“షుగర్ డాడీ కల్చర్” అనేది ఒక సామాజిక విపరీత ధోరణి. ఇందులో సాధారణంగా పెద్దవయసు, ఆర్థికంగా బలమైన వ్యక్తి (షుగర్ డాడీ) మరియు తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి (షుగర్ బేబీ) మధ్య ఆర్థిక సహాయం–వ్యక్తిగత సంబంధం ఆధారంగా ఒక ఒప్పందం లాంటిది ఉంటుంది. మానసిక పరిపక్వత లేని అమ్మాయిలు సోషల్ మీడియాలో కనపడే విలాసవంతమైన జీవితాలు తమ కు ఎందుకు లేవు? దీనికి డబ్బే కారణం కదా! అదెలాగో సంపాదించుకుని ఆ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అందరి ఎదుటా డాబు చూపించుకోవడానికి పట్టే తప్పుతోవనే షుగర్ డాడీ ( ఒక విధమున ట్రాప్) లో పడుతున్నారు.
ఇది ప్రేమ అని మొదలై, క్రమంగా డబ్బు అవసరాల ఆధారంగానే కొనసాగుతాయి. క్రమంగా ఆశలు- అత్యాశలై కుటుంబ విలువల కంటే డబ్బు, లాభం, సౌకర్యం వీటి మీద పడి ప్రేమ కాస్త దోమౌతుంది… డబ్బు.. డబ్బు.. అని కుట్టడం మొదలౌతుంది. ఇవి పాశ్చాత్య ధోరణిని తమ స్వంతం చేసుకుంటున్న సంస్కృతి. కానీ అక్కడో- ఇక్కడో ఒకటీ-అరా ఉన్నత వర్గాలలోఉండేవి. రాను రాను మధ్యతరగతికి ఎగబాకిన గజ్జి సంస్కృతి.దీని వల్ల భారతీయ సమాజానికి ఎంతో హాని కలుగుతుంది. నైతిక విలువల క్షీణత కలుగుతుంది. మన భారతీయ సంస్కృతిలో ఉన్న ధర్మం, గౌరవం, కుటుంబ బంధాలు బలహీనమవుతాయి. మహిళల గౌరవానికి ముప్పు ఏర్పడుతుంది.
ఇది మహిళలను ఒక “వస్తువు”లా చూసే భావనను పెంచుతుంది. యువత తప్పు దారులు తొక్కుతారు, ఎందుకంటే డబ్బు సంపాదించాలనే యావలో పడి వారికి ఎలాంటి నైతికత గుర్తురాదు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత ఈ మార్గంలో పడే ప్రమాదం ఉంది. దీనితో మానసిక మరియు భావోద్వేగ సమస్యలు వస్తాయి. ఇలాంటి సంబంధాలు స్థిరంగా ఉండవు. దాంతో ఒత్తిడి, నిరాశ, నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. సామాజిక అసమానత పెరుగుదల డబ్బు ఉన్నవారికి మాత్రమే అధిక ప్రాధాన్యత కలిగే పరిస్థితి ఏర్పడింది. మన సంస్కృతికి మూలపట్టైన పవిత్రత మంట కలసిపోతున్నది. దీనివల్ల ఎన్నో గుప్త రోగాల పాలౌతారు. అంతేకాదు! ఏ సోషల్ మీడియాతో ఆకర్షింపబడి ఈ దారిని ఎన్నుకుననదో… అదే సోషల్ మీడియా వాళ్ళ రేటింగ్ కోసం గంటలు గంటలు చర్చోప చర్చలు చేసి, ఆ అమ్మాయి జీవితాన్ని బజారుకీడ్చి, మనసుతో పాటు జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేసి, వారి నోటి దురద తీర్చుకుంటారు. ఈ అమ్మాయి రాటు దేలినదైతే పర్వాలేదు చావకుండా బతుకుతుంది. లేదా ఆ అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఒకప్పుడు స్నేహితురాలు చెప్పిన మాట సోషల్ మీడియాలో చూసేదంతా నిజంకాదు! జాగ్రత్త గా ఉండాలనే మాట ఆనాడు పెడచెవిన పెట్టినా… ఈ రోజు చెవిలో గింగురుమంటుంది.
ఈ సంస్కృతి రావడానికి కారణాలు పాశ్చాత్య ప్రభావం మరియు సోషల్ మీడియా, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, Instagram వంటి Instagram లో కనిపించే గ్లామర్ జీవితం. కుటుంబాల మధ్య ఆర్థిక అసమానతలు పేదరికం, ఉద్యోగ అవకాశాల లోపం దాంతో అందరివలె తానూ బతకాలనే కోరిక, తామూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నామనే ప్రదర్శన ( ఒకరిని చూసి మరొకరు) సులభంగా డబ్బు సంపాదించాలనే కోరికతో అడ్డదారులు తొక్కడం, వద్దని అంతరాత్మనో లేక స్నేహితులో చెప్పితే విలాసవంతమైన జీవితం ఆకర్షణ వదులుకోలేక, తన స్నేహితురాలి వలె లగ్జరీ జీవితం జీవించాలని దానిమీద ఆకర్షణ కలుగుతుంది. ఎందుకంటే ఈ దారులు వెతుక్కునే పిల్లలకు ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం సరిగా ఉండక కుటుంబ, విలువల లోపంతో పిల్లలకు సరైన మార్గదర్శకత లేకపోవడంతోనూ… అందుకు తగిన ఆకర్షణలు ఆ ఊబిలోకి తమంత తామే పడతారు. దీనికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు తోడై ,ఈ చిన్న పిల్లల కోరికలకు వత్తాసు పలుకుతూ ఇలాంటి సంబంధాలను ప్రోత్సహించే వెబ్సైట్లు, యాప్స్ యువతను సర్వ నాశనం చేస్తున్నది.
విలాసవంతమైన జీవితం కొరకు తప్పు తోవపడితే తర్వాత బాధ-ఒత్తిడే మిగులుతుంది
దీన్ని అరికట్టడమెలా? అంటే మొదటి మెట్టు కుటుంబమే… నైతిక విలువల విద్య నేర్పించాలి! పిల్లలకు చిన్నప్పటి నుంచే ధర్మం, గౌరవం, స్వాభిమానం నేర్పాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యం. పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడాలి, వారి సమస్యలు అర్థం చేసుకోవాలి. వారికి సోషల్ మీడియా అవగాహన కల్పించాలి. అందులోని నిజానిజాలు; సాధక బాధకాలు మొదలైనవి పిల్లల మనసులోనికి ఇంకించాలి. వాస్తవ జీవితం ఇలా తక్కువ వసతులులన్నా పరవాలేదు! గౌరవంగా బతకడమే మనకు ముఖ్యమని, తాత్కాలిక సుఖాలకంటే స్వాభిమానమే గొప్పదని , అలాంటి ప్రలోభాలకు లోనూకావద్దని చెప్పాలి. దాంతో పాటు సోషల్ మీడియా భ్రమలు వివరించాలి. నువ్వు చూసేదంతా నిజం కాదు! తెరమీద అలా కనపడుతుంది వెనుక జీవితాలు వేరేగా ఉంటాయి. అదొక ఊబిలాంటిది. దాని దగ్గరకు పోతే అపవిత్రమైన జీవితంలో కూరుకు పోవడమే తప్ప గౌరవప్రదమైన జీవితం ఉండదని విడమర్చి చెప్పాలి. డబ్బులకోసం ఇటువంటి తోవలు తొక్కవద్దని చెప్పి, వారి అవసరాలు తామే తీరుస్తూ… అలా వీలు కాకపోతే ఆర్థిక స్వావలంబన గురించి చెప్పాలి! దానికోసం ఎలా చదవాలో? ఎలా నైపుణ్యాలను నేర్చుకోవాలో వాటి ద్వారా ఎలా సంప్రదించుకోవాలో తెలిసేలా వివరించాలి. యువతకు ఉద్యోగ నైపుణ్యాలు నేర్పాలి. ఇక ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి దోపిడీ సంబంధాలను నియంత్రించడానికి కఠిన నిబంధనలు అవసరం.
“షుగర్ డాడీ కల్చర్” అనేది తాత్కాలిక సుఖం ఇచ్చేదే కానీ దీర్ఘకాలంలో నష్టాన్ని కలిగించే ధోరణి. మన భారతీయ సంస్కృతి గౌరవం, ప్రేమ, బాధ్యత మీద నిలబడింది.
కాబట్టి యువతలో స్వాభిమానం మరియు నైతికత తో పాటు కష్టపడి సాధించే జీవితం విలువలను పెంపొందిస్తే మాత్రమే ఈ సమస్యను తగ్గించవచ్చు. ముఖ్యంగా ఒకరిని చూసి మరొకరు ఇందులో కూరుకొని పోతున్నారు.
అంతేకాదు తన తోటి వారితో పోల్చుకోవాడాలు ఎక్కువ అయినవి… ఈ పోలిక చిన్న వస్తువు దగ్గర నుండి అతి ఖరీదైన వస్తువులు, నగలు, ఇండ్లు ఇలా దానికి అంతే లేదు! హద్దు అసలే లేదు. సామాజిక వేత్తలు తమ వంతు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి.
ఇంట్లో ఆధ్యాత్మికత వాతావరణం ఉండి తల్లిదండ్రులు ఆచరిస్తే… పిల్లలలో కాస్త పాపభీతి- భయంతో వెనకడుగు వేసే అవకాశమున్నది. తప్పొప్పులు బేరీజు వేసుకునే ఆలోచన కలుగుతుంది.
ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందో? అన్న వెరపు ఎప్పుడైతే పోయిందో ఇలాంటి అసహజ పనులు చేయడానికి యువతులు వెనుకాడడంలేదు. దైవభీతి, పాపపుణ్యాల పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గి వారు మందలించబోతే ఎదురు తిరిగి వారిని మానసికంగా గాయపరచడం చేస్తున్నది యువత. అందుకని బాల్యంలోనే నైతిక విలువలను నేర్పించడం, తమ శక్తిమేరకు పిల్లల అవసరాలను తీర్చడం చేయాలి. వాళ్ళముందు విలాసవంతమైన జీవితం లేదని తరచూ భార్యాభర్తలు గొడవపడితే అలాంటి కోరిక సమంజసమైనదేమోననే ఆలోచన పిల్లలో కలుగుతుంది. అలా కాకుండా మన పరిథి ఆదాయంలో మనం గౌరవంగా, ప్రశాంతంగా బతుకుతున్నాము. మన జీవితాలకేమైంది హాయిగా ఉన్నామనే సంకేతాలు పిల్లలకు అందించాలి. అపుడు సంతృప్తి ముఖ్యమనే జీవన విధానానికి పిల్లలు అలవాటు పడతారు.
పాఠశాలలోనూ ఉపాధ్యాయులు చెడు తోవ పడ్తున్నాడని పసిగట్టి సరైన దారిలోకి తెచ్చే విద్యాబోధన చేయడం చేయాలి.
ముఖ్యంగా ఈ ఆకర్షణలన్నీ మొబైల్స్, లాప్ టాప్ల వంటి విద్యుత్ పరికరాలే కాబట్టి వాటికి నియంత్రణ ఏర్పాటు చేసి, పిల్లల మీద నిఘా పెట్టాలి. ఎటువంటి పోస్ట్ లు, వెబ్ సైట్లు, చాటింగ్ ఎవరితో చేస్తున్నారని, తరచూ ఎలాంటివి చూస్తున్నారని గమనించి హెచ్చరిక చేయడం, వినకపోతే వాటికి తాళం వేయడం చేయాలి. అలా చేయాలంటే పిల్లలతో సమయం గడిపి, వారికి ఖాళీ సమయం చిక్కనీయ వద్దు.ఇలానే అని కాకున్నా .. తమకు తోచిన విధానంలో ఆకర్షణల వైపు పోనీయకుండా చేయాలి.
మనదేశంలో యువత ఎక్కువ ఉన్నది. దాంతో మన దేశం ఎంతో ఉన్నతి సాధించవచ్చు. ప్రపంచమంతా ఈ మన యువ శక్తికి ఈర్ష్య- అసూయలు పడుతున్నారు. మనం మన శక్తిని మనమే నిర్వీర్యం చేసుకుంటున్నామని త్వరగా గ్రహించాలి! యువతను పెడమార్గం పట్టకుండా చూసి, మనతో పాటు దేశ అభివృద్ధి లో పాలు పంచుకునే కొత్త నైపుణ్యాలతో అవసరమైనవి కనిపెట్టే దిశగా ప్రోత్సహిస్తూ… పిల్లల అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిని కోరుకుందాం!
సర్వే జనాః సుఖినో భవన్తు!!
