మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

లంబాడోళ్ళ పిల్ల

by కందుకూరి శ్రీరాములు January 1, 2023
written by కందుకూరి శ్రీరాములు

పాండవులు వాళ్లే గాదు
మేమూ ఐదుగురమే !
వాళ్లు అరణ్యవాసం చేశారు
మేము సముద్రవాసం చేశాం

  • * * *

అప్సరస కావచ్చు
రాజహంస కావచ్చు
చీకట్లో చూడలేము
చూద్దామని
వేకువ కోసం
కాళ్లు ముందుకు వెళుతుంటే భూమి వెనక్కి వెళ్తుంది ఆకాశమంచును చూడటానికి అడవులు

దాటి పర్వతాలు దాటి మైదానాలు దాటితే
ఒక ఉదయాన మా ముందు
మిలమిల మెరిసే లంబాడోళ్ళ పిల్ల నృత్యం చేస్తున్నట్టు సముద్రం –
అల అలా ముసుగేస్తూ తీస్తూ ఎంత అందమో –

పిఠాపురం వెళితే పండు లాంటి సోమసుందర్ కనపడ్డట్టు
ఉప్పాడ వెళితే జాంపండు లాంటి సంద్రం పిల్ల కంటపడ్డది
‘ కెరట గమన ‘
సయ్యాటలాడుకుంటూ వస్తుంది
చెమ్మా చెక్కలాడుకుంటూ వయ్యారంగా పోతుంది
మేమంతా తన్మయత్వంలో పడి ఇసుకలో ఇటూఅటూతిరుగుతుంటే
ఆల్చిప్ప దొరికింది ఆ తీరాన
అది ఆ పిల్ల అద్దం బిళ్ళ అనుకొని అరచేతిలో వేసుకుని అందులో చూస్తే
గలగల నవ్వుతుంది గజ్జల గౌను తొడుక్కొని
చూస్తేనే తరిగిపోతుంటే
నవ్వితే కరిగిపోకుండా ఉంటామా !

ప్రేమకు పొద్దూ లేదు మాపూ లేదు తెల్లారిందో లేదో
భూమిని సూర్యుడు చూసినట్టు ప్రేమికులం మేం అదే పనిగా చూస్తుంటే
దేహమునిండా అద్దాలు తగిలించుకుని
పొర్లుతుంది నీటి పొర మీద నెలవంకలా –
రజిత పథకాల జిలుగు పైట మెరిసిపోతుంటే
అందాల ముద్దుగుమ్మ
పడుకునే పరవశించిపోతుంది
తళతళ మెరుస్తున్న అలల దారాలతో నేసినవే
ఉప్పాడ జరీ చీరలు
నీటి కాంతుల్తోనో చెక్కిళ్ల నునుపుల్తోనో
చీర మెరుపుల్తోనో
చేపల కన్నుల్తోనో
లంబాడ పిల్ల తళుక్ తళుక్ మంటున్నది
ఓరచూపు కిరణాల కాళ్లు విసురుతూ
కసితీరా వేళ్ళు
మా కళ్ళల్లో గుచ్చుతున్నాయి
ఒడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చుని
మోహం తపస్సు చేస్తున్నాం
మేనక ముందు విశ్వామిత్రుడిలా –

తుంపరల్తో తనువును తనివితీరా సుతి మెత్తని చెక్కిలిగింతలుచేస్తుంటే
మతి గతితప్పి చెలించిపోతుంది
చేతులతో రారమ్మంటూ
పాదాలతో పోపొమ్మంటూ
ఆరామ్ చైర్ లో కూర్చుని హాయిగా ఊగుతుంది
ఉప్పాడ లంబాడోళ్ళ పిల్ల ఉద్వేగమైపోతుంది నిమిషనిమిషానికి –
దాని వాడి చూపులతో మేమంతా వేడెక్కిపోతున్నాం క్షణక్షణానికీ –

  • * * * *

పంచ పాండవులు వాళ్లే కాదు మేము ఐదుగురమే
వాళ్లు అరణ్యవాసం చేశారు
మేం సముద్రవాసం చేశాం
వాళ్లు ద్రౌపది కోసం మత్స్యయంత్రాన్ని కొట్టారు
మేం లంబాడోళ్ళ పిల్ల కోసం జల మంత్రాన్ని బట్టీ పట్టాం !!

( కె.శివారెడ్డిగారు , సుగమ్ బాబు గారు , ఆశారాజు గారు ,పెన్నా శివరామకృష్ణ గారు, నేను
ఒంగోలు కవిసమ్మేళనంలో పాల్గొనటానికి వెళ్లిన సందర్భంలో ఉప్పాడ బీచ్ సందర్శించిన సమయంలో రాసిన కవిత.

‘ పీఠభూమి’ పుస్తకంలో ప్రచురించబడిన
సౌజన్యంతో )

January 1, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

కథాసాహితి కడలి తరంగం – వడలి రాధాకృష్ణ

by Banda Venkata Krishna ShaktiDhar January 1, 2023
written by Banda Venkata Krishna ShaktiDhar

తెలుగు సాహిత్యంలోని కథాసాహితి ప్రక్రియలో ఆధునిక కాలంలో కృషి చేసిన కథా రచయితలలో సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని కథారచన చేసినవారు “కథాసుధానిధి” వడలి రాధాకృష్ణ గారు. ప్రవృత్తిరీత్యా తెలుగు సాహిత్యంతో మమేకమైన “కథాప్రపూర్ణ” వడలి రాధాకృష్ణ గారి కలం నుండి 600 కథలు జాలువారాయి. “కథాబ్రహ్మ”, “కథా విరించి” లేఖిని నుండి కథలే కాకుండా 400 కు పైగా కవితలు వెలువరించబడినాయి. అనేక కథా సంకలనాలకు ప్రధాన సంపాదకత్వం వహించి “భావకవితాభారతి” వడలి రాధాకృష్ణ గారు. సాహీతీవేత్తలకు “సాహితీమిత్ర” గా కవులకు “కవిమిత్ర” గా కథారచయితలకు “కథకరత్న” గా ప్రసిద్ధిచెంది కథాసాహితి కడలి తరంగమైన వడలి రాధాకృష్ణ గారి “మనసు మూలాల్లోకి” మన “అంతర్నేత్రం” దృష్టి సారిస్తే ఆ “మనసు చెప్పిన కథలు”, “వడలి రాధాకృష్ణ కథలు” గా ఆవిష్కృతమవుతాయి. కడలి తరంగమైన వడలి “మంచినీటి సముద్ర” కెరటం. “జీవనది”, “మంచినీటి సముద్రం” తో సంగమిస్తే కడలి కెరటాలు వడలి కథలై కథాసరిత్సాగర మవుతాయి. “చీకటి పున్నమి” కాంతులను మన “దోసలి సందిట” పెట్టుకొని “గూటిపడవ”లో ప్రయాణించి కథాసాహితి కడలి తరంగ ఆవిర్భావ తీరానికి చేరుదాం.

వడలి వెంకట సుబ్బారావు – సూరమ్మ పుణ్యదంపతులకు 1963 సెప్టెంబర్ 5వ తేదీన (సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మించిన రోజున) వడలి రాధాకృష్ణ గారు జన్మించారు. తల్లిదండ్రులు రాధాకృష్ణ అని నామకరణం చేయడం వెనుక గల కారణం రాధాకృష్ణన్ గారు పుట్టిన తేదీ, రాధాకృష్ణ గారు పుట్టిన తేదీ సెప్టెంబర్ 5వ తేదీ కావడమే. స్నాతకోత్తరస్థాయిలో (పోస్టు గ్రాడ్యుయేషన్) మూడు పట్టాలు పొందారు. 1) ఎం.ఏ. (ప్రభుత్వ పాలనా శాస్త్రం), 2) ఎం.బి.ఏ., 3) బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్, పిలానిలో ఎం.ఈ. (మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్). సైన్స్ నుండి యం.ఇ.; ఆర్ట్స్ నుంచి ఎం.ఏ.; కామర్స్ నుంచి ఎం.బి.ఏ. డిగ్రీలు విభిన్నరంగాలలో సాధించిన వడలి రాధాకృష్ణ గారు ప్రస్తుతం చీరాలలోని ఐ.టి.సి.లో ప్రోసెసింగ్ మేనేజర్గా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రవృత్తి అయిన కథారచనలో మేటిగా నిలిచి నేటి ఆధునిక కథా రచయితలను, సాహితీవేత్తలను గౌరవిస్తూ, వారి గ్రంథాలను ఆవిష్కరిస్తూ, సాహితీసేవలో తరిస్తున్నారు. 2005వ సంవత్సరములో చీరాలలో “సహజ సాహితీ” అనే సాహితీ సంస్థను నెలకొల్పారు. “సహజ సాహితీ”

ఆధ్వర్యములో ప్రసిద్ధ చిత్రకారులు, కవి, గాయకులు, సంగీత దర్శకులు, కథారచయిత అయిన శ్రీ కోన రమణరావు గారు రచించిన “విరిసిన వెన్నెల” కథా సంపుటిని; రెక్కలు ప్రక్రియలో రచనలు చేసిన పోగుల విజయశ్రీ గారి “ఉదయరాగాలు” ను ఆవిష్కరించారు. సాహితీ మిత్రులైన శ్రీనివాసగౌడ్ గారు, పోగుల విజయశ్రీ గారు, వంగర పరమేశ్వరరావు గారు మొదలగు వారితో కలిసి అనేక కవి సమ్మేళనాలు నిర్వహించారు. చీరాలలోని ప్రముఖ సాహితీ సంస్థలైన అప్పాజోస్యుల విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్కు; కళాంజలికి; సాహితీ స్రవంతికి; శ్రుతిభారతికి విశిష్ట సేవలందిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ తెలుగు పత్రికలలో వడలి రాధాకృష్ణ గారి రచనలు, కథాసంకలనాలు ప్రచురితమయ్యాయి. రాధాకృష్ణ గారి కథా సంకలనాలలో “జీవనది”; “గూటిపడవ”; “అంతర్నేత్రం”; “మనసు మూలాల్లోకి”, “చీకటి పున్నమి”, “వడలి రాధాకృష్ణ కథలు”; “మంచినీటి సముద్రం”; “దోసిలి సందిట” మొదలగునవి కథా సాహితీ ప్రపంచంలో అటు పాఠకులను, ఇటు పరిశోధకులను అలరిస్తూ ప్రజాదరణ పొందాయి. వడలి రాధాకృష్ణ గారి కథా సంకలనాల మీద విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలో పరిశోధనలు జరిగి, యం.ఫిల్.; పి. హెచ్.డి. డిగ్రీలు పొందిన పరిశోధక విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధక విద్యార్థి పెదలంక సుధాకరబాబు “జీవనది” కథా సంకలనంపై పరిశోధన చేసి యం.ఫిల్. పట్టా పొందారు. రాజమండ్రి దగ్గర బొమ్మూరులో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన నన్నయ ప్రాంగణములో తెలుగు పరిశోధక విద్యార్థి బొంతా రమేష్ “వడలి రాధాకృష్ణ – కవితానుశీలన” అనే అంశంపై పరిశోధన చేసి యం.ఫిల్. పట్టా పొందారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయములో తెలుగుశాఖలో పనిచేసిన ఆచార్య తేళ్ళ సత్యవతి గారి పర్యవేక్షణలో శ్రీ యల్. జ్యోతీశ్వర నాయుడు అనే తెలుగు అధ్యాపకులు “వడలి రాధాకృష్ణ రచనలు” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు. బొబ్బిలికి చెందిన శ్రీ కర్రి రాంబాబు అనే తెలుగు పరిశోధక విద్యార్థి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారి పర్యవేక్షణలో “వడలి రాధాకృష్ణ రచనలు-సమాలోచన” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు.

“భావకవితా భారతి” అనే బిరుదును కలిగియున్న వడలి రాధాకృష్ణ గారు “జలఖడ్గం”; “శిశిరచిత్రాలు”, “వట్టివేళ్ళు” (నానీలు) అనే మూడు కవితా సంపుటాలను వెలువరించారు.

కథారచనలు, కవితా సంపుటాలను వెలువరించడమే కాకుండా 30 కి పైగా ఇతర కవుల, రచయితల సంకలనాలకు ముందుమాటలు వ్రాయడం వలన వడలి రాధాకృష్ణ గారు పీఠికా రచయితగా సాహితీ ప్రపంచంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. తాను ప్రధాన సంపాదకులుగా ఉండి నాలుగు కథాసంకలనాలకు, రెండు కవితాసంకలనాలకు, రెండు మినీ కథాసంకలనాలకు ప్రధాన సంపాదకత్వ బాధ్యత సమర్థవంతంగా నిర్వహించిన ఘనత కూడా వడలి రాధాకృష్ణ గారికే దక్కుతుంది. వారు ప్రధాన సంపాదకత్వం వహించిన కథా సంకలనాలు – “కథాపురి”, “నాలుగు నాలుగుల పదహారు”, “ఐదు కలాలు ఐదేసి కథలు”; “కథానికా కదంబం”; కవితా సంకలనాలు – “మలిసంధ్య”; “అనేక అడుగులు-ఒక ప్రస్థానం”; మినీ కథా సంకలనాలు – “మినీ కథావసంతం”, “కాలుతున్న కాలం” (కరోనా మినీ కథా సంకలనం).

సాహితీ రంగాలలో విశేష కృషి చేసిన వడలి రాధాకృష్ణ గారిని రాష్ట్రంలోని అనేక సాహితీ సంస్థలు బిరుదులను ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. వాటిలో ముఖ్యంగా సెట్ సంస్థ, చీరాల వారు “సాహితీమిత్ర” బిరుదును; పి.యం.కె.ఎఫ్. సంస్థ, ఒంగోలు వారు “కవిమిత్ర” బిరుదును; శ్రీ చైతన్యభారతి సాహితీ సమాఖ్య, మార్కాపురం వారు “కథావిరించి” బిరుదును; భావతరంగిణి మచిలీపట్నం వారు “కథకరత్న” బిరుదును; గుఱ్ఱం జాషువా కళా సమితి, దుగ్గిరాల వారు “కథాప్రపూర్ణ” బిరుదును; కళాలయ సాహితీ సంస్థ, పాలకొల్లు వారు “కథాసుధానిధి” బిరుదును; పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ వారు “భావ కవితా భారతి” బిరుదును; విశ్వభారతి, ఒంగోలు వారు “కథాబ్రాహ్మి” బిరుదును; సాహితీ స్రవంతి, చీరాల వారు “సాహితీవాచస్పతి” బిరుదును ప్రదానం చేశారు.

“సహజ సాహితి” సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, చీరాల వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఉపాధ్యక్షులుగా, ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలులో కార్యనిర్వాహక సభ్యునిగా విశిష్ట సేవలందిస్తున్న వడలి రాధాకృష్ణ గారికి రాష్ట్రంలోని అనేక సాహితీ సంస్థలు ఎన్నో పురస్కారాలను ప్రదానం చేశాయి.

రజనీ కుందుర్తి, హైదరాబాద్ సాహితీపురస్కారం; తిక్కన రచయితల సంఘం, నెల్లూరు వారి సాహితీపురస్కారం, గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ సాహితీపురస్కారం, డా॥ రావూరి భరద్వాజ స్మారక సాహితీపురస్కారం, “మల్లెతీగ” మాసపత్రిక జాతీయస్థాయి ప్రతిభాపురస్కారం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారిచే ప్రతిభాపురస్కారం, భువనగిరి-తేజ ఆర్ట్స్ జాతీయ సాహితీపురస్కారం, మచిలీపట్నం ఆంధ్ర సారస్వత సమితి వారు వట్టివేళ్ళు నానీల సంపుటికి యిచ్చిన ప్రతిభాపురస్కారం, డా॥ వల్లభనేని నాగేశ్వరరావు విశిష్ట సాహితీపురస్కారం – 2007, శ్రీమతి పోగుల వెంకట రత్తమ్మ స్మారక విశిష్ట సాహితీ పురస్కారం – 2008, గూడూరుకు చెందిన శ్రీమతి ఇ. రత్తమ్మ శ్రమశక్తి పురస్కారం -2010, చీరాల – పసుమర్తి పార్థసారథిరావు ప్రతిభాపురస్కారం-2011, నెల్లూరు డా|| నాగభైరవ స్మారక స్ఫూర్తి పురస్కారం – 2013, కడప డా|| కవితా స్మారక సాహితీపురస్కారం-2014, వేద విజ్ఞాన పరిషత్ శ్రీ సేవాశక్తి పీఠం సాహితీపురస్కారం-2017, చీరాల యర్రమిల్లి నరసింహారావు సాహితీపురస్కారం- 2019.

ఆకాశవాణి విజయవాడ, మార్కాపురం కేంద్రాలవారు వడలి రాధాకృష్ణ గారి కథలను, కవితలను ధారావాహికల రూపంలో ప్రసారం చేశాయి. ప్రముఖ హాస్య నటులు శ్రీ యల్.బి. శ్రీరామ్ గారు వడలి రాధాకృష్ణ గారి రచనను “పసుపు కుంకుమ” పేరుతో లఘు చిత్రంగా చిత్రీకరించారు. అనేక అవధానాలలో పృచ్ఛకునిగా పాల్గొన్నారు.

కథారచయితగా, కవితాసంకలనాలకర్తగా, ప్రధాన సంపాదకునిగా, పీఠికారచయితగా, సహజ సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ఉపాధ్యక్షులుగా, ప్రకాశం జిల్లా రచయితల సంఘ కార్యనిర్వాహక సభ్యునిగా, అవధానపృచ్ఛకునిగా, జాతీయ స్థాయి విశిష్ట సాహితీ పురస్కారాల గ్రహీతగా, వక్తగా, సాహితీ సమావేశాల రూపకర్తగా, గ్రంథ ఆవిష్కర్తగా తెలుగు సాహితీ లోకంలో ప్రఖ్యాతి చెందిన వడలి రాధాకృష్ణ గారు నేటి యువ కథారచయితలకు మార్గదర్శకంగా నిలిచి స్ఫూర్తిదాయకమవుతున్నారు.

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi January 1, 2023
written by Chillara Bhavanidevi

5

‘‘మంజరీ! ఏమిటే చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నావు?’’

‘‘ఏమీలేదు చిన్నాజీ’’

‘‘ఏదో నాకు చెప్పవే! వేయిచంద్రికలు విరబూస్తున్న నీ మొహంలో ఆనందం చెప్పకనే చెప్తున్నది. చంద్రప్పను కలిశావా?’’

‘‘అవును చిన్నాజీ! ప్రభువు దయవల్ల మనకి మంచిరోజులే!’’

‘‘ఇక కల్యాణయోగమేనేమో!’’ చిన్నాదేవి ఆమెను ఆట పట్టించింది.

‘‘పోండి చిన్నాజీ! ఆ… నేను మా అమ్మని చూసి చాలాకాలమైంది ఇంటికి వెళ్ళివస్తాను.’’

‘‘నా అనుమతి ఎందుకు మంజరీ! నీవు నా చెలికత్తెవు కావు. చిన్ననాటి నేస్తానివి. నీకీ భవనంలో రాకపోకలకు పూర్తి స్వాతంత్రం ఉంది.’’

సంతోషంతో చిన్నాదేవి మందిరం నుండి బయలుదేరింది మంజరి.

విరూపాక్షస్వామి దేవాలయ వాణిజ్య వీధిలోంచి వస్తుండగా ఎవరివో గుసగుసలు చెవినబడ్డాయి.

‘‘ఇస్మాయిల్‌ ఆదిల్‌ఖాన్‌ పంపారు’’

‘‘ఏంటి ఖబర్‌?’’

ఒకడు  పరదేశి  అని  తెలుస్తోంది.  ముఖాలను  పూర్తిగా  వస్త్రంతో కప్పుకున్నాడు. మరొకడు విజయనగర పౌరుడే!

మంజరి వాళ్ళకి కనబడకుండా అటువైపు తిరిగి వస్త్రాలు, గాజులు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ ఆ సంభాషణ వింటున్నది.

‘‘రాయచూర్‌ ముట్టడికి రాయలు వస్తాడు కదా’’ పరదేశి చెప్తున్నాడు.

‘‘అయితే?’’

‘‘ముట్టడి జరుగుతుండగా రాయల సైన్యం రాయచూర్‌కి తూర్పువైపు గుడారాలు వేస్తారు’’ పరదేశి వివరిస్తున్నాడు.

‘‘అవును. సరిగ్గానే ఉందీ విషయం.’’

‘‘ఇకవిను.  మా  ఇస్మాయిల్‌  ఆదిల్‌ఖాన్‌  అశ్వదళాలు  పదాతి  దళాలతో విజయనగరానికి తొమ్మిదికోసుల దూరాన నిలుస్తాడు. కందకాలు తవ్వి ఫిరంగులను పేలుస్తాడు’’ పరదేశి మాట్లాడాడు.

‘‘ఇక విజయనగరం కోటమట్టిదిబ్బేనంటారా’’ విజయనగర వాసి ప్రశ్నించాడు.

‘‘ష్‌! జనం వింటారు. ఈ సమాచారం ఎక్కడా పొక్కరాదు. ఆదిల్‌ఖాన్‌ కోట ముట్టిడిరచే సమయానికి మీరు కోటలోపల నుంచి సహకరించాలి.’’

‘‘మాకు లాభం’’ ఆశపడ్డాడు విజయనగర ద్రోహి.

‘‘ఎంత కోరితే అంత’’ శత్రువు ఆశ చూపించాడు.

‘‘సువర్ణరాజ్యం ఇది. దీనిని స్వాధీనపరచటమంటే మాటలు కాదు. సరే మీ ఖాన్‌సాబ్‌కి చెప్పు. అంతా సవ్యంగా జరుగుతుందని’’ మాట ఇచ్చాడతను.

వాళ్ళిద్దరూ త్వరత్వరగా అక్కడినుంచి వెళ్ళిపోయారు.

మంజరి  తమ  ఇంటికి  పోలేదు.  నేరుగా  తిమ్మరుసు  భవనానికి బయలుదేరింది. విజయనగర ద్రోహి గుర్తించి ఆమెని వెంబడిరచాడు. తన అనుమానం నిజమే. ఆమె విజయనగరంలో వేగు. ఈ వార్త తిమ్మరుసుకు చేరవేస్తుంది. సందేహం లేదు. దారికాచి ఆపాడు.

‘‘ఆగు! నీ గొంతులోంచి మా రహస్యం పొక్కనీయకు’’ బొంగురుగా అన్నాడు.

‘‘ద్రోహి! విజయనగరానికే ఎగ్గు తలపెట్టిన నిన్ను వదిలిపెట్టను’’ సివంగిలా అతని జుట్టుపట్టుకుంది మంజరి.

ఒక  సామాజ్య  నర్తకి  అని  భావించిన  మంజరిలో  ఇంతటి  శక్తి అతడూహించలేకపోయాడు. తడబడి కైజారు దూయబోయాడు.

మెరుపులా ఒక అశ్వికుడొచ్చాడు. ఒక్కవుదుటున మంజరిని తన గుర్రంపైన కూర్చుండపెట్టుకొని క్షణంలో మాయమయ్యాడు. మైదానంలోకి వచ్చాక అశ్వం ఆగింది. అతని మొహం చూసి ఆమె నివ్వెరపోయింది. ఆనందించింది కూడా.

‘‘చంద్రా!’’

‘‘మంజూ! సాహసం కూడా అదను కనిపెట్టి చేయాలి. ఈ వార్త నాకూ తెలిసింది. తిమ్మరుసుగారికి చేరింది కూడా! నువ్వు మీ ఇంటికి పో! నేనూ వచ్చి కలుస్తాను. అక్కడ నీ అవసరం ఉంది’’ అంటూ ఆమెను అశ్వంపైన ఎక్కించుకొని కృష్ణసాని ఇంటిదగ్గర దింపి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు చంద్రప్ప.

ఇంటిదగ్గర జనం గుమికూడారు. తలా ఒకటి అనుకుంటున్నారు.

‘‘ఎలా జరిగింది? ఎవరు చేశారో ఈ ఘాతుకాన్ని’’ ఎవరో వ్యాఖ్యానించారు.

‘‘కాలమహిమ’’ మరొకరి బదులిది.

‘‘బతికినన్నాళ్ళు  కూతురి  వైభోగం  కోసమే  తపించింది’’  ఒకరు  జాలి చూపిస్తున్నారు.

ప్రజల మాటల్ని దాటుకుంటూ తోసుకుంటూ లోపలికి వెళ్ళిన మంజరి ఎదురుగా కన్పిస్తున్న దృశ్యాన్ని చూసి నిట్టనిలువునా కూలిపోయింది.

‘‘అమ్మా!’’ ఆ ఆక్రందన అందరి హృదయాలను పిండేసింది.

రాత్రి ఎవరో ఇంటదూరి విలువైన రత్నాభరణాలను దొంగిలించి కృష్ణసాని గొంతునులిమారట. ఆమె అతనిని చూసి ఉంటుంది. అందుకే  ఈ  మరణం. మరికాసేపట్లో చిన్నాదేవికీ వార్త అందింది. ఆమె పంపిన రాజోద్యోగుల సాయంతో మంజరి తల్లి అంత్యక్రియలను పూర్తిగా నిర్వర్తించగలిగింది.

ఇక  ఈ  భవంతిలో  ఏముంది?  తనను  గొప్పస్థానంలో  చూడాలని బతికినన్నాళ్ళూ  తపించిన  తల్లి  ఇక  లేదు.  తాను  ప్రేమించిన  చంద్రప్ప మారువేషంలో తిరుగుతున్నాడు. ఈ భవనంలో తనకి భద్రత ఏముంది?

మంజరి చిన్నాదేవి భవనానికే చేరింది. ‘‘చిన్నాజీ’’ అని ఏడుస్తున్న మంజరిని కౌగలించుకొని కంటతడిపెట్టింది చిన్నాదేవి. ప్రేమతో మంజరిని ఓదార్చింది.

‘‘నేటినుంచి  నువ్వు  నా  సోదరివి.  నా  దగ్గరే  ఉండు’’  అని  పలువిధాల సమాధానపరచింది. మంజరి మనసులో ఆకాశమంత దిగులున్నా తారకల్లాంటి వెలుగు దివ్వెలు దూరాన కన్పిస్తుంటే కొంత ఊరట చెందింది.

*  * *

రాయల సైన్యం రాయచూర్‌ ముట్టడికి బయలుదేరింది. వారి వ్యూహం ప్రకారం రాయచూర్‌కి తూర్పుదిక్కున రాయలసైన్యం శిబిరాల్లో ఉంది. ముట్టడికి రాయలు సర్వసన్నద్ధంగా తరలి వస్తే ఇస్మాయిల్‌ అదిల్‌ఖాన్‌ అశ్వపదాతి దళాలతో కోటకు తొమ్మిది కోసుల దూరాన నిలిచి కందకాలు, ఫిరంగులతో యుద్ధానికి సన్నద్ధమైనాడు. రాయలు గ్రహించాడు.

కోటముట్టడికి  కొంత  సైన్యాన్ని  అక్కడే  ఉంచి  మరికొంత  సైన్యంతో ఆదిల్‌ఖాన్‌ని ఎదిరించటానికి పూనుకొన్నాడు. నిజానికి ఈ యుద్ధం రాయల శక్తికి మించిపోయింది. ఒక దశలో అపజయం సూచనలున్నాయి. చివరికి అవమానం ఒప్పుకోని ధీమంతుడైన రాయలు యుద్ధరంగంలోకి స్వయంగా దిగి, తన సైనికులకు బలాన్నిచ్చాడు. ‘‘విజయమో వీరస్వర్గమో’’ అనే నినాదాలతో సైనికులకు నాయకత్వం వహించి నడిపించాడు. రాయల పౌరుషం శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడిరది. అపజయం విజయంగా మారింది. ఆదిల్‌ఖాన్‌ పారిపోయాడు. అతని సేనాధిపతి బందీ అయ్యాడు. ఆదిల్‌ఖాన్‌ పరాజయాన్ని కళ్ళారా చూసిన అల్లసాని పెద్దన ఆశువుగా ఇలా అన్నాడు.

అలుక న్ఘోటక థట్టికా ఖురపుటీ హల్యన్భురాసాని శ్రపు

చ్చలు వో దున్ని, తలచ్చమూ గజ మదాసార ప్లుతీన్గీర్తిపు

ష్కలసస్యం బిడి యేకధాటి భళిరా కట్టించి తే దృష్టికే

దుల నోగ్రఖాకపాలమర్ధప హరిద్భూజాంగల శ్రేణికిన్‌ (2)

రాయలు  రాయచూర్‌పై  యుద్ధానికి  వెళ్ళినప్పుడు  సపరివారంగా  కవులు, పండితులు వెంట ఉన్నారు. యుద్ధశిబిరం యుద్ధభూమిలా లేదు. రకరకాల ధాన్యాలు, ఆభరణాలు, ముత్యాలు అమ్మకాలు జరిగాయి. ఏదో మహానగరంలా ఉంది. రాయలు పోర్చుగీసు సైనికుల సహాయాన్ని కూడా పొంది రాయచూర్‌ ముట్టడిని సాధించాడు.

*  * *

తల్లి మరణం తర్వాత మంజరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. చిన్నాదేవి ప్రేమ, చంద్రప్ప స్నేహం ఆమె బాధను మరిపిస్తున్నాయి.

‘‘మంజూ! ఈ రోజు భువనవిజయానికి రావాలి’’ చంద్రప్ప ఆహ్వానించాడు.

‘‘ప్రత్యేకత ఉందా’’ నిరాసక్తంగా అంది.

‘‘ఈ రోజు రాయలవారు అన్ని భాషల కవులకు తమ కవిత్వాలు చదివే అవకాశం ఇస్తున్నారట.’’

‘‘అష్టదిగ్గజ కవుల కవిత్వాలు, ఛలోక్తులు ఎంతో రమణీయాలు కదా! మరి ఈ కవులెవరు? ఏ దేశంవారు?’’ ఆమెకి ఆసక్తి కలిగినట్లుంది.

‘‘మనదేశంలోని అన్ని భాషల కవులు విచ్చేస్తున్నారు. వస్తే నీ మనసు ఆనంద తరంగితమౌతుంది.’’

‘‘మరి నువ్వు రావా?’’

‘‘ఎందుకురాను! కానీ నన్ను అక్కడ నువ్వు గుర్తించలేవు.’’

అతనికి మంజరిని త్వరగా వివాహమాడాలని ఉంది. కానీ తల్లి మరణంతో దిగాలుపడిన ఆమె వద్ద అటువంటి ప్రస్తావన కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మంజరి మనసును ఉల్లాసపరచాలని చంద్రప్ప ప్రయత్నం. ఆ విషయం గ్రహించిన మంజరి భువనవిజయానికి హాజరవటానికే నిర్ణయించుకుంది.

*  * *

భువనవిజయసభ  ఇంద్రసభను  తలపిస్తున్నది.  శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, పూర్వపశ్చిమ దక్షిణ సముద్రాధీశ్వర, మూరురాయర గండ, సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణదేవరాయలకు జయీభవ! విజయీభవ! వందిమాగధుల స్తోత్రాలతో శ్రీకృష్ణదేవరాయలు సింహాసనంపై కొలువుదీరాడు.

కర్ణాటాంధ్ర సామ్రాజ్య రక్షామణి సభావైభోగం కళ్ళార చూడాలేగానీ ఊహింప శక్యము కాదు.

తిమ్మరుసు మంత్రి కనుసన్నలతో సభ ప్రారంభమైంది. మొదటగా తాళ్ళపాక పెదతిరుమలయ్యగారు అన్నమాచార్యుని పదకవితలను భక్తి పురస్సరంగా ఆలపించారు.

తందనానా అహి తందనానా పురె

తందనానా భళా తందనానా ॥

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే ` పర

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే

కందువగు హీనాదికము లందులేవు

అందరికి శ్రీహరే అంతరాత్మ ॥

ఇందులో జంతుకుల మింతా ఒకటే

అందరికి శ్రీహరే అంతరాత్మ ॥

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే

అండనే బంటునిద్ర అదియునొకటే ॥

మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే

ఛండాలుడుండేటి సరిభూమియొకటే ॥

కడిగి యేనుగు మీద కాయునెండొకటే

కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ

జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ॥

విశిష్టాధ్వైతంలోని ఆధ్యాత్మిక తత్వాన్ని సంకీర్తనగా విన్న కృష్ణరాయలు పరవశించారు.

నాడు ఒక ప్రత్యేకాంశం భువన విజయసభలో జరిగింది. తిమ్మనకవి నిలబడ్డాడు.

‘‘ప్రభూ!  నాచే  విరచితంబైన  పారిజాతాపహరణ  మహాప్రబంధంలో చాలావరకు విన్పించాను. నేడు విన్పించు రచన ఈ కావ్యానికి చాలా ముఖ్యమైంది. అవధరించండి.

అలకబూని కోపగృహంలో ఉన్న సత్యభామను ప్రసన్నం చేసుకోవటానికి శ్రీకృష్ణుడు అనేక విధాల ఆమెను అనునయించాడు. చివరకు

పాటల గంధిó చిత్తమున బాటిలు కోప భరంబుమాన్ప నె

ప్పాటున బాటు గామి మృదు పల్లవ కోమల తత్పద ద్వయీ

పాటల కాంతి మౌళి మణి పంక్తికి వన్నియ వెట్ట నా జగ

న్నాటక సూత్రధారి యదునందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్‌

జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తన

ర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునం

దొలగం ద్రోచె లతాంగి యట్లయగు నాధుల్నేరముల్జేయ బే

రలుకం జెందిన కాంత లెందు సుచిత వ్యాపారము ల్నేర్తురే!

ఇంత జరిగినా శ్రీకృష్ణ స్వామి ఏమన్నాడో వినండి ప్రభూ!

నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా

చిన యది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు మ

త్తను పులగాగ్ర కంటకవితానము దాకిన నొచ్చునంచు నే

ననియెద, నల్క మానవుగదా! యికనైన నరాళకుంతలా!

అంతా ముక్కున వేలేసుకున్నారు. సాక్షాత్‌ జగన్నాథుడయిన శ్రీకృష్ణుడు భార్య కాలితో తన్నినా ఓర్పు వహించినాడనే దీని భావం రాయల మనసుని ప్రభావితం చేసింది. దీనికి సంబంధించిన ఓ సంఘటన ఆయన స్మృతిపథంలో ఆ క్షణంలోనే మెదిలింది.

సాధారణంగా  చక్రవర్తి  వచ్చేదాకా  మహారాణి  తలగడ  మీద  తలపెట్టి పడుకోకూడదు. మహారాణి కాళ్ళవైపున తలపెట్టి పడుకున్నది. ఆ రాత్రి రాయలు ఆలస్యంగా అంతఃపురంలోకి వచ్చాడు. మెలకువ రాకపోవడంతో మహారాజు ఆమెకి నిద్రాభంగం కలగకుండా తలగడ మీద తలపెట్టుకుని నిద్రపోయాడు. పొరపాటున మహారాణి కాలు ఆయనకి తగిలింది. ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో మహారాణి కావాలనే రాజు తలను కాలితో తన్నిందని భావించి ఆగ్రహించి రాయలు అప్పటికప్పుడు అంతఃపురం వదిలి వెళ్ళాడు. ఆనాటినుంచి మహారాణి అంతఃపురానికి ఆయన పోలేదు.

పారిజాతపుష్పాన్ని తనకివ్వకుండా సవతి రుక్మిణికి శ్రీకృష్ణుడు ఇచ్చాడని ఆగ్రహించిన సత్యభామ ఆయన తలను కాలితో తన్నినా కృష్ణుడు ఆగ్రహించ లేదు. శ్రీకృష్ణదేవరాయలను కృష్ణాంశగా భావిస్తారు గాబట్టి ఆయనకూడా రాణిగారి కాలు తగిలినా ఆగ్రహించరాదని కావ్యబోధ. శ్రీకృష్ణదేవరాయలు మహారాణిని అనుగ్రహించేట్లు చేయడం కావ్యప్రయోజనం. మహారాణి నందితిమ్మనను రాయల మనసును మార్చమని కోరిన కోరికననుసరించే నందితిమ్మన అర్థస్ఫోరకంగా ‘పారిజాతాపహరణం’ రాశాడు. రాయలు  ఆలోచిస్తున్నాడంటే కావ్యప్రయోజనం నెరవేరినట్లేనని స్వస్తిపలికాడు తిమ్మనకవి.

మహాకవులు  కావ్యాలు  వెలయించటమే  కాదు,  కాపురాలు  కూడా నిలబెట్టగలరనటానికి ఇది ఉదాహరణ మాత్రమే!

చింతలపాటి ఎల్లకవి రాధామాధవ కావ్యాన్ని రుచి చూపించాడు. ప్రసిద్ధ కన్నడకవి తిమ్మణ్ణి కుమారవ్యాసుని భారతం నుంచి కావ్యగానం చేశాడు. విద్యానందుడు, గుబ్బిమల్లహ్హణ్ణ, కుమారవాల్మీకి, చాటు విఠలనాథుడు తమ కావ్యాలనుండి కొన్ని భాగాలను విన్పించారు.

నాటి సభకు గురువులైన వ్యాసరాయలు, వాగ్గేయకారులైన పురంధరదాసు కనకదాసులు కూడా విచ్చేశారు. తమిళకవి కుమారసరస్వతి ‘‘రాయల గజపతీ కుమారీ పరిణయం’’  నుండి  కవితాగానం  చేశాడు.  హరిహరదాసుడు ‘‘ఇరుసమయ  విళక్కుం  గ్రంథం,  జైన  నిఘంటికుడు  మండలపురందర్‌, జ్ఞానప్రకాశర్‌ ‘‘మంజరిప్పా’’ గ్రంథం, తిరువారూర్‌, ‘తత్వప్రకాశర్‌’ ఆయా కవులచే సభాసదులకు పరిచయం చేయటం జరిగింది.

సంస్కృత  కవులు  శ్లోకాలు  విన్పించారు.  రాయలు  తాను  స్వయంగా సంస్కృతంలో రచించిన ‘‘మదాలసచరితం’’ నుండి కవిత్వం విన్పించారు. కటకవాసి లొల్ల పండితుడు, ఈశ్వర దీక్షితుడు సత్కరించబడ్డారు. తనకు సంగీతం నేర్పిన లక్ష్మీనారాయణను రాయలు వైభవంగా సత్కరించారు. తిమ్మరుసు మహామంత్రి తాను రచించిన ‘అగస్త్య భారతవ్యాఖ్య’లో కొంత సభకు విన్పించారు.

ముగ్గురు దేవేరులు ఈ సభను ఎంతగానో ఆనందించారు. సంస్కృతం అంతగా రాని చిన్నాదేవి, కర్ణాటక తమిళ భాషలు తెలియని అన్నపూర్ణాదేవి మూడు భాషల్లో విదుషి  తిరుమలాంబ  ఈ  మువ్వురూ  కవితా  సౌరభాలను  నిండుమనస్సుతో ఆస్వాదించారు.

భువనవిజయ సభాప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు ఒక అపూర్వ ప్రకటన చేశారు. తెలుగుభాష తెలుగుజాతి ఉన్నంత కాలం నిలిచిపోయే ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించే  ఆ  సన్నివేశం  మరికొన్ని  రోజుల్లోనే  జరుగనున్నదని  తెలిసి అష్టదిగ్గజకవులంతా ఆనందించారు. అటువంటి నిర్ణయానికి అప్పాజీ రాయలను అభినందించారు.అందరూ పెద్దన అదృష్టాన్ని వేనోళ్ళ కొనియాడారు.

మంజరి కళ్ళు మాత్రం చంద్రప్ప కోసం ఆ సభలో నలుమూలలా వెదుకుతూ నిరాశగా వెనక్కి తిరిగి వస్తున్నాయి.

అప్పాజీవారికి చేరువలో కానుకలు అందిస్తున్న పరిచారిక సైనికుడు చంద్రప్ప అని గుర్తించడానికి ఆమెకి చాలా సమయం పట్టింది. దాదాపు సభ ముగిసే సమయానికి గానీ ఆమె అతన్ని గుర్తించలేకపోయింది. ఇది గమనించిన చంద్రప్ప తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ విధి నిర్వహణ చేస్తున్నాడు.

*  * *

 ‘‘ఫో! నీతో మాట్లాడను’’ మంజరి అలక నటించింది.

‘‘మరి ఈ రాళ్ళతో మాట్లాడటానికి వచ్చావా?’’ చంద్రప్ప ఉడికించాడు.

‘‘అంత సభలో ఎక్కడున్నావని వెదకను’’ రోషంగా అంది.

‘‘ప్రస్తుతం నేను ప్రచ్ఛన్నంగా ఉన్నాను. రాయచూర్‌ విజయం దక్కింది గదా! ఇంక అజ్ఞాతవాసం తేలినట్లే.’’

‘‘హమ్మయ్య’’

‘‘మంజరీ! సుముహూర్తం నిర్ణయించుకునే వచ్చాను’’

ఆమె ఆనందంగా చూసింది.

‘‘దసరా  మహోత్సవాల్లో  విజయదశమి  శుభదినం.  ఆనాడు  మనం దంపతులమవుదాం.  భువనేశ్వరీదేవి,  విరూపాక్షస్వామి  కృపవల్ల  ఈ విజయనగర సామ్రాజ్యంలో మనమూ నీడల్లానయినా మిగిలిపోతాం.’’

‘‘చంద్రం! నాదో కోరిక’’

‘‘చెప్పు మంజూ’’

‘‘మన వివాహం తిమ్మరుసుల వారి ఆశీస్సులతో జరగాలి. వారు కరుణా సముద్రులు. అడిగితే కాదనరు. నాకు ఎవరున్నారు? తల్లిపోయింది. వారిని నేను  పితృదేవులుగా  సంభావించాను.  తిమ్మరుసు  తనయులు  కూడా సోదరులుగా ఎల్లవేళలా నాకు రక్షణ ఇస్తున్నారు.’’

‘‘నీవన్నదానిలో అణుమాత్రమయినా అసమంజసం లేదు. రేపు తిమ్మరుసుల వారిని కలిసి నీ కోరిక విన్నవిద్దాం’’ ఒప్పుకున్నాడు చంద్రప్ప.

‘‘మన వివాహం విరూపాక్ష మందిరంలో జరగాలి’’ ఆమె కోరింది.

‘‘ఎంత చక్కని యోచన చేశావు మంజూ! విజయనగర సామ్రాజ్య రక్షకుడా ప్రభువు. అతని కృపతోనే మనం ఒకటవుదాం’’ అతనూ సంతోషించాడు.

‘‘చంద్రా! ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. ఆహారధాన్యాలకు కొదవలేదు. విజయనగర వీధుల్లో కెంపులు, వజ్రాలు, నీలాలు, పచ్చలు, ముత్యాలు, రత్నాలు అమ్మటం చూసి పరాయి మూకలు ఈ రాజ్యంపై కన్నేస్తున్నారు. ముఖ్యంగా బహమనీలు.’’

‘‘అవును. రాయచూర్‌ని రాయలవారు జయించాక ముసల్మానులకు కన్నెర్ర అయింది. వర్తకం పేరుతో శత్రు గూఢచారులు విరివిగా విజయనగరంలోకి ప్రవేశిస్తున్నారని సమాచారం.’’

‘‘ఈ వ్యాపకంలో నీ నృత్యసాధన కూడా మర్చిపోతున్నావు’’ ఆమె ధ్యాస మళ్ళించటానికి అన్నా అంతకుముందు మంజరి నోట వెలువడినవి చంద్రప్ప మనసులోని ఆలోచనలే.

‘‘తెలుగుభాషను అందలం ఎక్కించిన రాయలవారు దేవేరుల కోసం మూడు మందిరాలు నిర్మించారు కదా! వాటిని చూశావా మంజూ!’’

‘‘చూశాను! తిరుమలదేవి శివాలయం, చిన్నాదేవి కృష్ణ మందిరం, అన్నపూర్ణాదేవి జగన్నాథమందిరం. ఏమా దేవాలయాల వైభవం! ఎవరెన్ని మందిరాలు  ఏర్పాటుచేసుకున్నా  వారి  హృదయమందిరంలో  కొలువైంది శ్రీకృష్ణదేవరాయలవారే గదా!’’

‘‘మరి మా హృదయరాణి మందిరంలో ఎవరో!’’

‘‘ఇంకెవరూ’’ అతనివైపు చూసింది. నాట్యంలాంటి నడకతో నునుసిగ్గుతో అతని చేతిల్లో వాలిపోయింది మంజరి.

అప్పటిదాకా రాజ్యశ్రేయస్సు గురించి గంభీరంగా చర్చించిన మంజరి పెళ్ళిప్రసక్తి రాగానే సిగ్గుపడటం చూసి ‘ఆడవారి మనసు ఆర్ణవం లాంటిది’ నవ్వుకున్నాడు చంద్రప్ప.

*  * *

ఆ రోజు విజయనగరం నిజంగానే విద్యానగరమై సరస్వతీ నిలయమైన సత్యలోకంగా భాసిల్లుతున్నది. ప్రభువు మందిరం నుండి ఎదురుగా ఉన్న రాజమార్గం ఇరుపక్కలా మంత్రులూ, రాజోద్యోగులు, సేనానాయకులు, రాజబంధువులు, ప్రజలు, అష్టదిగ్గజ కవులు నిలబడి తిలకిస్తున్నారు. ప్రభువు మందిరంలోంచి అందమైన బంగారుపల్లకీ బయటికి వచ్చింది. పల్లకీలో ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన ఆసీనులై ఉన్నారు.

రాజమార్గానికిరువైపులా మామిడి తోరణాలు, మార్గమధ్యంలో రంగవల్లులు అలంకృతమైవున్నాయి.

శ్రీకృష్ణదేవరాయల ప్రభువు సర్వాలంకారభూషితుడై తెల్లని పట్టు వస్త్రాలు ధరించి అప్పాజీతో మందిరం వెలుపలికి వచ్చారు.

పల్లకీ  వెనుక  కొమ్ము  పండితవర్యులు  పట్టారు.  సాహితీపిపాసి, భువనవిజయాధిపతి, ఆంధ్రభోజుడు, తెలుగులెస్స అని పల్కిన కళావాచస్పతి, హిందూ సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజితుడు, మూరురాయగండడైన శ్రీకృష్ణదేవరాయ ప్రభువు సంస్కృతాంధ్రాలలో సమానంగా కవితామాలిక నల్లినవేళ కాలికి గండపెండేరము తొడిగించుకున్న ఆంధ్ర కవితాపితామహుడు అల్లసాని పెద్దన అధిరోహించిన బంగారు పల్లకీని తన భుజాన మోయటం తెలుగువారి చరిత్రలోనే అపూర్వ సంఘటనగా నిల్చింది. నాడు చూసినవారి కన్నులదే అదృష్టం.

హర్షధ్వానాలతో విజయనగర రాజమార్గం మారుమ్రోగింది. ప్రభువు భాషానురక్తి, కవులపట్ల వారికున్న గౌరవం భావితరాలవారికి ఆదర్శప్రాయమై నిలిచిన శుభవేళ అది.

*  * *

ప్రధాన  శిల్పాచార్యుడు  శిల్పులందర్నీ  సమావేశపరిచాడు.  హంపీ విజయనగరంలో నిర్మితమవుతున్న దేవాలయాల నిర్మాణానికి ఎందరో శిల్పులను విభిన్న ప్రాంతాల నుండి రప్పించడం జరిగింది. వారందరితో ప్రధాన శిల్పాచార్యుడు ఇలా ప్రస్తావించాడు`

‘‘దక్షిణ  భారతదేశంలో  అచిరకాలంలో  ఏకైక  చక్రవర్తిగా  కీర్తిగడిరచిన హిందూసామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన ఆంధ్రభోజుడు కృష్ణరాయ ప్రభువుల వారు అటు కదనరంగంలోనూ ఇటు కవనరంగంలోనూ ఎనలేని కీర్తిప్రతిష్టలు సాధించారు. రాయలవారు దైవభక్తి, కళాపోషణ, ప్రజాసేవానురక్తి, దయ, మానవీయత, వీర పరాక్రమం, పెద్దలయందు గౌరవం గల గొప్ప రేడు. మహామంత్రి తిమ్మరుసు ప్రభువుకు మంత్రికావటం వారికేకాదు మనందరి అదృష్టం.

ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ప్రభువు, మహామంత్రి, వారికి హృదయా న్నర్పించి సేవచేసే సేనావాహిని, న్యాయాధికారులు, దండనాయకులు, రాజ్యక్షేమం  కోరే  కవి  పండితులున్న  రాజ్యం  మన  విజయనగరం. రాత్రింబవళ్ళు ఆడామగా తేడా లేకుండా నిర్భయంగా తిరగగలిగే పరిపాలన ప్రభువు మనకిచ్చారు. వీధుల్లో రత్నాలు అమ్ముతున్న రాజ్యం ఇది.  కొత్తవారొస్తే మర్యాదలు చేసి గౌరవించే పౌరులున్న రాజ్యం మనది. కక్షలు, కార్పణ్యాలు మచ్చుకైనా కానరాని ఈ శాంతి సామ్రాజ్యంలో మనలాంటి కళాకారులు మనస్ఫూర్తిగా కళాసేవలో తరించగల అవకాశం ఉంది.

కళాకారునికి ఎక్కడైతే రాజాశ్రయం దొరుకుతుందో, ఎక్కడైతే  కళాకారులు అన్నవస్త్రాలకు కష్టపడక మనశ్శాంతిగా సంపూర్ణంగా కళారాధనలో నిమగ్నమౌతారో ఆ రాజ్యంలో సిరిసంపదలు విలసిల్లుతాయి. శారదాదేవి కొలువు తీరుతుంది. తిరుమలేశుని, విరూపాక్షుని సమానంగా అర్చిస్తూ హరిహరతత్వాన్ని ఆరాధించే రాయలవారు అనేక ఆలయాలు, కళామందిరాల నిర్మాణాలను తలపెట్టటం మనందరికీ తెలుసు.

మనలాంటి శిల్పులందరినీ పోషించి రాళ్ళల్లో రాగాలు పలికింపజేసే ప్రభువాయన.  మనందరం  ఐక్యభావనతో  ఈ  హంపీని  శిల్పారామంగా తీర్చిదిద్దుద్దాం.

నిన్ననే  తిమ్మరుసు  మహామంత్రి  నిర్మిస్తున్నవి,  సంకల్పిస్తున్నవి,  మరెన్నో వివరించారు. ఈ ఆలయాల సృష్టికి విశ్వకర్మ అబ్బురపడేట్లు మన ఉలులతో శిలలకు ప్రాణం పోయటానికి కంకణం కట్టుకోవాలి. ఏమంటారు?’’

శిల్పాచార్యుల సుదీర్ఘ గంభీర వాక్కుకు శిల్పులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వాళ్ళంతా ‘నభూతో న భవిష్యతి’ అన్నట్లు విజయనగర రాజధాని హంపీపట్టణాన్ని నిర్మిస్తున్న మయులా అన్నట్లున్నారు. ప్రతి ఒక్కరి మనసుల్లో సంకల్పదీక్ష, నేత్రాల్లో కళాకాంక్ష ద్యోతకమవుతున్నాయి.

శిల్పాచార్యులు మళ్ళీ కొనసాగించారు.

‘‘రంగమండపం పూర్తయింది. ఇంకా విరూపాక్ష దేవాలయ కళ్యాణమండపం, మహాగోపురం పూర్తికావాలి. కృష్ణస్వామి ఆలయం, హజారా రామాలయం, నాగలాపురంలోని విఠోభా ఆలయానికి కళాకృతుల బాధ్యతను నరహరివర్మకు అతని శిష్యులకు అప్పగిస్తున్నాను.’

నరహరివర్మ లేచి శిల్పాచార్యునికి కృతజ్ఞతగా వందనం చేశాడు.

మహోన్నత శిలపై తలపెట్టిన ఉగ్ర నరసింహమూర్తిని రామప్పే తీర్చిదిద్దాలి.

కాళహస్తిలో నూరుస్తంభాల మండపాన్ని, గోపురాన్ని చిన్నప్పకు అప్పగించాం.

చిదంబరంలో ఉత్తర గోపురాన్ని వరదయ్య పూర్తిచేస్తాడు.

శ్రీకృష్ణదేవరాయల ప్రభువు తిరుమల శ్రీ వేంకటేశుని గుడిముంగిట నిర్మింప తలపెట్టిన వేయిస్తంభాలమండపం, గర్భగుడి, వినాయక రథం, మూలగోపురం, వీటన్నిటి నిర్మాణం పూర్తి కావస్తున్నది. అక్కడ అత్యద్భుత కళాకృతుల పర్యవేక్షణ స్వయంగా మేమే చేస్తున్నాం.

శ్రీశైలంలో మండపం, గోపురం మల్లయ్య చూస్తాడు.

అరుణాచలంలో వేయిస్తంభాల మండపం, పదకొండు అంతస్తుల గోపురాన్ని శివన్న దగ్గరుండి శిల్పీకరిస్తాడు.

శిల్పాచార్యుల వారి వింగడిరపుకు శిల్పులంతా హర్షాతిరేకాన్ని ప్రకటించారు.

‘‘కాలం ప్రవాహం వంటిది. విజయనగర సామ్రాజ్య శిల్పులు చరిత్రలో మహనీయులుగా నిలిచిపోయే సువర్ణవకాశం దక్కింది. ఇదంతా పంపావతి కృప. భావితరాలవాళ్ళు మనం తీర్చిన కళామందిరాలు చూసి పులకాంకితులు కావాలి. ఈ శిల్పారామ సౌందర్యదీప్తుల వల్ల రాయల వారి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోవాలి. హంపీలోని విఠలమందిరం, రాతిరథాలకు స్వయంగా మేమే

ఉలిసేవలను అందిస్తున్నాము. ఇంక మీరంతా వెళ్ళి మీమీ పనులలో నిమగ్నం కండి. మీకు కావలసిన ఏర్పాట్లు అన్నీ జరిగాయి’’ అని అందరికీ సెలవిచ్చి పంపాడు శిల్పాచార్యుడు.

అపర విష్ణువు అయిన శ్రీకృష్ణదేవరాయల కీర్తిచంద్రికలను యుగాల పాటు శాశ్వతం చేసే కార్యక్రమానికి ఇది నాంది. రాజ్యం ఎంత సంపన్నవంతమైనా కాలచరిత్రలో ఏది నిలుస్తుందో చెప్పలేం. కానీ హంపీ శిలలు పాడుతున్న ఆ శిల్పరాగం మాత్రం శాశ్వతంగా నిలుస్తుందని శిల్పాచార్యుడికి తెలుసు. దూరంగా ఎవరో బైరాగి ఏకతార మీటుతూ పాడుకుంటున్నాడు.

‘‘రాయి రాయి అంటూ

రాతలే రాసేవు

రాయి రాత తెలియుడయ్యా!

రాయిలోనే ఉంది

రాయల ఘనచరిత ` అది

రాత కందని కావ్యమయ్యా!

రాజ్యమంటూ రగిలి

కోటలన్నీ దాటి

ఏమి సాధించేవు నరుడా

ఎన్ని గెల్చిన గాని

పున్నెమే మిగిలేది

ఏనాటికైనాను నరుడా!’’

తత్వం పాడుకుంటూ బైరాగి వెళ్ళిపోతున్నాడు. అతడు విజయనగర సామ్రాజ్య కీర్తి కావ్యాన్ని లిఖిస్తున్న బ్రహ్మలా కన్పిస్తున్నాడు.

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

by Mala Kumar January 1, 2023
written by Mala Kumar
January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సీతాయణం…

by Ramesh January 1, 2023
written by Ramesh

నాజూకు అందాలసీతా స్వయంవరం
విల్లును ఎత్తలేక యువరాజుల కలవరం
చివరికి రాముని కరమున విరిగింది శివధనస్సు
చిరునవ్వుల మురిసింది సీతమనస్సు

మిధిలా నగరిని
అయోధ్యాపురిని
ముడివేసింది నవమి
మురిసిపోయింది పుడమి

అమాయక కన్నుల బిలబిలచూపులు
నవవధువు జానకి మిలమిల మెరుపులు
పుట్టినింట అప్పగింతల కన్నీళ్లు
మెట్టినింట సంతోషాల సవ్వళ్లు
ఆనందశోభన సంరంభం
శృంగారరసయోగ జీవనం ఆరంభం

కైకేయి తలలో కన్నపేగుఅనురాగం
ఇలలో భరతుని పట్టాభిషేకం
మాటతప్పని రాఘవుడు
అయోధ్య విడిచివెళ్లాడు అరణ్య వాసం

రామపాలన మిధ్య
ఇక అడవే భుమిజకు అయోధ్య
చెట్టుచేమలు, మూగ జీవుల మధ్య
వైదేహి వైవాహికజీవితం
అష్టకష్టాల కన్నీటి గీతం

సీత అందానికి లంకాపతి అల్లాడే నిలువెల్లా
మతిపోయిన పదితలల రావణుడు
వేశాడు బంగురు లేడి వల
చెదిరింది సీతమ్మకల
సీతాపహరణంతో శ్రీరాముడే విలవిల

భర్త దూరమై భగ్నహృదయంతో
అశోకవనంలో ఆగని శోకం సీత
కలలుగన్న కాపురం
కమ్ముకున్నది గడ్డుకాలం
ఐనా వీడలేదు విభుని పై విశ్వాసం

హనుమంతుని నిండైన స్వామి భక్తి
వానరసేనల యుక్తి,ఉడతభక్తి
వానరచెలిమికి ఉప్పొంగిపోయే దాశరథి
నిర్మించెను లంక పై ఘన వారధి

దశరధపుత్రుడి సమర శంఖాపూరణం
తిరుగులేదు రామబాణం
నేలచూపేసింది రావణ అహం
లంకలో దశకంఠుని అంతం

అడవిలో అవనిజ పైవివక్ష
అనుమానంతో నిలువునా అగ్నిపరీక్ష
కాల్చి తేల్చింది అంగారం
సీతమ్మతల్లి మేలిమిబంగారం

అయోధ్యపురిలో రామ పట్టాభిషేకం
పులకించే అయోధ్య ప్రజానీకం
నాలుగు పాదాల పై ధర్మం
నడిచి తెలిపింది మనుగడ మర్మం

నెలలు నిండిన జానకి
ఎల్లలులేవు ఆనందానికి
రాముని మనసు కల్లోలం చాకలి నిందకి
నిండు చూలాలు లక్ష్మణుడితో నడిచే నట్టడవికి

సీత వాల్మీకి ముని ఆశ్రమంలో
ధరణిజ మరల రాముడు లేని వనవాసంలో
కుశలవుల జననంతో మురిసింది సీతమ్మతల్లి
ఆనందవర్షం కురిసి పులకించే పుడమితల్లి

సీతలేని రాముడు అయోధ్యలో
రాకుమారులు మునిఆశ్రమం లో
తండ్రికి,తనయులు దూరం
తుదకు తీరింది తల్లి దుఃఖ భారం

పరీక్షించిన పాడుకాలానికి
తల్లడిల్లిన సీతమ్మతల్లి
అమ్మ( భూమి) ఒడిని చేరింది మళ్లీ
తండ్రితనయులకు మిగిలింది నిట్టూర్పు
కాలానికి ఇది సీతా తీర్పు
రామాయణంలోఇది సీతాయణం.

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తొలి దళిత చారిత్రక నవల హేళావతి

by Butam Mutyalu January 1, 2023
written by Butam Mutyalu

దళిత అస్తిత్వ చారిత్రక తొలి దళిత నవల ‘హేలా వతి”. నిచ్చెనమెట్ల కుల సమాజంలో చరిత్రయవనిక పై తొలి దళిత నవల ‘హేలావతి’. రచ యిత ఉద్దేశం మత మార్పిడులు నివారిం చాలన్నది ఒకటైతే, హిందు మతంలోని లొసుగులను ఎత్తి చూపుతూనే సంస్కరణకు పూనుకున్న రచయిత తల్లా ప్రగడ సూర్య నారాయణ రావు. ఈ నవల కథా గమనాన్ని పరిశీలించే ముందు అప్పటి కాలాన్ని ప్రదేశాన్ని గమనంలోకి తీసుకోవాలి.

అప్పుడే నవల యొక్క విశిష్టత అవగతమ వుతుంది. మొఘల్ చక్రవర్తి బాబర్ కుమారుడు హుమాయూన్‌ను కాపాడిన వీరబలుని (మాల) కూతురే హేలావతి. ఆమె పెరిగి పెద్దదయి ఇస్లాం మతం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను రచయిత నాటకీయ ఫక్కీలో నాటి గ్రాంధిక భాషలో రాశాడు. వీర బలుడు కుటుంబం మతం మారడానికి కారణం. అంటరా నివారుగా నీచకులస్తులుగా హిందు మతంలో వారుపడిన కష్టాలు, కటిక పేదరికం, ఊరికి దూరంగా ఉండడం, బ్రాహ్మణులు ఎదురైతే తొలగిపోవడం, లేకుండే వారు విధించే శిక్షకు గురికావడం జరుగుతుండేది. ఆకలికి తాళలేక అడవిలోని గడ్డలు తవ్వుకొని తిని బతికే బతుక్కంటే మరణమే మేలని ఎదురు చూచే బతుకు ఎందులకు అని తలపోసేవారు.

రీసెంట్ గా (10సం) కింద విశాలాంధ్ర వారు బుక్ ప్రింట్ చేశారు

హిందూ మతం కల్పించిన పుట్టుక కారణంగా మాలవాడైన వీరబలుని కుటుంబం పనిలేక తినడానికి తిండిలేక మరణావస్థకు చేరుకుంటుంది. ఆ సమయంలో శత్రువు చేతిలో ఓడిపోయి పలాయనం చిత్తగించి ప్రాణాలు అరచేతపట్టుకొని మొఘల్ చక్రవర్తి హుమాయూన్ పారిపోతుండగా నది అడ్డుగా వస్తుంది. నదిని దాటే క్రమంలో రాజు ఆ ఏటిలోపడి స్పృహతప్పి పడిపోగా అక్కడ కంద గడ్డలకై ఏటి ఒడ్డున తిరుగాడుతున్న వీరబలుడు చక్రవర్తిని కాపాడుతాడు. అతను చక్రవర్తిఅని ఎరుగడు. హుమాయూన్ వలన అతనికి అతని కుటుంబానికి తినడానికి తిండి దొరుకుతుంది.
కొన్నిరోజులు అకడే ఉన్న చక్రవర్తి వెళ్లే సమయంలో చక్రవర్తి ప్రాణాలు దక్కించిన వీరబలునికి కృతజ్ఞతగా కొంత ధనం ఇచ్చి పోతాడు.

వీరబలుడు ఆర్థికంగా నిలదొక్కుకుని ధనవంతుడు అవుతాడు. కానీ, కులంలో మార్పు ఉండదు. అతని కూతురైన హేలావతి బాల్యం నుండి అతి సుందరవతి. బాల్యవివాహాలు జరిగే కాలంలో కూతురు పెళ్లికి నచ్చినవాడు దొరకక ఆందోళన చెందుతారు. కానీ, ఆమెను అమితంగా గౌతముడు ప్రేమిస్తాడు. హేలావతికి తన కులం, హిందూమతం కారణంగా తను పుట్టిన మాల కులంపైన తన జాతికి పేరు లేని వర్ణం రుద్దిన హిందూ మతంపైన అసహ్యం కలిగి ఆమె మతం మారి మరొక మతస్థుని పెళ్లాడాలనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఏటి జలగండం కలగగా, అప్పుడు గౌతముడు ఆమెకు బదులు తన ప్రాణాలు అర్పించి తన ప్రేమను చాటుకొని ఏటి మొసలికి బలవుతాడు.
గౌతముడు త్యాగానికి గుర్తుగా నిలుస్తాడు. ఆమె ఆయనను తలచుకుంటూ విచారమొందుతూ నిద్రలోకి జారుకుంటుంది. ఆనాడు తెల్లవారుజామున ఆమెకు ఒక కల వస్తది. ఆ కలలో ఆమె తన చుట్టూ పరిచారికలతో అంతఃపురకాంతలతో ఉన్నట్టు వచ్చిన కలను తల్లికి చెబుతుంది. అదే సమయంలో వారుండే చోటుకి దగ్గరలో కొండపై సోదెకత్తె శివశక్తి ఉంటుంది. సోదెకత్తెను భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకొని తల్లిదండ్రులతో ఢిల్లీ చేరుకొని అక్కడ హుమాయూన్ చక్రవర్తి మంత్రి కుమారుడి ప్రేమలో పడి చివరకు హిందూ మతాన్ని వీడి ఇస్లాం మతం స్వీకరించి అతడిని పెళ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

మొఘల్ చక్రవర్తిగా హుమాయూన్ ఉండగా, ఢిల్లీ పురవీధులలో హేలావతి తండ్రి వీరబలుడిని పాదుషా కౌగిలించుకొని అతడు తనకు చేసిన ఉపకారానికి రుణగ్రస్థుడై మాలడైన వీరబలుడిచే మత మార్పిడి చేయించి అతనికి సామంతుని హోదా కల్పించడం ద్వారా పంచముల గుణశీలములు వారి పరాక్రమములు చరిత్రలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి. 15వ శతాబ్దిగాథను ( యదార్ధ కథ)ను వందేళ్ల క్రితమే మన ముందుంచి యావత్తు దళితులకు గొప్ప మేలు చేశారు రచయిత.

  • భూతం ముత్యాలు
January 1, 2023 0 comment
2 FacebookTwitterPinterestEmail
కథలు

డియర్ ఫ్రెండ్

by Nandiraju padmalata January 1, 2023
written by Nandiraju padmalata


“హాయ్ అప్పూ…!”
“ఏంటే దివ్యా? గుర్తున్నానా అసలు? ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? పదిసార్లు ఫోన్లు, వాట్సాప్ మెస్సేజీలు. ఊహూ…! ఒక్కదానికీ జవాబివ్వలేదు. రెండేళ్లయింది! ఏమయ్యావే నువ్వూ ?”
“తీరిగ్గా మాట్లాడదామని ఊరుకున్నా…! ఇన్నాళ్ళకి దొరికింది తీరిక. గుర్గావ్ లో ఉన్నానే! నువ్వు?”
“నీకేమ్మా? ఎం టెక్ పూర్తి కాకుండానే క్యాంపస్ లో వచ్చింది, ఆ తర్వాత మంచి ఎమ్మెన్సీలోనూ కొట్టావు జాబ్. మేమేముందీ…? ఉన్న ఊళ్ళోనే చిన్న ఉద్యోగం. చెప్పు. చెప్పు…! కొత్త వార్తలేంటే?”
“అప్పూ…అది చెబుదామని ఫోన్ చేసానే! జాబ్ చాలా బావుంది. డేటా సైన్స్ మీద. మంచి హైక్ కూడా ఇచ్చారు. నేనో విషయం చెప్తానే అప్పూ….ఎవరికీ చెప్పకు! గుర్గావ్ లో నేను లివిన్ రిలేషన్లో … అదేనే, సహజీవనం. నా డేట్ సంజయ్ అని, జార్ఖండ్ అబ్బాయి. మంచోడు. పడి చస్తాడు నేనంటే…!”
“అమ్మో….! మీ ఇంట్లో తెలుసా దివ్యా?”
“నీ మొహం! ‘నీ ఒక్కదానికే చెప్తున్నా’ అన్నాను కదే…! మా ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో లేదో తేలనీ….అప్పుడు చెప్తా ఇంట్లో…! అయినా మా అమ్మా నాన్న ఒట్టి పాతకాలపు మనుషులు. ఒప్పుకోరు.. అఫ్ కోర్స్ ! నేను నా ఇష్టప్రకారమే చేసుకుంటాననుకో!”
“అయ్యో…! ఇదేంటే బాబూ..? ఖర్మ కాలి, కొంప మునుగుతే?”
“.నువ్వెక్కడ దొరికావే అప్పూ? ఏ కాలంలో ఉన్నావ్? జాగ్రత్త పడుతున్నాలే ..! ఊ…..నీ సంగతేంటి? “
“నాకేముంటాయ్ విషయాలు? పెళ్ళికొడుకు హంట్ లో ఉన్నారు అమ్మానాన్నా..”
“ఏంటి? ఇంకా ఎవరూ ప్రొపోజ్ చేయలేదా అప్పూ….? నిజం చెప్పు!”
“అంత సీన్ లేదులే ఈ జన్మకి . ‘ఏమంత అందాలు కలవనీ? వస్తాడు నిన్ను వలచీ? ఏమంత సిరి ఉంది నీకనీ వచ్చేను నిన్ను తలచీ? చదువా! పదవా! ఏముంది నీకు? సడి చేయకే వెర్రి మనసా?’ వేటూరి సుందర్రామ్మూర్తి గారు నా గురించే రాసుంటారనుకుంటా! చెప్పు..చెప్పు…! నువ్వే చెప్పవే సంజయ్ గురించి!“
“హి ఈజ్ ఏ గుడ్ గై…పాపం! ఈ కరోనా గోలతో, తన జాబ్ పోయింది. ఏడాది నుంచీ, నా జీతంతోనే బ్రతుకుతున్నాం. . వాడు ఆర్కిటెక్ట్ లే! జీతాలు బాగానే వస్తాయి కానీ, పోస్ట్స్ తక్కువగా ఉంటాయి. చాలా ట్రై చేస్తున్నాడు జాబ్ కోసం.”
‘మరి! వాళ్ళ వాళ్లకి తెలుసా దివ్యా? వాళ్ళొప్పుకుంటారా మీ పెళ్ళికి?”
“ఛస్తే ఒప్పుకోరు. ఇంకా, పాత కాలంలాగా మాట్లాడతావేంటి అప్పూ…వి ఆర్ మేజర్స్. చదువుకుని, ఇండిపెండెంట్ గా ఉద్యోగాలు చేసి సంపాదిస్తూ కూడా, అమ్మకి నాన్నకీ, తాతలకీ, అవ్వలకీ భయపడుతూ కూర్చోవడమేంటే…? రబ్బిష్. మా ఇద్దరికీ ఆ భయమేం లేదులే! అందుకే, ముందు మేం ఒకళ్ళకి ఒకళ్ళం సెట్ అయితే, అప్పుడు, పెళ్లి చేసుకుని చెప్పేస్తాం ఇద్దరి వైపు పెద్దవాళ్ళకి.”
“సెట్ అవకపోతే?”
“కోయీ ధిక్కత్ నై ! బ్రేకప్ …! అంతే….! లోకం చాలా పెద్దది…వీడు కాకపొతే మరోడు….!”
“అలా ఎన్నాళ్ళు?”
” తగిన వాడు దొరికేదాకా…..! నాకేం తక్కువే? అందం, చదువు, ఉద్యోగం, ఎట్రాక్టివ్ ఫిజిక్…తోక ఊపుకుంటూ వస్తాడెవడైనా…. హ…హ…హా…!”
“దివ్యా….! అలా నవ్వకే బాబూ…! నాకు భయమేస్తోంది. జీవితంలో ఎన్నిసార్లని ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తావు? మగాడికేం? దులిపేసుకుని వెళ్ళిపోతాడు. మనం అలా కాదు కదే సిరీ…..! మన శరీరమేమైనా డబుల్ కాట్ బెడ్డో, సోఫా సెట్టో కాదు కదా, పాతది మార్చి కొత్తది కొనడానికి? అసలు పెళ్ళీ వద్దు, పిల్లలూ వద్దు అనుకుంటే సరే గానీ, కావాలి అనుకుంటే అప్పుడెలా? నీలాగే లివిన్లు, బ్రేకప్స్ అయినవాడే దొరికి, తీరా పెళ్లి చేసుకున్నాక వాడు నిన్నొదిలేసి వెళ్ళిపోతే? నీకు పిల్లల్ని కనే వయసు దాటిపోతే?”
“పోనీ….!”
” అప్పటికే పిల్లలు పుట్టి ఉంటే?”
“పుట్టరు.”
“ఒకవేళ పుడితే? అదే……. పొరపాటో, గ్రహపాటో కావచ్చు…అప్పుడెలాగే?”
“ఏ పాటు పడో వదుల్చుకుంటాను. అయినా, అలా జరగదు!”
“ఏమో…? నీకే…అమ్మనవాలని ఆశ పుట్టిందనుకో! నువ్వే అనేదానివి కదా, ‘ఒపీనియన్స్ వుడ్ ఆల్వేస్ ఛేoజ్’ అని. అలా జరిగితేనో?”
“అబ్బా….! అప్పూ డార్లింగ్….! నా పిల్లలు కదా వాళ్ళు…! నా లాగే లిబరేటెడ్ సోల్స్ లాగా బ్రతుకుతారు. సరేనా…సతీ సావిత్రీ ?”
” కానీ….వాళ్ళు బ్రతకబోయే ప్రపంచం లిబరేట్ అవలేదు దివ్యా! నీ అంత ఇంటెలిజెంట్ని కాదు గానీ, పెళ్లి అనేది మన ఆడవాళ్ళకి పెద్ద భద్రత. చాలా బాధ్యతలని మనం భర్త మీద పెట్టేయొచ్చు. పెళ్లయిన ఆడవాళ్ళ మీద సొసైటీ కి గౌరవం, నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు. వాళ్ళు ఏ ఒత్తిడి లేకుండా పెరుగుతారు. నువ్వు అనొచ్చు, ‘పెళ్లి ఒక కాంట్రాక్టు, సర్దుకుపోయి బ్రతకాలి’ అని. కానీ, ఆలోచించవే! ఈ సంజయ్ గానీ, మరోడు కానీ నీకు సంపాదన లేని రోజున, నీ ఆరోగ్యం పాడైన రోజున నీకు తోడుంటాడని చెప్పగలవా? ఇప్పుడున్న అందం, వయసు పెరిగాక ఉండదు కదే…? మరో విషయం కూడా కూల్ గా ఆలోచించవే! ఈ సంజయ్ తో బ్రేక్ అప్ అయిపోయాక మరో అజయో, విజయో దొరక్కపోడు నీకు. కానీ, అతగాడికి నీలాంటి దివ్యలతో అప్పటికే బ్రేకప్ అయిపోయి, ఒకటో, రెండో ఇష్యూస్ ఉండి వుంటే, అది మరో తలనొప్పి కదే! కట్టుకోక పోయినా, తన బిడ్డల తల్లి పట్ల అతనికి బాధ్యత ఉంటుంది కదా! అప్పుడెలా? అప్పుడెలాగే దివ్యా? నీ స్టేటస్ ఎప్పటికీ మిస్ట్రెసే! చూడు…! పెళ్లి అనేది ఒక బంధం. నువ్వు బంధనం అన్నా నాకేం బాధ లేదనుకో. నూరు శాతం సుఖం ఉంటుందనను, కానీ, ఎక్కడో తప్ప, అభద్రత ఉండదు. మనకి మన తల్లిదండ్రులు, అత్తమామలు తోడుగా ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరికీ ఒక కమిట్మెంట్ ఉంటుంది. అసలు, పెళ్లి అంటూ ఒకటయిపోతే, ‘అమ్మయ్య ఓ పనయిపోయింది బాబూ’ అనుకోవచ్చు.!……. ఏయ్ దివ్యా? ఏంటి మాట్లాడట్లేదు…?ఉన్నావా!.సుత్తి కొడుతున్నానని ఫోను పెట్టేశావా? .”
“నో…వింటున్నా….! ఆలోచిస్తున్నానే అపూర్వా!”
” సారీ దివ్యా …! బాధపెట్టినట్లున్నా….!”
“కాదు…! ఆలోచనలోకి నెట్టావు. నిజానికి నేను నీకు ఫోన్ చేసింది, ‘నేను హైదరాబాద్ కి రిలొకేట్ అవుతున్నాను, ఒక ఫ్లాట్ చూసి పెట్టు’ అని అడుగుదామని. నీ మాటల వలన నన్ను నేను రివైవ్ చేసుకోవాలేమో అనిపిస్తోంది. భయపడడం లేదులే గానీ, జాగ్రత్త పడాలేమో! ఏమోనే! అయామ్ కన్ఫ్యూజ్డ్ నౌ .”
” నిన్ను అలజడికి గురి చేసినందుకు ‘సారీ’ మరో సారి! నీ కోసం తప్పకుండా మా కమ్యూనిటీ లోనే ఫ్లాట్ చూస్తానే! నిన్ను బాధ పెట్టానేమో!”
” కాదులే….! నేనంటే ఏంటో, నాకేం కావాలో నిర్ణయించుకోవాలని, త్వరగా సంజయ్ తో కొన్ని విషయాలు క్లియర్ చేసుకోవాలని అనిపిస్తోందిప్పుడు. థాంక్ యు అప్పూ …! మళ్ళీ చేస్తా నీకు ఫోన్.”
***

” హల్లో…!అమ్మా….!అపూర్వా…! మా దివ్య..మాట్లాడిందామ్మా? నీ మీద చాలా పెద్ద భారం పెట్టానమ్మా!”

“అంకుల్…ఒక ఫాదర్ గా మీ భయం తెలుసు నాకు. దాని టెన్త్ క్లాస్ నుంచీ అమ్మా, నాన్నా మీరే అయి దివ్యని ఎంత గారాబంగా పెంచారో కూడా నాకు తెలియనిది కాదు. కానీ మీ నుంచి తాను దాచిన ఇంత ముఖ్యమైన విషయాన్ని, అదే …. తన ఎఫైర్ గురించి మీకు తెలిసినా , తనతో నేరుగా మాట్లాడకుండా, నాతో డిస్కస్ చేసిన కారణం అర్థమయింది. తన మనసు బాధ పడడం మీరు భరించలేరు. తొందరపడి తప్పటడుగు వేయకుండా మనసుకు నచ్చిన వ్యక్తితో మీ అమ్మాయి సుఖంగా వైవాహిక జీవితం గడపాలన్న మీ ఆరాటమూ తెలిసింది. నా ప్రయత్నం నేను చేశాను అంకుల్. దివ్య చాలా తెలివైనది. ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనే నా నమ్మకం. “
” నా ఆశ అదే…! దివ్యమ్మ బావుండాలి. సంతోషంగా ఉండాలి. యోగ్యుడైన వాడిని తనే ఎంచుకుని ‘నాన్నా! నేనితన్ని ప్రేమించాన’ని అంటే నిరభ్యంతరంగా పెళ్లి చేస్తాను. కల్లబొల్లి మాటలకు లొంగిపోయే అమ్మాయిల్ని సర్వ నాశనం చేస్తున్న కిరాతకుల్ని, చూస్తున్నాం కదా మీడియా లో..! అందుకే…!భయమేస్తోంది. థాంక్యూ తల్లీ…!గాడ్ బ్లెస్ యు!”
“ థాంక్యూ అంకుల్ . నేను దివ్యతో టచ్ లోనే ఉంటాను. మీరు దిగులు పడొద్దు. బై అంకుల్…”

సరిగ్గా పదిహేను రోజుల తర్వాత, అపూర్వ కి దివ్య నుంచీ వచ్చిన ఫోన్ కాల్,
“ అప్పూ…!డియర్ ఫ్రెండ్….!శుభవార్త. సంజయ్ కి కూడా హైదరాబాద్ లో ప్లేస్ మెంట్ వచ్చింది. మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మేం చర్చించుకున్నాం. తర్వాత ఇద్దరం జంషెడ్ పూర్ వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించాం. ఇంక మా నాన్నతో మాట్లాడాలి. విష్ మీ ఆల్ ద బెస్ట్.”
“ అంతా మంచే జరుగుతుంది…అప్పూ…! మరో వసతి అవసరమేమిటి నీకు? మీ నాన్నగారు నీకోసం బుక్ చేసిన అపార్ట్ మెంట్ సిద్ధంగా ఉండగా….? తొరగా వచ్చెయ్యి….ఆల్ ది వెరీ వెరీ బెస్ట్!”

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

రంగు వెలసిన చిలుక

by Arutla Sridevi October 10, 2022
written by Arutla Sridevi

ఒక చిలుక అల్లనేరేడు చెట్టుపై పండ్లు తింటూ ఓ కొమ్మపై కూర్చుంది. ఇంతలో ఒక సాధువు ఆ చెట్టు కిందికి వచ్చి తన శిష్యులతో తీర్థ యాత్ర స్థల విశేషాల గూరి చర్చిస్తున్నాడు. ఆ సాధువు శిష్యులతో పాటు కొమ్మమీద చిలుక కూడా ఆ యాత్ర విశేషాలను వింటున్నరు. ఆ చర్చలో మానస సరోవరం గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ చర్చంతా విన్న చిలుక తెల్లవారు ఝామున్నే లేచి భగవంతుడికి దండం పెట్టుకొని మానస సరోవర యాత్రకు బయలుదేరింది.

చిలుక ఎగురుతూ ఎగురుతూ అలిసిపోయినప్పుడల్లా కొంత విశ్రాంతి తీసుకుంటూ మొత్తానికి మానస సరోవరం చేరింది. ఆ సరోవరంలోని నీళ్లు తళతళ మెరుస్తున్నాయి. అంత స్వచ్ఛమైన నీళ్లను అది ఇదివరకటి కెన్నడు చూడలేదు. అది ఆశ్చర్యంలో నుండి తేరుకోకమునుపే, మరింత ఆశ్చర్యాన్ని గొలిపే హంసలు దానికి కనిపించాయి. అవి తెల్లటి ముత్యాల రాసుల లాగ ఉ న్నాయి. చిలుక వాటి దగ్గరగా చేరి మీరెవరని ప్రశ్నించింది. మేము హంసలమని చెప్పాయనిం మిరెప్పట్నుంచి ఇక్కడుంటున్నారని అడిగింది చిలుక మేము పుట్టినప్పటి నుండి ఇక్కడ ంటున్నామని చెప్పాయవి. చిలుకకు హంసల లాగ తానూ తెల్లగా మారాలని అనిపించింది. అందుకు చిలుక బాగా ఆలోచించి ఈ శరీరాన్ని ఈ సరోవరంలో బాగా నానబెడితే నేను తెల్లగా అవుతానని సరోవరంలో మునిగింది. కానీ కొంత సేపటికే ఊపిరాడక కొన ఊపిరితో మునిగిపోసాగింది. ప్రమాదాన్ని గమనించిన హంసలు ఎట్లనో అట్ల దాన్ని రక్షించాయి. హంసలు చిలుకతో హితవు పలికాయి. “ఒసే చిలుకా ప్రకృతిలో ఎవరి రంగువారిదే దేని అందం దాని ఇప్పుడు నీ రంగుకేమయిందని ఈ ఉబలాటం” అన్నాయి హంసలు. జలుబుతో పడిసు పట్టి దగ్గుతున్న చిలుకకు ఒక హంస కరక్కాయ తెచ్చిచ్చింది. అది తిన్న చిలుక ఒక రెండి మూడు రోజుల్లో బాగా కోలుకుని తన ఇంటికి తిరుగు ప్రయాణమయింది.

తన నివాసమైన అల్లనేరేడు చెట్టుపై కూర్చున్న చిలుకకు మనసులో మనసులేదు. ఎక్స్ సరే తాను తెల్లగా మారాలన్న కోరికను అది అణచివేసుకోలేకపోతుంది. అక్కడికి ఒక మీటరు దూరంలో చిత్రావనంలో ఉన్న చింత చెట్టుపై కొంగాదేవి ఒక బ్యూటీ పార్లర్ నడిపిస్తు చిలుకకు ఈ విషయం తెలిసింది. అది వెంటనే కొంగదేవి దగ్గరకు వెళ్లి తెల్లరంగులోకి మా

లతను తెలిపింది. అసలే గిరాకీ తక తరంగాలను ఉత్సాహంగా చిలుకను రంగులోకి మార్చే ప్రక్రియకు అనుకుంది. అక్కడి బ్యూటివారలకు అలంకరించి తెల్లగా, చక్కగా పాలుగా ఉన్న బాతుల, కొంగల చిత్రపటాలు చూసిన చిలుకకు కాంగాదేవి తనను తప్పక అందంగా తీరి దిద్దుతామన్న నమ్మకం కుదిరింది.

కొంగాదేవి ప్రక్కనే ఉన్న పసుపుతోట నరనే ఆరబోసిన పసుపు కొమ్ము తెచ్చి ముత్యం పొడిచి, పొడిచి దానిలో నుండి రసం తీసి చిలుకకు బాగా పూసింది. అయితే ఆ వనువు తోట

వసువులు బడ పట్టకుండా ఒక విషపూరితమైన మందు చల్లుడు. ఈ విషయం కొంగాదేవికి అయడు. అంత సపటి తర్వాత పక్కనే ఉన్న చెలువులో స్నానం చేసిరమ్మని చిలుకకు కొంగాదేవి చెప్పింది. అలాగే స్నానం చేసి వచ్చింది చిలుక, పక్కనే బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని భయపడిపోయింది చిలుక. ఎందుకంటే చిలుక తెల్లరంగుకు మారకపోగా ఉన్న ఈకలు కూడా ఉండిపోయాయి. చిలుక లబోదిబో మొత్తుకుంటూ డా॥ “గద్ద” గారి దగ్గరకు వెళ్లింది. డా॥ ఉంది” గారు చిలుకను బాగా పరిశీలించి నీకు స్కిన్ థెరఫీ చేయాలి అందుకు బాగా ఖర్చవుతుంది. ఎంతలేదన్నా నువ్వు నెలకు సరిపడా తినే పండ్లు మొత్తం నాకు తెచ్చివ్పాలి అన్నది. చిలుక శరీరపు మంటకు ఓర్చుకోలేక “గద్ద” తో “సరే” అని ఒప్పుకున్నది. డా|| “గద్ద” ట్రీట్మెంట్

మొదలు పెట్టింది. గద్ద దగ్గరలో గల పట్టణానికి వెళ్లింది. అక్కడ ఒక భవనానికి రంగులు వేస్తుంటే దానికి ఆకుపచ్చరంగు కనిపించింది. వెంటనే ఆ ఆకుపచ్చరంగు తెట్టి చిలుకకు బాగా పూసింది. చిలుక మళ్లీ బావి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఎంతో మురిసిపోయింది తిరిగి తన నివాసమైన అల్లనేరేడు చెట్టు దగ్గరకు వచ్చింది.

పక్క చెట్టుపైన ఏదో కోలాహలం అదేమిటని తెలుసుకుంది. చిలుక, కోకిలమ్మ గానసభ అట. అన్ని పక్షులతో పాటు చిలుక కూడా గాన సభకు పోయి కూర్చుంది. కోకిల గానం

మొదలయింది. అందరు మైమరిచి గానం వింటున్నారు. అందరు కోకిలను బుగా మెచ్చుకున్నాడు కానీ చిలుకకు మాత్రం కోకిలపై ఈర్ష్య కలిగింది. పు. గొంతు బాగుంటే చాలునా నాలాగా నీతో

అందమా, చందమా ! నల్లగా ఎట్లున్నావు నువ్వు అబ్బ బీ.. ఛీ.. నాకసలు నీ దగ్గరే ఉండబుట్టి కావడం లేదు అంటూ కోకిలను అవమానపరిచింది. పాపం కోకిల చిన్నబోయింది ఇంతలో కాలివానలతో కూడిన వర్షం పడింది. ఆ వర్షంలో చిలుకకు పూసిన రంగు రాస్తపోయిం! “టు సచ్చగా కాక, ఇటు నల్లగా కాక అసహ్యంగా ఈ కలూడిపోయిన దాని చర్మ సొందరా చూసి పక్షులన్ని పకపక నవ్వాయి. తానెప్పుడూ అలా ఇతరులను అవమానించకూడు రయించుకున్న చిలుక శివుని ధ్యానించడానికి హిమాలయాలు కొన్ని రోజులు వెళ్ళింది.

October 10, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

జీవితం ఒక నిట్టూర్పు

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు October 6, 2022
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

నీలాకాశం…. చుక్కల కలలు

ఎగిసిపడే సెలయేటి తరగలు

అద్దంలో చందమామ

జోలపాటలతో విరుస్తున్న

మొలకనవ్వుల నిదుర

జీవితం ఎంత సుందరం?

ఎదలో ఏవో తెలియని తుమ్మెదలు

ఆకుపచ్చని పాటల విందులు

స్వప్నాలు… పరిష్వంగాలు

ఒక్కసారి మోగుతున్న కోటి వీణలు

జీవితం ఎంత సుందరం?

వెలుగును చీకటిగా చీకటిని

వెలుగుగా చిత్రించే పెదాలు

అధరాలకు వేలాడే ప్రభాతాలు

నగరీకరించబడే పసిపల్లెలు

జీవితం ఎంత వంచన?

రెండు గాళ్లకు మరొకటి…

వదలివేసిన స్టేయిరిక్ దీపాలు

చుట్టుముడుతున్న అజ్ఞాత బీభత్సం

అశాంతి అవమానాలతో

నిస్సహాయ సహగమనం

జీవితం ఎంత విషాదం?

చివరికి ఏమయింది?….

విప్లవ శంఖం మూగవోయింది.

అక్షర తపస్సు కొట్టుకొనిపోయింది

అధికారపు అహంకారం పెనవేసుకున్న బతుకు

కందెన లేని గీరె అయింది

ఇక జీవితమే ఒక నిట్టూర్పు

  • డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు, 9676096614

Life Is a Sigh!

Blue sky, stars dreams
Soaring ripples of rill
Moon in the mirror
Slumber of sprouting smiles 
being blown by lullabies.
How charming is life!
Some unknown bumblebees in heart
Feasts of verdant songs
Dreams, embraces
Lakhs of lutes 
ringing simultaneously.
How beautiful is life!
Lips depicting light as darkness; 
darkness drawing the picture of light.
Dawns dangling from lips; 
small villages turning into towns.
How deceitful is life!
Walking stick joined two legs; 
steric lights are abandoned.
Unknown terror all around!
Walking helplessly 
along with disquiet, disrespect.
 How tragic is life!
What is the end result?
The conch of revolution 
has fallen silent.
The penance of syllables 
got swept away.
The life entwined with 
hauteur of authority became
a cartwheel sans grease.
Now, life is but a sigh!

Origin (Telugu): Dr. Kanchanapalli Govardhan Raju
Translation: Elenaaga

a

October 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ప్రమీల ధైర్యం

by ఆచార్య మస‌న‌ October 6, 2022
written by ఆచార్య మస‌న‌

ప్రమీల కథావాహిని యధార్థమైన కథ

అర్థరాత్రి దాటుతున్న సమయం.

డోరుమీద లాఠీ దెబ్బలు…. నేను అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాను. నా అర్థాంగి ప్రమీల అకస్మాత్తుగా లేచి డోరు తీసిఁది. కళ్ళముందు ఎర్రటోపీలు. ఎందుకొచ్చారని ప్రశ్నించింది ధైర్యంగా. అందుకు వారి సమాధానం భయం కలిగించేదిగా కాక వినయపూర్వకంగా వెలువడడం విశేషం. బహుశా ప్రమీల ఆకారాన్ని చూసి నమ్రతను ప్రదర్శించారని చెప్పవచ్చును.

“ఓయూలో రైడింగ్ జరుగుతోంది. హాస్టళ్ళలో నాన్ బోర్డర్లు ఎక్కువయ్యారు. మా నుంచి తప్పించుకుని ఒక బోర్డరు మీ ఇంట్లోకి ప్రవేశించినట్టు అనుమానం. అతడు ఒకవేళ ఇంట్లో ప్రవేశిస్తే మాకు అప్పజెప్పండి.”

“అబ్బే… ఏ విద్యార్థీ మా ఇంట్లోకి రాలేదు. మీరు వెళ్ళొచ్చు!” తలుపులు మూసి గదిలోకి వచ్చి నా పక్కన చేరింది. ఏదో అలికిడి అయి నేను నిద్రలేచాను. తన నోటి నుంచి “ఏమండి! మీకు తెలుసా?” అని ఏదో చెప్పబోయింది. భయంతో లేచి కూర్చున్నాను. ఆమె పాఠం బట్టీ పట్టిన పిల్లవాడిలా విషయాన్ని అప్పజెప్పింది.

మీరు ఈటూ (E2) హాస్టల్ కు వార్డెన్ గా ఉన్నారు కదా…. దానిమీద ఈ రోజు రైడింగ్ జరిగింది. నాన్ బోర్డర్లు తప్పించుకుని చెల్లా చెదురయ్యారు. పోలీసులు మాత్రం వెంటాడి కొందరిని పట్టుకున్నారు. అందులో విష్ణు అనే అబ్బాయి వాళ్ళ నుండి తప్పించుకున్నాడు.”

“అవును… నల్లగా, పొట్టిగా, అమ్మవారి మాన్చలతో చూడడానికి వికారంగా ఉండే విద్యార్థి విష్ణమూర్తి. అతడు ఏదో ప్రయివేటు కాలేజీలో ఎంబీఏ చేస్తున్నాడు. నగరంలో ఎక్కడా వసతి లేకపోవడంవల్లా, పేదరికంవలా్ల చాలామంది విద్యార్థుల్లాగే ఈటూ హాస్టల్ లోని ఒక గదిలో నాన్ బోర్డర్ గా ఉన్న విషయం నాకప్పటికి గుర్తుకు వచ్చింది.

“ఆ విష్ణమూర్తి ఇక్కడికి వచ్చాడా?”

“అవును…! అతడిప్పుడు మిద్దెమీద పడుకున్నాడు. అసలేం జరిగిందో వినండి. పోలీసులు రావడానికి ఒక అరగంట ముందు ఒక అబ్బాయి తలుపు తట్టాడు. మీ పేరు చెప్పాడు. పోలీసులు తరుముతున్నారని, ఇంట్లోకి రానివ్వండని కన్నీటి పర్యంతమయ్యాడు. వెంటనే నేను తలుపు తీసి గడియ వేశాను. “ఏమైనా తిన్నావా” అని అడిగాను. తిన్లేదన్నాడు. కొద్దిగా అన్నం ఉంటే పెట్టాను. చల్లతో భోజనం ముగించాడు. వెళ్ళిపోతావా అని అడిగాను. అమ్మా… చాప ఇస్తే మిద్దెమీద పడుకుంటానన్నాడు. ఇది నేను పోలీసులు రావడానికి ముందు చేసిన పని అని వివరించింది.

నా అర్థాంగి ధైర్యానికి నేనెంతో మురిసిపోయాను.

ఫలశ్రుతి: ఇప్పుడా విష్ణమూర్తి సెంట్రల్ గవర్నమెంటులో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. ఇది జరిగి ఇరవయ్యేళ్ళు కావస్తోంది. ఇప్పటికీ విష్ణమూర్తి ప్రతీ పండగకీ ఫోన్ చేస్తాడు. “అమ్మ బాగుందా” అని అడుగుతాడు.  ఇరవయ్యేళ్ళుగా నా ఆరోగ్యాన్ని, ప్రమీల ఆరోగ్యాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. మొన్న మే లో కూడా అతడు ఫోన్ చేసి అమ్మ బాగుందా అని అడిగాడు. అతని ఫోన్ కాల్ కు ముందే ప్రమీల పరలోకానికి చేరింది. విష్ణమూర్తి మరొక మాట మాట్లాడలేదు. మర్నాడు నా ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడో పంజాబ్ లో పనిచేస్తున్నవాడు ప్రమీల మరణవార్తను విని జీర్ణించుకోలేకపోయాడు. ఉన్నపాటున రైలెక్కి, మా ఇంటికి వచ్చాడు. అతనికి ఇంట్లో గోడమీద వేలాడుతున్న ప్రమీల ఫోటో నవ్వుతూ కనిపించింది. కానీ అతడు మాత్రం దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు.

October 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us