మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

అభ్యుదయ కవి డాక్టర్ తిరునగరి

by Punnami Anjaiah September 24, 2025
written by Punnami Anjaiah

భావకవిత్వంపైన తిరుగుబాటుగా వచ్చినదే అభ్యుదయ కవిత్వం. ఈ సమాజంలో అసమానతలు ఉన్నవాళ్లు లేనివాళ్ళు ధనవంతులు సామాన్య ప్రజలు యజమానులు శ్రామికులు లాంటి భేదాలు సమసిపోయి అంతా ఒకటిగా కలసిమెలసి జీవించడమే అభ్యుదయం.
సామాన్య మానవుడిని సాహిత్యానికి మకుటధారిగా మలిచింది అభ్యుదయ కవిత్వం.శ్రీ శ్రీ,ఆరుద్ర,అనిశెట్టి, దాశరథి,సోమసుందర్, కాళోజీ మొదలైన కవులు అభ్యుదయ కవులుగా గుర్తింపు పొందారు. శ్రీ శ్రీ మహాప్రస్థానం, ఆరుద్ర త్వమేవాహమ్,సోమసుందర్ వజ్రాయుధం,అనిశెట్టి అగ్నివీణ, దాశరథి అగ్ని ధార, కాళోజీ నాగొడవ కావ్యాలు అభ్యుదయ కావ్యాలుగా ప్రజాదరణ పొందాయి.

గత జులై నెలలో శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్న మహాకవి దాశరథి రచించిన తొలి కావ్యం “అగ్ని ధార”ను ప్రచురించిన సంస్థ సాహితీ మేఖల. నల్లగొండ జిల్లాలోని చండూరు లో ఈ సంస్థను కవి రత్న అంబటి పూడి వెంకట రత్నం శాస్త్రి 1934 లో స్థాపించారు. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం తెలుగు భాషా వికాసం కోసం 92 యేళ్లుగా కృషి చేస్తున్న ఈ సంస్ధ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సుమారు 150 కి పైగా పుస్తకాలు వెలువరించి తెలుగు జాతికి వెలుగు బాటగా నిలిచింది. అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన ప్రముఖ కవి, సాహితీవేత్త, భారత్ భాషాభూషణ్ డాక్టర్ తిరునగరి రచించిన “వానా-వాడు” కవితా సంపుటిని కూడా సాహితీ మేఖల సంస్ధ ప్రచురించడం గమనార్హం.
ఆలేరు ప్రాంతంలో మొదటగా వినిపించే కవి పేరు డాక్టర్ తిరునగరి… వారి తర్వాతే ఇంకెవరైనా. అభ్యుదయ భావాలు, మానవతావాదం కలిగిన ఈ కవి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయస్థాయిలో తమ విశిష్ట రచనలతో బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. డాక్టర్ తిరునగరి పూర్తి పేరు తిరునగరి రామానుజయ్య. ‘తిరునగరి’ అన్న ఇంటిపేరుతోనే దాదాపు ఐదు దశాబ్దాల పాటు అసంఖ్యాక రచనలు చేసి తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధులయ్యారు. 30కి పైగా డాక్టర్ తిరునగరి రచనలు పుస్తకాలుగా ముద్రితమై పాఠకుల ఆదరణను పొందాయి. వచనం, పద్యం, గేయం, వ్యాసం, విమర్శ, పాట వంటి ప్రక్రియలో ఆయన అనేక రచనలు చేశారు. డాక్టర్ తిరునగరి సాహిత్యం పై ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ విశ్వవిద్యాలయాలలో పి.హెచ్.డి, ఎం ఫీల్ పరిశోధనలు కూడా జరిగాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటమండలంలోనిబేగంపేట గ్రామానికి చెందిన మనోహర స్వామి,జానకిరామక్క దంపతులకు 1945 సెప్టెంబర్ 24 వ తేదీన జన్మించారు. అధ్యాపక వృత్తి నుండి రిటైర్ అయి 2021 ఏప్రిల్ 25 న పరమపదించారు. తిరునగరి రచనల్లో శృంగార నాయికలు (ఖండ కావ్యం), బాలవీర ( శతకం), కొవ్వొత్తి, అక్షరధార, వసంతం కోసం, ఆహుతి, కాలహేల,తిరునగరీయం, తల్లి పేగు మొదలైన 30 కి మించి రచనలు చేశారు. కవితలే కాకుండా గేయాలు, పద్యాలు, సమీక్షలు,సాహితీ విమర్శనా వ్యాసాలు కూడా రాశారు. తిరునగరి రచించిన కవితలు, లలిత గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లలో పలుమార్లు ప్రసారం అయ్యాయి. వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

వస్తువుకు ప్రాధాన్యతనిచ్చి చేవగల కవితలు రాయడంలో వీరు నేర్పరులు. ఉత్తమ రచనకు ఉపన్యాసానికి కావలసిన భాషా పరిజ్ఞానాన్ని సంపాదించిన ప్రఖ్యాత కవి. తిరునగరి కవిత్వమే శ్వాసగా ఐదు దశాబ్దాల పాటు నిరంతరాయంగా సాహిత్య సృజన చేసి ప్రాచ్య,పాశ్చాత్య కవిత్వ సిద్ధాంతాలను ఆకళింపు చేసుకున్న గొప్ప సాహితీ వేత్త. తన రచనల ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచి తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మహాకవి డాక్టర్ దాశరధితో ప్రత్యక్ష సాన్నిహిత్యం కలిగిన ఆయనతో కలిసి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్న కవి తిరునగరి. తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన దాశరథి పురస్కారాన్ని 2020లో డాక్టర్ తిరునగరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా అందుకున్నారు. అభ్యుదయ కవిత్వోద్యమంలో చురుకుగా పాల్గొన్న తిరునగరి గ్రామీణుల మనస్తత్వానికి తన కవితలో నిలువుటద్దం పడతారు. అన్యాయాన్ని దౌర్జన్యాన్ని వర్తమానం నుండి గెంటేసి సమానత్వాన్ని, మానవత్వాన్ని ఈ సమాజం సాధించాలని ఆశిస్తూ అనేక కవితలు రాశారు. డాక్టర్ తిరునగరి తమ “ఆత్మకధ” వృత్తాంతాన్నిలా కవిత్వీకరించారు

‘ఎడారుల్లో సాగిపోతున్నాను
ఒయాసిస్సులనన్వేషిస్తూ
కంటకారణ్యాలలో సాగిపోతున్నాను
పూల దారుల్ని సంభావిస్తూ
దానవత్వంతో పోరాడుతున్నాను
మానవత్వాన్ని ఆహ్వానిస్తూ
నైరాశ్యాల్ని పారద్రోలుతున్నాను
ఆశాగీతాల్నాలాపిస్తూ
కష్టాలను సహిస్తున్నాను
సుఖాల్ని సందేహిస్తూ
అగతానికి స్వాగతం పలుకుతున్నాను
అవనికి కళ్యాణాన్ని కాంక్షిస్తూ
కాలంతో ప్రయాణిస్తున్నాను
వసంతం కోసం నిరీక్షిస్తూ
ఎడారుల్లో సాగిపోతున్నాను
ఒయాసిస్సులనన్వేషిస్తూ’

పద్యం,గద్యం,వచనం వంటి ఈ మూడు ప్రక్రియల్లో డాక్టర్ తిరునగరి తన సాహిత్య సృజనను చాటుకున్నారు. ‘నా కలంలో బలం ఉన్నన్నాళ్ళు కవితలు రాస్తుంటాను’అని మహాకవి దాశరథి అన్నట్లు చివరి క్షణం వరకు తిరునగరి కవిత్వమే ప్రాణంగా బతికారు. ‘రైతుదే తెలంగాణము’, అని దాశరథి అగ్నిధార లో అన్నట్లు తిరునగరి తన ‘వానా-,వాడు’ లో రైతు గురించి బాగా చెప్తారు.స్వాతంత్ర్యం వచ్చి నేడు 78 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు రైతన్న బతుకుతున్నాడని “వాడు వాడే” కవితలో అన్నదాతల కష్టాలను ఏకరువు పెట్టారు.
‘పారిశ్రామిక విప్లవాలు వచ్చినా, ప్రపంచీకరణ జరిగినా వాడు వాడే, పేదవాడుగా పిచ్చివాడుగా ఏమీలేని వాడుగా, ఎముకల గూడుగా వాడు వాడే,వాడి పేరు రైతే ‘అంటూ వాపోయారు.

‘వాన కురిసింది మొదలు
వాడి చేను పచ్చగా నవ్వుతుంది
వాన వాడి ప్రాణం
వాన వాడి జీవితం
వాన వాడి స్వప్నం
వానే లేకుంటే వాడే లేడు’అంటూ వానకు రైతన్నకున్న అనుబంధాన్ని “వానా-వాడు” కవితలో చక్కగా ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయమైన అభ్యుదయ మానవతా కవితా రవి తిరునగరి.

(సెప్టెంబర్ 24 న డాక్టర్ తిరునగరి జయంతి సందర్భంగా…)

September 24, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గౌరమ్మ

by Shyama Dasi September 24, 2025
written by Shyama Dasi

బెంగళూరులో మేమున్న అపార్ట్మెంట్ ఇరవై ఒక్క ఎకరాల స్థలంలో పచ్చని చెట్ల మధ్య పదమూడు వందల అపార్ట్మెంట్స్ తో అన్ని వసతులతో కూడి మినీ టౌన్ లాగా ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చి పదిహేను ఏళ్ల అవుతున్నది మేము వచ్చిన సంవత్సరానికి గౌరమ్మ వాళ్ళమ్మ రేణుకమ్మ తో కలిసి పని వెతుక్కుంటూ ఇక్కడ పనిచేసే వాళ్ళ రికమండేషన్ తో మా ఇంటి తో కలిపి మూడు ఇళ్లల్లో పనికి కుదిరారు.
గౌరమ్మంటే పిలుపును బట్టి వయసును అంచనా వేయలేనట్టి ఇరవై రెండేళ్ల అమ్మాయి అంత వయసు అని కూడా అనిపించనట్లుగా బక్క పల్చగా చిన్న ఆకారం నల్లగా కళగల ముఖంతో అతి తక్కువ గా మాట్లాడుతూ ముఖంలో ఏ భావం కనిపించనీయనట్లు ఉంటుంది.
సొంత ఊరు షిమోగా అని, ఇక్కడికి రాకపూర్వం అక్కడే కాఫీ తోటల్లో పని చేసేవారట. కాస్త పొలం పుట్ర కూడా ఉండేదట ఇళ్లల్లో పనికి కుదరడం ఇదే మొదలు అని చెప్పారు. కన్నడ తప్ప మరో భాష రాదు వాళ్ళకు, మాకు కన్నడ రాదు అయినా భాషతో అవసరం లేకుండానే వారం పది రోజుల్లోనే మాకు, పనికి కూడా సొంత మనుషుల్లాగా అలవాటైపోయారు. ఇప్పుడు నేల్లాళ్లు మేమెవ్వరం లేకున్నా,ఇంటి తాళాలు గౌరమ్మకిచ్చి వెళ్తాము ప్రతిరోజు వచ్చి దుమ్ము ధూళి ఉంటే దులిపి ఇల్లు శుభ్రం చేసి వెళ్తుంది. అంత నమ్మకం పెంచుకున్నాము. తడుముకోకుండా ఒక క్రమ పద్ధతిలో చాలా శుభ్రంగా చక చక పనిచేసుకోపోవడం వారి నేర్పరితనాన్నిచూపిస్తుంది . గౌరమ్మలా కాకుండా వాళ్ళ అమ్మ రేణుక గలగల మాట్లాడుతూ వుంటుంది.ఊరు నుండి తెచ్చుకున్న అమాయకత్వంతో పాటుగా, నిజాయితీగా పనిచేయడమే తెలుసు వాళ్లకు. ఎప్పుడైనా పిల్లలకు నలతగా ఉంటేనో, వాళ్ళ నాన్నకు బాగో లేకుంటే గాని, ఇంకా ఏ ఇబ్బందులు కలిగినా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చి కొన్ని పనులైనా చేసి వెళ్లేవారు. కోవిడ్ సమయంలో కొన్ని రోజులు అపార్ట్మెంట్ వారు బయట నుండి పని వాళ్ళను అనుమతించలేదు ఆ సమయంలో తప్ప మరెన్నడు సెలవు పెట్టింది లేదు. ఈరోజు వరకు అలా జరుగుతూనే ఉన్నది.
ఇంతకీ ఇంత ఉపోద్ఘాతం గౌరమ్మ గురించి కొంత చెప్పాలని. తన గురించిమాకు తెలిసిన విషయాలు ఏవైనా రేణుకమ్మ చెపితే తప్ప గౌరమ్మనోటి వెంట వాళ్ళింటి విషయాలు ఇంతవరకు వినలేదు. పదహారేళ్లకే బంధువుల పిల్లవాడికిచ్చి గౌరమ్మ పెళ్లి చేశారట . వెంట వెంటనే ఇద్దరు మగ పిల్లలు భర్త నుండి ఎలాంటి సహాయం లేకపోగా తాగుడు తిరుగుడు లాంటి వ్యసనాలు ఉన్న అతడు గౌరమ్మను వేధించడమే గాక, ఆ పిల్ల కూలి నాలి చేసి సంపాదించిన డబ్బులు కూడా లాక్కొని మళ్లీ ఏ ఆర్నెల్లకో ఇంటి ముఖం చూసేవాడట. అప్పుడప్పుడు ఎక్కడో పనిచేస్తున్నట్లు చెబుతూ కొడుకు చేతిలో పెట్టే డబ్బులకు అతని తల్లిదండ్రులు కూడా మోసపోయారు. పెళ్లయ్యాక ఆ కాస్త కూడా లేదు, వాళ్లు చేయగలిగింది కూడా ఏమీ లేదు కనుక కలోగంజో కలిసే తాగుదామని గౌరమ్మను పిల్లలను వారి దగ్గరే ఉంచుకున్నారు. కానీ అది ఎక్కువ రోజులు జరగలేదట ఉన్న కాస్త భూమి అప్పులకు పోగా, ఈ పెద్ద వయసులో ఊరు వదిలి రాలేమన్న అత్తమామలను వదిలి, గౌరమ్మ వాళ్ళ అన్న సలహా పై తల్లిదండ్రులను తోడు తెచ్చుకొని ఇద్దరు పసిపిల్లలతో బ్రతుకు తెరువు వెతుక్కుంటూ బెంగళూరు చేరింది. గౌరమ్మ అన్న బెంగళూరులోనే బేల్దారు పనులు చేసుకుంటూ భార్య ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. తన కోడలు నేత్ర చాలా మంచి అమ్మాయిని రేణుక చెబుతూ ఉంటుంది. తన పిల్లలతో పాటు గౌరమ్మ పిల్లలను కూడా చూసుకుంటూ, వీళ్ళు పనులు చేసుకుని నాలుగు రాళ్లు సంపాదించుకుని కుదుటపడేందుకు అవకాశం కల్పించింది ఆమె.
ఒక సంవత్సరం తర్వాత గౌరమ్మ తనకు సహాయంగా, తీసుకొచ్చుకున్న అమ్మానాన్నలతో కలిసి వేరే ఇంటికి మారింది. సంవత్సరం తిరిగే సరికల్లా ఇల్లు గడుపుకుంటూనే గౌరమ్మ మా సహాయంతో పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయించుకుని పిల్లల పేర్లతో కొంత డబ్బు జమ చేయసాగింది. చిట్లు కట్టుకుంటూ , అవసరాలకు చిట్లు పాడుకుంటూ డబ్బులు ఆదా చేసుకోవడం, అవసరాలకు అందుకోవడం సాధారణంగా వాళ్ళందరూ చేసే పని కానీ గౌరమ్మ ఎందుకో వాటి జోలికి పోలేదు. క్రమంగా మరో నాలుగు ఏళ్లలో ఇంకో నాలుగిళ్లకు పనికి కుదిరారు. పనుల్లో మార్పు లేదు కానీ టైం అడ్జస్ట్మెంట్స్ అంతే. మా ఇంట్లో పనికి చేరిన తొలి రోజు నుంచి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం గౌరమ్మకు మా ఇంట్లోనే, ఆయా సమయాల్లోనే తను పనికి వస్తుండటం వలన తనను పక్కనపెట్టి మేము తినలేక అలా ఏర్పాటు జరిగింది. పని ఎంత శ్రద్ధగా చేస్తుందో అంతే శ్రద్ధగా పిల్లలను చదివించుకుంటున్నది. గవర్నమెంట్ పథకాల రూపంలో అందిస్తున్న సహాయాన్ని ఓపిగ్గా తిరిగి సాధించుకుంటూ, తన కష్టానికి ఆధారంగా చేసుకుని ఉన్నంతలో పండుగలు పబ్బాలు, పుట్టినరోజులు అన్ని వెలితి లేకుండా జరుపుకుంటుంది .
పనిలోకి చేరకముందే అడ్వాన్స్ అడగడం నెలకు ముందే పై నెలలో చెల్లుపెడతామంటూ అప్పులు తీసుకోడాలు సర్వసాధారణం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా జీతం తప్ప అది కొన్ని ఇళ్లల్లో వెనుక ముందుగా కూడా ఇస్తుంటారట. ఎలా మేనేజ్ చేసుకుంటుందో గానీ అవసరం అని పది రూపాయలు ఎవరిని అడిగింది లేదు. నా వసతిని బట్టి రెండు వేలో మూడు వేలో అప్పుడప్పుడు చేతిలో పెట్టడం తప్ప అంతకుమించి నేను ఇచ్చింది కూడా లేదు. మిగిలిన ఇళ్ళ విషయం నేనెప్పుడూ అడిగింది లేదు తను చెప్పింది లేదు. మా ఇంటికి బంధువులు వచ్చివెళ్లేటప్పుడు మాత్రం గౌరమ్మ చేతిలో ఎంతో కొంత పెట్టేవారు. జీతం కాక ఇవేతనకు అదనంగా అందే డబ్బులు. చిన్న కుటుంబాల నుండి కోటీశ్వరుల వరకు అప్పులపై సంసారాలు జరుపుతున్న మేధావులకు ఈ విషయం ఎలా అర్థమవుతుంది. ” ఆకాశానికి ఆశల నిచ్చెనలు వేస్తూ, తృప్తి లేక ఎండమావులవెంట దాహం తీర్చుకునేందుకు పరుగులు పెడుతున్న వాళ్లకు “గౌరమ్మను గురించి ఎంత చెప్తే అర్థమవుతుంది. అప్పుడప్పుడు కనబడి వేధించే భర్త, అనారోగ్యంతో తండ్రి, చదువుకుంటున్న పిల్లలు, ఇంటి అద్దె, నిత్యవసరాలు ఇన్నింటినీ ఎలా నడుపుకుంటూ వస్తున్నది అనే విషయం ఒక ప్రశ్న గానే ఉండిపోతుంది.
ఏడెనిమిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌరమ్మ నాన్న ఈ మధ్యనే చనిపోయాడు. బంధువుల అందరి మధ్య అన్న వదినల సహాయంతో అన్ని కార్యక్రమాలు గౌరమ్మ జరిపించింది. ఒకరోజు రేణుక కన్నీళ్లు పెట్టుకుంటూ ఏ రోజు వాళ్ళ నాన్నను విసుక్కుని ఎరుగదమ్మ గౌరమ్మ, కోరినవి చేసి పెడుతూ అడిగినవి తెచ్చిస్తూ , వైద్యం చేయించడంలో గాని, ఎక్కడా అలక్ష్యం చేయకుండా ఇన్ని రోజులు ఇంకో పసిబిడ్డ లాగా చాకింది . అని రేణుక చెబుతుంటే, అన్ని వసతులు వున్న ఇళ్లల్లో కూడా వయసుడిగిన పెద్దలకు ఈ మాత్రం ఆదరణ దొరకడం లేదు కదా అనిపించింది.
శుభ్రమైన డ్రస్సులో ఎప్పుడూ కడిగిన ముత్యంలా ఉంటుంది గౌరమ్మ. అన్నట్లు ఇప్పుడు తన వయసుముప్పైయేడు సంవత్సరాలట గౌరమ్మ విషయంలో వయసు నిలిచిపోయిందా! అన్నట్లు పనికి చేరిన మొదటి రోజు ఎలా ఉందో ఇప్పటికీ ముఖంలో కనిపించే కాస్త అలసట తప్ప అలానే ఉంది. ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేకుండా నల్లని జుట్టు నూనె పెట్టి నున్నగా దువ్వుకొని జడ వేసుకుంటుంది. ఊహ తెలిసినప్పటినుండి “స్ట్రెస్ “తో పదహారేళ్లకే నెరసిన వెంట్రుకలతో తలకు రంగు వేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఇప్పటి పిల్లలు,నవ నాగరిక సమాజం తెలుసుకోవలసినది ” ఎవరో వస్తారని ఏదో చేస్తారని” ఎదురు చూడకుండా తన స్వశక్తికి పదును పెట్టుకున్న అతి సామాన్యమైన ఆడపిల్ల గౌరమ్మ. తన బాధలకు,సమస్యలకు కారణాలు ఏమైనాప్పటికీ, “తాను మోస్తున్న బాధ్యతలు, బంధాలు కేవలం తనవే “అన్న ఆలోచనే గౌరమ్మకు బలం కాగా, వాటిని ఎంతవరకు, ఏ విధంగా చక్కపరచుకుంటూ పోగలను అనేదే ఆమె ధ్యేయం. ఈ ప్రయాణంలో ఎవరి మెచ్చుకోలు తనకు అవసరం లేదు, విమర్శలకు చోటు ఇవ్వదు . గౌరమ్మ జీవిత ప్రయాణంలో నమ్మక తప్పని సత్యాలు ఇవి.
పద్నాలుగేళ్లుగా గౌరమ్మను చూస్తూ వస్తున్న నాకు ఎప్పటికప్పుడు తను ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో కనిపిస్తుంది. కంటికి ఆనని ఆకారం, మేరుశిఖరం వంటి ఆత్మస్థైర్యం ఆమెకు ఎలా అబ్బేయా అని అబ్బురపడుతుంటాను. అవార్డులు, రివార్డులు ఎరుగనిగౌరమ్మ లాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో!

September 24, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

అనుభవం ద్వారా విద్య

by mayuukha September 24, 2025
written by mayuukha

శ్లో. ఆచార్యాత్ పాదమాదత్తే
పాదం శిష్యః స్వమేధయా
పాదం సబ్రహ్మచారిభ్యః
పాదం కాలక్రమేణ చ
జ్ఞానమనేది నాలుగో వంతు గురువు గారి ద్వారా,మరో నాలుగో వంతు విద్యార్థి తన సొంత మేధస్సు ద్వారా,మరో నాలుగోవంతు తోటి మిత్రుల ద్వారా మరో నాలుగో వంతు లోకపరిశీలన ద్వారా లభిస్తుంది.అందుకు విజ్ఞాన విహారయాత్రలు దోహదం చేస్తాయి.చారిత్రక, ఆధ్యాత్మిక, విజ్ఞాన ప్రదేశాలను ప్రత్యక్షంగా దర్శించడం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. పాఠశాల లో పుస్తకాలలో చదివిన విషయాలను ప్రత్యక్షంగా చూడడం అనుభవించడం ద్వారా అనేక విషయాలు బాగా అవగతమౌతాయి. ఆనాటి చారిత్రక,సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి. అందులో భాగంగనే 8 వ తరగతి తెలుగు పాఠ్యాంశం సముద్ర ప్రయాణం లో భాగంగా మా విద్యార్థుల చేత వారి విజ్ఞాన విహారయాత్రలు,వ్యక్తిగతంగా వివిధ ప్రదేశాల సందర్శన విశేషాలను రాయించడం జరిగింది.ఈ విజ్ఞాన విహారయాత్రలు పిల్లల కు విజ్ఞానంతో పాటు వినోదాన్ని ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది.
వీటిని చదివి మా విద్యార్థులకు అభినందనలు ఆశీస్సులు,సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను

జి.లింగేశ్వర శర్మ
SA తెలుగు
జి.ప.ఉ.పాఠశాల రేగులపల్లి
చరవాణి.9603389441
సిద్దిపేట

నా ప్రయాణ అనుభవాలు
మేము అందరం రాత్రి పాఠశాలకు వచ్చాము. అంత లోపు టీచర్లు బస్సు తీసుకొని వచ్చారు. సామగ్రి సదిరి బస్సు ఎక్కించారు. అందరం పడుకున్నాము. మా బస్సు బయలు దేరింది. ఉదయం లేచేసరికి భద్రాచలం చేరుకున్నాము.భద్రాచలంలో ఆలయ మెట్లు ఎక్కి సీతారాముల దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత బస్సు ఎక్కి పాపికొండలకు వెళ్లి పడవ ఎక్కినాము పడవ ఎక్కిన తర్వాత పాటలు పెట్టారు.ఆటలు ఆడించారు. సరదాగా అల్లరి చేసుకుంటూ వెళ్ళాం. మధ్యలో ప్రాచీన శివాలయం ఉంది.కాలువలో కాళ్లు కడుక్కొని శివాలయంలో శివుడిని దర్శనం చేసుకుని పడవ ఎక్కాం. పడవలో ఆహారం పెట్టారు. తర్వాత పడవ ప్రయాణం మొదలైంది పాపికొండలు వచ్చాయి. అందరికీ కొండలు చూపించారు. తిరిగి ప్రయాణం చేశాం. ఈ ప్రయాణం ఒకరోజు పట్టింది. బస్సు ఎక్కి మేడారం వచ్చాము. మేడారంలో సమ్మక్క సారలమ్మ ల దర్శనం చేసుకొనేసరికి రాత్రి అయింది. మళ్ళీ బస్సులో రేగులపల్లికి బయలుదేరాము అర్ధరాత్రి పాఠశాలకు చేరుకున్నాం. మా సామగ్రినంత సర్దుకున్నాము.టీచర్లు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు.వారు వచ్చి మమ్మల్ని ఇండ్లకు తీసుకొని వెళ్లారు.

యం.రమేష్
8 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
గ్రా.రేగులపల్లి
మండలం బెజ్జంకి

మాభాగ్యనగర ప్రయాణ అనుభవాలు
మేము వేసవి సెలవుల్లో హైదరాబాద్ వెళ్ళాము ఆరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి అన్నం తిని రేగులపల్లి నుంచి బయలుదేరాము. బస్టాండ్లో నిలుచున్నాము. పక్కన దుకాణంలో చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నాము. బస్సు రానే వచ్చింది. బస్సు ఎక్కినాము సీట్లు ఖాళీ లేవు.నిలుచున్నాము.బస్సులో ఎక్కువమంది సిద్దిపేటలో దిగేవాళ్లే. మాకు దేవుని దయవల్ల సిద్దిపేట లో సీట్లు దొరికినాయి. మధ్యాహ్నం మూడు గంటల 35 నిమిషాలకు హైదరాబాదులో దిగాము. ఇక్కడ ఆటో ఎక్కి మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ అన్నం తినుకుంటూ సినిమా చూశాము. అక్కడ పది రోజులు ఉన్నాము. దాని తర్వాత దమ్మాయిగూడ వెళ్లాం. అక్కడ మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ బజ్జీలు కొనుక్కొని ఇంటికి వెళ్ళాము. అక్కడ ఒక మూడు రోజులు ఉన్నాము. తర్వాత చార్మినార్ వెళ్ళాం. అక్కడ మొత్తం తిరిగాను. అక్కడ నేను చెప్పులు కొనుక్కున్నాను. ఆ తర్వాత మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఐదు రోజులు ఉన్నాము. ఆ తర్వాత ఆదివారం రోజున మా ఇంటికి బయలుదేరా అక్కడ బస్సు ఎక్కిన బస్సులో మక్క కంకి అమ్మే వాళ్ళు వచ్చారు. కంకి కొనుక్కొని తినుకుంటూ ప్రయాణం అయ్యాము. సిద్దిపేటలో దిగినాము.అక్కడ మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆటో ఎక్కి మా ఇంటికి చేరుకున్నాం. బి ప్రకాష్
8వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేగులపల్లి
మండలం. బెజ్జంకి

హామీపత్రం .ఈ కథనం మా విద్యార్థి స్వీయరచన

ప్రయాణ అనుభవాలు
ఉదయం 3 గంటల 30 నిమిషములకు మా మామయ్య కారులో వచ్చాడు. మేము తయారు అయ్యాం. తయారైన తర్వాత బట్టలు సర్దుకున్నాం. బట్టలు సదురుకొని కారులో ఎక్కి బయలుదేరాము. కరీంనగర్లో ఆగాము. అక్కడ మా కారులో వచ్చిన కొందరు . కరీంనగర్లో దిగినారు వాళ్ళు దిగిన తర్వాత మేము కారుకు సిఎన్జీ కోసం తిరిగాము అక్కడ ఒక పెట్రోలు బంకులో సిఎన్జి ఉంది కానీ అక్కడ పనిచేసే వారు ఇంకా లేవలేదు. ఇంకొక పెట్రోల్ బంకులో సిఎన్జి ఉంది అక్కడ కూడా పనిచేసేవారు ఇంకా లేవలేదు. ఇంకొక పెట్రోల్ బంక్ లో సీఎన్జీ ఉంది వాళ్ళు ఒక అర్ధగంట ఆగి రమ్మన్నారు అంతలోపు మేము చాయ్ తాగి పెట్రోల్ బంకుకు వెళ్ళాం వాళ్ళు లేవలేదు వాళ్లను లేపి సీఎన్జీ కొట్టించాం. తర్వాత అక్కడి నుండి బయలుదేరిన తర్వాత కరెక్టుగా గంటన్నరకు గోదావరిఖనికి చేరుకున్నాం. అక్కడి నుంచి శ్రీరాంపూర్ వెళ్లేసరికి అర్థగంట అయింది. అక్కడి నుంచి భీమారం చేరే వరకు ఉదయం 6:00 అయింది అక్కడ పాల ప్యాకెట్లు, టిఫిన్ కొనుక్కొని వెళ్ళాము అక్కడి నుండి మా డాడీ కారు నడిపాడు. అక్కడ నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లినంక బ్రెష్ వేసుకొని ముఖం కడుక్కొని చాయ్ తాగిన తర్వాత రోజు పోచమ్మకు కోడి కోసాము. కోడిని కోసి వండుకొని తిన్నాం. తర్వాత రోజు సంఘంల పైసలు కట్టి మళ్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా తాత బండి నడిపాడు. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం.మా మామ తోని వాళ్ళ ఇంటికి వెళ్లాను. తర్వాత రోజు మా తల్లిదండ్రులు వచ్చారు. ఇంటికి చేరుకున్నాం ఇలా మా ప్రయాణం జరిగింది

యన్.అన్వేష్
8 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేగులపల్లి మండలం బెజ్జంకి

September 24, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

సుధలొలికించే కవనం తెన్నేటి

by రంగరాజు పద్మజ September 24, 2025
written by రంగరాజు పద్మజ

నాటక కళలు సృజనాత్మకతను, భావోద్వేగాలను పెంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. అలాగే సమాజంలోని సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కార సూచికంగా కూడా ఉంటాయి నాటికలు. అదే సమయంలో జన రంజకమై నాటక కళల ద్వారా మానసిక ప్రశాంతత చేరి ఉల్లాసంగా ఉండి, ఆరోగ్యం మెరుగుపడేందుకు సాయపడతాయి. శ్రమ చేసి, ఆలసిపోయిన శరీరాలకు వినోదం కలిగించి, వారిని ఉత్సాహ పరుస్తాయి. నాటకాలు రాసిన వారికి ఆత్మవిశ్వాసం పెరిగి, సమాజ స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించి బేరీజువేయగల శక్తి వస్తుంది.
అలాగే నాటకం కథను సంభాషణ రూపంగా చెప్పే ప్రక్రియ! అవే సంభాషణలు చదివినప్పటికంటే కూడా నాటక రూపంలో చూస్తే కథలో మమేకమైపోతాం! మనసులో ఒక ముద్ర పడుతుంది. పెద్ద కథలు పెద్ద నాటకాలుగా ప్రదర్శిస్తారు. చిన్న నాటకాలు చిన్న కథలను చెప్తాయి. అయితే ఈనాటి మన ఆతిథి శ్రీమతి తెన్నేటి సుధ గారు ఒక్కో సామెతకు ఒక్కో నాటిక రాసి వాటిని రేడియో ద్వారా శ్రోతలకు వినిపించేలా కృషి చేశారు. లక్ష్యం ఏదైనా కానివ్వండి! నాటిక సినిమా రాకముందు బాగా రాణించింది. పురాణాలు చదవకపోయినా వారికి నాటకాలా ద్వారా కథలు తెలుస్తాయి. అటువంటి నాటక రచన చేసిన నేటి తరుణి అతిథితో ముచ్చటించి మరిన్ని వారి రచనా విశేషాలు తెలుసుకుందాం!

రంగరాజు పద్మజ :— అమ్మా! నమస్కారం. మీ నేపథ్యం వివరించండి.
తెన్నేటి సుధ;– పద్మజ గారు నమస్కారమండీ! ఈరోజు మా ఇంటికి వచ్చి నాతో ముఖాముఖి చేస్తానని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కొండపల్లి నిహారిణి చాలా సంవత్సరాలుగా నాకు స్నేహితురాలు. తను కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇక నా జన్మ స్థలం వరంగల్. 1952లో పుట్టాను. అమ్మ తెన్నేటి అహల్యాదేవి, మా నాన్న టీవీ సుబ్బారావు గారు.
విద్వాన్ తెన్నేటి పేరుతో ఆయన చాలా పుస్తకాలు రాసారు. ఆయన తెలియని వారు లేరంటే అతిశక్తి కాదు! ఆయన నడుస్తున్న గ్రంథాలయం అంటారందరూ. ఆయన అభిరుచి గణితం. 20 పుస్తకాలు గణితానికి సంబంధించినవే రాసారు. గణితంలో ఆయనకు క్వాలిఫికేషన్ లేదు. ఆయన కేవలం తెలుగులో మాత్రమే M A చేసారు. క్వాలిఫికేషన్ లేకపోయినా తెలుగు అకాడమీ కోసం ఏడు పుస్తకాలు రాసారు. మహావీర గణితం, మాయా చదరాల లాంటివి. నీలికమల్ వారి కోసం 12 పుస్తకాలు గణితంలో రాసారు. ఆ తర్వాత సంస్కృత సూక్తి సౌరభం, తెలుగులో అలంకార వివరణ.. ఇలా ఆయన 32 పుస్తకాలు రాసారు.
అవన్నీ ప్రామాణికమైన గ్రంథాలు. అవి బహుళ ప్రాచుర్యం పొందాయి. కానీ ఆయనకు రావలసినంత పేరు మాత్రం రాలేదు. చాలా గొప్ప మేధావి! చదువుకున్నది తెలుగైనా అన్ని సబ్జెక్టులు అంటే ఎకనామిక్స్, ఫిజిక్స్, లాంటివన్నీ, సంస్కృతం, తెలుగు, ఉర్దూ( కవితా మాధురి) రాసారు. ఉర్దూలో కూడా అపారమైన పాండిత్యం ఉండేది. ఆయన కడుపున పుట్టడం నా అదృష్టం! అలాగే మా అమ్మ అహల్యాదేవి గారు కూడా అంతే! నాన్న ప్రోత్సాహంతో పెళ్ళైయ్యాక చదివింది. మెట్రిక్, బి ఏ(B A) హిందీ పండిట్,(hindi pundit) ట్రైనింగ్ చేసింది. హిందీ పండిట్ గా వరంగల్లో ప్రభుత్వ బాలికల పాఠశాలలో చాలా సంవత్సరాలు ఉద్యోగం చేసింది. అమ్మకు కూడా సాహిత్యం పట్ల చాలా అభిరుచి ఉండేది. ఆమె అప్పుడు వచ్చే పత్రిక స్వతంత్ర లో హిందీ నుండి తెలుగు అనువాదం రచనలు చేసింది.బాల అనే పత్రికలోనూ కవితలు రాసింది.
మేము ఆరుగురుము తోబుట్టువులం. ముగ్గురు మగ ముగ్గురు ఆడ… నేనే పెద్దదాన్ని. అందరినీ నాన్న కష్టపడి చదివించారు. రాయడంలో అమ్మానాన్న ప్రోత్సహించేవారు. నన్ను నాటికలు రాయమనేది ఎందుకంటే తను పని చేసే పాఠశాలలో అమ్మ సాంస్కృతిక కార్యక్రమాలు శ్రద్ధగా చేయించేది. ఏకపాత్రాభినయం, నాటికలు రాసేదాన్ని! వాటిని పిల్లల చేత వేయించేది. అలా చిన్నప్పటినుండి రాయడం, చదవడం ప్రోత్సహించేవారు. అందుకోసం అన్ని రకాల పుస్తకాలు కొనేవారు. మా నాన్న చిన్నప్పుడు కథలు చెప్పేవారు. తెలుగు పౌరాణిక కథలతో పాటు షెర్లాక్ హోమ్స్ (Sherlock Homes) రచయిత నాన్నకు చాలా ఇష్టం. ఆయనరచనలన్నీ మాకు చదివి చెప్పేవాడు. మాకూ ఆయనే అభిమాన రచయిత! అలా మా చిన్నతనం గడిచింది. హనుమకొండ మర్కజీ పాఠశాలలో ఏడవ తరగతి వరకు, పింగళి ఉమెన్స్ కాలేజీలో పియుసి వరకు చదివాను. తర్వాత డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్( Arts& sinsce )కాలేజీలో వరంగల్ లో చదివాను తర్వాత బీఎడ్ ( B, ed) చేశాను ఎమ్మే( M A) వరంగల్ లోనే చదివాను.

దాసరి నారాయణగారితో తెన్నేటి సుధ దంపతులు

ప్ర :– మీ రచనా వ్యాసంగం ఎప్పటినుండి ప్రారంభించారు? ఏమేమి రాసారు?
జ. 1969లో కథలు రాయడం మొదలుపెట్టాను. తెలుగు పత్రికలకు పంపడం మొదలు పెట్టాను. అమ్మానాన్నలు సంతోషపడేవారు. కవితలు, కథలు ఎక్కువ రాసాను. కుటుంబ నియంత్రణ సంస్థ వారు ప్రచారం కోసం కవి సమ్మేళనాలు చేయించేవారు. వాటిల్లోనూ కవితలు రాసాను.
జీవన రథం అనే కథ 69లో ఆంధ్రప్రభ లో అచ్చయింది. అది మెడ్రాస్ నుండి వెలువడేది. నా కథను పత్రిక లో ప్రింట్ అవడం చూసుకొని మురిసిపోయేదాన్ని. అలా రచన మీద శ్రద్ధ పెరుగుతూ పోయింది. నాకు 75 రూపాయల పారితోషికం కూడా పంపారు.
తెలుగు ఎమ్ఏ (M A ) పూర్తైంది. మా లెక్చరర్స్ చాలా గొప్పవారు. కోవెల సుప్రసన్న చారి గారు, కేతవరపు రామకోటి శాస్త్రి గారు, బిరుదురాజు రామరాజు గారు, మాదిరాజు రంగారావు గారు.
మాడపాటి హన్మంతరావుగారి పేరుమీద నాకు స్వర్ణ పతకం బహుమతి వచ్చింది. 1975 లో నా చదువు కాగానే వంశీ రామరాజు గారితో నా వివాహం జరిగింది. అప్పుడే హైదరాబాద్ వచ్చాను. అంటే పూర్వార్ధం అంతా వరంగల్లోనే గడిచింది- ఉత్తరార్థం నా జీవితమంతా హైదరాబాదులోనే గడిచింది.
మావారు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.1972 లో నటుడు శోభన్ బాబు చేత ప్రారంభించిన వంశీ ఆర్ట్స్ కార్యక్రమాలలో నేను కూడా చురుకుగా పాల్గొంటాను. 54 సంవత్సరాలుగా ఈ సంస్థతో ఆయనకు, నాకు అనుబంధం ఉంది. 1976లో పెద్దబాబు వంశీధర్ పుట్టాడు, తర్వాత వంశీకృష్ణ పుట్టాడు. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు. పెద్ద కోడలు తరంగణి- కర్నాటక సంగీతం టీచర్. కచ్చేరీలు ఇస్తుంది.
చిన్న కోడలు సుప్రియ న్యాయవాది. మనమరాలు అనఘా దత్త కూచిపూడి నాఠ్య కళాకారిణి. ఆర్నవ్ దత్త మనవడు. సిసిలిక , స్మేర మనమరాండ్లు.

ప్ర. మీరు ఒక్కొక్క సామెతకు ఒక్కొక్క నాటిక రాసారని విన్నాను. అలా రాయాలని ఆలోచన ఎలా కలిగింది? ఆ నాటికలు ప్రదర్శించారా?
జ:- 1977 లో అమృతవాణి అనే సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లాను. వాళ్లు నన్ను స్క్రిప్ట్ రైటర్ గా సెలెక్ట్ చేశారు. ఉద్యోగ నిర్వహణకు వెళ్లాను. అమృతవాణి అనేది ఒక క్రిస్టియన్ సంస్థ. 60 శాతం వాళ్ళ మతాన్ని ప్రచారం చేయడం 40 శాతం నీతి విలువలు సుభాషితాలు మొదలైనవి చెప్పడం చేసే వాళ్ళు. అక్కడ నన్ను నాటికలు రాయమని అడిగారు. వాళ్లు ఇచ్చిన సామెతకు నాటిక రాయమని అన్నారు. అలాగే రాస్తాను అని అన్నాను.
మన జీవితంలో ఒక భాగం ప్రతిరోజు సామెతలు వాడుతూనే ఉంటాము. ఆ వాడే సామెతలు మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకి ఎదురుపడతాయి. వాటి నుండి మనం పాఠాలు నేర్చుకుంటాము. వాటి మీద రాయమన్నారు. నేను పనిచేచింది రేడియో విభాగంలో, జాజిరెడ్డి గారు సామెత ఇచ్చేవారు. 4 లేదా 5 పాత్రలతో పది నిమిషాల నిడివితో నాటిక రాయాలి. వాటిని ప్రావర్బ్ స్కిట్స్ ( proverbs skits) అని అంటారు. ఆ పదినిమిషాలలో మన జీవితంలో ఈ సామెత ఒక సందర్భాన్ని తీసుకొని అది ఎలా ప్రయోగించబడింది అని చెప్పాలి. అనేది నిబంధన వేర్ కాస్ట్ ( where cast) అనే చోటుకు పంపేవారు. మనీలా ఫిలిప్పైన్స్ లో రేడియో స్టేషన్ అక్కడ ఇది బ్రాడ్ కాస్ట్ (ప్రచారం ) అయ్యేది. పెద్ద పెద్ద రేడియో ఆర్టిస్టులు అందరూ కూడా నేను రాసిన స్క్రిప్ట్ను రికార్డు చేసేవారు. అందులో పండా శమంతకమణి, పండా విజయలక్ష్మి, ఆశాలతా, కాశీ విశ్వనాథ, విద్యాసాగర్, భరణి మొదలైన వారందరూ అక్కడికి వచ్చి నేను రాసిన నాటికలలో నటించేవారు. అవన్నీ సిడి ల రూపంలో మనీలకు పంపేవారు. ఇలా ఒక సంవత్సరం పాటు నేను పనిచేసాను.
తరువాత తెలుగు అకాడమీలో ఉద్యోగం వచ్చింది. అయినా వారు నాటికలు రాయమని అడగడంతో 16 సంవత్సరాలు నాటకాలు రాసాను. అలా 500 నాటికలు పూర్తి చేసాను. తెలుగు అకాడమీలో నిబద్ధతతో పనిచేసాను. ఉపసంచాలకురాలిగా పదవీ విరమణ పొందాను. 32 సంవత్సరాలలో టెర్మినాలజీ, అనేక నిఘంటువుల కోసం పనిచేసాను. అలాగే తెలుగు త్రైమాసిక వైజ్ఞానిక పత్రికకు 16 సంవత్సరాలు సహ సంపాదకురాలుగా ఉన్నాను.
1995 నుండి 2010 వరకు ఆ పత్రిక బాధ్యత పూర్తిగా నాదే!
ఇంటర్మీడియట్ తెలుగు- ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు బి.ఈడి డిగ్రీ వరకు రెండు భాషల్లో తెలుగు అకాడమీలో ముద్రిస్తారు. ఇందులో నేను ఫిజిక్స్ పుస్తకాల పర్యవేక్షణ చేసే దాన్ని. సమావేశాలు ఏర్పాటు చేయించాలి. ఇంటర్మీడియట్ బోర్డు నుండి సిలబస్ తెప్పించుకొని, ఆ సిలబస్ లో ఉన్న ప్రకారంగా ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా ఇతర యూనివర్సిటీ వారు సంపాదకులుగా ఉండేవారు. ప్రాంతీయంగా ఉన్న నలుగురు రచయితలతో సంపాదకుల సమావేశం ఏర్పాటు చేసి, సిలబస్ ప్రకారం వాళ్లతో రాయించి, ఆ స్క్రిప్టు సమయానికి వచ్చేటట్టు చూసి, ప్రింట్ చేసే వరకు పూర్తి బాధ్యత వహించి అలా అన్ని పుస్తకాలు రావడానికి నేను కోఆర్డినేటర్ గా అంటే సమన్వయకర్తగా ఉన్నాను.
తెలుగు నా అభిమాన భాష కాబట్టి ఎంత పనైనా కష్టం అనిపించలేదు. ఎందరో గొప్ప వారి మధ్య పని చేస్తున్నానని ఆనందంగా ఉండేది. ఉదాహరణకు తాళ్లూరి నాగేశ్వరరావు గారు అకాడమీలో పనిచేసేవారు. రమాకాంత్ రావుగారు, పోరంకి దక్షిణామూర్తి గారు, నీలాజంగయ్య గారు, ఎం.ఎన్ నరసింహారావు గారు, గుమ్మా శంకర్ రావు గారు, బోయి భీమన్న గారి అమ్మాయి విజయ భారతి గారు డైరెక్టర్ గా ఉండేవారు.
సాహిత్య కోశం వంటి పుస్తకాలను అందరం సమైక్యంగా కృషి చేసి వెలువరించాము. జనరంజక గ్రంథాలు అనేకం పారిభాషక పద కోశాలను అన్ని సబ్జెక్టులలో తయారు చేసాము. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఫిజిక్స్ ఇంగ్లీషు పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలి అనుకున్నప్పుడు ఇందులోని పదాలు వాడుకుంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటారు కదా! అమ్మా నాన్న దైవం వలన నేను నా భర్త రామరాజు గారిని కూడా అలాగే అనుకుంటాను. నేను పుట్టిన వరంగల్ నాకు దైవం. అలాగే నేను పనిచేసిన తెలుగు అకాడమీ అంటే నాకు గౌరవం- నా అత్తగారిల్లు అయిన భాగ్యనగరానికి నమస్కరించిన రోజు ఉండదు! అంత ప్రేమ మమకారం ఉంటుంది. అవి తలుచుకుంటే నా మనసు ఆర్థ్రం అయిపోతుంది, ఒళ్ళు పులకరించిపోతుంది.
ఇలాగే నా ఉద్యోగ ప్రస్థానం నడుస్తూనే మా వారు నెలకొల్పిన వంశీ సంస్థతో అనుబంధం పెనవేసుకుపోయింది.
రామరాజు గారు చాలా ప్రోత్సహించారు. సృజనాత్మక శక్తిని బయటకు తీశారు. ఆయనకు ఋణపడి ఉన్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను ఇటీవల 50 సంవత్సరాల పెళ్లిరోజు చేసుకున్నాము. నేను వంశీ సంస్థకు అధ్యక్షురాలు అనేక సన్మానపత్రాలు రాసాను. ఆయన నిర్వహించే ప్రతి కార్యక్రమంలో నేను వెనుక ఉంటాను. గొప్ప గొప్ప రచయితలు, రచయిత్రులు మా ఇంటికి వచ్చేవారు. కే. విశ్వనాథ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు వంటి వారితో పరిచయం కావడం మా వారి వల్లనే కదా! కళలకు సంబంధించి ఎవరినైనా మా వారు ప్రోత్సహిస్తారు అంత విశాల హృదయం. పై తరం హీరోయిన్లు భానుమతి గారి నుండి అందరూ, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కూడా వచ్చేవారు.

చిరంజీవిగారితో సన్మానం

ప్ర. సమయం లేదు లేకపోతే ఎన్నో చేసేవాళ్ళుమని అంటారు. కానీ మరి మీరు ఇన్ని రంగాలలో కృషి చేసారు వీటన్నిటికీ సమయాన్ని ఎలా మీ గుప్పెట పెట్టుకున్నారు?

జ. సమయం లేదనడం నేను అంగీకరించను! సమయం చాలా ఉంటుంది. దాని వినియోగించుకోవడంలోనే ప్రజ్ఞ ఉంటుంది. ప్రతి నిమిషం చాలా విలువైంది. దాని వృధా చేయకుండా వాడుకోవాలి! బద్దకించి రేపు చేద్దాంలే!అంటుంటే ఏ పనీ కాదు! వంశీ రామరాజు గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాను. తాను అలా కచ్చితంగా అనుకున్న సమయానికే ఏ కార్యక్రమమైనా మొదలు పెడతారు.అందరూ అలా ఉండాలని అనుకుంటారు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లలను చూసుకోవడం చాలా కష్టమైతే, ఒక బేబీ కేర్ సెంటర్ ను పక్క గల్లీలోనే ఉన్న మాదిరెడ్డి సులోచన గారింట్లోనే ప్రారంభించాము. వారు మాకు మంచి మిత్రులు. అది 25 సంవత్సరాలు నడిచింది. నా పిల్లలను పెంచుకుంటూ, వాళ్ళ చదువు చూసుకుంటూ, నేను ఉద్యోగం చేస్తూ, మా వారు చేసే పెద్ద పెద్ద కార్యక్రమాలు అంటే వంశీ బర్కలి అవార్డుల సభలు నిర్వహించినపుడు నా వంతు సహకారం అందించేదాన్ని.

ప్ర. ఇలా మీ చుట్టూ ఇన్ని బహుమతులు, షీల్డ్ లు, పురస్కారమందుకుంటున్న చిత్రాలు చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది! మీ శ్రమ ఫలాల గురించి వివరించండి!
జ. సి. నారాయణరెడ్డి గారు మాకు ఆత్మబంధువు, వంశీ పుట్టుకను తెలిసిన మేనమామ అని చెప్తున్నాను కదా! వారు సుశీలా నారాయణరెడ్డి అవార్డ్ ప్రదానం చేసారు. డా.అమృతలత గారు వారి కూతురు జ్ఞాపకార్ధం అపురూప అవార్డును బహూకరించారు.
తెలుగు యూనివర్శిటీ వారు ఉత్తమ రచయిత్రి పురస్కారం , వాసిరెడ్డి సీతాదేవి గారి తల్లి గారి పేరు మీద వాసిరెడ్డి రంగనాయకమ్మ అవార్డు ఇచ్చారు. ఇలా చాలా అవార్డులు వచ్చాయి.

వంశీ పురస్కారం

ప్ర. వంశీ రామరాజుగారి విజయం వెనుక మీ సహకారం ఎలా ఉండేది? వారి గురించి చెప్పండి!
జ. ఆయన ప్రతి సంవత్సరం అమెరికాకు వెళ్లి, ఘంటసాల ఆరాధన ఉత్సవాలు చేస్తుంటారు. తన వేగ్నేష్ ఫౌండేషన్ పేరుతో దివ్యాంగుల కోసం ఒక పాఠశాల స్థాపించారు. ఆ స్కూలు 1983 నుండి 2019 కోవిడ్ వచ్చే వరకు నడిచింది.
పోలియో వ్యాధి తగ్గిపోయింది కదా! అందుకని ఆ వ్యాధి గ్రస్తులు చేరకపోవడంతో… మానసిక ఎదుగుదలలేని పిల్లల కోసం ఆ పాఠశాలలో ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసి నడిపిస్తున్నారు. వాటి కోసం విరాళాలు సేకరించారు. మూడు కోవెలలు కట్టారు. లక్ష్మీనరసింహస్వామి, సాయిబాబా గుడి, ఘంటసాల గుడి కట్టారు. అలాగే వంశీ సంస్థ ద్వారా వృద్ధుల ఆశ్రమము హయత్ నగర్ దగ్గర కుంట్లూరులో నడిపిస్తున్నారు. ఉదయం అంతా వీటిని చూసుకొని సాయంత్రం వంశీ ప్రోగ్రామ్స్ చూస్తారు అలా ఇద్దరం ఒక్క నిముషం వృధా చేయము.

తెన్నేటి సుధతో ముఖాముఖి గ్రహీత రంగరాజు పద్మజ

ప్ర. వంశీ ప్రచురణలు అని చెప్పారు! అందులో ఎలాంటి పుస్తకాలు ముద్రించారు ? మీరు దానికి ఎలా సహకరించారు?
జ. వంశీ చాలా కాలం క్రితం కొన్ని పుస్తకాలను ప్రచురించింది. మధ్యలో కొంత కాలం ఆపేశారు! మళ్లీ స్వర్ణోత్సవం (50 సం.రాలు) దాటిన తర్వాత చాలా పుస్తకాలు ముద్రించారు. అందులో సినిమాల మీద ముఖ్యంగా జమున గారి, సావిత్రి గారి సినిమాలు వాటి మీద కార్యక్రమాలు చేసి, ఆ ప్రసంగాలన్నీ పుస్తకంగా ప్రచురించాం. దానికి నేను సంపాదకురాలిని. అది కాకుండా వంశీ కథలు దాదాపు 20- 25 పుస్తకాలు నా సంపాదకత్వంలో వెలువడ్డాయి.
తర్వాత వంశీ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు సన్మాన పత్రాలు నాలుగైదు వందల వరకు రాసాను. నాలుగు సార్లు అమెరికాకు వెళ్లి వచ్చాను. వంగూరి ఫౌండేషన్ వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అక్కడ కూడా కార్యక్రమాలు చేసారు. వాళ్ళు పుస్తకాల ప్రచురిస్తారు. వంగూరి చిట్టెం రాజుగారు ఎన్నో కార్యక్రమాలు చేసారు. నెలనెలా వెన్నెల అని ఇప్పటికీ దాదాపు 200 పైగా అంటే 14 సంవత్సరాలుగా వరుసగా నిర్వహించారు.
1998లో అక్కడ ఆయన నిర్వహించిన కార్యక్రమంలో అట్లాంటాలో పాల్గొన్నాను. వంశీ రామరాజు గారు ప్రతి సంవత్సరం అమెరికాకు వెళ్లి ఆ ఘంటసాల ఆరాధనోత్సవాలు నిర్వహించి, ఆ వచ్చిన డబ్బుతో దివ్యాంగుల సంరక్షణ కోసం వినియోగిస్తారు. అలా ఆ పాఠశాలను అభివృద్ధిచేసారు.

ప్ర. లిటిల్ డిటెక్టివ్ నవల రాసాను అన్నారు కదా! అది ఎందుకు? రాయాలనుకున్నారు. దాని నేపథ్యం చెప్పండి!
జ. నాకు నవల రాయాలని కోరిక ఉండేది. కానీ రాయలేనేమో అని అనుకున్నాను కథలు, కవితలు రాసాను. చిన్నప్పటినుండి మా నాన్న నవలలు చదవడం అలవాటు చేసాడు. అందులో మధుబాబు డిటెక్టివ్ నవలలు కూడా ఉండేవి. ఇలాంటి ఒక నవల రాయాలనుకున్నాను. అప్పుడు షర్లాక్ హోమ్స్ ( Sherlock Homes) నవల చదివి ప్రేరణ పొంది రాసాను. దాన్ని దాసరి నారాయణ రావు గారి సంపాదకత్వంలో నడిచిన ఉదయం పత్రికలో ప్రచురించారు. అది ధారావాహికగా వెలువడింది. చిన్నపిల్లలే డిటెక్టివ్ లు గా సాగిన నవల.

నటి జమునతో 

ప్ర. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నాటక కళావైదుష్యం అనే పరిశోధనాంశంగా ఎన్నుకోవడానికి కారణం ఏమైనా ఉందా, నాటకాలు రాసారు. కనుక ఆ అంశమే కావాలని ఎన్నుకున్నారా?
జ. బలిజేపల్లి వారి రచన పైననే పరిశోధన చేస్తానని అనుకోలేదు. కానీ ఏ అంశాన్ని ఎన్నుకోవాలనే దానిమీద చాలా తర్జనభజన పడ్డాను. బలిజేపల్లి వారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది సత్యహరిశ్చంద్ర నాటకం. అది నాకు ఎంతో ఇష్టం. ఎన్నోసార్లు చూసాను. ఆ పద్యాలు విన్నప్పుడు నాకు స్ఫూర్తి కలిగేది. బలిజేపల్లి రచనల మీద నా సిద్ధాంత గ్రంథం రాస్తే ఎలా ఉంటుందని మా నాన్నని అడిగితే చాలా ప్రోత్సహించారు కానీ వారి రచనలన్నీ దొరకాలి కదా! ఆయన రచనలు…
శివానందలహరి (శతకము )
స్వరాజ్య సమస్య (పద్య కృతి)
బ్రహ్మరథం (నవల )
మణి మంజూష ( నవల )
బుద్ధిమతీ విలాసం (భక్త సిరియాళుని కథ)
ఉత్తర గోగ్రహణం (నాటకం )
సాత్రజితీ పరిణయం ( నాటకం )
ఉత్తర గోగ్రహణం ( అనువాదం )
అందులో సత్యహరిశ్చంద్రీయం బాగా ప్రసిద్ధి పొందింది. బలిజేపల్లి వారు రచయితే కాదు! నటుడు, వాగ్గేయ కారుడు, పాటలు పాడేవారు. నక్షత్రకుడిగా ఎన్నోసార్లు నటించారు. ఆయన రచనలు చదివిన కొద్దీ నాకు ఆసక్తి కలిగింది. గైడ్ గా ఎం వి ఆర్ శాస్త్రి గారు నన్ను చాలా ప్రోత్సహించారు. నాలుగు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను. బుద్ధిమతీ విలాసం నాటకం, సాత్రజితీ పరిణయం నాటకం దొరకడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో లైబ్రరీలకు తిరిగి మొత్తానికి సంపాదించాను. పరిశోధన చేసాను. వారి రచనలపై పరిశోధనగ్రంథం రాయడం నాకు ఆత్మ సంతృప్తినిచ్చింది.

ప్ర , ఆనాటి రచయతల, రచయిత్రుల ప్రభావం మీ మీద ఉందంటారా?
జ. తప్పకుండ ఉంది. ఎందుకంటే వాళ్లే నాకు స్ఫూర్తి ! ముఖ్యంగా తెన్నేటి లత మాకు దూరపు బంధువు కూడా! యద్దన పూడి సులోచనా రాణి నవలలు అంటే నాకు ఎంతో ఇష్టం. ఆమె వలె రాయాలని అన్న ఒక కోరిక బలంగా ఉండేది. ఎలా అయినా రాయాలి. పాఠశాల చదువైపోగానే నేను అలా అనుకొనే దాన్ని! నేను ఏదో ఒకటి రాసి మా ఇంట్లో చూపిస్తే చాలా బాగా రాసావే! అని నన్ను అభినందించడం, అలా నేను ముందుకు వెళ్లే అవకాశం కలిగింది.
సులోచన రాణి గారు, వాసిరెడ్డి సీతాదేవి గారు, యండమూరి వలె రచన చేయాలనుకున్నాను. ఏదైనా నా ముందు సంఘటన జరిగితే దాన్ని మలిస్తే పాఠకులకు చేరే మార్గం తక్కువ. ఆనాడు ఇన్ని మాధ్యమాలు లేవు! ఏవో కొన్ని పత్రికలు మాత్రమే ఉండేవి. వాటి ద్వారా మాత్రమే రచనలు బయటకు వచ్చేవి.

అక్కినేని నాగేశ్వరరావుతో సన్మానం

ప్ర. రచయిత్రుల కొత్త కథనం అని ఒక సంకలనం తీసారు కదా? దాని గురించి వివరించండి!
జ. రచయిత- రచయిత్రుల కొత్త కథలన్నీ ప్రచురించాలని వంశీ సంస్థ తలపెట్టింది. అట్లా మొదలుపెట్టినప్పుడు దానికి ఆర్థిక వనరు ఉండాలి కదా! ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలి? అని ఆలోచించినప్పుడు అమెరికాలో ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు (హృదయకోశ నిపుణులు) ఆయన సాహిత్యాభిలాషిగా ఆ ప్రచురణలకయ్యే ఖర్చు భరిస్తానని అనడంతో ఆరు కథా సంకలనాలు వెలువరించాము. కొత్త కథల పేరిట అంటే రచయిత్రుల (రచయితల) మొదటిగా రాసిన కథలు. మొదటి సంకలనం కేవలం రచయిత్రుల కథలే 32 కథలతో ముద్రించారు. తర్వాత ఇద్దరివి కలిపి ముద్రింప చేశాం! ఈ కొత్త కథల సంపుటిలకు నేను సంపాదకురాలిగా ఉన్నాను.

ప్ర. పత్రికల మీద మీ అభిప్రాయం చెప్పండి! ఇంకా ఏమైనా సూచనలు చేయండి!
జ. పత్రికలు ఎన్ని వస్తే అంత సాహిత్య సేవ జరుగుతుంది. పాఠకులు చదవడం ముఖ్యం… రాసే వాళ్ళు ఉన్నారు- ప్రచురించడానికి అంతర్జాల పత్రికలు ఎక్కువైనవి. స్వాతి, సాహితీ కిరణం లాంటి పత్రికలు తప్ప చాలావరకు కనుమరుగయ్యాయి. చదివింప చేసినంత కాలం పత్రికలు బాగా నడుస్తాయి. ఊరికే పత్రిక వెలువరిస్తే ఫలిత ఉండదు. ముఖ్యంగా యువత చదవాలి! కానీ చదువుతున్నారా? అంటే సందేహమే! ఎందుకంటే వారు సెల్ఫీలు, యూట్యూబ్లలో రీల్స్ చేయడంలో తలమునకలై ఉన్నారు. కొందరు యూట్యూబ్ లో కథలు వినిపించే ప్రయోగాలు చేస్తున్నారు కొన్ని కథలు శ్రోతలను చేరుతున్నాయి కూడా!
నీహారిణి వంటి వారు అంతర్జాల పత్రికలు నడపడం మంచి పరిణామమే! అలాగే ఇంకా ఎన్నో అంతర్జాల పత్రికలు వస్తున్నాయి. అయితే ఆ యా పత్రిక లలో యువతకు పనికొచ్చే అంశాలను చేర్చాలి! చాలా మార్పు వచ్చింది సమాజంలో… ఆ తరానికి ఈ తరానికి అభిరుచులు మారాయి! కొన్ని విషయాలు మనకు నచ్చినవో-నచ్చనివో ఉండవచ్చు! కానీ ఆ తరానికి చెందిన వాళ్ళమైనా ఈ తరం వాళ్లతో సర్దుకుపోయి, దీని కనుగుణంగా యువతలో మార్పు తెచ్చే అంశాలు ప్రచురించాలి. ఆ బాధ్యత పత్రికాధిపతులతో పాటు, రచయిత- రచయిత్రులకు కూడా ఉండాలి!

రంగరాజు పద్మజ :– అడగగానే కాదు… లేదు! అని తప్పించుకోకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి, అటు సాహితీ రంగానికి, ఇటు సేవారంగానికి సంబంధించిన మీ భార్యాభర్తల కృషి చక్కగా వివరించినందుకు పత్రిక తరపున మీకు కృతజ్ఞతలు. ఈ విషయాలన్నీ రేపటితారానికి స్ఫూర్తిదాయకాలే! అందుకు మీకెంతో ధన్యవాదాలు!
తెన్నేటి సుధ :— ఇంత దూరం వచ్చి, ఇంత సేపు కూర్చుని, పాఠకులను మెప్పించే తీరులో ముఖాముఖి జరిపినందుకు ధన్యవాదములు పద్మజ గారూ! నమస్కారమండీ! కథలో…నవలలో ఎవరికి వారు రాస్తారు. అందులో సందేహం లేదు! కానీ ఇతర రచయిత- రచయిత్రుల రచనలు కష్టనష్టాలకోర్చి సంపుటులుగా ముద్రించడం అన్నది గొప్ప హృదయం ఉంటే కానీ సాధ్యం కానీ పని. అలాగే ద్రవించే హృదయం ఉన్నప్పుడే సేవ చేయాలనిపిస్తుంది. భార్యాభర్తలిద్దరూ అటు బాలబాలికలకు- ఇటు వృద్ధులకు సేవలు అందించడం అంటే మాటలు కాదు! అది చెప్పినంత తేలికాకాదు!
హృదయమున్న రచయిత్రి కలం అంతే ఆర్ద్రతతో – విలువలతో కూడిన రచనలు వస్తాయి! అలా ముప్పేటలుగా సేవా- సాహితీ-ఆతిథ్యాలతో 50 సంవత్సరాలుగా ప్రజల మన్ననలను అందుకుంటున్నారు.
మరిన్ని రచనలు, వారి సేవలు సదా ఇలాగే కొనసాగాలని…. వారికి ఆ దేవదేవుడు అనేక మంగళ శాసనాలు అందించాలని కోరుకుంటూ రచయిత్రి తెన్నేటి సుధ గారిని అభినందిస్తూ….

September 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేవీ విధి వల్లభా

by రంగరాజు పద్మజ September 24, 2025
written by రంగరాజు పద్మజ

ప్రతీ ప్రళయం తరువాత జగాలన్నీ లయమైన తర్వాత తిరిగి పునః సృష్టి చేసేటప్పుడు బ్రహ్మకు సృజనాత్మకత ఇచ్చేది బ్రాహ్మి. ఈమె సృజన ఆలోచించగానే సృష్టి జరుగుతుందని, ఈ మొత్తం కార్యం బ్రహ్మం ఆదేశం ప్రకారం జరుగుతుందని భగవద్గీతలో చెప్పబడింది.
సృజనాత్మకత ఏ యుగానికైనా స్ఫూర్తి ఆధారంగా నడిచింది. మానవ కళ్యాణానికి, అభివృద్ధికి, ఆధ్యాత్మి విద్య, విజ్ఞాన శాస్త్రాలు రెండూ అవసరమే!

మానవ ఔన్నత్యం కోసం విద్య ఎంతో అవసరం.
ఆ విద్య రావాలంటే విద్యలకు దేవత ఐన సరస్వతీ కటాక్షం ఎంతో అవసరం.
ఈ కటాక్షాన్ని సంపాదించాలంటే విజ్ఞానం, ఆత్మ క్రమశిక్షణ ( అలసత్వం లేకుండా ఉండడం- అలాగే తుచ్ఛ విషయాలను కోరకుండా ఉండడం) ఉన్నప్పుడే విజ్ఞానమూ, కళలూ మన స్వంతమవుతాయి.
సరస్వతీ దేవి అనగానే మన కంటి ముందు ఒక రూపం వీణా పుస్తక ధారిణి కదలాడుతుంది.
అమ్మ దయ లేకుంటే మన నోటి వెంట మాటే రాదు! ప్రపంచం అంతా మాటతోనే ఒకరికొకరి మధ్య సంబంధం ఉంటుంది. అటువంటి మాటకు దేవత శబ్దాదిష్టాన దేవత రూపంగా మనం కొలుస్తాము.

జీవితం ఒక సృజన శీలమైన యాత్ర!
చీకటి నుండి వెలుగులోనికి పయనించే దీర్ఘమైన ప్రయాసలతో కూడిన ఈ మన ప్రయాణం చక్కగా జరగాలంటే జ్ఞానం అవసరం.
అందుకే మన ఋషులేనాడో అంటే 2 శతాబ్ది లోనే సరస్వతి దేవి స్తోత్రాలు, ప్రస్తావన, ఫలశ్రుతులు చెప్పారు. సరస్వతీ రహస్యోపనిషత్తు మధ్య యుగంలోనే చెప్పారు.మన దార్శనికులు. వేదంలో రుక్కుల వలె కీర్తించి, అమ్మవారి ఆరాధన తర్వాత శ్లోకాలలో రాసారు.

మయి మేధాం మయి ప్రజాం మయీన్ద్ర ఇంద్రియం దధాతు
మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు
ఓం హంస హంసాయ విద్మహే
పరమ హంసాయ ధీమహీ! తన్నోహంసః ప్రచోదయా” త్॥
ఇలా సరస్వతి దేవిని స్తుతిస్తుంది ఈ సూక్తం.
పలుకులమ్మ అనుగ్రహం కలగాలంటే నేర్చుకున్న విద్య జ్ఞాపకం ఉండాలంటే ఈ మేధా సూక్తాన్ని రోజు పఠిస్తారు. జ్ఞానదేవత జ్ఞానాన్నిస్తుంది కనుక నిత్యం పఠించవలసిందీ శ్లోకం.
హంస శ్వాస యొక్క ఉచ్ఛ్వాస- నిశ్వాసాలను చక్కగా వచ్చేలా చేయమని ప్రార్ధించారంటే శక్తి ఒక్కటే! ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని, సుపర్ణుడు (గరత్మంతుడు), యముడు, వాయువు మొదలైన పేర్లతో భావన చేస్తుంటారు. కానీ జ్ఞానప్రదాత సరస్వతీ మాతగాను, హంసగాను స్తుతిస్తారు! జ్ఞానానికి ప్రతీక హంస! అందుకే
యా దేవి సర్వభూతేషు బుద్ధి రుపేణ సంస్థితా
ఎన్ని రూపాలలో ఉన్న శక్తి మాత్రం ఒకటే! సరస్వతీ దేవి విద్యా దేవత! ఈమనే జ్ఞానాన్ని ఇచ్చి మంచి పనులు చేయిస్తుంది. అని ఋషులు చెప్పిన మాట!
వాగ్దేవతే — బుద్ధి దేవత!
మన మాటను నియంత్రించుకుంటూ, స్వచ్ఛంగా ఉంచుకుంటే మనం వివేకవంతులమౌతాము. ఆ వివేకంతో శాంతి- సంతోషాలు మన స్వంత మౌతాయని ఆది శంకరాచార్యులు వివేకచూడామణిలో…

యోగస్య ప్రథమం ద్వారం వాఙ్నిరోధః (శ్లో.367)
యోగానికి మొదటి మెట్టు వాక్ సంయమనము- అని అన్నారు.
మనశ్శాంతి కావాలంటే ఇతరులలో తప్పులు వెదకకుండా ఉంటే దానంతట అదే వస్తుంది. మేలు చేయాలనే ఆలోచన వస్తుంది. పరోపకారం తలపెడతాము! ఈ హృదయ వైశాల్యం వల్ల ప్రపంచమంతా తన ఇల్లే ఔతుంది!
సరస్వతీ దేవి విద్యా దేవత నే కాకుండా మనం వాగ్దేవిగా కొలిచే సరస్వతీ దేవి మనం మాట్లాడడానికి – మనలోని భావాన్ని వ్యక్తం చేయడానికి – శక్తినిస్తుంది. మనం ఏదైతే చూస్తున్నామో? దానిని ఎదుటి వారికి చెప్పగలుగుతున్నామంటే అమ్మ దయవలనే కానీ మరొకటి కాదు!
చదివిన దాన్ని మాటగా మార్చి, భావం చెడకుండా కూర్చగలిగి, మాట్లాడగలగడం వాగ్దేవి దయనే! అలా అమ్మ దయగల వారు మాత్రమే మంచి ఉపన్యాసకులుగాను, రచయితగానూ, కళాకారులుగాను రాణిస్తున్నారు.
ఇది ఒక క్రమ ప్రకారం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వారి ప్రజ్ఞతో ఒక విషయాన్ని తయారు చేసి, దాన్ని మాట ద్వారా చక్కగా చెప్పగలగడం– ఈ మూడింటికి వాక్కుగా సత్య రూపిణి, ఉక్తి సౌందర్య రూపిణి , సూక్తి శివ రూపిణి గా కవులు భావిస్తారు.
అందుకేనేమో? కాళిదాసు తన శ్యామలా దండకంలో…

మాణిక్య వీణాముపలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్రద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి అని అన్నారు.
భావమేమంటే?…
రత్నాల వీణను వాయిస్తూ… మృదువైన మధురమైన మాటటలతో కూడిన ఇంద్రనీలమముల వలె ప్రకాశించే కోమలమైన శరీరం కల మాతంగా కూతురా! ( శ్యామలా దేవి)
ఇక్కడ సౌందర్యంతో పాటు వాక్చాతుర్యాన్ని తెలుపుతున్నదీ స్తోత్రం.
ఈ వాక్చాతుర్యం కూడా మనకు అలవడేది పలుకులమ్మ దయవలెనే!సరస్వతీ దేవిని శబ్దానికి దేవతగానూ కొలిచారు!

శ్లో॥ భవాంభోజ నేత్రజ సంపూజ్య మానాంలసన్మంద
హాస ప్రభా భక్త చిహ్నం౹
చలచ్చంచలా చారు తాటంక కర్ణాం భజే
శారదాంబా మజస్రంమదంబామ్॥
అని మల్లినాథ సూరి వేడుకున్నాడంటే ఈ ప్రపంచం మొత్తం సరస్వతీ శక్తి ఆధారంగానే జీవిస్తున్నదని, ఆమె పాదాలు పట్టుకుని శరణు వేడుతున్నానంటాడు మహామహోపాధ్యాయుడు.
అంతే కాదు ! సంగీత స్వరాల రూపు సరస్వతి!
ఒక అక్షరం – మరొక అక్షరంతో కలిసి, కొన్ని అక్షరాలతో పదమై, ఆ పదాలు కొన్ని కలిసి, వాక్యమై, అలా కొన్ని వాక్యాలు కలిసి కావ్య రూపమై రావడానికి మూలం – పలుకులమ్మ! ఆ అమ్మ ను గురించి చెప్పడానికి నా కు తెలిసిన ఈ కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు, కొన్నివాక్యాలు సరిపోతాయా? సరిపోవు! గాక సరిపోవు! కనుకనే అమ్మా సరస్వతీ దేవీ! నీవు నన్ను అనుగ్రహించి, నిన్ను తెలుసుకునే జ్ఞానాన్ని ఇమ్మని వేడుకుంటూ….
అలా తనను నమ్మి, కొలిచిన ఎందరికో విద్యా ప్రాప్తిగా దీవించే అనంత సాగరి సరస్వతీమాత భక్తులకు కొంగు బంగారమే!
కోరిన వరాలిచ్చే మాత! సరస్వతీ మాత !

September 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కొత్త బతుకమ్మ పాట

by Nellutla Madhava Srinivas September 24, 2025
written by Nellutla Madhava Srinivas

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బిడ్డలను కాపాడు ఉయ్యాలో
పిల్లలంతా గూడి ఉయ్యాలో
పువ్వులను తెచ్చిరి ఉయ్యాలో
రంగురంగుల పూలు ఉయ్యాలో
రాసిగా పోసిరే ఉయ్యాలో
రాశిలోని పూలతో ఉయ్యాలో
రమ్యంగా పేర్చిరి ఉయ్యాలో
అతివలoత గూడి ఉయ్యాలో
అందంగా పేర్చిరి ఉయ్యాలో
సిరిగల్ల తల్లిని ఉయ్యాలో
సిద్ధమే చేసిరీ ఉయ్యాలో
వెంపలి చెట్టు నే ఉయ్యాలో
బొడ్రాయిగా నిలిపి ఉయ్యాలో
పూలతో పూజింతుము ఉయ్యాలో
తీర్చినా బతుకమ్మనుయ్యాలో
తనివితీరా చూసి ఉయ్యాలో
పడతులంతాగూడి ఉయ్యాలో
పాటకైగట్టిరే ఉయ్యాలో
కన్నెపిల్లలంతా ఉయ్యాలో
పట్టు పరికిణీ లతో ఉయ్యాలో
పడతులందరేమో ఉయ్యాలో
పట్టు చీరలతోని ఉయ్యాలో
తీరొక్క సొమ్ములతో ఉయ్యాలో
తీర్చిదిద్దు కొనిరి ఉయ్యాలో
తంగేడు పూలతో ఉయ్యాలో
బతుకమ్మలే పేర్చి ఉయ్యాలో
గునుగు పూలతోని ఉయ్యాలో
అందం గా దిద్దిరీ ఉయ్యాలో
రంగు రంగుల పూలు ఉయ్యాలో
పొంకముగ పొంగించి ఉయ్యాలో
పసుపు ముద్దతోని ఉయ్యాలో
గౌరమ్మనే నిలిపి ఉయ్యాలో
గుండ్రంగా తిరుగుతూ ఉయ్యాలో
పాటలే పాడిరీ ఉయ్యాలో
చప్పట్లు కొట్టుతూ ఉయ్యాలో
సంబరంగా ఆడిరీ ఉయ్యాలో
అమ్మ లక్కలు గూడి ఉయ్యాలో
అబ్బురంగ చూస్తుండి రుయ్యాలో
ఘనమైన తెలంగాణల ఉయ్యాలో
బతుకమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఆట మొదలు పెట్టే ఉయ్యాలో
బీరప్పపాటలను ఉయ్యాలో
తీరు తీరుగ పాడి రుయ్యాలో
అలుపు సొలుపు లేక ఉయ్యాలో
మగువలంతా చేరి ఉయ్యాలో
ముదముతో ఆడిరీ ఉయ్యాలో
దేశ దేశాలలో ఉయ్యాలో
దినమొక్క తీరుగా ఉయ్యాలో
బతుకమ్మను చేసిరి ఉయ్యాలో
చిన్న పెద్ద భేదాలు ఉయ్యాలో
ఎవరికసలు లేదు ఉయ్యాలో
అందరూ ఏకమై ఉయ్యాలో
ఆనందముతోడ ఉయ్యాలో//2//
అలుపెరుగ కాడిరే ఉయ్యాలో
అలసి సొలసినారు ఉయ్యాలో
నప రొక్కతీరు తీరుగాఉయ్యాలో
నైవేద్యములను తెచ్చి ఉయ్యాలో
పంచ కజ్జాయంబు ఉయ్యాలో
నైవేద్యము పెట్టి రుయ్యాలో
ఆడి పాడి అలసి ఉయ్యాలో
జోల పాట పాడి రుయ్యాలో
పోయిరా బతుకమ్మ ఉయ్యాలో
పోయి మల్ల రావమ్మా ఉయ్యాలో//.2//

September 24, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

నాటకాలను ప్రోత్సహించాల్సింది పత్రికలే

by రంగరాజు పద్మజ September 23, 2025
written by రంగరాజు పద్మజ

మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక ప్రతినిధి రంగరాజు పద్మజ జరిపిన ముఖాముఖిలో వనం లక్ష్మీకాంతారావు

*****************************************

         సామాజిక చైతన్యాన్ని పెంచేవి నాటక కళలు! ఈ నాటకాలలో జీవితాలలోని అనుభవాలను, సమస్యలను సంభాషణాల ద్వారా ప్రదర్శిస్తారు. ఇవి మానసిక ఉల్లాసం ఇవ్వడమే కాకుండా… సమాజంలో జరిగే అన్యాయాలు- అసమానతలు, సమస్యలను లేవనెత్తి , పరిష్కారాలను సూచిస్తాయి. సమాజానికి సందేశాలనిస్తూ… ప్రజలకు ఒక అవగాహన ఏర్పడేందుకు ఈ నాటకాలు ఉపయోగపడతాయి.   ముఖ్యంగా భారతదేశ సంప్రదాయ జానపద కళలను బతికించడానికి నాటకం ఒక మూల స్తంభంగా నిలుస్తుంది. నాటక సంస్థలు; పరిషత్తులు ; లేదా నాటకాలను ప్రదర్శిస్తూ కళాకారులు ఈ నాటకాలను రక్షిస్తాయి. గురజాడ అప్పారావు, పానుగంటి లక్ష్మీనరసింహం, ధర్మవరం కృష్ణమాచార్యులు, తిరుపతి వేంకట కవులు వంటి వారు నాటక రచనలు చేసి,  నాటక కళను ప్రదర్శిస్తే … అలాంటి నాటకాన్ని తర్వాతి తరాలకు అందించి బతికించాలని గొప్ప ఆశయంతో ఎన్నో నాటక సమాజాలు కృషి చేసాయి! చేస్తున్నాయి.. అలాంటి తెలంగాణ నాటక కళారంగానికి ఎనలేని సేవలు చేస్తున్నవారు వనం లక్ష్మీ కాంతారావు గారు. వీరు  వర్ధన్న పేట  *భారత నాటక కళా సమితి*. వేదికగా చేసుకోని సేవలు అందిస్తున్నారు. దాదాపు నలభై-యాభై సంవత్సరాలుగా నాటక కళారంగానికి ఆర్థిక -హార్దిక సేవలందిస్తున్నారు. వీరి ధ్యాసంతా నాటకాన్ని బతికించుకోవాలనే తపన! ఈ రంగానికి వారి సేవలు కూడా శ్వాసించినట్టుగా నిరంతరం సాగుతూనే ఉంటాయి. వారి కృషి – పట్టుదల రేపటి తరానికి ప్రేరణ కలిగించాలనే ఉద్ద్యేశ్యంతో ….  
          శ్రీమతి కొండపల్లి నీహారిణి సంపాదకత్వంలో వెలువడుతున్న తెలంగాణ తొలి అంతర్జాల ద్వైమాసిక పత్రిక *మయూఖ*  వారితో  సంభాషించి, వారి అనుభవాలు, ఆచరణలు, సలహాలు, సూచనలు గ్రహించి రేపటి తరానికి అందించాలని ఈనాటి విశిష్ట అతిథిగా వారిని పలకరించి, వారినుండి విలువైన వారి అనుభవాలను విందాము… అందుకే వారిని ఆహ్వానిద్దాము.

పద్మజ:– నమస్కార మండీ!
వనం లక్ష్మీకాంత రావు గారు:– నమస్కారం!

పద్మజ:– మీ కుటుంబ నేపథ్యం వివరించండి!

లక్ష్మీకాంతారావు:– కొండాపురం వాస్తవ్యులు వనం కేశవరావు- రాధమ్మ గారు మా తల్లిదండ్రులు. వారికి నేను ఎనిమిదవ సంతానాన్ని.   కేశవరావు గారి అన్న కుమారుడు వనం నరసింహారావు గారికి సంతానం లేకపోవడంతో నన్ను వారు దత్తత తీసుకున్నారు.  దత్తత తండ్రి నరసింహ రావుగారు. తల్లి రాధమ్మ గారు. పాతింటి రాధమ్మ గారి దత్తపుత్రుడుగానే నేను చలామణి అవుతున్నాను.

పద్మజ:- మీ విద్య- ఉద్యోగం గురించి వివరిస్తారా?
లక్ష్మీకాంతారావు:– ఒకటవ తరగతి నుండి నాలుగవ తరగతి వరకు కొండాపురం గ్రామంలోనే చదివాను. నాలుగవ తరగతి అయిపోయాక నా చదువు ఎక్కడ? అనే సమస్య మా అమ్మకు వచ్చింది. మా అమ్మ చెల్లెలు ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులు ఒద్దిరాజు రాఘవ రంగారావు గారి సతీమణి కమలాదేవి దగ్గర ఉండి చదువుకునేలా మాట్లాడి నన్ను అక్కడ చదివించింది. మాచిన్నమ్మ వెంటనే సరే! అంది ఎందుకంటే? పెదనాన్న గారింట్లో అది వరకే వైష్ణవుల పిల్లలు, మా బంధువుల పిల్లలు, దాదాపు 20 మంది చదువుకునే వారు ఇల్లంతా విద్యార్థులతో నిండి ఉండేది. వంట చేయడానికి అయ్యగారు ఉండేవారు. మూడు పూటలు భోజనాలు ఉండేవి.
        అలా ఐదు నుండి ఏడవ తరగతులు ఇనుగుర్తిలో కొనసాగింది. మా పెదనాయన  ఒద్దిరాజు రాఘవ రంగారావు గారి ఇంట్లో తెలంగాణలో ఆ రోజుల్లోనే వారు తెనుగు పత్రిక నడిపి, సాహిత్యం అంటే తెలియని రోజుల్లో… స్వంతంగా ముద్రణాలయం నెలకొల్పి, ఎన్నో పుస్తకాలు ముద్రించినటువంటి బహుళ కృషి చేసినటువంటి వారింట్లో నేను చదవడం నా అదృష్టం.
       తరువాత మా దగ్గర బంధువులు ఈటూరు వెంకటేశ్వరరావు గారి దగ్గర ఉండి ఎనిమిది నుండి పదకొండవ తరగతి వరకు వారింట్లో ఉండి చదువుకున్నాను.
    హైదరాబాదులో  నేనున్నప్పుడు వారింట్లో విద్యుత్ సదుపాయం ఉండేది కాదు! దాదాపు 1962- 63 ప్రాంతంలో నేను ఉన్న ఇంట్లో గ్యాస్ నూనె దీపాలు, కందిళ్ళు, పెట్టుకొని చదువుకునేవాళ్ళం. వీధిలో పెద్ద విద్యుత్తు లైట్ ఉండేది. మెట్ల మీద కూర్చొని వీధిలైట్ల వెలుగులో చదువుకున్నాను. తర్వాత నా చదువంతా హైదరాబాదులోనే ఉన్నత విద్య అంటే డిగ్రీ వరకు 69 లో బిఎస్సి పూర్తి అయిన తర్వాత మా అమ్మగారి ఆరోగ్యం బాగా లేక మళ్ళీ గ్రామానికి రావడం దాదాపు రెండు సంవత్సరాలు మా అమ్మగారు సేవలు చేస్తూ గడిచిపోయింది.
           అమ్మగారు గతించిపోయాక మళ్ళీ బిఎస్సి పూర్తిచేసుకుని బీఈడీ చదివి తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాను. బీఈడీ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు మా ఊళ్లో వ్యవసాయం చేశాను. తప్పని పరిస్థితుల్లో ఉద్యోగంలోనికి రావాల్సి వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తూ ఎం,ఏ ఎం.ఈ.డి కూడా చదివాను. ఆ విధంగా 1976లో ఉపాధ్యాయ వృత్తిలో చేరితే 2006 నుండి 2016 వరకు జూనియర్ లెక్చరర్ ఆంగ్ల భాషాధ్యాపకుడిగా పనిచేసాను. ఇలా కొనసాగింది విద్య-ఉద్యోగం.

పద్మజ:— నాటక కళా రంగంపై మీకు ఆసక్తి ఎలా ఏర్పడింది?
లక్ష్మీకాంతారావు:—- నాటక కళా రంగం మీద నాకు ఆసక్తి కలగడానికి ఒక విధంగా మూడు, నాలుగు తరగతులలో మా ఉపాధ్యాయులు సుందరయ్య గారనే చెప్పాలి!   ఆ రోజులలోనే పిల్లల చేత నాటకాలు వేయించాలని వారికి ఆసక్తి ఉండేది. నాతో మూడవ తరగతిలోనే నాటకం వేయించారు. అప్పుడు స్టేజీలు అవీ లేవు కదా!  ఊరిలోని మూడు వీధులు కలిసే కూడలిలో చెక్కబల్లతో స్టేజి తయారు చేసి పెట్రోమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి నాటకం వేయించారు. అలా నాలో నాటక రంగంపై ఆసక్తికి అప్పుడు బీజం పడింది.     బాల్యంలోనే  సాహిత్యం పట్ల, నాటకాల పట్ల ఆసక్తి కలిగిస్తే చివరి వరకు పెంపొందుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఆ ప్రయత్నం జరగడం లేదు! అది నా బాధ!
    చిన్నప్పుడు ఏదైతే మంచి సంస్కారం అబ్బాలనుకున్నా సాహిత్యం పట్ల అనురక్తి కలగాలన్నా, నాటకాలైనా, కళలైనా చిన్నప్పుడే ఆసక్తి కలుగజేయాలి. తల్లితండ్రులు గాని, ఉపాధ్యాయులు కానీ… అది నాకు మొదట్లో జరిగింది.    తర్వాత 5, 6, 7 తరగతులలో ఉన్నప్పుడు ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారి మనవడు కిషన్ రావు గారికి నాటకాలన్నా, కళలన్నా చాలా ఆసక్తి ఉండేది. వారు నాటకాలు రాసేవారు, అలాగే వేయించేవారు. చిన్న చిన్న పాటలు రాసి, పాడించడం, డాన్స్ లు నేర్పించి, స్టేజీ మీద చేయించేవారు. 15వ ఆగస్టు, 26వ జనవరి, పాఠశాల వార్షికోత్సవాలు …మొదలైన ఆయా సందర్భాలలో పాఠశాలకు వచ్చి, అక్కడ ఉన్న పిల్లలను ఎన్నుకొని, వారికి నేర్పించి, రిహార్సల్స్ (అభ్యాసం)  చేయించడం, అలా ఎంతో కృషి చేసేవారు. అలా నేను నాటకం వేయడం జరిగింది.
     చిన్నప్పటి నుండి నాకు నాటక ప్రదర్శన పట్ల అభిలాష కలిగింది. మా ఊరిలో సుందరయ్య సార్, ఇనుగుర్తిలో ఒద్దిరాజు కిషన్ రావు గారు ముఖ్యులు. ఈ విధంగా నాటకాలపై ఆసక్తి కలిగి క్రమక్రమంగా  పెరిగింది. ఉద్యోగం చేసేటప్పుడు కూడా నేను ఎక్కడ పని చేసినా విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ నాటకాలు వేయించేవాడిని. అలా ప్రతి సంవత్సరం తప్పకుండా చేసేవాడిని. నేను బి.ఈడి ( Bed) చేస్తున్నప్పుడు కూడా బీఈడీ కాలేజీలో నాటకాలు వేసాను. కృష్ణమూర్తిగారని ఒక లెక్చరర్ ఉండేవారు. ఆయన బాగా ప్రోత్సహించేవారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తన స్వస్థలానికి వెళ్లారు.    ఇంటర్ కాలేజీ టోర్నమెంట్స్ లో *పెండింగ్ ఫైల్* అనే నాటకంలో నేను ఉత్తమ నటుడిగా బహుమతి తీసుకోవడం జరిగింది.   నేను ఎక్కడ పని చేసినా పిల్లలతో నాటకాలు వేయించే ప్రయత్నం బాగా చేసే వాడిని. కొండాపురంలో ఐదు సంవత్సరాలు పని చేసినప్పుడు, ప్రతి సంవత్సరం వార్షికోత్సవానికి విద్యార్థులతోనూ, ఉపాధ్యాయులతోనూ తప్పకుండా నాటకం వేయించేవాడిని. చుట్టుపక్కల గ్రామాల నుండి ఆ నాటకాలు చూడడానికి బండ్లు కట్టుకొని వచ్చేవారు. రాత్రి ఒంటిగంట అయినా నాటకం పూర్తిగా చూసి ఆనందించే వాళ్ళు. ఎందుకంటే  ఆ కాలంలో వేరే ఇతరత్రా వినోద కార్యక్రమాలు ఉండేవి కావు. టీవీలు, రేడియోలు లేని రోజుల్లో ఎక్కడ నాటక ప్రదర్శన ఉన్నా… అక్కడికి వెళ్లి చూడడంతో నాటకాలకు ప్రోత్సాహం ఉండేది.    ఉపాధ్యాయ వృత్తిలోనూ, అధ్యాపకుడిగా పనిచేసినా నాటక రంగానికి తోచిన విధంగా సేవ చేసే భాగ్యం నాకు కలిగింది.

పద్మజ:– తెలంగాణలో నాటక కళా సంస్థలు గాని సమాజాలు  కానీ లేని సమయంలో … వర్ధన్నపేటలో భారతీయ నాటక కళా సమితి స్థాపించాలని  ఎందుకు అనుకున్నారు? ఎప్పుడు స్థాపించారు?
లక్ష్మీకాంత రావు:– అవును ఆ రోజుల్లో ఎక్కువగా ఈ నాటకాలకు వేదికలు ఉండేవి కావు! పౌరాణిక నాటకాలు మాత్రం వేసేవారు. పద్య నాటకాలు బాగా ఆడేవి. అవి కూడా టికెట్ కొని మరీ చూసేవారు. కానీ ఒకటే అసౌకర్యం ఏమిటంటే పాత్రధారులు అందరూ ఎక్కడెక్కడ నుండో వచ్చేవారు, వారి పద్యాలు వారు పఠించి నాటకాన్ని కొనసాగించేవారు. అలా నేను ఇనుగుర్తిలో చదువుతున్నప్పుడు కూడా సురభి నాటక సమాజం వారు వచ్చి రెండు మూడు నెలలు ఒకే ఊరిలో ఉండి చుట్టుపక్కల గ్రామాలలో నాటకాలు వేసేవారు. అవి చూసి మాకు నాటకం వేయాలని ప్రేరణ కలిగింది.
   సురభి నాటకాలు ఒద్దిరాజు రాఘవ రంగారావు  పెదనాయన గారి ఇంటి వెనుక పెరడులో డేరాలు కట్టి వేసేవారు. మా పిల్లలందరికీ టికెట్ లేకుండా నాటకం చూడడానికి పంపేవారు. అలా అన్ని నాటకాలు చూసే అవకాశం దొరికేది .
      1976లో నేను ఉద్యోగంలో చేరిన తర్వాత మూడుసంవత్సరాలు నిడిగొండలో పనిచేసి, 1979లో మా స్వగ్రామమైన కొండాపురానికి ఉపాధ్యాయుడుగా బదిలీ అయి వెళ్లాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాటకాలు వేయించడం… ఇవన్నీ కూడా ప్రజలకు బాగా తెలిసిపోయింది. అంతకు ముందే 1973లో ఇల్లందు గ్రామంలో భారతీయ నాటక కళాసమతి ఒకటి స్థాపించారు.
ఈ నాటక కళా సమితిని  ఈగ శ్రీహరి గారు, వడ్లకొండ వెంకటయ్య గారు, ఎల్ల గౌడు గారు, బొంపెల్లి పురుషోత్తం రావు గారు కలసి స్థాపించారు. మొదటి అధ్యక్షుడు మండల కిషన్ రావు గారు. వాళ్లు శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు 9 రోజులు తాలూకా స్థాయిలో నాటక పోటీలు నిర్వహించేవారు.అక్కడ రామాలయం ఉండేది. దాని ముందు స్టేజీ వేసి, నాటకం ప్రదర్శించేవారు. అలా 73-74- 75 వరకూ నడిచింది. తరువాత 76 లో వర్ధన్నపేటకు మార్చారు. కొండాపురంలో నేను పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బదిలీపై వచ్చిన తర్వాత 79 లో నన్ను ఆహ్వానించారు. ఇంతకు ముందు చెప్పినట్టు కిషన్రావు గారు ఇనుగుర్తి నుండి ఒక టీమ్ ను తీసుకుని వచ్చి, ఆ పరిషత్తులో పాల్గొనడం జరిగింది. అప్పుడు తాను రాసిన నాటకాన్ని ప్రదర్శించడంలో ఒక కొత్త ప్రక్రియను ప్రవేశ పెట్టారు. అదేమిటంటే నాటకంలో సన్నివేశానికి తగిన సంగీతం ఉండాలని, రేడియోలో కొన్ని సంగీత బిట్లు సేకరించి రికార్డు చేసుకుని ఆయా సన్నివేశాలకు తగినట్లుగా ప్లే చేసేవాడు. అంతవరకూ ఇలా చేయవచ్చని ఎవరికీ ఆలోచన రాలేదు. ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వస్తున్నదని ఆలోచించాము. ఆశ్చర్య పోయాము. ఎందుకంటే అక్కడ ఎలాంటి వాద్య సహకారం లేదు. ఇలా కొత్త ప్రక్రియను ఎంతో శ్రద్ధగా ప్రవేశపెట్టడమే కాకుండా ఆచరణలో పెట్టాడు. అలా ప్రదర్శించిన నాటకానికి బహుమతి లభించింది కూడా!
ఇక నా విషయానికి వస్తే … పాఠశాల వార్షికోత్సవం కొరకు నాటకం వేసి, అదే  శ్రీరామనవమి ఉత్సవాలలో ప్రదర్శించడం జరిగింది. అలా కళా సమితితో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఇల్లిందలలో ఉండేది వినాయక చవితి, శ్రీరామనవమి నవరాత్రులలో నాటకాలు వేయడం జిల్లా స్థాయి తాలూకా స్థాయిలో  పోటీలు నిర్వహించడం మేము నాటకాలు వేస్తున్నాము… అనగానే వారే రావడం, మేము వెళ్లి ఆ నాటకాలను చూసి బాగుంటే రమ్మని పిలిచే వాళ్ళం .అంటే దీనినే స్క్రూట్నీ అంటారు. ఈ సంస్థ స్థాపించిన మూడు సంవత్సరాల తర్వాత నన్ను సభ్యునిగా చేర్చుకున్నారు.
తర్వాత పాఠశాల వార్షికోత్సవంలో నాటకం వేసిన తర్వాత ఈగ శ్రీహరి గారికి నాటక రంగంలో నా కృషి నచ్చి, అధ్యక్షులుగా చేసారు. అంటే ఒక సంవత్సరం పరిచయం ,ఆ తర్వాత సంవత్సరం కళా సమితిలో సభ్యత్వం, ఆ మరసటి సంవత్సరం అధ్యక్షుడిగా నియమింపబడ్డాను. తర్వాత నాటక నిర్వహణకు డబ్బు కావాలి!కదా! అధ్యక్షుడుగా నేను, కార్యదర్శి ఇద్దరం కళల పట్ల అభిరుచిన్న వారి దగ్గరికి వెళ్లి, చందాలతో డబ్బులు సేకరించి, వాటితో నాటక నిర్వహణ చేసాము.   ఈలోపల *నిరూప్ సింక్రూమ్* అనే సంస్థ వారు ప్రథమ బహుమతి ప్రకటించారు.    అలాగే ఐతరాజు వేంకట నరసింహారావు( A V N)  గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం రెండో బహుమతి ప్రకటించారు.    ఈ రెండింటికి శాశ్వత నిధి ఏర్పాటు చేసి దాని మీద వడ్డీతో బహుమతి ప్రదానం ఇప్పటికీ చేస్తున్నారు.
    ఇక భోజనం ఖర్చులు మా అమ్మగారు వనం రాధమ్మ గారి పేరిట ఏర్పాటు చేసాను. ప్రతి సంవత్సరం దానికి కావలసిన సామాన్లు పంపాము. షీల్డ్ లు  ఒకరు, నాటక రంగస్థల నటులకు  పారితోషకాలకు మరో చందాదారులు… ఇలా తలా ఒక చేయి వేసి ఆ సంస్థను నడిపాము! మొదట్లో చెక్కబల్ల ఏర్పాటు చేసేవాళ్ళం.    తర్వాత గ్రామీణ పథకం ద్వారా స్టేడియం నిర్మించాము. ఈ స్కీం నియమాలేమిటంటే ప్రభుత్వానికి స్థలం చూపించి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే… రెండు లక్షలు ప్రభుత్వం తరపున ఇస్తుంది.  ఇలా ఏవైనా మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం చేయూతనిస్తుంది. అలా ఈ భారతీయ నాటక కళా సమితి  నిర్మించాలనుకున్నప్పుడు శ్రీ మునుగోడు నరసయ్య గారు గొప్ప హృదయంతో లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆ గ్రామంలో  స్థలాన్ని కొని ప్రభుత్వానికి చూపించాము. ప్రభుత్వం రెండు లక్షలు మంజూరు చేసింది. అలా ఆడిటోరియం రూపుదిద్దుకున్నది. దానికి *మునుగోటి నరసయ్య కళాభవన్* అని పేరు పెట్టాము. అందులో కార్యక్రమాలు చేసాం. ఇది ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన విషయం. అంతకుముందు నేను ఇదివరకు చెప్పినట్టు మూడు రోడ్ల కూడలిలో చెక్కబల్ల వేసి దానిమీద జంపఖానా వేసి తాత్కాలిక వేదిక తయారు చేసే వాళ్ళం. ఆడిటోరియం  తయారైన తర్వాత నాటక అధ్యక్షుడిగా 25 సంవత్సరాలుకృషి చేశాను.
ఉద్యోగ విరమణ కావడము, హన్మకొండకుకుటుంబంతో రావడము, సహృదయ సాహితీ సంస్థలో నేను సభ్యుణ్ణి కావడం, అక్కడా- ఇక్కడా ప్రయాణం చేయడం కష్టమైంది. అయినా నాటక సమాజాలకు పారితోషికం ముట్టాలనే సదుద్దేశ్యంతో  నాటక పోటీలలో వరుసగా నాలుగు రోజులు ఇక్కడ వేసిన నాటకాలు అక్కడ వేసిన నాటకాలు ఇక్కడ వేయమనేవాళ్ళం.
    పురుష వేషధారులు రాను- పోను వారి ఖర్చులు వారే భరించేవారు. అంతే కాదు నాటకానికి అవసరమయ్యే సెట్టింగ్లు, వస్త్రాలు, మేకప్ మెన్, ఇలా వాటన్నింటినీ ప్రదర్శన జరిగే చోటుకి అద్దె వాహనాల మీద తీసుకుని రావడం ఖర్చుతో కూడిన పని ఎక్కువ కష్టం అయింది.  సంస్థలో లైటింగ్ నాటకానికి అణువుగా ఉండక… అవసరమైన లైటింగ్ ఆయా నాటక సమాజాలే అమర్చుకునేవారు. ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఎంత కష్టమైనా నాటకలను భరిస్తున్నారు.
   ఇక స్త్రీ పాత్రధారులకు రాను పోను ట్రావెల్ ఖర్చులు, భోజనం ఏర్పాటు చేయాలి. వాటికి అదనపు ఖర్చు అయ్యేది. జిల్లా స్థాయికి అలాగే రాష్ట్రస్థాయికి క్రమక్రమంగా అభివృద్ధి చేసి అక్కడ మేము ప్రాయోజన ప్రదర్శన అంటే (Benfit show) *అల్లూరి సీతారామ రాజు* నాటకాన్ని వేయడం, దానికి అప్పుడు ఉన్నటువంటి పరిషత్తు చైర్మన్ గా ఉన్న జమున గారిని ఆహ్వానించడంతో వారు వచ్చారు. ఆంధ్రా నుండి నటులు నాటక పోటీలలో పాల్గొనేవారు. భారతీయ నాటక కళా సమితిలో ప్రదర్శించిన నాటకానికి బహుమతి వచ్చిందంటే? వాళ్లకు ఒక గుర్తింపు వచ్చినట్టు. వర్ధన్నపేట భారతీయ నాటక కళా సమితిలో ప్రథమ బహుమతి వచ్చిందంటే అన్ని సమాజాల వారు వారిని ఆహ్వానించేవారు. అంత పేరు వచ్చింది ఆ సమితికి.
    25 సంవత్సరాలు నేను ప్రతీ సంవత్సరం నాటకాలు వేయడం- వేయించడం వల్ల భారతీయ నాటక కళా సమితికి నాకు సంబంధం ఏర్పడింది. దానికి శాశ్వతంగా కొంత డబ్బును సమకూర్చి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలకు ఎవరిని చేయి చాచకుండా ఆయా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగడానికి ఏర్పాటు చేశాం! ఇలా ఆర్థిక వనరులు కానీ, ఆడిటోరియం నిర్మాణం కోసం కానీ నాకు దొరికే సెలవులన్నీ వర్ధన్నపేట భారత కళా సమితి అభివృద్ధి పనులకే కేటాయించాను. రెండో శని, ఆదివారాలు కానీ  వేసవి సెలవులు కానీ ఏసెలవైనా అక్కడికి వెళ్లడం, కార్యవర్గ సభ్యులను సమావేశపరిచి డబ్బులు చందాల రూపంగా వసూలు చేయడం, వాటితో ఏ కార్యక్రమాలు చేయాలని ఆలోచనలే తప్ప మరో ఆలోచన ఉండకపోయేది. 25 సంవత్సరాలు నా క్రీమ్ ఆఫ్ లైఫ్ ( cream of life) అంతా కూడా భారతీయ నాటక కళా సమితికే వెచ్చించాను.

పద్మజ:— హన్మకొండలోని *సహృదయ* *సాహిత్య* *సాంస్కృతిక* *సంస్థ* తో మీకున్న అనుబంధం దాని విశేషాలు చెప్పండి!
లక్ష్మీకాంత రావు :—- భారతీయ నాటకం సమితిలో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడే వరంగల్ జిల్లా కాకతీయుల సామ్రాజ్యం మంచి పేరున్నటువంటి ఈ నేలలో ఒక పరిషత్ ఎందుకు నిర్వహించ కూడదు అనే ఆలోచన వచ్చింది. అప్పుడు సాహిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు రెండూ నడిచే విధంగా ఒక సంస్థను స్థాపించాలని, నేను శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, ఏవీ నరసింహారావు గారు, ధర్భశయనం శేషాచారిగారు, డాక్టర్ ప్రసాద్ గారు, మేమందరం సమావేశమై మాట్లాడిన తర్వాత ఒకటే వేదిక మీద నుండి ఇటు సాంస్కృతిక అటు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలనే ఆదర్శంతో 1998లో ప్రారంభించాము.
        పరిషత్తులు నిర్వహించాలంటే ఆ రోజులలో 80,000 ఖర్చు వచ్చేలా ఉంది అంత ధనం సంపాదించలేమని, రెండు నెలలకు ఒక నాటికను ఎవరినైనా పిలిచి వేయించాలనే నిర్ణయించి, అలా రెండు సంవత్సరాలు వేయించాము. పబ్లిక్ గార్డెన్ లో వేదిక ఉండేది. సాంస్కృతిక కార్యదర్శిగా నేనున్నాను. వర్ధన్నపేటలో శివరాత్రి తో ముగించి ఇక్కడ కూడా అదే శివరాత్రి ఉత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించాము.
          పదవీ విరమణ పొందిన తర్వాత కాస్త ఆరోగ్యం సహకరించక వర్ధన్నపేట సంస్థను స్థానికులకు బాధ్యతలను అప్పగించి నేను విరమించుకోవాలని అక్కడ అన్ని వసతులు చేసిన తృప్తితో విరమించుకున్నాను. అలా  2006తో  భారతీయ నాటక కళాసమితితో సంబంధానికి తెరపడింది.      సహృదయను 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పరిషత్తు నిర్వహించడం, సాహిత్య కార్యక్రమాలు ఎన్నో చేశాం. మహాభారతం మీద విశ్లేషణా ప్రసంగాలు కవి పండితుల చేత చేయించాము. ఉపనిషత్తుల మీద ఉపన్యాసాలు, భాగవతం మీద ఉపన్యాసాలు, భగవద్గీత మీద ఉపన్యాసాలు పది రోజుల కార్యక్రమాలు నిర్వహించాము.   ప్రతి సంవత్సరం నాటక పోటీలు సాహిత్య కార్యక్రమాలతో గత 25 సంవత్సరాల నుండి సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ నిర్వాహణ జరుగుతున్నది.     ఉగాది పురస్కారాలు మొదలైన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈమధ్య దివంగతులైన రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి స్మృతి చిన్నంగా ఒక పురస్కారం ఇస్తున్నాము. సహృదయ ప్రారంభించాక రెండు మూడు సంవత్సరాలకు మాకు ఒక ఆలోచన వచ్చింది .
         తెలంగాణ వైతాళికులుగా పేరుపొందినటువంటి ఒద్దిరాజు సోదరులు ఆ రోజుల్లో అంత సాహిత్య కృషి చేసి, ఎన్నో పుస్తకాలు ముద్రణ చేసి, వారి స్వంతంగా ఒక ముద్రణాలయం స్థాపించి, అందులో ఎన్నో ప్రచురణలు చేసి, అంత శ్రమపడిన సోదరులు ఎవరికీ తెలియకుండా ఉన్నారు. ఆ రోజుల్లో అందుకే వారి పేరు మీద ప్రతి సంవత్సరం ఒక పురస్కారం ఇచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో కవి, పండితులకు, రచయితలకు పురస్కారం బహకరిస్తే అందరికీ తెలుస్తుందని అదే సంవత్సరం దాదాపు 98 లో ప్రారంభమైతే  అయిదారు సంవత్సరాలు 2003– 2004లో ఒద్దిరాజు వేణుగోపాల్ రావును సహృదయ సభ్యులుగా చేర్చుకున్నాక, అందరం కలిసి ఇంటికి వెళ్లి వేణుగోపాలరావుతో మా ఆలోచన ఇలా ఉన్నదని చెప్పినాము. సోదరుల పేరిట పురస్కారం ఇవ్వాలని ప్రతి సంవత్సరం 4000 రూపాయల పురస్కారం కింద ఇవ్వాలని ఆలోచన ఉంది. ఆర్థికంగా సహకరించగలుగుతారా? అని అడిగిన వెంటనే పురస్కారం డబ్బులు నేను ఇస్తానని అన్నాడు. మీరు కొనసాగించండి అని అన్నారు. అలా ఇప్పటివరకు  పురస్కారం పదివేల రూపాయలకు పెంచడం జరిగింది. దానిని ఒద్దిరాజు వేణుగోపాలరావు ఉన్నన్ని రోజులు వారి ఇచ్చారు. వారి తర్వాత భార్య విష్ణుప్రియ గారు కూడా కొనసాగిస్తున్నారు.
    ఒద్దిరాజు సోదరులు అంటే తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు! సాహిత్య రంగంలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కాని బహుముఖీనంగా  ప్రచారం జరిగింది. ఈ పురస్కారం ద్వారా మేము చేసిన సంతోషకరమైన విషయం అది.   సాహిత్యంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రక్రియకు , పద్యానికి ఒక సంవత్సరం, కథలకు, విమర్శకు, (ఫ్రీవర్స్)  వచన కవిత్వానికి అలా అన్ని ప్రక్రియలకు పురస్కారాలు ఇస్తున్నాము ఇప్పటికీ 25 సంవత్సరాలలో ఐదు ఆవృతాలు అయ్యాయి.

పద్మజ:— నంది నాటకాలకు న్యాయనిర్ణేతలుగా ఉన్నారు కదా! ఆ అవకాశం మీకు ఎలా కలిగింది? వాటి వివరాలు చెప్పండి!
లక్ష్మీకాంత రావు:– ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాటకాలను ప్రోత్సహించాలని ఆలోచన వచ్చినప్పుడు నాటక పోటీలు నిర్వహించాలని దానికొక పేరు నంది నాటకోత్సవాలనీ ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అప్పుడు 2004లో వాళ్ళు ఎవరైతే న్యాయానిర్ణేతలుగా బాగుంటారని ఆలోచించారట! ఎందుకంటే మొట్టమొదట నాటకాలను ఎన్నుకోవాలి.  ప్రతి జిల్లాకు వెళ్లి ప్రదర్శనలు చూడాలి. ముందుగా వాళ్ళు ఎంట్రీలు పంపుతారు. అలా 22 జిల్లాల నుండి ఎంట్రీలు వచ్చేవి. మొత్తం ఎంట్రీలను స్క్రూటినీ చేసి 12 నాటకాలు ఎన్నుకోవాలి! దీనికి ఎవరైతే బాగుంటుందని ఆలోచించి నా పేరు అక్కడ సూచించారు. ఎందుకంటే చాలా కాలం నుండి నేను నాటకాలు వేస్తున్నాను కాబట్టి నాకు తోడుగా మరో ఇద్దరిని సెలెక్ట్ చేసి మొట్టమొదటిసారిగా నంది నాటకోత్సవాలు నేను జడ్జిగా వెళ్లాను. దాని తర్వాత ఒకసారి ఫైనల్ జడ్జిగా కూడా వెళ్లాను. మరొకసారి ప్రాథమిక న్యాయనిర్ణేతగా కూడా వెళ్లాను. అలా మూడుసార్లు నంది నాటకోత్సవాలకు న్యాయనిర్ణేతగా పనిచేశాను. ఎక్కడా వ్యతిరేకత రాలేదు. అందరూ ఆమోదించారు. ఎందుకంటే పారదర్శకంగా ఎన్నుకోవడం జరిగింది.
            ఉమ్మడి రాష్ట్రస్థాయిలో రవీంద్రభారతిలో నంది నాటకోత్సవాలు అలా మొదలయ్యాయి. ఇప్పుడు కూడా ఆంధ్రలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరగడం లేదు. పది సంవత్సరాలయినా ఆ ఆలోచన లేదు. న్యాయనిర్ణేతగా నేను సన్మానింపబడ్డాను ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్థలు నిర్వహించే నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా విజయవాడ, కొలకలూరు, భద్రాచలం, తొర్రూరు, చిలకలూరిపేట మొదలైన సంస్థలకు వెళ్లాను.

పద్మజ:– మీరు ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు కదా! ఆయా సందర్భ విశేషాలు చెప్పండి!
లక్ష్మీకాంత రావు:-  ప్రతి జిల్లా నుండి ఒకనాటికను జిల్లా అధికారులు ఎన్నుకొని పంపితే రవీంద్రభారతిలో *సెక్రటేరియట్ కాంపిటీషన్స్* నిర్వహించేవారు. ప్రతి జిల్లా నుండి జిల్లా అధికారులు ఒక నాటికను పంపితే దానిని అక్కడ ప్రదర్శించేవారు. అలా వరంగల్ నుండి *జాతిస్మరామి* నాటకాన్ని జిల్లా అధికారులు పంపారు.అలా పంపించిన దాన్ని ఐదారు సార్లు ప్రదర్శించాము. ఆ నాటకంలో నాది ప్రొఫెసర్ పాత్ర! నాంపల్లి మధుబాబు గారు డైరెక్టర్! దానికి మంచి పేరు రావడమే కాకుండా రెండో బహుమతి కూడా వచ్చింది. అలాగే ప్రభుత్వ పరంగా రంగస్థలం పురస్కారం అందుకున్నాను. వీరేశలింగం జన్మదినం ఏప్రిల్ 16న జరిగే నాటక దినోత్సవం సందర్భంగా విజయవాడలో నాటకరంగానికి తెలంగాణా నుండి ఒకరికి, ఆంధ్రా నుండి ఒకరికి రంగస్థల పురస్కారం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందించగా నేను అందుకున్నాను.  తెలుగు యూనివర్సిటీ వారు కీర్తి పురస్కారం ఇచ్చారు. అప్పా జోష్యుల వారు (విష్ణుభట్ల-అభో విభో) సంస్థ వారు పురస్కారాన్ని ప్రదానం చేసారు. నిజామాబాద్ శ్రీపాద కళాపరిషత్ వార పురస్కారం ఇచ్చారు.  ఇలా 15 – 20 పురస్కారాలు నాటక కళాకారుడిగా అందుకున్నాను.
            శ్రీ కళానికేతన్ హైదరాబాద్ వారు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ నుండి ఒకరికి పురస్కారం ఇవ్వాలని ఇచ్చారు. ఆ సభకు సి నారాయణరెడ్డి గారు ముఖ్యఅతిథిగా వచ్చారు.

పద్మజ:– మీది బోధనారంగానికి సంబంధించిన వృత్తి , మీ అభిరుచి కళారంగం మీద, ఆచరణలో ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి, కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబం మీకు సంతృప్తి నిచ్చిన రంగం ఏది? ఈ రంగాలు ఎవరి మీదనైనా ఎట్లాంటి ప్రభావం చూపుతాయి?
లక్ష్మీకాంత రావు:– నేను స్వతహాగా వ్యవసాయ కుటుంబంలో జన్మించడం వల్ల వ్యవసాయం అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటినుండి పశువులను మేపడం, దగ్గర నుండి నాగలి పట్టడం మోట తోలడం అన్నీ చేసే వాడిని. సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు నౌకర్లతోనే ఉండేవాడిని. అలా సహజంగా వ్యవసాయ రంగంతో అనుబంధం ఉంది.      ప్రతి మనిషికి వృత్తి ఒకటి ఉంటుంది ప్రవృత్తి మరొకటి ఉంటుంది.  నేను కాకతాళియంగా ఈ ఉపాధ్యాయ వృత్తిలోనికి వచ్చినా వృత్తి పరంగా నేను న్యాయం చేశాననే చెప్తాను. బోధనా బాధ్యతలు, పాఠశాల నిర్వహణ అన్నీ చూసుకునేవాడిని.    కానీ నాకు చిన్నప్పటినుండి నాటకం గురించి మా గురువులు ఏ బీజావాపన చేశారో? దాని ద్వారా అది క్రమక్రమంగా మొక్కై, చెట్టై, పెరిగి ఊడలు పాతుకుపోయినట్టు… నాటక కళ మీద ఇష్టం పెరిగింది. 50 సంవత్సరాల నుండి కళారంగానికి సేవ చేసే అవకాశం కలిగింది.
     ఇక ఆధ్యాత్మికంగా అన్నప్పుడు ప్రతి మనిషి జీవితంలో  వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి.  ఆశ్రమాలలో ముఖ్యంగా మొదట బాల్యం, బ్రహ్మచర్యం, గృహస్థ, ఆశ్రమం… ఈ కాలంలో సన్యాసం తీసుకునేది లేదు.    కాబట్టి ఎవరికైనా 60 సంవత్సరాలు దాటిన తర్వాత తన గురించి తాను ఆలోచించటం మొదలు కావాలి! చాలా ముఖ్యమైన విషయం మనిషి జన్మ తీసుకున్న తర్వాత తానెవరు? ఈ భూమి మీదికి తాను ఎందుకు వచ్చాడు? తన లక్ష్యం ఏమిటి, అనేది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి!కేవలం ఒక్క మనిషికి మాత్రమే ఆ వివేకం ఉంటుంది  మిగతా జంతుజాలం అంటే 84 లక్షల జీవరాసులు ఉన్నా కానీ ఏది మంచి? ఏది చెడు? అనే వివేచన ఒక మనిషికి మాత్రమే ఉంటుంది.
    నేనెవరో? నేనెందుకు జన్మించాను? ఎక్కడ నుండి వచ్చాను? తన లక్ష్యం ఏమిటి? అనేది ఆలోచించుకోవాలి. ఏదో కొంతమందికి ఆ ఆలోచన వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళలో ఎంతమంది దాని గురించి సాధన చేస్తారో ఎంతమంది తమ గమ్యాన్ని చేరగలుగుతారనేది తర్వాత విషయం
    ముఖ్యంగా కొంత వయసు వచ్చాక మార్పు రావాలి! క్రమక్రమంగా లౌకిక విషయాల నుండి ఆధ్యాత్మిక వైపు తిరగాల్సి వస్తుంది. అలా వచ్చినప్పుడు తానేంటి? నేనెవర్ని? జీవనం యొక్క ప్రాధాన్యత ఏమిటి? నాలో ఉన్న దివ్య శక్తి ఏమిటి? ఆ దివ్యత్వాన్ని నేను ఎలా పొందగలిగాలి? అని ఆలోచన మనిషికి వచ్చిన తర్వాత క్రమక్రమంగా మార్పు వస్తుంది. అదే ధ్యేయము. 
*ఏ కంసత్ విప్రా బహుదా వదంతి* అంటే ఉన్న పదార్థం ఒకటే! అంతట సర్వే సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి ఏదైతే చైతన్య శక్తి ఉందో? అది అన్ని జీవరాసుల్లోనూ ఉంది. మనలో ఉన్న శక్తి తెలుసుకొనే ప్రయత్నం చేయాలి! ఏ చైతన్యం వల్ల మాట్లాడగలుగుతున్నాము? ఏ చైతన్య ఉండడం వల్ల చూడగలుగుతున్నాము? ఏ చైతన్యం వల్ల మనం ఆలోచించగలుగుతున్నాము? అది ఏమిటి? ఎక్కడ ఉంది? దాన్ని ఎలా తెలుసుకోగలం? దాన్ని అనుభవించగలగాలి తెలుసుకోవడమే కాదు అది ఉన్నది. అజ్ఞానం చేత కప్పి వేయబడి ఉంది. అజ్ఞానం తొలగించుకొని చైతన్యాన్ని అనుభవైక వేద్యం అది చెప్పడానికి వీలుకాదు! చూపించలేము! దాని అనుగ్రహంతోనే తెలుసుకుంటాం! జ్ఞాన గేయం అదే చైతన్యం ద్వారానే తెలుసుకోగలుగుతాము. పెద్దల ద్వారా తెలుసుకున్నప్పుడు కొంత ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చెప్పలేను కానీ కొంత ప్రయత్నం అయితే చేస్తున్నాను.

పద్మజ:– మనిషికి ఆధ్యాత్మికత  ప్రశాంతత నిస్తుందా?
లక్ష్మీకాంత రావు:— మనసుకు చాలా ప్రశాంతతని ఇచ్చేది ఆధ్యాత్మికత మాత్రమే! లౌకికమైన విషయాలు ఎన్ని పుస్తకాలు చదివినా, రాసినా, ప్రవచనాలు చేసినా అది అంతుపట్టదు. కానీ కేవలం సాధనతో మాత్రమే తనలోనికి వెళ్లి అంటే అంతర్ముఖీనం కావాలి.
   మనం చేసే పనులన్నీ ఇంద్రియాలతోనే చేస్తున్నాం! మనం ఎవరమనే విషయం తెలుసుకొని, సోహం అనేది తెలుసుకొని, కొందరు ఆసోహం దాసోహం ద్వారా తెలుసుకోవచ్చు! అని అంటారు. కొందరు సోహం తెలుసుకోవడానికి ఏ గురువు అవసరం లేదు ! ఎవరికి వారే సాధన చేస్తే తెలుస్తుందంటారు. తెలుసుకొనే ప్రయత్నం తప్పక ప్రతి మనిషి చేయాలి! అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటారు.
*మనుష్యాణం సహస్రేషుకశ్చిత్*
*సిద్ధానం కశ్చిన్ మాం వేత్తి తత్త్వతః*
           అంటే వేల మందిలో ఏ ఒక్కరో నేనెవరిని? అనే వివేకంతో  ఆలోచించగలుగుతారు… ప్రయత్నం చేస్తారు ! అలాచేసిన వేయి మందిలో  ఒకరు మాత్రమే తెలుసుకొని నన్ను చేరగలుగుతారు! అని చెప్తాడు.    అందుకే కోట్లాది జనం ప్రపంచంలో ఉన్నా గానీ 0.01 కూడా ప్రయత్నం చేయరు! మనిషి జన్మ ఎత్తి కూడా ప్రయత్నం చేయకపోతే *మహాతీ నష్టః* అంటే అంతకన్నా నష్టం లేదు అంటుంది ఉపనిషత్తు.    మళ్ళీ మానవ జన్మ వస్తుందో? లేదో? తెలువదు! ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మనిషి జన్మ వచ్చింది… దాన్ని సార్ధకం చేసుకోవాలి! ఎందుకంటే నిద్ర ,ఆహారం, భయం, మైథునం అన్ని ప్రాణులకు సాధారణంగా ఉండేవే… కానీ ఒక్క వివేకం మనిషికి మాత్రమే ఉంటుంది. ఆ వివేకాన్ని ఉపయోగించుకొని చైతన్య స్ఫూర్తితో నేనేమిటి? అని తెలుసుకోవాలి! రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస మొదలైన వారు చెప్పేది అదే!

పద్మజ:– దేవాలయ ధర్మకర్తగా సాంకేతికత ఇంత అభివృద్ధి చెందిన ఈ సమయంలో దేవాలయాల ఆవశ్యకత ఉంటుందని మీరు నిర్వహిస్తున్నారా?
లక్ష్మీకాంత రావు:– మన భారతదేశం వేద సంస్కృతి. ఇందులో భగవంతుడిని ఏ విధంగా  చేరాలనే విషయం చెప్తారు.కానీ భగవంతుడు ఎలా ఉంటాడు? వైకుంఠంలో ఉంటాడా? కైలాసంలో ఉంటాడా? అనే ఊహాగానాలే తప్ప సమగ్రంగా ఎవరూ చెప్పలేదు. ఈ విశ్వాసంతోనే భక్తి నెలకొని ఉంది తప్ప సరియైన ఆధారం ఏమీ లేదు! ఐనా మనకు ఏకాగ్రత కుదరాలంటే… ఇతర విషయాలన్నీ మరిచిపోయి ఏకీకృతంగా ఒకటే ఆలోచన చేయాలంటే మనకు ఏదో ఒక వస్తువు అవసరం.ఆ వస్తువు మీద మాత్రమే ఆసక్తి చూపించి,మనసును కేంద్రకృతం చేసినప్పుడు స్థిరంగా నిలబడుతుంది. మనస్సు స్థిరంగా నిలబడడమే శాంతి! అదే సౌఖ్యం !మనసు స్థిరంగా లేనప్పుడు మనకు ఎన్ని సంపదలు ఉన్నా… ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా… ఎంతమంది బంధువులు ఉన్నా మనకు మనం ప్రశాంతత పొందలేము. మనుసు స్థిరంగా నిలిచినప్పుడు మాత్రమే పూజ చేస్తాము. అలా నిలబడడానికి ఆవశ్యకమైంది ఒక విగ్రహం! మంత్రపూరితంగా ఎంతో శక్తిని ఆవహింప చేసి, బీజాక్షరాలుపయోగించి, తెలుసుకున్న పెద్దలు ఆగమశాస్త్ర విధానంలో పూజలు చేసేవారు. మనిషి కష్టంలో ఉన్నప్పుడు దేవాలయానికి రావడం, విగ్రహాన్ని దర్శించుకోవడం తన మనసులోని ఆవేదన చెప్పుకోవడంతో ఉపశమనం పొందవచ్చు… అని పెద్ద వాళ్ళు దేవాలయాలు నిర్మించారు. వీటివల్ల పాపం- పుణ్యం -భయం అనేవి  ప్రజలు ఆలోచించగలుగుతారు. దేవాలయ సంస్కృతే కనుక లేకపోతే ఒక కట్టడి ఉండకపోయేది! ఎందుకంటే మనం తప్పు చేస్తే దేవుడికి కోపం వచ్చి శిక్షిస్తాడు… అని అనే తలంపుతోనే మనిషి తప్పు పని చేయడానికి వెనుకాడుతాడు. లేకపోతే ఇంకా ఎన్ని అరాచకాలు జరిగేవో? ఎంత హింస పెరిగేదో?  
   అనూచానంగా వస్తున్న దేవాలయాలు అటు సంస్కృతిని కాపాడడంతో పాటు, పండగల పేరుతో గ్రామస్థులను ఒకచోట చేర్చి సంఘటితంగా మారే అవకాశం, ప్రజలలో విశ్వాసం కలగజేయడం, దేవుడు  మనను కాపాడుతాడు అనుకోవడమే భక్తి. ఇలా పలుకోణాల్లో దేవాలయాలు సమాజానికి హితవు కలిగించేవి కనుకనే మా పూర్వీకులు నిర్మించిన దేవాలయాన్ని కాపాడుకోవాలని, సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలని పునరుద్ధరణ చేయడం జరిగింది.
       రాజుల రాజుల కాలంలో ఊరి వారందరినీ ఒక దగ్గర కూర్చుని వాళ్లకు కావాల్సినవి ఏమిటో చర్చించుకుని పాలకులు కానీ ప్రధానాధికారి కానీ విషయాలు తెలుసుకొనేందుకు దేవాలయాలు ఉపయోగపడేవి. పాలకులు వచ్చినప్పుడు వారి గ్రామ సౌకర్యాల గురించి మాట్లాడేవారు అంతేకాక మన సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టుకునేందుకు గ్రామాలలో దేవాలయ నిర్మాణాలు చేసేవారు అని పెద్దలు చెప్తారు.
   దేవాలయాలు నిర్మించడం చాలా తేలిక ! కానీ దాని నిర్వహణ చేయడం చాలా కష్టం. పూర్వపు రోజులలో రాజులు,ధర్మకర్తలు దేవాలయానికి  పంట భూములు కేటాయించేవారు. వీటిని ఇనాం భూములు అనేవారు. దీనిలో పండిన పంటతో దేవాలయ విధులు, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అర్చకులకు కొంత భూమి ఇచ్చేవారు. పల్లకీలు, వాహన సేవలు మోసే వారికి పద్మశాలీలకు, వాహన ఊరేగింపు ముందు దివిటీ పట్టుకొనే  రజకులకు నైవేద్యం కొరకు సొండెలు అంటే గుగ్గిళ్ళు ఆ ప్రసాదం కొరకు సొండెలు తయారు చేయడానికి శనగలు పండించేందుకు  చెలుకలను, పొలాలను ఇనాముగా ఇచ్చేవారు.
          ఇక సాతాని వారికి కోవెలలో జరిగే కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లి చెప్పడము, విస్తర్లు, దొప్పలు ఆకులతో కుట్టడము, గంధం తీయడము, పూలమాలలు సేకరించడం, తులసీ దళాలు కోయడం ఇంకా కొన్ని దైవ సంబంధ పనులు ఎవరైనా గృహస్తులు దేవుడికి భోగానికని వంట సామాగ్రి ఇస్తే అవి తెచ్చి అర్చకుడికి ఇవ్వాలి.
             నిత్య విధి కార్యక్రమాలకు కేటాయించిన భూములు వ్యవసాయం చేసుకోవడం, పండించుకోవడం రోజు ఆరగింపు చేయడం వాళ్ళ బాధ్యత! ఇక విశేష రోజులు అంటే పండగలు, వార్షిక ఉత్సవాలు, అధ్యయన ఉత్సవాలు, కల్యాణంలో మళ్లీ ధర్మకర్తలే అందరూ కలిసి డబ్బులు కానీ వంట సామాగ్రి కానీ వంట చెరుకు దగ్గర నుండి అన్ని తీసుకువెళ్లి కోవెలలో అర్చకుడికి ఇస్తే ఉత్సవాలు జరిగేవి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో  పౌర్ణమి రోజు కళ్యాణం వారం రోజుల పాటు జరుగుతాయి. అందులో భాగంగా బండ్లు తిరగడం ఒకరోజు, మొదట ధ్వజారోహణము అంకురార్పణ, కళ్యాణము , తెల్లవారి సదస్సు ఇలా కార్యక్రమము ఐదు రోజులు చేస్తారు. వీటికి అయ్యే ఖర్చు ధర్మకర్తల కుటుంబాలే భరిస్తాయి. మార్గశిర మాసంలో గోదా కళ్యాణం చేస్తారు. సంక్రాంతికి ముందు తొమ్మిది రోజులు ఆండాళును పెళ్లికూతురును చేస్తారు దీన్నే మంజీల్ ఉత్సవం అంటారు. ఆ వేడుకలకు రోజుకొకరు చొప్పున భోగానికి భోజనశాలకు సామాను తీసుకెళ్లిన సాతాను వారికి అందరికీ సాహిత్యం అంటే వంట సామాను పంపిస్తారు. అమ్మవారికి పసుపు కుంకుమ కూడా పంపుతారు. ఒకప్పుడు అంటే 50 సంవత్సరాల కింద ఈ వ్యవస్థ ఉండేది.
           25 సంవత్సరాల నుండి వైష్ణవుల కుటుంబాలకు సంవత్సరానికి ఒకరు చొప్పున పంతులు వచ్చేవి అంటే ఆ కుటుంబంలోని వారు ఆ దేవాలయంలో పూజలు చేసేవారు. పాత తరం చేశారు. వాళ్ళ కొడుకులు చదువుకోవడానికి బస్తీలకు వెళ్లి ఉద్యోగాలు చేయడం కోసం వేరే ఊరికి వెళ్ళిపోయారు. పాత తరం అంతరించిపోయింది రెండవ తరం ఉద్యోగరీత్యా ఊరు విడిచి వెళ్లడం జరిగింది.  దేవాలయంలో అర్చకత్వం చేసేవారు లేరు…. లేకపోయేసరికి ఏం చేయాలనే ఆలోచన చేసి మళ్ళీ అందరూ నియోగులు ఉంటారు. వీరే ధర్మకర్తలు అందరూ కూర్చొని చర్చించితే వైష్ణవ కుటుంబాలు మేము దేవాలయాన్ని నిర్వహించలేము! మీకు తోచిన విధంగా చేయండి! అని వారు అనడంతో భూములు మీ ఇష్టం దేవాలయం మీ ఇష్టం ఏం చేసినా పర్వాలేదని వెళ్ళిపోయారు.
         ధర్మకర్తలు ఏం చేశారంటే? మాన్యపు భూములను రైతులకు కౌలుకు ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో దేవాలయ నిర్వహణ చేయాలని నిశ్చయించారు. వేరే ఊరు నుండి ఒక పూజారిని రప్పించి నియమించారు. నెల నెల జీతం మీద పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాము.
          దేవాలయం చుట్టూ శుభ్రం చేసేందుకు ఒక ఉద్యోగి, పాత్రలను శుభ్రం చేయడానికి ఒక ఉద్యోగిని నియమించాము. పూర్వపు రోజుల్లో అయ్యగార్లే పొలాలను వ్యవసాయం చేసి పంట పండించుకొని, గుడి నిర్వహణ చేసేవారు. ఇప్పుడు జీతం ఇచ్చి ఒక ఎంప్లాయ్ ని ఏర్పాటు చేసి అదే భూముల మీద వచ్చిన ఆదాయంలో డబ్బును వాళ్లకు జీతం రూపంలో ఇస్తున్నాము. ఇదీ ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ. ఇప్పుడు దేవాలయంలో జరిగే అన్నిటికీ మా నియోగుల కుటుంబాలే బాధ్యత వహిస్తున్నాయి ఉన్నవాళ్లలో వయస్సు రీత్యా పెద్ద వారిని చైర్మన్ గా ఎన్నుకోవడం, వారు గతించిన తర్వాత మరో  పెద్దమనిషికి బాధ్యత అప్పగించడం అలా దేవాలయ నిర్వహణ ధర్మకర్తగా ఇప్పుడు నేనే నిర్వహణ చేస్తున్నాను. భగవంతుని దయతో ఇప్పటికైతే నడుస్తున్నది చేతనైనంత వరకు చేస్తాను.

పద్మజ  :— మహా మహోపాధ్యాయ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి అనుయాయులుగా వారి ఆలోచనలు భక్తి మార్గాన నడిచే వారికి ఎలా దోహదపడతాయంటారు?
లక్ష్మీకాంత రావు:– కొందరు కారణ జన్ములు ఉంటారు . కేవలం ఏ కార్యక్రమం కోసం వాళ్ళు జన్మిస్తారో ఆ కార్యక్రమానికి అంకితమైపోతారు. మహా మహోపాధ్యాయ రఘునాథాచార్య స్వామి వారు భక్తి ఉద్యమానికి జన్మించారేమో? అనిపిస్తుంది.  కారణభూతులైన వారు తెలియని వారు లేరు. ముఖ్యంగా వరంగల్ లో మాత్రం వారి సేవలు అమోఘం! వారు  కృష్ణాజిల్లా మోటుపల్లిలో జన్మించి, ఆయన విద్యాభ్యాసం కోసం సీతారాం బాగ్ సంస్కృత పాఠశాలలో చదువుకొని, అక్కడి నుండి వరంగల్ సంస్కృత కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసి, పదవీ విరమణ పొందారు. వారి మేథా సంపత్తి చాలా పెద్దది. ఏకసంథాగ్రాహి! ఏదైనా విషయం వింటే ఎన్ని సంవత్సరాలైనా దాన్ని ఉటంకించే  (కోట్) వారు. అందుకే వారికి చదివిన కావ్యాలు కానీ ఉపనిషత్తులు కానీ కంఠతా ఉండేవి. వారు చాలా పుస్తకాలు రాసారు. సంస్కృత వ్యాకరణ మీద మంచి పట్టు ఉండేది. రచన విధానం బాగుండేది. వారు దేన్ని కోరకపోయేవారు. డబ్బు విషయంలో చాలా కచ్చితంగా ఉండేవారు. తన పెన్షన్ మీద వచ్చే ఆదాయంతోనే నిరాడంబరంగా జీవితాన్ని గడిపేవారు. ఎవరు ఇచ్చినా తీసుకోక *అపరి గ్రహం* అనేది వ్రతంగా ఆచరించేవారు. ఎవరైనా కానుకగా సమర్పిస్తే దాని తిరిగి ఏ దేవాలయానికో సమర్పించేవారు. వారి జన్మభూమిలో దేవాలయాలను జీర్ణోద్ధరణ చేసేవారు. అలా పుట్టిన ఊరిని కానీ, తను ఉద్యోగ నిర్వహణలో గడిపిన స్థలాన్ని కానీ మరిచిపోలేదు!  
       ఎన్నో గ్రంథాలు రాసి-ముద్రించారు. ఆచార్యులు అంటేనే ఆచరించి చూపేవారు అని వ్యుత్ప్యర్థం కదా! ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేసేవారు. అంతేకానీ ఒకటి చెప్పి, మరొకటి చేయకపోయేవారు. అందుకే అందరూ వారిని గౌరవించారు. వారి ఆశయాలు! సాధారణ జీవితం గడపడం, ఎవరి నుండి ఏమి ఆశించకపోవడం. మానవుడికి ఉపయోగ పడే రామాయణ, భారత, భాగవతాలు , ఉపనిషత్తులు మొదలైనవి 360 రోజులు అధ్యయనం చేస్తూ ఉంటే మన వ్యక్తిత్వంలో మార్పు వస్తుందని… నిత్య పారాయణ చేయమని చెప్పేవారు. అలాగే వాటి అర్ధాలు తెలుసుకొని ఆచరించమనే వారు.  ముఖ్యంగా వారికి ద్రవిడ ప్రబంధాల మీద మంచి పాండిత్యం ఉంది. అద్భుతమైన వ్యాఖ్యానాలు చేసేవారు, ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. సమాజం క్రమశిక్షణతో సక్రమంగా నడవాలంటే ఇలాంటి వ్యక్తులు అప్పుడప్పుడు భూమి మీది అవతరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

పద్మజ:— నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో  పత్రికల పాత్ర ఎలా ఉండాలి? మీరు పత్రికల అభివృద్ధికి ఏమైనా సూచనలు చేస్తారా?
జ. మయూఖ పత్రిక కొండపల్లి నీహారిణి నడిపిస్తున్నదంటే  చాలా సంతోషంగా ఉంది. ఏదైనా విన్నదానికంటే చూసినప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే దృశ్య రూపాలకు ఉన్న ప్రాధాన్యత మరో దానికి అంత ఉండదు. వెనుకటి రోజుల్లో కూడా నాటకాలు , ఆ తర్వాత సినిమాలు, ఇప్పుడు టీవీలు వచ్చాయి. ఏవైనా దృశ్యరూపకంగా మన కళ్ళకు ప్రత్యక్ష రూపంగా కనపడుతున్నాయి. వీటిని చిత్రాలు అంటాం కదా! కానీ సజీవంగా మనిషి ఎదురుగా నిలబడి సంభాషణలు చెబుతుంటే… ఆ ఆనందమే వేరు.
      ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠం చెప్పినప్పుడు ఏ ప్రభావం ఉంటుందో అటువంటి ప్రభావం విన్నప్పుడు ఉండదు! అయితే ఆ ప్రత్యక్షమైన ప్రభావం పడడానికి ఉపయోగంగా ఉండేవి మొట్టమొదటివి దృశ్యరూపకాలు. వాటిలో చెప్పదలుచుకునే విషయాన్ని పాత్రల ద్వారా ప్రజలకు అందించడం అనేది చాలా ప్రధానమైనది. ప్రజల్లో మార్పు వస్తుందా? రాదా? అనేది కాకుండా విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి! ఎంత మంది దాన్ని ఆలోచిస్తారు? ఆచరిస్తారు? అనేది తర్వాత విషయం.
    సమాజంలోని సమస్యలు కానీ, సంస్కృతిని గానీ, సాహితీ ప్రక్రియలుగాని ఒకరి ద్వారా ఒకరికి తరువాతి తరాలకు వస్తుంటేనే అవి నిలిచి ఉంటాయి.వాటిని  నిలుపుకోవడానికి ఆ క్రమంలో భాగంగా పెద్దలు మనకి ఇచ్చారు. మనం తర్వాత తరాలకు అందించాలి! అది మన బాధ్యత! ఆ సంస్కృతిని అందించాలంటే మంచి నాటకాలు బాగా ఉపయోగపడతాయి. సినిమాలు, సీరియళ్ళు ఏవో కొన్ని తప్ప కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చూసేలా లేవు! వాటి నిండా మోసాలు, కుట్రలు, పగలు, ప్రతీకారాలు, ఇలాంటివే ఉంటున్నాయి.
    మంచి చెప్పేవి నాటకాలే కాబట్టి నాటకాలను ప్రోత్సహించాల్సిందీ పత్రికలే! ఎక్కడైనా ఒక నాటక ప్రదర్శన జరిగినప్పుడు ఆ నాటక విశేషాలు, అవి ప్రదర్శించే తేదీలు, సమయమే, కాకుండా సంక్షిప్తంగా నటీనటుల నటన గురించి, వాటి సారాంశాలు తెలిపితే ప్రజలకు తెలుస్తుంది. నాటకానికి ఇంత ప్రాధాన్యత ఉందా? అని అనుకుంటారు…. ఈ తరానికి నాటకాల గురించి ఎక్కువగా తెలియదు! పాఠశాల వార్షికోత్సవాలలోను, జాతీయ పండగల సందర్భంగానూ ఏవో డాన్సులు చేస్తున్నారు తప్ప, నాటకాలు వేయించడంలేదు! వాటిని వేయించాలంటే చాలా శ్రమతో కూడుకున్నది, కాబట్టి ఆ జోలికి ఎవరూ ఆ దిశకు పోవడం లేదు!

   అలాంటప్పుడే పత్రికలకు నాటకాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది!  వాటి ద్వారా ప్రజలకు అభిరుచి కలిగించాలి .ఏది మంచి? ఏది చెడు? అని చెప్పగలిగేవి పత్రికలు మాత్రమే! నాటకాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలది… అలాగే పత్రికలది కూడా!
    మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక నిర్వహిస్తున్నటువంటి కొండపల్లి నీహారిణి గారు చాలా శ్రమ తీసుకొని, బహుముఖ ప్రజ్ఞాశాలులైన వారిని లేదా ఇలా ఒక ప్రత్యేకత ఉన్నవారి పరిచయం చేస్తూ,కార్యక్రమాలు నడుపుతూ, ఇటువంటి సాహిత్య పరంగా కృషి చేస్తున్న వారి కృషిని అభినందిస్తూ… ఇలా పత్రికలు సాహిత్యానికి, సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. 
           ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా *కావ్యేషు నాటకం రమ్యం* అన్న నానుడిని అక్షరాలా ఆచరిస్తూ… పరిషత్తులను కాపాడుకుంటూ.. వేదికలను సద్వినియోగం చేస్తూ…. నాటక రంగానికి విశేష కృషి చేసిన వనం లక్ష్మీకాంతరావు గారి సేవలు అమోఘం. ఈ ముఖాముఖిలో పత్రిక ల మధ్య-ప్రజల మధ్య మంచి సయోధ్య ఉన్నవి పరిచయ వ్యాసాలు, శీర్షికలుండడం ఎంత ముఖ్యమో ? వాటి గురించి వివరించి, మంచివి సేకరించి, వాటిద్వారా పాఠకులకు ఆయా రంగాలమీద అభిరుచి కలిగించడం అంతే ముఖ్యమని, సాహితీ ప్రియులను ఎప్పటికప్పుడు భాషాభిమానులను తయారు చెయడం అంతే ముఖ్యమనిచెప్పి, తమ విలువైన సమయాన్ని నాటకరంగ ఆవశ్యకత, దాన్ని నిలబెట్టే దిశగా  సాగిన వారి కృషిని, అందులోని సాధక బాధకాలను వివరించి, ముప్పేటలుగా సాగుతున్న వారి జీవన విధానం, అభిరుచి, అభ్యాసానికి అబ్బుర పడుతూ… ఇక ముందు కూడా వారనుకున్న విధంగా సాగాలని ఆకాంక్షిస్తూ….
          ఈ సంవత్సర ఫిబ్రవరి నెలలో కాళోజీ కళాక్షేత్రం లో వారి అభిరుచికి తార్కాణంగా 3 రోజుల పాటు తెలుగు భాషాహ్వాన నాటక పోటీలు 23 – నుండి 26 వరకు జరిపించారు. నేను ప్రత్యక్షంగా చూసాను. మానవ సంబంధాలను పటిష్ట పరిచే *స్వేచ్ఛ* *ఉక్కు సంకెళ్ళు* , *చిగురుమేఘం* లాంటి జీవితాన్ని ప్రతిబింబించే నాటికలలో సామాజిక సమస్యలు- పరిష్కారాలు చెప్తూ… యువతరానికి మేలుకొలుపుగా ఉండేలా  అద్భుతమైన నాటికలు ప్రదర్శింపబడ్డాయి.
            ఇలా సహృదయ సాహిత్య-సాంస్కృతిక సంస్థ వారి సేవలు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి. నాటక ప్రదర్శనలు చేయించిన నాటక ప్రియులు, రంగస్థల కళాకారులు, సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తుసాక్షి  వనం లక్ష్మీకాంత రావు గారు. వారిని అభినందిస్తూ- ధన్యవాదాలు తెలుపుతూ..
          ఈ కళలలను మనం గౌరవించి కాపాడుకోవాలి! ఇందులో పత్రికలతో పాటు- తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలి! పిల్లలకు కళల పట్ల అభిరుచి ఏర్పడేలా చూడాలి!             

September 23, 2025 7 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణ బతుకమ్మ పండుగలో తంగేడు పూలు (Cassia auriculata) శాస్త్రీయ, ఆధ్యాత్మిక మరియు విశ్వ నియమాల పరంగా ప్రాముఖ్యత:

by dr. Lakkraju Nirmala September 23, 2025
written by dr. Lakkraju Nirmala

1. తంగేడు పువ్వు – శాస్త్రీయ వివరాలు:

శాస్త్రీయ నామం: Cassia auriculata

ఇతర పేర్లు: Tanner’s Cassia, Avaram (తమిళంలో), తంగేడు (తెలుగులో)

భాగాలు ఉపయోగం: పుష్పాలు, ఆకులు, గింజలు, వేర్లు—all parts are medicinal.

ఔషధ గుణాలు: శరీర వేడి తగ్గించడానికి. ముత్ర విసర్జన నియంత్రణకు. చర్మ రోగాలు తగ్గించడానికి. రక్తశుద్ధి (Blood purification).

లివర్ ఫంక్షన్ మెరుగుపరచడం. డయాబెటిస్ నియంత్రణకు సహాయపడే గుణం కలదు.

2. బతుకమ్మలో తంగేడు పూలు – ఆధ్యాత్మిక భావన: బతుకమ్మ పండుగ అనేది: జీవరేఖను (life energy) పూజించే పండుగ. స్త్రీ శక్తిని (Shakti) ఆహ్వానించే కాలం. శరదృతువులో శరీర శుద్ధి, మానసిక విశ్రాంతి, ప్రకృతి మానవ మేళవింపును సూచిస్తుంది.

తంగేడు పువ్వు: ఆకర్షణీయమైన పసుపు రంగులో ఉంటుంది. ఇది సూర్య శక్తి, ఆరోగ్యాన్ని సూచిస్తుంది.

పసుపు రంగు అనేది విశ్వ శుద్ధి శక్తిని సూచించే తత్త్వంగా భావించబడుతుంది.

ఈ పువ్వు విషాలను శోషించగల సామర్థ్యంతో, ప్రకృతితో మానవుని అనుసంధానించే పాత్ర పోషిస్తుంది.

3. తంగేడు పూలు & విశ్వ నియమాలు – అనుసంధానం:

1. లా ఆఫ్ డివైన్ ఆనెస్స్ (Law of Divine Oneness): తంగేడు పువ్వు ప్రకృతిలోని శుద్ధికర శక్తిని మానవుని శరీరానికి కలిపే ఒక బంధం.
=> పుష్పం, భూమి, నీరు, శరీరం — ఇవన్నీ ఒకే శుద్ధతత్త్వానికి అనుబంధాలు.

2. లా ఆఫ్ వైబ్రేషన్ (Law of Vibration): తంగేడు పువ్వు పసుపు రంగుతో, ఆరోగ్యకర వైబ్రేషన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మానవ చక్రాలపై శుభ ప్రతిఘటన కలుగజేస్తుంది, ముఖ్యంగా మణిపూరక చక్రం (solar plexus chakra)పై ప్రభావం.

3. లా ఆఫ్ ఆక్షన్ (Law of Action): ఈ పువ్వు వాడటం అంటే ఒక చైతన్యక చర్య. శరీర శుద్ధి, ఇంటి పరిసరాల పరిశుభ్రతలో భాగమవుతుంది. అంటే, ప్రకృతి ద్వారా మన ఆరోగ్యాన్ని దిద్దుకోవడమే.

4. లా ఆఫ్ కరెస్పాండెన్స్ (Law of Correspondence): బయట పువ్వు శుద్ధి చేస్తే, మనలోనూ శుద్ధి జరుగుతుంది. అంతర్లోకం ↔ బాహ్య లోకం అనుసంధానం.

5. లా ఆఫ్ హార్మనీ & నేచర్ (Law of Rhythm/Nature): బతుకమ్మ కాలంలో ప్రకృతి శుద్ధితత్వం ఉద్భవిస్తుంది. తంగేడు పువ్వులు ఆ కాలంలో విరియడం అనేది ప్రకృతిలోని తరంగాలకు అనుగుణంగా శరీరాన్ని సరిపోల్చే ప్రక్రియ.

4. పంచభూత సంబంధం: పంచభూతం తంగేడు పూలు పాత్ర పృథివీ (భూమి) భూమిలో పెరిగే ఈ చెట్టు మూలికల శుద్ధితత్వం అందిస్తుంది
ఆపః (నీరు) దీని గుణాలు రక్తాన్ని, మూత్రాన్ని శుద్ధి చేస్తాయి
అగ్ని పసుపు రంగు అగ్ని తత్త్వానికి సమానం, మణిపూర చక్రాన్ని ఉత్తేజితం చేస్తుంది
వాయువు శరీరంలో గాలి ప్రసరణ, జీర్ణ వ్యవస్థకు శ్రేయస్సు
ఆకాశం ఈ పువ్వుతో శుభత, ఆధ్యాత్మికత అలవరుస్తారు, అంతర్గత స్థిరత్వానికి తోడ్పడుతుంది

సారాంశం: తంగేడు పువ్వు వాడకమంటే పుష్పార్చన మాత్రమే కాదు. అది: శరీర శుద్ధికి సహకరించే శాస్త్రీయ మార్గం,

ఆత్మశుద్ధికి దారి చూపించే ఆధ్యాత్మిక మార్గం, విశ్వ నియమాల ప్రకారం ప్రకృతి-ప్రాణి మిళిత జీవన తత్వాన్ని వ్యక్తపరచే మార్గం.

September 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ప్రకృతి పండుగ – ప్రాకృత పండుగ

by Dr. Bheri Sunitha Rammohan Reddy September 23, 2025
written by Dr. Bheri Sunitha Rammohan Reddy

బతుకమ్మ పండుగ ,పూల పండగ, జానపదుల పండుగ, కేవలం తెలంగాణకు మాత్రమే సొంతం అయిన పండుగ. ఏ పండగ చేసినా దేవుడిని పూలతో పూజిస్తాం, ఇక్కడ పూలనే పూజించే పండగ బతుకమ్మ పండుగ. అంటే ప్రకృతి పండగ, ప్రకృతి నే పరమాత్మ అని భావించి మన పూర్వీకులు చేసిన పండగ . చేను చెలకల్లో దొరికే తంగేడు, గునుగు, ముత్యాలపువ్వు, అడవి చేమంతి ,కట్ల పూలు, గుమ్మడిపూలు ఇవే బతుకమ్మకు అందాన్ని ఇచ్చి ఆకృతిని కల్పించే పూలు ఈ పండగ భాద్రపద అమావాస్య నుండి ఆశ్విజ అష్టమి వరకు అంటే చిన్న బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు బతుకమ్మ పండుగ రోజులు ,అందులో ఆరో రోజు గౌరమ్మ అలిగి వెళ్లింది అందుకే అది అర్రెమ్ ఆనాడు ఆనాడు బతుకమ్మ ఎవరు ఆడరు ఆడకూడదు, దీనికి కూడా కారణాలు ఉంటాయి. బహుశా ఆడవాళ్ళ కు అలసట తీరాలనో, పంట పొలాల పనులు పూర్తి చేసుకోవాలనో ఉద్దేశ్యం కావచ్చు.

బతుకమ్మ పేర్చడం ఒక కళ ఆడడం అంతకంటే గొప్పది . నాట్య కళ, గానకళ . అంటే సంగీత , సాహిత్య, నృత్య కళా రూపం సమ్మేళనం. చప్పట్లు చరుస్తూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ,పాటలు పాడుతూ ఉంటారు. ఇందులో చుట్టూ తిరగడం ప్రదక్షిణ చప్పట్లు చరచడం, భజన చేయడం ఆ చప్పట్లు మూడు సత్వస్తమ రజోగుణాలకు ప్రతీకలుగా, ఈ మూడు చప్పట్లు ,ఇక పాటలు గళార్చన .
బతుకమ్మ రూపం శ్రీ చక్రానికి మరో రూపం, జ్ఞానపదులు శ్రీ చక్రం అంటే జానపదులు బతుకమ్మ అన్నారు. మొత్తంగా అక్కడ ఇక్కడ తల్లి పరాత్పరేశ్వరి గౌరీ దేవి ,తరతరాల నుండి బతుకమ్మ ఆట ఆడుతూనే ఉన్నాం. అనేక పాటలు ఆ పాటలో అలవోకగా కట్టుకున్నవే అయినా అందులో ఆధ్యాత్మికత ఉంటుంది, సామాజికత ఉంటుంది ,చరిత్ర ఉంటుంది. ఇంకా ముఖ్యంగా పెళ్లికి ఎదిగిన పిల్లలకి ,పెళ్లయిన కొత్త పెళ్ళికూతురులకి, అత్తవారింట ఎలా ఉండాలి అని గౌరీ దేవి పేరుతో సుద్దులు చెప్పే పాటలెన్నో ఉంటాయి.
ఈ పండగలో నలుగురు కలిసి అందరం ఒక్కటే అని చెప్పే తత్వం ఉంది ,ఆధ్యాత్మికంగా గౌరీదేవిని కొలుస్తూ ఉన్న తత్వం ఉంది ,ఇక ఆరోగ్యం ఏ పూలైతే ఆరోగ్యాన్ని ఇస్తాయో వాటన్నింటినీ కుప్పగా పోసి బతుకమ్మగా పేర్చి వాటి ముందు ఓ రెండు గంటల ఆట ఆడితే మనం తీసే ఉఛ్వాస , నిశ్వాసవల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా నడుము వంచి లేస్తూ ఆడుతున్న ఆట వల్ల సంవత్సరకాలం నడుము నొప్పి రాదు. గొంతెత్తి పాడే పాటలు కాబట్టి రాగం పెరుగుతుంది, గొంతు రుగ్మతలు తగ్గుతాయి . నలుగురిలో మాట్లాడలేనితనం అనే భయాన్ని పోగొడుతుంది.
ఇట్లా ఎన్నో లాభాలు ఉన్న ఈ బతుకమ్మ పండగ తెలంగాణకు మాత్రమే సొంతమైన పండుగ . ఈ పండగ కాలంతో పాటు తీరు మారుతుంది కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రజలు, పండగ కావాలంటూనే పండగ రూపాన్ని మార్చారు. స్వచ్ఛమైన పూల బదులు రకరకాల కాగితాలు ప్లాస్టిక్ వచ్చి చేరుతున్నాయి. నోరార పాడే పాటల బదులు డీజేల హోరు మిగిలింది . ఇక ఆట శూన్యమే లేదా వింత వింత నృత్యాలు అసలు ఆడే పద్ధతి మర్చిపోయారు. ఎక్కడో ఉత్తర భారతంలో ఉన్న విన్యాసాలన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ముందున్న బతకమ్మకి నమస్కారముద్రలో చరిచే చప్పట్లు వెనక భాగం లో ఎలా చరుస్తారు ? అర్థం ఉందా ? ఏమో అయోమయం !!

ఆట ఆడక పాట పాడక ప్రదక్షణ లేక ఆడుతున్న ఆట గా చేస్తున్నారు.
ఇప్పుడు బతుకమ్మలు అమ్ముతున్నారట !! కొన్ని అయితే బుట్టలు తిరిగేసి ప్లాస్టిక్ పూలతో చుడుతున్నారట, ఎటు పోతుంది ? ఎన్నో తత్వాలతో కూడుకున్న ఉన్న ఈ పల్లె పండుగ ఎందుకు తీరు మారుతున్నది? ఆలోచించాలి … మన పండగనే అసలు పద్ధతిలో చేసుకోవాలి. అందులో ఉన్న అర్ధాన్ని, పరమార్ధాన్ని గ్రహించాలి. పండగను పండగ లాగానే చేసుకోవాలి. చేను చెలకల్లో తిరుగుతూ పువ్వు పువ్వు ఏరి రంగులద్దుతూ, సిబ్బి లో, స్థాంభాళలో, పెద్ద పెద్ద పలాల్లో , పేరుస్తూ అనుభవించిన ఆనాటి ఆనందాలు ఎక్కడ? అంతమంది వలయాకారంలో తిరుగుతూ ఉంటే, ఎంత అందమైన దృశ్యం!! ఒక్కరు పాటు పాడతూ చెప్తూ ఉంటే అందరు సామూహికంగా బృందం గానాలాలపించే మన సంస్కృతిని తిరిగి సాధించుకోవాలి. పాటను బ్రతికించుకోవాలి. బతుకు బతకనివ్వు అనే సదుద్దేశ్యంతో ఆరంభమై న బతుకమ్మ పండుగ గొప్పదనం పునరుద్ధరణ చేయాలి.
వీధి వీధి నుండి ఒక్కొక్కరుగా ఓ ప్రవాహమై గుడి ముందు లేదా చెరువు దగ్గర అందరం ఏకమై ఆడిన ఆనాటి ఆటల వైభవం ఏది ? పండగ తీరు మారింది . అయినా పండగ ఉంది. పండుగలు ఉండాలి.

September 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

“ఛోటా (హిమాలయన్) చార్ థామ్ యాత్ర”

by Maji Bharathi September 21, 2025
written by Maji Bharathi

       హిందువులు జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలనుకున్న యాత్రలలో, అతి ముఖ్యమైనది  ఛోటా చార్ థామ్ (హిమాలయన్ చార్ థామ్) యాత్ర ఒకటి. ఇందులో హిమాలయ పర్వతశ్రేణులలో వుండే బదరీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయ దర్శనాలుంటాయి. అక్షయ తృతీయ నుండి, దీపావళి వరకు (ఆరు నెలలు) మాత్రమే ఈ చార్ థామ్ యాత్ర తెరిచి ఉంటుంది. మిగిలిన ఆరునెలలు, మంచుతో కప్పబడి, ఆ ప్రాంతం ఆవాసయోగ్యంగా ఉండదు.
       [ఆదిశంకరాచార్యుల వారి చార్ థామ్ అంటే నాలుగు దిక్కులా ఉండే నాలుగు థామాల దర్శనం: అవి తూర్పున పూరీ (జగన్నాథ్), దక్షిణాన రామేశ్వరం (రామనాథేశ్వర్), పశ్చిమాన ద్వారక (శ్రీకృష్ణ), ఉత్తరాన బదరి (బదరీనాథ్)].

      ఈ యాత్రలో ఎక్కువ భాగం తలెత్తి చూడలేనంత ఎత్తులో మహోన్నతమైన మంచు శిఖరాలు. గలగల పారుతున్న హిమనదులు. త్రోవ పొడవునా ప్రకృతి రమణీయ దృశ్యాలే. ఎంత చూసినా తనివి తీరని అందం ఈ యాత్ర ప్రత్యేకం. త్రోవ పొడవునా, ఒకవైపు మహోన్నత పర్వతాలు. ఇంకొక వైపు, ఒళ్ళు జలదరింపజేసే లోయలు. కళ్ళను కట్టిపడేసే పచ్చదనం. పాము మెలికల్లా తిరుగుతున్న రహదారుల సొబగులు. ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నా తరగని అనుభూతినిస్తాయి. ఆ అనుభూతులను మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకోవాలే తప్పించి, కెమెరా కళ్ళకు కూడా పూర్తిగా అందవవి.
         ఈ యాత్ర, యెన్నో సవాళ్లతో కూడుకొని వుంటుంది. ప్రతికూల పరిస్థితులు వుంటాయని తెలిసీ, ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంటుందని తెలిసీ, యాత్రలో అనుక్షణమెదురయ్యే సవాళ్లను తట్టుకుంటూ, యీ యాత్ర చెయ్యడానికి సంకల్పిస్తారు భక్తులు.  ఏ నిమిషంలో వాతావరణం మారిపోతుందో… కొండచరియలే విరిగి పడతాయో, కుండపోత వర్షమే కురుస్తుందో, మంచు తుఫానే ముంచుతుందో… ప్రకృతి ఏ రకమైన బీభత్సాన్ని సృష్టిస్తుందో చెప్పలేని పరిస్థితుంటుంది. అందుకని మన చేతిసంచిలో అవసరమైన అన్ని రకాల మందులు, మంచినీళ్లు, శక్తినిచ్చే ఆహార పదార్థాలు, చలికి ఆగే దుస్తులు వుంచుకోవాలి. మార్గమధ్యంలో అవరోధమేర్పడితే, ముందుకు వెనుకకు వెళ్ళలేని పరిస్థితి, చాలా గంటలు రోడ్డుమీదే వుండాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకని ముందు జాగ్రత్తలన్నీ తీసుకొని మానసికంగా సంసిద్ధమై వుండాలి.
       ఎప్పుడెప్పుడా అని యెదురుచూస్తున్న మా చార్ థామ్ ప్రయాణం (ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి) మే 29న (2024), ఫ్లైట్లో ఢిల్లీ చేరుకోవడంతో మొదలైంది. ఢిల్లీనుండి బస్సులో, రాత్రికి హరిద్వార్ చేరుకున్నాం. 30వ తేదీన, ఉదయాన్నే లేచి హరిద్వార్ లో గంగానది దర్శనం చేసుకుని, బార్కోట్ కు ప్రయాణమయ్యాం. బార్కోట్ చేరుకునే మార్గమధ్యంలో వెహికల్ పర్మిట్ తీసుకోవాలి.
31st May: బార్కోట్ -యమునోత్రి- బార్కోట్ 
       బార్కోట్ నుండి 46 కిమీ దూరంలో వున్న యమునోత్రి జన్మప్రదేశం కాళింది పర్వతం. గంగానదికి అతి పెద్ద ఉపనది. మీదకు వెళ్లడానికి, నడకకు ఆరు గంటలు, గుర్రంమీద రెండు గంటలు పడుతుంది. వాలు తక్కువగా వుండి, యెత్తుగా వుంటుంది. అందుకని నడవడం కష్టం. ఇరుకైన దారి. దానికి తోడు పోనీల వాళ్ళు, డోలీల వాళ్ళు మనల్ని తోసేస్తూ వుంటారు. ఆలయంలో ప్రధాన మూర్తి యమునా దేవి. ఆమె వాహనం తాబేలు. యమునకు ఇరుప్రక్కల గంగ, సరస్వతి వుంటారు.
          అతి ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఒక ప్రక్క మంచు పర్వతాలు.,.. ఆ మంచు కరిగి, జలమై, నదాలుగా మారి, మనకి అడుగుల దూరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిలో చెయ్యి పెడితే జిల్లుమని, వేళ్లు కొంకర్లు పోతూ ఉంటాయి. ఆ శీతల నదాలకు చేరువలోనే, వేడి పొగలను వెలువరిస్తూ,  వేడి నీటిబుగ్గలుంటాయి. ఈ ఆలయ ప్రాంతంలో కూడా రెండు వేడినీటి బుగ్గలున్నాయి. ఒకటి ఆలయం కుడివైపున ఉంటే, ఇంకొకటి ఆలయం బయట ఉన్న సూర్యదేవాలయం దగ్గర ఉష్ణకుండం పేరుతో ఉంటుంది. ఇందులో బియ్యం మూట కట్టి ఐదు నిమిషాలుంచితే ఉడికిపోతుంది. దీని ప్రక్కన యమశిల వుంటుంది. అక్కడ సంకల్పం చెప్పించుకుంటారు. (యమున సోదరుడు యముడు). సూర్యదేవుని పిల్లలే యమున, యముడు.

      యమునోత్రి దర్శనమయ్యాక, ఉత్తర కాశి చేరుకోవాలి. కాని ఆలస్యమైనందున బార్కోట్ లోనే రెండవ రాత్రి కూడా వుండవలసి వచ్చింది.
        మేమున్న హోటల్ నుండి చూస్తే, ఎంతసేపు చూసినా అలానే ఉండిపోవాలనిపిస్తుంది. అందమైన లతలతో, పువ్వులతో అల్లుకున్న పచ్చని వృక్షాలు. ఎటు చూసినా పచ్చని కొండలే! వాటిమధ్య అక్కడక్కడ హోటల్స్, కంటికింపైన వర్ణాలతో.
        హిమాలయాలలో ఆలస్యంగా సూర్యాస్తమయం అవుతుంది. స్వచ్ఛమైన నీలి రంగులో ఆకాశం. ఆ నీలి రంగును ఆక్రమిస్తూ, అస్తమిస్తున్న భానుని కిరణాలు, ఆకాశాన్ని సింధుర వర్ణంలో మెరిపిస్తూ… ఏ చిత్రకారుడో చిత్రాన్ని గీసి ఇక్కడ మర్చిపోయాడేమోనని, చూస్తూ అలా మైమరచిపోతాం.
1st June: బార్కోట్-గంగోత్రి- పిపాల్ కోటి
      వేకువనే గంగోత్రికి బస్సులో బయలుదేరాం. త్రోవలో మెడికల్ కేంపుంది. ప్రకృతి అందాలను తిలకిస్తూ, కొండల మధ్య పయనిస్తూ, అడవులను దాటుకుంటూ, మధ్యాహ్నం రెండు గంటలకు గంగోత్రి చేరుకున్నాం.
      గంగోత్రికి వెళ్లే త్రోవలో అక్కడక్కడా చిన్న చిన్న గ్రామాలు, ఆర్మీ బేస్ లు, పవర్ ప్రాజెక్టులు కనిపిస్తాయి. త్రోవ కిరువైపులా పూలతో కూడిన పొదలు, చిన్న చిన్న చెట్లు. ప్రయాణం భారమనిపించదు. పగలు ఎండ చాలా తీక్షణంగా ఉంటుంది. ప్రయాణమంతా ఘాట్ రోడ్డే కాబట్టి, బస్సులో ఏసీ వెయ్యరు. లోపల మనకి కాస్త వేడిగా ఉన్నా, క్రిందకి దిగేటప్పటికి చల్లగా ఉంటుంది. వెళ్తున్న కొద్దీ, ఉష్ణోగ్రతలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది మనకు.
     గంగోత్రిలో మన యాత్రా రిజిస్ట్రేషన్ ను చెక్ చేసి, ముందుకు పంపిస్తారు. వెహికల్ పార్క్ చేసి, కొంత దూరం నడవాల్సింటుంది. వీల్ చైర్స్ వుంటాయి. త్రోవలో షాపులున్నాయి.
         గంగోత్రి ఆలయం పాలరాతి నిర్మితం. గంగామాతను ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. కరుణతో నిండిన ఆ కళ్ళు, మనపై ఆశీస్సుల వర్షాన్ని కురిపిస్తాయి. ఇక్కడ గంగను భగీరథి అంటారు. దేవప్రయాగలో, అలకానందతో కలిసాక గంగ అవుతుంది. అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే ఆలయం తెరిచివుంటుంది. ఆ తర్వాత, హర్షిల్ పట్టణానికి దగ్గర ముఖ్బా గ్రామంలో, గంగామాత పూజలందుకుంటుంది. ఆలయంలో అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మీదేవి, ఆదిశంకర, భగీరథ విగ్రహాలున్నాయి.

        ఆలయం బయట శివాలయం, హనుమాన్ ఆలయం వున్నాయి. మెట్లు దిగి క్రిందకు వెళ్తే, భగీరథ శిల వుంది. ఈ శిల నుండి నీళ్ళు వస్తూనేవున్నాయి. ఇక్కడ భగీరథుని విగ్రహం కూడా వుంది. కొంచెం ముందుకెళితే, పరవళ్ళు తొక్కుతూ, ధవళ వర్ణంలో, ఉదృతంగా గంగ. ఉరవడి శబ్దం వింటూనే మనసు పులకించిపోతుంది. గంగా స్నానం చేయాలని వున్నా, స్నానం మాట దేవుడెరుగు, గంగను ముట్టుకుంటేనే వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. ఇక్కడికి 19 కిలోమీటర్ల దూరంలో, గంగానది పుట్టిన స్థలం గోముఖం వుంటుంది. అక్కడికి వెళ్లడానికి రోజుకి 150 టికెట్లు మాత్రమే యిస్తారు. ట్రెక్కింగ్ చాలా కష్టం.
     గంగా ప్రవాహపు హోరుమంటున్న శబ్దం వింటుంటే మనసు పరవశించిపోతుంది. ఆ తల్లి పరవళ్ళను తిలకిస్తుంటే తనువు పులకాంకితమౌతుంది. వేళ్ళు కొంకర్లు పోతున్నా, గంగమ్మ తల్లిని ముట్టుకోకుండా ఉండలేకపోతున్నాం. అంతటి శీతల వాతావరణంలో కూడా అక్కడ నుండి కదలాలనిపించడం లేదు. గంగోత్రి నుండి కదలాలని లేకపోయినా, మారే శీతోష్ణ పరిస్థితులను జ్ఞప్తి పెట్టుకొని బలవంతంగా బయలుదేరాం. ఎంత తొందరగా, అక్కడినుండి బయటపడితే అంత మంచిది.
            కొండ చరియలు విరిగిపడినా, మంచు తుఫాను కురిసినా, కొండల మధ్య చిక్కుకుపోతాం. ఎటూ వెళ్లేందుకు వీలుండదు. బార్కోట్ నుండి బయలుదేరినప్పుడు వేడిగా వుంటే… ప్రయాణం సాగేకొద్దీ చల్లగా వుంటుంది. మధ్యాహ్నం తర్వాత ఆ చల్లదనం ఎక్కువవుతుంది. మార్గమధ్యంలో వుండిపోవాల్సి వస్తే, చలికి గడ్డకట్టుకుపోతాం. అందుకని మనతోపాటు అత్యవసర మందులు, బలాన్ని, శక్తినిచ్చే ఆహార పదార్థాలు, స్వెటర్, షాల్ వంటి వాటిని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎప్పుడు యెక్కడ, యే అవసరం పడుతుందో చెప్పలేం. ఈ రాత్రికి మేం ఉత్తరకాశి చేరుకోవాలి. కాని సమయాభావం వలన మార్గమధ్యంలో, పిపాల్ కోటిలో బస చెయ్యాల్సి వచ్చింది.
2-6-24: పిపాల్ కోటి – ఉత్తరకాశి – సీతాపూర్
ఉదయాన్నే పిపాల్ కోటి నుండి బయలుదేరి, ఉత్తర కాశీ చేరుకొని, అక్కడ కాశీ విశ్వనాధేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని, రాత్రికి సీతాపూర్ చేరుకున్నాం.
3-6-24: సీతాపూర్ – గౌరీకుండ్ – కేదారనాథ్
ఉదయం 3 గంటలకే సీతాపూర్ నుండి బయలుదేరి గౌరీకుండ్ మీదుగా కేదారనాథ్ చేరుకొని, కేదారనాథుని దర్శించుకుని, రాత్రికి కేదార్నాథ్లో ఉండి, మరుచటి రోజు గౌరీకుండ్ సీతాపూర్, ఋషికేశ్ ల మీదుగా జోషిమఠ్ చేరుకున్నాం.
          ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవదైన కేదారనాథ్, ఉత్తరాఖండ్ లోని, రుద్రప్రయాగ జిల్లాలో, సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో, గర్వాల్ కొండల పైభాగంలో వుంటుంది. ఈ గుడిని యెప్పుడు, యెవరు కట్టించారో చారిత్రక ఆధారాలైతే లేవు గాని, ఆదిశంకరాచార్యులు వారు నిర్మించినట్లు విశ్వసిస్తారు. ఇక్కడ కేదారేశ్వరుడు స్వయంభువు.
            పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి విముక్తి కోసం, మహాశివుని వెతుకుతూ హిమాలయాలకు వెళ్లిన పాండవులకు దర్శనమివ్వడం యిష్టం లేక, వృషభరూపంలో శివుడు మంచు లోపలికి చొచ్చుకుపోయాడని, అది తెలిసి పాండవులు వృషభం (శివుని) పృష్టభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు కథనం. పృష్టభాగం కేదారనాథ్లో వుంటే,  మంచులో కూరుకుపోయిన తలభాగం నేపాల్ లోని, ఖాట్మండులో పశుపతినాధునిగా పూజలందుకుంటున్నట్టు భక్తుల విశ్వాసం.      

           గౌరీకుండ్ నుండి రోడ్డు మార్గం లేదు. కొండల మధ్య ప్రయాణించవలసి వుంటుంది. గౌరీకుండ్ చేరుకోవడానికి వున్న మార్గాల్లో, మేం సీతాపూర్ నుండి చేరుకున్నాం.
               కేదార్ నాథ్ కు  హెలికాప్టర్ సదుపాయమున్నా టికెట్లు దొరకకపోవచ్చు. దొరికినా, మనం వెళ్లే సమయానికి వాతావరణం సరిగ్గా లేకపోతే, హెలికాప్టర్ క్యాన్సిల్ చేస్తారు. ఒక్కోసారి, మరో ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవుతామనగా కూడా, హఠాత్తుగా వాతావరణం మారిపోయి, హెలికాప్టర్లు వెనక్కి వచ్చేస్తాయి. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
       ప్రీపెయిడ్ పోనీ స్టేషన్ నుండి పోనీలుంటాయి. అక్కడ ఫిక్స్డ్ రేటు ఉంటుంది. నలుగురు మనుషులు మోసే డోలి, ఒక్క మనిషి వీపున మోసే పిట్టూ… వీటికి ప్రీ పెయిడ్ స్టేషన్ ఉండదు. డిమాండ్ బట్టి రేటు మారుతుంది.
       గౌరీకుండ్ నుండి కేదార్ నాథ్ కు నడిచి వెళ్లవచ్చు. (21 కి.మీ.) ప్రయాణంలో చలిని తట్టుకునే దుస్తులు వేసుకొని, సన్ స్క్రీన్ లోషన్, క్యాప్, రెయిన్ కోట్, ఎమర్జెన్సీ మందులు తప్పనిసరిగా వెంట వుంచుకోవాలి. త్రోవంతా రాతి పలకలతో వేసిన మెట్లుంటే, కొన్ని దగ్గర్ల మెట్లు లేకుండానే వుంటుంది. కొండల మధ్య నుండి, కొండలమీద నుండి ప్రయాణముంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి. త్రోవలో అక్కడక్కడా జలపాతాలు.
        వీక్షించాలేగాని, త్రోవంతా కళ్ళను తిప్పుకోనివ్వని ప్రకృతి సోయగాలు. గలగల కదిలే జలపాతాలు, మన పాదాలనంటి ప్రవహిస్తాయి. లోయల్లో నదులు ప్రవహిస్తూ, ముచ్చట గొలుపుతూ ఉంటాయి. అధిరోహించే కొండలు అనంతంగా సాగుతూనే ఉంటాయి. చల్లనిగాలి ముఖానికి స్వాంతన చేకూర్చుతుంటే, ప్రకృతి సోయగాలు మనసును మైమరిపిస్తుంటే, కాళ్లు వాటంత అవే ముందుకు సాగుతాయి.
       హఠాత్తుగా క్లౌడ్ బరస్టై, జలపాతాలు మార్గాన్ని ముంచెత్తే సందర్భాలు, కొండ చరియలు విరిగిపడి, మార్గం మూసుకుపోయే పరిస్థితులు, మంచు తుఫానులు, విపరీతమైన వర్షాలు… యిటువంటి ప్రతికూల పరిస్థితులు యెన్నో ఎదురుకావచ్చు. అటువంటి సందర్భాలలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తారు. మన ప్రయాణం యెక్కడైనా ఆగిపోవచ్చు. మానసికంగా సిద్ధపడాలి.
           కేదారేశ్వరుని నిజరూప దర్శనం మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. అప్పుడు స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు. 12-2pm మధ్యలో ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత బంగారు తొడుగుతోనే మనకు స్వామి దర్శనమిస్తారు. ఆలయం ముందు విశాలమైన ప్రాంగణం. ఎదురుగా నందీశ్వరుడు. అక్కడ నుండి చూస్తే, చుట్టూ పచ్చని కొండలతో, మంచు శిఖరాలతో, మంచు కరుగుతుంటే జాలువారే జలపాతాలతో, ప్రకృతి ఆహ్లాదకరంగా వుంటుంది. నీలి రంగులో స్వచ్ఛంగా ఆకాశం. ఆకాశాన్ని చీల్చుకుంటూ తన ప్రతాపాన్ని చూపించే సూర్యుడు. మేఘాలు లేకపోతే, సూర్యకిరణాల తీక్షణత చాలా ఎక్కువగా ఉంటుంది.
           దర్శనమెప్పుడవుతుందా అన్న ఆతృత ఒకవైపు. ఆ పరిసరాలలోనే ఉండిపోవాలనే కాంక్ష ఇంకొక వైపు. భలే చిత్రంగా ఉంటుంది ఆ అనుభూతి. దర్శనమయ్యాక, అక్కడి ప్రకృతిలో లీనమైపోతాం. కదలాలనిపించదు. గాని, మరుక్షణం ఏమౌతుందో ఊహించలేం.
       హఠాత్తుగా మేఘాల విష్పోటనం సంభవించవచ్చు. నదులు పొంగి పొరలవచ్చు కొండ చరియలు విరిగిపడి దారులు మూసుకుపోవచ్చు. మరల మార్గం సుగమమావటానికి ఎంత కాలం పడుతుందో తెలియదు. అందుకని, దర్శనం చేసుకున్నాక, ఆ అనుభూతులను మూట కట్టుకుంటూ, క్రిందకు చేరుకోవడం ఉత్తమం.
         గర్భగుడి ముందున్న మంటపంలో భీముడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు, ద్రౌపది, లక్ష్మీనారాయణుల విగ్రహాలు చిన్న చిన్న గూటిలో వున్నట్టుంటాయి. ఇక్కడ శివుడు లింగాకారంలో కాకుండా, అసమానంగా ఉన్న పెద్ద రాయి ఆకారంలో వుంటారు. పురాణ కథనం ప్రకారం, వృషభపు వెనుక భాగమది. కేదారేశ్వరుని దర్శనం చేసుకుని బయటికొస్తే, అక్కడొక చిన్న ఆలయముంటుంది. అదే అసలైన కేదారేశ్వర ఆలయమంటారు.
        కేదారేశ్వర ఆలయం వెనక భీమశిల వుంటుంది.  2013లో వచ్చిన వరదల్లో కొట్టుకొని వచ్చి, ఆలయానికి వెనక ఉండి వరద ప్రవాహాన్ని రెండు పాయలుగా చీల్చి, ఆలయాన్ని కాపాడిందని… అలాగని అది ఆలయాన్ని కాపాడేంత పెద్ద శిలైతే కాదు. ఆ కొండల మీద అంత పెద్ద శిలలున్న ఆనవాళ్లేమీ కానరాలేదు. అంతవరకు ప్రవాహంతో పాటు కొట్టుకొని వచ్చి, సరిగ్గా ఆలయం వెనకే కాపు కాసినట్టు యెలా వుండిపోయిందన్నది ఆశ్చర్యకరమే?
       ఆలయం వెనక కొండమీద క్షేత్రపాలకుని ఆలయం. దగ్గరలో ఆదిశంకరాచార్యుల వారి ఆలయం కూడా వుంటుంది. ఇక్కడే వారు శివసాన్నిధ్యం చెందారు.
       ఈ చార్ ధామ్ యాత్రలో ప్రయాణమెక్కువగా, దర్శన సమయం తక్కువగా వుంటుంది. అంతా ఘాట్ రోడ్ ప్రయాణమే.  పైకి వెళుతున్న కొద్ది మౌంటైన్ సిక్ నెస్ వచ్చే అవకాశమెక్కువ.
      ప్రయాణమెంత కష్టమనిపించినా, కేదారనాథుని దర్శనం కాగానే, ప్రయాణ బడలిక మాయమై, తనువు పులకితమౌతుంది. దేవదేవుని సన్నిధిలోనే వుండిపోవాలనిపిస్తుంది. ఎన్ని జన్మల భాగ్యమో, సశరీరంగా యీ పవిత్రభూమిపై కాలూనామని తలుచుకోగానే, మనసు అలౌకిక ఆనందాన్ని పొందుతుంది. ఉద్విగ్నతకూ లోనవుతుంది. ఆ మధురక్షణాలను వర్ణించలేం. అనుభవించగలమే తప్ప. అనంతమైన ఆ హిమవత్పర్వతాల మధ్య, ఆలయ సన్నిధిలో నిల్చున్నామన్న భావనే మధురం. ఆ అనుభూతులనన్నిటినీ మదిలో పదిల పరుచుకొని, ఇంకొకసారి దర్శించుకునే అవకాశమొస్తే బాగుండునని, శివుని ప్రార్ధించుకుంటూ వెనుదిరిగాం.
4-6-24: కేదారనాథ్- గౌరీకుండ్ – సీతాపూర్ – ఋషికేశ్ – జోషిమఠ్
రుషికేశ్ (హృషికేశ్) యోగాకు పుట్టినిల్లుగా కొలవబడుతుంది. ఎన్నో ఆశ్రమాలు ఇక్కడున్నాయి. 2015లో, రుషికేశ్, హరిద్వార్ నగరాలు దేశ వారసత్వసంపదగా పేర్కొనబడ్డాయి. ఇక్కడే గంగానదిపై రామ్ జూలా, లక్ష్మణ జూలా వంతెనలున్నాయి. ఇది దాటాక టెహ్రి డ్యాం వస్తుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్. ఆ డ్యామ్ చుట్టూ రెండు మూడు గంటలు పైనే తిరిగినట్టున్నాం. డ్యాముని దాటేసామని అనుకునేలోగా మరలా కనిపించేది.
5-6-24: జోషిమఠ్ – బదరీనాథ్
     ఉత్తరాఖండ్, ఛమోలి జిల్లాలో జోషిమఠ్ (జ్యోతిర్ మఠ్) ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన పీఠాలలో (మిగిలినవి- శృంగేరి, పూరి, ద్వారక, కంచి) ఒకటి. ఈ మఠము అధర్వణ వేదానికి ప్రతీక. 108 దివ్యదేశాలలో ఒకటి. ఆదిశంకరాచార్యులు వారు ప్రతిష్టించిన నరసింహస్వామి యిక్కడ ఆలయంలో కొలువు తీరారు. అమ్మవారు పరిమళవల్లి. ఇక్కడ నరసింహ స్వామి వారి ఎడమ చేయి సన్నంగా ఉంటుంది. ఆ చెయ్యి పడిపోయిన నాడు బదరీనాథ్ ఆలయం మాయమైతుందని, సాలగ్రామ ఆకారంలో, యిక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవిష్య బద్రిలో ప్రత్యక్షమవుతుందని యిక్కడి వారి నమ్మకం. బదరి ఆలయాన్ని ఆరునెలలు మూసి వేసినప్పుడు, బదరీనాథుడు యిక్కడికి వచ్చి పూజలందుకుంటారు. ఈ ఆలయం వెనక దశావతారాలు, శివ, అమ్మవార్ల ఆలయాలున్నాయి.

      మఠంలో బదరి నారాయణ, రాజరాజేశ్వరి దేవి ఆలయాలు, ఆదిశంకరాచార్యులు వారి ప్రతిమ యిక్కడ నిత్యం పూజలందుకుంటాయి. శంకరాచార్యుల వారు వాడిన సామాన్లు, తపస్సు చేసిన గుహ కూడా యిక్కడ చూడవచ్చు.
       ఇక్కడ ఆర్మీ మిలటరీ కంటోన్మెంట్ (ఘర్వాల్ రైఫిల్స్ వారి స్థావరం) కూడా యిక్కడే వుంది.
     ఇక్కడికి 10 కి.మీ. దూరంలో తపోవన్ వుంది. ఇక్కడ వేడి నీటి బుగ్గలుంటాయి. ఇక్కడి నుండి మనం ధవళగంగను చూడవచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఔలి రోప్ వే, గారి భవాని ఆలయాలున్నాయి.
        ఉత్తరాఖండ్లో 2021 లో వచ్చిన వరదల తరువాత, ఇక్కడి నేల కొద్దిగా కృంగిపోయి, యిల్లులు బీటలు వారి ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. ఇక్కడి నుండే బదరీనాథ్ యాత్ర మొదలవుతుంది. జోషిమట్ దాటాక విష్ణు ప్రయాగ్ హైడల్ ప్రాజెక్ట్, తపోవన్ విష్ణుజాడ్ హైడెల్ ప్రోజెక్ట్ లు మార్గమధ్యంలో కనిపించాయి.
బదరీనాథ్:   సాయంకాలనికి బద్రీనాథ్ చేరుకుని, దర్శనం చేసుకున్నాం.   
        ఉత్తరాఖండ్, ఛమోలి జిల్లాలో, అలకానంద నదీతీరంలో, ఘర్వాల్ పర్వతశ్రేణుల్లో, 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన, ప్రముఖ వైష్ణవ ఆలయం, బదరీనాథ్. ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి వేదాలలో, భాగవతంలో, స్కంద పురాణంలో, పద్మ పురాణంలో  వివరించబడింది. బదరికా (రేగు) వనం వలన యిక్కడ స్వామికి బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని ఒక కథనం. అశోకుని కాలంలో బౌద్ధ క్షేత్రంగా, తర్వాత ఆదిశంకరాచార్యులచే హిందూ క్షేత్రంగా పునరుద్ధరించబడిందన్న చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయం వెనుక ఉన్న రెండు కొండలను నరనారాయణులంటారు. ఈ స్థలానికి వున్న ప్రాముఖ్యతను బట్టి ఇక్కడ చాలా మఠాలున్నాయి.
      దక్షిణాదిలో ఉన్నట్లు ఉత్తరాదిలో ఆలయాలు పెద్దగా వుండవు. శిల్పకళా నైపుణ్యం కూడా యెక్కువగా కనిపించదు. ఎత్తైన మెట్లెక్కి, ప్రవేశద్వారం, మంటపం దాటి, ఆలయం లోపలికి ప్రవేశిస్తే, ఒక అడుగు ప్రమాణంలో, నల్లరాతిలో ఒదిగి, రెండు చేతుల్లో శంఖు చక్రాలతో, మరో రెండు చేతులు యోగముద్రలో, పద్మాసనం వేసుకొని, బదరీనాథుడు, బదరీ వృక్షం క్రింద దర్శనమిస్తాడు.  సంవత్సరానికి ఆరునెలలు మాత్రమే యిక్కడ కొలువై, తర్వాత జోషిమఠ్ కు చేరుకుంటాడు. ఆలయంలో పైకప్పు బంగారు తాపడంతో, స్తంభాలు, గోడలు వివిధ రకాల డిజైన్లతో అలరారుతున్నాయి. ఆలయంలోపల కుబేర, నారద, ఉద్ధవ, నరనారాయణుల మూర్తులుంటే, ఆలయం చుట్టూ  లక్ష్మి, గరుడ, నవదుర్గ, లక్ష్మీనరసింహ, ఆదిశంకరాచార్య, ఘంటకర్ణల ఉపాలయాలు వున్నాయి. మేము వెళ్లిన సమయానికి చాలా పెద్ద లైన్లు వున్నాయి. సెక్యూరిటీ బాగుంది. మొబైల్ ఫోన్స్ ఎలౌ చేశారు. చక్కగా ఫోటోలు తీసుకున్నాం. ఇక్కడ పచ్చి శనగపప్పు ప్రసాదంగా యిస్తున్నారు.

      ఆలయానికి సమీపంలో, కొద్దిగా క్రిందకు దిగితే, అలకానంద నదిని ఆనుకొని, తప్తకుండ్ వేడినీటి బుగ్గలున్నాయి (నారద కుండ్, సూర్య కుండ్). ప్రక్కనే వున్న అలకానంద నదిలో నీళ్లు మంచులా చల్లగా వుంటే, యిక్కడి నీళ్లు పొగలు చిమ్ముతున్నాయి. స్త్రీలు స్నానాలు చేసేందుకు వీలుగా, ఒక దాని చుట్టూ గదిలా కట్టారు. అది చిన్నగా వుండడంతో, అక్కడ రద్దీగా వుంది. మగవారు వేరే బుగ్గల్లో స్నానాలు చేసి, పిండ ప్రదానం చేస్తున్నారు. ఈ వైపు తీరమంతా సిమెంటుతో గచ్చు చేసి వుండడంతో, పితృ కార్యాలు చేసేవాళ్లకి సులభంగా వుంది.
       ఆలయం చుట్టూ చిన్న చిన్న వీధులు, అందులోనే దుకాణాలు, భోజనాలయాలు, చిన్న చిన్న యిల్లులున్నాయి. ఈ ప్రదేశం సంవత్సరానికి ఆరునెలలు మూసి వుంటుంది కాబట్టి, ఇళ్ల నిర్మాణాల మీద పెద్దగా ఖర్చు పెట్టరు. ఆలయానికి 300- 400 మీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు, హోటళ్లు, లాడ్జిలు, దుకాణాలు, మఠాలు చాలా వున్నాయి.
6-6-24: బదరీనాథ్ – హరిద్వార్ వయా ఋషికేశ్
      ఉదయాన్నే మరల దర్శనం చేసుకుని తప్తకుండ్ నీటిబుగ్గలను చూసాం. మాతో వచ్చిన కొంతమంది పితృకార్యాలు చేసుకున్నారు. బద్రీనాథ్లో మేము జీయర్ స్వామి మఠంలో వున్నాం. వసతిసౌకర్యం బాగుంది. అక్కడున్న సత్రంలో ఉచిత భోజనసదుపాయం కూడా వుంది. మధ్యాహ్న భోజనాలయ్యాక బయలుదేరి, రాత్రికి హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్ వెళ్లే త్రోవలో, అలకానంద నది మధ్యలో వుండే ధారీదేవి ఆలయాన్ని దర్శించుకున్నాం. అమ్మవారి ముఖం మాత్రమే పూజలందుకుంటుందిక్కడ. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. చార్ థామ్ ల రక్షకురాలిగా పరిగణించబడుతుంది ఈ అమ్మవారు.
7-6-24: హరిద్వార్  
        అమృతభాండాన్ని గరుత్మంతుడు తీసుకొని వచ్చే సమయంలో, అమృతం చిందిన నాలుగు ప్రదేశాలలో, హరిద్వార్ ఒకటని పురాణ కథనం. (ప్రయాగ్, ఉజ్జయని, నాసిక్- మిగిలిన మూడు క్షేత్రాలు). ఈరోజు హరిద్వార్ లోనే బస. ఇక్కడ కూడా చాలా ఆశ్రమాలున్నాయి. వసతి సదుపాయం బాగుంది. ముందుగా దక్షమహాదేవ్ ఆలయాన్ని దర్శించుకున్నాం. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం, సతి దేవి యజ్ఞగుండంలో దూకిన ప్రదేశమిది. ఆ తర్వాత బిల్వ పర్వతం మీదున్న వున్న మానసా దేవి ఆలయాన్ని దర్శించుకున్నాం. పైకి వెళ్లడానికి, మెట్ల మార్గంతో పాటు, రోప్ వే కూడా ఉంది. కొద్ది దూరంలో నీలపర్వత శిఖరంపై చండీదేవి ఆలయముంటుంది. ఇదొక శక్తిపీఠం. సమయం లేక దర్శించుకోలేకపోయాం.

ఆ రాత్రి గంగాహారతి చూసాం.  వారణాసిలో, గంగాహారతి చూశాక, యిక్కడ గొప్పగా అనిపించలేదు. కాని విపరీతమైన జన సందోహం.  
8-6-24: హరిద్వార్- ఢిల్లీ – విశాఖపట్నం
ఉదయాన్నే బస్సులో ఢిల్లీ చేరుకొని అక్కడి నుండి ఫ్లైట్లో విశాఖపట్నం చేరుకున్నాం.
    ప్రకృతి అందాల నడుమ కొలువైన ఈ చార్ థామ్ లను సందర్శించుకుని, ఆ లౌకిక ఆనందాన్ననుభవించి, జీవితకాలానికి సరిపడా మధురానుభూతులను మూట కట్టుకొని, సంతృప్తితో, స్వగృహాలకు చేరుకున్నాం.

September 21, 2025 10 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us