మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ పండుగ

by Dasari (jangiti) Shantakumari October 3, 2022
written by Dasari (jangiti) Shantakumari

తెలంగాణ సంస్కృతి విశిష్టమైనదే కాదు విలక్షణమైంది.తెలంగాణ ప్రజలు జరుపుకునే పండగల్లో బతుకమ్మ పండుగ ప్రత్యేకమైనది.బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.ప్రకృతిని ఆరాధిస్తూ,పూజిస్తూ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పండుగ బతుకమ్మ పండుగ.ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు అంతా కులాలు,మతాలు అంతస్థుల తారతమ్యం ,చిన్నా పెద్దా,వయోభేదం లేకుండా సంబరంగా ఆడుతూ పాడుతూ గౌరీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే పూల ఉత్సవం.ఈ పండుగ కోసం ఆడపడుచులమంతా ఎదురు చూస్తుంటాము.నగరాలలో ఉన్నవారు సైతం ఊళ్లకు పయనమై పండగలో పాల్గొంటారు.ఉరుకుల పరుగుల జీవితంలో ఈ పండగ ఇంటింటా సరికొత్త ఆనందాలను నింపి,ఉత్సాహాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఆటవిడుపు కాలమిది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏటా బతుకమ్మను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించటం విశేషం.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకుంటూ జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ.శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25 న ప్రారంభం కానున్నాయి.బతుకమ్మ ఉత్సవాలు కూడా ఇదే రోజున మొదలై 9 రోజులపాటు జరుగుతాయి. అక్టోబర్ 3 వ తేదీన సద్దుల బతుకమ్మ ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నాహాలు జరుపుతోంది. బతుకమ్మ పండుగ వారసత్వ పండుగ.చరిత్రకు సాక్ష్యమైన పూల జాతర. ఈ పండుగ ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో చారిత్రక కథలు,పురాణాల రూపంలో ప్రచారంలో ఉన్నాయి.నవాబులు, భూస్వాముల,పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.వారి అకృత్యాలకు బలైపోయి,నలిగిపోయినవారిని,వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి పూలను పేర్చి,బతుకవమ్మా…లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడుతాము.”బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ” పాటల వెనుక ఉన్న మర్మం ఇదే.వెయ్యేళ్లుగా ఇక్కడి ప్రజలము బతుకమ్మను తమ ఇంటిదేవతగా పూజిస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర అంతా ఇంతా కాదు. ఒకరకంగా ఉద్యమానికి ఊపునిచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని కదిలించటమే కాదు మన అస్తిత్వాన్ని నిలబెట్టిందనటంలో ఏ మాత్రం సందేహం లేదని చెప్పాలి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రధాన్యాన్నిచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది.

బతుకమ్మ పండుగ కథ :

తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్దం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ (ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా ) లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళనే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది.అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006 లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు.తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి , బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది.బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు.అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకోవడం జరిగింది. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను జరుపుకుంటున్నాము. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నాము. అంతేకాకుండా తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగలన్నీ సామాజిక సంబంధాలకు అద్దం పడతాయి.ప్రకృతిలో మమేకమై ఆత్మీయంగా బంధాలను పెనవేసుకోవడం ఇక్కడి ప్రజల సహజ జీవన సౌందర్యానికి ప్రతీక.బతుకమ్మకు వాడే పూలు కూడా సహజ సిద్ధంగా లభించేవి కావడం విశేషం.మానవ ప్రయత్నం లేకుండా సహజంగా లభించే మొక్కలకు,తీగలకు పూసేవే. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే సమయంలో…భూమితో,జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటాము.ఈ సంబరాల్లో పెండ్లికాని అమ్మాయిలు”బొడ్డెమ్మ”(పుట్టమన్ను తో చేసే దుర్గాదేవి బొమ్మ)ను చేసి వాకిట్లో ముగ్గులు వేసి ఆడుతారు.ఈ పండుగ బొడ్డెమ్మతో మొదలై బతుకమ్మగా రూపుదిద్దుకుంటుంది.ఇలా మట్టిరూపం నుంచి పూలరూపం పొంది నీళ్లలో కలిసిపోయే తంతు అంతా జానపదుల సంస్కృతిలో భాగం.ఆద్యంతం జానపదుల జీవన విధానం ఈ పండుగలో మేళవిస్తూ…అటు ప్రకృతితో ఇటు మనిషితో గాఢమైన నిరంతర సంబంధాన్ని ప్రదర్శించే అపురూపమైన ఉత్సవం.ప్రకృతిలో లభించే రకరకాల పూలవలె అందరూ కలిసి మెలిసి బతకాలనే గొప్ప సందేశం అంతర్గతంగా మనకు బోధిస్తుంది. ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటేనే పల్లెవాసుల జీవనశైలి, శ్రామిక రైతుల బతుకు చిత్రం ఇమిడి ఉండే సామాజిక ఉత్సవంగా …వృత్తి, వర్గ,కుల,ప్రాంత,మత సాంప్రదాయ భేదాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కలిసి సమతాభావాన్ని పెంపొందించే గొప్ప ఉత్సవం ఈ బతుకమ్మ పండుగ.

పర్యావరణ హితం :

 బతుకమ్మ పండుగ వర్షాకాలపు చివరలో,శీతాకాలపు తొలిరోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ నీటితో నిండి ఉంటాయి.రకరకాల పూలు దొరుకుతాయి.వర్షాకాలం,శీతాకాలం సంధి సమయంలో ఉపయోగించడంతో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.నిండుకుండలాగా ఉండే చెరువులు, కుంటలూ వీటితో శుభ్రం అవుతాయి. పర్యా వరణాన్ని కాపాడుతాయి. బతుకమ్మ పాటలు కష్టసుఖాలు, - ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాల మేళవింపుగా అలరిస్తూ...సంస్కృతి, సంప్ర దాయాలకు అద్దం పడతాయి. ఈ పర్వదినం సందర్భంగా తొమ్మిది రోజుల పాటు రకరకాల నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. మొక్కజొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం లాంటి పదార్థాలను నైవేద్యాల తయారీలో ఉపయోగిస్తారు

తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పేర్లు,నైవేద్యాలు :

1.ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్య రోజు. దీన్నే “పెత్రామాస” అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతాము.
2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తాము
3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తాము.
4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.
5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తాము.
6. అలిగిన బతుకమ్మ : ఆశ్వయుజ పంచమి. ఈనాడు నైవేద్యం సమర్పించము.
7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తాము.
8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తాము.
9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఇదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటాము. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం,మలీదా,నువ్వుండలు అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదిస్తాము.
బతుకమ్మ పూల పండగే కాదు ఆటపాటల పండగ.కోలాటాల పండగ.వేడుక ఒక ఎత్తయితే ఆ ఆటలు,పాటలు అనిర్వచనీయ ఆనంద హేలలు.బతుకమ్మ ఆట ఆడుతూ పాడే పాటలు ఆనందానుభూతిని పంచుతాయి.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు,ప్రేమ,స్నేహం,బంధుత్వం, ఆప్యాయతలు,త్యాగం,భక్తి,భయం,గౌరవం,చరిత్ర పురాణాలను మేళవించి పాడటం ఒక గొప్ప విషయం.
శతాబ్దాలుగా ధ్వంసమైన మన సంస్కృతి సంప్రదాయాలకు తిరిగి ప్రాణం పోసిన మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి కృషి ఎనలేనిది.మరువలేనిది.మన భాష సంస్కృతిని బతికించి, భావితరాలకు అందించటంలో తెలంగాణ జాగృతి చేస్తున్న కృషి ద్వారా ప్రపంచ స్థాయిలో బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు లభించింది.పూల పండగ అయిన బతుకమ్మ నేడు ఖండాంతరాలు దాటి, ప్రపంచమంతా విస్తరించి అట్టహాసంగా నిర్వహించబడుతోంది.

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorizedకవితలు

వెరపు లేని త్యాగానిదే రాజ్యం!

by -కోట్ల వెంకటేశ్వర రెడ్డి October 3, 2022
written by -కోట్ల వెంకటేశ్వర రెడ్డి

తెగించి పిడికిలెత్తినప్పుడే
ఎవరైనా తేరిపార జూసుకోవాలి
వెనకా ముందు ఆలోచించు కోవాలి
అవహేళనలన్నీ అగ్గి రాజేసేవే!

తెగింపు కొట్లాటలన్నీ
వెరపు లేని త్యాగలనుంచి పుట్టుకొచ్చినవే
వాపెప్పుడు బలుపు కారాదు
చలి చీమలేకమవుతుంటే సర్పానికి వణకు పుట్టాలి!

చూసీ చూసీ ఎలుగెత్తి చాటీ చాటీ
ఎద ఉప్పొంగే దృశ్యంగా
దేశ భక్తి మొలకెత్తాలి
విద్వేషాలు నింపే ఎన్నికల పెట్టుబడి కారాదు!

ఆధునిక కాలంలో ఎవరికైనా
సుదీర్ఘ పోరాటాలక్కర లేదు
ప్రజలు తలచుకుంటే ఆకాశం చిల్లుబడ్డట్లు
అధికారం కొంపలు మునుగుతాయి!

విలువలు దిగజారినప్పుడు
నువ్వెదిగొచ్చిన సంగతి మరచి పోరాదు
సూత్రమొక్కటే ఎవరికైనా
అహంకారం పతనానికి దారులు వేస్తుంది!

ఫోటో కోసం జరిగిన రచ్చ
బాల్యంలో చినిగిన చొక్క కోసం చేసిన
హాస్యాస్పద పోరాటాన్ని గుర్తు చేసింది
ఎవరేం చేస్తున్నది ప్రజలకెరుకైతున్నది!

పాద యాత్రలు పస లేని ప్రగల్భాలు
ప్రజా జీవితాలను ప్రతిబింబించనంత కాలం
విద్వేషాలు కుతంత్రాలేవీ
రాజ్యాధికారాన్ని కట్టబెట్ట లేవు నిలబెట్ట లేవు!

చీలికలు తెచ్చే వారిదెన్నడు
దేశానికి ఏలిక కారాదు
ఏకం చేసే వారికే
భిన్న సంస్కృతుల రాజ్య పట్టం!!
:- కోట్ల వెంకటేశ్వర

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నవ్వు ముఖం !!

by రాఘవాచార్య‌ October 3, 2022
written by రాఘవాచార్య‌

మనిషికి ముఖం ఉన్న దొకటే 
ముఖంలో ఒకసారి విచారం 
మరోసారి ఏడ్పు
మాటిమాటికి మాట మాటకు రంగులు మారే ముఖం 
ఒక్క ముఖం పై ఎన్ని తెరలు తెరలో 
రాత్రి కన్నులు మూసుకుంటే  నిద్ర ముఖం
నువ్వు ఏది ఆలోచిస్తే అది ముఖం పై చెంపపెట్టే 

పేరుకే పెద్ద ముఖం 
కాని నవ్వు ముఖంలోకి రావడం అంటే కష్టమే 
అద్దంలో చూసుకుని కావాలని నవ్వితే 
అది నీ ముఖం కాదు
అద్దం సొంతమే 

కారణం లేకున్నా
చిన్న పిల్లలు రోజుకు వందసార్లైనా నవ్వుతారు 
బాల్యమే కారణ జన్మ !
అకారణంగానూ ఆనందమే 
ఆనందో బాల్యం!
పెద్దలు కారణమున్నా నవ్వి ఏడ్వరు
భేషజం పెద్దరికం 
అన్నీ నవ్వుకు అడ్డం దిడ్డం వస్తాయి 

సర్కసులో జోకర్ 
సినిమాలో హాస్య నటులు మన ముఖాలను
 నవ్వు ముఖాలుగా మార్చే గొప్ప శిల్పులు !
మహా రాజులు నవ్వడానికి విదూషకులను      
ఎదురు బదురుగా ఉంచుకునే వారు  
బీర్బల్ కథలు నవ్వు బలం 
తెనాలి రామలింగని కథలు
రాయలు సైతం రాయలేన్నన్నీ !

 నవ్వు నిజంగా ఆరోగ్యంగా  
మన జీవితంలో ధన్వంతరి

ముక్కోటి దేవతలలో ఏ ఒక్కరిదీ నవ్వు ముఖం కాదు 
ఒక్క లాఫింగ్ బుద్ధ తప్ప
అదీ చైనాదే 

పెండ్లిలో ఫోటోగ్రాఫర్ వధూ వరులను   
నవ్వు ముఖం పెట్టమంటాడు
ఫోటోలోనైనా మనుషులు నవ్వితే ఫోటోలకు విలువ 
ఫోటోగ్రాఫరుకు గిరాకి 
నా కొడుకు నా కోడలు అంటూ  గర్వపడతారు
ఆల్బమ్ ను వందల సార్లు చూస్తారు

అసలు పాలకులు బాగుంటే
ప్రజలందరివీ నవ్వు ముఖాలే 
నిజంగా  నవ్వు ముఖమే స్వాతంత్య్రంగా మనం

      – 
                     879059396

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

స్వార్థం గొడుగు నీడలో…

by Senathipathi Dasyam October 3, 2022
written by Senathipathi Dasyam

స్వార్థం గొడుగు నీడలో…
లోకమంతా
ఇచ్చి పుచ్చుకునే సంత బేరాలవుతుంటే…ఒకనాటి
అనుబంధాలు…నేడు
చూద్దామన్నా…కనబడక..
కనుమరుగవుతున్నాయి!
అనుకోని అతిథి రాకోయి
అంటూ..
సన్నాయి రాగాలు వినిపిస్తుంటే..
రాటు దేలిన
మనసుల మధ్య…
ఆప్యాయతా చివురులు
చిగురించ లేక పోతున్నాయి!

తోలు బొమ్మలాట వంటి..
బతుకులో…నటిస్తూ
మసలటం రివాజైపోతుంటే..
నాలుకపై మాట గుండెలో దిగనీయక…
గుండెలో మాట పెదవి గడప దాటక…
భావం…గొంతు ముడిలో
ఉరి వేసుకుంటున్నాయి!
బంధాలు అనుబంధాలు..
ఎండుటాకులై రాలిపోతూ
నటించే వానికే…
హారతి పడుతుంటే..
ఆనందాల..
ఆత్మీయతల అర్థాల
స్వరాలు మారుతున్నాయి!

ఇకనైనా..
సంకుచిత గుహ నుండి
బయట పడదాం!
మసక బారుతున్న
బంధాలకు…
మానవత్వపు
మెరుగులు అద్దుదాం!!

దాస్యం సేనాధిపతి
హైదరాబాద్

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

దీక్షా తిలకం

by Kondapally Neeharini October 3, 2022
written by Kondapally Neeharini

చుక్క చుక్క నదిగా తరలి సంద్రమై
ఆకాశాన్ని ప్రతిబింబిస్తున్నట్టు
పువ్వు పువ్వు నవ్వుల దీపమై వెలిగే
బతుకమ్మ ఓ దివ్య దీక్షా తిలకం!

తెల తెలవారే తూరుపులో
తొలి పొద్దు రేఖలు నగవుల శిఖరం
క్షణాల అనుపద గమనాలలో
హరిద్రా మూర్తికి గాత్ర పూజనం
సాయం సంజె వేళల్లో చెరువుగట్టున ఆటపాటల సంబరం
బతుకమ్మ ఓ సామూహిక తేజో కళా తిలకం!

వర్ణరంజిత పరాగమే సురాగమై పరిమళించినట్టు
ప్రాణవాయువు డోలలో
అంతరంగ ఉయ్యాలో పాటల్లో తూగినట్టు
చందమామ చల్లని వెన్నెల తెమ్మెరల వలలో తేలి ఆడినట్టు
అస్తిత్వ ప్రతిధ్వనుల కోల్ కోరస్
ఒక్కేసి పువ్వేసే పాటల మెట్లెక్కినట్లు
బతుకమ్మ ఓ జానపద సారస్వత తిలకం!

తల్లి సౌజన్య మే తాయిలమై
బిడ్డ సంతసాల సాంగత్యమే పల్లవై
ఆంక్షలు దాటి కాంక్షలు దీర
ఇంటింటి గానము తానై
ఆడపడుచుల కమ్మన్ని ఆప్యాయతల పంటతానై
బతుకమ్మ కౌటుంబిక సహజీవన సురభిళ తిలకం!

కాఠిన్యాలను కాలదన్ని
అనంతమైన కలివిడితనానికి పునరుజ్జీవనం తానై
అంతర్ లోకాల
భావ సమ్మేళనాల
సరమూ తానై సాహిత్య స్వరమూ తానై
బతుకమ్మ ఓ సామరస్య సంజీవని తిలకం!

ఏటేటా
ఎలమి తానై బలిమి తానై
తల మీదికి ఎక్కిందంటే చాలు బతుకమ్మ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల సామాజిక చైతన్య తిలకం!

ఆకార ప్రాకారాలు దాటి
సాద ప్రసాదాలు పంచి
సమరసత తానై సౌశీల్యతా తానై

బతుకమ్మ తెలంగాణ స్నేహ సౌభాగ్య దీక్షా తిలకం!

పసుపూ కుంకుమా పూలు పండ్లూ
స్వచ్ఛమైన మనసులూ
అచ్చమైన ముచ్చట్ల పచ్చందనాలూ
నలుగురితో నడకలూ
పదుగురితో మృదు హాసాలు
ఆరోగ్యం చంద్రికలు ఔషధ మై
బతుకమ్మ ఓ పర్యావరణ పరిరక్షణ తిలకం!

సంతోష పల్లకినెక్కి
పాడ్యమి నవమిల నవ సందేశాన్నితెచ్చే
బతుకమ్మ
ప్రకృతి ఒడి
రంగు రంగుల సింగిడి
పూలు స్త్రీలు పాటలు పిల్లలు
ఇంటిల్లిపాది బతుకు బడి
తొమ్మిది రోజుల నమ్మిక సందడి
ఆ జీవ పర్యంత భావ సామరస్యం

బతుకమ్మ ఓ సౌందర్య దీక్షా తిలకం!! ॥2॥

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

నందివర్ధన పరిమళం..

by Chandu Pendyala October 3, 2022
written by Chandu Pendyala

పూలతోటలెన్నో ఉంటయి.పూలెన్నో పూస్తయి.అందులో వర్ధిల్లేవి ఎన్ని.పరిమళాలు వెదజల్లేవి ఎన్ని.నందివర్ధనం కనబడడం అరుదు,అందునా నెలనెలా నెలవంకలా కనబడడం ఆశ్చర్యం,అద్భుతం.
వివేకవంతులైన వివేక సర్వీస్ సొసైటీ ,అప్పాజోస్యుల ఛారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త నిర్వహణలో నిర్వహించిన ‘ నెలా నెలా నందివర్ధనం ‘ సభా కార్యక్రమములో ఈ రోజు 84 వ నందివర్ధనము గా తానూ ఒక సుగంధ ద్రవ్యమైన ఒక విశిష్ట వ్యక్తి, ,తెలుగు చదువును,తెలుగు రాతను చరిత్ర కావ్యంగా మలచిన శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి చరిత్రను శోధించి సాధించి సభలో సంధించిన ప్రముఖ రచయిత,సంపాదకురాలు డా : కొండపల్లి నీహారిణి గారికి అభినందనలు.

ఒకరి చరిత్ర గురించి ఒక నిండు సభలో మీరు వచ్చి చెప్పాలన్న సాహిత్యాభిమానుల కోరికను కాదనలేక వందల కిలోమీటర్ల దూరం పయనించడానికి సిద్ధమైన నీహారిణి గారి వెంబడి నేను , నా భార్య జ్యోతి రథానికి జోడు గుఱ్ఱాల లాగా హైద్రాబాదు అల్మాస్ గూడా శ్రీ శ్రీ హోమ్స్ లోని శ్రీ కొండపల్లి శేషగిరిరావు ఆర్ట్ గ్యాలరీ నుండి పొద్దున నాలుగు గంటలకు బాపట్ల కు బయలుదేరినం.యుద్ధం చేసేది ఎంత వీరుడైనా రధ సారధి సమయస్ఫూర్తి కలవాడు కాకపోతే చాలా కష్టం.మా రథ సారధి డ్రయివర్ ప్రభాకర్ అనుభవం ,అతని కవితా పిపాస తోడుగా బయలుదేరి బంకులో కారుకు కడుపునిండా మేత తినిపించుకున్నాం . సూర్యాపేట దగ్గరలో గల Hotel 7 లో ఇడ్లీ వడ తిని చాయ తాగి బాపట్ల కు బయలుదేరినం.నిజంగా Hotel 7 అదొక Heaven.చాలా శుభ్రంగా వున్నది.అక్కడ సినిమా నటులు కూడా ఆగి తిని పోతరు అని విన్నది నిజమేననడానికి మా ముందు Table దగ్గర కూర్చుని టిఫిన్ చేసిన సినీ నటుడు రాజా రవీంద్ర గారు నిజం చేసినరు.ఆయనను చూడడం కొత్త అనుభూతిని నింపింది.

Hotel 7 దగ్గర సెలవు తీసుకొని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి నిర్ణయించుకున్నాం .దొరికిన ఆ మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మేము సిద్ధమై దర్శనం గావించుకుని , దగ్గరలో గల మంగళగిరి పానకాల స్వామిని చూసి పానకం ఆయనకు పోసి మేము తాగి అధ్భుతమైన గోపురం చూసి అమరావతి చేరుకున్నం.

అమరావతిలో అమరలింగేశ్వరుని దర్శించి , మౌనముద్ర లో కూర్చుని నిలువెత్తు ఆదర్శంగా కనిపించిన బుధ్ధుని చూసి అక్కడ ఆర్య వైశ్య హోటల్లో ఒనగాయ ( చింతకాయ ) పచ్చడి తో కూడిన భోజనం చేసి బాపట్లకు బండి కట్టినం.అక్కడ మేము బసచేయడానికి Kavuri Grand లో రూము ఏర్పాటు చేసిండ్రు. ‘ కావూరి వారి సత్రం ‘ (Lodge ) చాలా నీట్ గా వుంది.అక్కడకు మేము చేరుకునేసరికి సభా నిర్వాహకులలో ఒకరైన సాహిత్యాభిమాని శీలం శ్రీనివాస్ గారు సభా సమన్వయకర్త గా సాదర స్వాగతం పలికినరు.
అక్కడ ఒక గంట రెస్ట్ తీసుకుని చాయ తాగి బాపట్ల దగ్గరలో గల ఒక వృద్ధాశ్రమములో నిర్వహించే ‘ నెలనెలా నందివర్ధనం ‘ మినీ సభకు వెదుళ్ళపల్లి మీదుగా శ్రీనివాస్ గారి వెంట పోయి సాయంత్రం 6 గంటలకు సభా ప్రాంగణం చేరుకున్నం. ప్రముఖ సాహితీవేత్త అప్పాజోస్యుల సత్యనారాయణ గారు ఎంతో

ఆత్మీయంగా పలకరించారు. అక్కడ నిర్వాహకులు అందించిన చీరాల స్పెషల్ బాదుషా , వేడి వేడి చిన్న సమూసాలు, నెయ్యి వేసిన ఇడ్లీ తిన్నాం.తర్వాత వేడి వేడి టీ తాగి సభికులకు కేటాయంచిన కుర్చీలలో కూర్చున్నం.
సభ ప్రారంభమైంది. ఈ సంస్థ వారు నిర్వహించే వేదిక పైన కేవలం ఆ రోజు ముఖ్యుల గురించే మాట్లాడే వక్త ఒక్కరే కూర్చోవడం జరుగుతుంది.సభలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి గురించి డా : కొండపల్లి నీహారిణి గారు ఇచ్చిన ఉపన్యాసం ఏ ఆయాసము లేకుండా అందరు హాయిగా వినడం జరిగింది. లక్ష్మణరావు గారు తెలుగు భాషా వ్యాప్తికి మరియు ఇతర భాషల కొరకు చేసిన కృషిని సోదాహరణంగా వివరించిన తీరు సభికులను ఆకట్టుకుంది.
చప్పట్లతో అభినందనలు తెలిపారు.

సభ ముగియగానే అందరితో మాట్లాడి, వారు ఇచ్చిన గ్రంథాలను, పుస్తకాలనూ తీసుకొని , సెలవు తీసుకుని బయలుదేరాం.
బాపట్ల లోని ‘ బొమ్మరిల్లు ‘ రెస్టారెంట్ కు పోయి పులుకాలు పన్నీరు కూర్మాతో తిని మాకై కేటాయించిన లాడ్జ్ లో రెస్ట్ తీసుకున్నం.
పొద్దున్నే లేసి దగ్గరలో బీచ్ వున్నది చూద్దాం అని ప్రభాకర్ చెప్పకపోతె ‘ సూర్యలంక ‘ బీచ్ చూసే అదృష్టం కోల్పోతుమనుకుంటా.సముద్రపు అలల అల్లరిని తనివితీరా చూసి ఒక అరగంట దూరంలో వున్న ‘ జిల్లెలమూడి ‘ కి బయలుదేరినం.జిల్లెలమూడి అమ్మ అంటే ఓ కాలాన ఒక వెలుగు వెలిగింది.మా చిన్నప్పుడు మా అమ్మ తోని అక్కడకు పోయినమని మా చిన్నక్కయ్య ( నీహారిణి ) చెప్పింది. జిల్లెల్లమూడి అమ్మ ఇప్పుడు లేకున్నా అక్కడ ఆమె ఆనవాళ్లు చెదిరిపోలేదు. ఇప్పటికి అక్కడ సేవా కార్యక్రమాలు,భజనలు కొనసాగుతూనే వున్నాయి.

అక్కడి నుండి పెదనందిపాడు మీదుగా చిలకలూరిపేటకు చేరినం.అక్కడ టిఫిన్ , టీ కానిచ్చి పిడుగురాళ్ళ , దామరచెర్ల దాటి మిర్యాలగూడ దగ్గరికి వచ్చేసరికి నేను కొన్నేళ్లు జాబ్ చేసిన ఆఫీసు యజమానులు మా Chairman Sir , MD Sir ఊరు గదా అని ఒక్కసారి మనసు పులకించి నా సంతోషాన్ని కారులో వున్న వారితో పంచుకున్న.మధ్యలో ‘ తిప్పర్తి ‘ తగిలింది.మా చిన్నప్పుడు వరంగల్ నుండి వచ్చి అక్కడ దిగి ఎడ్లబంఢిలో మా మేనమామల ఊరు గోపాలపురం చేరేవారం. ఆపాతమధురాల్లాంటి ఆ పాత ముచ్చట్లు ఎన్నో పంచుకున్నాం. ఇక ముందుకు కదిలి నార్కట్ పల్లిలో ‘ వివేరా ‘ హోటల్ దగ్గర ఆగి టీ తాగి ‘ చకినాలు ‘ కొనుక్కొని హైద్రాబాద్ కు చేరినం…

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మహాత్మా మళ్ళీ రా…..

by Shuktimati Vemuganti October 3, 2022
written by Shuktimati Vemuganti

సత్యాహింసలు మూర్తీభవించి ప్రభవించిన వ్యక్తిగా విశ్వమంతటా ఖ్యాతిని పొందిన మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాలుఘనంగాజరుపుకుంటున్నాము. అహింసాయుధంతో పోరాడి పరాయి పాలనను అంత మొందించిన జాతీయ వీరుడే కాక విశ్వమంతటా మానవసంబంధాలను అంతర్జాతీయ సహకారాన్ని వ్యాపింప చేసేందుకు శాశ్వత సూత్రాలను ప్రవచించి ప్రతిపాదించినధీరుడు.
గాంధీ గారు సౌతాఫ్రికాలో నల్లజాతీయుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడినందుకు అక్కడి వాడైన డెన్మండ్ టూ టూ అను నతడు మరియు భారతదేశ స్వాతంత్రాన్ని అహింసాయుధంతో సాధించినందుకు యూపీఏ పర్సన్ సోనియాగాంధీ సలహా సూచనతో ఐక్యరాజ్యసమితి 2007 జూన్ 15 నాడు గాంధీ మహాత్ముని పుట్టినరోజైన అక్టోబర్ 2 ను ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్’ డే గా ప్రకటించారు.
మహాత్ము ని మహిమాన్వితమైన వ్యక్తిత్వాన్ని గురించి గానీ, అర్ధ నగ్నంగా ఉండే ఆ యోగిపుంగవుడి శక్తియుక్తుల గురించి గానీ, చారిత్రక దృష్ట్యా గాని, మానవ దృష్ట్యా గాని అంచనా వేయడం అంత సులభం కాదు. ప్రపంచ ప్రజానీకాన్ని ఆకట్టుకున్న ఆ మనీషి వినూత్నమైన, అత్యద్భుతమైన వ్యక్తిత్వాన్ని గురించి నాలుగు మాటలు వ్రాయాలనుకోవడం నైతిక బాధ్యత.
ఒక్కొక్క మహానుభావులు ఒక్కొక్క క్షేత్రము నందు మాత్రమే మార్గదర్శకమై ప్రజలనుద్ధరింతురు. కానీ గాంధీగారుదేశముయొక్కసర్వతోముఖాభ్యుదయమునకై ఆధ్యాత్మిక ,పర్యావరణ , రాజకీయ, సాంఘిక రంగాలలో నిర్విరామంగా కృషి సల్పి అహింసాయుత సత్యాగ్రహ సమరం ద్వారా స్వరాజ్యమునుసంపాదించి ప్రపంచ చరిత్రలో మరెవ్వరూ పొందలేని స్థానాన్ని ఆక్రమించారు.
వీరికి బ్రాహ్మణుని కుండవలసిన బ్రహ్మజ్ఞానము, క్షత్రియుని కుండవలసిన శౌర్య ధైర్యపరాక్రమములు, వైశ్య ధర్మానుసారం గా పారిశ్రామికాభివృద్ధి వంటి వ్యాపారముల ద్వారా ధర్మబద్ధమైన ఆర్థికాభివృద్ధి నాలుగవదైన సేవాపరాయణత తో తన జీవితాన్నే
అంకితం చేసిన మహా పురుషుడు.
బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస, ఆశ్రమ ధర్మాలను నాలుగింటిని పాటించిన పూర్ణ పురుషుడితడు.. చతుర్విధ పురుషార్ధములఅనుష్టించి సాధించుకున్న మహాయోగి.వీరిదృష్టిలోఆధ్యాత్మికమనగానైతికములు. ధర్మ మనగా నీతి. సత్య మనగా స్వతంత్రం.
రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీ ఆశ్రమానికి వెళ్లి నప్పుడు
. ఏషదేవో విశ్వకర్మా మహాత్మా
సదా జనానాం హృదయే సన్నివిష్టః
అను ఉపనిషద్వాక్యాన్ని గాంధీకి అన్వయించి చెప్పి మహాత్మా’ అని సంబోధించినాడట.
స్వాతంత్రం వచ్చాక ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందని వారైన డాక్టర్ బి అంబేద్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, సి.డి.దేష్ముఖ్ లను ప్రభుత్వ యంత్రాంగంలో మంత్రివర్గ సభ్యులుగా చేర్చుకోవాలని దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రతీ పౌరుడి పాత్ర ఉంటుందని, నెహ్రూకు సూచించిన రీతి వీరికి ప్రజాస్వామిక వ్యవస్థ పై ఉన్న ప్రగాఢ విశ్వాసానికొక నిదర్శనం. అహింస స్వేచ్ఛాయుత సహకారం వల్లనే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని వీరి నమ్మకం ఏ ప్రభుత్వము ప్రజా పాలన లో తక్కువ జోక్యం కలిగించుకొనునో అదే శ్రేష్టమైన ప్రభుత్వం అనికూడా వీరి అభిప్రాయం.
ఇండియాలో మహత్తరశక్తి గాంధీయే అని న్యూఢిల్లీలో వైస్రాయి లిన్ లిత్ గో ప్రభువు ఒక పత్రికా విలేఖరితో అన్నాడట.
1924 సెప్టెంబర్ లో శ్రద్దానందస్వామిఢిల్లీప్రాంతంలో లేవదీసిన శుద్ధి ఉద్యమం ఫలితంగా హిందూ ముస్లింల మధ్య జరిగిన కలహాన్ని నిరసిస్తూ వారి ఐక్యత నే తన జీవితంలో ప్రధాన ఉద్దేశ్యమని అది ఫలించినప్పుడు మానవుడికి ఉండే 120 సంవత్సరాల ఆయువు తో తాను బ్రతక గలనని, లేనిచో నిరాహార దీక్షకు ఉపక్రమింతునని చెప్పడం వీరి మత సహనానికి ఉదాహరణ.
దేశ స్వాతంత్ర ప్రకటనతో దేశమంతా జయ జయ ధ్వనులతో వేలకంఠాలు మారు మ్రోగుతున్న చారిత్రాత్మక సంఘటన తో ఢిల్లీలోఎర్రకోటపై జాతీయ పతాకం రెపరెపలాడుతున్న తరుణంలో బెంగాల్ లో జరుగుతున్న హిందూ ముస్లింల అల్లర్లను అణచటానికి ఉపవాసదీక్ష అనే అస్త్రంతో అక్కడే ఉండి తను ఆశించింది ఒక్క రాజకీయ స్వాతంత్రం మాత్రమే కాదని సర్వమత ఐక్యత అన్నిటికంటే ముఖ్యమని ఈ మత కక్షల వల్ల తన మనస్సు పాడై నిరాశగాఉన్నదని,ప్రాణం పోయే వరకు ఉపవాసం చేస్తాననిహిందూ-ముస్లింల అంతరాత్మలను హెచ్చరిస్తూ ప్రకటించాడు. దీనితో గాంధీకి ఏమవుతుందోనన్న భయంతో ఇరు మతాలు శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేశారు.
ప్రపంచంలో అణుబాంబు నాశనం చేయనిది ఏదైనా ఉందంటే అదే అహింస అని గాంధీజీ ప్రకటించారు. అంతేకాక అహింసా ఆయుధాగారంలో నిరాహార దీక్ష ఆఖరి అస్త్రంగా తలచాడు.
పాకిస్తాన్ నుండి ఇండియాకు బాకీ ఉన్న ఒక పద్దు లోని మొత్తాన్ని రాపట్టుకునేందుకు గాను ఇండియా ప్రభుత్వం తాను పాకిస్థాన్ కి ఇవ్వవలసిన 55 కోట్ల రూపాయలను ఇచ్చుటకు ఆలస్యం చేసినప్పుడు గాంధీజీ మాటపై ఆ మొత్తం వెంటనే వారికి జమకట్టి వేశారు. ఇది వారి నైతికతకు ఒక చక్కని ఉదాహరణ
భారత నాగరికత వ్యవసాయిక నాగరికత అని ప్రపంచమునకు అన్నము కల్పించు వ్యవసాయకుడు సంఘమునకు మూలవిరాట్టుగా తలచెను.
లెక్కకు మించిన ఉత్పత్తికి బదులు లెక్కకు మించిన శ్రామికుల ద్వారా ఉత్పత్తిని కోరే గాంధీ గారు యంత్రీకరణ కు వ్యతిరేకులు కారు కానీ యంత్రాల ఎడ ఉన్మాద ప్రేమను, విచక్షణారహిత యంత్ర వృద్ధిని వ్యతిరేకించారు తప్ప ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వ్యతిరేకించలేదు.
వీరి దృష్టిలో స్త్రీలకు అత్యంత గౌరవ స్థానం ఉండేది అన్ని రంగాలలో స్త్రీలు ముందంజ వేయాలని, స్త్రీల పట్ల వివక్ష కూడదని నొక్కివక్కాణించారు.
వీరు అంటరానితనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డాక్టర్ బి అంబేద్కర్ తో సమానంగా దాని నిర్మూలనకై జీవితాంతం కృషి చేశారు. దేవుని మనుషులు గా పిలవబడే వారే హరిజనులని నామకరణం చేస్తూ వారే దేవుని ప్రేమకు పాత్రులని సాంఘిక అసమానతలకు కనువిప్పు కలిగించారు.
స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు గాని, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నపుడుగానీ, ఆశ్రమంలో ఉన్నప్పుడు గానీ ఎవరుతన అభిప్రాయాలను తిరస్కరించినా , గౌరవించినా మహాత్ముడు ఓర్పుతో విని అవసరమైన సలహాలను తీసుకునేవాడు.
ముస్లిం పక్షపాతిగా గాంధీని తలచి హిందూ మతోన్మాది ఆ మహాత్మను పేల్చివేసి విశ్వాత్మ లో లీనం చేశారు. భిన్న మతాల సామరస్యానికి జీవితమంతా కృషిచేసి, ‘ఈశ్వర్ అల్లా తేరే నామ్’ అని ప్రతి రోజు ప్రార్థించే అతని నోట ‘ హే రామ్’ ”హేరామ్’ అనే మాట చివరిదైంది.
వారు జీవితాంతం ఏ ఆశయాల కోసం పోరాడారో అవన్నీ ఈనాడు భూస్థాపితం అయిపోయి మామూలుగా ప్రతి ఏడాది అక్టోబర్ 2న జరిగే సభలో ఉపన్యాసాలు సమావేశాలు ఆయన పటానికి బూజు దులిపి పూల దండల అలంకరణ యధావిధిగా జరుగుతున్నది. రాను రాను కొత్త తరాలకు గాంధీ అనే పేరు మాత్రమే తెలిసి గాంధీజయంతి ఉత్సవాలు ఒక విగ్రహారాధన ప్రక్రియగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది.
గాంధీ గారి స్మారక చిహ్నాలు అనేక చోట్ల ఉన్నాయి. విజయవాడలో ఒక కొండకు గాంధీ పర్వతం అని పేరు. భూతలం మీదనే కాక ఆకాశంలో కూడా ఆయన పేరుతో గాంధీ నక్షత్రమని నామకరణం చేయాలని ఆలోచన ఉంది . కానీ గాంధీ గారు భౌతికంగా ఉన్నప్పుడే ఆయనను వ్యక్తిగతంగా కీర్తించడం. భజన చేయడం, పొగడడం ఏవగించుకునే వాడు. కేవలం తన ఆశయాలను. నైతికతను, అహింసా వాదాన్ని గౌరవిస్తూ అవి పాటించాలని కోరేవారు.
కాని పైన చెప్పబడిన వారి ఆశయాలన్నీ మృగ్యమై నేటి సమాజంలో కేవలం పదవి, ధనానికే పట్టాభిషేకం జరుగుతూ, రోజురోజుకు ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోతూ, మతకల్లోలాలు మారణహోమా లవుతూ మానవ ప్రకృతి రోజురోజుకు సంకుచితమై, స్వార్థంతో నీచమైఈపోతున్న ఈ తరుణంలో ఈ పరిస్థితులను ప్రక్షాళన చేయాలంటే గాంధేయవాదులు ఇంకా విస్తారంగా గాంధేయ సిద్ధాంతాల ఆశయాల సాహిత్యాన్ని లోకానికి సమర్పించాలి.
గాంధీ జన్మించి 150 సంవత్సరాల తర్వాత కూడా నేటి సమాజానికి యువతకు దేశానికి వారి ప్రబోధాలు అవసరం ఉంది. అంతేగాని ఆయన బోధనలకు తిలోదకాలు ఇస్తూ ఆయనను కరెన్సీ నోట్లపైఒక బొమ్మ గా, రాయిగా చివరకు నక్షత్రంగా మార్చాలి అనుకోవడం అవివేకం.
ఇంత మహనీయుడు అయిన వ్యక్తిఈనేలపైనడిచాడా!” అని భావి తరాల వారు విస్తు పోతారని ఇంకా వేల సంవత్సరాలు అయినా అటువంటి వ్యక్తి ఉండడని ప్రపంచప్రఖ్యాతసైంటిస్ట్ఐన్ స్టీన్ అన్నట్టుఆయనతరతరాలమానవఔన్నత్యానికైబోధించినవిలువలు ,నైతికధర్మాలుమననంచేసుకుంటూప్రభావితులమవుతూ, భావితరాల వారికి

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

నా డైరీ లో ఓ పేజీ.. ప్రపంచ పండగ బతుకమ్మ

by రూపాదేవి October 3, 2022
written by రూపాదేవి

  దసరా సెలవుల ముందురోజు పూల వనంలా మారింది బడి. బతుకమ్మ లోని రంగు రంగుల పూలకు సాటిగా రంగు రంగుల బట్టల్లో పువ్వుల్లా కేరింతలు కొట్టే చిన్నారులతో ప్రతీ ఏడాది దసరా సెలవుల ముందు రోజు బతుకమ్మ సందడి సంతరించు కుంటుంది తెలంగాణ బడులల్లో.

    కాలంతో పాటు ప్రయాణించాలి కాబట్టి కాలానికనుగుణంగా కట్టూ బొట్టుకు అలవాటు పడిన పిల్లలు చక్కని పరికిణీలు కట్టుకొని వాలుజడలు, వాటి చుట్టూరా పూల దండలు, పాపిట బిళ్ళ లు – చంపసరాలు , వడ్డాణాలు – వంకీలు, గాజులు – గజ్జెలు, కాటుకలు – గోరింటాకు భారతీయ వస్త్రధారణలో ధగ ధగా మెరిసిపోతూ బతుకమ్మలు పట్టుకున్న అమ్మాయిలను కళ్ళనిండుగా చూస్తూ ఉంటే కళ్ళకింపుగా ఉంటుంది.

ప్రతి దానికీ తీన్ మార్ డాన్సులు మాత్రమే తెలిసిన మగపిల్లలు కోలాటం కర్రలు పట్టుకుని పాటలకనుగుణంగా పదం కలపడం భారతీయ సంస్కృతిక వైభవాన్ని గుర్తుచేస్తోంది. పాశ్చాత్య పోకడలు ఎన్ని పెరిగినా భారతీయత మాత్రం లోపల అలాగే భద్రంగా ఉంది అనే సంతోషాన్ని , భరోసాను నింపుతోంది. విద్యాలయాల్లో జరిగే ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను పరిచయం చేస్తాయి. మూలాలు మరువకుండా చూస్తాయి.

  ఎప్పటిలానే సరిగా అర్థం కాని తీన్ మార్ పాటలు కాకుండా మంచి భావం, సందేశం గల సాహిత్యంతో అచ్చతెలుగు పాటల వల్ల ఈ తరం పిల్లలకు తెలుగు పదాలు పరిచయం అవుతున్నాయి. జస్టిన్ బీబర్, షకీరా పాటలే కాదూ అచ్చతెలుగు పాటలూ అంతే ఉత్సాహాన్ని ఊపునూ ఇస్తాయని పిల్లలకు తెలిసేలా నిరూపిస్తున్నాయి బతుకమ్మ పాటలు.

తెలంగాణ రాష్ట్ర పండగగా గౌరవం దక్కిన తర్వాత కాలం నుండి ఇప్పటి తరానికి అర్థమయ్యే భాషలో చాలా చాలా బతుకమ్మ పాటలు రాయబడుతున్నాయి, ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా ప్రత్యేకంగా బాణీలు కట్టబడుతున్నాయి. అయితే వెనుకటి నుండి కూడా ప్రాచుర్యంలో ఉన్న పాటలు  బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…, ఒక్కొక్క పువ్వేసి సందమామ…, రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీ రామ ఉయ్యాలో…ఇలాంటి పాటల్లో ప్రజల జీవన విధానం ప్రతిబింబించేలా సుఖ దుఃఖాలు కలగలిసిన బతుకులు అగుబడేలా పాటలు ప్రాచుర్యంలో ఉన్నవి.

నిజానికి తెలంగాణ ఏర్పడక ముందు వరకు ఉత్తర తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్న బతుకమ్మ పండుగ దక్షిణ తెలంగాణ లోని పాలమూరు జిల్లాలో తెలియదు. ఎక్కడా బతుకమ్మ ఆడే వారు కాదు కానీ ఏరొంక పున్నమి, పీర్ల పండుగలప్పుడు పిల్లలను అమ్మవార్లుగా భావించి మధ్యలో కూచోబెట్టి చుట్టూరా చేరి పాటలు పాడుతూ బొడ్డెమ్మ వేసే వారు.  తెలంగాణా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతి, సభ్యత చాటిచెప్పే వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ పండగ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం ఉద్యమనాయకుల ఆదేశం అయ్యిందీ ఇప్పుడదే ఆనవాయితీ అయ్యిందీ.

తెలంగాణ ఏర్పడ్డాక దీనికి రాష్ట్ర పండగ గా గౌరవం కల్పించబడింది. అప్పటినుంచి తెలంగాణా  ప్రభుత్వం ఈ పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తప్పని సరిగా బతుకమ్మ నిర్వహించేలా ఆదేశాలు చేసింది. ప్రజలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు,కార్యాలయాలు బతుకమ్మను నిర్వహించడానికిగాను అనేక వేదికలు ఏర్పాటు చేసి, పూవులు,విద్యుత్ వెలుగులు, పాటల కోసం మైకులు సమకూర్చి వేడుక చేసుకునేలా సౌలభ్యం కల్పిస్తోంది.

      భారతీయులు  ప్రాణి కోటి మనుగడకి కారణం అయిన ప్రతి దానినీ అంటే విశ్వంలోని సూర్యచంద్రులు, గ్రహాలు నక్షత్రాలు, గాలి, నీరు, నిప్పు, నేల, రాయి రప్ప, చెట్టు,పుట్ట , కొండ, గుట్ట, పాము,పక్షీ, జంతువు, కాలం, ఇలా ప్రతీది చివరికి జీవనానికి ఉపయోగపడే వస్తువులను కూడా కృతజ్ఞతా భావంతో దేవతల రూపంలో కొలుస్తారు. సామూహికంగా పండగలు, పర్వదినాలు చేస్తారు. భారతీయ పండుగలలో ప్రతి పండగకి ఓ పరమార్థం ఉంటుంది. ప్రతి ఉత్సవానికి ఓ కథ ఉంటుందీ. కాల గమనంలో ఉత్సవాల వెనక కథలు మారుతూ కొత్తవి చేరుతూ పోతున్నా ఉత్సవాల ఉద్దేశం మాత్రం అంతర్లీనంగా అదే ఉంటుంది.

      ఇక బతుకమ్మ పండుగ విషయంలో రకరకాల కథలు కథనాలు ప్రచారంలో ఉన్నా జీవులకు మనుగడకి కారణం అయిన ప్రకృతిని గౌరీదేవి పేరుతో కొలుస్తూ ఆమెకు ప్రతిరూపంగా సహజ సంజీవని రోగ నివారణి అయిన పసుపు ముద్దను చేసి ఆ ప్రతిమ చుట్టూరా అందుబాటులో ఉన్న పూలను అలంకరించి అందరూ చుట్టూ చేరి పాటలు పాడుతూ ప్రాణులకు బతుకునిచ్చే దేవతగా బతుకమ్మ పేరుతో కొలుస్తారు.

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరాదరణకు గురి అయి అంత పెద్దగా జరుపుకోని ఈ బతుకమ్మ పండుగ ఈ నాడు ప్రత్యేక తెలంగాణకు ప్రత్యేక పండగ. రాష్ట్ర అవతరణ తరవాత రాష్ట్రం లోని ఊరు – ఊరు,  వాడ – వాడా చేరింది. రాష్ట్ర హద్దులు దాటి, దేశ ఎల్లలు దాటి వెళ్లింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పూల పండగను ఘనంగా, ఇంత కళగా పుష్కలంగా పువ్వులతో జరుపుకోవడంతో ప్రజలకు వేడుకే కాదు ఆ పువ్వులు పండించే రైతుల మొహాల్లో కూడా నవ్వులు విరుస్తున్నాయి. బతుకమ్మ పుణ్యమా అని పూలు రైతులకు బతుకుదెరువు పెరిగింది. పూల వ్యాపారలకు లాభాలు పెరిగాయి తద్వారా ఆర్థిక మార్పిడి పెరిగింది. అలాగే బతుకమ్మ పాటల రూప కల్పన లో కవులకు , కళాకారులకి,  గాయకులకు, సాంకేతిక నిపుణులకు చేతినిండా అవకాశాలు, పని పెరిగినాయి.

 పిల్లలు పెద్దలు సంతోషంతో పాటు ఆనంద డోలికల్లో ఊగే సంబరం బతుకమ్మ.

ఆడ మగ తేడా లేకుండా పెద్దలే పిల్లలై,  పిల్లలతో కలిసి బతుకమ్మ ఆటలో లీనమై బాధ్యతలు, వత్తిడులు , సాధక బాధకాలు మరచి, ఈగోలు, స్థాయిలు, పట్టింపులు పక్కకు పెట్టి కాసేపు సంతోషంగా ఆనందంగా గడపటం ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించింది. బాల్యాన్ని గుర్తు చేసింది. ఏడాదికోమారు వచ్చే ఈ సంబరం మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యంగా కూడా పెంచుతుంది…

మనస్పర్థలు మరిపించే ఇలాంటి చక్కటి సంబరాన్ని కార్యాలయాల్లో ప్రవేశ పెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.

    శుష్క ప్రాంతం, గుట్టల ప్రాంతమైన తెలంగాణలో బంజరు భూములలో మొలిచే ఔషద మొక్కలు తంగేడు, గునుగు, పోక పూలు, పట్టుకుచ్చు పూలు, ఉప్పు పూలను శంఖు ఆకారంలో పేర్చి విశ్వ గతికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఎంచి  ప్రకృతి ఆరాధన చేసే ఈ పూల పండుగ ప్రకృతి స్వభావాన్ని, ఔషద గుణాన్ని, ప్రకృతి విలువను చెబుతుంది, ప్రకృతి పట్ల మనిషి భాధ్యత తెలుపుతుంది. పర్యావరణ హితకారిగా ఉంది.   

https://drive.google.com/file/d/1Ivv499DrppiHHK1DDgU0nEnVsbqNAYdK/view?usp=sharing                              

October 3, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

మానవత్వమే మాధవత్వం.

by Mukka Srinivas October 3, 2022
written by Mukka Srinivas

బ్రతుకు అర్ధం తెలియచేసేదే మానవత్వమే
మానసనిశీధి రెప్పలపై కాంతిరేఖ
మానవత్వమే

గుండెలోని అలజడులు కాలం చేసే గాయాలు
రుధిరపు మడుగుల ప్రళయంతో చితిని పేర్చవద్దురా
మనసులోని నిరాశకు ఆత్మీయతే
రేపటి పొద్దు
గగనపు దేవుడి రూపుకు పసిడే
అలంకారం కాదు
మనసే మాధవుడైతే మానవత్వమే వేదమంత్ర మవుతుంది.

పులకించే పూలగాలిలో శుభోదయం
మానవత్వ పరిమళమే మహోదయమై మహిని మురిపించే
సరిగమల పాట మానవత్వం.

ఋతువుల్లో మధువంతా
అనురాగపు మాటలవ్వాలిరా
మమతా సమతలతో మనసుబంధం పెనవేయాలు
కులమతాల కుమ్ములాటలు
రంగుల లోకపు భాగోతాలు
అనుబంధపు ప్రేమలే నింగి దేవుడి వాకిళ్ళు
చెలిమిని పంచేటి మానవత్వమే నిర్మల మానసం
మానవత్వమే మనిషిని మాధవుణ్ణి చేసే
నిత్య సత్యమైన అలంకారం.

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఉప్పెన సినీమా పాట సమీక్షా

by Ramakrishna Manimadde October 3, 2022
written by Ramakrishna Manimadde

“ఉప్పెన” సినిమా కోసం “శ్రీమణి” రాసిన
“నీ కన్ను నీలి సముద్రం “.. ఈ ప్రేమ పాట వింటే ..
మనసు పరవశిస్తుంది.. పలవరిస్తుంది..
ప్రేయసికై పరుగులు తీస్తుంది..

అలతి అలతి పదాలతో.. ప్రేమకు ప్రేమను అద్ది
హృద్యంగా ఆవిష్కరించిన తీరు..
ఈ పాటను పదేపదే వినేలా చేసింది.

చిలిపితనం.. కుర్రతనం.. కలగలిపి,
ప్రేమ పాటలలో.. పదికాలాల పాటు నిలిచేలా
ఈ పాటను తీర్చిదిద్దారు.

“నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం..” అంటూ
పల్లవిలోనే అదరగొట్టేశారు.

ప్రేయసి కన్నులను నీలి సముద్రం చేసి
ప్రేమికుడి మనసుని పడవ ప్రయాణం
చేయించారు కవి..

నీలాల కన్నులు అందానికి ప్రతిరూపమే కాదు..
వేలవేల భావాలను పసిగట్టేవి.. పలికించేవి..
నిగూఢతకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచేవి.

అలాంటి కన్నులను నీలి సంద్రం చేసి..
ప్రేమలోని గాఢతను తెలియజేశారు శ్రీమణి

ముత్యం స్వచ్చతకు ప్రతిరూపం..
మరి.. ప్రేయసి పెదాలపై విచ్చుకున్న ఆ స్వచ్చమైన నవ్వు
ప్రేమికుడిలోని కష్టాలను దాచేసి.. దాటివేసి
తీరానికి లాగేటి దారమే కదా..!

“నల్లనైన ముంగురులే
అల్లరేదో రేపాయిలే
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే ..”

ముసురుకున్న ప్రేయసి ముంగురులు అల్లరేదో రేపి..
ఇంకో లోకాన్ని లేకుండా కప్పాయి అంటూ.. కొంటేతనాన్ని కవిత్వికరించిన శ్రీమణి..
“ఘల్లుమంటే నీ గాజులే
జల్లుమంది నా ప్రాణమే
అల్లుకుంది వాన జల్లులా ప్రేమే ..”

ప్రేయసి గాజుల గలగలలు గల్లుమంటుంటే..
ప్రియుడి ప్రాణం జల్లుమనకుండ ఉంటుందా..?

వానాజల్లుల అల్లుకుంటుంది.. అలరిస్తుంది ..
అని
చిలిపి తనాన్ని చమత్కరించారు..
అంత్య ప్రాసలతో ఆకట్టుకున్నారు..

“చిన్ని ఇసుక గూడు కట్టినా
నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ..”

ప్రేమలో నాకే దక్కాలి అనే స్వార్థం ఉంటుంది..
ఆ స్వార్థంలో పసితనంలోని నిష్కల్మశం దాగి ఉంటుంది..
అందుకేనేమో కవి మనలను తిరిగి
పసివాల్లను చేశారు..

ఇసుక గూడు చేసుకుని పేరు రాసి పెట్టడం..
ఎంత హృద్యమైన భావన.. మరెంత గొప్ప వర్ణన..!
ఆ పేరును చేరిపెటి కెరటాలు పుట్టలేదని
తన ప్రేమను ఉన్నతీకరించాడు..

“ఆ గోరువంక పక్కన
రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంటా నువ్వుంటే నా పక్కన..”

ఏ జంటనైనా ఒకరికి ఒకరులా ఉంటే
చిలుక గోరువంకలా ఉన్నారు.. అని అంటాము.
అంతకన్నా చక్కని జంట తమదని చెప్పడం
కవి దార్శనికతకు… ఆదర్శ జంటని చెప్పటానికి
అద్దం పడుతుంది.

“అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని
తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ
చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమనీ..”

పాటకే హైలైట్ ఈ వర్డ్స్ ..
శ్రీమణి ఈ పాట రాయడానికి నిజంగానే
కొత్త కొత్త మాటలని అప్పు అడిగే ఉంటారు..

నవ్యత కు.. సృజనకు తన పాటలతో
ప్రాణం పోయడానికి నిత్యం తపన పడే శ్రీమణి
కవి హృదయానికి ఈ చరణం తార్కాణం అని చెప్పవచ్చు.

ముఖ్యంగా ఒక సినిమా పాట రాసేటప్పుడు..
సాహిత్యం రాయాలంటే..గీత రచయిత కు
మంచి సన్నివేశం.. సందర్భం దొరకాలి..
ఆ రెండు దొరికాయేమో రచయితకు
విజృభించాడు..

కమర్షియాలిటీ కూడా ఆలోచించి
టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వాలి
అనుకున్నారేమో శ్రీమణి..
“నీ అందమెంత ఉప్పెన
నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా”.. అంటూ
“ఉప్పెన” టైటిల్ ని ఉదాహరిస్తూ
సాహిత్యానికి భంగం కలగకుండా
తెలివిగా.. చక్కగా రాసారు..

యవ్వనంలో ఆకర్షణ .. అందం ..
యువతి యువకులకు ..
చాలా పసందుగా ఆనిపిస్తాయి ..
అందుకే..
ఉప్పెనెలా అందం చప్పున ముంచేసిందని
ప్రియుడు మునిగి తేలుతున్న వైనాన్ని..

ప్రేయసి ప్రాయపు పొంగులను..
ఆకర్షణను ఆరబోసారు.. కవి శ్రీమణి..

“చుట్టూ ఎంత చప్పుడొచ్చినా
నీ సవ్వడేదో చెప్పనా
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా..”

ప్రేమికుడు ఏకాంతంగా ఉన్నా.. ఎందరిలో ఉన్నా
తన ప్రేయసి సవ్వడిని పసిగట్టగలడు..

ఎంత దాచేసినా..దాయాలని చూసినా
జల్లేడేసి మరీ పట్టుకోగలడు..

శ్రీమణి సాహిత్యంలో కొత్త పోకడలను స్పృశించారు..
“జల్లడేసి” అనే ఆర్డినరీ పదాన్ని చాలా అద్భుతంగా
ఒదిగి పోయేలా రాశారు .. ఇది కవి నేర్పుని సూచిస్తుంది.

ఇలా.. పద ప్రయోగాలు చేస్తూ
ప్రేమ పాటకు జీవం పోయడం
రచయితకు ఆత్మ తృప్తిని ఇస్తుంది..
గీత రచయితగా కీర్తిని తెస్తుంది..

ఈ రెండూ చక్కగా నిర్వర్తించిన
శ్రీమణి అభినందనీయులు..

“నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని..’

అబ్బాయిలు అమ్మాయిలకు వల వేస్తారు..
కానీ..
ఇక్కడ అబ్బాయే అమ్మాయి ప్రేమ వలలో చిక్కుకుని
చేపలా విలవిలలాడుతున్నాడు..
నిజమే కాబోలు..
ప్రేయసి ఊహలను ఊపిరిగా
ఆమె ఊపిరినే ప్రాణంగా
బతుకుతున్న పిచ్చోడు కదా..!

సినిమా పాటలలో.. ప్రేమ పాటలకు
విస్తృతి, పరిధి చాలా ఎక్కువ..

కమర్షియాలిటీ మిస్సవ్వకుండా.. చక్కని సాహిత్యాన్ని అందించి.. కవిత్వాన్ని సూత్రీకరించి..
తన కలానికి ఉన్న పదును
మరోసారి తెలియజేశారు శ్రీమణి.

“శ్రీమణి.. ది బెస్ట్” అనేలా..
సాహిత్యాన్ని అందించిన ఈ పాట
ప్రేమికుల హృదిలో..
తెలుగు భాషాభిమానుల మదిలో..
“ఓ.. మంచి హిట్ పాటగా నిలిచిపోతుంది..

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us