మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంట‌ర్వ్యూలు

రచన అనేది ఒక సజీవ చెలిమ లాంటిది, జీవనది లాంటిది, పంటకాలువలకు పారే కాలువలాంటిది.

by Aruna Dhulipala July 28, 2025
written by Aruna Dhulipala

         – డా.కాలువ మల్లయ్య

                

వెయ్యికి పైగా కథలు, పద్ధెనిమిది నవలలు, వందలాది వ్యాసాలు రచించిన ప్రసిద్ధ కథకులు, నవలాకారులు డా. కాలువమల్లయ్య గారితో మయూఖ ముఖాముఖి                                   – అరుణ ధూళిపాళ

      కథా రచయితగా , నవలా రచయితగా ప్రసిద్ధిపొంది స్త్రీ, దళితవాద అభ్యున్నతి కోసం తెలంగాణ అస్తిత్వ చైతన్యం కోసం నిరంతరం తపించే అభ్యుదయ రచయిత కాలువ మల్లయ్యగారి జీవిత విశేషాలను, ఆయన కథ, నవలా పరిణామాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్,

1ప్ర:- మీ రచనల ద్వారా అనేకులను చైతన్యపరుస్తూ వస్తున్న మీ బాల్య విద్యా విశేషాలను మా పాఠకులకు తెలపండి.

జ:-  నమస్కారం.  నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నేటి పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తెలుకుంట గ్రామంలో జనవరి 12, 1952లో గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టాను. అది పారిశ్రామిక నాగరితకు దూరంగా ప్రకృతి సౌందర్యంతో అలరారే ఊరు. నా జీవన నేపథ్యం కూడా కష్టాలలో కూడుకున్నది. మాతండ్రి ఆ కాలంలో నాలుగవ తరగతి చదువుకున్నవాడు. నన్ను బాగా చదివించాలన్న కోరిక ఆయనకు, మా అమ్మకుండేది. ప్రత్యేకంగా ఒక స్కూల్ అంటూ మా ఊరికి లేదు. ఏదో ప్రయివేటుగా బడిలాగా ఉండేది. నేను చదువుతున్న క్రమంలో అది హైస్కూల్ గా మారింది. నేను చదువుకోవాలంటే ఆ ఊరి దొరను పర్మిషన్ అడగాలి. మా నాన్న నన్ను తీసుకొని పోయిండు. అప్పుడా దొర “చదువుకుంటే చెడిపోతరు. మీకు ఎట్లా ఎల్తది? వ్యవసాయం, గొర్లు ఉన్నయి కదా! చూసుకోమను” అనడం నేను విన్నాను. బాగా కోపం వచ్చింది. పిలగాన్ని నేనేం చేయగలను? అయితే మా నాన్న ఆ మాటలను ఖాతరు చేయకుండా నన్ను స్కూల్లో చేర్పించాడు. 9వతరగతి దాకా ఆ ఊళ్ళో చదువుకున్నా. అన్నిటిలో ఫస్ట్ ఉండేవాణ్ణి. నేను నాలుగవ తరగతిలో ఉన్నప్పుడే

ఫస్ట్ రావడం చూసి నన్ను స్కూల్ కి పంపొద్దు అన్న దొర

నన్ను ఇంటికి పిలిపించుకొని తన ఇంట్లో ఉండి చదువుకోమన్నాడు. ఆయన కొడుకు పురుషోత్తం నా క్లాస్ మేట్. వాళ్ళు కరణాలు. అయినా నన్ను బాగా ప్రోత్సహించాడు. హై స్కూల్ ఎలిగేడులో చదువుకున్నా.

పియుసి కరీంనగర్ లో చేశాను. 86.5% మార్కులతో మెరిటోరియస్ రావడంతో ఫస్ట్ లిస్టు లోనే ఓయూలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. నేను వద్దన్నా వినకుండా పురుషోత్తం ఇద్దరం కలిసి చదువుకుందామని నా సర్టిఫికెట్లను తీసుకొని పోయి అప్లై చేశాడు. దొర కూతురు అమెరికాలో ఉండేది. ఇద్దర్నీ అమెరికాకు పంపుతామన్నాడు. మా నాన్న కూడా పొలం అమ్మి డబ్బులు ఇస్తానన్నాడు. అక్కడికి వెళితే సుఖం వస్తుంది. కానీ సంతృప్తి రాదు కదా! స్వదేశం నుండి వెళ్లిపోవడం నాకు ఇష్టం లేకుండే. నా సుఖం కంటే నావాళ్ళతో కలిసి ఉండడమే మంచిదని భావించాను. బిఎస్సీ లో జాయిన్ అయిన. లిటరేచర్ లో అప్పటికే ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్ వయసులోనే పద్యాలు రాసేవాడిని. బిఎస్సీ తరువాత ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసిన. తరువాత పిజి,  డిపిఆర్ చేసిన. ఎమ్ ఏ తెలుగు, పిహెచ్ డి చేసిన. అప్పటికి గానీ నా చదువు దాహం తీరలేదు.

2ప్ర:-  మొదట సైన్స్ స్టూడెంటుగా ఉండి, విద్యాధికులైన మీకు సాహిత్యం పట్ల కాంక్ష పెరగడానికి కారణం ఏమిటి?

జ:- మా నాన్న తాను చదువుకున్నది కొంతవరకే అయినా పురాణ కథలు, రామాయణం మొదలుకొని డిటెక్టివ్ నవలల వరకు చదివేవాడు. మా పంచాయతీ లైబ్రరీలో శరత్ సాహిత్యం వంటి అనేక పుస్తకాలు ఉండేవి. అవి ఆయన తెచ్చేవాడు. కరీంనగర్ కు వెళ్లినప్పుడల్లా పేపర్ తెచ్చేవాడు. రామాయణ, మహా భారతాలు, భట్టి విక్రమార్క కథలు మాకందరికీ చెప్పేవాడు. నేను నాల్గవ తరగతికి వచ్చిన తరువాత నాతో చదివించి భావం తాను చెప్పేవాడు. మా ఇంటిముందే జానపద కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. ఊళ్ళో రకరకాల వృత్తుల వారిని చూశాను. సాధనా శూరులు, శారదకాండ్రు, గంగిరెద్దుల వాళ్ళు, కాటి కాపరులు, గుడ్డేలుగులోళ్లు, చిందుభాగోతులు, బుర్రకథలు చెప్పేటోళ్లు, నాటకాలు ఆడేటోళ్ళు ఇట్లా రకరకాల వృత్తులవారు ఆటాపాటలతో కథలు చెప్పేవారు. అట్లా కథల మీద, పాటల మీద ఆసక్తి ఏర్పడింది. ఊళ్ళో ఎన్నో సంఘటనలు, దోపిడీలు చూస్తున్నప్పుడు వీటి మీద ఎందుకు రాయకూడదు అనిపించింది. ఆరవతరగతిలో

ఉన్నప్పుడే ద్విపదలో పద్యాలు అయిదారు పేజీలు రాసి మా తెలుగు సార్ కు చూపెట్టిన. ఆయన ఇవన్నీ ఇప్పుడే వద్దని, కవిత్వం ఎవరుపడితే వాళ్ళు రాసేది కాదని, ఋషి అంశ ఉన్నవాళ్లే రాయాలని మంచిగా చదువుకోమని వాటిని చింపేశాడు. దాంతో కసి పెరిగి అయితే కవే కావాలి అనుకున్నా. పట్టుదల పెరిగి పద్యాలు రాసి కాపీలో భద్రపరచుకునేవాణ్ణి. మా స్కూల్ లైబ్రరీలో, పంచాయతీ లైబ్రరీలో నేను చదవని పుస్తకం లేదు. డిగ్రీకి వచ్చాక రెండు మూడు కథలు రాశాను. భువనపల్లి వెంకట రామారావు, మలయశ్రీ, అంపశయ్య నవీన్ లతో పరిచయం ఏర్పడింది. 1971లో ‘విధివ్రాలా?’ అని నవల రాసి అప్పుడు ఎలిగేడులో ఉపాధ్యాయునిగా ఉన్న మలయశ్రీకి చూపెడితే పోగొట్టాడు. బ్రహ్మరాతను బట్టికాక మనం చేసే పనులవల్ల మన భవిష్యత్తు, అభివృద్ధి ఉంటాయని అందులో రాశాను. కథ గుర్తుంది కాబట్టి మళ్లీ అదే నవలను రాశాను. అదే నా మొదటి నవల అని కూడా చెప్పొచ్చు.

3ప్ర:- సినారె గారితో మంచి పరిచయం ఉందని మీరే స్వయంగా చెప్పుకున్నారు. మీపైన ఆయన ప్రభావం ఏవిధంగా ఉందో చెప్పండి.

జ:-  మాది కరీంనగర్ జిల్లా కాబట్టి ఆయనంటే నాకు చాలా అభిమానం ఉండేది. నన్ను కూడా ఆయన బాగా ప్రేమగా చూసేవాడు. 1974లో ఒకసారి ఆయన ఉస్మానియాలో పనిచేస్తున్నప్పుడు పిజి సీట్ కోసం అశోక్ నగర్ లో ఉండే ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన కూతురు గంగ తలుపు తీసింది. సి నారాయణరెడ్డి గారు ఉన్నారా? అని అడిగాను. ఆయనెవరు అన్నది. ఆశ్చర్యపోయి మళ్ళీ అడిగాను. అప్పుడు సి. నారాయణరెడ్డి ఇల్లు. గారు ఎందుకండీ అన్నది. అంతటి ఉదార స్వభావులు వాళ్ళు. ఆయన అప్పుడు కలవలేదు. ఆ పని కూడా జరగలేదు. నేను నాగ్ పూర్ లో జాయినయ్యాను. కానీ ఆ సంఘటన అట్లా గుర్తుండిపోయింది. ఆయన పాటలు, ఆయన కవిత్వం నాకు బాగా ఇష్టం. నేను మొదట్లో కవిత్వం రాస్తున్నప్పుడు అవి పత్రికల్లో వచ్చేవి. గతం వర్తమానం భవిష్యత్తు అని రాసిన. గతం మీది, వర్తమానం ఘర్షణలది, భవిష్యత్తు మాది. అంటే పీడితులది అని. ఆయన “ఇది మంచి కవిత మల్లయ్యా! ఒకసారి నన్ను కలువు” అని ఉత్తరం రాశాడు. వెళ్లి కలుసుకున్న. అప్పుడాయన సాంస్కృతిక మండలి చైర్మన్ గా ఉండేవాడు. మా మామకు క్లాస్ మేట్ కూడా. నువ్వు

కథలు బాగా రాస్తున్నావు. నేను కవిత్వం రాస్తున్నాను. ఇద్దరం కరీంనగర్ వాళ్ళమే. మనదే రాజ్యం అన్నాడు. అంతటి వ్యక్తి అట్లా అనడం ఎంత ప్రోత్సాహాన్నిస్తుందో చెప్పండి. ఆ తరువాత ఎన్నో సందర్భాలు. ఎన్నో జ్ఞాపకాలు. ఈ సందర్భంలో ఇలాంటి ఒక విషయం జ్ఞాపకం వస్తున్నది. నేను డిగ్రీ చేసేటప్పుడు శ్రీశ్రీ, వరవరరావు లాంటి వాళ్ళు కరీంనగర్ కు వచ్చారు. విరసం ఏర్పడ్డ సందర్భమది. దాన్ని ప్రచారం చేయడం కోసం వచ్చారు. మా స్నేహితుడు కోటేశ్వరరావు, ఇంకో ఇద్దరం కలిసి వెళ్ళాం. నేను కవిత్వం రాసుకున్న డైరీ పట్టుకుపోయిన. శ్రీశ్రీని కలిసి మీ అభిమానిని అని చెప్పిన. ఏం చేస్తావు? అని అడిగారు. కవిత్వం రాస్తాను సార్. అని ఆ డైరీ చూపెట్టిన. నా భుజం మీద చేయి వేశాడు. అదొక అభయహస్తం లాగా అనిపించింది. ‘గో ఎ హెడ్’ అన్నారు. ముందు బాగా చదువుకో అన్నారు. అప్పుడు కచ్చితంగా రాయాలని మనసులో స్థిరపడిపోయింది.

4. ‘తెలుగులో ప్రగతిశీల కథా సాహిత్యం’ పైన పరిశోధన చేశారు. ఆ కథా సాహిత్యాన్ని ఎక్కడి నుండి ఏ కాలపు పరిధుల వరకు తీసుకున్నారు?

జ:-  ఎమ్.ఏ చేసేవరకు అప్పటికే మూడు వందల కథలు రాశాను. అందువల్ల కథాసాహిత్యం మీద పిహెచ్ డి చేయడం వల్ల వేల కథలు చదవొచ్చు. ఎంతోమంది రచనా విధానం తెలుసుకోవచ్చు. నాకు చదువుకోవాలనుకున్న కోరికలో ఇంకా చదవడానికి ఇదే చివర కదా! అందుకే దాని అంతు తేల్చుకోవాలనుకున్నాను (నవ్వుతూ). అసలు ఏమాత్రం చదువురాని కుటుంబం నుండి వచ్చి ఇంతవరకు చదువుకొని వేల పుస్తకాలు చదవడం మామూలు విషయం కాదు కదా! పి హెచ్ డి కోసం రామశాస్త్రి గారి దగ్గరకు వెళ్ళాను. అప్పటికే పత్రికల్లో నా కథలు వస్తున్నాయి. తెలంగాణ మాండలికంలో చేస్తానంటే నువ్వు లింగ్విస్టిక్ కాదు కాబట్టి లిటరేచర్ లో చేయాలి అన్నాడు. అప్పుడు ప్రగతిశీల కథల మీద చేస్తాను అన్నాను. ఈ ప్రగతిశీల అనేది అభ్యుదయ కథగా అంతకుముందు ఉన్నప్పటికీ విరసం ప్రారంభమైన తరువాత విప్లవకథగా మొదలైంది. అంటే ఇది 1970 మాట ఇది. అప్పటినుండి 1990 వరకు ఇరవై ఏండ్ల కథా సాహిత్యాన్ని తీసుకున్నాను. వేయి పైన కథలను, రెండు మూడు వందల పుస్తకాలను సేకరించి నోట్స్ తయారుచేసుకున్నా. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలలోని పుస్తకాలు చదివేవాడిని. వాసిరెడ్డి నవీన్ దగ్గర అనేక పుస్తకాలు, కథలు ఉండేవి. తర్వాత చేకూరి రామారావు గారి దగ్గర పుస్తకాలు ఇవన్నీ చదివి వెయ్యిపేజీల పుస్తకం తయారుచేస్తే దాన్ని కుదించగా ఆరువందల పేజీల పుస్తకమయింది.

5ప్ర. ఉద్యోగజీవితంతో పాటు సాహిత్యరచనను  సంబాళించుకుంటూ పూర్తిస్థాయి రచయితగా మారడం ఎప్పుడు, ఏవిధంగా జరిగింది?
జ:-  ఉద్యోగం, క్వాలిఫికేషన్ పెంచుకోవడం, సాహిత్యం ఈ మూడింటిని సంబాళించుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుండే రాస్తున్న విధివ్రాల, కొన్నికథలు, కొన్ని కవితలు అప్పటికే రాసిన. దాదాపు 1980 నుండి సీరియస్ గా రాయడం మొదలుపెట్టాను. అప్పటికే కొన్ని కథలు రాసినప్పటికీ 1983లో సృజన పత్రికలో ‘వెలి’ కథ మొదటిదిగా అందరూ చెప్తారు. 1986 – 87 సమయంలో విజయ్ కుమార్ నడుపుతున్న ‘జీవగడ్డ’  అనే పత్రికలో ప్రతీ ఆదివారం ఒక భేతాళ కథ రాసేవాడిని. కరీంనగర్ లో చదువుకుంటున్న కాలంలోనే నేను పత్రికలు చదివినప్పుడు అందులో తెలంగాణ కథలు కనిపించకపోయేవి. అప్పుడప్పుడు అంపశయ్య నవీన్ కథలు, నవలలు వచ్చేవి. తాడిగిరి పోతరాజు అని సెటిలర్. ఆయన కథలు ఉండేవి. అప్పుడు మనం ఎందుకు రాయకూడదనిపించింది. ఏం రాయాలన్నది ప్రశ్న? ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడే రాయాలి. అప్పుడు అల్లంరాజయ్య రాసినవే విప్లవ కథలు. తెలంగాణ ఉద్యమం గురించి ఎవరూ రాయడం లేదు. విప్లవాలతో పాటు జీవితం కూడా ఉండాలనుకున్నాను. తెలంగాణ భాష అప్పటి పత్రికల్లో రాలేదు. ‘అవ్వతోడు, గిది తెలంగాణ’ అనే పేరుతో ధైర్యం చేసి వరుసగా యాభై కథలు రాశాను. ఒక పత్రికకు ఇస్తే రెండేండ్లు దగ్గర పెట్టుకొని అవ్వతోడేంది? ఈ భాష ఏంది? అని భాష మారుస్తే వేస్తామన్నారు. వెనక్కి తెచ్చుకున్నా. నాలుగైదు ఏండ్లు అది పత్రికలలో తిరుగుతూనే ఉంది. ఎంత వివక్ష ఉండేదో చూడండి. ఆంధ్రప్రభ ఎడిటర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, సివి కృష్ణారావు ఆదివారం అనుబంధం చూసేవాడు. వాళ్లిద్దరూ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కలవాళ్ళు. “ఇంత అద్భుతమైన కథలను ఇన్ని రోజులు మాకెందుకు ఇవ్వలేదు?” అన్నారు. అయితే కొన్ని గొట్టు పదాలకు కింద అర్థం రాసివ్వండి అన్నారు. “మరి ఆంధ్రోళ్లు మాండలిక పదాలకు అర్థాలు రాస్తున్నరా సార్?” అన్నాను (గట్టిగా నవ్వేస్తూ). అందరికీ తెలియదు కాబట్టి కొన్నింటికైనా ఇవ్వమన్నారు. సరేనని రాసి ఇచ్చాను. అందులో ఒక్కొక్క కులం భాష ఉంటుంది. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. మన భాష రాస్తే ఆదరణకు తక్కువ లేదని అర్థమైంది. అప్పటినుండి రచయిత భాషను వ్యవహార భాషలో, పాత్రలకు సందర్భాన్ని బట్టి పాత్రోచిత భాషను రాయడం మొదలుపెట్టాను. కొన్నింటిని మొత్తం తెలంగాణలోనే రాశాను.

6ప్ర. “నేను సాహిత్యకారుడిని కాకపోయి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాణ్ణి” అనగలిగేంత కష్టాలను ఎట్లా అనుభవించారు?
జ:-   ఆ మాట నిజమే. నలభై ఏండ్ల క్రితం నేనన్న మాట. నా జీవితంలో ఎన్నోసార్లు నిరాశ, నిస్పృహలు, ఆర్థిక పరమైన, మరే ఇతర సమస్యలు వచ్చినప్పుడల్లా సాహిత్యమే తోడ్పడింది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేనేదైనా పుస్తకం తీసుకొని లోపలికి పోయేది. మంచి సాహిత్యం మనిషిని తీర్చిదిద్దుతుంది. సమస్యకు పరిష్కారం చూపెడుతుంది. జీవితం వడ్డించిన విస్తరి కాదు కదా! ఏ రోజైనా నేను రాయకుండానో, చడవకుండానో ఉంటానో, సంవత్సరం పాటు నా రచన, నా పేరు ఏ పత్రికల్లో రాకుండా ఉంటుందో అప్పుడు నేను చచ్చి పోయినట్లు లెక్క అనుకుంటాను. నేను స్కూలుకు వెళ్తున్నప్పటి నుండి ఏ రోజైనా కనీసం చదవకుండా, రాయకుండా ఉన్నరోజు లేదు. “కవిత్వం ఒక తీరని దాహం” అని శ్రీ శ్రీ అన్నట్టు రాస్తూ రాస్తూ చనిపోవాలన్నది, చనిపోయేవరకు రాస్తూ ఉండాలి అని నా కోరిక. సాహిత్యమంటే నాకు పంచప్రాణాలు. ఆరోప్రాణం కూడా.

7ప్ర. బుద్ధుని వంటి తాత్త్వికుల ప్రభావం మీ పైన ఎట్లా ఉంది?
జ:-    నాకు మొదటినుంచీ బుద్ధుడు అంటే ఇష్టం. ఆయన అహింసా సిద్ధాంతం, సత్యప్రవర్తన, దుఃఖ నివారణ మార్గాలు, సత్సంగతి, అష్టాంగమార్గాలు ఇవన్నీ ఇష్టం. బడి అంటే నాకు ఒక విజ్ఞాన కేంద్రంగా ఎంతో ఇష్టంగా ఉండేది. సెలవు రోజులో కూడా ఏదైనా పుస్తకం తీసుకొని వెళ్ళేవాడిని. క్లాస్ రూమ్ లు ఓపెన్ గా ఉండేవి. అక్కడ కూర్చొని చదువుకునేవాడిని. ఒకసారి సోషల్ సార్ బుద్ధుని కథ పాఠం చెబుతూ బాణం తగిలిన ఒక పక్షిని బుద్ధుడు కాపాడిన విధం చెప్పాడు. అది నా మీద బాగా ప్రభావం చూపింది. అప్పటినుండి బుద్ధుడే నాకు హీరో. బుద్ధిజమ్ తీసుకోవాలని ఎప్పటినుండో అనుకుంటున్నా. త్వరలో తీసుకుంటాను కూడా. దాదాపు బౌద్ధమార్గంలోనే నడుస్తున్నా. ఆ పాఠం విన్నాక ఇంటికి పోయి మొగురాల మీద, దూలాల మీద సత్యమునే పలుకవలెను. హింస చేయరాదు. అని చాక్ పీస్ తో రాశాను. ఇంకోసారి మద్యపానం వల్ల అనర్థాలు పాఠం సార్ చెప్పగా విని మా నాన్నతో చుట్ట తాగడం మానిపించిన. కల్లు తాగడం ఆ రోజుల్లో సాధారణం. ఆరోగ్యం కోసం, అలసట తీరడం కోసం తాగేవాళ్ళు వ్యసనంగా కాదు. కుటుంబంలో అందరూ తాగేవాళ్ళు. మా నాన్న నన్ను తాగుమని బలవంతపెడితే వ్యతిరేకించేవాణ్ణి. ఈ విధంగా బుద్ధుడు, ఆయన ఆదర్శం నాకు ఆచరణీయాలు అయ్యాయి.

8ప్ర. అంబేద్కర్ భావజాలం కూడా మీకు ప్రేరణ అయిందని మీరు చెప్పుకున్నారు. అది ఏవిధంగా జరిగింది?
జ:-  నేను చదువుకుంటున్న సమయంలోనే అంబేద్కర్ సంఘాలు ఊళ్ళోకి రావడం, రాజ్యాంగం గురించి తెలియడం, ఓటు హక్కుకు కారణం ఆయన కావడం, ప్రతీ ఒక్కరికి విద్య, అవకాశాలు సమానం కావాలని చెప్పడం, ఊళ్ళల్లో అంబేద్కర్ విగ్రహాలు స్థాపించడం, లైబ్రరీలు కట్టడం ఇవన్నీ నాకు ప్రేరణ నిచ్చాయి. నక్సలిజం, అంబేద్కరిజమ్ ఆరోజుల్లో ప్యారలల్ గా నడిచాయి. హింసను కోరుకొని సాయుధ పోరాటాన్ని సమర్థించిన వారు అటువైపు వెళ్ళారు. నేను సమానత్వాన్ని, సోషలిజాన్ని కోరుకున్నప్పటికీ హింసను ఒప్పుకోలేదు. సాయుధ పోరాటం పరిష్కారం కాదని కూడా వ్యాసాలు రాసేవాణ్ణి. ‘స్టేట్స్ సోషలిజమ్’ అని రాజ్యాంగ నియమాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అన్న అంబేద్కర్ భావాలకు ఆకర్షితుడనయ్యాను. చంపడం, చావడం ద్వారా ఇవి పరిష్కారం కావు. స్కూల్లో అంబేద్కర్ గురించి చదువుకున్న పాఠాలు, ప్రాక్టికల్ గా అంబేద్కర్ సంఘాలు చెబుతున్న విషయాలు, ప్రత్యక్షంగా దళితుల సమస్యలను చూడడం వల్ల ఏం జరుగుతున్నదో అర్థమైంది. అంబేద్కరిజమ్ కూడా బుద్ధిజమ్ నుండి వచ్చిందే. బుద్ధునికి అంబేద్కర్ పరోక్ష శిష్యుడు. ఇక మహాత్మా జ్యోతీరావ్ పూలేది జ్ఞాన సమాజం. చదువుకుంటేనే విచక్షణ ఏర్పడి సమస్యలు పరిష్కారమవుతాయన్నది ఆయన భావన. బ్రిటిష్ వారి కాలంలోనే దళితులకు పాఠశాలలు పెట్టి చదువు నేర్పించిన వాడాయన. ఆయన భార్య సావిత్రీబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయిని. కాబట్టి బుద్ధుడు, జ్యోతీరావ్ పూలే, అంబేద్కర్ వీళ్ళు ముగ్గురూ నాకు పరోక్ష గురువులు. ఈ మూడు సిద్ధాంతాలను జోడిస్తే భారతదేశంలోని సమస్యలే కాదు ప్రపంచంలోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అందుకే విశ్వమంటే బోధిసత్వుడే, దేశమంటే అంబేద్కరుడే అని పుస్తకాలు రాశాను. ఈ ముగ్గురి మార్గంలో నడవడం నా సాహిత్య లక్షణం.

9ప్ర. అధికార భాషాసంఘ సభ్యులుగా మీరు చేసిన కృషిఎటువంటిది?
జ:-   నిజంగా అధికార భాషాసంఘంలో ఉండడం ఒక మంచి పరిణామం. అవకాశం రావడం విచిత్రంగా జరిగింది. భాష మీద స్పష్టమైన అవగాహన రావడానికి మంచి వేదిక. అప్పటికే రచనలు చేస్తున్న నాకు అధికారికంగా గవర్నమెంట్ ద్వారా భాషకు ఎంత సేవ చేయొచ్చు అనేది నాకు అర్థమైంది. నేను పనిచేస్తున్న రామగుండం ఫర్టిలైజర్ సిటీ మూతపడిన తరువాత అందులో ఉద్యోగం పోయిన నేను ఏం చేయాలో తోచనప్పుడు ఈ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ పడింది. 2005 సంగతి ఇది. అప్పటివరకు సెక్రటేరియట్ ఎంట్రన్స్ కూడా నాకు తెలియదు. అప్లికేషన్ తీసుకొని గేటు ముందు వెళ్లి నిల్చున్నాను. నా కథలు చదివిన ఒకాయన వచ్చి ఇక్కడ నిలబడ్డారెందుకు? అని లోపలికి తీసుకుపోయాడు. రామచందర్ రావు సిఎం రాజశేఖర్ రెడ్డి గారికి సలహాదారు. ఆయన దగ్గరికి వెళ్లి అప్లికేషన్ ఇచ్చాను. ఆయన నవ్వుతూ మీ రచనలు కొన్ని చదివాను. ముఖ్యమంత్రి సంతకం పెడితే అయిపోతుందన్నాడు. వారం రోజుల్లో ఫోన్ వచ్చింది. అప్పటికే ఎబికె ప్రసాద్ ఛైర్మన్ గా ఎంపిక అయినట్టు, నన్ను సభ్యునిగా తీసుకున్నట్టు చెప్పారు. అప్పుడు అధికార భాషా సంఘం రూల్స్ అన్నీ తెలుసుకున్నాను. తెలుగులో రాయడం, తెలుగు మాధ్యమంలో చదవడం, స్కూల్ ఎడ్యుకేషన్ వరకు, డిస్ట్రిక్ట్ కోర్ట్ వరకు తీర్పులు అన్నీ తెలుగులో ఉండాలని ఇట్లాంటివి భాషకు ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం కూడా సర్క్యూలర్ లన్నీ తెలుగులోనే ఉండాలి. కానీ చూసేటప్పటికి ఒక్కటి కూడా తెలుగులో లేదు. మాకు ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇంగ్లీషులో ఇచ్చారు. నేను ఆ కార్డ్ విసిరేశాను. తెలుగు అధికార భాషా సంఘం పేరున తెలుగు అమలు కోసం మన నలుగురిని పెట్టినప్పుడు మనమే దాన్ని పాటించకపోతే ఎట్లా? అన్నాను. మరుసటి రోజు వాటిని తెలుగులో మార్చి ఇచ్చారు. పాస్ లన్నీ కూడా తెలుగులో చేశారు. ముప్పై నినాదాలు రాయించాం. పాత సెక్రటేరియట్ లో అవన్నీ ఉంటాయి. బస్సుల్లో రాయించాం. మీరు చూసి ఉంటారు. రెండేళ్లు నా సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఇరవై మూడు జిల్లాలు తిరిగి తెలుగు అమలు చేయించిన. ఒక తెలుగు మీడియం దగ్గరకు వచ్చేటప్పటికి వ్యతిరే కతలు వచ్చాయి. అప్పుడు ఎవరికి వీలయిన దాంట్లో వాళ్ళు చేరేలా రెండు మీడియమ్ లు పెట్టాలని చెప్పాను. నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పోరేట్ స్కూల్స్ కి కూడా వెళ్ళాను. అట్లా అనేక పాఠశాలలు తిరిగితే నెల్లూరు, నిజామాబాద్, కరీంనగర్ మూడు జిల్లాల్లో వందశాతం తెలుగు అమలయింది. దీన్నిబట్టి భాషకు చేయాల్సింది చాలా ఉందని అర్థమైంది. రెండు సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. తెలంగాణలో పర్యటనలు చేస్తున్నప్పుడు నేను సాయంత్రాలు ఆ మీటింగులలో పాల్గొనేవాడిని. తెలంగాణ వచ్చి తీరాలని ఉపన్యాసాలు ఇచ్చేవాడిని (గట్టిగా నవ్వుతూ). అందుకే ఇవ్వలేదు.

10ప్ర. జాషువా పరిశోధనా కేంద్రంలో మీరు చేపట్టిన బాధ్యతాయుతమైన కార్యక్రమాలు ఏవి?
జ:-   ఇందాకే చెప్పిన కదా ఫెర్టిలైజర్ సిటీ మూతపడిన తరువాత ప్రయివేటు ఉద్యోగాలు వెతుక్కునే క్రమంలో తెలుగు అకాడమీకి సంచాలకులుగా ఉన్న ఆచార్య యాదగిరి గారిని కలిశాను. మొదట దినసరి వేతనం ఇచ్చే విధంగా జాషువా పరిశోధనా కేంద్ర బాధ్యతలు అప్పగించారు. పదమూడు నెలల తర్వాత గౌరవవేతనంతో పనిచేశాను. జాషువా అంటే నాకు చాలా అభిమానం. అంతకుముందు జాషువాను చదివాను. కానీ అంత లోతుగా చూడలేదు. ఆయన రచనల గొప్పదనానికి ఒక్క ‘గబ్బిలం’ చాలు. అది భారతదేశంలో అస్పృశ్యత మీద వచ్చిన ఐదు గొప్ప పుస్తకాయాలలో ఒక్కటిగా చెప్పవచ్చు. కరుణశ్రీ, జాషువా, దాశరథి ఈ ముగ్గురూ పద్యాన్ని ఆధునిక భావజాలంతో ప్రోగ్రెసివ్ ఆలోచనలతో రాసినవారు. ఒకవైపు అకాడెమీకి పనులు చేస్తూనే జాషువా పుస్తకాలన్నీ చదివి అన్ని యూనివర్సిటీలలోసెమినార్లు పెట్టించి పుస్తకాలు వేశాం. పదమూడు పుస్తకాలు వేయించాం. అందులో రెండు నేనే రాశాను. 2014లో రాష్ట్రవిభజన జరిగిన తర్వాత సాహిత్యంలో కూడా రాజకీయాలు చోటు చేసుకొని అకాడెమీకి ఫండ్స్ ఇవ్వలేదు. అందుకే ఆ సంస్థ మూతబడి పోయింది. జాషువాను జాతీయ కవిగా గుర్తించాలన్న తపన నాది. అదే సమయంలో నాలుగవ తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ పుస్తకాలు, తెలంగాణ రచయితల పుస్తకాలు యాభైకి పైగా రావడానికి కారకుడినయ్యాను. తెలుగు అకాడెమీ నా ఆత్మ, నా పుట్టిల్లు అన్నట్టుగా చేశాను. తెలుగు అకాడెమీ ద్వారా తెలుగు భాషకు, సాహిత్యానికి పాఠ్య పుస్తకాలను అంతర్జాతీయ స్థాయిలో అందించడానికి ఎంతో చేయవచ్చు. కానీ నాకు ఆ అవకాశం అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ కాంట్రాక్టును పొడిగించలేదు.

11ప్ర. ‘మాదిగ విజయం’ నవలా నేపథ్యం గురించి చెప్పండి.
జ:-  ముఖ్యంగా నేను దళితుల మీద చాలా పుస్తకాలు రాశాను. నా ఉద్దేశ్యం రచయిత అనేవాడు తప్పనిసరిగా అణగారిన జీవితాలను చూసిన వాడు అయివుండాలి. వాళ్ళను గురించి పట్టించుకోవాలి. “కవి కష్టజీవికి ఇరువైపులా ఉండాలి” అని శ్రీశ్రీ చెప్పినట్లు కవి కష్టజీవి కష్టాలను చూడాలి. మా నాన్న ఆకాలంలోనే ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలవాడు. మాతాతకు నేను మొదటి వారసుడిని కావడం వల్ల నన్ను బాగా గారాబం చేసేవాడు. నన్ను భుజాలపై ఎక్కించుకొని వాడలు తిప్పేవాడు. అయితే చేంతాడులు, పశువులకు కట్టే పగ్గాల వంటివి తెచ్చుకోవడానికి మాదిగ వాడకు పోయినప్పుడు కాలికి చిన్న కాగితం ముక్క కూడా తగలనిచ్చేవాడు కాదు. నన్ను కింద దించకపోయేది. మా తాత చాలా మంచోడు కానీ అప్పట్లో ఈ పట్టింపులు ఎక్కువ కదా! ఊళ్ళో అన్ని పనులు అంటే కాష్టం కాలవడం, బొందలు తీయడం, బరువులను తలపై ఎత్తుకొని మోయడం, వెట్టి చేయడం వంటి పనులన్నీ వాళ్లే చేసేవారు. కానీ వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్షలు ఉండేవి. ఇవన్నీ ఏంటి అని ఆలోచించి వాళ్ళ మీద కలిగిన అభిమానంతో ‘పాలేరు’ అనే కథ రాసిన. వందలాది కథలు రాసిన. ‘మాదిగ విజయం’ అనేది 1997 లోనే రాసిన. ఇందులో అయిదు తరాల జీవితం తీసుకున్నాను. ఊళ్లోని ఒక కుటుంబాన్ని దగ్గరగా చూసి రాసింది. మొదటితరం వ్యక్తి రామయ్య వెట్టి చేస్తుంటాడు. ఆయన కొడుకు చెప్పులు కుడతాడు. మూడవతరం వ్యక్తి పాలేరు అవుతాడు. ఆ తరువాతి వాడు భూమి కొంటాడు. అది దొరలకు నచ్చదు. అతను వలస పోతాడు. ఇంత కష్టపడ్డ నేను నా కొడుకుకు ఇటువంటి కష్టం రాకుండా చదివించాలనుకుంటాడు. అప్పుడే ఆ ఊళ్ళో అంబేద్కర్ సంఘాలు రావడం జరుగుతుంది. అప్పుడు ఆ పిల్లవాణ్ణి బడికి పంపుతాడు. అతని పేరు ఎల్లయ్య. అందరూ ఆ పేరును ఎగతాళి చేస్తుంటే కాలేజీకి పోయిన తర్వాత ఆనందరావుగా పేరు మార్చుకుంటాడు. యూనివర్సిటీ ప్రొఫెసర్ అవుతాడు. తన పిల్లలను కూడా విదేశాలకు పంపుతాడు. అంటే ఒక తరం నుండి మరొక తరానికి జరిగిన పరిణామ క్రమం ఎట్లా ఉందో తెలుపుతూ వాళ్ళ భాష, వాళ్ళ కష్టాలు అవన్నీ రాశాను. 2014 లో ఆంధ్రప్రదేశ్ వారు పెట్టిన నవలల పోటీలో బహుమతి వచ్చింది. మొదట వేయిపడగలు నవలకు బహుమతి వస్తే నలభై ఏండ్ల తర్వాత మళ్ళీ నా నవలకు వచ్చిందని న్యాయనిర్ణేతలు ఫోన్ చేసి చెప్పారు. అది బ్రాహ్మణ వ్యవస్థను చిత్రించేది అయితే ఇది దళిత జీవన మేనిఫెస్టో అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే డిక్లేర్ చేశారు. 2015లో విజయవాడలో ఈ బహుమతి తీసుకున్నాను. దీన్ని కొలకలూరి ఇనాక్ గారు ఆనాటి ‘మాలపల్లి’ వంటిదని ప్రశంసించారు.

12ప్ర. మీ కథల గురించి, నవలల గురించి ఎన్ని విషయాలైనా అడగొచ్చు. అయితే ‘అస్పృశ్య కోయిల’ అనే నవల మీ రచనల ప్రత్యేకతల్లో ఒకటి అని విన్నాం. దాని గురించి చెప్పండి.
జ:-   అవును. ఒక దళిత స్త్రీ గ్రామాల్లో పడుతున్న ఆవేదన గురించి రాసిన. ఆ కష్టాల్లో ఒకటి సెక్సువల్ గా ఎదుర్కొనే సమస్య కూడా. ఆమె అన్నిటినీ ఎదుర్కొని దొర కొడుకునే బామ్మర్దీ అని పిలుస్తుంది. అంతేకాదు దొర ఇంట్లోనే ఉంటుంది. అయినా ఎన్నో బాధలకు గురి అవుతుంది. చిన్నప్పటినుండీ ఆమె జానపద పాటలు పాడుకునేది. అందువల్ల తరువాత కరీంనగర్ కు పోయి సింగర్ అవుతుంది. అట్లా ప్రజా గాయనిగా, అంబేద్కరిస్టుగా మారడమే ఆ కథ. ఇది నిజంగా జరిగిన సంఘటన. అది దృష్టిలో పెట్టుకొని మొదట్లో ‘బామ్మర్దీ’ అనే కథ రాసిన. దాన్నే ‘అస్పృశ్య కోయిల’ అనే నవలగా మార్చాను.

13ప్ర. కవిత్వం కంటే కథలను ఎక్కువగా ఇష్టపడ్డ మీరు కవితా సంకలనాలు కూడా వెలువరించారు కదా ఈ రెండింటిలో ప్రజలకు సన్నిహితంగా ఉండేది ఏది? ఎట్లా?
జ:-   ఒక పెద్దాయన చెప్పారు. కవిత అనేది స్వప్నసుందరి, కథ అనేది సహధర్మచారిణి అని (నవ్వుతూ). అంటే అది ఊహ. ఇది నిజం. కవిత్వం అందరూ చెప్పలేరు. కానీ కథ అందరూ చెప్పగలరు. ఒక సంఘటనను ఎదుటివాళ్లకు వివరిస్తున్నప్పుడు అది కథ వంటిదే కదా! మనమందరం కూడా పుస్తకాల్లో చదివేకంటే ముందు కథలు వింటూ పెరిగినవాళ్ళమే కదా! కవిత ఆవేశాత్మకం, కథ ఆలోచనాత్మకం. కథ మానవ జీవితానికి దగ్గరగా ఉంటూ ప్రభావితం చేస్తుంది. వాస్తవ జీవిత కథలు ప్రజలతో మమేకమై వాళ్లకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సందేశాన్నిస్తాయి. సమస్యలకు పరిష్కారాలను అంతర్లీనంగా చూపుతాయి.

14. మొదట్లో నవల రాయడానికి చాలా కష్టపడ్డాను అన్నారు కదా! ఒక నవల రూపాన్ని సంతరించుకోవడం అంత క్లిష్టమా? పాఠకులను అలరించే నవల ఎట్లా ఉండాలి?
జ:-   విద్యార్థి దశలో ‘విధివ్రాల’ నవల నాటి సంగతి కష్టపడడం అన్నమాట. ఒక ఆంగ్ల రచయిత చెప్తాడు. కథలు రాయాలంటే జీవితం చూడకపోయినా వయసుతో నిమిత్తం లేకుండా ఏదేని ఒక అంశంపై రాయొచ్చు. కానీ నవల రాయడం అంత సులభం కాదని. ఒక స్పందనో, ఆవేశమో కలిగినప్పుడు కవిత్వం ఒక పది వాక్యాలు రాయొచ్చు. దాన్ని తక్కువ చేయడం కాదు. ఎవరైనా రచన ప్రారంభం కవిత్వం నుండే చేస్తారు. నేను కూడా కవిత్వం నుండే ప్రారంభించాను. చెప్పదలచుకొన్న విషయాన్ని చాలా వివరంగా చెప్పాలంటే కవిత్వమో కథో సరిపోదు. పది కవితలు రాసేచోట ఒక నవల రాయొచ్చు. ఓ ఇరవై కథలు రాసేచోట ఒక నవల రాయొచ్చు. అంటే ఈ కథలన్నీ కలిపితే నవల అవుతుందని కాదు. నవల స్వరూపం వేరు. రెండు వందల కథలు రాసిన తర్వాత కూడా నాకు తృప్తి అనిపించలేదు. ఇంకా ఏదో చెప్పాలని, ఏదో మిగిలిపోయిందని అనిపించింది. కథ అనేది ఒక జీవన శకలాన్ని చెబితే నవల జీవితం మొత్తాన్ని చెబుతుంది. ఇట్లా చెప్పాలంటే కూడా వాళ్ళ జీవితాన్ని నిశితంగా పరిశీలించాలి. ‘ఊరంటే’ నవల 1983లో రాసిన. అది ఇంతవరకు ఏ పత్రికకు పంపలేదు. కొన్నేళ్లు మరే నవల రాయలేదు. తరువాత నవలలు మొదలు పెట్టిన. ‘భూమిపుత్రుడు’ అనే నవల రైతు జీవితాన్ని గురించి రాశాను. మంచి స్పందన లభించింది. అప్పటివరకూ తెలంగాణా రైతుల మీద రాలేదు. ఒకరైతు పన్నెండు నెలల జీవితాన్ని ఉగాది నుండి ఉగాది వరకు డైరీగా చేసుకొని నేపథ్యం, జీవితం, బాకీలు, వలసలు వీటన్నిటి గురించి రాశాను. శాతవాహన విశ్వవిద్యాలయ ఎమ్.ఏ విద్యార్థులకు ఇది పాఠ్యపుస్తకంగా పెట్టారు. ఆ తరువాత  ‘సాంబయ్య చదువు’ అని నా జీవితాన్నే తీసుకొని ఆత్మకథాత్మకంగా రాశాను. చాలామంది ఇప్పటికీ ఆ నవలలో మా జీవితాన్ని చూసుకున్నాం అంటారు. అది చతురలో వచ్చింది. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎమ్.ఏ. విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా పెట్టారు.

15ప్ర. ఆచార్య బన్న అయిలయ్యగారు మీపైనే ఒక పుస్తకం రాయడానికి మీ సాహిత్యం ఆయనకు ఏవిధమైన ప్రేరణ నిచ్చినట్లుగా భావించవచ్చు?
జ:-   2000 సంవత్సరం వరకు కూడా బన్న అయిలయ్య ఎవరో నాకు తెలియదు. ఆయన గత శతాబ్ది 90ల్లో ఒకసారి “నేను సాహితీ సంస్థల మీద పిహెచ్ డి చేస్తున్నానని, కరీంనగర్ జిల్లాలో ఏవైనా సాహిత్య సంస్థలు ఉంటే వాటి గురించిన వివరాలు తెలుపుమ”ని నాకు ఉత్తరం రాశాడు. నేను కొన్ని వివరాలు పంపిన. అయితే ఆయన వేరే టాపిక్ మీద చేశారు. అది వేరే సంగతి. అయితే కొద్దిరోజుల తర్వాత మల్లికార్జున్ అనే  అబ్బాయి నా దగ్గరకు వచ్చి బన్న అయిలయ్య సార్ చెప్పగా “మీ నవలల మీద పిహెచ్ డి చేస్తున్నానని, కొన్ని నవలలు చదివానని, కొంత రాశాన”ని చెప్పాడు. ఆయనకు నేను సహాయం చేశాను. ఆయన పిహెచ్ డి కూడా అయిపోయింది. కొన్ని ఏండ్ల తర్వాత అయిలయ్య ఫోన్ చేసి “మీమీద పుస్తకం రాస్తున్నానని కొన్ని వివరాలు కావాలి” అన్నాడు. ఫోన్ల ద్వారానే చెప్పాను. పుస్తకావిష్కరణకు నన్ను పిలిచాడు. అప్పుడే మొదటిసారి ఆయనను చూశాను. నాకు తెలియకుండానే నామీద పిహెచ్ డి చేయించాడు. నామీద పుస్తకం రాశాడు ఆయన. “నేనే జడ్జి అయి ఉంటే నోబుల్ ప్రైజ్ ఇచ్చేవాణ్ణి” అన్నాడు. అట్టడుగు వర్గాల గురించి నేను రాసిన రచనలు ఆయనను బాగా ఆకర్షించి ప్రభావితం చేశాయి. మాడభూషి వాళ్ళు ఇచ్చే పురస్కారం కోసం “ఈ కాలపు మేటి కథలు” అనే అంశంపై నా కథల గురించి మరో వందపేజీల పుస్తకం రాశాడు. సునీత అనే అమ్మాయితో నేను రాసిన ఎనిమిది వందల కథల మీద పిహెచ్ డి చేయించాడు. ఆరువందల పేజీల పుస్తకమది. నా సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశాడు.

16ప్ర. సాహిత్యం యొక్క ప్రయోజనాన్ని రచయితలు ఏ దృక్కోణంలో అర్థం చేసుకోవాలి?
జ:-    ప్రాచీన కాలం నుండీ పెద్దవాళ్ళు చెప్పిన విషయం సాహిత్యం ఆనందాన్ని కలిగించేదైనా ఉండాలి. ప్రయోజనాన్ని కూర్చేదైనా ఉండాలి. ఈ రెండూ ఉండాలని చెప్పినవాళ్ళు కూడా ఉన్నారు. ఆధునిక సాహిత్యానికి ప్రయోజనం ఉండాలి. లేకుంటే అటువంటి సాహిత్యం వృధా. ఈ భావనతోనే రచనలు చేస్తున్నాను. సమాజాన్ని పట్టించుకోకపోతే రచనలు ఎందుకు? రచన మనకు తెలియకుండానే సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. నాకు తెలియకుండానే నా కథలను చదివి ఎంతోమంది ఎన్నోచోట్ల వాటిని ఉపయోగించుకున్నారు. రాజకీయ నాయకులు, సినిమావాళ్ళు కూడా తీసుకున్నారు. ఆనందం కోసం సినిమా, టివి, నాటకాల వంటి ఎన్నో సాధనాలున్నాయి. కాబట్టి సాహిత్యం ప్రయోజనకారి కావాలి. నేను రాసిన కథల గురించి ఒకప్పుడు ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. ఇప్పుడు ఫోన్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళను ఆలోచింపజేస్తున్నాయనేదే కదా! ‘బతుకమ్మ’ సినిమా గురించి కొంత మార్పు చేసి తీశారు. ఒకాయన తీస్తానని నాదగ్గరికి వచ్చి, నాతో చర్చించి డెబ్భై రెండు ఎపిసోడ్స్ రాయించి, కొన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గరే పెట్టుకొని, కాపీ చేసుకొని ఏమీ లేకుండానే వాపస్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ‘ఆంబోతు’ అనే కథను ఆర్.నారాయణమూర్తి సినిమాగా తీస్తానని ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చాడు. ‘అరణ్యం’ అనే సినిమాలో వాడుకున్నాడు చెప్పలేదు. ప్రవీణ్ కుమార్ అనే అతడు నాతో చర్చించి కథ తీసుకొని సినిమా తీశాడు. అది కూడా తెలియదు. బతుకమ్మ సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజకు కంప్లైంట్ చేస్తే “తెలంగాణలో సినిమాలు వచ్చుడే ఎక్కువ. వచ్చినదాన్ని గురించి ఎందుకు? రిసీవ్ చేసుకోవాలి. వదిలేయండి” అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రయోజనం ఉండడం వల్లనే కదా ఇంతమంది నా కథలను తీసుకున్నారు. అందువల్ల మనం ఏది రాసినా ఆనందం ఉన్నప్పటికీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మధ్యయుగంలో సాహిత్యాన్ని ప్రయోజనకరంగా రాసినవాడు వేమన.

17ప్ర. పురస్కారాలు, బిరుదులు రచయిత రచనా సామర్థ్యానికి గీటురాయిగా భావించవచ్చా?
జ:-  పురస్కారాలు, బిరుదులు రచయిత బాధ్యతను పెంచుతాయి. నేను మటుకు వాటికోసం తండ్లాడలేదు. నాకు తెలియకుండానే ఎన్నో వచ్చాయి. పోయిన నెలలో తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ‘గువ్వలచెన్న’ నవలకు పురస్కారం వచ్చింది. మీరు కూడా చూశారు కదా! నిజానికి పురస్కారాలు గీటురాయి అని అనడం సరికాదు. సామర్థ్యం ఉన్నవాళ్ళందరికీ రావు కదా! పురస్కారాలు రాని గొప్పకవులు, రచయితలు ఎంతోమంది ఉన్నారు. శ్రీశ్రీ, రావిశాస్త్రిలకు వచ్చిందా? ‘జ్ఞానపీఠ్’ వచ్చే స్థాయి ఉన్నవాళ్లు ఎంతోమంది ఉంటారు. సంవత్సరానికి ఇరవై రెండు భాషల్లో ఒక్కసారి ఇచ్చే పురస్కారాలు ఎంతమందికి వస్తాయి? ఒకవేళ గీటురాయిగా భావిస్తే మటుకు రచయిత ఇంకా సమాజంలో తన బాధ్యత పెరిగినట్లుగా భావించి సమాజానికి ఉపయోగపడే రచనలు చేయాలి.

18ప్ర. అవును సార్! ఇటీవలే తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ఉత్తమ నవలా రచయితగా పురస్కారాన్ని అందుకున్నారు. ఆ విశేషాలు చెప్పండి.
జ:-   ఫెర్టిలైజర్ సిటీలో పనిచేస్తున్నప్పుడే ‘గువ్వలచెన్న’ నవల ప్రారంభించి తరువాత పూర్తి చేశాను. తెలంగాణ చేనేత కార్మికుల, పద్మశాలీల జీవిత నేపథ్యంతో రాసింది. తెలుగులో పద్మశాలీ జీవితాల మీద వచ్చిన మొదటి నవల పోరంకి దక్షిణామూర్తి రాసినది అయితే తెలంగాణలో వచ్చిన మొదటి నవల ‘గువ్వలచెన్న’. స్వాతంత్ర్యానంతరం జీవితాలను గెల్చుకున్న క్రమాన్ని ఇందులో ఆర్ద్రంగా చెప్పాను. ఇది 2004లో చతురలో అనుబంధ నవలగా ప్రచురితమైంది. తెలంగాణ సారస్వత పరిషత్తు దీన్ని గుర్తించి ఉత్తమ నవలా పురస్కారం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది.

19ప్ర. తెలంగాణ భాషకు పట్టం కడుతూ, తెలంగాణా ఉద్యమానికి ఊతమిచ్చిన మీరు తెలంగాణా సాధించిన తర్వాత మీరు కాంక్షించిన అభివృద్ధిని భాషాపరంగా చూడగలిగారా?
జ:-  నా జీవితమంతా తెలంగాణ భాష మీద, తెలంగాణ జీవితం మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ లోని ఉద్యమాల మీద, తెలంగాణ ప్రజలతో నడిచింది. ఎవ్వరూ అనడానికి ధైర్యం చేయని సమయంలో “అవ్వతోడు గిది తెలంగాణ” అనగలిగాను. తెలంగాణ భాషలో రాశాను. ఇదేం భాష? అన్నారు. భయపడలేదు. తెలంగాణ భాషకు సాహిత్య గౌరవం కల్పించడానికి కృషి చేసిన వాళ్లలో నేనూ ఒకడిని. ఒకరకంగా ప్రధానమైనవాడిని కూడా. తెలంగాణ భాషకు అద్భుతమైన లయ, సౌందర్యం ఉన్నాయి. అయినా పాఠ్య పుస్తకాల్లో అక్షరరూపం ఎక్కలేదు. 1991లో నా ‘భూమిపుత్రుడు’ నవలకు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం ఇచ్చింది. అప్పుడు కీర్తి అవార్డులు వచ్చిన పధ్నాలుగు మందిలో నేను చిన్నవాడిని. సభలో అంతమంది మాట్లాడడం కుదరదు కాబట్టి వయస్సులో పెద్దవారు ఒకరు, చిన్నవారు ఒకరు మాట్లాడాలని సినారె గారు అన్నారు. అట్లా నాకు అవకాశం వచ్చి నేను అన్ని విషయాలు ప్రస్తావన చేస్తూ మాట్లాడుతూ సినిమారంగంలో భాష వివక్షతకు గురవుతున్నదని చెప్పాను. అక్కడున్న సినిమా వాళ్ళు మేం మీ కథలు సినిమా తీస్తాం అన్నారు. తర్వాత ఎవ్వరూ రాలేదు(నవ్వుతూ). 1969లో నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఉద్యమం ప్రారంభమైంది. నేను ‘బతుకమ్మ’ అనే కవిత రాశాను. రెండోసారి ఉద్యమ సమయంలో ఆక్టివిస్ట్ గా పనిచేస్తూనే రచనలు చేశాను. ‘సింగిడి’ అని కథల సంపుటి రాశాను. ‘గుమ్మి’ అనే డిక్షనరీ తీసిన. వ్యాసాలు రాశాను. ‘నువ్వద్ది’ అనే కాలమ్ రాశాను. ‘తెలంగాణ మట్టికథలు’ నూటా పదిహేను కథలు రాశాను. ‘తెలంగాణ తాత కథలు’ రాశాను. ఇవన్నింటిలో తెలంగాణ జీవితం ప్రతిబింబిస్తుంది. ఆ సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ కాలువ మల్లయ్య కాలిగోటికి సరిపోని వాళ్ళు పద్మశ్రీలు పొందుతున్నారు. మనవాళ్లకు పొగరెక్కువ. మన దగ్గరికి రారు. అన్నాడని మిత్రులు చెప్పారు. అయినా నేను పోలేదు. పివి నరసింహారావు హయాంలో కూడా ఆయన నాపేరు తీశాడు. అప్పుడూ నేను వెళ్ళలేదు. ఆయన చివరిదశలో కలిసినప్పుడు ఒకసారి రమ్మన్నారు. వెళ్ళలేదు. కొంతకాలానికే ఆయన చనిపోయారు. ఎన్నో అవార్డులు రావలసినవి రాలేదు. మూడుసార్లు కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు ఒకసారి మధురాంతకం రాజారావు, ఇంకోసారి కాళీపట్నం రామారావు, మరోసారి పాపినేని శివశంకర్ వల్ల ఆగిపోయింది. ఇంత జరిగినా తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగు అకాడెమీలో నేను పనిచేశాను. పాఠాలు కూడా రాయించారు. ఇంతకాలం భాష వివక్షకు గురైంది కాబట్టి ఇప్పుడైనా తెలంగాణ మాండలిక భాషా పాఠాలు పెట్టాలి అన్నాను. పట్టించుకోలేదు. కేసీఆర్ అయితే ఈ విషయాన్ని కొట్టి పారేశాడని తెలిసింది. ఏ భాషతోని అధికారంలోకి వచ్చాడో, ఏ భాష మాట్లాడి సభలను అలరించాడో ఆ భాషనే తృణీకరించాడు. తెలంగాణకు ఒక భాషా విధానం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా జరగలేదు. కనీసం నా వంటివారు అక్కడ ఉన్నా కొంత ప్రయోజనం జరిగేది. అంటే అన్ని విషయాలతో పాటు భాష ఇప్పటికీ కూడా నిర్లక్ష్యానికి గురవుతుందనే చెప్పవచ్చు.

20ప్ర. వర్తమానకాలంలో వస్తున్న రచనలు సామాజిక చైతన్యాన్ని కలిగించే దిశగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా?
జ:-   నేను తెలుగు యూనివర్సిటీ అవార్డు కమిటీలో అప్పుడప్పుడు జడ్జిగా వెళ్తాను కదా? చాలమంచి పుస్తకాలు వస్తున్నాయి. అటువంటి వాళ్లకు అవార్డులు కూడా వస్తున్నాయి. నేను ఇరవై, ముప్ఫై ఏండ్ల నుండి చేస్తున్నాను. సమాజానికి ఉపయోగపడే రచనలనే
ఎంపిక చేస్తున్నాను. వాటికే వస్తాయని కాదు. వేరే జడ్జీలు కూడా ఉంటారు కదా! ఇక భాష అనేది పాఠ్యపుస్తకాల్లో ఉన్నప్పుడు, వాడుక భాషలో అది ఉపాధినిచ్చే భాషగా ఉన్నప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది. ప్రభుత్వ పాలనా భాషగా నైనా ఉండాలి. లేదంటే మృతభాష అవుతుంది. అందుకే రచయితలు భాషను, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి.

21ప్ర. వెయ్యికి పైగా కథలతో పాటు నవలలు, కవితలు, పరిశోధన, విమర్శ, ఇరవై అయిదు, ముప్ఫయి వేల పేజీల సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించిన తెలుగు రచయితలు రెండు రాష్ట్రాల్లోనూ లేరనుకుంటాను. మీకింత సాహిత్య వస్తువు ఎట్లా లభించింది? మీరు రాసిన వందలాది పుస్తకాల్లో కొన్ని ముఖ్యమైన వాటిని పేర్కొనండి. మీకు వచ్చిన అవార్డులను, విశేషాలను, మీ అంతిమ లక్ష్యాన్ని తెలపండి.
జ:-   నేను  FCI రామగుండంలో పనిచేస్తున్నప్పుడు అందులో జీతం తక్కువ కాబట్టి దానితో పాటు ట్యూషన్లు చెప్పడం, బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కౌన్సిలర్ గా పని చేయడం, వయోజనులకు పుస్తకాలు రాయడం లాంటి పనులు చేశాను. ఉద్యోగం పోయిన తరువాత హైదరాబాద్ లో కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్, అధికార భాషా సంఘ సభ్యునిగా, SRC, ఆంధ్రమహిళాసభలో పనిచేయడం, హైదరాబాద్ మిర్రర్ పత్రికకు సబ్ ఎడిటర్ గా చేయడం, తెలుగు అకాడెమీలో విషయ నిపుణునిగా చేయడం, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడెమీలో ప్రాజెక్టు చేయడం లాంటివి చేశాను. ఏ పని చేసినా సాహిత్యానికి రిలేటెడ్ గా ఉన్నవాటిని స్వల్ప ఆదాయమైనా ఎన్నుకున్నాను.
       సాహిత్యానికి వస్తువు దొరకదన్న సమస్యే లేదు. సముద్రమెంత విశాలమైందో జీవితమంత వైవిధ్య పూరితమైంది. నాకు సాహిత్యం జీవిత వృక్షానికి పూసే పువ్వు వంటిదన్న కొడవటిగంటి కుటుంబరావు మాటలు ఇష్టం. మనిషిని, జీవితాన్ని కథా వస్తువుగా, సాహిత్య వస్తువుగా తీసుకున్నప్పుడు వస్తువుకు కరువులేదు. చిన్నప్పటినుండీ నేను ఎక్కడికి వెళ్లినా జేబులో పెన్ను, కాగితం పెట్టుకొని వెళ్ళేవాడిని. ఇప్పటికీ అంతే. ఏ సంఘటన, సంభాషణ, వస్తువు కనిపించినా నోట్ చేసుకుంటాను. అట్లా నాకు ఇరవై డైరీల నిండా నోట్స్ ఉంది. నా జీవితకాలమంతా రాసినా వస్తువుకు కొరతలేదు. అవ్వతోడు గిది తెలంగాణ, మా కథలు, ఘర్మజలానికి…..?, కాలువమల్లయ్య కథలు, నేలతల్లి, కాలువ మల్లయ్య నవలలు, బతుకు పుస్తకం, అస్పృశ్య కోయిల, మాదిగ విజయం, తెలుగులో ప్రగతిశీల కథా సాహిత్యం, అస్పృశ్య యోధుడు, విశ్వమంటే బోధిసత్వుడే, మెతుకుపుస్తకం, Book Culture, Social Transformation, కులరహిత భారతం, తెలంగాణ మట్టికథలు, తెలంగాణ మన్ను కథలు, గుమ్మి, బహుజన రాజ్యం, తెలంగాణ కథ-తెలుగు కథ, ఊరు మేల్కొన్నది, ఏది సుఖం- ఏది దుఃఖం, గువ్వలచెన్న, తెలంగాణ దేవదాసు, కులకస్పి, ఆకాశంలో సగం, తెలంగాణ తాతలు చెప్పిన కథలు, జననీ జన్మ భూమిశ్చ, మౌనవసంతం, పైలం బిడ్డా…ఇందులోని కొన్ని పుస్తకాలు మాత్రమే. సత్యాన్వేషణ గ్రంథమాల రాస్తున్నాను. ప్రపంచ దుఃఖ నివారణోషధి గ్రంథం రాయడం నా అంతిమ లక్ష్యం. ప్రపంచ దుఃఖ నివారణ సూక్తులు రాస్తున్నాను. ఆటా, తెలుగు విశ్వవిద్యాలయం, కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ అవార్డు, గురజాడ కథా పురస్కారం, గిడుగు, జాషువా దళిత సాహిత్య పురస్కారం, రావి శాస్త్రి అవార్డు లాంటి జాతీయ , అంతర్జాతీయ అవార్డులు వంద వరకు వచ్చాయి. నా కథలు, పుస్తకాలు వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్య పుస్తకాలు. నలభై మంది పరిశోధక విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎమ్ ఫిల్, పి హెచ్ డి లు చేశారు. 60, 70 కథ, వ్యాస సంకలనాల్లో నా రచనలకు స్థానం లభించింది. నా రచనల వల్ల ప్రపంచ మానవాళి యుద్ధభయం, టెర్రరిజం, ప్రకృతి విధ్వంసం లేని మానవీయ సమాజం వైపు పయనించాలని కోరుకుంటున్నాను. అదే నా జీవిత, సాహిత్య అంతిమ లక్ష్యం. చివరిదశలో నేను పుట్టిన ఊరు తెలుకుంటలో గృహనిర్మాణం చేసుకొని శేషజీవితం గడపాలనుకుంటున్నా.

22ప్ర. రచనా శిల్పంలో ఎంతో అనుభవజ్ఞులై ఒక ప్రత్యేకతను నిలుపుకొన్న మీరు కథలు గానీ నవలలు గానీ ఎట్లా ఉండాలో ఈ తరం వారికి ఏవైనా సూచనలు
చేయండి.
జ:-   రచనలు ఎట్లా ఉండాలన్నది తీసుకునే అంశాన్ని బట్టి ఉంటుంది. మనం ఎందుకోసం, ఎవరి కోసం, దేనికోసం రాస్తున్నామో స్పష్టత ఉండాలి. అంటే రచయితకు స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉండాలి. సమాజ గమనం ఎట్లా ఉంది? ఎట్లా ఉండాలి? సమస్యలు ఎక్కడ ఉన్నాయి? వాటికి పరిష్కారం ఏమిటి? అనేది ఉండాలి. పరిష్కారాన్ని ప్రత్యక్షంగా చూపించకపోయినా ధ్వనింపజేయాలి. సమస్యను చెబుతూనే పరోక్షంగా పరిష్కారాన్ని సూచించాలి. ముఖ్యంగా ఈ తరం వాళ్ళు అధ్యయనం చేయాలి. అది తక్కువైంది. బాగా అధ్యయనం చేసేవారు జీవితంలోని సమస్యలను సరిదిద్దుకోగలరు. ఇంకొకటి సమాజం ‘మేము’ నుండి ‘నేను’ లోకి వెళ్ళిపోతున్నది. ఇవన్నీ పరిష్కారం కావాలంటే మంచి సాహిత్యం ఇంకా రావాలి. రచన మీద స్పష్టమైన దృక్పథం ఉండాలన్నదే నా అభిమతం. సాహిత్యం పురోగామి సమాజానికి దిక్సూచి గా ఉండి తీరాలి. సాహిత్యం కేవలం టైమ్ పాస్ కోసం చదివేది కాకూడదు. ప్రయోజనం లేని సాహిత్యం వృథా అని ఇప్పటికీ, ఎప్పటికీ నమ్ముతాను. సమాజాన్ని వెనుకకు తీసుకెళ్లే సాహిత్యం రాయడం కన్నా రాయకుండా ఉండడమే మంచిది.

ధన్యవాదాలు సార్. మీ విలువైన సమయాన్ని వెచ్చించి సుదీర్ఘమైన మీ రచనా జీవితాన్ని, ఒడిదుడుకులను మీ తపనను వివరించినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున కృతజ్ఞతలు, నమస్కారాలు సెలవు🙏🏼

July 28, 2025 9 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

మూత్రపిండం బాధ

by డా.కందేపి రాణీప్రసాద్ July 28, 2025
written by డా.కందేపి రాణీప్రసాద్

అలా స్తబ్దుగా ఉన్నావేమిటి? అవునూ మొహం గoటు పెట్టుకొని ఉన్నావేమిటి? అరే ఏమైంది? మొహం ఉబ్బిపోయింది? అంటూ కదలామెదలక కూర్చున్న మూత్రపిండాన్ని పలకరించింది క్లోమం. క్లోమం అలా పలకరించిందో లేదో మూత్రపిండం ఒక్కసారిగా ఏడ్చేసింది.
“ఊరుకో ఊరుకో ఏడవకు! ఏమైందో చెప్పు! అలా నీరసంగా ఉన్నావేమిటి? మూత్రపిండం వీపు నిమురుతూ ఉరడిస్తూ అడిగింది క్లోమం. ఏం చెప్పమంటావు నా బాధ. నా మొహం ఉబ్బిపోయింది నేనేమీ పని చేయలేకపోతున్నాను. నా కాళ్లు కూడా ఎలా వాచిపోయాయో చూడు”. అంటూ తన కాళ్ళను చూసుకోగానే మాట్లాడడం ఆపి ఏడవడం మొదలు పెట్టింది మూత్రపిండం.
అయ్యో ఏడవకు ఏడవకు, సరే తర్వాతే చెబుదువు గానీ ముందు ఏడవటం ఆపేయ్, ఇలా కూర్చో! కళ్ళు తుడుచుకో అని ఊరడిస్తూ “ఇదిగో కాసిని మంచినీళ్లు తాగు అన్నది క్లోమం. ఆ మాట అనీ అనగానే మూత్రపిండం మళ్ళీ ఏడవడం మొదలు పెట్టింది. అరే మళ్లీ ఏమైంది నీతో ఏం మాట్లాడినా ఇబ్బందిగా ఉన్నదే అని క్లోమం ముందుకు వంగి మూత్రపిండం భుజం తడుతూ అన్నది.
మూత్రపిండం ఏడుస్తూనే “నా ఈ పరిస్థితికి కారణం మంచినీళ్లే కదా! అందుకే నీవు మంచినీళ్లు మాట ఎత్తగానే నాకు ఏడుపు వచ్చింది” వెక్కుతూ వెక్కుతూ చెప్పింది. “అంటే ఏమిటి! మంచి నీళ్ల వలనే నీకీ పరిస్థితి దాపురించిందా! నాకు నీ విషయం వింతగా ఉన్నది నాకేమీ అర్థం కావడం లేదు” అన్నది ఆశ్చర్యంగా క్లోమం.
“నా మొహం కళ్ళు, కాళ్ళు ఇలా వాచిపోయి రోగగ్రస్థమై పోయానంటే ప్రధాన కారణం మంచినీరే. నా కడుపు లోపల రాళ్లు ఏర్పడి బాగా నొప్పి కలిగిస్తుంది. నా ఈ అవస్థలన్నింటికీ కారణం మంచినీరే!” అంటూ మూత్రపిండం చెబుతూ ఉండగానే క్లోమం మధ్యలో అడ్డు తగిలింది. “సకల జీవులకు దాహం తీర్చే మంచినీరు నీకిన్ని కష్టాలను తెచ్చిందా, నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. పంచభూతాలలో ఒకటైన స్వచ్ఛమైన మంచినీరు పోయే ప్రాణాలను నిలబెడుతుంది తిండి లేకపోయినా మంచినీటితో కొన్ని రోజులు జీవించవచ్చు అని అంటారు కదా! ప్రాణాన్ని నిలబెట్టే నీరు కాసేపు గొంతు తడపకపోతే ప్రాణం పోవడం ఖాయం అలాంటి మంచినీటిని తప్పుగా మాట్లాడుతావా”? ఆవేశంగా అన్నది క్లోమం.
“నేను చెప్పేది పూర్తిగా వినకుండా మాట్లాడతావేమిటి? మంచినీళ్లు తాకపోవడం వల్లే నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం. నేనొక ఆడపిల్ల కడుపులో ఉన్నాను ఆ అమ్మాయి ఏ రోజూ తగినంత మంచినీరు తాగదు అందువల్లే నాకీ జబ్బులు వచ్చాయి” అన్నవి మూత్రపిండం రోదిస్తూనే!
“ఓహో మంచినీరు తాగకపోవడం వల్ల నీకి జబ్బులు వచ్చాయా! మరి సరిగా చెప్పవేం? నేను మంచినీటి వలనే ఇలాంటి జబ్బులు వచ్చాయనుకున్నాను. అదేమిటి నేను ఎప్పుడూ వినలేదే అనుకున్నాను అందుకే ఆశ్చర్యం అనిపించింది. సరే ఇంతకు మంచినీరు ఎందుకు తాగటం లేదట” ఆరాగా అడిగింది క్లోమం
“అదే నేను ఇందాక చెప్పాను కదా! నేనొక ఆడపిల్ల కడుపులో ఉంటున్నానని. ఆడపిల్లకు చాలా చోట్ల బాత్ రూములు అందుబాటులో ఉండవు. బాత్ రూములు తక్కువగా ఉండటం వలన మూత్ర విసర్జన కష్టం కదా! ఎక్కువసార్లు మూత్ర విసర్జన జరగకుండా ఉండాలంటే మంచినీళ్లు తాగటం మానేయాలి అనుకుంటారు. అందుకే చాలామంది ఆడపిల్లలు బయటికి వెళ్లాలంటే మంచినీరు తాగరు. వారు మంచినీరు తాగకపోతే నా పని ఎలా జరుగుతుంది. దేహంలోని విసర్జకాలను నేను జల్లెడ బట్టి నీటితో కలిపి బయటికి పంపించే డ్యూటీయే కదా నాది, మరి మంచినీళ్లు లేకపోతే దేహంలో ఉన్న పనికిరాని వ్యర్థాలను బయటికి ఎలా పంపించాలి దాని వల్లే నాకీ బాధ” బోరు బోరున ఏడుస్తూ తన బాధను వెళ్ల గక్కింది మూత్రపిండం.
“వాళ్లు మంచినీళ్లు తాగకపోతే నువ్వేం చేస్తావు దానికి నువ్వు బాధపడి ఏం ప్రయోజనం. వారి శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించకు. వాళ్లకే అనారోగ్యం వస్తుంది. వారి ఆరోగ్యం గురించి వారికి శ్రద్ధ లేదా” అని క్లోమం కొద్ది కోపంతో అన్నది.
వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉంటే నాకీ బాధ ఉండదు. వారికి శ్రద్ధ లేకపోవడం వల్లే నాకీ కష్టాలు వస్తున్నాయి. నేను వ్యర్ధాలను బయటికి పంపకపోతే నాకే నష్టం జరుగుతుంది. మన ఇంట్లో చెత్త పేరుకుపోతే ఇల్లంతా దుర్గంధమయం అయినట్లుగా ఈ వర్గాలంతా నా కడుపులోపలే ఉంటే అనారోగ్యం సంభవిస్తుంది. వాళ్లకు డయాలసిస్ అవసరం పడుతుంది. నన్ను ఇబ్బంది పాలు చేసి వారు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏమిటో ఈ తెలివి తక్కువ మనుషులు. “నాగరికత పెంచుకున్నాం, మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి” అని విర్రవీగే మనుషులు వారికి వారే సొంతంగా జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. అని మూత్రపిండం వాపోయింది.
“ఓహో అలాగా! చక్కగా సమయం ప్రకారం మంచినీరు తాగితే ఇన్ని సమస్యలు ఉండవు కదా! చిన్న జాగ్రత్త పాటిస్తే పెద్ద సమస్య నుంచి బయటపడవచ్చు. ఆడపిల్లకు తగినన్ని బాత్ రూములు కట్టించవచ్చు కదా! దీనివల్ల ఎంతో ఉపయోగముందని తెలుసు కదా! తెలిసీ పరిష్కరించకపోవడం ఎంత తప్పు” క్లోమం ఆవేశంగా అన్నది.
“నా బాధ కూడా అదే కదా! ఏం చెయ్యను. ఏమి చేయలేకనే ఏడుస్తూ కూర్చున్నాను. ఎంతో తెలివిగల మానవులు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా? నా బాధలు ఎప్పుడూ తీరతాయో! ఎప్పుడైతే పరిష్కార దిశగా ప్రయత్నాలు జరుగుతాయో అప్పుడే నా బాధలు మాయమవుతాయి. దానికోసమే ఎదురుచూస్తున్నాను” అంటూ క్లోమం చెయ్యి పట్టుకుని నడవలేక నడుస్తూ వెళ్ళిపోయింది మూత్రపిండం.

July 28, 2025 7 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తిరుమల తిరుపతి లోని 108 ముఖ్య తీర్థాలు : ముక్తి మార్గాలు

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) July 28, 2025
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)


భారత దేశం లోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. దేనికది విశేషమైన చరిత్ర ను చెబుతున్నాయి. ఈస్ట్రెన్ ఘాట్స్ గా పేరున్న శేషాచలం కొండలు పచ్చని అడవులతో , పక్షి జాతుల తో జంతుసంతతితో అలరారుతున్నాయి. వీటినే తిరుమల గిరులు అంటారు.
తిరుమలగిరుల్లో 1008 తీర్థాలు ప్రధానమైనవి. ఈ తీర్థాల విశిష్టత ను తెలుసుకుందాం…
వీటిలో 108 జ్ఞానప్రదాతలుగా తెలియచేయబడినాయి.
తిరుమల తీర్థాలలో స్నానమాచరిస్తే వారికి ముక్తి కలుగు తుందని చెప్తారు. ఒక్కొక్క తీర్థానికి పేరు పెట్టబడింది.వాటిలో కొన్ని తీర్థాలను గురించి……

కుమార తీర్థం
కుమారస్వామి తారకాసురుడిని సంహరించడం వల్ల బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది. కుమారస్వామి బ్రహ్మ హత్యా దోష నివారణకు తగిన పరిహారం చెప్పమని మహేశ్వరుడిని ప్రార్ధించాడు. అప్పుడు శంకరుడు “నువ్వు భూలోకంలోని వేంకటాచల క్షేత్రానికి వెళ్ళు. ఆ ప్రదేశంలో ఉన్న పరమపవిత్రమైన తీర్థంలో నువ్వు ప్రతి రోజూ స్నానం చేసి ఆ పర్వతంపైన వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేయి. ఆ స్వామి నీ దోషాన్ని తొలగిస్తాడు. అని చెప్పి కుమారస్వామిని భూలోకానికి పంపాడు.
జనకుడు ఆదేశించిన ప్రకారంగా చేసి తన దోషాన్ని నివృత్తి చేసుకున్నాడు కుమార స్వామి. తపస్సుకు ముందు ప్రతిరోజూ కుమారస్వామి ఆ తీర్థంలో స్నానమాచరించడం వల్ల ఆ తీర్థానికి కుమార తీర్థంగా పేరు వచ్చిందని తెలు స్తోంది. ఈ తీర్థంలో స్నానం చేసిన వారు నవయవ్వన వంతులుగా ఉంటారని పురాణ కథ ద్వారా తెలుస్తోంది.

పూర్వం ఒక పండు ముదుసలి ఈ తీర్థంలో స్నానం చేసి బయటకు రాగానే యువకుడిగా మారిపోయాడట. స్వామి వారి ఆలయానికి సుమారుగా ఏడు కిలో మీటర్ల దూరంలో వాయవ్య దిశలో ఈ తీర్థం ఉంది. మాఘ పూర్ణిమ, మఖ నక్షత్రంనాడు మధ్యాహ్న సమ యంలో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

తుంబుర తీర్థం
తుంబురుడు తన వీణను వాయిస్తూంటే ఆ వీణను చూసిన నారదుడు నీ వద్ద ఆ కొత్త వీణ ఎక్కడిది అని అడిగాడు. ఒక మహారాజును తాను కీర్తించగా ఆ రాజు ఈ వీణను తనకు బహుమతిగా ప్రసాదించాడని చెప్పాడు తుంబురుడు. దైవాన్ని స్తుతించవలసిన నోటితో మానవుని కీర్తించడమేమిటని ఆగ్రహించిన నారదుడు నువ్వు చేసిన ఈ పనికి దైవత్వాన్ని కోల్పోయి భూలోకం లోనే ఉందువుగాక అని తుంబురుని శపించాడు. నారదుని శాపఫలితంగా తుంబురుడు తిరుమలేశుని కొండ మీద ఘోణ తీర్థంలో భూమి మీద పడతాడు. ఘోణ తీర్ధంలో స్నానమాచరించి ఆ పర్వతం మీదే ఉండి, శ్రీవేంకటేశ్వరుని గురించి తపస్సు చేస్తాడు. అతని భక్తికి, దీక్షకు, ఏకాగ్రతకు మెచ్చిన ఆ స్వామి తన దేవేరితో సహా అతనికి దర్శన మిచ్చాడు. నారదుని శాపం నుంచి తుంబురునికి విముక్తి కలిగించాడు. తాను ఆ ప్రాంతాన తపమాచరించడం వల్ల ఆ తీర్ధం తన పేరు మీద తుంబురు తీర్ధంగా ప్రసిద్ధి చెందాలని తుంబురుడు స్వామిని కోరాడు. అప్పటి నుంచి స్వామి అంగీకారంతో ఘోణ తీర్ధం తుంబురు తీర్ధంగా పిలువబడుతూ ప్రాముఖ్యతను పొందింది. ఫాల్గుణ మాసం, ఉత్తర ఫల్గునీ నక్షత్రం పౌర్ణమి నాడు మధ్యాహ్న సమయంలో తుంబురు తీర్థంలో స్నానం చేసినట్లయితే వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి. వారి కోరికలు నెరవేరుతాయి. ఈ తీర్థం శ్రీవేంకటేశ్వరస్వామి కోవెలకు సుమారుగా 14 కిలో మీటర్ల దూరంలో ఉంది.

ఆకాశగంగ తీర్ధం
ఈ తీర్థ ప్రాముఖ్యతను స్కాంధపురాణం తెలిపింది. అంజనాదేవి ఈ తీర్థంలో స్నానమాచరించి ఇక్కడ తపస్సు చేసి వాయుదేవుడు ప్రసాదించిన ఫలాన్ని తిన్న తర్వాత గర్భంధరించి, ఆంజనేయునికి జన్మనిచ్చిం దని పురాణం ద్వారా వివరిం చబడింది. ఈ కొండ మీద అంజనాదేవి తపస్సు చేయడంవల్ల ఆంజనేయునికి జన్మనివ్వడం వల్ల దీన్ని అంజనాద్రిగా పిలుస్తారు. ఆకాశగంగ తీర్థం గురించి ఒక కథ ఉంది. పూర్వం శ్రీశైలపూర్ణుడు పాపవినాశన తీర్థం నుండి స్వామివారికి అభిషేక జలాన్ని తెచ్చేవాడు. స్వామివారిపై అతనికున్న భక్తిశ్రద్ధలను గుర్తించిన తిరుమలేశుడు ధనుస్సు, బాణాలతో ఒక కిరాతకుని రూపం ధరించి శ్రీశైల పూర్ణుడు ప్రతిరోజూలాగానే పాపవినాశనం నుంచి పవిత్ర తీర్థజలం తెస్తూంటే అతనికి అడ్డు నిలిచి తనకు అమిత దాహంగా ఉందనీ, ఆ నీటితో తన దాహాన్ని తీర్చమనీ ప్రాధేయ పూర్వకంగా అడిగాడు. శ్రీశైలపూర్ణుడు ‘ఆ జలాన్ని పాపవినాశనం నుంచి స్వామి వారి అభిషేకా నికి తీసుకువెళ్తున్నాని, అది మానవుల కోసం కాదనీ, అతనికి నీరు ఇవ్వలేని తన నిస్సహాయతను తెలిపి ముందుకు అడుగులు వేశాడు. వెనుకనే వస్తున్న కిరాతకుని రూపంలో ఉన్న శ్రీనివాసుడు బాణం చేసి మట్టికుండకు రంధ్రం చేసీ, ఆ కుండలోని ఉదకాన్ని తాగేవాడు. ఆ ఘటం బరువు తగ్గడం గమనించిన శ్రీశైలపూర్ణుడు కుండకు రంధ్రం ఉండటం గమనించారు. “భగవంతునికి సమర్పించవలసిన జలాన్ని నువ్వు తాగేసి అపచారం వేశావు” అని బాధ పడుతున్న శ్రీశైలపూర్ణుడితో “దాహాన్ని తట్టుకోలేక ఆ పని చేశాను. అయినా నువ్వు విచారించవలసిన పని లేదు. ఇక్కడకు దగ్గరలోనే ఒక తీర్థం ఉంది. అందులోని జలాన్ని తీసువెళ్ళి స్వామివారి అభిషేకానికి సమర్పించవచ్చు” అన్నాడు. కిరాతకుడు.

కిరాతకుడి మాటలు విన్న అతను ఆ కిరాతకుని వెంట జలం తేవటానికి వెళ్లాడు. అతను శ్రీశైలపూర్ణుడిని ఆకాశతీర్థం వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ తీర్థం లేకపోయేసరికి అతను ఒక గడ్డిపోచను తీసి బాణంగా చేసి కొండ మీదకు విసిరాడు. అక్కడ నీరు ఉబికి ధారగా క్రిందకు రాసాగింది. “ఇది ఆకాశగంగానదిలోంచి వచ్చే జలం. ఇక ఈ తీర్థాన్ని ఆకాశగంగా తీర్థం అని పిలుస్తారు. దీన్నే శ్రీవేంకటేశ్వర స్వామి అభిషేకానికి ప్రతి రోజూ తీసుకువెళ్ళు. ఇందులోని జలం ఎంతో పవిత్ర మైనదిగా భావించబడుతుంది” అని చెప్పి వెళ్ళిపోయాడా కిరాతకుడు. ఇక్కడ పితృకార్యాలు కూడా చేస్తారు. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు చిత్తా నక్షరంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థంలో మరికొన్ని తీర్థాలు వచ్చి చేరుతాయి. కనుక ఆ రోజున ఆకాశగంగ తీర్ధంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. ఈ ఆకాశగంగ తీర్ధం తిరుమలేశుని ఆలయానికి సుమారుగా అయిదు కిలోమీటర్ల దురంలో ఉంటుంది.

పాండవతీర్థం

ఈ పాండవ తీర్థాన్ని గోగర్భ తీర్థం అని కూడా చెప్తారు. ఇది గోగర్భ డ్యామ్కు కిందగా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే పాండవులు నివసించినట్లుగా తెలుస్తోంది. పాండవులు రాజ్యాన్ని వీడి ద్రౌపదితో కలిసి శ్రీకృష్ణుడి సలహా ప్రకారంగా ఈ క్షేత్ర తీర్థం వద్దకు వచ్చి ప్రతిరోజూ తీర్థంలో స్నానం ఆచరిస్తూ శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించే వారు. ఇక్కడ వారు ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించి రాజ్యాన్ని దక్కించుకున్నారు. పాండవులు నివసించి స్నానమాచ రించిన తీర్థం, స్వామిని వారు కొలిచినందున ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు ఏర్పడింది. ఈ గోగర్భజలం తిరుమలకు చేరుతోంది. వృషభమాసం, శుద్ధ ద్వాదశి ఆదివారంనాడు లేదా బహుళ ద్వాదశి మంగళవారం నాడు ఈ తీర్థపు జలంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పోయి పుణ్యం లభిస్తుందని భక్తుల పరిపూర్ణ నమ్మకం. పాండవ తీర్థ సమీపంలో ఒక రాయి రెండు ముక్కలుగా విడిపోయింది. ఒక భాగం తీర్థ సమీపంలోనూ, రెండోది ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో ఉంది. ఈ గుండ్రాయిని దైవంగా భావిస్తూ మొక్కుకుంటే కలహాలు నివారించబడి అపార్థాలు, అశాంతి తొలగిపోతాయి. ఈ తీర్ధం శ్రీవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

      ఇక్కడ గంగాదేవి ఆంజనేయ స్వామి దేవాల యాలు ఉన్నాయి. పాపవినాశన తీర్థంలో స్నానం చేసిన భక్తులు ఆ ఆలయాలను దర్శిస్తారు. పేరుకు తగ్గట్టే ఈ తీర్థం పాపాలను హరిస్తుంది. ఆశ్వయుజ శుక్ల పక్షం, సప్తమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన ఆదివారంనాడు. లేదా ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన నాడు ఈ తీర్థానికి పర్వదినం. ఆ రోజుల్లో ఇతర తీర్థాలలోని జలం ఈ తీర్థంలోకి చేరుకుంటాయి. అందువల్ల ఆ పర్వదినాల్లో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల అనారోగ్యాలు, మానసిక అశాంతి, వేదనలు తొలగిపోయి పుణ్యం లభి స్తుంది. ఈ పాపవినాశన తీర్థం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి గుడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.

శేష తీర్థం

ఈ తీర్థం లోయలో ఉంది. ఈ తీర్థానికి చేరు కోవడమన్నది సాహసోపేతమైన చర్య. ఈ క్షేత్రం ఆది శేషుని తలపిస్తుంది. పాచికాల్వ గంగమ్మ గుడి నుంచి బయలుదేరి ఆ మార్గానికి రెండు వైపులా కనిపించే లోయ లను పాచిమడుగు, అవ్వాచారి కోనలు, సున్నపురాతి కోనలు, పోలిగాడి శిలను దాటుకుని ఈ శేషతీర్థానికి చేరుకోవలసి ఉంటుంది. తిరుమలేశుని గుడికి రామకృష్ణతీర్థం దగ్గర గా ఉంటుంది.

రామకృష్ణుడనే ఋషి శేషాచలం పర్వతం మీద తపస్సు చేసాడు. ఆయన తను స్నానం చేయటానికి ఒక తీర్థాన్ని ఏర్పరచుకున్నాడు. శ్రీనివాసుడు ఆ మహర్షికి దర్శనమిచ్చి ఆయన నిర్మించిన తీర్థం ఆ ఋషి పేరుతో రామకృష్ణతీర్థంగా పిలువబడుతుందని వరమిచ్చాడు. స్వామి ఆ మహర్షిని కరుణించిన రోజు మకరమాసం, పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ఈ తీర్థానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఆ రోజు దేవతలు దిక్పాలకులు వచ్చి ఈ తీర్థంలో స్నానం చేస్తారట. ఈ తీర్థం గురించి స్కాంధపురాణంలో తెలియజేయబడింది. ఆ రోజున ఈ తీర్థంలో స్నానం చేసిన భక్తుల నేరాలు, దోషాలు నివా రింపబడుతాయి. గురువులు, తల్లిదండ్రుల అభిమానాన్ని, అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీవారి ఆలయానికి దాదాపుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తీర్థం.

జాబాలి తీర్థం
తిరుమల నుంచి ఆకాశగంగకు చేరుకునే మార్గంలో ఈ తీర్థం నెలకొని ఉంది. ఈ ప్రదేశంలో జాబాలి మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ తీర్థానికి ఆ పేరు వచ్చింది. హనుమంతుని పుట్టుక ఈ ప్రదేశం లోనే జరిగిందని స్థలపురాణ కథల ద్వారా తెలుస్తోంది. బాల్యంలో ఆంజనేయుడు ఇక్కడే ఉన్నట్లు, సూర్యని చూసి అది పండుగా భ్రమించి మింగబోవడం కూడా అక్కడే జరిగిందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. రావణుని సంహరించిన రాముడు పత్నీ సమేతంగా అయోధ్యకు వెళ్లేటప్పుడు ఈ ప్రాంతానికే వచ్చినట్లుగా ఓ ప్రత్యేక కథనం. స్థల మహత్యాన్ని తెలుసుకున్న జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లుగానూ, అప్పుడు ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని స్థలపురాణం తెలియజేసింది. ఇక్కడ బాలాంజనేయస్వామి ఆలయ ఉంది. చైత్రపౌర్ణమి నాడు హనుమజ్జయంతి పర్వదినాన్ని ఇక్కడ జరుపుతారు. తిరుమలేశుని సన్నిధికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ తీర్ధం ఉంది. ఈ తీర్థాన్ని జాపాలి, జాడాలి అన్న పేర్లతో పిలుస్తారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే ఆధ్యాత్మిక భక్తి భావనలు పెరుగుతాయి. భగవంతునికి భక్తి మార్గం ద్వారా చేరువై ఆయన అనుగ్రహన్ని పొందుతారని భక్తులు విశ్వాసం. గ్రహబాధలు, గాలి, ధూళి (దెయ్యాలు), భూతాలు) తొలగిపోతాయని చెప్తారు.

కపిల తీర్ధం

పూర్వం భగీరథుడనే చక్రవర్తి శివుని తపమాచ రించి ఆయనను ప్రసన్నుడిని చేసుకున్నాడు. గంగానదిని తెచ్చే ప్రయత్నంలో గంగానది పాతాళలోకానికి భోగవతి’ అన్న పేరుతో చేరుకుంది. ఆ నదీతీరంలోనే కపిల మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజాభిషేకాలను చిత్తశుద్ధితో భక్తిశ్రద్ధలతో చేస్తుండేవాడు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పాతాళ లోకంలోని శివలింగం పెరుగుతూ భూమిని చీల్చుకుని పైకి వచ్చేసింది. ఆ లింగం మరింత పెరగకుండా బ్రహ్మ దేవుడు ధేనువు ఆకారం దాల్చి కాలిగిట్టలతో లింగాన్ని తొక్కి పెట్టినట్లు ఆ లింగం పైభాగాన ధేనువు గిట్టల గుర్తులు స్పష్టమవుతాయి. ఈ కపిలేశ్వర మహాలింగం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. భోగవతి గంగ కూడా శివలింగంతోపాటు పైకి ఉబికి వచ్చింది. దాన్నే కపిల తీర్ధంగా చెప్తారు. ఈ తీర్థప్రాంతంలో శ్రీకపిలేశ్వరస్వామి, దేవేరి కామాక్షితో కలిసి భక్తులకు తన దర్శనాన్ని ప్రసా దిస్తారు. ఇక్కడ ఉమాదేవితోనూ, స్కంధునితోనూ కలిసి ఒకే పీఠంలో ఉత్సవమూర్తి ఉండటంవల్ల ఆయనకు సోమాస్కంధమూర్తి అన్న పేరు ఏర్పడింది. ఈ కపిల తీర్థాన్ని గురించి అనేక కథలు ఉన్నాయి. వకుళమాత పద్మావతిదేవిని శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేయాల్సి ఉందిగా ఆమె తండ్రిని కోరాలని వెళ్తూ తన కోరిక నెరవేరాలన్న ధ్యేయంతో ఈ కపిల తీర్ధంలో స్నానం చేసిందట. అగ్నిదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి శివలింగా నికి పూజాభిషేకాలు నిర్వర్తించడంతో ఇక్కడి శివలింగానికి ఆగ్నేయలింగం అన్న పేరు ఏర్పడినట్లుగా పురాణకథనం. ఈశ్వరుడు తాను వేంకటాచలంలో ఉంటానని విష్ణువును కోరాడు.

అప్పుడు విష్ణుమూర్తి వేంకటాచల పర్వతపు ఆగ్నేయమూలగా ఉండమని ఆదేశించారట. విష్ణుమూర్తి ఆదేశానుసారంగా కపిల తీర్థ సమీపాన శివుడు ఇక్కడ ఉండటం వల్ల ఆ లింగం ఆగ్నేయలింగంగా పేరు పొందింది. అలిపిరికి దిగువన ఉన్నది ఈ కపిల తీర్ధం. ఈ తీర్థం శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల నుండి ఉద్భవించి తిరుమల కొండల మీదుగా ప్రవహించి తిరుపతికి చేరు కుంటుంది. అచ్యుత దేవరాయలు ఈ తీర్థం చుట్టూ నాలుగువైపులా నాలుగు సుదర్శన చక్రాల రాళ్ళను నాటి దానికి చక్ర తీర్థమని పేరు పెట్టారని చరిత్రాధారాలతో తెలుస్తోంది. దీన్నే సుదర్శన చక్రత్తాళ్వార్ తీర్ధం అని పిలుస్తున్నారు. శైవులు ఈ తీర్థాన్ని కపిల తీర్ధంగానూ, వైష్ణవులు ఆళ్వార్ తీర్ధంగానూ చెప్తారు. కపిలతీర్థంలో పితృకర్మలు, పిండ ప్రదానాలు, ఇతర దానాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు. ఆశీర్వ దిస్తారు. కోనేటికి దక్షిణంవైపుగా శ్రీవేణుగోపాలస్వామి దేవేరులు రుక్మిణి, సత్యభామల సమేతంగా ఆలయంలో భక్తులకు తన దర్శనాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ శ్రీలక్ష్మీ నారాయణుని ఆలయం కూడా ఉంది. కపిల తీర్ధంలో స్నానం చేస్తే ఏడుకొండలను ఎక్కి స్వామిని సునాయా సంగా అలసట లేకుండా దర్శించుకోగలమని భక్తుల నమ్మకం. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పోయి పుణ్యం లభిస్తుంది. భగవంతుని అనుగ్రహం పొందుతారు. కోరికలు మొక్కులు తీరుతాయి.

శక్రతీర్థం:
కపిల తీర్థానికి పైభాగాన ఉంది శక్రతీర్థం. శక్రుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు గౌతమి మహర్షి భార్యతో సంగమించిన పాపాన్ని తొలగించు కోవటానికి గాను ఈ తీర్థంలో స్నానమాచరించాడు. శక్రుడు నివసించిన ఈ తీర్థానికి చక్రతీర్థం అన్న పేరు ఏర్పడింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు దోషాలు నివారింప బడుతాయని భక్తుల నమ్మకం.

విష్వక్సేన తీర్ధం
శక్రతీర్ధానికి సమీపంలో ఉంది ఈ తీర్థం. వరుణ దేవుని పుత్రుడయిన విష్వక్సేనుడు ఇక్కడ తపస్సు ఆచరించాడు. అతని భక్తికి ప్రసన్నుడై విష్ణుమూర్తి దర్శన మిచ్చాడు. అతనిని తన సేనాధిపతిగా నియమించి విష్వక్సేనునికి శంఖు, చక్రాయుధాలను ప్రసాదించాడు. ఆ తీర్థం వరుణుని కుమారుని పేరు మీద విష్వక్సేన తీర్ధం అన్న పేరు మీద ప్రసిద్ధి చెందింది.

పంచాయుధ తీర్థాలు
విష్ణుమూర్తి ఆయుధాలయిన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనుస్సు వేరువేరు ప్రాంతాల్లో శ్రీమహా విష్ణువును గురించి తపస్సు చేశాయి. వాటి తపస్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై వాటిని అనుగ్ర హించాడు. అవి తపస్సు చేసిన స్థలాలే వాటి పేర్లతో తీర్థాలుగా ఏర్పడ్డాయి. శంఖతీర్థం, చక్రతీర్థం, గదాతీర్థం, నందక తీర్ధం, ధనుస్తీర్థంగా ఆ తీర్థాలు పిలువబడ్డాయి. ఈ పంచాయుధ తీర్థాలలో స్నానం చేసిన భక్తులకు శత్రుభయం ఉండదు. పాపాలు తొలిగిపోతాయి.

అసల తీర్థం
పూర్వం అగ్నిదేవుడు ఉదరంలో నొప్పితో బాధ పడసాగాడు. తన అనారోగ్యాన్ని పోగొట్టుకోటానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు. అప్పుడు ఆయన బాధ తొలగి పోయింది. అందువల్ల ఈ తీర్థాన్ని అనల తీర్థమనీ, అగ్ని తీర్థమనీ అంటారు. ఈ తీర్థంలో స్నానం చేసే వారికి ఆరోగ్యం పెంపొందుతుందని చెప్తారు. అనారోగ్యాలు తొలగిపోతాయి.

సనకసనందుల తీర్థం
బ్రహ్మ మానస పుత్రులు సనకసనందులు. వీరిద్దరే కాక ఎందరో మహర్షులు పరమేశ్వరుని గురించి ఈ ప్రాంతంలో తపస్సు చేశారు. ఇక్కడ వారు పరమేశ్వరుని అనుగ్రహం పొందటంతో ఈ తీర్థానికి సనకసనందుల మహర్షుల పేరు వచ్చింది. ఈ తీర్థం పాపవినాశనం డ్యామ్కు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.

బ్రహ్మతీర్థం
అగ్ని తీర్థానికి ఎగువగా ఉంటుంది బ్రహ్మతీర్థం. ఇక్కడ బ్రహ్మదేవుడు నారాయణుని గురించి తపస్సు చేశాడు. శ్రీహరి బ్రహ్మదేవునికి ప్రత్యక్షమై ఆయన కోరిక ప్రకారంగా సృష్టి కార్యానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా నిరాటంకంగా కొనసాగేటట్లుగా వరం పొంది నట్లుగా తెలియచేయబడింది. బ్రహ్మదేవుడు తపమాచ రించిన కారణంగా దీనికి బ్రహ్మతీర్ధమనే పేరు కలిగింది. ఈ తీర్థంలో స్నానం చేసిన భక్తులకు బ్రహ్మహత్యాపాతకం, ఇతర దోషాలు తొలగిపోతాయి.

త్రిమూర్తి తీర్థాలు
కపిల తీర్థానికి వాయువ్య దిశలో పెద్ద గూళ్ళల్లాగా మూడు దొన్నెలు ఉంటాయి. వాటి ద్వారా నీరు ప్రవహిస్తూ ఆ జలం కపిలతీర్ధంలో కలుస్తుంది. ఆ మూడు దొన్నెలను త్రిమూర్తులుగా భావిస్తూ వాటిని బ్రహ్మ గుండం, విష్ణుగుండం, మహేశ్వర గుండంగా పిలుస్తారు. మూడు దొన్నెలు ఒకే చోట ఉండడంతో ఈ తీర్థానికి త్రిమూర్తుల తీర్థాలు అనే పేరు ఏర్పడింది. కపిలేశ్వరుని అభిషేకించటానికి మహేశ్వర గుండంలోని నీటిని ఉపయోగిస్తారు.

అస్థి తీర్ధం
పూర్వం కృష్ణ శర్మ అనే బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను తీసుకుని గర్భవతి అయిన తన పత్ని, కుమారు నితో కాశీ పట్టణానికి బయలుదేరాడు. గంగానదిలో స్నానం చేసి తండ్రి అస్థికలను ఆ పుణ్యనదిలో కలిపి పితృకార్యం నిర్విఘ్నంగా నెరవేర్చాలనుకున్నాడు. అతను తొండమాన్ రాజును దర్శించాడు. “మహారాజా! నా భార్య గర్భవతి. నా కుమారుడు చిన్నవాడు అవడం వల్ల వీరు ప్రయాణించడం దుర్భరమవుతుంది. వీరిని వెంట పెట్టుకుని కాశీకి వెళ్ళలేను. అందువల్ల నా భార్యను, పుత్రుడిని మీ వద్ద ఉంచి నేను కాశీకి వెళ్ళి పితృకార్యాలను నిర్విఘ్నంగా నిర్వహించి వస్తాను అంతవరకూ దయ ఉంచి మీరు వారి పోషణ, రక్షణ బాధ్యతలను స్వీకరించ మని ప్రాధేయపడుతున్నాను” అని వేడుకున్నాడు కృష్ణశర్మ, అందుకు తొండమానుడు అంగీకరించి ఆ బ్రాహ్మణుని ఇల్లాలిని, కొడుకును ఒక గృహంలో ఉంచి వారికి ఆరు నెలలకు సరిపడే పచారీ సామానులను వస్తుసామగ్రిని అమర్చాడు. వారిని బయటకు రావద్దని చెప్పాడు. ఆ రాజు రాచకార్యాలతో నిమగ్నుడై బ్రాహ్మణుని భార్య, పుత్రుని విషయాన్ని విస్మరించేశాడు. కృష్ణశర్మ కాశీకి చేరుకుని తన జనకుని అస్థికలను కాశీలోని గంగానదిలో కలిపి గయకు వెళ్ళి శ్రాద్ధము పెట్టి పితృ కార్యాలను నిర్వర్తించాడు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ రెండు సంవత్సరాలకు తిరిగి వచ్చాడు. ఆ బ్రాహ్మణుని చూడగానే తొండమాన్ రాజుకు అతని భార్య, పుత్రుడు గుర్తుకు వచ్చారు. కృష్ణశర్మతో అతని భార్య బిడ్డలు క్షేమంగానే ఉన్నారని చెప్పాడు. కానీ అతని భార్యాబిడ్డలు మరణించి ఆ గృహంలో వారి అస్థికలు మాత్రమే మిగిలాయి. రాజు ఎంతో దుఃఖితుడయ్యాడు. వారు ఆకలిదప్పులతో మర ణించి ఉంటారని, తాను మహాపాపినని ఎంతో వ్యధతో చిత్తక్షోభను అనుభవించాడు. అతని మానసిక బాధను గుర్తించిన శ్రీవేంకటేశ్వరస్వామి “వారి అస్థికలను తీర్ధంలో ముంచమని” ఆదేశించాడు. స్వామి ఆదేశానుసారంగా ఆలయానికి తూర్పు దిశన ఉన్న తీర్థంలో అస్థికలను ముంచాడు. ఆశ్చర్యంగా ఆ అస్థికలు మాయమై కృష్ణశర్మ భార్య, పుత్రుడు సజీవులయ్యారు. అందువల్ల ఆ సరోవరానికి ఆ తీర్ధమనే పేరు వచ్చింది. శారీ కలియుగంలో ఆ తీర్థం కనుమరుగైంది. నేడు ఆ అస్థితీర్థం కనిపించలేదు.

*స్వామి పుష్కరిణీ తీర్ధం
ఈ తీర్థం శేషపర్వతం మీద ఉంటుంది. ఇది స్వామి వారి ఆలయానికి ఈశాన్నిదేశగా ఉంటుంది. స్వామి ఉండే ప్రదేశంలో నెలకొని ఉండడం పట్ల దీనికి స్వామి పుష్కరిణీ తీర్ధం అనే పేరు వచ్చింది. తిరుసులలోని స్వామి పుష్కరిణీ తీర్ధంలో పవిత్రంగా శక్తి భారంతో స్నానం చేస్తే సర్వతీర్థాలలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని బ్రహ్మ తెలిపినట్లుగా నామన పురాణంలో లిఖించబడింది. శ్రీవేంకటేశ్వర స్వామి తన దేవేరులైన శ్రీదేవి, భూదేవితో కలిసి ఈ పుష్కరిణిలో ఎలకాలాకు తాడని చెప్పబడింది. మార్గశిర శుక్ల పక్షంలో ద్వాదశి తిథినాడు ఉదయం సమయంలో ఇక్కడ పర్వోత్సవం జరుపబడుతుంది. ఈ పుష్కరిణికి ఉత్తర దిశగా వరాహ స్వామి కొలువై ఉంటాడు. ఆ ఆలయపు ముందుభాగాన్ని ‘వరాహ పుష్కరిణి’గా చెప్తారు.

కాయరసాయన తీర్థం
తెల్లని ఆకును ఈ తీర్థంలో వేస్తే అది నీలి రంగులోకి మారిపోతుందని చెప్తారు. ఈ తీర్థంలో స్నానం చేసే వారికి మునులు, యోగులు తమ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఆనాటి పెద్దలు విశ్వసించేవారు. ఈ తీర్థం స్వామి దేవాలయానికి సుమారుగా మూడున్నర మైళ్ళు. దూరంలో ఉంటుంది. సనకసనందన తీర్ధం నుంచి అది పాయగా చీలుతుంది. ఇందులో స్నానమాచరిస్తే మానసి శక్తి, దేహారోగ్యం పెరుగుతాయని భక్తుల పరిపూర్ణ నమ్మకం.

July 28, 2025 5 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కిరణ్ కుమార్ గారి కథలు – పరిశీలన

by Dr. Vasundhara July 28, 2025
written by Dr. Vasundhara

ఒక కథా రచయిత, కథ రాయాలని సంకల్పించినప్పుడు అది సమాజపరంగానో లేదా వ్యక్తిపరంగానో
కావలసిన, రావలసిన మంచి మార్పులకు ప్రతిబింబంగా తన కథ ఉండాలని ప్రయత్నం చేస్తాడు అలా చెయ్యాలి కూడా అప్పుడే ఆ కథకు సార్ధకత
ఉంటుంది. కిరణ్ కుమార్ గారి కథలను పరిశీలించినప్పుడు మనిషిలో ఉన్న మంచిని పైకి తెచ్చే ప్రయత్నంతో పాటు, సమాజంలో జరిగే కొన్ని అరాచకాలను ఖండించడంలో తన కథ ప్రతిబింబంగా ఉండాలి అన్న ధ్యేయం మనకు ప్రస్ఫుటమవుతుంది.

“రాధా అరవిందం”ఈ కథకు పేరు కథలోని పాత్రలతో పెట్టబడింది.
కథలోముఖ్యపాత్రులు మూడు రాధ, అరవింద్, నిషా. అరవింద్ ప్రేమించిన వ్యక్తి రాధ. అరవింద్ పెళ్లి చేసుకున్నా వ్యక్తి నిషా.
మానవ తప్పిదాల పరంగా చూస్తే అరవిందుకు ప్రేమ ఒకచోట,పెళ్లి ఒకచోట.
ఇది వివాహ వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లోపం అనవచ్చు.
తత్పలితంగా వచ్చే అనర్థాలు తక్కువేమీ కాదు. వాటిని వివరించేదే ఈ కథ అరవింద్ రాధను ప్రేమిస్తాడు. సోషల్ మీడియాలో ఎవరో చేసిన పనికి రాధను అనుమానించి వద్దనుకొని మరొకరిని వివాహం చేసుకోవడం అరవింద్ చేసిన మానవ తప్పిదం. ఇది మన వివాహ వ్యవస్థలో ఉన్న లోపం.

ప్రేమకు నిర్వచనం నమ్మకం, అంకితం.
తనను తాను మరొకరికి ఆర్పించుకోవాలి. పూర్తిగా నమ్మకంతో తన జీవితంలోకి ఆహ్వానించాలి.

ప్రేమించిన వ్యక్తి పైన అపనమ్మకపు నీడ కూడా పడకూడదు.
కానీ తాత్కాలిక ఇష్టాన్ని ప్రేమ అనే పేరుతో భ్రమించడం నాటి నుండినేటివరకు సమాజంలో జరుగుతున్న ఒక దురదృష్టకర విషయం.
వివాహానంతరం భార్యకు అరవింద్ ఇంట్లో చోటు ఉన్నది గాని మనసులో మాత్రం రాధకే ఓటు.
ఇది అరవింద్ చేసినరెండో తప్పిదం.

ఫలితంగా అరవింద్ రహస్య ప్రేమ నిషా ప్రాణాలకు ముప్పు కరిగించేదాకా వచ్చింది. చివరకు రాధ ప్రాణ త్యాగం చేసి తన ప్రేమకు ప్రాణం పోశానని, అరవింద్ నిషాల దాంపత్యం దానివల్ల బాగుంటుందని ఊహించడం మనిషికి ఆత్మవిశ్వాసాన్ని క్షీణింప చేసి, ఆత్మహత్యలకు ప్రోత్సహించడం లాగ ఉంది.

రాధ లేనంతా మాత్రాన నిషాలో ఏర్పడ్డ శూన్యత మాసి పోతుందా?
తనదైన చోటును మరొకరు ఇంతకుముందే ఆక్రమించి ఉన్నారన్న భావన నిషాలో నిమిషాల మీద ఎగిరిపోవడానికి ఇది తన ఇష్టం వచ్చినట్టు రాయించుకున్న సినిమా కథకాదు. సినిమాలో ప్రజాకర్షణ కోసం ఉండవచ్చు.
కానీ కథరాసే రచయిత అలా చూపించడు చూపించకూడదు.

ఈ కథా రచయిత కిరణ్ కుమార్ గారు ఈ కథ రాసే ముఖ్యోద్దేశం సోషల్ మీడియా చేసిన దుర్మార్గాన్ని బయటపెట్టాలి అనుకోవడమే.
కానీ దానితో పాటు మరోకొన్ని జీవిత సత్యాలను తన కథలో ఆవిష్కరింపజేశారు. అవి_ స్త్రీ పురుషులిరువురి కి ప్రేమ పెళ్లి రెండు ఒక్కటే. రెండు కాదు.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకో లేకపోతే పెళ్లి మానుకో. రెండు పడవల మీద ప్రయాణం నాలుగు జీవితాలకు అశాంతి.
నమ్మకానికి మరో పేరు ప్రేమ. అన్నిటికీ పరిష్కారం ఆత్మహత్య కాదు. రాధా లాంటివారు చేయాల్సిన ఆలోచన ఏవిటంటే, తన మంచితనంతో,
నిషా అనుమానాలను, ఆవేదనను అంతం చేయడం రాధ లాంటి వ్యక్తి చేయాల్సిన మంచి మార్గం,తన నిర్ణయాల ద్వారా,
మాటల ద్వారా అరవింద్కు తన హృదయంలో పూర్వ స్థానం తొలగించి సోదర భావన ఆవిష్కరిస్తే ఆ దాంపత్యం ఆరు పువ్వులు పన్నెండు పండ్లుగా. వర్ధిల్లుతుంది.

రాధ ఆత్మహత్య వల్ల అరవింద్ మనసులోని రాధా చనిపోదు కదా. ఆ భావన నిషాను ప్రతి నిమిషం బాధిస్తూనే ఉన్నప్పుడు
వారి దాంపత్యం రాధ కోరుకున్నట్లు హాయిగా జరుగుతుందా?

కథ చెప్పి విధానాల్లో ఇది ఒక పద్ధతి. కలిగే నష్టాలు కళ్ళ ముందు పెడితే మనిషిమారతాడని, మారాలని ఈ కథ రచయిత, డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గారు ఈ పద్ధతిలో మనకు కథను అందించారు.

దానితోపాటు నేడు జరుగుతున్న సోషల్ మీడియా లోని అకృత్యాలను, అఘాయిత్యాలను ఖండిస్తూ వాటి వల్ల ఎన్ని జీవితాలు నాశనమవుతున్నాయి అని ఈ కథ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు కిరణ్ గారు. సెల్లులో అసభ్య శృంగారాలు, స్నేహి తాలు, ఆకృత్యాల వల్ల మంచి జీవితాలు మాడిపోతున్న విషయాన్ని ప్రభుత్వాలు, ప్రజలు ఇప్పటికైనా గ్రహించి నిగ్రహించాలి. అని కిరణ్ కుమార్ గారి ఈ కథ గొంతెత్తి చెబుతున్నది.
వ్యక్తి పరంగా, సమాజ పరంగా, వివాహ వ్యవస్థ పరంగా ఈ కథ అందరికీ మేలుకొలుపు. చక్కటి కథ మనకు అందించిన కిరణ్ కుమార్ గారు అభినందనీయులు.

July 28, 2025 6 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

ప్రముఖ కవి,రచయిత చొప్పదండి సుధాకర్ గారితో ఇంటర్వ్యూ

by Naresh Chary July 27, 2025
written by Naresh Chary

మీ జననం మరియు కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి.
నేను పుట్టింది1967లో. మాది ఉమ్మడి మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామం. మాది స్వర్ణకారుల కుటుంబం. చిన్నతనంలోనే మా నాన్నగారు పరమపదించడంతో మా కుటుంబం చాలా కష్టాలను అనుభవించింది. మా అమ్మే పూర్తిగా మా ఆలనా పాలనా చూసింది.

మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
మా నాన్న చనిపోయిన అనంతరం చాలామంది మా అమ్మతో నన్ను ఏదైనా పనిలో పెట్టమని అన్నారు. కానీ మా అమ్మ చదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని గట్టిగా నమ్మి నన్ను పాఠశాలలో చేర్పించింది. ఆమె ప్రోద్బలంతోనే నేను చదువు కొనసాగించాను. ఏడవతరగతి వరకు అల్లీపూర్ లోనే చదువుకున్నాను. ఎనిమిది నుండి పదవ తరగతి వరకు సిద్దిపేటలో చదువుకున్నాను.ఇంటర్మీడియట్,డిగ్రీ నిజామాబాద్ లో పూర్తి చేశాను. అనంతరం బి.ఇడి పూర్తి చేశాను.

మీ ఉద్యోగ ప్రస్థానం గురించి చెప్పండి.
1995 లో ఉపాధ్యాయుడిగా నా ఉద్యోగ ప్రస్థానం కల్హేర్ మండల్ లోని మీర్ ఖాన్ పేట్ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభమైంది. అనంతరం వడ్డేపల్లికి బదిలీ అయ్యాను‌. తరువాత ఇర్కోడుకు వచ్చాను,తదుపరి సికింద్లాపూర్ లో విధులు నిర్వహించి చివరిగా ఓబులాపూర్ లో రిటైరయ్యాను.

మీరు సాహిత్యం వైపు అడుగులు వేయడానికి ప్రేరణ ఎవరు?
మేము ఐదుగురం అన్నదమ్ములం ఒక అక్కయ్య. ఇందులో పెద్దన్నయ్య 18 సంవత్సరాలకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ సంపాదించాడు. ఆయన కథకుడు. ఆయన కథలు పత్రికల్లో కూడా అచ్చయ్యాయి. ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది. నేను కూడా ఎందుకు కథలు రాయలేను అనే ఆలోచన మా అన్నయ్యను చూసినప్పుడు కలిగింది కానీ అడుగులు ముందు పడలేదు. అయినప్పటికీ రాయాలన్న దృఢ సంకల్పం మాత్రం నాకు అన్నయ్య నుండే వచ్చింది. నాకు ప్రేరణ ఆయనే.

మీ సాహితీ ప్రస్థానం గురించి చెప్పండి
నేను చదువుకుంటున్న సమయంలో మా ఊరిలో వాణి గ్రంథాలయం ఉండేది అది మా చిన్నాన్న ఆధ్వర్యంలో నడిచేది. అందులో దాదాపు 700 పుస్తకాలు, రకరకాల మ్యాగజైన్లు, వివిధ రకాల పత్రికలు ఉండేవి. నేను రోజు వెళ్లి వాటిని తెచ్చుకుని బాగా చదివే వాడిని.ఎంతగా అంటే అప్పట్లోనే నేను 600 పుస్తకాలవరకు చదివేశా.అలా పుస్తకాలు చదవడం వల్లే నాకు వాక్యనిర్మాణం పైన పట్టు దొరికింది. కథలను, నవలల్ని ఎలా రాయాలో ఏ విధంగా పాత్రలను ప్రవేశపెట్టాలో, డైలాగ్స్ ఏ విధంగా ఉండాలో తెలిసింది. ఆ సమయంలో నన్ను కకుభ గారి “జీవితమంటే ఏమిటి”నవల తీవ్రంగా ప్రభావితం చేసింది.అది చదివి దాన్నుంచి స్పూర్తి పొంది కచ్చితంగా నేనుకూడా నవల రాయాలని అనుకున్నాను.
నేను నిజాంబాద్ లో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక కామర్స్ లెక్చరర్ ఉండేవారు.ఆయన పేరు గన్ను కృష్ణమూర్తి.వారు ప్రముఖ కవి.ఆయన ఇటీవలే మరణించారు.వారు విమర్శనాత్మకంగా,చిక్కగా రాసేవారు. ఆ సమయంలో నేను అడపాదడపా కవితలు, కథలు రాసేవాడిని. అవి ఒకసారి వారికి చూపించాను. వారవి చూసి బాగున్నాయి ఇలాగే కొనసాగించు అని చెప్పారు. అప్పటినుంచి ఇంకా బాగా రాయడం పైన దృష్టి పెట్టాను. ఒకసారి కాలేజీలో కవితలు, వ్యాసరచన పోటీలు జరిగాయి. అందులో నేను పాల్గొన్నాను. అందులో ప్రథమ బహుమతి వ్యాసానికి,కవిత్వానికి రెండో బహుమతి వచ్చింది.నేను కవిత్వానికి మొదటి బహుమతి వస్తుందనుకున్నాను దానికి రెండో బహుమతి రావడానికి కారణం ఏంటి అని అడిగాను. అప్పుడు సార్ గారు మీ కవిత నెగటివ్ గా ముగిసింది అలాకాకుండా ఎప్పుడూ పాజిటివ్ గా ముగియాలి అని చెప్పారు. అప్పటి నుంచి కవితలు ,కథలు బ్యాలెన్డ్స్ గా రాయడం మొదలెట్టాను.
నా మొదటి కవిత 1982 లో” ఆంధ్రభూమి “లో అచ్చయింది. అనంతరం చాలా కవితలు కథలు అచ్చయ్యాయి.అప్పట్లో నేను చాలా పత్రికలకు ఉత్తరాలు రాసేవాడిని.అవి ప్రచురితమయ్యేవి కూడా. ఒకసారి నేను రాసిన మొదటి ఉత్తరం ఆంధ్రభూమిలో అచ్చయ్యింది. అప్పుడు నన్ను మా ఊర్లో అందరూ మెచ్చుకున్నారు. అది నాకు ఒక మంచి గుర్తింపునిచ్చింది. నాలో ఆత్మవిశ్వాసం పెంపొందింది.ఉత్తరాలు రాయడం ద్వారా నాకు మంచి రచనా శైలి అలవడింది. రాయడం,రాసినవి ప్రచురితమవడం నాకు ప్రేరకాలుగా ఉండేవి.అలాగే నా మిత్రులు రంగారావు,చంద్రం లాంటి వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు.
శ్రీ శ్రీ గారు చనిపోయిన రెండు సంవత్సరాలకు 1985 లో ఆయన స్మృతిగా ఓ కవిత రాశాను. అది “ఆంధ్రజ్యోతి” లో ప్రచురితమై నాకు మంచి పేరుతో పాటు 30 రూపాయలను తీసుకొచ్చింది. అప్పటినుంచి రాయడంలో నాకు వేగం పెరిగింది. కవితలు రాసే సమయంలోనే కథలు కూడా రాశాను. మొదటగా సినిమా రంగంపై వ్యంగంగా రెండు కథలు రాశాను. అవి “మయూరి” పత్రికలో అచ్చయ్యాయి. అలాగే స్వాతి వీక్లీ లో 8 కథల వరకు అచ్చయ్యాయి. 1994లో ఆంధ్రప్రభ పెట్టిన సంక్రాంతి కథల పోటీలో” వారసత్వం “అనే కథ రాశాను. దానికి చాలా మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వారసత్వం సుధాకర్ అని పిలిచేవారు .అది నాకు అమితానందాన్ని ఇచ్చింది. అది గంగిరెద్దుల వాళ్ళ కథ. దీన్ని సినిమా డైరెక్టర్ వంశీ గారు కూడా కట్ చేసి తన ఫైల్ లో పెట్టుకున్నారట. ఇప్పటికి కూడా వంశీ మెచ్చిన కథలు సెకండ్ వాల్యూమ్ లో ఈ కథ ఉంటుంది.దీన్ని బట్టి నేను కూడా ప్రామాణికంగా, బాగా రాయగలుగుతానని నమ్మకం నాకు కలిగింది. నేను ఇప్పటివరకు దాదాపు 100 కథలు,8 నవలలు,3000 కవితలు రాశాను.కానీ అచ్చయినవి మాత్రం ఒక కవితా సంపుటి (శబ్ద ఋతువు),ఒక కథల సంపుటి (వెన్నెల కుప్పలు),ఒక నవల(జీవితం చేసిన సంతకం).

మీ మొదటి కవితా సంపుటి “శబ్ద ఋతువు” గురించి చెప్పండి.
నేను కవితలు రాసిన సమయంలోనే “ఎక్స్ రే”వాళ్ళు రాష్ట్రస్థాయి కవితల పోటీ పెట్టారు. అది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. అందులో నేను పాల్గొన్నాను. దానికి నేను రాసిన “వలస దృశ్యం”కవిత పంపాను. దీనికి నేపథ్యం ఏంటంటే నేను సిరిసిల్లకు వెళ్లినప్పుడు మనవాళ్ళు అక్కడ నుండి బొంబాయి మీదుగా దుబాయ్ వెళ్ళేవాళ్ళు, వారి గాథలు దయనీయంగా ఉండేవి. వాటికి చలించి నేను రాసిన కవితే “వలస దృశ్యం”. ఈ కవితను పంపగా దానికే మొదటి బహుమతి వచ్చింది.1000 రూపాయలను నగదుగా పొందాను.చాలామంది సాహితీ ప్రముఖులు మెచ్చుకున్నారు. కొంతకాలం తర్వాత నేను రాసిన కవితలను గన్ను కృష్ణ మూర్తి గారికి చూపిస్తే బయట ఎన్ని అవార్డులు తీసుకున్నా, కవితా సంపుటి మాత్రం తప్పకుండా వెలువరించాల్సిందేనని చెప్పారు. అప్పటినుండి నాకు కూడా తప్పకుండా పుస్తకం వేయాలనిపించింది కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా త్వరగా వేయలేకపోయాను.చివరికి మిత్రుల సహకారంతో 2002 లో నా మొదటి కవితా సంపుటి “శబ్ద ఋతువు” తీసుకొచ్చాను.ఆవిష్కరణకు వార్తా సబ్ ఎడిటర్ గుడిపాటి గారు కూడా హాజరయ్యారు.అన్ని ఋతువులు ఉన్నట్టుగానే మనిషికి మాట్లాడే ఋతువు ఒకటి ఉండాలని అప్పుడైనా కాస్త నోరు విప్పడానికి సిద్ధపడతాడని ఆపేరు పెట్టాను.చాలామంది చదివి రాశిలో ఇది చిన్నదైనా వాసిలో పెద్దదని మెచ్చుకున్నారు. అందులోని కవితలు ఇప్పటికి కూడా వర్తిస్తాయని చాలా మంది అప్పుడే చెప్పారు. శివారెడ్డి గారు నా కవిత్వాన్ని చదివి 50 సంవత్సరాల వయస్సులోగల కవికి ఎలాంటి పరిణతి ఉంటుందో అంత పరిణతితో కవితలు రాశావని నన్ను మెచ్చుకున్నారు.కథలు రాసినా ,నవలలు రాసినా కవిత్వాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోకు అని చెప్పారు. దాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోలేని ప్రశంసగా భావిస్తాను.

చొప్పదండి సుధాకర్ తో ముఖాముఖి గ్రహీత నరేశ్

మీ శబ్ద ఋతువు కవిత సంపుటిలో మార్మికత తక్కువగానే ఉంది.దాని గల కారణం?
నేనెప్పుడూ సూటిగా కవిత్వం చెప్పడానికే ఇష్టపడుతాను. మార్మికతతో కూడా కొన్ని కవితలు రాశాను. కానీ ఎక్కువగా దానినే ఆశ్రయించలేదు. ఎందుకంటే అది సాధారణ పాఠకునికి అర్థం కాదు. మార్మికతను,పాండిత్యం తెలివితేటలు ప్రదర్శించడానికి,విషయం క్లిష్టంగా చెప్పడానికి ఉపయోగించవచ్చు. కానీ పూర్తిగా అందులోనే రాస్తే సాధారణ పాఠకుడు కవిత్వానికి దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే నేను విషయం స్పష్టంగా,సూటిగా ఉండే విధంగానే కవిత్వం చెప్పాలనుకున్నాను.చెప్పాను.

కవిగా జీవితం ప్రారంభించి కథా రచయితగా మరో అవతారం ఎందుకు ఎత్తాల్సివచ్చిందో చెప్పండి.
నేను కవిత్వం రాసే సమయంలోనే కొన్ని కొన్ని సంఘటనలు నన్ను కథకునిగా మార్చాయి.కవిత్వంలో చెప్పలేని విషయాలను కథల్లో చెప్పొచ్చు.కథలో కూడా కవిత్వాన్ని చూపించవచ్చు. నేను కథకుడిగా రాణించడానికి గల కారణం నా వాక్యాలు కవితాత్మకంగా ఉండడమే. ఒక పెద్ద విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు మనకు కథ, నవల సహాయపడతాయి. కాబట్టి నేను చూసిన సంఘటనలు,నన్ను కదిలించిన విషయాలు కొన్ని కవిత్వంలో ఇమడలేనివి. అందువల్లే కథలు రాయడం ప్రారంభించాను. నా మొదటి కథ 1989 లో అచ్చయింది. కథాసంపుటి మాత్రం కొన్ని కారణాలవల్ల 2011లో (వెన్నెల కుప్పలు) వెలువరించాను. ఇప్పటికీ నా దగ్గర 10-12 పుస్తకాలకు అచ్చయ్యేంత సాహిత్యం ఉంది. అది మొత్తం బయటికి రావాలంటే చాలా డబ్బు కావాలి. ఈసంవత్సరం మాత్రం ఒక పుస్తకం తీసుకొస్తున్నాను.
నేను ఈ మధ్య ఒక కథ రాసాను. దాని పేరు “తెల్లారే ముంగట సుక్క” ఇందులో విషయమేంటంటే ఒక ఊర్లో మల్లవ్వ అనే మంత్రసాని ఉంటుంది. ఆమె ఊర్లో అందరికీ కాన్పులు చేసింది;కాని ఆమెకు మాత్రం పిల్లలు లేరు. ఆ ఊరిలో రెండు మూడు తరాలు ఆమె చేతులమీదుగా పుట్టిన వాళ్లే. ఒకరోజు ఆమె చనిపోతుంది. ఆమెకు పిల్లలు లేరు కాబట్టి ఆమెకు తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో,చివరికి ఆ ఊరికి కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రెటరీ కలుగజేసుకొని తానే తలకొరివి పెడతాడు. ఈ సంఘటన ఒక ఊరిలో జరిగింది‌ దీన్ని నేను కవిత్వంలో చెప్పలేక కథలో చెప్పాల్సి వచ్చింది.నేను ఒక చోట “కథ కాలనీ వంటిది నవల నగరం వంటిది” అని చెప్పాను. వస్తువును బట్టి చెప్పాల్సిన విషయసాంద్రత మారుతుందని దాన్నిబట్టి ప్రక్రియ మారుతుందని నా ఉద్దేశం.

మీ “వెన్నెల కుప్పలు” కథా సంపుటిలో ఉన్న కథలన్నీ అద్భుతంగా ఉంటాయి. అందులో “గంటీలమడి” కథ ఎప్పుడో రాసినా దానికి ఇప్పటికీ దానికి ప్రాసంగికత ఉంది.అలా ఎలా రాయగలిగారు?
ఒక కవి లేదా రచయిత కవిత్వమో, కథనో రాయాలంటే తను ఊహించి రాయొచ్చు లేదా ఏదైనా సంఘటన ఆధారంగా రాయవచ్చు .నేను రాసిన” గంటీల మడి” కథ అలాంటిదే. భూమిని అమ్ముకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అందుకే కొన్ని ప్రాంతాల్లో భూమిని భూతల్లి అని కూడా అంటారు.గంటిల మడి కథ కూడా నా జీవితంలో చూసి రాసిందే. కొంత కల్పన జోడించాలంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో కొంత ఊహించి రాయాలి. అలా రాసాను కాబట్టే దానికి ఇప్పటికీ ప్రాసంగికత ఉన్నదని అనుకుంటున్నాను.అలాగే “పంట పొలాలు” కథ కూడా భూమి ఇది వృత్తం గానే సాగుతుంది. ఆ కథలో ఇద్దరు ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తులు ఒకరు జాబ్ చేసి చివరికి వ్యవసాయం వైపు, ఇంకొక వ్యక్తి ఉన్న పొలాన్ని వదిలి జాబ్ వైపు పయనించాలని చూస్తారు. కానీ అతనిలో మార్పు వచ్చి మళ్లీ పొలం దగ్గరికే వెళతాడు. రైతు కంటే రాజు ఎవరూ ఉండరు కదా! . నా కథా సంపుటిలో నాకు రాష్ట్రస్థాయి బహుమతి తీసుకొచ్చిన కథ “బతుకు వాసన” . ఇందులో గొప్పగా ఎదిగిన వ్యక్తి తన మూలాలు మర్చిపోతాడు.కొంతకాలం తరువాత ఒక గాలివానలో చిక్కుకున్నప్పుడు తనకు తన మూలాలు గుర్తుకువచ్చి మళ్ళీ పేదలవైపు ఆలోచించడం మొదలుపెడతాడు. ఈమధ్య కాలంలో ఈ అంశంతో సినిమా కూడా వచ్చింది. ఎందుకంటే ఆ పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి.

మీరు కథలు రాసే సమయానికి ఇప్పటికీ సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందని భావిస్తున్నారా?
చాలా వచ్చింది. ఎడ్యుకేషన్ పెరిగింది, సామాజిక పరిస్థితులు మారాయి ,పంటపొలాలన్నీ ప్లాట్లుగా మారుతున్నాయి, సోషల్ మీడియా జీవితాలపై బాగా ప్రభావం చూపుతుంది.జీవితం కూడా యాంత్రికంగా మారిపోయాయి.

మీ సాహితీ లక్ష్యం నెరవేరిందని మీరు భావిస్తున్నారా?
మంచి సమాజాన్ని నిర్మించడమే సాహిత్యం లక్ష్యం. అందులో నా సాహిత్యం చాలా వరకు వాస్తవ జీవితాలను ప్రతిబింభించేదే కాబట్టి వాటి యొక్క ప్రభావం బాగానే ఉంటుందని అనుకుంటున్నాను.ఉదాహరణకి నేను బిక్షగాళ్ళపైన ఒక కథ రాశాను. అది చదివినవారు వారికి దానం చేయకపోవచ్చు కానీ అసహ్యించుకోరు. అదేవిధంగా తల్లిదండ్రులపై రాసిన కథలు చదవడం ద్వారా తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి,వాళ్లకి చివరి దశలో ఏం అవసరమో తెలుసుకుంటారు వారి పట్ల దృక్పథాన్ని మార్చుకుంటారు.ఇలా ఒక్కో కథ ఒక్కో ప్రయోజనాన్ని ఆశించి రాసిందే . దాని ప్రభావం ప్రత్యక్షంగానో,పరోక్షంగానో సమాజం పైన ఉంటుందని నా నమ్మకం.

మీరు రాసిన కథల్లో కొన్ని పూర్తి తెలంగాణ మాండలికాల్లో రాశారు. దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? కథా రచనలో భాషా,యాసల ప్రభావం ఎంత ఉంటుంది?
దానికి కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని బట్టి భాష ప్రవేశిస్తుంది.అలాగే మన యాసలోనే చెప్తే బాగుంటుందని కొన్ని కథలను అలా చెప్పాను. కథలో భాష,యాసలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. యాసలో రాయడం వలన ఆ కథలను ఓన్ చేసుకోగలుగుతారు. అలాగని అన్ని కథలు అలాగే రాయలేము. నగరం ఇతివృత్తంగా గల కథలో యాసను అంతగా వాడలేం. కాబట్టి ఇతివృత్తాన్ని బట్టి భాషను ఎంచుకోవాలి అప్పుడే కదా!చదివేవారికి కథ మనసుకి హత్తుకుంటుంది. కథలో జీవం ఉంటుంది.

కథా రచయిత నుండి మళ్ళీ నవలా రచయితగా మారడానికి గల కారణం?
చెప్పాలనుకున్న విషయమే ఒక కారణం.నేను నవలలు బాగా చదివేవాడిని. వాటిని చదివిన తరువాత నేను కూడా ఎందుకు నవలలు రాయకూడదు అనే ప్రశ్న నాలో ఉదయించింది. అదే నన్ను నవల రాసే విధంగా చేసింది. నేను రాసిన “జీవితం చేసిన సంతకం” నవల 1991లో రాసింది. అది పత్రికలో కూడా సీరియల్ గా వచ్చి దానికి మంచి పేరు కూడా వచ్చింది. మొదటగా ఆ నవల పోటీ కోసం రాసింది; కానీ అది బయటకు రావడానికి చాలా సంవత్సరాల టైం పట్టింది. 2017 లో దాన్ని ప్రచురించాను.సీరియల్ గా రాస్తే వారం వారం ఒక మంచి ముగింపు ఉండాలి. తర్వాత వారం ఎప్పుడు వస్తుందో అనిపించే విధంగా రాయగలగాలి.అలాగే రాశాను కాబట్టి ఆ నవల ఎక్కువమంది పాఠకులకు చేరుకోగలిగింది.ఇది క్రైమ్,రాజకీయాల బ్యాగ్రౌండ్ లో జరుగుతుంది. కాబట్టి ఇది అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నవల ఒక సాధారణ వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేశారు అనేది నవలలో అంశం. ఇంతపెద్ద డ్రామా కథలో చెప్పలేను కాబట్టి నవలలో చెప్పాలనిపించింది.

మీ “జీవితం చేసిన సంతకం” నవలలో ఫరీదా పాత్ర కీలకమైంది. అది ఊహించి రాసిన లేదా నిజ జీవితంలో ఎవరినైనా చూసి రాసినదా?
కొంత రియాల్టీ లోంచి రాసింది,కొంత కల్పితాన్ని జోడించి రాసింది.రాజకీయాలు చాలావరకు డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇందులో స్త్రీలు కూడా కొన్ని సందర్భాలలో కీలకంగా మారతారు.అవసరమైతే రాజకీయాలను కూడా శాసిస్తారు.వారు తెగిస్తే ఎలా ఆలోచిస్తారో, పావులు ఎలా కదుపుతారో ఈ నవలలో చూడొచ్చు.

మీ అభిమాన రచయిత ఎవరు ఎందుకు?
నా అభిమాన రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఆయన ఫిక్షన్ అయినా నాన్ ఫిక్షన్ అయినా ఆకట్టుకునే విధంగా రాస్తాడు. ఒక తరాన్ని తన నవలా లోకంలో విహరింపజేసిన అద్భుతమైన రచయిత.అలాగే చిక్కగా రాసేవారెవరినైనా నేను ఇష్టపడతాను.

    మీరు పొందిన అవార్డుల గురించి చెప్పండి.
    “కీర్తిచక్ర” సాహితీ పురస్కారం.పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారు అందించారు.
    కవిత్వానికి:
    సాహిత్యంలో అత్యుత్తమ సంస్థ “ఎక్స్ రే”కవిత్వ పోటీలో మొదటి బహుమతి.(1995)
    1996 లో రంజనీ కుందుర్తి అవార్డు.
    GVR పురస్కారం రెండుసార్లు.
    కథలకు
    రంజని కుందుర్తి సంస్థ వారు నిర్వహించిన కథల పోటీలో “మట్టి పండగ” కథకు మొదటి బహుమతి.
    సోమెపల్లి పురస్కారం.(మొదటి బహుమతి)
    గంటీలమడి కథకు జాగృతి పత్రిక వారు అందించిన బహుమతి.
    ఆంధ్రభూమి పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో “బతుకు వాసన ” కథకు బహుమతి.
    “రచన” సంస్థ (USA) వారు నిర్వహించిన కథల పోటీలో “ఉన్నోళ్లు”కథకు ప్రథమ బహుమతి.
    “మైత్రేయి కళాసమితి” (సంగారెడ్డి) వారు నిర్వహించిన కథల పోటీలో “వారసత్వం” కథకు ప్రథమ బహుమతి.
    APTF వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి.
    ఉపాధ్యాయ పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో”రంగు వెలిసిన బతుకులు”కథకు మొదటి బహుమతి.
    “ఆంధ్ర ప్రభ” దినపత్రిక వారు నిర్వహించిన పోటీలో “ద్వానాంతరంగం” పుస్తకం పై రాసిన విమర్శకు గాను మొదటి బహుమతి.

    కొత్తగా రాసేవాళ్ళకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటి?
    కొత్తగా రాసే రచయితలు ముందుగా బాగా చదవాలి. ప్రాచీన సాహిత్యాన్ని ,ఆధునిక సాహిత్యాన్ని, ఇప్పుడు వస్తున్న సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి .అదేవిధంగా చిక్కగా రాయడం నేర్చుకోవాలి.నిరంతరం రాస్తూ పత్రికలకు పంపించాలి. అప్పుడు మాత్రమే కవైనా, రచయితైనా రాణించగలుగుతాడు. తన భావనా శక్తిని ఇనుమడింపజేసుకుంటారు.భవిష్యత్ తరాలకు గుర్తుండి పోతారు.
    – చొప్పదండి సుధాకర్
    9177348349

    July 27, 2025 11 comments
    0 FacebookTwitterPinterestEmail
    వ్యాసాలు

    మట్టి గణపతే మహాగణపతి

    by N. CHAKRI July 25, 2025
    written by N. CHAKRI

    అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు రాము, గౌతమ్,రాజేష్ ఈ ముగ్గురు మంచి మిత్రులు ఒకరోజు రాజేష్ మిగతా ఇద్దరు మిత్రుల దగ్గరకు వచ్చి వినాయక చవితి దగ్గరకు వచ్చింది. చెందాకు తిరుగుదామా అన్నాడు. వారు సరే రేపటి నుంచి తిరుగుదాం అన్నారు. మరుసటి రోజు పొద్దున్నే లేచి ముగ్గురు స్నేహితులు స్నానాలు చేసి చందా వసూలు చేయడానికి బయలుదేరారు. అలా కొన్ని రోజులు చందా వసూలు చేశారు. వినాయక చవితి ముందు రోజు ముగ్గురు స్నేహితులు పందిరి వేసి డెకరేషన్ చేశారు. గౌతమ్ వాళ్ళ నాన్న ట్రాక్టర్ ని తెచ్చాడు. ట్రాక్టర్లో మట్టి గణపతిని తీసుకొని వచ్చారు. గణపతి బప్పా మోరియా అనుకుంటూ పందిరిలోకి తెచ్చారు. గణపతికి కొబ్బరికాయ కొట్టారు. పూజారిని పిలిచి పూజ చేశారు. ప్రసాదం నైవేద్యం పెట్టారు. అందరినీ పిలిచి ప్రసాదం పెట్టారు. సాయంత్రం అయ్యింది. కాళ్లు చేతులు కడుక్కొని దేవుని పందిరిలోకి వచ్చారు. రాత్రి దేవుని పందిరిలోనే పడుకున్నారు. మరుసటి రోజు రాము వచ్చి మిగతా ఇద్దరి మిత్రులతో మనం అన్నదానం చేద్దామా అన్నాడు. మిత్రులు సరే అన్నారు. మూడు రోజుల తర్వాత రాము రాజేష్ గౌతమ్ ముగ్గురు మిత్రులు కలిసి అన్నదానం చేశారు. తొమ్మిది రాత్రులు గడిచాయి. పదవరోజు పులిహోర తయారు చేశారు. వినాయకున్ని ట్రాక్టర్లో పెట్టి ఎగురుకుంటూ చెరువు దగ్గరకు వచ్చారు. వినాయకున్ని చెరువులో నిమజ్జనం చేశారు.

    నీతి. చెరువులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను చెరువులో వేస్తే నీళ్లు కలుషితం అవుతాయి.నీటిలో ఉండే జీవులు చనిపోతాయి. కాబట్టి మట్టి వినాయకులనే పూజిద్దాం.

    July 25, 2025 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    పుస్త‌క స‌మీక్ష‌

    సమాజం పై గురిపెట్టిన అక్షరాయుధం

    by vanaparti padma July 21, 2025
    written by vanaparti padma


    కవి హృదయం సున్నితమైనది. ప్రతి వస్తువులో ప్రాధాన్యతను గుర్తిస్తాడు. పువ్వులోని సువాసనలు, పక్షిలోని జీవనతత్వం, మానవ మనగడలోని ప్రతి కోణాన్ని తన కలమనే ఆయుధం ద్వారా కవిత్వీకరిస్తాడు. కొన్ని సందర్భాలలో మనసును వెంటాడే అంశాలను, భావోద్వేగమైన సంఘటనలను ఎద పొరల్లో కదిలించి వేసినప్పుడు, తను ప్రతిఘటించ లేనప్పుడు మానవత్వం గల మనిషిగా మానసికంగా ‘మరణిస్తూనే’ ఉద్యమ గీతమై, ఎగిసిపడే కెరటమై భావాల అలలా తీరం చేరడానికి ప్రయత్నిస్తాడు.

    ఒక వస్తువు అందమైన రూపాన్నివ్వాలంటే లోహాన్ని నిప్పులో కాల్చి సుత్తితో కొడుతూ ఆకారాన్ని ఇచ్చి నగిషి కూర్చాలి. కవి హృదయం కూడా అంతే. అంతరంగంగా మథనం చేస్తూ సముద్ర కెరటంలా పడి లేస్తున్నట్లే కవి మనసు సమాజ హితమైన వాక్యం రాయడానికి ఓడి గెలుస్తూ, గెలుస్తూ ఓడడం వల్ల కవి ‘మరణిస్తూనే’ తన కలం ద్వారా తిరిగి జన్మిస్తూ, ఆకాశంలోని సూర్యునిలా ప్రకాశిస్తూ మానవ మనుగడకు ముందు ఉంటాడు. ఇటీవల బిల్ల మహేందర్ వెలువరించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ కవిత్వ సంపుటి కూడా మానవ సమాజ మార్పు కోసం పరితపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కవి గా ఆందోళన, సంఘర్షణకు గురవుతూ అనేక ప్రశ్నలు వేధిస్తుండగా ఆ మానసిక స్థితిని కవిత్వం చేసాడు. అలాంటిదే ‘మేం కవిత్వమే రాస్తాం’ కవితలో చూడొచ్చు. అసమానతలను రద్దు చేస్తూ, సమిష్టి ఉద్యమాల అవసరాన్ని గుర్తిస్తూ వాటి ఆశయాలకు నిబద్ధుడై కవిత్వం రాస్తాడు బిల్ల మహేందర్.

    సమాజం అంటే మనుషుల సమూహం. అంటే మనిషి సమాజంలో అంతర్గతంగా ఉంటాడు. కరోనాకాలం మనుషుల మధ్య ఎడమ చూపించినప్పటికీ ఆపదలో ఒకరికొకరు అండగా ఉండాలనే ఆవశ్యకత కూడా నేర్పింది. మానవత్వాన్ని సజీవం చేసింది. కవి రాసిన ఓ కవితలో ‘చినుకు/ మట్టిలోంచి విత్తు మొలకెత్తించినట్లు/ మనిషిలోని మానవత్వాన్ని/ మొలకెత్తిస్తే ఎంత బాగుండు!?’ అంటాడు. ఇక మనిషి పువ్వై పుష్పించి మానవతా పరిమళాలను వెదజల్లాలని ఆశపడతాడు.

    ఇజ్రాయిల్ బాంబుదాడులకు, సైనిక కాల్పులకు మరణించగా మిగిలిన పిల్లల లేత మనసులు భయబ్రాంతులకు గురైన సందర్భాన్ని ‘ముట్టుకుంటే ముత్యమైపోతరు కదా/ పట్టుకుంటే లేడి పిల్లలై దుంకుతరు కదా/ కదిలిస్తే పువ్వై విచ్చుకుంటరు కదా’ అంటూనే వారి మానసిక స్థితిని ”బ్రెడ్ కు రాసిన జామ్ ను చూసి రక్తమని’ భయపడిన క్షణాలను భిన్నంగా అక్షరీకరించాడు మహేందర్. బతకడమే యుద్దంగా మార్చిన వ్యవస్థను ధిక్కరిస్తాడు.

    నేటి ప్రపంచీకరణ కాలంలో చదువుల వేటలో పిల్లలకు, కన్నవారికి మధ్య దూరం పెరుగుతున్నది. అలాంటి సందర్భాన్ని ‘నాలుగు పదుల వయసు దాటాక / ఖాళీ విలువ బాగా తెలిసి వచ్చింది / ఒక్క ఖాళీ పూరించడానికి వేలసార్లు మరణించేవాడిని / ఇప్పుడు నాకు ఆరుపదులు / ఇద్దరు పిల్లలు రెక్కలొచ్చి అందనంత దూరం ఎగిరిపోయాక / బతికే పూరించని ఖాళీగా మిగిలిపోయింది’ అంటాడు. చేనేత పరిశ్రమ గురించి చక్కగా వ్యథభరితంగాత ‘ఆకలి పేగుల్ని పోగులుగా పోగులుగా రాట్నంతో వడికి / కండలను కండేలుగా చేసి / ఒంటి చేత్తో పట్టు బట్టలు నేసిన బాపు / పెయ్యి మీద రోజు ఒక్కటే చినిగిన బనీనును తొడుక్కునప్పుడు / బాపు ఎందుకో నాకు నచ్చలేదు’ అంటూ తండ్రుల త్యాగాలను స్పష్టం చేశాడు.

    స్త్రీ, పురుషుల సంబంధాల్లో పురుషాధిక్యతను తెలిపే కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. ‘మౌనానికి అర్థాలు వేరులే’ అన్నట్లుగానే నిశ్శబ్దానికి భావాలు అనేకం. మనం సూటిగా చెప్పలేని భావం నిశ్శబ్దానికి వదిలినట్లే కవిత్వం నిశ్శబ్దం భావాన్ని వ్యక్తీకరిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీ మెడలోని బంగారం అవసరానికి ఆయుధంగా మారే ఆర్థిక వనరు అవుతుంది. ఎన్నో, మరెన్నో సార్లు మన జీవన యానం ఆర్థిక వనరుగా మారుతుందనే విషయం ‘వసంతహారం’ కవిత తెలుపుతుంది. అంతర్జాలంలో చిక్కుకుపోయి స్మార్ట్ ఫోన్ కి వెళ్ళాడుతున్న తరం గురించి ‘గూగుల్ సెర్చ్’ లో, గాజా యుద్ధం అంతర్జాతీయ దృక్పథాన్ని మరియు దురాక్రమణ, ప్రతిఘటన దాడులు సర్వసామాన్యమైపోయిన పాలాస్తీనా దారుణమైన జీవన బీభత్సవాన్ని ‘గాజా’ కవిత్వం లో అద్భుతంగా కవిత్వీకరించాడు.

    రైతులు మన దేశానికి ఊపిరి అని, వాళ్ళ చేతులు కాళ్లు దేశాన్ని, ప్రజలను బతికించే ఆకుపచ్చ సంతకం చెబుతూ వారి ఆత్మ గౌరవాన్ని చాటుతాడు కవి. ‘బతకంతా అసమానత శిలువను మోస్తూ, అడుగడుగున అవమానపు చూపులు ధరిస్తున్న’ బహిష్కృత మానవుడి దుఃఖం మురికి కాలువలు, ఫుట్ పాత్ ల చిరునామాగా ఉపాంతీకరించబడిన మానవుడి దుఃఖం ‘నా దేశం / ఏ కులం గానో మతం గానో / విడిపోయిన ప్రతిసారి / నేను మరణిస్తూనే ఉన్నాను’ అంటూ కవిగా తన మనోవేదనను కవిత్వం చేసిన బిల్ల మహేందర్ తాత్వికత తెలిసిన కవిగా ఈ సంపుటిలో కనబడతాడు.

    July 21, 2025 29 comments
    0 FacebookTwitterPinterestEmail
    వ్యాసాలు

    మన తెలుగు నాటకాలు – మట్టి మనిషి

    by Sammeta Vijaya July 21, 2025
    written by Sammeta Vijaya

    రచయిత్రి: మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన సాంఘిక నవల . పశ్చిమగోదావరి కృష్ణ గుంటూరు జిల్లాలలోని వ్యవసాయ కుటుంబాలు వంద సంవత్సరాలలో నాలుగు తరాల జీవిత చిత్రాలను చిత్రీకరించినటువంటి నవలగా మట్టి మనిషి మలచబడింది. ఈ నవల ప్రత్యేకత 14 భారతీయ భాషలలోకి అనువదింపబడడం . దీని యొక్క కథ నేపథ్యం భూస్వామి ధనిక రైతు దళారి వ్యవస్థ మధ్య ఉన్న సంఘర్షణని చిత్రీకరించినటువంటి నవల. ప్రధాన పాత్రధారి సాంబయ్య అనే రైతు . అతని భూమి కుటుంబం అతని తర్వాత వంశం ఎటువంటి సంఘర్షణలకు లోనయ్యారు అన్నది వివరిస్తుంది. ఈ నవల లో సాంబయ్య కు భూమి పట్ల గల ప్రేమను కళ్ళకు కట్టినట్లు చూపించారు . భూమి అనేది రైతుకు జీవితంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నది ఈ నవలలో ప్రస్ఫుటంగా వివరించే ప్రయత్నం చేశారు వాసిరెడ్డి సీతాదేవి గారు.

    39కి పైగా నవలలు 100కి పైగా కథలు రచించినటువంటి ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు. వీరి మరీచిక నవలను ఆనాటి ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత అది తొలగిపోయింది. సీతాదేవి గారు 2000 లో మట్టి మనిషి నవలను రచించారు. కొన్ని నవలలు ప్రజానాయకుడు , మనస్సాక్షి, ఆమెకథ , మృగతృష్ణ మొదలైనవి సినిమాలుగా వచ్చాయి.
    జవహర్ బాలభవన్ డైరెక్టర్ గాను ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గారు పని చేసారు. కొన్ని అనువాదాలు కూడా. 5 సార్లు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. రచయిత్రిగా ప్రత్యేక స్థానం పొందిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి.

    నాటకీకరణ :
    ఈ నవల నాటకీకరణ కు పూనుకున్న రచయిత శ్రీ వల్లూరు శివప్రసాద్ గారు. కథా , నాటక రచయితగా సాహితీ లోకంలో విశేషంగా కృషి చేస్తున్నారు . 70 కి పైగా రచించిన కథల్లో 30 కి పైగా బహుమతులు పొందినవి. గత సంవత్సరం వీరు రచించిన కొరివి కథకు అనిల్ కథలపోటీలో 25 వేల బహుమానం అందుకున్నారు. అనేకమైన నాటికలు రచించారు . 25 నాటికల సంపుటిని ఇతర సంపుటులు వెలువరించారు. శ్రీ చక్రం , ఎడారికోయిల, మిస్సెడ్ కాల్స్, ధ్వంస రచన , క్షతగాత్ర గానం, హింసధ్వని వంటి పలు నాటికలు ,నాటకాలు , శ్రవ్య నాటికల సంపుటి వీటన్నింటితో పాటు అరసం ప్రధాన సంపాదకులు గా పలు సంపుటాలను వెలువరించారు . నాటక చర్చా కార్యక్రమాలు నిర్వహించారు.

    దర్శకత్వం:
    మట్టి మనిషి నాటకం దర్శకత్వం చేసిన వారు. యస్ యం బాషా గారు . అనేక నాటకాలలో నటించి , దర్శకత్వం వహించిన బాషాగారు స్వయంగా ఈ నాటకంలో కీలకమైన కనకయ్య పాత్రలో నటించి నాటకమంతా తనదైన పాత్రతో హుషారుతనం జోడించారు. నాటకానికి నిండుతనం ఈ పాత్రలోనే అన్నట్లుగా తనదైన నటనను ప్రదర్శించారు.
    కథాంశం :
    మట్టి మనిషి పెద్ద నవల. కథలో పాత్రలు వీరభద్రయ్య దగ్గర పాలేరుగా వెంకయ్య పని చేసేవారు . ఆ పాలేరు వెంకయ్య కొడుకు సాంబయ్య. యజమాని అయిన వీరభద్రయ్య కొడుకు బలరామయ్య. బలరామయ్య కూతురు వరూధిని.
    సాంబయ్య కొడుకు వెంకటపతి. తండ్రి పాలేరుగా పడిన అవస్థ నుంచి బయటపడి ఏనాటికైనా తనకు కొంత భూమి సమకూర్చుకుని స్వంతంగా వ్యవసాయం చేసి ఆ భూమిని క్రమంగా పెంచుకుంటూ పోవాలని తాపత్రయం సాంబయ్యది . దాని కోసం చాలా కష్టపడి భూమిని కంటికి రెప్పలా చూసుకుని క్రమక్రమంగా కొన్ని ఎకరాల భూమి ఇల్లు సంపాదిస్తాడు.

    ఈ క్రమంలో భార్య సహాయం కూడా తీసుకుంటాడు . తీరా భార్య పురిటి నొప్పులతో ఉంటే పంట నూర్పిడి చేయిస్తూ పని కొందరికి అప్పగించి భార్య దగ్గర కు వస్తాడు మగబిడ్డ పుట్టాడని మురిసి పోయాడు. కానీ భార్య అనారోగ్యం తో ఉందని బయట పట్నం ఆసుపత్రికి తీసుకు వెళ్ళాలని నాటు వైద్యుడు చెప్పగానే అయోమయం లో సరైన నిర్ణయం తీసుకోలేక పోతాడు. ఫలితంగా భార్యను కోల్పోతాడు.
    పొలం పనుల ధ్యాసలో వేరే వివాహం చేసుకోకుండా కొడుకు వెంకటపతి ని కూడా తన బాటలో నడిపిస్తాడు.
    పెంచుకున్న భూమి తనలో ఆశను పెంచింది . ఏ యజమాని దగ్గర తన తండ్రి పనిచేసాడో అదే యజమాని కొడుకైన బలరామయ్య తన కూతురైన వరూధినిని తన కొడుకు వెంకటపతికిచ్చి కాళ్ళు కడిగించాలనుకుంటాడు. వరూధిని కోడలిగా ఇంట్లో అడుగు పెడుతుంది. మొగ దిక్కులేని ఇంటిని అందంగా తీర్చిదద్దినట్లు చేసి ఇంటిని భర్తను తన అధీనంలోకి తీసుకుంటుంది.
    మామ గారైన సాంబయ్య కష్టార్జితాన్ని తన ఆలోచనలు విలాసం కోసం వినియోగించి తన స్నేహితుడైన రామనాథం సినిమా థియేటర్ యజమానితో చేతులు కలిపి , మరో డి.ఎస్పీని కలుపుకుని పెట్టుబడులు పెట్టి భర్తను తాగుడుకు బానిస చేసి ఉన్నదంతా కోల్పోతుంది. ఈ ప్రక్రియలో లాయర్లు నమ్ముతుంది. అందుకు తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటుంది. కోలుకోలేని ఎదురు దెబ్బకు బలౌతుంది . భర్త వెంకటపతి తండ్రికి ముఖం చూపలేక కొడుకైన రవిని సాంబయ్య ఉండే చోట వదిలి వెళ్ళిపోతాడు.
    మనవడు రవి వచ్చి సాంబయ్య ను చేరగానే సర్వం కోల్పోయిన దుఃఖం లో ఉన్న సాంబయ్య కు ప్రాణం లేచి వస్తుంది. మనవడు తన వారసుడు తిరిగి తనకు పొలం సమకూర్చాలని తాపత్రయంతో బంజరు భూమిని తన దగ్గర ఉన్న నగలు తాకట్టు పెట్టి కూరగాయలు మనవడికి చూపిస్తూ పని నేర్పుతూ పంట పండిస్తాడు. ఈ క్రమంలో తాతా మనవడు సంభాషణలు రైతుకు పొలం పట్ల మట్టితో ఉన్న అనుబంధం వివరించబడుతుంది.
    పంట చేతికి వచ్చే సమయానికి పొలం అప్పచెప్పిన కనకయ్య అది తన భూమి అని పోలీసులను తీసుకొస్తాడు. చేతికొచ్చిన పంట భూమి నీది కాదు అన్న మాట జీర్ణించుకోలేక ఆ మట్టిలోనే ప్రాణం విడుస్తాడు సాంబయ్య. సాంబయ్య చనిపోవడం తట్టుకోలేక చిన్నవాడైన రవి కర్ర తీసుకుని కనకయ్యని కొట్టబోగా అది పక్కన ఉన్న కామందు తలకు తగిలి రక్తం కారుతుంది. హత్యా ప్రయత్నం చేసాడని పోలీసులు రవిని అరెస్ట్ చేస్తారు. రవి తిరిగి వస్తా నీ అంతు తేలుస్తా అనడంతో కథ ముగుస్తుంది.
    హైదరాబాద్ రంగభూమిలో ప్రదర్శన:
    మట్టి మనిషి నాటకీకరణ చేసి మొదట్లో నాలుగు గంటల నాటకం గా గతంలో ప్రదర్శనలిచ్చారు. ప్రస్తుతం 3 గంటలకు కుదించిన నాటకాన్ని ఇటీవల రంగభూమి లో ప్రదర్శన మే నెల 31, జూన్ 1 వ తేదీ రెండు రోజులు ప్రదర్శన ఏర్పాటు చేసారు. విజయ వంతంగా రెండు ప్రదర్శనలు జరిగాయి. నాటకం చూసేందుకు సీతాదేవి గారి కుటుంబం నుంచి కృష్ణకుమారి గారు మరి కొందరు వచ్చి పారితోషికం అందజేసారు.
    నటీ నటులు:
    నాటకం ముందు ప్రస్తావన తో మధ్య మధ్య జరిగే కథనం వ్యాఖ్యానంతో సూత్రధారి గా సురభి నిఖిలేశ్ , సురభి ప్రియాంక అందరినీ ఆకట్టుకున్నారు.
    ప్రధాన పాత్రధారి సాంబయ్య పాత్రను మొదటి దశలో పి. భుజంగరావు గారు , తర్వాత దశలో ఎం వి. రాజర్షి గారు ఇరువురూ తమ పాత్రలకు న్యాయం చేసారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. వరూధిని పాత్రలో ఎన్ షణ్ముఖి పూర్తిగా పాత్రలో ఇమిడిపోయే నటనను ప్రదర్శించింది. ఒక రకంగా వరూధిని నాటకంలో నవల పరంగా ఎక్కువ భాగం నాటకం లో తన పాత్రతో చుట్టూ ఉన్న పాత్రధారులు తో తానై నిలిచింది. ఎక్కువ సమయం ఈ సన్నివేశాలలో సాగింది. వాసిరెడ్డి సీతాదేవి గారు భూమి పట్ల పట్టింపు లేక తర్వాత తరాలు వ్యసనాలకు లోనయ్యారని తెలపడం వరూధిని తన భర్త, ఆ తరం ఎలా ప్రవర్తించారో తెలియజెప్పారు.


    నాటకం ఆద్యంతం రకరకాల హావభావాలతో సమయానుకూల స్పందనలతో ఆకర్షణీయంగా , ఆకట్టుకునే నటన కనకయ్య పాత్రధారి అయిన నట దర్శకుడు యస్ ఎం బాషా గారు పాత్రౌచిత్య నటనతో నాటకంలో చైతన్యవంతమైన ప్రదర్శన చేసి అందరినీ అలరించారు. నటన దర్శకత్వం రెండు బాధ్యతలను స్వీకరించి తదనుగుణంగా నాటకాన్ని నడిపించారు.
    కొడుకు వెంకటపతి గా కె. గోవర్ధన్ రెడ్డి అమాయకంగా ను , రామనాథ బాబు గా ఎస్ . డి. హసన్ మోసకారి గాను చక్కని నటనను అందించారు . నాటకంలో ఇతర పాత్రలలో సోల్జర్ షఫి డి ఎస్ పి గాను, యలమంద గా పి. తిరుమల రావు, ఏసోబు గా డి. సాయికిరణ్, రామి గా బి.సంధ్య, రత్తమ్మ గా సాయి దీపిక , ఆచారిగా , గురునాథంగా ఎం సాంబశివరావు, దుర్గమ్మ పాత్రలో , బుచ్చమ్మ పాత్రల్లో యస్ మాధవి , పాపారావుగా జె. రత్న రాజు, కాంతమ్మ గా డి. చిత్కళ, జూనియర్ వెంకటపతిగా శ్రీకర్, పోలీస్-1గా, ఆఫీస్ బాయ్ , క్లీనర్ పాత్రలలో సాయికిరణ్, పోలీస్ -2 గా దానిష్ అలీ, నటి గా రూపిక , స్త్రీలుగా చిత్కళ, దివ్య, రూపిక, సాయి దీపిక, శేషమ్మ గా సురభి ప్రియాంక , బలరామయ్య గా కె. శేఖర్ రెడ్డి , గుమాస్తాగా సుజిత్, పాపారాయుడు గా మాధవ్ , రాముడు ఎస్ వంశీ, దాసుగా పి. తిరుమలరావు, గోపాలరావుగా బి స్వరాజ్, శివరామ కృష్ణయ్య గా , మంత్రి గా , రామానందం పాత్రలలో వై. వి ఆర్ ఆచార్యులు, కృష్ణయ్య గా సుజిత్, రవి పాత్రలో దేవేష్ నటించారు.
    సాంకేతిక నిపుణులు:
    ఇంత పెద్ద నాటకానికి సాంకేతిక నిపుణుల సహకారం ఎంతో అవసరమైనది. ఆహార్యం పచ్చల శివ, సంగీతం సురభి నాగరాజు, కాస్ట్యూమ్ బి . సంధ్య/ ఎస్ వంశీ , కీ బోర్డ్ వై. గంగాధర్, గేయ రచన చింతలపల్లి అనంత్ , గేయ రచన సుద్దాల అశోక్ తేజ , పాటలు వసీం, డప్పు డప్పు అనిల్, లైటింగ్/ సెట్ సురభి ఉమా శంకర్/ అభి అందించగా స్టేజ్ మానేజర్ గా అభి రెడ్డి, ఆడిటోరియం మానేజర్ గా అర్షద్ షేక్, /శివరామ కృష్ణ ఆడిటోరియం అసిస్టెంట్ గా వెంకట్ లక్ష్మన్ వ్యవహరించారు. ఫొటో , వీడియో, పబ్లిసిటీ బి . సాయికిరణ్ చూసుకున్నారు. పి ఆర్ ఓ గా అర్షద్ షేక్/ సాయికిరణ్ ఉన్నారు. వీరందరి సమిష్టి సహకారం నాటకంలో నిండుతనాన్ని తీసుకు వచ్చాయి.


    ఇంతమంది కళాకారులను సిద్ధం చేసుకుని సమన్వయం చేసుకుంటూ చేసిన ప్రయత్నం గొప్పది .ఈ విషయం
    నాటకంలోని సాంబయ్య రవితో అన్న మాటలతో తెలుస్తుంది.
    మనిషికి సంతోషం ఎక్కడుందంటావు? కష్టపడి పని చేయడంలో ఉంది . చెమటోడ్చి భూమి దున్నడం లో ఉంది. రెక్కల కష్టం అక్కరకు రావడంలో ఉంది. మన కష్టార్జితం మన చేతుల్లోకి వచ్చే ఆనందం లాంటిది ఈభూమి . దీనిని మించినది మరొక్కటి లేదురా.. అంటాడు రవితో.
    బడిలో చదివే విద్యార్థికి పొలంలో పని చేసే రైతుకి సామ్యం చెప్పే ఒక గొప్ప డైలాగ్ సాంబయ్య మనవడితో అనడం . ” ఈ నేల నా పలక. నాగలే నా బలపం . పొలమే నా బడి . భూమి మీద దిద్దాను . రోజుకు ఒక్కొక్క మాట ఈ భూమే నాకు నేర్పింది. నా తల్లి , దైవం, గురువు ఈ భూమేరా రవీ! ఇప్పుడు చెప్పురా మనవడా నీ బడి గొప్పదా నా బడి గొప్పదా? “
    పొలాన్ని బడిగా మార్చుకున్న మట్టి మనిషి జీవన రేఖా నాటకమిది.
    దళిత చైతన్యం నింపుతూ వస్తాను భూమిని ఆక్రమించే వారి పని పట్టడానికి అని చెప్పడం ఆశావహ దృక్పథం కలిగిస్తుంది. చివరిగా మట్టిలో పుట్టిన వాడ్ని
    మట్టి మీద బతికిన వాడ్ని
    మట్టిలో కలిసి పోతున్న వాడ్ని
    వంటి మీద మట్టి ఉండక
    మరి బంగారం ఉంటుందా !
    అని ప్రశ్నించిన పాత్ర మట్టి మనిషి.
    మట్టి మనిషి నవల ప్రముఖ నవలలలో 13 వ స్థానంలో నిలిచిన నవలగా పేరొందడమే గాక గొప్ప నాటకంగా వల్లూరు శివప్రసాద్ గారిచే నాటకీకరణ గా మలచబడి యస్. ఎం బాషా గారు దర్శకత్వం లో రూపుదిద్దుకుని మనందరి మనసులలో స్థిరంగా నిస్సందేహంగా నిలిచి ఉండే నాటకం మట్టి మనిషి .

    July 21, 2025 25 comments
    0 FacebookTwitterPinterestEmail
    కవితలు

    ఎంత బాగుండో

    by Dr. Aruna Parandhamulu July 21, 2025
    written by Dr. Aruna Parandhamulu

    ఊహా తెలియని
    నాడు ప్రేమించిన నా తల్లి
    ఊహా తెలియగానే
    ద్వేషించడం మొదలెట్టింది. ఎందుకో..!
    అయినా! నా జన్మ కారకురాలే
    అనుకుని సర్దుకుపోయా..!
    కఠినత్వానికి మరోరూపమని
    నా తల్లి పేరు చరిత్రలో నిలిచిపోయింది.
    కసాయి తల్లి అని నా మనసును సమాధానపరుచుకున్న
    ఆ దేవుడికే నోరు ఉంటే
    ఎంత బాగుండేదో!
    జన్మనిచ్చిన పిల్లల్ని
    ప్రేమించమని చెప్పేవాడేమో! బహుశా!
    రాతి బండలాంటి
    నా తల్లి మనసును కరిగించే వాడేమో..!
    బహుశా!
    నుదుటి రాతలు రాసిన
    ఆ బ్రహ్మదేవుడు నా తల్లి
    తలరాత ఇంత చక్కగా
    రాశాడేoదుకో..!
    కన్న పిల్లల పైన కసాయితనం చూపించమన్నాడేoదుకో!
    కన్న పిల్లల మనసు
    నా కసాయి తల్లికి తెలిస్తే
    ఎంత బాగుండో!
    నిజంగా! ఆ బ్రహ్మ దేవుడే వచ్చి నా తల్లి మనసు మారిస్తే ఎంత బాగుండో..!

    July 21, 2025 21 comments
    0 FacebookTwitterPinterestEmail
    Uncategorized

    మన తెలుగు నాటకాలు- అమ్మ చెక్కిన బొమ్మ

    by Sammeta Vijaya July 20, 2025
    written by Sammeta Vijaya

    అద్భుతాలను సృష్టించిన నాటిక అమ్మ చెక్కిన బొమ్మ
    మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.. అన్నారు తల్లిది ఎన్నటికీ ప్రథమ స్థానమే!
    అమ్మ పేరులోని మాధుర్యానికి అక్షరాలతో అభిషేకించిన పాటలెన్నో..
    • అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట
    అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట..
    • పెదవే పలికిన మాటల్లోని తీయని పలుకే అమ్మా
    • అమ్మని మించి దైవమున్నదా..
    ఇలా చెప్పుకుంటూ పోతే పాటలనేకం
    కొత్తగా ప్రత్యేకంగా వినపడుతున్న పాట..
    బొమ్మరా ఇది బొమ్మరా అమ్మచెక్కిన బొమ్మరా.. ఈ పాట మనల్ని అమ్మ ప్రేమలో ముంచెత్తుతుంది. శ్రీనిధి వీనులవిందుగా పాడిన ఈ పాట అమ్మ చెక్కిన బొమ్మ నాటికలోనిది.
    మొదలు పెట్టిన కొద్ది కాలంలోనే పలువురి ప్రశంసలతో పలు ప్రదర్శనలవైపుకి విస్తరించి ప్రదర్శించిన ప్రతి చోటా అభినందనలు , అవార్డుల వెల్లువ కొనసాగుతున్న అమ్మచెక్కిన బొమ్మ . ఆ నాటకం వివరాలలోకి వెళితే …
    రచయిత్రి :
    అమ్మ చెక్కిన బొమ్మ నాటికను శ్రీమతి జ్యోతిరాజ్ బీశెట్టి రచించారు. ప్రముఖ నాటకరంగ దర్శకుడు, నటుడు అయిన డా. వెంకట్ గోవాడ తన తల్లి పేరు మీద నిర్వహించిన అమ్మ కథాంశంగా నిర్వహించిన నాటికలపోటీలో ద్వితీయ బహుమతి పొందిన నాటిక.
    జ్యోతి రాజ్ బీశెట్టి పలు నాటకాలలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న నటి. అమ్మ చెక్కిన బొమ్మ లో ప్రధానమైన అమ్మ పాత్రను తానే నటించారు .నాటికను తనే రచించి నటించడం ఈ నాటిక ప్రత్యేకత. జ్యోతి పదకొండేళ్ళ వయసులో రేపేంది నాటికలో తొలిప్రదర్శన చేసి, తిరిగి 2017 లో “బావా ఎప్పుడు వచ్చితివీవు” నాటికతో మొదలుపెట్టి నేటి వరకు నిరంతరాయంగా నాటకాలలో నటిస్తున్నారు. శిష్లా చంద్రశేఖర్ గారి రచనల మీద ప్రస్తుతం పి హెచ్ డి చేస్తున్నారు . జ్యోతి అంతకు ముందు మూల్యం నాటికతో మంచి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు .మంచి ఇతివృత్తం , సామాజిక అంశాన్ని ఎంచుకోవడం జ్యోతి రచనకు నటనకు వన్నె తెచ్చాయి.

    దర్శకత్వం : డా. వెంకట్ గోవాడ తెలుగు నాటక రంగంలో యువ నాటక దర్శకుడు నటుడు నిర్మాత ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి పూర్తిస్థాయిలో నాటక రంగానికి తమ సేవలను అందిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్ లో పీజీ డిప్లమా చేసిన డాక్టర్ వెంకట్ గోవాడ పలు నాటకాలలో విభిన్న పాత్రలను పోషించి అందర్నీ మెప్పించారు . 2013లో గోవాడ క్రియేషన్స్ ప్రారంభించి పలు నాటకాలలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు సినిమాలు సీరియల్స్ లో పాత్రలు పోషిస్తున్నారు. మూల్యం నాటికలో నటన తో పాటు దర్శకత్వం వహించి పలువురి ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం వీరి దర్శకత్వంలో అమ్మ చెక్కిన బొమ్మ రెండు తెలుగు రాష్ట్రాలలోను అందరి ప్రశంసలను అందుకుంటుంది. పరిషత్తులలో పలు అవార్డులను సొంతం చేసుకుంది.
    కథాంశం: అమ్మ చేతిలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న అబ్బాయి ఎదుగుతున్న క్రమంలో కొన్ని మార్పులు గ్రహిస్తుంది తల్లి. మొదట పొరపడుతున్నాననుకుంది తర్వాత గమనించింది. అబ్బాయిగా ఉన్న కొడుకు అమ్మాయిగా ఉండటానికి ఇష్టపడటం అతనిలో మార్పులు ..తనలో జరుగుతున్న మార్పుల పట్ల సంఘర్షణ.. ఈ విషయమై తల్లి పాట్లు, భర్త విముఖత సమాజానికి భర్తకు ఎదురీది తల్లి తీసుకునే నిర్ణయం దాని ఫలితం .. వీటన్నింటి మధ్య రూపుదిద్దుకున్న నాటిక.
    పాత్రలు: వెన్నెల గా రూపుదిద్దుకునే ముందు చిన్న బాబు గా దివేష్, కాస్త పెద్దయ్యాక భాను ప్రకాష్ వెన్నెలగా మారిన ట్రాన్స్ జెండర్ పాత్రలో ట్రాన్స్ జెండర్ హర్షిణి మేకల పాత్రలకు జీవం పోసారు. తండ్రిగా డా. వెంకట్ గోవాడ తల్లిగా జ్యోతి పరిణితి చెందిన కళాకారులుగా నాటకాన్ని తల్లితండ్రుల మానసిక స్థితిని భావోద్వేగ నాటకంగా మలిచి పాత్రలలో లీనమై నటించారు. బొమ్మరా ఇది బొమ్మరా పాటతో శ్రీనిధి, సంగీతం సమకూర్చిన నాగరాజ్ , ఫణీంద్ర రోహిత్ సెట్ డిజైన్.. ఇతర సిబ్బంది సహకారంతో రూపుదిద్దుకున్నదీ అమ్మ చెక్కిన బొమ్మ.

    ప్రత్యేకత :
    విన్నూత్న కథాంశం.. ఎదురు దెబ్బలకు తట్టుకున్న ధీరగా తల్లి పాత్ర, భర్తా బిడ్డా మధ్య బిడ్డవైవు మొగ్గు చూపిన సంఘటనలు సంభాషణలు.. ట్రాన్స్ జెండర్ల దుస్థితి వారి భవితను ఎంచుకొనే విషయంలో లేని సహకారం , ఎదుర్కొన్న వివక్ష, అవమానం చివరకు కన్న తండ్రి నిరాదరణ .. అన్నింటిని అధిగమించి చేరుకున్న లక్ష్యం ఐ ఏ ఎస్ వెన్నెల గా రూపాంతరం .. అనేక విషయాల కలబోత ఈ బొమ్మ.. తను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఏది? తను మాత్రం తన సాధనతో సమాధానమై నిలిచింది.

    ప్రత్యేక ప్రశంస : ఈ నాటికలో ప్రత్యేక ప్రశంస అందించ వలసిన అమ్మ చెక్కిన బొమ్మ వెన్నెల పాత్రలో నటించిన హర్షిణి మేకల . హర్షిణి మేకల ఒక ట్రాన్స్ వుమన్, ఆమె అందాల పోటీలలో, నటనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె చిన్నతనంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె 2024 లో జరిగిన మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలలో ఐదవ స్థానంలో నిలిచారు మరియు మూడు టైటిల్స్ గెలుచుకున్నారు. తన జీవితం లాంటి ఈ నాటికలో తను నటించడం ఈ పాత్రకు న్యాయం చేసినట్లైంది. హర్షిణి నటన అందరి ప్రశంసలకు నోచుకుంది.
    అద్భుతమైన కథనం రచించిన జ్యోతిరాజ్, విలక్షణంగా నటింపజేసి దర్శకత్వం వహించిన డా వెంకట్ గోవాడ, ట్రాన్స్ జెండర్ ఆత్మకథ అనిపించిన రీతిలో స్వయంగా ఆ పాత్రకు న్యాయం చేసిన హర్షిణి , తన స్వరంలో అమ్మ చెక్కిన బొమ్మను చూపిన శ్రీనిధి .. నాటకంలోని భావాలలోకి సంగీతం జోడించిన నాగరాజ్ , వెన్నంటి ఉన్న రాధ గారు స్వరాజ్ గారు తదితర బృందం మొత్తం అభినందనీయులే! ఈ మహత్తర నాటకంలో అవార్డులతో పాటు ప్రశంసల జల్లుకు పాత్రులు. మరిన్ని విజయాలను అందుకుంటూ సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల మన దారుణమైన ప్రవర్తన మార్చుకునేందుకు దోహదం చేస్తుందీ నాటిక.

    July 20, 2025 28 comments
    0 FacebookTwitterPinterestEmail
    Newer Posts
    Older Posts

    Recent Posts

    • వేకువ పాట
    • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
    • సనాతనమంటే?
    • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
    • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

    @2021 - All Right Reserved to Mayuukha The Magazine


    Back To Top
    మయూఖ
    • హోమ్
    • కవితలు
    • కథలు
    • ధారావాహిక నవల
    • వ్యాసాలు
    • బాల‌సాహిత్యం
    • ఇంద్రధనుస్సు
    • ఇంట‌ర్వ్యూలు
    • పుస్త‌క స‌మీక్ష‌
    • అనువాద సాహిత్యం
    • About Us