మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

” ఆశల తోవలు “

by Ravinder konda October 24, 2021
written by Ravinder konda

మబ్బుల్ని మింగిన ఆకాశం

నెత్తురొడ్డిన జాతీయ రహదారిలా..

సెగలు కక్కుతోంది!

బారెడు పొద్దుతో-నిద్దుర లేసిన

బలిసిన అంబోతులు

ఆకలితో అరుస్తుంటే..

బక్కచిక్కిన ఎండిన డొక్కలు

ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని

బతుకులు నెట్టుకొస్తున్నారు!!

 

రోడ్డు పక్కన పూరిగుడిసెలో..

తొంబదేళ్ల పండు ముసలవ్వ

కుక్కి మంచం పై.. ములుగుతూ

రాని చావుకోసం ఎదిరిచూస్తుంటే

ఎవ్వరు లేని అనాధకు అన్ని తానై..

శునకమొక్కటి అవ్వకు ఓదార్పునిస్తుంటే..!

ఎంగిలి మెతుకులు తిన్న..

మమకారమో !.. తోకాడిస్తూ..

దారేంటూ పోయే వారిని చూసి

చొంగ కారుస్తూ.. బేల మొఖం తో

ఆర్థిస్తుంటే.. అవ్వకోసం. ఆ గుడిసె

తలుపులను గుడి గంటలా

మోగిస్తుంది!

 

కలల్ని తరిమిన నిదుర మత్తు

పొద్దు పొడిచేటప్పటికి

ఆశల తోవలు దున్నిందేమో..

రాతిరి కురిసిన వానకి

చిత్తడయిన పంట కల్లంలో

ఆరబెట్టిన ధాన్య రాసులు

తడిసి ముద్దయి కన్నీళ్లు

రాలుస్తున్నాయి!

వున్నోడిని వదిలి

కాయకష్టం నమ్ముకునోన్ని

నట్టేట్ట ముంచడం కాలానికి

అలవాటైపోయిందేమో..

ఏడాదంతా ఎదిరిచూసిన

ప్రతిఫలానికి.. ఆకలి చావులు

బహుకరించి చల్లగా జారుకొంది!!

 

నిర్మలమైన ఆకాశం..

నిప్పుల రాజుకోవడం..

పచ్చని అడవిని ధ్వంసం చేసి

కాసుల గనుల కక్కుర్తికీ

బహుళ జాతులకు తాకట్టు

పెట్టి..ఉసురు తీసినందుకో మరి!!

ఉన్నప్పుడు జలగలా పీడించి

ఉన్నందంతా దోచుకొని అనాధల

వదిలేసి.. బాధ్యతలు మరిచిన

మనిషికన్నా..అప్పుడప్పుడు

విదిలించిన పిడికెడు మెతుకులకు

ప్రేమను ఓలకపోసిన.. తనకన్నా

జంతువే నయమని తెలిసి..

మనిషిగా సిగ్గుపడాలి మరి!!

రాత్రి పగలు తేడాలేని..

కాలం తో పోటీపడి..

నల్గురికి కడుపునింపే

అన్నదాత.. శోకవిహీనుడై

అలమటిస్తుంటే.. ఆదు కోవాల్సిన

అధికారం.. మీనామీషాలు

లెక్కిస్తుంటే . ప్రకృతి చేసే

గారడీ ఆటకి బలిపశువులయ్యే

అమాయకులకు ఆశల తోవాల్ని

అడ్డుపెట్టి మనస్సు గాయాలకు

పథకాల లేపనం పూసి..

అడుక్కొనే బానిస బతుకులను

చేసి..ఓట్లు వేసే మరమనుషులు గా

మార్చి.. మానవత్వం మరిచిపోయి..

మనుసుల మనుషుల మధ్య

 

కుల మత ప్రాంతీయ బేధాలు

రగిల్చి రావణ కాష్టం చేస్తుంటే..

ఇక జాలి దయ కరుణ లు

వదిలి.. వాస్తవం లో

మనిషి జీవించినప్పుడే..

స్వయం సమృద్ధి వైపు

అడుగులేస్తాడు..! మనసు

పొరల్లో ప్రేమ అనురాగాలు

చిగురింపచేసి . పర్యావరణ

పరిరక్షణ కు..

నడుము కడతాడు..!

స్వార్థ పరుల కొమ్ములు వంచి

తెగిపోయిన బంధాలకు..

ఆత్మీయ అన్వేషణ చేయ

కొడగట్టిన బతుకు దీపం

వొత్తికీ ఆశల తోవలా

చమురు పోసి రేపటి

నవోదయానికి

పురుడు పోస్తాడు..!!

 

 

†********

రవీందర్ కొండ

9848408612

ఆల్వాల్, హైదరాబాద్

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆమె

by Bhairi Indira October 24, 2021
written by Bhairi Indira

ఆమెను చూసే
చీమలు శ్రమించడం నేర్చుకున్నాయి
ప్రపంచం
ప్రేమించడం నేర్చుకుంది

ఆమె ఓర్పును
గుండె అరువడిగింది
కాలం ఆమెను గమనిస్తూ
నడుస్తూంది

ఆమె మౌనాన్ని
మూగజీవులు పోగేసుకున్నాయి
ఆమె వేదన
అంతరిక్షంలో నిక్షిప్తమైంది

ఆమె కన్నీరు
సముద్రాల
దాహం తీరుస్తూంది

ఆమె వ్యక్తిత్వం
ఆకాశానికి తలమానికమైంది
ఋతువులు
ఆమె జీవితమై చరిస్తున్నాయి

ఆమె కదలితే
సూర్యోదయం
కను మలిగితే
చీకటి

గాలి నీరు నిప్పు
ఆమెలోనే లీనమై ఉన్నాయి
భూమి కూడా
ఆమె చుట్టే తిరుగుతూంది

నిజానికి సూర్యుడు
ఆమెలానే దహిస్తున్నాడు
ఆమె మాత్రం
‘మనిషి’ కోసం చూస్తూంది

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఎవరు పాడుతారీపాటనీ…

by డా. టి. సంపత్ కుమార్ October 24, 2021
written by డా. టి. సంపత్ కుమార్

పల్లవి:   ఎవరు పాడుతారీపాటనీ

బాలుపై చెక్కిన ఈ గీతికనీ

బాలు… చిన్న బాలు… పెద్ద బాలు

పాటల చక్రవర్తే మన బాలు

చరణం 1:         ఏ పాటలో ఇమడని మనిషి

సాకీలక్కరలేని సాయుధుడు

పల్లవీలతో పనిలేని గాయకుడు

చరణాల ఆభరణాలు లేనివాడు                          -పల్లవి

చరణం 2:         వేల పల్లవులకి ప్రాణం పోసాడు

లక్షలని మించి చరణాల్నికదిపాడు

ఏకదాటి శ్వాసలో… బహుశ్వాసలతో

మన చెవుల్లోకి అమృతమూదాడు                    -పల్లవి

చరణం 3:         నిద్రపోని బాలు స్వరం

నిత్యమూ పాడుతూనే ఉంటుంది

ఇళ్ళల్లో… మురికివాడల్లో…

దేశ సరిహద్దుల్లో… విదేశాల్లో

రాత్రనకా… పగలనకా…                       -పల్లవి

చరణం 4:         మర్యాద రామన్నతో తొలి అడుగు

పదహారు భాషల్లో బహురూపి

పాడుతా తీయగాతో పరమాన్నం

స్వరాభిషేకంతో పాట సర్వస్వం                -పల్లవి

చరణం 5:         తడబడే పెదిమలతో పలికిన

సరిగమపదనిసల ఎక్స్ రే తీసాడు

సర్జరీలు చేసి చిన్నారులతో పలికించాడు

వారసత్వ సంపదలని మనకు వదిలాడు               -పల్లవి

చరణం 6:         చితిమంటలు తాకని శరీరం

కళ్ళముందే కరిగిపోవడాన్ని తట్టుకోం

మూడు మజిలీలతో అందరికీ కనిపించి

మట్టివస్త్రాలని కప్పుకొంటూ

భూమాత ఒడిలోకి ఒదిగిపోయాడు

మన కళ్ళముందే కనుమరుగైయ్యాడు                 -పల్లవి

చరణం 7:         తొమ్మిదినెలలు శకుంతలమ్మ గర్భంలో

భూమిపై ఉన్నంతకాలం “బాలు”గానే

పాటలప్రియులని మురిపించాడు

సులోచనాలతో సుధీర్గ నిద్రలోకి

మరో తల్లి ఒడిలోకి ఒదిగిపోయాడు           -పల్లవి

చరణం 8:         పాటలో ఇమడని పండితారాధ్యుడు

పల్లవిలో పట్టని గంధర్వుడు

చరణాలు సరిపోని చతురుడు

భౌతికంగా కనబడని విద్వాంసుడు

పాటలని మాకు వదిలివెళ్ళిన పరమాత్ముడు           -పల్లవి

 

ఈ పాట బాలుగారికి అంకితం. పాట నచ్చిన సంగీత దర్శకులెవరైనా ప్రాణంపోస్తే బాలుగారు తప్పక వింటారేమో! 

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

చెదిరిన కల

by Sudharshan Chintapatla August 26, 2021
written by Sudharshan Chintapatla

మూలం: రవీంద్రనాథ్‌ టాగూర్‌       అనువాదం: చింతపట్ల సుదర్శన్‌

నేను చేరేటప్పటికి డార్జిలింగ్‌ వర్షంలో తడిసి ముద్దయ్యింది. బయటకి వెళ్ళదల్చుకోలేదు కాని వెళ్ళకుండా హోటల్‌లోనే ఉండిపోవడం నచ్చలేదు. టిఫిన్‌ ముగించి రెయిన్‌ కోటు తొడుక్కుని బూట్లు వేసుకుని అలా నడిచి వద్దామని బయటకు వెళ్ళాను. మధ్య మధ్య ముసురు పడుతూనే వుంది. దట్టమైన మబ్బులు వెలుతుర్ను పూర్తిగా కప్పేస్తుంటే సృష్టికర్త కొండల్ని చుట్టుపక్కల ఉన్న పరిసరాలను రబ్బరుతో తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాడా అనిపించింది.

పొగ మంచు కప్పేసిన వాతావరణాన్ని మనుషులెవరూ లేని రోడ్డుని ద్వేషించే వాణ్ణి ఇప్పుడు నా పంచేంద్రియాలతో నేల వైవిధ్యాన్ని, రంగుల్ని మళ్ళీ మళ్ళీ ఆస్వాదించాలనుకుంటూ నడుస్తున్నాను. ఈ సమయంలో ఒక స్త్రీ రోదిస్తున్న ధ్వని అతి దగ్గరలో వినిపించింది. జీవితం ఎంతో జటిలమైనది. విషాదం దానికి కొత్త కాదు. ఎవరో ఒకరు ఏ కారణంచేతో రోదించడం సర్వసాధారణమైన విషయమే. మరో సమయంలో అయితే పెద్దగా పట్టించుకునే వాణ్ణి కాదు. కానీ ఇప్పుడు ఈ మేఘావృతమయిన వాతావరణంలో ఆ ధ్వని మాయమైపోతున్న ప్రపంచపు శోకంలా అనిపించి ఏడుపు వినవస్తున్న చోటుకు వెళ్ళాను. రోడ్డు పక్కనే ఉన్న ఓ బండరాయి మీద కూర్చుని ఉన్న ఒక స్త్రీ రోదిస్తున్నది. ఆమె దుస్తులు మట్టి రంగులో ఉన్నయి. చిక్కులు కట్టిన జుట్టును నడినెత్తిన ముడివేసుకుంది. డార్జిలింగ్‌లో కలకత్తా రోడ్డు మీద కొండ పక్కన ఓ బండరాయి మీద ఒక సన్యాసినిని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఆమెను హిందీలో అడిగాను.

‘ఎవరమ్మా నువ్వు? ఏం జరిగింది?’

మొదట ఆమె ఏమీ మాట్లాడకుండా నీళ్ళు నిండిన కళ్ళతో నా వైపు చూసింది. ‘భయం లేదు. నేను చెడ్డవాడినేమీ కాదు’ అన్నాను. ఆమె స్వచ్ఛమైన హిందుస్తానీలో మాట్లాడిరది. ‘సిగ్గూ, భయమూ అవమానమూ అనేవి మరిచిపోయి చాలా కాలం అయింది. ఒకప్పుడు పరదా చాటున ఉండే నన్ను చూడటానికి నా స్వంత సోదరుడు కూడా అనుమతి కోరేవాడు. కాని ఇప్పుడు ప్రపంచానికీ నాకూ మధ్య ఏ అడ్డు తెరా లేదు’ అన్నది.

ఇదేదో మంచి కథ అల్లే విషయం అని అనిపించింది నాకు. సిగరెట్టు పొగను రైలు పొగలా వదులుతున్న నన్ను కుతూహలం గట్టిగా పట్టుకుంది. ‘నేను నీకేమైనా సాయపడగలనా?’ అని అడిగాను.

ఆమె నా వైపు సూటిగా చూస్తూ ‘బద్రౌన్‌ నవాబు గోలమ్‌కాదర్‌ ఖాన్‌ కుమార్తెను నేను’ అంది.

బద్రౌన్‌ ఎక్కడుందో గోలమ్‌ కాదర్‌ ఖాన్‌ ఎవరో, నవాబు కూతురయిన ఈమె రోడ్డు మీద రోదిస్తూ ఎందుకు కూర్చుని ఉందో నాకు అర్థం కాలేదు. కానీ ఆమె చెప్పే కథను వినే అవకాశాన్ని వదులుకోవద్దనుకున్నాను. నేను వంగి ఆమెకు సుదీర్ఘమైన సలాం చేసి ‘బీబీ సాహెబ్‌ క్షమించడండి నాకు మీరెవ్వరో తెలియదు’ అన్నాను.

పక్కనే ఉన్న మరో బండరాయిని చూపుతూ ‘కూర్చోండి’ అన్నది. ఆమె పక్కనే నాచు పట్టి ఉన్న బండరాయి మీద కూచుంటూ అడిగాను ‘బీబీ సాహెబ్‌ మీకీ పరిస్థితి ఎలా వచ్చింది?’

బద్రౌన్‌ యువరాణి నుదురు కొట్టుకుంది. ‘ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంతో నాకు ఎలా తెలుస్తుంది. ఈ అనంతమైన బరువైన కొండల్ని పలుచటి మేఘాలతో దాచి పెట్టే వాడెవడో?’ అందామె మబ్బుల్లోకి చూస్తూ.

నేను ‘అవును, విధి లీలలు ఎవరికి తెలుస్తయి. విధి ముందు మనమంతా చీమలమే కదా!’ అన్నాను.

ఆమె చెప్పడం మొదలు పెట్టింది. మా తండ్రి గారి నరాల్లో ఢల్లీి చక్రవర్తుల రక్తం ప్రవహిస్తూ ఉండేది. తన కుటుంబ ప్రతిష్ఠను నిలబెట్టుకోవడానికి నాకు సరైన భర్త కోసం ప్రయత్నాలు చేయసాగారు. లక్నో నవాబు దగ్గరి నుంచి పెండ్లి ప్రస్తావన కూడా వచ్చింది. బ్రిటిష్‌ వారికి సిపాయిలకు మధ్య ‘పోరు సాగుతున్న కాలం అది. హిందుస్తానీ ఫిరంగి జ్వాలల కారణంగా చిక్కని పొగలు కమ్ముకుంటున్న సమయమది’

నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా ఒక స్త్రీ స్వచ్ఛమైన హిందుస్తానీలో మాట్లాడ్డం విని ఉండలేదు. బీబీ సాహెబ్‌ మాటల్లో వాక్యాలు మంచు కప్పిన బంగారు మొక్కజొన్న పొలాల్లో వీచే ఉదయపు గాలుల్లా సుకుమారంగా, అందంగా ఉన్నవి. నవాబుల భాష వింటుంటే మబ్బుల్లో దాక్కున్న బ్రిటిష్‌ వాళ్ళ రాతి డార్జిలింగ్‌కు బదులు నా మనో నేత్రానికి మొగల్‌ నగరం, పాలరాతి భవనాలు, వీధుల్లో తిరుగాడే పొడవాటి తోకలున్న గుర్రాలు బంగారు అంబారీలున్న ఏనుగులు, వివిధ రంగుల తలపాగాలతో వదులు చొక్కాలు పైజామాలు ధరించి, వేళ్ళ దగ్గర ఒంపు తిరిగిన పాదరక్షలు తొడుక్కుని నడుములకు కత్తులు వేలాడ దీసుకుని కావలసినంత తీరిక కలిగి ఉండి, ఉల్లాసంగా జీవితం గడిపే మనుషులు కనిపించారు.

నవాబు కూతురు నూరున్నిసా నో లేక మెహరున్నిసానో అంది తన పేరు, కథ కొనసాగింది. ‘మా కోట యమునా నది ఒడ్డున వుండేది. మా సైన్యాధిపతి ఒక హిందూ బ్రాహ్మడు. ఆయన పేరు కేశర్‌లాల్‌. ఆమె తన గొంతులోని మాధుర్యాన్నంతా కేశర్‌ లాల్‌ అన్న మాటలో ఒలికించింది.

కేశర్‌లాల్‌ మత ఆచారాలను కచ్చితంగా పాటించే హిందువు. నేను ఉద యం నిద్ర లేవగానే జనానా కిటికీలోంచి చూస్తే యమునానది వక్షం మీద చేతులు గుండ్రంగా తిప్పుతూ సూర్య నమస్కారాలు చేస్తూ కనిపించేవాడు. నది ఒడ్డున తడిసిన దుస్తులతో కూచుని మంత్రాలు చదివేవాదు. తర్వాత భైరవి రాగంలో ఒక కీర్తనను ఆలపిస్తూ తన ఇంటికి వెళ్ళిపోయేవాడు.

నేను ఒక ముస్లిం అమ్మాయిని. నా మతం గురించి నాకు ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు. ఆచరణలు, సిద్ధాంతాలు ఏమీ తెలియవు. ఇక మా ఇంట్లో పురుషుల్లో మత సంబంధమైన నిబంధనలు మద్యపానం, స్వార్థ చింతనల కారణంగా బలహీన పడ్డాయి. సుఖాల కారణంగా జనానాలో కూడా మతం సజీవంగా ఉండేది కాదు.

దేవుడు బహుశా నా లోపల ఒక సహజమైన  దాహాన్ని నిక్షేపించాడేమో  ఉదయపు మసక వెలుతురులో కేశర్‌లాల్‌ ప్రశాంత యమునా నది తెల్లటి మెట్ల మీద పూజలు నిర్వహించే దృశ్యం నాలో మాటల్లో చెప్పలేని భక్తి భావాన్ని నింపేసేది. తన సమయపాలన, క్రమశిక్షణ, భక్తి, చురుకైన అందమైన దేహంతో ఒక పొగరాని జ్వాలలా ఉండేవాడు. అతని పవిత్రత సౌకూమార్యం, సౌందర్యం ఒక అమాయకమైన ముస్లిం అమ్మాయిని ఒక విచిత్రమైన ఆరాధనాభావంతో వశం చేసుకుంది.

నాకు ఒక హిందూ సేవకురాలు ఉండేది. ఆమె ప్రతి రోజూ కేశర్‌లాల్‌కు మోకరిల్లి ఆయన పాద ధూళిని స్వీకరించేది. ఆ దృశ్యం నన్నెంతో ఆనంద పరిచేది. అసూయ కూడా కలిగించేది. ప్రత్యేక పూజల సమయంలో నది ఒడ్డున అన్న సంతర్పణ జరిగేది. నేను నా సేవకురాలికి ఆ కార్యక్రమం కోసం కొంత డబ్బు అందించేదాన్ని. ‘కేశర్‌లాల్‌ను భోజనానికి ఆహ్వానించావా?’ అని అడిగేదాన్ని. ఆమె భయపడుతూ ‘కేశర్‌లాల్‌ గారు ఎవరి దగ్గరా ఆహారం స్వీకరించరు. బహుమతులు తీసుకోరు’ అనేది. నేను ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని కేశర్‌లాల్‌కు నా ఆరాధనా భావాన్ని ప్రకటించలేకపోతున్నందుకు నా మనస్సు చివుక్కుమనేది.

మా పూర్వీకుల్లో ఒకరు ఒక బ్రాహ్మణ బాలికను అపహరించి వివాహం చేసుకున్నారు. నేను జనానాలో కూర్చుని ఆమె స్వచ్ఛమైన నెత్తురు నా నరాల్లో ప్రవహిస్తున్నదని అనుకునేదాన్ని. ఆ అనుబంధం కారణంగానే కేశర్‌లాల్‌ పట్ల నాలో ఆరాధనా భావం అంకురించింది అనుకునేదాన్ని. నా సేవకురాలి ద్వారా హిందూ మతం గురించి, ఆచారాల గురించి, దేవతల గురించి తెలుసుకున్నాను. అద్భుతమైన రామాయణ మహాభారత కథలు విన్నాను. విగ్రహాలు, శంఖాలు, గంటలు, ధూప పరిమళాలు, పూల సువాసనలు, గంధపు అలంకారం దైవిక శక్తులు కలిగి ఉండే యోగులు సన్యాసులు ఒక అతీంద్రియ అతి ప్రాచీనమైన ప్రపంచం మొత్తం నా కళ్ళముందు నిలబడేది. నా హృదయం గూడు లేని పక్షిలా విశాలమైన రాజభవనంలో ఒక గదిలో నుంచి మరొక గదిలోకి ఎగురుతుండేది. నాలో ఉన్న అమ్మాయి మనసుని హిందూ ప్రపంచం ఒక అద్భుతమైన కథా సామ్రాజ్యంలా ఆకర్షించింది.

ఆ సమయంలో కంపనీకి సిపాయిలకు మధ్య పోరు ప్రారంభం అయింది. తిరుగుబాటు అలలు మా కోట వరకూ విస్తరించాయి. కేశర్‌లాల్‌ ‘గో భక్షకులైన తెల్ల వాళ్ళను ఆర్యావర్తం నుంచి తరిమెయ్యాలి హిందూ ముస్లిం రాజులు అధికారం కోసం జూదం ఆడే స్వేచ్ఛను మళ్ళీ పొందాలి’ అన్నాడని తెలిసింది.

మా తండ్రి గోలమ్‌ కాదర్‌ ఖాన్‌ గారు ఆచితూచి కాని యే పనీ చెయ్యరు. ఇంగ్లీషు వాళ్ళు తల్చుకుంటే ఏమైనా చెయ్యగలరు. హిందుస్తాన్‌ పౌరులు వాళ్ళకి ఏ విధంగానూ సరితూగరు. ‘నేను నా ఈ చిన్నకోటను ఎట్టి పరిస్థితుల్లో పణంగా పెట్టను గౌరవప్రదమైన కంపెనీతో పోరు సలపమని నన్ను అడగవద్దు’ అన్నారు.

హిందూ ముస్లింల రక్తం మరిగిపోతున్న సమయంలో ఒక వ్యాపారస్తుడిలా తండ్రి గారు మాట్లాడిన మాటలు మాకందరికీ కోపం తెప్పించాయి. మా అమ్మ, ఆమె సవతులు కూడా ఆగ్రహ పడ్డారు. కేశర్‌లాల్‌ సాయుధ బలాలతో వచ్చి ‘నవాబ్‌ సాహెబ్‌ మీరు మాతో చేతులు కలపకపోతే మిమ్మల్ని బందీని చేసి యుద్ధం ముగిసే వరకు కోటను మా ఆధీనంలో ఉంచుకుంటాం’ అన్నాడు.

‘ఆ అవసరం లేదు. నేను మీతో పాటే ఉన్నాను’ అన్నారు తండ్రిగారు.

‘మీ కోశాగారం నుంచి కొంత ధనం ఇవ్వండి’ అన్నాడు కేశర్‌లాల్‌.

మా తండ్రిగారు ఎక్కువ మొత్తం ఇవ్వలేదు. ‘మీకు అవసరం అయినప్పుడు ఇంకా యిస్తాను’ అన్నాడు.

నేను నా ఒంటి మీది నగలు మొత్తం తీసి ఓ గుడ్డలో మూట కట్టి సేవకురాలి ద్వారా కేశర్‌లాల్‌కు పంపాను. ఆయన దాన్ని స్వీకరించడంతో నా ఆనందానికి హద్దులు లేకుండా పోయేయి.

తుప్పు పట్టిన తుపాకులను శుభ్రం చేయడం, పాలిష్‌ చెయ్యడం, పాత కాలపు నాటి కత్తులు పదును పెట్టడంతో పోరుకు సిద్ధం అయ్యాడు కేశర్‌లాల్‌. ఒకనాటి మధ్యాహ్నం జిల్లా కమిషనర్‌ తన ఎర్ర చొక్కా సైనికులతో కోటలోకి వచ్చాడు. రహస్యంగా ఆయనకు తిరుగుబాటు విషయం తెలియచేశారు నాన్నగారు. కేశర్‌లాల్‌ మొండి కత్తులతో విరిగిన తుపాకులతో ప్రాణాలకు తెగించి, కంపెనీ సైన్యంతో పోరాడాడు. ద్రోహి అయిన మా తండ్రి గారి ఇల్లు నాకు నరకంగా కనిపించింది. దు:ఖం కోపం నన్ను ఆవహించినా ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చలేదు. పిరికివాడయిన నా సోదరుడి దుస్తులు వేసుకుని ఎవరూ చూడకుండా జనానా నుంచి పారిపోయాను.

ధూళి, సైనికుల అరుపులు, తుపాకీ మ్రోతలు, మందుగుండు పొగ తర్వాత భయంకరమైన నిశ్శబ్దం నేల మీదా నీటిలోనూ ఆకాశం వరకూ వ్యాపించాయి. సూర్యాస్తమయ సమయం. యమునా నది ఎర్ర బడిరది. ఆకాశంలో పూర్ణచంద్రుడు వేలాడుతున్నాడు. యుద్ధ రంగంలో మరణించిన వారి శవాల మధ్య కలియ తిరిగాను.

కేశర్‌లాల్‌ను వెదకడం తప్ప మరో లక్ష్యం లేదు. అర్ధరాత్రి దాకా వెదుకుతూనే ఉన్నాను. యుద్ధ రంగానికి దగ్గర్లో యమున ఒడ్డున ఉన్న మామిడి చెట్టు క్రింద కేశర్‌లాల్‌, వ్యక్తిగత సహాయకుని మృతదేహాలు కనపడ్డాయి. తీవ్రంగా గాయపడ్డ యజమానిని సేవకుడే మోసుకొచ్చాడో, సేవకుడినే యజమాని తీసుకు వచ్చాడో ఇక్కడికి ప్రశాంతంగా మరణించడానికి.

మొట్టమొదటి సారిగా నేను కేశర్‌లాల్‌ ముందు మోకరిల్లాలనే దీర్ఘ కాలపు కోరికను తీర్చుకున్నాను. ఆయన పక్కన మోకాళ్ళ మీద కూలబడ్డాను. నా పొడుగాటి జుట్టును విరబోసుకుని భావావేశంతో ఆయన కాలి ధూళిని రుద్దుకున్నాను. మంచులా చల్లబడ్డ కాలి వేళ్ళను నా నుదురుకు తగిలించుకుని ముద్దు పెట్టుకున్నాను. నెలల నించీ ఆపుకున్న కన్నీరు ఉబికి వచ్చింది. అప్పుడు ఆ దేహం కదిలింది. ఆయన పెదవుల నుంచి ఒక సన్నటి మూల్గు బయటకు వచ్చింది. ఆ శబ్దానికి భయంతో ఒక్కసారిగా వెనక్కి కదిలాను. బలహీనమైన ధ్వనితో ‘దాహం’ అన్నాడు. నేను యమునలోకి పరుగెత్తాను. నా దుస్తులను తడిపి తీసుకువచ్చాను. సగం తెరుచుకున్న కేశర్‌లాల్‌ పెదవుల మీద నీటిని పిండాను. అతని ఎడమ కంటికి అయిన భయంకరమైన గాయానికి తడిగుడ్డను చింపి కట్టు కట్టాను. మరికొన్ని సార్లు యమున నుంచి నీళ్ళు తెచ్చి అతని ముఖం తడిపిన తర్వాత ఆయనకు స్పృహ వచ్చింది. ‘ఇంకొంచెం నీరు తీసుకురానా?’ అన్నాను. ‘ఎవరు నువ్వు?’ అన్నాడు కేశర్‌లాల్‌. నేను ఏమీ దాచదలచలేదు. ‘మీ సేవకురాలిని గోలమ్‌ కాదర్‌ఖాన్‌ గారి కుమార్తెను’ అన్నాను. కనీసం మరణానికి ముందు అతనికి అతని పట్ల నాకు ఉన్న ఆరాధనా భావాన్ని తెలియజేసి ఆ ఆనందపు అనుభూతిని పొందుదామనుకున్నాను. కానీ ఆ మాట వినడంతోటే సింహంలా గర్జించాడు. ‘ఆ ద్రోహి కూతురివా? మరణసమయంలో ఒక ముస్లిం స్త్రీవి నాకు నీరు ఇచ్చి నా మతాన్ని అపవిత్రం చేశావు’ అంటూ కుడిచేత్తో నా చెంప మీద బలంగా కొట్టాడు. నా కళ్ళు గిర్రున తిరిగాయి. దాదాపు స్పృహ కోల్పోయాను.

నా వయస్సు పదహారు. జనానా నుంచి మొదటిసారి బయటకు వచ్చాను. సూర్యుని వేడి అందమైన నా బుగ్గల గులాబీ రంగును యింకా దొంగిలించలేదు. ఇది ఈ ప్రపంచంలో నా ఏకైక ఆరాధ్య దైవం నుంచి నాకు అందిన తొలి పలకరింపా అనుకున్నాను. ‘మీరు నిర్భాగ్యురాలైన ఈ సేవకురాలి సేవలు అందుకోరు. ఇతరుల దగ్గర ఆహారం ముట్టరు. సంపన్నుల నుంచి బహుమతులు స్వీకరించరు. మీరు ప్రత్యేకమైన వారు. ఒంటరి వారు. ఎవరికీ అందని వారు. మిమ్మల్నే ఆరాధించే అమ్మాయిని మీరు స్వీకరించరు. నా ఆత్మను మీకు సమర్పించే హక్కు నాకు లేదు’ అన్నాను.

ఆయన ముఖంలో ఆశ్చర్యం లేదు. అసలు ఏ భావమూ లేదు. మెల్లగా లేచి నిలబడ్డాడు. నా చేయి అందించబోతే నిరాకరించాడు. తూలుతూ యమున ఒడ్డుకు నడిచాడు. ఒడ్డుకు కట్టబడి ఉన్న పడవతాడు విప్పాడు. దాటించడానికి ఎవరూ లేదు. కేశర్‌లాల్‌ పడవ ఎక్కి వేగంగా ముందుకు కదిలాడు. నది మధ్యలోకి వెళ్ళేదాక కనిపించి ఆ తర్వాత కనిపించలేదు. ఏమాత్రం తగ్గని నా ఆరాధనా భావంతో ఆ పడవ ముందు మోకరిల్లి ఈ వ్యర్థ జీవితాన్ని ఈ నిశ్చలనమైన రాత్రి వేళ వికసించకుండానే రాలిపోయే మొగ్గలా అలలు లేని ప్రశాంతమైన యమునలో మునిగిపోయి ముగిద్దామనుకున్నాను. ఆకాశంలో చంద్రుడు, దట్టమైన నల్లని చెట్లు నదిలో నీలి సిరా రంగు నీళ్ళు, మామిడి తోటకు పై భాగాన ఉన్న మా కోట గోపురాలు అన్నీ కల్సి మృత్యుగీతం ఆలపించాయి. భూమి, ప్రపంచం చుక్కలు నిండిన నిశ్చలమైన చంద్ర కాంతి నన్ను ఏక కంఠంతో మరణించమన్నాయి. కానీ నేను మరణించలేదు. యమునలో కంటికి కనిపించని పడవ ఆ వెన్నెల రాత్రి నన్ను వెనక్కు తోసేసింది. జీవితపు పథంలోకి తిరిగి పంపించింది. నేను నది  ఒడ్డు వెంట నిదురలో నడిచే దానిలా రెల్లు పొదల మధ్య నుంచి చిట్టడవి దారిలో నడిచాను.

కథ వింటున్న  నా సిగరెట్టు మలిగిపోయింది.. ఆమె చెప్తున్నంతసేపు గోడ మీది చిత్ర పటంలా కూర్చుండిపోయాను. ఆమె మళ్ళీ చెప్పసాగింది.

మొదట మిన్ను విరిగి మీద పడ్డట్టు అయింది. కానీ ఒక నవాబు జనానాలోని అమ్మాయికి బయటి ప్రపంచం నిషేధించబడినది అనుకోవడం ఒట్టి భ్రమ. ఒకసారి బయటకు వస్తే దారి అదే దొరుకుతుంది. జీవితంలో సాధించలేనిది యేదీ లేదని తెల్సుకున్నాను. నేను నడిచే దారిలో అనేక అడ్డంకులు ఉండవచ్చు కానీ అదీ ఒక దారే అనుకున్నాను. నాకు తరచు కేశరీలాల్‌ గురించిన వార్తలు తెలుస్తుండేవి. ఆయన తాంతియా తోపే సైన్యంలో చేరాడని తెల్సింది. ఆకాశంలో మెరిసే మెరుపులా తిరుగుబాటు పోరులో ఉన్నాడని తెల్సింది. నేనప్పుడు యోగిని దుస్తులు ధరించి బెనారస్‌లో తాత్విక గురువు శివానంద స్వామి దగ్గర సంస్కృత శాస్త్రాల్ని అధ్యయనం చేస్తున్నాను. ఆయన ఆశ్రమానికి దేశంలోని అన్ని వార్తలూ అందేవి. యుద్ధ వార్తలు వింటుండేదాన్ని.

బ్రిటిష్‌ ప్రభుత్వం తిరుగుబాటు మంటల్ని ఆర్పేసింది. ఇక కేశర్‌లాల్‌ వార్తలు తెలియరాలేదు. నేను అక్కడ ఉండలేక శివభక్తుడి వేషంలో బయలుదేరి అనేక ఆశ్రమాలు దేవాలయాలు దర్శించాను.

కేశర్‌లాల్‌ తెల్సిన ఒక వ్యక్తి ఆయన యుద్ధంలో మరణించి ఉండాలి లేదా ఉరితీయబడి ఉండాలి అన్నాడు. అలా జరిగి ఉండదని నా మనస్సు నాకు చెప్పింది. కేశర్‌లాల్‌కు మరణంలేదు. ఆ అజేయమైన జ్వాల ఎన్నటికీ ఆరిపోదు. అది యింకా  ఎక్కడో మండుతూనే ఉంటుంది. నన్ను నేను సమర్పించుకోవడానికి కేశర్‌లాల్‌ ఎక్కడో ఉండే ఉంటాడు హిందూ శాస్త్రాలు ధ్యానం ద్వారా పవిత్ర ఆచరణల ద్వారా ఒక తక్కువ కులం వాడు బ్రాహ్మణుడు కావచ్చు అంటున్నాయి, కానీ ఒక ముస్లిం బ్రాహ్మణుడుగా మారటాన్ని గురించి ఎక్కడా లేదు. నేను కేశర్‌లాల్‌ను కలవటం కోసం బయటా లోపలా బ్రాహ్మణత్వం సాధించాను. శరీరమూ, మనస్సూ మాటా ప్రవర్తనా అన్నీ మారిపోయాయి. నా బ్రాహ్మణ అమ్మమ్మ రక్తం ఏ మాత్రం శక్తి కోల్పోకుండా నా లోపల ఉన్నది.

కేశర్‌లాల్‌ చిన్న పడవలో యమునా నది మధ్యకు వెళ్ళిన చిత్రమే నా మనస్సులో నిలిచి ఉన్నది. తోడు ఎవరూ లేకుండా పవిత్రమైన ఆత్మ పరిపూర్ణమైన మనిషి గ్రహాలూ, చంద్రుడూ, నక్షత్రాలూ తననే నిశ్శబ్దంగా చూస్తుంటే వెళ్ళిపోయినప్పటి దృశ్యం రాత్రీ పగలూ నా కంటి ఎదుట నిలిచేది.

నా అన్వేషణ కొనసాగింది. ముప్ఫయి సంవత్సరాలు    గడిచిపోయేయి. ఉరి శిక్ష తప్పించుకుని కేశర్‌లాల్‌ నేపాల్‌లో ఆశ్రయం పొందాడని తెల్సింది. నేను నేపాల్‌ వెళ్ళాను. కేశరిలాల్‌ నేపాల్‌ వదిలి వెళ్ళిపోయాడని, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదని తెల్సుకున్నాను. నేపాల్‌లో మనుషుల పద్ధతులు నాకు నచ్చలేదు. నా పవిత్రతను కాపాడుకుంటూ తిరిగి ప్రయాణం ఆరంభించాను. నా పడవ దాదాపు ఒడ్డుకు వచ్చేసిందని నా జీవిత లక్ష్యం చేరుకోవడానికి ఇంకా ఎంతో దూరం లేదని అనిపించేది. ఇల్లు వదిలిన ముప్ఫయి ఎనిమిది సంవత్సరాల తర్వాత డార్జిలింగ్‌కు వచ్చాను. ఒక్క క్షణం ఆగి అంది ఆమె ‘ఇవ్వాళ ఉదయం కేశర్‌లాల్‌ను చూశాను’.

‘ఎవరినీ?’ నమ్మలేక అడిగాను నేను. నవాబు కూతురు చెప్పింది ‘వయస్సు మళ్ళిన కేశర్‌లాల్‌ను డార్జిలింగ్‌ సరిహద్దుల్లో ఉన్న భూటాన్‌ గ్రామంలో భూటానీ భార్యతో ఆమె వల్ల కలిగిన మనవలు మనవరాళ్ళతో ఒక మురికి ఇంటి ముందు మొక్కజొన్న గింజలు ఏరుతుంటే చూశాను’

ఆమె కథ ముగించింది. నేను సానుభూతి వ్యక్తం చేద్దామనుకున్నా, ‘ముప్పయి ఎనిమిదేళ్ళు ఎక్కడెక్కడో తిరిగి అపరిచితుల మధ్య బతికితే ఎవరైనా తమ మతాన్ని ఆచరణను మరిచిపోతారు’ అన్నాను.

‘ఆ సంగతి నాకర్థం కాలేదు అనుకోకు. సుదీర్ఘ కాల కష్టాలు ఎదుర్కొన్న దాన్ని. ప్రమాదాలు అవమానాలు ఎదుర్కొన్న దాన్ని. నా యువ హృదయాన్ని దొంగిలించిన బ్రాహ్మణీకం కేవలం ఆచారం మూఢ విశ్వాసం అనుకోలేదు. నేను అది ఒక ధర్మం అని భావించాను. అనంతమైనదని శాశ్వతమైనదని అనుకున్నాను. కేశర్‌లాల్‌ చేత తిరస్కరించబడి అవమానించబడిన ఆ రాత్రి. ఆయన నా పట్ల చూపిన ప్రవర్తనను ఒక గురువు నేర్పిన తొలి పాఠంగా భావించి రెట్టించిన ఆరాధనా భావంతో ఆయన అన్వేషణ కొనసాగించాను. అయ్యో బ్రాహ్మడా నువ్వు నీ అలవాట్లను ఆచరణలను అన్నింటినీ మరొక జీవన విధానంలో పూర్తిగా మార్చుకున్నావు. మరి నేను నా జీవితాన్ని యవ్వనాన్ని ఆత్మను త్యాగం చేశానే. వాటిని తిరిగి ఎలా పొందగలను?’ అంటూ ఆ స్త్రీ లేచి నిలబడి ‘బాబూ సాహెబ్‌’ వీడ్కోలు అంది. నేను ఏమీ అనక ముందే గాలిలో తేలి ఆకాశంలోని మబ్బుల్లో కల్సిపోయింది.

నేను కళ్ళు మూసుకున్నా. ఆమె చెప్పిందంతా మరొక్కసారి కళ్ళ ముందు కదలాడిరది. ఒక పదహారేళ్ళ అమ్మాయి, నవాబు కుమార్తె గదిలో తివాచీ మీద కూచుని కిటికీలోనుంచి యమున వైపు చూస్తున్నది. ఒక సాయంత్రపు వేళ ఒక యోగిని భక్తి పారవశ్యంలో కనిపించింది. ఒక వృద్ధ మహిళ డార్జిలింగ్‌ లోని కలకత్తా రోడ్డు పక్కన బండరాయి మీద కూచుని కనిపించింది. నా హృదయం ముక్కలైంది.

నేను కళ్ళు తెరిచాను. మబ్బులు తొలిగిపోయేయి. సూర్యకాంతిలో ఆకాశం నిర్మలంగా వుంది. నేను లేచి నిలబడ్డాను. మేఘాలు కమ్మిన తుఫాను వాతావరణంలో నేను విన్న కథను ఇప్పుడు సూర్యకాంతిలో నమ్మలేకుండా ఉన్నా ను. ఇదంతా సిగరెట్టు పొగ మేఘాల్లో నా ఊహాచిత్రం. ఆ ముస్లిం స్త్రీ ఆ హిందూ నాయకుడు, యమునా నది ఒడ్డున ఆ కోట బహుశా ఏవీ నిజమైనవి కావేమో!

 

August 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorizedఇంద్రధనుస్సు

పద్యసుగంధం

by డా|| మృదుల నందవరం August 26, 2021
written by డా|| మృదుల నందవరం

క్రిందటి సంచికలో విద్య యొక్క ఆవశ్యకతను తెలుసుకున్నాం. ఈ సంచికలో విద్యకు చెందిన మరొక రేఖను చూద్దాం.

శ్లో||    దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతో పిసన్2 పిసన్ !

           మణినా భూషితస్సర్పః కి మసౌ న భయంకరః?

అని భర్తృహరి దుర్జన పద్ధతిలో చెబుతాడు.

విద్య ఎంతో గొప్పదైనా అది ఎవరి వద్ద ఉన్నదో, వారినిబట్టి మాత్రమే ఫలితం ఉంటుంది. మంచివారి వద్ద ఉన్న విద్య ఎంత లోకహితము. వారినే మనం ఆశ్రయించాలి. విద్య ఉన్నది కదా అని దుర్మార్గులను మనం చేరదని తెలిపే పై శ్లోక తాత్పర్యానికి ఏనుగు లక్ష్మణకవి సులువైన తెలుగు చేశాడు.

తే.    విద్యచే భూషితుండయి వెలయుచున్న

         దొడరి వర్జింపనగుజుమీ దుర్జనుండు

          చారు మాణిక్య భూషిత శస్తమస్త

          కంబయిన పన్నజిి గము భయంకరముగాదె!

పాము తలపై ఎంత విలువైన మాణిక్యం ఉన్నప్పటికీ మనం ఎలా దూరంగా ఉంటామో, దుర్మార్గుని వద్ద ఎంత గొప్ప విద్య ఉన్నప్పటికీ అతని దరికి మనం చేరరాదని భావం.

విలువ కలిగిన మణి ఉన్నది కదా! అని పాము తన సహజ స్వభావాన్ని ఎలా మార్చుకోలేదో, అలాగే దుర్జనుడు ఎన్ని గొప్ప చదువులు చదివినప్పటికీ తన స్వభావాన్ని వదులుకోలేడు. విద్య, మనిషిని చెడు నుండి మంచివైపుకు మరల్చాలి కదా! అనే సందేహం మనకు కలగొచ్చు. కాని, అతడు నేర్చిన విద్యను, అతని దుష్టస్వభావమే బలీయమైనపుడు, విచక్షణ కోల్పోతాడు. పాములాగానే ప్రవర్తిస్తాడు అని గుర్తించాలి.

అతనికే సమాజంలో వ్యక్తులతో మనం తగు జాగ్రత్తలతో మెలగాలని కవులు మనకు బోధిస్తున్నారని గ్రహించాలి.

స్వామి వివేకానందగారి ప్రసంగాలలో లభించిన ఆణిముత్యాలను ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకుందాం.

‘ధనం కాదు, కీర్తి ప్రతిష్టలూ కాదు, విద్వత్తు (పాండిత్యం) కాదు. సౌశీల్యం ఒక్కటే కష్టాలనే దుర్భేధ్యమైన అడ్డుగోడలను చీల్చుకని పోగలిగినది. దీనిని జ్ఞప్తిలో ఉంచుకోండి.’

అన్న మాటల్లో విద్య కన్నా విచక్షణ ముఖ్యమని, సౌశీల్యమే గొప్పదని, అది మాత్రమే సమాజంలోని అడ్డుగోడల్ని కూల్రదోయ గలదని ఆయన అభిప్రాయము.

ఆట పాటల్లో, వేషభాషల్లో, సుఖదుఃఖాల్లో అన్ని దైనందిన అలవాట్లలో నీతి తప్పని ధీరులై, జీవించండి. అలాంటి ఆదర్శంతో, జీవితాన్ని నిర్మించుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు.’

అన్న మాటల్లో బాహిరమైన వేషధారణే కాదు.  అంతరమైన భావజాలం కూడా ఆదర్శపూరితంగా ఉండాలన్నది అర్థమవుతూంది. మనోవాక్కాయ కర్మలయందు ఎవరు పవిత్రులై ఉంటారో వారు మాత్రమే సత్ పురుషులుగా కీర్తింపబడతారని మనం గుర్తించాలి.

ఇటువంటి పెద్దల వాక్యాలు మనల్ని మరింత పరిపూర్ణులుగా తయారుచేస్తాయి. ఎప్పటికప్పుడు మనల్ని మనం తీర్చిదిద్దుకోడానికి ఉపయోగపడతాయి.

 

August 26, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

సంతాప తీర్మానం

by కొల్లాపురం విమల August 25, 2021
written by కొల్లాపురం విమల

మితృలారా!

నాకోసం  ఈ ఒక్క పని చేసి పెట్టండి

చనిపోయిం తర్వాత నన్ను ఆగం చేయకండి

నాకు యే మత ధృవీకరణ పత్రాన్నో జారీ చేయించకండి

పని గట్టుకని యే బోధనలకూ పూనుకోకండి

ఈమె యే ఫలానీ నమ్మకాలకో, దేశానికో, జాతీయతకో

విధేయురాలు అంటూ

నమ్మించే ప్రయత్నం చేయకండి,

నా శవాన్ని ప్రభుత్వాలకు ఒప్పజెప్పే ప్రయత్నం చేయకండి కనీసం –

అయ్యలారా – అమ్మలారా-

దౌర్భాగ్యులు అణచుకోలేక చేసే తిట్ల దండకమే నాకు గుర్తింపు

రచ్చబండ అంచులకయినా వాళ్ళు రాకపోవచ్చుగాక,

నా ప్రేమికులకేం కొదువ లేదు –

జీవితంలో దాగిన వాస్తవ బీజం,

దుమ్మూ – ధూళీ, రికామీ గాలీ నా ప్రియ నేస్తులు

వాళ్ళని నిందించకండి,

శుద్ధవాదుల మెప్పు కోసం

నా శవాన్ని మాత్రం క్షమాభిక్ష కోరే స్థితిలోకి నెట్టకండి-

సహచరీ!

నన్ను తెల్లశాలువాలో చుట్టలేదని బాధపడకు,

నా శవాన్ని అడవిలో వదిలెయ్

ఈ ఆలోచనే ఎంత సేద దీరుస్తుందో తెలుసా నన్ను!

అడవి మృగాలు నా కోసం వస్తై

నా ఆలోచనలను యే నీతుల తరాజు లోనో పెట్టకుండా

నా ఎముకలనూ, మాంస ఖండాలనూ

కెంపు లా మెరిసే నా గుండెనూ

ఆబగా పీక్కుతింటూ సంతోషపడుతై

పెదవులు నాక్కుంటూ తృప్తిగా చప్పరిస్తై

స్నేహ విధేయమైన వాటి కళ్ళల్లో

అప్పుడు

నీవు సైతం చెప్పలేని

సత్యం మెరుస్తుంది

ఈ శవం ఓ మనిషిదనీ

తను అనుకున్నదే మాట్లాడిన ఆమెదనీ

ఏనాడూ పశ్చాత్తాపం ఎరుగని జీవితానిదనీ

  • ఉర్దూమూలం : ఫమీదా రియాజ్
  • స్వేచ్ఛానువాదం : కొల్లాపురం విమల

ఫమీదా రియాజ్ 1946లో బ్రిటిష్ ఇండియాలో పుట్టి పాకిస్తాన్ లో పెరిగిన ప్రగతిశీల కవయిత్రి.  స్త్రీవాది – హక్కుల కార్యకర్త. తన భావాలను నిక్కచ్చిగా రాసే కవయిత్రిగా ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. జనరల్ జియా – ఉల్ – హక్ మతోన్మాద వైఖరులను ధిక్కరించినందుకు ఆమె నడుపుతున్న పత్రిక మూసేయాల్సి వచ్చింది. ఆమె భర్త జైలు పాలయ్యాడు. ప్రముఖ కవయిత్రీ, స్నేహితురాలూ అయిన అమృత ప్రీతమ్ సాయంతో తన పిల్లలతో పాటుగా పాకిస్తాన్ నుంచి తప్పించుకొని 7 యేళ్ళపాటు రాజకీయ శరణార్థిగా భారతదేశంలో తలదాచుకుంది. పేట్రేగిన మతతత్వ ధోరణులను ఖండించిన నేపథ్యంలో “నీవు కూడా నాలాగే” అనే తన కవితలో ఛాందసత్వాన్ని ధిక్కరించిన మేధావి. భావాలలో, కళాత్మక వ్యక్తీకరణలో నజ్మాహికత్, పాబ్లో నెరూడా సార్ర్తే, సిమోన్ డిబోరా లతో సమానంగా ఈమెని విమర్శకులు గుర్తిస్తారు.  పార్సీ కవయిత్రి ఫరోక్ జాద్, రూమీ వంటి కవుల కవితలను ఉర్దూలోకి అనువదించి మంచి అనువాదకురాలిగా సైతం గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 సంవత్సరంలో లాహోర్లో ఆమె చనిపోయిన వార్తను పత్రికలో చదివి ఆమెకి నివాళిగా కొల్లాపురం విమల చేసిన స్వేచ్ఛానువాదం (వివిధ ఇంగ్లీషు అనువాదాల ఆధారంగా) ఈ కవిత.

 

 

 

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథా పంచకం (చిన్న కథలు)

by Dr. Lakshmanacharyulu M August 25, 2021
written by Dr. Lakshmanacharyulu M

అనువాద కథలు

మూలం : నరేంద్ర లాహ (హిందీ)                                                  అనువాదం : డా॥ లక్ష్మణాచార్యులు, మరింగంటి

1. కారణం

గోపాలరావు వంటి భావుకుడైన రచయిత ఎందుకని ఆత్మహత్య         చేసుకున్నాడో, అసలు కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే, తెలుస్తే ఆ కారణం అనేది అతనికే తెలియాలి, లేదా నాకు తెలియాలి లేదా ప్రసిద్ధ ప్రచురణకర్త రూప కిశోర్ గారికి తెలియాలి. బ్యాంక్ లోని ఆయన ఖాతాలో ఒక లక్ష రూపాయల పెద్ద మొత్తం ఉండగా కూడా మరి ఆయనెందుకని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఎవ్వరి ఊహకీ అందడం లేదు. ఇదేదో ఆ రచయిత పిచ్చితనమే అనే నిర్ధారణకి వచ్చిన జనం ఈ విషయాన్ని ప్రక్కన పడేశారు.

ఈ సంఘటన మొత్తం నా కళ్ళముందే జరిగింది. నేను రూపకిశోర్ గారి కార్యదర్శిని. గోపాలరావుగారు ఒక రచయితగా గొప్ప పేరు సంపాదించాడు. ఆయన వద్ద డబ్బు లేదు, కాని తను వ్రాసిన సాహిత్యం చాలానే ఉంది. అయితే రూపకిశోర్ గారి ఆఫీసులో ఏదో విషయమే వారిద్దరి మధ్య గొడవ జరిగింది.

“మిమ్మల్ని మీరేమనుకుంటున్నారసలు? డబ్బుకి ప్రతిఫలంగా పనులు కూడా చేయించుకుంటున్నారు కదా! అసలు రచయితే గనక లేకపోతే, ప్రచురణకర్తల భవనాలు నిలబడలేవు” అంటూ గోపాలరావు వాదించాడు.

రూపకిశోర్ ఒక జిత్తులమారి వ్యక్తి కద! మొహంపై నవ్వు పులుముకుంటూ, అప్పుడేర్పడిన పరిస్థితిలో గాంభీర్యతను తేలికగా కొట్టేస్తూ-

“ఆరే! మీరు అలా ఊరికే కోపం తెచ్చుకుంటున్నారు. సరే, మనం ఓ ఒప్పందం చేసుకుందాం. మేము మీరు రాసిన సాహిత్యం అంతా కొనేసి మీకో లక్ష రూపాయలకి చెక్కు ఇస్తాం సరేనా!” అని అన్నాడు.

గోపాలరావు దీన్ని తనకు లభించిన గౌరవంగా భావించాడు. సరే, కోటీశ్వరుడైన రూపకిశోర్ గారి కార్యాలయంలో గోపాలరావు మొత్తం సాహిత్యాన్ని ఆయన ఎదురుగానే తగలబెట్టటం జరిగింది. దీన్ని ఆపాలని కోరుకున్నా, గోపాలరావు దాన్ని నిరోధించలేకపోయాడు. పైగా వెళ్ళిపోతూ ఉండగా – “నీలాంటి చౌకబారు రచయితలు వస్తారు, పోతారు. మా దృష్టిలో నీ సాహిత్యం విలువ ఇంతేనని తెలుసుకోండి” అనే మాటలు ఆయన చెవిలో కూడా పడ్డాయి.

అంతే! అదే రాత్రి గోపాలరావు ఆత్మహత్య చేసుకున్నాడు.

2. వ్యాపారం 

ఎందుకోగాని ఆ రాజకీయ నాయకుడి మొహం గంభీరంగా తయారైంది ఎంతో దిగులుగా, దిగాలుపడి, తన ఇంటిపెరట్లో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు.  ఏదో పెద్ద సమస్య తనని చుట్టుముట్టినట్టుగా అనిపించింది నాకు.

వెంటనే దగ్గరకు వెళ్ళి సహానుభూతి ప్రదర్శించి, భుజంపై చేయివేసి కారణం ఏమిటని మెల్లగా అడిగా – దానికాయన ఎంతో బాధపడిపోతున్నట్లుగా నాతో ఇలా అన్నాడు –

అవును తమ్ముడూ, చాలా పెద్ద చిక్కే వచ్చిపడింది. ఆర్నెల్లు గడచిపోయాయ్, ఒక్క హర్తాళ్ గాని, ఉద్యమంగాని, గొడవగాని ఏదీ జరగలా? నాకేంటో చాలా బాధగా ఉందోయ్!        ఇలాగే ఇంకో నెల గడుస్తుందనుకో. ఇక నా వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది” అని అన్నాడు.  అంతే, ఆ మాటలు విన్న నా తల గిర్రున తిరిగిపోయింది.

3. ఎంపిక

అతనికి హఠాత్తుగా యమధర్మరాజు దర్శనం అయింది. ఒక్కసారిగా కంగారు పడినా వెంటనే స్థిమితపడి – “అయ్యా! ఏమిటీ అకాల ఆగమనం? నాకేమీ పోయే కాలం రాలేదే!” అని ప్రశ్నించాడు.

“నేనొచ్చింది, నీ కోసం కాదురా మూర్ఖుడా! నీకింకా భూమ్మీద నూకలున్నాయ్ అయినా నీ ఖర్మ ఎప్పుడు, ఎలా కాల్తుందో చెప్పలేను”, అద్సరే! ప్రస్తుతం నీకో పరీక్ష. నీకు అమ్మ కావాలో, భార్య కావాలో, ఇరువురిలో ఎవరు కావాలో, అక్కర్లేదో తేల్చుకో. ఇద్దరిలో ఒక్కరిని ఇవాళ నేను పట్టుకపోవడాని వచ్చాను” అని అన్నాడాయన.

మనవాడు ఒక్క క్షణం ఆలోచించి, అయ్యా! యమ ధర్మరాజా! అలా అయితే మీరు మా అమ్మనే పట్టుకుపోండి.  ఆమెతో నాకెలాంటి ప్రయోజనం లేదు. భార్య ఇంకా కొంతకాలం నాకు పనికొస్తుంది. ముందు ముందు ఈమె కూడా పనికి రాకుండాపోతే, అప్పుడు ఈమెను కూడా మీకు నేను అప్పగిస్తా” అని అన్నాడు. అది విన్న యమధర్మరాజు అవాక్కైపోయాడు.

4 . సానుభూతి

శ్రేష్ఠిగారి మరణంతో నగరమంతా శోక సాగరంలో మునిగిపోయింది. ఆయనకెంతో పేరు – ప్రఖ్యాతులుండడం వల్ల ప్రతి ఒక్కరూ అంతిమ దర్శనం చేసుకోడానికని ఆయన ఇంటికి వచ్చి భౌతిక కాయం చుట్టూ చేరారు.

అలా సానుభూతి ప్రకటించి, రెండు కన్నీటి బొట్లు రాల్చడానికి వచ్చినవారిలో నేను కూడా ఉన్నాను. ఆయన పార్థివ శరీరంపై పూలు జల్లి రెండు నిముషాలు మౌనంగా నిలబడి ముందుకు జరిగాను.

ఇంతలో నాకు ఇద్దరి వ్యక్తులం గుసగుసలు స్పష్టంగా వినబడ్డాయి. వారికి నేను వింటున్నట్టు తెలీదు.

“అరే! ఇవాళ మనకి మంచి అవకాశం దొరికిందిరా! ఎంత వీలైతే అంత ఎంత అందితే అంత, నీ ఇష్టం. జనం చాలామందే ఉన్నారు, పనికానిచ్చెయ్! కాని జాగ్రత్త రోయ్!”

ఇంతలో ఇంకో గొంతు వినబడింది –

“మరేం ఇబ్బంది లేదురా! కొన్ని పూలు దోసిళ్ళలో నింపుకుని కొంతసేపు దిగులు, దిగాలు మొహంపైనా…. పులుముకుంటే… మనకిక… డబ్బులే డబ్బులు – ఉదయం నుండి సాయంత్రంవరకు మనం ఆ శవం చుట్టూతా తిరిగే గుంపులో వీలైనన్ని ఎక్కువసార్లు కలసి తిరుగుదాం, మనం పూలు చల్లుకుంటూ నడుద్దాం, అలాగే ‘మన పని’ కానిచ్చేద్దాం. ఓ నాలుగైదు జేబులు అలా… అలా కత్తరించేద్దాం…. కాని ఓ సంగతి మాత్రం మరచిపోకు! మొహం మీద నవ్వనేదే రాకూడదు. అప్పుడప్పుడు కళ్లు తుడుచుకుంటూ ఉందాం. పూలు అలా చల్లుకుంటూ పోదాం…. మనం సానుభూతి, శోకం ప్రకటించేందుకు గద వచ్చింది, ఏమంటావ్….”

అంతే! నా మొహంలో నెత్తురు చుక్కలేదు.

5. హర్తాళ్ 

అమ్మ అలా నడుస్తూ నడుస్తూ ‘బ్యాట్’ చేత పట్టకుని వంటింట్లోకి విసవిసా వెళ్ళింది.

అమ్మ అలా తన బ్యాట్ తీసుకుని వెళ్ళడం సంజయ్ కంటపడింది. వాడు కంగారు పడ్డాడు. ‘అమ్మా! అంటూ ఆమెని ఆపి, “ఏంటిది? నా బ్యాట్ తో నీకేం పని? ఎందుకలా పట్టుకెళ్తున్నావ్ వంటింట్లోకి?” అని అడిగాడు ఆశ్చర్యంతో.

అమ్మ వాణ్ణి అలా చూస్తూ “మరేం లేదురా? ఇంట్లో వంట చెరకు అయిపోయింది. ఈ బ్యాట్ తోనే ఇవాళ వంట!’’       అంది.

“ఏంటీ! వంటా! నా బ్యాట్ తోనా? ఏంటమ్మా? నీకు నా బ్యాటే దొరికిందా?” అడిగాడు ఆందోళన పడుతూ –

అమ్మ వాడి కళ్ళల్లోకి చూస్తూ – “అరే! నువ్వే కదరా ఇలా చెయ్యడం నేర్పింది? మీ కుర్రాళ్ళంతా హర్తాళ్ తో బస్ తగలబెట్టి మన సంపదని, మన వస్తువుల్ని మనమే తగలబెట్టుకోవాలన్నది నాకు నేర్పారు కదరా?

సంజయ్ కి విషయం అంతా అర్థమైంది. కళ్ళు తెరుచుకున్నాయ్. ఇక నుంచి ‘దేశానికి’ నష్టం కలిగించే ఏ పనీ చెయ్యను చెయ్యనివ్వనని నిర్ణయం తీసుకున్నాడు.

 

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

A WINTER EVENING

by Palakurti Dinakar August 25, 2021
written by Palakurti Dinakar

A WINTER EVENING                               – Anugu Narasimha Reddy
Like characters in a play
One after the other
crossing the crossroads
A mother dragging her child home
Shop keeper closing his shutters to ‘call it a day’
Lamp post chasing the twilight with intensified energy
Feeling chill, clouds trying to hid above the sky
The wind by hugging the snow whispering the story of a spirit silently
Sparrows practicing silence sitting among the leaves of a tree
Evening ‘Azaan’ flowing from the heart of a mosque
like a moral story from a monastery
Snow dries in the air as there is ‘no room’ to fall
Moonlight looking for the mirrors of the wall to shine
Stars winking their eyes somberly
Nandivardanam* climbing the gate to touch the heaven
As the roads exhibiting their narrowness daily
Someone trying to cut across the ‘sea of chill’ with his bike
It’s like painting a black image on the blackest canvas
The circle around the light is dancing
The village is covered tightly by the cold blanket
Hating the unnatural makeup of the so-called dearest
Protesting on multistoried buildings
Exhibiting enmity on aberrant urbanization
The breeze turned towards the sons of the soil

The fruit-cart at the corner
The plum jujube at the crossroads
Fried groundnut under the electricity pole
Inviting affectionately
The ‘mother chill’
The poor only provides shelter.

(Translated from Original Telugu Poem ‘Seethakalam … Sayamkalam’ by Dr. Palakurthy Dinakar)
*Flower plant called Nerium Coronarium

 

నాటకంలో పాత్రధారుల్లా

ఒక్కరొక్కరే చౌరస్తా దాటేస్తుంటారు

ఓ తల్లి వీపులో చరిచి పిల్లను లాక్కెల్తుంది

అమ్మింది చాల్లే అనుకొని

షాపాయన షెటర్ లాగేస్తుంటాడు

ముసకైన కొద్దీ హుషారై

చీకట్లను తరిమేస్తుంది దీపస్థంభఁ

మబ్బులకు చలేసి నింగిపైకెక్కి దాక్కుంటై

మంచును కావులించుకున్న గాలి రహస్యంగా

బూచి కథ చెబుతుంది

చెట్ల ఆకుల నడుమ పిచ్చుకలు

నిశ్శబ్ధాన్ని సాధన చేస్తుంటాయి

మున్నాశ్రమంలో నీతి గీతంలా

మజీరు హృదయం నుండి

సాయంకాలపు అజా ప్రవహిస్తుంది

కురవడానికి జాగా లేక మంచుగాల్లో కలుస్తుంది

వెన్నెల మెరవడానికి గోడల అద్దాల్నివెతుక్కుంటుంది

మూస్తూ తెరుస్తూ చుక్కలు

కన్ను గీటుదాటాడుతుంటాయి

దేవలోకాన్ని తాకి రావాలని

నందివర్ధనం గేటెక్కి చూస్తుంది.

రోజు కురుచదనం రోడ్లమీద ప్రదర్శన చేస్తుంటే

ఒకడు మహా నిరసనగా ఎడతెగని చలి సముద్రాన్ని

బైకు బాకుతో కోసుకుపోతాడు

నల్లటి కాన్వాసుమీద నల్లరంగు బొమ్మేసినట్లు

మనుషులంతా మసక చీకట్లో కలుస్తుంటారు

దీపం చుట్టూ వలయం నర్తిస్తుంది

ఊరి చుట్టూ చలి దుప్పటి ముసురుకుంటుంది

ఐనవాళ్ళు ఆహార్యం మీద అయిష్టంతో

బహుళ అంతస్తుల భవనాలపై నిరసనలతో

నాజూకుల, నాగరీకాల కృత్రిమత్వాలపై విరోధంతో

చలిగాలి మట్టి బిడ్డల దిక్కు మళ్ళుతుంది.

మూలమీద పండ్ల బండి

చౌరస్తాలో రేగుబండ్లు

కరెంటు స్థంభం కింద వేగిన పల్లీ

సాదరంగా ఆహ్వానిస్తై

చలి తల్లి దాక్కునేందుకు కూడా

పేద బతుకులే ఆశ్రయమిస్తై

August 25, 2021 2 comments
2 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

స్వామి వివేకానంద

by - మూర్తి కెవివిఎస్ August 25, 2021
written by - మూర్తి కెవివిఎస్

ఈరోజు వివేకానంద స్వామి వర్ధంతి.ఆధ్యాత్మిక భాష లో చెప్పాలంటే మహా సమాధి లోనికి ప్రవేశించిన రోజు.ఈ సందర్భంగా ఆయన రాసిన ఓ వ్యాసం అనువాదం చేయాలనిపించింది.అది యూరపు ఖండం గురించినది,ఇంకా ముఖ్యం గా చెప్పాలంటే పారిస్ నగరం గురించినది.ఆయన చికాగో ఉపన్యాసం నిమిత్తం అమెరికా కి మాత్రమే  ప్రయాణించినట్లు చాలా మందికి తెలుసు కాని యూరపు లోని పలు దేశాల్లో కూడా ఆ తర్వాత పర్యటించారు. చాలా ఆసక్తికరం గా అనిపించింది. మరి అనువాదం లోపలికి వెళదామా..! సరే…!!

*                 *               *

“అసలు యూరప్ అంటే ఏమిటి..? ఎందుకని నల్లని వారు,కాంస్య,పసుపు రంగుల లో ఉన్నవారు,ఆసియా,ఆఫ్రికా,అమెరికా ఖండాల లో ఉన్న సమస్త నివాసితులు ఈ యూరోపియన్ల కి తలవంచారు..? ఈ కలియుగం లో ఎందుకని వీరు తిరుగులేని పాలకులయ్యారు..? ఈ యూరప్ ని అర్ధం చేసుకోవాలంటే ముందు ఫ్రాన్స్ ని అర్ధం చేసుకోవాలి.అవును దాని ద్వారానే రావాలి. పశ్చిమ దేశాల్లోని ప్రతి సమున్నత భావం ఇక్కడ అత్యున్నత స్థాయిని చేరుకుంది.ప్రపంచాన్ని శాసించే గొప్ప శక్తి యూరప్ అయితే దానిలోని ప్రధాన కేంద్రం పారిస్ నగరం.పాశ్చాత్య సంస్కృతి కి పట్టుగొమ్మ.

యూరపు కి సంబంధించిన నైతిక విషయాలు,మర్యాదలు,ఆచారాలు ఇంకా మంచీ చెడు వెలుగు చీకటి అన్నీ కూడా ఇక్కడ ఫలప్రద దశ ని పొందాయి.ఇది ఒక మహా సముద్రం వంటిది.దీనిలోపల ఎంతో విలువైన వజ్రాలు,పగడాలు,ముత్యాలు ఉన్నాయి.అదే విధంగా భయంకరమైన సముద్రజీవాలు,షార్క్ లు వంటివీ ఉన్నాయి. ఈ ఖండం అంతటికి కర్మ క్షేత్రం వంటిది ఫ్రాన్స్ దేశం.

చిత్తరువు లా తీర్చిదిద్దినట్లు ఉండే దేశం ఇది.మరీ చల్ల గా గానీ,మరీ వేడి గా గానీ ఉండదు.సారవంతమైన నేల.ఆకాశం నిర్మలం గా ఉండి,సూర్యుడు ఎంతో హాయి గా అనిపిస్తాడు. ఓక్,ఎల్మ్ వృక్షాలు విరివిగా ఉంటాయి.గడ్డి భూములు,మనోహరమైన పర్వతాలు, పారే సెలయేళ్ళు ఎంతో అందం గా ఉంటాయి. చైనా లోని కొన్ని ప్రాంతాల్లో తప్పా ఇంత అందమైన దేశాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఆ నీటి లోని సౌందర్యం,ఆ భూమి లోని మోహ భావం,ఆ గాలి లోని వెర్రితనం, ఆ ఆకాశం లోని ఉన్మత్త ఆనందం…ఆహా..!

ధనికులు,పేదలు ఇంకా యువకులు వృద్ధులు అందరూ తమ ఇళ్ళని,గదులని,వీథులని,తోటలని,ఇతర ప్రదేశాల్ని ఎంతో అందం గా,కళాత్మకం గా ఉంచుకుంటారు.మొత్తం దేశం అంతా కూడా చిత్తరువు లా ఉంటుంది. ప్రకృతి పట్ల,కళ పట్ల అటువంటి ప్రేమ ని ఒక్క జపాన్ లో తప్పా ఇంకెక్కడా నేను చూడలేదు.మహా నిర్మాణాలు ,తోటలు ఇంద్రుడి స్వర్గాన్నే తలపిస్తాయి. రైతులు పండిచే ఆ భూముల్లో కూడా…ప్రతి దాంట్లోనూ ఒక కళాత్మకతని ప్రయత్నించి సఫలమయ్యారు.

పారిస్ నగరం యూరపు ఖండ నాగరికత కి అత్యున్నత శిఖరం.గంగా నదికి గోముఖి ఎలాగో అలా.ఆ మహా నగరం ఎల్లవేళలా ఆనందం తో పొంగిపొర్లుతూ భూమి మీద స్వర్గం లా ఉంటుంది.లండన్ లో గాని,బెర్లిన్ లో గాని ఇంకెక్కడ గాని అలాంటి విలాసవంతమైన,ఆనందకరమైన జీవనం మనకి కనబడదు.అయితే ఒకటి నిజం…లండన్ లోనూ,న్యూయార్క్ లోనూ అపారమైన సంపద ఉన్నది.బెర్లిన్ లో గొప్ప జ్ఞాన సంపద ఉన్నది. అయితే వాటిల్లో ఎక్కడా ఫ్రాన్స్ వంటి నేల లేదు,ఫ్రెంచ్ వారిలో ఉండే జీనియస్ లేదు.సమృద్ధి గా ధనం ఉండవచ్చు గాక,జ్ఞానం ఉండవచ్చుగాక,ప్రకృతి సౌందర్యం ఉండవచ్చు గాక…కానీ మనిషి అనే వాడు ఎక్కడ..?

ప్రాచీన గ్రీకు ల యొక్క అంశయే ఈ ఫ్రెంచ్ ప్రజల్లో ఉన్నది. అప్పుడు మరణించి మళ్ళీ వీరి లో మొలకెత్తింది. ఎప్పుడూ సంతోషం గానూ,ఉత్సాహం గానూ ఉంటారు.దేనిపట్ల పట్టింపులేనట్లు గానూ,సిల్లీ గానూ ఉంటారు.మళ్ళీ కొన్నిసార్లు చాలా విచారం గానూ,పట్టింపు ఉన్నట్లు గానూ,ప్రతి పని పట్టుదల తో చేయాలనట్లు గా ఉంటారు.ఏ మాత్రం ఎదురుదెబ్బ వచ్చినా నిరుత్సాహం గా అయిపోతారు.అయితే ఆ నిరుత్సాహం కాసేపు మాత్రమే,మళ్ళీ ఆ ఫ్రెంచ్ వ్యక్తి మొహం కొత్త ఆశ,నమ్మకం తో కళకళ వెలుగులీనుతుంది.

యూరపు లోని యూనివర్సిటీలు అన్నిటికీ పారిస్ యూనివర్సిటీ యే మోడల్ అని చెప్పాలి.ప్రపంచం లోని అన్ని వైజ్ఞానిక అకాడెమీ లు ఫ్రెంచ్ అకాడెమీ కి అనుకరణలే.వలస దేశాల్లో సామ్రాజ్యాల్ని ఏర్పరచడం లో తొలిగురువు ఫ్రాన్స్ దేశమే.మిలటరీ,ఆర్ట్ విషయా ల్లో ఉపయోగించే పదసంపద చాలా వరకు ఫ్రెంచ్ పదాలే.చాలా యూరోపియన్ భాషల్లో ఉపయోగించే శైలీ విలాసం,పద బంధాలు ఫ్రెంచ్ భాష లో నుంచి తీసుకున్నవే.సైన్స్,తత్వశాస్త్రం,కళలు వంటి విషయాల్లో పారిస్ ఒక గని వంటిది అని చెప్పాలి.

ప్రతి చోట ఫ్రెంచ్ వారి నుంచి తీసుకున్న అనుకరణలు కనిపిస్తాయి.ఆయా విషయాల్లో ఫ్రెంచ్ వారు పట్టణ ప్రజలు కాగా మిగతా వారు గ్రామీణులు అనవచ్చు.ఫ్రెంచ్ వాళ్ళు ప్రారంభించినదాన్ని జెర్మన్లు,ఇంగ్లీష్ వాళ్ళు అనుకరిస్తుంటారు.అది యాభై ఏళ్ళ తర్వాత కావచ్చు, ఇరవై ఏళ్ళ తర్వాత కావచ్చు, విద్య లో గాని, సాంఘిక విషయాల్లో గాని, కళ ల్లో గాని…జరిగేది అదే..!

స్కాటిష్ రాజు ఇంగ్లండ్ కి రాజు అయినపుడు ఈ ఫ్రెంచ్ నాగరికత స్కాట్ లాండ్ దాకా పాకింది.అప్పుడు ఇంగ్లాండ్ లో గొప్ప తిరుగుబాటు భావాలు పెల్లుబికినాయి.ఇంగ్లాండ్ లో రాయల్ సొసైటీ లాంటి గొప్ప సంస్థలు స్కాట్ లాండ్ కి చెందిన స్టూవర్ట్ వంశపు రాజులు పాలించిన కాలం లోనే రూపుదిద్దుకున్నవి.

మళ్ళీ ఇంకొకటి,ఫ్రాన్స్ దేశం స్వేఛ్చ కి పుట్టినిల్లు.ఇక్కడ,ఈ పారిస్ నగరం నుంచే ప్రజాశక్తి ప్రవహించి యూరపు లోని పునాదుల్ని కంపింపజేసింది.ఆ రోజు నుంచి యూరపు యొక్క ముఖ చిత్రం మారిపోయి,కొత్త యూరపు ఉనికి లోకి వచ్చింది.స్వేఛ్చ,సమానత్వం,సౌభ్రాతృత్వం అనేవి ఇకమీదట వినిపించవు,కారణం ఇపుడు ఫ్రాన్స్ వేరే భావాల్ని ఇతర లక్ష్యాల నిమిత్తం అనుకరిస్తున్నది.అయితే ఫ్రాన్స్ వెదజల్లిన ఆ విప్లవ భావాలు యూరపు లోని అన్నిదేశాల్లోనూ తమ పని తాము చేసుకుంటూపోతూనే ఉన్నాయి.

ఒకరోజు ఇంగ్లాండ్ కి చెందిన ఓ ప్రసిద్ధ శాస్త్రవేత్త తో మాట్లాడాను. పారిస్ నగరం తో ఏ దేశం సంబంధం పెట్టుకుంటుందో ఆ దేశపు జనుల ప్రగతి లో ఆ మార్పు కనబడుతుంది.ప్రపంచానికి కేంద్ర బిందువు వంటిది అది అని ఆయన చెప్పాడు.వినడానికి కొంత అతిశయోక్తి లా ఉన్నా కొంత నిజమూ లేకపోలేదు. ఎవరు ప్రపంచానికి ఏ కొత్త భావాన్ని ఇవ్వాలన్నా పారిస్ చాలా అనువైన ప్రదేశం.

పారిస్ ఒక విషయాన్ని అంగీకరించిందంటే చాలు,మొత్తం యూరప్ అంతా కూడా దాన్ని ఆమోదిస్తుంది.ఒక శిల్పి,చిత్రకారుడు,సంగీతకారుడు,నృత్యకారుడు ఇంకా ఏ కళాకారుడు గాని మొదట పారిస్ లో పేరు తెచ్చుకోగలిగితే మిగతా అన్ని దేశాల్లో అతడు కీర్తిని గౌరవాల్ని పొందుతాడు.

మనదేశం లో పారిస్ నగరం యొక్క చీకటి కోణాన్ని మాత్రమే ప్రచారం చేశారు.అది భయంకరమైన ప్రదేశమని,భూలోక నరకమని..! కొంతమంది ఇంగ్లీష్ జాతీయుల అభిప్రాయం అది.ఇంద్రియ సుఖాలు తప్పా మరేది లేదనుకునే కొంతమంది ధనికులకి,సహజం గానే పారిస్ అంటే భోగ సంస్కృతి కి పర్యాపదం లా కనిపిస్తుంది.

పశ్చిమ దేశాల్లోని అన్ని పెద్ద నగరాల్లోనూ ఇవి సహజమే.అది లండన్,బెర్లిన్,న్యూయార్క్ ఏదైనా గానీ.అయితే తేడా ఏమిటంటే,మిగతా దేశాల్లో ఈ ఇంద్రియ సుఖాలు పొందే విధానాలు చాలా వల్గర్ గా ఉంటాయి. పారిస్ లోని దుమ్ము సైతం బంగారు ఆకుల తో కప్పినట్టుగా ఉంటుంది.మిగతా నగరాల్లోని విధానాలు బురద లో పొర్లాడే పంది లా ఉంటే,పారిస్ లో విధానాలు నెమలి సుతారం గా పింఛం విప్పి ఆడినట్లుగా ఉంటుంది.

సంతోషం గా, ఆనంద జీవనం గడపాలని ఏ దేశం మాత్రం కోరుకోదు..? అలా కానట్లయితే పలు ప్రదేశాలనుంచి ధనికులు అంతా ఇక్కడికి, ఈ పారిస్ కి ఎందుకు వస్తున్నట్లు..? ఎందుకని గొప్ప చక్రవర్తులు,రాజులు మారుపేర్ల తో ఇక్కడ నివసిస్తూ ఇంద్రియ సుఖాల్లో ఓలలాడుతుంటారు..?ప్రతి దేశం లోనూ ఎవరైనా సుఖమే గదా కొరుకునేది,తేడా ఏమిటంటే ఫ్రెంచ్ వాళ్ళు సుఖం పొందే విధానాల్ని ఒక సైన్స్ లా అభివృద్ధి చెసుకున్నారు.ఈ నిచ్చెన లో వాళ్ళు బాగా పై స్థాయి కి చేరుకున్నారు.

 

 

 

August 25, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఆ వరండాలు

by Jwalitha August 25, 2021
written by Jwalitha

నేనొక లాంతరు పట్టుకుని
ఆ వరండాలలో నడుస్తూంటాను

పగిలిన స్లాబు నుండి కిందకు జారుతున్న నీటి బొట్లను వింటూ

పర్వతపు లోతుల్లో
పక్షిగూళ్ళలల్లో,
నా స్నేహితుల ఎడదల్లో నా నడక,

వారివి పాలరాతి కళ్ళు.
వెలుతురు నీడలు మాత్రమే చూడగలం
వారి ముఖాల మీద
జీవితం విసిరిన దుఃఖపు ఛాయలు.

చీకటి లోపలికి దారితీసే
దట్టమైన ప్రదేశానికి నా నడక,
ఏ శక్తులు లేని చోట,

నా అడుగుల ప్రతిధ్వని మాత్రమే…

కందిలి వెలుతురు అంతమయ్యే వరకూ నా నడక
విధి వశాత్తు అపరిచిత మలుపులో
నేను  శిలగా మారుతాను.

కానీ ప్రవేశద్వారం వద్ద, కొండచరియలు విరిగి
దారి మూతబడిందని
త్వరగా మరచిపోయాను,

ఒక సతతహరితారణ్యంలో
హిమనీనదం నుండి
సెలఏరు పారే చోట
ఆడజింక ఒకటి
తన మచ్చలకూనకు జన్మనిస్తుంది

మలయ మారుతం హఠాత్తుగా
చిక్కని ఆకుల ఉడతలను ఎగురవేస్తుంది,
అందరిలాగే నేనూ చూస్తూంటాను

ఉదయపు ప్రతి ఆనందాన్ని తిరిగి పొందుతాను ,
పొడవైన పండ్ల తోటలలోని
ప్రతి యాపిల్ రుచిని నేను ఆస్వాదిస్తాను
కాబట్టి నేను ప్రేమించిన ప్రతిదానిని
నేను ప్రశాంతంగా వదిలివేయగలను.

భూమి జలచరాలతో పాటు వంపు తిరిగిన మద్యం పాత్రలను,
ఇత్తడి షాన్డిలియర్లను మోస్తుంది.

ఎప్పుడో ఒక రోజు
కుక్కలు ఎలుగుబంటిని వెంటాడుతున్నప్పుడు
మంచునేల పై పగళ్ళు తెరుచుకుంటున్నప్పుడు

తరతరాల ప్రజలు
గోడలపై క్షీణించిన
మన అక్షరాలను అర్థంచేసుకుంటారు

పనికిరాని రాజభవనం
చాలా అల్పమైనదని

వారి స్వంత ఆనందాలెన్నో
మేము ఎరుగుదుమని తెలుసుకొని
ఆశ్చర్యపోతారు వారు.

(ఒరెగాన్-బర్కిలీ, 1964)

English poem by : Czeslaw Milosz (జెస్లో మిలోస్)

THOSE CORRIDORS

I walk those corridors by torchlight Hearing water trickle down onto broken

Deep into the mountain. In niches, busts of my friends, Their eyes are of marble. Only the light and shadow Throw over their faces a brief sour grimace of life.

So, farther into the labyrinth leading to the dark interior, Where there are no kobolds, only the echo of my steps. Until the torch gutters out, and on the unknown bend Where it is fated, I will turn to stone.

But at the entrance, blocked by a landslide and soon forgotm In a fir forest by a stream falling from a glacier, A doe will give birth to her freckled fawn and the air

Will unfurl intricate leafy spirals to other eyes, as once to m

And every joy of morning will be discovered again, Each savoring of an apple picked in the tall orchard.

So I can leave peacefully everything I loved.

The earth will carry aqueducts, amphoras, brass chandelier

And when some day dogs chasing a bear

Burst into a crevasse and people of far-off generations Decipher our angular letters on the walls

They will be amazed that we knew so many of their own Though our futile palace has come to mean so little.

Oregon-Berkeley, 1964

“మీరు తప్పు చేశారు”

ఒక సామాన్యునికి అన్యాయం చేసిన మీరు
నేరాన్ని చూసి అట్టహాసంగా నవ్వుతారు
మంచి చెడును కలగాపులగం చేసి
విచక్షణా పంక్తిని మసగ పరిచేందుకు
మీ చుట్టూ మపు గుంపును ఉంచుకుంటారు

ప్రతి ఒక్కరూ మీ ముందు నమస్కరించినప్పటికీ
ధర్మం వివేకం మీకు కలగాలని వారంటారు,
మీ గౌరవార్థం బంగారు పతకాలను పొందిన తర్వాత
మరో రోజు గడిపినందుకు సంతోషిస్తారు

సురక్షితంగా ఉన్నామనుకోకండీ,
కవి గుర్తుంచుకుంటాడు అన్నీ
మీరు ఒకరిని చంపవచ్చు, కాని మరొకరు పుడతారు
తేదీల వేసి రాసిన ఒప్పందం ఇది

ఒక శీతాకాలపు ఉషోదయాన
ఒక మంచి పని చేస్తారు మీరు,
ఒక చెట్టుకొమ్మ వంగి పోయేలా
ఉరితాడు కట్టుకొని వేలాడుతారు

(వాషింగ్టన్, D.C., 1950)
English poem by : Czeslaw Milosz (జెస్లా మిలోస్జ్)

YOU WHO WRONGED

You who wronged a simple man Bursting into laughter at the crime, And kept a pack of fools around you To mix good and evil, to blur the line,

Though everyone bowed down before Saying virtue and wisdom lit your way, Striking gold medals in your honor, Glad to have survived another day, you,

Do not feel safe. The poet remembers. You can kill one, but another is born. The words are written down, the deed, the date.

And you’d have done better with a winter dawn, A rope, and a branch bowed beneath your weight.

Washington, D.C., 1950

చెస్లా మిలోజ్

“చెస్లా మిలోజ్’ ఒక పోలిష్-అమెరికన్ కవి, గద్య రచయిత, అనువాదకుడు దౌత్యవేత్త.
20 వ శతాబ్దపు గొప్ప కవులలో ఒకడిగా గుర్తించబడ్డాడు. అతను 1980లో సాహిత్యానికి నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. ( కవిత్వం లో నోబుల్ బహుమతి పొందిన మొదటి పోలాండ్ కవి ఇతనే). ఆ ప్రస్తావనలో, స్వీడిష్ అకాడమీ మిలోజ్ గురించి” ప్రపంచంలో మనిషి ఎదుర్కొన్న తీవ్రమైన సంఘర్షణలను బహిర్గతం చేసిన గొప్ప కవి” అని ప్రశంసించింది.

చెస్లా మిలోజ్ సెటెనల్, కౌనో గవర్నరేట్, రష్యన్ సామ్రాజ్యం లో 30 జూన్ 1911లో జన్మించాడు

14 ఆగస్టు 2004 (వయసు 93) క్రాకోవ్, పోలాండ్లో మరణించాడు.

ముఖ్యమైన రచనలు :
రెస్క్యూ -1945,  ద కాప్టివ్ మైండ్ – 1953,  ఎ ట్రేటైస్ ఆన్ పోయెట్రీ- 1957

భార్య పేర్లు: జనీన మిలోజ్ (1956-1986),  కరోల్ తిజ్పిన్(1992-2002)

సంతానం: ఆంథోనీ,  జాన్ పీటర్

చెస్లా మిలోజ్ కొడుకు ఆంథోని తన తండ్రి కవితలను కొన్నింటిని ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. చెస్లా మిలోజ్ సోదరుడు ఆండ్రజ్ మిలోస్ (1917- 2002) కూడా సాహితీవేత్తే. అతడు పోలిష్ జర్నలిస్ట్, అనువాదకుడు, డాక్యుమెంటరీ చిత్రనిర్మాత. మిలోజ్ రెండవ ప్రపంచ యుద్ధంలో వార్సాపై జర్మన్ ఆక్రమణ నుండి బయటపడి , యుద్ధానంతర కాలంలో పోలిష్ ప్రభుత్వానికి సాంస్కృతిక అనుబంధకర్తగా మారాడు. కమ్యూనిస్ట్ అధికారులు అతనిని బెదిరించినప్పుడు, అతను ఫ్రాన్స్ కు వెళ్ళాడు. యునైటెడ్ స్టేట్స్ లో బహిష్కరణను ఎదుర్కొన్నాడు. అక్కడ అతను బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయ్యాడు. అతని కవితలు ముఖ్యంగా అతని యుద్ధకాల అనుభవం గురించి వ్యక్తపరిచాయి. ‘ది క్యాప్టివ్ మైండ్’ అనే గద్యరచన స్టాలినిజం గురించి ఆయన చేసిన , ఒక ప్రముఖ వలస కళాకారుడిగా, మేధావిగా అతనికి పేరు తెచ్చి పెట్టింది.  జీవితమంతా మినోజ్  తన రచనలలో నైతిక విలువలు, రాజకీయాలు, చరిత్ర, విశ్వాసం వంటి అంశాలపై ప్రశ్నలను విశ్లేషించాడు. అనువాదకుడిగా, అతను పాశ్చాత్య రచనలను పోలిష్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు,  పండితుడిగా సంపాదకుడిగా, పశ్చిమ దేశాలలో స్లావిక్ సాహిత్యంపై ఎక్కువ అవగాహన సాధించాడు.

మిలోజ్ 2004 లో పోలాండ్‌లోని క్రాకోవ్‌లో మరణించాడు. పోలాండ్‌లో ప్రసిద్ధ ధ్రువాలకు గౌరవ ప్రదేశంగా పిలువబడే చర్చి అయిన ‘స్కాల్కా’లోవిశ్లేషణ అతన్ని ఖననం చేశారు.

సాహిత్యంలో నోబెల్ బహుమతితో పాటు, మిలోస్ ఈ క్రింది అవార్డులను అందుకున్నారు:

పోలిష్ PEN అనువాద బహుమతి (1974) ,  గుగ్గెన్‌హీమ్ ఫెలోషిప్ ఫర్ క్రియేటివ్ ఆర్ట్స్ (1976),  న్యూస్టాడ్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ (1978),  నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ (యునైటెడ్ స్టేట్స్ 1989)

రాబర్ట్ కిర్ష్ అవార్డు (1990)

ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగిల్ (పోలాండ్, 1994)

మిలోజ్ మిచిగాన్ విశ్వవిద్యాలయం, ఓక్లహోమా విశ్వవిద్యాలయంతో సహా అనేక సంస్థలలో విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్ గా పేరు పొందారు. అక్కడ అతను 1999 లో పుటర్‌బాగ్ ఫెలోగా ఉన్నారు. అతను అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, లో ఎన్నికైన సభ్యుడు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ , మరియు సెర్బియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్లలో 1971లో అతను హార్వర్డ్ నుండి గౌరవ డాక్టరేట్లను పొందాడు.

1992 లో లిథువేనియాలో మిలోస్జ్ గౌరవార్థం  అతని జన్మస్థలాన్ని మ్యూజియం, సమావేశ కేంద్రంగా మార్చారు.  1993 లో, అతన్ని క్రాకోవ్ గౌరవ పౌరుడిగా చేశారు.   ఆయన పుస్తకాలకు అనేక అవార్డులు వచ్చాయి.

*  అతని మొదటి పుస్తకం ‘ఎ పోయమ్ ఆన్ ఫ్రోజెన్ టైమ్’కు విల్నోలోని పోలిష్ రైటర్స్ యూనియన్ నుండి అవార్డును లభించిందది.

* ది సీజర్ ఆఫ్ పవర్ ప్రిక్స్ లిట్టరైర్ యూరోపీన్ (యూరోపియన్ లిటరరీ ప్రైజ్) ను పొందింది.

*”రోడ్ సైడ్ డాగ్’ సేకరణ పోలాండ్లో నైక్ అవార్డును అందుకుంది.

*1989 లో, మినోస్జ్ రెండవ ప్రపంచ యుద్ధంలో వార్సాలో యూదులను రక్షించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను గుర్తించి, హోలోకాస్ట్‌కు ఇజ్రాయెల్ యొక్క యాడ్ వాషెం స్మారక చిహ్నంలో “రైటియస్ అమాంగ్ ది నేషన్స్”గా పేర్కొన్నారు.

మిలోజ్  మరణానంతరం కూడా గౌరవించబడ్డాడు. పోలిష్ పార్లమెంట్  ఆయన నూరవ జయంతి 2011వ సంవత్సరాన్ని “మిలోజ్ ఇయర్” గా ప్రకటించింది. ఇది పోలాండ్ అంతటా, న్యూయార్క్ నగరంలో, యేల్ విశ్వవిద్యాలయంలో, డబ్లిన్ రైటర్స్ ఫెస్టివల్‌లో, అనేక ఇతర ప్రదేశాలలో సమావేశాలు మరియు నివాళి ద్వారా గుర్తించారు. అదే సంవత్సరం అతని పేరున లిథువేనియన్ తపాలా స్టాంపు విడుదల చేశారు.  పారిస్ సమీపంలో వీధులకు అతని పేరు పెట్టారు. విల్నియస్, పోలిష్ నగరాలైన క్రాకోవ్, గ్డాన్స్క్, బియాస్టాక్, పోజ్నాస్, వ్రోకావ్ లలో అతని పేరున ‘మిలోజ్  స్క్వేర్’ లు ఉన్నాయి.  2013 లో, విల్నియస్ లోని ఒక ప్రాధమిక పాఠశాలను మిలోజ్ స్మారకంగా   పెట్టారు.

August 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us