మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

రెక్కలు

by Peddurti Venkatadasu August 20, 2021
written by Peddurti Venkatadasu
రాసే వాళ్లంతా
గొప్ప
పండితులే
కావచ్చు —
చూసేవాడు
జ్ఞాని!

కాలు
కదపనోడికి
కాలువైనా
కడలే—
సొమరికన్నీ
అమావాస్యలే!

సుడిగుండాలుసునామీలు
కడలికే కాదు
కార్యోన్ముఖులకూ..
చలించనిదే
ధీరత్వం!

ప్రేమను ఆశించడం
అందరి కల
ప్రేమను పంచడం
కొందరి కళ–
కాగితంపువ్వు
పరిమళం పంచదు!

చీకటిని
గెలవడానికి
రవి కూడా
రాత్రంతా ఆగాల్సిందే —
సహనంతోనే
వెలుగు సాధ్యం!

ఏ ఒక్కర్నో కాదు
అందర్నీ
పలకరించేవే
వైఫల్యాలు–
పడిలేచినోడే
ప్రాజ్ఞుడు!
August 20, 2021 2 comments
2 FacebookTwitterPinterestEmail
కవితలు

75 వసంతాల ‘‘మయూఖ’’ భారత ‘‘అమృతోత్సవ’’ పతాక

by Krishna Vaddepalli June 23, 2021
written by Krishna Vaddepalli

నా దేశం వేద పునీత ` భగవద్గీత

నా జెండా శాంతి, అహింసల ‘ఎజెండా’ !

భరతుడు, రాముడు, కృష్ణుడు పరిపాలించిన

గౌతమ, ఆది శంకరాదులు ప్రవచించిన

గంగా, గోదావరి, కావేరి ప్రవహించిన

పావన జీవనక్షేత్రం ` నా దేశం,

విశ్వశాంతి సందేశం ` నా దేశం!

పురుషోత్తమ, చంద్రగుప్తుల ప్రతిఘటనల మార్గం

శివాజీ, ఝాన్సీల స్వాతంత్య్ర ఖడ్గం

సిపాయీల తిరుగుబాటుతత్వం

గాంధీజీ, నేతాజీ నేతల స్వాతంత్య్ర మనస్తత్వం

నా జెండా జవసత్వం !

హిమవన్నగం తలమానికంగా

వింధ్య గిరీంద్రం ఒడ్డాణంగా

కన్యాకుమారి పాదపీఠంగా

అలరారే భారతావని నా దేశం,

పాడిపంటల తులతూగే శ్రీకోశం ` నా దేశం!

హరిత భరిత సస్యశ్యామలం ఆకుపచ్చగా

త్యాగచరిత అరుణవర్ణం లేత ఎరుపుగా

శాంతి ` అహింసల సంకేతం స్వచ్ఛమైన తెలుపుగా

కలగలిసి ఎగిరే మువ్వన్నెల నా జెండా,

పులకిత భారతి మెడలో విరిసే పూదండా !

సాధించుకున్న స్వాతంత్య్ర విజ్ఞానంతో

నా దేశం నాకంలా వర్ధిల్లాలి,

నా జెండా ధర్మచక్రంగా విలసిల్లాలి.

June 23, 2021 1 comment
2 FacebookTwitterPinterestEmail
కవితలు

వంటిల్లు

by ఆచార్య ఎన్. గోపి June 23, 2021
written by ఆచార్య ఎన్. గోపి

*వంటిల్లు*

నేను భోజన ప్రియుణ్నే కాదు
జనప్రియుణ్ని కూడా.
తినేటప్పుడు
ఎవరైనా తోడుండాలి.

వంటింట్లో అన్నం ఉడుకుతుంటే
ఆ చుట్టు పక్కల్నే
పచారులు చేసేవాణ్ని
వీడికి ఆకలెక్కువ అనేది మా అమ్మ.

కొత్తిమీర సువాసన నాకిష్టం
వాటి ఆకులు
కళాత్మక రమ్యంగా కూడా వుంటాయి.
వాటి నెవరో కత్తిరించి
ట్రిమ్ చేశారన్నాడు నలిమెల భాస్కర్.

పోపులో
పసుపు వేసి కలుపుతుంటే
బంగారాన్ని కరిగించి నట్టుంటుంది.

ఉల్లిపాయలను
ఓపిగ్గా గోలిస్తాను గాని
కోసేటప్పుడు రాలే
కన్నీటి చినుకులను మాత్రం తట్టుకోలేను.

తినేటప్పుడు
ఒక్క మెతుకు కూడా
కింద పడనివ్వను.
పడ్డా, మళ్ళీ పళ్లెంలో వేసుకొని
పండించిన రైతును తలుచుకుంటాను.

నాలుక పొడవు జానెడే కావచ్చు
కాని వేలాది సంవత్సరాల
పాకశాస్త్ర ప్రస్థానానికది
తిరుగు లేని సూచిక.

వంటింటి దినుసులకు
పునరుక్తి దోషం ఉండదు.
అన్నం పాతదే కావచ్చు
ఆకలి మాత్రం కొత్తది.

అయితే ఒకటి
భోజనానికే కాదు నేను
పనికి కూడా తయారు.
అందుకే నాపైన
మా ఆవిడ ప్రేమ చెక్కు చెదరలేదు.

— *డా౹౹ ఎన్. గోపి*

June 23, 2021 2 comments
3 FacebookTwitterPinterestEmail
కవితలు

మట్టి బుర్ర!

by -కోట్ల వెంకటేశ్వర రెడ్డి June 23, 2021
written by -కోట్ల వెంకటేశ్వర రెడ్డి

అవును
నాది మట్టి బుర్రే
ఇదిగో మది నిండా హరిత స్వప్నాలే!

ఏడాదికో ఆకు
నేల రాలుతున్నా
చిగురు వేయటం మానలే!

గాయ పరిచిన వాడు
వచ్చి పంచన చేరినా
వింజామరం ఊపటం ఆపలే!

ఏడాది పొడుగునా
ఎన్ని ఆటుపోట్లొచ్చినా
ధైర్యం ఏ మాత్రం సడలలే!

రాయి విసిరిన వానికీ
ఫలమే ఇచ్చాను గాని
ఎన్నడూ పగబట్టలే!

అవసరానికి దేశ భక్తిని
ఎన్నడూ నినాదం చేయలే
ఈ దేశం నాకేమిచ్చిందనీ అడగలే!

ఎక్కడ నిలబడ్డా
ఊక దంపుడు మాటలు విసరలే
ఏ కాలుష్యం దరి చేరనీయలే!

అవును
నాది మట్టి బుర్రే
ప్రతి అడుగు వెలుతురు కలనే!!

– కోట్ల వెంకటేశ్వర రెడ్డి

June 23, 2021 0 comment
3 FacebookTwitterPinterestEmail
కవితలు

ఇంక్

by Devender Annavaram June 23, 2021
written by Devender Annavaram

రచయితలు చేతులెందుకు దాచుకుంటరు
కలం లోంచి సిర పారుతనే ఉంటది
కాలానికి కలానికి విరమణ లేదు

నానినంకనే గింజనుంచి మొలక
పదను తాకితేనే పద్యం కమ్మని వాసన
వేదన పడితెనే పదపదం వికాసం

రాస్తున్న పెన్నుకు ఇరాం లేదు

సామరస్యం కుదిరేదాకా ఎక్కుడే
పరిపూర్ణత సాధిస్తేనే ప్రశాంతత

కవికూడా చరిత్రకారుడే
కవిత్వం నడుస్తున్న ఇతిహాసం
తెల్లకమ్మల నిండా చిలుకుతున్న స్వేదం
తరతరాల జన జీవన చిత్రిక

వాక్యం వెంట వాక్యం నడక
జోరుగా సాగుతున్న భావ ధార
సామాజిక ఆకాంక్షల సింగిడిపూత

అంతరంగం ఒక చంచల వీరంగం
చిక్కనైన ఆలోచనల కోసం
చిన్నమంటమీద తీగపాకం

రగిలే అక్షరాలు నిత్యం చలించే నిష్కలు
మౌనం ఒక చిన్న కునుకు
కైత్వం ఆరిపోని అగ్గిదీపం
సాహిత్యం ఆగి ఆగి కురిసే వర్షం .

June 23, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

పెదవంచుల పూలతోట

by అనూశ్రీ. June 23, 2021
written by అనూశ్రీ.

రాయి పూలను పూయించలేదు
కానీ తీగల్ని మోస్తూ ఆవాసమౌతుంది

ముళ్ళకంచెకూ పుష్పించే శక్తిలేదు
కానీ నేలజారే పూల తీగకు
తానొక ఆధారమవుతుంది…

మదిలో వేల వెతలు పయనిస్తున్నా
చిరునవ్వు పూలు కొన్ని దోసిట పడితే
ఆనంద సౌరభాలు పంచవచ్చు..

వేదన నదులను ఈదడం
జీవితానికి అలవాటవుతుంటేనే
అనుభవాల గవ్వలను సేకరించవచ్చు

ఆత్మవిశ్వాసమనే బలం
గుండెలో ఉదయించనిస్తే
ఒడిదుడుకులెన్నున్నా ఒడ్డుచేరవచ్చు..

కన్నుల కన్నీటి జలపాతాలతోనే
పెదవంచుల పూదోటను
నిత్యం సాగు చేయవచ్చు…!!

— అనూశ్రీ

June 23, 2021 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

ప్రేమ-వియోగం

by -ప్రమోద్ ఆవంచ June 23, 2021
written by -ప్రమోద్ ఆవంచ

చలితం చరితం గమనం మన
ప్రయాణం.
మర్మం మననం మధురం ఇవే
జ్ఞాపకాల ప్రమోదం.

విరహం వియోగం వినిమయం గాయం
నిరసనై నన్ను నేను కోల్పోగా ముసురుకుంది
ఆది అంతం అంతా శూన్యంలా!

వలపు విరుపు మలుపు ఎన్నో చూసాను.
కోపం తాపం నిగ్రహం మనిషి తత్వం
నింగి తావి తనువు మనసు గాయాల కుప్పైంది.

నిద్ర కల కాలం నిరీక్షణ శిక్ష విధించింది.
మంచి చెడు స్నేహం శత్రుత్వం పెరిగే అంతరాలు
కలిమి కొలిమి బలిమి లేమి అశాశ్వతం.

మంట మింట కంట తడిలా కురుస్తుంది.
ప్రకృతి ప్రేమ కథ చిత్రం విచిత్రం.

కళ్ళు భాష మౌనం ఎన్నో ప్రశ్నలు
మస్తిష్కంలో ఆలోచనలై ప్రవహించే సాగరం
శృతి తప్పిన జీవన రాగం.

తానొక చుక్కలను కప్పుకున్న ఆకాశం
నేనొక రాలిపడిన నక్షత్రం.

-ప్రమోద్ ఆవంచ

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అయినా… ఎప్పటిలాగే! 7

by సోమశిల తిరుపాల్ June 23, 2021
written by సోమశిల తిరుపాల్

ఆకులు తిని బతికిన ఆదిమకాలంనుండీ..
అరనిమిషంలోనే అనంత విశ్వాలను
అరచేతిలో చూసుకునే కాలమొచ్చినా…
అన్నమో రామచంద్ర అన్న
‘ఆకలి కేకలు’ … ఎప్పటిలాగే…!

కంపెనీలు సృష్టించిన కల్తీ వస్తువుల ధరలు
పైపైకి పాకీ ఆకాశానికి తాకుతున్నా..
మట్టి నుండి బువ్వను సృష్టించిన
కష్ట జీవి చెమటచుక్కల విలువ
పాతాలంలోకీ పోతునే ఉన్నయ్..ఎప్పటిలాగే..!

స్వాతంత్ర్య దినోత్సవాలెన్ని జరుపుకున్నా..
పాలకులు ప్రకటించిన పథకాలు ఎన్ని ఉన్నా..
ప్రభుత్వ విజయాల పరంపర లెక్కలెన్నున్నా..
సగటు మనుషుల సాదా జీవనం ఎప్పటిలాగే…

అధికారంలో అనంత శిఖరాలను అధిరోహించినా..
ఈఫిల్ టవరంత ఎత్తు ఆస్తులు కూడబెట్టినా..
ఆశ చావని అదుపులేని అవినీతి ఊడలు
పిల్లలమర్రి లెక్కా పెరిగుతున్నయ్. ఎప్పటిలాగే…

ఆగర్భ శ్రీమంతుల విలాస జీవితాలు
ఆకాశమార్గంలో హాయిగా ఎగురుతుంటే
నడక తప్పా ఏ మోటారు దూరలేని
అరణ్యపు చీకటి బాటల్లో పయనిస్తున్న
అభాగ్యురాల్ల ‘ప్రసవ’ కేకలూ ఎప్పటిలాగే..

ఆసుపత్రి బిల్లు కట్టలేక పొత్తిళ్లలో
కన్నుమూసిన భర్త/తండ్రి /పాపలనూ
గుండెలకు హత్తుకుని
గుండెలు పగిలేలా రోధిస్తూ..
నిలబడ్డ తల్లుల రోధన ఎప్పటిలాగే.

ఆరుగాలం పండించిన అన్నదాతల బతుకులు
మాయాజాలం మార్కెట్లో దళారుల దౌర్జన్యానికి
దగాపడుతూనే ఉన్నాయ్ !. ఎప్పటిలాగే..

వారానికోనాడూ కడుపునిండా తినలేని
అభాగ్యులు చౌరస్తాలో నిలబడి
కదలలేని అంగవైకల్యంతో
అడుక్కుంటున్నయ్ .. ఎప్పటిలాగే …

ఉన్నత శిఖరాలనుండి
నికృష్టమైన జీవితాల లోతులనూ..
కళ్ళుండీ చూడలేని కనకపు కంత్రి గాళ్ళు
ఇంకా …. ఎప్పటిలాగే..

కళ్ళు మూసుకుని కలియుగాన్ని దర్శించే
కంత్రి మంత్రగాళ్ళూ ఎప్పటిలాగే…
కడుపుమీద కాలు పెట్టీ పిల్లల పుట్టించేటీ
మూఢనమ్మకాల మాయా సంస్కృతి ఎప్పటిలాగే!

-సోమశిల తిరుపాల్

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పశుపక్ష్యాదులు వేదన

by సుదర్శనం వేణుశ్రీ. June 23, 2021
written by సుదర్శనం వేణుశ్రీ.

సీ. మననుండివిడిపోయి మైదానమందుండె
వనపర్వతములందె వసతి మాది
మనజాతిగుణములు మానవులమదిలో
ఒదిగిమనలమించి ఒకరొకరును
మనలక్షణములను మసులుకొనుచునుండి
మనలతిట్టుకొనగ మనుజులేమొ
మనవాసములనెల్ల మాయముచేయుచు
మనుషులెందులకిల మనలచంపి
తే. విందుభోజనములుచేయు వికృతమైన
జాతివారలుగున్నట్టి జనములైరి
దయనుమరచినవారలై భయముగొల్పుచు
కోప తాపాలకొందరు కుజనులైరి.

సీ. జంతువులైనట్టి జాతిమాదైనను
ఆహారముకొరకు అదనుచూసి
వేటాడితినెదము వివిధరుచికికాదు
దాచుకొనువిధాలు తలచబోము
ఆత్మరక్షణకోరి అడవులందుండేము
అన్యాయములునుమాకసలురావు
కొండగుహలనుండి కూటికై వేటాడి
తినుచుండుమమ్ముల తరుముటేల
తే. మానవులికనుద్వేషాల మర్వరైరి
మీకుమీరైమనుషులుగ మెదలుకొనుచు
ఆస్థియంతస్థులకొరకు అల్పులౌచు
పలుచనౌదురుమాజాతి పసులముందు.

సీ. అడవి మైదానాల హాయిగాతిరుగాడు
పక్షులానందము పంచుచుండి
విహరించుగగనాన వివిధభంగిమలలొ
స్వీయనిర్మాణాల చిత్రముగను
గూళ్ళనునిర్మించి కునుకునుదీయుచు
ఆహారములతిని అనవరతము
పలుశబ్ధరావమ్ము పంచేటి పక్షులు
పాలనిచ్చియుపెంచు పక్షికలదు
తే. పక్షులాహారములతిను పలురకాల
మాంసమాహారమేతిను మరియు కొన్ని
ధాన్యములుతినుపిట్టలు దరికిచేరు
మానవులిలమానవతను మర్వనేల.

 

-సుదర్శనం వేణుశ్రీ.

June 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సాఫ్ట్‌వేర్ నానీలు

by కుడికాల వంశీధర్ June 23, 2021
written by కుడికాల వంశీధర్

మగతలో
కీప్యాడ్‌పై చెయ్యి పడింది
అల్లుకున్న
అక్షరాలు కవిత్వమైనై

హ్యాకరైనా
కంప్యూటర్లని చేధించగలడు
కాని
అంతరంగాన్ని కాదు

తిరిగిన దేశాలు
పాస్‌పోర్ట్ చూపింది
దేశానికెంత దూరమో
గుట్టు విప్పింది

హార్డ్‌వేర్ అంటే
పైన ఉండే తొడుగు
సాఫ్ట్‌వేర్ ప్రాణం
దానిదే అసలు అడుగు

హార్డ్‌వేర్ అంటే
కనిపించే దేహం
సాఫ్ట్‌వేర్ అంటే
పనిచేసే మంత్రం

ట్విట్టర్‌లో
పిచ్చికూతలు కనిపెట్టిందేమో
పిచ్చుక
అలిగి వెళ్ళిపోయింది!

కొన్ని పరిచయాలు
దూరమవుతాయి
వాడని
పాస్‌వర్డ్ మరచిపోయినట్టు

కన్నీళ్ళు
కాసేపట్లో ఆరిపోతాయి
జ్ఞాపకాలు
గుండెలో ఆర్కైవ్ అవుతాయి

గుండెల్లో
గుబాళించాలి ప్రేమ
అది గూగుల్లో
దొరకదు సుమా!

లెక్కలకే అయితే
క్యాలిక్యులేటర్ చాలు
ఎకసెక్కానికా
కంప్యూటర్?

లెక్కలు నేర్పింది
క్యాలిక్యులేటర్
లెక్కలేనితనం చూపింది
కంప్యూటర్

ఆశలకు కళ్ళెం
లేని మనిషి
అవుట్ ఆఫ్ మెమొరీ
ప్రోగ్రాం అవుతాడు

గూగుల్‌లో
అన్నీ దొరుకుతాయి
ఆమె దుఃఖానికి
కారణం తప్ప

నానా జంక్‌ను
నింపకు
చెత్తకుండీకి కూడా
సహనముంటుంది

నిన్న పనిజేసింది
నేడు బెడిసికొట్టింది
సాఫ్ట్‌వేర్ కూడా
బంధాల మాదిరే!

యంత్రాలకు
మాటలు నేర్పుతారు
ఇంట్లోవారితో
మౌనవ్రతం

రాసింది ప్రింట్ తీసావా?
ఫాంటు మారకపోతే
అందరి చేతిరాత
ఒకటే

రోజు కూలీకి ఎక్కువ
వెట్టి చాకిరీకి తక్కువ
ఇదండీ
సాఫ్ట్‌వేర్ ప్రపంచం

వర్షం కురిస్తే
పంట నవ్వుతుంది
వర్షన్‌తో సాఫ్ట్‌వేర్
మెరుగవుతుంది

సాఫ్ట్‌వేర్ పరిమళం
ఎంత గొప్పదో!
మొగ్గలు కాదు
అవి బగ్గులు

కుడికాల వంశీధర్

June 23, 2021 4 comments
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us