మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

అమ్మాయి – ఆయుధ పాణి . . .

by రాఘవాచార్య‌ October 24, 2021
written by రాఘవాచార్య‌

చోద్యం ! శిక్షలు ఎంతో సరలమై
నేరస్థుడి దోషాలు మాఘవేసినట్లే ఉంటాయి
ముఖం పై ఏ మాత్రం భయం సెగ ఉండదు
రిమాండులు కోర్టులు చెరసాలలూ
కీచకులకు సేదగా ఒయసిస్సులేనేమో
శిక్షా కాలంలోనూ గుడ్లు మాంసం తింటూ
అత్తవారిల్లు వైభవంగా గోవా ఊటిలాగే జైల్లా !!

శిక్షలు ఎంత సుఖమో !
శిక్షా స్మృతులు రాసేవారికి
ఆడ పడుచులున్నారా ??
శోధనగా మా ఆవేదనా ప్రకరణము

అల్లా ! మీ దేశాలలోని శిక్షలే శిక్షలు
అమ్మాయిల పై చేయి వేయడానికి
మరణ భయంతో వెనుకంజ వేసి
అక్కడికక్కడే పక్షవాతం వచ్చి పడిపోతారు
ఖబరస్తాన్ వాడి అడ్రస్

అసలు న్యాయంగా
వీధి వీధికి ఉరితాడు వేలాడుతూ
మదన కామరాజులకు అనగొండ దృశ్యం కావాలి
తల్లులు తమ  కొడుకు పెరుగుతుంటే
గల్లీలోని ఉరితాడును
చూపుడు వేలితో ముక్కు సూటిగా చూపించి
గుణ పాఠాలు చెప్పాలి  మరి మరీ
వాడికి భవిష్యత్తు దర్శనంగా !!

పగలైతేనేం అర్ధరాత్రి ఐతేనేం
సిక్కు వీరుల్లా మా అమ్మాయిలు
ఎక్కడైనా ఖడ్గాలు ధరించిన
వైనమే వైభవమే కావాలి మరి
స్వీయ చరిత్రకు స్వీయ రక్షణ

తల్లులూ ! వంటింట్లో రుచికరంగా
పరాటాలు చేయడమే కాదు
చేతి వాటంగా కరాటే చేయాల్సిందే
దెబ్బకు సీసా మత్తు దిగి
శాశ్వతంగా మగ పుట్వడిని మరువాల్సిందే

ఇక అమ్మాయి అంటే ఆయుధ పాణిగా
మనకెంతో నిర్భయం నిమ్మలం

October 24, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

నీపై నాకా నమ్మకముంది..

by Urimalla Sunannda October 24, 2021
written by Urimalla Sunannda

వేలు పట్టుకుని నీతో నేను నడవాలని
నీ గొప్పతనం తెలిసినప్పటి నుంచీ కోరిక
అదేమిటో అసహనమో
ఆధిపత్యమో
ఇలా విదిలించుకుని అలా
గోడకు వేలాడే క్యాలెండర్
చెట్టువై
ఒడిసిపట్టుకుందామనుకున్న
రోజుల ఆకుల్ని విదిలిస్తూ వదిలేస్తూ
నవ్వుతూ
ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోతావు..

నేననుకుంటాను..
నీతో నేను ఆగకుండా నడిచి
జయించిన విజయాలేవో గతం సంచిలో
అపురూపంగా దాచుకుని
మురుద్దామనీ..

చేయి ఎప్పుడు వదుల్తావో తెలీదు
ఓ బద్దక నేస్తం నాతో ముచ్చటించినప్పుడో
ఓ నిర్లక్ష్యం నన్ను నీడలా వెంటాడి లోబరుచుకున్నప్పుడో…

కనీసం ఓ హెచ్చరిక అలారమైనా మోగించకుండా
నన్ను మోసగించి వెళుతూ ఉంటావని ఉక్రోషంతో..

అంతరంగం ముందు నిన్ను నిలదీయిస్తే
ప్రభాత కిరణాల సాక్షిగా
నిశీధి వెలిగే చుక్కల ముందు
చిత్రంగా నన్నే దోషిని చేస్తావు…

నాకంటూ ఓ రోజు రాకపోతుందా
ఏకాగ్రతతో నిన్నే ధ్యానిస్తే
ఏమరుపాటుగా నైనా నిన్ను వదలకుండా ఉంటే…

ఏదో ఒకటి సాధించి
రాలిపోయే రోజుపై చెరగని సంతకమొకటి చేయకపోతానా
నీవిచ్చిన ఈ తరపు కానుకనై మిగలక పోతానా..
కాలమా!…అప్పుడు నువ్వే
నా జయంతినో వర్ధంతినో
కొందరికైనా గుర్తొచ్చేలా చేస్తావు..
నీపై నాకా నమ్మకం ఉంది

 

October 24, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

వేప చెట్టు కింద

by Sridhar reddy Billa October 24, 2021
written by Sridhar reddy Billa

పేరుకు ఇల్లే గానీ

పగిలిపోయిన పెంకులు పేర్చినట్టు

రెండు గదుల పెంకుటిల్లు.

దాని ముందరొక  వేప చెట్టు!

బుడి బుడి అడుగుల బుడ్డోడిగా,

వేప మండకు వేలాడిన ఉయ్యాలలో

ఊగుతూ  కేరింతలు కొట్టాడు.

వేప చెట్టు కింద!

పదేళ్ల పడుచు పిల్లోడిగా

పక్కింటి  పిల్లోళ్లతో

గుండాలు గీసి, గుంతలు జేసి

గోళీలు గురిచూసికొడుతూ గెంతులేసాడు.

వేప చెట్టు కింద!

ఇరవైయేళ్ళ పరువంలో

ఉదయాన్నే వేపపుల్ల వేసి నములుతూ

పక్కింటి ఆసామి పేపరు పట్టుకొచ్చి

అక్షరాలనన్ని అరిగించుకున్నాడు.

వేప చెట్టు కింద!

ఊరి యువకులను పిలిచి

నడిరేయి దాకా

సమసమాజ మంటూ

సామ్యవాదమంటూ

ఉపన్యాసాలతో ఉర్రూతలూపాడు.

వేప చెట్టు కింద!

ఇపుడు తనకొక ఇల్లాలు

బోసినవ్వుల ఓ బుడ్డోడు.

పనికి పోయి వచ్చి

మధ్యాహ్నమంతా మంచంపైనే  కునుకు.

వేప చెట్టు కింద!

కొడుకు పెండ్లికి

ఊరంతటిని పిలిచాడు

ఉడుకు ఉడుకు భోజనాలు పెట్టించాడు

ఊరంతా ఆరగించారు.

వేపచెట్టు కింద !

ముసలివాడై పోయాడు.

రోజూ భగవన్నామ స్మరణ

మనవడితో కాసేపు

ముసలోళ్లతో కాసేపు కాలక్షేపం.

వేప చెట్టు కింద!

ఓ రోజు పొద్దున

లేపబోతే లేవలేదు

ఊరంతా వచ్చి చేరారు.

చితి పేర్చటం కోసం

చెట్టు మండనొకటి నరకాలన్నారు.

వేప చెట్టు కింద !

దినాలు గడిచాయి .

మరొక మండపై

మనవడు ఉయ్యాలూగుతున్నాడు

మరో జీవితమారంభమైంది

వేప చెట్టు కింద !

October 24, 2021 1 comment
2 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆలోచనల  విస్పోటనం

by Khadar basha October 24, 2021
written by Khadar basha
“ఆలోచనల అగ్నిపర్వతం బద్దలైంది/”
“నా లో నేనే ప్రశ్నించుకున్నా/”
అద్భుతమైన ఈ భూ మండలంలో
పచ్చగపరిచిన ప్రకృతిని
తోడుగా నీ సహజీవులతో
బతుకు వెళ్ళదీస్తున్ననీవు
నాది నాదంటున్నావేమిటి!!
బాటసారివి కదా నీవు?
నీ పుట్టుక కోందరికి అనందాన్నిస్తుంది
నీ గిట్టుక విషాదంలోకి ముంచేస్తుంది
పుట్టినప్పుడు ఏమి తీసుకునిరావు
పోయేటపుడు ఏమి తీసుకోనిపోవు
నిన్ను మహత్ముని చేసేది అత్మస్వరూపమే
నిన్ను ముర్కుడిగా చేసేది అహంకారమే
మంచి ప్రవర్తన నిర్థేశించేదే విధేయత/”
చెడు ప్రవర్తనను నిర్థేశించేదే అవిధేయత/”
అంతరాంతరాలలో జ్వలించే లావా నీ ఆలోచనే/
అత్యన్నత స్థాయికి ఎదగాలన్న ఆలోచనే /
అధఃపాతాళానికి దిగజారాలన్న నీచెతల్లోనే
చేతానవస్థలో నున్న నీ వ్యక్తిత్వం
సుప్తచేతనావస్థతో  సుసంపన్నం
నీ శరీరం నీ మనసుకు బానిస
మనసులోని తెల్లని ఆలోచనలు వికాస
“కర్త నేనేనంటే దానవుడు/”
“కర్త నేను కాదంటే  మానవుడు/”
“మనసు నిన్నధిగమిస్తే అసంపూర్ణం/”
“మనస్సుపై నీ అధిపత్యం జీవితం సంపూర్ణం/”
తరచి తరచి చూస్తే ఇప్పటికి నువు సాధించేదేంలేదు/
కరోనా నిన్ను బంధిస్తే విలవిలలాడిపోయావు కదు/
“ఓ మనిషి మానవత్వవిలువలు కాపాడు/”
“సమాజ సంక్షేమానికి సహయపడు/
నీ అత్మసాక్షిగా ప్రశ్నించుకో?
నీ శరీరం వదిలి వెళ్ళాలిగా
నీవీక్కడ బాటసారివేగా!!!!
October 24, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మనిషిలా బతికితే

by Dr. T Radhakrishnamacharyulu October 24, 2021
written by Dr. T Radhakrishnamacharyulu
బతుకులో దుఃఖాన్ని దాచుకున్నా
మనిషిగా సంతోషాన్ని అందించాను
లోకానికి
కానీ మూఢుడు విషం చిమ్మిండు
తనలోని రాక్షసత్వం నిద్ర లేచినప్పుడు
మనసు వెన్నలా ధారపోసింది అంతా
రాయిలాంటి నిన్ను వెన్నంటి నడిచా
హాయిగా నిద్రలోకి జారావు నిండుగా
రాయి కరిగింది మంచి మాటకు
కానీ మనిషే మారలేదు అసలు రూపుకు
బహుశా ప్రకృతిలో మట్టి మారిందేమో!
నేను మనిషిగానే బతుకుతా
ఎవరు పొగిడినా మరి తెగిడినా
కవరూ కలరింగూ పనిలేకుండా
పవరూ పొగడ్తల యావలేకుండా
మెత్తని చేతులు రాసే కొత్త కవిత్వంలా
 గుండె హత్తుకుంది నిండుగా గొంతును
నునువెచ్చని ఎర్రనదిలా
నడక సాగుతూనే ఉంది నాలో
ఆకుపచ్చని తోట పిలుస్తుంది
నా  మిత్రుల తడార్పే ఎడారి నీటికై
డా.టి.రాధాకృష్ణమాచార్యులు
9849305871
October 24, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బ్రతుకుటెట్ల…..

by Madugula Muralidhara Sharma October 24, 2021
written by Madugula Muralidhara Sharma

బ్రతుకుటెట్లనుచును* భయపడుటేలకో? పక్షిగూడునువీడి* బయలు దేరి! గింజలు వెతుకుచు* గెంతుచు పోవును! వానిజాడనెరుగు* వరకు వేగ! జీవన మందును* చేయూత కోరతు! యత్నమ్ము చేయుము* యాతననక! ఊరపిచ్చుకతీరు* ఉబలాటపడుచుండ! అన్నపానాదులు* నందగలరు! జీవసత్యమ్ముపిచ్చుక* జీవితమ్ము! యత్నమును జేయ తెలియునా* హారపథము! సాధనమ్మున సమకూరు* సత్ఫలితము! జీవితమ్మననిదియెగా* చివరివరకు!

October 24, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆపరేషన్

by Ammangi Venugopal October 24, 2021
written by Ammangi Venugopal

ఈ దేహం ఒక వ్యవస్థ అనుక్షణం దానితో అవస్థ

‘ఇక్కడికి రా నాన్నా’ కొడుకు పిలుపు

స్నానాల గదికి పోలేనివాడు సముద్రాలు దాటగలడా?

పక్కింటి పిల్లలే నీ బర్త్ డే చేస్తారు

కొవ్వొత్తి ఆర్పి కేక్ లోకి చాకు దించుతుంటే

ఏవేవో భావాలు

క్రమంగా జబ్బు గ్రహణమవుతుంది

‘ఆపరేషన్’ అంటాడు డాక్టర్

నీ గదిలో ఫినాయిల్ వాసన గుప్పుమంటుంది

మేకప్ చేసుకున్న మేకపోతు గాంభీర్యం

నీరు కారిపోతుంది

కళ్ళుమూస్తే పాపం చచ్చిపోయిన వాళ్ళంతా

కలలో క్యూ కడుతున్నారు

ఆపరేషన్ థియేటర్ లోకి అడుగుపెట్టగానే

కోడి రెక్కల టపటపలా గుండె దడ

ప్రాణభయం ఉదాసీనంగా మొదలై ఉధృతమవుతుంది

మణికట్టుమీద శరీరంలోకి రహదారి పరుస్తారు

రక్తం బొట్టు బొట్టుగా దేహంలో కలుస్తుంటే

నీ రక్తాన్ని నువ్వే తాగుతున్న భ్రాంతి

ముక్కుతో పొడిచి షుగర్ ను కొలిచి

వడ్రంగి పిట్టలా ఎగిరిపోతుంది గ్లూకోమీటర్

ఆక్సీజన్ పైపు దేహాన్నో బెలూన్ను చేస్తుంది

మెత్తగా మత్తుసూది దిగుతుంది

కత్తులు కత్తెర్లు కాసేపు సర్జన్ చేతులవుతాయి

‘ఆపరేషన్ సక్సెస్’ అన్న అభినందనతో

రాలబోతున్న పువ్వును

అంటుపెట్టుకుంటుంది ఆశాలత

ఐసియు అజ్ఞాతవాసంలో కూడా

గాయంమీద కుట్టుమిషన్ నడుస్తూనే ఉంటుంది

మగత నిద్రలో ఎవరో పిలిచినట్లనిపిస్తే

మూగరోదన దైవస్మరణ ఫలించి

నీ వాళ్లు వచ్చారని భ్రమపడతావు

వాళ్ళు నీ పక్క పేషంట్ కొడుకు కోడలు

ఆమె చంకలోని పాప ‘తాతా’ అని పిలుస్తూ

ఎత్తుకొమ్మని నీకు చేతులందిస్తుంది

పోయిన ప్రాణం లేచి వస్తుంది

నీ జీవితం లెక్కలో మిగిలిన కాలం రెట్టింపవుతుంది!

 

 

October 24, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

భవిష్యత్తు భారతం

by Nakka Harikrishna October 24, 2021
written by Nakka Harikrishna
యాంత్రిక మనస్తత్వాల
అమానవీయ వలయాలు
ఆహాకార ఆర్తనాదాల నడుమ
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
ఉయ్యాలలో పసిపాప నవ్వుతో
రోడ్డుపక్క చెట్టు కొమ్మకు వేలాడుతూ
వాహన ధూళి మేఘాల మధ్య
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
కన్న కడుపుకు కనే కడుపు బరువెక్కింది
కాలువ మురుగు నీళ్లను మింగి
కళ్లు తేలేసిన శిశువు అంతరంగంలో
ఈ దేశ భవిష్యత్తు భావనలు ?
*
కాలుష్య కోరల ఖనన క్రియ
ఖలుని చూపుల్లో జనవనం
ఊపిరి ఉరికొయ్యలలో
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
నెత్తుటి గీతాలాపనలో
తుపాకుల రాజ్యస్థాపన
గుండెల మీద దిగిన కత్తులలో
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
వృద్ధాశ్రమ కూపంలో
జీవితదాతల నిట్టూర్పులు
విలువలు చిలువలు చేసే చేతులలో
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
ధనామోహపు దారుల వెంట
మోసపు కళ్ళ మనిషి ప్రయాణం
అవకాశవాదుల ఉచ్చుల మధ్య
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
*
నగరాల వెంట అనాగరికుడై
నేలతల్లి గౌరవాన్ని మంటగలుపుతున్నాడు
మాతృదేశ జెండాకే జై కొట్టనివానిలో
ఈ దేశపు భవిష్యత్తు భావనలు ?
October 24, 2021 2 comments
3 FacebookTwitterPinterestEmail
కవితలు

” ఆశల తోవలు “

by Ravinder konda October 24, 2021
written by Ravinder konda

మబ్బుల్ని మింగిన ఆకాశం

నెత్తురొడ్డిన జాతీయ రహదారిలా..

సెగలు కక్కుతోంది!

బారెడు పొద్దుతో-నిద్దుర లేసిన

బలిసిన అంబోతులు

ఆకలితో అరుస్తుంటే..

బక్కచిక్కిన ఎండిన డొక్కలు

ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని

బతుకులు నెట్టుకొస్తున్నారు!!

 

రోడ్డు పక్కన పూరిగుడిసెలో..

తొంబదేళ్ల పండు ముసలవ్వ

కుక్కి మంచం పై.. ములుగుతూ

రాని చావుకోసం ఎదిరిచూస్తుంటే

ఎవ్వరు లేని అనాధకు అన్ని తానై..

శునకమొక్కటి అవ్వకు ఓదార్పునిస్తుంటే..!

ఎంగిలి మెతుకులు తిన్న..

మమకారమో !.. తోకాడిస్తూ..

దారేంటూ పోయే వారిని చూసి

చొంగ కారుస్తూ.. బేల మొఖం తో

ఆర్థిస్తుంటే.. అవ్వకోసం. ఆ గుడిసె

తలుపులను గుడి గంటలా

మోగిస్తుంది!

 

కలల్ని తరిమిన నిదుర మత్తు

పొద్దు పొడిచేటప్పటికి

ఆశల తోవలు దున్నిందేమో..

రాతిరి కురిసిన వానకి

చిత్తడయిన పంట కల్లంలో

ఆరబెట్టిన ధాన్య రాసులు

తడిసి ముద్దయి కన్నీళ్లు

రాలుస్తున్నాయి!

వున్నోడిని వదిలి

కాయకష్టం నమ్ముకునోన్ని

నట్టేట్ట ముంచడం కాలానికి

అలవాటైపోయిందేమో..

ఏడాదంతా ఎదిరిచూసిన

ప్రతిఫలానికి.. ఆకలి చావులు

బహుకరించి చల్లగా జారుకొంది!!

 

నిర్మలమైన ఆకాశం..

నిప్పుల రాజుకోవడం..

పచ్చని అడవిని ధ్వంసం చేసి

కాసుల గనుల కక్కుర్తికీ

బహుళ జాతులకు తాకట్టు

పెట్టి..ఉసురు తీసినందుకో మరి!!

ఉన్నప్పుడు జలగలా పీడించి

ఉన్నందంతా దోచుకొని అనాధల

వదిలేసి.. బాధ్యతలు మరిచిన

మనిషికన్నా..అప్పుడప్పుడు

విదిలించిన పిడికెడు మెతుకులకు

ప్రేమను ఓలకపోసిన.. తనకన్నా

జంతువే నయమని తెలిసి..

మనిషిగా సిగ్గుపడాలి మరి!!

రాత్రి పగలు తేడాలేని..

కాలం తో పోటీపడి..

నల్గురికి కడుపునింపే

అన్నదాత.. శోకవిహీనుడై

అలమటిస్తుంటే.. ఆదు కోవాల్సిన

అధికారం.. మీనామీషాలు

లెక్కిస్తుంటే . ప్రకృతి చేసే

గారడీ ఆటకి బలిపశువులయ్యే

అమాయకులకు ఆశల తోవాల్ని

అడ్డుపెట్టి మనస్సు గాయాలకు

పథకాల లేపనం పూసి..

అడుక్కొనే బానిస బతుకులను

చేసి..ఓట్లు వేసే మరమనుషులు గా

మార్చి.. మానవత్వం మరిచిపోయి..

మనుసుల మనుషుల మధ్య

 

కుల మత ప్రాంతీయ బేధాలు

రగిల్చి రావణ కాష్టం చేస్తుంటే..

ఇక జాలి దయ కరుణ లు

వదిలి.. వాస్తవం లో

మనిషి జీవించినప్పుడే..

స్వయం సమృద్ధి వైపు

అడుగులేస్తాడు..! మనసు

పొరల్లో ప్రేమ అనురాగాలు

చిగురింపచేసి . పర్యావరణ

పరిరక్షణ కు..

నడుము కడతాడు..!

స్వార్థ పరుల కొమ్ములు వంచి

తెగిపోయిన బంధాలకు..

ఆత్మీయ అన్వేషణ చేయ

కొడగట్టిన బతుకు దీపం

వొత్తికీ ఆశల తోవలా

చమురు పోసి రేపటి

నవోదయానికి

పురుడు పోస్తాడు..!!

 

 

†********

రవీందర్ కొండ

9848408612

ఆల్వాల్, హైదరాబాద్

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆమె

by Bhairi Indira October 24, 2021
written by Bhairi Indira

ఆమెను చూసే
చీమలు శ్రమించడం నేర్చుకున్నాయి
ప్రపంచం
ప్రేమించడం నేర్చుకుంది

ఆమె ఓర్పును
గుండె అరువడిగింది
కాలం ఆమెను గమనిస్తూ
నడుస్తూంది

ఆమె మౌనాన్ని
మూగజీవులు పోగేసుకున్నాయి
ఆమె వేదన
అంతరిక్షంలో నిక్షిప్తమైంది

ఆమె కన్నీరు
సముద్రాల
దాహం తీరుస్తూంది

ఆమె వ్యక్తిత్వం
ఆకాశానికి తలమానికమైంది
ఋతువులు
ఆమె జీవితమై చరిస్తున్నాయి

ఆమె కదలితే
సూర్యోదయం
కను మలిగితే
చీకటి

గాలి నీరు నిప్పు
ఆమెలోనే లీనమై ఉన్నాయి
భూమి కూడా
ఆమె చుట్టే తిరుగుతూంది

నిజానికి సూర్యుడు
ఆమెలానే దహిస్తున్నాడు
ఆమె మాత్రం
‘మనిషి’ కోసం చూస్తూంది

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us