మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

by Gaddam sulochana March 29, 2026
written by Gaddam sulochana

ప్రముఖ సాహితీవేత్త రూప్ కుమార్ డబ్బికార్ గారు వివిధ సాహిత్య ప్రక్రియలతో సాహితి కృషి చేస్తున్నవారు. ఇటీవల వారి లేఖిని నుండి
వెలువడిన నవల భానుమతి.నవలా శీర్షిక చదవగానే ఎవరీ భానుమతి ఏమా కథ అన్న ఆసక్తి సహజంగానే పాఠకులకు కలుగుతుంది.
మహాభారత కథ ఆధారంగా ఎక్కడ గుర్తింపబడని,అంతగా ప్రాధాన్యత లేనికురువంశపు కుల వధువు, దుర్యోధనుడి భార్య అయిన భానుమతిని ప్రధానపాత్రగా మలచి ఉదాత్తంగా ఆమెను ఈనవలలో ఆవిష్కరించారు రచయిత.స్త్రీ పక్షపాతిగా, స్త్రీవాద దృక్పథంతో అనేక విషయాలను ఈ నవలలో చర్చించారు. నవలా విషయానికి వస్తే దుర్యోధనుడు స్వయంవర సభ నుండి భానుమతిని బలవంతంగా ఎత్తుకొని వస్తాడు. ఆ సందర్భంగా రాజసభలో పెద్దలు, గురువులు ఆక్షేపించడం, కర్ణుని శౌర్య పరాక్రమాలను అడ్డుపెట్టి కన్యను ఎత్తుకు రావడం తప్పు అన్నారు అప్పుడు దుర్యోధనుడు తాత భీష్ముడు కాశీరాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను స్వయంవర సభ నుండి తీసుకొని రావడం ఉదాహరణగా చూపి తన చర్యను సమర్ధించుకున్నాడు.

నవలా నాయిక భానుమతి అతి సౌందర్యవతి. సుగుణరాశి. సున్నిత హృదయాంతరంగి. యోధురాలు. ఈ స్త్రీ మూర్తి మానసిక సంఘర్షణలను, వేదనలను అనేక కోణాలుగా దర్శించి, స్పర్శించి, ఊహించి చక్కగా విశ్లేషిస్తూ వాస్తవిక కల్పనా రమ్యతగా ఈ నవలను తీర్చిదిద్దారు రచయిత డా. రూప్ కుమార్ డబ్బీ కార్.ఇక కథలోకి వెళితే కళింగ రాకుమారి భానుమతిని సుయోధనుడు పరిణయమాడడంతో కథ మొదలై, కురుక్షేత్ర యుద్ధం ముగిసే వరకు కొనసాగుతుంది.
తన పుత్రుడు దుర్యోధనుని భానుమతి భర్తగా స్వీకరించేలా గాంధారి ప్రయత్నిస్తుంది. ఆమె మాటలు భానుమతి పై చాలా ప్రభావం చూపాయి. భానుమతిని కూతురిలా చూసుకుంటానంటుంది. రాజవంశంలో మగవారి మనస్తత్వాలు మనకు అంతుచిక్కవు. వారి
ఆధిపత్య ధోరణులకు అంతు ఉండదు. నాతో పోల్చుకుంటే నీవు అదృష్టవంతురాలివే కదా! అని తనను తాను ఓదార్చుకుంటూ, భానుమతిని సమాధానపరుస్తుంది. ఇక్కడ రచయిత గాంధారి తల్లి మనసును పుత్ర ప్రేమను,

ఇద్దరి మధ్య సంభాషణను అత్యంత ఆసక్తికరంగా చిత్రించారు.భానుమతి తన మనసుకు నచ్చచెప్పుకుని దుర్యోధనుని భర్తగా
స్వీకరిస్తుంది.అయినా ఆమె విరహవేదననే అనుభవించినట్లు
ఈ నవల వల్ల మనకు తెలుస్తుంది. “యువరాజు దుర్యోధనుడు పాండవ ద్వేషియై అడవిలో కాలిన కట్టెలా తన రాణి పట్ల నిరాశక్తుడై తిరుగాడుతున్న గుడ్డివాడు”
చంద్రవంశంలో పుట్టిన రసికత్వం లేని వాడు.
“పతిసాంగత్యం లేని సతికి శశికాంతులతో పని యేమి” అని తన ఇష్ట సఖి కుముద్వతితో చెప్పుకొని బాధపడుతుంది. విలువైన సంపదను ధనాగారంలో పడేసినట్లు తనను తెచ్చి అంతఃపురంలో వదిలిపెట్టాడని వాపోతుంది. ద్రౌపదికి చెప్పకుండా ఆమె సలహా తీసుకోకుండా పాండవులు ఏ పని చేయరని భానుమతి విన్నది.భానుమతి సలహా కాదు కదా కనీసం ఆమె ఉనికిని కూడా గుర్తించడు దుర్యోధనుడు. ఒక సందర్భంలో ‘ స్త్రీ ఉనికి కూడా పురుషుడి నడత ప్రవర్తన పైనే ఆధారపడి ఉంది? ఆత్మగౌరవం లేని భార్య బతుకు వైధవ్యం కన్నా ఘోరమైనది కదా! అది నేను తప్ప ఇతరులు అనుభవించలేని దుస్థితి, తెలుసుకోలేని సత్యం’ – అంటుంది. ఒక స్త్రీ యొక్క మానసిక వేదనా తీవ్రతను తెలిపే ఈ మాటల వల్ల
హస్తినాపుర యువరాణిగా ఆమె ఎలాంటి స్థితిని పరిస్థితిని అనుభవిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

పాండవులు కూడా కురువంశ వారసులని భావించిన సహృదయ ఆమె. కర్ణుని జన్మ రహస్యం తెలిసి కుంతీ పుత్రుడని ఆనందించింది.
ద్రౌపది వస్త్రాపహరణలో ఆమెకు జరిగిన అవమానం సమస్త స్త్రీ జాతికి అవమానమని, ఆ చర్యకు కారణమైన తన భర్తను తలుచుకొని అసహ్యించుకుంటుంది. అంతఃపుర స్త్రీ జనానికి మొహం చూపలేని స్థితికి తెచ్చాడని భావిస్తుంది. వికర్ణుడు మాత్రం బాధ్యతతో దుర్యోధనుని ప్రశ్నించి, ద్రౌపది మర్యాద కాపాడే ప్రయత్నం
చేశాడని, అతని భార్య మృదుల అదృష్టవంతురాలనీ, స్త్రీ లోకంలో ఆమెకు గౌరవం దక్కిందని భావిస్తుంది.

సంధి రాయబారానికి వచ్చిన కృష్ణుడు
భానుమతిని కలిసినప్పుడు ఆమెలో ఎలాంటి కోరికలు కనపడలేదు. ‘ కాలంలో కదిలిపోతున్న ప్రకృతి కాంతలా ఉంది’. హస్తినకు కాబోయే మహారాణిని అన్న ఆశ కాని అహంకారం కానీ ఆమెలో ఏమాత్రం కనిపించలేదు. యుద్ధం
ముగిసిన తర్వాత యుయుత్సుడు (దృతరాష్ట్రుడికి గాంధారి దాసి సుఖద వలన కలిగిన పుత్రుడు) గాంధారిని కలవడానికి వచ్చినప్పుడు గాంధారి అతన్ని తప్పుపడుతుంది. భానుమతి మాత్రం పాండవుల పక్షం చేరి, కురువంశ చరిత్రలో కీర్తిని నిలబెట్టుకున్నావని మెచ్చుకుంటుంది. నీలాంటి భర్తను పొందిన నీ భార్య మాధురి అదృష్టవంతురాలంటుంది. ఈ సందర్భంగా భానుమతి మాటలు అన్యాపదేశంగా తనపై చేస్తున్న అభియోగాలని గాంధారి మనసు బాధపడినా, నిజమే కదా అన్న సత్యాన్ని గ్రహిస్తుంది. తల్లిగా తాను పూర్తిగా విఫలమైనానని, ప్రజలు సమాజం తన గురించి ఎంత వక్ర భాష్యం చెప్తుందో కదా! అన్న బాధ కూడా ఆమెలో కలుగుతుంది.
యుద్ధం ముగిసింది “భర్త లేడు అన్న బాధ తప్ప అలవాటైన ఒంటరితనం ఆమెను బాధించడం లేదు” పరాధీన భావన మాత్రం ఆమెను దహించి వేస్తుంది. దానిని కూడా ఆమె అలవాటు చేసుకుంటుంది. కుముద్వతి
తెచ్చిన గంగా జలాన్ని మండుతున్న తన గొంతులోకి వంపుకుంది భానుమతి. ‘గొంతును తడుపుతూ గంగాజలం, హస్తిన నగర భూమిని తడుపుకుంటూ గంగానది ప్రవహిస్తూనే ఉంది’ అని నవల ముగుస్తుంది. మన మనసులను కదిలించి వేసే భానుమతి కథ ఇది.

గాంధారి తన అభిప్రాయాలను సూటిగా చెప్పగలిగిన ధీరవనిత శివ భక్తురాలు. ధర్మాచరణ కలిగినది. అన్నీ ఉన్నా భర్తను కొడుకును ఏ విధంగానూ మార్చలేకపోయిన అసమర్ధురాలుగా, నిస్సహాయురాలుగా ఉండిపోయింది. భార్యగా తల్లిగా ఆమె పూర్తిగా విఫలమైంది. రాజభోగాలు ఉన్నా తాను ఒంటరినేనని, శివుని ఆరాధనలోనే గడుపుతున్నానని భావిస్తుంది. ధృతరాష్ట్రుడు తమ్ముని కోసం తాను కోల్పోయిన రాజ్యాధికారాన్ని తిరిగి తన సంతానం ద్వారా సాధించుకోవాలన్నా ఆకాంక్షతో, సమయానికి సంతానాన్ని కనలేని గాంధారిని తీవ్రంగా అవమానించాడు. కోపం పై నియంత్రణ లేక సంతు కావాలని గాంధారి అంతరంగ దాసి సుఖదను కోరుకున్నాడు. గాంధారి అసహనానికి గురైంది. అతని కోరిక పట్ల అసహ్యం జుగుప్సా కలిగాయి. కానీ ఆ చర్యను ఆమె ఆపలేకపోయింది. కృష్ణుడు రాయబారిగా హస్తినకు వచ్చినప్పుడు అతనితో సంభాషిస్తూ, తన మనసులోని మాటను అప్రత్యక్షంగా వ్యక్తపరుస్తుంది. దుర్యోధనుని స్వార్థం లో తప్పులేదంటుంది. అతడు వారసత్వాన్ని కోరుకుంటున్నాడని, తండ్రిలా అంధుడా? అంగవైకల్యమా? మానసిక వైపల్యమా?అన్ని విధాల సమర్థుడని అపారమైన పుత్ర ప్రేమను వ్యక్తం చేస్తుందే తప్ప శాంతి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయదు. భానుమతిని ఎత్తుకు వచ్చినప్పుడు కూడా అతన్ని తప్పు పట్టలేదు. ధృతరాష్ట్రుడిలాగానే ఆమె కూడా పుత్ర ప్రేమలో మునిగిపోయి తల్లిగా దుర్యోధనుని సరియైన దారిలో నడిపించలేదన్నది వాస్తవము. అలాగే ఆమె తన సోదరుడు శకుని ‘శత్రువునైన నవ్వుతోనే పలకరించి తన పగను తీర్చుకోగల కుటిల నీతిజ్ఞుడు’ అని తెలిసి
అతని దుష్టపన్నాగాలను నిరోధించలేకపోయింది.

రూప్ కుమార్ గారి రచనాశైలి ప్రత్యేకమైంది. కాలానుగుణమైన, పాత్రనుగుణమైన, కథానుగుణమైన భాషను ఉపయోగించడం ఒక నైపుణ్యం. వీరు రచించిన ‘లచ్చుంబాయి’ కథా సంపుటిలోని కథల్లో పాత్రోచితమైన వ్యవహారిక భాష సొగసును చూడవచ్చు. ప్రస్తుతం భానుమతి నవలలో సరళ సుందరమైన గ్రాంథిక భాషతో కూడిన కవితాత్మకమైన ప్రవాహ శైలి మనం గమనించవచ్చు. రూపు కుమార్ గారు కవి కూడా కావడం వలన ఇందులో అద్భుతమైన వర్ణనలు కూడా చేశారు.

ఈ నవలలో మరో విశేషం ఏమిటంటే,
సైన్స్ ను జోడిస్తూ
క్షేత్రం బీజంపై
భానుమతి సందేహాల పరంపరగా అనేక విషయాలు
చర్చించడం.ఈ చర్చ వలన మనకు ఒక విషయం స్పష్టం అవుతుంది. క్షేత్రస్థానీయులైన తల్లి యొక్క పాత్ర బిడ్డల గుణగణాలపై అధికంగా ఉంటుంది.అందువల్లనే మన సంప్రదాయంలో కూడా గర్భిణిగా ఉన్న స్త్రీని ప్రత్యేక శ్రద్ధతో చూస్తారు. సీమంతం లాంటి వేడుకలు చేస్తారు కదా! డాక్టర్లు కూడా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తారు.

ఇక ఈ నవలలో కృష్ణుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది ధర్మరక్షణార్థం కించిత్
అధర్మమార్గమైనా సరే అంటాడు. ముల్లును ముల్లుతోనే తీయాలనే రాజకీయ రహస్యం తెలిసినవాడు. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో దిట్ట. ధర్మసంస్థాపనయే లక్ష్యంగా సాగిన మహాభారతాన్ని ముందుండి నడిపే లక్ష్యాన్ని నెరవేర్చాడు. కావున విజేత కృష్ణుడే అన్నది రచయిత అభిప్రాయం.

కథ ప్రారంభం నుంచి గంగా యమునా నదుల ప్రస్తావన కథ మొత్తంగా ప్రవహిస్తూనే ఉంటుంది. భారతీయ నవలా సాహిత్యంలో మహాభారతంలోని స్త్రీల పాత్రలను ఆధారంగా చేసుకుని వచ్చిన నవలలు చాలా తక్కువ. వచ్చిన వాటిలో ద్రౌపది గాంధారి కుంతి పాత్రలపై వచ్చాయి. కానీ, దుర్యోధనుడి భార్య హస్తిన యువరాణిగా భానుమతిని నవలగా చిత్రించిన ఆనవాళ్లు లేవు. తెలుగులో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాసిన ద్రౌపది నవల వచ్చింది. ఒక కొత్త కోణంలో భానుమతి పాత్రను రూపు కుమార్ డబ్బీకార్ గారు ఈ నవలలో ఆవిష్కరించారు. ప్రతి స్త్రీ కథలోనూ నిశ్శబ్దంగా దాగిన జీవిత సత్యాలను భానుమతి అంతర్మథనంగా వివరించే ప్రయత్నం ఈ నవల మొత్తంలో మనకు కనిపిస్తుంది. అనేక ఆలోచనలను రేకెత్తిస్తుంది. మళ్ళీ కొత్తగా భారతాన్ని మొత్తం మననం చేసుకుంటాము. ఈ నవల చదువరులను ఆసక్తికరంగా చదివిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వివేచనాత్మకంగా భానుమతి పాత్ర ఔచిత్యాన్ని దర్శింపజేస్తూ, మహాభారతంలోని ముఖ్యమైన స్త్రీ పాత్రల వ్యక్తిత్వాలను విమర్శనాత్మకంగా విశ్లేషించిన తీరు అభినందనీయం.

March 29, 2026 48 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సెలవంటూ నింగికేగిన గంభీరస్వరం : శ్రీ టేకులపల్లి గోపాల రెడ్డి

by Radhika Suri March 28, 2026
written by Radhika Suri

ఒక్క కవితను కూడా వారు రాసింది లేదు, చిన్న కథను కూడా అల్లిందీలేదు, ఐనా వారిలో నిగూఢంగా దాగిన రచనాతృష్ణ అక్షర ఝరుల్ని అలవోకగా పారించి మూడు సంపుటాలుగా స్వీయ చరిత్ర ‘జీవన స్రవంతి’ని బ్రెయిలీ లిపిలో రాయించింది. వారిలోని కవి హృదయం’ సోమవారపు కవి సమ్మేళనం’లో భాగస్వామిని చేసింది. ఊతకర్రను ఆసరాగా చేసుకుని ఏమరుపాటు లేక జీవిత వైకుంఠపాళీలో ఒక్కోమెట్టు ఎక్కుతూ గమ్యం చేరిన వారి ప్రస్థానం ,స్వానుభవం నేర్పిన పాఠాలను అధ్యాపకుడిగా, భాషావేత్తగా తేటతెనుగుపై మమకారం ఎంతో మంది శిష్యులకు పాఠాలుగా నేర్పి సఫలీకృతున్ని చేసి విద్యార్థుల్లో మనోధైర్యం నింపి వారి మనసులకు చేరువ చేసింది .

దివ్యచక్షువుల పాలిటి ఆశా కిరణం’ లూయీబ్రెయిల్’ ని ‘చీకటిసూర్యుడు ,’అంటూ బ్రెయిలీ లిపి సృష్టికర్తను పొగడ్తలతో ముంచేసేవారు. ఒక అధ్యాపకుడికి ఆశయం తోడైతే ప్రబోధం కడలి అలలై ఎగిసిపడి ఎందరిలోనో స్ఫూర్తి నిలుపుతుంది. తన జీవితంలోని ఆటుపోట్లను తట్టుకుంటూ అనేకంటే ‘చీకటి సముద్రాన్ని’ ఈదడం అంటే సముచితమేమో! జీవితపు పరుగు పందెంలో ఒక్క అడుగు వెనుకబడితే చాలు మాటల ఈటెలతో మనసుకు తూట్లు పొడుస్తుందీ సమాజం. ఇది అన్నీ సక్రమంగా ఉన్న వారి జీవితాల్లో , అదే వైకల్యపు జీవితమైతే పెనుకల్లోలమై ప్రకంపనలని సృష్టిస్తుంది.

చిన్ననాడు వారి తండ్రి పడ్డ మనోవేదన, ముందుచూపుతో వారు బలంగా నాటిన ‘క్రాంతి బీజాలు’ వేళ్ళూనుకుని అంధులైన వీరిని అక్షర ప్రబోధకుడిగా మార్చి, వెలుగులీనే కళ్ళుండీ దిక్కులు చూసే ఎందరో శిష్యుల్లో చైతన్యాన్ని నింపి దిశా నిర్దేశం చేయించింది. వీరు 2012లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి తెలుగు అధ్యాపకులుగా పదవీ విరమణ చేసిన అనంతరం నేటి కామారెడ్డి జిల్లా పోచారం స్వగ్రామంలో విశ్రాంత జీవనం గడిపారు.

ఇక నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి.
గతమూడు సంవత్సరాలుగా మా’ సోమవారం కుటుంబం’లో అందరితో ముచ్చటిస్తూ కవితలపై నిష్పాక్షికంగా స్పందిస్తూ , ప్రోత్సహిస్తూ కార్యక్రమం చివరగా వారి వాగ్ఝరితో ఆవారం సెలవు తీసుకుని మరోవారానికై ఎదురుచూసే సభ్యులం మేమందరం. అలాంటి సోమవారపు ప్రయాణం తొలినాళ్లలో, నా ‘ఆలోచన’ కవిత విని (ఇది కొండపల్లి నీహారిణి గారి తరుణి ఆన్లైన్ మ్యాగజైన్లో వచ్చింది)మరుసటి రోజు రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు .అమ్మా నీ కవిత విన్నప్పుడు నా గతం కళ్ళ ముందు నిలిచింది ,ఆలోచనలు ఎలా మనిషికి ఊపిరి పోస్తాయో !అలాగే ఎంతలా ఊగిసలాటకు కారణం ఔతాయో కదా! నేను ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపానో ! తెలియదమ్మా అంటూ చాలా సేపు మాట్లాడారు. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని గంటలు నాతో సంభాషించారో లెక్క తెలీదు. నా కవితల్లో వ్యక్తిత్వ వికాసపు ఛాయలు ఉంటాయని, అలాగే నీలోని జంకును వెనక్కి నెట్టి పడేయమ్మా ఇంకా అద్భుతంగా రాయగలవని అంటుండేవారు. సర్ ఒక పది సంవత్సరాల ముందు మీరు నాకు పరిచయమై ఉంటే ఎంత బాగుండేది అంటే అదేం లేదు రాధికా ! నువ్వు నా శిష్యురాలివే నేను చాలా సందర్భాల్లో నా సన్నిహితులతో చెప్తూ ఉంటాను అనేవారు.’రాధిక నా శిష్యురాలు’ అని అన్న వారి మాటలు నాకు ఒక ప్రశంసా పత్రమై చక్కటి జ్ఞాపకాన్ని మిగిల్చాయి .

వారి ‘జీవన స్రవంతి’ నవలపై కొంతమందితో వ్యాసాలు రాయించినప్పుడు నేను వారి నాన్నగారిపై రాస్తానన్నాను ఆ వ్యాస సమీక్ష ‘మనోహరి’ ఆన్లైన్ పత్రిక సంపాదకులు బుజ్జమ్మ (స్వప్న) గారు వేస్తే సార్ కు పంపించాను , దాన్ని చదివి ఎన్నోసార్లు అభినందిస్తూ సంతోషపడేవారు .ఏదో ఒక సందర్భంలో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆనందించే వాళ్ళు .మరో పాత్ర గురించి రాయమన్నప్పుడు నేను నవ్వుతూ మేడమ్ గారి గురించే రాస్తాను సర్ అది కూడా ఆమె వర్షన్ లోనే అంటే పర్లేదమ్మా ఎవరి అభిప్రాయం వాళ్లది రచయితకు స్వేచ్ఛ ఇవ్వాలి కదా అంటూ నవ్వారు.

రంగరాజు పద్మజ గారు అరుణ ధూళిపాళతో కలిసి చిన్న జీయర్ స్వామి వారి అంధుల పాఠశాలలో గడిపిన సందర్భాన్ని , స్వామి వారితో జరిగిన ఆత్మీయపు సంభాషణ తనకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చిందని చెప్పారు. సర్ మోటివేషనల్ స్పీకర్ గా మీరు ఇలాంటి పాఠశాలలకు వెళ్లి ప్రసంగాలు చేయవచ్చు కదా అన్నప్పుడు వయసు ప్రభావం, చూపులేనితనం ఇబ్బందికరమైన అంశాలు కదమ్మా అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్పారు.

సరిగ్గా నెలరోజుల ముందు మరేదైనా పాత్ర గురించి రాశావా రాధికా అని అడిగారు అప్పుడు సర్,మీ నాన్నగారు ముందు చూపుతో మీ జీవితానికి చక్కటి బాట వేసి మీకు స్ఫూర్తి ప్రదాతగా మారారు కదా! అదే స్ఫూర్తితో మీ అబ్బాయి కష్టకాలంలో మీరు అండగా నిలిచారు , ఈసారి మీ అబ్బాయిని మీరు ఎలా వెన్ను తట్టింది రాయాలనుకుంటున్నాను అని చెప్తే , చాలామంచి మాటచెప్పావు రాధికా అంటూ ఆనంద పడిపోయారు.

ఒక పది రోజుల ముందు అనుకుంటాను సార్ ఫోన్ చేస్తే నేను బంధువుల ఇంట్లో పెళ్లి హడావిడిలో చూసుకోలేదు తర్వాత నేను కాల్ చేయడం వారు స్పందించకపోవడం ఇలా జరిగింది చివరికి ఎలాగోలా లిఫ్ట్ చేశారు. పది నిమిషాలు వారి మాటల ప్రవాహం కొనసాగింది. అమ్మా ఒక కోరిక ఉంది, నా ‘జీవన స్రవంతి’ నవలపై పరిశోధన చేసే వాళ్ళు ముందుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నా పూర్వ విద్యార్థిని ప్రొఫెసర్ రజని అంబేద్కర్ యూనివర్సిటీ హెచ్. ఓ. డి. ఆమె ఒక సందర్భంలో నాతో చెప్పింది, సార్ ఇద్దరు ముగ్గురు విద్యార్థులతో మీ పుస్తకాలపై పి.హెచ్.డి. చేయించాలనుకుంటున్నాను అని, ఇదే వారు నాతో మాట్లాడిన చివరి మాట .ఆ తర్వాత పది రోజులకే అంటే ఉగాది ముందురోజు ఉదయం నా సహోదరి , కవయిత్రి పద్మశ్రీ చెన్నోజ్వల ఫోన్ చూపిస్తూ సార్ ‘శివైక్యం ‘చెందారు అనడం ఒక పిడుగుపాటులా తోచింది. ఆత్మీయమైన గురువును కోల్పోయిన సందర్భమది .ఇక ప్రత్యక్షంగా సార్ ను చూసింది మూడు సార్లు మాత్రమే, కానీ ఫోన్లో గంటలు గంటలు సాగిన సంభాషణలో ఎన్నో ప్రాపంచిక విషయాల్ని , వివిధ మనస్తత్వాల విశ్లేషణ జరిగేది. ఇది నా ఒక్కదాని అనుభవం కాదు గ్రూపులోని ప్రతి వారితో వారు ఇలాగే అనుబంధాన్ని పెంచుకున్నారు. ఎవరిని కదిలించినా ఇలాంటి ఎన్నోవిషయాల్ని చెప్తారు.

సర్ , నేను మీ దగ్గర ప్రత్యక్షంగా విద్య నేర్వకపోయినా ,ఈ పరిమిత సమయంలో మీ పరిచయం నాకు ఎన్నో విషయాలు నేర్పిందని సవినయంగా చెప్పుకుంటాను.

మీ కలల పుస్తకానికి మీ శిష్యురాలు అరుణ ధూళిపాళ అక్షర రూపాన్నిస్తే మరో శిష్యులు వేణు నక్షత్రం గారు ‘ఆటా’ వేదికపై ప్రపంచంలోని సాహితీ ప్రియులందరికీ మిమ్మల్ని సగౌరవంగా పరిచయం చేసి గురుదక్షిణ చెల్లించుకున్న శిష్యులయ్యారు. గురుశిష్యుల సత్సంబంధానికి మీరు ముగ్గురు ప్రతీకగా నిలిచారు.

సర్ , మీరు ప్రత్యక్షంగా వెలుగును చూడలేకపోయారేమోగానీ పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. మీ హఠాన్మరణాన్ని తట్టుకోవడం మాకందరికీ కష్టమే!మీ గంభీర స్వరం తిరిగిరాని లోకానికి శాశ్వతంగా వలస పోవడం మాకు మింగుడు పడని విషయమే! మీ ఆత్మీయపు మాటల్ని మదిలో నింపుకుని సజల నయనాలతో అక్షర సుమాంజలి ఘటిస్తూ, మీ కోరిక తప్పకుండా నెరవేరాలని మనసారా కోరుకుంటున్న మీ శిష్యురాలు.

March 28, 2026 32 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

యోధ 

by MR Arunakumar March 22, 2026
written by MR Arunakumar

 నా చిట్టి తల్లీ! ఇంకో వారంలో నువ్వు వచ్చేస్తున్నావంటే నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. మరి నాతో నేరుగానే మాట్లాడొచ్చుగా ఈ ఉత్తరం ఎందుకంటావా?నిజమే తల్లీ! కానీ నీతో నేరుగా మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. నీకు తెలుసా బంగారూ.. కొన్ని విషయాలు ముఖాముఖి మాట్లాడలేమని?  అవున్నిజం! ఆ సంగతులు మనసులో ఘనీభవించిన దుఃఖపు పొరలో, విషాదాలో, విస్మయాలో, విచారాలో, అనుభూతులో, అనుభవాలో,ఆనందాలో, అద్భుతాలో.. ఏవైనా కావచ్చు. గుండె తడి గొంతులో కొట్టుకులాడి పెదవి అంచుల్లో పొడిబారి పోవచ్చు లేదా కళ్ళల్లోకి ఎగిసిపడే కన్నీటి కెరటాలూ కావచ్చు. వేదనా.. వేడుకా .. చెమ్మగిల్లేవి మాటలే కదా! అందుకే మాట్లాడలేని మాటలు మర్చిపోకుండా తడబడకుండా అక్షరాలై.. పదాలై.. వాక్యాలు సాగే వెల్లువే ఉత్తరం! రాసిన మనిషి మన ఎదురుగా కూర్చుని మనతో మాట్లాడిన అనుభూతినిచ్చేది.. మళ్లీ మళ్లీ అనుభవానికి వచ్చేది ఉత్తరమే కదా!?!

 నా చిన్నారీ! నువ్వు చదవగలిగే సమయం వచ్చేవరకు… ఉహు..చదివి అర్థం చేసుకునే విజ్ఞత నీకు కలిగే వరకూ ఈ లేఖను పదిలంగా దాచుకుంటాను. భవిష్యత్తులో నేను నిన్ను ప్రశ్నించాల్సిన సమయమో.. నువ్వు నన్ను నిలదీసే సందర్భమో వచ్చినప్పుడు ఈ ఉత్తరమే మాట్లాడుతుంది. మరి మాట్లాడే ఉత్తరానికి నా గురించి నివేదిస్తేనే కదా నీకు చెప్పగలదు!?!

  నా జాబిల్లీ!  మా అమ్మానాన్నలకు నేను ఒక్కతినే సంతానం. పాపం మా అమ్మ నలుగురు పిల్లల్నయితే కన్నది కానీ నాకన్నా ముందు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ ..పుట్టిన కొద్ది గంటలకే చనిపోయారట. నవ మాసాలు మోసి పురిటి నొప్పులు భరించి ప్రసవించిన బిడ్డలు అలా

చనిపోతుంటే తల్లిదండ్రుల వేదన హృదయ విదారకం కదా! బిడ్డల్ని బతికించుకోవాలని వారు పడ్డ తపన చెప్పనలివి కానిది. ఆ అలివి కాని బాధే నాకు “కుప్పమ్మ”  అని పేరు పెట్టడానికీ వెనుకాడ లేదు. అవును. నేను పుట్టింది పల్లెటూరు కాదు. ఓ మోస్తారు పట్టణమే అయినా బిడ్డ బతకాలన్న ఆశ ..మూఢనమ్మకాలను జయించింది. పక్కింటి అవ్వ చెప్పిందని పుట్టగానే నన్ను తీసుకెళ్లి చెత్త దిబ్బ మీద పెట్టి పూజ చేసి “ఈ బిడ్డను నాకు ప్రసాదించమ్మా. నీ పేరే పెట్టుకుంటాను” అని ప్రార్థించి ఇంటికి తెచ్చారట. వారి నమ్మకమో, ప్రార్థన ఫలించిందో, నా ఆయువు గట్టిదో.. కానీ నేను బతికి బట్ట కట్టాను. అందుకే నాకు కుప్పమ్మ అని పేరు పెట్టారు. ముగ్గురు దక్కని బిడ్డల తర్వాత బతికిన నేను అమ్మానాన్నల గారాల బిడ్డను కాక మరేం అవుతాను? కింద పెడితే చీమ కొరుకుతుందేమో పైన పెడితే గద్ద తంతుందేమో అన్నట్లు కళ్ళల్లో పెట్టుకొని అపురూపంగా పెంచారు నన్ను. అయితే ఎంత ప్రేమ ఉన్నా అమ్మ క్రమశిక్షణ, కట్టుబాట్ల మధ్య నేను సగటు ఆడపిల్లగా అంటే ఆచార వ్యవహారాలు, భయభక్తులు, వినయ విధేయతలు కలిగిన ఆడపిల్లగా ఎదిగాను. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదవాలని ఉన్నా బయట ఊర్లకు పంపడానికి అమ్మానాన్నలు ఇష్టపడలేదు. పెళ్లి చేద్దామని అమ్మ.. అప్పుడే ఎందుకని నాన్న వాదులాటలో మూడేళ్లు గడిచాయి. దానికి ముగింపుగా నా పెళ్లి ఘడియలు దూసుకు వచ్చాయి. బంధువుల పెళ్ళిలో నన్ను చూసిన నా అత్తమామలు అక్కడే పెళ్లి మాటలు మొదలు పెట్టేశారు. నా అమాయకత్వం వారికి, నా అందం వాళ్ళ అబ్బాయికి నచ్చేశాయి. ఇక నేను నచ్చాల్సింది వాళ్ళ అయిదు మంది కూతుళ్లకు.

” ఐదు మంది ఆడబిడ్డలా? మన బిడ్డ నోట్లో నాలుక లేనిది. వాళ్లతో ఎలా వేగుతుంది? ఈ సంబంధం వద్దు” అనేసింది అమ్మ భయంగా.

 “అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు, కుటుంబాలు వాళ్ళవి. ఎప్పుడో.. ఏదో పండగ పబ్బాలకు వస్తారు అంతే కదా!అయినా వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ అమ్మానాన్నలు దిట్టంగా ఉన్నారు. అబ్బాయికి, మన పాపకు అంత బరువు బాధ్యతలు ఉండవు. ఒక్కడే కొడుకు కదా కోడల్ని బాగా చూసుకుంటారు. ఊర్లో పొలాలు కూడా ఉన్నాయట” అని పెళ్లి పెద్దగా ఉన్న శివయ్య గారు హామీ ఇచ్చినా అమ్మ అంతగా ఇష్టపడలేదు.

“ఒంటికాయ సొంటి కొమ్ములా మన పాప అన్నదమ్ములు ..అక్క చెల్లెళ్ళు లేకుండా ఒంటరిగా పెరిగింది. పెద్ద కుటుంబంలోకి పాప పోతే రేపు మనం లేకపోయినా వాళ్లే బాగా చూసుకుంటారు” అని నాన్న ఇంకా కొందరు బంధువులు నచ్చ చెప్పడంతో  అమ్మకు ఒప్పుకోక తప్పలేదు.

అత్తమామలు, అయిదు మంది ఆడపడుచులు, వాళ్ల భర్తలు.. పిల్లలు ..వామ్మో.. అంత పెద్ద కుటుంబంలో నేను ఇమడగలనా అన్న భయం నాకూ మొదలైంది. అయితే అత్తగారింట్లో అందరూ నన్ను బాగానే చూసుకున్నారు. ఎవరితోనూ పొరపచ్చాలు లేకపోవడానికి కారణం వారందరి మంచితనం, ప్రేమ కారణమని నేను భావించేదాన్ని. అమ్మకూ చెప్పేదాన్ని.

 “వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవడమే తప్ప వాళ్ల కోసం తాను ఎంత శ్రమ పడుతుందో పాపకు తెలియడం లేదు. ఇద్దరు ఆడబిడ్డల బిడ్డలు నలుగురు.. వీళ్ళ ఇంట్లోనే ఉంటారట. పొద్దున్నే లేచి వాళ్ళను రెడీ చేయటం, అత్తగారికి వంట పనిలో సాయం చేయటం, ఆ పిల్లలకి టిఫిన్లు తినిపించి.. క్యారేజీలు సర్ది స్కూల్ బస్సు వచ్చే వేళకు పంపాలంటే ఎంత హైరానా?  ఎంత అలసిపోతుందో నా బిడ్డ. అయినా ఇంకా ఇంటి పనులు ఎన్నుంటాయి?” అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే నాన్న ఓదార్చటం నేను విని విననట్లు ఉండిపోవటం జరిగేది. ఏ పండుగకో తప్ప నేను అమ్మగారి ఇంటికి వెళ్ళింది లేదు.

” పండగలకు ఆడబిడ్డలు వస్తారు. అందరితో సందడిగా, సరదాగా ఉంటుంది. మీ అమ్మగారింట్లో లింగు.. లిటుకూమంటూ మీ అమ్మానాన్న ..నువ్వు..  ఏం బాగుంటుంది? తర్వాత ఎప్పుడన్నా వెళ్లొచ్చులే. చిన్నోడికి కూడా అక్కలతో గడపడమే ఇష్టం” అనేసేది అత్త. నిజమే కదా అనుకునే నా మట్టిబుర్రలో కొంచెం మట్టి తవ్వి తీసేది అమ్మ.

” అదేంటి ఆవిడకు ఉన్నట్లు మాకు ఉండదా పండుగకు కూతురు అల్లుడు ఇంటికి రావాలని? సరదాగా గడపాలని?  అయినా ఆ మందకు గొడ్డు చాకిరి చేయటమే నీకు అక్కడ దొరికే సరదా కదా?” అక్కసుగా అనేది అమ్మ.

“లేదమ్మా !వంటలన్నీ ఆవిడే చేస్తుంది. నేనేదో సాయం చేయటం

..వడ్డించటము.. పిల్లలకు తినిపించడం అంతే.  అయినా కూతుర్లతో సమానంగా నాకూ పట్టుచీర కొంటుంది, అందరూ మొదట నన్నే సెలెక్ట్ చేసుకోమంటారు తెలుసా?”  నా మాటలు విని అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ నా తలను గుండెకు హత్తుకొని

 “నిన్ను లోకజ్ఞానం లేకుండా పెంచిన నాదే తప్పు.” అని గొణుక్కొనేది.

  అంతకన్నా పెద్ద తప్పు నాకు కుప్పమ్మ అని పేరు పెట్టడం అని అమ్మకు చెప్పలేకపోయే దాన్ని. ఇంట్లో అందరూ చేరి కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్న వేళ హఠాత్తుగా ఎవరికో ఒకరికి నా పేరు గుర్తొస్తుంది. కావాలని “కుప్పమ్మా” అని పిలుస్తారు. 

“అయినా అదేం పేరు ? చెత్తకుప్ప పేరు పెడతారా ఎవరైనా?  తనూ అలాగే ఉందిలే జిడ్డు మొహం వేసుకుని ఎప్పుడూ”  మొహాలు చిట్లిస్తారు. హేళనగా నవ్వుతారు.

 ” ఆ పేరు ఎందుకు గుర్తు చేసుకుంటారు ఇప్పుడు?  పెళ్లిలోనే పేరు మార్చుకున్నాం కదా “కుముద” అని లక్షణంగా”  ఓసారి పెద్దాడబిడ్డ కోప్పడింది. ” కుముద అంటే తామర పువ్వు”

“ఆ! అది కూడా బురదలో నుంచే కదా పుట్టింది” ఒక ఆడబిడ్డ అంటుంది వెటకారంగా.

“బురదను ఎందుకు చూస్తావు పువ్వును చూడకుండా? అయినా సమస్త జీవకోటి ఆహారం ఆ మట్టిలో నుండే కదా వచ్చేది, అలా గేలి చేయకూడదు. మనమంటే స్నానాలు చేసి తయారై కూర్చున్నాము ఒక్క పని చేయకుండా. కుముద పాపం ..పొద్దున్నుండి వంటగదిలోనే ఉంది. జిడ్డు కారకుండా ఇంతెత్తు పౌడర్లు రాలుతాయా మొహం నుండి?”

 పెద్దాడబిడ్డ కొంచెం కోపంగా అంటుందా ..ఇహ మిగతా నలుగురూ తమ మొహాలు తడుముకుంటూ.. ముడుచుకుంటారు.

” పండగ పూట బిడ్డలను ఎందుకు బాధపెడతావు? నువ్వు ఊరుకో పెద్ద పాపా” అని అత్త పెద్ద కూతురుని మందలిస్తుంది.

 “అవునవును. అందరూ కలిసి ఆ బిడ్డను బాధపెట్టేది నీకు కనపడదామా?” అంటూ పెద్దాడబిడ్డ నా వైపు జాలిగా చూస్తుంది. ఆమె ఒకరే కొంచెమన్నా నాకోసం మాట్లాడేది ఆ ఇంట్లో 

“ఆ బిడ్డకు ఏం బాధ? ఆయమ్మ  పేరు అదే కదా?” అనే తల్లిని ఇంకేం

అనలేక తన నుదుటిపై సన్నగా కొట్టుకుంటుంది పెద్దాడబిడ్డ అసహనంగా.

 ఇంత ప్రహసనం జరుగుతున్నా ఏ ఒక్కరి భర్త కూడా.. నా భర్తతో సహా ఒక్క మాట మాట్లాడరు,  ఖండించరు తప్పని.

 తప్పు కాయమని.. బాధపడవద్దని నా భర్త ఏనాడూ వాళ్ళ ముందు.. వెనకా కూడా నన్ను ఓదార్చనే లేదు. లేని దానికోసం బాధపడడం ఎందుకని నేను పట్టించుకోవడమే మానేశాను. నేను వదిలేసిన బాధ అమ్మకు చెప్పి బాధ పెట్టడం ఎందుకు? అందులోనూ తన పెంపకం వల్లనే నాకు ధైర్యం లేదని అమ్మ పడుతున్న నొప్పిని మరింత నొక్కడం సమంజసం కాదు కదా? 

అమ్మలంతా బిడ్డలు బాగుండాలనుకున్నట్లే పిల్లలు కూడా అమ్మల్ని బాధ పెట్టకూడదు కదా?

  పెళ్లయిన ఆరు నెలల నుండి మొదలైన ఆరాలు, ఆరాటాలు, మూతి విరుపులు, సలహాలు.. ” విశేషమేమీ లేదా ఇంకా?” అన్న ప్రశ్నకు మూలం. ఆ విశేషానికి అర్థం ఆరు నెలల తర్వాత ఆనందాన్ని మోసుకొచ్చింది. అత్త ఇంట్లో కన్నా అమ్మానాన్నలు చాలా ఆనందపడ్డారు తాము అవ్వా తాతలు అవుతున్నామని. సంబరంతో కాసిన్ని కన్నీళ్లు, బోలెడు నవ్వులు కురిపించారు. మిఠాయిలు పంచారట ఇంటి చుట్టుపక్కలా.

 బోలెడు ఫలహారాలు, స్వీట్లు, పండ్లు, పచ్చళ్ళు, ఊరగాయలు మోసుకొచ్చారు అత్తింటికి.

” భలేవారే! మూడో నెలకే సీమంతం చేసేటట్లున్నారే?” అని హాస్యమాడారు అత్త ఆడపడుచులు.

 అమ్మ చిన్నబోయిన మొహానికి నవ్వు అతికించుకుంది “మాకు ఉన్నది ఒకే బిడ్డ. తన కడుపులో నాలుగు కాయలు కాస్తే మాకు అంతకన్నా కావాల్సిందేముంది?”

” ఆ,..మా కాలంలో ఏదో కనేసాం..సాకేసాం కానీ ఈ కాలంలో నలుగురిని కనీ..సాకి సంతరించడం అంటే మాటలా? ఇంటిపేరు నిలబెట్టే ఒక మగబిడ్డ చాల్లే” అనేసింది అత్త

 “అదేమిటావిడ అలా అనేసింది?  కూతుర్లకేమో ఇద్దరు ముగ్గురు కావాలి. కొడుక్కేమో ఒకే బిడ్డా?” అమ్మ బోలెడు ఆశ్చర్యపోయింది నాన్నతో. “అలా కాదు పాపా? నువ్వు కనీసం ఇద్దరినన్నా కనాల్సిందే. ఒకరికొకరు

తోడుంటారు. నువ్వు చూడు ఒంటరివైపోలా?” అమ్మ మాటలకు “ఇకమీద నా బిడ్డే నాకు తోడు. ఒంటరితనమేమీ ఉండదులే” అనుకున్నా ఆనందంగా  మనసులోనే. 

నా భర్త నాతో ఏకాంతంగా గడిపేది ఏ అర్ధరాత్రో, అపరాత్రో ..పది నిమిషాలు మాత్రమే! పొద్దున ఆఫీసుకు పోతే పొద్దు పోయాకే ఇంటికి వచ్చేది. వచ్చాక అమ్మానాన్నలతో మాటలు, అక్కల పిల్లల హోంవర్కులు, భోజనాలు.  పనంతా అయ్యాక నేను గదిలోకి వెళ్ళేసరికే తను నిద్రపోతుంటాడు. మేమిద్దరమే కలిసి ఏ ఊరికో, ఏ గుడికో, ఏ ఫంక్షనుకో వెళ్లిందే లేదు. ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్లడమే. ఇక తను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందీ తక్కువే. 

నాలుగో నెల అయ్యాక ఫ్యామిలీ డాక్టర్ వద్దకు చెకప్ కు తీసుకెళ్లారు మా అత్త, భర్త. స్కానింగ్ లో బిడ్డ గుండె కొట్టుకోవడం చూపించింది డాక్టర్. నా లోపల మరో గుండె నా రక్తంతో కొట్టుకోవడం చూసి ఏడ్చేశాను.

“అయ్యో!  ఎందుకు ఏడుస్తున్నావు?  బిడ్డ బాగుంది.” అంది డాక్టరు కంగారుగా.

 అది ఏడుపు కాదు ఒక బిడ్డకు తల్లి నవుతున్నానన్న ఆనందం ! చిరునవ్వు నవ్వాను. ఆ చిరునవ్వు నిజంగా ఏడుపుగా మారుతుందని నాకు అప్పుడు తెలియదు.

 వారం తర్వాత నాకు అబార్షన్ అయిపోయింది.  బాగా ఏడ్చాను. విషయం తెలిసి అమ్మానాన్న ఉరుకులు పరుగులతో వచ్చారు. నాన్నే నన్ను అమ్మను ఓదార్చారు తన కన్నీళ్లు ఉగ్గబెట్టుకొని.

” పాప నీరసంగా ఉంది. నాల్రోజులు మా ఇంటికి తీసుకెళ్తాం” అమ్మ అభ్యర్థనగా అడిగింది అత్తను. విపరీతమైన రక్తస్రావంతో తోటకూర కాడలా వేలాడిపోతున్నాను. ఏదో అనబోయి మామగారి కనుసైగతో ఆగి తలూపింది అత్త,

 నెల రోజులు ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మ నాకిష్టమైనవి వండి బలవంతంగా తినిపిస్తూ.. పాలు పండ్ల రసాలు తాగిస్తూ.. నన్ను బలంగా తయారు చేసింది, అత్త, ఆడపడుచులు ఫోన్ చేసి పరామర్శించారు గాని ఒక్కరూ ఇంటికి రాలేదు నన్ను చూడడానికి నా భర్తతో సహా. నాకు బాధ అనిపించింది. అమ్మానాన్నలు మనసులోనే బాధపడ్డారని నాకు తెలుసు

కానీ ఇరుగు పొరుగు వారి బాధ మా కన్నా ఎక్కువ.

” అదేంటి ఎవరూ రారు చూడ్డానికి? వాళ్లేం మనుషులూ?” 

వెనకా…ముందు గుసగుసలు, ఆరాలు! కందకు లేని దురద కత్తికే ఎక్కువ.

” అల్లుడికి తీరికలేని ఉద్యోగం. అత్తగారు, మామగారు, ఆడుపడుచులు .. అందరూ రోజూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు పంపిస్తారని అడుగుతూనే ఉన్నారు. నేనే.. పాప ఒళ్ళు కుదుటపడనీ.. పచ్చి ఒళ్ళు కదా అని దాటేస్తున్నా”  అమ్మ సంజాయిషీలో నిజాయితీ మాకే కాదు అందరికీ తెలుసని అడిగే వాళ్ళ చూపులు, నవ్వులు చెబుతూనే ఉన్నాయి. నాకు కోపం, బాధ, ఉక్రోషం! మింగనూలేను కక్కనూ లేను. నాకు నేనే సర్ది చెప్పుకొని బయలుదేరాను.

” మరో నాలుగు రోజులుండరాదా?” అమ్మ దీనంగా చూసింది. 

“తర్వాతయినా వెళ్లాలి కదా!” అన్నాను బలవంతంగా నవ్వుతూ.

 “నేను ఇక వెళ్ళను. ఇక్కడే ఉంటాను” అని చెప్పే రోజు ఒకటి వస్తుందని నాకు అప్పుడు తెలియదు.

 మరో ఏడాది రోజులు కాలం కరి మింగిన వెలగయింది. ఈ ఏడాదిలో రెండు అబార్షన్లు. నేను అమ్మా ఏడ్చే వాళ్ళం. మా అత్తగారే మమ్మల్ని ఓదార్చేది. 

“ఏం వయసయిపోయిందని ? పుడతారులే!” అని.

” నాకు పుట్టాక పోతే.. నీకు పుట్టక ముందే పోతున్నారేమిటి?” అంటూ అమ్మ కుమిలిపోయేది. గుళ్ళు గోపురాలు, చెట్లు, పుట్టలు తిరగటాలు, ముడుపులు నోములు వ్రతాలు.. ఆమెకు తెలిసిందంతా చేసేది. నా చేత చేయించేది.

” మీకేమన్నా పిచ్చా?  తన ఆరోగ్యం గురించి ఆలోచించరా?” డాక్టరమ్మ గొంతు తీవ్రంగా వినిపించింది అత్త, మామ, భర్తలతో. ఆస్పత్రిలో నేను గది బయట కూర్చుని ఉన్నాను. కొద్దిసేపు తర్జనభర్జనల తర్వాత వాళ్ళు బయటకు వచ్చి నన్ను లోపలికి వెళ్ళమన్నారు.

 బెడ్ పై నన్ను పడుకోమని డాక్టరు ఇంజక్షన్ వేయబోయింది. నేను ఆమె చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని కన్నీళ్ళతో అన్నాను

 “ప్లీజ్ మా!  మంచి మందులు ఇవ్వండి. ఈసారన్నా నాకు బిడ్డ పుట్టాలి. నేను అమ్మను అవ్వాలి” 

 డాక్టర్ కళ్ళల్లో సన్నటి నీటి పొర. నా వేపు జాలిగా చూసింది. కాసేపు నన్ను

ఇంజక్షన్ ను మార్చి మార్చి చూసింది. మరి కాసేపు కుర్చీలో కూర్చుని సాలోచనగా నా వేపు చూస్తూండిపోయింది. నేను ఆమె వేపే చూస్తూ ఏడుస్తూనే ఉన్నాను నా పొట్టను రెండు చేతులతో నిమురుకుంటూ.

” అయితే నేను చెప్పినట్లు చేస్తావా?” అడిగింది డాక్టరు లేచి తలుపు గడియ వేసేసి.

” బిడ్డ కోసం…”

” బిడ్డ కోసం ..నీ కోసం కూడా!”  డాక్టర్ చెప్పిందంతా విన్నాను కానీ అర్థమవడానికి చాలా సేపే పట్టింది. భయంతో వణికిపోయాను. తడారి పోయిన నా నోట్లో తన నీళ్ల బాటిల్ తెరిచి నీళ్లు పోసింది.

“ధైర్యం తెచ్చుకో. నీ ధైర్యమే నీ బిడ్డకు నీకు బతుకునిస్తుంది. నేను ఒకటే డాక్టర్ కాదు ఈ ఊర్లో..  కానీ నీకు నువ్వే. నువ్వే నీ బిడ్డకు!”

 దగా పడ్డ మనసు విలవిల్లాడుతోంది. వంచన సెగతో రక్తం కుతకుతలాడుతోంది. పరిస్థితిని చేతుల్లోకి తీసుకొని చక్కదిద్దుకోమని బుద్ధి హెచ్చరిస్తోంది.

 “అమ్మా!  మీరు చెప్పినట్లే చేస్తాను”  దృఢ నిశ్చయంతో ఆమె ఫోన్ తీసుకొని అమ్మకు ఫోన్ చేశాను వెంటనే రమ్మని.

 మేము ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే అమ్మానాన్న వచ్చేశారు. ఈలోపు నేను మా గది తలుపులు వేసుకొని నా బట్టలు, నగలు, పెద్ద సూట్ కేసులో సర్దేసుకున్నాను.

“మళ్ళీ ఇలా జరిగిందేమిటి?” అమ్మ రాగానే మొదలెట్టిన ఏడుపుకు ఈసారి అత్త వంత పాడింది.. “ఇదంతా మా ఖర్మ” అంటూ.

 నాకు నవ్వు వచ్చింది. ఖర్మకు… కర్మకూ తేడా నాకిప్పుడు తెలుసు కదా ? వచ్చేస్తుంటే అందరి చూపులూ సూట్ కేసు వేపే. నేను ఎవరి వైపూ చూడలేదు. కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు. అమ్మానాన్నలతో వచ్చేసాను.

 నేను వచ్చి ఐదు నెలలు అవుతుంది. ఫోను పని చేయడం లేదని రెండు మూడుసార్లు అత్త, భర్తా వచ్చారు చూడాలని. నేను నా గది తలుపు తీయనే లేదు.

 “పాప ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మానసికంగా చాలా దెబ్బతిందని డాక్టర్ అన్నారు. బాగయ్యాక మాట్లాడుకుందాం లేండి. మేము కూడా మంచి

డాక్టర్లకే చూపిస్తున్నాం” 

నాన్న కరుకుగా అనడంతో వాళ్లేమీ మాట్లాడలేక వెళ్లిపోయారు

 నా చిన్నారి యోధా! ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే భయంతో కుందేలు పిల్లలా వణికి పోయే నేను ఇంత ధైర్యంగా ఇంతటి నిర్ణయం తీసుకోవడమే కాదు మా అమ్మా నాన్నల్ని కూడా ఒప్పించానంటే కారణం నాలోని నువ్వే!కడుపులో నుండే నాకింత ధైర్యం ఇచ్చిన నా బంగారు తల్లీ!  నువ్వు పుట్టాక నేను ఇంకా ఎంత నిర్భయంగా ఉంటానో కదా?  అందుకే నీకు అనుకోకుండానే “యోధ” అని పేరు పెట్టేశాను.

 కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే నాకు ఒక్క మాటా చెప్పకుండానే అబార్షన్లు చేయించిన ఆ నరరూప రాక్షసులను.. నిజం చెప్పాలంటే హంతకులను.. నీకు నాన్న అని, అవ్వాతాతలని, మేనత్తలని పరిచయం చేయలేను. నీకసలు వాళ్ళను చూపించను కూడా.

 ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకుందాం. మనకు మన ధైర్యమే తోడు నీడ గా బతుకుదాం.  చెప్పాను కదా ఏ బలహీన క్షణమో మన ధైర్యాన్ని ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు ఈ ఉత్తరమే మనకు భగవద్గీత!          

 యోధ రాక కోసం ఎదురు చూస్తూ        

                “ఆనందాల కుప్పమ్మ”

March 22, 2026 50 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

రైతు నేల తల్లి సైనికుడు

by Manasa March 22, 2026
written by Manasa

దేశానికి అన్నం పెట్టే అన్నదాత
ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నాడు
ప్రజల ఆకలి తీర్చే ఆ వ్యవసాయదారుడు
దళారీల కుతంత్రాలకు బలి అవుతున్నాడు
మట్టిని నమ్ముకున్న ఆ కృషీవలుడు
ప్రకృతి విలయాలకు విలవిలలాడుతున్నాడు
సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడేవాడు సైనికుడైతే…
అందరి ఆకలి తీర్చే రైతు కూడా ఒక సైనికుడే!
నిరంతరం కష్టపడటమే రైతు తీరు..
అతనే కదా నింపుతాడు ప్రజల కడుపు తీపి..
చదువు లేకపోయినా రైతు ఎంతో గొప్ప వాడే
అతని జీవితం పదాలతో రాయలేని ఒక కావ్యం
కాయ కష్టం తప్ప మరో ప్రపంచం తెలియనివాడు
సింహాసనం లేని వ్యవసాయ రాజ్యానికి
కిరీటం లేని రాజు ఆయనే!
లోకం కోసం పోరాడే ఆ పచ్చని సైనికుడు
తన రక్తాన్ని చెమటగా మార్చి అందరికీ అన్నం అవుతాడు
తుపాకీ పట్టని సైనికుడు మన రైతు
నాగలి పట్టి నడిపిస్తాడు దేశ ప్రగతి రథాన్ని
ఎండకు ఎండి వానకు తడిసి అతడు పండించే పంట
ప్రతి మనిషి ప్రాణానికి అది ఒక వరప్రదాత
అప్పుల భారంతో రైతు వెన్నుపూస వంగినా…
ఆశతో మళ్ళీ విత్తనం వేసే ధైర్యశాలి!

March 22, 2026 44 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆమె నా దేవత- అమ్మ

by Siri Vennela March 22, 2026
written by Siri Vennela

సూర్యుడే సిగ్గుపడేంత బంగారు వన్నె కలది … నా దేవత !
కోకిల రాగంతో పోటీపడే ముద్దు మాటలతో సోయగం… నా దేవత !
చంద్రుని వెలుగుని మరిపించే సింగారాల చిరునవ్వు … నా దేవత !
చేతుల్లో చాకచక్యం… మాటల్లో మాధుర్యం
కళ్లతోనే కోటి భావాలు తొలగించే రూపం….
చూడగానే నా దిష్టే తగులుతుందేమో అనిపించేంత అందం నా దేవత!
తన ప్రేమ అనంతం… తన మమత అమూల్యం…
తన ప్రేమ స్వచ్ఛమైన అగ్ని వంటిది
ఊపిరి పోసే ఆయువు వంటిది!
నా సంతోషాన్ని తనదిగా నా బాధను తనదిగా..
నా ఇష్టాలనే తన ఇష్టాలుగా మార్చుకొని
తనకంటూ ఒక జీవితం ఉందని మరిచిపోయిన త్యాగమూర్తి ఆమె!
నేను పుట్టిన క్షణం నుండే నా కోసం బ్రతకడం మొదలు పెట్టింది…
పాపం పిచ్చిది… నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది!
నేను బాధ పెట్టాను భరించింది.. నేను కోప్పడ్డాను సహించింది…
తిట్టాను నవ్వుతూ భరించింది ….
నేను చేసిన ప్రతి తప్పును క్షమిస్తూ వచ్చింది !
నాకు గోరుముద్దలు తినిపిస్తూ తన ఆకలిని మరిచింది …
నాకు ఇష్టమైనవి కొనిస్తూ తన ఇష్టాలను వదులుకున్నది ….
అమ్మా ఇన్ని చేసిన నీకు ఒక్కటే చెబుతాను!
నాకు నువ్వు కావాలి.. నీతో గొడవ పడటం కావాలి …
దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు…
అంతటి నిన్ను పూజించినా… సేవించినా ….
నా ప్రేమనంతా కుమ్మరించినా ఈ లోకం సరిపోదు!!

March 22, 2026 29 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

The race

by Kondapally Keyura March 22, 2026
written by Kondapally Keyura

Once upon a time  there was a little girl and boy. They were both brother and sister. In summer, they would have a bike race. But the brother always would win. So, one time the sister went off to find the fastest vehicle on Earth. She saw a bus, it was fast.

 So, she asked the bus, “Bus…Bus,  are you the fastest vehicle on Earth?”

 The bus said,”I am fast… but not the fastest. The car is faster than me”. So, the girl asked the car. She said, car… car… are you the fastest vehicle on Earth?”

 The car said, “I am very fast faster than a bus. But the train is faster than me”.So, the girl marched over to the train. She asked “Train… Train are you the fastest vehicle on Earth?”

 The train said, “I am the fastest land vehicle on Earth. But, the airplane is faster than me”.

So the girl put her jetpack on and flew to the airplane. She asked airplane , “Are you the fastest vehicle on Earth ?” .

The airplane says, “I’m close to the fastest. But, I think rocket is the fastest so the Earth. Girl flew to the rocket. She asked rocket , Rocket….Rocket .. are you the fastest vehicle on Earth?”

 Rocket said, I’m the fastest vehicle on Earth”. The girl was so happy . She went back to her bike and put on rocket boosters and she raced that day. And she won and she figured out that fun is the key to winning !!

        ****The End****

March 22, 2026 47 comments
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

విప్లవమాత భికాజీ రుస్తుం కామా

by Vijaya Ranganatham March 22, 2026
written by Vijaya Ranganatham

భారత స్వతంత్ర పోరాటంలో దేశంమొత్తంగా సత్యాగ్రహాలు, నిరసనలు, ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు కూడా చేసారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ మొదలైనవారు 1931 లో ఉరికొయ్యలు ఎక్కారు. విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ పోరాటంలో చంపబడ్డాడు. ఆంగ్లేయులు అరాచకంగా లాటీచార్జ్ చేయటం వల్ల లాలా లజ్ పత్ రాయ్ తీవ్రంగా గాయాలై చనిపోయాడు.

1928లో సైమన్ కమిషన్‌కి వ్యతిరేకంగా లాహోర్‌లో జరిగిన నిరసనల్లో లాలా లజ్‌పత్ రాయ్ పాల్గొన్నారు. అప్పటి బ్రిటిష్ పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ ఏ. స్కాట్ ఆదేశాలపైభారీ లాఠీచార్జ్జరిగింది.ఆ లాఠీచార్జ్‌లో లజ్‌పత్ రాయ్తీవ్ర గాయాలపాలయ్యారు.“ఇవాళ పోలీసులు నాపై కొట్టిన ప్రతి దెబ్బ, ఆంగ్లేయుల పాలనపై కొట్టిన దెబ్బే.”అని ఆయన అన్నారు. లాఠీచార్జ్‌లో వచ్చిన తీవ్రమైన గాయాల వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది.కొద్ది వారాల తరువాత,గుండె సమస్యలు తీవ్రమై, ఆ గాయాల ప్రభావంతోనే ఆయన మరణించినట్లు ఆ కాలం నాటి వైద్యులు, చరిత్రకారులు పేర్కొంటారు.

బ్రిటిష్ పంజాబ్ గవర్నర్ మైఖేల్ ఓ డైయర్ జలియన్ వాలా బాగ్ మారణకాండకి వ్యతిరేకంగా అతన్ని మట్టుపెట్టి జైల్లో మగ్గాడు ఉద్దమ్ సింగ్. జనవరి 21, 1943 నాడు క్విట్ ఇండియా మూమెంట్ నాయకుడినిహోము కలానిని ఉరితీసారు. రాణి లక్ష్మీబాయి, మంగల్ పాండే, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ లాంటి ఎంతోమంది త్యాగధనుల కష్టమే ఈనాడు మనమనుభవిస్తున్న స్వతంత్ర భారతం.

ఈపోరాటపు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడి ఘనతకెక్కినవారు కొందరైతే, ప్రపంచానికి తెలియని, మనవరకు చేరని త్యాగధనులు లెక్కలేనంత మంది ఉన్నారు. భారత దేశపు మూలమూలలనుండి పౌరులు ఈ ఉద్యమాల్లో పాలు పంచుకున్నవారే. చాలా మంది స్వాతంత్ర్యం పోరాటయోధులు చరిత్రమరుగున అనామకంగా జారిపోయారు. అందరూ మనదేశంలో ఉండి పోరాడిన వారు. కాని మన దేశపు వనిత, పరాయి దేశం అందునా మనదేశాన్ని పట్టి పీడిస్తున్నబ్రిటన్ లో ఉండి భారతదేశం కోసం పోరాటం చేసిన యోధురాలు. బ్రిటిష్ అరాచకపు పాలన గురించి ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన, గళమెత్తిన వీర వనిత మరెవరో కాదు “భికాజీ రుస్తుం కామా”. కాని మనలో చాలా మందికి తెలియదు ఆమె సేవా నిరతి, పోరాట ధీరత్వం.

భికాజీ రుస్తుం కామా, “మేడమ్ కామా”గా కూడా పిలువబడేవారు, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆమె భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్సీ వనిత.భికాజీ కామా సెప్టెంబరు 24 1861న ధనవంతుడైన పార్సీ కుటుంబంలో జన్మించింది. తండ్రి, సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్, బొంబాయి ( ముంబై ) నగరంలో వ్యాపారస్తుడు. దానం చేయడంలో, సహాయ పడడంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ వ్యాపారి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రభావితమైన భికాజీ బాల్యం నుండే రాజకీయ సమస్యల వైపు ఆకర్షితురాలైంది. ఆమెకు భాషల పట్ల ఉన్న తేలివితేటలతో దేశంలో ఉన్న ఇతర వర్గాలతో వాదించడంలో ప్రావీణ్యం పొందింది. ఆ సమయంలో దేశంలోనే అత్యుత్తమ మహిళల విద్యాలయంగా భావించే అలెగ్జాండ్రా సంస్థ నుంచి ఆమె చిన్నతనంలోనే పలుభాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. మంచి విద్య, ఆంగ్లం మీద పట్టు వచ్చింది.

భికాజీ 1885లో రుస్తుం కామా అనే ప్రసిద్ధ న్యాయవాదిని వివాహం చేసుకుంది, కానీ సామాజిక రాజకీయ సమస్యలతో ఆమెకు విభేదాలకు దారితీసింది. భర్తతో పాటు అత్తవారింట అంతా ఆంగ్లేయ సర్కారుకు మద్దతుదారులే. రుస్తుం కామా బ్రిటిష్ వారి వ్యామోహం, సంస్కృతి పట్ల మోజుతో, బ్రిటిష్ పాలకులు భారతదేశానికి ఎంతో మేలు చేసారనే భావనతో ఉన్నవాడు. జాతీయవాది, దేశ భక్తి ఉన్న భికాజీ, బ్రిటిష్ వారు తమ సొంత లాభం కోసం భారతదేశాన్ని నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేశారని నమ్మిన వ్యక్తి. ఇద్దరూ భిన్నధ్రువాలయ్యారు. చివరకు బ్రిటిష్‌పై పోరాటం కోసం ఆమె భర్తకు దూరమయ్యారు.

భికాజీ తన సమయాన్ని, దాతృత్వ కార్యకలాపాలు చేయడం, సామాజిక సేవలాంటి వాటితోగడుపుతూ ఉండేది. 1896లో బాంబే ప్రెసిడెన్సీలో ‘బుబోనిక్ ప్లేగు’ వ్యాధి రావడం, ఎంతో మంది చనిపోవడం, దానితో ప్లేగు బాధితులను కాపాడటానికి పనిచేస్తున్న బృందానికి సహాయం చేయడానికి భికాజీ స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. ప్రజలు భయంతో ఇళ్లలో తలదాచుకున్నారు. కానీ భికాజీ మాత్రం తన ప్రాణాల్ని పణంగా పెట్టి, రోగులకు సేవ చేసింది. ఆమెకి కూడా ఈ ప్రాణాంతక వ్యాధిరావడంసంక్రమించింది. కోలుకున్నప్పటికీ, విశ్రాంతి కోసం యూరప్ వెళ్ళమని డాక్టర్ల సలహా మేరకు 1902 లో, భికాజీ భారతదేశం నుండి లండన్ కు వెళ్ళింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత , భారతదేశపు బ్రిటిష్ వారు భికాజీకి ఒక సందేశం పంపుతూ,”ఒక వేళ భారతదేశం వెళ్లాలంటే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనకూడదు” అనే షరతు విధించారు. దీనితో భికాజీ లండన్ లోనే ఉండవలసి వచ్చింది.చికిత్స కోసం వెళ్లిన ఆమెని, ఆ యూరప్‌ భికాజీ జీవితాన్నే మార్చేసింది. యూరప్‌లో కొత్త దీపం వెలిగింది. ఆరోగ్యం మెరుగయ్యాక భారత్‌కు తిరిగి రావటానికి ఆంగ్లేయ సర్కారు షరతులు విధించడం,భారత స్వాతంత్య్రోద్యమానికి,బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గాని, ఇండియాకు వెళ్ళనీయనని ప్రభుత్వం ఆంక్షలు విధించటం వల్ల, ఆమె ఇక యూరప్‌లోనే ఉండాలని నిశ్చయించు కున్నారు. వారి మాటలు విని భికాజీ హృదయం మంటలతో రగిలింది. “మన దేశం బానిసగా ఉంటే నేను ఎలా నిశ్చింతగా జీవిస్తాను?”అని.భారత స్వాతంత్ర్య పోరాటానికై తన చర్యలను తీవ్రతరం చేసింది. గళం ఎత్తి గర్జించింది. పత్రికలు, పాంఫ్లెట్లు ముద్రించి, భారతదేశంలో జరుగుతున్న దౌర్జన్యాలను ప్రపంచానికి తెలియజేసింది.

అక్కడున్న భారత స్వాతంత్ర్యోద్యమ కర్త శాంయజీ కృష్ణవర్మ గారి చేత ప్రభావితమై, 1905 లో దాదాభాయ్ నౌరోజీ కి సహాయకురాలిగా ఇండియన్ హోం రూల్ సొసైటీని స్థాపించింది.
భికాజీ ఇంగ్లండ్ వదలి పారిస్ నగరంలో నివాసం ఏర్పరచుకుంది. 1907 ఆగస్టు 22.. జర్మనీలోని స్టుట్‌గాట్‌లో అంతర్జాతీయ సామ్యవాద సదస్సు జరిగింది. కమ్యూనిస్టు యోధుడు లెనిన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. భారత్‌ నుంచి దాదాబాయి నౌరోజీ వచ్చారు. అలాంటి సదస్సులో.. నిండు చీరతో.. తలపై ఒకవైపు కొంగు కప్పుకొని కూర్చుంది ఓ యువతి. భారత్‌ తరఫున బ్రిటిష్‌ యూనియన్‌ జెండాను ఎగరవేయటానికి సిద్ధమవుతుంటే.. వ్యతిరేకించిన ఆ యువతి తన సంచిలోంచి చిన్న త్రివర్ణ పతాకాన్ని తీసి ఎగరేశారు. అంతర్జాతీయ సోషలిస్టు సమావేశంలో వేదికపైకి భారతీయురాలు భికాజీ కామా అడుగుపెట్టింది. ఆమె చేతిలో ఒక జెండా ఉంది. త్రివర్ణ పతాకం. ఆమె గళం మార్మోగింది:

“ఇది బానిసత్వంలో ఉన్న భారతదేశపు జెండా. ఒక రోజు ఇది స్వతంత్ర భారత జెండా అవుతుంది!”అక్కడున్నవారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ క్షణం భారత చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది.ఆ పతాకాన్ని, అప్పటి 8 రాష్ట్రాలకు ప్రతీకగా ఎనిమిది పువ్వులు, హిందూ ముస్లింల ప్రాతినిధ్యంగా కాషాయం, ఆకుపచ్చ రంగులు, స్వాతంత్య్రం కోసం అమరులవుతున్నవారి చిహ్నంగా ఎరుపు రంగులతో, మధ్యలో వందేమాతరం నినాదంతో.. రూపొందించారు.

మనదేశానికొక పతాకం ఉండాలని, దామోదర్ వినాయక్ సావర్కర్ తో కలసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారుచేసి ఆ సమావేశంలో ప్రదర్శించింది. భారత స్వాతంత్య్ర పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా సదస్సులోని ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. భారత్‌లో బ్రిటిష్‌ అకృత్యాలను, భారత స్వాతంత్య్ర ఆవశ్యకతను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చారు. ఆమే బికాజీ కామా. అంతా ఆమెను మేడమ్‌ కామా అని పిలవటం మొదలెట్టారు. భారత్‌లో ఇంకా స్వాతంత్య్ర డిమాండ్లే గట్టిగా వినిపించని కాలంలో.. త్రివర్ణ పతాకాన్ని విదేశీగడ్డపై ఎగరేసిన ధీశాలి మేడమ్‌ కామా.

ఆమె జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో భారత స్వాతంత్ర్య జెండాను ఎగురవేసిన ఘనత పొందారు. కలకత్తా జెండా ఆధారంగా ఆమె ఈ జెండాను రూపొందించారు, ప్రస్తుత మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం భికాజీ కృషే.

లండన్ లో ఆమెకు విప్లవ వాదులు శ్యాంజీ కృష్ణ వర్మ, లాలా హర్ దయాళ్, ఎస్ఎస్ రాణా, వీర సావర్కర్, సేనాపతి బాపత్ లతో పరిచయం ఏర్పడింది. దాదాభాయ్ నౌరోజీలతో కలిపి విదేశాల్లో భారతదేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేయటం మొదలుపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ద సమయంలో లండన్ లో ఆమెపై కట్టడి పెరగ్గా, పారిస్ కి మకాం మార్చి, పారిస్ ఇండియన్ సొసైటీ స్థాపించారు. ఐర్లాండ్‌, ఈజిప్టు, సోవియట్‌ విప్లవవాదులతో పాటు ఫ్రాన్స్‌ సోషలిస్టులతో ఆమెకు సత్సంబంధాలుండేవి. లెనిన్‌, మాక్సిమ్‌ గోర్కీలాంటి ప్రముఖులు ఆమెను అభిమానించే వారు. భారత విప్లవవాదులకు ఆర్థికంగా కూడా ఆమె సాయం చేసేవారు. సావర్కర్‌ జైల్లో ఉండగా ఆయన కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే.. మేడమ్‌ కామానే వారిని ఆదుకున్నారు.

ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌ తరఫున పాల్గొనటానికి ఐరోపా వచ్చిన భారతీయ సైనికులను ఆమె కలుసుకొని వారిని ఆంగ్లేయులపై తిరుగుబాటుకు ప్రోత్సహించారు. దీంతోబ్రిటన్‌ ఒత్తిడితో పారిస్‌లోనూ ఆమెపై ఆంక్షలు మొదలయ్యాయి.భికాజీ ఫ్రాన్స్లో నిర్భంధించబడింది. యుద్ధానంతరం ఫ్రాన్స్ లోనే యుండి, మన స్వాతంత్ర్యం కోసం వ్యాసాలు వ్రాస్తూ, ప్రసంగాలు చేస్తుండేది.

సోవియట్‌ యూనియన్‌కు వచ్చి ఉండాలని లెనిన్‌ ఆహ్వానించారు. కానీ ఆమె అమెరికా పయనమై.. అక్కడి ప్రజలకు భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని వివరించారు. భికాజీ కామా ధైర్యాన్ని చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహించింది. ఆమెను భారత్‌లోకి రానివ్వలేదు. సుమారు 35 సంవత్సరాలు ఆమె విదేశాల్లోనే గడిపింది – స్వదేశం కోసం పోరాడుతూ, కలలు కంటూ. చివరికి, వృద్ధాప్యంలో ఉన్న భికాజీకి భారత్ తిరిగి వచ్చే అనుమతి లభించింది. 1935 వరకు అలా ప్రవాసంలోనే గడిపిన కామా ఆరోగ్యం దెబ్బతిని పక్షవాతానికి గురయ్యారు. ఇక ఆమెతో ఎలాంటి ప్రమాదం లేదని గుర్తించిన బ్రిటిష్‌ ప్రభుత్వం భారత్‌లో అడుగుపెట్టడానికి అనుమతించింది. 1935 లో జన్మభూమికి తిరిగి వచ్చిన 9నెలల తర్వాత, తన 74వ ఏట ఆ విప్లవమాత కన్నుమూసారు. తీవ్రమైన అస్వస్థతకు గురై, 1936 ఆగస్టు 13న మరణించింది. తన యావదాస్తిని ఆవాబాయి పెటిట్ అనాథ శరణాలయానికి దానం చేసింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనుకుంటే అష్టైశ్వర్యాలను అనుభవించే అవకాశం. కానీ ఆమె వాటన్నింటినీ కాదనుకుంది. భర్తను సైతం వదులుకుంది. ఆంగ్లేయులకు లొంగకుండా భారతావని బానిస సంకెళ్ళు తెంచటంకోసం పరితపించింది. భారత్ లో ఇంకా స్వరాజ్య కాంక్ష మొదలు కాక ముందే 1907 లోనే బోల్ష్ విక్ వీరుడు లెనిన్ తదితరుల సమక్షంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన విప్లవ మాత భికాజీ రుస్తుం కామా.

భారతదేశంలో ఒక ప్రాంతానికి – Bhikaji Cama Place (భికాజీ కామా ప్లేస్) అని ఆమె పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇంతటి గొప్ప దేశ భక్తురాలి స్మృత్యర్థం ఆమె జన్మ శతాబ్ది సందర్భంగా 1962 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. 1997 సంవత్సరంలో మన కోస్ట్ గార్డ్ లోని అతివేగపు గస్తీ నౌకను ఆమె పేరు పెట్టారు.

భికాజీ కామా పేరు నేటికీ గర్వంగా పలుకుతారు.ఆమెను“భారత విప్లవ తల్లి”అని పిలుస్తారు.

భారత జాతీయ జెండా రూపకల్పనలో ఆమె పాత్రను ఎవరూ మరువలేరు.ఈ విధంగా భికాజీ కామా గారి జీవితం – ఒక త్యాగం, ఒక కల, ఒక జెండా కథ.

March 22, 2026 6 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగు జాతీయాల సొగసు

by చంద్రకళ దీకొండ March 22, 2026
written by చంద్రకళ దీకొండ

జాతీయం చేసుకున్న జాతీయాలు

చరిత్రపరంగానో..
పాలనాపరంగానో,ఇరుగు పొరుగులా కలిసుండే ప్రాంతాల పరంగానో…ఇతర భాషలను కలుపుకుంటూ సాగే నిరంతర స్రవంతి భాష!
ఏ భాష మనుగడకైనా అది అవసరమే!
భిన్నత్వంలో ఏకత్వాని కి ప్రతీకలమైన మనం ఇతర భాషల పదాలను జాతీయం చేసుకుని జాతీయాలుగా చేర్చుకుని,సంభాషణల్లో వాడుకుంటున్నాం.
ఉదాహరణకు…
నకరాలు పోవటం

అరేయ్! నకరాలు పోకురా..నారాలు తీస్త మళ్ల–ఏమనుకున్నవో!
ఏందిరా-గీ సిన్న పని జేయమంటే తెగ నకరాలు పోతున్నవ్?
నా కాడ నీ నకరాలు సాగవ్ బిడ్డా-గిదే సెప్తున్న
పై సంభాషణలు తెలంగాణ ప్రాంతంలో వింటూనే ఉంటాం.11-14 శతాబ్దాల మధ్య కాలంలోని తెలుగు శాసనాల్లో ఈ మాట నఖరు,నగరం అనే రూపాంతరాలతో సహా విస్తృత ప్రయోగంలో ఉంది. ఒక అర్థం దేవాలయమని,రెండోది వర్తకసంఘమని.ఏ మహానగరంలోనయినా వ్యాపారస్థులుగాని,అంగళ్లు గాని ఒకే ప్రాంతంలో ఉంటే, దాన్ని నకరవీడు,నకరవాడ అనేవాళ్ళు.బిడారు వర్తకులు ఏ నగరంలోనో,ప్రాంతంలోనో శాశ్వత నివాసం ఏర్పర్చుకుని,వ్యాపారం చేస్తుంటే అది నకరం, నకరాలు పోవటం అంటే కొనుగోలు కోసం ఆర్భాటంగా బయలుదేరడం.నకరానికి వెళ్లి,బేరసారాలు చేస్తూ,అక్కడ పెద్ద ఎత్తున కొంటున్నట్లు హంగామా చేయడం,బడాయికి పోవటం,నేటి భాషలో ఫోజులు కొట్టడం అన్నమాట!స్వస్థలంలో,స్వగ్రామంలో దొరికే వస్తువుల కోసం పరాయిచోట్లకు పోవటం సమాజంలో గౌరవానికి చిహ్నంగా నేటికీ ఉంది.చూస్తూనే ఉన్నాముగా..ఇక్కడ రేగు,జామ వంటి తాజా పండ్లు ఉండగా,నిలవ పండ్లు(స్ట్రాబెర్రీ,చెర్రీ,లిచీ,థాయ్ జామ, డ్రాగన్ ఫ్రూట్,వగైరా…)తింటూ,గొప్పలు పోవడం,నకరాలు కొట్టడం. దౌర్బల్యాలకు స్థల,కాల పరిమితులు లేవు మరి!

నంగనాచి- తుంగబుర్ర

ఓయబ్బో-ఏమెరుగని నంగనాచి అండీ…నోట్లో వేలెట్టినా, కొరకలేదు పాపం!
నంగనాచి-తుంగబుర్రా ని–ఎన్ని అబద్ధాలు చెబుతోందో!
చేసేదంతా చేసి,ఏమెరుగని నంగనాచిలా ఎలా కూర్చుందో చూడండి!
ఇలాంటి సంభాషణలు మన చెవుల్లో పడుతూనే ఉంటాయి.
నంగనాచి అనేది తెలుగు మాటగా వినిపించే హిందీ సమాసం. అంటే,’దిగంబరంగా నాట్యమాడే’ అని అర్థం.తుంగబుర్ర మాత్రం అచ్చతెలుగు మాట.తుంగ ముస్తె(దుంప)కూ,దిగంబర నాట్యానికీ సంబంధం లేదు కదా!హిందీలో ‘నంగా’ శబ్దం, సంస్కృతంలోని ‘నగ్న’ శబ్దభవం.ఊతం కోసమో,నాట్యకత్తెలా నున్నగా ఉందనే అర్థంలోనో తుంగబుర్ర కలిపివుండొచ్చు.
తమిళంలో నంగై శబ్దానికి కోడలు,వదినె, నెరజాణ అనే అర్థాలున్నాయి.మలయాళంలో నజ్జి అంటే చురుకైన, తెలివిగల స్త్రీ అని అర్థం.కన్నడంలో నాచిగె, నాచికె,నాన్చికె వంటి రూపాలకు సిగ్గు,మర్యాద,సిగ్గరి,వగైరా అర్థాలున్నాయి.ఒకనాటి తెలుగులో కూడా అలాంటి అర్థం ఉండి వుండొచ్చు..అవి మన పక్క రాష్ట్రాలే కదా!
మొత్తానికి నంగనాచి అంటే సిగ్గుమాలిన పిల్ల,తుంగబుర్ర (తక్కిన దుంపల్లాగా దానికి చర్మం ఉండదు)అంటే దిగంబరి అని అర్థమన్నమాట.అన్నట్టు–సర్వసాధారణంగా స్త్రీల విషయంలోనే ఈ జాతీయం వాడుతుంటారు.

బాదరబందీ

ఆయనకేం- ఏ బాదరబందీ లేదు.టింగురంగా అంటూ పూలరంగడిలా ఊరంతా తిరిగొస్తుంటాడు!
ఆవిడ ఒంటికాయ-శొంఠి కొమ్ము-చేసేందుకు ఏ పనీ లేదు-చేసి,ఎవరికీ పెట్టే పనీ లేదు-ఏ బాదరబందీ లేని అదృష్టవంతురాలమ్మా!
అబ్బా!దేవుడా!ఈ బాదరబందీలు ఇంకా ఎంతకాలం భరించాలో!
ఇలా ఈ జాతీయాన్ని మనం వింటూ ఉంటాం.
అసలు ఈ బందీ అనే శబ్దానికి బాధ్యతల్లో ఇరుక్కుపోవటం కాక,ముడి, కట్టు అని అర్థం.ఇది హిందీ/ఉర్దూ పదం.బాదర అన్న భాగానికి అర్థం లేదు.అది ‘బారహ్’ అని వ్రాసి,’బారా’ అని ఉచ్చరించే సంఖ్యావాచక శబ్దానికి వికృతరూపం.ముస్లింల పరిపాలన కాలంలో రాజకీయోద్యోగులు పొడుగాటి అంగరఖా ను ధరించేవారు.అప్పటికి బొత్తాములు లేదా గుండీలు వాడుకలోనికి రాలేదు.అందువల్ల కుడి,ఎడమ అంచులను చిన్న దారాలతో కలిపి కుట్టుకునేవాళ్ళు.అవి పన్నెండు(బారా) ముళ్ళు.మూడు,నాలుగు గుండీలు పెట్టుకోవడానికే బద్ధకించే వ్యక్తులు పన్నెండు ముడులు వేసుకోవాలంటే విసుక్కునేవారు.బారా ను, బాధ ను మేళవించి బాదర ను సృష్టించుకున్నారు.చివరకీమాట బాధ పుట్టించే చిక్కు వ్యవహారం అనే అర్థంలో ఈ జాతీయం వెలిసింది.సురవరం ప్రతాపరెడ్డిగారు ఈ బారాబందీ అంగీబొమ్మను గూడా గీయించి,ప్రచురించారు,ఆంధ్రుల సాంఘిక చరిత్రలో.చూసారా…వేషధారణకు,అలంకరణకు సంబంధించిన ఈ మాట చివరకు సంసారంలో బాధ్యతలకు,తలెత్తే చీకాకులకు ఎలా అన్వయించబడి,జాతీయంగా మారిందో!ఆసక్తికరంగా ఉంది కదూ!
మరికొన్ని విశిష్టమైన జాతీయాలను మరలా తెలుసుకుందాం!

జాతీయాలు అర్థమైతే మన జాతి చరిత్ర అర్థమౌతుంది అన్నారు పెద్దలు.మరి మనం మన మాటల్లో అలవోకగా వాడే కొన్ని జాతీయాలు, వాటి అర్థాల్ని తెలుసుకొని,అర్థవంతంగా ప్రయోగిద్దాం.

చేయి తడపడం

ఆ ఆఫీసులో ప్రతి వారి చేయి తడపనిదే ఒక్క ఫైలూ కదలదు.మన పని జరగదు

ఆ సీటులో కూర్చున్నాయన చేయి తడిపారంటే,ఇట్టే మీ పని జరిగిపోతుంది

ఇలాంటి సంభాషణలు మనం తరచుగా వింటూనే ఉంటాం. మరి చేయి తడిపితే,కరెన్సీ నోట్లు తడుస్తాయి కదా! అనే సందేహం రావడం సహజం.ఆ సందేహానికి సమాధానం ఏమిటంటే…
పూర్వకాలంలో బంగారు వరహాలు,వెండి నాణేలు,ఇత్తడి నాణేలు వాడకంలో ఉండేవని మనకు తెలుసు.శ్రీరాముడు తానీషాకు నాణేల రూపంలో రామదాసు బాకీ చెల్లించాడని కూడా కథలో విన్నాం.
ఆ నాణేలను(లోహంతో చేసినవి)ఇతరులకు ఇచ్చేముందు,వారి చేయిని నీటితో తడిపి,ఇచ్చేవారట! ఎందుకంటే,మనం కరోనా కాలంలో చేతుల్ని శుభ్రపరచుకున్నట్టుగా,రోగక్రిములేవీ అంటకుండా,ముందుజాగ్రత్త అన్నమాట!
అందుకే చేయి తడపడం అంటే ధనం చెల్లించడం అనే అర్థంలో ఈ జాతీయం మొదలైంది.

అరణ్యరోదనం

మనం దీని గురించి ఎంత మొత్తుకున్నా,అది అరణ్యరోదనే

ఆ నిశీధిలో నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె ఏడుపు అరణ్యరోదనే అయ్యింది

అరణ్యమంటే అడవి.రోదనమంటే ఏడుపు.అడవిలో ఏడిస్తే వినేవారుండరు,సానుభూతి చూపేవారుండరు,ఓదార్చేవారుండరు.అందువల్ల ఏడ్చినా ప్రయోజన శూన్యమే.వృధా శ్రమ.నవ్వినా,తిట్టినా, పొగిడినా, మరే పని చేసినా..అడవిలో చేసినప్పుడు ఏ ప్రయోజనం ఉండదు. అయినాసరే,వాడుకలో ఏడ్పుకే ప్రాధాన్యమిచ్చి,ఈ జాతీయం పుట్టించారు.అనవసర శ్రమ అనే అర్థంలో కూడా ఈ మాటను వాడుతుంటారు.

అరవ చాకిరి

అబ్బబ్బ!ఈ అరవ చాకిరీతో చస్తున్నాను అంటుంది ఓ ఇల్లాలు.

నా చేత అడ్డమైన అరవ చాకిరీ చేయించుకుని,సరైన జీతం కూడా ఇవ్వకుండా,పనిలోంచి తొలగించాడు ఆ కంపెనీ వెధవ

పై మాటల్ని వింటూనే ఉంటాం కదా..అనేక కారణాల వలన తెలుగువాళ్లకూ,అరవలకు ఎప్పుడూ పడేట్లు లేదు.
చాళుక్యులు, చోళులు మొదలైన రాజవంశాలవాళ్ళు తెలుగుదేశాన్నిజయించి,
పాలించినప్పటినుంచీ ఈ విరోధం కొనసాగుతున్నట్లుంది.వాళ్ళ కుంభకోణాలు,చిదంబర రహస్యాలు మనవాళ్ళని అనేకవిధాల బాధించి వుండవచ్చు. కానీ, ఉత్తరాదిన పంజాబీ వారిలా,దక్షిణాదిన తమిళులు శ్రమజీవులన్న మాట నిజం.అందువల్ల మనకు వాళ్లంటే ఈర్ష్య పుట్టి,రాజకీయాది కారణాలవల్ల అది అసహ్యంగా పరిణమించి ఉంటుంది. మాట,పలుకు లేకుండా ఎంత చాకిరీ అయినా చేస్తే,దాన్ని గొడ్డు చాకిరీ అంటాం కదా..ఆ గొడ్డు స్థానంలో అరవ శబ్దాన్ని చేర్చి,వారిని అమర్యాద చేసారన్నమాట!అరవకుండా చేసే చాకిరీని,అరవలు చేసే చాకిరీని కలిపి శ్లేషలో బంధించి,ఈ సమాసం కల్పించి ఉండొచ్చు మనవాళ్ళు.కర్ణాటులు కూడా తెలుగు తేట, కన్నడ కస్తూరి,అరవ అధ్వాన్న మని ఆక్షేపిస్తుంటారు.
ప్రాచీన తమిళంలో పదాదిని ‘ర’ పలకటం లేదు. అందుకే ‘రవం'(ధ్వని) ఉన్న తమ భాషను మధుర భాష అని భావించి వాళ్ళు అరవ మని పిలుచుకుంటే,సరిగ్గా ఆ మాధుర్యమే లేదని ఆ భాషను మనం అరవమంటున్నాం. చిలప్పతికారం(శిల్పాధికారం) అనే తమిళ కావ్యంలో కణ్ణకి మాటలు అరవం కన్నా తియ్యగా ఉంటాయని వర్ణించాడు కవి.కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు ఎవరి భాష వారికి గొప్ప!
భాష సంగతి ఎలా ఉన్నా,తమిళులు చేసే శ్రమను మన గొడ్డు చాకిరీతో పోల్చి,ఈ జాతీయాన్ని పుట్టించారన్నమాట!

March 22, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చారిత్రక నవలాచక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్!

by Achyutuni Rajasri March 22, 2026
written by Achyutuni Rajasri


భారతీయ ఆర్ష సంస్కృతి ,భారత చరిత్ర ను పరిశోధించి దేశం ధర్మంకోసం నేటికీ రచనలుచేస్తున్న పుంభావసరస్వతి శివప్రసాద్ గారు.ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన సిందూరం ప్రచురించి చైతన్యంతెచ్చారు.23.12.1940లో తాడికొండలో జననం,ఎం.ఎ.పి.హెచ్.డి చేసిప్రొఫెసర్ గాతెలుగుశాఖలో 2000లో రిటైరైనా జోష్ గా మాట్లాడుతూ శ్రోతలలో దేశ భక్తి రగిలించే దిట్ట ఆయన! డాక్టర్ ఉమాదేవి భార్య.ముగ్గురు సంతానం.చారిత్రక నవలాసమ్రాట్ నవలావిరించి శివ కవీంద్ర,అభినవ పాల్కురికి,అభినవధూర్జటి ,వేదవిజ్ఞానఖని మొదలైన బిరుదులతో పాటు స్వర్ణ గండపెండేరం,స్వర్ణ కంకణాలు,దేశ విదేశాల్లో సత్కారాలు రేడియో టి.వి.ప్రసంగాలతో శ్రోతలని ఉర్రూతలూగించిన గంగాఝరి ఆయన!1100సార్లు భువనవిజయం ప్రదర్శించారు.కృష్ణాపత్రికలో సంపాదక వర్గంలో సేవలందించారు.ఉత్థాన(కన్నడ)వైదిక భాస్కర్,హిందీమిలాప్(హిందీ)సియాసత్( ఉర్దూ) జాగృతి ఆంధ్రభూమి,ఆంధ్ర ప్రభ,ఆంధ్ర జ్యోతి ఈనాడు,తానామాసపత్రిక, అమెరికా తెలుగుజ్యోతిలో టిటిడి సప్తగిరిలో పుంఖానుపుంఖాలుగా వేలాది వ్యాసాలు కవితలుప్రచురింపబడినాయి.
భారతీయ సాహిత్య పరిషత్ సంస్థాపక సభ్యుడు,ఆచార్య శిప్రమునిపీఠం సంస్థాపక అధ్యక్షుడు,ఉమాదేవిమెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడుగా ఆయన సేవలు నిరుపమానం. ఈయన గ్రీక్ భాషపై విశేష పరిశోధన చేశారు.అమెరిక జర్మనీ,బ్రిటన్,సింగపూర్,దుబాయ్ మొదలైన దేశాల్లో పర్యటించి 25వేలపైగా ఉపన్యాసాలిచ్చారు.

తమ పూర్వీకుల గూర్చి ఆయన ఇలాచెప్పారు,” మాపూర్వీకులుకాశ్మీర్ నుంచి వచ్చి గణపతిదేవుడు,రుద్రమదేవికాలంలో ఓరుగల్లులో రాజగురువులుగా స్థిరపడ్డారు.మాతామహస్థానం ఒంగోలు,తాడికొండ పితామహస్థానం,వరంగల్ ముదిగొండ వారి గురుపీఠం.మానాన్నగారుమల్లికార్జునరావు బి.ఎస్సీ.చదివి భ్రమరి అనే పత్రిక ఎడిటర్ గా వక్తగా పేరుగాంచారు .” శివ ప్రసాద్ గారిచదువు ఇసుకను ఓనమాలు రాయడంతో ప్రారంభమైంది.5వక్లాసుతర్వాత పెన్సిల్.నాటి మెట్రిక్ నేటి ఎం.ఎ.తో సమానం.ఆరోజుల్లో ఎం.ఎ.లెక్చెరర్ జీతం 16రూపాయలు.100నోటు చూసి ఎరగరు. బడిఫీజు అర్ధరూపాయి.ఈయన బడిపై యూనియన్ జాక్ జెండా ఎగిరేది.ఆనాడు కులమతవర్ణ వర్గ వివక్షత లేకుండ పిన్నీ బాబాయి వదినె అని పిలిచేవారు. ఆనాటి మన భారతీయులు,”మంగళమనరే” అని బ్రిటిష్ పాలకులకు జైకొడుతుంటే హిట్లర్ సుభాష్ చంద్ర బోస్ తో” మీ భారతీయులకు బానిసత్వం ఇష్టం “అని అన్నాడుట. ఇలాంటి విషయాలు తనగురువులు చెప్పి దేశ భక్తిని నూరిపోశారంటారు శ్రీముదిగొండవారు.ఆరోజుల్లో ఈయన ప్రభావితంచేసిన పాటల్లో గరిమెళ్ల సత్యనారాయణ గారి”మాకొద్దీ తెల్లదొరతనం” కాశీనాధుని, ముట్నూరి, ఉన్నవ,దుగ్గిరాల మొదలైన మహామహుల్ని చూశారు శివ ప్రసాద్ గారు.బాల్యంలో సినిమాలు తెగచూసేవారు. ఆరోజుల్లో 100గ్రామాలకి కల్పి ఒకటే హైస్కూల్ తాడికొండ లో ఉండేది.శరత్ సాహిత్యం,ఆంగ్లానువాదాలు,చదివి ఇంటర్ లో రచనలు చేయటం ఆరంభించారు.తనను బాగా ప్రభావితం చేసిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు,నోరినరసింహశాస్త్రిగారు అనిచెప్పారు.ఎన్నికల టైంలో పాటలు పద్యాలు రాయటం ప్రారంభించిన ఆయన వాల్తేర్ యూనివర్శిటీ ఎం.ఎ.లో కాంపిటేషన్ లో ఫస్ట్ ప్రైజ్ పొందటం సాహిత్య వేత్తగా ఎదగటానికి బీజంవేసింది అంటారు.ఈయన దివాకర్లవెంకటావధానిగారి ప్రియశిష్యులు.

ఇక తనపై ఆధ్యాత్మిక ప్రభావం తనతాతగారైన కొంపల్లి జ్వాలయారాధ్యులవారివల్లనే అని చెప్పారు.నిరంతర శివ పూజలు చేసేవారాయన.బాబాయిరామలింగశాస్త్రి గారు ఆధ్యాత్మిక భావాలు గుప్పించారు.భారతీయ ధర్మ ప్రచారంచేయాలని దివాకర్లవారు చెప్పేవారు.ఇక నేటి సాహిత్యం గూర్చి ఆయన అభిప్రాయాలు ఇవి” మనకి బుక్ కల్చర్ తగ్గి లుక్ కల్చర్ పెరిగింది.మనదేశచరిత్ర పూర్తిగా వక్రీకరించబడింది. విదేశీయుల్ని పొగిడే చరిత్రలు పాఠాలుగా వచ్చాయి.కాలడీ ఆదిశంకరాచార్యులవారు నేషనల్ హీరో!మతప్రవక్త కాదు.దేశమంతా ఒక్కటే హైందవీయసంస్కృతి కి మూలస్థంభం ఆయన! వేదాల్ని ఎగతాళి చేయవద్దు.గౌరవించండి.చరిత్రను వక్రీకరించవద్దు.పరాజయం నుంచి పాఠాలు నేర్చుకోవాలి.సమాజానికి సరైన చరిత్ర చెప్పాలని చారిత్రక నవలలు శోధించే రాశాను. రాయటం చదవటం కూడా కష్టం.కానీమన భారత దేశ చరిత్ర పవిత్రత ఆధ్యాత్మికత అందరికీ తెలియాలి.మానాన్న 1940లోనే ఎర్రజెండా పట్టుకున్న వామపక్షంవాడు. నేను ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యత ను తెలియజెప్పాలి అనే ఉద్దేశంతోనే రాశాను,రాస్తున్నాను.” నిజంగా మన ఆర్షధర్మం సంస్కృతి అసలు సిసలు చరిత్ర తెలియాలంటే శ్రీముదిగొండ శివ ప్రసాద్ గారి పుస్తకాలు ప్రతి బడిలో కాలేజీలో ఉండితీరాలి

March 22, 2026 10 comments
1 FacebookTwitterPinterestEmail
కవితలు

హింసాలంకారం

by chittiprolu Subbarao March 22, 2026
written by chittiprolu Subbarao

కపాలమాలదాల్చి

తాండవించేరక్కసిఅక్కడ

ముత్యాలసరంధరించి

తుంపెసలాడేకోమలిఇక్కడ

అక్కడభీభత్సమని

ఇక్కడలాలిత్యమని

తలపోశానిన్నాళ్ళు

రక్కసివక్షంమీదనేకాదు

కోమలిహృదయంమీదకూడా

విగతజీవులఆర్తనర్తనమే

కనిపిస్తూందీనాడు

March 22, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us