మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

స్త్రీల సౌభాగ్యపు…..సిరి
నుదుట కుంకుమ బొట్టు

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) March 7, 2023
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

“ఓం ఐం.. హ్రీం…క్లీం…! అంటూ ఒకొక్క నామాన్ని ‘కుంకుమ’తో అమ్మవారి పాద – చరణాలవిందములకు ఎంతో భక్తితో ప్రతి నామం చివరలో ‘నమః’ అని పలుకుతూ కుంకుమను స్వీకరించమని అమ్మవారికి సమర్పిస్తాము.
అమ్మవారి పూజలో ఎక్కువగా ‘కుంకుమ’ పూజ ఉంటుంది. ఇది ఎన్నో ఏళ్ళ తరబడి ఆచరణలో ఉంది. ఎప్పుడు, ఎలా, ఎవరినుంచి ఈ ఆచారం వచ్చిందో ఇంతవరకూ తెలియదు.

అచ్చమైన స్వచ్ఛమైన కుంకుమ పొడిని పసుపునుంచి తయారు చేస్తారు. ప్యూర్ పసుపు తీసుకొని దానిలో
నిమ్మరసం,కొంత కర్పూరం వేసి కలిపితే కుంకుమ తయారయి, పూజకు సిద్ధమయ్యింది. ఒకసారి కుంకుమ తయారైన తర్వాత పసుపు తన మునుపటి సువాసన కోల్పోతుంది. ఈ కుంకుమలో ఓ కొత్త సుగంధం వాసన తయారై దాని సువాసన విస్తరిస్తాయి. ప్యూర్ కుంకుమ చేతికి అంటుకోదు. బాగా తడి ఆరి పొడి పొడిగా ఉంటుంది. దైవజ్ఞ శక్తి ఈ కుంకుమలో కలిసి విస్తరిస్తుంది.
పూజలో అర్చనలోనూ, నుదట పై కుంకుమ కూడా ఆకర్షింపజేస్తుంది. కుంకుమనుంచి చైతన్యం చెలరేగి అన్ని చోట్ల విస్తరిస్తుంది. అదే కుంకుమ మహత్యం.

అమ్మవారికి ఇష్టమైన కుంకుమార్చన అమ్మని ఆకర్శించి భక్తులను రక్షిస్తుంది. అర్చనలలో అష్టార్చన 108 నామాలు పఠిస్తూ కుంకుమతో అర్చన చేయడం జరగుతుంది. సహస్రార్చనలో 1008 వివిధ నామాలతో కుంకుమతో అర్చన చేస్తూ అమ్మను కొలుస్తారు. ఈ ఒకొక్క నామం ఉచ్చరించేప్పుడు అది హృదయారవిందంనుంచి వికసించి భక్తి పూర్వకంగా నామంతో సహ కుంకుమను అమ్మ పాదాలకు సమర్పించడం జరుగుతుంది. ఇది ప్రతి వ్యక్తిలోను ఒక ఆధ్యాత్మికమైన భావన కలిగించి శక్తిని చేకూరుస్తుంది.

‘ఓం’- ఓం అనే అలలు ప్రపంచమంతా విస్తరించి, సృష్టి, స్థితి, లయ లో చేరి ఒకటై కలిసిపోతుంది. ఒక సారి ఉచ్ఛరించినప్పుడు వ్యక్తిలో ఈ మూడు అంశాలలో, ఏదైనా ఒకటి ప్రయోగంలో ఉంటుంది. ‘ఐం’- మహా సరస్వతిని ధ్యానించే
మొదటి ఉచ్చరణ.
‘హ్రీం’- మహా లక్ష్మిని ధ్యానించే
మొదటి ఉచ్చరణ. ”క్లీ’- మహా కాళిని ధ్యానించే
మొదటి ఉచ్చరణ.
ఇలా నామాలతో కుంకుమా చేయడం వల్ల వ్యక్తికి శాంతి, రక్షణ, విజయం, మంచి ఆరోగ్యం కలిగి, సంపన్నులు కావడం జరుగుతుంది. అమ్మవారికి చాలా ప్రియమైనది. కుంకుమ-అర్చన. అందుకే అర్చనతో అమ్మవారిని ఆకర్శించ గల అద్భుత శక్తి ఒక ‘కుంకుమ’కే గలదు..

బ్రుకుటి మధ్యన కుంకుమ, తిలకధారణతో బొట్టు పెట్టుకోవడమన్నది స్త్రీలకు అలంకరణే కాదు, అది సౌభాగ్యచిహ్నం కుంకుమ పెట్టుకోకుండా పూజ చేయకూడదని చెబుతారు పెద్దలు. సుదుటన తిలకం బొట్టు బిళ్ళ ధరించినప్పటికీ పాపిల్లో కుంకుమను ధరించాలి వివాహితులు పురుషులు కూడా పూజకు ముందు కుంకుమ, చందనం, విభూమి, సింధూరంతో బొట్టు పెట్టుకుంటారు. నుదుటన ధరించే బొట్టు శుభప్రదంగా భావించబడుతోంది. పురాణ గ్రంథాలలో నిదుట తిలక ధారణ పవిత్రత గురించి తెలుపబడింది. లక్ష్మీదేవి ఐదు ప్రాంతాలలో ఉంటుందట. ముత్తయిదువ పాపిట భాగంలో పెట్టుకునే కుంకుమ వద్ద, గోమాత వెనుక భాగంలో, ఏనుగు యొక్క శిరస్సు భాగంలో, తామర పూలలో, బిల్వ దళాలలో లక్ష్మి ఉంటుంది.

మతపరంగా వారు నుదుటన పెట్టుకునే తిలక ధారణలో వ్యత్యాసాలు ఉంటాయి. శైవులు నుదుటన విభూదితో మూడు రేఖలను అడ్డంగా గీసుకుంటారు. ఆ రేఖల మధ్యన కుంకుమను పెట్టుకుంటారు. వైష్ణవులు నిలువుగా మూడు నామాలను పెట్టుకుంటారు. శాక్తేయులు ఎర్రటి కుంకుమతో పెద్ద బొట్టును చేయుటన ధరిస్తారు. తమిళులు నుదుట మీద పెట్టుకున్న బొడ్డుపైన విభూదితో చిన్న అవరేఖను పెట్టుకుంటారు. మన సాంప్రదాయంలో కుంకునుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. స్త్రీలు నుదుటన తిలకాన్ని కానీ, బొట్టుబిళ్ళను గానీ పెట్టుకున్నప్పటికీ పాపిల్లో కుంకుమను పెట్టుకోవడం శుభసూచకంగానూ, సౌభాగ్య చిహ్నంగానూ భావిస్తారు.నుదుటన బొట్టు లేకపోతే అశుభ చిహ్నంగా తలుస్తారు. అమ్మవారికి కుంకుమ పూజ చేయడం, సహస్ర కుంకు మార్చన చేయడం శుభప్రదం, వారికి అష్టఐశ్వర్యాలు, సుఖసౌఖ్యాలు, ఆనందం లభిస్తాయి.

నుదుటన కుంకుమను ధరించినప్పుడు మూలా ధారంలో ప్రారంభమైన సుషుమ్న నాడి శిరస్సులోని సహస్రాన చక్రాన్ని కలుస్తుంది. దాని పక్కనే ఉన్న ఇడ, పింగళ అనే నాడులతో, కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞా చక్రానికి చేరుకుని, ఆ తర్వాత నుదుటని కలసిపోతుంది. నుదుట మీద ఉన్న ఆ స్థానాన్ని త్రికూటమని అంటారు. ఆ స్థానం నుంచి యోగశక్తి మొదలవుతుంది. అక్కడే జ్ఞాననేత్రం ఉంటుందనీ, దానికి శక్తి కలిగించటానికి, నుదుటన కుంకుమను ధరించాలనీ ఆధ్యాత్మికులు చెబుతున్నారు.

బొట్టు పెట్టుకునే ఆచారం, శిశువు పుట్టి పురిటిస్నానం అయిన వెంటనే చేసే వారసాలు, నామకరణపు వేడుకలతోనే ఆరంభమవుతుంది. నల్లటి బొట్టును శిశువు నుదుటన పెడతారు. ఆ నల్ల బొట్టును ఇంట్లోన పెద్దవారే తయారు చేస్తారు. పాపాయికి దిష్టి తగలకుండా ఉండాలని ఆ విధంగా నల్లబొట్టును పెడతారు పెద్దలు. స్త్రీలే కాదు, పురుషులు కూడా కుంకుమ బొట్టును పెట్టుకునే, వారు పూర్వపు రోజుల్లో స్త్రీలు నుదుటి మధ్యన కుంకు మను పెట్టుకునేవారు. చరిత్రను పరిశీలిస్తే రాజులు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు రాజులు తమ భర్తలకు వీర తిలకాన్ని దిద్ది పంపించే వారని తెలుస్తోంది. ఈ విధంగా బొట్టుకు మన హైందవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి.

నుదుటన కుంకుమ ధారణ వల్ల అజ్ఞాచక్రం స్పందించి, అక్కడున్న నరాలు ఉత్తేజితమవుతాయి. నొసలు మధ్యన పెట్టుకునే చందనం బొట్టు శరీరానికి చల్లదనాన్ని సమకూరుస్తుంది. అంతేకాదు, సిరిసంపదలను కలిగిస్తుంది. ఆంజనేయుని సింధూరాన్ని నొసల మధ్య పెట్టుకుంటే గాలి, ధూళి, భూతప్రేత పిశాచాలు దరి చేరవు. వారు ధైర్యవంతులవుతారు. శత్రుపీడనాన్ని తొలగించుకోగలుగుతారు. ఆయురారోగ్యాలు పెంపొందు తాయి. రామాయణంలో తిలకధారణ ప్రస్తావన ఉంది సీతారామలక్ష్మణుల వనవాస సమయంలో సీతాదేవి, శ్రీరామునితో కలసి విహరిస్తున్నప్పుడు స్వేదం వల్ల కుంకుమ చెదిరిపోయి చెమట నీటితో బొట్టు కరిగి పోయింది. అప్పుడు శ్రీరాముడు మణి శిలతో తిలకాన్ని తయారు చేసి సీతాదేవి నుదుటన తీర్చి దిద్దాడు. అశోకవనంలో ఉన్న సీత హనుమంతునితో ఆ విషయాన్ని చెప్పి హనును తనను కలసిన విషయాన్ని ఆ విషయం ద్వారా తెలుసుకుంటాడని, అప్పుడు శ్రీరాముడు విషయాన్ని గుర్తు చేసుకుంటాడని తెలియచేసింది. వివాహిత అయిన స్త్రీ నుదుటన బొట్టు లేకుండా ఉండ కూడదు. దాన్ని అశుభంగా భావిస్తారు.

ముత్తయిదువుకు కుంకుమ సౌభాగ్య చిహ్నం. పాపిట్లో పెట్టుకునే కుంకుమ భర్తకు రక్షణగా పని చేస్తుందని చెబుతారు. పేరంటానికి పిలవటానికి స్త్రీలకు నుదుటన కుంకమను పెట్టి ఆహ్వానిస్తారు. పేరంటానికి వచ్చిన స్త్రీలకు కుంకుమ పెట్టి గంధం, పసుపు రాసి సత్కరిస్తారు. ఇవన్నీ స్త్రీలకు సౌభాగ్య చిహ్నాలు ఇంటికి ఎవరైనా స్త్రీలు ముఖ్యంగా వివాహితులు వస్తే వారు వీడ్కోలు తీసుకుంటున్న సమయంలో మరువక కుంకుమతో బొట్టు పెట్టి పంపిస్తారు.స్త్రీలు చేసే నోములలో పసుపు కుంకుమ, కేదారేశ్వరీ గౌరీవ్రతం, ఉదయ కుంకుమ అనే నోములు ఉన్నాయి. ఎవరింటికైనా వెళ్ళి పేరంటానికి బొట్టు పెట్టి పిలవాలను కుంటే ఆ సమయంలో ఇంట్లో స్త్రీలు లేకపోతే గడపకు కుంకుమను.
కడపకు పెట్టే ఆచారం మనలో ఉంది. అంటే గడప లక్ష్మీదేవి అన్న భావన. కుంకుమ లక్ష్మీ ప్రధానమైనది. కుంకుమ ధారణ సౌభాగ్యవంతం. హిందూ సాంప్రదాయంలో కుంకుమ ధారణకు ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత,విలువ ఉన్నాయి

       తిలకం తయారీకి తేనె, హోమయజ్ఞ భస్మాలు, ఆవు పేడ , ఆవుపాద ధూళి, పెరుగు, నెయ్యి, గోరో జనం, కస్తూరి, గోపీచందనం, బిల్వా, రావి, తులసి, భస్మం, ఎర్రచందనం, తెల్ల చందనం, అగరు, అంజీర, పసుపు, కుంకుమ, నల్లపసుపు, ఆష్టగంధం, తదితర పదార్ధా లను ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి రక్షగా కవచం వంటివి.

అమ్మవారికి ప్రియమైన కుంకుమ ఆర్చనలోని మహాత్మ్యం, అమ్మవారిని ఆకర్షించగల అద్భుతమైన శక్తి ఒక్క కుంకుమకే ఉంది. పసుపును తీసికొని నిమ్మరసం కొంత, కొంత కర్పూరం కలిపితే స్వచ్ఛమైన కుంకుమ.తయారవుతుంది. ఇది అమ్మవారికి చాలా ప్రియమైనది. మహర్షులు మనకందించిన, సంస్కావంతమైన, స్త్రీలకు ముత్తైదువతనానకి చిహన్నమైన ఈ సనాతన కుంకుమబొట్టు సంప్రదాయాన్ని నేటి యువతులు గ్రహించి.. స్త్రీల ముఖారవిందానికి, ఆభరణం అయిన కుంకుమబొట్టులోని విలువలను భావితరానకి తెలిపే ప్రయత్నం చేయాలి.

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

A Leader in Us All

by Ananya March 7, 2023
written by Ananya

Standing out is a leader’s feature.
But don’t most of us want to stand out?
Be it sarcasm, honesty, or rebellious in nature,
There is a leader in all of us, no doubt.

Some have experience, others have seen afar,
Some just know the theory, others do their part.
But in the end, there is a leader in all of us, no doubt.

Belief is something invisible, a power
That has the strength to pull us up.
But don’t depend all on it, don’t hover,
Believe in yourself and dont give up.

That satisfaction, that smile you get,
When you make people better, not alone.
Your help they will never forget,
When you get together, it will be shown.

Because there is a leader in all of us,
And you better have no doubt.

March 7, 2023 3 comments
9 FacebookTwitterPinterestEmail
Uncategorized

మనం దేశం- మన మహిళా లోకం

by Kondapally Neeharini March 7, 2023
written by Kondapally Neeharini

సంపాదకీయం

వసంత రుతువు వచ్చింది. చైత్రమాసం పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకునే సంప్రదాయం గల తెలుగు వాళ్ళం మనం. చైత్రమాసం మొదటి నెల. పాడ్యమి మొదటి రోజు, మొదటి నక్షత్రం. నక్షత్ర గమనాలతో, ప్రకృతి కి అనుగుణంగా ఏర్పరచుకున్న పేర్లు ఇవన్నీ. ఉగస్య ఆది: ఉగాది. ఉగ అంటే నక్షత్రం నడక, గమనం కదా అర్థం. శుభకృత్ నామ సంవత్సరం వెళ్లి, కొత్త సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నామంటే శోభను,ఆనందాన్ని కలిగించే సంవత్సరం అని భావిస్తున్నాం. చలికాలం పోయి, శరత్, శిశిర రుతువు లు పోయి వసంతగానం తో ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా మారుతుంది. ఇది మనం భారతదేశం భౌగోళిక పరిస్థితి వలన కలిగిన వాతావరణం. ఇదంతా ఒకసారి గుర్తు చేసుకుంటూ గత వర్తమానాల మధ్య మనం ఏం సాధించాము అనేది ఒక సింహవలోకన చేసుకోవడం అవసరం.

రాజకీయాలు అవసరం లేదనుకున్నా, తెలియదు అనుకున్నా, వాటి వైపు కన్నెత్తి చూడని వాళ్ళకి కూడా రాజకీయాల ప్రభావం అనేది జీవితాలపై ఏదో రూపాన పడుతూనే ఉంటుంది. మహిళల మీద మరీ ఎక్కువగా ప్రభావం పడుతుంది. అదేంటి అని అనకుండా, అది ఏంటో గమనిద్దాం అనుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా మార్చి 8న ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి . ఈ సందర్భంలో భారతీయ మహిళ ఈ మార్చి 8 రోజున ఏమైనా ప్రత్యేకంగా తెలుసుకోగలిగిందా? ఏమైనా ప్రత్యేకంగా లబ్ధి పొందగలిగిందా? అనేది అవలోకించాల్సిన విషయం. తిండి, బట్ట, నీడ అనే మౌలిక అవసరాలు కాకుండా మహిళల అభివృద్ధి పరంగా చూసినప్పుడు, ఎన్నో వేల గ్రామాలు కలిగినటువంటి మన దేశంలో గ్రామ గ్రామాన బ్రతుకుతున్న స్త్రీలు అభివృద్ధి పథంలో ఉన్నారా ? పట్టణాలలో స్త్రీలు ఆధునిక సౌకర్యాలనుభవిస్తున్నారేమో కానీ

అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతున్నారా? పెట్రేగిపోయిన పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ మహిళల పట్ల నిలుచుని ఏమైనా గొంతు ఎత్తగలిగిందా? లేదు లేదు లేదు అనే సమాధానాలే వస్తాయి.

ఆడపిల్లనైనా మగపిల్లలైన సమానమని విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులకి కూతురు విషయం వస్తే నిరాశ మిగులుతున్నది. చదవాలి ఉద్యోగం తెచ్చుకోవాలి, అంతే ! ఈ ధ్యేయంగా అడుగులు వేస్తున్న అమ్మాయిల పరిస్థితి ఏమంత బాగోలేదు. కళాశాలలోనైనా, కార్యశాలలోనైనా అంతులేని వివక్షను ఎదుర్కొంటున్నారు. ముఖం ముందు మంచిగా మాట్లాడుతారు పక్కకు జరగగానే అభాండాలు వేస్తారు, అఘాయిత్యాలూ చేస్తారు.

వెకిలి మాటలు మకిలి మనసులు అర్థం చేసుకోగలిగే వాళ్ళ అర్థం చేసుకుని ఆ మగవాళ్లను దూరం పెడతారు. అర్థం చేసుకోలేని అమ్మాయిల పరిస్థితి ఇక అంతే.ఇవి పనివేళల్లో ప్రత్యక్షంగా జరిగేవి. ఇక పరోక్షంగా తక్కువ నా?వేతనాలు, ఇంక్రిమెంట్లవి ఒక తీరైతే, ఆడవాళ్ళ సమస్యలు ఓ తీరు. శారీరక అనారోగ్య సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వాలూ ముందుకురావు, ప్రైవేటు ఉద్యోగ సంస్థలు ముందుకురావు. దీనికి ప్రముఖ ఉదాహరణ ‘ నెలసరి సమయంలో సెలవులు ‘ అనే అంశం. బంగాళా ఖాతం లో వాయుగుండాలు వచ్చిపోతున్నట్టే, మహిళా దినోత్సవ సందర్భం వరకు అట్లా కొన్నేవో ఆటుపోట్లు వచ్చిపోతుంటాయి. తట్టుకునే హృదయాలు ఉండాలి. గుండె తడి అయ్యే వాళ్ళుంటే, దుఃఖ విముక్తి గొడుగు లు పట్టే ప్రయత్నాలు చేస్తారు. పశ్చిమ దేశమొకటీమధ్య కొత్త గా మెరుస్తున్నది. వాళ్లకు నూతన సంవత్సరమిప్పుడు రాదు. మార్చ్ 8 వాళ్ళకు కొత్తగాదు!

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కళారాధకుడు సంజీవదేవ్

by Cheedella Seetha Lakshmi March 7, 2023
written by Cheedella Seetha Lakshmi
  సంజీవదేవ్ లలితకళారాధకుడు.ముఖ్యంగా చిత్రలేఖనం,ఫోటోగ్రఫీలకు కొత్తరూపులు అద్ది కృతకృత్యుడైనాడు.
తెలుగులోనే కాక సంస్కృతాంగ్ల,ప్రెంచి, వంగ,హిందీ,ఉర్దూ భాషల్లో నిష్ణాతుడు.
 విద్యాలయాల్లో చదవకుండా పోయినప్పటికి ప్రపంచానుభూతి,విదేశపర్యటానుభవము, ప్రకృతి సౌందర్యానుశీలనం ఈయనలో కవితాదృక్పథం వైపు మళ్లించింది.

రసలేఖలు,తేజోరేఖలు,సమీక్షా రేఖలు,తెల్లమబ్బులు,దీప్తిధార,తెగిన జ్ఞాపకాలు,గతంలోకి, స్మృతి బింబాలు,గ్రే అండ్ గ్రీన్ మొదలైనవి ఈయన రచనలు.

మిత్రులకు,బంధువులకు,మహా మహులకు ఉత్తరాలు రాశారు.ప్రతీ ఉత్తరం ఒక కళాఖండం.విషయ విపులీకరణ,వారి వారి స్థాయికి దగినట్లు సమాధానం రాయడం కన్పిస్తుంది.ఒక విషయాన్ని చెప్పదలచుకొన్నప్పుడు వాక్యాలను,పదాలను అటు ఇటు త్రిప్పి,ఉత్తేజం కలిగించే విధంగా,చదువరులను ఊర్రూతలూగించే విధంగా రాయడం ఈయన ఉత్తరాల్లోని ప్రత్యేకత.

ఈయన ఉత్తరాల్లో నిత్యజీవితంలోని విషయాలు,తాత్త్విక విషయాలు,సరససల్లాపాలు,నీతులు ఎన్నో చోటు చేసుకున్నాయి.ఇంకా అనేక విషయాలు ఉత్తరాల్లో నిక్షిప్తమై ఉన్నాయి.
“మనం రాజనైతిక జీవులం కాదు.”శుద్ధ సాంస్కృతికజీవులం” అని ఈ విశాల విశ్వంలో సుఖాల కంటే కష్టాలే ఎక్కువ.కానీ మనిషి తన మనోసాధన ద్వారా ఖేదాన్ని మోదాలుగా మార్చుకోగలడు.విషాదాన్ని ఆనందంలో రూపాంతపర్చడమే మానవ ధర్మం”.అంటూ కృష్ణాబాయికి రాసిన లేఖలో తెలిపాడు.కష్టాలు రావడం సహజం.కష్టాల్లో కృంగిపోకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మనోనిబ్బరం అవసరం అంటాడు.అందంలోనూ,ఆనందంలోనూ నిరంతరం జీవించడానికి ప్రయత్నించాలి.ఈ ప్రయత్నంలో విఫలం చెందినా ఆ విఫలత కూడా గొప్ప ఘనకార్యమే అని అంటాడు.

చిత్త చాంచల్యంలో బడక ధీరచిత్తంతో జీవనసమరంలో పోరాడే వ్యక్తులు ధన్యులు. అని విషాదాన్ని భరించడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఎప్పుడూ ఆనందమే అని చెప్తూ నిరీక్షణ భవిష్యత్తుకు చెందింది.వాస్తవం వర్తమానానికి చెందింది.జ్ఞాపకం భూతకాలానికి చెందింది.” అని త్రికాలాల గూర్చి ఎంతో చక్కగా వివరించాడు.

మంచితనం లేని తెలివితేటలు సంఘాన్నీ, వ్యక్తినీ కూడా చీకటి గుణాల్లోకి గుంజుతుంది.ఎంత తెలివి వున్నా మంచితనమనేది ముఖ్యం అనే భావన కలవాడు.

“ఏది నీతి, ఏది అవినీతి అనే విషయాల్లో జీవిత రహస్యాన్ని అర్థం చేసుకున్న వాళ్లకు నీతి మీద ప్రీతి ఉండదు.అవినీతి మీద రోతా ఉండదు.” అని ఉద్బోధిస్తాడు.

బుచ్చిబాబు గారికి రాసిన లేఖలో ” నిత్యజీవితం నుండి బాధను తొలగించలేం కానీ బాధ వుంటూనే బాధ పడకుండా ఒక ఆనందమయ స్థితిని సృష్టించుకోగలం” అంటూ జీవిత సత్యాన్ని వెల్లడించాడు.
బాధ జీవితంలోని బోధకు మార్గం.అని. హితవు చెప్తాడు.లింగం వీరభద్రయ్య చౌదరి కి రాసిన లేఖలో,’ఆషా’ రాసిన ఉత్తరంలో కూడా ఇదే భావాన్ని తెలియజేశాడు.
వస్తువుల్ని సృష్టించడం సులభమే కానీ సుందరమైన ఆలోచల్ని సృష్టించడం చాలా కష్టం.నిత్యావసరాలు ఎన్ని వున్నా, ఎన్ని అనుభవించినా జీవితాన్ని సమన్వయం చేసుకోటంలో ఉంది ఆనందం ” అంటాడు తన చెల్లి భారతీదేవికి రాసిన ఉత్తరంలో.

లక్ష్మికి రాసిన లేఖలో “వైఫల్యాలను చూసి మనం నిరాశ చెందాల్సిన పనిలేదు” అంటూ ప్రోత్సాహ వాక్యాలు చెప్తాడు.

నార్ల చిరంజీవికి రాసిన ఉత్తరంలో అసలు జీవితమంటే ఏమిటి? అనేదాన్ని విశదీకరిస్తూ
” జీవనకళ లేకపోతే సమస్తకళలూ పెద్ద నటన మాత్రమేనని,బాగా జీవించడం అంటే భోగంతో కానీ,యోగంతో కానీ జీవించటం కాదు.త్యాగంతో నిండిన రాగంతో జీవించటం.రాగం అంటే రంగు.రాగం అంటే నాదం.రాగం అంటే అనురాగం.రాగం లేని జీవితం రోగంతో నిండిన బ్రతుకే.” అని జీవితసారాన్ని చక్కగా నిర్వచించాడు.

జీవితంలో రసానుభూతి అవసరం అనే అభిప్రాయం గలవాడు. జీవితాన్ని ఎప్పుడు సంతోషంగా గడపాలి, దుఃఖాలకు కృంగిపోవద్దు అనే హితోక్తులు పలుసార్లు వ్రాశాడు
చాలా లేఖలో సంజీవదేవ్ తన అభిరుచులు వ్యక్తిగత విషయాలు లేఖల్లో వివరించాడు తనకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది.ఈ విషయాన్నే కృష్ణాబాయికి వ్రాసిన లేఖలో
” నిమ్మంటే నా కిష్టం.దానిమ్మంటే నా కిష్టం.
బొమ్మంటే నాకిష్టం,లేని అమ్మంటే నాకిష్టం.

తన హృదయాన్ని విప్పిచెప్పాడు. నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమని తెలిపాడు వ్యక్తుల జీవితాల్లోని ఎండనీడల్ని తెలుసుకోటంలో నాకెంతో అభిలాష,ఆనందం.నావి ఇతర్లకు తెలపటంలో కూడా”” అంటూనే భావ వినియం జరగాలి అని చెప్తాడు.

తన వ్యక్తిగతాభిప్రాయాన్ని
తెలుపుతూ వసుమతికి వ్రాసిన ఉత్తరంలో “నేను పాండిత్యానికి విలువనివ్వను,కళా ప్రతిభలకు విలువనివ్వను,తెలివితేటలకు
విలువ ఇవ్వను,మరి దేనికి విలువ ఇస్తానో తెలుసా వసూ?
హృదయస్పందన అంటే ప్రేమ,జాలి,దయ,కరుణ,సానుభూతి, వీటికి నేను ఇచ్చేది- అవి ఎవరితో ఉన్నా సరే,స్త్రీలలో ఉండేది. వారిలో విద్య ఉన్నాసరే లేకపోయినా సరే వారు నాకు ప్రియులు హృదయస్పందనే ప్రాణస్పందన,ప్రాణస్పందనే ఆత్మానందం. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ సాదాగా జీవించడం ఉన్నతంగా ఆలోచించడమే
తన అభ్యాసమని చెప్పుకున్నాడు.

తపస్వికి రాసిన ఉత్తరంలో
మరణ పర్యంతరం శాంతితో, ఆనందంతో నేను జీవిస్తూ ఇతరులను జీవింపచేయటం
జీవిత లక్ష్యమని రాశారు.జీవితాసాంతం
ఆనందాన్ని కోరువాడు సంజీవ్ దేవ్.సాహిత్యరచనలో కంటే చిత్రరచనలో ఎక్కువ ఆనందమని తెలియచేశాడు.

ఎవరిదగ్గరినుండైనా సరే ఉత్తరం రాగానే వెంటనే బదులివ్వడం సంజీవదేవ్ కు బాగా అలవాటు. ఆయన మాటల్లోనే “ఉత్తరం అందగానే జవాబు రాసే దురభ్యాసం ఒకటి చిన్నప్పటి నుంచీ నన్ను
పట్టి పీడిస్తున్నది” అని దాన్ని ఒక వ్యసనంగా చెప్పుకున్నాడు.

ఉత్తరం అంటే సరియైన నిర్వచనం చెబుతూ ఉత్తరాల్లో ఏ విషయాలు ఉంటే బాగుంటాయో అచ్యుతవల్లికి రాసిన లేఖలో వివరిస్తాడు.”ఉత్తరాలు కేవలం
పాఠ్య గ్రంథాలుగా పాఠాలు లాగా భోగట్టా ప్రధానంగా మాత్రమే ఉంటే చాలా ఎండుగా, నీరసంగా ఉంటవి.వ్యక్తిగత విశేషాలుంటూనే అపరోక్షంగా కాకా పరోక్షంగా ఇన్ఫర్మేషన్ అందజేయబడుతూ ఉండాలి కదూ. వినోదం కూడా విజ్ఞానం”. ఉత్తరాలు సమాచారాన్ని అందించివే కాక వినోదాన్ని కల్పిస్తూ విజ్ఞానాన్ని
కూడ బోధ పరచేవిగా ఉండాలంటాడు.

ఉత్తర ప్రత్యుత్తరాలలో మళ్ళీ నవప్రాణ స్పందన జన్మించాలంటే మధ్య మధ్య విరామం అవసరం” అని కృష్ణాబాయికి రాసిన లేఖలో తెల్పుతాడు.

లేఖలు రాయడంలో గల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ లక్ష్మికి రాసిన ఉత్తరంలో ” సాహిత్యాన్ని గురించీ, కళలను గురించీ,మానవ జీవనతత్వాన్ని గురించి మనము భావవినిమయం చేసుకోటం ఎంతో శాంతి” అని వివరిస్తాడు.ఒకరినొకరు విషయాలను ఇచ్చి పుచ్చుకోవడం వలన పలువిషయాలు తెలుస్తాయి.ఉత్తరాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అనే అభిప్రాయం కలవాడు.

తను రాసే ఉత్తరాల్లో “మెట్ట వేదాంతోపన్యాసాలు అవుతున్నవేం!”రుక్కుకు రాసే ఉత్తరాలు అదొక ధోరణిలో ఉంటూంటవి. వాటిలో లవ్, సెక్స్,మొదలైన సైకలాజికల్ ప్రసంగాలు రాస్తుంటాను.వేదాంతాని కంటే లవ్ మరియు సెక్స్ ఏమీ తక్కువస్థాయికి చెందవు”అని అచ్యుతవల్లికి రాసిన ఉత్తరంలో చెప్తాడు.ఆయన లేఖల్లో ఎన్నో సాహిత్యాంశాలు ఇమిడి ఉన్నాయి.

రచనా పద్ధతిని వివరిస్తూ ఆషా కు రాసిన లేఖలో ” సుందరమైన భావావళి లేని సుందరమైన భావావళి పాఠకుని హృదయంపై అంతగా ముద్రవేయజాలదు. కానీ ఇందుకు వ్యతిరేకంగా సుందరమైన పదావళి లేని సుందరమైన భావావళి పాఠకునిపై మంచి ప్రభావాన్ని వేస్తుంది” అంటూ భావ ప్రాధాన్యాన్ని తెలిపాడు.

ఆషా కు రాసిన ఇంకో ఉత్తరం లో గద్య, పద్య,సంగీత భేదాల్ని తెలియజేస్తూ మూడింటి ప్రాధాన్యాన్ని తెలియజేశాడు.” గద్యం అనేది ఆలోచన.పద్యం అనేది వేదన.సంగీతం అనేది సంవేదన.గద్యం అభివ్యక్తపర్చజాలని దాన్ని పద్యం అభివ్యక్తపరుస్తుంది.పద్యం అభివ్యక్తపర్చలేని దాన్ని సంగీతం అభివ్యక్తపరుస్తుంది.గద్యం భోగట్టానిస్తుంది.పద్యం ప్రేరణనిస్తుంది. సంగీతం తన్మయతనిస్తుంది.అర్థాలు గల శబ్దాలు గద్యాన్ని నిర్మిస్తవి,శబ్దాలు లేని నాదం సంగీతాన్ని స్పృశిస్తుంది.గద్యం అనేది భూమి.పద్యం అనేది ఆకాశం,సంగీతం అనేది ఇంద్రధనుస్సు!” ఈ మూడు కూడా సమాన ప్రాముఖ్యం గలవే అంటాడు.

బి.మోహనరావుకు వ్రాసిన లేఖలో ఆధునిక సాహిత్యాన్ని నిర్వచిస్తూ రోమాంటిక్ భావాన్ని అభివ్యక్తి చేయజాలదని ఆధునిక సాహిత్యాన్ని ఎవరూ నిందించరాదంటూ,జీవితంలో అన్నీ సౌకర్యాలనుపయోగించుకున్నప్పుడు ” ఆధునికజీవితానికి ‘ ఎగ్జిస్టెన్సియనిస్టు’ తత్వానికి,అచేతనకు సంబంధించిన ఆధునిక మనోవిజ్ఞానానికి ప్రతిబింబమే ఆధునిక సాహిత్యం” అని వివరిస్తాడు.మన అనుభవాన్ని,వాస్తవికతను వ్యక్తం చేయాలి.జీవితానికి,సాహిత్యానికి సంబంధం ఉండాలి.కల్పనకు తావివ్వరాదు వాస్తవిక దృక్పథం ఉండాలి.ఆధునిక సాహిత్యాన్ని ఆనందించండం అంటే ప్రాచీన సాహిత్యాన్ని నిరసించడం కాదని,నవీనాన్ని ప్రేమిస్తూ ప్రాచీనాన్నికూడా గౌరవించాలని,ప్రాచీనం నుండే నవీనం ఉద్భవిస్తుందని,వర్తమానానికి భూతకాలం మాతృక అయితే భవిష్యత్తుకు వర్తమానం మాతృక అంటాడు.

రాధాకృష్ణ(శ్రీ రమణ) కు రాసిన ఉత్తరంలో ” సాహిత్యంలో అనుభూతి మాత్రమే వుంటే చాలదు.ఆలోచన మాత్రమే వున్నా చాలదు.రెండూ వున్నపుడే అది సమగ్రం.మేధకూ, హృదయానికీ కూడా పని కలగాలి”. అని సాహిత్యం అంటే హితాన్ని ఉపదేశించాలి, రసానందం కలిగించాలి,ఆలోచింపజేసేదిగా ఉండాలి.ప్రాచీనులు చెప్పిన కావ్యప్రయోజనం,ఉపదేశం,ఆనందం అన్న అభిప్రాయానికి దగ్గర వాడుగా కనిపిస్తాడు సంజీవదేవ్.

భారతదేశం కాని విదేశీ సాహిత్యం కాని ఒక ప్రాంతంలోనిది మరో ప్రాంతంలో వినిమయం జరిగితేనే ప్రపంచ ప్రజల్లో నిజమైన సౌభ్రాతృత్వం జనిస్తుందని ఆశించాడు.
అనాలోచితంగా చేసే పనిలో పరిపూర్ణత ఉండదని,ఏ కళైనా ముందు ఆలోచన సృష్టించిన తర్వాతే కల్పన ఉంటుందని,కల్పన లేని కళ వుండదని అంటాడు.

తన రచనాశైలిని వివరిస్తూ ఒక లేఖలో ” ఒక్కోసారి తార్కిక స్రవంతిలో పడి మొదటి వాక్యంలో అర్థమైన విషయాన్నే సాగదీసి,అరగదీసి,ఈకకు ఈకా,తోకకు తోకా విడగొట్టి అతిగా విశదీకరించటం నా వ్రాతల్లో అప్పుడప్పుడు జరుగుతుంటుంది.ఇందు మూలాన ఎదుటి వాళ్ళను మరీ పిల్లల్ని చేసి చెపుతున్నారు అనే అపోహకు తావున్నది.ఇక కొందరు విద్యావంతులున్నారు.వారు నా యీ విశదీకరణ శైలిని ప్రశంశిస్తారు.అతార్కిక వాక్య నిర్మాణం,పునరుక్తి వివరణ,చాలా ఎన్నదగిన ప్రత్యేకత అని అంటారు.” అంటూ కృష్ణాబాయికి రాసిన లేఖలో ఆత్మ విమర్శ చేసుకున్నాడు.

ఇతర కవులపై సంజీవదేవ్ అభిప్రాయాలు

గోపీచంద్ గురించి రాస్తూ "ఆయన రచించిన కల్పనా సాహిత్యంలో హృదయంలోని రసానుభూతికంటే మేధలోని ఆలోచనలకే ఎక్కువ తావు ఆయనదంతా అనవచ్చు." అని అంటాడు.

రంథి సోమరాజుకు రాసిన లేఖలో ఆయన రచించిన ‘రతనాల తండ్రి’ రచనపై సంజీవదేవ్ తన అభిప్రాయాన్ని తెలుపుతూ ” మీ పదాల ధ్వని,అందులోని భావలావణ్యమూ నన్నెంతో మెప్పించింది.కథా వస్తువుతో పని లేకుండానే కేవలం శబ్దం,భావం నాకెంతో రసాన్ని ప్రసాదించింది.” అని వివరించాడు.

రంథి సోమరాజు రాసిన ‘ ఈ మనిషి ఈ లోకం’ కథపై కూడా తన అభిప్రాయాన్ని లేఖద్వారా వ్యక్తపరిచాడు.” ఎలా వ్రాస్తారండి మీరు అలాంటి హృదయాన్ని ప్రకంపనపరచే కథల్ని? మీ పాత్రలు అమృత పాత్రలు.సిరాతో కాక హృదయంలోకి రక్తాన్ని బయటకి కార్చి అందులో పాళీ అద్ది వ్రాస్తారా మీ కథల్ని.” అని ఇది పొగడ్త అవుతుందేమోనని భయపడుతూ వ్రాశానంటారు.భావాల తగ్గట్టు ఆత్మీయంగా వుంటుందంటాడు.
సంజీవదేవ్ రస హృదయం స్పందించే తీరు తెలుస్తుంది.

అచ్యుతవల్లి రచించిన కథపై అభిప్రాయాన్ని తెలుపుతూ సంభాషణలూ, సంఘటనలూ చిత్రంగా ఉందని అంటూనే కొన్ని సలహాలు ఇచ్చాడు ” మీరు ఇతర్ల ప్రఖ్యాత కథలు బాగా చదవాలి.మానవుల నిత్య జీవితాల్లో ప్రతి స్వల్ప విషయాన్ని ,అతి ప్రాముఖ్య సంఘటననూ నిశితంగా స్టడీ చేయాలి.ఓపికతో మానవ స్వభావాలను అవగాహన చేసుకోవాలి. వాస్తవ వాదాల్ని, కల్పనా వాదాన్ని సమ్మిశ్రమం చేసి నూతన కళాసృష్టిని చేసి చూపాలి”.అని సూచించాడు. కథా రచయిత చక్కని కథను ఆవిష్కరించాలంటే రచయిత సామాజిక జ్ఞానం,లోకాన్ని చదవడం,ఇతర రచనలు చదవడం ఎంత ముఖ్యమో అప్పటివారికే కాదు ఏ కాలంలో రచయితలకు కూడా వర్తించే తీరులో చక్కని,చిక్కని సలహాలనిస్తూ సూచన చేశాడు.

ఇంకో ఉత్తరంలో అచ్యుతవల్లి రచించిన’వర్షం వచ్చినరోజు’ కథానికపై అభిప్రాయాన్ని తెలుపుతూ సంఘంలోని రెండు వ్యక్తుల మనస్తత్వాలను చక్కగా చిత్రించారని,ఏది లభిస్తే సుఖపడాలని అందరూ కోరుకుంటారో అది లభించినా సుఖపడరు’. అంటూ “ఉన్న హంసతో అసంతృప్తి,లేని కొంగ కోసం ఆరాటం మీ కథలో చక్కని మనస్తత్వాలను చిక్కని జీవన సత్యాలను పుష్పింపజేశారు.” అని రాశాడు. ఇంత చక్కని కథ దక్షిణ,ఉత్తరాది భాషల్లో తర్జుమాజరగడం మంచిది అంటాడు.ఉత్తమ విమర్శకుని లక్షణం సంజీవదేవ్ లో కనపడుతుంది.ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా నిర్భయంగా చెప్పడం సంజీవదేవ్ కే చెల్లిందని అనుకోవచ్చు.

ప్రముఖ చిత్రకారుడు డా.ఎస్. వి.రామారావుకు రాసిన ఉత్తరంలో “విఫలప్రేమ,భగ్నహృదయం,ఎండిన నది,మరణిస్తున్న మనిషి మొదలైనవే కవులకూ, కళాకారులకూ కూడా రసమయ వస్తువులు.” అంటూ వివరించాడు.కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ అన్నట్లు జీవితంలో ప్రకృతిలో కరిగిపోయినవి,ఎగిరిపోయినవే కళాకారులకు వస్తువులుగా పనికి వస్తాయి.

డి.రామలింగంకు రాసిన లేఖలో ఇప్పుడిప్పుడు వ్రాసిన ఆంగ్లకవితలు పత్రికలో ప్రకటించిన వాటిని కలిపి ‘Echos of Silence’ అనే పేరుతో పుస్తకరూపంలో అచ్చు వేయాలన్న ఆసక్తిని కనబరుస్తూ తన ‘రసరేఖలు’అన్న గ్రంథాన్ని అకాడమీ దృష్టికి తేవాలన్న రామలింగం సూచనకు సంజీవదేవ్ తన అభిప్రాయాన్ని తెలుపుతూ అకాడమీల పరిస్థితిని వివరించాడు.”అభిమానాలకూ,
కులతత్వాలకూ,అయోగ్యతలకు విలువివ్వడానికి చాలా ఖ్యాతి చెంది వున్నాయి అకాడమీలు .” అంటూ అకాడమీల అస్తవ్యస్థను,సమాజంలో అకాడమీలు ఎవరిని గౌరవిస్తాయో, ఎంత రాజకీయం నడుస్తుందో,అయోగ్యులకు మాత్రమే అకాడమీలు విలువనిస్తాయని ఉన్న వాస్తవాన్ని,నాటి సమాజ పరిస్థితిని వివరించాడు.నేటిదాకా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు.

సామాజిక స్వేచ్ఛ కావాలంటాడు.”స్వేచ్చలేని నాగరికత నాగరికతే కాదు.”అంటూనే మానవునికి కీర్తి మీద కాంక్ష ఎక్కువ.కీర్తిపై కాంక్ష లేకుంటే ఏ కార్యాన్నైనా సాధించడానికి సాహసంచేసే వాడు కాడు “దేశంలోని కళలూ, విజ్ఞాన శాస్త్రాలూ, సుజ్ఞాన సాధనలూ అన్నీ కూడ నిద్రాణమైయే వుండేవి.”అని వక్కాణిస్తాడు.కార్యసాధకునికి కీర్తి కాంక్ష ఉంటేనే విజయం తప్పక లభిస్తుంది.

రచనపై అభిప్రాయానికి కొలబద్ద ఏమిటో చక్కగా చెప్తూ “ఒకరి రచన మంచిది అనీ చెడుది అని విలువకట్టడానికి ఆ చదివే వ్యక్తి యొక్క అర్హత మీద కూడా ఆధారపడి ఉంటుంది.” అంటూ రామబ్రహ్మంకు రాసిన ఉత్తరంలో వివరిస్తాడు.
నిజమే కదా మరి. వారి వారి స్థాయిని బట్టి, వారి వారి ఆలోచనా రీతులను బట్టి ఒకరి రచనను గ్రహించడంలో,అర్థం చేసుకోవడంలో,ఆస్వాదించడంలో మార్పులు వస్తుంటాయి.విమర్శలో కూడా అంతే.వారి వారి స్థాయిని బట్టి,వారి వారి సామర్థ్యం బట్టి ఆలోచనాతీరులను బట్టి తేడాలుంటాయి.

అరుణకు రాసిన ఉత్తరంలో ఆధునిక విద్యా విధానాన్ని విశ్లేషిస్తూ మాతృభాషలో బోధన ఉంటే బాగుంటుంది.ఇంగ్లీషును అంతర్జాతీయ,అంతర్ రాష్ట్రీయ భాషగా వాడుకొని మాతృభాషపై ఉన్న అభిమానం కొద్ది ఇంగ్లీష్ భాషపై విరోధంగా మారకూడదన్న భావాన్ని వ్యక్తం చేస్తూ ఆయన మాటల్లో” మానవుని మానవీయ గుణాలను వికసింప చేయటంలో తోడ్పడే విద్య ఆదర్శమైన విద్య.జీవితపు శారీరక,మానసిక,భౌతిక,రసాత్మక,,ఆత్మికశక్తులను వికసింప చేస్తుంది సరైన విద్య.విద్యార్థులకు విజ్ఞానమూ, వినోదమూ కూడా ఇచ్చేదిగా ఉండాలి” ఇలా విద్య అంటే ఏమిటో నిర్వచించాడు.

” విద్య అనేది మెదడుకూ,సంస్కృతి అనేది హృదయానికీ చెంది ఉన్నట్లు కనిపిస్తుంది.మెదడులోని హేతువు,హృదయంలోని విశ్వాసం మానవుణ్ణి ప్రకాశవంతంగా మధురంగా మారుస్తవి.” అంటూ బి.మోహనరావుకు రాసిన ఉత్తరంలో వివరిస్తాడు.విద్య పుష్పం అయితే,సంస్కృతి సువాసన, వాసన లేని పుష్పానికి ఎక్కువ విలువ లేనట్లే సంస్కృతి,సంస్కారం లేని విద్య నిరర్థకం కదా.

చిత్రకళపట్ల ఆసక్తి ఎక్కువ సంజీవదేవ్ కు.సాహిత్యం కంటే కూడా చిత్రరచనపట్ల ఎక్కువ ప్రేమని చూపించేవాడు.ముందు ఆలోచన,తర్వాత కళావిష్కరణ,సాహిత్య, సంగీత,నాట్య,చిత్రకళలపై ఎన్నో ఉపన్యాసాలిచ్చి అందరి మన్ననలను పొందాడు.” రంగుల్లో సృష్టించి చిత్రాన్ని నిర్మాణం చేయడం,పదాల్లో సృష్టించి కవితను తయారుచేయడం- Technique లో భేదించినా మూలంలో ఒకటే.హృదయంలో దాగివున్న రసానుభూతికి ఒక బాహ్యరూపానివ్వటం మాత్రమే”. అని అంటాడు. జీవిని దుఃఖంనుండి ఆనందం వైపుకు త్రిప్పలేని కళ కేవలం కల మాత్రమే నంటూ ” ఆధునిక చిత్రకళలో అర్థాలకోసం వెదకటం అనర్థం” అంటూనే చిత్రకళను ప్రోత్సహించరు,ఆదరించరనే ఆవేదనను వ్యక్తం చేస్తూ” లక్ష రూపాయలతో ఇల్లు కట్టి ఇరువైవేల రూపాయల ఫర్నీచర్ కొని,ఒక వేయిరూపాయల మౌలిక చిత్రాన్ని అందులో ఉంచటానికి కొనరు ఏమిటో ఈ మనస్తత్వాలు”. చిత్రకళను ఉద్ధరించరనే ఆవేదననను డి.రామలింగంకు రాసిన లేఖలో తన బాధను బహిర్గతం చేశాడు.

” పరీక్షలు తెలివిని కొలిచే యంత్రం కాదు అవి తెలివితక్కువను కొలిచే యంత్రం”. అంటూ పరీక్షావిధానాన్ని విమర్శించాడు.

వివాహ వ్యవస్ధ గురించి చెప్తూ అంతర్వర్ణ,అంతర్ ప్రాంతీయ,వివాహాల్లో విచిత్రం లేదు.ఈనాటి కాలంలో అవి మామూలే.సంస్కరణ అంటే స్త్రీ,పురుషులకు మధ్య వివాహం చేయడం కాదు.స్త్రీ స్త్రీ యే,పురుషుణ్ణి పురుషుడే వివాహమాడితే అది సంస్కార వివాహం అంటాడు.

సంజీవదేవ్ రాజకీయ ఉపన్యాసాలపట్ల విముఖతభావం కలిగినవాడు.కూలియిచ్చి వినమని చెప్తే కూడా”ఆ కూలి తీసుకుని వినటం ఎగేసివద్దాం అనిపిస్తుంది.” అని కూచోని వినకపోవడం ఇటువంటి స్థితి నేటి కాలంలో కూడా గమనిస్తున్నాం.జనాన్ని పోగుచేయడానికి, సేకరించడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో,ఎన్ని తాయిలాలు పెడుతున్నారో ప్రత్యక్ష అనుభవమే. నాడైనా, నేడైనా,ఏనాడైనా మారని దుస్థితి,దుసంస్కృతి.

,జీవితంలో గొప్ప విశేషమేమిటంటే ” యోగ్యమిత్రులను పొందటం” అంటూ మిత్రత్వాన్ని నెరపడంలో ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

వేదాంత,తాత్విక విషయాలను లేఖల్లో వ్యక్తం చేశాడు.కోరికలను జయిస్తే సుఖశాంతులు అంటాడు.” దుఃఖాన్నించి ఆనందాన్ని సృష్టించుకోవడమే ‘ఆధ్యాత్మిక సాధన’ అని బుచ్చిబాబుకు రాసిన ఉత్తరంలోను,చెల్లి భారతీదేవికి రాసిన ఉత్తరంలోను ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

” సాధకులు ఇంద్రియగ్రాహ్యజగత్తును గాక అతీంద్రియ సత్యాన్ని ధ్యాన సాధన ద్వారా అందుకొని దానితో ఏకత్వం చెందటం మిస్టిజం; ఒక అర్థంలో మిస్టిజం అంటే భక్తి యోగం అనే అర్థమే”. అని లక్ష్మికి రాసిన ఉత్తరంలో విపులీకరిస్తాడు.

సంజీవదేవ్ లేఖలో వ్యక్తిగత విషయాలు,ఆధ్యాత్మిక విషయాలే కాక సాహిత్య, సామాజిక ,చిత్రకళకు సంబంధించిన విషయాలు తెలుపుతూనే లేఖలు వ్రాయడంలో,లేఖలు అందుకోవడంలో తృప్తి ఉంటుందని చెప్తాడు.జీవితంలో ఆనందాన్ని అనుభవించడం రసానందాన్ని పొందడమే పరమార్థం అని పెక్కుచోట్ల వక్కాణించిన కళాతపస్వి సంజీవదేవ్.

సంజీవదేవ్ ఒక్కో లేఖ ఒక సుదీర్ఘమైన వ్యాసంలా ఉంటుంది.ఏదన్నా ఒక విషయాన్ని తీసుకుని దాన్ని విపులీకరించడం ఈయన లేఖల్లో కన్పించే ప్రత్యేక లక్షణం.ఆయన లేఖలలోని వేదాంత, తాత్విక,సాహిత్య,సాంఘిక విషయాలు పాఠకులలో ఎంతో జిజ్ఞాసను రేకెత్తించేవిగా ఉంటాయి.

లేఖలలో ఎన్నో రకాల విషయాలను స్పృశించడంబట్టి ఆయన రాసిన వ్యాసాలను బట్టి సంజీవదేవ్ కు జీవితంపట్ల గల అవగాహన, విషయ పరిజ్ఞానం తెలుస్తాయి.ఆయన లేఖలద్వారా ఆయన గొప్ప వక్త అనీ,పాఠకులకు ఏదేని ఒక సందేశం ఇవ్వాలనే ఆరాటం మనకు ఆయన రాసిన ప్రతీ లేఖలోను కనిపిస్తుంది.

జీవన రేఖ

సంజీవదేవ్ ఇంటిపేరు సూర్యదేవర.గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడి గ్రామంలో జులై 3 వతేదీ 1914వ సంత్సరంలో జమీందారీ కుటుంబంలో పుట్టాడు వెంకాయమ్మ ,రామదేవరాయలు తల్లిదండ్రులు.హోదా ఉన్నప్పటికీ సామాన్యుడిలా జీవించడమంటే ఇష్టం చిన్నప్పటినుండి సంజీవదేవ్ కు. చిన్నతనంలోనే తల్లిలేని పిల్లవాడయ్యాడు. అమ్మమ్మ వాళ్ళింట్లో,పెదనాన్న వాళ్ళింట్లో పెరిగి ఇంట్లోనే చదువుకున్నాడు.పెద్దగా చదువుకోలేదు కానీ హిమాలయాలపట్ల ఉన్న ఇష్టంతో ఇంట్లో చెప్పకుండా తన 26 వ ఏట హిమాలయాలకు వెళ్లడం అక్కడ కొంతకాలం ఉండడం, ఉత్తర భారతదేశాన్ని చుట్టుముట్టడం,ప్రకృతిని ఆస్వాదించడం,చిత్రాలు వేయడం జరిగింది.30 ఏళ్ళు వచ్చేసరికి ఎంతో జ్ఞానం సంపాదించాడు.
బెంగాల్,ప్రెంచి,జపానిస్,ఉర్దూ,హిందీ భాషలు నేర్చుకోవడమే కాక ఎస్పరాంటో అనే అంర్జాతీయ భాషను కూడా నేర్చాడు.కాళిదాసు రచనలను,జయదేవుని గీతగోవిందాన్ని చదివాడు బెంగాలీ సాహిత్యాన్ని చదివాడు.లక్నోలో హసిత్ కుమార్ హల్దార్ దగ్గర చిత్రలేఖనం నేర్చుకోవడమే కాక నోబుల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథుణ్ణి చూసే అదృష్టం కలిగింది.చిత్రకళపై పట్టు సాధించాడు.రవీంద్రునితో బెంగాలీ భాషలో మాట్లాడమే కాక రవీంద్రుని రెండు రచనలను చదివి వినిపించి ముగ్దుణ్ణి చేశాడు.”కవిగానే కాదు మనిషిగా జీవించాలన్న” రవీంద్రుని మాటలు సంజీవదేవ్ హృదయాన్ని తాకాయి.

1954 సంవత్సరంలో సులోచానదేవితో వివాహం జరిగింది.ఇద్దరు కొడుకులు పుట్టారు.చదివింది 8 వ తరగతే అయినప్పటికీ 14 భాషల్లో రాయడం,చదవడం వచ్చు. ప్రతిసంవత్సరం సంక్రాంతికి తుమ్మపూడి వాళ్ళింట్లోనే కవిసమ్మేళనాలు జరుపుతుండేవాడు. నార్ల వెంకటేశ్వరరావు,త్రిపురనేని గోపిచంద్,నాగభైరవ కోటేశ్వరరావు లాంటి గొప్పగొప్ప కవులు సైతం కవిసమ్మేళనానికి హాజరయ్యేవారు.
విద్యార్థి పత్రికలో 1963 సం. లో ఒక వ్యాసం రాస్తూ మనిషి కనకం, కాంతం,పదవి,సుఖం అన్నిటినీ వదిలేస్తాడు కానీ కీర్తి కాంక్షను వదిలివెయ్యడు అని అంటాడు.ఇలా గొప్ప చిత్రకారుడు,వ్యాసకర్త అయిన సంజీవదేవ్ ఎన్నో గ్రంథాలు రాశాడు.
ఈయన చేసిన సేవను గుర్తించి1980 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ,కళాప్రపూర్ణ పురస్కారం ఇచ్చి గౌరవించారు.1995 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్. టి.రామారావు చేతుల మీదుగా హంస పురస్కారాన్ని పొందారు.

దేశ విదేశాల కవులు,చిత్రకారులతో సంబంధాలుండేవి.తుమ్మపూడికి సంజీవదేవ్ ను కలవడానికి ఆయన ఇంటికి వచ్చేవారు.
బుచ్చిబాబు,దేవులపల్లి కృష్ణశాస్త్రి ,రవీంద్రునితో సంబంధాలుండేవి.
మిత్రులకు ఉత్తరాలు రాసేవాడు. అమెరికాలో
స్థిరపడ్డ ప్రముఖ చిత్రకారుడు ఎస్.వి రామారావు తో ఉత్తరాలు నడిచేవి.

ఎంతో పేరుప్రఖ్యాతులు గడించిన ప్రముఖ చిత్రకారుడు,సాహిత్య వేత్త, ఆధ్యాత్మిక వేత్త,తాత్వికుడు అయిన సూర్యదేవర సంజీవదేవ్ ఆగస్టు 25 వ తేదీ 1999 వ సంవత్సరంలో తన జన్మభూమి తుమ్మపూడిలో తుదిశ్వాస విడిచినప్పటికీ ఆయన పంచిన జ్ఞానం గ్రంథాలరూపంలో మనకు అందుతూనే ఉన్నాయి.

March 7, 2023 3 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అమ్మభాష-ఆత్మభాష

by Damaraju Vishalakshi March 7, 2023
written by Damaraju Vishalakshi

అమ్మ ఒడిలో దూరినట్లు
అందలంలో దాగినట్లు
అధ్బుతాన్ని చూసినట్లు
ఆనందతాండవమాడినట్లు
అనుభూతినిచ్చి అమ్మభాష
ఆనందాన్ని కలిగిస్తుంది

పొద్దుపొడుపు పొడిచినట్లు
పొత్తిళ్ళ పాప నవ్వినట్లు
పాలకంకులు విరిసినట్లు
పంటచేలు ఊగినట్లు
పసితనం నుండే నేర్చిన
పసిడిభాష తృప్తి నిచ్చును

చల్లగాలి వీచినట్లు, ,
సన్నాయి మేళం మ్రోగినట్లు
సన్నజాజులు రాలినట్లు
సప్త స్వరాలు మీటినట్లు
సత్కవుల కవిత్వం చదివినట్లు
మాతృభాష మాట్లాడినప్పుడు
మనసు కు కలిగేది ఊరటనే

జావళీలుపాడినట్లు
జాజిమల్లెలు విరిసినట్లు
జాతి వజ్రం మెరిసినట్లు
జయకేతనమెగిరినట్లు
అమ్మభాషను ఆదరించి ఆనందంతో పొంగాలి మనం

పండితులు బోధించినట్టు
పామరులు తలలూపినట్టు
విజ్ఞులందరు మెచ్చినట్లు
విశ్వానకీర్తి ప్రభలేటట్టు
ప్రజలపై నాల్కపైమాతృభాష
వెలుగులు కట్టి ఆడాలి ఇప్పుడు

తెలుగు బిడ్డల హృదయమంతా భాషాభిమానం పొడజూపి నప్పుడు
వర్ధిల్లేది అస్తిత్వ కేతనం

తెలుగుతోటలో ఆడినట్లు
తెలుగు పూలను ఏరుకున్నట్టు
తెలుగుదనం పొంగినట్టు
తెలుగు వారు తలవాలి అనయం

తెలుగు నీది తెలుగు నాది
తెలుగువాళ్లమై మనమిప్పుడు
తెప్పమీద తేలినట్టు
తెప్పరిల్లాలి అత్యధికం

గతచరితలు విరిసినట్లు
ఘనకీర్తిని చాటినట్టు
విజ్ఞానగంగలో విజయులమైనట్టు
జ్ఞానులు బోధించినట్లు
భాషతలుచుకు పొంగాలిప్పుడు
భావితరాలకు తరగని నిధిగా!!

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చిరునగవు చిత్రం

by Aruna Dhulipala March 7, 2023
written by Aruna Dhulipala

పేగులు చుట్టే నొప్పిని భరించి
పొత్తిళ్లలో నిండుగా నింపుకున్న
ఆనంద జోల..
మృత్యువును సైతం ఆహ్వానిస్తూ,
మరో ఊపిరిని
మట్టిమీద నిలపడానికి
సిద్ధపడే మమకారం ..
ఆకలిని మరచిపోయి,
స్వచ్ఛమైన పాలధారలతో
పెదవులపై తడి మెరుపులు
దిద్దిన అనురాగం…

ఇప్పుడు…
అనుభవాల రాపిడికి నలిగి,
జవసత్వాలు నీరయి
ముడుతలుగా మిగిలిన దేహం..
కడవరకు తోడుంటానన్న
ప్రమాణం కల్లయి,
బాధ్యతలకు ఎరగా మారి
సాలెగూడుకు చిక్కింది..

కుంగిన రెక్కలను మొదలంటా విరిచి
ఇనుపపాదాలకింద నలిపి
వెళ్లిపోయిన పెంచుకున్న భ్రమ..
బతుకును బలవంతంగా సాగదీస్తూ
కాలుని పిలుపుకై కళ్ళు నిలిపి
ఆత్మవిశ్వాసపు త్రాసులో
బరువుగా తూగుతూ
చిరునవ్వు చిత్రంగా..ఆమె..

అరుణ ధూళిపాళ.

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నేను సైతం

by Peddurti Venkatadasu March 7, 2023
written by Peddurti Venkatadasu

వెలుగును పంచుతూ బతుకును బలిఇచ్చే కొవ్వత్తిని కాను….
కాసేపు మెరిసినా కళ్ళకద్దుకునేలా
బతుకునుసాగించే కర్పూరాన్ని కాను….
తానరిగిపోతూ కూడా సుగంధ పరిమళం అందిస్తూమురిసే గంధం
చెక్కను కాను…
అంధకారం అలుముకున్న బ్రతుకులో అజ్ఞానాన్ని తొలగించే
అక్షరం ముక్కను కాను…
నీడనిస్తూ పూలనిస్తూ ఫలాలనిస్తూ
ప్రాణవాయువు నందిస్తూ రకరకాల
గృహోపకరణాల రూపంలో సేవలందిస్తూ సస్యశ్యామలంగా
నా దేశాన్ని నిండుగా నిలుపుతూ…
మొడై పండుముసలిలా చిక్కి శ్యల్యమై ఎండుకట్టేగా మారి కడకు
కాలుతూ కూడా పరులకు పనికొచ్చే
తరువును అసలే కాను ……
ఇన్నాళ్లు సేవలు పొందడమే తెలిసిన నాకు సిగ్గుగా వుంది
మనిషై ఈ మట్టిలో పుట్టినందుకు
ఒక్క మంచి పనైనా చేయాలని సంకల్పించుకున్నా పైచేయి అంటే
చేయి అధించడం అని తెలుసుకున్నా!!!

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నిశ్శ‌బ్ద గీత‌మై…

by తిరునగరి శ్రీనివాస్ March 7, 2023
written by తిరునగరి శ్రీనివాస్

మౌన సంభాష‌ణ‌లెన్నో
మ‌న‌సు పొర‌ల్లో…
ప్ర‌వ‌హించే గీత న‌దులెన్నో
అంత‌రాంతరాళాల్లో…
ఊపిరాడ‌ని అవ‌స్థ‌ల్లోనూ
మైదాన‌మంత క‌విత్వం పుడుతుంది
మూసిన కిటికీలపై
మ‌న‌సు భాష‌ను అది చిల‌క‌రిస్తుంది
చుక్క‌ల జెండాల‌ను ప‌ట్టుకుని
చిగురు చిరునామాగా ఊత‌మౌతుంది
బువ్వ‌లోని మ‌ట్టి ప‌రిమ‌ళ‌మౌతుంది
జీవితాన్ని వ‌డ‌గ‌ట్టిన క‌న్నీరవుతుంది
అర్థం చెప్పి ఆచ‌ర‌ణ‌వుతుంది
గాలికి ఆయువు పోసి
ఆకుప‌చ్చ‌ని పాట‌వుతుంది
వాస్త‌వ‌మై గుండెల్లో స్థాపిత‌మౌతుంది
జ‌రామ‌ర‌ణాలు జ‌యించి
అజ‌రామ‌ర‌మ‌వుతుంది
న‌దీ హృద‌య‌మ‌వుతుంది
అనుభ‌వాల అగాధ‌ల‌పై
ఆలోచ‌నాలోచ‌న‌మ‌వుతుంది
జీవ‌న చైత‌న్యదాయినిగా విక‌సిస్తుంది

March 7, 2023 2 comments
1 FacebookTwitterPinterestEmail
కవితలు

వర్క్ ఫర్ హోమ్

by కుడికాల వంశీధర్ March 7, 2023
written by కుడికాల వంశీధర్

ఎన్నో ఉదయాలు
ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్
బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్ స్లైసుల్లో చేరిపోతాయి.

ఎన్నో మధ్యాహ్నాలు
పనిభారంతో కళ్లు
లంచ్ బాక్స్‌ని మరిచిపోతాయి.

ఎన్నో సాయంత్రాలు
నిబద్ధత, విధేయత
కండెన్స్డ్ పాలలా  కాఫీ కప్పులో దూరిపోతాయి.

ఎన్నో రాత్రులు
స్క్రీన్ మీద ఎర్రర్స్
ఎర్రని కంటిజీరలా మారిపోతాయి.

మాటల ప్రవాహాన్ని,
చూపుల బేలతనాన్ని
వైఫై తరంగాలు
గిగాబైట్లలో మోసుకు పోతాయి.

అతను అక్కడ వేరే ప్రాజెక్ట్‌లో
ఆమె ఇక్కడ కోడ్ రివ్యూలో

నేరుగా ఇటుక ఇటుక పేర్చి కట్టుకోక పోయినా
వారు ఇన్‌స్టాల్‌మెంట్స్ కూర్చి కట్టుకున్న ఫ్లాట్
అందంగా, విశాలంగానే ఉంది
వర్క్ ఫ్రమ్ హోమ్‌కి వీలుగా
ఇద్దరికీ చెరో గది.

బాల్కనీ లోంచి రోజూ
వారిని గమనించే గువ్వల జంట
పుల్ల, పుడక తెచ్చి అల్లుకున్న
గుండె అంత గూటిలో
దగ్గరగా చేరుకుంటూ
ఇంటికి కొత్త అర్థాన్ని తెచ్చే పనిలో
లోకాన్ని మరచిపోతున్నాయి.

March 7, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

డాక్టర్‌, డాక్టర్‌

by ఒద్దిరాజు మురళీధరంరావు March 7, 2023
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒకనాడు తీవ్రమైన ఎండలో మధ్యాహ్నం ఒక ముసలతను పల్లెటూరు
బాటెంబడి నడిచి వస్తున్నాడు. అతను అలసిపోయాడు. దాహంతో ఉన్నాడు. రోడ్డు
ప్రక్కనే అతను ఒక చిన్న నిత్యవసరాల కొట్టు చూశాడు. దాని పైకప్పు రేకులది,
గోడలు మట్టివి. దాుకాణ్‌దారు లోపల విసురుకుంటూ ఈగలను పారదోలుతూ
భరించరాని వేడిలో కూర్చొని ఉన్నాడు. కొట్టు ముందాు ఒక బెంచ్‌ వుంది. సాయంత్రం
అయ్యాక గ్రామస్థులు అక్కడకు చేరి కలుస్తుండేవారు. ఆ ముసలతను చేతకాక ఆ
బెంచ్‌ మీదా వాలిపోయాడు. కొద్దిసేపు కూడ మాట్లాడలేనంతగా అలసిపోయాడు.
చివరకు అతను నోరు తెరచి ఒక్కమాట అన్నాడు, ”నీరు!” అని.
ఇప్పుడు ఈ గ్రామం తీవ్ర సమస్యను ఎదాుర్కుంటున్నది. ఇది ఎడరికి
దాగ్గరలో ఉంది. ఇక్కడ వర్షాలు సంవత్సరానికి ఒకసారి వచ్చి కుంటలు, బావులు
నింపుతాయి. కానీ వర్షాలు రాక రెండు సంవత్సరాలు అయ్యింది. గ్రామస్తులు
దాూరాన ఉన్న కాలువ నుండి నీరు తెచ్చుకుంటున్నారు. ప్రతి ఉదాయం మగవారు,
ఆడవారు గుంపులుగా చాలాదాూరం నడిచి ఆ చిన్నకాలువలో వారి కుండలలో నీరు
నింపుకొని వచ్చి రోజంతా ఆ నీరే వాడుకునేవారు. ఆ విలువైన నీటిబొట్టును కూడ
అతి జాగ్రత్తగా వాడుకునేవారు.
అయినప్పటికి దాహంతో ఉన్న ముసలతనికి నీరు లేదాని ఎలా చెప్పగలవు
నీవు? వేరే ఆలోచించకుండ కొట్టతను రవి చాలా దాయగలవాడు, తన కుండ
నుండి ఒక గ్లాసెడు నీరు ముసలతనికి ఇచ్చాడు. ఆ మనిషి అత్యాశతో ఆ నీరు
తాగేశాడు. అప్పుడు అతను ఇంకొక శబ్దం పలికాడు. ‘ఎక్కువ!’ అని, రవి కొరకు
ఆగకుండ అతను ఒక గంతు వేసి కుండను లేబట్టి పెదావులకు ఆనించి మొత్తం నీరు
ఒక చుక్క కూడ రవికి లేకుండ తాగేశాడు.
పాపం రవి ఏం చేయగలడు? అతను కేవలం భయంతో కనురెప్ప
వాల్చకుండ చూశాడు. అప్పుడు అతను తనలోతను అనుకున్నాడు, ‘ఫర్వాలేదాు,
నేను ఒకతని అవసరానికి సహాయం చేశాను, ఇంతే గదా.
ఆ కొత్తతను, ఇంతలో తృప్తిగా కనిపించాడు. అతను కుండను రవికి
తిరిగి ఇచ్చాడు సంతోషంగా. అందాుకు రవికి తృప్తి అయింది. రవితో ఆ వృద్ధుడు,
నా ప్రియమైన అబ్బాయి, ఎల్లపుడు ఇట్లే దాయతో వుండు. నాకు చేసినట్లే నావలె
వచ్చేవారికి సహాయపడు, నిన్ను దీవిస్తారు. అప్పుడు అతని చేతిక్ఱోను తీసుకొని
నెమ్మదిగా రోడ్డు వెంబడి కుంటుతూ నడిచి వెళ్ళాడు. రవి కొత్త ముసలతను కనబడేంత
వరకు చూసి, తను షాపులోకి తిరిగి వచ్చాడు.
ఆ మధ్యాహ్నం వేడి విపరీతంగా ఉంది. కొద్దిసేపయ్యాక రవికి తీవ్రమైన
తలనొప్పి వచ్చింది. అతని పెదావులు ఆరిపోయాయి. గొంతు ఎండిపోయింది,
విపరీతమైన దాప్పిక అయింది. అతనికి వాస్తవంగా తానేరు అవసరమైంది. కాని ఆ
యాత్రికుడు మొత్తం నీళ్ళు తాగేశాడు. ఒకటో, రెండో చుక్కలు దొరకవా అని కుండను
లేపి పెదావుల దాగ్గర వంచాడు. అతనికి ఆశ్చర్యమేసింది. ఎప్పుడైతే కుండలోని
నీటిధార తన ముఖంపై పడిందో ? అది తీయగా ఉంది, కొత్త శక్తినిచ్చే ఆ నీరు
అతని దాప్పిక తీర్చడమే గాక అతని తలనొప్పిని కూడ పోగొట్టింది.
రవి ఆ నీటికుండను కనురెప్ప వాల్చకుండ చూస్తున్నాడు ఏమయిందాని.
అప్పుడే కుంటుకుంటూ షాపుకు చేరాడు కరీం. కరీం యువకుడు. అతనికి కొన్నేండ్ల
క్రితం జరిగిన ప్రమాదాంలో కాలుకు దెబ్బ తగిలి కుంటివాడయ్యాడు. ఎప్పుడైతే
అతను ఆరోగ్యంగా లేక మరియు అలసట చెందాడో, అతని కుంటికాలు చాలా
బాధా పెట్టింది. కరీం కూడ షాపు ముందాు బెంచ్‌పై పడిపోయి, ముసలతని వలె
గాలి పీల్చుకోలేకపోయాడు. అప్పుడు అతను తన జేబు నుండి కావలసిన సరుకుల
లిస్టు రవికి అందించాడు. రవి సరుకులను ప్యాక్‌ చేస్తున్నపుడు కరీం ఒక చిన్నమూట
విప్పి దానిలోని పదార్థాన్ని భోజనంగా తిని బెంచ్‌పై కూర్చున్నాడు. చివరకు అతను
దాస్తీతో మూతి తుడుచుకొని రవి నీటికుండ వైపు చెయ్యి చూపాడు. ‘నేనొక గుటక
నీరు తీసుకోవచ్చా? ఇప్పుడు బాగా వేడిగా ఉంది’.
రవి ఏదో పప్పు కొలుస్తున్నాడు. అతను చూడకుండ, ‘నేను నీకు కొంత
నీరు ఇవ్వడనికి సంతోషిస్తాను. కానీ ఎవరో ఒకతను దానిలోని నీరు చాలావరకు
తాగేశాడు. అప్పుడు నాకు బాగు లేకుండెను, అప్పుడు నేను అందాులోని చివరి
బొట్టు కూడ తాగేశాను.’ అన్నాడు.
‘ఏమంటున్నావు మిత్రమా? నేను కుండ నిండ నీరు నిండి బయటికి
వస్తున్నట్లు చూస్తున్నాను!”
రవి పైకి చూశాడు, నమ్మలేక రెప్పవాల్చకుండ చూశాడు. అతని కండ్ల
ముందే కరీం గ్లాసెడు నీరు తీసుకొని తాగాడు, తరువాత సరుకుల డబ్బులు ఇచ్చి
38
వెళ్ళిపోయాడు.
అతని కుంటితనం దాదాపు పోయిందా? అని రవి కరీం వెళుతుంటే
చూశాడు బయటికి వచ్చి. ఎండ వల్ల అతను సరిగా చూడలేకపోతున్నానని అనుకొని
షాపులోకి తిరిగి వచ్చి చల్లగా ఉన్నందాున కునుకు తీశాడు.
ఎవరో తన పేరుపెట్టి అర్జెంటుగా పిలుస్తున్నట్లు విని లేచాడు. అతను
కండ్లు తెరిచి కరీంను చూశాడు. ఈసారి అతను తన చెల్లెలు ఫాతిమా చెయ్యి
పట్టుకొని ఉన్నాడు. అన్నా, నిద్రా లే, మాకు నీతో అవసరం ఉంది అని కరీం
కోరాడు.
‘ఎ ఎ ఏంటి? ఏమైనా బాగు లేదా?”
‘ఫాతిమా జ్వరంతో మాడిపోతున్నది!’
‘అయితే డక్టర్‌ దాగ్గరికి తీసుకపో, ఆమెను ఈ షాపుకు ఎందాుకు తీసుకు
వచ్చావు?’
కరీం ఇతని వైపు నిలకడగా చూస్తూ అన్నాడు, నీవు నాకు ఎట్లు బాగు
చేశావో తెలియదా? నా కాలు చాలా సంవత్సరాలు నన్ను ఇబ్బంది పెడుతున్నది.
దానంతట అదే బాగయింది, నీ గారడి కుండ నుండి తాగిన నీరుతో, ఫాతిమాకు
కొన్ని నీళ్ళు ఇవ్వు. నాకు నమ్మకం ఉంది, దానితో ఫాతిమా జ్వరం తగ్గుతుందాని.
రవి ఆశ్చర్యపడినాడు. గారడి కుండయా? నయం చేసే నీరా? కరీంకు
ఏమి తోచడం లేదాు. అయినప్పటికి ఫాతిమాకు కుండలో నీరు అందించాడు. ఆమె
కొద్దిగా తాగింది, తరువాత విశ్రాంతి కోసం కూర్చుంది. నిముషాల్లోనే ఆమె తల
ఎత్తి అంది, ఇది నిజమే అన్నలారా! వాస్తవంగా నా జ్వరం తగ్గింది.
త్వరలోనే గ్రామంలో ఈ వార్త వ్యాపించింది. రవి, తినుబండరాల
మామూలు షాపు యజమాని. అతను ఇప్పుడు గారడి కుండ యజమాని. ఆ నీటితో
ఎవరికైనా ఏ వ్యాధినైనా బాగు చేయగలదాు. ప్రతి రాత్రి రవి ఆ కుండను షాపులోనే
వుంచి పోయేవాడు, ఉదాయాన అది తీయటి మరియు చల్లని నీటితో పూర్తిగా
నిండిపోయేది. ప్రతిరోజు అతని షాపు ముందాు రోగులు, వారి బంధాువుల క్యూ
ఉండేది. ఒక్కొక్కరికి రవి కుండలోని కొద్ది నీళ్ళు ఇచ్చేవాడు మరియు వారంతా
ఇప్పుడు బాగున్నాము అనుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆ కుండ ఎప్పుడు కూడ
ఖాళీగా లేదాు. రవి, ఆ ముసలతనికి తను సహాయం చేసినందాుకు ఆయన కృతజ్ఞతా
39
పూర్వకంగా ఈ బహుమతి నాకు ఇచ్చి ఉండవచ్చు అని గ్రహించాడు. ఎంత పెద్దా
బహుమతి ఇచ్చాడో అని ప్రతిరోజు ఆయనకు మనసులోనే కృతజ్ఞత చెప్పుకునేవాడు.
త్వరలోనే అతని చిన్నషాపు హాస్పిటల్‌గా మారింది. రవి ఆ నీటికి ఒక్క
పైస కూడ చార్జ్‌ చేసేవాడు కాదాు. ప్రజలు తృణమో, పణమో, కొందారు బహుమానాలు
అతని కొరకు వదాలి వెళ్ళేవారు, కొందారు ఏమి ఇవ్వకనే వెళ్ళిపోయేవారు. అయినా
అతను దానితోనే సంతోషంగా ఉన్నాడు.
ఒకరోజు ఒక ధానికుని నౌకరు వచ్చి ‘నా యజమానికి బాగులేదాు. నా
వెంట వచ్చి అతనికి కొన్ని నీళ్ళు ఇవ్వండి’ అని అన్నాడు.
రవి జవాబు చెప్పాడు. ‘చూడు నీ వెనుక ఎంత లైను ఉందో, వారి వంతు
కొరకు ఎదిరి చూస్తున్నారు. నేను వారికి సహాయం చేయకుండ వదిలేసి నీ యజమాని
వద్దాకు ఎలా రాగలను? ఈ రోగులు ఎండలో చాలాసేపు ఎలా నిలబడగలరు నీవు
ఊహించావా? నీ యజమానిని ఇక్కడికి రమ్మను. నేను అక్కడికి వచ్చిన దానికన్న,
నేను అతనికి ఇక్కడే నీరు యిస్తాను.
ఆ నౌకరు ‘రవి, ఈ బీదావాండ్లకు సహాయం చేయడం వలన నీకేమీ
వస్తుంది? ఏవో కొన్ని రూపాయలు, కొన్ని బియ్యం మరియు కొంత పప్పు? నా
యజమాని ఇంటికి రా. అతను నీకు రూపాయలు, బహుమతులు కురిపిస్తాడు. నీకు
అవసరాలు ఎలా తీరుతాయే అనే ఆవేదాన కనీసం ఒక నెల వరకు కూడ ఉండదాు’.
రవి ప్రేరేపింపబడినాడు. అది నిజమే, ఒక ధానికుడిని బాగు చేసి, తన
రోజు వారి ఖర్చుల సంపాదించుకోవచ్చు గదా? రవి అక్కడ బయట ఎదాురుచూస్తున్న
జనులను మర్నాడు రమ్మని తను భూస్వామి నౌకరు వెంట వెళ్ళాడు.
నెమ్మదిగా, రవి మారిపోయాడు. ఆయన ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్న
రోగులను చూసి భరించలేకపోయాడో, ఇప్పుడు ప్రతిరోజు ఒక ధానిక రోగి కోసం
ఎదాురు చూస్తున్నాడు, అందాువలన అతనికి చేతినిండ డబ్బు వస్తుందాని ఊహించాడు.
రోజులు గడిచాయి. ఆ తీరుగ కాలాలు మారాయి, మరల వేసవి వచ్చింది.
రవి తన పాత షాపులో పద్దాులు రాసుకుంటున్నపుడు ఒక ముసలతని వణుకు
పిలుపు ”కుమారా, నీళ్ళు” అని వినిపించింది.
ఆశ్చర్యపడి అతను పైకి చూశాడు. ఇది తనకు బహుమతిగా గారడి
కుండను ఇచ్చిన ముసలతనిదేనా? కాని వచ్చినతని వెనుక రాజు వార్త తెలిపేవాడు
40
ఉన్నాడు. ‘త్వరగా రా!’ రాజుగారి మనిషి గట్టిగా అరిచాడు. ”రాణి గారిని దోమ
కుట్టింది!” అని.
‘నీళ్ళు!’ ఆ ముసలతను మళ్ళీ అడిగాడు.
‘ఆ రాణిగారు మంచిగా లేరు!” రాజు మనిషి మళ్ళీ అరిచాడు.
ఒక బీదా ముసలతను తనకు సహాయపడిన వాడో కాదో లేక తనకు
నీటికుండ ఇచ్చినతనేమో అని ఆలోచిస్తున్నాడు. మరోవైపు రాజు పంపిన మనిషి,
అతను ఊహించాడు, బంగారు నాణాల వర్షం అతనిపై కురుస్తుంది. బాగు చేసే
నీరు రాణి గారి దోమకాటు నొప్పి తగ్గించగానే, ఏది మంచిదో తెలుస్తూనే ఉంది.
అతను కుండను తీసుకున్నాడు మరియు కొత్తతనితో అన్నాడు. ‘ఇక్కడే
వేచి ఉండండి మామయ్యా, నేను వెంటనే తిరిగి వస్తాను’.
వేగంగా పరుగెత్తే రాజు గ్ఱుోాలు రాజభవానికి అతడిని చేర్చాయి. అక్కడ
అతను త్వరగా రాణిగారిని సమీపించాడు. ఆమె చేతిపై దోమ కుట్టినచోటును
ఆశ్చర్యంతో చూశాడు. అతను గ్లాసులో కొన్ని నీళ్ళు వంచాడు, కానీ ఏమీ రాలేదాు!
మరల మరల కుండ వంచాడు. దాన్ని కింది మీదికి చేశాడు, లోతులోకి చూశాడు.
అది ఎముకవలె ఎండి ఉన్నది.
”ఓ మోసగాడ!” అని రాజు అరిచాడు. అయితే నీవు నా రాజ్యంలోని
ప్రజలను ఇలా మోసం చేస్తున్నావు! వెళ్ళిపో, నాకు ఇకముందాు మంత్రపు కుండల
నీరు ప్రభావం గురించి వినరావద్దాు. నీవు ఒకవేళ మరల ప్రకటించావో, నిన్ను
శాశ్వతంగా ఆ ఊరినుండి వెళ్ళగొడతాను. తరువాత అతను రాణిగారి కన్నీరు తుడుస్తూ
ఆమె చేతిపై ఏర్పడిన వాపుపై చేయి రుద్దాుతూ కొంత ఉపశమనం కలిగించాడు.
రవి నెమ్మదిగా తన గ్రామానికి నడిచి వెళ్ళాడు. అతను తన షాపు వద్దాకు
వెళ్ళాడు. అక్కడ ఎవరు లేరు. అతను తనను నీళ్ళడిగిన ముసలతని కోసం వెతికాడు.
అతను అక్కడ ఎక్కడ కనిపించలేదాు. అతను కేక వేశాడు, ‘మామయ్యా, నన్ను
క్షమించు, నేను తప్పు చేశాను. దాయచేసి రండు, నేను మీకు నీళ్ళు ఇస్తాను”. కాని
దానికి జవాబు లేదాు. ఇప్పుడతను గ్రహించాడు, ఈ ముసలతను సంవత్సరం క్రిందా
తనను కలిసినతనే.
అతను దాయతో బాగుచేసిన జనులను మరియు వారు తిరిగి ఇష్టపడి
దీవించిన వారిని గుర్తు చేసుకున్నాడు. వారు చేసిన దాతృత్వం, కొన్ని డబ్బులు
41
ఇవ్వడం మరియు వారి తోటలోని కూరగాయల మూటలను ఇచ్చినవారిని గుర్తు
చేసుకున్నాడు. ఎప్పుడు అతను స్వార్థపరుడైనాడో, అత్యాశ పరుడైనాడో, అతను
చాలా అవసరమైన వారిని అశ్రద్ధా చేశాడో మరియు ఆ ముసలతను ఇచ్చిన శక్తిని
రవి సరీగ ఉపయోగించకపోయాడో తను ఆ శక్తిని తిరిగి తీసేసుకున్నాడు.
ఏం బాధాలేదాు, రవి తనలోతానే నవ్వుకున్నాడు. తనకు నీటి ద్వారా
వచ్చిన డబ్బుతో గ్రామానికి నిజమైన డక్టరును ఏర్పాటు చేస్తాను, అతను మెడిసిన్లు
మరియు రోగాల గురించి బాగా తెలిసినవాడై ఉంటాడు. ఇకపై జనులు గారడివాడు
బాగుచేస్తాడని వేచి చూడల్సిన అవసరం ఉండదాు.
ఆరోజు నుండి రవి తన కుండను మామూలు నీటిని కాలువ నుండి
తెచ్చుకొని తన చిన్నషాపులో పెట్టుకొని ఆ ముసలతని కోసం ఎదాురు చూస్తున్నాడు.
ఏదో ఒకనాడు అతను తిరిగి రావచ్చు. కాని అప్పటివరకు రవి నిజమైన డక్టర్‌ను
తన గ్రామానికి తేవాలని నిశ్చయించుకున్నాడు.
˛˛˛˛˛˛˛˛˛˛˛˛˛˛

March 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us