మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

విశాలంగా పారేదే కన్నీరు

by Chandaluri Narayana Rao September 28, 2022
written by Chandaluri Narayana Rao

ఏ పొద్దు చూసినా ఒకటే రద్దీ
ఏ గల్లీకి పోయినా అంతా తొక్కిడే.
నగరానికొచ్చిన”పల్లె “బతుకింతే.

వృత్తి కళ్ళకు గంతలు కట్టి
ఊరి దారికి గోడ కట్టి
కాని పనులు ముందు చేతులు కట్టుకొని,
చెప్పిన మాటవినే పనిముట్టును వదిలి పట్నం వచ్చిమీట నొక్కితే
తిరిగే యంత్రంగామారి ,
కాసులుకొట్టుకొచ్చే గాలానికి గాలమేసే
పచ్చకాగితల పిచ్చిలో బతుకు గాలివాటానికి ఎగిరే ఓ చిత్తు కాగితంలా ఎక్కడికో కొట్టుకుపోతుంది.

చిటికలో గల్లుమనే చిల్లరకు
రుచి మరిగిన ప్రాణాలకు
గడప దాటితే దిగులుగుండంలో
పడి మాడిపోతామనే బతుకు భయం
ఒకనాడు కష్టాన్ని నమ్మిన దేహమే
కపటాన్ని మోహించి అక్కడే మగ్గుతుంది.

ముక్కులు పగలే కంపుతో కాపురం
కుక్కిన ప్రత్తి బూరంలా
కొంపలో సూరీడు ఎప్పొడిచ్చాడో తెలియని కుములుడుకు
నీడ దుప్పటి కప్పిన వాలు పంచలతో…
మాగుడాసన మూగిన మురికికూపంలో
ఈగలతో కలసి
దోమలతో సహజీవనమే జీవితం.

నల్ల మబ్బు కనిపిస్తే చాలు
సందు గుండె గుల్లె.
ముసురు ముప్పు పట్టి
చినుకు చిందేతే
చుట్టూ చీకటి తడే
వీధులన్నీ గర్భందాల్చిన ప్రాజెక్టులే.
ఇళ్లన్నీ నీళ్లలో తేలాడే పడవలే.
వానొస్తే తడవని కళ్ళు లేవు.
తడపని బాధ లేదు.
గుడ్డి పొడి వెలుగులో
పొట్టను ముడుచుకొని
చెమట ఆవిరి చాలక నడిచే
బిక్కుబిక్కు మంటూ బతుకు బండి ఆగి
అంతా ఇరుకుమయం.

వీధి ఇరుకు-ఇల్లు ఇరుకు
పడక ఇరుకు-నిద్ర ఇరుకు
జీతం ఇరుకు-జీవితం ఇరుకు.
దారి పొడుగునా అన్ని ఇరుకులే.
విశాలమైనది దరిద్రమొక్కటే.
విశాలంగా పారేది కన్నీరొకటే.

..చందలూరి నారాయణరావు
          9704437247

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నీరు మింగిన నేల

by Giriprasad Chelamallu September 28, 2022
written by Giriprasad Chelamallu

———————–

 ప్రవహించిన నది

 పూర్తిగా కప్పేసింది నేలని

ఉప్పొంగిన నది స్థిరమై

కొండని కోనని ముంచేసింది

నది చుట్టూ వర్థిల్లిన  మనుగడ ను మట్టెట్టింది

గూగుల్ కి అందని గూడేలని సైతం గుటుక్కు మింగింది

నదిని ఆసరాగా చేసుకుని తీరాన ఆవాసాలు

ఒండ్రు మట్టి నేల ఆసరాగా ఆలంబన

తమదైన సంస్కృతి విరాజిల్లిన నేల

జంతు సావాసం లో ఎదిగిన మనిషి 

మునిగిన గుడిసెలో గతాన్ని నెమరు వేసుకుంటూ రేపటి కోసం ఆలోచనలో

ఎన్ని గుడిసెల్లోనో ఎన్ని బతుకుల్లోనో శోకాన్ని నింపిన నది

ఆవేశం ఆక్రోశం చల్లారి అడ్డుకట్టని సుతారంగా తాకుతుంది

వెనుకకు తిరిగి చూసుకుంటే తాను చేసిన విధ్వంసం తాలూకు మచ్చలు కానవస్తాయి

ఒక్కో చెట్టు ఎన్నేళ్ళ ప్రాయమో

యవ్వన దశలోని చెట్లు సైతం ఆయుస్సు గూడి గూడేల తో పాటు జల సమాధి

చెట్టు తో పాటు మీది గూడు మునిగితే తల్లడిల్లిన పిట్ట ప్రాణం

తమతో పాటు తమ కోసం పారిన నది నట్టేట ముంచుతుందని ఊహించని జీవ రాశులు

ఎంతటి మిత్ర ద్రోహం! మహా విషాదం!!

మనిషి అంతే.. తన సమూహంతో

ఓ తెగ ఓ జాతి వలస

అన్నీ కోల్పోయి ఇంకా ఎత్తైన కొండ మీదికి అదే చోటు

మైదానం రుచించదు

అవే విల్లులు అవే బాణాలు అదే వేట

ఆ అడవి లో దొరికేవే ఆహారం

ఇంకో చెట్టు కి పుట్ట కి మొక్కు

తనదైన బతుకు ఎవ్వరికీ హాని కలిగించక

అక్షరం లేక పోయినా తన తరపున గొంతులు విప్పారవని ఎరుగు

వెనుక ముంచి ముందుకు సాగేకాలువల్లో

కమురు వాసన పసి గట్టలేరు

ఆనవాళ్ళు లేని ఇళ్ళు వెనుక

గుమ్ములు నిండే ఇళ్ళు ముందు

రెంటి మధ్య నవ నాగరికుల పోలవరం

ఎవరికి వరం!! ఎవరికి శాపం!!!

– గిరి ప్రసాద్ చెలమల్లు

  9493388201

201 క్లాసిక్ అవెన్యూ మియాపూర్ హైదరాబాద్ 500049

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

హోమ్ టూర్..మా  కొత్త గుడిసె…

by Dasari Mohan September 28, 2022
written by Dasari Mohan

కొత్త గుడిసెలో  కాలు  పెట్టాము

కొన్ని  కోణాల్ని మీకు  చూపెడతాను

ఎండిన ఆకుల కింద

తడి తాకని  ఆనవాళ్లు  ఆనందించండి

ఓపెన్ కిచెన్ 

దాచి పెట్టేది  ఏముందని

ప్లేట్ల  సంఖ్య  పెరిగినా

మెతుకులు  భాగించ బడతాయి

సింగిల్ స్వింగ్ డోర్

తాకితేనే  తెరచు కుంటుంది

తమ పర  భేదాలు లేవు

తాళం వేసుకునేంత  స్థోమత  రాలేదు

ఫాల్స్ సీలింగ్ లేదు

ఆకాశం నేరుగా కనబడుతుంది

ఆకలి అయినప్పుడు

చుక్కలు లెక్కబెడుతు  మరచి పోతాం

స్మోక్ వ్యూ

ఎటుచూసినా మున్సిపాలిటీ మంటలే

ఎక్కడెక్కడి  పాపాల్ని  తెచ్చి పార బొస్తారు

డంపింగ్ యార్డ్  మా గడప ముందే  మరి

వంద శాతం వాస్తు వుంది

గుడిసె కు దిక్కు లుండవు

మూలలన్నీ  మూలిగే  జీవులే

అయినా నిమ్మకాయ కట్టాం

అధికారుల దిష్టి పడుతుందేమో అని

దినమంతా సూరీడు తోడు

రాత్రి చందమామ విశిష్ట అతిథి

గుడిసె చూట్టూ

కబ్జా గ్రహాలు పరిభ్రమిస్తూనే వుంటాయి

భూమి కి ఆకర్షణ శక్తి అంతా ఇంతా  కాదు

ఇంటి నెంబర్ ఇవ్వలే

ఇంకా LRS  BRS  సెగ తాక  లేదు

JCB లు  మిసైల్ లా దూసుకు వచ్చినపుడు

లాఠీలు మానవత్వం వదిలి  విరుచుకు పడ్డ ప్పుడు

కొండ కింద నో  మూసీ పక్కనో

మరో కొత్త గుడిసె లో

మళ్లీ మరో  వీడియో తో  మీ  ముందుకు…..

September 28, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

వచ్చిపో మిత్రమా!

by Koundinya Tilak September 28, 2022
written by Koundinya Tilak

శాంతి కపోతాలు నాయింటి వరండాలో వాలినట్లు,
శీతల పవన మాలికలు నా బెడ్‌ రూమ్‌ కిటికీ నుండి దూరినట్లు,
పక్కింటి వంటింటి సువాసనలు నా ముక్కు పుటాలను తాకినట్లు
కొబ్బరాకుల నుండి పున్నమి నాటి వెన్నెల కిరణాలు,
నా మేడ గదిలోకి వచ్చినట్లు వచ్చిపోమిత్రమా !
మనసు విప్పి మాట్లాడుకుందాం!మాటలతో సేద దీరుదాం !
ఇంటి గేట్‌ లోకి బంతి పడినపుడు,
బయట ఆడుకునే పిల్లలు లోనికి వచ్చినట్లు,
ఆరు బయట చెట్టు పైని ఉడుత,పెరటిలోకి షికారుగా వచ్చినట్లు,
బాలభానుని సూర్య కిరణాలు,
వెంటిలేటర్‌ నుండి వచ్చి వెచ్చదనాన్ని కూర్చినట్లు
వచ్చిపో మిత్రమా !
మనసువిప్పి మాట్లాడుకుందాం! మాటలతో సేద దీరుదాం !
మిత్రమా! నీవు వచ్చినపుడు
ఫోన్‌ చేసి రావద్దు!నా సమయం తీసుకొని రావద్దు!
ఉన్న పళాన రావాలి ! నీ సమయం కూడా
నాకు కేటాయించి రావాలి!
కాలింగ్‌ బెల్‌ నొక్కి రావద్దు! నా పేరు పెట్టి పిలుస్తూ రావాలి !
ఊసుల, బాసల పేటికలు మోసుకు రావాలి !
గతకాలపు గాధల నిధులు త్రవ్వుకొని రావాలి !
నీవు వచ్చిన తరువాత కాలమనే ఉయ్యాలలో ఊగుతూ
మధురమైన గతాన్నితవ్వుకుందాం !
పాత విషయాలు తలుచుకొని నవ్వుకుందాం !
భద్రమైన భవితవ్యాన్ని నిర్మించుకుందాం !
అలాగే నీవు వెళుతూ..వెళుతూ..
అలిసిన మనసుకు ఉపశమనాన్ని ఇచ్చే
నిన్ను కొద్దిగా విడిచె వెళ్ళు!
నేస్తమంటే వీడేనని-గుర్తుకు తెచ్చే
నన్ను కొద్దిగా తెసుకొని వెళ్ళు!

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

రాగమాలిక

by B.V. Shivaprasad September 28, 2022
written by B.V. Shivaprasad

తెల్లవారే జాము మరెంతో మిగిలేవుంటుంది

నేను సుషుప్తిలో గురకలు తీస్తూనేవుంటాను

కానీ నీ సగం నిద్ర కళ్ళు మాత్రం

నిన్ను నిర్దాక్షిణ్యంగా వంటగదిలోకి ఈడ్చుకుపోతాయి

నీ రోజువారీ రాగమాలిక మూడవ ‘కాలం’ లో మొదలౌతుంది

బ్రేక్ఫాస్ట్ బిలహరి రాగాన్నీ, లంచ్ బాక్సులు సర్దే మధ్యమావతి రాగాల్నీ ఆలపించి

అలసట థిల్లానా పాడుకుంటూనే ఆఫీసుకు చేరుకుంటావు

అక్కడ నీతోటివారూ, అధికారులూ

మరో మడత కచేరీ మొదలెడతారు

కాలగానం సాగి సాగి సాయంత్రమయ్యాక

సంధ్యారాగం సాయంతో ఇంటికి చేరుకుంటావు

ఆవారం తన వయసును ముగించుకుంటూ

ఆదివారంలోకి అంతిమంగా అడుగుపెడుతుంది

అయినా నీ కాలపట్టిక పెద్దగా మారదు

ఈసారి అదనంగా ఇల్లు శుభ్రం చేసే ఇంకో దీర్ఘ రాగాన్ని

నీ నిస్సతువ శరీరంతో పాడడం ప్రారంభిస్తావు

వారాంతం ముగిశాక సోమవారం మళ్ళీ మాకోసం

నీ శ్రమదాన సంగీత కచేరీ మొదలౌతుంది

‘ప్రేమికుల దినం’ రోజు మాత్రం నేను నీకు ఐ లవ్యూ చెప్పి

ఒక ముద్దుతో సరిపెడుతూవుంటాను

రేపు ఉగాది-మన కొత్త సంవత్సరాది

నేను కూడా రేపటినుంచి ప్రతిరోజూ

నీ దినచర్యలో పాలుపంచుకుంటాను

మాకోసం నువ్వు చేసే శ్రమయజ్ఞంలో

నావంతు పాత్రను పోషిస్తాను

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అసలు రంగు

by Sambamurti Landa September 28, 2022
written by Sambamurti Landa

కవితైనా కథైనా

ఎక్కడి నుంచి పుడుతుందసలు?

నీ చుట్టూ వెచ్చగా పరుచుకున్న 

నిశ్శబ్దం చిట్లి

నువ్వో కవితవుతావు

గుండెల మీద 

ప్రేమగా చెక్కుకున్న పేరొకటి 

చీకట్లోకి ఎగిరిపోయాక

నేనొక పాటవుతాను

కన్నీటిమంటల్లో దగ్ధమవుతూ

ఎవరో ఒక కథవుతారు

అందమైన చెట్ల మీద

అక్షరాలు వాలవు

నిజానికి అవి 

చెల్లాచెదురైన లోయల్లో మొలకెత్తుతాయి

నలిగిన కాలిబాట పక్కన

సగం చితికిన గడ్డిమొక్కలకు పూస్తాయి

రంపాలతో తలలను కోసి

దుంగలుగా తరలించుకుపోయిన

చెట్ల పాదాలకు కాస్తాయి

ఏ ఎండుకొమ్మలకో చిక్కుకుని

మనసు గాలిపటం చిరిగిపోతుంది

గాలి వీచినపుడల్లా సలపరించే గాయాలు 

కొన్నాళ్ళకు అక్షరాలవుతాయి

కెరటాలు తలలు బాదుకునే

రాళ్లన్నీ

శిల్పాలు కావు

ఎగిరే రంగులన్నీ

సీతాకోకచిలుకలనుకోవడానికి లేదు

ముట్టుకొని చూస్తే తప్ప

అసలు గుట్టు తెలీదు

చూపు విస్తరిస్తున్నకొద్దీ

నీ మరుగుజ్జుతనం నీకు తెలిసొస్తుంది

ఒక దిగంతం తర్వాత

మళ్ళీ ఒక బూడిద రంగు ఆకాశం 

దానికిందొక నీడరంగు నేలా

కమిలిన చర్మంరంగు జీవితాలూ వుంటాయి

చూసిందే రాసుకుంటూపోతే కుదరదు 

ఆవలివైపు నుండి చూస్తేనే

ప్రపంచం అసలు రంగు తెలుస్తుంది

September 28, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

లసుము…

by Ramesh September 28, 2022
written by Ramesh

శిధిలమైన మట్టిగోడలు  ఇల్లు 

ఆశలు కోరికలు లుప్తమైన కళ్లు 

తుట్టెలుగట్టిన

పిట్టగూడోలే బిరుసెక్కిన కురుల మొగం

అపుడపుడవుతుంది ఆమె  ఆగం

నిరుత్సాహంతో కృంగి వంగిననడుము దేహం

నింగిని  ఆసాంతం చూట్టం ఒక సందేహం

వాలుగా చూస్తుంది

పుడమికి అభిముఖమై అడుగేస్తుంది  

విధి వింతగా రాశాక

భర్త కనుమూశాక 

సుఖం  ఎండమావి

దుఃఖమయగుండె ఒక ఆరని దుబాయ్ చమురుబావి 

మోసాలు మోహాలు

కలలు కలతలు ఎరుగని ఎద

అమాయకపు అఙ్ఞానం 

తెల్సీతెలియనితనం కధ ఆమె

రోడ్డువార మైలురాళ్లలాగా

కష్టాలు కన్నీళ్లు  స్వాగతం చెబుతుంటే

ఆకులు  రాల్చిన   చెట్టులాగా

గ్రీష్మం కాల్చిన కొండలాగా

నిల్చుంది మౌనంగా జీవితంలో

కాస్తంత మాతృత్వం 

కాస్తంత బంధుత్వం సివా  ఏమీ తెలియని వెర్రిమాలోకం ఆమె

ఏ ఆశాపాశాలకు

ఏ ఆరాటపోరాటాలకు  తావీయని ఆమె

చిల్లిగవ్వలేని 

చింతించ పనిలేని

ప్రపంచం గురించి  ఊసేలేని 

ఒక వింతమాలోకం ఆమె

మన హడావిడి అలజడికి ఆమడదూరం

మన ఆధునిక వలముడికి బహుదూరం ఆమె

వసంతం ముంగిట  శిశిరం 

శప్తమయజీవిత విపంచిక శోక స్వరం  ఆమె.

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

“నేనో నదిని”

by Ledalla Rajeshwar Rao September 28, 2022
written by Ledalla Rajeshwar Rao

నేను నదినై పారుతున్నప్పుడు

ఎన్ని ఎత్తైన కోరికల శిఖరాల మీద నుండి పరుగెడుతూ,

పడి నలుగుతూ, నడుస్తూ, నెత్తురోడుతున్న దేహపు  వ్రణాలతో మూలుగుతూ,  

నీ దాహం తీర్చానో కదా!

నేను నదినై పారుతూన్నప్పుడు

బాధల గులకరాళ్ళ అలజడి శబ్దాలేవో

హోరులోంచి

ఆవేదనగా

వినిపించాయి.

నేను అనుభవాల వాగుల మిళితమై

ప్రవహించినప్పుడు

కొత్త నెత్తురు లేవో

నాలో నిండినట్లు, కొత్త బంధాలేవో పెనవేసుకున్నట్లు

ఉత్సాహంతో ఉరకలు వేశాను.

మొదట్లో 

నన్నందరూ పరిహసించిన వాళ్ళే.

దోసెడు ధార 

దాహార్తినెలా తీర్చగలదని 

నవ్విన వాళ్ళే.

ఇప్పుడు 

చూసి నవ్విన 

నాప చేన్లన్నీ

పండించానా లేదా?

నెర్రెలు వారిన 

ఎడారి ముఖాలను ముద్దాడుతూ,

నవనవోన్మత్తమై

నేలకు హరితాన్ని

పులిమానా లేదా?

పడుతూనో,లేస్తూనో, 

వడివడిగానో, తడబడుతూనో,

వక్రం గానో,

సరళంగానో

నడిచానా లేదా?

నేల గుండెల ఆవేదనని చల్లారుస్తూ,

నాగరికతల రహస్యాల్ని గర్భంలో దాచుకుని, సజలమై పారే

అశ్రు దుఃఖాన్ని అమృతంలా చిలకరించానా లేదా?

యవ్వనంలో గంభీరంగా శబ్దించినా

వృద్ధాప్యంలో భారాన్ని మోయలేక

కూడబెట్టిన బంధాల

ఇసుక మేటల్ని విడవలేక, భరించలేక

చిక్కి శల్యమై

నెమ్మదిగా గతాన్ని నెమరేసుకుంటూ,

తియ్యని కన్నీటి అనుభూతుల్ని,

స్థబ్దమై ఉప్పబారిన దుఃఖ సంద్రంలో

కలిపానా లేదా?

నేనో నదినై మీ తడారిన గుండెల అర్ద్రత

నింపానా లేదా?

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నాగరికత

by Sunkara Gopalaiah September 28, 2022
written by Sunkara Gopalaiah

నేనుకూర్చున్న ఈ నేలకింద

నువ్వునడుస్తున్న ఈ భూమ్మీద

అక్కడెక్కడో

పొరలుపొరలుగాతిరుగుతున్న

నాగేటిసాళ్లఅడుగున

అలలుఅలలగాకొనసాగుతున్న

నీటిలోపల్లోపల ఆ మట్టికింద

కాలానికిసాక్ష్యమైనపుర్రో

చరిత్రకుఋజువైనశాసనమో

తెగిపడినరాజ్యపతాకమోఉండేఉంటుంది

బావిలోవిసిరినపాతాళభైరవికొక్కానికి

చిక్కినవస్తువుల్లా

ఆ కిందస్మృతులజాడ

పసుపుకుంకుమవిభూది

బౌద్ధపీఠమో ,పీరో, శిలువోఏదోఒకమతసామాగ్రి

మతమౌఢ్యంతోమండినగుండెలో

సతీసహగమనఅవశేషాలోదొరక్కపోవు

మొదటిమానవుడిఅనుభూతిగీతం

జానపదస్త్రీసహజస్వరపేటిక

గజ్జెకట్టిఆడినఆడపిల్లపాదాలపసిడికాంతిరేఖ

పనిముట్లుపట్టిజెండాలాఎగిరినచేతులు

తెల్లగారాలిపడినమేఘశకలం

ధారగాప్రవహించేఉమ్మనీరు

ఎక్కడెకడినుంచోహృదయాలుసాచినచెట్టువేర్లు

ప్రకృతిపారేసుకున్నపదచిత్రాలు

కారంపూడికత్తోబహుజనకార్మికునిసుత్తో

బొబ్బిలియుద్ధంలోదొర్లినసామాన్యునితల

యుద్ధంఆగిపోవాలన్నకరుణామయునికల

అడుగడుగునాదాగినచారిత్రకసంభాషణ

ఏప్పటినుండోనొప్పులుభరిస్తున్ననేల

కొనసాగుతున్నమట్టిబొమ్మలగాథ

నేనుకూర్చున్న ఈ నేలకింద

నువ్వునడుస్తున్న ఈ భూమ్మీద

మట్టికన్నకలలు

సమాధిలోనుంచిమాట్లాడుతుంటాయ్

మనిషిమనిషిగా మెరుగుపడటానికి మించిన

సరికొత్త నాగరికత ఏముంటుంది?

September 28, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

యుద్ధమేఘం

by Naresh Chary September 28, 2022
written by Naresh Chary

యుద్ధమేఘమెప్పుడూ
రక్తాన్నేవర్షిస్తుంది
అశాంతినేమొలకెత్తిస్తుంది

యుద్ధకారకులకేం ?
ఏసిగదుల్లోకూర్చొని
తామురేపినయుద్ధపుసెగ
ఎన్నిదేశాలకుతగులుకుందో
తామురగిల్చినఆవేశపుటగ్నిలో
ఎన్నిదేహాలుమాడిపోయాయో
తమఆధిపత్యపుపాదాలకింద
ఎన్నిశరీరాలునలిగిపోయాయో
తామునూరినవిద్వేషపుకత్తులకు
ఎన్నితలలుతెగిపడ్డాయోలెక్కిస్తూ
బాగానేవుంటారు

యుద్ధంముగిసినా
యుద్ధంచేసినగాయపుగుర్తులు
గతాన్నెప్పుడూతవ్విపోస్తూ
తమవాళ్ళతోగడిపినక్షణాలను
తమవాళ్ళతోపంచుకున్నజ్ఞాపకాలను
పదేపదేగుర్తుకుతెచ్చి
గుండెనుబరువెక్కిస్తాయి
పోయినవారికిగుర్తులుగామిగిలినవారిని
జీవశ్చవాలుగామారుస్తాయి

యుద్ధవిధ్వంసంతో
బీటలువారిననేలపై
కొన్నితరాలదాక
మనుషులకుమాత్రమేసొంతమైన
నవ్వులపువ్వులు
ఏ పెదాలపైనావికసించవు
సంతోషానికికారణమయ్యేప్రశాంతతకు
ఎవరిహృదయంలోనూతావుదొరకదు
ప్రతీకారవాంఛలేని
ఏ ఒక్కఅడుగూముదుకుకదలదు
కొత్తఆశలనురేకెత్తించే
ఏ శాంతిగీతమూవినిపించదు

ఎందుకంటే
యుద్ధమేఘమెప్పుడూ
రక్తాన్నేవర్షిస్తుంది
అశాంతినేమొలకెత్తిస్తుందికదా!

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us