మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

వన ప్రాశస్త్యం

by T Venkateshwara Raju April 8, 2025
written by T Venkateshwara Raju

వేదాలు గద్దించాయి
ఇతిహాసాలు ప్రశాంతంగా చెప్పాయి
పురాణాలు ప్రవచించాయి
గ్రంథాలు ఘోషించాయి
వనాలు
మన ప్రాణాలని
శాస్త్రం చెప్పింది
సామాన్యుడూ చెప్పాడు
ప్రకృతి ప్రకోపాలకు
విరుగుడు అడవులేనని

విద్యాభ్యాసంనుండి
వానప్రస్థం వరకు
పశుపాలననుండి
పరిపాలన వరకు
సంస్కృతి చెప్పింది
సాంప్రదాయం నిలబెట్టింది

ప్రజాస్వామ్యంలో
ప్రజాపాలనలో
మాటలు కోటలు దాటుతున్నాయి
చేతలు శాసనాలకే పరిమితమౌతున్నాయి

హరితహారమంటారు
హడావిడి చేసేస్తుంటారు
వేలకోట్ల వాయినాలిస్తారు
వనాలశాతం పెరగలేదంటారు

భూపందేరానికి
భూకామందులమంటారు భూకామాంధులైపోతుంటారు
పచ్చని అడవుల్లో
పశుపక్ష్యాదులు లేవంటారు
బుల్డోజర్లతో
భస్మీపటలం చేస్తుంటారు

అరణ్యాలు
ఆరోగ్య ప్రదాయిణులు
పెరగనివ్వండి
ప్రభుత్వస్థలాలంటూ
ప్రేలాపనలు మానండి
జీవవైవిధ్యాన్ని
అవనిపై మననీయండి
వన ప్రాశస్త్యాన్ని గుర్తించండి
ఘన వారసత్వాన్ని నిలబెట్టండి

April 8, 2025 22 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తప్పిపోయిన చోటవెతుకులాట-‘మళ్లీ మనిషి లోకి’

by Bellamkonda Sampathkumar April 7, 2025
written by Bellamkonda Sampathkumar

ఒక సహించని తనం, సహనం లేనితొందరలు, మనిషి మీద మనిషికి అకారణంగా ఏర్పడుతున్న ద్వేషం, అసూయ, స్వార్థంసామాజిక వికారాలకు కారణమవుతున్నాయి. మనిషిని మానవత్వాన్ని తప్పించిన,మనిషిలో మనిషి లేనిఅనేక పరిస్థితులనేపథ్యంనుంచి, కవి తన పరిసరాల నుంచి మొదలై రాసినకవితాగుచ్చం‘మళ్లీ మనిషి లోకి’ కవితా సంపుటి. మనిషిలో మనిషి ప్రవహించటం లేదు. మనిషిలో మనిషితోటి వారినికనీసం మెచ్చే పరిస్థితి లేదు.మనిషి తప్పిపోయిన చోటు నుండి.దూరమైనదగ్గరితనంలోంచి మళ్ళీమనిషి మనిషి లోకి రావాలనికలల సంపుటిని వెలువరించాడు కవి. ఆదిలాబాద్ ప్రజల గొంతుక.  – ”పచ్చని కోరికలతో/పంటనే ప్రపంచ మనుకొని/లోకమే తన వాళ్లనుకొని/బతుకుపయనమై పోతున్నప్పుడు/ఆకుపచ్చని కలల రాజు మట్టి గొంతుక కవిఉదారి నారాయణ.

మళ్లీ మనిషి లోకి ఉదారి నారాయణ కవితా సంపుటిలో మొత్తంయాభై ఎనిమిది కవితలు ఉన్నాయి.ప్రతి కవిత దేనికదే వస్తు శిల్పాలతో అలరారుతుంది.కవితా సంపుటిలో ప్రజల దుఃఖముంది. భావోద్వేగాలు ఉన్నాయి.మార్పు కోసం పడుతున్న తపన ఉన్నది. ప్రబోధం ఉన్నది. సందేశం ఉన్నది. ఇన్నిటి వ్యాఖ్యానమే మళ్ళీ మనిషి లోకి. ఇక్కడ రెండు పార్శ్వాలు ఉన్నాయి.ఒకటవ పార్శ్వంలోఎక్కడ గాయమవుతున్నదో అక్కడే మొదలవుతున్న కవికనిపిస్తాడు. రెండవ పార్శ్వంలోఒక భిన్నత్వము నుండి మళ్లీ మనిషి లోకిఒకటిగా చేర్చబడటం. పుస్తకం టైటిల్ని చూస్తే మళ్ళీ మనిషి లోకి అంటే ఏమిటి అని ప్రశ్న ఉదయిస్తుంది. కానీకవితా సంపుటి చదివిన తర్వాతకవి వేదనలన్నీ అర్థమవుతాయి.
మనిషిలోఅనేక శత్రువులు వచ్చి పడ్డారు.ఇవాళమనిషి మనిషిగా లేడు.మనిషిలో నుండిమనిషి తప్పిపోయాడు. మనిషితనాన్ని గుర్తించి మళ్లీ ప్రసరించమని కవికోరుకుంటున్నాడు. కవిత్వానికి తగినట్టుగా సంపుటి పై గల ముఖచిత్రం అంత మార్మికతను కలిగి ఉన్నది.మళ్లీ మనిషి లోకి వెళ్లే ముందు ఒక ప్రాథమిక ప్రశ్న – నేను ఎవరిని అని ప్రశ్నించుకోవటం.నేను అని పలకడంలో ఏక వచనం సూచిస్తుంది కానీ, నాలో నేనే లేనప్పుడు నేను అనే అస్తిత్వానికి అర్థం ఏమి ఉంటుంది? నేను అనబడే మనిషిలో అనేక బాధలు ఉన్నాయి,అపజయాలున్నాయి, గాయాలు ఉన్నాయి, చెప్పలేనన్ని అగాధాలు ఉన్నాయి. గాథలు ఉన్నాయి.నేనిలా ఒక్కడినే ఉండాలి, బాధలతోనే ఉండాలి అని ఎవరనుకుంటారు? ఇవాళ సగటు మనిషి ఒంటరి అయిన తర్వాత వేధిస్తున్న ప్రశ్నలు ఎన్నో కవినీ వేధించాయి. సామాన్యులను చుట్టుముట్టుకున్న అనేక సమస్యల పొరలను ఒకటి ఒకటిగా వలిచి చూపిస్తున్న ప్రయత్నమే ఈ కవితా సంపుటి.బాధలకు కన్నీళ్ళకు కారణమైన వాళ్లను చూపిస్తూ మనిషి కమ్మని సందేశం ఇస్తున్నాడు. దురాక్రమణ స్వభావం, ఆధిపత్య భావన, అసూయ ఒకరిని కూలదోయాలనే కుట్రపూరితమైన ఉద్దేశాలు, తోసుకొని ముందుకు పోవాలని కుటిలం మొదలైనవన్నీమనిషిని మనిషి నుంచి తప్పిస్తున్నాయి.

ఎవరి మనసులు వీళ్లు అనే కవితలో కవిపక్షం‘గుండుసూది నుంచి రాకెట్ దాకా / నెత్తుటి ముద్దలైనోళ్ళు/కంపెనీ లేబుళ్ల కిందజిగురుపూతైనోళ్లు / ఎక్కడికి వీళ్ళ పయనం/వాళ్ల బాధలను తుడిచే గుండెల వైపు/ వాళ్లు మొలకెత్తిన మట్టి వైపు /వాళ్ల మనుషులు ఉండే దారి వైపు ‘ప్రజల వైపు. నమ్ముకున్న శ్రమ, ఫలించినపుడు వలసపోయి బతుకుతున్న బాధలో కవి వెతుకులాట ఆదిలాబాధ ప్రజలనిషానీ చిత్రం.ఆదిలాబాద్ గుర్తులను బాల్యాన్ని నెమరు వేసుకున్నాడు. జీవితంతో సంభాషణ, చెట్టుతో జ్ఞాపకాలు జ్ఞాపకాలైన సంభాషణ,అవి ఎంతటివోచిత్రిక చేస్తూ ‘ నేను మనసుతో మాట్లాడాలనుకున్నప్పుడు / ఈ చెట్టు నీడనే చేరుకుంటాను /చెట్టుతో మాట్లాడుతానని అంటాడు కవి. అట్లా మాట్లాడితే చెట్టు వింటుంది. కవిత్వం అంటే మనిషే. ”కవిత్వం మరేమీ కాదు కాలమే.హృదయం తోలుచుకొని వచ్చే వేడి వేడి అక్షరాలపనితనం. అక్షరాల అల్లిక అని చెబుతూడా. నందిని సిధారెడ్డి మొత్తం మీద జీవితం వాసన రావాలే అంటారు. కాల సందర్భాన్ని, కవిత్వాన్ని, అట్లాసంపుటిలో రూపు కట్టించాడు కవి.మనిషికి మనిషి తనానికిదగ్గరై మళ్ళీ మనిషి లోకి -సంపుటిని అందించాడు ఉదారి నారాయణ. ఆయనప్రజలను ప్రేమించడం వలననే దుఃఖాన్ని అర్థం చేసుకున్నాడు. ప్రజలలో తాను ఒకడై కవిత్వం రాశాడు.సింగల్ చాయ్, ఒక డబల్ రొట్టెతో ఆకలిని చల్లబరుచుకునే అతి సామాన్యులలో సామాన్యుడైతే తప్ప ప్రజల హృదయాలలోకి తొంగి చూడలేరు. అట్లాంటి సామాన్యులకు ధనస్వామ్యులలో తుపాతులు ఏం తెలుస్తాయి? “మీ రియల్ దందాలకు ఆల్ ఇండియా కుట్రదారులకు నేను అడ్డు రాను/ మా కాందానంతా గిదే పని చేసి/ గీన్నేఇంతఖాల్ అయ్యిండ్లు /మీ అందరి భరోసా తోనే /బతుకు డకల్ బండిని దొబ్బుక స్తున్నా / గీ మట్టిలోనే పుట్టినోన్ని /గీ మట్టిలోనే పదిలమయ్యేటోన్ని /నన్ను దొబ్బెయ్యకుండ్లి /నన్ను గీడ్నుంచి  గెదమకుండ్లి / నా బతుకును కూలగొట్టకుండ్లి “అంత స్పష్టంగా చెప్పిన కవి ఉదారి నారాయణ. ఇది ధిక్కారం. కవి సున్నిత మనస్కుడు కనుక సెన్సిటివిటీని తీసుకుంటూనే ఖచ్చితత్వాన్ని ప్రకటించాడు.నతన వెంట పాఠకులను తీసుకువెళ్లడానికి నిలిపి ఆలోచింప చేయటానికి ప్రజలపై సానుభూతిని కలిగించటానికితగిన భావవ్యక్తీకరణను భాషలో పొందుపరిచాడు.
మానవత్వమే గెలుస్తుందని చెప్పటానికి కరోనా వైరస్ వింత పోకడలను కవిత్వీకరించటము ఒక దాఖలా.ఒక అప్పటి కాలంలో ప్లేగు ప్రబలి ప్రజా జీవితాలను అతలాకుతలం చేసింది. ఆ అనుభవాలు మనముందుపై తరాల వాళ్లకు ఉంది.అప్పటి కొన్ని జాగ్రత్తలు , అందులో నుండి బయటపడేకొన్ని వ్యూహాలుకొంతవరకు అందినప్పటికీ, కరోనామహమ్మారికొత్త రకం గా వచ్చింది.ఇట్లా కరోనాపీడించటాన్ని అనుభవించాం.ఇక్కడఎప్పటికైనా మానవత్వమే గెలుస్తుందని ఒక ధీమానికవి వెల్లడించిన తీరుఆశాజనకమైంది.ఈ కరోనాకు కులం లేదు మతం లేదు ఏ వివక్షత లేదు కానీ అన్ని వివక్షతలు ఉన్న మనిషికి సోకింది.ఎప్పటికైనా ఆ మనిషి లోకి తొంగి చూసే కవిత నేల దిగిన నెలవంకలు. కరోనా వైరస్ తో మరణించిన హిందువులకు ముస్లిం సోదరులు అంత్యక్రియలు చేసిన సందర్భాన్ని’శరీరాన్ని పాయలుగా చీల్చుకొని / జీవజలాన్నిచ్చే నది లాంటివాడని…గుర్తుంచుకో “ఇది చారిత్రకసందర్భంగా కవి గుర్తు చేశాడు.
మన పరిసరాలనుమనలను ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోకపోతే మనం ఎట్లా ఉండలేమో మన మెదడును అలాగే శుభ్రం చేసుకో లేకపోతే అట్లానేమనగలగలేం.అందుకు కవిత్వం గొప్ప ఉపకరణ.మన ఆలోచనలు పరిణతి చెందటానికిగొప్పగా ఉపకరిస్తుంది.భావనలను సృజనతో మేళవించుకోవటానికి మనకున్న పెద్దదిక్కు కవిత్వమే.ఆలోచింపచేసేది కవిత్వం.రూపాంగానే మిగిలిపోయిన మనిషినైతికంగా మిగలలేదు. ఆత్మీయతను కోల్పోయిన చోటఆగమైపోతున్నాడు. కనుక మనిషిని పునస్తాపితం చేయడానికి మనిషి లోకి తొంగి చూడమనిమళ్లీ మనిషి లోకి కవిత్వమంతా ఆర్ద్రమై పరుచుకున్నది.
సమాజంఇట్లా ఉండటానికి వైరుధ్యాలను చెప్పి స్వీయానుభవాలను జతచేసి ఆలోచింపజేశాడు కవి.’ఆ పెద్దలు నా బతుకు దాతలు /నా మెతుకు మెతుకుపై /నిజాయితీ శిల్పం చెక్కిన /శిల్పకారులు వాళ్లు .ఎంతో సహజంగా చెప్పాడు. అలానే “కుమ్మరి కుండను నేను/ నీ పగలెత్తు అలసటను నిద్రలోకి పంపే /గౌండ్ల మల్లేషు కల్లు బుంగను నేనే / నా చూపు ఒక కళాఖండం అన్నాడు.శ్రమ చేస్తున్న జీవులను కళాత్మకంగా చూస్తూ కవిత్వమయ్యాడు .ఉపాధ్యాయ వృత్తిలోతెలుగు సబ్జెక్టు బోధించే టీచర్ఉదారినారాయణ. భావవాదం ఎక్కువగా కనిపించే వారి కన్నా భిన్నమైన వాడు. వాస్తవికతను అధ్యయనం చేశాడు కనుక పిల్లల మీద ముద్ర వేయగలరచనలు చేశాడు.భద్ర జీవితమే ముఖ్యం అనుకుంటేఉదారి నారాయణ కవి కాలేకపోయేవాడు.వివక్షతల పూరితమైన సమాజంలో డబ్బు పీడన ఎలా ఉందో రైతు వేదనలు ఎలా ఉన్నాయోఅర్థం చేసుకున్న కవి ఊరు కండ్ల ముందే చిద్రమవుతున్న ధైర్యాన్ని రాశాడు.పల్లెలు పట్టణాలుగా మారిపోతుంటే ఆహారం వేషధారణ వ్యవహారం మారిపోతూ ఉంటే ఇది నాగరికథ అన్నాడు.
వ్యవసాయం ఒకప్పుడురైతు చేతిలో ఉండేది.ఎరువులు విత్తనాలు అన్ని రైతే సమకూర్చుకునే వాడు.ఇవాళ మార్కెట్ పై ఆధారపడపలసిన స్థితి ఏర్పడింది.రైతు పరాధీనమయ్యాడు.చివరకు ఆత్మహత్యల పర్యంతమయ్యాడు.ప్రపంచీకరణ కనిపించని శత్రుదాడిలో యుద్ధం ఎక్కడ చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోఎవరికి ఎవరుఏమీ కానీ ఒంటరితనంలోకి వెళ్ళిపోయారు.కార్పొరేట్ వైద్యం ప్రజలకు మరింతభారమైపోయింది.ఎక్కడో ప్రకృతి లోసహజ సుందర అడవుల మధ్య స్వచ్ఛమైన జీవనం మధ్యఉన్న ఆదిలాబాద్ ప్రజలు కూడా ఇవాళ్ళ ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి .పల్లె ఎప్పుడూఇంకా పచ్చని కొంగుపరచి చూస్తదికానీ వచ్చి వాలుతున్నవి డేగలు కదా!అందుకే కవి”రేపైనా ఎప్పుడైనా/ నా చిన్ని బొమ్మరిల్లు/ లారీల్లోనో లాకర్లలోను కరెన్సీ కావచ్చు/ అప్పటి చర్నాకోలలు/చెరి సగం మైనింగులా / చప్పరించవచ్చు ” కవిత్వమైపారించాడు.
జీవితమంతా సంఘర్షణ అయిఉన్నది.అందుకే ప్రజల జీవితాన్ని అర్థంచేసుకోవలసిన ఆగత్యమున్నది. ఉదారి నారాయణఆ ప్రయత్నంలోభాగంగా కవితా సంపుటిని వెలువరించాడు.ఆయనకవిత్వంలో స్థానికత ఉంది.కొత్త ఒరవడితో రాయాలనే ప్రయత్నాలుఉన్నాయి. గోగు పువ్వును కొత్తగా అభివ్యక్తిచేశాడు.పరిస్థితినిఉన్నదిఉన్నట్టుగాప్రజల వద్దకు తీసుకుపోవడానికిప్రజలనుచైతన్యం చేయటానికికవికంకణబద్ధుడైయున్నాడు.నిత్యమై మెలకువతో ఉన్న కవిమళ్లీ మనిషి లోకిఅభినందనీయమైంది.

April 7, 2025 22 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గళమెత్తిన మహిళా పత్రికలు

by రంగరాజు పద్మజ April 5, 2025
written by రంగరాజు పద్మజ

         ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం వలసలు పోయి జీవించడం వాటివల్ల ఆయా ప్రదేశాల స్థానిక ప్రజలు, విద్య- ఉద్యోగావకాశాలు కోల్పోయి, భాష -ఆచార వ్యవహారాల అస్తిత్వం కోల్పోయి, అవమానింపబడి ఎంతో హీనమైన జీవితం గడుపుతూ… మళ్ళీ  ఆ అవకాశాలు తమ స్వంతం చేసుకుని మెరుగైన జీవితం జీవించాలన్న కోరిక ఉండడం సహజమే కదా!

     ఆ కోవలోనే మహిళలు వారి ప్రతిభలను ఎక్కడా ప్రదర్శించుకునే అవకాశాలే లేక  వివక్షకు గురైన సంఘటనలెన్నెన్నో…  అవకాశాలు లేవు కానీ ప్రతిభకు లోటులేదని చెప్పడానికి ఆ కాలంలోనే పత్రికలలో మహిళలకు ప్రత్యేక కాలమ్స్ నడిపారు.

    ఇటీవల ఒక మహిళ తమ సంతానం అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్న వారి ఆశలు అక్కడి ప్రభుత్వ పాలనా విధానాలు  అడియాసలుచేస్తే.. తమ పిల్లలు తిరిగి మన దేశం

 రావడం చాలా బాధాకరమని చెప్పి బాధపడింది.

   ఈ సంఘటన విన్నాక మా నాన్నగారు చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చింది. “ఎప్పుడైనా అవసరం ఒక మార్గాన్ని ఎన్నుకుంటుందని అది  అణచివేతలో తమ ఉనికిని చాటుకునేందుకు చేసే చర్య రచనా రూపంలో కానీ, తిరుగుబాటు రూపంలోనైనా కానీ వారిలోని అసహనం వెళ్లగక్కవచ్చు, సాధించవచ్చు” అని, ఒక పత్రిక స్థాపనకు దారితీసిన వైనం చెప్పారు.

   1901 లో మద్రాసులో కమలా సత్యనాథన్ అనే  ఒక మహిళ *ఇండియన్ లేడీస్ మ్యాగ్జిన్* అనే ఆంగ్ల పత్రికను స్థాపించి సంపాదకీయం చేసిన మొట్టమొదటి భారతీయ మహిళా పాత్రికేయురాలు అనీ,  ఈ పత్రికలో ఆమె చర్చించని విషయం అంటూ లేదనీ, మా సోదరి దయామతీ దేవి కూడా చెప్పేవారు.

  ఉత్తేజపూరితమైన సంపాదకీయాలు రాస్తూ, స్త్రీలకు ప్రేరణ కలిగించేదనీ, అంతవరకూ వారు ఇల్లే సర్వస్వం అనుకున్నవారు ఓహో! ఇలా కూడా తమ ప్రతిభను చాటుకోవచ్చా? అనే

ఆలోచన కలిగించే విధంగా ఆయా సంపాదకీయాలుండేవట. అంటే మహిళల అస్తిత్వం కోసం, సంస్కృతి సంప్రదాయాలను రక్షించడం కోసం  మహిళలకు ఆ పత్రికలో పెద్దపీటనే వేసింది కమలా సత్యనాథన్.

       ఎందుకంటే? తరతరాలుగా సంస్కృతీ వారధులు మహిళలే కనుక ముఖ్యంగా ఆనాడు  వలసరాజ్య నిబంధనల వల్ల ఎక్కువ నష్టపోయింది కూడా స్త్రీలే కావడం! పితృ స్వామ్య వ్యవస్థలో అణగారి పోతున్న  అతివల పక్షాన వారి హక్కులు- బాధ్యతలు తెలుపుతూ సమాజంలో ఎదగాలన్న ఆశను కలిగించింది ఆ పత్రిక.

   అందుకోసం స్త్రీలకు  విద్య యొక్క ఆవశ్యకతను తెలుపుతూ, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ, తోటల పెంపకం, కుటీర పరిశ్రమలు, కుట్లు- అల్లికలు, ఇలా స్త్రీ సంబంధమైన అన్ని అంశాల్లో నిష్ణాతులను పరిచయం చేస్తూ, ప్రేరణా మూర్తులను సామాన్య గృహిణులకు పరిచయం చేస్తూ  జ్ఞాన ప్రసరణలు చేసిన మాన్వి కమలా

సత్యనాథన్.

   ఆ కాలంలో ఆడవారు మంచి భావకులై  రచనలు చేసే సత్తా ఉన్నా… ఏ పత్రికలోనైనా  ప్రచురించుకోవాలంటే… ఎవరేమనుకుంటారో?? అని సంఘంలో ఒక బెరుకు- బిడియంతో ఉన్న కాలంలో మహిళలతో నాటకాలు, కథలు, పనులలో శ్రమను మరచిపోయే పాటలను, సీరియళ్లు రాయించి, ప్రచురించి సంపాదకత్వం వహించిన కమలా సత్యనాథన్ అభినందనీయురాలు.

    ఆ కాలంలోనే కాదు! ఏ కాలంలో నైనా కుటుంబాలు యావత్తు ఆడవారి సేవల మీద ఆధారపడి నడిచేవే… కనుక సక్రమంగా పనులు చేయాలంటే ఆడవారికి ఆరోగ్యం ముఖ్యమని భావించి, ఆరోగ్య సంబంధ రచనలు అచ్చు వేసేవారు.

   పత్రికలో  ఒకటి రెండు కాలమ్స్ కేవలం  మానవీయ విలువల ప్రచురణకే కేటాయించేవారు. ఆ కాలంలో సాధికారత సాధించిన మహిళామణులు రమాబాయి,

సొరాబ్జీ,  జోసెఫ్ లాంటి గొప్ప మహిళలు చేపట్టిన పనులను- అందులో వారు సాధించిన విజయాలను  వరుసగా ఆ పత్రికలో  ప్రచురించేవారు.

     అయితే పత్రిక  ఆర్థిక ఇబ్బందులతో పాటు ఎన్నో కారణాలు వల్ల కొంతకాలం పత్రికను ఆపాల్సి వచ్చింది. ఇంకొందరు ఏమంటారంటే?  అప్పుడప్పుడే జాతీయ ఉద్యమాలు ఊపందుకుంటున్న ఆ తరుణంలో ఆ ఉద్యమాలను ప్రోత్సహిస్తూ పత్రికలో ఏ రచనలు రాలేదనీ, అందుకే పాఠకులు ఆదరణ చూపలేదని అంటారు. కానీ దేనికైనా ఒక పరిధి ఉంటుంది కదా?  ఆ కాలంలో రాజకీయాల జోలికి వెళ్లేంత సాహసం స్త్రీలకు లేదేమో? అని నేను అనుకుంటాను.

   అంతే కాదు రాజకీయాలలో ప్రవేశించమని మహిళలకు పిలుపు ఇవ్వలేదని ఒక అపవాదు కూడా ఉన్నది. ఆమె మహిళలను కుటుంబ పరిధి దాటిపోనివ్వని సనాతన వాదురాలనే ఒక అపప్రథను ఎదుర్కొంది. అందుకు ఆమె

సంపాదకీయాలు అలానే ఉండేవని మా సోదరి చెప్పేది.

ఏదేమైనా ఆర్థిక ఒడి దొడుకులతో పాటు ఇతర కారణాలతో కష్టమైనప్పుడు ఆమె  వ్యాపార ప్రకటనలు ఆయా పారిశ్రామిక వేత్తల దగ్గర సేకరించి పత్రికలో  ప్రచురించి ఆ విధంగా ఆర్థికంగా ఆసరా తీసుకున్నారు.

    1901 లో స్థాపించిన పత్రిక 1918 వరకు మాసపత్రికగాను,  1927 నుండి 1938 వరకు ద్వైమాసిక పత్రిక గాను నడిపారు. తర్వాత ఆమె కూతురు పద్మినీ సత్యనాథన్ పత్రిక పగ్గాలు చేతబట్టి, సహసంపాదకురాలిగా సేన్ గుప్తాను నియమించి; తాను ప్రచురణ నిర్వహణ చేస్తూ పత్రిక ను నడిపింది.

  ఇక్కడ పత్రిక ఎందుకు ఆగిపోయిందన్న ప్రస్తావన కాదు ముఖ్యం… వలసవాదుల వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడల్లా ప్రజల పక్షాన పత్రికలు గొంతెత్తేవి  అనేది ముఖ్య విషయం. అలా వెనక్కి వెనక్కి పయనిస్తే ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.

  గుజరాత్ లోనూ జాతీయోద్యమం ( అప్పటికా పేరు లేదు ) కానీ వలసవాదుల అణచివేతను తట్టుకోలేక  స్త్రీలను చైతన్య పరచాలనే ఉద్దేశ్యంతో  *స్త్రీ బోధ్* మహిళా పత్రిక 1857లో స్థాపించటం జరిగింది.

    అలాగే కేరళలోనూ మలయాళ పత్రిక

*కేరళ సుగుణ బోధిని* అని తిరువనంతపురం నుండి మరో పత్రిక వెలువడింది.

1992 లో *తూర్పు పనోరమా* అనే పత్రిక మహిళాసారధ్యంలో స్థాపించబడింది. ఇది మొట్టమొదటి ఈశాన్య భారతదేశం నుండి వెలువడిన ఆంగ్ల పత్రిక. ఆ కాలంలో ఆ ప్రాంతంలో విధి వంచితులైన , క్రూర వైధవ్య దుఃఖ పీడితులైన, వారిని తొక్కివేసే సామాజిక నిర్బంధాలు, ఇక్కడ పేదనా, బడుగు వర్గాలా? అనే తేడాలేదు… వివిధ వర్గాలలోని స్త్రీలు జీవితపు సుడిగుండంలో చిక్కుకుని, అర్ధాంతరంగా అసువులు బాసిన అతివల  యధార్థ గాథలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వారి ఆక్రోశమూ, తీరని కోరికల నేపథ్యమూ, ఆస్తి

హక్కులు లేక దీనావస్థలో పడిన వైనమూ, ఇలా ఎన్నెన్నో సమస్యలను చర్చించిందా పత్రిక.

  ఎవరు ఏ పత్రిక స్థాపించినా స్త్రీలను సంతోషంగా ఉంచడమని, సమాన హక్కులతో జీవించమని చెప్పడమే…. ధ్యేయం… అలాగే అదే సమయంలో వారిని ఉత్తమ గృహిణులుగా ఉండాలనే సమాజ దృష్టి… ఎవరైనా కాస్త వారి హక్కుల కోసం పోరాడితే వారిని తెగించిన ఆడవారిగానే ఆ కాలంలో పరిగణించారు. అది దాదాపు 1930 వరకు నడిచింది. స్త్రీలకు బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నదని తెలియకుండా పురుష సంపాదకత్వంలో వచ్చిన పత్రికలు కొంచెం జాగ్రత్త పడ్డారనే చెప్పవచ్చు. అందుకే ఈ మహిళా పత్రికల స్థాపన జరిగిందేమో?

  తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు మహిళల పక్షాన నిలిచిన పత్రికలు మహిళా సంపాదకీయం  చేస్తూ విలువైన సందేశాలను ఇచ్చి, ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా… స్వతంత్రంగా మన భావాలు వెలిబుచ్చుకొనే తోవ చూపిన మహిళ పత్రిక స్థాపకులకు, మహిళా సంపాదకులకు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ…           

April 5, 2025 23 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

కవి మిత్రుల హృదయ భాషణం

by Gaddam sulochana April 5, 2025
written by Gaddam sulochana

ఫిబ్రవరి 16 తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు నిర్వహించిన సోపతి సప్తతి సభ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, కందుకూరి శ్రీరాములు, నాళేశ్వర శంకరం, నందిని సిధారెడ్డి ఈ ముగ్గురు కవులకు జరిగింది. ఈ సభలో మచ్చుకైనా తొంగి చూడని హంగులు ఆర్భాటాలు. దరిచేరని గజమాలలు ఫోటోల గోలలు లేకుండా సాదాసీదాగా సభ ఆసాంతం సాహితీ ప్రసంగాలతో గుబాళించింది . ఇదే సప్తతి సభల సందేశమైనది. ఈ ముగ్గురు కవులు ఈ సందర్భంగా తమ మనసును పంచుకున్న కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.

కందుకూరి శ్రీరాములు తన సాహితీ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, సిధారెడ్డి గారి ‘భూమి స్వప్నం’ నాళేశ్వరం శంకరం గారి ‘దూది మేడలు’ అచ్చయిన చాలా కాలానికి తన కవితా సంపుటి ‘వయోలిన్ రాగమో! వసంత మేఘమో!’ 1993లో అచ్చైందన్నారు. తానప్పుడు మినీ కవితలు తుమ్రీలు రాసేవాడినని, అవి తనకు చాలా ఇష్టంగా ఉండేవని చెప్పారు. “కళ్ళు పోయినా/ కాళ్లు చేతులు పడిపోయినా/ గుండెల్లో తడుండాలిగానీ/ నాలుకైనా నాలుగ క్షరాలు రాస్తుంది” అనే తన మినీ కవితను ఒక సభలో దేవి ప్రియ గారు చదివి వినిపించి మెచ్చుకున్నారట.
ఓ సారి విశాఖపట్నం కవి సమ్మేళనంలో పాల్గొనవలసి ఉండగా, ఒక కవిత రాసి శివారెడ్డి గారికి చూపిస్తే, మరో కవిత రాయమని చెప్పారని, అది బాగా లేదని అర్థం చేసుకున్నానని, ఆ సాయంత్రం సముద్రాన్ని చూసి, తెల్లవారగానే సముద్రం వద్దకు వెళ్లి ,”ఓ విశాఖ సముద్రమా/ నువ్వు ఆకాశమంత ఎదగడానికి/ ఎన్నేళ్ల దీర్ఘ తపస్సమాధి లో ఉన్నావో ” అని 30 లైన్ల కవిత రాసి ఆ సాయంత్రం కవి సమ్మేళనంలో చదివినప్పుడు గొప్ప స్పందన వచ్చిందని, శివారెడ్డి గారు కూడా మెచ్చుకున్నారని చెప్పుకున్నారు.
సినారె, శివారెడ్డి, సిధారెడ్డి, బెడిద రాజేశ్వరరావు వీరు తను సాహిత్యంలో ఎదిగి స్థిరపడడానికి హార్దికంగా ఆర్థికంగా ఎంతో తోడ్పాటునందించారు. 1974లో ఒక కవిత రాసి ‘సినారె‘ గారికి పంపిస్తే వారు ‘మీ కవితా జిజ్ఞాసను అభినందిస్తున్నా’నని లేఖ రాశారని అది ఇప్పటికీ తన వద్ద ఉందని ఆనాటి జ్ఞాపకాలను సంతోషంతో పంచుకున్నారు.

1979లో ఆర్ట్స్ కాలేజీలో చేరడం, 30 మంది కవుల పరిచయం, అక్కడి సాహితీ వాతావరణం తన జీవితంలో తనను తాను నిలబెట్టుకోవడానికి తోడ్పడిన మంచి అవకాశంగా భావించారు. వరవర రావు గారు ముందుమాట రాసిన “సందర్భం” కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, తెలుగు యూనివర్సిటీ అవార్డు రావడం జీవితంలో గొప్ప మలుపు. మినీ కవితలు రాయడం మానేసి పెద్ద కవితలపై దృష్టి పెట్టాలని చెప్పిన సిధారెడ్డి గారి సలహాను పాటిస్తూ, పెద్ద కవితలు రాయడంలో శ్రద్ధ పెట్టానని, దశాబ్ద కాలంలోనే అనేక కవితా సంపుటాలు తీసుకువచ్చానని అందరితో తన సంతోషాన్ని పంచుకున్నారు. నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం ల స్థాయి తనకు లేకపోయినా, వాళ్లతో కలిసి సప్తతి జరుపుకోవడం ఆనందంగా ఉందని, వారి స్నేహం తనకు గొప్ప అదృష్టమని చెప్పారు. కాస్త పేరు ప్రతిష్టలు రాగానే సంపాదన పెరగగానే, బంధువులను, స్నేహితులను, చేయూతనిచ్చిన వారిని మర్చిపోయే ఈ రోజుల్లో ఎంతో ప్రేమగా స్నేహంగా ఇలా చెప్పడం చాలా బాగా అనిపించింది. ఈ మధ్యనే 2024లో ‘పలకల నుంచి పలుకులవైపు’ కవితా సంపుటి కూడా అచ్చువేసారు.

నాళేశ్వరం శంకరం గారిది సప్తతి రెండవ సభ. జీవితం వ్యక్తిత్వం సాహిత్యంతో ముడిపడిన తన జీవిత విశేషాలను సదస్సులతో పంచుకున్నారు. 70 సంవత్సరాలుగా తన బతుకు ఒకే తీరుగా ఉందని, తనలాంటి బతుకు ఎవరికి ఉండొద్దని అందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.

తన ఊరిపై అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపించారు. వారి ఊరికి రెండు చెరువులు, తాటివనం, 10 ఊర్లకు సరిపడే ఈత కల్లుండేదని, హైదరాబాదు కూడా మా ఊరి ముందు చిటికెన వేలుకు కూడా సరిపోదని గొప్పగా చెప్పుకున్నారు. తన ప్రేమ కథ దేవదాసు సినిమా కన్నా గొప్ప కథట. ప్రేమంటే తెలియని నాలుగవ ఐదవ తరగతిలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. తర్వాత ఆమే అతని జీవిత సహచరిగా అయింది. కులాంతర వివాహం, తండ్రి తిరస్కారం, తీవ్రమైన దూషణ వ్యతిరేకత వల్ల ఊరికి దూరమయ్యానని, మళ్ళీ ఆ వూరు స్మశానంగా మారినాకే (పోచంపాడులో మునిగింది) వెళ్లానని చెప్పారు. తన ఇంటి స్థలం వెతుక్కోవడానికి వేప చెట్టు ఆనవాలుగా గుర్తించి, అక్కడే చాలాసేపు గడిపి వచ్చానని చెప్పారు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎంత దుఃఖం కలిగిందో, ఊరును స్మశానంగా చూసినప్పుడు అంత దుఃఖాన్ని అనుభవించానని ఆవేదనగా చెప్పుకున్నారు. వారి ఊరి వాళ్ళు వయసు వచ్చి కాక, రాజకీయ ఆర్థిక సాంఘిక కారణాల వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ అని వాపోయారు. జంగాలైన తాను చిన్నప్పుడే ‘భిక్షాం దేహి” అని అడుక్కునేవాడినని, అమ్మ పాలిచ్చి పెంచితే ఊరు తనకు అన్నం పెట్టి పోషించింది. బతుకునిచ్చింది. తనను తన కుటుంబాన్ని పోషించింది అని చెప్పారు. తనకు వాళ్లు భిక్షను వేసి బాలశివుడు వచ్చాడని తన కాళ్లకు మొక్కడం ఆశ్చర్యమనిపించేదని, అడుక్కుంటున్నాను కదా! నేను కదా వారి కాళ్లకు మొక్కాలని ఆలోచన అప్పుడే తనకు కలిగేదని,ఆ భావజాలంతో తీవ్రమైన స్వభావం ఉండేదని, బహుశా అదే తనను కవిగా మార్చిందేమోనని అభిప్రాయపడ్డారు.

ఇల్లు, ఊరు విడిచి రావడం, చదువు ఉద్యోగం ఇబ్బందులు అన్ని చెప్పారు. తన భార్య వైపు వారు గొప్పగా ఉన్నప్పటికీ తాను ఎవరిని ఎప్పుడు కూడా కలవలేదని, తన విలువ వ్యక్తిత్వం కాపాడుకోవడం తనకు ముఖ్యమని చెప్పారు.ఇలా చెప్పడం శంకరంగారి మానసిక పరిణతికి గొప్ప సాక్ష్యం.ఆయన నమ్ముకున్న విలువలు గొప్పవి.

‘దూది మేడలు’ ఒక్క పుస్తకాన్ని అచ్చు వేశానని అంటారు కానీ, ప్రస్తుతం కొనసాగుతున్న సమాజంలో అనేక పుస్తకాలుగా దాన్ని భావిస్తున్నట్టు చెప్పారు. బెడిద రాజేశ్వరరావు బతికి ఉంటే కనుక మా అందరి కన్నా చాలా ముందుండే వారన్నారు. బైసా రామదాసు మొదటి స్నేహితులని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఇంటర్ కాలేజీ మ్యాగజైన్ ఎడిటర్ గా తన కవిత ‘వాణి నా రాణి’ ఒక ఫుల్ పేజీ వేశాడట అది అప్పట్లో శంకరం గారికి గొప్ప సంతోషం కలిగించిందట. అతను గనుక జర్నలిజంలోకి వెళ్లి ఉండకపోతే గొప్ప కవి అయ్యేవారని “కాళ్లు ఇనుప స్తంభాలు/ భవంతులను మోస్తున్నాయి/ చేతులు విసనకర్రలు/ సుఖ గాలులు వీ స్తున్నాయి” అని ఇంటర్లోనే రామదాసు గారు రాసిన కవిత తనకు బాగా నచ్చిందన్నారు.

చలంగారిని తెలంగాణకు తెచ్చానని, కేవలం ఇక్కడ స్త్రీల ఉద్యమాలు ఎస్టాబ్లిష్ కావాలని అలా చేశానని బాగా నడపానన్నారు. ఓల్గా లాంటివారు చాలామంది వచ్చారు. అయితే అది మగవాళ్లది అన్న ఉద్దేశంతో స్త్రీవాద ఉద్యమం దాన్ని పక్కకు పెట్టింది కానీ, చలం చేసినంత కృషి స్త్రీలకు మరెవరు చేయలేదని అభిప్రాయపడ్డారు. ఇది తనకు పెద్ద మలుపు అని కూడా చెప్పారు. తన ప్రియమిత్రుడు నందిని సిధారెడ్డి గురించి కూడా ఎంతో అభిమానంగా ప్రేమగా ఇలా చెప్పారు…. తన తండ్రి తనను జీవితాంతం కోప్పడేవాడని, సిద్ధారెడ్డి కూడా నాన్నలా కోప్పడతారని ఆయన కోపం మాత్రం అమ్మపెట్టే ముద్ద అంత ఆత్మీయంగా ఉంటుందని, తనకు నాన్న చేయవలసిన ఎన్నో పనులు తనకి చేసి పెట్టారని ప్రేమను వ్యక్తపరుస్తూ, స్నేహ పరిమళాలను సభంతా పరిచారు.

సోపతి సప్తతి మూడవ సభ నందిని సిధారెడ్డి గారిది స్నేహం గొప్పతనాన్ని సమాజానికి తెలిపాలని వారి ఉద్దేశ్యం అందరికీ ఆచరణీయం అనుసరణీయం. 50 సంవత్సరాలుగా ఏ అరమరికలు లేని స్నేహంగా, కవిత్వంగా, జీవితాన్ని కొనసాగిస్తున్న ముగ్గురు కవుల సప్తది సభ జరగడం ఒక ప్రత్యేకత. ఇదొక మంచి సందేశాన్ని అందించే అపూర్వ సన్నివేశం. లక్షల మందిలో మాట్లాడడం కంటే, కొద్ది మంది ఆత్మీయుల మధ్య మాట్లాడడం, ఆత్మీయులు ఇచ్చే స్ఫూర్తి గొప్పది అని అభిప్రాయపడ్డారు.

ఆర్ద్రత నిండిన మనసుతో తన చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తు చేసుకున్నారు చంకలో తమ్ముని ఎత్తుకొని, చేతితో తనను పట్టుకొని, చేదబావిలో దూకి చనిపోవాలనుకుందట వాళ్ళ అమ్మ. ముందు చంకలో బిడ్డను వేయాలా, చేయి పట్టుకున్నతనను వేయాలా అని ఆలోచిస్తున్నంతలో, పక్కన ఉండేటటువంటి వడ్ల అంతయ్య పరుగున వచ్చి, మందలించి ఆ ప్రయత్నాన్ని విరమింప చేశారని, అదే అంతయ్య కొన్ని రోజుల తర్వాత కుటుంబ సమస్యతో ఉరి వేసుకున్నప్పుడు, అప్పుడే నీళ్లకు వెళ్ళిన వాళ్ళమ్మ అతనిని లేవట్టి అందర్నీ పిలిచి అతని ప్రాణాలు కాపాడిందని ఇది రూల్ అని చెప్పారు. ఇతరులకు మనం ఏదైతే ఇస్తామో! అది మనకు తిరిగి వస్తుందనే సత్యం ఈ సంఘటన ద్వారా మనకు స్పష్ట మవుతుంది.

ఆరుద్ర గారి “పులి వస్తే పులి ఎన్నడు అదరదు/ మేక వస్తే మేక ఎన్నడు బెదరదు/ మాయ రోగమదేమో కానీ/ మనిషి మనిషికి కుదరదు” అనే కవితా పంక్తులు ఉదాహరిస్తూ మనుషులు మనుషులు విడిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కవులు మరీ వింతగా ప్రవర్తిస్తున్నారు. నేనే కవిని అనే ధోరణి పెరిగిపోతుందని, కవిని చూస్తే మరో కవి ఓర్వడని, మనుషుల యొక్క నైజాన్ని ఒకింత ఆవేదన హాస్యాన్ని మిళితం చేసి ఉదహరించారు.

ఒక సందర్భంలో తెలంగాణ భాషలో మంచి కవిత్వం రాసిన కవి మోత్కూర్ అశోక్ గారి కోరిక మేరకు మెదక్ పుస్తక ఆవిష్కరణ సభకు ‘చేరా’ గారిని తీసుకొని వెలితే, అతనక్కడ ‘తెలంగాణ కవులు ఇట్లాంటి కవిని చూసి తల ఎత్తుకోవచ్చు’ అన్నారట.అసలు తెలంగాణ కవులు తల ఎత్తుకునే ఉన్నారు. అది చెప్పడానికి ‘చేరా’ అవసరం లేదు. నా కవిత్వానికి బలం చేరా నుంచి రాలే! అలంకార గ్రంధాల నుండి రాలే! తెలంగాణ మట్టి నుండి వచ్చింది. మా బాపు అవ్వ మా ఊరి నుండి వచ్చింది. వివక్షాపూరితమైన విమర్శకుడైన చేరాలాంటి వాళ్లతో గొడవ పడ్డానని, నా మట్టినాకు రోషాన్ని ఇచ్చిందని,అది నా గర్వమని, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా తేల్చేశారు.

కవిత్వం అలంకార శాస్త్రాల నుంచి రాదు. జీవితాల నుండి వస్తుంది. గాథాశప్తశతిలో ఉన్నది ఆనాటి గాథలు సామాజిక జీవితమే! కవిత్వానికి కొలమానం విమర్శకుల ప్రశంసలు కాదు.” నేను రాస్తా వాళ్ళు చదువుతారు మధ్యన ఈ విమర్శకులెవరు?” అన్న కాళోజీ మాటల్ని గుర్తు చేసుకున్నారు. “హైదరాబాదు/ అందమైన సీతాకోకచిలుక/ దాని కాళ్లకు కత్తులు కట్టి/ కోడిపందాలు ఆడకండి” అన్న రాజు గారి కవిత్వాన్ని చదివి ఇంతకన్నా జీవితం నేర్పిన కవిత్వం ఏముంటుంది. ఇదే కదా కవిత్వం అన్నారు. ఈ ప్రాంతం కాకపోయినా ఆరుద్ర, కుందుర్తి, సోమసుందర్ మొదలైన వారు తెలంగాణ మీద కవిత్వం రాశారన్నారు. ఒక పోతన, సోమన, వేమన లేకుండా సిధారెడ్డి లేడు. ఒక కవికి బలం అనేకమంది పూర్వకవులు సమకాలీన కవులేనని గుర్తు చేశారు.

విప్లవోద్యమం తన కవిత్వాన్ని స్వీకరించిందని “మా మౌనం ప్రమత్తతే అనుకుంటావు/ నీకు తెలుసో తెలియదో/ గోడకు వేలాడే తుపాకీ కూడా/ మౌనంగానే ఉంటది “అనే కవితా పంతులు సైన్స్ కాలేజీలో, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో, తిరుపతి హాస్టల్లోనూ కనిపించిన సందర్భాలను వివరిస్తూ, కవిత్వం ఎవరు చదువుతారు అనుకుంటాం కానీ, ఎవరికి అవసరమో వాళ్ళు చదువుతారని వివరించారు. నేను తెలంగాణ ఉద్యమాన్ని ప్రేమించాను. ఆ సామాజిక సందర్భం గొప్పది. మంచి అక్షరాలు రాసే అవకాశం నాకు వచ్చింది. మనుషుల్ని ఏరుకోవడం అనుభవాల్ని, వస్తువుల్ని, సన్నివేశాలని ఎన్నుకోవడం తెలుసు. సహజ సుందరమైన అలంకారికమైన ప్రజల భాష శక్తి కలిగిన భాష. దాన్ని ఏరుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. జీవితంలో స్పష్టత లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. దాశరధి ప్రజా జీవితంలో నుండి వచ్చారు. మెల్లమెల్లగా తప్పిపోయారని గుర్తు చేసుకున్నారు. ఎవరికైనా ఒక స్పష్టత ఒక నిర్ణయం ఒక విధానం అవసరమని, చుట్టూ ఉన్న మయసభను తెలుసుకొని అడుగులు వేయాలని సూచించారు.

కులం ఇప్పుడు కొలమానమైనది. కానీ నాకు కులంతో సంబంధం లేదు. మనుషుల హృదయాలను ప్రేమించాను. హృదయాలతోనే నడుస్తాను. కులాన్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడండి కానీ, కులంలోనూ మంచి వాళ్లను ప్రేమించండి. కవులు ఏం చేయాలి? మనుషుల్ని కవిత్వాన్ని జీవితాన్ని సమాజాన్ని ప్రేమించాలి. నేను అట్లా ప్రేమించాను. మనుషుల్ని స్నేహితులను సంస్థలను నమ్మాను. కాబట్టే నాకు మంచి మిత్రులు ఉన్నారు. మంచి కవిత్వము రాశాను. అనీ సంతృప్తిని వ్యక్తం వ్యక్తం చేస్తూ ,మంచి సందేశాన్ని అందిస్తూ ముగించారు.

ఇలా కందుకూరి శ్రీరాములు గారు, నాళేశ్వరం శంకరం గారు, నందిని సిధారెడ్డి గారు తమ సాహితీ ప్రయాణాన్ని తమ జీవితాలను వ్యక్తిత్వాలను 50 ఏళ్లుగా కలిసి సాగిస్తున్న స్నేహ ప్రయాణాన్ని అందరితో పంచుకున్నారు. ‘చూస్తాం చేస్తాం రాస్తాం’ అని సిధారెడ్డి గారు చెప్పినట్లుగానే వీరి ప్రయాణం ఆయురారోగ్యాలతో, ఉత్సాహంగా, సామాజికంగా మార్గదర్శనం చేస్తూ, కొనసాగాలని ఆశిద్దాం.

April 5, 2025 48 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఈ రాత్రి శూన్య మెలా అవుతుంది**?

by Dilawar April 2, 2025
written by Dilawar

ఈ రాత్రి నాలుగు వైపులనుండీ అంటుకుంటున్నది
స్వప్నం కాలేకపోయిన యీ రాత్రి
పచ్చి పుండై సలుపు తున్నందుకు హాయిగానే ఉంది
నేనీ దిగులు రాత్రిని దు:ఖంలో ముంచకొని పానం చేస్తున్నాను
నేనీ కలత నిద్రల రాత్రిని మేఘ మల్హార రాగం లో గానం చేస్తున్నాను
తుఫానులను ఉచ్చ్వాసగా
అగ్ని జ్వాలలను నిశ్వాసగా
చేసుకున్న వాడికి
బతుకును చీకటి సముద్రపు
టలల్లోకి విసిరేయడం
గుండెల్ని పిండే విషాదం కాదు కదా
వలపు తీర విరహిణులతో ఐక్యం కాలేని
హృదయ నాదం
జీవం లేని శబ్దమై నీరసించి తుది శ్వాస విడిచింది
దారుల్ని పారేసు కున్న గాయం
ఎవరికోసమో ఉన్మత్తంగా అన్వేషిస్తున్నది
అయినా బొత్తిగా శూన్యం అలుముకోలేదు
జ్ఞాపకాల నుంచి ఒక్కొక్క నెత్తురు బొట్టూ
పచ్చిగా చిక్కగా రాలుతూనే ఉంది
నగరం నడిబొడ్డుకింద జారిన చీకటిలో
సామూహిక స్ఖలనాల్లో తడిసిన
బిచ్చగత్తే ఆర్తనాదం శూన్యం కాదు కదా
తుపాకి వనంలో విరిసిన బుల్లెట్ల పువ్వుల మధ్య
వీచిన మృత్యు పరిమళం శూన్య మెలా
అవుతుంది?
భళ్ళున మాతృత్వం పగిలి
చీకటి ముళ్ళ పొదల మధ్య
తెగిన పేగు బంధపు నెత్తురు గుడ్డును
శూన్యమని ఎవరంటారు?
గుండెల్ని చీలుస్తూ మొరుగుతున్న
కుక్క గొంతు శ్రుతిలోని జీర శూన్యానికి సంకేతాలేనా?
దేన్నీ పట్టించుకోకుండా కొండ చిలువలా కాలాన్ని ఆబగా మింగుతున్న గడియారం ముళ్ళు
చైతన్యానికి ప్రతీకలే కదా?
మెల్లగా ఏకాంతం; అలజడి ఉప్పెన అవుతూ నన్ను సుడివేస్తున్నది
అదే పనిగా మీటుతున్న గుండె ఏకతార లోంచి
రక్తం వెచ్చగా స్రవిస్తున్నది
ఇక యీ రాత్రి ఇంతే….
నా సుందర స్వప్నం,ఈ రాత్రి పిరమిడ్ కింద
క్లియోపాత్ర గా మారి మూల్గు తున్నది

April 2, 2025 21 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

‘మంటల స్నానం’ కవిత్వం ఏం చెబుతోంది ?

by Bandari Rajkumari April 2, 2025
written by Bandari Rajkumari

దిగంబర(2009), గరళమ్(2013), తప్త స్పృహ(2015)తో సుపరిచితమైన కవి ‘మౌనశ్రీ మల్లిక్’. ఇప్పుడు “మంటలస్నానం'(2025) తో పలకరిస్తున్నడు. తన కవిత్వ పుస్తకాల శీర్షికలు ఆలోచింపజేసేవిగా వుంటయి. వ్యక్తిగా తన ప్రస్థానం అనేక ఆటుపోటుల సమాహారం. జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎన్ని పోరాటాలు చేసాడో అది అతని వ్యక్తిగతం. ‘కవిత్వం, పాట’ తోటి మనిషికి ఎంత సన్నిహితునిగా మార్చాయో అదంతా సామాజికం. కవి జీవితంలో కవిత్వం ఎంత? కవిత్వంలో కవి జీవితం ఎంత? అనే ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు కవి ఆచరిస్తున్న సూక్తి లాంటి నినాదప్రాయ కవిత్వ వాక్యాలు మనల్ని ఆలోచింపజేస్తయి.

” జీవితంలో కవిత్వం వరించడం ఉత్సవం! కవిత్వంలో జీవితం తరించడం ఉద్యమం!!”

ఆచరణ – జీవితం రెండూ వేర్వేరు కానప్పుడు వ్యక్తి ఆదర్శనీయుడు అయితడు. నిజంగానే ‘మౌనశ్రీ’ ఆదర్శవంతుడనుకుంటే ఆచరణ జీవితం జమిలీగా కలిసిన ఒక మెటాఫర్ అయితది. కవిత్వానికి సంబంధించి, కవిత్వపుస్తకాలకు సంబంధించి, ప్రచురణకు సంబంధించి, వాక్య నిర్మాణానికి సంబంధించి తనదైన ప్రత్యేక శైలి తనకుంది. ఒక కవిత్వ పుస్తకానికి ‘ఎడిటర్’ ను పెట్టుకోవడం తెలుగు సాహిత్యంలో చాలా అరుదు. మౌనశ్రీ ఈ విషయంలో అందరికంటే ముందు వరుసలో ప్రథముడుగా అవుపిస్తడు. విరామ చిహ్నల ఉపయోగం, ఇవ్వవలసిన స్పేస్ – వాక్యంలోనూ, పేరాగ్రాఫ్ లోనూ, స్టాంజాలోనూ అర్థం చెడిపోకుండా అక్షరం పట్ల వున్న అమితమైన భక్తి మౌనశ్రీ రాతల్లో ప్రస్ఫుటంగా మనం దర్శించవచ్చు. ‘తప్తస్పృహా’ కు ‘మంటలస్నానం’ కవిత్వానికి మధ్య దశాబ్దకాలపు దూరం వున్నప్పటికీ సాహిత్యానికి దూరంగా, అక్షరానికి దూరంగా ఎడబాటు విరహం లేదు. అంతేకాదు ‘మంటలస్నానం’ కవిత్వం ‘తప్తస్పృహ ‘ లోని లోటుపాట్లను సవరించుకోగలిగింది. దిగంబర, గరళమ్ లో వున్నంత బిగి తప్తస్పృహ కాలానికి సడలినప్పటికీ ‘మంటల స్నానం’ అంతకు మించి బూమరాంగ్ లా తనచేతికి అందివచ్చింది. ప్రాణం పెట్టి పాట రాసినా అందులో ఎంతకాలం స్వేచ్ఛగా బ్రతుకుతాడో తెలియదు గానీ కవిత్వ పంక్తుల్లో అక్షరమక్షరం స్వేచ్ఛను అనుభవించగలడు, జీవించిన క్షణాల్ని మనతో పంచుకోగలడు. ఈ స్వేఛ్ఛ రాతకు సంబంధించింది. రాయగలిగే స్వేచ్ఛకు సంబంధించింది.
*
కవిత్వం ఎవరి పక్షం? జవాబుగా ప్రజల పక్షం అంటూ సర్వదిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వని వినిపిస్తుంటది. కవిత్వం ప్రజల పక్షం అయితే ఏంటి? కాకుంటే ఏంటి? ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏంటి? ఈ కవిత్వం ప్రజలు చదువుతారా? తమ బాధల్ని చెమట వాసనతో నెత్తుటి సిరాలో ముంచి రాసిన కవిని హత్తుకుంటారా? మరెందుకీ కవిత్వం! కవులకీ, శ్రమజీవులకీ మధ్య వారధి ఎవరు నిర్మించాలి? కవిత్వాన్ని మోసుకెళ్లి వారి హృదయాల్ని తాకేలా ఎవరు చేయగలరు? ఎప్పుడు కవి అవసరం? అసలు ఈ ప్రపంచానికి కవుల అవసరం వుందా? చర్చ ఫలవంతంగా జరిగే ఒక సుహృద్భావ వాతావరణం కావాలి. కవిత్వం రాతల్లోనే కాదు చేతల్లోనూ పని చేస్తుందని ప్రపంచంలోని వివిధ ఉద్యమాలు నిరూపించిన సందర్భాలు లేకపోలేదు. యితర ఉద్యమాల మాటేమో గాని ‘తెలంగాణ ఉద్యమం’ సాక్షీభూతంగా పేర్కొనవచ్చు.

“రోజులో ఒక్కసారైనా
ఎండలో మాడి స్వేదమై రాలాలి
జీవితంలో ఒక్కసారైనా
చెడుపై దావానలమై ఎగబడి దాడి చేయాలి” (మంటల స్నానం)

కవి ప్రభోదకుడై వుంటడు. ఉత్ప్రేరకమై పనిచేస్తడు. ఉద్యమాలకు ఆయువుపట్టు అయితడు. ఆరిపోని జ్వాలకు రక్షణ కవచమై నిలుస్తడు. చెనుట చిందించేవాడే మనిషి అని ఎలుగెత్తి చాటుతడు. అభ్యర్థించటం కాదు పిడికిలి బిగించమనే సందేశాన్ని పంపిస్తడు.
*
వస్తువును కవి నిర్దేశిస్తాడా? లేక కవులను వస్తువు నిర్ధేశిస్తుందా? రెండు రకాలుగా జరుగుతుందని అనుకుంటే ‘వస్తువు’ ను నిర్దేశించే కవులు మొదటి రకం. వస్తువు చేత నిర్దేశింపబడే కవులు రెండవరకం. మొదటిరకం కవులకు వస్తువు స్థిరమైనది. దాన్ని దాటి బైటికి రాలేరు. భక్తి కవులు, ప్రకృతి ఆరాధకులు మొ.నవారు ఈ కోవకు చెందుతరు. రెండవ రకం కవులు చలన సహితమైన సమాజంలోని మార్పులకు స్పందిస్తూ కాలంతో పాటుగా కొంతమంది, కాలం కంటే ముందుగా కొంతమంది చైతన్యవంతులై కొనసాగుతరు. మౌనశ్రీ ఈ రెండోరకం కవి అని చెప్పటం నా ఉద్దేశ్యం. వర్తమాన అంశాల్ని ఇప్పటి మనుషుల భావోద్వేగాల్ని, వీటిని కూడా కవిత్వం చేయగలమా? అనిపించేవి ‘వస్తువు’ లుగా కనిపిస్తయి. అయితే చాలా వరకు ‘వస్తువులన్నీ నిర్దిష్టంగా గాక సాధారణీకరించినట్టుగానే మాట్లాడతయి. కవి విశ్వ మానవతావాదిగా కనిపిస్తడు. నిర్దిష్టం(Specific )గా మాట్లాడనంతవరకు మనం సేఫ్ మోడ్ లో వున్నట్టు భావించాలి. సాధారణీకరించి (Generalised) మాట్లాడుతున్నప్పుడు, మానవత్వం ఎజెండాగా కొనసాగుతున్నప్పుడు రక్షణ తంత్రాలు (Defense mechanism) అంతగా అవసరం పడవు. అందరూ బాగుండాలి – అందులో మనముండాలి అనే ఆశావాహ దృక్పథం, పాజిటివ్ నేచర్ ‘మౌనశ్రీ’ కవిత్వంలోనూ కనిపిస్తయి. ఎంత సాధారణీకరించి మాట్లాడుతున్నప్పటికీ నిర్థిష్టమైన స్వరం అప్పుడప్పుడూ తొంగిచూసి వెళ్తుంటుంది.

“కొంతకాలానికి
ఊరు నోరు తెరుచుకుంటుంది
నీ గురించి మాట్లాడటానికి’ బంధుగణం ఒళ్లు విరుచుకుంటుంది.
నిన్ను జైకొట్టడానికి!
నీ చిరపరిచితులకు చలనం వస్తుంది
నిన్ను కలిసి తరించడానికి” (చెప్పు తెగేలా చెప్పు)
*
మౌనశ్రీ కవిత్వ నిర్మాణ పద్ధతుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇవి తన కవిత్వ శిల్పాన్ని గురించి విడమరిచి చెబుతయి. నెగెటివ్ గా మాట్లాడి పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించే నిర్మాణ వ్యూహం ‘మొక్కలు నాటకండి’ కవితలో చూడొచ్చు .

పుస్తక రచయిత మౌనశ్రీ మల్లిక్
సినిమా, టీవీ పాటల కవి

“దయ చేసి మొక్కలను అస్సలు నాటకండి
ఒకవేళ బుద్ధి పుట్టి నాటినా వాటి సంరక్షణ మరిస్తే మాత్రం
ఆ మొక్కలను హత్య చేసినట్టే కాదు
ఈ పుడమిని అభిమానభంగం చేసినట్టు
ఔను మరి చెట్టుంటేనే కదా
అవని అయినా ప్రాణి అయినా ఉండేది”
*
మానసిక ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే బాహ్య ప్రపంచపు అలజడికి కార్య కారణ సంబంధం నెరిపి, రెండు సందర్భాలకు ఔచిత్య వంతమైన అన్వయ సంయమనం ప్రదర్శించి ఒక తీర్పును వెలువరించే నిర్మాణ వ్యూహం “పిట్టమనసు’ కవితలో దర్శించవచ్చు.

“పిసరంత పిట్టకైనా
చెట్టంత మనిషికైనా
కడుపు తీపి ఒక్కటే”
*
సాధారణమైన, సామాన్యమైన అంశాలు విరోధాబాసను తెలీకుండానే ఎలా ప్రదర్శిస్తాయో తెలిపే నిర్మాణ వ్యూహం ‘గమనిస్తే’ కవిత చెబుతది.

” జై కొట్టే సమూహంలో బుసకొట్టిన గుంపూ ఉంటుంది”
*
గతాన్ని నెమరేసుకోవడం అంతా ‘నాస్టాల్జియా’ అనుకుంటే పాఠకుడు వింటున్నట్టుగా ముచ్చట చెప్పుకుంటూ జ్ఞాపకాల దొంతరల్ని ఉల్లి పొరల్లా ఒలుస్తూ ఒల్శెంత దుక్కాన్ని ఒక్కమాటలో చెప్పి కంట తడి పెట్టిస్తడు. జీవితం మొత్తం చెప్పడం ఒకెత్తు. ముగింపు చెప్పడం మరో ఎత్తు.

” అది నా మనుగడను మలుపు తిప్పిన ఇల్లు మాత్రమే కాదు
మా అమ్మ తుదిశ్వాస విడిచిన ఇల్లు” (పాత అద్దె ఇల్లు)
*
కవి యుద్ధం గురించి మాట్లాడుతడు. యుద్ధం పుట్టకతో ముడిపడి వున్న బంధాన్ని చెబుతడు. యుద్ధం ఎక్కడలేదని ప్రశ్నిస్తడు? పాలస్తీనా – ఇజ్రాయేల్ సందర్భాన్ని ప్రస్తావిస్తడు. బుద్ధుడు, జీసన్, ప్రవక్త ఏయే యుద్ధాలు చేసారు? కవి ఎటువంటి యుధ్ధాన్ని కోరుకుంటున్నడు? ఈ కవిత మాట్లాడుతది.

“ఔను యుద్ధం జరగాలి. మతాల సరిహద్దులు దాటి కులాల గీతలు దాటి
మేం మనుషులమని
ప్రపంచం ముక్త కంఠంతో నినదించే
యుద్ధం జరగాలి
ఔను యుద్ధం జరగాల్సిందే! (యుద్ధం జరగాల్సిందే..!)
*
వస్తు సృహ, కవిత్వ నిర్మాణ కౌశలం మెండుగా వున్న కవి మౌనశ్రీ మల్లిక్. విరహమైనా, శృంగారమైనా, కరుణను ఒలికించినా ఏ రసాస్వాదనలోనైనా పాఠకులు మునకలు వేసేంత సమ్మోహన వాక్యం తనది. తను సాహిత్య ఇగురం తెలిసిన కవి. తనను తాను, తన కవితావాక్యాన్ని నిత్యం పుటం పెట్టుకుంటూ సానబారిన కవిత్వ వెలుగుల్ని మున్ముందు మరిన్ని పంచాలని కోరుకుంటూ ‘మంటల’ స్నానం’ వెలువరిస్తున్న శుభ సందర్భంగా అభినందనలు.

April 2, 2025 28 comments
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వాస్తవిక జీవన కథనం – ధూళిపాళ అరుణ కలం

by ఒద్దిరాజు మురళీధరంరావు March 31, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

         మన చుట్టూ ఉన్న సమాజంలో అనేకమైన సంఘటనలు మనలో ఎన్నో అలజడులను సృష్టించి మనసును కకావికలం చేస్తాయి. కవులు, రచయితలు ఆ భావోద్వేగాలను తమ రచనల ద్వారా బహిర్గతం చేస్తారు. ఆ విధంగా వెలువడినదే ధూళిపాళ అరుణ రచించిన “మిగిలేవి గురుతులే” కథా సంపుటి.        ఇందులోని కథలన్నీ వాస్తవ జీవన చిత్రణలే. తనకళ్ళ ముందు కుటుంబాలలో జరిగిన అనేక వెతలను ఆమె కథలుగా మలచింది. అవన్నీ యథార్థ గాథలే. స్వతహాగా కవయిత్రి కూడా కావడం వల్ల కొంత కవితా శైలి కూడా కనిపించి పాఠకుల హృదయాలను హత్తుకుంటుంది.

        పుస్తకం పైన కవర్ పేజీ ఎంతో రంధితో కూడుకున్నదిగా కనిపించి చివర పేజీలో ‘హమ్మయ్య! పుస్తకం పూర్తయింది’ అన్నట్టు నవ్వు ముఖం కనిపిస్తుంది. ఇందులోని 15 కథలూ వాస్తవాన్నిచూపిస్తూ ఆసక్తికరంగా ఉండి పాఠకులను చదివింప జేస్తాయి. కథల్లో అక్కడక్కడా కొన్ని వాక్యాలు తెలుగు భాషలో చెక్కబడినవా? అన్నట్టు తోస్తాయి. నేను కథల విశ్లేషణ జోలికి వెళ్లకుండా నాకు నచ్చిన అలాంటి కొన్ని వాక్యాలను ఉదాహరిస్తాను.

“మునుముందుకు నడవడమే మనిషి కర్తవ్యం”

మనిషి జీవితానికి ఎన్నో సవాళ్లు, ఎదురీతలు ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు సాగుతూనే ఉండాలన్న కర్తవ్యబోధ ఇక్కడ కనిపిస్తుంది.

“బలహీనంగా ఉన్నంతవరకు సమాజం అణచి వేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది”

ప్రస్తుత కాలంలో బలమున్న వాడిదే పైచేయిగా ఉండడం మనం గమనిస్తున్నాం. అదే బలహీనుడైతే సమాజం అణచివేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇది సమాజస్వరూపం.

“రక్షించవలసిన తండ్రే కాటేస్తే సమాజం ఏం చేస్తుంది? నీడనివ్వని చెట్టువల్ల ప్రయోజనం ఏమిటి?”

వీరేశ్ కూతురు మీద చేసిన అఘాయిత్యాన్ని వివరిస్తూ రచయిత్రి చెప్పిన పాఠకులను ఆలోచింపజేస్తాయి.

కనుల నీరు పెట్టిస్తాయి.

“కంటిలో నుండి ఊట బావి లాగా నీరు ఊరుతూనే ఉంది”

“కళ్ళు నిండు తటాకాలయ్యాయి”

“నిద్ర ఎక్కడో ముఖం చాటేసింది”

“కన్నీటికి కన్ను నిరంతర ఆవాసమైంది”

ఇలాంటి కవితాత్మక వాక్యాలు అరుణలోని కవయిత్రిని మనముందు నిలబెడతాయి.

“నాపై వేలాడదీసిన కాలసూచి రాత్రి రెండుగంటలు దాటినట్టు చూపిస్తోంది”

గోడమీద గడియారాన్ని గురించి అన్యాపదేశంగా రాసిన ఈవాక్యం రచయిత్రి రచనా ప్రతిభను తెలియజేస్తుంది.

“కొన్ని తొందరపాటు నిర్ణయాలు, కొన్ని ఆలస్యపు నిర్ణయాలు జీవితాంతం శిక్షను విధిస్తాయి”

జీవితంలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి తొందరపడటం, మరొక్కసారి సమయానికి సరైన విధంగా తీసుకోకపోవడం. ఈ రెండూ ప్రమాదమే. వాటివల్ల జరిగే అనర్థం ఒక్కోసారి యావజ్జీవితం అనుభవించాల్సి ఉంటుంది. ఎంతో

అనుభవం గడిస్తేనే ఇలాంటి వాక్యాలు రాయడం సాధ్యమవుతుంది.

మరో కథలో….

“ఏ శిల్పానికైనా ప్రాణం కళ్ళే కదా! గీయడంలో కొద్ది తేడా అయినా అందమంతా చెడిపోతుంది”

వినాయక విగ్రహాలను చేసే కుటుంబాన్ని గురించిన ఈ కథలో విగ్రహాన్ని ఎంత బాగా తయారుచేసినా కళ్ళను చిత్రించడంలో ఏమాత్రం తేడా వచ్చినా బొమ్మ అందం చెడిపోతుందని చెప్పడం ఆమెకున్న అవగాహనను తెలియజేస్తుంది.

అదే కథలో….

“హృదయపు త్రాసు కూతురి వైపు మొగ్గింది”

“తనకన్నా బిడ్డ జీవితమే ముఖ్యమనుకున్న తల్లి గుండె బలహీనమై కొట్టుకోవడం చేతగాక ఆగిపోయింది”

అనే వాక్యాలు మాతృత్వపు త్యాగానికి అద్దం పడతాయి.

ఇంకో కథలో….

“జీవితమంతా పోరాడిన ఆమె మరణం కోసం పోరాడలేదు”

ఒక స్త్రీ జీవితమంతా కష్టాలలో మునిగి,

అకాల మరణంతో హఠాత్తుగా చనిపోవడాన్ని గురించి చెప్పిన వాక్యమిది. ఏ అనారోగ్యం, వార్ధక్యం మీద పడకుండానే ఆమె సునాయాసంగా మరణించడం ఒక విధంగా ఆమె పాలిట వరమే. కనీసం మరణ సమయంలోనైనా ఎలాంటి బాధ ఆమె పొందకపోవడం

ఒక రకంగా అదృష్టమే.

“లోకంలో ప్రతి మనిషికి సలహా చెప్పడమంత సులువు మరేదీ ఉండదేమో?”

ఇది అందరికీ అనుభవమే. చాలామంది వాళ్ళు ఆచరించని ఎన్నో విషయాలను ఇతరులకు సలహాలుగా ఇస్తుంటారు. లోకం పోకడ ఇది.

         ఈ విధంగా ఈ కథా సంపుటిలో సమాజానికి, వ్యక్తులకు అన్వయించగలిగే ఎన్నో వాక్యాలను ధూళిపాళ అరుణ గారి కలం నుండి చూడగలం. ఇలాంటి రచనలు ఆమె ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను.

March 31, 2025 29 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

సన్నాయి మహిమ

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, March 31, 2025
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

నరసింహపురం అనే గ్రామంలో శరభయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ గ్రామం గత మూడు సంవత్సరాలుగా వర్షాలు లేక కరువు కాటకాలతో సతమతమైంది. ఆ సంవత్సరం ఆ శరభయ్య పొలం కూడా వర్షం లేక పైరు ఎండిపోయింది. అతడు దాన్ని చూసి బాధపడుతున్న సమయంలో అక్కడి నుండి ఒక సన్యాసి పోతూ ఆ రైతును పిలిచి ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నించాడు . ఆ రైతు తన పొలం ఎండిపోయిందని,తాను ఎలా బ్రతికేదని బదులిచ్చాడు . అప్పుడు ఆ సన్యాసి ఒక సన్నాయిని తన సంచిలో నుండి తీసి బిగ్గరగా ఊదాడు . వెంటనే ఆ పొలం పచ్చగా నిగనిగలాడింది.
ఆ రైతు ఎంతో సంతోషించి ” మహాత్మా! ఒక్క నా పొలం పచ్చగా ఉంటే సరిపోదు. మా ప్రజలందరి కడుపులు నిండాలంటే మీరు మా గ్రామంలో గల అన్ని పంటచేలను పచ్చగా చేయాలి” అని కోరాడు. ఆ రైతు పరోపకార బుద్ధికి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆ సన్నాయిని ఇస్తూ ” ఓ. ఉపకారీ! ఈ సన్నాయి నేను ఊదితే ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. అడిగిన వారి కోరికను తీరుస్తుంది. కానీ ఇప్పుడు అది ఇక నా చేతిలో పనిచేయదు. అందువల్ల దీనిని నీకు ఇస్తున్నాను. తీసుకో! దీనిని నీవు ఊదితే అది మూడు సార్లు నీ కోరికలను తీరుస్తుంది. కానీ ఒక్క షరతు. నీవు ఇప్పుడు కోరినట్లే ఇతరులకు ఉపయోగపడే కోరికలను మాత్రమే కోరాలి. స్వార్థంతో నీవు ఏ కోరిక కోరినా ఇది పనిచేయదు” అని దానిని ఆ రైతుకి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆ రైతు సంతోషంగా దాన్ని తీసుకొని తమ తోటి రైతుల పొలాలన్ని పచ్చగా ఉండాలని, పంట బాగా పండాలని కోరి దానిని ఊదాడు. వెంటనే మిగతా రైతుల పొలాలన్ని పచ్చదనంతో నిగనిగలాడాయి. ఒక కోరిక ఆ విధంగా నెరవేరింది. తర్వాత ఎండాకాలం తమ గ్రామంలోని చెరువులన్నీ ఎండిపోవడం చూసాడు. మూగజీవాలకు నీటి కటకటను గమనించాడు. తమ గ్రామంలోని చెరువులన్నీ నిండాలని తన కోరికగా కోరి తిరిగి ఆ సన్నాయిని ఊదాడు. వెంటనే ఆ గ్రామంలో గల చెరువులన్నీ ఆశ్చర్యంగా నిండిపోయాయి. ఆ తర్వాత మూడవ కోరికగా అడవిలోని, గ్రామంలోని ఎండిపోతున్న చెట్లన్నీ ఆకుపచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలని ఆ సన్నాయిని ఊదాడు. వెంటనే ఆ అడవిలో,గ్రామంలో ఉండే చెట్లన్నీ ఆకుపచ్చదనంతో నిగనిగలాడాయి. మూడు కోరికలు పూర్తి కావడంతో ఆ సన్నాయి తన మహిమను కోల్పోయింది. ఆ చెట్ల వల్ల భారీ వర్షాలు పడి ఆ గ్రామంలో పంటలు చాలా పండాయి. దానితో ఆ గ్రామం కరువు కాటకాలు తీరిపోయాయి. తమ గ్రామ కరవుకాటకాలు పోగొట్టిన ఆ రైతును గ్రామస్థులు అందరూ అభినందించారు.

March 31, 2025 27 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వని ‘తలకు’ జోహార్…జోహార్…

by Devaraju Revathi March 31, 2025
written by Devaraju Revathi

స్త్రీ చైతన్యం తొలిమెట్టు
అదే ఆశయాలమలిమెట్టు
మహిళల చేతనం నవోదయం
ప్రతి ఇంటికి ఆమే ఉషోదయం

పాత్ర ఏదైనా‌‌ అందు‌ జీవించడం
సహనం కరుణా మమతలతో
ఎదుటివారిని మెప్పించడం
తనకంటూ ఓ ప్రత్యేకతను
నిలుపుకుంటూ‌ ముందుకేగడం

బాధ్యతలెన్నోమోస్తూ తానూ
కొవ్వొత్తిలా కరిగి వెలుగివ్వటం
బాధనుగుండెల్లోదాచుకుని
బ్రతుకుదెరువుకైపోరాటం

మహిళలు జాతికి రత్నాలు
ఆదర్శం గానిలబడుతారు
స్ఫూర్తి‌ ప్రదాతలు మరెందరో
నిత్య‌ నూతన సృజనలతో
కళామతల్లుల గాథలుయెన్నో

ప్రతిభా సంపద పరిమళాలతో
వివిధ రంగాలలోరాణిస్తూ
కీర్తిప తాకము లెగురేస్తూ
తారాజువ్వలు గా దిగంతాలకు
చంద్రికలై కాంతులు విరజిమ్మే
వనితలందరికీ జోహార్ జోహార్

చంద్రయానమునశాస్త్రవేత్తలై
సాంకేతిక విప్లవసారథులై
వినూత్న రీతుల వేగంతో
జాబిలమ్మనే దరిజేర్చే
మార్గాన్వేషణ‌ పరిశోధకులు
మగువలు మీకివె అంజళులు

March 31, 2025 84 comments
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

A LONG…….. JOURNEY

by Naresh Chary March 31, 2025
written by Naresh Chary

తేది:23-02-2025 ఆదివారం.
సమయం:ఉదయం 6:00 గంటలు,రంగంపేట.
ఉదయం ఆరవుతున్నా బయట ఇంకా మసక చీకటిగానే ఉంది.చలి కూడా ఉంది. బద్ధకపు సూర్యుడు త్వరగా లేస్తే కొంత చలైనా తగ్గును అనుకుంటూనే కార్లో కూర్చున్నాను. ప్రయాణం మొదలైంది.డ్రైవింగ్ మా పెద్ద సార్ (ఉపేందర్ రెడ్డిగారు) చేస్తున్నారు. పక్కనే వారి తమ్ముడు అమరేందర్ రెడ్డి గారు కూర్చున్నారు. వెనుక సీట్ లో నేను కూర్చున్నాను. కారు బయలుదేరింది చీకటిని చీల్చుకుంటూ చలిని చీల్చుకుంటూ……
సార్ 50 లో ఉన్నాడు, కార్ 70 లో ఉంది.క్షణాల్లోనే సంగాయిపేట దాటేశాం కొద్ది నిమిషాల్లోనే కారు చిన్న ఘనపూర్ దాటి పోతంశెట్టిపల్లి చేరి మెదక్ మెయిన్ రోడ్డెక్కింది. అక్కడికి వెళ్ళిందంటే కారుకు కుదుపు ఉండదు. జర్నీ సాఫీగా సాగుతుంది.ఉషోదయపు కిరణాలు మమ్మల్ని సుతిమెత్తమెత్తగా తాకుతున్నాయి. రోడ్డంతా ఖాళీగా ఉండడంతో కారు వేగం కాస్త పెరిగింది. చూస్తుండగానే మెదక్,రామాయంపేట్,దాటింది. సిద్దిపేట కాస్త దూరంగా ఉందనగా డ్రైవింగ్ అమరేందర్ సార్ తీసుకున్నాడు‌. కొద్ది సేపట్లోనే సిద్దిపేటకు చేరుకున్నాం.అక్కడే అంబేద్కర్ సర్కిల్ లో గరం గరం చాయ్ తాగి బైపాస్ నుంచి వరంగల్ బయలుదేరాం.ఈరోజు మా హెడ్మాస్టర్ సార్ వాళ్ళ బంధువుల పెళ్లిళ్లు వరంగల్, జనగాం, ఆలేరులలో ఉన్నాయి. కూడా రమ్మంటే వెళ్ళాను.
వరంగల్ అనగానే నాకు మొదటగా గుర్తొచ్చేది వేయిస్తంభాల గుడి. వీలుంటే చూద్దాం అనుకున్నాము కానీ వీలు లేకపోయింది‌. 10 గంటల వరకు వరంగల్ చేరుకున్నాము. సార్ వాళ్ళు పెళ్ళిలో గంట సేపు ఉంటామని అనడంతో నేను నా మిత్రుడి ఇంటికి వెళ్లాను. 11:30 ప్రాంతంలో అక్కడినుండి జనగాం వెళ్లాము.పెళ్లి కన్వెన్షన్ లో. ఇది జనగాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.కన్వన్షన్ చాలా పెద్దగా ఉంది. పెళ్లికి దాదాపు 3,000 మంది హాజరయ్యారు.అందరూ ఖద్దరుదారులే.MP, జిల్లా జడ్జి లాంటి ప్రముఖులు, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కొంచెం వాకబు చేస్తే తేలింది ఏమంటే పెళ్లి వాళ్ళు రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళని. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనశాలకు వెళ్ళాము. విపరీతమైన రద్దీ ఉంది అయినప్పటికీ ఏదోలా చోటు దొరికించుకొని భోజనం చేశాము. పన్నీర్ బాగుంది . అదేమిటబ్బా ! నాన్ వెజ్ సెక్షన్ కంటే వెజ్ సెక్షన్ లోనే జనాలు ఎక్కువగా ఉన్నారేమిటి? అనుకున్నాను .కొంచెం నాన్ వెజ్ వైపు చూస్తే అర్థమైంది అక్కడ చిన్న పాటి యుద్ధమే జరుగుతోందని. దానికి భయపడి జనం ఇటు వైపు వచ్చారు. భోజనం ముగించుకొని కాసేపు కూర్చొని అక్కడినుండి ఆలేరు బయలుదేరాం .ఇది సార్ విలేజ్(మర్పెడ) వాళ్ళ పెళ్లి.ఇక్కడికొచ్చేసరికి పెళ్లి అయిపోయింది. చాలా వరకు జనాలు కూడా ఖాళీ చేశారు. మేము వెళ్లి వధూవరులను కలిసాము. పెళ్లి వాళ్ళు మమ్మల్ని భోజనశాలకు తీసుకెళ్ళారు. జనగాంలోనే గట్టిగా తినడం వల్ల ఇక్కడ ఫార్మాలిటీగా ఐస్ క్రీమ్ తిని అక్కడినుండి 4:00 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాము.

అబ్బురపరిచే కొలనుపాక జైనాలయం:
పెళ్లి మండపం నుండి సరాసరి ఆలేరుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాక లోని జైనాలయానికి వెళ్ళాం. అది 2000 సంవత్సరాల నాటిది. తెలుగు రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద జైనాలయం ఇది. ఆలయాన్ని చూడగానే నాకు క్రీ.పూ 6 వ శతాబ్దం నాటి చరిత్ర గుర్తొచ్చింది .అప్పటి సాంఘిక ,ఆర్థిక, మత రాజకీయ పరిస్థితులు గుర్తొచ్చాయి.
క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో మన దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అప్పటికి వైదిక మతమే విస్తృతంగా వ్యాప్తిలో ఉంది.మోక్షం పొందాలంటే యజ్ఞ యాగాలు, కర్మకాండలు చేయాలి .అవి ఖర్చుతో కూడుకున్నవి. మంత్రాలు కూడా సంస్కృత భాషలో ఉండేవి అందువల్ల అవి సామాన్య ప్రజలకు అర్థమయ్యేవి కావు. ఇవే జైన మతం ఆవిర్భవించడానికి కారణమని చెప్పాలి.
జైనమతాన్ని స్థాపించింది వర్దమాన మహావీరుడు. కానీ దానికంటే ముందే 23 మంది తీర్థంకర్లు ఉన్నారని జైనమత గ్రంథాలు పేర్కొంటున్నాయి. వారిలో మొదటి వారు ఋషభనాథుడు తర్వాత అజిత నాథుడు, సంభవనాథుడు, అభినందన, సుమతి నాథ, పద్మ ప్రభువు, సుపార్శ్వనాథ, చంద్ర ప్రభు, పుష్పదంత, శీతలనాథ, వాసు పూజ్య, విమలనాథ,అనంతనాథ, ధర్మనాథ, శాంతి నాథ, కుంతనాథ ,అరనాథ ,మల్లనాథ, మునిసువీరనాథ, నేమినాథ, అరిష్టనేమి, పార్శ్వనాథ లాంటి 23 మంది తీర్థంకరుల తర్వాత వచ్చిన వాడే 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు. ఋషభనాథుడు మొదటి తీర్థంకరుడు అయినప్పటికీ జైనమతంలో ఈయన కొన్ని మార్పు చేర్పులు చేసి దాన్ని ఒక క్రమ పద్ధతిలో ప్రచారం చేసి విస్తృత పరిచాడు కాబట్టి వర్ధమాన మహావీరుడిని జైన మత స్థాపకుడు అన్నారు.

వర్ధమాన మహావీరుడు తన 30 ఏళ్ల వయసులో గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టి సన్యాస దీక్ష స్వీకరించాడు. 13 సంవత్సరాల కఠోర దీక్ష చేసిన అనంతరం అతనికి జ్ఞానోదయమయింది. మరో 30 సంవత్సరాలు మగధ, అంగ,కోసల ప్రాంతాల్లో జైనమత తత్వాన్ని ప్రచారం చేస్తూ 72 సంవత్సరాల వయసులో పావాపురి వద్ద తనువు చాలించాడు.
జైనమతం ప్రతిదాంట్లో ఆత్మ ఉంటుందంటుంది, నిరాడంబరతకు ప్రాముఖ్యతనిస్తుంది.మానవ జీవన సాఫల్యానికి వర్ధమాన మహావీరుడు మూడు ముఖ్యాంశాలను సూచించాడు అవి1. సరైన విశ్వాసం 2.సరైన జ్ఞానం 3.సరైన నడవడి.ఇతను జైన మతంలో చెప్పిన పంచ సూత్రాలకు అంటే పార్శ్వనాథుడు చెప్పిన సత్యం,అహింస,అపరిగ్రహం అస్తేయం లకు బ్రహ్మచర్యం జోడించి వీటిని పాటించాలని చెప్పాడు.వీటిని “పంచ కళ్యాణాలు” అంటారు. ఏ విధంగా సులభ మార్గంలో మోక్షం పొందాలో ప్రజల భాషలో చెప్పాడు మహావీరుడు .దాంతో జైన మతం భారతదేశమంతా వ్యాపించి, కొంతకాలం ఆదరణకు కూడా నోచుకుంది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో చిన్న స్పర్థల వల్ల జైన మతం శ్వేతాంబర, దిగంబర శాఖలుగా విడిపోయింది. దక్షిణ భారతదేశంలో స్థూల భద్రుని నాయకత్వాన శ్వేతంబర శాఖ, ఉత్తర భారత దేశంలో భద్రబాహుని నాయకత్వంలో దిగంబర శాఖ ప్రచారం నిర్వహించుకున్నాయి.ఇందులో ఉండే కఠిన నియమాల వల్ల కాలక్రమమేనా జైన మతం క్షీణించి బౌద్ధమతం ఆవిర్భవించింది.ఏ శాఖ వారైనా తీర్థంకరులను గౌరవించారు.
జైనమత వ్యాప్తిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించారు. ఇదిగో ఈ కొలనుపాక జైనాలయం కూడా అందులో భాగంగానే నిర్మించబడింది. ఆలయాన్ని చూడగానే ఉత్సాహమేసింది. ఫోన్లో ఆలయాన్ని బందిద్దామనుకున్నాను కానీలోపలికి ఫోన్ తీసుకెళ్ళనివ్వలేదు. ఫోన్లన్నీ కారులో పెట్టి లోనికి ప్రవేశించాము.గుడి బయటి భాగానికి పెయింట్ వేస్తున్నారు.గుడి చాలా ప్రశాంతంగా ఉంది. గుడి లోపల ఇంకా ప్రశాంతంగా ఉంది.గుడి ద్వారం కోటను తలపిస్తుంది. ద్వారంవైపు అటు ఇటుగా ఉన్న నల్ల రాతితో చెక్కిన ఏనుగులు మనకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటాయి.గుడి మొత్తం చలువరాయితో నిర్మించబడింది.గుడి లోపలి భాగం మాటల్లో వర్ణింపనలవిగాకుండా వుంది. అద్భుతమైన శిల్పకళాకౌశలంతో మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. నాట్యకత్తెలు,తప్పెట వాయిస్తున్న స్త్రీ శిల్పాలు,పువ్వులు, తీగలు ఎంత అద్భుతంగా చెక్కబడ్డాయో! అణువణువునా పొదిగియున్న ఇక్కడి శిల్ప సౌందర్యం ఎవరిరైనా కట్టిపడేస్తుంది. పాలరాతిపై అంత అద్భుతమైన శిల్ప సంపదను ఆవిష్కరించినందుకు ఆ శిల్పకారులకు నమస్కరించాలనిపించింది. ఎంత ఓపిక,ఎంత ఏకాగ్రత ఉంటే అలా చెక్కగలరు. అబ్బబ్బా …. చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. బహుశా ఇలాంటి శిల్ప సంపదను మనం కేవలం మన దేశంలోని ఆలయాల్లోనే చూడగలమనిపించింది. కొంచెం టైం వెచ్చించాలి గాని మనదేశాన్ని పూర్తిగా సందర్శిస్తే ప్రపంచంలోని సగభాగాన్ని చూసినట్టే. గుడి లోపలి భాగంలో చుట్టూ జైనతీర్థంకరులు ఉన్నారు. ఆ విగ్రహాలన్నీ నల్లరాయితో మలచబడ్డాయి. ఆలయంలో ప్రధాన ఆకర్షణ వర్ధమాన మహావీరుడు, ఋషభనాథుడు,నేమినాథుడి విగ్రహాలే.
ఇక్కడి మూలవిరాట్టు ఋషభనాథుడు. మూల విరాట్టుకు కుడివైపున గల గర్భగుడిలో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కుంభకంతో కూడిన సిద్దాసనం, అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉంది. వేళ్ళు పొడవుగా ఉన్నాయి. నవ్వు ముఖం, పాల భాగం విశాలంగా ఉండి చుబుకం మనోహరంగా ఉంది.విజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారతదేశంలో మరెక్కడా లేదు.
ఋషభనాథుని విగ్రహం38.5 అంగుళాల వెడల్పు 34.56 అంగుళాల పొడువు కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ విగ్రహం ఆహార్యము బహుగొప్పగా మలచబడింది. అర్ధ పద్మాసన సిద్దాసనంలో ఉండి ముఖ ముద్ర గాంభీర్యంగా ఉన్నది, కాంతి మండలం గుండ్రంగా ఉన్నది, లలాటం మీద చంద్రుడు, చుబుకం మీద సూర్యుడు,అరచేతి మీద శంఖం, చక్రం ఉన్నాయి. ఇది భరత చక్రవర్తి నెలకొల్పిన అతి ప్రాచీనమైన విగ్రహం. వాటి కింద హిందీలో వారి పేర్లు కూడా ఉన్నాయి.
ఋషభనాథునికి ఎడమవైపు నేమి నాథుని విగ్రహముంది.ఇది కూడా పద్మాసనంలోనే,గొప్ప అలంకారభూయిష్టంగా ఉంది. ఆ ముగ్గురిని తనివితీరా చూసి,నమస్కరించి ముందుకు కదిలాము. ఆలయపు దక్షిణపు గోడపై జైనమహా సభలు జరిగిన వివరాలు పొదగబడిన చిత్రము ఒకటి కనిపించింది. దాన్ని చూసి ముందుకు కదిలాము. గుడిలో మమ్మల్ని ఆశ్చర్యపరచినవాటిలో గుడి డోం ఒకటి.దాన్ని చూస్తే నాకు OU ఆర్ట్స్ కాలేజీడోం గుర్తుకొచ్చింది. దానికంటే ఇది ఇంకా బాగుంది. డోంచుట్టూ అద్భుమైన శిల్ప సంపద మమ్మల్ని కన్నార్పకుండా చేసింది. డోంని ఎలా నిర్మించారని చాలాసేపు ఆలోచించాను……నిజంగా అద్భుతమది.
అలా గుడి లోపలిభాగంలో ఉన్న జైననతీర్థంకరుల విగ్రహాలను మొత్తం చూశాము.గుడి మధ్య భాగంలో కొంతమంది భక్తులు ఉన్నారు.వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. వాళ్ళ ముఖంలో లవలేశమైనా ఆతృత గానీ కోపం గానీ లేవు.ఏ భావం లేకుండ ఉండడం చాలా కష్టం,కానీ అసాధ్యం కాదు. అక్కడంతా మౌనం తాండవించింది.మేము కూడా మౌనంగా ప్రధానాలయం దాటాము.
ప్రధానాలయానికి కుడివైపున చిన్న ఆలయం ఉంది.అదికూడా చాలా బాగుంది.ప్రధానాలయానికి ఉత్తర భాగంలో ఉన్న మరో ఆలయానికి వెళ్ళాము. ఆలయం చిన్నగానే ఉంది లోపల పాలరాతితో చెక్కబడిన శాంతి నాథుని(తీర్థంరుల్లో ఒకరు) విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంది ధ్యానముద్రలో శాంతి నాథుడు అద్భుతంగా దర్శనమిచ్చాడు.
మళ్లీ ఎప్పుడైనా వస్తే ఫ్యామిలీతో రావాలనుకుని మెల్లిగా బయటకు వచ్చాము. ఫోన్ గనక అనుమతిస్తే నేను ఎన్నో ఫోటోలు వీడియోలు తీసేవాడిని. అయినా అది చూస్తే తప్ప లేని చెప్పలేని అనుభూతి. గుడి బయట కొన్ని ఫొటోలు దిగి గుడికి వీడ్కోలు చెప్పి మెల్లిగా చేర్యాల కు బయలుదేరాం అక్కడ మా బుడ్డోడితో ఒక 15 నిమిషాలు గడిపి సిద్దిపేటకు బయలుదేరాం.

అలా అలా…రంగనాయక సాగర్ జలాశయపు ఒడిలో…
సిద్దిపేటలో సందర్శించదగ్గ వాటిలో రంగనాయక సాగర్ జలాశయం ఒకటి.ఇది సిద్దిపేటకు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామానికి దగ్గరలో ఉంది. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 2300 ఎకరాల్లోదీన్ని నిర్మించారు. దీనికి కెపాసిటీ మూడు టీఎంసీలు. దీనిని 2020లో హరీష్ రావు ,కె.టి.ఆర్ గార్లు ప్రారంభించారు. ఇది సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 114,000 ఎకరాలకు నీరందిస్తుంది. ఎండాకాలంలో కూడా సిద్దిపేట పరిసర ప్రాంతంలో చెరువులు నిండుగా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం ఈ జలాశయమే.
రంగనాయక సాగర్ జలాశయం పై వరకు కార్లో వెళ్లొచ్చు. దాని చుట్టూతా హారమున్నట్టు తారు రోడ్డు ఉంది. జలాశయం,చుట్టుప్రాంతం చాలా శుభ్రంగా ఉంది. నీళ్లు కూడా బాగానే ఉన్నాయి. దీవి మధ్యలో దేశం ఉన్నట్టు రంగనాయక సాగర్ మధ్యలో గెస్ట్ హౌస్ ఉంది. అక్కడి వరకు మనం కారులో వెళ్లొచ్చు .సందర్శకులతో ఎప్పుడు కూడా ఇది కళకళలాడుతుంది. మేము గెస్ట్ హౌస్ కు దగ్గరదాకా వెళ్లి చుట్టూ చూసాం. ఎటు చూసినా జలమే. కళ్ళకు ఎంతో హాయి కలిగించేదృశ్యమది. అక్కడ వివిధ భంగిమల్లో కొన్ని ఫోటోలు దిగాము. తర్వాత ఇంకొంత దూరం వెళ్లి ఎక్కడ నుండి నీళ్లు ఇందులోకి వస్తాయో ఆ పంపుల దగ్గరికి వెళ్ళాము. అక్కడ సాగర్ లోపలికి వెళ్లడానికి కట్టబడిన బాల్కనీ కట్టడం ఉంది. అక్కడి నుంచి చూస్తే రంగనాయక సాగర్ మహా అద్భుతంగా కనిపించింది. అక్కడ కూడా కొన్ని ఫోటోలు దిగాము. అప్పుడే సూర్యుడు మెల్లిమెల్లిగా నిద్రలోకి జారుతున్నాడు.మేము తిరుగు ప్రయాణమయ్యాం.ప్రస్తుతం బోటింగ్ అవకాశం లేదుగానీ ఉంటే వెళ్లే వాళ్ళమేమో……

విజయ్ సార్ ఇంట్లో వేడివేడి పూరీ……
రంగనాయక సాగర్ నుండి తిరుగు ప్రయాణమై సరాసరి సిద్దిపేటలోని విజయ సార్ ఇంటికి వెళ్ళాం. సమయం సాయంత్రం 7:00 అయింది. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యాం. మేము వస్తున్నామన్న వార్త ముందే తెలియడంతో కావచ్చు మాకోసం సార్ స్పెషల్ గా పూరి చేయించారు.తిని చాలాసేపే అయింది కాబట్టి మాకు కూడా ఆకలైంది. పూరీలను చూడగానే ఇంకా ఆకలె క్కువైందనొచ్చు. లేత గోధుమ రంగులో పొంగిన పూరీలు, వాటి పక్కన కాబూలీ శనగలతో చేసిన కర్రీ….. కాంబినేషన్ అదిరింది. విజయ్ సర్ కొసరి కొసరి వడ్డిస్తుంటే ఆసాతం మేమాస్వాదిస్తూ తిన్నాం. అనంతరం అందమైన వైన్ గ్లాసులలో ఆపిల్ జ్యూస్ తాగడం చాలా బాగా అనిపించింది.సోంపు వేసుకొని కాసేపు సార్ వాళ్ళ స్కూల్ విషయాలు కాసేపు మా స్కూల్ విషయాలు ఇంకాసేపు విద్యార్థుల భవితవ్యం గురించి మాట్లాడుకొని ఎనిమిది గంటలకి విజయ్ సర్ నుండి సెలవు తీసుకొని రంగంపేటకు బయలుదేరాం.
కారు సాధారణ వేగంతోనే ముందుకు వెళుతోంది. ఎండాకాలం ఆరంభమైంది కదా…. కారు అద్దాలు తీస్తుంటే చల్లటి గాలి మాకు సుతిమిత్తగా తగులుతోంది. వెనకసీట్లో కూర్చున్న నేను ఎప్పటికప్పుడు క్రికెట్ స్కోర్ చూస్తున్నాను. ఈరోజు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ పాకిస్థాన్ చేసింది. రెండో ఇన్నింగ్స్ మొదలైంది. స్కోర్ పెద్ద గా లేకపోవడంతో పెద్ద ఒత్తిడి కూడా ఏం లేదు. అందునా చేజింగ్ కింగ్ కోహ్లీ ఉన్నాడు కదా….భయమేల అనుకున్నాను. మ్యాచ్ మొదలైంది. ఇండియా బాగానే బ్యాటింగ్ చేస్తుంది అమరేందర్ సార్ డ్రైవింగ్ కూడా బాగా చేస్తున్నాడు. అదేమిటో చల్లగాలి తగిలినాకొద్ది నాకు నిద్ర ముంచుకొస్తుంది ఓవైపు మ్యాచ్ ,మరో వైపు నిద్ర…ఎలా…. అనుకుంటుండగానే గంటలో మెదక్ చేరుకున్నాము.అక్కడ ఆగి ఛాయ్ తాగడంతో నిద్ర కాస్త పారిపోయింది. ఇక మెదక్ నుండి బయలుదేరి సరాసరి రంగంపేటకు వచ్చేసరికి సమయం 9:45 అయ్యింది.
అక్కడక్కడా ఆగుతూ, ఆతిథ్యం స్వీకరిస్తూ వచ్చినందుకేమో! 450 కిలోమీటర్లు ప్రయాణించినా మాకు అలసట కలగలేదు. చూస్తుండగానే ఇండియా పాకిస్తాన్ పై విజయం సాధించింది. ఇంకేం…..ఖేల్ ఖతం దుకాణం బంద్.

వీలైనప్పుడు మీరు కూడా కొలనుపాక జైనాలయాన్ని, రంగనాయక సాగారాన్ని తప్పకుండా సందర్శించండి.

March 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us