మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

ఓ తండ్రి తీర్పు

by mayuukha July 30, 2023
written by mayuukha

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే తనను తాను నిర్లక్ష్యం చేసుకున్నట్టే ఈ సత్యాన్ని గ్రహించక చాలా మంది విచిత్రం గా ప్రవర్తిస్తారు. కాల చక్రం గిర్రున తిరిగి మళ్లీ వీళ్ళ దగ్గరికే వస్తుందని గ్రహించరా? కాదు అన్నీ తెలుసు అయినా తెలివితక్కువ ఆలోచనలతో అట్లాగే చేస్తారు. ఏదైనా కోల్పోయిన తర్వాత విలువ తెలుస్తుంది. కన్నతండ్రి ని వదిలించుకున్నానుకున్న ఓ కొడుకు కు అతడు చేసిన అన్యాయం అతని వెంట పడ్తుందని అద్భుతంగా చిత్రీకరించారు చిటికెన కిరణ్ కుమార్. ఈ దుర్మార్గాన్ని తండ్రి సహించక ఛీ కొట్టినట్టు ఇచ్చిన తీర్పు పాఠకులను, ప్రేక్షకుల ను తప్పకుండా ఆలోచనలలో పడవేస్తుంది. ఎన్ని బాధలు పెట్టినా కన్నపాశం అంటూ తన సంతానానికే సేవలు చేయడం కన్నా అనాథలు అన్నార్తుల కు చేయూతనివ్వడం మంచిదని ఈ ” ఓ తండ్రి తీర్పు” చిటికెన కిరణ్ కుమార్ రచించిన కథ చెబుతుంది. ఈ కథను లఘు చిత్రం గా నిర్మించి బహుమతి ని కైవసం చేసుకున్న చిత్ర బృందానికి, చిటికెన కిరణ్ కుమార్ కూ అభినందనలు తెలియజేస్తున్నాను

-డాక్టర్ కొండపల్లి నీహారిణి, కవయిత్రి, రచయిత్రి
మయూఖ, తరుణి అంతర్జాల పత్రిక ల సంపాదకురాలు.

https://m.facebook.com/story.php?story_fbid=2499168466923796&id=100004920000278&mibextid=Nif5oz

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

విలువల మూట

by డా. రూప్ కుమార్ డబ్బీకార్ July 30, 2023
written by డా. రూప్ కుమార్ డబ్బీకార్

అడిగి అడిగి అలసిపోయాను

కాశీపుర వీధుల్లో తిరిగినట్లు

కాగితపు భిక్షా పాత్రతో

గడప గడపను గంగలా తాకి తీర్థమయ్యాను

ఐనా –

నా గొంతు తడారే వుంది

గుండె ఎడారై ఇసుక నదుల్ని

సాగనంపడానికి సిద్ధంగా ఉంది

భుజాన వేళ్లాడుతున్న ఖాళీ జోలె

బరువు విలువ ఏమిటో బోధిస్తోంది

కొన్ని యోజనాల పొడవు నా గమ్యం

తెలియని దారుల్లో అడుక్కుంటూ, వెతుక్కుంటూ-

ప్రతి సింహద్వారం ఎదురగా నిలుచొని

గడప మీద విసుగ్గా విసిరేసిన అనుభవాలను ఏరుకుంటూ –

దారి మధ్యలో –

గడ్డకట్టిన మాటల చిత్తు కాగితాలను పోగేసుకుంటూ

ఛీత్కారాల గ్రీష్మంలో కాలిపోతున్న

మంచులో తడిసి ముద్దయిన ‘గొబ్బెమ్మ’ పొడపైన

విరిసే వసంతాలను ఎదపైకి ఎత్తుకుంటూ

నడచి నడచి అలసిపోయాను

ఫడేల్ మని మూసుకుంటున్న ద్వారాల వెనుక

కనబడిన ఖండిత దృశ్యాలను

మూగబోయిన ముఖ ద్వారాల గొంతుల్లోంచి

జారిపడుతున్న కొన్ని మాటల రేణువులను

రిక్తమైన హృదయ కళశంలోకి వొంపుకున్నాను

బరువెక్కిన జోలెతో వెనక్కి తిరిగితె

ఈ ప్రపంచం వదిలి వెళ్లిన చోటే

నేనొక

విలువల మూటనయ్యాను.

July 30, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

మేలుకో

by Rasheed July 30, 2023
written by Rasheed

పచ్చని నేలపై పశుత్వం
పెల్లుబికిన వేళ

భూగర్భ ఖనిజాలపై
దృష్టి పడిన వేళ

కన్నూ మిన్నూ కానకుండా,
స్త్రీలు పిల్లలు అని చూడకుండా,
దాడులు అత్యాచారాలు
జరిపిన వేళ

దుకాణాలు,
వాహనాలు,
ఇళ్ళు,కాల్చివేసి,
బూడిద చేసిన వేళ

దిగంబర స్త్రీపై
దాష్టీకం చేస్తున్నాడు క్రూరుడొకడు
బెల్టుతో బాదుతున్నాడు
నిర్దయతో వాడొకడు
నవ్విపోదురుగాక నాకేంటన్నట్టు
నడిబజార్ లో సిగ్గు లేని జనాలు
చోద్యం చూస్తున్నవేళ

కాళ్లొకచోట
చేతులొకచోట
తలొకచోట
మొండెమెుక చోట
తెగిపడిన వేళ
మణిపూర్ మాయలో పడిన వేళ

ప్రపంచంలో జరుగనటువంటి
హింస జరిగిన వేళ
ఈ కిరాతకానికి
హిట్లర్ సైతం సిగ్గుపడేవేళ

రెండు నెలలుగా
సోషల్ మీడియాను
చీకట్లో ఉంచిన వేళ

ఎంతోమంది తల్లుల
అక్కల చెల్లెళ్ళ
కూతుళ్ళ హాహాకారాలకు
ఆకాశం దద్దరిల్లిందేమో

దేవుని వద్ద దేర్ ఉంది
ఆయన వద్ద
అధేంర్ లేదు
దేవుడికి భయపడాలి మరి
అది మణిపూర్ కానీ
మరోటి కానీ
తప్పు చేసారంటే తలవంచాల్సిందే!

పిల్లి కళ్ళు మూసుకొని
పాలు తాగినంత మాత్రాన
ప్రపంచం చూడకుండా ఉంటుందా?

ఓ ప్రపంచమా మేలుకో
ఓభారతీయుడా మేలుకో

శాంతిని
సోదర భావాన్ని
ప్రేమాభిమానాలు
గల వాతావరణాన్ని
ఈ నేల కోరుతున్నది
కంకణం కట్టుకో
కంకణం కట్టుకో
కంకణం కట్టుకో

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మన పూర్వీకుల చరిత్ర తప్పక తెలుసుకోవాలి

by రంగరాజు పద్మజ July 30, 2023
written by రంగరాజు పద్మజ

తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి ఉన్న స్థానం గురించి, పొన్ని దొర, కులమతాల ముద్దుపట్టి మలయప్ప సంస్కృత విద్వాంసుని గురించి, శివానందలహరి ప్రస్తావన మొదలైనవి చక్కగా తెలియజేశారు. మన తెలుగునాట శాస్త్ర సంబంధ పరిశోధనలు జరిగాయి అని చెప్పడం బాగుంది. జ్యోతిష్యం, వైద్యశాస్త్రం తెలుగు నేలపై ఎలా ఉండేది అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు రచించారు కరణం బాల సుబ్రమణ్యంపిళ్ళైగారు.
ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏనుగులను పట్టే విధానం, వాటికి శిక్షణ ఎలా ఇస్తారని, విలు విద్యా ప్రదర్శనం, యుద్ధతంత్రాలు, శిక్ష విధానాలు, సాతులూ,సంతలు, పన్నులు ,నాటక ప్రదర్శనలు, తోలు బొమ్మలాటలు, ఆలయనిర్మాణం, కోటల కట్టడం, ఊర్లో ఎట్లా ఏర్పడ్డాయి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు ఈ నవలలో…
ఈ నవలలో ఒక చోట వీరన్న బోయెడు వారసుడు ప్రయోజకుడు కాకపోవడంతో ఆయన మరణించిన తరువాత బోయ దొరసాని మంగసాని బోయలకు ఎలా నాయకత్వం వహించిందో? చక్కటి రాజనీతితో జయసింహడిని ఎలా ఎదుర్కొన్నదో ఆ సన్నివేశాన్ని చాలా చక్కగా వర్ణించి చిత్రీకరించారు. ఆ సన్నివేశం చాలా బాగుంటుంది.

ఇందులో తిరుమల తిరుపతి గురించి చక్కగా వివరిస్తారు ఈ రచయిత. ఇందులో వకుళమాత ను అపరశక్తిగా చూపించారు. పరమ భక్తురాలు గాను చూపించారు.
మనం తెలుగు వాళ్ళం అయినందుకు మన పూర్వీకుల చరిత్ర తప్పక తెలుసుకోవాలి. మనం ఎంతో ఇష్టపడే పద్యం పుట్టుక కథాకమామిషు ఈ నవలలో చక్కగా వివరించారు. ఈ బోయ కొట్టం పండ్రెండు చారిత్రక నవల తప్పక చదవ తగిన పుస్తకం.
చాళుక్యరాజుల నాటి కథ కాబట్టి ఆనాటి సామాజిక విధానాన్ని, వారి అలవాట్లు, ఆనాటి వస్తువులు ఎలా ఉండేవని? ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి… విశదీకరిస్తే ఇంకా బాగుండేది.
నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటి అంటే? చాళుక్య, పల్లవ రాజుల కాలక్రమంతో పాటు క్రమణికను పోలుస్తూ రాయడం ఎంతో కష్టమైన విషయం. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు రచయిత.
గ్రాంధికభాషలో రచించిన ఈ బోయకొట్టములు పండ్రెండులో భాష, కల్పనలు, శైలి ఎంతో బాగున్నాయి.
ఇతిహాసంలో చీకటి కోణములోని అట్టడుగున పడి కాన్పింపని కథలు రాయగలిగే వాళ్ళు రావాలి. దానికి ప్రేరణగా రచయిత పిళ్ళైగారు నిలిచారు. అప్పుడే చరిత్రలో మరిన్ని అంశాలు రాబోయే తెలుసుకునే వీలు ఉంటుంది.
ఒక మంచి చారిత్రక నవల చదవడం మన పూర్వీకుల గురించి తెలుసుకోవడం, మన తెలుగు వీరుల వీరత్వాన్ని రచయిత కళ్ల ద్వారా మనం చూడగలగడం మహద్భాగ్యంగా భావిస్తూ…

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అదృశ్యం

by Dr. Varigonda Satya Surekha July 30, 2023
written by Dr. Varigonda Satya Surekha

పడక్కుర్చీలో దీర్ఘాలోచనలో మునిగిఉన్న నరసింహమూర్తికి భార్య అడుగులు చేతిలో మజ్జిగ గ్లాసుని, గడియారంలో తొమ్మిది గంటలని గుర్తు చేశాయి. ఇరవై ఏళ్ళుగా ఏ ఒక్క రోజు తప్పని దినచర్య. నర్సింహమూర్తి, తన నలభైవ ఏట నుండి రెండోపూట భోజనం మానేశారు. సాయం వేళల్లో ఏదైనా అల్పాహారం. రాత్రిపూట సరిగ్గా తొమ్మిదింటింకి గ్లాసుడు మజ్జిగ. ఇంట్లో ఉన్నంతసేపు గడియారం చూసుకునే అవసరం నర్సింహమూర్తికి ఏనాడు కలగలేదు.

సాయంత్రం ఐదున్నరకి ఇంటికి రాగానే బట్టలు మార్చుకుని ముందు గదిలో పడక్కుర్చీలో కూర్చుంటారు. అలా కూర్చున్న మూడు నిమిషాలలో చేతిలో పొగలుగక్కే కాఫీని పెడతారు జానకమ్మ. ఏడు గంటలకు స్నానం. ఏడున్నర కి అల్పాహారం తొమ్మిదింటికి గ్లాసుడు మజ్జిగ తాగి సరిగ్గా రాత్రి పది గంటలకి తమ పూర్వీకుల నుండి సంక్రమించిన పట్టె మంచంపై నడుం వాలుస్తారు. తిరిగి ఉదయం ఐదు గంటలకి నిద్ర లేస్తారు. కాఫీ, తర్వాత ఎనిమిది గంటలకి ఉపాహారం. తొమ్మిదింటికి క్యారెజ్ తీసుకొని బడికి బయలుదేరడం. తనకి అవసరాలు తీర్చబడడమే తప్ప ఏ రోజూ ఎలా తీరుతున్నాయి అన్న ఆలోచనే రాలేదు.

ఇవాళ ఉదయం తన మిత్రుడు సహాధ్యాయి సుధాకరం సహచరిని కోల్పోయిన వార్త విన్నప్పటి నుండి మజ్జిగగ్లాసు అందుకునే పడక్కుర్చీ ఖాళీ అయినా,మజ్జిగ అందించే మట్టి గాజులు నిష్క్రమించినా ఆవరించే శూన్యాన్ని అధిగమించి జీవితాన్ని కొత్తగా ఆరంభించటం సాధ్యమా అన్న ఆలోచన తనని ఉదయం నుండి ఆందోళనకి, ఆవేదనకి గురి చేస్తోంది.

“ఏవిటండీ! ఇంకా ఉదయం విచారంలోంచి బయటపడలేదా?” గ్లాసు చేతికందిస్తూ అడిగింది జానకమ్మ. సమాధానానికై ఎదురు చూడకుండా . “ఏవిటండీ! పంపిన దేవుడు తిరిగి పిలిస్తే పోకుండా ఉంటామా!? ముందు వెనక అంతే. పోయిన వారు ధన్యులు. ఉన్నవారు భగవంతుడి ఆరాధనలో కాలం గడుపుతూ ఆయన ఆజ్ఞ కోసం వేచిచూడాలి. జంట జీవితం ఒంటరిదైతే భగవంతుడి తోడు కోరాలే కాని ఈ వయసులో అలవాట్లు అవసరాలు ఎలా అనికాదు. అనవసరంగా ఆరోగ్యంపాడు చేసుకోక నేను ఇచ్చినన్నాళ్ళు మజ్జిగ తాగండి. ఇవ్వలేని రోజున మీరే కలుపుకుతాగడం అలవాటు చేసుకోండి.” అని చిరునవ్వుతో వెడుతున్న ఆవిడని “మరి తాగేవారు లేకపోతే…” అని అడగాలి అనుకొని దొరికి దొరకని సమాధానం మనసుని చేరగా మజ్జిగ మరింత రుచిగా అనిపించింది నర్సింహమూర్తికి.

July 30, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

తరంగిణి

by Dr. Gillipalli Brahmam July 30, 2023
written by Dr. Gillipalli Brahmam


అలా…..అలా..
అలరించే అలలతో
పాడుతూ సాగిపోతావు

చల్లని నీమనసు
సుతిమెత్తని నీ హృదయం
నీ ఒడి చేరినపుడే నాకర్థమైంది౹

గర్భంలో ఎన్ని విపత్తులు దాచుకుంటావు౹
బాహ్యంలో ఎందరి రసపిపాసకుల హృదయం దోచుకుంటావు౹

కవి కలంలోని సిరలో రసమైంది నీవే కదా౹
నీ రసమైన మాహృదయంలో ఉత్సాహం నింపింది నీ పరుగే కదా౹
నీకు ఒరిగేదేముంది అనుకోవు౹
అడుగడుగునా
పుడమికి పచ్ఛదనాన్నద్దుతావు౹
ఆర్తుల ఆకలి తీర్చడంకోసం
వారి నోటిలో అన్నపు ముద్దౌతావు౹

నీలో అడుగిడగానే
నాకు నేనే పొంగి పోయేటట్లు
నాగరికతను బోధిస్తావు౹
సంస్కృతీ సంప్రదాయాలను కథలు కథలుగా చెప్తావు౹

ఓ తరంగిణి
గమ్యాన్ని మరువని గమనం నీది౹
నన్ను మరువకు
నీతో కలసిన పలుగు రాళ్ళకు మృదుత్వాన్ని అలదినావు
నేనూ రాయినే
రాస్తూనే ఉంటాను
నిను చూస్తూనే ఉంటాను..
నీవు పాడుతూనే ఉండాలి
పుడమిని కాపాడుతూనే ఉండాలి౹

★★★★★★★★★★★

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలంగాణ యశోధరులు- ఒక పరిశీలన

by Sunkepally Nagender Sharma July 30, 2023
written by Sunkepally Nagender Sharma

పుస్తక సమీక్ష: తెలంగానా యశోధరులు (వ్యాస సంకలనం),
రచయిత్రి: డా.నమీలకొండ సునీత, కామారెడ్డి, చరవాణి: 9908468171.

పేజీలు:180.

డా. నమిలకొంద సునీత పరిశోధక వ్యాస సంకలనం,
తెలంగాణ యశోధరులు- ఒక పరిశీలన
——+++++———
సమాజ హితాన్ని కోరేది సాహిత్యం. సాహిత్య సృజనకు లోతైన సామాజిక, సాహిత్య, తాత్విక అధ్యయనం మిళితమైతే బంగారానికి పరిమళం అబ్బినట్లుగా ఉంటుంది. మానవ జీవితంలోని వివిధ రంగాలు , సాహిత్యంలోని వైవిధ్య పరిణామాలను, వివిధ ప్రక్రియలను సునిశితంగా పరిశీలించి, తగిన వ్యాఖనాలతో ఎప్పటికప్పుడు రచయితలు వర్తమాన సాహితీ ప్రపంచానికి అందించాలి . నాటినుండీ నేటి వరకూ సమాజంలోని మార్పులను, లోటుపాట్లను ఎత్తి చూపి సంస్కరించడానికి ఎందరో మహానుభావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు, నాటి కాలపు రాజులు, ఈ నాటి ప్రజాస్వామ్య వాదులు, అభ్యుదయ మహిళలు, ప్రజా ప్రతినిధులంతా కృషి చేశారు. చేస్తూనే ఉన్నారు. తెలంగాణలోని వివిధ పార్శ్వాలలో రాణించిన మహామహులెందరో ఉన్నారు. నిస్వార్థ సేవాపరాయణుల జీవితాలను, ప్రతిభా సామర్థ్యాలను తెలుసు కోవడానికి, భావి తరాలకు అందించడానికి సాహిత్యం ఒక ఉపకరణంలా పని చేస్తుంది. అందులో భాగంగా అలాంటి ప్రతిభా సంపన్నుల గొప్ప కృషిని, వారి జీవిత అనుభవాలను, వారి రచనలను విశ్లేషణ చేయడంలో ఆరితేరిన వారిలో డా.నమిలకొండ సునీత గారు ఒకరు. తెలంగాణ సాహిత్య పునర్నిర్మాణాన్ని చేయాల్సిన బాధ్యత డా.సునీత లాంటి వర్తమాన రచయితలపై ఉంది. సమాజము-సాహిత్యము రెండూ పెన వేసుకొని పోయి సమాజాన్ని సంస్కరించడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నది. ఎంతోమంది ప్రాచీన సాహిత్య కారులు వర్తమాన సాహిత్యకారులు, భక్త శిఖామణులు, సమాజ హితం కోసం రచనలు చేస్తూ ఉద్యమాలు సాగిస్తూ తమవంతు పాత్రను పోషించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ వాస్తవ్యురాలైన సాహితీవేత్త డాక్టర్ నమిలకొండ సునీత గారు ఇటీవల పరిశోధించి రాసిన తెలంగాణ యశోధరులు వ్యాస సంకలనం ఇందులకు ప్రతీకగా నిలుస్తుంది. ఇందులో ఎందరో మహానుభావులను, పాలకులుగా రాణించిన మహిళా మణుల ప్రతిభా సామర్థ్యాలను, అవధానులపాండిత్య ప్రకర్షను,పద్యకవుల కవన సౌరభాలను, విద్యావేత్తలు, ఆర్షధర్మ, సాహిత్య సామాజిక రంగాలకు చెందిన వరిష్టుల ప్రత్యేకతలను లోతుగా తవ్వి, పరిశోధించి 15 వ్యాసాలుగా రాశారు. ఈ వ్యాసాలు మేలిమి బంగారంలా తయారవడానికి రచయిత్రి చేసిన నేపథ్య కృషి, లోతైన అధ్యయనం అపారమైనది. శ్రీ విద్యో పాసకులు సద్గురు శివానందనాథ, ప్రముఖ సాహితీవేత్తలు ఆచార్య ఎస్వీ. రామారావు, డా. టి .శ్రీరంగ స్వామి, డా. అయాచితం నటేశ్వర శర్మ లు.ముందు మాటలు రాసి, రచయిత్రిని అభినందించారు.

డా.సునీత ఈ వ్యాసాలకు సాహిత్య, సామాజిక వ్యాసాలుగా పేర్కొని తన కలాన్ని పదునెక్కించారు. రచయిత్రి తొలుతగా 2016లో ప్రభాత కిరణాలు అనే వ్యాస సంపుటితో సాహిత్య వ్యాసాలు వెలుగులోకి తెచ్చారు. నిత్య పరిశోధనలతో తన రచనా వ్యాసంగాలను కొనసాగిస్తూ, పత్రికలకు, ప్రత్యేక సంచికలు రాస్తూ తన సాహితీ ప్రావీణ్యాన్ని చాటు కొంటున్నారు. వీరు తెలుగు. ఎం. ఎ చేసి, ఎంఫిల్, పి. హెచ్. డి పట్టాలను పొందారు. వృత్తి రీత్యా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ప్రభుత్వ తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు.తన సిద్ధాంత అంశమైన వరంగల్ జిల్లా పత్రికలు- సాహితీ సేవ గ్రంథాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ద్వారా పరిశోధించి, సుమారు 300 పేజీలతో అచ్చు వేసి పాఠ కాదరణను పొందారు. రచయిత్రి ఎం. ఫిల్ పరిశోధన గ్రంథం “మూక పంచశతి వ్యాఖ్యానాలు ఒక పరిశీలన” అచ్చులోకి రావాల్సి ఉంది. మూడవ గ్రంథంగా 2022 సంవత్సరంలో తెలంగాణా యశోధరులు పేరిట వ్యాస సంకలనాన్ని అచ్చులోకి తెచ్చారు.

ఇహ వీరి వ్యాసాలు ప్రత్యేకమైన శైలితో, తెలుగుదనంతో అలలారుతాయి. పలు సామెతలు, సంస్కృత శ్లోకాల ఉదాహరణలు, ఉపమాన, ఉపమేయాలు, అలంకారాలు, మాత్రా ఛందస్సు మొదలగు అంశాలతో వ్యాస నడవడిక హృద్యంగా సాగుతుంది. ఈ వ్యాస సంకలనం ప్రచురణకు హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కొంతమేరకు ఆర్థిక సాయాన్ని అందించారు.

ఇక వీరి వ్యాసాలలోకి వెళ్తే తెలంగాణ సంస్థానాల్లో మహిళల పాత్ర, గద్వాల సంస్థానంలో సాహిత్య సేవ వీరి నిశిత పరిశోధనలకు అద్దం పడతాయి. తెలంగాణ ప్రాంతంలో 14వ శతాబ్దం నుండి 19 శతాబ్దం ఉత్తరార్థం వరకు కుతుబ్ షాహీల నుండి మొగలులు, నైజాం రాజుల పాలనా కింద 14 సంస్థానాలు పాలించాయని ఆమె పేర్కొన్నారు. ఈ సంస్థానాల రాణుల పాలనలో జరిగిన సామాజిక, సాహిత్య రంగాల గూర్చి అధ్యయనం చేసి చక్కటి పరిశోధక వ్యాసాన్ని అందించారు. ఇందులో గద్వాల, వనపర్తి , అమర చింత (ఆత్మకూరు), జటప్రోలు(కొల్లాపూర్), పాపన్నపేట , పాల్వంచ, బొరవెల్లీ , సిర్నా పల్లి, గోపాల పేట, తదితర సంస్థానాల గూర్చి రచయిత్రి చక్కగా చర్చించారు. గద్వాల సంస్థాన మూల పురుషుడు కాకతీయ ప్రతాప రుద్రుని కాలం నాటి గొన బుద్ధారెడ్డి యనిపెద్ద సోమ భూపాలుడని, ఇతనే శోభనాద్రి, సోమనాద్రి గా. పిలువ బడ్డాడని, క్రీ.శ.1663-1735 పేర్కొంటూ,ఇతనే గద్వాల కోట నిర్మాతలని అన్నారు. గద్వాల పాలకులలో శ్రీరామ భూపాలుడు, సీతారామ భూపాలుడు, తర్వాత ఆది లక్ష్మీ దేవమ్మ.దత్త పుత్రుడు కృష్ణ రాం భూపాలుడు ముఖ్యులను. పేర్కొన్నారు. ఇందులో భాగంగా అనేకమంది సాహిత్యకారులు ఈ సంస్థానాలలో కవులుగా రాణించి పలు గ్రంథాలు రాసినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ సంస్థానాలలో కవులకు, పండితులకు ముఖ్యంగా పద్య కవులకు, సాహిత్యకారులకు చక్కటి ఆదరణ లభించిందనట్లు తెలిపారు.గద్వాల ప్రభువు పెద్ద సోమ భూపాలుడు స్వయంగా కవి, జయ దేవుని గీత గోవిందాన్ని తెలుగు సేత చేశారని రాశారు. గద్వాల ప్రభువుల కాలంలోనే కవి, పండితులు , అవధానులైన తిరుపతి వెంకట కవులు, మరియు రామ భూపాలుడు కాలంలో, శ్రీపాద కృష్ణమూర్తి వంటి ఉద్దండులైన కవులు ఈ సంస్థానాలకు విచ్చేసి సన్మానింపబడ్డారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వివిధ సంస్థానాధీ శులైన మహిళలు అందించిన చక్కటి పరిపాలనను, సాహిత్య సేవలను ఈ వ్యాసంలో రచయిత్రి సోదాహరణంగా వివరించారు. తెలంగాణ సంస్థానాలలో మహిళలు రాచరికం చేశారని చక్కటి పరిపాలనను అందించారని ఎంతోమంది కవులను ఆదరించారని ఆమె విపులంగా పేర్కొన్నారు. వివిధ సంస్థానాలలోని రాణుల గూర్చి రాశారు . అమ్మక్కమ్మ లింగమ్మ, మంగమ్మ, చొక్కమ్మ , వెంకట లక్ష్మమ్మ, ఆది లక్ష్మీదేవి, సరళాదేవి, భాగ్యలక్ష్మమ్మ వెంకటరత్నమాంబ, రాణి శంకరమ్మ, మల్లమ్మ , ఎల్లమ్మ లచ్చవ్వ దొరసాని, లక్ష్మీనరసాయమ్మ , గిరియమ్మ , చీలం జానకి బాయి మొదలైన మహిళామణులు సంస్థానాలను చక్కగా పరిపాలించారని ఉదాహరించారు.

ప్రముఖ పద్య కవులైన వేముగంటి నరసింహచార్యులు, వారి రచనలపై 26 పేజీలలో సుదీర్ఘ వ్యాసము రాసి, హైలైట్ నిలిచిపోయారు. వేముగంటి వారు మహాభారతంలోని తిక్కన వంటి ఉద్ధoడ పండితులని ఆమె పేర్కొన్నారు. సంస్కృతాంధ్ర భాషలతో పాటు ఉర్దూ భాషలో చక్కటి పాండిత్యాన్ని సంపాదించుకొని అనేక పద్య కృతులను రాసి పండితలోకం మెప్పు పొందారని, మెదక్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేసేసమయంలో ఎంతోమంది యువ కవులకు ఆదరువుగా నిలిచి, వారిని ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఆధునిక ప్రాచీన కవిత్వాల వారధిగా వేముగంటి వారు రాణించారని పేర్కొన్నారు. వేముగంటి వారి రచనల్లో ఆధ్యాత్మికత ఆత్మీయత, జాతీయత, సామాజిక అంశాలు పుష్కలంగా ఉన్నాయని అందుకే వీరి రచనలు సుప్రసిద్ధమయ్యాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాలల్లో , విశ్వవిద్యాలయాల్లో వీరి రచనలు పాఠ్యాంశాలుగా తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. వేముగంటి వారు బెజవాడ గోపాలరెడ్డి , డా.బోయి భీమన్న, దాశరథి కృష్ణమాచార్యులు, దేవులపల్లి రామానుజారావు, డాక్టర్ సినారె, పేర్వారం జగన్నాథం గడియారం రామకృష్ణ శర్మ వంటి ప్రముఖులు సమకాలీనలుగా ఉన్నారని, వారి సహచర్యంతో విశిష్టమైన రచనలు చేసి వాసికెక్కి నట్లు తెలిపారు . వేముగంటి కృతులు ప్రబోధము, భాష్పాంజలి, అమరజీవి, బాపూజీ, కవితాంజలి, తిక్కన, వీర పూజ, మంజీర నాదాలు, శ్రీ వెంకటేశ్వర ఉదాహరణము , గణేశ ఉదాహరణము, ఆంధ్ర విష్ణువు, భక్త రామదాసు, శ్రీ వాసవీ సరస్వతి వైభవము భావాంజలి, వ్యాసకలాపము, అక్షర దీపాలు, పురుషకారము, మేలుకొలుపు, శ్రీ వివేక విజయము, అమృత వర్షిని, ప్రియదర్శిని, సువర్ణ సుమాంజలి, శ్రీహరి చరణస్మరణ గీతి, శ్రీకృష్ణ లీలామృతం , శ్రీరామ పద్యమాలికా స్తోత్రము,పంచాష్టకములు, తదితర కృతులపై విశ్లేషించారు. ఒకరకంగా చెప్పాలంటే వేముగంటి పద్య కృతులన్నిటిని సాకల్యంగా పరిశీలించి చక్కటి వ్యాసాన్ని పరిశోధకులకు కరదీపికగా, పాఠకాదరణకు పాత్ర మయ్యేలా అందించారు. వేముగంటి జీవితము, సాహిత్యం పై ఒకటి రెండు పరిశోధనలు విశ్వవిద్యాలయాలలో జరిగాయని, అవి సరిపోవని ఆమె పేర్కొన్నారు. వీరి రచనలపై రచనలపై విడివిడిగా విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెబుతూ చర్చించారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఆస్థాన కవి, పద్యకవి అయిన స్వర్గీయ మామిడిపల్లి సాంబ కవి గారు మరుగున పడిన మహాకవుల జాబితాలో చేరినా, వీరి రచనలను వెలికి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వీరి రచనలు ముఖ్యంగా వారి సామాజిక కృతులపై వివరంగా విశ్లేషించారు. 19వ శతాబ్దంలో పద్య కవిగా ద్విపద రామాయణం , రాజేశ్వర సుప్రభాతం వంటి రచనలతో పాటు బుర్రకథలు యక్షగానాలు, నాటకాలు హరికథలు రాసిన కవిగా వీరు సుప్రసిద్ధులని ఆమె తెలియజేశారు . సాంబకవి గారిని డాక్టర్ సినారె వంటి మహాకవి గురుతుల్యులుగా భావించారని పేర్కొన్నారు. భక్తి ప్రధానమైన రచనలతో పాటు దేశభక్తి జాతీయత మానవతావాదం సమాజ శ్రేయస్సు వీరి రచనల్లో నిండుగా కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. వీరు పద్య కృతులైన లోభ సంహారము,ముక్తాహారము, మహాదేవరశతకము, జయశ్రీ, మధురఝంకా కరములు, రాజేశ్వర తారావళి వంటి వాటితో పాటు నదులపేరిట వెలువరించిన ఖండకావ్యాలు వీరి రచనా వైదుష్యానికి ప్రతీకలుగా నిలిచాయనీ, ప్రాచీన ఆధునిక సాంప్రదాయాలతో వీరి రచనలు భాషించాయని ఆమె పేర్కొన్నారు. ముక్తాహారము, కుంజ విహారం, లోభ సంహారము, జయశ్రీ పద్య కృతులను విపులంగా చర్చించారు. కుంజవిహారము పద్య కృతి కి నామౌచిత్యము పాటించారని, రాధా మాధవుల ప్రణయ వృత్తాంతాన్ని ప్రధానంగా తీసుకొని 40 పద్యాలతో కావ్యంగా మలిచారని ఆమె పేర్కొన్నారు. సాంబకవి అవధానాలతో తిగుళ్ళ శ్రీహరిశర్మ వంటి అవధానులు వెలుగులోకి రావడానికి స్ఫూర్తినిచ్చారని ఆమె పేర్కొన్నారు. సాంబకవి సాహిత్యం, పద్య కృతులపై చక్కటి పరిశోధన చేసిన శ్రీమతి డా.ఇట్టేడు విష్ణు వందనా దేవి అభినందనీయురాలన్నారు. ఆర్ష కవి దోర్బల విశ్వనాథ శర్మ పద్య కవిత్వం గురించి, వివిధ దైవతాలపై ఆయన రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలను చక్కగా విశ్లేషిస్తూ పరిచయం గావించారు.
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి సాహిత్యము, వారి ఉన్నత వ్యక్తిత్వం గూర్చి పరిపాలన దక్షతల గూర్చి రాసిన వ్యాసంలో పలు విషయాలు చర్చించారు. పీవీ గారు శ్రీ రామానంద తీర్థ , బూర్గుల రామకృష్ణారావు తదితరుల స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో చైతన్య శీలిగా వ్యవహరించారని, రాజకీయ పదవుల్లో రాణిస్తూనే, మరో పక్కన సాహితీ రచనా వ్యాసంగాలను, సాహితీ గ్రంథాధ్యయనాలను కొనసాగించారని పేర్కొన్నారు. వీరు నైజాం విముక్తి కాలంలో రాసిన గొల్ల రామవ్వ కథ లో అప్పటి తెలంగాణ జీవభాష పదాలను ప్రయోగించారని ,వరంగల్ లో సదాశివరావు గారితో కలసి కాకతీయ పత్రికకు సారథ్యము వహించి, పాత్రికేయునిగా వ్యవహరిస్తూనే వీరు వివిధ పేర్లతో నాలుగు కథలను రాసినట్లుగా పేర్కొన్నారు. విశ్వనాథ రాసిన వేయి పడగలను సహస్ర ఫణి భూషణ్ పేరున హిందీలో అనువదించి బహు భాషావేత్తగా ప్రసిద్ధిగాంచారని పేర్కొన్నారు. వీరు “లోపలి మనిషి” పేరిట ఆత్మకథను రాసుకున్నారని ఇందులో తన స్వీయ అనుభవాలను ఆనంద్ పాత్ర ద్వారా వ్యక్తీకరించారని అన్నారు.

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన వివిధ రచనలు ముఖ్యంగా ఏకవీర, వేయి పడగలు నవలలను విశ్లేషణాత్మకంగా చర్చించారు.ఏకవీర నవలా నేపథ్యాన్ని చక్కగా వివరించారు. తెలుస్తుంది ఈవ్యాసం రచయిత్రి రచనా కౌశలానికి దృష్టంతంగా నిలుస్తుంది. తెలంగాణలోని పద్య కవిత్వ వైభవంతోపాటు అవధాన రంగంలో ప్రముఖులైన కవుల మూర్తీభవించిన అవధాన వైభవాన్ని తెలంగాణ అవధాన వైభవము అన్న శీర్షికన చర్చించారు. వేములవాడకు చెందిన ప్రముఖ కవి వేదాంతం కాశీనాథం గారి పద్య రచనల గూర్చి, వారి గొడగూచి పద్య కృతి విశిష్టత గూర్చి కాశీనాథుని కావ్యానుశీలనము అనే శీర్షికన విపులంగా విశ్లేషించారు . వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర పురా వైభవం, ప్రాశస్త్యం గూర్చి చక్కగా పరిశోధించి రాశారు. మహాభారతంలోని వివిధ జానపద పాత్రలు, జానపద గేయాలు, జానపదుల నోళ్ళల్లో నానిన పాటల గూర్చి రసవత్తరంగా రాశారు. ‘మహాభారత పాత్రలు జానపద ప్రతీకలు’ అనే శీర్షికన రాసినఈ వ్యాసం పురాణేతిహాసాల పట్ల వారికి గల అవగాహనను వ్యక్తం చేస్తుంది. జానపద సాహిత్యంలో మహాభారత పాత్రలు ఏ రకంగా ప్రచారంలో ఉన్నాయో ఆమె ఈ వ్యాసం ద్వారా విప్పి చెప్పారు. రైతులు వ్యవసాయంలో ఉన్నప్పుడు వర్షాల వల్ల పిడుగుపాటుకు గురికాకుండా ఉండటానికి పాండవ మధ్యముడైన అర్జునుని తలుచుకుంటారు. ఆంధ్ర తమిళ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఐదు రాళ్ళను పెట్టి గుడులుగా భావించి పంచపాండవులని పూజిస్తారనే పలు విశేషాలను రచయిత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గిరిజనుల్లో ఒక తెగ అయిన గోండులు పొలాల్లో విత్తనాలు చల్లే ముందు భీమసేనుని అర్చిస్తారని ఆమె పేర్కొన్నారు. మహాభారతంలోని ఏకలవ్యుడు సూతుడు విశ్వరూపుడు, ఘటోత్కచుడు, ఇరావంతుడు పాత్రల గూర్చి, సుభద్ర సారె, ధర్మరాజు జూదము, ద్రౌపది మాటలు.. తదితర అంశాలపై వచ్చిన జానపద గేయాలు గూర్చి చక్కగా చర్చించారు. తాళ్లపాక తిమ్మక్క రాసిన సుభద్ర కళ్యాణము ఆధారంగా వచ్చిన జానపద గేయాల గూర్చి చక్కగా చర్చించారు.

అవిభక్త నిజామాబాద్ జిల్లా నవలా సాహిత్యం పై చక్కటి సుదీర్ఘ వ్యాసము రాశారు. ఈ ఉమ్మడి జిల్లా తొలినాళ్ల నుండే నవలా సాహిత్యంలో కీలకపాత్రను పోషించి మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. తాను నివసిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే కాక, పొరుగున ఉన్న మెదక్ జిల్లా సాహిత్య రచనలు, అక్కడి కవుల సృజనలపై ఆమెకు చక్కటి పట్టు ఉంది. ప్రజల మనిషి నవల రాసిన వట్టికోట ఆల్వార్ స్వామి నిజామాబాద్ జిల్లాలో జైలు జీవితం గడిపారని ఇక్కడి నుండే వచ్చిన ప్రసిద్ధ నవలా రచయిత లోకమలహరిగారు, డా. కేశవరెడ్డి, 40 నవలలు రాసిన బొమ్మ హేమా దేవి, మరియు కేవీనాథం, తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్, డాక్టర్ అమృతలత, కంఠo నేని రాధాకృష్ణ, యాటకర్ల మల్లేష్ ,వి.శాంతి, మేడిచర్ల ప్రభాకర్ రావు ,మల్లవరపు చిన్నయ్య, కస్తూరి మురళీకృష్ణ, సిరిగాద శంకర్ ,డాక్టర్ వి. ఆర్ శర్మ ,దారం గంగాధర్, ఎనిశెట్టి శంకర్, శ్రీమతి అయాచితం స్పందన తదితరులు నవలా సాహిత్యంలో వాసిగాంచారని ఆమె పే ర్కొన్నారు. సుమారుగా ఆరేడు దశాబ్దాల నుండి ఇక్కడ నవలా సాహిత్యం వర్ధిల్లుతుందని ఆమె పేర్కొన్నారు. రచయిత్రి తెలంగాణ యశోదరులు పేరిట తెలంగాణలో ప్రసిద్ధులైన వారితో పాటు, వెలుగులోకి రాని మహనీయమనిందరినో వెలుగులోకి తెచ్చే ప్రయత్నం సఫలీకృతమైనది. ఈ పుస్తకం పరిశోధకులకు ఎందరికో దారి దీపంగా నిలుస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ఆ బాలగోపాలం చదివి భద్రపరచుకున్నదగిన పుస్తకం మిది. డా.సునీత సాహిత్య వికాసం అధ్యయనం, రచనా వ్యాసంగం తో ముడిపడి తన రచనలను పత్రికలకు పంపుతూ.అచ్చులోకి తేవడం.అభినందనీయం.

-సంకేపల్లి నాగేంద్రశర్మ, రైటర్, కరీంనగర్ .dt 26.6.2023

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నిత్యనూతన—–చైతన్యం.!!

by Kandakatla Janardhan July 30, 2023
written by Kandakatla Janardhan

ఈ రోజంతా మనమందరం
కొత్తదనంతో-నవతనువుతో
హృదయమంతా ఉదయించిన
ఉత్తేజ ఉద్వేగభరిత
హుషారుగా ఉషానిషా కిరణాలవుతున్నాం..!

మనమంతా
ఉల్లాసంగా ఉత్సాహంగా
తొలి యవ్వన కాంతులమై
అన్ని పండుగలన్నీ ఒకేసారి
కాళ్ల ముందుకు వచ్చినట్లుగా…

విందుల వినోదాలు
సరదాలసరాగాలన్నింటిలో
సత్వర ద్వార సందర్శనమై
సంలీన విలీనమై
సౌకర్యాల సౌరభాల మధ్యఓ విజయంగా విజృంభిస్తున్నాం…!

కలకలం – కలతలు లేకుండా
కలకాలం కలిసి ఉండాలనీ
కలలన్నీ నిజం కావాలనీ
సంకల్ప సంక్రాంతికి
నిర్ణయాలు నిర్భయంగా
తోడూ నీడైన నిమిషాన
ప్రతీ వాగ్దానంతో
ఒళ్లు విరుచుకుంటున్నాం..!!

ఇక…. ఇప్పటి నుండి
రేపటి – భావి జీవితం కోసం
క్రమం తప్పని..కసరత్తుని
కంకణంగా కట్టుకుని…………….

కలం కదిలించి- కదం కదిపి
గళం విప్పి- గతం మరిపించి
సవరించుకుని సరిదిద్దుకుని
సర్దుబాటు చేసుకుని

అప్పటి వరకు
ముడుచుకున్న ముఖాలు
వికసితమైన వీక్షణంతో
వైరాగ్యంలో మహాభాగ్యాన్ని
వేకువ మెళకువల్లో మెలికలు తిరిగి
మేలిమిని వెతుక్కుంటున్నాయి..!!

అనుదినమూ ఆనందంగా
శ్వాసించిన..ఆశించిన..ఆచరించిన
తరుణం తర్వాత…

నిన్నటి కన్నా మిన్నగా
ఏ తీరమైనా- ఏ తరమైనా
మహాత్తరమవుతుందనీ…..

అటు ఆరంభశూరత్వ లేమిని
ఇటు నూతనతన్మయత్వ కలిమిని
నిత్యం నిఖిలం
చలించని చెలిమిని
అభిలషిస్తూనే
ఇపుడు ఇక………
గమనం-గమ్యం పురోగమించేలా
అందరం…..ఒక్కటవుదాం…..!!!

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

బాలల అనువాద కథలు

by ఒద్దిరాజు మురళీధరంరావు July 30, 2023
written by ఒద్దిరాజు మురళీధరంరావు

మూలం:- డా॥ బి.జి రమేష్ గారు.
అనువాదకులు:- ఒద్దిరాజు మురళీధర్ రావు గారు.

పాశ్చాత్య దేశాలతో పోల్చుకున్నప్పుడు మన తెలుగు భాషలో బాలలసాహిత్యం తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా ఉన్న ఆ కొద్ది రచనలు పిల్లలకు చేరువ కావడం లేదు.. దానికి కారణం
” తిలాపాపం తలా పిడికెడు” అన్నట్టు సృజనాత్మక త అంతగా లేని మూస విద్యావిధానంలో విద్యార్థులు “హోం వర్కు” తోనే అధిక సమయం మరియు అధిక భారంతో గడపడంతో సమయం లేక పోవడం, తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే ఇల్లు చేరే సరికే పిల్లలు నిద్రలోనూ…. నిద్రావస్థలో ను ఉండడం, ముఖ్యంగా కొందరు తల్లులకు పిల్లల చేత ఎలాంటి పుస్తకాలు చదివించాలనే ఎంపికలో అవకాశాలు లేకపోవడమనే నాకనిపిస్తుంది… ఆ లోటు పూడ్చడానికా? అన్నట్టుగా డా.బి.జి రమేష్ గారి ఆంగ్లంలో రాసిన పిల్లల కథలు విలువలు నేర్పే దిశగా సాగాయి.

మూల రచయిత రమేష్ గారు కన్నడ ప్రాంతానికి చెందిన రచయిత, మైసూరు జిల్లా లోని హోనాసోగే గ్రామానికి చెందిన వారు. వీరు ఎన్నో గ్రంథాలను రచించారు. అందులో ఈ ” Bed time stories ” అనే కథల పుస్తకాన్ని గౌరవనీయులు ఒద్దిరాజు మురళీధర్ రావు గారు తేలిక తెలుగు భాషలో పిల్లలకు ఎవరి సహాయం లేకుండానే అర్థమయ్యేటట్టు గా అనువదించారు.
అనువాదం చేయడం అంత సులువేమీ కాదు. ఒక భాష వస్తే సరిపోదు! అక్కడి కథను ఇక్కడ అన్వయిస్తూ చెప్పాలి. ఎందుకంటే మూలంలోని పరిసరాలు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలువేరు. అయినా వాటికి లోటు లేకుండా… మూల రచయిత భావం, సహజత్వం చెడకుండా తనదైన భాషా శైలి లో బాల బాలికలకు అందించడం కష్టమే అయినా మురళీధర్ రావు గారికి ఇదివరలో రవీంద్రనాథ్ ఠాగూర్, లియో టాల్స్టాయ్ వంటి రచనలను అనువదించిన అనుభవం ఉంది. అంతేకాదు మూల భాష మరియు లక్ష్య భాష రెండూ చక్కగా తెలుసుకాబట్టి మూలంలోని విషయం చెడకుండా కథలంటే ఇష్టపడే చిన్నారులకుచక్కగా అనువదించ�

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మనిషి కోసం తపన

by A, Gajender Reddy July 20, 2023
written by A, Gajender Reddy

వారాల ఆనంద్ రచనల్లో ‘మానేరు తీరం’ విలక్షణమైంది. ‘ప్రవాహం పయనమై సముద్రాన్ని చేరుతుంది. అవును. పరుగులెత్తడం తెలిసిన ప్రవాహం నేలతల్లిని ఆర్తిగా తడుముతూ గమ్యం వైపు సాగిపోతుంది” అంటూ ప్రారంభమౌతుంది. మరి మనుషుల్లో – ప్రవాహం తెలీని బతుకుల్లో మాటలు కోటలు దాటుతాయి, చేతలు సాగిలబడతాయి, గమ్యం గాభరా పడుతుంది.
నేడు మనుషుల్లో సహజత్వం క్షీణిస్తున్నది. నటన పెరుగుతున్నది. మనసుల్ని భూస్థాపితం చేసి లోకం వేదికపై దర్జాగా నటించేస్తూ బతికేస్తున్నామని, మానవీయ విలువల కంటే ఎక్కువగా కుహనా అవసరాలపై మక్కువను పెంచుకున్నామని అంటాడు. మనం ఎంత ఉదాసీనులమై పోయాం! “యథాలాపంగా ఊపిరి తీసుకుంటున్నట్లుగానే మనం లోకం కేసి చూడ్డం అలవాటు చేసుకుంటున్నాం. తూర్పు పడమరై పోయినా, ఆకాశం విరిగి మీద పడ్డా, ప్రవాహం ఎదురు తిరిగి దిశ మార్చుకున్నా, మనుషులు మమతానురాగాల్ని పోగొట్టుకున్నా, మానవతా విలువలన్నీ కట్టగట్టుకు కొట్టుకుపోయినా, స్నేహం నిర్దయగా స్వార్థమయి పోయినా, అవసరం మనిషిని ఆటవికున్ని చేస్తున్నా, మనిషి విలువ వినియోగ వస్తువై పోయినా మనం ప్రేక్షకునిలా అలా గంభీరంగా చూస్తూ మన బతుకు మనం బతికేస్తున్నాం”.
ఇప్పుడంతా లౌక్యం యాంత్రికత్వం కృత్రిమత్వం. మనిషన్న మాటకి అర్థం మారి యంత్రాలకు పర్యాయపదాలుగా మారుతున్నాం. మనల్ని మనం వదిలేసుకొని పరుగులు తీస్తున్నాం. ఎవరి కోసమో దేనికోసమో తెలీకుండానే చేస్తున్న పనిలో ఎవరికి ఆనందముంది? మనది కాని మనకోసం కాని బతుకు వేరేవారి నియంత్రణలో వేరెవరి లాభం కోసమో ఉక్కుచట్రంలో బిగించ బడి పరుగు తీస్తున్న బతుకు దేనికి? చరిత్రగతిలో ధూళిలా రాలిపోవడం తప్ప, అనంతయాత్రలో ఆనవాలు మిగల్చకుండా సాగిపోవడం తప్ప ప్రయోజనమేముంది? అని ప్రశ్నిస్తాడు ఆనంద్.

సమాజం దాకా ఎందుకు? ఇద్దరు కలిస్తే ప్రేమగా అభిమానంగా పలకరించుకుంటున్నారా? ఎన్ని దూరాలు, ఎన్ని అనుమానాలు? ఇద్దరు మనుషుల మధ్య రెండు మనసుల మధ్య రెండు ఆలోచనల మధ్య ఎడం నిజంగా ఎంత ఘోరం? అంటూ ఒకే మనిషిలోని అంతర్ బహిర్ తత్వాల మధ్య ఎడాన్ని కూడా ఉటంకిస్తాడు. ఆనాటి ఆ స్నేహాలు ఏవి? సెలవులకి ఊరికి పోయి వచ్చిన అనుభవాల ముచ్చట్లు అందరం కలిసి పంచుకోకుండా కాలు నిలిచేదా! కాలం నడిచేదా? అని గుర్తు చేస్తాడు. నేడు ప్రతిక్షణం అవిశ్వాసాన్ని మోస్తూ చివరి అంచుకు ఎలా చేరగలం? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉందో కూడ చెప్తాడు. ఆనంద్. “మనం ఒకరికి ఒకరంగా సాటి మనిషిగా స్నేహం పంచుకోవాల్సి ఉంది. అభిమానాన్ని పెంచుకోవాల్సి ఉంది. ప్రేమను నింపుకోవాల్సి ఉంది. మనల్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. శ్వాసలో విశ్వాసాన్ని నింపుకోవాల్సి ఉంది.” ఇద్దరి మనుషుల కరచాలనంలోంచి స్నేహం ఉరకలెత్తాలని, రెండు చూపుల ఆరాధనల్లోంచి ఆప్యాయతలు వెల్లివిరియాలని కోరుకుంటాడు. మమేకత్వం మనల్ని మనుషుల్ని చేస్తుందని భావిస్తాడు. ఎక్కడ మనిషిని తూచకుండా మనిషిలా చూస్తారో అక్కడిదాకా ఏకబిగిన నడిచిపోవాలనీ, పరుగులు

తీయాలనీ ఆనంద్ మనసు మానేరులా ఉరకలు వేస్తుంది. సాగిపోతున్న కాలంలో ప్రతిక్షణం ఓ నూతన శకానికి నాంది పలకాలి. ఓ సరికొత్త ఆలోచనకి అనుభూతికి తొలిమెట్టు కావాలి. మనిషిని చిగురింపజేసే, మనసుని పురివిప్పదీసే నూతనోదయం కావాల్సిందే, మనిషి మనిషిగా మిగలాల్సిందేనని ఆకాంక్షిస్తాడు.

మౌనం, మాట, మరుపు, మనసుల గురించి ఆనంద్ చెప్పిన వాక్యాలు ఆణిముత్యాలు. వినగలిగితే మౌనంలో కోటి గొంతుకల రవాన్ని పెదాలు వినిపిస్తాయి… నిశ్శబ్దాన్ని నిక్షిప్తం చేసుకొని భావ తరంగాల్ని మోస్తూ సాగే మౌనం ఖచ్చితంగా అర్థవంతమయిన సంభాషణమే. మాట ఎగసిపడే భావనా తరంగం. జాలువారే ఆత్మీయతా ప్రవాహం. మాట మనసులో ముంచితీసిన అనుభూతి ప్రతిబింబం. మాట పలికితే గుండెల్నినట్టుంటుంది. మనిషికి మరపు వరం. మనిషి కదలికకే మూలం. గతంలోని బాధామయ అనుభవాల్ని మరువకుంటే వర్తమానం భయంకరమవుతుంది. అట్లాగే గతకాలపు సంతోషంలో కొట్టుకుపోతూ ఉంటే భవిష్యత్తు బాధామయమవుతుంది. మనిషి మనస్సు అనురాగపు ఆర్ద్రతను ఆశిస్తుంది. తనను తానుగా గుర్తించే తోడును కోరుకుంటుంది. ఎవరి ఊహయితే ఉరకలు పెట్టిస్తుందో ఎవరి స్నేహమయితే ఆనంద తీరాన్ని చేరుస్తుందో ఎవరి తోడయితే సంతోషపు సముద్రాల్లో ఈదులాడిస్తుందో ఆ తోడు కోసం స్నేహం కోసం ఆ ఆలంబన కోసం మనసు తహతహ లాడుతుంది.

ఇంకా “శిశువు కెవ్వుమన్న పిలుపులో జీవన పోరాటపు ప్రతిధ్వని వినిపిస్తుంది” “ఆకాశం వేయి వెలుగుల సూర్యునికి మాతృమూర్తి… ఆకాశం మనకు నేస్తం… మొత్తంగా శూన్యం తాత్కాలికం.. చేతనే శాశ్వతం” వంటి చైతన్యం వైపు మనిషిని నడిపించే మహా పంక్తులు మనల్ని వెన్నాడుతాయి.

ఈ పుస్తకానికి విశ్వేందర్ రెడ్డి అందించిన ముఖచిత్రం, లోపలి పేజీలలో కల్యాణం శ్రీనివాస్ గీసిన భావగర్భితమైన బొమ్మలూ మనల్ని ఆకర్షిస్తాయి. ‘మానేరు తీరం’ వారాల ఆనంద్ హృదయం ద్రవించి, మేధస్సును మధించి, మనిషి కోసం తపించి రాసిన గ్రంథం.

ప్రతులకు : వారాల ఆనంద్

9440501281

July 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us