మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ధారావాహిక నవల

శుభ ముహూర్తం-1

by Maji Bharathi May 30, 2025
written by Maji Bharathi

మనం చిన్నప్పటినుండి విన్న కథలలో మొదటి కథ ఎప్పుడూ, అనగనగా ఒక రాజు… అంటూనే మొదలవుతుంది. అటు పౌరాణికమైనా, యిటు చారిత్రికమైనా రాజులు, రాణుల గురించిన కథలు మనల్నెప్పుడూ ఉర్రూతలూగిస్తూనే ఉంటాయి. మరలా మరలా చదవాలనిపించేలా ఆ పాత్రల ఔచిత్యాలుంటాయి. అలనాటి ఆ కథాగమనంలో భాగస్వాములమై, అటువంటి పాత్రల్లో ఊహించుకోవడం ఎవరికైనా తీయని అనుభూతినిచ్చేదే.
       అటువంటి కథలు మృగ్యమవుతున్న నేటి కాలంలో, ఒక కాల్పనిక చరిత్రను మన ముందుకు తెస్తున్నారు ప్రొఫెసర్ భారతి. నిండు గోదారిలా ఉరకలెత్తే కథాగమనంతో, చక్కని కథాశిల్పంతో, అబ్బురపరచే రచనా కావ్యంతో, కనుల ముందు కనిపించేలా అన్ని పాత్రలనూ ప్రతిసృష్టి చేసి, మనలను అలరించడానికి “శుభ ముహూర్తం” చూసుకుని మరీ, ధారావాహిక నవలగా మనకందించడానికి మన ముందుకు వస్తున్నారు. మరెందుకాలస్యం… ఆ “శుభముహూర్తం”లో, కళ్లకు కట్టినట్టు కనిపించబోయే రాజప్రసాదాలను అవలోకిస్తూ, మాధవీలత లల్లుకున్న వనాలలో విహరిస్తూ, యుద్ధతంత్రాలతో అచ్చెరువొందుతూ, మనకందించబోయే, అపురూపమైన ప్రేమకథా విందుకు మీకిదే మా ఆహ్వానం.
సంపాదకవర్గం, తరుణి

రచయిత్రి పరిచయం
ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతి గారు, మన తరుణి పాఠకులకు సుపరిచితులే. భారతీయం పేరుతో కాలమ్ నిర్వహించారు. “విధి నిర్వహణలో నా అనుభవాలు” అంటూ, వైద్యవృత్తిలోని తన అనుభవాలను, మైక్రోబయాలజిస్టుగా వ్యాధులు గురించిన వ్యాసాలను మనకందించారు. “ఆలోచనా తరంగాలు”, “వేకువ” అనే రెండు కథా సంపుటాలను వెలువరించి, మూడవ కథాసంపుటి “జీవనగానం”ను త్వరలో విడుదల చేయబోతున్నారు.
“కళింగ కథాజాడ”లో నాలుగు తరాల రచయితలలో వీరూ ఒకరు కావడం అభినందించదగ్గ విషయం. దగ్గరగా 80 పై చిలుకు కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఒక్క ఈనాడు ఆదివారం అనుబంధంలోనే ఎనిమిది కథలు ప్రచురింపబడ్డాయంటే, ఆమె కలానికున్న పదును తెలుస్తుంది.
వృత్తిపరంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ప్రవృత్తిపరంగా రచనా వ్యాసంగంలో ఉన్న, ప్రొఫెసర్ మజ్జి భారతిగారి కలం నుండి వెలువడుతున్న ధారావాహిక నవల “శుభ ముహూర్తం”, మన పాఠకుల కోసం…సంపాదకవర్గం తరుణి

మగధ దేశపు మహారాజు విక్రమసింహ మనసు గాలిలో తేలిపోతున్నది. కోరుకున్న కన్య, వలచి చేపట్టిన సుగుణాల రాశి, అందాల ప్రోవు విదర్భ దేశపు రాకుమారి ప్రమీలాదేవితో ఈరోజు తన జీవితం పండబోతుంది. ఎంత గంభీరంగా ఉందామనుకున్నా, విశాలమైన కళ్ళు వెలుగులను వెదజల్లుతున్నాయి. పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటున్నాయి. అసలే సమ్మోహనాకారం. దానికి తోడు మనసులోని ఆనందం మోముపై ప్రతిఫలించగా, మగవారి మనసులను కూడా కొల్లగొట్టేంత సమ్మోహనంగా కనిపిస్తున్నాడు విక్రమసింహ.

అది చూసి “మన్మధుడే స్వయంగా వచ్చి పూల బాణాలు వేసినా, మరులు గొనరని పేరు గాంచిన మీరు, ఈరోజు యిలా అయిపోయారేమిటి మహారాజా! పున్నమి చంద్రుడు నీ మోమును ఆవహించాడా ఏమి? ప్రేమానురాగాల వెన్నెల సోనలు కురిపిస్తున్నాయి మీ కళ్ళు. మహారాణి వారు ఏం మాయ చేశారో?” అని హాస్యం ఆడనే ఆడాడు చిన్ననాటి నుండి స్నేహితుడు, ప్రస్తుతం ఈ దేశ సర్వ సేనాధిపతి, అనంతుడు.

ఆ మాట గుర్తొచ్చి ఒళ్లంతా పులకాంకితం కాగా, రాకుమారి ప్రమీలాదేవితో సమాగమానికి మనసు ఉరకలు వేసింది. ఇన్నినాళ్ళ తన తపఃఫలం ఈరోజు ఫలించబోతుంది. ఈరోజు కోసం ఎంత వేచి చూశాడో! ఎంతమందిని చూసినా చలించని తన మనస్సు, రాకుమారి ఆలోచన రాగానే అలా అయిపోతుందేమిటి? పురుషుడ్ని… నాకే యిలా ఉంటే మరి రాకుమారి? ఆమె కూడా తన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారేమోనన్న ఆలోచన రాగానే, అంతఃపుర శయనమందిరం వైపు అడుగులు గబగబా పడ్డాయి. ప్రమీలాదేవిని చూడగానే మనసు ఆనందంతో ఉరకలేసింది.

పరిమళాలు వెదజల్లే పూమాలలతో అలంకరించిన అందమైన శయన మందిరంలో, విశాలమైన పాన్పుకు ఒక చివర, మేలి ముసుగులో, సిగ్గుతో తలదించుకొని రాకుమారి. పరాక్రమంలో పురుషులనెంత ఎదిరించినా, స్త్రీలకు సిగ్గే అలంకారమేమో! యుక్తవయసు వచ్చాక ఏ స్త్రీని ఇంత దగ్గరగా చూడాలని కూడా అనిపించని విక్రమసింహ మనసుకు, ఆమెను చూడగానే ఏమవుతుందో మరి? పరవశించిపోతుంది. ఇందుకేనా! మనిషి జీవితంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు మన పెద్దలు. ఇంకా జాగు చేసి రాకుమారి మనసు నొప్పించకూడదు. ఎప్పటినుండి ఎదురుచూస్తున్నారో, మా కోసం! ఈ ఆలోచన వచ్చిన తడవే, ఆమెను సమీపించి, “రాకుమారీ. ఈ శుభదినం కోసం మేము ఎన్నినాళ్ళ నుండి వేచి చూస్తున్నామో! యిన్నినాళ్ళకు మా కల ఫలించింది” అని ఆమె కరస్పర్శకు చేయి చాచాడు.

విక్రమసింహ కరస్పర్శ కాగానే, రవికిరణాలు సోకిన కలువలా, ఆమె ముడుచుకుపోయింది. సిగ్గుతోనేమో అనుకుని, “రాకుమారీ! అగ్నిసాక్షిగా మిము వివాహమాడిన వారము. మా దగ్గర మీకీ బిడియమేల! నేటి నుండి మనమిరువరమూ ఒకరమే. తనువులే వేరుగాని, హృదయమొక్కటే” లాలనగా ఆమె చుబుకాన్ని ఎత్తి మేలిముసుగు తీయబోయాడు. పర పురుషుని స్పర్శ తగిలిన దానిలా అడుగు వెనుకకు వేసి, మరింత తలదించుకుంది. అది గ్రహించుకునే స్థితిలో లేడు. ఆనందంతో మబ్బుల్లో విహరిస్తున్నాడు. అందుకే, ఊహించని ఆమె చర్యకు “రాకుమారి! మేము, మిమ్ము వలచిన విక్రమ సింహులం. మా దగ్గర మీరు స్వేచ్ఛగా ఉండవచ్చు” అని అనునయంగా చెప్పాడు.

“క్షమించాలి. మేము మిమ్ములను అలా తలచలేము. మా మనసు అన్యాక్రాంతం” హీనస్వరంతో చెప్పింది.

అప్పటికి ఈ లోకంలోకి వచ్చాడు. ఐనా, తాను వింటున్నది నిజమేనా! లేక పొరపడుతున్నాడా! మమ్ము వివాహం చేసుకొని, వారలా ఎందుకంటారు? ఎక్కడో పొరపాటు జరిగింది. “రాకుమారీ! మేము మగధ దేశాధీశులం. మిమ్ము అగ్నిసాక్షిగా వివాహమాడిన వారం. మా చెంత మీరు బిడియపడనవసరం లేదు” మరింత అనునయంగా చెప్పాడు.

“క్షమించాలి. మా మనసు అన్యాక్రాంతం” ఈసారీ నెమ్మదిగానే, ఐనా పొరపాటుకు ఆస్కారం లేని విధంగా, చాలా స్పష్టంగా చెప్పింది.

ఆ మాట వీనులకు సోకగానే, శరాఘాతం తగిలినట్లు, పాతాళానికి కృంగిపోతున్నట్టు అనిపించింది. అంతటి మహారాజూ ఆ క్షణంలో మామూలు మనిషైపోయాడు. గడియపాటు ఏమనాలో తోచలేదు. ఎన్నో యుద్ధాలలో అలవోకగా నెగ్గిన ఆ ప్రభువుకు, నిలదొక్కుకోవడానికి కొద్దిసేపు పట్టింది. తాను ఊహించినదేమిటి? ఇక్కడ జరుగుతున్నదేమిటి? ఇన్ని దినముల నుండి, క్షణాలు లెక్కపెట్టుకుంటూ, వేచి చూస్తున్నది, యిందుకొరకా? ఈ మాట వినడానికేనా తామిన్నాళ్లూ నిరీక్షించింది? తామొక్కరేనా, వారిని వలచినది? వారికి తమయందు అటువంటి అభిప్రాయం యెన్నడూ కలగలేదా? అటువంటప్పుడు వారు తమనెందుకు వివాహం చేసుకున్నారు? తమనెందుకు ఆశల పల్లకిలో విహరింప చేశారు?

రాకుమారి వైపు చూశాడు. తన ఆలోచనలతో సంబంధం లేనట్టు, ఎదురుగా శిల్పంలా… అంతే! తనదనుకున్న కన్య మనసు, వేరేవాళ్ల మీద లగ్నమై ఉందన్న విషయం గ్రహింపుకు రాగానే, ఆవేశం ముంచుకొచ్చింది. అంతవరకు కళకళలాడిన ముఖం, పొద్దు గ్రుంకుతున్న సూర్యునిలా ఎర్రబారింది. కళ్ళల్లో రక్తమే పొంగి వస్తున్నట్టు… కళ్ళు మరింత విశాలమయ్యాయి. నాసికాపుటాలు అదురుతున్నాయి. వీటితో తనకేమీ సంబంధం లేనట్టు రాకుమారి, శిల్పంలా అలాగే నిలుచున్నారు.

“మరి మమ్ము ఎలా వివాహం చేసుకున్నారు?” కోపంతో ప్రశ్నించాడు విక్రమసింహ.

“మేము చేసుకోలేదు. మీరే చేసుకున్నారు. పెండ్లి కోసం మీరు రాయబారం పంపినప్పుడు, మా తండ్రిగారు మీతో ఉద్వాహం చేయలేనని విన్నవించుకున్నారు. ఎందుకలా చెప్పారా అని, ఆనాడే మీరు ఆలోచించి ఉండాల్సింది? అనాలోచితంగా మాపై యుద్ధాన్ని ప్రకటించి, మా రాజ్యాన్ని గెలుచుకున్నారు. మాది చిన్న రాజ్యమని మీకు తెలుసు. యుద్ధంలో మీతో నెగ్గలేమనీ తెలుసు. రాజ్యం కోసం మా తండ్రిగారు నన్ను మీకిచ్చి వివాహం చేయడానికి అంగీకరించారు. మా తండ్రిగారి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత, ఒక పుత్రికగా నాపై ఉంది. అందుకే మీతో వివాహానికి అంగీకరించాను. నా మనసు వేరే వారిమీద లగ్నమై వున్నా కూడా, కుమార్తెగా నా బాధ్యత నిర్వర్తించాను.”

ఆ మాటలు విన్న విక్రమసింహ, నిజమే! మీ కన్యను మా రాజ్య పట్టమహిషిగా చెయ్యమని, రాజమాత శుభపత్రిక పంపించినప్పుడు, వారు నిరాకరించారు. తామే ఈ నిజాన్ని గ్రహించుకోలేకపోయారు. కనీసం వివాహానికి ముందైనా రాకుమారి తన అభిప్రాయం చెప్పి ఉండాల్సింది అనుకుంటూ “మీకు యిష్టం లేనప్పుడు, ఈ వివాహానికి అంగీకరించకుండా ఉండాల్సింది మీరు” అన్నాడు.

“ఓడిపోయిన రాజు, రాజ్యంతో పాటు వారి కన్యలు కూడా విజయుడైన రాజు సొత్తన్న విషయం మీకు తెలియనిది కాదు. ఆ ధర్మాన్ని అనుసరించి, మీతో వివాహానికి అంగీకరించాను. వివాహం చేసుకోని పక్షంలో, నాకున్న ఇంకో మార్గం ఆత్మార్పణ చేసుకోవటం. ఆత్మార్పణ చేసుకుని, నా తల్లిదండ్రులను క్షోభ పెట్టి, నరకానికి పోలేను. అందుకే ఈ వివాహానికి అంగీకరించాల్సి వచ్చింది.” వేదన నిండిన స్వరంతో సమాధానమిచ్చి తలదించుకుంది.

తల దించుకున్న ప్రమీలాదేవిని చూశాడు. ఆమె ముఖంలో విపరీతమైన బాధ గోచరిస్తుంది. ఆ బాధ చూడగానే విక్రమసింహ కోపం, నీరు తాకిన పాలపొంగులా చల్లారిపోయింది. వివేకం మేలుకుంది. అవును! ఆమెను ప్రాణాధికంగా ప్రేమించాడు. కాని, ఆమె మనస్సు, తనమీద వుందో లేదో గ్రహించుకోకుండా రాయబారం చేశాడు. ఆమె తండ్రిగారు వివాహానికి అంగీకరించలేదు. యోగ్యుడైన తనతో, వారి కుమార్తె వివాహానికి వారెందుకు అంగీకరించలేదోనని, అప్పుడే తాను ఆలోచించవలసింది? తన తల్లిగారి మరణానికి ఆమే కారణమని, తొందరపడి యుద్ధం ప్రకటించాడు. తన రాజ్యంతో పోలిస్తే, విదర్భ దేశం చాలా చిన్న రాజ్యం. గెలవడం తనకు నల్లేరు మీద నడక. రాచమర్యాద నిలుపుకోవడం కోసం కుమార్తెకు యిష్టం లేకపోయినా తనతో వివాహం జరిపించేటప్పుడు ఆమె తండ్రిగారు ఎంత క్షోభ అనుభవించి వుంటారో, ఒక్కక్షణం కళ్ళముందు కనిపించింది.

తన తొందరపాటుతనానికి ప్రమీలాదేవి బలి అయిపోయింది. ఆమె మనసును చూరగొన్న ఆ భాగ్యవంతుడు ఎవరో? ఎంత అదృష్టవంతుడో? కాని, ఆ ఊహ రాగానే మనసు మరల బాధతో నిండిపోయింది. తనకు దక్కని అదృష్టం ఎవరికో దక్కినందుకు మనసు కృంగిపోయింది. రాజుననే విషయం మర్చిపోయాడు. తనమీద తనకే జాలి వేసింది. ఎందరో మహారాజులు వారి కన్యలను వివాహం చేసుకోమని రాయబారం నడిపారు. కానీ, తన మనసంతా ప్రమీలాదేవి మీదే లగ్నమై ఉండడం చేత, వారందరికీ సామరస్య పూర్వకంగా, కాదు అని బదులు చెప్పగలిగాడు.

ఈరోజు దేశమంతా రాజుగారి వివాహ వేడుకలలో మునిగివుంది. కాని, ఈ అంతఃపురంలో తన మనసు, తన ఎదురుగా ఉన్న ప్రమీలాదేవి మనసు విచారంలో మునిగి ఉన్నాయి. ఇంకా ఆమెను ప్రతిరోజూ చూస్తూ, ఈ క్షోభ భరించడం తన వల్లకాదు. ఆమెను, ఆమె తండ్రిగారి దగ్గరికి పంపించడం ఉత్తమం. ఇలా నిర్ణయించుకున్న విక్రమసింహుడు, “రాకుమారి! జరిగిన దానిని మేము వెనుకకు తీసుకురాలేం. కాని, మీ మనసుకు కష్టం కలిగించేలా, యిక్కడ మిమ్మల్ని ఉంచడం భావ్యం కాదు. మిమ్మల్ని మీ తండ్రిగారి దగ్గరకు పంపించి వేస్తాను. సిద్ధం కండి” అని  వెనుదిరిగాడు.

“క్షమించండి. ఈ పరిస్థితులలో, నేను మరలా మా రాజ్యానికి వెళ్ళలేను. ఒకసారి వివాహం అయ్యాక, ఆ కన్యకను భరించవలసినది ఉద్వాహం చేసుకున్న వారే. వివాహం అయిన వెంటనే కొమరిత, భర్తను విడిచి పుట్టింటికి చేరుకుందంటే, దాని పర్యవసానాలు మీకు తెలిసే ఉంటాయి. ఒకసారి వివాహం అయ్యాక, నేనిక విదర్భ రాజ్య రాకుమార్తెను కాదు. మగధ రాజ్యపు పట్టపురాణినే. ఆ మర్యాదను నేను కాపాడతాను” తలవంచుకొని నెమ్మదిగా బదులిచ్చింది ప్రమీలాదేవి.

“మనసు ఎవరికో అంకితం చేస్తూ, ఇక్కడ తన దేశపు పట్టపురాణిగా ఉంటానని, ఆమె అనడం చాలా అన్యాయమని మనసు ఆక్రోశించింది. తాను ప్రాణాధికంగా ప్రేమించిన స్త్రీమూర్తి, వేరే వాళ్లను మనసులో నిలుపుకుని, అనుక్షణం తన ఎదురుగా ఉంటానంటే ఎలా భరించేది?” ఆమె కోరికను మన్నించవద్దని విక్రమసింహ మనసు చెప్తుంది. కాని, వేరు మార్గం లేదు. ఎందరో రాజుల కొమరితలను తిరస్కరించి, వివాహం చేసుకున్న కన్యక, వివాహం కాగానే పుట్టింటికి వెళ్ళిపోతే, ఆమె రాజ్యం సంగతేమో కాని, తన రాజ్యప్రతిష్ట ఏమవుతుందో  ఒక్కక్షణం కళ్ళముందు కనిపించింది విక్రమసింహకు.

మనసుకు ఇష్టం లేకపోయినా, “సరే” అన్నమాట బయటకు వచ్చింది. “సరే” అని చెప్పి వెళ్ళిపోతున్న విక్రమసింహను, “ఇంకొక విషయం” అన్న ప్రమీలాదేవి మాట ఆపింది. వెనుదిరగకుండానే “చెప్పండి” అన్నాడు.

“మీరు మా రాజ్యాన్ని గెలవడానికి కారణం, మాది చిన్నరాజ్యం అనేకాదు, వారసుడు లేకపోవడం కూడా ఒక కారణం. నేనే పురుషున్ని అయి, మీతో సమానంగా యుద్ధ విద్యలలో, శౌర్య పరాక్రమాలలో ఆరితేరిన దానినయి ఉంటే, మీతో యుద్ధం చేసి గెలిచేదాననేమో!”

ఆమె మాట ముగియలేదు. నేనే పురుషున్ని అయితే అన్న ఆమె మాటకు, ఒక్కసారి ప్రమీలాదేవిని… ఈ అందాల లావణ్యరాశి, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న సుకుమారిని, దృఢమైన శరీరంతో, వీరోచితంగా పోరాడే ఒక పురుషునిగా ఊహించుకుని, ఫక్కున నవ్వాడు విక్రమసింహ.

“మా బాధ, మీకు హాస్యాస్పదంగా ఉందా?” తలెత్తకుండానే అడిగింది ప్రమీలాదేవి.

“క్షమించాలి. నా ఉద్దేశం అదికాదు. మీరు పురుషుడై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని. అంతే.” సున్నితంగా బదులిచ్చాడు విక్రమసింహ.

తనను తాను పురుషునిగా ఊహించుకున్న, ప్రమీలాదేవికి కూడా పెదవులపై నవ్వు పారాడింది. అది బయటపడకుండా తల మరింత దించుకుంది ఆమె. పెదవులపై చిరునవ్వును బయటకు రాకుండా  కన్నులలోనే అదమగా, అది మోమంతా పరుచుకొని, ఆమె వదనం చంద్రకిరణాలు సోకిన కలువలా వికసించింది. మోము మరింత అందంతో కాంతులను వెదజల్లింది. అందంతో ఇనుమడించిన ఆమె మోముని చూసి ఒక్కసారిగా మైమరిచిపోయాడు విక్రమసింహ. అలా ఎంత కాలం గడిచిందో తెలియదు.

“ఇంకొక మనవి” అడగలేక అడిగిన, ప్రమీలాదేవి మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు. “మన, ఈ రహస్యం ఎవరూ గ్రహించకుండా ఉండాలంటే, అంతఃపురం పూర్తిగా మా అధీనంలో ఉండాలి.”

అంతఃపురం వారి అధీనంలో అంటే… ప్రస్తుతం ఆమె ఈ దేశపు మహారాణి కాదు. శత్రుదేశపు రాకుమారి. వారి అధీనంలో అంతఃపురం ఉంచడమంటే నిప్పుతో చెలగాటమే! అలాగని, ఆమెను చూస్తూ కాదనలేడు. వలచిన వనిత కోరికను కాదనలేని తన నిస్సహాయతకు, వగచక తప్పలేదు విక్రమసింహకు. “సరే” అన్నాడు.

“మరొక్క మనవి. క్షమించాలి. మీతో ఎలా చెప్పాలో! కానీ మా తండ్రిగారికి మేము యుద్ధంలో ఏ విధమైన సహాయం చేయలేక పోయినందుకు మేము ఓడిపోయాం. అందుకని … ” అంటూ సందిగ్ధంలో ఆగిపోయింది ప్రమీలాదేవి.

“ఫరవాలేదు. చెప్పండి.” ఇంతవరకూ వచ్చాక, ఏమైనా జరగనీ, అనే నిశ్చయానికి వచ్చాడు విక్రమసింహ.

“మాకు యుక్తవయసు వచ్చినవరకు,  మమ్ములను మగబిడ్డగానే పెంచారు మా తండ్రిగారు. మేము అన్ని యుద్ధవిద్యలూ నేర్చుకున్నాం. కాని, మాకు యుక్తవయసు రాగానే మమ్ములను అంతఃపురానికే పరిమితం చేశారు. అందుకని నేను యుద్ధ విద్యలలో ఆరితేర లేకపోయాను. నాకు ఇప్పుడవన్నీ నేర్చుకోవాలని ఉంది. ఎవరైనా నా మీదకు దాడికి వస్తే ఎదురొడ్డి గెలవాలని ఉంది. నాకు, నా చెలికత్తెలకు యుద్ధవిద్యలు నేర్పించే బాధ్యత మీరు తీసుకోవలసినదని సవినయంగా వేడుకుంటున్నాను” అంటూ చేతులు జోడించింది ప్రమీలాదేవి.

నవ్వొచ్చింది విక్రమసింహకు. ప్రేమించి, యుద్ధంలో గెలిచి  వివాహం చేసుకున్న స్త్రీమూర్తి, నా మనసు వేరే వారికి అంకితం, మీ రాజ్యంలో ఉంటాను గాని, మీకు సంబంధించిన వ్యక్తిని కాను. రేపు అవసరమొస్తే మీతో యుద్ధం చేయటానికి యుద్ధవిద్యలలో నేను ఆరితేరాలి. అందుకు మీరే నాకు సహాయం చేయాలి అని అడుగుతున్నందుకు. ప్రమీలాదేవి ముఖం చూస్తూ కాదని చెప్పలేకపోయాడు. “మీ అభిమతం. అలాగే కానివ్వండి” అని చెప్పి వడివడిగా ముందుకు అడుగులు వేశాడు విక్రమసింహ.

*

చిన్ననాటి నుండి ప్రాణస్నేహితుడు, ఈ దేశపు మహారాజు, కోరుకున్న సఖితో వివాహం జరిగి ఆనందపు అంచులు చూస్తూ ఉండి వుంటాడు. మహారాజు  ప్రేమ సామ్రాజ్యంలో ఆనందం ఆవలి అంచులను తాకే వరకు, దేశ భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై ఉంది. మహారాజు ఆనందానికి ఎవరూ అడ్డురాకుండా, రాజ్యవ్యవహారాలను చూసుకోవలసిన బాధ్యత కూడా  స్నేహితుడిగా తనమీద ఉంది, మనసులో ఇలా అనుకుంటూ, వెనక్కి తిరిగి అంతఃపురాన్ని అవలోకించాడు అనంతుడు. దీపాల కాంతుల్లో ధగధగలాడుతుంది అంతఃపురం. తన మహారాజు వదనంలాగే… మహారాజు తలపుకు రాగానే ప్రఫుల్లమయింది అనంతుని మనసు.

నెల రోజుల నుండి మహారాజు పరిణయ మహోత్సవ సందర్భంగా పేదవారికి దానధర్మాలు, ప్రముఖులకు కానుకలు, దేవాలయాలకు మడులు మాన్యాలూ అందజేయబడ్డాయి. పేద ధనిక అన్న తేడా లేకుండా పుర ప్రజలంతా ఈ సంబరాన్ని గొప్పగా జరుపుకుంటున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ఇంటింటినీ, వాడవాడనూ అలంకరించారు. మహారాజంటే, ప్రజలకున్న అభిమానం అటువంటిది. అంతటి మహారాజును, అంతఃపురం వరకూ తోడ్కొని వచ్చి సింహద్వారం దగ్గరే ఆగిపోయి “మీ ముఖంలో ఆనందం ఎప్పుడూ ఇలాగే కలకాలం ఉండాలి” అని ఆలింగనం చేసుకుని వీడ్కోలు చెప్పాడు.

అంతఃపురం నుండి వెను తిరుగుతుంటే, అంతకు ముందు జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. “ఎప్పుడూ గంభీరంగా, సూర్యుని ప్రతాపంతో నిండి ఉందా అనిపించేలా ఉన్న మా మహారాజుల ముఖం, ఈనాడు పున్నమి చంద్రునిలా ప్రేమానురాగాల సోనలు కురిపిస్తుంది. ఏలనో! ఎవరేమి మాయ చేసారో”నని తాను హాస్యమాడగానే, “అలాగే చూస్తూ ఉండు, అనంతా! శత్రువుల పట్ల కర్కశుడని పేరొందిన ఈ దేశ సర్వసేనాధిపతిని, తమ ప్రేమానురాగాల ధారలతో ముంచెత్తి, ముట్టుకుంటే కరిగిపోయే హిమఖండంలా మార్చటానికి, యెవరో యెక్కడో యెదురు చూస్తూనే ఉన్నారు. ఆ శుభ ఘడియలు రానీ! అప్పుడు చూద్దాం. నీ మోము యే సోనలు కురిపిస్తుందో!” అని బదులిచ్చాడు ప్రాణ స్నేహితుడు విక్రమసింహ. అది గుర్తుకు రాగానే అనంతుని ముఖంలో చిరునవ్వు తొణికిసలాడింది.

నిద్రించిన సమయంలో తప్ప, యింతవరకు ఎప్పుడూ విక్రమసింహను విడిచిపెట్టింది లేదు. ఇప్పుడు ఆ అలవాటు మార్చుకోవాలి. తనలో తానే అనుకుంటూ అంతఃపురం భటులను మరొక్కమారు హెచ్చరించి, తన మందిరం వైపు నడుస్తున్న అనంతుడు, దూరంగా చీకటి ముసుగులో మహారాజ మందిరం వైపు, గబగబా వెళ్తున్న వ్యక్తిని చూశాడు. ఇంత రాత్రివేళ మహారాజ మందిరం వైపు… మనసొక్కసారిగా త్రుళ్ళి పడింది… త్రుళ్ళి పడడమే కాదు, భయాందోళనలకు లోనయింది.  ఏమి జరుగుతుంది? ఆలోచనలతో తలబ్రద్దలై పోతుంది. ఏమి చెయ్యాలో తోచడం లేదు. అడుగు ముందుకు పడడం లేదు. మనసు కీడును శంకిస్తుంది. శిలలా బిగుసుకుపోయాడు అనంతుడు.

*

తర్వాత భాగం మలి సంచికలో…..

May 30, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

జీవన మాధుర్యం

by Laxmi Madan May 30, 2025
written by Laxmi Madan

5 వ భాగం

వసంత కూతురు పెళ్లికి వచ్చి అపర్ణ చిన్నప్పటి జ్ఞాపకాలను అన్ని మననం చేసుకుంటూ పెళ్లిలో ఎంజాయ్ చేస్తూ సుదత్తలు కలవడానికి అపర్ణ తన పుట్టి పెరిగిన ఇంటికి వెళుతుంది.. కథలోకి వెళ్దాం.

” అత్తా! అక్కడ మోరిలో నుండి పాము కనబడుతుంది” అన్నది అపర్ణ భయంగా.

మెల్లిగా వంగి చూసింది సుధ…

” నువ్వు భయపడకు అది పాము కాదు.కప్ప తల బయటకు పెట్టింది .అయినా ఇక్కడ పాములు రావడం కూడా సహజమేలే, చిన్నప్పుడు మనం ఎన్ని పాములను చూడలేదు” అన్నది సుధ.

” భయమేస్తుంది అత్తా! ఇంతకీ అది కప్పనేనా? “అని అడిగింది.

” అవును కప్పనే” అని ఒక కర్రతో కప్పను అలా నెట్టేసి చేతులు కడుక్కొని వచ్చింది సుధ.

మళ్లీ ఇద్దరూ మనసాలలో వచ్చి కూర్చున్నారు. ఇంతలో తలుపు చప్పుడు అయ్యింది.

” ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా?” అంటూ వెళ్లి బయట తలుపు తీసింది సుధ.

” ఓ మీరా వేణు! రండి లోపలికి” అని పిలిచింది.

ఎవరు వచ్చారో అపర్ణ కు అర్థం కాలేదు..

అతను లోపలికి వచ్చాక కుర్చీ చూపించి కూర్చోమని చెప్పింది సుధ.

వేణు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికే లేచిన అపర్ణ మరో కుర్చీలో కూర్చుంది. సుధ కూడా కూర్చొని,

” వేణు! ఈమె నా మేనకోడలు అపర్ణ.

అపర్ణ !ఇతను వేణు అని ఎమ్మెల్యే గారి అబ్బాయి. ఇతను కూడా రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. బిజినెస్ లు కూడా ఉన్నాయి.

అయినా మీరిద్దరూ ఒకరికొకరు తెలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంచుమించు మీ వయసు ఒకటే! స్కూల్లో ఏమైనా పరిచయం ఉందేమో మీకు” అని చెప్పింది సుధ.

అపర్ణను చూసిన వేణు ఒక్కసారి షాక్ అయ్యాడు.

“అపర్ణను ఎన్ని రోజులకి చూస్తున్నాను. అసలు నన్ను గుర్తు పట్టిందా”?అనుకున్నాడు.

అపర్ణ కూడా వేణుని చూసి ఆశ్చర్యపోయింది. “ఎన్ని రోజులకి చూసాను అతన్ని. నన్ను గుర్తుపట్టాడా” అని అనుకున్నది.

ఇద్దరూ ఒకేసారి అన్నారు.

” అవును మేమిద్దరం ఒకే క్లాసు” అన్నారు.

“అయితే మీరు మాట్లాడుకొండి. నేను వేణుకి కాఫీ తీసుకొని వస్తాను” అని అన్నది సుధ.

“ఈ సమయంలో కాఫీ వద్దు ,ఏమీ వద్దు. మీరు కూర్చోండి” అన్నాడు వేణు..

” మీరు చాలామంది విద్యార్థులకు ఉచితంగా చదువు నేర్పించడం మాకు తెలుసు. నేను కూడా ఎన్నో రోజుల నుండి మిమ్మల్ని చూస్తున్నానమ్మా. అయితే మా నాన్నగారు మా స్కూల్లో మిమ్మల్ని టీచరుగా చేస్తారా? అడిగారు .దానికి మీరు ఒప్పుకుంటే మీరు తొందరలోనే జాయిన్ కావచ్చు. మీకు ఒక వ్యాపకం లాగా ఉంటుంది. నేను అందుకనే ఈ సమయంలో వచ్చానమ్మా” అన్నాడు వేణు.

” నిజమా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఊరికే ఉండడం నాకు ఇష్టం లేక, ఎవరైనా పిల్లలు వస్తే వాళ్లకి క్లాసులు తీసుకుంటున్నాను. ఇలా నాకు ఒక ఉద్యోగం ఇచ్చారంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది. తప్పకుండా నేను ఈ ఉద్యోగం చేస్తాను థాంక్యూ వేణు” అన్నది సుధ.

సుధ లేచి కిచెన్ లోకి వెళ్ళింది.

అప్పుడే వేణు అడిగాడు.

“అపర్ణా!ఎలా ఉన్నావ్ నేను గుర్తున్నానా” అన్నాడు.

” నిన్నెలా మరిచిపోతాను వేణు. ప్రతిరోజు గుర్తొస్తావు. కానీ ఈరోజు ఇక్కడ నిన్ను కలుస్తానని ఊహించలేదు” అన్నది అపర్ణ.

“నిన్ను కలవాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియలేదు. మన ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. వాళ్లు కూడా సరిగా చెప్పలేదు అన్నాడు వేణు.

ఇంతలో సుధ జ్యూస్ తీసుకుని వచ్చింది.

” జ్యూస్ తాగు వేణు” అని చేతికి ఇచ్చింది.

కాసేపు ముగ్గురు మాట్లాడుకున్నారు. ఇంతలో సుధ మొబైల్ కి కాల్ వచ్చింది.

“ఒక్క నిమిషం” అంటూ సుధ లోపలికి వెళ్ళింది.

వేణూ! నేను ఇంకో రెండు రోజులు ఇక్కడ ఉంటాను. ఒకసారి నన్ను కలుస్తావా?నేను వసంత వాళ్ళ అమ్మాయి పెళ్లికి వచ్చాను” అని చెప్పింది.

“నాకు కూడా వసంత ఇన్విటేషన్ ఇచ్చింది. నేను పెళ్లికి వస్తాను. అక్కడ కలుద్దాం” అని చెప్పి వెళ్ళిపోయాడు.

వంటింట్లో నుండి బయటకు వచ్చిన సుధ, అపర్ణను అడిగింది.

” అప్పూ! వేణు నీకు పరిచయం కదా! అప్పట్లో ఒకటి రెండుసార్లు ఇతని గురించి చెప్పావు. నాకు లైట్ గా గుర్తుంది” అన్నది సుధ.

” అవును సుధత్తా! పరిచయం ఏమీ లేదు. కానీ ఇద్దరం ఒకటే క్లాస్ .నేనంటే అతనికి చాలా ఇష్టం ఉండేది. ఆ వయసులో ఆ ఇష్టాలు ఏం తెలియవు కదా? నాకు కూడా అతనంటే ఒక విధమైన ఇష్టం ఉండేది. చిన్న వయసులో దానికి పేరు ఏం పెట్టలేము. కానీ ఒకరిని ఒకరు కళ్ళతో మాత్రమే చూసుకున్నాము. నేను ఎక్కడికి వెళ్లినా నా వెనకాల నీడలా వచ్చాడు తప్ప, ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు” అన్నది అపర్ణ.

” సరే చాలా రాత్రి అయింది పడుకో. నువ్వు మళ్ళీ రేపు వసంత ఇంటికి వెళ్లాలి కదా” అన్నది సుధ..

ఇద్దరూ అట్లా హాల్లో పడుకున్నారు.

సుధ వెంటనే నిద్రపోయింది. కానీ అపర్ణకు అసలు నిద్ర రాలేదు. తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటి కళ్ళ ముందు కదలాడుతున్నాయి. అందులో తను పుట్టి పెరిగింది ఈఇంట్లోనే. ఆ చిన్నప్పటి మట్టి వాసన ముక్కుపుటాలకు తగిలి ఎంతో ఆహ్లాదపరుస్తున్నాయి. గతంలోకి వెళ్లిపోయింది అపర్ణ.

అపర్ణ చిన్నప్పుడు ఆ ఇల్లు మట్టి నేల ఉండేది. పనిమనిషి బాలమ్మ వారానికి ఒకసారి ఎర్రమట్టి పేడ కలిపి చక్కగా అలికేది. అలికిన ఇంట్లో నాయనమ్మ, సుద్ధతో ముగ్గులు వేసేది .కాస్త నాయనమ్మ చేతకాకుండా అయిన తర్వాత, మెంచు రుబ్బి దానిలో చిన్న బట్ట ముక్కను ముంచి, దానితో రకరకాల ముగ్గులను వేసుకునే వాళ్ళు. ఎక్కువగా ఇంటిని అలంకరించడంలో నైపుణ్యం సుధదే.

ఉదయమే ఇంట్లో అంతా హడావుడిగా ఉండేది. ఇటు అపర్ణ తండ్రి దక్షిణామూర్తి ఆఫీసుకు వెళ్లాలి. పిల్లలు స్కూల్లోకి వెళ్లాలి. ఇంట్లో మడి, ఆచారం ,పూజలు వెరసి సందడిగా ఉండేది.

సుధ పిల్లలందరినీ లేపి, స్నానాలు చేయించి, చక్కగా తల దువ్వేది.తర్వాత తను స్నానం చేసి, పెరట్లో పూలు కోసుకొని వచ్చి, దేవుడి గదిలో పెట్టి, తర్వాత రాత్రి మిగిలిన అన్నం లో చింతకాయ పచ్చడి, నెయ్యి కలిపి అన్నయ్య పిల్లలకు తినిపించి, తాను తినేది.

దక్షిణామూర్తి గారు దేవుడి గదిలో కూర్చుని, అనుష్టానము ,పూజ చేసుకునేవారు. తల్లి అన్నపూర్ణమ్మ దేవుడి మహా నైవేద్యంకు సిద్ధం చేసేది. అపర్ణ తల్లి అత్తగారికి వంటలో సహాయం చేస్తూ, భర్తకు కావలసినవి చూస్తూ, ఇంటిలోని పనులన్నీ చక్కబెడుతూ ఉండేది. అప్పటి పనులు మామూలుగా ఉండేవా? మడి నీళ్ళు బావిలో నుండి తోడి పెట్టడం, స్నానాలకి గోళాల్లో నీళ్ళు నింపడం, మొక్కల సంరక్షణ, వ్యవసాయం పనులు , వచ్చి పోయే అతిధులు ఒకటేమిటి ఇవన్నీ చూసుకోవడం సుమతి వంతు అయ్యేది.

దక్షిణామూర్తి నలుగురు పిల్లల బాధ్యత అంతా చెల్లె సుధనే తీసుకునేది. సుధ హైస్కూల్ లో ఉన్నప్పుడు, ఈ పిల్లలు ప్రైమరీ స్కూల్లో ఉండేవాళ్లు. వీరిని స్కూలుకు పంపించి, తాను హై స్కూల్ కి వెళ్ళేది సుధ.

అంతేకాదు చక్కగా చదువుకునేది. తను చదువుకోవడమే కాకుండా, ఇంటికి వచ్చాక అన్నయ్య పిల్లలతో హోంవర్క్ చేయించడం, వాళ్లకు రాని లెక్కలను చెప్పడం, ఇవన్నీ ఇష్టంగా చేసేది. వారితో కలిసి ఎన్నో ఆటలాడేది. ఇలాఅందరితో సన్నిహితంగా మెలిగేది సుధ.

ఎవరికి ఏ అవసరం వచ్చినా..
“సుధా”అంటూ పిలిచే వాళ్ళు.

ఇవన్నీ కాకుండా చూడ చక్కని తీరు సుధది.
బారుగా తీరైన జడ .లక్ష్మీ కళ ఉట్టిపడే వర్చస్సు, చక్కని లంగా వోణీలో ఎంతో అందంగా ఉండేది.

“ఒరేయ్ దక్షిణామూర్తి! నీ చెల్లెలు రూపమే కాకుండా, గుణంలో కూడా అందమైనదే రా! ఎవరు చేసుకుంటారో కానీ వాళ్ళింట్లో దీపమై వెలుగుతుంది” అని దక్షిణామూర్తితో అనేవాళ్లు.

దక్షిణామూర్తికి కూడా చెల్లెలు అంటే చాలా ఇష్టం.

ఇంటికి ఎవరు వచ్చినా, ముందుగా మంచినీళ్లు ఇచ్చి పలకరించి వెళ్ళేది. చిన్నవయసులో ఎంతో పరిణీతి కలిగినట్లు ఉండేది. తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల ,తల్లి అన్నల పెంపకంలోనే పెరిగింది. వదినకు తలలో నాలుక లాగా ఉండేది.

ఇలా సుధలో అన్నీ మంచి లక్షణాలే.

పదవ తరగతి పరీక్షలు రాసిన సుధ. ఊళ్లో జరిగే సీతా రాముల కల్యాణానికి, అన్నయ్య పిల్లలతో కలిసి వెళ్ళింది.

తొమ్మిది రోజుల ఉత్సవాలకి తప్పక హాజరయ్యే వాళ్ళు. హరికథలు వింటూ, పూజా కార్యక్రమాలను చూస్తూ సీతారామ కళ్యాణం వీక్షించి ఇంటికి వచ్చేవాళ్ళు.

అలా ఒకరోజు గుడిలో కూర్చున్నప్పుడు, వారి బంధువుల కుటుంబం ఒకటి అక్కడికి వచ్చింది. వాళ్లు సుధను చూడటం, వాళ్లకు ఈ అమ్మాయి ఎంతో నచ్చి, ఇంటికి వచ్చి దక్షిణామూర్తి గారితో సంప్రదించడం జరిగింది.

బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ అబ్బాయికి సుధను ఇవ్వాలని కోరారు.

” ఇంత చిన్న వయసులో సుధకు పెళ్లి చేయాలని మేము అనుకోవడం లేదండి. సుధకు చదువులో ఆసక్తి ఉంది” అని చెప్పాడు దక్షిణామూర్తి.

” తాను ఎంత చదువుకుంటానంటే అంత మేము చదివిస్తాము. మీరు మాత్రం ఈ సంబంధం కాదన వద్దు” అంటూ వాళ్ళు ఎంతగానో ప్రాధేయపడ్డారు.

అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ..

“ఇంటికి వచ్చిన సంబంధాన్ని కాదనడం ఎందుకురా దక్షిణామూర్తి !మంచి సంబంధం పెళ్లి చేసేద్దాం రా” అని అన్నది.

అలా అనుకున్నదే ఆలస్యం, నిశ్చితార్థం, పెళ్లి అన్ని నెలలోపలే జరిగిపోయాయి. అలా సుధ అత్తవారింటికి వెళ్లిపోయిన తర్వాత, పిల్లలకి ఆమె లేని లోటు తెలిసి వచ్చింది. ఒక పిల్లలకే కాదు , ఇంట్లో అందరూ సుధను మిస్ అయిపోయారు.

కొన్ని రోజులు ఇంట్లో వస్తువులన్నీ స్తబ్దుగా తయారయ్యాయి .అసలు సుధ లేకుండా ఇల్లు గడుస్తుందా! అనిపించేది.

రాను, రాను అందరూ అలవాటు చేసుకున్నారు.

అపర్ణ అత్త సుధని అలా చూస్తూ ఉండి పోయింది.

” నిజంగా అత్త ఎంత మంచిది” అని అనుకుంది.

అలా సుధను చూస్తూ మళ్ళీ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది అపర్ణ.

సుధ వెళ్ళిపోయాక, “సుధా! ఇది ఎక్కడ? సుధా ?అదెక్కడ? అనే సుధను పిలవడం. మళ్లీ సుధ లేదని ఒక్కసారిగా మౌనం దాల్చడం జరిగేది.

పిల్లలైతే పొద్దున లేవగానే సుధత్త ఇక్కడికి రా! నా బ్రష్ ఇవ్వు. నా బ్యాగ్ ఎక్కడ?” ఇలా అడిగేవాళ్ళు.

చాలా రోజులకు కానీ అందరికీ సుధ ఇంట్లో లేదనే నిజం అర్థమయింది.

సుధకు ఎక్కువగా అపర్ణతో చనువు ఉండేది. ఆమె వెళ్లిపోయిన తర్వాత అపర్ణ నిస్తేజంగా తయారైంది. ఆ వయసులో అదేంటో కూడా అర్థం కాలేదు అపర్ణకి.

ఉదయమే లేచి పెరటి గడపలో కూర్చునేది. పెరట్లో పూసిన మందారాలను, గన్నేరు పువ్వులను, చామంతి పువ్వులను చూస్తూ ఆలోచనల్లో పడేది. ప్రకృతి పట్ల ఆరాధన అప్పుడే ఏర్పడింది అపర్ణకి.

అపర్ణ అనుకునేది నేను కూడా సుధత్త లాగా అందరికీ అనుకూలంగా ఉండాలని ,అలా మెల్లగా సుధ తత్వం అంతా అపర్ణకి అలవడింది. కాకపోతే సుధకు ఉన్నంత సహనం అపర్ణకు లేదు. అనవసరంగా ఎవరైనా ఏదైనా అంటే చెడా మడా కడిగిపారేసేది. ఇంట్లో కూడా ముక్కుసూటి తత్వమే. తప్పు చేస్తే వెంటనే ఒప్పుకునేది. తప్పు చేయకుంటే మాత్రం ఎంత పెద్ద వాళ్ళనైనా ఎదిరించి మాట్లాడేది. తల్లి సుమతి ఎన్నోసార్లు చెప్పేది.
” అలా అందరితోనే పెళుసుగా మాట్లాడవద్దని”

” నేను తప్పు చేయనప్పుడు ఎందుకు మాట పడాలి” అని సమాధానం ఇచ్చేది అపర్ణ.

ప్రైమరీ స్కూల్ అయిపోయి హై స్కూల్ కి వెళ్లారు అపర్ణ మరియు అన్న తమ్ముడు చెల్లె.

చురుగ్గా ఉండే అపర్ణ అంటే అందరికీ ఇష్టమే. క్లాసులో పోటీ తత్వం ఉండేది. ఆ రోజుల్లో అమ్మాయిలు అంత ధైర్యంగా ఉండే వాళ్ళు కాదు. కానీ అపర్ణ ఎవరికి భయపడేది కాదు.

తరగతిలో ఏ ప్రశ్న టీచర్ అడిగినా, టక్కున లేచి జవాబు చెప్పేది. అబ్బాయిలకు ఇది నచ్చేది కాదు. కొంతమంది వాదనకు దిగేవాళ్లు. కానీ అపర్ణ డోంట్ కేర్ అన్నట్టుగానే ఉండేది.

ఒకరోజు సాంఘిక శాస్త్రం పీరియడ్లో ,సార్ చెప్తుంటే శ్రద్ధగా వింటుంది అపర్ణ. పాఠం చెప్తూ చెప్తూ సార్ ఏదో జోక్ చెప్పాడు. ఆ జోకు విన్న అపర్ణ పగలబడి నవ్వింది. అలా నవ్వుతూ పక్కకు తలతిప్పి చూసింది. చివరి బెంచ్ లో కూర్చున్న ఒక అబ్బాయి తదేకంగా తన్నే చూస్తున్నాడు. అప్పుడే బాల్యం దాటిన వయసు. మగ, ఆడ తేడాలు తెలుసుకుంటున్న తరుణం. ఒక్కసారిగా గుండెలయ తప్పినట్లు అయింది అపర్ణకి.

మళ్లీ అదేం తెలియనట్లుగా, పాఠం వింటూ మెల్లిగా పక్కకు తిరిగి చూసింది. ఆ అబ్బాయి అలాగే చూస్తున్నాడు. అపర్ణలో కలవరం మొదలయ్యింది.

” ఏంటి ఏదో కొత్తగా అనిపిస్తుంది ఈ రోజు నాకు” అని అనుకున్నది.

కానీ ఆ వైపే మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. మనసుని నిగ్రహించుకొని, పాఠం వినడంలో నిమగ్నం అయిపోయింది అపర్ణ.

ఎప్పటిలాగే స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు. మధ్యలో ఎందుకో తల వెనక్కి తిప్పి చూస్తే, కొంచెం దూరంగా అనుసరిస్తూ వస్తున్నాడు ఆ అబ్బాయి. అతని పేరు వేణు.

“అతను వెళ్ళేది ఇంటికా? లేక నా కోసం తన వెనుక వస్తున్నాడా” అని అనుకున్నది అపర్ణ.

స్నేహితులకు ఎవరికి అనుమానం రాకుండా, అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా కొంచెం దూరంలో తన ఇల్లు వస్తుందని ఒక సందు దగ్గర అతని నిలబడ్డాడు. అపర్ణ వెళ్లేంతవరకు అక్కడే నిలబడి, అతను సందులోకి వెళ్ళిపోయాడు.

అపర్ణకు అప్పుడు అర్థమయింది. అతని ఇల్లు ఆ సందులోనే అని, కానీ అతను ఎదురుచూస్తున్నది మాత్రం తన కోసమేనని పూర్తి క్లారిటీ వచ్చేసింది.

ఇంటికి వెళ్ళిందన్నమాటే కానీ, పదేపదే అతని చూపులు గుర్తొస్తున్నాయి. చురుగ్గా ఉన్న అతని కళ్ళు తనను వెంటాడుతున్నాయి. చదువు మీద కానీ, ఏ పని మీద కానీ మనసు నిమగ్నం చేయలేకపోయింది.

వెంటనే లేచి తనకు ఇంటి దగ్గర ఉన్న తన స్నేహితురాలు ఇంటికి వెళ్లిపోయింది .ఆమెనే సువర్ణ.

ఈ విషయం చెప్పాలని నోటి వరకు వచ్చింది అపర్ణకి. కానీ ఎటు పోయి ఎటు వస్తుందోనని, ఏమీ చెప్పలేదు. కాసేపు సువర్ణతో మాట్లాడి ఇంటికి వచ్చేసింది.

ఇలాంటివి ఏవి ఇంట్లో చెప్పకూడదు, అని ఒక నిర్ణయానికి వచ్చేసింది. మళ్ళీ తన చదువు ఆగిపోతుంది అని అనిపించింది. ఆ సమయంలోనే శ్యామ్ ఏడిపించడం, అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిపోయాయి.
శాం పైన కంప్లైంట్ ఇవ్వగలిగింది కానీ వేణుని చూస్తే అలా అనిపించడం లేదు.

అతను ఏరోజు అపర్ణ ఇబ్బంది పెట్టలేదు. అతను చేసేదల్లా కళ్ళలో తన ఆరాధనను నింపుకొని చూడటం. కానీ ఆ వయసులో అవేమీ అర్థం కావు కదా! పరస్పర ఆకర్షణ మాత్రం ఉంటుంది కదా!

అపర్ణ కూడా పదవ తరగతికి వచ్చింది. అన్న కాలేజీ కోసం పట్నం వెళ్ళాడు. చెల్లెలు తమ్ముడు మాత్రం అదే స్కూల్లో తనతో పాటు చదువుకుంటున్నారు.

అపర్ణ తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు వేసవి సెలవులు వచ్చాయి. అప్పుడు సుధత్తతో వెళ్ళినట్టుగా తను కూడా చెల్లిని, తమ్ముడిని తీసుకుని గుడికి వెళ్ళేది.

ఉదయం గుడికి వెళ్తే ఎప్పుడో మధ్యాహ్నం ఇంటికి చేరి, భోజనం చేసేవాళ్లు .మళ్లీ సాయంత్రం కాగానే హరికథల సమయానికి గుడికి వెళ్లేవాళ్లు. ఈ నేపథ్యంలో అక్కడ అపర్ణకి వేణు కనిపించేవాడు.

ఒకరోజు హరికథ వింటూ కూర్చుంది. అలా తన్మయత్వంతో వింటున్న అపర్ణకు మనసులో ఏదో అలజడి మొదలైంది. చూపుల బాణాలు గుచ్చుకున్నట్లు అనిపించింది. వెంటనే పక్కకు తిరిగి కళ్ళెత్తి చూసింది.

వేణు అపర్ణను చూస్తూ దూరంగా నిలబడ్డాడు. అతను హరికథ వినడం లేదు. అపర్ణ కోసం మాత్రమే గుడికి వచ్చాడు. అలాగే చూసిన అపర్ణ చూపులు తిప్పుకొని హరికథ వినడానికి ప్రయత్నం చేసింది. కానీ ఈసారి ఆ ప్రయత్నం విఫలమైంది. ఎంతసేపటికి కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది. తల్లితండ్రులు అందరూ గుడిలోనే ఉన్నారు .కానీ ఇంకా తనకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే తమ్ముడుని తీసుకొని ఇంటికి బయలుదేరింది.

అక్కడంతా చీకటిగా ఉంది. అలా వెళ్తుంటే భయమేసింది. చుట్టూ తిరిగి చూసింది. అప్పటికే వీళ్ళని అనుసరిస్తున్నాడు వేణు.

మొదటిసారిగా అనుకుంది. “హమ్మయ్య వేణు వెనకాల వస్తున్నాడు ఇంకేం భయం లేదు” అని.అలా వీళ్లు వాళ్ళింటి సందు వెళ్లే వరకు అతను అలా నిలబడి చూస్తూనే ఉన్నాడు.

ఇలా ఒకరినొకరు చూసుకోవడమే తప్ప, కనీసం పలకరించుకోలేదు.

ఎండాకాలం సెలవులు అయ్యాక ,స్కూలుకు వెళ్లాలని అపర్ణకు ఉత్సాహంగా ఉన్నది. అప్పట్లో జూన్ రాగానే వర్షాలు పడేవి. బోరున కురుస్తున్న వర్షం. అపర్ణ పుస్తకాలు తీసుకొని స్కూలుకు వెళ్లడానికి బయలుదేరగానే, ఇంట్లో అందరూ

“ఈ వర్షంలో స్కూలుకి వెళ్తావా? మొదటి రోజులు ఎలాగు క్లాసులు కావు” అని అన్నారు.

కానీ, అపర్ణకు వేణుని చూడాలని ఉంది. అందుకని

“లేదమ్మా పదవ తరగతి కదా !మొదటి రోజు నుండి క్లాసెస్ తీసుకుంటామని చెప్పారు .తప్పకుండా వెళ్లాలి “అని జవాబుకు ఎదురు చూడకుండా వర్షంలో తడుస్తూ బయలుదేరింది.

అప్పటికే బయట నిలిచి ఉన్న సువర్ణను చూస్తూ.

“ఏంటే వర్షంలో నువ్వు వస్తావని అనుకోలేదు. అసలే తప్పించుకోవాలని చూస్తావు కదా”! అన్నది అపర్ణ సువర్ణను చూస్తూ..

” నువ్వు ఈరోజు స్కూలుకు వెళ్తావని నాకు తెలుసు. అయినా నువ్వు ఎందుకు వెళ్తున్నావో కూడా నాకు అర్థం అయింది లేవోయ్” అంటూ చిలిపిగా నవ్వింది సువర్ణ.

” నేను ఎందుకు వెళ్తున్నానో నీకేం తెలుసు?ఆపవే, ఎవరైనా చూస్తే నా చదువు గోవిందా” అన్నది.

” ముందైతే స్కూల్ కి వెళ్దాం పద !గొడుగు తెచ్చాను ఇద్దరం కలిసి వెళ్దాం” అని సువర్ణ గొడుగు పట్టింది.

ఇద్దరూ గబగబా నడుచుకుంటూ స్కూల్ కి వెళ్ళిపోయారు.

మొదటి పీరియడ్లో సైన్స్ సార్ వచ్చాడు.

అందర్నీ నవ్వుతూ పలకరించాడు.

” ఈసారి పదవ తరగతి అందరూ బాగా చదువుకోవాలి. తప్పకుండా పాస్ కావాలి” అని చెప్పాడు.

” బాగా చదువుకుంటాం సార్” అని ముక్తకంఠంతో అందరూ అరిచారు.

అపర్ణ క్లాస్ అంతా పరికించి చూసింది

“ఏంటి, వేణు కనపడటం లేదు. స్కూల్కు ఎందుకు రాలేదు!” అని మనసులో అనుకుంది.

పక్కనే కూర్చున్న సువర్ణ,

“ఇంకా రాలేదా”! అని అడిగింది.

మనసు ఎక్కడో ఉన్న అపర్ణ “అవును రాలేదు” అంటూ ఒక్కసారి సువర్ణ వైపు చూసి,

“ఏంటి రాలేదా అని అడిగావు ఎవరు?” అని అమాయకంగా అడిగింది.

” ఇంకా నా దగ్గర అమాయకంగా నటించకు అప్పూ! నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. నేను ఎవరికీ చెప్పనులే! భయపడకు. కానీ నీ మనసు నాకు తెలియదా” అన్నది సువర్ణ.

సువర్ణను చూస్తూ అపర్ణ చిన్నగా నవ్వింది.

ఇంతలో వేణు క్లాస్ కి వచ్చాడు.

” ఏంటి మొదటి రోజే ఆలస్యంగా వచ్చావా”? అని అడిగాడు సార్

” చేతిలో పుస్తకాలు ఏవి” అని మళ్ళీ అడిగాడు.

“ముందు నన్ను క్లాసులోకి రానివ్వండి సార్ చెప్తాను” అన్నాడు వేణు నవ్వుతూ వినయంగా.

” సరే వచ్చి కూర్చో. ఇప్పుడు చెప్పు” అన్నాడు సార్.

” నేను ఇక్కడ టీసి తీసుకొని హైదరాబాద్ స్కూల్లో జాయిన్ అవుతున్నాను. అందుకని ఒకసారి అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను” అని అన్నాడు వేణు.

ఒక్కసారిగా అపర్ణకి కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసాయి .

“ఏంటి వేణు ఇక్కడ నుండి వెళ్ళిపోతాడా?” అని మనసులో అనుకొని మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేసింది.

వేణు అపర్ణ వైపు చూస్తూనే ఉన్నాడు. కానీ అపర్ణ అతని వైపు ఒక్కసారి కూడా చూడలేదు. అతను ఎవరో తెలియనట్లుగానే ఏదో రాసుకుంటూ కూర్చుంది.

” అప్పూ! నీకోసం వేణు చూస్తున్నాడు ఒకసారి తలతిప్పి చూడు” అన్నది సువర్ణ మెల్లగా.

“వద్దు నేను చూడను” అంటూ తల పైకి కూడా ఎత్తకుండా కూర్చుంది అపర్ణ.

వేణు కాసేపు క్లాసులో కూర్చుని వెళ్లిపోయాడు.

కొన్ని రోజుల వరకు అన్యమనస్కంగా గడిపింది అపర్ణ. చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఆటల మీద ఆసక్తి తగ్గింది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చునేది.

తల్లి ,తండ్రి, నాయనమ్మ అందరు అడిగారు.

“ఏమైందే నీకు? ఇలా నిశ్శబ్దంగా ఉంటున్నావు? ముందులా చురుగ్గా ఉండటం లేదు. సుధత్త గుర్తొస్తుందా ఏంటి”? అని గుచ్చి గుచ్చి అడిగారు.

ఏమి సమాధానం చెప్పకుండా అపర్ణ ఆ విషయాన్ని దాటవేసేది.

కొన్ని రోజులు పోయాక మామూలు మనిషి అయిపోయి, చదువు పైన శ్రద్ధ పెట్టింది.

అలా ఎంత శ్రద్ధగాను చదువుకున్నది అపర్ణ.

అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం వేణు తనని ఫాలో అయ్యేది గుర్తుకొచ్చి కొంచెం బాధపడేది. ఆ తర్వాత మరిచిపోయింది.

అలా పదవ తరగతి పరీక్షలు రాసి ,మంచి మార్కులతో పాస్ అయింది అపర్ణ. ఆ రోజుల్లో పాస్ అవ్వడమే చాలా గొప్ప. ఇంకా ఆడపిల్లల వైపు మరీ తక్కువ మెజారిటీ ఉండేది.

పదవ తరగతి పాస్ అయిందని ఇంట్లో చాలా సంతోషపడ్డారు. ఇంకా ఏ కాలేజీలో ఎక్కడ చేర్చాలి అని ఆలోచించారు.

సశేషం

May 30, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

శిలోద్భవ

by Mala Kumar May 29, 2025
written by Mala Kumar

“మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా?”

అకస్మాత్తుగా వినిపించిన ప్రశ్నకు, ఆశ్చర్యంగా చూసి “ఏమిటీ? నన్ను పెళ్ళిచేసుకుంటారా?” పకపకా నవ్వింది రాజి.

“అబద్ధం కాదు నిజంగానే అంటున్నాను. మా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్, అతని సహాయంతో మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుంటాను. నన్ను నమ్మండి” సీరియస్‌గా అన్నాడు విశ్వం.

“మీరు చదువుకున్నారు, మంచి ఉద్యోగం వస్తుంది. అసలు మీరు ఇక్కడికి రావటమే విచిత్రం! వచ్చినప్పటి నుంచి కబుర్లు చెపుతున్నారు. పైగా నన్ను పెళ్ళిచేసుకుంటారా? అభ్యుదయభావాలా?” గమ్మత్తుగా అడిగింది.

“ఈరోజు మా స్నేహితుడి బలవంతం మీద కొంత, అసలు ఈ అనుభవం ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలంతో కొంత వచ్చాను. మిమ్మల్ని చూడగానే ఏదో ఆత్మీయ భావం కలిగింది. అందుకే అడుగుతున్నాను నన్ను పెళ్ళి చేసుకుంటారా?” మళ్ళీ అడిగాడు విశ్వం.

విశ్వం కళ్ళల్లో కనిపించిన ప్రేమ, నిజాయితీని చూసి “మీకెందుకు ఆభావన కలిగింది? నాలో ఏమి ఆత్మీయత చూసారు? నేనొక వేశ్యనని మర్చిపోతున్నారా?” విస్మయంగా అడిగింది.

“ఎందుకు? ఏమిటి? అంటే ఏమి చెప్పను? కొన్నిటికి సమాధానం ఉండదు” జవాబిచ్చాడు విశ్వం.

విశ్వం వైపు సాలోచనగా చూసింది. ఒక్క క్షణం ఆగి, “ నిజంగా మీకు నామీద ఆత్మీయతాభావం ఉంటే ఒక సహాయం చేయగలరా?” కన్నీటిని కనురెప్పల మాటున దాచుతూ అడిగింది రాణి.

“ఏమి సహాయం చేయాలి?”

“మా నాన్న ఆటో డ్రైవర్. అమ్మ ఒక పెద్దింట్లో పని చేసేది.మేము హైద్రాబాద్‌లో ఒక బస్తీ లో ఉండేవాళ్లము. నేను, మా చెల్లి, తమ్ముడు అక్కడే ఉన్న గవర్నమెంట్ స్కూల్‌లో చదివేవాళ్ళము. నేను తెల్లగా, అందంగా ఉండేదానిని అని నన్ను రాణీ అని పిలిచేవారు అమ్మానాన్నా. నేను ఎనిమిదవ తరగతి చదువుతుండగా జబ్బు పడ్డాను. చాలా వీక్ అయ్యాను. అందుకని ఆ సంవత్సరం స్కూల్ మానిపించి, అమ్మ తనతో పెద్దింటికి తీసుకెళ్ళేది. వాళ్ళ నాలుగేళ్ళ లోయర్ కేజీ చదువుతున్న, బాబుని స్కూల్‌కు తీసుకెళ్ళి, మధ్యాహ్నం  స్కూల్ అయిపోయవరకు అక్కడే ఉండి, ఇంటికి తీసుకొచ్చేదానిని. మేడంకు చిన్నచిన్న పనులు చేసిపెడుతూ సహాయంగా సాయంకాలం వరకూ అమ్మతో ఉండేదానిని. బాబును స్కూల్‌కు తీసుకెళ్ళే డ్రైవర్ మురళి. అతనూ నాతోపాటే స్కూల్ అయిపోయేవరకూ ఉండేవాడు. ఆ సమయంలో నాతో చాలా చనువుగా ప్రేమ మాటలు చెపుతుండేవాడు. నన్ను పెళ్ళి చేసుకుంటాననేవాడు. అప్పుడు నాకు నిండా పద్నాలుగు ఏళ్ళు కూడా లేవు. ఏమీ తెలియని రోజులు.బాబు వచ్చేవరకూ కార్‌లో కూర్చొని అతను చెపుతుండే ప్రేమ కబుర్లు నన్ను సుందరస్వప్నలోకంకు తీసుకెళ్ళేవి. పైగా చూస్తున్న సినిమాల, టీ.వీ షోల ప్రభావమనుకోండి, ఏదైనా అనుకోండి, ఓ రోజు స్కూల్ నుంచి అటే అతనితోవచ్చేసాను. అమ్మా వాళ్ళ గురించి కానీ స్కూల్‌లో ఉన్న బాబు గురించికానీ ఆలోచించలేదు! ఇక ఆతరువాత చెప్పేదేముంది? అందరికీ తెలిసిన మామూలు కథే! కడుపుతో ఉన్న నన్ను ఇక్కడ అమ్మేసి చెక్కేసాడు! ఇప్పుడు నా బాబుశౌర్యకు నాలుగు సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే వాడికి ఊహ తెలుస్తోంది. ఇక్కడే ఉంటే నాకే విటులను తీసుకొచ్చేవాడవుతాడు. వాడు ఇక్కడ పెరగటం నాకు ఇష్టం లేదు. బాగా చదువుకొని జీవితంలో మంచి వ్యక్తిగా స్థిరపడాలని నా కోరిక. మీకు వీలవుతే వీడిని ఈ వాతావరణానికి దూరంగా  తీసుకెళ్ళి ఏదైనా స్కూల్‌లో, హాస్టల్‌లో చేర్చండి. డబ్బు సంగతి ఆలోచించకండి. నేను వీడికోసం ఎంతైనా కష్టపడుతాను. ఫీజులు నేనే కడుతాను. అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటాను. ఇక్కడి మౌసీకి నేను ఇక్కడే ఉండి, డబ్బులు సంపాదించి ఇస్తే చాలు. అభ్యంతర పెట్టరు” అని వేడుకోలుగా అన్నది రాజీ.

ఆ తల్లి హృదయం ను అర్థం చేసుకున్న విశ్వం శౌర్యను కలింగ్‌పాంగ్ లోని స్కూల్‌లో, తన స్నేహితుని కొడుకని, తల్లితండ్రులు ఆక్సిడెంట్‌లో చనిపోయారని, తను గార్డియన్ అని చెప్పి చేర్చాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. శౌర్య గ్రూప్ పరీక్షలు పాస్ అయ్యి, పోలీస్ ఆఫీసర్ అయ్యాడు.

“ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టు” విశ్వ తన ఎదురుగా నిలబెట్టిన యువకుడిని తేరిపారా చూసింది రాజి. అప్పుడప్పుడు కలింగ్‌పాంగ్ వెళ్ళి కొడుకును దూరం నుంచి చూస్తూ ఉండేది. ఇప్పుడుయూనీఫాంలో ఎదురుగా ఉన్న కొడుకును కన్నీరుతో కళ్ళు మసకలుబారుతుండగా, ప్రేమగా తడుముతూ భావోద్వేగానికి గురయ్యింది రాజి! విశ్వ వైపు తిరిగి రెండు చేతులూ జోడించింది!

తల్లిని పొదివి పట్టుకొని, తనవైపు భయంభయంగా, ఆసక్తిగా చూస్తున్న అందరినీ చిరునవ్వుతో చూసి, పెద్ద సోఫాలో కూర్చొని ఉన్నావిడతో “మౌసీ మా అమ్మను తీసుకెళుతున్నాను” అన్నాడు శౌర్య.

అప్పటి వరకూ వాళ్ళిద్దరినీ గమనిస్తున్న మౌసీ, యూనీఫాంలో ఉన్న శౌర్యను ఏమనలేక “సరే తీసుకెళ్ళు కానీ కాస్త మమ్మలిని కూడా చూసుకుంటూ ఉండు” అంది ఆదరంగా.

“అలాగే నువ్వింకే అమ్మాయినీ తీసుకురాకుండా కనిపెట్టి ఉంటానులే నవ్వుతూ అని పదమ్మా” అన్నాడు శౌర్య అమ్మతో.

అప్పటి వరకూ ఒక ట్రాన్స్‌లో ఉన్నట్టున్న రాజీ”నేనెందుకు వద్దు. నేను నీతో వస్తే సమాజంలో నీకు గౌరవం ఉండదు. నాతో గడిపిన ఎందరో ఎదురైనప్పుడు నిన్ను చిన్నచూపు చూస్తారు. నీకు పెళ్ళి కాదు. వద్దు నన్ను ఇట్లాగే ఉండనీయి. నేను కోరుకున్నట్లుగా నువ్వు పెద్ద ఆఫీసర్‌వి అయ్యావు. ఆతృప్తి చాలు నాకు” వణుకుతున్న గొంతుతో అంది రాజి.

“నాకు నా అమ్మ చాలు. ఈ సమాజంతో నాకు పనిలేదు. నిన్ను ఇష్ఠపడి, గౌరవంగా చూసుకునే అమ్మాయి వస్తే పెళ్ళి చేసుకుంటాను. లేకపోతేలేదు. ఇంక మాట్లాడక పద” అన్నాడు శౌర్య.

అదేమిటి రాజీ, ఈరోజు కోసమే కదా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసింది. ఇన్నాళ్ళు ఈ మురికి కూపంలో కష్టపడ్డావు. ఇక కొడుకు దగ్గర గౌరవంగా ఉండు” మందలింపుగా అన్నాడు విశ్వ.

ఇక మారు మాట్లాడకలోపలి నుంచి సూట్‌కేస్ తెస్తున్న రాజీ చేతిలోని సూట్‌కేస్ తీసి కింద పెడుతూ “ఇక్కడ నుంచి ఏమీ తేవద్దు. ఈ సామానులనూ, ఈ జ్ఞాపకాలనూ అన్నీ ఇక్కడే వదిలిరా” అంటూ తల్లిని పోలీస్ జీప్ ఎక్కించాడు.

పోలీస్ జీప్ ఎక్కుతుంటే రాజీ కాళ్ళు తడబడ్డాయి. కొడుకును పట్టుకున్న చేయి కూడా వణికింది. ఇప్పటి వరకూ ఎన్ని సార్లో పోలీస్ వాన్, పోలీసులు బందిలి దొడ్డిలోకి పశువులను తోలుతున్నట్లుగా లాఠీతో అదిలిస్తుంటే ఎక్కింది. ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ తల్లిగా ఎక్కుతుంటే చెప్పలేని భావోద్వేగానికి గురి అవుతోంది. తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న శౌర్య అమ్మ చేతిని మృదువుగా తట్టి, చిన్నగా ఎక్కించాడు.

                                     ***

పదమ్మా అంటూ అమ్మ భుజాల చుట్టూ చేయివేసి ఇంట్లోకి నడిపించాడు శౌర్య. Sourya I.P.Sగేట్ ముందున్న నేమ్ ప్లేట్‌ను ఆప్యాయంగా, గర్వంగా తడుముతూ లోపలికి నడిచింది.

పోలీస్ కాలనీలో చిన్న, ముచ్చటైన క్వాటర్శౌర్యది. హాల్, కిచెన్, మూడు బెడ్ రూంస్, ఇంటి చుట్టూ అందమైన తోట, ఆర్డర్లీ, వంటమనిషి, పని మనిషి అన్నీ అమర్చిన ఇంటిని చూసి మురిసిపోయింది రాణి. ఇంత వైభోగానికి తను తగునా అని నూన్యతాభావం కలుగుతోంది. పోలీస్‌లను చూసి ఉలిక్కిపడుతోంది. ఎవరిని చూసినా తనను చూసి నవ్వుకుంటున్నారేమోననే భావననే కలుగుతోంది. అమ్మను గమనిస్తూనే ఉన్నాడు శౌర్య. ఓరోజు ఒక మధ్యవయస్కురాలిని వెంటబెట్టుకొచ్చాడు.

“అమ్మా, ఈవిడ పేరు శారద. ఈవిడ రామకృష్ణామఠం లో యోగా నేర్పిస్తారు. ఇక నుంచి రోజూ మనింటికి వచ్చి నీకు యోగా నేర్పిస్తారు. చదువు చెపుతారు. బయటకు తీసుకెళుతారు” అని ఆవిడను పరిచయం చేసాడు.

నాకెందుకు నాన్నా యోగా, చదువు అనబోయింది కానీ శౌర్యను చూస్తూ అనలేక పోయింది. శారద వైపు చూసింది. తెలుపుకు ఎరుపు రిబ్బెన్ అంచు ఉన్న నేత చీర, తెలుపునలుపు కలగలిసిన జుట్టుతో చిన్న ముడి, నుదుటన చిన్న కుంకుమ బొట్టుతో సింపుల్‌గా ఉంది. రాజీ తనవైపు చూడగానే చిన్నగా నవ్వింది ఆవిడ.

“మా అమ్మ, రాజేశ్వరి” శారదకు పరిచయం చేసాడు. 

ఎప్పుడో నా అసలు పేరు రాజేశ్వరి అని చెప్పింది వీడికి బాగానే గుర్తుందే అనుకుంది రాజీ.

మరునాడు సాయంకాలం నాలుగు గంటలకు రాజేశ్వరిని రామకృష్ణమఠంకు తీసుకెళ్ళింది శారద. అక్కడ ఒక హాల్‌లో ఒక స్వామీజీ భగవద్గీత వినిపిస్తున్నారు. కాసేపు అక్కడ కూర్చున్నాక, వేరే హాల్‌లోకి తీసికెళ్ళింది. అక్కడ పిల్లలకు యోగా నేర్పిస్తున్నారు. అక్కడ నుంచి వెనుక వైపు ఉన్న మందిరంకు తీసుకెళ్ళింది. అక్కడ కూర్చున్నారు. ప్రశాంతంగా ఉన్న మఠం పరిసరాలు రాజేశ్వరికి చాలా నచ్చాయి. రాజేశ్వరి సెల్ తీసుకొని, యూట్యూబ్ తెరిచి, చాగంటి, గరికపాటి వారి ప్రవచనాలు ఎలా వినాలో, నచ్చిన పాటలు ఎలా వినాలో చూపించింది. శారదతో వస్తున్నప్పుడు తన గురించి ఏమైనా అడుగుతుందేమో, తన సంగతి తెలిసి చిన్న చూపు చూస్తుందేమో అని ఉన్న రాజీ, శారద అసలు ఆ విషయం గురించే మాట్లాడకపోవటము, తెలిసినట్లే లేకపోవటముతో  నూన్యతాభావన, బెరుకు పోయాయి రాజేశ్వరిలో. శారద ఆహార్యం, స్నేహశీలత్వం నచ్చాయి రాజేశ్వరికి. ప్రతిరోజూ సాయంకాలం వచ్చి రాజేశ్వరిని బిర్లా మందిర్, రామకృష్ణామఠం అలా తీసుకెళ్ళేది. శారద సత్ సాంగత్యంలో రాజేశ్వరి మంచి సాహిత్య పఠనం, ప్రవచనాలు విని ఆకళింపు చేసుకోవడం అలవరుచుకుంది.

రాజేశ్వరిలోని మార్పును ఆనందంగా గమనిస్తున్నాడు శౌర్య. ఒకసారి అమ్మ చిన్నప్పుడు ఉన్న బస్తీని వెతుక్కుంటూ తీసుకెళ్ళాడు. పోలీస్ జీప్ ఇంటి ముందు ఆగేసరికి చాలా భయపడ్డారు వాళ్ళు. రాజేశ్వరిమాటలతో జ్ఞాపకం తెచ్చుకున్నారు. తమ్ముడి, చెల్లెలి పెళ్ళిళ్ళు అయ్యాయి. బాగానే సెటిల్ అయ్యారు. తమ్ముడి కుటుంబం, అమ్మానాన్నా కలిసి ఉన్నారు. కాలం తెచ్చిన మార్పు వారిలో కనిపిస్తోంది. కాసేపు కూర్చొని వచ్చేసారు. తనవాళ్ళను చూసేసరికి తనలో మనోబలం పెరిగినట్లుగా అనిపించింది రాజేశ్వరికి!

ఆ రోజు ఆగస్ట్ పదిహేను. బస్తీ మధ్యలో ఝండా ఎగురేసి మైక్ చేతిలోకి తీసుకొని చుట్టూ చూసింది. అక్కడ ఉన్న పిల్లలను చూస్తుంటే తన బాల్యం గుర్తొచ్చింది. ఝండాను పోలినట్లు, తెలుపుకు ఆకుపచ్చ అంచున్న ఖాదీ చీర, నారింజ రంగు జాకెట్టు, మెడలో సన్న స్పటికపు మాల, చిన్న ముడితో డిగ్నిఫైడ్‌గా ఉన్న రాజేశ్వరిని ఆరాధనగా, ఏమి చెపుతుందా?! అని అసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ.

“అందరికీ నమస్కారం. మీలో పెద్దవాళ్ళు కొంత మందికైనా నేను గుర్తు ఉండే ఉంటాను. నా చిన్నప్పుడు మీ అందరిలాగే ఆటపాటలతో ఇక్కడే పెరిగాను. ఆనందంగా అమ్మానాన్నల నీడన ఉన్న నాకు ఒక త్రాష్టుడు తగిలాడు. వాడి మాయమాటలకు మోసపోయి, నా జీవితాన్ని చిందరవందర చేసుకున్నాను. ఇంకో పుణ్యాత్ముని సహాయసహకారము వలన నా కొడుకు ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్‌గా మీ ముందుకు వచ్చాడు. నేను ఒక ముళ్ళ కంచె నుంచి బయటకు వచ్చాను. ఇదంతా మీకెందుకు చెపుతున్నాను అంటే నాలాగా ఏ ఆడపిల్లా మోసపోకూడదని. అమ్మాయిలూ, అబ్బాయిలూ మీ వయసు చదువుకునే వయసు. ఇది వరకులాగా మనలని అమ్మానాన్నలు పనులకు పంపటం లేదు. వాళ్ళ శక్తి కొద్దీ మంచి స్కూల్స్‌లోనే చదివిస్తున్నారు. ప్రభుత్వం మనకు ఎన్నో రాయతీలూ, అవకాశాలు కల్పిస్తోంది. వాటిని ఉపయోగించుకోండి. చక్కగా చదువుకోండి. అమ్మాయిలూ అనవసరపు వ్యామోహాలకు లొంగిపోకండి. గుడ్ టచ్, బాడ్ టచ్ ఏదో తెలుసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే అమ్మకు, టీచర్‌కు చెప్పండి. వాళ్ళు మీ బాగు కోరేవారే. ముందుకోపం చేసినా తరువాత అక్కున చేర్చుకుంటారు. అబ్బాయిలూ మీరూ అనవసరమైన వ్యాపకాలు పెట్టుకోకండి. పిచ్చిపిచ్చి, భయంకరమైన వీడియోలు చూడకండి. వాటి వ్యామోహంలో పడితే మీ జీవితాలే నాశనమవుతాయి. మీ తోటి అమ్మాయిలను గౌరవించండి, తెలిసీతెలియక ప్రేమ అంటూ, ఏవో అనుభవాలు కావలంటూ వారిని వేధించకండి. మీకోసం మీ తల్లి తండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించండి. ఈనాటి బాలలే రేపటి పౌరులు. ఈనాడు మీ ప్రవర్తన బాగుంటే రేపటి సమాజం బాగుంటుంది. మీరే అందరికీ విజ్ఞాన దీపికలు.

ఏదీ అందరూ లేచి నిలబడి “మేము బాగా చదువుకుంటాము. మంచి ప్రవర్తన కలిగి ఉంటాము. పెద్దలు చెప్పిన మాట వింటూ వారిని గౌరవిస్తాము. దేశం కోసం పాటుపడతాము అని ప్రమాణం చేయండి” అని అందరితో ప్రమాణం చేయించింది.

‘జై హింద్’ అని సమావేశం ముగించింది.

ముళ్ళ కంచెను దాటి, శిధిలమైన శిలలా ఆత్మన్యూన్యతో బాధపడిన అమ్మ దేవుని గుడిలో వున్న శిల్పంగా కనిపిస్తున్న అమ్మను అపురూపంగా చూసాడు శౌర్య!

May 29, 2025 5 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

జ్ఞానోదయం

by Nellutla Madhava Srinivas May 29, 2025
written by Nellutla Madhava Srinivas

చిట్టి కథ గొప్ప సందేశం
ఒకరోజు ఒక బోయవాడు అడవిలో వేటకు వెళ్లాడు . అతడు కొన్ని పావురంలను వేటాడు సాయంత్రం ఇంటికి తిరుగు ముఖం పట్టాడు దారిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలై దారంతా జలమయం అయ్యింది. అప్పుడు ఆ వేటగాడు గబగబా ఒక మర్రి చెట్టు కింద తలదాచుకోవడానికి వెళ్ళాడు. వేటగాడు మర్రి చెట్టు కిందకు వెళ్లిన తర్వాత ఆ మర్రి చెట్టుకు ఒక వాగ్దానం చేశాడు. నన్ను విపత్కర పరిస్థితి నుండి ఈరోజు నువ్వు కాపాడినట్లయితే నేను రేపటినుండి వేటను వదిలేస్తాను ఇంకా ఏ కష్టమైనా చేసుకొని బ్రతుకుతాను ఈ జీవహింస చేయను అని అమరు చెట్టుకు వాగ్దానం చేస్తాడు. కాసేపటికి వాన కొంచెం తగ్గుముఖం పడుతుంది.అప్పుడే పైన చెట్టు మీద గుడి కట్టుకొని నివసిస్తున్న ఒక మగ పావురం మేత కోసం వెళ్లిన ఆడ పావురాన్ని తలుచుకొని దుఃఖిస్తుంది. అయ్యో!!! మేత కోసం వెళ్లిన నా భార్య ఇంకా రాలేదు ఏ ఆపద వచ్చిందో తనకు అని బాధపడుతుంది. ఇంతలో చెట్టు క్రింద వేటగాడు వేటాడి తెచ్చి పెట్టుకున్న పావురాలలో ఈ మగ పావురం భార్య అయిన ఆడ పావురం కూడా ఉండి మగ పావురం మాటలను వింటుంది. ఆహా!! నా జన్మ ధన్యం. నా భర్తకు నా మీద ఉన్న ప్రేమను ప్రత్యక్షంగా చూడగలిగాను. మొదటి అదృష్టవంతురాలిని అని అనుకుంటుంది. తనకోసం వ్యాకులత చెందుతున్న భర్తను చూసి జాలి వేసి ప్రేమగా అరుస్తుంది. ఆడ పావురం అరుపును గమనించిన మగ పావురం చెట్టు కిందకు వంగి చూస్తుంది. అక్కడ తన భార్య అయిన ఆడ పావురాన్ని చూసి చాలా సంతోషించి అది కూడా అడపావురం వద్ద వాలుతుంది. భర్తను చూసిన ఆడ పావురం మగ పావురంతో ఈ విధంగా అంటుంది. ఈ చెట్టు పైన మనం గూడు కట్టుకొని నివసిస్తున్నాం కనుక ఇదే మన ఇల్లు ఈ వేటగాడు మన ఇంటికి వచ్చిన అతిధి. కనుక నీవు అతనికి అతిధి మర్యాదలు చేయి అని మగ పావురంతో చెప్తుంది. మగ పావురం అలాగేనని అయ్యా!!! ఇది మా ఇల్లు. మీరు మా ఇంటికి వచ్చిన అతిధి. అతిధికి అతిధి మర్యాదలు చేయాల్సిన బాధ్యత కూడా నాదే కనుక మీకు నేను ఏ విధంగా మర్యాదలు చేయగలను తెలియజేయండి అని అడుగుతుంది మగ పావురం. అప్పుడు ఆ వేటగాడు ఇప్పటికైతే నాకు చాలా చలిగా ఉంది చలిని తగ్గించడానికి ఏమైనా చేయగలిగితే చేయి అని చెప్తాడు. అది విన్న మగ పావురం వెంటనే చెట్టు కింద అక్కడక్కడ పడి ఉన్న చిన్నచిన్న కర్ర పుల్లలను తెచ్చి చలిమంటను వేస్తుంది. వేటగాడు కాసేపు ఆ చలిమంట కాచుకొని కాసేపు ఆగిన తర్వాత తనకు బాగా ఆకలిగా ఉందని చెప్తాడు. అది విన్న మగ పావురం అయ్యా!!! మాకు ఆకలి వేస్తే అప్పటికప్పుడు వెళ్లి ఆహారాన్ని సేకరిస్తాము దానినే తింటాము. మీ మానవుల లాగా మేము ఆహారాన్ని దాచుకోము. కానీ మీరు పక్షులను వేటాడి తింటారు కదా!!! అయితే ఇప్పుడు నేను చేయగలిగింది ఒక్కటే నేను ఈ మంటల్లో దూకి మీకు ఆహారాన్ని అవుతాను స్వీకరించండి అంటూ…. మగ పావురం ఆ మంటల్లో దూకుతుంది. అది చూసిన వేటగాడు చలించిపోయి ఛీ!! పక్షికి ఉన్న పాటి జ్ఞానం కూడా నాకు లేకుండా పోయింది. అతిధి మర్యాద చేయడానికి వేరే దారి లేక అది పక్షి అయినప్పటికీ దాని ప్రాణాన్ని త్యాగం చేసి నాకు ఆహారంగా మారింది. మరే విధంగానైనా ఆహారం సంపాదించుకోగల శక్తి సామర్థ్యాలు కలిగిన నేను మాత్రం మూగ జీవులను హింసించి వాటిని ఆహారంగా సేకరిస్తున్నాను. నా మీద నాకే అసహ్యంగా ఉంది .అనుకొని వలలో ఉన్న పావురాలన్నింటిని ఆకాశంలోకి విసిరేస్తాడు. అన్ని పావురాలు గాల్లోకి సంతోషంగా ఎగిరిపోగా ఆడ పావురం మాత్రం అతిధి మర్యాద కోసం ప్రాణత్యాగం చేసిన భర్తను తలుచుకొని దుఃఖిస్తూ తను కూడా ఆ చితిమంటలో దూకి ఆత్మర్పణం చేసుకుంటుంది. అప్పటికే ముక్తిని పొందిన మగ పావురం దేవలోకంలో బంగారు విమానంలో కూర్చుని ఎదురుచూస్తుంది ఆడ పావురం కోసం. భార్య మాట కోసం భర్త ,భర్త కోసం భార్య ఒకరికొకరు త్యాగాన్ని ప్రదర్శిస్తారు. మనల్ని నమ్మి ఆశ్రయించి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించి అతిధి మర్యాదలు చేసినంత మాత్రము చేత పక్షులైన పావురాలకి మోక్షం కలిగింది. మనం చేసిన మంచి ఎప్పటికీ వృధా పోదు అనటానికి ఈ కథ ఒక నిదర్శనం. కథ కల్పితమే అయినప్పటికీ విని నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈ కథలో. మనం మంచి విషయాన్ని స్వీకరించాలి అనుకున్నప్పుడు అది కథన, కల్పితమ, వాస్తవమా చూడాల్సిన అవసరం లేదు. సందేశాత్మకంగా ఉన్న దేని నుంచైనా మంచిని నేర్చుకోవచ్చు . చిట్టి కథ గొప్ప సందేశం. మిత్రులందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు నచ్చే మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో రాయటం జరిగింది.

(సామాజిక మాధ్యమం నుండి సేకరణ)

సర్వేజనా సుఖినోభవంతు

May 29, 2025 6 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పత్రిక పాతదైనా- సంపాదకీయం కొత్తది

by రంగరాజు పద్మజ May 29, 2025
written by రంగరాజు పద్మజ

మహిళా పత్రిక సంపాదకులు 100 సంవత్సరాల క్రితమే వారి పత్రిక లో ఏంచెప్పాలనుకుంటున్నారో ఒక నిర్దిష్ట అంశాన్ని లేదా వారు లేవనెత్త బోయే సమస్య గురించిన చక్కని అవగాహన ఉందనడానికి నిదర్శనము అప్పటి సావిత్రి పత్రిక.
1904 లో స్థాపించిన ఈ పత్రిక విదుషీమణి శ్రీమతి పులుగుర్తి లక్ష్మీ నరసమాంబగారు, సంపాదకురాలు.
స్వాతంత్ర్యం రాక మునుపు మహిళల పరిస్థితి చాలా దుర్భరంగాను, అధ్వాన్నంగా ఉండేది. అయితే వారికి తమ ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చాలామందికి తెలియకపోయేది.చదువులేకపోవడం ఒకటైతే, ఇంట్లోనూ- దేశంలోనూ స్వతంత్రత లేకపోవడం మరో కారణం. ఇంకా శోచనీయమైన విషయం ఏమిటంటే ఆయా కష్టాలు ఆ బాధలు తమకు వచ్చిన సమస్యలుగా గుర్తించక, నిశ్శబ్దంగా జీవితంలో ఒక అవీ భాగం అనుకొని, అవన్నీ భరించాలి కాబోలు అనుకునే అమాయకులే ఆనాడు ఎక్కువ!
అటువంటి ఆడవారి బాధలు చూడలేక, వారిలో ధైర్యాన్ని పెంచాలని, చైతన్యం తీసుకురావాలని, భాషా -సాహిత్యాల పట్ల వారికి అభిరుచి ఏర్పరిచి, వాటి ద్వారా జీవితమంటే ఇది కాదు! మరోలా ఉంటుందనీ, ఉండేలా ప్రయత్నించాలని ఎరుక కలిగిస్తూ, వారి అస్తిత్వ ఆత్మ గౌరవం నిలుపుకొనే దిశగా ఈ పత్రిక నిర్వహించబడింది.
ఎందుకంటే మహమ్మదీయుల పాలనలో ఉర్దూ భాషకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. తెలుగులో ఏ రచనా ప్రక్రియనైనా వస్తే పాలకుల( నైజాము) ఆక్షేపణలకు గురయ్యేవి.
తెలంగాణ నడిబొడ్డులో ప్రజల భాషను ఆక్షేపించడం,మగవారిని కూడా ఆఫీసులకు వారు కట్టుకునే పద్ధతిలోనే వస్త్రధారణ ఉండాలని షరతు పెట్టడం ఇవన్నీ భరించలేక,మహిళలుగా తమకంటూ ఒక పత్రిక ఉండాలని, దాని ద్వారా తమ మనోభావాలు సమాజానికి ఎరుక చేయాలని,
సావిత్రి పత్రిక యజమానురాలు, సంపాదకురాలు పులుగుర్తి లక్ష్మీనరసమాంబ గారు మహిళల కంటూ ఒక పత్రిక ఉండాలని భావించారు.
మగవారు స్వేచ్ఛగా పత్రికలకు ఉత్తరాలు రాసుకుంటారు. అదే వారికి చెందిన మహిళలు మాత్రం వారి మనోభావాలు ఎందుకు తెలుపుకోకూడదు? అని గృహిణులుగా ఉన్న ఉద్యోగస్తులైన వారిని రచించమని ప్రోత్సహించేది. ఎందుకంటే కొన్ని విషయాలు అనుభవించే కొందరికే తెలుస్తాయి! మరికొన్ని విషయాలు మరికొందరికి తెలుసు… ఇలా వారు- వీరు; వారికి తెలిసిన విషయాలను తెలిపినా మహిళలకు అన్ని విషయాలు తెలుసే అవకాశముంటుంది అనేది ఆమె ఆంతర్యం. అదే ఆమె పత్రికను స్థాపించడానికి కారణం అని కూడా చెప్పారు.
ఆమె ఎందరో రచయిత్రుల రచనలను వెలుగులోనికి తీసుకొని వచ్చారు. 1904లో తాను స్వయంగా ఎన్నో రచించి, తమ పత్రికలో ప్రచురించారు. అలా అని కేవలం మహిళల రచనలే కాదు! మగవారి రచనలు కూడా తమ పత్రికలో అచ్చు వేశారు. కాకపోతే ఈ పత్రికలో ఎక్కువ పాతివ్రత్యం గురించే ఎక్కువ రచనలు వచ్చాయి. ఈ పాతివ్రత్య ప్రబోధాలు పద్య రూపకంగా ఉండేవి.
నీతి పదములు –ఏప్రిల్ 1904;
సత్య ధర్మములు ఫిబ్రవరి ఏప్రిల్ 1904 ;
స్త్రీ నీతి దీపిక 1904 ఆగస్టు;
స్త్రీ నీతి గీతముల ఫిబ్రవరి 1904;
నీతి పదములు ఫిబ్రవరి ,మార్చి, ఏప్రిల్ 1912. ఇలా ఎన్నో రచనలు చేయగా వాటిని తమ పత్రిక లో ముద్రించారు.
ఈ రచనలు స్త్రీలకు సత్యధర్మం చాటు చెప్పాయి.
సంపాదకూరాలి దృష్టిలో స్త్రీ విద్యావంతురాలైతే ఆకుటుంబం అందరూ నీతినియమాలతో ఒక కట్టుబాటులో నడుస్తారని అనుకుని, ఆమె మంచి సంపాదకీయాలు రాసేవారు.
అలాగే ఇంటి పనులు కూడా తల్లిని చూసి పిల్లలు నేర్చుకుంటారని, అలానే పిల్లలు సత్ప్రవర్తనతో మెలగాలంటే మహిళలు చదువుకోవాలని,తెలుపుతూ… కాలాన్ని వృధా చేసుకోవద్దని, ఉబుసుకుపోక మాటలు, ఇల్లామల్లి ముచ్చట్లు మాట్లాడవద్దని రాసేవారు.
ఈ పత్రికలో స్త్రీ విద్యా పంచరత్నాలు 1910లో ఉప్పల నరసమాంబ, ర్యాలీ జానకీరామాయమ్మ,ఆత్మూరి అన్నపూర్ణమ్మ,మొదలైన రచయిత్రులు విద్యకు ప్రాధాన్యతనిస్తూ…. వనితలు చదువుకోవాలని తమకు తెలిసినవి రాసి పత్రికలకు పంపాలని కోరుతూ సంపాదకీయం రాయడం ఎంతో అభినందించదగ్గ విషయము.
అంతేకాదు స్త్రీల పట్ల మగవారి ప్రవర్తన కూడా బాగుండాలని అప్పుడే స్త్రీ తన విద్యతో వచ్చిన ఆలోచనలతో చక్కని ప్రణాళికలతో ఆ కుటుంబాలు రాణిస్తాయని, అలా పురుషులు సకల సద్గుణాలు ఆచరిస్తూ, వారింటి మహిళలు ఆచరించాలని విన్నపము అనే శీర్షికతో సెప్టంబర్ (1910) లో రాసారు.
ఆ కాలంలోనే ఆడవారు చదువుకొని ఉద్యోగాలు చేయాలని దామెర్ల సీతమ్మ అన్నారు.
బొంబాయిలో ఇలా చదివి ఉద్యోగం చేస్తున్న వారెందరో ఉన్నారని, రఖమాబాయి, డాక్టర్ కృష్ణాబాయి,డాక్టర్ కమలాకర్ బాయి, మొదలైన ఎందరో మహిళలు బాగా చదువుకొని ఇటు ఉద్యమం చేస్తూనే, అటు ఇంటిని చక్కదిద్దుకుంటున్నారని రాసారు.
ముఖ్యంగా వితంతువులు చదువుకుంటే వారు ఎలా జీవించాలో తెలుసుకొని,తమ కాళ్ళ మీద తాము నిలబడుతూనే, సమాజానికి కూడా అసరాగా నిలబడతారని రాసారు.
కొందరుకుని అపవాదులేసినట్టు చదువుకున్న మహిళలు వారి ఇష్టా రాజ్యంగా ప్రవర్తించి చెడునడ త అలవర్చుకుంటున్నారనేది అబద్ధమని చెప్పింది. అలా అన్నప్పుడు మగవారు మాత్రం చదువుకొని ఉద్యోగం చేయడం లేదా? వాళ్ళు దుర్మార్గులు అయినారా? అని సమాజాన్ని ప్రశ్నించింది.
ప్రవర్తన అనేది వారి గుణగణాల మీద ఆధారపడి ఉంటుంది కానీ, చదువుకోవడం వల్ల చెడిపోయారని అనడం మూర్ఖత్వం అని రాసింది. ఇంకా చదువుకుంటే సంస్కారం అబ్బి సూఖశాంతులు నెలకొంటాయని రాసారు.
అలా అంటే మనం విదుషీమణులుగా చెప్పుకుంటున్న వారు గానీ, పురాణ స్త్రీలు కానీ పాతివ్రత్యాన్ని పాటించింది బాగా చదువుకోవడం వల్లనే కానీ… మరో విధంగా కాదు!
మైత్రేయి, సులభ మొదలైన వారంతా చదువుకోవడం వల్ల బ్రహ్మజ్ఞానం పొందగలిగారని, వాళ్ల కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయిందని, కాబట్టి మంచి విద్య వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, శ్రీమతి పులిగుర్తి లక్ష్మీ నరసమాంబగారు తన సంపాదకీయంలో వివరించారు. ఆమె దార్శనికత కలిగిన మహిళ.ఎప్పుడూ 20 సంవత్సరాల ముందు ఆలోచించి పరిస్థితులను ముటదే పసికట్టి, ముందే హెచ్చరికలు చేసేవారు.
ఎన్నో అభ్యుదయ భావాలతో నిర్వహించిన ఈ పత్రిక మీద కొన్ని అపవాదులొచ్చాయి. బాల్యవివాహాలను వ్యతిరేకించిందీ పత్రిక. అంతే కాదు ఎన్నో సమావేశాలలో ఆ బాల్య విహాలు చేస్తే వచ్చే సమస్యల మీద ప్రసంగించింది.
స్త్రీల కోసం గ్రంథాలయాలు ఏర్పరచి, వితంతువులకు ఆసరాగా నిలిచింది. ఇలా తన పత్రిక ద్వారా మహిళలకు సహాయ సహకారాలు అందించమని 1911 లోనే కోరిందంటే ఎంత ముందు చూపు ఉన్న పత్రికాధిపతో కదా?
1910 స్త్రీల సనాతన మండలి గుంటూరులో మొదటి మహిళా సభ రాష్ట్రస్థాయిలో జరిగింది. విద్యార్థిని సమాజం ఆధ్వర్యంలో రెండవ సభ జరిగింది. ఈ సందర్భాన్ని గురించి తన పత్రికలో పులుగుర్తి నరసమాంబ
ఆంధ్ర మహిళ కార్యదర్శిని పేరుతోఎనిమిది పేజీలలో సంపాదకీయం వివరించింది.
చిన్న పెద్ద తేడా లేకుండా కులాలకు అతీతంగా వారందరినీ ఆ సభకు ఆహ్వానించింది. ఇందులో విద్య గురించి చర్చించడానికి ఒక సభ, సమాజంలోని లోటుపాట్లు గురించి మాట్లాడడానికి ఒక సభ, ఇంటికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి మరోసభలు ఉపశీర్షికలు పెట్టి ఇరవైరెండు రకాలైన సమస్యలను చర్చించారు.
చర్చలలో ఒకరి మధ్య మరొకరికి బేధాభిప్రాయాలు వచ్చి కొంతకాలం పత్రిక నిలిచిపోయినా మహిళల గురించి మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలు వెతకడం అనే గొప్ప కార్యక్రమానికి నాంది పలికింది మాత్రం 1904 లోనే… ఆ నాటి నుండే మొదలైంది ఈ పరంపర.
పందిటి వీర రాఘవమ్మ గారు ఆంధ్ర సోదరీ సమాజం స్థాపించి, పులుగుర్తి లక్ష్మీనరసమాంబ గారి అధ్యక్షతన అత్యద్భుతంగా తన ప్రతిభా పాటవాలతో మహిళలను చైతన్యవంతులుగా చేయడానికి ఎంతో కృషి చేసింది.
అలా చైతన్య వంతులైన మహిళలు, స్వాతంత్య్రం కోసం ప్రజలను మేలుకొలిపారు.
ఇవాళ మనం రాజకీయ,ఆర్థిక, సాంకేతిక,నిర్వహణలలో ఇలా నిలదొక్కుకొని రాణించడానికి ఆనాటి నరసమాంబ వంటి మహిళల ప్రోద్బలం, ప్రోత్సాహం ఎంతోఉంది.
ఎందుకంటే గృహహింస ఎంత ఉన్నా ఇదిలానే ఉంటుందని, దాన్ని భరించాలకునే మనస్తత్త్వం నుండి ఎదురించి, ఆత్మాభిమానంతో బతకాలని నేర్పిన ఆనాటి పత్రికలు ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండానే నడిపారు.
మరో కారణం రవాణా సౌకర్యాల వసతి అంతగా లేక ఒక విషయం సామాన్యులకు చేరడం వ్యక్తిగతంగా సభలు ఏర్పాటు చేసి, ప్రసంగాల వల్ల కష్టమైయ్యేది. ఆర్థిక వనరులు అడ్డు తగిలేవి. తమకంటూ ఆదాయంలేని మహిళలకు సభా నిర్వహణ తలకు మించిన భారమయ్యేది.
పత్రికలైతే ఇంటింటా చేరి, విషయం అందరికీ చేరుతుందని ఆలోచన చేయడం మరో కోణం.
ఏదేతైనేమి ? సామాజిక స్పృహ ఉండి, అణచబడిన మహిళలలు తలెత్తుకుని జీవించాలన్న వారి ధ్యేయానికి, పత్రిక ప్రజలకూ – ప్రభుత్వానికి నడుమ వంతెనవలె పనిచేయాలనే ఆశయంతో… శాంతి సుస్థిర సమాజాన్ని కాంక్షించే పత్రికలకెప్పటికైనా ఋణపడే ఉంటాం! ఆ నారీ మణులందరికీ
నమోవాకములర్పిస్తూ…

May 29, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

భువిలో స్వర్గం

by Kattekola Vidyullata May 29, 2025
written by Kattekola Vidyullata

హిమాంశ్ – మణిపూర్‌లో పనిచేస్తున్న ఒక యువ ఇంజినీర్.

సుష్మిత – తమిళనాడులో పుట్టి పెరిగి, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.

ఒక వివాహ పరిచయ వేదిక ద్వారా కలుసుకున్న వీరు, ప్రేమించి పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు పూర్తైంది. ఒకరికొకరు తగిన సహచరులుగా నిరూపించుకున్న  ఈ దంపతులు, తమ జీవితంలో మొదటి మూడు సంవత్సరాలు నిత్యజీవన పోరాటాలలో గడిపేశారు.

ఉద్యోగాలలో స్థిరత్వం వచ్చేసరికి, కొంత సమయం తమకోసం గడపాలనిపించింది. “నువ్వెప్పుడూ చెబుతూ ఉంటావుగా కాశ్మీర్ గురించి… స్వర్గమేనంటూ,” అన్నాడు హిమాంశ్.

ఆ మాటకు మురిసిపోయింది సుష్మిత. బాల్యంలో పుస్తకాల్లో చూసిన దాల్ సరస్సు, టులిప్ తోటలు, మంచుతో కప్పిన పర్వతాలు—తన కలల ప్రపంచం కళ్ళ ముందు కదలాడింది.

విమానం కాశ్మీర్ మీదుగా వచ్చినప్పుడు, వారిద్దరూ కిటికీ పక్కన కూర్చొని చూసిన దృశ్యం జీవితంలో మరువలేనిది. ఎత్తయిన పర్వతాలపై కురిసిన మంచు కప్పు, గగనాన్ని తాకే చిలిపి మేఘాలు, తాను ఊహించుకున్న రకాల రకాల పూల పరిమళం అప్పుడే తన నాసికను తాకిన అనుభూతి కలిగింది సుస్మిత కు.

“ఇది నిజంగా మన భారత్ లోనిదేనా?” అని ఆశ్చర్య పోయారు ఇద్దరూ.

శ్రీనగర్ చేరుకున్న మరుసటి రోజు వారిద్దరూ దాల్ సరస్సు సందర్శించేందుకు బయలుదేరారు. అలసిపోయిన మనసుకు అది ఒక శాంతి నిలయం. ఓ బోట్ హౌస్‌లోకి ఎక్కి, ఆ ప్రశాంతత మధ్య ప్రేమతో మాటలు చెప్పుకుంటూ సాగిపోయారు.

చుట్టూ దర్పణంలా మెరుస్తున్న నీళ్లు, వాటిలో ప్రతిబింబించే పర్వత శిఖరాలు, బోటు మీద కొలువైన కాష్మీరీ కళాకృతులు ఇవన్నీ ఒక గంధర్వ లోకాన్ని తలపించాయి. అక్కడే ఓ పూల బోటులో అమ్మాయిలు వదిలిన టులిప్ పూలు, ఆర్చిడ్ల పరిమళాలు శ్వాసలో నింపుకున్నారు.

“ఇదేనా మన కలల ప్రపంచం?” అని ఆశ్చర్యంగా అన్నాడు హిమాంశ్.

ఏప్రిల్ నెల. తక్కువ గాలి, మంచు ఇంకా కాస్త బాగానే ఉంది. శ్రీనగర్ చేరుకున్న రోజు నుంచే వాళ్లను అబ్బురపరిచిన పర్వతాలు, పూల తోటలు, దాల్చిన చెట్లు, చలిగాలి ఒకరిపై ఒకరికి మరింత అనురాగాన్ని పెంచుతున్నాయి. ఈ ప్రయాణానికి తన అత్తమామలను కూడా రమ్మని ఎంతగానో కోరింది సుస్మిత. వీరికి ఏకాంతం కలిగించేందుకో, లేక నిజంగానే చెప్పారో, “ నా ఆరోగ్యానికి అంత చల్లని వాతావరణం సరిపడదమ్మా, మీరు వెళ్ళండి. మరేదైనా తీర్థయాత్రకు అందరం కలసి వెళదాం,”  అంటూ తన మాట తోసి పుచ్చిన అత్తగారితో తన మనసులోని భావాలు పంచుకునేందుకు ఫోన్ చేసింది.

“అత్తయ్యా! మీరు చూడాలి ఈ పువ్వుల తోటల్ని… మన జీవితంలో ఒక్కసారైనా రావాలి ఇక్కడకి. భూమి మీద స్వర్గం అంటే ఇదే అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది,” అంటూ ఫోన్‌లో ఉద్వేగంతో చెప్పింది సుష్మిత.

“చాలా సంతోషం తల్లీ, నువ్వు ఎంతగా ఆనందిస్తున్నావో నీ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది. హాయిగా ఎంజాయ్ చేయండి. నాకూ, మీ అమ్మకూ మంచి షాల్స్ తీసుకురండి. సంతోషంగా తిరిగి రండి,” నిండుగా ఆశీర్వదించారు పార్వతి గారు.

తరువాత శ్రీనగర్ లోని ఓ ప్రముఖ ఆర్కిడ్ తోట. వివిధ రంగుల్లో విరజిమ్ముతున్న పూలు. వేలాది రంగుల పుష్పాల మధ్య నడవడం అంటే భూమిపై ఆకాశంలో నడిచినట్టే. సుష్మిత అబ్బురపడింది.

“ఒక్కో పువ్వు ఒక్కో భాషలో ప్రేమను పలికిస్తున్నాయనిపిస్తోంది,” అంది. హిమాంశ్ త‌న ఫోన్లో వాటి ఫోటోలు తీస్తూ నవ్వాడు. “నీ ముఖంలో ఆనందాన్ని చూసేందుకే ఈ ట్రిప్‌,” అన్నాడు ప్రేమగా.

అక్కడ నీలీ, పచ్చ, నారింజ రంగుల ఆర్కిడ్స్ తో పాటు, చాలా అరుదైన పుష్పాలు కూడా ఉన్నాయి. వాటిపై పడే మంచు తుంపర్లు, హాయిగా వీస్తున్న వసంతగాలులు — మదిని మంత్రముగ్ధం చేశాయి.

“ఇక్కడే ఓ చిన్న ఇంట్లో ఉండిపోతే ఎంత బాగుండు,” అంటూ తన భర్త చేతిని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుని మైమరపుగా అన్నది సుష్మిత.

బోట్ హౌస్ లో ఆ రాత్రి, చలిగాలి తాకుతూ ఉన్నా, సుష్మిత తన డైరీ తీసుకుని కాసేపు ఏదో రాసింది.

“ఏమిటది?” అడిగాడు హిమాంశ్.

“నీ కోసం. ఈ కాశ్మీర్ నాకు నిన్ను కొత్తగా పరిచయం చేసింది,” అంది. “ఏదీ, దేవిగారేం రాశారో మేం తెలుసుకోవచ్చా?” గోముగా అడిగిన హిమాంశ్ ను చూస్తూ తన పేరు లాగానే వెన్నెలలా హాయిగా నవ్వింది సుస్మిత.

ఈ మంచు చల్లదనం కంటే నీ పలుకులు మృదువైనవి,

ఈ సరస్సు ప్రశాంతతకంటే నీ మౌనం లాలిత్యమైనది.

ఈ పర్వత శిఖరాలను మించినవి

మనం ఆశగా అల్లుకున్న జీవన శిఖరాలు!

పూల తోటల మధ్య విహరిస్తున్నా,

నీ శ్వాసే నాకు గొప్ప పరిమళం.

ఇక్కడి వర్ణాలు, వాయువులు, నీటి ప్రతిబింబాలు

అన్నీ నాకు నీవైపే చూపిస్తున్నాయి.

ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటే

నిన్ను చూస్తే చాలనిపిస్తోంది.

నీవుంటే – ఈ పయనం పూర్ణం,

నీవే లేకపోతే – కాశ్మీర్ కూడా రంగులేని శూన్యం.

హిమాంశ్ నిశ్శబ్దంగా ఆమె కవితను విన్నాడు. ఆమె కళ్ళలో తనకోసం మెరిసిన ప్రేమలోతులు అర్థమయ్యాయి. ఆ క్షణం బోట్ హౌస్‌లో కాకుండా, వాళ్లు ప్రేమ అనే మరొక లోకంలో విహరించారు.

*************************

ఓ స్థానిక టూర్ గైడ్‌తో కలిసి మరికొంతమంది పర్యాటకులను కలసుకుని పహల్గామ్ చూడాలని నిర్ణయించుకున్నారు. చుట్టూ మంచు పర్వతాలు, నదుల ప్రవాహం. అక్కడే కొత్తగా పరిచయమైన బెంగుళూరుకు చెందిన నవవివాహిత దంపతులు – అనీష్, నీతా. వాళ్లతో కలసి సాయంత్రం హడావుడిగా గడిపారు.

“ఓ… నీతా ఎంత బాగుంది నువ్వు కట్టుకున్న దుపట్టా. మా ఆడపడుచుకి కూడా ఇలాంటిదే  తీసుకుంటాను,” అని సుష్మిత చిరునవ్వుతో చెప్పింది.

తర్వాతి రోజు పహల్గామ్‌కు బయలుదేరారు. పర్వతాల మధ్య నెమ్మదిగా ప్రయాణించి ఒక చిన్న మైదానం దగ్గర బస్ ఆగింది. పర్యాటకులంతా దిగారు. కొందరు ఫొటోలు తీస్తుంటే, కొందరు ఆ ప్రాంతం యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. మరికొందరు ఎడ్వెంచర్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ వీరిద్దరూ తమ తల్లిదండ్రుల కోసం కశ్మీరీ శాలువాలు కొనాలనుకుని కొండ దిగువ దుకాణం వద్దకు వెళ్లారు.

కొంతసేపటికి టపటపా గాలిలో తూటాల మోత. పర్వత మార్గం అంతా గర్జనలతో, అరుపులతో మారుమోగింది. ప్రజలు పరుగులు, ఏడుస్తూన్న పిల్లలు, రక్తపు మడుగులో పర్యాటకులు, భీకరమైన మానవ సృష్ట దుశ్ఛర్య.

కొంత సేపటి తర్వాత సైన్యం వచ్చి పరిస్థితిని నియంత్రించగలిగారు. కానీ అప్పటికే… అనేక ప్రాణాలు మట్టిలో కలిశాయి.

హిమాంశ్ సుష్మిత అక్కడే ఉండాల్సింది. వారు షాల్ దుకాణానికి వెళ్లడం వాళ్ళ ప్రాణాలకు రక్షణగా మారింది. అదే సమయంలో తమ పెద్దవారి కోసం శాల్స్ కొనేందుకు వెళ్ళడం, వారి ఆశీర్వాదమేనేమో! కానీ, వారి కళ్ళముందు బాధాకరమైన దృశ్యం. అనీష్‌ను, నీతా భర్తను కాల్చి చంపారు ఆ ఉన్మాదులు. తల్లడిల్లిన నీతా, భర్త శవాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తుంటే, అక్కడ ఉన్న వారి హృదయాలు బద్దలయ్యాయి.

“ఇక్కడ మనిషిగా జీవించడం ఎంత కష్టం అన్నది ఇప్పుడు అర్థమయింది,” అంది సుస్మిత. ఆమె మాటల్లో ఉలిక్కిపాటు లేదు, ఉత్కంఠ లేదు — ఒక తీవ్రమైన మనోవేదన ఉంది. ఆ క్షణం వరకూ స్వర్గాన్ని తలపించిన ఆ ప్రాంతంలో మృత్యువు కరాళ నృత్యం చేయడం కళ్ళారా చూడడంతో ఆమె షాక్ కు గురయింది.

ఆ 26 మంది అమాయక హిందూ పర్యాటకులు, తమ కుటుంబాలతో కశ్మీర్ లోని పహల్గాం, గల్గస్, సోనమార్గ్ లాంటి అందమైన ప్రాంతాలు చూసేందుకు వచ్చినవారే. కానీ మతాన్ని అడిగి, ‘నువ్వు హిందువా? ముస్లింవా?’ అని ప్రశ్నించి, ‘హిందువు’ అని చెప్తేనే మృత్యుదండన విధించిన ఉగ్రవాదుల చర్య యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది.

ఈ వార్త కశ్మీర్ లోని స్థానిక చానెల్ లో వెలువడగానే, దేశవ్యాప్తంగా మీడియా దాన్ని బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం చేయసాగింది. “పహల్గామ్ లో ఉగ్రవాదుల పైశాచికత్వం. మతం అడిగి మరీ 26 మంది అమాయక హిందూ పర్యాటకుల హత్య.” దేశమంతా ఉలిక్కిపడింది.

ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద యువతతోపాటు పెద్దలూ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ముంబైలో, బెంగుళూరులో, హైదరాబాద్‌లో, కోల్‌కతాలో నిరసనలు ఎగిసిపడ్డాయి. సోషల్ మీడియాలో –

#JusticeFor26, #StopTerrorin Kashmir, #HindusAreNotSafe అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.

పోలీసులు, సైన్యం తీవ్రంగా అలర్ట్ అయ్యాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి.

ప్రధానమంత్రి తక్షణమే విదేశీ పర్యటన రద్దు చేసుకుని తిరిగి వచ్చారు. టీవీ చానెళ్ల ద్వారా దేశ ప్రజలతో ప్రత్యక్ష ప్రసంగం చేశారు. “ఈ ఉన్మాద చర్య మన దేశ గౌరవాన్ని విచ్ఛిన్నం చేయడమే కాదు, ఇది మానవత్వం పై దాడి. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తాం. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను మాత్రమే కాదు, వారికి మద్దతుగా నిలిచిన వారికి కూడా తగిన గుణపాఠం నేర్పుతాం,” అని ప్రకటించారు.

ఆ తర్వాత ప్రయాణం ఆగిపోయింది. మరుసటిరోజు తిరుగు ప్రయాణం అయ్యే లోగా తమ బంధువులంతా తమ యోగక్షేమాల గురించి వాకబు చేస్తుండడంతో వారికి తమ క్షేమ సమాచారాన్ని మెసేజ్ ద్వారా తెలిపారు వారిద్దరూ.

భారమైన హృదయంతో తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. ఇప్పుడు జీవితంపై వారి దృక్పథం మారింది. వాళ్లు హోటల్ నుంచి ఇంటికి ఫోన్ చేసినప్పుడు, “ఇక్కడి ప్రజలకు ఈపాటికే మనసులు విరిగి పోయి ఉండాలి. అయినా సరే, చిరునవ్వుతో మనల్ని స్వాగతిస్తున్నారు,వారికి ధన్యవాదాలు,” చెప్పింది సుష్మిత తన తల్లితో.

హైదరాబాద్ చేరుకున్న తర్వాత, సుష్మిత తన ఉద్యోగంలోకి వెళ్లే ముందు చిన్న మెసేజ్ వ్రాసి టేబుల్ మీద పెట్టింది.

“ప్రతి ఉదయం నా కళ్లెదుట నువ్వు ఉండటం ఒక అద్భుతం. ప్రతిరోజూ మనం మనసు విప్పి మాట్లాడుకోగలిగితే – అదే నిజమైన స్వర్గం. కాశ్మీర్ ఇది నేర్పింది.”

ఆ ప్రయాణం వారిద్దరిలో మార్పు తీసుకొచ్చింది — సహజమైన అందం పట్ల ప్రేమను, మానవీయత పట్ల మమకారాన్ని, ఒకరి జీవితంలో మరొకరి విలువను మరింత లోతుగా అర్థం చేసుకునే సాధనగా మారింది.

ప్రకృతి ఎంత అందమైనదైనా, మనిషి హృదయం కన్నా పెద్ద స్వర్గం లేదు. మనం ప్రేమతో, శాంతితో జీవించగలిగితే, ఏకంగా ఒక కాశ్మీర్ మన హృదయంలోనే నెలకొంటుంది.

May 29, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఇంకెప్పుడు….

by K. Akshaya May 29, 2025
written by K. Akshaya

నిద్రలేవడంలో
సూర్యునితో పోటీపడినప్పుడల్లా
ఎప్పుడూ ఆమెనే గెలుస్తుంది

వాకిలి ఊడ్చి,కల్లాపి చల్లి
రోజొక కొత్తముగ్గుతో
సూర్యోదయానికి
స్వాగత గీతం పాడుతుంది

తనకు ఆకలవుతున్నా
ఇంటిల్లిపాదికీ ఆకలితీరాకే
తాను ఆకలి తీర్చుకుంటుంది

నిరంతరం శ్రమిస్తూ
చిందరవందరగా ఉన్న ఇంటిని
ఇంద్రభవనంలా మార్చుతుంది

కుటుంబాన్ని చక్కదిద్దే పనిలో
ఆమె కళలు అటకెక్కుతున్నాయి
ఆమె కలలు
కన్నీటి సంద్రంలో కలుస్తున్నాయి

వంశాభివృద్ధికీ,దేశాభివృద్ధికీ
ఒక మంచి కుటుంబంకోసం
తన జీవితాన్ని త్యాగం చేస్తున్న
“ఆమె”ను ఇంకెప్పుడు గుర్తిద్దాం
“ఆమె”ను ఇంకెప్పుడు గౌరవిద్దాం

May 29, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

దిక్సూచి

by వారాల ఆనంద్ May 29, 2025
written by వారాల ఆనంద్

ఆత్మా ఇల్లూ ఒకటే

చూపునకు చిన్నగా వుంటాయి

లోన ఎంత విశాలమో

రెంటికీ చుట్టూ గోడలుంటాయి

గోడల్లో కిటికీలుంటాయి

బయటకు వెళ్ళడానికీ లోనికి రావడానికీ

దర్వాజాలుంటాయి

తలుపులు తలపులు

మూసుకుంటాయి తెరుచుకుంటాయి

గాలీ వేల్తురూ

కిటికీల గుండా ద్వారాల గుండా

వెంటిలేటర్ల ద్వారా

ఇంట్లోకి వస్తూ పోతూ వుంటాయి

సయ్యాటలాడతాయి సరసాలడతాయి

కొండకచో దాగుడుమూతలాడతాయి

నేనేమో ఇంట్లో కొంత బయట కొంత

కాలం గడిపేస్తూ వుంటాను

ఇల్లేమో స్థిరంగా నిలబడి

చోద్యం చూస్తుంది

ఆత్మే ఆలోచనల భారంతో

అనుభవాల వేదనలతో

నా అన్ని కదలికలకూ చేష్టలకూ

సాక్ష్యంగా బాసింపట్టు వేసుక్కూర్చుంటుంది

నేనేమో ఆత్మను దిక్సూచిగా

ప్రయాణం సాగిస్తూ వుంటాను

May 29, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వజ్రపు తునక

by A. Gajender Reddy May 29, 2025
written by A. Gajender Reddy

డిస్కో సంగీతం కన్న పల్లెలో వినిపించే కోయిల కంఠస్వరం తీయగా ఉంటుంది. నల్లా నుంచి వచ్చే నీటికన్న ఏటిలో చెలిమె తోడి నీళ్ళు తాగే అనుభూతి గొప్పది. ‘మాజా’కన్న మామిడిపండును స్వయంగా తీసుకొని రసాన్ని ఆస్వాదిస్తే ఎంత బాగుంటుంది! ఆనాడు ఒక్క పైసకే వచ్చే బెల్లాన్ని తింటే కలిగిన ఆనందం ఈనాటి చాక్లెట్‌ బిస్కట్లతో కలగడం లేదు. చెట్టు కింద కూర్చుని గాలి పీలుస్తుంటే కలిగే సౌఖ్యం ఏసిలతో రావడం లేదు. చిర్ర గోనె ముందు క్రికెట్‌ బలాదూర్‌. గుడ్డి దీపం ముందర పదవ తరగతి పరీక్షలకు చదివిన వజ్ర సంకల్పం ముందు భూరి భవనపు ట్యూబ్‌ కాంతిలో చదివే పట్టా విద్య దిగదుడుపే. వాన వెలిశాక మట్టి వాసన, ఆరుద్ర పురుగుల సర్కస్‌ ఫీట్లు, పిచ్చుకల మట్టి స్నానాలు, వెన్నెల్లో ఆడిన ఆటలు, ఎండాకాలం బావుల్లో ఈతలు ఈనాడేవి? మన చిన్నతనం మనకు చిన్నతనం కాదు. బాల్యం మళ్ళీ రమ్మంటే వస్తుందా? ‘‘అనుభూతుల్ని పోగొట్టుకున్న గుండె ఎడారి. అనుభూతుల్ని పదిలపరచుకున్న గుండె సతతహరితారణ్యం’’. ఇటువంటి మధురమైన భావాల సుమమాల డా॥నలిమెల భాస్కర్‌ ‘‘సుద్దముక్క’’.
మట్టిమీద నడవాల్సిన పాదాలు మార్బుల్‌ మీద నడుస్తున్నందుకు బాధగా ఉంది. మట్టినిలబెడుతుంది. మార్బుల్‌ పడగొడుతుంది. అమ్మ ఇల్లంతా పేడతో అలికితే, వారానికి సరిపడిన శీతల గంధస్పర్శ. ఆనాడు ఇల్లు, సమస్త కుటుంబ సభ్యులకు ఓ శీతలీకరణ కేంద్రం. అడుగున ఆలంబనగా మట్టినేల, చుట్టూ మట్టిగోడలు, కప్పుపైన మట్టి గూనపెంకులు. మట్టి పొయ్యి మీద మట్టికుండలో మట్టిమనుషులైన కాపు బిడ్డల చెమట చుక్కలు మెతుకుల రూపంలో. చేదబావి మట్టి ఫ్రిజ్‌. మట్టి వాకిలి, పేడ సాన్పు, సుద్దతో ముగ్గులు గృహ పుస్తకానికి ముచ్చటైన ముందుమాటలు. మట్టికీ ఇంటికీ మనిషికీ గల బంధం భాస్కర్‌ కవిత్వంలో ఆస్వాదిస్తాం.

భాస్కర్‌ మనిషిని రెండు కాళ్ళ గేహం అంటాడు. గృహానికీ దేహానికీ అద్భుతమైన పోలికలు చెప్తాడు. కాళ్ళు పిల్లర్లు. మోకాలిచిప్పలు ప్లింత్‌ బీములు. జీవకణాలు ఇటుకలు. బొక్కలు ఐరన్‌. మాంసం సిమెంట్‌. పై తోలు ప్లాస్టరింగ్‌. పుర్రె స్లాబ్‌. కళ్ళు కిటికీలు. ముక్కుపుటాలు శ్వాసకోశాలు, వెంటిలేటర్లు. నోరు ప్రధాన ద్వారం. పొట్ట సువిశాలమైన హాలు. గుండె వాటర్‌ ట్యాంక్‌. వీటిని కవిత్వీకరించిన తీరు భాస్కర్‌లాగా మరెవ్వరూ చేయలేరు.
ఇందులో శ్రామికజనజీవన చిత్రణం ఆర్ద్రంగా ఉంటుంది. శ్రామికుల ఋణం మనం తీర్చుకోవాలనిపించేలా చేస్తుంది. తమ బతుకుల్ని బండలకేసి బాదుకుంటూ మన బట్టల్ని గట్టున ఆరేస్తారు రజకులు. మన బట్టల్ని పిండీపిండీ వాళ్ళు తోలుబొమ్మలవుతారు. వాళ్ళు ఉతికిన దుస్తులతో మనం మన లోపలి ముఖాన్నీ మురికినీ చాటు చేసుకొని రోజూ నాగరికులమవుతాం. ఎవరి బట్టల్ని వారికి, తప్పిపోకుండా అందించే అమోఘమైన జ్ఞాపకశక్తి వారిది. ‘‘సమాజ కల్మషాన్ని కడిగివేయడానికి/ కంకణధారులైన వ్యక్తులు సంస్కర్తలయినప్పుడు/ తరతరాలుగా మైలబట్టల్ని/ మల్లెపూలు ఉల్లిపొరలూ చేసేందుకు/ కటి బద్ధులైన వీళ్ళూ సంస్కర్తలే’’.
చెప్పులు కుట్టేవాడురెక్కలూడి విలవిలా కొట్టుకుంటున్న మన పాదరక్షలను ఆప్యాయంగా సేదదీరుస్తాడు. ‘‘తెగిన మన వేళ్ళనీ/ ఊడిన మడమల్నీ/ ఏ సంజీవనితో అతుకుతాడో కాని/ మళ్ళీ మన కాళ్ళు క్షణంలో రెక్కలౌతాయి’’. మడిచిన తన మోకాలిమీద గడ్డం ఆనించి అతనలా తదేక దీక్షతో మన పాదరక్షల్ని కుడుతుంటే ఈ కవికి, బట్టలు తొడుక్కున్న వేమనయోగి భంగిమ గుర్తుకొస్తుంది. బ్రహ్మ కడిగిన పాదమైనా అతనికి బలాదూరే. మగ్గం ముందు చేనేత కార్మికుని ఆకారం ‘‘తన కాళ్ళూ చేతుల్ని/ లయబద్ధంగా కదుపుతూ/ కళ్ళల్లో వత్తులూ పత్తులతో పాటు/ దారాలు వేసుకొని/ వాటిని తన కన్నీళ్ళతో పిండి/ చెమటతో తడిపి/ నెత్తురులద్ది/ మన కళ్ళముందే పడుగూ పేకల్ని కలగలిపి/ ఒక వస్త్రాన్ని తయారు చేస్తుంది. అతని గుండెనిండా లబ్‌డబ్‌ శబ్దం బదులుగా లట్కురం పొట్కురం శబ్దమే వినిపిస్తుంది. చేనేత వాళ్ళయినా, చెప్పులు కుట్టేవాళ్ళయినా, రజకులైనా ఈ కవి వాళ్ళ జీవితాల లోతుల్లోకి వెళ్ళి కవిత్వం రాసినట్టుగా ఉంటుంది.
వాన గురించి ఇందులో ఉన్నది కమ్మని కవిత్వపు సోన. మొగులు మెత్తవడుతది. గాలి ఇసిరిసిరి కొడుతది. మొగులు మీద ఇసుర్రవుతులు తిరుగుతున్నట్టు గుడగుడ మొదలయితది. చినుకు పడుడు ఆలిశెంబూమిలకెల్లి బువ్వ వాసన వస్తది. మేఘాలు నేల మీద చేసే తొలి సంతకం వాన. పడిన ప్రతి చినుకూ కంచంలో మెతుకై పరిణమించడం అసలు సిసలైన వాన. ‘‘రైతులు శెమ్ట వడిపితే/ పొలంలకెల్లి సెంటత్తది పంటత్తది’’.
నలిమెల భాస్కర్‌కు ‘‘పుస్తకాల షాపులోనో/ పుస్తక ప్రదర్శనలోనో కాలు పెట్టడమంటే/ పూలతోటలో అలా హాయిగా విహరించి రావడం/ పుస్తకాన్ని ఎత్తిపట్టుకోవడమంటే/ రచయితను మన చేతి పొత్తిళ్ళలో/ ఒడుపుగా ఓలలాడిరచడం లాలించడం’’. అతనికి ప్రతిదీ కవిత్వమే. చెట్లకు నీళ్ళు పోసి వాటి దాహం తీరుస్తుంటే కవిత్వం రాసినంత సంతోషంగా ఉంటుంది. కాపు బిడ్డలు పొలంలో వంగి నాట్లు వేస్తుంటే సామూహిక కవి సమ్మేళనం గుర్తుకు వస్తుంది. పెరట్లో రకరకాల పూలు రంగులతో వికసిస్తుంటే తనకు మల్టీకలర్‌ పుస్తకం వేసుకున్నంత ఆనందంగా ఉంటుంది. ‘‘రైలు భూమ్మీద ఊయలలూగే నావ/ దేశం పెట్టెలు పెట్టెలుగా కనిపిస్తుంది/ అసలు సిసలు దేశం జనరల్‌ బోగీలోనే ప్రత్యక్షమవుతుంది/ పట్టాల పాదాలమీంచి దూసుకువస్తోన్న రైలు/ ఒక ద్విపద కావ్యంలా/ అద్భుతమైన దీర్ఘ కవితలా అనిపిస్తుంది’’.
డా॥నలిమెల భాస్కర్‌ బహుభాషా కోవిదుడు. అనువాదకుడు. ‘‘మా అనువాద కలాలతో ప్రపంచ సాహితీ పరిమళాల్ని మట్టి అంతటా పరుస్తాం. మాది అనువాద కులం/ మేం అనువాదకులం’’ అని సగర్వంగా ప్రకటిస్తాడు. ఈ కవి ఎన్ని ప్రదేశాల్ని తిరిగినా, ఎన్ని సాహిత్యాల్ని చదివినా స్థానికతను మరువడు. బహు భాషకరుల జిల్లా అయిన కరీంనగరంను ‘‘ఇది ఆదిమానవుని/ కాలితో క్యాలితో పునీతమైన పుడమి/ శాతవాహనుల ఏలుబడిలో/ చేవదేరిన శాగవారిన జాగ/ ఒక్క గాథాసప్తశతి చాలు/ ఇది హాలుని నేల/ కథాసరిత్సాగరాలకే కాదు/ కవితా నవలాది సకల సాహిత్య ప్రక్రియలకిది ఆలవాలం’’ అని ప్రశంసిస్తడు. ‘‘మానేరు కవులారా! మీరు కవిత్వం రాయడం మానేరు సుమా!’’ అని వెన్ను తడుతడు.
‘‘నలిమెల కవిత్వంలో కళ్ళు` ‘‘కదులుతున్న శరీరం తోటలో/ ఒకే తీరు సౌష్ఠవం కలిగి/ విరబూసిన సున్నితమైన కలువలు/ ఈ రెండు కళ్ళే ఈరేడు లోకాల వాకిళ్ళు/ ఈ రెండు కళ్ళే ఏడేడు పదునాల్గు భాషాసాహిత్యాల లోగిళ్ళు’’. చెట్లు పెడస్ట్రల్‌ ఫ్యాన్లు. మట్టికుండలు ఆదిలాబాద్‌ నుండి తరలివచ్చిన మట్టి గుండెలు. సహజ శుద్ధ శీతల రంజనిలు. ఉగాది కవితలో కొత్తకుండ తనను మట్టి నుండి సృష్టించిన కుమ్మరి గురించి కన్నీరు కుమ్మరిస్తుంది. నీరుమనస్సు నీరునీరౌతుంది. చింతపండు చింత పడుతుంది. బెల్లం ప్రశ్నిస్తుంది.
‘సుద్దముక్క’లో సామాజికత తక్కువేంలేదు. ‘‘ఈ తక్కెడకు/ ఎలానూ వ్యక్తిత్వం లేదు/ ఏ వైపున కొంత ద్రవ్యం పడ్డా/ అటు వేసే మొగ్గు చూపుతుంది/ గత్యంతరం లేక/ వ్యక్తిత్వం లేని తక్కెళ్ళ చేతనే/ అసంఖ్యాక జీవితాలు తూచబడుతున్నాయి’’ అన్నప్పుడు నేటి రాజకీయం, అధికారగణం, అవినీతి స్ఫురిస్తాయి. ‘‘కనీసం కొలిచే వ్యక్తైనా/ తక్కెడ కాకుండా ఉంటే చాలు’’ అనే దాంట్లో మనుషులు నిజాయితీపరులు కావాలనే ఆకాంక్ష ఉంది. ‘‘ముక్కు ఉక్కులా తయారవ్వనంతకాలం/ ఈకల్లో బాకులు మొలవనంతకాలం/ కోడి మెడ/ పిల్లికి సరదా’’ అనే పంక్తుల్లో బాధితులు సాయుధులు కావాలనే సందేశం ఉంది. ‘రూపాయిబిళ్ళ’ కవితలో మానవాళిని ‘మనీ’ గారడివాడు కోతిని ఆడిరచినట్లు ఆడిస్తున్నది. నాణెంలో బొమ్మాబొరుసుల స్థానంలో ప్రాణమున్న మనిషిని, మానవత్వాన్ని నిలబెడదాం రండి అని ఆహ్వానిస్తున్నాడు.
ఈ పుస్తకంలో ఇవన్నీ ఒక ఎత్తు. ఉపాధ్యాయుని గురించి, సుద్దముక్క గురించి రాసిన ఆరు కవితలు మరో ఎత్తు. ఆరు కవితలలో నలిమెల భాస్కర్‌ ఉపాధ్యాయున్ని ప్రపంచాన అగ్రభాగాన నిలిపాడు. అధ్యాపకునికి అక్షరాభిషేకం చేశాడు. ‘‘అతడు కాలు మోపడం తోటే అణువణువూ అక్షరమవుతుంది/ అతని మాటల రెక్కల మీద/ పిల్లలు అత్యంత సురక్షితంగా/ జ్ఞాన విహాయసంలో విహరించి వస్తారు’’ అని ఉపాధ్యాయుడి ఔన్నత్యాన్నీ, ‘‘క్లాసులో ప్రవేశిస్తున్న ప్రతిసారీ/ అతని కుడిచేతికి ఆరో వేలు/ అదనంగా మొలుస్తుంది/ అది ఖచ్చితంగా జ్ఞానం ఘనీభవించిన తెల్లని సుద్దముక్కే’’ అని చాక్‌పీస్‌ ప్రాధాన్యాన్ని వెల్లడిస్తాడు. అతడు పద్యం ఎత్తుకుంటే గాన కచేరీ. పాఠం చెబుతుంటే జ్ఞాన కచేరీ. పాఠం చెప్పీ చెప్పీ అతని ఊపిరితిత్తులు ఉత్త ఉలిపిరి తిత్తులవుతున్నా విద్యార్థులకు జ్ఞాన జ్యోతులు పంచుతాడు. విద్యార్థులకు అతడు బోధవృక్షం. సంచార బృహద్గ్రంథం. టీవీ పాఠాలు అతనికి ప్రత్యామ్నాయం కాదు. అతడు రక్తమాంసాలతో అపార ప్రేమాభిమానాలతో పిల్లల ముందు కదలాడుతున్న తల్లి, తండ్రి, మిత్రుడు, వేదాంతి. అతని దృష్టిలో పిల్లలకు పాఠాలు చెప్పడమంత పవిత్రమైన కార్యం మరొకటి లేదు. అతడొక కాంతి నక్షత్రం. ఈ దీపం వెలుతురులో ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తయారయ్యారు.
సుద్దముక్క సూర్యగోళం నుండి కోసుకొచ్చిన రశ్మి శకలం. చందమామ నుండి తీసుకొచ్చిన వెన్నెల గడ్డ, అన్నప్పుడు భాస్కర్‌ కవిత్వం తారాస్థాయికి చేరుతుంది. సౌందర్యోపేతం అవుతుంది. చాక్‌పీస్‌ విద్యార్థులకు ‘‘సమస్తమైన దిక్కుల్ని నిర్దేశించగల చుక్కాని/ తరగతికి వెళ్ళే ఉపాధ్యాయునికి ఊపిరి గుళిక/ ఉపన్యాసకులకు ఊతకర్ర’’.
సహజంగా, సులువుగా, ఆత్మీయంగా, త్యాగమయంగా ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నపుడు ఊగే పిల్లల ముఖాలు చూడాలి. పూవుకు తావిలా, పిల్లలకు చదువు సంస్కారాలు అబ్బినపుడే విద్యకు సార్థకత. పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పినప్పుడే సార్థకత. భాస్కర్‌ దృష్టిలో ‘‘ఈ భూమండలం మీద ఏకైక లోకైక దర్శనీయ స్థలం బడి’’.
‘సుద్దముక్క’ తెలుగు కవిత్వంలో ఓ వజ్రపు తునక. ఇందులో అడుగడుగునా కవిత్వం. అణువణువునా నవత్వం. ప్రతివాక్యం ఆస్వాదయోగ్యం. అనుభవైకవేద్యం. డా॥నలిమెల భాస్కర్‌ ఈ పుస్తకాన్ని చదివిన పాఠకులను జ్ఞానపీఠం మీద కూర్చోబెడతాడు.

ప్రతులకు :
డా॥నలిమెల భాస్కర్‌
97043 74081

May 29, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni May 29, 2025
written by Narendra Sandineni

బిట్ల అంజనీ దేవి మనసెందుకో సున్నితం కవిత
కవయిత్రి బిట్ల ఆంజనీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం అంటే ప్రాణం.ఇప్పుడు కూడా ప్రతి రోజు మంచి పుస్తకాలు చదువుతారు. సమాజ అభ్యుదయం కాంక్షించే సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు.చదువు పట్ల మక్కువతో ఎంఏ. బీ.ఈడీ.పూర్తి చేశారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అప్పుడప్పుడు కవితలు,వ్యాసాలు రాయిస్తున్నారు.విద్యార్థుల్లో దాగి వున్న సృజన శక్తికి పదును పెట్టిస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా సాహిత్య సృజన కొనసాగిస్తున్నారు. కవయిత్రి అంజనీ దేవి కలం నుండి జాలువారిన మనసెందుకో సున్నితం కవితా సంపుటిలోని మనసెందుకో సున్నితం కవిత పై విశ్లేషణా వ్యాసం. ఈ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఈ కవిత మనసు గురించి రాయడం జరిగింది.మనసు గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ఉంది.అందరు చదవాల్సిన కవిత.
“మొదటిసారి వేడి తగిలినపుడు
“వేళ్ళు చురుక్కుమన్నాయి/అని అంటున్నారు.
పొయ్యి మీద వంట చేస్తున్నపుడు గిన్నె వేడిగా ఉంటుంది.వంట పూర్తి అయిన తర్వాత పొయ్యి మీద ఉన్న గిన్నెను గుడ్డను రెండు చేతులతో పట్టుకొని భద్రంగా చేతులు కాలకుండా గిన్నెను జాగ్రత్తగా తీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. మొదటిసారి చేతికి వేడి తగిలినప్పుడు వేడి గిన్నె చేతికి అంటుకుని వేళ్లకు బాధ కలిగింది అనే చక్కని భావాన్ని వ్యక్తీకరించిన తీరు బాగుంది.
“వయసు పెరిగే కొద్ధీ
“చర్మం ముదిరిందో
“అలవాటయిందో
“తట్టుకునే శక్తి పెరిగిందో
“ఇప్పుడు అమాంతం
“వేడి గిన్నెను దించగలదు/అని అంటున్నారు.
జీవితం నేర్పిన పాఠాలుగా తోస్తుంది.వయసు పెరిగింది.వయసుతో పాటు చర్మం ముదిరింది.ప్రతి రోజు వంట చేస్తున్నది.వంట చేయడం ఇప్పుడు అలవాటయింది.వేడిని తట్టుకునే శక్తి కూడా పెరిగింది.ఇప్పుడేమో అమాంతం చేతిలో బట్ట లేకుండా పొయ్యి మీద నుండి వేడి గిన్నెను దించుతుంది.వేడి గిన్నెను పొయ్యి మీదనుండి దింపినప్పటికీ చేతులు కాలడం లేదు.వేడి గిన్నెను దించితే చేతులు కాలుతాయని స్పృహ కూడా లేకుండా పోయింది.మనిషి యొక్క అనుభవాలు మనసు సున్నితత్వం నుండి కఠినత్వం వైపు ఎలా తీసుకెళ్లింది.మనిషి మనస్సు ఎంతగా మారి పోయింది.మనిషిలోని మనసు యొక్క సున్నితత్వం గురించి కవయిత్రి అందించిన భావం అద్భుతంగా ఉంది.

“మొదటి అడుగు సున్నితంగా
” ముళ్ళు తగిలినా రాయి తగిలినా
“నొప్పితో తడబడింది/అని అంటున్నారు.
ఎవరికైనా,ఎప్పుడైనా,మొదటి అడుగు సున్నితంగా ఉంటుంది అని మన అందరికి తెలుసు.మొదటిసారి ముళ్ళు తగిలినా,రాయి తగిలినా నొప్పితో తడబడింది.బాధతో విలవిలలాడింది.ముళ్ళు తగిలిన చోట అవస్థను అనుభవించింది.ఎవరికైనా రాయి తగిలిన చోట నొప్పి ఉంటుంది.రాయి తగిలిన చోటనే మళ్లీ దెబ్బ తగిలి శరీరానికి కలిగిన బాధను ఓర్పుతో భరించింది.
“ఎముక ముదిరిందో
“అవసరాల అనివార్యతో
“ఇపుడు ముళ్ళపై నడవగలను
“కంకరపై పడుకోగలను/అని అంటున్నారు.
నిజమే.వయసు పెరిగిన కొద్ది ఎముక ముదిరింది. అవసరాలు మరియు అనివార్య పరిస్థితులు వల్ల ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలను అన్న ధైర్యం పెరిగింది.ముళ్ళపై నడవగలను అనే ధీమా పెరిగింది.ముళ్ల పై నడిస్తే ఏం జరుగుతుంది? కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయి.కంకరపై పడుకోగలను అనే ఆత్మ విశ్వాసం సైతం పెరిగింది.కంకర పై పడుకుంటే శరీరానికి కంకర రాళ్లు ఒత్తుకొని ఏ కష్టాన్ని అయినా ఏ సమస్య నైనా ఓర్చుకునే లక్షణం అలవడింది.
“అనుభవం పెరిగే కొద్దీ
“అన్నీ తట్టుకున్న ఈ శరీరంలో
“మనసెందుకో అందుకు భిన్నం/అని అంటున్నారు.
జీవితం నేర్పే పాఠాల వల్ల అనుభవం పెరిగింది.ఈ శరీరం మాత్రం అనుభవం పెరిగిన కొద్ది అన్నిటిని తట్టుకుంది.మనలో భావోద్వేగాలు,అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు లేదా మనస్సు. మనసుకు రూపం లేదు.పేరు మాత్రమే ఉంది. దేవుడికి రూపం లేదు.మనసు ఎక్కడ ఉంది?మన లోపల మనసు దాగి ఉంది.మనసు అంటే ఆలోచన అని అర్థం.ఆలోచనల్లో కూడా తేడాలు ఉంటాయి. మనస్సు అనేది ఎవరికి వారి సొంతం.సంకల్పమే మన మనస్సు.ఇతరుల మనసును ఎవ్వరు తెలుసుకోలేరు.మన మనస్సే జీవిత లక్ష్యాన్ని సాధిస్తుంది.శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది మన మనసు.మన మనస్సే జీవిత లక్ష్యాన్ని కోరుకోవాలి.ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి.శరీరం స్వాధీనంలో లేదు.మనసు స్వాధీనంలో లేదు.మనస్సు అంటే అంతరంగం. మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు, విచక్షణ,మొదలైన అంశాలు.మనస్సు ఏదైనా వస్తువు లేదా జీవరాశి పై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం.ప్రతి మనిషి యొక్క భావాలు,అనుభూతులు,అభిప్రాయాలు,వారి వారి మనస్సు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది.అందుకే ఎవరి ఆలోచనలు వారివే. మనసు గతి యింతే,మనిషి బ్రతికింతే,మనసున్న మనిషికి సుఖం లేదంతే,చలనచిత్రంలోని పాటను మనం విని ఉన్నాం.మనిషి మనసు ఎవరికి అర్థం కాదు.మనసు అంటే నానార్థాలు హృదయం, మానసం,ఇష్టం,తలపు,వలపు,చిత్రం,మది.మనసు గురించి కవయిత్రి మనసెందుకో భిన్నమని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

“అమ్మ తిట్టినపుడు
“ఏడ్చి మర్చిపోయా
“మళ్లీ అమ్మా అన్నాను/అంటున్నారు. మనం ఏమైనా తప్పు చేస్తే అమ్మ తిట్టుతుంది.అమ్మ తిట్టినప్పుడు మనకు దుఃఖం వచ్చి ఏడుస్తాం.అమ్మ కొట్టినా,తిట్టినా తిరిగి అమ్మ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది.అమ్మ ఆలనలో,లాలనలో అమ్మ కొట్టిన సంగతి,తిట్టిన సంగతి మర్చిపోయి మళ్లీ అమ్మ దగ్గరికి చేరుతాం.అమ్మ ఎవరు?అమ్మ ప్రత్యక్ష దైవం.అమ్మను మాతృదేవోభవ అని శాస్త్రాలు చెబుతున్నాయి.అమ్మ కనిపించే దైవం.అమ్మ కని పెంచే దైవం.అమ్మ గురించిన భావన అద్భుతం. కవయిత్రి అమ్మను గుర్తుచేసింది,అమ్మ లోకం గురించి,మనలను ఆలోచించేలా చేశారు.
“దోస్తు కొట్టినప్పుడు దెబ్బలాడి
“మరిచిపోయాను
“మళ్లీ ఆడుకున్నాను/అంటున్నారు.
స్నేహమేరా జీవితం.స్నేహమేరా శాశ్వతం.సినీ గీతం ఉంది.ఏవో చిలిపి చేష్టలు,ఏదో అల్లరి,దోస్త్ కొట్టినప్పుడు దెబ్బలాడి మరిచిపోయి మళ్లీ ఆడుకున్నాను.స్నేహితులు కొట్లాడుకుంటారు.అన్నీ మర్చిపోయి అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఆడుకుంటారు.స్నేహబంధం విలువైనదిగా చెప్పుకుంటారు.నిజమైన స్నేహితులు జీవితాంతం కలిసి మెలిసి ఉంటారు.స్నేహం యొక్క ఔన్నత్యాన్ని కవయిత్రి చక్కగా వివరించారు.
“సార్ కొట్టినపుడు
“వెక్కి వెక్కి ఏడ్చిన/అంటున్నారు.
సార్ అంటే ఎవరు?ఉపాధ్యాయుడు.ఆచార్య దేవోభవ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆచార్యుడు కూడా దేవునితో సమానం.సార్ ఏదైనా తప్పు పని,అల్లరి చేస్తే మరియు చదువుకోకుంటే మందలిస్తారు.సారు కొట్టినప్పుడు వెక్కివెక్కి ఏడ్చాను.పిల్లలు సారు కొడితే ఏడుస్తారు.పిల్లలను తల్లిలాగే సారు కూడా దగ్గరికి తీస్తాడు.సార్ చక్కగా చదువు చెప్పి మనలో జ్ఞాన దీపం వెలిగిస్తాడు.సార్ మనలను సన్మార్గంలో నడిపిస్తాడు.సార్ కొట్టినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం చక్కగా ఉంది.కవయిత్రి మనలను బాల్యపు జ్ఞాపకాలలోకి తీసుకెళ్లిన తీరు అద్భుతం.
“ఇప్పుడెందుకో
“గుట్టలుగా పేరుకున్న దుఃఖం
“ఉబికి రానే రాదు
“గుండెలో భారం తగ్గనే తగ్గదు/అంటున్నారు.
జీవితంలో మనిషి ఎన్నో కష్టాలను కడగండ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే కష్టాలు ఒక్కటొక్కటిగా మాయమై పోతాయి.కష్టాలను సహనంతో ఓర్చుకుంటే గుట్టలు గుట్టలుగా పేరుకున్న దుఃఖం ఆవిరి అయి పోతుంది. కష్టాల నావను ఈదుతున్నప్పుడు గుండెల్లో భారం ఎలా తగ్గుతుంది?కష్టాలు క్రమేణా తగ్గిపోతే గుండెల్లో భారం తగ్గుతుంది.కవయిత్రి కవితలో దుఃఖం గురించిన భావాన్ని చక్కగా పండించారు.
“మనసు చేతికి దొరికితే బాగుండు/అంటున్నారు.
మనసు చేతికి దొరికే వస్తువు కాదు.మనసు మన ఆలోచనల్లో నిండి నిబిడీకృతమై ఉంటుంది.మనసు చిక్కబట్టిన వాళ్లను మహర్షులు అంటారు.నిత్యం యోగా,ప్రాణాయామాలు చేయడం ద్వారా మనసు స్వాధీనంలోకి వస్తుంది.మనసు స్వాధీనంలోకి తెచ్చుకున్న వాళ్లను స్థితప్రజ్ఞులు అంటారు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుల గురించి వ్రాయబడింది.
“ముండ్లు గుచ్చో
“సెగ తగిలించో
“రాతితో బాదో
“గట్టి పడేసే దాన్ని/అంటున్నారు.
మనసు మనకి అందదు.మనసుకి ముళ్ళు గుచ్చలేం.మనసుకు సెగ తగిలించలేం.మనసును రాతితో బాధి గట్టి పడేయడం సాధ్యం కాదు. మనసును గురించి కవయిత్రి భావన మనలను ఆలోచింపజేస్తుంది.
“వయసు పెరిగే కొద్దీ
“ఈ మనసెందుకో
“మరింత సున్నితమవుతోంది/అంటున్నారు.
వయసు పెరిగే కొద్ది వయసుతోపాటు ఈ మనసు మరింత సున్నితమవుతోందనే భావం అద్భుతంగా ఉంది.మనసు యొక్క సున్నితత్వం గురించి కవయిత్రి భావాల్లో వాస్తవం దాగి ఉంది.
చక్కటి కవిత అందించినందుకు కవయిత్రి బిట్ల అంజనీదేవిని అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

May 29, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us