మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

తరగని ప్రశ్న!

by Ramesh September 15, 2023
written by Ramesh

వర్షాన్ని,భూతల్లిని నమ్ముకుంటాడు రైతు
సాలుసాలంతా స్వేదం చిందించి కష్టించి
పంటను గిట్టుబాటుధరకుఅమ్ముకున్నప్పుడు
కళ్లల్లో ఆనందాల అరోరాకాంతులు
భూమంతా సంతోషమే గుండెల్నిండా
మనసు దూదిపింజంలా తేలిపోతుంది ఆ క్షణం

అక్కడ ప్రాజెక్టు మంజూరు కాకముందు
ఏలోటులేని మహారాజు అతడు
మాలకు దారం
మమతలకు మనిషే ఆధారం
ఆరుగాలం దుక్కిదున్నే హాలికుడికి
మరిభూమేకదా బంగారం
ప్రాజెక్ట్ పనుల ప్రకటన
సర్వేలు,నిర్థారణలు
నష్టపరిహారాల వెల్లువ
ఏండ్లకేండ్లు వ్యవసాయం చేస్తున్నా
పట్టాపాసుబుక్కుల్లేని రైతే
ఏ హక్కుల్లేని నేరస్తుడు ఇప్పుడు?
జవాబులు లేని ప్రశ్న అతడు?
కుటుంబానికి ఏమని చేస్తాడతడు వాగ్దానం ?
పట్టాకాగీతాలులేని రైతులంటే శీతకన్నే

వాస్తవాలకు దూరమైన జి.వోలు
దయలేని అధికారులు
కంటితుడుపుగా కొంతమొత్తం విదిలిస్తే ఏంలాభం?
అతడు కన్నకలలన్నీ
తటాకంలో గాలిగీసేఅలలై తీరంలోకనుమరగయ్యాయి
పట్టాభూమిగల రైతు నగదుకునగదు,భూమికిభూమి పొంది
నాగలిపట్టి దర్జగా దున్ని ఏటికేడుప్రగతిపల్లవందుకోవడం
ఆవశ్యకమైన దేశాభివృద్ధి దేశప్రజలందరికీ శుభసూకమే
పట్టాదస్తావేజులులేని నిర్వాసితుడు మాత్రం
భూమితోబాటుప్రాజెక్టు నీళ్లల్ల నిండామునిగి
ఏకాకి బాధాజీవి కావడమే విషాదగీతం
ఉన్నట్టు ఉండి అతను దున్నే భూమి ఎలా అదృశ్యం అవుతుందో?
ఎందుకు అంతర్థానం అవుతుందో?
అర్థంకాదు…ఎటూ పాలుపోదు… అతనికి
భూమిలేనితనం
కర్షకుడికి భరించరాని విలువల్లేని ఒంటరితనపు బతుకువేదనే ఈ లోకంలో
ఆశలన్నీ పక్షులై తిరిగిరాని దూరాలకుఎగిసిపోయిన ఆకాశం అతడు
ఎంతగా ఎదురుచూసినా ఏమి ప్రయోజనం?అంతా శూన్యం?
చివరికి అప్పులు అతని ఆస్తులు
బతుకు తిప్పలైన జీవితం అతడు
ఒక్కోసారి ప్రాజెక్ట్ అంటే
లోతట్టుభూముల్ని
పట్టాలేని భూరైతుల్ని
గల్లంతుచేస్తున్న సముద్రజలం
జీవితాలు జీవితాలే తలక్రిందులు చేస్తున్నభూస్థలం బహుశా
వంశపారంపర్యమైన భూమికి
పట్టాచేసుకోకపోవడం అజ్ఞానమో,పేదరికమో, నిర్లక్ష్యమో,జడత్వధర్మమో
దేశంలోవెసులుబాటు చట్టాలు ఇంకనూ లేకపోవడం తలపోసే అంశం
అదిగో నైరుతిఋతుపవనాల ఆగమనం
ఆగని కుండపోతవానల ఏకశృతి గానం
జలాశయాలు అన్నీ నిండుకుండలే!.
భూమిని,భుక్తిని కోల్పోయిన రైతులకేది న్యాయం?.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చెరగని గురుతు

by Aruna Dhulipala September 15, 2023
written by Aruna Dhulipala

ఉక్కిరిబిక్కిరి ఆలోచనలు
సంబంధం లేని గజిబిజి వలగా
మనసును చిందరవందర చేస్తూ…..
మొదలెక్కడో? కొన ఏమిటో..?
వాటన్నింటిని అప్పగించా
కలానికి కళ్ళుగా….

భావాలన్నీ రూపాలుగా
చిత్రవిన్యాస చేతనలుగా
హరివిల్లు రంగుల పొదలై
అక్షరాలుగా సాగుతూ
ముడులన్నీ విడిపోతూ
ఒదుగుతున్నాయి పేజీలపై..

మట్టిని తాకుతూనో
గాలిని వేలితో చుడుతూనో
మబ్బులో చినుకులా కరుగుతూనో
పక్షములు కట్టుకొని
ఆకాశనావలో తిరుగుతూనో
ముత్యపు చిప్పలా
కడలి లోతులు చూస్తూనో
ప్రవహిస్తుంటా అక్షరంగా..

అంతేనా……..
ప్రశ్నించే తత్వానికి
ఎలుగెత్తే గళానికి
పోరాటానికి, ఆరాటానికి మధ్య
జీవించే వర్తమానంలో
సిరాగా వర్షిస్తుంటా…
చరితకు మిగిలే గురుతుగా..

September 15, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

బిడ్డా…. గిట్లుంటది..!

by Madarapu Vanisri September 15, 2023
written by Madarapu Vanisri

ఏంది బిడ్డా../
నీకు ఇంకా తెల్వదా
మన తెలుగు భాష/
తెలంగాణ యాస/
ఎంత కమ్మగుంటదో../

నేనిదివరకే సెప్పిన ఎట్లుంటదో/
ఐనా మల్ల ఒకసారి చెప్తా../
ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా /
మన భాష..యాస కమ్మగనే ఉంటది.. /

మన భాషలో రాత్తాంటే
చద్దన్నం లో పచ్చడేసుకొని/
నంజుకున్నట్టు రంజుగుంటది../

జర్రున పారే యేరు లాగా/
సొగసుగుంటది..

యింటాంటే..
ఉగ్గు పాలకన్న కమ్మగుంటది../

బతుకమ్మ పాటలా/
యినసొంపుగుంటది../

అమ్మ జోల పాట లా/
హాయిగుంటది../

పసిబిడ్డ నవ్వులా/
స్వచ్ఛంగుంటది../

ఆడబిడ్డల ప్రేమ లా/
ఆప్యాయంగా ఉంటది../

ఏడికి పోయినా మన భాషకు/
దండం పెట్టేటట్టు గొప్పగా ఉంటది../

భారతీయ సంస్కృతి లా/
ఆదర్శంగా ఉంటది../

ఇంతకన్న సంబరంగా /
ఇంకేం ఉంటది../

దండాలు .. తెలుగుతల్లీ/
తెలంగాణ తల్లీ/
నీకు దండాలు../

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గోమఠేశ్వరుని మహామస్తకాభిషేకం

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) September 15, 2023
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

చారిత్రాత్మకమైన పరిశోధనా వ్యాసం :
చారిత్రాత్మకమైన బాహుబలి : చాముండరాయుని చరిత్ర : హసన్పర్తి జిల్లా : కర్ణాటక రాష్ట్రం :

పన్నెండు సంవత్సరాల కొక పర్యాయం ఒక నిర్ణీతమైన రోజున, మంగళప్రదమైన శుభసమయంలో బాహుబలి (గోమఠేశ్వరుని) మహామస్తకాభిషేకం దక్షిణ భారతంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శ్రావణబెళగోళలో జరుగుతుంది. బాహుబలి యొక్క బూడిదరంగు నల్లరాతి విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద నిలువెత్తు విగ్రహం. భయభక్తులను ప్రేరేపించే ఈ 1012. ఏళ్ళ విగ్రహం దిగంబర జైనులకు ప్రధాన యాత్రా కేంద్రమైన ఇంద్రగిరి కొండపై ఎండకు, వానకూ తల వొగ్గి నిల్చి ఉన్నది. తొలి మహామస్తకాభిషేకం 1398 ఏ.డి. లో జరిగినట్లు నమోదయింది.

శ్రావణబెళగొళ బెంగుళూరుకు దాదాపు 160 కి.మీ.ల దూరంలోనూ, మైసూరుకు 100 కి.మీ.ల దూరంలోనూ ఉన్నది. చక్కని కంకర రాతి రోడ్లపై ప్రయాణించి పర్యాటకులు కార్లు, బస్సుల ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు.

కన్నడ భాషలో ‘బెళగుళం’ అంటే ‘తెల్లని కొలను’ అని అర్ధం. పట్టణం మధ్యలో ఉన్న పవిత్ర సరస్సును ఇది సూచిస్తుంది. గొప్ప యోగిపుంగవుడైన శ్రావణుడు ఇక్కడ నివసించేవాడు. కనుక ఈ రెండు పేర్లు కలిసి ఈ ప్రదేశం ‘శ్రావణబెళగుళం’ అయింది.

సమమైన మైదాన భూమిపై ప్రభవించిన రెండు పర్వతాలు ఇంద్రగిరి, చంద్రగిరి ఈ పట్టణంలో ఉన్నాయి. కటాక్షించే పొడుగైన బాహుబలి విగ్రహం ఇంద్రగిరి పర్వత శిఖరంపైన నిల్చి ఉంటుంది. ఈ కొండ యొక్క రాతి ఉపరి భాగాన్ని 500 మెట్లుగా చెక్కి, అనేక కమానుల ద్వారా 470 అడుగుల ఎత్తుగల శిఖర భాగానికి చేరి విగ్రహ పాద స్పర్శ చేసేందుకు వీలు కల్పించారు.

1962 ఎ.డి.లో ఈ విగ్రహస్థాపన జరిగినట్లు విశ్వసించబడుతున్నది. స్థానిక గాంగ ప్రధాన నాయకుడు, రాచమళ్ళ ముఖమంత్రి అయిన చాముండే, రాయని ఆజ్ఞప్రకారం ఒక ఏకశిల దీన్ని కొండపై చెక్కారు. తాజా కొలతల ప్రకారం బాహుబలి ఎత్తు 58.6 అడుగులు. బ్రహ్మాండమైన పాదాలు పొడవు 8 అడుగుల అంగుళాలు కాలివ్రేళ్ళు 2 అడుగుల 9 అంగుళాలు. బాహుబలి వదన మండలంలో ప్రసరిస్తున్న కరుణ, దయావైఖరి ఎవరినైనా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

అయోధ్య పాలకుడైన రిషభుని కుమారులలో బాహుబలి ఒకడు. అతడు, అతని అగ్రజుడు భరతుడు రాజ్యాధికారం కోసం పోరాటం జరుపుకున్నారు. ఈ యుద్ధంలో గెలుపు సాధించిన ‘బాహుబలి రాజ్యాన్ని సోదరుడు భరతునికి అప్పగించి, తపస్సు చేసుకునేందుకు అరణ్యాలకు వెళ్ళాడు.
బాహుబలి మహత్తరమైన నైతిక శక్తి మరియు సదాచారం కల వ్యక్తి అతని సోదరుడు భరతుడు అతని విగ్రహం నెలకొల్పాడు. కాని అది కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరువాతి సంవత్సరాలలో చాముండరాయడనే వ్యక్తి ఈ కథ విని ఆ స్థలాన్ని గుర్తించలేకపోయాడు. అప్పుడు అతడు చంద్రగిరి కొండ పైనుండి ఒక బాణాన్ని విడిచిపెట్టాడు. అది ఇంద్రగిరి కొండపైన బాహుబలిని ప్రతిబింబిస్తున్న ఒక రాతికి తగిలింది.

ఆ రాతిని చెక్కి తక్షణం బాహుబలి విగ్రహాన్ని తయారు చేయమని అతడు తన శిల్పులను, ఆజ్ఞాపించాడు. వారు కొండపై నుండి పని ప్రారంభించారు. మోకాళ్ళ వరకు వచ్చేసరికి విగ్రహం పూర్తిచేసేందుకు శిల (రాయి) చాలలేదు. లభ్యమైనంతలోనే విగ్రహం పూర్తిచేసేందుకు — కాళ్ళను చెక్కవలసి వచ్చింది. అందువల్లనే మోకాళ్ళ క్రింద నుండి విగ్రహం సరైన పాళ్ళు నిష్పత్తిలో ఉండదు.

మహామస్తకాభిషేక ఉత్సవ సమయంలో బ్రహ్మాండమైన సరంజాలు విగ్రహం చుట్టూ ఒక వేదికపై 108 మంది పూజారులు నిలబడి వివిధ లోహాలతో చేసిన 1008 పవిత్ర జలాన్ని బాహుబలి మస్తకంపై ప్రోక్షించి అభిషేకిస్తారు. దీని తరువాత పాలు, పుష్పాలు, బంగారం, వెండి, దళాలు, సింధూరం, చందనం మరియు నవరత్నాలతో విగ్రహన్ని మంత్రోచ్చారణల మధ్య మత నియమానుసారం అభిషేకిస్తారు

జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైన మతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాతి కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు.

బాహుబలి జననం:

కథలను బట్టి బాహుబలి చరిత్రను తెలుసుకోవచ్చు. జైనమతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరుగడించిన రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్తులు విశ్వసిస్తున్నారు. సునందాదేవి, యశస్వతీ దేవి (సుమంగళీదేవి అని కొందరు ఉదహరిస్తున్నారు) అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. సుమంగళకు 99 మంది కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. కుమారుల్లో పెద్దవాడి పేరు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారు.విష్ణుపురాణం భరతుడు, బాహుబలి ఇద్దరే రిషభదేవుని కుమారులని చెబుతోంది. భరతుడు గొప్ప వీరునిగాను, రాజనీతి కోవిదుడుగానూ తయారయ్యాడు. బాహుబలి చాలా పొడగరి. మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా తయారయ్యాడు. అతడి భుజబలం అమోఘమయింది. బ్రహ్మి సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె పేరు మీదే అప్పట్లో ‘బ్రాహ్మీ’ లిపిని రిషభదేవుడు కనిపెట్టాడంటారు. అశోకుని కాలంలో దొరికిన తొలి శాసనాలు అత్యధికం బ్రాహ్మీ లిపిలోనే ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. సుందరి గణితంలో దిట్టయింది. వృషభదేవుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు.

ఒకరోజు రాజ నర్తకి అయిన ‘ నీరాంజన ‘ నిండుకొలువులో ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ హఠాత్తుగా కిందపడి మరణిస్తుంది. ఈ మృతితో ‘జీవితం క్షణభంగురం’ అని అర్థమైన ఋషభనాథుడు విరక్తుడవుతాడు. తన రాజ్యంలోని అయోధ్యకు భరతుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి, పోదనపురానికి రాజుగా బాహుబలిని ప్రకటించి- తాను సర్వసంగపరిత్యాగిగా మారి జనారణ్యంలోకి వెళ్లిపోతాడు. తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచిపెట్టాడు. తరువాత సన్యాస దీక్ష తీసుకుని వస్త్రభూషణాదులను త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. అనేక ఏళ్ళ తపస్సు అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయింది. దీన్నే ‘జినత్వం’ పొందడం అంటారు. తాను తెలుసుకున్న సత్యాలను దేశాటన చేస్తూ ప్రజలకు తెలియ చేశాడు రిషభుడు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది. అనేకమంది రాజులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు రిషభుని మతాన్ని స్వీకరించారు.

బాహుబలి జైనులలో చాలా గౌరవనీయమైన వ్యక్తి, రిషబదేవ (జైనమతం యొక్క మొదటి తీర్థంకరుడు) కుమారుడు మరియు భరత చక్రవర్తిన్ సోదరుడు. అతను నిలబడి ఉన్న భంగిమలో కయోత్సర్గ , 12 సంవత్సరాలు కదలకుండా ధ్యానం చేశాడని మరియు ఈ సమయంలో, అతని కాళ్ళ చుట్టూ ఎక్కే మొక్కలు పెరిగాయని చెబుతారు. తన 12 సంవత్సరాల ధ్యానం తరువాత, బాహుబలి సర్వజ్ఞతను (కేవల జ్ఞాన) పొందాడని చెబుతారు.

భరతుడు బాహుబలి ల యుద్ధం :

భరతుడు బాహుబలి ఇద్దరూ బలశాలురే, ఇద్దరి బలబలాలు బలమైనవే కాబట్టి, ఈ యుద్ధంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు మంత్రులు ఒక ఒప్పందం చేశారు. యుద్ధ రంగంలో పోరుకు సిద్ధమైన అన్నదమ్ముల దగ్గరకు వచ్చి తమ ఒక ప్రతిపాదన వారి ముందుంచారు. ఇరు సైన్యాలు తలపడితే అపార ప్రాణ నష్టం జరుగుతుందని కాబట్టి సైన్యాలను యుద్ధములో దించకుండా అన్నదమ్ములు ఇద్దరే యుద్ధము చేయాలని ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతే వారి రాజ్యం గెలిచిన వారికి ఇచ్చివెయ్యాలనేది మంత్రుల ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ సమ్మతించారు. వీరిద్దరి మధ్య దృష్టి యుద్ధం,జల యుద్ధం, మల్ల యుద్ధం, అనే మూడు రకాల యుద్ధాలు జరగాలని మంత్రులు నిర్ణయించారు. అయితే ఎవ్వరూ ఆయుధాలు ప్రయోగించరాదని షరతు విధించారు. ఆయుధాలు లేకుండా పోరాడి విజయం సాధించిన సమరం మానవ చరిత్రలో ఇదే మొదటిది. అందుకే దీన్ని “నిశస్త్రీయేకరణ” అన్నారు. దీన్నే ఈరోజుల్లో మనం నిరాయుధీకరణగా అంటున్నాం.

ముందుగా యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం నియమం ప్రకారం ఒకరి కళ్ళల్లోకి ఒకరు తీక్షణంగా చూస్తూ ఉండాలి కల్లార్పకూడదు ఎవరు ముందు కళ్ళు ఆర్పుతారో వారు ఓడిపోయినట్లు లెక్క, బాహుబలి తన అన్న భరతుని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తున్నాడు. అతడిలో ఏవేవో ఆలోచనలు చెలరేగుతున్నాయి చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న ఈ కళ్ళలోకి క్రోధగ్నులని ఎలా విరజిమ్మడం… అనుకుంటూ ప్రసన్న వదనంతో అన్నగారి కళ్ళల్లోకి చూస్తున్నాడు బాహుబలి. భరతుని పరిస్థితి అలాగే ఉంది. తమ్ముడు ముఖంలో కనిపిస్తున్న ప్రేమ మమకార వాత్సల్యాలకు తనలో ఉన్న కోపాన్ని మరిచిపోయి ప్రశాంత చిత్తుడై కళ్ళు మూసుకున్నాడు. అయితే భరతుడు దృష్టి యుద్ధంలో ఓడిపోయినట్లు మధ్యవర్తులు ప్రకటించారు. కళ్ళు మూసి తెరిచే లోపల ఓటమి పాలవ్వడంతో భరతుడు నివ్వెర పోయాడు. రెండవ జల యుద్ధం ప్రారంభమైంది నదిలో దిగి ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకోవడం మీ యుద్ధం ప్రత్యేకత. యుద్ధం ప్రారంభమైన కొంతసేపటికి భరతుడు అలసిపోయాడు ఈసారి కూడా అమేయ భుజబల సంపన్నుడైన బాహుబలి నే విజయం వరించింది. రెండు యుద్ధాల్లో ఓడిపోయిన భరతుడు మల్ల యుద్ధంలోనైనా గెలవాలని గట్టిగానిశ్చయించుకున్నాడు ఆ యుద్ధమూ ప్రారంభమైంది. ముందుగా భరతుడు బాహుబలి పై పిడిగుద్దులు కురిపించాడు. రెండో గుద్దుకే బాహుబలి కింద పడిపోయాడు. తమ్ముడు కింద పడిపోవడంతో కంగారుపడ్డాడు భరతుడు. తమ్ముడు మరణిస్తున్నాడేమోనని బాధపడ్డాడు. ఇంతలో ఎప్పరెల్లి పైకి లేచాడు బాహుబలి ఇప్పుడు గుద్దే వంతు అతడిదే. అన్నను రెండు చేతులతో పైకి లేపి గిరగిరా తిప్పి జాగ్రత్తగా కిందికి దించాడు. గట్టిగా గుద్దడానికి చెయ్యి పైకి లేపాడు ఈ దెబ్బతో భరతుడు చనిపోవడం ఖాయమని అక్కడ చేరిన వారందరూ అహంకారాలు చేశారు. భరతుడు కూడా ప్రాణభయంతో పనికి పోయాడు ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆయుధాన్ని వాడ రాదని నియమాన్ని పక్కనపెట్టి తన చక్ర రత్న ఆయుధాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు కానీ అది పనిచేయలేదని జైనా గ్రంథాలు చెబుతున్నాయి నియమా విరుద్ధంగా ఆయుధాన్ని ప్రయోగించాడని కోపముతో బాహుబలి అన్నను గుద్దడానికి పిడికిలి ఎత్తాడు. చెయ్యి ఎత్తిన వెంటనే అతడి మనసులో రకరకాల ఆలోచనలు చెలరేగాయి నేనేం చేస్తున్నాను నా తండ్రి తృణప్రాయంగా భావించి త్యధించిన రాజ్యాధికారం కోసమా ? తోబుట్టువులను చంపబోతున్నాను. తుచ్చమైన ఈ రాజ్య భోగభాగ్యాలు వద్దు తండ్రిగారు , తమ్ముళ్ళలాగే నేను సన్యాసం స్వీకరించి శాశ్వతానందాన్ని విశ్వప్రేమను పొందుతాను… ఇలా సాగింది బాహుబలి ఆలోచన అంతే తనను క్షమించమని అన్న భరతుని కోరాడు. తన రాజ్య భాగాన్ని కూడా అన్నగారికి ఇస్తున్నట్లు ప్రకటించాడు అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటున్నట్లు చెప్పి ఆభరణాలు దుస్తులను తొలగించుకొని వెంట్రుకలను చేత్తో పీక్కున్నాడు. జైనా మతంలో దీక్ష తీసుకున్న వారు వెంట్రుకలను పీకడం ద్వారా తొలగించడం ఇప్పటికీ చూడవచ్చు. భరతుడు ఎంత వారిస్తున్న వినకుండా బాహుబలి దీక్ష తీసుకున్నాడు.

జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైన మతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాతి కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు.

బాహుబలి జైనులలో చాలా గౌరవనీయమైన వ్యక్తి, రిషబదేవ (జైనమతం యొక్క మొదటి తీర్థంకరుడు) కుమారుడు మరియు భరత చక్రవర్తిన్ సోదరుడు. అతను నిలబడి ఉన్న భంగిమలో కయోత్సర్గ , 12 సంవత్సరాలు కదలకుండా ధ్యానం చేశాడని మరియు ఈ సమయంలో, అతని కాళ్ళ చుట్టూ ఎక్కే మొక్కలు పెరిగాయని చెబుతారు. తన 12 సంవత్సరాల ధ్యానం తరువాత, బాహుబలి సర్వజ్ఞతను (కేవల జ్ఞాన) పొందాడని చెబుతారు.

కర్కల

కర్కాలా దాని 42 అడుగుల (13 మీ) ఏకశిలా గోమటేశ్వర బాహుబలి విగ్రహానికి ప్రసిద్ధి చెందింది, ఇది దాదాపు 1432లో నిర్మించబడిందని మరియు రాష్ట్రంలో రెండవ ఎత్తైన విగ్రహం అని నమ్ముతారు.ఈ విగ్రహం రాతి కొండపై ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఇది 1432 ఫిబ్రవరి 13న విజయనగర పాలకుని సామంతుడైన భైర అరసా వంశానికి చెందిన వీర పాం భైర అరస వడయార్ చేత ప్రతిష్ఠించబడింది.

బెంగళూరు నుండి 158 కి.మీ. అంటే 98 మైళ్ళు దూరంలో ఉన్న శ్రావణబెళగొళలో బాహుబలి యొక్క ఏకశిలా

విగ్రహం ఒక గ్రానైట్ బ్లాక్ నుండి చెక్కబడింది. ఈ విగ్రహాన్ని గంగా రాజవంశ మంత్రి మరియు సేనాధిపతి చావుందరాయలు నియమించారు; ఇది 574001 (17 m) పొడవు మరియు కర్ణాటకలోని హసన్ జిల్లాలో శ్రావణబెళగొళలో ఒక కొండ పైన ఉంది. ఇది 981 CE లో మరియు దాని చుట్టూ నిర్మించబడింది మరియు ఇది ప్రపంచంలోని అతిపెద్ద స్వేచ్ఛా విగ్రహాలలో ఒకటి. విగ్రహం 25 కిలోమీటర్ల అంటే 16 మైళ్ళు దూరం నుండి కనిపిస్తుంది. శ్రావణబెళగోళ జైనులకు తీర్థయాత్ర ( తీర్థం) కేంద్రంగా ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహానికి స్నానం చేస్తారు మరియు ఈ కార్యక్రమం ఇలా జరుపుకుంటారు మహామస్తకాభిషేకం.

శ్రావణబెళగొళ ఊరిపేరు వెనకున్న కథ

‘శ్రావణ బెళగొళకు’ ఆ పేరు రావటానికి వెనుక ఓ చక్కటి కథ ప్రచారంలో ఉంది. ‘బెజ్’ అనే కన్నడ పదానికి ‘తెల్ల తామరలు’ అని అర్థం. ‘గౌళ’ అంటే కొలను. ‘తెల్లని’ తామరపువ్వులతో నిండిన చక్కని కొలను’ ఆ ఊళ్లో ఉంది కాబట్టి దానిని ‘బెళగొళ అన్నారు. ఈ ఊరు చుట్టుప్రక్కల ‘హళె బెళగొళ’, ‘వీడి బెళగొళ’ అనే ఊళ్లు ఉండటం వల్ల కూడా దీనికి ‘బెళగొళ అనే పేరు స్థిరపడిపోయింది. జైన భక్తులైన ‘శ్రవణులు’ ఈ ఊళ్లో ఎక్కువగా ఉండటంవల్ల ‘శ్రవణ’ అనే పదాన్ని ముందు చేర్చుకుని ఈ ఊరు ‘శ్రావణ బెళగొళ అయ్యింది అంటారు. తెల్లతామరలతో నిండిన చక్కని పుష్కరిణే కాక- ‘ఇంద్రగిరి, చంద్రగిరి’ అనే రెండు అందమైన కొండలు కూడా ఈ ఊళ్లో ఉన్నాయి. ఇంద్రగిరినే ‘పెద్దమల’ అనీ, చంద్రగిరిని ‘చిన్నమల’ అనికూడా అంటారు.

శ్రావణ బెళగొళకు వాయవ్య దిక్కున ఉన్న చంద్రగిరి కొండకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. 200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండమీదకు వెళ్లాలంటే 240 మెట్లెక్కి వెళ్లాలి. అశోక చక్రవర్తి తాతగారైన ‘చంద్రగుప్త మౌర్యుడు’ తన గురువు అయిన ‘భద్రబాహు ముని’తోనూ, ఇతర శిష్యగణంతోనూ ఈ చంద్రగిరికి
ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్థలం. సంస్కృతమే కాక, కన్నడ, తమిళ, మరాఠీ భాషలలో చెక్కిన అనేక శిలాశాసనాలు ఈ కొండపై ఉన్నాయి. ‘గుళ్ళకాయి అజ్జి’గా పేరొందిన ‘బిందెవ్వ’ విగ్రహం, త్యాగస్తంభం యాత్రికులు, పర్యాటకులు తప్పకుండా చూడవలసినవి. ఇవన్నీ ఒక ఎత్తయితే- సౌందర్యం మూర్తీభవించిన ‘బాహుబలి విగ్రహం’ ఒక్కటీ ఒక ఎత్తు. ఇంద్రగిరి శిఖరాన నిర్మితమైన బాహుబలి కారణంగానే శ్రావణ బెళగొళ ప్రముఖ యాత్రాస్థలంగా రూపుదిద్దుకుంది.

విగ్రహాన్నంతటినీ అభిషేకించే కార్యక్రమాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. దీనినే ‘మహామస్తకాభిషేకమ్’ అంటారు.12 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరిగే ఈ ‘బాహుబలి మహామస్తకాభిషేకమ్’ ప్రాధాన్యత గురించీ కొన్ని విషయాలు. బాహుబలి మహామస్తకాభిషేకం సందర్భంగా భక్తులు అభిషేకం చేసేటప్పుడు కింద నిలబడి పాదాలను మాత్రమే. అభిషేకించగలరు. గోమఠేశ్వరునికి బిందెల కొద్దీ పాలు, తేనె, పెరుగు, అన్నం, కొబ్బరి పాలు, నెయ్యి, చక్కెర, బాదం పప్పు, కుంకుమ పువ్వు, నాణేలు, పసుపు, డ్రైఫ్రూట్స్, పండ్లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు. పూజారులు విగ్రహం పై నుండి అభిషేకం చేయడానికి వీలుగా స్ట్రక్చర్ కడతారు. దీని మీదకు వెళ్ళి అభిషేకం తంతు పూర్తి చేస్తారు. పర్యాటకులకు మహామస్తకాభిషేకం సమయంలో చూడటం కంటే మామూలు రోజుల్లో వెళ్ళడమే అనువుగా ఉంటుంది. ఈ ఆలయం కొండమీద ఉంటుంది. ఈ కొండ ఎక్కువ ఎత్తు లేకపోయినా ఎక్కడం కష్టమే.

మహా మస్తకాభిషేకాన్ని ‘గ్రాండ్ ఫెస్టివల్ ఆఫ్ శ్రావణ బెళగొళ ‘ ‘గా వ్యవహరిస్తూ ఉంటారు. శోడషోపచారాలలో అభిషేకానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. బాహుబలికి జరిగే మహామస్తకాభిషేకం 1,008 కలశాల జలంతో జరుగుతుంది. బంగారునాణాలు, జలం నిండిన కలశాలను. బాహుబలి తలపై గుమ్మరించనప్పుడు- అవి విగ్రహం మీదుగా రంగులీనుతూ పాదాల దగ్గరికి జాలువారుతాయి. పాదాల దగ్గరకు చేరిన పదార్థాలను భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఈ ప్రసాదం లభిస్తే భక్తులు తమ జన్మ చరితార్థమైనట్లేనని భావిస్తారు. మంగళవాద్యాల హోరులో, జైనసాధువుల మంత్రోచ్ఛారణ నేపథ్యంలో, భక్తుల జయజయ నినాదాల ధ్వనితో ‘మహా మస్తకాభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదటగా బాహుబలి విగ్రహం. వెనుక నిర్మించిన వేదిక మీద నుంచి పవిత్ర ముహూర్త సమయంలో జైనగురువులు బాహుబలికి శుద్ధోదకంతోనూ, క్షీరంతోనూ, ఖాృతంతోనూ అభ్యంగన స్నానం చేయిస్తారు. పంచామృత స్నానం తరువాత మహామస్తకాభిషేకం ప్రారంభమై 1008 పవిత్ర కలశాలతో అభిషేక కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ప్రతి కలశాన్నీ మామిడి ఆకులతోనూ, నారికేళ ఫలంతోనూ అలంకరిస్తారు. అభిషేకానికి సువర్ణ, రజిత, ఇత్తడి వగైరా కలశాలను ఉపయోగిస్తారు. చతుష్కోణ కుంభాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఆకాశంలో నుంచి హెలికాప్టర్ ద్వారా పుష్పాలను చల్లే పుష్పవృష్టి- ఈ కార్యక్రమంలో ముఖ్యాకర్షణగా కొద్ది సంవత్సరాల నుంచీ భాసిస్తోంది. కార్యక్రమం ఇక కొద్దిసేపటికి ప్రారంభమౌతుంది అనగానే జైనసాధువులు వేదిక పైకి చేరి, కలశాలతో సిద్ధంగా ఉంటారు. ప్రతీ జైనగురువు చేతిలోనూ ఒక కలశం, పాలతో నిండిన ఒక పాలపాత్ర, ఒక నేతిపాత్ర సిద్ధంగా ఉంటాయి. సరిగ్గా ముహూర్తం వేళకు అభిషేకం ప్రారంభమవుతుంది. మొదటగా పాలతోనూ, తరువాత నేతితోనూ మూర్తిని అభిషేకిస్తారు. ఆ తరువాత శతాధిక కలశాలతో యధావిధిగా ‘మహామస్తకాభిషేక మహోత్సవం’ కొనసాగుతుంది. మొట్టమొదటి ‘మహామస్తకాభిషేకాన్ని’ బాహుబలి విగ్రహ నిర్మాత అయిన చాముండరాయడు జరిపినట్లు చెబుతారు. తరువాత 1398 వ సంవత్సరం. నుంచీ ‘పండితాచార్య’ అనే ఆచార్యుడు 12ఏళ్లకి ఒకసారి వరుసగా ఏడుసార్లు మహామస్తకాభిషేకాన్ని నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 1659 వ సంవత్సరం నుంచి మైసూరు మహారాజులు బాహుబలికి మహామస్తకాభిషేకాన్ని నిర్వహించడం ప్రారంభించారు. 1910వ సంవత్సరంలో అప్పటి మైసూరు ప్రభువైన ‘కృష్ణరాజేంద్ర వొడయార్’ మహామస్తకాభిషేకాన్నీ చేశారు.

చాముండరాయడి కథ

పెద్దమల లేక ‘పెర్కళ్ళప్పు’ అనికూడా పిలిచే ఇంద్రగిరి పర్వతం శ్రావణ బెళగొళకు జీవనాడి వంటిది అని చెప్పవచ్చు. 470 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండమీద 8 జైన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అమ్మదేవ, చిన్నణ్ణ, భరతబాహు, సిద్ధర బసదులు’ ముఖ్యమైనవి. కొండపై ‘గొమ్మఠేశ్వరాలయం’ కూడా ఉంది. నాలుగు మంటపాలు, ఐదు మహాద్వారాలు, మూడు స్తంభాలతో అనేక ప్రాచీన శిల్పాలతో, శిలాశాసనాలతో విలసిల్లుతున్న ఇంద్రగిరి ఎంతో చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్థలం. ‘ఇంద్రగిరి’ శిఖరంపై ఉన్న బాహుబలి విగ్రహాన్ని నిర్మించింది. ‘చాముండరాయడు అనే మంత్రి 2 వ మారసింహుడికి, 4వ రాచమల్లుడుకీ మంత్రి అయిన చాముండరాయడు జైన మతస్తుడు. బాహుబలి స్వర్ణప్రతిమ గురించి విన్న చాముండరాయని తల్లి ఆ మూర్తిని దర్శించేదాకా ఏదీ ముట్టనని నిరాహారదీక్ష ప్రారంభిస్తుంది. ఆ బంగారు విగ్రహం అగోచరమైపోయిందని చెప్పినా ఆమె వినిపించుకోదు. ఇక చేసేదిలేక చాముండరాయడు తల్లితో సహా బాహుబలి విగ్రహాన్ని అన్వేషిస్తూ రాజ్యం నుంచి బయలుదేరతాడు. ఆ ప్రయత్నంలోనే ‘శ్రావణ ‘బెళగోళ’లోని ‘చంద్రగిరి’కి చేరి ఓ రాత్రి అక్కడ నిదురిస్తాడు. ఆ రాత్రి కలలో చాముండరాయనికి
‘కూష్మాండిని, పద్మావతి’ అనే యక్షిణులు ప్రత్యక్షమై ‘బాహుబలి స్వర్ణప్రతిమ దర్శనం అలభ్యం’ అనిచెప్పి, భక్తిశ్రద్ధలతో వెతికితే ఎదురుగా ఉన్న ఇంద్రగిరిపై బాహుబలి ప్రత్యక్షమౌతాడు అని చెప్పి అదృశ్యమవుతారు. యక్షిణులు చెప్పినట్లుగా చాముండరాయడు ‘ఇంద్రగిరి’ చేరుకోగా… బాహుబలి శిరస్సు ప్రత్యక్షమౌతుంది. ఆ ముఖ సౌందర్యానికి ముగ్ధుడైన చాముండరాయడు బాహుబలిని ‘గుమ్మటేశ్వరుడు’ అని కీర్తించాడంటారు. ‘గుమ్మటుడు’ అంటే ‘మన్మథుడు’ అనికూడా అర్ధం. గుమ్మటేశ్వరుడే రానురాను ‘గోమఠేశ్వరుడు’గా మారిందంటారు. తర్వాత చాముండరాయడు గుమ్మటేశ్వరుడిని శిరస్సు పరిమాణానికి తగినట్లుగా 59 అడుగుల ఎత్తుగల ఏకశిలా విగ్రహాన్ని నిర్మింపజేశాడు. విగ్రహ ప్రతిష్ఠ క్రీ.శ.982 ప్రాంతాలలో జరిగినట్లు భావిస్తున్నారు.

చాముండరాయనికి గర్వభంగం

విగ్రహ ప్రతిష్ఠాపన అయితే జరిగింది కాని, అంతటి భారీ విగ్రహానికి అభిషేకాలు, పూజ, వగైరా కార్యక్రమాలు నిర్వహించడం ఒక పెద్ద సమస్యగా మారింది. అప్పటికే అంత పెద్ద విగ్రహ నిర్మాణానికి కారకుడైనందుకు గాను. చాముండరాయని మనస్సులో గర్వం చోటుచేసుకొంది. ఆ గర్వంతోనే చాముండరాయడు ‘బాహుబలి మహామస్తకాభిషేకానికి ,తల నుంచి పాదాల వరకు అభిషేకం చేయడానికి పూనుకున్నాడు
కానీ, ఎన్ని బిందెల పవిత్రజలాన్ని విగ్రహం తలపై గుమ్మరించినా… గోమఠేశ్వరుడు పూర్తిగా తడవటం లేదు. ఆ జలం ఆయన భుజాల వరకే సరిపోతోంది తప్ప కిందికి జారటం లేదు. ఈ పరిస్థితి చూసి చాముండరాయడు దిగులుతో ఉండగా.. ‘కూపొండిని: అనే యక్షిణి ఓ ముసలమ్మ వేషంలో చేతిలో చిన్నబిందెతో వచ్చి బాహుబలికి ‘పంచామృత స్నానం చేయిస్తానంటుంది. ఆమె కోరిక విని చాముండరాయుడు. నవ్వుకుంటాడు. నేను వేలకొద్దీ బిందెలతో అభిషేకిస్తున్నా తడవని దేవుడు నీ దగ్గరున్న చిన్నబిందెలోని పంచామృతాలతో తడుస్తాడా?
అంటాడు. ఆ తర్వాత అయిష్టంగానే ఆమె బాహుబలికి అభిషేకం చేయటానికి ఒప్పుకుంటాడు. ముసలమ్మ బాహుబలికి నమస్కరించి, తన చేతిలో వున్న చిన్నబిందెలోని పంచామృతాలను దేవుని శిరస్సుపై పోస్తుంది. చిత్రంగా అంతటి దేవుడూ ఆ కొద్దిపాటి ధారతోనే పూర్తిగా తడిసిపోతాడు. ఈ విచిత్రానికి చాముండరాయడు మొదట్లో ఆశ్చర్యపోయినా… తర్వాత తన అహంకారానికి పశ్చాత్తాపపడి, తనను క్షమించమని భగవంతుడిని వేడుకుంటాడు. ఆత్మశోధన, పశ్చాత్తాపాల అనంతరం చాముండరాయుడు చేసిన అభిషేక జలం బాహుబలి కాళ్లవరకూ జారి సంపూర్ణ అభిషేకం చేసినట్లే అవుతుంది. ఈ కథకు సాక్ష్యంగా చేతిలో చిన్నబిందెను పట్టుకొనివున్న ఓ ముసలావిడ విగ్రహాన్ని ఈనాటికీ బాహుబలి విగ్రహం దగ్గరగా చూడవచ్చు, స్థానికులు ఈమెను బిందెవ్వ అని అంటూ ఉంటారు. సంపద వైభవం, అధికారం లాంటివేవీ నిర్మలమైన భక్తికి సాటిరావు అని బిండెవ్వ ఉదాహరణ ఋజువు చేస్తూవుంటుంది. ఏదిఏమైనా బిందెవ్వ కరుణ వల్ల బాహుబలికి తొలి ‘మహామస్తకాభిషేకం’ చేసినవాడుగా చాముండరాయడు ప్రసిద్ధి కెక్కాడు. అప్పటినుంచీ ఈ విరాట్ స్వరూపానికి ‘మహామస్తకాభిషేకం’ ప్రతి పుష్కరానికి (పన్నెండేళ్లకి) ఒకసారి ఎంతో వైభవోపేతంగా జరుగుతూనేవుంది.

ఊరు సరస్సు పేర్ల వెనక మరో జానపద ఐతిహ్యం:

వింధ్యగిరిపై రాజమల్ల మంత్రి చాముండిరాయ ఎన్నో ప్రయాసలు పడి గోమఠేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ విగ్రహానికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం జరిగేలా ఏర్పాటుచేశాడు. తొలినాళ్ళలో అభిషేకోత్సవం జరిపించాలని చాముండిరాయ నిర్ణయించాడు. గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన తనకు తప్ప వేరే ఎవరికి ఆ అభిషేకోత్సవంలో పాల్గొనే అవకాశం లేదని ప్రకటించాడు. బాహుబలి అభిషేకానికి అన్ని ద్రవ్యాలు తెప్పించాడు చాముండిరాయ. అభిషేకోత్సవం మొదలైంది. చాముండి తెప్పించిన అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అన్నీ ఐపోయాయి. కాని అభిషేక ద్రవ్యాలు బాహుబలి పాదాలకు కూడా చేరలేదు. చాముండిరాయకు యేమిచేయాలో పాలుపోలేదు. చివరికి ఒక అజ్జి (ముసలవ్వ) గుల్లెకాయ (కొబ్బరికాయ) లో కొన్ని పాలు తీసుకొని వచ్చిందట. తనకు అభిషేకానికి అనుమతి ఇవ్వమని కోరిందట. భటులు ముందు అంగీకరించకపోయినా, చాముండిరాయ ఆజ్ఞతో అనుమతించారట. అవ్వ ఆ చిన్న కొబ్బరి చిప్పలోని పాలను బాహుబలి మస్తకంపై పోయగా, ఆ కొద్ది పాలే ఆశ్చర్యంగా బాహుబలి శిరస్సు నుండి పాదాలకు చేరి మొత్తం తడిపివేశాయట. అంతటితో ఆగకుండా ఆ విగ్రహం నుండి పాలు కొండ మీదికి, ఆ వింధ్యగిరి మీద నుండి కిందికి ధారాపాతగా ప్రవహించాయట. అలా పారిన ఆ పాలతో ఏర్పడినదే ఈ సరస్సు అని, అందుకే ఇది తెల్లగా ఉన్నదని, దానికి శ్వేతకొలను లేదా దవళసరోవరమని పేరొచ్చిందని చెబుతారు. చాముండిరాయ అవ్వ మహాత్యానికి అబ్బురపడి, క్షమించమని కోరాడట. ఆ అవ్వ ఎవరో కాదని జైన జాతి రక్షక దేవత అని, భగవంతుడి సేవాభాగ్యాన్ని అందరికి కలిపించాలని చాటి చెప్పి, చాముండిరాయ కళ్ళు తెర్పించడానికి వచ్చిందని జైనులు విశ్వసిస్తారు. ఆ అవ్వకు ఒక ఆలయాన్ని నిర్మిచారు. ఆ ఆలయాన్ని గుల్లెకాయ అజ్జి ఆలయంగా పిలుస్తారు.

ఈ పట్టణంలో చంద్రగిరి, వింధ్యగిరి అను రెండు కొండలు ఉన్నాయి. ఇక్కడ ఆచార్య బద్రబాహు, అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు తపస్సు ఆచరించినట్లు తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దిలో అశోకడు ఇక్కడ చంద్రగుప్తుని పేరుతో మఠాన్ని ఏర్పాటు చేశాడు. చంద్రగిరిపై గొప్ప ఆలయం ఉంది. దీనిని గంగ రాజు రాజమల్ల మంత్రి, నేమిచంద్రుని శిష్యుడిగా చెప్పబడే చాముండిరాయ నిర్మించాడు.

పట్టణంలోని వింధ్యగిరిపై 58 అడుగుల ఎత్తైన ఆకర్షణీయమైన గోమఠెశ్వరరుని
ఏకశిలా విగ్రహం ఉంది. దీనికి ప్రపంచంలో అతి పొడవైన ఏకశిలా విగ్రహంగా గుర్తింపు ఉంది. ఈ విగ్రహం యొక్క పీఠంపై కన్నడ,ప్రాచీన కొంకణి, సంస్కృత సమ్మిళితమైన లిపిలో ఒక శాసనం ఉంది.ఈ శాసనం శక సంవత్సరం 981 నాటిదిగా చెప్పబడింది. ఈ విగ్రహాన్ని కన్నడ ప్రజలు గోమఠెశ్వరునిగా పిలుస్తే జైనులు బాహుబలి గా కొలుస్తారు.

September 15, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చందమామయ్య

by Tungaturti Madhusudana Rao September 15, 2023
written by Tungaturti Madhusudana Rao

నాడు మా అమ్మ అవని నుండి నీవు విడిపోయి గగనతలంలో విహరిస్తున్నావని మా అమ్మ
” చందమామ రావే జాబిల్లి రావే” అని నిన్ను పిలుస్తూ బుజ్జగిస్తూ పాటలు పాడుతూ ఆడిస్తున్నది…
నీ వెన్నెల చల్లదనంలో రాత్రి వేళ , హాయిగా తీయగా పాడుతూ ఆడుకుంటున్నాము…
నీవు మా చెంతకి తిరిగి రాలేకపోయినా
మేమే మేనమామ ఇంటికి , ఆశించి ప్రయత్నించి వచ్చాము మామయ్య…
ఎలాగైతేనేం నీ నివాసం చూడగలిగాం నేడు.
నీ ముందు భాగం పండు వెన్నెల ప్రసరిస్తే ,
నీ వెనుక భాగం చిమ్ము చేకటెందుకు?
నీ తిమిర భాగంలో నిక్షిప్తంగావున్న సంపదను చూడాలని ఉంది మామ !
ఈ ఖనిజ, మూలకౌల సంపదంతా ఇక్కడ నిరుపయోగంగా పడివున్నాయి….
ఒంటరివాడివి ఎందుకు నీకివన్నీ !
ఎవరైనా ఆస్తులు సమకూర్చి కూడబెట్టినా రాబోవు తరానికి అందిస్తారు…
నీవు వదలివచ్చిన నీ సోదరి , మా భూమాత సంతతే కదా మేమంతా!
అమ్మ తరువాత ఆమె తోబుట్టువు నీవు , మాకు మా మేనమామవే కదా….
ఎన్నో శ్రమలకోర్చి నీ ఇంటికి వచ్చాము.
మా జగతి జనం పురోగతికి తోడ్పడి ,
నీ నిక్షిప్త నిధులను భువికి తరలించి , ఆదుకోవాలని ఆశించివచ్చాం !
ఈ రాఖీ పండుగ సందర్భంగా , మాకు రాఖీకట్టి
” అంతా శుభమే జరుగుతుందని, క్షేమంగా వెళ్లి లాభంగా రండని ” మా అమ్మ అవని పంపించింది.
మీకు ఈ సందర్భంగా భువిపై జనావళి అందరి శుభాకాంక్షలు అందిస్తున్నాం.
ఇక నుండి మేమిలానే వస్తూ పోతుంటాం .
ఇక సెలవు

September 15, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

*”&_

by Ramesh September 15, 2023
written by Ramesh

వర్షాన్ని,భూతల్లిని నమ్ముకుంటాడు రైతు
సాలుసాలంతా స్వేదం చిందించి కష్టించి
పంటను గిట్టుబాటుధరకుఅమ్ముకున్నప్పుడు
కళ్లల్లో ఆనందాల అరోరాకాంతులు
భూమంతా సంతోషం గుండెల్నిండా
మనసు దూదిపింజంలా తేలిపోతుంది ఆ క్షణం

అక్కడ ప్రాజెక్టు మంజూరు కాకముందు
ఏలోటులేని మహారాజు అతడు
మాలకు దారం
మమతలకు మనిషే ఆధారం
ఆరుగాలం దుక్కిదున్నే హాలికుడికి
మరిభూమేకదా బంగారం
ప్రాజెక్ట్ పనుల ప్రకటన
సర్వేలు,నిర్థారణలు
నష్టపరిహారాల వెల్లువ
ఏండ్లకేండ్లు వ్యవసాయం చేస్తున్నా
పట్టాపాసుబుక్కుల్లేని రైతే
ఏ హక్కుల్లేని నేరస్తుడు ఇప్పుడు?
జవాబులు లేని ప్రశ్న అతడు?
కుటుంబానికి ఏమని చేస్తాడతడు వాగ్దానం ?
పట్టాకాగీతాలులేని రైతులంటే శీతకన్నే

వాస్తవాలకు దూరమైన జి.వోలు
దయలేని అధికారులు
కంటితుడుపుగా కొంతమొత్తం విదిలిస్తే ఏంలాభం?
అతడు కన్నకలలన్నీ
తటాకంలో గాలిగీసేఅలలై తీరంలోకనుమరగయ్యాయి
పట్టాభూమిగల రైతు నగదుకునగదు,భూమికిభూమి పొంది
నాగలిపట్టి దర్జగా దున్ని ఏటికేడుప్రగతిపల్లవందుకోవడమే
ఆవశ్యమైన దేశాభివృద్ధి దేశప్రజలందరికీ శుభసూకమే
పట్టాదస్తావేజులులేని నిర్వాసితుడు మాత్రం
భూమితోబాటుప్రాజెక్టు నీళ్లల్ల నిండామునిగి
ఏకాకి బాధాజీవి కావడమే విషాదగీతం
ఉన్నట్టు ఉండి అతను దున్నే భూమి ఎలా అదృశ్యం అవుతుందో?
ఎందుకు అంతర్థానం అవుతుందో?
అర్థంకాదు…ఎటూ పాలుపోదు… అతనికి
భూమిలేనితనం
కర్షకుడికి భరించరాని విలువల్లేని ఒంటరితనపు బతుకువేదనే ఈ లోకంలో
ఆశలన్నీ పక్షులై తిరిగిరాని దూరాలకుఎగిసిపోయిన ఆకాశం అతడు
ఎంతగా ఎదురుచూసినా ఏమి ప్రయోజనం?అంతా శూన్యం?
చివరికి అప్పులు అతని ఆస్తులు
బతుకు తిప్పలైన జీవితం అతడు
ఒక్కోసారి ప్రాజెక్ట్ అంటే
లోతట్టుభూముల్ని
పట్టాలేని భూరైతుల్ని
గల్లంతుచేస్తున్న సముద్రజలం
జీవితాలు జీవితాలే తలక్రిందులు చేస్తున్నభూస్థలం బహుశా
వంశపారంపర్యమైన భూమికి
పట్టాచేసుకోకపోవడం అజ్ఞానమో,పేదరికమో, నిర్లక్ష్యమో,జడత్వధర్మమో
దేశంలోవెసులుబాటు చట్టాలు ఇంకనూ లేకపోవడం తలపోసే అంశం
అదిగో నైరుతిఋతుపవనాల ఆగమనం
ఆగని కుండపోతవానల ఏకశృతి గానం
జలాశయాలు అన్నీ నిండుకుండలే!.
భూమిని,భుక్తిని కోల్పోయిన రైతులకేది న్యాయం?.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

రెడ్ వెల్వెట్ మైట్స్

by జయంతి వాసరచెట్ల September 15, 2023
written by జయంతి వాసరచెట్ల

నేలను కరుచుకుని అర అంగుళం దేహం
తలకు రెండు యాంటినా కళ్ళు
ఆరుకాళ్ళతో చలాకీగా కదులుతూ
కత్తిరించిన ఎర్రటి మక్మల్ బట్ట ముక్కలు
చల్లినట్లు నేలపై ఆరుద్రలు!

ఆరుద్ర కార్తె ఆరంభం తో
చినుకులతో పాటే
ఎర్రటి మొగ్గలు పూసినట్లు
పచ్చటి గడ్డిపై అవి…

బీడు వారిన భూమిపై
తొలకరి జల్లు చేరంగానే…
బడిగంట శబ్దానికి
పిల్లలు బిలబిలా పరుగుతీసినట్లు
కుప్పలుతెప్పలుగా చందమామ పురుగులు!

కొంత ఇసుక నేల
మరికొంత పచ్చ గడ్డి నేల ఉంటే చాలు
పట్టుకుచ్చుపూలలా అలరిస్తాయి!

పిల్లలను పెద్దలను ఆకర్షిస్తూ
ముట్టుకుంటే ముడుచుకు పోయే
అత్తిపత్తి మొక్క లా మక్మల్ పురుగులు!

ఇసుకనేల బొరియల్లో జీవనం సాగిస్తూ ….
నేలను గుల్ల బార్చి పంటకుపోషకాలు
అందించడంలో సహాయకారులు!

ఆ రుద్రుడికి ప్రీతికరమైన నామాలతో
మన మధ్యే మనకోసం బ్రతికే జీవులు !
వరుణదేవుడి కి ప్రతిరూపాలు
రైతన్నలకు నేస్తాలు ఆరుద్ర పురుగులు!

పక్షవాతం మరెన్నో రుగ్మతలకు
తమ ప్రాణాలను అర్పించి
సాంప్రదాయ ఔషధ ప్రధాతలు రెడ్ వెల్వెట్ మైట్స్!

ఇప్పుడు
దళారుల చేతుల్లో కాసులు కురిపించేందుకు
వాటి దేహాలను చాలించి
రేపటి తరానికి ఆన్లైన్ లో
బొమ్మలుగా కనిపించబోతున్నాయి!

September 15, 2023 0 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఇంటి పేరు

by ఆచార్య మస‌న‌ September 15, 2023
written by ఆచార్య మస‌న‌

యాదగిరిగుట్టకు ఒకరోజు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. కార్యక్రమం రచ్చ యాదగిరి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటైంది.

సభలో ఎంతోమంది పాల్గొన్నారు. కవి కాబట్టి రచ్చ యాదగిరి కూడా పాల్గొన్నాడు. కార్యక్రమం బాగా జరిగింది. భోజనాలు కూడా చేశాం మధ్యాహ్నం కాబట్టి.

రచ్చ యాదగిరి గారు నాదగ్గరకి వచ్చి ”మీ ప్రసంగం బాగుంది. మీరెక్కడుంటారు హైదరాబాద్‌లో” అని అడిగాడు. ”బోడుప్పల్‌” అని సమాధానమిచ్చాను. వెంటనే నాకు నా అర్ధాంగి ప్రమీల పేరు స్ఫురించింది. కారణమేమంటే ఆమె తల్లిగారి ఇంటిపేరు ‘రచ్చ’ కావడమే.

”నా భార్య రచ్చవాళ్ల ఇంటి ఆడపిల్ల. మీరు రచ్చ వాళ్లు కావడం ఆనందంగా ఉంద”న్నాను.

యాదగిరి గారికి నాతో కొంతసేపు మాట్లాడాలనిపించింది. ”మీ అత్తగారి ఊరేది? మీ మామ ఏ పని చేసేవారు. మీ అర్ధాంగి గృహిణియేనా?” వినయంగా ప్రశ్నించాడు. ”మా మామగారు హైదరాబాదు వాస్తవ్యులు. మెడికల్‌ డిపార్టుమెంటులో పని చేశారు. ఇప్పుడు నా భార్య లేదు” అన్నాను కళ్లు తుడుచుకుంటూ. యాదగిరి గారు నా స్థితిని అర్థం చేసుకున్నారు. ”మీరు మా ఇంటికి వస్తారా? దగ్గరనే” అని కోరారు. నేను కాదనలేకపోయాను. మా ప్రమీల పుట్టినింటికి వెళ్లినంత ఆనందమైంది నాకు. యాదగిరి ఇంటి వాళ్లంతా పరిచయమయ్యారు. మా ప్రమీల ఏ లోకంలో ఉందోగాని, ఆమె పుట్టిన ఇంటిపేరు ఎంత మహిమగలదో తెలిసింది.

నేను హైదరాబాదుకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాను. ”మీరు రావడంవల్ల మా ఇల్లు పావనమైంది” అంటూ ఇంట్లోంచి ఒక శాలువా తెచ్చి కప్పినారు.

యాదగిరి గారి సౌజన్యానికి ఎంతో మురిసిపోయాను. వారిని చూచినప్పుడు మా మామగారే గుర్తుకు వచ్చారు. మా మామ కూడా నన్నెంతో ఆదరించేవారు. ప్రేమతో పలకరించేవారు.

పుస్తకావిష్కరణ తర్వాత నేను యాదగిరిగుట్టకు ఎన్నిసార్లు వెళ్లానో నాకే తెలియదు. వెళ్లినప్పుడల్లా యాదగిరి గారింటిలో ఆతిథ్యం తీసుకోకుండా రాను. యాదగిరి గారి కుటుంబ సభ్యుల్లో నేనొకడినయ్యాను. యాదగిరి గారు ఆర్‌.ఎమ్‌.పి. డాక్టర్‌ కనుక అప్పుడప్పుడు ఆరోగ్య సంబంధమైన సూచనలు కూడా ఇచ్చినారు. నాకే చిన్న బాధ కల్గినా యాదగిరి గారితో చెప్పుకోవడం పరిపాటి అయ్యింది. వారు నా రచనలు కూడా చదివినారు. అప్పుడప్పుడు పద్యాలు రాసి నా చేత దిద్దించుకున్నారు.

ఒకమాటలో చెప్పాలంటే యాదగిరి గారు ఆత్మబంధువు లయ్యారు. హైదరాబాదుకు వచ్చినప్పుడల్లా నన్ను చూసి వెళ్తారు. ప్రతిరోజు ఫోన్లో తప్పక మాట్లాడుతారు.

యాదగిరి గారికి నాకు ఏమిటో విడదీయరాని సంబంధం కల్గింది. బహుశా మా ప్రమీల ఇంటిపేరు, వారి ఇంటి పేరు ఒకటి కావడమేనా? ఇంటి పేర్లొకటైనంత మాత్రాన ఇంత అనుబంధం ఏర్పడుతుందా?

ఇదంత ప్రమీల ప్రభావమేనని నా మనస్సు పదేపదే గుర్తు చేస్తుంది.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఒక రాకుమారుడు

by ఒద్దిరాజు మురళీధరంరావు September 15, 2023
written by ఒద్దిరాజు మురళీధరంరావు

పూర్వం సిద్ధార్థుడు అనే ఒక రాకుమారుడు ఉండేవాడు. అతడు దయగలవాడు. అతడు వయసులో చిన్నవాడైనప్పటికీ ఎవరు బాధపడుతున్నా ఇష్టపడేవాడు కాదు. అతను జంతువులను కూడా ప్రేమించేవాడు. అతను ఎప్పుడూ అందరినీ దయగా చూసేవాడు కాబట్టి అందరు అతన్ని ఇష్టపడేవారు.

ఒకరోజు రాజుగారి తోటలో సిద్ధార్థ నడుస్తుండగా, ఏదో బాధతో ఏడుస్తున్న శబ్దం విన్నాడు. వెంటనే తనముందు ఏదో పడింది. అతను అక్కడికి వెళ్ళి చూస్తే, ఒక అందమైన తెల్లని హంస ఉంది. అది నొప్పితో మూల్గుతున్నది. ఒక బాణం ఆ పక్షి శరీరంలో గుచ్చుకుని రక్తం కారుతుంది.

దాని అవస్థ చూసి బాధపడి రాకుమారుడు సిద్ధార్థ చాలా జాగ్రత్తగా ఆ పక్షిని లేపి తన చేతులపై పెట్టుకొన్నాడు. ”దాన్ని ముట్టుకోకు, అది నాది” అనే అరుపు విన్నాడు. సిద్ధార్థ అటు చూసేవరకు అతని మేనమామ కొడుకు దేవదత్‌ తనవైపు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని ఒక చేతిలో ఒక బాణం ఉంది. రెండవ చేతిలో బాణాల పొదిలో నిండా బాణాలు ఉన్నాయి.

”ఆ పక్షి నాది, నాకు తిరిగి ఇచ్చేయి” అని అన్నాడు.

”ఈ పక్షి నాకు దొరికింది. నేను పాపం ఈ పక్షిని జాగ్రత్తగా చూసుకుంటాను” అన్నాడు సిద్ధార్థ.

”నేను ఆ పక్షిని బాణంతో కొట్టి పడేశాను, కాబట్టి అది నాది” అన్నాడు దేవదత్‌.

ఇద్దరు వాదులాడుకొంటున్నారు. చివరకు వారు తీర్పు కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. రాజు శుద్ధోదనుడు దర్భారు నడిపిస్తున్నాడు. ఇద్దరు బాలురు లోనికి వెళ్ళి వారికి తీర్పు కావాలని కోరారు.

”చెప్పండి మాకు, మీ సమస్య ఏమిటి, మేము వింటున్నాము”, రాజు శుద్ధోధనుడు అన్నాడు.

దేవదత్‌ ”మహారాజా! సిద్ధార్థ నా పక్షిని తీసుకున్నాడు. నేను బాణంతో ఆ పక్షిని పడేశాను, కాబట్టి అది నాదే. దయచేసి నా పక్షిని నాకు ఇప్పించండి” అన్నాడు.

”రాకుమార సిద్ధార్థ ఇది నిజమేనా?” అడిగాడు శుద్ధోధనుడు.

”మహారాజా, ఈ పక్షి ఘోరంగా గాయపడి తోటలో పడి ఉంది. నేను దాన్ని పైకి లేవదీశాను” అన్నాడు సిద్ధార్థ.

”తరువాత” సిద్ధార్థ చెప్పసాగాడు, ”నేను దాని గాయాన్ని శుభ్రపరిచాను. ఇప్పుడు అది కోలుకుంటున్నది. నేను దాన్ని చంపనీయను. ఎవరికి కూడా ఇతరుల ప్రాణం తీసే హక్కు లేదు. నేను దాన్ని అతనికి ఇవ్వను” అన్నాడు.

రాజ దర్భారు (కోర్ట్‌)లో ఉన్న ప్రజలందరు రాకుమారుడు సిద్ధార్థ చూపిన దయకు ముగ్ధులైనారు. వారు రాజు గారి తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారు.

రాజు సమస్యపై విచారణ చేసి, అతని నిర్ణయం వెలిబుచ్చాడు.

కేవలం సృష్టికర్తకే ప్రాణాన్ని తీసుకునే హక్కు ఉంటుంది. ఒకరు చేసిన సృష్టిని వేరే వారు నాశనం చేసే హక్కు ఉండదు. ఈ కేసులో దేవదత్‌ పక్షిని చంపే ప్రయత్నం చేశాడు. కాని సిద్ధార్థ దాన్ని రక్షించాడు.

కాబట్టి ప్రాణం తీసే వ్యక్తి కన్నా, ప్రాణాన్ని కాపాడిన వారికి ఎక్కువ హక్కు ఉంటుంది. కనుక ఆ పక్షి సిద్ధార్థకు చెందుతుంది కానీ దేవదత్‌ కు చెందదు.

రాకుమారుడు సిద్ధార్థ ఇది విని చాలా సంతోషించాడు. దర్భారులో ఉన్న ప్రజలు కూడా అంత తెలివైన, దయగల రాజు పాలనలో ఉన్నందుకు చాలా ఆనందించారు.

”ఆ యువ రాకుమారుడు ఎవరో మీకు తెలుసా?” కథ చెప్పిన తరువాత తాతగారు అడిగారు. ”అతను ఇంచా చాలా నెమ్మదస్తుడు మరియు దయగల వాడిగా ఎదిగాడు. అతను కేవలం దయగల వాడేగాక తన చుట్టు ఉన్నవారికి కూడా బోధించేవాడు. అతను గౌతమ బుద్ధుడు”.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సూర్య నమస్కారాలు

by Bandi Usha September 15, 2023
written by Bandi Usha

యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, ధ్యానంతో కూడుకొని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. ఇది 12 రకాల భంగిమలతో కూడి ఉంటుంది. ఏ ఆసనాలు అయినా బ్రహ్మముహూర్త సమయంలో చేస్తే మంచి ఫలితం వస్తుంది.

సూర్యనమస్కారాలు బ్రహ్మముహూర్త సమయం లేదా సూర్యోదయ వేళలో సూర్యునికి అభిముఖంగా ఒక్కో భంగిమకు ఒక్కో మంత్రం జపిస్తూ చేయాలి.

1. ప్రణమాసనము :

చేయు విధానం : తివాచీపై సమస్థితిలో నిల్చొని కనురెప్పలు మూయాలి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రను ఛాతిపై ఉంచాలి. ఈ స్థితిలో బొటనవేళ్ళు మాత్రమే ఛాతీని తాకాలి. మిగిలిన వేళ్ళను బొటన వేళ్ళతో కలిపి ఉంచి, కొద్దిసేపు ఉచ్ఛ్వాస నిశ్వాసలను చేయాలి.

ఈ ఆసనాన్ని సూర్య మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం మిత్రాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – ఏకాగ్రత, ప్రశాంతత, మానసిక స్థిరత్వం కలుగుతుంది.

                        – వెన్నెముక నిటారుగా ఉంటుంది.

2. హస్త ఉత్తానాసనము :

చేయు విధానం : శ్వాస లోపలికి పీలుస్తూ, రెండు చేతులు పైకి చాచి, మోకాళ్ళు వంచకుండా చేతులను చూస్తూ, నడుము నుండి పైభాగం వెనుకకు వంచాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం రవయే నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – జీర్ణక్రియ, ఉదర కండరాల పనితీరు మెరుగవుతుంది.

                        – అధిక బరువు, కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

3. పాదహస్తాసనము :

చేయు విధానం : శ్వాస విడుస్తూ ముందుకు వంగి రెండు చేతులను పాదాల పక్కగా ఉంచాలి. చేతులు, పాదాల జతలో ఉంటాయి కాబట్టి దీనికి పాదహస్తాసనము అని పేరు.

ఈ స్థితిలో తలను క్రింది వంచే ఉంచాలి. లేదంటే మెడ పట్టే అవకాశం ఉంది. మోకాళ్ళు వంచరాదు.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం సూర్యాయ నమః” అని జపించాలి.

గమనిక : అధికంగా రక్తపోటు ఉన్నవారు, నడుమునొప్పి మరియు మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.

ప్రయోజనాలు : – జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.

                        – వెన్నెముక శక్తివంతం అవుతుంది.

                        – మలబద్ధకం, పొట్ట తగ్గుతుంది.

                        – స్త్రీలకు కలిగే పొత్తికడుపు సమస్యలు తగ్గుతాయి.

4. అశ్వ సంచలనాసనము :

చేయు విధానం : ఎడమ మోకాలును వంచుతూ పాదాన్ని నేలపై ఉంచి, కుడికాలును బాగా వెనుకకు చాచి వేళ్ళపై పాదాన్ని ఉంచాలి. రెండు చేతుల్ని పైకెత్తి నడుము నుండి పైభాగమంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

ఈ భంగిమ దౌడు తీయటానికి సిద్ధమైన గుర్రము వలె ఉంటుంది కావున దీనికి అశ్వ సంచలనాసనము అని పేరు.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం భావనే నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – కండరాలు, నాడీ మండలం శక్తివంతం అవుతుంది.

                        – పొట్ట తగ్గుతుంది.

                        – రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

5. దండాసనము :

చేయు విధానం : శ్వాస విడుస్తూ కటి భాగము పైకెత్తి రెండు చేతులను బాగా చాచి నేలపై ఆన్చాలి. నడుమును ఎత్తరాదు, దించరాదు. వెనుకనుండి చూస్తే ఒక సరళరేఖలా ఉండాలి. కాలి మడమలు నేలపై ఆన్చి ఉంచాలి. ఈ స్థితిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం ఖగాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – శరీరమంతా నూతన శక్తి వస్తుంది.

                        – వెన్నెముక, నరాలు ఉత్తేజం చెంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

6. అష్టాంగ నమస్కారాసనము :

ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారాసనము అనే పేరు వచ్చింది.

చేయు విధానం : చేతులు, పాదాలు కదల్చకుండా నడుమును కొంచెం పైకెత్తి, శ్వాసను విడుస్తూ, ఛాతీ, గడ్డంను రెండు చేతుల మధ్యలో నేలపై ఆన్చాలి. ఈ స్థితిలో రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, ఛాతీ, గడ్డము నేలపై ఉంటాయి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం వూష్ణే నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – కాళ్ళు, చేతులు, కండరాలు శక్తివంతం అవుతాయి.

                        – వెన్నెముక, ఛాతీ భాగానికి ప్రయోజనం చేకూరుతుంది.

                        – తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

7. భుజంగాసనము :

ఈ భంగిమ పడగ విప్పిన పాములా ఉంటుంది కావున దీనికి భుజంగాసనము అని పేరు.

చేయు విధానం : శ్వాస తీసుకుంటూ అష్టాంగ నమస్కార ఆసనము నుండి భుజంగాసనములోకి రావాలి.

పాదాలను వెనుక జతలో ఉంచి, చేతులను నేలపై ఆన్చి తల, నడుము వీలైనంత పైకెత్తాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం హిరణ్యగర్భాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – పొత్తికడుపు, కాలేయం, మూత్రపిండాలకు చక్కటి వ్యాయామం.

                        – మలబద్ధకం పోతుంది.

                        – ఛాతీకి, భుజాలకు ప్రయోజనం చేకూరుతుంది.

8. పర్వతాసనము :

ఈ భంగిమ పర్వతం ఆకారంలో ఉంటుంది కావున దీనికి పర్వతాసనము అని పేరు వచ్చింది.

చేయు విధానం : ఐదవ స్థితి వలనే చేతులు, పాదాలు నేలపై ఉంచి నడుమును పైకెత్తి తలను క్రిందికి దించుతూ శ్వాస విడవాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం మరీచాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – కాళ్ళు, చేతులకు ప్రయోజనం

                        – నరాలు శక్తివంతం అవుతాయి.

9. అశ్వ సంచలనాసనము :

చేయు విధానం : నాలుగవ స్థితిలో చెప్పిన విధానమే కానీ కాలు మార్చాలి. నాలుగవ స్థితిలో కుడికాలును వెనుకకు చాచితే ఇక్కడ ఎడమ కాలును వెనుకకు చాచి, కుడికాలును ముందుంచి శ్వాస పీలుస్తూ నడుము నుండి పై భాగం వెనుకకు వంచాలి. చేతులు వంకర ఉండరాదు.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం ఆదిత్యాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – నాలుగవ స్థితిలో వలనే ప్రయోజనాలు చేకూరుతాయి.

10. పాద హస్తాసనము :

చేయు విధానం : మూడవ స్థితిలో చేసినట్లుగానే అశ్వ సంచలనాసనం నుండి పాద హస్తాసనంలోకి శ్వాస విడుస్తూ రావాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం సవిత్రే నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – మూడవ స్థితి వలనే ప్రయోజనాలు చేకూరుతాయి.

11. హస్త ఉత్తానాసనము :

చేయు విధానం : శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తి నడుము నుండి పైభాగం వెనుకకు వంచుతూ రెండు కాళ్ళను వంపు లేకుండా జతలో ఉంచాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం ఆర్కాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – రెండవ స్థితిలో వలనే ప్రయోజనాలు చేకూరుతాయి.

12. ప్రణమాసనము :

చేయు విధానం : శ్వాస తీసుకుంటూ నడుమును యథాస్థితికి తీసుకుని వచ్చి మొదటి స్థితి వలనే నమస్కారముద్ర ఛాతీపై ఉంచాలి.

ఈ ఆసనాన్ని మంత్రంతో జపించదలుచుకున్నవారు ”ఓం భాస్కరాయ నమః” అని జపించాలి.

ప్రయోజనాలు : – మొదటి స్థితిలో ప్రయోజనాలు చేకూరుతాయి.

గమనిక : ఈ 12 భంగిమలు ఒక ఆసనములోనుండి మరో ఆసనములోకి మారాలి. ఒక్కొక్కటి విడివిడిగా వేయరాదు.

మొదటి ఆరు భంగిమలే మరలా తిరిగి చేస్తాము. 5వ, 7వ భంగిమలో కొద్దిపాటి మార్పు ఉంటుంది.

ఒక్కో భంగిమ చేసినపుడు కలిగే ప్రయోజనంతో పాటు మొత్తం చేయటం ద్వారా శరీరంలోని విషపదార్థాలను తొలగించుకోవటమే కాక….

1. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.

2. మెటబాలిజం పెరుగుతుంది.

3. ఋతు సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి.

4. నడుము సన్నగా అవుతుంది.

5. వత్తిడి తగ్గి, నిద్ర బాగా పడుతుంది.

6. చర్మం కాంతివంతమవుతుంది.

7. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.

8. అనహత, విశుద్ధి, స్వాధిష్టాన, మణిపూర, ఆజ్ఞాచక్రాలు శుద్ధి అవుతాయి.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us