మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

రోజుకోసారి కొత్తగా పుట్టడం 

by Chandaluri Narayana Rao August 15, 2022
written by Chandaluri Narayana Rao

రోజుకో నిజం

రాత్రికి నాకు తగాదా పెట్టి

పక్కరోజుకి వెళ్లి దాక్కుంటుంది.

ఒళ్ళు విరుచుకుని

కాలమెంత జాగానిచ్చినా

చీకటిలో  నానిన మాటలలో

ఒక అర్థం తెల్లగా మెరుస్తూ పారుతుంటే

మరోవైపు అదే అర్థం నల్లగా తునకలై…

కళ్లెదుటే పల్టీ కొట్టి

ప్రశ్నలుగా  పుట్ట పగిలి 

పాయలు పాయలుగా పాకే 

ప్రతి పన్నెండు గంటల ప్రయాణంలో

మనసుకు నిద్రనప్పజెప్పి

కన్నార్పని భయంతో 

కటిక చీకటిలో శరీరం ఎన్నో అనుభవాలకు చేసేది దాస్యమే .

ఇంతలో  వేకువ వెన్నును గుచ్చగానే

నిన్న నిజం  నేడెక్కడోనని వెతికే కళ్ళకు

పగటి నటనే ఓ వింతసమస్యగా

విస్మయించలేనిదే యుద్దానందం.

దారిపొడవునా ముళ్ల కాట్లకు

కళ్ళ వెంట మాటలు

చురుకు చురుకుమని జారి

తడిసే  జాము జాములో

బొట్లు బొట్లుగా కదిలిన భావప్రవాహానికి 

రాత్రికో నిజంలా

పగటికో అబద్దం కొత్త అవతారం.

క్షణం తీరికలేని మనసు ఆకలికి

ఆవిరయ్యే అందాలన్నీ 

రుచిగల ఇష్టాలుగా

రాత్రి వేదిక కావడం అనివార్యం.

మనసును చంపుకోలేని శరీరం

శరీరాన్ని తెంపుకోలేని మనసు

పెనవేసుకుని ముడులేసుకుని

రోజుకోసారి కొత్తగా పుట్టడం

రోజుకోసారి వింతగా గిట్టడమనే

వింతానుభవాల నేపధ్యమే సాంగత్యం.

పగటి ప్రతిధ్వనిగా రాత్రిని

రాత్రి ప్రతిరూపంగా పగటిని

మనిషిని శాశ్వతంగా లిఖించి

మనసును  నటింపచేయడమే సత్యం.

రోజుకో నిజం ఓ వైపు

పగటికో అబద్దం మరోవైపు

మద్య మనిషి పాదం

మనసు పథం వేరువేరుగా

మనిషి తనకు తానే భిన్నంగా

మనసును నగ్నంగా 

బయట నిలబెట్టటమే 

సత్యమైనది….స్వార్థమైనది  …

స్వర్గమైనది….సొంతమైనది….

….చందలూరి నారాయణరావు

            9704437247

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorizedవ్యాసాలు

జీవిత సత్యాలు – చలం లేఖలు

by Cheedella Seetha Lakshmi August 15, 2022
written by Cheedella Seetha Lakshmi
   తెలుగుజాతిని ఓ కుదుపు కుదిపి పేరుకున్న తరతరాల జడత్వాన్నుంచి వెన్నుతట్టి మేల్కొల్పిన    అసాధారణ  వ్యక్తి  చలం. 

20 శతాబ్దిలో తెలుగువారిలో ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన చలం ఎవరితోనూ పోల్చడానికి వీల్లేని వ్యక్తి అంటే అతిశయోక్తి కాదు.రమణాశ్రమం వెళ్లకముందు చలం ఆలోచనలు,జీవితం ఒక విధంగా ఉన్నాయి.రమణాశ్రమం వెళ్ళాక ఆయన అభిప్రాయాల్లో ఎంతో మార్పు కనిస్తుంది.

వ్యక్తిగతాభిప్రాయాలు,జీవన విధానం,తత్కాలీన సాంఘిక సమస్యలు,ఉద్యమాలు, రచనా వివరాలు, అనుభవాలు,సాహిత్య విమర్శలు,ఆధ్యాత్మిక సాధనలు మొదలైనవెన్నో విషయాలు చలం ఉత్తరాల్లో దర్శనమిస్తాయి.చలం సాంఘిక,వైవాహిక వ్యవస్థలో చిచ్చు రగిల్చి సంప్రదాయగుండెల్లో జ్వాలలురేపిన కాలమది.ఆస్తిక నాస్తికుల విచికిత్సతతో దేవునికోసం దేవుళ్లాడిన కాలం కూడా అదే. చలం ఆలోచనలకు,ఆశయాలకు రూపకల్పనే చలం మిత్రులకు రాసిన ఉత్తరాలు.

” ఉత్తరాలు వ్రాయడం,వ్రాయించుకోవడం ఒక గొప్ప సృజనాత్మక కళ. ఈ కళ తెలుగు రచయితల్లో చలం గారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అని సాహసం చేయలేము గానీ,ఈ కళ కళాత్మకంగా తెలిసిన వారిలో చలం గారు ప్రముఖులు అని మాత్రం అనొచ్చు.” అని సంజీవదేవ్ పేర్కొన్నాడు.

చలం జీవిత పరిణామక్రమం లేఖల్లో స్పష్టంగా గోచరిస్తుంది.దీక్షితులకు రాసిన లేఖలో చలం ఇలా చెప్పుకుంటాడు.” నేను చాలా Sensitive. ముఖ్యంగా స్నేహితుల విషయమై కొన్ని సమయాల్లో వాళ్ళని సరిగా అర్థం చేసుకోను.మిమ్మల్ని ఎప్పుడూ ఘనంగా ఎంచుకున్నాను— నా ఉపయోగం కోసం కాదు.నేను చూసిన వాళ్లలో Generally as one of the Thoroughly nice gurllness persons ( Few they are) కానీ యీ మధ్య మీకు తెలీకుండా నేనేమో,మీరు మీ ఉత్తరాల్లో నన్ను దెప్పుతున్నట్లు కనపడ్డది.నేనేమన్నా చేశానా?” చలంది సున్నితహృదయం.తన మనస్తత్వం తెలిసిన వారితోనే పరిచయాలు పెంచుకుని మనసులోని విషయాలు పంచుకున్నాడు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

చలం దీక్షితులు గారికి వ్రాసిన ఉత్తరాలు చాలా విలువగలవి. “ఈ ఉత్తరాలు చదివితే వేంకట చలం గారి హృదయానికి సమీపముగా పోవచ్చు.దానిలోతు, వైశాల్యము తెలుసుకోవచ్చు.వారి సారస్వత కృషిని,పురిగొల్పిన భావోద్వేగం ఇందు గమనింపవచ్చు.
అరమరిక లేకుండా నిర్భయంగా మనుష్యుల్ని గురించీ సంస్థల్ని గురించీ చర్చించుకునేందుకు ఉత్తరాల్లోనే సావకాశముంది అట్టి చర్చలూ– అభిప్రాయాలూ– ఈ ఉత్తరాల్లో ఉన్నవి.కొన్ని ఘాటుగా కూడా ఉన్నవి.” అన్నాడు దీక్షితులు.

” జీవితమంటే ప్రేమ నాకు,దేవుళ్ళో కానీ,బతుకు తరువాత బతుకులో గానీ,దేశంలో గానీ నాకు విశ్వాసం లేదు.” అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాడు చలం.

అరుణాచలం వెళ్ళాక వీరేశలింగంకు రాసిన లేఖలో కూడా ఇలా తెల్పాడు.” ఇదివరకైనా నేనేదో అందరితో కలిసే వాణ్ణనుకున్నారా? ఏ నలుగురు మిత్రులో తప్ప( వాళ్ళు నా అభిప్రాయాలు ఒప్పుకునేవాళ్లే) ఎవరితోనూ నాకెప్పుడూ సంబంధం లేదు.బతికిపోయినాను.అట్లాంటి వాళ్ళు నా కిప్పుడూ వున్నారు.” ఆయనకు పరిమిత సంఖ్యలోనే మిత్రులుండేవారని,ఈయన అభిప్రాయాలనర్థం జేసికొనే వారితోనే సాన్నిహిత్యం పెంచుకునేవారని తెలుస్తుంది.

చలం దీక్షితులకు రాసిన ఉత్తరాల్లో మనసువిప్పి తన కుటుంబ విషయాలు,వైయక్తిక విషయాలను వెల్లడించాడు. ప్రజలు తన జోలికెప్పుడు రారని అంటూ ” లోకాన్ని తన్నేవాణ్ణి చూచి లోకం అవసరమైన దూరానికి తానే జరుగుతుంది”. అంటూ తను స్థాపించిన బడిలో పిల్లల్ని పంపించనందుకు ప్రజల మీద కోపంగా ఉందని తెలిపాడు. తనను హెడ్మాస్టరుగా బెజవాడలో వేశారని,మీతో ఎంతో చెప్పాలని ఉందని తన మనసులోని మాట దాపరికం లేకుండా దీక్షితులకు తెలియచేసే ఉద్దేశ్యం గల చలం ఆనాడు ప్రభుత్వ ఉద్యోగం చేసే చలం ఇలా రాశాడు.” మీ స్నేహితుడు మన ఆఫీసులో నా మీద చాలా విషం పోశాడు. నేను నడవడిలో, డ్రెస్ లో,మాటల్లో ,నడకలో చాలా కేర్ లెస్ గా వుంటానని వెళ్లి స్వయంగా పనిపట్టి చెప్పాడు.అతను నేనడిగినప్పుడు, ఈశ్వరుని ఎదుట తానేమీ యెరుగనన్నాడు.
పొద్దస్తమానం మానవ జంతుసేవ మాట్లాడతాడు మళ్లీ” అని మాలతీబాయికి తప్ప తన మంచితనం ఎవరికీ తెలియదని రాశాడు. ఇలా ఆనాటి సమాజ పరిస్థితి, చలంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చాటుగా చలం గురించి
నీచమైన అభిప్రాయాలు కలవారని,చలం ఎదుట కనిపిస్తే భయపడి అబద్ధాలాడేవారని,చలం గురించి ప్రజలు రకరకాల వ్యాఖ్యానాలు చేసికొనేవారని దాన్ని బట్టి అప్పట్లో సంఘంలో చలంకు గల విలువ తెలుస్తుంది.ఆనాటి విద్యా విధానానికి తిరగబడి,విద్యావిధానం నచ్చక తన పిల్లలు చదువు మానేసినట్లు చలం దీక్షితులకు రాసిన ఉత్తరంలో తెలిపాడు.తన జీవిత యత్నాన్ని,తన స్ట్రగుల్ ను అర్థం చేసుకో గలిగిన వాళ్ళు లేరని,కొత్తవాళ్ళు స్నేహం చేయడం లేదని,తన జీవన పోరాటంలో,జీవన యత్నంలో చివరికి తనొక్కడే మిగిలి పోతాడని తెలిపాడు.చలంలో తిరుగుబాటు ధోరణి కన్పిస్తుంది.సంఘాన్ని ఎదిరించైనా సరే పోరాటంలో ఒక్కడే మిగిలిపోయి తుదివరకు జీవిత లక్ష్యాన్ని సాధించేవరకు పోరాడుతూనే వుంటానని స్పష్టంగా తెలియచేశాడు. పట్టుదల కలిగిన వాడుగా,ఎవరికి భయపడని వాడుగా తన నిర్ణయం పట్ల శ్రద్ధ కలవాడుగా,ఈశ్వరుని పట్ల విశ్వాసం కలవాడుగా కనిపిస్తాడు.

చలం భవిష్యద్దర్శనం కలవాడుగా కనిపిస్తాడు.తను రచించిన సెక్స్ పుస్తకం పేరు ‘ స్త్రీ’ ని ఒక్క నిమిషం నాకు విశ్రాంతినివ్వక — అగాధ వియోగభారం కిందనో చీల్చి,నలిపి ఊపిరాడక నా జీవితాన్ని పాలించే స్త్రీ లోకానికి నివేదతము చేస్తున్నానని రాస్తూ ” ఇది స్త్రీ లోకానికి నా Farewell ఏమో ,చివరికి నేనూ మారబోతున్నానేమో! ఎవరికి తెలుసు? ” అని దీక్షితులకు రాశాడు.గొప్పవాళ్ళు,
మహాత్ముల మాటలు అనాలోచితంగా,ఆయాచితంగా వెలువడుతాయి. భవిష్యత్తులో ఆ మాటలకర్థం ఎంతో ఉంటుంది.నేను మారబోతున్నానేమో అని చెప్పిన చలం దార్శనికుడు,మహాత్ముడు,ఋషితుల్యుడు,మనీషి, భవిష్యత్తును దర్శించిన కాలజ్ఞానవేత్త అని ఘంటాపథంగా చెప్పవచ్చును.ఆయన మారిన విషయం ఆయన చెప్పినట్లుగానే అరుణాచలం జీవితంలో స్పష్టమవుతుంది.చలం ఆలోచనా వైఖరి,జీవన విధానం దీక్షితులకు రాసిన ఉత్తరాల్లో వ్యక్తమౌతుంది.

తన కాలం మధురంగా గడిపేందుకు ‘ ఒక యూరేషియన్ అమ్మాయి’ ఉన్నట్లు తెలుపుతూ ” జరగడానికి వీలు దివ్య సన్నివేశాలు నా జీవితంలో జరుగుతాయని ఇంకా కలలు కంటున్నాను.” అని చెప్పిన ఆశాజీవి.తన సూక్ష్మ శరీరంలో ఆధ్యాత్మిక జ్ఞానత్వం పొందుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశాడు దీక్షితులకు రాసిన లేఖలో.చలం ఆలోచనల్లో మధ్యమధ్య మార్పును గమనించవచ్చు.దేవునిపట్ల విశ్వాసం లేదని గట్టిగా చెప్పాడు ఒకసారి.వెంటనే మరోసారి ఈశ్వరునిపట్ల విశ్వాసముంది అంటాడు.ఆస్తినాస్తిక విచికిత్స,ద్వైధీ భావన చలంలో కనిపిస్తుంది.చలంకు స్నేహితురాండ్రు వున్నట్లుగా లేఖల ద్వారా తెలుస్తుంది.

” యూరేషియన్ స్నేహితురాలు” ఒక మోటారు కారు తీసుకొని రమ్మంటుందని తెలిపాడు ఒక లేఖలో. లీల పరిచయం మొదలైనవి లేఖల్లో రాశాడు. దీక్షితులకు రాసిన ఇంకో లేఖలో కిటికీ కింద ఓ అమ్మాయి వెడుతుందని, ఆ అమ్మాయిని తనూ, తనను ఆ అమ్మాయి పరస్పరం ఇష్టపడుతున్నారని,కానీ వారి మధ్య పది గజాల దూరముండేదని తెలిపాడు.
ఆ మాత్రం దూరం కూడా సహించలేని మనస్తత్వం చలందని స్పష్టంగా వ్యక్తమవుతుంది.

తన ఉద్దేశ్యాన్ని ఒక లేఖలో ఇలా తెల్పాడు.” యవ్వనంలో ఉన్న భార్యలకు పిల్లలు లేకపోతే సంతానమివ్వడం,బాల వితంతువులకు కూడా” అనడం వల్ల స్త్రీలపై చలంకున్న వ్యామోహం తెలుస్తుంది.ఇదే సందర్భంలో ఇంకో మాట అంటాడు.అన్ని ఆశయాలను వదులుకొని ” గొప్ప యోగినౌతాను.నా అద్భుతమదిమల కీర్తి దిగంతంగా వ్యాప్తిస్తుంది.స్త్రీ పురుషులు నా పాదాలముందు నమస్కరిస్తారు”.అని గొప్ప యోగి అవుతున్నట్లుగా తను కొన్ని మహిమలు చూపించేవాడుగా తెలియజేశాడు.వ్యతిరేక భావ ధోరణి స్పష్టంగా గోచరిస్తున్నది. ఎన్నో చేయాలనుకుంటున్నట్లు కలలు కన్నాడు.

చలం తన జీవితంపై ఖచ్చితమైన అభిప్రాయాన్ని దీక్షితులకు రాసిన లేఖలో ఇలా తెల్పాడు.” నాకు జీవితమంటే ప్రేమ,కన్నీళ్లలో,నవ్వులతో,నీచత్వంతో,త్యాగాలతో, స్వార్థంతో,ఔదార్యంతో,విషాదంతో,ఆనందంతో ఈ జీవితమే మంచిది.మళ్లీ మళ్లీ అనంతంగా పుడుతో పెళ్లి చేసుకుని సంపాయించి,పిల్లల్ని కని, పాపాలు చేసి,ప్రేమించి,ద్వేషించి,నవ్వి,మూలిగి కాని ఏ మోక్షం అక్కర్లేదంటాను నిశ్చయంగా” అని సూటిగా చెప్పాడు.లోకంలో తనను గృహచ్చేదకుడంటారని తెల్పడం వల్ల సమాజంలో చలంపై ఎటువంటి నీచాభిప్రాయముండేదో తెలుస్తుంది.అందుకనే ఆ కాలంలో చలంకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి భయపడేవారు.

రామజోగారావుకు రాసిన ఉత్తరంలో ” మూడు నెలల నుంచి స్త్రీ స్నేహమయింది కానీ సంపర్కం కాదు.ముందు కూడా తటస్థించదు” అని వాస్తవాన్ని చెప్పాడు.దీక్షితులకు రాసిన ఉత్తరంలో చలం గారికి ఒక తమాషా అనుభవం జరిగిందని రాశాడు. కనిగిరిలో తనకపరిచితురాలైన ఒక హైస్కూల్ అమ్మాయి అర్ధరాత్రి చలం ఇంటికి వచ్చి చలాన్ని లేపి తనను మోహించమని,ప్రేమించమని అర్థించిందట.తాగుతున్నట్లు ( మద్యం)గా కూడా లేఖల్లో తెలియపరిచాడు.చలం ఆలోచనలు స్త్రీ చుట్టే తిరుగుతుండేవి అనడానికి చలం రాసిన ఉత్తరాలే ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిపోతాయి.

” స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు” అని కుండబద్ధలు కొట్టినట్లు పచ్చినిజాన్ని నిర్మొహమాటంగా వ్రాస్తూనే దీక్షితులకు రాసిన ఉత్తరంలో ” స్త్రీ కొరకు జీవితాన్ని ధ్వంసం చేసుకున్నవాళ్ళని,అంటే కీర్తి,డబ్బూ కాదు- అంతకన్నా శ్రేష్ఠమయినవి- జీవితం మీద ఆసక్తిని-శక్తిని- బతకడంలో ఆనందాన్ని పోగొట్టుకున్న వాళ్ళని చూస్తే- నేను చాలా వివేకవంతుణ్ణిగా తోస్తాను.” అని లోకంలో తనకంటే కూడా బలహీన మనస్తత్వాలు కలవారున్నారని వారికంటే కూడా తను తెలివిగలవాడుగా చెప్పుకొన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు.స్త్రీ మూర్తి పట్ల ప్రేమను చూపించాడు కానీ దిగజారుడుతనం లేదని తెలుస్తోంది.స్త్రీలే తనను ఆప్యాయతతో చూశారని అనుకోవచ్చు.

తన ఉద్దేశ్యాన్ని ఇంకా ఇలా తెల్పాడు.” నా పిల్లల్ని చదివించాలని, వాళ్ళకి పెళ్లిళ్లు చెయ్యాలని ఏమీ వ్యామోహం లేదు.మా అబ్బాయి రౌడీ అయినా,అమ్మాయిలు వేశ్యలైనా నాకు సంతోషం,నమ్మకం- నేను స్వతంత్రుణ్ణి.నా ఆత్మ నాది.” అని అంటూ స్వేచ్ఛా ప్రియత్వాన్ని చాటాడు. సమాజాన్ని,సంసారాన్ని పట్టించుకోని స్వేచ్ఛాజీవిగా కనిపిస్తాడు చలం.మూఢాచారాన్ని నిరసిస్తూ, దీక్షితులకు రాసిన ఇంకో లేఖలో “ఏమి నమ్మినా నాకు వచ్చే నష్టాలేవీ లేవు.ఆ విధంగానే నాకే విశ్వాసం కుదిరితే అదే నిజమని తోస్తే రేపు సంపూర్ణమైన నిరీశ్వరవాదిని గానీ లేక మూఢాచారవంతుణ్ణి సనాతనుణ్ణి కానీ- కావడానికి నాకేమీ అభ్యంతరం లేదు.
ఏ పల్టీ కొట్టడానికో నేను సిగ్గుపడను.నాకు వాస్తవమని నిశ్చయంగా తోచాలి.మీరు- నా జీవితంలో కొన్ని పల్టీలకు కారణం మీరు” అంటూ తను నమ్మిన సిద్ధాంతంలో చర్చించే వాడుగా( శృంగారి కానీ,ఆధ్యాత్మిక మార్గంలో కానీ) తన మనసుకు నచ్చినపుడే,సత్యమని నిశ్చయంగా తెలిసినప్పుడు ఏ మార్గంలోనైనా వాస్తవానికి దగ్గరగా నడుస్తూ తృప్తిగా చరించే మనస్తత్వం చలందని తెలుస్తుంది.చలం పరిపూర్ణ విశ్వాసానికి పట్టం కట్టాడు.

అంత స్వేచ్ఛను కోరి,సంఘాన్ని ఎదిరించి ఇష్టానుసారం చరించి శృంగారంలో మునిగితేలిన చలం స్త్రీ స్వేచ్ఛను కాంక్షించిన చలం ” పశ్చిమ భౌతిక శాస్త్రమూ, ఠాగూరు గారి బ్రహ్మసమాజపు వేదాంతప్రభావం వల్ల చలంలో మత విజ్ఞానం ఏర్పడి ఆధ్యాత్మికతవైపు దారి తీశాయి.” స్త్రీ కాముకుడు,కథకుడు చలం చచ్చిపోబోతున్నాడు.ఈశ్వర సందేహంలో శృంగార తత్వంలో మునిగి బీరుతాగే, మాంసం తినే,ఆడవాళ్ళని ముద్దు పెట్టుకునే జి.వి.జీవిలో ఆత్మవుందని గుర్తించకలిగింది– మీరు,అవును మీరు” అని దీక్షితులకు రాసిన ఉత్తరంలో వివరించాడు.చలంలో పరివర్తన వచ్చిన విషయం లేఖల్లో స్పష్టమవుతుంది.నిరీశ్వరవాది ఈశ్వర వాదిగా మారాడు.భగవాన్ పై విశ్వాసం కుదిరింది.వాస్తవాన్ని నమ్మేవరకు విశ్వసించని చలం ఆత్మానుభవం వాస్తవమని తాను నమ్మిన వాస్తవ ప్రపంచం నుండి మానసిక మార్పుకులోనై వాస్తవమనే నమ్మిన ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించాడు. తనను చీదరించుకున్న ఆంధ్ర దేశాన్ని,ప్రజలను వదలి సత్యాన్వేషణలో అరుణాచలానికి దారితీశాడు. శృంగారంలో ఆనందాన్ని అనుభవించి వైరాగ్యంతో ఆధ్యాత్మిక చింతనతో ఆనందాన్ని అనుభవించడానికి పయనమయ్యాడు.

” సంఘసంస్కార విషయంలో,స్త్రీల బాధల విషయంలో బాధననుభవించి ” నా ఆత్మ ఏ కొంచెం,సాక్షాత్కారమైనా నాకు ఆడపిల్లల అవసరం లేదు అంటాను” అంటూ దీక్షితులకు రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు. స్త్రీ సౌందర్యం కోసం కలలు కనే చలం ఈశ్వర సౌందర్యం కోసం పరితపించడం మొదలు పెట్టాడు.

చలం లేఖల్లో సాహిత్య విషయాలు చోటుచేసుకున్నాయి.
చిత్తశాంతి లేదు.ఎప్పుడూ మానసిక ఒంటరితనం,బాధతోనే ఎక్కువ కాలం గడిపాడు చలం.తను రచన చేయడానికి కారణాన్ని వివరిస్తూ చలం జోగారావుకు రాసిన లేఖలో ” బాధ అనేది ప్రపంచంలో ఉన్నన్నాళ్లు పుట్టడమనేది విషాదం నాలుగు మణుగుల ఆనందం వున్నాసరే రెండు తులాల బాధ దాన్నంతా చెరుపుతుంది.” అని రచనా హేతువును వివరించాడు.చలం బాధాతప్తజీవి.బాధలోంచే కవిత్వముద్భవించిదని తేల్చి చెప్పాడు నిజమే ప్రథమ కావ్యం రామాయణం శోకంతోనే శ్లోకం ఉద్భవించిన వాల్మీకి మహర్షి నోటిద్వారానే వెలువడింది.

పత్రికలలో తననెవరేం తిట్టినా పట్టించుకోలేదని ” నా వైపు కొందరున్నారనే ఇట్లాంటివి సహించరనే తెలిసి వొస్తే కొంత భయపడతారు విమర్శకులు” అని జోగారావుకు రాసిన లేఖలో తెలిపాడు.సినిమా స్టార్ల ఆరాధకులైన పత్రికలవాళ్ళు ( స్వతంత్ర) చలాన్ని వ్రాయమని,అచ్చువేసుకుంటామని బతిమాలి,బలవంతం చేసి వ్రాయించుకుని అచ్చువేయకుండా తనపై ఆవిధంగా కసిని తీర్చుకున్నారని,మోసం చేశారని, ‘ లోకం తీరే అంత- మోసం,దొంగతనం ఉంటేనే గాని మనిషిని ఏ ఫీల్డ్ లోనైనా సరే సక్సెస్ వరించదు” అంటూ జోగారావుకు రాసిన లేఖలో విశదం చేశాడు. లోకంలో అంతా మోసం,దగాయే అని నిక్కచ్చిగా చెప్పాడు.అవును ఇప్పటికైనా పత్రికలవాళ్ళు పేరున్న వాళ్లవి,తెలిసిన వాళ్లవే అచ్చువేస్తారు.బాగా రాసినాసరే వాళ్లకు పరిచయం లేకుంటే,సిఫార్సు లేకుంటే అచ్చు వేసుకోరు ప్రముఖ పత్రికల వాళ్ళు.

బెజవాడ ప్రజలు తనను తరిమేసినట్లుగా, సామాన్లు అన్నిటిని అమ్మేసి,బతికివున్నామనే సంతోషం కూడా లేదని,దేశం ఒదిలితేనే బాగు పడ్తామని జోగారావుకు రాసిన లేఖలో తన మానసికవ్యధను వ్యక్తం చేశాడు.

చలం రచనల్లో వాస్తవికత ఉంటుందని తను నమ్మిన సిద్ధాంతమే రచనలో ప్రతిబింబిస్తుందని చలం దీక్షితులకు రాసిన ఉత్తరం వల్ల తెలుస్తుంది.చలం నిండా ‘సెక్స్’ ఉంటుందని అంటారు.’సెక్స్’ నేరం కింద ఒప్పుకుంటున్నానని కాదు. ఏ విషయంలోనైనా పూర్తిగా మునిగి కాని తార్కిక,మానసిక పర్యవసానాల దాకా తరచిచూచే వాడు త్వరలో సత్యమార్గం అందుకుంటాడని నా నమ్మకం.” సెక్స్ నా ముక్తి మార్గం” అని రాస్తూ దేశంలో ఇంతవరకు లేని కొత్తదనం నాలో ఏమీ లేదని,ఏది ఫీల్ అవుతామో అదే రాస్తామని చెప్తాడు.అయితే తన రచనలో ఫోర్స్ లేదని తానే ఒప్పుకుంటాడు.మంచి సారస్వతం రెండు రకాలని, ఒకటి గోడమీది పటంలాగా మనసుని అందాలతో నింపేదని,రెండవది ఉరిమి ఉరిమి చించి చెండాడి మంచికో చెడ్డకో జీవితాన్ని ఇన్ఫ్లుఎన్స్ చేసేదని చెప్తూ మొదటి రకం సాహిత్యం బళ్ల కొద్ది వస్తుందని,రెండో రకం సారస్వతాన్ని దేశానికి అందించేది నేను ఒక్కణ్ణేనని దీక్షితులకు రాసిన లేఖలో చెప్పుకున్నాడు. అంటే చలం రచనలు జీవితాలపై ప్రభావాన్ని చూపించేవిగా వుంటాయని తెలుస్తుంది.
ఆ విషయం చలమే ఒప్పుకున్నాడు.చలంకు తన రచనల పట్ల అమిత విశ్వాసం,ప్రజలను మార్చగలననే నమ్మకం బలంగా ఉండేదని తెలుస్తుంది. ఉత్తరాలు ఆయన మనసును అద్దం పడుతున్నాయి.

దీక్షితులకు రాసిన ఉత్తరంలో చలం అభిప్రాయం స్పష్టంగా గోచరిస్తుంది.1900వ సంవత్సరం తర్వాత ప్రచురించిన పుస్తకాలలో ఒకటి కూడా కొంతకాలం నిలవదని,” మన సారస్వతంలో, అభిప్రాయాలలో కొత్త కాలువలూ,కళలో కొత్తమార్గాలూ ప్రారంభించిన వాళ్ళు కొద్దిమంది వున్నారు.వాళ్ళల్లో నేనొకణ్ణి”. అని తన టెక్నిక్,ఆలోచనలు పాశ్చాత్య వాతావరణానికి సంబంధించేట్లుగా వుంటాయి కాబట్టే ఈ దేశంలో అట్లాంటి సాహిత్యం అభివృద్ధి చెందిందని ఘంటాపథంగా చెప్పాడు. దీన్నిబట్టి చలం ఎంత ఆత్మవిశ్వాసం గలవాడో తెలుస్తుంది.

రాజకీయంగా,సాంఘికంగా ముందు ఏ దేశం మారబోతుందో దాన్నిబట్టే తన పుస్తకాలకు విలువుంటుందని ” ఈనాడు వాస్తవజీవితంలో,మాటల్లో చాలామంది చూపుతున్న పోకడలనే నేను కళారూపంలో వ్యక్తం చేశాను” కానీ భాష నాకు ఆటంకమని,ఉద్రేకానికి తగ్గ శైలి లేదని చెప్పాడు.

ఆధునిక రచయితలు వారి కావ్యాలపై స్థాలీపులాక న్యాయంగా విమర్శించాడు. దీక్షితుల రచనపై ( వరూధినీ,చెంచురాణి) పై నిష్పాక్షికంగా విమర్శ చేశాడు.” మీ రచనల్లో ఉప్పు కారం తక్కువగా తోస్తుంది. ఈ అభిప్రాయం నా స్వంతం.కానీ మీ సూనృతమూ, మెత్తని హాస్యం చాలా మంది ఎంత ఇష్టపడతారో ఊహించుకోగలను.కొంచెం కట్లు వొదిలించుకుని,ప్రయత్నిస్తుంటేబహు గొప్పవి రాస్తారని నా నమ్మకం.” అని సూచనలతో కూడిన విమర్శ,,తియ్యని చురకలు వేశాడు.

“మునిమాణిక్యం”వి కులాసాగా చదువుకోవడానికే పనికి వస్తాయని,” విశ్వనాథ” కవిత్వం అర్థం కాదని,” కృష్ణశాస్త్రి” తను నిజంగా ఏమి ఎట్లా అనుభవించాడో అదే రాస్తే అద్భుతమైన గీతాలు వ్రాయగలడని అభిప్రాయాన్ని తెలుపుతూనే హృదయం మీద అతనిచ్చే నాజూకు నొక్కులు అని మెచ్చుకుంటాడు.” వేదం” కలంలో శక్తి వున్నా కవిత్వం కోసమే బతుకుతాడని,” నోరి” కవికింద నాకు తెలీదు అనీ,” నాయని” కవిత్వం నచ్చదు.” బసవరాజు అప్పారావు” ఒక గొప్ప కవిత్వపు పంక్తికోసం నూరుడబ్బాల చత్త రాస్తాడనీ,” రాయప్రోలు” శైలి బాగునప్పటికీ కొత్త అభిప్రాయాలు సున్న అని నిర్మొహమాటంగాను,కుండ బద్దలు కొట్టినట్లుగానూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

ఈ విధంగా చలం మిత్రులకు రాసిన లేఖలను పరిశీలించి నట్లయితే చలం హృదయం విప్పి తను అనుభవించిన ప్రతి విషయాన్ని మిత్రులతో దాపరికం లేకుండా వ్యక్తీకరించినట్లు గమనించవచ్చు.సాంఘిక,
వేదాంత,సాహిత్య విషయాలు,ఆరోగ్య విషయాలు,కుటుంబ విషయాలు ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో విషయాలు చలం లేఖల్లో చోటు చేసుకున్నాయి.చలం అనుభూతులు,అనుభవాలు,
కష్టసుఖాలు మిత్రులతో లేఖలద్వారా పంచుకున్నాడు.చలం ఔద్యోగిక జీవితంలో తటస్థపడిన వ్యక్తుల మనస్తత్వాలు, జీవిత సిద్ధాంతం, జీవన విధానం మొదలగునవి ఎన్నో విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.

రమణాశ్రమ జీవితంలో చలం భావనా దృక్పథం
(ఉత్తరారుణాచలం)

అరుణాచలం వెళ్ళాక చలం మనస్తత్వంలో మార్పు వచ్చినట్లుగా లేఖలవల్ల స్పష్టంగా తెలుస్తుంది.
బంకుపల్లి రామజోగారావుకు, వీరేశలింగంకు రాసిన లేఖల్లో ఇన్నేళ్లు ప్రపంచానికి సృష్టికి సరైన అర్థం కనబడక,ఏమీ తెలీకపోవడం చేతనే,ఎవ్వరు చెప్పినా నమ్మక అరుణాచలానికి రాక జీవితాన్ని వృధా చేసుకున్నాననే బాధను వ్యక్తం చేశాడు.జీవితంలో ఎంత పోగొట్టుకున్నాడో వెనక్కి తిరిగి చూస్తే తన చేసిన తప్పేంటో తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు.

” ఎక్కడి చలం ఎక్కడి అరుణాచలం దేవుణ్ణికాదు,ఋషిని కాదు,ఓ సమాధిని సేవించుకుని నమ్ముకొనిపడి వున్నాను.” అంటూనే మోక్షం కావాలని లేదు.వస్తుందన్న ఆశలేదు అని చెప్తూనే అంతలోనే అయోమయావస్థలో పడిపోతాడు చలం. పేరుకున్న ఈ సంస్కారాన్ని కాల్చే శక్తి భగవాన్ కి ఉంది.ఎవరు చెప్పినా అర్థం కాదు.ఏదో బాధ చలంను కలచివేసేది.బాధను భగవాన్ కు వదిలేసి బాధపడకుండా ఉండడం నేర్చుకున్నాడు.అప్పటికి భక్తిపై నమ్మకం కుదరలేదు”.అని దీక్షితులుకు రాసిన లేఖలో అంటాడు.

చలం రామజోగారావుకు రాసిన లేఖలో ” పాత జీవితమంతా ఓ కల లాగా అయిపోయింది. ఇట్లా కాలం గడచిపోవడమే ఆశయం.ఇంకా చలం అనే పేరు కూడా మనసులోంచి గుర్తులేకుండా పోవాలని ప్రయత్నం.ఏదో ఎవరో ఆకాశం నించి ఎప్పుడు దిగివస్తారో అన్నట్లు వుంది మనసు.చివరికి అన్ని బాధలూ పడి స్వర్గధామము చేరుకున్నాను.” అనే సంతృప్తిని మానసిక మార్పును వ్యక్తం చేశాడు.

వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో చలం తన ఆవేదనను,ఆంధ్రలో తనను ఎంత నీచంగా చూశారో,ఆంధ్ర జనులపై విరక్తి భావం,రమణాశ్రమంలో చలం పొందుతున్న అనుభూతిని కళ్ళకు కట్టినట్లు వివరించాడు. నేను కష్టాల్లో వున్నప్పుడు ఎవరు ఆదుకున్నారు? కుక్కల్లాగు నన్నన్నివిధాలా క్షోభిల్లచేస్తూవుంటే ఎవరు సహాయానికి వొచ్చారు.ఈ ముప్ఫయి ఏళ్ళు డబ్బు తీసుకోకుండా ఇన్నేళ్లు రాసిన నాకు, డబ్బు లేని రోజున ఎవరిచ్చారు ఒక్క రూపాయి? తీరా నేనొచ్చిన తర్వాత అందరూ అడిగేవాళ్లే ఎందుకు వెళ్ళావని? ఎందుకు? నా బాధ ఇంక వుండదని రూఢి గనుక” అంటూ తన మానసిక వేదనను వెళ్లబోసుకున్నాడు.ఆనాడు ఆంధ్రదేశంలో తనపట్ల ప్రజలకున్న అభిప్రాయాన్ని కూడా చెప్పుకున్నాడు.తాను అరుణాచలం రావడానికి కారణం చెప్తూ ” యువతీ యువకులు దొంగ మొహాలు చూసి” వచ్చేశానన్నాడు. చలం మానసిక చిత్రీకరణ ఈ లేఖలో కనిపిస్తుంది బెజవాడ ప్రజలు తనను ఏ విధంగా,ఎంత నీచంగా చూసేవారో వివరించాడు. వీరేశలింగంకు రాసిన లేఖలో ” ఇదివరకు పురుషులు భయపడేవారు,నేను నా పుస్తకాలూ వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళ అధీనంలోంచి యెక్కడ తిరుగుబాటు చేయిస్తానేమోనని. ఇప్పుడు స్త్రీలు భయపడుతున్నారు,( ఇంకా భయపడతారు కూడా ఎక్కువగా ముందు ముందు) తమ పురుషుల్ని ఎక్కడ సన్యాసుల్ని చేస్తానోనని—- నాతో స్నేహమన్నా,మా ఇంటికి రావడమన్నా అంత ఘోరం క్రింద ప్రచారం చేస్తారు బెజవాడ ప్రజలు” అని వాపోయాడు చలం.

అరుణాచలం వచ్చాక చలం మానసికంగా ఎంతో ఎదిగాడు.గత జీవితాన్ని మరచిపోయి తర్వాత జీవితాన్ని,మనసును రమణాశ్రమంలో భగవాన్ కే అర్పించడానికి ప్రయత్నం చేశాడు ఇదే సందర్బంలో చలం మాటలు ” ప్రస్తుతం నా మనసులోకి అట్లాంటివి తీసుకోవడం బాధ సాధనలో వున్నాను ” అన్నాడు.

” నా కోసమే కాదు,నా నుండి ఏదో తెలుసుకోగలమనే వారందరికోసమూ చేస్తున్నాను ఈ తపస్సు ,ఇది కష్టతరమైనమార్గం ,కానీ నన్ను నడిపేది ఈశ్వరుడైన భగవాన్ రమణ ” అంటూ ధైర్యంగా చెప్పుకుని ఎంతో విశాల హృదయాన్ని ప్రకటించి తన మిత్రులకు ఆధ్యాత్మిక సందేశాలను,సత్యాలను,
జ్ఞానాన్ని లేఖలద్వారా పంచి ప్రచారం చేశాడు వేమన వలె చలం భోగిగా వుండి తర్వాత యోగిగా మారాడు.
చలంలో వచ్చిన మార్పు,జీవితంలో రెండు పార్శ్వాలను లేఖల ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చును.

జీవితంలో శృంగారమే గొప్పదని భావించిన చలం మెల్లమెల్లగా సత్యమేమిటో తెలుసుకొని, అన్ని బాధలూ పడి చివరికి స్వర్గధామం చేరుకొని,హృదయపరిపక్వత చెంది ఇలా అంటాడు రామజోగారావుకు రాసిన లేఖలో. “శృంగారానికి,ఆధ్యాత్మికానికీ చాలా సన్నిహితమని,జీవితంలో ఎన్ని నిరాశలున్నా లొంగిపోక,నిరాశ పడక బలంతో జయించి ముందుకు సాగాలని హితబోధ చేస్తూ ” క్రమంగా మన చేతులకి విధి నిరాకరించిన సౌందర్యం మన హృదయంలో ప్రజ్వలిస్తుంది వొదలకండి అన్వేషణ. శృంగారాన్ని అన్వేషిస్తో ప్రయాణమై, పోయి పోయి చివరికి ఆ శృంగారం కాంతిగా మారిన సంకేతస్థలానికి చేరుకుంటాము.భగవాన్ ఆనందమయం సర్వశక్తి ” అని తాను తెలుసుకున్న నగ్న సత్యాన్ని ఎంతో చక్కగా వక్కాణించాడు.తాను భగవానుని పూర్తిగా విశ్వసించినట్లు తెలిపాడు మండువ జగ్గారావుకి రాసిన లేఖలో ” శృంగారంలో కన్న మరి దేంట్లోనూ ఎక్కువ ఆనందాన్ని అనుభవించలేదు.మనసుని మించిన ఆనందం ఆధ్యాత్మికం, కామి కాక మోక్షగామి కాడు ఒకటి అసహ్యం,రెండోది మూర్ఖం ” అని వ్రాస్తూనే సాధనమంటే జీవితాన్ని ఈశ్వరునికి అర్పణ చేయడమంటాడు.

ఒక సినిమాకు కథ రాయడానికి మద్రాసుకు వెళ్లినా కూడా చలం ఆలోచనలు భగవాన్ చుట్టూనే తిరుగుతుండేవి.దీక్షితులకు రాసిన లేఖలో ‘ అరుణాచలం పోవాలని ఒకటే పీకుతోంది మనసు. భగవాన్ నాకిట్లా శిక్ష వేశాడు. ఇక్కడ ఈ వాతావరణంలో ఎక్కడా వినపడరు. ఆయన నవ్వుతున్నారు నా బాధల్ని చూసి.ఈ సినిమా కోసం బతకడం కన్నా చచ్చిపోవడం నయం.ఎంతెంత మోసాలు!అసహ్యాలు, డబ్బు…..ఇట్లాంటి మురుగునించి తప్పించారు మీరు నన్ను భగవాన్ని నాకు చూపించి”.అనడం వల్ల చలంలో వచ్చిన మార్పు ,స్త్రీ వ్యామోహం నుండి మనసు భగవాన్ వైపుకు మళ్ళి ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవడం ,ఇంతకాలం ఎంతో మురుగులో కొట్టుకుపోతున్న చలం తనను రక్షించినందుకు దీక్షితులకు కృతజ్ఞతలు తెలిపాడు.

రమణ మహర్షి దగ్గర చేరడానికి కావాల్సింది మనలో పట్లు పోయి ” బంధువుల్నీ,మర్యాదల్నీ వొదిలేయడానికి ఓ గొప్ప అర్హత ” అని వీరేశలింగం గారికి సలహా ఇస్తాడు.

చలం దీక్షితులను,వీరేశలింగం గారిని రమణ మహర్షి ఆశ్రమానికి రమ్మని పదేపదే కోరుతూ ఎన్నో ఉత్తరాలు రాశాడు.

చలం మండువ జగ్గారావుకు రాసిన లేఖలో నిత్య సత్యాలను, ఆధ్యాత్మిక భావాలను,తన రచనా వైఖరిని ఎంతో చక్కగా వెల్లడించాడు.” ఆధ్యాత్మిక సాధన అంతా ఏకాగ్రతను కుదుర్చడానికే అంటూ” కాలాన్ని,దేశాన్ని బట్టి మారడమేమిటి? మనిషి మనిషికీ మారుతుంది.నీతి మారదు. నీతికి సంబంధించిన పాపపుణ్యాలనే ఆ ఆచారాలు మారతాయి.
ఆ సంగతి అంగీకరించదు సంఘం.అందరికీ ఒకటే నీతిని రుద్దుతుంది.అదే చలం తగాయిదా సంఘంతో.” అని సంఘానికి చలం ఎందుకు వ్యతిరేకమో,చలం భావాలను ప్రజలు ఎందుకు అసహ్యించుకుంటారో వివరిస్తాడు.

చలం ప్రత్యేకత అతను నమ్మినదాన్ని ఆచరించడం,ఇతరుల కోసం త్యాగం చెయ్యడం,కష్టాలలోకి పోవడం కనుక అతనికి ప్రతిష్ట రాలేదు.

ఒక స్త్రీ విషయమో కాదు వీళ్ళ బతుకుల్లోని నీచత్వాన్ని,దొంగతనాన్ని,
బూతుని,మోసాల్ని బైటపెట్టడానికి ప్రజలకి చాలా కసి,ఎన్నడూ అతన్ని క్షమించలేదు.

అందుకే చలం రాతలకి అంత బలం” .అంటూ ఉన్న వాస్తవాన్ని తెలుతుపుతూనే చలాన్ని పట్టిన రొష్టు ఠాగూరుకు పట్టలేదని జగ్గరావుకు రాసిన ఉత్తరంలో పేర్కొంటాడు.

చలం తన కవిత్వంలో గల ప్రత్యేక లక్షణాన్ని ఇంకా ఇలా వివరించాడు జగ్గారావుకు రాసిన ఇంకో లేఖలో.” మన అనుభవానికి మారిన సంగతుల్ని మనం ఒప్పుకోకపోవడం పొరపాటు.ముఖ్యంగా స్త్రీ మనస్తత్వ విషయంలో కానీ,మన అనుభవాల్ని అటుంచి కథలో ఇది అసంభవం అనిపిస్తే చదువరికి, అది రచనలో లోటు.మామూలు తెలుగువాళ్లు అసంభవమనుకునేవి సంభవమనిపించేట్లు రచించడం చలం ప్రత్యేకత” అని తన రచనా వైఖరిని తెల్పాడు.నిజాన్ని నిర్భయంగా చెప్పే చలంను వాస్తవికతవాది అనవచ్చు.

” ఏమైనా ఈశ్వరుడిలో భక్తి విశ్వాసాలు వుంటే ఎటువంటి ఆపదల్లోంచీ బైటికి రాగలడు.” అంటూ భక్తిపట్ల తనకు గల నమ్మకాన్ని వ్యక్తం చేశాడు చలం జగ్గారావుకు రాసిన లేఖలో.ఆ విశ్వాసమనేది హృదయంలోంచి రావాలి .మనం ఏ పని చేసినా సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో చేస్తేనే సఫలమవుతుంది అనేది వాస్తవం.
అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? సాధనెందుకు చేయాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో కనిపిస్తాయి.” అనుభవానికి అతీతమైన అనుభవానికి పోతారు.అదే ఆధ్యాత్మికం ఇంద్రియాల నుంచి తప్పించి దృష్టిని ఏ ఆధారమూలేని ఆనందంలో లయం చేయడానికేగా” సాధన అని అంటారు.మనసు ఏకాగ్రతను ఎలా సాధించాలి అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా వివరించాడు.

” ప్రపంచంలో నలిగి,కాగి,దిక్కులేని వాళ్ళకే ఈ ఆధ్యాత్మిక ప్రపంచం” అంటూ చక్కని నిర్వచనాన్ని వీరేశలింగం గారికి రాస్తూ శాంతి,కాంతి ఇచ్చేవాడు ఒక్క ఈశ్వరుడే అని కుండబద్దలు కొట్టినట్లు తను నమ్మిన సత్యాన్ని ధైర్యంగా చెప్పాడు.” ఎవరి కర్మకి వారే కారణం.ఈ కర్మ పరంపర అనే ఎడతెగని వలనుంచి బైటపడడానికి ఈశ్వరుడొక్కడే సాధ్యం.” అని పచ్చి నిజాన్ని చెప్తూ తన అనుభవాన్ని తేల్చి చెప్పాడు. ఎంత శత్రువునైనా ప్రేమ వల్ల జయించవచ్చునన్న ఆత్మవిశ్వాసం కలవాడు చలం.

ఒకప్పుడు భావోద్రేకంతో ఉండడం వల్ల జీవితంలో ఉపద్రవాలు వచ్చాయన్న సత్యాన్ని తెలుసుకుని వీరేశలింగంకు రాసిన ఉత్తరంలో చలం ఇలా వివరించాడు. ” మనకి అందమైన స్త్రీని చూడగానే కలిగే భావోద్రేకం వల్ల మన జీవితాన్ని ఆమె జీవితాన్ని నడపలేము. బాధనే వాంఛాగ్ని మీలో ఇముడ్చుకోగల లోతును సంపాయించండి… ఆ లోతును ఎంత ప్రయత్నించీ సంపాయించుకోలేకే చాలా ఉపద్రవాలు తెచ్చుకున్నాను…అంత కన్న విషాదం నన్ను నమ్మిన వారికి తెచ్చాను.ఇట్లాంటివి మనలో చాలా వరకు సమసిపోతేనేగాని అరుణాచలానికి పిలుచుకోరు ఈశ్వరుడు.” అంటూ అనుభవాన్ని వివరిస్తూ పశ్చాత్తాపాన్ని తెలుపుతూ వీరేశలింగానికి మార్గాన్ని సూచించాడు.అనుభవంలో చేదును చవిచూసి నలుగురికి ఆ చేదు నిజాన్ని తెలిపి సత్యాన్ని ప్రచారం చేశాడు చలం.ముందు మానసికంగా మార్పు రావాలని సలహా ఇచ్చాడు.

జీవన్ముక్తిని కోరి తన ఆశయం జీవించాను,జీవిస్తున్నాను అనే మరుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటమేనంటాడు చలం.

శివంకు రాసిన లేఖలో అరుణాచలం వచ్చాక ఇదివరకు లేని హాయి ఇప్పుడున్నదంటాడు.
” శాంతి,ఆనందం ఇట్లాంటి పదాలకి అర్థం అనుభవిస్తేనే గాని తెలీదు” అంటూ బంకుపల్లి రామజోగారావుకు రాసిన ఉత్తరంలో రాస్తూ సంతోషం,ఉత్సాహం ఏమీ లేకుండా పూర్తిగా అంధకారంలో పడితేనేగాని కాంతి దొరకదంటాడు చలం.

ఎంతో మందికి తన జ్ఞానామృతాన్ని పంచిపెట్టిన చలం ఆధ్యాత్మికతలోను తీవ్రవాదే. ఉన్నతమైన స్వేచ్చకోసం కలలుకని, తపించి,బాధపడి,ఆధ్యాత్మికంలోకి దిగి ఎదిగాక తను నమ్మిన సత్యాన్ని నలుగురికీ లేఖలద్వారా ప్రచారం చేసి అందరూ అసహ్యించుకున్న చలం, ఎవరికి ఏమీ కాని చలం తన జీవితంలోనూ,సాహిత్యం తోనూ అందరికీ తానే అయి ఎంతో గొప్పవాడుగా గోచరిస్తాడు. ఆనాటి సమాజ పరిస్థితుల్లో చలం ఎదుర్కొన్న సమస్యలు,చలం సాధించిన విజయాలు,మానసిక విశ్లేషణ,ఆయన అనుభవాలు ఒకటేమిటి ఎన్నో విషయాలు లేఖల ద్వారా వెల్లడించాడు.చలం మానసిక మార్పుకు అద్దం పడతాయి ఈ లేఖలు.అరమరికలేకుండా చేదు నిజాల్ని అందరికి పంచిపెట్టిన ధీశాలి చలం.

సమకాలికులకు మిత్రులకు రాసిన లేఖల్లో ఈయన ఆలోచనా సరళి,సాహిత్య విమర్శ,సునిశిత పరిశీలన,కష్టసుఖాలు మొదలగునవి తెలుసుకోవచ్చు.ఆవకాయ పచ్చడి మొదలు బుజ్జిగాడి కబుర్లు అన్ని విషయాలు లేఖల్లో చోటు చేసుకున్నాయి.

గురజాడపై చలం అభిప్రాయాన్ని జగ్గారావు తన లేఖల ద్వారా ఇలా తెలియచేశాడు. ” గురజాడ తిరుగుబాటంతా రచనల్లోనే కానీ జీవితంలో ఏమీ కనబడదు.ఆనాడు ఎవరూ చేయని సాహసం చేసి ఇరుకున పెట్టి సంకెళ్ళ నుండి భాషా, భావాల్ని ఒక్క దెబ్బతో ముక్కలు చేశాడంటాడు చలం”.

శరత్ రచనలను గూర్చి చెపుతూ చలం ” శరత్ నాయికా నాయకులకు వెన్నెముక లేదు.వాళ్ళ వొళ్ళంతా మెత్తని హృదయమే. ఎముకలు లేవు విధికి వెన్నవలె లొంగిపోతారు” అని విమర్శించాడు.

శ్రీ శ్రీ కోరింది ఆర్థిక విధానాన్నే గాక సామాజికంగా మార్పు కోరితే చలం హృదయంలో మార్పు కోరాడు అని జగ్గారావుకు రాసిన లేఖలో అంటాడు.శ్రీ శ్రీ” కవిత్వానికి గొప్పతనం పట్టింది.చలం లోకవిరోధిగానే వుండిపోతాడు” అని రాశాడు.

చలం మనసును అర్థం చేసుకోవడానికి లేఖలెంతో పనికివస్తాయి.సాహిత్యంలో చలం లేఖలకు చాలా ప్రాధాన్యముంది.ఆయన జీవన విధానానికి అక్షర సత్యాలైన లేఖలు అందించిన
చలం జీవన పరిణామక్రమం,ఆలోచనా వైవిధ్యం,ఆలోచనావిధానం,
సమకాలీనాధునిక కవులపై దృక్పథం,ఆధ్యాత్మిక భావసంపద ఎన్నో విషయాలు లేఖల్లో నిక్షిప్తాలు.

లేఖలన్నింటిని పరిశీలించినట్లయితే చలం రమణాశ్రమానికి వెళ్లక ముందు,వెళ్లిన తర్వాత రెండు జీవితాలను,రెండు ఆలోచనా రీతుల్లో మార్పులను రెండు కోణాల్లో గమనించవచ్చు.జీవితంలో నన్ను కదిలించే శక్తి ఒక స్త్రీకి తప్ప ఎవ్వరికి లేదన్న చలం తర్వాత జీవితాన్ని,మనసును రమణ భగవాన్ కే అంకితం చేసి సాధన చేయడమే కాక జీవితంలో ఇప్పుడు ఎంతో హాయిని పొందుతున్నానని తాను నమ్మిన నగ్న సత్యాన్ని,సిద్ధాంతాన్ని ఎంతో ఘాటుగా,ఉన్నదున్నట్లు తన మిత్రులకు రాసిన ఉత్తరాలే నిదర్శనం.
సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గుడిపాటి వెంకటచలం మే నెల 19 వ తేదీ 1894 వ సంవత్సరంలో మద్రాసులో కొమ్మూరి సాంబశివరావు కొమ్మూరి వెంకట సుబ్బమ్మలకు జన్మించాడు.తాత గుడిపాటి వెంకట రామయ్య తనను దత్తత తీసుకున్నందుకు గాను ఇంటిపేరు గుడిపాటిగా మారింది.చిన్నప్పటి నుండే అభ్యుదయ భావాలు కలిగి స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలని ఆశించి స్త్రీ వాదిగా ఎన్నో రచనలు చేసి తెలుగు సాహిత్యంలో తనదంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న చలం మే నెల 4 వ తేదీ 1979వ సంవత్సరం అరుణాచలంలో కన్నుమూశాడు.

 చిన్నప్పుడే తండ్రి తన తల్లిని వేధించే తీరును చూసి చలించిన బాల చలం హృదయం మీద తీవ్ర ముద్రపడి స్త్రీ ఔన్నత్యం,స్త్రీ స్వాతంత్య్రం కోసం రచనలు చేసి స్త్రీ పక్షపాతిగా పేరు పొంది జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించి తాను నమ్మిన సిద్ధాంతం కోసం పరితపించిన ఆదర్శవంతుడు చలం తెలుగు సాహిత్యంలో ఉత్తమోత్తముడు,ఉన్నత మహాకవి.
August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మేరా భారత్ మహౕన్

by గురిజాల రామశేషయ్య August 15, 2022
written by గురిజాల రామశేషయ్య

సకల జీవుల బతుకు
చీకటి వెలుగుల అతుకు’బొతుకు

చీకటి విశ్రాంతి కోసమే !

వెలుగుతో మేల్కొని
వెలుగులో మేల్ కని
చీకటినీ గెల్వవచ్చు

చీకటిని గెల్వటమంటే
బుద్ధి పదునెక్కటమే

చీకటిని వెలిగించు’కోకుంటే
మనుషులు గెలువ’లేరు
ఎవరూ గుర్తించలేరు

పారతంత్య్రం మానవాళికి
మహాంధకార సదృశం

  *          *          *

మున్ముందే ఝాన్సీ కీ రాణీ
పసిబిడ్డను ఒడి’నిడుకొని

అశ్వారూఢయై ఖడ్గం ఝళిపించింది.

ధిక్కార స్వరాలను అచటానికి
పరాయి రాయ్ రాయి ప్రభుత్వం
చట్టాలను మరింత బిగించింది.
ఉద్రేకం మిట్టమధ్యాహ్నమయింది.
* * *
“స్వాతంత్ర్యం నా జన్మ’హక్కు” అనే వాక్కు
‘లోకమాన్య’ తిలక మహామంత్రం.
“వందేమాతరం” బంకించంద్ర నినాదం.

ఈ వాక్యద్వయి ప్రతిపౌరుని
నోటిగూటిలో రెక్కలల్లార్చింది.

  • * *
    చెఱసాలలు చంద్రశాల’లైనాయి
    ఉరితాళ్లు కంఠహారాలైనాయి
    ఉప్పు చేయటమే సత్యాగ్రహమైంది

“వందేమాతరం”అంటూ ఆ తరమంతా
హర్ ఏక్ కదమ్ కదమ్ పర్ కదమ్
ముందడుగే వేసింది వీరావేశంతో

ప్రతి కరాన మూడు రంగుల జెండా
ప్రతి గళాన వందేమాతరం నిండా
దేశం దేశమే పోరాడింది
దేశం వేషమే మారిపోయింది

    *             *              *

అది ఆగష్టు 15 , 1947 సుప్రభాత వేళ
భారత స్వాతంత్ర్య భానూదయ వేళ
స్వతంత్ర భారత సుస్వర పరిమళ హేల

    *             *          *

యుగయుగాల పర్యంతం
స్వతంత్ర భారతం ఆద్యంతం
సమైక్య జీవన సంకేతం
శ్రేయోరాజ్య సంగీతం

అమర వీరులకు జోహార్లర్పిస్తూ
స్వాతంత్ర్య గీతం ఆలాపిస్తూ
రోజు రోజూ ఎదుగుతూ
సగర్వంగా బతుకుతూ

మనం భారతీయులమని
“సత్యం శివం సుందరం” గీతం మనదని
సంతోషంగా గొంతెత్తి పాడుతూ
జీవిద్దాం జీవిద్దాం శోభిద్దాం శోభిద్దాం!!!
మేరా భారత్ మహాన్
మేరా భారత్ మహాన్

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ప్రదేశాలు , వాటి ప్రాచుర్యాలు

by nellutla Indrani August 15, 2022
written by nellutla Indrani

మనం నివసించే భూమి గురించి , అవసరాలు తీర్చే నీటిని గురించి సామాన్యంగా అందరికీ తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది . ఈ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసే ప్రయత్నమే ఇది.

మనకు ఉన్నది తక్కువ “ఉర్వి”. 29% , నీరు 71% ఉన్నది . కొత్త కొత్త పరిశోధనలు చేస్తూ భూగోళ శాస్త్రజ్ఞులు భూమి పల్లంగా ఉందని అంటున్నారు . విషయం ఏది ఎలా ఉన్నా ,మనకు 7 ఖండాలు ఆసియా ,యూరోప్ ,ఆఫ్రికా , అంటార్కిటికా, ఆస్ట్రేలియా నార్త్ అమెరికా మరియూ సౌత్ అమెరికా.
అన్ని ఖండాలు కూడా వేటికవి ఎంతో సుందరమైన ప్రదేశాలు . ప్రతి ఖండానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను సంతరించుకున్న ఖండం ఆఫ్రికా .”ఆఫ్రికా” అంటే “మదర్ ఆఫ్ ఆల్ కాంటినెంట్స్”అని అర్థం. తూర్పున రెడ్ సి మరియు పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తరాన మెడిటరేరియన్ సీ. దక్షిణాన హిందూ మహా సాగరం మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు కలిసి ఉన్నాయి.
ఆఫ్రికా ఖండం ఎడారులు పర్వతాలు అడవులు గడ్డి భూములు నదులు ప్రాంతాలుగా విభజింపబడింది ఆఫ్రికా పేరు వినగానే గుర్తుకొచ్చే సహారా ఎడారి బహు గొప్పది ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి ఎడారిలో ఏముంది చూడడానికి అని ఎడారి వంటి జీవితం అనే మాటలను సర్వసాధారణంగా వింటూ ఉంటాం .కానీ బ్యూటిఫుల్ సాండ్ డ్యూన్స్ అంటే” అందమైన ఇసుక తిన్నెలు” అని అర్థం.
అగ్నిపర్వతాలు కొన్ని ప్రాంతాలలో సాల్ట్ వాటర్ లేక్స్ ఫ్రెష్ వాటర్ లేక్స్ చాలా అందంగా ఉంటాయి
ఆఫ్రికా ఖండంలోని 54 దేశాలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది.
విస్తీర్ణంలో అల్జీరియా పెద్ద దేశం చిన్న దేశం గాంబియా.
అల్జీరియా క్యాపిటల్ ఆల్జీయర్స్.
అల్జీరియా స్వతంత్ర దేశం కాకమునుపు ఫ్రెంచ్ కంట్రోల్లో ఉండేది.అల్జీరియా 1962 లో స్వతంత్ర దేశం అయింది.
అల్జీరియా_ ఆల్జీయర్స్


ఆఫ్రికాలో అతిపెద్ద దేశమైన అల్జీరియా 1962లో స్వతంత్ర దేశం అయింది అల్జీరియా రాజధాని ఆల్జీయర్స్.
పూర్వం నుండి కూడా నాగరికత నదుల వడ్డులలోనే ఉద్భవించి పరిఢవిల్లింది. అదేవిధంగా అల్జీరియాలో కూడా షలిఫ్ నది ఒడ్డున నాగరికత విలసిల్లింది.
“షలిఫ్” నదికి ఉపనది “సెబ్ గాగ్”. సెబ్ గాగ్ నది “అమోర్” పర్వత శ్రేణుల్లో పుట్టింది.
ఇక ఆఫ్రికా అనగానే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సహారా ఎడారి గుర్తొస్తుంది. అంబరెల్లా లాగా అలరించే అకేషియా చెట్లు చూడముచ్చటగా ఉంటాయి. క్యాట్ వాక్ చేస్తున్నవా అన్నట్లు ఉంటాయి.
ఇక్కడి రాక్ మౌంటైన్స్ చిత్రకారుని చిత్రంలా చాలా చక్కగా ఉంటాయి. అట్లాస్ పర్వతాలు మెడిటెరేనియన‌్ సముద్రానికి మరియు సహారా ఎడారి మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన సరిహద్దులు.
చాలా క్యూట్ గా ఉండే ఫెన్నెక్ ఫాక్స్ అనే జంతువు ఆఫ్రికా నేషనల్ ఎనిమల్.
మనిషి ఆకాశంలో విహరించేందుకు విమానం తయారీ కి ప్రేరణ కలిగించింది పక్షులు. వివిధ రకాల పక్షులకు ఇది నిలయం. అలా పక్షులు జంతువులు, వృక్షాలు, పర్వతాలతో గల అందమైన ప్రకృతిని ఆస్వాదించే ప్రకృతి ప్రేమికులకు కన్నుల పండుగగా ఉంటుంది.
అన్నాబా మరియు ఓరన్ ఇక్కడ నేచురల్ పోర్ట్ సిటీస్. ఐరోపా నుండి ఎక్కువగా టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. స్కూబా డైవింగ్, స్నార్కిలింగ్ మొదలైన యాక్టివిటీస్ తో ఈ పోర్ట్స్ అన్ని కళకళలాడుతూ ఉంటాయి. తూర్పున ఉన్న రెడ్ సీ లోని బ్లూ వాటర్ చాలా అందంగా ఉంటాయి. ఈ పట్టణాలు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కలయికతో ప్రత్యేకంగా కనిపిస్తాయి.
ఇలా ఆఫ్రికా ఖండం అందమైన ఖండం. ఇటువంటివి మరిన్ని వచ్చే సంచికలో తెలుసుకుందాం

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

పోలీసు కస్టడీలో గణనాధుడు

by Madhavapeddi Usha August 15, 2022
written by Madhavapeddi Usha

అదేంటీ పోలీసు కస్టడీలో వినాయకుడా………??? అని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఇది కలా నిజమా లేక నేనేమైనా జోకు జోకాననుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే! ఇదస్సలు జోకు కాదు, వైష్ణవ మాయా కాదు.ఇది అక్షరాలా నూటికి నూరుపాళ్ళు నిజం. నమ్మలేరా…..?
అయితే మనస్సు ఉగ్గపట్టుకుని , నిర్భయంగా ముందుకు సాగి పొండి. చదవండి చివరిదాక!!!
అసలయినా ప్రపంచమంతా ఈ మాయదారి కరోనా…చాపక్రింద నీరులా ప్రాకి , యావత్ ప్రపంచాన్నీ ఓ కుదుపు కుదిపేస్తుంటే, కాలచక్రం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఫలితంగా రావలసిన పండగలన్నీ వస్తున్నాయి పోతున్నాయి. మనం అనుకుంటున్నట్లుగానే ఈ సారి వినాయక చవితి కూడ వచ్చేసింది.
ఇక చూసుకోండి నా సామిరంగా, దేశంలో అందరిలోనూ ఒకటే కలకలం……ఈ సందర్భంలో వినాయకుడి విగ్రహాలు తయారు చేసేసి , పెద్ద ఎత్తున ఆర్భాటంగా పండగ చేసుకోవాలా వద్దా అన్న మీమాంస అందరిలోనూ తలెత్తింది.
ప్రభుత్వాలు మాత్రం, ఈ కరోనా కారణంగా , మునుపటిలాగా పండుగ ఉత్సవాలుగా చేయవద్దనీ, ఎక్కడైనా సరే జనం గుంపులు గుంపులుగా పోగయే వ్యవహారాలేవీ పెట్టుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. అందరూ పూజలు ఇంటివరకే పరిమితం చేయాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
కానీ మన ఈ పామర జనం ఊరుకుంటారా? అసలు ఎవరి మాటైనా వినే అలవాటు మన ప్రజలకు ఉంటే , మన దేశం ఇలా ఎందుకుంటుంది? ఎప్పుడో బాగు పడి ఉండేది కదా!!!
అది సరే ముందు విషయం చెప్పండి……ఉపోద్ఘాతాలు వద్దు అంటారా…..? అదే అక్కడికే వస్తున్నా…….కాస్త ఓపిక పట్టండి మరి….!
అనగనగా ఒక మహానగరంలోని ఒకానొక గేటెడ్ కమ్యూనిటీ అయిన సొసైటీ. అందులో యదార్థంగా జరిగిన కథ ఇది. ఇంకా ఈ జాగేలనో అని మీలో మీరు హమ్ చేస్తున్నారా? ఇదిగో చెప్తున్నా…..చెప్పేస్తున్నా……కాచుకోండి! ఆ సొసైటీలో రీసెంట్గా మ్యానేజింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయండీ!
అందులో గెలిచిన వాళ్ళకు , ఉన్నమాట చెప్పొద్దూ…..ఈ సొసైటీని పరిపాలించడంలో అస్సలు అనుభవం లేదంటే నమ్మండీ! ఆ గెలుపుకూడ చాలా కుట్రలు పన్ని సంపాదించిందే కానీ, న్యాయబద్ధమైన గెలుపు కాదు.
విపక్షాలను దెబ్బకొట్టి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న దురుద్దేశంతో చేసిందే కానీ మరోటి కాదు. ఆ సంగతి అలా ప్రక్కన పెట్టి మనం అసలు కథకి వద్దాము.
ఈ గెలిచిన కమిటీ అధికారంలోకి వచ్చి రెండు నెలలుకూడకాలేదు వినాయక చవితి రానే వచ్చింది. ఇక చూసుకోండీ వీళ్ళ ఉత్సాహానికి అంతులేదు. ఓ ప్రక్క పూర్వంలానే వినాయకుడ్ని ప్రతిష్ఠించాలి….అంటూ ఈ పాత మేనేజ్మెంట్ పుణ్యమా అని రెండేళ్ళనుంచీ ఒక పండగాలేదు….పబ్బమూ లేదు….ఎందుకని అడిగితే ఈ కరోనా ఉన్నంతవరకూ, ఈ పండుగలూ, గిండుగలూ జాన్తా నై అని చెప్తారా…..ఇప్పుడు చూడండి మా తఢాకా …….అని కొత్త కమిటీ వాళ్ళందరూ ఒకటై సొసైటీలో ఉన్న రెసిడెంట్స్ ఎవరినీ సంప్రదించకుండానే వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసేసుకుని, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయసాగారు.
ఇదంతా గమనిస్తున్న ఫ్లాట్ ఓనర్స్ మండిపడి ఎవరిని అడిగి చేస్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ అని కమిటీ వాళ్ళని నిలదీసారు! అసలే కరోనా భయంతో ఓప్రక్క వణికి చస్తుంటే మళ్ళీ ఇదో ఆపద తెచ్చి పెట్టారేంటని ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. కానీ మొండివాడు రాజుకన్నా బలవంతుడన్నట్లు , వీళ్ళు ఇలా గర్జిస్తునే ఉన్నారు…..కమిటీ మాత్రం మేం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం, కంగారు పడకండి అంటూ, గణేసుని కూడ తెచ్చి ప్రతిష్ఠించేసారు. ఇదంతా గమనిస్తున్న ప్రతి పక్షాలు గట్టిగా హెచ్చరించాయి. ఏమైనా జరగకూడనిది జరిగితే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అల్టిమేటమ్ ఇచ్చారు.
దాంతో భయపడ్డ ఈ కొత్త కమిటీ వాళ్ళు వినాయకుడి దగ్గరకు ఎవరూ వెళ్ళకుండా బ్యారికేడ్స్ కట్టేసి, పిల్లలెవరూకూడ దగ్గరకు వెళ్ళకుండా ఇద్దరు సిక్యూరిటీ వాళ్ళని కాపలా ఉంచి, ఎవరూ అక్కడ గుమి గూడకుండా చూస్తూ ఉండమని ఆదేశాలు జారీ చేసారు. అది కాక ఉదయం సాయంత్రం యధావిధిగా పూజ కావించి , పూజారి వెళ్ళి పోవడానికి కుదుర్చుకున్నారు. అంతే కాదు పోలీస్ పెట్రోలింగ్ కూడ అరేంజ్ చేసారు.
ఇంతకీ మన గణనాధుడు మాత్రం, భక్తులులేక గిజ గిజలాడుతున్నట్లుగా అనిపించింది.భక్తులతో కళకళలాడే మంటపాలలో ప్రతిష్ఠించబడి , రోజూ నైవేద్యాలూ ప్రసాదాలతో , మరెన్నో సాంస్కృతిక కార్యకలాపాలతో అందరినీ అలరించాల్సిన గణపతి బిక్కు బిక్కుమంటూ గడపసాగాడు పోలీసు కస్టడీలో…….! అది చూసిన ఫ్లాట్స్లో నివసించే జనాలకు చాలా బాధ, జాలీ రెండు కలిగాయి.ఇక ఆ వినాయకుడ్ని దేవుడే కాపాడుగాక అనుకుని చేసేదేమీలేక పాపం గణేశుడు అని మనస్సులో అనుకుంటూ మౌనంగా ఉండి పోయారు.అయినా దేవతలకే తప్పటంలేదు కష్టాలు మరి మానవమాత్రులమైన మనమెంత అని అనిపించడం లేదూ ఈ కథ చదివాక!!!

అంకితం
————-
అన్ని విఘ్నాలనూ తొలగించే విఘ్నేశ్వరుడికి ఈ చిట్టి కథ అంకితం.

మాధవ పెద్ది ఉష

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మంగళ గౌరీ వ్రతం – సుమంగళకరం

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) August 15, 2022
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

శ్రావణమాసం అంటేనే పండుగలకు నోములకు వ్రతాలకు అనువైన మాసంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రావణం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. ఈ నక్షత్రం నుంచి ఈ మాసానికి ఆ పేరు వచ్చినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నక్షత్రం శ్రీమహావిష్ణువుకు కూడా ప్రీతికరమైనట. ఈ మాసములో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి దేవి వ్రతాన్ని చేసుకుంటారు నిచ్చలమైన భక్తితో మహాలక్ష్మితో పాటు సమంగా శివశక్తిని సైతం ఆరాధిస్తారు
ఈ మాసములోనే మంగళ గౌరీని కూడా ఎంతో భక్తి భావనతో పూజిస్తారు మహిళలు.

        శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైనది. శ్రావణంలో వచ్చే మంగళవారాల్లో కొత్తగా పెళ్ళయిన యువతులు మంగళవారం నాడు "మంగళగౌరీ" వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు చేయాలి. వరుసగా ఐదు సంవత్సరాలు చేయలేక ఏదైనా ఇబ్బంది. వచ్చినా మరో సంవత్సరం చేయవచ్చు. అయితే ఐదు సంవత్సరాల ఈ వ్రతాన్ని తప్పకుండా పూర్తి చేయాలి... మంగళగౌరీవ్రతం ఎంతో మహిమాన్వితమైంది.

పూర్వం శౌనకాది మహర్షులకు సూతమహర్షి మంగళగౌరీ వ్రతాన్ని, ఆ మహత్యాన్ని తెలియజేసినట్లుగా పురాణాలు వివరించాయి. నారదులవారు మంగళగౌరీ దేవి మహత్యాన్ని సావిత్రీ దేవికి తెలియచేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మంగళ గౌరీ నోమును గురించి ద్రౌపదికి బోధించాడు. ఇవన్నీ పురాణాల ద్వారా తెలిసిన విషయాలు.

పరాశక్తి అయిన మంగళగౌరీ వ్రతాన్ని ఆచ రించి, ఆమెను భక్తితో పూజించినట్లయితే ఆ దేవి అను గ్రహం ఆ స్త్రీకి లభించి ఆమె సౌభాగ్యం కలకాలం. నిలుస్తుంది. వారికి వైధవ్యం ఉండదు. మంగళగౌరీదేవి. పసుపు, కుంకుమ, గంధం. పరి మళభరితమైన మంగళ ద్రవ్యాలలోనూ, పూలలోనూ కొలువై ఉంటుంది. మంగళ గౌరీని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మంగళగౌరీని పూజించిన కుజుడు మంగళవారానికిఅధిపతి అయ్యాడు. త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరిం చబోయే ముందు ఈశ్వరుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయాన్ని పొందాడు. మనువంశపు రాజైన మందుడు గౌరీ దేవి వ్రత ప్రభావం వలన చాలా కాలం భూలోకంలో సిరిసంపదలతో సుఖసంతోషాలతో రాజ్యపాలన చేసాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి మంగళగౌరీ దేవిని పూజించి వైధవ్యాన్ని తొలగించుకున్న సుశీల కథను తెలియజేశాడు.

పూర్వం మహిష్మతీ నగరాన్ని జయపాల్ రెడ్డి అనే రాజు పాలించేవాడు. ఆ రాజ్కో సంతానం కలగలేదు మహారాణి ఎన్ని మొక్కలు మొక్కిన, ఎన్ని పూజలు చేసినప్పటికీ ఫలితం లభించలేదు. ఆ రాజదంపతులకు సంతానం కలుగలేదు. పరమేశ్వరుడు ఒక సాధువు రూపంలో మహిష్మతీ నగరానికి వచ్చి జయపాలుని అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి ‘భవతీ భిక్షాం ‘దేహి’ అని శంఖాన్ని పూరించాడు. ఆ మాటలు, శంఖా నాదం విన్న మహారాణి స్వయంగా భిక్ష వెయ్యాలని ద్వారం వద్దకు వచ్చి చూస్తే ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆ సన్యాసి రావడం, ఆమె లోపల నుంచి వచ్చేలోపు భిక్షను స్వీకరించకుండా వెళ్ళి పోవడం జరిగింది. ఈ విధంగా పలుమార్లు జరగటంతో ఆ విషయాన్ని భర్తకు తెలియజేసింది మహారాణి. అప్పుడు జయపాలుడు “ఆ సన్యాసి మన ద్వారం చేరుకోవటానికి ముందుగానే నువ్వు ఆ ద్వారం వద్ద ఆ మహాత్మునికి భిక్ష వేయటానికి సిద్ధంగా ఉంటే ఆయన ఎదురుచూడవలసిన అవసరం లేకుండా నీ భిక్షను స్వీకరిస్తాడు” అని చెప్పాడు. మరునాడు సన్యాసి రావటానికి ముందుగానే ఆయనకు భిక్ష ఇవ్వటానికి కావలసిన సరంజామాతో మహారాణి ద్వారం ముందు నిలబడింది.
ప్రతి రోజూలాగానే ఆ సన్యాసి శంఖం ఊది “భవతీ భిక్షాందేహి” అన్నాడు. వెంటనే మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయటానికి సిద్ధపడింది. కానీ సన్యాసి ఆమె భిక్షను స్వీకరించకపోగా సంతానం లేని నీ చేతి భిక్షను నేను తీసుకోను” అని వెళ్ళిపోతుండగా “స్వామీ! మాకు సంతానం లేని మాట నిజమే. తమరు దయతో మాకు సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి మహాను భావా” అంటూ రెండు చేతులూ జోడించి ప్రార్థించింది. సాధువు రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడు “నీ
భర్త నీలి వర్ణపు వస్త్రాలను ధరించి నీలి రంగు అశ్వాన్నిఅధిరోహించి నగరానికి తూర్పు దిశగా వెళ్ళమని చెప్పు: అక్కడ అశ్వం అలసటతో ఎక్కడ ఆగి పోతుందో అక్కడ తవ్వమని చెప్పు. అప్పుడు అక్కడ ఒక స్వర్ణదేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో చిత్తము ద్ధితో శుచిగా పూజిస్తే ఆమె మీరు సంతానాన్ని ప్రసాది స్తుంది” అని చెప్పి ఆ సన్యాసి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు.

రాణి ద్వారా విన్న విషయాలను ఆచరించ. టానికి మహారాజు నీలి వస్త్రాలను ధరించి నీలి అశ్వం మీద అరణ్యానికి చేరుకున్నాడు. ఎక్కడైతే అశ్వం అల సటతో ముందుకు కదలకుండా ఆగిపోయిందో అక్కడ తవ్వించగా స్వర్ణమందిరం కనిపించింది.
ఆ ఆలయంలోని అమ్మవారిని నియమనిష్ఠలతో పూజించాడు జయపాలమహారాజు. ఆమెను ఎంతగానో స్తుతించాడు. అతని భక్తికి ప్రసన్నురాలైన ఆ తల్లి ఆ రాజుకు దర్శనమిచ్చి నీకు సిరిసంపదలను ప్రసాదిస్తానని చెప్పింది.

“తల్లీ నాకు ధనము కావాలన్న ఆశలేదు.. సంతానం లేని నాకు దయతో సంతానం కలిగే భాగ్యాన్ని
ప్రసాదించండి” అని కోరాడు. “నీకు వైధవ్యం కలిగి ఎక్కువ కాలం జీవించేపుత్రిక కావలెనా, అల్పాయుష్కుడై, సన్మార్గుడైన పుత్రుడు కావలెనా కోరుకో’ అని చెప్పింది ఆ అమ్మవారు.
పితృదేవతలను ఉద్దరించేందుకు సజ్జనుడైన పుత్రుడు కావాలని కోరుకున్నాడు జయపాలుడు.

“నీ కోరిక నెరవేరుతుంది. నా పార్శ్వమున
ఉన్న గణపతి నాభియందు అడుగు ఉంచి ఆ కనిపించే చూత వృక్షం నుంచి ఫలాన్ని కోసి, దాన్ని నీ భార్యకుఇవ్వు” అని చెప్పి అమ్మవారు అదృశ్యమైపోయింది. జయపాలుడు అమ్మవారు చెప్పినట్లుగా ఒక్క ఫలాన్ని మాత్రమే కోయకుండా చేతికి అందిన పండ్లన్నీ తెంపేసరికి. గణపతికి ఆగ్రహం కలిగింది. “నీకు జన్మించే పుత్రుడు అల్పాయుష్కుడు. అతను పదహారవ ఏట సర్పకాటుతో “మరణిస్తాడు” అని శపించాడు.
జయపాలుని భార్య ఒక కుమారునికి జన్మ నిచ్చింది. అతనికి పెళ్ళి జరిపిస్తే కుమారుని ఆయుర్దాయం పెరుగుతుందేమో అన్న ఆశతో, ఆ నమ్మకంతో మహారాణి తమ కుమారునికి వివాహం చేద్దామని భర్తతో చెప్పింది. తన పుత్రుడైన శివుడిని మేనమామతో కాశీకి పంపించాడు జయ పాలుడు

ఆ స్వామిని దర్శించిన తర్వాత పుత్రుని కళ్యాణం జరిపిద్దామని భార్యతో చెప్పాడు మహారాజు..

శివుడు, మేనమామ ప్రయాణం చేస్తూ మార్గ మధ్యంలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ ఒక సత్రంలో వారు బస చేశారు. సత్రం బయట కొంతమంది. కన్యలు కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకుంటున్నారు. ఇంతలో ఒక కన్య మరొక కన్యతో గొడవపడింది. ఆ కన్య సుశీలను దుర్భాషలాడుతూ “ముండ రండ” అని నిందించింది.
అప్పుడు సుశీల రోషంతో “మా ఇంట్లో ముండలు, రండలు ఉండరు. నా తల్లి శ్రావణమంగళగౌరీ వ్రతం చేస్తుంది. ఆ మంగళగౌరీదేవి కృప మాకందరకూ కలుగుతుంది” అని చెప్పింది. శివుని మేనమామ ఆ మాటలు విన్నాడు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి తెలిసిన ఆయన మనసులో ఒక ఆలోచన ప్రవేశించింది. తన మేనల్లుడితో సుశీల వివాహం జరిపిస్తే మంగళగౌరీ అమ్మవారి దయ వల్ల తన మేనల్లుడు.
పూర్ణాయుష్కుడవుతాడు” అన్న నమ్మకం కలిగింది.
సుశీల తండ్రి శివాలయంలో పూజలో ఉన్నాడని.. తెలుసుకుని ఆలయానికి వెళ్ళి సుశీల తండ్రికి కనిపించ కుండా రహస్యంగా ఆలయం వెనుక దాగి ఉన్నారు. శివుడి మేనమామ
“ఈశ్వరా నా కూతురుకి పెళ్ళి చేయాలను కుంటున్నాను. తగిన వరుడు లభించేలా దీవించు దేవా అని ప్రార్ధించాడు.

“భక్తా శివుని పేరు గల యువకుడు నీ.. కుమార్తెకు వరుడవుతాడు. అతను కాశీ పట్టణానికి వెళ్తూ సత్రంలో బస చేశాడు. నీ కుమార్తెకు అతనితో కళ్యాణం జరిపించు. అంతా మంచే జరుగుతుంది” అని చెప్పారు. శివుని మేనమామ.
ఆ మాటలకు మహదానందం చెందాడు. సుశీల తండ్రి. అతని అన్వేషణలో సత్రంలో ఉన్న శివుడు అతనికి కనిపించాడు. అతనితో తన పుత్రిక వివాహం జరిపించాడు. సుశీల తండ్రి పెళ్ళయిన ఆ దంపతులు ఆ రాత్రి బ్రహ్మ చర్య ప్రతాన్ని పాటించగా మంగళగౌరీ దేవి సుశీలకు స్వప్నంలో దర్శనమిచ్చి “నీ భర్త అల్పాయుష్కుడు ఈ రోజుతో అతని జీవితకాలం ముగిసిపోతుంది. నీ భర్తను కాటు వేయడానికి ఒక సర్పం రాబోతోంది. నీ భర్త మరణించకుండా నీ సౌభాగ్యం నిలవటానికి నేను నీకొక ఉపాయం చెప్తాను. నువ్వు కుండ నిండా పాలు పోసి, ఉంచు. నీ భర్త ప్రాణాలు హరించటానికి వచ్చే కృష్ణసర్వం ఎదురుగా ఆ కుండను ఉంచు. అప్పుడా సర్పం పాలును తాగటానికి కుండలోకి ప్రవేశిస్తుంది. వెంటనే నువ్వు ఒక వస్త్రంతో కుండ మూతను గట్టిగా కట్టేసి, ఉదయం ఆ కుండను నీ తల్లికి వాయనంగా ఇవ్వు నీకు సౌభాగ్యం తొలగిపోదు” అని చెప్పింది.
వెంటనే మెలకువ వచ్చిన సుశీల ఆ అమ్మవారు చెప్పినట్లుగానే ఒక కుండలో పాలను నింపి ఒక నూతన వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది. కృష్ణసర్పం వచ్చి పాలను చూసి త్రాగటానికి కుండలోకి వెళ్ళింది. సుశీల వెంటనే నూతన వస్త్రంతో కుండ మూతను గట్టిగా కట్టేసింది. శివుడు నిద్రలేవగానే మేనమామతో కలసి కాశీకి వెళ్లిపోయాడు. చెప్పినట్లుగా తన తల్లికి ఆ ఘటాన్ని వాయనం ఇవ్వగా వస్త్రాన్ని తొలగించి మూతను తీసి చూస్తే సర్పానికి బదులుగా ఒక ముత్యాల హారం కనిపించింది. ఆ మంగళగౌరీకి మనసులోనే నమస్క రించింది సుశీల. తన భర్త తనతో చెప్పకుండా వెళ్ళి పోయినప్పటికీ ఎప్పటికైనా తిరిగి వస్తాడని నమ్మింది. ఈలోగా పరమేశ్వరుడు సుశీల పాతివ్రత్యాన్ని పరీక్షింపకోరి శివుని వేషంతో వారింటికి వస్తే అతను తన భర్త కాడని అతని చెంతకు వెళ్ళనని వ్యతిరేకించింది సుశీల ఆ మాయా శివుడు అంతర్ధానమయ్యాడు. తన భర్త తిరిగి వస్తాడన్న దృఢనమ్మకంతో ఒక సత్రాన్ని కట్టించమని తండ్రిని కోరింది సుశీల.

సత్రంలో వచ్చిన వారందరినీ నిశితంగా పరిశీ లిస్తూ అతిథి సత్కారాలు చేయసాగింది సుశీల. తన తీర్థ యాత్ర పూర్తి చేసుకుని మేనమామతో కలసి ప్రతిష్టానపురం చేరుకున్న శివుడు సత్రంలో బస చేశాడు. శివుడిని గుర్తిం చిన సుశీల అతడే తన పతి అని తల్లితండ్రులకు చెప్పింది. శివుడు ఆమెను తన భార్యగా స్వీకరించాడు. అల్పా యుష్కుడై తన ఆయుష్షు పెరగటానికి కారణమేమిటని సుశీలను ప్రశ్నించాడు శివుడు.

సుశీల చిరునవ్వుతో ఇదంతా ఆ మంగళగౌరీదేవి అనుగ్రహం అని చెప్పింది. ఆ నూతన దంపతులిద్దరూ సుఖసంతోషాలతో సిరిసంపదలతో ప్రేమానురాగాలతో జీవితాన్ని గడిపారు. శ్రీకృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. అప్పటి నుంచీ స్త్రీలు అందరూ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించసాగారు.

‘వాజ్ఞ్మయ భూషణ’ -“కావ్యసుధ “
9247313488 : హైదరాబాద్.

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అల్లనేరేడు !!

by Ananthaacharaya K.S. June 24, 2022
written by Ananthaacharaya K.S.

కూసే పిట్ట వాలే చెట్టు
పొదల్లో గెంతే కుందేళ్లు
పిట్టలు కట్టిన గూళ్ళు
పారే నదిమీద వాలే
కొంగలు
ఇవన్నీ ఇప్పుడు స్క్రీన్ మీది
బొమ్మల సింగారమే
నిజ రూప దర్శనం కరవైన బంగారమే!

కౌసు పిట్టలు కాగితాల్లో మిగిలిన కారికేచర్స్
కోయిల అమెజాన్ లో అమ్మకానికి కూసే కూలి !

వెదురు గొంతులు బొంగురు పోయి కురచనయిన మాటలు
కీ బోర్డులో e రాత. !
మౌస్ రాక్షసి నోట చేతి రాత!

బయోడైవర్సిటీలో నడక తప్పిన గుడ్డి ఎద్దు !ఎడారి మీద పచ్చ గడ్డి మైదానపు మరీచిక!

స్వరం తప్పిన
పచ్చని జావళీలు…. ప్లాస్టిక్ హంగుతో
పాప్ మ్యూజిక్

గాలికీ ఓ లెక్కుంది
కరెన్సీ ని పీలుస్తుంది
ఊపిరితిత్తుల వ్యాపారానికి
ప్రాణవాయువే పెట్టుబడి

ప్లాస్టిక్ కవర్ల
గుట్టలు తవ్వకుండా దొరికే
కాలాంతర గుప్తులు!

కాలాలు మారినా వర్షాలు ముఖం చాటేసిన
విప్పుకొనే మల్లె
మనసు మాలిన్యాన్ని
కడుగుతుoది

అల్ల నేరేడుయే
ఆకలికి
నైవైద్యమవుతుంది

పచ్చని మొక్కయే
కాలుష్యం మీద
పచ్చ బొట్టయి మెరుస్తుంది !!

June 24, 2022 0 comment
3 FacebookTwitterPinterestEmail
కథలు

‘బెల్లం ఆవకాయ తెచ్చిన తంటా’

by Madhavapeddi Usha June 21, 2022
written by Madhavapeddi Usha

ఈ రోజు నేను ఆవకాయ గురించి వ్రాయబోతున్నాను. ఆవకాయ అంటే ఇష్టపడని తెలుగువారు ఉంటారా అసలు? ఆ మిథునం సినిమా పాట ఎంతో సమయోచితంగాను, తెలుగువారికి ఓ కితాబు ఇచ్చినట్లే ఉంటుంది. ఆ పాట విన్నప్పట్నుంచి మనందరికీ ఆవకాయమీద ప్రేమాభిమానాలు పొంగి పొర్లాయంటే ఒప్పుకుంటారా? అసలైనా తినబోతూ రుచిలెందుకు లెండి! నేను ఇప్పుడు రాయబోయే మా ఇంట్లో ప్రతి ఏడాది జరిగే ఆవకాయ ప్రహసనం చదివారంటే, మన భానుమతి అత్తగారి కథలు బలాదూర్ అనుకొని నాకు కూడా ఒక స్పెషల్ బిరుదు ఇచ్చేస్తారు తెలుసా!

సరే, అసలు విషయానికి వద్దాం. పోయిన సమ్మర్ లో మాకూ కరోనా రావడంవల్ల నేను ఊరగాయలు ఓ మాదిరిగ పెట్టాను. ఇంతకీ మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేటంటే మాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఒకళ్ళు U.S అయితే ఇంకొకరు ఎవరూ అంతగా పట్టించుకోని కానీ world అంతా మెచ్చుకొనే బుల్లి దేశం ఉందే…. అదే న్యూజిలాండ్ అండీ…. పోయి పోయి అక్కడ సెటిలైంది. పైగా అక్కడ వాతావరణం సీనిక్ బ్యూటి అంతా నాకు నచ్చాయి పో. (అంటే మా అల్లుడుగారికి కూడా లెండి) అని ఒక్క అక్షరంలో తేల్చిపారేసింది. ఇంకా ముఖ్యమైన కారణం అక్కడ  ఇండియాలో లాగా దోమలుండవట (మా అమ్మాయికి దోమల ఎలర్జీ ఉంది లెండి). అందుకని అక్కడకి వెళ్ళాక అది సుఖసంతోషాలతో వర్థిల్లుతోంది. మనకి, అంటే తల్లిదండ్రులకి కూడా కావల్సిందదేగదండి!

ఇకపోతే అప్పట్నుంచి నేను ప్రతి ఏడాది కిలోలకి కిలోలు ఊరగాయలు ఇటు అటు ఎడాపెడా పెట్టేసి, వాళ్ళకి కొరియర్లో పంపించటం అలవాటైపోయింది. (మా వాళ్ళకి, అల్లుళ్లకీ, మనవళ్లకి ఆవకాయన్నా, దానితోపాటొచ్చే రకరకాల పచ్చళ్ళన్నీ కూడా చాలా ఇష్టమండీ). పంపించాక వాళ్లకి అందడం పెద్ద process  అన్నమాట.

కానీ U.S.వాళ్లు ఏవన్నా అనండి, చాలా మంచివాళ్ళు కరెక్టుగా మూడు, నాల్గు రోజులలో చేరిపోతాయి. కానీ ఈ న్యూజిలాండ్ కస్టమ్స్ వాళ్ళేమో పరమ దుర్మార్గులండీ! మన పికిల్స్ చేరడం చేరతాయి. కాని వాళ్ళ చేతుల్లో పడ్డాయంటే చాలు. ఇక మనం రామనామ జపం చేయాల్సిందే లేక ఆ క్షణ క్షణంలో సినిమాలో లాగా ‘దేవుడా! దేవుడా!’ అంటూ కూర్చోవాల్సిందే. మొన్నైతే మేము న్యూజిలాండ్ కు పికిల్స్ పంపినపుడు ఓ వారం రోజుల ఎదురు చూపుల అనంతరం మా అమ్మాయి దగ్గరనుండి ఒక ఫన్నీ మెసేజ్ వచ్చింది. అదేంటంటే ‘అభిమన్యు హాజ్ రీచ్ డ్ కురుక్షేత్ర బాటిల్ ఫీల్డ్” అని వచ్చింది. మేము ఫోన్ చేసి అడిగితే అప్పుడు చెప్పింది. కష్టమ్ వాళ్ళమో కురుక్షేత్ర్ యుద్ధభూమి, పద్మవ్యూహంలో చేరిన అభిమన్యుడేమో ఆవకాయ. ఇక వాటిని పరిక్షించేందుకు కస్టమ్స్ అధికారులు మొదలుపెడతారని దాని సారాంశం. అది విని మాకు నవ్వాగలేదు. అసలు మహాభారతంలో, అభిమన్యుడు చనిపోతాడు కదూ. కానీ మా చిన్నమ్మాయి భారతంలో మాత్రం చావడు. ఏదో కొన్ని రోజులు హోరా హోరీ కష్టమ్స్ ఆఫీసర్సతో యుద్ధం చేశాక విజయుడై ఇంటికి చేరతాడన్నమాట.

ఇక ఊరగాయల పార్సెల్ దగ్గర్నుంచి ఊరగాయలన్నీ బయటికి తీసాక వాటిని బాటిల్స్లో పెట్టాక వాటిని కూడా ఫోటో తీసి మాకు వాట్సప్ లో పెట్తారన్నమాట. అవి చూసుకని మేము ఆనందంతో తబ్బిబ్బై ఇక డాన్స్ చేయడమే తరువాయి.

మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఈసారి నన్ను అందరూ బెల్లం ఆవకాయ గూర్చి అడగడం, దాని రెసిపీ చెప్పడంతో నేను కూడా బెల్లం ఆవకాయ పెడదామని ఉబలాటపడ్డాను. ఒకరైతే బెల్లం పాకం పట్టాలి వగైరా – వగైరా అని చెప్పారు. ఆ సింగినాదం – జీలక్రర అదేం అక్కర్లేదండీ, మన రెగ్యులర్ ఆవకాయలోనే బెల్లం కలపండి, అదే బెల్లం ఆవకాయ అంటే అంతే ఇంకేం లేదు మరొకరూ చెప్పారు. ఇంకేం, అంతే కదా వెరీసింపుల్ అనుకుంటూ కొంచెం ఆవకాయ జాడిలోంచి విడిగా తీసి అందులో తగినంత మోతాదులో బెల్లం కలిపేసి, బెల్లం ఆవకాయ జిందాబాద్ అనుకుని నన్ను నేనే అభినందించుకున్నాను. తీరా పిల్లలకి పంపేందుకు వాళ్లనడిగితే ‘వామ్మో అదేంటి ఎప్పుడూ వినలేదే. బెల్లం మాగాయ విన్నాంగాని బెల్లం ఆవకాయ గురించి వినలేదు. తినలేదు. అయినా మేము రిస్క్ తీసుకోదల్చుకోలేదు. మా కొద్దంటే మాకొద్దని ఇద్దరూ ముక్తకంఠతో సెలవిచ్చారు. దాంతో నా గుండెల్లో రాయి పడింది. ఇప్పుడేం చేయడం అంత ఆవకాయలో బెల్లం కలిపానే అదంతా ఎవరు తింటారు? ఇంతలో నాకొక బ్రిలియంట్ ఐడియా తట్టింది. అది వినే ముందు తెనాలి రామకృష్ణులవారి కథ తెలుసుండాలి.

ఒకసారి రాయలవారు వారి తల్లిగారి ఆబ్దికమప్పుడు భోక్తలకు ఒక బంగారు మామిడిపండు తలా ఒకటి చొప్పున ఇద్దామనుకున్నారు. కారణం వారి తల్లిగారు చనిపోతూ మామిడిపండు తినాలన్న తన కోరికను వెలిబుచ్చారట. కాని ఆ కోరిక తీరకుండానే కాలం చేశారు. రాయలవారందుకు చాలా వ్యథ చెంది ఆబ్ధికం రోజున తల్లిగారి ఆత్మశాంతి కోసము అందరికీ బంగారు మామిడి పండ్లు దానమిస్తున్నారు. కాని అక్కడ కొంత మోసము జరగనారంభించింది. భోక్తలందరూ పేరాశతో రెండోసారి కూడా తీసుకొనడం మొదలుపెట్టారు. అది గమనించి రామకృష్ణులవారు ఇలాగైతే ఖజానా ఖాళీ అవుతుందని భయపడి వీరికి గుణపాఠం చెప్పాలని ఒక ట్రిక్ చేస్తారు. వెంటనే ఏమని ఎనౌన్స్ చేశారంటే, రామక్రిష్ణులవారి తల్లిగారు చనిపోయే ముందు తనకు వాతలు పెట్టమని కోరుకున్నారట. (బహుశా ఆ రోజుల్లో అదో రకం వైద్యం అయి ఉండవచ్చు). కానీ చూస్తూ చూస్తూ తల్లికి వాతలు పెట్టే బాధాకరమైన పని చేయనంటే చేయనని భీష్మించుకు కూర్చున్నారట. దాంతో ఆవిడ కోరిక తీరకనే పరమపదించారట. కానీ ఎవరూ వాతలు పెట్టించుకోవడానికి ఒప్పుకోరు కనక తన తల్లి కోరిక తీర్చుటకిదే తగిన సందర్బం అని తలచి ఒక బంగారు మామిడి పండుకి ఒక వాత తీసుకోవాల్సిందిగా ఒక నిబంధన పెట్టారు. దాంతో కొంతమంది పెట్టించుకున్నారు. కానీ అందరూ సాహసించలేకపోయారు. దాంతో ఖజానా ఖాళీ అయిపోతుందన్న రామకృష్ణులవారి భయానికి చెక్ పడింది.

సో, ఆ కథ లాగ నేను కూడా మా పిల్లలకి నేను పెట్టిన పికిల్స్ కావాలంటే బెల్లం ఆవకాయ కూడా ఒక్కో కిలో చప్పున తీసుకోవాలని ఒక కండిషన్ పెట్టాను. దాంతో పిల్లలు తప్పనిసరి ఒప్పుకోవల్సి వచ్చంది.

తరువాత ఆ రుచిలేని బెల్లం ఆవకాయ తీసుకున్నారేగాని దాన్నలాగే ఉంచి మిగతావి లాగించడం మొదలెట్టారు. కానీ నేను ఊరుకోక రోజూ బెల్లం ఆవకాయ తిన్నారా? లేదా? అని ఫోన్ లో సతాయించే దాన్ని – అది భరించలేక వారం వారం గెష్ట్లలని భోజనానికి పిల్చి ఆ బెల్లం ఆవకాయ వాళ్లకి వేసి ఖర్చు చేశారు. అప్పట్నుండి ఆ బెల్లం ఆవకాయ బాధితులెవరూ వారింటిపై కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించలేదు. నేను కూడా బెల్లం ఆవకాయ మాట కలలో కూడా తలచడం మానేసాను.

ఇంతకీ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు నాకు ఏం బిరుదునిస్తున్నారు? చెప్పరూ।।

June 21, 2022 4 comments
3 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నాకు తెలిసిన ‘సి.నా.రె.’

by Kopparti Rambabu June 21, 2022
written by Kopparti Rambabu

2019 లో కీ.సే. సి.నారాయణ రెడ్డి గారి గురించి రాసినది. మరొక్కసారి వారిని స్మరించుకుంటూ……….

ఆధునిక తెలుగు సాహితీ జగత్తులో , నిలువెత్తు రూపం …..సి నా రే. ఆయనకి రోజూ కవిత రాయనిదే తెల్లవారదు, కవితకు కొత్త సొబగులు అద్దనిదే నిద్దర రాదు.

ఆయన కవి, అధ్యాపకుడు, పరిశోధకుడు. అన్నిటినీమించి మనిషి జీవితాన్ని ఒక ప్రిజమ్ లోంచి కాంతి ప్రసరించినప్పుడు వెలువడే రంగులన్నింటినీ మేళవించి, పద చిత్రణతో , రూపుకట్టించిన మేధావి.

ఆయన మాట్లాడుతుంటే మువ్వల సవ్వడి గొంతులో వినిపిస్తుంది.ఆయన బహుముఖ సాహితీ స్వరూపాన్ని దర్శించడం అంటే , గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ , గుడి గోపురం, గోడల మీద చెక్కిన శిల్పాలను చూడడం వంటిది.

ఆయన రచనల్లో అత్యంత ప్రశస్తమైనది గా భావించబడేది ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిపెట్టిన ” విశ్వంభర ” వచన కావ్యం. మానవుడు ఆ కావ్యానికి నాయకుడు. ప్రకృతి నాయిక.ఆదిమ కాలంనించీ ఆధునిక కాలం వరకూ సాగిన మనిషి జీవన ప్రస్థానం , ఐదు ప్రకరణాలుగా సాగిన సుదీర్ఘ కవిత.” నేను పుట్టక ముందే నెత్తి మీద నీలితెర.కాళ్ళ కింద ధూళి పొర.” అంటూ మొదలయ్యి “ఎంతటి కలవరమో వెదుళ్లకు ప్రతి అంగం నాదంగా పరిణమించాలని……ఎంతటి ఆరాటమో కొండరాళ్లకు ……అఖిలాణువులు మూర్తులుగా మూర్తీభవించాలని…. అనిసాగిపోయే కవితా ప్రవాహం గుక్కతిప్పుకొనివ్వదు.

నారాయణ రెడ్డి గారిని చూసి మాట్లాడిన అదృష్టం నాది.ఆయన సినిమా పాటల సంకలనం ” పగలే వెన్నెల ” ఆయన చేతులమీదుగా కాలేజీలో బహుమతిగా అందుకున్నాను.మూడు వేల పైచిలుకు పాటలు రాసిన ప్రతిభా మూర్తి. జ్ఞానపీఠ బహుమతి పొందిన విశ్వనాథ వారిని మెప్పించటంకోసం ” ఏకవీర ” సినిమాకు మాటలు రాశారు.ఆ సినిమా చూసి హాల్లోంచి బయటికి వస్తూ ఒక సామాన్య ప్రేక్షకుడు అన్నాట్ట ” ఈ సినిమాలో పాటలు అన్నీ అర్థం అయ్యాయి కానీ మాటలు ఒక్క ముక్కా అర్థం కాలేదు ” అని.

అయితే ఆ సినిమాలో ” తోటలో నారాజు ” పాట సినీ ఉద్యానవనంలో రెడ్డిగారిని రారాజుగా నిలిపిన పాట.ఆ పాటలో ఆయనే అన్నట్టు అది రస రమ్య గీతం.అదే సినిమాలో ఆయన తాను కాలేజీ రోజుల్లో రాసిన ” ప్రకృతిలో ప్రణయిని కవితని పాటగా పెట్టారు.బాలూ ఎంత నిదానంగా పాడారు అంటే , పడవలో వెళ్తూ పాట వింటే , పడవ కంటే పాట వెనకబడినట్టు అనిపిస్తుంది.

గులేబకావళి కథ (1962)నించీ మొదలైన ఆయన సినీ గీత రచనా ప్రస్థానం , ఐదు దశాబ్దాలకు పైగా సాగింది.ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉంటూ , హైద్రాబాద్ నించీ చెన్నైకి విమానంలో వచ్చేలోపు కొన్ని పాటలు రాసేసే వారుట.చెన్నైలో మేము ఉన్న టీ నగర్ , బస్ స్టాండ్ ఎదురుగా సుధార హోటల్ లో బసచేసేవారుట.

నారాయణ రెడ్డి గారిని సాహితీ మూర్తిగా , మరొక మారు దర్శించాలి అంటే, ఆయన అనేకానేక రచనలు ఆధారంగా ఆయన బహుముఖ సాహితీ రూపాన్ని సందర్శించాలి.కవిగా పద్య రచనతో శ్రీకారం చుట్టి , కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, ఋతు చక్రం వంటి పద్య కావ్యాలు రాశారు. వచన కవిగా జలపాతం, అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసం, మంటలూ – మానవుడు, ఉదయం నా హృదయం, మార్పు నా తీర్పు, తేజస్సు నా తపస్సు, ఇంటిపేరు చైతన్యం, కవిత నా చిరునామా, కాలం అంచుమీద, నడక నా తల్లి, శిఖరాలూ లోయలూ, మట్టీ మనిషీ ఆకాశం, దూరాలను దూసుకొచ్చి, ఆరోహణ, దృక్పథం, భూగోళమంత మనిషి బొమ్మ, , వ్యక్తిత్వం, గదిలో సముద్రం.
:
👆 ఆయన కావ్యాల పేర్లు ….ఒక క్రమపద్ధతిలో పెర్చితే అది ఒక కవిత అవుతుంది. అందువల్లే భారతీయ జ్ఞానపీఠ కమిటీ, వారి సృజనాత్మక సాహితీ సేవకు మెచ్చి వారి చుట్టూ పట్టు ఉత్తరీయం కప్పినట్టు వారి సమగ్ర సాహిత్యానికి జ్ఞాన పీఠ బహుమతి ప్రకటించింది

సి నా రే ని తిరుగులేని పరిశోధకుడిగా మాత్రమే కాకుండా ఆచార్య స్థానంలో నిలబెట్టిన గ్రంధం “ఆధునిక ఆంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు.” రిఫరెన్స్ పుస్తకంగా ఆధునిక తెలుగు కవిత్వం మీద దీనిని మించిన పరిశోధనా గ్రంధం వేరొకటి ఇప్పటిదాకా రాలేదు.

సినిమా పాటల రచయితగా ఎన్ని ఉదాహరణలు చెప్పినా , ఆయన పాటలలోని మాటల సొగసు తరగదు. పాటలో ఏముంది నా మాటలో ఏముంది అంటూ ఆయన రాసిన సినిమా పాటలమీద ఆయనే రాసిన లఘు వ్యాఖ్యానాలు , పాటలలోని అందాలను వెతికి పట్టుకునేలా చేస్తాయి.

కృష్ణవేణి సినిమాలో నాయికని నది తో పోలుస్తూ రాసిన “శ్రీగిరి లోయల సాగే జాడల శతకోటి విద్యుల్లతలు వికశింపచేసినావు ” అంటారు, శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ గురించి.
సీతా కళ్యాణం సినిమాలో గంగావతరణం పాట ఆయన పాండితీ ప్రకర్షకు నిదర్శనం. “కదిలింది కదిలింది గంగ, మహోత్తుంగ తరంగ ” అంటూ గంగా నదీ ప్రవాహాన్ని , పదప్రవాహంగా, కవితా ఝరిగా పరుగులెత్తించారు.

నదులు అంటే ఆయనకు బహు మక్కువ, ఆయనకు నలుగురు కుమార్తెలు, గంగ,యమున, సరస్వతి,కృష్ణ ,….వారి పేర్లు.

ఆయనకు, జ్ఞానపీఠ బహుమతి వచ్చాక , శృతి నీవు గతి నీవు, ఈ నా కృతి నీవు భారతీ …… అంటూ రాసుకొచ్చి శరణాగతి నీవు భారతీ అంటారు.ఆ పాట ఆయన జ్ఞానపీఠం పై నిలిచిన సరస్వతీ దేవికి చేసిన గీతార్చన. ఆ పాటలో ప్రతి పదమూ , కవితాత్మ దర్శన ప్రాప్తి కలిగించే కైవల్య పథం.
:
ఒక సినిమా పాట మీద పాఠం రావడం , ఆయనకే చెల్లింది…..” వట పత్ర సాయికి ” పాట రాసిన ఆయన వెళ్లిపోయారు అని బాధ కలిగినా తాత రాసిన జోల పాట పిల్లలరూపంలో సాక్షాత్తూ ఆభగవంతుడు నిత్యం విని ఆనందిస్తూనే ఉంటాడు.

నారాయణరెడ్డి గారు , తెలంగాణాలో , హనుమాజీ పేటలో జన్మించారు.ఉర్దూ మీడియంలో చదువుకున్నారు.పారసీక భాషలో కూడా పట్టు ఉంది. ఆ పాండిత్యం ఆయన చేత తెలుగులో గజల్స్ రాయించింది.గజల్ శ్రీనివాస్ ఆయన గజల్స్ బాగా పాడి ఆయన మానస పుత్రుడిగా పేరుతెచ్చుకున్నాడు.
ఆయన కూడా తన గజల్స్ చాలా బాగా పాడి క్యాసెట్స్ రూపంలో తీసుకొచ్చారు.”అమ్మ ఒక వైపు , దేవతలంతా ఒక వైపు, సరి తూగమంటే, అమ్మవైపు ” అన్న ఆయన గజల్ మాతృవాత్సల్యాన్ని మనసుకి హత్తుకునేలా చేస్తుంది.
ఆయనకు సమకాలికుడైన ఆయన మిత్రుడు దాశరథి తో కలిసి తొలి రోజుల్లో జంట కవిత్వం రాశారు.
పోతన భాగవత పద్యాలకు మందార మకరందాలు పేరిట సరళ వ్యాఖ్య రాశారు. 85 సంవత్సరాలు పైగా జీవించి , పుట్టినప్పటినించీ లెక్క గట్టుకున్నట్టు 85 కి పైగా రచనలు ప్రచురించారు.ఏటేటా వచ్చే ఏ సంస్థ తెచ్చే కవితా సంకలనాల్లో ఐనా ఆయన కవిత ఉండ వలసిందే. అది ఆయనకు జ్ఞానపీఠం వచ్చింది కనుక వేసే పెద్ద పీట కాదు . కాలానుగుణంగా, భావజాలానికి , కవిత్వ వ్యక్తీకరణ విధానానికి పదును పెట్టుకుంటూ, పాళీకీ పదును తగ్గలేదని కొత్త కలాలకి ధీటుగా కవిత్వం రాసే ఆ నిత్య కవితా వసంత భోగ రాయుని గొప్పదనం అది.

నారాయణరెడ్డి మౌలికంగా కవి.కవిత్వం విషయంలో ఆయన నమ్మిన ఆచరించిన, అనుసరించిన రచనా సూత్రం “కవిత్వానికి మూలం భావం…..అదే కవితాత్మ……. ఆ ఆత్మకు రూపాన్నిచ్చేది భాష…… అది దేహం. ” ఈ సూత్రం ఆధారంగానే ఆయన ఏడు దశాబ్దాలు కవిగా మనగలిగాడు.

మనమధ్య, నరుడిగా , నారాయణుడి గా తన విశ్వంభర మహా కావ్యం ద్వారా కవితా విశ్వ విహారం చేశారు. ఆయన తన రచనల ద్వారా చేసిన “సదాలోచనలు అంతరంగాలను సమీక్షించి చూపుతాయి.ఆ సమీక్షలు జీవన నిర్వహణకు పురోదర్శినులవుతాయి ” కళాత్మకత, వైజ్ఞానికత, ఆధ్యాత్మికత , సాధనలోఎన్ని ఎదుదెబ్బలు తగిలినా మనిషి ఎప్పుడూ తిరోగామి కాడు, అనేది ఆయన ప్రగాఢ నమ్మకం.అదే విశ్వంభర కావ్యంలో ఆయన సృష్టించిన కవితా సారాంశం.

కవిత రాయనిదే నిదుర రాని ఆయన శాశ్వత నిధురలోకి వెళ్లి పోయారు, తన రచనల ద్వారా తెలుగు మానవాళిని నిత్య. జాగురూకులై ఉండమని నిర్దేశిస్తూ….ఆ కవితా శిఖరానికి శిరస్సు ఎత్తి నమస్కారం.ఆయన కవితా సంస్కారానికి శిరస్సు వంచి అభివాదం.నివాళి.

June 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాపు

by పొట్లపల్లి శ్రీనివాసరావు June 21, 2022
written by పొట్లపల్లి శ్రీనివాసరావు

నీవు లేని నీకోసం కవిత రాయాలని
ముప్పిరి గొన్న ఆలోచనల.. కలం చేత పెట్టాను
ఆరు పదుల పైగా నీ తో నడిచిన రోజులన్నీ
ఒకటొకటిగా మెదడు సందుగ దూకి నెట్టుకొస్తున్నాయి

నీవు లేని నీకోసం తన్నుకొస్తున్న అక్షర ప్రవాహం
కంటి సుడిగుండాల వలయాల చీల్చి వర్శిస్తూ..
మసక మసకగా కాగితం మీద వాలిన
పదాల పాదాలను నదీ జలమై అభిషేకిస్తూ..

బాపూ!నీవు లేని నీకోసం కవిత రాయాలనుకున్నా
నీ చుట్టే నేనున్నానని భుజం తడుతున్నట్టు..బాపు

ముందు రోజు మల్లెపువ్వులా నవ్వులు చల్లి
మనవడి పెళ్లి శుభలేఖ ఆసాంతం చదివి
అందులో నీ పేరు ఉందని మెరిసి
విద్యుద్దీపకాంతుల్లో ఇల్లంతా బాగుందని మురిసి
చక్రాల కుర్చీ మీద ఫోటోలకు ఫోజులిస్తివి
చూసి అబ్బురపడితివి కదా బాపూ..
పత్తి పువ్వు లా చూసుకున్నాము కదా …
అంతలోనే ఏమైంది…ఇంటి నిండా చీకట్లు
చెప్పా చెయ్యక ఎలా వెళ్ళిపోయావు బాపూ..

మేమంతా ఉన్నతంగా ఎదగాలి అన్నావు
నీవేమో ఉన్నంతలోనే బతకాలనుకున్నావు

నీ స్వప్న సాకారం కోసం మా చదువుల కోసం
మాటిమాటికి ఇరుకిరుకు ఇళ్లకు మారుతూ
కిరాయి ,కిరాణా దుకాణం ఖాతా,ఫీజులు బట్టలు పుస్తకాలు,రోగాలు..మధ్యతరగతి ఖర్చులకై..
బతుకు తెరువు కోసం చాలీచాలని
ఆనాటి అత్తెసరు జీతాల బడిపంతులు నీవైనా
నిర్మొహమాటంగా గలగల మాట్లాడే నిష్కపటి వై
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకుడివై
ఎదిగి జీవించిన ఆత్మాభిమానపు జెండా నీవు బాపు

ఉద్యోగానంతరమే అసలు జీవితమని
అరిగిపోయిన శేష జీవితం కాదని అది అశేష మని
సుప్తంగా ఉన్న అంతశ్చేతనను తట్టిలేపి
పసితనపు ఛాయతో కవిత్వమై వెలిగావు
ఒక విశాల ప్రపంచంలో ఒదిగి పోయావు

తనదైన భావన పరిధిలో తట్టిన ప్రతిదీ
కవిత్వీకరించి పిలిచిన ప్రతి చోటా
దూరాభారమనక వయసును మరిచి
వినిపించి పొంగిపోయావు కదా!బాపు

కలల కుంచెతో అక్షరీకరించి
కలల కొలిమి తో స్నేహించి
కలల సంతకం చేసిన చెలిమి నీవు
కలుపుగోలుతనం అసలు రూపం నీవు

కోపం లోనూఆర్ద్రతలోను శివుడి పేరును
సార్థకం చేసుకున్న ధరణీశ్వరుడవు నీవు
అవును భోళాశంకరుడివి నీవు నీ వని
నీవు లేని నీకోసం ఏమి రాసినా…

గుర్తొస్తే చాలు బరువెక్కి ఎక్కెక్కి ఏడిచే గుండెలు
మర్చిపోతే కదా!చాక్పీస్ చేతులతోఎందరికో
జ్ఞాన గవాక్షాలు తెరిపించిన బోధి వృక్షాన్ని…
ఆ నీడలో మమ్ము నడిపించిన జ్ఞాన సుగంధాన్ని..

అన్నీ ఉన్నా నీవు లేవు
నీవే లేనప్పుడు ఎన్ని ఉన్నా ఏదో వెలితి
మా అందరి హృదయాల్లో ఏదో కలత

June 21, 2022 1 comment
2 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us