(మొదటి భాగం)
మహాకవి గురజాడ స్వర్గంలో సుఖవంతమైన ఈజీ చైర్లో (ఎనుకటి తాతయ్యలు వాడేది) కూర్చుని మధురవాణి ఇంటర్వ్యూలు చదువుతుంటాడు. చుట్టూ చాలా పుస్తకాలు నిలువు గుట్టల్లా ఉంటాయి.
ఊర్వశి : నమస్కారం గురువులకు గురువు గురజాడ గారూ! బాగున్నారా?
గురజాడ : ఆఁ ఈ బిరుదు గురువులకే గురువు అనేది చెళ్ళపిళ్ళ వారికి, ఆ తర్వాత విశ్వనాథకు, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీకే నప్పుతుంది, చెల్లుతుంది.
ఉ: అదేమిటి మీ స్ట్రగుల్ తర్వాత దాదాపు ఒక ముప్పయేళ్ళు మీ ప్రభావం తెలియకుండా, బయట పడకుండా చేసిన చెళ్ళపిళ్ళ వారికి, విశ్వనాథ వారికి ఈ బిరుదు చెల్లుతుందన్నారు. ఎందుచేత?
గు: వ్యావహారిక భాషోధ్యమ తీవ్ర ప్రభావం చేతనే చెళ్ళపిళ్ళ వారి పద్యాలు పండితుల నొదిలి పామరుల చెంతకు చేరాయి. అంతే కాకుండా నేను చెప్పిన పై ఆ నలుగురూ సాహిత్య బృందాలను వెంటేసుకు తిరిగారు. కాబట్టి ఆ బిరుదు వారికే వర్తిస్తుంది.
ఉ : ఓహో! అలాగా! మీ చేతిలోకి ఈ మధురవాణి ఇంటర్వ్యూలు ఎలా వచ్చింది?
గు : ఇది మిసిమి రాణి పంపించింది.
ఉ : ఆహా! మధురవాణి, మిసిమిరాణి ఇలా ఎంతమంది తెలుసేం మీకు.
గు: అది నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు. అదంతే.
ఉ : సరే కానీ, మీ శిష్య న్యూక్లియర్ బాంబు శ్రీశ్రీ “అడుగు గురజాడది. అది భావికి బాట. మనలో వెధవాయిత్వం మరపించే పాట” అంటూ మన సాహిత్య పరిణామంతో కొత్త రోడ్డు మీరు వేశారని తామంతా అరసం, విరసం ఇత్యాదులు ఆ రోడ్డు వెడల్పు మాత్రమే చేశామని వాక్రుచ్చారు. మీరేమంటారు?
గు: అదేమిటి? వీళ్ళు చేసిన అన్ని అవకతవక పనులకు నేనా బాధ్యున్ని? అంటే కీర్తి కిరీటాలు, అవార్డులు వీరికి, అపఖ్యాతి, నిందా, దుమారాలు నాకా? ఏడి వాడు ఎక్కడున్నాడిప్పుడు?
ఊ : ఆయన ఆర్నెల్లు స్వర్గంలో, ఆర్నెల్లు నరకంలో ఉంటుంటాడు. ఎక్కడున్నా కుదురుగా ఉండడు. ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడూ విప్లవం లేవదీస్తుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు మీకు కలవకపోతాడా! ఒక తడాఖా తీద్దురు గాని లెండు.
గు : సరేగానీ, ఏమిటీ వీడ్ని నా శిష్య న్యూక్లియర్ బాంబు అన్నావూ. ఇదేం ప్రయోగం?
ఊ: : అంటే శిష్య పరమాణువు అనేది సాధారణంగా అందరూ వాడేదే కదా అని. అది కాక శ్రీశ్రీ మరియు ఆయన అనుయాయులంతా మీకు చేసిన సేవ అంతాయింతా కాదు కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఆపద ప్రయోగం చేశా.
గు : ఉహ్, ఆ సోది పోనిద్దూ. నా తర్వాత వారు నా బాటలు నడిచినవారు కృష్ణశాస్త్రి, చలం, దాశరథి, సుంకర, కాళోజీల తర్వాత నేను నీకు గుర్తొచ్చానా!
ఊ : నాకు మీపై అవ్యాజమైన ప్రేమ, భక్తి ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో ఎడిటోరియల్ బోడొకటి ఏడ్చింది కదా. వారు సూచించిన వారినే, సూచించిన క్రమంలోనే మేము ముఖాముఖి నిర్వహించాలి.
గు : ఒహో! అదొకటుందా మధ్య. సరే, కానీయ్.
ఊ : : శ్రీ కొవ్వలి గోపాలకృష్ణ, శ్రీమతి గురజాడ అరుణ, శ్రీ గురజాడ రవీంద్రుడు అంటే మీ ముని ముని సంతతి అమెరికాలో గురజాడ ఫౌండేషన్ పెట్టి మీరు నడిపి వదిలిన ప్రకాశికను త్రైమాసికంగా అంతర్జాల పత్రికగా నడుపుతున్నారు.
ఎల్ల లోకములొక్క యిల్లె
వర్ణబేధములెల్ల కల్లె
చెట్ట పట్టాల్ పట్టుకు
దేశస్తులంతా నడువ వలెనోయ్
మంచి గతమున కొంచెమేనోయ్
మందగించకముందు కడుగేయ్
అనే మీ భావజాలానికి అనుగుణంగా నడుపుతున్నారు. ఇందులో గురజాడ అరుణ స్వయానా మీ ముని ముని సంతతే.
గు : అదేమిటీ! ఇప్పుడున్న సాహిత్యకారులూ, సాహిత్యాభిమానులూ, కళాకారులూ, కళాభిమానులంతా నా ముని ముని సంతతే కదా! ఇందులో స్వపర బేధం లేదు నాకు. అయినా ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నావూ?
ఊ : ఎందుకంటే మీ ఆనందగజపతిరాజు సంతతి నుంచి వచ్చిన పి.వి.జి. రాజు గారు కాంగ్రెస్ నాయకులు. అప్పటి జమీందారీల రద్దు నేపథ్యంలో గుడి, గోపురాలు, స్కూళ్ళు, కాలేజీలు యాజమాన్యం పేరు మీద రూ. 50,000 కోట్ల ట్రస్టు ఏర్పరచారు. ఆ సంతతి ఇంకా ఆ దర్జా, హోదా అనుభవిస్తున్నారు. మీ సంతతులు మాత్రం అదే సాహిత్య సేవలో తరిస్తున్నారు. ఈ తేడాలెందుచేత?
గు : అదే, అంతే నాకు ప్రాప్తం అనుకుంటాను. ఈ కొవ్వలి గోపాలకృష్ణ సహస్రాధిక నవలా రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహరావు సంతతేనా?
ఊ : : ఔనౌను. అదే సంతతి. కానీ మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. దాటవేస్తున్నారు.
గు : రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి దేశంలోకెల్లా అత్యంత విలువైన సంపదను ట్రస్ట్ ద్వారా కాపాడుకున్నారు. కాంగ్రెస్, టిడిపి ఏదైతేనేం వాళ్ళకు సాధ్యమైన తోచిన రాజకీయ, సామాజిక సేవ చేస్తున్నారు. మిగతా వారిలో ఆ తెలివితేటలు, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల ఆస్తులన్ని ప్రభుత్వ పరమైనాయి. ఇక మిగతాది ఎ.జి.కె. మూర్తి అడ్వర్టైజింగ్ రంగంలో రాణించాడు కదా. ఎవరైనా స్క్రాచ్ టు రిచ్చెస్ కావలసిందే. ఏ రంగమైనా తెలివితేటలు, ప్రతిభ, పోటీతో రాణించాల్సిందే.
ఊ : కానీ మావోయిస్టులు, రాజ్యాంగం ప్రతిభా, గితిభా జాన్తానై. దళిత, గిరిజనులందర్నీ బహుజనులతో పాటు అధికార పీఠం ఎక్కించాల్సిందే అంటున్నారు కదా! దీనికేమంటారు.
గు : అనడానికేముంది. సామాజిక చట్రంలో బ్రాహ్మణులుపై దొంతరలో ఉన్నారు. వారి క్రింద రెడ్డి, వెలమ, కమ్మలు ఉండి వ్యవసాయం చేయించేవారు. ఆ గ్రామీణ వ్యవస్థలో కులవృత్తులన్నీ పాలుపంచుకునేవి. వాటి క్రింది సంచారజీవులు, సామాజిక బహిష్కరణకు గురైనవాళ్ళు ఉండేది. గిరిజనులు ఒక ప్రత్యేక జీవన పద్ధతి. వారి రక్షణకు, ఎదుగుదలకు రాజ్యాంగం ప్రత్యేక సూచనలిచ్చింది. ఐతే సామాజిక, రాజకీయ రంగాలలో సమాన అవకాశాలు లభించి అందరి ఎదుగుదలకు, సామాజిక ఉద్యమాలు దోహదం చేయాలి.
ఊ : ఐతే నేను శ్రీ పి.వి. నర్సింహారావు మరియు శ్రీ జి. వెంకటస్వామి గార్లపై తులనాత్మక, సామాజిక, రాజకీయ పరిశోధన చేయాలని అనుకుంటున్నాను గురువుగారూ.
గు: నీ జర్నలిజం ఇంటర్వ్యూలేవో నువ్వు చేసుకోక ఇటువంటి సమస్యల తేనెతుట్టి వ్యవహారాల్లో ఎందుకు వేలు పెడతావు. నీ పని నువ్వు చేసుకో చాలు.
ఊ : మీ వీరేశలింగం పంతులు, మీ వరవరరావు తమ సమకాలీన సమాజాన్ని, చెడును చీల్చి చెండాడొచ్చు కానీ మేం పరిశోధనలు చేయకూడదా? మీరు మీ లెక్చరరుద్యోగం చేసుకోక అన్నింట్ల వేలు పెడతారేం! మేం మాత్రం చేయకూడదా?
గు :అందులో రాగల సాధక బాధకాల వల్ల నేనలా చెప్పాను. నీకు ఆ ఓపికా, ఉత్సాహం ఉంటే చెయ్యి. పట్టుదలను ఎవడాపగలడు?
ఊ : ఇదేమిటి, నేను మీ అభిప్రాయాల్ని, ఇంకా చాలా విషయాల్ని అడుగుదామని వచ్చి ఇలా వేరే రూట్లో వెళ్తున్నాను.
గు : అదే చాంచల్యం!
ఊ : ఎందుకో గురువుగారూ మీలాంటి వాళ్ళు దగ్గరకు వస్తే వ్రాసుకున్న ప్రశ్నలకు బదులుగా చాలా ఉప ప్రశ్నలే వస్తుంటాయి.
గు : సరే సరే ఇతర దారుల్లో వెళ్ళకుండా నీ సమయం మించి పోకుండా ప్రశ్నలు వెయ్.
ఊ : కవులలో గుర్రపు స్వారీ వచ్చిన ఆధునిక కవులెవరైనా ఉన్నారా?
గు : అదేమిటి! నీ చూపు గుర్రపు స్వారీ మీదకు పోయింది. కొంపదీసి నా స్థానిక ప్రయాణాలలో వేరే రవాణా సౌకర్యం అందుబాటులో లేక నేను గుర్రపు స్వారీ చేశాను. నన్ను రామప్పంతులును ఒక గాటను కట్టవు గదా!
ఊ : అది కాదు, మీ పాత్రలన్నీ మీ అభిమాన పాత్రలే, సజీవ మూర్తులే. మీరు గుర్రపు స్వారీ ఠణాయించారు. ఆ విధంగా ఎన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు గార్ల జానపదాలకు స్ఫూర్తి కదా!
గు: సంపూర్ణ ఆరోగ్యవంతులైన వారెక్కడ, అర్భకున్ని నేనెక్కడ! నువు భలే సామ్యం చెపుతావులే. ఊరుకో. అయితే ఒక రకంగా ఎన్టీఆర్ అభినయంలో ఆణిముత్యం, మధురవాణి అలియాస్ సావిత్రిల కన్యాశుల్కం
ఉంది కదా!
ఊ : ఆఁ గుర్తొచ్చింది గుర్తొచ్చింది. నష్కల్ రాకుమారుడు తీగారం నాన్న, ఎన్టీఆర్ నెల్లుట్ల నర్సింహ్మారావు అలియాస్ మధుసుధనరావు గారు, నష్కల్ నుంచి హన్మకొండకు యెల్ల గుర్రంపై వచ్చేవారు.
గు : ఇదేం బేహద్బీ. ఉండుండు. గుర్తుచేసుకోనీ. ఆ ఈయన మంచి అందగాడు, స్ఫురద్రూపి, కవి, గేయ రచయిత, గాయకుడు.
ఊ : ఔనౌను. అయితే మన సినీ కథానాయక ఎన్టీఆర్ గారు చదువుకునేటప్పుడు సైకిల్పై తిరిగి పాలు అమ్మేవారు. ఆ కాలంలో ఈ నష్కల్ లేదా తీగారం ఎన్టీఆర్ గారు మక్తేదార్ అంటే ఒక రకమయిన జమీందార్ హోదాలో తెల్ల గుర్రంపై కమాను నిర్వహించేవారు. అయితే కమ్యూనిస్టు పోరాటాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో ఆ మక్తాలు, జమీందారీలు రద్దై తెలంగాణ విముక్తమైంది. ఆ తర్వాత చివరకు చివరి పది పదిహేను సంవత్సరాల కాలంలో ఈ కరణం ఎన్టీఆర్ మహావీర్ హాస్పిటల్లో కేర్కర్గా, కోఆర్డినేటర్గా నెలకు 10 వేల రూపాయలకు పాలు పండ్లు, ఔషధాల పంపకం చూసేవారు. ఒక జీవితంలోనే ఐశ్వర్యం, హోదా, ఎత్తుపల్లాలు, నిమ్నోన్నతాలు ఈ ఇద్దరు ఎన్టీఆర్ జీవితంలో సంభవించాయి. దీనికి మీరేమంటారు?
గు : ఔనౌను, జీవితం బహు విచిత్రమైంది. ఎన్నో మలుపులు తిరుగుతుంది.
ఊ : చరిత్ర ఇది అయితే, మరి దేశ్ముఖ్, దేశ్పాండే, మక్తేదార్ల రద్దు కాంగ్రెస్ ఖాతాలో పడిందేమిటి?
గు : కాంగ్రెసు నైజమే అది. అది స్వతహాగా ఏ ఉద్యమం చేయదు. ప్రతి ఉద్యమాన్ని అది క్యాష్ చేసుకుంటుంది.
ఊ : ఐతే, ఈ కరణం ఎన్టీఆర్ గారు మంచి ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ఒక అందమైన వైశ్య పతివ్రతా శిరోమణి, 20 కిలోల బంగారంతో లేచిపోదాం వస్తావా అని వెంటపడిందట. మీకేమైనా ఇటువంటి అనుభవాలున్నాయా?
గు : సాహిత్యం, భాషాసేవ, సంస్కరణవాదం, ఉద్యోగ బాధ్యతలు ఇలా నేను నా పనులలోనే నిమగ్నమై ఉన్నాను. అయినా వెంకటరమణయ్య పంతులు గారు వేశ్యల జీవితాలు, తాగుబోతుల అడ్డాలు, సామాజిక సమస్యల్ని నువు నిశితంగా దగ్గరగా పరిశీలించావు. అందుకే సజీవ రక్తమాంసాలతో తొణికిలాడుతున్న అద్వితీయ నాటకాన్ని, కథల్ని, గేయాల్ని రచించావని కితాబునిచ్చారు. అయితే సమాజంలో ఐశ్వర్యవంతులు, అందగాళ్ళకు ఇటువంటి ఉపాఖ్యానాలెన్నో ఉంటాయి. పోనిద్దూ.
ఊ : సరే, సరే గురువుగారూ. ఈ కరణం ఎన్టీఆర్ గారు మన కమ్యూనిస్టు రాఘవరావుగారూ ఉత్తరోత్తరా వియ్యంకులయ్యారు.
గు : మరి అదే కదా! సంఘర్షణ, సంవాదం, సమన్వయం అదే హైందవం (భారతీయం). ఇలానే సామాజిక పరిణామ ప్రగతి నడుస్తుంది.
ఊ : మీరు కొంచెం ఓర్పుతో, సమన్వయంతో ఇంకో 25-30 సంవత్సరాలు మంచి నవల శాస్త్రీయ రచనలు చేస్తే మీ ఆణిముత్యాల్ని మీరే ఆంగ్లీకరిస్తే తెలుగు సాహిత్యానికి అంటే భారతికి రెండవ వాఙ్మయ నోబెల్ బహుమతి వచ్చేది కదా!
గు: ఆలోచించకుండా ఉండటం, విశ్రాంతిగా గడపటం నా స్వభావానికే విరుద్ధం. అందుకే ఎల్లప్పుడూ ఆలోచనలతో ఉద్రేకానికి ఉద్వేగానికి గురయ్యేవాన్ని. అందుకే నా చివరి రోజుల్లో నన్ను కలుద్దామని నా ప్రాణమిత్రుడు గిడుగు పిడుగు వెంకటరామ్మూర్తి పంతులు అనుకొని మా ఊరికి వచ్చి కూడా కలువలేదు. ఏం ఉంటుంది? భాషా సంస్కరణవాదం, సంఘ సంస్కరణ వాటికై ఉద్రేకపడటం అదే కదా! అందుకే పాపం ఆయన రాలేదు. అయితే హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు నోబెల్కి అర్హతలున్నా హంగు చేసుకోలేకపోయాడు.
ఊ : ఔనౌను అదే కదా! ఎవర్ని కలవం వారే గుర్తించాలి అని భీష్మించుకుంటే ఈ రోజులలో కుదరదు కదా! మళ్ళీ మనవాళ్ళలో శేషేంద్ర ఒక్కరే ఆ స్థాయికి ఎదిగారు.
గు : సంప్రదాయ సాహిత్య పరంపర అవగాహనతో షోడశి రామాణ రహస్యాలు మంత్రశాస్త్ర యోగశాస్త్ర నేపథ్యంలో నిరూపించాడు. ఆధునిక సాహిత్య నేపథ్యంలోనూ అద్భుత కృషి సల్పాడు.
ఊ : ఔనౌను, ఇందిరాదేవి ధనరాజ్గర్ సాంగత్యంలో జ్ఞానబాగ్ ప్యాలెస్ కూడలిగా ఉర్దూ, ఫారసీ, ఇంగ్లీష్ గోష్టిలు జరిగేవి. జర్మన్, లాటిన్, గ్రీక్ ఇత్యాదుల్లో ఆయన కవిత్వం అనువాదమై అనువాదమై, విశ్వవ్యాప్త అభిమానులను ఆయనకు తెచ్చిపెట్టింది. నోబెల్ దాకా పాకగల్గాడు కానీ ఆయనకీ జ్ఞానపీఠం దక్కలేదు, అని అభ్యుదయ సాహిత్యకారులు ఆయన గురించి, శ్రీశ్రీ గురించి వాపోతున్నారు.
గు : అందుకే నేను సాహిత్యం, కళలు రెండూ స్వతంత్ర ప్రతిపత్తితో ఉండి సమాజానికి దిక్సూచిలా కావాలని ప్రతిపాదించాను. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండి, నిజమైన ప్రతిభను గుర్తిస్తే ఇటువంటి విమర్శలు రావు కదా!
ఊ : మరేమో… మరీ… మరీ మీ బయోపిక్ రాద్దామని ఎవరైనా వచ్చారా?
గు : అబ్బా, భూమి గుండ్రంగా ఉంటుందని ప్రతి విషయాన్ని అటుతిప్పి ఇటు తిప్పి నా నెత్తిమీదకు తెస్తావెందుకు? నా కాలంలో నాకు అటువంటివి తటస్థపడలేదు. అయితే ఏం? ఎన్టీఆర్ జీవిత చరిత్ర లక్ష్మీపార్వతి వ్రాస్తే నీకేంటి, నాకేంటి ఆవిడ తెలుగు సంస్కృత భాషాధురీణ, మంచి విద్వాంసురాలు.
ఊ : మీరు, వీరేశలింగం పంతులు గారు ఓ… ఏకపక్షంగా బాగా బౌద్ధాన్ని అభిమానించి హిందూమతాన్ని తూలనాడారు. ఆఁ మీ ఈ విదుషీమణులే విద్వాంసురాల్లే బౌద్ధాన్ని భ్రష్టు పట్టించారు. ఆ అవశేషాల నుంచి అవకతవకల నుంచి అద్వైత భేరీ మ్రోగించి శంకరులవారు ఆ శతాధిక మతాల్ని ఒక్కటి చేశారు.
గు : ఔను, అదంతా చరిత్ర. సరే ఇప్పుడేమంటావు.
ఊ : కారం గారని మహా ముదురు. రెండు సూత్రీకరణలు చేశారు. 1. పిలిచి తిట్టించుకోవడం అంటే ఇప్పుడు బౌద్ధం ఉంది కదా. యజ్ఞయాగాదులు, బలులు, క్రతువులతో ఉన్నప్పుడు దానిని సంస్కరించింది. మరదే బౌద్ధం పతనమైనప్పుడు ఇదే హిందూ బ్రాహ్మణ మతం దాన్ని జీర్ణం చేసుకుంది. అదే బ్రాహ్మణులు సామాజిక మార్పుకై చిత్తశుద్ధితో కృషిచేసి ఇప్పుడు సకల దుర్గుణాలకు, రుగ్మతలకు బ్రాహ్మణులే కారణమని వారు సంస్కరించిన వారితోనే తిట్టించుకోవడం. ఇంగ్లీషువారు ఆధునిక ఆలోచనా, సమాన అవకాశాలు, ప్రజాస్వామ్య భావాలు విద్యావిధానంతో ప్రవేశపెట్టి తమ ముడ్డిక్రిందికి తామే నీళ్ళు తెచ్చుకొన్నారు. ఇట్ల ఇవన్నీ పిలిచి తిట్టించుకోవడంగా చెప్పుకోవచ్చు.
గు :: ఆహా! అయితే ఇంకొకటి ఏమిటి?
ఊ : దే ఆర్ అగ్రీడ్ టు డిసగ్రీ. అంటే ఎవరి భావాలు వారికి ఉండవచ్చు. అందుకే వారు ఎవరి స్వతంత్ర ఆలోచనలు వారికి ఉంచుకొని సమాజంలో స్వయం ప్రతిపత్తితో ఆలోచిస్తూ మనగల వచ్చు. అది ఈ భారతీయ, హిందూ సంస్కృతిలో, సమాజంలో ఎప్పటినించో అంతర్భాగంగా వస్తుంది. ఇది రెండో సూత్రీకరణ.
గు : ఔను, త్రిపురనేని వారిని, జాషువా, అల్లూరి, బోస్, రామానంద తీర్థ, ప్రకాశం, మగ్దూం, రావి, తాపీ వంటి వారిని కులదృష్టితో చూడటం చాలా తప్పు. ఎవరైనా ఏ కులంలో పుట్టినా ఆ కుల బారియర్ దాటి సమాజానికి ఏం చేశారనేది చూడాలి. ఇక్కడ కూడా సంకుచిత దృష్టేనా?
ఊ : మీకూ, వీరేశలింగం గారికి కూడా ఈ తిట్లు తప్పలేదు.
గు : సమాజంలో బేధభావాలు, వివక్షలు పోవాలని, కృషి చేసేవారిని కూడా అపార్థం చేసుకుంటారా? ఇది చాలా తప్పు. తప్పుడు అవగాహన.
ఊ : ఈ విధంగా కారం గారి ఈ రెండు సూత్రీకరణలు నా అవగాహనను పెంచాయి గురువుగారూ. అందుకే ప్రపంచమంతా, దేశస్తులంతా చెట్టపట్టాల్ పట్టుకు నడువవలెనోయ్ అనే మీ మాట శిరోధార్యం.
గు : ఏమిటేమిటి? చిత్రం బహు చిత్రం. విచిత్రం అనేలాగుంది నీ భావన. ఎవడో బోడిగాడు. ఈ కారంగాడు రెండు సూత్రీకరణలు చేశాడట. మహా పొంగిపోతున్నవ్. మళ్ళీ కొత్తగా వీన్నెవర్నో నా నెత్తిమీదికి తెస్తున్నది. ఒక్క గిరీశం గాడితోనే సతమతమౌతున్నా.
ఊ : అది కాదండీ గురువుగారూ. ఇస్లాంలో వేరే ఆలోచనకు, భావనకు చోటుండదు. అట్లే క్రిస్టియన్ దేశాలు క్రిస్టియానిటీ తప్ప వేరేవాటిని అంగీకరించవు. ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి వివిధ భావాలు విరుద్ధ భావాల సహజీవనం భారతీయం, హైందవం. మరి ఈ రెండు గుంపులు భారతదేశానికి సెక్యులరిజం బోధిస్తామని బయల్దేరాయి కదా! ఇది ఎంత వరకు సమంజసం.
గు : బహుశా ఆ కారంగాడి రెండు సూత్రీకరణల ద్వారా నీవీ ప్రశ్న వేస్తున్నావా? మంచిది, మంచిది. ఇంకో ఆలోచనని, సంస్కరణని ఒప్పుకొనని ఎడారి మతాలు ఈ వైవిధ్య, విరుద్ధ భావాల సంకలనం స్వతంత్రం అయిన భారత్కు పాఠాలు బోధిస్తారా అని నీ ధర్మాగ్రహం. సరే, ప్రజాస్వామ్యయుతంగా ఏ గుంపు గద్దెనెక్కితే అవే భావాలకు గుర్తింపు వస్తుంది.
అక్షరార్చన సమూహ పండిత సమూహానికి
సవినయ పూర్వక నమస్సుమాంజలు.
గురువుగారు డా.గండ్ర లక్ష్మణ రావు గారి ప్రేరణ తో…
వేణుశ్రీ గారు అనగానే ప్రశ్నించే గొంతుక,ఎదురు తిరిగే సాహసం, స్థిర చిత్తు లు, చైతన్య మైన నడక, అభ్యుదయం ఆయన దృక్పథం.మానవత్వం ఆయన తత్వం. కవిగా,అనేక సాహితీ సంస్థలతో అనుబంధం కలిగినవారు. సామాజిక కార్యకర్త. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు. వేణుశ్రీ గారి పూర్తి పేరు సుదర్శనం వేణుగోపాలా
చార్య. వీరు ఉమ్మడి కరీంనగర్ జల్లాలోని నందగిరి కోట్ల గ్రామానికి చెందిన కవి. వీరి తండ్రి గారు సుదర్శనం హనుమాoడ్లు
తెలుగు భాషా పండితులు.
ఆచార వ్యవహారాలు కట్టు బొట్టు అన్ని తెలిసిన వైష్ణవ సంప్రదాయo లోంచి వచ్చిన వేణుశ్రీ గారు అభ్యుదయ సంఘాలతో
అనుబంధం పెంచుకొని
ఆదర్శ వివాహం చేసుకొని
తాను నమ్మిన దానిని బోధించి, ఆచరించి సిద్ధాంతానికి కట్టుబడిన
వారు వేణు శ్రీ గారు. వరంగల్ లోని విశ్వేశ్వరాంధ్ర సంస్కృత కళాశాలలో మహా మహోపాధ్యాయ పద్మ శ్రీ శ్రీభాష్యo విజయ సారథి గారి శిష్యరికం లో సంస్కృత, తెలుగు సాహిత్య అంశాలు,వ్యాకరణ ఛందో అలంకార శాస్త్రాలు అభ్యాసం చేసిన ప్రతిభాశాలి. వీరి మొదటి రచన స్వేచ్చ వచన కవితా సంపుటి. తదుపరి ప్రజాభారతం, వరేణ్య శతకం, తెలంగాణ ఘోష
ప్రచేతసా, కైరవ శతకాలు.
తన కవితా శక్తితో సమ సమాజ కాంక్షను వెలిబుచ్చారు.కవిత్వం కవిత్వం కోసం కాకుండా రేపటి తరానికి అందించాలన్నదే ఆరాటం.
తేలికైన పదాల తో వచన కవిత్వం రాసిన వేణుశ్రీ గారు అంతే సులభంగా పద్యం రాయవచ్చునని
నిరూపించారు. ప్రస్తుతానికి వస్తే కైరవ శతకం లో మనుమడి పేరుతో తాత
బోధిస్తున్నారు కాదు ఉపదే శిస్తున్నారు.
తాత మాటలు కైరవా! తరగని నిధి! అనే మకుటంతో శతకం సాగుతుంది. మకుటం లోనే గొప్ప నిధిని ప్రోగుచేసి పంచారు.
శతకం లో పద్య రూపం పాతదే అయినా కవి తన చుట్టూ ఉన్న జీవన అల్లికలుగా శాతం ఆధునికతను కలిగి ఉంది.
కైరావ అనే పదానికి అర్థం
తెల్లకలువ అని అర్థం.స్వచ్చ మనసు పారదర్శకత నీతి నిజాయితీలను ప్రతి బింబoప జేశారు. డా.గండ్ర లక్ష్మణ రావు గారు ముందు మాట రాస్తూ ఒక్కొక్క పద్యం లో ఒక్కొక్క విషయాన్ని పలు కోణాల లో వివరించడానికి
పొడవైన సీసా పద్యాల నెన్నుకున్నారు. సీస పద్యాలు పదహారు రకాలున్నాయని ఛందో శాస్త్రం తెలుపుతుందన్నారు.
గణాల ప్రయోగాన్ని బట్టి.పాదాల విరుపులను
బట్టి వైవిద్యం గల సీస పద్యాలున్నాయన్నారు.
నన్నయ్య నుండి నేటి దాకా కావ్యాలలో శతకాల లో విరివిగా వాడిన సీసా పద్యానికి వేణు శ్రీ గారు కొత్త నడకలు నేర్పించారని అన్నారు.
వేణు శ్రీ గారు ప్రజాకవి కనుక పల్లె జనాలు,అవస్థలు వృత్తులు, తెలంగాణ తేజైన పదాలతో బలహీన మైన వారి పక్షాన నిల్చి బలమైన గొంతుతో,సూక్ష్మ దృష్టితో పద్య నివేదనం చేశారు.
సీ!! పాత విషయముల పద్యాలలో తిరిగి
వ్రాయుటేలయనుచు ప్రశ్నలేయు
వారలుకాలరింక వాదనలను చేయు
సద్విమర్శకులకు సవినయముగ
తిన్నయన్నమెరోజు తినుటలేదమనము
అట్టివేపద్యాలు అందరింక
మంచి మార్గమున మసులు కొందురనియు
మరల మరల వ్రాయ మారుదురని
తే!! ఎంచుకొన్న కవులికను ఎంచినట్టి
మనుషులందున కొందర్ని
మార్చవచ్చు
ననుచు కొత్తగజెప్పంగ జనులు చదువ
కవితా పద్యమైనను నిల్చు కాలమందు
తాటమాటలుకైరవా! తరగని నిధి.
ఈ పద్యం సులభంగా అర్థమవుతంది. పాత విషయాలే అయినా
కొత్తగాచెప్పారు. విశ్వనాథ వారి వాడుకను వాడుకొని ..తినిన అన్నము తినుటలేద మనము…అట్టివే పద్యాలు. ఎన్ని మార్లు విన్నా అవి విలక్షణంగా నిత్య నూతన తో భాసిస్తాయి అనేది వీరి భావన. అందరినీ మార్చలేం ఎంచుకొని కొందరిని మార్చ వచ్చు అని సూటిగా తెల్పారు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు…అనే శతక పద్యాన్ని గుర్తు చేసి మంచి శతకం మన ముందుంచారు. కరీంనగర్ లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన లో4.3.2023 న రచయిత ముద్దసాని రాంరెడ్డి గారి స్మారక పురస్కారం మరియు పది వేల నగదు అందుకోబోతున్న సందర్భం లో వేణు శ్రీ గారికి నమస్సులు.. అభినందనలతో..
కె ఎస్ అనంతాచార్య
కరీంనగర్
మాటలో మతలబులెన్నో!
మర్మాలు ఇంకెన్నో కదా!
మాట మలయ మారుతంలా హాయినిస్తుంది
చందన లేపనంలా చల్లనైనది
ఆత్మబంధువు పలకరింపులా సాంత్వనమిస్తుంది
మాట చిన్నదే !మది గాయం పెద్దది చేస్తుంది
అదే మాట గాయాన్ని మాన్పే దివ్య ఔషధమౌతుంది
అలజడితో నిశ్శబ్ద తరంగమౌతుంది
మదిని కాల్చే అగ్ని కణమౌతుంది
కసిరేపి పాతాళానికి తొక్కేస్తుంది
మారణ హోమానికి పరాకాష్ఠౌతుంది
ఒక్క మాట జీవితాన్నే మార్చేస్తుంది
మార్పుకు మూల హేతువౌతుంది
మనసు పదిల పరిచే ప్రయత్నమౌతుంది
మానవత్వానికి మరో రూపమౌతుంది
ప్రేరణతో విశ్వవిజేతను చేస్తుంది
పెదవి దాటితే మరలి రాదు
మదిని కాల్చితే మరపురాదు
–గీతాంజలి కవిత.(13.1.2023)
ఇప్పుడా నువ్వు వచ్చేది ??నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక?
నాకు తెలుసు ఇక ఇప్పుడు నువ్వు వస్తావని…
నా వీధిలోకి నింపాదిగా నడుచుకుంటూ ఇప్పుడైనా వస్తానంటావా? సరే.. రా..
నేను లేని ఖాళీ ఇంటి ముందు నిలబడి…
ఒకప్పుడు నీ కోసం ఎదురుచూసిన ఈ శూన్యపు ఇంటిని గాజు కళ్ళతో చూస్కో..
నా ఇంటి నిశ్శబ్దంలో ..నేను నీకు చెప్పాలనుకున్నవి వినిపిస్తే.. ఇప్పటికైనా విను..
కన్నీళ్లేమైనా రాలితే… రాలనివ్వు !
విషాదపు చీకటి నిండిన గదుల్లో వెలుతురు మిణుగురులు ఏమైనా మెరిస్తే పట్టుకో కొన్ని.
ఇక వెళ్లిపో..అక్కడ నేను లేను
నీకు ఇక దొరకను…!
నేనున్నప్పుడు ఇన్నాళ్లూ రాకుండా ఉన్న నువ్వు..
ఖాళీ ఇంటి ముందు కూడా ఉండకుండా వెళ్లిపో..
రాకింక !
మనిషిగా మారానంటావా..
నేను వెలిగించాల్సిన దీపం ఇంకా చీకటిని తాగుతూ ఉందంటావా.. ఉండనివ్వు !
నేను రాకపోతేనేం .. లేకపోతేనేం.. ? దీపం దానంతట అదే వెలుగుతుంది.
వెళ్లు….!
నన్నిక రమ్మనకు !
నువ్వూ రాకు !
నువ్వు లేని ఇల్లేమీ చిన్నబోదు.
నన్ను బాధపెట్టిన నిన్ను ఇల్లేనాడు ప్రేమించలేదు..క్షమించలేదు కూడా !
నువ్వు నాతో లేనప్పుడు ఇల్లే మనిషిగా మారి నాతో కబుర్లు చెప్పేది..వెచ్చగా కౌగలించుకుని ఓదార్చేది !
నేను లేక పోతేనే.. ఇల్లు ఏడుస్తుంది.
దానికదే కథలు చెప్పుకుంటుంది.
గది గదినీ పలకరిస్తుంది.
తనలో తాను ఆరాటంగా తిరుగుతూ నా గాయాల్ని తడుముతుంది.
ఏకాంతపు రాత్రుళ్లల్లో నేను మైమరచి విన్న గులాం అలీ గజల్స్ నీ…నా రఫీ పాటల్ని..నూర్జహాన్ గమకాల్ని తానూ యాద్ చేసుకుంటూ ఇల్లు కన్నీరు పెడుతుంది…
నన్ను తలచుకుంటూ… విరహ వేదనలో కాలిపోతుంటుంది.
నా పాదాల స్పర్శ కోసం నేలను ముధ్ధాడుతూ ఉంటుంది.
నన్ను అక్కడ లేకుండా చేసిన నీపై ఆగ్రహంతో రగిలిపోతుంటుంది.
నా కన్నీళ్ళతో మరకలైన దిండు గలీబుని ప్రేమగా నిమురుతుంది.
నేను రాసిన కథలు.,కవితలూ నువ్వు వినలేదేమో కానీ… ఇల్లు విన్నది.
నేను వెళ్లాక ఇల్లు గడపమీద కూర్చుని తీరిగ్గా నా కవితల పుస్తకాన్ని తిరగేస్తూ కన్నీళ్లు కారుస్తుంది.
కిటికీలతో..గదులతో.,తలుపులతో., పరువులతో..పరదాలతో.,
వంటింటి గిన్నెలతో ..ఆరిపోయిన పొయ్యితో..అలమరలోని పుస్తకాలతో.. టేబుల్ పైని నా కాగితాలతో ..కలంతో..నా చాయ్ కప్పుతో..
హేంగర్లకు వేలాడుతూ గాలికి కదిలే నా చీరలతో..నన్ను నేను చూసుకున్న నిలువెత్తు అధ్ధంతో..
అధ్ధం మీది నా కళ్ళ కాటుక మరకలతో.. గోడమీది నా బొమ్మతో..
ఇంటిని అల్లుకున్న పూల తీగలతో.. పెరటిలోని గువ్వలతో .,ఇంటి డాబాతో.,
డాబా పైని వెన్నెలతో చుక్కలతో…వాకిట్లోని ముగ్గుతో…ముగ్గుపై వాలిన ఎండతో… రాత్రి రాలిన పున్నాగ పూలతో .. కథలు చెబుతుంది ఇల్లు.
ఎవరివి అనుకున్నావు…
నీ–నా కథలే..!
అర్థాంతరంగా ఆగిపోయిన మన కథలు!
ఏమనుకున్నావు మరి…ఇల్లొక స్టోరీ టెల్లర్ !
దిగులు పడకు.. నువ్వు లేకపోతే ఇల్లేమీ చిన్నబోదు.. ఇల్లు కథలే కాదు పాటలు కూడా పాడుతుంది…
పాడకుండా గొంతులో నిలిచిపోయిన పాటలే అందుకుంటుంది ఇల్లు.
నేను రాసిన కవితలనే పాడుతుంది….
అవును ఇల్లు పాడుతుంది
అందుకే ఇల్లు .. నువ్వు నాకు చేసిన గాయాల్ని పాడే గాయకురాలు !
ఇల్లొక సంగీతం !
ఇల్లు కథలు రాస్తుంది
ఇల్లొక పుస్తకం అవుతుంది.
ఇల్లొక కలం అవుతుంది.
ఇల్లొక రచయిత్రిగా మారిపోతుంది
అడిగి చూడు…ఇల్లు మాట్లాడుతుంది.
అచ్చం నా లాగా !
అవును నేను ఇల్లుగా మారాక
ఇల్లు నేనుగా పరివర్తన చెందాక..
ఇల్లూ.. నేనూ ఒకటే అయ్యాక..
నేనా ఇల్లు విడిచి పెట్టిపోయినా
ఇల్లు.. నేనుగా నిలబడి ..నిట్ట నిలువు చూపుల కన్నులతో…నీతో మాట్లాడుతుంది.
నిన్ను నాలాగే ప్రశ్నిస్తుంది
హెచ్చరిస్తుంది.
నిన్ను లోపలికి రానిస్తుందనుకుంటున్నావా…
ఈ ఇల్లు నీ ఉనికికి మాత్రమే కాదు నా దుఃఖానికే చిరునామా !
నేను లేని ఇంట్లో ఉంటే ఉండు..పోతే పో !
ఇల్లు అలానే అక్కడే ఉంటుంది…
ఎందుకంటే ఇల్లు
నన్ను పువ్వు నుంచి కత్తిగా మార్చిన కార్ఖానా !
ఇల్లొక చరిత్ర !!
ఇల్లొక స్టోరీ టెల్లర్ !!
కే దా ర్ నా థ్ జ ల వి ల యం…..
మహాద్రి, పార్శ్వే చ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురా సురైర్యక్ష మహోరగాద్వైః కేదారమీశం శివమేక మీడే ॥
ఏ పుస్తకానికైనా ముఖచిత్రం రచయిత ఏం చెప్పబోతున్నారో అనే దానికి సూచికగా ఉంటుంది. అలాగే ఈ కాలమేఘం కేదార్నాథ్ జలవిలయం ముఖచిత్రం కూడా లోపలి అంశాలకు అద్దం పట్టినట్టు ఒక సంకేతంగా నిలిచి ఎంతో బాగుంది…
కంటికంతా జలమయమై
మింటి వరకు ఏక రాశై
జగములన్నియు కాలయోనిలో
మొగములెరుగక నిదురబోవగ…

ఈ పుస్తకం పేరు చూడగానే నాకు ప్రళయావసాన ప్రకృతి కళ్ళముందు కదలాడింది.
కాలమేఘ పుస్తక సమీక్షరాద్దామని అనుకున్నప్పుడు….
తెలుగు సాహిత్య ప్రక్రియలలో ఎన్నో చదివాము !చూసాము!
కొన్ని ఆనందింప చేసేవిగా కొన్ని ఆలోచింపచేసివిగా ఇలా రకరకాల అనుభూతులను కలిగిస్తాయి ఆయా పుస్తకాలు…
కానీ కాలమేఘం మాత్రం యదార్ధ సంఘటనైనా కూడా… జరిగిన ప్రమాదం టీ.వీ వార్తా ఛానళ్ల ద్వారా భయానక కథలతో.. జలప్రళయంతో అంతా మునిగిపోతున్నదా? అన్నట్టున్న ఉత్తరాఖండ్ లోని రుద్ర ప్రయాగ లోనిచార్ ధామ్ యాత్రలలో ఒకటైన కేదార్ నాథ్ ఆకాశగంగ విరుచుకుపడిన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలను పదేపదే చూసినప్పుడు టీ.వి. వాళ్ళు ఎందుకు చిత్రహింస పెడుతున్నారని అనిపించింది. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత సాటి- తోటి మనవారు పడిన కష్టాలు చూసి మనసంతా కలచివేసింది. అదేమిటో చూద్దాం! మానవతా దృక్పథంతో స్పందిద్దాం!!
రండి ! ఈ పుస్తకంలో పయనిద్దాం!!
M.S.R. వెంకట రమణ గారు రచించిన కాలమేఘం పుస్తకాన్ని జగద్గురువు ఆది శంకరాచార్యుల దక్షిణామ్నాయ శృంగేరి పీఠం శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారు ఆవిష్కరణ చేయడం రచయిత యొక్క ఆధ్యాత్మిక చింతన తెలుస్తోంది.
ఈ పుస్తకానికి గౌరవనీయులు రచయిత , నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారు” అకాలమేఘం” అంటూ ముందు మాటలో “భారతీయ జీవనంలో తీర్థయాత్ర ప్రాముఖ్యతను వివరిస్తూ..” గంగను తీసుకువెళ్లి రామేశ్వరంలో కలపడం అంటే యావత్ భారతాన్ని ఆ సంస్కృతిని, ఆ వేషభాషలను ,ఆ ప్రదేశాలను పరిశీలించి అక్కడ ప్రతిబింబిస్తున్న భారతీయ ఆత్మ దర్శనం చేసుకోవడమే అని అభిప్రాయపడ్డారు.
శ్రీ ముత్తై రవీంద్ర గారు” రచనలో శాస్త్రీయ సమాచారం జోడిస్తేనే ఏ రచనకైనా ప్రామాణికత చేకూరుతుంది” అని విలువైన సందేశాన్ని అందించారు.
అలానే ఈ పుస్తకం వాతావరణ శాస్త్రీయ సమాచారంతోనే సాగి, ఎక్కడ ఆగకుండా చదవరులను చదివించింది.
కేదార్నాథ్ ఆధ్యాత్మిక నివాస స్థలమైన చిన్న పట్టణం. ఆ వరద బీభత్సానికి కొట్టుకొని పోయిన కేదార్నాథ్ మందిరాన్ని కొట్టుకుపోకుండా ఆపిన భీమశిల దైవ సంకల్పమా? లేక యాదృచ్ఛికమా? అని ఆశ్చర్యపోతూ వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదని అంటూ….”ఓరోగ్రాఫిక్” ప్రభావం గురించి మంచి అవగాహన కల్పించడం బాగుందని ప్రశంసించారు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హ్యూస్టన్ టెక్సాస్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు గారు.
నిజమే! భారత పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు రచయిత.
ఎప్పుడైనా మానవులు ప్రకృతిని రక్షించుకుంటూ దానితో కలిసి జీవించాలి కానీ దానిమీద అధికారం చూపిస్తూ నాశనం చేయకూడదని … అలా ధ్వంసం చేయడమే ఈ మహా విపత్తుకు కారణమని, వచ్చిన ప్రకృతి వైపరీత్యాలను ఎంతమంది చెప్పినా తన ధోరణి మానుకోని మానవుడు ప్రకృతి కోపానికి బలి కాక తప్పదని హెచ్చరిస్తూనే … కనీసం ఇలాంటి రచనలు చదివైనా కొందరైనా మారతారని ఇటువంటి రచనలు సమాజానికి అవసరమని నొక్కి ఒక్కాణించారు భాషావేత్త పూర్వ ఉప సభాపతి మాన్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు.
మానవ మాత్రులు ప్రకృతితో వాదలాడకూడదని కనువిప్ప కలిగించే రచన ఈ కాలమేఘమని అంటూ ప్రకృతిలో పుట్టి గుహలలో పెరిగిన మనిషి వాటి నుంచి దూరమై ఊళ్లోకి చేరి గూళ్ళు కట్టుకున్న జీవి.. ప్రకృతి విలయానికి భయపడి పోతున్నాడని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పిన ఈ రచయిత వెంకూ గారిని అభినందిస్తూ” ఈ ప్రకృతి వైపరీత్యానికి” కారణమని వృక్షాల ఆవశ్యకతను తెలియజేస్తూ గౌరవనీయులు విశ్రాంత న్యాయమూర్తి కుకుడాల లక్ష్మణగారి ముందుమాట కాలమేఘం పుస్తక రచయిత వెంకూ గారి మాటకు వత్తాసు పలికింది.
నిజంగా మనమందరం ఆలోచించవలసిన విషయం ఇది! కాదు తేలికగా తీసుకోకూడని విషయం కూడా…
కాలమేఘం పుస్తకం కరుణ రసభూయిష్ట బాణీ అని ఆధ్యాత్మిక ధోరణిలో స్పందిస్తూనే… ప్రేక్షకుల వలే కేదార్ నాథ్ లో జరిగిన సంఘటనలను చూసి ఊరుకోకుండా… భవిష్యత్తులో ఇలాంటి విపత్తు వస్తే ఎలా స్పందించాలనే విషయం ఈ పుస్తకం ద్వారా అందించారని రచయితను చెన్నపురి తెలుగు అకాడమీ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ డాక్టర్ తూమాటి సంజీవరావు గారు తమ ముందు మాటలో అభినందించారు.
ఇక రచయిత తన మనసులోని మాట “ధర్మ చక్ర *ప్రవర్తితం ” ప్రకారం ఈ రచన చేయడంలో తాను కర్తను కానని రాయాలనే కోరికే కర్తగా రాయించిందని మల్లినాథ సూరి వలె సవినయంగా మనవి చేసుకున్నారు.
నిజమే అనిపించింది ! ఒక జలవిలయాన్ని అక్షరీకరించడం మామూలు మాట కాదు! శాస్త్రీయంగా ఏ తప్పిదాలు ఎలా జరిగాయని ఈ తిలా పాపంలో తలాపిడికెడు ఎవరు ఎవరిదని ఖచ్చితంగా తేల్చి చెప్పడం దానికి సాక్ష్యమా అన్నట్టుగా… కేదారేశ్వరునితో పాటు యాత్రీకుల, ప్రయాణ సాధనాల, ప్రకృతి రమ్యతను, భక్తుల సత్సంగాలను, గంగానది ఉగ్రరూపాన్ని, పట్టణంలోని భవనాలు కూలిపోయి విపత్తు కలిగించిన భయానక దృశ్యాలను, అంతకు ముందుఉన్న పూర్వ పట్టణాన్ని, ఢిల్లీలోని వాతావరణ శాఖ కార్యాలయం, సీనియర్ సైంటిస్ట్ విశ్వనాథ చాంబర్ ను, మునిగిపోతున్న కేదారేశ్వర ఆలయాన్ని, మంచు కొండలు, ‘ఎలనినో ‘ ఏర్పడితే ఎలా ఉంటుందో వివరించే చిత్రాలను, వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ విభాగాన్ని, శిఖర పరిశోధన చిత్రం, గంగలో కొట్టుకుపోయిన వాహనాల చిత్రాలు….ఇలా ఒకటేమిటి? దేవాలయ నిర్మాణ పరిజ్ఞాన చాతుర్యాన్ని వివరించే ప్రాచీన చిత్రంతో పాటు, పాండవులు కట్టిన మందిరాన్ని, అక్కడి వ్యాపారుల అమానుష చర్యలను, శవాల మీది వస్త్రాలను మాన రక్షణకోసం ఉపయోగించుకున్న పరిస్థితి కల్పించిన లయకారుడి విన్యాసాన్ని, లింగం చుట్టూ ఉన్న శవాలు, కాలనేత్రుడై చూస్తున్న రుద్రుడు, రక్షణ కోసం పర్వతం పైకి ఎక్కుతున్న యాత్రికులు, తెహ్రి- గడ్వాల్ లోని జలాశయం, భాగీరథి నదిపై నిర్మించిన డ్యామ్, విద్యుత్ ఉత్పత్తి కోసం నిలువ ఉంచిన ఆ డ్యామ్ తెగితే ఊరు కొట్టుకొని పోతుందని హెచ్చరిస్తూ తెలిపిన చిత్రం, హరిద్వార్ , ఋషీకేష్ , పట్టణాలకే కాక ఎన్నో నగరాలకు ముప్పు ఉందని, మిథైన్ వాయువు యొక్క ప్రభావం వల్ల కలిగే ముప్పు ఎన్నో విషయాలు చదువరులకు చిత్రాలతో విశదీకరించడం, చిత్రాలను చూస్తూ పుస్తకం చదువుతూ ఉంటే హృదయం ద్రవిస్తున్నది. ఎప్పుడో 2013లో జరిగిన ఈవిలయం ఇప్పుడు జరుగుతూన్నదా? అన్నట్టుగా ప్రకృతి విలయాన్ని కళ్ళకు కట్టేలా ఉందీ పుస్తకం.
వేడినీటి కుండాలు ఎలా పేలిపోయాయో? దాని తాండవమేమిటో? ఆ శబ్దానికి భయపడిన జనం హాహాకారాలు కళ్ళకు కట్టినట్టు వివరించారు.
మిలిటరీ వారి దుశ్చర్య కూడా బాధ కలిగించింది. ఇదే సందని డబ్బులు దోచుకోవడం అక్కడి ప్రాంతీయుల పైశాచిక ఆనందం, ఆడవారిదేహ బాధల పరిస్థితి.. బాపురే!! పగవారికి కూడా ఇలాంటి దుస్థితి రావద్దనిపించింది.
గాయపడిన వారు చనిపోవడం చూసి ఇతర యాత్రికులు భయపడటం… నిజంగా రంపపు కోతే! ఇంత క్షోభలో రాజకీయాల కంపుతో మరింత జుగుప్సాకరంగా మారడం రచయితకు అసహ్యం వేసినట్టుంది.
కలెక్టర్ బసవ వెంకటరామచంద్ర పురుషోత్తం అండ….. గుడ్డిలో మెల్ల!
భాగీరథి, అలకనంద, మందాకినిల ఉగ్రత్వానికి బలైపోయిన యావత్ మానవ నిర్మితాలు రోడ్లు, వంతెనలు మొదలైనవే కాకుండా ప్రాజెక్టులు సర్వం సహా నాశనాన్ని, ఆ రాష్ట్రాభివృద్ధి వందసంవత్సరాలు వెనుకబడింది అనడం.. ఒక విలేఖరిగా రచయిత జల ప్రళయాన్ని విలయంగా మలచడం అద్భుతమైన విషయం.
మొదటి పేజీలోని “బృహద్ స్వరూపుడైన మహాకాలుడు అంత వరదల్లోనూ కంఠం వరకే వరద పోట్టేత్తడం…” ఆ చిత్రం… చిత్రంగా ఉంది.
సాంకేతిక కారణాలు కొన్ని అయితే అనుభవం లేని వారు నిర్మాణాలు చేయడం ,విద్యుత్ కోసం ప్లాంట్లు కట్టడం, నది నీటిని తరలించడం… మొదలైనవే కాకుండా అడవులు నరికి వేయడం వంటి ఎన్నో పొరపాట్లు మరియు టూరిజం కూడా విలయానికి కారణం అని సూచించారు రచయిత.
చివరకు ఇచ్చిన సందేశం ప్రకృతితో ఆటలాడవద్దని అలాగే ఆ ప్రాంతం వారికి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి సాధించాలని, కేవలం టూరిజం మీదనే ఆధారపడద్దని చక్కని సూచన చేశారు.
” క్లౌడ్ బరస్ట్” కారణంగా (కేదార్నాథ్) ఉత్తరాఖండ్ విషాద జలవిలయానికి కారణం మానవ తప్పిదంగా జరిగిందని, చెప్తూనే ఊరుకోలేదు. పరిష్కారం కూడా చక్కటి సూచనలతో… ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చేసిన హెచ్చరిక ఒక్క ఉత్తరాఖండవాసులకే కాదు… ఎక్కడెక్కడ నదీ పరివాహక ప్రాంతాలున్నాయో?? ఎక్కడెక్కడ తీర్థయాత్రా స్థలాలున్నాయో? వాటి దగ్గర యాత్రికులు మానవతా ధోరణితో ఉండి, వ్యర్థాలతో భూమిని, నీళ్ళను, గాలిని కలుషితం చేయవద్దని చెప్పే ఈ కాలమేఘం ఒక వీరబ్రహ్మ కాలజ్ఞానం వంటిది!
ప్రతి ఒక్కరూ చదివి పాటించాల్సిన ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అవన్నీ చెప్తూ పోతే నా సమీక్ష వ్యాసం వలె కాకుండా పుస్తకమయ్యే ప్రమాదముంది… అందుకే ముగిస్తూ..
ఎందుకంటే ప్రకృతి శక్తిని ఎవరూ ఊహించలేరు! భవిష్యత్తులోఎటువంటి వైపరీత్యమైనా రావచ్చు! జీవితాలను అస్తవ్యస్తం చేయవచ్చు! అలా జరగకుండా ఉండాలంటే శాస్త్రీయతతో ఏర్చి కూర్చిన విజ్ఞాన భాండాగారం వంటి పుస్తకం ఈ కాలమేఘం పుస్తకం . ముఖ్యంగా యాత్రికులు తప్పక చదవాలి! చదివిన విషయాలు పాటించి భవిష్యత్ తరాల వారికి మన సంప్రదాయ కట్టడాలను వారసత్వంగా ఇవ్వాలి!
విరామమెరుగక వీస్తున్నది
విద్యుత్ వీవన
ఊష్మకంలో వెట్టిచాకిరిచేస్తూ
వీవనలెన్ని వీచినా
తరగని వేసవితాపం
తనువంతా స్వేదం
నిదాఘమ నిద్ర కోసం
కృత్రిమకృత్యాలెన్నయినా
ఆ సూరీడి ఎదుట
వెలవెలబోయే దివిటేలేగా
మదిలోన ఎదలోన
భానుడి భగభగల ఊష్ణసంవహనం
రహదారులన్నీ
నిర్మానుష్య నిస్సవ్వడి క్షేత్రాలు
సవ్వడి పెరిగి
శీతలత్వాన్ని స్పృశిస్తూ ప్రశ్నిస్తూ
చినబోయిన శీతల యంత్రాలు
పర్యావరణ మిత్రకు
పరిపరి ప్రశ్నలు
పెను సవాళ్లు
పెచ్చుమీరుతున్న
సంబంధ బాంధవ్యాల నిష్పత్తుల క్షీణత
జలచక్రంలో
తరిగిన తరువులు
కొండలు గుట్టలు చెరువుల
అదృశ్యదృశ్యం
నీరింకని సిమెంటు రోడ్లు
అడుగడుగున
వర్షాగమనంలో
మట్టి వాసనలకు దూరమైన బతుకులు
నీరింకని చెమ్మలేని చేతల చైతన్యం
నవనాగరికత పేరున
పన్నీరు తన్నీరు
కాలుష్యపు కాసారంలో
కన్నీరై కడగండ్లు
వాతావరణంలో నీటితేమ లేని
పొడిబారిన తడిలేని వడగాడ్పులు
ఉష్ణోగ్రతల ఉక్కిరి బిక్కిరిలో
జీవజాలం
శీతల పవనపుంజాల వేటలో
అతలాకుతలం!
బొగ్గుబావుల్లో
వేసవి నిప్పుల కొలిమికి
స్నేహం స్వేదంతో
మలయసమీరాల వీవనలు
కర్బన ఉద్గారాలతో
కర్పరాలను దాటేస్తూ
వేడి చెలిమెల గ్రీష్మతాపం
బాష్పోత్సేకానికి
బహుదూరపు బాటసారిలా
విశృంఖలంగా వృక్ష హననం
ఎడారుల్లా మారుతున్న
కారడవులు కార్చిచ్చు
కదనోత్సాహాంతో!
శిక్షణలు క్రమశిక్షణలు
మరచిన మనిషి అవసరానికి
ప్రకృతి బలిపశువు
ప్రకృతి విశృంఖల విధ్వంసం
లయకారకం వినాశకరం
విరించి విరచితం
వాతావరణ సమతుల్యత
అసమగ్రం అసమంజసం
డబ్బుమైకంలో మద్యం మత్తులో
ఆడంబరాల ఆలంబనలో గ్రీష్మం
వీవనలెన్ని విరామమెరుగక ఊగినా
తగ్గని శరీర తాపం
మనిషి మనసు మారితేనే
ఆదర్శ వాతావరణం
ఆదర్శ సమాజం
లేదంటే నరక కూపంగా
నవసమాజం ప్రగతిని ప్రశ్నిస్తూ!
అడవిలో ఒక గున్నమామిడి చెట్టు ఉన్నది. ఆ చెట్టు చాలా గుబురుగా ఉన్నది. చాలా పక్షులు నివాసం ఉంటున్నాయి. ఒక కోయిల కుటుంబం కూడా నివసిస్తోంది. ఉదయాన్నే కోయిలలు కమ్మగా రాగాలు తీస్తుండేది. మిగతా పక్షులన్నీ చక్కని పాటలు వింటూ పనులు చేసుకునేవి. కోయిలలు అంటే అందరికీ ఎంతో ఇష్టం.
కోయిలలు చాలా మంచివి. ఎవరికి సహాయం కావాలన్నా ముందుండేది. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే కష్టపడి ఆహారాన్ని తెచ్చిచ్చేవి. వాళ్ళింటి పనులన్నీ చేసి పెట్టేవి.
ఆ చెట్టు మీద ఒక కాకి కుటుంబం కూడా నివసిస్తోంది. చెట్టు మీద అన్ని రకాల పక్షులు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్స్ లాగా రకరకాల భాషలతో కలిసి ఉండేవి.
కోయిలలు ఉదయం లేవగానే అందర్నీ చక్కగా పలకరించేవి. ఎక్కడ కనిపించినా చక్కగా నమస్కారం పెట్టేవి. ఎంతో మర్యాద, మన్నన తెలిసిన కుటుంబమని పేరు పొందాయి. మంచి సంగీత పరిజ్ఞానం గల పక్షులని పేరు తెచ్చుకున్నాయి.
వీటికిలా పేరు రావడం కాకికి అస్సలు నచ్చలేదు. ఎక్కడ చూసినా కోయిల పేరు వినబడడంతో కాకి మనసు రగిలిపోయేది. కోయిల ఏమీ చేయక పోయినప్పటికీ కాకికి కోయిల నచ్చేది కాదు. కోయిల కన్న అద్భుత గాత్రం చూసి వళ్ళంతా కారం రాసుకున్నట్లుగా ఉండేది. కోయిల కాకికి సహాయం చేసి పెట్టినా ఒక్కసారి కూడా థాంక్యూ అనేది కాదు. అయినా కోయిల ఏమీ పట్టించుకునేది కాదు.కాకి సరిగా మాట్లాడకపోయినా కోయిల మాత్రం ఎంతో ప్రేమగా పలకరించేది.
ఒక రోజు సింహం అడవిలో ఆటాపాటా ఏర్పాటు చేద్దామని అనుకున్నది. పాటాలు పాడేవాళ్ళనీ, నాట్యం చేసే వాళ్ళనీ పిలవమని నక్కకు చెప్పింది. నెమలి బాగా నాట్యం చేస్తుందని అందరూ చెప్పటంతో నెమలిని పిలిచింది. అలాగే “పాటలు ఎవరు బాగా పాడుతారు” అని నక్క వెతకసాగింది. అంతలో కాకి కనిపించింది. “మీ చెట్టు మీద చాలా పక్షులుంటాయి. కదా! ఎవరైనా పాటలు పాడతారా అని వాకబు చేసింది. కాకి గతుక్కుమన్నది. కోయిల సంగతి తెలుసా? అనుకున్నది. అయినా సరే చెప్పకూడదనుకుంది. ‘ఎవరూ లేరు’ అన్నది కాకి వెంటనే. సరేలే అని వెళ్లిపోయింది నక్క. హమ్మయ్య కాకి ఊపిరి పీల్చుకుంది. కోయిలకు పేరు రాకుండా చూశానని సంబరపడింది.
అడవిలో కార్యక్రమం అయిపోయింది. కోయిల పాట పాడలేదు. కాకి మనసులో చాలా ఆనందించింది. అందరూ వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వచ్చారు. తను అబద్ధం చెప్పిన విషయం ఎవరికైనా తెలుస్తుందేమోనని కాకి మధన పడుతూ ఉంది. ఎవరికైనా తప్పు చేస్తే మనసులో సంతోషం ఉండదు కదా! అదీకాక ఎవరు తెలుసుకుంటారో అని దిగులు. ఈ దిగులు ఆలోచనల వల్ల కాకి సరిగా తినలేకపోయింది.
కోయిల మాములుగానే ఉన్నది. ఇవన్నీ తెలియవు కదా! కాకి మాత్రం సంతోషంగా ఉండలేకపోతుంది. కాకికి లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు. సరే అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది.
అర్దరాత్రికి కాకికి కడుపులో మంట వస్తుందని పించింది. గుండెలో భుజాల్లో నొప్పి పెరుగుతున్నట్లుగా అనిపించి అరుద్దామనుకుంది.నోరు పెగల్లేదు. స్పృహ కోల్పోయింది.
కాకి మరల కళ్ళు తెరిచేసరికి నెమలి గారి వైద్యశాలలో ఉన్నది. పక్కనే భార్య కూతురు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏడుస్తూ నిలబడి ఉన్నారు. నాకేమైంది? అని కాకి అడిగింది. “అంతా బాగానే ఉంది.ఎక్కువగా మాట్లాడకు” అని నెమలి భుజం మీద చెయ్యేసి అన్నది.
తర్వాత కాకి భార్య విషయమంతా చెప్పింది. అర్దరాత్రి కాకి స్పృహ తప్పగానే వైద్యశాలకు తిసుకేల్లడానికి ఎవరూ రాలేదు. కోయిల ముందుకొచ్చి కాకికి ఆసుపత్రికి తీసుకువచ్చింది. అంతేకాక కాకి కుటుంబానికి ధైర్యం చెబుతూ మనోస్థైర్యాన్ని నింపింది. నెమలిని నిద్ర లేపి విషయమంతా వివరించింది.
కాకి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. తాను కోయిలకు పేరు రాకుడదని ప్రయత్నించినా కోయిల మాత్రం కాపాడింది. ఛీ నా మనసు ఎంతా ఈర్శగా మారిపోయింది. ఈ ఈర్షను వదిలించుకోవాలి. తన మనసు చేస్తున్న ఘోషను వినకుండా ఇలాగే ఉంటుంది.
వెంటనే కోయిలను క్షమించమని అడిగింది. తను చేసిన తప్పును చెప్పి పశ్చాత్తా పడింది. కోయిల క్షమించేసింది. నీవు చేసిన తప్పు తెలుసికున్నావు. అదే చాలు అని కోయిల నవ్వి ఊరుకున్నది. కాకి కోయిలకు నమస్కరించింది.
మట్టి విలువ తెలిసిన మనుషుల మధ్య ఆమె జీవితం ఊపిరి పోసుకుంది. పట్టణంలోని పల్లె వాతావరణంలో పెరిగి ప్రకృతి పరిమళాలకు చిన్నతనాన్నే పరవశించించారు. దేశభక్తి కి ప్రతీకగా నిలిచే సైనికుల కుటుంబాల జీవితాలను చాలా దగ్గరగా చూశారు. భర్త చేయి పట్టుకుని పారిశ్రామిక వాడలో అడుగుపెట్టి అక్షరం తో దోస్తి కట్టారు. జీతం పెరుగుతుందన్న ఆశతో చదివిన డిగ్రీలు ఆమె జీవనగమనాన్ని మార్చాయి. కూలీగా, కార్మికురాలిగా, రచయితగా, జర్నలిస్ట్ గా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమకారిణి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన ఆమెకు రాజకీయ రంగం ఆహ్వానం పలికింది. ఏ రంగంలో ఉన్నా ప్రజల మధ్య ప్రజల మనిషిగా ఉంటే అవకాశాలు అవంతట అవే వస్తాయి అని ప్రగాఢంగా నమ్మే వ్యక్తి ఆమె.. అందుకే దినసరి కూలీగా జీవితం ప్రారంభించినా జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉంటే కాలం తప్పక అవకాశం ఇస్తుందన్న తన నమ్మకం నిజమైంది అంటారు ఆమె. అంచెలంచెలుగా తనను తాను మలచుకుంటూ ప్రస్తుతం రాజకీయరంగంలో జాతీయస్థాయి లీడర్ గా కొనసాగుతున్నారు. ఆమే ప్రముఖ రచయిత, భారత బొగ్గు గనుల శాఖ నుంచి సెంట్రల్ కోల్ ఫీల్డ్ , జార్ఖండ్ రాష్ట్రానికి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జాతీయ నేత జాజుల గౌరీ గారితో ముఖాముఖి….. (తరుణివారపత్రిక సౌజన్యంతో)
తరుణి : రైతు బిడ్డగా, కార్మికురాలిగా పనిచేస్తూనే సామాజిక కోణం నుంచి ఆలోచిస్తూ అనేక రచనలు చేశారు. ఇది ఎలా సాధ్యమైంది.
జాజుల గౌరీ : కంటి ముందు కనిపించే అనేక అంశాలు నా కథల్లో పాత్రలుగా మారాయి. అందుకే నేను రాసిన కథలు సామాజిక అంశాల చుట్టూ అల్లుకున్నవి. చిన్నతనం నుంచి నేను పెరిగిన వాతావరణం, అణచివేత అనేక కొత్త విషయాలు నాకు నేర్పింది. నా చుట్టూ ఉన్న సంఘటనలు, వ్యక్తులు నా కథల్లోని ఇతివృత్తాలుగా , పాత్రలుగా మారారు. వాస్తవికతకు అద్దంగా పట్టేలా నా సాహిత్యం ఉంటుంది.

తరుణి : మీరు పెరిగిన వాతావరణం గురించి చెప్పండి.
జాజుల గౌరీ : సికింద్రబాద్ లోని బొల్లారం దవఖానాలో పుట్టాను. లోతుకుంటలో జాజుల బాయి లో పెరిగాను. మాది దళిత వ్యవసాయ కుటుంబం. మా నాయిన జాజుల మల్లయ్య, అమ్మ జాజుల లక్ష్మమ్మ. నాయిన వాళ్లు 1930 ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలోని కీసర నుంచి వచ్చి అల్వాల్ లోని వ్యవసాయ భూముల్లో మాదిగతనం చేస్తూ స్థిరపడ్డారు. ఆ తర్వాత ఎనిమిది ఎకరాల బీడు భూమిని లోతు కుంటలో సాగు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అమ్మమ్మ వాళ్లది అంబర్ పేట. ఇప్పుడు ఈ ప్రాంతమంతా పట్టణంగా మారింది. కానీ మా చిన్నతనంలో చుట్టూ పచ్చని పొలాలు ఉండేవి. ఒకవైపు కిసాన్.. మరోవైపు జవాన్. మా ఇల్లు, పక్కనే పొలాలు. మరోవైపు చూస్తే మిలట్రీ ఏరియా. పొద్దుగాల పొద్దుగాల సైనికుల కవాతులు , వారి క్రమశిక్షణతో కూడ జీవితం కనిపించేది. ఊహ తెలిసే నాటికే నిస్వార్థమెరుగుని రైతు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికుల కుటుంబాల మధ్య పెరిగాను. నాయిన వ్యవసాయ పనులతో పాటు మేస్త్రిగా పనిచేసేవాడు. మా ఇల్లు మేమే కట్టుకున్నాం. అంతేకాదు వాయుపురి, మల్కాజ్ గిరి, సఫిల్ గూడ, సికింద్రబాద్ కాలనీలో చాలా ఇండ్లు మా వాళ్లు కట్టినవే. మేం ఏడుగురు పిల్లలం. అక్క, ముగ్గురు అన్నల తర్వాత నేను, గంగ కవలలుగా పుట్టాం. ఆ తర్వాత ఒక చెల్లెలు. అమ్మ పొలం పనులు చేస్తూనే జానపాదాలను ఎంతో బాగా పాటలు పాడేది. అలవోకగా వందకు పైగా జానపదాలు ఆమె నోట నానేవి. అక్షర ముక్కరాని జీవితంలోని సందర్భాలకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆమె పదాలను అల్లుతూ పాటలు పాడేది. ఇంట్లో రేడియో మాత్రం ఎప్పుడు మోగుతూనే ఉండేది. చదువు జీవితాన్ని మార్చుతుందని నాన్న చెప్పేవారు. మా వంశంలో బడికి పోయినా మొదటి ఆడపిల్లను నేనే. లోతుకుంట ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. అక్కడ జరిగిన సంఘటనలు నా జీవితంపై చాలా ప్రభావం చూపించాయి. నా మొట్టమొదటి టీచర్ అన్నమ్మ చూపించిన ప్రేమ నా జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. జీవితాలను ఆవరించి కులం ఒకటి ఉంటుందని స్కూలు స్థాయిలోనే గ్రహించాను. జీవితంలో ఉన్నత దశకు చేరుకోవాలంటే చదువు ముఖ్య సాధనమని అర్థమైంది. ఒకవైపు పచ్చని ప్రకృతి, మిలట్రీ ప్రాంతపు క్రమశిక్షణతో కూడిన కవాతులు, మరోవైపు అమ్మ పాటలు..రేడియోలో వచ్చే బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు నాలో సాహిత్య అభిలాషను కలిగించాయి. పాటల్లోని పదాల్లో అంత్యప్రాసలను గమనించేదాన్ని. చిన్న కాగితం దొరికినా చదవుతూ.. నా మనసుకు తట్టిన భావాలను రాసుకునేదాన్ని. అలా అలా రాయడం మాత్రం స్కూలు స్థాయిలోనే అలవాటు అయ్యింది. పట్టణీకరణలో ముందుగా మాయం అయ్యేవి దళితుల వ్యవసాయ భూములే. అలా మాకు ఉన్న పొలం కాస్త కాలనీలుగా రూపాంతరం చెందాయి. వైవిధ్యభరితమైన వాతావరణంలో పెరిగాను.
తరుణి : చదువు జీవితాన్ని మార్చుతుందని నమ్మారు కదా మరి చదువు మీ జీవితంలో తీసుకువచ్చిన మార్పు గురించి చెప్పండి.
జాజుల గౌరీ : పెద్దపెద్ద చదువులు చదవాలని ఎంతగా ఉన్నా కుటుంబ పరిస్థితులు అనుకూలించాలి కదా. పెండ్లీ కారణంగా చదువు ఎనిమిది లోనే ఆగిపోయింది. మా ఆయన మునింగం నాగరాజు. ఆల్వీన్ కంపెనీలో పనేచేసేవాడు. దాంతో పొలాల మధ్య నుంచి పరిశ్రమల మధ్యకు శాస్త్రీ నగర్, ఎర్రగడ్డకు మకాం మారింది. మాకు ఇద్దరు పిల్లలు, చాలీ చాలనీ జీతం. చదువు మీద నాకు ఎప్పుడూ ఆసక్తి ఉండేది అది గ్రహించి మా వారు నాకు పుస్తకాలను కొని ఇచ్చారు. కానీ సరైన గైడెన్స్ లేక నేను డైరెక్ట్ గా టెన్త్ రాయలేకపోయాను. అయితే నాకు అలవాటు ఉండేది అదేమిటంటే కనిపించిన ప్రతి చిత్తు పేపర్ ని తీసుకుని చదవడం నాకు సాహిత్యం పై ఆసక్తిని పెంచింది. సనత్ నగర్ , బాలానగర్ పారిశ్రామిక వాడలకు అతి దగ్గరగా మా ఇల్లు ఉండటంతో ఇల్లు గడవడం కోసం, పిల్లల చదువుల కోసం ఫ్యాక్టరీలకు పనికి వెళ్లక తప్పలేదు. కరెంటు మీటర్లు తయారు చేసే కంపెనీలో ఐదురూపాయల వేతనానికి పనిచేశాను. అక్కడ నాతో పాటు పనిచేసే శారద చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పింది. అక్కడే ఉన్న హస్పిటల్ లో ఆయాగా పనిచేస్తే రెండు వందల రూపాయలు ఎక్కువ ఇస్తారని తెలిసి అక్కడ చేరాను. అయితే రక్తం చూస్తే కళ్లు తిరిగేవి.. దాంతో ఆ ఉద్యోగం కొద్దిరోజులే. 1989 నుంచి నా జీవితంలో దుర్భరమైన పరిస్థితులు. అల్విన్ లో మా వారి కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం రేపు మాకు అన్నట్లుగా ఉండి మొత్తానికి 1990 ప్రాంతంలో ఆల్వీన్ మూతపడింది. దాంతో మా ఆయన ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖలో డైలీ లేబర్ గా చేరారు. 9 వందల రూపాయల జీతం. ఎటు సరిపోని సంపాదన. బతుకు ఉద్యమం మొదలైంది. పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించడం కోసం మంచి ఉద్యోగం రావాలంటే ముందుగా పై చదువులు చదవాలని నిర్ణయించుకున్నాను. రిసెప్షనిస్ట్ గా పనిచేస్తే ఎక్కువ జీతం వస్తుందని ఎవ్వరో చెప్పగా తెలిసింది. మా చుట్టూ ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే చదువు ఒక్కటే మార్గంగా కనిపించింది. నా తపన గమనించి ఫ్యాక్టరీలో పనిచేసే గోపాల్ అనే ఒకతను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష అప్లికేషన్ తీసుకువచ్చి ఇచ్చాడు. పరీక్ష రాసి.. 1993లో డిగ్రీలో జాయిన్ అయ్యాను. అదే సమయంలో శ్రీలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్రిక్స్ కంపెనీలో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. కొండల్ రావు గారు ఆ సంస్థ యజమాని. పిల్లలను తీసుకుని వెళ్లి ఆఫీస్ లో కూర్చునేదాన్ని. మొదటిసారి ఫోన్ చూసింది మాట్లాడింది అక్కడే. దాదాపు ఐదేండ్లు అక్కడే పనిచేశాను. ఆ తర్వాత 2008 వరకు చదువు కొనసాగింది. డిగ్రీ, ఎంసిజె, ఎంఎ, ఎల్ఎల్ ఎం పూర్తి చేశాను. పిహెచ్ డిలోనూ సీటు వచ్చింది.
తరుణి : మీ తొలి రచన ఎప్పుడు ప్రచురించబడింది.
జాజుల గౌరీ : చిన్నతనం నుంచి అమ్మ పాడే జానపద గేయాలు. రేడియోలో నిరంతరంగా వచ్చే పాటలు, నాటికలు ఎంతగానో ఆకట్టుకునేవి. రేడియోలో పాట వస్తుంటే ఆ పాటలోని పదాలను గుర్తు పెట్టుకుని రోజంతా అవే పాడేసరికి పదాల మధ్య ఉన్న ప్రాసలు తెలిసి కవిత్వం రహస్యం ఏమిటో అర్థం అయ్యేది. 1980లో నాలోని స్పందనలు రాయడం మొదలుపెట్టాను. అయితే డిగ్రీలో తెలుగు సాహిత్యం చదువుతున్నప్పుడు అమ్మ పాడిన పాటే మౌఖిక సాహిత్యం అని, గ్రంథస్తం అయితేనే అది సాహిత్యంగా పదికాలాలు నిలుస్తుందని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను.

తెలిసి తెలియని వయసులో రాసిన కవిత్వం గుర్తుకువచ్చింది. సాహిత్యంపై అవగాహనతో రచన ప్రక్రియ మొదలైంది. పత్రికలకు పంపించాను. కానీ ఏ పత్రికలు కూడా నా రచనలను ప్రచురించలేదు. అదే సమయంలో ఒక సభలో పరిచయం అయిన గెస్ట్ లెక్చరర్ డాక్టర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ రాంనగర్ లోని ఏకలవ్య పత్రిక సంపదకులైన కె. జి. సత్యమూర్తి గారికి నన్ను పరిచయం చేశారు. 1997లో దసరా దీపావళి సంచికలో ఉతికి ఆరేస్తా అన్న కవిత మొదటిసారి అచ్చు అయ్యింది. అలా పత్రికలో నా సాహితీ ప్రస్థానం మొదలైంది. డా. ననుమాస స్వామి, ప్రొ. సత్యనారాయణ తదితరులు నా కవిత్వాన్ని మెచ్చుకున్నారు. ఆ తరువాత మాదిగ సాహిత్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ నాగప్ప గారి సుందర్ రాజుగారు ఈనాడులో మాదిగ రచయితల నుండి కవితలు కావాలంటూ పత్రిక ప్రకటన ఇచ్చారు. అది చదివి నేను అందులో జాయిన్ కావడం జరిగింది. నాగప్ప గారి సుందర్ రాజుగారు సాహిత్య రచన మేలుకువలు నన్ను సాహిత్య పీఠంపై నిలిపాయి. వెనిక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. మాదిగ సాహిత్య వేదిక ద్వారా నా సాహిత్య ప్రస్థానం వ్యాసం, కవిత, కథ, నవల ప్రక్రియలకు దారితీసింది. నేను రాసిన మొదటి కథ మన్ను బువ్వ, దస్తకత్ కథలు ఎదురుచూపులు కథాసంకలనంలో వచ్చాయి. మాదిగ సాహిత్య వేదిక ఉపాధ్యక్షురాలిగా కొనసాగాను. ఆ సమయంలో , దార్ల వెంకటేశ్వరరావు, కొల్లూరి చిరంజీవి తదితరులతో సాహిత్యచర్చలు జరిగేవి. అదే సమయంలో నాగప్ప గారి సుందర రాజు గారి మరణంతో మాదిగ సాహిత్య వేదిక ద్వారా రచనలు రావడం ఆగిపోయింది. నా రచన వ్యాసాంగం కొనసాగుతున్నా పత్రికలకు పంపే సాహసం చేయలేదు. ఎందుకంటే ఎంతో శ్రమపడి రాసిన నా కథలు చెత్తబుట్టలో పడటం నాకు ఇష్టం లేకపోయింది.
తరుణి : ఉద్యమంలోకి ఎలా వచ్చారు. సత్యమూర్తి లాంటి ప్రముఖులతో మీ పరిచయం ఎలా జరిగింది.
జాజుల గౌరీ : కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో తెలియదు. కానీ, కాలం మనల్ని కొన్నింటికి ఎంపిక చేసుకుంటుంది అని మాత్రం నేను నమ్ముతాను. సోషల్ వెల్పేర్ ఆఫీస్ లో పనిచేసే క్రమంలో మా ఆయన సభలకు, సమావేశాలకు వెళ్లేవారు. అలా ఒకసారి జె.బి రాజు గారి సభకు మా ఆయన వెళ్లడం.. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ పుస్తకం ఆయన చేతికి వస్తే పుస్తకాలపై నాకున్న ఆసక్తి తెలిసి ఆ పుస్తకం తీసుకువచ్చి నాకు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారి గురించి తెలుసుకునే అవకాశం ఆ పుస్తకం ద్వారా కలిగింది. 14 ఏప్రిల్, 1996 ఆ రోజు ఆదివారం. బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజ్ కి క్లాస్ కు వెళ్లాను. లంచ్ తర్వాత సెమినార్ హాల్ లో ఉపన్యాస పోటీ ఉంది అంటే అందరం వెళ్లాం. అంబేద్కర్ గురించి అందరూ మాట్లాడారు. ఇంకా ఎవ్వరైనా మాట్లాడండి అంటూ ఐదు నిమిషాలు టైం ఇచ్చారు. అందరి మాటలు విన్న నేను బి. ఆర్. అంబేద్కర్ గురించి అంతకు ముందే చదివిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాను. మాట్లాడేందుకు సిద్ధమై వేదికపైకి వెళ్ళాను. జీవితానికి, కులానికి ఉన్న సంబంధం అర్థం చేసుకుంటూ రాజ్యాంగ రచనకు ప్రేరణ ఇచ్చిన ఆయన జీవితం నుంచి చదువే జీవితాన్ని మార్చుతుందన్న నా జీవితం వరకు నేను గమనించిన కొన్ని అంశాలను చెప్పాను. ఐదు నిమిషాలు కాస్త 25 నిమిషాలు అయ్యింది. అందరూ చప్పట్లతో నా ఉపన్యాసాన్ని మెచ్చుకున్నారు

. ఆ పోటీల్లో నాకే ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది. ఆ తర్వాత మా గెస్ట్ లెక్చరర్ డాక్టర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ గారు నాతో మాట్లాడారు. ఆయన అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారు. ఉద్యోగం కోసం డిగ్రీలో చేరాను అని తెలిసి జర్నలిజం చదువు పిఆర్ ఓ ఉద్యోగం వస్తుందని చెప్పారు. ఒక రోజు ఓయూ అంతా తిప్పి చూపించారు. ఉస్మానియా యూనివర్సిటీలోఆర్ట్స్ కాలేజీ డోం ముందు నిలబడి జీవితంలో ఎత్తైన స్థాయికి చేరుకోవాలని కలలు కంటూ వాటిని పట్టుదలతో సాకారం చేసుకోవాలి అంటూ చెప్పారు. ఆ క్షణం ఆ మాటలు నాతో పట్టుదలను మరింత పెంచాయి. ఓయూలో బిసిజె, ఎంసిజె చేశాను. కేసరి పత్రికలో కొన్నిరోజులు జర్నిలిస్ట్ గా పనిచేశాను. అయితే జీతం ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అక్కడ మానేశాను. ప్రభంజన్ సార్ ద్వారానే ప్రముఖ విప్లవ రచయిత కె.జి. సత్యమూర్తిగారు పరిచయం. రాంనగర్ లోని ఆయన ఇంటికి మొదటిసారి వెళ్లినప్పుడు ఆయన అడిగిన మొదటి ప్రశ్న బిడ్డ అన్నం తిన్నావా అని.. బిడ్డా అంటూ పిలిచిన ఆయనను నేను నాయిన అంటూ పిలిచేదాన్ని. ఎంతో మంది ప్రముఖులు, సాహిత్యకారులు అక్కడకు వచ్చేవారు.
తరుణి : మీరు రాసిన కవిత్వంలో ఆవేశం, కథలో ఒక ఆలోచన ఉంటాయి. మీ సాహిత్యానికి ప్రేరణ.
జాజుల గౌరీ : చిన్నతనం నుంచి నేను చూసిన జీవితాలే నాకు ప్రేరణ. నిరంతర శ్రమ జీవి మా నాయిన, తర్కంతో కూడిన ప్రేమ మూర్తి మా అమ్మ, మన జీవితాలను మనమే నిర్మించుకోవాలని నేర్పించారు. సైన్యంలోకి వెళ్లిన కొడుకు కోసం ఏండ్ల తరబడి కండ్లు కాయలు కాచేలా ఎదురుచూసే తల్లు లు, సాటి మనిషిని కులం కోణంలో చూసే సమాజంలో దళితుల జీవన విధానం, సమస్యలు ఎలా ఎన్నో ప్రేరణ ఇచ్చే అంశాలున్నాయి.
– కోవెల సుప్రసన్నాచార్యులు
తెలుగు సాహితీ జగత్తుకు తలమానికమైన సుప్రసిద్ధ కవులు, విమర్శకులు, ఆధ్యాత్మిక, తాత్వికవేత్త, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కార గ్రహీత కోవెల సుప్రసన్నాచార్యులు గారితో ముఖాముఖి. -అరుణ ధూళిపాళ

గురువుగారు నమస్కారాలు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మహద్భాగ్యం. మీలాంటి మహనీయుని గురించి మా పాఠకులకు పరిచయం చేయడం నా జీవితానికి ఒక గొప్ప అనుభూతి.
1) మీ బాల్యం, విద్యాభ్యాసాల గురించి మాకు వివరంగా తెలపండి.
జ. మార్చి 17, 1936న వరంగల్లులోజన్మించాను నేను. మా తండ్రి వెంకట నరసింహాచార్యులు గారు, తల్లి లక్ష్మీనరసమ్మ గారు. మా పితామహుడు అయిన కోయిల్ కందాడై రంగాచార్యులు గారు, మాతామహులైన ఠయ్యాల లక్ష్మీనరసింహాచార్యులు గారు నాకు సాహిత్యంలో గురువులు. వరంగల్లు లోనిని ఏవీవీ హైస్కూల్లో ఉన్నత విద్య వరకు చదివి, హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎమ్.ఏ చేసి రామరాజ భూషణుని కృతులు అనే అంశంపై పరిశోధన చేసి పీ హెచ్ డీ పట్టా పొందాను.
2) కేవలం 9వ ఏట కంద పద్యాలు రాసిన సామర్థ్యం ఎలా పట్టువడింది?
జ. ఛందస్సు తెలియదు నాకు. నేర్చుకోలేదు ఇవ్వాల్టి వరకు కూడా. అప్పుడు వీధి బళ్ళలో భాగవత పద్యాలు, భాగవత ఘట్టాలు చెప్పేవారు.అది చదవడం, వినడం వల్ల వాటి నడక మాకు అర్థం అయ్యేది. ఆ కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడంటే “”హయరింకా ముఖ ధూళి ధూసర పరిన్యస్త అలకోపేతుడై” గుర్రపు డెక్కల యొక్క ధూళి ఎగిసి ముఖం మీద పడింది. ముంగురులలో చెమట వచ్చింది. ఆ దుమ్ములో పడి అట్టకట్టుకుని పోయిన రూపాన్ని ఎంతో అందంగా వర్ణించాడు. ఇలా కాకుండా రారా పరిగెత్తుకు పోదాం క్రికెట్ ఆడదామంటే ఏముంటుంది దాంట్లో? పోతనది ఎంత గొప్ప కవిత్వం అంటే విజువలైజేషన్లో ఆయనను మించిన వారు లేరు. “నల్లని వాడు పద్మ నయనంబులవాడు కృపారసంబు పై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు”ఈ పద్యాలు చదువుతున్నప్పుడు పద్యం యొక్క రూపం, నడక, గురులఘువులు ఎక్కడ ఉంటాయో తెలియకపోయినా ‘ధాటి’ అంటారే ఆ ధాటి నాకు తెలిసేది. ‘శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకలజనులు’..’తన కోపమె తన శత్రువు’..ఇలా భాగవతం, సుమతీ శతకం, పద్యాన్ని నేర్పాయి. ఒక ఇమేజ్ మనసులో ఏర్పడితే దానికి ఒక ధాటి వస్తుంది. చెక్కుతూ పోవాలి దాన్ని. అది అందరికీ సాధ్యం కాదు. అలా చెక్కుతూ పోయినవాడు కృష్ణశాస్త్రి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇలా గొప్పగా వ్యక్తీకరించడమనేది పోతన వల్ల నాకు కలిగింది. సుమతీ శతకంలో కంద పద్యం ఒరవడి తెలుస్తుంది కదా! అది 6,7 ఏళ్ళ వయస్సులోనే పిల్లలకు చెప్తారు కదా! అదే నాకు అలవడింది. It happend, it continued till day. అందువల్ల దానికోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరం రాలేదు. అంతే కాక మా తాతగారు ఉభయ వేదాంత విద్వాంసులు. ఆ రోజుల్లో కాంచీపురం నుండి బరంపురం వరకు ఆయన ఉపన్యాసం లేని ఊరు లేదు. దాదాపు 3 గంటలు. మైకు లేకుండా చెప్పేవారు. కంఠం చాలా గొప్పగా ఉండేది. నా మొదటి విద్యా ప్రదానం ఆయన దగ్గరే జరిగింది. రజాకార్ల గొడవలు జరుగుతున్న సందర్భంలో మేము తల దాచుకోవడానికి కల్లెడ గ్రామంలో ఉండేవాళ్ళం. మధ్యాహ్నం గుడిలో భక్తి ప్రబోధ విషయాలు, సాయంకాలం శ్రీమద్రామాయణం చెప్పేవారు తాతగారు. మాకు అప్పుడు పని ఏమీ లేదు. కాబట్టి అన్నీ వింటూ ఉండేవాళ్ళం. పులిహోర ప్రసాదం కోసం వెళ్ళేవాళ్ళం (నవ్వుతూ). కేవలం కాలక్షేపానికి మాత్రమే కాక, వేదాంత, పురాణ, ఇతిహాస, ఉపనిషత్తుల విషయాలు కూడా చెవిలో వినబడుతుండేవి. ఆ తర్వాత జాతీయోద్యమ స్ఫూర్తితో ఏర్పడ్డ చందా కాంతయ్య గారి ‘ఆంధ్ర విద్యాభివర్ధిని’ స్కూల్లో చదువుకున్నా.. చందా గారు గొప్ప వదాన్యుడు. ఉర్దూ మీడియం స్కూళ్లకు వ్యతిరేక ఉద్యమంలో భాగంగా లక్షరూపాయలు దానంగా ఇచ్చి తెలుగు మీడియం స్కూల్ పెట్టాడు. దాంట్లో చదువుకున్నా. అందులో గొప్ప టీచర్లు వుండేవారు. అక్కడ ఒక సాంస్కృతిక వాతావరణాన్ని ఏర్పాటు చేశారు వారు. ప్రతీ ఏటా పోతన జయంతి చేసేవారు. రెండు మూడు రోజులు ఉత్సవాలు చేసేవారు. విశ్వనాథ వెంకటేశ్వర్లు గారని విశ్వనాథ సత్యనారాయణ గారి తమ్ముడు గొప్ప విద్వాంసుడు. ఆయన పాఠం చెప్పేవాడు మాకు. పద్యం, కవిత్వం ఎలా ఉండాలో, ఎలా రాయాలో చెప్పేవారు. ఆయన చెప్పే పద్ధతి నాకు ఆదర్శం. ఆయన నత్కీరుని కథ ఉదాహరణగా చెప్పి, ఎవరినీ స్తోత్రం చేయవద్దని, ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని ఈ రెండు విషయాలను చెప్పారు నాకు. అవి నేను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాను. అలాగే రాస్తూ వచ్చా. ఎవరికీ ఎప్పుడూ తలొగ్గలేదు. ఆ స్కూల్లో సోమేశ్వర రావు గారని ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు. పేరుకు ఇంగ్లీష్ టీచరే గాని ఆయన చిత్రకారుడు. సంస్కృతి గురించి చెప్పేవారు. పాఠశాలలో రామప్పకు ఎక్స్ కర్షన్ తీసుకెళ్లినప్పుడు అక్కడి శిల్పకళలో హోయసాల, కాకతీయ, చోళుల భేదాలను కూడా చెప్పేవారు. ఈ విధంగా రచనా పద్ధతి నాకు అలవడింది. అలా రాస్తూనే వున్నా.
3. అసలు కవిత్వం యొక్క లక్షణం ఏమిటి? ఇప్పటి కవిత్వం ఎలా వుంది? కవిత్వంలో రసజ్ఞత ఎలా ఉండాలి?
జ. వ్యంగ్య భావన ఉండడం కవిత్వం యొక్క ముఖ్య లక్షణం. వాక్యంగా చెబితే కవిత్వం కాదు. ఇప్పుడేమయ్యిందంటే ఏదో పాద విభజన చేస్తున్నారు. అదే కవిత్వం అంటున్నారు. ఎక్కువమంది కవిత్వానికి దూరంగా ఉంటున్నారు అనుకుంటున్నాను. నేను చాదస్తుడిని అనుకోవచ్చు, మరేమైనా అనుకోవచ్చు. అప్పట్లో ఎన్నో అవకాశాలు ఉండేవి. ఇప్పుడు క్రమంగా తగ్గిందని అనుకుంటున్నా. పద్యం ఎప్పుడైనా సరే ఆనాటి చైతన్యాన్ని లబ్దీకరించుకునే శక్తి దానికున్నది. దాశరథి పద్యం మామూలుదా? పింగళి కాటూరి వారి సౌందర నందనంలోని పద్యాల కాఠిన్యం…? అసలు కాఠిన్యం అంటే..? భావ క్లేశం ఉండొచ్చు. మోహన్ ప్రసాద్ కవిత ఎంతమందికి అర్థం అవుతుంది? ఆయనను పొగిడిన వాళ్ళు కొన్ని కవితల్ని కాదంటే..? వాళ్ళ దృష్టి వేరు కదా! కవిత్వంలో ఒక ఆత్మీయ లక్షణం ఉండాలి. శ్రీశ్రీ “కవితా! ఓ కవితా” లో కవిత అనేది ఏకాంతమైనది. భావ గర్భితమైనది అనే మాట అంటాడు. ఏకాంతంలో వుండే ఒక స్థితి అనుభవంలోకి రావాలి. దానికోసం ఎన్నో చోట్లు చూస్తూ వచ్చాడు. నిఘంటువు, వ్యాకరణాలను, ఛందస్సులను వదిలేయమంటాడు. ఎందుకు వదలాలి? అవి ప్రధానం కావు కాబట్టి. కానీ అవి ఉంటాయి. విశ్వనాథ కూడా ఒకచోట ” నా కవితకు ఔచితి లేదు, భాషలేదు, ఆకృతి లేదు. ఊరక రసాత్మకనే ప్రవహించి పోదు” అంటాడు. అంటే వ్యాకరణం, శబ్దం లేదని కాదు కదా! కేవలం నిఘంటువుల్ని మాత్రమే పట్టుకోవద్దనేది వారి భావన..ఇద్దరూ వారివారి మాటల్లో ఒకే విషయం చెప్పారు. దాశరథి ఒకచోట అంటాడు. వైద్యశాస్త్రం శ్లోకాల్లో ఉంటుంది. మరి అది కవిత్వం అవుతుందా? అని. కవిత్వానికి ఆత్మస్పర్శ ఉండాలి. అది ఉండాలంటే అంతస్సులోకి వెళ్లిపోవాలి. వ్యష్టి చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో అనుసంధానించుకోవాలి. రస సిద్ధాంతంలో సాధారణీకరణం అనే మాట వాడారు. అంటే ఏమిటి? కవి తన దేశాన్ని, కాలాన్ని మరచిపోవాలి. అన్నింటినీ దాటుకొని విశ్వయాత్ర చేయాలి. ఎవరి జీవితంలోనైనా ఏవో అనుకోని విషయాలు వస్తూనే ఉంటాయి. వాటిని కవిత్వీకరించాలి. ఇదే ‘విశ్వజనీనం’ అనే మాట అవుతుంది. కావ్యాల్లో చెట్లు, పుట్టలు, పక్షులు, చంద్రుడు, మేఘం ఇలా ప్రకృతి ఉంటుంది. ఇవి ఏమీ చెప్పవు. తన భావాలన్నింటికీ ఏదో ఒకదాని మీద ఆధారపడి మనుష్యత్వాన్ని కల్పించి, దాంతో ఏదో ఒక సందర్భాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తాడు కవి. ఆ సమయంలో అన్నింటినీ మరచిపోయి రెక్కలు కట్టుకుని మరీ ఎగరాలి. నేల బారుగా పడిపోతే లాభం ఏముంది? 80, 90 ఏళ్ళల్లో జరిగింది ఏమిటంటే భావనల కంటే ఉపన్యాసాలకు, సిద్ధాంతాలకు, ఇతర విషయాలకు ప్రాధాన్యత పెరిగింది. మనుచరిత్రలో ప్రవరుడు దారి తప్పాడు. ఇలాంటి ఇష్టంలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం అందరికీ సహజమే. దాని నుండి బయటపడడానికి ప్రయత్నమూ సహజమే..దాన్ని అర్థం చేయించడమే కవికి ముఖ్యమైనది. అందువల్ల కవిత్వం ఎప్పుడూ అపరిమితమైన స్థితిలో ఉండాలి కానీ పరిమితులకు లోబడి ఉండకూడదు. శబ్దానికి ఒక శిల్పం ఉండాలి. శాస్త్రాలు వేరు, కావ్యాలు వేరు.శాస్త్రాలకు, కావ్యాలకు వుండే భేదం తాదాత్మ్యత. తన్ను తాను మరిచిపోయినప్పుడు సమస్త విశ్వంలో ఉండే భావన తనలో లీనమయ్యే పరిస్థితి వస్తుంది. అలౌకికమైన ఆనందపు స్థితిని పొందడం కవిత్వం చేసే పని. పద్యం అంటే ఏవో గణాలు కుదుర్చుకొని ఛందస్సు సరిచూసుకొని రాసేది కాదు. మనసులో ఛందస్సు కుదురుకున్నాకే పద్యం బయటకు వస్తుంది. ఇది విశిష్టమైన ప్రక్రియ. ఉపమానాలు వుండొద్దు, ఉపమేయాలు వుండొద్దు, శబ్దం వుండొద్దు. మనకు ఉన్న కొన్ని శబ్దాలతోనే కవిత్వం ఉండాలంటే ఆ పటుత్వం ఎలా ఉంటుంది? ఇప్పటికే ఎంతో శబ్ద సంపదను కోల్పోయినాము. ఈనాటి ఆధునిక కవులలో శబ్దజ్ఞానం కొరవడింది. తిలక్ కవిత్వంలో ‘రొమాంటిక్ ఎలిమెంట్’ ఉండడం చేత అంత గొప్ప కవి అయ్యాడు. ‘రొమాంటిక్ ఎలిమెంట్ ‘అంటే ఏమిటి? ప్రతీదాన్ని ప్రేమించడం. ప్రేమ అనేది స్త్రీ పురుష సంబంధం కాదు. బాహ్య, అంతర్లీనమైన ప్రతీ అంశాన్ని ప్రేమించ గలగాలి. ఏ వస్తువునైనా కవిత్వంగా మార్చగలిగే శక్తి ఉండాలి. దీనికి ప్రాచీన, ఆధునిక కవిత్వాలనే భేదం అవసరం లేదనుకుంటా. కవిత్వంలో గాఢత వద్దంటే ఎలా? నాకనిపించేది ఏంటంటే We are loosing almost all the essences of the literature. వివాదాల్లో పడి వీటిని పోగొట్టుకుంటున్నామేమో…
4) హైదరాబాద్ లో మీరు ప్రారంభించిన ‘రసధుని’ సంస్థ గురించిన వివరాలు చెప్పండి. ఇంకా అలాంటివి ఏవైనా మీరు స్థాపించారా?
జ. మేము చదువురీత్యా హాస్టల్లో ఉండేవాళ్ళం. సాయంకాలం కాగానే సుల్తాన్ బజార్ కి వచ్చి ఎక్కడో ఒకచోట భాషా మీటింగులు అటెండ్ చేసేవాళ్ళం. పల్లా దుర్గయ్య, నారాయణరెడ్డి, దాశరథి, రామరాజు గారు ఆళ్వార్ స్వామి, వరదాచార్యులు గారు వీళ్లంతా పల్లా దుర్గయ్య గారి ఇంట్లో సమావేశం అయ్యేవారు. ఆ సమయంలో వరదరాజేశ్వరరావు గారు కవిత అనే రెండు వచన సంపుటాలు వేశారు. అబ్బూరి ఛాయాదేవి సంపాదకత్వంలో కూడా ఆయన రచనలు వెలువడ్డాయి. ఆళ్వార్ స్వామి దేశోద్ధారక గ్రంథమాలకు పుస్తకాలు వేస్తున్నారు. రాఘవాచారి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు అప్పుడు. ఆయన ఆదర్శ సాహిత్య అనే ఏదో పేరుతో పుస్తకాలు వేస్తుండేవారు. సాహిత్యం మీద ఆక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. అప్పటికే తెలంగాణ రచయితల సంఘం ఏర్పడింది. మొదటి మహాసభలు జరిగినాయి. దానికి దాశరథిగారు అధ్యక్షులు. ఆ సమావేశానికి శ్రీశ్రీ మొదలైన వారు ఎంతోమంది వచ్చారు. తర్వాత సంఘాలలో చాలా మార్పులు వచ్చాయి. సారస్వత పరిషత్తుకు అప్పటికే స్థలం ఉండేది. దానిని ఆక్రమించాలనే ప్రయత్నాలూ జరిగాయి. ఆ సమయంలో నేను నా మిత్రుడు మాదిరాజు రంగారావు గారు హాస్టల్లో ఉండే వాళ్ళం. పద్యం అంటే చాలా ఇష్టమైన తనకి. రాత్రి 8,9 గంటల సమయంలో గంట గంటన్నర సేపు రామాయణ కల్ప వృక్షం చదివి వినిపించేవాడు. పద్యాలు బాగా చదువుతాడు ఆయన. అప్పుడు హైదరాబాద్లో ఆక్టివిటీ కోసం ‘రసధుని’ పేరుతో సంస్థ ప్రారంభించాలని అనుకున్నాము. అదే సమయంలో రామకోటి శాస్త్రి గారు గుడివాడ నుండి వచ్చి రిసెర్చ్ చేస్తున్నారు ఇక్కడ. మొదలి నాగభూషణ శర్మ ఎమ్.ఏ చదువుతున్నారు. రమాపతిరావు గారు, అక్కిరాజు గారు మేమంతా కలిసి తాజ్ మహల్ లో ఏదో ఓ మూల కూర్చొని టీ తాగుతూ చాలా సమయం గడిపే వాళ్ళం. అప్పుడు ఈ ‘రసధుని’ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఒక కవి మీద స్టడీ చేసిన ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగింది. మొదటిది విశ్వనాథ మీద చేశాం. గౌతమ రావు గారు ,సంపత్ కుమార్ ఆచార్య గారు, ఆనందమూర్తి గారు మొదలైనటువంటి వారు ముందు వ్యాసాలు రాసారు. ఆ వ్యాసాలనే ఉపన్యాసాలుగా తయారు చేశాం. ఆ వ్యాసాలన్నీ తర్వాత స్రవంతి పత్రికలో వచ్చాయి. తర్వాత శ్రీశ్రీ పేరు మీద కూడా సెమినార్ ఏర్పాటు చేశాము. సంపత్ రాఘవాచారి అనే ఆయన ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా ఉండేవాడు. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరుగా పనిచేసే ఒక ఆయన ఇంకో ఇద్దరు,ముగ్గురు శ్రీశ్రీ గురించి మాట్లాడారు. చలం మీద అనుకున్నాం కానీ కుదరలేదు. విశ్వనాథ గారి మీద వ్యాసాలు అన్నీ స్రవంతిలో వచ్చాయి. తెలంగాణ సంఘంలోని కవులు విస్తృతంగా కృషి చేశారు. ప్రాచీన కావ్యాలలోని ఒక్కొక్క ఆశ్వాసాన్ని ఒక్కొక్కరు గానం చేసేవారు. కొత్త కవులు అందరికీ మంచి ప్రోత్సాహం ఇచ్చేవారు. దాశరథి,ఆనందమూర్తి, నారాయణ రెడ్డి ఏదో ఒక కావ్యాన్ని గానం చేసేవారు. పైకి చదవడం వల్ల మనసులోకి పోతుందది. శబ్దం కాదు భావం ముఖ్యం. గౌతమ రావు గారు కల్పవృక్షం చదివితే అక్కడ చేకూరి రామారావు లాంటి ఎలాంటి పెద్ద వాళ్ళు ఉన్నా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కరీంనగర్ లో రెండు మూడు రోజులు సెషన్స్ పెట్టుకునేవాళ్ళం. ఐదు, ఆరు సంవత్సరాలు నడిచింది అట్లా. పద్యం అంటే చైతన్యం. చచ్చుగా చదవడం కాదు. ఏదైనా కవిత్వమయంగా చెప్పినప్పుడు అనుభూతి కలుగుతుంది. 1954 లో సాహితీ బంధు అని వరంగల్ లో ప్రారంభించాము. 1957లో మిత్రమండలి, 1960లో కులపతి సమితి స్థాపించాము. ‘చేతనావర్త కవులు’ అనే పేరిట నేను, సంపత్కుమారాచార్య, పేర్వారం జగన్నాథం, నరసింహారెడ్డి కలిసి అనేక వ్యాసాలు ప్రచురించాము. ఇది ఒక కవిత్వ తీర్థయాత్ర. పోతూ ఉండడమే.. కనిపించిందల్లా జేబులో వేసుకోవడమే. ఆ విధంగా కవిత్వ యాత్రలో మమేకమై పోయేవాళ్ళం.
5) అవధానాల మీదకు మీ దృష్టి ప్రసరించడానికి కారణాలు ఏవి?
జ. 1970 ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఈ లెఫ్టిస్ట్ కోర్సులు పద్యాలను తిరస్కరించడం మొదలు పెట్టాయి. పద్యం పనికిరాదు. పద్యాలు రాయకూడదు. ఛందోబద్ధ గణాలన్నీ వ్యర్థములని సిద్ధాంతాలు చేయడం మొదలు పెట్టాయి. దాన్ని తట్టుకోవడానికి ఏదో ఒక మార్గం అవసరం. పద్యం చెప్పడం ఎంత సులభమైంది? ఎంత హాయిగా చదువుకోవచ్చు? ఎంత హృద్యంగా ఉంటుంది? ఇవన్నీ తెలియాలి కదా! కొప్పరపు కవులు గంటకు 500 పద్యాలు ఆశువుగా చెప్పేవారు. విశేషమేమిటంటే, ఉదాహరణకు…జటాయువు కథ చెప్పాలంటే, మొత్తం ఆ కథకు సంబంధించిన పద్యాలే అన్ని చెప్పేవారు. అది అద్భుతమైన శక్తి. అదే కావ్య నిర్మాణమంటే. తిరుపతి వేంకట కవుల సమకాలికులు. వారు. ఆ కాలంలో వందలకొద్దీ శతావధానులు వచ్చారు. గుంటూరు సీమ వాళ్ళను చూస్తుంటే ఎంత గొప్ప పరిశ్రమ జరిగిందో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ సందర్భంలో మా వూళ్ళో ఎవరో ఒకాయన వచ్చి అష్టావధానం చేశారు. అది మాకు అంతగా నచ్చలేదు. నేను, శ్రీభాష్యం విజయసారథి గారు,ఇంకో ఇద్దరం మిత్రులం రోజూకలుసుకునేవాళ్ళం. విజయ సారథి గారు అపుడు నన్ను ప్రారంభం చేయమన్నారు. “నేనెక్కడ చేయగలను ఈ ఆశువుగా” అంటే “ఎందుకు కుదరదు..చేయి” అన్నారు. వాళ్ళింట్లోనే ప్రారంభం చేశాను. ఒక కవి మిత్రుని ఇంట్లో సాయంకాలాలు కలుసుకొని రెండు, మూడు రోజులకొకసారి నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది ఈ మూడు, నాల్గు అంశాలపై అభ్యాసం చేసేవాడిని. అష్టావధానంలో మిగతావి ఈజీనే కదా! ఆ క్రమంలో ఉగాది వచ్చింది. ఆరోజు మొదటిసారి ( 1973 ) అవధానం చేశాను. అట్లా తీవ్రంగా మూడేళ్లు చేశాను. ఆ తర్వాత ఇక చాలనిపించింది. ఎందుకంటే పృచ్ఛకులు దొరకరు. ఉన్నవాళ్ళు సందర్భానికి తగని అంశాలేవో ఇవ్వడం.. మనం వాళ్ళని ఏమీ అనలేక పోవడం.. అందుకే విరమించుకున్నా. 1975లో తెలుగు మహాసభలు జరిగాయి. దానికి ముందు వరంగల్ లో ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఒక మధ్యాహ్నం పూట నా అష్టావధానం పెట్టారు. మా ఇంగ్లీష్ ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి గారు గొప్ప సంస్కృత విద్వాంసులు. ఆయన సమస్య ఇచ్చారు. అనుకోకుండా అక్కడికి పీవీ నర్సింహారావు గారు వచ్చారు. చిన్నప్పటినుండీ తెలిసినవాడిని అవడం వల్లో, చిన్న పిల్లవాడు వీడేం చేస్తాడని చూడడానికో మొత్తానికి వచ్చారు. ఎప్పటి నుండి చేస్తున్నావని అడిగారు. ఇటీవలే పద్యం మొదలు పెట్టానని చెప్పాను. అలా ఆయన రావడం నాకు జీవితంలో మరపురాని అనుభూతిని మిగిల్చింది. ఎందుకంటే కవిత్వ స్థాయి తెలిసిన వాడు కాబట్టి, ఆ స్థాయిలో ఆస్వాదించ గలుగుతాడు కాబట్టి. మరోసారి భారతీ తీర్థ స్వామివారు వరంగల్ లో శంకర మఠానికి వచ్చినప్పుడు వారి ఆశీస్సులు లభించాయి. తర్వాత 20 ఏళ్లకు అక్కడే కవితా ప్రసాద్ అవధానం స్వామివారి సమక్షంలో జరిగింది. పృచ్ఛకునిగా వున్నాను నేను. నన్ను చూసి వారు 20 ఏళ్ళ క్రితం మీరు అవధానం చేశారు కదా! అని అన్నారు. వారి ధారణా శక్తికి ఆశ్చర్యపోయాను. వారు శాస్త్రాలలో సమృద్ధులు. తపస్వి. ఇలాంటి అదృష్టాలు కొన్ని నాకు కలిగాయి.

6) అవధాన ప్రక్రియలో విజయం సాధించాలంటే ఏ విధమైన పట్టు సాధించాలి?
జ. పట్టు ఏముందమ్మా ! ముందు పద్యం తెలియాలి. ఆశువుగా పద్యం చెప్పగలగాలి. భాష మీద అధికారం ఉండాలి. వెతుక్కుంటూ, వెతుక్కుంటూ పోవడం కాదు. ధారగా రావాలి. రెండవది ధారణ ఉండాలి. మనం ముందు ఒక పాదం చెబుతాం. ఓ సమస్య, ఓ దత్తపది, ఓ నిషిద్ధాక్షరి ఇవన్నీ ఒక ఆవర్తనం పూర్తయ్యేటప్పటికి ముందువన్నీ జ్ఞాపకంలో ఉండాలి. అవి ఒక క్రమంలో చెప్పగలగాలి. ఉదా: నిషిద్ధాక్షరి చూస్తే, ఒక అక్షరం దగ్గర నిషేధం అయ్యేటప్పుడు దానికి ప్రత్యామ్నాయ పదం మన దగ్గర ఉండాలి. అలాగే ఆ అక్షరం తర్వాత నిషేధించబడే అక్షరాన్ని ఊహించి దానికి తగిన మరో పదాన్ని మన ఆలోచనల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. లోకజ్ఞత కూడా అవసరం. ఎందుకంటే ఇపుడు అప్రస్తుత ప్రశంస ఉంటుంది. ఆ సమయంలో కోపం తెచ్చుకోకూడదు. సరదాగా ఉండాలి. ఇలా వుండగలిగితే సాధ్యం అవుతుంది.
7) దాదాపు మీకు సమవయస్కులు, చిన్నాన్న గారైన సంపత్కుమారాచార్యులు గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది?
జ. మా పినతండ్రి ఆయన. మా నాన్నగారికి కనిష్ఠ సోదరుడు. ఆయనకు నాకు కేవలం మూడేళ్ళ వయసు తేడా మాత్రమే ఉంది. అందువల్ల స్నేహితుల్లాగా మెలిగేవాళ్ళం. చాలామంది మేమిరువురం సహోదరులమని పొరపాటు పడేవాళ్ళు ( నవ్వుతూ ). ఇద్దరమూ కలిసి జంటగా కవిత్వం చెప్పేవాళ్ళం. హృద్గీత, ఆనందలహరి, అపర్ణ అనే రచనలను చేసాం. చేతనావర్త కవులుగా పేరు తెచ్చుకున్నాం. ఎన్నో సాహిత్య అనుభవాలున్నాయి ఇద్దరివీ కలిపి.
8) భారతీయ గొప్ప తత్వవేత్త, మహాయోగి శ్రీ అరవిందులవారి తత్వం మీకెలా అలవడింది?
జ. మా టీచరు సోమేశ్వరరావు గారని చెప్పాను కదా!ఆయన ద్వారానే అరవిందుల వారి గురించి తెలిసింది. అదేకాక శతావధాని వేలూరి శివరామ శాస్త్రిగారు ‘భారతి’లో అరవిందుల వారి తత్త్వం గురించి వ్యాసాలు రాసారు. అవి చదివాను. నాకది నచ్చింది. ఆయన జగత్తు మిథ్య అనలేదు. శంకరులు కూడా మిథ్య అంటే పారమార్థిక మిథ్య అన్నారు కానీ వ్యావహారికంలో కాదు. అరవిందుల వారు ఏం చెప్పారంటే “జగత్తు పరిణామంతో కూడుకున్నది.. ఈ జడమైన పదార్థం ప్రాణంగా, ప్రాణమైన పదార్థం మనసుగా, మనసైన పదార్థం విజ్ఞానంగా, విజ్ఞానమైన పదార్థం ఆనందంగా పరిణమిస్తుంది. అట్లాగే ఆనందం నుండి విజ్ఞానానికి, విజ్ఞానం నుండి మనస్సుకు, మనస్సు నుండి ప్రాణానికి, ప్రాణం నుండి జడత్వానికి దిగివస్తుంది” అని. దీనిలో transformation ఉంటుంది. ఇది ascent, descant గా నడుస్తుంటుంది. మానవుడు ఎప్పుడూ ascent కోసం ప్రయత్నించాలి. పైకి ఎక్కాలి. తన చైతన్యాన్ని దివ్య తరంగా మార్చుకోవాలి. అని చెప్పారు. ఈ విషయాలన్నీ నేను శివరామశాస్త్రి గారి నుంచి కొంచెం, మా టీచరు చెప్పడం ద్వారా కొంత నేర్చుకున్నా. విశిష్టాద్వైతంలో గాని, ద్వైతంలో గాని జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడూ నిత్యమే. ఇక్కడ జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి కూడా ఒకటే అంశం కానీ అవస్థా భేదం చేత ఒకటి ఒకటిగా, ఒకటి ఒకటిగా మారిపోతూ ఉంటుంది. పరిణమిస్తూ ఉంటుంది. ఆ పరిణామంలో మనం భాగమయ్యి ఎంత aspiration జరిగితే అంత పరిణామం సిద్ధిస్తుంది. అప్పుడు ఈ జగత్తులో దుఃఖం పోతుంది. మృత్యువు పోతుంది. మృత్యువు ఉందనుకుంటాం మనం. భగవద్గీతలో చెప్పినట్టు ఈ శరీరం పోతుంది. మరో శరీరం వస్తుంది. పరిణమిస్తుంది తప్ప మృత్యువనేది భయంకర పదార్థం కాదు. మనం ఎంత కష్ట పడితే అంత పైకి పోతాం. Rituals ని పట్టించుకోను నేను. Traditions లో ఉండే rituals తో నాకు సంబంధం లేదు. దాంట్లో ఉండే సత్యంతో సంబంధం. ఆ సత్యం ఏమిటంటే నాకు నా దేశం, జాతి, సంస్కృతులు ముఖ్యం. ఇవి భద్రంగా ఉంటే జగత్తుకు భద్రం కలుగుతుంది. ఇందులో వుండే సకల ప్రాణులు భద్రంగా ఉంటాయి. మానవుడే మహనీయుడు అంటూ చెట్లు, పుట్టలు అన్నింటినీ ధ్వంసం చేసి ప్రకృతిని సర్వ నాశనం చేస్తుంటే ఏం జరుగుతుంది? Industrial Revolution రాకముందు ఎలా ఉండేది? ఇంత అకాలం ఉందా? ఇసుకను తీయడం వల్ల నీరూ పాయె, కొండలు, బండలు పోయేటప్పటికి వర్షాలూ పాయె. ఋషులను సృష్టి తెలిసిన క్రాంత దర్శులు అన్నారు ఎందుకు? Universal truth తెలిసిన వాళ్ళు వారు. మరి మనం..? పరుగెడుతున్నాం. “రాజా కాలస్య కారణం” అని సామెత ఉంది. పరిపాలనా దోషాలు కాలాన్ని అకాలంగా మారుస్తాయి. మంచి వైపు వెళ్తున్నామా, చెడు వైపు వెళ్తున్నామా తెలియడం లేదు. మంచి జరుగుతుందనే ఆశించాలి.
9) భగవాన్ రమణమహర్షి గారు మీ ఆలోచనలను ఎలా ప్రభావితం చేయగలిగారు?
జ. వారి మార్గం అందరికీ ఆదర్శం ఆచరణీయం. అందుకే నచ్చింది నాకు. అరవిందో, రమణమహర్షి సమకాలికులు. చలం అంతగా మారడానికి కారణం చింతా దీక్షితులు. రమణ మహర్షి భక్తులు. అలా మారిన చలం తిరువణ్ణామలైలో స్థిరపడిపోయారు. నేను ఆయన్ను అక్కడే చూసాను. సౌరీస్ మొదలగు వారు అక్కడ ఒకే ఇంట్లో ఉండేవారు. చలం, నేను చాలాకాలం ఉత్తరాలు రాసుకున్నాం. మంచి కవిత్వం ప్రస్తావన వచ్చినప్పుడు సౌందర్యలహరి, శివానంద లహరి పుస్తకాలు పంపించాను ఆయనకి. ఆ సమయంలో ఆయన మారడం వల్ల లాభం ఏమిటి? భగవద్గీతను అనువాదం చేశాడు. రమణ మహర్షిపై వచన గేయాలు రాశాడు. గీతాంజలి అనువాదం చేశాడు. ఇన్ని చేసినా అంతకుముందు జీవితం పరిస్థితి ఏమిటి? అంతే.. మనిషికి కర్మఫలం తప్పదు.
10) ‘విశ్వలయ’ ప్రతిపాదన అంతరార్థాన్ని వివరించండి.
జ. సాహిత్యంలో ‘విశ్వలయ’ ఉండాలనే ప్రతిపాదన అది. సూర్యుడు ఉదయించడం, వాయువు వీయడం లాంటివన్నీ నియమాలకు లోబడి జరుగుతున్నాయి. ఇదే విశ్వంలో వుండే క్రమమైన వ్యవహారం. అంటే సృష్టి అంతా ఒక లయలో నడుస్తున్నది. భాషలో ఒక లయ ఉన్నది. మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇలా ఒక లయ ఉన్నది. ఒక క్రమము, క్రమ వికాసము వున్నది. ఒక పువ్వు పుట్టడం, పరిమళించడం, రాలిపోవడం ఇవన్నీ కూడా సృష్టిలో ప్రతీ వస్తువుకు, ప్రతీ అంశానికీ ఉంటుంది. ఈ విశ్వంలో ఉండే లయను అనుసరించిపోతే మనకు అనుకూలంగా నడుస్తుంది. దీనికి భిన్నంగా పోతే ప్రవాహానికి ఎదురీది నట్లు అవుతుంది. అట్లాగే కవిత్వంలో కూడా భాషలో లయ ఉండాలి. ఛందస్సులో లయ ఉండాలి. శబ్దంలో లయ ఉండాలి. అపశబ్దం ఉండకూడదు. సంగీతం పాడే వాళ్ళకు లయ ఉంటుంది. అలాగే భాషలో ఉండే లయ మనలో reflect కావాలి. ఋతువులన్నీ క్రమబద్ధంగా సాగుతాయి. శిశిరంలో గ్రీష్మం, గ్రీష్మంలో వర్షం రాదు. ఇప్పుడెందుకు వస్తుందంటే భూతాపం పెరిగింది కాబట్టి.
అంటే ఇక్కడ విశ్వలయ తప్పింది. మనుషులే కారణం దీనికి. సృష్టి యొక్క లయ ఏంటంటే పుట్టడం, పెరగడం, చివరకు నశించడం ఇది పద్ధతి. మనిషి యొక్క చైతన్యం దాన్ని అనుసరించి ఉండాలి. స్త్రీలను హింసిస్తున్నారు ఇప్పుడు. ఢిల్లీలో, హైదరాబాద్ లో ఎక్కడైనా ఇదే నడుస్తున్నది. ఒక 50 ఏళ్ల నాటి క్రితం ఒక బంధుత్వం, ఒక ప్రేమ అన్నీ సహజంగా ఉండేవి. తర్వాత అవన్నీ పోవడం లేదా? ఇవాళ మానవ సంబంధాలు బలహీన పడలేదా? ఇవన్నీ మన జీవితంలోని లయను తొలగిస్తున్నవి. ‘విశ్వలయ’ అనేది ఏదో అద్భుతమైన విషయం అని కాదు. The system in the Universe un disturbed and help to growth towards universal consciousness. అదే విశ్వలయ అంటే.
11) తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో మీరు రాసిన పలు గ్రంథాల్లో మీకు అత్యంత సంతృప్తిని ఇచ్చినది ఏది?
జ. అన్నీ సంతృప్తిని ఇచ్చినవే.. ప్రతీదీ సంతృప్తి ఇస్తేనే రాశాను. నేను వ్యాపారం కోసం రాయలేదు. డబ్బు కోసం రాయలేదు. నేను నా మనసులోంచి తన్నుకు వచ్చిన భావాలనే రాశాను. “కన్నుల ఓకిరింతలుగ రాల్చెడి భాష్పజలము గొంతులో సన్నవడి.. పుట్టువుల చాళ్ళు దాటుతు వచ్చి నీ సన్నిధి చేరితి..మిగులు సంగతి నీదయా!” ఎంత వేదన ఉంటే ఇలా వస్తుంది? కన్నులకు కూడా ఓకిరింత ఉంటుందా? ఎన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చామో..మనకు మంచి గురువు లభించడమంటే అది అదృష్ట విశేషమే.. ఎన్ని జన్మలు వెతుక్కుంటూ వస్తే ఆ గురువు లభిస్తాడు? అదొక అద్భుత సన్నివేశం. ఏదో అదృష్టవశాత్తూ ఈ దేశంలో ఉండే మట్టివాసన లభించింది.
12) విభిన్నమైన పద్య, వచన కవిత్వాన్ని ఎలా సంబాళించుకున్నారు?
జ. ఎందుకు భిన్నమైనవి? ప్రాచీన కావ్యాల్లో వచనం లేకుండా ఏ ఒక్కటైనా ఉందా? నిర్వచనమని రాసుకోవాల్సి వచ్చింది (నిర్వచనోత్తర రామాయణం).
పాత, కొత్త ఏమిటి? వేంకటేశ్వర గీతాలేమిటి? సింహగిరి వచనాలేమిటి? వేంకట పార్వతీశ కవులు భావ సంకీర్తనమనే కావ్యం రాశారు. దానిలో రెండవ భాగం అనుకుంటా…పూర్తి వచనంలాగా ఉంటుంది. పద్యమే అది ( గట్టిగా నవ్వుతూనే ). మీరు ఎంత తన్నుకున్నా పద్యం దొరకదు. చలం గారి వచనాలు? ప్రాచీనం ఏంటి నాకర్థం కాదు. భాష ప్రాచీనమవుతుందా? దాహం వేసినప్పుడు మంచినీళ్లు తాగడం సహజం అది ఏ భాషలో చెప్పినా.. అంతే కదా! చిలుక, కోకిల, మర్రిచెట్టు ఇవన్నీ ప్రాచీనమా? అప్పుడున్నది ఇవాళ లేనిదేమిటి? ఇవాళ లేదు అంటే మనం నాశనం చేసుకున్నదే. ప్రకృతికి మానవుడు చేసిన దుర్మార్గం తప్ప మరోటి కాదు. స్పందనలు అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. మృత్యుభయం అందరికీ సమానమే ఎప్పుడైనా.. “ఆహార నిద్రా భయ మైథునంచ సామాన్య మేతత్ పశుభిర్నరాణామ్” ఆహారం, నిద్ర, భయం, స్త్రీ పురుష సంగమం ఇవన్నీ మానవునికి పశువులకు సమానమే. అరిషడ్వర్గాలు ఇవాల్టివా, ముందు లేవా? “ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే” దీంట్లో ప్రాచీనత, నవీనతలు ఏమున్నాయి? నేను వ్యతిరేకిస్తున్నానని అనుకోవద్దు. ఎక్కడ Universal అయితే అక్కడ కవి ఉంటాడు. Universal కాని చోట కవి ఉండడు. ఇదే సిద్ధాంతం.
13) అపారమైన మీ సాహితీ జగన్నిర్మాణంలో మూలాధారంగా నిలిచిన అంశం ఏది?
జ. సృష్టి రహస్యం తెలుసుకోవడం. మనిషి రహస్యం తెలుసుకోవడం. ఈ జీవితం continue కావాలి. Consiousness continue కావాలి. అది ఒక పరిమితిలో ఉంటుంది. దాన్ని దాటి రావాలి. కుండలో ఉన్న ఆకాశం వేరు. బయట ఉన్న ఆకాశం వేరు. కానీ కుండ అనేది దానికి పరిమితి విధించింది. కుండ పగిలిపోతే ఆకాశం లేకుండా పోతుందా? అలాగే “యూనివర్సల్ కాన్షియస్ నెస్” కూడా మన లోపలే ఉంది. అది బయట ఎక్కడో లేదు. అది అల్టిమేట్ గా మనకు కావాలి. అదే ముక్తి. అంటే ఘటాకాశ స్థితి నుండి మహాకాశ స్థితికి చేరుకోవడమే ఒకరకంగా మోక్షం.
14) అనేక ఉద్యమాలు, త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం లభించడం ఎలా అనిపించింది?
జ. తెలంగాణ ఉద్యమం రాజకీయ ఉద్యమం. ఈ ప్రాంతానికి న్యాయం జరగడం లేదన్న భావనతో ఉద్యమం ఊపిరి పోసుకొంది. దానికి ముందే సాంస్కృతికోద్యమం జరిగిందని ముందే మీకు చెప్పాను. ఆ ఉద్యమంలో పదవులు, ఆకాంక్షలు, స్వార్థాలు లేవు. ఒక ఇంట్లో బలవంతుడు ఉంటే బలహీనుని ఇబ్బంది పెడతాడు. అన్యాయం జరగ లేదని నేననను. కానీ సాంస్కృతికోద్యమం బలహీన పడడం సరియైనది కాదు. అది ఎప్పుడూ బలంగా ఉండాలి. నిజాం కాలంలో అణచివేతకు గురయ్యాము. మన కర్మ..తప్పలేదు. మా మేనమామ ఆ రోజుల్లో హైదరాబాద్ లో చదువుతున్నాడు. ఒకసారి ఇంటికి వచ్చేటప్పుడు షేర్వాణి, కుచ్చు టోపీ ధరించి వచ్చాడు. ఆ వేషం చూసి ఆశ్చర్య పోయాను. కానీ తప్పదు. అణచివేత ఉన్నప్పుడు బాధ తప్పదు. అవి రాజకీయ పరమైనవి. రాజకీయానికి, సంస్కృతికి తేడా చూడాలి. ఒక సందర్భంలో ఒక మంత్రి గారిని కలవాల్సి వచ్చింది నేను. అందులో మాన్య మహాశయులు మంత్రి గారికి అని, కింద ఇతరులకు ఆచార్య, డాక్టర్ అని గౌరవ వాచకలున్నాయి. నా పేరు దగ్గర ఏమీ లేవు. అయితే మీరంతా డాక్టర్లు, ఆచార్యులు కానీ నేను కానా! అని ఆహ్వాన పత్రిక కింద పడేశాను. మనసు గాయపడింది. రాజకీయ బలం ఏంటంటే మనిషిని విచిత్ర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ఇవన్నీ తలచుకుంటే కష్టాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా మాట్లాడుతున్నప్పుడే శరీరం పక్కకు వాలిపోతే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అవార్డులు వద్దు, రివార్డులు వద్దు. ఇస్తే వద్దని అనను. ఇవ్వమని అడగను. అంతే…
15) చివరగా రాబోయే తరాలవారికి మీ ఆశీర్వాద బలంగా ఏదైనా సందేశం ఇవ్వండి.
జ. (నవ్వుతూ) నా పుస్తకాలన్నీ సందేశాలే. నేను రాసిన కారణం “A search for Universal Truth” కోసమే. వెతుకులాట కోసమే. లయలో లీనమైపోవాలి. మొత్తానికి మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆనందాన్ని పొందాలి. చుట్టూ మంచి వాతావరణాన్ని ఏర్పరుచుకోవాలి. మంచి వాయువు పీల్చాలి. అట్లా ఉంటే చాలు జీవితం ధన్యమైనట్లు…
………ఇంతటి వయస్సులో కూడా అడిగిన వెంటనే కాదనకుండా మాకోసం సమయాన్ని వెచ్చించినందుకు వేనవేల నమస్కారాలు. ఎన్నెన్నో విషయాలను తెలుసుకున్నాం. ఈరోజు మా జన్మలు ధన్యత పొందాయి..మా తరఫున, మా పాఠకుల తరఫున మీకు కృతజ్ఞతాభివందనాలు.
