మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
బాల‌సాహిత్యం

బాలల కథ

by Shanthi Prabodha Valluripalli January 31, 2025
written by Shanthi Prabodha Valluripalli

సాయికి పన్నెండేళ్ళు.  

తన చక్రాల కుర్చీలో కూర్చుని కలలు కంటూ ఉంటాడు. తన కలలను నిజం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. 

ఎనిమిదేళ్ల వయసులో సాయికి జబ్బు చేసింది. ఆ జబ్బు వల్ల సాయి కాళ్లు రెండూ  చచ్చుబడిపోయాయి. లేచి నడవలేకపోతున్నాడు.  ఇక ఎప్పటికీ నడవలేడని వైద్యులు చెప్పారు. 

అమ్మా నాన్న చాలా దుఃఖించారు.  మొదట్లో సాయి కూడా బాధపడ్డాడు. 

సాయితో కలిసి బడికి వెళ్లిన, ఆడుకున్న మిత్రులు అవిటివాడని వెక్కిరించారు. దూరమయ్యారు.  సాయి ఒంటరి అయ్యాడు.  

మిత్రుల ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. 

తన మిత్రులతో  తిరగ లేనందుకు, ఆటలు ఆడలేక పోతున్నందుకు దిగులు పడ్డాడు.  

చక్రాల కుర్చీలో కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తూ సాయి కలలు కంటున్నాడు. రకరకాల కలలు కంటున్నాడు. 

సాయికి బొమ్మలు వేయడం చాలా ఇష్టం.  ఆ బొమ్మల ద్వారా తన కలలు, ఆశలు  వ్యక్తం చేస్తున్నాడు.   

సాయి గదిలో కిటికీ దగ్గర కూర్చుంటే పచ్చని మైదానం కనిపిస్తుంది. 

ఆ మైదానం సాయి బొమ్మల్లో రంగుల మైదానంగా మారింది.  ఆ మైదానంలో అతను పరుగులు తీస్తున్నాడు.  ఎగురుతున్నాడు. 

ఆకాశంలో ఎగిరే పక్షులు అతని బొమ్మల్లో అతని స్నేహితులుగా మారాయి. 

సాయి ఆ రోజు రాత్రి చాలా సంతోషంగా నిద్రపోయాడు. 

అతని కలల్లో అతను ఒక గొప్ప చిత్రకారుడు. అతని బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతున్నాయి. ప్రజలు అతని బొమ్మలను చూసి ఆనందిస్తున్నారు.

ప్రశంసిస్తున్నారు. 

సాయి ఉదయం లేస్తూనే ఆ విషయం అమ్మతో చెప్పాడు.  ఆ తర్వాత “అమ్మా, నేను పెద్దయ్యాక చిత్రకారుడు అవుతాను. నేను చాలా బొమ్మలు వేస్తాను. నా బొమ్మలు చూసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు” అని చెప్పాడు.

అమ్మ సాయిని దగ్గరకు తీసుకుని “నా చిట్టి తండ్రీ.., నీ కలలు నిజమవుతాయి. నీవు చాలా తెలివైనవాడివి. నీవు ఏమి అనుకుంటావో అది చేయగలవు” అని ముద్దిచ్చి  ప్రోత్సహించింది.

పెద్ద రంగుల పెట్టె, కుంచె, కాన్వాసు తెచ్చి “నీ కలలు నిజం చేసుకో ” అన్నాడు  నాన్న.  

“అన్నా నీకేది కావాలన్నా నన్నడుగు, నీకు నేనున్నా” చెప్పింది  చెల్లి. 

కిటికీలోంచి వచ్చే వెలుతురులో సాయి ముఖం ఆనందంతో మెరిసింది. 

సాయి చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నాడు కానీ, అతని మనసు మాత్రం ఎల్లప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. కొత్త కొత్త కలలు కంటూనే ఉంది.  కొత్త లోకాల్లోకి తీసుకుపోతూనే ఉంది.  

తన కలల్లో చూసినవన్నీ సాయి బొమ్మలుగా గీస్తున్నాడు. వాటికి రంగులు అద్దుతున్నాడు.  అవి అతనికి గొప్ప గుర్తింపుని ఇచ్చాయి.  ఎన్నెన్నో బహుమతులు తెచ్చిపెట్టాయి. 

సాయి కన్న కలలు అతనికి కఠిన పరిస్థితుల నుంచి బయటపడే శక్తిని ఇచ్చాయి. 

చిత్రకారుడిగా లోకానికి పరిచయం చేశాయి. 

కలలు కనడానికి ఎవరికీ పరిమితులు లేవు. ఆ కలలు నిజం చేసుకోవడానికి మాత్రం కృషి చాలా అవసరం.  

మరి, సాయి ఆ కృషి చేస్తాడా? 

భవిష్యత్ లో గొప్ప చిత్రకారుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడా? . 

ప్రపంచం అతన్ని గుర్తిస్తుందా? 

మీరు చెప్పండి. 

వి. శాంతి ప్రబోధ 

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నిర్జల నిధి

by Ammangi Venugopal January 31, 2025
written by Ammangi Venugopal

చరిత్ర భూగోళాల మీద ప్రవహించిన నదీ!

అక్షాంశ రేఖాంశాల మీద పొంగి పొరలిన నదీ!

నిరుడు నింగనీ నేలనూ ఒకటి చేసిన నదీ!

ఊళ్ళ కూళ్ళను అష్టదిగ్బంధనం చేసిన నదీ!

ఇప్పుడు ఈ ఎండల్లో

తల్లడిల్లుతున్నావు ఎండిపోయిన డొక్కలతో

నీ దాహం తీర్చుకోవటానికి నీ నీళ్లే నీకు సరిపోవు

ఇసుక మీద ఈదలేక చీదరించుకుంటున్నై చేపలు

పెయ్యి తడుస్తలేదని తిట్టుకుంటున్నై ఊరపిచ్చుకలు

ఒక్క పుక్కలింతకు కూడా సరిపోవని

తిరిగిపోతున్నది చీనులబారు

ప్రతిబింబాలు చూసుకునేందుకు చారెడు నీళ్లులేని

బెంగళూరు నుండి వలసపోతున్నై పావురాలు

అలల హోరు నశించి

ఇసుక లారీల జోరు పెరిగిన వేళ

నెలల క్రితం తలలు ప్రదర్శించిన తాళ్లు

నేడు నిలబడ్డాయి దిసమొలతో

నిరుడు భయంతో మబ్బుల చాటున దాక్కున్న సూర్యుడు

నేడు ఉష్ణ మండల సమ్రాట్టై ఏలుతున్నాడు నేలను

ఇంకా రెండు డిగ్రీల ఎండ పెరిగితే

ఈ ఇసుక తిన్నెలు వేగి వేగి పేలాలవుతయ్

నదీ!

ఏమైంది పిల్లకాల్వలకు గిలిగింతలు పెట్టిన నీ సరసం?

ఎక్కడ పోయింది ఉపనదులతో సంగమించిన నీ పౌరుషం?

ఏది మరి కంటి సైగతో పంటకాల్వలను సారించిన రాజసం?

ఇసుక గడియారంలో కాలం స్తంభించిన వేళ

ఎండ మావులు చేసే గ్రాఫిక్స్ నమ్మకు

ఈ రోజుు నీవు భూమి గీసుకున్న దారిద్ర్యరేఖవు

పుట్టినచోట ఉత్తరీయమంతైనా లేని నీవు

ఎట్లా ప్రవహిస్తావు కడలి అంచుల దాకా?

నదీ! నిర్జల నిధీ!!

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వికృత సంక్రాంతి

by ChittiProlu Venkata Ratnam January 30, 2025
written by ChittiProlu Venkata Ratnam

భాస్కరుడు రాసులు మారడం మకర సంక్రాంతి

నాయకులు పార్టీలు మారడం వికృత సంక్రాంతి

నారీమణులు ముగ్గులు వేయడం మకర సంక్రాంతి

నాయకమణులు దురాగతాచరణకు స్కెచ్చులు వేయడం వికృత సంక్రాంతి

దాసరులు గంగిరెద్దుల నాడించడం మకర సంక్రాంతి

మోసరులు సంఘాన్నే ఆడించడం వికృత సంక్రాంతి

హరిదాసుల భగవత్సం కీర్తనం మకర సంక్రాంతి

జనరాసుల జగజ్జంత్రీల కీర్తనం వికృత సంక్రాంతి

మకర సంక్రాంతి ఏడాది కొక్కసారే వస్తుండగాా

వికృత సంక్రాంతి ఎల్లవేళలా నర్తిస్తుండడమే

హృదయాలలో జరిగే వ్యధా సంక్రాంతి

వెరసి ఇప్పుడు జరిగేది వ్యధా వికృత సంక్రాంతి

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఎన్నాళ్ళో వేచిన సమయం

by Vijaya Kandala January 30, 2025
written by Vijaya Kandala

13 జనవరి 2025 నుండి మొదలైన మహాకుంభమేళా సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక వ్యాసం. మయూఖ పాఠకులకు ప్రత్యేకం..

పరిచయం

మహాకుంభమేళా అనేది కోట్లాది హిందువులు సంస్కృతి సంప్రదాయాలపై అచంచల విశ్వాసంతో చేసే యాత్ర ఈ సంవత్సరం 13 జనవరి నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు సాగే 45 రోజుల యాత్ర.

ఇందులో నాలుగు రకాలు ఉంటాయి. సాధారణ కుంభమేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది . ప్రతి ఆరు సంవత్సరాలకు జరిగేది అర్థ కుంభమేళా పూర్ణకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లలో జరుగుతుంది . ఇలా 12 పూర్ణకుంభమేళాలు జరిగాక జరిగేది మహాకుంభమేళా . అంటే 144 సంవత్సరాలకు జరిగేది .ఇది అలహాబాద్ లో మాత్రమే జరుగుతుంది. అయితే ఈ రోజులలో 12 సంవత్సరాలకు జరిగే దాన్నే మహాకుంభమేళా అని పిలుస్తున్నారు.

కుంభం అంటే సంస్కృతంలో కుండ అని కలశం అని అర్ధాలు ఉన్నాయి . ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం ఒక రాశి కూడా కుంభరాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళ అంటే కలవడం, జాతర అని అర్థాలు, లక్షలాది హిందువులు గంగ ఒడ్డుకు చేరుకొని . చేసే వేడుక ఈ జాతర మరిచాను లక్షలాది ఒకప్పుడు . నేఊ కోట్లాది అనాలి. 2013లో జరిగిన కుంభమేళాకు దాదాపు 20 కోట్ల మంది వచ్చారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా ఈ మేళా జరుగుతుంది . సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉంటే త్రయంబకేశ్వర్లో సూర్యుడు మేషరాశిలో ఉంటే హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది .

అలాగే బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉంటే ప్రయాగరజ్ లో బృహస్పతి- సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటే ఉజ్జయినిలో జరుగుతుంది . ఇందువల్లే ప్రతి స్థలంలోనూ బృహస్పతి సూర్యుడు చంద్రుడు స్థానాల ఆధారంగా మేళా తేదీలను నిర్ణయిస్తారు. వాటిని షా హిస్నాన్ లేదా రాజస్నాన్ అని అంటారు.

పౌరాణిక ఆధారాలు

పురాణాల ప్రకారం క్షీరసాగర మధనంలో, భాగవత విష్ణు పురాణాలలో రామాయణం, మహాభారతాల్లో దీని ప్రసక్తి కనిపిస్తుంది. – క్షీరసాగ చిలకడం మొదలు పెడతారు. తీరా అమృతం దొరికాక ఎక్కువ వాటా కోసం గొడవలు పడతారు రాక్షసులు చేతిలో ఆ అమృత కుంభం పడితే వారి అరాచకాలకు హద్దులు ఉండవని తెలిసిన మహావిష్ణువు కుంభాన్ని ఆ ప్రదేశం నుంచి దూరంగా తీసుకెళ్తాడు .అలా వెళ్ళినప్పుడు కొన్ని అమృత బిందువులు ప్రయాగ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్లలోని నదుల్లో పడ్డాయని ప్రజల విశ్వాసం .

ఎన్నో ఏళ్లుగా ప్రయోగరాజ్ లో పురోహిత్యం చేస్తున్న తెలుగు పురోహితుడు శ్రీ ఎడవల్లి చంద్రశేఖర ప్రవీణ్ శర్మ గారి అభిప్రాయంలో ఈ నాలుగు ప్రదేశాలలోనే కుంభమేళా నిర్వహించడంపై భిన్న కథనాలున్నాయి . సామ. అధర్వణ వేదాల ప్రకారం సముద్ర మధనం లో వచ్చిన అమృత కలశాన్ని మొదటగా జయంతుడు అనే కాకి నోట కరచుకొని భూమి చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంలో నాలుగు చుక్కలు ఈ ప్రదేశాల్లో పడ్డాయని, అందువల్లనే ఈ నాలుగు క్షేత్రాలలో కుంభమేళ జరుగుతుంది. అయితే అమృత కలశాన్ని నోట కరుచుకొని వెళ్ళింది కాకి కాదు గరుడ పక్షి అని మరో కథనం..

చరిత్ర ఏం చెస్తోంది ?

క్రీస్తు శకం 629 -645 మధ్యకాలంలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయున సాంగ్ కుంభమేళాను గురించి ప్రస్తావించాడు. ఇతను హర్షవర్ధనుని కాలంలో మన దేశానికి వచ్చాడు.

ఆధునిక కాలంలో దీని గురించిన ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఇంపీరియల్ గజేటి ఆఫ్ ఇండియా లో 1796 లో రెండు మిలియన్ల మంది 1889లో 2.5 మిలియన్ల యాత్రికులు కుంభమేళాకు వచ్చినట్లు ప్రకటించారు.

జ్వర్ కుంభమేళాలో బ్రిటిష్ అధికారి రాబర్ట్ మాంటి గౌరీ మార్టిన్ సందర్శకులలో బుఖారా కాబుల్ తుర్కిస్తాన్ నుండి వచ్చిన గుర్రాల వర్తకులు ఉన్నారన్నాడు. వీధితో బాటు అరబ్బులు పర్షియన్లు గుర్రాల వ్యాపారం కోసం వచ్చారని చెప్పాడు. ఆ మేళాలో రోడ్డుకు ఇరువైపులా ధాన్యం, తినుబండారాలు, బట్టలు, బొమ్మలు అమ్మవారున్నారట. యాత్రికులు నీళ్లలో వదిలే దీపాలు కదలే నక్షత్రాలలో కనిపించేవని కూడా చెప్పాడు. ఎందరో హిందూ రాజులు సిక్కు ప్రభువులు నవాబులు మేళా చూడడానికి వచ్చే వారిని కూడా చెప్పాడు ప్రయాగ లో 1895 లో జరిగిన కుంభమేళాకు వచ్చిన ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేయిన్ దీన్ని చాలా మెచ్చుకున్నాడు . 1938లో లార్డ్ అక్లాండ్ యాత్రికులపై పన్నును రద్దు చేశాడు. అందువల్ల యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రకమైన మేళాలను ఆదాయ వనరు గానే పరిగణించి, ప్రోత్సహించింది. పన్నులు కూడా వసూలు చేసేది . ఈ సందర్భంలో జరిగే అమ్మకాలపై టాక్స్ కూడా విధించేవారు. 1954లో ఐదు మిలియన్ల మంది 1977లో 10 మిలియన్ల మంది 1989లో 15 మిలియన్ల మంది కుంభమేళాను దర్శించుకున్నారు.

ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంచనా ప్రకారం 2019 కుంభమేళాలో 200 మిలియన్లకు పైగా యాత్రికులు వచ్చారు. ఇది ప్రపంచంలో Largest People Gadharing కుంభమేళా అధికారులు ఒకేరోజులో అత్యధిkuలు దర్శించిన తేదీలు 10 ఫిబ్రవరి 2013లో 30 మిలియన్లు 4 ఫిబ్రవరి 2019లో 50 మిలియన్లు అని ప్రకటించారు.

అయితే ప్రాచీన వేదకాలం నుండే ఈ ఆచారం ఉన్నట్లు వేద విద్వాంసులు అంటారు .ఈ కుంభమేళా స్నానాలు 850 ఏళ్లకు పైగా జరుగుతున్నట్లు, ఆదిశంకరులు దీనికి ఆద్యుడు అని కూడా చెప్తారు .వీరి తర్వాత శంకరుల శిష్యులు, అనుయాయు లు, సన్యాసులు,అఘోరాలు, నాగ సాధువులు రాజస్నానానికి ఏర్పాట్లు చేసేవారు. ఇలా షాహి స్నానం చేయడం వల్ల గత జన్మల పాపకర్మల నుండి విముక్తి కలిగి, మోక్షం పొందుతారని ఆస్తికుల విశ్వాసం. అందుకే ఒకప్పుడు లక్షల్లో ఉన్న యాత్రికుల సంఖ్య కోట్లల్లోకి పెరిగింది పెరగబోతోంది రాబోయే కాలంలో,

మరి కాస్త ముందుకొస్తే 1982లో అమృత్ కుంటే ర్ సంధానే అనే బెంగాలీ సినిమా కుంభమేళా దృశ్యాలను చిత్రీకరించింది. .2001లో మారజయో యో బెంజో, నిక్ డేలు The Greatest Show on earth అనే డాక్యుమెంటరీ తీశారు. నదీముద్దీన్ KUMBH MELA Songs of the river అని 2004లో మరొక డాక్యుమెంటరీ ని చిత్రించాడు. 28 ఏప్రిల్ 2017 BBC. Greatest Show on Earth Kumbha Mela పేరుతో ఇంకో ఆడియో వీడియో రిపోర్టును కూడా విడుదల చేసింది.

అంతేనా

అంటే కాదు అనే చెప్పాలి కుంభమేళా అంటే కేవలం స్నానాలే అనుకుంటే పొరపాటే . అంతకు మించిన విశేషాలు లెక్కలేనన్ని . తర్పణాలు, పిండ ప్రదానాలు, పితృ పూజలు, దాన ధర్మాలు, సంతలు, విద్యావిషయక చర్చలు, వేద పండితుల వాద ప్రతి వాదాలు సాధువుల సంతుల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు You Name It we have it అన్న రీతిలో ఉంటాయి. సామూహిక భజనలు ప్రార్ధనలు, పారాయణాలు అడుగడుగునా కనిపిస్తాయి.

ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడిపే భోజనశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస ఏర్పాట్లు , స్నానానికి కావలసినటువంటి ఏర్పాట్లతో పాటు బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లను చేశారు .టెంట్ సిటీని నిర్మిస్తున్నారంటే ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయో ఆలోచించుకోండి. ఇవన్నీ ఎప్పటికప్పుడే ఔరా అనిపిస్తాయి.

ఈ రోజుల్లో మనలాంటి సాధారణ భక్తులతో పాటుగా, వీఐపీలు, నాగా సాధువులు, ఇతర సాధువులు, కల్పవాసీలు ( నెల రోజులు దీక్షలో ఉండేవారు) పీఠాధిపతులు, మఠాధిపతులు, విదేశీ వార్తా విలేకరులు ప్రసిద్ధిగాంచిన వీడియో గ్రాఫర్లు, స్వదేశీ వార్తా సంస్థల ప్రతినిధులు మరెందరెందరో వీటిని ప్రజలకు అందించడానికి ప్రతీక్షణం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అయిపోయిందా

నాగా సాధువుల ప్రసక్తి లేకుండా కుంభమేళా వేడుకలు వ్యాసాలు అన్నీ అసంపూర్ణమే అసమగ్రమే వేలాది నాగ సాధువుల ప్రవేశం వారి అద్భుత విన్యాసాలు మనల్ని నిశ్చేష్టులను చేస్తాయి.

వీరి ప్రవర్తన, వేషధారణ అన్ని ప్రత్యేకమే. వ రు తప్పకుండా ఈ కుంభమేళా వస్తారు ఎలా వస్తారో తెలీదు. మేళా అయ్యాక ఎక్కడికి వెళ్తారో ఎలా వెళ్తారో కూడా తెలీదు. చాలామంది ఒంటినిండా బూడిద పూసుకొని నగ్నంగా ఉంటారు . తలంతా జడలు కట్టి ఉంటుంది . మేళా మొదలయ్యేసరికి సిద్ధం తర్వాత మాయం. కచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు . సడన్గా తిట్టడం కూడా మొదలెడ తారు .కసురుకుంటారు .ఏ కాలమైనా, ఎలాంటి వాతావరణమైనా దిగంబరులే బంధాలను ఇష్టపడరు. అత్యంత తీవ్రమైన పద్ధతులలో శారీరక క్రమశిక్షణను పాటిస్తారు . మనసుతో శరీరాన్ని శాసిస్తారు .ఈ యాత్ర సమయంలో మాత్రమే జనాలతో కలుస్తారు.

సభ్య సమాజం వీరిని దూరంగా పెట్టినా, అసహ్యించుకున్న, భయపడ్డా గ్రామీణ ప్రాంతాల వారు, విదేశీయులు బాగా నమ్ముతారు . ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తారు. వారి ఆగ్రహాన్ని భరించి, ఆశీస్సులను పొందడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు . సాధువులు, బిక్షకులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అధికారులు ప్రభుత్వం సాధారణ భక్తులు, దేశ విదేశీ సందర్శకులు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, చరిత్రకారులు, స్వచ్ఛంద సంస్థలు ఇందరు మరెందరో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న కుంభమేళా కొన్ని గంటల్లో మన కళ్ళ ముందుకు రాబోతోంది .రెండు చేతులు చాచి తరతరాల సంస్కృతి సంప్రదాయాలకు విశ్వాసాలకు భారతీయతకు చిరునామాగా నిలిచిన ఈ కుంభమేళాను ఆనందిద్దాం. ఆహ్వానిద్దాం. మన మధ్యలో రాజకీయాలను చేరనీయకుండా మానవత్వాన్ని పరిమళింప చేద్దాం .ఎందుకంటే ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ ఎందుకంటే ఇది ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ కనుక.

రెండవ మరియు చివరి భాగం కొరకు ఎదురు చూడండి. త్వరలో..

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

 మౌనం సోమరి కాదు

by Chandaluri Narayana Rao January 30, 2025
written by Chandaluri Narayana Rao

మౌనం
ఖాళీగా తిరిగే సోమరి కాదు

ఏ క్షణంలోనూ రక్తం మరిగి.
పరుష పదజాలం
ముఖంలో పారకుండా కట్టుకున్న ఆనకట్ట.

మెడలో భయం వ్రేలాడుతూ
నెత్తిన పెట్టుకున్న నిజాలే బరువుగా
మెత్తగా కనిపిస్తూ మత్తుగా నటించే స్థితి.

లోపల ఎర్రని కోపాన్ని నాలుకే మూటకట్టి
బొట్టు చూపు  కన్నెర్ర చేయకుండా
శరీరాన్ని బిగించే అరుదైన సందర్భం.

ఆలోచనలు విగ్రహాల్లా బిగుసుకుపోయి
నరాల్లో చైతన్యం పిడచగొట్టుకుపోయి
పాదాలు నేల స్పర్శ మరచే విచిత్రం.

మౌనం
మాట దిమ్మరి కాదు
మనసు కాపలా

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మన తెలుగు నాటకాలు – దేవరాగం

by Sammeta Vijaya January 30, 2025
written by Sammeta Vijaya

తెలుగు సాహిత్యంలో అమ్మ అంశంతో కథలు కవితలు నవలలు నాటకాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అమ్మ త్యాగాన్ని అమ్మ గొప్పతనాన్ని అమ్మంటే దేవత అని రకరకాలుగా అమ్మను గురించిన రచనలను మనం గమనించాం ఆ తర్వాత స్నేహం దానికి సంబంధించినటువంటి కథలు , కవితలు , నవలలు వంటి రచనల్ని మనం చూసాం కానీ ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంశం వృద్ధాప్యం. వృద్ధాప్యానికి సంబంధించినటువంటి రచనలు చాలా తక్కువగా వచ్చాయి వచ్చినా వాటిని ఎవరు ఇష్టపడరు పైగా అంత ప్రాధాన్యత కూడా ఇవ్వరు. వృద్ధులైన తల్లిదండ్రులు పడుతున్న మానసిక స్థితిని వ్యక్తీకరిస్తూ కవితలు కథలు వచ్చిన నాటకాలు మాత్రం చాలా తక్కువగా మనకు కనిపిస్తాయి

శ్రీ విశ్వనాథ గణపతి రావు రచించిన జీవనవేదం వృద్ధుల పట్ల నిరాదరణ కథా వస్తువుగా రచించిన నాటిక. శ్రీ అరిసెట్టి శివన్నారాయణ గారి పుణ్యఫలం నాటకం కూడా తల్లిదండ్రుల పట్ల బిడ్డలు చూపించే నిర్లక్ష్యం , ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు పెళ్లి అయ్యాక భార్యని వారి తల్లిదండ్రులను పట్టించుకుని కన్నతల్లి తండ్రులను పక్కన పెట్టడం ..వారి కడుపుకోతని కళ్ళకు కట్టినట్లుగా వివరించిన నాటిక. స్నిగ్ధ (గోపి సత్య ప్రకాష్) గారి నాటిక సద్గతి కూడా తల్లిని పట్టించుకోని కొడుకు కథ. శ్రీ వల్లూరు శివప్రసాద్ గారు రచించిన వానప్రస్థం నాటకంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సుఖం లేకపోవడం గురించిన నాటిక.
ఆధునికంగా అనేకమైన నాటికలు ఇదే వస్తువుపై వచ్చినా వేటికవే తమ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి నాటక ప్రదర్శనలలో కొత్త ఒరవడి సృష్టించిన విధానం కథానాటికల పోటీ. అజో- విభో -కందాళం ఫౌండేషన్ ( అప్పా జోస్యుల విష్ణుభొట్ల) వారు కథ ఆధారంగా రాసిన నాటికలను మాత్రమే ప్రదర్శింపజేసే ఏకైక పరిషత్ ! ఈ ఫౌండేషన్ నాటిక ప్రదర్శనలతో పాటు సాహితీ రంగాన్ని కూడా సమానంగా ఆదరిస్తుంది. వివిధ సాహిత్య విభాగాల్లో విశేషంగా కృషిచేసిన వారిని ఘనంగా సత్కరిస్తుంది. వారి సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలతో అపురూపమైన జ్ఞాపికలను అందిస్తుంది . ఈ ఎంపికలో భాగంగా నిష్ణాతులతో ముందుగా ఎంపిక చేయిస్తుంది.
వర్తమాన సమాజంలో వివిధ అంశాలపై రైతుల దోపిడి, స్త్రీ స్వేచ్ఛ ,కుటుంబ సంబంధాలు ,మానసిక సమస్యలు మొదలైన అంశాలపై నాటికలు రచించిన కథా రచయితల నాటికలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తుంది ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న నాటిక దేవరాగం. మూలకథ రచయిత సయ్యద్ సలీం గారు.
సయ్యద్ సలీం గారు కథలు కవితలు నవలల రచయితగా సాహితీ రంగంలో తనదైన స్థానం ఏర్పరుచుకున్న ప్రముఖ రచయిత మనిషి కథతో సాహితీ ప్రపంచంలో అడుగుపెట్టి 300 కి పైగా కథలు 150 కవితలు 30 కి పైగా నవలలు రచించారు. వీరి కథలు కన్నడ హిందీ ఒరియా మరాఠీ భాషలలోకి అనువదించబడ్డాయి. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత .మానవత్వం ప్రధాన అంశంగా వీరి రచనలు అందరి చేత చదివింప చేస్తాయి.
మూల కథ శీర్షిక అమ్మ . నాటకీకరణ చేసిన కె కె ఎస్ స్వామి గారు దీనికి దేవరాగం అని పేరు పెట్టారు. అజో విభో కందాళం , జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన కథ నాటికల పోటీలలో జనవరి 4 2025 ప్రదర్శింపబడిన ఈనాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని గెలుచుకుంది బాధపడుతున్న తల్లిని కాపాడుకోవడం కోసం కూతురు ఎదుర్కొన్న ఇబ్బందులను సలీం గారు వివరిస్తూ ఈనాటికను రచించారు అనకాపల్లిలో కొణతాల వెంకట నారాయణమ్మ కళా ప్రాంగణంలో శ్రీ సౌజన్య కళాశాల వంటి ఉత్తరాంధ్ర వారి ప్రదర్శన దేవరాగం. పేక్షకుల విశేష ఆదరణ పొందిన నాటకం ఈ నాటకం.
జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లలకు ఉండే బంధం ఎంత బలమైనదో స్పష్టంగా చూపిన నాటిక . బంధాలు విడవకుండా తల్లిదండ్రులను చూసుకోవడం , వృద్ధాప్యంలో వారికి అండగా నిలబడడం వారికే ఎంతో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తుందని చెప్పడం ఈ నాటిక కథాంశం.

ఈ నాటకంలో తండ్రి కొడుకు అల్లుడు స్నేహితుడు డాక్టర్ కూతురు పాత్రలు ఉంటాయి తండ్రి పాత్రను దమ్ములూరి సత్యనారాయణ గారు పోషించారు .విదేశాలలో ఉన్న కొడుకు తనకోసం వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తాడు తండ్రి .కొడుకు పాత్రలో మెట్ట వెంకటరాజు గారు విదేశంలో ఉన్నా రంగస్థలం మీద పక్కన ఉండి మాట్లాడుతూ అక్కడ నుంచి వీడియో కాల్ లో మాట్లాడిన భావనను కలిగిస్తూ మాట్లాడుతాడు . ఇది నాటకం ప్రదర్శన లో గొప్పతనం!
మొదటి దృశ్యంలో తండ్రిని పుట్టినరోజు సందర్భంగా పలకరించిన కొడుకు వీరి మాటల ద్వారా తండ్రికి కొడుకును చూడాలన్న తపన.. కొడుకుకేమో ఉద్యోగ పరంగా రాలేని పరిస్థితి కనిపిస్తాయి. ఇంతలో కూతురుగా నటిస్తున్న సాలూరు జ్యోతి అల్లుడుగా నటించిన మెట్ట పోలి నాయుడు ప్రవేశిస్తారు ఇదే దృశ్యంలో తండ్రి స్నేహితుడైన బిడ్డ శివ పాత్రధారి కూడా తన స్నేహితుని పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తారు మొదటి సన్నివేశంలోని కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తనను చూసేందుకు వచ్చే సంవత్సరం వరకు రాడన్న దిగులు కూతురు అల్లుడు పుట్టినరోజు శుభాకాంక్షలు స్వయంగా వచ్చి తెలిపిన వారు కూడా ఉద్యోగరీత్యా డిప్యూటేషన్ మీద విదేశానికి వెళ్ళబోతున్నారన్న వార్తను విని స్నేహితుడు ఎంత సంతోష పెట్టాలని చూసిన తండ్రి డీలా పడిపోతాడు. అది చూసి కూతురు తను చేస్తున్న ఈ తప్పును క్షమించమంటుంది .
అప్పుడు తండ్రి అంటాడు “ఇక్కడ తప్పంతా మనుషుల మధ్య పెనవేసుకుపోయిన మమతాను రాగాల రక్త సంబంధాలదే! మనిషిని కట్టిపడేసే అన్ని బంధాల్లోనూ కణ సంబంధం చాలా బలమైంది. ఆ బంధం బ్రతికి ఉండగానే మానసికంగా దూరమైతే కలిగే బాధ మరణం కన్నా విషాదమైనది ఎందుకంటే దాన్ని జ్ఞాపకంగా మిగుల్చుకోలేము అనుభూతిగా అనుభవించలేము ” అంటాడు వృద్ధాప్యంలో ఉన్న కన్నతండ్రి వేదన ఈ మాటలలో చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది.

రెండవ దృశ్యంలో తండ్రి దగ్గరికి కూతురు అల్లుడు అమెరికా వెళ్ళిపోయే ముందు కొంతకాలం తండ్రి దగ్గర ఉండేందుకు వస్తుంది కూతురు భర్తతో సహా అవి చూసి తండ్రి శివ స్నేహితుడు మురిసిపోతాడు . అది అదృష్టం అని స్నేహితునితో అంటూ “అదృష్టం అంటే ఆస్తిపాస్తులు అంతస్తులు అధికారం హోదా లెక్కపెట్టలేనంత డబ్బు వెలకట్టలేనంత సిరిసంపదలు కావు !మనల్ని అర్థం చేసుకొని అభిమానించి అనుక్షణం మన కోసం ఆలోచించే ఆత్మీయులు మనకి దక్కడం నిజమైన అదృష్టం !” అంటాడు.
మూడవ దృశ్యంలో తండ్రి కూతురు అల్లుడు వెళ్లిపోతారన్న షాక్ లో తనకి పీడకలలు వచ్చినట్లు భయపడుతూ వణికిపోతుంటాడు ఏదేదో ఆలోచనలలో మునిగిపోతుంటాడు . అతనిలోని మానసిక అనారోగ్యం మొదలైంది . అది ఇంకా కూతురు అల్లుడు గమనించలేదు.
నాలుగవ దృశ్యంలో పాస్పోర్ట్ ఉన్న బ్యాగు మాయమవడం పై కూతురు తండ్రిని అనుమానిస్తుంది అనుకోకుండా ఆ బ్యాగు స్నేహితుడు తన కొడుకుకు ఎల్ఐసి ఆఫీసులో దొరికిందని తీసుకొస్తాడు. మానసికంగా షాక్ కి గురైన తండ్రికి తను ఆ బ్యాగు తీసుకెళ్లిన జ్ఞాపకం కూడా లేదు.. కావాలని మేము వెళ్ళిపోతున్నామని పాస్పోర్ట్ లు ఉన్న బ్యాగును మాయం చేసావని నింద వేస్తారు కూతురు అల్లుడు!
ఐదవ దృశ్యంలో మరింత షాక్ లో ఉన్న తండ్రి అల్లుడుని చూసి ఇంట్లో దొంగ వచ్చాడని భ్రమపడి పిచ్చిగా ఇల్లంతా తిరిగి అల్లుడిని దొంగ దొంగ అని అరిచి గొంతు నొక్క పోతాడు ! అర్థం చేసుకోని కూతురు తండ్రిని దూషిస్తుంది . స్నేహితుడు కూతురు అల్లుడు ఇద్దరినీ కూర్చోబెట్టి అతని ఆరోగ్య స్థితిని వివరిస్తాడు. స్పృహ కోల్పోయిన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతనికి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నాడని చెబుతాడు డాక్టర్ . తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ అయిదు సంవత్సరాలకు మించి బ్రతకరని మతిమరుపుతోపాటు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్లు ఊహించుకుంటారని చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తారని చెబుతారు డాక్టర్.

ఆరవ దృశ్యంలో కూతురు అన్నతో మాట్లాడి తండ్రి పరిస్థితిని వివరిస్తుంది. తానిప్పుడు రాలేనని అవసరమైతే మరి కాస్త డబ్బు పంపిస్తానని అంటాడు అన్న. ఏడవదృశ్యంలో అన్న రాకపోవడం తండ్రి అనారోగ్యంతో ఆలోచనలో పడుతుంది కూతురు .
తనతో వస్తున్నావా లేదా అని ప్రశ్నించిన భర్తతో నేను ఇప్పుడు కూతురు, భార్య ,కోడలు ,పిల్లల తల్లి గాను, కాదు స్వార్థానికి అతీతంగా స్పందించే సహృదయం ఉన్న మనిషిగా నాకు జన్మనిచ్చిన నాకు జీవితాన్ని ప్రసాదించిన నాన్న అనే సాటి మనిషి కోసం ఆలోచిస్తున్నాను అంటుంది.
తండ్రి స్నేహితుడు కూతురిని అల్లుడిని ఆపమని చెప్పినప్పుడు కూతురు “నీటిలోపల చేపలు, గాలిలో పక్షులు ఎదురీది బ్రతుకుతున్నప్పుడు మనిషిని నేను పరిస్థితులకు ఎదురీది బ్రతకలేనా ? ” అంటుంది కూతురులో మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఆమెలోని మార్పును చూసి తండ్రి స్నేహితుడు “చిన్నతనం ఏ గుడికి దైవదర్శనానికి వెళ్లిన మీ నాన్న నిన్ను భుజాల మీద కూర్చోబెట్టుకొని దైవ స్వరూపాలని చూపించేవాడు కానీ ఈరోజు నువ్వు నీ జీవితాన్ని గర్భగుడిగా మార్చి అందులో నీకు జన్మనిచ్చిన కన్న తండ్రిని మూలవిరాట్టుగా ప్రతిష్టించి సేవిస్తున్నావు. నువ్వు మీ నాన్న కూతురువి కాదు దేవరాగానివి తల్లి! ఆ దేవరాగం పాదాలు కళ్ళకు వత్తుకొని నా జన్మ తరించి నీ తల్లీ ” అంటాడు.
తండ్రిని కాపాడుకోవడం తన జీవన లక్ష్యాన్ని పక్కనపెట్టి తండ్రిని చూసుకునేందుకు సిద్ధపడ్డ ఉదాత్తమైన కూతురు కథ దేవరాగం . ఈ నాటకాన్ని నాటకీకరణ చేసిన కేకేఎల్ స్వామి గారు డాక్టర్ పాత్ర పోషించిన శ్రీ గంగాధరయ్య గారికి ఈ నాటకం అంకితం చేశారు వృద్ధాప్యంలో తండ్రి పట్ల కొడుకు కూతురు తీసుకోవలసిన శ్రద్ధను చూపించవలసిన బాధ్యతను వేలెత్తి చూపిన నాటిక దేవరాగం.

ఈనాటికకు సంగీతం పి లీలా మోహన్ అందించగా కళాకారులకు ఆహార్యంతో అందంగా తీర్చిదిద్దింది ఎస్ రమణ గారు . నాటక ప్రదేశానికి రంగాలంకరణ చేసిన వారు సింగూరు రమణ గారు . అద్భుతమైన లైటింగ్ ను అందించిన వారు నిరంజన్ . నాటకం ఆధ్యాంతం దర్శకత్వం వహించిన వారు శ్రీ కేకేఎల్ స్వామి గారు.
నాటకం సలీం గారి కథను రక్తి కట్టించేలా మరి కాస్త నటనను ప్రదర్శించి ఉండొచ్చు. మూల కథ మాత్రం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిరాకరించినప్పుడు ఆ తల్లిదండ్రుల మనోవేదనకు నిజ దర్పణం. ఇక వారు అనారోగ్యానికి గురైతే కలిగే పరిణామాలను కూడా ఈ నాటకంలో మనం గమనిస్తాం .కూతురు తండ్రి కోసం భర్తతో పోట్లాడిన సన్నివేశంలో డాక్టర్ గోవాడ దర్శకత్వంలో వచ్చిన మూల్యం నాటికలో భార్య తన తండ్రి కోసం తపించి భర్తతో వాదించిన దృశ్యం మనకు జ్ఞప్తికి వస్తుంది.

నాటకీకరణలో కే కే ఎల్ స్వామి గారు కృతకృత్యులయ్యారు మంచి నాటకాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు ఇటువంటి అంశాలతో మరెన్నో నాటకాలు మూల కథకులు సలీం గారి నుంచి నాటకీకరణ చేసిన కేకేఎల్ స్వామి గారి నుంచి వస్తాయని ఆశిద్దాం!
* * * * * * * * * *

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

శిఖరం

by Devanapalli Veenavani January 29, 2025
written by Devanapalli Veenavani

ఒక అత్యున్నత స్థానంలో ఉన్న సాధారణ వ్యక్తిత్వం
ఒక సాధారణ వ్యక్తిలో అత్యున్నత స్థానానికి ఎదగగల ప్రజ్ఞ
పక్క పక్కన మనగలగిన విలక్షణ కవి అటల్ బిహారీ వాజ్ పాయ్.
ప్రధానిగా ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఇక సాహిత్యకారునిగా నిలబెట్టిన కవితా పుస్తకం వాజ్ పాయ్ కవితల తెలుగు అనువాదం ” శిఖరం “.

వాజ్ పాయ్ గ్వాలియర్ (1924 ) లో జన్మించారు.ఆయన విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నారు. 1961 నుంచి రాజకీయాలకు సంభందించిన పుస్తకాలు ప్రచురించారు. దేశం అత్యాయక పరిస్థితులలో ఉన్నప్పుడు ,జైలు శిక్ష అనుభవిస్తున్న ప్పుడు కవితలు రాశారు.అయితే తన 71 వ సంవత్సరం లో అంటే 1995 లో మొదటి సంకలనం ” మేరీ ఇక్కావన్ కవితే ” ఇంకా అదే సంవత్సరం ” సంవేదన ” , “నయే దిశా ” ప్రచురించారు. ఇందులో చివరి రెండు సంకలనాలు ప్రముఖ గాయకులు జగ్జిత్ సింగ్ చేత ఆల్బమ్స్ చేయబడ్డాయి .
మరో రెండేళ్లకు అంటే 1997 లో ” శ్రేష్ఠ కవిత ” సంకలనం , 1999 లో ” క్యా ఖోయా క్యా పాయా ” సంకలనం ఆ తర్వాత 2003 లో “ట్వంటీ వన్ పోయంస్ ” సంకలనం, మొత్తంగా ఆరు సంకలనాలు ప్రచురించారు.

ఇప్పుడు పరిచయం చేసే పుస్తకం “శిఖరం” వాజ్ పాయ్ కవితలను
తెలుగులోకి ప్రముఖ కవి జలజం సత్యనారాయణ అనువదించి అందించిన పుస్తకం. ఇది , 2016లో అందుబాటులోకి వచ్చింది.
పుస్తకంలోని 47 కవితలు అత్యంత సాధారణ వస్తువులు. అయితే వారు ఉన్న స్థాయిలో అత్యంత సామాన్యమైన అంశాన్ని పట్టుకోవడం
స్పందించడం వారు సామాన్యుడితో మమేకయ్యారని తెలియజేస్తోంది.

ఇక వారి వ్యక్తిత్వమే వారి కవితా వస్తువైంది.నిరాడంబర జీవనం ఇష్టపడే ఆయన పై స్థాయి ఎప్పుడూ ఏకాకిని చేస్తుందని , ఏ గడ్డి పోచా కనిపించనంత ఎత్తు తనకు ఇవ్వవద్దని కోరుకున్నారు.

అదే విషయాన్ని శిఖరం కవితలో ఇలా చెప్పుకున్నారు

“ఎత్తైన పర్వతాలపై
చెట్లు ఎదగవు
మొక్కలు మొలకెత్తవు
గడ్డి పరకలు కూడా పరుచుకోవు
మంచు పొరలు మాత్రమే పరుచుకుంటాయి.
శవం మీది తెల్లటి వస్త్రం లా
మృత్యు వు చల్లబడుతుంది
అది నదీ రూపం ధరించి నవ్వుతూ ఆటలాడుతుంది
తన దీన స్థితి పై రోదిస్తూ
చుక్క చుక్క రాలుస్తుంది
ఇలాంటి ఎత్తు
దేనికి సమతుల్యం
అది నీళ్లను రాయిగా చేస్తుంది
నవ్వుతూ నిన్ను వెక్కిరిస్తుంది
..
..

ఎంత ఎత్తుకు ఎదిగితే
అంత ఏకాకి అవుతాడు
బాధైనా భారమైన తనే మోస్తాడు
పెదాల మీద చిరునవ్వు అతికించుకొని
తనలో తనే ఏడుస్తాడు
..
..

ఓ ప్రభూ
నన్ను అంత ఎత్తుగా ఎదగనీకు
ఇతరుల నెవ్వరినీ గుండెలకు హత్తుకొలే నంతగా
అంతటి హృదయ కాటిన్యాన్ని ఎప్పుడూ నాకివ్వకు”

అన్న వేడుకోలు వాక్యాలు వారి వ్యక్తిత్వాన్ని శిఖరం లా నిలబెడతాయి.

తన చుట్టూ ఉన్నట్టే ఉండి వ్యాపరమైపోయిన అనుభందాల మధ్య , గడిచిన జీవితం నుంచి మాయమౌతున్న మిత్రుల్ని తలుచుకొని ఇలా నిట్టూరుస్తాడు.

“కాపలా ఎందుకూ పనికి రాలేదు
రస హృదయం రిక్తమైంది
జీవితం గడిచిపోయింది..!

లాభ నష్టాల ఒడిదొడుకు లలో
జీవన సరళి వ్యాపారమైంది
అమ్ముడు పోయె వాని
ధర నిర్ణీత మైంది
అమ్ముడు పోని వాడు
పనికిరాని వాడయ్యాడు

నన్ను సంతలో
ఒంటరిగా నిలబెట్టి
మిత్రులు ఒక్కైక్కరే జారిపోయారు
జీవితం గడిచిపోయింది..! ” అంటారు జీవితం గడిచిపోయింది అన్న కవితలో.

ఆత్మ పరిశీలనతో తన పుట్టిన రోజున
వయసు పెరుగుతున్న కొద్దీ మనసును చీల్చే
దుగ్ధను ఇలా అక్షరబద్ధం చేస్తారు

“నాకు దూరం నుంచి
ఏదైనా కనిపిస్తుంది
గోడ మీది రాతల్ని
దూరం నుంచి చదవగలుగుతాను
కానీ దగ్గరనుంచి
హస్తరేఖలని చదవ లేను

సరి హద్దుల్లో ప్రజ్వరిల్లే జ్వాలలు
నాకు కనిపి స్తాయి
కానీ నా కాళ్ళ కింద
రగిలే బూడిద నాకు కనిపించడం లేదు
నేనేమైనా ముసలివాణ్ణి అయిపోయినా ? “

అంటూ నిర్దాక్షిణ్యంగా మనల్ని దాటిపోయే వయసు వృద్దున్ని చేసిందని తనకు తాను వ్యతిరేకి అవుతున్న సందర్భాన్ని ఆక్షేపిస్తారు.

అసంబద్ధ పరిస్థితుల్లో నిర్ణయాత్మక సంఘర్షణలో తనలో రగిలిన
భావావేశాన్ని, నాలుగు రోడ్ల కూడలి లో నిలిపిన సందిగ్ధాన్ని విచలిత హృదయుడై ” ఏ దారిలో నడవాలని” ప్రశ్నిస్తాడు. హృదయానికి ముసుగు వేసుకొని “పాట పాడలేనని ” చెప్తాడు.

వాజ్ పాయ్ తాత్విక చమక్కులు
చల్లి కవిత్వాన్ని వెలిగిస్తారు. మనసును నిష్కల్మశంగా నిలుపుకోవాలని , సత్యం వెనుక మర్మాన్ని తెలుసుకోమని చెప్పకనే చెబుతారు.

“మనిషి గుర్తింపు
ధనం ,కుర్చీతో రాదు
అతని మనస్సు తో ముడిపడి ఉంటుంది
ఫకీరు మనస్సు ముందు
సర్వ సంపదలూ నిర్వికారమవుతాయి”
..
..

“పుట్టుక చావూ ఎప్పుడూ ఉండేవే
జీవితం ఒక సంచార ప్రక్రియ
ఇవ్వాళ ఇక్కడ ఉంటాం
రేపు ఎక్కడో?
ఎవరికి తెలుసు
రేపు సూర్యుణ్ణి ఎక్కడ చుస్తామో
విచిత్రమైన శూన్యం
ఆత్మ బుద్ది ఏం తీర్పు చెప్తుంది”

..
..

“శ్వేత వస్త్రాలు ధరించి నంత మాత్రాన
హృదయ మాలిన్యం దాగి పోతుందా..?”

..
..

“జీవన్మ రణాలు నిరంతరం సాగే ప్రక్రియ
జీవనం ఆటవికుల గుడారం లాంటిది
ఇవ్వాళ ఇక్కడ రేపటి ప్రస్థానం ఎక్కడో
ఎవడికి తెలుసు రేపటి ఉషస్సు ఎక్కడో
ఆకాశం అనంతం, చీకటి రాత్రిలో
ప్రాణాలు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి”
..
..
వంటివి కొన్ని వారి కవితల్లోంచి ఏరి రాసినవి.

వాజ్ పాయ్ జైల్లో ఉన్నప్పుడు రాసిన కవితలు
‘ తల వంచం ‘ , ‘ఒక సంవత్సరం గడిచిపోయింది’ ,’ పరిహసిస్తున్న రాత్రి ‘, ‘ మళ్లీ సూర్యుడు ప్రకాశిస్తాడు ‘ వంటివి వారి చలనశీల జీవన గమనాన్ని పట్టిస్తాయి.

ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోదగినది “సామూహిక అత్యాచారం” అన్న కవిత.నాకు బతకాలని ఉంది అంటూ మొదలయ్యే ఆ కవిత ఆద్యంతం విదారక స్త్రీ హృదయాన్ని స్పృశిస్తుంది. ప్రధాని గానే కాదు అత్యంత సామాన్యుడిగా మనసున్న వాడిగా వాజ్ పాయ్ ఒక స్త్రీ దుఃఖానికి అక్షరాలతో నివాళి అర్పించారు.

స్వతంత్రం సిద్దించిన తరుణంలో , ఎమర్జెన్సీ కాలంలో, కాశ్మీర్ విషయంలో కూడా వారు కవితలు రాశారు. మొక్కవోని ధైర్యంతో పోరాడాలని నినదించే పదాలను సాగు చేశారు.

చివరి కవిత ‘ కొత్త గీతం పాడతాను ‘

” చెదరిన కలల వెక్కి వెక్కి ఏడ్పులు
ఎవడు వింటాడు ?
అంతరాళం లో దాగిన వెతలు కనుల కొలుకులలో ఒలుకుతున్నవి
ఓటమి ఎప్పుడూ అంగీకారం కాదు
తగాదాలు ఎవడిక్కావాలి
కాల కపాలంపై రాసిన రాతల్ని
చెరిపేస్తాను, మళ్లీ రాస్తాను
కొత్త గీతం పాడుతాను ” అంటూ ముగుస్తుంది.

అయితే వాజ్ పాయ్ కవిత్వం మనకు తెలుగులో
ఆలస్యంగా నైనా అందుబాటులోకి తెచ్చినందుకు జలజం సత్యనారాయణ గారిని అభినందించాలి. మూల భాష నుంచి అనువదించినప్పుడు భావాలను యథాతథంగా సృజన చేయడం కష్ట మైన పని అనుకుంటాను. అయితే శిఖరం మన తెలుగు కవిత్వమే అన్నంత స్పష్టమైన అనుభూతి పంచుతుంది.

” సూర్యుడు మళ్లీ మళ్లీ ఉదయిస్తాడు
తాపం మళ్లీ మళ్లీ ఏర్పడుతుంది
కానీ తోటలోని
పచ్చ పచ్చని దర్భలపై
ప్రతి రుతువులోనూ
మంచు ముత్యాలు దొరకవు “

అని వారే అన్నట్టు వాజ్ పాయ్ లాంటి
ప్రజ్ఞాశాలి అల్లిన కవితలు కూడా
మళ్లీ మళ్లీ దొరకవు.

January 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మన తెలుగు నాటకాలు – నిన్నే పెళ్ళాడుతా

by Sammeta Vijaya January 29, 2025
written by Sammeta Vijaya

కావ్యాలలో నాటకం రమ్యమైనది.” నాటకాంతం హి సాహిత్యం ” అన్న మహాకవి కాళిదాసు భావనలో అన్ని సాహిత్య ప్రక్రియలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం . కవిత్వం, వ్యాసం ,కథ, నవల వీటన్నిటి తర్వాత నాటకం వస్తు రూపంలో భావగంధం కలిగి మనోరంజనం కలిగిస్తూ సామాజిక ప్రయోజనం తో పాటు సందేశాన్ని అందించే అద్భుత దృశ్యరూపకం నాటకం.
సజీవ ప్రదర్శన తో నాటకం అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ ఏయే నాటకాలు నాటికలు ప్రదర్శించబడ్డాయో వాటి కథ, నటీనటులు , సాంకేతిక నిపుణులు ,దర్శకుడు వీరందరి గురించిన సమాచారం తిరిగి చూసుకోవాలంటే మనకు కనిపించదు అందుకోసం నా పరిధిలో నేను గమనించిన చూసిన నాటకాలను పరిచయం చేయాలని ఉద్దేశంతో మన తెలుగు నాటకాలు అనే పేరుతో నేను కొన్ని నాటకాలను పరిచయం చేయాలనుకుంటున్నాను. తద్వారా మన తెలుగు నాటకాలు కొన్ని చదివి తెలుసుకునే అవకాశం కొంతమందికైనా కలుగుతుందని ఆశాభావం. అయితే నాటకం చదివి తెలుసుకోమన్నది నా ఉద్దేశం కాదు. నాటకం ఖచ్చితంగా రంగస్థలం మీద ప్రదర్శించినప్పుడు చూడవలసినదే . కాకపోతే ఆ నాటకం గురించిన సమగ్ర సమాచారం తెలుసుకోవడం ద్వారా నాటక రచయిత ,నటీనటుడు ,ప్రదర్శనలు తీసుకున్నటువంటి శ్రద్ధ కళాకారుల నైపుణ్యం వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను మీ అందరి ఆదరణను కోరుకుంటున్నాను. ఇక పై నేను ధారావాహిక గా అందించే మన తెలుగు నాటకాలను మీరందరూ చదివి తెలుసుకుంటారు కదూ .. ఆయా నాటికలను మీ సమీపంలో ప్రదర్శించబడినప్పుడు తప్పనిసరిగా చూస్తారని ఆశిస్తున్నాను.

నిన్నే పెళ్ళాడుతా నాటకం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించారు. అనేక కథలు, నవలలు, నాటికలు వ్రాసారు. ఈమె పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీ చదవి, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై సీవరేజ్‌ బోర్డులో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో అధికార హోదాలో పదవీ విరమణ పొందారు. ఈమె సరసిజ అనే పేరుతో ఒక సాహిత్య సంస్థను నెలకొల్పారు.
రేడియో నాటక రచయిత్రిగా సుమారు రెండువందల పైన నాటకాలు ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అయ్యాయి. యవనిక, రంగస్థలం , అంతర్మథనం, మ్యాచ్ ఫిక్సింగ్ ,మేమూ మనుషులమే తదితర రంగస్థల నాటక రచయిత్రిగా పేరుపొంది శ్రద్ధాంజలి, హాంగ్ మి ప్లీజ్, మహానటుడు, మానవా ఏది నీ చిరునామా , అష్టావక్ర మొదలైన నాటికలు అనేకం రచించి ప్రదర్శింపజేసారు. అనేక టెలీ ఫిల్మ్స్ రచించారు. ఉత్తరం (రసరంజని నాటక రచన పోటిలో బహుమతి పొందిన నాటకం) ,స్పర్శ (అమెరికా తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన నాటక రచనల పోటిలో ప్రథమ బహుమతి పొందిన నాటకం), హైటెక్ కాపురం (మమకారాల కాపురం పేరుతొ అమెరికాలో ప్రదర్శన సరసిజ థియేటర్ ద్వారా) ,మిస్సమ్మ( విజయ వారి మిస్సమ్మ సినిమా రంగస్థల నాటకంగా సరసిజ థియేటర్ ద్వారా అమెరికాలో ప్రదర్శన). అనగనగా ఓ రాజకుమారి (భేతాళ కథ ఆధారంగా రాసిన జానపద నాటకం అమెరికాలో ప్రదర్శన)
ఇవి కాకుండా టివి సీరియల్స్ , నవలలు రచించి అనేక పురస్కారాలు అందుకున్నారు.

సరసిజ విమెన్ థియేటర్ వ్యవస్థాపన 2013 లో జరిగింది.
ఇటీవల తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, సరసిజ విమెన్ థియేటర్, లేఖిని మహిళా రచయిత్రుల సంస్థ కలిసి నాటకం రాయడం ఎలా ? అనే వర్క్ షాపును నిర్వహించారు. వివిధ నాటకరంగ ప్రముఖుల ప్రసంగాలతో శిక్షణను నడిపించి చివరి రోజు తెలుగు విశ్వ విద్యాలయం నందమూరి తారకరామారావు సభా ప్రాంగణంలో నిన్నే పెళ్ళాడుతా నాటకం ప్రదర్శింపజేసారు. నాటకం ఆద్యంతం అందరినీ ఆకట్టుకుని మనసారా నవ్వేలా చేసింది. నాటకం లో పాల్గొన్న వారందరూ తమ తమ పాత్రలకు జీవం పోసారు.
నాటకంలో ప్రత్యేకత మొట్టమొదట నాటకాన్ని పరిచయం చేయడం అపర్ణ మరియు సతీష్ లు నాటకం తో పాటు నాటక రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారి గురించి అదే విధంగా ఆరోజు కార్యక్రమంలో పాల్గొనే అతిథులను గురించి పరిచయం చేస్తూ నాటకానికి ముందుగా ఉపోద్ఘాతాన్ని అందించి నాటకంలోకి ప్రవేశింప చేశారు.
గిరి ఈ నాటకంలో కథానాయకుడు. గిరి తల్లిదండ్రులు అబ్బాయికి 40 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నాడని ఇంకా వివాహం కాలేదని సంబంధాలు అనేకం చూస్తుంటారు. తండ్రి శ్రీధర్ కూడా విసిగిపోతాడు . వచ్చిన సంబంధాలు గిరి తనకు నచ్చలేదని తిప్పికొట్టేవాడు. అనేక పెళ్లి సంబంధాల వారిని సంప్రదిస్తూ అబ్బాయికి మంచి అమ్మాయి కోసం ఆరాట పడుతూ ఉంటుంది తల్లి కామాక్షి. పెళ్లి సంబంధాలు చూపించే సీతారామశాస్త్రి గారు ఎన్ని సంబంధాలు చూపించిన అవి నచ్చలేదని తోసి పారేస్తుంటాడు గిరి. ఎవరైనా పులిహోర సరిగ్గా చేసే వారిని పెళ్లి చేసుకుంటానంటాడు గిరి.

ఆధునిక పెళ్లిచూపులు అబ్బాయి ఇంటికే అమ్మాయి కుటుంబం వచ్చే ఏర్పాటు చేసి ఎలాగో తల్లిదండ్రుల చేత ఒప్పించి రప్పిస్తాడు సీతారామశాస్త్రి . సర్వోత్తమరావు వరూధిని, జ్వాలలు ఇంటికి వచ్చి ఇల్లు బాగోలేదని అబ్బాయి జీతం ఎంత అని రకరకాలుగా ప్రశ్నిస్తారు .విసిగిపోయిన గిరి స్నేహితుడు కుమార్ ను పిలిచి నువ్వు తయారు చేసే రోబో ని తీసుకురా నేను ఆ రోబోను పెళ్లి చేసుకుంటానంటాడు .నిజంగానే ఆ రోబో బందాని ఇంట్లోకి తీసుకొస్తాడు కుమార్.
ఆ రోబో పేరు బందా బొమ్మ లాగా అందంగా ఉండడం చూసి ఆమెను చూడగానే ఇష్టపడతాడు గిరి. ఈలోగా అంతకు ముందు వచ్చిన జ్వాలా వచ్చి నిన్ను నేనే పెళ్ళాడుతా అంటుంది. అంతకు ముందు పెట్టిన కండిషన్స్ అన్ని పక్కన పెడతానంటుంది రోబో బందా నాకు నువ్వే నచ్చేసావు అంటుంది . ఈ హడావిడి కి పోలీసు వచ్చి విషయం అర్థం కాక అయోమయంలో పడతాడు . జ్వాలా, బంధ నేను నిన్నే పెళ్ళాడుతా అంటే నేను నిన్నే పెళ్ళాడుతానడంలో హాస్యం మరింత రక్తి కట్టింది అంతకుముందు బెట్టు చేసిన జ్వాల తల్లిదండ్రులు కూడా తిరిగి మామూలుగా మారుతారు చివరికి గిరి బందా రోబోను తిరస్కరించి జ్వాలను పెళ్ళాడుతాడు .


చక్కని సంభాషణ ప్రతి సన్నివేశంలో హాస్యం పండేలా చేసింది ఇందులో రచయిత్రి ప్రతి స్పష్టంగా కనిపించింది . రోబో పాత్ర పోషించిన బంధ అలాగే పోలీస్ పాత్ర పోషించిన గోవింద్ నాయుడు అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఈ నాటకంలో నటించినటువంటి నటీనటులు శ్రీధర్ పాత్రలు కాకర్ల హనుమంతరావు కామాక్షిగా శోభ గారు నటించగా గిరి పాత్రలో మంజునాథ్ చక్కని పాత్రపోషణ చేసి ఇతనే ఈ నాటకానికి దర్శకత్వం కూడా వహించాడు.
కుమార్ గా ప్రశాంత్ జ్వాలగా అనూష ,వరూధినిగా శ్రీదేవి ఏకే బందాగా పూజ ,సీతారామశాస్త్రిగా వేణుగోపాల్ , సర్వోత్తమరావుగా రామకృష్ణ గారు , రామ్మూర్తి గా స్వరాజ్ కుమార్ గారు , కానిస్టేబుల్ గా గోవింద నాయుడు గారు నటించగా ఈ నాటకానికి ఆహార్యం అందించిన వారు మల్లాది గోపాలకృష్ణ గారు, సంగీతం సమకూర్చిన వారు సురభి నాగరాజు గారు ,లైటింగ్ అమర్చినవారు సురభి ఉమాశంకర్ గారు .
నాటకం మొత్తం ఆద్యంతం చక్కని దర్శకత్వం వహించి అనేక నాటకాలలో నటిస్తూ అటు నటన ఇటు దర్శకత్వంలో రాణిస్తున్నటువంటి నటుడు మంజునాథని అందరూ మెచ్చుకున్నారు. వీటన్నిటికీ అతీతంగా అత్యద్భుతమైన రచనతో హాస్యంతో అందరినీ ఆకట్టుకొని మూడు రోజుల నాటకం రాయడం ఎలా వర్క్ షాప్ తో పాటు అద్భుతమైన నాటకం ప్రదర్శింపజేసిన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారిపై సభలో ఉన్న వారందరూ ప్రశంసల వర్షం కురిపించారు.
నాటకానంతరం జరిగిన సభలో ముఖ్యఅతిథిగా డాక్టర్ కె వి రమణ గారు తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు, గౌరవ అతిథులు గా ఆచార్య డి.ఎస్.ఎన్ మూర్తి గారు, బుర్ర సాయి మాధవ్ గారు ప్రముఖ సినీ రచయిత, ఆత్మీయ అతిథులుగా డాక్టర్ విజయభాస్కర్ గారు, డాక్టర్ మధు చిత్తరువు గారు, బి ఎన్ రెడ్డి గారు , శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారు , శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు పాల్గొనగా సభాధ్యక్షత వహించిన వారు శ్రీ రామ కోటేశ్వరరావు గారు.
నాటకంలో పాల్గొన్న వారిని, నాటకం రాయడం ఎలా వర్క్ షాప్ లో పాల్గొన్న రచయితలు, విద్యార్థులను అలాగే లేఖిని పురస్కారాలను అందించడం జరిగింది. అతిధులందరూ ఏకగ్రీవంగా మహిళా రచయిత్రులను విరివిగా నాటకాలు రచించడంలో పాలుపంచుకోవాల్సిందిగా కోరారు. మంచి నాటకాలను రచించి సమాజంలో సమకాలీన సమస్యలపై స్పందించి మహిళలు నాటక రంగంలో మరింతగా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకతని వివరించారు.
నిన్నే పెళ్ళాడుతా నాటకం చూడడానికి వచ్చిన వారందరూ ఒక మంచి వినోదాత్మకమైన హాస్య భరితమైనటువంటి నాటకాన్ని చూసామన్న సంతృప్తిని వ్యక్తపరిచారు.

January 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

అతి ఆశ కొంపకు చేటు

by ఒద్దిరాజు మురళీధరంరావు January 29, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక బీద విధవరాలు, ఒక పినాసి జమీందారు ప్రక్క ప్రక్క ఇండ్లలో వుండేవారు. జమీందారు దురాశా పరుడు. కాబట్టి  ప్రక్క ఆమె సేబు పండ్లను తనకు సరిపోను లేని వాడివలె తెంపుకునేవాడు. ప్రక్క వారి చెట్టు కొమ్మ తన గోడను తగులుతున్నది కావున అది తనదేనని గట్టిగా వాదించేవాడు. తనకు ఒక మంచిరోజు వస్తుందని నమ్మకంగా అనుకుంది ఆ ఆడమనిషి, ఆ పీనాసి ముసలతనికి వచ్చేది వస్తుంది.
ఒకరోజు ఆమె పొయ్యిల కట్టెల కొరకు అడవికి పోయింది. వెంట ఆమె ఒక రొట్టె ముక్కను తీసుక వెళ్ళింది. దారిలో ఆమె ఒక బిచ్చగాడిని చూచింది. అతను ఆ రోజు అప్పటివరకు ఏమి తిన లేదని గ్రహించి, తన రొట్టె మాడిన భాగం తప్ప మిగతా మొత్తం రొట్టె ఆ బిచ్చగాడికి ఇచ్చింది. ఆమె దానికి బదులు అతని నుండి ఏమి ఆశించలేదు. కాని ఆ ముసలతను ఆమెకు దగ్గరిలోని ఒక చెలుకను చూపించాడు. ఒక క్షణం ముందు అక్కడ ఏమి లేని చోట రెండు ఆలుగడ్డలను చూసింది. ఒక చిన్న మాడు ముక్క తను వుంచుకొని మొత్తం రొట్టె తనకు ఇచ్చినందుకు బదులు వాటిని తీసుకొమ్మని అతడు చెప్పాడు. అవి తీసుకొని, కొన్ని పొయ్యిల కట్టెలు తీసుకొని ఇల్లు చేరింది.
మరునాడు ఉదయం ఆమె ఒక అసమాన్యమైన మెరుపుతో లేచింది. ఆమె స్టౌ ప్రక్కన కట్టెల మోపు సూర్యరశ్మిలో చుట్టబడినట్లు చూచింది. ఆమె దానిలోనికి చూసింది. అక్కడ ఆమెకు ఒక్కొక్క ఆలుగడ్డ బంగారంగా మారింది, కనిపించింది.
ఆ పిసినారి భూస్వామి అటు పోవుకుంటూ బెల్‌ కొట్టకుండా ఆ బీదామె ఇంట్లోకి వెళ్ళాడు. ఆ బీదామె జరిగినదంతా దాపురం లేకుండా చెప్పింది. వెంటనే ఆ భూస్వామి గీరల బండి, ఐదు రొట్టెలతో అడవికి వెళ్ళాడు. అక్కడ అతను ముసలతనితో కలిశాడు. అప్పుడు అక్కడ జరిగినదంతా ఏమైందో మీకు తెలిసే ఉంటుంది. ఆ ముసలతను ఈ భూస్వామికి ప్రక్కన ఉన్న చెలుక చూపించాడు. ఆ చెలుకలని ఆలుగడ్డలను భూస్వామి బస్తానిండా నింపుకొని ఇల్లు చేరాడు. తన జొన్నల గదిలో ఆలుగ్డలను పోశాడు. కానీ మరునాడు తను లేచి చూసి బహు చెడ్డ షాక్‌ తిన్నాడు. ఒక్కొక్క ఆలుగడ్డ నుండి డజన్‌ డజన్‌ ఎలుకలు తయారై కొట్టంలో వున్న మొత్తం జొన్నలను తినేశాయి. అతనికి బంగారం రాలేదు, ఉన్న జొన్నలు ఎలుకల పాలయినాయి. అందుకే అంటారు, అతి ఆశ కొంపకు చేటు అని.

January 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

కష్టజీవి

by ఒద్దిరాజు మురళీధరంరావు January 29, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఎర్నీ అనబడే ఒక బాలుడు పరిశోధన కథలు (డిటెక్టివ్‌ స్టోరీలు) చదవడం ఇష్టపడేవాడు. కాని మీరు అతను డిటెక్టివ్‌ కావాలని ఊహిస్తున్నారా? ఆ అవకాశం లేదు. అతను ఒక దొంగ కావాలని నిశ్చయించుకున్నాడు. ప్రపంచంలో ఇది తప్ప అతడిని వేరే ఏ వృత్తి ఆకర్షించలేదు. ఆయన ఎదిగిన వెంటనే ఒక పయతాప ముఖానికి పెట్టుకొని, జేబులో ఒక బొమ్మ పిస్టల్‌ దూర్చుకొని ఒక బ్యాంకుని దోచుకుందామని బయలు దేరాడు. ఒక బ్యాంక్‌ లోకి వెళ్ళి క్లర్కును నత్తి వలన హ, హ, హాండ్స్‌ అప్‌ అని అరిచాడు, పిస్టల్‌ చూసిస్తూ. కానీ వెంటనే అలారం మోగటం మొదలయింది.
ఎర్నీ ఏం జరుగుతున్నదో తెలుసుకోక ముందే, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బ్యాంకు దోపిడీ ప్రయత్నం చేసినందుకు జైల్లో వేశారు. వాస్తవంగా బ్యాంక్‌ దోయడం తన వంటి అనుభవం లేనివాడు మొదలుపెట్టడం కష్ట కార్యమే. నేను చాలా సామాన్యమైన ప్రయత్నాలే చేయాలి అనుకున్నాడు కాబట్టి ఆయన జైలు నుండి విడుదల అయినాక ఒక పెద్ద షాపు బంగ్లా కిటికీ పగులగొట్టి లోనికి దూరాడు. అక్కడ అతనికి ఏది  చేతికందితే అది తన బస్తాలో వేసుకున్నాడు. కానీ అతను కిటికీ గుండా బయటకు వెళుతున్నపుడు పట్టుబడి రెండవసారి జైలులో వేయబడినాడు. అక్కడ విడుదలయ్యాక ఒక ఖాళీ ఇంట్లోకి దూరాడు. అక్కడ అతను బీరువాలు వగైరా వెతికాడు, కాని అక్కడ ఏమీ దొరకలేదు.
కానీ దారిలో దొంగల ముఠాకు పట్టుబడి బాగా దెబ్బలు తిన్నాడు. తను తెచ్చుకున్నది కూడా వాళ్ళు తీసేసుకున్నారు. కారణం ఆ ఇల్లు వాళ్ళ ప్రాంతం.
ఎప్పటివలనే నేర పరిశోధకులు తన వేలి ముద్రలు ఖాళీ ఇంట్లో బీరువాలపై ఏర్పడిన వాటిని గమనించి మరల జైల్లో వేయబడ్డాడు.
ఎప్పుడూ ఇదే తంతుగా జరుగుతున్నందుకు జైలుశిక్ష ఎక్కువ కాలం పడుతుండేది.
చివరకు దొంగతనాల కన్నా వేరే మంచి వృత్తులు ఉంటాయని గ్రహించి, స్థానిక జంతు ప్రదర్శన శాలలో ధృవ ప్రాంత ఎలుగుబంట్లకు మేత వేసే ఉద్యోగం సంపాదించాడు. అప్పుడప్పుడు వాటికి తను నేరాలు చేస్తున్నపుడు జరిగిన విషయాలు చెప్పేవాడు.
దొంగతనాలు చేయడం కన్నా, చిన్న ఉద్యోగమే మేలు అనుకున్నాడు, కష్టమైనా.

January 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us