మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

అనర్ఘ రత్నాలు

by డా॥ సంగనభట్ల నరసయ్య November 8, 2021
written by డా॥ సంగనభట్ల నరసయ్య

శా||  శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు

యేలోకానాం స్థితి మావహంత్యవిహితాం స్త్రీ పుంసయోగోద్భవాం

తేవేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితావస్సురైః

భూయాసుః పురుషోత్తమాంబుఝభవ శ్రీకంధరా శ్శ్రేయసే

ఆదికావ్య నిర్మాత నన్నయ మహాకవి తన తెలుగు భారతములో తొట్ట తొలుత ఈ శార్దూల విక్రీడిత పద్యము రాసినాడు. అది సంస్కృతంలో ఉంది. తెలుగు భారతానికి సంస్కృత స్తుతి ఎందుకు?

సంస్కృతంలో రాయడానికి కారణం దేవభాషా వందనం. సంస్కృతంలో రాసిన కారణం మరొకటి ఉంది.

ఇది త్రిమూర్తి స్తుతి. వీరిని సురలు సంపూజ్యం చేస్తున్నారన్నాడు. సురల భాష గీర్వాణి. అందుకే ఈ గైర్వాణం భావం మనోనేత్రం తెరిపించేంత గొప్పది. ఛందస్సు ఉభయ భాషా ప్రచవితం.

వ్యాసప్రోక్త భారతం సంస్కృతం. తెలుగుభాషకు వెన్నుదన్ను వంటిది. “గాసట బీసటల గాథలు తవ్వుకుంటున్న” తెలుగువారికి పంచమ వేదాన్ని రుచి చూపించబోతున్నాడు ఆదికవి. గాసట అంటే గాథా సప్తశతి వంటి ప్రాకృత భాషా కథలు బీసట అంటే బృహత్కథ వంటి పైశాచీ భాషా కథలు తెలుగువారి తొలి కథా సాహిత్యం… తాను రాయబోయేది సంస్కృత మహాకావ్యగాథ. ధర్మం కావాల్సినవారికి ధర్మం. పౌరాణికులకు పురాణం. తత్త్వజ్ఞులకు తత్త్వశాస్త్రం. కృష్ణభక్తులకు కార్ ష్ణ్యం ఐన అలాంటి కావ్యానికి తొలి ప్రార్థనగా త్రిమూర్తుల వర్ణనగా దేవభాషలో రాసి తన సంస్కృత భాషా, కావ్య, కల్పనా ప్రాగల్భాన్ని పండించినాడు.

లక్ష్మీ సరస్వతీ పార్వతులు వరుసగా వక్షము, ముఖమున, శరీరార్థ భాగమున నిలుపుకొని మూడు వేదముల సారం మూర్తిమత్వం పొందిన సకల భువన రక్షణ ప్రభువులు, ఆద్యులు ఐన హరిహర హిరణ్యగర్భులను పద్మోమా వాణీపతులను నన్నయ ఈ శ్లోకమున స్తుతించినాడు.

నన్నయ తన కావ్యాన్ని లోనారసి చూడమన్నాడు. లోతుల్లో కావ్యకళను నిక్ష్తిప్తం చేసినాడని సూన. పై పద్యం చూద్దాం.

ముగ్గురు మాతలు శ్రీ, వాణీ, గిరిజలు, శ్రీ కావ్యారంభ శబ్దం. సంపద్వంతం. మరి బ్రహ్మతో ప్రారంభించాలి కదా త్రిమూర్తి స్మరణ! ముగ్గురు పరమ పురుషులు. లోకముల సృష్టి, స్థితి, లయలకు కారకులు. స్థితిమంతుడు విష్ణువు బ్రహ్మను బొడ్డు తామరలో సృజించినందున విష్ణువే తొలుత స్మరణీయుడైనాడు. ఆ విషయాన్ని అంబుజభవ శబ్దంతో స్మరించినాడు.

ముగురమ్మలు లేక సృష్టి లేదు. స్త్రీ పుంస యోగములో సృష్టి అని సూచన. మానవ దృష్టికి యోగమంటే సంయోగము. కాని ఈ త్రిమూర్తులు తమ లోకపాలనంలో అనగా స్థితి, సృష్టి లయలలో వక్షోముఖాంగములలో తమ స్త్రీలను స్థిరపరచుకొన్నారట. వక్షస్థలంలో లక్ష్మి, ముఖంలో వాణి, అంగార్థంలో గిరిజనులున్నారు. ప్రేమస్థానం హృదయం వక్షస్థలం, వాగ్రూప స్థానం నోరు, శక్తిస్థానం శరీరం కదా! అలా ఉంచినారు. పైగా అవిహతమ్మని స్థిరంగా, శాశ్వతంగా ఉన్నారని, ప్రతిక్షణం ‘లోకానాం స్థితి’కి కారణమైనారు అని వివరణ.

ఆ ముగ్గురి స్థితి ఏమి? వేదస్వరూపం. వేదాలు మూడు. వేదస్థితి మూడు దశలు. అందుకే వేద త్రయమూర్తులు అన్నాడు. అవి ఋగ్ యజుస్సామాలు. ఇవి పరస్పర అర్థమైత్రి కలవి. లోనారసి చూస్తే ఈ మూడువేదాల అంతమైన సారభూత దశ త్రిమూర్త్యాత్మకం ఐన విశ్వం. ‘ఋచస్సామాని జజ్ఞిరే’ అని, వేదాలు మూడేనని తైతి్తరియోపనిషద్వాక్య ప్రమాణం. “వేదాంతేషు యమాహు రేక పురుషం” అని ఈ ముగ్గురు “ఏక పురుషుడే”ని కాళీదాసుని కవితా నిష్కర్ష. అపుడు ముగ్గురు స్త్రీలు ఏకీకృతమైన శక్తి స్వరూపమైన ముగ్గురమ్మల మూలపుటమ్ముగా మారి లోకస్థితి శక్తిగా నిలిచినట్టు నన్నయ సూచన.

పురుష శబ్దం స్థితికి, భవశబ్దం సృష్టికి, శ్రీ శబ్ద (శ్రీ కంధర = విషకంఠ) మనగా విష శబ్దం లయకు సంకేతాలుగా నన్నయ నిష్కర్ష ‘చిరాయ’ శబ్దంలో సృష్టి వయస్సును నిపతించినాడు.

శ్రీ, వాణీ, గిరిజలను, వక్షో, ముఖా, అంగములలో పురుషోత్తముడు, అంబుజభవుడు, శ్రీ కంధరుడు ఊర్థ్వ, భూలోక, పాతాళ నామ లోక్రతయ రూప విశ్వంలో ఏలుటగా క్రమాలంకారంలో పేర్చినాడు నన్నయ.

దధతః అనగా ధరించినారని విశ్వాన్ని, విశ్వ ప్రజలకు శ్రేయస్సును ఇమ్మని ఆ సురలచే సంపూజితులైన వారిని ప్రార్థించినాడు.

శ్రీతో ప్రారంభించి, విషశబ్దం పరిహార్యం కనుక పర్యాయమైన శ్రీ శబ్దంతో మరియు శ్రేయశ్శబ్దంతో  శ్లోకాన్ని ముగిస్తూ కావ్య ప్రపంచ శ్రేయస్సుకు, లోక శ్రేయస్సుకు త్రిమాతృ త్రిమూర్తి వందనం చేసి తెలుగు సారస్వత ప్రపంచాన్ని ప్రారంభించినాడు ఋషి సదృశుడైన ఆదికవి. “ఋషీణాం పునరాద్యానాం వాచమర్ధోను ధావతి” అన్నట్లు త్రిమూర్తి సంకేతంగా మూడు పర్వాలే రాయబోతున్నట్టు చెప్పి, అంతే అనుసృజించి, మహాకవి నిత్యసత్యవచనుడైనాడు.

(ఈ శీర్షికన ఆంధ్రసాహిత్యంలో అనర్ఘ పద్య రత్నాలను ధారావాహికంగా అందిస్తున్నాం. – సంపా.)

 

 

 

November 8, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

వెలువర్తి వెలుగు రవ్వ!!

by Ananthaacharaya K.S. October 30, 2021
written by Ananthaacharaya K.S.

మహా మహోపాధ్యాయ, కవి పండితులు, నిఘంటు నిర్మాతలు, గుణ గరిష్ఠులు, ఆచార్య వరిష్ఠులు, సంస్కృతాంధ్రభాషా సాహిత్యాలలో పండితులు నిగర్వి నిరాడంబురులు ఆచార్య రవ్వా శ్రీహరిగారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి భాషామతల్లి సేవలో జీవనయానం కొనసాగించిన బహుముఖ ప్రజ్ఞాశీలి ఆచార్య రవ్వాశ్రీహరిగారు. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠం నుండి దిద్దుకున్న సంస్కృత భాషా తిలకం ఉపకులపతి పీఠమెక్కి విద్యా ప్రభలు పంచింది. ఎం.ఎ.(తెలుగు) ఎం.ఎ.సంస్కృతం, భాస్కర రామాయణం – విమర్శనాత్మక పరిశీలన అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టాను పొందిన ప్రతిభ వారిది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఒరియంటల్ కళాశాలలో ఉపన్యాసకులుగా, ఉపన్యాసక వృత్తిలోకి అడుగిడినారు. సీనియర్ తెలుగు పండితుని నుంచి ప్రొఫెసరందాకా ఆదర్శవంతమైన అద్భుతమైన బోధన చేసిన ఉత్తమ ఆచార్యులు.  ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ద్రావిడ యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా, హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం ఇన్ చార్జ్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన పరిపాలనా దక్షత వీరిది. రవ్వా శ్రీహరిగారు వివిధ విశ్వవిద్యాలయాలలోని విద్యా సంఘాలతో లెక్కకు మిక్కిలి పదవులు నిర్వహించిన ఘనత వీరిది.

శ్రీహరిగారు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీహరి నిఘంటువు. తెలుగు సారస్వత క్షేత్రంలో నిలిచిపోయే అనేక అంశాలను అనుశీలించారు. తెలుగు నిఘంటువులున్నంత కాలం, సూర్యరాయాంధ్ర నిఘంటువుతోపాటు ‘శ్రీహరి నిఘంటువు’ కూడా నిలిచిపోతుందని పరిశోధకుల అభిప్రాయం.

మరొక అద్భుత గ్రంథం సంకేత పదకోశం. దీనిలో మనకు కావల్సినన్నివ్యాకరణ, తర్క, మీమాంస, జ్యోతిష, అలంకారాల ఆయుర్వేద మొదలైన శాస్త్రాలకు సంబంధించిన పదాల కూర్పు జరిగింది. రెండవ ముద్రణలో మరిన్ని అంశాలను చేర్చి పాఠకులకు ఆసక్తిని కలిగించారు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య కీర్తనల్లోని అచ్చ తెలుగు పదాలను, క్లిష్టమైన భాషాంశాలను భక్తి భావ సంపన్నతను, సంగీత ప్రావీణ్యతను భాషా ప్రయోగ చతురతను ఎన్నింటినో అన్నమయ్య పదకోశంలో వివరించిన విజ్ఞానవంతులు ఆచార్యులు. తెలంగాణా భాషా ప్రాచీనతను, ప్రామాణికతను ఎత్తి చూపిన శ్రీహరిగారి రచన తెలంగాణా మాండలికాలు – కావ్య ప్రయోగాలు. తెలంగాణాలో వాడుకలో వున్న ఎన్నో పదాలకు అర్థాలను తెల్పినారు. నల్లగొండ జిల్లా ప్రజల భాష….. మాండలిక పదకోశం నిర్మించినారు. వ్యాకరణ పదకోశము, వాడుక తెలుగులో అపప్రయోగాలు, లఘుసిద్ధాంత కౌముది, పాణినీయ అష్టాధ్యాయి తెలుగు అనువాదం , కాశీకాసహితం ౨ సంపుటాలు) సంస్కృత రచనలలో సంస్కృత సూక్తి ముక్తావళి సంస్కృత న్యాయాలు, సంస్కృత నీతి రత్నాకరం, సంస్కృత న్యాయదీపిక అనువాదాలలో డా|| సి.నారాయణరెడ్డి ప్రపంచపదులు, జాషువా ఫిరదౌసి, గబ్బిలం వేమన శతకం శేషప్ప నరసింహ శతకం, మాతృగీతమ్, స్వీయరచనలు సంస్కృతీ వైజయంతితోపాటు అనేక రచనలకు సంపాదకత్వం వహించిన కవి పండితులు, భాషావేత్త, వీరి సాహిత్య వ్యాసాలు చాలావరకు పరిశోధనాత్మకమైనవి, ఆలోచనాత్మకమైనవి. రవ్వాగారి గ్రంథాలలో ప్రామాణికత, శాస్త్రీయ స్పష్టంగా గోచరిస్తుంది. తెలుగులో భాషా సాహిత్యానికి సంబంధించిన వీరి రచన ఉదయభారతి. ఇందులో తెలుగు, సంస్కృతం భాషా సాహిత్యాలకు వ్యాసాలు, వ్యాకరణ సంబంధితాలున్నాయి. తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలుగులో అలబ్ధ వాఙ్మయం, భాస్కర రామాయణు – విమర్శనాత్మక పరిశీలనము (సిద్ధాంత గ్రంథము)

శ్రీహరిగారి రచన భాషా విశేషాంశాలు, వ్యాకరణ సంబంధితాలు, సాధికారతతో చెప్పి పరిశోధకులకు, భాషా ప్రియులకు అనేక విషయాలు తెల్పి ఇంకా తెల్పవలసిని అనేకం ఉన్నాయంటూ భావి పరిశోధకులకు వదిలివేసినారు.

నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండలం వెలువర్తిలోని నిరుపేద చేనేత కుటుంబంలో 5 మే 1943న రవ్వా వేంకటటనరసమ్మ,నరసయ్య దంపతులకు జన్మించినారు. అమ్మమ్మ తాతయ్యల ప్రోత్సాహంతో భువనగిరిలో 5వ తరగతి వరకు చదివినారు. తల్లగారి మరణంతో చదువుకు అవాంతరం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి శ్రీహరి గారిని చదివించలేనని తెలియజేశారు. దినపత్రికలోని యాదగిరి దేవస్థానము సంస్కృత విద్యాపీఠం ఉచిత చదువును భోజనాల్ని కల్పిస్తారని తెల్సుకొని అక్కడ చేరిన ఆచార్యులవారి జీవితం మలుపు తిరిగింది. అక్కడ నుండి బయలుదేరి ఉన్నత చదువులు, ఉన్నతోద్యోగాలు నిర్వర్తించిన ఉభయభాషా ప్రౌఢి.

ఆచార్య శ్రీహరిగారి పంచశతి (75 సంవత్సరాలు) పురస్కరించుకొని ‘శ్రీహరి విజయం’ పుస్తకం వేయడం జరిగింది. దీనిలో అనేక వ్యాసాలు సాహితీవేత్తల అభిప్రాయాలు, రచనలు వీరి సంబంధిత సాహిత్య విశేషాంశాలు పొందుపరచబడినాయి.

అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన, నిఘంటువు నిర్మాణం వీరి ప్రతీ అక్షరం వినూత్నం. వీరీ విశేష కృషికి పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. సంస్కృతి విద్యాపీఠ్ తిరుపతి వారి మహామహోపాధ్యాయ కేంద్ర సాహిత్య అకాడమి వారి పురస్కారం (అనువాద రచనకు), తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, జాషువా సాహిత్య పురస్కారం, న్యూజెర్సి అమెరికావారి బ్రౌన్ పురస్కారం, సౌశీల్య పురస్కారం, పరవస్తు చిన్నయ సూరి జాతీయ పురస్కారం లాంటి చాలా పురస్కారాలు పొందినారు.

ఆచార్య రవ్వా శ్రీహరిగారంటే నడిచే విజ్ఞాన సరస్వం. వీరి గురించి రాయటం ఒడవని ముచ్చట. ఇలాంటి మహానుభావులపై అత్యంత ఇష్టంతో, జాగరూకతతో అల్పుడిని అంటూ అనల్పమైన శ్రీహరిగారి తెలుగు రచనలు – సమగ్ర పరిశీలనపైన డా|| సి.యాదగిరి ఆచార్య సాగి కమలాకరశర్మగారి వద్ద పరిశోధన చేసి పట్టాను పొంది తెలుగు ఉపాధ్యాయులు కాకున్నా డా || యాదగిరి గారు తమ పరిశోధనలో ఎన్నో విషయాలను తేటతెల్లం చేసినారు. ఇంకా రవ్వాగారి మీద చాలా పరిశోధనలు రావాల్సి ఉంది.

ఆచార్య రవ్వా శ్రీహరి గారి కలం నుండి ఇంకా ఎన్నోరావల్సి ఉండేది. అనారోగ్య కారణాల వలన పూర్తి కాలేకపోయినాయి. ప్రస్తతం డా||సి.యాదగిరి గారు పరిశోధనలో భాగంగా శ్రీహరి చేసిన ఇంటర్వ్యూ యదాతథంగా మీకు అందిస్తున్నాం.

-కె.ఎస్.అనంతాచార్య

 

వెలువర్తి వెలుగు రవ్వ!!

సార్ మీ బాల్య విశేషాలు తెలియజేయండి?

మా అమ్మమ్మగారి ఊరు రామన్నపేట తాలుకాలోని ‘మునిపంపుల’ గ్రామం. అక్కడ చదువు బాగా ఉంటుందని మా అమ్మగారు ప్రాథమిక విద్యాభ్యాసం కోసం అక్కడే ఉంచినారు. నాలుగవ త

రగతి వరకు అక్కడే చదివినాను.

పల్లెటూరి చదువుల ప్రభావం వివరించండి?

‘మునిపంపుల’ పల్లెటూరైనా అక్కడి తల్లిదంద్రుడుల తమ పిల్లలకు మంచి చదువు చెప్పించాలని తమ పిల్లలను చక్కని విద్యావంతులుగా చేయాలని వారికి ఆసక్తి ఉండేది. అందువల్ల అక్కడి అధ్యాపకులందరు కూడా చక్కగా విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని మంచి విద్యావంతులుగా సిద్ధం చేసేవారు.

ఉన్నత పాఠశాల చదువులవరకు ఏమైనా విశేషాలు తెలియజేయండి?

మునిపంపులలో నాల్గవ తరగతి అయిపోగానే ఉన్నత పాఠశాల విద్యభ్యాసం కోసం భువనగిరిలోని ప్రాథమికోన్నత పాఠశాల లో చేరడం జరిగింది. అక్కడ ఒక సంవత్సరం మాత్రమే చదివి 5వ తరగతి పూర్తి చేసుకున్నాను.

పాఠశాల చదువులు వదిలిపెట్టి గురుకుల విద్యకు ఎలా వచ్చారు?

5వ తరగతి పూర్తి చేసిన సంవత్సరమే వేసవి సెలవులలో మా అమ్మగారు పరమపదించడంవల్ల నా చదువు కొనసాగే సూచనలు సన్నగిల్లినాయి. ఇక పై తరగతులు చదివించడం, కుటుంబ ఆర్థిక కారణాల కారణంగా సాధ్యం, కాదని మా, నాన్నగారు చెప్పడం జరిగింది. అనుకోకుండా ఆ సమయంలోనే ఒకరోజు పత్రికలో యాదగిరి దేవస్థానంవారి సంస్కృత విద్యాపీఠం ప్రవేశానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఆ పాఠశాలలో చేరే విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యాలు ఉంటాయని,  ఫీజులేవి ఉండవని సంస్కృతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఎంట్రెన్స్ పరీక్షకు బోధన ఉంటుందని తెలియచేసినారు. ఆ ప్రకటన చూసి యాదగిరి గుట్ట సంస్కృత విద్యాపీఠంలో చేరడం జరిగింది. అక్కడే నాలుగు సంవత్సరాలు సంస్కృత విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత సికింద్రాబాద్ లోని మున్నాలాల్ సంస్కృత కళశాలలో ఒక సంవత్సరం చదివి ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తీర్ణుడను కావడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో చేరి నాలుగు సంవత్సరాలు సంస్కృత వ్యాకరణాన్ని అధ్యయనం చేసి బి.ఓ.ఎల్. పట్టాను ప్రథమ శ్రేణిలో సంపాదించినాను.

సంస్కృత కళాశాలలో మీ చదువు ఎలాంటి నియమాలతో కొనసాగేది?

నేను చదువుకున్నటువంటి సంస్కృత పాఠశాలలో ఇంచుమించు అందరూ బ్రాహ్మణులే ఉండేవారు. నలు

గురైదుగురు మాత్రమే బ్రాహ్మణేతరులు ఉండేవారు. వీరు కూడా బ్రాహ్మణ విద్యార్థుల మాదిరిగా బ్రాహ్మణ ఆచారాలను పాటించాల్సి ఉండేది. విద్యార్జనే ప్రధానంగా పెట్టకున్నవాణ్ణి కనుక వారి నియాలన్నింటిని నేను కూడా తు.చ. తప్పకుండా అనుసరించేవాణ్ణి. ఆ నియమాలన్నీ కూడా తరువాతి కాలంలో నా క్రమశిక్షణ జీవితానికి మంచి పునాదులు వేసాయి.

గురువుల ప్రభావం మీ మీద ఎలా ఉండేది?

తొలిదశలో కేరళ సుబ్రహ్మణ్యశాస్త్రి గారు సంస్కృత అక్షరాభ్యాసం చేయించిన గురువులు. వారు అప్పుడే మైలాపూర్ సంస్కృత కళాశాలలో (మద్రాస్/ చెన్నై) శిరోమణి పరీక్షలో ఉత్తీర్ణులై యాదగిరి విద్యాపీఠంలో సంస్కృత అధ్యాపకులుగా చేరినారు. వారు మంచి అధ్యాపకులు, అంతేకాక విద్యార్థుల యొక్క క్రమశిక్షణపై మంచి శ్రద్ధ కలవారు. అందువల్ల వారి శిక్షణలో తొలిదశలో సంస్కృతాన్ని చక్కగా అధ్యయనం చేయడానికి పునాదులు పడ్డాయి. వారు తొలి దశలో వేసిన పునాదే నాకు తర్వాతి కాలంలో ఎంతో లాభాన్ని చేకూర్చింది. తొలి దశలో వారి ప్రభావం నాపై ఎంతగానో పడింది. ఆ తర్వాత నాకు వ్యాకరణ విద్యను ప్రసాదించినటువంటి గురువులు ముగ్గురు. ఒకరు కోయిల్ కందాడై శఠగోప రామానుజాచార్యులుగారు, శ్రీమాన్ ఖండవల్లి నరసింహశాస్త్రిగారు, శ్రీమాన్ అమరవాది కృష్ణమాచార్యులవారు. ఈ ముగ్గురూ వ్యాకరణ గురువులు. మునిత్రయం అనదగినవారు నాకు సంస్కృత వ్యాకరణాన్ని మహాభాష్యాంతం అనుగ్రహించిన గురువులు. వీరు నన్ను పుత్రునిలాగా భావించి నా విద్యాభ్యాసంతోపాటు నా యోగక్షేమాలు కూడా చూస్తూ నన్ను ప్రోత్సహించినవారు. వీరి ప్రభావం నా మీద అమితంగా పడిందని చెప్పవచ్చు.

సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుంచి వచ్చిన మీకు అధ్యయనంలో కలిగిన అనుభవాలు ఏమిటి?

సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుండి వచ్చిన నాకు సంస్కృత అధ్యయనంలో, శాస్త్ర అధ్యయనంలో కాని ఏ విధమయిన ఆటంకాలు ఏర్పడలేదు. మా అధ్యాపకులు అందరూ బ్రాహ్మణులే. అయినా నన్ను చాలా అభిమానంతో, ప్రేమతో చూచుకునేవారు. నేను బాగా చదువుతానని అందులోను బ్రాహ్మణేతర కుటుంబం నుండి వచ్చి వ్యాకరణ శాస్త్రాన్ని చక్కగా బ్రాహ్మణ విద్యార్థులతో సమానంగా అధ్యయనం చేస్తున్నందుకు వారెంతో సంతోషపడి నన్ను ప్రోత్సహించేవారు. ఒకసారి పరీక్షలో నేనెంతో బాగా రాసిన సమాధాన పత్రానికి సంతుష్టులయిన మా గురువుగారు శ్రీమాన్ శఠగోప రామానుజాచార్యుల వారు ఎంతో ఆనందించి నా పై తరగతి విద్యార్థులకు పాఠం చెబుతూ నా సమాధాన పత్రాన్ని వారికి చూపి నన్నెంతో ప్రశంసించినారట. ఈ విషయం విన్ననాడు నాకు మా గురువుగారు ఎంత విశాల హృదయులో అవగతమయింది. అంతేకాక నా మరో గురువు శ్రీ అమరవాది కృష్ణమాచార్యులవారు. నేను కళాశాల విడిచిపెట్టిన తర్వాత కూడా విద్యార్థులందరికీ కూడా నా గురించి చెబుతూ నన్ను ప్రశంసిఁచేవారని అప్పటి ఆ విద్యార్థులు వచ్చి చెప్పేవారు. వారి విశాల హృదయానికి నా జోహార్లు. కనుక విద్యాభ్యాస దశలో సంస్కృత సంప్రదాయేతర కుటుంబం నుండి వచ్చినా నన్నందరూ అభిమానించారే కాని నాకు ఏ విధమైన ఇబ్బంది కలుగలేదు.

సంస్కృతంలో డిగ్రీలు సాధించినా తెలుగు ఉపన్యాసకులుగా మీ అనుభవాలు?

నేను మౌలికంగా అధ్యయం చేసింది సంస్కృతమే కాని ఆ రోజుల్లో సంస్కృతం చదువుకున్న పండితులందరికీ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకులుగానే ఉద్యోగానికి అవకాశం ఉండేది. సంస్కృత అధ్యాపకుల ఉద్యోగాలు ఉండేవి కావు. కనుక నేను కూడా తొలి దశలో ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగానే చేరి 5,6 సంవత్సరాలు పనిచేసినాను. తెలుగులోను, సంస్కృతంలోను, ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయినాను. అయితే సంస్కృత శాఖలో నాకు అవకాశం రాకపోవడంతో తెలుగుశాఖలో ఉపన్యాసకునిగా చేరడం జరిగింది. అయితే సంస్కృతంలోలాగా తెలుగులో కూడా నేను ప్రావీణ్యం సంపాదించి తెలుగుశాఖలో కూడా ఉత్తమ అధ్యాపకుడిగా పేరు సంపాదించుకున్నాను.

భాషా పరిశోధనలకు ఎందుకు పూనుకున్నారు?

నాకు అభిమాన విషయం సంస్కృత వ్యాకరణం. అందులో మహాభాష్యాంతం చదువుకున్నాను. ఆ కారణంగా తెలుగు వ్యాకరణాలను కూడా బాగా అద్యయనం చేయడం జరిగింది. పాణినీయ వ్యాకరణంలో భాషా శాస్ర్తానికి సంబంధించిన మౌలికమైన అనేకాంశాలు ఉన్నాయని ఆధునిక భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆధునిక భాషా శాస్త్రం కూడా కొంత అధ్యయనం చేయడంవల్ల భాషా పరిశోధనపై నాకు ఎక్కువ ఆసక్తి కలిగింది.

వ్యాకరణ శాస్త్రంలో సాధించిన విజయాలు వివరించండి?

నేను అటు సంస్కృత వ్యాకరణాన్ని ఇటు తెలుగు వ్యాకరణాన్నిఇటు తెలుగు వ్యాకరణాన్ని రెండింటిని అధ్యయనం చేయడంవల్ల రెండింటిలో కొంత కృషి చేయడం జరిగింది. విశ్వవిద్యాలయంలో, కళాశాలలో అనేక సంవత్సరాలు బాల వ్యాకరణం, ప్రౌఢవ్యాకరణం, ఆంధ్రశబ్ద చింతామణి మొదలైన అనేక వ్యాకరణ గ్రంథాలను బోధించడం జరిగింది. సంస్కృతంలో లఘుసిద్ధాంత కౌముది గ్రంథంలో తెలుగు విద్యార్థులకు అవసరమయ్యే కొన్ని భాగాలను తెలుగులోకి అనువదించడం జరిగింది. అలాగే పాణిని రచించిన అష్టాధ్యాయి గ్రంథాన్ని ఇటీవల కాశికావృత్తితో పాటుగా అనువాదం పూర్తి చేయడం జరిగింది. దీనిని తెలుగు అకాడమీ వారు రెండు సంపుటాలలో ముద్రించి వెలుగులోకి తెచ్చినారు.

నిఘంటు నిర్మాణంలో అనుభవాలు తెలియజేయండి?

మొట్టమొదటగా నేను తెలుగు అధ్యాపకుడిగా చేరి అధ్యాపన చేస్తున్నప్పుడు నాకు కలిగిన కొన్ని అనుభవాలే నా నిఘంటు నిర్మాణ కార్యక్రమానికి దోహమయినాయని చెప్పవచ్చు. నేను రచించిన నిఘంటువులన్నీ విద్యార్థులు యొక్క అవసరాలను తీర్చడం కోసమే. అయితే నిఘంటు నిర్మాణం అనేది చాలా శ్రమతో కూడిన పని. ఎంతోమంది సమష్టిగా చేయవలసిన పని, అయినా నాకా ప్ర్రకియపై ఉన్న అభిమానమే నాచే అనేక నిఘంటువులను నిర్మింపచేసింది. నిఘంటు నిర్మాణం వల్ల భాషకు సంబంధించిన అనేకాంశాలను నేను క్రొత్తగా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా “శ్రీహరి నిఘంటువు” నిర్మాణ సందర్భంలో తెలుగు సాహిత్యంలోని అనేక గ్రంథాలను పరిశీలించే అవకాశం కలిగింది. అనేక నిఘంటువులను పరామర్శించే అవకాశం కూడా కలిగింది.

సంస్కృతం నుండి తెలుగుకు, తెలుగు నుండి సంస్కృతంలోకి అనువాదాలు ఎందుకు చేయాలనుకున్నారు? వాటి నేపథ్యం, అనుభవాలు వివరించండి?

నేను విద్యార్థిగా ఉన్నప్పుడే నాకు సంస్కృత శ్లోక రచనపై ఎందుకో ఆసక్తి కలిగింది. మొట్టమొదటగా కాళహస్తీశ్వర శతకంలోని ఒక పది పద్యాలను సంస్కృతంలోకి అనువదించడం జరిగింది. ఆ శ్లోకాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృతశాఖ ప్రచురించే ‘జయంతి’ పత్రికలో ప్రచురింపబడ్డాయి కూడా. కొంతమంది అవి బాగున్నాయన్నారు. ఆ ఉత్సాహమ తెలుగులోని రచనలను సంస్కృతంలోకి అనువదించడానికి స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తితోనే ప్రపంచ పదులు, ఫిరదౌసి, గబ్బిలం, నరసింహశతకం గ్రంథాలను, అన్నమయ్య సూక్తులను సంస్కృతీకరించడం జరిగింది.

‘విశ్వంభర’ లాంటి సినారె మహా కావ్యాలు ఎన్నో వుండగా, ‘ప్రపంచ పదులు’ ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

‘విశ్వంభర’లోని విషయం గహనమైంది. ‘ప్రపంచపదులు’లోని విషయం ప్రతి వ్యక్తిని స్పృశిస్తుంది. ఇదొక శతకం లాగా వుంది. ‘విశ్వంభర’లో గాఢత్వముంది. సులభ గ్రాహిత్యం తక్కువ. బాగా ఆలోచిస్తే గానీ అది అర్థం కాదు. ‘ప్రపంచపదులు’ అలా కాదు. శతకాల మాదిరిగా అందులోని భావాలు సమాజంలోని అందరికీ సంబంధించినవి. భాష కూడా సరళంగా వుంటుంది. సులభంగా అర్థం అవుతుంది. ఈ కారణాలచేత ‘ప్రపంచపదులు’ సంస్కృతంలోకి అనువదిస్తే అది అందరినీ ఆకర్షిస్తుందని భావించాను. అంతేకాకుండా ఇందులోని ఛందస్సులోనూ ఒక విశేషముంది. ముఖ్యఁగా సంస్కృతంలో ఒక కొత్త ఛందస్సును – రుబాయి ఛందస్సును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది అనువాదం చేస్తే , అందుచేత అదే ఛందస్సులో సంకలనంలోని 108 కవితలు అనువదించాను. అనువాదం అంటే సాధారణంగా భావాన్ని తీసుకుని ప్రాచీన ఛందస్సులైన చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం ఇత్యాదుల్లో పొందుపరుస్తారు. కానీ నేను, నారాయణరెడ్డిగారు ఏ ఛందస్సును, ఏ మాత్రా ఛందస్సును ఆశ్రయించి ఆ రుబాయిలను వ్రాశారో, అదే పద్ధతిలో సంస్కృతంలో వ్రాశాను. సంస్కృతంలో సంప్రదాయ పద్దతులకు భిన్నంగా వ్రాయడం సాధారణంగా ఉండదు. అయినా నేను ఆధునికంగా వ్రాశాను.

నారాయణరెడ్డిగారి కవిత్వం ఎక్కువగా శబ్దాశ్రయ చమత్కారానికి చెందింది కదా? సంస్కృతంలోకి మీరు ఎలా అనువదించారు?

చాలావరకు ఆయన చూపినటువంటి శబ్దాలకు సంబంధించిన సొగసులన్నీ సంస్కృతంలో తీసుకురావడానికి ప్రయత్నించాను. ఎక్కడో కొన్ని రాలేదు కానీ ఎనభై శాతం దాకా వారు శబ్దాలంకారాల్లో చూపిన సొగసును సంస్కృతంలో తెచ్చాను. అదే ఛందస్సులో అంత్యప్రాసలతోపాటు అనువదించాను. మూల రచనలాగే నా అనువాదం లయాత్మకంగా, సరళంగా వుంది.

లోగడ మీరేమి సంస్కృతీకరించారు?

మొట్టమొదటి నుంచీ నేను సంస్కృతంలో కృషి చేసినప్పటికీ సంస్కృతంలో ఈ అనువాద ప్ర్రకియను మాత్రం ఈ ‘ప్రపంచ పదులు’తోనే ప్రారంభించాను. దీని తర్వాత మహాకవి జాషువా ‘ఫిరదౌసి’ కావ్యాన్ని సంస్కృతంలోకి తెచ్చాను. ఆయన మహాకావ్యం ‘గబ్బిలం’ ‘తైలపాయిక’ శీర్షికన సంస్కృతీకరించాను. ఇవి కాకుండా నేరుగా సంస్కృతంలో శతక రూపంలో ‘మాతృగీతిక’ను ఎప్పుడో వ్రాశాను. మొదట పరిశోధన, నిఘంటు సంబంధ కృషి చేశాను. కవిత్వపరమైన కృషి చాలా ఆలస్యంగా ప్రారంభించాను.

సంస్కృతంలో పాఠకులు చాలా తక్కువగా ఉన్నారు కదా? అలాంటప్పుడు మీ ప్రయత్నం పాఠకులకు ఎంతవరకు చేరుతుందని భావిస్తున్నారు?

సంస్కృత పాఠకులను మనం మొత్తం దశంలో పరిగణలోకి తీసుకోవాలి. విదేశాలలో కూడా సంస్కృతం వుంది. మన దేశంలో ఎంత శ్రద్ధతో సంస్కృతం చదువుతున్నారో, అంత శ్రద్ధగా విదేశాలలోనూ సంస్కృతం చదువుతున్నారు. ఆ మధ్య కార్డోనా అనే గొప్ప సంస్కృత జ్ఞాని ఇక్కడికి వచ్చారు. ఆయన కాశీలో వుండి సంప్రదాయ పండితుల వద్ద మహాభాష్యం, వ్యాకరణం చదువుకుని గొప్ప భాషావేత్తగా ప్రసిద్ధికెక్కారు. ఇలా ఇఁకా చాలామంది వున్నారు. సంస్కృతం విశ్వవ్యాప్తమైన భాష. కాబట్టి మన దేశంలో, విదేశాలలో సంస్కృతం చదువుకునేవారు పెద్ద సంఖ్యలో వున్నారు. వారు ఈ గ్రంథాలు చదివితే చాలు.

మరి సంస్కృతం మృతభాష అని కొందరు హేతువాదులే వాదిస్తున్నారు. మీరేమంటారు?

మృతభాష అంటే వారి దృష్టి – వ్యవహారంలో లేని భాష అని. వ్యవహారానికి ఉపయోగించని భాషలు ఎన్నో ఉన్నాయి. విజ్ఞానమంతా ఈ సంస్కృత భాషలోనే వుంది. అందుచేత సంస్కృత భాష విషయంలో ఇది దురభిప్రాయం. ఇలా ఎందుకు జరిగిందంట – సఁస్కృత భాషలో అనేక సాంకేతిక రంగాలకు చెందిన శాస్ర్త గ్రంథాలు వున్నప్పటికీ కేవలం ఆయుర్వేదం, ఖగోళశాస్త్రం మాత్రమే ఇంతకాలంగా ఇతర భాషలలోకి వచ్చాయి. మిగతా శాస్త్రాలు ఇతర భాషల్లోకి రాలేదు.

ఈ తరుణంలోనైనా మిగతా సాంకేతిక శాస్త్రాలను కూడా ప్రాంతీయ భాషలలోకి తేవచ్చు కదా?

అనువాదం చేయవచ్చు. కానీ ఆ పరిభాషిక పదాలు ప్రస్తుతం అర్థం కావు. అవి వ్యవహారంలో లేవు కాబట్టి క్లిష్టంగా వుంటాయి. నేను భరద్వాజ విమాన శాస్త్రం చదివాను. ఇలా ఇంకా ఎన్నో శాస్త్రాలు వున్నాయి. మైసూరు విశ్వవిద్యాలయం వారు “శివతత్త్వ రత్నాకరం” అనే గొప్ప గ్రంథం ప్రచురించారు. అందులో నగరం ఎలా కట్టాలి? ఏ భవన ఎలా నిర్మించాలి? తోటలు ఎలా, ఎక్కడ వుండాలి? తోటల్లో ఎలాంటి చెట్లు పెంచాలి? ఊళ్ళో ఎలాంటి చెట్లు పెంచాలి? వాటికి ఎలాంటి ఎరువులు వేయాలి? ఇత్యాదులు అన్నీ చెప్పారు. మేఘాల గురించీ చెప్పారు. అవి ఎన్ని రకాలు, ఎలాంటి మేఘం వర్షిస్తుంది లాంటి వెన్నో వున్నాయి. అలాగే – ‘రత్నశాస్త్రం’, ‘లోహశాస్త్రం’, ‘జలార్గళ శాస్త్రం’ వుంది. ఇందులో విమానశాస్త్రం హిందీలోకి వచ్చింది. మిగతావి అన్నీ సంస్కృతంలో మాత్రమే వున్నాయి.  వాటిని ప్రస్తుతం ఇతర భాషలలోకి పారిభాషిక పదాలు వెదికి అనువదించడం చాలా కష్టం. శ్రమపడి ఒకవేళ ఎవరైనా అనువదించినా ఆ పారిభాషిక పదావళి ఎవరికీ అర్థం కాదు. భూకంపాలు ఎప్పడు వస్తాయి? అనే అంశంపై ఈ మద్య తిరుపతిలో కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వారు ఇప్పటి శాస్త్రంతో పోల్చుతూ, వరాహమిహిరుడు ప్రభృతులు ఏమి చెప్పారో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే మహాభారతంలోని వాస్తు విజ్ఞానాన్ని గురించి వివరిస్తూ ఆ మధ్య తెలుగులో ఒక గొప్ప సిద్ధాంత గ్రంథం వచ్చింది.

సంస్కృతంలో విజ్ఞానం ఇంత వుండగా, ఆ భాష గురించిన దురభిప్రాయం కేవలం మన దేశంలోనే వుంది. అన్ని విదేశాలలోనూ సంస్కృతం పట్ల గౌరవభావమే ఈనాటికీ నెలకొని వుంది. నిజానికి హేతువు లేని వాదాన్ని మన దేశంలో హేతువాదులే చేస్తున్నారు. ‘ధ్వన్యాలోకం’, ‘రసగంగాధరం’ లాంటి గ్రంథాలు ఇంకెక్కడా, ఏ భారతీయ భాషలోనూ లభించవు. భరతుని నాట్యశాస్త్రమంత గొప్ప గ్రంథం ఏమొచ్చింది? వాత్స్యాయనుడి కామసూత్రమంత గొప్ప కామశాస్ర్త

గ్రంథం ఏమొచ్చింది? అలాగే పాణిని ‘అష్టాధ్యాయి’ అంత గొప్ప వ్యాకరణం ఇంతవరకు రాలేదు. కార్డొనా పాణినిని క్షుణ్ణంగా పఠించాడు. చెప్పగలడు. మనవాళ్ళు కొంత చాదస్తం చేశారు. అయితే దాన్ని మనం పక్కనపెట్టి భాషను చదవాలి. అందులోని శాస్త్రాలు తెలుసుకోవాలి.

ఆంగ్లం ఇత్యాది ఆధునిక భాషలపై మోజు చూపుతున్న ఈ తరుణంలో మీరు సంస్కృత భాషా రంగంలోకి ఎలా ప్రవేశించారు?

అది విచిత్రంగా జరిగింది. నేను నాల్గవ తరగతిదాకా మా ఊళ్ళో చదివాను. ఐదవ తరగతి భువనగిరికి వెళ్ళి చదివాను. ఆ వేసవిలోనే మా అమ్మగారు పోయారు. అంతటితో నా చదువు కూడా ఆపేయ్యమన్నారు. భువనగిరిలో చదివితే డబ్బు కావాలి. నెలకు పదిహేను సేర్ల దాకా బియ్యం, ఖర్చులకు ఐదు రూపాయలు కావాలి. ఆ డబ్బు వీలు కాదు పంపన్నన్నారు మా నాయనగారు. ఆ సమయంలో యాదగిరి గుట్ట దేవస్థానంలో సంస్కృత విద్యాపీఠం పెడుతున్నట్టు, అక్కడ ఉచితంగా విద్య చెప్పడమే కాకుండా భోజన వసతి కల్పిస్తున్నట్టు పత్రికలో వార్త వచ్చింది. అది చూసి నేను, నా తోటి మరో నలుగురు స్నేహితులు కలిసి యాదగిరిగుట్ట వెళ్ళాం. కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు, సురవరం ప్రతాపరెడ్డిగారు, మందుముల నరసింగరావుగారు అక్కడ కమిటీలో వున్నారు. వారి సహృదయతవల్ల నేను 1953లో అందులో చేరాను. అప్పుడు నాకు పది సంవత్సరాలు. నిజానికి మాకు అప్పుడు సంస్కృతం అంటే ఏమిటో తెలియదు. ఉచితంగా విద్య నేర్పుతారు, భోజనం పెడతారనీ, ఇంటి నుంచీ బయటపడవచ్చునని బయలుదేరాం.

అయితే ఒక షరతు పెట్టి లక్ష్మణశాస్త్రిగారు మమ్ములను తీసుకున్నారు. మూడు మాసాల పరీక్షలో ఉత్తీర్ణులయితే చదువు కొనసాగిస్తాననీ, తప్పితే తప్పించివేస్తానని చెప్పారు. దానికి కట్టుబడి చేరాం. చివరికి నేనొక్కణ్ణే ఆ పరీక్షలో ఉత్తీర్ణుడిని అయ్యాను. మిగతా నా స్నేహితులను ఇంటికి పంపారు. అమరకోశం, శబ్దమంజరి ఇత్యాదులు సంప్రదాయబద్ధంగా చెప్పారు. అక్కడ ఐదు సంవత్సరాలు చదివితే ‘ఎంట్సన్స్ కు’ పంపుతారు. నేను ‘ఎంట్రన్స్’ ఆ తర్వాత డి.ఒ.ఎల్., బి.ఒ.ఎల్. – అన్నింట్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. బి.ఒ.ఎల్.లో ప్రథమ శ్రేణిలో మొదటిర్యాంకు. వ్యాకరణం ప్రత్యేకంగా చదివాను. నేను పద్దెనిమిదిన్నర సంవత్సరాలకే బి.ఒ.ఎల్ పూర్తి చేశాను. దాన్ని ‘శిరోమణి’ అని మద్రాసులో, ‘విద్వాన్’ అని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంటారు. మొత్తం తొమ్మిది సంవత్సరాలు సంస్కృతం చదివాను. అందులో ఐదేండ్లు యాదగిరిగుట్టలో, నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ లోని సీతారాంబాగ్ లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో శఠగోప రామానుజాచార్యుల అధ్యాపకత్వంలో ఎంతో నేర్చుకున్నాను. బి.ఒ.ఎల్. కాగానే వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో (1962)లో అధ్యాపకుడిగా చేరాను. అంతకుముందు ప్రైవేట్ గా మెట్రిక్యులేషన్ పూర్తి చేశాను. పండిట్ శిక్షణ పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను.  ఇక్కడ ఐదు సంవత్సరాల అధ్యాపక వృత్తిలో వుండి ఎం.ఏ సంస్కృతం ప్రథమ శ్రేణిలో ప్రథమ ర్యాంకుతో 1967లో ఉత్తీర్ణుడనయ్యాను. బంగారు పతకం పొందాను. వెంటనే ఆంధ్ర సారస్వత పరిషత్తువారి కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరాను. ఇక్కడ చేరాక తెలుగులో ఎం.ఏ. చేసి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. అంతకముందే బి.ఒ.ఎల్. కూడా తెలుగులో పూర్తి చేశాను. ఇక్కడ ఐదున్నర సంవత్సరాలు పనిచేశాక ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఉపన్యాసకుడిగా చేరాను. అక్కడే ‘భాస్కర రామాయణంపై’ పరిశోధన డాక్టర్ బి.రామరాజుగారి పర్యవేక్షణలో చేశాను. అలాగే భాషా శాస్త్రంలో పి.జి.డిప్లొమా కూడా ప్రథమ్రశేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. రీడర్ అయ్యాను. ఐదు సంవత్సరాలు పనిచేశాక ప్రొఫెసర్ అయి, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధిపతిగా తొమ్మిదేండ్లు పనిచేశాను. ఆ తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా 3 ½    సంవత్సరాలుగా చేశాను.

పరిశోధన రంగంలో మీరు అనుసరించిన పద్ధతులు వివరించండి?

ప్రధానంగా నా పరిశోధన సాహిత్యానికి, భాషకు సంబంధించినది. సాహిత్యంలో ప్రధానంగా ప్రాచీన సాహిత్యం పైనే కృషి చేయడం జరిగింది. భాస్కర రామాయణంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రచించినాను. ఇంతకుపూర్వం సాహిత్యం రంగంలో నిష్ణాతులయిన వేటూరి ప్రభాకర శాస్త్రి, మానపల్లి రామకృష్ణకవి, నిడదవోలు వెంకట్రావు, ఆచార్య బిరుదురాజు రామరాజు మొదలైన పరిశోధకులు అనుసరించిన పద్ధతినే నేను అనుసరించడం జరిగింది. భాషా రంగంలో కూడా కొంత పరిశోధన చేయడం జరిగింది. ఇందులో ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య చేకూరి రామారావు నాకు మార్గదర్శకులు.

ఉపన్యాసకులుగా మీ అనుభవాలు తెలియజేయండి?

ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా 6 సంవత్సరాలు పని చేసిన తర్వాత 1967లో ఆంధ్రసారస్వత పరిషత్ వారు నిర్వహిస్తున్న ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరినాను. ఆ రోజుల్లో ప్రాచ్య కళాశాలలో తెలుగు సంస్కృతాలలో మంచి ప్రవేశం ఉన్న ఆసక్తి ఉన్న విద్యార్థులు చేరేవారు. పాఠ్యప్రణాళికలో కూడా మంచి స్థాయి గల గ్రంథాలు పాఠ్యగ్రంథాలుగా ఉండేవి. వయస్సులో నాకంటే పెద్దవాళ్ళు కూడా విద్యార్థులుగా ఉండేవారు. అందువల్ల పాఠ్యాంశాలను బాగా చదువుకొని పాఠాలు చెప్పవలసి ఉండేది. ఆ కళాశాల సాయం కళాశాల కనుక నేను ఉదయమంతా కూడా ఈ పాఠ్యాంశాలను బాగా చదువుకని పాఠం సిద్ధం చేసుకుని వెళ్ళడంవల్ల నా విజ్ఞానం బాగా పెరగడానికి అవకాశం కలిగింది. మౌలికంగా నేను చదువుకున్నది సంస్కృతమే అయినా తెలుగు సాహిత్యం, తెలుగు వ్యాకరణాలు ఇవన్నీ నేను స్వయంగా చదువుకుని అధ్యాపనం చేసే అవకాశం లభించింది. ఈ కళాశాలలోని బోధన, తెలుగులో మంచి పాండిత్యం సంపాదించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను, కేంద్రీయ విశ్వవిద్యాలయంలోను తెలుగుశాఖలో అధ్యాపకుడిగా పనిచేసే అవకాశం కలిగింది.  ఈ విశ్వవిద్యాలయాలలో ప్రధానంగా నేను వ్యాకరణం, సంస్కృతం, భాషా శాస్త్రం ఈ విషయాలను బోధించేవాణ్ణి. విద్యార్థులకు ఈ విషయాలు బోధించేటప్పుడు పరిశోధనాత్మక దృష్టిని, తులనాత్మక పరిశీలనా దృష్టిని అలవరచుకోవడం జరిగింది.  వ్యాకరణం, సంస్కృతం ఇవి కొంత కఠినమైన అంశాలయినా విద్యార్థులు చాలా శ్రద్దగా వినేవారు. పరీక్షలలో కూడా బాగా వ్రాసి మంచి మార్కులు తెచ్చుకునేవారు. విద్యార్థులకు వ్యాకరణం, సంస్కృతం, భాషా శాస్త్రం చెప్పేటప్పుడు చాలా ఆనందంగా ఉండేది. వ్యాకరణం చెప్పేటప్పుడు ప్రధానంగా ఆయా వ్యాకరణ గ్రంథాలలోని ఉదాహరణలే కాక తక్కిన సాహిత్యంలోని ఉదాహరణలు కూడా చెప్పడంవల్ల విద్యార్థులకు ఆయా గ్రంథాల పరిచయం కూడా కలిగేది. నిజంగా ఉపన్యాసకుడిగా ఉంటూ విద్యార్థులకు పాఠాలు బోధించడం భగవంతుడిచ్చిన ఒక వరంగా భావించినాను.

తెలుగుశాఖ అధ్యక్షులుగా మీ అనుభవాలు వివరించండి?

కేంద్ర విశ్వవిద్యాలయం (హైదరాబాద్)లో నేను తెలుగుశాఖకు సుమారు 8,9 సంవత్సరాలు అధ్యక్షునిగా ఉన్నాను. అధ్యక్షునిగా ఉన్న కాలంలో నాకు నా సహాధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సహకరించినారు. అందువల్ల నాకు ఏ విధమైన ఇబ్బంది కలుగలేదు. విద్యార్థులంతా కేవలం చదువుమీదనే శ్రద్ధ కలవారు కావడం చేత అధ్యాపకులు బోధన, పరిశోధన రంగాలలో నిమగ్నులై ఉండడంవల్ల మా తెలుగు శాఖలోని కార్యక్రమాలన్నీ సజావుగా సాగేవి. విద్యార్థులంతా క్రమశిక్షణతో ఉండటంవల్ల పరిపాలనలో నాకేవిధమైన ఇబ్బంది కలుగలేదు. నేను అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఎంతోమంది విద్యార్థులు యుజిసివారి జె.ఆర్.ఎఫ్.స్కాలర్ షిపంలను పొందినారు. ప్రతి సంవత్సరము ఒకటి, రెండు సెమినార్లు నిర్వహిస్తుండడంవల్ల విద్యార్థులలో పరిశోధనాసక్తి బాగా వృద్ధి చెందింది. పాఠ్యంశాలు నిర్ణయించడంలో మా శాఖకు స్వాతంత్ర్యం ఉండడంవల్ల ఎప్పటికప్పుడు సమయానుకూలంగా విద్యార్థులకనుగుణమైన క్రొత్త పాఠ్యంశాలను నిర్ణయించే అవకాశం ఉండేది.

విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా మీ అనుభవాలు తెలుపండి?

హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఉండగా నాకు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్ష పదవి లభించింది. ఇది ద్రావిడ భాషల యొక్క తులనాత్మక అధ్యయనానికి, ద్రావిడ సంస్కృతి అధ్యయనానికి ఏర్పడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయానికి నేను రెండో ఉపాధ్యక్షుణ్ణి. విశ్వవిద్యాలయం స్థాపించిన నాలుగవ ఏట (సంవత్సరం) నేను ఉపాధ్యక్ష పదవి చేపట్టినాను. అప్పటికి ఆ విశ్వవిద్యాలయానికి కొన్ని భవనాల నిర్మాణం జరిగినా విద్యాత్మకంగా మంచి పునాదులు వేయడం జరుగలేదు. రెండు, మూడు శాఖలు మాత్రమే అప్పటికి ఉండేవి. అధ్యాపకులు కూడా ఆరేడుగురు మాత్రమే ఉండేవారు.  నేను ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత క్రొత్త శాఖలను ఏర్పాటు చేయడమే కాక ఆ శాఖల్లో అధ్యాపకుల నియామకాన్ని కూడా చేపట్టడం చేత దానికొక స్వరూపం ఏర్పడింది. విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో చేరడం జరిగింది. భవనాల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మొత్తంమీద నేను ఉపాధ్యక్షుడుగా ఉన్న మూడున్నర (3 ½) సంవత్సరాలలో ఆ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం కృషిచేయడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. అధ్యాపకులు విద్యార్థులు, అధికారులు అందరూ సహకరించడంవల్ల ఈ విశ్వవిద్యాలయాన్ని నా పరిపాలనా కాలంలో నా శక్తి మేరకు అభివృద్ధి పథంలో నడిపింపగలిగాను.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల ముఖ్య సంపాదకులుగా మీ పరిశ్రమ, ప్రయోజనాలు వివరించండి?

అధ్యాత్మిక ప్రచారం కోసం గ్రంథ ప్రచురణను ఒక ప్రధాన సాధనంగా చేసుకున్న దేవస్థానాలలో ఏకైక దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. దేవస్థానంలో జరుగుతున్న గ్రంథ ప్రచురణల కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రత్యేక అధికారి అవసరమని భావించి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఐ.ఎ.ఎస్ గారు తృప్తినిచ్చినటువంటి వృత్తి అధ్యాపక వృత్తి. అధ్యాపనంవల్ల కలిగే ఆనందం ఎంతో గొప్పది. ఒక్కొక్కసారి ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకొని దానిని విద్యార్థులకు చెప్పినపుడు కలిగే ఆనందమే వేరు. పరిపాలనలో కొన్ని మంచి పనులు చేయవచ్చు. కాని పరిపాలనలో అందరి మన్నన పొందడం కష్టమే. దానివల్ల కలిగే తృప్తి తాత్కాలికమే అని భావిస్తాను. అధ్యాపక వృత్తిలో ఎంతో మందికి జ్ఞానభిక్షపెట్టి వారిని సమున్నత స్థాయికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ నాకు అధ్యాపనమంటే ఎంతో ఇష్టం. కుప్పంలో ఉపాధ్యక్షుడుగా ఉన్న కాలంలో కూడా ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు వ్యాకరణాన్ని బోధించేవాడిని.

అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన వంటి వాటిలో మీకు ఇష్టమైన అంశం ఏది? ఎందుకు?

అనువాదం, సంకలనం, విమర్శ, పరిశోధన వంటి వీటిలో అన్నీ నాకు ఇష్టమైన అంశాలే. ఈ అంశాలన్నింటిలో ఇంతో అంతో నేను కృషి చేయడం జరిగింది. కొన్ని గ్రంథాలు కూడా రచించినాను. వాఙ్మయానికి సంబంధించినటువంటి ప్రతి ప్రక్రియ విశిష్టమైనదే. ఈ ప్రక్రియలన్నీ సాహిత్యానికి అవసరమైన అంశాలే.

మీ మాండలిక భాషా సంబంధ కృషి గురించి తెలుపండి?

చిన్ననాటి నుండి నాకు మాండలికాలంటే  ఎంతో ఇష్టం. ముఖ్యంగా మా నల్లగొండ జిల్లా మాండలిక పదాలంటే ఎంతో ప్రాణం. చిన్నతనంలో ఇంట్లో మా అమ్మమ్మ వాడే ‘కొర్కాసు’, ‘సోయి’ వంటి మాండలిక పదాలు నాకిప్పటికీ జ్ఞాపకమున్నాయి. నేను ఉపన్యాసకుడిగా పనిచేస్తున్నప్పుడు మా నల్లగొండ జిల్లా మాండలిక పదాలను అధ్యయనం చేస్తూ “నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం” అనే గ్రంథాన్ని సమకూర్చినాను. అలాగే మాండలిక పదకోశం” అనే గ్రంథాన్ని సమకూర్చినాను. అలాగే మాండలిక పదాలకెన్నింటికో కావ్య ప్రయోగాలను గుర్తించి వాటికి కూడా ‘తెలంగాణా మాండలికాలు – కావ్య ప్రయోగాలు’ అని ఒక నిఘంటువును కూర్చినాను. ఈ రెండు నిఘంటువలేకాక అనేక మాండలిక పదాలను – వివిధ జిల్లాలకు సంబంధించిన వాటిని నా ‘శ్రీహరి నిఘంటువు’ కూడా చేర్చినాను.

ఈ రెండు నిఘంటువులకు కూడా విపులమైన పీఠికలను కూడా సంతరించినాను. నల్లగొండ జిల్లా మాండలిక పదకోశానికి వ్రాసిన పీఠికనే నల్లగొండ జిల్లా ప్రజల భాష అనే పేరుతో ముద్రించాను.

వీటితోపాటు మాండలికాలకు సంబంధించిన ఎన్నో వ్యాసాలను కూడా రచించడం జరిగింది. ఇటీవలే ప్రచురించిన అన్నమయ్య పదకోశంలోను, ‘అన్నమయ్య’ పదకోశంలోను, ‘అన్నమయ్య అచ్చ తెలుగు’ అన్న గ్రంథాలలో రాయలసీమ మాండలిక పదాలను, ఇతర మాండలిక పదాలను కూడా పేర్కొని అన్నమయ్యకు మాండలిక ప్రయోగాలపై ఉన్న అభిమానాన్ని వివరించడం జరిగింది.

ఆంధ్రసారస్వత పరిషత్తు మరియు వివిధ సాహిత్య, విద్యా విషయిక సంస్థలతో మీకు గల సంబంధం తెలుపండి?

నాకు మొట్టమొదటగా సంస్కృత భాషపై ప్రజలకు ఆసక్తిని పెంపొందించటానికి, సంస్కృత భాషా వ్యాప్తికీ ఏర్పడిన ‘సురభారతీ’ సమితితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. జస్టిస్ అల్లాడి కుప్పుస్వామిగారు, శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు, ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడుగారు మొదలైన ప్రముఖులెందరో ఈ సమితిలో ఉండేవారు.  ఈ సంస్థకు నేను కొంతకాలం సంయుక్త కార్యదర్శిగా ఉండినాను. తర్వాత తెలుగుభాషా సాహిత్యాలకు తెలంగాణాలో ఎనలేని సేవచేస్తున్నఆంధ్రసారస్వత పరిషత్తులో సభ్యుడిగా, పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా ఉండి యథాశక్తి సేవలను అందించడం జరిగింది. ఆంధ్రసారస్వత పరిషత్తు ట్రస్టులో కూడా ఇప్పటివరకు నేను సభ్యునిగా ఉన్నాను. ఇవికాక సంస్కృత భాషా ప్రచారసమితి (హైదరాబాద్)కి కులపతిగాను, సరస్వతీ విద్యాపీఠానికి (ఆంధ్రప్రదేశ్) అధ్యక్షునిగాను ఉండి నా సేవలను అందించడం జరిగింది.

సాహిత్య సంస్థలతోనే కాక అనేక విద్యా సంస్థలతోను నాకు సంబంధం ఉంది. హైదరాబాద్ లోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలకు ఉపాధ్యక్షునిగాను, త్రిలింగ విద్యాసమితికి అధ్యక్షునిగాను, జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పాలకమండలి సభ్యునిగాను, తెలుగు అకాడమి పాలకమండలి సభ్యునిగాను, ఇంటర్ మీడియట్ బోర్డు పాలకమండలి సభ్యునిగాను, ఎపి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ సొసైటీ పాలకమండలి సభ్యునిగాను ఇలా ఎన్నెన్నో సంస్థలతో సంబంధం ఉంది. అన్నమయ్య పదకోశ నిర్మాణానికి పూనుకున్నాను. అనేక పండితులను సంప్రదించి వివిధ ఆకారాలను పరిశీలించి, కొన్ని మారుమూల నిఘంటువులను పరిశీలించి నా శక్తి మేరకు నిఘంటువును సిద్ధం చేయడం జరిగింది. ఇది సమగ్రమైన నిఘంటువని భావించడం లేదు. నిజంగా ఏ నిఘంటువూ సమగ్రం కాదు. పండితుల సూచనతో ఈ నిఘంటువును సమగ్రం చేయడానికి ప్రయత్నించాను.

అన్నమయ్య భాషా వైభవంపై మీ కృషిని తెలియజేయండి?

అన్నమయ్య సంకీర్తనల్లో కనిపించే భాషా వైభవం ఎంతో గొప్పది. తెలుగు భాష యొక్క సహజమైన విరాట్ స్వరూపం ఆ సంకీర్తనల్లో గోచరిస్తుంది. అచ్చమైన తెలుగు పదాలు, మాండలికపదాలు, లోకోక్తులు, పదబంధాలు మొదలైన వాటివల్ల అన్నమయ్యకు తెలుగుభాషపై ఉన్న ప్రేమతోపాటు ఆయనకున్న సర్వతోముఖమైన పాండిత్యం వ్యక్తమవుతుంది. సంస్కృత దీర్ఘ సమాసాలతో రచనలు చేసే కాలంలో అలతి అలతి అచ్చ తెలుగు పదాలతో వ్యావహారిక భాషలో గొప్ప గొప్ప భావాలను అతి హృద్యంగా వర్ణించడం ఆయనకే చెల్లు. ఒక విధంగా వ్యావహారిక భాషకు, వ్యావహారిక భాష ఉద్యమానికి అతడే ఆద్యుడని చెప్పవచ్చు. అన్నమయ్య ప్రదర్శించిన ‘తెలుగు భాషా వైభవం’ నన్నెంతో ఆకర్షించింది. భాషా విశేషాలకు అన్నమయ్య సంకీర్తనలు పెన్నిధులని చెప్పవచ్చు. అందుకే అన్నమయ్య భాషపై నేను ‘అన్నమయ్య భాషవైభవం’, ‘అన్నమయ్య – అచ్చ తెలుగు, అన్నమయ్య నవ్వులు’ అన్న గ్రంథాలను ప్రచురించడం జరిగింది.

ఆధునిక కాలంలో తెలుగు పరిశోధకులకు అలబ్ధవాఙ్మయం గురించి మీ సలహాలు?

ప్రాచీన కాలంలో వివిధ కవులు రచించిన కావ్యాలన్నీ మనకిప్పుడు లభించడం లేదు. మన అలసత, అజ్ఞానం వల్ల పూర్వకవులు రచించిన ఎన్నెన్నో గ్రంథాలను ఎర్రన రామాయణం వంటి అమూల్యమైన గ్రంథాలను పోగొట్టుకున్నాం. ప్రస్తుతం మనకు లభ్యంకాని గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. సంకలన గ్రంథాలు, కావ్యపీఠికలు మొదలైన ఆధారాల ద్వారా ఈ గ్రంథాల ఆచుకీ తెలియవస్తుంది. ఈ అలబ్ధ వాఙ్మయంపై మానవలి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటి మహామహులు కృషిచేసిన విషయం తెలిసిందే. వారి ఆదర్శంతో ఈ విషయంలో  నేను కొంత కృషిచేసి తెలుగులో అలబ్ధ వాఙ్మయం, అలబ్ధ కావ్య పద్యముక్తావళి అని రెండు గ్రంథాలను రచించడం జరిగింది. ప్రాచీన సాహిత్యంపై అభిమానం కలిగిన పరిశోధక విద్యార్థులు ఈ రంగంలో కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనివలన ప్రాచీనులు వివిధ ప్రక్రియలతో ఎంతో శ్రమించి రచించిన అమూల్య గ్రంథాలను గురించి తెలియవస్తుంది. అంతేకాక ఆయా గ్రంథాలు ఎవరి దగ్గరనైనా ఉంటేవాటిని సంపాదించి లోకానికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ కృషి తెలుగు సాహిత్య చరిత్ర సమగ్ర రచనకు కూడా దోహదకారి అవుతుంది.

తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి మీ సూచనలు?

పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రాంత సాహిత్యానికి, తెలంగాణా ప్రాంత కవులకు, తెలంగాణ భాషకు ఏ కారణం చేతనో ప్రాధాన్యం దక్కలేదు. తెలంగాణాలో గొప్ప గొప్ప కావ్యాలు రచించిన కవులు ఎంతోమంది ఉన్నావారిని గురించిన అధ్యయనానికి ప్రాధాన్యం లభించలేదు. తెలంగాణాలో మరింగంటి కవులు మొదలయిన కవి కుటుంబాలు ఎన్నో ఉండినట్లుగా, ఆయా కుటుంబాలలోని కవులు తరతరాల సాహిత్యాన్ని పండించినట్లుగా మనకు తెలుస్తుంది. కనుమరుగై వెలుగులోకి రాని తెలుగు కవిపండితులను గురించి ఆచార్య బిరుదురాజు రామరాజుగారు ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. కనుక ఇక్కడి కవి పండితులు తెలంగాణా ప్రాచీన కవులను, పండితులను గూర్చి పరిశోధనలు చేసి వారి వైశిష్ట్యాన్ని వెలుగులోకి తేవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక తెలంగాణా భాషను గురించి – పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా భాష ఎంతో ఈసడింపుకు గురైంది. తెలంగాణా మాండలికాలకు, విశిష్ట ప్రయోగాలకు రచనలో ఏ మాత్రం స్థానం లేకుండా ఉండేది. ఎక్కడైనా తెలంగాణా రచయితలు తమ మాండలిక పదాలను రచనలలో వాడినా పరిహాసానికి గురయ్యేవారు. తెలంగాణా భాషలో ప్రాచీనమైన పలుకుబడులు ఎన్నో కనిపిస్తాయి. ఉదాహరణకు కోలెన్, తల (సమయం), సంచకారి మొదలైనవి. తెలంగాణా భాషలో పదబంధాలు, సామెతలు ఎన్నో విశిష్టమైనవి ఉన్నాయి. అవన్నీ తెలుగుభాషకు అమూల్యమైన అలంకారాలు. వాటినన్నింటినీ ప్రస్తత రచయితలు తమ భాషలో వాడుకుంటూ తెలంగాణా భాష యొక్క వైశిష్ట్యాన్ని ప్రయోగ విశేషాలను అందరికీ తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే తెలంగాణాలో ప్రత్యేకంగా వాడబడే మాండలిక పదాలకు, పదబంధాలకు, సామెతలకు ప్రత్యేకంగా నిఘంటువులు రావలసిన అవసరం ఉంది. తెలంగాణా భాషాభిమానులు ఇందుకు పూనుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యాకరణ అధ్యాపకులకు మీ సూచనలు?

భాష అనేది వ్యాకరణ యుక్తంగానే వ్యవహరింపబడుతుంది. అయితే ప్రతి వ్యవహర్త తాను వ్యాకరణ యుక్తంగానే మాట్లాడినా, తాను మాట్లాడుతున్న భాషలోని నియమాలను వివరించలేదు. వ్యాకర్త మాత్రమే మనం మాట్లాడుతున్న భాషలోని భాషా నియమాలను గ్రహించగలడు. ఆ భాషా నియమాలే ఒక విధంగా వ్యాకరణం.

వ్యాకరణాన్ని బోధించే అధ్యాపకులు ప్రధానంగా వ్యాకరణ గ్రంథాలలో ఉన్న ఉదాహరణలను మాత్రమే విద్యార్థులకు బోధిస్తారు. అలా కాకుండా ఆయా కావ్యాలలోని ప్రయోగాలను కూడా విద్యార్థులకు తెలియచేయాలి. ఉదాహరణకు “ఉపయోగంబునందు ఆఖ్యాతకు తోడ వర్ణకంబగు” అనే బాల వ్యాకరణ సూత్రానికి బాల వ్యాకరణంలోని ఉదాహరణ మాత్రమే చెబుతారు. కాని మహాభారతం మొదలైన గ్రంథాలలోని ప్రయోగాలను వెదకి వాటిని కూడా విద్యార్థులకు చెప్పవలసిన అవసరం ఉంది. విద్యార్థులే స్యయంగా ఆ ప్రయోగ విశేషాలను గమనించే విధంగా ఉపాధ్యాయుడు శ్రద్ధ  తీసుకోవలసిన అవసరం ఉంది. వ్యాకరణాన్ని కేవలం ఉపాధ్యాయుడు బోధించడం కాకుండా విద్యార్థులచే భాషా ప్రయోగాలలోని విశేషాలను గమనింపచేసే విధంగా ప్రయత్నం చేస్తే విద్యార్థికి వ్యాకరణం అంట ఆసక్తి కలుగుతుంది. వ్యాకరణమంటే అదొక కొరకరాని కొయ్య అనే భావం తొలగిపోతుంది.

మీరు అభిమానించే ప్రాచీన కవులు వారి ప్రత్యేకతను తెలుపండి  ?

ప్రాచీన కవుల్లో నాకు బాగా నచ్చిన కవులు నన్నయ్య, తిక్కనలు. నన్నయ కాలానికి తెలుగులో కావ్య రచన అంతగా సాగలేదు. కావ్యాలు రాలేదు. కనుక తెలుగు సమగ్ర కావ్య రచనకు అనుగుణంగా పూర్తిగా రూపుదిద్దుకోలేదు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

October 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

దాశరథి కృష్ణమాచార్యులు

by డాక్టర్ అడిగొప్పుల సదయ్య October 30, 2021
written by డాక్టర్ అడిగొప్పుల సదయ్య
తెలగాణ కవిరాజు దులిపె నైజాం బూజు
కొదమ సింగంబయ్యి అదిలించె నక్కలను
రుద్రవీణను మీటి నిద్రాణ తెలగాణ
ప్రజల గుండెల జొచ్చి ధ్వజమెత్తె గొంతుకై
తెలుగు సాహితి జనని తిరువడుల మదినింపి
నవ్య రీతుల కవిత నావిష్కరించెనిట
దుష్ట ఖాసిం రజ్వి దురిత చేష్టలనాప
నెదిరొడ్డి నినదించె ఎర్ర సూరీడోలె
ఇందూరు జైలులో బంధింపబడి, యందు
బొగ్గులను రాజేసి పుట్టించె కవితలను
పోతన్న తోటలో పుణికి పూసిన సుమము
వెదజల్లె రాజరిక వ్యతిరేక పరిమళము
పద్దేలతో నిజాం గద్దె వణికించితివి
వీరకవి సింహమా! వీర తెలగానమా!
గజలు గీతాలకూ గమకాలు జోడించి
తెలుగు వాణి మెడలో వెలుగు దండేసితివి
నమస్తే సారధీ! నమస్తే కవితాబ్ధి!
నమస్తే దాశరథి! నమస్తే! నమస్తే!
October 30, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

ఎస్పీ బాలున్ దలతున్

by Bobbili Yugandhar October 29, 2021
written by Bobbili Yugandhar

1 — సరిగమ పరిమళము నెరిగి
సరిసరి నటనలకు తగిన
సరసత పెంచెన్
నిరతము సుస్వర మధురిమ
పరిపరి విధముల పంచిన
బాలున్ దలతున్

2 — గళమున మధు స్వరాళిని
గలిగి చిలికి నవరసాల
కమ్మగ నొలికెన్
ఇలలో పాడుత-తీయగ
ఎలమిని నేర్పిన మెలపులు
యేపుగ మెరిసెన్
3 — మరిమరి ముసిముసి నగవుల
సరి జేయుచును దొసగులను
సౌమ్యత దిద్దెన్
అర విరిసిన సరిగమలను
పసి గళముల పరచినట్టి
బాలున్ దలతున్
4 — సరిగమ పదనిస గమ్యము
నెరుగుచు సుగీత నినదము
నిటు నటు తేల్చెన్
సురుచిర మృదుపద సంపద
మెరుపుల రస భావఝరి
దుమికి భువి తరలెన్

5 — సరిసరి పదముల గలగల
ఝరి సరి గతులను గళమున
జలజల రాల్చెన్
పరిపరి విధముల జనములు
మరిమరి మురిసిరి యెదలను
మరతురె బాలున్
———-×——–

 

October 29, 2021 3 comments
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

లేడిస్‌ స్పెషల్‌ నవల

by Devendra October 28, 2021
written by Devendra

‘‘స్త్రీలు సంపాదించినంత మాత్రాన ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినట్టుకాదు. తను సంపాదించే డబ్బుమీద పూర్తి అధికారం, దానిని ఖర్చుపెట్టే నిర్ణయాధికారం ఉన్నప్పుడే నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినట్లు లెక్క’’ అంటారు. సీనియర్‌ రచయిత్రి పరిమళా సోమేశ్వర్‌గారు.

‘లేడిస్‌ స్పెషల్‌’ నవల 1996 నుండి 2000 సం॥ వరకు వార్తాదినపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడిరది. ఆ తర్వాత జయంతి ప్రచురణల వారు 2018 పుస్తకరూపంలోకి తీసుకువచ్చారు.

నవలలో తుంగభద్ర రైలు ప్రొద్దున సికింద్రాబాద్‌నుండి బయలుదేరి మహబూబ్‌నగర్‌ వరకు ప్రయాణంచేసే క్రమంలో ఆయా స్టేషన్‌లలో ఆగితే ఉద్యోగం చేసే మహిళలలు రైలు ఎక్కి వారి గమ్యాలలో దిగిపోతూ ఉంటారు. మళ్ళీ తిరుగు ప్రయాణంలో రైలు ఎక్కి వారి ఇంటికి చేరుకుంటారు. నవలలో మహిళా ఉద్యోగస్థుల కోసం ప్రత్యేకంగా లేడీస్‌ కంపార్ట్‌మెంట్‌ కేటాయించబడిరది. ఒకవైపు ప్రయాణం కొనసాగుతుంది. మరొకవైపు రైలుడబ్బాలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళల ఆరాటాలు, పోరాటాలు ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఆవిష్కరింపబడుతూ ఉంటాయి. దాదాపు ఒక నలభై పాత్రలు ప్రవేశిస్తూ, నిష్క్రమిస్తూ వారి వారి సమస్యలను జీవనకావ్యంలా పాఠకుడి మనసులో అలజడిని రేపుతాయి.

ఆధునికయుగంలో చదువుకునే మహిళల సంఖ్య పెరిగింది. ఉద్యోగాలు చేసేవారి సంఖ్యకూడా పెరుగుతూ వస్తుంది. ఈనాడు మహిళలు ఆర్థిక స్వావలంభన దిశగా ప్రయాణిస్తున్నారు. నవలలో కూరలమ్ముకునే మహిళ దగ్గర్నుండి టీచర్లు, లెక్చరర్లు, లాయర్లు, డాక్టర్లు, క్లర్కులు ఇట్లా అన్నిరంగాలలో ఉన్న మహిళలు ఏవిధంగా కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమన్వయపరుచుకుంటూ ప్రగతివైపు అడుగులు వేస్తున్నారనే అంశం ఇతివృత్తంగా స్వీకరించబడిరది. ఈ మహిళా పాత్రలన్నీ కూడా దిగువ మధ్యతరగతికి  చెందినవి.

ఆడవారు ఉద్యోగాలు చేస్తే కుటుంబం అభివృద్ధి చెందుతుందనే ఉద్ధేశ్యంతో ప్రోత్సహిస్తున్న పురుష పాత్రలే నవలలో సందర్భానుసారంగా ప్రస్తావించబడ్డాయి. కాని మహిళలు ఒక హక్కులాగా ‘ఉద్యోగధర్మం స్త్రీ లక్షణం’ అని సమాజంలో సగభాగంగా స్త్రీలు తమకాళ్ళమీద తాము నిలబడడానికి ఇంకా చాలాకాలం పడుతుంది. ముందు సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లయితే రానురాను స్త్రీలందరు ఆర్థిక స్వావలంబన దిశగా విజయం సాధించగలుగుతారు.

‘‘సమాజంలో పురుషుడితో సమానంగా స్త్రీ పనిచేస్తూ .. ఇంట్లో తల్లిగా, భార్యగా విధులు నిర్వర్తిస్తూ … ద్విగుణీకృతమైన బాధ్యతలు చేపడుతున్నా క్రుంగిపోక, ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కదిలిపోయే ఆ ఉద్యోగినులను రోజురోజు కన్నులపండుగగా తిలకిస్తుంటారు జనం’’. అన్న నవలలోని మాటలు మహిళా సాధికారతను తెలియజేస్తున్నాయి.

నవలలో సువర్చల మేడమ్‌, సరళటీచర్‌, పార్వతి, రాణి, వనజ, విమల, కమల, నిర్మల, జయ, కవిత, భార్గవి, వాణి, లక్ష్మి, కాంతం, రాజశ్రీ, సుబ్బలక్ష్మి, రాణి, సరస్వతి, కరుణ, రేణుక, అనసూయ, గౌరి, సరోజ, నిమ్మి, అమల, శమంతకమణి, విశాలాక్షి, సుందరి మొదలైన మహిళా ఉద్యోగునుల పాత్రలు వారిచుట్టు ఉన్న సమస్యలను, ఆనందాలను ఆవిష్కరిస్తారు.

పార్వతి పాత్ర ఆధునిక కాలంలో పుట్టి, పెరిగి, ఉద్యోగం చేస్తున్నప్పటికి ఆమె ఆలోచనలన్ని ప్రబంధకాలపు పరిధిలో ఉంటాయి. ఆమె వయస్సు యాభై ఏండ్లపైనే ఉంటుంది. తెలుగు లెక్చరర్‌గా మహబూబ్‌నగర్‌ ప్రభుత్వకళాశాలలో పనిచేస్తుంది. ప్రయాణం సమయంలో లలితసహస్రనామాలు వల్లెవేస్తూ ఉంటుంది. పార్వతి సనాతన ధర్మాన్ని ఇష్టపడ్డప్పటికి ఏమి అభ్యంతరం లేదుకాని, సమకాలీన సమాజంపట్ల ఆమెకు సదాభిప్రాయం లేదు. పార్వతి పాత్ర విద్యావంతురాలు, ఉద్యోగస్తురాలు కాని ఆమె సమాజ మార్పును స్వాగతించడానికి సిద్దంగా లేదు. సువర్చల మేడమ్‌ షాద్‌నగర్‌ స్కూల్‌లో షెడ్‌ మొస్ట్రెస్‌గా పనిచేస్తుంది. వయస్సు చేత, సంస్కారం చేత పెద్దరికంతో వ్యవహరిస్తుంది.

విమల మండలస్థాయిలో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రభుత్వోగిని. పై అధికారి పురుషుడని విమలభర్త ఆరోపణ ‘‘విమలభర్త వట్టి అనుమానం మనిషి. ఆమె ఎదురుగా ఓ మగాడు వస్తుంటే చాలు. విమల మైలపడినంతగా గింజుకునేవాడు. రోజూ ఆఫీసులో ఏం చేస్తుంటావు. మీ ఆఫీసులో మగ వాళ్ళెంతమంది? మీ ఆఫీసరు మంచివాడేనా? అందంగా ఉంటాడా? పెళ్ళయిందా? పెళ్ళాంతో సఖ్యంగా ఉంటాడా? అంటూ ప్రతిరోజు ప్రశ్నలతో వేధించుకుతినేవాడట’’,  విమల పరిస్థితి మనచుట్టు ఉన్న సమాజంలో చాలా మంది స్త్రీలకు ఎదురయ్యే సమస్య. తరతరాలుగా స్త్రీని భోగవస్తువుగా, ఇల్లాలిగా, అబలగా చూసిన పితృస్వామ్య వ్యవస్థ మెళ్ళమెళ్ళగా ఇంటినుండి బయటికి వచ్చిన స్త్రీకి పురుషులనుండి ఇంటినుండి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ విమలకు భర్త ఆర్థిక స్వావలంభనకు అవకాశం కల్పించినట్టే కల్పించి ఆమెను అనేక కట్టుబాట్లకు గురిచేస్తుంటాడు. నమ్మకం లేని చోట స్త్రీ పడే అవస్థలన్నిటిని విమల పడుతుంది. చివరికి ఆమె భర్త భార్యను ట్రాన్స్‌ఫర్‌ చేయించడానికి పెద్ద ఎత్తుగడ వేయాల్సి వచ్చింది. పై అధికారి విమలను లైంగికంగా వేధించాడని పత్రికకు ఇవ్వడంతో విమల కన్నీరుమున్నీరవుతుంది.

భర్త ఈగో మరియు అనుమానికి, చేయని తప్పుకు విమల పరువును పణంగా పెట్టడమన్నది దారుణమైన విషయంగా ఒక రాజకీయ అంశంగా చూడవచ్చు. అందుకే రచయిత్రి స్త్రీల మౌలిక సమస్యలన్నిటికీ కారణం ` పురుషుడి దురహంకారమే. ఆ దురహంకారం ‘భర్త’ అనే స్థానంలోనే ఉంది. వివాహవ్యవస్థ స్త్రీకి బయటి ప్రపంచం నుండి రక్షణనిస్తుంది. కానీ, ఇంట్లో మాత్రం ఆమె బందియే! ఆమె తన శారీరక బలహీనతకు, మానసిక సౌకుమార్యానికి మాతృత్వప్రేమకు అన్ని రకాలుగా బందీగా మారినప్పుడే ఆమెను భార్య అంటారు’’ అంటే స్త్రీ తనను తాను బందీ చేసుకుంటే తప్ప కుటుంబం నిలబడలేదు. విమల విషయంలో సమాజం, ఉద్యోగం సమస్యకాదు. భర్త అనుమానం ఆమెను అశాంతికి, అభద్రతకు గురిచేశాయి. అందుకే విమల భర్తనుండి విడివడడానికి నిర్ణయం తీసుకోకతప్పలేదు.

నిర్మల భర్త ఫస్ట్‌ తారీకు రాగానే లెక్కచేసి మరి డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు అడిగితే ‘‘ఇంటికి కావలసిన సరుకులన్నీ నేనే తెస్తాను, నీకు రైల్వేపాస్‌ కూడా నేనే కొనిస్తాను. టిఫిన్‌ బాక్స్‌ తీసుకెళ్తావ్‌ … ఇంకా నీకు డబ్బెందుకు?’’ అంటాడు.

నిర్మల ఉద్యోగం చేస్తుందిగాని ఆర్థిక స్వాతంత్య్రం నిర్ణయాధికారం సాధించలేకపోయింది. స్త్రీ డబ్బు సంపాదిస్తే సరిపోదు. తన సంపాదనను ఎలా ఖర్చుపెట్టాలో నిర్ణయించుకునే స్వాతంత్య్రం ఉండాలి. స్త్రీల విషయంలో ఒక సమస్య మరొక సమస్య రూపాంతరం చెందుతుందే తప్ప పూర్తిగా పరిష్కారం కావడం లేదు. దానికి ప్రధానకారణం కుటుంబం, మతం, సమాజం చుట్టు అల్లబడిన, రాజకీయ అంశాలు, పెత్తనం చెలాయించాలనే పురుషుడి మనస్తత్వం.

రాధ ఉద్యోగం చేస్తున్న మహిళ. రైలు ప్రయాణంలో ఆ రోజు రాధతో పాటు ఆమె భర్త కూడా వచ్చాడు. ఎందుకంటే రాధకు ఎరియర్స్‌ యాభైవేలు వచ్చేవి ఉంటే ఆమె అంత డబ్బును ఎలా తెస్తుందో ఏమోనని రాధమీద నమ్మకం లేక ప్రయాణమయ్యాడు. రాధకు పాస్‌ ఉండటంతో టికెట్‌ కొనలేదు. భర్త కొనుక్కుంటాడనుకొని డైరెక్టుగా ట్రైనెక్కిసింది రాధ. నెక్ట్స్‌స్టాఫ్‌లో  రైలు ఆగగానే భర్త వచ్చి లేడిస్‌ కంపార్ట్‌మెంట్‌లో అందరిముందు రాధను చెంపదెబ్బ కొడతాడు. ఆమె చుట్టు ఉన్న మహిళలు అతన్ని  కొట్టి ఆడవాళ్ళ పరువు తీయవద్దని వార్నింగ్‌ ఇస్తారు. దానికి ఆమె భర్త ‘‘నా పెళ్ళాం నా ఇష్టం’’ అంటాడు. స్త్రీ భార్యగా ఉన్నంత మాత్రాన భర్త తాలుకు వస్తువుకాదు ఆమె ఒక మనిషి అన్న ఆలోచనా మార్పు పురుషుల్లో రావడం ఎంతైనా అవసరం. శమంతకమణికి రైలు ఆలస్యంగా ప్రయాణించడం వల్ల ఆఫీసుకు లేటవుతూ ఉంటుంది. కలెక్టరాఫీసులో ఉద్యోగం చేస్తు రోజు ఆలస్యంగా వచ్చి పబ్లిక్‌కు అసౌకర్యం కలిగిస్తుందని, హెడ్‌క్వార్టర్‌లో ఉండి ఉద్యోగాలు చేయాలి గాని, హైదరాబాదునుండి ఉద్యోగం చెయ్యడమెంటని ఎవరో కంప్లేంటు ఇస్తే శమంతకమణి లాంగ్‌లీవ్‌  పెట్టాల్సి వస్తుంది. ఒక స్త్రీ ఉద్యోగం చేసే చోట ఉండి, వారినికోసారి ఇంటికి వెళ్ళిరావడం అంటే సాధ్యపడదు. పురుషుడి విషయంలో అది సాధ్యమవుతుంది. కారణం కుటుంబం నడవాలంటే పొద్దస్తమానం స్త్రీ శక్తి, శ్రమ ధారపోయాల్సిందే.

లేడిస్‌ స్పెషల్‌ నవల మొత్తం ఆర్థికంగా నిలబడ్డ మహిళల సాధికారతను తెలియజేస్తూనే, మహిళలు ఉద్యోగాలు చేసే క్రమంలో ఇంటా, బయట తలెత్తుతున్న కొత్త సమస్యలను అనేక కోణాలల్లో విశ్లేషణ చేసి చూపించినది. దాదాపు 32 మహిళా పాత్రలు వారి వారి సమస్యలను పాఠకుల ముందుంచుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా స్త్రీల చుట్టు ఉన్న సంకుచిత పరిధులు, అవి దాటి రాలేని పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది లేడిస్‌ స్పెషల్‌ నవల.

Attachments area

October 28, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

అత్యాశ అంధకారమే

by Vennela Amulya October 28, 2021
written by Vennela Amulya

రమ – సుమ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు . రమ మంచి గుణం కలది . కాని సుమ మాత్రం అత్యాశ కలది . ఒక రోజు రమ వాళ్ళ నాన్నకి చాలా జ్వరం వచ్చింది . పొలం దగ్గరికి వెళ్ళలేకపోయాడు . స్కూల్ నుంచి రాగానే రమ వారి నాన్నను చూసి చాలా బాధపడింది . ఆమె నాన్న రమను చూసి
” రమ ,కాస్త పొలం దగ్గరికి వెళ్ళి రామ్మా “అని అన్నాడు .
“అలాగే నాన్నా ” అంది రమ.
రమ సుమ ఇంటికి వెళ్ళి “సుమ , మా బావి దగ్గరికి వెళ్లి పోలానికి నీళ్ళు పెట్టి వద్దాము, వస్తావా “. అని అడిగింది .
” సరే వెళ్ళి వద్దాం “అని ఇద్దరువెళ్ళసాగారు. పాలానికి చేరుకున్నారు . పొలానికి నీళ్ళు పెట్టి వచ్చేటప్పుడు ఒక పక్షి కాలు విరిగి ఉండడం రమ చూసింది . ఆ పక్షి బాధను చూస్తూ తను చాలా జాలిపడింది . వెంటనే రమ ఆ పక్షిని చేతిలోకి తీసుకొని అక్కడే ఉన్న చెట్ల నుండి రసం మందు తయారు చేసి కాలికి కట్టు కట్టింది . అలాగే ఒక మూడు రోజులు పసరు రాసింది . మూడు రోజుల్లో గాయం తగ్గిపోయింది . దానికి కృతజ్ఞతగా పక్షి ఒక చిన్న పెట్టె ఇచ్చింది .
రమ దాన్ని తెరిచి చూసింది . అందులో గుమ్మడికాయ విత్తనాలు ఉన్నాయి .వాటిని తీసుకెళ్ళి పక్కనున్న పెరట్టిలో నాటింది.అవి ఒక మూడు నెలలో కాయలు కాసాయి .రమ కాయలను పగలగొట్టి చూసింది . అందులో బంగారు నాణాలు కనిపించాయి . రమ వీటిని చూసి చాలా ఆశ్చర్యపోయింది . ఈ విషయము వెళ్ళి సుమ కి చెప్పింది . సుమ మనసులో వెంటనే దురాశ కలిగింది . అదే పక్షి వచ్చి సుమ వాళ్ళ ఇంటి గోడ పైన వాలింది . వెంటనే సుమ పక్షిని చేతిలోకి తీసుకుని దాని కాలు విరగగొట్టింది .
తరువాత దానికి రమ వలె మందు తెచ్చి మళ్ళీ కట్టు కట్టింది. ఇప్పుడు కూడా దానికి ఒక మూడు రోజులకీ తగ్గిపోయింది .అలా సుమకి కూడా ఆ పక్షి ఒక చిరు పెట్టె ఇచ్చింది . అందులో కూడా గుమ్మడికాయ విత్తనాలు ఉన్నాయి.వాటిని తీసుకెళ్ళి సుమ కూడా పెరట్లో నాటింది.అలానే మూడు నెలలకి చెట్టుకి కాయలు కాసాయి సుమ ఎంతో ఆనందంతో ఆ కాయను పగలగొట్టింది . వెంటనే వాళ్ళ ఇల్లు పేలి పోయింది.
అప్పుడు అర్థమయింది సుమకు అత్యాశ పనికిరాదు అని . అందుకే అత్యాశ వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయి .
నీతి : – అత్యాశ అంధకారానికి దారితీస్తుంది .

***
వెన్నెల అమూల్య
9 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
జక్కాపూర్, సిద్దిపేట జిల్లా
సెల్ : 9963864140

October 28, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఒక్కొక్కరు ఒక్కో తీరు

by Kayyala Akshya October 28, 2021
written by Kayyala Akshya

బంగారంగా బతుకమ్మ
ఆతృతతో పిల్లలు
సంబరంలో ఆడపిల్లలు
మమకారంతో మగపిల్లలు
సిరినవ్వులతో ఆడవాళ్ళు
ఆనందం తో మగవాళ్లు
ముచ్చట్లతో ముసలివారు
అందమైన ఆడపడుచులు
నీరు నిండుగా చెరువు
పండుగ సందడిలా ఊరు
అనురాగాలతో కుటుంబం
గౌరమ్మ దీవెనకై వేడుకోలు

 

October 28, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పల్లెటూరి అబ్బాయి

by Parsa Mounika October 28, 2021
written by Parsa Mounika

రామా పురం అనే గ్రామంలో రాజు అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి అమ్మ,నాన్న ఎవరు లేరు .అతను ఒక అనాధ. రోజు ఊరివారందరి దగ్గర అడుక్కుని తినేవాడు. ఒక రోజు అతనికి చాలా ఆకలి వేసింది.అతనికి ఎవరు ధర్మం చేయలేదు. పాపం ఆ అబ్బాయి వీదులన్ని తిరిగాడు .అయినా తనకు ఎవరూ ధర్మం చేయలేదు .
ఆకలితోనే నడుచుకుంటూ ఆ గ్రామం చెరువు ఒడ్డుకు వెళ్లాడు .అక్కడికి వెళ్ళగానే తను కళ్లు తిరిగి పడిపోయాడు .అప్పుడే అక్కడికి ఒక పెద్దావిడ వచ్చింది. అతనిని చూసి చాలా జాలివేసి వెంటనే అతని పైన కొన్ని నీళ్ళు చల్లింది .అతను వెంటనే లేచి చాలా కృతజ్ఞతలు అని ఆ పెద్దావిడకు చెప్పాడు .
అప్పుడు ఆ పెద్దావిడ ” నీవు ఎవరు బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చావు ,కళ్లు తిరిగి ఎందుకు పడిపోయావు “అడిగింది.. అప్పుడు ఆ అబ్బాయి నేను ఒక అనాధ నని చెప్పాడు . తనకున్న కష్టం అంతా చెప్పాడు.అప్పుడు ఆ పెద్దావిడ
” అయ్యో పాపం ,జరిగినదంతా ఒక పీడ కలలా మర్చిపోయి నువ్వు నాతో వస్తే, నేను నీకు ఏది కావాలంటే అది కొనిస్తాను .పాఠశాలలో మంచి చదువు చదివిస్తాను.ఇంకా నువ్వు సంతోషంగా బ్రతుకచ్చు “అని చెప్పి అతనిని తీసుకొని వెళ్ళింది.
అతను ఆ పెద్దావిడ తో కలిసి ఆమె ఇంటికి వెళ్ళాడు. పెద్దావిడ రాజు ను పాఠశాలలో చేర్పించింది.కొన్ని సంవత్సరాలలో అతని జీవితం మారిపోయింది.తరగతిలో ఎంతోమంది స్నేహితులు పరిచయమయ్యారు.ఆ అబ్బాయిని పెద్దావిడ తల్లి లా పెంచుతుంది. ఇప్పుడు అతను అనాధ కాదు.

***
పర్స మౌనిక
8 వ తరగతి
ZPHS జక్కాపూర్
సిద్దిపేట జిల్లా, తెలంగాణా
సెల్ :9989488156

October 28, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
Uncategorized

మయూఖ శరదృతు ,అక్టోబర్ మాస సంచిక సంపాదకీయం

by mayuukha October 26, 2021
written by mayuukha

కాలం ఎంతో విచిత్రమైంది. ఎన్నో సంగతులను మోసుకొస్తూ మనుషుల్ని ఆశల ఊయలలో ఊగిస్తూ ఉంటుంది. ఈ ఆశనే ఒక ఊతకర్ర లాగా వెంట రావాలి. దట్టమైన అడవిలో నడచివెళ్ళేప్పుడు పురుగుబూచిని బెదరగొట్టేందుకు చేతి కర్రను నేలపైన కొడ్తు, శబ్ధం చేస్తూ నడవాలి. ఎంతో ధైర్యాన్నిచ్చేది ఆ క్రరనే. మనకు అట్లా ధైర్యాన్నిచ్చేవి మన ఆశలే. గతంలో సాధించిన ఆశలు , రేపు సాధించాలనుకునే ఆశలు జమిలిగా కర్రసాయమౌతాయి. ఈ ఆశలకు ఆశయాలు తోడైతే తప్పకుండా మన జీవన ప్రయాణం సాఫీగా సాగుతుంది. దీన్ని సాధించాలంటే తగినంత కృషి తప్పనిసరి అవసరం. పనిలోనే ఆనందాన్ని వెతుక్కునే అలవాటు మనదైతే నలుగురికి మనమే ఆదర్శనీయులం అవుతాం , అవ్వాలి.
ఈ మధ్యకాలంలో భయంకర స్వార్థాపేక్ష నుండి జనులు బయట పడలేకపోతున్నారు. అందరూ మంచివాళ్ళే, మరి అన్యాయాలు ఎట్లా జరుగుతున్నాయో! మత్తు పదార్థాలు శరీరానికి ఏ విధమైన ఆరోగ్యాన్ని ఇవ్వవు. కాని తక్షణ సుఖాన్నిస్తాయన్న అత్యాశతో తీసుకుంటుంటారు. అదేంటో తెలివి ఎంత పెరుగుతుంటే విధ్వంసాలు అంత పెరుగుతున్నాయి. గతంలో ఒక పద్ధతి ఉండేది. ఊళ్ళల్లో ఎవరు ఏ పంటలు వేస్తున్నారో తెలిసిపోయేది . కాబట్టి భయం తో అదికూడా ఏ కొద్దిమందో దొంగచాటుగా పంటల మధ్య వేసి పండించేవారు గంజాయిని. కాని ఈమధ్య విరివిగా పండిస్తున్నారు. ఈ విషయం ఊళ్ళల్లో చాలామందికి తెలుసు. అయినా ఏ ఒక్కరూ పెదవి విప్పడం లేదు. వీళ్ళంతా మాయా మర్మాల టక్కుటమారీలు చేసేవాళ్ళేం కాదు. సాధారణ ప్రజలు మాకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్లుండేవారు. వీళ్లలో స్వార్థమనే భావనతో పాటు , మనకెందుకులే అనే కనిపించని నిర్లిప్తతతో చాలామంది ఉంటారు . పంట వేయడం, పండించడం, కోయడం, సంపాదన కోసం పంపిణీ చేయడం అన్నీ….అన్నీ తెలుసు. వీళ్లు, ఇందులో భాగస్వాములైనవాళ్ళు మామూలుగా ఈ సామాన్య ప్రజల మధ్యనే అందరిలో ఒకరిగా ఉంటుంటారు.
మరి పిల్లి మెళ్ళో గంటనెవరు కట్టాలి? మేధావులు బాగా ఆలోచించాల్సిన విషయమిది.

పుట్టుకతోనే ఒక గుణం వెంట వస్తుంది. ఉదాహరణకు ఒక గుర్రం పరుగెత్తుతూ ఉంటుంది. అది పోటీ కాదు. కాని ఆ గుర్రానికి తనను స్వారీ చేసేవాడు మెచ్చుకునేది ఎట్లా అర్థం అవుతుంది? అర్థం అవుతుంది. కర స్పర్శనో, చూపులో, శబ్ధోచ్ఛారణనో ఏదో సంకేతాన్ని గ్రహిస్తుంది గుర్రం. ఇది జీవి లక్షణం, జీవలక్షణం. ఇంత తెలియదా మనుషులకు? తెలుసుకాని ఊరకుంటారు, ఉత్తినే ఉంటారు. ఇది సమాజానికి ద్రోహం చేసినట్లే. వ్యవస్థల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీదా ఉంటుంది. “పిట్టమనసు పిసరంతైనా, ప్రపంచమంతా దాగుంది” అన్నారు దాశరథి. మనం రక్తగతం ఎంత చేసుకోగలిగాము అన్నదే ముఖ్యం. ఇప్పడున్న మన తరమైనా, రేపటితరమైనా బాగుండాలంటే పిల్లల భవిష్యత్తు కోసం మనుషులుగా ఆలోచించాలి. ఎదిరించాలి, తెలియజేయాలి, శిక్షపడేలా చూడాలి. పెంచకుండా అడ్డుకోవాలి. దీనికి ప్రత్యక్షంగా కూడా చేయనక్కరలేదు. పరోక్షంగానూ చేసి సాధించవచ్చు. ఈ మహత్కార్యం కోసం సామాజిక సేవా సంస్థలు, పెద్దలు ముందుకురావాలి .
పాఠశాల విద్యార్థులనూ వదలడం లేదు ఈ అవినీతిపరులు . ఇదీ దృష్టిలో పెట్టుకోవాలి. సంబంధిత డాక్టర్లు , సేవారంగంలోని ప్రముఖులు ఒక ఉద్యమ ప్రాతిపదికన సలహాలను ఇస్తూ తల్లితండ్రులను చైతన్యపరచాలి. విద్యాసంస్థలకు వెళ్ళిగాని, కాలనీల్లోకి వెళ్ళిగాని ఒక సంఘం స్థాపించడంలాంటివి చేయాలి. ఇంటింటికీ తిరిగి మాదకద్రవ్యాల వల్ల కలిగే ఇబ్బందులు , జబ్బులు ఎలా బాధిస్తాయో  ప్రచారం చేయించగలిగితే మరెంతోబాగుంటుంది . కష్టమైన పనే కాని ఆలోచననైనా సంఘసేవకులకు ఉంటే మంచిది.ముక్కుపచ్చలారని పిల్లలు మన దేశ భావి జీవసంపదలు.
ఆ ఏంకాదు మనపిల్లలు అలా ఏంచేయరు అనే అలసత్వం వద్దు . అసలు వాళ్ళ మనసుల్లో ఏమున్నదో పసిగట్టడము అంత తేలిక కాదు కాబట్టి వాళ్ళకు తెలియకుండానే నిఘా అనేది వేయాలి . జాతి సమగ్ర వికాసం కోసం , అభివృద్ది కోసం పాటుపడాల్సిన అవసరమున్నది.యువత నిర్వీర్యం కావడం మనకళ్ళముందే కూలిపోతున్న భవనం వంటిది . ఏ మనోవైకల్యాలు లేని స్వచ్ఛమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు తమకు తోచిన కృషి చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడున్నది .

ఆగిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసే శక్తిని అలవరచుకోవాలి. ఒక చింతనాక్రమం ఉండాలి. మయూఖ పాఠకులకు ఒక సామాజిక చింతనను గుర్తు చేయడమే ఇది.

ఇక నాలుగో సంచికగా శరదృతువును ఆలంబన చేసుకుని వస్తున్న ఈ మయూఖ ఎప్పటిలాగే అన్ని రకాల సాహిత్యప్రకియలను మీకు అందిస్తున్నది. కవితలు ఆలోచనాత్మకమై, హృదయాలను కదిలించే వస్తువుతో అలరారేవి ఉన్నాయి. ధారావాహికంగా వచ్చే తెలంగాణ ప్రబంధాల వ్యాసం అయితేమి, కవిత్వ నైపుణ్యాలు – ప్రసంగ పాఠమైతేనేమి, స్వరాంజలి, లేఖా సాహిత్యం ,యోగా , ఉపనిషత్తు కథాత్మక వ్యాసం వంటి వ్యాసాలైతేనేమి ఎంతో విస్తృతమైన విషయ సమాచారంతో ఉన్నవే కాకుండా మరెన్నో విశేషాలను ప్రోదిచేసిన ఇతర వ్యాసాలు ఉన్నాయి. ఇక కథలలో వైవిధ్యభరితమైన కథలూ, అనువాద కథలూగాని, అనువాద సాహిత్యంగాని పత్రిక తెరిచారు అంటే తప్పక ఇప్పుడే చదవాలని అనిపించేలావుంది మయూఖ. మన కవులకు , రచయితలకు, చదువుతున్న పాఠకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు,  అభినందనలు తెలుపుతూ అభిప్రాయాలను వ్రాసి పంపి సాహిత్య సమ్యక్ దృష్టిని చాటుతారని ఆశిస్తున్నాను.

October 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

డా .ముదిగంటి సుజాతా రెడ్డి

by Rama Devi Nellutla October 26, 2021
written by Rama Devi Nellutla

తెలంగాణా తొలితరం రచయిత్రులలో అగ్రగణ్యులు , సాహిత్య పరిశోధకులకు దారి చూపే దీపధారి , బహు గ్రంథకర్త డా . ముదిగంటి సుజాతా రెడ్డి .  ఆమె మాట మెల్లన , మెత్తన !మనసు తెల్లన ,చల్లన !
రచన లోతయిన, సమగ్రమైన పరిశోధన !  బోధన స్పష్టమైన , సులువైన జ్ఞాన వితరణ !

తన జీవితం గురించీ , వృత్తి గురించీ , ప్రవృత్తి గురించీ మయూఖ ముందు డా . సుజాతా రెడ్డి గారు పంచుకున్న అనుభవాలూ , జ్ఞాపకాలూ మీ కోసం ….

మీరింత  గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు కదా ! మీ పూర్వీకులలో ఎవరైనా రచయితలు ఉన్నారా ?

లేరు . అసలు విద్యావంతులే లేరు . ఇక రచనలు కూడానా ? ఆడపిల్లలకు చదువులే వద్దనే కాలం అది . ఎక్కువ మంది నిరక్షరాస్యులు , కొద్ది మంది చదివినా ప్రాధమిక విద్య కాగానే పెళ్లి చేసేవారు .

మీ కుటుంబ నేపథ్యం , పుట్టిన ఊరి నేపథ్యం చెబుతారా ?

మాది వ్యవసాయదారుల కుటుంబం . నాన్న రాంరెడ్డి , అమ్మ వెంకటమ్మ గార్లు . ఎంతో కష్టపడితే గానీ .. తిండిగింజలు పండని పరిస్థితి . ముగ్గురు ఆడపిల్లలం , ఇద్దరు అన్నదమ్ములు .నేను రెండవదాన్ని .

అప్పట్లో తెలంగాణా లోని అన్ని పల్లెల్లోలాగానే మాదీ చిన్న పల్లెటూరు . నల్గొండ జిల్లా నకిరేకల్ మండల్ లోని ఆకారం మా ఊరు . అసలు మా ఊరి పేరు అర్కవరం . ఊరి చెరువు కట్ట క్రిందనే సూర్యుడు , “శివుడు , విష్ణువు” కొలువుదీరిన త్రికూటాలయం ఉండేదట . కాకతీయుల కాలంలో చాలా ఊర్లల్లో త్రికూటాలయాలే ఉండేవి . అర్కుడు ఉన్నందువల్ల అర్కవరం అయి రానురానూ వాడుక భాషలో ఆకారం అనేవారు .

మరి ఆడపిల్లలకు చదువే అబ్బని రోజుల్లో మీరెలా చదువుకున్నారు ?

మొదట్లో ఊళ్ళో బడికి పంపారు . అయితే అప్పుడు నల్గొండ జిల్లా ప్రజా పోరాటాలతో అగ్ని గుండంలా ఉండేది. ఉద్యమంలో భాగంగా అప్పటి కమ్యూనిస్ట్ నాయకులు ఊళ్ళల్లో దొరల భూములు , ఇళ్ళూ ఆక్రమించడం , ఆస్తులు ధ్వంసం చేయడం చేస్తూ ఉండేవారు . ఆకారం లో మా భవంతి కూడా కూలగొట్టారు . బెదిరింపులు తీవ్రమవడంతో మా కుటుంబం ఆంధ్రా ప్రాంతంలోని నరసరావుపేటకు వెళ్ళింది . 1948 -49 ప్రాంతంలో నేను అక్కడ స్కూల్లో చదువుకున్నాను .

ఆ తరువాత తెలంగాణాకు వచ్చాక కూడా నల్గొండకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో .. వరంగల్ జిల్లాలోని మా అమ్మమ్మగారి ఊరైన వెంకటాద్రిపేటకు వచ్చి అక్కడ రెండేళ్ళున్నాం . అక్కడ ఓ పంతులు చెప్పే వీధిబడి లో నన్ను చేర్పించారు .

అక్కడే అఆలు , ఎక్కాలు ,గుణింతాలు నేర్చుకున్నాను . సిరి , చుక్క ఇవన్నీ భయంతో చదివేదాన్ని .ఏదైనా నేర్చుకోకపోతేనో , త్వరగా జవాబు చెప్పకపోతేనో ఒంటి కాలి మీద నిలబెట్టడం , గోడకుర్చీ వేయించడం వంటివి చేస్తూ ఉండేవాడాయన . అప్పట్లో  జొన్న పేలాలు తినేవాళ్ళం . బియ్యం , మొక్కజొన్న కంకులు , కూరగాయలు వంటివి చదువు చెప్పినందుకు పంతులుకు ఇస్తూ ఉండేవాళ్ళం .

మళ్ళీ నల్గొండకు  వెళ్లలేదా ? మీ హై స్కూల్ విద్య ఎలా కొనసాగింది ?

1950 లో కొంచెం పరిస్థితులు చక్కబడ్డాక నల్గొండకు వెళ్లాం . అయితే , మా నానమ్మ , బాపు ( నాన్న ), తాతమ్మ ( మా బాపుకు నాన్నమ్మ ) మాత్రం ఊర్లో ఉండి వ్యవసాయం , పాడి చూసుకునేవారు . మా అమ్మ , మేము అయిదుగురం పిల్లలం ఒక కిరాయి ఇంట్లో నల్గొండ లో మా చదువుల కోసం ఉండేవాళ్ళం .

నేనక్కడి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుకున్నాను . పది మంది అమ్మాయిల్లో నేనొక్కదాన్నే టెంత్ పాస్ అయ్యాను .

అప్పటికీ , ఇప్పటికీ చదువులో .. ముఖ్యంగా ఆడపిల్లల చదువుల్లో విద్యాపరంగా , సామాజిక పరంగా మీరు గమనించిన మార్పులేమిటి ?

చాలా ఉన్నాయి . అప్పట్లో ఏడో తరగతి లేదా పదో తరగతి కాగానే ఆడపిల్లలకు పెళ్లి చేసేవారు .పై చదువులు చదివించడం తక్కువ . అందులోనూ కృష్ణా , గుంటూరు జిల్లాల తాలూకూ ఆంధ్రా అమ్మాయిలు  వాళ్ళ తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా బోర్డర్ ప్రాంతాలైన నల్గొండ , కోదాడ , సూర్యాపేటల్లో ఉండేవారు . వాళ్ళను బాగానే చదివించేవారు .

అప్పటికీ ఇప్పటికీ చదువుల్లో వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే ..అప్పుడు తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా , తమ పిల్లల చదువు గురించి అంతగా తెలియకపోయినా , పాఠశాలల్లో ఉపాధ్యాయులు పూర్తి శ్రద్ధ చూపించేవారు . పిల్లలతో తరగతి పుస్తకాలతోబాటు సాహిత్యపఠనం చేయించేవారు . మరి ఇప్పుడు తల్లిదండ్రులు విద్యావంతులై ఉండి కూడా పిల్లలు అకడమిక్ గా బాగా గొప్పగా ఉండాలని చూస్తున్నారే తప్ప .. చాలా మందికి సాహిత్యం అన్న మాట కూడా తెలియదు .

స్కూల్ లో మాకు డ్రాయింగ్ , క్రాఫ్ట్ నేర్పేవారు . చెట్టునో , పూలకుండీనో , టేబుల్ నో గీయమనీ , పడవలు చేయమనీ , రంగు కాగితాలతో రకరకాల డిజైన్లు కత్తిరించమనీ .. ఇలా సృజనాత్మక శక్తిని పెంపొందించే కళలు నేర్పేవారు . స్కూల్ ఆవరణలో మడులు చేసి కూరగాయల మొక్కలు , పూల మొక్కలు వేసి మా చేతే నీళ్లు పోయించేవారు . ఎవరి మొక్క ఎక్కువ పూస్తే , కాస్తే .. వాళ్లకు అదో సంతోషం కలిగేది .

అప్పట్లో తెలంగాణలో నెలకొని ఉన్న దారిద్ర్య పరిస్థితులు , కరువు , తక్కువ ఆదాయాలు , లాభం లేని వ్యవసాయం , ఇతర కులవృత్తులు … వీటన్నిటి వల్లా ఆడపిల్లలకు  తొందరగా పెళ్లి చేసి భారం వదిలించుకోవాలనుకునేవారు . 1950 నుండీ బళ్ళల్లో ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం వచ్చింది . 1952 నాటికి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళ నాయకత్వం లో కమ్యూనిస్ట్ పోరాటాలు సాగుతూనే ఉండేవి.

మీకు పుస్తకాలు చదవడం ఎలా అలవాటయింది ? మీ ఇంట్లో ఎవరైనా పాఠకులు ఉండేవారా ?

మా ఇంట్లో ఎవరూ పుస్తకాలు చదివేవాళ్ళు లేరు . అయితే గవర్నమెంట్ స్కూల్ అయినా మాకు మంచి గ్రంధాలయం ఉండేది . వారానికి ఒకట్రెండు లైబ్రరీ క్లాసులుండేవి . టీచర్స్ మాతోనే పుస్తకాలు పైకి పెద్దగా  చదివించేవారు . కొన్ని మాకు మేము చదువుకునేవాళ్ళం .వేయి పడగలు , నారాయణ రావు , గోన గన్నారెడ్డి వంటి పుస్తకాలు స్కూలు రోజుల్లోనే చదివాను . అర్థం కాకపోయినా శరత్ నవలల అనువాదాలు చదివేదాన్ని . సంజీవరావు గారి ‘ మొగలాయి దర్బారు ‘ నాలుగు భాగాలు పూర్తిగా ఎంతో ఉత్కంఠతో చదివాను . తరువాతి రోజుల్లో వివిధ సాహిత్య అధ్యయనం పట్ల ఆసక్తి కలగడానికి అదే పునాది అనుకుంటాన్నేను .

మీకు చదువు చెప్పిన టీచర్లు , మీతోబాటు చదువుకున్న విద్యార్థినులు గుర్తున్నారా ?

ఎందుకు లేరు ? బాల్య జ్ఞాపకాలు మరువలేనివి కదా ! 1950 లో తెలంగాణా స్కూల్స్ లో తెలుగు మీడియం ప్రవేశపెట్టగానే పెద్ద ఎత్తున ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన టీచర్లు రిక్రూట్ అయ్యారు . ఆగ్నెస్ అనే టీచర్ చాలా బాగా పాఠాలు చెప్పేది . అలాగే మాకు హెడ్ మాస్టర్ గా మృగశిర అన్న టీచర్ ఉండేది . ఆమె పెళ్లి చేసుకోలేదు . రోజులో అధికభాగం స్కూల్ లోనే గడిపేది .వాళ్ళ అక్కచెల్లెళ్ల పేర్లు కూడా  నక్షత్రాల పేర్లు ఉండేవి . విశాఖ .. అలాగన్నమాట . మృగశిర టీచర్ మా బడిలో మంచి లైబ్రరీ ఏర్పరచడానికి ముఖ్య కారణం . హిందీ బోధించే సత్యవతి టీచర్ నన్ను బాగా ప్రోత్సహించేది . వాళ్ళ చెల్లెలు ఇందిర నా క్లాసుమేట్ . అయినా అప్పుడలాంటి భేదాలు లేవు .

ఇక తరువాతి కాలంలో నల్గొండలో మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్న డా . ప్రేమలత కూడా నా క్లాసే . రోజూ బగ్గీలో స్కూల్ కి వచ్చేది .

మరి మీకు టెంత్ అవగానే పెళ్లి చేయకుండా ఎలా చదివించారు ?

అప్పటి పరిస్థితుల దృష్ట్యా నాకు వెంటనే పెళ్లి చేసేందుకు అనుకూలంగా లేకపోవడంతో ఎన్నో తర్జనభర్జనల అనంతరం నన్ను హైదరాబాద్ నారాయణ్ గుడాలోని రెడ్డి విమెన్స్ కాలేజ్ లో పి యూ సీ లో ఇంగ్లీష్ మీడియం సైన్స్ లో జాయిన్ చేశారు . ఇంటికి దూరంగా ఉండటమో మరి ఎందుకో నేను అక్కడ అంత బాగా చదవలేకపోయాను .

పీ యూ సీ తర్వాత మళ్ళీ నల్గొండకు వెళ్ళిపోయి బి ఏ లో చేరాను . హైదరాబాద్ లో మా కాలేజ్ లెక్చరర్ అయిన పోతుకూచి వెంకట్రామయ్య గారే నల్గొండ డిగ్రీ కాలేజ్ లో మాకు సోషల్ స్టడీస్ బోధించేవారు .

మీ వివాహం ఎప్పుడు జరిగింది ? పెళ్లి వల్ల మీ చదువుకు ఏమైనా ఆటంకం వచ్చిందా ?

డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవగానే నా పెళ్లి జరిగింది . మా అమ్మమ్మ తల్లిగారిల్లు కరీంనగర్ లోని పొతకపల్లి . ఆమె బంధువులే మా అత్తగారింటి వారు . ఈ సంబంధం చూసింది కూడా ఆమే . మా మామగారు కొండల్ రెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థిగా ఉమ్మడి రాష్ట్ర తొలి అసెంబ్లీలో ఎమ్మెల్యే గా పనిచేశారు . ఆయనకూ , మా వారికీ కూడా ఆదర్శ భావాలుండేవి .  ఆర్యసమాజ్ విధానాలను అనుసరించేవారు . ఇక మా వారు గోపాల్ రెడ్డి హరిద్వార్ లో సంస్కృతం లో ఎమ్మే చదివారు . ‘ ఓ డాక్టరో , ఇంజనీరో , లాయరో కాదు , సంస్కృతం లో ఎమ్మే చేసి ఏం చేస్తాడు ?’ అన్నారు మా బంధువుల్లో కొందరు .

కట్నం వద్దన్నారనే ఒక్క కారణం తో  నేను పెళ్ళికి ఒప్పుకున్నాను . పెళ్లయ్యాక కూడా నేను చదువుకోవచ్చని వారు చెప్పడంతో చాలా సంతోషపడ్డాను .

మరి అనుకున్నట్టుగా మీ చదువు కొనసాగిందా ?

1960 లో గోపాల్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ లో సంస్కృత శాఖలో ఉద్యోగం వచ్చింది . నేను కోఠి విమెన్స్ కాలేజీలో చేరి బీ ఏ పూర్తి చేసాను . తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చి 1963 లో ఎమ్మే చేశాను . 1963 లోనే మా పాప వాసవిక పుట్టింది . తనను మా అమ్మ చూసుకోవడంతో నా చదువుకేమీ ఇబ్బంది కాలేదు .  ఆ తరువాత ఏడాదికే బాబు ఉదయన పుట్టాడు .

మీరు ఉద్యోగం చేయాలని అనుకోలేదా ?

ఎందుకు లేదూ ? నాకు

ఉద్యోగం చేయడం ఇష్టమే ! అయితే ఊరిలో మా మామగారు హత్యకు గురికావడంతో, అక్కడి ఒత్తిడుల వల్ల ఓ సంవత్సరం మా ఊరిలో ఉండాల్సి వచ్చింది .ఉస్మానియా యూనివర్సిటీ లోనే ఫ్రెంచ్ విభాగం హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ భోగ్లే గారని .. ఆ తర్వాతి కాలంలో క్రికెట్ కామెంటేటర్ గా పేరు తెచ్చుకున్న హర్షా భోగ్లే తండ్రి …ఉండేవారు . ఆయన రెకమండేషన్ తో ఆ తరువాతి సంవత్సరం 1964 లో నృపతుంగ స్కూల్ లో హైస్కూల్ సెక్షన్స్ కి టీచర్ గా చేరాను .

మీరు జర్మనీ వెళ్లడం ఎలా జరిగింది ?

ఉస్మానియా యూనివర్సిటీ లో మా వారు సంస్కృత శాఖ లో పని చేస్తూనే భోగ్లే గారి ద్వారా జర్మన్ నేర్చుకోవడం మొదలుపెట్టారు . అదే శాఖలో ఉన్న జర్మన్ దంపతులు జీమెన్స్ గార్లతో పరిచయం అయి , వారి ప్రోత్సాహంతో ఉస్మానియాలో లెక్చరర్ ఉద్యోగానికి ఓ సంవత్సరం పాటు వేతనం లేని సెలవు పెట్టి జర్మనీ వెళ్లారు . ఆ సంవత్సరం మా ఇద్దరు చెల్లెళ్ళనీ , తమ్ముళ్ళనీ ఓ పనివాడినీ మా ఇంట్లో ఉంచుకుని చదువు చెబుతూ ఉండేదాన్ని .

ఇక ఆయన ఇంకొన్నాళ్ళు అక్కడే ఉండాలనుకోవడంతో .. 1965 లో మా బాబుని అమ్మ దగ్గర వదిలి , పాపను మాత్రం తీసుకుని మొదటిసారిగా మ్యూనిచ్ విమానం ఎక్కాను . అప్పుడు జర్మనీ వెళ్ళడానికి వీసా అవసరం లేకుండేది .

మీ జర్మనీ జీవితం

 ఎలా ఉండేది ? ఎన్నాళ్ళున్నారక్కడ ?

జర్మనీకి వెళ్ళగానే బేసిక్ జర్మనీ నేర్చుకున్నాను . ఏదైనా ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా జర్మనీ వచ్చి ఉండాలి . అందుకని నైట్ స్కూల్ లో చేరి జర్మనీ నేర్చుకున్నాం . గోపాల్ రెడ్డి గారికి సంస్కృతం బాగా వచ్చును గనుక గ్రామర్ సహితంగా జర్మనీ నేర్చుకోవడం తనకు సులభమైంది . అందువల్ల ఆయనకు ఏ భాషైనా తొందరగా వచ్చేది . నాకూ జర్మనీ నేర్పుతూండేవారు . నేనక్కడ ఒక లైబ్రరీలో ఉద్యోగం చేశాను . ఆ సమయంలో చాలా ఇంగ్లీష్ , జర్మన్ , సంస్కృతం పుస్తకాలు చదివాను .

మాకు అక్కడ ఏ వార్తలూ తెలిసేవి కాదు . అప్పుడు టీవీలూ లేవు . ఎప్పుడన్నా ఓ సినిమా చూసేవాళ్ళం .ఇండియా నుండి అప్పుడప్పుడూ ఉత్తరాలు వచ్చేవి అంతే ! మా సమయంలో ఎక్కువ భాగం పఠనం , పరిశోధనకే వినియోగించే వాళ్ళం . అవన్నీ నోట్స్ గా రాశాను . తిరిగి 1969 లో ఇండియా వచ్చేసాం .

ఇండియా వచ్చాక ఏం చేశారు ? రాగానే మళ్ళీ ఉద్యోగం చేయాలన్పించిందా ? విశ్రాంతిగా ఉండాలనుకున్నా

రా?

మాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు గానీ , మేమొచ్చిన సమయానికి ప్రత్యేక  తెలంగాణా ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నది . బళ్ళు , కాలేజీలు ఏవీ నడవడం లేదు . ఇక కరీంనగర్ జిల్లా పొతకపల్లి దగ్గర మా ఇంటి పరిస్థితులూ ఏమంత బాగా లేవు . మేము జర్మనీ వెళ్తూ వ్యవసాయం చూసుకోమని మా దగ్గరి బంధువుకు అప్పజెప్పి వెళితే ఆయన మొత్తo అప్పులు చేసి నానా గందరగోళం చేసి పెట్టాడు . ఒక సంవత్సరం పాటు ఊళ్ళోనే ఉండి , ఆ సమస్యలన్నీ తీర్చుకుని మళ్ళీ హైదరాబాద్ చేరాం .

అప్పట్లో జర్మనీకీ , ఇక్కడికీ తేడా ఎలా ఉండేది ? ఎందుకొచ్చాంరా అనిపించిందా ?

అట్లా ఏమీ అనుకోలేదుగానీ , తేడా మటుకు చాలా ఉండేది . ఎక్కడ జర్మనీ .. ఎక్కడ ఇండియా ! మనం ఆ స్థాయికి ఎప్పుడు వస్తామో అనిపించేది . ముఖ్యంగా మన దగ్గర అపరిశుభ్రత చాలా ఎక్కువ . చాలా మందికి విద్య అందుబాటులో లేదే అనిపించేది .

జర్మనీ లో అప్పటికే ప్రతిదీ ‘ రెడీ టూ కుక్ ‘ లాగా దొరికేది . ఉదాహరణకు అక్కడ చికెన్ రెడీమేడ్ గా దొరికితే ఇక్కడ కో

డిని కొనాలి , బూరు తీసి కొయ్యాలి , అప్పుడు గానీ వండుకోలేము . బోలెడు సమయం దానికే పోయేది . మేము యూనివర్సిటీ క్వార్టర్స్ దగ్గర ఉండేవాళ్ళం . కనీసం కోడి గుడ్లు కావాలంటే సుల్తాన్ బజార్ నుండి రాంకోఠి మధ్యలో ఓ షాప్ లో మాత్రమే దొరికేవి . అప్పటికి వంట గ్యాస్ సౌకర్యం వచ్చింది గానీ , కూపన్ సిస్టం .. దానికి పెద్ద క్యూలో నిలబడాల్సి ఉండేది . ప్రతిదానికీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉండేది .

ఇప్పుడు విదేశాలకు వెళ్లేవాళ్లకూ , యాభై అయిదేళ్ల క్రిందట వెళ్లిన మీకూ ముఖ్యమైన తేడా ఏమిటి ?

మేము డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళలేదు . మా వారికి కొత్త భాషలు నేర్చుకోవడం పట్ల ఉన్న ఆసక్తి , ఇతర భాషల సాహిత్యం , సంస్కృతీ అధ్యయనం చేయాలన్న తృష్ణ .. ఈ రెంటి వల్లనే యూనివర్సిటీలో జీతం, సీనియారిటీ నష్టపోయి కూడా జర్మనీ వెళ్ళాం తప్పితే మరొకటి కాదు . తిరిగి వచ్చాక కూడా మేమిద్దరం ఉద్యోగాలు చేస్తే తప్ప వీలు కాని పరిస్థితులే ఉండేవి .

ఇక ఇప్పుడు వెళ్ళేవాళ్ళు  ఉన్నత విద్య కోసమో , పరిశోధనల కోసమో , ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకనో , మెరుగైన

జీవితం కోసమో , కేవలం డబ్బు కోసమో .. ఇలా ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు .

మీరు యూనివర్సిటీ ఉద్యోగం కొరకు ప్రయత్నించలేదా ?

ఎమ్మే లో కాలేజీ వాళ్ళు పొరపాటుగా నా ఇంటర్నల్ మార్కులు యూనివర్సిటీ వారికి పంపలేదు .అందుకని నాకు పీజీ లో హయ్యర్ థర్డ్ క్లాస్ వచ్చింది . అందులో నా పొరపాటు ఏ మాత్రం లేకపోయినా ఫలితం నేను భరించాల్సి వచ్చింది . అలా యూనివర్సిటీ జాబ్ రాలేదు . 1970 లో మళ్ళీ విద్యాసంస్థలు తెరిచాక కొన్నాళ్ళు తార్నాకా లోని సెయింట్ ఆన్స్ లో పనిచేశాను . 1971 లో ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయి నారాయణ్ గూడా రెడ్డి కాలేజీ లో పార్ట్ టైం లెక్చరర్ గా చేరి , ఆ తరువాత ఫుల్ టైమర్ గా మారాను . 2000 లో రిటైర్ అయ్యేదాకా అక్కడే పని చేశాను . అప్పుడు ఎయిడెడ్ కాలేజీగా ఉండేది , తరువాత అటానమస్ అయింది .

మీకు సాహిత్య సృజన పట్ల మక్కువ ఎలా కల్గింది ?

చిన్నప్పుడు స్కూల్ రోజుల్నుంచీ వివిధ పుస్తకాలు చదవడం అలవాటయిందన్నాను కదా ! ఎమ్మే లో నా సబ్జెక్టు తెలుగు గనుక అలా కూడా బాగా సాహిత్యం చదివాను . ఇక జర్మనీ లో ఉన్నప్పుడు జర్మన్ , ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో గొప్ప గొప్ప వాళ్ళ పుస్తకాలు చదివి వాళ్లెలా రాశారు , వీళ్ళేం చెప్పారు అని క్షుణ్ణంగా పరిశీలించడం , ఆ అధ్యయనాల్ని నోట్స్ గా రాయడం అలవాటయింది . పర్షియన్ , ఈజిప్షియన్  వంటి ప్రాచీన సంప్రదాయ సాహిత్యాన్ని చదవడం , ఆయా రచనల్ని మన తెలుగుతో , సంస్కృతంతో పోల్చడం , రాయడం .. అలా అప్పుడు కలిగిన ఆసక్తి కొనసాగింది .

కాల్పనిక సాహిత్యం .. ముఖ్యంగా స్త్రీలు రాసిన నవలలు పాఠకులను ఉర్రూతలూగిస్తూ , డబ్బు కూడా తెచ్చిపెడుతూన్న రోజుల్లో మీరు పరిశోధనాత్మక ,వాస్తవిక చిత్రణతో కూడిన రచనల్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటి ?

ఎందుకో మరి నాకు తెలియకుండానే పరిశోధన , అధ్యయనం అంటే నాకు ఇష్టం ఏర్పడింది . దానికి తోడు జర్మనీ లో సంస్కృత

విభాగం ఇంచార్జిగా ఉన్నప్పుడూ , ఇక్కడికి వచ్చాక యూనివర్సిటీ సంస్కృత శాఖ లోనూ పనిచేసిన మా వారు గోపాల్ రెడ్డి కూడా ఈ విషయంగా చాలా సహకరించారు . ఆయన సహకారమే లేకపోతే వెయ్యి పేజీల ‘ సంస్కృత సాహిత్య చరిత్ర ‘ గ్రంథం రాయడం సాధ్యపడేది కాదు .

అంతే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖాధిపతిగా ఉన్న ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారి పర్యవేక్షణలో నేను రచించి సమర్పించిన సిద్ధాంత  గ్రంథం ‘ మను -వసు చరిత్రల తులనాత్మక పరిశోధనము ‘ నాకు 1975 లో పీ హెచ్ డీ  తెచ్చిపెట్టడమే కాక పాఠకుల , విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో  నా తరువాతి రచనలు ఆ దిశగానే సాగాయి ..

చాలా పుస్తకాలు  రచించిన మీరు వాటిని ఎలా ప్రచురణ లోకి తీసుకొచ్చారు ? శ్రమతో  బాటూ ఇదంతా ఎంతో ఖరీదైన వ్యవహారం కదా !

అవును . రాయడానికి ఎంత శ్రమైనా పడతాం గానీ , ప్రచురణ కష్టమైన పని . డబ్బుతో కూడుకున్నది కూడా! చాలా పుస్తకాలు నా స్వంత ఖర్చుతో వేసుకున్నవే !అయితే గోపాల్ రెడ్డి గారూ , నేనూ కల్సి రాసిన ‘సంస్కృత సాహిత్య చరిత్ర ‘ గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు మొదట 1986 లో ప్రచురించారు . కాగితం ఖర్చుల క్రింద రెండు వేల రూపాయలు మాత్రం ఇచ్చారు . ఆ తరువాత అదే పుస్తకాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వాళ్ళు ఏడు సార్లు పునర్ముద్రించారు . ఆఖరి ముద్రణ 2000 కాపీలు తీసారు .

అలాగే 1991 లో ‘ తెలుగు నవల -అనుశీలనం ‘ పుస్తకం తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్ధిక సహాయంతో ముద్రింపబడింది . శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారిచే 1993 లో ప్రచురింపబడిన ‘ ‘వేమన -నాట సంప్రదాయం ‘ గ్రంథానికి గాను టిటిడి ధర్మ ప్రచార పరిషత్ వారు నాకు కొంత డబ్బు ఇచ్చారు .

ఇక 1975-76  నాటి నా పిహెచ్డీ గ్రంథం ‘ మను -వసు చరిత్రల తులనాత్మక అధ్యయనము ‘ 1981 లో తెలుగు యూనివర్సిటీ వారు అచ్చు వేశారు .అలాగే నేను ఎమ్మే లో రాసుకున్న నోట్స్ ను యధాతథంగా 1982 లో ‘శ్రీనాథుని కవితా సౌందర్యము ‘ పుస్తకంగా వెలువరించాను .అదే విధంగా రెడ్డి విమెన్స్ కాలేజీ లో పని చేస్తున్నప్పుడు ఎమ్మే క్లాస్ కోసం ‘తెలుగు సాహిత్య చరిత్ర ‘ బోధించమన్నారు . అందుకోసం ఎంతో అధ్యయనం చేసి చారిత్రిక , సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర అంశంపై నోట్స్ రాసుకుని విద్యార్థులకు బోధించడం జరిగింది .ఇది 1996 లో పుస్తకంగా వచ్చి 2004 లో పునర్ముద్రణ జరిగింది .

ఎన్నో యూనివర్సిటీలకు నా పుస్తకాల్లోని అధ్యాయాలు పాఠ్యఅంశాలుగా  ఎంపిక చేయబడ్డాయి .యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులకూ , పోటీ పరీక్షల వారికీ ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడ్డాయని సంతోషం కల్గింది .

రసావిష్కరణ అనే మాట సాధారణంగా కావ్య ప్రసక్తి వచ్చినపుడు మాట్లాడుతాం కదా ! మీరు రచించిన ‘ రస చర్చ -ఆధునికత ‘ అనే పుస్తకం గురించి చెప్పండి .

రస చర్చ నిజానికి కావ్య గ్రంథాల విషయంలోనే జరుగుతుంది . కానీ ఆధునిక సాహిత్యంలో కూడా బహు పాత్రలు , ఎక్కువ సందర్భాలు , అనేక సన్నివేశాలు కలిగి ఉండే నవలల విషయంలో రసపుష్టి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాను .ఈ పుస్తకం 2010 లో వచ్చింది . సాహిత్య ప్రక్రియ వేరు కావచ్చు గానీ , ప్రాచీన కావ్యాలలోలాగానే నవలల్లో కూడా ఒక సమగ్ర జీవితం , లేదా కొన్ని జీవితాలకు సంబంధించిన పూర్తి చిత్రణ , విశ్లేషణ ఉంటాయి . ఒక కవి కావ్యంలో ఏమి చెప్పాడో అదే మాదిరిగా ఒక రచయిత తన నవలలో వర్ణించిన భావాలను పాఠకుడు పూర్తిగా మమేకమై అనుభవించడమే రసావిష్కరణం . ఇది కవితలో , కథలో , నాటకంలో కూడా ఉంటుంది గానీ ,నిడివి దృష్ట్యా  నవలలో ఎక్కువ .

పరిశోధనాత్మక సైద్ధాంతిక రచనలకే పరిమితమైన మీరు కాల్పనిక నవలలు రాయడం ఎప్పుడు ఎలా ప్రారంభించారు ? మీ నవలల గురించి చెబుతారా ?

ముందే చెప్పినట్టు నవలలో సమగ్ర జీవన చిత్రణ ఉంటుంది . అయితే నా నవలలు పూర్తిగా కాల్పనికమైనవి కావు . వాస్తవ జీవితాల ఆధారంగా వ్రాయబడ్డవే . తొలి తెలంగాణా ఉద్యమం , రజాకార్ల ఆగడాలు , ఆ రోజుల్లోని సాంఘిక , ఆర్ధిక జీవన స్థితిగతులు , కొన్ని అనుభవాలు , జ్ఞాపకాలూ … వీటి  నేపథ్యంతో 1990 లో ‘ మలుపు తిరిగిన రథచక్రాలు ‘ నవల రాశాను . దాశరథి రంగాచార్య గారికి చూపిస్తే ‘ ఇట్లాoటి నవలలు ఇప్పుడెవరూ వెయ్యరు , మీరు  స్వంతంగా ప్రచురించుకోవడం మంచిది ‘ అని సలహా ఇచ్చారు . ఆ తరువాత 1994 లో ‘ సంకెళ్లు ‘నవల రాశాను .

స్త్రీ వాదం ఉధృతంగా తలెత్తిన రోజుల్లో మీరు రచించిన ‘ ఆకాశంలో విభజన రేఖల్లేవు ‘ ఏ విధంగా ప్రత్యేకమైనదని భావిస్తారు ?

జ : స్త్రీ పురుషులిద్దరూ సమానమే ! ఏ ఒక్కరు ఇతరుల స్వేచ్ఛను , వ్యక్తిత్వాన్ని కించపరిచి అణగదొక్కాలని చూసినా అది దోపిడీనే అవుతుంది . అయితే , స్త్రీ వాదం స్త్రీలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు . స్త్రీ ఆధిక్యత రావాలంటే కూడా సరికాదు .మొత్తం సమాజానికి సంబంధించిన విషయం ఇది . పురుషులు మారితేనే , స్త్రీని తమతో సమాన హక్కులున్న వ్యక్తిగా గుర్తించి , గౌరవిస్తేనే ఆదర్శ సమాజం ఏర్పడుతుంది . మహిళా ఉద్యమాల ఆశ , ఆశయం ఇదే అని చెప్పే ప్రయత్నం చేశాను .

ఆత్మకథ రాయాలని ఎందుకు అనిపించింది ? దాని గురించి చెప్పండి .

జ : నేను పుట్టి పెరిగిన తెలంగాణా వాతావరణం ఇతర తెలుగు ప్రాంతానికి పూర్తిగా భిన్నమైనది . స్వరాజ్య పోరాటం , బీదరికంతో పోరాటం , చదువుకోవడం కోసం పోరాటం ఆ కాలంలోని ఆడపిల్లలందరికీ సమానమే అయినా ఇక్కడ ,  నిజాం పాలన నుండి విముక్తి కోసం పోరాటం అదనం . రజాకార్ల దుశ్చర్యలు , రైతాంగ పోరాటాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవం , ఆ తరువాతి రోజుల జ్ఞాపకాలు అందరితో పంచుకోవాలనిపించి ‘ ముసురు ‘ పేరుతో నా ఆత్మకథ రాసి 2010 లో ప్రచురించడం జరిగింది . తెలంగాణా స్త్రీలలో ఆత్మకథ రాసిన తొలి వ్యక్తిని నేనే అని పరిశీలకులు అన్నారు .

మీ ఇతర రచనలన్నీ ప్రచురణకు నోచుకున్నాయా ? ప్రస్తుతం ఏమి రాస్తున్నారు ?

నేను రాసిన  నవలలే కాకుండా , కథలు కూడా సంపుటాలుగా ముద్రించబడ్డాయి . 1998 లో విసుర్రాయి , 2001 లో ‘ మింగుతున్న పట్నం ‘ 2005 లో ‘ వ్యాపార మృగం ‘ 2010 లో ‘ మార్క్స్ పుట్టాలి ‘ 2014 లో ‘ నిత్య కల్లోలం ‘ పుస్తకాలుగా వచ్చాయి .ఇప్పుడయితే ఏమీ రాయడం లేదు .

ప్రస్తుతం దినపత్రికలో సీరియల్ గా వస్తున్న ‘ తెలంగాణా తెలుగు సాహిత్య చరిత్ర ‘ గురించి చెబుతారా ?

ఇది 2015 లోనే రాశాను . నమస్తే తెలంగాణా లో సీరియల్ గా ప్రస్తుతం వేస్తున్నారు . చాలా మంది తెలంగాణా అభిమానులే కాక , పరిశోధక విద్యార్థులు , పోటీ పరీక్షలకు చదివే వారు ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారు . తెలంగాణా గడ్డ మీద ఉద్భవించిన సాహిత్యం చాలా విలువైనది . అయితే ఎక్కువ భాగం గుర్తింపుకు నోచుకోకుండా పోయింది . దానిని వెలికి తీసి వెలుగు లోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది .

ఒక ప్రక్కన పరిశోధన , మరో ప్రక్కన ఉద్యోగం , ఇంకొక ప్రక్కన రచనా వ్యాసంగం , అన్నిటికన్నా ముఖ్యం ఇంటి పని , పిల్లల పెంపకం .. ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి ?

మొదట్లో మా పాపను కొన్నాళ్ళు , మా బాబును చాలా ఏళ్ళు మా అమ్మే పెంచింది . ఇక నేను ఉద్యోగం చేస్తున్నప్పుడూ , తరువాత కూడా రాములు అన్నతడు మా ఇంట్లో వంట చేయడమే కాదు , పనులన్నీ చేసి పెట్టేవాడు . ఆడవాళ్ల. వ్యాసంగాలన్నీ వంటిల్లు మింగేస్తుంది .ఆ విధంగా రాములు నా  బరువును చాలా మటుకు తగ్గించాడు . అందరికీ ఆ అవకాశం దొరకదు .అందుకే , నా  ఫ్లాట్ పక్కనే  …అతనికి కూడా ఒక ఫ్లాట్ కొనిచ్చాను .

మీరు ఎన్నో దేశాలు పర్యటించారు కదా , యాత్రా రచనలేవైనా చేశారా ?

అవును , జర్మనీ మొదలుకొని ఈజిప్టు , ఇంగ్లాండ్ , స్పెయిన్ , ఇటలీ , జపాన్ , చైనా దేశాలన్నీ తిరిగాను . 2011 లో ‘ అద్భుత చైనా యాత్ర ‘ రచించాను .

 

మీ పిల్లలకు మీ సాహితీ వారసత్వం వచ్చిందా ? పుస్తకాలు చదువుతారా ? రచయితల పిల్లలకు కూడా పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే ఇతరులెలా చదువుతారు అన్న మాటతో మీరు ఏకీభవిస్తారా ?

లేదు . మీ మూడు ప్రశ్నలకూ నా సమాధానం ఇదే ! ఒక వృత్తిలో ఉన్నవారి పిల్లలు అదే వృత్తి చేపట్టాలని లేదు . పైగా రచన వృత్తి కాదు , ప్రవృత్తి . ఇక పోతే పుస్తక పఠనం లాంటి అభిరుచులు ఎవరికి వారు పెంపొందించుకోవాలి. ఇప్పటి వేగవంతమైన జీవన విధానంలో డబ్బు సంపాదించడం , అనుభవించడం .. వీటికే జీవితం సరిపోతోంది . ఎవరి పిల్లలయినా ఇంతే ! అయితే పాఠకులు , పుస్తక ప్రేమికులు ఎప్పుడూ ఉంటారు .

సాహిత్యం బతికి బట్ట కట్టాలంటే ఏమి చేయాలి ? వర్ధమాన రచయితలకు , పరిశోధకులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

ప్రస్తుతం ప్రపంచ సాహిత్యంతో పోటీ పడుతూ తెలుగు రచనలు బాగానే వస్తున్నాయి .నవలలు తగ్గినా కవిత్వం , కథలు చాలా వస్తున్నాయి .ఈ మధ్య కాలంలో సాహిత్యంలో కొత్త వాదాలేవీ రాలేదు . అయితే విదేశాల్లోలాగా రచనను వృత్తిగా తీసుకునే పరిస్థితి మన దగ్గర లేదు . ప్రింట్ పత్రికలు మూతబడుతున్నాయి. ఆన్ లైన్ వెబ్ మ్యాగజైన్లు వస్తున్నాయి . ఎలాంటి రెమ్యూనరేషన్ లభించడం లేదు. ఒకప్పుడు పత్రికలు ఆడవాళ్లే ఎక్కువగా చదివేవారు . వాళ్లంతా ఇప్పుడు టీవీ సీరియల్స్ కీ , రకరకాల గేమ్ షో లకీ అలవాటు పడ్డారు . అయితే నిరాశపడవల్సిందేమీ లేదు . చదివేవాళ్లే చదువుతారు .

మన విద్యావిధానం సరిగా లేదు . నిరుద్యోగం ఎక్కువగా ఉంది . ఉపాధి లేనపుడు పుస్తకాలేం కొంటారు , ఏం రాస్తారు ? పాఠశాల , కళాశాల స్థాయిలోనే సాహిత్యానికి కొంత ప్రోత్సాహం ఉండాలి . సెలవుల ముందు కొన్ని పుస్తకాలు కేటాయించి సెలవుల్లో చదవమని స్కూల్స్ తెరిచాక వాటిపై వ్యాసరచన , ఉపన్యాస , చర్చ , క్విజ్ లాంటి పరీక్షలు పెట్టి వాటికి కొన్ని మార్కులు కేటాయించాలి . అప్పుడే పిల్లలకు సాహిత్యంతో పరిచయం ఏర్పడుతుంది .

రచనలు చేయాలనుకునే వారు ముందు బాగా చదవాలి . ఏమీ చదవకుండానే రాయాలనుకోకూడదు . వివిధ రచనా ప్రక్రియల్ని అర్థం చేసుకోవాలి . నిఘంటువులను చూడాలి . దానివల్ల భాషాసంపత్తి పెరుగుతుంది . చాలా మంది ఇవేవీ చేయడం లేదు . తప్పులతో రాస్తున్నారు .  తప్పు పదప్రయోగాలు చేస్తున్నారు . తప్పు ఉపమానాలు వాడుతున్నారు . ఇక యూనివర్సిటీ వాళ్ళు కూడా సరిగా అధ్యయనం చేయడం లేదు . ముందు వాళ్ళు రాసిన వాటిల్లోంచి అందులోంచి కొంత .. ఇందులోంచి కొంత ముక్కలు తెచ్చి పేర్చి వ్యాసాలూ , పుస్తకాలూ రాసేస్తున్నారు . ఈ ధోరణి మారాలి . అప్పుడే తెలుగు సాహిత్యం నిలబడుతుంది .

 

October 26, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us