మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

పుత్రోత్సాహము తల్లికి

by Kattekola Vidyullata November 22, 2023
written by Kattekola Vidyullata

 ట్రింగ్ …ట్రింగ్ ..

ఫోన్ మోగడం తో వంట గదిలో నుంచి వచ్చింది సుజాత “హలో, హలో ,నేను అమ్మా నీ శీను ని మాట్లాడుతున్నాను.”

” చెప్పు బాబూ, ఏంటి సంగతి అంత ఆనందంగా ఉన్నావు?”

” ఆ అవునమ్మా ! ఆనందం కాదు అంతకు మించి. నా (నీ) కల నెరవేరింది అమ్మా. నేను కలెక్టర్ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యాను.. ఇప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. వెంటనే నీకు ఫోన్ చేస్తున్నాను.

ఈ క్షణం నీ పక్కన ఉండి ఉంటే బాగుండు. నీ కళ్ళల్లో ఆ వెలుగులు చూస్తే బాగుండు అనిపిస్తోంది అమ్మా. రాత్రి ట్రైన్ కి బయలుదేరి వస్తాను.”

“ఏంటి శ్రీనూ, నువ్వు చెప్పేది నిజమా? మన కల నెరవేరిందా? సో గ్రేట్ నాన్నా! కంగ్రాట్యులేషన్స్! మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. ఎంతో గర్వంగా ఉంది. సరే వెంటనే బయలుదేరిరా.

నువ్వు వచ్చేసరికి నీకు ఇష్టమైన బొబ్బట్లు, ఆవ పెట్టిన పులిహోర చేసి ఉంచుతాను. మీ స్నేహితులను కూడా భోజనానికి పిలువు. ఈ ఆనందం వాళ్ళ అందరితో షేర్ చేసుకుందువు గానీ.”

“అలాగే అమ్మా. అలా అయితే ముద్దపప్పు ఉంచు. ఆ వెంకట్ గాడికి మన ఇంట్లో ముద్దు పప్పు ఆవకాయ అంటే ప్రాణం. మీ అమ్మ అంత బాగా ఆవకాయ ఎవరూ చేయలేరు రా అంటాడు. ఇక ఉంటాను మరి. వాళ్ళందరికీ ఫోన్లు చేయాలి. బై,”

” బై శీను, జాగ్రత్త. బయలుదేరినప్పుడు ఫోన్ చెయ్,” చెప్పింది సుజాత.

ఫోన్ పెట్టేసి ఆనందభాష్పాలు తుడుచుకుంటూ సోఫాలో కూర్చుంది. మనసు గతంలోకి జారిపోయింది అప్రయత్నంగా.

“అది కాదమ్మా, నువ్వు ఇప్పుడు భర్తను వదిలేస్తే ఈ పిల్లాడిని పెట్టుకుని ఎలా బతుకుతావు? నువ్వు చేస్తున్నది ప్రైవేట్ ఉద్యోగం. ఆ సంపాదనతో పిల్లాడిని చదివించడం సాధ్యమవుతుందా? మంచో చెడో పిల్లాడి కోసమైనా నువ్వు సర్దుకుపోవాలి అతడితో,” తన తల్లి మాటలు.

“లేదమ్మా అతనితో కలిసి ఉంటే నా పిల్లాడికి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అనిపిస్తుంది నాకు. అతడి చెడు ప్రవర్తన పిల్లాడి పెరుగుదల పై ప్రభావం చూపిస్తుంది. నాకది ఇష్టం లేదు. నేను నా శ్రీనూని ఒక గొప్ప పౌరుడిగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నాను.సాధ్యమైతే వాడిని కలెక్టర్   గా చూడాలనుకుంటున్నాను. నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకు. అతనితో కలిసి ఉండమని చెప్పకు, ప్లీజ్.”

ఏ ధైర్యంతో ఆ నిర్ణయం తీసుకుందో తెలీదు కానీ తన భర్త తనను మోసం చేస్తున్నాడని, తిరుగుబోతు గా మారాడని తెలియగానే అతడితో విడాకులకు సిద్ధమైంది.

కానీ అమ్మ చెప్పిన మాట నిజమే. తన ప్రైవేట్ టీచర్ ఉద్యోగం తో కొడుకుకి మంచి చదువు చెప్పించడం కష్టం. కనుక దీనికి ఏదైనా చేయాలి. శ్రీను ని బాగా చదివించాలి. ఎలా? ఏం చేయటం? ఆలోచిస్తూ ఉండగా ఒక  మంచి ఉపాయం తట్టింది  సుజాతకి.

అవును కరెక్ట్ అలా చేస్తే తనతోపాటు తన లాంటి మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కల్పించవచ్చు. సంపాదన పెరుగుతుంది కనుక ఇబ్బంది ఉండదు.

కానీ తను అనుకున్నది ఆచరణలో పెట్టి ఫలితం రావడానికి కనీసం ఒక ఏడాది కాలం పడుతుంది, అప్పటి వరకూ తనూ, పిల్లాడు బ్రతకడానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోతుందా? మళ్లీ ఆలోచనలో పడింది సుజాత.

తన ఆలోచనని, ప్రణాళికను అన్నగారితో చర్చించింది. చిన్ననాటి నుంచి అన్నయ్య తను మంచి ఫ్రెండ్స్. తన ప్రతి సంతోషంలో, కష్టంలోనూ తోడు ఉన్నవాడు అన్నయ్య. ఇది కూడా తన ధైర్యానికి కారణం కావచ్చు.

“చాలా బాగుంది సుజాతా. నీకు ఎలాగు వంట చేయడం ఇష్టం కదా. నీ చేతి వంట అమోఘంగా ఉంటుంది కాబట్టి  తప్పక విజయం సాధిస్తావు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అన్నా వదినలు ఉన్నారని మర్చిపోకు,” అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించాడు అన్నయ్య.

అదిగో ఆరోజు తన ఆలోచనల్లో మొదలైనది “అమ్మ చేతి వంట” అనే క్లౌడ్ కిచెన్. పూర్తి శాకాహార ఆంధ్ర భోజనం.

ఉన్నపళంగా హైదరాబాద్ వచ్చేసింది తను. భర్త (తను) ఉద్యోగం చేస్తున్న ఊరిని వదిలి. అయితే ఇక్కడ తన చిన్ననాటి స్నేహితులు చాలామంది ఉన్నారు. వారికి ఫోన్ చేసి చెప్పింది తను వస్తున్నానని.

 తన స్నేహితురాలు సీత ఎంతో సహాయం చేసింది. ఉండేందుకు ఇల్లు చూసి పెట్టడమే కాక ఆమె భర్త వ్యాపారంలోనే ఉండడంవల్ల తను వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన సరుకులు వస్తువులు వంటివి అతని స్నేహితుల వద్ద హోల్ సేల్ ధరలకు ఇప్పించడం వంటి ఎన్నో.

చివరికి తను విడాకులకు అప్లై చేసేందుకు లాయర్ గారిని కూడా పరిచయం చేసింది సీత. ఆమెకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి.

ఆ విడాకుల ప్రహసనం మామూలుగా జరిగిందా? తను మగవాడిని కనుక ఎంతమందితో తిరిగినా తప్పులేదనే అహంకారంతో ఉన్న భర్త, అంతే గొప్పగా అతనికి వత్తాసు పలికే అత్తగారు ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేయడానికి ప్రయత్నించారు!

తనకు తెలియకుండా

పిల్ల వాడిని కలుసుకుని వాడి బుర్రలో తనకు వ్యతిరేకంగా విషం నూరి పోయడానికి కూడా సిద్ధపడ్డారు. 

పాపం శీను, చిన్న పిల్లవాడు. తల్లా,తండ్రా అంటే ?కానీ వాడు చాలా తెలివైనవాడు. అంతేకాక చిన్ననాటి నుండి తానే లోకంగా బ్రతుకుతున్న తన తల్లి మనసు అర్థం చేసుకున్నాడు. తన తోటే ఉన్నాడు. తనని పూర్తిగా నమ్మాడు.

తన భర్త లాంటి మగవారిని ఏం చేయాలి అసలు? కాలం ఎంత మారినా తాము మారమని, మగవాడు అంటే అదేదో దేవుడు అన్నంత అహంకారం. తాను విడాకులు అనే సరికి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు తల్లీ కొడుకులు. అయినా తన తప్పు ఒప్పుకునేంత ఔన్నత్యం లేదు కదా!

అతని తప్పు మూలానే తాను విడాకులు కోరుతున్న విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

తన అన్నయ్య స్నేహితుడైన ఒక ఇన్స్పెక్టర్ సహాయంతో సాక్ష్యాలను సేకరించగలిగింది.

కేవలం విడాకులతో వదిలేయాలా లేక తనను మానసికంగా ఇంత బాధపెట్టిన అతడినిజైలుకు పంపించాలా? ఎన్నో ఆలోచనలు.

కొత్తగా మొదలు పెట్టిన వ్యాపారం ఒకపక్క, కోర్టు కోసం తిరగటం ఒకపక్క. ఈ మధ్యలో బంధువులలో గుసగుసలు. వీటన్నిటినీ అధిగమిస్తూ శ్రీను చదువుకు ఏమాత్రం అంతరాయం కలుగకుండా చూసుకుంటూ తన వ్యాపారంపై దృష్టి పెట్టలేక పోతోంది.కానీ పోరాడాలి, గెలవాలి అన్న తపన, గెలుస్తాను అనే ఆత్మవిశ్వాసం ఏనాడు విడవలేదు సుజాత.

ఏదైనా వ్యాపారం మొదలు పెట్టి అందులో విజయం సాధించడం సినిమాలో చూపించినంత సులువైన విషయం కాదు అని అర్థమైంది సుజాతకు.

అందులోనూ తన లాంటి ఒంటరి మహిళలకు ఆ పోరాటం ఇంకా ఎక్కువ. కానీ పోరాడితే విజయం తప్పక సాధించగలం అని నిరూపించింది కూడా తను.

తను ఆనాడు ఒక శాఖగా ప్రారంభించిన “అమ్మ చేతి వంట” తన అయిన వాళ్ళు, స్నేహితుల ప్రోత్సాహం తో పాటు హైదరాబాద్ నగర వాసుల ప్రోత్సాహంతో, వారి శాఖాహార అవసరం తీరుస్తూ, వారిచ్చిన మంచి ఫీడ్ బ్యాక్ వలన ఈరోజు నగరంలోని వివిధ ప్రాంతాలలో 8 శాఖలుగా విస్తరించింది.

 అన్ని శాఖలలో కలిపి దాదాపు 50 మందికి పైగా ఆడవారు పనిచేస్తున్నారు. వారంతా తనలాగా జీవితంలో ఏదో విధంగా దెబ్బతిన్నవాళ్లే.

కొత్త శాఖను ప్రారంభించినప్పుడల్లా కనీసం ఒక నెల రోజులు తను అక్కడే ఉంటూ అక్కడ వంట చేయడానికి వచ్చిన వారికి ప్రతి ఆహారం తను అనుకున్న రుచి వచ్చేలా ఎలా చేయాలో కొలతలతో నేర్పించడం చేసింది .

అందువల్ల అన్ని శాఖలలోనూ ప్రతి రోజూ ఒకే రుచి. రుచి, శుచి, నాణ్యత విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం వల్ల తను అనుకున్న విధంగా విజయం సాధించగలిగింది.

వ్యాపారం లో ఎంత బిజీగా ఉన్నా శ్రీను చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎప్పుడూ మర్చిపోలేదు సుజాత. మంచి కాలేజీలో ఇంటర్ చదివాడు.

ఫ్రెండ్స్ అంతా ఇంజనీరింగ్ చదువుతున్నా తన ఆశయం అది కాదని తెలుసు కనుక డిగ్రీలో చేరాడు శ్రీను. చదువులో ఎప్పుడూ అశ్రద్ధ చూపలేదు. పీజీ చదువుకుంటూనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు.

తల్లి కష్టం, మనసు అర్థం చేసుకున్నాడో ఏమో చిన్ననాటి నుంచి తల్లి కలనే తన కలగా చేసుకుని కలెక్టర్ అవడం కోసమే చదివాడు. గత రెండు ప్రయత్నాలు విఫలం అయినప్పుడు కుంగిపోకుండా ముచ్చటగా మూడో ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు.

ఈ సంతోషానికి అవధులు ఉన్నాయా? అసలు ఇది నిజమేనా? తను కలగంటోందా?  చేతి మీద గిల్లుకుంది సుజాత. ‘అబ్బా!’ నొప్పి తెలుస్తోంది. అయితే ఇది నిజమే అన్నమాట.

వెంటనే ఈ ఆనందాన్ని తన తల్లిదండ్రుల తోటి, అన్నా వదినల తోటి పంచుకోవాలి. తన స్టాఫ్ అందరికీ శ్రీను వచ్చాక పెద్ద పార్టీ ఇవ్వాలి.

“అమ్మా, నేను కలెక్టర్ అయిన తర్వాత నువ్వు ఇంక ఏ మాత్రం కష్టపడొద్దు.నాతోటే ఉండాలి. ఈ ఆంటీలందరికీ నేను ప్రభుత్వ రుణాలు వచ్చేలా చేసి సొంత వ్యాపారాలు చేసుకునేలా చేస్తాను,” అని చెప్పే శ్రీను అంటే వాళ్ళందరికీ ఎంత ఇష్టమో. ఈ వార్త విని చాలా సంతోషిస్తారు. ఆలోచిస్తూ సోఫాలోంచి లేచింది తన పుత్రోత్సాహాన్ని అందరితో పంచుకోవడం కోసం సుజాత.

రచన :  కట్టెకోల విద్యుల్లత

6302805571

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగు… సంస్కృత పదాల స్వరూపం

by రంగరాజు పద్మజ November 22, 2023
written by రంగరాజు పద్మజ

      పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయులకైనా , విద్య నేర్చుకొనే చిన్నారులకైనా పెద్ద సమస్య ఏమిటంటే? ఏది సంస్కృత పదం?, ఏది తెలుగు పదం? అని గుర్తించడం, కత్తి మీద సామే . అయితే కొంచెం కష్టపడి ప్రయత్నం చేస్తే సంస్కృతం, తెలుగు పదాలును సులభంగా కొనుక్కోవచ్చు. కష్ట పడితే సాధించలేనిది లేదు కదా! తెలుగు, సంస్కృత పదాలను సులభంగా ఎలా తెలుసుకోవచ్చో చేసే చిరు ప్రయత్నం ఇది.

    బాలవ్యాకరణంలో చిన్నయసూరి సంస్కృత సమం , సంస్కృత భవం, ప్రాకృత సమం, ప్రాకృత భవం, దేశ్యాలు గురించి సంజ్ఞాపరిచ్ఛేదంలో చక్కగా వివరించారు. సంస్కృత పదాలను తత్సమాలని, తెలుగు పదాలను ఆచ్ఛికాలని చెప్పారు.ఆచ్ఛిక పరిచ్ఛేదంలో

“సంస్కృత సమేతరంబైన యీ భాష యచ్చనా బడు” అని సూత్రీకరించారు.

అనగా పైన చెప్పిన సంస్కృత సమ పదాలుగాక , సంస్కృత భవం ,ప్రాకృత సమం ,ప్రాకృత భవం ,దేశ్యాలతో కూడిన పదాలను ఆచ్చికపదాలు లేదా తెలుగు పదాలని చెప్పవచ్చని ఫలితార్థం.

మొదట సంస్కృత పదములను… గురించి తెలుసుకుందాం

1.సంయుక్తాక్షరములతో కూడిన పదములన్నీ సంస్కృతపదాలు.

ఉదా:-చక్రః , వర్షమ్ , మూర్ఖః ,అర్చన , కర్పూరమ్ ……

ఇవి తెలుగులో చేరునపుడు వీటికి తెలుగు ప్రత్యయాలైన డు, ము ,వు లు చేరి చక్రము,  వర్షము , మూర్ఖుడు , అర్చన , కర్పూరము అని మారుతాయి.

2. సంశ్లిష్టాక్షరములతో కూడిన పదములు సంస్కృత పదాలు….

ఉదా:-స్త్రీ ,రాష్ట్రం ,అర్ఘ్యం ,జోత్స్న ,క్త్వార్థం……

3 మహాప్రాణాక్షరాలతో కూడిన పదాలు సంస్కృత పదాలు…….

ఖరం ,ఘటం ,ఛత్రం ,ఝషం ,కంఠం ,ఢంకా ,కథ ,ధనం ,ఫలం భజన…..

4.విసర్గతో కూడినవి సంస్కృత పదాలు….

ఉదా:-దుఃఖం ,అంతఃపురం ,అంతఃకరణ ,తపఃఫలం, మనఃకాయం….

5.ఋ ౠలతో కూడిన పదాలు సంస్కృత పదాలు….

ఉదా:-ఋషి  ,ఋణం , ఋతువు ,….

6.శ ,ష ,హలతో కూడినపదాలు సంస్కృత పదాలు….

ఉదా:- శతము ,శంకర ,శశము, శంతనుడు ,ఆశ ,ఆకాశం ,

వేషము, దోషము ,ప్రదోషము ,

హంస ,హలము ,హాలాహలం ,హారం హీనం ,హోమం……

7.డు ,ము,వులు చేరడానికి తగిన పదాలు సంస్కృత పదాలు….( ఇవి తెలుగులోకి చేర్చేటప్పుడు డు ,ము ,వు లు చేరి వస్తాయి.)

రామ, భీమ , భయంకర, కంస

వన, దేశ , ప్రాంత ,ఆవేశ ,

చిత్ర, క్రతు , ధేను, తరు గురు,….

రాముడు, భీముడు , భయంకరుడు, కంసుడు

వనము, దేశము , ప్రాంతము ,ఆవేశము ,

చిత్రము,  క్రతువు , ధేనువు, తరువు గురువు,….

8.ఉపసర్గతో కూడిన పదాలు సంస్కృత పదాలు….

ఉదా:-ప్రతిదినం , ప్రఖ్యాతి , సకుటుంబం , ప్రత్యక్షం , పరోక్షం , దుర్లభం , సంతృప్తి, అపరిశుభ్రం , ,…

9.సంస్కృత సంఖ్యావాచకాలతో కూడినవి సంస్కృత పదాలు….

ఏక ,ద్వి ,త్రి చతు ,పంచ ,షష్టి సప్త, అష్ట, నవ , దశ , శత , సహస్ర….

10. సవర్ణదీర్ఘ ,గుణ ,యణాదేశ వృద్ది , అనునాసిక , విసర్గ , జస్త్వ , శ్చుత్త్వ…. సంధులతో కూడినవి సంస్కృత పదాలు….

అష్టావధానం, కవీశ్వర, గురూపదేశం, పితౄణం వేంకటేశ్వర ,మహర్షి ,ప్రత్యేక, అణ్వస్త్రం, ఏకైక ,పరమౌషదం మనోహరం ,చతుషష్టి……

11 ఋతువుల పేర్లు , తిథులపేర్లు , నక్షత్రాల పేర్లు ,తెలుగు సంవత్సరాలు…. సంస్కృత పదాలు

ఉదా:-వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు….

అమావాస్య ,పాఢ్యమి …..

అశ్వని ,భరణి,…..

ప్రభవ, విభవ….

12. వట్రుసుడితో కూడినవి సంస్కృత పదాలు….

ఉదా:-గృహము ,కౄరుడు , కృపాణము , ధృతరాష్ట్రుడు , దృష్టి , ధృవీకరణ, పృథివి , పృచ్ఛకులు , భృగువు , సవితృ ,ధాతృ ,నేతృ ,భర్తృ కర్తృ …..

13.యకారముతో కూడిన పదాలు తెలుగులో లేవు. అంటే యకారంతో కూడిన పదాలన్నీ సంస్కృత పదాలే.

యమున , యముడు , యజ్ఞము , యంత్రము , యాత్ర….

ఇక తెలుగు పదాల గురించి తెలుసుకుందాం

1.ద్విత్వాక్షరములతో కూడిన పదాలు తెలుగు పదాలు

ఉదా:-అమ్మ, అక్క ,అవ్వ, అత్త , కుక్క, మొగ్గ , వెన్న , కర్ర , నిచ్చెన , గజ్జెలు , పిట్ట….

2 .అరసున్నతో కూడిన పదాలు తెలుగు పదాలు

ఉదా:-తెలుఁగు ,మూఁడు ,చీఁకటి ,పాఁత , కోఁతి మూఁత. కోఁట పేఁట మూఁట……

3.సర్వనామాలన్నీ తెలుగుపదాలు

ఉదా:-నేను, మేము, నీవు మీరు, అతడు , వాడు , వారు , వాడు , వీడు, ఎవడు, ఎంత , అంత , ఇంత,  కొంత, కొన్ని, ఎన్ని , అన్ని , అక్కడ, ఇక్కడ , ఎక్కడ….

4.క్రియలతో కూడినపదాలు తెలుగు పదాలు

ఉదా:-వండు ,తిను,చదువు ,పాడు ,వచ్చు ,పోవు ,అమ్ము , కొను….

(లిఖించు ,భావించు ,భేధించు ,ఖండించు ఇలాంటివి సంస్కృత క్రియలు. సంస్కృత క్రియలు తెలుగులో అలాగే చేరవు. క్రియలు చివరి ఇంచు చేరుతాయి)

5.స.. తో కూడిన పదాలు ఎక్కువగా తెలుగు పదాలు

ఉదా:-సంత, సంచి , సంతకం ,ఆస ,ఆకసం ,పూస, గసగసాలు……

(సంతోషం , సంభవం… ఇలాంటివి సంస్కృత పదాలు)

6.కొన్ని డు, ము, వులతో కూడినవి తెలుగు పదాలు

ఉదా:-వాడు ,వీడు ,పాపడు ,మగడు, కైరుడు, కత్తలుడు , జన్నడు , తమ్ముడు, మనుమడు, ఆటగాడు , జూదగాడు, పాటగాడు , వేటగాడు, బల్లిదుడు, ఱేడు, చెలికాడు , హెగ్గడికాడు , అటమటీడు , కన్నడీడు , కల్లరుడు , పాము , ఇనుము , అల్లము, సున్నము, బియ్యము , అందము, చందము,చెరువు, పరువు, కరువు, దరువు, నిలువు , కొలువు,….

7. సంయుక్తాక్షరంతో గానీ మహాప్రాణాక్షరంతో గానీ కూడినప్పటికి పదం చివర డు ,ము ,వు … చేరితే అవి తెలుగు పదాలుగా మారుతాయి. (కానీ మూలం సంస్కృత పదం) వీటినే తత్సమాలు అంటారు. వీటికి మరొక పేరు ప్రకృతులు.

ఉదా:- ఈశ్వరుడు, భీముడు , పర్వతము, భయము , క్రతువు , తరువు..

భీముడు+ అతడు

పర్వతము + అది

భయము +ఎందుకు

8.ఎ ,ఒ, చ, జ(దంత్యాలతో కూడినవి) లతో కూడినపదాలు తెలుగు పదాలు 

ఉదా:-ఎలుక ,ఎంత ,ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ,ఎరుక, ఎరువు ,ఎరుపు , ఒక , ఒంటె, ఒంటరి, ఒనరు, ఒప్పు, ఒత్తు, ఒద్దిక , చాప, చురక ,చూలు, చందమామ, జడ, జల్లెడ, జముడు ,జాతర ,జున్ను

9.సంఖ్యలన్నీ తెలుగు పదాలు

ఉదా:-ఒకటి ,రెండు,మూడు ,నాలుగు ,ఐదు ,ఆరు…నూరు ,వంద ,ఇన్నూరు ,వేయి,

10. కృదంత ప్రత్యయాలు చేరిన పదములు అచ్చతెలుగు పదాలు

కోయు+త….కోత

కోయు అనేది క్రియ .. క్రియా మీద త అనే కృదంత ప్రత్యయం చేరి కోత అని నామవాచకంగా మారింది.

పండు+ట..పంట

మూయు+త…మూత

పూయు +త…పూత

మండు +ట…మంట

అరుచు+పు…అరుపు

మునుగు +క…మనక

చేరు+ఇక…..చేరిక

కోరు+ఇక…..కోరిక

అలుగు+క….అలక

పోవు+ క….పోక

ఊరు +ట….ఊట

11.తద్దిత రూపాలతో ఏర్పడు పదాలు తెలుగు పదాలు.

నామవాచకాల మీద గానీ, విశేషణాల మీద గానీ చేరి నామవాచకంగా మారే పదాలను తద్దినాలు అంటారు.

పెద్దతనము… పెద్ద అనేది విశేషణం. దాని మీద తనము అనే తద్దిత ప్రత్యయం చేరి పెద్దతనంగా మారింది.

 పెద్దఱికము, చుట్టఱికము , కన్నెఱికము, పూజారి, అరమరిక ,చదువరి ,తెంపరీ , తెరువరి ,సుంకరి ,జూదరి,

జాలరి ,టక్కరి ,వగలాడు ,దొమ్మరి ,ముక్కిడి,ఆటగత్తె , మోసగత్తె ,చాకిత ,కఱవత , చిఱుతుక , నాతుక, నెలతుక

12.శకటరేఫములతో ఏర్పడేవి తెలుగుపదాలు.

కఱ్ఱ ,బఱ్ఱె ,తొఱ్ఱ ,గొఱ్ఱె ,ఱంపము ,జుఱ్ఱు ,కఱ్ఱు ,మఱ్ఱి ,,……..

13.కొలమానం తెలుపే పదాలు అచ్చతెలుగుపదాలు….

జాన ,మూర ,బిత్తెడు ,దోసెడు ,మానిక, కుంచం , పడి , సేరు , అణా , దమ్మిడి , రూక ,రూపాయి

గుర్తించుకోవలసినవి….

1.సంయుక్తాక్షర పదములన్నీ సంస్కృతపదాలే కానీ

కర్జము ,సంద్రం ,….మొదలైన పదములు ఆచ్చికపదాలు.

2 వస్తే ,ఇస్తే ,తెస్తే,అరిస్తే మొదలైన చేదర్థకాలతో కూడినవి  ఇవి సంయుక్తాక్షరాలతో కూడినా మూల రూపం వచ్చు ఇచ్చు తెచ్చు అరుచు అనేవి అచ్చతెలుగు పదాలు.

(మూల రూపం వచ్చు+తే… వస్తే)

3.అన్నము వంటి ద్విత్వాక్షర పదాలు సంస్కృత పదాలుగా ఉన్నాయి.

ఇలా తెలుగు, సంస్కృత పదాలను సులభంగా గుర్తించవచ్చు. కానీ అభ్యాసం వలన మరి కొన్నింటిని తెలుసుకోవచ్చు

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కన్నీళ్ళు

by జయంతి వాసరచెట్ల November 22, 2023
written by జయంతి వాసరచెట్ల

కళ్ళు ఎప్పుడూ….
భావాలను తర్జుమా చేస్తాయి
కన్నీళ్ళు కళ్ళకు తోడై నిలుస్తాయి!

మాట మౌనం వహించినప్పుడు
మరో కొత్త భాషగా కన్నీళ్ళు!

మనసు అద్దానికి కళ్ళు ప్రతిబింబమైతే
కళ్ళ తో చెప్పలేని …
భావాల సమూహం కన్నీళ్ళు !

నిత్యం
అనేక సంఘర్షణల నడుమ నలిగిపోయి
హృదయం ద్రవించి కళ్ళనుండి ధారాపాతమై
దగ్ధమైన హృదయాన్ని చల్లబరుస్తాయి కన్నీళ్ళు!

ఓదార్పు మాటల ప్రవాహంతో
రాలుతున్న ఒక్కో కన్నీటి చుక్కా
పెదాలపైని చిరునవ్వుతో
అంతర్థానమవుతాయి!

కన్నీళ్ళు విలువైనవి
వాటిని దాచుకునే చోటు చిరునవ్వు!

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఈ లోకం

by mayuukha November 22, 2023
written by mayuukha

గాయాలెన్నైను
గుట్టుగా సర్దుకోవడమే తప్ప
మనసు విప్పి చెప్పలేను
అర్థం చేసుకోవడమే తప్ప
అవసరమైనవి అడగలేను
కష్టమెంతైనను కన్నీరు కార్చడమే తప్ప
కాదని అనలేను
అందరిప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే తప్ప
ప్రశ్నించలేను

సుఖదుఃఖాలలో సహాచరిణిని
సర్వము అంకితం చేసిన సౌభాగ్యినిని
ఇంటందరి బాగోగులు చూసే ఇల్లాలిని

కాపురం గుట్టుచప్పుడు కాకుండా సర్దుకుపోయే గృహిణిని
జీవితపయనంలో జీవచ్చవంగా బతుకుతున్న
అతిసాధారణమైన అర్ధాంగిని నేను

ఈ తరతరాల బ్రతుకులో తరుణిగా బ్రతుకుతున్న
అనుదినం నా వేదనలను వెనుకేసి ముందుకు కదులుతున్న
కదనరంగంలో నన్ను నేను

నిరంతరం
నిత్యచైతన్యవంతంగా నిలబెట్టుకుంటున్న
అయినా ఈనాటికి ఒంటరి ఆడది అంటే ఆ లోకం చూపేవేరు
ఆదిశక్తిలా కొలువైన ఆడదానిగా అలుసైన

నివురుగప్పిన ఈ సమాజం ఎప్పుడూ విసురుతూనే ఉంటుంది నాపై ఓ చూపు

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

పద్యము తెలుగువాడిలో భాగమగును భాగమే కాదు మనిషికి భాగ్యమగును”- గౌరీశంకరశర్మ

by రంగరాజు పద్మజ November 22, 2023
written by రంగరాజు పద్మజ

అవధాన వరేణ్యులు మాన్యులు శ్రీ ముత్యంపేటగౌరీ శంకరశర్మ గారితో మయూఖ పత్రిక పరిపృచ్ఛా

సాహిత్య ప్రయోజనం హృదయాన్ని స్పందింపచేయాలి.. సాహిత్య ప్రయోజనం జాతీయ ప్రయోజనమైనప్పుడు.. స్పందించే హృదయాలు సంస్కారాలను పెంచుకొని, మంచి పౌరులుగా తయారవుతారు. అలా ఉన్నతులైన వారు మరింతమందికి  జీవిత విధానాలకు మార్గదర్శకులుగా .. సమాజానికి ప్రేరణ ఇచ్చేవారిగా చేయడం సాహిత్య లక్ష్యం!

    సాహిత్యం పాఠకుని సంస్కారాన్ని పెంచే ప్రక్రియలో నూతనత్వం యొక్క అవసరాన్ని గమనించి  ప్రతి తరంలో కవి పండితులు ఆయా ప్రక్రియలలో రచనలను సృష్టించారు…

గౌరీశంకర శర్మ

   ఆ కోవలోనే చక్కటి పద్యాలను అవధానాల రూపంలో అందిస్తూ… అటు భాషామ తల్లికి, ఇటు  సమాజానికి సాహిత్య సేవకులుగా.. అందిస్తున్న కవి పండితులు  శ్రీ ముత్యంపేట గౌరీ శంకరశర్మగారు మన మయూఖ ద్వైమాసిక పత్రిక పాఠకుల ఆత్మీయ అతిథులు.

   సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం వ్యర్థమని పెద్దలు చెప్పే మాట ! దానితో నేను ఏకీభవిస్తూ..

ఆ దిశగా మన సాహిత్య ప్రక్రియలను బతికి బట్టకట్టిస్తున్న సృజన కారులను గౌరవిస్తూ… రేపటి తరానికి మార్గదర్శకులుగా చూపించాలనే చిరు ప్రయత్నమే ఈ ముఖాముఖి!!

ఆస్వాదించండి!

అష్టావధాన కార్య మ

దృష్టముచే గాక యెట్లు దీర్పంగ వచ్చున్

కష్టమో సుఖమో యది యు

తృష్ణ మనుషులే యెఱింగి కీర్తింతురిలన్॥

మన తెలుగు సాహిత్య పరిణామంలో ఎన్నెన్నో ప్రక్రియలు రూపొందాయన్నది అందరికీ తెలిసిన విషయమే!

          పరిచయమే అక్కరలేని ప్రముఖ అవధాని గారిని పరిచయం చేయడం మంటే రేపటి తరానికి ప్రేరణ కల్పించడానికే! ఈనాటి మన ముఖాముఖీన  కార్యక్రమంలో

బహుముఖీన విద్యా విశారదులు, జంట  అవధానులుగా తెలుగు రాష్ట్రాలలో పేరుపొందిన సంస్కృత అవధానులు ,

1,మహాకాళీ సుప్రభాతం ,

2. శ్రీరామచంద్ర సుప్రభాతం,

3.శ్రీ శివానందోదాహరణం,

4.శ్రీనోరి నరసింహోదాహరణము, వంటి బహుపుస్తక గ్రంథకర్తలు, మాన్యులు ముత్యంపేట గౌరీశంకరశర్మగారు. శ్రీయుత గౌరవనీయులైన ముదిగొండ అమర్నాథశర్మ గారితో పాటు సంస్కృత- తెలుగు అవధానాల నెన్నిటినో అలవోకగా చేసిన కవి, పండితులు , సాహితీవేత్త గారి ముఖతః గా వారి సాహితీ యాత్ర గురించి తెలుసుకుందాము.

పద్మజ. నమస్కారమండీ!

ముత్యంపేట గౌరీశంకర శర్మ:- నమస్కారం.

పద్మజ (ప్ర) :-

మీవంటి సరస్వతీ స్వరూపులకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల గురించి, మీ నేపథ్యం గురించి మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?

గౌరీశంకర శర్మ:- (జ)

మా స్వగ్రామం లచ్చపేట, దుబ్బాక మండలం ॥సిద్దిపేట జిల్లా, మా తల్లిదండ్రులు నాగలింగ శాస్త్రి- రాజ్యలక్ష్మి గారలు. మా నాన్నగారు సంస్కృతాంధ్ర పండితులు.

న్యాయ వేదాంతాయుర్వేదాభిజ్ఞ బిరుదు వారికి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఇద్దరు అక్కయ్యలు తర్వాత నేను, తమ్ముడు.

పద్మజ:- (ప్ర)

మీ విద్యాభ్యాసము, వృత్తి, ప్రవృత్తుల గురించి వివరిస్తారా?

గౌరీశంకర:- (జ)

నా విద్యాభ్యాసం మా నాన్నగారు సంస్కృత పండితులు కాబట్టి, నాకు కూడా సంస్కృతం నేర్పించాలనే ఉద్దేశంలో  శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల కళాశాల వేములవాడలో చేర్పించారు. ఆరవ తరగత నుండి బి ఏ ఎల్ వరకు పది సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా విద్యను పూర్తి చేశాను. సంస్కృతం,సాహిత్యం, తర్క, వ్యాకరణాలు, మొదలగు వాటితో పాటు  ఈశ్వర గారి కిష్ఠయ్య ఘనాపాఠీ గారి దగ్గర వేదం కొంత భాగం నేర్చుకోవడం జరిగింది. మా కళాశాలలో మంచి విద్వద్దిగ్గజా ల్లాంటి గురువులు ఉండేవారు. ఆ తర్వాత భాగ్యనగరంలో తెలుగు M A సంస్కృతం MA phd చేసి, 2002లో  ఉద్యోగం లభించింది వృత్తిపరంగా వైదిక కార్యక్రమ నిర్వహణం.

పద్మజ ( ప్ర):–

ఉపాధ్యాయ వృత్తిలో ఏవైనా పురస్కారాలు అందుకున్నారా? విశిష్ట సేవలందించినందుకు బిరుదులు గానీ పొందారా?

గౌరీశంకర ( జ).

వృత్తిలో 2014లో జిల్లా స్థాయి  [మెదక్] ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, తెలుగు మహాసభలలో అవధానంలో [మహబూబ్ నగర్] లో  అవధాన తిలక అనే బిరుదునిచ్చారు. అలాగే శ్రీశైల పీఠం ఆస్థాన పండితుడిగా, శ్రీ పుష్పగిరి  పీఠానికి కూడా ఆస్థాన పండితులుగా శ్రీ విద్యా శంకర భారతి స్వామి వారు నియమించడం నా సుకృతం.

పద్మజ ( ప్ర):-

పద్య ప్రాశస్త్యాన్ని మీరెలా సమర్ధిస్తారు? దానిని ఎలా కాపాడుకోవచ్చు? విద్యా ప్రావీణ్యత చూపేందుకే పద్యరచన చేస్తారా? ఎందుకంటే ఆంగ్లమాధ్యమంలో కొనసాగుతున్న నేటి విద్యా బోధనా విధానంలో తరగతి గదిలో పాఠ్యాంశాలలో ఇదివరకు వలె పద్య పాఠాలు కనపడడం లేదన్నది ఒక వాదన వినిపిస్తున్న ఈ తరుణంలో పిల్లల చేత పద్య రచన ఎలా కొనసాగించ గలం ?

గౌరీశంకర శర్మ (జ):-

“పద్యము తెలుగువాడిలో భాగమగును భాగమే కాదు మనిషికి భాగ్యమగును” అన్నట్లుగా ఆత్మానందానికి ప్రతీక పద్యం! పద్యం చదువుతుంటే ఆందోళనలు అన్ని తగ్గి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆంగ్లమాధ్యమంలో చదివినా విద్యార్థులకు మంచి, మంచి వేమన పద్యాలు, సుమతీ శతక పద్యాల ద్వారా నీతిని బోధించాలి. ఇదివరకటిలాగా కాకుండా మా పాఠశాలలో నైతే పిల్లల చేత కొంతవరకు రచన చేయిస్తున్నాను   

పద్మజ. ప్ర :-

ఉభయ భాషలలో పట్టు సాధించడానికి ఎలాంటి కృషి చేసారు?

గౌరీశంకర ( జ):-  ఉభయ భాషలలో పట్టు -అమరకోశం – శబ్ధమంజరి- బాల బోధిని, కావ్య ప్రబంధ పఠనం మొదలైనవి చాలా దోహద పడినవి.

పద్మజ(ప్ర) :–

నోరి నరసింహోదాహరణము రచించడాని గల ప్రేరణఏమిటి? అసలు ఉదాహరణములను ఎలా చెప్పుకోవచ్చు?

గౌరీశంకర ( జ):–

సద్గురు శివానంద మూర్తిగారు మా శైవపీఠానికి పీఠాధిపతిగా ఉండేవారు. వారు లోక గురువులు. ఆధ్యాత్మిక భావనా సంపన్నులు. ఎందరో గొప్పవారు వారికి శిష్యులుగా ఉన్నారు. ఒకసారి వారి ఆశ్రమం భీమిలి [విశాఖపట్నంలో] సభలు జరిగిత వెళ్ళాం. ఊరికే ఎలా వెళ్లడం? అని ఆలోచించి వారికి ఏదైనా సమర్పిస్తే బాగుంటుందని

భావించి వారిపై ఉన్న భక్తికి నిదర్శనంగా విభక్తి కావ్యం  ఉదాహరణ కావ్యం రచించి వారి సమక్షంలో ఆవిష్కరణ చేసి, వారికే అంకితం ఇచ్చాను.దీంట్లో సంబోధన విభక్తితో కలిసి, ఎనిమిది విభక్తులతో ఒక్కొక్క విభక్తి ఒక్కొక్క పద్యం, అలాగే కళిక- ఉత్కళిక, రగడలతో  స్తుతి కావ్యాన్ని సంతరించి గురు పాదాలకు సమర్పించడం జరిగింది.

పాల్కురికి సోమనాథుడు వేసిన సంప్రదాయమిది. కవిసామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి కుమారులు నోరి  సుబ్రహ్మణ్య శాస్త్రిగారు వారి తండ్రి గారి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్  స్థాపించి ప్రతి సం॥ పురస్కారాలు ఇస్తున్నారు. అలా మాకు కూడా ఇచ్చారు. వారి పైన సంస్కృతంలో మిత్రుడు అమర్నాథ్ శర్మ, తెలుగులో నేను రచించి వారికి సమర్పించుకున్నాము.

పద్మజ (ప్ర):-

మహా కాళీ సుప్రభాతం రచనా నేపథ్యం చెప్పండి?

గౌరీశంకర ( జ) :–

అది 1990 సంవత్సరంలో వేములవాడలో విద్యాభ్యాసం కాగానే నాచారంలో శ్రీ మహా కాళి దేవాలయంలో వాస్తు జ్యోతిష పండితులు శ్రీ వేదాంతం నరసింహమూర్తి గారి దగ్గర శిష్యరికం, పురోహితం చేస్తూ అమ్మవారిపై శ్రీమహాకాళి సుప్రభాతం రచించి శ్రీమతి కే .కమల ఆచార్య రవ్వ శ్రీహరి గారు ముదిగొండ వీరభద్రయ్య గారి చేతుల మీద ఆవిష్కరణ జరిగింది.

పద్మజ( ప్ర) :–

అవధానాలే కాక ఇతర కళారంగాలలో మీ పాత్ర- వాటి విశేషాలువివరించండి!

గౌరీశంకర శర్మ:- (జ)

మా గురువుగారు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ తిగుళ్ళ శ్రీ హరి శర్మ గారు

వేముల వాడలో మాకు సాహిత్యాన్ని బోధించేవారు. వారు అష్టావధానులు వారి వద్ద మెలుకువలు నేర్చుకున్నాము అలా అవధానాలు చేస్తున్న సమయంలో ప్రాచీన కావ్యములు పఠించడం జరిగేది ఆ పద్యవాసన వల్లనే ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు దివాకర్ల వేదిక తరపున భువన విజయాలు వేసేవారు. ఒకసారి నన్ను దూర్జటి పాత్ర వేయమన్నారు. ఆ పాత్ర వేసి రక్తి కట్టించేసరికి అలా అన్ని పాత్రల పద్యాలు కంఠస్థం చేయవయ్యా! నీకు ఏ పాత్ర అవకాశమిస్తే ఆ పాత్ర వేయాలి అనేవారు. అలా రాయలు, తిమ్మరసు తప్ప అన్ని పాత్రలు వేసేవాడిని. ముఖ్యంగా పెద్దన, ధూర్జటి, మల్లన పాత్రలు వేసేవాడిని అలాగే ప్రతాపరుద్ర నాటకంలో విద్యానాథుడి పాత్ర కైలాస సాహితీ సభలో శ్రీనాథుడి పాత్ర ఇలా పోషిస్తూ కళా రంగంలో కృషి చేయడం జరిగింది.

పద్మజ (ప్ర) :–

అవధాన విద్య నేర్చుకోవాలనే అభిలాష కలవారికి మీరేమైనా మార్గదర్శనం చేస్తారా?ఇంకా ఇతరులెవరైనా ఆ దిశగా కృషి సల్పుతున్నారా? వారికి మీరిచ్చే సలహా ఏమిటి?

గౌరీశంకర శర్మ(జ) :–

అవధాన విద్యనేర్చుకోవాలనే తపన గల వారికి మామిత్రులు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవగాహన కళాపరిషత్తు  స్థాపించి ఎందరికో ఔత్సాహికులకు అవధానులచేత శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాంట్లో నేను కూడా పాల్గొని శిక్షణ ఇచ్చాను. నా సలహా ఒకటే పద్యాలు బాగ నేర్వాలి ఇతరులవి కూడా చదవాలి అదే ఆలోచన ఉండాలి. శ్రద్ధ, ఏకాగ్రత మొదలైనవి ఉండాలి!

పద్మజ( ప్ర):–

కళలకు సమయం వెచ్చిస్తే చదువు

కుంటుపడుతుందనే విద్యార్థుల తల్లిదండ్రులకు మీరిచ్చే సలహా ఏమిటి?

గౌరీశంకర శర్మ (జ):–

కళలకు సమయం వెచ్చిస్తే చదువుకుంటు పడుతుంది అనేది కేవలం వారి అపోహ మాత్రమే! అటు చదువుతూ ఇటు సంగీతం, నాట్యం, కరాటే, వాయిద్యాలు పిల్లలు నేర్చుకోవడం లేదా? ఇప్పుడు అలాగే ఈ పద్యరచన కూడా!!

పద్మజ ( ప్ర):–   

తెలుగుభాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టమనే ఒక అపోహ ప్రజలలో ఉన్నది. దానికిమీరేమంటారు?

గౌరీశంకర శర్మ (జ) :-

తెలుగు భాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టం అనేది కూడా ఒక అపోహనే! ఇప్పటికీ తెలుగుతో పాటు ఆంగ్లభాష నేర్చుకుని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కదా! కేవలం తెలుగైతే తెలుగు పండితులుగా భాషావేత్తలుగా అయ్యే అవకాశం ఉంది.

పద్మజ( ప్ర) :–

కొసమెరుపుగా మీరు తెలుగు భాష- విద్యా బోధన ఎలా ఉండాలనుకుంటారు? అంటే పిల్లవాడికి తనంత తానే తెలుగు భాష మీద మక్కువ పెంచుకునేలా ఏమి చేయవచ్చు? దానిని ఆచరణలో ఎలా పెట్ట వచ్చు? దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా?

గౌరీశంకర శర్మ ( జ):–

పిల్లవాడికి తెలుగు భాష మీద మక్కువ కలగాలంటే మనం కొన్ని భాష చమత్కారాలు, పొడుపు కథలతో కూడిన పద్యాలు అనుప్రాసాలంకార శోభితమైన పద్యాలు ముందు మనం చదువుతూ, పాడుతూ, ఆడుతూ నేర్పిస్తే నేర్చుకుంటారు. మా పాఠశాలలో పిల్లలకు పద్యంతాక్షరి పోటీలు పెట్టి బహుమతులు ఇస్తాను. వాటికోసం పద్యాలు కంఠస్తం చేస్తారు.

పద్మజ ( ప్ర):-

అటు వృత్తి ఇటు ప్రవృత్తి రెండింటికీ సమన్యాయం ఎలా చేయగలుగుతున్నారు? అలాగే సమయ సద్వినియోగం గురించి రెండు మాటలు చెప్పండి!

గౌరీశంకర శర్మ (జ):-

వృత్తి- ఉద్యోగం -ప్రవృత్తి -వైదిక కార్యక్రమాలు- సాహిత్య- అవధాన, కళారంగాలపై అవగాహన సమయం సెలవులు ఉంటే వాటిని సార్థకచేస్తున్నాను.

క్షణశఃక౯శశ్చైవ- విద్యామర్ధంచ సాధపేత్! అని మా నాన్న గారు చెప్పేవారు. ఊరికే ఉండొద్దు అంటే సంపాదన. అయితే విద్యాదానం ఇలా…

పద్మజ ( ప్ర) :- 

మీరు మెప్పు పొందిన అవధానం గురించి, ఛందోభాషణం కానీ అప్రస్తుత ప్రసంగం సందర్భంగా మీరు చెప్పిన పద్యాలు మా మయూఖ పాఠకులకు చెప్పండి!

గౌరీశంకర శర్మ ( జ):–

 అవధానములో మెప్పు పొందిన అవధానం రవీంద్రభారతిలో ప్రపంచ తెలుగు మహాసభలలో చేసిన అవధానం 17-12- 2017 లోజరిగింది. దానిని శ్రీ నాగ ఫణి శర్మగారు ప్రత్యక్షంగా విని మెచ్చుకున్నారు. అలాగే ఒక అవధానంలో ఒక సమస్యను ఇచ్చారు!

హనుమత్పుత్రుడు భీష్మ సూనను వివాహంబాడె రారండహో!

వినుమా! నేడిట కృష్ణ దివ్య కథలావిష్కారమున్ జేసెదన్

ఘన వంశాంబుధి నోలలాడిన మహా గాంభీర్య తేజస్విమున్

అనుమానింపకు మమ్మ! శౌరి మతడే యాశ్చర్యమౌ దివ్య దే

హనుమత్పుత్రుడు …..

అంటూ నందుడు గోపవనితలలో తన కుమారుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్పే సందర్భం కొంచెం ఇబ్బంది అయినా బాగా వచ్చింది. అలాగే రచించిన మహాకాళేశ్వర శంకరా!  అనే ఏకప్రాస శతకానికి ముందు మాట చెప్పి పద్యంతో ఆశీర్వదించారు ద్వి సహస్రావధాని నాగపణిశర్మ గారు.

మతి మన్మంజులమై, శివా కరుణమై, మాధుర్యమై ధుర్యమై

సతత త్ర్యంబక పాదభక్తివశమై సమ్మాన్యమై మాన్యమై

కృతి మన్మంగళమై సదాశివద గౌరీ శంకర ప్రోక్త- వా

క్యతపః పూర్ణమునౌ శతాత్మకము శ్రేయః ప్రేమముల్ గూర్చుతన్!

అంటూ ఆశీఃపూర్వకముగా అభినందించారు.

దాదాపు అవధాన వరేణ్యులందరి అవధానములలో పాల్గొన్నాను.

నాగఫణిశర్మగారు, గరికపాటి వారు, వద్దిపర్తి వారు, మేడాసాని వారు, జీఎం రామ శర్మ గారు, ఆముదాల, కడిమిళ్ళ వారిలాంటి పెద్దవారితో అవధానాలలో  పాల్గొనే అవకాశం లభించింది.

చివరగా మయూఖపత్రికా ప్రశంస

ఈ మయూఖము శిఖరమై యిలను నిలిచి

బహుముఖీనము  గాంచుచు భద్రమగుత!

సాహితీ సుధ వెలయించి శాశ్వతమగు

కీర్తినందుచుభవితకు  స్ఫూర్తినిడుత!

ఈ అవకాశాన్ని కల్పించిన సహృదయ వరేణ్యులు ఆర్ష ధర్మ ప్రదీపిక రంగరాజు పద్మజ గారికి కృతానేక కృతజ్ఞతా పూర్వక ధన్యవాద నమస్సులు.

          శుభం.

రంగ రాజు పద్మజ:-

గౌరవనీయులైన అవధాని గారిచే చక్కని సాహిత్య విశేష విషయాలను తెలుసుకున్నాం! మనమూ ఆ దిశగా అడుగులు వేద్దాం!

        మాన్యులు అవధాన శిఖామణి శ్రీయుత గౌరీశంకరశర్మ గారితో ముఖాముఖీ భాగ్యం కల్పించిన మయూఖ పత్రిక సంపాదకురాలికి ప్రతేక ధన్యవాదములు తెలుపుతూ…

జయతు !  తెలుగు భాషామతల్లీ! జయతు !

పరిపృచ్ఛ- రంగరాజు పద్మజ.[కథా రచయిత్రి]

November 22, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మనిషిని మేలుకొలిపే సంపుటి”భావ కదంబం”

by Samala Kiran November 22, 2023
written by Samala Kiran

      మనసైనది రాయకుంటే ఎలా? అంటూ మనసులోని భావాలన్నింటినీ “భావకదంబం”గా అందించిన మనసుకల రచయిత శ్యాంప్రసాద్ రెడ్డి. పరిశీలన గుణం, స్పందించే గుణం ఈ రెండు కవికి చాలంటాను అయితే వీటి వెనుక హృదయం ఉండాలి. సమాజాన్ని పరిశీలించి, హృదయముతో స్పందించి, భావాలను కవితా సంపుటిగా తీసుకురావడం అభినందనీయం.        

              కవిని కాదు,కవితారీతులు నాకు తెలియదంటూనే కవితాత్మకంగా కవిత్వం చెప్పిన రచయిత నిరాడంబరులు, నిరహంకారులని అర్థమవుతుంది. కవిత్వం చాలావరకు ఆత్మాశ్రయమే అయినా విరివిగా వస్తువులను ఎంచుకున్నారు. సంపుటిలోని పలు కవితలు సామాజిక, ధార్మిక, దేశభక్తి ప్రబోధాత్మకంగా పటుత్వాన్ని కలిగి ఉన్నవి. అనేక కవితల్లో సహజమైన అంత్యనుప్రాస అలరింపజేస్తుంది. అల్ప అక్షరాలతో అనల్ప భావాలను వెదజల్లిన కవితలు మరెన్నో. పద సంపద కొదువలేనంతగా…..బలంగా,  భావ సంపద అదుపులేనంతగా…. వేగంగా ప్రకటించటం ఈ రచయితకే చెల్లింది.
            కవికి జీవితానుభవం ఎక్కువ. అందుకే “జీవితం” కవితలో అక్షరాలతో ఆడుకున్నారు. జననం,మరణం,పయనం,తోరణం,పోరాటం, ఆరాటం, కోలాటం, ఊగిసలాట, దోబూచులాట, సోపానపు ఆట, చదరంగం, రణరంగం, బొంగరం, క్షణభంగురం, అమరం, అజరామరం వంటి పదాలతో జీవితాన్ని హృద్యంగా చెప్పారు.  “అనంత గమనం” లో విచ్ఛిన్నమవుతున్న వివాహ వ్యవస్థను గుర్తు చేస్తూ, భార్యాభర్తల అనుబంధం ప్రాధాన్యతను చెప్పుకొచ్చారు. “నువ్వు ఏడుస్తూనే ఉండు నేను నవ్వుతూనే ఉంటా” కవిత ద్వారా ఈర్ష్యా ద్వేషాలను విడిచి జీవించాలనే సందేశం నర్మగర్భంగా నొక్కి చెప్పారు రచయిత. “దేవుడు దీవించాడు” అంటూ అమ్మలో అందరినీ, అన్నింటిని ఇచ్చాడని అమ్మ గొప్పతనాన్ని కవిత్వంలో పంచారు. “పెళ్లి సందడి”లో సాంప్రదాయ వివాహ పద్ధతిని కళ్ళ ముందు నిలబెట్టారు. సామాన్యుడి సైకిల్ గురించి చెబుతూ బాలగేయం లాంటి కవితని రాసిన విషయం పాఠకులకు ఇట్లే తెలిసిపోతుంది.
        నిరీక్షణ,జ్ఞాపకాలపుటలు, పాదాక్రాంతం, ఎదురుచూపులు, నీకు తెలుసా, ఇలా సాగనీ ప్రియా, రారాధ నా ప్రియ, నడిచిరా నా ప్రియ, తకిట తకధిమి కవితల్లో భావకవి కృష్ణశాస్త్రిలా ఊహాసుందరిని సృష్టించుకున్నారో, గతకాలపు మధుర అనుభూతులో, భార్యని ప్రేయసిగా ఊహించుకొని రాసుకున్నారో కానీ అన్నియు సుమధుర సుస్వర మధుర కవితలే.
              “నిర్భయ”కవితలో రచయిత  భావావేశాన్ని “వావి వరస మరచిన జాతిని నపుంసకుల చేయమని” దేవతలకు వినిపించేలా ప్రకటించాడు. ‘పీఎసెల్వీ’ లో దేశభక్తిని, ‘అమ్మ భాష’లో భాషానురక్తిని, ‘ఇది జన ఉగాది’ లో హిందూ ధర్మ ప్రశస్తి ని చాటి చెప్పారు. “గాంధారం గొల్లుమంటుంది” కవిత మధ్యయుగాలనాటి మతమౌడ్యమూలాలను ప్రశ్నిస్తుంది. మానవత్వ రక్షణకు క్రూరత్వం అంతం కావాలని కవి అంతరంగం. విస్తరిస్తున్న మతమౌడ్య ఛాయలను “షరియా కోరలు చాస్తోంది, తుపాకి గొట్టం చట్టం చేస్తోంది” అంటూ ధ్వనిస్పోరకంగా ఉగ్రమనస్తత్వాలను ధైర్యంగా దునుమాడారు. “పరాన్నభుక్కులు”, “అక్షరం అమ్ముడుపోయింది” కవితలలో వాళ్లే….వాళ్లే….. అంటూ హిందూ వ్యతిరేకుల కుట్రలను బట్టబయలు చేశారు. ‘దేశం గీశం జాన్తానై యని వేషాలెన్నో వేస్తోంది మోసాలెన్నో చేస్తోంది’ అని చైనా, పాకిస్తాన్ లకు వంత పాడే కలాలను కడిగిపారేశారు. అసంపూర్ణ తైల వర్ణచిత్రంలో ‘విప్లవపు పసిగుడ్డు’ విధ్వంస సిద్ధాంతాన్ని ఆవిష్కరింపజేశారు. ఇలా అనేక కవితల ద్వారా సాహితీ, సామాజిక, చారిత్రక రంగాలలో చొరబడిన భీభత్సకారుల్ని చెడుగుడి ఆడుకున్నారు.
         రచయిత శ్యామప్రసాదులు కావున శ్రీకృష్ణుడే ఇష్టసఖుడేమో…. పలు కవితలను జగద్గురువు పై సృష్టించారు. “మీ కన్నవాడు మీ కన్నా మిన్నవాడు” అంత్యప్రాసలతో కన్నయ్యకు పట్టాభిషేకం చేసింది. “కలుద్దాం కడుగుదాం” అంటూ సమాజంలోని దుర్మార్గాలను చెండాడేందుకు ఒక్కసారైనా కన్నీరు కార్చేద్దామంటూ పిలుపునిస్తారు రచయిత. “కల్లోలిత కలం”తో కవితా సంపుటిని పూర్తిచేస్తూ – నా కలం రేపిన కలకలం తప్ప, నా తప్పేం లేదు’అంటూ కవితలన్నింటితో కవిత రాయడం ఈ సంపుటి ఓ విశేషం అయితే, ముగ్గురు లబ్ద ప్రతిష్ఠితులతో ముందుమాట రాయించటం మరో విశేషం. ఆకర్షణీయమైన ముఖచిత్రముతో పుస్తక ప్రచురణల సంస్థ మెగా మైండ్స్ ముద్రించడం ఆనందదాయకం. మొదటి సంపుటితోనే పాఠకుల హృదయాలను ఆకట్టుకునే కవిత్వాన్ని అందించిన రచయిత మరెన్నో రచనలు తీసుకురావాలని ఆశిద్దాం, అభినందిద్దాం.

ప్రతులకు:-
మెగా మైండ్స్ పబ్లికేషన్స్ – 8500581928

November 22, 2023 0 comment
5 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

పారమార్థిక చింతన ఉన్నప్పుడే సమాజం ‘అర్ధ’వంతమవుతుంది- ఆచార్య మసన చెన్నప్ప

by Aruna Dhulipala November 22, 2023
written by Aruna Dhulipala

ఆర్షకవి, ఆర్షకోకిల, సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య డా.మసన చెన్నప్ప గారితో మయూఖ ముఖాముఖి.

               నమస్కారం సర్.

మీ సాహితీ ప్రస్థానాన్ని గురించి మా పాఠకులకు తెలియజేయాలనే కోరికతో మీ ముందుకు వచ్చాము.

1.. మీరు పుట్టిన జన్మస్థలం, తల్లిదండ్రులు, మీ బాల్య విశేషాలు, చెప్పండి..

జ:    అమ్మా! నమస్కారం. నేను తెలంగాణలో పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి తాలూకా, మాడుగుల మండలం, కొలుకులపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఫిబ్రవరి 8, 1955లో జన్మించాను. మా తల్లి రామలక్ష్మమ్మ గారు, తండ్రి బుచ్చయ్య గారు. వారికి నేను ఏడవ సంతానం. మాది చేనేత కుటుంబం. అక్కడ మా ఇద్దరన్నయ్యలకు చదువుకునే అవకాశం లభించలేదు. స్త్రీవిద్యకు కూడా అంతగా ప్రాధాన్యం లేని కాలం కాబట్టి మా అక్కయ్యలు కూడా చదువుకోలేదు. అన్నయ్యలిద్దరు మగ్గం నేస్తే తప్ప పూట గడవని పేద స్థితి మాది. ఇంట్లో దాదాపు 15 మందిమి ఉండేవాళ్ళం. అయినప్పటికీ నా చదువుకు అమ్మానాన్నల ప్రేరణతో బాటు అన్నయ్యలిద్దరి ప్రేరణ కూడా పుణ్యవశాత్తు లభించడం చేత నేను చదువుకోగలిగాను. చదువుకునే సమయంలో బాల్యంలో అ ఆ లు దిద్దించిన అబ్దుల్లా సార్, ఎ బి సి డి లు పెట్టించిన సాల్మన్ సార్ ఇప్పటికి నాకు బాగా గుర్తు. 5వ తరగతి వరకు వారు నాకు మంచి ప్రేరణ కలిగించారు. దాని తర్వాత ఒక విధంగా అక్కడ పై చదువుకు అవకాశం లేకపోవడం వల్ల చదువు ఆపాలి. కానీ మా పెద్దన్నయ్య వీరయ్య గారు, చిన్నన్నయ్య సత్తయ్య గారు మా తమ్ముడు చదువు కోవాలని నల్గొండ జిల్లా చింతపల్లికి పంపించారు. అందరికంటే చిన్నవాణ్ణి కాబట్టి నా పైన అందరికీ ప్రేమాభిమానాలు ఉండేవి.

మసన చెన్నప్ప

2. చింతపల్లిలో మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది?

జ:    మాది కడు పేదరికం అని చెప్పాను కదా! వారం వారం చింతపల్లి నుండి సైకిల్ మీద కొలుకులపల్లికి వచ్చేవాడిని. మా అమ్మ గానీ వదిన గానీ ఒక ఇనుప సందూకలో బియ్యం వగైరా వస్తువులు వారానికి సరిపడా పెట్టి ఇచ్చేవారు. ఒక బియ్యం బస్తాలో కట్టెలు చిన్న ముక్కలుగా చేసి ఇచ్చేవారు. కట్టెల పొయ్యి మీద వండుకునేవాడిని. చాలా కాలానికి బత్తీల స్టవ్ వచ్చింది. పెళ్లిలో మా అత్తగారు వాళ్ళు బర్నల్ స్టవ్ కానుకగా ఇచ్చారు (నవ్వుతూ). మా నాన్నగారు ప్రతీ వారం ఒక రూపాయి ఇచ్చేవారు. నా జీవితంలో మా నాన్నగారు ఎక్కువలో ఎక్కువ ఇచ్చిన కరెన్సీ ఒక్క రూపాయి అయితే మా పెద్దన్నయ్య ఎక్కువలో ఎక్కువ ఇచ్చిన కరెన్సీ పది రూపాయలు. మా వాళ్ళు నేను చదువుకుంటే చాలు అనుకోవడం, నాకూ చదువు మీద శ్రద్ధ ఉండడం, ఇంటి పరిస్థితులు తెలిసి ఉండడం వల్ల వారిని దేనికీ వేధించలేదు. అలా పదవతరగతి వరకు అక్కడే చదువుకున్నాను.

3. మీకు తెలుగు భాష పట్ల ఆసక్తిని, మక్కువను పెంచింది ఎవరు?

జ:   చింతపల్లి పాఠశాలలో బాలకృష్ణ గారని తెలుగు పండితులు. నాకు ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య విద్యా సంస్థ పరీక్షల ఫీజు కట్టించి నాతో ఆరవ తరగతి నుండే పరీక్షలు రాయించారు. దానివల్ల నాకు తెలుగు భాషలో ప్రవేశంతో పాటు అభిమానం ఏర్పడింది. సుమతీ శతకంలోని యాభై పద్యాలు, వేమన శతకంలోని యాభై పద్యాలు కంఠస్థం అయ్యాయి. కాబట్టి మొత్తం మీద బద్దెన భూపాలుడు, వేమన్న గారు నాలో ఆవహించారు (పెద్దగా నవ్వేస్తూ) కనుక నేను నా రచనా వ్యాసంగంలో పది శతకాలు రాశాను. శతకం అంటే నూరు పద్యాల రచన. బహుశా నూరు సంవత్సరాలు జీవించాలని తెలుగు వాళ్ళు ఈ శతక రచనకు శ్రీకారం చుట్టారేమో అనిపిస్తుంది. అంతేకాక పిల్లలకు శతక పద్యాలు నేర్పిస్తే నైతికంగా వాళ్ళు ఎదుగుతారన్నది నా భావన. అందుకే శతక పద్యాల వల్ల అర్థ శత గ్రంథకర్తనయ్యాను. బాలకృష్ణ గారు, అడపాల నరసింహారెడ్డి  గారు (నల్గొండ జిల్లా), మధుసూదన రావు గారు (సూర్యాపేట), శ్యామలయ్య గారు (దేవరకొండ) ఈ నలుగురూ ప్రత్యేకంగా నేను మరచిపోలేని నన్ను అభిమానించే గురువులు. వారి మార్గంలో నేనూ అధ్యాపకుడిని కావాలనే కోరిక ఆనాడే కలిగింది. ఈ సమయంలో నేను మరిచిపోలేని జ్ఞాపకాలను చెప్పాలి మీకు. నేను ఒకసారి “స్వయం పరిపాలనా దినోత్సవం” లో పాల్గొన్నాను. ఆ సందర్భంగా నాకు 40 పేజీల ఎక్సర్సైజ్ బుక్, ఒక పెన్సిల్ బహుమతిగా ఇచ్చారు. వాటిని నేను డిగ్రీ పాసయ్యేవరకు దాచుకున్నాను. 9వ తరగతి చదువుతున్నప్పుడు మధుసూదన్ రావు గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు. అప్పుడు ‘ఉదయిని’ అనే స్కూలు వార్షిక సంచిక వెలువడేది. దానికి సంపాదకునిగా ఉండాలంటే వారు పెట్టే వ్యాసరచన పోటీలో నెగ్గాలి. అయితే వారు కవిగా, రచయితగా, సంస్కర్తగా, వైతాళికుడుగా, యుగకర్తగా ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ వ్యాసం రాయమని పోటీ పెట్టారు. నేను కందుకూరి వీరేశలింగం పంతులు గురించి రాశాను. హెచ్ ఎస్ సి విద్యార్థుల కంటే బాగా రాయడం వల్ల నన్ను విజేతగా చేసి ఆ పత్రికకు సంపాదకునిగా పెట్టారు. దానికోస…

5. గుండేరావు హర్కారే గారికి, మీకు ఉన్న అనుబంధం ఎటువంటిది?

జ:   విశ్వకర్మల హాస్టల్లో నేను ఉండేవాడిని అని చెప్పాను కదా! నేను బి ఓ ఎల్ పాసయిన తర్వాత హాస్టల్ వారు కులేతరులు ఉండకూడదని కండిషన్ పెట్టారు. దానితో నేను నా మిత్రులు రామచంద్రారెడ్డి, కృష్ణారెడ్డిలతో ఓల్డ్ సిటీకి వెళ్ళాను. అక్కడ గుండేరావు హర్కారే గారని గద్వాల ఆస్థానంలో సంస్కృత పండితులుగా లక్ష్మీ మహదేవమ్మ దగ్గర ఉన్నవాడు. సెషన్ జడ్జిగా, కలెక్టర్ గా పని చేశాడు. సాలార్జంగ్ కు క్లాస్ మేట్ ఆయన. అప్పుడు 86 సంవత్సరాల వయస్సు ఆయనకు. సంస్కృతంలో పాణినీ వ్యాకరణానికి మిషన్ తయారు చేశాడు. ఆయన శిష్యులు రవ్వా శ్రీహరిగారు. శ్రీహరి గారు మాకు ఆంధ్ర సారస్వత పరిషత్తులో వ్యాకరణ బోధకులు. క్లాసులో ఏదో సందర్భంలో ఓల్డ్ సిటీలో ఉన్న గుండేరావు హర్కారే ఇలా మిషన్ తయారు చేశారని, తాను ఆయన శిష్యుడినని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకొని ఆయనను కలవడానికి ఆయన ఇంటికి వెళ్ళాను. ” నీకు ఛందస్సు వచ్చా?” అని అడిగారాయన. ఆశువుగా పద్యం చెప్పగలను అన్నాను. ఒక పద్యం చెప్పమంటే చెప్పాను. “నేను నిన్ను కవీశ్వరా” అంటాను అన్నారు. సంతోషంగా నేను “మిమ్మల్ని తాతయ్యా” అంటాను అన్నాను. “తెలంగాణోదయం” లో ఆయన గురించి 40 పద్యాలు రాశాను. అలా ఓల్డ్ సిటీ నుండి బొగ్గుల కుంటకు తిరుగుతూ బిఓఎల్ చేస్తూ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఆయన ఆశీర్వాదం చాలా గొప్పది. 1975 నుండి 1977 వరకు అక్కడ ఉన్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధమై సామాను సర్దుకున్నాను. చెప్పడానికి ఆయన దగ్గరకు వెళ్ళాను. ఒక అపురూప క్షణమది. “ఊరుకు వెళ్తున్నాను. ఇక పట్నంతో సంబంధం లేదు” అన్నాను. ఆయనకెందుకో కన్నీళ్లు వచ్చాయి. 12 భాషల పండితుడాయన. “పోతున్నవా? లేదు. నాలుగు రోజులు మా ఇంట్లో ఉండు” అన్నారు. ఆయన సంకల్పం ఏమిటో గాని అక్కడ ఉన్న ఆ నాల్గు రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది. నేనున్న ఇంటి పక్కన పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. “సికింద్రాబాద్ ఇస్లామియా హైస్కూల్లో  టీచరు ఉద్యోగం ఉన్నట్లు పత్రికలో ప్రకటన వచ్చిందని, నీవు తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశావు కాబట్టి అప్లై చేయమని” ఆ ఇంటి యజమాని బట్టు నర్సిరెడ్డి చెప్పారు. ఆశ్చర్యంగా వాళ్ళు చెప్పిన రోజే ఆఖరి గడువు. గుండేరావు గారి దగ్గరకు వచ్చి విషయం చెప్పాను. ” శుభమ్ భూయాత్ ఉద్యోగ ప్రాప్తిరస్తు” అని ఆశీర్వదించారు. అలాంటి మహానుభావుని ఆశీర్వచన ఫలితం వల్ల ఖండవల్లి లక్ష్మీ రంజనం, రాయప్రోలు సుబ్బారావు, దివాకర్ల వేంకటావధాని వంటి మహామహులు కూర్చున్న తెలుగు శాఖ సింహాసనంపై కూర్చుండే అదృష్టం దక్కింది.

6. “వేటూరి ప్రభాకరశాస్త్రి  వాఙ్మయ  సూచిక” అనే అంశంపై ఎం.ఫిల్ చేయడానికి మార్గదర్శకులు ఎవరు? దాని నేపథ్యం ఏమిటి?

జ:     నేను వేటూరి ప్రభాకర శాస్త్రిగారి వాఙ్మయం మీద ఎమ్ ఫిల్ చేయుమని మా గురువు రవ్వా శ్రీహరి గారు సూచించారు. దీనికి మార్గదర్శకులు వేటూరి ఆనందమూర్తి గారు. వేటూరి ప్రభాకరశాస్త్రి గారి కుమారులు. మారిషస్ నుండి అప్పుడే వచ్చారు. ఆయన నాకు ఎమ్ ఏ లో అధ్యాపకులు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్. విజయ్ నగర్ కాలనీలో ఉండేవారు. 1977 లో యూనివర్సిటీకి దగ్గర ఉండాలని నేను వారాశిగూడకు మారాను (ఎమ్ ఏ) కోసం. వారింటికి నేను ఎమ్ ఫిల్ గురించి 180సార్లు సైకిల్ మీద వెళ్ళాను. దీంట్లో శాస్త్రిగారి వాఙ్మయం మొత్తాన్ని తీసుకున్నాను. ఆయన రచించిన “చాటుపద్య మణిమంజరి” మంచి పేరు తీసుకు వచ్చిందాయనకు. ఆయన లైబ్రరీ చాలా పెద్దది. అందులోంచి ఆయన పుస్తకాలు తీసుకొని క్రమపద్ధతిలో పేర్చి ‘Bibilogrphy’ తయారుచేశాను. అంటే కేవలం పుస్తకాల పేర్లు కాకుండా వాటిని గురించి వివరణాత్మకంగా రాశాను. ఆవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ పద్ధతిలో చేయడానికి శ్రీకారం చుట్టినవాడిని నేను.

7.  “ప్రాచీన కావ్యాలు- జీవన చిత్రణ” అనే మీ పి హెచ్ డి అంశంలో ఏ కావ్యాలను తీసుకున్నారు? ఎటువంటి జీవితాలను చిత్రించారు?

జ:    ఈ అంశాన్ని ఎస్వీ రామారావు గారు ఇచ్చారు. దీనికి గైడుగా ఆనందమూర్తి గారే ఉన్నారు. ఆయనతో పదేళ్ల అనుబంధం నాది. ఎమ్ ఏ లో రెండేళ్లు, ఎమ్ ఫిల్ లో మూడేళ్లు, పి హెచ్ డిలో అయిదేళ్ళు. ప్రాచీన కావ్యాల్లో నన్నెచోడుని “కుమారసంభవం” నుండి కూచిమంచి తిమ్మకవి “నీలాసుందరి పరిణయం” వరకు  దాదాపు ఒక 40 కావ్యాలు తీసుకున్నాను. ప్రాచీన కాలంలో ఎఱ్ఱన, మధ్యయుగంలో శ్రీకృష్ణ దేవరాయలు, అనంతర కాలంలో శుక సప్తతి కారుడు కదిరీపతి. వీరంతా చాలా మేలుతరమైన గ్రామీణ జీవితాన్ని అభివర్ణించారు. ఆ కాలంలో నగరాలున్నా గ్రామీణ జీవితానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పట్నాల పక్కన పొలాలున్నాయంటే గ్రామాలున్నట్లే కదా! గ్రామీణ జీవన స్పర్శ లేని కవి లేనే లేడు. అందరికంటే ఎక్కువగా శ్రీకృష్ణ దేవరాయలు గ్రామీణ జీవనం గురించి తెలిసిన నాగరికుడు అని చెప్పవచ్చు. ఆయనను గ్రామాల గురించి తెలిసిన ప్రభువు, కవి, దార్శనికుడు అని నిరూపించాను. ప్రాచ్య కళాశాల విద్యార్థిని కావడం వల్ల ప్రాచీన కావ్యాలంటే చాలా మక్కువ నాకు. అందువల్ల ఈ అంశాన్ని ఎంచుకున్నాను. 300 పేజీలున్న సిద్ధాంత గ్రంథం రాశాను. ఎఱ్ఱన “హరివంశం” లో గొల్లవాళ్లకు ఆభరణాలు అని చెబుతూ అందరు వేసుకునే సాధారణమైన ఆభరణాల వంటివి కాకుండా కుండలో పాలు పోసి కాచడం వల్ల వచ్చే మసి వాళ్లకు ఆభరణం అంటాడు. పాల పొంగును ఆభరణం అంటాడు. పేడ తీస్తుండగా అంటుకునే పేడను కూడా ఆభరణం అంటాడు. అంటే చూడండి. పల్లీయుల యొక్క జీవితంలోని అందాన్ని ఎంత అద్భుతంగా చిత్రించాడో? అలాగే సింహాసన ద్వాత్రింశికలో కొరవి గోపరాజు చింతపండు ఎవరి ఇంట్లో ఉంటుందో వాళ్ళింట్లో చింతలు ఉండవని రాశాడు. ఇవన్నీ కూడా గ్రామజీవన వర్ణన ప్రధానమైన కావ్యాలు. అలా ప్రాచీన కావ్యాల గురించి 5, 6 ఏళ్ళు పరిశోధన చేశాను. చాలా కష్టమైన పని అది. బావిలో నుండి నీళ్ళు తోడినట్లుగా తీయాలి కదా! ఆనంద మూర్తి గారు నన్ను తన కుటుంబ సభ్యునిగా భావించేవారు. పరమ సాత్వికులు. “వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ పీఠం” అని తిరుపతిలో ప్రారంభమైతే మూడు, నాలుగేళ్లు శాస్త్రిగారి మీద మాట్లాడడానికి ఆహ్వానించారాయన.

8. మీ ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమై కొనసాగిన క్రమాన్ని వివరించండి.

జ:      మీకు ఇంతకు ముందు ఘుండేరావు హర్కారే గారి వాళ్ళింట్లో ఉన్నప్పుడు, చివర్లో వెళ్లిపోయే ముందు  సికింద్రాబాద్ లోని ఇస్లామియా స్కూల్ లో అవకాశం వచ్చిందని చెప్పాను కదా! ఆయన ఆశీర్వాద మాహాత్మ్యం వల్ల నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ (1975 ) అయ్యాను. మొట్టమొదటగా నా ఉద్యోగ ప్రస్థానం అక్కడే మొదలయ్యింది. 1980లో ఎమ్ఏ అయిపోగానే “ప్రగతి మహా విద్యాలయ” అని సుల్తాన్ బజార్ లో ఉండేది. వారి అడ్వర్టైజ్ మెంట్ వచ్చింది. ఒక్క పోస్ట్. ఇంటర్వ్యూకు 136 మంది వచ్చారు. జూనియర్ కాలేజీ జాబ్. అంతమందిలో నేను సెలెక్ట్ కావడం మా గురువు గారి ఆశీర్వాద బలమే తప్ప మరొకటి కాదు. అందుకే వైస్ ఛాన్స్ లర్ పదవి రాకపోయినా నాకు బాధ లేదు. కాలేజీకి సైకిల్ మీద వెళ్లి వచ్చేవాడిని. నేను అలా వస్తుండడం చూసి మా కాలేజీ ప్రిన్సిపాల్ (ఎన్. టి. వేదాచలం) గారు స్కూటర్ కొనుక్కోమని కాలేజీ నుండి 14 వేల రూపాయలు సాంక్షన్ చేయించారు. మంచివ్యక్తి ఆయన. ఎనిమిదేళ్ళు పని చేశాను అక్కడ.  ప్రగతి మహావిద్యాలయంలో ఉన్నప్పుడే ఎంఫిల్ (1981-83) మూడేళ్లు, పిహెచ్ డి అయిదేళ్ళు (1983-88) చేశాను. 1989లో తెలుగు శాఖ ప్రకటన వచ్చింది. అప్లై చేశాను. 46మందిలో నలుగురైదుగురం సెలెక్ట్ అయ్యాము. మొదటి పిజి కాలేజ్ సికింద్రాబాద్. దానికి ప్రిన్సిపాల్ సౌందర రాజ నందన్ గారు. నాకు ఆయన ప్రగతి మహావిద్యాలయంలో ఉన్నప్పుడే పరిచయం. ఆయన నాకు చాలా ఇష్టుడు. వెల్దండ రఘుమన్న, రాజన్న శాస్త్రి, ముదిగొండ శివప్రసాద్, నేను నల్గురం ఉండేవాళ్ళం. 1989 నుండి1996 దాకా అక్కడే పనిచేశాను. ఇలా 40 ఏళ్ళ ఉద్యోగ జీవితంలో హైస్కూల్లో ఆరేళ్ళు, ప్రగతి మహావిద్యాలయంలో ఎనిమిదేళ్ళు, విశ్వవిద్యాలయంలో ఇరవై ఆరేళ్ళు ఎన్నో అనుభూతులతో జీవితం గడిచిపోయింది.  

9. మీ ఉద్యోగ జీవితంలో మీరు నిర్వహించిన పదవులు, తీసుకొచ్చిన మార్పులు ఎటువంటివి?

జ: సమయపాలన నా మొదటి లక్షణం. దాన్ని చాలా క్రమశిక్షణతో నిర్వర్తించేవాడిని. ఏ క్లాసుకైనా అధ్యయనం లేకుండా వెళ్ళేవాడిని కాను. వివిధ మనస్తత్వాలు కలిగిన విద్యార్థులకు తగినట్టు వారి పురోగతికి పాటు పడడం, పుస్తకాలు చదివే దిశగా వారిని ప్రేరేపించడం, మంచి మంచి పుస్తకాలను సేకరించి
లైబ్రరీలో అందుబాటులో ఉంచడం చేసేవాడిని. E2 హాస్టల్ కు వార్డెన్ గా ఉన్నాను. పల్లెటూళ్ళ నుండి వచ్చే విద్యార్థులు ఎక్కువమంది ఉండేవారు. హాస్టల్ లో ఉండే విద్యార్థులు చాలామంది అధికారుల ఇబ్బందులకు గురయ్యేవారు. కానీ నేను అటువంటి అధికారిని కాను. 9 సంవత్సరాలు చేశాను. నా హయాంలో 40 గదులను నిర్మాణం చేయించాను. విశ్వవిద్యాలయంలో సాంస్కృతిక కార్యదర్శిగా చేశాను. వెల్ఫేర్ అసోసియేషన్ కన్సల్ట్ గా చేశాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటుగా ఉన్నాను. అనేక కాలేజీలకు సెమినార్లు నిర్వహించడానికి వెళ్లేవాడిని. పోతన మీద, వేటూరి ప్రభాకర శాస్త్రి గారి మీద సెమినార్లు నిర్వహించాను. భాషాభిమానమే తప్ప ఆంధ్ర, తెలంగాణా భేదం లేదు నాకు. నేను అక్కడ ఉన్నప్పుడు రావూరి భరద్వాజ గారు కూడా ఉన్నారు స్వచ్ఛందంగా అక్కడ ఉన్నారు. మేమిద్దరం సుమారు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లైబ్రరీ బుక్స్ సెలెక్షన్ కమిటీ మెంబర్లుగా ఉన్నాం. ఆయనకు చాక్లెట్లు తినే అలవాటు ఉండేది. రోజూ ఒకటి, రెండు చాక్లెట్లు నాకు ఇచ్చేవారు. అది ఎప్పుడూ మర్చిపోను.

10. “మల్లిపదాలు” అనే పేరుతో మీ సాహితీ యాత్ర ప్రారంభమైంది కదా! దానికి నేపథ్యం ఏమైనా ఉందా?

జ:     1988 లో నేను ఎమ్ ఏ చేస్తున్నప్పుడు ఆరుద్ర “కూనలమ్మ పదాలు” దొరికాయి. అందులో ప్రతీ పాదంలో పది మాత్రలుంటాయి. చివరి పాదంలో ఒకటి, రెండు మాత్రలు తగ్గవచ్చు. నన్ను ఆ పుస్తకం ఆకర్షించి, పదాలు రాయడం మొదలు పెట్టాను.. ” తేనెలో కలమద్ది తెనిగించె పోతన్న, కనుకనే నా భాష తెలుగాయె మల్లి”…” వేమన్న పద్యాలు వేపాకు వైద్యాలు, తెలుగులో హృద్యాలు తెలుసుకో మల్లి”….. “ఆగినా ఒక గంట ఆపైన మరితంట, బస్సు డ్రైవరు కంట పడబోవు మల్లి”(జీవితానుభవం..నవ్వుతూ)….. 1980 లో ఒక సంఘటన జరిగింది. నారాయణరెడ్డి గారు ఆర్ట్స్ కాలేజీలో చెబుతున్నారు. నేను నిజాం కాలేజీలో చదువుతున్నాను. ఆయన ఉద్దేశ్యం ఆయన పాఠం చెప్పినవారికే గోల్డ్ మెడల్ రావాలని.  కానీ మొదటి రెండు సెమిస్టర్లలో నేను ఆధిక్యంలో ఉన్నాను. ఇరివెంటి కృష్ణమూర్తి గారి ద్వారా నాతో మాట్లాడడానికి నన్ను ఆర్ట్స్ కాలేజీకి పిలిపించారు. ‘ఏం చేస్తున్నావని’ అడిగారు? “ఇస్లామియాలో ఉద్యోగం చేస్తూ, సాయం కళాశాలలో చదువుతున్నానన్నాను.’ఏం రాస్తున్నావని’ అడిగారు. ‘మల్లి పదాలు’ రాస్తున్నా అన్నాను. ‘ఏదీ చదువు?’ అన్నారు..” వచ్చి పోయెను పైస,తెచ్చి పెట్టెను గోస, రాకున్న ఏ ఆస లేకుండు మల్లి”…. చూడ వచ్చినవారు చుట్టాలు కాబోరు. పండుటాకుల జోరు ఎండుటకె మల్లి” అని విన్పించాను. ఆయన చాలా సంతోషించి ” చెన్నప్ప “మల్లిపదాలు” పుస్తక ప్రచురణకు డబ్బు ఇవ్వమని” అకాడెమీకి రాశారు. వారు 1000 రూపాయలు ఇచ్చారు. 30 పేజీల పుస్తకం అది. 200 రూపాయలు ఖర్చు అయింది. 800 రూపాయలు మిగిలాయి. ఇప్పటి మంత్రి తలసాని యాదవ్ హైస్కూలు లో నా విద్యార్థి. అతనికి నేనంటే ఎంతో ప్రేమ. 100 పుస్తకాలు అమ్ముడయ్యేలా చేశాడు. అలా వచ్చిన నా మొదటి పుస్తకం అది. దాన్ని నా మొదటి గురువు ఘుండేరావు హర్కారే గారికి అంకితం ఇచ్చాను.

ఆచార్య మసన చెన్నప్పగారితో ముఖాముఖి గ్రహీత శ్రీమతి అరుణదూళిపాళ

11. సుదీర్ఘమైన మీ ఉద్యోగ నిర్వహణ బాధ్యతల్లో ఆధ్యాత్మికత, తాత్త్వికత చోటు చేసుకోవడానికి ప్రేరణ ఎలా కలిగింది?

జ:     నేను సికింద్రాబాద్ పిజి (OU) కాలేజీలో చేస్తున్నప్పుడు మా క్లాసులు 8.30 నుండి 12.30 వరకే ఉండేవి. 1995 లో ఒక సంఘటన జరిగింది. మా పిల్లలు సీతాఫల్ మండి ఆర్య సమాజం స్కూల్లో చదువుతుండేవారు. ఒకసారి పేరెంట్ గా అక్కడికి వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో ఒక మహానుభావుడిని చూశాను. ఆయనే ఉన్నతమైన స్థానాన్ని అలంకరించిన “పండిత గోపదేవశాస్త్రి”. స్వామి దయానంద సరస్వతి శిష్యునికి శిష్యులు వీరు. ఆయనను చూడడం మొట్టమొదటి సారి. ఆయన భాషణం విన్నాను. అప్పటివరకు నేను ఎంతోమంది మాట్లాడగా విన్నాను. కానీ ఈయన లాగా వారు మాట్లాడలేదని అర్థం అయింది. ఆయన మాటలు నన్ను చాలా ఆకర్షించాయి. ఎందుకో “ఈయన నాకు గురువైతే బాగుండేది” అనిపించింది మనసులో. గమ్మత్తు ఏమిటంటే అదే సంవత్సరంలో సికింద్రాబాద్ లోఆయన శతజయంతి వేడుక జరుగుతోంది. శతజయంతి కన్వీనర్ నాకు పరిచయస్తులు. ఆయనకు ఫోన్ చేసి సభా నిర్వాహకులు ఎవరు? అని అడిగాను. “ఇంకా ఎవరినీ అనుకోలేదు. ఆలోచిస్తున్నాం”  అన్నారాయన. నేను డా.సి. నారాయణ రెడ్డి గారి శిష్యుణ్ణి. నాకు అవకాశం ఇస్తే చేస్తాను అని అన్నాను. ఆయన నన్ను కె.ఎస్. మూర్తి అని ప్రిన్సిపాల్ సెక్రటరీ (సెంట్రల్ గవర్నమెంట్) దగ్గరకు తీసుకు వెళ్ళాడు. మూర్తిగారు నన్ను పరీక్షించారు. ఎలా చేయగలనో ఆ విధానాన్ని వారికి చెప్పాను. వెంటనే నన్ను సెలెక్ట్ చేశారు. ఆ సభకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, గవర్నర్ కృష్ణ కాంత్ విచ్చేసారు. కృష్ణ కాంత్ గారు శాస్త్రిగారికి స్నేహితులు. ఆవుల సాంబశివరావు గారు కూడా శాస్త్రిగారికి శిష్యులు. ఆయన కూడా వచ్చారు. 5 వేల మంది సభకు హాజరయ్యారు. సభ విజయవంతంగా ముగిసింది. చాలా బాగా చేశారని పలువురు ప్రశంసించారు. అయిపోయిన తర్వాత నేను వస్తుంటే శాస్త్రిగారి శిష్యురాలు సంధ్యావందనం లక్ష్మీదేవి గారు ఎదురుపడి ” మీరు ఆర్యసమాజ్ సభ్యులు కారు, శాస్త్రిగారికి శిష్యులూ కారు. ఆయన పుస్తకాలు కూడా చదివినవారు కారు. అలాంటప్పుడు ఏ అర్హత ఉందని మీకు నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు? యూనివర్సిటీలో మీరు ప్రొఫెసర్ కాబట్టి మాట్లాడగలిగారు కానీ ఆయన గురించి మీకేం తెలుసు?” అన్నారు నన్ను నిలదీస్తూ. తెలియని వారి గురించి తెలిసినట్లు మాట్లాడడమే గొప్ప అన్నాను. వచ్చేముందు శాస్త్రి గారి పాదాలకు నమస్కరించాను.  ఆయనకు వయసురీత్యా కళ్ళు కనబడేవి కావు. తెల్లవారి ఆయన ఎవరింట్లోనైతే ఉంటున్నారో ఆయన చేత నాకు ఫోన్ చేయించారు. ” గురువు గారు మిమ్మల్ని జ్ఞాపకం చేశారు. మీరు వస్తారా? ఆయనను రమ్మంటారా?” అన్నాడు. వారు ఇంటికి వస్తే మా జన్మ ధన్యమవుతుందని నా భార్య ఇక్కడికే రమ్మని చెప్పమంది. అదే విషయం చెప్పాను ఆయనతో. సరేనని మా ఇంటికి వచ్చారు. అంత గొప్పవారు మా ఇంటికి రావడంతో మా ఇల్లు పావనమైంది. ఆయన వచ్చారని తెలిసి 50 మంది దాకా బస్తీ వాళ్ళు వచ్చారు. అందరమూ ఆయనను మనసారా పూజించుకున్నాము. అప్పుడే నేను ఆయనకు అంకితమయ్యాను. చదువు మీద అభిరుచి ప్రైమరీలో కలిగితే, హైస్కూల్లో తెలుగులో అభిరుచి ఏర్పడింది. ముండేరావుగారి ద్వారా సాహిత్య పరిచయం అయితే ఆధ్యాత్మిక, తాత్త్వికతలకు నాలో ప్రేరణ కలిగించిన వారు గోపదేవశాస్త్రి గారు.

12. గోపదేవశాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేయాలనుకున్న మీ కోరిక ఎలా నెరవేరింది?

జ:      గోపదేవులు సామాన్యులు కారు. వేద, వేదాంగాలను, ఉపనిషత్తులను, దర్శనాలను ఆపోశన పట్టిన మహాపండితులు. కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి గారివద్ద వీరు వేదాంత దర్శనం చదువుకున్నారు. వీరిరువురికీ మంచి సాన్నిహిత్యం. గోపదేవులు శాస్త్రం చదువుకున్నారు కాబట్టి ఆయనను  ‘శాస్త్రి’ గా పేర్కొన్నారట చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు.  శాస్త్రిగారు మా ఇంటికి ఆయన వచ్చిన రోజే నేను ఆయనకు శిష్యుడనయ్యాను. శాస్త్రిగారు నాతో “నీకు ‘దర్శనాలు’ చెప్పాలనుకుంటున్నాను. 1940లో నేను వాటికి వ్యాఖ్యానాలు రాశాను. ఎన్నో ప్రసంగాలు వాటి మీద చేశాను. కానీ ఇక్కడ ఎవ్వరూ నేర్చుకోలేదు. నీకు నేర్పుతాను” అన్నారు. పరమానందంగా అంగీకరించాను. అదృష్టం ఏమిటంటే నేను చేస్తున్న సికింద్రాబాద్ పిజి (OU) కళాశాల దగ్గర్లోనే వాళ్ళ ఇల్లు ఉండడం. కాబట్టి కాలేజీ మధ్యాహ్నం అయిపోగానే లంచ్ చేసి సౌందర రాజన్ గారికి చెప్పి శాస్త్రి గారింటికి వెళ్ళేవాడిని. ప్రతీరోజూ ఆరుగంటలు ఆయన నాకు ‘దర్శనాలు’ చెప్పేవారు.   ఒకరోజు కాలేజీ బాయ్ కాట్ అయితే వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళింటివాళ్ళు ఆయనకు కళ్ళు కనపడవు కాబట్టి పొద్దున టిఫిన్ పెట్టి బయట తాళం వేసి గేటు తెరిచి ఉంచి వాళ్ల పనుల మీద వెళ్ళిపోతారు. మధ్యాహ్నం వస్తారు. నేను వెళ్లి గురువుగారూ! అని పిలిచాను. ఆయన కిటికీ దగ్గర నిలబడి “బయట తాళం ఉంది కదా!” అన్నారు. వెనక్కి వెళ్ళిపోతానన్నాను. అప్పుడాయన “ఒకరోజు వేస్ట్ అవుతుంది. నీకేమో కానీ నాకు కష్టం” అన్నారు. భవిష్యద్దర్శనం చేయగలిగినవారు ఆయన. బయట ఏదైనా కుర్చీ ఉంటే కిటికీ దగ్గరకు లాక్కొని కూర్చోమన్నారు. మూడుకాళ్ళ కుర్చీ ఒకటి ఉంది. అదే చెప్పాను. “పరవాలేదు. మనకు రెండే ఉన్నాయి కదా!” అన్నారు. ఆరోజు పాఠాన్ని ఆపకుండా మొత్తం చెప్పారు. ఇలా ఆయన దగ్గర 13 నెలలు చదువుకున్నాను. ఆయన మరణించే రోజు దసరా. అది ఆయనకు తెలుసు. అప్పటికి నూటా ఒక్కేళ్ళు ఆయనకు. ఆరోజు పొద్దున్నే ఇంటికి రమ్మన్నారు. ఆయన దగ్గరే కూర్చున్నాను. చాలా మంది ఉన్నారక్కడ. ఎన్నో విషయాలు మాట్లాడారు. మాట్లాడుతూ మాట్లాడుతూ అందరినీ బయటకు వెళ్ళిపొమ్మని, నన్నొక్కడినే ఆయన దగ్గర ఉండమన్నారు. నాతో మాట్లాడుతూ నా చేతుల్లోనే ప్రాణం వదిలారు. ఆయన న్యాయం, వైశేషికం, సాంఖ్యం,యోగం, ఉత్తర మీమాంస…ఈ ఐదింటికి వ్యాఖ్యానాలు రాశారు. ఈశా, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య , బృహదారణ్యకోపనిషత్తుల పైన కూడా వ్యాఖ్యానాలు రాశారు. ఆయన రాసిన వాటిల్లో ఈశావాస్యం, బృహదారణ్యకం మాత్రం చెప్పి మిగతావన్నీ నన్ను చదువుకోమన్నారు. 60 పుస్తకాలు రాశారు. ఆయన శిష్యరికం పొందడం పూర్వజన్మ సుకృతం. వారి ప్రభావం నామీద చాలా ఉంది. ఆయన వల్లే నాకు భక్తి, జ్ఞాన, కర్మ యోగాలకు సంబంధించిన విషయాల పట్ల మక్కువ ఏర్పడింది. అప్పటినుండి 25 ఏళ్లుగా నేను వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు అధ్యయనం చేస్తూనే ఉన్నాను.

13. మీరు రాసిన ‘నేత్రోదయం’ ఆంగ్లంలోకి అనువదించబడింది. అలాంటి అనువాదాలు ఇంకా ఏవైనా ఉన్నాయా? స్వయంగా మీరేమైనా అనువాదాలు చేశారా?

జ:      నేను రాసిన ‘నేత్రోదయం’ కవితా సంపుటి “Eye –  Rise” అనే పేరుతో ఉషా కె. శ్రీనివాస్ గారు, కె.శ్రీనివాస శాస్త్రిగారు ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఆమెను నా కవిత్వం బాగా ఆకర్షించింది. ఇదొక్కటే కాదు అన్యభాషల్లోకి అనువదించబడిన పుస్తకాల్లో “నయాగరా” ఒకటి. 2009 లో నేను అమెరికాకు వెళ్ళినప్పుడు నయాగరా జలపాతాన్ని చూశాను. మొదటి రోజు రెండు గంటలు, రెండవరోజు రెండు గంటలు చూశాను. దాని మీద ఒక గేయ కావ్యం రాశాను. దానిని జి. పరమేశ్ అనే అతను హిందీలోకి అనువదించాడు. అలాగే “ఆ సందూక” అనే పేరుతో నేను రాసిన కవితా సంకలనాన్ని “వహ్ సందూక్” అనే పేరుతో ఆయనే అనువదించాడు. నేను రాసిన శుకోపనిత్తును డా. ఎమ్. రంగయ్య హిందీలోకి అనువాదం చేశాడు. ‘చింతన’ అనే పేరుతో నేను రాసిన వ్యాసాలు “Contemplation” గా ఇంగ్లీషులోకి పాలకుర్తి రామమూర్తి అనువాదం చేశాడు. “హృదయకమలం” అనే ఆధ్యాత్మిక వ్యాస సంపుటిని వెంకటేశ్ దేవన్ పల్లి  (బెంగుళూరు) హిందీలోకి అనువదించాడు. ఇక నేను రవీంద్రుని గీతాంజలికి లఘుకవితారూపం ఇచ్చి “సడిలేని అడుగులు” అనే పేరుతో అనువదించాను. అనువాదమే కాకుండా విదేశీయాత్ర అనుభూతులతో “అమెరికా ఓ అమెరికా” అను పేరిట కవిత్వాన్ని రాశాను. “బ్రహ్మచర్యం” అనే హిందీ పుస్తకాన్ని తెలుగులో అదే పేరుతో అనువదించాను.

14. భగవద్గీతను మాతృమూర్తిగా దర్శించి ‘మాతృగీత’ శతకాన్ని రాసిన మీ అనుభూతిని వివరించండి.

జ:    మనకు దేశమాత ఎలాంటిదో గీతామాత కూడా అలాంటిదే. దేశమాతగా ఆ దేశంలోని మనుషులను ప్రేమించడం, సాహిత్యాన్ని గౌరవించడం, ఆదర్శంగా స్వీకరించడం ఎలా చేస్తామో అలాగే భగవద్గీతను కూడా అలా ఆదర్శంగా తీసుకోవాలని ఆ దృష్టితో ఈ పేరు పెట్టాను. వైదిక పరమైన వ్యాఖ్యలుగా ఉన్న వాటిలో కొన్ని శ్లోకాలను తీసుకొని శతకరూపంలోకి 102 పద్యాల్లో “మనసు వెట్టి చదువు మాతృ గీత” అనే మకుటంతో వ్యాఖ్యానించాను. ” శ్రీకరం బటంచు చిన్నప్పుడే బుద్ధి/ కీలు గొలిపినాడ గీత యందు/ గీత కన్న గొప్ప గీత యేమున్నది?/ మనసు వెట్టి చదువు మాతృ గీత”….పద్మపత్ర మెట్లు పంకమ్ము నంటదో/ అటుల జ్ఞాని అవని కంటకుండు/ కర్మ వాసనలను కాదన లేమయా/ మనసు వెట్టి చదువు మాతృ గీత” ఇలా సాగుతూ ఉంటాయి. కృష్ణుడు నిష్కామ కర్మ యోగి. ఆయన పురాణ పురుషుడు కాడు. చారిత్రక పురుషుడు. జీవితంలో ఒక్కొక్క మెట్టెక్కి యోగీశ్వరునిగా నిలబడ్డాడు. ఆయన నోటి నుంచి వచ్చిన గీతావాక్కులు వేదం సమ్మతమైనవి. అందుకే దీన్ని సరళంగా శతకరూపంలో రాశాను.

15. “సాహిత్యంలో తత్వ దర్శనం” ఎలా చేయగలిగారు? దానికి ప్రేరణ ఏమిటి?

జ:    మానవ జీవితం ఎంతో విలువైంది. అట్టి జీవితానికి సార్థకత ధర్మాన్ని అనుష్ఠించడం వల్లనే కలుగుతుంది. సమస్త మానవాళికి చెందిన వాఙ్మయం అంతా మన దేశం నుండే పరివ్యాప్తమైంది. అందుకే ఆ ధార్మికత, తత్త్వ చింతన వేదకాలం నుండి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అదే చెప్పాలనిపించింది. సాహిత్యంలో తత్త్వ దర్శనం అంటే వ్యక్తి ప్రధానంగా కాకుండా తత్త్వ ప్రధానంగా తీసుకున్నాను. వస్తువు వేరు. వస్తు తత్త్వం  వేరు కదా! ఇక్కడ వస్తువు యొక్క తత్త్వం ప్రధానం. ఉదాహరణకు ఈశ్వరుడు అని భగవంతుని రకరకాల పేర్లతో కొలుస్తున్నాం. అది వేరు. కానీ ఈశ్వర తత్త్వం వేరు. నేను సాహిత్యంలో ఉపనిషత్ కారులను, దార్శనికులను తత్త్వదర్శనులుగా గుర్తించాను. తెలుగు రామాయణాల్లో కూడా తాత్త్విక చింతన ఉన్నది. అలాగే ఆముక్త మాల్యదలో కూడా శ్రీకృష్ణ దేవరాయలు తత్త్వ దర్శనం చేయిస్తారు. ఆధునికులలో కూడా వానమామలై వరదాచార్యులు, గురజాడ అప్పారావు, దాశరథి, కాళోజీ వీరి కవిత్వంలో తాత్త్వికత ఉన్నది. తరువాతి కాలంలో సామల సదాశివ కవిత్వంలోనూ, వేటూరి రచనల్లోనూ తాత్త్వికత కనిపిస్తుంది. వీళ్ళందరి సాహిత్యంలో నుండి తత్త్వాన్ని తీసుకున్నాను.

“ఇచ్ఛా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ/ ఙ్ఞానాన్యాత్మనో లింగమ్”……(న్యాయం)

“అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః”… (యోగం)

“స హీదమన్నం ధియా ధియా జనయతే కర్మభిః, యద్ధైతన్న కుర్యాత్ క్షీయతే హ”(బృహదారణ్యకం)

“ఆత్మ కాని మేన నాత్మ బుద్ధియును………అవిద్య యను మహా తరువు నుత్పత్తి కీ ద్వయంబు విత్తు మొదలు” (ఆముక్తమాల్యద)

“స్వీయ లోపమ్ము లెరుగుట పెద్ద విద్య/ లోపమెరిగిన వాడె పూర్ణుడగు నరుడు” (దాశరథి)

ఇలా సాహిత్యంలో చాలాచోట్ల తత్త్వం కనిపిస్తుంది.

16. మీ పద్య కవితా సంపుటి “తెలంగాణోదయం” గురించి చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా?

జ:     ఉద్యమంలో  పాల్గొనడం ప్రత్యక్షంగా కాకపోయినా ఆర్ట్స్ కాలేజీ బయట గంటసేపు ఉపన్యాసాలు ఇచ్చేవాడిని. ఒక క్లాసు బయట ఒక క్లాసు లోపల (నవ్వుతూ). అంటే కాలేజీ లోపల పిల్లలకు తరగతులు తీసుకునే వాడిని. కాలేజీ అయిపోయాక బయట తెలంగాణ ఉపన్యాసాలు. విద్యార్థుల భూమిక ఎక్కువ. 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఎందుకో 2013 లోనే నాకు తెలంగాణ వస్తుందన్న నమ్మకం ఒక కవిగా కలిగింది.1956 లో విశాలాంధ్ర ఏర్పడింది. 1955 లో దాశరథి గారు “మహాంధ్రోదయం” రాసి సురవరం ప్రతాపరెడ్డి గారికి అంకితమిచ్చారు. అది నాకు నేపథ్యం. అలాగే నేను కూడా 2013 లో 13 శీర్షికలతో తెలంగాణ గురించి  “మహా తెలంగాణోదయం” అనే పేరుతో పద్యాలు రాసి దాశరథి రంగాచార్యుల గారి వద్దకు తీసుకువెళ్ళాను. ఆయన దాన్ని చూసి ‘మహా ‘ అనేది తీసేసి “తెలంగాణోదయం” అని పెట్టమన్నారు. ఆయనతో తీసుకున్న లాస్ట్ ఇంటర్వ్యూ అది. అలా రాసిన కావ్యాన్ని ఉద్యమంలో క్రియా శీలుడైన హరీశ్ రావు గారికి అంకితం ఇచ్చాను. అప్పుడున్న బిజీలో కెసిఆర్ గారు దొరికేవారు కారు. సిద్దిపేటలో రమణాచారి గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. గుమ్మన్నగారి శ్రీనివాసమూర్తి గారు, నందిని సిధారెడ్డి గారు కూడా ఉన్నారు ఆ సభలో.

” తమిళ సోదరుల్ మిమ్మట్లు తరిమివేయ/ వచ్చి మామీద పడితిరి వసతి లేక/ ఎంత కాలమ్ము మిమ్ము భరించగలము? ఆత్మగౌరవ పోరాటమయ్య మాది”

“ఒక్క దాశరథియు, నొక్క సురవరము/ నొక్క కాళుడు, మరి వొట్టికోట/ యెంత తపము జేసి యీ తెలగాణను/ గొప్ప జేసినారొ చెప్పలేను” ….ఇట్లా తెలంగాణ గొప్పదనాన్ని చెబుతూ రాసిన కావ్యమది.

17. “రాణివా? నీవు మద్గృహరాజ్ఞి వీవు” అని మీ సతీమణి గురించి “ప్రమీలా త్రిశతి” పేరుతో స్మృతి కావ్యంగా మలిచారు… ఆదర్శనీయమైన మీ అనుబంధాన్ని వివరించండి..

జ:  1976 లో ప్రమీలతో నా వివాహం జరిగింది. 40 ఏళ్ళ కాపురంలో నాల్గు సినిమాలు కూడా కలిసి చూశామో లేదో? తనకు ఇష్టం ఉండేది కాదు. ఆమె జీవితంలో 40 రూపాయలు కూడా ఆమెకు వైద్యం కోసం ఖర్చు పెట్టలేదు. అంతటి ఆరోగ్య వంతురాలు, మంచి యోగ్యురాలు ఆమె. ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిస్తున్నాను నేను. నా చదువు ఆమె లోకంగా ఉండేది. ముగ్గురు పిల్లల బాధ్యత కూడా ఆమే తీసుకుంది. ఇంటి వ్యవహారాలు అన్నీ ఆమెనే చూసుకునేది. ఎక్కడికి వెళ్లినా పుస్తకాలు పట్టుకుపోయే వాడిని. ముషీరాబాద్ కేర్ ఆసుపత్రిలో వాళ్లమ్మ గారిని చూడడానికి వెళ్తే వైద్యులు ఆమె బ్రతకదని చెప్పారు. ఆ వార్త విని షాక్ కు గురయి మరణించింది ఆమె. “ఐదు నిమిషాల సమయం ఇవ్వలేదు మీ భార్య. అందుకే బ్రతికించలేక పోయాం” అన్నారు డాక్టర్లు. ఆ తర్వాత సంవత్సరానికి తల్లి మరణించింది. ఎంతో మంది విద్యార్థులు మా ఇంటికి వచ్చేవారు. అందులో చాలామంది ఆమె చేతి భోజనం తిన్నవారే. అందరినీ కన్నతల్లిలా ఆదరించేది.  ఈ రాజ్ఞి అనే పదం వేదం నుండి తీసుకున్నాను. రాణియే రాజ్ఞి. రాజు అంటే తండ్రి అని, రాణి అంటే తల్లి అని అర్థం. ఇది తెలియని పిచ్చివాళ్ళు కొంతమంది పిల్లలమఱ్ఱి పిన వీరభద్రుడు “వాణి నా రాణి” అంటే తప్పు అర్థాలు వెతికారు. నా ఇంటికి తల్లి ఆమె. అందుకే గృహరాజ్ఞి అన్నాను. ప్రమీలకు 20 సంవత్సరాల 6 నెలల వయస్సులో పెళ్లి జరిగితే నా కూతురుకు అదే వయస్సులో పెళ్లి జరిగింది విచిత్రంగా. అందరూ భార్యను అర్ధాంగి అంటారు. కాని ఈ చెన్నప్ప దృష్టిలో అలా కాదు. పూర్ణాంగి ఆమె నాకు.

” అర్ధాంగి అను మాట అర్థ సత్యమె కాని/ పూర్ణాంగి వనుటయే  పొసగు నాకు”…

“రాణివా? నీవు మద్గృహ రాజ్ఞివి వీవు/ ఇంతివా?  నీవు

నా నేత్ర కాంతి వీవు’

“ప్రేయసి యను మాట ప్రియమైనదే గాని/ సహధర్మ చరియన్న చాలు నాకు”

అందరూ ప్రేయసి అనే మాటను ప్రియురాలు అనే అర్థంలో తీసుకుంటారు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు వెళ్లిపోతుంటే భార్య ఎక్కడికని అడుగుతుంది. అప్పుడాయన సన్యాసాశ్రమానికి వెళ్తున్నానంటాడు. అప్పుడామె దేనికోసం అంటుంది. మోక్షం కోసం అంటాడు. మీ పురుషులకేనా మోక్షం మాకు అవసరం లేదా అని సూటిగా అడిగిన ప్ర…

ఆచార్య మసన చెన్నప్ప రచించిన పుస్తకాలు

18. వేదాల మీద, ఉపనిషత్తులపై అధికమైన మక్కువ కలిగిన మీరు వాటి మీద రచించిన రచనలు గానీ, చేసిన ప్రసంగాలు గానీ ఏమైనా ఉన్నాయా?

జ:       వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేయడం వల్ల కలిగిన సంస్కారంతో ‘ఈనాడు’ పత్రికలో అంతర్యామి శీర్షికన వచ్చిన వ్యాసాలన్నింటినీ “సమదర్శనం” పేరుతో వెలువరించాను. “నమస్తే తెలంగాణ” లో ‘చింతన’ శీర్షికన వచ్చిన వ్యాసాలను “చింతన”, “హృదయకమలం” పేరుతో వెలువరించాను. ప్రత్యేకంగా “వేదాలు – వేదాంగాలు”, “ఉపనిషత్తులు – దర్శనాలు”, “మోక్ష సాధనలో దశోపనిషత్తులు” అనే గ్రంథాలను సామాన్యులకు సైతం అర్ధమయ్యే శైలిలో రచించి, ముద్రింపచేసాను. “ఈశావ్యాసోపనిషత్తు” మీద నా ప్రసంగాలు యూట్యూబులో 30 ఎపిసోళ్లుగా ప్రసారమయ్యాయి. “శివ సంకల్ప మంత్ర వైశిష్ట్యం” పేర నా ప్రసంగాలు 20 ఎపిసోళ్లలో ప్రసారమయ్యాయి. నాకు వైదిక సాహిత్యం అంటే చాలా ఇష్టం. వేదాది శాస్త్రాలు సనాతన ధర్మానికి పట్టుగొమ్మలు. వేదాలు అందరివి, వాదాలు కొందరివి. అని నా అభిప్రాయం.

19. మీకు విద్యాసంస్థలతోనే కాక ఇతర సాహితీ సంస్థలతో ఏమైనా అనుబంధం ఉందా?

జ:    నేను 1981 లో “ప్రజా భారతి” అనే సంస్థకు స్థాపక కార్యదర్శిగా ఉండి ఎన్నో  సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాను. 30 సంవత్సరాల క్రితమే ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ( ఇప్పుడు తెలంగాణా సారస్వత పరిషత్తు) కార్యవర్గ సభ్యునిగా దేవులపల్లి రామానుజరావు గారి చేత నియమింపబడ్డాను. సినారె అధ్యక్షులుగా ఉన్నప్పుడు సంయుక్త కార్యదర్శిగా పని చేశాను. ప్రస్తుతం పరీక్షా కార్యదర్శిగా ఉన్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర “సామాజిక సమరసతా వేదిక” కు అధ్యక్షునిగా 6 సంవత్సరాలు పని చేశాను. సీతాఫల్ మండి ఆర్యసమాజ గౌరవ సభ్యునిగా 1995 నుండి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాను.

20. ఇంతటి సాహితీ ప్రియులైన మిమ్ములను వరించిన అనేక పురస్కారాలలో మిమ్మల్ని సంతృప్తి పరచినవి ఏవి?

జ: నాజీవితంలో నేను పొందిన అవార్డులు ఎన్నో ఉన్నాయి. కాని వాటిలో గురజాడ అప్పారావు గారి గోల్డ్ మెడల్ రావడం గొప్ప సంతృప్తిని కలిగించింది. గురజాడ నాకు చాలా ఇష్టమైన కవి. ఆయన ప్రత్యేక ఛందస్సుతో రాసిన “ముత్యాల సరాలు” నాకు చాలా ఇష్టం. అందువల్ల బృహదారణ్యకోపనిషత్తుకు రాసిన “బృహద్గీత”, సాంఖ్య దర్శనానికి రాసిన “ప్రకృతి పురుష వివేకం”, ఈశావ్యాసోపనిషత్తుకు రాసిన “ఈశావ్యాసం” ఛాందోగ్యోపనిషత్తుకు రాసిన “ఉద్గీథం”… వీటిని ముత్యాలు సరాలు ఛందస్సులో కూర్చాను. అగ్నిస్వరాలు, అమృతస్వరాలు కూడా ముత్యాల సరాలులో అందించాను. ఇవన్నీ కలిపి మొత్తం 4వేల ముత్యాల సరాలు అవుతాయి. ఇన్ని ముత్యాల సరాలు రాసిన కవిని బహుశా నేనే కావచ్చు. 2019 లో సనాతన ఛారిటబుల్ ట్రస్ట్ వారు విశాఖపట్నం భీమిలీలో శివానంద మూర్తి గారు నాకు నేషనల్ లెవెల్ ప్రతిభా పురస్కారాన్నిస్తూ 51వేల రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. అలాగే అమృతలత ఇందూరు అపురూప రాష్ట్రస్థాయి జీవన సాఫల్య పురస్కారంతో పాటు 25 వేల రూపాయల నగదు బహుమతి పొందాను. అంటే ఒక విద్యార్థిగా ఒక అవార్డు, ఆధ్యాత్మిక వేత్తగా ఉన్నందుకు ఒక పురస్కారం, సాహితీవేత్తగా ఒక పురస్కారం పొందాను. ఇంతకు మించి ఏం కావాలి?

 21..”ఆలోచనామృతమే కవిత్వం”  అనే మీ దృష్టికోణంలో కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఎటువంటివి?

జ:    ఆపాత మధురం సంగీతం, ఆలోచనామృతం కవిత్వం అని అంటారు కదా! సంగీతం మధురమైనది. కవిత్వం ఆలోచింపజేసేది. కవి కర్మ కావ్యం అంటారు. “ప్రజ్ఞా నవనవోన్మేష శాలిని ఇతి ప్రతిభామతా”. కవిత్వం ఎప్పుడూ కొత్తగా ఉండాలి. వస్తువు పాతదే కావచ్చు. కొత్త ఉపమానం వల్ల దాన్ని కొత్తగా ఆవిష్కరించాలి. “కవిర్ మనీషీ” అని యజుర్వేదంలో ఉంది. కవిః అంటే ఇక్కడ సర్వజ్ఞుడు అని, మనీషీ అంటే జీవుల మనస్తత్వాలను తెలిసినవాడు అని అర్థం. ఇక్కడ కవి అంటే సర్వజ్ఞుడు. అంటే భగవంతుడు. మనీషీ అంటే ఎవరి మనసులో ఏముందో ఏక కాలంలో తెలిసిన వాడు. అంటే కవి సర్వజ్ఞుడు కావాలి. అన్నీ తెలియాలి. లోకజ్ఞుడు కావాలి. ముందు ఋషి కావాలి. “నానృషిః కురుతే కావ్యం” అన్నారు కదా! మంత్రదృష్ట అయినవాడు ఋషి అవుతాడు. ఋషి అయినవాడు కవి అవుతాడు.  “విశ్వ శ్రేయః కావ్యమ్” అన్నట్టు కావ్యం విశ్వానికి శ్రేయస్సు కలిగిస్తుంది. ఆంధ్రశబ్ద చింతామణిలో నన్నయ్యగారు చెప్పిన మాట ఇది. అంటే కవి తన కావ్యం ద్వారా లోకానికి మేలు కలిగించాలి. ఏవో రచనలు చేయడం కాదు. సమాజంలో అవి ఎంత మార్పును తీసుకొస్తున్నాయో ఆలోచించాలి. హృదయ పరివర్తనకు కారణభూతమయ్యేలా కవిత్వం ఉండాలి.  మరిచిపోయేది, మారిపోయేది కవిత్వం కాదు. మార్పును కలిగించేది కవిత్వం కావాలి. అది విశ్వజనీనం కావాలి. కవి క్రాంతదర్శి కావాలి.  గీతాంజలిలో ఒకచోట రవీంద్రులు ” నీప్రేమలో నా ప్రేమ. ఇద్దరి ప్రేమలో ఉన్నది నువ్వే కదా” అంటారు. భగవంతుడు ప్రేమమూర్తి. మనందరినీ ప్రేమిచేవాడు ఆయన. చూడండి ఎంతటి ఫిలాసఫర్ కదా ఆయన? నేను గీతాంజలికి చేసిన “సడిలేని అడుగులు” చదివి కొలకలూరి ఇనాక్ గారు మిమ్మల్ని “ఆత్మీయ స్పర్శాలింగనం” చేసుకోవాలనిపిస్తుంది అన్నారు. ఆధునిక కవుల్లో కూడా జాషువా, దాశరథి, కాళోజీ లాంటి వాళ్లు అలాంటి మార్పు దిశగా కవిత్వం రాశారు.   కాబట్టి కవి అలాంటి కవిత్వం రాయడం సమాజ హితవును కలిగిస్తుంది.

22. ప్రస్తుతం వస్తున్న ఆధునిక కవిత్వం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?  

జ:  నేను మంచి కవిత్వం రావాలని ఆశిస్తాను. కవిత్వం ఎటర్నల్. కవి ఇవాళ ఉంటాడు. రేపు ఉండడు. కానీ కవిత్వం అలా నిలిచిపోతుంది. వ్యాసుడు, కాళిదాసాదులు కాక ఇతర భాషల్లోనూ గొప్ప కవులున్నారు. కవితాబలం పైనే కవి చిరకాలం నిలిచిపోతాడు. అంటే కవి యొక్క బలం కవిత్వం అన్నమాట. ఉదాహరణకు భారతీయ శిల్ప కళకు ఆలయాలు నిదర్శనాలు. రాయిని గుర్తించి అద్భుత శిల్ప కళా ఖండాలుగా మలిచారు వాళ్ళు. అంటే వస్తువును గుర్తించారు కాబట్టి శిల్పంగా చెక్కగలిగారు. ఈనాటి కవులకు అది లేదు. కవితావస్తువు లేకుండా మంచి కవిత్వం ఎలా వస్తుంది. ముందు ఒక మంచి వస్తువును ఎంచుకోవాలి. ఏదో రాస్తూ పోతున్నాం. అదే కవిత్వం అని ఒకరికొకరు పొగుడుకోవడమే తప్ప అసలు కవిత్వం రావడం లేదు.  

23. తెలుగు సాహిత్యం పట్ల అత్యంతాసక్తి కలిగిన కవులకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏవి?

జ: ఏ సాహిత్య రచన అయినా ఆధ్యాత్మికతతో మేళవించినప్పుడు అది మానవ సమాజానికి ఉపయోగ పడుతుందని నా భావన. అంటే పారమార్థిక చింతన ఉండాలి. అర్థ చింతన ఉంది ఇప్పుడు (నవ్వుతూ). కానీ అది లౌకికం. పారమార్థిక చింతన ఉన్నప్పుడే సమాజం ‘అర్ధ’వంతమవుతుంది. ముఖ్యంగా అధ్యయనం చేయాలి.  రాయడం పనిగా పెట్టుకుంటున్నారు. చదవడం లేదు.  డెబ్భై శాతం రాయడమే చేస్తున్నారు. కానీ డెబ్భై శాతం అధ్యయనం చేయాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. అధ్యయనం లేకపోతే అవగాహన ఉండదు. అవగాహన లేకుండా ఎలా రాయగలుగుతారు? రాసేటప్పుడు సమాజాన్ని తిరస్కార భావంతో చూడొద్దు. ఇష్టమైనదే చెప్పండి. ఇష్టం కాని దాన్ని రాస్తూ కష్ట పడడమెందుకు? నీకు ఇష్టం లేనిది మరొకరికి ఇష్టమైనదై ఉండొచ్చు కదా! ఈ రోజుల్లో అధ్యయనం లేకపోవడం వల్ల శబ్దజ్ఞానం కూడా తక్కువై పోయింది. వర్గ విభేదాలు, కుల మత భేదాలు, స్త్రీ పురుష భేదాలు లేకుండా రాసేది అందరి హితవు కోసం రాయాలి.  ఎక్కడో ఒకచోట నేను “వేద విద్యకు దూరమైతిమి, భేద విద్యకు దగ్గరైతిమి” అన్నాను. “సర్వేజనాః సుఖినోభవంతు” అని కదా వేదం చెప్తోంది. వేదాలకు దూరం కావడం వల్ల స్త్రీ గొప్పదనం తెలుసుకోలేక పోతున్నాం. అన్నీ తెలుసుకోవాలంటే అధ్యయనం చేయాలి. అప్పుడే చక్కగా రాయగలుగుతారు.

24. మీ సాహితీ యాత్రను ఇంకా కొనసాగిస్తున్నారా?  

జ:  అవును ఇంకా కొనసాగిస్తున్నాను. శరీరంలో ఓపిక ఉన్నంతవరకు చేస్తూనే ఉంటాను. పతంజలి యోగ దర్శనానికి నేను స్క్రిప్టులో  1100 పేజీలు రాశాను. 500 పేజీల్లో “సంపూర్ణ యోగదర్శనం”గా అది వెలువడనుంది. ప్రింట్ అవుతోంది. కృష్ణుడు మంచి యోగి. నాకు యోగమంటే చాలా ఇష్టం. అందుకే భగవద్గీతను ఎంతో ఇష్టపడతాను. వారానికి రెండురోజుల చొప్పున “వేదాంత దర్శనం” ఇంట్లోనే స్వయంగా బోధిస్తున్నాను.  వారానికి రెండు రోజులు “యోగ దర్శనం” ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాను. ఈనెలలో (నవంబర్ 2023) చెరుకూరి రామారావు గారి ఆధ్వర్యంలో చెరుకూరి గ్రూపు తరఫున 11 రోజులు భగవద్గీత మీద ప్రసంగిస్తున్నాను. ఈ మధ్యనే నేను ఉత్తర కాశీకి వెళ్లి వచ్చాను. గంగోత్రికి సంబంధించి “గంగోత్రి వైభవం” పద్యకృతి రాశాను. అది ఈ మధ్యనే వెలువడింది కూడా. “శ్రేష్ఠారామం”, “నా చూపు దేశం వైపు” అనే వచన కవితా సంపుటాలు ముద్రణలో ఉన్నాయి. దత్తాత్రేయుని మీద ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. ధర్మవ్యాధుని మీద కూడా ఒక పుస్తకం రానున్నది. The success of Karma Yoga, Gnana Yoga అని రెండు పుస్తకాలు రాయాలి. విషయ సేకరణ కూడా చేయడం జరిగింది. కర్మ యోగానికి రాముడు ప్రతీక అయితే జ్ఞాన యోగానికి కృష్ణుడు ప్రతీక. అందుకే వాళ్ళిద్దరి గురించి రాయాలని అనుకుంటున్నాను. భగవంతుడు అనుగ్రహించినంత వరకు రాస్తూనే ఉంటాను.

నమస్కారాలు సార్…సుదీర్ఘమైన మీ సాహిత్య, ఆధ్యాత్మిక జీవిత ప్రస్థానాలను ఎంతో ఓర్మితో, కూర్మితో మాకు తెలియజేసినందుకు మా తరఫున, మా పాఠకుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సెలవు.

.

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

కళ

by Nidhir Avyayah Chelpati October 3, 2023
written by Nidhir Avyayah Chelpati
October 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఓ కర్షకా ! ఓ హాలికా

by Narendra Sandineni October 3, 2023
written by Narendra Sandineni

అన్నాడి గజేందర్ రెడ్డి, ఓ కర్షకా! కవిత పై విశ్లేషణా వ్యాసం.
కవి,గాయకుడు,రిటైర్డ్ ప్రిన్సిపల్,ప్రభుత్వ జూనియర్ కళాశాల,మానకొండూర్,అన్నాడి గజేందర్ రెడ్డి కలం నుండి జాలువారిన”ఓ కర్షకా” కవిత పై విశ్లేషణా వ్యాసం.ఓ కర్షకా కవిత ఏమిటి? అని ఆసక్తి తో చదివాను.నాకు చాలా నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.

“ఓ కర్షకా ! ఓ హాలికా
“అన్నదాతా ! సౌభాగ్య ప్రదాత
కర్షకుడు ఎవరు? వ్యవసాయం చేసేవాడు. పొలం దున్ని బతుకువాడు.కర్షకున్ని,రైతు, వ్యవసాయదారుడు అని పిలుస్తారు.హాలికుడు ఎవరు? నాగలి పట్టి దున్నేవాడు.నిరంతరం కృషి చేసేవాడు రైతు అని చెప్పవచ్చు.మనదేశంలో ముందుగా పేర్కొన దగ్గ వారిలో రైతులు ముందు ఉంటారు.రైతే రాజు.రైతు దేశానికి వెన్నెముక వంటి వాడు.అన్నదాత ఎవరు? అన్నదాత సుఖీభవ అని అంటారు.మనకు అన్నాన్ని ప్రసాదించే రైతు సుఖంగా ఉంటే దేశమంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పవచ్చు.కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది.హాలికుల శ్రమకు దేశంలోని ప్రజలంతా ఋణ పడి ఉంటారు.సౌభాగ్య ప్రదాత ఎవరు? అంటే మనకు సౌభాగ్యాన్ని ఇచ్చేవాడు రైతు అని ఘంటాపథంగా చెప్పవచ్చు.ఇందులో సందేహానికి తావు లేదు.
“రైతు రాకతోనే ప్రతి చేను పులకరిస్తుంది”
రైతు రాకతోనే చేను ఎందుకు పులకరిస్తుంది? అది ఏమైనా జీవమున్న మనిషా? భూమికి ఎలా స్పందనలు ఉంటాయి అని మనకు ఆశ్చర్యం కలిగవచ్చు.రైతు రాకతోనే అంటే రైతు చేనులో అడుగుపెట్టగానే చేను పులకరిస్తుంది. ఆ గగుర్పాటును చూడగానే రైతు ముఖం లో ఆనందం వెల్లివిరిస్తుంది.అలాంటి ఆనందపు అనుభూతులు రైతు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. రైతు రాకడ తెలియగానే చేను ఎదలో కలిగే గిలిగింతలతో,ఆనందంతో మరియు తన్మయత్వంతో పులకరిస్తుంది అని చెప్పిన కవి గజేందర్ రెడ్డి భావన గొప్పగా ఉంది.
“నీ మాటతోనే ప్రతి పిట్ట పలకరిస్తుంది”
రైతు మాట వినగానే పిట్టలు ఎక్కడైనా పలకరిస్తాయా? పిట్టలు తమ సహజ స్వభావంతో కిచకిచ శబ్దం చేస్తాయి.కోకిలలు కుహు కుహు రాగాలతో పాటలు పాడుతాయి.రైతు మాట వినగానే పిట్టలు మాట్లాడుతాయి.పిట్టలు మాట్లాడటం గురించి మనం చిన్నతనంలో పంచతంత్ర కథలలో చదివాం.ఆనాటి ఆ కథల్లో ఎంతో నీతి దాగి ఉంది. మరి ఇప్పుడు కవి గజేందర్ రెడ్డి సైతం రైతు తో పిట్టలు సంభాషిస్తున్నాయి అని చెప్పిన భావం అద్భుతం.
“పశు పక్ష్యాదులకు తెలుసు నీ జీవ కారుణ్యం
పశువులంటే నాలుగు కాళ్ల జంతువులు.గొర్రె,ఆవు, బర్రె లాంటివి అని చెప్పవచ్చు,పక్షులు,పిట్టలు కూడా నానా రకాలుగా ఉన్నాయి.జీవ కారుణ్యం అంటే ఏమిటి? జీవుల పట్ల జాలి,దయ కలిగి ఉండటాన్ని జీవ కారుణ్యం అంటారు.సకల జీవుల పట్ల భూత దయ కలిగి ఉండాలి.సమస్త జీవకోటిని ప్రేమించాలి. అందరి పట్ల దయ కలిగి ఉండాలి అని గ్రహించి నడుచుకున్నవారు రైతులు అని చెప్పవచ్చు.ఒక మనిషి దుఃఖం,బాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది కారుణ్యం.దయ ఒక సాత్విక భావన. ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం రైతులది. రైతుల వల్లనే మనమందరం బతుకుతున్నాం.రైతు పశువులను పెంచుతాడు మరియు పశువులను ప్రాణంగా ప్రేమిస్తాడు.రైతు చేను చెలకల్లో పక్షులు గింజలు తిని బతుకుతాయి.రైతు పశువుల పట్ల మరియు పక్షుల పట్ల కారుణ్యంతో ఉంటాడని లోకమంతా ఎరిగినదే.పశుపక్ష్యాదులకు రైతుల జీవ కారుణ్యం తెలుసని చెప్పడం,కవి గజేందర్ రెడ్డికి రైతుల పట్ల గల ఎనలేని ప్రేమను తెలియ చేస్తుంది..
“మానవాళి కంతటికి నువ్వే శరణ్యం” రైతులు ఎండనక,వాననక,పగలనక,రాత్రనక చేనులో,పొలంలో దిగి కష్టపడతారు.దుక్కి దున్నుతారు.విత్తనాలు నాటుతారు.నీరు పెడతారు. చేనుకు కాపలా కాస్తారు.రాత్రి పగలు చేనులోనే ఉంటారు.అన్ని జాగ్రత్తలు తీసుకొని రైతు పంటలు పండిస్తాడు.అందుకే మానవాళికంతటికి రైతు రక్షించే కవచం,నువ్వే శరణ్యం అని చెప్పిన కవి గజేందర్ రెడ్డి భావన చక్కగా ఉంది.

అన్నాడి గజేందర్ రెడ్డి

“ఏ నేలకి ఏ పంటో తెలిసిన శాస్త్రజ్ఞుడివి”
నేల భూగోళంపై ఎగువ పొరలో వృక్షాలు పెరిగే భాగాన్ని నేల అంటారు.నేలలు భూ ఉపరితలంపై ఉన్న శిలలు వాతావరణ ప్రభావంతో మెత్తటి నేలలుగా మారతాయి.నల్లరేగడి నేలలు,ఎర్ర నేలలు, జిగురు నేలలు మొదలైనవి.నీటిపారకం ఎక్కువ ఉన్నచోట వరి వంటి పంటలను పండిస్తారు. నీటిపారకం తక్కువ ఉన్నచోట మిగతా పంటలు పండిస్తారు.ఏ నేలలో ఏ పంట పండించాలో రైతుకు తెలిసిన విద్య.పంటలు పండించడంలో రైతుకు ప్రావీణ్యత ఉంది.రైతును శాస్త్రజ్ఞుడివి అని కీర్తించిన కవి గజేందర్ రెడ్డి భావన చక్కగా ఉంది.
“అనుభవాన్ని జోడించి పండించే విజ్ఞుడివి”
రైతు పనిచేస్తూ ఉంటే అనుభవం కలుగుతూ ఉంటుంది.రైతు అనుభవాన్ని ఆచరణలో పెడుతూ వ్యవసాయం చేస్తే మరింత లాభం పొందుతాడు. రైతు అనుభవానికి మరింత పదును పెడితే మరిన్ని విజయాలు సాధిస్తాడు.వాస్తవ జ్ఞానమే సరైన జ్ఞానం.రైతు నిరంతరం పని చేయడం ద్వారా, పరిశీలన ద్వారా అనుభవం వస్తుంది.రైతులు అనుభవాన్ని జోడించి పంటలు పండించే నిపుణులు అని చెప్పిన కవి గజేందర్ రెడ్డి భావన అద్భుతం గా ఉంది.
“నీ స్వేద జలంతో పసిడి పంట పండుతుంది”
రైతు నేలతల్లి సంతోషపడేటట్లుగా నెత్తురు చెమటగా మార్చి బంగారాన్ని పండిస్తాడు.రైతు చెమట చుక్కలకు బంగారు రాశుల పంట పండించే శక్తి ఉంది.కార్మిక కర్షక స్వేద జలానికి ఖరీదు కట్టి షరాబు లేడోయ్ అని మహాకవి శ్రీశ్రీ అన్నాడు. కర్షకుల శ్రమతోనే బంగారు పంటలు పండుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.
“నీ స్వేద బలంతో సిరి ఇంట నిండుతుంది’. రైతు చెమట చుక్కల బలంతోనే ధాన్య రాశులతో ఇల్లు నిండుతుంది. రైతు కష్టించి స్వేధం చిందించడం వల్లనే సంపద లభిస్తుందని కవి చెప్పిన భావం చక్కగా ఉంది.
“చెట్టు ఎంత ఎదిగినా వేళ్ళు భూమిలోనే”
చెట్లు నేల పటుత్వాన్ని మరియు భూసారాన్ని చక్కగా కాపాడుతాయి.ప్రకృతికి అందాలు చేకూర్చడంలోను వ్యవసాయంలోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.చెట్టు కొమ్మలు రెమ్మలు కలిగి 20 అడుగులు ఎత్తు పెరిగే వాటిని చెట్టు అంటారు.ఇవి ప్రతి సంవత్సరం చిగురిస్తు,పుష్పిస్తూ,కాయలు, పండ్లు అందిస్తాయి.చెట్టు ఎంత ఎదిగినా వేళ్ళు భూమిలోనే ఉంటాయనే నిజాన్ని కవి తెలియ జేస్తున్నారు.
“మహోన్నతుడవైనా నీ కాళ్లు నేలపైనే”
మహోన్నతుడు అంటే గొప్ప వాడు లేక అధికారం కలవాడు అని అర్థం.రైతును మహోన్నతుడు అని అంటున్నారు.రైతు మహోన్నతుడు ఎలా అవుతాడు అని మనకు ఆశ్చర్యం కలగవచ్చు. సర్వసత్తాక గణతంత్ర రాజ్యానికి అధిపతి అయిన రాష్ట్రపతిని మహోన్నతుడు అని అంటాం.కాని కవి గజేందర్ రెడ్డి సామాన్యమైన రైతును మహోన్నతుడని పోల్చడం చక్కగా ఉంది.నిజంగా కవి రైతు జీవితాన్ని పరిశీలించి,పరిశోధించి చెప్పినట్లుగా ఉంది.ఇవాళ కొంత సంపద సంపాదించగానే కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో ఎవరిని లెక్కచేయకుండా ఆకాశం పైన ఉన్నట్లు తామేదో గొప్పవారు అయినట్లుగా కొంత మంది ప్రవర్తిస్తుంటారు.కాని మహోన్నతుడు అయిన రైతు కాళ్లు నేల మీదనే ఉంటాయని అని చెప్పడం అద్భుతం.
“నీ మట్టి కాళ్ళ నెప్పుడు మేము కళ్ళకద్దుకోవాలి”
రైతు మట్టికాళ్లతో పొలంలో దిగి పొలాన్ని దున్నుతాడు.మట్టిలో మట్టై రైతు అనేక కష్టాలను పడతాడు.రైతుకు పురుగు పుట్రా మరియు తేల్లు మరియు పాములతో ప్రమాదం ఉంటుంది.ఎండ వానల్ని లెక్క చేయకుండా రైతు అహారహం శ్రమిస్తాడు.కలుపుతీస్తాడు.పంటను ఎలుకలు, పక్షులు తినకుండా కాపాడుతాడు.చివరకు పంటను పండిస్తాడు.రైతు మాత్రం కడుపును మాడ్చు కుంటాడు.రైతు కన్నీళ్లు అలాగే ఉంటాయి.ఎంత రాతి గుండెనైన కరిగించే కష్టాలు రైతువి అని చెప్పవచ్చు.వ్యవసాయదారుల జీవితాలను కళ్ళకు కట్టినట్టు వర్ణించారు.నిర్విరామంగా కష్టపడుతున్న రైతు కాళ్ళను మేము కళ్ళ కద్దుకోవాలి అని చెప్పిన కవి గజేందర్ రెడ్డి సంస్కారాన్ని మెచ్చుకోవాలి.
“నీ నడవడి చూచి మేము బతుకుదిద్దుకోవాలి
రైతు యొక్క ప్రవర్తనను చూసి మా యొక్క బతుకులు మార్చుకోవాలని చెప్పడం చక్కగా ఉంది. రైతు ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నాడు. రైతు జీవితం ఆచరణీయమైనది.రైతు ఎలా బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడో.మేము కూడా రైతులాగా జీవితాన్ని సత్ప్రవర్తనతో సరి దిద్దుకోవాలని చెప్పిన తీరు కవి గజేందర్ రెడ్డికి రైతుల పట్ల గల ప్రేమను
వ్యక్తం చేస్తుంది.
“నీ శిరమే హిమవన్నగ శిఖరం”
హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది.భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు రక్షణ కవచాలుగా ఉన్నాయి. హిమాలయాలు తీవ్రమైన చలికాలంలో వచ్చే చల్లటి గాలులని అడ్డుకుంటున్నాయి.హిమాలయ నదులు జీవనదులు.గంగా,సింధు,బ్రహ్మపుత్ర నదులు. ఉపనదుల వల్ల హిమాలయ ప్రాంతం అత్యంత సారవంతమైన నేలలు కలిగి ఉంది.ఆహారం మరియు వాణిజ్య పంటలు పండటానికి ఉపయోగకరంగా ఉంది.కవి గజేందర్ రెడ్డి రైతు యొక్క కృషిని తలుచుకున్నారు.రైతు చేస్తున్న కృషి మరపురానిది,మరువలేనిది. రైతును హిమాలయ పర్వతం యొక్క శిఖరంతో పోల్చడం అద్భుతంగా ఉంది.
“నీ చిరునవ్వే దేశానికి వరం”
వరం అంటే దేవతల వల్ల తీర్చబడు కోరిక.అలాంటి వరంను మనం కోరకుండానే ఇస్తున్నవాడు ఎవరు? అంటే రైతు అని చెప్పవచ్చు.అన్నదాత గా ఉండి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంటలు పండిస్తున్నాడు. సకల మానవాళికి ఆహారం అందించి ప్రాణాలు కాపాడుతున్నది రైతు అని చెప్పడం,రైతు సుఖంగా ఉండాలని రైతు యొక్క చిరునవ్వు దేశానికి వరం అని చెప్పడం కవి గజేందర్ రెడ్డి రైతు యొక్క బాగును కాంక్షించడం చక్కగా ఉంది.
“నీ త్యాగం నిరుపమాన మనితర సాధ్యం”
కష్టాన్ని దాచుకోని రైతు దేశాభివృద్ధికి మూలమైన గొప్పవాడు.నేల తల్లి సంతోషపడేటట్లుగా నెత్తురు చెమటగా మారుతుండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతు త్యాగానికి వెలకట్టలేము.కంటికి రెప్పవలె చేను చుట్టు కంచె వలె రైతు శ్రమించి పంటలను పండిస్తున్నాడు.దేశ జనాల ఆకలి మంటలను చల్లారుస్తున్న కష్టించి పనిచేసే రైతుకు ఏమిచ్చి మనం ఋణం తీర్చు కోగలం.రైతులు చేస్తున్న త్యాగం ఇతరులకు సాధ్యం కానిదని చెప్పడంలో సందేహం లేదు.
“నీ బతుకే దేశానికి సందేశం”
రైతు సామాన్యుడిగా బతుకుతున్నాడు.అతని జీవన విధానం,అందరికీ ఆదర్శం,మరియు ఆచరణీయం అని పేర్కొనదగినది.రైతు బతుకు దేశానికి సందేశం అని చెప్పడం చక్కగా ఉంది.రైతు గురించి కవి గజేందర్ రెడ్డి రాసిన కర్షకా కవితను గేయం గా కూడా పాడుకొనవచ్చు.ఈ కవిత అలతి అలతి పదాలతో చక్కగా ఉంది.కవి గజేందర్ రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను. అన్నాడి గజేందర్ రెడ్డి,జవారి పేట గ్రామం, ఇల్లంతకుంట మండలం,రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు.తేది 16- 06- 1958 రోజున సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు సూర్యమ్మ,ఆనంద రెడ్డి.తండ్రి ఆనందరెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు.గజేందర్ రెడ్డి 1 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ గాలిపల్లి లో చదివారు.10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆర్ట్స్ కరీంనగర్ లో చదివారు.డిగ్రీ ప్రైవేట్ గా,ఆ తర్వాత ఎం.ఏ.తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాద్ లో చదివారు.గజేందర్ రెడ్డి 1985లో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల మానకొండూరులో ప్రిన్సిపల్ గా 31-03-2015 రోజున రిటైర్ అయ్యారు. గజేందర్ రెడ్డి లెక్చరర్ గా పనిచేస్తూనే పలు సాహిత్య సంస్థలతో అనుబంధం పెంచుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా పలు సాహిత్య సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.కవి,గాయకుడు మరియు మంచి వక్త. అందరితో స్నేహంగా ఉంటారు.స్వయంగా పాటలు రాసి చక్కని స్వరంతో లీనమై పాడుతారు. 7 వ తరగతి చదువుతున్నప్పుడే ఉత్తర గోగ్రహణం అనే నాటకాన్ని రాసి అభినయించారు.9వ తరగతిలో భక్త ప్రహ్లాద నాటకంలో ప్రహ్లాదుడిగా అభినయించారు మరియు 10వ తరగతి చదువుతున్నప్పుడు కిరాతార్జునీయం నాటకంలో అర్జునుని గా నటించారు.చిన్నతనంలోనే పాటలంటే ఆసక్తి కలిగి పాడుతుండేవారు.అలాగే పాటల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు‌. గజేందర్ రెడ్డి వివిధ పత్రికలలో 150 వరకు సాహిత్య వ్యాసాలు రాశారు.వివిధ పత్రికలలో వెలువడిన వ్యాసాలతో “వెలుగుల వెల్లువ” కవిత్వ వ్యాసాలు పుస్తకం డిసెంబర్ 2022లో ప్రచురించారు.గజేందర్ రెడ్డి ప్రముఖ దినపత్రిక వెలుగులో వారం వారం సమీక్ష వ్యాసం రాస్తున్నారు.

October 3, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

చందమామయ్య

by Tungaturti Madhusudana Rao October 3, 2023
written by Tungaturti Madhusudana Rao

నాడు మా అమ్మ అవని నుండి నీవు విడిపోయి గగనతలంలో విహరిస్తున్నావని మా అమ్మ
” చందమామ రావే జాబిల్లి రావే” అని నిన్ను పిలుస్తూ బుజ్జగిస్తూ పాటలు పాడుతూ ఆడిస్తున్నది…
నీ వెన్నెల చల్లదనంలో రాత్రి వేళ , హాయిగా తీయగా పాడుతూ ఆడుకుంటున్నాము…
నీవు మా చెంతకి తిరిగి రాలేకపోయినా
మేమే మేనమామ ఇంటికి , ఆశించి ప్రయత్నించి వచ్చాము మామయ్య…
ఎలాగైతేనేం నీ నివాసం చూడగలిగాం నేడు.
నీ ముందు భాగం పండు వెన్నెల ప్రసరిస్తే ,
నీ వెనుక భాగం చిమ్ము చేకటెందుకు?
నీ తిమిర భాగంలో నిక్షిప్తంగావున్న సంపదను చూడాలని ఉంది మామ !
ఈ ఖనిజ, మూలకౌల సంపదంతా ఇక్కడ నిరుపయోగంగా పడివున్నాయి….
ఒంటరివాడివి ఎందుకు నీకివన్నీ !
ఎవరైనా ఆస్తులు సమకూర్చి కూడబెట్టినా రాబోవు తరానికి అందిస్తారు…
నీవు వదలివచ్చిన నీ సోదరి , మా భూమాత సంతతే కదా మేమంతా!
అమ్మ తరువాత ఆమె తోబుట్టువు నీవు , మాకు మా మేనమామవే కదా….
ఎన్నో శ్రమలకోర్చి నీ ఇంటికి వచ్చాము.
మా జగతి జనం పురోగతికి తోడ్పడి ,
నీ నిక్షిప్త నిధులను భువికి తరలించి , ఆదుకోవాలని ఆశించివచ్చాం !
ఈ రాఖీ పండుగ సందర్భంగా , మాకు రాఖీకట్టి
” అంతా శుభమే జరుగుతుందని, క్షేమంగా వెళ్లి లాభంగా రండని ” మా అమ్మ అవని పంపించింది.
మీకు ఈ సందర్భంగా భువిపై జనావళి అందరి శుభాకాంక్షలు అందిస్తున్నాం.
ఇక నుండి మేమిలానే వస్తూ పోతుంటాం .
ఇక సెలవు

October 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us