మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

మా పల్లె

by K. Krupa May 29, 2025
written by K. Krupa

మా పల్లె
మాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం
పొద్దు పొద్దున్నే
సుప్రభాతాల చప్పుడుకు లేచే సూర్యుడు
పిల్లల దాగుడుమూతలాటకు
సహకరించే చంద్రుడు

ఎటు చూసినా
పచ్చని పంటపొలాలు
ఏ ఇంట్లో చూసినా
పసందైన పిండి వంటలు

కోడి కూత వినగానే
రేగుపండ్ల కోసం పిల్లలు పరుగులు తీస్తారు
రైతులు పంటపొలాలకెళతారు

కోయిలమ్మ కూతలు
పచ్చని ఆకుల మధ్య విరబూసే పువ్వులు
ఎంత బాధనైనా తీర్చేస్తాయి
అందరి ముఖాల్లో నవ్వులు చిందించడానికి
రైతు చెమట చుక్కలు చిందిస్తాడు

కల్మషం లేకుండా
అందరినీ పలకరించే ప్రజలు
సరదాగా సంతోషంగా గడిపే జీవితాలు
చిన్న కష్టం వచ్చినా
నేనున్నా అని చెప్పే పెద్ద వాళ్ళ మాటలు

అందాలు చూడడానికి పట్టణం వాళ్ళు
ఎక్కడికో వెళ్తారు కదా!
ఒకసారి మా పల్లెటూరికి వచ్చి చూడండి
కమ్మనైన మా పల్లె
అందమైన మా సిరిమల్లె

May 29, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రక్తదానం

by Maji Bharathi May 29, 2025
written by Maji Bharathi

దానములన్నిటికన్న రక్తదానం మిన్న. ఎందుకంటే రక్తదానం వలన ఒక నిండుప్రాణం కాపాడవచ్చు. అట్లాగే అవయవ దానం నుండి కూడా. మిగిలిన ఏ దానములలోనైనా, ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశముండదు. అందుకని అన్ని దానములలో కన్నా ఈ రెండు దానములే శ్రేష్టం. ఈరోజు మనం రక్తదానం గురించి తెలుసుకుందాం.

అసలు రక్తం దేనితో తయారవుతుంది. ఇది ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అనే వాటి కలయికతో కూడి ఉంటుంది. ఎర్ర రక్తకణాలు శరీరావయవాలకు కావాల్సిన ప్రాణవాయువును అందిస్తే, తెల్ల రక్తకణాలు రోగ నిరోధకతను పెంపొందిస్తే, ప్లేట్ లెట్స్ రక్తాన్ని గడ్డ కట్టించి, రక్తస్రావం జరగకుండా కాపాడుతాయి. రక్త కణాలు ఎముక మూలుగు లేక మజ్జ (Bone marrow) నుండి తయారవుతాయి. ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులైతే, తెల్ల రక్తకణాలు- వాటి రకాన్ని బట్టి జీవితకాలం మారుతుంది. జీవితకాలం దాటిన రక్తకణాలు నాశనమై, కొత్త రక్తకణాలు రక్తంలో చేరుతుంటాయి.

ఏదైనా కారణము వలన శరీరంలో రక్తస్రావమైనా (ఉదాహరణకు స్త్రీలలో వచ్చే నెలసరి, ప్రసవము, పెద్ద ప్రేవుల క్యాన్సర్, కొన్ని రకాలైన నులిపురుగులు… మొదలగు సందర్భాలలో జరిగే రక్తస్రావము), శరీరంలోని రక్త పరిమాణం (5L) తగ్గకుండా శరీరం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్లాస్మా పరిమాణం తగ్గకుండా, కణాల నుండి నీరు రక్తంలో చేరుతుంది. అలాగే బోన్ మేరో ఎక్కువ పనిచేసి రక్తకణాలను అందిస్తుంది. ఆ రకంగా, రక్తం ద్వారా అవయవాలకు అందే ప్రాణవాయువు పరిమాణం తగ్గకుండా జాగ్రత్తపడుతుంది శరీరం. దీనికి కొంత సమయం పడుతుంది.

కాని కొన్ని సందర్భాలలో (రోడ్డు ప్రమాదాలు,శస్త్ర చికిత్సల్లో మరియు ప్రసవ సమయాల్లో కాంప్లికేషన్స్ తలెత్తితే), రక్త పరిమాణము పెంచే సమయం శరీరానికి తగినంత లేకుంటే, రోగి షాక్ లోకి వెళ్లి మరణించే అవకాశాలెక్కువ. అటువంటి సందర్భాలలో, రక్తమార్పిడి రోగి ప్రాణాలను కాపాడుతుంది. అలాగే రక్తకణాలు తొందరగా విచ్ఛిన్నమయ్యే తలసీమియా, హిమోఫిలిక్ రోగుల్లో, రక్త కణాలు సరిగ్గా తయారవ్వని ఎప్లాస్టిక్ ఎనీమియా రోగుల్లో మాటిమాటికీ రక్తాన్ని ఎక్కించవలసి ఉంటుంది.

అయితే ఈ రక్తదానం చెయ్యడానికి అర్హులెవరంటే… 18- 65 సంవత్సరాల మధ్య ఉన్న ఆరోగ్యవంతులైన స్త్రీ పురుషులు. హిమోగ్లోబిన్ శాతం స్త్రీలకు 12.5%, పురుషులకు 13% తగ్గకుండా వుండాలి. వారికి ఏ విధమైన వ్యాధులు ఉండకూడదు. (ముఖ్యంగా హెచ్ఐవి, హెచ్.బి.వి, హెచ్.సి.వి. మరియు కొన్ని రకాలైన సుఖ వ్యాధులు). దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, క్యాన్సర్ రోగులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 45 కేజీల కన్నా తక్కువ బరువు ఉన్నవారు, రక్తదానము చేయడానికి అనర్హులు. రక్తదానానికి, రక్తదానానికి మధ్య కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలి.

రక్తదాత నుండి 300 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి, హెచ్ఐవి, హెచ్.బి.వి, హెచ్.సి.వి. మరియు సిఫిలిస్ వ్యాధులు లేవని నిర్ధారించుకున్నాక, ఆ రక్తాన్ని బ్లడ్ బ్యాంకులో అలాగే (Whole blood), 4°C వద్ద ఏడు వారాల వరకు నిల్వ ఉంచవచ్చు. లేనిపక్షంలో ఆ రక్తాన్ని, ప్యాకెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ (ఏడు రోజుల వరకు), ప్లాస్మా (ఫ్రేజెన్ ప్లాస్మా: -20°C వద్ద కొన్ని సంవత్సరాలు)… యిలా వేరు చేసి దాయవచ్చు. రక్తహీనత ఉన్నవారికి ప్యాకెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నవారికి (ఉదాహరణకు డెంగ్యూ జ్వరం) వాటిని, ఆటోయిమ్యూన్ డిసీజ్ ఉన్నవారికి ప్లాస్మాను అందిస్తారు. రక్తాన్ని సంగ్రహించాక మాత్రమే పరీక్షలు చేస్తారు. ఒకవేళ పరీక్షల్లో ఏ వ్యాధి అయినా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆ రక్తాన్ని ఉపయోగించరు.

రక్త మార్పిడి చేసేముందు, రోగికి ఆ రక్తం సరిపోతుందా లేదా అనేది బ్లడ్ గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్ అనే పరీక్షలు చేసి నిర్ధారించుకుంటారు వైద్యులు. O, A, B, AB అనే నాలుగు రకాల రక్త గ్రూపులు, వాటిలో Rh పాజిటివ్, నెగిటివ్ అని రెండు రకాలు ఉంటాయి. “O నెగిటివ్” రక్తాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. వారిని “యూనివర్సల్ డోనార్స్” అంటారు. “AB పాజిటివ్” వ్యక్తులకు ఎవరి రక్తాన్నైనా ఇవ్వవచ్చు. వారిని “యూనివర్సల్ రెసిపియంట్స్” అంటారు.

రక్తదానం చేసిన వారికి ఏ రకమైన ఇబ్బందీ, తలెత్తదు. ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకున్నాక, మామూలుగా విధులు నిర్వర్తించుకోవచ్చు. ముందే చెప్పుకున్న ప్రకారం, దానం చేసిన రక్తాన్ని దాత శరీరం కొద్ది కాలంలోనే సమకూర్చుకుంటుంది.

ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నా, ఎప్పటికప్పుడు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహించి, రక్తాన్ని సేకరించి, అవసరమైన వారికి అందిస్తూ, మానవ సేవను చేస్తున్నారు. వారితో పాటు మనం కూడా ఆ సేవలో పాల్గొందాం రండి.

May 29, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సంబురం …?

by Madhu Jella May 29, 2025
written by Madhu Jella

పెళపెళలాడుతూ…
కొత్తనోటు
కళకళలాడుతున్న
కొత్తపెళ్ళి కూతురిలా

విచ్చిన కలువల్లా
విప్పార్చి చూసాయి
అబ్బురంగా
రెండుకళ్ళు
ఎన్నడూ చూసెరగనట్లు

చేతివేళ్ళు
పులకించిపోయాయి
కొత్తనోటు స్పర్శ
కొత్త అనుభూతిని
వింతగా అందిస్తూంటే

రంగురంగల
కొత్తనోట్లు…
తడిమి తడిమి చూసుకుంటుంటే
హరివిల్లు
చేతికొచ్చినట్లుంది

కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు
కొంటెగ
గెంతులేస్తుంది
మనస్సు

చొక్కా జేబు….
నోరెళ్ళబెట్టి చూస్తోంది
ఎప్పటికైనా…
కొత్తనోట్లన్నీ తన అరలో
హాయిగా నిద్దరోతాయని
దానికి
గర్వం

తనువంతా
వేయేనుగుల బలం
ఆవహించినట్లు
పుంజుకొని
నిటారుగా తలెత్తుతుంది

అంతలోనే…
అవసరాలు..ఆశలు
రంకెలు వేస్తూంటే

గుండెలయ తప్పుతోంది
గతుకుల రోడ్డులో
ఆగాగి వెళుతున్న మరబండిలా

కళ్ళు మసకబారుతున్నాయి
పున్నమి రాత్రి
గ్రహణం పట్టినట్లు

కాళ్ళు..చేతులు వణికిపోతున్నాయి
ఏదో భయంకర దృశ్యాన్ని
అతిదగ్గర నుండి చూసినట్లు
ఏదో పాపం చేసినట్లు
ఏదో వినకూడనిది
విన్నట్లు

తనువు పట్టుదప్పుతోంది
ఓడే జట్టులో విశ్వాసం
సన్నగిల్లుతున్నట్లు
నీరసంగా నిట్టూరుస్తోంది

క్షణాలు గడవకముందే…
సంబురమంతా
కంచికి చేరింది

కొత్తనోట్లు
దారం తెగిన పతంగాల్లా..

రెక్కలొచ్చి
గూడునొదిలిన
విహంగాల్లా…
సంతలనట్టడవిలో
ఎక్కడకో
ఎగిరిపోతున్నాయి
ఎక్కడా.. నిలువలేక

జేబు
బిక్కమొహంతో
బేలగా
అలా చూస్తుండిపోయింది

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఉపయోగపడిన విద్య

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, May 29, 2025
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

నరసింహపురంలోని శరభయ్య మిక్కిలి ధనవంతుడు . అదే గ్రామంలో కాంతయ్య అను ఒక బలశాలి ఉండేవాడు. అతడు చక్కని కండల పుష్టితో ఉన్నవాడు. అంతేగాకుండా అతడు మల్లయుద్ద విద్యను కూడా నేర్చుకున్నాడు. ఒకసారి అతడిని చూసిన శరభయ్య అతనితో" ఈ మల్లయుద్ద విద్య నేర్చుకోవడం ఎందుకు? శుద్ధ దండగ. వ్యర్థంగా ఈ కండలు పెంచడం నాకైతే నచ్చలేదు ? "అని అన్నాడు. అది విని కాంతయ్య ఏమీ మాట్లాడలేదు . ఒకసారి శరభయ్యకు అత్యవసరంగా పొరుగూరు వెళ్లవలసిన అవసరం కలిగింది. అతడు తన వెంబడి చాలా డబ్బును తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు. అతడు ఆ పొరుగూరికి వెళ్లాలంటే అడవి మార్గం గుండానే నడచి వెళ్లాలి . అక్కడ ఖచ్చితంగా దొంగలు ఉంటారనీ, అందువల్ల ఒంటరిగా పోరాదని ఆ గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. కానీ శరభయ్యకు ఇప్పుడు తోడు ఎవరూ లేరు. దేవునిపై భారం వేసిన శరభయ్య పొరుగూరుకు తన డబ్బు మూటగట్టుకొని ఒంటరిగా తన నడకను కొనసాగించాడు. కొద్ది దూరం పోగానే అతనికి తన ముందు వెళ్లుతున్న కాంతయ్య కలిశాడు . వెంటనే శరభయ్య కు ఒక ఉపాయం తోచింది. అతడు కాంతయ్యను కుశల ప్రశ్నలు వేసి తాను చాలా పిరికి వాడిననీ, తన డబ్బును ఒకవేళ దొంగలు అడ్డుకుంటే వారి బారి నుండి దానిని కాపాడమని అతడు వేడుకున్నాడు. కాంతయ్య సరేనని ఆ డబ్బును తీసుకొని తన వద్ద పెట్టుకున్నాడు. కొద్ది దూరం పోగానే శరభయ్య ఊహించినట్లుగానే దొంగలు శరభయ్యను అటకాయించారు. శరభయ్య తన వద్ద ఏమీ లేదని తెలిపాడు. అయినా దొంగలు అతనిని సోదా చేశారు. వారికి అతని వద్ద ఏమీ దొరకలేదు. తర్వాత వారు శరభయ్య ను వదిలిపెట్టి కాంతయ్య వద్దకు వెళ్లారు. అతనిని తన వద్ద ఉన్న డబ్బు అంతా ఇమ్మని బెదిరించారు. కాంతయ్య బలశాలి మాత్రమే కాకుండా మల్లయుద్ద వీరుడు కూడా కాబట్టి వారి పైన దాడి చేశాడు. అతని దెబ్బల బలానికి వారు భయపడి పారిపోయారు. ఆ తర్వాత శరభయ్య కాంతయ్యతో " నిన్ను గతంలో ఈ కండలు పెంచడం ఎందుకు? శుద్ద దండగని దెప్పిపొడిచాను. అందుకు నన్ను క్షమించు. వాటి అవసరం ఇప్పుడు నాకు తెలియవచ్చింది. నా డబ్బును నీ భుజ బలంతో కాపాడావు. నీ మేలు మరచిపోలేను. నీ ప్రాణాలకు త్యజించి వారితో పోట్లాడి నా డబ్బును కాపాడావు. నీకు ప్రతిఫలం గా ఈ వెయ్యి రూపాయలు ఇస్తున్నాను తీసుకో!" అని అన్నాడు. అప్పుడు కాంతయ్య ” చూడు మిత్రమా! నాకు నీ డబ్బు వద్దు. సాటి మనిషికి సాయం చేయడంలోనే ఎంతో ఆనందం ఉంది. నా విద్య ఇక్కడ ఉపయోగపడింది. నీవే కాకుండా మరికొందరు కూడా ఈ కండలు పెంచడం ఎందుకు అని నన్ను దెప్పిపొడిచారు. అది ఆత్మరక్షణకే కాకుండా నీలాంటి వారికి సాయపడుతుందని వారికి తెలియదు. నీ మీద నాకేం కోపం లేదు. ఏ విద్యనైనా నేర్చుకుంటే అది మన అవసరానికి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. నేను మనను కాపాడుకునెందుకే వారి పై దాడి చేశాను తప్ప నాకు వారిపై కూడా ఎలాంటి కోపం లేదు” అని అన్నాడు . అప్పుడు శరభయ్య ” నీవు నేర్చుకున్న విద్య ఆత్మ రక్షణకే అనుకున్నాను . కానీ ఇలా నాలాంటి వారికి సాయపడుతుందని కూడా నేను ఎన్నడూ అనుకోలేదు ” అని అన్నాడు . శరభయ్య అతనికి ధన్యవాదాలు తెలిపి తన డబ్బును తీసుకొని వెళ్లి పోయాడు.

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నీవేనట…..!

by Teegala Likhita May 29, 2025
written by Teegala Likhita

ఓ జననీ!
ఈ సృష్టికి మూలం నీవే,
ఈ పుట్టుక కి కారణం నీవే,
కర్తవు నీవే,
కర్మవు నీవే,
తొమిది నెలలు మోసి జన్మ ని ఇచ్చే అమ్మ వి నీవే,
చేయిపట్టుకుని నడిపించే తల్లివి
తప్పటడుగులు వేస్తే మంచి దారిలో నడిపించే మార్గం నీవే,

బడి చదువు ల పాఠాలు నేర్పితే
ప్రపంచాన్ని చూపించి జీవిత
పాఠాలను నేర్పించే గురువు వి నీవే,
ఓర్పులో అవని వీ నీవే,
విద్య లో వాణి వీ నీవే,
బాణివీ నీవే …

సహనం లో రుద్రునివి నీవే,
శక్తివీ నీవే
అక్కవీ నీవే ,చెల్లి వీ నీవే,తల్లి వీ నీవే,
బతుకుకో అర్థం చెప్పే చెలివీ నీవే నెచ్చెలి వీ నీవే…

అన్నీ  నీవే!
నీవు లేకుంటే సాగుతుందా ఈ ప్రపంచం ,
నీవు లేకుంటే ఉండేదా ఈ సృష్టి  
నీవే లేకుంటే ఉండేవా ఈ మనుషులు బంధాలు …
నీవే గా కష్టాల కడలి లో తోడు ఉండి నడిపించే చుక్కాని వి ,
నీవే గా  కనులు తెరిచిన తరుణం నుండి కనులు మూసే వరకు
బంధాల కోసం,బాధ్యత ల కోసం, కుటుంబం కోసం,
శ్రమిస్తావు
అనుక్షణం ఆరాటమవుతావు
ప్రపంచం తో పోరాడే యోధురాలివీ అవుతావు!

నీవే గా శత్రువులకి కాళి మాత వి ,
నీవే గా ఆకలికి అన్నమయ్యే అన్నపూర్ణా దేవి వి
నీవే గా చదువు నీ నేర్పంచి చక్కగ చేసే సరస్వతి వి,
నీవే గా ప్రతి ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీ దేవి వి….

కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ
అన్నిటిలో నీవే నట – ఈ సమస్తం నీవేనట
నీవేనట …
నీవే ఈ జనం గుర్తించని స్త్రీ మూర్తి వి!
నీవేగా ఈ లోకం గుర్తించలేని జగజ్జనని వి !!

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

విలువ

by Sushma Merugu May 29, 2025
written by Sushma Merugu

గీసందెందుకొ మాయింటి మీద జీవ్వడ్డది…
“మస్తు రొజులైతుంది ఒకపారి ఒచ్చిపొ అవ్వ’… అని మా అమ్మ….
ఇల్లంత శీకటి శీకటి ఐతుంది … ఎప్పుడొస్తవవ్వా … మా బాపు…
యేమన్నగాని… గీసారి ఇంటిక్వోవాలని తీర్కజెస్కొన్మరి వొయ్న.
గూటిక్వోతనన్న ముర్పెంల నిద్ర గూడవట్టలే సక్కగ…
ఎప్పట్లెక్కనే పొద్దుగల్లనే లేష్నా…. గిన్ని పాలబోట్లు దాగి బైలెల్లిన.
ఎర్రబసెక్కుడే ఎర్కలేదు మా బాపే తోల్కపోతుండే.. బండి మీద..
యేం శితం జనం….
ఉష్కెవోస్త రాల్నంత మంది..!!! యిండ్లల్ల ఓల్లుంటలేరా అన్పిచ్చింది….
గప్పట్ల చర్చికి వోయ్నప్పుడు జూష్నది యాదికోచ్చింది.
‌‌గీ ఫ్రీ బస్సు పుణ్యమేందో గానీ… ” స్త్రీలను గౌరవించాలి ” అన్నమాటకే కర్వైపోయింది…

యెట్లనో గట్ల తిప్పల్వడి మా పల్లెకు జెర్కున్న…. అమ్మయ్య…!!! పానమేంత నిమ్మలమైందో…
అచ్ఛేటప్పట్సంది బస్సు దిగకముందె మా బాపు ఫోన్ల మీద ఫోన్లు జేస్తుండు…. నేనెక్కిచ్కస్తనవ్వా….. ఏం నడుస్తవని…! నేన్జెప్పలే ఇగ,… మస్తు రొజులైంది గట్ల గట్ల శేన్లల్లకెంచి సూస్కుంటొద్దామని ఇక్మత్ జేశ్న…!
……గిది మావూరేనా….!!? పక్కూర్ల దిగిన్న…?!!
గిదేందీ గిట్లుంది…
బండి దిగంగనె శెట్లన్నీ ఆర్తిచ్చినట్లన్పిచ్చు….గిడ కాన్గ శెట్లు, బూర్గుబుడ్ల శెట్లు ఉంటుండే… ఎవ్వి గన్పిస్తలే… కొట్టేశ్నట్టున్రు…. గప్పట్ల ఉస్కుల్కెంచి ఒస్తుంటే గా బూర్గు బుడ్డెలు ఎర్కోని మంచిగ ఎండవెట్టి , ఎల్దుర్తి ల లచ్చింపతి దుకాన్ల అమ్ముతుంటిమి…. షేటాక్కు ఐదు రూపాలిస్తుండే… గవ్వే గల్లగుర్గిలల్ల ఎస్కోని పైసల్ జమాజేసుకుంటుట్టిమి.
…..మస్తెండ గొడుతుంది..బాపుకు జెప్పిన అయిపోవు అన్పిచ్చింది.
“నిండ మున్గినంక సలేంది’…. ఓచ్చిన ఒడ్షిపోయింది.. గీయింత దూరం నడ్వలేనా…
శిన్నగున్నప్పుడు నాకంటె బర్వుండే బ్యాగేస్కొని ఇస్కుల్కు గింత కంటె ఎక్వ దూరమే నడ్షి పోతుంటిమి గిదెంత…!!
గొర్ల కొట్టాలు దాటంగనె….మా మామొల్ల పొలము…,ఆడనే కోల్ల పారముంటుందే మాడి శెట్టుంటుండే….,
పారముంది గని మాడి శెట్టు లేదు.. అయ్య!!..గది గూడ కొట్టేశిన్రా….!!?
మాడితొక్కు ఎట్ల పెట్కుంటున్నరో యెమొమరి.. పిఠాన పిరమునయీడ్కె బైట!!
ఒక్క పిట్ట కానోస్తలే.. కాకులు గూడ లేవు… గూల్లల్ల వన్నయేమో తియ్ ఎండమస్తు కొడ్తుంది…
కుస్తోల్లిండ్లల్లకచ్చిన…. మా తాతోలిల్లొచ్చింది గాళ్లనట్కాంచి మా ఆడకట్టుకు జెర్కున్న ఇగ….
మా శిన్నమ్మ… మయింటిపొంటి అత్తమ్మ అందర్గుసోని బీడీలు జేస్తుండ్రు…
“గిప్పుడే ఆస్తున్నవా… ఎట్లున్నవు.. ” యేమమ్మ గట్ల ఒట్టిశాపోలయినవు… కూడు సక్కగ తింటలేవా’…?? అనుకుంట అడిగిన్రు .. ఇంకిత సేపుంటే మల్లేడ లగ్గం గిగ్గం అనంటరేమొనని జెల్ది ఇంట్లక్వొయ్న!!!!
” మావ్వ రానే ఓచ్చింది… మావ్వ మావ్వ…!!! ఎండలోచ్చినవు…. షెప్పొద్దావ్వా….?!!నేనస్తుంటి గదా….
“ఓచ్చిన గదనే…! నాక్మనూరు దెల్వకనా…
యేమ్మా …?!! అనిగ మామ్మను మా బాపు ను మస్తుగ్గగాలిచ్చకున్న…
యెప్పుడెల్లినవో… బుక్కేడు మెత్కులు ఎస్కున్నవొ లేదో… నీకిష్టమని పప్షార్వెట్టిన ‘
ఇగ ఇంట్లక్వోయి కాల్జెతులు గడ్కొని పప్షార్తొటి ఇన్ని మెత్కులల్లిన…
తిని గట్ల ఒర్గిన .. గప్పుడే నా సప్పుడిని మా పెద్దమ్మొచ్చింది… మా పెద్దయ్యకు… పెద్దమ్మకు..మస్తిష్టం నెను… పానం జేస్తరు నన్ను…
ఇగ సాయింత్రం ఆలు కల్లు తెచ్చుకుండ్రు తాగుతున్నరు సీరియల్ జూస్కుంటా…
“మా పెద్దమ్మంటుంది..
“గిప్పుడు గింత షానిగున్నవు గని.. నువ్వు శిన్నగన్నప్పుడు కప్పను పట్కొని పిస్కుతుంటివి.. బాపులతోనే కల్దుకాన్లకు పోతుంటివి..బజ్జీలు ఇప్పిచ్చేదాకా ఊకుంటుట్వ బిడ్డా….. ఆన్కుంట నౌతుండ్రు….!!

అంబటాళ్లకు లేష్న… మంచిగ… అమ్మగూడ లేపలే…
లేవంగనే బంగ్లమీద్కి వోయి తిర్గుకుంట పండ్లు తోముకుంటున్న …
మెట్లెక్కంగనే… సక్కగ సూస్తే.. మా మల్లన్న గుట్ట కన్పిస్తది… పక్కకే శేన్లు ఉంటయి…
మంచిగ పిట్టల సప్పుడ్కే లేస్తుండే…. గిప్పుడు ఒక్క పిట్టె కానొస్తలే…
బాపు పొలం కాడికి పొయ్యోస్తా అన్నడు…
నెంగూడ ఒస్తానే బాపు‌ అని పొయ్న…
మా బాయికాడికి పోతుంటే రెండు కొబ్బరిశెట్లుంటుండే ఒక్కొపారి గా బొండాలు కొట్కొని పోతుంటిమి… గాడా బీడుంటుండే గిప్పుడాడా నాట్లేశిన్రు…
మా బాయి పక్కకే మా శేను..మాది పొత్తుల బూమి…. మాగమామసకు ఒంటలక్వోతుంటిమి ఆడ్కే …
మాబర్రెలు గట్టేశే కాన్గ
శెట్టుకుయ్యాల కట్కున్నము…అదింక గట్లనే ఉంది….
మా శేన్లల్లకు పోతుంటే మస్తు శెట్లుంటుండే… గవన్నీ లేనేలేవ్…
గప్పట్ల పొలం కాడికి పోవాల్నంటె‌…మస్తు బుగులైతుండే …పాములు…ముంగీసలు పారం కాడ
కుక్కలుంటుండే… మస్తు పిట్టెలుంటుండే
యేమన్న ఒరిల శిన్న పుర్గు పుట్రున్నా గవ్వే తింటుండే…
గిప్పుడట్ల లేనట్లుంది… …గప్పుడే మా బాపొచ్చిండు…
” యేముందవ్వ మా నాయ్ననలందరున్నప్డే మంచిగుండే…
ఎవుసం నమ్ముకుంటే ఎమస్తుందని.. గందుకే అందర్వోయిండ్రు…
మనమే ఐదిండ్లోల్లమ్ మిగ్లినం…
ఔమరి…. గప్పుడే మంచిగుంటుండే…
మంచిగ సేంద్రియ ఎర్వులెస్కొని పండించుకున్నోళ్లే మంచిగుండే.. పంట మంచిగొస్తుండే…. గిప్పుడన్ని… గా మందు సంచులేనాయే…. ఏమేమో స్ప్రే లు కొట్టవట్టే…..దాన్కి తోడు గీ ఫైజీ నెట్వర్కులంట… అవ్విటి రెడియేషనూ… పిట్టెల పాణం దీశే… ఇగ పంటేడిది పక్కులేడియి…
” రాన్రానూ రాజు గుర్రం గాడ్దైదట ‘ మనం యేమ్ గావాల్నొ మర్శి యెంత ఇల్వైనయి పొడగొట్కుంటున్నమో మనకెర్కైతలే… మనముంగటోల్లు మనకెంత మంచిగ ఆరసత్వపు సొత్తుంచిండ్రో… మనమూ మన తర్వాత తరాన్కుంచుడు మరుస్తున్నం.
ఎంతకైనా ఓల్డ్ ఇస్ గోల్ద్ అన్నట్లు… గప్పుడే మంచిగుంటుండే…!!!

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni May 29, 2025
written by Narendra Sandineni

నాంపల్లి సుజాత మచ్చిక…! కవిత
ప్రముఖ కవయిత్రి,నాంపల్లి సుజాత కలం నుండి జాలువారిన హోమ్ మేకర్ కవితా సంపుటిలోని “మచ్చిక…! కవిత పై విశ్లేషణా వ్యాసం.మచ్చిక కవితను ఆసక్తితో చదివాను.నాకు చాలా నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.కుక్కను విశ్వాసం గల జంతువు అంటారు.పల్లెల్లో ప్రతి ఇంట కుక్క ఉంటుంది.ఊర కుక్క పిల్లలు పెడితే ప్రేమగా చూడడం తెచ్చి పెంచుకునే సంస్కారం,ఆనాటి పల్లె వాసుల్లో ఉండేది.ఇప్పుడు ఆ సంస్కారం తగ్గిందేమో అనిపిస్తుంది.పల్లెలోని జనాలు వాళ్ళు అన్నం తినేటప్పుడు ఓ ముద్ద కుక్కకు పెడతారు.కుక్కను కాలభైరవుడు,పరమేశ్వరునిగా భావిస్తారు.కాలం మారింది.ఇప్పుడు పట్టణాల్లో ప్రతి ఇంట తమ రక్షణ కోసం కుక్కను పెంచుతున్నారు.కుక్కను గొలుసు పెట్టి కట్టి ఉంచుతారు.కుక్కలు ఉన్న ఇంటికి వెళ్ళాలంటే ఎవ్వరైనా భయపడతారు.ఇంటి ముందు గేట్ పైన కుక్క ఉంది జాగ్రత్త,బివేర్ ఆఫ్ డాగ్ అని బోర్డ్ తగిలిస్తారు.కుక్క ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి రక్షణ కల్పిస్తుంది అని మనం చెప్ప వచ్చు. పోలీసులు దొంగలను,నేరస్థులను పట్టుకోవడానికి నేరం జరిగిన ప్రదేశానికి శునకంను తీసుకెళ్ళి వదులుతారు.శునకం వాసన చూసి నేరస్థులను పట్టగలదని నమ్మకం ఉంది.పోలీసులు రాత్రివేళలో నగరమంతా తిరుగుతూ పహారా కాయాలి. రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పహారా కాస్తూ ఆ నగరాన్ని కాపాడవలసిన బాధ్యత పోలీసులపై ఉంది.మారిన పరిస్థతులు పోలీసులు పహారా కాయడం లేదు.మనం విచారించాల్సిన విషయం.ఊర కుక్కలు రాత్రంతా మేల్కొని నగరంలో తిరుగుతూ వాడ వాడ తిరుగుతూ పహారా కాస్తూ నిర్విరామ సేవలు అందిస్తున్నాయి. కుక్కలు ఏ చిన్న అలికిడి అయిన బౌ బౌ మని మొరుగుతాయి.కుక్కల అరుపులకు దొంగలు పారి పోవాల్సిందే.నేరస్థుల పాలిట సింహా స్వప్నంలా కుక్క నిలుస్తుంది.అలాంటి కుక్కపై మచ్చిక పేరుతో చక్కని కవితను సుజాత మనకు అందించారు.ప్రతి ఒక్కరు ఆ మచ్చిక ఏమిటో దాని మతలబు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించేలా ఉంది.
“ఓ నాలుగు మిగిలిన/మెతుకులను విదిల్చి/ఇక నీ ప్రపంచమంతా/నా చెంతేనని శాసించడమే మచ్చిక…!/అని అంటున్నారు.కవయిత్రి సుజాత భావనలో ఎంతో నిజాయితీ ఉంది. ఇవ్వాళ లోకంలో కుక్కలు పెంచుతున్న తీరును నాలుగు వాక్యాల్లో భావగర్భితంగా తెలియ జేశారు.ఇక నీ ప్రపంచమంతా నా చెంతేనని శాసించడమే మచ్చిక అనే పదానికి అర్థం మరియు మచ్చిక లోని రహస్యాన్ని లోకానికి వెల్లడించారు.

“ఆది మానవుడి స్వార్థపూరిత పుర్రె లోంచి/ పుట్టుకొచ్చిన వ్యూహాత్మక కుట్రే అది…!/అనే దానిలో వాస్తవం దాగి ఉంది.ఆది మానవుడు తాను మనుగడ సాగించడానికి కొన్ని జంతువులను మచ్చిక చేసుకున్నాడు.అందులో కుక్క కూడా ఉంది.ఆది మానవుడు తన రక్షణ కోసం,తన బాగు కోసమే కుక్కను చేరదీశాడు.మచ్చిక చేసుకున్నాడు.ఆది మానవుడు అడవుల్లో తిరుగుతుంటే ఎన్నో క్రూర మృగాల నుండి రక్షణ కోసం కుక్కను పెంచుకున్నాడు.ఆది మానవుడు సంచార జీవితం గడిపే వాడు.ఆది మానవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి కుక్కలు కూడా వెళ్ళేవి.ఆది మానవుడికి కుక్కలు తోడుగా ఉండి కాపాడాయి అని మనం చిన్నతనంలో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం.
“బొచ్చు కుక్కకి అంగీ తొడిగి/సంబుర పడుతున్నాడు/ అహ…ఎంతటి దయార్ధ హృదయుడో/నరనరానా జీవ కారుణ్యం/ అనుకుంటాం… కానీ/ఆ మచ్చిక వెనుక ప్రయోజనం/ఎవరికి తెలియదని/షాంపూలు వ్యాక్సిన్స్ బొమ్మ బొమికలు/అతని పరిరక్షణ కోసమే…!/అని అంటున్నారు.మనకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.నిజంగా జరుగుతున్న విషయాన్ని కవయిత్రి సుజాత మనకు కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తున్నారు.మనమందరం అంగీకరించాల్సిన విషయం.
“కాలకృత్యాలు కాలెత్తడాలు/కనురెప్పల కదలికలు/దాని ఇచ్చానుసారమనుకునేరు/వాడి ఆదేశానుగుణంగానే/అని అంటున్నారు.కుక్కను తీసుకొని వెళ్లి దాని కాలకృత్యాలు తీర్చడం, కాలెత్తడాలు కనురెప్ప కదలికలు దాని ఇచ్చానుసారం కాదు.వాడి ఆదేశానుగుణంగానే కుక్క మెదులుతుందని తెలియజేస్తున్నారు.
“ముందస్తు శిక్షణే కాదు/మూతికి శిక్కం కూడా మన ప్రమేయమే…! అని కవయిత్రి తెలియ జేస్తున్నారు.
“అరిచి ఘీ పెట్టి గింజుకున్న…/కుక్క ఎంత అరిచి బౌ బౌ మని మొరిగిన గింజుకున్న … గొలుసుతో కట్టబడి ఉంటుంది.కుక్క గొలుసుతో బంధింపబడి ఉంది.గొలుసు కట్టు దాటి ఆవలి గట్టు బందు వర్గాన్ని ముట్టరాదు అనే వాస్తవాన్ని కవయిత్రి సుజాత మనకు తెలియజేస్తున్నారు.

“గీసిన గిరి దాటి/అర ఇంచు స్వేచ్ఛ ఉండదు/ బంధించి ఉంచిన కుక్కకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది. గీసిన గిరి ఎలా దాటుతుంది.అర ఇంచు స్వేచ్ఛ ఉండదు అనే నిజాన్ని కవయిత్రి సుజాత తెలియజేస్తున్నారు.
“ఒక్కసారి…/గొర్రెల మందలోనో,బర్రెల గుంపులోనో/
కలిసి జీవిస్తున్నట్టు/నిన్ను నీవు ఊహించుకో తేలిపోతుంది…!/అని అంటున్నారు.కుక్కను ఒక్కసారి గొర్రెల మందలోనో,బర్రెల గుంపులోనో, జీవిస్తున్న వాటికి స్వేచ్ఛ ఉంటుంది.గొర్రెల కాపరి, పశువుల కాపరి వాటిని చక్కగా మేపుతాడు. గొలుసుతో కట్టి వేయబడి ఉన్న కుక్కను నిన్ను నీవు ఊహించుకో తేలిపోతుంది.నీ స్వేచ్ఛ ఏమిటో నీకు తెలుస్తుంది అనే నిజాన్ని కవయిత్రి సుజాత చక్కగా తెలియజేశారు.
“మొదట వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళామా/ మనం తప్ప వాటికి గతి లేదా/ ఆలోచించండి…!?/ అని అంటున్నారు.మొదట వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళామా ఆది మానవుడి చరిత్ర చదివితే తెలుస్తుంది.మన రక్షణ కోసమే కుక్కను మచ్చిక చేసుకున్నాం.కుక్కకు మనం తప్ప వాటికి గతి లేదా? ఆలోచించండి అని కవయిత్రి సుజాత మనలో ఆలోచన తరంగాలను రేకెత్తిస్తున్నారు.మనకే కుక్క అవసరం ఉంది.మనమే కుక్కను పెంచుకుంటున్నాం.కుక్క లేకుంటే మనకే గతి లేదు అని తెలియజేయడానికి మనలను కవయిత్రి సుజాత వాటి లోకంలోకి వెళ్లి ఆలోచించమని తెలియజేస్తున్నారు.భావం చక్కగా ఉంది.
“విడ్డూరమంటే ఇదే/సాటి మనిషిని చీదరించుకుని/ వీటిని ఆదరించడం వెనుక అంతర్యం/ఎవరికి తెలియనిది../ ముమ్మాటికిది/ముదిరిన స్వార్థ చింతన…!/అని అంటున్నారు.విడ్డూరం అంటే అర్థం మూర్ఖం.మనిషిని మనిషిగా చూడలేని వాళ్ళు,సాటి మనిషిని ఆదరించని వాళ్ళు,మనుషులేనా అని ప్రశ్నిస్తున్నారు.కుక్కల్ని ఆదరించడం వెనుక ఆంతర్యం తెలియనిది కాదు.ముదిరిన స్వార్థ చింతన అని చక్కగా తెలియజేస్తున్నారు.కుక్కల్ని ఆదరించినట్లే సాటి మనుషులను కూడా ఆదరించాలి.కుక్కల్ని ప్రేమించినట్లే సాటి మనుషుల్ని కూడా ప్రేమించాలి అని సందేశాత్మకంగా మచ్చిక కవిత ద్వారా నాంపల్లి సుజాత తెలియజేశారు.కవయిత్రి సుజాతను అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు
విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రోడ్డు ప్రమాదాలు

by Dr. Nannapuraju Vijayasri May 29, 2025
written by Dr. Nannapuraju Vijayasri

ప్రతినిత్యం రహదారులు రక్తంతో ఓలలాడుతున్నాయిఅనేక దుర్ఘటనలలో 4.80మంది ప్రాణాలు కోల్పోయారు 4.62లక్షల మంది గాయాల పాలైనారు.రహదారి భద్రతపై ప్రభుత్వాలు అంతబాధ్యతారాహిత్యంగానే ఉన్నాయి. 4.62లక్షల మందిని గాయాల పాలుఅయ్యారు. 2022 తో పోలిస్తే మృతులు 2.6 క్షతగాత్రులు 4.4 %పెరుగుదల జరిగింది.మధ్యతరగతి వర్గాలకు చెందిన యువత నడివయస్కులే రోడ్లపై రక్త దాహానికి ఎక్కువగా గురవుతున్నారు.దానివలన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి.అతివేగానికి తోడు రోడ్ల నిర్మాణంలో లోపాలు లైసెన్సులజారీలో అక్రమాలు వాహన చోదకులబాధ్యతారాహిత్యం భద్రతాప్రమాణాల అమలులో నిర్లక్ష్యం తదితరాలతో రహదారులపై నిత్యం నెత్తుటేల్లుపారుతున్నాయి.
ఈ మధ్యకాలంలో అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలుఏయిర్ బెలూన్ వంటిసౌకర్యాలుఅందుబాటులోకి వచ్చాయి.అయినా ప్రమాదాల్లో మృత్యువు పాలు అవుతున్నారు.మనదేశంలో జాతీయ రహదారులు2% అయినామరణాల్లో అధిక వాటా వాటిదే.ఇతర దేశాల్లో సైకిళ్ళుమోటార్ వాహనాలు పాదాచారులకువేరు వేరు మార్గాలున్నాయి.రోడ్ల నిర్మాణంలో మేలిమిప్రమాణాలుపాటించడం ట్రాఫిక్ నిబంధనలుఅక్కడ అమలు చేయడం ఒక కారణం. మన రవాణ చూసినట్టు అయితే పుట్ పాత్ లపైనాద్విచక్ర వాహనాలు నడపడం ట్రాఫిక్ పోలీసులు చలానాల విషయంపైశ్రద్ధ వహించడం బ్లాక్ స్పాట్ల సరి చేతలు. డ్రైవర్లు పని వత్తిడితోమద్యం మత్తులో బండితోలడంతో రక్తం చిందినరహదారులు అవుతున్నాయి.

ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తే బాధితుల ఊపిరి నిలపవచ్చు. 108 పోను చేసి అంబులెన్సులు వచ్చేసరికిఆలస్యమై ఎందరో నిస్సహాయంగా ప్రాణాలు వదులుతున్నారు.రోడ్డు ప్రమాద బాధితుల అపన్న హస్తంఅందించడంపైప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలి.ట్రాఫిక్ ఉల్లంఘనపైతగు చర్యలు తీసుకోని బ్లాక్ స్పాట్లను తక్షణం సరిదిద్దాలి.డ్రైవింగ్ పాఠశాలలువిరివిగా ఏర్పాటు చేయాలి.
మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్నిఢీ కొట్టి కారుపై పడిన మృతదేహంతో 18 కీ.మీ.ప్రయాణించిన వైనంచక్కగా చదువుకొని వృద్ధిలోకి రావలసినచిన్నపిల్లలు సైతం తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం వల్ల వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు బలిగొంటున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడుతున్నారు.జాతీయ నేరగణాంకసంస్థలెక్కల ప్రకారం 2022 లో మద్యం డ్రగ్స్ మత్తులో వాహనాలు నడిపిన వారి కారణంగా దాదాపు మూడువేల ప్రాణ దీపాలు ఆరిపోయాయి ఆరు వేల మంది క్షతగాత్రులయ్యారు.హైదరాబాద్ లోని డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో లక్షల మందికి పైగా కేసులునమోదయ్యాయి. వారిని 5 వేల మందికి జైలుకు పంపారు. ఆ దండనకు ఏ మాత్రం వెరవనిచాలా మందిమళ్లీ మళ్లీ తప్పులుచేస్తున్నారు.ఢిల్లీలో ఒక స్వచ్ఛంద సంస్థ ముప్ఫై వేల మందివాహనదారులతో ఒక సర్వే చేస్తే తాగి బండ్లు నడిపినట్లు 81%ఒప్పుకున్నారు. బయటకు వెల్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు.జాతీయ రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో లిక్కర్ విక్రయాలను నిషేదించాలన్నసుప్రీం కోర్ట్ రోడ్లపైనరమేధం ఆగాలంటే తాగి బండి నడిపే ప్రతి ఒక్కరికి సరి అయిన శిక్షలు విధించాలి. మధ్యం మత్తులో అనేక మంది అమానుష నేరాలకు పాల్పడుతున్నారు. ఆరోగ్యాలను గుల్ల చేయడం సామాజిక అశాంతికి కారణమవుతున్న మద్యం తాగి వాహనం నడపడమే కారణమవుతుంది.
రహదారిపై మరణమృదంగంజాతి గుండెల విసేలా అనునిత్యం మార్మోగుతుంది.దేశవ్యాప్తంగా ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు 19 మంది మృత్యువాత పడుతున్నారు. క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదలతో తీవ్రతకళ్ళకు కట్టినట్టుకనబడుతుంది. మృతుల్లో 18-45 ఏళ్ళ మధ్య వారే 69%. వరకు వున్నారు.
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగమైన రహదారిభద్రతపై దృష్టి పెట్టి 2030 నాటికల్లారోడ్డు ప్రమాదాల్నిమృతుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సంకల్పించింది. 2030నాటికి రోడ్ల నిర్మాణం వేగ నియంత్రణ కచ్చితంగా నిబంధనలు అమలుకుప్రాధాన్యం వేగ నియంత్రణణుతగ్గించే ప్రయత్నంలో చైనాఅద్భుత ఫలితాలు సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకతగ్గితే అంతకుమించి భారతదేశంలో పెరిగి నిశ్చేష్ట పరుస్తోంది.వాహన వేగాన్ని 51%తగ్గించగలిగిన ప్రమాద మరణాలు 30% దాక నియంత్రించగల వీలుందని తెలిసినా ఎడెనమిదిసెకండ్లలోనేవందల కిలోమీటర్ల వేగంఅందుకనే శకటాలు రోడ్డు ఎక్కుతున్నాయి. ఎయిర్ బ్యాగ్ ల్ని తప్పక వాడాలి. అమెరికాలో 98% జర్మనీ 89% చైనా 65%భారతదేశంలో 12 నుండి 13 మాత్రం వాడుతున్నారు. రహా దారి భద్రంగాఉండాలంటే వచ్చే పది సంవత్సరాలలో 10,900కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని దాని వలన స్థూల దేశీయుత్పత్తి 3.7 %ఆర్థికంగా గిట్టుబాటు అవుతుందని ప్రపంచ బ్యాంక్ సూచిస్తుంది. రహాదారిపై మేట వేసిన నెత్తుటి సంక్షోభాన్నిరూపుమాపినపుడేసంక్షేమ రాజ్యా ప్రాణ ప్రతిష్టల భావన కలుగుతుంది.
2016లో దేశవ్యాప్తంగా రహదారులు రక్తదాహానికి 16 వేలమంది పాదాచారులు 2022లో 32 వేలకు పైగా బలి అయ్యారు. 90% పాదాచారులు గాయాలపాలు అయ్యారు అత్యధికులు పేద మధ్యతరగతి ప్రజలే ఆర్థిక ఇక్కట్లలోకి నెట్టేస్తున్నాయి 9వేల కి.మీ పైగా రహాదారులు విస్తరించి వుంటే 10% బాటలపైనే పుట్ పాత్ లు వున్నాయి. పుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు స్కై వాక్ లు ఏర్పాటు చేయాలి భద్రత అవగాహన చేయాలి రోడ్ల నాణ్యతనుమెరుగుపరచాలి

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తస్మాత్ జాగ్రత్త

by Kura Bhanuja May 29, 2025
written by Kura Bhanuja

యేండ్ల పోట్లాటలు
ఎరకలేని ఉన్మాదం
రేకెత్తుతున్నాయి మతజాడలు
ఏది మతం ఏది అభిమతం
ఎంచుకోవాలి మనమే
అన్నిమతాల సారమొక్కటే
మానవత్వమే మనిషితత్త్వం
మతచిచ్చులు మరవనిమచ్చలు

ఆవేశం ఆగ్రహం
అంతానికి సూచికలు
మా ఆలోచన ఆయుధమే కానీ
కాదు వెనుకబాటు
జనం మాకు సామాన్యం కాదు
అదే మా పౌరుషం

మా దేశతలం తలమానికం
కోల్పో నీచూపు
నుదుటిని వెలుగు చెరిపే నీ పైశాచికం
ఉగ్రవాదాన్ని ఉప్పుపాతరేసి
నింగిని తలచేలా నీ ఆయుధాల నిర్వీర్యం
నీకు తెలుసు మా యుక్తి
నీ తెలివి ప్రపంచాన లోకువయ్యింది
ఏదో చెల్లుబాటుకై నీ ప్రయత్నం
మా ధైర్యం
ఆపరేషన్ సింధూర్ గా
నీ నట్టింట్లో అడుగుపెట్టి
నీ ఉగ్రమూక
ఆనవాళ్ళను తొలగించిన తీరును
చూసావు కదా
నారీశక్తి నారీగళం ప్రపంచంముందు
ప్రచండమైంది

ఆసరాకై అగ్రరాజ్యాల పొత్తుచేరి
ఒప్పందం కూర్చుకుంటావు
మళ్లీ నీదైన
కుతంత్రపు బుద్ధితో
దొంగచాటుదాడులకు సైతం దిగుతావు
నీ కుతంత్రాలకివి
చెంపపెట్టు
ఉఫ్ ఉఫ్ అని ఊదితే నీ ఊసే ఉండదు

భారత నారి వీరనారి
ఒక్కో అడుగు వేల ఉదాహరణలు
తస్మాత్త్ జాగ్రత్త!

May 29, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ధీరలారా!ధీరులారా!శిరసాభివందనం.

by Padma Tripurari May 29, 2025
written by Padma Tripurari

మానవతకు పట్టిన
చీడ పురుగులను
ఏరవేసి
శాంతి వృక్షానికి నీరు పోసి
జ్వలన శిఖలై ఎగిసిన ధీరలారా!
ధీరులారా!
వందనం.
శిరసాభివందనం.

ప్రాణభీతిని
తరిమికొట్టి
ప్రాణప్రీతిని
వదిలిపెట్టి
మాతృభూమికి
ప్రాణమిచ్చెడి
శూర లారా!
శూరులారా!
వందనం
.శిరసాభివందనం.

రక్తబంధము కన్న ఎన్న
భరతమాత సేవ మిన్న
అన్న మాటనె
హృదిని నిలిపి
సమరమందున
ఎగసి దూకిన
విజయలారా!
విజయులారా!
వందనం.అభివందనం.

బంధు వర్గము
స్నేహ బంధము
మదిని మెదిలిన
మనసు దృఢము చేసి
దేశ సేవకు
కదం తొక్కిన
భారతావని ప్రియ బంధులారా!
భయమన్నదెరుగని
అభయులారా!
వందనం.శిరసాభివందనం.

ధైర్యమన్నది
మదిని నిండగ
పిడుగులాగా
హుంకరించిన
రణ యోధలారా!
సమర యోధులారా!
వందనం
.శిరసాభివందనం

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us