ్వేదంలో మహిళా ఋషులు ఉన్నారు (లోపాముద్ర, గార్గి, అపాలా వంటివారు), కానీ మైత్రేయి ఋగ్వేద ఋషిగా పేర్కొనబడలేదు. మైత్రేయి ప్రధానంగా ఉపనిషత్తుల కాలానికి చెందిన వ్యక్తి, ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తులోనే ఆమె స్థానం స్పష్టంగా కనిపిస్తుంది. మైత్రేయి యాజ్ఞవల్క్య సంభాషణ భారతీయ తత్వశాస్త్రంలో అత్యంత ముఖ్యమైనది. వేదకాలంలో మహిళలకు విద్య, తత్వచింతన అవకాశాలకి మైత్రేయి ఉదాహరణ. ఆమె ప్రాచీన భారతదేశానికి చెందిన మహిళా తత్వవేత్త. ఆమె గురించి ఋగ్వేదంలో సూక్తాలు లేవు. మైత్రేయి ప్రధానంగా బృహదారణ్యక ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఆ ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షితో ఆమె చేసిన సంభాషణలో ఆత్మ అంటే ఏమిటి, మనుషులు ఎందుకు ప్రేమిస్తారు అనే విషయాలు చర్చించబడతాయి. ఈ సంభాషణ ప్రకారం, మనం ఇతరులను లేదా వస్తువులను ప్రేమించేది మన ఆత్మ కారణంగానే. ఈ సంభాషణలో చెప్పిన ఆత్మ, బ్రహ్మ ఏకత్వ భావన
2 / 8
తరువాత కాలంలో ఏర్పడిన అద్వైత వేదాంతానికి ఆధారంగా పరిగణించబడుతుంది. శంకరాచార్యుల శిష్యుడు సురేశ్వరాచార్యుడు తన వర్తిక గ్రంథంలో ఈ విషయాలను మరింత వివరించాడని చెబుతారు.
మైత్రేయి ఎక్కడ పుట్టింది అనే విషయంపై ఉపనిషత్తులు మౌనం పాటిస్తున్నాయి. కేవలం యాజ్ఞవల్క్య ఆశ్రమం / గృహ పరిసరాల్లో ఆమె జీవించింది అనే అంచనా మాత్రమే. పండితుల అంచనాలు (ఊహలు మాత్రమే – సాక్ష్యాలు కావు) విదేహ దేశం (మిథిలా ప్రాంతం) లేదా కురుపాంచాల ప్రాంతం. ఎందుకంటే యాజ్ఞవల్క్యుడు ఈ ప్రాంతాలవాడని వినికిడి. కానీ ఇది శాస్త్రీయ నిర్ధారణ కాదు.
బృహదారణ్యక ఉపనిషత్తులో ఆమెను “మైత్రేయి” అనే పేరుతో మాత్రమే పరిచయం చేస్తుంది. ఆమె భర్త యాజ్ఞవల్క్యుడు అని మాత్రమే చెబుతుంది. ఆమె తండ్రి పేరు, తల్లి పేరు, ఆమె వంశం (గోత్రం) ఎక్కడా ధృవీకరించలేదు. ఇది ఉపనిషత్తుల స్వభావమని చెబుతారు. ముఖ్యమైన తాత్విక కారణ మేమిటంటే వేద–ఉపనిషత్తు సంప్రదాయంలో “ఎవరి కుమార్తె?” కంటే “ఏ సత్యాన్ని తెలిపింది?” అన్నదే ముఖ్యం. మైత్రేయి విషయంలో ఆమె ప్రశ్నలే ఆమె గుర్తింపు. ప్రామాణికంగా చెప్పగల విషయాలు ఆమె బ్రహ్మవాదినీ, అత్యున్నత వేదాంత విద్య పొందిన స్త్రీ, గురువునే ప్రశ్నించే స్థాయిలో మేధస్సు కలది. గృహస్థ జీవితం కంటే జ్ఞానజీవితాన్ని ఎంచుకున్నది. అంటే ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె ఆలోచనలే నిర్వచించాయి, వంశం కాదు.
“మైత్రేయి తల్లి–తండ్రులు లేదా ఆమె జన్మస్థలం గురించి ఉపనిషత్తులు ఎటువంటి వివరాలు ఇవ్వవు. ఇది వేదకాల గ్రంథాల ప్రత్యేకత. వ్యక్తిగత చరిత్ర కంటే, ఆమెలో వ్యక్తమైన తాత్విక చైతన్యమే ముఖ్యమని ఇది సూచిస్తుంది. మైత్రేయి గుర్తింపు ఆమె వంశం వల్ల కాదు, ఆమె అడిగిన ‘అమృతత్వం’ ప్రశ్న వల్ల నిలిచింది.” కానీ ఆమె మానవ జ్ఞానానికి కుమార్తె అని మాత్రం స్పష్టంగా తెలుస్తుందని పండితుల అభిప్రాయం. మైత్రేయి తల్లి, తండ్రులు, జన్మస్థలం గురించి ఉపనిషత్తులు గానీ, వేద గ్రంథాలు గానీ ఎక్కడా పేర్కొనలేదు. ఈ వివరాలు చారిత్రికంగా లభ్యం కావు. మైత్రేయి తల్లి–తండ్రులు, ఆమె జననం ఎక్కడ అనే విషయంపై స్పష్టంగా, ప్రామాణికమైన వివరాలు దొరకలేదు. వేదాలు వ్యక్తిగత జీవన చరిత్ర కాదు, తత్త్వజ్ఞానమే ప్రధానమని చెబుతాయి. ఉపనిషత్తులు ఆమె అంతర్గత జీవితం గురించి మాత్రమే మాట్లాడతాయి, బాహ్య జీవితం గురించి కాదు.
మరి మైత్రేయి ఎవరు? మైత్రేయి వేదాంత కాలానికి చెందిన బ్రహ్మవాదినీ — అంటే బ్రహ్మం (పరమసత్యం) గురించి విచారించే తత్వవేత్త. ఆమె పేరు బృహదారణ్యక ఉపనిషత్తులో అత్యంత గౌరవంతో ప్రస్తావించబడింది. ఆమె యాజ్ఞవల్క్య మహర్షి ఇద్దరి భార్యలలో ఒకరు, కానీ సాధారణ గృహిణిగా కాకుండా జ్ఞానాన్వేషిణిగా నిలిచింది. కాలం సుమారు క్రీ.పూ. 800–700. స్థానం విదేహ రాజ్యం జనక మహారాజు కాలం. ఆమె స్వభావం జిజ్ఞాస, తత్త్వవిమర్శ, ధైర్యం. గ్రంథాల ద్వారా కనిపించే లక్షణాలు ప్రశాంత స్వభావం, స్పష్టమైన ఆలోచన, వినమ్రత, ధైర్యం, భావోద్వేగం కంటే తత్త్వబుద్ధి. ఇవే మనకి అందుబాటులో ఉన్న సమాచారం.
అంతేకాక మైత్రేయి గురించి కొన్ని ప్రత్యేకతలు వివరించారు. వాటిలో సంపదను త్యజించిన స్త్రీ అని, ప్రాచీన కాలంలో ఆస్తి పంచుకోవడం గొప్ప అవకాశమైనా, ఆమె దాన్ని తిరస్కరించిందని పండితుల ఉవాచ. అంతే
3 / 8
కాక ఆమెలో ప్రశ్నించే ధైర్యం ఎక్కువని, యాజ్ఞవల్క్య బోధ మధ్యలో “ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు, మరింత వివరించండి” ఆమె భర్తను ప్రశ్నించేది. ఆ ప్రాచీన వ్యవస్థలో భర్తతో మాట్లాడటానికే చాలా ధైర్యం కూడదీసుకోవలసిన తరుణంలో మైత్రేయి నిస్సంకోచంగా ప్రశ్నించటమే తన జ్ఞానమార్గమని భావించింది.
ఆమె గార్గితో సమకాలీకురాలు, సమాన స్థాయిగా పేరొందారు. గార్గి సభలో ప్రశ్నించింది. మైత్రేయి గృహంలో ప్రశ్నించింది. ఇద్దరూ తత్వంలో సమానులు. కాని మైత్రేయి జనకుడి సభలో ఉండిందన్న దానికి ఆధారాలు లేవు. ఆ సభలో పాల్గొన్నది గార్గి మాత్రమే. ఈ ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో, వేర్వేరు మార్గాల్లో ఉపనిషత్తుల తాత్విక పరిపక్వతకు దోహదం చేశారు.” గార్గి, సభలో ప్రశ్నించిన తాత్విక ధైర్యం. మైత్రేయి, జీవితార్థాన్ని వెలికితీసిన తాత్విక లోతు. ఇద్దరూ ఉపనిషత్తుల రెండు ముఖాలని పండితుల అభిప్రాయం.
ప్రసిధ్ధ మైన విదేహ రాజు జనకుడి సభలో యజ్ఞవల్కుడు, ఉద్దాలక ఆరుణి, అశ్వలాయనుడు, కాహోళుడు, భుజ్యుడు, గార్గివాచక్నవి వంటి మహాతాత్వికులు పాల్గొన్నారు. ఇది ఒక పబ్లిక్ ఫిలసాఫికల్ డిబేట్. గార్గి సభలో నిలబడి యాజ్ఞవల్కుడిని నేరుగా ప్రశ్నిస్తుంది. రెండుసార్లు వాదన చేసినట్టుగా చెప్పబడుతుంది. అందుకే గార్గి సభా తత్వవేత్త. కాని మైత్రేయి జనకుడి సభలోను, పండితుల సభలోను, రాజసభలోను ఎటువంటి తత్వ విచారం చేసినట్టుగా బృహదారణ్యక ఉపనిషత్తు 2.4, 4.5 అధ్యాయాలలో లేదు.
కాని యాజ్ఞవల్క్యుడు – మైత్రేయి మధ్య వ్యక్తిగత తాత్విక సంభాషణ మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ఆమె యాజ్ఞవల్క్యుడితో వ్యక్తిగతంగా జరిపిన సంభాషణ ద్వారా వేదాంతానికి అంతఃస్వరూపాన్ని ఇచ్చింది. ఇది గృహ పరిసరాల్లో జరుగుతుంది. అంతర్ముఖమైన (introspective) వేదాంత బోధ, మోక్ష, ఆత్మ, అమృతత్వం గురించిన ఉపదేశం మాత్రమే. అందుకే మైత్రేయి అంతఃతాత్విక విచారణకారిణి (private philosopher) అని వివరించారు.
ఎందుకు ఈ తేడా. ఇది చాలా ముఖ్యమైన తాత్విక విషయం. గార్గి, సమాజంలో జ్ఞానస్థాయిని ప్రశ్నిస్తుంది. తత్త్వానికి బాహ్య సరిహద్దులను పరీక్షిస్తుంది. “ప్రపంచానికి ఆధారం ఏమిటి?” అని అడుగుతుంది. మైత్రేయి, జీవనార్థాన్ని ప్రశ్నిస్తుంది.“నేను అమృతత్వాన్ని ఎలా పొందగలను?” అని అడుగుతుంది. తత్త్వాన్ని జీవితంతో అనుసంధానిస్తుంది. ఒకరు లోకాన్ని ప్రశ్నించారు, మరొకరు జీవితాన్ని ప్రశ్నించారు. ఇక మనం మైత్రేయి జ్ఞానోపదేశం, తత్వ విచారం ఎలా పొందిందని ఆమే భర్తతో చేసిన వాదనలను బట్టి మనకు అవగాహనకు వస్తుంది.
మైత్రేయి–యాజ్ఞవల్క్య సంభాషణ (బృహదారణ్యక ఉపనిషత్తు 2.4). ఈ సంభాషణను ఉపనిషత్తుల హృదయం అని కూడా అంటారు.
యాజ్ఞవల్క్యుడు గృహస్థాశ్రమాన్ని వదలి వనప్రస్థానికి వెళ్లాలని నిర్ణయించే సందర్భంలో, తన ఆస్తిని ఇద్దరు భార్యలకు పంచాలనుకుంటాడు. దానికి మొదటి భార్య కాత్యాయనీ గృహ జీవితం కోరింది. కాని రెండవ భార్య
4 / 8
అయిన మైత్రేయి జ్ఞానాన్ని కోరింది. లక్ష్యం- బ్రహ్మజ్ఞానం, దారి – తత్త్వవిచారణ, ప్రతీక- జ్ఞాన దాహం మైత్రేయి తత్వ విచారమైతే, కాత్యాయనికి గృహసుఖం, కర్తవ్యాచరణ, సంప్రదాయం ప్రధానమైనాయి.
అప్పుడు మైత్రేయి తన భర్తను అడిగిన ప్రశ్నే వేదాంత చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైనది.
“స్వామీ! ఈ సంపదతో నాకు అమృతత్వం లభిస్తుందా?” దానికి యాజ్ఞవల్క్య సమాధానంగా “లేదు మైత్రేయి! ధనంతో అమృతత్వం రాదు. ధనం కేవలం భౌతిక సుఖాన్ని ఇస్తుంది.” అంటాడు.
అప్పుడు మైత్రేయి:
“అయితే నాకు ఆస్తి అవసరం లేదు. నాకు బ్రహ్మజ్ఞానం కావాలి.” అని తన ఖచ్చితమైన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇది ఆమె వైరాగ్యం + తత్త్వజిజ్ఞాసకు నిదర్శనం. మైత్రేయికి బోధించిన తత్త్వసారం.
1.ఆత్మకేంద్ర తత్త్వం యాజ్ఞవల్క్యుడు చెప్పిన ప్రసిద్ధ వాక్యం:
“ఆత్మవా అరే దృష్టవ్యః, శ్రోతవ్యః, మంతవ్యః, నిదిధ్యాసితవ్యః”
అర్థం ఆత్మనే చూడాలి, వినాలి, ఆలోచించాలి, ధ్యానించాలి. ఉపనిషత్తుల కేంద్ర సిద్ధాంతం ఇదే.
2.ప్రేమకూ మూలం ఆత్మే అని అద్భుతమైన మానసిక-తాత్విక విశ్లేషణను యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి వివరిస్తాడు.
· భార్యను భార్యగా కాదు — ఆత్మ వల్లే ప్రేమిస్తాం
· భర్తను భర్తగా కాదు — ఆత్మ వల్లే ప్రేమిస్తాం
· కుమారుడు, ధనం, లోకం — అన్నీ ఆత్మ వల్లే ప్రియమైనవి
3.ఆత్మ = బ్రహ్మం. మైత్రేయికి బోధించిన అత్యున్నత సత్యం:
· ఆత్మకు ద్వితీయమేదీ లేదు
· ఆత్మే బ్రహ్మం
· అన్నీ చివరికి ఆత్మలోనే లీనమవుతాయి.
మైత్రేయి కాలం: వేదాంత ప్రారంభ దశ (సుమారు క్రీ.పూ. 800–700). గ్రంథ మూలం: బృహదారణ్యక ఉపనిషత్తు. 2.4 అధ్యాయం. 4.5 అధ్యాయం. పాత్ర: బ్రహ్మవాదినీ (బ్రహ్మజ్ఞానం కోరిన స్త్రీ తత్వవేత్త). సంబంధం: యాజ్ఞవల్క్య మహర్షి భార్య. ఉపనిషత్తుల్లో పేరు స్పష్టంగా పేర్కొనబడిన కొద్ది మంది స్త్రీలలో మైత్రేయి ఒకరు — ఇదే ఆమె గొప్పతనమని ఇదే ఆమె చారిత్రిక స్థానం మని పండితుల అభిప్రాయం.
“బ్రహ్మవాదినీ” అంటే ఏమిటి? వేదకాలంలో స్త్రీలు రెండు రకాలుగా వర్ణించబడ్డారు.
5 / 8
- సద్యోవధూవులు – గృహజీవితం ఎంచుకున్నవారు
- బ్రహ్మవాదినులు – బ్రహ్మజ్ఞానం కోరినవారు
మైత్రేయి రెండవ వర్గానికి చెందినది. ఆమెకు వివాహం గృహసుఖం కోసం కాదు. జ్ఞానసాధనకు ఒక దారి మాత్రమే.
మైత్రేయి–యాజ్ఞవల్క్య సంభాషణ, సందర్భం. యాజ్ఞవల్క్యుడు గృహస్థాశ్రమం విడిచి వనప్రస్థం / సన్యాసానికి సిద్ధమవుతాడు. తన ఆస్తిని భార్యలైన కాత్యాయనీ, మైత్రేయికి పంచాలనుకుంటాడు.ఇక్కడే మైత్రేయి అడిగిన ప్రశ్న వేదాంత చరిత్రను మార్చింది.
మైత్రేయి ప్రశ్న – వేదాంతానికి మూలబిందువు
ప్రశ్న:”స్వామీ! ఈ సంపదతో నేను అమృతత్వాన్ని పొందగలనా?”ఇది సాధారణ ప్రశ్న కాదు.
ఇది మూడు విషయాలను సూచిస్తుంది: - ఆమెకు మరణభయం లేదు, కానీ మరణాతీత స్థితి కావాలి
- ఆమెకు సంపద విలువ తెలుసు, కానీ అది తుదలక్ష్యం కాదని తెలుసు
- ఆమెకు మోక్ష జిజ్ఞాస ఉంది
ఇదే వేదాంతానికి ఆరంభం.
యాజ్ఞవల్క్య సమాధానం. “న ఆరే అమృతత్వస్య ఆశా అస్తి విట్టేన” (ధనంతో అమృతత్వం రాదు)
అర్థం: ధనం సుఖం ఇస్తుంది. కానీ శాశ్వతత్వం ఇవ్వదు.
మైత్రేయి వెంటనే స్పందిస్తుంది:
“యేనాహం న అమృతా స్యామ్ కిమ్ అహం తేన కుర్యామ్”
(అమృతత్వం రానిదైతే, అటువంటి దానితో నాకు పనేముంది?) ఇది ఆమె తాత్విక ధైర్యానికి అద్భుత ఉదాహరణ.
మైత్రేయి ఎంపిక – జ్ఞానమే సంపద ఆమె స్పష్టంగా చెబుతుంది.“నాకు ఆస్తి వద్దు” “నాకు బ్రహ్మజ్ఞానం కావాలి” ఇది త్యాగం కాదు, తత్త్వబుద్ధి.
యాజ్ఞవల్క్య బోధించిన మహత్తర సిద్ధాంతం ఆత్మకేంద్రీకరణ “ఆత్మవా అరే దృష్టవ్యః, శ్రోతవ్యః, మంతవ్యః, నిదిధ్యాసితవ్యః”
6 / 8
అర్థం ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మను ధ్యానించాలి.ఆత్మను అనుభవించాలి.ఇదే ఉపనిషత్తుల సారం.
ప్రేమ తత్త్వం – ప్రపంచంలో అత్యద్భుతమైన విశ్లేషణ
యాజ్ఞవల్క్యుడు చెబుతాడు: భర్త భర్తగా కాదు → ఆత్మ వల్లే ప్రియుడు. భార్య భార్యగా కాదు → ఆత్మ వల్లే ప్రియురాలు.కుమారుడు, ధనం, లోకం → అన్నీ ఆత్మ వల్లే ప్రేమించబడతాయి
ఇది భారతీయ తత్త్వంలో తొలి మానసిక విశ్లేషణ.
ఉపనిషత్తులో ప్రసిద్ధ వాక్యం ఉంది.
న వా అరే పత్న్యాః కామాయ పతిః ప్రియో భవతి
ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి
అర్థం: భార్య కోసం భర్త ప్రియుడు కాదు; ఆత్మ కోసం భర్త ప్రియుడు అవుతాడు.
ఆత్మ అంటే బ్రహ్మం. ఆత్మకు రెండవది లేదు. ఆత్మే పరమసత్యం. అన్నీ చివరకు ఆత్మలో లీనమవుతాయి. మైత్రేయి ఇదే జ్ఞానం కోరింది.
మైత్రేయి ప్రత్యేకతలు (లోతైన విశ్లేషణ)
1) ప్రశ్నించే హక్కు
ఆమె యాజ్ఞవల్క్య బోధలో మధ్యలోనే చెబుతుంది: “ఇది నాకు ఇంకా స్పష్టంగా లేదు”
వేదకాలంలో గురువును ప్రశ్నించే హక్కు ఆమెకు ఉంది.
2) సంపదను తిరస్కరించిన స్త్రీ ఇది త్యాగం కాదు —సారాన్ని గుర్తించిన బుద్ధి.
3) గార్గితో తుల్యత. గార్గి సభలో ప్రశ్నించింది. మైత్రేయి గృహంలో ప్రశ్నించింది. ఇద్దరూ బ్రహ్మం గురించే ప్రశ్నించారు.
మైత్రేయి తత్త్వం:నీ విలువ బయట ఉన్న వాటితో కాదు. నీ లోపల ఉన్న ఆత్మబుద్ధితో నిర్ణయించాలి. “ధనం కాదు, జ్ఞానమే అమృతత్వం” అని లోకానికి నేర్పిన మహాస్థ్రీ మైత్రేయి. జీవితం సుఖంగా ఉండాలి కానీ జీవితార్థం తప్పిపోకూడదు. సంబంధాలు ప్రేమకు మూలం.
యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్పిన అత్యంత లోతైన మాట: “భర్తను భర్తగా కాదు — ఆత్మ వల్లే ప్రేమిస్తాం.”
7 / 8
ఆధునిక అన్వయం: సంబంధాలు స్వార్థంపై ఆధారపడితే అవి నిలవవు.“నువ్వు నాకు ఏం ఇస్తావు?” అన్న భావనకు బదులు. “నువ్వు ఉన్నావు కాబట్టి నేను సంపూర్ణుడిని” అన్న భావన రావాలి. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కు మూలం అని విశ్లేషకులు అంటారు.
మహిళా సాధికారత – మైత్రేయి ఆదర్శం. సంపదను తిరస్కరించింది. జ్ఞానాన్ని ఎంచుకుంది.గురువునే ప్రశ్నించింది.
ఆధునిక మహిళలకు ఇది చెబుతున్న సందేశం. ఆర్థిక స్వావలంబన ముఖ్యం. కానీ బౌద్ధిక స్వాతంత్ర్యం మరింత ముఖ్యం. ప్రశ్నించే ధైర్యమే నిజమైన సాధికారత. ఆధునిక జీవితంలో ఆందోళన, ఒంటరితనం,అర్థశూన్యత పెరుగుతున్నాయి.
మైత్రేయి దృష్టిలోని పరిష్కారం. ఆత్మపరిశీలన, మౌనం, లోపలి అవగాహన.ఇవే నేటి mindfulness, self-awareness భావనలకు మూలం. మైత్రేయి తత్త్వం – ఒక వాక్యంలో “బయట సంపాదించేది జీవితం; లోపల తెలుసుకునేది జీవనార్థం.” మైత్రేయి జీవితం మనకు చెబుతున్నది ఒకే ఒక్క సత్యం: “ధనం జీవనానికి అవసరం; జ్ఞానం జీవనార్థానికి అవసరం.” ఈ సత్యం కాలాతీతం. వేదకాలంలో ఎంత నిజమో, ఈ ఆధునిక యుగంలో కూడా అంతే నిజం.
మైత్రేయి మన ఆధునిక పండితుల దృష్టిలో కూడా మహోన్నత స్త్రీ అయింది.
మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డా. ఎస్. రాధాకృష్ణన్ గారు మైత్రేయి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు.
“Vedanta begins with questions like Maitreyi’s.”
“మైత్రేయి అడిగిన ప్రశ్నలతోనే వేదాంతం ప్రారంభమవుతుంది.” అని చెప్పొచ్చునంటారాయన.
ఫ్రెడ్రిక్ మాక్స్ ముల్లర్ (Friedrich Max Müller).ఆయన ఒక జర్మన్ మూలాలున్న భాషావేత్త, సంస్కృత పండితుడు, తత్వవేత్త. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, భారతీయ తత్వశాస్త్రంను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ విద్వాంసుడు. ఋగ్వేదాన్ని సంపాదించి, విమర్శాత్మకంగా సవరించి ప్రచురించిన తొలి పండితుల్లో ఒకరు. అంతటి ప్రముఖుడు మన మైత్రేయిని శ్లాఘిస్తూ ఇలా అన్నారు.
“Maitreyi is the philosophical conscience of the Upanishads.”
“ఉపనిషత్తుల తాత్విక అంతఃసాక్షి మైత్రేయి.”
భారత దేశానికి చెందిన ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ మైత్రేయి గురించి చెబుతూ “Her dialogue shows complete intellectual equality.” “ఆమె సంభాషణ సంపూర్ణమైన మేధో సమానత్వాన్ని ప్రతిబింబిస్తుంది.” అన్నారు.
8 / 8
ఇంతటి గొప్ప వ్యక్తుల ప్రశంసలను పొందిన మైత్రేయి నిజంగా స్త్రీ శక్తికి నిదర్శనమని, ప్రశ్నించే హక్కు మహిళలకూ ఉందని మనందరికి మార్గదర్శిగా ఆకాలంలోనే మనకు బాట వేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనిపిస్తుంది.
భారతీయ తత్త్వచింతనలో తొలి స్త్రీ తత్వవేత్తలలో ఒకరు. స్త్రీ విద్య, తత్త్వచింతనకు ఆదర్శం. నేటికీ పుస్తకాలు, వ్యాసాలు, నాటకాల్లో ప్రేరణగా నిలుస్తుంది. మైత్రేయి ‘ధనం కాదు, జ్ఞానమే అమృతత్వం’ అని లోకానికి చెప్పిన మహాస్త్రీ. స్త్రీ జ్ఞానానికి ప్రతీక, భారతీయ తత్త్వచింతనలో తొలి స్త్రీ స్వరం, నేటికీ స్త్రీ విముక్తి, విద్యా ఉద్యమాలకు ప్రేరణ ఇవే ఆమె వారసత్వంగా నిలుస్తాయని చెబుతారు.
మైత్రేయి వేదాంత తత్వంలో ఒక మహానుభావి.
ప్రముఖ కవి,కందుకూరి అంజయ్య కలం నుండి జాలువారిన కట్టెపల్క కవితా సంపుటిలోని కట్టెపల్క కవితపై విశ్లేషణా వ్యాసం.పూర్వ కాలంలో బాల్యంలో కట్టెపల్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ఇది చదువుకోవడానికి సాధనం మాత్రమే కాదు,ఇందులో ఒక చిన్న పిల్లవాడి జీవితం, అనుభవాలు,పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పిల్లవాడు పలకను సిద్ధం చేసుకునే దృశ్యం పాఠకునిలో ఒక రకమైన ఆసక్తిని కలిగిస్తుంది.కట్టె పల్క ఒక జ్ఞాపకాల ఖజానా,చిన్నపిల్ల వాడి ప్రపంచం,బాల్యం, భావోద్వేగాలు,ఆత్మగౌరవం,విద్య, సంస్కృతి,సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది. ఒకప్పుడు కట్టెపల్కకి ఎంతో ప్రాధాన్యత ఉండేది. పాఠశాలకు వెళ్లే ప్రతి పిల్లవాడి చేతిలో కట్టెపల్క కనిపించేది.కవి అంజయ్య చదువుకోవడానికి సాధనమైన కట్టెపల్కను ఆధారంగా తీసుకుని కవితకు ప్రాణం పోశాడు.ఇది ఒక బాలుడి చిన్ననాటి గాథ,ఆనాటి అపురూపమైన జ్ఞాపకాలను సమృద్ధిగా కవితలో చిత్రించాడు.కట్టెపల్క పుస్తకాలతో కూడిన వస్తువు కాదు.అది చిన్నారికి శక్తిని,గర్వాన్ని, గుర్తింపును,భద్రతను అందిస్తుంది.కట్టె పల్క పై చదువు నేర్చిన, తన చిన్ననాటి పాఠశాల అనుభవాలను,అందమైన బాల్యాన్ని అక్షరీకరించడం చక్కగా ఉంది.ఇది తాను బాల్యంలో చదువు నేర్చుకునే క్రమంలో ఎదురైన కష్టాలను, అడ్డంకులను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగిన రోజులను,ఆనాటి మధురమైన జ్ఞాపకాలను ప్రతిబింబిస్తుంది.కవి అంజయ్య కట్టెపల్క కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం. కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.
“బీరాకు బొగ్గు మెత్తగా దంచి/రెండు వైపుల పూసి ఆరబెట్టితే/నల్లసరం బండలాగ నిగనిగా మెరిసేది/ఈ కవితా పంక్తులు చిన్నప్పటి గ్రామీణ బాలుడికి చదువు పట్ల గల శ్రద్ధ,పలకను అందంగా తీర్చిదిద్దే నైపుణ్యం,సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

కట్టెపల్క రాసుకోవడానికి అనుకూలంగా తయారు చేసుకోవడానికి ప్రకృతిలో దొరికే పదార్థాలైన బీర ఆకులు,బొగ్గుతో దంచి పలకపై దట్టంగా పట్టించే పద్ధతి వాడుకలో ఉండేది.ఇలా పాలిష్ చేసిన కట్టెపల్క నల్లసరం బండలాగా నిగనిగ మెరిసేది. కట్టెపల్క మెరవడమే పిల్లాడికి గర్వం,దానిని చూడగానే అతనిలో ఆనందం పొంగిపొర్లేది. గ్రామాల్లో నల్లసరం రాతిబండలు మెరిసిపోతుంటాయి.కవి కట్టెపల్క నల్లసరం బండలాగా మెరిసేది అని చెప్పిన తీరు బాగుంది.
“చేతిలో అమరక/భుజం మీద పెట్టుకొని/ బడికి పోతుంటే బాల భీముడు అనేవారు/మెరిసే కట్టెపల్కను భుజంపై పెట్టుకొని బడికి వెళుతున్న చిన్నారిని బాల భీమునిగా పేర్కొనడం అద్భుతంగా ఉంది.కట్టెపల్కను భుజం మీద పెట్టుకొని తాను వేసే ప్రతి అడుగులో తనపై ఎనలేని ఆత్మవిశ్వాసం, ప్రత్యేకమైన నమ్మకం కలిగేది.అది తనకు బలాన్ని,ధైర్యాన్ని ఇచ్చేది.బడికి వెళ్తుండగా చూసిన గ్రామస్తులు బాల భీముడు అని సంబోధించడం, ఎంతో ఉత్సాహాన్ని,గర్వాన్ని కలిగించేది.ఇది బాల్యంలోని అమాయకత్వాన్ని,చిన్ననాటి సంఘటనల సమాహారంగా సూచిస్తుంది.భుజం మీద పెట్టుకున్న కట్టె పల్కను బలంగా భావించడం, పిల్లాడికి ఆత్మగౌరవం,బలమైన వ్యక్తిత్వం,సామాజిక గుర్తింపును అందించింది.ఇది పిల్లవాడి గ్రామీణ బాల్యంలోని ఈ అసాధారణ దృశ్యం అద్భుతంగా ఉంది.
“నా జోలికి వచ్చిన వాళ్లను జోపడానికి/ ఆయుధం అంగరక్షకుడు పలుకనే/ఈ కవితా పంక్తులలో కట్టెపల్కను అంగరక్షకుడిగా, ఆయుధంగా చెప్పడం,బాల్యంలో కనిపించే అమాయకత్వం,అల్లరి భావనలతో మిళితం చేసిన తీరు బాగుంది. ఆకతాయి పిల్లల చిలిపి చేష్టలు చికాకును కలిగిస్తాయి,భరించలేనివిగా ఉంటాయి. అనవసరంగా తన జోలికి వచ్చిన వారిని జోపడానికి కట్టెపల్క ఆయుధంలా రక్షణను అందించేది.ఇది తనకంటూ ఉన్న చిన్న ప్రపంచానికి చిన్నారి ఊహా శక్తికి,ధైర్యానికి నిదర్శనం.కట్టెపల్క కేవలం చదువుకోవడానికే కాదు,అది పిల్లాడికి రక్షణను కూడా అందిస్తుంది.ఇందులో కట్టెపల్కను అంగ రక్షకుడుగా భావించడం,రాజుల భద్రతను కాపాడే అంగరక్షకుని గుర్తు చేస్తుంది.ఒక చిన్న పిల్లవాడికి కట్టెపల్క కల్పించే రక్షణ దానిపై విశ్వాసం గొప్పగా ఉన్నది అని వర్ణించడం చక్కగా ఉంది.
“బలపం పట్టి అడ్డం పొడువు గీతలు పెడితే/ సాలు పొన్న సాలు పెట్టి/పొతం చేసిన నల్లరేగడి లాగుండేది/కట్టెపల్కపై బలపంతో రాసే అలవాటు పిల్లవాడిలోని శ్రద్ధను,క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. విద్య నేర్చుకునే చిన్న పిల్లాడి ప్రపంచంలో భాగంగా బలపం పట్టుకుని కట్టెపల్కపై సన్నని గీతలు గీయడం,రాయడం అనేది అతని సహజ స్వభావాన్ని తెలుపుతుంది.కాన్వాస్ పై చిత్రాలు గీసే కళాకారుడిని పోలి కట్టెపల్కపై అక్షరాలు దిద్దే చిన్నారి కనిపిస్తున్నాడు.పలకపై బలపంతో దిద్దిన ఆ మొదటి అక్షరాలు,నేర్చుకున్న విద్య అతనిలోని వ్యక్తిత్వాన్ని మలిచే మొదటి మెట్టు.విద్య జీవితానికి పునాది.అతని భవిష్యత్తు వృద్ధికి,జ్ఞానానికి,నిర్ణయ శక్తికి,జీవన దర్శనానికి మొదటి రూప కల్పన. ఉపాధ్యాయుడి బోధన ద్వారా పిల్లవాడు చదువు నేర్చుకుని జ్ఞానాన్ని పొందుతాడు.చదువు అందించిన జ్ఞానం జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపడానికి మరియు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడతుంది. కట్టెపల్క ఒక చిన్నారి చేతిలో ఉన్నప్పుడు అది చదువుకి ఆరంభం.జ్ఞానానికి ప్రవేశ ద్వారం.అది భవిష్యత్తుకు పునాదిగా,సంస్కృతికి జ్ఞాపకంగా చిరస్థాయిగా నిలుస్తుంది.
“పొతం చేసిన నల్లరేగడి లాగుండేది/రైతు పొలంలో దుక్కి దున్ని వ్యవసాయానికి అనువగునట్లుగా పొతం చేసిన నల్లరేగడి భూమిలా కట్టెపల్క ఉంది. ప్రతి పిల్లవాడు ఒక కళాకారుడే.నల్లరేగడి పూత వలె మెరిసే కట్టెపల్క ఒక గ్రామీణ సౌందర్య చిహ్నం. అది అక్షరాల భాషను నేర్పిన గురువులా ఉంటుంది. చిన్ననాటి అలవాట్లు,చదువు పట్ల ఆకర్షణ పలక మీదే మొదలయ్యేది.ఈ రోజు ఆధునిక టెక్నాలజీ పెరిగింది. కంప్యూటర్,ల్యాప్ టాప్,స్మార్ట్ ఫోన్, డిజిటల్ పాఠాలు వచ్చిన తర్వాత వాటి వాడకం తగ్గింది.కట్టెపలకపై దిద్దిన అక్షరాలు,అది ఇచ్చిన ఆత్మవిశ్వాసం,చదువు విలువ మరిచిపోలేనిది. కట్టెపల్క పిల్లల బాల్యంలోని ఒక చిన్న వస్తువు అయినప్పటికి ఎంత గొప్ప భావాలను, జ్ఞాపకాలను,విలువలను అందించగలదో ఈ కవిత అద్భుతంగా తెలియజేస్తుంది. కట్టెపల్క ఒక వస్తువు కాదు.ఒక యుగం,ఒక జీవన పాఠం,ఒక చిన్నారి చేతుల్లో మొదలైన మహాప్రస్థానం.పాతకాలం పాఠశాలల్లో చదివిన వారందరికీ కట్టెపల్క సరైన గుర్తింపును పొందింది.ఆనాడు అదే ఉత్తమం. కట్టెపల్కను భుజంపై పెట్టుకోవడం ఇది పిల్లాడి వ్యక్తిత్వానికి మొదటి రూపం. ఆనాడు అదే రక్షణ కవచం.అది తోడుగా ఉంటే ఒంటరిగా అనిపించేది కాదు.కట్టె పలకపై అక్షరాలు దిద్దడం,గీతలు గీయడం అది వారి కళ,దానిని చూసిన వెంటనే పాతకాలపు విద్య,ఆ తరానికి చెందిన బాల్య స్మృతులు గుర్తుకు వస్తాయి.కట్టెపల్క అతని బలం,రక్షణ,ఆత్మగౌరవం,చిన్న ప్రపంచం అని చెప్పిన తీరు వాస్తవికంగా ఉంది.
“అక్షరం పొన్న అక్షరం పొదుగుతుంటే/గొర్రు పట్టి జొన్నపోత పోసినట్టుండేది/ఈ కవితా పంక్తులు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ పద్ధతిని అక్షరాలు రాయడంలోని సున్నితమైన అనుబంధాన్ని ఎంతో సహజంగా ప్రతిబింబిస్తున్నది.ఇక్కడ అక్షరం కేవలం భాషా చిహ్నం కాదు.అది జ్ఞానానికి అవగాహనకు ప్రతీక.ఒక అక్షరం మరొక అక్షరంతో కూర్చడం అనేది విద్య క్రమంగా,సహజంగా,మనసులో స్థిరపడుతున్న ప్రక్రియను సూచిస్తుంది.చదువు అనేది యాంత్రికమైన చర్య కాదు.జీవంతో కూడిన సృజనాత్మక భావనను వ్యక్తపరుస్తుంది.పెరడు దున్ని జొన్నవిత్తు నాటి రైతు చూపే శ్రద్ధ,ఓర్పు, నమ్మకం అనే లక్షణాలు ఇక్కడ అక్షర విద్యలోను ప్రతిఫలిస్తున్నాయి.ఈ ఉపమానం గ్రామీణ జీవన నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరిస్తుంది.అక్షరాలు నేర్చుకోవడం అనేది విత్తనాలు నేలలో నాటినట్టే, వెంటనే ఫలితం కనిపించకపోయినా,కాలక్రమేణా అవి పంటగా ఎదుగుతాయి.ఈ కవితా పంక్తులలో కవి విద్యను గ్రామీణ వ్యవసాయంతో పోల్చి చదువు మన జీవనానికి ఎంత సహజమైనదో,ఎంత శ్రమతో కూడినదో తెలియజేస్తున్నాడు.కట్టెపల్కపై అక్షరాలు రాయడం ఒక వ్యవసాయ కార్యంలా,శ్రమతో కూడిన పనిలా చిత్రీకరించబడింది.ఇది గ్రామీణ జీవనానికి విద్య ఎంత దగ్గరగా ఉందో సూచిస్తుంది.
“అ నుండి ఱ వరకు రాసిన అక్షరాలు పాలు పట్టిన జొన్న కంకులై పలకరించేవి/ఈ కవితా పంక్తులు అక్షర విద్యను గ్రామీణ జీవన అనుభవంతో మేళవిస్తూ – భాష – సంస్కృతి – కాల ప్రవాహాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది.ఇక్కడ అ నుండి ఱ వరకు అనేది క్రమబద్ధమైన తెలుగు అక్షరమాల సంపూర్ణతను సూచిస్తుంది.పాలు పట్టిన జొన్న కంకులు అన్నది పరిణతి చెందుతున్న గింజల దశను సూచిస్తుంది.అక్షరాలు అలా పలకరించేవిగా మారడం అంటే అవి కాగితంపై నిశ్చలంగా,చిహ్నాల రూపంలో కాకుండా జీవంతో కూడిన స్నేహితుల్లా విద్యార్థిని ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించడం, నేర్చుకున్న అక్షరాలు జ్ఞానంగా,అనుభవంగా మనసులో నిలిచిన దశను ప్రతిబింబిస్తుంది.ఈ కవితా పంక్తులలో అక్షర విద్యను పంట ఎదుగుదలతో పోల్చి భాషా సంపదను గ్రామీణ సౌందర్యంతో అనుసంధానించారు.అక్షరాలు పాలు పట్టిన జొన్న కంకుల్లా కనిపించడం – విద్య ఫలప్రదమైన దశకు చేరుతున్నది అనే ఆనందాన్ని, భాష పట్ల ఉన్న సాన్నిహిత్యాన్ని,అలాగే కాలంతో పాటు మారిపోయిన అక్షరాల పట్ల ఉన్న నోస్టాల్జియాను ఒకే సారి వ్యక్తం చేస్తుంది. అక్షరాలను జొన్న కంకులతో పోల్చడం,చాలా అందమైన ఉపమానం.అక్షరాలు పిల్లల మనసులో ఫలవంతంగా ఎదుగుతున్న పంటలుగా మారాయి. విద్య అంటే కేవలం చదువు కాదు.అది జీవనానికి ఆహారం అన్న భావం ఇక్కడ కనిపిస్తుంది.

“వర్ణమాల నేర్చుకుంటేనే/వర్ణాన్ని జయించినట్టు అనిపించేది/ఈ కవితా పంక్తులు అక్షర విద్యకు ఉన్న అంతర్గత గౌరవాన్ని,భాషా చైతన్యాన్ని గాఢమైన రీతిలో వ్యక్తపరుస్తాయి.ఇక్కడ వర్ణమాల అనేది అక్షరాల సమాహారం మాత్రమే కాదు.జ్ఞానానికి అలంకారమైన దండ.వర్ణం అంటే అక్షరం,కులం/ జాతి,రంగు,స్వభావం వంటి అర్థాలు ఉన్నాయి. రంగులను వర్ణం అంటారు.హిందూ ధర్మంలో సమాజాన్ని బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర నాలుగు ప్రధాన వర్ణాలుగా విభజించడానికి జాతి పదం వర్ణంగా ఉపయోగించబడుతుంది. తెలుగులో అక్షరాలను కూడా వర్ణాలు అంటారు.విడివిడిగా ఉన్న అక్షరాలు ఒక క్రమంలో,ఒక శైలిలో గుచ్చబడినప్పుడు అవి భాషగా,భావవ్యక్తీకరణగా మారుతాయి.కవి ఈ పదాన్ని ఉపయోగించడం ద్వారా అక్షరాల మధ్య ఉన్న సౌందర్యంను, సంపూర్ణతను సూచిస్తున్నాడు.వర్ణాన్ని జయించినట్టు అనిపించేది.ఇది అత్యంత భావగర్బితమైనది.జయం అనేది ఇక్కడ ఇతరులపై సాధించిన గెలుపు కాదు,అజ్ఞానంపై సాధించిన అంతర్గత విజయం.ఒక్కో అక్షరాన్ని నేర్చుకోవడం అంటే భాషలోని ఒక్కో అడ్డంకిని దాటడం, భావవ్యక్తీకరణకు మార్గాన్ని తెరవడం,వర్ణమాలపై పట్టు సాధించినప్పుడు అక్షరాలపై అధికారం కలిగినట్టుగా వాటిని తన భావాలకు లోబర్చుకున్నట్టుగా అనిపిస్తుంది.ఈ కవితా పంక్తుల్లో విద్య ఒక యుద్ధంలా కాకుండా,సాధనగా ఆవిష్కృతమవుతుంది.అక్షరాలు ఒకప్పుడు అపరిచితమైనవిగా కనిపించినా వర్ణమాలగా క్రమబద్ధం అయినప్పుడు అవి జయించదగినవిగా మారతాయి.కవి బాల్య అనుభవాన్ని ఆధారంగా చేసుకుని చదువు ఒక విజయం,భాష ఒక సాధన, అక్షరాల అవగాహన ఆత్మవిశ్వాసానికి మూలం అనే భావాన్ని సున్నితంగా వ్యక్తం చేశాడు.వర్ణమాల నేర్చుకోవడం అంటే కేవలం చదవడం,రాయడం మాత్రమే కాదు.భాషా లోకాన్ని జయించి తన భావాలకు అనుగుణంగా అక్షర రూపం ఇవ్వడం అనేది గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.అక్షరాలు నేర్చుకోవడం ద్వారా వ్యక్తి తనపై సమాజం మోపిన మౌనాన్ని చెరిపేసుకుని తన అస్తిత్వాన్ని ప్రకటించుకుని చైతన్యాన్ని పొందుతాడు.విద్య అతనిని వర్ణ వ్యవస్థ అనే అడ్డుగోడను దాటే శక్తిగా మారుతుంది.చదువు వల్ల కలిగే ఆత్మవిశ్వాసం, స్వీయ గౌరవం,ఇవి కులపరమైన పరిమితులను ప్రశ్నించే చైతన్యంగా రూపాంతరం చెందుతాయి. అక్షర జ్ఞానం అంటే కేవలం పుస్తకాల జ్ఞానం కాదు. అది ఆలోచనల స్వేచ్ఛ,ప్రశ్నించే ధైర్యం,వివక్షను దాటి సమానత్వాన్ని సాధించాలనే తపన.వర్ణాన్ని జయించడం అనేది సమాజంలోని అసమానతలను అధిగమించడం. సంఘంలోని కుల వ్యవస్థను జయించినట్లుగా భావించవచ్చు.
“పాఠాలు వెంట వెంటనే అప్పగిస్తుంటే/పంతులు గుండెలో దడ మొదలయ్యేది/ఇది విరామం లేకుండా పాఠాలు అప్పగించడం పిల్లవాడి బుద్ధి తీక్షణతను విద్య నేర్చుకోవడంలోని నిరంతర సాధనను ప్రకటిస్తుంది.చదువు ఇక్కడ ఆనందంగా కాక బాధ్యతగా మారిన క్షణాన్ని కవి గుర్తు చేస్తాడు. సాధారణంగా చదువు నేర్చుకునేటప్పుడు భయపడేది విద్యార్థి.కానీ,ఇక్కడ చక్కగా చదువు నేర్చుకున్న విద్యార్థి వల్ల పంతులుకు గుండెలో దడ మొదలవుతుంది.ఇది కవి చేసిన ముఖ్యమైన భావ విప్లవం.గురువు చెప్పిన పాఠాలను చక్కగా నేర్చుకొని వెంట వెంటనే విద్యార్థి అప్పగిస్తుంటే అతనికి చదువు పట్ల గల అసాధారణ శ్రద్ధను, క్రమశిక్షణను తెలియచేస్తుంది.ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా,తప్పులు లేకుండా,నిర్ణీత సమయానికి పాఠాలు అప్పగించడం, విద్యార్థి తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తున్న స్థితిని తెలియజేస్తుంది.ఇది సాధారణ పరిస్థితి కాదు.ఇది గురువు అంచనాలను సవాలు చేసే స్థాయి.ఇక్కడ పంతులుకు కలిగిన భయం ఏమిటి? శిక్షించాల్సిన అవసరం లేకపోవడం వల్ల వచ్చిన భయం కాదు.అది బాధ్యత,ప్రతిష్ట, అధికారం కదిలిపోవడం వల్ల వచ్చిన భయం. పాఠాలు వెంట వెంటనే అప్పగించే విద్యార్థి ముందు గురువు తన కఠినత్వాన్ని ప్రయోగించే అవకాశం కోల్పోతాడు.శిక్ష ద్వారా నిలబెట్టుకున్న అధికారానికి ఇది ఒక మౌన సవాలు.అందుకే పంతులుకు అంతర్గత అసౌకర్యం కలుగుతుంది.గురువు వ్యవస్థలో తప్పు పట్టడం ఒక అలవాటుగా మారినప్పుడు,తప్పులు లేకుండా చక్కగా చదువుకున్న విద్యార్థి అతనికి ఒత్తిడిని కలిగిస్తాడు. విద్యార్థి తప్పు లేకపోతే శిక్షించలేడు.శిక్ష లేకపోతే తన ఆధిపత్యం తగ్గిపోతుంది ఏమో అన్న భయం పంతులు గుండెల్లో దడగా మారుతుంది.విద్యార్థి బాగా నేర్చుకుంటే గురువుకి ఆనందం కలగాలి. కానీ,ఇక్కడ గురువుకి భయం కలగడం,అప్పటి విద్యా వ్యవస్థలో గురువు పాత్ర బోధకుడిగా కాక నియంత్రకుడిగా మారిపోయింది అని సూచిస్తుంది. ఈ అంతర్ముఖ విరోధమే గురువు గుండెలో దడగా వ్యక్తమవుతుంది.విద్యార్థి బాగా చదువుకొని చక్కగా పాఠాలు అప్పజెప్పినప్పుడు ఇతరుల ముందు గురువు అప్రమత్తంగా ఉండాలి.ప్రశ్నలు,లోపాలు వెతకాలి.తన స్థాయి తగ్గకుండా జాగ్రత్తపడాలి.ఈ సామాజిక ఒత్తిడి భయానికి కారణం.ఈ కవితా పంక్తి ద్వారా కవి చెప్పేది ఏమిటి?అప్పటి విద్యావ్యవస్థలో భయం విద్యార్థి నుంచి గురువు వైపు కూడా ప్రవహించేది.చదువు జ్ఞానోత్సవం కాక, అధికార – ఆధిపత్యాల ఆటగా మారినప్పుడు,నిజాయితీగా నేర్చుకున్న విద్యార్థి కూడా గురువుకు అసౌకర్యాన్ని కలిగిస్తాడు.అందు వల్ల పంతులుకు వచ్చిన గుండెలో దడ భయానికి కాదు.తన అధికారం,తన పాత్ర,తన వ్యవస్థ పై పడిన మౌన ప్రశ్నకు ప్రతిధ్వని.ఈ కవితా పంక్తులు – ముఖ్యంగా బాల్యంలోని భయం శిక్ష, గర్వం,ఆనందం అన్నిటిని నిర్బంధం లేకుండా నిజాయితీగా ఆవిష్కరిస్తుంది.
“తొక్కుడు బండ తొవ్వలో పడుతుందని/ అదిమిపట్టేవాడు/ఇది శారీరక శిక్షణ ద్వారా క్రమశిక్షణను నేర్పే పద్ధతికి సంకేతం.విద్యతో పాటు భయం కూడా ఎలా కలిసి నడిచేదో తెలియ జేస్తుంది.ఈ కవితా పంక్తి గ్రామీణ జీవన అనుభవాన్ని బలమైన ప్రతీకాత్మకతతో ఆవిష్కరిస్తుంది.తొక్కుడు బండ అన్నది నియంత్రణ లేకపోతే ప్రమాదం కలిగించే శక్తిని సూచిస్తుంది. తొవ్వ అంటే దారి.అది జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లకు,ప్రమాదకర పరిస్థితులకు రూపకం. అదిమి పట్టేవాడు అనే పదం అప్రమత్తతకు,బాధ్యతాయుతమైన నియంత్రణకు ప్రతీక. ప్రమాదం సంభవించే లోపు దాన్ని అడ్డుకునే జాగ్రత్త,అనుభవం,చైతన్యం ఇందులో ప్రతిఫలిస్తాయి.ఇది కేవలం శారీరక చర్య కాదు : మానసిక స్థితి – భయం కాదు,బాధ్యత – అనే భావనను బలపరుస్తుంది.ఈ కవితా పంక్తిలో కవి ఒక సామాజిక సత్యాన్ని ఆవిష్కరిస్తాడు.నియంత్రణ లేని శక్తి వినాశానికి దారి తీస్తుంది.జాగ్రత్తతో కూడిన నియంత్రణే భద్రతకు మార్గం అనే తత్వాన్ని సులభసాధ్యంగా పాఠకుడి హృదయంలో నాటే శిల్పం ఇది.ఈ కవితా పంక్తి అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం,జాగ్రత్తగా ఉంటే భద్రత కలుగుతుందనే బాధ్యతాయుతమైన జీవన దృష్టిని ప్రతిపాదిస్తుంది.
“నవ్వుకుంటూ తొడపాశం పెడితే/నరకం కనబడేది/ గురువు నవ్వే ముఖం వెనుక దాగిన శిక్ష పిల్లవాడి దృష్టిలో నరకప్రాయంగా ఉంటుంది.నవ్వుకుంటూ అనే పదం మాయను,మృదుత్వాన్ని,పైకి కనిపించే అమాయకత్వాన్ని సూచిస్తుంది. కానీ,అదే నవ్వు వెనుక దాగి ఉన్నది తొడ పాశం,అది బంధనం, మోసం,అణిచివేతకు ప్రతీక.నవ్వుతూ ప్రారంభమైన బంధం చివరకు వ్యక్తిని నిస్సహాయ స్థితిలోకి నెట్టడం – అదే నరకం కనబడేది అన్న అనుభూతి.ఇక్కడ నరకం అనేది మతపరమైన భావన కాదు.అది జీవితంలోని ఎదురయ్యే బాధ,అవమానం, మోసపూరిత సాన్నిహిత్యం.వ్యక్తి స్వేచ్ఛను హరించగా లోపల నరకతుల్యమైన వేదన ఉద్భవిస్తుంది అని కవి చెబుతాడు.పైకి ప్రేమగా, నవ్వుగా కనిపించే సంబంధాలు,ఎలా హింసాత్మకంగా మారుతాయో.కవి బలమైన ప్రతీకలతో ఆవిష్కరించాడు.
“డస్టర్ తోని దవడల మీద పొడిస్తే/దండగ మాలిన చదువు అనిపించేది/ఇక్కడ శిక్షల వల్ల చదువు పట్ల విరక్తి కలుగుతుంది అనే విషయం ఇందులో ఉంది. ఈ కవితా పంక్తులు విద్యావ్యవస్థలోని నిర్దయతను, బాలుర మనసుపై పడే హింసాత్మక ముద్రను హృదయ విదారకమైన స్థితిని ఆవిష్కరిస్తాయి. జ్ఞానాన్ని అందించాల్సిన గురువు చేతిలోని డస్టర్ – బ్లాక్ బోర్డ్ తుడవడానికి ఉపయోగించే సాధనం – ఇక్కడ శిక్షించడానికి వాడబడుతున్నది. దవడల మీద పొడిస్తే అనే పదం – శారీరక వేదన మాత్రమే కాదు.బాలుడి గౌరవానికి కలిగే గాయాన్ని కూడా సూచిస్తుంది.పిల్లవాడి ముఖంపైన పడ్డ దెబ్బ వల్ల అతని మనసులో భయం,అవమానం చోటు చేసుకుంటుంది.గురువు అసహనం పిల్లవాడిపై హింసగా మారిన క్షణమే విద్య తన మానవీయతను కోల్పోతుంది.అందుకే బాలుడికి ఇది దండగ మాలిన చదువు అన్న భావన కలుగుతుంది.చదువు పట్ల ప్రేమ,ఆసక్తి పెరగాల్సిన వయసులో భయం,ద్వేషం కలుగుతుంది.ఇది చదువుపై కాదు – చదువును బలవంతంగా,హింసతో నేర్పే విధానంపై వచ్చిన నిరసన.ఇక్కడ దండగ అనే పదం చదువు వ్యర్థం అని కాదు.హింసతో కూడిన చదువు నిరర్ధకం అనిపిస్తుంది.ఈ కవితా పంక్తుల ద్వారా కవి విద్యా వ్యవస్థ పై మౌన విమర్శ చేస్తాడు. బాల్యాన్ని సృజనాత్మకంగా వికసింప చేయాల్సిన పాఠశాల భయాన్ని నింపే స్థలంగా మారినప్పుడు,చదువు తన అసలు లక్ష్యాన్ని కోల్పోతుంది అని సూచిస్తాడు. కవితలోని ఈ దృశ్యం విద్య అనే పవిత్ర ప్రక్రియపై పడిన మచ్చగా నిలుస్తుంది.కవి ఈ కవితా పంక్తులలో హింసాత్మక బోధన వల్ల కలిగే భయాన్ని, చదువు పట్ల విరక్తి కలుగడాన్ని స్పష్టంగా చూపిస్తునే మానవత్వంతో కూడిన విద్యా బోధన యొక్క ఆవశ్యకతను బలంగా ప్రతిపాదిస్తున్నాడు.
“అందరిలో అగ్రభాగాన నిలిస్తే/ఆకాశాన్ని అందుకున్నట్టుండేది/విద్య ద్వారా లభించే గౌరవం, ఆనందం ఈ కవితా పంక్తిలో శిఖరానికి చేరుతుంది. ఈ కవిత గ్రామీణ బాల్యాన్ని,పాత విద్యావిధానాన్ని, విద్యలోని కఠినత్వం,ఆనందం,సహజ ఉపమానాలతో భావోద్వేగంతో వ్యక్తపరుస్తుంది.ఇది కేవలం ఒక వ్యక్తి జ్ఞాపకం కాదు.ఒక తరం విద్య, అనుభవానికి అద్దం పట్టిన కవిత.కట్టెపల్క కవిత చదువు ద్వారా బాలుడికి కలిగే ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని,ఆశా పూరిత దృక్పధాన్ని హృద్యంగా ప్రతిబింబిస్తున్నది. కట్టెపల్క పై అక్షరాలు దిద్దుకుంటూ గురువు చెప్పిన పాఠాలను శ్రమతో నేర్చుకుని పిల్లవాడు ఇతరుల కంటే ముందు ఉండ గలిగిన క్షణం అతని జీవితంలో ఒక విజయోత్సవంలా మారుతుంది.అందరిలో అగ్ర భాగాన నిలిస్తే అది కేవలం శ్రేణిలో ముందు ఉండడం మాత్రమే కాదు.తనపై తనకు కలిగిన నమ్మకాన్ని అణిచివేతల మధ్య ఎదగగలిగిన గర్వాన్ని సూచిస్తుంది. ఇది పోటీ భావన కంటే సాధన ఫలితంగా వచ్చిన గెలుపు,అక్షర జ్ఞానం అనే చిన్న అడుగు అతని మనసును పెద్ద స్వప్నాల వైపు తీసుకొని వెళ్తుంది.ఆకాశాన్ని అందుకున్నట్టు ఉండేది అనే ఉపమానం, బాలుడి మనసులోని సున్నితమైన కలల విస్తృతిని ప్రతీకాత్మకంగా చూపుతుంది. ఆకాశం – అపారమైన అవకాశాలకు, అంతులేని ఆశలకు సంకేతం.పిల్లవాడికి చదువు ద్వారా తన స్థితి మారుతుంది అనే అపారమైన నమ్మకం కలుగుతుంది.కవి చదువు యొక్క సానుకూల శక్తిని ప్రశంసిస్తాడు.శిక్ష, భయం,అవమానం చూపిన ఇతర పంక్తులతో పోలిస్తే ఇవి ముఖ్యంగా చదువు యొక్క ప్రాముఖ్యతను వ్యక్తం చేస్తున్నాయి. కట్టెపల్క అనే సాధారణ పరికరం కూడా సరైన మార్గ నిర్దేశం లభిస్తే బాలుడిని ఆకాశాన్ని అందుకునే స్థాయికి చేర్చగలదు అనే ఆశావాహ దృక్పథం ఇక్కడ వ్యక్తం అవుతుంది.ఈ కవితా పంక్తులు గ్రామీణ పాఠశాల జీవితంలోని బాల్య స్మృతులు, విద్య, అనుభవాలను చాలా సహజమైన ఉపమానాలు, ప్రతీకలతో ఆవిష్కరిస్తాయి.కవి తన చిన్ననాటి పాఠశాల అనుభవాన్ని ఒక జీవన దృశ్యంగా మన ముందు ఉంచుతాడు.కట్టె పల్క అనేది కేవలం ఒక పలక కాదు.అది ఒక కాలానికి,ఒక జీవన విధానానికి చిహ్నం.మొదటిసారిగా కట్టెపల్క పై అక్షరాలు దిద్దడం అనేది కేవలం చదువునకు ప్రారంభం కాదు. అది వారి జీవిత ప్రస్థానానికి మొదటి అడుగులుగా నిలుస్తుంది.కట్టెపల్క జ్ఞానానికి మొదటి వెలుగు. విద్యా లోకానికి ద్వారం.భవిష్యత్తు నిర్మాణానికి సోఫానం.కట్టెపల్క పై శ్రమతో నేర్చుకున్న అక్షరాలు పిల్లవాడి జీవితమంతా తోడుగా ఉంటాయి.కాలం మారినా,అక్షరాలు విలువ ఎప్పటికి తగ్గదు. విద్యకు జీవితాన్ని మలిచే శక్తి ఉంది. కట్టెపల్క కవిత అందించే ముఖ్యమైన సందేశం ఇది.విద్య మనిషిని తీర్చిదిద్దే గొప్ప ఆయుధం.బాల్యంలో కట్టెపల్క పై దిద్దిన అక్షరాలు అందించిన జ్ఞానం జీవితంలో ముందుకు సాగడానికి తోడ్పడుతుంది.ఈ కవితా పంక్తులు శ్రమ,విజయం,స్వప్నాల విస్తరణ అనే జీవన సత్యాన్ని బాల్య అనుభవాల ద్వారా ప్రతీకాత్మకంగా ఆవిష్కరిస్తుంది.విద్యా వ్యవస్థలో భాగమైన కట్టెపల్క గురించి చక్కటి కవితను అందించిన కవి అంజయ్యను అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కందుకూరి అంజయ్య తేది 04 – 08 – 1960 రోజున జన్మించారు.వీరి తల్లిదండ్రులు: లక్ష్మి,రాజయ్య గారలు.వీరు గుల్లకోట గ్రామం,వెల్గటూర్ మండలం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు.వీరు 1 వ తరగతి నుండి 6 వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల,గుల్లకోట గ్రామంలో చదివారు. వీరు గుల్లకోట నుండి మూడు కిలోమీటర్ల దూరంలో గల ఎండపెల్లి గ్రామంనకు నడిచి వెళ్ళి 7 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గవర్నమెంట్ హై స్కూల్,ఎండపల్లి గ్రామంలో చదివారు.వీరు ఇంటర్మీడియట్ బై.పిసి.బిషప్ సాలమన్ జూనియర్ కాలేజి,కరీంనగర్ లో చదివారు.వీరు బి.ఎస్సీ.డిగ్రీ శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
కరీంనగర్ లో చదివారు.వీరు ఎం.ఏ. (తెలుగు), ఎం.ఫిల్.డిగ్రీ పూర్తి చేశారు.వీరు కేంద్రీయ విశ్వవిద్యాలయం,హైదరాబాదు నుండి చెరబండరాజు నవలలు అను అంశం పై పరిశోధన చేసి 1989 సంవత్సరంలో ఎం.ఫిల్. డిగ్రీని పొందారు.శ్రీ కె.కె. రంగనాథాచార్యులుగారు పర్యవేక్షకులుగా వ్యవహరించారు.వీరు1990లో చేనేత & జౌళి శాఖలో అసిస్టెంట్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా నియమింపబడ్డారు.వీరు తేది 31 – 08 – 2018 రోజున డిప్యూటీ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. వీరు సాహితీ సోపతి, ఎన్నీల ముచ్చట్లు,తెలంగాణ రచయితల వేదిక వంటి పలు సంస్థల ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు.
కవి అంజయ్య ముద్రిత రచనలు :
1.కట్టెపల్క కవితా సంపుటి,2013.
2.జమిడిక కవితా సంపుటి,2023.
3.కదలిక సాహిత్య వ్యాసాలు,2024.
4.వడపోత కందుకూరి అంజయ్య కవిత్వంపై అనుశీలనా వ్యాసాలు,2025.
కవి అంజయ్య పొందిన పురస్కారాలు :
1.అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం,2014లో పొందారు.
2.అక్కెపెల్లి ఫౌండేషన్ సినారే అవార్డు 2021లో అందుకున్నారు.
3.తెలంగాణ సారస్వత పరిషత్ డాక్టర్
రావికంటి వాసునందన్ ధర్మనిధి పురస్కారం,2025లో పొందారు.
పుట్టినింటి వారు తనవాడంటే మెట్టినింటి వారు తమ వంశోద్ధారకుడంటారు. అటువంటి విధంగా మాతృభూమితో మల్లెల పందిరి వోలె అల్లుకున్న మమతల బంధం శ్రీ సామల సదాశివ గారిది. కుమ్రం భీమ్ జిల్లా, ఆసిఫాబాద్ పెన వేసుకున్నది. రెండు శతాబ్దాల క్రింద భారత్ ను వదిలి పెట్టిన కుటుంబమైన “రుషియెనాకో” బ్రిటన్ అధ్యక్షుడు కావడంతో మా భారతీయుడు ఆంగ్ల దేశానికి అధిపతి అయ్యాడని ఆనందించే పేగు బంధం మనది. ఇక వంద శాతం గ్రామీణ వ్యవహారిక భాషలో “యాది”ని రచించిన సామల సదాశివ గారిని ఆసిఫాబాద్ ఏల మరిచి యుండగలదు. కృష్ణుడు యశోదమ్మ ఒడిలో పెరిగినా, సేద తీరినా దేవకీ వసుదేవుల పుత్రుడే !
తెలంగాణలో తెలుగు భాషకే వన్నె తెచ్చిన సామల సదాశివ దహెగాం మండలంలో తెనుగు పల్లెలో పుట్టటం యాదృచ్చికమే. కాని అదే కీర్తి కిరీటంలో కలికితురాయి. అందుకే ఆయన “అందరి బంధువయ్యాడు”. మా నాన్న కీIIశేII దేవరాజు సాంబమూర్తి గారితో సహచరునిగా డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పని చేయటంతో మాకు ఆత్మీయ అనుబంధం సదాశివ గారి కుటుంబంతో ఏర్పడింది.

సామల సదాశివ గారి తండ్రి నాగయ్య గారు తాలూకా కేంద్రమైన వాంకిడిలో ఉద్యోగ రీత్యా పని చేసినా అక్కడి ప్రజలతో మమేకమై ఎందరో విద్యార్థులకు గురువుగా ఇరుగు పొరుగులకు పితృ సమతుల్యంగా వాత్సల్యం అందించారు. అప్పుడే “గయోపాఖ్యానం” నాటకం వ్రాసి వేషాలు వేయించి దర్శకత్వం వహించి ప్రదర్శింప జేసారు. ఆ దృశ్యాలన్నీ బాల్యంలో వున్న సదాశివ గారి హృదయ ఫలకంలో సుస్థిర స్థానం పొందాయి. మరాఠీ భాషా ప్రభావం వల్ల పద్యాలు కంఠస్థం చేశారు.
సదాశివ గారి బాల్యం, ప్రాథమిక విద్య వాంకిడి, మిడిల్ విద్య ఆసిఫాబాదులో 7వ తరగతి వరకు సాగింది. అదే తరుణంలో గోండు వీరుడు కుమ్రం భీమ్ గిరిజనుల హక్కుల కోసం పోరాటము చేసి నిజాం ప్రభుత్వ సైనికుల చేతిలో అమరుడయ్యాడు. ఆయన శవంను సదాశివ గారు చదువుతున్న పాఠశాల ముందున్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆ సంఘటనతో భీం వీరోచిత పోరాటం, గిరిజనుల కష్టాలు, ప్రభుత్వ మొండి వైఖరి ఆయన మనసుపై సుస్థిర స్థానం పొంది ఆలోచనలకు తెర లేపాయి. మరొక సంఘటన ఒక సోదరి అకాల మరణం. తండ్రి నాగయ్య ఉద్యోగానికి రాజీనామా చేయటం సదాశివ గారి జీవితాన్ని మలుపు తిప్పాయి. అప్పటికే మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై ఉండటంతో ఉద్యోగంలో చేరక తప్పలేదు.
సిర్పూరు కాగజునగర్ మిడిల్ స్కూలులో 1947 జులై 24న గురువుగా గురుతర బాధ్యతలు స్వీకరించి శాశ్వతంగా గురువు స్థానం నిలబెట్టుకున్నారు. కొద్ది రోజులు లక్షెట్టిపేటకు బదిలీపై వెళ్ళినా తిరిగి వచ్చి – 1954 ఆగస్టు వరకు అక్కడే ఉద్యోగం చేస్తూ సేవలందించారు. కోటగిరి నారాయణ గౌడ్ వంటి ఎందరో విద్యార్థులను విజ్ఞాన దీపాలుగా తీర్చి దిద్దారు.
ఆ తరువాత ఆసిఫాబాదులో విద్యా పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. రెండవ దశలో 1959 నుండి రెండేళ్ళ పాటు సిర్పూరులో మూడవ సారి 1976 నుండి 1980 వరకు వాంకిడిలో పని చేసి మాతృభూమితో మక్కువ పెంచుకొని సేవలందించారు. సామల సదాశివ గారి ఎదుగుదలను చూసి వారి తండ్రి నాగయ్య గారు ఎంతో సంతోషించి వారి మిత్రులతో చెప్పి ఆనందించే వారట. కానీ కొడుకును చూస్తే పొగిడేవాడు కాదట. కొడుకును ముందర పొగిడితే ఆయుఃక్షీణ మని భావించేవారట. అంతే గాకుండా తొలి కాన్పులో పుట్టిన పాపను అధిక గారాబం చేయటం వలన జరిగిన నష్టం కారణంగా సదాశివను సాధారణంగా చూసేవారట.
సామల సదాశివ గారి బాల్యమంతా వాంకిడిలోనే జరగటం మూలంగా ఆ గ్రామ పెద్ద రామగిరి రంగయ్య గారి కుటుంబంతో మమేకమై జీవించారు. వరుసలు పెట్టి పిలుచుకోవడమే గాకుండా నేటికి అదే స్థాయిలో కొనసాగటం విశేషం. రామగిరి పురుషోత్తం, వైకుంఠం సోదరులు సదాశివ గారిని “బాపు” అని పిలిచేవారు. రంగయ్య గారి సోదరి కూడా సదన్నా అని ఆప్యాయంగా పిలిచేవారట. ఆమె భర్త అనారోగ్యంతో బాధ పడుతున్నాడని తెలిసి తట్టుకోలేక అక్కడికి సదాశివ గారు వెళ్లలేక పోయిన దయార్ద్ర హృదయుడని వారి కుమారుడు “సామల రాజవర్దన” రచనల ద్వారా అర్థమవుతుంది.
నిష్కల్మషంగా సదాశివ గారితోని ప్రేమ పంచుకునే మరో కుటుంబం జిల్లాలో తొలి గిరిజన పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి గిరిజన శాఖా మంత్రి స్వర్గీయ కొట్నాక భీంరావు గారి కుటుంబం. వాంకిడి మండల కేంద్రానికి సమీపంలో ఉండి గ్రామంలో విద్యార్థి దశ నుండి కలిసి మెలిసి తిరిగిన భీంరావు బంబారా గ్రామ నివాసి. ఈ విషయాలన్నీ సదాశివ గారి “యాది” రచనల్లో తరచూ గమించవచ్చు. మాస్టారు అన్ని రకాలుగా ఎదగడానికి వాంకిడి అందించిన మమతానురాగాలన్నది సదాశివ గారి కుటుంబ సభ్యుల ఏకాభిప్రాయం. వాంకిడి అవ్యాజ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలతో తడిసి ముద్దెå రుద్రాభిషేకం పొందిన సర్వ విద్యల ఈశానుడు సదాశివుడే.
తండ్రి నాగయ్య గారు వేయించిన గయోపాఖ్యానం నాటకంలో పద్యాలు కంఠస్థం చేయడం సదాశివ గారి మనసును సాహిత్యం వైపు త్రిప్పింది. జీవితంలో కొత్త మజిలీ ఆరంభానికి తొలి అడుగుగా చెప్పవచ్చు. అతడు ఆంధ్ర నామ సంగ్రహం వంటి లక్షణ గ్రంథాలు చదువటం, తండ్రి నాగయ్య గారు ప్రోత్సహించటంతో దైవ స్తుతిగా వాంకిడిలో వున్నపుడే “సాంబశివ శతకం” రచించారు. అదృష్టమేమంటే సాహితీ పోషకులుగా వాంకిడిలోని కళాపిపాసి కర్నె వసంత్ గారి తండ్రి కర్నె వెంకట నర్సు ముద్రణ బాధ్యత వహించారు. వారి పద్యాలు కూడా రసరమ్యంగా వుంటాయి.
వాంకిడి, తెలంగాణలో గిరిజన ప్రాంతాల సాగునీటి కరువున్న ప్రాంతం. నాటికీ నేటికీ ఈ ప్రాంతం అంతే. ఇక్కడ పండే అవిసె గింజల నూనె నిత్యం వినియోగించేవారు. అవిసె పూలు, ఆవాల పూలు నీలి, పసుపు రంగులలో రహదారి కిరువైపులా అలరారడంతో నీలమేఘ శ్యాముని స్తుతిస్తూ “వేంకటేశ్వరా” మకుటంతో “అతసీ కుసుమోపమనీల గోత్ర” అంటూ వృత్తాలు వ్రాశారు. తర్వాత “వృషభగిరి నివాస వేంకటేశ” మకుటంతో ఆటవెలదులు వ్రాశారు.
“విశ్వామిత్ర” మనే నిరీక్షణ లఘు కావ్యాలు వ్రాయడమే కాకుండా చిత్రాల్ని కూడా స్వయంగా గీసారు. సదాశివ మాస్టారు ప్రియశిష్యులు కాగజునగరు నివాసి స్వర్గీయ కోటగిరి నారాయణ గౌడు సంపాదకత్వంలో “సదాశివ కావ్యసుధ” పేరుతో కాగజునగరు తెలుగు సాహితీ సదస్సు సంస్థ 2008లో పుస్తకావిష్కరణ చేసింది. దీనిలో సాంబశివ శతకం, మంచిమాటలు ఉపదేశ కావ్యం, నిరీక్షణము, ప్రభాతము, విశ్వామిత్రము, లఘుకావ్య సంపుటాలు, నారద గర్వభంగము గేయ కావ్య అనుసృజనలు, ఉర్దూ భావ గీతాలు, సాఖీనామా ఈశ స్తుతి, జలాలుద్దీన్ రుమీ, అమ్జద్ రుబాయిలు, స్తుతి కవితలు, సూక్తి సుధ కవితలు పొందుపర్చారు.
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, లక్ష్మీనర్సమ్మ వంటి ప్రముఖుల సందేశాలున్నాయి. తుమ్మూరి రామ్మోహన్ రావు, రాళ్ళపల్లి మురళీధర్ గారు ముద్రణలో వీలైనంత సహకారం అందించారు. చిన్ననాడు వాంకిడిలో కుమ్రం భీం శవాన్ని చూసిన జ్ఞాపకాలతో ఏడవ తరగతి వాచకంలో పాఠ్యభాగ రచయితగా ఆయన పాఠాన్ని చేర్పించి తెలుగు రాష్ట్రంలో ప్రచారం, కీర్తి పెంచారు. సదాశివ గారు బాల గోపాలుని కోసం వ్రాసిన
“ఘల్లు ఘల్లున గంతిడి రారా నంద కుమారా
జగదే మోహనాకారా గోపకిశోరా! ముఖ్ డా ఉత్తర తెలంగాణ నిండా నేటికీ ప్రచారంలో వుంది.
మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా సామల సదాశివ మాస్టారు మాతృభూమితో మమతాను రాగాలు అల్లుకొని మల్లెల బంధంతో పరీమళాలు నిరంతరం పంచుతూనే ఉన్నారు.
“శ్రీ సామల రాజవర్దన్ గారి రచన “మా అమ్మ” వ్యాసం ఆధారంగా వ్రాసిన వ్యాసం.
ప్రముఖ కవి,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,బహు భాషావేత్త, అనువాదకులు,తెలంగాణా పదకోశకర్త,
రిటైర్డ్ తెలుగు భాషా ఉపన్యాసకులు,
ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,డాక్టర్ నలిమెల భాస్కర్ గారు సమకాలీన తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్వరం కలిగిన కవి.విద్యార్థులపై లోతైన ప్రభావాన్ని చూపిన ఉపాధ్యాయుడిగా,భాషా సౌందర్యాన్ని సూక్ష్మంగా ఆవిష్కరించిన అనువాదకుడిగా,అలాగే మానవ అనుభూతుల్ని,తాత్విక లోతులతో వ్యక్తపరిచిన కవిగా ఆయనకు విశేష గుర్తింపు ఉంది.జీవితం,ప్రకృతి మానసిక సంఘర్షణలు,విముక్తి వంటి భావాలు ఆయన కవిత్వంలో సహజంగా మేళవిస్తాయి.కవి భాస్కర్ కలం నుండి జాలువారిన విమోచనం కవిత కూడా ఆ అంతర్లీన తాత్విక దృష్టికి ప్రతిబింబంగా నిలుస్తుంది.విమోచనం కవితలో విముక్తియే ప్రధాన భావంగా ఆవిష్కృతమవుతుంది.కవి వివిధ స్థాయిల్లో ప్రకృతి,మానవ అనుభూతి,కళా సృజనల ద్వారా విమోచనం ఎలా సహజమైన ప్రక్రియగా,అవసరంగా మారుతుందో ప్రతీకల ద్వారా ఆవిష్కరిస్తాడు.ఇది కేవలం విముక్తిని కోరుకోవడం మాత్రమే కాదు ; తనలోని భారాన్ని విడిచిపెట్టి తన అసలైన స్వరూపాన్ని వెలికి తీయాలనే తపన.
సమకాలీన కవిత్వంలో విముక్తి అనే భావం విస్తృతమైన తాత్విక అర్థాన్ని సంతరించుకుంది.కవి భాస్కర్ రాసిన విమోచనం కవిత ఆ భావానికి లోతైన అంతర్ముఖ రూపాన్ని అందిస్తుంది.ఈ కవితలో విమోచనం అనేది బాహ్య బంధనాల నుంచి విడిపోవడమే కాక,అంతర్గతంగా మనసును భారాల నుంచి విడుదల చేసి ప్రక్రియగా ఆవిష్కృతమవుతుంది.ఈ కవితలో కవి జీవితం,ప్రకృతి, మానవ అనుభూతులను ప్రతీకల ద్వారా సమన్వయ పరుస్తాడు.విమోచనం అనేది ఒక్క క్షణంలో సాధించబడే స్థితి కాదు ; అది ఒక సహజమైన,నిరంతరమైన ఆత్మాన్వేషణ, తనలో పేరుకుపోయిన బాధలు,భయాలు,అపోహలు, అహంకారాలను వదిలిపెట్టి నిజస్వరూపాన్ని వెలికి తీయాలనే తపనగా ఈ విముక్తి రూపుదిద్దుతుంది.కవి ఉపయోగించిన ప్రతీకలు ఎంతో సున్నితంగా ఉంటాయి.బంధనాలను సూచించే సంకెళ్లు,భారాన్ని సూచించే మోపులు,వెలుగును సూచించే ఉదయాలు వంటి ప్రతీకలు మానసిక స్థితులను ప్రతిబింబిస్తాయి.ఇవి పాఠకుడిని అంతరంగంలోకి తొంగి చూడమని ఆహ్వానిస్తాయి.విమోచనం అనేది ఇతరులిచ్చే వరం కాదు.అది స్వయంకృత ప్రయత్నం ద్వారా సాధించాల్సిన అనుభూతి అనే ఈ సందేశం ఈ కవితలో స్పష్టంగా కనిపిస్తుంది.భాషాపరంగా ఈ కవిత సరళమైనప్పటికీ భావగర్భితంగా ఉంటుంది.అలంకారాల ఆర్భాటం లేకుండా,సహజమైన పదాలతోనే గాడమైన తాత్విక భావాలను వ్యక్తపరచడం భాస్కర్ గారి కవిత్వ ప్రత్యేకత,ఉపన్యాసకుడిగా ఆయనకు ఉన్న భాషాపరమైన లోతు,అనువాదకుడిగా సంపాదించిన విశాల దృష్టి ఈ కవితలో ప్రతిఫలిస్తుంది.ఈ విమోచనం కవిత మానవ జీవన ప్రయాణంలో తప్పనిసరిగా ఎదురయ్యే అంతర్ముఖ సంఘర్షణలకు ఒక తాత్విక సమాధానాన్ని అందిస్తుంది. విమోచనం అనేది పారిపోవడం కాదు,ఎదుర్కొని,అర్థం చేసుకుని తనను తాను ఆవిష్కరించుకునే ప్రక్రియ అని ఈ కవిత బలంగా నొక్కి చెబుతుంది.అందుకే ఈ కవిత పాఠకుడిని కేవలం చదివించదు ; ఆలోచింపజేస్తుంది,ఆత్మ పరిశీలనకు దారితీస్తుంది.కవి భాస్కర్ విమోచనం కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారిద్దాం.కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.

“మేఘాలు/తమను తాము/విముక్తం చేసుకోవటానికి/వర్షమై కురుస్తాయి/ఈ కవితలో కవి ప్రకృతి రూపకాల ద్వారా జీవన తత్వాన్ని ఆవిష్కరిస్తాడు.మేఘాలు ఇక్కడ వాతావరణ అంశాలు కాకుండా మనసులో పేరుకుపోయిన భారాలు, బాధలు,అణిచివేసిన భావాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మేఘాలు తమలోని నీటిని దాచుకుంటూ ఉండలేవు.ఆ భారాన్ని మోస్తూ ఉండటం కన్నా వర్షంగా మారి కురవడం ద్వారా తాము తేలికపడతాయి.ఇదే ప్రక్రియను కవి భాస్కర్ విమోచనంగా చూస్తాడు.ఇది త్యాగం ద్వారా కలిగే విముక్తిని సూచిస్తుంది.ఈ కవితా పంక్తిలోని భావన మనిషి జీవితానికి అన్వయించబడుతుంది.మనిషి కూడా తనలోని బాధలను, కన్నీళ్లను,అణిచివేసిన భావాలను వెలిబుచ్చినప్పుడే విముక్తిని పొందగలడు.అందువల్ల వర్షం – కన్నీళ్లకు,మేఘాలు – మనస్సులో పేరుకున్న వేదనలకు ప్రతీకలుగా మారతాయి. కవితలో భాష అతి సరళమైనదైనా,భావం మాత్రం గంభీరమైనది.అలంకారాల కంటే తాత్వికతకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది.చిన్న కవితా పంక్తుల ద్వారా జీవిత సత్యాన్ని గట్టిగా చెప్పడం ఈ కవిత ప్రత్యేకత.విమోచనం కవిత బాధను దాచుకోవడం కాదు,విడిచిపెట్టడమే నిజమైన స్వేచ్ఛ అనే సందేశాన్ని ప్రకృతి ప్రతీకల సహాయంతో హృద్యంగా వ్యక్తం చేస్తుంది.ఆధునిక కవిత్వం అలంకారాల గజిబిజిలో కాదు – అనుభూతి సత్యంలో నడుస్తుంది. మేఘాలు తమను తాము విముక్తం చేసుకోవడానికి వర్షమై కురుస్తాయి అనే ఈ కవితా పంక్తులు ప్రకృతిని వర్ణించడం లేదు.కవి మనిషి అంతరంగాన్ని చదువుతున్నాడు.మేఘాలు పేరుకుపోయిన మౌనం,అణిచివేసిన కోపం,బయటకు రాని కన్నీళ్లు.ఆధునిక మనిషి కూడా అలానే బరువుగా, నిండిపోయి,కానీ కురవ లేక ఉంటాడు.వర్షం ఇక్కడ బలహీనత కాదు,ఓటమి కాదు – అది ధైర్యం,విడిచి పెట్టే శక్తి. ఈ కవితా పంక్తి చెబుతుంది – దాచుకోవడమే స్థైర్యం అన్న పాత నమ్మకాన్ని వదిలేయమని,కురవగలగడమే విమోచనం. కన్నీళ్లు కార్చగలగడమే మనిషిగా మిగలడం.అందుకే ఈ కవితా పంక్తి చిన్నదైనా దాని ప్రతిధ్వని పెద్దది – ఆధునిక మనిషి మనస్సులో కురుస్తూనే ఉంటుంది.ఇక్కడ మేఘాలు ఒక అంతర్భారాన్ని మోసే మనసుకు ప్రతీకలు.వర్షంగా కురవడం అనేది వాటి విముక్తి.అవి దాచుకున్న నీరు వర్షంగా మారినప్పుడు మేఘాలకు తేలిక కలుగుతుంది.మనసులో పేరుకుపోయిన బాధ,ప్రేమ,వ్యధ బయటికి వస్తేనే మనిషికి విమోచనం లభిస్తుందనే సంకేతం ఇందులో ఉంది.
“పొదుగులు/తమ విడుదల కోసం/ఆకలిగొన్న శిశువుల/ పెదాలపై ఒదుగుతాయి/ఈ కవితా పంక్తిలో భావ సాంద్రత ఎక్కువగా ఉంది.కవి అత్యంత సున్నితమైన ప్రకృతి మానవ సంబంధాన్ని ప్రతీకాత్మకంగా ఆవిష్కరిస్తాడు.కవి మాతృత్వం, దయ,విమోచనం అనే భావాలను ఒకే ప్రతీకలో మేళవించాడు.పొదుగులు తమ విడుదల కోసం అని చెప్పడం ద్వారా ఇది కేవలం శిశువు ఆకలిని తీర్చడం కాదు – తనలో నిండిపోయిన పాలను విడుదల చేయడం ద్వారా తల్లికి కలిగే విముక్తిని కవి సూచిస్తున్నాడు అంటే ఇవ్వడం ద్వారా పొందే తేలిక పాటుతనం,తృప్తి,విమోచనం. పొదుగులు ఇక్కడ కేవలం శరీర అవయవాలుగా కాక త్యాగానికి,మాతృత్వానికి,దయకు,జీవన పోషణకు ప్రతీకలుగా మారతాయి.తమ విడుదల కోసం అనే భావన అత్యంత లోతైనది.ఇది భౌతిక విడుదల కాదు – ఇది సహజ ప్రవృత్తి,ఇది కర్తవ్యబోధ,ఇది అంతర్లీనమైన ప్రేమ ప్రవాహం. పొదుగులు పాలు ఇవ్వడం ద్వారా తమలోని భారాన్ని వదులుకుంటాయి – ఇది శారీరక విమోచనం.అదే సమయంలో శిశువు ఆకలిని తీర్చడం ద్వారా జీవనాన్ని కొనసాగించే కార్యం జరుగుతుంది – ఇది జీవన విమోచనం. ఆకలి గొన్న శిశువులు ఇక్కడ కేవలం శిశువులు మాత్రమే కాదు – సహాయం,ప్రేమ,ఆదరణ కోసం ఎదురు చూస్తున్న సమాజంకు ప్రతీకలుగా చూడవచ్చు.పెదాలపై ఒదుగుతాయి అనే కవితా పంక్తి చాలా సున్నితంగా లయాత్మకంగా ఉంది. ఇది కవితలో మాతృ స్పర్శ యొక్క మృదుత్వాన్ని,అదే సమయంలో త్యాగంలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. మేఘాలు వర్షమై కురిసి విముక్తి పొందినట్లే,పొదుగులు కూడా పాలను ఇచ్చి విముక్తి పొందుతాయి.ఈ కవితా పంక్తులు విమోచనం అనే తాత్విక సమీకరణాన్ని స్థాపిస్తాయి.భాషలో ఎలాంటి అలంకారాల ఆర్భాటం లేకుండా అనుభూతి ప్రధానంగా ఉంది.ఇదే ఆధునిక కవిత్వ లక్షణం.విమోచనం అనేది స్వార్థ రహితంగా ఇవ్వడంలోనే ఉంది అని,మాతృత్వ ప్రతీక ద్వారా హృద్యంగా తెలియజేస్తాయి.ఇక్కడ జీవితం జీవనాన్ని తాకే క్షణాన్ని సూచిస్తుంది.ఇది కేవలం పాలిచ్చే దృశ్యం కాదు – ఇది జీవితం – జీవితాన్ని కాపాడుకునే సంధి స్థలం.ఇది జీవన తత్వాన్ని తెలిపే కవితా దృష్టి కోణం ఉంది. ఈ కవితా పంక్తి ద్వారా కవి చెప్పేది విమోచనం అనేది వేరుపడటం కాదు.విడిచిపెట్టడమే.దాచుకోవడం కాదు పంచుకోవడమే అంటే మేఘాలు వర్షంగా కురవడం ఎలా విమోచనమో,పొదుగులు పాలుగా మారి శిశువును చేరడం కూడా అలాగే విమోచనమే.ఈ కవితా పంక్తి త్యాగం ద్వారా విముక్తి.ప్రేమ ద్వారా స్వేచ్ఛ ఇచ్చే ప్రక్రియలోనే విడుదల అనే తత్వాన్ని హృద్యంగా వ్యక్తం చేస్తుంది.ఇది అత్యంత సున్నితమైన మానవీయ ప్రతీక.పొదుగులు పాలతో నిండినప్పుడు విడుదల కావాలనే తపన కలిగి ఉంటాయి.ఆ విడుదల ఆకలితో ఉన్న శిశువు పెదాలపై జరిగితేనే అది సార్ధకమైన విమోచనం అవుతుంది.ఇక్కడ విముక్తి స్వార్థపూరితంగా కాదు ; అది ఇతరుల అవసరంతో కలిసిన త్యాగం,ప్రేమలోని విమోచనం ఇదే.ఇక్కడ విముక్తి స్వార్థపూరితం కాదు ; అది ఇతరుల అవసరంతో కలిసిన త్యాగం, ప్రేమలోని విమోచనం ఇదే.
“స్వర పేటిక/తన విముక్తిని/చెవులారా వినేందుకు/రసప్లావిత హృదయాల్లోకి/ రవాణా చేస్తుంది/అత్యంత సృజనాత్మకమైన ప్రతీకలు ఉన్న కవితా పంక్తులు.కవి కళ,సంగీతం,భావోద్వేగం,
విముక్తి అనే అంశాలను ఒకే ప్రవాహంలో కలిపాడు.స్వర పేటిక ఇక్కడ కేవలం శరీర అవయవం కాదు – మనసులో దాచుకున్న భావాలను శబ్దంగా మార్చే సృజనాత్మక కేంద్రం.స్వరపేటిక తన విముక్తిని పొందాలంటే మౌనంగా ఉండకూడదు – పాట స్వరంగా బయటకు రావాలి.అంటే వ్యక్తిగత విమోచనం అనే భావన ఇక్కడ ప్రధానంగా నిలుస్తుంది.
చెవులారా వినేందుకు అనే పదబంధం సంగీతం సాగించే భౌతిక ప్రయాణాన్ని సూచిస్తే,రసప్లావిత హృదయాల్లోకి అనే పదాలు అది చేరుకునే అంతర్లీన గమ్యాన్ని సూచిస్తాయి. సంగీతం చెవుల దగ్గర ఆగదు ; అది హృదయంలోకి చేరాలి.అక్కడే రసం పుట్టుతుంది ; అక్కడే అనుభూతి సంపూర్ణమవుతుంది.
ఇందులో రవాణా చేస్తుంది అనే యాంత్రిక పద ప్రయోగం విముక్తి వంటి అంతర్లీన భావంతో కలిపిన తీరు ఈ కవిత ఆధునిక కవిత్వ లక్షణాన్ని బలంగా ప్రతిఫలింపజేస్తుంది.కవి తన అనుభూతి ప్రపంచాన్ని ఆధునిక దృష్టితో ఆవిష్కరిస్తాడు.ఈ కవితలో మేఘాలు,పొదుగులు ఎలా విమోచనం పొందాయో ఇక్కడ స్వర పేటిక కూడా తనలోని స్వరాన్ని పంచడం ద్వారా విముక్తి పొందుతుంది.అందు వల్ల ఈ కవితా పంక్తులు చెబుతున్న సారాంశం – కళకు విమోచనం వ్యక్తీకరణలో ఉంది.వినబడినప్పుడే స్వరం జీవిస్తుంది. భాషలో ఆర్భాటం లేదు.భావంలో లోతుంది.ప్రతీకల ద్వారా ఆధునిక అనుభూతి శాశ్వతం అవుతుంది.ఈ కవితా పంక్తులు విమోచనం కవితకు కళాత్మకమైన శిఖరాన్ని అందిస్తాయి.స్వరపేటికలోని స్వరం బయటకు రాకపోతే అది నిశ్శబ్దంగా నలిగిపోతుంది.స్వరం బయటకు వచ్చి శ్రోతల హృదయాల్లోకి ప్రవేశించినప్పుడే అది జీవం పొందుతుంది. ఇది కళ స్వభావాన్ని తెలియజేస్తుంది – కళ తన విమోచనాన్ని ఇతరుల అనుభూతుల ద్వారా పొందుతుంది.కళాకారుడి వ్యక్తిగత భావం సామూహిక రసానుభూతిగా మారడమే అసలైన విముక్తి అని కవి స్పష్టం చేసిన తీరు చక్కగా ఉంది.
“కవి/తన నుండి తను విడివడి/సర్వ స్వతంత్రుడయ్యేందుకు/ పడుతున్న పెనుగులాటే/చివరికి కవిత్వమై అలరారుతుంది/ చాలా లోతైన ఆత్మ పరిశీలనతో నిండిన కవితా పంక్తులు.ఈ పంక్తుల ద్వారా కవి తన కవిత్వ సృష్టి యొక్క అంతర్లీన సంఘర్షణను స్పష్టంగా ఆవిష్కరిస్తాడు.కవిత్వం ఇక్కడ సౌకర్యం నుంచి పుట్టిన ఫలితం కాదు ; తనతో తానే పోరాడి సాధించిన విముక్తి యొక్క రూపం.
తన నుండి తను విడివడి అనే పదబంధం
అంతరంగ విభజనను సూచిస్తుంది.ఒకవైపు వ్యక్తిగత బాధలు,భయాలు, పరిమితులు : మరోవైపు వాటిని అధిగమించాలనే సృజనాత్మకమైన తపన.
సర్వ స్వతంత్రుడయ్యేందుకు అనే లక్ష్యం సామాజిక బంధాల నుంచే కాక,ఆత్మలోని అహం,సంకుచిత మౌనాల నుంచి విముక్తిని కూడా సూచిస్తుంది.ఈ విముక్తి సులభంగా లభించదు.అందుకే కవి దీనిని పెనుగులాటగా వర్ణించాడు.అది మౌనంతో,భయంతో,అనిశ్చితితో సాగే అంతర్మథన యుద్ధం.ఆ పెనుగులాట చివరికి నాశనంగా కాక కవిత్వంగా అలరారుతుంది ; అశాంతి కళగా పరివర్తన చెందుతుంది.ఈ కవితా పంక్తులు విమోచనం కవితలోని మౌలిక,తాత్విక భావాన్ని హృద్యంగా వ్యక్తం చేస్తాయి. మేఘాలు వర్షమై,పొదుగులు పాలనిచ్చి విముక్తి పొందినట్లే,స్వర పేటిక స్వరమై విమోచనాన్ని అందుకున్నట్లే,కవి తనలోని తను ను విడిచిపెట్టి కవితగా మారినప్పుడే స్వేచ్ఛను పొందుతాడు.భాష ఆధునికం ; వ్యక్తీకరణ సూటిగా,తాత్వికత గాఢంగా ఉంది.ఈ కవితా పంక్తులు కవిత్వం అనేది ఫలితం కాదు – ఒక ప్రక్రియ అని స్పష్టం చేస్తాయి.విమోచనం అనేది సృష్టి ద్వారానే సాధ్యం అనే సందేశాన్ని బలంగా ప్రతిపాదిస్తాయి. కవి తన స్వార్థం,అహం,వ్యక్తిగత సంకుచితత్వం నుంచి విడివడి స్వతంత్రుడవ్వాలనే పోరాటమే కవిత్వం.ఇది సులభమైన ప్రయాణం కాదు – ఒక పెనుగులాట.ఆ అంతర్గత సంఘర్షణ నుంచే కవిత పుడుతుంది.ఈ కవిత ద్వారా కవికి విమోచనం లభిస్తే,పాఠకుడికి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది.
ఈ కవితలో ప్రకృతిలో విమోచనం వర్షంగా, మాతృత్వంలోని ప్రేమగా,కళలో రసానుభూతిగా,కవిలో కవిత్వంగా ప్రకటితమవుతుంది.విమోచనం అనేది పారిపోవడం కాదు ; తనలోని నిండుదనాన్ని ఇతరులతో పంచుకోవడం.ఈ భావనను సులభమైన పదాలతో గాఢమైన ప్రతీకల ద్వారా వ్యక్తపరచడంలో ఈ కవిత సాహిత్య సౌందర్యాన్ని సంతరించుకుంది.అంతిమంగా ఈ కవిత మనకు చెప్పేది ఇదే – నిండినదంతా వెలువడితేనే తేలిక ; వెలువడినదంతా కవితగా మారినప్పుడే విమోచనం.కవి భాస్కర్ విమోచనం అనే చక్కటి కవితను అందించినందుకు మనసారా అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని కోరుకుంటున్నాను.
సంగీత జలధిలో మునకలేస్తూ, స్వరాలను శ్వాసిస్తూ, రాగాలను పానంచేస్తూ, పంచప్రాణాలుగా అభిమానిస్తూ, ఆరోప్రాణంగా ఆరాధిస్తూ వన్నె తెచ్చిన స్వరకర్త లెందరో.
పలు చరణాలతో కూడిన స్వరకల్పనకి పల్లవి తిరగలి చక్రమై రాగానికి శోభ నిచ్చిన విధంగానే బాలభానుడి లేత కిరణాలైనా, సోముడి వెన్నెల జల్లులైనా ప్రకృతి సోయగమై మనసుకు హాయి గొలుపుతాయి.
సంగీత పరిభాషలో స్వరాల సమూహాన్ని ‘రాగం ‘ అంటారు. ఒక్కొక్క రాగం ఒక్కొక్క మూర్చనను కలిగి ఉంటుంది. ప్రతీ మూర్చన తనవైన స్వరాలను కలిగి ఉంటుంది. స్వరాలేవైనప్పటికీ రాగభావం మాత్రం మాధుర్యభరితమే.
చుక్కలు పరిచిన నీలాల దుప్పటి కవులకు కవితావస్తువై, కావ్యాల్లో సైతం తనదైన ముద్ర వేసుకుంది.
ఎదఎదను రంజింపజేసే సంగీత సుధ దేశకాలాల్ని బట్టి ఏ రూపు సంతరించుకున్నా(కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య), ఏ చోట ప్రవహించినా అంతిమంగా దాని లక్ష్యం అలౌకికానందమే.
సంగీత వీచికతో కూడిన శబ్దాన్ని ‘నాదం ‘ అంటారు. అనంతరాగాల సమన్వితమైన సంగీతం నాదమయం. గుప్పెడు గుండెలో కోటి భావనలు దాగి ఉన్నట్టే, అసంఖ్యాక రాగాలలో ఇమిడి ఉన్న నాదమొక్కటే.
మధురమైన ఆ సుధాగానాన్ని గ్రోలుతూ, ఆ నాద జగత్తులో పరవశిస్తూ, సంగీత సరస్సులో వికసించిన పద్మాలెన్నో.

నారాయణ అయ్యర్, అమ్మిని అమ్మాళ్ దంపతుల తనయగా 08/04/1938 భారతదేశంలోని చెన్నై నగరంలో జన్మించి, సంగీత సరస్సులో ముచ్చటగా మూడోసారి{( పద్మశ్రీ-1984), (పద్మభూషణ్-2004), (పద్మ విభూషణ్-2026)}వికసించి, తన పూదేనియల వెదజల్లిన ఈ పద్మమే ఎన్. రాజం.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన 2026వ సంవత్సరపు పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పొందిన ఐదుగురు సభ్యుల్లో ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ వాయు లీన విద్వాంసురాలు వయొలిన్ వాద్యంలో (కళల విభాగంలో)సాధించిన ప్రతిభకుగాను ఈ అవార్డును పొందారు.
హిందుస్థానీ సంగీతంలో నిష్ణాతురాలైన వీరు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తమ ఉద్యోగ నిర్వహణలో సంబంధిత విభాగానికి అధిపతిగా, ప్రదర్శన కళల విశ్వవిద్యాలయ విభాగాధిపతిగా తమ సమర్థవంతమైన సేవలు అందించి, పలు పదవులకు వన్నె తెచ్చారు.
వీరంందించిన సేవలకు గాను సంగీత నాటక అకాడమీ (1990) అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమి అందించే అత్యున్నత గౌరవమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 2012లో వీరిని వరించింది.
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడైన తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యురాలిగా సంగీతంపై పట్టు సాధించారు.
ఘర్(ఇల్లు) అనే హిందీ పదం నుండి ఉద్భవించిన’ ఘరానా ‘ అనే సంగీత ప్రక్రియలో నిష్ణాతులైన హిందుస్తానీ సంగీత గురువు ఓంకారనాథ్ ఠాగూర్ వద్ద రాగవికాసాన్ని నేర్చుకున్నారు.
ఘరానా అనే పదానికి సంగీత వారసత్వం, గురుశిష్య సంప్రదాయం అని అర్థం. ఇది ఒక నిర్దిష్ట సంగీత శైలి. రాగ, గాత్ర వాద్య శైలులను అభ్యసించే విధానాన్ని సూచించే ప్రక్రియ(గ్వాలియర్ ఘరానా).
వారణాసిలో మహదేవ్ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో ఆ నగరం యొక్క ఠుమ్రీ సంప్రదాయాన్ని కూడా అభ్యసించారు. క్రమంగా వాద్య సంగీతంలోకి అడుగుపెట్టి చివరకు హిందుస్తానీ సంగీతంలో వయొలిన్ విద్వాంసురాలిగా ఖ్యాతి గాంచారు.
తండ్రి మార్గదర్శకత్వం లో ‘గయాకి అంగ్ (గాత్ర శైలి)’ అనే ప్రక్రియను అభివృద్ధి పరిచారు. గయాకి అంటే హిందీ, అరబిక్ భాషలలో పాడటం అని అర్థం. ఖయాల్ అంటే హిందీ భాషలో ఆలోచన అనీ, పర్షియన్ భాషలో సాహిత్యం అని అర్థం. సరళంగా చెప్పాలంటే ఖయాల్ గయాకి అనేది నిర్దిష్ట శైలి, వేగం లేని వివరణాత్మక గానకళ. వీరు తమలోని సంగీత పరిజ్ఞానానికి సాధనను జోడించి వయొలిన్ వాద్యంపై మనుషుల స్వరాన్ని పోలిన విధంగా వాయించే విధానాన్ని కనిపెట్టారు.
వయొలిన్ భారతీయ సంగీత కచేరీలో, ముఖ్యంగా కర్ణాటక సంగీత కచేరీలో ఉపయోగింపబడే ప్రధాన సహకార తంత్రీవాద్యం. దీనికి ‘ ఫిడేలు ‘ అని మరో పేరు. గాంభీర్యంతో కూడిన మాధుర్యం దీని సొంతం. ఇది పాశ్చాత్య వాయిద్యమైనప్పటికీ, కర్ణాటక సంగీతంలోని అతి సూక్ష్మ గమక విశేషములను కూడా పలికించగల సామర్థ్యం ఉండటంచే ప్రధాన పక్క వాయిద్యంగా, తని వాయిద్యంగా భారతీయ సంగీతంలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించుకుంది.
కర్ణాటక సంగీత శైలిలో ప్రముఖ వయొలిన్ విద్వాంసుడైన T.N. శేషన్ తోబుట్టువు వీరు. చార్టెడ్ అకౌంటెంట్ ఐన T.S. సుబ్రహ్మణియన్ అనే వ్యక్తిని వివాహమాడి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి, ఆ శిశువుకు సంగీత శంకర్ అని నామకరణం చేశారు.
కూతురైన సంగీత శంకర్ గారికి, మనవరాళ్లైన (సంగీత శంకర్ గారి తనయలు) రాగిణి శంకర్, నందిని శంకర్ లను వయొలిన్ వాద్యంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.
మేనకోడలైన కళారాంనాథ్, డా. సత్యప్రకాష్ మెహంతీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఐన ప్రణవ్ కుమార్ వీరి శిష్యులు. కర్ణాటక సంగీత గాయని మరియు సామాజికవేత్త ఐన పద్మా స్వామినాథన్ వీరికి అత్తగారు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రముఖ నేపధ్య గాయని ఐన వాణీజయరాం వీరికి వదిన.
సంగీత కుటుంబంలో జన్మించి, ఆ సాగరాన్ని మథించి, అందుండి లభించిన రాగసుధల్ని వారసత్వంగా తనవారికి పంచడమే కాకుండా, స్వపర భేదాలెంచక అభిమానించి, ఆరాధించిన (సంగీతాన్ని) వారందరికీ వితరణ చేసి, అందులోనే తాదాత్మ్యం చెందిన ఈ సంగీత శిఖరానికి(రాజం గారికి) కైమోడ్పులర్పిస్తూ…..
భరతనాట్యంలో ప్రప్రథమ భారతీయ మహిళా నృత్య కళాకారిణియైన వీరు ఫిబ్రవరి
29 ,1904 లో మధురై, మద్రాస్ (ప్రెసిడెన్సి బ్రిటిష్ ఇండియా)లో జన్మించారు .తల్లిదండ్రులు నీలకంఠశాస్త్రి శేషమ్మాళ్ గార్లు. సంస్కృత పండితులు, చరిత్రకారులైన నీలకంఠ శాస్త్రిగారు “థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా “లో సభ్యులు .
నాటి సామాజిక పరిస్థితులను అనుసరించి బాల్యవివాహానికి పెద్దలు ప్రయత్నించినప్పుడు తిరస్కరించిన రుక్మిణి ,ఏడవ సంవత్సరంలో ఉన్నప్పుడే తండ్రితో పాటు ఆమె సొసైటీలో చేరారు. కర్ణాటక సంగీతము , భరతనాట్యం లో అభిననివేశం సంపాదించారు . విదేశీయులైన జార్జ్ ఆరుండేళ్ ను 1920లో తన పదహారవ ఏట వివాహం చేసుకున్నప్పుడు ఆమె వయస్సు పదహారు సంవత్సరాలు కాగా, జార్జ్ ఆరుండేళ్ వయసు నలభై సంవత్సరాలు . తల్లిదండ్రులు విముఖత చూపినప్పటికీ అనిబిసెంట్ ఆధ్వర్యంలో వీరి వివాహం జరిగింది.
ఆధ్యాత్మికత పైనున్న ఆసక్తే ఆమెను,’ యంగ్ థియోసాఫిస్టిక్స్ ఫెడరేషన్’ అధ్యక్షురాలిని చేసింది. ‘థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం’లో జార్జ్ అరుండేల్ బోధకులు. వివాహానంతరం దంపతులిద్దరూ ఇరు సంప్రదాయాల్ని పరస్పరం గౌరవించుకుంటూ చక్కని జీవన యానం చేశారు. ఒకానొక సందర్భంలో భర్త గురించి చెప్తూ , “చతుర భాషణులు, జన సమూహంలోఉంటూ,అందరిని చైతన్య పరచడం వారి ప్రత్యేకత అంటారు .వీరి వివాహం సనాతన సాంప్రదాయ వర్గాలకు నచ్చక సంఘం నుండి కొత్తజంటను, ఆమె కుటుంబాన్ని బహిష్కరించినప్పటికీ వారి కలివిడితనం ప్రజల మద్దతుతో తిరిగి సమాజంలో కలిసిపోయారు.

మరోసందర్భంలో తమ కుటుంబ నేపథ్యం గురించి చెప్తూ మా ఇంట్లో ఆంక్షలు, కట్టుబాట్లు ఉండేవి కావని, సంస్కృతీసాంప్రదాయాల్ని తమవారిని చూస్తూనే నేర్చుకున్నానంటారు. కులమత భేదాలు, సంకుచిత స్వభావాలు ,జంతుబలులు లాంటి మూఢనమ్మకాలు ఉండేవి కావంటారు .
జార్జ్ అరుండేల్ వృత్తి ధర్మం లో భాగంగా వారు ఎన్నో దేశాలను చుట్టివచ్చే అవకాశం వారికి లభించింది .ఆ సందర్భంగా
అన్నాపావ్లోవా బావ్లే అనే రష్యన్ కళాకారిణి చేసిన బ్యాలెరీనా నృత్యాన్నిచూసి, పాశ్చాత్య బాలేట్ వైపు ఆకర్షితరాలైన ఈమె బావ్లే గురువు’ క్లియోనార్టి ‘వద్ద నృత్యాన్ని అభ్యసించారు. తరువాత బావ్లే సలహాతో
భరత నాట్యం నేర్చుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం కేవలం దేవదాసీలు మాత్రమే చేసే ఆ నృత్యాన్ని సనాతన వర్గపు స్త్రీలు భరతనాట్యం నేర్చుకోవడం అవమానంగా భావించే సందర్భం. ఐనా అందరి విమర్శల్ని ,అభ్యంతరాలని పక్కకు నెట్టి ‘మీనాక్షి సుందరం పిళ్ళై ‘దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం పొందారు. ‘కేలూనాయర్’ వద్ద కూడా నాట్యం నేర్చుకున్నారు. ‘థియోసాఫికల్ సొసైటీ’ వజ్రోత్సవాల్లో భాగంగా ఇరవై వేల మంది ఆహుతుల మధ్య ప్రదర్శన ఇచ్చి రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ లాంటి ఎందరో ప్రముఖుల ప్రశంస పొందిన ప్రతిభాశాలి. ‘జేమ్స్ కజిన్’ అనే ఐర్లాండ్ కవిని ఆమె నాట్యం ఎంతగానో ఆకర్షించగా ,అతని ప్రోత్సాహంతో ‘ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ‘ పేరిట 1936 లో నృత్యాలయాన్ని ఏర్పాటు చేశారీదంపతులు .అదే అంచెలంచెలుగా ఎదుగుతూ ‘కళాక్షేత్రం’గా రూపం మార్చుకుంది. తన తొలి గురువైన సుందరం పిళ్ళై మరియు వారి అల్లుడు చొక్కలింగం పిళ్ళైలను తమ కళాక్షేత్రంలో గురువులుగా నియమించుకుని ,నలుగురు విద్యార్థులతో ప్రారంభించబడి అంచలంచెలుగా ఎదుగుతూ శిఖరాగ్రాన నిలిచిందీనాడు. నాట్యంతో పాటు సంగీతాన్ని కూడా చేర్చినేర్పిస్తున్నారు .తోటలు తామరకొలను సాంప్రదాయిక కట్టడాలతో తన అభిరుచికి తగ్గట్టు ఒక నాట్య దేవాలయంగా తీర్చిదిద్దారీ కళాక్షేత్రాన్ని.
కేవలం దేవదాసీలు మాత్రమే ఈ నృత్యం చేయాలన్న ముద్రను చెరిపేసి ఈ కళారూపాన్ని జన రంజకంగా తీర్చి దిద్దిన
లాస్య ప్రియ.
శ్రీ జార్జ్ అరుండేల్ 1945 లో మరణించేనాటికి రుక్మిణీఆరుండేల్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు .(ప్రముఖ తత్వవేత్త ఐన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు జార్జ్ అరుండేల్ గారి పూర్వ విద్యార్థి.)
1967లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ని కూడా పొందారీమె.
1977లో ప్రధాని మొరార్జీ దేశాయ్ రాష్ట్రపతి అభ్యర్థిగా
శ్రీమతి ఆరుండేల్ ను ప్రతిపాదించినపుడు సున్నితంగా తిరస్కరించారట .రాష్ట్రపతి పదవి కన్నా నాట్యాన్ని ఇష్టపడ్డ వ్యక్తి అని , ‘2013 లో కళాక్షేత్రలో రుక్మిణీ దేవి స్మారకోపన్యాసం సందర్భంగా నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
గుర్తు చేశారు ‘.

భరతనాట్యానికి మార్పులు చేర్పులు చేసి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ప్రపంచ ప్రాముఖ్యతను కలిగించారు. దేవదాసి సమాజంలోని టి. బాల సరస్వతి మరికొందరు నృత్య కళాకారుల సహాయ సహకారాలతో ఈ కళను గుడిమెట్లు దాటించి ప్రపంచ వేదిక పైకి తీసుకురావడంలో విశేష కృషి సల్పిన రుక్మిణి ఆరుండేల్ , భరతనాట్యంలో శృంగార అంశాలను తొలగించి భక్తి రసానికి ప్రాధాన్యతను కలిగించి పాఠ్యాంశాల్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దారు. ఆహార్యంలో, ఆభరణాలకు, రంగస్థల దృశ్యాలకు కొత్తదనాన్ని జోడించి నృత్య , నాటక ఆకృతినిచ్చి రామాయణంలోని కొన్ని అంశాలను అత్యంత జనాదరణ పొందేలా రూపొందించారు.
1952 ఏప్రిల్ లో మొదటిసారి రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికైన తొలి నాట్య కళాకారిణిగా రికార్డు సాధించారు .రెండుసార్లు ఈ పదవినలంకరించిన వీరు జంతు సంక్షేమం కోసం “ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఆనిమల్ ఆక్ట్ “కోసం “జంతు క్రూరత్వ నిరోధక బిల్లు 1960 “తేవడంలోను,”జంతు సంక్షేమ బోర్డు “స్థాపనలో విశేషమైన కృషి చేశారు .ఈ బిల్లు ప్రవేశ పెడుతూ ఆమె చేసిన ప్రసంగానికి ప్రభావితులైన ప్రధాని నెహ్రూ చొరవతో త్వరితగతిన చట్టం రూపుదాల్చింది. ఎన్నో సంస్థలతో కలిసి జంతు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వీరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1956లో ‘పద్మభూషణ్’ తో సత్కరించగా , ‘దేశికోత్తమ’ బిరుదుతో ‘శాంతినికేతన్’ సన్మానించింది.
నాట్య రీతిలో భగవత్తత్వాన్ని జోడించి , వీరు భరతనాట్యాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శించి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందడమే కాక ,నాట్యాన్ని ఉన్నత శిఖరాన నిలిపిన ఘనత సాధించారు .
ఫిబ్రవరి 24 ,1986న శ్రీమతి రుక్మిణీఆరుండేళ్ హంసమంజీరమై నటరాజ పాదాల చెంత చేరారు .
ప్రకృతిలో సంస్కృతిలో కనిపించే రంగులన్నీ ప్రతీకాత్మకమైనవి .ప్రత్యకమైనవి . భారతీయ ఆత్మకు అభివ్యక్తీకరణమే రంగుల సమ్మేళనం .రంగులు మన జీవిత గమనంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి . మతం – రాజకీయం– పండుగలు – వేడుకలు అన్నింట్లోనూ రంగుల ఎంపిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. మానవ జీవితంలో రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది . ప్రకృతిని ,పరిసరాలను రాగరంజితం చేసే రంగులు మన భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయి .ఋతువులు మారగానే రంగుల కలయిక మారుతుంది .
ఈ రంగుల కథ మనం అనుకున్న దానికంటే క్లిష్టమైనది .లోతైనది కూడా !మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని లోకానికి పరిచయం చేస్తుంది .
పసుపు రంగు ఆశావాదానికి ప్రతీక .శుభకరీ ,శోభస్కరి ,మంగళకరి అయిన పసుపు లేనిదే ఏ వంటిల్లు సమగ్రం కాదు మన దేశంలో .హిందూమతంలో పసుపు పవిత్రతకు జ్ఞానానికి చిహ్నం .లక్ష్మీదేవికి సంబంధించిన రంగు. విష్ణుమూర్తి పీతాంబరుడు కదా!
ఇంద్రధనస్సులో మూడవ రంగుపసుపు . సూక్ష్మ బుద్ధికి ,జ్ఞానానికి ప్రతీక చక్ర వ్యవస్థలో మణిపూర చక్రానికి సంబంధించినది . ఈ చక్రం మనిషి అహానికి ,శక్తికి స్థానం.. చరిత్రకందని కాలంలో కనిపించే గుహల చిత్రలేఖనాలలో కనిపించే ప్రధాన రంగుల్లో ఒకటిపసుపు రంగు . రోమ్ , ఈజిప్ట్ దేశాల్లో 17 వేల సంవత్సరాల పూర్వం ఉన్నగుహల్లోని చిత్రలేఖనాల్లో ప్రస్ఫుటంగా కనిపించే రంగు పసుపు. క్రైస్తవ ధర్మంలో మోసం , వంచన అనే భావాలకు గుర్తుగా వాడేవారు ఒకప్పుడు .అదే ఈజిప్టులో బంగారు వర్ణమ్ శాశ్వత జీవితానికి ప్రతీక .ఈజిప్షన్లు దేవతల చర్మం బంగారు పసుపు వర్ణంలో ఉంటుందని ఎముకలు పసుపు రంగులో ఉంటాయని నమ్మేవారు .
ఒకప్పుడు బౌద్ధ ధర్మం లో ఈ రంగు అణ కువకు వినయానికి గుర్తు .బౌద్ధ శ్రమణులు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు . వారిలో జాగరుకతను స్థిరపరచడానికి ఈ పద్ధతినిబుద్ధుడు నిర్దేశించాడు .
చైనాలో ప్రాచీన కాలంలో పసుపు రంగు వస్త్రాలను కేవలం చక్రవర్తులే ధరించాలని నియమం ఉండేది . ఈ సంప్రదాయం ఒకప్పుడు రాజరికానికి గౌరవానికి చిహ్నం .
జపాన్‌లో ధైర్యానికి చిహ్నం అయితే కొన్ని యూరోపియన్ దేశాలలో అసూయ లేదా ద్రోహభుద్ధి కి సంకేతం . మనదేశంలో ఈ రంగు జ్ఞానం అభ్యాసానికి చిహ్నం . ముఖ్యంగా వసంత పంచమి వేడుకల్లో సరస్వతి దేవి ఆశీస్సుల కోసం పసుపు రంగు దుస్తులు ధరించడం ,అమ్మవారికి పసుపు రంగుతో చేసిన ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ .
కొన్ని ప్రాంతాలలో ఈ రంగుకు వ్యతిరేకమైన అర్థాలు కూడా కనిపిస్తాయి . దీని వాడకంలో ఎల్లో బెల్లీ అంటే పిరికివాడు అని సూచించడానికి ,ఎల్లో జర్నలిజం అంటే సత్య దూరమైన ,అతిశయోక్తులతో నిండిన వార్తలని అర్థం .చదువరుల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి రాతలు రాస్తారని , ప్రచారం చేస్తారని దీని భావం .
నూతన సంవత్సర వేడుకల్లో పసుపు రంగులో దుస్తులు ధరిస్తే ధనాన్ని సంతోషాన్ని అదృష్టాన్ని వ స్తుందని చాలామంది లాటిన్ అమెరికన్లు విశ్వసించేవారు ఒకప్పుడు .
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రంగుల పరిశోధకుడు హోవార్డ్ కెమ్ ప్రాసెసర్ ఆసుపత్రి గదులు ప్రశాంతతను ప్రతిబింబించాలని , రోగుల మనసులో ఆందోళనను తగ్గించడానికి కొన్ని సూచనలు చేశాడు . వాటి ప్రకారం గది పైకప్పుకు ఆకాశపు నీలం , నేలకు ఆకుపచ్చ ,గోడలు ఉదయించే సూర్యుని రంగు అయిన పసుపును వాడాలి .
Ketchup And Mustard theory
ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ? బర్గర్ కింగ్ ,మెక్‌డోనాల్డ్ వారి లోగోలను గమనించారా ?ఇందులో ఎరుపు పసుపు రంగులు ప్రధానమైనవి .శాస్త్రబద్ధమైన ఆధారాలు దొరక్కున్న కొన్ని పరిశోధనలు ఎరుపు రంగు మనిషి ఆకలిని ప్రేరేపిస్తుందని ,పసుపు రంగు సౌకర్యాన్ని సూచిస్తుందని అందుకని వీరు రెండు రంగులను వాడారని అంటారు .దీన్ని అద్భుతమైన కలయికని ఫ్రెంచ్ ఫ్రై లకు టమాటో కెచప్ గొప్ప జోడి అని అంటారు .ఈ కాంబినేషన్ అత్యంత ప్రజాధరణ పొందిందని అందరికీ తెలుసు
పుష్యరాగం
నవరత్నాలలో పసుపు వన్నెతో ఉండేది పుష్యరాగం .ఇది గురు గ్రహానికి చెందింది . కోరండం ఖనిజంతోనే పుష్యరాగాలు ఏర్పడతాయి . వీటిలో పారదర్శకమైన పసుపు రంగులో బంగారు వన్నెతో ధగధగలాడే రత్నాలను కనకపుష్యరాగాలని అంటారు . పురాతన కాలం నుండే ఇవి వాడుకలో ఉన్నాయి. ప్రాచీన గ్రీక్ , రోమన్ ,ఈజిప్షియన్ ,సింధులోయ నాగరికతల కాలంలో రాచ కుటుంబాల వారు ఆభరణాలలో వీటిని విరివిగా వాడేవారు .
ఆనందం ఆశావాదం
పసుపు రంగును చూడగానే మెదడులో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది .ఇది ఆనందాన్ని ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని ,ఆశావాద దృక్పథాన్ని పెంచుతుంది .
ఏ కాగ్రత మేధస్సు
ఇది మెదడును ఉత్తేజ పరుస్తుంది . జ్ఞాపకశక్తిని ,ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది అందుకే స్టడీ రూము లో పసుపు రంగు వాడడం మంచిదంటారు .
ఆకలి
ఆకలిని ప్రేరేపించే రంగు . అందుకే రెస్టారెంట్లలో ,డైనింగ్ రూములలో ఈ రంగుని ఎక్కువగా ఉపయోగిస్తారు .
వాస్తు ఇంటి అలంకరణ
ఇంటి హాల్ లేదా డైనింగ్ రూమ్ లో పసుపు రంగు వేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం సంతోషం పెరుగుతాయని వాస్తు చెప్తోంది .
పచ్చ కామెర్లు
మూత్రం పసుపు రంగులో రావడం అనేది దీని లక్షణం .కాలేయ సంబంధిత సమస్య .
పసుపు రంగు వ్యక్తిలో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను ప్రేరేపిస్తుందని సైకాలజిస్ట్‌లు చెప్తుంటారు .పసుపు మెదడు కార్యకలాపాలను పెంచుతుందని జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు . అందుకే మార్కెటింగ్ నిపుణులు తమ వస్తువుల ప్యాకింగ్ లలో వాటి ప్రకటనల్లోనూ పసుపు రంగును ఎక్కువగా వాడుతుంటారు .
పసుపు రంగును మెచ్చేవారు
ఈ రంగును ఇష్టపడే వారి గురించి చెప్పడానికి చాలానే ఉంది .ఆహ్లాదంగా చురుకైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు .వ్యాపార దక్షత ఎక్కువ .కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు . తాను ప్రత్యేకమైన వ్యక్తిని అనిపించుకోవడం వీ రికిష్టం .ఎక్కువ మందితో స్నేహం చేస్తారు .చూడడానికి మాడర్న్ గా కనిపించిన పాతకాలపు ట్రెండ్స్ అంటేనే ఎక్కువ మక్కువ .
ఎం తటి క్లిష్ట పరిస్థితులైన తేలికగా హ్యాండిల్ చేయడం వీరి ప్రత్యేకత .చాలా ఎమోషనల్ . కానీ ఏ ఫీలింగు బయటికి ప్రదర్శించరు. చాలా త్వరగా నిర్ణయాలు మార్చుకోవడం వీరి బలహీనత .
త్వరగా నిర్ణయాలను తీసుకుంటారు .చురుకుగా పనిచేస్తారు .సాధారణంగా ఎక్కువ ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు . చాలా శక్తివంతులు .
ప్రతిభావంతులైన వ్యక్తులకు పసుపు రంగు పువ్వులు ఇవ్వడం ఆచారం. అతని ప్రతిభకు ప్రశంసలు ఈ రూపంలో అందిస్తున్నారని అర్థం. వీ రు ఎప్పుడు చుట్టుపక్కల వారికి ఆనందాన్ని పంచే స్వభావం కలిగి ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చెబుతారు ఉత్సాహంగా ఉంటారు ఎటువంటి పరిస్థితినైనా సానుకూల దృక్పథంతో స్వీకరించి ముందుకు సాగడం వీధి ప్రత్యేకత .
ఇది కంటికి అత్యంత ప్రకాశవంతంగా కనిపించే రంగు కనుక ట్రాఫిక్ లైట్స్ లో ఉపయోగిస్తారు .
బంగారం , ఉదయిస్తున్న సూర్యుడు ,నిమ్మకాయ ఈ రంగు పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి .
ఫోటోగ్రఫీలో గోల్డెన్ అవర్ అంటే సూర్యోదయం తర్వాత మొదటి గంట ,సూర్యాస్తమయానికి ముందు చివరిగంట .ఈ సమయంలో సూర్య కాంతి చాలా మృదువుగా ,వెచ్చగా ఉంటూ అందమైన నీడలను ఇస్తుంది .ఫోటోలకు అద్భుతమైన రూపం ఇస్తుంది . పోర్ట్రైట్స్ , ల్యాండ్ స్కేప్ ,రొమాంటిక్ ఫోటోషూట్లకు సరైన సమయం .
మీకు తెలుసా పసుపు రంగును చూసి భయపడే వారి భయాన్ని Xantophobia అంటారు .
ఇది చాలా ప్రకాశ వం తమైంది . ప్రస్ఫుటంగా కనిపించే రంగు .
పసుపు రంగుకు సంబంధించిన సాంస్కృతిక చరిత్ర కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నది
ట్రాఫిక్ లైట్లు మొట్టమొదటిసారిగా అమెరికాలో 1920 ప్రాంతాలలో ప్రవేశపెట్టారు .తొలుత పసుపు నలుపు రెండు రంగులు మాత్రమే ఉండినవి .
రంగులు మన మెదడులో రకరకాలైన రసాయనాలను రిలీజ్ చేస్తాయి .
పసుపు రంగు మన మెదడులో సెరటోనిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది .ఈ సరటోనిన్ మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది .
పొలాలలో కీటకాలను బారి నుంచి రక్షించడానికి పసుపు రంగు స్టిక్కీ ఉపయోగిస్తారు ఎందుకంటే కీటకాలు పసుపు రంగును త్వరగా ఆకర్షింపబడతాయి .
ఒకప్పుడు ఎల్లో ఫీవర్ అనేవ్యాధి వ్యాప్తిలో ఉండేది .ఇది దోమల ద్వారా సోకుతుంది .ఫ్లూ వంటి లక్షణాలతో తీవ్రమైన శారీరక బాధతో ఒకప్పుడు ప్రజలు బాధపడేవారు .
మన దంతాలు పసుపు రంగులో మారడానికి కాఫీ టీ సో డాలాంటివి తాగడం ముఖ్యమైనకారణం . మన పంటి పైన ఉండేటువంటి ఎనామిల్ బలహీనం చేసి పసుపు రంగు పోరని ఏర్పరుస్తాయి
మరో వింతైన విషయం YELLO DAY అనేది కూడా ఉంది . సంవత్సరం మొత్తంలో చాలా సంతోషకరమైన రోజుగాదీన్ని జరుపుకుంటారు . ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన జరుపుకుంటారు .
2016 ఫిబ్రవరిలో మలేషియన్ గవర్నమెంట్ పసుపు రంగు టీ షర్ట్ లను బ్యాన్ చేశారు .ఎందువల్ల అంటే ఇది వేసుకున్న నిరసనకారులు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఉద్యమంలో లేవదీశారు .
John D. Hertz అనే వ్యక్తి Yellow Cab Company స్థాపించా .రు ఆయన కా రలన్నింటికీ పసుపు రంగు పెయింట్‌తో ఉండేది .ఆయన పసుపు రంగు చాలా దూరం నుంచి కూడా త్వరగా గుర్తించడానికి వీలవుతుంది అని తెలుసుకున్నారు . అందువలన టాక్సీలు అన్నిటికీ కూడా పసుపు రంగు వేయించి ఎల్లో క్యాబ్ కంపెనీ అనే పేరుతో ఒక కంపెనీని ప్రారంభించారు .
చివరిగా మరొక్క మాట
సమస్యలు ఎన్నున్నా , సంఘర్షణలెన్నైనా మనసుంటే మార్గం అంటుంది పసుపు రంగు .ఇదే జీవిత సత్యం .
విజయ కందాళ
9912842104
ప్రముఖ కవయిత్రి,హిమజ కలం నుండి జాలువారిన తల్లులు – పిల్లలు కవిత పై విశ్లేషణా వ్యాసం.ఈ కవిత తల్లి – పిల్లల మధ్య ఉన్న బంధాన్ని అత్యంత సున్నితమైన మానసిక కోణంలో ఆవిష్కరిస్తుంది.సాధారణంగా పిల్లలు చిన్న వయసులో తల్లులపై ఎక్కువగా ఆధారపడుతారు.కానీ చూస్తుండగానే కాలచక్రం గిర్రున తిరుగుతుంది.పిల్లలు పెద్ద వాళ్ళుగా మారడం సహజం.పిల్లలు తమ తమ జీవితాలను నిర్మించుకుంటూ తల్లి ఇంటి నుంచి దూరం అవుతారు.ఆ దశలో తల్లి ఎదుర్కొనే అదృశ్య వేదనని ఈ కవిత హృద్యంగా చిత్రిస్తుంది.కవయిత్రి ఎదిగిన పిల్లల తల్లుల లోపలి నిశ్శబ్దాన్ని, వారి మౌన ప్రేమను చాలా నిజాయితీగా, హృదయాన్ని హత్తుకునేలా వ్యక్తీకరించిన తీరు వాస్తవికంగా ఉంది.తల్లులు – పిల్లలు కవితలోని భావాలు ఒక తాత్విక పరిపూర్ణతను,మాతృ ప్రేమ యొక్క మాధుర్యాన్ని, హృదయంలోని నిశ్శబ్దతత్వాన్ని చాలా లోతుగా ప్రతిబింబిస్తున్నాయి.ఇక తల్లులు – పిల్లలు కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారిద్దాం. కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.
“ ఎవరూ నేర్పరు.. /అనే కవితా పంక్తి తల్లుల అంతర్గత ప్రపంచాన్ని ప్రకటించే మౌన యంత్రం లాంటిది.తల్లులు – పిల్లల సంబంధం కేవలం పాఠ్య పుస్తకాల ద్వారా నేర్పే విషయం కాదు.ఇది ఎవరికి వారు సహజంగా నేర్చుకోవాలి.ఈ విద్యను ఎవరు నేర్పరు.ఇది అనుభవం,విరామాలు, విడిపోవడాలు వల్ల కలిగే సంఘర్షణలను అద్బుతంగా ఆవిష్కరిస్తుంది.పిల్లలను పెంచే దశలో తల్లి ఎన్నో ఆటంకాలను,అడ్డంకులను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగుతుంది.అయినప్పటికీ తల్లి తన పేగు పంచుకు పుట్టిన పిల్లలను ప్రేమించడం,వారికి రక్షణ కల్పించడం,వారు సరైన మార్గంలో పయనించేందుకు దోహదపడుతుంది.కానీ పిల్లలు ఎదిగే కొద్ది తల్లి పాత్రలో ఒక నిశ్శబ్దమైన మార్పు చోటు చేసుకుంటుంది.ఇక తల్లి పిల్లల ప్రపంచ కేంద్రం కాదు అని అంగీకరించాలి.వారి నిర్ణయాలను తాను వెనుక నిలబడి ఆశీర్వదించాలి – ఇవి ఎవరు నేర్పని పాఠాలు.ఈ కవితలో తల్లి ప్రేమ బిగ్గరగా మాట్లాడదు.తల్లి మౌనంతో పిల్లలకు వీడ్కోలు చెప్పడం నేర్చుకుంటుంది.పిల్లల జీవితంలో తల్లి జోక్యం తగ్గడం అనేది నిర్లక్ష్యం కాదు.అది పరిపక్వమైన తల్లి ప్రేమకు నిదర్శనం.తన అవసరాలను తల్లి పక్కన పెడుతుంది,కేవలం పిల్లల కోసమే బతుకుతుంది. పిల్లలు స్వేచ్ఛగా జీవించేందుకు త్యాగమూర్తి అయిన తల్లి సహకరిస్తుంది.తల్లి అందించే త్యాగం వర్ణనాతీతం.ఎలాంటి శిక్షణ,సూచనలు లేకుండానే తల్లి ఈ మార్గంలో నడుస్తుంది. తల్లికి ఎవరు నేర్పరు అనేది ఒక అంతర్లీన ఆవేదన.ఈ కవితా పంక్తిలో మౌనం ప్రధానమైనది.ఇక్కడ కనిపించకుండా తల్లి ప్రేమ ఒక నీడ వలె ఎప్పుడు తన వెంటనే ఉంటుంది.పిల్లలు ముందుకు నడుస్తుంటే ఆ నీడ వెనకే తల్లి నడుస్తుంది.ఇవి ఎవరు చెప్పని మాటలు,చూపునకు అందని కన్నీళ్లు,ఎవరు అడగని హక్కులు – తల్లితనపు మౌన స్వభావాన్ని తెలియజేస్తుంది.ఈ కవితలో తల్లితనాన్ని ఒక జీవన తత్వంగా ఆవిష్కరిస్తుంది.తల్లి ప్రేమతో పిల్లలను బంధించి ఉంచదు.అవసరమైన సమయంలో పిల్లలను వదిలి పెట్టి ఉండాలి అని తల్లికి ఎవరు నేర్పరు. ఇవి ఎవరి వల్ల తల్లికి రాదు.తల్లి హృదయం లోపల పిల్లల గురించి తెలుసుకునే జ్ఞానం ఉంటుంది,మరియు నిశ్శబ్దంగా,ఒక విశాలమైన జీవిత సత్యం దాగి ఉంది.తల్లికి ఇది ఎవరు నేర్పని బోధన.ఈ విద్య పాఠశాలలకు,పుస్తకాలకు,ఉపదేశాలకు అందని అనుభవ పాఠం.కొన్ని విషయాలు చెప్పి ఎవరికీ నేర్పించలేము.తల్లి తన అనుభవం,లోక పరిశీలన ద్వారా నేర్చుకుంటుంది.ఇవి తల్లికి ఎవరు నేర్పని జీవిత పాఠాలు.అవి తల్లి మనసులో పుట్టి కాలంతో పరిపక్వం అవుతాయి.ఇవి ప్రేమ,ఓర్పు,నిరీక్షణ, త్యాగం అని ఈ కవితలోని భావాలు సున్నితంగా తెలుపుతున్నాయి. ఎవరు నేర్పరు .. అనే విరామంతో కూడిన కవితా పంక్తిలో ఎవరూ అనే పదం సంపూర్ణ శూన్యతను సూచిస్తుంది.ఇవి ఎవరి సూచనలతో రాని గుణాలు.జీవితంలోని అనుభవాలతో మాత్రమే మనసు వాటిని నేర్చుకుంటుంది అని,ఒక నిస్సృహ లేదు,ఒక అంగీకారం ఉంది అని,ఇది బాధ్యతను బయటకి నెట్టడం కాదు,లోపలికి తీసుకోవడం అని,తల్లి తాను అనుభవించి తానే అవగాహనకు రావాల్సిన మార్గం అని.ఈ కవితా పంక్తి మౌనానికి ఇచ్చిన గౌరవాన్ని తెలుపుతున్నాయి.ఇవి తల్లికి ఎవరు చెప్పని పాఠాలు,పలకని గురువులే తన జీవితాన్ని మెల్లగా మలుస్తాయి అనే జీవిత సత్యం దాగి ఉంది.అందుకే ఎవరు నేర్పరు అనే అనుభవాత్మక అవగాహన పాఠకుని హృదయంలో ఎప్పటికి నిలిచిపోతుంది.తల్లులకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది.పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిపోయాక మిగిలే ఖాళీని ఎలా భరించాలో మాత్రం ఎవరు నేర్పరు అని కవయిత్రి చెబుతుంది.ఇది పిల్లల పట్ల గల తల్లుల అనుభవాన్ని గొప్ప అనుభూతిగా మారుస్తుంది.

“పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యాక/వాళ్ళు వెళ్ళి పోయే ఇంటి నిశ్శబ్దాన్ని/ఇందులో కాల ప్రవాహం స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నతనంలో పిల్లలు ముద్దు ముద్దు మాటలతో,ముచ్చటైన నవ్వులతో అలరిస్తారు.అలాంటి అల్లరితో నిండిన ఇల్లు ఇప్పుడేమో నిశ్శబ్దానికి ప్రతీకగా మారింది.అది ఖాళీ అయిన గది లోపలి నిశ్శబ్దం కాదు.ఖాళీ అయిన మనసు,తల్లితనంలో వచ్చే మార్పు కేవలం భౌతిక మార్పు కాదు.ఇది భావోద్వేగ సంబంధాన్ని బలంగా వ్యక్తీకరిస్తుంది.
“ఎలా భరించాలో,ఎలా తట్టుకోవాలో/అనేది తల్లి అంతర్మనస్సులో రగిలే పోరాటాన్ని తెలుపుతుంది.ఈ నిశ్శబ్దం తల్లులు భరించదగినదేనా?ఇది తల్లుల మనసును కుంగదీసే భారమా?అనే సందేహం స్పష్టంగా వ్యక్తం అవుతుంది.
“అది గోడల మధ్య నిశ్శబ్దం కాదు/మనసులోకి నెమ్మదిగా చేరే శూన్యం../అని కవయిత్రి చెప్పడం వల్ల ఒక గొప్ప భావ విప్లవానికి నాంది పలికింది.పిల్లలు ఇంట్లో లేకుంటే ఇల్లు బోసి పోయింది అంటుంటాం.సాధారణంగా పిల్లలు లేని ఇంటి గోడలు మౌనంగా ఉంటాయి.ఇది ఇంటి తలుపులు మూసిన తర్వాత ఏర్పడిన నిశ్శబ్దం కాదు.పిల్లలు లేని ఇంటిలో ఒక రకమైన శూన్యాన్ని చూస్తాం.ఆ ఇంటిలో మౌనం తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది అంటాం.ఇల్లు నిశ్శబ్దంగా ఉండడం ఒక విషయం అయితే, ఇక్కడ నిశ్శబ్దం భౌతిక స్థాయిని దాటి మానసిక స్థాయికి చేరుకుంటుంది.ఇది మనసులోకి నెమ్మదిగా చేరే శూన్యం.ఇక్కడ నిశ్శబ్దంగా మారిన శూన్యం ఒక్క సారిగా దాడి చేయదు.ఆ నిశ్శబ్దం నెమ్మదిగా రోజువారీ అలవాట్ల మధ్య ఏర్పడిన ఖాళీ.అది గదిలోని నిశ్శబ్దాన్ని,ఖాళీ కుర్చీలను,వాడిన పాత్రలను చూపిస్తూ,మనసులోకి నెమ్మదిగా చేరే శూన్యాన్ని సూచిస్తుంది.ఈ కవితకు ఇది గుండె వంటిది.ఇది ఆ తల్లుల మౌన పరిపక్వతను సూచిస్తాయి.పిల్లలు ఎదగడం ఒక ఘనత అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా తల్లి వాళ్ళ కోసం జీవించడం.అదే తల్లితనపు అత్యంత నిశ్శబ్దమైన రూపకం.ఇది తల్లి హృదయంలోని భావోద్వేగం కాదు.తల్లి తన అస్తిత్వాన్ని ప్రకటిస్తుంది.ఈ కవితలోని భావాలు హృదయ స్పర్శను కలిగిస్తాయి.పిల్లలు ఒక్కసారిగా తల్లికి దూరం కావడం కాదు.రోజురోజుకు పిల్లలు ఇంటిలో లేనితనం తల్లి మనసులో ఒక రకమైన శూన్యాన్ని పెంచుతుంది.ఈ శూన్యం శబ్దం లేకుండా,కంటికి కనిపించకుండా తల్లికి తీవ్రమైన వేదన కలిగిస్తుంది.తల్లులు – పిల్లలు కవితలో తల్లి ప్రేమ,త్యాగం,నిరీక్షణ,ఒంటరితనం,ఒక మౌన వేదనగా రూపుదిద్దుకున్నాయి.ఇది కేవలం ఒక తల్లి కథ కాదు.ఇది పిల్లలు ఉన్న ప్రతి తల్లి జీవితానికి ప్రతిబింబం.ఈ కవితా పంక్తిలోని సరళమైన భాష,లోతైన భావాలు మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి.
“ఎదిగిన పిల్లలు/తమ రెక్కలు విప్పి ఆకాశాన్ని తాకుతారు/ దూరాలు దాటుతారు../తల్లి ఒడిని మర్చిపోయినట్టే కనిపిస్తారు/ఈ కవితా పంక్తులు కవయిత్రి పిల్లల ఎదుగుదలతో పాటు తల్లి – పిల్లల బంధంలో వచ్చే సహజమైన దూరాన్ని ఎంతో సున్నితంగా ఆవిష్కరించింది. జీవితం అనే ప్రయాణంలో పిల్లలు ఎదగడం సంతోషంగా కనిపించినా,ఆ ఎదుగుదల వెనుక తల్లి హృదయంలో మిగిలేది మౌన వేదన అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“ఎదిగిన పిల్లలు అనేది వారి శారీరక,మానసిక వికాసానికే కాదు,వారి వ్యక్తిగత స్వాతంత్ర్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.తల్లి ప్రేమతో పెరిగిన పిల్లలు ఇప్పుడు తమకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకున్నారు అనే సహజమైన భావం ఇమిడి ఉంది.
“తమ రెక్కలు విప్పి ఆకాశాన్ని తాకుతారు అనేది రెక్కలు,ఆకాశం,స్వాతంత్ర్యం,స్వప్నాలు,స్వయం ప్రతిపత్తి అనే భావాలకు సంకేతం.పిల్లల ఎదుగుదల సానుకూలమైనదే అయినా తల్లి నుండి పిల్లలు విడిపోవడం,తల్లి హృదయానికి నొప్పిని కలిగిస్తుంది.కవయిత్రి పిల్లలను పక్షులుగా ఊహించడం,వారి ఆశలు,కలలు,ఆకాంక్షలను అద్భుతంగా వ్యక్తం చేసింది.పిల్లలు స్వేచ్ఛగా విహరించి ఆకాశాన్ని అందుకోవడం,విజయాన్ని సొంతం చేసుకోవడం,అంతర్లీనంగా తల్లి పెంపకం సార్థకం అయింది అని కవయిత్రి భావిస్తుంది.
“దూరాలు దాటుతారు../అనేది ఇది కేవలం భౌతిక దూరానికే కాక,భావోద్వేగానికి సంబంధించిన దూరం అని,పిల్లలు చదువు,ఉద్యోగం,జీవన ప్రయాణం పేరిట తల్లి నుంచి దూరం అవుతారు అని,ఈ దూరం తల్లి మనసుకు బాధాకరమే అవుతుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“తల్లి ఒడిని మర్చిపోయినట్టే కనిపిస్తారు/ఇక్కడ కవయిత్రి ఎంతో నొప్పిని కలిగించే నిజాన్ని ఎంతో మృదువుగా చెప్పింది. పిల్లలు నిజంగా తల్లిని మర్చిపోరు.పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పును తల్లి గ్రహిస్తుంది.ఇది తల్లి మనసు పడే ఆత్మీయ వేదనను సూచిస్తుంది.ఈ కవితా పంక్తిలో పిల్లల ఎదుగుదల వల్ల తల్లికి కలిగే ఆనందం – తల్లికి ఏర్పడే ఒంటరితనం అనే రెండు విరుద్ధ భావాలను ఒకే సందర్భంలో చూపిస్తాయి. పిల్లలు తమ రెక్కలు విప్పి ఎగిరిపోవడం సహజమే అయినా, ఆ ప్రయాణంలో తల్లి ఒడి మౌనంగా వెనకబడి పోతుంది.తల్లి ప్రేమ ఎంతో నిస్వార్ధమైనది,పిల్లల స్వాతంత్ర్యం ఎంతో అనివార్యమైనది అని గుర్తు చేస్తుంది.ఇది పాఠకుడి హృదయాన్ని ఆలోచింపజేస్తుంది.
“కన్న తల్లికి మాత్రం/వారి ప్రతి అడుగు గుర్తుంటుంది/ఈ కవితా పంక్తిలో తల్లితనపు మౌనాన్ని,అత్యంత సరళంగా, లోతైన భావాలతో కూడి ఉంది.ఇది కన్నతల్లి అనుభవం, త్యాగం,నిరంతర జ్ఞాపకాల సమాహారంగా నిలుస్తుంది.పిల్లలు ఎదుగుతూ తమ గతాన్ని మరచిపోతారు.కానీ తల్లి మాత్రం వారి ప్రతి అడుగును మనసులో దాచుకుంటుంది.ఈ కవితా పంక్తిలో భావ ప్రధానత స్పష్టం అవుతుంది.పిల్లలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే తల్లి వారి జ్ఞాపకాలతో జీవిస్తుంది.పిల్లల పట్ల గల అపారమైన ప్రేమతో తల్లి వారి జ్ఞాపకాలను గుర్తు పెట్టుకోవడం,వారిని వదిలి ఉండలేని స్వభావం స్వార్థరహితమైనది,ప్రతిఫలాపేక్ష లేనిది,కాలంతో పాటు చెరగనిది.ఇందులో తల్లితనాన్ని ఒక జ్ఞాపకాల నిల్వగా కాక ప్రేమతో నడిచే మౌన చరిత్రగా చిత్రిస్తుంది.పిల్లల మొదటి అడుగు నుంచి జీవితంలోని కీలక నిర్ణయాలు అన్నిటిని తల్లి మనసులో దాచుకుంటుంది.ఇందులో తల్లి ప్రేమ ఎప్పటికీ తగ్గదు అనే సంకేతం వ్యక్తం అవుతుంది.
“వాళ్ళిక ‘అమ్మా’ ఇదెలా చేయాలి?/అని అడగకపోవడం/ఈ కవితా పంక్తులు తల్లితనంలోకి వచ్చిన నిశ్శబ్ద విరామాన్ని, కాలంతో వచ్చిన దూరాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తాయి. పిల్లలు తల్లిని అమ్మా ఇదెలా చేయాలి?అని అడగకపోవడం, ఇక్కడ నిర్లక్ష్యం కాదు.అది పిల్లల ఎదుగుదల స్వభావాన్ని సూచిస్తుంది.ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి తల్లిని ఆశ్రయించిన పిల్లలు,ఇప్పుడు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే స్థితిలోకి చేరుకున్నారు.పిల్లల్లో వచ్చిన ఈ మార్పు సహజమైనదే.అది తల్లి హృదయంలో మౌన వేదనగా మారుతుంది.అమ్మా అనే పిలుపులో ఆత్మీయత దాగి ఉంది. పిల్లల అమ్మా అనే పిలుపే తల్లికి అవధులు లేని సంతోషాన్ని కలిగిస్తోంది.తల్లికి పిల్లలే ప్రపంచం.పిల్లల అమ్మా అనే పిలుపు తగ్గిపోవడం,తల్లి అవసరం తగ్గింది అనే భావం కాదు.ఇక్కడ తల్లి పాత్ర మారింది అనే సంకేతం.పిల్లలకు మార్గదర్శిగా ఉండాల్సిన తల్లి ఇప్పుడు మౌనసాక్షిగా మిగులుతుంది.ఈ కవితా పంక్తుల్లో భావ వ్యతిరేకత ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది.పిల్లల స్వావలంబన తల్లికి ఆనందాన్ని ఇవ్వాలి. ఇక్కడ తల్లి హృదయంలో ఒక రకమైన వేదన కలుగుతుంది. పిల్లలు అమ్మా ఇదెలా చేయాలి?అని అడగకపోవడం ఒక విజయం.కానీ ఆ విజయానికి తల్లి హృదయం చెల్లించే మూల్యం నిశ్శబ్దమే అని తల్లితనంలో వచ్చే అత్యంత సున్నితమైన దశను చూపిస్తాయి.పిల్లలు బలపడిన క్షణంలోనే తల్లి ప్రేమ మాటల నుండి మౌనంగా మారిపోయే దశను చేరుకుంటుంది.ఇక్కడ పిల్లల ఎదుగుదల ఒక స్పష్టమైన మలుపుగా మారింది.ఒకప్పుడు పిల్లలు ప్రతి చిన్న విషయానికి అమ్మను ఆశ్రయించిన పరిస్థితి ఉండేది.ఎదిగిన పిల్లలు తల్లిని ఆశ్రయించకపోవడం సహజమే.ఇది తల్లి మనసులో ఒక రకమైన శూన్యాన్ని మరింత పెంచుతుంది.
“మీ సలహా లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం/ఈ కవితా పంక్తులు తల్లితనంలో చోటు చేసుకునే అత్యంత గాఢమైన మార్పును సూచిస్తాయి.ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం అనేది కేవలం బుద్ధి పరిపక్వతకు సూచిక కాదు.అది తల్లి పాత్ర నుంచి పిల్లలు క్రమంగా బయటకు నడిచే క్షణాన్ని తెలుపుతుంది.ఒకప్పుడు ప్రతి నిర్ణయానికి తల్లే ఆధారంగా ఉండేది.అలాంటిది ఇప్పుడు ఆ ఆధారం తగ్గింది.పిల్లలు అంతర్గతంగా మారి,వారికి తల్లి స్వయంగా అవసరంలేని స్థితి వస్తుంది.
“మీరు లేకుండానే జీవించడం/మొదలు పెట్టినప్పుడు/అనే కవితా పంక్తి అత్యంత బలమైన భావంతో కూడి ఉంది.ఇది పిల్లల తిరస్కారం కాదు.ఇది పిల్లల స్వావలంబన అయినా తల్లి హృదయంలో ఏర్పడిన శూన్యం.తల్లి ప్రేమ అవసరమైందా?కాదా? అనే పరిశీలనను అది ఒప్పుకోదు.తల్లి ప్రేమ ఉనికిపై ఆధారపడదు.ఈ మార్పు ఒక్క సారిగా జరగలేదు.ఇది ఒక దశ,ఒక ప్రక్రియ.ఇది నెమ్మదిగా మొదలయ్యే పిల్లల ప్రయాణం అని తెలియజేస్తుంది.తల్లి అవసరం లేకుండా పిల్లలు జీవించడం మొదలు పెట్టినప్పుడు, అప్పుడే తల్లి జీవితం కూడా ఆ క్షణం నుంచే కొత్త అర్థాన్ని వెతుక్కోవడం మొదలు పెడుతుంది.ఇది తల్లి సాధించిన విజయమే.ఆ విజయాన్ని కూడా మౌనంగా భరించే శక్తి కూడా తల్లిదే.ఈ కవితా పంక్తులు తల్లి జీవితంలో వచ్చిన మౌన నిర్ణయాన్ని కవయిత్రి అద్భుతంగా చూపిస్తుంది.పిల్లలు స్వతంత్రంగా జీవించడం సహజమే అయినా,అదే సమయంలో తల్లి పాత్ర మెల్లగా పక్కకు చేరింది అనే భావన ఆమెను లోలోపల గాయపరుస్తుంది అని చెప్పిన తీరు వాస్తవికంగా ఉంది.
“అప్పుడే ఆ మౌనం .. హృదయాన్ని కెలుకుతుంది/ఈ కవితా పంక్తి తల్లితనంలోకి అకస్మాత్తుగా ప్రవేశించే అంతర్గత వేదనను అత్యంత ప్రభావవంతంగా ప్రతిబింబిస్తుంది.ఇక్కడ మౌనం కేవలం శబ్దలేమి కాదు.అది మాటలు ఆగిపోయిన తర్వాత మిగిలే శూన్యం.పిల్లల నిర్ణయాలు,వారి స్వతంత్ర జీవితం మొదలైన క్షణంలో,బయటకు కనిపించేది శాంతి అయినా లోపల మాత్రం ఒక అలజడి ఏర్పడుతుంది.ఆ అలజడిని ఇక్కడ మౌనం అనే భావంతో ఆవిష్కరిస్తుంది. పిల్లల మౌనం తీవ్రమైన వేదన కాదు.నిరంతరం హృదయాన్ని తాకుతూ ఉండే సూక్ష్మమైన నొప్పి.ఒక సూదిలాగా మెల్లగా గుచ్చుకుంటూ మరచిపోలేని బాధగా మారుతుంది.ఈ భావం అతిశయంగా కాకుండా మరింత నిజంగా నిలబెడుతుంది. అప్పుడే ఆ మౌనం అనే ఈ అనుభూతి ఆలస్యంగా కాక, వెంటనే కలుగుతుంది అని సూచిస్తుంది.పిల్లల మాటల్లో దూరమయ్యే క్షణానికి తల్లి హృదయం ఆ మార్పును గుర్తిస్తుంది.ఇది భావోద్వేగ స్పందనకు తల్లి హృదయం ఎంత సున్నితమో చూపిస్తుంది.శైలీ పరంగా ఇది చిన్న కవితా పంక్తి అయినా విరామ చిహ్నం ద్వారా భావ విస్తరణ కలుగుతుంది. తల్లి చెప్పలేని మాటలు,దాచుకున్న కన్నీళ్లు, అనిర్వచనీయమైన భావాల్ని సూచిస్తాయి.ఈ కవితా పంక్తి తల్లి ప్రేమలోని మౌన వేదనకు పరాకాష్ట.మాటలు లేనప్పుడు కూడా ప్రేమ ఎలా నొప్పిగా మారుతుందో చెప్పిన తీరు బాగుంది.ఇది కవితలో బలమైన భావ ప్రకటన.మౌనం ఇక్కడ శబ్దరహితంగా గుచ్చుకునే బాధగా మారుతుంది.తల్లి హృదయాన్ని కెలికే ఈ మౌనం బయటకు కనిపించదు.కానీ లోలోపల నిరంతరం క్షోభకు గురి అవుతుంది అనేది వాస్తవం.
“అయినా నవ్వుతారు../ఈ కవితా పంక్తిలో తల్లితనపు పరాకాష్టను,త్యాగానికి ఉన్న ఆత్మ గౌరవాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరిస్తాయి.ఇందులో నిజమైన తల్లి ప్రేమ అసలైన స్వరూపం దాగి ఉంది.తల్లి లోలోపల బాధను దాచుకుని పిల్లల ముందు చిరుదరహాసం కురిపిస్తుంది.ఇదే అమ్మల గొప్పతనం,సహజమైన ప్రేమకు అత్యున్నత రూపం.తల్లి హృదయం కెలుకుతున్నా లోపల మాత్రం మౌనం గూడు కట్టుకుని ఉంటుంది.బయటకు మాత్రం నవ్వుతున్న అమ్మ ముఖమే కనిపిస్తుంది.అది నటన కాదు.పిల్లల ఆనందం కోసం తల్లి తన ఎద లోపలి బాధను మరిచేపోయే సహజ స్వభావాన్ని తెలుపుతుంది.
“అదే కదా అమ్మలు/కోరింది/ఇందులో తల్లి ఆశ ఏమిటి? పిల్లలు తన చుట్టూ తిరగడం కాదు.తన నీడలో ఉండడం కాదు.పిల్లలు తమంత తాముగా నిలబడడం.పిల్లలు తమంత తాముగా నిర్ణయాలు తీసుకోవడం.ఈ అవగాహన తల్లి ప్రేమ, అధికారం కాదు.పిల్లల స్వేచ్ఛను అంగీకరించే తత్వం అని వ్యక్తం చేస్తున్నాయి.
“వాళ్ళంత వాళ్ళుగా ఎగరాలని/వారి స్వంత ఆకాశం వెతకాలనే కదా!/తల్లి తన బాధ కన్నా పిల్లల ఆనందాన్ని ముఖ్యంగా భావిస్తుంది.పిల్లలు స్వతంత్రంగా తమ స్వప్నాలను అనుసరించి జీవించాలన్నదే తల్లి కాంక్ష.ఇక్కడ తల్లి ప్రేమ,నిస్వార్థత పరాకాష్టను చేరుకోవడాన్ని సూచిస్తుంది. ఈ కవితా పంక్తులలో తల్లి ప్రేమ,త్యాగం,మౌనవేదన అన్నీ ఒకే భావ స్రవంతిలో ప్రవహిస్తాయి.పిల్లలు ఎదుగుదల తల్లికి గర్వాన్ని కలిగిస్తుంది.ఆ గర్వం వెనుక దాగి ఉన్న తల్లి ఒంటరితనాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తుంది.తల్లి హృదయం ఎప్పుడూ పిల్లల ఆకాశానికి రెక్కలు ఇస్తుంది అనే సత్యాన్ని గుర్తు చేస్తుంది.ఇందులో ఎంతో సౌందర్యంతో కూడుకున్న రూపకాలు ఉన్నాయి.ఎగరడం – స్వేచ్ఛకు, స్వావలంబనకు ప్రతీక.స్వంత ఆకాశం – స్వప్నాలకు,స్వీయ గుర్తింపుకు సంకేతం.తల్లి పిల్లలకు ఇచ్చేది రెక్కలు ; ఆకాశం వాళ్లది కావాలనేది ఆమె కోరిక.తల్లి ప్రేమ అనేది పిల్లలను తన దగ్గరే కట్టిపడేయడం కాదు.వారిని తన హృదయం నుంచి విడిచిపెట్టి,ప్రపంచం వైపు ధైర్యంగా పంపగలగడం.నవ్వుతో విడిచిపెట్టడమే తల్లితనపు అత్యున్నత విజయము.కవయిత్రి తల్లి ప్రేమ యొక్క లోతును ఆమె మౌన త్యాగాన్ని అత్యంత హృద్యంగా ఆవిష్కరిస్తుంది.ఈ కవితా పంక్తులు పిల్లలు ఎదిగి స్వతంత్రంగా మారే క్షణాల్లో తల్లి హృదయంలో చెలరేగే సంఘర్షణలను భావోద్వేగాల సంక్లిష్టతలను అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. “ఆ నవ్వు వెనుక .. /అనేది మొదటి నుంచే ద్వంద్వ భావాన్ని సూచిస్తుంది.కవయిత్రి మానవ భావజాలంలోని సూక్ష్మతను ఎంతో సున్నితంగా ఆవిష్కరించింది.నవ్వు సాధారణంగా ఆనందాన్ని,తృప్తిని కలిగిస్తుంది.కానీ ఇక్కడ చెప్పిన నవ్వు నిజమైన ఆనందం కాదు.అది బయటకు కనిపించే ఒక కృత్రిమ ప్రకాశం మాత్రమే.లోపల నిగూఢంగా దాగిన భావాలను,మౌనంగా మరుగున పడేసే ఒక తెర..
“ఒక చిన్న విరుపుని దాచుకుంటుంది హృదయం/అనేది ఆ బాధ స్వభావాన్ని పూర్తిగా నిర్వచిస్తుంది.హృదయం తన లోపలి గాయాన్ని బహిరంగం చేయదు.నవ్వు ఆనందానికి ప్రతీకగా కనిపించినా,దాని వెనుక దాగి ఉన్న చిన్న విరుపు – తల్లి హృదయంలోని మౌన బాధను సూచిస్తుంది.అది తల్లి హృదయంలో పెద్దగా కనిపించని చిన్న గాయం అయినా లోపల నిత్యం నొప్పిని కలిగిస్తుంది.విరుపు చిన్నదిగా కనిపించినా అది హృదయంలోని నిగూఢమైన బాధను,తీరని లోపాన్ని సూచిస్తుంది.అది బయటికి స్పష్టంగా కనిపించదు. కానీ లోపల మాత్రం బాధ నిరంతరం రేపుతుంది.సమాజం ముందు బలంగా కనిపించడానికి నవ్వును ఆశ్రయిస్తుంది. హృదయం బాధను దాచుకోవడం బలహీనత కాదు.ఇది ఒక రకమైన ధైర్యం,సహనం,తన బాధను ఇతరులపై మోపకుండా తానే మౌనంగా మోసుకుపోవడమే ఇక్కడి భావ సారాంశం. బయట కనిపించే ఆనందం లోపల దాగి ఉన్న మౌన వేదన మధ్య ఉన్న అంతర్లీన విరుద్ధతను నవ్వు అనే సాధారణ ప్రతీక ద్వారా కవయిత్రి మనుషుల హృదయాల్లో దాగి ఉండే అనుభూతుల లోతును సున్నితంగా ఆవిష్కరించింది. “ఎదిగిన పిల్లల తల్లి అవ్వడం అంటే/ఇక్కడ ఆరంభమే తల్లి పాత్ర ఒక కొత్త నిర్వచనాన్ని పొందుతుంది.మాట్లాడకుండా ఉండడం,నేర్చుకోవడం,తన భావాలను తానే అణిచి వేయడం.ఈ మౌనం త్యాగానికి నిదర్శనం.కవయిత్రి ఇక్కడ చిన్నపిల్లల మరియు ఎదిగిన పిల్లల తల్లితనానికి మధ్య ఉన్న అంతరాన్ని సూచిస్తున్నది.ఎదిగిన పిల్లలు శారీరకంగా మాత్రమే కాదు,వారి మనసులో చెలరేగే భావోద్వేగాలు,వారు ఆలోచనలో స్వతంత్రులు అవుతారు.ఆ స్వతంత్రతను అంగీకరించడం తల్లితనానికి ఒక కొత్త పరీక్ష అవుతుంది. “మాటల్ని దిగమింగడం నేర్చుకోవడం – /అనే క్రియ అత్యంత బలమైనది.తల్లి చెప్పాలనుకున్న మాటలు ప్రేమతో వచ్చినవే.అయినా,అవి పిల్లల స్వేచ్ఛను హరించకూడదు. వారి స్వంత అనుభవాలను,అడ్డుకోకూడదు అనే అవగాహనతో తల్లి మౌనంగా మింగి వేయాల్సి వస్తుంది.అది భయంతో వచ్చిన మౌనం కాదు,ఆత్మ నిగ్రహం,పరిణతమైన ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.ఆత్మ నిగ్రహంతో ఏర్పడిన ఈ మౌనం తల్లిని చిన్నదిగా చేయదు,మరింత గొప్పదిగా చేస్తుంది.తల్లి తన అనుభవాల్ని,ఆదేశాల్ని పక్కన పెట్టుతుంది.పిల్లలు వారి జీవితాన్ని వారే తీర్చిదిద్దుకోవాలి. పిల్లలు తమ మార్గం తామే కనుగొనాలి అని తల్లి అనుమతించడమే ఇక్కడ చూస్తున్నాం.ఈ కవితా పంక్తులు మాటల నుంచి మౌనానికి మారిన ప్రేమను చిత్రిస్తాయి.ఎదిగిన పిల్లల తల్లి పిల్లలకు చెప్పడాన్ని తగ్గించాలి.పిల్లల మనసులోని భావాలను అర్థం చేసుకోవాలి అనే లోతైన సత్యాన్ని సున్నితంగా తెలియజేస్తుంది.
“వాళ్ళు తప్పు చేస్తున్నా చెప్పకుండా ఉండటం/అనేది తల్లి లోపలే ఒక నిశ్శబ్దమైన ప్రేమ తత్వం,ఒక అంతర్లీనమైన త్యాగ భావన దాగి ఉంది.ఇది మౌనానికి గొప్ప అర్థం ఇచ్చిన కవితా పంక్తి.సాధారణంగా తప్పు కనిపిస్తే సరిదిద్దాలి,అదే ప్రేమగా భావిస్తాం.అయితే ఇక్కడ కవయిత్రి సాంప్రదాయ భావనకు కొత్త అర్థాన్ని ఇస్తుంది.తప్పు కనిపిస్తున్నా చెప్పకుండా ఉండటం అనేది ఒక నిర్లక్ష్యం కాదు.అది ఒక అవగాహనతో కూడిన మౌనం.ఈ మౌనం వెనుక ఉన్న భావం ఏమిటి?పిల్లలు ఎదగాలి తమ తప్పులను తాము తెలుసుకోవాలి.పిల్లలు తాము చేసిన తప్పుల నుంచే ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి అనే విశ్వాసం ఉంది.నియంత్రించే ప్రేమను తల్లి అందించదు.పిల్లలకు స్వేచ్చను ఇచ్చే ప్రేమను తల్లి అందిస్తుంది.ఇది మాటలతో బోధించక, అనుభవాలతో నేర్పే మాతృ హృదయపు తత్వం.ఇక్కడ చెప్పకుండా ఉండటం అనేది బలహీనత కాదు.అది తన ఆందోళనను లోపలే మింగేసుకుని,ఎదుటివారి స్వతంత్రతను గౌరవించే ధైర్యం.తప్పు చెపితే పిల్లల మనసుకి గాయం అవుతుందేమో, వారి ప్రయాణాన్ని మధ్యలో ఆపేస్తారేమో అనే భయంతో,ప్రేమ మాటలుగా కాక మౌనంగా మారుతుంది.ఈ కవితా పంక్తిలో తల్లితనం,పరిపక్వ ప్రేమ,మానసిక విశాలతను సూచించే ఒక నిశ్శబ్ద స్వీకారం ఉంది.ఇందులో గట్టిగా నిలిచే మాటలు ఏవి లేకపోయినా భావం సున్నితమైనది.తల్లి ప్రేమలోని అత్యంత క్లిష్టమైన దశను చూపిస్తుంది.ఒకప్పుడు తప్పును సరిదిద్దే హక్కు ఉన్న తల్లి,ఇప్పుడు ఆ హక్కును కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.ఇది బాధతో కూడిన పరిపక్వతను సూచిస్తుంది.
“వారి సమాచారం అందకపోయినా/అనే కవితా పంక్తి పిల్లల గురించి తల్లి పడే ఆవేదనను అత్యంత మృదువుగా మౌనంగా వ్యక్త పరుస్తుంది.ఇది తల్లి హృదయానికి ఆందోళన కలిగించే విషయం.ఇక్కడ తల్లి ఆవేదన అరుపు వలె బయటపడదు.పిల్లల గురించిన సందేశం రాకపోవడంతో ఆమె హృదయం లోలోపలే ఉలిక్కిపడుతుంది.ఇది అనుమానంతో నిండిన భయం కాదు.అధికారంతో అడిగే ప్రశ్న కాదు – పిల్లలు బాగున్నారా?అనే అస్పష్టమైన ఆందోళన మాత్రమే.తల్లి ఆవేదన వారిని బంధించదు,వెంటాడదు.కానీ వారికి తెలియకుండానే ఆమె మనసు వారి హృదయాన్ని తాకుతూ ఉంటుంది.పిల్లల సమాచారం లేకపోయినా ఆమె ప్రేమ ఆగదు.ఆమె ప్రార్థన ఆగదు.మాట లేకుండా ఆమె ఎదురు చూపు కొనసాగుతుంది.అందుకే తల్లి ఆవేదన శబ్దం లేని బాధగా,నిశ్శబ్దాన్ని తెలిపే అమితమైన మమకారంగా చిత్రిస్తుంది.ఇక్కడ సమాచారం అనేది కేవలం వార్త కాదు – అది వారి శ్వాసకు ధ్రువీకరణ.వారి క్షేమానికి నిదర్శనం.ఇది హృదయానికి ఊరట కలిగించే చిన్న సంకేతం.వారి సమాచారం అందకపోయినా అనేది వేచి చూడటంలోని నిశ్శబ్దాన్ని సూచిస్తుంది.ఇది ఆందోళనతో కూడిన అరుపు కాదు.భయంతో ఉలిక్కిపడే ఉద్వేగం కాదు – అది ఆశను మనసులో అణిచిపెట్టుకొని మౌనంగా కూర్చునే ఓర్పు.ఈ కవితా పంక్తిలో వేదన బయటికి కనిపించదు.ఎవరిని నిలదీయదు.ప్రశ్నలు అడగదు.కేవలం కాలానికి తన మనసును అప్పగించి ఎదురుచూసే అంతర్లీన ప్రేమగా నిలుస్తుంది.ఇది పిల్లల పట్ల గల అనుబంధాన్ని మౌనంగా కొనసాగుతున్న మనసు సంబంధాన్ని సూచిస్తుంది.అది సమాధానం అడగకుండా ఉండే సంయమనం ఇక్కడ కనిపిస్తుంది.
“ఆతురతను అణుచుకోవడం/ఇక్కడ ఆతురత అనేది కేవలం సమాచారం కోసం తపన కాదు.అది లోపల ఉప్పొంగే భయం, ఆందోళన,అనిశ్చితి – అన్నిటి సమ్మేళనం.పిల్లల సమాచారం రాకపోవడం సహజంగా తల్లి మనసును కుదిపేస్తుంది. అలాంటి వేళ ఆతురత బయటకు వచ్చి అరవాలి అనుకుంటుంది.కానీ ఆతురతను అణుచుకోవడం అంటే ఆ భయాన్ని ఆ తొందరను ప్రేమతో లోపలే కట్టడి చేయడం.అది నిర్లక్ష్యం కాదు.నిరాకరణ కాదు.అది ఎదుటివారి స్వేచ్ఛను గౌరవిస్తూ తన మనసును నియంత్రించుకునే మౌన సాధన.ఈ కవితా పంక్తిలో పరిపక్వమైన ప్రేమ కనిపిస్తుంది.బయటికి కనిపించని లోపలి పోరాటం.సమాచారం రాకపోయినా ఆతురతని అణిచివేసి వేచి చూడటం,ఇది నేర్చుకునే భావ స్థితి.అందుకే ఈ కవితా పంక్తి మాటలతో కన్నా మౌనంతో ఎక్కువగా మాట్లాడుతుంది.అరవని ఆతురత,చూపించని కలత – ఇవే ఈ కవితా పంక్తికి ఉన్న గొప్ప బలం.అంటే ప్రేమ సహజంగా కోరుకునే సమీపాన్ని తెలుసుకోవాలి అనే తపనను తాను నిగ్రహించుకోవడం.ఇది ప్రేమను నియంత్రించడం కాదు; ప్రేమలోనే తనను తాను నియంత్రించుకోవడం.ఆతురతను అణచడం అంటే తన హృదయాన్ని వెనక్కి లాగడం కాదు – ఎదుటి వారి స్వేచ్ఛను ముందుకు నెట్టడం.పిల్లల గురించి వారు ఎక్కడికి వెళ్ళారో? వారు ఏం చేస్తున్నారో?వారి సమాచారం తెలియకపోవడం వల్ల తల్లి మనసులో ఆందోళన కలిగించినా,ఆతురతను బయటకు చూపకుండా అణిచివేయడం తల్లి మౌన ధైర్యానికి సంకేతం.
“దూరాన్నుంచే వారిని ప్రేమించడం/అనే కవితా పంక్తి తల్లి ప్రేమలోని అత్యంత మృదువైన కానీ లోతైన రూపాన్ని ఆవిష్కరిస్తుంది.ఇక్కడ దూరం భౌతిక విభజన మాత్రమే కాదు.అది ఎదిగిన పిల్లల జీవితాల్లోకి తల్లి వెనక్కి అడుగు వేసిన స్థానం.వారి సమాచారం అందకపోయినా,మనసులో ఆందోళనా అలలు ఎగసినా,ఆతురతను అణుచుకొని వారిని వారి ప్రపంచంలో ఉండనివ్వగలగడం – అదే ఈ ప్రేమ యొక్క అసలైన పరిపక్వత.దూరం నుంచే వారిని ప్రేమించడం అంటే వెంటాడని మమకారం,చూపించని ఆరాటం.తల్లి హృదయంలో చెలరేగే ఆరాటం తగ్గదు.కానీ అది అరవదు. మౌనంగా ఉంటుంది.కంటికి కనిపించని జాగ్రత్తగా మారుతుంది.ఈ కవితా పంక్తులు తల్లి ప్రేమ,పిల్లలపై ఉన్న ఆందోళన వారి స్వేచ్ఛపై భారం పడకుండా తనలోనే దాచుకుంటుంది.అందుకే ఈ ప్రేమ దగ్గరగా ఉండి కూడా దూరంగా నిలబడగలదు.దూరాన్నుంచే వారిని ప్రేమించడం అంటే వారిని విడిచి పెట్టడం కాదు.వదిలేయడం కాదు.వారి ఎదుగుదలకి తాను అడ్డు కాకుండా తన ఆరాటాన్ని నియంత్రించుకుంటూ ప్రేమించగలగడం.ఈ కవితా పంక్తి తల్లి ప్రేమ అరవదు అనే రూపాన్ని,ఆతురతను అణుచుకునే మౌన త్యాగాన్ని సున్నితంగా వ్యక్తం చేస్తుంది.ఈ కవితా పంక్తి ప్రేమకు భౌగోళిక పరిమితులు లేవు అని చెబుతుంది.దగ్గరగా ఉండడం ప్రేమకు ప్రమాణం కాదు అని,దూరం నుంచి కూడా వారిని అదే లోతుతో ప్రేమించవచ్చు అని కవయిత్రి నిరూపిస్తుంది.ఇక్కడ పిల్లలు దూరమైనా తల్లికి వారిపై అనురాగం తగ్గదు.
“జోక్యం లేకుండా కేవలం నిశ్శబ్దంగా ప్రేమించడం/ఇక్కడ జోక్యం లేకుండా అనడం అనాసక్తి కాదు.దూరంగా నెట్టి వేయడం కాదు.అది తెలిసి వెనక్కి తగ్గడం.పిల్లల జీవితాల్లోకి తల్లి తన ప్రేమను భారంగా మారనివ్వకుండా అడుగులు మెల్లగా వెనక్కి వేయడం.నిశ్శబ్దంగా ప్రేమించడం అంటే ప్రశ్నలు అడగకుండా.వారికి సలహాలు ఇవ్వకుండా,వారి విషయాల్లో తల దూర్చకుండా,భయాలను బహిర్గతం చేయకుండా,తన హృదయంలోనే ఆరాటాన్ని అణిచి పెట్టుకోవడం.అది అరవని ప్రేమ.చూపించని జాగ్రత్త.ఈ నిశ్శబ్దంలో తల్లి ప్రేమ తగ్గదు – మరింత లోతుగా మారుతుంది.దగ్గరగా ఉండే ప్రేమ నుంచి దూరంగా ఉండే ప్రేమగా రూపాంతరం చెందుతుంది.వారి జీవితాలకు నీడ కాకుండా దూరాన నిలిచే వెలుగుగా మారుతుంది.జోక్యం లేకుండా కేవలం నిశ్శబ్దంగా ప్రేమించడం అంటే తల్లి ప్రేమలోని పరిపక్వ స్థాయి.ఆమె పిల్లల స్వేచ్ఛను తన మమకారంతో కట్టిపడేయదు.వారి దారిలో అడ్డుకాకుండా వారికి దూరాన నుంచే అదృశ్యంగా కాపలా ఉంటుంది.ఈ కవితా పంక్తి తల్లి ప్రేమ మాట్లాడకుండానే మాట్లాడే రూపాన్ని,చేయి పట్టుకోకుండా బలాన్ని ఇచ్చే మౌనాన్ని సున్నితంగా వ్యక్తం చేస్తుంది.ఇదే ఈ భావ సమూహానికి హృదయం.జోక్యం లేని ప్రేమ అనేది స్వేచ్ఛను హరించని మమకారం – దగ్గరగా ఉండాలనే తపనను అదుపులో ఉంచి,వారి ప్రయాణాన్ని అడ్డుకోకుండా దూరం నుంచే తోడుగా నిలిచే ప్రేమ.నిశ్శబ్దం ఇక్కడ ఖాళీ కాదు.అది పూర్తి అయిన భావం.ఈ కవితా పంక్తులలో సౌందర్యం విస్తృత మౌనంలో ఉంది.ఇందులో ఎక్కడ ఆర్తనాదం లేదు.ఆదేశం లేదు,ఆక్రోశం లేదు.ఉన్నది ఒక్కటే – తన అవసరాలను పక్కనపెట్టి ఎదుటివారి స్వాతంత్ర్యాన్ని కాపాడే ప్రేమ.ఈ కవితా పంక్తులు సాధించిన ప్రేమ స్వరూపం.మాటలు తగ్గిన చోట,భావం లోతుగా మాట్లాడే ఒక సున్నితమైన అనుభూతి.ఇది తల్లి ప్రేమకు కొత్త రూపం.తల్లి దగ్గరగా ఉండి చూసుకోవడం కాదు.తల్లి దూరంగా ఉండి కూడా పిల్లవాడి గురించి ఆత్మీయంగా ఆలోచించడం,జోక్యం లేకుండా కేవలం నిశ్శబ్దంగా మమకారంతో మనసులోనే ప్రేమించడం.ఇది తల్లి పిల్లలకు స్వేచ్ఛ నిచ్చిన ప్రేమని అర్థం అవుతున్నది.ఇందులో ప్రేమలోని పరిమితి,గౌరవం,స్వేచ్ఛ స్పష్టంగా వ్యక్తం అవుతాయి.
“చేసేదేం లేక చేతులు ముడుచుకొని/అనే కవితా పంక్తి తల్లి జీవిత ప్రయాణంలో వచ్చిన ఒక మౌన మలుపును సూచిస్తుంది.ఇక్కడ చేసేదేం లేక అనడం అలసత్వం కాదు, నిర్లక్ష్యం కాదు.పిల్లల కోసం తల్లి తాను చేయగలిగినదంతా చేసింది,రాత్రిళ్ళు నిద్ర లేక తాను కాపలా కాసింది,వారి ఎదుగుదల కోసం తాను పాటుపడింది,వారి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది,ఇవన్నీ చేసిన తరువాత తనకు చివరికి అశక్తత మిగిలింది.చేతులు ముడుచుకోవడం అనేది చేతుల వద్ద శక్తి లేక పోవడమే కాదు.అది జోక్యం కూడదన్న స్వయంకృత నిర్ణయం.తల్లి ప్రేమ ఇంకా ఉప్పొంగుతునే ఉంది.కానీ ఆ ప్రేమను చేతుల ద్వారా కాదు,హృదయం ద్వారానే వ్యక్తం చేయాల్సిన దశకు చేరుకుంది.ఒకప్పుడు తల్లి తన చేతులతో పిల్లలకు తినిపించింది,వారిని ఆడించింది, వారు కిందపడితే లేపింది,వారికి అండగా నిలిచింది,వారు భయపడితే దగ్గరకు తీసుకుంది,వారి భయాన్ని పారద్రోలింది, ఇప్పుడు వారి కోసం చేయాల్సిన శక్తి ఉన్నా తావే చేతులు ముడుచుకుని మౌనంగా ఉండాల్సిన పరిస్థితి.ఈ కవితా పంక్తిలో విషాదం ఏమిటి?పిల్లలు దూరమయ్యారు అని కాదు.తల్లి చేయగలిగిన పనులు సకాలంలో పూర్తి చేసింది. కానీ,తల్లికి ఇప్పుడు కేవలం ప్రేమించడమే మిగిలిన స్థితి.ఇది అత్యంత బాధాకరమైనది.అదే అత్యంత పరిపక్వమైన ప్రేమ కూడా.చేసేదేం లేక చేతులు ముడుచుకొని అనే కవితా పంక్తి జోక్యం చేయగల శక్తి ఉన్నా చేయకుండా నిలబడే మౌనాన్ని గాఢంగా వ్యక్తం చేస్తుంది.ఇది తల్లి అశక్తతను కాదు, – అవస్థను గౌరవంగా భరించే స్థితిని సూచిస్తుంది చేయగలిగినదంతా చేసి తల్లి ఇప్పుడు జోక్యం చేసుకునే హక్కు కూడా లేక తన చేతులను తానే ఆపేసుకున్న పరిస్థితి ఇది.ఈ దృశ్యం తల్లి అసహాయతను స్పష్టంగా చూపిస్తుంది. చేయగలిగేది చాలా ఉన్నా చేయకూడదనే నిర్ణయమే తల్లిని స్థబ్దంగా నిలబెడుతుంది. “వణికే హృదయాన్ని అదుపులో పెట్టుకొంటూ/అనే కవితా పంక్తి చేసేదేం లేక చేతులు ముడుచుకొని అనే భావానికి లోపలి అర్థాన్ని,భావోద్వేగాల గుండెను అందిస్తుంది.చేతులు ముడుచుకోవడం బయట కనిపించే స్థితి అయితే,హృదయం
వణకడం లోపల జరుగుతున్న తుఫాను.చేయగలిగేదేమి లేక నిలబడిన తల్లి మనసులో మాత్రం నిశ్శబ్దంగా వణుకుతునే ఉంటుంది.వణికే హృదయం అంటే భయంతో కొట్టుకుంటున్న మనసు,అనిశ్చితితో కంపిస్తున్న భావాలు.పిల్లల క్షేమంపై ఉన్న అపారమైన ప్రేమే ఆ వణుకుకు కారణం.అది బలహీనత కాదు – మమకారానికి వచ్చిన సహజ స్పందన.అదుపులో పెట్టుకొనడమంటే ఆ వణుకును అణిచి వేయడం కాదు.పిల్లల మీద పడకూడదని తల్లి తనలోనే ఆ బాధను కట్టడి చేయడం.చేతులు కట్టుకున్నట్టే,హృదయాన్ని కట్టడి చేసుకున్న స్థితి ఇది.ఈ రెండు కవితా పంక్తులు కలిసినప్పుడు తల్లి ప్రేమలోని ద్వంద్వం స్పష్టం అవుతుంది.బయటికి శాంతంగా కనిపించే రూపం,లోపల మాత్రం నిరంతరం కదలాడే ఆరాటం,చేయలేని చేతులు,ఆగని హృదయం – ఇవే ప్రేమ యొక్క నిజమైన రూపం.అందుకే వణికే హృదయాన్ని అదుపులో పెట్టుకుంటూ అనే కవితా పంక్తి తల్లి ప్రేమలోని ఆరవని బాధను,నిశ్శబ్దంగా భరించే ధైర్యాన్ని సున్నితంగా లోతుగా వ్యక్తం చేస్తుంది.వణికిన హృదయాన్ని నియంత్రించుకోవడం.ఇది అవసరమైన అసహనం.ఇక్కడ హృదయం వణుకుతుంది.కానీ ఆ వణుకు బయటకి రావడానికి తల్లి అనుమతించదు.ఇది భావోద్వేగాన్ని నియంత్రించే పరిపక్వత.ప్రేమ బలహీనంగా కాక క్రమశిక్షణగా మారిన క్షణంను తెలుపుతుంది.ఇది లోపలి తుఫాను చిత్రణ. హృదయం వణుకుతోంది.కానీ ఆ వణుకును బయటికి రానివ్వదు. భయాన్ని,ఆరాటాన్ని,అనిశ్చితిని అమ్మలు తమతోనే కట్టడి చేసుకుంటారు.
“కొన్ని సార్లు అమ్మలు చెప్పుకుంటారు – / చాలా సార్లు పైకి చెప్పరు/ఇక్కడ తల్లి మౌన స్వభావం స్పష్టం అవుతుంది.తన బాధను బయటికి చెప్పడం వల్ల తల్లికి ఉపశమనం వస్తుంది, తన బాధను చెప్పితే పిల్లల మీద భారం పడుతుంది అనే భయంతో తల్లి మాటలను లోపలే మింగేస్తుంది.మాట కన్నా మౌనం మేలు అని భావిస్తుంది.ఈ ద్వంద్వతే తల్లితనానికి అసలైన రూపం.మాటలుగా చెప్పినప్పుడు అది స్వల్పం ; చెప్పని సమయంలోనే అసలు భారం అంతా దాచుకుని ఉంటుంది.చెప్పకపోవడమే తల్లి మోసే పెద్ద భారంగా మారుతుంది.ఈ కవితా పంక్తులు తల్లుల అంతర్గత ప్రపంచాన్ని బహిర్గతం చేస్తాయి.బాధను ఎవరితోనైనా పంచుకోకుండా,ఎక్కువగా దాన్ని లోలోపలే దాచుకుంటారు.
“సరే,పరవా లేదనుకున్నా/అనేది తల్లి నేర్చుకున్న ఆత్మ సాంత్వన.అదే నిజమైన ఒప్పుకోలు కాదు.తన హృదయాన్ని తానే నెమ్మది పెట్టుకునే ప్రయత్నం.బయటకి చెప్పే ధైర్యం లేక లోపల మాత్రం ఇంకా ప్రశ్నలే.ఇది తల్లి మనసుకే చెప్పుకుంటుంది.తల్లి పరిస్థితిని ఒప్పుకున్నట్టు సూచిస్తూ తన మనసును తానే సమాధానపరుచుకునే ప్రయత్నం చేస్తున్నది.
“లోపల మాత్రం కొంచెం దిగులు చీకటి/ పుడుతుంది/అనే కవితా పంక్తి ఈ కవితకు భావాత్మక గుండె.ఈ దిగులు అరవదు.పెద్దగా కనిపించదు.అది వెలుగు లేనిది కాదు – వెలుగు దూరంగా నిలబెట్టబడిన స్థితి.నిశ్శబ్దంగా,నెమ్మదిగా హృదయంలో చీకటిలా పుడుతుంది.తల్లి ప్రేమలోని అరవని బాధను,చూపించని వణుకును మాటల కన్నా లోతైన మౌనాన్ని అతి మృదువుగా చిత్రిస్తుంది.ఈ కవితా పంక్తి మొత్తం భావానికి లోతు ఇస్తుంది.దిగులు ఇక్కడ బయటకు పొంగదు.నిశ్శబ్దంగా చీకటిలా పుడుతుంది.అది వెలుగు లేకపోవడం కాదు – వెలుగు దూరంగా నిలబెట్టబడిన స్థితి.ఈ కవితా పంక్తులలో తల్లి బాధను నేరుగా చెప్పకుండా ఆ బాధ చుట్టూ ఏర్పడే మౌనాన్ని చూపించడం ద్వారా కవయిత్రి మనసును తాకుతుంది.ఇవి తల్లి తనంలోని అత్యంత సున్నితమైన క్షణాలు.మాటలకందని బాధను ప్రేమతోనే అదుపులో పెట్టుకున్న హృదయాన్ని ప్రతిబింబించే లోతైన ప్రకటన.ఈ కవితా పంక్తులు తల్లి హృదయంలో మిగిలే మసక వెలుతురును చూపిస్తుంది.పైకి సమాధానంగా కనిపించినా, లోపల మాత్రం చిన్న చీకటి పుట్టడం – అది తల్లి ప్రేమకు చెల్లించాల్సిన మౌన మూల్యం.ఈ కవితా పంక్తులలో ఎదిగిన పిల్లల తల్లి అనుభవాన్ని తెలుపుతాయి.ఇవి గొంతెత్తి చెప్పే బాధ కాదు.మౌనంగా భరించే వేదన.నవ్వులో దాచిన విరుపు.మాటల్లో లేని ప్రేమ,దూరంలో పెరిగే ఆత్మీయత – ఇవన్నీ కలిసి అమ్మ అనే అక్షరానికి లోతైన అర్థాన్ని ఇస్తాయి. ఈ కవితా పంక్తులలో కవయిత్రి అమ్మ అనే పాత్రను అత్యంత లోతైన మానసిక స్థాయిలో ఆవిష్కరిస్తుంది. బయటకు కనిపించే చిరునవ్వు వెనుక దాగి ఉన్న వేదనను ఈ కవితా పంక్తులు చక్కగా వ్యక్తం చేస్తాయి.ఇది మాటలతో చెప్పలేని అనుభూతి కవిత్వంగా నిలుస్తుంది.ఈ కవితా పంక్తులు అమ్మ హృదయంలోని మౌన తుఫానును అద్భుతంగా ఆవిష్కరిస్తాయి.బయటకు కనిపించే తల్లి మనసులో మాటల కందని ఆందోళన ఎలా కదలాడుతుందో గొప్పగా చూపిస్తాయి.
“ముందులా ప్రతిక్షణంలో/మీ భాగస్వామ్యం ఉండదిక/అనేది సంబంధాల్లో వచ్చే మౌన మార్పును లోతుగా వ్యక్తపరుస్తుంది. ఇది కాలం తీసుకు వచ్చే సహజమైన దూరం.ముందులా అనే పదం గతంలోని సమీపాన్ని గుర్తుకు తెస్తుంది – ప్రతిక్షణం పంచుకున్న మాటలు,చూపులు,నిర్ణయాలు.కానీ ఇప్పుడు ఆ నిరంతర భాగస్వామ్యం నెమ్మదిగా సడలిపోతుంది.ఇది ఒక్కసారిగా తెగిపోవడం కాదు.గమనించ లేనంత మెల్లగా జరిగే మార్పు.ఇక్కడ కవయిత్రి సంబంధం గురించి చెప్పడం లేదు,కేవలం స్వరూపం మారింది అని సూచిస్తుంది.ఇది ప్రేమ తగ్గిపోయిన స్థితి కాదు – ప్రేమ వ్యక్తమయ్యే విధానం మారిపోయిన దశ. ఇక్కడ ఒక స్వీకారం ఉంది – అతి చేరువ నుంచి కొంత దూరానికి చేరుకున్నా,ఆ దూరంలో కూడా అనుబంధం మౌనంగా కొనసాగుతూనే ఉంటుంది.ఈ కవితా పంక్తిలో ముఖ్యంగా తల్లితనం,భాగస్వామ్యం,ఇది ఏ లోతైన సంబంధానికైనా వర్తిస్తుంది.ఏదో ఒక దశలో ప్రతిక్షణం అనేది అవసరమైనప్పుడుగా మారుతుంది.అది వియోగం కాదు – పక్కకు వచ్చిన ప్రేమ యొక్క నిశ్శబ్ద రూపాంతరం.ఇందులో మనసుకు చెప్పేది ఇదే – నిజమైన అనుబంధం అనేది ప్రతిక్షణం కనిపించాల్సిన అవసరం లేదు ; అది కనిపించకపోయినా అంతర్లీనంగా ఉండగలిగినప్పుడే అది లోతైన ప్రేమగా నిలుస్తుంది.ఈ కవితా పంక్తులు తల్లికి ఎదురయ్యే వాస్తవాన్ని నిరాడంబరంగా అంగీకరిస్తాయి. ఒకప్పుడు పిల్లల జీవితాలలో కేంద్రంగా ఉన్న తల్లి కాలక్రమంలో ప్రక్కకు నెట్టబడుతుంది.ఇది నిరాకరణ కాదు. పిల్లల ఎదుగుదల సహజ పరిణామం.అయినా ఈ సత్యం హృదయానికి మృదువైన గాయం చేస్తుంది.ఈ కవితా పంక్తుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.ఒకప్పుడు ప్రతి క్షణంలో పిల్లల జీవితానికి కేంద్రంగా ఉన్న తల్లి,ఇప్పుడు ఆ స్థానం నుండి మెల్లగా పక్కకు జరుగుతుంది.ఇది సహజమైన విరామమే అయినా,భావోద్వేగపరంగా తల్లికి భారమే అవుతుంది.
“వారికి మీ అవసరం అంతగా ఉండదిక/అనే కవితా పంక్తి సంబంధాల్లో వచ్చే అత్యంత సున్నితమైన మలుపును మౌనంగా,కానీ లోతుగా సూచిస్తుంది.ఇందులో ఎటువంటి తిరస్కారం లేదు,ఎలాంటి నిర్లక్ష్యం లేదు.ఉన్నది ఒక్కటే అవసరం తగ్గిపోయిన దశ – ప్రేమ తగ్గిపోయిన దశ కాదు. అంతగా అనేది భావంలో మృదుత్వాన్ని తీసుకొస్తుంది. అవసరం పూర్తిగా లేనిది కాదు.అది కేవలం ముందులాగా తీవ్రంగా ప్రతి అడుగులో అవసరమైనది కాదు.ఇక్కడ అవసరం అనేది శారీరకమో,ఆర్థికమో మాత్రమే కాదు – మనసు అలవాటు పడిన తోడు,ప్రతిక్షణం తోడు కావాలనే మనసు స్థితి.ఆ స్థితి నుంచి వారు నెమ్మదిగా బయటకు వస్తున్నారు.ఇది ఎదుగుదల యొక్క సంకేతం.ఒకప్పుడు మీ ఉనికి లేకుండా వారి రోజు పూర్తి అయ్యేది కాదు.ఇప్పుడు మీ ఉనికి వారి లోపల నిశ్శబ్దంగా నిలిచి పోతుంది.అది బయటకు అడిగే అవసరంగా మారడం లేదు.ఇందులో తల్లి హృదయానికి వచ్చే మౌన వేదన దాగి ఉంది.కానీ అదే సమయంలో మీ ప్రేమ ఫలించి వారిని స్వతంత్రంగా నిలబెట్టిందన్న గర్వం కూడా దానిలో కలిసి ఉంటుంది.ఈ కవితా పంక్తులు విచ్ఛిన్నాన్ని కాదు,విడిచిపెట్టగలిగే ప్రేమను ప్రతిబింబిస్తుంది.అవసరం లేని చోట కూడా ఉండగలిగే అనుబంధమే,ఈ భావానికి అంతర్లీన హృదయం.తల్లి హృదయాన్ని మెల్లగా తాకే నిజాన్ని ఒప్పుకోవాలి.ఇక తల్లి అవసరం తగ్గిపోవడం,ప్రేమ తగ్గిందన్న అర్థం కాకపోయినా తల్లికి మాత్రం అది ఒంటరితనానికి సంకేతంగా అనిపిస్తుంది.
“అయినా అమ్మలు/వాళ్ళకి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేస్తూ/అనే కవితా పంక్తులు తల్లితనంలోని నిశ్శబ్దమైన నిరంతర ప్రేమను అత్యంత సహజంగా వ్యక్తపరుస్తాయి. అయినా అనే పదమే ఈ కవితా పంక్తికి ఆత్మ వంటిది. ముందుగా చెప్పబడిన దూరం అవసరం తగ్గిన వాస్తవం.ప్రతి క్షణం భాగస్వామ్యం లేకపోయినా ఖాళీ – అన్నిటిని అంగీకరించిన తర్వాత కూడా తల్లి ప్రేమ ఆగదని చెబుతుంది. ఇక్కడ ప్రేమ మాటలుగా కాదు,ప్రశ్నలుగా కాదు, ఫిర్యాదులుగా కాదు – వంటగా మారుతుంది.వాళ్ళకి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేయడం,తల్లి ప్రేమకు అత్యంత సహజమైనది.ఈ వంటకాలు కేవలం ఆకలి తీర్చడానికి కావు. వాటిలో జ్ఞాపకాలు ఉంటాయి.పెరిగిన సంవత్సరాల అలవాట్లు ఉంటాయి.నీకిష్టం అని గుర్తుంచుకునే హృదయ శ్రద్ధ ఉంటుంది.వాళ్ళ అవసరం తగ్గినా,వాళ్ళ ఇష్టం తల్లి మనసులో తగ్గదు.ఇక్కడ తల్లి తన ఉనికిని ప్రకటించదు, అడగదు,పిల్లలు ఏం తిన్నారో? ఏం తినలేదో?అనే సందేహం లేకుండా,కేవలం వంటలు సిద్ధం చేస్తూ ఉంటుంది.ఈ కవితా పంక్తులు చెబుతున్నది ఇదే.నిజమైన తల్లితనం అవసరంగా అడిగినప్పుడు మాత్రమే కాదు,అవసరం లేనప్పటికీ ప్రేమగా మిగిలే నిరంతర చర్య.అందుకే ఈ అయినా లోపల వేదన ఉంది.అంగీకారం ఉంది,అదే సమయంలో అడగని తల్లి ప్రేమ యొక్క మహిమ కూడా ఉంది.ఇదే ఇక్కడ గొప్ప మలుపు. ఇక్కడ తల్లి అవసరం తగ్గినా,భాగస్వామ్యం కనిపించకపోయినా తల్లితనం ఆగదని ఇది సూచిస్తుంది.ప్రేమ ప్రతిఫలంపై ఆధారపడదు అనే సత్యం ఇక్కడ నిలుస్తుంది. ఇది శారీరక సేవ కాదు,జ్ఞాపకాలలోకి చేసే ప్రయాణం.పిల్లలు తన వద్ద లేకున్నా వారి రుచులు తల్లి చేతుల్లో ఇంకా జీవిస్తూనే ఉంటాయి.ఇక్కడ తల్లి ప్రేమ చర్యల రూపంలో వ్యక్తం అవుతుంది.పిల్లలు తన వద్ద లేకున్నా,వాళ్ళ ఇష్టాఇష్టాలు తల్లి చేతుల్లో జీవిస్తూనే ఉంటాయి.తల్లి చేతి వంటకం ఒక స్మృతిగా, ప్రేమకు ప్రతీకగా మారుతుంది.
“వారి చిన్నప్పటి ఫోటోలను గుండెతో/తుడుస్తూ కాపాడుతూ/అనే కవితా పంక్తులు తల్లితనంలోని అత్యంత లోతైన మౌన భావాన్ని హృద్యంగా ప్రతిబింబిస్తాయి.ఇక్కడ ఫోటోలు కేవలం చిత్రాలు కావు.అవి కాలం ఆగిపోయిన క్షణాలు.పెరిగిన పిల్లల వెనుక చిన్న చిన్న నవ్వులు,చేతుల వెచ్చదనం,అప్పటి ఆధారపడిన ఉనికికి గుర్తులు.తుడుస్తూ అనే క్రియ ద్వారా భావం మౌనంగా ఆవిష్కృతమవుతుంది. అది దుమ్ము తుడవడమే కాదు – కాలం వేసిన మసకను దూరం తెచ్చిన మౌనాన్ని,కళ్ళలోకి వచ్చిన తడి గుర్తులను కూడా నెమ్మదిగా తుడిచే ప్రయత్నం చేస్తున్నది.
గుండెతో తుడవడం అంటే – చేతులతో కాదు,జ్ఞాపకాలతో, అనుభూతులతో,విడిచి పెట్టలేని మమకారంతో తాకడం.అది స్పర్శ కాదు.ఒక ప్రార్థనలా జరిగే చర్య.కాపాడుతూ అనే పదం ఈ కవితా పంక్తికి ఆత్మగా నిలుస్తుంది పిల్లలు ఇప్పుడు తమ జీవితాలను తామే కాపాడుకుంటున్నారు.కానీ తల్లి మాత్రం వారి గతాన్ని వారి చిన్నప్పటి రూపాన్ని తన హృదయంలో ఇంకా జాగ్రత్తగా కాపాడుకుంటుంది.ఈ కవితా పంక్తుల్లో వేదన అరవదు ; మౌనమే దాని వ్యక్తీకరణ.అవసరం తగ్గిన తర్వాత కూడా తల్లి ప్రేమ తగ్గదని అది జ్ఞాపకాల రూపంలోనైనా నిరంతరం కొనసాగుతుంది అని ఈ కవితా పంక్తులు సున్నితంగా వ్యక్తం చేస్తున్నాయి.అందుకే వారి చిన్నప్పటి ఫోటోలను గుండెతో తుడుస్తూ కాపాడుతూ అనేది తల్లి ప్రేమకు ఇచ్చిన అత్యంత నిశ్శబ్దమైన,చిరస్థాయిగా నిలిచిపోయే రూపకం.ఈ దృశ్యం అత్యంత భావ సూక్ష్మమైనది.వారి చిన్నప్పటి ఫోటోలను తుడవడం అనేది కేవలం ఫోటోల మీద పడిన దుమ్ము,ధూళిని తొలగించడం కాదు – కాలం వేసిన దూరాన్ని నెమ్మదిగా తుడిచే ప్రయత్నం చేస్తున్నది.గుండెలో అనే ఈ పదం ఈ చర్యను ఆత్మీయ ఆచారంగా మార్చుతుంది.ఈ కవితా పంక్తుల్లో లోతైన భావం,పిల్లల పట్ల గల స్మృతి,వారితో గల అత్యంత సాన్నిహిత్యాన్ని తెలుపుతాయి.తన పిల్లలు తన వద్ద ఇప్పుడు లేరు.వారు తనకు దూరంగా ఉన్నారు.తన పిల్లల ఫోటోలను తుడిచి వారు తన వద్ద ఉన్నట్లుగా తాను భావిస్తుంది.అది కేవలం ఫోటోలను శుభ్రపరిచే పని కాదు.అది తన పిల్లల జ్ఞాపకాలను ఎంతో ప్రేమతో సంరక్షించడమే.తన అపురూపమైన పిల్లల ఫోటోలను గుండెతో తుడవడం అనే ప్రయోగం తల్లి ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తుంది.
“ప్రతి రాత్రీ వాళ్ళ క్షేమానికై ప్రార్థిస్తూ ../ఇక్కడ తల్లి ప్రేమ దైవ స్పర్శగా మారుతుంది.తల్లి చేతుల్లోంచి బాధ్యత దూరమైనా ప్రార్థన రూపంలో ఆ బాధ్యతను దేవుడికి అప్పగించబడుతుంది.ఇది తల్లితనపు మౌన ఆచారం.తల్లి పిల్లల బంధం విడదీయరానిది.తల్లి ఎప్పుడు పిల్లల క్షేమాన్ని కోరుకుంటుంది.పిల్లలు దైనందిన జీవితంలో లేకపోయినా ప్రార్థనలలో మాత్రం తల్లి వారి క్షేమానికై నిరంతరం ప్రార్థిస్తూ ఉంటుంది.
“ప్రపంచం వారి పట్ల మృదువుగా ఉండాలని/దేవుడిని కోరుకుంటూ .. /ఇది తల్లి చేసే అత్యున్నత ప్రార్థన.పిల్లలను కఠిన ప్రపంచం నుంచి కాపాడలేని స్థితిలో ప్రపంచమే వారికి మృదువుగా మారాలని కోరుకోవడం,ఇదే పరిపక్వమైన ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది.ఈ కవితా పంక్తుల్లో ప్రేమించే మనసు గల తల్లి యొక్క అంతర్లీన ప్రార్థన అత్యంత సౌమ్యంగా వ్యక్తపరుస్తుంది.ప్రపంచం అనేది కేవలం సమాజమే కాదు – అనుభవాలు,సంబంధాలు,విజయాలు, వైఫల్యాలు,గాయాలు అన్నింటిని కలుపుకున్న విస్తృత జీవన వేదిక.ప్రపంచం సహజంగా కఠినమైనదని తెలిసినా,అది తన పిల్లల పట్ల కాస్త మృదువుగా ఉండాలనే ఆకాంక్ష.ఇది తల్లి హృదయంలోని అపారమైన దయని సూచిస్తుంది.పిల్లలు ఎదిగిన తర్వాత తల్లి రక్షణ చేతులు వెనక్కి తగ్గినా,వారి జీవిత ప్రయాణం బాధలతో నిండి పోకూడదు అనే తపన ఇక్కడ దాగి ఉంది.
“దేవుడిని కోరుకుంటూ.. అనే కవితా పంక్తి తల్లి అశక్తతను, అదే సమయంలో ఆమె విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.ఇకపై ప్రతిదీ తన చేతుల్లో లేదని తెలిసినప్పుడు ఆమె ఆశలు ప్రార్థనగా మారతాయి.చేయగలిగినదంతా ప్రేమే, చెప్పగలిగినదంతా ఆశీర్వాదమే అనే భావన నిగూఢంగా నిండి ఉంది.ఇది గొంతెత్తి చేసేది కాదు – మౌనంగా నిరంతరంగా సాగే మనసు ప్రార్థన.ఈ కవితా పంక్తులు తల్లి ప్రేమ యొక్క పరిపక్వ దశను సూచిస్తాయి.కాపాడటం నుంచి విడిచి పెట్టడం వరకు వచ్చిన ప్రయాణాలు ఆమె ప్రేమ ఆజ్ఞగా కాదు – ప్రార్థనగా మారుతుంది.ఇది పిల్లల కోసం తల్లి చేసే అత్యున్నత కార్యం. ప్రపంచం మారకపోయినా,దేవుడి దయ అయినా వారి వెంట ఉండాలనే ఆకాంక్ష.ఈ కవితా పంక్తుల్లో తల్లి ప్రేమ యొక్క పరాకాష్టను చూపిస్తాయి.పిల్లలు బలంగా మారాలని కాదు – ప్రపంచమే వారి పట్ల మృదువుగా ఉండాలి అని కోరుకోవడం.తల్లి దృష్టి కోణం ఎంత సున్నితమో తెలియజేస్తుంది.
“తల్లితనం ఎప్పుడూ దాగదు/కేవలం రూపం మారుతుందంతే – /ఈ కవితా పంక్తులు తల్లితనం యొక్క శాశ్వతత్వాన్ని,దాని అంతర్గత ప్రవాహాన్ని గొప్పగా ఆవిష్కరిస్తాయి.తల్లితనం కనిపించక పోయినా అంతరించదు.అది కొత్త రూపంలో కొనసాగుతూనే ఉంటుంది. తల్లితనం అనేది ఒక దశ,ఒక పాత్ర మాత్రమే కాదు.అది ఒక జీవన తత్వం.పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లితనం స్పష్టంగా కనిపిస్తుంది.పాలిచ్చే చేతులలో,నిద్రలేని కళ్ళలో,కాపాడే ఒడిలో,కానీ,కాలం గడిచే కొద్దీ,పిల్లలు తమ తమ ప్రపంచానికి వెళ్ళే వేళ ఆ తల్లితనం కనుమరుగు అవుతుంది అనిపించవచ్చు.ఈ కవితా పంక్తులు కవితకు తాత్విక కేంద్రం. తల్లితనం తగ్గదు,అదృశ్యం కాదు.అది కేవలం తన వ్యక్తీకరణ మార్గాన్ని మార్చుకుంటుంది అని స్పష్టంగా ప్రకటిస్తుంది. ఇక్కడ దాగదు అనేది పదం ముఖ్యమైనది.తల్లితనం అంతరించదు.తల్లితనం మాయం అవదు.అది కేవలం ప్రత్యక్షంగా కనిపించని రూపంలోకి మారుతుంది.చిన్నప్పుడు చేయి పట్టుకొని నడిపిన ప్రేమ తర్వాత నిశ్శబ్ద ప్రార్థనగా మారుతుంది.తల్లి ఆప్యాయంగా చెప్పిన సూచనలు మౌనంగా ఆలోచించే ఆశలుగా రూపాంతరం చెందుతాయి.ఇలా తల్లితనం తన వ్యక్తీకరణను మార్చుకుంటుంది. కానీ,తన అసలైన స్వభావాన్ని వదులుకోదు.
కేవలం రూపం మారుతుందంతే అనే కవితా పంక్తి తల్లితనానికి ఉన్న జీవన స్రవంతిని సూచిస్తుంది.ఇది నీటి వలె ఒకప్పుడు, ప్రవాహంగా మరొకప్పుడు,ఆవిరిగా ఇంకొకప్పుడు వర్షంగా మారినా నీటి స్వరూపం మారదు. అలాగే తల్లితనం కూడా పిల్లల వయసు,పరిస్థితులు, దూరాలు మారినా,ప్రేమగా,బాధ్యతగా,మమకారంగా నిరంతరం కొనసాగుతుంది.ఇది లోతైన తాత్వికతను కలిగి ఉంది.తల్లితనం శరీరానికే పరిమితం కాదని,అది మనసు – ఆత్మల స్థాయిలో కొనసాగేది అని తెలియజేస్తుంది.కనుక ఈ కవితా పంక్తులు తల్లిని మాత్రమే కాదు.ప్రతి తల్లితనాన్ని అనుభవించే హృదయాన్ని తాకుతాయి.తల్లితనాన్ని ఒక అజరామరమైన ప్రేమగా నిలబెడుతుంది.తల్లితనం ఎప్పుడూ దాగదు.అది జీవన ప్రవాహంలో మౌనంగా వెలుగుతూనే ఉంటుంది.
“నీడలా ఆవరించి ఒక వీడుకోలులోకి/మారిపోతుంది/ఇక్కడ తల్లితనం నీడగా మారుతుంది – తల్లి ముందుండి నడిపించదు,తల్లి వెనుకనుండి నీడలా కాపాడుతోంది.ఇక్కడ వీడికోలు అనేది కనిపించకుండా ఉండే సంరక్షణ.ఈ కవితా పంక్తి సున్నితమైన భావ ప్రకటనతో కూడినది.తల్లితనాన్ని నీడతో పోల్చడం అత్యంత సార్ధకమైన రూపకం.నీడ కనిపించకపోయినా వెన్నంటి ఉంటుంది.వీడుకోలు అనేది దూరమవడం కాదు,రక్షణతో కూడిన మౌన అనుసరణ. ఇక్కడ కవయిత్రి నీడని ప్రతీక ద్వారా అనిర్వచనీయమైన అనుభూతిని ఆవిష్కరిస్తుంది.నీడ అనేది ఎప్పుడు వెన్నంటి మాట లేకుండా తోడుగా ఉండే ఒక మౌన ఉనికి.అది ప్రేమ కావచ్చు,జ్ఞాపకం కావచ్చు,బాధ కావచ్చు-అది ఏది అయినా వ్యక్తిని పూర్తిగా కప్పి వేస్తూ అతని అస్తిత్వంలో కలిసిపోతుంది.ఇక్కడ ఆవరించిన అనే పదం ఆ భావం తాత్కాలికం కాదు.సంపూర్ణంగా మనసును ఆక్రమించేదని సూచిస్తుంది.ఒక వీడుకోలులోకి మారిపోతుంది అనేది అత్యంత వేదనాత్మకమైన మలుపు.నీడలా దగ్గరగా ఉన్న భావం.చివరికి వీడుకోలుగా మారడం అంటే ఉనికి నుంచి వియోగానికి,సమీపం నుంచి దూరానికి జరిగే మౌన పరిణామం.ఇది గట్టిగా ప్రకటించిన వీడికోలు కాదు.నెమ్మదిగా అనివార్యంగా జరిగే అంతరాయం.మన జీవితాల్లో కొన్ని సంబంధాలు,జ్ఞాపకాలు మొదట నీడలా వెన్నంటి తోడుగా ఉండి కాలక్రమంలో మాట లేకుండానే వీడికోలుగా మారిపోతాయి అనే జీవిత సత్యాన్ని సున్నితమైన రూపకంలో వ్యక్తం చేస్తుంది.శబ్దాల కంటే మౌనాలకే ఎక్కువ స్థానం ఇచ్చిన ఈ కవితా పంక్తి పాఠకుడి హృదయంలో దీర్ఘకాలం ప్రతిధ్వనిస్తుంది.
“ఇది ఎవరికి కనిపించని ప్రేమ ..!/ అనే ఈ భావానికి మౌనముద్ర వేస్తుంది.ఇది ప్రశంసలు కోరని ప్రేమ,ఇది గుర్తింపు ఆశించని ప్రేమ.అయినా కనిపించని ప్రేమ జీవనమంతా తోడుగా ఉండే ప్రేమ ఇది.ఈ కవితా పంక్తి అత్యంత సున్నితమైన నిర్వచనం ఇస్తుంది.ఇక్కడ ప్రేమ ప్రదర్శన కోసం కాదు,గుర్తింపు కోసం కాదు.ఇది ఎవరికి కనిపించని ప్రేమ.ఈ కవితా పంక్తులు తల్లి ప్రేమ కాలంతో పాటు మౌనంగా మారినా తగ్గదని బలంగా తాకుతాయి.చిన్నప్పటి సంరక్షణ నుంచి పెద్ద వాళ్ళైన అయిన తర్వాత ప్రార్థనల వరకు – తల్లితనం ఒక నిరంతర ప్రయాణం.కనిపించని చోటే ఎక్కువగా పని చేసే ప్రేమే అమ్మ ప్రేమ అనే సత్యాన్ని ఈ కవిత మనసులో నాటుతుంది.ఈ కవితలో కనిపించని ప్రేమ మౌన భావాలద్వారా వ్యక్తం అవుతుంది.తల్లితనాన్ని గొప్పగా నిశ్శబ్దంగా నిలబెట్టిన ఈ కవితా పంక్తులు పాఠకుడి హృదయంలో దీర్ఘకాలం ప్రతిధ్వనిస్తాయి.ఇది తల్లి ప్రేమ యొక్క అదృశ్య మహాకావ్యం – కనిపించని నీడలో జీవించే అత్యంత శక్తివంతమైన భావ ప్రకటన.ఈ కవితా పంక్తులు ఎదిగిన పిల్లల పట్ల తల్లితనం పొందే నిశ్శబ్ద రూపాంతరంను అత్యంత సున్నితంగా ఆవిష్కరిస్తాయి.తల్లితనం ఎక్కడ ముగియదో,ఎలా మౌనంగా మారుతుందో,ఈ భావ ప్రవాహం స్పష్టంగా చూపిస్తుంది.ఈ కవితా పంక్తులలో కవయిత్రి తల్లితనాన్ని ఒక స్థిరమైన భావంగా కాకుండా కాలానుగుణంగా రూపాంతరం చెందే శాశ్వత ప్రేమగా ఆవిష్కరిస్తుంది.పిల్లలు ఎదుగుదలతో తల్లి పాత్ర తగ్గిపోతుంది అనే భావనను ఖండిస్తూ తల్లితనం దాగిపోదు – కేవలం మౌనంగా మారుతుంది అనే సత్యాన్ని ఈ కవిత ప్రతిపాదిస్తుంది.
“ఎదిగిన పిల్లల తల్లి అవ్వడం అంటే/మీరిక వారి ప్రపంచ కేంద్రం కాదని/ఒప్పుకోవడం/ఈ కవితా పంక్తులు కవితకు తాత్విక పునాది.ఒకప్పుడు తమ చుట్టూ తరిగిన పిల్లల ప్రపంచం అనే సత్యాన్ని విడిచిపెట్టి ఇప్పుడు తాము ఆ ప్రపంచ అంచులకు జరగాల్సిన అవసరాన్ని తల్లి అంగీకరిస్తుంది.ఇది ఓటమి కాదు,తల్లితనంలో వచ్చిన ఉన్నత స్థాయి విజయం.ఈ కవితా పంక్తులు తల్లితనంలోని అత్యంత సూక్ష్మమైన కానీ అత్యున్నతమైన భావ పరిణామాన్ని ఆవిష్కరిస్తాయి.ఇక్కడ కేవలం పిల్లలు పెద్దవారు అవ్వడాన్ని చూడడం కాదు.తల్లితనం కూడా వారి ఎదుగుదలతో పాటు మరో దశకు మారుతుంది అనే సంకేతం. చిన్నప్పటి తల్లితనం,రక్షణ,మార్గ నిర్దేశం,నిర్ణయాల కేంద్రంగా ఉంటే – ఎదిగిన పిల్లల తల్లితనం మౌనంగా వెనుకబడి,దూరం నుంచే ఆశీర్వదించే స్థాయికి చేరుతుంది.ఇది తల్లికి కలిగే భావోద్వేగ పరిపక్వతను సూచిస్తుంది.
“మీరిక వారి ప్రపంచ కేంద్రం కాదని ఒప్పుకోవడం/ఈ కవితా పంక్తిలో తల్లికి ఎదురయ్యే అత్యంత కఠినమైన సత్యాన్ని స్పృశిస్తుంది.ఒకప్పుడు పిల్లల ప్రపంచం తల్లి చుట్టూ తిరిగేది,కాలక్రమేణా ఆ కేంద్రం మారిపోతుంది – వారి కలలు,స్నేహాలు,ఆలోచనలు,స్వతంత్ర నిర్ణయాలు,కొత్త కేంద్రాలుగా ఏర్పడతాయి.ఈ మార్పును నిరసించకుండా బాధతో కాకుండా అంగీకారంతో స్వీకరించడమే,ఇక్కడి అసలైన భావం.ఈ కవితా పంక్తులలో త్యాగం,విడిచి పెట్టే ప్రేమ,నిశ్శబ్ద గౌరవం వంటి విలువలను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ తల్లి ప్రేమ శబ్దంగా ప్రకటించబడదు.అది ఒప్పుకోవడంలో,వెనక్కి తగ్గడంలో,పిల్లల స్వేచ్ఛకు స్థలం ఇవ్వడంలో వ్యక్తం అవుతుంది.ఎదిగిన పిల్లల తల్లి అవ్వడం అంటే తమ స్థానాన్ని కోల్పోవడం కాదు. పిల్లల జీవితంలో తల్లి కేంద్రంగా కాకపోయినా వారి ప్రపంచాన్ని నిలబెట్టే మౌలిక శక్తిగా మారడం.ఈ కవితా పంక్తులు తల్లితనంలో వచ్చే అత్యంత కఠినమైన స్వీకరణను సూచిస్తాయి.ఒకప్పుడు పిల్లల ప్రపంచానికి కేంద్ర బిందువైన తల్లి,ఇప్పుడు ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సిన నిజాన్ని అంగీకరించడం – ఇదే పరిపక్వమైన తల్లితనం.
“అదే ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉండటం/తల్లి ముఖ్య కేంద్రం కాదని ఒప్పుకున్నా ప్రేమ తగ్గదు.ప్రేమ పరిమాణం మారదు. దాని వ్యక్తీకరణ మారుతుంది.ఇది షరతులు లేని ప్రేమకు ప్రతీక.ఈ కవితా పంక్తి తల్లి తనంలోని శాశ్వతత్వాన్ని ప్రేమ యొక్క రూపాంతర స్వభావాన్ని అత్యంత మృదువుగా వ్యక్తపరుస్తుంది.అదే ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉండటం అంటే ప్రేమ తగ్గడం కాదు.మారకపోవడం కూడా కాదు.కాలానికి అనుగుణంగా తన స్వరూపాన్ని మార్చుకుంటూ కొనసాగడం. చిన్నప్పుడు పిల్లలపై చూపిన ప్రేమ,అధికారం,సంరక్షణ,దిశా నిర్దేశంగా కనిపిస్తే, వారు ఎదిగిన తరువాత అదే ప్రేమ నమ్మకంగా,గౌరవంగా,మౌనంగా మారుతుంది.ఇక్కడ అదే ప్రేమ అనేది తల్లి హృదయంలోని స్థిరత్వాన్ని సూచిస్తుంది. పరిస్థితులు మారినా,సంబంధాల దూరాలు పెరిగినా,తల్లి ప్రేమకు మాత్రం విరామం ఉండదు.అది ప్రశ్నించదు.హక్కుల కోసం అడగదు.పిల్లల స్వేచ్ఛను గౌరవిస్తూ కూడా వారి పట్ల తన ఉనికిని విడిచిపెట్టదు,అదే ప్రేమ అనే భావం నిశ్శబ్ద కాంతిలా ఉంటుంది.కనుక కనిపించకపోయినా,దారిని వెలిగించే ప్రేమ ఇక్కడ భావోద్వేగ ప్రదర్శన కాదు.అంతర్గత నిబద్ధతగా వ్యక్తం అవుతుంది.పిల్లలు తమ ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నా తల్లి ప్రేమ మాత్రం వారి జీవిత ప్రవాహానికి అడుగడుగునా తోడుగా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది.ఇక్కడ తల్లి ముఖ్య కేంద్రం కాకపోయినా తల్లి ప్రేమ తగ్గదు అని ఈ కవితా పంక్తి స్పష్టం చేస్తుంది.తల్లి పాత్ర మారినా భావం మారదు.ఇది స్వార్థరహితమైన తల్లి ప్రేమకు సంకేతం.
“కొన్ని ప్రేమలు ఎప్పటికీ వీడిపోవు – /అనే కవితా పంక్తి లోతైన భావంతో సాంద్రతతో కూడినది.అది ప్రేమను కాలానికి, దూరానికి,అతీతమైన శాశ్వత సత్యంగా ప్రతిష్టిస్తుంది.ఈ కవితా పంక్తి చెబుతున్నది – నిజమైన ప్రేమకు వీడుకోలు అనే భావమే ఉండదు అని,రూపాలు మారవచ్చు,సంబంధాల రూపకల్పన మారవచ్చు.అయినా భావపు మూలం చెదరదు. అది దేహాల అనుబంధం కాదు,స్మృతుల,అనుభూతుల, మౌనాల లోతైన బంధం.ఈ ప్రేమ కనిపించకపోవచ్చు, పలకరించకపోవచ్చు,రోజు గుర్తు చేయక పోవచ్చు,అయినా అది మన శ్వాసలా – గుర్తించకపోయినా,విడిచిపెట్టలేనిది. కాలం దాన్ని మసకబార్చదు.పరిస్థితులు దాన్ని చెరిపేయ లేవు.అది గాయాల్లో నిశ్శబ్దంగా నిద్ర పోతుంది.ఆనందాల్లో మౌనంగా నవ్వుతుంది.ఈ కవితా పంక్తి వియోగాన్ని నిరాకరించే తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.ప్రేమ అనేది కలిసుండడమే కాదు,విడిపోయిన తర్వాత కూడా మనలో కొనసాగడమేనని సూచిస్తుంది.అయినా ఇది తల్లులు – పిల్లల ప్రేమలకు సంబంధించిన ప్రత్యేకత.ఇది అన్ని ప్రేమల ప్రత్యేకత కాదు – కానీ నిజమైనవి మాత్రమే – ఎప్పటికీ వీడిపోవు.ఇది ఒక నిశ్శబ్దమైన అంగీకారం.ప్రేమ విడిచి వెళ్ళదు – మనమే దాని వద్ద నుంచి కాస్త దూరంగా పోతాం.వీడ్కోలు చెప్పని భావం అయినా అది మనలోనే ఉంటుంది.కాలం,దూరం, మౌనం – ఏదీ ఈ ప్రేమను విడదీయలేవు.తల్లి ప్రేమకు ఇది శాశ్వతత్వాన్ని అందిస్తుంది.
“వాడి పోయినా నిశ్శబ్దంగా మమకారంతో వేచి చూడ్డం నేర్చుకుంటాయి .. ❤️
ఇక్కడ ప్రేమకు మానవ లక్షణాలు ఆపాదించబడ్డాయి. వాడిపోయినట్టుగా కనిపించినా అది చనిపోదు.మమకారంతో వేచి చూడటం అనేది ఆశను అరవకుండా కాపాడుకోవడం, నిశ్శబ్దం ఇక్కడ బలహీనత కాదు స్థిరత్వం.ఇక్కడ హృదయం అనే చిహ్నం ఈ భావాల మధ్య ఒక మౌన హృదయ స్పందనలా పనిచేస్తుంది.ఈ కవితా పంక్తిలో త్యాగం, పరిపక్వత,నిశ్శబ్ద ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తుంది.
ఇక్కడ వాడిపోయిన అనే పదం శరీర అలసటను కాదు – మనసు ఎన్నో విరామాలు,నిరీక్షణలతో కొంచెం క్షీణించిన స్థితిని సూచిస్తుంది.వాడిన హృదయం అరవదు.మౌనంగా తట్టుకోవడం మాత్రం నేర్చుకుంటుంది.నిశ్శబ్దంగా మమకారంతో అనేది ప్రేమ యొక్క అత్యున్నత స్థాయిని తెలియజేస్తుంది.ఇది మాటల ప్రేమ కాదు.ఎదుటివాడు తిరిగి వస్తాడా? గుర్తుపెట్టుకుంటాడా?అనే ప్రశ్నల కంటే ముందుకు వెళ్లిన ప్రేమ ఇది.ఎదురుచూసే మనసు తన ఉనికిని ప్రకటించదు.కేవలం ఉండిపోతుంది.
“వేచి చూడ్డం నేర్చుకుంటాయి../అనేది ప్రేమ ఒక సహజ గుణం కాక కాలంతో,అనుభవంతో అలవడే విద్య అని చెబుతుంది.వేచి చూడడం ఇక్కడ బలహీనత కాదు ఓర్పు – ఆశను గట్టిగా పట్టుకొని మౌనంగా నిలబడే ధైర్యం ఓర్పు.
ఒక అంతర్లీన స్త్రీత్వం,తల్లితనపు ప్రతిధ్వని వినిపిస్తుంది. కాలం ఎంత తీసుకున్నా ప్రతిఫలం ఇవ్వకపోయినా ప్రేమ వదలని హృదయ స్వభావం.ఇది ప్రేమ పెరిగే విధానానికి సంబంధించిన ఒక నిశ్శబ్ద పాఠం.మాటలు తగ్గిన చోట మమకారం పెరిగే విధానం.ఇక్కడ ప్రేమను ఒక గొప్ప అనుభూతిగా చిత్రించారు.అది వాడిపోవచ్చు.అలసి పోవచ్చు.కానీ,ఆశను కోల్పోదు.వేచి చూడ్డం అనేది తల్లి ప్రేమ యొక్క అత్యున్నత రూపం.
“కానీ,అదే ప్రేమ తత్వం/వాళ్ళను నిలబెడుతుంది/ప్రపంచాన్ని నిలబెడుతుంది!!/ఈ కవితా పంక్తులలో తల్లి ప్రేమ వ్యక్తిగత స్థాయిని దాటి విశ్వస్థాయికి విస్తరిస్తుంది.పిల్లలను నిలబెట్టడమే కాదు మానవ సంబంధాల ద్వారా ప్రపంచాన్ని నిలబెట్టే శక్తిగా,ప్రేమను కవయిత్రి ప్రతిపాదిస్తుంది.ఈ కవిత ఎదిగిన పిల్లల తల్లితనాన్ని త్యాగం కాదు – తత్వంగా చూపిస్తుంది.కనిపించకుండా నిలిచే ప్రేమే ప్రపంచాన్ని నిలబెడుతుందన్న సత్యాన్ని హృదయానికి చేరువ చేసే ప్రకటన ఇది.ఇక్కడ హృదయ చిహ్నం భావ విరామంగా పని చేస్తుంది.ప్రేమ కేవలం భావం కాదు అని కవయిత్రి సూచిస్తుంది.ఈ కవితా పంక్తులు తల్లితనాన్ని వ్యక్తిగత అనుభూతి నుంచి విశ్వవ్యాప్త విలువగా మార్చేస్తాయి. పిల్లలను మాత్రమే కాదు – సమాజాన్ని,ప్రపంచాన్ని నిలబెట్టే మూలశక్తిగా కవయిత్రి ఆవిష్కరిస్తుంది.తల్లులు – పిల్లల కవిత ఒక తాత్విక పరిపక్వతకు చేరుతుంది.తల్లితనం అంటే ఆధిపత్యం కాదు.విడిచిపెట్టగలిగే ధైర్యం,మాటలు తగ్గిన చోట ప్రేమ లోతుగా మారుతుంది.వేచి చూసే మౌనమే తల్లి ప్రేమ యొక్క పరమార్థం అన్న సత్యాన్ని ఈ కవిత హృదయానికి చేరుస్తుంది.ఈ కవితా పంక్తులలో ప్రేమను ఒక తత్వంగా ప్రతిష్ఠించారు.ఇక్కడ ప్రేమ అనేది వ్యక్తిగత అనుభూతి స్థాయిని దాటి,జీవనాన్ని నిలబెట్టే శక్తిగా అవతరిస్తుంది.కానీ అనేది ముందున్న అలసట,నిరీక్షణ అన్నింటికీ విరుద్ధంగా నిలుస్తుంది.ఎంత వాడిపోయినా,ఎంత నిశ్శబ్దంగా వేచి చూసినా ఆ ప్రేమ తత్వం ఎప్పటికి నిలిచి ఉంటుంది.అది లోపల నుంచి మనిషిని నిలబెట్టే అంతర్గత స్వరం.వాళ్లను నిలబెడుతుంది అనేది వ్యక్తిగత స్థాయిలో ప్రేమ చేసే పని చెబుతుంది.ఆశ క్షీణించిన వేళ,గుర్తింపులేమి కలిగినప్పుడు ప్రేమే మనిషికి వెన్నెముకలా మారుతుంది.అది బలంగా ఉండమని ఆదేశించదు – నిలబడే శక్తిని మౌనంగా అందిస్తుంది.ప్రపంచాన్ని నిలబెడుతుంది అనే విస్తరణలో ఈ ప్రేమ వ్యక్తి హద్దులను దాటి సమిష్టి మానవత్వంగా మారుతుంది.తల్లితనం,మమకారం,కరుణ,ఓర్పు వంటి సుగుణాలన్నీ ఈ ప్రేమ తత్వం నుంచే జన్మిస్తాయి.అవే యుద్ధాల మధ్య శాంతిని,స్వార్థాల మధ్య సహజీవనాన్ని నిలబెట్టే అదృశ్య స్తంభాలు.ఇది ప్రేమకు ఇచ్చిన తాత్విక నిర్వచనం.ప్రేమ లేకపోతే జీవితం కదలికలతో ఉన్నా లోపల ఖాళీగా ఉంటుంది.ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనిషి నిలబడతాడు.మనిషి నిలబడినప్పుడే ప్రపంచం నిలబడుతుంది.అందుకే ఈ కవితా పంక్తులు ఒక ప్రకటనలా వినిపిస్తాయి.ప్రేమ బలహీనత కాదు ప్రేమే ఆధారం.ప్రేమే ప్రపంచం నిశ్శబ్ద వెన్నెముక.ఈ కవితా పంక్తులు ఎదిగిన పిల్లల తల్లితనానికి సంబంధించిన పరిపక్వ ప్రేమ తత్వాన్ని అత్యంత మౌనమైన గౌరవంతో ఆవిష్కరిస్తాయి.ఇక్కడ తల్లితనం అరవదు,ఆజ్ఞాపించదు.అది అంగీకరిస్తుంది.వేచి చూస్తుంది.నిలబెడుతుంది.ఈ కవితా పంక్తులలో ఎదిగిన పిల్లల తల్లి అనే భావానికి తాత్వికమైన సంపూర్ణత ఇస్తుంది. ఇది కేవలం తల్లి అనుభవం మాత్రమే కాదు – ప్రేమని శాశ్వత విలువకు ఇచ్చిన నిర్వచనం.కవయిత్రి హిమజ ఒక తల్లిగా తన అనుభవాలను,లోకరీతిని తన మాతృ హృదయంలో చెలరేగే సంఘర్షణలను తల్లులు – పిల్లలు కవితలో ఆవిష్కరించిన తీరు ఆశ్చర్యాన్ని,ఆనందాన్ని కలిగిస్తుంది.
తల్లులు – పిల్లలు మరియు అందరి హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే కవితను అందించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
