మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

వెలుగుల వేళ – శుభకృతేతెంచె

by బ్రాహ్మణపల్లి జయరాములు April 9, 2022
written by బ్రాహ్మణపల్లి జయరాములు

“శార్వరి బతుకు చీకట్లో సాగిపోయే
ప్లవరు జనులంత పడరాని పాట్లుపడిరి
నేటి కైనను బతుకాశ నిజము చేయ
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప
కోవిడను వ్యాధి బీదల కొంపముంచె
చేయ పనులేవి లేకను చెదిరె మనసు
ఉసురు సురని బతుకువారి యుసురు నిలుప
శుభకృతేతెంచె ప్రజలకు సుఖముగూర్ప
రెండువత్సరాలుగ ప్రజలేమి తోడ
చెప్పలేనట్టి బాధల చిన్నబోగ
ఊపిరిని పీల్చు కొనజేసి యుత్సవముగ
శుభకృతేతెంచె ప్రజలకు సుఖము గూర్ప
రోగ బాధలు లేనట్టి రోజు లొచ్చి
కష్టజీవులు సుఖపడుకాలమొచ్చి
లోకమంతట శుభములు కేకవేయ
శుభకృతేతెంచె ప్రజలకు సుఖముగూర్ప
రైతు శ్రామిక జనులంత రేయి పగలు
శ్రమకు తగిన ఫలితములు సొంతమవగ
సర్వవృత్తుల జనులెంతొ సౌఖ్యమొంద
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప
భారతీయులందరునిక బాధలేక
సుఖము సంతోషములనెంతో చూరగొనగ
ఈ యుగాదియు నూరట నిచ్చుచుండ
శుభకృతే తెంచె ప్రజలకు సుఖముగూర్ప

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శుభకృత్ వత్సర శుభాకాంక్షలతో..

by చుక్కాయపల్లి శ్రీదేవి April 9, 2022
written by చుక్కాయపల్లి శ్రీదేవి

చం.శుభములొసంగుచున్ ప్రకృతి శోభలతో నెదమోదమొందగా
ప్రభవమయెన్ శుభోదయ ప్రభాత మయూఖములే వసంతమై
సభికుల లాస్యలాహిరి ప్రశాంత మనోహర రంగభూమియం
దభయముదెల్పుచున్ శుభకృతై తరలెన్ ఘనమౌయుగాదియై

ఉ.తీయని గూఢముల్ బ్రతుకు తీరును మార్చగ, వేపపూతయే
మాయని గాయముల్ మరచి మౌనముదాల్చగ‌,నుప్పు కారముల్
సోయగమౌచు జీవితపు సొంపులు హంగులు తీర్చిదిద్దగా
సాయమొనర్చు షడ్రుచుల సారముగూర్చు నుగాది పచ్చడై

ఉ.కోకిల సుస్వరమ్ములును కొమ్మలరెమ్మల లేత పత్రముల్
సాకరమై మనోహర వికాసములై వనశోభనింపగా
చీకటి వీడ జాతకము చింతలు బాపెడి యోగమందగా
యీకలి దోషముల్ తొలగి యీశ్వర దీవెనలే స్రవించులే

శా.పంచాంగశ్రవణమ్ము పాపహరమై భావిన్ ప్రసాదించగా
సంచారమ్మొనరించుచుండు గ్రహముల్ చైత్రమ్ముతో సాగుచున్
పంచున్ వత్సర సత్ఫలమ్ములదె సంప్రాప్తమ్ములౌ రాశులున్
పెంచున్ ధైర్యము జాగ్రతల్ ప్రజలలో విచ్చేయు సన్మిత్రతన్

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్త్రీ విద్య

by రంగరాజు పద్మజ April 9, 2022
written by రంగరాజు పద్మజ

ఒద్దిరాజు సోదరులు వంద సంవత్సరాల క్రితమే తెనుగు పత్రిక( 12-8-1925) లో ఒక ఆదర్శవంతమైన సంపాదకీయం రాశారు. అదేమిటంటే స్త్రీ విద్యా వ్యాప్తి కోసం సమాజానికి కనువిప్పు కలిగించేలా ఉంది ఆ సంపాదకీయం ! అంతే కాదు! స్వాతంత్ర్యోద్యమం, గ్రంథాలయోద్యమం గురించి చెప్పిన సంపాదకీయం!
ఆ సంపాదకీయాన్ని వంద సంవత్సరాలైనాఎందుకు ఆ విషయం చెప్పుకుంటున్నామంటే…? ఈ సంవత్సరం తెనుగు పత్రిక శత జయంతి జరుపుకుంటోంది. అంతేకాదు స్త్రీ విద్యావశ్యకత చెబుతూనే మగవారి బాధ్యతలను తెలిపారు.అందుకే ప్రత్యేకంగా ఈ అంశాన్ని పాఠకులకు మరియొక సారి తెలియజేయదలచుకున్నాన
మహిళల విద్య గురించి ఇప్పటికీ బాహటంగా
కాకున్నా లోలోపల ..అక్కడక్కడా …పల్లెల్లో కాకున్నా
బాగా చదువుకున్న వారి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
తమ వాదాలు పరిగణనలోకి తీసుకోవాలనీ, నిజా నిజాలు బయట పడాలనీ,కాని పక్షంలో నిందా పాత్రులేననీ, స్త్రీలు విద్యావంతులైతే ఆ సంసారం ఆనందంతో గడపుతూ,సుఖవంతమైన జీవితం జీవించవచ్చనీ,ముఖ్యంగా స్త్రీ విద్య తప్పనిసరనీ,
అప్పుడే మహిళ అంతులేని మెప్పులు పొందుతుందనీ అందరికీ తెలుసు.
ఐనా కొందరు అహంభావులై మహిళలు విద్యావంతులైతే అవిధేయులుగా అవుతారనీ చెడు ప్రచారాలు చేసే వారికి స్వాభిమానం లేదేమో?
చదువుకొన్న యువతులకు మాత్ర స్వాభిమానం తప్పక దెబ్బతింటుంది అనడంలో సందేహమేలేదు.ఆ విషయంలో చర్చకు తావేలేదు.సరే ఆవిషయం వదిలేసి, సాధ్యమైనంత వరకు తమ భార్యా- బిడ్డలను
చదివించడం మంచిదని ఈనాటి కాలానికి అక్కరకొచ్చేది చదువేనని అనుభవం ద్వారా తెలుసుకున్నవారందరూ స్త్రీ విద్య ఆశపడుతున్నారు.
విద్య కొరకు తాపత్రయ పడుతున్న సమాజంలో
నిజామాంధ్ర ప్రదేశ్ లలో ఉన్న చదువుకోవాలనుకునేమహిళల వంటి ( తెనుగు పత్రిక సంపాదకుల జనయిత్రి వంటి ) అంటే ఒద్దిరాజు సోదరుల తల్లిగారైన రంగనాయకమ్మ గారివంటి వారెందరో ఉన్నారు.
వాళ్ళు కేవలం పెద్ద వారి ఆచారమని. మంచిదైనా కాకున్నా దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇక్కడే కాదు ప్రపంచమంతటా అందరూ చదువుకోలేకపోతున్నారు. ఇలా తెలియని వారెందరో ఉన్నా…బహిరంగ సభలలో వేదికలమీద భయమే లేకుండా ఉపన్యాసం చేసేలా స్త్రీ విద్యను సాటి తోటి మహిళలకు తెలిసేలా శ్రీమతి చాట్రాతి లక్ష్మీ నరసమాంబ, శ్రీమతి సత్యవతీబాయి మొదలైన ఏ కొద్దిమంది మాత్రమో మహిళలు అదీ వేళ్లమీద లెక్కబెట్టేంత మంది మాత్రమే నిజాంరాష్ట్రాంధ్ర దేశంలో స్త్రీ విద్య ఉందనేది కొంచమైనా అపవాదు తొలగించగలుగుతున్నారు.
స్త్రీ విద్యను గురించి శ్రద్ధ తీసుకోవలసిన ఈ సమయంలో సులువైనది, భావుకతతో కూడిన ఉన్నత విద్యాభిరుచికి మూలమైన , అంతులేని లాభాలున్నటువంటి, అందరికీ ఆమోదమైనట్టి ఇంట్లోనే విద్య నేర్చుకునే విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇలా ఇంట్లో ఉండి విద్య నేర్చుకోవడం చాలా తేలిక!కాబట్టి ఆడపిల్లలే కాకుండా గృహిణులు కూడా చదువు నేర్చుకోవచ్చును. అక్షరం ముక్క రాని ఆడవారుసైతం తక్కువ సమయంలోనే తన ఇంటి
కుపయోగపడే పనులను అవలీలగా చేసుకునే శక్తి సామర్ధ్యాలు కలుగుతాయి.
స్త్రీ విద్యపై అభిమానమున్న అన్ననో, కుమారుడో? భర్తనో? తండ్రో ఇంటినుండి చదివి పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలనుకునే వారికి కాస్త సహాయం చేయడమేమంత కష్టం కాదు!
ఇలా ఇంట్లో ఉంటూనే చదువుకొని పరీక్షలు రాసే అవకాశము మన రాష్ట్రంలోనూ వ్యాప్తి చెందుతున్నది. అందుకుగాను చాలా సెంటర్లు ఏర్పడ్డాయి. వాటి ద్వారా కావలసిన సమాచారము దొరుకుతుంది. అయినా కూడా యువతులందరికీ ఈ విషయం గురించి తెలిసింది అనుకోవడానికి వీలు లేదు. అందుకే ఎక్కువమంది మహిళలు ఈ పరీక్షలు రాసి పాస్ అవుతారని చెప్పలేము. కానీ ఇలాంటి అవకాశము అందిపుచ్చుకోవడానికి ముందుకు రావడానికి ఎన్నో ఆటంకాలున్నాయి.. అయినా ఎక్కువమంది ఈ విషయం తెలుసుకొన్నారనీ… వారు ముందుకు వస్తారనీ చెప్పలేము. ఎందుకంటే ఎక్కువమంది తెలియని వారే ఉండడంవల్ల అంచనా వేయలేం. ప్రస్తుతం కాదు కూడదని ఈ నలుగురో ఐదుగురో ఈ పరీక్షలలో పాల్గొన్నంతమాత్రాన సరిపోదు.
ఈ పరీక్షలు జాతి లింగ వివక్షత లేకుండా సౌకర్యం కోసం ఏర్పాటు చేయబడినప్పుడు మగవారు పరీక్ష రాయడం కంటే వారు తమ కోసం ఇంట్లో శ్రమ పడుతున్న మహిళలకు బోధించడంలో సమయాన్ని ఎక్కువ కేటాయిస్తే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కానీ అంతటి ఓపిక ఆడవాళ్ళ లోను మగవాళ్ళ లోనూ ఉండాలి!
విద్యావ్యాప్తి స్త్రీలలో లేకపోవడం వల్ల ఈనాటి గృహ విద్య పరీక్షలో ఆసక్తి కలగాలంటే… కొంత శ్రమ పడాలి! ఇటువైపు స్త్రీల వైపు నుండి కూడా శక్తి కలిగి ఉండి ఉంటే విద్య నేర్చుకోవడానికిఅవకాశాలున్నాయి. స్త్రీ పురుషులు విద్య నేర్చిన వారైతే దేశానికి ఉపకార దీక్ష పూని, పల్లెటూర్లలో కి వెళ్లి అక్కడ సభలను సమావేశాలను ఏర్పాటు చేసి ఉపన్యాసాలు ఇచ్చి స్త్రీలకు విద్య పట్ల ఆసక్తి ముఖ్యంగా ఇంటి నుండి పరీక్షలు రాయాలనే అభిరుచి కల్పించవచ్చు. కానీ అది అంత సులువు కాదు! ఎందుకంటే ఎవరికి తగ్గ పనులలో వారు తలమునకలయ్యే ఈ సమయంలో తమ పనులు విడిచిపెట్టి ఇంకొకరికి విద్యా బోధన, అవగాహన కలిగించడం కష్టమైన పనే.. అయినా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు పర్యటన చేసినా సరిపోదు! ఇది చాలా మంది కూడి జరపవలసిన ఒక బృహత్తర కార్యక్రమం… అందుకే ఈ పని అనుకున్నంత సంతృప్తి కరంగా ఈ విధానంలో వ్యాప్తి చెందదేమో అనిపిస్తున్నది.
విద్యా పక్షపాతి అని పేరు పొందిన నిజాం ప్రభుత్వం ఏ చిన్న ఊళ్ళోనో కాకుండా మిగిలిన ప్రతి గ్రామంలోనూ బాలల పాఠశాల తోపాటు బాలికల పాఠశాల ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది . దాంతో స్త్రీ విద్య అతి తక్కువ కాలంలోనే వ్యాపించవచ్చు అనే ఒక నమ్మకం కలగవలసిన అవసరముంది. కానీ ఏ బస్తీలోనో తప్ప బాలికల పాఠశాలలో గల ప్రతి గ్రామమునందైనా బోధన, పరీక్షల నిర్వహణకై స్థలాన్ని కేటాయించవలసి వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు బదులు ఉపాధ్యాయినులను తక్కువ చూపు చూడకూడదు. పల్లెటూరులలో వాతావరణం వేరుగా ఉంటుంది. సామాన్యంగా ఏ బాలిక అయినా వివాహం ముందు మాత్రమే విద్య అభ్యసించాలని అనుకుంటారు పెద్దలు. తరవాత కుటుంబ పరిస్థితులు సహకరిస్తేనే ఆ విద్య కొనసాగుతుంది… లేని పరిస్థితుల్లో ఆమె చదువుకు అంతరాయం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో భర్త, కుటుంబం ఆమెకు సహకరిస్తే అత్యున్నత విద్య ఆమె సొంతం అవుతుంది.
స్త్రీ విద్యాధికురాలైనప్పుడు ఆ కుటుంబం సవ్యదిశలో నడుస్తుంది. పిల్లలు విద్యాధికులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకుగాను ప్రోత్సాహం కూడా ఎక్కువ లభిస్తుంది. అంతేకాదు కుటుంబ అవసరాల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చినపుడు చక్కటి బేరీజు వేస్తుంది. ఏఖర్చుకుఎంత డబ్బు కేటాయించాలి? అనే స్పష్టత ఉంటుంది.కొండొకచో చేదోడువాదోడుగా సంపాదిస్తుంది. అప్పుడు కుటుంబం వీధిలో పడకుండా చక్కని ఆర్థిక పరిపుష్టితో నిలదొక్కుకుంటుంది.
కాబట్టి మన తెలుగు రాష్ట్రంలో మహిళలకు విద్య ఎంతో అవసరమని గుర్తించి మన పాలకులు ప్రతి గ్రామంలోనూ బాలికల పాఠశాలలను స్థాపించాలని సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇలా ఎంతో అవగాహనను కలిపించే సంపాదకీయం రాయడం ఆనాడు ఒద్దిరాజు సోదరులకే చెల్లును.
అంతేకాకుండా నిజాం నవాబుకు బాలికల పాఠశాల నెలకొల్పాలని అర్జీతో పాటు ఒక హెచ్చరిక కూడా చేశారు. పట్టుబట్టి ఇనుగుర్తి గ్రామంలో” “ప్రయోగాత్మక బాలికల ప్రాధమిక పాఠశాల” వచ్చే లా కృషిచేసి, ఏర్పాటు కూడా చేశారు.
ఇలా స్త్రీ విద్యావ్యాప్తికి ఎంతగానో తోడ్పడింది ఈ తెనుగు పత్రిక.

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శుభ స్వాగతం

by డా॥ గండ్ర లక్ష్మణరావు April 9, 2022
written by డా॥ గండ్ర లక్ష్మణరావు

కాల మెప్పుడు ముందుకే కదలుచుండ
జ్ఞాన సంపన్నుడయ్యెను మానవుండు
అయిన హత్యలు యుద్ధాలు ఆక్రమణలును
ఆప లేనట్టి యిట్టి విజ్ఞానమేల 1

తీయగా రాగమ్ము తీయవే కోకిలా
కఱకు గుండెల లోన కరుణ గలుగ
చలువ చేయగరావె మలయానిలాంగన
కోపాగ్ని చల్లారి కుదురు కొనగ
తెల్లని మల్లెలు చల్లుమా వల్లికా
పగల భావము లన్ని ప్రణయ మవగ
తరులార రెక్కల తలిరాకు నింపుడీ
బీటలౌ మనముల ప్రేమ లోలుక
అరుణ కిరణాల రథమెక్కి తరలి రమ్ము
అంద మంతయు లొకాన చిందు లాడ
సరస మాధవా శుభ వసంత మవగ
వచ్చు నీకు నిదియె శుభ స్వాగతమ్ము 2

తెలుగు జనాలు షడ్రుచుల తీరును పచ్చడి గా గ్రహించి యీ
కలుములు లేములున్ మరియు కష్ట సుఖమ్ముల రాక పోకలన్
దలతురు గాని యాశలను తప్పక పెంచుక చూచు చుందు రా
ఫలముల నీయ రాగదవె| పండుగ వోలెను నవ్య వత్సరా | 3

వైద్య మెంతగా పెరిగిన , వాయు వందు
ప్రాణ హరమైన కీటముల్ ప్రాకి పోయె
మానవులు తప్పు చేయుట మాన రైరి
మనిషి తడి యెండి పోవుటే మనకు శిక్ష 4

ఎప్పుడు వచ్చి పోయెదవు నెన్నియొ కోర్కెల పంచి పెట్టుచున్
ఇప్పుడు తీరునింక నని యెంతోముదమ్మున చూచు చున్న మా
తప్పులు దిద్ది సర్వ శుభదాయిని వైన యుగాది నీకు మే
మెప్పుడు స్వాగతించెదము, మీరిన యాశల త్రుంచ బోకుమా | 5

దేశము లందు వైరములు తెచ్చి, యమాంతము పోరు పెట్టి,యా
వేశము నింపి ప్రాణముల పేల్చి నివాసము కాల్చి వేసి యా
కాశము వైపు చూపినది కాలము కాలుడు గాప్లవాబ్ది ,రా
వే, శుభ కృత్ సార్థకము వేయివిధమ్ముల చేయు మాధవా| 6

చైత్ర రథమెక్కి భాస్కర శస్త్రములతొ
దుష్ట రాక్షస గుణముల దునిమి వేయ
శ్రీ వసంతమాధుర్యము చిహ్న ములుగ
సకల జనులకు మేలుగా సాగి రమ్ము 7

ఈ శుభ కృత్ వత్సర మున
రాశులు గా పంచి పెట్టు ప్రజలందరకున్
పేశల మైన గుణమ్ముల
దేశము సుఖ శాంతులందు తేలి సుఖించన్ 8

అర్థ కామమ్ము లందున అణగి పోక
ధర్మ మార్గమ్ము వైపుకు ధరణి యంత
కదలి సాగగ నీవె దిగ్దర్శనమ్ము
నగుచు రావయ్య నీకు నమస్కరింతు 9

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఆచార్య దేవోభవ – నాటిక (పౌరాణికం)

by Arutla Sridevi April 9, 2022
written by Arutla Sridevi

పాత్రలు
గురువు – ధౌమ్య ముని
శిష్యులు – అరుణి, వేదా, ఉపమన్యు
తెరవెనుక – సూత్రధారి
ద్వాపర యుగాంతంలో ధౌమ్యుడనే ఋషి ఉండేవాడు. అతనివద్ద వేదాభ్యాసము చేస్తూ ముగ్గురు శిష్యులుండేవారు. అందులో ఒకడు అరుణి, రెండవవాడు వేదా. ఇతనిని బైదుడు అని కూడా అంటారు. మూడవవాడు, అందరికన్నా చిన్నవాడు ఉపమన్యు. విద్యాభ్యాసం కోసం వారు ముగ్గురూ గురువును సేవిస్తూ ఉండేవారు. ఆ కాలంలో గురువులు ముందుగా శిష్యుల అంతఃకరణంలో భక్తిని పరీక్షించి వారిపై కృప చూపి, వారికి విద్యనేర్పేవాడు. ఈ గురుశిష్యుల కథనే నాటికగా రూపొందించాను. ఈ కథ మహాభారతం మొదటి పర్వంలోనిది (ఆదిపర్వం).
ఈ నాటికను 5 తరగతి నుండి 8వ,9వ తరగతివరకు వేయవచ్చు. గురువు పాత్ర 9,10వ తరగతి విద్యార్థులు వేస్తే బాగుంటుంది.
మొదటి ఘట్టమం
తెర తోలుతుంది. ముందుగా ఆశ్రమ వాతావరణం కనపడుతూ ఉంటుంది. పర్ణకుటీరము, పచ్చని చెట్లు, లేళ్ళు, కుందేలు, పక్షులు, పూల మొక్కలు ఉంటాయి. రంగస్థలంపైన అయితే తెరద్వారా వాతావరణం చూపించాలి.
T.V.లో అయితే సెట్టింగ్స్ ద్వారా చూపించవచ్చు. రేడియోలో అయితే వాయిదాల సహకారంతో పక్షుల కిలకిల రావాలు మొదలైనవి వినిపించవచ్చును.
ధౌమ్యముని : (పద్మాసనుడై కూర్చొని ఉంటాడు)
నాయనా అరుి ఇలా రా నాయనా
అరుణు: పిలిచారా గురువుగారు (లోపల నుండి రంగస్థలంపైకి పరిగెత్తుకొస్తాడు)
ధౌమ్యముని : ఈ రోజు నీవు మన పొలానికి వెళ్ళి చెరువులోని నీరు పొలానికి మళ్ళించు, వెంటనే వెళ్ళు.
అరుణి : ఆజ్ఞ. గురువుగారు ఇప్పుడే వెళ్తున్నాను (రంగస్థలంపై నుండి లోపలికి వెళ్లిపోతాడు)
(తెర ద్వారా పొలం చూపించాలి. చెరువులో నీరు చూపించాలి. నీటి శబ్ధము వాయిద్యాల సహకారంతో చూపించాలి)
అరుణి పొలం దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ పొలం మధ్య గుండా ఒక కాలువ ప్రవహిస్తూ ఉంది.
అరుణి: (ఆశ్చర్యముఖంతో – స్వగతం) (సంభాషణ బయటకు వినబడాలి)
ఆ ఇదేమిటి పొలంలో నీరు ఇలా ప్రవహిస్తుందేమిటి? అయ్యో ఇప్పుడేం చెయ్యాలి? (కొంచెంసేపు ఆలోచిస్తూ అటూ, ఇటూ తిరుగుతాడు). ఆ ఇక్కడేదో పెద్ద బండలా ఉఁదే. అవును బండే. ఈ బండను ప్రవాహానికి అడ్డంగా పెడ్తాను.
(బండను వేదికపై ముందే అమర్చి పెట్టుకోవాలి (అట్టతో తయారుచేసినది) )
(అయినా కూడా ఈ బండను నెటే్టసి నీరు ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంటుంది)
అయ్యో! నీరు ఆగడం లేదే ఎట్లా?
(కొంచెంసేపు అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తాడు)
ఆ ఇక్కడ గడ్డిమోపును అడ్డంగా వేస్తాను.
(అరుణి ముఖం సంతోషంగా ఉంటుంది)
గడ్డి మోపును అడ్డంగా వేస్తాడు.
(అయినా నీరు ప్రవహించడం ఆగలేదు)
భగవంతుడా శ్రీహరీ నీవే ఏదైనా దారి చూపించు. గురువుగారు చెప్పిన పని పూర్తి చేయలేకపోతున్నాను. నీటి ప్రవాహం ఆపలేకపోతున్నాను. పొలం అంతా నీటితో మునిగిపోతుంది.
ఏడుస్తూ ఓ చెట్టుకింద చతికిలబడిపోతాడు)
(మళ్లీ కొంతసేపటికి లేచి కళ్ళ నీల్లు తుడుచుకుని ఇలా తన మనసులో అనుకుంటాడు).
ఏమైనా సరే గురువుగారి ఆజ్ఞను పాటించాల్సిందే. అందుకు నా ప్రాణాలు పోయినా సరే. (నిర్ణయించుకుంటాడు)
(మనసులో గురువుని ఇలా ధ్యానించాడు)
గురుః బ్రహ్మ గురుః విష్ణు
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
రెండు చేతుల్తో పక్కనున్న తీరాన్ని పట్టుకొని, రెండవవైపు తన పాదాలు పెట్టి నీటికి అడ్డుగా పడుకొన్నాడు.
(ఈ విధంగా చేయగానే పొలం లోనికి ప్రవహించే నీటి ప్రవాహ వేగం కొంత తగ్గింది. అరుణి మాత్రం నీటిలో మునిగిపోయాడు. తల మాత్రం బయట ఉంది).
ఆహా నాదెంత భాగ్యము. ఎలాగైతేనేం గురువుగారు చెప్పిన పని చేయగలిగాను. ఇక నా ప్రాణం పోయినా నాకే బాధ లేదు.
(సెట్టింగ్ మార్చాలి)
(ఆశ్రమ వాతావరణం)
ధౌమ్యముని : (అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తాడు.)
పగలు గడచిపోయింది. చీకటి పడ వస్తూంది. అరుణి ఇంకా రాలేదేమిటి? (ఆందోళనగా)
ఎందుకైనా మంచిది. ఒక్కసారి పొలం దగ్గరకు వెళ్ళి చూసొస్తాను.
(పొలానికి వెళ్తాడు అక్కడ శిష్యుడు కనబడడు)
అరుణీ అరుణీ (పిలుస్తాడు)
అయ్యో అరుణి ఏమయ్యాడు? అతన్ని ఏ క్రూరమృగమో తినెయ్యలేదు కదా! (మనసులో)
నాయనా అరుణీ (ఇంకా గట్టిగా పిలుస్తాడు) ఎక్కడున్నావు నాయనా.
అరుణి: గురువుగారూ నేనిక్కడ అంటూ పరుగెత్తుకొని వస్తాడు (బట్టలు తడిచి ఉంటాయి).
ధౌమ్య : (ప్రేమతో అతన్ని ఆలింగనం చేసుకుంటాడు). అరుణీ తడిచిపోయావా నాయనా. ఎంత పని చేశావు నాయనా. గురువు మాట కోసం నీ ప్రాణాలమీదికే తెచ్చుకున్నావా? (గద్గద స్వరంతో)
శిష్య శిఖామణీ నీకు వేదశాస్త్రం, వ్యాకరణాది విషయాలు అన్నీ ధారపోస్తాను. రా నాయనా మన ఆశ్రమానికి వెళదాం.
(ఇద్దరూ ఆశ్రమానికి వచ్చేస్తారు)
(తెర వెనుక : అరుణికి సకల విద్యలూ అబ్బిన తరువాత వివాహ యోగ్యుడైన తరువాత గురువుగారు అతన్ని ఆశీర్వదించి గృహస్థాశ్రమం స్వీకరించమని ఇంటికి పంపిస్తాడు).
…………………

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

స్వాగత లేఖ

by Arutla Sridevi April 9, 2022
written by Arutla Sridevi

పల్లవాలపై పచ్చ రంగు తో
లిఖియించిన స్వాగత లేఖ
నోట కరచుకొని గొంతు సవరించి
పాట పాడినది కోకిల దూత
పిలుపునందుకొని వసంత రాజు
చైత్ర రథము పై పుడమికి రాగా
రాలిన పువ్వులు తివాచీ పరువా
రాలే పువ్వులు అక్షితలైనవి
మధువు టీ గలు విందు చేయగా
మధువు గ్రోలిన మత్తు మదాన
నిదుర పోయెను వన రా రాజు
రెక్కల మాటున దాచుకున్న
మంచు బిందువుల పన్నీరు జల్లుతూ
మేలుకొలిపినవి కుసుమ రాణులు
కళ్ళు తెరిచిన రుతు రారాజుకు
కనిపించిందోక నందన జాన
ఆమె మోము చందమామ
పేరేమో శుభకృత్ నామా

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలుగు సులభ వ్యాకరణం

by కూకట్ల తిరుపతి April 9, 2022
written by కూకట్ల తిరుపతి

పురాతనం నుండి అధునాతనం వరకు తెలుగుభాషను ఎందరో మహానుభావులు సుసంపన్నం చేశారు. ప్రతినిత్యం తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి మరెందరో మహనీయులు పలు విధాలుగా పాటుపడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా “తెలుగు వ్యాకరణం” మీద ఎన్నో పుస్తకాలను వెలువరిస్తున్నారు. ప్రత్యేకించి పాఠశాల దశ విద్యార్థుల కోసం తేలికపాటి పదాలతో, వ్యాకరణ సూత్రాలను సరళంగా అందించడానికి తెలుగు పండితులు కుంట వేంకటేశం గారు పూనుకోవడం ప్రశంసనీయం. తెలుగు పాఠ్యాంశాల బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగంగా వచ్చే భాషా వ్యాకరణాంశాలను, ఛందో అలంకారాలను అలతి అలతి పదాలతో లలితమైన రీతిలో లక్ష్యాలక్షణం చేశారు. కమ్మనైన అమ్మభాషకు మరింత కమ్మదనాన్ని అద్దారనడంలో అతిశయోక్తి లేదు.

తేట తెలుగు భాషకు చెందిన వర్ణములు, అందలి భేదముల వివరణతో “విద్యార్థి వ్యాకరణ కిరణం” భాషా పునాదుల్లోకి ప్రసరించింది. పద విభాగములు, భాషా భాగములు, వాచకములు, వచనములు, విభక్తి ప్రత్యయములను విడమరచి చెప్పిన తీరు తేజోవంతంగా ఉంది. వాక్య భేదములు, విరామ చిహ్నములను సోదాహరణంగా విశ్లేషించిన విధం సహజాతిసహజంగా ఉంది. తెలుగు సంధులు, సంస్కృత సంధుల పరిచయం అరటిపండును ఒలిచి నోట్లో పెట్టినట్టే ఉన్నది. సమాసములు, అలంకారములు, ఛందస్సులను అలవోకగా అభ్యసించేటట్టుగా అక్షరాల ఆసువోశారు.

పెద్దపల్లి జిల్లా, కమాన్ పూర్ మండలం, జూలపల్లి వాస్తవ్యులు కుంట వేంకటేశం గారు. ఆయన పుట్టినూరులోనే 1989లో పాఠశాలను నెలకొల్పి, విద్యాగంధాలను పంచిన విద్యాభిమాని. 2006లో తెలుగు భాషోపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశించారు. ఆ వెనువెంటనే 2008లో తెలుగు భాష సహోపాధ్యాయులుగా ఎంపికవడం ఆయన పట్టుదలకు నిదర్శనం. పిల్లలకు మాతృభాషా మాధుర్యాన్ని పంచుతూ, వారిలో విలువలను జీవన నైపుణ్యాలను పెంచుతున్న ఆదర్శ ఉపాధ్యాయులు కుంట వేంకటేశం గారు. “అనంతవరం మాణిక్యలింగం, శతక సాహిత్యం – పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేసి, కాకతీయ విశ్వవిద్యాలయం ద్వారా ఎం.ఫిల్. పట్టాను పొందిన గొప్ప పరిశోధకులు. దశాబ్దాల బోధనానుభవం, పరిశోధనలో పటుత్వం కుంట వేంకటేశం గారి సొంతం. తెలుగు వ్యాకరణం గొట్టు కాదు. తేలికైనది తెలుగు భాష. పిల్లలు తెలుగును సులువుగా నేర్చుకోవచ్చని, ఈ పొత్తం ద్వారా రచయిత నిరూపించారు.

బాల వ్యాకరణ పీఠికలో చిన్నయసూరి స్వయంగా “పెక్కు లక్ష్యములు సావధానముగా పరిశీలించి, రచనా ప్రణాళిక నిర్ణయించుకొని” తానొక లక్షణ గ్రంథమును రచించినట్లు పేర్కొన్నారు. వ్యాకరణం పాఠకుల్లో సాధు, అసాధు శబ్ద వివేకాన్ని కలిగిస్తుంది. భాష యొక్క కీలక స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. కవి ప్రయుక్తములైన శబ్దాలకే లక్షణం చేస్తుంది. లక్ష్యం లేకుండా లక్షణం పుట్టుట అసంభవం కదా! కాబట్టి వ్యాకరణం ప్రయోగశరణమైనది. విద్యార్థులు భాషను సులువుగా నేర్చుకోవడానికి వ్యాకరణం దోహదపడుతుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి, వ్యాకరణ అధ్యయనం తోడ్పడుతుంది. పిల్లలు ఉత్తమ పాఠకులుగా, లేఖకులుగా ఎదగడానికి ఈ చిరు పొత్తం చంద్రునికో నూలు పోగులాగా సహకరిస్తుందని భావిస్తున్నాను.

ఈ పుస్తకంలో రచయిత కుంట వెంకటేశం గారు తనకున్న భాషా పరిజ్ఞానంతో, బోధనానుభవసారంతో, ఎన్నో విషయాలను సముచిత వివరణలతో, చక్కని ఉదాహరణలతో తెలియజేశారు. దీనిప్రతి ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండదగినది. బడిపిల్లలందరికీ అందుబాటులోకి తీసుకురాదగినది. ఉపాధ్యాయులు ప్రత్యేకమైన చొరవ తీసుకొని, విద్యార్థులకు చేరువ చేయాల్సిన అవసరముంది. తెలుగు వ్యాకరణాన్ని సులభరీతిలో, బొత్తిగా వివరంగా, విపులంగా విడమరచి చెప్పిన ఈ గ్రంథాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. విద్యార్థుల మదిలో చెరగని ముద్రవేసే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. తెలుగుభాషా బోధకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన కుంట వేంకటేశం గారికి హృదయ పూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో పుస్తకాలు ఆయన కలం నుండి జాలువారాలని ఆకాంక్షిస్తూ…

సెలవిప్పటికీ… స్నేహమెప్పటికీ…

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ April 9, 2022
written by కొరుప్రోలు హరనాథ్

టేక్స్

కేవలం
జీతానికే
టే్క్స్ కదా అని
చంకలెగరెయ్యకు-
జీవితానికి కూడా
టేక్స పడే రోజొకటి
వస్తందున్న
విషయం మరిచిపోకు

ఆస్తి – నాస్తి
ఎయిర్ కండిషన్ గదులూ
త్రీ యేసెస్ బార్ లు
లెక్సెస్ – యన్ – యక్సీ కార్లు
మఖ్ మల్ కుషన్ పరుపులు
బొచ్చుకుక్కలు
ఆస్తికుని ఆస్తికత్వం-
మురికివాడలూ
కూలన గోడలు
పేవ్ మెంట్లు
మెట్లోషల్టర్లు
గజ్జికుక్కలు
నాస్తికుని ఆస్తికత్వం

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ప్రియజ్ఞాపిక

by Konduri KashiVishveshwara Rao April 9, 2022
written by Konduri KashiVishveshwara Rao

ఆడిటోరియంలో ‘‘కాలేజీ వార్షికోత్సవ సభ’’ దేదీప్య కళాకాంతులతో ప్రారంభం అయ్యింది. కాలేజీ సెక్రటరీ పోడియం మైక్లో ఒక్కొక్క విద్యార్థినీ పరిచయంచేసి, వారిని వేదికపైకి ఆహ్వానిస్తోంది. బహుముఖ ప్రజ్ఞాశాలియైన సెక్రటరీ పద్మావతి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటంలో ఆమెకు ఆమే సాటి.
కవిత్వం, నాటకం, సంగీతం ఇంకా వివిధ రంగాల విద్యార్థులు వేదికపైకి వచ్చి ముఖ్యఅతిథి, ప్రిన్స్పల్ చేతుల మీదుగా తమ బహుమతులను జ్ఞాపికలతోపాటు అందుకుంటున్నారు. ఇప్పుడు చిత్రకళలో మన కాలేజీకి గర్వకారణమైన ఇంద్రవర్మను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం! విజయ కరతాళ ధ్వనులతో ఆడిటోరియం దద్దరిల్లింది.
కానీ ఇంద్రవర్మ మాత్రం ఎందుకో నిదానంగా వస్తున్నాడు. అతడు ప్రియ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ తన చిత్రకళను ప్రోత్సహించింది. తను వేసిన ప్రతి చిత్రానికీ రంగులు, మెరుగులు దిద్దించిన తోటి సహ విద్యార్థిని ప్రియను కూడా వేదికపైకి పిలవమని సెక్రటరీకి చెప్పాడు.
కానీ ప్రియ రాకపోవటంతో, పెయింటింగ్ పోటీలో మొదటి బహుమతి, జ్ఞాపికనూ అందుకున్నాడు ఇంద్రవర్మ.
అదే సమయంలో ఇంద్రవర్మ స్నేహితులు అందంగా ప్యాక్చేసిన ఒక పెద్ద ఫోట్ పోట్రైట్ను వేదికపైకి తీసుకొచ్చారు. ముఖ్యఅతిథి, ప్రిన్స్పల్ సంయుక్తంగా ఆ పోట్రైట్ను ఆవిష్కరించారు.
అది ఒక స్త్రీ మూర్తి కళాఖండం. ఆమెలో ఒక అమ్మ ఉంది. ఆ చిత్రంలో ఓ చిన్నారి, అక్క, చెల్లెలు, వదిన, భార్య అందరూ కన్పిస్తున్నారు. ఆమెలో ప్రత్యేకంగా ఒక స్నేహితురాలు కన్పిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన సృష్టి అంతా స్త్రీ మూర్తిలోనే అంతర్లీనంగా ఉందన్న ఇంద్రవర్మ నిర్వచనం రసజ్ఞులను ఆకట్టుకొంది.
ఈ పెయింటింగు నేను నా తోటి విద్యార్థిని ప్రియతో కలసి చిత్రించాను. అందుకే ఈ బహుమతి మా ఇద్దరికీ చెందుతుందని ప్రియను కూడా వేదికపైకి ఆహ్వానించాను. నాకు రంగులు వేయటం నేర్పిన మన కళాశాలకి గుర్తుగా, దీనిని ‘‘ప్రియజ్ఞాపిక’’గా సమర్పిస్తున్నాను అని ఇంద్రవర్మ ఆనంద భాష్పాలతో కూడిన ఉద్వేగ చిరుప్రసంగంతో మళ్ళీ ఆహుతులంతా కరతాళ ధ్వనులతో, స్టాండిరగ్ ఒవేషన్ ఇచ్చారు.
చూస్తూ చూస్తూండగానే కాలేజీ జీవితం తెలియకుండా హాయిగా సాగిపోయింది. ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులు, చదువుల తల్లి దేవాలయ ప్రాంగణంలో నేర్పుతుంది.
మీరు కూడా స్వయంగా పెన్సిల్ గీతలతో బొమ్మలు వేయాలి. బాపుని గుర్తు చేసుకోండి. బొమ్మలు వేయగలరు. వేసిన బొమ్మలకు వాటర్ కలర్స్ వేయండి. అప్పుడు మీకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. వేసిన చిత్రాలు మీకు నచ్చాయి అంటే మీరు కళాకారులే! వాటిని చూచిన స్నేహితులు, కుటుంబసభ్యులు మీకు ఇచ్చే కాంప్లిమెంట్లు ఎన్నో ఉంటాయి సుమా! అవి ఆనాడు పాఠాలు చెప్పిన గురువుగారి మాటలు, ఇంకా జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి ఇంద్రవర్మకు.
కాలేజీలో విద్యార్థులందరూ…. నువు ఇంద్రవర్మవు కావు ` రవివర్మవే అనే వాళ్ళు. ‘‘ఏనాటికైనా మన ఇంద్రవర్మ ప్రపంచ ప్రఖ్యాత పికాసో వంటి గొప్ప చిత్రకారుడు అవుతాడని’’ ప్రసంసించాడు ప్రిన్సిపల్.
అసలు ఈ అభినందల, ప్రసంశల వెల్లువకు సూత్రధారి ప్రియ. ఇవన్నీ అందుకోవటానికి ఆమెకే అర్హత ఉందని ఆవేదన చెందాడు. ప్రియను చూడటానికి అతని హృదయం పరితపిస్తోంది. కేవలం పెయింటింగ్ మీదే కాకుండా, చదువు మీద కూడా శ్రద్ధ పెట్టాలని తనకు వెన్నుదన్నుగా నిలిచింది ప్రియ.
ప్రియ స్ఫూర్తితోనే డిగ్రీలో ర్యాంకు సాధించాడు. ఆమె చెప్పకపోతే నిజంగానే తన చదువు అటకెక్కి కూర్చునేది అని తెలుసుకున్నాడు.
డిగ్రీ రెండో సంవత్సరంలో కూడా ఇంద్రవర్మకు అత్తీసరు మార్కులే వచ్చాయి. దాన్ని అలుసుగా తీసుకొన్నాడు హరిప్రసాద్. ఇంద్రవర్మను అవమానించాడు. ఒరేయ్! నీకు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకు. హాయిగా రోడ్డు పక్కన దేవుడు బొమ్మలు గీసుకున్నావనకో! ఏకంగా కాసుల వర్షమే కురుస్తుందన్నాడు. బాబు రవివర్మ! నీకు చదువెందుకు? మాకు లాగా మార్కులతో పనేంటి? అసలు రంగులు లేకపోయినా, బొగ్గులతో కూడా బొమ్మలేసి డబ్బు సంపాదిస్తావ్! అని కించపర్చాడు ఉదయ్కుమార్. వీరిద్దరికీ ప్రవీణ్, శేఖర్లు తోడై అగ్నికి ఆజ్యం పోసేవాళ్ళు. వాళ్ళు మారరు! ర్యాగింగ్ చేసి చేసి నెగిటీవ్గా తయారైపోయారు.
ఇంద్రవర్మకు ఉద్యోగం వచ్చింది. అయినా అంత సంతోషంగా లేదు. ప్రతీ క్షణం ప్రియా ఆలోచనలే. అసలు ప్రియ ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మనసు బాగోపోయినా, మనశ్శాంతి కోసం పెయింటింగ్ వేస్తున్నాడు. అది గ్రహించిన కంపెనీలోని సహ ఉద్యోగులు ‘‘ఆర్ట్ పెయింటింగ్ గ్యాలరీ’’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది.
ఇప్పుడు ఇంద్రవర్మ వేసిన పోట్రైట్లకు ఇతర దేశాలలో గిరాకీ పెరిగింది. ఇంద్రవర్మ భారతదేశంలో ప్రముఖ చిత్రకారునిగా అవార్డును అందుకున్నాడు. గౌతమబుద్ధుడు చెప్పినట్లు ‘‘నీవు ఏది ఆలోచిస్తే, అదే అవుతావు’’ ఔను! నేను ఇప్పుడు గొప్ప కళాకారుణ్ణి అయ్యాను అని గౌతమబుద్ధుని బొమ్మకు నమస్కరించాడు.
కానీ ఇంద్రవర్మ మనసులో మాత్రం ఏదో వెలితి, అశాంతి గూడుకట్టుకున్నాయి. హాలులో కూర్చుని టి.వి. చూస్తుండగా కొరియర్ వచ్చింది. ఆతృతతో కవర్ తెరిచాడు. అందులో ప్రియ వ్రాసిన ఉత్తరం, అంతే! వెంటనే ఒక్కసారిగా ఎగిరి గంతేసి…. యా! హూ… అంటూ గట్టిగా కేకవేశాడు.
కొడుకు వేసిన కేకకి వంటింట్లోంచి వచ్చిన తల్లి ‘‘అదేమిటిరా అంత గట్టిగా అరిచావ్! అని అడిగింది. అసలు తల్లిని పట్టించుకుంటేగా!
హలో ఇంద్రవర్మ! నేను అమెరికాలో నువ్వు వేసిన అపూర్వ కళాఖండాలు చూసి ఎంతో ఆనందించాను. నా సంతోషాన్ని వెంటనే ఫోన్ చేసి నీకు చెప్పాలనుకున్నాను. కానీ ఎందుకో నాకు అప్పుడు హిందీ సినిమా హీరోయిన్ కరీనా కపూర్ మాటలు గుర్తుకు వచ్చాయి. అవి ‘‘నేను ఉత్తరాలకే ఎక్కువ ప్రాముఖ్యత నిస్తాను. నా స్నేహితులకూ, బంధువులకూ ఉత్తరాలే వ్రాస్తుంటాను.’’ ` కరీనాకపూర్.
మనకున్న ప్రేమ, బాధ, ఆనందాలను ఉత్తరాల ద్వారా అయితే బాగా వివరంగా తెలియజేస్తాం. అలాంటి అమూల్యమైన ఉత్తరాలను జీవితాంతం పదిలంగా దాచుకుంటాం. అలాగే అప్పుడప్పుడూ చదువుకుంటాం కూడా. అందుకే నేను స్వీటు తిన్న తరువాత హాట్ తినను. ఎందుకంటే మనసారా మాధుర్యాన్ని ఆస్వాదించాలి కాబట్టి.
ఇంద్రవర్మ! నువ్వు నేను కలలు కన్నట్టు గొప్ప పెయింటర్ అయినందుకు నాకు చెప్పలేనంత గర్వంగా ఉంది. కంగ్రాట్యులేషన్స్ ఇంద్రా.
‘‘ఇంద్రవర్మ! నువ్వంటే నాకు చాలా ఇష్టం.’’ మన ప్రేమను జీవితాంతం అనుభవించాలంటే మనం పెళ్ళి చేసుకోకూడదు. ఈ విషయంలో నన్ను క్షమించు. శ్రీ కృష్ణుడు ఆరువేల భామలకు మధుర ప్రేమికుడు. వారి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. మన ప్రేమ కూడా జీవితాంతం మధురతరంగిణిలా ప్రవహించాలి. రెండు రోజుల్లో నేను ఇండియాకి వస్తున్నాను. మిగిలిన అన్ని విషయాలు అక్కడ నెమరేసుకుందాం!
` నీ ప్రియ స్నేహితురాలు
ఉత్తరం చదివిన ఇంద్రవర్మ దృష్టి టి.వి. చానల్లో కన్పిస్తున్న బ్రేకింగ్ న్యూస్పై పడిరది, ‘‘బోయింగ్ విమానం సముద్రంలో కూలిపోయింది” చూపిస్తున్న ఫోటోలలో ప్రియ ఫోటో, పేరునూ స్పష్టంగా చదివి సోఫాలో కూలబడిపోయాడు ఇంద్రవర్మ.

April 9, 2022 4 comments
1 FacebookTwitterPinterestEmail
కథలు

రంగులు

by Divakarla Rajeshwari April 9, 2022
written by Divakarla Rajeshwari

అలారం మోగింది . నేత్రిక కళ్ళు నులుపుకుంటూ లేచింది . మొహం మీద నీళ్ళు జల్లుకొని పుస్తకం తెరవబోతుంటే పావని వచ్చింది. గుడ్ లేచావా! ఓ గంట సేపు చదువుకో. ఆరుగంటల కల్లా కారు డ్రైవింగ్ కోచ్ వస్తానన్నాడు. . కిందకెళ్ళు , అటు తరువాత ..అని పావని ఇంకా ఇంకా చెప్పబోతుంటే, నేత్రిక అందుకుంటూ, స్నానం చేసి 402 ఫ్లాట్ లో ఉన్న శారదమ్మగారి దగ్గర సంగీతం క్లాస్ కు వెళ్ళాలి, కాలేజ్ కు వెళ్ళాలి …అంతేగా! అమ్మా! విసుగ్గా అంది.
కాలేజ్ నుంచి డేడీ నిన్ను పిక్ చేసుకుని బేడ్మెంటెన్ గ్రౌండ్స్ దగ్గర దింపుతారు .అక్కడ ప్రాక్టీస్ కాగానే కాల్ చేయి . నేనొచ్చి తీసుకొస్తాను తరువాత కొద్ది సేపు రెస్ట్ తీసుకుని చదువు కుందువుగాని అంటూ, ఆ రోజు చేయ వలసిన దాన్నంతా చెప్పింది పావని
నేత్రిక దుఖం, కోపం రెండూ మిళితమైన స్వరంతో,
అమ్మా!…
ఇంకో నెలలో నాకు పరీక్షలు, బాగా చదువుకోవాలి. పరీక్షలయ్యేవరకూ చదువుతప్ప అన్నీ మానేస్తానమ్మా. మా స్నేహితు లందరూ తరగతి లో మంచి పర్సెంటేజ్ రావాలని కొచింగ్ కు వెళ్తున్నారు. నువ్వేమో కోచింగ్ క్లాసులు వద్దంటావు. ముఖ్యమైనది వదిలిపెట్టి తక్కినవన్నీ చేయమంటావు. .అని గట్టిగా ఇంకా ఏదో అనబోతుంటే
అందుకుని ..నిన్ను మంచి స్కూల్ లో చేర్పించాము . అక్కడ బెస్ట్ టీచర్లు ఉన్నారుకదా ! మళ్ళీ ప్రత్యేకంగా పాఠాలు ఎందుకు చెప్పు? తరగతిలో శ్రద్ధగా వింటే చాలు, చదువే జీవితంకాదు, అన్నింటినీ నేర్చుకోవాలి. ఆ క్లాసులకు వెళ్ళే టైములో ఏ యోగా క్లాస్ కో వెళ్ళావనుకో , ఏకాగ్రత పెరుగుతుంది, ఆరోగ్యంబాగుంటుంది, ..నాతో వాదించకు, చెప్పినట్టు చెయ్యి అంటూ గదిలోంచి బయటకు వెళ్ళింది పావని.
చేసేది లేక ఇక పుస్తకం మూసేసి, దుస్తులు మార్చుకుని కిందకు వెళ్ళింది నేత్రిక . లిఫ్ట్ లో తనతో పాటు చదువుకుంటున్న పిల్లలు కోచింగ్ క్లాసులకు వెళ్తూ పలకరించారు. ఓ డ్రై వింగ్ నేర్చుకోడా నికి వెళ్తున్నావా? కొచింగ్ క్లాస్ లో రుద్ది రుద్ది పడేస్తున్నారనుకో , నీకేం , తెలివైన దానివి.. .వాళ్ళు అలా అంటుండ గానే
లిఫ్ట్ కిందకు దిగింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
అమ్మ చెప్పినవన్నీ ముగించుకుని ఇంటికి చేరేసరికి తమ ఫ్లాట్లో ఉండే స్త్రీలు కొంతమంది కూచుని మాట్లాడుతూ ఉన్నారు . వాళ్ళు నేత్రికను చూడగానే, పావని తో
మీ నేత్రిక చాలా తెలివైంది. చక్కగా మీరు నేర్చుకోమన్నవన్నీ నేర్చుకుంటుంది. చదువులో కూడా ముందుంటుంది. అంటూ ప్రశంసించారు.
తరువాత వాళ్ళ సంభాషణ కొనసాగిస్తూ, పావని గారూ. మీరిక్కడకు వచ్చినప్పటినుంచీ మాకందరికీ ఎంతో బాగుందండీ, మీరు మాకు కుట్లూ అల్లికలూ నేర్పుతున్నారు,అంటుంటే, . మీరు నేర్పించిన తెలుగు “అచార్” ను మాఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టపడుతున్నారు అంది నార్త్ నుండి వచ్చిన లీలా బహెన్.
అది సరేకాని రేపు హోళీ పండుగ కదా! మీరు చెప్పినట్టే రంగు రంగుల పూలన్నింటినీ ఏరి పూలపొడి తో రంగులను తయారు చేసాంకదా! ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా హాయిగా హోలీ ఆడుకుందాం! సాయంత్రం అందరం కలసి కమ్యునిటీ హాల్ లో భోంచేద్దాం. ఒక్కొక్కరం ఒక్కో వంటకం చేసి మన వంట రుచులను పంచుకుందాం. మన పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది, అంది పరిణీత బెంగాలీ యువతి. పిల్లలకు రేపెలగూ సెలవేకదా,! వాళ్ళ తో కలసి రోజంతా హాయిగా గడుపుదాం అంది పావని.
హోలీ గురించిన కథలను పిల్లలకు నేను చెప్తాను అంది, పురాణ కథలను చదివిన కస్తూరి.
అదే ప్రహ్లాదుడు ఆతని సోదరి హోలిక, శివుని తపో భంగాని కొచ్చిన కాముని దహనం ..ఈకథలేనా? మంచిది …..సంక్షిప్తంగా చెప్పు అంది పావని.
హోలీ పున్నమ స్వచ్ఛతను ప్రసరించే పండుగ. ఈ పండుగ రోజున, వెన్నెల వెలుగు లోని వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి, అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది , వాతావరణం లో ధాతువు సంపూర్ణ ధర్మాన్ని పొందుతుంది. వసంత కాలంలో వాతావరణములో మార్పులు జరగటం వల్ల వైరల్ వ్యాధులు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధాలుగా పనిచేస్తాయి. సంప్రదాయంగా రంగులను నిమ్మ, కుంకుమ, పసుపు,బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్య విధానం లో, తయారు చేస్తారు.
తడిగా రంగుల కొరకు, మోదుగ పుష్పాలను రాత్రంతా మరిగించి అవి పసుపు రంగు లోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది. దురదృష్టకరంగా కొందరి వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. కొన్నిసార్లు బట్టి పట్టి ముఖ్యమైన పానీయాన్ని తండై లేదా భంగు ను తయారుచేస్తారు …తనకు తెలిసిన విషయాలను చెప్పింది జ్ఞాన ప్రభ.
నొ ,నొ, పిల్లలను సమయం వేస్ట్ చేయ నీయరు. మాఅయన ఒప్పుకోరు. పరీక్షల రోజులు కదా! చదువుకోవాలంటారు… అంది కనక మహాలక్ష్మి
ఒక్క రోజు సరదాగా గడిపితే ఏమీ కాదు. పెరుగుతున్న పిల్లలకు, అందరితో కలిసిమె లిసి ఉండటం అలవాటు చెయ్యాలి….అంది పావని.
అందరూ రేపటి సన్నా హా లను గురించి ముచ్చటించుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు.
రాత్రి 11 పదకొండు గం టలయింది నేత్రిక గదిలో లైటు వెలుగుతోంది. నేత్రికా పడుకో .మళ్ళీ రేపు చదువు కోవాలంటూ పొద్దున్నే లేస్తావు, అంటూ గదిలో కొచ్చి నేత్రిక తలను నిమురుతూ ముద్దుపెట్టుకుంది పావని. పడుకో అంటూ మరోసారి హెచ్చరించింది బయ టికెళ్తూ . …
పావని భర్త ఈశ్వర్ “పావని ధోరణి తనకలవాటే కనుక “ఏమిటో అందరూ పిల్లల్ని చదువుకొమని పోరు పెడుతుంటే నువ్వు చదివింది చాలు పడుకో అంటావు ,”అన్నాడు అర్థం కానట్టు.
అదికాదండీ, నేత్రిక చదువులో వెనుకబడిందే మీ కాదు, అది తెలివైంది. చదువుకోవాలి నిజమే . చదువు జీవితానికి వెలుగు ,కాని ఆవెలుగు చుట్టూ ఉన్న అనేక రంగులను మనం గుర్తించాలి. ఆరంగులన్నింటినీ అనుభవాలుగా వెదజల్లుకోవాలి .ఒకరు మనపై వేసిన రంగును ఆనందంగా స్వీకరించి, రక రకాల రంగులతో వాళ్ళను మురిపించాలి. అన్ని రంగుల కలయికతో సంతృప్తిగా సాగిపోవాలి . అయినా మీకు తెలియని దేముంది. రేపు హోలీ కదా!
ఆమనీ సుమడోలగా, రాసలీలగా, వసంతోత్సవ హేలగా, అలలారే ‘హోలీ’ మానవాళిలో సమైక్యతనీ, సంఘటిత శక్తినీ, సమాజ చైతన్య స్పృహనీ కలిగిస్తుంది. అందరిలో కొత్త ఉత్సాహం నింపడానికి దోహదం చేస్తుంది.
ముఖ్యంగా విశ్వకవి రవీంధ్రనాధ్‌ టాగూర్‌కి వసంతాగమన సమయానికి సుస్వాగతం పలికే హోలీ పండుగ అంటే ఎంతో ఇష్టం.శాంతి నికేతన్ లో చదువు కున్నారు. “ఒరె భాయి ఫగూన్ లగచె బొనె బోనె …దాలె దాలె ఫులె ఫులె, పతే, పతే రె,
ఆరలె ఆరలె కొనె కొనె” అని పాడే వారు కదా… రంగులు చల్లుకోడానికి సిద్ధ పడండి అంది నవ్వుతూ పావని.

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us