మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

బహుముఖ ప్రజ్ఞాశాలి సర్ సి.ఆర్ రెడ్డి

by Cheedella Seetha Lakshmi April 10, 2022
written by Cheedella Seetha Lakshmi

సర్ సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభావంతుడైన  కవి,విమర్శకుడు, రాజకీయవేత్త, వక్త, హేతువాది, ఆదర్శవంతుడు. మైసూరు మహారాజా కళాశాల ఆచార్యులుగా,ప్రిన్సిపాల్ గా,తర్వాత సంస్థాన విద్యాశాఖాధికారిగా,ఆంధ్ర విశ్వకళా పరిషత్ అంటే నేటి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక ఉపకులపతిగా(వి.సి) తన బాధ్యతను నిర్వహించడమే కాకుండా రాజకీయాలలో కూడా పాల్గొని ఎం. ఎల్.సి.గా ఎన్నికై ప్రముఖ రాజకేయవేత్తలతో కూడా సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు.

    అన్ని రంగాలలో తన ప్రతిభను చాటుకున్న  ఆచార్య సి.ఆర్.రెడ్డి గారు డిసెంబర్ 10 వ తేదీ 1880 సంవత్సరంలో  చిత్తూరు జిల్లా కట్టమంచిలో సుబ్రహ్మణ్య రెడ్డి,నారాయణమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు.ఐదో ఏటనే వీధిబడిలో విద్యను ప్రారంభించి చిన్నవయసులోనే భారతం,అమరకోశం,రామాయణాన్ని చదివాడు.ప్రతి పరీక్షలో ఉన్నతశ్రేణిలో పాసయ్యాడు.మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఉన్నతవిద్యను పూర్తిచేశాడు.1902 లో బి.ఏ.పరీక్ష లో చరిత్ర,తత్వ శాస్త్రంలో అత్యధిక మార్కులతో బంగారు పతకాలను సాధించాడు.

1899 సంవత్సరంలో నవ్య కావ్యరచన పోటీలో తన 19వ ఏటనే “ముసలమ్మ మరణం” లఘుకావ్యానికి బహుమతి లభించింది. డిగ్రీలో అత్యధిక మార్కులు సాధించిన కారణంగా భారతప్రభుత్వపు విద్యార్థి వేతనంతో ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి   అనుబంధంగా ఉన్న సెయింట్ జాన్స్ కళాశాలలో ప్రవేశం పొంది తెలివితేటలతో సమర్థతను చాటుకుని అనేక పురస్కారాలు అందుకున్నాడు. 1903 సంవత్సరంలో ఇతని ప్రతిభకు, సామర్ధ్యానికి గుర్తింపుగా “రైట్ బహుమతి” లభించింది. ఆంగ్లేయుల మన్ననలు పొందాడు.1905 లో కేంబ్రిడ్జి లిటరరీ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికై తన ఉపన్యాసాలతో అందరి మనసులు చూరగొన్నాడు.1906 సంవత్సరంలో ఎమ్.ఏ.పరీక్షలో ప్రథమశ్రేణిలో ప్యాసయ్యాడు.

ఇతని ప్రతిభను గుర్తించి బరోడా సంస్థానాధీశుడు శాయాజీ రావు గైక్వాడ్ తన సంస్థానంలో ఉద్యోగం ఇవ్వదలచి, దానికొరకు వివిధ విశ్వవిద్యాలయాలు సందర్శిచడానికి అమెరికాకు పంపించాడు.పర్యటన పూర్తయ్యాక 1908 సంవత్సరంలో స్వదేశానికి వచ్చి బరోడా కళాశాలలో ఆచార్యునిగా,ఉపాధ్యక్షునిగా ఉద్యోగం చేశాడు కట్టమంచి. తర్వాత మైసూరు మహారాజా కళాశాలలో ఆచార్యునిగా,ప్రిన్సిపాల్ గా, విశ్వవిద్యాలయ రూపకర్తగా,విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక్కడ పనిచేసిన 12 సంవత్సరాలలో హరిజనులకు పాఠశాలలో ప్రవేశం కల్పించడానికి  చాలా కృషి చేశాడు.విద్యాశాఖాధికారిగా ఉండి “ప్రతి ఊరికి ఒక పాఠశాల” అనే ఉద్యమం ప్రారంభించాడు.1921లో ఆకస్మాత్తుగా పదవికి రాజీనామా చేసి రాజకీయాలలో పాలుపంచుకున్నాడు.

1922 సంవత్సరంలో జరిగిన ఉపఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుండి అత్యధిక మెజార్టీతో శాసనసభకు ఎన్నికైనాడు.కొంతకాలం చిత్తూరు జిల్లా బోర్డ్ చైర్మన్ గా సేవ చేశాడు. తర్వాత ఆంధ్రవిశ్వకళాపరిషత్ మొట్టమొదటి కులపతిగా,తిరిగి అదే విశ్వవిద్యాలయానికి రెండవసారి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టాడు. ఇలా సి.ఆర్.రెడ్డి అనేక రంగాల్లో సేవలు చేసి తన ప్రతిభను చాటుకున్న మేధావి.

 సర్ సి.ఆర్.రెడ్డి వేదం వెంకట రాయశాస్త్రి గారి శిష్యుడు.విశ్వకళా పరిషత్ అధ్యక్షునిగా వున్నప్పుడు గురుదక్షిణగా వేదం వారికి  “కళాప్రపూర్ణ” బిరుదును ఇవ్వమని యూనివర్సిటీ వారికి సూచించాడు.సి.ఆర్.రెడ్డి రాసిన గొప్ప విమర్శ గ్రంథం “కవిత్వ తత్త్వ విచారము”.

    కట్టమంచి లేఖలు రాయడంలో నేర్పరి.అయితే ఈయన లేఖలు ఎన్నో ఉన్నప్పటికీ ముద్రితమైనవి తక్కువే అని చెప్పాలి. సాహిత్య మిత్రులకు,రాజకీయవేత్తలకు,సన్నిహితులకు ఎన్నో లేఖలు రాశారు కానీ లభ్యమైనవాటిలో,అందులో ముద్రితమైన వాటిలో ఎక్కువ లేఖలు రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మకు రాసినవే అవి కూడా ఆంగ్లభాషలో ఉన్నాయి.

  ఈ లేఖల్లో ఆరోగ్యవిషయాలు,కుటుంబ విషయాలు, సి. ఆర్.రెడ్డి ఆలోచనలు మొదలగునవెన్నో  చోటుచేసుకున్నాయి.ఒక  విషయం గురించి ఆచూకీ తెలుసుకున్నప్పుడు పరిపూర్ణ అవగాహనతో సూచనలు సలహాలు  ఇవ్వడం రామలింగారెడ్డి  గారి లేఖల్లో కనిపించే ప్రత్యేకలక్షణం.ఆయన వేమనకు సంబంధించి  అనేక ఉషయాలను  సూచిస్తూ  రాళ్లపల్లికి లేఖలు రాశారు.

సి.ఆర్.రెడ్డి రాళ్లపల్లికి రాసిన లేఖలో  ఆంధ్ర విశ్వకళాపరిషత్  వారు ఏర్పాటు చేసిన  వేమన ప్రత్యేకోపన్యాసాల గురించి ఎందుకు అప్లై చేయలేదని ప్రశ్నించాడు.  రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ చేత ఉపన్యాసాలు ఇప్పించాలని ఆయన కోరికగా కనిపిస్తుంది. అందువల్లనే లేఖ రాసి   ప్రత్యేకంగా ఉపన్యాసాల కోసం ఎందుకు అప్లై చేసుకోలేదని సూటిగా ప్రశ్నించాడు. ఇదే  వి.వి.శర్మ దగ్గర వేమన  గురించిన  సమాచారం చాలా  ఉన్నదని  ఎన్నికైన ఉపన్యాసకునికి  ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు కూడా శర్మ  అంగీకరించాడని తెలిపాడు.

సి.ఆర్.రెడ్డి  రాళ్లపల్లికి ఒక  సుదీర్ఘమైన రహస్యలేఖను రాశాడు. ఇది చాలా విలువైనది.దీనిలో వేమనకు సంబంధించిన సమాచార సేకరణ ఉంది.

వి.వి.శర్మ. దగ్గర ఉన్న వేమనకు సంబంధించిన విషయాలను   తెప్పించుకోమని సలహా ఇచ్చాడు.

  బ్రౌన్ ముద్రణలో వేమనకు  సంబంధించిన  వంగూరి సుబ్బారావు రచనలు,క్రిస్టియన్ కాలేజీ  మ్యాగజైన్ లో వచ్చిన వ్యాసం చూడవలసిందని సూచిస్తూ  హాస్యగాడు అన్న పదం వేమనకు వాడవద్దని సూచించాడు.

పరిహాసరసం గురించి అధ్యయనం చేయాలని,సాహిత్యంలో పరిహాసరసం ఆవశ్యకత,అవసరం ఎంత వరకున్నదో లోతుగా పరిశీలించాలని  రాస్తూ, కాళ్లకూరి గోపాలరావు రచించిన ఆపూర్వ సంఘ సంస్కార గ్రంథపీఠికలో ఈ విషయాన్ని  తాను రాసినట్లు సి.ఆర్.రెడ్డి లేఖలో తెలిపారు.

    “కవిత్వ తత్వ విచారం” లో సి.ఆర్.రెడ్డి  పరిహాసరసం అంటే ఏమిటో రాస్తూ  వేమన పద్యాలలో పరిహాసరసం ఉన్నదని రాస్తూనే  “మరుగు  మరియాదలు  లేని మోటు విధముగా దిట్టడు. నొప్పిచెందువారు సైతం ఇతరులతో

కలిసి నవ్వునట్లు చేయ సమర్థుడు” అని వేమనను కొనియాడాడు.

     వావిళ్ళ వారు ముద్రించిన గ్రంథంలో  రాళ్లపల్లి రాసిన పీఠికను విమర్శిస్తూ

 సి.ఆర్.రెడ్డి తన లేఖల్లో ఇలా అంటాడు”  నీవు రాసిన పీఠిక  బాగున్నప్పటికీ కొద్దిపాటి న్యాయమే

జరిగిందనీ, ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని,

వేమన రచనారహస్యాలను వెలికి తీయాల్సిన అవసరం ఉన్నదని  విమర్శనాత్మకంగా  సూచిస్తూనే

సి.ఆర్.రెడ్డి  వేమనపై తనకుగల

అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఇలా చెప్పాడు. “తెలుగు రచయితలలో

వేమన చాలా గొప్ప పండితుడని

వేమన ఒకరిని అనుకరించడు, వేమనను ఇంకొకరు అనుకరించలేరని,వేమన పద్యాలు సహజధోరణిలో  సుకుమారమైన శైలి కలిగి  సహజత్వాన్ని   కలిగి ఉన్నాయని”  రాశాడు.   

     ఈవిధంగా ఈ లేఖలో వేమన గురించి సమగ్ర సమాచారం అందిస్తూనే  తనకు అనారోగ్యంగా  ఉన్నదని,బెంగళూరుకు ప్రయాణమవుతున్నట్లు తెలుపుతూ,  తన ప్రయాణ విషయాన్ని గోప్యంగా ఉంచమని

రాశాడు.ఈ లేఖలో వేమన ఉపన్యాసాలకు రాళ్లపల్లి ఎన్నికైనట్లు కూడా తెలిపాడు. వేమన పద్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో వేమనపై రాసే గ్రంథం కూడా  అంత గొప్పగా ఉండాలని  వేమన రచించాడా   అన్న అనుభూతి పొందేటట్లు రాస్తావని తన ఆశాభావం వ్యక్తం చేశాడు. రాళ్లపల్లికి రాసిన ఇంకో లేఖలో వేమన గురించి రాస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని

హితవు  పలికాడు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పువాటిని పుక్కిటి పురాణాలను గుడ్డిగా నమ్మక  నిజాన్ని పరిశోధించాలి అంటాడు.  ‘కటారుపల్లి’ లో  వేమన సమాధి ఎదుట లభించే  కథలను నమ్మక, మీకు సమ్మతమని తోస్తే  “వేమన గాథలు” పేర అనుబంధంలో చేర్చాలని సూచించాడు.

          విగ్రహారాధనను,కర్మకాండలను,ఆచారాలను నిరసించిన వేమన సమాధి ఎదుటనే  దున్నపోతులను బలి ఇవ్వడమనేది  వేమన పట్ల  ఇంతకన్నా ఘోర అపచారమేముంటుందని  రెడ్డిగారు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.హిందూ సమాజం దిగజారి కుళ్ళిన అంగంలా తయారైందన్న  ఏహ్య భావాన్ని వ్యక్తం చేశాడు.

    రాళ్లపల్లికి రాసిన ఇంకో లేఖలో వేమన గురించి తనకు తెలిసిన  ఇంకాస్త సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. వంగూరి సుబ్బారావు రాసిన గ్రంథం అత్యంత విలువైనదని సూచించాడు.పోతన వేమనలను పోలుస్తూ లేఖలో ఇలా వివరించాడు. “పోతన బోధకుడుగా నీతిని మాత్రమే బోధించాడని,వేమన అలాకాక సంఘాన్ని,సమాజపరిస్థితులను,

మతాచారాలను, జీవితాలను ఆకళింపు చేసుకుని  తన నీతి సూత్రాలను తన రచనలో

నిబంధించి  పోతన కంటే ఒక మెట్టెక్కి అసలుసిసలైన నీతిబోధకుడుగా  అవతరించాడని రాశాడు. దీన్నిబట్టి

సి.ఆర్.రెడ్డి గారికి వేమన పట్ల ఉన్న గౌరవం,అనురాగం వ్యక్తమౌతుంది.

     తంజావూరు  లైబ్రరీలో  ఉన్న వేమన చిత్రపటమే వంగూరి సుబ్బారావు  పుస్తకంలో ఉంది కాబట్టి  లైబ్రరీ కార్యదర్శిని  సంప్రదించాల్సిన అవసరం లేదని రాశాడు.

     ఈ మధ్య కాలంలో జపాన్ భౌతిక శాస్త్రవేత్త పాదరసంలోని  ఒక అణువును  బంగారం అణువుగా మార్చాడు. శాస్త్రీయాధారమన్నది కాదు సమస్య, నిజంగా   దొంగసన్యాసులు “హేమ తారక విద్య”   చేయగలుగుతారా లేదా  అన్నది సమస్య అని రాశాడు. వేమన రసవాదంపై  నీవే నిర్ణయాలు తీసుకోమని చెప్పాడు.

వేమన తెలుగు ప్రజలకే పరిమితం కాలేదన్న విషయం తమిళ  కన్నడ ప్రాంత ప్రజలు  వేమన  చెప్పిన  నానుడులు,

సామెతలను వాడుతుండడం బట్టి తెలుస్తుందని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యయనం కొనసాగించాలని సూచించాడు.” వేమన తంజావూరులో చాలా ప్రఖ్యాతి గడించడానికి గల కారణం ” హేమతారక విద్య” పట్ల ప్రజలలో ఉన్న విశ్వాసమేనంటాడు.అయితే వేమన తనకీ విద్య వచ్చునని ఎక్కడా తెల్పనప్పటికీ ప్రజలే వేమనలాంటి యోగులకు కూడా ఈ విద్యనంటగట్టారంటాడు.

    సర్ కట్టమంచి ఇంకా ఇలా వివరించాడు.” భూమిపై సంతోషంగా జీవించాలంటే డబ్బు ఎంతో అవసరం” వేమన రచనలో కూడా పేర్కొన్నాడని వ్రాశాడు.

వేమన సమకాలీన సాంఘిక పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకోవాలని సలహానిస్తూ ఆనాటి సమాజంలో స్త్రీని ఏవిధంగా చూసేవారో దృష్టిలో పెట్టుకుని స్త్రీ విషయంలో వేమన తీర్పును,వేమన దృష్టిని అధ్యయనం చేయాలని సూచనలిచ్చాడు.నిజంగా ఆనాడు సంఘంలో స్త్రీని చిన్నచూపు చూసేవారని, గ్రంథాల్లో కూడా స్త్రీ పట్ల చిన్నచూపున్నట్లే కనిపిస్తుందని,చారిత్రక దృష్టి కూడా అవసరమని రాశాడు. ఈ లేఖలో  వేమన గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు వేమన సమకాలీన సాంఘిక పరిస్థితులు,చారిత్రకనేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సమగ్ర పరిశీలన చేసి చక్కని గ్రంథం వ్రాయాలన్న ఆకాంక్ష కలవాడుగా కనిపిస్తాడు.రాళ్ళపల్లికి రాసిన వేరే లేఖలో వేమనపై రాసిన ఉపన్యాస గ్రంథం పూర్తికావస్తున్నట్లుగా భావిస్తున్నానని రాస్తూ ఆ వ్యాసాలను సాధ్యమైనంత త్వరలో కాకినాడను వేదికగా చేసుకొని ఉపన్యాసాలిప్పించాలన్న కోరికను వ్యక్తం చేశాడు.

    ఇంకో లేఖలో” ఉపన్యాస పరంపర గ్రంథం వెలువడడంలో మీరు కృతకృత్యులయ్యారని అభినందనలు తెలుపుతూనే ఇది నాకంత ఆశ్చర్యాన్ని కలిగించలేదంటాడు.దీన్ని బట్టి ఎప్పటికప్పుడు రాళ్ళపల్లి చేసే శ్రమను ,పరిస్థితిని తెలుసుకోవడం వలన, రాళ్ళపల్లి ఈ విషయంలో పూర్తిగా కృతకృత్యుడౌతాడన్న విశ్వాసం ఉండడం వల్ల గ్రంథరూపంలోకి వచ్చాక రామలింగారెడ్డికి పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు.రాళ్ళపల్లి రాసిన “మానిస్క్రిప్టు” లను విశ్వవిద్యాలయానికి బహూకరించమని తన ఉత్తరంలో కట్టమంచి కోరుతాడు.

     రాళ్ళపల్లికి రాసిన ఇంకో లేఖలో రాళ్ళపల్లి ” శాలివాహన సప్తశతి” అనువాదాన్ని మెచ్చుకుంటూ భావయుక్తంగా ఉన్నదని,సరళంగా వున్నదని,సుందరంగా వున్నదని,ఆకర్షణీయంగా వున్నదని ప్రస్తుతిస్తూ దాని మూలగ్రంథ రచయిత కాలం,ఇతర వివరాలు తనకు తెలియపరిస్తే పీఠికను వ్రాయడానికి ఇష్టపడుతున్నట్లుగా వ్రాశాడు.అయితే కేవలం 400 పద్యాలే వ్రాసి సంతృప్తిపడక పూర్తి గ్రంథాన్ని )అనువాదం చేయమని కోరాడు.” ఇది సమీక్షాత్మక లేఖ అనవచ్చు.

   ఇంకో లేఖలో తన ” కవిత్వ తత్త్వ విచారము” రెండో ముద్రణకు నోచుకుంటున్నట్లు తనకిది ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపాడు.” శాలివాహన సప్తశతి ” పీఠికకోసం రాళ్ళపల్లి సహాయాన్ని అర్థించాడు.

     సారస్వత లేఖలతో పాటు కుటుంబ విషయాలకు సంబంధించిన లేఖలున్నాయి.తన కూతురు తన డ్రైవరు భార్యను చూడాలని కుతూహల పడుతున్నట్లుగా తెలపడం వలన సామాన్యులను సైతం గౌరవించే ఉన్నత వ్యక్తిత్వం ,రామలింగారెడ్డి మనస్తత్వం ద్యోతకమౌతుందని తెలుస్తుంది.

   “స్వయంవరం” గురించి ప్రత్యేకంగా లేఖలో వివరించాడు.” స్వయంవరం” వల్ల యుద్ధాలు పరిణమిస్తాయని ,ఈ స్వయంవరంలో రాజులు వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు వధువు తండ్రి కేవలం ప్రేక్షకునిగా మిగిలిపోతాడని ,స్వయంవరానికి అన్ని రకాల వయసు వాళ్ళు ,బ్రహ్మచారులు,బహుభార్యలు కలిగినవారు పాల్గొని ఆ పెళ్లికుమార్తె తమలో ఎవరిని వరిస్తుందోనని ఉవ్విళ్లూరుతుంటారని,తమను వరిస్తుందో లేదో అన్న అనుమానం కూడా వారికి కలదని రాశాడు.

తాను స్వయంవరం సిద్ధాంతాన్ని ప్రాథమికంగా ప్రాచీన “ఇండో ఇరానియన్ మ్యారేజ్ మార్కెట్” పద్ధతి ననుసరించి రూపొందించామని రాశాడు.ఈ మార్కెట్ లో  అందమైన అమ్మాయిలను అమ్మకానికి నిలబెట్టేవారు.దానికి సంబంధించి మన వైదిక సాహిత్యంలో కూడా ఆధారాలు కనిపిస్తున్నాయని రాశాడు.

  ” స్వయంవరం” గురించి గ్రంథరూపంలో వెలువడితే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఈ విధంగా సామాజిక లేఖలు కూడా రాశాడు.

    కట్టమంచి రామలింగారెడ్డి కాలంలో కన్యాశుల్కం ఉండేది.ఆడపిల్లలను వేదించడం,స్త్రీలపట్ల అగౌరవంగా వుండటమనేది మనకు పూర్వంనుండి వస్తున్న ఆచారమే.ఈ కాలంలో కూడా అందమైన ఆడపిల్ల వెళుతుంటే ఈలలు వేసి గోలలు చేసి ఏడిపించడం చూస్తున్నాం.అందం అనేది కూడా స్త్రీ జీవితానికి ఆటంకమేనని తెలుస్తుంది.

   ఈ విధంగా కట్టమంచి లేఖలను పరిశీలించినట్లయితే వేమనపై సమగ్ర అవగాహన,సరియైన ఆధారాలు కనుగొని సమగ్రంగా వేమనపై గ్రంథం వెలువరింప చేయాలన్న ఆయన ఆసక్తి,మనస్తత్వం,సామాజిక అవగాహన,మొదలైన విషయాలు తెలుస్తాయి.

    వేమన అంటే తన కిష్టం కావడం వల్ల వేమనపై గ్రంథం తెలిసినంతవరకు విషయ సేకరణలో సహాయం చేసి ప్రోత్సహించే వాడుగా కనిపిస్తాడు.

     కట్టమంచి రామలింగారెడ్డి మద్రాసు గవర్నరుకు లేఖ రాస్తూ,ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు.అంతేకాక ఈ ఉత్తరం హృదయవేదనతోను,బాధతోను,విచారంతోను రాస్తున్నట్లు తెలియజేశాడు.

       స్వాతంత్య్రం,ప్రజానీకం యొక్కఆర్థికాభివృద్ధి ,బ్రిటిష్ ప్రభుత్వంలో శాశ్వతంగా లభించవన్న విశ్వాసంతోను,స్వజాతీయులు ఆబాలగోపాలం చేస్తున్న త్యాగాలు సి ఆర్.రెడ్డికి మనస్తాపం కలిగించి,ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుటకు ఇష్టం లేక రాజకీయాల్లో చేరాలన్న ఆసక్తితో రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపాడు.

     ఈ విధంగా రామలింగారెడ్డి లేఖల ద్వారా ఆయన మనస్తత్వం ,ఆలోచనా పద్ధతి తెలుసుకునే అవకాశం ఉంది సాహితీవేత్తలలో రామలింగారెడ్డి లేఖలకు కూడా ప్రముఖ స్థానముందని గమనించవచ్చు.

       బహుముఖ ప్రజ్ఞాశాలి ,ఆజన్మ బ్రహ్మచారి ,సద్గుణవంతుడు, సాహితీవేత్త,విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు రాజకీయ దురంధరుడైన  సర్ సి.ఆర్ రెడ్డి 1951వ సంవత్సరం ఫిబ్రవరి 24 వతేదీ తన 70వ ఏట మద్రాసులో అనారోగ్యంతో తనువు చాలించాడు.

April 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వ్యంగ్య చిత్రాలు (కార్టూన్స్)

by Suvarna Bhargavi April 10, 2022
written by Suvarna Bhargavi
April 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణ కలనం

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి April 10, 2022
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

ఆధారములు
****
అడ్డం
**
01. ఆదిశేషుడు (7)
05. ఎటు వ్రాలినా కుర్చీ మీద తీసే నిద్ర (3)
07. సన్నని వీధి, అవకాశం (2)
08. ఊహలాడే మాట (2)
09. ప్రాచీనమైన (2)
11. కంటి నల్లగ్రుడ్డు చిటికెన వ్రేలు (4)
14. సాధారణం రెండువైపులా నేరమే (3)
15. ఒక నాటి సత్యభామ నది (3)
17. కంట్లో పడి బాధించేది (3)
18. పుట్టుమచ్చ (5)
20. కోపం (2)
21. సదాగంగలో దాచుకోము (2)
23. తలలేని అతను తాను (2)
24. చివరిమజిలీ (2)
26. ఆమని కామం లయ వంటిదే (3)
28. పొత్తంలో కమ్మకు ఒకవైపు (2)
30. మరుదంతిలో వారణం (2)
31. ఎటునుంచైనా అరిటాకు శత్రువు (3)
32. శ్రీశైలంలో లింగడు శ్రీరంగంలో…
35. వైఖరి (3)
37. పశువుల కళేబరాలను తినేది (4)
38. కోరకుండా అనుకోకుండా దక్కేది (4)
39. పసుపు (3)

నిలువు
**
01. కలహాశనుడు (7)
02. వంచన (2)
03. మోటు ముసలి (3)
04. నది (3)
05. వసంతుడు (6)
06. సుదాముడు (4)
10. మీరు పిలవని పేరంటానికి వస్తారా? మారాము నడగండి (2)
12. అగ్గి (5)
13. చూస్తే నీరు ఇంతులకు ఇష్టం (3)
16. ఆనతిలో వందనం (2)
19. నెలతలో పాకేది (2)
22. వాసనతో ఓ ఖనిజం (3)
24. గర్వం (3)
25. అతి లేని అతివ (2)
27. మర్యాదను పాడుచేయు (5)
29. మోసగాడు (5)
30. దండుగపాలైన గుంపు (2)
33. గంటల గొట్టి గడియల చూపేది (4)
34. హరి పడకటిల్లు (3)
36. తల్లితో ఏనుగు (3)

April 10, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

లత జ్ఞాపకాలు

by ఆచార్య ఎన్. గోపి April 10, 2022
written by ఆచార్య ఎన్. గోపి

నాలుగో యేటి నుంచే
సినిమాలు చూసే వాణ్ని.
మా ఊరి టకీస్
గడ్డి పొలాల మధ్యన వుండేది.
దాని సిగలోంచి వెలువడే
లత పాటలువింటూ
అది మరింత పచ్చగా మొలిచేది.

ప్రత్యక్షంగా
ఆమెను నేను చూడలేదు.
అందుకే భౌతికంగా
మన మధ్య లేదనే బెంగ లేదు.
సర్వాంతర్యామికి
రూపం లేకున్నా పరవా లేదు.

ఏమి కంఠస్వరమామెది!
శ్రావ్యత అనేది చిన్న మాట
మాటల కందని మనోజ్ఞత.
సాహిత్యాన్ని మీరిన మాధుర్యం
కళ్లు మూసుకుంటే
లోకనులు విచ్చుకోవడం అనివార్యం.

పరాయి ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా
ఎక్కడి నుంచో
ఆమె పాట వినిపిస్తే
భారత్‌లోనే వున్నట్టు అనుభూతి.
నియంత్రణ రేఖను దాటేసిన
నిర్మలమైన నిరాటంక ధృతి.
హృదయ సీమలు గడిచి
ఆత్మ దాకా ప్రవహించిన విఖ్యాతి.

రాసిన వాడు
సరస్వతీ పుత్రుడైతే
పాడుతున్న ఆమె
ఒక భావోద్వేగ గాయత్రి.

సందర్భాలు మరింత
మెరిపిస్తాయి నిజమే గాని
వాటికి అతీతమైన
ఆనంద కళాదీప్తి ఆమె.

గానం వెలువడేది
ఆమె గళమే కావచ్చు
కాని అందులో అలవోకగా
ఒదిగిపోయింది
యావత్ లయాత్మక భూగోళం.

April 10, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
Uncategorized

మయూఖ శుభకృత్ వసంతఋతు (ఏప్రిల్ )సంపాదకీయం

by mayuukha April 9, 2022
written by mayuukha

నేలమ్మా! నేలమ్మా! అని ఎలుగెత్తి ఆర్తితో పిలవాల్సి వచ్చే కాలం రానున్నది.
మనం తిరుగాడే భూమిని కన్నతల్లిలా భావిస్తాం. స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టేది. ఇదే సూత్రం భూమిని గురించీ చెప్పుకోవాలి. భూతల్లి, నేలతల్లి బాగుంటే నే మనమ బాగుంటాం, చెట్లూ పచ్చగా ఉంటాయి.
ఇక్కడే గుర్తుకువచ్చే ఒక కవిత “ఆ చల్లని సముద్రగర్భం, దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో!” ….. “భూగోళం పుట్టుక కోసం జరిగిన పరిణామాలెన్నో…. అన్నారు మన మహాకవి దాశరథిగారు. ఎన్నో పరిణామాల తర్వాత దాదాపు 475 కోట్ల సంవత్సరాలు కాలం గడిచిన తర్వాత పరిణామం చెంది భూమి గోళాకారపు స్థితికి వచ్చింది. దాదాపు 370 కోట్ల సంవత్సరాల క్రితం జీవావిర్భావం జరిగిందనీ శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా తెలుస్తున్నది. ఈ అనంత విశ్వంలో జీవులు కనిపించే గ్రహం భూమి వంటిది ఇంకేదైనా ఉందా? అనే ప్రశ్న తొలచి, ప్రయత్నిస్తూనే ఉన్నది నేటి ఈ విజ్ఞానమంతా. కానీ ఇంకా ఏ ఆధారాలు కచ్చితంగా దొరికిన దాఖలాలు లేవు. సకలప్రాణి కోటి సంచరించే ఒకే ఒక గ్రహం భూమి అని అనుకున్నప్పుడు, కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా జీవులైన మానవులదే.
మన పంచేంద్రియాలు మంచిగా పనిచేయాలంటే పంచభూతాలూ మంచిగా ఉండాలి. ఏ ఒక్కటి ‘అతి’కి గురైనా మన బ్రతుక్కి గతి లేకుండా అవుతుంది. అందుకే పృథ్వీ పరిరక్షణ ఇప్పుడొక అవసరమైన స్పృహ. ఈ పరిరక్షణ లక్ష్యం కోసం “ధరిత్రీ దినోత్సవం ‘’ అనే బృహత్తర కార్యక్రమాల్ని చేయటానికి పూనుకున్నది. ప్రకృతి వైపరీత్యాలను ఎటూ అడ్డుకోలేము. కనీసం తగ్గించే ప్రయత్నాలైనా చేయాలి. ఈ స్పృహతోనే 1970వ సంవత్సరం ఏప్రిల్ 22ను ‘ధరిత్రి దినోత్సవం’ గా నిర్ణయించి నిర్వహిస్తున్నది. భూమిని కాపాడే ప్రయత్నం కోసమే Save the World అనే నినాదం వినిపిస్తున్నది. చాలా ఏళ్ల క్రితం డైనోసార్ లు అని మనమిప్పుడు అంటున్న రాక్షస బల్లులు ఉండేవి. అవి పూర్తిగా అంతరించిపోయాయి.
ఇప్పుడు ఎక్కడా ఎక్కువ కనిపించని, ఆఫ్రికా, ఇండియా దేశాలలోనే కనిపించే పులులు క్రమంగా అంతరించిపోతున్నాయి. వీటిని రక్షించుకోవాలన్న తెలివిని తెచ్చుకుంటున్నాం. వీటికోసం, ఇట్లా అంతరించిపోతున్న జీవజాతుల పరిరక్షణ కోసం బలమైన చట్టాలనే తయారుచేసుకోవాల్సిన అవసరం, అగత్యం వచ్చింది. మన పరిసరాలలో కిచకిచలాడే పిచ్చుకలను మనం కోల్పోతున్నాం. మరి కొన్ని జంతువులు కూడా కనుమరుగవుతున్నాయి. ఇవన్నీ ఎన్నో దుష్ఫలితాలనూ ఇస్తాయి. ప్రస్తుతం కోట్ల కోట్ల జనాలు బ్రతికే ధరిత్రికి కూడా ఇటువంటి కష్ట సమయం వస్తున్నది. రానున్న రోజుల్లో జరగబోయే విధ్వంసాన్ని ఆపడానికి ఇప్పుడే కళ్ళు తెరవాలి. అందుకోసం ప్రతి మనిషి పుట్టిన రోజును జరుపుకుంటున్నట్టు, ఏప్రిల్ 22 నాడు భూమిని కాపాడుకునేందుకు అంతా కృషి చేస్తామని ప్రతినబూనాలి, నడుం బిగించాలి.
ప్రకృతి సిద్ధమైనవి ఏవీ మనిషి సృష్టించలేడు ఏవి చేసినా అవి కృత్రిమంగానే ఉంటాయి . లేనివి తేలేం కాని ఉన్నవి కాపాడుకోగలం.
మనుషుల జీవనశైలిలో చాలా మార్పు వచ్చింది. శాస్త్ర , సాంకేతిక ప్రగతిలో భాగంగా ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్నాం.ప్రకృతిలో ఉండే వనరులను కొల్లగొట్టడం మానవ నైజం అయిపోయింది. కొండలను పిండిచేస్తూ, అడవులను నరికివేస్తూ భూమి సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్న వైనాన్ని చూస్తూనే ఉన్నాం.అసలే ప్లాస్టిక్ , రబ్బర్ ల వాడకం ఎక్కువైపోయింది. ఇక అంతా కాలుష్యమే కాలుష్యం.

ఈ అనంత విశ్వంలో సకల ప్రాణికోటి సజీవంగా ఉన్న ఒకే గ్రహం భూమి. చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకునే తీరు తెలిసిందే. భూమిలోని సారాన్ని పీల్చి పిప్పిచేస్తూ ఎంతో నష్టం కలిగిస్తున్నాం. విపరీతమైన రసాయనాలను ఉపయోగిస్తూ పంటలను పండించడం వలన ఒకవైపు ఆహారంలో పోషక విలువలు ఏవైతే సహజ సిద్ధంగా ఉంటాయో అవన్నీ హరించిపోతున్నాయి. మరోవైపు ఈ రసాయనాల వలన భూసారమూ తగ్గిపోతున్నది. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్ల తర్వాత భూమిలో పంటలకు అవసరమయ్యే ఖనిజాలన్నీ అంతరించిపోతాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. భూసారాన్ని దెబ్బతీసే ఈ నికృష్ట చర్యలు ఎక్కువ కాకుండా ఉండాలంటే సహజ ఎరువుల వాడకంతో పంటలు పండిస్తూ, పంటల మార్పిడిచేస్తూ భూసారాన్ని పరిరక్షణ చేయాలి. వ్యవసాయ క్షేత్రాల్ని సుసంపన్నం చేయాలి.
ఇంధన ఉత్పత్తి తగ్గించడం, ఇంధన వినియోగం తగ్గించడంవలన కాలుష్యాన్ని ఎట్లాగైతే ఎక్కువ కాకుండా చేయగలమో, ఆధునిక వ్యవసాయం కోసం వాడుతున్న ఈ రసాయన పదార్థాల వాడకం తగ్గించడం వలన భూకాలుష్యాన్ని ఎక్కువ కాకుండా చేయగలం .ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. కావలసింది కేవలం పూనిక.
కాళ్ల క్రింద నేల కరిగిపోతున్నది కనులు తెరువు మానవా అని ఎవరు చెప్తారు మనకు. కొందరుంటారు సంఘ ఉద్ధారకులు, కొందరుంటారు ప్రకృతి ప్రేమికులు . కొందరుంటారు ప్రాణదాతలు . వారికోసం కాదు మనం మనకోసం ఏం చేస్తే బాగుంటుంది అని అంతర్మథనం చెందాల్సిన తరుణం ఆసన్నమవుతున్నది. నేలతల్లి కోసం ఉద్యమించాల్సిన ఆగత్యం మనదే !సంసిద్ధులమవుదాం!!

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శ్రీరామ రామ రామేతి..

by Ashtakala Vidyacharan April 9, 2022
written by Ashtakala Vidyacharan

“ఆత్మానాం మానుషం మన్యే రామం దశరథాత్మజం” అన్నది శ్రీరాముడు పలికిన వాక్యమని చెప్పబడింది. అంటే నేను దశరథ పుత్రుడను..నా పేరు రాముడు..నేను కేవలం మానవుడినే అని. శ్రీ రాముడిని దేవునిగా తలుస్తూ నిత్యం స్మరించే మన లాంటి సామాన్య భక్తులకు ఇది అంత సులువుగా నమ్మే విషయం కాదు.వాల్మీకి మహర్షి కూడా శ్రీ మద్రామాయణంలో ఎక్కడా రాముణ్ణి దేవునిగా చిత్రీకరించలేదు. కానీ మానవాతీతమైన ఎన్నో కార్యాలు సంకల్ప బలం చేత సాధించిన వ్యక్తిత్వంగా మనకు పరిచయం చేశాడు. సామాన్య మానవుడు పడే కష్టాల కన్నా ఎన్నో రెట్లు కష్టాలు అనుభవించిన ఒక అత్యున్నత వ్యక్తిని దర్షింపచేశాడు. రామో విగ్రహవాన్ ధర్మః అన్నట్టు అన్ని ఆదర్శాలకు ఉదాహరణగా నిలిపి, మర్యాదాపురుషోత్తముడైన మానవుని కథగా మనకు అందించాడు.
రామాయణము ఒక భక్తి కావ్యం అని, దైవ చరిత్ర అని అనుకుంటే అది ఒక కోణం.కానీ దానిని ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా, ఒక వైజ్ఞానికమైన విశేషాలకు,రాజకీయ పరిజ్ఞానాన్ని పంచే గ్రంథంగా చూసే వారికి మాత్రం, ఎన్నో విషయాలకు వేదికగా నిలుస్తుంది.
ఒక రాజ్యానికి సమర్థవంతమైన రాజు యొక్క అవసరం,ఆ రాజుకు ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు,ఆ రాజు తెలుసుకోవాల్సిన బాధ్యతలు , తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుస్తాయి. ఒక విజ్ఞానవంతుడైన రాజు లేక పోవడం వల్ల ఆ రాజ్యం లో జరిగే అనర్థాలు, అటువంటి రాజ్యంలో ప్రజల మానసిక స్థితి ఎప్పుడూ ఎలా ఉంటుందన్నది,యుగాలు మారినా,తరాలు మారినా
ఒక్కలాగే ఉంటుందన్నది మహాకవి వాల్మీకి వేరు వేరు పాత్రల ద్వారా ఈ విషయాన్ని చెప్పించిన తీరు చూస్తే సుస్పష్ట మవుతుంది. రాజు లేని రాజ్యం లో వెల్లువెత్తే అరాచక పరిస్థితుల్ని, రాజ్యంలో ధర్మం తప్పడం ,సత్య సంధత లేకుండా ఉండడం,నేరాలు, మోస ప్రవృత్తి పెరుగడం, సజ్జనుల నిరాదరణ, దొంగతనాలు,అపరిశుభ్రత మొదలైనవి పెరిగి దేశం చిన్నాభిన్నమయ్యే స్థితి వస్తుందని దీని సారాంశము.
అలాగే ఒక రాజనీతిజ్ఞత గల రాజు యొక్క లక్షణాలని, అవలంబింప వలసిన వ్యూహాలని, వనవాసం లో ఉన్న తనను మళ్లీ అయోధ్యకు రాజుగా ఉండమని వేడుకొంటున్న భరుతుడి కి రాముడు కుశల ప్రశ్నలు వేసే ప్రక్రియలో చేసిన సూచనల ద్వారా చెప్పిస్తారు వాల్మీకి. ఒక రాజు, విశ్వాసపాత్రులైన అధికార గణాన్ని ఎలా ఎన్నుకోవాలి, అంతర్గత, బాహ్య శత్రువులపైన,గూఢచార వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలి, నేరాలకు తగిన శిక్షలు వేయకుండా లంచాలకు లోబడే చట్ట,న్యాయ వ్యవస్థను ఎలా క్రమబద్ధీకరించాలి, దేశంలో ఉన్న మేధావులను,విజ్ఞానవంతులను,ఎలా,గౌరవించాలి, యుద్ధ,దండ నీతి, దేశం యొక్క నైసర్గిక పరిస్థితులను బట్టి వాటిని సమర్థవంతంగా ఎలా వాడుకోవాలి, అన్న విషయాల విచారణ చేస్తారు శ్రీ రామచంద్రమూర్తి.
ఇక వైజ్ఞానిక,సాంకేతిక విషయాలు రామాయణంలో ఎన్నో చెప్పబడ్డాయి.రాముణ్ణి తిరిగి తీసుకు వచ్చి పట్టాభిషక్తుణ్ణి చేస్తానని భరతుడు, వనానికి వెళ్ళడానికి సిద్ధపడే నేపథ్యంలో ఆ ప్రయాణం సుఖంగా జరగడానికి, ఏకంగా పెద్ద రహదారి నే నియమింప జేశాడని, ఆ పనిలో ఎంతో మంది నిష్ణాతులు,యంత్రాలు నడిపే,కొలతలు వేసే నిపుణులను,వినియోగించారని, వారు మధ్య మధ్య విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా దారి ప్రక్కన, ఎన్నో విశ్రాంతి భవంతులు నిర్మించి, నదుల నుండి తాగునీటికి కాలువలు, మరియు నూతులు త్రవ్వించారని, ఆ దారి వాడుతుంటే పాడవకుండా, గట్టి సున్నంతో దారులు నిర్మించారని, అదికూడా అతి తక్కువ సమయంలో నిర్మించారని చెప్పడం చూస్తే రామాయణ కాలంలోనే ఎంత విజ్ఞానం అభివృద్ధి చెందిందో తెలుస్తుంది.
అట్లాగే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి మానవుడిలో, స్ఫూర్తిని పెంచి, జీవితాన్ని సరైన దృక్పథంతో మలుచుకోవడానికి ఉపయోగ పడే కాలానికి వీగిపోని ఎన్నో హితోపదేశాలను మహాకవి వాల్మీకి శ్రీ మద్రామాయణం లో పొందుపరిచారు.తండ్రి మాటను ఆచరించడమే ముఖ్య ధర్మమని శ్రీరాముడు, అన్నమాట జవదాటని తమ్ముళ్లు,ధర్మాచరణం యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ఇది తమకే కాక సమస్త మానవాళికి శిరోధార్యమని చెపుతారు. మానవాళికి క్షమా గుణమే గొప్ప అలంకారమనీ, ,దానం, యజ్ఞం, కీర్తి, చివరకు ధర్మం కూడా క్షమకు ప్రతి రూపాలు అని హితవు పలుకుతారు.మరోచోట మానవప్రయత్నం కన్నా దైవేచ్ఛనే మిన్న, అన్ని కష్ట సుఖాలకు దైవాశ్రయమే సరియైన దారి యన్న సందేశమూ ఉంటుంది. ఎక్కువ మంది మూర్ఖులకన్న ఒక్క పండితుడు ఇచ్చే సూచన శ్రేయస్కరమని, అలాగే దక్షుడు, శూరుడైన ఒక్క మంత్రి చాలు రాజ్యానికి మంచి చేయడంలో అనీ బోధిస్తారు. చెట్లు ఋతువులను బట్టి పూతనూ, కాయలను బొందినట్టు, ప్రాణులు తమ కర్మ ఫలితాన్ని సమయం రాగానే పొందుతారు. స్వలాభ పరులు రాజుకు ఎప్పుడూ ప్రియవచనాలే పలికి తమపని చక్కపెట్టు కుంటారు.అటువంటి వారిని రాజులు గుర్తించాలని, మోయగలిగిన బరువునే తలకెత్తుకోవాలి, జీర్ణమయే ఆహారాన్నే భుజించాలి,లేకున్నట్లైతే అది వ్యాధి కారకమవుతుంది. దుఃఖం, ఆర్థిక నష్టం, ప్రాణానికి ముప్పు ఉన్నప్పుడే, ధైర్యవంతుడు తన బుద్ధితో వాటిని ఎదుర్కోవాలి. రాజద్రోహి , గోబ్రాహ్మణ , నిరపరాధుల హంతకుడు, చోరుడు, లోభి, అన్నకు ముందు పెండ్లి చేసుకునే వాడు, మిత్రద్రోహి,గురుద్రోహి, ఖచ్చితంగా నరకానికి పోతారు. ఎవ్వరితో నైననూ ఎక్కువ ప్రీతి, ఎక్కువ ద్వేషమూ మంచిది కాదు.
కోపి పాపం చేయకుండా ఉండడు.సజ్జనులను, దూషించకుండా ,కష్టపెట్టకుండ ఉండడు,అంటూ కోపం వలన వచ్చే నష్టాలు హనుమ ద్వారా చెప్పిస్తారు.
ధనం గలవానికే ఎక్కువ మంది స్నేహితులు ఏర్పడి, అతడు ఒక ఉత్తముడుగా,గొప్ప గుణవంతుడు గా, తెలివికలవాడుగా పొగడ బడుతాడు. నిజంగా బుద్ధి కుశలుడు వీటినుండి తెలివిగా తప్పించుకోగలడు అని ఒక చోట సందేశం ఉంటుంది. రాజు, ధర్మం , ధనార్జన, వాటిని వినియోగం చేయడంలోనూ, పుణ్యపాపకార్యాల భేదాల్లోనూ మార్గదర్శకుడు. రాజు ధర్మాచరణాన్ని పాటిస్తే ప్రజలు కూడా వారిని అనుసరిస్తారు కదా. యథా రాజా తథా ప్రజా అన్న సూక్తి కూడా మనకు రామాయణంలో నిదే.
ఇలా శ్రీమద్రామాయణ కావ్య రూపంలో ఉన్న రామకథ సాక్షాత్తు అన్ని వేదాల సారం అని చెప్పవచ్చు. జ్ఞాతవ్యాలు, కర్తవ్యాలుగా చెప్పబడే జ్ఞానకాండ,కర్మకాండల సారం రామాయణము. భూమిపై పుట్టిన ప్రతి మానవుడు, తెలుసుకోవాల్సిన, జీవించినంత కాలం తప్పక ఆచరించవలిసిన విషయాల సమాహారమే శ్రీ రామకథ… శ్రీ రాముడు దేవుడైనా, పురుషోత్తముడైనా, ఎలా అనుకున్న భక్తిగా ఆరాధించడం లో ఉన్న తాదాత్మ్యత మనకు ఆదర్శమే కదా..
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైక మక్షరం పుంసాం మహపాతక నాశనమ్

April 9, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శ్రీ శుభకృత్ నామ ఉగాది సంప్రదాయ పండుగ

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) April 9, 2022
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

తెలుగు వారికి సంప్రదాయక ముఖ్యమైన పర్వదినం ఉగాది. మన కున్న అన్ని పండుగలలో కెల్లా ఉగాది పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. కొత్త కాలానికి స్వాగతం చెప్పే పండుగగా నూతన సంవ త్సరాది ప్రజాళికి ఒక విన్నూత స్పూర్తినిస్తుంది. కాలమానం ప్రకారం చాంద్రమానాన్ని పాటించే తెలుగువారికిది తొలి పండుగు ఈ ఉగాది పం డుగ అన్ని పండుగల కంటే భిన్నమైనది. మనకున్న పండుగలన్నీ భగ వంతుని ఆరాధించి అతని కృపా పాత్రులు కావాలని చేసికొనేవే. ఈ ఉగాది పండుగ మాత్రం మానవునికి వసంత సిద్ధమైన ప్రకృతి మాత పండుగ, వసంత మాసంలో వచ్చే ఈ ఉగాది ప్రకృతిలో చైతన్యం నింపుతుంది. చెట్లు, లతలు, పూలమొక్కలు చిగురులు తొడిగి, వికసించి ప్రకృతి అందానంతా సంతరించుకొని, ఉగాది నాటికి నూతన జీవకాంతితోనిండి మానవునిలోని ఆశల ఆశయాలను చిగురింపచేస్తుంది. ఈ శిశిర ఋతువులో మోడువారిన మహావృక్షాలు సైతం జీవం పోసికొని పునర్జన్మనొంది మళ్లీ ఈ వసంత ఋతువులో చిగురించి పచ్చదనంతో – కళకళలాడుతూ ఉంటాయి. నిజానికి ఉగాది ప్రకృతి సిద్ధమైన ప్రకృతి మాత పండుగ..

వసంత కాలమున ప్రకృతి నవ చైతన్యము మోసులెత్తుటను బట్టి ఈ కాలమే నూతన సంవత్సరారంభమని క్రీస్తుశకం నాల్గవ శతాబ్దములో ఉన్న జ్యోతిర్ వేత్త వరాహ మిహిరాచార్యుడు వసంత విఘవత్కాలము వివిధ నక్షత్రములకు చలించి అశ్విని నక్షత్రాదిలో సంభవించుట వివిధ నక్షత్ర ములకు గ్రహించి, మన ప్రాచీన దేవమాన దిన ప్రారంభకాలమైన ఉత్తరాయణ పుణ్య కాలాన్ని వసంత కాలమని నిర్ణయించినాడు. ఆనాటి నుండే చైత్ర మనమే నూతన సంవత్సరాదిగా పరిగణింపబడుతుంది.

మనకు నాల్గుయుగాలన్నాయి, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు వీటిలో  కృతయుగాది చైత్ర శుద్ధ పాడ్యమి తిథినాడు జరిగింది. కనుక ఇది యుగాది, కృత యుగాది, అంటే సృష్టి ఆరంభమైన రోజు. ఈ రోజునే సకలచరాచర సృష్టికి కారణభూతుడైన బ్రహ్మ సృష్టి ప్రారంభమయినదనీ నాడు సూర్యోదయ కాలంలో సంవత్సరం, ఆయనం, మాసం, ఋతువు,నక్షత్రం, గ్రహం ఇత్యాదులు సమగ్రంగా సృష్టి చేశాడని బ్రహ్మాండ పురాణంలో  తెలుస్తోంది.

తెలుగుజాతి, సంప్రదాయాలు ఇనుమడించే ఉగాది ప్రధానంగా కాలధర్మాన్నిగుర్తించేఉద్దేశింప బడినది.  “ఉగ” అంటే నక్షత్రగమనం. ‘ఉగస్య ఆది: ఉగాది” అని పురాణోక్తి. ఉగ +ఆది =ఉగాది అయింది. యుగములకు ఆది ఉగాది.  కృతయుగం 17,28,000 త్రేతాయుగం 12,96,000, ద్వాపరయుగం 18.84,000 కలియుగం 4,32,000 సంవత్సరాలు మొత్తం కలిపి 43,20,000 సంవత్సరాలు. ఒక మహాయుగము అగును. ఇట్టి మహాయు భాగము ఒకటి బ్రహ్మకు ఒకరాత్రి. మరొక మహాయుగము ఒక పగలు అగును. ఈ విధముగా బ్రహ్మకు వెయ్యి యుగములు గడిచిన మీ శ్రీమహాకస్థనుకు ఒక ఘడియ కాలం అగును ఈ ఈ విధముగా గుణించి విష్ణువుకు 12 లక్షల యుగాదులు గడిచిన రుద్రునికి ఒక కళార్ధమగును. ఈ విధముగా రుద్రునికి 11 కోట్లు ముఖములు అక్షరాత్మక బ్రహ్మ మగును. బ్రహ్మకు ఒక రోజులో 14 మన్వంతరాలు ఉండును. వీటిలో భయంబవ, సర్వోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షస మన్యంతరాలు పూర్తి అయ్యి పదవ దైన వైవస్వత మన్వంతరములో 27 మహాయుగములు గడిచి 28వ మహా యుగములో కృత, త్రేతా, ద్వాపర యుగములు గడిచి కలియుగ ప్రథమం పాదములో నడుచున్నది.

జ్యోతిశాస్త్ర ప్రకారం 27 నక్షత్రాలు, ఒక్క నక్షత్రానికి 4 పాదాలు మొత్తం 108 పాదాలు. అవి 12 రాశులుగా ఏర్పడతాయి. తొమ్మిది నక్షత్ర పాదాలు కలిస్తే ఒక రాశి అవుతుంది. 9+12=108 అవుతుంది. అవి మేషం మొదలు మీన రాశులు చంద్రుడు ఒక్కనక్షత్రాలలో ఒక్కో రోజు ఉంటాడు. సూర్యుడు ఒకరాశి నుంచి మరొక రాశికి ప్రవేశించ దానికి నెలరోజులు పడుతుంది.

సూర్యుని సంచారానుసారం సౌరమానమనీ, చంద్రుని సంచారాను సారం చంద్రమానమనీ, బృహస్పతి సంచారానుసారం బార్వస్పత్స మాన మనీ కాలానికి కొలమానాలు ఏర్పడ్డాయి. ఆయా కొలమానాల్లో అనంత మైన కాలాన్ని యుగాలుగా విభజించుకోవడం జరిగింది. రేయింబవళ్లు’ సమానంగా ఉండే ‘విషవత్’ కాలం వసంత కాలంతో ప్రారంభమవుతుంది. 60 సంతవత్సరాలు కలిపితే ఒక ‘ఆవృతి’ అవుతుంది. బ్రహ్మదేవునికి ఒక రోజున కల్పం అంటారు. ఒక కల్పం 864 సంవత్సరాలకు సమానం. చాంద్రమానాన్ని బట్టి ఈ కల్పం తొలి రోజు ఉగాది. శ్రీమహావిష్ణువు సోమకుడనే రాక్షసిని దునిమి వేదాలను రక్షించాడు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ద్వాపర యుగము ముగిసి కలియుగము ప్రారంభమైనది. ప్రాచీన కాలంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, మార్గశిర శుద్ధ పాడ్యమి, తర్వాత చైత్ర శుద్ధ పాడ్యమిని ‘ఉగాది’గా జ్యోతిష్యులు భావించారు. ఆచార్యుడైన వరాహ మిహిరుడు నక్షత పరిగణనాన్ని అశ్విని నుండి ప్రారంభించి చైత్ర, వైశాఖ మాసములను వసంత ఋతువుగా నిర్ధారించాడు. అప్పటి నుండి చైత్రమాసమే సంవత్సరాదిగా పరిగణిస్తున్నాము. చైత్రమాసంలో ఏదో ఒకరోజు ఈ పండుగను చేసికోకూడదా? పాడ్యమినాడే ఎందుకు చేసి కోవాలి అనే సంశయం కలుగ వచ్చును!?

పూర్వం పూర్ణిమనుంచి పూర్ణిమకు నెల లెక్కకట్టు ఆచారం ఉండేది. అమావాస్య నుంచి అమావాస్యకు నెలలెక్క కట్టడమూ ఉండేది. ఈ విషయమును నిర్ణయ సింధుకారుడైన కమలాకర భట్టు చాల చర్చించాడు. చంద్రగతితో నెల లెక్క పెట్టడం సులభం కనుక, అది అనాదిగా ఉన్నందున, శుక్ల పక్షాదితో నెల లెక్క పెట్టాలని నిర్ణయించాడు. అంతేకాకుండా భాస్క రాచార్యుడు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో సూర్యుడు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమినాడు లంకానగరంలో ఉదయించడం వల్ల అంటే భూమధ్య రేఖపై ఉండడం వల్ల ఆనాడే యుగ, దిన, మాస, వర్షారంభం అవుతుందని నిర్ణయించాడు. ఉగాది పండుగను చేసుకొనే పద్ధతిని వివరించినారు.

“ఋతువునాం కుసుమాకరః” ఋతువులలో వసంతం నేనేని భగ వద్గీతలో శ్రీకృష్ణభగవానుడు అన్నాడు. ఋతువులలో శ్రేష్ఠమైన వసంత ఋతువు ఆనందోత్సాహాలను పెంచుతుంది.
వసంతం సమస్త సృష్టి అనే యజ్ఞాన్ని ప్రేరేపించే ఆజ్యం. గ్రీష్మం సమిధ. శరత్తు హవిస్సు. ఈ రకమైన సృష్టి యజ్ఞ సుసంపన్న కారణమైన వసంతం తొలి ఋతువై సంవత్సరాది అయింది. ఋతువులలో తొలి దైన వసంత ఋతువు, మాసాలలో తొలిదైన చైత్రమాసం, పక్షాలలో తొలిదైన శుక్లపక్షం, తిథులలో తొలిదైన పాడ్యమి, ఇవన్నీ కలిసి సూర్యోదయ సమయంలో ఉంటుందో ఆ రోజే ‘ఉగాది’ పర్వదినం.

“చైత్ర మాసిజగత్ బ్రహ్మ  ససర్జ ప్రథమే హని
శుక్ల పక్షే సమగ్రం    తథా సూర్యోదయే తథా కాలస్య గణమపి…” అని బ్రహ్మ సృష్టి చైత్ర శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమై నేటికి అవిచ్చిన్నంగా, నిరంతరంగా కొనసాగుతున్నది కాబట్టే ప్రతి చైత్ర శుద్ధ పాడ్యమికి ఉగాది పండుగ జరపడం మన సంప్రదాయం అయింది. కాలమానం ప్రకారం చాంద్రమానాన్ని పాటించే తెలుగు వారి కిది తొలిపండుగ.

“స్మరే త్సర్వత్ర కర్మాదౌ చాంద్రం సంవత్సరం
సదానాన్యం యస్మా దృత్సరాదౌ ప్రకృతి స్తన్యకీర్తితాం” అను స్మృతి వాక్యం కూడ వైదిక కర్మలలో చాంద్ర మానాన్నే అందరూ ఆచరించవలెనని, అనుసరించాలని పేర్కొన్నది. విక్రమాదిత్యుని రాజ్యాభిషేకం కూడా చాంద్రమాన సంవత్సరానిదేయని సిద్ది. విక్రమ శకం కూడ ఈ రోజునే ప్రారంభం కావడం విశేషం.

ఉగాది జరుపుకొనే విధానం

April 9, 2022 0 comment
2 FacebookTwitterPinterestEmail
కథలు

ఆహార గొలుసు

by బి.వి.ఎన్.స్వామి April 9, 2022
written by బి.వి.ఎన్.స్వామి

నవీన్ పగటి నిద్ర తీస్తున్నాడు. స్నేహితుడు లేపటంవల్ల నిద్రాభంగమైంది.
”ఈ సమయాన వచ్చా వెందుకు”
”ఏమీ తోచడం లేదు”
”నీకు తోచకుంటే నా నిద్ర చెడగొడతావా”
”కోపానికి రాకురా, నీ దయను”
”ఎందుకంత బాధగా ఉన్నావు”
”బాధ కనిపిస్తుందా”
”అవును నీకేం తక్కువ. వాస్తవంగా నీ బాధ్యతలన్నీ తీరాయి. లోకం బాధ నీకెందుకు. ఎవరెక్కడ పోతేంది. మందిని బాగుచేయడం నీ శక్తికి మించిన పని. ప్రపంచంలో అందరూ సమర్థులే. ఒకరు చెబితే విని బాగుపడే స్థితిలో ఎవరూ లేరు. అందరికి అన్నీ తెలుసు. అందరికంటే నాకే తక్కువ తెలుసు అనుకోవాలి. అప్పుడే బి.పి., షుగర్ లాంటి వ్యాధులు దరి చేరవు. ఆరోగ్యం, తృప్తి సమకూరుతాయి.”
”అనేక మార్పులు అనివార్యాలై పరాయితనం వైపు మనుషుల్ని తీసుకెళ్తుంటే ఎట్లా ఆలోచించకుండా ఉండగలం!”
”ఉదాహరణకు ఏదో ఒకటి చెప్పు చూద్దాం!”
నా చిన్నప్పుడు మా గురువు గారికి రెండు చేతులా దండం పెట్టేవాణ్ణి. నడుస్తున్నవాడల్లా ఆగి మంచీ చెడు మాట్లాడేవాడు. నేను టీచర్ను అయ్యాక బడికి సైకిల్ పై వెళ్ళాను. మా విద్యార్థులు దండం పెడితే ఒక చేత సైకిల్ హ్యాండిల్ పట్టుకొని, మరోచేత్తో నమస్కారం పెట్టి, ఆగి పలకరించేవాణ్ణి. మా అబ్బాయి టీచర్ అయ్యాడు. బైక్ పై బడికి వెళ్తున్నాడు. వాడి విద్యార్థులు సైకిల్పై వస్తున్నారు. విద్యార్థులు ఒక చేత ”హాయ్ సార్” అంటే మా వాడు బైక్ వదిలే వీలు లేక తల పంకించి ”హాయ్” అంటున్నాడు. పలకరించడం ఆగిపోయింది. నా మనమడు విద్యాశాఖాధికారి. కార్లో నుండే ఇతరులకు చేయి ఊపుతూ వెళతాడు. అలవాట్లలో మార్పు వచ్చిందా, లేదా? నమస్కారం లోని మానవీయత ఉందా? ఊడిందా?
”ఊడింది వాస్తవమే. ప్రగతి కూడా వాస్తవమే.
”మానవీయత లేని అభివృద్దే మిగిలిందని బాధ”
”అభివృద్దిలోని ఆనందాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. నీకు, మాత్రం ప్రతిదాంట్లో ఏదో ఒక తప్పు కనపడుతుంది. పాజిటివ్గా ఆలోచించు.”
”ప్రగతితో పాటు ప్రశాంతత ఉంటే సుఖమయ జీవితం సాధ్యం. మనుషుల మధ్య మానవీయత అవసరం. అది పోతుందనే బాధ. ఆత్మగల ఆలోచన, అవసరం మేరకు ఆలోచన, ఈ రెంటి మధ్యగల తేడా నీకు అర్థం కావడం లేదు.”
”నాకు, నీవు ఎప్పుడూ అర్థం కావు”.
పవన్కు ఊపిరాడడం లేదు. నవీన్ లాంటి వాడికి మానవీయతలోని మాధుర్యం ఎట్లా రుచి చూపించాలో పాలుపోవడం లేదు. జాలి, కరుణతో కూడిన సంస్కారం ఎలా ఉంటుందో అర్థం చేయించాలి. అందుకు ఏం చేయాలి? తీవ్రంగా ఆలోచించాడు. కళ్ళుమూసుకొని అరగంట సేపు నిశ్చలంగా ఉన్నాడు. సెల్ మోగింది. దాని గొంతు పిసికాడు. మెసేజ్లతో పాటు ఆడియో మెసేజ్లు డిలిట్ అయ్యాయి. ఆ క్షణంలో తళుక్కున మెరిసిందో ఆలోచన. ఆడియో రికార్డర్ ద్వారా కథ చదివి నవీన్కు పంపిస్తే బాగుంటుందనిపించింది. నిశ్శబ్దంగా ఉన్న గదిలోకి వెళ్ళాడు. మౌత్ మైక్ పెట్టు కొని ఆడియో రికార్డర్ ఆన్ చేసాడు. చదవడం మొదలు పెట్టాడు.
* * *
అప్పుడే పుట్టిందో జింకపిల్ల. అది చూసి చెట్టు ఫక్కున నవ్వింది. పూలు, పండ్లు రాలాయి. కళ్ళు తెరిచింది పిల్ల. నన్నెవరు తెచ్చారీ భూమిపైకి. వెతికింది. వెతుకుతూ, వెతుకుతూ ముందుకు సాగింది. పచ్చిక, గాలి ఎంత చల్లగున్నాయో, అనుకుంది. అమ్మకోసం ఆరాటపడింది. అప్పుడే భూమి పైకి వచ్చిన పిల్లను చూసి సమస్త సృష్టి పరవశించింది. భానుడు భగభగమనడం తగ్గించాడు. జింకపిల్ల అడుగులకు మడుగులొత్తింది పృథ్వి. గాలి వాయులీనం వినిపించింది. అమ్మ ప్రేమకోసం జింకపిల్ల తహతహలాడింది. అది తెలిసిన ఆకాశం ఆనందనాట్యం చేసింది. అమ్మకోసం వెతుకుతూ మరింత ముందుకు నడిచింది. నీరు దారిచ్చింది. నిప్పు చెమ్మగిల్లింది.
బయటకు వెళ్ళిన తల్లి తిరిగివచ్చింది. పిల్ల కనపడలేదు. ఇంత తొందరగా ఎటు వెళ్ళింది దుఃఖపడింది. వాడేడి! వాడికి పట్టింపులేదు. ఎటు వెళ్ళినట్లు ? ”నేను సైతం మేతకు వెళ్ళిన” అంటాడు. ”చెప్పిపోవాలి కదా.” ”నేను మాత్రం చెప్పివెళ్ళానా”, ”పడుకొని ఉంటే ఎలా లేపడం” అలా అంతర్మథనం సాగింది.
పంచభూతాలకు పాలుపోవడం లేదు. తల్లి, పిల్ల వేరు వేరయినవని కలవరపడ్డాయి. ఆకాశం తెల్లబోయింది. వాయువు హోరుమంది. నీరు సుళ్ళు తిరిగింది. అగ్నిని నివురు అలుముకొంది. భూమి పట్టన పగిలింది. పిల్ల-తల్లి పయనం సాగుతుంది. రెంటి దిక్కులు వేరయ్యాయి. తిరిగివచ్చిన తండ్రి జింక ఒళ్ళు విరిచింది. ఇల్లంతా కలియదిరిగింది. బిడ్డ పుట్టిన ఆనందం ఆవిరయింది. స్త్రీ పురుష ఫలం అందకుండా పోయిందనే బెంగ పట్టుకుంది. రాత్రంతా మెలకువగా ఉండడం వల్ల బిడ్డను చూసాను. దాహం తీర్చుకుని వచ్చేసరికి బిడ్డ మాయమైంది. బాధ్యత నాదా? చింత పడింది.
* * *
తప్పటడుగులు వేస్తూ ఆలోచిస్తుంది పిల్ల. ఇంతకూ అమ్మ ఎలా ఉంటుంది? కళ్ళు తెరవక ముందే ఎటో వెళ్ళింది. అమ్మ తిరిగి వచ్చేదే నా వద్దకు. నేనే తొందరపడి బయల్దేరాను. అమ్మ నాకు ఎదురుగా వస్తది. అమ్మ ఎలా ఉంటుంది ? అమ్మ ప్రేమకు మారు రూపం నేనే కదా! అమ్మ నాలాగే ఉంటుంది. నేనెలా ఉంటాను ? సందేహాలకు లోనౌతూ అడుగులు వేస్తుంది. నాలుగడుగులు వేసిందో లేదో. ‘అమ్మా ఆకలి అంది” నీరసంతో కూలబడింది. కళ్ళు తిరిగినవి. ప్రపంచం మసక బారింది. ఆ స్థితిలో కాస్తంత దూరంలో అమ్మలాగా కనిపించింది. లేని ఓపిక తెచ్చుకుంది. మెల్లమెల్లగా అటువైపు అడుగులేసింది.
* * *
అమ్మ పిచ్చిదైంది. పిల్లకోసం పిచ్చిగా తిరిగింది. ఎత్తుపల్లాలు, శిఖరాలు – లోయలు గాలించింది. చిన్నప్పుడు నేను అమ్మ చెప్పినట్లు వినేది. ఈ కాలపు పిల్లలు పుట్టుకతోనే స్వతంత్రులవుతున్నారు. స్వేచ్ఛ మంచిదే. ఉరిబిగించేదిగా ఉంటే ఎట్లా? ఈ కడుపు కోత దేనికి? అది వెళ్ళినందుకా? ప్రసవ ఫలితమా? బొడ్డుతాడు బంధమా? తల్లి ప్రేమ అంటే ఇదేనా? ఏమో తెలియటం లేదు. అంతా అయోమయంగా ఉంది. వాడి పరిస్థితి ఏమిటి? వాడి మొహం వాడికింత పట్టింపా? ఏమో? తనలో తానే నవ్వుకుంది. యాతన పడింది. వెతుకుతుంది. ఎక్కడని వెతకాలి. వెతకకుండా ఉండగలనా? పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి.
* * *
వెతకాలి… వెతకాలి…. ఎక్కడికని పోవాలి? ఎటువైపని వెళ్ళాలి? కూచుంటే ఇక్కడికే వస్తుందా? రాదుగాక రాదు. అది దారి తప్పిన పిల్ల. వెతకాలి… పట్టుకోవాలి…. ఈవిడ ఇంకా రాలేదు. అడుగు ముందుకేసాడు. భార్యాబిడ్డలు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు. పరిపరి విధాల మనసుపోతుంది. పిల్లది తప్పే. ఉన్నచోట ఉండక ఎందుకు బయల్దేరినట్లు? ప్రేమ ఒక చోట ఉండనిస్తదా! ఎన్ని దివారాత్రాలు తిరిగిన. దీని తల్లిని ఒప్పించటానికి. మనసు, తనువుల ప్రతిఫలనం నా బిడ్డ. ఎక్కడుందో. మృగారణ్యం మొగారణ్యం అంతా అడవి, భయంపాకింది. ఈ పిల్లకు ఓపిక లేదు. ఈ తరమే అంత. ఒప్పుకోళ్ళ స్థానంలో బలవంతాలు వచ్చి చేరినయి. ఆలోచనలన్నీ పుకార్లలా విహరిస్తున్నవి. కళ్ళు-కాళ్ళు వెతుకుతున్నవి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుంది పరిస్థితి.
* * *
తల్లి, పిల్ల, తండ్రి, అడవిన పడ్డారు. తల్లి ప్రేమకోసం పిల్ల తహతహలాడింది. దగ్గరలో ఉన్న జంతువు తల్లే అనుకొని మరింత చేరువైంది. దాని మెడవరకు వెళ్ళింది. పిల్ల ఒళ్ళు పులకరించింది. తల్లిని ముద్దాడింది. ”భూమిపైకి నన్ను తెచ్చింది. నీవేకదా” అడిగింది. పిల్ల ప్రవర్తన వల్ల ఎదుటి జంతువులోని మాతృహృదయం పాలుగారింది. పిల్లను అక్కున చేర్చుకుంది. దాని విశాలమైన ఉదరం పిల్ల ఆటస్థలమైంది. బండలాంటి దాని తల నీడలో విశ్రమించింది. కళ్ళు విప్పార్చి తదేకంగా తల్లిని చూస్తూ పాలకోసం ప్రయత్నించింది.
* * *
తల్లిజింక, కొండా-కోన గాలించింది. డస్సింది. గుట్ట-గుండె తడిమింది. దహించుక పోయింది. అడుగులు తడబడ్డాయి. నీటి కోసం అలమటించి కూలబడింది. చావు వచ్చేలా ఉంది. ఆకాశం వైపు మెడసాచింది. కన్నీరుకార్చింది. లేని ఓపిక తెచ్చుకుంది. నీటి జాడకు బయల్దేరింది. సుడిగాలి పయనం చేసింది తండ్రి జింక. ”ఎక్కడున్నవు బిడ్డా” అని నోరారా అరిచింది. అడవంతా ప్రతిధ్వనించింది. నీరై దుమికింది. రాయి-రప్ప ఒరుసుకపోయింది. సుడిగాలై గాలించింది. కాయ-కంప గీరుకపోయింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అడవిని అడిగింది. నిశ్ళబ్దం కనిపించింది. నీరసం కమ్మింది. నాలుక పిడచకట్టింది. లేని ఓపిక తెచ్చుకొని నీటికోసం బయల్దేరింది.
* * *
ఆకసాన్నంటినట్లున్న పొడవైన చెట్లు. వాటి ఆకులు రాలుతున్నవి. విశాలమైన నది ఒడ్డుకు ఇరువైపులా చెట్లు. అవి నదికి గొడుగు పడుతున్నట్లున్నవి. నది శబ్దిస్తుంది. ఆ శబ్దం దాహార్తులను పిలుస్తున్నట్లున్నది. తీరం పొడవునా జంతుజాలం సేదతీరుతుంది. రాలిన ఆకు, నీటితో తడిసి మెత్తటి పరుపులా విస్తరించింది. దానిపై సేదతీరిన జంతువు కదిలినా, నిద్రాభంగం కాకూడదని ఆకు శబ్దించడం లేదు. ప్రకృతి ఒడి మెత్తన. నిద్రించిన ప్రాణికి సాంత్వన. మెలకువ కలిగిన మెదడుకు ఆలంబన.
* * *
నదీ తీరంలో చెట్లతో పాటు దట్టమైన పొదలున్నవి. పొదల మాటున దాక్కుని జంతువులు ఉన్నాయి. వేటగాళ్ళు ఉన్నారు. దాడి చేయాలనుకున్నవారు మాటు వేయడం పరిపాటి. ఆ రోజు వేటకోసం భార్యతో సహా వచ్చాడు వేటగాడు. మాటు వేసాడు. అక్కడ ఆదమరిచి పడిపోయిన తల్లి జింక పై భార్యభర్తల చూపు పడింది. పడి ఉన్న దాని వైనం చూసి దంపతులు సంబరపడ్డారు. బాణం ఎక్కుపెట్టి నారి సారించాడు. వదలడమే ఆలస్యం. భార్య వారించింది.
”ఎందుకు అడ్డుకున్నావు” అన్నాడు
”నిద్రపోతున్న దాన్ని చంపడం పాపం”
”ఆకలిని చంపడం కూడా పాపమే”
”బాలింతలా ఉంది పాపం”
”నా ధర్మాన్ని విస్మరించడం పాపం”
”మనిషి పుటుక పుట్టినపుడు నెనరు ఉండాలె”
”అందుకే నిన్ను, నాతో రావద్దంట”
”అటు చూడు” అంది
మొహం వేళ్ళాడేసుకొని, తడబడుతున్న కాళ్ళతో వచ్చింది తండ్రి జింక. కడుపునిండా నీళ్ళు తాగింది. తాగిన చోటే సాగిలపడింది. కళ్ళు మూసింది. గతం కదలాడింది. కళ్ళు తెరిచింది. భారంగా నిశ్వసించింది. మళ్ళీ కళ్ళు మూసింది. దుఃఖం తన్నుకొచ్చింది. కళ్ళు తెరిచింది. ఓపిక లేకున్నా లేచి నిలబడింది. ఎదురుగా దగ్గర్లోనే పడి ఉన్న తల్లి జింక కనిపించింది. ఉత్సాహంగా ముందుకురికింది. అచేతనంగా పడి ఉన్నదాన్ని చూసి కంటనీరు పెట్టింది. నాలుకతో నిమిరింది. తలతో తట్టింది. భయంతో దిగ్గున లేచింది తల్లి జింక. ఎదురుగా తండ్రి జింక. భయం స్థానంలో కోపం చేరింది.
”ఎక్కడ తిరగబోయినవురా” కోపగించింది.
…………………………………………
”బిడ్డను పోగొట్టుకున్న రా” నిస్సహాయంగా అరిచింది.
…………………………………………
”ఇదంత నీ వల్లనే జరిగింది. నాశనమయిపోతవు” శపించింది.
”జరిగిందానికి ఇద్దరం బాధ్యులమే” నిశ్చలంగా అంది తండ్రి జింక
ఆ మాటతో కూలబడింది. సోయి తప్పింది. దాని పక్కనే కూర్చొని సపర్యలు చేసింది తండ్రి జింక. ఇదే అదనుగా మరోసారి దాడికి సిద్దమయ్యాడు వేటగాడు. మళ్ళీవారించింది భార్య.
”నా పాలిటి దరిద్రదేవతవు నీవు” అన్నాడు
”బిడ్డను పోగొట్టుకొని ఉన్నారు వాళ్ళు”
”అయితే నాకేంటి?”
”వన్య ప్రాణులను చంపితే జైల్ల పెడుతారట”
”నీతులు చెప్పకు. ఇవ్వాళ పూటగడవడం ఎట్ల?”
”ఒక్కరోజు ఉపాసం ఉందాం”
”రేపటికి ఎట్ల?”
”రేపటి సంగతి దేవుడెరుగు”
వేటగాడు విల్లు కింద పెట్టాడు. సపర్యల తరువాత తల్లిజింక తెలివికొచ్చింది. రెండు జింకలు కలిసి కనిపించిన దారిలో పయనించాయి. వాటిని వేటదంపతులు వెంబడించారు.
* * *
జింక పిల్ల పాలకోసం ప్రయత్నించింది. తనది కాని వాసనేదో వేసింది. వెగటు పుట్టింది. ముద్దాడిన మూతికి రక్త రుచి తెలిసింది. తొందరలోనే అది తన తల్లి కాదని గ్రహించింది. జింక పిల్ల రక్తంలో భయం చొరబడింది. అక్కడి నుండి పరుగెత్తింది. పరుగును చూడగానే జంతువులో వేటాడే లక్షణం మేల్కొంది. వెంటాడింది. క్షణంలో పంజా విప్పింది. విసిరింది. జింకపిల్ల తప్పించుకుంది. జంతువు గాండ్రించింది. ముందుకు దూకింది. మెడ పట్టింది. కొరికింది. పులినోట్లో పడి జింకపిల్ల చచ్చింది. కాసేపు స్థంబించిన ప్రకృతి మరల యధావిధిగా మారింది.
* * *
రెండు జంటలు ఒక దాని వెనుక ఒకటి పరుగునడక పెడుతున్నవి. అలా వెళుతున్న వాటికి చావు వాసన సోకింది. తల్లి జింక ఠక్కున ఆగింది. వాసన వైపు మళ్ళింది. తండ్రి జింక వెంబడించింది. అవి దారి మళ్ళడం చూసి వేటదంపతులు ఆశ్చర్యపోయారు. వాటి వెనకే వెళ్ళారు. ఆ దారి జింకపిల్ల చచ్చిన ప్రదేశానికి తీసుకెళ్ళింది. పిల్ల అవశేషాలు కనపడుతున్నాయి. పోగొట్టుకున్న బిడ్డను తలచుకుంటూ జింక జంట దుఃఖిస్తున్నది.
”అయ్యో బిడ్డా ఎంత పనైపాయె” అంది వేటకత్తె
”చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత” అన్నాడు వేటగాడు.
”ఈ మాత్రం దానికే ఎంత తతంగం. దేవునింట్ల మన్నువడ. చోద్యం చేస్తడు”
”జింకను పంపినోడే, పులిని పంపిండు”
”అంటే!! నీ ఉద్దేశం ఏంది”
”పులికి ఆహారంగా జింకను పంపిండు”
”చంపి తినుడేనా పులి పని”
”పిల్లను చంపలేకపోతే, పులి పరువేం కావాలె”
”బలవంతుడు, బలహీనుణ్ణి చంపుడేనా! కనీస పాపభీతి ఉండక్కర్లేదా?”
”నా బంగారం కదూ! ఇంటికి పోదాం పదా”
”ఏమోనయ్యా! అంత ఎటమటం అనిపిస్తుంది”
”జింకపిల్ల, నువ్వు ఇద్దరూ అమాయక ప్రాణులే”
”మనం ఆకలికి ఓర్చుకోగలం. బిడ్డ ఆకలి తీర్చడం ఎలా?
”జింకను చంపుతానంటే అడ్డుపడ్డావు. ఆకలి తీరే మార్గం నీవే చెప్పాలి.”
”పులి చంపిన జింక పిల్లను తీసికెళ్దాం”
”సరే పదా!
* * *
నవీన్, కథ విన్నావు కదా వేటగత్తె మానవీయ ఆలోచనల వల్ల పెద్ద జింకలు బతికి బయట పడ్డాయి. వేటాడే మనస్తత్వంవల్ల పిల్ల జింక చచ్చిఊర్కొంది. వేటాడే మనస్తత్వం మనుషుల్లో పెరగడంవల్ల పిల్ల జింకల్లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు కదా!

April 9, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

మధుమాసం (పద్యకవిత)

by బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం April 9, 2022
written by బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం

లేజిగురు పులకలెత్తెను
రాజతగిరి శివయు – శివల
రమ్యనటన ది
వ్యాజానందప్రకటన
నీ జగతికి తెలుప వచ్చెనే
‘మధు’ విలకున్! 1
రంజిల్లె కవుల గుండెలు
కెంజిగురాకు లగుచు
రసగీతిక లల్లన్
సంజయె శాశ్వతమేమో!
మంజరులకు నిలయమయ్యె
మహి నెల్లెడలన్! 2
రాగాంకితమైన మదికి
త్యాగమ్మే తప్ప వేరు
ధర్మము కలదే?
పూగుత్తులు రసికజనుల
రాగార్తిని దీర్ప రసప
రాయణలయ్యెన్! 3
పూవులకును భ్రమరాలకు
నేవో దివ్యానుభూతు!
లెవ రెరుగరొకో!!
తావియు – షట్పదరాగము
భావికి ఫలరూప మీయ
వర్ధిలె నేమో!? 4
క్షణములొ? ఘడియలొ? జీవిత!,
మణువంతైనను ముఖాన
నరయము పూలం
దణకువయెతప్ప శోకము!,
వణకెడు నరు జుచి “వలదు!
వల!!” దను నవిగో!! 5
మృదుహాసము, తేనె వలపు,
చిదిమిన పాల్గారు ముగ్ధ
శృంగారమ్మన్,
వదలని దానవిభూతియు
పదిలము లని జీవితాన
పలుకు విరు లవే!! 6
“ఇచ్చినది తనకు – దాచిన
మ్రుచ్చులకే!” యన్న మాట
మోమాటము లే
కచ్చపు ప్రియభాషణముల
నిచ్చలు తెల్పుటకె ధాత
నిన్ననిపెనొకో!? 7
తేనియవలె తీయనయిన
వాణి తెలుగటంచు జగతి
బహువిధములుగా
జ్ఞాన”మయూఖ”ల జిమ్ముచు
మౌనముతో తెలుపు పూలు
మధుమాసమునన్! 8
తెలగాణ తేటదనమును
సులలితవదనా! “మయూఖ”
సురుచు లెగయగా
గలగల నవ్వుచు, పిలుచుచు
నిల జనులకు నడత నేర్ప
నెంతువె గురువై! 9
అందముల జిందు మాసమ!
విందొనరించెదవు శివుని
ప్రేమకు రూపై –
కందొవకె కాదు…. మదికిని!;
సందేహమె? జనుల కీవె
సద్గురు వనగా!? 10

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

రుచులివి

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి April 9, 2022
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

సీసము:- అమ్మపాలు బలము
లందించు తీపి గా
నల్లారుముద్దుగా నారు నెలలు;
అయ్య పెంపకమున నదుపాజ్ఞలను జూప
నగుపించు కారమై యతని తీపి;
వలపులు సుఖములు కులుకులు తళుకులు చెలిమియు కలతల దెలుపు పులుపు ,
ఇష్టమైన పనుల కష్టము గనరాక
తినగ తినగ చేదు తీపి నిచ్చు!
తే.గీ ౹౹ వగరు రుచిలేక నారోగ్యవంతమగును,
మితముగా జేర్చ రుచులకు జతయె యుప్పు !
శుభకృదబ్దాది హార్దికశోభలందు,
మనుజుల నుగాదిపచ్చడి మైత్రి బెంచు!

April 9, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us