మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

భారతదేశం విశిష్టత

by M.Umalaxmi June 14, 2022
written by M.Umalaxmi

భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు.

• వీటిలో మొదటిది “జంబూ ద్వీపము”. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణ గోదావారీ మధ్య స్థానే……). జంబూ అంటే “నేరేడు” పండు లేదా “గిన్నె కాయ”, ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది.
[05/03, 9:54 am] M. Umalaxmi: • ఆ తరువాత వచ్చిన పేరు “భారతదేశం” లేదా “భరతవర్షం”, ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు “భరతుడు”. ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు.

• తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధునది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధునదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.

• తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారత దేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు, అవి భారతదేశం ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూ దేశం యొక్క రూపాంతరమే!
కొన్ని హిందూ గ్రంథాలలో, ఉదాహరణకు మనుస్మృతి, కొన్ని బౌద్ధధర్మ గ్రంథాలు, ‘ఆర్యదేశ్ అనే పదము ఉపయోగంలో కానవస్తుంది. భారతదేశాన్ని ‘ఆర్యవర్త’, ‘ఆర్యవర్తం’ అని పిలువబడింది. ఆర్య, ఆర్యధర్మ, ఆర్యన్ ఈ పదాలన్నీ ఆర్య తెగ కొరకు ఉపయోగించబడింది. తమిళ కవి తన కవితలో భారతదేశాన్ని ఆర్యనాడు అని సంబోధించాడు. ‘ఆర్య’ అనగా ‘ఉన్నతుడు’, ‘దేశ’ లేదా ‘నాడు’ అనగా ప్రాంతము.
ఈ ఆంగ్ల పదము, గ్రీకు పదమైన ‘Ivoia, లాటిన్ ద్వారా ఇండియా.’Ivoia బైజాంటియన్లో

సింధూనది కి ఆవల గల రాజ్యం. క్రీ.పూ. 5వ శతాబ్దంలో హెరొడోటస్ పాలిటోనిక్ “ఇండియన్ లాండ్” (Indian land), అవెస్తన్ నుండి “హిందుస్” (సింధూ నదిని సూచిస్తుంది) దరాయిస్ నుండి, సంస్కృతం నుండిసింధు (సింధూనదిని సూచిస్తుంది). ఆఖరుకు సంస్కృత పదం నుండి స్థిరపడింది సింధు, లాటిన్ నుండి ఇండియా, పేర్లు స్థిరపడ్డాయి.
భారత్ అనే పేరు – భారత రిపబ్లిక్, లోని భారత్ సంస్కృతం నుండి స్వీకరించిన అధికారిక పదం. సంస్కృత పదమైన ‘భారత్’, ‘భారత’ అనే పదం నుండి ఉద్భవించింది.

విష్ణు పురాణం నుండి.

uttaram yatsamudrasya himädreścaiva dakṣiṇam

varṣam tadbhāratam nāma bhāratī yatra santatiḥ

उत्तरं यत्समुद्रस्य हिमाद्रश्चैव दक्षिणम् । वर्षं तद् भारतं नाम भारती यत्र संततीः ।। “వర్షం” (దేశం) సముద్రానికి ఉత్తరాన ఉన్న, హిమములతో కూడిన పర్వతాలకు దక్షిణాన గల, దీనిని భారతం అని, ఇక్కడ భారత సంతతి నివసిస్తుంది.”
సంస్కృత సాహిత్యం నుండి తీసుకున్న పేరు, భారత రిపబ్లిక్ ప్రాంతాన్ని, భారతదేశము, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ల కొరకే గాక ఆఫ్ఘనిస్తాన్ లోని అనేక ప్రాంతాల కొరకు ఉపయోగించబడింది. ఈ ప్రాంతం 4-3వ శతాబ్దాలు క్రీ.పూ. మౌర్య సామ్రాజ్యము, మొఘల్ సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యము, బ్రిటిష్ సామ్రాజ్యము మున్నగు వాటి కొరకునూ ఉపయోగించబడింది.

అఖండ భారతదేశం అనే పదజాలమునూ సమకాలీన రాజకీయాలలో కానవస్తున్నది, దీని ముఖ్య ఉద్దేశము, ఈ ప్రాంతాలన్ని ఏకీకరించి ఒక అఖండ ప్రాంతంగా అభివృద్ధి పరచాలి.
హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతములకు జన్మనిచ్చింది. ఇది బహుభాషా, బహుళ జాతి సంఘము. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది. దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. ఇది సింధు లోయ నాగరికతకు ఆలవాలము.
మౌర్య సామ్రాజ్య కాలంలో ప్రస్తుత సరిహద్దులలో కొద్దిభాగం మినహాయించి, సరిహద్దులు దాటిన ప్రాంతాలతో పాటు ఒకే చక్రవర్తి పాలనలోవున్నా, తదుపరి పలు చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా ఈ రాజ్యాలను స్వాధీనం చేసుకోవడంతో బ్రిటీష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ పాలనలోకివచ్చింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం జరిగిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది. అయితే, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, పోషకాహార లోపం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నది.
[05/03, 10:08 am] M. Umalaxmi: మధ్య ప్రదేశ్ లోని భింబెట్కా వద్ద లభ్యమైన రాతియుగపు శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. క్రీ.పూ. 7000 సమయంలో, మొట్టమొదటి నియోలిథిక్ స్థావరాలు పశ్చిమ పాకిస్తాన్ లో మెహర్గర్, ఇతర ఉపఖండపు ప్రాంతాల్లో కనిపించింది. ఈ విధంగా సింధూలోయ నాగరికత అభివృద్ధి, దక్షిణ ఆసియాలో మొదటి పట్టణ సంస్కృతి అభివృద్ధి చెందాయి. ఇదే క్రీ.పూ.26 వ శతాబ్దం, క్రీ.పూ.20 వ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికత. క్రీ.పూ.5 వ శతాబ్దం నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయిxe. ఉత్తర భారతంలో, మౌర్య సామ్రాజ్యం, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. అశోకుడు ఈ వంశంలోని ప్రముఖ రాజు. తరువాతి వచ్చిన గుప్తులకాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు, చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలగువారు పాలించారు.
తరువాతి వచ్చిన గుప్తులకాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు, చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలగువారు పాలించారు. విజ్ఞాన శాస్త్రము, కళలు, సారస్వతం, భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, భారతీయ మతములు, భారతీయ తత్వ శాస్త్రం మొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఢిల్లీ సుల్తానులు, తరువాత మొగలులు పాలించారు. అయినా, ముఖ్యంగా దక్షిణాన స్థానిక సామ్రాజ్యాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి.

రెండవ సహస్రాబ్ది మధ్యల, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండు వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీపై 1857లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన ప్రథమ స్వాతంత్ర్య సమరం) తరువాత, భారతదేశంలోని అధిక భాగం బిటిషు సామ్రాజ్యం కిందకు వచ్చింది.
ముఖ్యంగా దక్షిణాన స్థానిక సామ్రాజ్యాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి.

రెండవ సహస్రాబ్ది మధ్యల, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండు వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీపై 1857లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన ప్రథమ స్వాతంత్ర్య సమరం) తరువాత, భారతదేశంలోని అధిక భాగం బ్రిటిషు సామ్రాజ్యం కిందకు వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వాతంత్య్ర సమరం ఫలితంగా 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. 1950 జనవరి 26న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.

విభిన్న జాతులు, విభిన్న మతాలతో కూడిన దేశంగా భారతదేశం – జాతి, మత పరమైన సంఘర్షణలను చవిచూసింది. అయినా, తన లౌకిక, ప్రజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. 1975, 1977 మధ్యకాలంలో అప్పటి విభిన్న జాతులు, విభిన్న మతాలతో కూడిన దేశంగా భారతదేశం – జాతి, మత పరమైన సంఘర్షణలను చవిచూసింది. అయినా, తన లౌకిక, ప్రజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. 1975, 1977 మధ్యకాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే పౌర హక్కులకు భంగం వాటిల్లింది. భారత దేశానికి చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా 1962లో యుద్ధం జరిగింది. పాకిస్తాన్తో 1947, 1965, 1971లోను యుద్ధాలు జరిగాయి. అలీనోద్యమంలో భారతదేశం స్థాపక సభ్యురాలు. 1974లో, భారత్ తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. 1998లో మరో ఐదు పరీక్షలు నిర్వహించింది. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలతో

ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారింది.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కవిత్వంలో వైవిధ్యం

by mayuukha June 14, 2022
written by mayuukha

కవిత్వము ధరణిలో కలిగించు చేతనలు
అక్షరమ్మును నేను ఆహ్లాద మిచ్చెదను

పుస్తకమ్ముకు గలదు పురా సంబంధమును
బ్రతుకుమార్చిన కలము బ్రహ్మ వ్రాతకు శుభము

చదువు సాధన లేక చాల వేదన పడితి
పుస్తకాలను జదివి పుణ్యమది యెరిగితిని

అలతి పదములు నాకు అభయమిచ్చిన చోట
పరుల నవ్వులు నాకు పరమ సహనము నిచ్చె !
2)
విశ్వనాథ రచనలు వినోదమ్మును యిచ్చె
గ్రాంథికము గుట్టునవి గ్రహియింప జేసినవి

సినారెవి గజళ్ళును సెహబాసు మదిదోచె
దాశరధి యలవోక దారులను పదమందె

భానుమతి కథలన్ని భళిభళీ యనుకుంటి
ఆవకాయ పెట్టిన అత్తగారివి కథలు

సులోచన ద్వయముతో సుందరపు కథలెన్నొ
అబ్బూరి ఛాయమ్మ అద్భుతపు మార్గమది

సమకాలీన రచన సాంద్రతలు చూస్తిమి
యండమూరిని చదివి యత్నములు మెచ్చితిమి

పెద్దిభొట్లకు నెంత పెద్దరికమో చూడు
మానవుల కష్టాలు మరిమరీ వ్రాశారు

ఒక్కరా యిద్దరా ఒక తరము వారంత
ప్రభావమ్మును జూపి ప్రతిభలని పండించె

నా ప్రయోగమ్ములను నలుగురూ మెచ్చితిరి
జీవితము సఫల రస ప్లావితము నయ్యెనిక

శ్రీవాణి చరణములు శ్రీకరము శుభకలము
బలరామ కృష్ణసిరి బాగుగా మాకివ్వు !!

June 14, 2022 0 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శ్రీయాదాద్రీశవైభవమ్-17

by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు June 14, 2022
written by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు

కైవల్య శ్రీ దపాదం కలికలుష మహత్వ చ్ఛిదారూఢ పాదం సత్పూజాపాదపాదం సకల రుగపహరామూల్య సంపాదపాదం శాపాస్తామోద పాదం సురవరసరి దుద్భూత ఫూతాబ్ద పాదం వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్ || తాత్పర్యం: మోక్షలక్ష్మిని ఇచ్చే పాదము; కలిపురుషుడు మానవుల చేత చేయించే సమస్త పాప భారాన్నీ ఛేదించడం కోసం పైకెత్తబడిన పాదము; చక్కని పూజలు అందుకోవటానికి ఆశ్రయమైన పాదము; సకల విధ రోగాలను – జాడ్యాలను హరించివేసే – అమూల్యమైన వరాలను అనుగ్రహించే – పాదము; మునివరులు, మహర్షులు ఇచ్చిన అస్త్రాల వంటి శాపాలను సంతోషంతో అంగీకరించిన పాదము; దేవనదియైన గంగ పుట్టుకకు మూలమై పవిత్రమైన పాదపద్మము కలవాడు శ్రీహరి. అట్టి యాదాద్రిపై వెలసి తన బలిష్ఠములైన భుజబలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: లోకులు తమకోసం, తమ కుటుంబం కోసం ఎన్నో చిన్న-సన్న కోరికలతో ఎందరో దేవతల్ని పూజిస్తూ ఉంటారు. వారిచ్చే అల్పమైన వరాలు భక్తుల తాత్కాలిక సుఖాలను, భోగవాంఛల్ని కొంతవరకే తీర్చగలుగుతాయి. కాని శాశ్వతానందాన్ని మాత్రం అందించలేవు. మోక్షప్రాప్తితో మాత్రమే నిజమైన, నిత్యానందం లభిస్తుంది. “మోక్షమిచ్చే జనార్ధనాత్” అని ఋషివచనం. (కైవల్య+శ్రీ +ద+పాదం=) అటువంటి మోక్షసంపదను అనుగ్రహించేవాడు విష్ణువు మాత్రమే! హరిపాదాలను ఆశ్రయించటమే మోక్షసంపత్పాప్తికి ఉన్న ఏకైక మార్గం!

కలియుగంలో ధర్మం ఒక్క పాదంతో మాత్రమే నడుస్తుందని సమస్త పురాణాలూ వక్కాణిస్తున్నాయి. సుఖలాలస–భోగవాంఛ మితిమీరి, ద్రవ్య సంపాదన మాత్రమే ఏకైక మార్గంగా బతికేస్తున్న నేటి కలియుగంలోని మానవుడు చేయని పాపాలు లేవు. (కలి+కలుష మహత్వ +ఛిద్+ఆరూఢ+పాదం=) కలిపురుష ప్రభావితులై మానవులు చేస్తున్న ఘోరమైన పాపాల మోపుల్ని ఛేదించి వేయడం కోసం హరి తన పాదాలను సంసిద్ధంగా ఉంచుతాడు. అంటే విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించిన వారికి పాపవిముక్తి చాలా తేలిక!

(సత్పూజా+ఆపాద+పాదం=) పూజ అంటే అర్చనాదులు. పెద్ద వాళ్ళను గౌరవించడానికి చేసేవే పూజలు మొదలైనవి! అటువంటి సత్పూజల్ని అందుకునేవి శ్రీహరి పాదాలు. అంతమాత్రమే కాదు. హరిపాదాలను ఆశ్రయించినవాళ్ళు గొప్ప పూజాదికాల్ని అందుకోవటానికి అర్హులౌతారు కూడ!

భోగాభిలాష శరీరాన్నే కాదు – మనస్సుని, ఇంద్రియాలను కూడ గాడి తప్పిస్తుంది. దాంతో ఎన్నో విధాల మానసిక – శారీరక బాధలు, రోగాలు మనిషిని క్రమంగా ఆక్రమిస్తాయి. (సకల+రుక్+అపహర+అమూల్య+సంపాద+ పాదం=) అటువంటి సమస్త రోగాలను క్షణాలలో తొలగించి, నయం చేసే – గొప్పదనాన్ని సంపాదించి పెట్టే – విలువ కట్టలేనివి శ్రీహరిపాదాలు!

మహర్షులు మహనీయులు. తపస్సంపన్నులు! వారికి ఆగ్రహం వచ్చినా-అనుగ్రహం కలిగినా క్షణాలలో స్పందిస్తారు. భవిష్యత్ దర్శనం చేయగల మహర్షులు శ్రీహరిని కూడ అనేక సందర్భాలలో శపించారు! విష్ణువు అనేకములైన – మత్స్య, కూర్మ, వరాహ, నారసింహాది రూపాలలో – జన్మలెత్తటం, రామకృష్ణాది అవతారాలలో ఎన్నో కష్టాలు అనుభవించటం,

కలియుగంలో ఆపద్బాంధవుడై వరదుడైన శ్రీనివాసుడు లక్ష్మీదేవితో ఎడబాటు పొందటం మొదలైనవన్నీ మహర్షులిచ్చిన శాపఫలాలే కదా! అటువంటి (శాప+అస్త్ర+ఆమోద+పాదం=) మహర్షుల శాపాలనే అస్త్రాలను సంతోషంతో ఆమోదించి, భూమిపై వివిధ రూపాలలో జన్మించి, నేటికీ భక్తుల పూజలందుకుంటున్నాడు శ్రీహరి!

సమస్త పాపాలను హరించివేసేది గంగానది! (సురవర+సరిత్ + ఉద్భూత +పూత +అబ్జ+పాదం=) బ్రహ్మసృష్టికి ఉపయోగపడుతూ ఆయన కమండలంలో అడిగి ఉందట ఆకాశగంగ! ఆయన విష్ణుమూర్తి పాదాలను కడిగితే – అక్కడ నుండి ప్రవహించిన గంగ విష్ణుపాదోద్భవి అని పేరు పొందింది. సురవర సరిత్ అంటే ఆకాశ గంగ! గంగ పుట్టుకకు ఆధారమైన పవిత్ర పాదం, తామర పూవులాంటి పాదం, కలిగినవాడు విష్ణుమూర్తి! శ్రీయాదగిరిపై వెలసి, తన పటుతర భుజబలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీనరసింహుణ్ణి కవి తన పద్య రక్తారవిందాలచే పూజించి, నమస్కరిస్తున్నాడు.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చిరస్మరణీయుడు……

by Shuktimati Vemuganti June 14, 2022
written by Shuktimati Vemuganti

రచయిత, జర్నలిస్ట్, కాలమిస్ట్, తెలంగాణ మొదటి అధికార భాషాసంఘ అధ్యక్షుడు, శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావుగారి నిష్క్రమణ తెలంగాణకు, తెలుగు భాషకు, సాహితీలోకానికి తీరని లోటు.
వీరి స్వస్థలం వరంగల్ జిల్లాలోని బొల్లి కుంట గ్రామం.1938లో వెంకట చలపతి రావు గారు, ఆండాళమ్మ గార్ల నలుగురు కుమారులలో కడపటి వాడు. ఈ నలుగురిలో పెద్దవాడు దేవులపల్లి రామానుజరావు గారు. రెండవవాడు విద్యాసాగర్రావుగారు.తర్వాత మదన్మోహన్రావుగారు. చివరివాడు ప్రభాకర్ రావు గారు.
వీరి తల్లిదండ్రులకిద్దరికీ సాహిత్యంలో సారస్వతంలో అభిరుచి, ఆసక్తి, అభినివేశం విశేషంగా ఉండేది. వీరి తండ్రి హన్మకొండ కోర్టులో వకీలు గా పనిచేశారు. వృత్తిరీత్యా లాయర్ అయినా ప్రవృత్తి పరంగా వీరికి సాహిత్యంపట్ల మక్కువ తో పాటు స్వయంగా పండితులు.
ప్రతిరోజు రామాయణాది పురాణములను పఠించేవారు. దేవులపల్లి రామానుజ రావు గారు గొప్ప కవి .పండితులు.మదన్మోహన్ రావు గారు ఉర్దూకవి.
చరిత్ర మీద పరిశోధన చేసిన ప్రముఖులు శేషాద్రి రమణ కవులు, తెలుగు పత్రిక  సంపాదకత్వం వహించి ప్రచురించిన మహా పండితులు వద్దిరాజు సోదరులు, కాళోజి, దాశరథి, పి.వి నరసింహారావు వంటి ప్రముఖులు వీరి ఇంటికి వస్తూ పోతున్నటువంటి పాండిత్య వాతావరణంలో ప్రభాకర్ రావు గారు పుట్టి పెరిగారు. ఆ విధంగా వీరికి చిన్నప్పటినుండి సాహిత్యంతో అనుబంధం ఏర్పడింది. సారస్వత దృష్టిగల వీరి కుటుంబ సభ్యులకు ఎవరికీ డబ్బు సంపాదన మీద దృష్టి పోలేదు.
మీరు హైస్కూల్లో చదువుతున్నప్పుడే విజయవాడ నుండి వెలువడే ప్రముఖ తెలుగు పత్రిక విశాలాంధ్ర సంపాదకత్వం వహించిన వారు. నార్ల చిరంజీవి గారు ,మద్దుకూరి చంద్రశేఖరరావు గారి ప్రోత్సాహంతో వీరు అనేక ఆర్టికల్స్ రాయటమే కాక మన మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుని మీద చాలా పెద్ద వ్యాసం రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు శోభ అనే కాలేజీ పత్రికకు  ముందు వ్యాసరచన పోటీ పెట్టి అందులో ప్రథముడిగా ఉన్నవాడిని సంపాదకుడిగా నిర్ణయించారు. ఆ ప్రథముడు వీరే. అప్పట్లో హైదరాబాదులో అన్ని కాలేజీలు కలిపి సాంస్కృతిక ఉత్సవాలను జరిపేవారట. ఆ సందర్భంలో దీపిక అను పేరు గల ఒక సంచికను ప్రచురించారు. దానికి కూడా వీరే ఎడిటర్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే మహాకవి గురజాడ గురించి వ్రాసిన వ్యాసానికి అఖిల భారత స్థాయిలో భారత ప్రభుత్వం వాళ్ళు యునెస్కో పక్షాన నిర్వహించిన పోటీలో ఆ వ్యాసానికి ప్రథమ బహుమతి వచ్చింది. ఆ విధంగా యునెస్కో అవార్డు లభించింది. ఒక విధంగా చెప్పాలంటే వీరు రాయని పత్రిక అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. కాళోజీ వలెనే వీరుకూడా ఎంత నిరాడంబరుడో అంతకన్నా కొన్నిరెట్ల నిరాడంబరత వీరి రచనలలో ఉంటుంది. ఎటువంటి ఉత్ప్రేక్ష లు, అతిశయోక్తులు వీరి రచనలలో కనపడవు.
గాంధీ శకం, మన మహనీయులు, చెప్పుకోతగ్గ మనుషులు, తెలంగాణ తేజోమూర్తులు, సమరం నుంచి స్వాతంత్రం, మహాకవి గురజాడ, సంపాదకీయాల సంకలనం, పారిజాతాలు కవితా సంకలనాలు, శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం (110 సంవత్సరాల) చైతన్య చరిత్ర. ఇవి వీరి రచనలలో కొన్ని.
వీరి సతీమణి పేరు విమలాదేవి. వీరికి ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె.
కాళోజీ గారు తెలంగాణ కోసం వారి అమూల్యమైన జీవితాన్ని అంకితంచేసినట్టు వీరు తెలుగు భాషా వికాసం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
2009 నుండి 2014 వరకు  తెలంగాణా స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ కోసం ‘పెన్షనర్స్ మూమెంట్” అను పేరుతో నడపబడి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అదే మాసపత్రిక ‘పెన్షనర్స్ వాయిస్’ అను పేరు గా మార్చబడిన పత్రికకు నిజామ్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనం కోసం పోరాడిన వీరులైన, అమర వీరులైన దేశభక్తుల, స్వాతంత్ర సమరయోధుల గూర్చి దాదాపు వందల మంది గురించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ పత్రికలో రచించిన ఘనత వీరికి తప్పమ‌రెవరికీ సాద్యం కాదనడంలో అతిశయోక్తి లేదు.
వీరి తాత్విక దృష్టి ఎంత ప్రాచీనమైనదో అంత ఆధునికమైనది. అంత హేతుబద్ధమైనది. వీరి రచనలలో దుర్బలతకు, నిరాశకు, మూఢ విశ్వాసాలకు, సంకుచితత్వాన్నికి చోటు లేదు. వీరు హిందూ మతాన్ని గుడ్డిగా ఆరాధించ లేదు. అందులో మానసిక దౌర్భల్యానికి దారితీసే దుర్లక్షణాలను నిరసించాడు. హిందూ సంఘ పతనానికి కారణమైన వాటిని తిరస్కరిస్తూ ఏది సజీవమైనదో, చైతన్యవంతమైనదో దాన్నే స్వీకరించాడు.
వీరు ఎంత నిరాడంబరుడో రచనలలో అంత సాహసి. గాంధీజీ తత్వాన్ని జీర్ణించుకున్న బహుకొద్ది మందిలో మీరు ప్రముఖులు. తెలుగు భాషను పునరుద్ధరించటానికి విశేష కృషి చేసిన వాడు.
వివిధ రంగాలలో సుప్రసిద్ధులైన వ్యక్తులు మరణించినప్పుడు వారి స్మృతి కి శ్రద్ధాంజలి ఘటిస్తాము. మరపురాని, చరిత్రలో చిరకాలం నిలిచిపోయే యశశ్శరీరులపై జోహార్లర్పిస్తాము.
ఇంతటి మహానుభావుని కోల్పోయినందుకు చింతిస్తూ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పాదం పై సాహితీ సౌరభాలు

by Sammeta Vijaya June 14, 2022
written by Sammeta Vijaya

తెలుగు సాహిత్యంలో ఏ ప్రక్రియ తీసుకున్నా దేనికదే తనదైన ప్రత్యేకతతో భాషాభిమానులకు మనోల్లాసాన్ని కలుగజేస్తుంది. పాటలు ఇష్టపడే వారికి పాటలు , పద్యాలు కోరుకునే వారికి పద్యాలు కవిత్వం కావాలనుకున్న వారికి కవితల్లో ఇలా రకరకాలుగా మన అభిరుచికి తగిన అంశాలను చూసే చదివే వినే ప్రయత్నాలు మనం చేస్తుంటాం. సరిగ్గా అటువంటి సందర్భమే నాకు ఎదురైంది… ఇటీవల ఎక్కువ సమయం మా మనవడితో గడపడం వల్ల ధ్యాసంత బాల్యం మీద వాడి ప్రతి కదలిక మీద కేంద్రీకృతమైంది. నాకు అప్పుడే పుట్టిన పసికందుల పాదాలు అరిచేతులు భలే ఇష్టం . ఆ పాదాలను చూడటం అందునా వచ్చే పోయే దారిలో ఏ పసిపిల్లలు కనిపించినా ఈ రోజు దైవ దర్శనం అయింది అనుకునే దాన్ని. ఈ క్రమంలోనే బాబు పాదాలు నా మనస్సును ఒక్క ఊపు ఊపేసాయి… 

      ఆ పాదాల మీద నేనెన్ని అక్షరాలను చుక్కలుగా పెట్టను.. ఎన్ని పాటలను గుర్తుతెచ్చుకోను.. ఎంత మంది నాలా పాదాలను చూసి పరవశించి వాక్యాలుగా మలిచారో .. ఎందరి దృష్టిలో పాదం ఏ రూపంలో రూపు దిద్దుకుందో.. ఒక్కసారి వారి ఊహలలో నేనూ చేరిపోతే… ఆ ఆలోచనలకు ప్రతిరూపం ఈ రచన.   

     ఉదయం లేవగానే మొదట మంచం మీద నుంచి భూమి పై పాదం మోపుతూ చదువుకోవలసిన శ్లోకం ఒకటి ఉంది .. సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే ।  విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే ॥ (భూమి నమస్కారం) 

ఓ దేవీ, సముద్రమే వస్త్రంగాకల అమ్మా, పర్వతాలే వక్షఃస్థలంగా కల తల్లీ, విష్ణువుకు భార్య అయిన దానా, నీకు నమస్కారము. నా కాలితో (నిన్ను) తాకటాన్ని క్షమించు. 

 ఈ శ్లోకం చదివి, ఈ భావాన్ని స్మరించి, భూమిని తాకి నమస్కరించిన తరువాతే కింద అడుగు పెట్టాలి అని పెద్దలు చెప్పారు. అది మనం భూమాతకు సమర్పించే కృతజ్ఞత.

    అలా మొదలైన పాదం మోపుతూ చెప్పే శ్లోకం నుంచి దేవుడిని ముఖ్యంగా చిన్ని కృష్ణుడు చిట్టి పాదాలపై పాట వైపు తొంగిచూస్తే మొదట స్ఫురించే అన్నమయ్య పాట…

చిన్ని శిశువు చిన్ని శిశువు

ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు॥

తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత

కాయలవంటి జడలా గములతోడ

మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ

పయక యశోద వెంట పారాడు శిశువు॥

అంటూ మువ్వల పాదాల కృష్ణుడు మనకంటి ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడిక మనకు వెంటనే చిన్ని కృష్ణుడు చేసిన కాళీయమర్దనం గుర్తొస్తుంది. అంతే కాదు కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాల గోపాల మా బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ ఇదేనా ఆ మురళీ పాట… ఎస్ జానకి స్వరంతో  వీనుల విందుగా వినిపిస్తుంది. 

     శ్రీనివాసుని పాదాలను తామరలతో పోల్చిన పోలికను గురించి అన్నమయ్య సంకీర్తనాలలో కవిసమయాలు అనే అంశం పై జి. అన్నపూర్ణ గారు రాసిన  వ్యాసం ద్వారా కవిసమయాలను విస్తృతంగా  చూడవచ్చు దేవతామూర్తులను  ఆపాదకేశాంతం వర్ణించడంఆచారం. పాదాలను తామరలు, ఎర్రకలువలు, చిగురుటాకులు, పగడాలతో పోల్చడం కవిసమయం. అన్నమయ్య పాదాలనుతామరలు, తులసీదళం, చిగురు, చింతకొమ్మ, కూర్మం, సంతముద్రకోల, నాగళ్ళతో పోల్చాడు.

    పొంచి తామరపువ్వుల బోలిన పాదాలాతడు వంచి తుమ్మెదల కొప్పు వడిసోక మొక్కవే …

అని శ్రీనివాసుని పాదాలను తామరలతో పోల్చాడు. తామరలు అందమైనవి, మకరందంతో నిండినవి, ఆస్వాదించే వారి బడలికను పోగొట్టేవి. అట్టివే స్వామివారి పాదాలు. ఆశ్రయించిన వారి అలసటను తీర్చేవి. 

     తనను ఆశ్రయించేవారికి గట్టి ఆధారాన్నిచ్చే స్వామివారి పాదాలను చింతకొమ్మలతో పోల్చాడు. కొనల నీ పాద చింతకొమ్మయేదిక్కు (2146) చెట్లలో చింతకొమ్మ చాల గట్టిది. ఆ కొమ్మను పట్టుకుని వేలాడే వారికి అది విరిగిపోతుందనే భయం లేదు. స్వామిపాదాలు జీవికి చింతకొమ్మ లాంటివే.  (ఈ మాట జూలై 2001)

    పాదాలను గురించిన పాటలు శివునిపై కూడా ఉన్నాయి … 

శివ శివ శివ అనరాదా శివ నామము చేదా శివ పాదము మీద నీ శిరసు నుంచ రాదా …అవే పాట ఒకటైతే నాట్యమయూరి పాట 

ఈ పాదం ఇలలోన నాట్యవేదం ఈ పాదం నటరాజుతో ప్రమోదం…అనేది. ఇటువంటిదే

  • చరణ కింకిరులు ఘల్లు ఘల్లుమన కరకంకణములు గలగలలాడగ ఆడవే మయూరి నటన మాడవే మయూరి
  • మరొక అద్భుతమైన పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  స్వరంలో ప్రాణం పోసుకున్న పాట …

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం

ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం

ప్రణతులే చేయలేనీ ఈ కరమేలా ఈ కరమేలా

ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం

అంటూ మంజునాథుని వేడుకునే పాట. 

ఎంత మధురమైన భక్తి భావన.. 

     ఆ భక్తి దాదాపు అందరు దేవుళ్ళపై అపారంగా కురిసింది .. రామునిపై మరెన్నో…

  • ఇదివో ఇదివో ఇనకుల తేజము 

ఇదియే రాముని పాదము 

పదము పదమునను ప్రణవనాదమై 

పరిపాలించెడి పాదము

జై జై రామ్ జై శ్రీ రామ్

గంగమ పుట్టిన గామిడి పాదము

ఘన బ్రహ్మమే తా కడిగిన పాదము

మంగళమగు మహనీయుని పాదము

మాటలకందని మహా పాదము

లింగమూర్తి లాలించిన పాదము

లలన సీత సేవించిన పాదము

అంగవించి ఆ దైత్యుల తునిమిన 

అహల్య తాకిన పాదము          -ఇదివో

మాత కౌసల్య ముద్దులాడిన

ముంగిట తిరిగిన మురుగుల పాదము

పితర దశరథుని పొట్టను తన్నిన 

బాలరాముని భవ్య పాదము

హితవుని కోరి కౌశిక యాగము 

కావ్య వచ్చిన కందువ పాదము

గయసేతువు వరకు సాగిన పాదము 

సాగర మదమును అణచిన పాదము -ఇదిగో

పసిడి లేడికై పరుగిడు పాదము 

వసుధ మరీచుని వధించు పాదము

ఉసురున వాలిని జంపిన పాదము

వెసగు సుగ్రీవుడు వేడిన పాదము

దశకంఠుని ధర కూల్చిన పాదము 

ధీర మారుతీ హృదయము పాదము

దిశలెల్లను తానేలిన పాదము 

 దేవుడు వేంకట రాముని పాదము

సామవేదం వేంకట మురళీకృష్ణ రచించిన ఈ పాట తారక్ మ్యూజిక్ లో తారక్ రామారావు పడాల , హైదరాబాద్ సమర్పణలో యూ ట్యూబ్ లో లభ్యం.

     రాముని గురించిన పాటలు అనేకానేకంగా దర్శనమిస్తాయి.

  • పదములే చాలు రామా నీ పద ధూళులే పదివేలు
  • నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా …
  • శ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే

వారిజ భవ సనక సనందన వాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ)

దారిని శిలయై తాపము తాళక

వారము కన్నీరును రాల్చగ

శూర  అహల్యను జూచి బ్రోచితివి ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)

అనే కీర్తనలెన్నో …

దైవపరంగా పాదాలను వీక్షిస్తూ పాడిన పాటలలో మతాలకతీతమైన భావన ఉంది

  • నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి

నిన్ను పాడి కీర్తించెదను

యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది వంటి పాటలెన్నో ఉన్నాయి.

      కె.వి . ఎస్. రామారావుగారు ఈమాటలోవేటూరి పాటలలో పాదాల ప్రాముఖ్యతను …ఆరాణి పాదాల పారాణి జిలుగులో / నీరాజ భోగాలు పాడనీ తెలుగులో” అన్నా, “నీ చల్లని చరణాలు చల్లిన కిరణాలలో / “అన్నా, శ్రద్ధంతా శబ్దాలంకారాల మీదేఅంటూ విశ్లేషించారు.  

  • మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె  నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా …తోడబుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లమ్మా..ఎవరినైనా కంటతడి పెట్టించే పాట అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక. 

గద్దర్ సాహిత్యానికి వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాట. 

     చిన్ని పాదాలను చిన్నారులను చూసి రాసిన గీతాలు తరచి చూస్తే ఆ భావపరంపరలో మనమూ లీనమవక తప్పదు. 

  •  నీ సిన్ని సిన్ని పాదాలు  సూడచాలలేని కన్నులు 

బ్రతుకు బాటలోకి ముల్లులు

దాటి మిగిలి ఉన్ననా కన్నులు…అంటూ

సిద్దిపేట శ్రీకాంత్ అప్ లోడ్ చేసిన పాట  కదిలించేస్తుంది ( యూ ట్యూబ్) . మరొక పాట 

  • నీ సిన్ని సిన్ని పాదాలను గుండెలపైనే మోసినా 

నీ కాళ్లకు తొడిగిన గజ్జెల సప్పుడు గుండె సప్పుడై దాసిన

నీ కాళ్లకు మట్టి అంటకుండ నీ అడుగుల అడుగై నడచిన

నా పంచ ప్రాణాలు నువ్వేనంటూ గుండెలపైన కాసిన

సెట్టు నీడవోలె నీతోడు వుంటానె సిట్టితల్లి

నువు నిదరోయెయేలల్లో ఊగేటి ఉయ్యాల నేను తల్లీ….

-పెద్దపల్లి ట్యూన్స్ లో సాయిగౌడ్ అప్ లోడ్  చేసిన పాట యూట్యూబులో..రచన దిలీప్ దేవగన్- ఎంత ఆర్దృతతో కూడిన భావన. 

     పుస్తకాలు పాదాలతో అను సంధానమైన శీర్షికలతో ప్రచురించబడ్డాయి. ప్రముఖ కవి, రచయిత , దర్శకుడు డా.ప్రభాకర్ జైని గారు తన కవితా సంపుటి    “పాదముద్రలు ”శీర్షికతో వెలువరించారు.“పాదముద్రలు ”అనే పేరుతో తన రెండో కవితా సంకలనం తీసుకొచ్చాడు కవి మిత్రుడు శాఖమూరి రవి. 

దీనిని గురించి కొలిమి లో నాగేశ్వర్ ప్రస్తావిస్తూ “ పక్షిబంధం” అనే కవితలో  ఇప్పుడు  నా అడుగులది 

పక్షి పాదముద్రల వెతుకులాట”…. అని ప్రకటించాడు. నిజమే అవి… శాఖమూరి అప్పారావు పాదముద్రలు భారత విప్లవోద్యమకొండగుర్తులు ఇవి కవి, శాఖమూరి రవి కవితలు…అన్నారు. మరొక పుస్తకం ఉక్కుపాదం – జాక్ లండన్  ధనస్వామ్య వ్యవస్థ పైశాచికానికి, ఫాసిస్టుతత్వానికి జాక్లండన్ పెట్టిన పేరు ”ఉక్కుపాదం“. ఇది 1907లో వెలుగు చూసింది. 

సాహితి పాదముద్రలు పేరుతో 

కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి తన కవితలో అకస్మాత్తుగా

ఆకాశమెత్తు ఎదగడం 

అర నిముషంలో కుప్పకూలటం 

ఎన్నిసార్లు చూడలేదు!

నీ యాత్ర పొడవెవనికి కావాలి?

ఈ మట్టి మీద 

నీ పాదముద్రల 

సంతకాల దాఖలాలేవి?… అంటారు.

భాస్కరభట్ల కవితల్లో అడుగులు సాగిపోయినా జ్ఞాపకాల పాదముద్రలు పదిలమే! 

ఒక పాదానికే 

చోటుదొరికింది..!

రెండో పాదం గాల్లోనే…

ఫుట్‌బోర్డ్ ప్రయాణం!

—–

చదువుకునే రోజుల్లో …

అందమైన అమ్మాయి కనిపించగానే

చూపులన్నీ

పాదాలమీదే!.

హమ్మయ్య.. 

మెట్టెల్లేవ్..

ఆమె నాదే!

అంటూ చక్కని భావవ్యక్తీకరణ చేసారు. 

జులై 1, 2019 నా అక్షరాలు…పేరుతో పల్లెపు స్వాతి సారంగలో ఒక కవితలో  

మా అమ్మ పగిలిన పాదాల్లో కనిపించే మట్టిగుండెల అలజడి నాలో పోటెత్తే సంద్రమైంది.

పార ఎత్తి ఒరం చెక్కేటపుడు 

నా కాళ్లకు అంటుకున్న రేగడి చల్లదనమే

ఈ అక్షరాల గుండె తడంతా అనే కవితలో అమ్మ పగిలిన పాదాలను అలజడిని చూపించారు. 

మరో కవిత  

చిమ్మ చీకటిలో …

ఈ ఇసుక దారుల్లో 

నేనెప్పుడు ఒంటరిగా నడిచినా

మిణుగురు పూల వెలుగుల్లో 

నీ పాద ముద్రలు కనిపిస్తయ్….

నీ నెత్తురంటిన గడ్డిపూలు

ఆత్మీయంగా పలకరిస్తయ్

మిణుగురు పూల వెలుగులో కనిపించే పాదముద్రలు మన మనసులలో ముద్రను వేస్తాయి. 

ఏప్రిల్ 1, 2022 న 

మహమూద్ కవితలలోనూ పాదముద్రలు కనిపించాయి….

తేనె ఫలం

ఆ మెత్తటి ఇసుకతిన్నెల్లో

పడ్డ నీ పాద ముద్ర లో

ఒలికిన నా చూపు లో

సగం చీకటి

సగం వెలుతురు ఇప్పుడు..

…..

నీ పాద ముద్రల పదాలను చదువుకొని

నడకలోని అనుభవాలతో మానవ చరిత్రలోని ఎత్తుపల్లాలు తెలుసుకొని

మనుషులు కొత్త నడవడికకు అలవాటు పడ్డారా?

……

నువ్వు పాదం మోపిన చోట

కోటలన్నీ ఓడిపోతాయని

కుటీరాలు తలెత్తుకుంటాయని

చరిత్ర చెప్పిన పాఠం. 

మానవ చరిత్రను ఈ పాదముద్రలు ప్రశ్నిస్తున్నాయి…

ఇంటిని ఒంటరిగా వొదిలొచ్చాను ..కవితలో  ఇల్లెప్పుడు ఊరిచుట్టే తిరుగుద్ది , సూర్యుడు చుట్టు భూమిలా !అది కనకమేడకాకపోవచ్చు అందులో మా తాతలు నడయాడిన పాదాలున్నాయి ఇల్లుమునిగితే పర్వాలేదు పాదాలగుర్తులు ఏమైపోతాయోననిఒకటే భయం అంటారు ..దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి.

అది మా అమ్మ ……!అంటూ 

అది…బురద పొలంలో నాటుకొని  కుళ్ళిన పాదం 

పల్లెరుల మీద నడిచిన ఆనెల రాళ్ళ పాదం జొన్న కొర్రుల మీద నడిచి నెత్తుటి పూలు పూచిన పాదం బతుకును నిప్పులమీదనడిపించిన ఉక్కుపాదం 

ఏమనుకోకు తల్లి  

ఒక్కసారి రక్తమోడుస్తున్న ఆ పాదాన్నిముద్దాడ నివ్వు

అది మా అమ్మ పాదం అంటాడు ఇబ్రహీంనిర్గుణ్ తన కవితలో…

బిల్లా మహేందర్ అంతరం అనే కవితలో నిజమే..నువ్వన్నట్లుగా ఆకలేమి అంతగా నేరం కాకపోవచ్చు గాక..కాని.., 

చెమట చుక్కల్లోంచి మొలకెత్తే పచ్చని చిగుర్ల మీద పాదం మోపడం నేరం..

ఏపుగా ఎదుగాల్సిన మొలకల్ని నవ్వుతూ దారుణంగా పెకిలించి వేయడం నేరం!!

పాదం ఎక్కడ మోపాలో సూచిస్తే తగుళ్ల గోపాల్ తన కవితలో బాల్యం ఎదురైన చేదు అనుభవాలను పాదాలపరంగా ఇలా అంటారు.. చిన్నప్పటి నుండి  పశువులు కాసిన ఆ బాల్యపు జ్ఞాపకాలన్నీ“ముల్లు పాటం”  అనే కవిత రాసుకొన్నాడు.  అందులో..

“కంపల మీదంగా 

వరికొయ్యల మీదంగా 

ఎగిరి దుంకి ఆవుల్ని మర్లేసినాక 

తూట్లు పడిన జల్లెడ లాగ అరికాళ్ళు 

ఎక్కడ కూర్చుంటే అక్కడ,

కాళ్ళను ముందల వేసుకొని,  

ముళ్ళను తీయడం తోనే,

గడిచి పోయింది బాల్యం 

అంటారు తగుళ్ల గోపాల్…

షేక్ పీర్ల మహమూద్ చిన్నారి పాదం 

అనే కవితలో… 

ఏదీ ఒక సారి తదేకంగా నీ పాదాన్ని  చూడనీ 

నిజానికి,దాన్ని ముద్దాడాలి 

దాన్నోసారి గుండెల మీద ఆన్చుకోవాలి

మసి పారాణిలా అంటుకున్న 

చిన్ని పాదాల గరుకుతనంలో నా బాల్యపు గురుతులేవో వెతుక్కోవాలి…అంటారు. 

ఇంద్ర ప్రసాద్ ఓ కవితలో 

ఆమెకు దయ లేదు …

అనుకోకుండా పాదాల మీద

చిన్న స్పర్శ

పక్కమీద చిన్న ముడత

గాలి కెరటాల హోరు

ఎక్కడో కాంతి రొద

ఇంక ఈ రాత్రి

నిరీక్షణే… అంటారు. 

రవీంద్ర నూటెంకి  తన కవితలో 

ఆ పాదాలు మన కేమిచ్చాయి? 

గుప్పెడంత మట్టినిచ్చాయి 

ఆ మట్టిలో మొలకెత్తి విశ్వమంతా వ్యాపించే 

విత్తనమంత విశ్వాసాన్నిచ్చాయన్నారు.  

ఆ పాదం …

మానవ చరిత్రను సృష్టించిన మట్టిపాదం

ఈ మట్టి చరిత్ర గతిని మార్చిన మహా పాదం

నా కంటి చెలకలో నిరతం కోండ్రలేసే నాగటి పాదం

నిత్యం కన్నీటితో కడుగ వలసిన అమ్మ పాదం

ఆ బ్రహ్మే కడుగ వలసిన మట్టిపాదం వట్టిపాదం అతి మామూలు పాదం 

అది మట్టి పాదం

అది మట్టి పాదం !

అంటూ శ్రమ జీవుల పాదాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. 

ఇలా చెప్పకుంటూ పోతే ఎన్ని పుస్తకాలో ..ఎన్ని పాటలో..ఎన్ని కవితలో ..ఉటంకించని స్పృశించని పాదాలెన్నో..

     పాదాలు ఒకచోట భక్తి పారవశ్యంలో మునిగిపోయే ఆధ్యాత్మిక భావనను కలిగిస్తే మరి కొన్ని పాదాలు ప్రేయసి అందచందాలలో భాగంగా ఓలలాడించాయి. కొన్ని పాదాలు బాల్యపు చెరగని ముద్రలైతే కొన్ని పాదాలు అనుసరించవలసిన సరికొత్త మార్గాలు .. కొన్ని పాదాలు  చెమటను చిందించే శ్రమను వ్యక్తీకరిస్తే కొన్ని పాదాలు చరిత్రపుటలను తిరిగేసాయి… చిన్ని పాదాలు గుండెలో సవ్వడి చేస్తూ పవిత్రతకు ప్రతిబింబాలుగా సాక్షాత్కరిస్తాయి ..పాదాలు పరమ పద సోపానాలు . పాదాలు నిష్కల్మష నిజదర్శనాలు. అటువంటి పాదాలకు అక్షరాభివందనాలు. 

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సిగ్నల్ దొరకని కలలు…

by Dasari Mohan June 14, 2022
written by Dasari Mohan

నిత్యం  నేను
ట్రాఫిక్ వలయం లోనే
మెడ మీద హెల్మెట్
చెమట జలపాతాన్ని రాలుస్తూ …

సిల్క్ రూట్ ఎప్పటి నుండో
స్వాగతం బోర్డ్ పట్టుకుని
సమర్ ఖండ్ సరాయి లో రూం బుక్ చేసింది
భాష రాని దేశం లో
బాధలు ఎంత అందం అయినవో
కాలు పెట్టడం ఖత్రా అయేటట్లుంది
వైరస్ కలల్ని  పొక్కిలి పోక్కిలి చేస్తోంది….

ప్రామిస్  చేయించుకుని
పది ఏళ్లు అయ్యింది ఎప్పుడో
రామోజీ ఫిల్మ్ సిటీ రోజంతా తిప్పుతానని
గుర్తు చేస్తూ గుచ్చుతునే భార్యామణి
పిల్లల చదువులు పెద్దల కోరికలకు సైంధవులు
వాయిదా పర్వాలతో సంసారాయణం సాగదీత…

చిన్ననాటి మిత్రుడు
ప్రతి పండుగకు రమ్మని
పల్లె కలవరిస్తోందని పదే పదే గుర్తు చేస్తూ
కాల్వలు సెలయేర్లు మత్తడి
కౌమారాన్ని లాలించాయి ఆడించాయి
బాల్యాన్ని  rewind  చేసుకునే భాగ్యం
చెట్టూ చేమను వాటేసుకుని తనవి తీరా ఎడ్వాలి
కొలువు సెలవు అడిగితే చివరి పని దినమే …..

ఎన్ని ఆశల సందడో బతుకు
ఇప్పటి కిప్పుడు అయితె
సిగ్నల్ పడితే చాలని
సెకండ్ లు లెక్కపెట్టు కుంటూ…       

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

జై జవాన్

by Butam Mutyalu June 14, 2022
written by Butam Mutyalu
ఆనందు తీసుకున్న నిర్ణయం అతని తల్లికి ఏమాత్రం మింగుడుపడడంలేదు. అతని భార్య సరోజ అతని నిర్నయాన్ని అస్సలు జీర్ణించుకోలేక పోతుంది. అతని అబిప్రాయంతో ఏకీబవించకుండా కాసేపు మౌనవ్రతం దాల్చింది ఆమె. అతని తల్లి కోడలికి బాసటగా నిల్సి ‘‘ఒరే ఆనందు  ఏందిరా నువు సేసేది, ఈడ బతికేది బతుకు కాదా,నువ్వు మమ్ముల ఇడిసి దూరంగా పోతంటే ఎట్టా, సర్కారు నౌకరి వొచ్చిందంటే సంబురపడ్డాం గని మిలటరీ నౌకరంటే   ఒప్పుతాంరా అయ్యా, ఉన్నొక్కనివి ఇడ్సిపోతే ఎట్టరా ఆనందూ, మయ్యగాని నెత్తినోరుకొట్కోని చెబుతున్న ఇనరా అయ్యా, నారెక్కలిర్గలే రెక్కలిర్గిందాంక సాకుతా , అటెంక ఏదన్న పనిసూసుకో బిడ్డా కోడలుపిల్ల వుత్తమనిషి కూడా కాదాయె, ఈ సమయముల్ల పిల్లకు నువు తోడుగుండాలే. అసలే పెద్దింటిపిల్ల ప్రేమించి మరి పెండ్లాడ్త్వి,ఇప్పుడు పచ్చిని చేసి ఇడ్సిపోతె ఎట్టా. దానిబతుకేంగాను, పిల్ల బాగోగులెవరు సూస్తరు.’’ అంటూ కంతలబోయిన కండ్ల నీళ్ళు రాలుస్తూ అరవసాగింది.అప్పటికే ఆమె మూడుకాళ్ళ ముదిమికొచ్చింది. 
దుఖ్ఖాన్ని కళ్ళలో అదిమిపట్టిన సరోజ మౌనంతో సూటిగా ఆనందు కళ్ళలోకి చూసింది. అతను తన బట్టలను బ్యాగులోకి సర్దుకొంటూ ‘‘సరూ మనకోసమే నేను ఈ పని చేస్తున్నా. ఈరోజుల్లో గవర్నమెంట్‌ జాబ్‌ దొరకడం అంత ఈజీ కాదని నీకు తెల్సు, మనం హయిగ బతకాలంటే ఏదోపని చేయాల్సిందే, ఆప్ట్రాల్‌ ప్యూన్‌ పోస్ట్‌కు పి.ఎచ్‌.డి చేసిన వారు అప్లై చేస్తున్నారు. మనమెంత పైగా ఒకే ప్రయత్నంలోనే మిలటరీలో జాబ్‌ వచ్చింది. ఆనందించాల్సింది పోయి అమ్మ, నువ్వు నాపై అక్కసు ఎల్లగక్కితే ఎలా, నా ఆశయం దేశసేవ చేయడం. అందివచ్చిన అవకాశం వదులుకోలేను.’’ అంటూ తడుముకోకుండా పలాకాడు ఆనంద్‌. 

‘‘ఆనంద్‌ సేవే పరమావది అయితే ఈ దేశంలో, మన రాష్ట్రంలో వివిధ రంగాలలో జాబ్‌ చేసేవారిది సేవకాదా.’’అంటూ గాటుగానే బదులు పలికింది సరోజ అతనివైపు కటినంగా కోపంతో చూస్తూ
‘‘చూడు మైడియర్‌ సరూ అలా ఉరుమురిమి చూడకు, నేను తట్టుకోలేను ప్రేమామృత ధారలు కురిపించే నీకళ్ళు నిప్పులవాన కురిపించి నన్ను దహించివేయకు’’అంటూనే దీనవదనంతో ప్రాదేయపడుతున్నట్టుగా ఆమెవైపు లీలగా చూస్తూ తన చేతితో ఆమె గదుమను తడిమాడు.
‘‘ఓయబ్బో లేనిప్రేమవొలికించకు, ఆనంద్‌ నిన్ను నేను ఎంత ఆరాదించానో అది నీకు తెలుసు, ఐనా బాడర్‌ లో జవాన్‌ జాబ్‌ మంచిదే కాని నీ తెలివికి ఇక్కడే ఏ ప్రయివేట్‌లో చూసుకున్నా చాలినంత జీతమిస్తారు, నువ్వే ఓ నెట్‌సెంటర్‌ పెడితే నలుగురికి ఉపాదికల్పిస్తావు. ి ఆనంద్‌ నీవు బాడర్‌లో అష్టకష్టాలు పడటం నాకు సుతారమూ ఇష్టంలేదు. ఇప్పటి పరిస్థితుల్లో నువ్వు వెళ్లితే నన్నేవరూ చూసుకుంటారు. మీ అమ్మ అసలే మతిమరుపు మనిషి, నేనో వుత్తమనిషిని కాను నెలలు నిండిన గర్బినిని, నీ తొందరపాటు నిర్ణయాలతో విసిగించకురా..’’అంటూ తన పొట్టపై చేయితో నిమురుకొంటూ అతనివైపు దీనాతిదీనంగా చూసింది.
‘‘సరూ అన్ని ఏర్పాట్లు చేస్తా, నువ్‌ ఫికర్‌ చేయకు కొన్ని రోజులు ఓపిక పట్టు అంతా సర్దుకుంటుంది. నేను ఈ నేలపై పుట్టినందుకు దేశ సేవ చేసేబాగ్యం నాకు లభించింది. ఆనందపడు, ఎందరికొస్తుంది ఈ అవకాశం. తినడంకోసమే అయితే ఏదోపనిచేసి బతకొచ్చు. మనిషన్నాక ఏదో సాధించాలి. అందరిలా మనముంటే ఎలా కాస్తా భిన్నంగుండాలి,నేనలావుండడం నీకిష్టంలేదా. నీకు గుర్తుందా సరూ నువ్వే అనేదానివి మనం అందరికంటే డిపరెంట్‌గా ఆలోచించాలి అని అందుకే సైన్యంలో చేరా.’’ అంటూ సరూ తలనిమురుతూ మాటలతో మరిపించాడు.
‘‘ఏమో బాబు మీరెన్నైనా చెబుతారు. సరే మళ్ళి తమరి రాక ఎప్పుడో’’ జీరబోయిన గొతుంకతో అడిగింది.
‘‘పోన్‌ చేస్తుంటా,కుదిరితే లెటర్‌ రాస్తా’’అంటూ ఆమెను చివరగా ఆలింగనం చేసుకొని నుదురుపై ముద్దుపెట్టి అటునుంచి కదిలాడు. ఆక్షణంలో అతనికి తెలియకుండానే కన్నుల్లో నిద్రానమైన కడలి ఉద్వేగంతో పొంగి కంటిరెప్పలనుండి తన్నుకొచ్చి కన్నీటి వరద పారింది. అతను కళ్ళు తుడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు. అతనినే చూస్తూ నిలబడిపోయింది సరోజ.
ఆమె మతి యాదుల్లోకి మల్లింది ‘‘ఈ నేలపై తలుకుబెలుకు కాంతులీనె నవజాతశిశువు పుడమీన పాదం మోపె గడియ కోసం ఎదురుచూస్తాను, నీ మది తలపులు తెరచుకొని నీ గుండె గది పడకలో నీ పక్కనే నేను కొలువు దిరుగుతాను ఆనందు కలతపడకు కలలు కను వీరుని కల కను దేశభక్తుల గాదలు విను అవి నాకు నీ జాబుతో సంతకం చేసి పంపు నేను వాటిని చదువుతున్నప్పుడు నాలో నూతనత్తేజం నిండాలి. నీకుమల్లె నేను మాతృభూమిపైన మమకారం పెంచుకోవాలి.’’ అని తనలో తాను అనుకోసాగింది. అతను దూరమౌతున్నకొద్ది అతనిపై ఆమె చూపు దుర్బినిలా నిలబెట్టి చూడసాగింది. అతను మాయమయ్యాడు…. ఆమె కళ్ళలో అతని రూపు నిలిచిపోయింది.
అతను సరిహద్దులో కాపలా కాస్తున్నప్పుడు కోడెతాచుల బుసలుకొట్టె చీకటిలో కంచె ఆవలి కాలాంతకుని పసిగట్టె పనిలో అతని కనురెప్పలు మూయక తెరచుకొని ఉంటాయి. శత్రువు నిశ్శబ్ద పాదాల అలికిడి పసిగడుతూ కారుచీకటి కమురువాసనలో కనురెప్పలు తెరిచి రెటినా దుర్బినిగా మారుస్తాడు. అతని చెవిలో కర్నబేరి రిక్కపొడుచుకొని అగంతకుని అలికిడి సవ్వడిని వినసాగుతుంది. భూతలస్వర్గం కాశ్మీరపు అందచందాలలో హిమపాతపు మంచులోయలో ముసురులా ఎడతెరుగక మంచు కురుస్తుంది. కర్కశత్వం నిండిన కఠినశిలా హృదయంలో డమరుక నాథం దేశభక్తి గేయాలాపన. లోయలో జలపాతం సడిచేస్తూ సైనికుల కవాత్తును కీర్తిస్తూ గానం చేస్తుంది. డేరాలలో కొందరు యోదులు విశ్రమిస్తుంటారు అలసిసొలసి. కార్పెట్‌ బూట్ల పహారా కాస్తూ అతను, ఆనందు లాంటి యోదులు ఎందరో. ఇక్కడ సూర్యోదయాలు, చంద్రోదయాలు, అమావాస్య నిశి చీకటి రాత్రులు వారికి ఒక్కతీరే, వారి మనసులో సంతోషపు ఆనందగడియల్ని వెదికేందుకు క్షణం తీరిక ఉండదు. వారి కవాత్తు, మార్చ్‌ ఫస్ట్‌ మంచులోయలో దూకే జలపాతంలా సాగుతుంది. గగన సీమలో సాగిపోతున్న వలసపక్షుల క్రమశిక్షణకు ఏ మాత్రం తీసిపోని తీరున వారు సరిహద్దు కంచె ముందు సాగుతారు, కఠోర సాధనతో సాయుదులై అకస్మిక యుద్దంలో ముందుకు దూకుతారు. కంచె ఆవల మాటువేసే శత్రువు దుశ్చర్యను పసిగడతారు, తిప్పికొడతారు. వారు భారత సైనికులు, కార్గిల్‌ వీరులు. అయినా వారు అప్పుడప్పుడు అంతర్గత శత్రువు నుండి ,అలాగే సరిహద్దు కంచెదాటిన శత్రువు చేతులో ఎదురుదెబ్బలు తింటుంటారు. అవి పటాన్‌కోట్‌, యూరిసెక్టార్‌ లాంటివి. కాని వారి మనోధైర్యం ఈసమంత చెదరదు వారి గుండె నిబ్బరం శత్రువు ఎదురుదెబ్బలతో రెట్టింపు చేస్తాయి. తూర్పున సూర్యుడు ఉదయించి పడమర అస్తమించడం మళ్ళీ ఉదయించడం ఎంత వాస్తవమో భారతమాత స్వేచ్చగా ఉండాలని తపన పడుతూ ఎదురొడ్డి పోరాడి సడలని అచెంచల ఆత్మ విశ్వాసంతో అసేతు హిమాచలం కాపలా కాయడం అంతే వాస్తవం.
‘‘హలో ఆనంద్‌ ఎలా ఉన్నావు నీకోసం నీరాకకోసం కళ్ళ ఒత్తులు పెట్టుకొని నేను, మీ అమ్మ, మన బిడ్డ ఎదురుచూస్తున్నాం వేయి కళ్ళతో నీవు ఎప్పుడొస్తావా నన్ను మళ్ళీ తన్మయత్వంతో ఆలింగనం చేస్కుంటావా అని ఎదురుచూస్తున్నా’’ అంటు ఆతృతతో పలకరించింది సరోజ.
‘‘సరూ మాకు విజయాలు, అపజయాలు మామూలే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కంటికి రెప్ప వాల్చకుండ, కునుకు తీయకుండ గస్తీ కాయడం మా డ్యూటీ. ఇది ఒకరోజుతో ముగిసేది కాదు ఏటి ప్రవాహంలా నిరంతర నిఘా ఆదమరిస్తిమా శత్రువు చేతికి మేం చిక్కినట్టె గస్తీ పెంచితిమా వాడు మాకు చిక్కినట్టే ఇక్కడ మాకు మరణం వీరత్వం వెన్నుచూపడం పిరికితనం చావడమో చంపడమో ఇదే మా డ్యూటీ నిరంతర నిఘాలో అలుపులేకుంటా ఉన్నా నువెలా ఉన్నావు.’’ అంటూ ఉద్వేగంతో ప్రవాహంలా అతని పలకరింపు సాగింది.
భయాందోళనకు గురైన సరోజ అతనితో మాట్లాడుతూ ‘‘నేను రోజు పూజలు చేస్తూనే ఉన్నా కన్పించిన చెట్టును, పుట్టను, కొండను, కోనను మొక్కుతూనే ఉన్నా ,నువ్వు క్షేమంగా ఉండాలని మా దరి చేరాలని’’ అంటూ ఆమె గద్గద స్వరంతో పలకరిస్తుంటె అతనూ నిట్టూర్చాడు ఇద్దరూ ఫోన్‌లో పిచ్చాపాటి కబుర్లాడుకున్నారు. అమ్మ గురించి, అమ్మగల్లాడుతున్న చిన్నోడి గురించి ఆమె చెబుతావుంటే అతను మురిసిపోయాడు.
మురిసిపోతూనే ‘‘సరూ సరిహద్దు కంచెలు మా చరిత్ర చెప్పడమే కాదు మా గురించి స్వర్ణాక్షరాలతో లిఖిస్తాయి. యావత్‌ భారతదేశానికి మా కీర్తిని, మా త్యాగాలను వివరిస్తాయి. దేశానికే కాదు ప్రపంచానికి చాటుతాయి. ఇంతటి గొప్ప గణకీర్తి ఏ పౌరునికి, ఏ ఉద్యోగికి లబిస్తుంది’’ అంటూ అతను వారి ఉన్నతిని స్తుతిస్తుంటే సరోజ ఒంటిలో ఒకవైపు ఒనుకు పుడుతూనే, మరో వైపు తన పెనిమిటిలోని పౌరుషత్త్వము ఆమెలో రాజుకుంది. కాని ఆమెలో తెలీని ఆందోళన జరగకూడనిది ఏదైన జరుగుతుందేమోనని మదిలో ఆందోళన ‘‘ఏమండీ జాగ్రత నేను రోజు పేపరు తిరగేస్తూనే ఉన్నా సరిహద్దులో జరుగుతున్న సంఘటనలను చదువుతూనే ఉన్నా. సినిమాల్లో మాదిరి కసాయి ముష్కరలు మీ పట్ల కర్కశత్వం ప్రదర్శిస్తారట కదా అదే నా బెంగ అది వింటుంటే, చదువుతుంటే ఒళ్లు గగ్గురు పొడుస్తుంది జాగర్త సుమా.’’ అంటూ దీనంగా విలపించ సాగింది సరోజ. కళ్ళలో సుడులు తిరిగిన కన్నీటిని తుడుచుకొంటూ…
‘‘సరూ యుద్దంలోకి దిగాక విజయమో వీరమరణమో మిగతావాటి గురించి ఆలోచిస్తామా’’ అంటూ గర్వంతో పలికాడు ఆనంద్‌. అలా చెబుతూనే ‘‘సరూ సరిహద్దుల్లో ఈ మద్య మాలో ఒక జవాన్‌ దారితప్పి కసాయి ముష్కర మూకకు చిక్కాడు దేహమంతా విషం నింపుకున్న కసాయి ఉగ్రమూక అతడి దేహానికున్న శిరస్సును ఖండిరచి మొండాన్ని గరుడలకు ఆహారంగా పారవేసి తలతో బంతులాడుకున్నారట. అంతకుముందు వీర సైనికుని కాల్లుచేతులు కట్టివేసి హింసిస్తూ ఈడ్చుకెళ్లి ఆనందపడసాగారు. దేహంనుంచి కారుతున్న ఒక్కొక్క రక్తపు బొట్టును చూసి పకపకనవ్వుతూ ఈలలు వేసారు చేతులలో గుండుసూదులు గుచ్చారు. చేతిగోర్లు పీకి కాటాలు గుచ్చారు కీల్లు విరగొట్టి మేకులు దించారు. పళ్లూడగొట్టి కనుగుడ్లు పెరికి వేశారు. దేహమంతా రగతాలు కారుతుంటే ఎరట్రి కారాన్ని దేహమంతా పులిమి అతడు ఆహాకారాలు చేస్తుంటే వారు ఆనందతాండవం చేశారు వారి ఉన్మాద వికృత క్రీడకు చచ్చి పడున్న దేహం మౌన సాక్షిగా నిలుస్తుంది అయినా వారి కసి తీరదు ఎక్కడో గుర్తుతెలియని చోట మొండం ఒకచోట, తలొకచోట మంచులోయలో రాబందులకు ఆహారంగా విసిరేసి రాక్షసానందం పొందుతారు అయితేనేం అతను అమరుడు అతని కీర్తి అజరామరం మువ్వన్నెల జెండై రెపరెపలాడుతుంది’’ అంటూ అతను చెపుతావుంటే సరళ వెన్నుల్లో ఒనుకు పుట్టింది. గుండె వేగం పెరిగింది అతని మాటలు వింటున్నంత సేపు ఆమెలో ఉద్ద్వేగం కట్టలు తెంచుకుంది కసితో ఆమె మతి రగిలింది ‘‘ఆనంద్‌ అలాంటి కసాయి ముష్కరుల మట్టికర్పించు నీకండగా నేనే కాదు ఈ దేశమంతా వెన్నంటే ఉంది’’ అంటూ భావోద్వేగంతో పలకగానే ఆనంద్‌ మది ఆనందతాండవం చేసింది ఆమె మాటలకు. ‘‘సరూ ఈ భూతల స్వర్గంలో కొన్ని రోజుల్లో మేం కొత్తచోటుకు వెళ్తున్నాం’’ అంటూ చివరి మాటగా పలుకుతూ ‘‘మన బాబుకు, నీకు నా ముద్దులు’’అని పోన్‌ పెట్టేశాడు. నెలలు గడుస్తున్నాయి, తన బాబుగూర్చిన ఆనందగడియలను అప్పుడప్పుడు ఆనందు, సరోజలు పోనులో మాటలాడుకుంటూనేవున్నరు, ఒకరినొకరు పలకరించుకొంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూనేవున్నరు, వారి బాబు వచ్చిరాని మాటలతో ఆనందును పలకరిస్తుంలే అతనిలో సంతోషం వికసించి విప్పారేది.
ఒకనాటి సాయంత్రం టీవి ముందు వాలి టివి ఆన్‌ చేసింది. అన్ని న్యూయస్‌ చానల్లలో స్క్రోలింగ్‌ హెడ్‌లైన్‌లతో కాశ్మీర్‌లోయ రక్తసిక్తం, పుల్వామా సెక్టార్‌లో నలబైమంది జవాన్లు ఉగ్రదాడిలో వీరమరణం పొంది అమరులైయ్యారు. ఆ వార్త దావానంలా భారతావని వ్యాపించింది. టీవీలముందు కూర్చున్నవారు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. సరోజలో వణుకు మొదలైంది, గుండె వేగంగా కొట్టుకోసాగింది, ఆమెలో ఏదో తెలియని ఆందోళన ఆమెని ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. తనదేహం తన ఆదీనంలో లేకుండా పోయింది. ‘‘ఆనంద్‌, ఆనంద్‌ ’’అంటూ కలవరిస్తూ తదేకంగా రెప్పవాల్చకుండా ఆ ఘటననే చూడసాగింది. టీవిలో వచ్చె దృశ్యాలు చూపరుల గుండెల్నిపిండెసేలావున్నాయి, ఆదృశ్యం భీతావాహ భయానకం సైనికుల బస్సు తుక్కుతుక్కైంది,ఆబస్సులో వున్న అరవైమందిలో నలబైమంది అక్కడికక్కడే వీరమరణం పొందారు.సైనికుల శరీరాలు ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయాయి,ఉగ్రవాది ఒక్కడు ముందుగా బస్సును డీకొట్టి ఆపై తనను తాను పేల్చేసుకొని సృష్టించిన విద్వంసం అది. అప్పుడే వీరమరణం పొందిన సైనికుల పొటోలు టివీలో రాసాగాయి,అందులో ఆనందు పొటో వుండడంతో సరోజ తట్టుకోలేక స్పృహకోల్పోయింది,ఆ ఘటన చూపరులకు ఊరిజనాలకు ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది, రోమాలు నిక్కపొడుచుకుంటున్నయి. జనం నరనరాల్లో ఆవేశం కట్టలుతెంచుకొని , మరుగుతున్న రక్తాన్ని అనుచుకోలేక దాయాది దేశంపై తలోతీర్గ దుమ్మెత్తిపోయసాగారు. దిక్కులుపిక్కటిల్లేలా ‘‘ఆనందూ అమర్‌రహే’’అంటూనే అంతకంతకూ ప్రతీకారం బదలా తీర్చుకోవాలని ముక్తకంఠంతో చాటుతున్నారు…
ఆయల్ల పనికెళ్లిన బాలమ్మ పనిముగిసింది. పొద్దుకూకింది, సందలవడ్డది, ఊరపసులు ఇంటిబాట పట్టినయ్‌.వాటి ఎనకాలె పనికెళ్లిన కూలీలందరూ కొండ ఆవలిగట్టునుంచి కొండెక్కిదిగి ఎగుడుదిగుడు గుంతల బెట్టెరాళ్ల బాటలో నడిచినడిచి వారికాళ్లు అలిసిఅలిసి మెత్తబడ్డాయి అయినా తిన్నగా అడుగులోఅడుగేస్తూ ఇంటిబాటపట్టారు. పొద్దుమునిగి చీకటిపరుచుకొంటుంది ‘‘ఇంటికెళ్లి గింత చాయసుక్క కడుపులేసుకుంటే కడుపులాకలి సల్లబడుద్ది’’అని తనమదిలో అనుకొంటూ ఇంటినిసమీపించింది. ఇంటిముందు జనం గుమ్మిగూడివున్నరు, ఇసుకపోస్తే రాలనట్టుగ. ‘‘ఏందల్లా ఏంది మా ఇంటిముంగల గుమ్మిగూడిరడ్రు,కశ సందిడువుర్రి ఇంట్లకుపోవాలే, ఏందే సరోజా ఏంది జనం’’అంటూ అందరివైపు ఎగాదిగా చూసింది సరోజా టీవిముంగల కూలవడివోయింది పోరడు తల్లిమీన తారాడ్తుండు జనం వార్తలు ఇనసాగిండ్రు. సరోజ ఏడుస్తుంది, ఎన్నడూ కడవాడకట్టుకు రాని జనం ఇంటిముంగల గుమ్మిగూడటం చూసి ‘‘ఏంజరిగిందర్రా ఏంది సంగతి’’ అంటూనే వారివైపు ఎగాదిగాచూసింది. ‘‘ఓ బాలమ్మా గుండేదైర్నం చేసుకో అటకూలవడు,నీ కొడుకు ఆనందు…. ఆనందూ’’ అని గుంపులో ఓవ్యక్తి అనేలోపే ‘‘ఏమయిందయా నా ఆనందుకూ…’’అని సూటిగా వారివైపుచూస్తూ అడిగింది. అమ్మా ఇంకెక్కడి ఆనందూ నీకొడుకు ఉగ్రదాడిలో వీరమరణం పొందిండు, సైన్యంలో వుండి దేశానికి సేవచేస్తూ, అసువులుబాసి అమరుడైండు తల్లి నీ ఎంట ఊరుంది, ఊరెకాదు ఈ దేశమే మీయెంటవుంది.’’ అనేసరికి ‘‘అయ్యో ఓరి దేవుడో ఎంతపనిచేశావురో, నాఇల్లు ముంచితివా.. నా ఆనందూ ఓయమ్మా, ఓ దేవుడా.. ఎట్టబతికేది సరోజా.. నా తల్లి ఏమి శెరలొచ్చెరా బగవంతా, ఎవనికేం పాపంచేస్తిమి సామి నాయిల్లు ముంచితివీ, మమ్ముల మగదిక్కులేనోళ్ల జేస్త్వి ఓయమ్మా…ఓ అయ్యా… నా ఆనందూ ఏడకానొస్తడే, మల్లెప్పుడొస్తడే, అమ్మో,అయ్యో, మా తండ్రి.. ఆనందా..’’ అంటూ తలబాదుకుంటూ, జుట్టుపీకుంటూ వల్లవల్ల ఏడుస్తూ కూలవడిపోయింది టీవిముందు. ఆమెకు కొడుకు లేడన్న వాస్తవం జీర్ణించుకోలేకపొయింది. ఆమెలో ఆవేశం దుఖ్ఖమై ఉప్పొంగింది,కంతలవోయిన కండ్లలో ఇంకిన కన్నీరు ఊటలా ఉబికి వరదలైపారుతూ చెంపలపై జాలువారుతూ కొంగుతడిసి ముద్దయ్యింది చీకటి ఆ ఇంటిని కాలసర్పమై మింగింది. నిశిచీకటి కమ్మింది ఊరిపెద్ద ఒకరు ఆ యింటిలో క్యాండిల్‌ జ్యోతులను వెలిగించాడు, బైట జనం అమర జవానుకు జేజేలు పలుకుతూ ఆ ఊరంతా జ్యోతులతో దిక్కులు పిక్కటిల్లేలా జోహార్లు అర్పిస్తూ ర్యాలితీసి ఊరంతా ఆ ఇంటికి బాసటగా నిలిచిండ్రు….
భూతం ముత్యాలు, కథారచయిత
9490437978

June 14, 2022 0 comment
5 FacebookTwitterPinterestEmail
కవితలు

అమ్మ — బ్రహ్మ.  . .

by రాఘవాచార్య‌ June 14, 2022
written by రాఘవాచార్య‌

బలమైన పదార్థాలంటూ నా 
యోగ క్షేమం వహామ్యహంగా 
కొసరి కొసరి తిన్నవన్నీ నేనే   
అమ్మ కడుపులో ఉండి
గుట్టు చప్పుడు కాకుండా ఆరగిస్తున్నాను
 లొటుకలు వేసుకుంటూ !

ఎంత బరువు పెరిగి పోతున్నానో ఏనుగు గున్నలా!
అమ్మ కడుపులో కాలు మీద కాలు వేసుకుని ఎంత సుఖంగా పెరుగుతున్నానో !
జోర్ దార్ నవాబు దర్జా !

అమ్మకు పాదాలు ఉబ్బుతున్నాయట
ఎంత భారంగా నడుస్తుందో!
నా పాదాలూ నొప్పెడుతున్నాయి
అమ్మకు ఏమైతే నాకూ అదే !

నేను కడుపులో ఉన్నా నాకు 
బయటవన్నీ వినిపిస్తునే ఉంటాయి !
నావి పాము చెవులనుకుంటా !
మా అమ్మ క్షేమ సమాచారం 
ఎప్పటికప్పుడు నా కెరుకే 
దివ్య శ్రవణం నాది

అమ్మ ఒడిలో పడ్డాకా పెద్ద పెరిగి 
అమ్మను సుఖ పెడుతాను 
అమ్మ కంట నీరు రానీయను
ఉల్లి గడ్డ కూడ కోయనీయను
చిన్న నోరు పెద్ద మాట మరి !  
తప్పదు కదా 
తప్పు కాదు కదా

బ్రహ్మ దేవుడు ఉపదేశమిచ్చాడు నాకు!
నీకు అమ్మనే బ్రహ్మ 
నేను పేరుకే బ్రహ్మ 

అమ్మను ప్రపంచ మహా రాణిలా చూసుకుంటాను
కాలు కింద పెట్టకుండా రెడ్ కార్పెట్ పై నడిపిస్తాను 
మీకు తెలుసా  !
అమ్మలను మనం సుఖపెడితే 
నాన్నలకు ఎంత సంతోషమో
                      – కందాళై రాఘవాచార్య
                           8790593638  

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

భావితరాలకు జీవనమివ్వు

by Uma Maheshwari June 14, 2022
written by Uma Maheshwari

సృష్టికి ప్రతిసృష్టిది
ప్రగతిలో ముందడుగిది
అభివృద్ధిలో ముందంజది
నాగరికతలో ముందుచూపుది
ఐనా ఒక కోణమేగా ఇది

సాంకేతిక రంగాన పరుగులు
శాస్త్ర విజ్ఞానమున జ్ఞానులు
సాంఘిక, గణిత శాస్త్ర కోవిదులు
మరచిన మానవతా వాదులు
పెరిగిన అత్యాసల స్వార్ధపరులు

సులభతరం ఎంచుకుని
సౌలభ్యం అందుకుని
అడ్డదారులు ఏర్పరచుకుని
అదే విజయమని జెబ్బలు చరచుకుని
తిని కూర్చుని అలసిపోయే జనులు

ప్లాస్టిక్ కనుగొని మురిసి
అవసరాలకు అక్కరకొచ్చునని మురిసి
చరవాణుల అభివృద్ధిలో ముందడుగేసి
పక్కికూనల చావులని గాలికొదలేసి
అవసరాలు తీరుట ముఖ్యమనుకునే అజ్ఞానులు

ప్లాస్టిక్ వ్యర్ధాలు తిని పశువులు
సముద్రంలో కలిసి చలచరాలు
తెలియకనే మనలో నింపుకుని
ప్లాస్టిక్ కోరలకు చిక్కి విలవిలలైనా మార్పురాని మందమతులం

గమ్యంచేరేందుకు సులభమని
ద్వి,చతుః చక్ర వాహనాలు శ్రేష్టమని
దూరాలకు హద్దులు చెరుపుకుని
ఎన్నింటినో కనిపెట్టుకుని
కాలుష్యంలో చిక్కి సమసిపోతున్నాం

ఇకనైనా తెలుసుకో
నిను నీవే మార్చుకో
విజయంవైపు సాగిపో
నిస్వార్ధంగా ఎదిగిపో
సమాజహితం కోరుకో

సామాజిక బాధ్యత మరువకు
నీబగెలుపే ముఖ్యమనుకోకు
తోటివారి విజయానికివసహకరించు
భవిష్యత్ తరాలకి మంచిని పంచు
కాలుష్య రహిత సమాజంగా ముందుతరాలకి అందించు మానవా!!!!!

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అనర్ఘ రత్నాలు

by డా॥ సంగనభట్ల నరసయ్య June 14, 2022
written by డా॥ సంగనభట్ల నరసయ్య

         ఉ. క్షోణితలంబు నెన్నుదురు సోకగ మొక్కి నులింతు సైకత

శ్రోణికి జంచరీక చయ సుందర వేణికి రక్షి తానత

శ్రీణికి దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్

వాణికి నక్ష రామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్

                                                                   (6-I. పోతన భాగవతం)

మధుర భాగవత మహాకావ్యకర్త బమ్మెర పోతనామాత్య కృత సరస్వతీ దేవిస్తవం ఇది. చదువుల తల్లిని కావ్యారంభాన స్మరించాడు. నమస్కార స్మరణలో ఎన్ని విశేషాలో!

నెన్నుదురు సోక అంటే నిండైన నుదురు భూమికి తాకించి మొక్కుతానన్నాడు. ఇది సాష్టాంగ నమస్కారం. కరచరణ యుగము నురము నొసలు, భుజములు, ధరణి సోక మొక్కగ లేదా!” అని అష్ట అంగములను త్యాగరాజస్వామి నమస్కార సమయాన భూమికి తాకించాలన్న సంప్రదాయం జ్ఞప్తిచేసాడు. సైకత శ్రోణి మరొక విశేషణం. ఇసుక తిన్నెల వంటి పిరుదులని. విశాల జఘనములని. ఇది విజ్ఞాన సంకేతం.  విజ్ఞానం విశాలం, గోపనీయం, ఎంత ఎరిగినా ఒదిగి ఉండటం గోపనీయత. చంచరీక చయ అనగా తుమ్మెద సమూహం వంటి అందమైన కురులు కలది. తుమ్మెదలు పువ్వు పువ్వుకు తిరిగి మకరందం సాధించినట్టు జ్ఞానతృష్ణతో గ్రంథాలు శోధించమని సంకేతం. శిరోజాలు తలలోని విజ్ఞానానికి పుట్టిన ఆలోచనలకు సంకేతం. స్థూలదృష్టిలో స్త్రీ సౌందర్యం. సూక్ష్మదృష్టికి విజ్ఞాన సంకేతాలవి.

రక్షిత + అనత శ్రేణికి = వినయంతో ఒదిగి ఉండి చదివే విద్యార్థినీ విద్యార్థి సమూహానికి రక్షకురాలు. తోయజాత భవ చిత్తునకు వశీకరణ చేయగల ఏకవాణి. అనగా వశీకరణ చేయగల ఏకైక వాక్కు కలదని, తన వాక్యాలతో బ్రహ్మను వశం చేసుకోగలదని. బ్రహ్మను అనగా భగవంతుని వశం చేసుకోవడం వాక్కుకుసాధ్యం కాదు కదా! “యతో వాచో నివర్త్యంతే అప్రాప్య మనసాసహ” (వాక్కు, మనస్సు భగవంతుని, బ్రహ్మమును, పొందలేక తిరిగి వచ్చాయి) అని కదా ఉషనిషత్సూక్తి! కాని ఇక్కడ విజ్ఞానరూపిదేవిని మనం వశం చేసికొంటే బ్రహ్మ వశమవుతాడని. అంటే అర్థమవుతాడని, పొందగలమని అంతరార్థం. వాక్కుతో సభ వశీకరణమవుతుంది కదా! సమాజం వశమవుతుంది కదా!

వాణికి అంటే సరస్వతీదేవికి వాగ్రూపియైన దేవతకని సంకేతార్థమే.

అక్షదామం (స్ఫటిక జపమాల), శుక = చిలుక, వారిజ = పద్మం, పుస్తక = గ్రంథం చేతిలో గల రమ్యపాణి = అందమైన చేతులు కలది, లేదా పై వాటిని పట్టుకోవడంతో చేతులు అందమైనాయని, ‘పుస్తకం హస్త భూషణం” అని ఆర్యోక్తి కదా!

అమ్మ చతుర్భుజి. నాలుగు చేతులు నాలుగు ఋగ్యజుస్సామా ధర్వణాలు. తల్లివేద స్వరూపిణి. వేదస్థాపిత బ్రహ్మమును అర్థం చేసికొనే విద్యాధిదేవత అని సంకేతం. ఒకచేత పుస్తకం. ఇది ధర్మానికి సంకేతం. ధర్మానికి గ్రంథాలుగా ఉంటాయి. పూర్వవుజులు ఆచరించిన, నిశ్చయించిన, లిఖించినట్టివి. శుకం మరోచేత ఇది కామానికి సంకేతం. సౌందర్యవతి

స్త్రీ శుకరూపం. శుకం మన్మథవాహనం. భోగానికి గుర్తు. వారిజం మరోచేత. ఇది అర్థ సంకేతం. లక్ష్మీదేవి వారిజభవ. అక్షదామం (స్ఫటిక) శుద్ధమోక్షానికి సంకేతం. మోక్షార్థులు జపనిష్టులు. జపనం, భగవన్నామాధ్యానైక చిత్తానికి సోపానం, జపగణనకు అక్షమాల. ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు దేవి సంకేతరూప. ఉపాసనా రూప.

ఆ అర్థాలే పద్యం నిండా పరచుకొన్నాయి. పోతన్నవాణి సుమధుర, అష్ట ‘ణ’ కారయుత శోభిత అనుప్రాస ప్రియకవిత

June 14, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us