మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
బాల‌సాహిత్యం

పట్టుదల

by mayuukha September 21, 2025
written by mayuukha

అనగనగ ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో 90 మంది విద్యార్థులు ఉండేవారు.ఆ విద్యార్థులేదరిలో ఒక విద్యార్థి బాగా చదివేవాడు. ఆ విద్యార్థికి చదువుపై చాలా ఆసక్తి ఉండేది.ఆ విద్యార్థికి పోలీస్ కావాలని కోరిక ఉండేది.అతడు ఏ పరిక్ష రాసినా ముందు వచ్చేవాడు.మిగత విద్యార్థులు ఆడుకుంటూ ఉంటే ఇతను చదువుకునేవాడు.బడి పూర్తైన తరువాత ఇంటికి వెళ్ళి చాలా కష్టపడి చదువుకునేవాడు. ఆ విద్యార్థి ఒక పరీక్ష రాసాడు ఆ పరీక్షలో మండలంలోనే మొదటిస్థానంలో నిలిచాడు.ఆ విద్యార్థి వెయ్యిరూపాయలు బహుమతిగా పొందాడు. 10వ తరగతిలో పరీక్ష రాసి మంచి మార్కులతో పాస్ అయ్యాడు తర్వాత కరీంనగర్ లో ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేశాడు.పోలీస్ పరీక్షలకు సిద్ధం అయ్యాడు.పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి.పోలీస్ ఉద్యోగం వచ్చింది. అనుకున్నది సాధించి పోలీస్ అయ్యాడు.తన కల నెరవేర్చుకున్నాడు.

నీతి క్రమశిక్షణ పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు

రమేష్
8,వ తరగతి

September 21, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

మట్టి గణపతే మహాగణపతి

by mayuukha September 21, 2025
written by mayuukha

అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు రాము, గౌతమ్,రాజేష్ ఈ ముగ్గురు మంచి మిత్రులు ఒకరోజు రాజేష్ మిగతా ఇద్దరు మిత్రుల దగ్గరకు వచ్చి వినాయక చవితి దగ్గరకు వచ్చింది. చెందాకు తిరుగుదామా అన్నాడు. వారు సరే రేపటి నుంచి తిరుగుదాం అన్నారు. మరుసటి రోజు పొద్దున్నే లేచి ముగ్గురు స్నేహితులు స్నానాలు చేసి చందా వసూలు చేయడానికి బయలుదేరారు. అలా కొన్ని రోజులు చందా వసూలు చేశారు. వినాయక చవితి ముందు రోజు ముగ్గురు స్నేహితులు పందిరి వేసి డెకరేషన్ చేశారు. గౌతమ్ వాళ్ళ నాన్న ట్రాక్టర్ ని తెచ్చాడు. ట్రాక్టర్లో మట్టి గణపతిని తీసుకొని వచ్చారు. గణపతి బప్పా మోరియా అనుకుంటూ పందిరిలోకి తెచ్చారు. గణపతికి కొబ్బరికాయ కొట్టారు. పూజారిని పిలిచి పూజ చేశారు. ప్రసాదం నైవేద్యం పెట్టారు. అందరినీ పిలిచి ప్రసాదం పెట్టారు. సాయంత్రం అయ్యింది. కాళ్లు చేతులు కడుక్కొని దేవుని పందిరిలోకి వచ్చారు. రాత్రి దేవుని పందిరిలోనే పడుకున్నారు. మరుసటి రోజు రాము వచ్చి మిగతా ఇద్దరి మిత్రులతో మనం అన్నదానం చేద్దామా అన్నాడు. మిత్రులు సరే అన్నారు. మూడు రోజుల తర్వాత రాము రాజేష్ గౌతమ్ ముగ్గురు మిత్రులు కలిసి అన్నదానం చేశారు. తొమ్మిది రాత్రులు గడిచాయి. పదవరోజు పులిహోర తయారు చేశారు. వినాయకున్ని ట్రాక్టర్లో పెట్టి ఎగురుకుంటూ చెరువు దగ్గరకు వచ్చారు. వినాయకున్ని చెరువులో నిమజ్జనం చేశారు.

నీతి. చెరువులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను చెరువులో వేస్తే నీళ్లు కలుషితం అవుతాయి.నీటిలో ఉండే జీవులు చనిపోతాయి. కాబట్టి మట్టి వినాయకులనే పూజిద్దాం.
యెన్. చక్రి,
8 వ తరగతి,

అనగనగా ఒక ఊరిలో కిరణ్,గౌతం అనే ఇద్దరు యువకులు ఉండేవారు.19 యేళ్లు గౌతంకు 20 యేళ్లు .వారిద్దరూ మంచి మిత్రులు ఒకరోజు వీరు కాలేజీ కీ వెళ్లేటప్పుడు దారిలో ఒక తెల్లటి కారు కనపడింది. కారు చాలా బాగుంది.కిరణ్ గౌతంలు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు.మా నాన్న ను ఇలాంటి కారు కొనివ్వమంటాను అని గౌతం అన్నాడు.అప్పుడు కిరణ్ కూడా నేను మా నాన్న ను కొనివ్వమని అడుగుతానన్నాడు.కాలేజి ముగిసాక ఇద్దరూ ఎవరిండ్లకు వారు వెళ్లారు.
కిరణ్ వాళ్ల నాన్న తో ఇలా అన్నాడు నాన్న నాన్న ఈరోజు నేను కాలేజీ వెళ్లే దారిలో ఒక తెల్లటి అందమైన కారును చూశాను.అది నాకు కొనివ్వమని అడిగాడు.అప్పుడు కిరణ్ వాళ్ల నాన్న నా దగ్గర అంత డబ్బులు లేవు నేను రోజు కష్టపడి పనిచేస్తే మన కడుపు నిండుతుంది మనకు అంత స్తోమత లేదు అనగానే కిరణ్ సరే నన్నాడు.మరునాడు గౌతం కూడా వాళ్ల నాన్న తో ఈ కారు గురించి చెప్పి కొనివ్వమని అడగ్గానే గౌతం తండ్రి నీకన్న నాకు ఏదీ ఎక్కువ కాదు అని కారు కొనవచ్చాడు.
మరుసటి కిరణ్ గౌతం లు కాలేజి కీ వెళ్లేటప్పుడు గౌతం వాళ్ల నాన్న తనకు కారు కొనిచ్చాడని తెలిపాడు.కిరణ్ మా నాన్న కొనివ్వలేదని చెప్పాడు.ఆ తర్వాత కొద్దిరోజులకు కాలేజీలో పరీక్షలు జరిగాయి.ఆ పరీక్షల్లో కిరణ్ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.కాని గౌతం ఫేల్ అయ్యాడు.కిరణ్ వెంటనే వాళ్ల నాన్న దగ్గర కి వెళ్ళి తాను పాసయ్యానని ఉద్యోగం కూడా వచ్చిందని జీతం డబ్బుల తో కారు కొంటానని వాళ్ల నాన్న తో చెప్పగ వాళ్ల నాన్న ఎంతో సంతోషించాడు. గౌతం వాళ్ల నాన్న గౌతం ను నీవు పాసయ్యవా అని అడిగాడు.అప్పుడు గౌతం నేను ఫేలయ్యానని చెప్పగనే గౌతం తండ్రి నేను ఎంతో కష్టపడి నీకు ఫీజు కట్టి అడిగిందల్లా కొనిచ్చి చదివిస్తే ఫెలవుతవా అని కోపంతో మందలించారు.కిరణ్ తెల్లటి కారులో కుటుంబ సభ్యుల తో తిరుగుతూ సంతోషంగా జీవితాన్ని గడిపాడు.
నీతి బాగా చతువుకుంటే బాగుపడతారు
బాగా చదువుకోక పోతే జీవితాంతం బాధపడతారు
రచయిత. వి.చక్రి
7వ తరగతి

అనగనగా ఒక ఊరిలో బాలు,రాజు, చందు సుధీర్ అని నలుగురు స్నేహితులు ఉండేవారు. మీరందరూ ప్రాణ స్నేహితులు ఒకరినొకరు కలిసిమెలిసి ఉండేవారు సుధీర్ కి 11 సంవత్సరాలు చందు రాజు మరియు బాలుకు కూడా11 సంవత్సరాలు ఒకరోజు ఈ నలుగురు ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద ఏనుగు పరిగెత్తుకుంటూ అటువైపు వచ్చింది.దాన్ని చూసి ఆ నలుగురు పరుగు తీశారు. పరిగెత్తుతూ పరిగెత్తుతూ సధీర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఆ ఏనుగు వెళ్ళాక వచ్చి ఆడటం మొదలుపెట్టారు ఆ మరుసటి రోజు సుధీర్ పుట్టినరోజు పుట్టినరోజున మిగతా ముగ్గురూ మిత్రులు పొద్దున్నే లేచి సుధీర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అందరూ కలిసి పాఠశాలకు వెళ్లారు మిత్రులందరికీ మిఠాయిలు పంచారు ఆ తర్వాత రోజు నుంచి పరీక్షలని తరగతి ఉపాధ్యాయులు చెప్పారు. మళ్లీ ఇంటికి వచ్చి చదువుకొని ఉదయం పాఠశాలకు వెళ్లారు వారం రోజుల్లో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి ఫలితాలు వచ్చే రోజు రానే వచ్చింది .ఆ నలుగురిలో చందు కు మంచి మార్కులు వచ్చాయి మిగతా మిత్రులకు తక్కువ మార్కులు వచ్చాయి. ఆ ముగ్గురు చాలా బాధపడ్డారు చందు వాళ్ళని ఓదార్చాడు ఈసారి పోతే మళ్ళీ ఒకసారి బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోండి అని చెప్పాడు.ఏదైనా ప్రయత్నిస్తేనే ముందుకెళ్తామని చెప్పాడు. చందు సరే మిత్రమా మరోసారి ప్రయత్నిస్తాం అని మిగతా ముగ్గురు మిత్రులు చెప్పారు ఇప్పుడు వాళ్లు ఏడవ తరగతికి వచ్చారు ఈ సంవత్సరమైనా మంచి మార్కులు తెచ్చుకుందామని అనుకున్నారు ఆటలాడడం తగ్గించి చదవడం మొదలుపెట్టారు. ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్లారు పాఠశాల నుంచి వచ్చాక సాయంత్రం వేళల్లో ట్యూషన్ కు వెళ్లారు. సెలవు రోజుల్లో కూడా సమయం వృధా చేయకుండా పెండింగ్ హోంవర్క్ ను పూర్తి చేశారు. చదువుకున్నారు. ఏడవ తరగతి వార్షిక పరీక్షల్లో అందరు విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు అందరూ చాలా ఆనందించారు
సూక్తి కష్టపడితేనే ఫలితం ఉంటుంది
యం.సహనశ్రీ
8,వ తరగతి

సహకారం
అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడు కలసి మెలసి ఉండేవారు. ఆ ముగ్గురి పేర్లు సోను, చీకు, బంటి ఒకరోజు వీరిలో సోనుకు ఒక ఆపద వచ్చింది. అది ఏమిటంటే ఆ ముగ్గురు ఒకరోజు అనంతసాగర్ గ్రామంలోని సరస్వతి దేవాలయానికి వెళ్లారు. అక్కడ జాతర జరుగుతుంది. సోను జ్యూస్ తెచ్చుకుంటాను అని చెప్పి వెళ్ళాడు. అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. జ్యూస్ తెచ్చుకోవడానికి వెళ్లిన సోను ఇంకా రాలేదు. రెండు గంటలు అయింది. అయినా అయినా కూడా ఇంకా రాలేదు. చీకు బంటి చాలా కంగారు పడ్డారు. ఎక్కడికి వెళ్ళాడో అని చీకు బంటితో సోను జాడ కోసం వెతుకుదామని అడిగాడు. కానీ బంటి సహకరించకుండా ఇంటికి వెళ్లిపోయాడు. కానీ చీకు తన మిత్రుడు సోనుని వెతకడానికి వెళ్ళాడు. అన్నిచోట్ల వెతికాడు. చివరకు సత్రంలోకి వెళ్లాడు. అక్కడ సోను కనిపించాడు. చీకు చాలా సంతోషముతో సోను దగ్గరికి వెళ్లి సోనుని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా జ్యూస్ తాగి ఇంటికి వచ్చారు
నీతి ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు
యం.సహన శ్రీ
7 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
మర్రి చెట్టు

అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు కింద పిల్లలు పెద్దవారు అందరూ విశ్రాంతి తీసుకునేవారు ఒకరోజు అక్కడికి ఆ ఊరి సర్పంచ్ గారు వచ్చి ఇలా అన్నాడు ప్రజలారా నేను ఈ చెట్టును నరికేపిస్తున్నాను అప్పుడు ఆ మాటలు విన్న ఒక వ్యక్తి చెట్టును నరక వద్దు ఇది ఎన్నో సంవత్సరాలుగా మనకు గాలి నీడను ఇస్తుంది ఈ చెట్టుపై పక్షులు గూడు కట్టుకొని నివసిస్తున్నాయి చెట్ల వలన మనకు వర్షాలు కురుస్తాయి అని చెప్పాడు ఆ మాటలు విన్న గ్రామ సర్పంచ్ గారు తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రజలారా నేను ఈ చెట్టును నరికేయను మన గ్రామంలో ఇంకా అనేక మొక్కలను నాటి నాటింపజేస్తాను అని చెప్పాడు అప్పుడు ప్రజలందరూ ఎంతో సంతోషించారు అప్పటికే చీకటి అయింది అందరూ అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు ఏ అందరూ వారి వారి ఇండ్లమందు మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు భోజనం చేసి పడుకున్నారు

నీతి.చెట్లను నరికేయవద్దు ప్రకృతిని నాశనం చేయవద్దు.
నరెడ్ల.భార్గవ్
6 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు సురేష్, రాము,నరేష్ ఒకరోజు ముగ్గురు స్నేహితులు జాతరకు వెళ్లారు. కానీ అనుకోకుండా ఆ జాతరలో రాము తప్పిపోయాడు. సురేష్ నరేష్ ఇద్దరూ చాలాసేపు రాము కోసం వెతికారు. కానీ రాము దొరకలేదు అప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు ఎంతో బాధ పడ్డారు. ఈ విషయం వారి తల్లిదండ్రుల కు చెప్పారు.మరుసటి రోజు కూడా వెతికారు అయినా కానీ రాము దొరకలేదు.పోలీసుల కు కూడా చెప్పారు.ఇట్లా నెలరోజులపాటు వెతికారు అయినా రాము జాడ లభించలేదు. మిగతా ఇద్దరూ స్నేహితులు రాము కోసం ఆలోచిస్తూ చాలా రోజులు బాధపడ్డారు. స్నేహితులిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు నరేష్ కి 16 సంవత్సరాలు సురేష్ కి కూడా 16 సంవత్సరాలు నరేష్ సురేష్ లు ఒకరోజు నరేష్ పుట్టిన రోజు సందర్భముగా అనాథ ఆశ్రమంలోని వారికి పండ్లు దానం చేయడానికి వెళ్లారు. అక్కడ వాళ్ల మిత్రుడు అన్నం తింటూ ఉండగా నరేష్ సురేష్ లకు గుర్తుపట్టారు. అప్పుడు చాలాకాలంగా తప్పిపోయిన తమ మిత్రుడు రాముని గుర్తుపట్టారు.చాలా ఆనందించారు. ఆ రోజు జాతరలో ఎలా తప్పి పోయాడో ఇక్కడికి ఎలా చేరుకున్నడో అడిగి తెలుసుకున్నారు. రాముని అక్కడి నుంచి తీసుకొనిఇంటికి వారి తల్లిదండ్రుల దగ్గర కు తీసుకొని వెళ్లారు.
జి.చైత్ర
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రేగులపల్లి

స్నేహం విలువ
అనగనగా ఒక ఊరిలో ఆరుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్లు అందరూ ఒకే తరగతి వాళ్ళు. అందరూ కలిసి ఎప్పుడు బడికి వెళ్లేవారు. వాళ్లు చాలా బాగా కలిసి ఉండేవారు. ఒక అమ్మాయి కుటుంబం వేరే ఊరికి వలస వెళ్లింది. ఇక ఐదుగురే మిగిలారు మళ్లీ ఒక అమ్మాయి వాళ్ళ నాన్నకు పని దొరికిందని వాళ్లు కూడా వలస వెళ్లారు. ఇంకో అమ్మాయి చదువుకోవడానికి హాస్టల్ వెళ్ళింది, ముగ్గురే మిగిలారు వాళ్లు చాలా బాధపడుకుంటూ ఉన్నారు అందులో ఒక అమ్మాయి ఇలా అన్నది మన స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు అని అన్నది. ఇంకో అమ్మాయి నాకు వాళ్లతోనే ఉండాలని అనిపిస్తుంది అని అన్నది మళ్లీ ఒక అమ్మాయి ఏం చేస్తాం మన రాత ఇలా ఉంది వాళ్ల రాత అలా ఉంది. మనం వాళ్లు విడిపోవాలని ఉంది కావచ్చు.ఇలా ఉండగా ఒకరోజు మార్కెట్ కి వెళ్ళగా అక్కడికి హాస్టల్ కి వెళ్లిన అమ్మాయి వచ్చింది. అప్పుడే ఇంటి దగ్గరే చదువుతున్న అమ్మాయి చూసి ఆమె దగ్గరకు వెళ్ళింది. ఎప్పుడు హాస్టల్ నుంచి వచ్చావు అని అడిగింది. ఆమె నేను మొన్ననే వచ్చాను అని చెప్పింది ఎలా ఉన్నావ్ నువ్వు హాస్టల్ కు ఎందుకు పోయావు. అని అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి ఇలా అన్నది మా నాన్న చాలా తాగుతూ అమ్మని కొడుతుండేవాడు. ఇంట్లో సరుకులు తెచ్చేవాడు కాదు. తినడానికి ఏమీ లేవు. చేయడానికి పని లేదు ఇంట్లో పరిస్థితులు బాగా లేవు అందుకే వెళ్ళా అని అన్నది. తర్వాత రోజు ఆ ముగ్గురు బడికి వెళ్లారు ఆ అమ్మాయి జరిగినదంతా మిగతా ఇద్దరితో చెప్పింది అందులో ఒకరు ఇలా అన్నారు పాపం వాళ్ళ నాన్న అలా చేయకపోతే మన దోస్త్ మనతోనే ఉండేది. కొన్ని రోజులు బాగానే ఉంది ఒకరోజు వలస వెళ్లిన అమ్మాయి ఫోన్ చేసింది తాను చాలా ఏడ్చింది. నేను వస్తా ఏడవ తరగతి అయిపోయాక అని అన్నది. అలా కొన్ని రోజులు గడిచాయి అందరిదీ ఏడవ తరగతి పూర్తి అయింది. ఎనిమిదవ తరగతికి మిగతా ముగ్గురు మిత్రులు వచ్చారు అందరూ సంతోషించారు ఆ ఆరుగురు మిత్రులు కలిసిమెలిసి ఉన్నారు.ఎక్కడికి వెళ్లినా అందరూ కలిసి వెళ్లేవారు
మాళవిక
8వ రతగతి
ZPHS REGULAPALLY
M.BEJJANKI
DIST.SIDDIPET
నీతి. స్నేహం ఎంతో మధురమైనది

అనగనగా ఒక ఊరిలో రాజు గౌరమ్మ అనే దంపతులు ఉండేవారు వాళ్లకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉండేవారు వాళ్ల పేర్లు గోపి అమల సిరి అయితే రాజు ఒక రోజు వేరే ఊరికి పోయి వస్తుండగా యాక్సిడెంట్ లో కాలు విరిగి మంచాన పడ్డాడు అప్పటినుంచి ఆ పిల్లలకు తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళ అమ్మ గౌరమ్మనే అలా కొన్ని రోజులు గడిచాయి వాళ్ళ పెద్ద కూతురు అయిన అమలకు చదువుకునే వయస్సు వచ్చింది. కానీ వాళ్ళ నాన్న పరిస్థితి బాగాలేదని వాళ్ళ అమ్మ తనతో చీపుర్లు అమ్మడానికి తీసుకుపోయేది. అలా కొన్ని రోజులు గడిచాయి. సిరికి కూడా చదువుకునే వయస్సు వచ్చింది. కానీ సిరిని కూడా తనతో పాటు చీపుర్లు అమ్మడానికి తీసుకుపోయింది. కానీ సిరికి మాత్రం ఒక్క కోరిక ఉండేది.
ఆమె మంచి చదువులు చదివి డాక్టర్ కావాలని అలా ఇద్దరు కూతుళ్లు వాళ్ళ అమ్మతో చీపురులు అమ్మడానికి వెళ్లేవారు అలా కొన్ని రోజులు గడిచాయి గోపికి చదువుకునే వయసు వచ్చింది .వాళ్ళ అమ్మ గోపిని మాత్రం బడికి పంపించింది. ఒకరోజు గౌరమ్మ ఉదయమే లేచి చీపురు కట్టలు కడుతూ గోపిని బడికి తయారు చేస్తుంది. దాన్ని అమల ఇంకా సిరి గమనిస్తూ ఇలా అన్నారు అక్క మన తమ్ముడిని బడికి పంపిస్తున్నది అమ్మ కానీ మనల్ని మాత్రం చీపుర్లు అమ్మడానికి తనతో పాటు తీసుకుపోతుంది అని అన్నది సిరి అప్పుడు తల్లి గోపి మంచి చదువులు చదివి దేశాన్ని ఉద్ధరిస్తాడు అన్నది గౌరమ్మ కొడుకుని తయారు చేసింది .తల్లి కూతుర్లు తలపైన చీపురు కట్టలు పెట్టి ఊళ్లోకి వెళ్లారు బడి దగ్గరికి వచ్చి కొడుకుని బడిలో దింపి కూతుర్లను చీపురులు అమ్మడానికి తీసుకుపోయింది. ఇక్కడ జరిగిన సంఘటనంతా ఒక దుకాణం దగ్గర కూర్చొని ఉన్న ఒక వ్యక్తి చూశాడు .ఆ వ్యక్తి తన పక్కన ఉన్న వ్యక్తితో ఇలా చెబుతున్నాడు ఆడపిల్లలు చదువుకోవడం తప్పా అని అన్నాడు అప్పుడు ఆయన పక్కన ఉన్న వ్యక్తి ఇలా అన్నాడు ఇప్పుడు ఎవరు ఇలా చేస్తున్నారు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా సమానంగా చూస్తున్నారు అని అన్నాడు ఎలాగైనా వాళ్లకి సహాయం చేయాలనుకున్నాడు ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు నీ ఇద్దరు కూతుర్లలో ఒక కూతురుని దత్తతకు ఇస్తావా అని అడిగాడు అయితే గౌరమ్మ ముందు వెనక ఆలోచించకుండా చిన్న కూతురైన సిరిని దత్తత ఇచ్చింది దాన్ని చూసి అమల ఎంతో బాధపడ్డది అయితే ఒకరోజు అమల అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ తమ్ముడితో నన్ను బడికి పంపించు అని అడిగింది అప్పుడు గౌరమ్మ ఆడపిల్లవు నీకు చదువు ఎందుకు అని అన్నది పాపం అమలు చాలా ఏడ్చింది అయితే అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు గౌరమ్మ చీపురులు అమ్మడానికి వెళుతున్న సమయంలో అప్పుడే దత్తతకు తీసుకున్న వ్యక్తి వచ్చే నీ కూతురిని నేను ఉన్నత చదువులు చదివించి ఒక మంచి డాక్టర్ని చేశాను అని అన్నాడు అప్పుడు గౌరమ్మ తన మనస్సులో ఇలా అనుకుంది మంచిగా చదువుకొని దేశాన్ని ఉద్ధరిస్తాడు అనుకున్న కొడుకు తాగుబోతుగా మారి ఊర్లో తిరుగుతున్నాడు కదా అని అనుకున్నది తన తప్పును తెలుసుకొని ఎంతో బాధపడింది
నీతి .ఆడ మగ ఇద్దరినీ సమానంగా చూడాలి
యం.సాత్విక
7 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రేగులపల్లి.

అబల కాదు సబల

అనగనగా ఒక పల్లెటూర్లో ఒక కుటుంబం ఉండేది సోమయ్య అతని పేరు అతనికి ఒక కొడుకు మరియు ఒక కూతురు.
అతడు కూలీ పని చేస్తూ వాళ్ల కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు.అతడు కొడుకును,కూతురునీ బడికి పంపుతుండేవాడు అతనికి కొడుకు అంటే చాలా ప్రేమ కూతురిని చిన్న చూపు చూసేవాడు ఆమె చాలా బాధపడే ఎప్పుడు తమ కూతురిని తిట్టేవాడు.అన్ని బాధలను ఓర్చుకోలేక ఒక్కోసారి చనిపోవాలని అనుకుందికూతురు. కానీ తన లక్ష్యాన్ని తాను చేరుకోవాలని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాత్రింబవళ్లు కష్టపడి చదివేది. అలా కాలం గడిచిందిఆమె పదవ తరగతి కూడా పూర్తి చేసింది.
ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంటర్ విద్యను కూడా పూర్తి చేసింది. వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియకుండా ఆమె ఆర్మీ కోర్స్ శిక్షణ కోసం హైదరాబాదుకు వెళ్లి అక్కడ ఆర్మీ కోర్సులో శిక్షణ తీసుకుంటుంది కొద్దిరోజుల తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఆడపిల్లవు నీకు అటువంటి ఉద్యోగాలు ఎందుకు అనీ,ఆడపిల్లవు ఇంట్లో ఉండి పని చేసుకోక పట్నం వెళ్లి చదవడం ఎందుకు అని అన్నాడు అప్పుడు కూతురు ఆడపిల్ల అంటే వంటింటి కుందేలు కాదని ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించి వాళ్ళ నాన్న కళ్ళు తెరిపించాలని అనుకుంది. అలా ఆమె ఎంతో కష్టపడి ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకొని పరీక్షలు రాసి ఆర్మీలో ఉద్యోగం తెచ్చుకొని తన లక్ష్యాన్ని సాధించి ఆడది అబలకాదు సబల అని నిరూపించింది.
అప్పటినుండి వాళ్ళ ఊరి ప్రజలందరూ ఆడపిల్లల్ని చిన్నచూపు చూడకూడదని అనుకొని ఆడపిల్లంటే తక్కువ కాదు మగ పిల్లవాడు ఉంటే ఎక్కువ కాదని తెలుసుకొని అప్పటినుండి ఆడపిల్లల్ని బడికి పంపించడం మరియు ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టారు
నీతి ఆడది అంటే అబల కాదు సబల
యం. జ్యోత్స్న
9.వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

అనగనగా ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబ పెద్ద పేరు రాంబాబు తన భార్య పేరు లక్ష్మి ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు .ఆ ఇద్దరు కొడుకులను పదవ తరగతి వరకు చదివించారు. అక్కడితో తమ చదువులు ఆపేశారు కూతురిని మాత్రం ఎనిమిదవ తరగతి వరకే చదివించారు. ఒకరోజు కూతురు తన తండ్రి వద్దకు వెళ్లి నేను చదువుకుంటా అని అడిగింది అయితే వాళ్ల నాన్న నువ్వు ఆడపిల్లవి నీకు చదివు ఎందుకు వద్దు చదవడం ఆపేసి ఇంటి పని చేయు అని తిట్టాడు. అప్పుడు ఆమె అనుకుంది అందరూ చదువుకుంటున్నారు నేనే ఎందుకు చదువుకోడం లేదు అని. ఇలా బాధపడితే ఏం వస్తది.మంచిగా చదువుకొని వాళ్ళ నాన్న ఆలోచనలో మార్పు తీసుకు రావాలనుకుంది. అప్పటినుండి ఆమె ప్రొద్దున్నే ఇంటి పనులు చేసి తర్వాత పాఠశాలకు వెళ్లి ఆ తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో పనులు చేస్తూ ఎంతో కష్టపడి తన కష్టార్జితంతో చదువుకుంది. ఆమె పదవ తరగతి పూర్తి చేసింది. మంచి మార్కులతో పాసయ్యింది పరీక్షలు అయిపోయాక సెలవుల్లో బట్టలు కుట్టడం నేర్చుకుంది ఆమె కష్టపడి దాచుకున్న పైసలతో బట్టల మిషన్ కొనుక్కుంది అలా కాలం గడుస్తుండగా ఆమె చాలా డబ్బులు సంపాదించింది తర్వాత తన పోలీసు లక్ష్యం పైన పట్టుదలతో ఉన్నది. ఆమె తన లక్ష్యం చేరుకోవడానికి వేరే గ్రామం వెళ్లి అక్కడ చదువుకోవాలని అనుకుంది. ఇంట్లో చెబితే అమ్మానాన్నలు ఒప్పుకోరని ఆమె ఇంట్లో చెప్పకుండా వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ కష్టపడి పని చేస్తూ పోలీస్ శిక్షణ తీసుకుంది. ఒకరోజు వాళ్ళ అమ్మానాన్నలు ఈమె గురించి తెలుసుకొని ఆమెకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని అడిగారు ఆమె ఇంటికి వెళ్తే తన ఆశయం కోల్పోతాను కావచ్చు అని అనుకొని అక్కడే ఉండి పోలీస్ శిక్షణ తీసుకుంది. ఇంటికి వెళ్లలేదు కొన్ని రోజుల తర్వాత ఆమె పోలీస్ శిక్షణ పూర్తి పూర్తి చేసింది ఆ తర్వాత పోలీస్ ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలు రాసేటప్పుడు ఎలాగైనా బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి మా అమ్మానాన్నల కళ్ళు తెరిపించాలని అనుకుంది. అనుకున్నట్టుగానే మంచి మార్కులు సాధించి పోలీస్ ఉద్యోగాన్ని సంపాదించి ఉద్యోగంతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ అమ్మానాన్న బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూశారు. తమ కూతురు. ఆమె తన టోపీ తీసి వాళ్ల నాన్న తలపై పెట్టింది వాళ్ళ నాన్న కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి ఆమె వాళ్ళ అమ్మానాన్నలతో ఇలా అన్నది అమ్మ నాన్న ఆడదంటే అబల కాదు సబల అని చెప్పి వాళ్ళ అమ్మానాన్నలకు కళ్ళు తెరిపించింది ఆమె చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఇటు తన కోరిక నెరవేరినందుకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించినందుకు ఇలా అప్పటినుండి అందరూ తమ కొడుకుల్ని ఒకలా తమ కూతురిని ఒకలా చూడడం కాకుండా ఇద్దరినీ సమానంగా చూసే చూశారు.
యం.రోషిణీ
9.వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
గ్రా.రేగులపల్లి

అనగనగా ఒక ఊరిలో రాము ఇంకా సోము అనే స్నేహితులు ఉండేవారు. రాము వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం కానీ సోము వాళ్ళు చాలా ధనవంతులు సోము బడికి వాళ్ళ నాన్న కారులో వెళ్లేవాడు .అదిచూసి బడి దగ్గర ఉన్న పిల్లలకు చాలా ఆశ్చర్యం వేసేది. రాము కాలినడకన బడికి వెళ్లేవాడు బడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత చాలా చక్కగా చదువుకునేవాడు కానీ సోము ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ తీసి ఫోన్ తీసుకొని వీడియో గేమ్స్ ఆడేవాడు. బడిలో వారి టీచర్ ఇచ్చిన హోంవర్క్ ను చేసేవాడు కాదు. రాము వాళ్ళ నాన్న పనిచేస్తుంటే సహాయం చేసేవాడు. ఒకరోజు రాము వాళ్ళ టీచర్ పిలిచి రాము ఇంకో రెండు రోజుల్లో స్కూల్ ఫీజు కట్టకపోతే నిన్ను బడికి రానివ్వను అని అంటుంది. వాళ్ల టీచర్ బడిలో జరిగిన సంగతంతా వాళ్ళ నాన్నతో చెప్పాడు. వాళ్ళ నాన్న ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని వచ్చి రాము స్కూల్ ఫీజు కట్టాడు. కానీ ఆ వ్యక్తి నాకు మూడు నెలల తర్వాత అప్పు వడ్డీతో సహా ఇవ్వాలి అని చెప్పాడు. తర్వాత ఒకరోజు సోము వాళ్ళ నాన్న ఒక పని మీద వేరే ఊరికి పోవలసి వచ్చింది అయితే సోము రాముతో బడి నుండి ఇంటికి వస్తున్న సమయంలో రాము ఇలా అన్నాడు సోము ఈరోజు మీ నాన్న ఎటు వెళ్ళాడు అని మా నాన్న ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాడు అని చెప్పాడు సోము. అంతలో రాము వాళ్ళ ఇల్లు రాగానే ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్లేసరికి ఇంటి ముందు అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి గొడవ చేస్తున్నాడు. అయితే రాముకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు రాము మనస్సులో ఒక ఆలోచన వచ్చింది ఒక పది రోజులు బడికి వెళ్లకుండా వాళ్ళ అమ్మానాన్నలతో వ్యవసాయ పనులకు వెళ్లాలి అనుకున్నాడు ప్రతిరోజు పనులకు వెళ్లేవాడు ఆ తరువాత ఆ అప్పును తీర్చాడు. తీర్చిన మరుసటి రోజు నుంచి రామ బడికి వెళ్ళాడు అప్పుడు సోము వాళ్ళ నాన్న ఊరి నుంచి ఇంకా తిరిగి రాలేదు అయితే సోము రాముతో ఇలా అన్నాడు రాము మా నాన్న బెట్టింగ్ యాప్ లో మా కారు ఇంకా ఇల్లు తాకట్టు పెట్టాడు. ఇంకా చాలా డబ్బు పెట్టి ఎంతో నష్టపోయాడు అని చెప్పాడు ఆ మాటల విన్న రాము సోము నీకు ఒక మంచి మాట చెబుతాను విను ఇది మా నాన్న చెప్పిన మాట వేగంగా వచ్చే బండి వేగంగా వచ్చే డబ్బులు ఎప్పుడో ఒకప్పుడు అవి మనని కింద పడేస్తాయి. అని అన్నాడు అలా రోజులు కొద్ది రోజులు గడిచాయి సోము వాళ్ళ నాన్నకు బెట్టింగ్ యాప్ లో చాలా నష్టం వచ్చి ఆర్థికంగా చాలా దెబ్బ తిన్నాడు. డబ్బులు అన్ని పోయాయి. అలా ఆ కుటుంబం కష్టాల పాలయింది. కానీ రాము వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంది
నీతి.దరాశ దుఃఖానికి కారణం
యం.సాత్విక
8 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రేగులపల్లి

అనగనగా భైరవాపురం అనే గ్రామంలో నరసయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య లచ్చవ్వ చాలా పిసినారిది ఆ దంపతులకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు అలా పెద్ద కూతుర్ని అమ్మ చదువుకోనివ్వలేదు చిన్న వయసులోనే పెళ్లి చేసింది వాళ్ల కొడుకుని మాత్రం చదివిస్తుంది వాళ్ల చిన్న కూతురికి కూడా పెళ్లి చేయాలని చూస్తుంది కానీ ఆమె వాళ్ళ నాన్న సాయంతో చదువుకుంది ఆమె అలా చదువుకుంటుండగా వాళ్ళమ్మ తనతో ఇలా అంది నీకు కూడా పెళ్లి చేస్తే మా భారం మొత్తం దిగిపోతుంది అని అంటుంది అప్పుడు ఆమె ఇలా అంటుంది అమ్మ నువ్వు అక్కకు చదువుకోకుండానే పెళ్లి చేశావు కానీ నేను ఇంత తొందరగా పెళ్లి చేసుకోను అంటుంది వాళ్ళ అమ్మ అంతా విని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవు అని తిడుతుంది. అప్పుడు ఆమె అమ్మ నువ్వు కూడా ఆడదానివే కదా ఎందుకు పెళ్లి అని విసిగిస్తావు అని అంటుంది అలా కొడుకు 10వ తరగతి పూర్తి చేస్తాడు కూతురు కూడా పట్టుదలతో చదివి పదవ తరగతి పూర్తి చేస్తుంది పదవ తరగతిలో కూతురికే ఎక్కువ మార్కులు వస్తాయి ఇంకా ఉన్నత చదువులు చదువుతా అంటే వినకుండా వాళ్ళమ్మ పెళ్లి చేస్తుంది వివాహం అయిన తర్వాత ఆమె తన భర్తను తాను చదువుకుంటానని ఎంతో ప్రాధేయపడుతుంది దానికి అతడు సరే నువ్వు ఎంత చదువుకుంటే అంత చదువుకో అని అంటాడు కానీ అత్తింటి వారు ఒప్పుకోరు కానీ భర్త అవేవీ పట్టించుకోకుండా వేరే ఊరికి తీసుకెళ్లి చదివిస్తాడు ఆమె బాగా చదివి పేజీ చేసి టీచర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తుంది కానీ వాళ్ళ అన్న మాత్రం పదవ తరగతి పూర్తికాగానే చదువు మానేసి ఏ పని లేకుండా జులాయిగా తిరుగుతూ ఉంటాడు కానీ ఆమెకు మాత్రం ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చాక తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ నువ్వు నన్ను ఇక్కడ చదువుకోనివ్వలేదు కానీ నేను నా భర్త ప్రోత్సాహంతో చదివి ఎప్పుడూ ఉద్యోగం చేస్తున్నాను అని అంటుంది అప్పుడు తన తల్లి తప్పును తెలుసుకొని ఎంతో బాధపడుతుంది కన్న కొడుకు మాత్రం ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతూ ఉంటాడు అందుకే కూతురు ఇలా అంటుంది ఇప్పటికైనా ఆడపిల్లలని చిన్నచూపు చూడకుండా బాగా చదివించాలని తల్లితో చెబుతుంది.

యం.హాసిని
8 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రేగులపల్లి

గంజాయి మత్తులో జీవితాలు చిత్తు
అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే మధ్యతరగతి కుటుంబం జీవిస్తూ ఉండేది. అతనికి ఒక కొడుకు ఒక కూతురు అతడు వ్యవసాయదారుడు. వ్యవసాయ పనులు చేస్తూ మొదట్లో కుటుంబంతో హాయిగా జీవినం గడిపేవాడు. కానీ ఒకరోజు స్నేహితులతో బయటకు వెళ్ళాడు వారు అతనికి గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు చేశారు దాంతో రామయ్య గంజాయి కి అలవాటు పడ్డాడు. తండ్రిని చూసి చదువుకోవాల్సిన కొడుకు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. నాన్నను అన్నను చూసి చెల్లి చాలా బాధపడింది. తను వాళ్ళ నాన్నను అన్నను మార్చాలని అనుకొని బాగా చదివి ఏ కలెక్టర్ పోలీసో కావాలని అనుకుంది. వాళ్ళ అమ్మ కూలీకి వెళ్లి ఎండలో కష్టపడి కూతురిని చదివించింది. తను ఏమీ తినకుండా చాలా కష్టపడి వీళ్ళకు మాత్రం తిండి పెట్టేది. నాన్న కొడుకు ఇద్దరూ కలిసి మాదక ద్రవ్యాలకు పూర్తిగా బానిస అయ్యారు. వాళ్ల చెల్లి మాత్రం తాను కలెక్టర్ అయ్యి వాళ్ల నాన్న లాంటి మాదక ద్రవ్యాలకు బానిస అయిన ఎందరినో మార్చాలని నిర్ణయించుకుంది.అనుకున్నట్టుగానే బాగా కష్టపడి చదివి కలెక్టర్ అయింది. ఇలాంటి వాళ్ళ పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. అలాగే ఆలేఖను చుట్టుపక్క గ్రామాల్లోకి కూడా పంపించింది .శ్వాస సమస్యలు,ఊపిరితిత్తుల సమస్యలు,ఆకలి.మందగించడం,తలనొప్పి.మైకము మొదలైనటువంటి హానికారక ప్రభావాలపై మాదక ద్రవ్యాల వాడకం ఒక కరపత్రం రూపొందించి, అన్ని ఊర్లలో పంచింది. మత్తు పదార్థాల అమ్మకాలను నిషేధించాలనీ ప్రభుత్వానికి లేఖ రాసింది ప్రజల్లో వవిధ సామాజికమాధ్యమాల ద్వారా అవగాహన కల్పించింది. ఇలాంటి అనేక ప్రయత్నాల వలన తాను అనుకున్నట్టుగానే వాళ్ళ నాన్న అన్న మత్తు పదార్థాలు సేవించడం మాని మేలుకొని ఎప్పటిలాగే వ్యవసాయం చేస్తూ హాయిగా బ్రతికేలా చేయగలిగింది.వాళ్ల చెల్లి అనుకున్నట్టుగానే మాదక ద్రవ్యాల అమ్మకాన్ని నిషేధించింది. నిషేధించడంతోపాటు వాళ్ళ నాన్న అన్న లాగా ఇతర గ్రామాలలో ఇలాంటి మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారిలో మార్పు తెచ్చింది.ఊరూరా మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే సమస్యల పోస్టర్లు అతికించి అవగాహన కల్పించి వారు వారి పనులు చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఆరోగ్యంగా జీవించేటట్లు చేసింది.
నినాదాలు
మాదక ద్రవ్యాలను మానేద్దాం మోదము గా జీవిద్దాం

మాదక ద్రవ్యాలను మానండి ఆరోగ్యాలను కాపాడుకోండి

మాదక ద్రవ్యాల కు నో చెబుదాం రోగాలను తరిమికొడదాం
నీతి
మత్తు పదార్థాలు జీవితాలను చిత్తు చేస్తాయి.
యం.జ్యోత్స్న
9వ

ఉపకారం
అనగనగా ఒక ఊరిలో అంజయ్య అనే అతను ఉండేవాడు. అతడు కట్టెలు కొడుతూ జీవనం సాగిస్తుండేవాడు. అతడు రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని పట్నం తీసుకువెళ్లి అమ్మేవాడు .అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కట్టెలు కొట్టే దగ్గరలో ఒక బావి ఉంది అందులో గొర్రె మరియు ఆవు పడ్డాయి. ఆవు మరియు గొర్రె బాగా అరుస్తున్నాయి. అతడు తన పని తాను చేస్తుండగా అరుపులు వినిపించాయి. కానీ ఆ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అతడు చాలా భయపడ్డాడు. అతనికి చాలా దాహం వేసి నీళ్లు తాగడానికి బావి వద్దకు వెళ్లాడు ఆ అరుపులు ఆ బావిలో నుండి వస్తున్నాయని అతనికి అప్పటి వరకు ఏమాత్రం తెలియదు. అతడు బావిలోకి తొంగి చూశాడు. ఆవు మరియు గొర్రె బావిలో పడి ఉన్నాయి. వాటిని ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు. వెంటనే అతడు తను కట్టెలను తీసుకువెళ్లడానికి తెచ్చిన తాడును బావిలోకి వేసి వాటిని కాపాడాలనే ఉపాయం వచ్చింది. వెంటనే తాడును బావిలోకి వేసి ఆవు మరియు గొర్రెలను కాపాడాడు .అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఎప్పటి లాగానే కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్లాడు. కట్టెలు కొడుతూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు .అప్పుడే అక్కడికి గొర్రె వచ్చింది కానీ గతంలో తనకు చేసిన సహాయాన్ని మరిచిపోయి అహంకారంతో అతనికి సహాయం చేయకుండా వెళ్ళిపోయింది. మరికొద్ది సేపటికి అక్కడికి ఆవు వచ్చింది. అతనికి దగ్గరగా వెళ్లి ఎవరా అని చూసింది అతడు తనను గతంలో ఆపద నుండి రక్షించిన అంజయ్యని గుర్తించింది. పక్కనే ఉన్న వాగు దగ్గరికి వెళ్లి నోటితో నీళ్లను తీసుకొని వచ్చి అతని మొఖం పైన చల్లింది .అప్పుడు అతనికి మెలకువ వచ్చింది.ఎదురుగా ఉన్న ఆవును చూశాడు.ఎంతో సంతోషించాడు. ఆవును తన వెంట తీసుకువెళ్లి ప్రేమగా పెంచుకున్నాడు.
నీతి
మనకు మేలు చేసిన వారిని ఎప్పటికీ మరిచిపోకూడదు

యం .జ్యోత్స్న
9వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రేగులపల్లి

September 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రచయిత్రి మనోఫలకంపై చేసుకున్న ‘జ్ఞాపకాల సంతకం ‘

by Radhika Suri September 21, 2025
written by Radhika Suri

స్వచ్ఛమైన నవ్వు , భేషజమెరుగని చక్కటి పలకరింపు సోదరి అరుణ ధూళిపాళ సొంతం. సోమవారం కవి కుటుంబంలో తనతో నా తొలి పరిచయం . తన పుస్తకావిష్కరణ సభకు వెళ్ళి చేతిలో పుస్తకంతో ఇల్లు చేరిన నాకు, పుస్తకం తిరగేయాలంటేనే మనసు మౌనం దాల్చేది , ఎన్నిసార్లు తిరగేయాలని పట్టుకున్నా కళ్ళు ఎలాంటి భావాలు ఒలకబోస్తాయోనన్న బెంగతో చదవడం మానేసిన సందర్భాలున్నాయి.

స్పందించే మనసున్న కవిలో భావాలు తరంగాలై లేచినపుడు అక్షరాలు ఆరాటంతో జట్టు కట్టి ఆకారం దాలుస్తాయి. భావుకురాలైన అరుణ తన మదిలో అనునిత్యం మెదిలే జ్ఞాపకాలను 53 సంతకాలుగా అక్షరబద్ధం చేసింది. ‘కన్నీటి తరంగం’తో మొదటి సంతకం పెట్టి ‘శిఖర పతాకం’గా ఈ పుస్తకంలో చివరి సంతకం చేసింది.

మూగవేదనలో ఎన్నో సమస్యలు , సంఘర్షణలుంటాయి. జ్ఞాపకాల సంతకాలు కొన్ని కన్నీటి సుడులమధ్య, మరికొన్ని ఉద్వేగాలకు లోనైనపుడు ,ఇంకొన్ని నిస్తేజం ఆవహించినపుడు ఇలా వివిధ భావాల కలగలుపుతో చేసిన జ్ఞాపకాల సంతకాలన్నీ మదిపొత్తంలో భద్రపరిచినవే .

తన మొదటి కవితలో ‘బాల్యం అందమైన ఒక స్వప్నం’/….’బాధ్యతలెరుగని జీవనయానం/ అది ఒక అద్భుత దృశ్య కావ్యం/’ ..అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది.

నిజానికి బాల్యం అందరికీ తీపి గుర్తులనేం మిగల్చదు. కొందరికి మినహాయింపులు ఉంటాయి. చిన్ననాడే దూరమైన నాన్న ఆమె తలపుల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాడు . ‘సంగీత సమ్రాజ్ఞిగా /చూడాలనుకున్న తపన/ కరిగిపోయింది నక్షత్రాల్లో/’అంటూ తీరని కోరికతో దూర తీరాలు చేరిన తండ్రిని తలుచుకుంటూ దుఃఖిస్తుంది . అరుణను వెంటాడే మొట్టమొదటి జ్ఞాపకమది.

విధివికటాట్టహాసం చేస్తే జీవితం ఇలా కూడా ఉంటుంది అనడానికి
మరో సాక్ష్యం ‘తాళి కట్టిన బంధం తెగిపోయినా/ ప్రేమపాశాన్ని తెంచుకోలేక /’…అంటూ వాపోతుంది.సప్తపదితో ఒక్కటైన మనోరథుడు అర్ధాంతరంగా చిటికెన వేలు వదిలేసి కనుమరుగైతే! కళ్ళముందు ప్రేమ గుర్తులు ప్రశ్నలా మిగిలినప్పుడు అపురూపంగా పొదివిపట్టుకుని రక్షణ కవచంలా మారాలంటే ఎన్ని అడ్డంకులు ఉంటాయో మనసున్న వారందరికీ తెలిసిన విషయమే !

‘అన్న ‘హృదయం అన్నీ తానై/నేనే తనకు అన్నీఅయినట్లుగా/పంచి ఇచ్చింది ఆత్మీయతానురాగాలు’/అని గతాన్ని గుర్తుచేసుకుంటుంది. అన్నిట్లో అండగా నిలిచిన సహోదరున్ని ఆత్మీయంగా మనసు పొరల్లో భద్రంగా దాచుకుంది.

కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పిస్తుంది అనే జీవిత సత్యాన్ని జీర్ణించుకుని ఆత్మవిశ్వాసం నింపుకుంటూ ముందుకు సాగడం నేర్చుకున్నానంటూ ‘ విషాద గీతాన్ని నేను/ నైరాశపు రాగాన్ని నేను ‘అంటూ తొలి కవితతోనే జీవిత చిత్రాన్ని కళ్ళ ముందుంచుతుంది.

సుఖదుఃఖాల సారమే జీవితం , పుట్టింది మొదలు గిట్టే వరకు ఎన్నో అనుభవాలు కొన్ని రంగుల మయమైతే, నిరాశ మిగిల్చేవి ఇంకెన్నో ! మదిగదిలో వసివాడని జ్ఞాపకాలే అన్నీ!
గెలుపోటములను
సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తుంది సెలవంటూ వెళ్ళిన బాంధవుడి కోసం కళ్ళు ఇంకా ఆరాటంగా వెతుకుతూనే ఉన్నాయని ఆవేదనతో చెప్తుంది.
బంధాలు ,అనుబంధాల మాయల వలయంలో చిక్కినప్పుడు ఊపిరాడని సందర్భాలుంటాయి, విలువలెరుగని ‘చిన్న మనసుల’ మాటలు ,చేతలు సమ్మెట పోట్లై బాధిస్తున్నప్పుడు జ్ఞాపకంగా మిగిలిన సఖున్ని కలల లోగిలిలో కలిసి మంతనాలాడుతుంది, పోట్లాడుతుంది . అలిగి కన్నీళ్లు కారుస్తుంది .అపసవ్యంగా సాగే బతుకుబాటలో జవాబు దొరకని ప్రశ్నలతో నైరాశ్యం కమ్మేసినపుడు ఏకాంతం బాధిస్తుంటే రేపటి ఆశ కోసం కొత్తదారి వెతుక్కుంటూ ‘అక్షర సమరం చేయడానికి /అంతరంగంలోనికి అడుగెట్టా’/నంటూ ‘సిరా సంతకాలు చేయడానికి’ స్వేచ్ఛగా ముందడుగేస్తుంది.

కాలంతో పాటు బతుకు నడక సాగాలి ఎన్నో మజిలీలను దాటుతూ, ఎగుడు దిగుళ్లను సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవడం నేర్చుకోవాలని , జీవితాన్ని ఏమరుపాటుతనం తలకిందులు చేసేస్తుందని హెచ్చరిక చేస్తుంది. మానవీయ విలువలు మంట గలిసిపోతున్నాయని ఆవేదన చెందుతూ, ప్రశ్నిస్తూనే ఉంటానని నొక్కి చెప్తుంది .

పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి సమాజానికి అందించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులది, కానీ ఒంటరి మహిళగా ఒత్తిళ్ళను తట్టుకుంటూ వాళ్ళను పెంచే క్రమంలో తన మనసునే ఇష్టసఖిగా చేసుకొని కష్టసుఖాలు చెప్పుకుంటూ ఊరట పొందుతుంది.

ఇంటెడు చాకిరీ చేస్తూ అందరికీ తలలో నాలుకైన ఇల్లాలిని వంటింటి కుందేలును చేసిన సమాజమే వేదికలెక్కగానే గృహలక్ష్మి, ధృవతారఅంటూ కీర్తిస్తుందని అసహనం వ్యక్తం చేస్తుంది. స్త్రీ శక్తి స్వరూపిణి , సహనశీలకు అగ్నిపరీక్షలా అంటూ ఆవేశం వెళ్ళగక్కుతుంది .

వాలుకుర్చీని గూర్చి చెప్తుందొక చోట ముప్ఫై నలభై ఏండ్ల క్రిందటి వరకు వాలుకుర్చీలో కూర్చుని సేదదీరని ఇంటి పెద్దలు లేరంటే అతిశయోక్తి కాదు. గుమ్మంవారగా వేసుకొని హాయిగా కునుకుతీస్తూ గతం తాలూకు విషయాలను తలుచుకుంటూ సేదదీరిన వారు ఎందరో కదా! ‘ఒద్దికగా కూర్చుంటుంది ఓ మూల/…మడత పెడితే /గోడకు అతుక్కుంటుంది మౌనంగా/’ అంటూ వాలుకుర్చీని గుర్తు చేస్తుంది. ‘ఒక్క మాటలో చెప్పాలంటే అది/ జ్ఞాపకాలన్నింటినీ/ రాసులుగా పోసి/ దొంతరలుగా పేర్చి/ అరల్లో భద్రంగా దాచిన గుండెతడి /అంటూ కితాబిస్తుంది.

మనిషి జీవితంలో తలగడది ప్రధాన పాత్ర . గుండె తపనలను చల్లారుస్తుంటుందని , గుట్టు విప్పదు /గురుతు తెలియనివ్వదని నర్మగర్భంగా చెప్తుంది.
నిజానికి దిండు అలసినవారి తలకింద ఒదిగిపోయి హాయినిగొలిపే సుతిమెత్తని ఉపధానం. భావోద్వేగాలను, సుఖదుఃఖాలను సమానంగా పంచుకునే ఒరుగుబిళ్ళై బాధలలో ఓదార్పునిస్తుంటుంది .గోపనాన్ని గుమ్మం దాటనీయని నేర్పరి.

నిన్నటి ఓటమిని నేటి అనుభవంగా మార్చుకుని తెలివిగా ఒడిసిపట్టే ప్రయత్నంలో ఎదురయ్యే అవాంతరాలకు బెదరక ముందుకు సాగిపోతే విజయం మీ సొంతమవుతుందంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది.

దేశ రక్షణను తన భుజస్కందాలపై మోసే వీర జవాన్ల త్యాగనిరతిని కీర్తిస్తుంది. సామాజిక రుగ్మతలపై మండిపడి అక్షరాయుధాలతో సరికొత్త సంగ్రామం చేస్తానని గొంతెత్తి నినదిస్తుంది . పల్లె తీరుకు ముగ్ధురాలై అరుగు ముచ్చట్లను అవలోకనం చేసుకుంటుంది .’గుమ్మం ముందు అరుగులు/ నవ్వుల ఆవాసాలుగా నోళ్ళువిప్పి/క్షేమాలను అరుసుకుంటాయి’ అంటూ అరుగు ముచ్చట్లను ఏకరువు పెడుతూ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుని సంబర పడుతుంది. మేధామథనానికి అచ్చెరువొంది , పెద్దరికాలను బద్ధలుకొట్టి /విదేశీ కిరీటాలను/ భరతమాత పాదాల చెంతకు చేర్చిన /అరుదైన అంతరిక్ష కావ్యం అంటూ శ్లాఘిస్తుంది. దేశ కీర్తి పతాకాన్ని/ ప్రపంచ శిఖరంపై/..ఎగరేయాలని ఉవ్విళ్ళూరే యువ శక్తిని జాతిరత్నాలు అంటూ కొనియాడుతుంది .

సోదరి అరుణ కలంపట్టి కదులుతున్న వైనానికి ఆశ్చర్యం కలుగుతుంది. పాత జ్ఞాపకాలను గుండె బరిణలో దాచుకుని నూతన చైతన్యంతో మనసు దారిని మళ్ళించి కవనబాటలో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ _

September 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆకుపచ్చని ద్రవం

by డా. రూప్ కుమార్ డబ్బీకార్ September 21, 2025
written by డా. రూప్ కుమార్ డబ్బీకార్

ప్రయాణంలో మజిలీలు ఉంటాయి

ఇతిహాసాల్లో పర్వాలుగానో, కావ్యాల్లో ఖండికలుగానో

ప్రయాణంలో అప్పుడప్పుడు విరుపులుంటాయి

ప్రయాణంలో జీవితం ఇతిహాసంగానో, కావ్యంగానో నిలిచిపోవాలి

నలుగురి నాలుక మీద ఓ పద్యంగానో, గుర్తుండి పోయే ఓ వాక్యంగానో మిగిలిపోవాలి

షడ్జమ స్వరంలో నెమలి నాట్యంలా జీవనోత్సాహంలా పరిమళించాలి

జీవితమంటేనే ప్రయాణం, ప్రయాణమంటేనే జీవితం

ప్రయాణం జీవలక్షణం కావాలి

ప్రయాణంలో దూరాలు కొనసాగుతూ వుంటే ఆశ్చర్యపోనక్కర్లేదు!

ఈ ప్రస్థానంలో కొన్ని గొప్ప సంఘటనలు జరగవచ్చు లేదా ఎదురు కావచ్చు

ప్రయాణం ఒకరి కోసమే కాకూడదు,

కొమ్మలాంటి దారి మీద ప్రయాణం ఆకుపచ్చని ద్రవమై ప్రవహించాలిI

September 21, 2025 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

మనిషే ఆయుధం కావాలి

by Chandaluri Narayana Rao September 21, 2025
written by Chandaluri Narayana Rao


 ఈ బాధ నా కంటే ముందే
లోకంలో పుట్టి ఎందరినో ఏడ్పించి
ఇప్పుడు నా వంతుగా
నా బతుకుని తలుపు తట్టింది అంతే .

కనిపించని ఈ గాయాన్ని
బాధ అని పిలిచే హక్కు లేదు.
బాధపడే దిక్కు లేదు.
తరాలుగా తుప్పుపట్టిన కన్నీళ్లుకు 
పూడిన గొంతు ఓ దిగుడు భావి.

పాడుపడ్డ సమస్యను పూడిక తీస్తే
విరిగిన ఏళ్లు సాక్షిగా
పగిలిన కలల అలికిళ్ళుతో
చల్లారిన చరిత్రలో 
కంపు కొట్టే కుళ్ళు వాసనే.

పారేసుకున్నవి నాలుకపై నడిస్తే
పచ్చి నిజాలను అందంగా హత్య చేసి
అబద్ధాలతో పూడ్చి పెట్టీ
బాధను జాగ్రత్తగా బతికించి
దూరంగా వదిలి సందేశం చల్లగా తప్పుకుంటుంది.

ఏ బలం లేని బతుకుల్లో
ఏపుగా పెరుగుతూ
ఒకరి కంటే ముందుగా
ఇంకొకరిలో పుట్టి ఎదిగే బాధకు ఎప్పటికైనా
మనిషే ఆయుధం కావాలి.

September 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ధర్మాచార్యులు

by Radhika Suri September 21, 2025
written by Radhika Suri

రేపటి తరానికి చదువుల
సారాన్ని బోధిస్తూ
బతుకుదెరువుకు బాటలు వేసే దిశా నిర్దేశకులు
అజ్ఞానపు చీకటిలో చిక్కిన
అంతేవాసిలో
సంస్కార సురభిళాలద్ది
జాతి రత్నాలుగా మార్చే శిక్షణాదక్షులు

పాఠాలలో జీవిత పాఠాలను రంగరించి
మంచీచెడుల మర్మాన్ని విప్పిచెప్పి విజ్ఞతను నేర్పే వర్ణప్రవక్తలు

ఎంతటి మేధావికైనా తొలి పాఠాలు నేర్పేది గురువని మరువకు

నైతిక విలువలు నేర్పాల్సిన గురువులే నైచ్యానికి చిరునామాగా నిలిచి
వెకిలి చేష్టలు వింత పోకడలతో భావి జీవితాలతో చెడుగుడాడుతూ గందరగోళంలో పడేసి
మొగ్గ తొడిగే అరవిందాలను నిర్ధాక్షిణ్యంగా చిదిమేస్తుంటే
మద్యంమత్తులో జోగుతూ చదువులమ్మ వాటికను అపవిత్రంపాలు చేస్తుంటే
ఆచార్యుల అడుగుజాడలే శిరోధార్యమన్న అభ్యాసకులను అయోమయంలో కి నెట్టొద్దు

అక్షరాలను శ్వాసిస్తూ జ్ఞానోపాసనతో కాంతులీనే
పుంభావ సరస్వతులున్న
భూమిఇది
గురువును బ్రహ్మను చేసి విద్యాపీఠంపై నిలిపిన
సంస్కృతి మనది
గురువు గుర్తొచ్చినంతనే
అసంకల్పితంగా ముడుచుకునే చేతులు సిరిజోతలై అలరించాలి

(మధిరాపానం చేసి బడిలో వీరంగం చేసిన ఉపాద్యాయురాలిని మీడియాలో చూసి)

September 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

జెండా సూర్యుడు

by కందుకూరి శ్రీరాములు September 21, 2025
written by కందుకూరి శ్రీరాములు

జెండా సూర్యుడు
రెపరెపలాడుతున్నాడు !

ఎన్ని మేఘాలు
ఎన్నెన్ని గ్రహణాలు కమ్ముకున్నాయి
ఎన్ని తాపాలు
ఎన్నెన్ని కోపాలు విరజిమ్ముకున్నాయి

ఎన్ని వాదాలు
ఎన్నెన్ని రణన్నినాదాలు
కవోష్ణ రక్తసిక్తమయ్యాయి !

గత చరిత్ర
వర్తమానానికి పూలబాట కావాలి !
వర్తమానం భవిష్యత్తరానికి
కొత్త లోకం రావాలి !

ఎగురుతున్న మువ్వన్నెల జెండాలో
కుట్రలూ కూహకాలూ కనపడొద్దు
నవ్వెన్నల మువ్వల గువ్వలు కువకువమనాలి !

జెండా బానిస కాదు !
కారాదు !!
జూలు దులిపి గర్జిస్తున్న సింహం !!!
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల చిహ్నం !!!
సమున్నతంగా జాతి జనులు పులకరించిపోయే మహోత్తుంగ జలపాతం !!!!

ఇవ్వాళ్ల ఈనాడు
ఎర్రకోట మీదనే కాదు
ప్రతి ఇంటి మీదనే కాదు
జాతి జనుల గుండెల్లో
ధీరోదాత్తమైన
నిరంతరంగా
నిరభ్యంతరంగా
ఎగురుతున్న మువ్వన్నెల జెండా !

యావత్ జాతికి
పెద్దదిక్కు !
శాసిస్తున్న సామ్రాజ్యవాదుల్నెదుర్కొనే
ధైర్యం కవచపు ఉక్కు !

వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవానికి నమస్కారం !
మువ్వన్నెల ప్రజాస్వామ్య జెండాకు వందనం !

భరత వీరుడు
తలవంచడు !
జెండా శౌర్యం
తలదించదు !
ఎర్రకోట మీద రెపరెపమంటాయి !!

(75 ఏళ్ల స్వాతంత్ర్య వజ్రోత్సవ సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో చదివిన కవిత)

September 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నోసటబొట్టు ఆచారమా ?ఆరోగ్యమా….?కుంకుమ బొట్టు ధరించడం వల్ల ఎన్నో లాభాలు

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) September 21, 2025
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

‘కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం’ అనే శ్లోకం వినని వాళ్లుండరు. సంస్కృతంలో ‘తిలకమ్’ అని, తెలుగులో ‘బొట్టు’ అని అర్థం. మన నుదుటిలో జ్ఞాన నేత్రం ఉండేచోటు అంటే రెండు కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రానికి తగులుతూ ఎఱ్ఱని కుంకుమ బొట్టు ప్రతినిత్యం పెట్టుకోవాలని యోగశాస్త్రం చెబు తోంది. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులున్నాయి. ఇవి ప్రాణశక్తిని ప్రవహింపజేసే అదృశ్య నాళికలు. వీటన్నింటికీ కేంద్ర స్థానం లలాట భ్రూమధ్యభాగం, అంటే కనుబొమల మధ్య స్థానం. ఈ స్థానంలోంచి ప్రాణశక్తి కిరణాలు ప్రసారమౌతాయి. ఈ ప్రాణశక్తి కిరణాలు వ్యర్థం కాకుండా ఆపగల మహత్తరమైన శక్తి, కుంకుమ, విభూతి, గంధం, కస్తూరి, చందనం వంటి పదార్థాలకు ఉంది. ఇవి దృష్టి దోషాలను కూడా నివారిస్తాయి. అందుకే మహర్షుల బోధనల వలన నుదుటిపై బొట్టు ధరించడం మనకు సంప్రదాయంగా మారింది. కంకుమలో పసుపు ఉంటుంది, రెండు గుణాలు కలిగిన ఈ కుంకుమను నుదుట గంధం ధరించి దానిపై కుంకుమ ధరిస్తే. మంచి ఫలితాలుంటాయి. గంధం జ్ఞానానికి సంకేతం.

యోగశాస్త్రం ప్రకారం ఈ రెండు కనుబొమల మధ్యన ఆజ్ఞా చక్రం ఉండే చోట మనం పెట్టుకునే కుంకుమ వేలి ఒత్తిడివలన ఒకర కమైన ఉత్తేజం ఏర్పడుతుంది.
స్త్రీకి నొసటిమీద ఎర్రని కుంకుమ బొట్టు ముత్తైదువతనాన్ని సూచిస్తుంది. మనస్తత్వ శాస్త్రరీత్యా ఎర్రని కుంకుమ ఒక ప్రత్యేక మైన వర్గ ఫలం కలిగి ఉంది. నొసటిమీద కుంకుమ పెట్టుకోవడం మన భారతీ యుల ప్రాచీన సంప్రదాయం బొట్టు ధరించడం మగవారికీ అవ అవసరమే భగవంతుడు సంచరించే షుఘుమ్ననాడి ఎక్కడ రెండు కనుబొమల మధ్య వుంటుందో అక్కడ ఆజ్ఞాచక్రస్థానంలో కుంకుమ ధరిం పించడం వలన భగవంతుని స్మరించిన వారమౌతాము

ముఖానికి ఆభరణం తిలకం. పద్మపురాణంలో, ఆగ్నేయపురాణంలో పరమేశ్వర సంహితలో స్త్రీలు, పురుషులు అనే భేదం
లేకుండా నొసటిమీద కుంకుమ ధరించడం వలన భర్త ఆయుష్షు పెరుగుతుందని, లక్ష్మీనివాసమైన నుదుటిపై బొట్టు ధరించే వేళ్ళు ‘ఊర్ధ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్యవర్ధకమ్ లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీ నివాసకమ్’ అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టుపెట్టుకోవాలని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే అంత్య ప్రాసల కవి ఆరుద్ర ‘నూరేళ్ళ షెట్టు నొసటి బొట్టు అది నోచే నోముల కలిమి పెట్టు” అన్నాడు జ్ఞానదాతయైన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోఖించాడు. అలాంటి జ్ఞానాన్ని పొందడానికి పురు షులు సైతం బొట్టు పెట్టుకోవడం ఆనవాయితిగా వస్తోంది.

బొట్టు శుభానికి సంకేతం. శుభకార్యాలను ఆహ్వానించడానికి మహిళలకు బొట్టు ఇవ్వడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. బొట్టును జగన్మాత సౌందర్య చిహ్నంగా భావిస్తారు. నాగరిక్తత ముసుగులో ఈనాడు యువత కుంకుమ బొట్టుకు దూరమౌతూ ప్లాస్టిక్ స్టిక్కర్లకు దగ్గరౌతోంది. ఈ ప్లాస్టిక్ స్టిక్కర్ల వలన రకరకాల చర్మవ్యాధులకు గురి అవుతున్నారు. హిందూ ధర్మశాస్త్రాల్లో ఉన్న కొన్ని ఆచారాలను వాటి వెనుక ఉండే వైజ్ఞానిక విషయాలను నేటి యువతులు తెలుసుకోవలసిన అవసరం ఎంతగానో వుంది.

కుంకుమబొట్టు. మేదస్సును పెంచి వృద్ధిపరచే సాధనంగా మన పూర్వీకులు భావించారు. ఈ కుంకుమ బొట్టు స్త్రీల ముఖారవింద ఆకర్షణతోపాటు ఆరోగ్యసూత్రాలు దాగి ఉన్నట్లు, హిందూ స్త్రీ నుదుటి బొట్టు లేకపోవడం ముఖం కళావిహీనంగా అగుపిస్తుంటుంది. ప్రాచీన కాలంనుండి ఆచారంగా వస్తోన్నది. పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరిం చడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సుకాని నిష్ఫలమౌతాయని, మహర్షులు, సాధువులు, దేవతా ఉపాసకులు నుదుట తిలకం ధరిం చేవారు. నిత్య నైమిత్తిక కామ్యకర్మలు, శ్రాద్ధకర్మలు నుదుటిన బొట్టు లేకుండా చేయడం వలన నిష్ఫలమవుతాయని మన ధర్మశాస్త్రాల్లో కూడా పేర్కొనబడింది.

( ఈ వ్యాసం ఆంధ్రభూమి దినపత్రికలో సెప్టెంబర్ 9, 2017 న వ్రాశాను )

September 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

రామయ్య సందేహం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, September 21, 2025
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

నరహరిపురం లోని శరభయ్య పొలం పనిచేసి సాయంత్రం తన మిత్రుడైన రామయ్యతో ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతని చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది. దారిలో ఒక నాగుపాము అతనిని కరవడానికి వచ్చింది. శరభయ్య తన చేతిలోని కర్రను చూపి దానిని బెదిరించాడు . ఆ కర్రచప్పుడుకు ఆ పాము భయపడి వెనుకకు తిరిగి పారిపోయింది. తర్వాత ఆ శరభయ్య మరికొంచెం దూరం వచ్చేసరికి ఒక కుక్క అతని వద్దకు వచ్చింది. వెంటనే శరభయ్య తన చేతిలోని కర్రను చూపి దాన్ని కూడా బెదిరించాడు. అది కూడా భయపడి పారిపోయింది.
ఆ తర్వాత అతడు ఇంటి పొలిమేరల వద్దకు వచ్చేసరికి అతని వద్దకు ఒక లేగ దూడ పరిగెత్తుకుంటూ ఎదురుగా వచ్చింది. వెంటనే శరభయ్య తన చేతిలోనున్న కర్రను కింద పడవేసి ఆ లేగ దూడను తన చేతులతో ఆప్యాయంగా ఎత్తుకున్నాడు .
అప్పుడు ఇదంతా చూసిన రామయ్య ” ఏమయ్యా శరభయ్యా! నాకొక సందేహం వచ్చింది. ఎందుకో నాకు నీ వాలకం అర్థం కాలేదు. ఆ పామును, కుక్కను నీవు నీ చేతనున్న కర్రతో బెదిరించావు. మరి ఈ లేగదూడనేమో నీ చేతులతో ఎత్తుకున్నావు. ఇదేమిటి! పోనీ ఆ పాము విషపురుగు కనుక బెదిరించావు. సరే! కానీ ఆ పెంపుడు జంతువైన ఆ కుక్కను కూడా నీవు ఎందుకు బెదిరించావో నాకు అర్థం కాలేదు” అని అన్నాడు.
అప్పుడు శరభయ్య ” ఔను. నీవన్నది నిజమే. ఆ పాము విషపురుగు. అందులోనూ అది నన్ను కాటేయడానికి వచ్చింది. అందుకే దానిని నా కర్రతో బెదిరించాను. అందువల్లనే అది వెనుకకు తిరిగి పారిపోయింది. ఇక ఆ కుక్క నన్ను కరవడానికి వచ్చింది. అది పెంపుడు జంతువే. కాదనను. కానీ అది పిచ్చికుక్క. మనను పిచ్చికుక్క కరిస్తే ఎంత ప్రమాదమో నీకు తెలియంది కాదు. అందుకే దానిని కూడా నా చేతిలోని కర్రతో బెదిరించాను. అదీ భయపడి పారిపోయింది. అవి రెండు నాకు హాని చేయడానికి వచ్చాయి. అందువలననే వాటిని కర్రతో బెదిరించవలసి వచ్చింది.
ఇక ఈ లేగ దూడ సంగతి అంటావా! అది మొన్న మొన్ననే పుట్టింది. దాని వల్ల మనకు ఎలాంటి కీడు లేదు. అది నాకోసం ప్రేమతో పరిగెత్తుకొని వచ్చింది . మన కోసం ప్రేమతో వచ్చిన చిన్నవారిని మనం దండిస్తామా చెప్పండి. అందువల్లే అలా చేశాను” అని అన్నాడు. అతని వివరణకు రామయ్య ఎంతో సంతోషించాడు. అందుకే పిల్లలూ! మనకు ఏదైనా సందేహం వస్తే దానిని పెద్దవారిని అడిగి నివృత్తి చేసుకోవాలి.

    September 21, 2025 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    కథలు

    జన్మదినం

    by కె. వీణారెడ్డి, September 21, 2025
    written by కె. వీణారెడ్డి,

           ఆరోజు భరత్ భర్త్ డే!
      “గుడ్ మార్నింగ్ అండ్ హాపీ భర్త్ డే డాడీ” అంటూ పిల్లలు వరుణ్, పవన్ ,
      “మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే” అంటూ అతడి భార్య దివిజ అభినందనలు తెలిపారు.
      “థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ”అంటూ  ఆనందంగా అందరినీ హగ్ చేసుకున్నాడు భరత్.
      భర్త్ డే ఆదివారం కావడంతో ఇంట్లో అందరూ ఎంతో ఉత్సాహంగా వున్నారు.
      “ఈరోజు నా భర్త్ డే సందర్భంగా..ఇంట్లో అమ్మకు వంటపని లేకుండా కేక్ తో పాటు ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాము ఓకేనా?”
      “ఓకే డాడీ.. అలాగే చేద్దాం” అంటూ సంబరంతో ఎవరికేది ఇష్టమో ఆ లిస్ట్ మెన్షన్ చేశారు పిల్లలు!
      టిఫిన్ కార్యక్రమం తర్వాత, ముందురోజు ఆల్టరేషన్ కని ఇచ్చిన తన కొత్త డ్రస్ తెచ్చుకుందామని వెళ్లి తిరిగొచ్చేటపుడు, గేటుదాకా వచ్చిన భరత్ వర్షం చినుకుల కారణంగా ర్యాంప్ మీద కాలు జారి కింద పడిపోయాడు!
      “అయ్యో డాడీ” అంటూ ఆందోళనగా తండ్రిని పట్టుకొన్న పిల్లలు “మమ్మీ.. డాడీ కింద పడ్డాడు” అంటూ కేకేశారు. ఆదుర్దాగా అటువచ్చిన దివిజ పిల్లల సాయంతో భర్తను లేవనెత్తింది. కుడికాలికి గేటు దిమ్మె తగిలి  బాగా నొప్పి కావడంతో,  భార్య భుజంపై వేసి, పిల్లల ఆసరాతో  ఇంట్లోకి నడిచివచ్చి మంచంపై వాలిపోయాడు భరత్. కదలనీయని కాలిబాధతో “అమ్మా..అబ్బా” అంటూ తల్లడిల్లిపోతున్న భరత్ ను, పక్కింటాయన సాయంతో క్యాబ్ లో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. స్కానింగ్ చేసి, కాలి మడమ దగ్గర హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పి కాలికి బ్యాండేజ్ వేశారు హాస్పిటల్లో!
                           *********
      “ఎలా వుంది భరత్ ? నీవు కిందపడ్డావని, కాలికి  లైట్ ఫ్రాక్చర్ అని తెలిసి వచ్చాను. డాక్టర్ ఏమన్నాడు?” అని అడిగింది పక్క కాలనీలో వున్న, అప్పుడే అక్కడికొచ్చిన భరత్ మేనత్త మీనాక్షి.
      “రెండు నెలలు రెస్టు తీసుకొమ్మని చెప్పి, క్యాల్షియం టాబ్ లెట్స్ , పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఇంటికి  పంపించారత్తమ్మా” అన్నాడు భరత్ నీరసంగా.
    “కాలు బాగా బాధ పెడుతోందా?” ఆర్తిగా అడిగింది మీనాక్షి.
      “బాగానే బాధపెడుతోంది.. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తప్ప నిన్నటినుండీ నిదురకూడా పట్టడంలేదు!” మూలుగుతూనే అన్నాడు భరత్.
      “పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం అంత మంచిదికాదు కదా.. నొప్పికలవాటుపడుతూ మెల్లమెల్లగానూ సహజంగానూ కంట్రోల్ కావడమే కరేక్టేమో కదా”
      “అమ్మో అత్తమ్మా అది నావల్ల కావడం లేదు.. పెయిన్ కిల్లర్ వేసుకోకుంటే పెయిన్ నన్ను కిల్ చేసేలా వుంది!”                                              
      బాధగా మూలుగుతూనే అన్నాడు భరత్ .
      “అయ్యో భరత్ నీ భర్త్ డే నాడే ఇలా జరగడం బాధగా అనిపిస్తుందిరా!”
      ” నా సగం అదనపు బాధంతా అదేకదా అత్తమ్మా.. ఎంతో ఉత్సాహంగా వున్న ఇంట్లోని వాళ్లనంతా నిరుత్సాహపరిచిన ఫీలింగ్ నన్ను అంత తొందరగా హీలింగ్ కానివ్వదేమోననిపిస్తుంది!”
      “బాధపడకు భరత్..  వాళ్లు నీ ఫ్యామిలీ మేంబర్సేగా.. కష్టం సుఖం కలిసి పంచుకోవలసిన వాళ్లేకదా! అవునూ ఇంతకూ నీ పుట్టినరోజుకు ఎవరెవరిని ఆహ్వానించివుండిన్నవు?”
      “ఎవరినీ లేదు.. ఓన్లీ ఫ్యామిలీమెంబర్స్ అంతే!”
      మూలుగుతూనే అప్సెట్ మూడ్ తోనే అన్నాడు
      ” అన్నట్టు నేనోమాటడుగుతాను బాధపడవుగా భరత్ ?”
      “బాధెందుకత్తమ్మా.. మొదటినుండీ నువ్వు నాకు ఎన్నో చెప్పేదానివి.. వెల్ విషర్ వే కాదు నాకు రోల్ మోడల్ వి కూడా! నువ్వంటే నాకెంతో గౌరవం అభిమానం!”
      “థ్యాంక్యూ భరత్.. అదే చనువుతో అడుగుతున్నాను.. నిన్నటి నీ జన్మదిన సందర్భం లో పాల్గొనేది ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అన్నావు.. ఎవరెవరి గురించి అన్నావు?”
      “ఇంకెవరు ఫ్యామిలీ అంటే భార్య దివిజ, పిల్లలు వరుణ్ పవన్ లు.. అంతేకదా అత్తమ్మా!”
      ” అంతేనా భరత్.. నీ జన్మదిన పర్వంలో ప్రధానంగా పాల్గొనవలసినవాళ్లింకెవరూ లేరా?”
      “అంతకన్నా ముఖ్యమైనవాళ్లింకెవరుంటారు?”
      “వుంటారు.. వున్నారు భరత్.. నీ జన్మదినవేడుకల్లో పాల్గొనవలసిన వాళ్లలో అందరికన్నా అతిముఖ్యమైన వ్యక్తి  ఎవరంటే.. నీకు జన్మనిచ్చి, నీకోపుట్టినరోజును కల్పించిన మీ అమ్మ శాంతమ్మ!”
      “అత్తమ్మా” ఆశ్చర్యం కలవరం కలగలిసిన స్వరంతో అన్నాడు భరత్ .
      ” అవును భరత్ ఆలోచించు.. నీవు కడుపున పడిననాటినుండీ తొమ్మిది నెలలు గర్భవికారాలను భరించిమరీ నీబరువును మోసిన భూమాతకాదా నీ జన్మదాతగా మీ అమ్మ?”
      అవును అన్నట్టు తలాడించాడు అంతలోనే కదిలిన కాలి బాధతో “అమ్మా” అని మూలిగాడు భరత్.
      “చూడు భరత్ నీ కాలికి అయిన చిన్న హెయిర్ లైన్ క్రాక్ కే ఇంతలా ఇబ్బంది పడుతున్నావ్.. కానీ..  కానీ.. నీ తల్లి తన ప్రసవవేదన సమయంలో ఎంతబాధ భరించివుంటుందో ఊహించనైనా ఊహించివుంటావా?” అంటున్న మీనాక్షి కంఠం వణికింది. వింటున్న భరత్  భారంగా బాధ వ్యక్తపరుస్తూనే అయోమయంగా చూశాడు.
      “భరత్.. నేనీమధ్యే ఒకలేడీ డాక్టర్.. అందునా ప్రసవానుభవంవున్న గైనకాలజిస్ట్ చెప్పగా విన్నాను.. ప్రసవ సమయంలోని నొప్పి స్థాయిని అంచనావేసేది, జీరో టు టెన్ పాయింట్ ఫైవ్ దాకా వుండేది డోల్ స్కేల్ అనేదాని మెజర్ మెంట్ ప్రకారం.. దాదాపు దాని చివరి సంఖ్య దాకా తాకే బాధ ప్రసవవేదనేనట! అలాగే మరో అంచనా ప్రకారం, సగటున మానవశరీరం భరించగలిగేది 45యూనిట్ల బాధ మాత్రమేనట! కానీ.. కానీ.. పురిటినొప్పుల్లో మాత్రం ఆ మాతృమూర్తి భరించే బాధస్థాయి 57యూనిట్లదాకా వుంటుందట.. అంటే అది మామూలు బాధకాదుకదా భరత్ ?”
      “అత్తమ్మా” చిన్నగా భరత్ కంఠం కంపించింది.
      “అవును భరత్.. బాధయొక్క ఆఖరి అంచుకు చేరిన ఆపురిటినొప్పి స్థాయిని అంచనావేయగలమా? ఒకేసారి 20 ఎముకలు విరుగుతున్నంత బాధ వుంటుందట! చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కే నీవింత హైరానా పడుతున్నావ్ .. కానీ.. నీకు జన్మనిచ్చిన, నీ జన్మదినానికి కారణమైన నీతల్లి నీకు జన్మనిచ్చేవేళ, అంతటి ఆ పురిటినొప్పులనెలా భరించి నిన్నీలోకంలోకి తీసుకొచ్చిందో అర్థంచేసుకోగలవా?”
    “అమ్మా” అప్రయత్నంగా భరత్ కంటివెంట నీటితోపాటు నోటివెంట ఆమాట వచ్చింది.
      “భరత్ దీన్నిబట్టి నీకింకా ఏమర్థమవుతుంది.. ప్రసవ సమయంలోని మరణావస్థను దాటి నీకు జన్మనిచ్చిన తల్లికూడా మరోజన్మ ఎత్తిందన్న సత్యం అందులో వెల్లడి కావడం లేదా? నీ పుట్టినరోజు నీ ఒక్కడిదేకాదు, అది నీతల్లి మళ్లీ పుట్టినరోజు అని గుర్తించలేకున్నావా?”
       భారమైన, సంచలనాత్మకమైన భావాలతో క్షణం కళ్లు మూసుకున్నాడు భరత్.
      “నీ పుట్టుకకు ఆధారమైన, నీ పుట్టినరోజు వేడుకకు కారణమైన, అందరికన్నా ముందు నువ్వు నీ తల్లిని తలచుకోవలసిన రోజు.. నీ తల్లితో కలిసి నీ జన్మదినాన్ని నీ జనని జన్మదినంగా కూడా జరుపుకోవలసిన దినం.. అలా ఎలా మరిచిపోయావు మీ అమ్మ శాంతమ్మను?”
      హితవైన మందలింపుతో కూడిన ఆ ప్రశ్నతో , ఎంతో ఆవేదన, అంతులేని ఆర్ద్రతా భావం కలిగింది భరత్ లో!
    “అమ్మా.. నన్ను మన్నించమ్మా” అంటూ అమ్మను తలుచుకుని, అమ్మ యొక్క తనజన్మ భారాన్ని తెలుసుకొన్న ఆ వేదనాస్పందన అనేది తన హెయిర్ లైన్ ఫ్రాక్చర్ బాధను తేలికపరిచినట్టనిపించి, పెయిన్ కిల్లర్స్ తో పనిలేదనిపించింది భరత్ కు!
      తన తల్లికి కొత్త జన్మనిచ్చిన తన జన్మదినం.. తన జనని జన్మదినం అనికూడా అనిపించి తన మాతృమూర్తి పట్ల ఒక అమృత భావన కలిగిందతడిలో!
    “అత్తమ్మా.. అమ్మను మరిచి జరుపుకున్న ఇన్నేళ్ల నా జన్మదినాలన్నీ నిరర్థకమైనవే! ప్రసవవేదన అనే మరణావస్థను కూడా మధురబాధగా భరించి నాకు జన్మనిచ్చి తాను మళ్లీ జన్మించిన నాతల్లితోనే ఇకపైన నా జన్మదినాలన్నీ! కొత్తగా నాకు మాతృదర్శనం కలిగించి, సత్య సందర్శనం గావించిన నీకు వేనవేల ధన్యవాదాలత్తమ్మా!” అంటూ మేనత్త చేతుల్ని  తన చెమరించిన కళ్లకద్దుకున్నాడు భరత్!
                       *********
                                              కె. వీణారెడ్డి,
                                              హైదరాబాద్.
                                            7337058025

    September 21, 2025 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    Newer Posts
    Older Posts

    Recent Posts

    • వేకువ పాట
    • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
    • సనాతనమంటే?
    • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
    • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

    @2021 - All Right Reserved to Mayuukha The Magazine


    Back To Top
    మయూఖ
    • హోమ్
    • కవితలు
    • కథలు
    • ధారావాహిక నవల
    • వ్యాసాలు
    • బాల‌సాహిత్యం
    • ఇంద్రధనుస్సు
    • ఇంట‌ర్వ్యూలు
    • పుస్త‌క స‌మీక్ష‌
    • అనువాద సాహిత్యం
    • About Us