మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

మా పంతులు

by Rudrakhala Matam Prabhu linga Shastri January 15, 2024
written by Rudrakhala Matam Prabhu linga Shastri

సిగరెట్టు త్రాగే బలహీనత ఉండేదేమో
త్రాగుచుండగ మా కంటపడలేదెన్నడు.

మాకు తెలియకూడదని చివరిదినం నాడు
రెండవ ఆటకు సినిమాకు పోయెవాడట.

మాలో ఒకరి వలె దైవ భక్తి ఉండెనో లేదో
నుదుటి పై విభూతి లేకుండ ఉండకుండె.

మధ్యాహ్నం ఓపిక ఉన్నా లేకున్న తప్పక
కాళ్ళు చేతులు ముఖం కడిగే తినేవాడు.

ఇంటిలో ఒక్క పనియైనా చేసేవాడో కాదో
బడిలో తిన్నాక బాక్స్ ను కడుక్కునేవాడు.

మద్యం సేవించే వాడో కాదో ఏ ఒక్కరును
మా పంతులు త్రాగునని అనగా వినలేదు.

మేము హోంవర్క్ సక్రమముగ చేయకుంటె
ఇళ్ళకు వచ్చి పెద్దలను చేయించమనేవాడు.

మా సోమరితనం వలన పై అధికారి నుండి
మాటపడిన మా ముందు అబద్దమాడలేదు.

మా అల్లరికి విసిగి ఒక్కోసారి ఆయన చేసిన
బడితెపూజ మేం మరచినను, బాధపడేవాడు.

బడిలో తనకొడుకు మాలాంటి విద్యార్థియే
ప్రత్యేకహోదా లేదు; అర్హత బట్టే మార్కులు.

మా పంతులు ముందు మేము విద్యార్థులమే
కాని విద్యార్థి మరియు విద్యార్థినిలము కాము.

మా యూనిఫామ్ స్టిచ్చింగ్ లో తేడా ఉండేదేమో
మా పంతులు చేయించే డ్రిల్ లో ఉండేదికాదు.

పద్యాల ఎక్కాల లో వారి కఠిన శిక్షణలో నేడు
మా ల్యాబ్ టాప్ తప్పినా మేం తప్పడములేదు.

వల్లెవేయించే వారి అసమాన ఓర్పుతో నేడు
స్పెల్లింగ్స్, అల్ప, మహాప్రాణాలలో దిట్టలం.

టైప్డ్ ‘ఒ’ మరియు ‘బ’లను గుర్తుపట్టలేరేమో
వారు దిద్దించినందున మేము వ్రాస్తె పొరబడరు.

January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

బక్కవ్వ

by Humayun Sangheer January 15, 2024
written by Humayun Sangheer


“ఈ ఫోటోలోని మహిళ పేరు స్వరూప. వయసు 28 సంవత్సరాలు. మతిస్థిమితం బాగాలేక గతవారం తప్పిపోయింది. ఎక్కడైనా కనిపిస్తే కింది నెంబర్‌లో తెలుపగలరు.. ఇట్లు పంకజ్” వాట్సాప్‌లో ఫార్వాడెడ్‌గా వచ్చిన ఆ మెసేజ్, అందులోని ఫోటో చూసి హృదయ్ ఒక్కసారిగా షాకయ్యాడు?

ఎదురు సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న అనిత భర్త ముఖంలో టెన్షన్ గమనించింది. పుస్తకం పక్కనబెడుతూ “ఏమైందండీ” అని ప్రశ్నించింది. అదుర్దాగా భార్య ముఖంలోకి చూస్తూ చేతిలో ఫోన్ అనిత ముందుకు చాచాడు హృదయ్.

అనిత ఆ మెసేజ్ చదివింది. “ఈమె మనూరామెనే గదా” అడిగింది అనిత. శూన్యంలోకి చూస్తూ అవునన్నటట్టు తలూపాడు. “అసలే పిచ్చిది.‌ ఎటు వోయిందో ఏమో” అంటున్న భార్య మాట విని ఆమె వైపు ఉరిమినట్టు చూశాడు. “ఓహ్ సారీ అండీ పొరపాటుగా అన్నాను” అపాలజీ చెప్పింది అనిత. హృదయ్‌కి తన చిన్ననాటి స్నేహితులు అందరూ ఎంతో ఇష్టమనే విషయం అనితకు అప్పుడే స్ఫురణకు వచ్చింది.

ఎప్పుడు టైం దొరికినా వాళ్లతో ఆడిన ఆటల గురించి చెప్పడం.. యాదగిరి, సీను, గోపి, నసీమా, లతీఫా, సాయవ్వ, పోషవ్వ, ముజ్జు, సంగవ్వ, లచ్చిమి, రవి, శివుడు, సాదక్, పంకజ్, స్వరూప (బక్క) ఇలా భర్త చెప్పిన చిన్నప్పటి స్నేహితుల పేర్లన్నీ అనితకు బాగా నోటెడ్ అయ్యాయి.

ఆలోచనలో పడిపోయింది కాసేపటివరకు. బక్క గురించి ఆలోచిస్తోంది. ఊరు వెళ్లినప్పుడు ఒకట్రెండు సార్లు బక్కను కలిసిన రోజులను గుర్తు చేసుకుంది. బక్క రూపం కాసేపు కళ్లల్లో మెదిలింది. బక్క అందరిలాంటి పిల్ల కాదని దిగులు చెందుతోంది. హృదయ్ మథనం కూడా అదే. కాసేపటికి “అనిత” అన్న హృదయ్ పిలుపుతో ఠక్కున వాస్తవంలోకి వచ్చింది అనిత.

భర్త వైపు చూసింది. “ఏం ఆలోచిస్తున్నవు” అడిగాడు. ఏం లేదన్నట్టు తలూపింది. హృదయ్ తన ఫోన్‌తో పంకజ్‌కు కాల్ కలిపాడు.

పంకజ్ ఫోన్ ఎత్తాడు. “బక్క కనిపిస్తలేదురా” అని వలవలా ఏడ్చేస్తున్నాడు.

“ఎన్ని రోజులైందిరా?” కంగారుగా అడిగాడు హృదయ్. “మూడు రోజులైందిరా. దానికి ఎర్వ పర్వ ఏం తెల్వది. ఎటువోయిందో ఏమో. ఇంట్ల అమ్మానాయిన గుండె వల్గుతున్నరు” అని ఏడుస్తూనే మాట్లాడుతున్నాడు పంకజ్.

“నువ్వేం టెన్షన్ వడకు యాడికి పోదు” హృదయ్ మాట పూర్తి కాకుండానే పంకజ్ అందుకుని “అసలే బయట కరోనా రోగం పార్సుకపోయి ఉన్నది. ముట్టుకుంటే అంటుకుంట అన్నట్టే ఉన్నది. దీనికి ఆ రోగం దెల్వది, మాస్కులు, శానిటైజర్ల గురించి అసలే దెల్వది. సరిగ్గా మాట్లాడలేదు. నత్తి నత్తి మాట్లాడుకుంట ఎటెటు తిర్గుతున్నదో ఏమోరా” గాద్ఘధికమైంది పంకజ్ గొంతు.

“పోలీస్ స్టేషన్‌ల కంప్లైంట్ ఇచ్చినవార”
“ఇచ్చినరా. కరోనా టైంల గా పిచ్చిదాన్ని సరిగ్గా సూస్కోరా అని ఎస్సై ఉల్టా తిట్టిండు. ఇసుంటి టైంల దమాక్ మంచిగ లేనోళ్లను ఇంట్ల కట్టేశి పెట్టాలె అని అన్నడు. ఈ టైంల పోలీసోల్లకు ఇరువై నాలుగ్గంటలు కరోనా డ్యూటీ జేస్తందుకే సరిపోతున్నరు. ఇప్పుడు ఇసుంటి కొత్త కేసులు యాడ వట్టించుకుంటర్ర” విచారించాడు పంకజ్.

హృదయ్ ఏం చెయ్యాలనే ఆలోచనలో పడ్డాడు.

మళ్లీ అతనే అందుకుంటూ..”పోలీసోల్లు ఇప్పుడు ఏం జెయ్యరనే ఇషారతోని సోషల్ మీడియాను నమ్ముకున్న. ఎవరికైన కానస్తే ఫోన్ జేస్తరుగదా” “అవును మంచిపని చేసినవురా. నువ్వు పరేషాన్ అయి అమ్మానాయినలను పరేషాన్ చెయ్యకు సరేనా”

“మంచి మంచోళ్లనే దిక్కులేని సావు సంపుతున్న కరోనా మన బక్కవ్వను ఏం జేస్తదోనని గావర అయితున్నదిర. గదొక్కటే బుగులు నాకు”
“నువ్వు అంతదాక ఆలోశించుకొని మైండు కరాబ్ జేస్కోకు” ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు హృదయ్.

“లాక్‌డౌన్ ఉండుంటే నాకేం రంది లేకుండేరా. లాక్‌డౌన్ తెరిశినకాన్నుంచి పాజిటివ్ కేసులు శానా పెరుగుతున్నయి. అదే నా భయం. హైదరాబాదులనే ఉన్న ఆ మహమ్మారి ఇప్పుడు జిల్లాలకు గూడ పాకింది. మనూర్ల గూడ ఒకోళ్లకు కరోనా అచ్చింది. అచ్చినోడు గాంధీల నవుస్తున్నడు. ఈడ ఇంటిల్లాదులంతా 28 రోజులు హోం క్వారంటైన్‌ల ఉన్నరు. దీంతోని ఊరంతా తాయిమాయి అయితున్నరు. ఏం పాడు గత్తరోనని కుదెం వెట్టుకున్నరు. ఈ టైం ఎసుంటిదో దానికి తెల్వది. ఇంట్లున్నప్పుడే యాల్లకు బువ్వ తినది. ఇప్పుడు బయట ఏం తింటున్నదో, ఎటేటు తిరుగుతున్నదో. ఈ టైంల మంచిగ తిని ఇమ్యూనిటీ పెంచుకోవాలని మనకు తెలుసు గనీ, దానికేం తెలుసురా? ఆ సాడేసాతోని పేరు తలుసుంట అది ఇంకింత పిచ్చిపిచ్చి జెయ్యవట్టిందిర” వణుకుతోంది పంకజ్ స్వరం.

సాడేసాతోడు అనగానే ‘కిరణ్’ అనే పేరు ద్యోతకమైంది హృదయ్‌కి. “పెండ్లి ఏమంట అయిందో కిరణూ కిరణూ‌‌.. ఇదే దాని నోటి నుంచి అచ్చిన పేరు. ఇది పిచ్చిదని, ఎత్తుపండ్లు ఉన్నయని, ఒంటె పెదవులు ఉన్నయని, మాట్లాడ్తె నోట్లెకెల్లి సొల్లు కారుతున్నది, తుంపిర్లు వడ్తున్నయని, చెవులకెల్లి చీము కారుతున్నదని.. ఇట్ల శానా వంకలన్ని తీశి దీనితోని సంసారం జెయ్యనంటే చెయ్యా అంటున్నడు ఆడు. ఎడ్డిదాన్ని అంటగట్టినమని ఉల్టా మామీద కేసు వెడ్తా అంటున్నడురా. అల్ల అని దాన్ని ఈడ నూకిపెట్టి ఆడు మిర్యాలగూడకు ఎల్లిపోయిండు. సంసారం చెయ్ బావా అని వాని కాల్లు మొక్కుతమా. పోని అని ఊకున్నం కనీ, ఇది వాన్ని మచ్చంవోయిన మరుస్తలేదు. పన్నా లేశినా కిరణ్ తప్పిచ్చి దాని నాల్కె మీద వేరే పేరే ఉంటలేదు. దీనిది నిజంగనే పిచ్చి ప్రేమరా. ఆడు దీన్ని ఇడసవెట్టి రేపు ఇంకోదాన్ని ఏలుకుంటడు. మా అమ్మా నాయినలు చెప్తే ఇనకుంట దాని లగ్గం చేశిర్రు. ఇయాల్లరేపు లోపం ఉన్న ఆడపిల్లలను ఎవడు పెండ్లి చేసుకుంటడు చెప్పు?”

“అవున్రా బక్క లగ్గం జేశి తప్పు జేశిర్రు. అట్లనే ఉంటుండె” హృదయ్ అన్నాడు.
“లోకం బాధకు అమ్మా నాయినలు దాని బొండిగె కోశిర్రు‌. పిల్ల పెయిమీదికి 28 ఏండ్లు అచ్చినయి. ఇంటి మీద బెలుగు లెక్కట ఇంకా ఆ పిల్లను ఎన్నొద్దులు ఉంచుకుంటరు. ఆమెకు తగ్గ పొలగాన్ని లెంకి అటు ఎత్తి ఇయ్యుర్రి అని మా మేనమామలు, పెద్దమ్మలు గూడ జోరీగల లెక్క పోరిర్రు. ఆల్ల బాధ పడలేక ఎత్తిచ్చినట్టు అయింది” వాపోయాడు పంకజ్.

“అయిందేదో అయిపోయిందిరా. తలరాత ఎట్ల రాసుంటే అట్లనే అయితది. విధిరాతను ఎవరం మార్చలేం గదా” సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు హృదయ్.

ఇంతలో పంకజ్ మరింత వెక్కడం వినిపించింది. “అరేయ్ పంకజ్ ఊకె ఏడ్వకురా. నువ్వు భయపడుతున్నంత ఏంగాదు‌. నేను గూడ వాట్సాప్ గ్రూపులల్ల, ఫేస్‌బుక్‌ల షేర్ జేస్త సరేనా. వీలైతే టీవీల గూడ వార్త ఏపిద్దాం. నువ్వు అంతలోపు ఎసుంటి పిచ్చి పిచ్చి ఆలోచన్లు వెట్టుకోకుంట ధైర్యంగ ఉండు. నిన్నిట్ల జూస్తె ఇంట్ల అందరు పరేషాన్ అయితరు. ఇంటికి పెద్దోనివి నువ్వఉ ఏం గుండెవల్గకు” అన్నాడు హృదయ్.

వెక్కుతూనే “థాంక్స్ రా ఉంటమరీ” “సరే.. బాయ్” అని ఫోన్ కట్ చేసి అనితను చూస్తూ నిట్టూర్చాడు. వాళ్ల డిస్కషన్ మొత్తం విన్న అనిత ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది.

ఇంతలో హృదయ్ నెర్వస్‌గా అంటున్నాడు. “ముందు నుయ్యి వెనుక గొయ్యి లెక్కటుంది మన పరిస్థితి. హైదరాబాద్‌ల కేసులు శితాం బుక్ అయితున్నయి. ఏమన్న బయటకు వోయి ట్రై జేద్దామంటే కరోనా భయం ఉన్నది” హృదయ్ గొంతులో జీర.

“అనవసరంగా ఆ పిల్ల పెండ్లి చేశిర్రు. నాకు పెండ్లి చెయ్యుర్రని ఎల్లాడినట్టే చేశిర్రు. చెయ్యకపోయినా గట్లనే ఉండేది. అసుంటోల్లు చాలా సెన్సిటివ్ ఉంటరు” అంటున్న అనిత వైపు చూస్తూ అవునన్నట్టు తలాడించాడు.

“ఎంత మంచిది పాపం. ఎటు వోయిందో.. ఏమేం గోస వడుతున్నదో. కరోనాల గూడ కొందరు కావురాలు వట్టిన బాడ్కావ్‌గాళ్లు పాపాలకు పాల్పడుతున్నరు. ఎడ్డిది, గొడ్డుది అంటలేరు. అదే టెన్షన్ అయితున్నది” అంటున్న భర్త భుజం మీద చేయి వేసింది అనిత.

“ఇప్పటిదాకా మీ దోస్తుకు ధైర్యం జెప్పి ఇప్పుడు నువ్వే ఇట్ల గావరైతే ఎట్ల? ఏంగాదు అనవసరంగ ఆలోచించకు” అంది భుజాన్ని నొక్కుతూ.

“ఎంటనే ఊరికి పోవాలనిపిస్తున్నది. కనీ పోలేం. పోంగ తొవ్వల కరోనా యాడ అంటుకుంటదోనని భయం‌. వర్క్ ఫ్రం హోమ్‌తోని మెసలకుంట పని అయితున్నది. ఇంత పని జేశినా సగం జీతమే ఇస్తున్నది కంపెనీ. ఇట్ల దేశంల ప్రతీ కంపెనీ దివాళా తీశింది. ఇంటి కిరాయోల్లు ఆగరు, కర్సులు మోపవుడు ఆగయి. ఎసుంటి దినాలు అచ్చినయి. ఇట్ల అయితదని ఊహించలేం. అవునూ పోరలేరి?” ఇంట్లో అటూ ఇటూ చూస్తూ అడిగాడు హృదయ్.

“ఇస్కుల్లు లేక దినాం ఆటనే అయింది వాళ్లకు. కింద ఆడుకుంటున్నరు” తాపీగా అంది అనిత.

“గేటుకు తాళం ఏశిర్రు గదా” “ఆ వేసే ఉంచిన. ఈ కరోనాతోని పాపం పోరగాళ్లను గూడ జైల్ల పెట్టినట్టు అయిపోతున్నది. ఈ అపార్ట్‌మెంట్‌ల కిందికి మీదికి ఆడుకుంటున్నరు అంతే” నిట్టూరుస్తూ అంది.

ఇంక మరో మాటకు ఆస్కారం లేకుండా తన ఫోన్‌లోంచి బక్క మెసేజ్ ఫార్వాడ్ చేశాడు. తన ఫోన్‌లోని అన్నీ గ్రూపుల్లో పెట్టాడు. అలాగే ఎఫ్బీ, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్‌లో కూడా ఫార్వాడ్ చేశాడు.

కొంతమంది తన హైదరాబాద్ స్నేహితులకు ఫోన్ చేసి మరీ చెప్పాడు.

* * *

బక్క అసలు పేరు స్వరూప. చిన్నప్పుడు కాస్త సన్నగా ఉందని వాళ్లమ్మ ‘బక్కవ్వ’ అని పిలుచుకునేది.

దీంతో అదే నిక్ నేమ్ అయిపోయింది. బక్కవ్వను కాస్త తోటి పిల్లలందరూ కలిసి ‘బక్క’ అని పిలవడం మొదలుపెట్టారు.

బక్కకు ముందు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లున్నారు. పంకజ్ బక్కవ్వకు పెద్ద తమ్ముడు. పంకజ్ టీచర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం ఓ స్కూల్లో విద్యా వాలంటీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.

ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు కూడా చెబుతున్నాడు. బక్క వాళ్ల నాన్న అంగళ్లు తిరుగుతూ ఉల్లి, వెల్లుల్లి, అల్లం అమ్ముతుంటాడు. వాళ్లమ్మ ఇంట్లో చిన్నగా కిరాణా కొట్టు పెట్టుకుంది. పుట్టడమే బక్క మతి స్థిమితం లేకుండా పుట్టింది.

అలాగనీ మరీ మతిస్థిమితం లేనిదేమీ కాదు. తను మాట్లాడే మాటల్లో స్పష్టత లేకపోయినా అర్థమయ్యేవి. ఇతరులు చెప్పింది కూడా అర్థం చేసుకునేది.

ఇల్లు, వాడకట్టు తప్ప వేరే ప్రపంచం తెలియదు. అందరి పిల్లల్లాగ బట్టలు సరిగ్గా వేసుకోవడం, తల దువ్వుకోవడం వంటివి చేసేది కాదు. వాళ్లమ్మే అవన్నీ చేసేది.

అంతా బాగానే సాగుతున్న వారిని ఇరుగుపొరుగు వారు, బంధువులు బక్క పెళ్లి ప్రస్తావన తెచ్చి వారి కుటుంబంలో అశాంతికి కారణం అయ్యారు.

మిర్యాలగూడలో కిరాణా కొట్టు ఉంది మంచి అబ్బాయని కిరణ్‌ను చూశారు. కిరణ్ కూడా పెద్ద అందగాడేమీ కాదు. అతనికి పోలియోతో ఒక కాలు కుంటిగా ఉంది.

దీంతో అతనికి పిల్లను ఇచ్చేవారు కరువయ్యారు. ముప్ఫై ఐదేళ్ల వయసొచ్చింది. తనకింక ఈ జన్మకు పెళ్లి కాదని దిగులు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బక్క సంబంధం అతనికి వరంలా అనిపించింది.

బక్కను చూడగానే ఆతృతగా సంబంధం ఖాయం చేసుకుందాం అన్నాడు. ఈ జన్మకు తమ బిడ్డకు పెళ్లే కాదనుకున్న బక్క అమ్మానాన్నలకు ఈ సంబంధం ఖాయం అవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అటు కిరణ్ అమ్మానాన్నలు కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్లు అడిగినదాంట్లో కొసరుతూ తమతో అయినంతలో పెళ్లి చేశారు. పెళ్లయ్యాక రెండు నెలలు సజావుగానే ఉన్నారు.

ఆ తర్వాత కోడలు పిచ్చిదని అత్తామామలు, పిచ్చిదాన్ని నాకు అంటగట్టారని కిరణ్ పోరడం మొదలుపెట్టారు. “దానికి వంటావార్పు వచ్చు. మాటలు జర తొతరతొతర వోతయి. ఇంటి మట్టుకు అన్ని పనులు సగవెడ్తది” అని బక్క వాళ్ల అమ్మానాన్నలు ఎంత సర్ది చెప్పినా కిరణ్ వినిపించుకోలేదు.

చివరికి వదిలేస్తానని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో బక్క వాళ్ల అమ్మానాన్నలు మహిళా మండలిలో ఫిర్యాదు చేశారు. వారొచ్చి చెప్పారు, చివరికి పోలీసులతో కూడా కౌన్సెలింగ్ ఇప్పించారు.

అయినా అతని తీరులో మార్పులేదు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు ప్రారంభ దశలో ఉన్నాయి. బక్కకు ఏవో కబూర్లు చెప్పి రాత్రి ఇంటిదాక దిగబెట్టి అటునుంచి అటే బస్సెక్కి తన ఊరు వెళ్లిపోయాడు కిరణ్.

భర్త మళ్లీ వస్తాడనే ధ్యానంలో ఉండిపోయింది బక్క. కిరణ్ చేసిన పనికి మండిపోయిన పంకజ్, కిరణ్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తోంది.

వదిలించుకున్నాడని నిర్ధారించుకున్నారు. ఇంతలో దేశంలో, రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్రం పక్షం రోజుల సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది.

ఇది అయిపోయాకే కిరణ్‌తో మాట్లాడదామని భావించాడు పంకజ్. వైరస్ తీవ్రత, కరోనా మరణాలు రేటు పుంజుకోవడంతో లాక్‌డౌన్ పొడిగించింది ప్రభుత్వం. ఈ మధ్యలో బక్క కిరణ్‌ను తలుచుకోని రోజు లేదు.

ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు అని నచ్చజెప్పుకుంటూ వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువే.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వికృత రూపం దాల్చి కరాళనృత్యం చేస్తోంది. ఎందరో బలి అవుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలతో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నారు.

ఎటుచూసినా కరోనా హాహాకారాలే. లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మరోవైపు వలస కార్మికులు కూడా ఆకలికి అల్లాడుతున్నారు. పనుల్లేక తమ సొంతూళ్లకు కాలినడకన, సైకిళ్ల మీద వందలు, వేల కిలోమీటర్లు వెళుతున్న గుండెలు కలిచివేసే సంఘటనలు ఎన్నో.

చైనావాడి నిర్వాకంతో ప్రపంచం మొత్తం పరేషాన్ అవుతోంది. ఇలా మూణ్నెల్ల కాలం గడిచిపోయింది. ‘ఇక లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల్సిందే.. లేదంటే మరింత సంక్షోభంలో కూరుకుపోతాం’ అని భావించాయి ప్రభుత్వాలు.

లాక్‌డౌన్‌ను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఈ క్రమంలో ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన ప్రజలు తమతమ స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. దీంతో హైదరాబాద్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగింది‌. రోజుకు వందలు నుంచి వేలకు వేలు కేసులు నమోదవుతున్నాయి.

ఎటు వెళ్లాలన్నా ఎవర్ని ముట్టుకోవాలన్నా ఒక రకమైన భయం అందరిలో. బక్క, కిరణ్ నామస్మరణను ఇంకా పెంచింది. ఆ పేరే ఆమె నోటివెంట జపమైంది. ‘కిరణ్.. కిరణ్..,’ అంటూ అటూ ఇటూ పరుగులు పెడుతుంటే ఇంట్లో కట్టేశారు.

అయినా తాడు తెంపుకొని ఎదురైన బస్సులో ఎక్కి వెళ్లిపోతోంది. ఒకసారి మెదక్‌లో, ఒకసారి నర్సాపూర్‌కు వెళ్లి పట్టుకొచ్చాడు పంకజ్. స్థానిక డాక్టర్‌కి చూపిస్తే “క్రాక్ అయిపోయింది. తీసుకెళ్లి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించండి” అని చెప్పాడు.

నిద్ర కోసం ఏవో మాత్రలు రాసిచ్చాడు. అలా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న క్రమంలో ఓరోజు రాత్రి హైదరాబాద్ బస్సెక్కింది. తన భర్తతో ఎలా వచ్చిందో కాస్త గుర్తు పెట్టుకున్నట్టుంది. అలాగే వెళ్లిపోదామని భావించి బస్సెక్కింది.

  • + +
    పక్షం రోజులు అవుతోంది బక్క తప్పిపోయి. నిత్యం సోషల్ మీడియాలో పంకజ్, హృదయ్ ఆ పోస్టును షేర్ చేస్తూనే ఉన్నారు.

ఇంతలో హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ మట్టుకు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అప్పటికే సోషల్ మీడియాలో హైదరాబాద్ డేంజర్ జోన్‌లో ఉందనీ.. ఊళ్లకు వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోండనే వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

హృదయ్ తన పిల్లల గురించి ఆందోళన చెందుతున్నాడు. తనకేమైనా, పిల్లలకు ఏమైనా తట్టుకోలేడు. అసలే మధ్య తరగతి జీవితాలు. కరోనా సోకితే గాంధీలో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే ఉన్న ఇల్లు అమ్ముకోవాల్సిందే.

అనిత కూడా ఊరెళ్లిపోదామని అంటోంది. వెళ్లడమే బెటర్ అనుకుంటుండగా బక్క గురించి తెలిసి ఆగిపోయాడు. బక్క ఆచూకీ తెలిశాక ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో ఓరోజు శంషాబాద్‌లో ఉండే మితృడు రాజు అనుకోకుండా ఫోన్ చేసి బక్క శంషాబాద్ బస్టాండ్‌లో కనిపించిందని చెప్పాడు. వెంటనే రమ్మన్నాడు.

ఆతృతగా హృదయ్ ఫోన్ కట్ చేసి బయలుదేరడానికి హడావిడి పడుతున్నాడు. అనిత వెంటనే చేతులకు గ్లౌజులు, ఫేస్ మాస్క్, గాగుల్స్, శానిటైజర్ సీసా తెచ్చి హృదయ్‌కి అందించింది. అవన్నీ తీసుకుని ఇంట్లో కాలు బయట పెడుతుండగా పిల్లలిద్దరూ “డాడీ మేమూ వస్తాం” అని హృదయ్ కాళ్లను అల్లుకుపోయారు. “డాడీ ఇప్పుడే అస్తరు. మీరు ఉండుర్రి” అంటూ అనిత వాళ్లిద్దరినీ పట్టుకుంది. హృదయ్ ఒక్క ఉదుటున బయటపడ్డాడు.

బైక్ కిక్ కొట్టాడంటే శంషాబాద్ చేరేవరకు ఎక్కడా ఆగలేదు. శంషాబాద్ బస్టాండ్ వద్దకు వెళ్లి బక్కను చూసి షాకయ్యాడు హృదయ్. జుట్టంతా చింపిరైంది. ఒంటిమీద దుస్తులు మైలబారి, చిరిగిపోయాయి. ఆ స్థితిలో బక్కను చూసి హృదయ్ మనసు తరుక్కుపోతోంది.

ఇంతలో పోలీస్ జీపు, అంబులెన్స్ వాహనాలు వచ్చాయి. హృదయ్ ఉండబట్టలేకపోయాడు మాస్క్ తొలగించి “బక్కా” అని గట్టిగా అరిచాడు. హృదయ్ పిలుపు విని తలతిప్పి చూసింది‌ బక్క. హృదయ్‌ని గుర్తుపట్టిన బక్క ముఖంలో ఆనంద చారికలు.

“అరేయ్ చిన్నా” అని ఏడుపందుకుంది. ‘చిన్నా’ హృదయ్ నిక్ నేమ్. హృదయ్ దగ్గరకు పరుగెత్తుకు వస్తున్న ఆమె చేతిని నిండా పీపీఈ కిట్ ధరించిన అంబులెన్స్ సిబ్బంది గట్టిగా పట్టుకుంది.

“చిన్నా చిన్నా” అని ఏడుస్తూ దగ్గుతోంది బక్క. “వదలండి సర్ తను మా ఫ్రెండ్ వాళ్ల సిస్టర్. మెదక్ దగ్గర గోపాల్‌పేట్ ఊరు తనది” గట్టిగా అరుస్తూ చెప్పాడు హృదయ్. “ఓకే బట్ ఆమెకు కరోనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఇలాగే వదిలేస్తే తాను చచ్చింది గాక ఇతరులను చంపుతుంది” మాస్కులో ఉన్న ఎస్సై అన్నాడు.

హృదయ్ ఖిన్నుడయ్యాడు. “ఈ ఏరియాలో గత వారం నుంచి కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈమె వల్ల కేసులు పెరుగుతున్నాయని ఇక్కడి స్థానికులు మాకు సమాచారం అందించారు. అందుకే గాంధీకి తీసుకెళ్తున్నాం. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి ఏమైనా ఉంటే చెబుతాం” అన్నాడు ఎస్సై.

“సర్ తనకు మామూలు సర్ది, దగ్గు కావచ్చు. గోలీలేసుకుంటే తక్కైపోతది” కంగారుగా హృదయ్ అన్నాడు. “అవన్నీ పరీక్షలు చేస్తేనే కదా తెలిసేది తప్పుకో” హృదయ్‌ని పక్కకు నెట్టాడు ఎస్సై. అంబులెన్స్ సిబ్బందికి రాజు, హృదయ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు.

‘‘ఈవారం నుంచి స్వరూప ఈ బస్టాండ్‌లనే ఉంటున్నదట. ఆకలైతే ఇండ్ల పొర్త వోయి అడుక్కచ్చుకొని తింటున్నదట. రాత్రింబగళ్లు కిరణ్ పేరే తల్సుకున్నదని ఇక్కడోల్లు చెప్పిర్రు. ఈ నాలుగైదు రోజుల సంది దగ్గుతుంది, తుమ్ముతుందట. ఇక్కడోళ్లందర్కి ఆమెకు కరోనా అచ్చిందని అనుమానం కలిగి పోలీసోళ్లకు ఫోన్ చేశిర్రంట. ఇసుంటి గోస పగోనికి గూడ రావొద్దుర” అంటున్న రాజు ముఖంలోకి చూస్తున్న హృదయ్ ముఖంలో దుఖ్ఖం పొంగుకొచ్చింది.

‘చిన్నా చిన్నా’ అంటూ ధీనంగా ఏడుస్తున్న బక్కను అంబులెన్స్‌లో వేసుకుని వెళ్లిపోయారు. వెంటనే పంకజ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తాను హైదరాబాద్ బయలుదేరి వస్తున్నానని పంకజ్ చెప్పాడు.

* * *
పంకజ్, హృదయ్ ఇంటికి వచ్చినప్పటి నుంచి తన ధ్యాసంతా గాంధీలో ఉన్న బక్క మీదే పెట్టాడు. తినడం లేదు. పదేపదే గాంధీకి వెళ్లొద్దాం అంటున్నాడు. అక్కడ ఎవర్నీ రానివ్వడం లేదని హృదయ్ చెబుతున్నాడు.

“బక్కవ్వకు నిజంగనే కరోనా అచ్చిందంటవార” ఈ ప్రశ్న ఇప్పటికి వందసార్లు అడిగుంటాడు పంకజ్. “ఎహె రాదుర బై. అచ్చినా మన బక్కవ్వ దులిపేస్తది” ధీమాగా చెప్పాడు హృదయ్.

“ఏమోరా భయమైతున్నది. ఎటెటు తిరిగిందో.. ఎట్ల గడిపిందో తలుసుకుంటే దుఖ్ఖం ఆగుతలేదు” అని వలవలా ఏడుపందుకున్నాడు.

“అన్న నువ్వు అనవసరంగ ఆలోచించి మైండు కరాబ్ జేస్కోకు ఊకో” అని అనిత అంది.

ఇద్దరికి భోజనం వడ్డించింది. పంకజ్ కరుచుకుంటూ తిన్నాడు. పక్షం రోజుల తర్వాత గాంధీ నుంచి హృదయ్ ఫోన్‌కు కాల్ వచ్చింది. “స్వరూపకు నెగెటివ్ అని వచ్చింది. వచ్చి తీసుకుపోండి” ఆమాట వినగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినంత పనైంది హృదయ్‌కి.

అదే మాట పంకజ్‌కి చెప్పగానే “పోదాం పా” అని కంగారు పెడుతున్నాడు. ఇద్దరూ ఆటోలో గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. డిశ్చార్జ్ అయ్యేవారిని వెనుక గేటు నుంచి పంపిస్తున్నారని చెబితే ఆ వైపే వెళ్లారు.

అక్కడ రిసెప్షన్ సీట్లో కూర్చున్న ఓ డాక్టర్ వీళ్లిద్దర్నీ పిలిచాడు. “సారీ టు సే.. మీ స్వరూపకు కోవిడ్ లక్షణాలు ఏమీ లేవు. అసింప్టమాటిక్ ఉండే. అంటే ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌గా వస్తుంది. కానీ, మా డ్యూటీ మేము చెయ్యాలి కదా. ఈ వారం రోజులు తనను స్పెషల్ వార్డులో మంచానికి కట్టేసి ట్రీట్‌మెంట్ చేశాం. ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్ ఇచ్చాం” అని చెప్పారు.

ఇంతలో బక్క లోపలి నుంచి వస్తోంది. బలహీనంగా వస్తున్న బక్కను చూడగానే పంకజ్‌కు ఉద్విగ్నంతో కన్నీళ్లు ఆగలేవు.

“బక్కవ్వ” అన్నాడు. ఆ మాట విని తలెత్తి పంకజ్‌ను చూసి “తమ్మూ” అని ఉద్వేగంతో పరుగెత్తుకుంటూ వస్తోంది బక్క. దగ్గరికొచ్చి పంకజ్‌ను గట్టిగా పట్టుకొని వెక్కుతోంది. ఇంతలో ఏమైందో అకస్మాత్తుగా “కిరణ్.‌. కిరణ్” అని లీలగా అంటోంది.

ఆ పేరు వినగానే పంకజ్ పళ్లు పటపటా నూరుతున్నాడు. “అగో కిరణ్.. కిరణ్” అని గట్టిగా అరుస్తూ గేటు వైపు పరుగులు తీసింది. పంకజ్, హృదయ్‌కి ఏం అర్థం కాకుండా ఉంది. ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. డిశ్చార్జ్ అయి బయటకు వెళుతున్న పేషెంట్లను తప్పించుకుంటూ బక్క ఏకధాటిగా పరుగెత్తుతోంది.

ఆమె వెనకాల పంకజ్, హృదయ్ పరుగులు తీశారు. ఆ గుంపులో నిండా శాలువా కప్పుకుని నీరసంగా నడుస్తున్న వ్యక్తిని అనుసరిస్తోంది బక్క. పంకజ్, హృదయ్‌లకు ఏం అర్థం కావడంలేదు.

శాలువా కప్పుకున్న వ్యక్తి భుజం మీద చేయి వేసి తన వైపు లాగింది ‘కిరణ్ కిరణ్’ అంటూనే. ఆ కుదుపులకు అతను తూలుతూ బక్క వైపు తిరిగాడు. బక్క అనుమానమే నిజమైంది. అతను కిరణే. బలహీనంగా, నీరసంగా ఉన్నాడు.

కిరణ్‌ను చూసి పంకజ్, హృదయ్‌లు షాక్ అయ్యారు. తూలుతున్న కిరణ్‌ను గట్టిగా పట్టుకుంది బక్క. బక్క ముఖంలో ఎక్కడలేని ఆనందం తాండవిస్తోంది.

ఇన్ని రోజులు తను దేనికోసమైతే ప్రాణం పెట్టి ఎదురుచూస్తుందో అదే తన ముందు ఉండేసరికి బక్క ఆనందం నింగినంటింది. బక్కను చూసిన కిరణ్‌లో మునుపటి అసహ్యం, ఏవగింపు ఎక్కడా కనిపించడం లేవు. బహుశా అతనూ బక్క కోసం ఎదురు చూస్తున్నట్టే అతని కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. “సరూపా” అని గట్టిగా అరిచి బక్కను అలుముకుని పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు.

అక్కడున్న వారంతా వీళ్లను చూస్తూ “కరోనా తగ్గిందనే సంబురంల ఉన్నట్టున్నరు” అని అనుకున్నట్టు వెళ్లిపోతున్నారు.

వాళ్లని హృదయ్, పంకజ్ అలా నిల్చుని చూస్తున్నారు. “ఇప్పుడు బక్క ప్రపంచం కిరణే. బావను మంచిగ జూస్కుంటే అక్కను మంచిగ సూస్కున్నట్టే” అంటున్న హృదయ్ వైపు నిర్లిప్తంగా చూశాడు పంకజ్.

ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి రివ్వున వీస్తోంది. కాసేపటికి వాళ్లను అనుసరించారు పంకజ్, హృదయ్. పంకజ్‌ను చూడగానే కిరణ్ మరింత భావోద్వేగంతో వెళ్లి కౌగిలించుకుని

“నన్ను క్షమించు పంకజ్. నేను తప్పు జేశిన. సరూపను అరార గోస వెట్టిన. ఆ పాపం ఊకెనే పోలేదు. అమ్మానాయినలకు కరోనా అచ్చి సచ్చిపోయిర్రు. ఆల్ల శవాలు గూడ ఇయ్యలేదు. ఏడ బొంద వెట్టిర్రో గూడ తెల్వది. నాకు గూడ కరోనా అచ్చింది. ఈ గాంధీలనే ఉండి కోలుకున్న. ఇయ్యాల్ల డిశ్చార్జ్ చేశిర్రు. అనవసరంగ మంచిగైన.. నేను గూడ ఈ రోగంతోని పోయుంటే బాగుండేది. మాకు కరోనా అచ్చిందని ఏ సుట్టపోల్లు గూడ పల్కరిచ్చే పాపాన పోలేదు. ఒంటిగాన్ని అయిపోయిన” అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు.

అదంతా విని కిరణ్ మీదున్న కోపం మొత్తం పోయింది పంకజ్‌లో.. జాలి కలుగుతోంది. “అయిందేదో అయిపోయింది బావా బాధపడకు. నీకు మేము లేమా” అన్నాడు గాద్ఘధిక స్వరంతో.

బక్కకు తన అత్తామామలు చనిపోయారని అర్థమై ఏడుస్తోంది. “నా పెండ్లాం పిచ్చిదని దాన్ని సతాయించిన. కనీ అది నిజంగనే పిచ్చిది. నేనంటే దానికి పిచ్చి ప్రేమ. నన్ను సంటి పొలగాని లెక్కట సూసుకుంటది. దాని స్వచ్ఛమైన ప్రేమను నేను అర్థం జేస్కోలేకపోయిన.

ఇంతగానం పెండ్లాం ప్రేమ ఈ ప్రపంచంల ఏ మొగోన్కి గూడ దొరకదేమో” అంటున్న కిరణ్ కళ్లు ఏరుధారలయ్యాయి. “సై మాట చెప్పినవ్ బావా. ఈడినుంచి నీకంతా మంచే జరుగుతది. కరోనా నీలో మార్పు తీసుకచ్చింది. పా ఇగ ఇంటికి వోదాం. మిర్యాలగూడల ఒక్కోనివి యాడుంటవు. గోపాల్‌పేట్‌లనే దుకాణం పెట్టుకొని ఉందువు పా ఆడనే” హృదయ్ మాటలకు కళ్లు తుడుచుకుంటూ గుండెలో ఆత్మస్థైర్యాన్ని ప్రోది చేసుకుంటూ.. బక్క వైపు ఎనలేని ప్రేమతో చూస్తూ ముందుకు నడిచాడు కిరణ్.

కిరణ్ మీద నుంచి దృష్టి మరల్చని బక్కవ్వ అతని అడుగులో అడుగు వేసింది.

January 15, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాయుధ పోరాటం, తొలి, మలిదశ ఉద్యమాలు: కవిత్వం

by డా. ఏనుగు నరసింహారెడ్డి January 15, 2024
written by డా. ఏనుగు నరసింహారెడ్డి

”నెత్తురు పారనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో
నేలకు రాలనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో”
అని ఎవరన్నారో తెలియదుకాని అచ్చుగుద్దినట్లతుకుతుంది ఈ నేలకు. తెలంగాణ భౌగోళికంగా దక్కన్‌ పీఠభూమిలో భాగం. పీఠభూమిలోని రాష్ట్రాలలో తెలంగాణ చరిత్ర, వారసత్వం భిన్నమయింది. పీఠభూమిలోని ఇతర ప్రాంతాలన్నీ బ్రిటిష్‌ పాలనలో ఉంటే తెలంగాణ మాత్రం రాచరికంలో మగ్గింది. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా జాతీయోద్యమం లేదు. ఆంగ్ల విద్యలేదు. సంస్కరణలు లేవు. తెలుగు భాషలోని వ్యవహారికవాదం లేదు. వెరసి తెలంగాణ సమాజం 1948 దాకా భూస్వామ్యంలో ఆగిపోయింది. మాంటేగ్‌ ఛేమ్స్‌ ఫర్డ్‌ సంస్కరణలు, భారత స్వాతంత్య్ర చట్టం, ప్రొవెన్షియల్‌ కౌన్సిల్‌ కు ఎన్నికలు, పరిమితంగానైనా ప్రజాస్వామిక వాతావరణం ఇక్కడ మృగ్యం. కాబట్టి సామాన్యుడి జీవన వనరు అయిన భూమి భూస్వాముల చెరలో ఉండిపోయింది. సమాజంలో కష్టజీవుల శ్రమను దోచుకోవడం నిరాఘాటంగా కొనసాగింది. శ్రమజీవులు కొద్దిగా వెసులుబాటు కోరుకున్నా పీడన కొనసాగించింది భూస్వామ్యం. గదిలో బంధించి దాడి చేస్తే పిల్లి కూడా తిరగబడినట్లు సామాన్యులు అనూహ్యంగా తిరగబడ్డారు. అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భూమికోసం, భుక్తికోసం, పీడననుండి విముక్తి కోసం సాగిన ఈ పోరాటం భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. కమ్యునిస్టు పార్టీ ఉద్యమానికి గీటురాయిగా లభించిన గొప్ప పోరాటమిది. 11వ ఆంధ్రమహాసభ భువనగిరిలో ఇచ్చిన పిలుపుతో 1944లో మొదలైన సాయుధపోరాటం 1951 వరకు వివిధ రూపాలలో, స్థాయిలలో కొనసాగింది. సాయుధ పోరాటంలో విస్తృతంగా సాహిత్యం వచ్చింది. సాహిత్యంలోని ఇతర రూపాలలో ఈ పోరాటం తక్కువగా చిత్రించబడినా పాటలో మాత్రం అపురూపంగా స్థిరపడింది. పాట సాయుధ పోరాటానికి ఊపిరులూదింది కూడా.

‘ఆపరేషన్‌ పోలో” పేరుతో భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా హైదాబాద్‌ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేసుకున్న తర్వాత సాయుధ పోరాటం పాక్షిక లక్ష్య సాధనతో ముగిసిపోయింది. మొదట మిలటరీపాలనలో జయంతి నాథ్‌ చౌదరీ, పౌర పాలనలో భాగంగా 26.1.1950 నుండి 6.3.1952 వరకు ఎం.కె. వెల్లోడి హైదాబాద్‌ రాష్ట్రాన్ని పాలించారు. 1952 మొదటి సాధారణ ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు. మద్రాసు నుండి విడిపోయిన ఆంధ్రులు కర్నూలులో అరకొర వసతితో పరిపాలన నడుపుతున్న క్రమంలో తెలుగు వారికొకే రాష్ట్రం అనే వాదాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు పావులు కదిపారు ఆంధ్రనాయకులు. అప్పటి హెదాబాద్‌ నాయకులు కె.వి. రంగారెడ్డి ఆధ్వర్యంలో దాన్ని వ్యతిరేకించారు. వీరి అపోహలను నివృత్తి చేస్తూ పెద్దమనుషుల ఒప్పందం చేసుకొని తెలంగాణకు కొన్ని రక్షణలు ప్రతిపాదించి ఆంధ్రప్రదేశ్‌ ను ఏర్పాటు చేసారు. తన పదవీకాలం పూర్తి కాకముందే బూర్గుల పదవి పోయింది. నీలం సంజీవరెడ్డి ఆం.ప్ర.కు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. పెద్దమనుషుల ఒప్పందంలోని ఒక ఒప్పందం ”ఆంధ్రప్రాంతం వారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతం వారికి ఉపముఖ్యమంత్రి పదవి సృష్టించి ఇవ్వాలి”. నీలం సంజీవరెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే విలేఖరులు ‘ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారు’ అని అడిగారు. దానికి జవాబిస్తూ నీలం సంజీవరెడ్డి ‘ఉపముఖ్యమంత్రి పదవి ఆరవ వేలు లాంటిది. దాంతో అలంకారమే తప్ప ఏ ప్రయోజనమూ లేదు’ అన్నాడు. ఇలా ఆం.ప్ర. ఏర్పడ్డప్పటి నుండి అన్ని రక్షణ చర్యలను తుంగలో తొక్కారు ఆంధ్ర ప్రాంత పాలకులు. అప్పటికే ముల్కీ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న తెలంగాణ విద్యావంతులు ఆంధ్రులకు వ్యతిరేకంగా రగిలిపోయారు. 1969లో జై తెలంగాణ ఉద్యమం మెరుపులా ఆరంభమయింది. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 369 మంది విద్యార్థులు, యువత అసువులు బాసారు. ఈ సందర్భంగా సాహిత్యం అపురూపంగా సృజించబడింది. కథలు, కవిత్వం, పాటలు ఉద్యమాన్ని చిత్రించాయి. ఉద్యమాన్ని ముందుకు నడిపించాయి.
జైతెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా అణిచివేసి తెలంగాణ వాడైన పీవీ నరసింహారావును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. తర్వాత పదేండ్లకే తెలుగుదేశం ఆవిర్భవించి ఎన్‌.టి.రామారావు రాకతో సీమాంధ్రుల వలసలు పెరిగిపోయాయి. చంద్రబాబు, వై.ఎస్‌. అధికారంలో ఉండగా ఆంధ్రుల ఆధిపత్యం పరాకాష్టనందింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా మేధావులు ఆలోచించారు. భువనగిరి డిక్లరేషన్‌తో దానికొక రూపం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, ఎన్నికలు, రాజీనామాలతో వాతావరణం వేడెక్కింది. వంటావార్పు, సకల జనుల సమ్మె, సాగరహారంతో తెలంగాణ రాష్ట్ర కాంక్షను కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రేసు పార్టీ స్పష్టంగా గుర్తించింది. సోనియాగాంధీ చొరవతో రాష్ట్రం 2.6.2014 ఆవిర్భవించింది. మలిదశ ఉద్యమ సందర్భంగా సాహిత్యంలోని అన్ని ప్రక్రియలు స్పందించాయి. కథలు, నవలలు, వచనకవిత్వం, పద్యాలు, పాటలు వేలాదిగా పుట్టుకొచ్చాయి. ఉర్రూతలూపాయి.

సాయుధ పోరాట కవిత్వం:

‘అది తెలంగాణలోన దావాగ్ని లేచి
చుట్టుముట్టిన భీకరాశుభదినాలు
అని నిజాము నృపాలుని అండదండ
చూచుకొని నిక్కినట్టి పిశాచి కలలు
నాడు మానవతీ నయనమ్ములందు
నాగ సర్పాలు బుసకొట్టి నాట్యమాడె
నాడు మానవ నవనాగరికత
తన్నుదిన్నది రాక్షసత్వమ్ము తోడ’

అన్న దాశరథి పద్యాలు నిజాం రాజ్యపు చివరిరోజులకు అద్దం పడుతున్నవి. అరాచకాలను, శ్రమదోపిడీని, భూస్వామన పీడనను, పేదరైతులపై పన్నుల భారాన్ని తలపోస్తూ

‘తేనెలు పిండే తెలంగాణము
నెత్తుట ముంచెత్తెదరా?
తెప్పరిల్లిన ఈ తెలంగాణము
కుత్తుక బట్టొత్తెదరా?’

అని ప్రశ్నిస్తాడు భాగి నారాయణమూర్తి, పద్యము, గేయాలలోనే సాయుధ పోరాటపు చిత్రణ చూడవలసి ఉంది. కవిత్వంలో ఆధునిక రూపమైన వచనకవిత్వం బలంగా లేనప్పుడు, సాహిత్య రూపంగా పిలుచుకునే గేయం ప్రజల వాడుకలో మరింత సరళమైన పాటగా మారింది. ఉద్యమ నమోదుకు ఉద్యమ విస్తృతికి పాట మహాశక్తిగా పని చేసింది. సాయుధ పోరాటంలో ప్రధానమైన ఘట్టాలపైన, బందగీ హత్య, దొడ్డి కొమురయ్య కాల్చివేత, చాకలి ఐలమ్మ భూపోరాటంపైన పాటలు వచ్చాయి. అప్పటికే ప్రజా కవులుగా ప్రసిద్ధులైన బండి యాదగిరి, సుద్దాల హన్మంతు, నాజర్‌ మొదలైన వారు రచించి స్వయంగా పాడి పోరాటాన్ని బలోపేతం చేసారు. గ్రామీణ కూలీలైన జీతగాళ్ళ దయనీయ స్థితిని కళ్ళకు కడుతూ…

‘ఏరన్న రాక మునుపే ఎగువాక వచ్చేరన్నా
ఎవరింట ఉందువన్న బువ లేని జీతగాడ
భూమిని దుక్కిదున్ని పైరులనెల్ల సాకి
సోమరిపోతులను మేపాలి యెల్లకాలం
తెలియార తెలివితోడ కలవారి జీతగాడ’

అని పాడుతాడు నాజర్‌. ఇంతే దీనగీతాన్ని ఒక పసుల కాపరి మీద కేంద్రీకరిస్తూ

‘పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడా
పాలుమరిచీ ఎన్నాళ్ళయ్యిందీ
ఓ పాలబుగ్గల జీతగాడ
కొలువు కుదిరీ ఎన్నాళ్ళయ్యిందీ
ఆకు తేళ్ళు కందిరీగలు అడవిలోగల కీటకాలు
నిన్నేమైనా కాటు వేసాయా’

అని సుద్దాల హన్మంతు రాసిన పాట సాయుధ పోరాటానికి పునాది రాళ్ళను పేర్చింది. పోరాటం నిజాం రాజ్య పతనం మీద కేంద్రీకరించబడ్డాక బండి యాదగిరి రాసిన

‘బండెనుక బండిగట్టి
పదహారు బండ్లుగట్టి
ఏ బండ్లె వస్తవు కొడుకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవ్‌ రో
నైజాము సర్కరోడా’

అన్న గేయం బహుళ ప్రజాదరణ పొందింది. మొదట ఇది ప్రతాపరెడ్డి దొరకు వ్యతిరేకంగా కవి రాసినా ప్రజలు దీన్ని వస్తు విస్తృతి చేసి నిజాం పక్షంగా ప్రసిద్ధం చేసారు. ఈ కోవలో మేర మల్లేశం, ఆకుపత్ని శ్రీరాములు, తిరునగరి రామాంజనేయులు, కోగంటి గోపాలకృష్ణయ్య, నూతి నర్సయ్య, వట్టికొండ రామకోటయ్య, కాంచనపల్లి చినవెంకట రామారావు, నల్ల నరసింహులు, కణ్వశ్రీ, కాళోజీ, కొమరగిరి నారాయణరావు, అలువాల వెంకయ్య, వయ్యా రాజారాం, వానమామలై వరదాచార్యులు, కె.ఎల్‌. నరసింహారావుల గేయాలు, పాటలు సాయుధపోరాటాన్ని చిత్రించాయి. ఈ కవులే కాకుండా ఇతరులు రాసి పాడినవి ఎన్నో నమోదు కాకుండా పోయినవి. రాతలోకి రాకుండా నేరుగా కైకట్టి పాడుకొని పోరాటంలో పాల్గొన్న గాయక యోధులవి కూడా పోయినవి. నమోదు కాలేదు. కొన్ని పాటలు ప్రసిద్ధమై కర్తృత్వం తెలియకుండా కూడా పోయినవి.
జాల్నా జైలు దరోగాగా పనిచేసిన కూర్రుడు కోదండరాంరెడ్డిని నిందిస్తూ మేర మల్లేశం రాసిన

‘నీవు పెట్టిన హింస మేమెట్ల మరుతుము
వస్తుందిరా ఒక్కరోజు
కోదండ రాంరెడ్డి నిన్నొదిలి పోదు’

అనే పాట అప్పటి ఉద్యమకారుడి వేదనను కళ్ళకు కడుతుంది. ఆకుపత్ని శ్రీరాములు రాసిన

‘భలే మజాగున్నది నిజామోని సంగతి
హిందూ ముస్లీములు నా రెండు కండ్లంటడు
పెద్ద కన్ను చిన్నకన్ను
ఎంతో వికారంగ ఉంటడు’

అనే గేయం వ్యంగ్యంగా, ఆలోచనాత్మకంగా సాగుతుంటది. తిరునగరి రామాంజనేయులు సాయుధపోరాటంలో ‘రాక్షసుడు నైజాము రాజు పిచ్చిగరెచ్చి’ ఏమేం చేసాడో రాసాడు. కోగంటి గోపాల కృష్ణయ్య రాసిన ‘తెలంగాణ ప్రజలంత కలవాలోయ్‌ / తెగువతో పోరాడి గెలవాలోయ్‌’ అనే గేయం, వట్టికొండ రామకోటయ్య రాసిన ‘మనకొద్దీ పోలీసు రాజ్యం’ అనే గేయం, కాంచనపల్లి చినవెంకటరామారావు రాసిన ‘ఖరాఖండి’ అనే గేయం, నల్లా నరసింహులు రాసిన ‘జయభేరి మ్రోగించరా ఆంధ్రుడా / జయ పతాకంబెత్తరా’ అనే గేయం, కణ్వశ్రీ రాసిన ‘అది నా తెలంగాణ తొలగర కసాయీ! / అది నా తల్లినేల తొలగర గుండా’ అనే గేయం, కాళోజీ రాసిన ‘నల్లగొండలో నాజీ వృత్తుల / నగ్ననృత్యమింకెన్నాళ్ళు’ అనే గేయం, కొమరగిరి నారాయణరావు రాసిన ‘ఆంధ్రమహా సభ చూడ పోదాము రారండు’ అనే గేయం, అలువాల వెంకయ్యగారి ‘ఆంధ్రమహాసభకరుగుదెంచండి’ అనే గేయం, కె.ఎల్‌. నరసింహా రావు రాసిన ‘అమరజీవి కొమురయ్య’ గేయం, వానమామలై వరదాచార్యులు రాసిన గేయంలో నిజాం నుద్దేశించి రాసిన ‘చినిగిన గుడ్డలు దొడిగే చిత్రపు ఫకీరువయా / ఇనుమువలెనె బంగారపు ఇటుకలంక గూర్చుమయా’ అనే వ్యక్తీకరణలు ఈ కోవలో ఎన్నదగినవి.
కవిత్వపు నూతన పోకడలు అంతగా లేని ఆ రోజులలో కూడా వినూత్న వ్యక్తీకరణలున్న పాటలు ఇప్పటి పాఠకులను అబ్బురపరచగలిగేవిగా ఉన్నాయి కొన్ని. వయ్య రాజారాం చిలుకా అనే శీర్షికతో తత్వం చెప్పినట్లుగా పోరాటాన్ని చెబుతాడు.

‘మున్నాళ్ళ మురిపెంకు మురిసేవు తరిసేవు
ముందుగతి కానవేచిలుకా
అద్దె కొంపల నుండి గద్దెక్కి నాననుచు
మిడిసి పడకేరామ చిలుకా’

అంటాడు. ఇంకొక పాటలో ‘గురిగింజ గురిమల్లెలో” అనే దరువులతోనే పోరాటం పాటంతా రాస్తాడు. నూతినర్సయ్య ఈ కోవలో ప్రత్యేకంగా చర్చించదగిన కవి. ఈయన ఆలేరు కాల్పులపై బుర్రకథ రాసి ప్రజల పోరాటానికి అనుగుణమైన దర్వులో వీరగాథ చెప్పాడు. తిరునగరి ‘సైసైగోపాలరెడ్డి’ అనేది గొప్ప ఊపునిచ్చే పాట. సుద్దాల దెబ్బకు దెబ్బపాటలు కూడా అదే ఊపు ఉంటుంది. చూడండి.

‘వెయ్‌ వెయ్‌ వేయర దెబ్బ
దెబ్బకు దెబ్బ వేయ్‌ వేయ్‌
దయ్యపు గుండా గొయ్యలు రజాకార్లు
కయ్యానికి మనపైబడి వచ్చిరి’

వెట్టిచాకిరి మీద, శ్రమ దోపిడి మీద, ఎర్రజెండా మీద, ఉద్యమ కదలికల మీద అనేక పాటలు అజ్ఞాత కవులు రాసినవి కూడా పెద్ద సంఖ్యలో ప్రచారంలో ఉన్నాయి. ‘వేగరావోయి కార్మికా, వేగరావోయి కర్షకా’, ‘కొంగునడుముకు చుట్టనే చెల్లెమ్మ’ తదితర గీతాల కర్తృత్య నిర్ధారణ కోసం సాహిత్య విద్యార్థులు పరిశోధన చేయవలసిన అవసరం ఉంది.

జై తెలంగాణ ఉద్యమ కవిత్వం:

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి ఆంధ్రులతో కలిసినందుకు వారి ఆధిపత్యం మొదటి నుండీ అన్ని రంగాలలో కొనసాగింది. భాష, ఉద్య్యోగాలు, చదువులు అన్ని రంగాలలో వారిది పై చేయిగా చేసుకొని పెత్తనం సాగించారు. నిజాం పాలన నుండి మరల వీరి పాలనలోకి వచ్చినట్లయింది తెలంగాణ. అది భరించలేని తెలంగాణ ప్రజలు ‘ఆంధ్ర గోబ్యాక్‌’, ‘నాన్‌ ముల్కీ గో బ్యాక్‌’ పేరుతో 1969లో పెద్ద ఉద్యమం నడిపించారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు అందులో పాల్గొన్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంగా కవులు, సాహితీ వేత్తలు కూడా ఉద్యమంలో గొంతు కలిపారు. అయితే అప్పుడు తెగించి రాసినవి, మాట్లాడినవి అన్నీ రికార్డు కాలేదు. దొరికిన వాటిలో కథలు, కవిత్వం, పాట ద్వారా ఉద్యమం వేడిని అంచనా వేయవచ్చు.
ఆం.ప్ర. ఏర్పాటును స్వాగతించిన ఆనాటి ప్రసిద్ధ కవులలో ఒక్క కాళోజీ మాత్రమే 1969 ఉద్యమాన్ని సమర్థించాడు. తెలంగాణ ఆకాంక్షను కృష్ణుడిగా, అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డిని కంసునిగా సంభావింపజేస్తూ

”కృష్ణుడివలె ‘తెలంగాణ
మొలుస్తాండు జేలులోన
బ్రహ్మానందుడు కంసుడు
బలుస్తాండు జేలినతల
రాజ్యమంత కాస’య్యల
రాజ్యము అనుకుంటున్నాడు
బ్రహ్మానందుని కాసు
బదనామైనది బజార్లో”

అని ప్రకటించాడు కాళోజీ. ‘తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా?’ అన్న కాళోజీ ప్రశ్నకూడా అప్పటిదే. సమైక్యమనే రాచపుండుకు సరియైన మందు వేయాలంటూ పేర్వారం జగన్నాథం

‘దిగాలు పడి చూస్తావెందుకు తమ్ముడూ!
మన తల్లికీనాడు
వెన్నులో పుట్టింది రాచపుండు
నాటు వైద్యులూ నర్మ సచివులూ పనికిరారు
ఏదో ఒక విధంగా తగిన చికిత్స చేయమంది
ఇంతలో ఈ వ్రణం మానిపోదు’

అని గొంతెత్తాడు.

‘వేరు పడితే కష్టమనడం
వెనుకటి రోజుల్లో మాట
కలిసిమెలిసి సుఖపడుట
కథల్లో సిన్మాలో నీతి’

అని కుండబద్దలు కొట్టాడు అగ్ని.

‘మేమంతా సిద్ధం
అనవరతం, అనుక్షణం
మా గడ్డ విముక్తి కోసం
మా బతుకులు తృణపాయం’

అన్నాడు వెన్నెల. చరిత్రను సూత్రీకరిస్తూ రుద్రశ్రీ

‘నేను తెలంగాణ పౌరున్ని
నేను తెలుగు మాట్లాడే మానవున్ని
రెండు వందల సంవత్సరాల నుండి
నిండుగా పరపీడన కలవాన్ని’

అని ప్రకటించాడు. ముకురాల రామారెడ్డి జై ఆంధ్రను తొక్కవేసిన అమానుషాన్ని ప్రశిస్తూ అలోచనాత్మకమైన కవిత రాసాడు.

‘నలభై ఎనిమిది నాటి
స్మృతులీనాడు సాక్షి
పాత గోలకొండ పత్రికలు సాక్షి
కులసతి మున్షీ కలము సాక్షి
కుట్రతెరుగని కుర్రలు
అన్నెం పున్నెం ఎరుగని బాబులు
అన్సోషల్‌ ఎలిమెంట్స్‌
పేర కాల్చబడ్డారు’

పెరుమాండ్ల సుధాకర్‌ సరళవాక్యాలు ఆ సందర్భాన్ని ఎలా స్ఫురణకు తెస్తాయో చూడండి.

‘తమ్ముడూ అనివచ్చిన
అన్నను చూసాను
తీపిమాటల చురకత్తుల్ని
విసరడం చూసాను
తల్లి యొడిలోన మంటల్ని
లేపడం చూశాను
తల్లి హృదిలోన పొంగిన
బాధల్ని చూసాను
చూడరానిది చూశాను
చూడాలని చూశాను
చూపుకందని అన్నల అహంకారానికి
అనురాగం లేని అంధుల అన్యాయానికి
అన్న, తమ్ముని యింట
పగవాగే అంటున్నాను’

అప్పుడు కొందరు తెలంగాణ వారు సమైక్యత వైపు కూడా నిలబడ్డారు. వారిని ఉద్దేశించి శీలం రాజేశం ఆలోచనాత్మకమైన కవిత ‘పిల్లికి ఎలుక సాక్ష్యం’ రాసాడు.

‘మంచి మాటలతో
మా ప్రయత్నం లేదా!
దంచి పుచ్చుకుంటాం
మా మంచి తెలంగాణను’

అన్నట్లుగా ఆ రోజుల్లో ఆంధ్రులపై దాడులు, బస్సెక్కి టిక్కెట్టు కొనకుండా జై తెలంగాణ అని కూర్చునుడు నడిచిందట. పిట్టల రామస్వామి అప్పటి ప్రభుత్వ పెద్దలను నిందిస్తూ

‘సిగ్గులేని మంత్రులంత
దోచినారు తెలంగాణను
ఉద్యమాన్ని అణచుటకై
దొంగ ఎత్తులేసినారు’

అని రాసాడు.
కవిత్వం మధ్యతరగతి బుద్ధిజీవులను కదిలిస్తే పాట సామాన్యులలో చైతన్యం రగిలిస్తుంది. 1969 ఉద్యమంలో స్త్రీలు కూడా పోరాట కవిత రాసారు. తెన్నేటి సుధాదేవి
‘తెలంగాణ జన్మ హక్కు
కాదన బ్రహ్మకు తరమా?’
అనడంలో మంచి శ్లేషసాధించింది, ఆనాటి ముఖ్యమంత్రి పేరును సూచిస్తూ, కుమారి కలువకొలను ‘ఎదిరిస్తార’ అనే కవితలో శాంతియుత పోరాటంలో రాష్ట్రం సిద్ధించదని చెప్పి రాసింది. ఈ కందుల జోసెఫ్‌, బాలాజీ గోగీకర్‌, నీలా జంగయ్య, కోవెల సంపత్కుమార, రావెళ్ళ వెంకటరామారావు, యస్‌. రాంబాబు, భారవ, యశోద, గిరి, ఋక్కు, సుంకుశ్రీ, యుగంధర్‌, శ్రీధర్‌ రెడ్డి, విద్యార్థి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కె.ప్రభాకర్‌, శేషభూషణ రావు, అనుముల శ్రీహరి, జగదీశ్వర స్వామి, బాసిరి, ఆకుపత్ని శ్రీరాములు, చెరుకు సత్యనారాయణరెడ్డి, రాజశేఖరం, కె. భాస్కర్‌ బాబు, వేణు సంకోజు, బయ్యా నాగరత్నం, చెరబండరాజు, భార్గవ, జి. యశోద, ఎస్వీ సత్యనారాయణ, కసిరెడ్డి వెంకటరెడ్డి తదితర కవులు తెలంగాణ పోరాటం సందర్భంగా కవిత్వం రాసారు. అయితే పోరాటానికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వని వాళ్ళు కూడా ఇందులో చాలా మంది ఉన్నారు. వారు చాలామంది తెలంగాణ ఔన్నత్యాన్ని కవిత్వీకరించారు.
ఆనాటి పాటల్లో బహుళ ప్రజాదరణ పొందిన పాటలున్నాయి. కరృత్వం తెలియని

‘ఓ బ్రహ్మానందరెడ్డి నీ బతుకు బంజర దొడ్డి
పుట్టింది ఆంధ్రపుటుక పెరిగింది తెలంగాణ
మా డబ్బు దోచినావు ఆంధ్రోల్లకిచ్చినావు’

లాంటి పాటలతో పాటు స్వయంగా పాటలు తామే రాసిపాడిన కవులున్నారు. ముచ్చెర్ల సత్యనారాయణ 1952లోనే గైర్‌ ముల్కీ గోబ్యాక్‌ అని నినాదం ఇస్తూ ఉర్దూ తెలుగు కలగలిసిన ఈ పాట రాసాడు. చూడండి.

‘సంజీవరెడ్డి మామా
సునోజీ మేరా గానా
కహతా హై తెలంగాణ
ఇన్సాన్‌ తుమ్‌ కోమానా
ఐసా కభీ న జానా
బందర్‌ కే కార్నామా
బాతేఁతో లాక్‌ బోలా
బహుల్‌ జల్ద్‌ మగర్‌ భూలా
హోగయే తేరా హవాలా
నికల్‌ గయా దివాలా
ఛోడో జీ తెలంగాణ
చలే జావో రాయలసీమ’

పక్నుద్దీన్‌ విజయమో వీర్‌ స్వర్గమో తేల్చుకొమ్మని చెప్పే పాట రాసాడు. ఇది విద్వత్కవి రాసిన కవితలాంటి గేయం.

‘విజయమ్మో లేక వీర మరణమ్మో కాక
వేరొక్కటి నేను గోర వేరెం దున నేను జేర
కదనమ్మో లేక విష్ణు సదనమ్మో కాక వేరు
విషయమ్ముల నేను గోర, వృత్తమ్ముల నేనుజేర’

అని నడుస్తుందీ గేయం. అనుముల శ్రీహరి గేయాలు చాలా శక్తివంతమై ప్రసిద్ధిలోకి వచ్చాయి. మనవాళ్ళు పెద్దమనుషుల ఒప్పందం మీద గుడ్డిగా సంతకం పెట్టారని విమర్శిస్తూ

‘అంతా మన పెద్దవాళ్ళ అల్పబుద్ధి హేతువురా
స్వంత లాభమొకటి చూసి సంతకాలు చేసినారు
చౌ ఎన్‌ లై వంటి వాళ్ళ సన్నిధిలో చేరినారు
భావి తెలంగాణ ప్రజల బతుకులతో ఆడినారు’

అంటాడు. ఇంకా ఎస్‌. మాధవీయాదవ్‌, కమలేకర్‌ రామచంద్రజీరావు, మంత్రి శేషభూషణ్‌, ఎం. సుదర్శన్రెడ్డి తదితరుల పాటలు కూడా ఈ కోవలో పేర్కొన దగినవి.

మలిదశ ఉద్యమ కవిత్వం:

మలిదశ ఉద్యమారంభాన్ని మలిదశ ఉద్యమ కవిత్వాన్ని ఎక్కడ ఎట్లా పారంభమయిందో చెప్పడం కష్టం. 1995 నుండి ఈ దిశగా మేధావులు, తొలిదశ ఉద్యమ కారుల ప్రయత్నం పునః ప్రారంభ మయింది. జర్నలిస్టులు, కవులు, గాయకులు 2000 సంవత్సరం తర్వాత పూర్తిగా ఈ వాదంపై ఆలోచించడం, రాయడం మొదలయింది. తెరాస ఏర్పాటయ్యాక తెలంగాణ వాదంపై కార్యావళి మొదలయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను 2009, డిసెంబర్‌ 9న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి డిసెంబర్‌, 23న దాన్ని ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ వారికి ఒక షాక్‌ ట్రీట్‌ మెంటుగా పని చేసింది. అప్పటి దాకా కొంత ఉదాసీనంగా ఉన్న తెలంగాణ వారు కూడా రాష్ట్రం ఏర్పడి తీరాల్సిందేనన్న ఏకాభిప్రాయానికొచ్చారు. ఇక అప్పటి నుండి ఉద్యమం ఆగలేదు. సాహిత్య సృజన కూడా ఆగలేదు. వేలాదిగా కవితలు, పాటలు పుట్టుకొచ్చాయి. డజనకొద్ది సంకలనాలు, వందలాదిగా సంపుటాలు, ఎక్కడ వీలైతే అక్కడ కవిసమ్మేళనాలు నిర్వహించబడ్డాయి. అనేక సాహిత్య సంస్థలు అందులో మునిగిపోయాయి. తెరవే చేసిన కృషి గొప్పది. మరసం, తెసావే, నీలగిరి సాహితి, పాలమూరు సాహితి, హైకవే తదితర సంస్థలు పనిచేసాయి. పొక్కిలి, మత్తడి, మునుం, జులూస్‌, ములాఖాత్‌ వంటి సంకలనాల కొద్దీ కవితలు వచ్చాయి. వీటన్నింటినీ శీర్షికలుగా విభాగించి విశ్లేషించడం కానీ, కవులందరినీ, కవితలన్నింటినీ కనీసం పేర్కొనడం కానీ చిన్న విషయం కాదు. చిన్న వ్యాసంలో కేవలం విహంగ వీక్షణం మాత్రమే చేయగలం. అది కూడా వస్తుకేంద్రంగానే.

తెలంగాణ భాషా హేళనను ధిక్కరిస్తూ ప్రజల జీవభాషగా ఎలుగెత్తిన కవితలు చాలా వచ్చాయి. ఆ రోజుల్లో తెలంగాణ భాష మీది ప్రేమను ప్రకటిస్తూ

‘నా తెలంగాణ భాష
ఊటల తేటనీరసొంటిది
సవ్వారి కచ్చురాల నడకల్లో ఇనిపించే
మువ్వల సప్పుడు సొంటిది
పిల్లంగోయని ఇనిపించే రాగమ సొంటిది’

అంటాడు టీ. కృష్ణమూర్తి యాదవ్‌. నందిని సిధారెడ్డి ఇంకొక అడుగు ముందుకు వేసి ఆధిపత్య భాషీయులను ధిక్కరిస్తూ

‘మాటకు రంగులద్దిన మాయలోడా
నీ కొంచెపుతనానికి
నా మాట మంచం పట్టింది గదరా
దోసెడు రక్తమిచ్చి బతికించుకుంటా నా మాటను’

అంటాడు. భాషా విచక్షణను పాటలో కూడా ప్రశించాడు లైనేష్‌ కుమార్‌.

‘అప్పారావో నీకు లెక్కల్‌ రావో
అప్పారావో నీకు తెలంగాణ మాటలు రావో
నీవు పిట్టల దొరవ్‌ పొద్దున పోతవ్‌
బి.డి. ఎల్‌.లో డ్యూటీ ఉంటది పిట్టలుగోటె పోత ఉంటది
ఊరూ ఊరూ తిరగపోతవు ఉడకందే తింటనంటవు
తెలంగాణ రాదంటవ్‌ తెలివిలేని వాళ్లంటవ్‌’

అన్నది ఆయన పల్లవి. ఎలికట్టె అయిలయ్య ‘తెలంగాణ రథం’ గేయంలో ‘భాషలోని యాస మీద ఎక్కిరింపులేందన్నం’ అని ప్రశ్న వేస్తడు. ప్రసిద్ధి పొందిన కాళోజీ భాషా వెటకారం ఈ ఉద్యమంలో బాగా ప్రచారంలోకి వచ్చింది.
ఒక వేళ తెలంగాణ నిజంగా ఏర్పడితే హైద్రాబాద్‌ మాత్రం యుటీగా గాని ఉమ్మడి రాజధానిగా గాని ఉంచాలన్న సీమాంధ్రుల ఆశలను తెలంగాణ కవులు అవహేళన చేసారు. భీం వంశీరాం చందర్‌ అనేకవి మొఖం మీద కొట్టినట్లు జవాబిచ్చాడు.

‘హైద్రబాదు మాదంటే మూతపండు రాలుతాయి
మర్యాదగ పోకుంటే రోకండ్లే ఎగురుతాయి
మీ అబ్బసొత్తు కాదురో హైద్రాబాదు మాదిరో
తెలంగాణ గుండెరో హైద్రబాదునిడువంరో’

అని ఈ కవి రాత వెనుక సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసిన ఒక వ్యాస స్ఫూర్తి ఉందనిపిస్తుంది. ‘హైద్రాబాద్‌ జనని తెలంగాణ’ ను సుంకిరెడ్డి ఆంధ్రజ్యోతి డైలీలో రాస్తూ హైదాబాద్‌ నిర్మాణ పనుల్లో తెలంగాణ జిల్లాల శ్రామికుల పాత్ర మాత్రమే ఉందని రాసాడు. హైదాబాద్‌లో పుట్టి పెరిగిన లోకేశ్వర్‌

‘నా జానె జిగర్‌ నగర సుందరి కళ్ళు ముక్కు చెవులు చెంపల్ని చెక్కేసి
నామరూపాల్లేని అనామికను చేస్తున్న చట్టబద్ద కోస్తా ఉగ్రమూకలు
పట్నాన్ని ఎకరాలుగా గజాలుగా లెక్కిస్తున్న నయా వలస పాలకులు’

అని నిందిస్తాడు.
తెలంగాణ వనరుల దోపిడీపై చాలా కవిత్వం వచ్చింది. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి దోపిడీని సృజనాత్మకంగా వ్యక్తీకరిస్తూ

‘భూమి ఒక బ్లాంక్‌ చెక్‌
నీరు దాని విలువను నిర్ణయిస్తది’

అంటాడు.

‘నిజం దేవుడెరుగు
నీరుకొస్తానెరుగు’

అని కూడా తనే అనగలిగినంత లోతైన అధ్యయనం ఆయనది. అమ్మంగి వేణుగోపాల్‌ వనరుల దోపిడీ ఇంకొక విధంగా ఆలోచించాడు.

‘సచివాలయం తవ్వి చూడు
తెలంగాణ బొంద కనిపిస్తది’

అన్నాడు.
ఈ ప్రాంతపు మౌలిక విశేషాలను ఆత్మగౌరవాన్ని సగౌరవంగా ప్రకటించారు కవులు. ఇక్కడి పండగ పబ్బాలను నెత్తికెత్తుకోవడంతో పాటు ఇక్కడి ప్రజలను తక్కువ చేసి మాట్లాడే మాటలకు తిరుగులేని జవాబు లిచ్చారు. బతుకమ్మ పండుగనాటి కళను వర్ణిస్తూ దేశపతి శ్రీనివాస్‌

‘పండుగ రోజులల
లైట్లు లేకపోయినా
పల్లె పల్లెంతా గొప్ప వెలుగే
గాలి నిండా
గునుగులూ తంగేళ్ళ గుసగుసలే ‘

అంటాడు. కాసుల లింగారెడ్డి బతుకమ్మను విప్లవాత్మగా సంబోధిస్తూ

‘భూస్వామ్యాన్ని భూస్థాపితం చేసిన బతుకమ్మ
సమస్త సాంస్కృతిక ఆధిపత్యాల మీద
సరికొత్త ఆయుధం’

అంటాడు. యాభైయ్యేండ్ల తేనెపూసిన పెద్దన్నల ప్రేమను వినూత్నంగా చెబుతూ డా.కొండపల్లి నీహారిణి

‘అక్షరాలు కలిసి ఉన్నట్లే
మనమూ అర్థ శతాబ్దం నుంచి పుస్తకాలు తెరిస్తే మాత్రం
నేను ఒక్క పేజీలోనూ లేను’

తిప్పి పొడుస్తారు. నగర సంస్కృతిని చెబుతూ గంగా జమునా తహజీబ్‌ ను వర్ణిస్తాడు ఎస్‌. జగన్‌ రెడ్డి.

‘ప్రతి బస్తీ చివర
ఒక మజీద్‌ ఒక మందిర్‌
అజా పిలుపే మేలు కొలుపు’

ఉద్యమానికి ముందు, ఉద్యమ కాలంలోనూ తెలివైన ఒక ప్రచారాన్ని ప్రవేశపెట్టారు. దానర్థమేమిటంటే ఆంధ్ర వారు చాలా కష్టబోతులు, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులు. అదేనిజమైతే వాళ్ళ అక్కడే శ్రమలు దుమికించుకోవచ్చు కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి దోపిడిచేసి మాకు పేరుబెట్టడం ఎందుకని కవులు ప్రశ్నించారు. సాయిచంద్‌ ఇలా ప్రశ్నిస్తాడు.

‘మా విజయవాడలో కనకదుర్గమ్మ కాసుల రాసులు అడిగినమా
తిరుమల తిరుపతి వెంకటేశుని హుండీ లెక్కలు అడిగినమా
కాకినాడ మీ విశాఖపట్నం ఓడరేవు మేమడిగినమా
కృష్ణా డెల్టా గుంటూరులో గుంటెడు జాగను అడిగినమా’

ఆంధ్రులు కష్టబోతులు, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులు అన్న ప్రచారాన్ని ‘వాళ్ళు కష్టపడ్తర్సార్‌’ అన్న కవితలో చాలా వ్యంగ్యంగా తిప్పికొడతాడు, ఏనుగు నరసింహారెడ్డి. చూడండి.

‘వాళ్ళు
కోనసీమలో కొబ్బరాకులమ్మి
ప్రజ్ఞాపురంలో పత్తితోటకొంటరు
…………….
మనోళ్ళు
చరిత్ర చింతాక్రాంతమైనప్పుడు
రాయి ముక్క అవసరం లేకుండా
చార్మినార్‌ ను కట్టి చందమాముకు పోటీపెడ్తారు’

మలిదశ ఉద్యమంలో పెను విషాదం విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలు. ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులమీద విస్తృతంగా కవిత్వం, పాటలు వచ్చాయి.

‘మీ తాతలు
నెత్తురు మోటలు గొట్టిండ్లు
పోరు పంటలే పండించిండు
తుఫానుకు జోరు మనపోరే నేర్పింది
నీళ్ళకాల్వకు రువ్వడి నెత్తుటి కాల్వే నేర్పింది
బిడ్డా! పానం దీస్కున్నవ్‌
తెలంగానొస్తదా ..?’

అని ఒక తల్లి గొంతుకగా ప్రశ్నిస్తాడు పి.యాదగిరి.

‘వీరులు మరణిస్తే
ఉద్యమాలు బెంగటిల్లుతై
పోరాటాలు మసకబారుతై
మీ బలిదానాలకు
వాళ్ళ కంటి కొలుకుల్లోంచి
ఒక్క దుఃఖపుచుక్కెనా రాలనప్పుడు
గుండె గదిలో రెండు
వేదనా కదలికలైనా పుట్టినప్పుడు
చావుకెందుకు మీకు మీరే
రహదార్లు పరుస్తున్నారు’

ఒక తండ్రిలా ఉదారి నారాయణ అమరులను ప్రశ్నిస్తాడు. ఇక దరువు ఎల్లన్న రాసిన

‘వీరులారా వందనం విద్యార్థి
అమరులారా వందనం పాదాలకు
మా త్యాగధనులారా మంచిపోమూ మేము
గుండెల్ల గుడిగడుతం పోరుదండం బెడుతం’
అనే పాట, మిట్టపల్లి సురేందర్‌ రాసిన

‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా
రక్త బంధం విలువ నీకు తెలియదురా
నుదుటి రాతలు రాసె ఓ బ్రహ్మదేవా
తల్లికొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా
తెలిసుంటె చెట్టంత నా కొడుకును
తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు’

అనేపాట, గద్దర్‌ విప్లవోద్యమంలో భాగంగా రాసి పాడిన

‘ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో గలిసినారా
సుక్కలలో గలిసి మీరు సూరులయినా మొలసినారా
ఏ దిక్కులేనోళ్ళకు మా బిడ్డలు
మీరు దిక్కులూపే చుక్కలయ్యిండ్రా మా కూనలు’

అనే పాట మలిదశలో కళ్ళనీళ్ళు పెట్టించాయి. ఇలాంటి సామూహిక స్మృతిగీతాలే కాక వ్యక్తిగతంగా కూడా స్మృతి కవిత్వం, స్మృతి గీతాలు వచ్చాయి. వేదికలను ఉర్రూతలూగించాయి. అందెశ్రీ ఉద్యమంలోనే పాడిన మంగళాశాసనం

‘జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’

2.6.2014న నిజమయింది. తెలంగాణ రాష్ట్రావిర్భావానంతరం, ఆవిర్భావ సందర్భంగా కూడా పాటలు, కవితలు వచ్చాయి. పత్రికలను అలంకరించాయి.
ఉద్యమం పరిసమాప్తమయ్యాక దాని రూపం ఘనీభవిస్తున్న తరుణంలో చిన్న సంఘటనలు, చిన్న సందర్భాలు, చిన్నచిన్న ఊతాలు మరుపుకు గురవుతాయి. అందులో ఆశ్చర్యం గాని ఆవేదన చెందాల్సిందిగానీ లేదు. కానీ ఉద్యమం సఫలీకృత థకు రాగానే శతృశిబిరం మిత్రులకన్నా ముందు ఉద్యమ కేంద్రానికి చేరుకోవడం అన్యాయం. ఇది ఎక్కువగా రాజకీయులలో ఉంటుంది. కవులకు ఆకాంక్షలుంటాయి. అవి ప్రజాప్రేరితం. ఆశలేమీ ఉండవు. వారి పేరు పుటలలో ఉంటుంది. అంతేచాలు. మలిథ ఉద్యమంలో పేర్కొనాల్సిన కవులు లెక్కకు మిక్కిలి. వారిలో చర్చకు పెట్టాల్సి ఉండి పెట్టలేకపోయిన వారు ఎందరో. అందులో కొందరి పేర్లు.
గూడ అంజయ్య, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, తిరునగరి దేవకీదేవి, మిత్ర, జయరాజు, మల్లావఝుల సదాశివుడు, అనిశెట్టి రజిత, జ్వలిత, వరంగల్‌ శ్రీనివాస్‌, నేర్నాల కిషోర్‌, దయా నర్సింగ్‌, సురా, దర్వు ఎల్లన్న, దర్వు అంజన్న, కొల్లపురం విమల, కోదారి శ్రీను, ఏపూరి సోమన్న, కొమిరె వెంకన్న, యశ్‌ పాల్‌, గిద్దె రాంనర్సయ్య, పాటమ్మ బిక్షపతి, పైలం సంతోష్‌, వరవరరావు, మురళి మధు, చెన్నాడి వెంకట రమణారావు, వై. వెంకన్న, గోగు శ్యామల, డా.ఏ. జయంతి, అంబటి వెంకన్న, యోచన, వేణు సంకోజు, బెల్లియాదయ్య, షేక్‌ బాబా, గాజోజు నాగభూషణం, ఎస్‌.వి. మల్లిక్‌ తేజ, ఓరుగంటి శేఖర్‌, జనార్థన్‌, దేవరశెట్టి జనార్థన్‌, బుర్ర సతీష్‌, కందికొండ, నిస్సార్‌, సినారె, ననుమాస స్వామి, శ్రీరామోజు హరగోపాల్‌, జూలూరు గౌరీశంకర్‌, కాశీం, దాసరాజు రామారావు, అయాచితం నటేశ్వర శర్మ, అభినయ శ్రీనివాస్‌, పిట్టల రవీందర్‌, పత్తిపాక మోహన్‌, మౌనశ్రీ మల్లిక్‌, డప్పు రామస్వామి, కాంచనపల్లి, వేముగంటి మురళీకృష్ణ, వెలపాటి రామరెడ్డి, మండలస్వామి, పెరుమళ్ళ ఆనంద్‌, పగడాల నాగేందర్‌, మునాసు వెంకట్‌, కూకట్ల తిరుపతి, అన్నవరం దేవేందర్‌, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, గుడిపాటి, రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, నాళేశ్వరం శంకరం, కంశ్రీ, వేముల ఎల్లయ్య, వెల్దంది శ్రీధర్‌, వఝల శివకుమార్‌ తదితరులు.
భౌగోళికంగా, సాంస్కృతికంగా ప్రత్యేకమైన అస్తిత్వం గలిగిన తెలంగాణ ఒక రాష్ట్రంగా భౌతికంగా ఏర్పడడం ఇక్కడ ప్రజలందరికీ పండగ రోజు. ఒక ప్రజాస్వామిక వాతావరణం ఇక్కడ పరిఢవిల్లడం కోసం కవుల ఆలోచనల అవసరం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది.

        - డా||ఏనుగు నరసింహారెడ్డి
                  8978869183

ఉపకరించిన గ్రంథాలు

  1. నిప్పుల వాగు – సం. అందెశ్రీ – వాక్కులమ్మ ప్రచురణ
  2. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం- డా. వెల్దండి శ్రీధర్‌ – తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ
  3. జనని, తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం – సం. రుద్రశ్రీ వెన్నెల – తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ
  4. తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు-డా. ఏనుగు నరసింహరెడ్డి -నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌, హైద్రాబాద్‌
  5. ప్రత్యూష – వివిధ రచయితలు – తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ
  6. పరంపర – సం. నందిని సిధారెడ్డి – తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ
January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథా పంచకం

by Dr. Lakshmanacharyulu M January 15, 2024
written by Dr. Lakshmanacharyulu M

1. పోనీ ! పోనీ !

కోల్‌ కతా ఓ మహానగరం. పెద్ద సంఖ్యలో.. చాలా పెద్ద సంఖ్యలో జనం అక్కడ నివసిస్తూ ఉంటారు. అలాగే అక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. లక్షల మంది బస్సులు, స్టీమర్ల, హ్రంలు, ట్రైయిన్లు, ఇలా ఏ వాహనం దొరికితే దానిలో, ఆఫీసులకి, ఇతర పనులకి వెళ్తూ – వస్తూ ఉంటారు. రవాణా సాధనాలన్నీ ఎప్పుడూ క్రిక్కిరిసిపోయి ఉంటాయి.

రామం, సుధీర్‌, జేమ్స్‌, అయూబ్‌ – నలుగురూ వేర్వేరు ఆఫీసుల్లో పనులు చేస్తూ, రోజూ ప్రొద్దున్నే వెళ్ళడం, తిరిగి ఇళ్ళకు రావడం చేస్తూ ఉంటారు. పరస్పరం పరిచయాలైతే లేవు, కాని ఇవ్వాళైతే నలుగురూ ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్నారు.

బస్సు ప్రయాణీకుల్తో కిటకిటలాడుతోంది. సూదిమొనంత ఖాళీ కూడా లేదు. రామం, సుధీర్‌, అయితే ఎలాగో అలా త్రోసుకుంటూ లోపలికి వెళ్ళ గలిగారు. జేమ్స్‌ కొంచెం కష్టపడితే ఇక లోపలికి వచ్చేస్తాడు కాని పాపం ! అయూబ్‌ బస్సు ద్వారం దగ్గరే కడ్డీ పట్టుకుని వ్రేలాడుతూ ఉన్నాడు.

ఇంతలో బస్సు కదిలింది. రోడ్డు మీద జనం బస్సుల్లో జనం. ప్రజల మానసిక థ కూడా దిగజారి పోయింది. ఎవరూ ఎవర్ని లెక్క చేయరు. ఎవరి స్వార్థం వారిదే. ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు రామం.

అంతే ! ధడేలన్న శబ్దం. ఏదో పడిపోయినట్టయింది. ఎవరిదో భయం నిండిన ‘కేక’ హృదయ విదారకంగా వినబడింది. బహుశా అయూబ్‌ పడిపోయినట్టున్నాడు. అలా క్రింద రోడ్డు మీద పడిపోయిన అయూబ్‌ మీది నుండి – వెనకాలే వచ్చిన ఒక వాహనం, వేగం నియంత్రణ కోల్పోయినందున, వెళ్ళిపోయింది. అయినా….

రామం, సుధీర్‌, జేమ్స్‌ మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినబడుతున్నాయ్‌…

అరే ! భయ్యా ! మా ఆఫీసుకు లేటయి పోతోంది.

పద, పద !! పోనీ ! పోనీ !! బస్సు పోనీ !!

2. మీ గొప్ప కోసమని…

ఒకప్పుడు గురు శిష్యులిద్దరూ ఒక ఊర్లో ఉండేవారు. ఇద్దరూ ప్రతిరోజూ జ్ఞాన సంబంధమైన  చర్చ జరుపుతూ ఉండేవారు.

ఒకరోజున గురువుగారు శిష్యుణ్ణి పిలిచి – ”ఇవాళ నేను ఓ గంటసేపు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతా.. నువ్వు జాగ్రత్తగా విని విశ్లేషిస్తూ, నేనేం చెప్పానో సరిగ్గా చెప్పాలి” అని అన్నాడు.

ఓ గంటసేపు గురువుగారు తన గురించి చెప్పాక, విశ్లేషించమని కోరగా, ”అయ్యా ! మీరు ఎక్కువగా మీ గురించే మీరు పొగుడుకున్నారు. ఆత్మస్తుతి ఎక్కువైంది. మీకు ”నేను” అనేది ఎంత ఇష్టమని తేలిందంటే, సుమారుగా ప్రతి వాక్యంలోనూ దాన్ని ఉపయోగించారు. ఇక ఇతరుల్ని చాలాసేపు నిందించారు, విమర్శించారు. మీకు మీలోని మంచితనం మాత్రమే కనిపించగా, ఇతరుల్లోని లోటుపాట్లు, తప్పులు మాత్రం మీకు కనిపించాయి”.

”మీ వ్యక్తిగత జీవితం గురించి విన్నాక ”మీరు మీ కీర్తి కోసం, మీ గొప్పత కోసం ఇతరుల్ని విమర్శకు గురిచేస్తూ, వారిలో ఏవో తప్పులు వెదుకుతూ ఉంటారని నాకు అర్థమైంది” అని అన్నాడా శిష్య పరమాణువు.

3. స్వర్ణ యుగం

భూమ్మీద ఒక్కో మతానికి చెందిన ఒక్కో వ్యక్తి మిగిలాడు. పరస్పరం పోట్లాడుకున్న దాని ఫలితంగా ఇలా జరిగింది. ఇప్పుడు వారి కళ్ళల్లో ఈర్ష ్యకి బదులు భయం చోటు చేసుకుంది. తమలో తాము పోట్లాడుకుని, పోట్లాడుకుని మనుషుల ఎత్తు బాగా తగ్గిపోగా, చుట్టూ ఉన్న జంతువుల ఎత్తు బాగా పెరిగిపోయింది. ఆ పశువులన్నీ మనుషుల్ని చుట్టుముట్టాయి.

”ఇక మనం బ్రతికి బట్ట కట్టలేం. ఈ జంతువులు మనల్ని తినేస్తాయి” అని అన్నాడో మనిషి.

మరొకడు కొంచెం తెలివిగలవాడు ”అసలు ఇన్ని శతాబ్దాలుగా మనిషి ఎలా తప్పించుకున్నాడో గదా అని ఆలోచిస్తే, మనుషుల్లోని ఐకమత్యమే దీనికి కారణమని తెలుస్తుంది. కానీ… మతం పేర, కలహాలు ప్రారంభం అయినప్పట్నించే మనిషి పరిస్థితి ఇలా అయిపోయింది” అని అన్నాడు.

”సరే ! మనం ఇప్పుడేం చేద్దాం?” అన్నాడు మూడోవాడు.

”రండి! మళ్ళీ అందరం ఏకమౌదాం. ఐకమత్యమే బలం. అప్పుడు బహుశా మనమే మళ్ళీ గెలుస్తాం” అన్నాడు నాలుగోవాడు.

పశువులు చాలా తెలివి గలవి. మనుష్యులంతా ఒకటైతే మనం వారిముందు నిలబడలేం. ఓడిపోతాం అని అనుకుని మనుష్యుల చుట్టూ ఉన్న కట్టడిని తొలగించి వారికి స్వేచ్ఛనిచ్చాయి.

అంతే ! భూమ్మీద కేవలం మానవతా మతం మాత్రమే నిలబడింది. నవనిర్మాణం, మానవ ప్రగతికి సంబంధించిన స్వర్ణయుగం మరల తిరిగొచ్చింది.

4. సంతాప సభ

స్కూల్లో ఒక విచిత్రమైన ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. పిల్లలంతా లైన్‌లలో నిలబడి మౌనంగా ఉన్నారు. ఇంతలో ఓ కారు హారన్‌ శబ్దం వారి నిశ్శబ్దానికి భంగం కలిగించింది.

గోపీ ఇవాళ మళ్ళీ ఆలస్యంగా వచ్చాడు. రాగానే కారు దిగి భయం భయంగా వెళ్ళి లైన్లో నిలబడ్డాడు. మెల్లగా తన ప్రక్క ఉన్న బాలుని అడిగాడు.

”ఏమైంది?”

”కనబట్టంలా? సంతాప సభ నడుస్తోంది” అని గుసగుసలాడాడు బాలు.

”ఎవరు పోయార్రా?”

”మన రామయ్య మాస్టారు నిన్న రాత్రే కాలం చేసారట”. సంతాప సభ ముగిసింది. ”ఇవాళ స్కూల్‌ మూసేస్తున్నాం” అని ప్రకటించారు హెడ్మాస్టర్‌ గారు.

గోపీకి పట్టలేనంత ఆనందం కలిగింది. బాలు భుజం మీద చెయ్యేసి నవ్వుతూ – ”భలే ! స్కూల్‌ బంద్‌ ! సరేగాని మెట్రోలో క్రొత్త సినిమా విడుదలైందిరా ! పోదామా !

బాలు నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడు.

5. పలాయనం

డాక్టర్‌ సారథి తీరిక అస్సలులేని మనిషి. ఇవాళెందుకో బాగా అలసిపోయాడు. రేయింబవళ్ళూ రోగులు, పరీక్షలు, చికిత్స… ఇదే గొడవ. అసలైతే ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ ఉంటాడు. మంచిగానే రోగులతో ప్రవర్తిస్తాడు. ఇవాళ… విసిగిపోయాడో ఏమో, ఎటైనా దూరంగా, వెళ్ళి ఏకాంతంగా ఉండాలని అనుకున్నాడు.

అప్పుడే ఆయనకి తన మిత్రుడు సుందరం గుర్తుకొచ్చాడు. స్కూల్‌ రోజుల నుండి ఫ్రెండ్‌. ఎన్నిసార్లు ఇంటికి రమ్మని ఆహ్వానించినా సారథి వెళ్ళలేక పోయాడు. ఇవాళ ఎలాగైనా సరే, వెళ్ళి ఓ 2-3 గంటలు ఆయనతో గడపాలని భావించాడు. కాదు… గట్టిగా అనుకున్నాడు. సారథి ఓ పది నిముషాల తర్వాత సుందరం గారింటి ముందు నిలబడి, కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. మొహంలో ఆనందం. ఇక్కడ తననెవరూ… ఏ రోగీ… వచ్చి విసిగించదు” అని అనుకున్నాడు.

ఇంతలో తలుపు తెరుచుకుంది. శ్రీమతి సుందరం డాక్టర్‌ సారథిని చూసి, గుర్తుపట్టి నమస్కరించింది.

అరె ! మీరు రావడం చాలా మంచిదైంది. మీ స్నేహితుడి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నిన్నట్నించి బాగా జ్వరం ఉంది. రండి.. రండి…” అన్నదావిడ.

January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నవ్వే వాళ్ళు నవ్వనీ..Lyrical View

by Ramakrishna Manimadde January 15, 2024
written by Ramakrishna Manimadde

లోకులు కాకులు..
అనూహ్యమైన విజయాలు సాధించినా
ఏదో ఒక రకంగా వేలెత్తి చూపటానికే ప్రయత్నిస్తారు..
అందుకే విమర్శలకు కుంగిపోవద్దు.. Don’t Care అనుకుంటూ ధృఢ చిత్తంతో సాగిపోవాలి.. లక్ష్యాన్ని చేరుకోవాలి..

ఇలాంటి సందేశాన్ని పక్కా కమర్షియల్ మాస్ సినిమాలో కన్విన్సింగ్ గా చెప్పారు “చంద్రబోస్”.
అగ్రకథానాయికుడికి అఖండమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది.. ఆ ఫ్యాన్స్ కు మంచి మెసేజ్ ఆ హీరో పాత్ర ద్వారా చెప్పిస్తే మరింతగా జనంలోకి వెళ్తుంది. ఆ ఫల్స్ ను పట్టుకుని “చెన్నకేశవరెడ్డి” సినిమాలో హీరోయిజం ఎలివేట్ చేస్తూ.. చక్కని సందేశం అందించారు గీత రచయిత.

నవ్వే వాళ్ళు నవ్వనీ
ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ
పొగిడే వాళ్ళు పొగడనీ
తిట్టే వాళ్ళు తిట్టనీ
don’t care

“లోకో భిన్న రుచి” అని లోకోక్తి.. సమాజంలో విభిన్న వైరుధ్యాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సక్సెస్ సాధించిన వారిని చూసి.. వారి విజయాన్ని తక్కువ చేయాలనే దుర్బుద్ధి కల వ్యక్తులు.. “ఇదీ ఒక విజయమేనా..? దీనికే అంతగా మురిసిపోవాలా !” అని అక్కసుతో నవ్వే వాళ్ళు ఉంటారు.. అసూయతో ఏడ్చేవారు ఉంటారు.
కనుక Don’t Care.

అద్భుత విజయాన్ని సాధించావు, నీ సక్సెస్ మరో పది మందికి స్ఫూర్తి అని పొగిడేవారూ ఉంటారు. గెలుపుతో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని చూసి, తలపొగరు చూడు అని తిట్టేవారు ఉంటారు. వీటన్నిటినీ చూసి పొంగిపోకు.. కుంగిపోకు..!!

పూలే నీపై చల్లనీ
రాళ్ళే నీపై రువ్వనీ
ఎత్తుకు నిన్నేగరెయ్యనీ
గోతులు నీకై తీయనీ
don’t care… నవ్వే వాళ్ళు

ప్రేరణ ఇచ్చే నీ ఎదుగుదలను చూసి సత్కారాలు, సన్మానాలతో నిన్ను పూల వర్షంలో ముంచెత్తే వారు ఉంటారు.! కంటగింపుగా మారిన నీ ఎదుగుదలకు ఓర్వలేని తనంతో, విమర్శ అనే రాళ్ళను నీపై వేస్తారు. సో Don’t Care.

శ్రమ కోర్చి.. కష్టే ఫలి అని నువ్వు నిర్మించుకున్న విజయ సౌధాన్ని చూసి అంతెత్తున నిన్ను ప్రపంచానికి చూపెడతారు. నీ ఉన్నతిని, అభ్యున్నతిని చూసి తట్టుకోలేని వారు, నిన్ను పాతాళంలోకి నెట్టివేయాలని గోతులు తవ్వుతారు. అందుకే ఇలాంటివి కౌంట్ చేయకు.. కేర్ చేయకు.!

అనుకొన్నది నీవ్వే చెయ్‌
అనుమానం మాని చెయ్‌
నీ మనసే గట్టి చెయ్‌
నీదే రా పై చెయ్‌

సాధ్య అసాధ్యాలు పరిశీలించి, నువ్వంటూ ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక వెనుకడుగు వేయకు. సక్సీడ్ అవుతానో లేదో అనే అనుమానాన్ని పెట్టుకోకు. ‘ష్యూర్ నేను సాధిస్తాను’ అని మనసులో గట్టిగా అనుకుని పనిచెయ్.. నీదే పైచెయ్..!! అంటున్నాడు కథా నాయకుడు.

ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో
క్రమశిక్షణ తో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో
చిరునవ్వుతో బ్రతకాలన్నది పువ్వును చూసి నేర్చుకో
ఓర్పు సహనం వుండాలన్నది పుడమిని చూసి నేర్చుకో

మన జీవిత గమ్యానికి.. గమనానికి ప్రకృతి ఒక ప్రతిబింబం.. ఈ చరాచర జగత్తులో మనకు ఎన్నో పాఠాలను ప్రకృతి నేర్పుతుంది.

చెట్టు మనకు నీడనిచ్చి హాయినిస్తుంది.. ఫలాలను ఇచ్చి ఆకలి తీరుస్తుంది.. ప్రాణ వాయువునిచ్చి ప్రాణ ప్రతిష్ట చేస్తుంది. ఆకాశాన్ని అందుకునే మహావృక్షం సైతం తన కొమ్మలను చిగురులను నేలవైపే సారిస్తుంది. కనుక ఎంత ఎదిగినా ఒదిగిఉండాలి అని చెట్టును చూసి నేర్చుకో..

నలిపేస్తే చనిపోయే చీమలు అని మనం చిన్నచూపు చూస్తాము.. కానీ కలిసికట్టుగా ఆ చీమలు చేసే సంఘజీవనం మనకు స్ఫూర్తి కావాలి. అందుకే క్రమశిక్షణతో ఎలా మెలగాలో చలిచీమల నుండి నేర్చుకోవాలి.

పసిడి పువ్వులను చూస్తే మనసు పరవశానికి లోనవుతుంది. అలసిన దేహం ఆ పువ్వులను చూసి సాంత్వన చెందుతుంది. పువ్వులా ఎల్లప్పుడూ పెదవిపై చిరునవ్వు తాండవించాలి. ఆ నవ్వు పదుగురికి పలకరింపు కావాలి.

‘భూదేవి అంత ఓర్పు’ అని నానుడి. సునామీలు, భూకంపాలు, అగ్ని శిఖలు, పాపాలు.. వీటన్నింటినీ పుడమి భరిస్తుంది..మనలను రక్షిస్తూనే ఉంటుంది. మన జీవిత పయనంలో కష్టనష్టాలను భరిస్తూ, పుడమి అంత ఓర్పు నేర్పు ఉండాలని.. ప్రకృతిని నిత్య జీవితానికి అన్వయిస్తూ చెప్పాడు.

ఎంత తొక్కినా .. నిన్నెంత తొక్కినా ..
అంత పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో
నేర్చుకొన్నది పాటించేయి, ఓర్చుకొంటూ పనులే చేయి
నీదే రా పై చెయ్‌

ఎదుటి వారికి అరుదైన విజయం.. చక్కటి జీవితం లభిస్తే తొక్కెయ్యాలని చూసే వ్యక్తులు చాలా మంది ఉంటారు. సో.. నిన్నెంత తొక్కితే అంత పైపైకి రావాలని బంతిని చూసి నేర్చుకో..!

నేర్చుకున్నది ఒక పాఠంగా స్వీకరించు.. మరోచోట అన్వయించుకో అడ్డుతెరలను అధిగమించి.. నేర్చుకుంటూ ఓర్చుకుంటూ నీపని నువ్వు చేసుకో.. చూసుకో..! ఆటోమేటిగ్గా నీదే పైచేయి అవుతుంది.. విజయపరంపర కొనసాగుతుంది.

ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో
పరులకి సాయం చేయాలన్నది సూర్యుణ్ణి చూసి నేర్చుకో
సోమరితనాన్ని వదలాలన్నది గడియారాన్ని చూసి నేర్చుకో
ప్రేమనందరికి పంచాలన్నది భగవంతుణ్ణి చూసి నేర్చుకో

అద్దం ముందు నిలబడితే.. మన రూపాన్ని, ఆహర్యాన్ని ఉన్నది ఉన్నట్టు చూపెడుతుంది.
నీతి నియమాలతో.. సత్య నిష్టతతో వాస్తవాలను, నిజాలను నిర్భయంగా చెప్పాలి. అంతేకానీ ఎదుటి వారి మెప్పు కోసమో, తాత్కాలిక అవసరం కోసమో మన వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు.

ఈ భూమిమీద ప్రాణికోటికి సూర్యుడు ధాతువు.. మూలాధారం.! సేవా గుణాన్ని సూర్యుడిని చూసి నేర్చుకోవాలి. అందుకే అన్నారు ‘పరులకు చేశావంటే సేవ.. పరమాత్ముడు నువ్వు కావా..!’అని.

నిరంతరం కదులుతూనే ఉంటుంది గడియారం.. అర క్షణం ఆగిపోతే.. ప్రపంచమే స్తంభించిపోతుంది. కనుక సోమరితనాన్ని వదిలి నిరంతరం శ్రమిస్తూ, పరిశ్రమిస్తూ ఉండాలి.

భగవంతుడి దృష్టిలో, సృష్టిలోని ప్రతిప్రాణి ముఖ్యమే. అందుకే తమపర భేదాలు లేకుండా, స్వార్థ చింతన వీడి, భగవంతుని కృపతో జీవించి ఉన్నంత వరకు అందరికీ ప్రేమను పంచు.. ప్రేమతో జీవించు..!

ఎంత చెప్పినా… నేనంత చెప్పినా
ఇంకెంతో మిగులున్నది అది నీకు నీవు తెలుసుకో
నేర్చుకొన్నది పాఠం చేయి నలుగురికీ అది నేర్పించేయి నీదేరా పై చెయ్‌”..

అని జీవిత సత్యాలను శోధించి, ఆధ్యాత్మికతను అద్ది, తాత్వికతతో బతుకు పోరాటాన్ని, మనుషుల అంతరంగాన్ని, సమాజంలో మెలిగే విధానాన్ని, విజయాలను అధిరోహించే తీరును, నేటి తరానికి అర్థమయ్యేలా ఉదాహరణలతో, బతుకు మలుపును, గెలుపు ఔచిత్యాన్ని ‘అగ్ర కథానాయకుడి’ ద్వారా సూత్రీకరించి.. సమాజానికి చేరవేసే గొప్ప ప్రయత్నం చేసిన చంద్రబోస్ అద్భుతమైన ఇన్స్పిరేషన్ సాంగ్ రాసి మరోమెట్టు చేరారు.

January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మెరుగైన…సమాజం…ప్రగతి పథంలో దేశం…

by mayuukha January 15, 2024
written by mayuukha

ఎందరో
మేధావులు…
సమతా వాదులు…
సంఘ సంస్కర్తలు…ఈ
పుణ్యభూమిలో జన్మించి
మెరుగైన సమాజం కోసం…
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం…
ప్రజల్లో సామాజిక చైతన్యం కోసం…

ఎన్ని సందేశాలిచ్చినా…
ఎన్ని హెచ్చరికలు చేసినా… 
తమ జీవితాలను ఫణంగా
పెట్టి ఎన్ని ఉద్యమాలు
ఎన్ని పోరాటాలు చేసినా…
ఎంతగా పరితపించినా…
ఎంతగా ఆశపడినా…
ఎంతగా ఆరాటపడినా…

ఈ సమాజంలో ‌
“విప్లవాత్మకమైన 
మార్పులు” రాకపోవడానికి…
ఈ దేశంలో “ఆశించి ప్రగతి”
కళ్ళకు కనిపించక పోవడానికి కారణం…

పేదవాళ్లలో…
ధైర్యం లేకపోవడం…
సాహసం చేయకపోవడం…
అంతులేని అమాయకత్వంలో…
అజ్ఞానాంధకారంలో మునిగిపోవడం…

మధ్యతరగతి వారికి…
సమయం లేకపోవడం…
సమిష్టిగా స్పందించక పోవడం…
ధనవంతులకు దాసోహం అనడం …
పేదవారిపై పెత్తనం చెలాయించడం…
చైతన్య రహితులై మౌనవ్రతం దాల్చడం…

ధనవంతులకు…
అవసరం లేకపోవడం….
చీకటి వ్యాపారాలు చేసి
దొరికినంత దోచుకోవడం…
స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడం…
అట్టడుగు వర్గాల్ని అణగద్రొక్కడం…
మధ్యతరగతి వారిని మాయచేయడం…
ప్రభుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడం.

మరి సమసమాజం నిర్మాణ స్థాపనెప్పుడు?
దేశంలో శాంతిసౌభాగ్యాలు వర్థిల్లేదెప్పుడు?

మనిషి మనిషిలో…
మానవత్వం వికసించినప్పుడు…

పేదలు…
ఆర్థిక అసమానతలనుండి బానిసత్వపు
భావనలనుండి విముక్తి పొందినప్పుడు…

మధ్యతరగతి ప్రజల్లో…
విజ్ఞాన జ్యోతులు వెలిగినప్పుడు…
విప్లవజ్వాలలు రగిలినప్పుడు…

ధనవంతుల చేతుల్లో…దాతృత్వం
గుండెల్లో…దైవత్వం పొంగి పొరలినప్పుడు.

January 15, 2024 1 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మహాకవి పోతన

by mayuukha January 15, 2024
written by mayuukha

పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయాన పాత్రంబునన్
నెట్టం గల్గను, గాళి గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ మానకు మమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ!
(భాగవతము – పోతన)

“మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో”.. నన్నయ తిక్కనాది కవులు ఈ భాగవతాన్ని ఇప్పటి వరకు తెలుగులో వ్రాయలేదు.. “దీనిం తెనింగించి నా జననంబున్ సఫలంబు సేనెద పునర్జన్మంబు లేకుండగన్” అనే విశ్వాసాన్ని ప్రకటించాడు, పోతన గారు. మరొక జన్మ లేకుండా ఉండేందుకు ఈ భాగవతాన్ని తెలుగులో వ్రాస్తాను.. అంటూ ఆరంభించారు పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం.

ఆ ప్రక్రియలో భాగంగా సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ చెప్పిన పద్యమే పై “పుట్టం బుట్ట” అన్న పద్యం..

నమ్రత, వినయ, విధేయతలను వ్యక్తీకరించే విధంగా చెప్పిన పద్యం ఇది.

భాగవతాన్ని తెలిసి పలకడం తమ్మి చూలికి కాని శూలికి కాని సాధ్యం కాదని ఒకవైపు చెపుతూనే దానిని తెనిగించేందుకు సన్నద్ధమైన పోతన గారి ప్రజ్ఞాపాటవాలు ఆ సంకల్పంలోనే వ్యక్తమౌతున్నాయి.
అయినా .. “ఎట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ” అంటూ భారం ఆమెపైనే పెట్టడం ఆయనలోని సర్వ సమర్పణ భావాన్ని తెలుపుతుంది. పుట్టలో పుట్ట లేదు.. అంటే పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను.. వాల్మీకి తపస్సు చేస్తున్న సమయంలో ఆయన శరీరం అంతా పుట్టలు పెట్టిందట. దానిలో నుండి వెలికి వచ్చిన వాడు కాబట్టి అతను వాల్మీకిగా ప్రసిద్ధుడయ్యాడు. శరంబునన్ మొలవ.. రెల్లుగడ్డిలో జనించిన వాడు.. శరవణ భవుడు లేదా కుమారస్వామి. నేను కుమార స్వామిని కాదు.. అంభస్ అంటే నీరు.. నీటిపై చేసే ప్రయాణానికి అనువైన సాధనము (పాత్ర).. పడవలో సత్యవతికి పరాశరునికి జనించిన వాడు.. వ్యాసుడు.. ఆ వ్యాసుని నేను కాను.. కాళి గొల్వను.. కాళికా మాతను సేవించి ఆమె ప్రసాదంతో మహాకవి యైన వాడు.. కాళిదాసు.. నేనా కాళిదాసును కాను.. అయినా దొరంకొని (పూనుకొని) ఉంటిని.. ఉన్నాను… దేనికి? పురాణింపన్.. భాగవత పురాణాన్ని రచించేందుకు పూనుకొని ఉన్నాను. నిజానికి నాకా సామర్ధ్యం లేదు.. ఎవరికి ఉన్నది? వాల్మీకి, కుమారస్వామికి, వ్యాసునికి, కాళిదాసు లాంటి మహాత్ములకు మాత్రమే ఉన్నది… అయినా నేనా పనిని సంకల్పించాను. ఎందుకని? నా జననము సఫలము చేసుకోవాలని.. సామర్ధ్యం లేదని తెలిసినా ఎందుకు ప్రయత్నిస్తున్నాను? అంటే నాకు అండగా నీవు ఉన్నావనే నమ్మకంతో…

అమ్మా! నీ అండ చూచుకొని గొప్పనైన కార్యాన్ని తల కెత్తుకున్నాను. అంతేకాదు.. ముందు చెప్పిన మహాత్ములైన వారి వెంట నడుస్తాను.. అయితే ఆ సరణి మాత్రం నీవే నాకివ్వాలి. నిన్ను నమ్ముకున్నాను తల్లి.. “మేల్ పట్టున్ మానకు మమ్మ” మంచి పట్టుగా ఉండవమ్మా… ఓ దయకు సముద్రం లాంటి దానా.. బ్రహ్మీ మాతా అంటున్నాడు, పోతనగారు.

దయ ఆలోచనకు పరిమితమైనది కాగా కరుణ ఆచరణకు సంబంధించినది.. ఆలోచన ఆరంభం కాగా.. ఆచరణ ముగింపు…

“మేల్ పట్టున్ మానకు మమ్మ” … ఒక ఇరుకైన చేదబావి పూడిక తీస్తున్నారు.. అది ఒక ఉదాత్తమైన కార్యం.. ఒకడు లోపల ఉన్నాడు.. ఒకడు వెలుపల ఉన్నాడు. లోపల ఉన్నవ్యక్తి బావి లోపలి మట్టిని తీసి తట్టలో వేస్తాడు.. వెలుపల ఉన్న వ్యక్తి దానిని జాగ్రత్తగా పైకి చేది ఆ తట్టలోని మట్టిని బైట పారబోస్తాడు. పైన ఉన్న వ్యక్తి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోపలి వ్యక్తి ప్రమాదానికి గురవుతాడు. మట్టి తట్ట తొణికినా… జారినా.. తాడు తెగినా.. లోని వ్యక్తికి ప్రాణాపాయ స్థితి కలుగుతుంది. అందుకే లోని వ్యక్తి అంటున్నాడు.. అరే జాగ్రత్తగా పైకి చేదుకో… అంటూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పైన ఉండే వ్యక్తికి చెపుతున్నాడు. లోపలి వ్యక్తి ప్రాణాలు పైన ఉన్న వ్యక్తి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నాయి.

అదే విధంగా పోతన గారు దుష్కరమైన కార్యాన్ని తలకెత్తుకున్నాడు. తన సంకల్పం ఉదాత్తమైనది.. అత్యంత గహనమైనది. తానెంత సమర్ధుడైనా.. అమ్మవారి కరుణాదృక్కులు లేకపోతే తన ప్రయత్నం అపహాస్యం పాలవుతుంది. అందుకే మేల్ పట్టున్ మానకు మమ్మ.. అంటున్నాడు.

ఇకపోతే.. ముందు చెప్పిన వాల్మీకి వ్యాసుల మధ్యలో శరవణ భవుడు ఎందుకు వచ్చాడు అనేది చర్చ.. సుబ్రహ్మణ్య స్వామి కవిగా కాని పురాణకర్తగా కానీ ఎక్కడా చెప్పబడలేదు కదా మరి ఆ వరసలో ఆయనను ఎందుకు చేర్చినట్లు అనేది అనుమానం.

దీనిని చర్చిస్తూ.. మా ఆప్త మిత్రులు, పెద్దలు కీ. శ్రీ సత్యనారాయణ రాజుగారు ఒక మాట చెప్పేవారు. ఒకప్పుడు భారతి మాస పత్రికలో దీనిపై చర్చ జరిగిందని… శరంబునన్ మొలవ అనేది నిజానికి శిరంబునన్ మొలవ అని ఉండాలని కొందరు పండితులు అభిప్రాయ పడ్డారని అయితే ఆ అభిప్రాయాన్ని పలువురు పరిష్కర్తలు, పండితులు ఖండించారని చెప్పేవారు. పుట్టం, బుట్టశిరంబునన్ అనేది కాలక్రమంలో పుట్టంబుట్ట, శరంబునన్ మొలవగా మారిందని చెప్పడం హాస్యాస్పదం అని చెప్పేవారు.

మహాకవి చెప్పిన పాఠాన్ని మార్చడం చాలా అన్యాయమని పెద్దల అభిప్రాయం. కావ్యమనేది పురుషుడని.. ఆ కావ్య పురుషునికి కుమార స్వామికి గాఢమైన మైత్రి ఉన్నదని.. అంతేకాదు.. అతడు గొప్ప రసజ్ఞుడని అందుకే కవికి పురాణ కర్తకు మధ్య కుమార స్వామిని పెట్టాడని మా సత్యనారాయణ రాజు గారి అభిప్రాయం.
పెద్దలు ఈ పద్యాన్ని పరిశీలించి మీ మీ అభిప్రాయాలను జోడింపుల రూపంలో పంచుకుంటే రసజ్ఞులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తూ.. నమస్సులతో..

January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

దార్శనికుడు శ్రీ పీ.వీ. నరసింహారావు

by Dr. Kasarla Rangarao January 15, 2024
written by Dr. Kasarla Rangarao

బాల్యం విద్యాభ్యాసం దత్తత ప్రాథమిక విద్య బంధువుల ఇంట్లో సాగింది తండ్రి చిన్నప్పుడు తనపై కూర్చుండబెట్టుకొని వినిపించిన భారత రామాయణ భాగవతాలు ఆకలింపు చేసుకున్నారు ఏకసంతాగ్రహి సాధారణంగా ప్రశ్నపత్రంలో ఏమైనా ఆరు ప్రశ్నలు యత్నించండి అని ఉంటుంది అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసి ఏమైనా ఆరు సమాధానాలు సరి చూసుకోండి అని వ్రాసేవారట ఏ పరీక్షలోనైనా వారు సర్వప్రదముడిగా వచ్చేవారట.
ఆయన ఉస్మానియా విద్యార్థిగా ఉన్నప్పుడు వందేమాతరం ఉద్యమంలో 300 మంది విద్యార్థులతో 1939 లో పాల్గొన్నారు అప్పటి హైదరాబాద్ నిజాం ప్రభుత్వం వీరందరిని చదువు నుంచి ఉద్యోగ అవకాశాల నుండి భర్తరఫ్ చేసింది అప్పుడు పీవీ గారు నాగపూర్ నుండి బీఎస్సీ ఎల్ఎల్బి పూర్తి చేశారు . ఏఐసిసి సభ్యుడుగా నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని 1948 1948 తెలంగాణ విముక్తి పోరాటానికి తన వంతు దోహదం చేశారు. 1948 నుండి 1952 వరకు శ్రీ పాములపర్తి సదాశివరావు గారితో కలిసి కాకతీయ పత్రిక నడిపారు మంథని ఎమ్మెల్యేగా 1957 నుండి 1977 వరకు రాజకీయ ఎదుగుదల జరిగింది న్యాయ సమాచార శాఖ మంత్రిగా 1962 -64 న్యాయ దేవదాయ శాఖ మంత్రిగా 1964 -67 వైద్య ఆరోగ్య విద్యాశాఖ మంత్రిగా 1967 -71 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా19 71 -73 ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా 1975 -76 తెలుగు అకాడమీ చైర్మన్గా 1968 -74 దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ చైర్మన్గా 1972 నుండి. లోక్సభ సభ్యునిగా హనుమకొండ నుండి 1977- 1984 నుండి 1984 -1989 పబ్లిక్ అకౌంట్స్ కమిటీగా 1978- 79 . ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో విదేశాంగ శాఖ ,గృహ మంత్రి, రక్షణ మంత్రి ,మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఇన్ని శాఖల అనుభవం గడించారు .

1989 -91 మధ్యలో రాజకీయాలనుండి విరమించుకొని తన పుస్తకాలు కంప్యూటర్లు హైదరాబాద్ కు తరలించారు రాజీవ్ గాంధీ హత్య వల్ల శ్రీమతి సోనియా గాంధీ సహకారంతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొమ్మిదవ భారత ప్రధానమంత్రిగా 1991 -1996 పనిచేశారు ఆయన నిర్వహించిన ప్రతి పదవిలో శాఖపై జరగని ముద్ర వేశారు విద్యాసంస్కరణలు న్యాయ దక్షత భూసంస్కరణలు ఇందులో ప్రధానమైనవి . ప్రధానంగా ఆయన భూసంస్కరణల పైగట్టిపట్టు పట్టడంతో భూస్వామ్య వర్గాలు బాహాటంగా తిరుగుబాటు చేశాయి జై ఆంధ్ర ఉద్యమం కేవలం ఒక మిశ,సాకు మాత్రమే. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ విధిలేని పరిస్థితిలో పీవీని తొలగించి రాష్ట్రపతి పాలన విధించారు . ప్రధానమంత్రిగా శ్రీ పివి గారు ఆర్థిక సంస్కరణలు దేశ భవిష్యత్తుపై జరగని ముద్ర వేశాయి ఆర్థిక సంక్షోభంతో దివాలా అందుకు చేరిన దేశాన్ని గట్టెక్కించి ప్రగతి పథంలో అభివృద్ధి పథంలో పట్టాలెక్కించారు .ఆయన తర్వాత 25 ఏళ్లు మరి తర్వాత కూడా ఆర్థిక ప్రగతి రథం ఆయన వేసిన మార్గదర్శనంలోనే నడుస్తుందంటే ఆయన ఎంతటి దార్శనికుడో కూడా అర్థమవుతుంది. ఆయన ఐదేళ్ల పాలన దినదిన గండం నూరేళ్లుగా నడిచింది .ప్రతిపక్ష నాయకుడికి దేశం తరఫున ఐక్యరాజ్యసమితి (శ్రీ వాజపేయి గారికి)బాధ్యతలు ; శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి కార్మిక లేదా శ్రామిక నాణ్యతలు పారిశ్రామిక సంబంధాలు క్యాబినెట్ శాఖ ఇచ్చి వారి సేవలను సంపూర్ణంగా వినియోగించుకున్నారు .
వీరిభార్య పేరు సత్తమ్మ. వీరికి ముగ్గురు కుమారులు అయిదుగురు కుమార్తెలు కలరు వీరికి దాదాపు 17 భాషలు తెలుసు అని ప్రతీతి.చాలామంది పీవీ గారిని అష్టభాష కోవిదురని ప్రశంసిస్తారు .వీరి ఆత్మకథాత్మక నవల ద ఇన్సైడర్ గా వచ్చింది .దీనిని కల్లూరి భాస్కరం గారు “లోపల మనిషి”గా అనువదించారు వీరి జీవిత గమనాన్ని ” హాఫ్ లయన్” పేరుతో వినయ సీతాపతి ఇంగ్లీషులో రచించారు ఇందులో ఆయన జీవితంలోని అన్ని పార్శ్వాలను , వ్యాసంగాలను ఆయన ప్రమాణాలతో సహా నిరూపించారు . ఇందుకు వినయ్ సీతాపతి వారి కుటుంబ సభ్యుల అనుమతితో ఆయన డిజిటల్ డైరీ ని వాడుకున్నారు పివి గారి జీవిత సత్యాలు అన్నింటిని ఆయన ప్రజా బాహుళ్యం ముందుంచారు .ఇది అందరూ చదవదగ్గ పుస్తకం
శ్రీ పివి గారు హిందీ యం.ఏ. సాహిత్య రత్నలో భాగంగా శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలను “సహస్ర ఫణ్ ” పేరుతో హిందీ చేశారు . అలాగే మరాఠీలో హరి నారాయణ ఆప్టే గారి నవల పాన్ లక్షత్ కోన్ ఘటే ను “అబల జీవితం ” గా తెలుగు చేశారు .ఆయన సాహితీ పిపాస జీవితాంతం కొనసాగింది .
ఆయన ముఖ్యమంత్రిగా తీసుకువచ్చిన భూసంస్కరణలు ప్రధానమంత్రిగా తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు చాలా సామాజిక ప్రభావాన్ని ఆర్థిక ప్రగతిని తెచ్చిపెట్టాయి . మానవత్వంతో కూడిన సంస్కరణలు మార్కెట్ ఆధారిత మార్పులు గా చెరగని ముద్ర వేశాయి ఆయన పరిపాలన కాలంలో తీవ్రవాదంతో అట్టుడుకుతున్న పంజాగులో ఎన్నికలు నిర్వహించి చట్టబద్ధ పాలనను గాడిలో పెట్టారు . వి.పీ.సింగ్, చంద్రశేఖర్ హయాంలో దిగజారిన జమ్ము కశ్మీర్ పరిస్థితుల్ని గట్టిగా నియంత్రించి అదుపులోకి తెచ్చి , ఐక్యరాజ్యసమితి మరియు భారత పార్లమెంటు ద్వారా జమ్ముకశ్మీర్ భారత్లో అభిన్న అంగమని ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలుపుకోవడమే మిగిలిందని బలంగా గట్టి సందేశం ఇచ్చారు. ఆయన ప్రధాన ప్రతిపక్షం కూడా ఆయన చూపిన దారిలోనే నడుస్తుండడం విశేషం ఆయన వ్యక్తిత్వ వికాసం లోని ప్రధాన ప్రత్యేక విశేషాలు .

1) ఆయన లోక్సభ సభ్యుడుగా హనుమకొండ ఆంధ్ర ప్రదేశ్ ,రామ్ టెక్ మహారాష్ట్ర, కర్నూలు ఆంధ్ర ప్రదేశ్, బరంపురం ఒరిస్సాల నుండి ప్రతినిధిత్వం వహించారు ఆయన దక్షిణోత్తర భారతం అంటే భారతదేశ ప్రతినిధిత్వం వహించారు .
2) 1983 లో అలీనదేశాల శిఖరాగ్ర సభలో క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రో తో స్పానిష్ లో మాట్లాడి ఆయనను అబ్బుర పరచారు .
3)ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని అత్యంత చాకచక్యంతో పూర్తి కాలం నడిపి సమూల మార్పులు రాగల తీసుకువచ్చే దిశగా దేశాన్ని ఎన్నో అవరోధాల మధ్య నడిపించాడు .
4) అయోధ్య రామ మందిరం వివాదాన్ని రాజ్యాంగబద్ధంగా పరిష్కారానికి విశేషమైన కృషి చేశారు . ఆ పరిస్థితుల్లో ఆ విధంగా నడిపించడం వల్లనే 1979 నుండి 2019 వరకు ప్రతిపక్షానికి పూర్తి మెజారిటీ రాకుండా ఉన్న పరిస్థితి నెలకొంది .
అయోధ్య వివాదానికి పీవీ ని బాధ్యుడిని చేస్తూ ఆ తర్వాత ఆయన సాధించిన విజయాల్ని ఏమాత్రం ప్రస్తావించకుండా సాగిన కాంగ్రెసు పార్టీ మనుగడ ఆత్మహత్యా సదృశ్యంగా మారింది . నిస్పాక్షిక విమర్శకులు సమీక్షకులు భారతదేశానికి పీవీ చేసిన సేవ చూపిన దిశా నిర్దేశం ఇంకా ఏ ప్రధాని వల్ల కూడా కాలేదని తేల్చి చెప్తున్నారంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత పట్టిష్టమైందో లోకానికి తెలియజెప్పినట్ల యింది . ఒక మామూలు గ్రామ కరణం : ఒక రైల్వే క్యాంటీన్లో చాయ్ అమ్మిన వ్యక్తి ఇలా సామాన్య నేపథ్యం కలవారు అసామాన్య కార్యాలు చేసి అతి తక్కువ సమయంలో భారత్ ను అగ్రరాజ్యంగా తీర్చిదిద్దగలరని లోకానికి చాటి చెప్పింది భారత ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ . ధన్యవాదములు

January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

జాతీయ భావ కిరణాల సంపుటి”సవిత”

by Samala Kiran January 14, 2024
written by Samala Kiran

తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వాన్ని ధిక్కరించి వరంగల్లు వేదికగా అంకురించిన కవిత్వం చేతనావర్త కవిత్వం. ఈ చేతనావర్త కవులలో వేనరెడ్డిగా సుప్రసిద్ధులయిన డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి ఒకరు.  ప్రగతివాద కవి మార్క్సిస్టు కానక్కరలేదని, అంతరాత్మ ప్రబోధమే ఉన్నత విలువలకు, ఉత్తమ కవిత్వానికి ప్రేరణ అని నమ్మిన కవులు చేతనావర్తన కవులు. “గతం నాస్తి కాదు అనుభవాల ఆస్తి” అన్న వేనరెడ్డి “సవిత “అను ఈ సంపుటి మొదట 1973లో సాందీపని ప్రచురణల ఆధ్వర్యంలో ముద్రించబడింది. తొలిముద్రణలో “శత సహస్ర ముఖాల సరస కవి” అనే పేరుతో దాశరధి కృష్ణమాచార్యులు ముందుమాట వ్రాశారు. “పరిశీలన” అనే పేరుతో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు వ్యాసం అందించారు. ఇప్పుడు మళ్లీ “సహృదయ” సాహిత్య సాంస్కృతిక సంస్థ రజతోత్సవాల ప్రచురణలో భాగంగా వేన రెడ్డి గారి “సవిత” వచన కవితా సంపుటి 2023లో ఐదవ ముద్రణకు నోచుకుంది . అదృష్టం కొద్దీ 2023 ఆగస్టు 13న ప్రఖ్యాత పద్య కవి శ్రీ గిరిజా మనోహర్ బాబు గారి ద్వారా కరీంనగర్లో నేను అందుకుంటిని. అందినదే తడవుగా ఆద్యంతం కవితా పఠనం పూర్తి చేసి నాలుగు మాటలు చెప్పాలని ఈ సమీక్షకు పూనుకున్నాను. 34 ఏళ్లు మాత్రమే జీవించిన ఈ చేతనావర్తన కవి కాలం పై చెరగని ముద్రని తన రచనలతో వేశాడు. అందుకే వేనరెడ్డి మరణం తట్టుకోలేక తన బాధను “కరిగే వెన్న ముద్ద” పేరుతో కాళోజి రాసిన కవిత సందర్భోచితం. 
“తాపసియై కైతగమారిన రసికుడు/
దారిని తీర్చుచు నడిచిన పథికుడు/ 
వ్యక్తిత్వం కోల్పోని సాంఘికుడు /
ఆయాసము పడనట్టు సాధకుడు/”
అని వేన రెడ్డి వ్యక్తిత్వాన్ని నా గొడవలో చిత్రించారు.
           సవిత అంటే సూర్యుడు. సూర్యుడు వెలుగుకి, వేడికి, విజ్ఞానానికి సంకేతం. వేనరెడ్డి కవిత్వంలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయంటారు 5 వ ముద్రణలో ముందు మాటనందించిన ప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్. వేన రెడ్డి గారిపై తిలక్,శ్రీ శ్రీల ప్రభావం ఉన్నట్లు కొన్ని కవితల ద్వారా మనకు అర్థమవుతుంది. సంపుటిలో 26 కవితలతో పాటు, వేనరెడ్డి తన డైరీలో రాసుకున్న 54 భావ కవితలను ‘రస రేఖలు’గా ఈ సంపుటిలో అందించారు.
         తొలి కవిత “జన్మాష్టమి”లో కవి అనన్య భక్తిని ప్రకటిస్తూనే సమకాలీన సామాజిక పరిస్థితులను విన్నవించుకుంటాడు. 
“గోమాయుల రాజ్యంలో/
గోవులు జీవించలేవు/
మాకు వెన్నలేదు/
మాకు వెన్నెల లేదు”అంటూ “ఈ తమస్సు చీల్చబడుతుంది” కవితలో 
పచ్చని ఎర్రని కామెర్లవాడు/
ప్రజా హృదయమెరుగనివాడు/ప్రజాస్వామ్యానికి తగడు/ఇంటినేదిద్దుకోలేనివాడు/
ఇంటర్నేషనలిస్టు కాలేడు/ అంటూ జాతీయ భావాన్ని తీసిపారేసే వామపక్షులపై విరుచుకుపడ్డాడు. ఈ కవితలోని ఒక్కో పదం, ఒక్కో పాదం ఓ ‘బలమైన ప్రకటన’కి చిరునామా.  “యుద్ధం పూర్తి కాలేదు”అంటూ తల్లి నుదుటి కాశ్మీర కుంకుమ నిండుగాఉండాలి /
హుందాగా అందంగా వెలగాలి/
అని కాశ్మీర సంరక్షణ సందేశం ఆనాడే కవి అందించాడు. ‘చీకటి ఆవులించింది’, ‘సూర్యుని విడిపించాలి’ కవితల్లో కవి సామాన్యుని జీవిత సంఘర్షణలను భావాత్మకంగా చెప్పుకొచ్చారు. ఈ కవితలలో అక్షర సంపద జలపాతంలా ప్రవహించినది అని చెప్పవచ్చు రాత్రి, ధాత్రి, తెట్టే, గుట్ట, భీకరమై, కాకరమై, దూకి, ప్రాకి, త్యాగి, జోగి, మకలు, మెలికలు, ఆకలి కేకలు, కామం,క్షేమం …మొదలగు అనేక పదాలతో చిక్కటి, చక్కటి సాంద్ర కవిత్వాన్ని ఒలికించారు.
         ఆధునిక కవితా ప్రస్థానంలో వినూత్నప్రయోగాల్ని అందించిన విశేష కవి వేన రెడ్డి. “రఫ్ స్కెచ్” అన్న కవితలో 
‘పెద్దలు, గద్దలు తినేసినాక/
తోలూడదీసి వేలాడిన గోమాతల ఉంది దేశం/ఇది నా దేశం రఫ్ స్కెచ్/
అంటూ భారతీయ సామాజిక వ్యవస్థని కళ్ళ ముందు నిలిపాడు కవి. 
దేహంలో జీవం లేదు/
జాతి రక్తంలో శక్తి లేదు/
చేతల్లో చైతన్యం లేదు/అంటూనే 
వారి నుదుట ఎప్పుడు కాషాయారుణ/
ఉషస్సు ఉదయిస్తుందోనని/ కవి ఆశావాద దృక్పథాన్ని వెలిబుచ్చాడు.
            ” కాలాన్ని కత్తిరించి చూడకు” శీర్షికనే ఆలోచనాత్మకం. ఇందులో ‘దేశాన్ని విభజించి భజించరాదు/ అది అఖండ స్వరూపం/’అనడం వెనుక కవి జాతీయ సమగ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ దేశం నీది ఈ బ్రతుకు నీది/
నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవాల/
నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి/ అంటాడు కవి. “ఆకలి ఒక్కటే సత్యం” కవితలో 
‘ఆకలి అంతర్జాతీయమైంది/విశ్వజనీనమైంది’ అనడంలో కవి మానవతా స్థాయిని గుర్తించవచ్చు. ‘పిచ్చి గుండె’లో ధైర్యం నింపుతూ “పిరికిగా చావకు”అంటూ సకల మానవాళికి హితబోధ చేస్తాడు కవి. 
నీ చావు నీ బ్రతుకు నీ ఒక్కడి సొత్తు కాదు/ సంఘపరం/ అంటాడు వేనరెడ్డి. “?-!” శీర్షికతో ఉన్న కవిత పాఠకుడికి వాస్తవంగా ఓ ప్రశ్నార్థకమే?ఓ ఆశ్చర్యార్థకమే! ఓ జీవిత సందేశమే.
          “కవిత్వం నా ఊపిరి”లో కవి వేనరెడ్డి కవిత్వ లక్ష్యాన్ని సూటిగా తెలియచెప్పారు. మనిషి కోసం/ దేశం కోసం/చిందిన రక్త చందనం కవిత/ అంటాడు. సంచలనం కవిత/సమాజ సంఘటనంకవిత అంటాడు కవి.అవును కదా!! వివిధ వాదాలతో సమాజాన్ని విడదీసే కవిత్వం గుట్టలు గుట్టలుగా వస్తున్న నేటి కాలానికి అనువర్తింపదగినది ఈ కవిత పాదం. సమాజ సంఘటనము కవిత కానీ సమాజాన్ని ముక్కలు చేయడం కాదు. “నీ కాళ్ళ మీద నువ్వు” అనే కవితలో దేశ విచ్చిన్నకర శక్తుల మనస్తత్వాన్ని అక్షర అక్షరాన తెలుపుకొచ్చాడు కవి.
కులం పేర, మతం పేర/
భాష పేర, ప్రాంతము పేర/
నిన్ను విభజించి,చించి/
నీ కళ్ళల్లో దుమ్ము చల్లి/
నీ గాయం మీద కారం చల్లి/
లేపుతారు ప్రే/
రేపుతారు నీలో పశువుని/….
ఎంతటి గాడమైన ప్రకటికరణ. ఇంకా ఈ సంపుటిలోని ఒక్కో కవిత ఓ అధ్యాయమే అవుతుంది. ” జాగృతి”, “సంధుక్షణము”, “ప్రాప్యవరాన్నిబోధత” మొదలగునవి ప్రచండ జాతీయతా భావాలని వికసింపజేసే కవితలే. ఇంతటి భావ కిరణాల “సవిత” తాకిడి మీ హృదయాలని తాకాలంటే మీరు ఈ కవితా సంపుటి పఠనంలో మునగాలి. దీనిని మరోసారి ముద్రించి సాహితీ లోకానికి అందించిన సహృదయ వారు సదా అభినందనీయులు.
ప్రతులకు:
సహృదయ
హనుమకొండ
9949013448

January 14, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

చైతన్య దీప్తులు

by Kondapally Neeharini January 14, 2024
written by Kondapally Neeharini

మయూఖ సంపాదకీయం, జనవరి నెల 2024 -డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ సంపాదకులు

కాలం తనతో పాటు మంచి చెడులను తీసుకువస్తూ ఉంటుంది. అంది పుచ్చుకున్న వాళ్లకు అందినంత. రోజులు గడుస్తూ నే ఉంటాయి. క్యాలెండర్ల పేపర్లు తిప్పేస్తూ ఉంటాము. నిత్య జీవన సమరంలో కొన్ని సంతోషాలు కొన్ని దుఃఖాలు భ్రమణం చేస్తూనే ఉంటాయి. 2023

ఇటువంటివే కొన్ని సంఘటనలను మనసు లోతుల్లో పడవేసిపోయింది. సామాజిక అసమానతల ఉద్వేగాలను రగిల్చి పోయింది. కొన్ని అద్భుత ఆవిష్కరణల సందర్భాలను ఇచ్చి పోయింది. మరికొన్ని ఆలోచనాత్మకమైన ధోరణలను అందించిపోయింది. కొత్త సంవత్సరం వచ్చింది, 2024 లో అడుగు పెట్టాము.

విద్య,వైద్యం ఏ పౌరుడికైనా ఎంతో ముఖ్యమైనవి అనే జ్ఞానం ఎప్పుడో మూల మూలన పాకిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా తమ పిల్లల్ని చదివిస్తున్నారు అట్టడుగు శ్రామిక వర్గాలు కూడా ఈ నిజాన్ని గ్రహించాయి. వీళ్ళలో కొందరు ఉన్నత విద్యను అందిపుచ్చుకుంటున్నారు. కొంతమంది చదవలేక, పరీక్షలు రాయలేక కొందరు వెను తిరుగుతున్నారు. కొందరు రాసి ఉత్తీర్ణత సాధించలేక వెను తిరుగుతున్నారు. అయినా కానీ వీళ్ళేమి ధైర్యాన్ని కోల్పోవడం లేదు. పనిచేసుకొని బ్రతకాలి అని ఒక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు.దీనికి కారణం వాళ్ళ ముందు తరం వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు తాతలు, నానమ్మలు అమ్మమ్మలు ఇచ్చిన స్ఫూర్తి. రెండు కాళ్లు రెండు చేతులు ఉన్నాయి ఆలోచించడానికి మెదడుంది ఇంత గొప్ప ప్రపంచాన్ని చూస్తున్నాము, చెడ్డ పనులు చేయకుండా కష్టం చేసుకుని పని చేసుకుని బ్రతికితే తప్పేం లేదు అనే తెలివిడి కి వచ్చి బ్రతుకుతూనే ఉన్నారు.

అయితే, ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకవలసిన అవసరం లేదు ఎవరినీ ఎవరు అవమానపరచడం ఎవరు సహించరు అనే విషయాన్ని గ్రహించారు కాబట్టి గౌరవాన్ని కోరుకుంటున్నారు. గతంలో ఉన్నట్టు తమకంటే తక్కువ ఉన్న వాళ్ళను అవమాన పరిచడం ఇప్పుడు ఉన్నత వర్గాల వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు ఈ అలవాట్లను మానుకుంటున్నారు. అందరినీ సమాన దృష్టితో చూడడం అనే భావాలు ఈ కొత్త తరంలో కనిపిస్తున్నాయి .ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు తాము తమ జీవన విధానాన్ని అనుసరించి ఉన్నట్టే ఉంటున్నారు. బుద్ధి జ్ఞానంలో మేము కాస్త ఎక్కువ అనుకుంటున్న వాళ్ళు ఆ విధంగానే వాళ్ళ జీవన విధానం తో ఉంటున్నారు, కానీ ఎదుటివాళ్ళను కించపరిచి మాట్లాడమనేది చాలా వరకు తగ్గిపోయింది. ఈ మార్పుకు కారణాలేంటి అని ఒకసారి తరిచి చూస్తే ఈ ఉన్నత భావాలు ఇలాగే కొనసాగుతాయి.

సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ

సింహవలోకనం చేయవలసిన అవసరం ఉంది. కుల మతాలకు అతీతంగా కులమత భేదాలను ఖండిస్తూ సమాజాన్ని సమానత్వంతో చూడాలని చెప్పిన మహా మనిషి. ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన ఇక్కడ కూడా ఒక అగ్నిని రగిలించినటువంటి స్త్రీ మూర్తి. నిమ్న జాతులకు అభ్యున్నతికి కృషి చేస్తూ భర్త జ్యోతిరావు పూలే ఆదర్శాన్ని తలకెత్తుకున్నటువంటి మహిళ. కుల వ్యవస్థకు శూద్రుల అసమానతలకు కారణాలను వెతికి సామాజిక బాధ్యతగా పోరాటం చేసినటువంటి విధుషి. పితృస్వామ్య పరిపాలన లో మగ్గుతున్నటువంటి స్త్రీల పక్షాన గళమెత్తిన ఉద్యమకారిణి. ఎప్పుడో 1848లోనే బాలికల కోసం మరీ ముఖ్యంగా తక్కువ కులాల బాలికల కోసం,స్త్రీల కోసం పాఠశాలలను ప్రారంభించిన ధైర్యశాలి. ఆ రోజుల్లో ఉన్న సామాజిక కట్టుబాట్లను ఆధిపత్య ధోరణలను ధిక్కరించి ఉపాధ్యాయురాలిగా తనను తాను నిరూపించుకున్నటువంటి సావిత్రిబాయి పూలే ఈ ఆధునిక భారత దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అని కీర్తినందుకున్నారు. మొదటి బడిని స్థాపించిన కొన్ని ఏళ్లలోనే దాదాపు 20 బడులను ప్రారంభించి ఉచితంగా విద్యను అందించే ఉద్యమానికి ఆద్యులయ్యారు. ఆ రోజుల్లో ఒక 18 ఏళ్ల యువతి ఇంతటి సాహసానికి పూనుకోవడం అనేది ఎంతో గొప్ప మాట.

సామాజిక సమస్యలను గురించి, మానవ హక్కులను గురించి స్త్రీలకు తెలియజేస్తూ వాళ్ళని చైతన్యపరచడంలో భాగంగా మహిళా సేవ మండల్ అనే ఒక సంఘాన్ని కూడా స్థాపించింది సావిత్రి బాయి. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు” అని చెప్పిన మాటలను వినడమే కానీ ఆచరణ శూన్యము అని గ్రహించి, “మహిళా హక్కులే మానవ హక్కులు” అని శూన్యము గ్రహించి, “మహిళా హక్కులే మానవ హక్కులు” అని నినదించిన సావిత్రిబాయి పూలే పితృస్వామ్య వ్యవస్థను ఖండించి, బాల్య వివహాలను చేయకూడదని, వితంతువులకు పునర్వివాహాలు చేయవచ్చునని, మూఢనమ్మకాలకు వదలాలని, సతీసహగమనాన్ని వ్యతిరేకించాలని పెద్ద పోరాటాలనే చేశారు. ఎన్ని వేధింపులు ఎదురైనా భయపడలేదు, ఎదురీదారు. వితంతువులకు శిరోముండనం అంటే, తలవెంట్రుకలు తీసి, గుండు చేయడం అనే దుశ్చర్యను ఖండించి క్షురకులకు చెప్పి “వితంతువులకు శిరోముండనం చేయుము” అని వాళ్లచేత చెప్పించి, సమ్మె కూడా చేయించారు. ఇది పద్దెనిమిది వందల అరవైలలోని మాట! జ్యోతిరావు ఫూలే ప్రారంభించిన సత్యశోధక్ మండలి ద్వారా మహిళా విభాగం నిర్వహించిన సావిత్రి బాయి ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చారు. తన భర్త ఫూలే మరణించిన తర్వాత ఆయన చితికి సావిత్రి బాయి నిప్పు పెట్టి కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చిన సంస్కర్త. భర్త సంఘ సంస్కరణలను తన భుజాలపై వేసుకున్న ధీశాలి. 1897లో పూణే నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆ వ్యాధిగ్రస్తులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. జోలె పట్టుకొని విరాళాలు సేకరించి, ఆ వచ్చిన మొత్తంతో వైద్యశిబిరాలను నిర్వహించి, సేవా కార్యక్రమాలను చేసిన సావిత్రి బాయి పూలే చివరకు ఆ ప్లేగు వ్యాధివలననే మరణించారు. ఆమె మరణించిన 100 ఏళ్లకు అంటే 1997లో భారత ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. ‘సావిత్రి బాయి పూలే’ Savitri bai phule’ పేరుతో 200 రూపాయల విలువ చేసే తపాలా బిళ్లను 1998లో విడుదల చేసి గౌరవించింది. అంతేకాదు పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రి బాయి విశ్వవిద్యాలయం అని పేరును పెట్టడం కూడా ఒక గొప్ప నిర్ణయం.

ఇంతటితో అయిపోయిందా? సావిత్రిబాయి పూలే ఆదర్శాలు నిజంగా ఆచరింపబడుతున్నాయా?  ఆచరింపబడితే ఎంతవరకు,  ఎలా? అనేది ప్రతి ఒక్కళ్లు వాళ్ల మనసుల్లో ప్రశ్నలు వేసుకున్నట్లయితే ఒక ‘విజన్’ ఏర్పడుతుంది.

శతాబ్దం గడిచిపోయిన స్త్రీల జీవితాలలో రావాల్సిన అంత మార్పులు రాలేదనేది సత్యదూరం కాదు. ఇంకా ఇంకా అణచివేత అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో పురుషాధిక్య ప్రపంచంలో మగ్గుతున్నటువంటి స్త్రీల పక్షాన గొంతెత్తుతున్న స్వరాలకు సావిత్రిబాయి పూలే పేరు కొండంత బలాన్ని ఇస్తుంది. ఏం కారణం ఇంకా ఈ 2024లో అడుగుపెట్టినా కూడా మార్పులు ఏవీ రాకుండా సమాజం చెలరేగుతూ ఉంటే అర్థం ఏముంది? ఒకవైపు  బడుగు బలహీనవర్గాల వారిని అవమానపరచడమైతే ఏంటి? అదే బడుగు బలహీనవర్గాల కుటుంబాలలో స్త్రీలు ఇంకా పురుషాధిక్యంలో మగ్గి పోవడమైతేనేమి ఎలా చూడాలి అర్థం కాని స్థితి. ఉన్నత వర్గాలనుకునే వాళ్లు, బాగా చదువుకున్నవాళ్లు అని చెప్పబడే వాళ్లు, ధనవంతులు, గొప్ప కులం అనుకునేవాళ్లు అంటూ ఎన్ని రకాల పేర్లు ఉన్న వాళ్ల ఇళ్లల్లోనూ ఆడవాళ్లని అదిమిపెట్టి చులకనగా చూడడం అనేది తగ్గు ముఖం పట్టని ఘోరం. ఇది ఏ దారులను ఏర్పరుస్తుంది?

“కెరత్ నహీ, రోజ్ గార్ చాహియే”. దానమిచ్చే సొమ్ము వద్దు ఉపాధి ఇవ్వండి” అని గొంతెత్తి అరవాల్సిన అవసరం స్త్రీలకు ఇంకా ఎందుకు ఉంది? ఆడవాళ్లకే కాదు అణగారిన వర్గాల మగవాళ్లకి ఈ కష్టం ఏమొచ్చింది, ఎందుకు వచ్చంది? సమాజంలోని ఒడిదొడుకులను ప్రశ్నించిన సావిత్రిబాయి పూలే 1854లోనే ‘కావ్యఫూలే’ అనే పుస్తకాన్ని ప్రకటించిన కవయిత్రి. ప్రకృతి పరంగానైనా, భగవంతుని సృష్టిపరంగా నైనా మనుషులంతా సమానమే. మగ జాతి విభేదాలు శారీరక నిర్మాణంలోనే గాని మానసిక భావనలో తేడాలు ఎందుకు ఉండాలి? అనే ప్రశ్న వేధించిన కవయిత్రిగా తమ కలాన్ని ఎత్తారు. మనుషుల మధ్య అసమానతలను ఖండించారు. పావన కాశీ శుభోదయం అనే పుస్తకము, గొప్ప వక్త అయిన సావిత్రి బాయి ఫూలే ఉపన్యాసాలు వ్యాసాలుగా ప్రచురించిన పుస్తకము వెలువడించారు.  ఆ ఆధిపత్య రోజులలో కుల వ్యవస్థను ఖండించి, శూద్రులకు సమానత్వాన్ని ఇవ్వాలని ఎలుగెత్తిన విప్లవ వనిత! వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, సమాజోద్ధరణకు నడుం బిగించిన వ్యక్తిత్వం గల సావిత్రిబాయి ఫూలెకు నివాళులర్పిస్తూ, ఆమె ఆశయాలను పాటించే దిశలో అడుగులు వేద్దాం. కష్టపడి పనిచేసే వాళ్లకు చేయూతనిద్దాం, విద్యా విజ్ఞానాలు అందిపుచ్చుకునే ఆసరాలవుదాం. ఎవరి ఆత్మ అభిమానాన్ని కించపరచకుండా సమానత్వాన్ని చాటుదాం. కాలం తిప్పే ప్రతి పుటలో మన కోసం కొన్ని అక్షరాలను రాసుకుందాం.

January 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us